నవలలు

నవలలు

సైరన్ నవల  రెండవ పార్ట్ –  ఆరవ   భాగం

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)                                                                                                                                     

                                                                             22

 

            రాత్రి పది గంటలకు మొగిలి సైకిలేసుకొనచ్చిండు. శంకరయ్యను పక్కకు తీస్కపోయి - ‘‘అన్నా! ఎర్రజెండోల్లు డెలిగేటు గంగరాజుం ఎగేత్తే ముప్పైనలుబైమంది తాగి బాయి మీనికి పోతండ్లట - షరీపన్న మనలను సుత రమ్మన్నడు’’ అన్నడు. చంద్రకళ మొగిలి గావర చూసి ‘‘ఏంది పిలడా! ఏమన్న గడబెడా! ఇంతకూ తిన్నవా? రాయేశ్వరి మంచిగున్నదా?’’ అడిగింది. ‘‘గాలి గురించి బాయి మీద గడబిడ జరిగింది. లోడర్లంత పని బందు వెట్టిండ్లు - పోశన్న నీకెరికే గద మా బాయి మీద దొర మనుసులకు మీ ఎర్రజెండోల్లకు పడది... రెండు షిప్టులు బందయినయి. మూడోషిప్టుకు కమునిస్టు గంగరాజుంను తాగవోయించి  నడిపిత్తనంటడ్లట - బాయిదాక పోయత్తం’’ శంకరయ్య బయలుదేరుతూ...

            ‘‘పొయిరాండ్లి -అసలే రోజులు మంచిగలేదు - జేగర్త - మొగిలీ - నువ్వే తొక్కు సైకిల్‍ - శంకరన్న ఒక్క పెగ్గేసుకున్నడు’’ పోశెట్టి...

            ‘‘ఎహె గదెంత -అరిగిపోయింది’’ శంకరయ్య... మార్గమధ్యలో శంకరయ్య లక్ష్మి కడుపుతోనున్న సంగతి రెకులషెడ్డు కట్ట సంగతి చెప్పిండు.

            మొగిలి శంకరయ్యను అలాయి బలాయి తీసుకున్నడు. ‘‘చెలో! వదిన మందిల గల్సింది. దునియ కగ్గితల్గ గిసోంటి బాధ చెప్పుకోరాదు. ఇనరాదు’’ మొగిలి.

            ఇద్దరు బాయిమీదికి చేరే సరికి పదకొండయ్యింది. ఎర్రజెండోల్లు ముప్పయిమంది ఊగుతండ్లు - షరీప్‍ వాళ్లు అంత రాత్రి యాబయి మంది వస్తరనుకోలేదు. బాయి బందయిన వార్త తెలిసి మూడోషిప్టువాళ్లు ఎవరు బాయిమీదికి రాలేదు. గీ పీడలెందుకని మొఖద్దమ్‍లు రూంలనుంచి కదులలేదు.

            ‘‘మేం అందరి కోసం కొట్లాడ్తన్నం. గాలి మీకు అవసరమే. ఎర్రజెండ పార్టీ పేరు చెప్పి - మీరేమాకు నాయకత్వం వహించాల్సింది. మేనేజుమెంటు తొత్తులుగ - తు మీ బతుకు సెడ మందిలో నుండి ఎవరో!

            ‘‘ఎర్ర జెండ ఎలిసిపోయి తెల్ల జెండయ్యింది’’ కార్మికులు గొనిగిండ్లు... ఇంతలోనే కాంగ్రెసు పార్టీ వాళ్లు ఇరువై మంది దాకా వచ్చిండ్లు. ‘‘ఎవలన్న బాయి దిగిండ్లో -అగో బొగ్గు కుప్పల కింద బొంద వెడ్తం’’ మల్లయ్య అరిచిండు.

            మొత్తానికి పన్నెండు గంటలకు అందరుబాయిల దిగకుండనే వెనుదిరిగిండ్లు.

            మూడు రోజులు బాయి నడువలేదు. బాయి కాడికి ప్రతిషిప్టుకు షరీప్‍, శంకరయ్య, మొగిలి మరో ముప్పైమంది కార్మికులు షిప్టుల వారిగా కావలున్నారు.

            నాలుగోనాడు పదిగంటలకు నోటీసు బోర్డు మీద పెద్దగా తెలుగులో...

            ‘‘మానవతా దృక్పథంతో గాలి, వెలుతురు, రేలింగు సమస్యలన్ని వెంటనే సరి చేయడానికి యాజమాన్యయం ఒప్పుకుంటున్నది. కార్మికులు రెండవ షిప్టునుండి తమ విధులకు హాజరు కావాల్సిందిగా ఇందు మూలకంగా కోరడమైనది’’.

            మల్లయ్యను భుజాలమీద ఎత్తుకొని షరీఫ్‍ గ్యాంగు పెద్ద ఊరేగింపు తీశారు. దప్పులు - శంకరయ్య బృందం ఆటపాటు...

            అన్ని యూనియన్లు విజయంమనదే విని ఊదరగొట్టాయి. మీటింగులు పెట్టాయి.

