నవలలు

నవలలు

సైరన్ నవల  రెండవ పార్ట్ –  నాల్గవ  భాగం 

 సైరన్ నవల  రెండవ పార్ట్ –  నాల్గవ  భాగం  

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)                                                           

 

                                                                                 18

 

            శనివారం రోజు బాయిలు బందు. సాయంత్రం మీటింగయితే పొద్దటి రైలుకే పోదామని రెహనా అందరిని జమ చేసింది. షరీప్‍వారం దినాల నుండి ఇంటికే రాలేదు. మీటింగు ఏర్పాట్లల్లనే ఉన్నడు. శంకరయ్య రెండు దినాలముందే గోదావరిఖనికి పోయిండు.

            లక్ష్మి, మొగిలి, రాజేశ్వరి, కొత్త గుడిసెలోల్లు మరో నలుగురు పోశెట్టి - రైలెక్కిండ్లు. చంద్రకళ పిలగానితోని కట్టమైతదని రాలేదు. రైలు రామగుండలదిగి గోదావరిఖని పోయటాల్లకు ఉదయం తొమ్మిదయ్యింది.

            మీటింగు చౌరస్తా దగ్గర మంథెనకు పోయేతొవ్వకు పెద్ద మైదానంల పెట్టిండ్లు. వచ్చేది కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి జార్జిపెర్నాండేజ్‍ కను ఎటుబొయి ఎటత్తదోనని సింగరేణోల్లు స్టేజీకోసం కర్రలు, కంకబొంగులు, బల్లలు, టెంట్లు ఇచ్చిండ్లు - పెద్ద పెద్ద లైట్లు బెట్టిండ్లు. చాలా చోట్ల మంచి నీళ్లు ఏర్పాటు చేసిండ్లు. స్టేజీదగ్గర అన్నిడివిజన్ల నుండి వచ్చిన సింగరేణికార్మికులు విద్యార్థులు వందలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నరు. స్టేజీవెనుక కార్యకర్తల కోసం గాడిపొయ్యిల మీద వంటలు చేస్తున్నరు.

            రెహనా అందరిని వంటలకాడికి తీసుక పోయింది. అందరు ఉప్మాతిని చాయ్‍ తాగిండ్లు. ఆడవాళ్లందరు కూరగాయలు కోసుడు - కడుగుడు వంటల దగ్గర బిజీ అయిపోయిండ్లు.

            మొగిలి - పోశెట్టి స్టేజీ దగ్గరికి పోయి వాళ్లతో పాటు పనిలోకి దిగిండ్లు - స్టేజీకి పదిగజాల దూరం బారికేడ్లు కట్టిండ్లు - ఆడవాళ్లకు, మొగవాళ్లకు ప్రత్యేకంగా కట్టిమద్యలో దారికోసం కంక బొంగులు పాతిండ్లు- వర్షాకాం అయినా - మూడు దినాల నుండి వాన గెరివిచ్చింది. ఆకాశంలో మబ్బులు తిరుగుతున్నాయి - అప్పుడప్పుడు జల్లు పడుతున్నది. కాని - బురద బురద కాలేదు.

            ‘‘వానచ్చేది - పాణంపొయ్యేది తెలువది - ఎందుకైనా మంచిది ఎంత దూరం వీలైతే అంత దూరం టెంట్లు కడుదాం బెల్లంపల్లినుంచి, మందమర్రి నుంచి లారీలల్ల టెంట్లచ్చినయ్‍’’ - రజబ్‍ అలీ ఆమొత్తం కార్యక్కమాలను చూస్తున్నాడు.

            ‘‘అన్నా నేను చూసుకుంటపో - నువ్వు మరేదన్న పనుంటె చూసుకపో’’ - పోశెట్టి...

            అందరికి చాయ్‍లచ్చినయ్‍, రాజేశ్వరి, లక్ష్మితీసుకవచ్చి ఇచ్చిండ్లు.

            కొంచెం దూరంలో జననాట్యమండలి కళాకారులు రాత్రికి జరగబోయే - కార్య్కమాలకు రిహాల్సల్స్ చేస్తున్నారు. అక్కడికి పోయిండ్లు లక్ష్మి, రాజేశ్వరి గద్దరన్న చెముటలు కారంగ - అదరికి అడుగులు నేర్పుతండు - సంజీవన్న - పాడుతండు.

            చెయ్యిచెంపకు బెట్టుకొని ఎర్రజెండా కుడిచెయ్యి చిటుకన వేలుకు కట్టుకొని ‘‘మీ పాదాపాదాన పరిపరి దండాలు’’ - కళ్లు మూసి శంకరయ్య తన్మయత్వంలో పాడుతున్నాడు. ఆ కంఠస్వరానికి లక్ష్మి ఒళ్లంతా పులకరించింది. శంకరయ్య కండ్లు తెరిచేసరికి ఎదురుంగ చాయ్‍ గ్లాసుతో లక్ష్మి - శంకరయ్య రాగమాగిపోయింది...సిగ్గుపడ్డడు.

            ‘‘ఏందిర తమ్మీ ! రాగమాగపోయింది. సిగ్గుపడుతున్న వేందిరో ? అక్కను జూసా?’’ గద్దర్‍ బొంగురు గొంతుతో - కొంటె నవ్వుతో...

            ‘‘అన్నా! లక్ష్మి’’ శంకరయ్య తనకిచ్చిన చాయ్‍ గద్దర్‍కిచ్చి -

            ‘‘ఆ..లచ్చక్క...’’

            లక్ష్మి ముఖమంతా వెలిగిపోయింది.

            ‘‘సెల్లే గట్ల చెప్పు - నీ భర్తాలుడా! కైతికాలోడు. మంచిగ పాడ్తండు. సెంగోబిల్లంటడు. జెరజాగర్త’’

            లక్ష్మి కలవెలపడ్డది. ‘‘అన్నా - గిది మాసెల్లె మంచిగపాడ్తది. అగో గస్టేజీ కాడ పనిచేస్తండు మొగిలి మా మరిది’’ అన్నది రాజేశ్వరిని ముందుకు తోసింది.

            గద్దర్‍ ఇద్దరిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నడు.  ‘‘సెల్లెండ్లు - మావోళ్లుసిగ్గు పడ్తండ్లు - సెల్లె పాడవా? మా దగ్గర ఇద్దరే సెల్లెండ్లున్నరు. మీరత్తే ఆట పాట జబర్‍దస్తీగుంటది.’’

            ‘‘లేదన్నా - మల్లచ్చినప్పుడు’’ లక్ష్మి, రాజేశ్వరి అక్కడినుండి వంట దగ్గరికి పోయిండ్లు.

            పొద్దటి నుంచే పల్లెల నుంచి - దూరప్రాంతాల నుంచి మంది రావడం మొదలయ్యింది. మైదానం అంతకంతకూ నిండిపోతున్నది. దూరంగా ట్రాక్టర్లు, లారీలు ఆపిండ్లు - కొంత మంది ప్రైవేటు బస్సులు తెచ్చిండ్లు.

            ప్రభుత్వ నిర్భంధం నశించాలి

            రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి.

            రైతాంగ పోరాటాలు వర్దిల్లాలి

            పౌరహక్కుల సంఘం వర్ధిల్లాలి

            రాడికల్‍ విద్యార్థి సంఘం వర్దిల్లాలి

            లాంటి నినాదాలు ఎక్కడి గుంపు అక్కడనే ఇస్తున్నారు. చిన్న చిన్న బృదాలుగా ఏర్పడి పాటలు పాడుతున్నారు. ఎగురుతున్నారు. ఏవూరు కవూరే తెచ్చుకున్న పులిహోర పొట్లాలు తింటున్నారు.  ఉసిల్ల పుట్ట చెదిరినట్టు మంది - పశువుల మందలు బెదిరినట్లుగా మంది - పూనకం పూనినట్టుగా - జట్లు జట్లుగా సాయంకాలం వరకు మైదానం పూర్తిగా నిండిపోయింది. సింగరేణి వాళ్లే అంతటా ప్లడ్‍లైట్లు పెట్టిండ్లు. పదివేలకు పైన్నే కార్మికులు, విద్యార్థులు, రైతులు, మహిళలతో ఆమైదానమంతా పికపిక లాడుతంది. గోలీసొడా వాళ్లు, పండ్లవాళ్లు పల్లీలవాళ్లు, రోడ్డుతీర్థం తీరుగున్నది.

            లక్ష్మి, రాజేశ్వరి, రెహనా, ఆడవాళ్ల గుంపులో ఆడవాళ్లందరిని లైనుగ కూర్చుండ బెడుతున్నారు.

            మొగిలి స్టేజీ చుట్టు ఎవరినీ  రాకుండా పెట్టిన రక్షణ బృందంలో వాలంటీరుగా ఉన్నాడు. తనెత్తుకంకకర్ర పట్టుకొని మందిని స్టేజీదగ్గరికి ఒత్తుక రాకుండా ఆపుతున్నాడు.

            శంకరయ్య, గద్దర్‍ బృందం, నాగయ్య, చందర్‍బృదం షరీప్‍ స్టేజీమీద ఉన్నారు. స్టేజీకి కొంచెం దూరంలో - గంగాధర్‍ కొంచెం దూరంగా గల సింగరేణి క్వార్టర్‍ లో ముఖ్యలందరితో మాట్లాడి - బయలుదేరాడు.

