ఊరంతా ఉసికై ఉడికి
కక్కుడు పారుడు కల్లోలం లేపితే
పోచమ్మతల్లి కన్నెర్ర జేసిందని
సల్లపరుసుటానికి
జబ్బకు జమిడిక ఏసుకుంటడు
దప్పుదర్వులతోని
జతకట్టిన జమిడిక జతులకు
చచ్చుబడ్డ కాళ్ళకు ప్రాణమొస్తది
కఠినశిలలు కాల్పనిక జగత్తులో విహరిస్తయి
సలిబోనం ఎత్తుకొని
సల్ల గురిగి పట్టుకొని
వేప రిమ్మలు కంఠహారంగా ధరించిన
కల్లు బింకుల కావడినెత్తుకొని
వెయ్యి కండ్ల తల్లికి వేడ్క చేయ
చిల్లుల కుండలు
చిరునవ్వులొలుకుతుంటే
సల్లపరుస్తరు
మాపటేల మంత్ర ముగ్దులను చేసే
వాయిద్యాల విన్యాసాలు
నెత్తిమీద బోనం
బోనం మీద మండుతున్న గండ జిరుక
సుట్టబట్ట మీద సుతారంగా కొలువైతయి
గావుపిల్ల యాటపిల్ల
పిల్లపాపలతోనే కలిసి నడుస్తయి
తల్లి సుట్టు తిరిగి
సురాముప్పై మూడు కోట్ల దేవతలను తలుసుకొని
డప్పు మీద కూసుండి
పెయినిండ బండారి పూసుకొని
నుదుటికి ఎర్రబొట్టు పెట్టుకొని
చెటిల్ చెటిల్ అని ఈరగోల ఉరుముతుంటే
పెద్ద పెద్ద కండ్లు తెరుసుకుంట
అడుగులో అడుగేసి నడిస్తే
పూనకం వచ్చిన పోతలింగాన్ని చూసి
పెయిపొన్న ముండ్లు నిక్కపొడుస్తయి
నాలుగడుగులేసి
రెండు చెక్కిళ్ళను
చిటికెలో చీల్చి
కింది పెదవిని అందుకొని
గొంతు కాడికి తెంపితే
గిలగిల కొట్టుకొనే గావుపిల్ల
చిలచిల చిమ్మే రక్తం
ఊదు మైసాక్షి ఉసి గొల్పుతుంటే
రక్షించుమమ్మా పోచమ్మా!
నిన్ను రాసవారలు గొల్తురమ్మా!
పాటపాడితే
కో అంటే ఓ అని పలుకుతది పోచమ్మ
ఎల్లమ్మ కథ చెప్పితే
ఏరుపారినట్టు
తడబడని నుడుగుల అడుగులు
తరగలెత్తుతయి
జమదగ్ని పరశురాముని
పౌరుషం చెప్పి
లందల దాగిన చందమామ
ఎల్లమ్మను కండ్లకు చూపుతరు
కాటమరాజు కొలుపుకు
కావడిబద్దలు సలాం చేస్తయి
ముంజల పండుగ
మురిపెం నింపుతది
ఊరు కొలుపు
చుట్టూళ్ళ బైండ్లకు పిలుపు
తలా ఒక పని ఆసరైతరు
రాత్రి రచ్చబండ కాడ కొలుపు
దొబ్బను నోట్లెపెట్టుకొని
పేగులను మెడకు సుట్టుకొని
ఊరి చుట్టూ సర్వు చల్లుకుంట తిరిగితే
దుష్ట శక్తులు దూరమైతయి
జడిసిన కలలో ఉలికిపడ్డా
కోర్నాలు కోరినా
సందులు తలిగినా
పోయిలోని బూడిద పెద్ద మందైతది
మంత్రించి ఇస్తే
మటుమాయమయ్యే ఆపదలు
గ్రామ దేవతలను కొలిసే
ఊరిగొడుగులు
ఊట చెలిమెలు
జమిడికలు