            రెండోషిప్టునుండి బాయి సైరన్‍ కూసింది. కార్మికులు గనిలో ఎప్పటిలాగే దిగారు.

            ఆ రాత్రి బాయి మైసమ్మ గుడికి, ఊళ్లో ముఖ్యప్రాంతాలల్లో పోస్తర్లు పడ్డాయి’’.

            ‘‘సిగరేణి చరిత్రలో మొదటి సారిగా తమ స్వంత శక్తితో యాజమాన్యంతో పోరాడి - కనీసవసతులైన, గాలి, వెలుతురు, రేలింగ్‍ సమస్యలను సాధించుకున్న కార్మికులకు విప్లవ అభినందనలు -రాడికల్స్’’

            కార్మికులు, పిల్లలు, ఆడవాళ్లు, వ్యాపారస్తులు గుంపులు గుంపులుగా విరగబడి పోస్తర్లను చదివారు. ఈ రాడికల్స్ ఎవరో? ఎవరికి చైతన్యాన్ని బట్టి వాళ్లు అర్థం చేసుకున్నారు.

 

                                                                        23

 

            తెలతెల వారుతుండగా, బట్టలన్నీ మాసిపోయి - ముఖమంతా పీక్కపోయి రఘు వచ్చిండు.

            లక్ష్మి నీళ్ల బిందెతో ఎదురచ్చింది.

            ‘‘అయ్యో అన్న ఎట్లనో తడక తడకైనవు - పాణం మంచిగలేదా?’’ లక్ష్మి... శంకరయ్యకు ఆ దినం సెలవు రోజు - గుర్రుకొట్టి నిదురపోతండు.

            ‘‘అయ్యో సెల్లె గింత సలిల నీళ్లు మోత్తున్నవ్‍’’ లక్ష్మి కడుపుకేసి చూస్తూ...

            ‘‘ఏంజెయ్యల్నన్న - అక్క వాళ్లింటికి రమ్మన్నది. గిప్పుడే పోయి ఆళ్లమీద పడి తినుడెందుకని ఇంట్లపని చేస్కోపోతే ఎల్లది గదా!’’

            ‘‘మరి శంకరయ్య బావను గీనీళ్లకన్న తోలక పోయినవా?’’

            ‘‘నీ కెర్కలేనిదేమున్నదన్న. నల్లకాడ ఆడోల్లు నలుగురు నాలుగు మాటలంటరు. ఇంట్ల పనంత అయినే చేత్తండు. నాకన్న ముందే లేత్తండు. ఇయ్యల్ల పండనియ్యని నేనే లేపలేదు’’.

            నీళ్ల తిప్పలు తప్పలేదా?’’

            ‘‘మునుపటంత తిప్పలు లేదు. పదిగుడిసెలకో నల్ల బెట్టిండ్లు.  కావాల్సినన్ని నీళ్లు దొరుకుతన్నయ్‍...సత్తవడుత గోళెం నింపుతె’’

            ‘‘నల్లెక్కడ సూపెట్టు’’

            రెండు ఇండ్లావల - రఘు చూసివచ్చిండు. నల్లా ఉట్టిగనే పోతంది.

            ‘‘అయినను లేపుతనన్న’’

            ‘‘వద్దు. మంచిపని చేసిండ్లు. రేకులేసిన మేస్త్రీ పనిమంతుడు. బాగ గట్టిండు. మొదలు బావపడుకున్న అర్రకు తలుపువెట్టు’’ అన్నాడు.

            లక్ష్మి వద్దన్నా వినకుండా బాకెట్టుబిందె తీసుకొని పావుగంటలో రెండు సింమెంటు నీళ్ల గోళాలె - నింపిండు. తన బట్టలు తుక్కున్నడు. స్నానం చేసిండు. అప్పటికి శంకరయ్య లేచి సిగ్గుపడుతూ - ‘‘అయ్యో కామ్రేడ్‍! నన్ను లేపద్దా! నెవ్వెందుకు నీళ్లు మోసినవ్‍?’’

            ‘‘కామ్రేడ్‍!’’ రఘు ఒత్తి పలికిండు.

            అప్పటికి లక్ష్మి ముగ్గురికి చాయ్‍ తెచ్చింది.

            ‘‘సర్సల్‍గున్నది. కామ్రేడ్‍ లక్ష్మి చాయ బాగున్నది’’ రఘు లక్ష్మి కలవెల పడ్డది. ఒళ్లంతా ఏదో పాకినట్టనిపించింది.

            ‘‘అయో అన్నా - నన్ను కామ్రేడ్‍!’’

            ‘‘అన్నకాదు. కామ్రేడ్‍’’ - అన్నకన్నా - తండ్రికన్నా - అన్నిబందుత్వాల రక్త సంబంధం, కులం, మతం, డబ్బు - వీటితో కూడుకున్నయి. అంటే వ్యక్తిగతమైనవి - ఒక్క కామ్రేడ్‍ రాజకీయమైంది. ప్రపంచ వ్యాపితమైంది వీటన్నిటి కన్నా ఉన్న తమైంది’’.

            ‘‘కామ్రేడ్‍!’’ లక్ష్మి తడబడ్డది.