            నాగయ్య మైకు ముందుకు వచ్చి - ‘‘ప్రియమైన కార్మికులారా! ప్రజలారా! రైతులారా! అమ్మలారా! అక్కలారా!’’

            ‘‘జెప్పన మొదలు పెట్టుండ్లి - గద్దరన్నను పాటెయ్యిమను’’ ఎవరో అరిచిండ్లు.

            ‘‘మన ప్రియతమ నాయకులు జార్జిఫెర్నాండేజ్‍- కేంద్రమంత్రి - పత్తిపాక వెంకటేశ్వర్లు - వకీలు - పౌరహక్కులనేత ఇంకా అయిదు నిముషాలలో స్టేజీమీదికి విచ్చేస్తున్నారు. దేశమంతా జైలు చేసి వేలాది మందిని జేల్లల్ల కుక్కిన కాంగ్రెసు ప్రభుత్వానికి ఇందిరా గాంధీకి ప్రజలు ఓడించి బుద్ది చెప్పారు. ప్రజలు ఇంతపెద్ద ఎత్తున మీటింగుకు కదిలి వచ్చారు. ప్రజలందరికీ - ఈ మీటింగుఏర్పాటు చేసిన పౌరహక్కుల సంఘంనికి జేజేలు చెప్పుకుంటూ ఇప్పుడు అనుకున్న ప్రకారంగా  మీటింగు ఆరంభమౌతుంది. స్టేజీమీద వెనుక భాగంలో పది కుర్చీలు వేశారు. నాగయ్య ఒక్కొక్కరిని స్టేజీమీదికి ఆహ్వానించాడు. కార్యకర్తలు అలాంటి వ్యక్తులను స్టేజీమీదికి తెచ్చారు. ప్రజలు ఈలలు, చప్పట్లు కొట్టారు.

            ఇంతలోనే మీటింగులో జార్జుపెర్నాండేజ్‍ వస్తున్నడనీ - కలకలం బయలు దేరింది...

            జార్జుఫెర్నాండేజ్‍ స్టేజీమీదికెక్కేసరికి - ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘‘జిందాబాద్‍ జిందాబాద్‍’’ ఫెర్నాండేజ్‍ జిందాబాద్‍’’

            రాజకీయ ఖైదీలను బేషరుతుగావిడుదల చేయలి’’

            ‘కార్మికుల ఐఖ్యత

            ‘వర్దిల్లాలి

            ‘సబ్‍కా ఝండా లాల్‍ ఝండా!’’

            ‘విద్యార్థుల, మేధావుల, కార్మికుల, రైతాంగం ఐఖ్యత

            ‘వర్ధిల్లాలి

            ఫెర్నాండేజ్‍ అందరికి కుడిచెయ్యి పిడికిలెత్తి లాల్‍సలామ్‍ చెప్పిండు. కుర్చోలో కూర్చున్నడు.

            అప్పుడు కార్యక్రమం మొదలయ్యింది.

            గద్దర్‍ బృందం, సంజీవ్‍, చందర్‍ కలిసి లైనుగ నిలబడి

            ‘‘సుత్తీ కొడవలి గుర్తగవున్నా!

            ఎర్రని జెండా!

            ఎగురుతున్నదీ! ’’పాట పాడిండ్లు.

            సభ నిశబ్దమయ్యింది.

            ఆ తరువాత పత్తిపాక వెంకటేశ్వర్లు మైకుముందు నిలబడి ‘‘ప్రజలారా! ఎమర్జెన్సీ ఎత్తేసినతరువాత మనప్రాంతంలో పెట్టిన మొట్టమొదటి మీటింగుకు ఇన్నివేల మంది ఎన్నో కష్టాలకోర్చి వచ్చినందుకు స్వాగతం. డిల్లీ నుండి పని ఒత్తిడి ఎంతో ఉన్నా - ఇచ్చిన మాట ప్రకారం, తను ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రజలకోసం ఈ మారుమూల ప్రాంతానికి విచ్చేసిన కా।। జార్జ్పెర్నాండేజ్‍కు లాల్‍సలాంలు, చాలా పోగ్రంలున్నాయి. మీటింగు పదిగంటల దాకా నడుస్తుంది. వలంటీర్లు చాలా మందున్నరు. వాళ్లంతా కావాలిసన వాళ్లకు నీళ్లు, పులిహోర పొట్లాలు పంచుతారు పోలీసులారా! ఈ మీటింగు సజావుగా జరుగాలంటే -మీరు ప్రజలను భయబ్రాంతులనుచేయవద్దు - ఎమర్జేన్సీలో ఏంజరిగిందో మీకు తెలుసు ఇప్పుడు ప్రభుత్వాలు మారినయ్‍ - ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. పోరాడుతున్నారు...మంచి మంచి పాటలు, ఆటలున్నాయి. ఇప్పుడు కామ్రేడ్‍ బృందం అమరవీరుల పాటతో కార్యక్రమం మొదలౌతుంది.

            గద్దర్‍ - బృందం ముందటికి వచ్చింది. గద్దర్‍ గొంతెత్తి - ‘‘అహో...ఓహో’’ అన్నాడు. ప్రజలుకేకలు- పాటకు ట్యూనయ్యారు.

            ‘‘లాల్‍సలామ్‍ - లాల్‍సలామ్‍’’

            పాటపాడిండు. ప్రజలంతా ఆమూడులోకి వచ్చిండ్లు అతని వలపోత, వీరత్వం ప్రజలను కదిలించివేసింది. కొంత మంది కన్నీళ్లు కార్చిండ్లు. లక్ష్మికి కండ్లు ఎర్రబడ్డయి. కొందరు పండ్లు పటపట కొరికిండ్లు.

            ఆ తరువాత చందర్‍ బృందం పాడిండ్లు...

            ‘‘కమ్యూనిస్టు కిష్టగౌడ్‍

            కామ్రేడ్‍ భూమయ్యా’’

            అందులో శంకరయ్య చందర్‍ పక్కనే తను నాట్యంచేస్తూ రెండో మనిషిగా కోరస్‍ యిచ్చాడు. పత్తిపాక వెంకటేశ్వర్లు మైకు తీసుకొని...

            ‘‘దేశంలో పరిస్థితి మారినా! రాష్ట్రంలో వెంగళరావు ప్రభుత్వం మారలేదు. ఇంకా జైల్లల్లో రాజకీయఖైదీలు వంద లాదిమంది ఉన్నారు. వారిని వెంటనే బేషరుతుగా విడుదల చేయాలని సభాముఖంగా డిమాండు చేస్తున్నాం’’ అని ఏయేయే జైల్లల్లో ఎంత మంది ఉన్నారో వాళ్లందరి గురించి చెప్పుకొచ్చాడు.

            తరువాత నాగయ్య మైకు పట్టుకొని...

            ‘‘ఇది కొత్తపాట - మూమూలుగా పోరాడే వాళ్లను కోపగొండి వాళ్ల తీర్గ చూస్తరు. కాదు వాళ్లు వెన్నెల కోనలు - మనపిల్లలు...

            ఎర్రజెండెర్రజెండెన్నియ్యలో

            ఎరెర్రని దీజెం డెన్నియ్యలో

            పేదలపాలీ టెన్నియ్యలో

            మరిపెన్నిధి ఈజెం డెన్నియ్యలో ।।ఎర్ర।।

            అన్నలు అన్నా లెన్నియ్యలో

            వెన్నెలకోనా లెన్నియ్యలో

            మరి ఎలుగూరవ్వ లెన్నియ్యలో

            తూరపుదిక్కూ నెన్నియ్యలో

            మరి సూర్యుడు పొడిసిం డెన్నియ్యలో

            ప్రజలాకొరకూ ఎన్నియ్యలో

            మన అన్నలు నిలిచా రెన్నియ్యలో

            పడమటిదిక్కూ నెన్నియ్యలో

            సూరుడు గుంకిం డెన్నియ్యలో

            ప్రలా మధ్యా నెన్నీయ్యలో

            మన అన్నలు ఒరిగా రెన్నీయలో

            ఒరిగిన అన్నల కెన్నీయలో

            మన ఎర్రనిదండా లెన్నీయలో

            సీకటి కొండ ల్లెన్నీయ్యలో

            మరి సివరీమూల లెన్నియలో

            నక్సల్‍ బరినుం డెన్నియలో

            మరి నాలుగు దిక్కూ లెన్నీయ్యలో

            పోరుసాగం గెన్నీయలో

            మరి పోరుమార్గం లెన్నీయలో

            ఒరిగిన అన్నల కెన్నీయలో

            మన ఎర్ర దండాలెన్నియలో ।।ఎర్ర।।

            ఆగదు ఆగా దెన్నీయలో

            పోరాటామాగా దెన్నీయలో

            పోరుమార్గం లెన్నీయలో

            మరి నువ్వూ నేనూ ఎన్నీయలో

            నువ్వూ నేనూ ఎన్నియలో

            కలిసేపోదా మెన్నీయలో

            కలిసేపోదా మెన్నీయలో

            మరి నడిచేపోదా మెన్నీయలో ।।కలిసే।।

            ఎర్రజెం డెర్రజెం డెన్నియలో

            ఎరెర్రని దీజెండెన్నియలో

            పాట అయిపోగానే ఒక్కసారిగా జనం ‘‘మల్ల పాడాలే నన్నరు.

