కవితలు

(February,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

క్రూర ప్రపంచమా...

" Never ever seek for greatfulness from mankind, you shall always see ungrearfulness. Do what you must do as a solemn duty "     --- Ernest Agyemang Yeboah

       1.

ఇక్కడంతా ఇంద్రజాలం..

నమ్మకాల కనికట్టు..

 

కనిపించే మనిషి మాయమై

అంతలోనే కోరల్తో కనిపిస్తాడు.

స్నేహంగా చేయి చాచినవాడు

ఇంకో చేతిని కరవాలంగా దూస్తాడు.

 

సన్నగా కనిపించని కత్తివాదరకు

గొంతు తెగుతుంది.

తెగినట్టు అనిపించదు.

రక్తం కారుతుంది.

కారినట్టు అనిపించదు.

గుండె గాయమోడుతుంది.

గాయం ఎక్కడా గొంతు విప్పదు.

 

నీ ముందు ప్రపంచం నవ్వుతుంది.

వెనుక ముఖచిత్రం మారుస్తుంది.

 

ఎవ్వరెందుకు దగ్గరౌతారో 

దూరమౌతారో అంతుపట్టదు.

 

ఎందుకో ఎలానో ఎవరూ చెప్పరు.

ఏ చిక్కుముడి ఎవరూ విప్పరు.

 

నీరేదో..పాలేదో చిలక్కొట్టేసరికి

ముప్పాతికపాళ్లు జీవితం జారిపోతుంది.

       2.

చిన్న చిన్న విషయాల వెనుక

జీవితం దాక్కుంటుందంటారు..

ఈ ప్రపంచం మన ప్రపంచం కావడం

చిన్న విషయం కాదు.

 

మాలిమి అయిన ఏనుగు

ఒక్కోసారి క్రూరంగా తిరగబడినట్టు

క్రూరంగా పెడబడుతుంది ప్రపంచం.

 

పారే నీటి మీద

మంచు గడ్డ కట్టినట్టు

గడ్డ కట్టి వుంటుంది ప్రపంచం.

స్వార్థపు చెక్కు కట్టి వుంటుంది.

 

అప్పుడు అది

కన్నీటిప్రార్థనలకు కరగదు.

దానికి కన్నీరు కలుషిత పదార్థం.

అవసరమే దాని అత్యవసర లక్షణం.

       3.

దయను అడుక్కోవడం

దయనీయం.

 

భిక్షపాత్రలో

ఒకింత ప్రేమకబళం పడటం

ఒక ఉత్సవం.

 

ఈ భూమిపొరల్లో అరుదుగా దొరుకుతున్న

మూలకం మానవత్వం.

మనిషి- సాటి మనిషి కష్టంపై

కంపించడం..స్పందించడం

ఇప్పుడు చారిత్రాత్మకం.

        4.

మహా మహా మానవ హననాల తర్వాతా

మనిషి కాగడా వెలిగించాడు.

 

శవాల కుప్పల మీద నిలబడి

శాంతి మంత్ర జైత్రయాత్ర జరిపించాడు.

 

మళ్లీ మళ్లీ మొదలకంటా నరికేసినా

మళ్లీ ఓం ప్రథమం నుంచి 

మొలకలా మొదలయ్యాడు.

 

అన్ని క్రూరత్వాల్నీ, కుత్సితాల్నీ

ఎదుర్కోవడానికి

ఒకడుంటాడు ఎక్కడో

దీపం పట్టుకొని -

      5.

క్రూరత్వం 

నీ సహజ గుణం కాదు.

నువ్వేసుకున్న పై ముసుగు.

 

ఏదీ శాశ్వతం కాదు.

నీ క్రూర నడత కూడా.

 

క్రూర ప్రపంచమా..

నీ క్రూరత్వంపై నువ్వే

తిరగబడే రోజు

తప్పక వస్తుంది.

 


ఈ సంచికలో...                     

Feb 2021

ఇతర పత్రికలు