కవితలు

(July,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

దిలీప్ కవితలు  ఐదు

1

వామనావతారం

 

రాజ్యమా..

నీది వామనావతారం

 

మొదటి పాదం అడవుల పై

రెండవ పాదం గనుల పై

మూడవ పాదం నదులపై మోపినపుడు

రాజ్యమా.. నీది వామనావతారం

 

రాజ్యమా...

నీది వామనావతారం

 

మొదటి పాదం మైనార్టీల పై

రెండవ పాదం మహిళల పై

మూడవ పాదం బహుజనులపై మోపినపుడు

రాజ్యమా.. నీది వామనావతారం

 

 

రాజ్యమా...

నీది వామనావతారం

 

మొదటి పాదం కలాల పై

రెండవ పాదం గళాల పై

మూడవ పాదం ప్రశ్నించే ప్రతి మనిషిపై మోపినపుడు

రాజ్యమా.. నీది వామనావతారం

 

రాజ్యమా...

నీది వామనావతారం.

 

2

 

ఆపలేవు!

 

స్వరాజ్య భారతంలో

మేం జీవ నదులం

మా దారిలో మేము పయనిస్తామ్

 

స్వతంత్రమనే చెట్టుపై

స్వేచ్ఛగా వాలిన కోకిలలం

మేం స్వేఛ్ఛాగానం చేస్తాం

 

సమాజమనే వెదురుపై

వెలసిన స్వర వాహికలం

మేం భిన్న స్వరాలను వినిపిస్తాo

 

కలాలన్నిటిని సమాధి చేస్తే

నేల పొరలలో పరివ్యాపించి

కొత్త మొలకలై మొలకెత్తుతాం

నేలనేలంతా 

సుందర భరితం చేస్తాం

 

గళాలన్నిటికి సంకెళ్ళేస్తే

గొలుసు సందుల్లోనుంచి

నిశ్శబ్ద నినాదమై

గాలినంతా ఆవహిస్తాo

సమాజానికి

కొత్త ఊపిరులు ఊదుతాం

 

భానుడికడ్డుగా

మీరెన్ని పరదాలు కట్టిన

వెలుగు రేఖలు మీ ముఖాలపై

పడకుండా అడ్డుకోగలవు కానీ

భూమి పై ప్రసరించకుండా ఆపలేవు!

భూమి పై ప్రసరించకుండా ఆపలేవు!

 

 

3

 

శిక్షించండి...!

 

 

శిక్షించండి శిక్షించండి

పడుకోనిచ్చినందుకు పట్టాలను

ఆగకుండా దూసూకోచ్చినందుకు రైలును

కాదంటే... లేదంటే

పట్టాలపై పడుకోడమే నేరమనె నెపంతో

చిద్రమైన దేహాలను శిక్షించండి

 

శిక్షించండి శిక్షించండి

నడవనిచ్చినందుకు దారిని

నీడనిచ్చినందుకు చెట్టుని

కాదంటే... లేదంటే

అనుమతి లేనిదే రహదారిపై నడిచారనె నెపంతో

పగిలిన పాదాలను శిక్షించండి

 

శిక్షించండి శిక్షించండి

సొమ్మసిల్లి పడిపోతే యెళ్ళగొట్టని రైల్వే స్టేషన్ని

నిదురపోతుందేమొనని ఊరుకున్న అధికారులని

కాదంటే... లేదంటే

తల్లి చనిపోయిందని తెలియక

గుక్కపెట్టి ఏడ్చుతూ తల్లిని లేపే శిశువు కన్నీళ్ళు

మీ ఊకదంపుడు ఉపన్యాసాలకు అడ్డుతగిలి ప్రశ్నిస్తాయనె నెపంతో

ఏడ్చే చిన్నారిని శిక్షించండి...!

గుక్కపెట్టి ఏడ్చే చిన్నారి గొంతు ఆగేదాకా శిక్షించండి..!

 

 

4

 

ఎవరినీ...?

 

ఎవరినీ..

నన్ను నన్నుగా చూడని

దేశంలో నేనెవరిని?

 

ఎదురుగా ఉన్న నన్ను తప్పించి

కనపడని నన్ను పట్టి చూసే

సంస్కృతిలో నేనెవరిని?

 

తరాలు మారిన

అంతరాల దొంతరలో

అట్టడుగున ఉన్న వాణ్ణి

 

నా పనితో కన్నా

కులంతోనే గుర్తించబడుతున్నవాణ్ని

అందరి మధ్యన ఉన్న అంటరానివాణ్ని..

 

సదువుకి,సంపదకి

సంస్కృతికి,సమాజానికి

దూరంగా ఉంచబడ్డవాణ్ని

 

వెలి వేతలతో వేదనలను

అణచివేతలతో అన్యాయాలను

పుట్టుకతోనే పురుడు పోసుకున్నవాణ్ని

 

ఎవరిని

దేశంలో నేనెవరిని...?

 

 

*U.p లో దళిత మహిళా అన్నం వండినదని తినకుండా చేసిన లొల్లి సందర్బంగా

 

 

        5

 

నిజంగా ప్రజాస్వామ్యమే

 

 

మా ఓటు తో గద్దెనెక్కినోడు

మమ్ముల గద్ధురాంచంగా

 

మేమిచ్చిన అధికారం తో అందలమెక్కీనోడు

మమ్ముల అదిమిపట్టంగా

 

మా పేరు చెప్పి పాలించెటోడు

మమ్ముల పరాయికరించంగా

 

మా గొంతుకగా ఉండాల్సినోడు

మా గొంతులు నోక్కంగా...

 

ఇది నిజంగా ప్రజాస్వామ్యమే..

మేమేకదా మము ఏలుమని

మిము గద్దెనెక్కీచింది

 

నిజంగా ఇది ప్రజాస్వామ్యమే..!

నిజంగా ఇది ప్రజాస్వామ్యమే...!!

 

 

 

              


ఈ సంచికలో...                     

Jul 2021

ఇతర పత్రికలు