            ఈ సారి గద్దరు ముందుకొచ్చి తను నాట్యం చేస్తూ ‘‘చెళ్‍ - బలే’’ - కలిపి పాట పాడిండు. స్టేజీ ఊగిపోయింది - జనం కేరింతలు కొట్టారు - డ్యాన్సులు చేశారు. వాళ్ల కెక్కడో సూటిగా తాకింది. పాట అలలుగా మోగింది. పాటయిపోయింది - నాగయ్య మైకు తీసుకొని...

            ‘‘1974లో ఏడు లక్షల మంది రైల్వే కార్మికుల అధ్యక్షులుగా మన జార్జి నాయకత్వంలో దేశ వ్యాపితంగా రైల్వే కార్మికులు సమ్మే చేశారు. దేశమంతా ఆగిపోయింది. ఎమర్జెన్సీలో రహస్యంగా ఉండి ఉద్యమాన్ని నడిపారు. ఇప్పుడు మీ ముందు మాట్లాడుతారు’’. ఇదే మాటను ఇంగ్లీషులో చెప్పిండు నాగయ్య.

            జార్జిఫెర్నాండేజ్‍ మైకు తీసుకున్నాడు. కార్మిక నాయకుడుగా కార్మికులతో ఎట్లా మాట్లాడాలో తెలిసినవ్యక్తి - ‘‘కామ్రేడ్స్ అని ఆరంభించి - భారతదేశ పరిస్థితుల గురించి మాట్లాడారు. భారతదేశం అనేక వనరులు, అపారమైన మానవ వక్తి గల ధనవంతమైన దేశం - కాని భారతప్రజలు బీద వాళ్లు - ఎందుకు?

            ఫెర్నాండేజ్‍ హిందీలో మాట్లాడితే హైదరాబాదు నుండి వచ్చినాయన తెలుగులో చెప్పడం ప్రారంభించాడు.

            ‘‘ఎందకంటే - మనం మన కష్టంతో తయారు చేసిన దంతా - దేశంలోని బడా భూస్వాములు,పెట్టుబడిదారులు కాజేస్తున్నాడు. అలాంటి వాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడుతోంది - లేదు  ఈ పరిస్థితి మారాలని జయ్‍ప్రకాశ్‍నారాయణ్‍ లాంటి వాళ్లు దేశవ్యాపితంగా పెద్దఉద్యమం లేవదీశారు. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి, ఉద్యమాలు నడిపాడు. నక్సలైట్లు, బెంగాల్‍లో, శ్రీకాకుళంలో, ఆంధ్రలో పోరాటాలు చేశారు. ప్రభుత్వం ఎమర్జెన్సీ పెట్టి ముప్పైవేల మందిని చంపింది. వేలాది మందిమీద కేసులు పెట్టింది. ప్రజలు అలాంటి జూటా నియంత సర్కారును గద్దెదించారు. ఇందిరాగాంధేగాని వెంగళ్‍రావే గాని, మరెవరన్నాగాని - ప్రజల ముందు నిలబడలేరని తెలుసుకోవాలి. రాజకీయ ఖైదీలందరిని బేషరుతుగా విడుదలచేయాలి చేపిస్తాం’’.

            అరగంట మాట్లాడిండు. దేశవ్యాపితంగా జరిగిన రైల్వే సమ్మెనుండి మొదలు కొని, బీహార్‍, బొంబాయి లాంటి చోట్ల జరిగిన ఉద్యమాల గురించి వివరించారు. అప్పుడు చందర్‍ బృందం ముందుకు వచ్చింది.

            షరీప్‍ ముందుకు వచ్చి -

            ‘‘సింగరేణి కంపేనీలో

            సితక బడ్డ బతుకులోడ’’

            పాట పాడిండు. సింగరేణి కార్మికులు కేరింతలు కొట్టారు. తమ గురించి మొట్టమొదటి సారిగా పాట విన్నందుకు - మళ్లీ పాడుమన్నారు. అప్పుడు శంకరయ్య ముందుకువచ్చి మళ్లీ పాడాడు.

            శంకరయ్య కంఠంలో పాట ప్రాణం పోసుకున్నది.

            నాగయ్య ముందుకువచ్చి - ‘‘మూడే ముచ్చట్లు - పల్లెల దొరల ఆటలు సాగయి. అట్లనే వాళ్ల తాత సొమ్మయినట్టు - సింగరేణిల అధికార్లు పెత్తనం చేస్తే సాగదు. సింగరేణిలో దొరల రాజ్యం నడుస్తున్నది - యూనియన్‍ నాయకులు దొరలే - బస్తీలన్నీ గజగజ లాడుతున్నాయి. వడ్డీలు, చిట్టీలు, దుకాణదారులు అధిక ధరలు - అన్ని ప్రాంతాలల్లో దొరలు గుండాలను పెంచి పోసిస్తున్నారు. సింగరేణి కంపినీలో చట్టాలు లేవు. రూల్లు లేవు. ఇష్టారాజ్యం. రాడికల్‍ విద్యార్థులు కార్మికులు ప్రతిదాన్ని లెక్కలు తీశారు. ఖబర్‍ద్దార్‍ మీ ఆటలింక సాగయి. మీ రందరు బతికేది - పుట్టెడు బండకిందికి పోయి బొగ్గు తీసే కార్మికుల శ్రమ మీదనే వాళ్లు బరిగీసి నిల్సిండు. - సింగరేణి కార్మికుల బొగ్గువలననే పరిశ్రమలు నడుస్తున్నయి. విధ్యుత్తు మన కందుతోంది’’.

            ‘‘పల్లె పల్లెన పోరుబాటలు

            ఎర్రనీ శ్రీకాకుళము

            నాడు అక్కడ రగిలి రగిలి

            నేడు ఇక్కడ మండుతంది’’ నాగయ్య ఆగిండు. జనం ఊపిరి బిగపట్టారు.

            పోరుబాటల పోదమా

            బావయో బంగారయో

            ఎర్రతోవల పోదమా

            ధీరుడో గని కార్మికా ।।పల్లె।।

            నాగయ్య పాట ఆపేసిండు. కార్మికులు ‘‘ఓహ్‍’’ అంటూ లేచిండ్లు - అరె మంచిగున్నది పోనియ్యి - పాడుండ్లి

            పల్లె పల్లెన పోరుబాటలు

            ఎర్రనీ శ్రీకాకుళము

            నాడు అక్కడ రగిలి రగిలి

            నేడు ఇక్కడి మండుతుంది

            పోరుబాటల పోదమా

            బావయో బంగారయో

            ఎర్రతోవల పోదమా

            ధీరుడో గని కార్మికా       -   ‘‘పల్లె’’

            సిన్న పోటువ లెన్నో దిగి

            ఎంప్లాయిమొంటు కాల్‍దీసి

            బాయి ట్రేనింగు జెయ్యబోతె

            దొరలు బోళ్ళు కడుగబెట్టిరి

            ఎట్టి సాకిరి దప్పలే

            బావయో బాంగారయా

            అరువ సాకిరి దప్పలే

            ధీరుడో గని కార్మికా ।।పల్లె।।

            సిమ్మ సీకటి దారిలోన

            సెమ్మాసును సేతబట్టి

            నెత్తిమీన సేప్టి క్యాపు

            సేతులోన బొగ్గు తట్ట

            నీ బతుకు మారే దెప్పుడు

            బావయో బంగారయా

            నువు బాగుపడేదెప్పుడు

            ధీరుడో గని కార్మికా ।।పల్లె।।

            భూమి కడుపు బొగ్గు గుట్టల

            రేయి పగలు బేధమేది

            బొగ్గు పొక్కల సీకటేల

            అగ్గితోని కాల్సినట్టే

            దగ్గుకుంటూ దునుసుకుంటూ

            బావయో బంగారయా

            రొమ్ము లెండి కాటికైతివి

            ధీరుడో గని కార్మికా ।।పల్లె।।

            ఖరీదైన బట్టలేసి

            కమ్యూనిస్టు వాని జెప్పి

            ఉన్న ఊరు విడిసి పెట్టి

            రెక్కబొక్కలు ఇరుసుకోని

            పెల్ల పెల్లను పెల్లగించి

            బాయిదొరల సంపదాల

            ఎంత కంతకు బెంచినావు

            సాలి సాలని గుడిసెలో నువు

            బావయో బంగారయా

            ముక్కి మూల్గి సచ్చినావా

            ధీరుడో గని కార్మికా ।।పల్లె।।

            కన్నతల్లి పోగులమ్మి

            ఉన్న కోండ్ర రయిను బెట్టి

            ఒక్క పూటే తిండి తిని

            నాగలేక కొలువు సేత్తె

            మూడు ఏండ్లు గడిపిపాయె

            బావయో బంగారయా

            పరిమినెంటు గాకపాయె

            ధీరుడో గని కార్మికా ।।పల్లె।।

            ఎన్నిరోజులు ఇన్ని బాధలు

            పనిఇసిరెలె ఆయుధాలు

            పల్లె పల్లెన బలగమున్నది

            సేతులో సెమ్మాసు ఉన్నది

            సెమ్మాసు మర్రెయ్యరో

            బావయో బంగారయా

            దోరల భరతం బట్టరో

            ధీరుడో గని కార్మికా ।।పల్లె।।

            కంజెరలు మోగినయ్‍ - మద్దెల్లు మోగినయ్‍ - కాళ్ల గజ్జెలు మోగినయ్‍ - గద్దర్‍, చందర్‍, సంజీవ్‍ ముందుకచ్చిండ్లు మొత్తం జననాట్యమండలి అంతా ఆ పాటతో ఆడిండ్లు - శంకరయ్య కోరస్‍ నుండి పాటెత్తుకున్నడు. అతను అందరికన్నా ముందుకు వచ్చిండు.

