ఇపుడు నా ఇల్లుఒంటరిది.. గుండె నిండా అలజడి ఉన్నా గోడలు, కుర్చీలు అన్నీ
వెలవెల పోతున్నాయి
శబ్దాలన్నీ చప్పుడు మరచిపోయి
ఎక్కడికక్కడ మౌనంగాఉన్నాయి
అదేం చిత్రమో కానీ.. మినుకు మినుకు మనే తారల్లా వచ్చేవారంతా మెరుస్తున్నారు సరే! కాకుంటే వేదనల్ని మోసుకొస్తున్నారు కన్నీళ్ళను ఒంపి వెళ్ళిపోతున్నారు నాకు తప్పదు కదా! వారు వెళ్ళాక నా ఓర్పు పరదాతో మరకు నా మనసుకు అంటకుండా అంతా శుభ్రం చేసుకుంటూ ఇకపై... ఎవరూ రానివ్వకూడదు అని
నాకు నేనే ఓదార్చుకుంటున్నాను. వచ్చినా తలుపులే తెరవకూడదనుకుంటున్నాను..
తెల్లవారితే మళ్ళీ తలుపు తెరవక తప్పదు.. తలుపుకు తడి అంటక తప్పదు అన్నట్లు మళ్ళీ రేపటి సరికొత్త ప్రయాణం.. మళ్ళీ ఆహ్వానాలు . మళ్ళీ అదే తంతు..!
వచ్చేవారంతా పంచుకునేవారే పాపం! కాకుంటే ప్రపంచాన్ని పంచుతున్నారంతే! సమాజంలోని అసాంఘిక సంఘటనల్ని.. కష్టాలకడలిలో కొట్టుకుపోతున్న కన్నీటి కధల్ని తెలుసని చెబుతున్నా పరిచయం చేస్తున్నారు నేనేం చేయగలను..? ఆ కథన్నింటినీ ఒక దృశ్యకావ్యంగా మార్చి మళ్ళీ ఆ కథల్నికనిపించేసమాజానికి అందిస్తున్నాను. విన్నకథే అని తెలుస్తున్నాపిచ్చి సమాజం.. మరచిపోయి కన్నీరు పెట్టేస్తున్నారు..
ఎందరో చూస్తున్నారు. వింటున్నారు అరచేతుల్లో దాచుకున్న గుండెను
ఎంతో భారంగా మోస్తున్నారు సమాజాన్ని తప్పించుకోవానుకుంటూ ఇంటి గడియలువేసుకుంటున్నారు.. ఉదయం తులుపులుతెరవక తప్పదు.. ఎవరో రాక తప్పదు.. కాకుంటే ఆ వచ్చేవారేదో ఒక శుభవార్తను అందిస్తే బావుండు.. ఒక చిరునవ్వును కానుకగా ఇస్తే బావుండు.. అందుకే నా ఎదురుచూపు.. గుండె ఒంటరిదైనా పర్వాలేదు.. ఇల్లుఒంటరిది కాకూడదు కదా..!!