నవలలు

నవలలు

సైరన్ నవల  రెండవ పార్ట్ –  నాల్గవ   భాగం

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)

‘‘మీరంత ఏలు ముద్దెరగాళ్లమో, ఔసెల్లే - నువ్వు మూడో తరగతి చదువుకున్నమో? మొగిలి పెండ్లిప్పుడు - సదివిన పిల్ల మనింట్ల సంసారం జేత్తదా? అని అత్తనంగవిన్న’’ లక్ష్మి.

                తడుక దగ్గర కూచున్న రాయేశ్వరి ‘‘ఎహె - ఎప్పుడో వాన కాలపు సదువు - అంత మర్సిపోయిన’’ అన్నది సిగ్గుపడుతూ...

                ‘‘నీయవ్వ ! గొడ్డలి పురాండమయ్యింది. మీలచ్చక్కకు, ఆ అక్కకు నువ్వే పంతులు - రేపు పలకదెత్త - కంపిని కాడ ఇజ్జతు వోతంది - లాగులు లసకాండ్లేసుకున్నవ్‍ - సంతకం జెయ్యరాదా అంటండ్లు’’ జీతాలిచ్చే క్లర్కులు శంకరయ్య లేచి కరపత్రం చేతికిచ్చిండు.

                రాజేశ్వరి కిందా మీద చూసింది - అక్షరాలు అలుక్కపోయినట్టు కన్పించాయి... సల్ల చెముటలు పెట్టినయ్‍ అందరి చేతుల్ల తాగిన చాయ్‍ గ్లాసులు లక్ష్మి తీసుకపోయి ఇంటి వెనుక వేసి వచ్చింది.

                ‘‘ఏందే సెల్లె గంత ఖతర్‍నాకున్నదా? సల్ల సెమాటల్‍ బెడ్తన్నయ్‍’’ శంకరయ్య...

                ‘‘నువ్వుండు - గింత మంది ముందు సదువుడంటె మాటలా? ఏది నీకు పాటలత్తయేమొపాడు’’అన్నది లక్ష్మి. రెహనా కింద కూర్చున్నది. రాజేశ్వరి, రెహనా పక్క కూర్చుండి సరాంచి చదవడం మొదలు పెట్టింది.

                కార్మికులారా! ప్రజలారా! ప్రజాస్వామిక వాదులారా! ‘‘భారతదేశంలో 25 జూన్‍ 1975 నుండి 20 మార్చి 1977 దాకా సుమారు ఇరువై ఒక్కనెలలు ఎమర్జెన్సీని పెట్టి ఇందిరాగాంధీ ప్రభుత్వం పోరాడే ప్రజలను లక్షలాది మందిని జైల్లల్లో పెట్టింది. విప్లవకారులను ఎన్‍కౌంటర్ల పేరుమీద వేలాది మందిని చంపించింది. దేశమేపెద్ద జైలుగా మారిపోయింది.’’

                రాజేశ్వరి మొస తీసుకున్నది... మొత్తం కరపత్రం చదివేటాల్లకు పావుగంట పట్టింది.. నలుగురికి ఎంత మేరకు అర్థమయ్యిందో కాని ఎవరు మాట్లాడలేదు. మొదట తేరుకున్నది రెహనా...

                ‘‘దేశంల గంత జరుగుతున్నదన్న మాట - మనమేమొగీ బురదల గుడిసెల కాడ నీళ్లకోసం కొట్లాడుతన్నం. గదీసంగతి ఏడి పనాడున్నది. మనుసుల పడ్తలేదు. అంత గాయిగాయి గున్నది. సమఝయితలేదు. ఈనె ఇంటికాడున్నప్పుడు మస్తు చెప్పుతడు మనుసులనెట్టకని నాకే నువ్వు తిరుగేది సాలదా? నేను గియ్యన్ని నేర్సుకొని ఏంజేత్తనంట’’ రెహనో దడి తడుక తీసుకొని వీధిలకొచ్చింది. శంకరయ్య ఎటుమనుసుల బట్టక రెహనాను సాగదోలడానికి బజార్లకచ్చిండు. కొత్త గుడిసెలు ఇంకా కట్టెటోల్లు కడ్తనే ఉన్నరు. దారిలేక తోవంత బురద బురదయ్యింది. గుడిసెలల్లో పొగ ఆలిశ్యంగా బద్దకంగా లేస్తోంది. ‘‘వీనవ్వల గుడిసెలు కట్టుకుంటిమి గని - తొవ్వ దారి లేక పాయె - నీళ్లు లేకపాయె - కరంటు లేకపాయె - కంపినోని నోట్లె....పాపపోడు. ఏడనో జంగల్ల బాయిలు దోడి - మనుషులకు తిండితిప్పలు - పండుడు లేసుడుంటయని - సౌలతు చెయ్యాలని లేకపాయె’’ - తిడుతున్నాడు శంకరయ్య ‘‘గదెనే అన్న - వానికేం పట్టి - వాళ్లకు అన్ని సౌలతులున్నయి - అందరం బొయ్యి అడుగాలె’’ - రెహన - ‘‘నీకడుపు సల్లగుండ - ఇండ్లుకట్టిండ్లు గని రమ్మంటే ఏర్కుంటరు - పిరికోల్లుగాదు.’’ అతనే - రెహనా వెళ్లి పోయింది...

                ‘‘బాయిల కప్పతీర్గయ్యింది...గింత కథలుండె - మనకు తెలవకనేపాయె - ఎట్లనన్న జేసి మీటింగుకు పోవాలె - తెలుసు కోవాలె - ఇంకా చానున్నయి. బాయిల పనుల గురించి - చానున్నయి.’’శంకరయ్య మళ్లీ గుడిసెలోపలికివచ్చి.

                ‘‘బస్తీలల్ల - బతక వశం గాదు... దుకాండ్లకుబోతే - నిలువుదోపుకం - ఆడోల్లయితే గీడ ఈనం బతుకు - సంగం మందిమి ఎట్ల బతుకుతన్నమో? పాయకాండ్లులేవు. పదిమందిమి జమై తుమ్మ చెట్లల్లకు బోవాలె - ఆడ పందులు - సీకటైతే మొగోళ్లు, గుండేగాళ్లు - పానంపోతది.  మొగోల్ల కెరికేనా? మొన్న తాగుబోతు గుండాగాడు మీద సెయ్యేసె’’ లక్ష్మి కళ్ల పొంటి నీళ్లుకార్తన్నయి.  ‘‘ఊకో అక్క  - ‘‘రాజేశ్వరి కొంగుతోటి లక్ష్మి కన్నీళ్లు తుడిచింది.

                 రాజేశ్వరికి ఒక ముక్క అర్థంకాలేదు. పల్లెల్లకన్న కాలేరీల ఏం బాగ లేదని మాత్రం అర్థమయ్యింది.

                ‘‘చల్‍ బంతిపువ్వులా దండలే దెచ్చితి భామరో తలుపులు దియ్యవే’’

శంకరయ్య మంచంలో నుండి లేచి అడుగులేసిండు. లక్ష్మి ముఖంలో వెలుగు...కిరణ్‍ నవ్విండు. ‘‘పో - పొయ్యి గ దడిమంచిగ గట్టు. పాయఖానా కట్టియ్యి. మంచి పాటలు నేర్చుకొని గ మీటింగుల పాడు...గ గుండెగాళ్లను నరుకుండ్లి. ఆడోల్లకు ఏంగావాలో తెలుసుకో’’ లక్ష్మి.

                అప్పుడు రాజేశ్వరికి భూధేవి తెచ్చిన విత్తనాలు గుర్తుకొచ్చినయ్‍.

                లక్ష్మి, రాజేశ్వరి కలిసి చిక్కుడు, బీర, కాకర, ఆనిక్కాయ అలిశంత గింజలను దడికి పోసిండ్లు.

                కొంచెం జాగా చేసి జాలారి దగ్గర బంతిపూల విత్తనాలు చల్లిండ్లు కొంచెందూరంలో తోటకూర గింజలు పోసిందిరాజేశ్వరి.

                ఏవేవో పాటలు గున్‍గునాయించుకుంటూ - శంకరయ్య బాత్‍రూం తడకలు సరిచేసిండు. విప్ప చెట్టుకింది నుండి రెండు సలుపలు తెచ్చి బాత్‍రూంలో వేసిండు - నీళ్లు పోవడానికి కాలువ తవ్విండు. కాని పాయఖాన ఎట్లాకట్టాలో అర్థంకాలేదు. వైర్లతోని దడి బందవస్తు చేసిండు. ఇంటిలోపటి మేదరి తడుకలు నిలబడడానికి కొయ్యలు పాతిండు.