            ‘‘సిన్న పోటువలెన్నో దిగి’’

            సుట్టూ దిరిగి చెయ్యి సూపిండు ‘‘వోహ్‍’’ అన్నరు కార్మికులు...

            ‘‘ఎంప్లాయి మెంటు కాల్‍దీసి

            బాయిట్రేనింగ్‍ జెయ్యబోతే

            దొరలు బోళ్లు కడుగ బెట్టిరి

            అరె! ఎట్టి సాకిరి దప్పలే 

            బావయో బంగారయా

            అరువ సాకిరి దప్పలే’’

            కార్మికులు లేసిండ్లు - ఈలలు గొట్టిండ్లు. ‘‘బావయో బంగారయా మల్ల పాడుమన్నారు. మళ్ల చరణం పాడిండు

            సిమ్మ సీకటి దారిలోన

            సెమ్మాసును సేతబట్టి

            నెత్తిమీద సేప్టి ల్యాంపు

            సేతులోన బొగ్గుతట్ట

            నీ బతుకు మారేదెప్పుడు

            బావయో బంగారయా

            నువు బాగుపడేదెప్పుడూ

            ఈ సారి ఆడవాళ్లు మళ్ల పాడుమన్నరు. లక్ష్మి లేచి అరుస్తోంది. తను ఇప్పుడే బొగ్గు తవ్వుతున్నట్టు - శంకరయ్య పాటలో లీనమై పాడుతున్నడు. కార్మికులు ఊపిరి బిగపట్టిండ్లు. వాళ్ల లోలోపల ఏదో పాకుతోంది. - అది చరణాల వల్లనా? రాగం వల్లనా? శంకరయ్య గొంతువల్లనా? అభినయనం వల్లనా? వాళ్లు అనుభవించిన జీవితం యొక్క కళాత్మక ప్రదర్శణ వళ్లనా?

            ‘‘భూమి కడుపు బొగ్గు గుట్టల

            రేయి పగలు బేదమేది

            బొగ్గు పొక్కల సీకటేల

            అగ్గితోని కాల్సినట్టే

            కార్మికులు ఘోల్లు మన్నారు. తమందరిని, పెనాల మీద వేసి మాడ్చినట్లుగా లక్ష్మి వెక్కివెక్కి ఏడుస్తోంది - గందుకనే తాగుతరు మొగోళ్లు - ఏంగోస’ ‘పనికగ్గితల్గమనం తింటున్నం తిర్గుతున్నం - వాళ్లేనా? బాయిపని కగ్గితల్గ నీళ్లులేక నిప్పులు లేక మనందరం అగ్గిలనే మాడ్తన్నం. రాజేశ్వరి లక్ష్మిని పట్టుకున్నది.  శంకరయ్య కళ్లల్లో జలజల నీళ్లూరినయ్‍ - కంఠం పూడుక పోయింది. నాగయ్య అందుకున్నడు.

            దగ్గుకుంటూ దనుసుకుంటూ

            బావయో బంగారయా

            ఆఖరుకు గద్దరందుకున్నడు. అంతెత్తు ఎగిరిండు - దునికిండు.

           

            ‘‘పల్లె పల్లెన బలగమున్నది

            సేతులో సెమ్మాసు ఉన్నది

            సెమ్మాసు మర్రేయరో

            బావయో బంగారయా

            దొరల భరుతం బట్టరో

            ధీరుడో గని కార్మికా!

            కార్మికులంతా ఘోల్లున లేచారు. వాళ్ల ముఖాలు వెలిగి పోతున్నాయి. లోపల ఏదో అవ్విచ్చినట్లనిపించింది. ఇప్పుడే ఈ క్షణంలోనే పోయి గనులు - ఆఫీసులు తొక్కేస్తారేమొ? దొరికిన వాళ్లనల్లా గొంతు పిసుకతారేమొ నన్నంత ఆవేశంలో ఉన్నారు. వేలాది చెమ్మాసులు గాలిలో లేచి నట్టుగా ఆకాశంలో ఉరిమింది...కొద్దిగా గాడుపుదుమారం లేచించి...

            వాళ్లందరిని మళ్లీ కూర్చుండ బెట్టేసరికి అరగంట పట్టింది. గాలి ఆగిపోయింది. మీటింగంతా వేడి సెగలు తాకుతున్నట్టుగా కూర్చున్నారు.

            కళకు అంత శక్తుంటదని స్టేజీమీదున్న వాళ్లందరికి తెలిసింది.

            గంగాధర్‍ మైకు ముందుకు వచ్చిండు. పాట అతని ముఖంలో ప్రతిఫలిస్తోంది. ‘‘కార్మికులారా! పాట విన్నరు గదా! అటు బాయిల్లో, ఇటు బస్తీలల్లో దుకాండ్లకాడ, అంతటా మనం నిప్పులల్లో ఉన్నట్టున్నదా? లేదా?’’

            ‘‘ఉన్నది. మలమల మాడిపోతన్నం పట్టించుకునేటోడు లేడు’’

            ‘‘యూనియన్లు ఉన్నయికదా?’’

            ‘‘బట్టెబాజి యూనియన్లు - దొంగయూనియన్లు’’ కార్మికులు పెద్ద పెట్టున అరుస్తూనే ఉన్నారు’’

            ‘‘అంటే సింగరేణిలో అనేక సమస్యలున్నాయి. అవేమిటో నేను వివరిస్తాను.

            బాయి పనంటే కార్మికులకు తెలుసు. కాని అక్కలకు, అమ్మలకు తెలువదు. మైళ్ల కొద్ది భూమిలోపలికి పోవాలి.- చిమ్మంచీకటి నెత్తికిటోపిలైటు. అక్కడ మన బాటల తీరుగా తవ్వుతరు. తవ్వేటందుకు గుట్టాల మందు పెట్టి పేలుస్తరు. గంధకం వాసన, విపరీతమైన వేడి గాలి వెలుతురు సరీగలేనిచోట - నీళ్లు కారుతుండగా పైలి అంటే ఇద్దరు ఒకడు ఎత్తాలె - ఒకడు మోయాలె - ఇద్దరు కలిసి నాలుగు టబ్బులు నింపాలె - టబ్బులు అందరు చూసేఉంటరు. ఆ పని జరుగుతున్నంత సేపు ఊపిరాడక వసవస దక్కుకుంట కార్మికులు కింద పడిపోతరు. కాని అధికారులు పంఖాల కింద ఆఫీసులకూసుండి - బండ బూతులు తిడుతరు... ఈ సభాముఖంగా కొన్ని డిమాండ్లు...

            - పనిస్థలాలకు, కాలి టబ్బులు, తట్టలు, సెమ్మాసులు, బూట్లు సకాలంలో సప్లైచేయాలి.

            - రక్షణ కోసం యాజమాన్యం ప్రత్యేక శ్రద్దపెట్టాలె

            - బాయిదొరల ఇండ్లల్లో వెట్టిచాకిరి రద్దు చేయాలి.

            - అధికార్లు కార్మికులతో మర్యాదగా మెదలాలి.

            - టెంపరరీ కార్మికులను, బదిలీఫిల్లర్లను పర్మినెంటు చేయాలి

            బొగ్గు లోడిండులో కంట్రాక్టుకార్మికులను దోపిడి చేస్తున్న కంట్రాక్టర్ల జులుం నశించాలి, లారీ ఒక్కింటికి కార్మికులకు ఇచ్చేది వందను నూటయాభైకి పెంచాలి. బట్టలు, బూట్లు, దవాఖాన సౌకర్యం, ప్రావిడెంట్‍ ఫండు సౌకర్యం - కలిగించాలి. పనిస్థలాలల్లో షెడ్లు, నీటి పంపులు లాంటి సౌకర్యాలు ఏర్పాటుచేయాలి.

