ఎడిటోరియల్ బోర్డు
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
క్రాంతికిరణ్ కవితలు ఐదు
1
పోరాటమే స్వేచ్ఛా పునాది
ఏమిటి నేస్థం ఎందుకా కన్నీరు
స్వేచ్ఛా బందీ అయిందనా
విరామం విరమనవ్తుందనా
లే లేచి ఆ కన్నీరు తుడుచుకో
అదిగో అలా చూడు ఆకాశం
ఇంకా విశాలమౌతున్నది
అరుణ కాంతులతో విరసిల్లుతున్నది
చీకటికి చన్నీళ్ళ
చిరుదద్దు కుట్టినది
వసంతపు వానచినుకొకటి
యాంగ్సి మబ్బుల
నుండి గంగకు చేరింది
విప్పపూల వనంలో
తుపాకీ దండు విరిసింది
రెప్పపాటు దూరంలో
బంగారు లేడి కూలనుంది
పులిని మింగిన మేక
పిల్లనగ్రోవి ఊదింది
మేకలను మింగిన పులి
పల్లవి ఆగిపోయింది
చూసావుగా నేస్తం
ఇంకెప్పుడూ ఎడవమాకు
కష్టాల కాలిగొర్లు తియ్యమాకు
వాన వంటిది నీప్రేమ
మెరుపు వంటిది నీ దీమా
భుజం తట్టి చెబుతున్నా విను
అడుగు అడుగు ముందుకేస్తెనే
అలసట పారిపోతుంది
పిడికిలి బిగిస్తేనే
గెలుపు నీ ముందుంటుంది
2
హిస్టరీ అడ్మిరెస్ డెత్
నేను వెళ్తున్న
ఒక ద్వేషాన్ని
ప్రేమగా మలిచెందుకై
ఒక సత్యాన్ని
నిలుపెందుకై
నేను వెళ్తున్న
ఆ దారిలో
కోర నాగులుండొచ్చు
నన్ను కాటేయోచ్చు
ప్రాణాలు తీసే
ఊబిలుండొచ్చు
నను ముంచేయొచ్చు
పీక్కు తినే పులుండొచ్చు
నను చీల్చేయొచ్చు
ఈ పోరులో
నా చేతులు తెగిపడొచ్చు
నా కళ్ళు రక్తం కార్చొచ్చు
నా తల పేలిపోవచ్చు
ప్రాణం పెకిలి పోవచ్చు
ఐతేనేం
చచ్చిన శవంలా
పడుండటం కంటే
చావేమేలు
చరిత్ర మెచ్చే
భానిస
చరిత్రను మార్చే
చావే మేలు
3
ధిక్కార వసంతం
వసంత ఋతువుని
వర్షించే మేఘాన్ని
మట్టి వాసనని
అడవి అందాన్ని
పైడి పదాన్ని
వెన్నెల వసంతాన్ని
వేకువ ధీరత్వాన్ని
నువు
అణిచేద్దాం అని
అనుకున్నపుడల్లా
మరింత ఉవ్వెత్తున
లేస్తూనే ఉంటాయి
ఉప్పెనై పొంగుతూనే ఉంటాయి
4
అణు సంగీతం
పుట్టుకే శరణమై
జీవితం మరణమై
ఊసుల ఉవ్విళ్ళు
ఊహల్లో ఉరి పోసుకుంటుంటే
మై డియర్ రెడ్ రోజ్
నా చివరి శ్వాస
నీ చిరుగాలి సితారా
సంగీతాన్ని వినింది
అణు వణువుకు
ఆ సంగీతం
ధైర్యం దారులేసింది
మందారం మకరందాన్ని
పులుముకుని నా చేతిని తాకింది
అది బారెల్ చివరినుంచి
బతుకును చూపింది
మై డియర్ రెడ్ రోజ్
నిజంగా నీ ప్రేమ ఎంతో గొప్పది
నా చివరి చూపూ వరకు
నీ వెకువ వెలుగులకే
ఈ నా జీవితం అంకితం
5
వాగ్దానం
ప్రియా...
ఆవిరై
సగమాకాశంలో
మేఘమైన
నీ ప్రేమని
చినుకులు చినుకులుగా
వెన్నెల వానలా
కురిపించు
స్వేచ్ఛ గాలుల గానానివై
ఓసారి వచ్చి
మరోవసంతాన్ని
వాగ్దానం చేసిపో