                లక్ష్మి రాజేశ్వరి కలిసి ఇంటి లోపల నేలంతా చదునుచేసి అలికారు...

                బయటికి ఈ పనులన్నీ చేస్తున్నాకూడా లోపల కరపత్రం తమకు సరిగా అర్థం కాలేదన్న దుగ్ద వెంటాడుతూనే ఉన్నది.

                                                                                                13

                శంకరయ్య పొద్దటి బజిలీ చేసి బాయి బయటకు వచ్చిండు. బయటి చల్లగాలిసోకి పానమంత గిప్పుడే తిరిగచ్చినట్లయ్యింది...దచ్చినం బాజు మబ్బు పెరక్కత్తంది. ఎక్కన్నో వాన పడుతున్నట్టున్నది. కమ్మటి మట్టి వాసన.

                తేరుకొని చూసేసరికి ‘‘ఏం బావా గాలికి గాయి గత్తరైతన్నదా?’’ తన పక్కనున్న హరీప్‍ తెల్లగా పండ్లు కన్పించేటట్టు నవ్విండు.

                ‘‘ఓసి - నీ అందం చూసి చెంచాలమైతినే చెంచితా!’’ శంకరయ్య పాటెత్తుకున్నడు.

                ‘‘ద్దుత్‍ ఎవలన్న సూత్తె నవ్వుతరు. అగో అటు సూడు మనోళ్లు మీటింగు వెట్టిండ్లు’’

                శంకరయ్య దూరంగా మైసమ్మ గుడికాడ రాలచెట్టు కింద గుంపుకన్పిత్తంది. కంజెర చప్పుడు...

                ‘‘ఓ నిచ్ఛమే - ల్యాంపు రూంల ల్యాంపు పారేసిపోదం’’ ఇద్దరు గాభర గాభరగా ల్యాంపు రూంలకు పోయి ల్యాంపులు పారేసి మీటింగు కాడికొచ్చేసరికి - జెండా గద్దెమీద ధోతి గట్టుకొని, ఎడం భుజంమీద గొంగడేసుకొని కుడి చేతుల ఎర్రదస్తీ పట్టుకొని పబ్బతి పట్టి -

                ‘‘లాల్‍సలామ్‍ లాల్‍సలామ్‍

                లాల్‍సలామ్‍ లాల్‍సలామ్‍’’

ఒకాయన పాట పాడుతండు. అతని పక్క మరో నలుగురు కోరసిత్తండ్లు - అప్పటికే అక్కడ నాలుగైదు వందల మంది జమైండ్లు.

                కంపినీ వాచ్‍మన్లు నోల్లు తెరిసి చూత్తండ్లు. ఎడం బాజున్న బిల్డింగుల్ల నుండి క్లర్కులు - వోర్‍మన్‍లు, సర్దార్లు దూరంగా నిలుసుండి చూత్తండ్లు. మందిలో హరీష్‍ను వెత్తుక్కోని శంకరయ్య అతని పక్క నిలబడి - ‘‘నిన్న కరపత్రం చదివినం’’ అన్నడు శంకరయ్య.

                ‘‘అర్థమయ్యిందా? మీటింగు ఇంకా వారందినాలె గదా! బాయిల కాడ, బస్తీలల్ల ప్రచారం చేస్తండ్లు. చానా మంది రావాలె - మన బలమేందో? కంపినోనికి యూనియనోల్లకు సర్కారుకు తెలువాలె’’ హరీష్‍.

                ‘‘గదే పర్‍షాన్ల బిడ్డ - సగం తెలువలే’’

                ఇంతలోనే - మందిలనుంచి గంగాధర్‍ జెండా గద్దెమీదికి వచ్చి నిలుసున్నడు...

                ‘‘ఓ - మన నాగన్న దోస్తే -’’ శంకరయ్య పట్టలేక అన్నడు మొకం వెలిగిపోంగ...

                చుట్టూ చూస్తే హరీప్‍ కన్పించలేదు. జెండాగద్దెకాడ ముందువరుసలో నిలుచున్నడు. ఇంతలోనే విద్యార్థులు కరపత్రాలు తలోటి ఇచ్చిండ్లు. - శంకరయ్య మల్లొకటి తీసుకొని జేబుల బెట్టుకున్నడు.

                ‘‘కార్మికులారా! కామ్రేడ్స్!

                పదహారో తేదినాడు - గోదావరిఖనిలో పౌరహక్కుల మీటింగులో మన కార్మికులు వందలు కాదు వేల మంది పాల్గొనాలె. మన బలం చూపాలే - కరపత్రంలో చెప్పినట్టు ఇందిరగాంధీ - వాళ్లనాయిన నెహ్రూ - చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకున్నరు. మట్టకు బెల్లం రాసి నాకిచ్చిండ్లు. స్వాతంత్రం తెచ్చిన మన్నరు. తెల్లోల్లు బోయి నల్లోల్లు పీక్కతినుడు మొదలైంది. పల్లెలల్ల దొరలు వేలాది ఎకరాల భూములు ఆక్రమించి రైతులను, కూలీలను పిక్కతింటండ్లు - గదేంది అన్నందుకు -మన దగ్గర్నే - తిర్యాణిల పోరాటం చేసిన భూమయ్య, కిష్టగౌడులను ఉరి తీసిండ్లు - దొరలను నిలదీసిన మాలాంటి యువకులను జైల్లల్ల బెట్టిండ్లు. - ఇందిరా గాంధీ - ఆమెగగావురాల కొడుకు ఎన్నికలల్ల ప్రజలు ఓడగొట్టిండ్లు. ఇంకా వేలాది మంది జైల్లల్లనే ఉన్నరు. రాజకీయ ఖైదీలందరిని బేషరుతుగ్గా విడుదలచేయాలి. లెక్కలు తీద్దాం - పోరాడుదాం - గోదావరిఖనిలో, బెల్లంపల్లిలో కలిపియాభయి మంది కార్మికులు ఇంకా జైల్లున్నరు. సింగరేణిలో ఎట్లాంటి సంగతులున్నయో మీకందరికెరికే. చాలా మంది కార్మికులను డిస్మిస్‍ చేసిండ్లు – వీళ్ళం దరిని పనిలకు తీసుకోవాలి వాటన్నిటిని నిలతీద్దాం. అందుకే ఈ మీటింగు’’

                ఇంకా మాట్లాడే వాడేమొగాని - గాడుపు దుమారం, దబ్బడ దిబ్బెడ వానచ్చింది.

                రేకులషెడ్ల కిందికురికారు. హరీప్‍ మందిలోనుండి వెతుక్కుంటవచ్చి - ‘‘బావా! మాపటించి మార్కెట్ల మీటింగున్నది - అక్కను తీస్కొనిరా’’ అన్నడు.

                ‘‘సరే! గాని నువ్వు ఇంటికి రావా! ఒక్క మాటడుగునా! చిన్నయ్యలు, పెద్దయ్యలు (క్లర్కులు) వోర్‍ మన్లు తొంగితొంగి సూత్తండ్లు కిరికిరి చెయ్యకురా?’’ నువ్వు నడువ్‍’’ అన్నాడు.

                శంకరయ్య సైకిలెక్కిండు - వాన వచ్చినట్టే వచ్చి ఆగిపోయింది - ఇంకా చెవులల్లో కంజెరదప్పు విన్పిస్తోంది...లోపల ఏదో బలం సొచ్చినట్టయ్యింది.

                వత్త మనోళ్లను గల్సి - మీటింగుల కలుద్దాం.

గట్ల భయపడద్దనే కదా! గీ మీటింగులు వాళ్ల తాతసొమ్మూ మనం బొగ్గుల అగ్గై బొగ్గు తీత్తే - వీళ్ల పంఖాలకింద కూసుండి తింటాండ్లు మనం వేల మందిమి - ఆళ్లు మనకు భయపడలె - ఉల్టా మనం భయపడుడేంది? కానూన్లు - లెక్కలు పత్రాలు మనం సూత నేర్సుడే - నిలదీసుడే.

                                                                                                                14

                శంకరయ్య అద్దం ఎడంచేతుల పట్టుకొని పెంటర దువ్వుకుంటండు. లక్ష్మి సింగులు బొడ్లె చెక్కుకొని అంపుల కాడి నుంచి వచ్చింది.

                ‘‘సోకుల వడవడ్తివి. సీకటైతంది. గకరంటువైరు ఊసిపోయినట్టున్నది. జెర పెట్టరాదు.’’