            ఉద్యోగాలిప్పిస్తామని యూనియన్‍ నాయకులు, కంపినీ అధికారులు కార్మికుల దగ్గర వసూలు చేసిన డబ్బువాపసు యివ్వాలి

            ట్రేనింగ్‍ చేసిన కార్మికులకు, బదిలీఫిల్లర్లను పర్మినింటు చెయ్యాలి

            - సింగరేణిలో డెబ్బైవేల మంది పనిచేస్తున్నారు. కాని క్వార్టర్లు పందొమ్మిదివేలు కూడాలేవు. అవి కూడా పై అధికారులు, క్లర్కులు, ఓర్‍మెన్లు, సూపర్‍వైజర్లు, మెకానిక్కులు, ట్రేడ్‍మన్లు, వైద్యసిబ్బంది, టీచర్లకే క్వార్టర్లు - నూటికి తొంభై శాతం కార్మికులకు ఇంటి వసతిలేదు. ఎక్కడో ఊర్లకు దూరంగా అడవుల్లో ఏర్పాటుచేసిన గనుల దగ్గర కార్మికులు ఎట్లా నివసించాలి? యాజమాన్యానికి, యూనియన్లకు పట్టదు...

            ఇండ్లులేక - గుడిసెలు కట్టుకున్నారు. రోడ్లులేవు. కరంటు లేదు, నీటి వసతి లేదు బాతురూంలులేవు పాయఖానాలు అసలేలేవు, స్కూల్లు అసలేలేవు. గుడిసెలు నరకకూపాలు.        

            - కార్మికుల గుడిసెలకు, బస్తీలకు ఉచిత నీరు, విధ్యుత్తు ప్రతిగుడిసెకు మరుగుదొడ్డి సానిటేషన్‍ ఏర్పాటు చేయడం కంపెనీ తప్పనిసరైన బాధ్యత వేలకోట్లు సంపాదిస్తున్న కార్మికులందరికి క్వార్టర్లు నిర్మించియివ్వాలె

            - తాత్కాలికంగా అనువైన స్థలం చూపి అభివృద్దిచేసి గుడిసెలకు జాగాయిచ్చి - సింగరేణి సహాయ సహకారాలందించాలి. ఉచిత నీటి వసతి, కరంటు - శానిటేషన్‍ క్వార్టర్లకు ఇచ్చినట్లే ఇవ్వాలి. బస్తీల దగ్గర దవాఖానాలు, స్కూల్లు నిర్మించాలి.

            కార్మికులారా!

            పల్లెల్లో దొరల దోపిడి, పీడన భరించలేక గుడిసెమీద దెబ్బకొట్టి ఇక్కడచ్చిపడ్డాం, ముఖ్యంగా మాలలు, మాదిగలు ఇతర చేతివృత్తులవారు. భూమిలేని నిరుపేదులు వ్యవసాయందెబ్బతిన్న చిన్నరైతులు - ఇక్కడ కూడా దొరలు తయారయ్యిండ్లు... ట్రేడ్‍ యూనియన్‍ నాయకులుగా, పెద్ద పెద్ద అధికారులుగా, సారా, కల్లు, బ్రాండి షాపులు, సినిమాహాల్లు, పెద్ద పెద్ద దుకాణాలు, వడ్డీ వ్యాపారం...ఇవన్నీ నడువాలంటే కార్మికులు తిరుగబడకుండా ఉండాలంటే - గుండా గ్యాంగులుండాలి. బెల్లంపల్లి, మందమర్రి, గోదావరిఖనిలో గుండాలు కార్మికులను తన్నడం - కొట్టడం - ఆడవాళ్లను ఎత్తుకపోయి వారి మీద దాడి చేయడం - ఎన్నెన్నో - దొరలు సింగరేణి వెనుక నుండి నడిపిస్తున్నారు. గుండారాజ్యం నడుస్తోంది. కార్మికులకు చట్టాలుంటాయి. వెల్‍ఫేర్‍ ఆఫీసర్లుంటారు. బాయకమిటీలు ఉంటాయి - సేప్టీ కమిటీలుంటాయి - కార్మిక సంఘాలుంటాయి. నిజానికి గనుల ప్రాంతంలో కార్మిక - యజమాని సంబంధాలుండాలి. ప్రతిదానికి రూల్సుఉంటాయి.  కాని ఇక్కడ గుండా రాజ్‍ సమ్మె నిరోధక కమిటిలాంటివి గుండాలతో పెట్టారు.

            గంగాధర్‍ ఆగిండు.

            ‘‘నరకం’’ ‘‘నరకం’’ కార్మికులు అరిచారు.

            ‘‘కార్మిక ప్రాంతంలో చట్టాలు, పోలీసులుంటారు కనుక కొంత భద్రతుండాలి. ఉన్నదా?

            ‘‘లేదు లేదు - దోపిడి రాజ్యం, దొంగల రాజ్జెం’’ కార్మికులు మొత్తుకున్నారు.

            దుకాణదారులు - ఏదైనా అమ్ముతరు - ఎంతకైనా అమ్ముతరు అడిగేటోడుండడు. వాళ్లు గుండాలకు నెలమామూల్లు యివ్వాలి. పోలీసులకు - యితర అధికారులకు లంచాలివ్వాలి. వడ్డీవ్యాపారం, చిట్టీవ్యాపారం, లక్షతొంబైవ్యాపారాలు సారా, బ్రాండీ, కల్లు కల్తీ - ఇష్టమున్నరేట్లు, యూనియన్‍ చందాల వసూల్లు - దందాలు - నౌకరి పైరవులు, కార్మికుడు అర్దపూట సెలవు కోసం, దవాఖాన కోసం  యూనియన్‍ చుట్టు తిరిగాలె - లంచాలిచ్చుకోవాలె - ఉద్యోగాలు వేలంపాట - అందరికి వాటాలు - ఇవన్నీ మీకందరికి ఎరుకున్నవే – గందునే పాట మొదట్ల ఏమన్నడు?

            ‘‘పల్లె పల్లెన పోరుబాటలు

            ఎర్రని శ్రీకకుళాలు

            నాడు అక్కడ రగిలి రగిలి

            నేడు ఇక్కడ మండుతంది’’

            ఈ సమస్యలన్నింటికోసం ఎవరు పోరాడలే

            ‘‘కార్మికులే - కార్మికులే’’

            ‘‘పోరాడితే పోయేదేమిలేదు - బానిస సంకెళ్లుతప్ప...

            చప్పట్లు - చప్పట్లు - ఈలలు...గాడుపు గాలిదుమారం మొదలైంది.

            రెండు శిబిరాలుగా చీలి ఉన్న - అటు యాజమాన్యం, వ్యాపారస్థులు, అధికారులు, యూనియనోళ్లు - గుండాలు ఇటు ఎవరికి వారే ఉన్న కార్మికులు - దోపిడి పీడన చేసేటోల్లదంరు కలిసున్నారు. కనపడకుండా ఉన్నారు. గది తెలిసింది. తాము విడిగాలేమని కోట్లాది మంది శ్రామికులతో ఉన్నామని చిక్కురు బ్రక్కురుగా అర్థమయ్యింది. మోసకారి, దగుల్బాజీ దోపిడి దారులేకాదు, తమకోసం నిలబడి - తమతో కలిసి పోరాడే వాళ్లున్నారు. అనే సంగతి కార్మికులకు తెలిసింది.    వాళ్లు తమను అలాయి బలాయి తీసుకుంటండ్లు - ఆ స్పర్శ ఈ మీటింగుతో కార్మికులందరికి అనుభవంలోకి వచ్చింది.

 

                                                                        19

 

            పాలవాగు కొత్త గుడిసెలకు వెళ్లే దారి పెద్దరోడ్డుకు కలిసే చోట దాదాపు నూరు మంది ఆడవాళ్లు బిందెలు, కుండలు పట్టుకొని జమైఉన్నారు. కొందరు బిందెలు బోర్లేసి వాటిమీద కూర్చున్నారు. ఆదారి సింగరేణి క్వార్టర్ల మీదుగా పోతుంది. ఎడంపక్క వోర్‍మన్లు, సర్దార్లు, క్లర్కుల క్వార్టర్లు -పెద్దరోడ్డు కావలు దొరల పెద్ద క్వార్టర్లు - కుడివేపు ఎప్పుడో పడేసి గుట్టలుగా పేరుకపోయిన బొగ్గు సేల్‍  వాటి మీద పిచ్చిచెట్లు - మురికితుమ్మలు - పందుల ఆవాసాలు, క్వార్టర్లు ఆఖరయ్యేదాకా కంకరరోడ్డున్నది. కొత్తగా కట్టుకున్న గుడిసెల రోడ్డు బురద బురదగా రొచ్చు రొచ్చుగా ఉన్నది.

            మధ్యలో నిలబడ్డ రెహనా కుడిసెయ్యి అడ్డం బెట్టుకొని తూరుపు కేసి చూసి ‘‘ఏమాయ్యోల్లా అందరు తీరిపారి కూసుండ్లు. అవతల వంటలేదు. తంటలేదు. పదైనట్టున్నది’’. అన్నది.

