కవితలు

(November,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

దొరతనం కూలేదాకా

తెలంగాణ జాగల ఆంద్రోళ్ళ పెత్తనం ఎన్నాళ్ళంటూ,
నీళ్లు, నిధులు, నియామకాలు
మా భూములు మాకంటూ,
మా ఉద్యోగాలు మాకంటూ
గొంతెత్తి నినదించినోల్లం
పాణాలకు తెగించి రైలు పట్టాల మీద పన్నోల్లం
ఉడుకుడుకు పాణాలు వోతున్న జై తెలంగాణ అన్నోల్లం. 
తెలంగాణ అచ్చేదాక తెగించి కొట్లాడినోల్లం

గోతికాడి నక్కలాగ నక్కి నక్కి దాగినోడు
ఒక్క రోజు దీక్ష చేసి నిమ్మరసం తాగినోడు 
విద్యార్థుల ఉద్యమం ముందు 
బొక్క బోర్లావడ్డోడు 
పీకల్దాక తాగినంక
పిచ్చి పిచ్చి వాగెటోడు
ఫామ్ హౌజ్ ల పన్నడంటే
పగలు రాత్రి తెలువనోడు.

తెలంగాణ యాసతోటి,తెలంగాణ భాషతోటి 
అందరికీ ఉచిత విద్యంటూ
దళితుడు ముఖ్యమంత్రి అంటూ
ఇంటికో ఉద్యోగమంటూ
డబుల్ బెడ్రూమ్ ఇళ్ళంటూ
మోసపూరిత వాగ్దానాలతో
పిట్టల దొర వేశాలతో అధికారంలోకి వచ్చినోడు.

అధికారం నెత్తికెక్కీ ఆరేళ్లు గడిచిపోయే
సోర సోర పోరగాళ్ళు
ఉద్యోగాలిమ్మంటే 
పోలీసుల ఉసిగొలిపి
పొట్టు పొట్టు గొట్టిచ్చినోడు

నిరుద్యోగ భృతి అడుగుతే
పని జేసుక బతుకాలంటూ
ఉపాధి సూపియ్ దొర అంటే..
ఉన్న ఉద్యోగాలూ పీకేసినోడు.

అల్లుడత్తే ఏడ పండాలంటూ
డబుల్ బెడ్రూమ్ ఇల్లంటూ
ఉన్నగుడిసే పీకేసినోడు
ఉచిత విద్య అనుకుంటనే
ఉన్న బళ్ళు మూసేసి
బడికిపోయే పోరాగాండ్లకు
బర్లనిస్తా కాయుండ్రని
జీయరుసామి నోట్లెనోరు 
బెట్టినోడు.

బడులు మూసి బార్లుదేరిసి
పనిచేసే సత్తువున్న యువతను 
మద్యానికి బానిసల జేసి
యేజ్ బారు అయ్యేదాకా
ఉద్యోగాలియ్యకుంటా..
ఆత్మహత్యల పాల్జేస్తివి...

నీ కుటిల నీతి తెలువనోళ్ళు 
మళ్లీ నీకు ఓట్లు గుద్ది 
గద్దెమీద ఎక్కిస్తే...
మా గోసి గుడ్డ గుంజుకొని
పెనం నుంచి పొయ్యిల నూకి
గాయిదోళ్ల బతుకులకు
గిదే బంగారు తెలంగానంటివి.

యెనుకటి మీ తాతల
రోజులు కావుకొడుక
మీ తలపొగరు దిగేదాకా
దొరతనం కూలేదాకా...
బహుజనులం ఒక్కటయ్యి
బరిగీసి నిలవడుతాం...

నిలవడుతాం,కలబడుతాం
కలేవడుతాం,ఎగవడుతాం
నీ దొరగడీల పెత్తనాన్ని 
కూకటేల్లతో పెకిలిస్తం.

 


ఈ సంచికలో...                     

Nov 2020