                శంకరయ్య గుడిసె బయటకు వచ్చి కంకబొంగుతోని కరంటు వైర్లు వీధిలైను వైర్లకేసి గుడిసెలోపటి కొచ్చిండు. లక్ష్మి స్విచ్చేసింది. కరంటు బుగ్గెలుగుల శంకరయ్య వెలిగిపోతండు. నల్లగున్న కలగల మొకమేలక్ష్మి మొదటి సారిగా మొగని ముఖంలోకి చూసి మనుసుల అనుకున్నది తాగుడు తగ్గిన కాన్నుంచి మనిషి షానిల వడ్డడు.అనుకున్నది.

                ఇంతకు ముందయితే శంకరయ్య, లక్ష్మి మాట్లాడుకోవడం,తిట్లతోను, ఒకలనొకలు దెప్పుకోవడంతో సరిపియేది. ఇద్దరు ఎదురుపడి ఒకలనొకలు చూసుకున్నది తక్కువే.

సీకట్ల సంసారం - ఒక పీడలాగ గడిచింది. శంకరయ్య కండ్ల సందుల నుండి లక్ష్మిని చూసిండు. తనకు ఆడవాళ్లు సరిగా తెలువదు. తల్లి చనిపోయినదగ్గరినుండి తనను దగ్గరితీసి దగ్గెరగా మాట్లాడిన ఆడమనిషేలేదు. లోపల ఏం జరుగుతందోగని - మనుషులంత కొత్తగా వింతగా కన్పిస్తున్నరు. ముఖ్యంగా నాగయ్య, హరీషు గంగాధర్‍ లాంటి మనుష/లను చూసినంక - తనను తాను తరిచి చూసుకోవడం మొదలైంది. - మనుషులుగతిలేక మంది దగ్గర అట్లకన్పడ్తరు గని లోపట అట్లగాదు. ‘‘లక్ష్మి తనకు ఎరికేనా?’’....తలెత్తి లక్ష్మి ముఖంలోకి చూసిండు.  ఏందా చూపు  పెండ్లికొడుకు తీర్గ తయారై పెండ్లి జేసే పూజారి తీర్గ - ‘‘ఏంది తయారై తీరిపారి మంచాల గలాసలన్నవ్‍’’ - లక్ష్మి తడుకకు ఒరిగి -

                ‘‘లే - పిల్లను సూసుటాన్కి పోతన్న’’

                ‘‘సరే! మంచిదీ - నా పీడన్న పోతది - పోయినోనివి పోతివిగని ఏవ్వేసుకొనిపో’’ - అంది చిరుకోపంగా - శంకరయ్య హఠాత్తుగా లేచి లక్ష్మి మెడమీద కొప్పుకింద ముద్దు పెట్టుకున్నడు.

                ‘‘లే - లే - పో - తాగుపో’’-

                ‘‘ఆ నిషాఎప్పుడో పోయింది’’

                ‘‘మళ్ల ఈ నిషా ఎక్కిందా? లేడికి లేసిందే పరుగని’’ లక్ష్మి సుతారంగా వొదిలించుకొని గుడిసె బయటకు పోయింది.

                శంకరయ్య గుడిసె బయటకొచ్చి ‘‘ఆరున్నరకు మార్కెట్లమనోల్ల మీటింగున్నది - పోతన్న - ఆలిశ్యమైతదేమొ?’’

                ‘‘అదే నువ్వొక్కేనివే పోతన్నవ్‍ నేను రావద్దా?’’

                ‘‘ఆడ గడబిడయితదేమొ?’’

                ‘‘అయితేంది? మీరు కొట్లాడ్తరుగని మేం గీ గుడిసెల్లనే కూసుండి మురిగిపోవన్నా?’’ ఎప్పటికి మాఎంటుండి దుడ్డు పట్టుకొని కావల గాత్తరా?’’

                ‘‘సారలి గ్యాంగు గుండా గాళ్లత్తరేమొ?’’

                ‘‘రానియ్యి - ఆనిపురసాలమీద తంటే సత్తరు. ఆనాడు తయారుగలేముగాని - మొగోళ్లు మీరేం అనుకుంటరేమొనని - గని - తోలుదీసి దోర్నాలు గట్టకపోదుమా?’’ శంకరయ్య లక్ష్మిని కొత్తగా భయంగా చూసిండు.

                ‘‘పో - తయారు గాపో - ఇద్దరంపోదాం ’’ లక్ష్మి అయిదు నిమిషాలల్లో తయారైవచ్చింది. ఇద్దరు గుడిసె బయటకొచ్చినంక - ఇంతకు ముందైతే - శంకరయ్య ముందు నడిచేటోడు - లక్ష్మి అయిదు గజాల వెనుక నడిచేది. ఇద్దరు పక్క పక్కనే నడుస్తున్నారు. వాళ్ల గళ్లీ దాటి మేన్‍ రోడ్డుమీదికచ్చిండ్లు. కరంటుబుగ్గలెలిగినయ్‍...

                ‘‘నా రాజుయినవా? లండబోల్ల పిల్లగాడు కరపత్రం మళ్ల సదివిండు. - గిప్పుడు కొంత అర్థమైంది. మీటింగు సంగతి చెప్పిండు. నువ్వు పోయినంక - ఇది వరకు లేదుగాని - ఇప్పుడు వచ్చేదాక మనుసుల బట్టది. పిస్సలేత్తది. ఏమైందోనని - ‘‘లక్ష్మికంఠం ఆత్మీయంగా - పక్కనే నడుస్తూ...

                ‘‘మరి రోజుడూటీకి పోతన్నగద - గదిడేంజర్‍గద’’

                ‘‘గీ కరపత్రం తోనే కొద్ది కొద్దిగ మీరేంజేతండ్లో తెలుత్తంది. అంతకు ముందు బేఫికరుగుండేది - మీరేంజేత్తరో తెలువది గదా?’’

                ‘‘కరపత్రంల రాసిందానికన్న పనికాడ బవుతకిలీబుంటది’’

                ‘‘గిప్పుడు తెలుత్తంది. అందరెందుకు తాగుతరో? అంటేసిన బొగ్గుపొయ్యిల తీర్గ మంటర మంటరుంటరో?’’ శంకరయ్య, లక్ష్మి మార్కెట్టుకుపోయే రోడ్డ మీదకచ్చిండ్లు - చాలా మంది కాలినడకన, సైకిల్ల మీద మార్కెటు దిక్కు పోతండ్లు -    ఆడవాళ్లు తక్కువనే -

                ‘‘ఆడోళ్లు ఎవలత్తలేరుగదా?’’

                ‘‘నాగయ్యబావ, హరీపన్నలాగా - నీలాగా రానియ్యద్దా?’’ రాకపోతే మాకెట్లతెలుత్తది’’ మార్కెటు కాడికొచ్చేసరికి - వందలుగాదు వేలమంది జమైండ్లు - పెద్ద పెద్ద లైట్లు బెట్టిండ్లు మార్కెట్టు వెలిగిపోతంది.

                ‘‘ఓహ్‍ - నువ్వు నన్నువిడిచి పోకు గింతమందిల కాటగలుత్త’’

                ‘‘బాతాలు జేత్తివిగదా?’’

                ‘‘శంకరయ్య ఎడమచెయ్యిని తన కుడి చెయ్యిలోకి తీసుకొని ‘‘గాయింత చెయ్యకపోతే మొగోళ్లు మమ్ముల బతుకనిత్తరా?’’

                శంకరయ్య మొట్ట మొదటిసారిగా గాలిలో తేలిపోతున్నట్టుగున్నది. బిజరబిజరమందీ - శంకరయ్య, లక్ష్మి నడుస్తున్నారు. తెలిసినోళ్లెవలన్నా కన్పిస్తరేమొనని వెతుకుతండ్లు. మంది కేమైందో గిప్పుడే చీకట్లనుంచి వెలుగులగు వచ్చినట్టు - పెద్దగా మాట్లాడుకుంటండ్లు. ‘‘గీ మద్దెన నువ్వు డూటీకి పోయిన వంటే - ఇంటికచ్చేదాకా - అంత ఎట్లనో ఉంటంది’’ లక్ష్మి శంకరయ్య చెవుల చెప్పింది అదోవిధమైన కంఠస్వరంతో...

                ‘‘నిజంగనా?’’ శంకరయ్య....

                ‘‘ఓ అన్నా - వదినా! మీకోసం వెతుకుతన్న’’ మొగిలి ఒళ్లంతా కళ్లు చేసుకొని మొదటిసారిగా శంకరయ్యను అలాయిబలాయి తీసుకున్నడు వెలిగిపోయే మొఖంతో...