            ‘‘మంచి నీల్లేలేవ్వు - వంటేడ - తాగటానికి నీళ్లులేక సత్తున్నమంటే’’ - సత్యవతి మొగోళ్ల మీన మన్నువడ ‘‘ఒక్క మొగోడన్న ఈడికత్తలేరు. సావనియ్యి - ఆడిముండలని గుడిసెల్ల సాపుకపన్నరు’’. మరియమ్మ చేతులార్పింది. కొత్త గుడిసెలు కట్టేటప్పుడు - గియ్యయన్ని విచారాలు చేయలేదు. అప్పటి తొందర అప్పటిది. అసలు ఉంటయో -పీకేత్తరో తెలియని దశలో కట్టిండ్లు...తెల్లారే బుల్‍డోజర్లు తోలితొక్కిద్దామనుకున్న యాజమాన్యానికి - గోదావరిఖని పౌరహక్కుల మీటింగు అడ్డమచ్చింది. పైగా కేంద్రం పరిశ్రమల మంత్రిగా ఉన్న జార్జి పెర్నాండేజే వస్తుండని తెలిసి - తికమక పడ్డరు. అసలు మీటింగే జరుగకుండ కట్టడి జేత్తామనుకున్న పోలీసులకు పరిస్థితి ఉల్టా తిరిగింది - మీటింగు ఏర్పాట్లు చూడాల్సి వచ్చింది. ఈ గొడవల్ల గుడిసెలు కూల్చేస్తే పెద్ద గొడవైతది - ఆ తర్వాత చూసుకుందామనుకుంటే - కాలరీ ప్రాంతంలో లోలోపల అగ్గి రగులుతోంది. ఇంతకాలం - యూనియన్లు - యాజమాన్యం కలిసి నడిపించిన వ్యవహారం - ఇప్పుడు పాలవాగు గుడిసెలు పీకేస్తే - కమ్యూనిస్టు యూనియన్‍తో గొడవకు దిగినట్లుయి తది. కొత్తసమస్య. ఇప్పటికైతే - ఇక్కడ కట్టినవి నూటాపది గుడిసెలు - ఇది సింగరేణంతా వ్యాపించకుండా - ఖాళీస్థలాల దగ్గర వైర్‍ పెన్సింగు వేసి - కాపలా పెట్టారు. మొత్తానికి నేల మట్టం కావాల్సిన గుడిసెలు నిలబడ్డాయి. గోదావరిఖని మీటింగు విజయమంతం కావడంతో అటు యాజమాన్యం - కార్మికులు మునుపటి తీర్గ కుదరదనుకున్నారు. గత నెల రోజులుగా - గుడిసెలు కట్టుకోవడం, మరమత్తులు చేసుకోవడం, మొగవాళ్లు సైకిళ్లకు బిందెలు కట్టుకొని ఎక్కడ పబ్లిక్‍ నల్లా ఉంటే అక్కడికిపోయి నీళ్లు తుయ్చుకున్నారు. కొంత మంద దయగల క్వార్టర్ల వాళ్లు నీళ్ల సహాయం చేసిండ్లు. వర్షాలు ఎక్కువ పడటంతోటి పరిస్థితి విషమించింది. దాదాపు వంద పది కుటుంబాలు బురదలో నీళ్లులేక అల్లల్లాడి పోయాయి.

            ‘‘ఇటుసూత్తే - మంచి ఇండ్లు వాళ్లకు - పాయకాండ్లనల్ల పూలచెట్లకు నల్ల - మనకు గీగతేంది? మనం జేసినపాపమేంది?’’ మరియమ్మ.

            రాజేశ్వరి నడిమందిల రెహనా పక్క నిలబడి అందరి ముఖాలు చూస్తున్నది.

            ‘‘పొద్దెక్కుతంది ఏం చేద్దాం?’’ రాయేశ్వరి.

            ‘‘ఎంత బతిలాడినా క్వార్టర్లోల్లు నీళ్లు బొయ్యరు’’ సత్యవతి.

            ‘‘పొయ్యిలోపట సొచ్చి నీళ్లు పట్టుకపోదామా?’’ రెహనా...

            ‘‘గంత దమ్ముంటే - ఆళ్లు ఏకమై పొల్లు పొల్లు తంతరు’’ రాజమ్మ...

            ‘‘ఇగో కొంచెం దూరం బోతే - వీళ్లందరి కోసం కట్టిన పార్కున్నది.. గాడదొరుకతయేమొ చూద్దాం’’ మరియమ్మ సలహాఇచ్చింది.

            ఆడవాళ్లందరు లేచిండ్లు - బిందెలు పట్టుకొని కుండలు పట్టుకొని పెద్ద బజారులో రెండు వందల గజాలు నడిచేసరికి కుడి చెయ్యివేపు పార్కున్నది. ఎట్లా తెల్సిందో ఏమోపార్కు గేట్లు మూసి పార్కులో పనిచేసే కులీలు వాచ్‍మన్లు గేట్లకాడ నిలుసున్నరు.

            ‘‘వీల్లింట్ల పీనిగెల్ల వీల్లు నీళ్లిచేటట్టులేదు’’ రాజమ్మ...

            ‘‘ఇక్కడ అందరికి వాళ్ల తాతల సొమ్ములు దాసవెట్టిండ్లు ఒక్క ఫిల్లరోల్లే ఎట్టి కచ్చిండ్లు - వాళ్లకు గుడిసుండద్దూ - పెండ్లాం పిల్లలుండద్దు - వాడు గర్మిపేసుల బొగ్గు తవ్వుతుంటే -గీదొంగలంత సుఖంగ బతుకుతరు’’.

            ఎవరో బావయో బంగారయ్య పాటెత్తుకున్నరు.

            ఆదారంట సైకిలు తొక్కుకుంట వస్తున్న మొగిలికి ఇంత మంది ఆడవాళ్లు బిందెలతో జమకూడడం - విచ్చిత్రంగాతోచింది. సైకిల్‍ స్టాండేసి గుంపు దగ్గర కచ్చిండు.

            ‘‘ఏమైందక్కా?’’మొగిలి

            ‘‘నీళ్లులేక - దొరుకక- ఇగో గీడికచ్చినం’’రెహనా..

            ‘‘మరి మనోళ్లంత ఏమైండ్లు?’’ మొగిలి...

            ఆడిముండలు ఏంజేత్తరో సూత్తామని - గుడిసెలల్ల సాపుక పన్నరు?’’

            మొగిలి ఆపక్కనే నిలుసున్న రాజేశ్వరిని చూసిండు. ‘‘ఇగో - గిదంత గాదుగాని - నీళ్లు, రోడ్డు, కరంటు లేని కాడ గుడిసెలు కట్టుకోమని - తలాకొంత దీసుకొని - మన దిక్కుతొంగి సూడని - ఎర్రజెండా యూనియనోల్లను అడుగుద్దాం’’ సత్యవతి...

            ‘‘ఔను - ఇయ్యల్ల తేలిపోవాలె - మనం ఎంత మొత్తుకున్నా - ఇనెటోడులేడు’’. రెహనా...

            ‘‘పాండ్లి అంగడి బజార్ల ఎర్రజెండ యూనియనోల్ల ఆఫీసులడుగుదాం’’ - రెహన దారి తీసింది.

            పెద్ద దారిగుండా ఆడవాళ్ల గుంపు బయలుదేరింది.

            ‘‘మాకు మంచినీళ్లుగావాలె’’

            ‘‘కావాలె - కావాలె’’

            నినాదాలు

            మొగిలి గుడిసెల దగ్గరికి పోయిండ్లు. నైట్‍ చేసినోళ్లు రెండో బిజిలీ పోవాల్సినోళ్లు అప్పటికే జమైండ్లు - చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. అంతగోలగోలగా ఉంది. మొగోళ్లకు ఏడిచే పిల్లలను ఎట్లా సముదాయించాలో తెలువకున్నది.

            ఇంకా నిద్రమబ్బు తొలిగిపోని షరీప్‍ మధ్యల నిలబడి నెత్తి గోక్కుంటున్నాడు.

            ‘‘ఆడోళ్లంత యూనియనాఫీసుకు పోతండ్లు’’ మొగిలి చెప్పిండు.

            ‘‘పాండ్లి - మనం కూడ పోద్దాం - ఇజ్జత్‍ పోతంది - సావోరేవో తేల్సుకుందాం - నీళ్లు గావాలె - రోడ్డు గావాలె కరంటుగావాలె’’ షరీప్‍ ఆవుళించి లుంగీ మలిసి కట్టిండు.

            మొగిలికి ఇవ్వల్ల రిటన్‍ - ఇంటికి బయటు దేరపోతుంటే వోర్‍మన్‍ పిలిసి మేనేజర్‍ మనోహరింటికి తోట పనికి పంపిండు. అక్కడ గడ్డిపీకి, మళ్లుతవ్వి, విత్తనాలేసేసరికి పదయ్యింది, వెట్టిచాకిరి...

            మొగవాళ్లు అందరు కల్సియాభైమందయ్యిండ్లు అందరు సైకిల్లేసుకొని - యూనియన్‍ ఆఫీసుకుపోయే సరికి - అక్కడ తమ ఆడవాళ్లే కాక ఇంకా మూడు నాలుగు వందల ఆడవాళ్లు - రెండు మూడు వందల స్కూలుపిల్లలు నిలబడి ఉన్నారు.

            మంది మధ్యలో నిలబడి ఇబ్రాహీం....

            ‘‘కామ్రేడ్స్ - మహిళలారా! మీకు నీళ్ళ సమస్య తీవ్రంగా ఉన్నమాట నిజమే, మేం యాజమాన్యంతో మాట్లాడుతాం - పరిష్కరిద్దాం’’.

