కవితలు

(February,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

చీకటి కవల

పొగతో పగ చిమ్ముతూ,

మబ్బుల్ని చెదరగొట్టి మేడలు కట్టింది.

కొండ పక్కకు ఒత్తిగిల్లే వెలుతురు బాతును

విస్తరణ కత్తి వేటుకు బలి చేస్తూ,

ఏటా చెరువుగట్టు ను తవ్వి తవ్వి నవ్వింది.

అల్లిబిల్లి తీగెల చిట్టి అడవిని

కాస్త కాస్త చప్పరించి చదరాలుగా కోసింది.

ఒద్దన్నా వచ్చిపడే అవసరం నగరం.

 

పరువు పాచికలాడించి 

ఊడిగం చేయించే జూదగృహం.

ఆశల కర్మాగారం లో పుట్టిన కృత్రిమ ఆటబొమ్మ.

తనను సృష్టించిన మనిషినే

విలాసాల కలలతో  స్నేహం చేయించి

భ్రమల పందేరంలో దేహాన్ని

బేరం పెట్టమంటుంది పట్నం.

 

పక్క వాడిని తొక్కి మరీ 'పైకి' లేచే 

పోటీ పరీక్ష ఇక్కడ చట్ట బద్ధం.

మోసం,మోహం కలనేసిన మలిన వస్త్రం.

ఆకాశాన్ని మోసే ఇరుకు గదుల్లో,

ఏమెరుగనట్టు అడ్డంగా పడుకునే‌ కొండచిలువ

పుట్టిన కొన్నాళ్ళకే  తప్పిపోయి

అవినీతికి అమ్ముడు పోయిన ' చీకటి కవలనగరం.

 

పల్లె బావుండేది.

"పిన్నీ ,వదినే" , "చంటోడా,నడిపోడా " అంటూకూరిమి తో సుఖం,దుఃఖం పంచుకునేది.

ఒక చిన్నారి పురిటి కేక ను పండుగ చేసుకుని,

ఒక మరణాన్ని మదిలో మోసి

మూకుమ్మడి పస్తు పడుకునేది.

 

అనుబంధం విరబూసే వనం పల్లె.

ఇప్పుడిలా నగరం ఆవలి ఆవరణలో

కుండీలో మరుగుజ్జు మర్రి లా మిగిలింది.

 

 


ఈ సంచికలో...                     

Feb 2021

ఇతర పత్రికలు