                శంకరయ్యకు ఇది కొత్తే - మనుషులకేమయితంది. ఈ మనుషులులావుటోల్లే - మనుషులను - ముదిరిపోయి - గిడుసబారిన మునుషులు ఇంత మంది ఒక్కసారి జమైతే గట్లనే ఉంటదా? అందరు తాగినట్లు ఏదిఏమైనా? ఏదో కావాల్సి దగ్గరయ్యే మనుషులకన్నా! నాగన్నవాళ్లు అట్లకాదు. మరెట్లా?

                ఈ సంగతేందో? తేలకముందే - మొగిలీ - రాజేశ్వరిని గీడికి తీసుకరాకపోయినవా?’’

                ‘‘మా వత్తనన్నది - కని ఆడోళ్లు వత్తరో రారోనని - నువ్వత్తనంటే తీసుకత్తును...’’ మొగిలి మార్కెట్లో మధ్యలో బల్లలేసినట్టున్నది... స్టేజీమీద బాయి మీద పాడినట్టే పాటలు పాడుతండ్లు. శంకరయ్య, లక్ష్మి మొగిలి కలిసి అంతకలెదిర్గిండ్లు ఒక చోటసుట్టూ పదిమంది నేసుకొని రెహనా కన్పించింది. రెహనా వెలిగిపోతూ - లక్ష్మికి చేతుల చెయ్యి గల్పి - అలాయి బలాయి తీసుకున్నది.

                ఇంతట్లనే - పోలీసులు కన్పిచ్చిండ్లు - మీటింగు సుట్టూ తిరుగుతండ్లు. లక్ష్మికి భయమయ్యింది. చెవులో గుసగుసలాడింది.

                ‘‘అక్కా - పోలీసోల్లచ్చిండ్లు - గుండే గాళ్లచ్చిండ్లా?’’

                ‘‘గుండెగళ్లత్తే గింతమందిల తొక్కిసంపరా?’’

                ‘‘మరి పోలీసోలు?’8

                ‘‘భయంపోవన్ననేగదా! మనోళ్లు మీటింగు పెట్టింది. మనమేమన్న లంగలమా? దొంగలమా? యూనియనోళ్లు ఓట్లకోసమచ్చినోళ్లు మీటింగులు పెట్టుకుంటలేరా? గట్లనే - మనకు హక్కులున్నయనేగదా? గోదావరిఖనిల మీటింగు పెట్టుకునేది - గందుకోసమే గదా! అందరికి మీటింగు బెట్టి చెప్పుడు’’

                ‘‘ఓ నువ్వు గీడున్నవా? ఓయ్‍ బావా? రా వట్టెటోళ్లు లేరు - కోరసిత్తువురా?’’ హరీప్‍ శంకరయ్య సిగ్గు పడుతుండగానే - హరీప్‍ శంకరయ్యను స్టేజీమీదికి తీసుక పోయిండు. లక్ష్మి, మొగిలి, రెహనా గుంపు దగ్గర కూర్చున్నారు. ఇంతలోనే బక్కయ్య అనే ఫిల్లర్‍ సొలుగుతూ వచ్చి వాళ్ల పక్కకు కూర్చున్నాడు. అను తడబడే గొంతుతో ‘‘వాళ్లంత ఎవలు?’’ అడిగిండు మొగిలిని - ‘‘రాడికల్లు’’ మొగిలిచెప్పిండు. జెబర్దస్తీగ ఎగురుతండ్లు నాతీర్గ మందు గిన ఏసిండ్లా?’’ అడిగిండు. ‘‘ఎహె   వాళ్లు తాగరు’’ మొగిలి. గీమీటింగు బెట్టి ‘‘మారైతే గంత గుండెధెర్నం ఎట్లచ్చింది మందేత్తే నేనుపులి - ఎయ్యకపోతే పిల్లి’’ వీరులారా మీకు ఎరెర్ర దండాలు’’ పాట పాడుతున్నరు. తర్వాత గంగాధర్‍ ఎమర్జెన్సీ కన్నాముందు ఆ తరువాత జరిగిన విషయాలు చెప్పుకొచ్చిండు. అ తరువాత  సింగరేణిలో జరిగేదోపిడి, దౌర్జన్యాలగురించి వివరించాడు.

                లక్ష్మి, మొగిలికి, రెహనాకు వాళ్లకు అంతదైర్యం ఎక్కడి నుంచివచ్చిందో చెప్పలేకపోయారు. మీటింగు అయిపోయే సరికి రాత్రి పది గంటలయ్యింది. శంకరయ్య, లక్ష్మి గుడిసె చేరుకునే సరికి పదిన్నరయ్యింది. తిని పడుకునేసరికి పదకొండు.

                ‘‘లక్ష్మి నువ్వు బాగున్నవే?’’శంకరయ్య తమకంగా - ‘‘ఎంతబాగ?’’

                ‘‘మీటింగంత బాగున్నవ్‍’’

                ‘‘నువ్వు మంచిగ సుతివట్టినవ్‍ - ఎగిరినవ్‍.. ఔను ఒక తాగినాయిన - గంత గుండెధైర్యం ఎట్లచ్చింది. తాగిండ్లా అన్నడు’’

                ‘‘పాట కల్లు, సారా కన్న పెద్దనిషా - నిజంగనే స్టేజీ ఎక్కంగనే పుల్‍బాటల్‍ గొట్టినట్టయ్యింది’’

                శంకరయ్య లక్ష్మిని తమకంతో ముద్దులాడిండు. ‘‘మళ్ల ఇదోటా’’ లక్ష్మి పెండ్లి అయినప్పటి నుండి మొట్టమొదటిసారిగా -ఇద్దరు ఒకరి కొకరైపోయారు. నిశిరాత్రి - మైకంలో లక్ష్మి, శంకరయ్య.

 

                                                                                                                15

               

                సన్నగా తుంపరపడ్తంది...రాత్రి బజిలీకి పోయచ్చి - పదింటికి తిని నిదురబోయిండు మొగిలి... రెండుగంటలకు తెలివచ్చింది. మంచంలో లేచి కూర్చున్నడు - ఇప్పుడే తెల్లారి నట్టున్నది... 

                ‘‘పండుకోకపోయినవ్‍ ఇంక పొద్దంగలేదు’’ రాజేశ్వరి పీటమీద కూర్చున్నది. ఇంతలోనే గుడిసెముందు నాగయ్య తలకు వరుకు సంచి   పెట్టుకొని కన్పించిండు.

                మొగిలి, రాయేశ్వరి బయటికి వచ్చిండ్లు. ‘‘అబ్బా! ఏం దారి అంత బుడుగు. డూటీలకు ఎట్లపోతన్నరు?’’  దదడిపుల్ల తీసి కాళ్ళకు అంంటిన బురద రాకేసిండు.  రాయేశ్వరి అంపులకాడి నుంచి కంచు ముంతల నీళ్ళు తెచ్చిఇచ్చింది. కాళ్లు కడుక్కొని గుడిసెలకు వచ్చిండు. అంగంత తడిసింది.. బాగా అలిసిపోయినట్టున్నడు. మొగిలి తువ్వాల తెచ్చి ఇచ్చిండు. తలంత తుడుచుకున్నడు. రాజేశ్వరి మొగిలి ధోవతి తెచ్చి ఇచ్చింది.

                ‘‘మొగిలి అంగున్నదా?’’

                ‘‘నాయన్ని ఖమీజులాయె - బుస్కోట్లు కాదాయె’’

                నువ్వింక మారలేదుర తమ్మీ?’’ ఖమీజువేసుకుంటూ రాజేశ్వరి బొగ్గుపొయ్యి అంటేసి చూరుకింద బెట్టింది. ‘‘మరి మరదలుకు ఒక్క సిన్మా అన్న సూపెట్టినవాలేదా?’’ మంచంలో కూర్చుంటూ...

                ‘‘ఏడన్నా - గుడిసె కట్టెటాల్లకే పానం మీది కచ్చింది. అందరుతలో చెయ్యేసే పటికె అయ్యింది గని - అయ్యేదా? పాపం హరీప్‍ గుడిసె పనట్లనే ఉన్నది - అయినేమొ మీటింగని ఇల్లు వట్టకుంట తిరుగుతండు.’’

                ‘‘రాయేశ్వరి పాలున్నయా?’’

                ‘‘చాయపెడుతబావా! ఎంతల మీరు మాట్లాడుకుంట ఉండుండ్లి - ‘‘నేను పెడుత అవ్వల్దర్జుచాయ్‍, పొయ్యి ఎంత సేపట్ల రడీ అయితది?’’ నాగయ్య చూరుకిందికి పోయి - కొంచెం గ్యాసు నూనె పోసిండు...