            ‘‘నీ పరిష్కారం గంగలవోను, తాగటానికి నీళ్లు గావాలె’’ ఎవరో మందిల నుంచి అరిచిండ్లు...

            ‘‘ఇప్పటికిప్పుడు కావాలంటే ఎట్లా?’’ ఇబ్రాహీం...

            ‘‘నీళ్లులేపోతే గొంతెండిసస్తం’’ గిది బువ్వగాదు నీళ్లు...

            ‘‘మీరు తల్సుకుంటే - బోలెడు టాంకర్లున్నయ్‍ తెప్పియ్యిండ్లి’’ షరీప్‍ అరిచిండు.

            ‘‘కంపినోన్ని మీరడుగుతరా? మేమే అడుగాల్నా’’ రెహనా అరిచింది...

            ఇబ్రహీం గడ్డంగోక్కున్నాడు. ఏమాటలు చెప్పాలో అర్థంగాకున్నది. ‘‘కంపెనోడు - యూనియనోడు ఒక్కటే - పదండి పోదాం - కంపినోన్నే అడుగుద్దాం’’. ఎవరో అరిచారు. మంది కదిలిండ్లు -అదే పెద్ద దారిగుండా - అయిదు వందల మంది ఆడా, మగా, ఖాళీబిందెలతో నడుస్తున్నారు. స్కూలు పిల్లలు నినాదాలిస్తున్నారు.

            ‘‘రాడికల్స్ వర్ధిల్లాలె’’

            విధిలేక ఇబ్రహీం, కొమురయ్య, మరో నలుభైమంది యూనియన్‍ డిలిగేట్స్ ఆగుంపు ముందు నడుస్తున్నారు. ఆ గుంపు జనరల్‍ మేనేజర్‍ ఆఫీసుకు చేరుకునేసరికి పన్నెండయ్యింది. గుంపు మూడు నాలుగు వేలకు పెరిగింది. మిగతా గుడిసెల వాళ్లు కలిసిండ్లు...

            జనరల్‍ మేనేజర్‍ ఆఫీసుగేట్లు మూసిండ్లు - మంది ఆఫీసుముందు చెట్ల కింద, ఎదురుగా ఉన్న గ్రౌండులో కూర్చుండో - నిలబడో ఉన్నారు. నినాదాలు, పాటాలు...ఇంకా మంది వస్తూనే ఉన్నారు.

            మంది మధ్యలో శంకరయ్య మరో పదిమంది పాటలు పాడుకుంటా ఆడుతున్నారు. శంకరయ్య బావయ్యో, బంగారయో పాటెత్తుకున్నాడు.

            ఇంతలోనే యాభైమంది పోలీసలు, ఇద్దర్‍ యస్సైలు, సర్కిల్‍ వచ్చారు. సర్కిల్‍ లోపలికి వెళ్లాడు. ఇబ్రహిం, కొమురయ్య మరో నలుగురు డెలిగేట్సు వాళ్లతో పాటు లోపటికి వెళ్లారు. అక్కడ అప్పటికే భాస్కర్‍రావు, జనరల్‍ మేనేజర్‍ శాస్త్రి, జనరల్‍ మేనేజర్‍ పర్సనల్‍ ధర్మారెడ్డి కూర్చుండి ఉన్నారు.

            సర్కిల్‍ ఇనెస్పెక్టర్‍ జనరల్‍ మేనేజర్‍ రూంలోకి ప్రవేశించాడు. పోలీసులు రావడంతోటి బయట నినాదాలు పెరిగాయి. బిందెలు కొడుతూ ఆడవాళ్లు ‘‘మాకు నీళ్లు కావాలె’’ అని అరుస్తున్నారు. పరిస్థితి అదుపుతప్పతుందేమొ ననిపించింది.

            పర్సనల్‍ మేనేజర్‍ మోహన్‍రావు జనరల్‍ మేనేజర్‍ పర్సనల్‍ ధర్మారెడ్డి పక్కకూర్చున్నాడు ఇద్దరు ఏదో గుసగుసలాడారు. ఇంతలోనే ఆఫీసు ప్యూను రాములు అందరికి చాయబిస్కిట్లు తెచ్చాడు.

            పర్సనల్‍ మేనేజర్‍ మోహన్‍రావు మూసి ఉన్న గది తలుపు తీసుకొని బయటకు వచ్చాడు.

            బయట యస్సై శాయిలు, వేల్పేరు ఆఫీసర్‍ శంకరలింగం గాభరాగా ఎదురు చూస్తున్నారు.

            ‘‘సార్‍ పరిస్థితి అదుపు తప్పేట్టున్నది. గోడలు ఎక్కిలోపలికి వస్తరేమొ?’’ శంకరలింగం.

            ‘‘సార్‍ సర్కిల్‍సాబును పిలుస్తరా?’’యస్సైశాయిలు.

            లోపలున్న సర్కిల్‍ బయటకు వచ్చిండు.

            నలుగురు కలిసి జియమ్‍ఆఫీసు బయటకు వచ్చారు.

            బయటలొల్లి, నినాదాలు, ఎప్పుడుచేరారో సోడా బండ్లకేచుచప్పుడు దూరంగా రోడ్డుమీద ట్రాపిక్‍ ఆగిపోయి నట్లున్నది...

            ఇంతలోనే ఎవరో ఒక టేబుల్‍ తెచ్చివేశారు.

            ఆ టేబుల్‍ మీద అనుకోకుండానే - పర్సనల్‍ మేనేజర్‍మోహన్‍రావు ఎక్కాడు. రెండు చేతులెత్తి - ‘‘శాంతి శాంతి’’ అన్నాడు. ఏంచెప్పగలడోనని - అంతా నిశబ్దమయ్యారు.

            ‘‘ఒక పద్దతుంటది. ఇట్లా చెయ్యద్దు - ఇప్పటికిప్పుడు సింగరేణి యాజమాన్యం నీళ్లు, యివ్వడం ఎట్ల సాధ్యమౌతుంది’’

            ‘‘వచ్చిండురో బుడ్డరకాం. మరి అదే సింగరేణిల కొంత మందికి క్వార్టర్లు ఎట్లిచ్చిండ్లు?’’ రెహనా అరిచింది.

            ‘‘వాళ్లంతా అధికారులు. అది కంపినీ రూలు’’ మనోహర్.

            ‘‘అయితే ఆ అధికార్లతోనే బొగ్గు తవ్విచ్చుకపో మా వోళ్లనెందుకు ఈడికి తెచ్చిండ్లు’’ - మరియమ్మ

            ‘‘చట్ట ప్రకారం జీతాలిస్తున్నం కదా! ఇప్పుడికిప్పుడు ఇండ్లు గావాలంటె ఎట్లా?’’ మనోహర్‍...

            ‘‘ఇండ్లుగాదు మొగడా! నీళ్లు గావాలంటన్నం, మేం కట్టుకున్న గుడిసెలకు రోడ్డు గావాంటున్నం’’ - షరీప్‍...

            ‘‘కరంటుగావాలంటున్నం’’ సత్యవతి...

            ‘‘కావాల్సిందే - కాని హెడ్డాఫీసు పర్మిషన్‍ కావాలె - ఆలోచిస్తం. మీరు ప్రశాంతంగా వెళ్లిపోండి’’ మనోహర్‍ ‘‘పోకపోతే ఏంచేస్తరు?’’ చాలా మంది అరిచిండ్లు. యస్సై మైకందుకొని’’ ఇది చట్టవిరుద్దం. లాఠీచార్జ్ చెయ్యవల్సివస్తుంది’’ అరిచాడు.

            ‘‘కొట్టుండ్లి - నీళ్లులేక సచ్చే బదులు ఈడనే సత్తం ’’ ఆడవాళ్లు మొత్తుకున్నరు. ప్రజలంతా దగ్గరి దగ్గరికి వచ్చారు. పోలీసులు కంపినీ గార్డులు చుట్టూ మూగిండ్లు - ఏదో జరుగగలదని - అందరు గాభరా పడ్డారు. కొందరు పోలీసుల చేతుల్లో లాఠీలున్నాయి - తుపాకులున్నాయి. కంపినీగార్డులు చేతుల్లో లాఠీలున్నాయి.

            ఆడవాళ్లు, పిల్లలు బొగ్గు పెళ్లలు చేతుల్లోకి తీసుకున్నారు. అప్పటికి మధ్యాహ్నం రెడు దాటి పోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

            జియమ్‍ ఆఫీసులోపలి నుండి ఇబ్రహీం, కొమురయ్య బయటకు వచ్చారు.

            అదే టేబుల్‍ మీద ఇబ్రహీం ఎక్కి...

            ‘‘కామ్రేడ్స్! దాదాపు తొంభైవాతం కార్మికులు - గుడిసెల్లో తప్పనిసరైన పరిస్థితిలో బతుకుతున్నరు. అంటే సింగరేణి వ్యాపితంగా అరువై వేల కార్మికుల సమస్య - అన్నిచోట్ల ఇవే సమస్యలున్నాయి. సిగరేణి యాజమాన్యంతో మేం కామ్రేడ్‍ శేషగిరిరావు మక్దుం మోహినోద్దీన్‍ల నాయకత్వంలో యాభయేండ్లనుంచి అప్పటి నుంచి కొట్లాడుతున్నం’’.

