ఎడిటోరియల్ బోర్డు
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
నెత్తురు
సందె సూరీడు
నిలువెల్లా కరిగిపోయి
తనువెల్లా పారినట్టు
నునువెచ్చని నెత్తురు
నరనరనా ఉరుకుతుంటుంది
ఏ సురగోళాల సరిహద్దులు దాటుకొని
ఎప్పుడు, ఎలా
ఈ పవిత్రమైన మట్టిలోకి ప్రవేశించిందో గాని
మట్టి తీరుగా అది కూడా మమతలనల్లుకుంటుంది
మృత్తికలోంచి మొక్కల వ్రేళ్ళలోకి ప్రవహించి
గింజలుగా బయటకొస్తుంది
గింజలు వొట్టి గింజలుగానే కన్పిస్తాయి,
మానవమాత్ర నేత్రాలకు గోచరించని సృష్టిమూలాలవి.
ఆకలిని ఆసరాగా చేసుకొని
కడుపులోకి చొరబడ్డ గింజలు
శక్తి సమన్వితమైన రక్తమై జనిస్తాయి
పారే నీరు మట్టిలోని ఖనిజాలను
సుదూరాలకు చేరవేసినట్టు
రక్తం కూడా జీవి లక్షణాలను ఒడిసిపట్టి
తరతరాలకు పారుతుంది
అసలు రక్తమంటే ఏమిటి?
గాఢనిద్రలో కూడా కలలై వెంటాడే భయం.
తన నుండి తనవాళ్ళను విడదీయలేనంత గట్టి బంధం
మనిషి మీద మన్ను చూపించేంత వింత ఆకర్షణ
చేవజచ్చిన దేహాలకు జవసత్త్వలనిచ్చే చైతన్యం
అసహాయుల కోసం ఆత్మార్పణకు సిద్ధపడే త్యాగం
రణక్షేత్రాలను తడిపేందుకు ఏరులై ఎగసే ఉత్సాహం
ఒక జాతి యావత్తును కనుసన్నలలో నడపగల ధైర్యం
నెత్తురంటెనే జీవం కదా!
ఈ విశ్వకాలాంతరాళల్లో కదిలే ప్రతి ప్రాణీ నెత్తుటి ముద్దే కదా!
రక్తమంటేనే దేహంలో చరించేది కదా!
మానవ చరితలన్నీ రక్తసిక్తమే కదా!