                పొయ్యి తయారయేసరికి అరగంట పట్టింది. వానతగ్గి ఆకాశం తేటగయ్యింది.

                నాగయ్య తడిసిన బట్టలు పొయి మీద కాపుకున్నడు. చాయ్‍ పెట్టిండు. ముగ్గురు తాగిండ్లు.

                రాయేశ్వరి కోడిగుడ్డు కూర, అన్నంవండింది. ఇద్దరు తిన్నరు.

                ‘‘మొగిలీ సైకిలు కొనక్కోలేదా?’’

                ‘‘శంకరయ్య బావ కొనిచ్చిండు పాత సైకిల్‍ గని మార్కెట్ల బెట్టిండట - ఎవలో ఎత్తుకపోయిండ్లు - ‘‘మల్ల కొనలేదా?’’ - నౌఖరి దొరికేటాల్లకే అప్పయింది. పెరడి బామని కిట్టయ్య దగ్గర గిర్విపెట్టి తెత్తి - అయ్యి మిత్తి పెరుగ వట్టె - గుడిసెకు పోశన్న పెట్టిండు. బదిలీ పిల్లరాయె - డ్యూటీలు నెలకు పదిహేను దొరుకుతన్నయి?

                ‘‘మరెట్ల పోతన్నవ్‍రా!’’

                ‘‘నడిసే’’ - నాగయ్య బట్టలేసుకొని తయారయ్యిండు. ‘‘మీటింగు ఇంకా మూడొద్దులేఉన్నది. పనులన్ని అట్లనే ఉన్నయి. నా ఎంట వత్తవా? మల్లే బజలీ’’ - ‘‘రేపు రెండో బజిలీ’’

                ‘‘బావా మీరేసిన కరపత్రం సదివిన’’ రాజేశ్వరి మెరిసే కళ్లతోని.

                ‘‘అయితే నువ్వేనన్న మాట - వీళ్ల గురువువు - మరి మనోనికి సదువు చెప్పుతన్నవా? లేదా?’’

                రాజేశ్వరి సిగ్గుపడ్డది. అదేందో మొగిలికి అర్థంకాలేదు. లోపలినుండి కరపత్రం తీసుకవచ్చింది.

                మొగిలి తీసుకొని అటిటు చూసిండు.

                ‘‘మరి మొగిలికి చదివి విన్పిస్తివా?’’

                ‘‘లేదు. మొన్న శంకరన్న, లక్ష్మిక్కా, రెహనక్క వచ్చిండ్లు - శంకరన్న తెచ్చిండు - నాతోని సదివిచ్చిండ్లు - మొన్నటి నుంచి నాలుగు పారీలు సదివిన’’ -

                ‘‘ఓరినీ! మరదలే హుశారున్నది. మరి అర్థమయ్యిందా?’’ రాయేశ్వరి కుడిచెయ్యి ఊపి అర్థం కాలేదన్నట్టు చెప్పింది.

                ‘‘ఔను మీరిద్దరు గోదావరిఖని మీటింగుకు రావాలె - గప్పుడు చాలా సంగతులు తెలుస్తయి. తెలువాలె ననేగదా! ఔ - రాయేశ్వరి - రాత్రి బజిలికి మొగిలి పోతే ఒక్క దానివి ఉంటన్నవా?’’

                ‘‘మొదట్ల భయమయ్యింది. వారం దినాలు రెహనక్క పడుకున్నది. నాలుగైదు రోజులు లక్ష్మి అక్క ఉన్నది - ఇప్పుడు అలవాటయ్యింది.’’

                ‘‘మొగిలీ బట్టలేసుకో - పనున్నది.’’ మొగిలి బట్టలేసుకున్నడు.

                ‘‘రాయేశ్వరి - పనిమీద పోతన్నం - రాత్రికి మొగిలి రాడు. రేపు పొద్దుగాల వస్తడు.’’

                ‘‘సరేబావా!’’

                                                                                                16

                సింగరేణి క్వార్టర్ల దగ్గర మూల మీది టేల దగ్గర సైకిల్‍ కిరాయకు తీసుకుందామనుకున్నరు.

                ‘‘ఇగో పాషా గీనే మీ తమ్ముడు’’ నాగయ్య పరిచయం చేసిండు... మొగిలి ఆశ్చర్యపోయిండు’’ తను ఇక్కడే ఉంటున్నా ఎవలు తెలువదు. నాగన్నకు ఎంత మంది ఎరుకో... మనుసులో అనుకున్నడు. అవసరముంటే మావోనికి సైకిలియ్యి కిరాయకు.’’

                ‘‘తప్పకసార్‍ - ఏ బాయికి చేత్తవ్‍?’’

                ‘‘కెకెటూల’’ మొగిలి చెప్పిండు.

                ‘‘బాయీసాబ్‍! అగో గసైకిల్‍ కొంటబో - నాదగ్గర నాలుగు నెల్లు తిరిగింది. నెలకుపది రూపాల చొప్పున పదినెల్లు ఇయ్యిపో’’ పాషా...

                ‘‘అరెభయ్‍ ఎవల పడితే వాళ్లను నమ్ముతే దివాళతీస్తవ్‍’’ నాగయ్య సైకిల్‍ను అన్ని బాగున్నయే లేవో చెక్‍చేసి చూసిండు.

                ‘‘అందరి కిత్తనా! మీరు మా హరీషన్న దోస్తులు. మేరేకు మాలూమ్‍ అన్న. మొకం సూత్తె తెలుత్తది. నమ్మకం లేకపోతే పని నడువదన్న... మీరిప్పుడు తీసుకపోయి సూడుండ్లి రేపు నా దగ్గరియ్యిండ్లి... బిల్‍కుల్‍ నయాకర్‍కే దేతాహూం’’ పాషా.

                నాగయ్య సైకిలు నడుపుతున్నడు. మొగిలి వెనుక  కూర్చున్నాడు.

                ‘‘అన్నా ఏడవోటే ఆడ గింతమంది ఎట్ల ఎరికైండ్లే’’ మొగిలి...

                ‘‘మా పని పదిమందిని కలుసుడేగదే’’

                ‘‘అన్నా కొత్త దెతుంటదే?’’ అన్నడు మాటమారుస్తూ...

                ‘‘ న్నూటయాభయుంటది. మనోడె మోసం చెయ్యడు. గిప్పుడు సెకండుహాండు సాలు - నెలకు పది రూపాలియ్యి - కిరాయకు తీసుకున్నవనుకో’’

                ‘‘పాషాకు నట్టం జరుగిందేమొ?’’ పోయిన సైకిల్‍ నూటయాభైకి కొన్నం’’

                ‘‘లేదు లేరా! ఒక్కోకాడ ఓ రేటు ఇందట్ల కంపినీ బట్టి రేట్లుంటయి. ఫిలిప్స్ ఎక్కువుంటది.

                ‘‘లేదు లేరా! మరోకాడయితే మోసం చేసి అంటగడ్తరు. పాషా మంచోడు. మోసగాడు కాదు. నియ్యతి మనిషి.’’

                ఇద్దరు కలిసి మార్కెట్‍కు పోయిండ్లు - అక్కడ మొగిలికి తెలువని మరో అయిదుగురున్నరు. వాళ్లందరు కలిసి హోటల్‍ కాడ చాయ్‍ తాగిండ్లు - పైసలు వాళ్లే కట్టిండ్లు..

 

                అటునుండి పోతుంటే ‘‘గిక్కన్నే కిష్ణారావు దొరుంటడు’’ మొగిలి సైకిల్‍ తొక్కుకుంటన్నడు.

                ‘‘మా ఎరుకే - సిక్కులాయినె, వీడు కలిసి చిట్టీలు నడుపుతరు. నూటికి పది మిత్తి కిత్తరు. వీడు ఆయన భార్యకు సూటి వెట్టిండు. అదోపెద్దకథ - దొరలు ఏదైనా వాడుకుంటరు. మంచిగుంటె సాలు - వాళ్ల కన్నుబడితే ఎట్లనైన తీసుకుంటరు.’’ ఇంటి ముందు సారలి గ్యాంగు గోడపక్క కట్టిన సింమెంటు గద్దెమీద కూర్చున్నరు.