            ‘‘ఎక్కడేసిన గొంగడక్కన్నే ఉన్నది. గీ భారతమద్దు మాకు నీళ్లుగావాలె’’ అరుపులు కేలు..

            ‘‘సింగరేణి గురించి పోరాటాలగురించి తెలియని వాళ్లు - బాధ్యతలేని వాళ్లు మీటింగులు పెట్టి ఎక్కించిండ్లు అట్లగాదు - లోపట మా నాయకులు మాట్లాడుతండ్లు’’

            ‘‘ఎవలో చెప్పుతేనే నీళ్లు తాగుతన్నమా? ఎవలో చెప్పుతనే తింటన్నమా? ఏర్గవోతన్నమా? అంటే నువ్వనే మాట్లేందయ్యా కామ్రేడ్‍ - మీరంత గొర్రె మంద అనేగదా?’’ షరీప్‍ అరిచిండు.

            ‘‘నువ్వు తీరిపారున్నవ్‍ - మేం ఆకటున్నం. పొయ్యి చెప్పుపో - అయ్యా పోలీసోల్లు మేం భూములు, జాగలడుగుతలేం - నీళ్లయ్యా - నీళ్లు - గతుపాకులు పట్టుకపోయి మేనేజర్‍ను బెదిరిచ్చి నీళ్లు తీసుకరాపో’’

            ఇబ్రహీం ఏదో అరుస్తూనే ఉన్నాడు. అందరుబావయ్యో బంగారయ్యపాటెత్తుకునురు.

            యస్సై సాయిలు ‘‘సార్‍ ఏంచేద్దాం?’’ సర్కిల్‍తో గుసగుసలాడిండు.

            ఏం చెయ్యలేమయ్యా - ఆడవాళ్లు, స్కూలు పిల్లలున్నరు. పైగా డియస్‍పిలేంది ఆర్ డి వో ర్యాంకు వాళ్లు లేంది ఏమి చెయ్యలేం - మనం లాఠీచార్జుచేస్తే -వాళ్లుమంటర మంటరున్నరు. వాళ్లు రాళ్లు రువ్వుతరు -పైరింగ్‍ ఆర్డర్‍ యిచ్చేటోడు లేడు’’

            అనుకుంటనే మళ్లీ లోపటికి వెళ్లాడు. అప్పటికే జనరల్‍ మేనేజర్‍ శాస్త్రీ ముఖమంతా ఎర్రగా చేసుకొని అరుస్తున్నాడు.

            ‘‘ఇది బిగ్‍ ఇస్యూ - మనం నీళ్లిస్తే - రోడ్లెయ్యి మంటరు. రోడ్లేస్తే కరంటు పెట్టుమంటరు. వీధుల్లో కరంటు పోల్లేస్తే - గుడిసెలకు కనెక్షనియ్యిమంటరు. జాగా చూపు మంటరు. గుడిసెలకు డబ్బులివ్వుమంటరు. మనకు ఇలాంటి సవాలక్ష పనులకు ప్రోవిజన్సులేవు. సింగరేణి వ్యాప్తంగా చిన్నవో పెద్దవో అరువై వేల గుడిసెలున్నయి. వీటన్నిటిగురించి - యండి లెవల్ల - ఆలోచించాలె - నెత్తిమీది కచ్చేదాకా పర్సనల్‍ డిపార్టుమెంటు ఏం చేస్తున్నట్టు...’’

            ‘‘సార్‍ కూల్‍ - సింగరేణింటేనే సమస్యలు - ఇంత మంది లేబరున్న కాడ సమస్యలుంటాయి కదా?’’ భాస్కర్‍రావు.

            శాస్త్రి పక్కనే గల బాత్‍రూంకు వెళ్లి - మొఖం కడుక్కొని వచ్చి ప్రెస్‍గా కూర్చున్నాడు...

            ఈలోగా సర్కిల్‍ ఇన్‍స్పెక్టర్‍ అతని పక్కకు వెళ్లి నిలుచున్నాడు. జియం, పర్సనల్‍ ధర్మారెడ్డి సర్కిల్‍ కలిసి అతని రూంలోకి వెళ్లారు.

            ‘‘ధర్మారెడ్డి సాబ్‍ - పరిస్థితి అదుపు తప్పుతోంది. మేం ఏంచేయలేకున్నాం. డియస్‍పి - ఆర్‍డివో రావాలంటే ఇంకా అరగంట పడుతుంది’’. సర్కిల్‍...

            ‘‘అదే నయ్యసమస్య’’

            ‘‘మీరు ఎన్నో చిట్కాలు చేస్తరు. దీందేమున్నది - ఏ కాంట్రాక్టరుకు చెప్పినా ఇప్పుడు ట్యాంకర్లతోటి నీళ్లు సప్లైచేస్తరు. ఆ తరువాత ఇది మేజర్‍ పంచాయితీ సర్పంచ్‍కు చెప్పితే నల్లాలు, రోడ్డు, కరంటు పెట్టిస్తడు. అది సర్పంచ్‍ మీదికెళ్లి పోతది’’. సర్కిల్‍ సలహాయిచ్చిండు.

            మనోహర్‍ రెడ్డి ఔననలేదు కాదనలేదు.

            మరో పది నిమిషాలకు కామ్రేడ్‍ భాస్కర్‍ రావు బయటకు వచ్చిండు. అప్పటికే వాళ్ల యూనియన్‍ డెలిగేట్సు, మెండర్లు చుట్టు ముట్టిండ్లు నిమిషాలమీద చిన్న స్టేజీ లాంటిది ఏర్పాటు చేసిండ్లు.

            అ పక్క ఇబ్రహీం - ఈ పక్క కొమురయ్య నిలుచుండగా భాస్కర్‍రావు నవ్వు ముఖంతో అందరికి చేతులూపిండు మంటర మంటర ఉన్న జనానికి ఇదేమి అర్థంకాలేదు.

            ‘‘కామ్రేడ్స్! ఎన్నో పోరాటాలు చేసి గెలిచిన మన యూనియన్‍’’...

            ‘‘నమ్మినానబోత్తె పుచ్చి బుర్రలైనయట’’ - దగ్గరలో ఉన్న సత్యమ్మ - ఆమె పక్కరాజేశ్వరి - ఆపక్క రెహనా - మరియమ్మ...

            కాసేపు అదీ ఇదీ మాట్లాడి ‘‘పాలవాగు పక్కగుడిసెల దగ్గరికి నీళ్లటాంకులు బయలు దేరినయ్‍’’ అన్నాడు.

            పెద్ద పెట్టున కేకలు లేచినయ్‍...

            ‘‘మరి దారి, కరంటు’’ రెహనా...

            ‘‘అన్నీ వసతులు మన గ్రామ మేజర్‍ పంచాయితీ సర్పంచ్‍ పదిరోజుల్లో కలుగ జేయడానికి ఒప్పుకున్నాడు. ఇది మన యూనియన్‍ ఘణ విజయం’’.

            ‘‘అరె మనం మేనేజుమెంటుతోని కొట్లాడ్తె గా సర్పంచ్‍ ఎక్కన్నుంచచ్చిండ్లురా!’’ ఎవరో గొణిగిండు.

            మొగిలికి ఈ వ్యవహారం ఏమి అర్థంకాలేదు.

            ‘‘లేనత్త కంటె గుడ్డత్త నయం’’ అన్నాడెవడో - ఎక్కన్నుంచో దప్పులు వచ్చినయ్‍ - దండలు వచ్చినయ్‍ - భాస్కర్‍రావుకు బొట్లు బెట్టిండ్లు - జీబచ్చింది. జీబుపైటాపు తీసేసిండ్లు - భాస్కర్‍రావు రెండు చేతులు జోడించుకొని నిలబడ్డడు. అతనిపక్క ఇబ్రహీం, కొమురయ్య నిలుచున్నరు.

            ఎర్రజెండాలు రెపరెపలాడినయ్‍

            ‘‘ఏఐటియుసి’’ అరిచారు

            జిందాబాద్‍ అన్నారు ‘‘ఎర్రజెండా’’

            జిందాబాద్‍, భాస్కర్‍రావు జిందాబాద్‍ నినాదాలు మారుమోగాయి.

            మొగిలి రాజేశ్వరిని సైకిల్‍ మీద ఎక్కించుకున్నాడు. ఊరేగింపు నడుస్తోంది. పెద్దరోడ్డుకు ఈపక్క ఆపక్క కార్కికులు, జనం నిలబడి చూస్తున్నారు. ఆ జనంలో కాంగ్రెసు యూనియనోల్లు, సారలి గుండా గ్యాంగు ఉన్నారు. వాళ్లు పండ్లు గొరికారు.

            మొగిలి, రాజేశ్వరి వచ్చేసరికి నీళ్ల ట్యాంకులు బురదలోనే గుడిసెల్లోకి వచ్చాయి.

            ఇద్దరు కలిసి నీళ్లు పట్టుకున్నారు. ఆ నీళ్లతోనే స్నానాలుచేశారు.

 

( తరువాయి భాగం వచ్చే సంచికలో )

 

ఈ సంచికలో...                     

NOV 2020

ఇతర పత్రికలు