                ‘‘మొగిలి వాళ్లతోని కొట్లాటైతది మనం ఇరుక్కపోతం - పనులు బాగున్నయి’’ మొగిలి సైకిలాపిండు ‘‘ఎందుకే?’’ అడిగిండు. సైకిల్‍ నాగయ్య తీసుకున్నడు. వీళ్లు మెంటల్‍ గాళ్లు పొద్దందాక కార్మికుల నుంచి వంతు సీసావసూలు చేసింది తాగుతరు. మనసోయి మీదుండరు. వాళ్లకు బారాఖూన్‍ మాపి. జన్నె కిడిసినట్టు ఊరిమీద పడి తిరుగుతరు. వీళ్ల పీడతోని గీ కాలరీ అంత గజగజ వనుకుతందనుకో - సూడలే - వీళ్ల గాయి ఎంతదాక నడుత్తదో - మనమే ఏదన్న చెయ్యాలె? దొర ఇంటికాన్నయితే -చెప్పులేసుకొని తిరుగద్దు - రుమాలు చుట్టుకోని తిరుగద్దు’’ ఇప్పుడు కొద్దిగ తగ్గిండ్లు - మూడేండ్ల కిందటిదాకా అట్ల కన్పిచ్చినోళ్లను గుండాగాళ్లు లోపటేసి తన్నెటోళ్లు’’.

                మొగిలి ముఖమంతా నెత్తురు పేరుకున్నది. అతను ఎప్పటినుంచో వాళ్లను తన్నాలనుకుంటున్నడు. అన్నా గీల్లేనే మార్కెట్ల లక్ష్మివదినెను ముట్టుకున్నరు.

                ‘‘నీ యవ్వ ఒక్క గుద్దుకు’’ -  మొగిలి గులిగిండు.

                ఎరికే తమ్మి వీళ్ల చరిత్రంతాఎరికే. వీళ్లు ఒక్క గుద్దుతోని పోయేటోళ్లుగాదు. దొరలు, కంపినోళ్ల సేతుల తుపాకులు.

                ‘‘అంత ఈజీగాదు మొగిలీ! ఇదంతా పెద్దలింకు - బొగ్గు బాయిలే దొరలతోటి నడుత్తన్నయంటే ఎంతపెద్ద బలగం - దీని సంగతులు తెలుసుకోవాలె - ఏదిచేసినా ప్లానుతోని జెయ్యాలె - మందికి ఎరుకై మంది పూనుకుఒని చెయ్యాలి. గీ ఒక్క కాడలేదు - పల్లెలనుండి ఢిల్లీ దాకా ఉన్నదిది. గందుకనే కదా గింత తిరుగుడు.’’

                ‘‘ఏందిబే - అక్కడ గుసగుస - పోండ్లి. గు...రేగిందా?’’ సారలి అరిచిండు. లాగుజేబులో నుండి బటన్‍ చాకు తీసి అంగిజేబులేసుకున్నడు. నాగయ్య సైకిలు ఎక్కిండు మొగిలిని ఎనుక కూసుండమన్నడు వాళ్ల గ్యాంగును అంచనా గడుతూ - స్పీడుగ వాళ్ల ముందు నుంచే సైకిల్‍ పోనిచ్చిండు. సారలి అరస్తున్నాడు. శంకరి వెనుక పరుగుత్తుకొచ్చిండు. మూల మలుపు దుకాణం కాడ ఆగిండ్లు... శంకరి, మరొకరు తిట్టుకుంట వెళ్లి పోయిండ్లు... నాగయ్య మొఖం చూసిండు. మొగిలి నదురు బెదురులేదు. మొగిలికి గుండెదడ తగ్గింది.

                ‘‘వాళ్లకు మనం దొరుకుతే’’ - మొగిలి ‘‘మనం కలవడుదుము. వాళ్లపని ఇప్పుడే అయిపోవు’’ నాగయ్య బటన్‍చాకు మడిచి లాగుజేబులేసుకున్నడు.

                రెండు పలుకలు, బలపాలు, రెండు పెద్దబాల శిక్షలు కొన్నాడు. ఏమి ఎరుగనట్టే - మొగిలికి బటన్‍చాకే కన్పిస్తున్నది. ‘‘మొగిలి గీ చాకు, గూండాగాళ్ల   సంగతి ఎవలతోని అనకు’’ నాగయ్య 

                ‘‘అననే...’’

                ‘‘గీ పలుక లెందుకే?’’ మొగిలి...

                ‘‘లక్ష్మి వదిన కొకటి - నీకొకటి - మీరు సదువుకోవాలె - సకలం తెలుసుకోవాలె’’ - నాగయ్య చిరునవ్వు నవ్వుతూ...

                కరంటు బుగ్గలెలిగినయ్‍. ఏడు గంటలకు శంకరయ్య ఇంటికి పోయిండ్లు...

                లక్ష్మి బీరపువ్వు పూసినట్టు నవ్వింది. శంకరయ్యలేడు.

                ‘‘వదినా! అన్నెటుపోయిండు?’’ నాగయ్య...

                వాస్త వాస్త నాయిల్లు ముంచేటట్టున్నవ్‍గద.

                ‘‘పిస్సలేపిండ్లు - గదా! ఆగుతలేడు. పాటలు పాడటానికి తిరుగుతండు షరీపన్న వచ్చితీస్కపోయిండు’’

                ‘‘నేను కలిసిందెప్పుడు ఏదన్న పిస్సలేతే నీతోనే’’

                పలక - పెద్దబాల శిక్ష పుస్తకం - లక్ష్మిచేతుల పెట్టుకుంట నాగయ్య...

                ‘‘గియ్యెందుకు? నన్ను లంగేసుకొని బడికి పొమ్మన్నవా? ఏంది?’’

                ‘‘నవ్వొక్కదానివేనా? అన్ననెక్కరేసుకొని బడికి పోవాలె’’

                ‘‘సరే సంబుడం’’ - అపురూపంగా పలకను, పుస్తకాన్ని గుండెల కదుముకున్నది - పుస్తకం వాసన చూసి’’ బలేవాసనున్నదే?’’

                ‘‘పిలడా! బజారుకుబోయి చికెన్‍దేపో’’ మొగిలికి చెప్పింది.

                ‘‘రాయేశ్వరి గుడ్డుకూర పెట్టింది...పోవాలె - మల్లత్త పనున్నది. మీరిద్దరు మీటింగుకు రావాలె’’

                ‘‘మరి మీ అన్న తీసుకత్తడో రాడోకద’’

                ‘‘అన్నను ఇంట్లుంచి - నువ్వురా’’ నాగయ్య...

                ‘‘పిలడా! మా సంసారం గిప్పుడే గాడిలపడ్డది. పుల్లలు వెట్టకు -నువ్వెన్ని ఇకమాతులవడ్డ - నేను నిన్ను చేసుకునేదిలేదు.’’ లక్ష్మి వక్కడ వక్కడ నవ్వింది.

                ‘‘మారే మీ తీరుగ నేను గీ ఊబిల దిగగదా! సంసారమంటే నానుంచేడయితది. - ఎన్ని గావాలె’’ నాకు గంత సత్తాలేదు.

                ‘‘మందికి మాటలు సెప్పుకుంట దిర్గినట్టుగాదు. పెండ్లయితే నీకాళ్ళిరుగుతయ్‍’’ లక్ష్మి - ‘‘నేను మొగలి సారలిని, శంకర్‍గాన్ని చూసినం’’ నువ్వుభేఫికర్‍గుండు నాగయ్య మొగిలికి ఏదన్న మాట్లాడాలని ఉన్నది కాని - ఏం మాట్లాడాలో తెలియలేదు.

                ‘‘వదినా! కొత్త సైకిల్‍ గొన్న’’ మాటమారుస్తూ మొగిలి - బయటకు వచ్చి చూసింది.’’ అరె మీ అన్న సూసినదానికన్న మంచిగున్నది - ఎంతకు గొన్నవ్‍?’’ మల్ల పోగొట్టుకోకు - తాళమేసి పెట్టుకో’’

                ‘‘కొనుడెక్కడిది? అల్లుకుబోతె పిల్ల దొరికినట్టు - కిరాయ తీసుకుందామని పోయినం - అయినెను షరీపన్న పరిచయం చేసిండు - తెలిసనాయినె - తమ్మునికి పరిచయం చేసిన - అర్థంచేసుకున్నడు. అయినె దగ్గర ఇరువై సైకిల్లు కిరాయకు తింపుతడు. మనోనికి వాయిదాల పద్దతినకట్టుమని నూరు రూపాయలకు ఇచ్చిండు.’’

                ‘‘నక్కను దొక్కినవుపో - మరి పార్టీ ఇచ్చిండో లేదా?’’ లక్ష్మి తమాయించుకొని - ఆ అవమానాన్ని పొడిగించుకోదలుచుకోలేదు. అందులో నాగయ్య ముందు.

                అన్నకు గసొంటియి అలవాటులేదుగద’’ - మొగిలి ‘‘కాలేరీ మీదికచ్చి తాగుడలు వాటయ్యిందారా?’’ నాగయ్య ఆశ్చర్యపోతూ -

                ‘‘లేదన్న - అప్పుడప్పుడు. కొంచెం కొంచెం’’ మొగిలి సిగ్గుపడుతూ -

                ‘‘వద్దురా! అదోలంపాటకం - బతుకే పెద్దనిషా - దాన్ని మించింది లేదు.’’

                లక్ష్మి ముఖం మాడిపోయింది.

                అయ్యో పాట పెద్ద నిషానట మీ అన్న సెప్పిండు.

                ‘‘మీ అన్న గూడ మీ పిస్సలవడి - మునుపటితీర్గ తాగుతలేడు - ఎంత కాలముంటడోగని’’

                ‘‘ఔనుగని - మొగోళ్లు తాగటానికి సవాలచ్చ బాధలు చెప్పుతరు - ఆడిదానికన్నేక్కువ బాధలున్నయా? మరి ఆడోళ్లు తాగరెందుకు?’’ లక్ష్మి...

                ‘‘మంచి ప్రశ్న వదినా? వాళ్లు బతుకును ఉన్నదున్నట్టు సూత్తరు. కట్టాలల్లనుంచి నేర్సుకున్నరు నిలబడ్డరు. తాగుడమంటే తపించుకోవడం - ఆడవాళ్లకు తపించుకోను దారి లేదు గదా! వళ్లకు బతుకోనషా. పిల్లలు సంసారం ఇల్లు - ఇరుగుపొరుగు వదినా ఇయ్యల్ల బస్టాండుల బస్సులకోసం ఎదిరి సూత్తన్న - ఆదరబాదరగ ఒక కుటుంబమచ్చింది. ఇద్దరు పిల్లలు - రెండు బ్యాగులు - మొగాయన పాన్‍టేలా దగ్గరికి పోయి జర్దాపానేసుకచ్చిండు - బీడి బస్సబస్స పీల్సుకుంట దూరంగ నిలుసున్నడు. ఆతల్లి పిల్లల నిద్దరిని కుదురగ కూర్చుండబెట్టిరెండు బ్యాగులు పక్కామెకు చెప్పి - ముంగటికి పోయి మూడు మల్లెపూల దండ దెచ్చుకొని తలల బెట్టుకొని - కుదురగ కూసున్నది - మల్లెపూలనిగాదు. మొగోనికి దేనిమీద సోయిలేదు. దేన్నయినా ఖరాబుచేసుడే ఆడోల్లు ఎంత చిన్న జాగా అయినా వెలిగిత్తరు’’. ప్రతి చోట, ప్రతినిమిషం జాగ్రత్తగా ఉండకపోతే ఆడవాళ్లకు నడువది.

                ‘‘నిన్ను ఎవతి చేసుకుంటదోగాని - సుఖపడ్తదిపో’’

                ‘‘మల్లగదేమాట - సంసారంల సుఖమేడ కాలిపోతది. సుఖం మన సుట్టున్న అందట్ల ఉంటది. మొగిలికి ఇదంతా ఏం అర్థంకాలేదు. లక్ష్మి చక్కరతెచ్చి మొగిలికి, నాగయ్యకు పెట్టింది కొత్తసైకిల్‍ ధావత్‍ అన్నది. ఏడు గంటలకు బయట పడ్డరు. మొగిలి సైకిల్‍ తొక్కుతున్నడు.

                పాషా దుకాణం దగ్గరికి వచ్చిండ్లు. -

                ‘‘మొగిలి జేబులేమన్న పైసలున్నయారా?’’

                ‘‘ఉన్నయే పదిహేను రూపాయలున్నయి’’.

                పదిరూపాలు పాషాకిచ్చిండు.

                ‘‘పాషాబై సైకిల్‍ జబర్దస్తీగున్నది. మేం పనిమీద బెల్లంపల్లి పోతన్నం ఇంకా తొంభై రూపాయలు నెలకు అయిదిస్తడు.  ఎవడైనా బచ్చెగాడుంటె - గీ సైకిల్‍ దీస్కపోయి వీళ్లింట్ల పెట్టియ్యి. ఇగో - గీ పలుక, పుస్తకంకూడా’’

                ‘‘టీకై అన్నా - మాతామ్‍, ఇన్‍కా ఘర్‍ మాతామ్‍ - కొత్త గుడిసెలుగదా! షరీపన్న ఇంటికాడ’’

 

                                                                                                                17          

 

                నాగయ్య, మొగిలి, గంగాధర్‍ ఇంటికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిదయ్యింది. అది సింగరేణి వర్కర్ల క్వార్టర్‍ - దాని వెనుక భాగంలో రేకులతో సాయబాను దించి -రేకులతో - తడుకలతో పెద్ద రూంలాగా చేశారు. అందులోనే వంట - ఎవరు వచ్చినా విడిది.

                అక్కడ గంగాధర్‍ అమ్మ లక్ష్మమ్మ అన్నం కూరగంజులు ముంగట వెట్టుకొని కూర్చున్నది. ఆమె చుట్టు - పళ్లెం, మూతగాజు ఏదుంటె అది పట్టుకొని ఎనమండుగురు కూచున్నరు.

                ‘‘దాండ్లి బిడ్డ - మీతోని పదైతరు. లెక్క కలుత్తలేదని - గంగన్న మెల్లగ సప్పుడు గాకుంట వొయి మూలకు బియ్యంఉన్నయి -సోడన్ని తేపో - పెడుదాం - ఎందుకైనా మంచిది’’ - లక్ష్మమ్మ

                ‘‘ఎందుకైనా మంచిది ఇంకో మానెడు పెడితే - మాట్లాడుకునే దయిపోయినంక మరో అలుగం తింటం’’ రాజన్న 

                ‘‘గంగన్న - ఎవలను తీసుకచ్చినా పర్వలేదుగని - గీ రాజన్నను తీసుకరాకు - మూడు రోజులకే నాయిల్లు గోడలతోటట్టు తినేత్తడు. మీ అయ్య మనందర్ని ఆవలికిఎల్ల గొడ్తడు’’. లక్ష్మమ్మ..

                ‘‘మంచిదే గద - మనకు జాగాలేదా?’’ మాతోటే ఉండేదు రాజన్న.

                మొగిలికి ఇదంతా నిజమో, పరాచికమో తెలియకుండా ఉంది. ఇంత మంది పనులిడ్సి పెట్టి, ఇల్లు ఇడవాటం విడ్సిపెట్టి, ఏరందీ రవుసులేకుంట తిరుగుతండ్లు - బిందాస్‍ తనేమొ? వీళ్లంటే - వీళ్లకన్న ముదురు ముసలమ్మే ఉన్నట్టున్నది.

                నాగయ్యతనో చిన్న గిన్నె తెచ్చుకున్నడు. మొగిలికో గిన్నె ఇచ్చిండు. గంగధర్‍ బియ్యంతెచ్చి కడిగి పొయ్యి మీద పెట్టిండు.

                ‘‘మా తమ్ముడు మొగిలి - కెకె టూ ల బదిలీఫిల్లరుగ  చేత్తండు’’ నాగయ్య...

                ‘‘తమ్మీ రడీగుండు. ఎప్పుడోగప్పుడు మీ ఇంటిమీద గిట్లనే బడుతం’’ రాజన్న -

                ‘‘ఎహె - అక్క మంచిది’’ గంగాధర్‍.

                ‘‘అడుగు వెట్టిన వన్నమాట - కానీయ్‍, షరీపన్న జెర జాగర్త’’

                ‘‘అడుగు గాదు మా బంగుళాలు - ప్లానుగీసి కట్టిన ఇంజెనీరేఅయినామో’’ షరీప్‍...

                ‘‘వొరే గంగన్న - వీళ్లు నిన్ను ముంచుతర్రా - నువ్వు ఇంజెనీరు సదివి - బంగారు బిళ్ళగొట్టి - మంచి నౌఖరిడ్సిపెట్టి గీ అవారా, గూండా గాళ్లతోని తిర్గి సెడిపోతివి, ఆరునెల్లు జేల్ల వడ్తివి - తిరుగలేక సత్తిమి - అగో చెల్లెండ్లు పాటలు పాడుతండ్లు - అయ్యకు బుట్టిన ఆరుగురు పరమభాగోతు లైతిరి. మీ నాయిన్న అంతకు ముందు నాతోని గంటకో మాటన్న మాట్లాడేటోడు - బిల్‍కుల్‍ మూగనోముబట్టిండు. నేనే చెడగొట్టిన్నంటండు’’.

                ‘‘మా అందరిని సెడగొట్టేది గంగన్నే’’ రాజన్న.

                ‘‘అయింది లచ్చక్క వయితెరిసింది’’. షరీప్‍ మూతులు సూత్తే ఏం తెలువనోని తీరున్నడుగని, పొడిచిండు. మధ్యల కలుగ జేసుకొని.. ‘‘ఇగో వీన్ని నమ్మకుండ్లి అసలే బొగ్గుబాయిలు - వీడు అగ్గితల్గ బెతుతడు నాలెముచ్చోడు. అన్నది - కొంచెం పప్పేస్తూ - అందరి ముఖాలు చూస్తూ మధ్యమధ్యల నవ్వుతూ మధ్యల కూర్చున్నకొత్త మనిషి ఏం మాట్లాడకుంట తింటండు.

                ‘‘కామ్రేడ్స్ - తొమ్మిదిన్నరకు కూచోవాలె’’ నన్నాడు. అతను చెయ్యికడుక్కొని - మూతి తుడుచుకొని - మొగిలి పక్కకు కింద కూర్చున్నడు.

                ‘‘పనెట్లున్నది?’’ అన్నడు స్నేహంగా...

                ‘‘నేలకు ఇప్పుడైతే పదిహేను మస్టర్లు దొరుకుతన్నయి’’. అన్నాడు మొగిలి...

                అగో ఆయన రఘు - రాజన్న తెలుసుగదా! ఆయన మోహన్‍చందర్‍, పాటలు పాడుతడు. గంగాధర్‍, ఎరికేగద - మేమంత లాకప్‍లల్ల గిట్లనే కల్సున్నం. గంగన్న చెల్లెండ్లు వాళ్ళిద్దరు. మా అందరికి అవ్వ - లక్ష్మవ్వ... గీ పట్టెకందరికి ఎరుకే - అవ్వ తిట్టకుంటే మాకు మనుసుల పట్టది...’’

                మోహన్‍ - కొంచెం దూరంలో చాపలు రెండు పరిచాడు. అందరు తిని - బోళ్లు తోమిండ్లు.

                ‘‘జేగర్త - మెల్లెగ మాట్లాడుకోండ్లి - మీ నాయిన్న ఇంట్లనే ఉన్నడు’’ తను, గంగాధర్‍ చెల్లెండ్లిద్దరు లోపలికి పోయి తలుపేసుకున్నరు.

                మొగిలికి విడిగా కింద సంచిబొంతలు పరిచి ఒక శద్దరిచ్చిండ్లు.

                ‘‘ఇగ పడుకో - మాకు చిన్న మీటింగున్నది’’ నాగన్న చెప్పిండు.

                ‘‘అన్నా గంగన్న వాళ్లు ఏమిటోల్లన్న’’ మొగిలి...

                ‘‘ఎందుకు తమ్మీ మానాయిన అడిగినట్టడుగుతన్నవ్‍. మాదిగలు’’ నాగయ్య ..

                ‘‘గందుకనే ఖుల్లం భుల్లంగున్నరు. మనోళ్లు బీసుకపోల్లు - పక్కుననవ్వరు’’ మొగిలి...

                మొగిలి నడుం వాల్చిండు కాని - నిదుర రవాడంలేదు. ఎందుకో అందరి కులాల గురించి అడుగాలనుకున్నడుగని - నాగన్న ఏమనుకుంటడో? వాళ్లందరు గుండ్రంగా కూర్చున్నరు - కొందరు బీడీలు ముట్టించిండ్లు - రఘు మధ్యల కూర్చున్నడు. సూడవోతే మనిషి బక్కగా - కంక బద్దలాగున్నడు. చురుకు చూపులు, ‘‘కామ్రేడ్స్’’ రఘు మొదలేసిండు. ఎమర్జెన్సీ తరువాత గోదావరిఖనిలో మనం పెడుతున్న మొట్టమొదటి పెద్ద మీటింగిది. ఇంకా మూడు దినాలే ఉంది. బాగాప్లాను చేసుకొని పని చెయ్యకపోతే - దీని ప్రభావం మన కార్యకలాపాల మీద పడుతుంది. సరే! మీరందరికి తెలిసిన విషయాలు గంగాధర్‍ ఏజెండా చదువు.

గంగాధర్‍ ఎజెండా చదివిండు.

- మీటింగుకు జనసమీకరణ, రవాణా

- మీటింగు స్టేజీ, టెంట్‍, మంచినీళ్లు, ఇతర వసతులు - పులిహోరపొట్లాలు

- లైజనింగు

- స్టేజీ నిర్వహణ, అతిధులు, మాట్లాడవలిసినవాళ్లు, విషయాలు

- సాంస్కృతిక  ప్రదర్శనాలు - సింగరేణి గురించి కొత్త పాటలు

- నిర్భందం - పౌరహక్కులు

- రైతాంగ పోరాటాలు

- విద్యార్థి సంఘాలు

- కార్మికబస్తీలు, ట్రేడ్‍ యూనియన్లు

- యాజమాన్యం, కార్మికచట్టాలు, పనిపరిస్థితులు

- గూండాలు - అరాచకశక్తులు

- ఇతరాలు

- విమర్శ - ఆత్మవిమర్శ

                మొగిలికి అందులో ఒక్కటి అర్థంకాలేదు.

                ‘‘అబ్బో వీళ్ల మెదట్ల ఎన్ని సంగతులున్నయో?’’ అనుకున్నాడు. మధ్యమధ్యన తెలివచ్చినపుడు కూడా వాళ్లు మాట్లాడుతూనే ఉన్నారు.

                మసుకుండంగనే నాగన్నలేపిండు. చీకటి చీకటి ఉండంగానే ఇద్దరు బయట పడ్డారు. ఎక్కడోల్లక్కడ పోయినట్టున్నది.

                ‘‘నిద్ర పట్టిందా మొగిలీ’’ నాగయ్య..

                ‘‘మా పట్టింది గని - ఎప్పుడు చూసిన మీరంత మాట్లాడుకుంటనే ఉన్నరు.  మందికోసం గింత తిప్పలు పడ్తండ్లు’’

                ‘‘ఔను మీటింగు ఎట్ల చెయ్యాలెనని?’’

                ‘‘అబ్బో! కట్టె కొట్టె తెచ్చే అన్నట్టులేదు ఎవారం’’

                నాగయ్య నవ్విండు. ఇద్దరు బస్టాండుకాడ ఇడ్లీలు తిని చాయలు తాగిండ్లు - బస్సెక్కేటాల్లకు బై బై అయ్యింది.

                ‘‘నిన్నటి నుంచి నాతో తిరుగతన్నవ్‍ - ఏం అర్థమయ్యింది’’ నాగయ్య.

                ‘‘నాకు కన్పిచ్చేది కాదు - కన్పియ్యనిది చానా కథున్నది. అన్పిచిందన్నా’’

                ‘‘గందుకే చదువుకోవాలె - అంత చిక్కురుబొక్కురుగా కన్పిస్తదిగని - లోపలికిపోతే - మనం పంటకోసం ఎన్ని సార్లు దున్నుతమో? గన్ని మతలబులుంటాయి. మన ఎనకటోళ్లు గదంత రాసి పెట్టిండ్లు’’

                ‘‘తెలిసినా కొద్ది నొప్పి ఎక్కువైతందన్నా’’ మొగిలి.

                ‘‘గదేమరి. ఎనుకటిది తెలుసెకోవాలె - ముందుకుపోవాలంటె గయ్యన్ని గావాలె - మనకే కాదు. సమాజం మొత్తం మలుకలు వడ్డది. చిక్కువడ్డది. దానిన సాపుజేసి ముందుకు నడిపియ్యాలో’’

                ‘‘ఎవలూ?’’

                ‘‘నువ్వే - ఇంకెవలు - మనమే. సరే - నాకు పనున్నది పోత - సిగ్గుపడకు - మరదలతోటిసదువు నేర్సుకో - మన షరీప్‍ కాడ మంచిమంచి వయిలున్నయి. చదువరావాలె’’

                ‘‘ఇంటిదాకాచ్చిపోరాదే?’’

                ‘‘ఇప్పుడు పనున్నది. మల్లత్త - మనోల్లత్తరు. నా తీర్గనే సూడు’’

                నాగయ్య షేకహాండిచ్చిండు. మొగిలి బస్సుదిగిండు. నాగయ్య అదే బస్సుల ముందుకు పోయిండు.

                                                                                                                        ( తరువాయి భాగం వచ్చే సంచికలో )

 

ఈ సంచికలో...                     

OCT 2020

ఇతర పత్రికలు