            తను తెచ్చిన మూడు పుస్తకాలు ‘‘అమ్మ’’ లక్ష్మికిచ్చిండు. లక్ష్మి వనికే చేతులతో పుస్తకాన్ని తీసుకొని వొళ్లో పెట్టుకున్నది. చంటి పిల్లను తడిమినట్టు తడిమింది. గాలికి వంగిన చెట్టు బొమ్మ పుస్తకంమీద.

            ఇంకో రెండు పుస్తకాలు ఉక్కుపాదం’ ‘జననాట్యమండలిపాటలుశంకరయ్యకిచ్చాడు.

            శంకరయ్య ఆ పుస్తకాలను అపురూపంగా అందుకున్నాడు. ‘‘కామ్రేడ్‍! గుట్టలల్ల తిండిలేక నకనకలాడి పోయినం, పుట్నాలు, బిస్కెట్లే - పైగా నడక - మీరుంటరో ఉండరని -కామ్రేడ్‍ లక్ష్మిని చూసే సరికి పాణం పడ్డది అబ్బ అడివిల ఏంచలి?...కాలేరి మీద ఎచ్చగున్నది’’

            ‘‘అయ్యో ఉడుకు నీళ్లు పెడుతుగదా! సన్నీళ్లే పోసుకున్నవ్‍ - బొగ్గుపొయ్యి అంటేస్త’’ - లక్ష్మిలేచింది.

            శంకరయ్య లక్ష్మిని వారించి - బొగ్గుపొయ్యి అంటించిండు. లక్ష్మి పూరీలు చేస్తుంటే రఘు కాల్చిండు. దడిలో నుంచి లేత సొరకాయ తెచ్చి పెసరుపప్పుతో కలిపి రఘే కూర చేసిండు.

            ‘‘పప్పుతినక...మొఖం వాచిపోయింది’’.

            అప్పటికి ఎనిమిదియ్యింది. ‘‘తొమ్మిదింటిదాకా మాట్లాడుకుందాం మీ నుంచి వినాల్సినవి చాలా ఉన్నయి. తొమ్మిదింటికి కామ్రేడ్‍ శంకర్‍ బయటికి పోయి చిన్న పని చేసుకరావాలె - అన్నింటికన్నా ముఖ్యం. కామ్రేడ్‍ లక్ష్మి మా చిన్నాయిన బిడ్డ - నేను అన్నను...కంట్రాక్టర్‍ను - ఎవరన్నా అడిగితె చెప్పాలె...’’

            ‘‘దబ్బన వాళ్లు ఇంకా ఎక్కువడిగితే లక్ష్మి మనం సందియ్యద్దు - ఎక్కువ చెప్పద్దు’’

            ‘‘అట్ల నవ్వి ఊర్కొవడమే’’ రఘు.

            ‘‘కామ్రేడ్‍ లక్ష్మి, నీ చదువు, మీ బస్తీలో, మొగిలి వాళ్ల బస్తీలో నీకు తెలిసిన విషయాలన్ని చెప్పు’’?

            లక్ష్మి మొదట తను దవఖానకు పోయిన దగ్గర మొదలేసి - దవాఖానలో పొగరు బోతు కాంపౌండర్లు - పట్టించుకోని డాక్టర్లు - రోగాలు, మందులు - అన్ని చెప్పింది - తరువాత బయటకు దొడ్డికి పోవడం కష్టం రేకుల షెడ్డు కట్టాల్సి రావడం - అవన్నీ చెప్పుకచ్చింది. మరింక ఏమి చెప్పాలో తోచలేదు. మొత్తం ఊడ్చినట్టు అయిపోయినయ్‍ అరే తనకు గింతే ఎరుకా! గియ్యన్ని తన సంగతులే - తను తన చుట్టే గిరగిర తిరుగుతున్నట్టు లక్ష్మికి మొదటి సారిగా అర్థమయ్యింది.

            ‘‘మంచిగ చెప్పినవ్‍ కామ్రేడ్‍!’’

            ‘‘నాకెందుకో - మంచిగనిపిస్తలేదు. మీరంత గిట్ల తిరుగుతంటే మేం ఇండ్లు, పిల్లలని - మా సుట్టు మేమే తిరుగుతున్నం’’ శంకరయ్య...

            ‘‘నిజమే కామ్రేడ్‍! నువ్వు చేసేపని నువ్వు చేస్తున్నవ్‍ - పనిమొదలయ్యింది - బాయిపని చేస్తన్నవ్‍, నీరెక్కలకష్టం. పైగా ఆ కామ్రేడ్‍ ఉత్త మనిషి కాదు. అవును. కొత్తింట్ల కచ్చేటప్పుడు - బాగనే కర్సయ్యిందా?’’

            ‘‘లేదు కామ్రేడ్‍ - మా సడ్డకుడు ధూందాంగ చేసిండు. బాపనోడు పాలుపొంగిచ్చుడు’’

            ‘‘అయినే పేరు పోశెట్టికదా! అయినే కమ్యునిస్టు యూనియన్ల డెలిగేటుకదా!’’

            ‘‘పేరుకే - తెల్ల కమ్యూనిస్టులు - అయితే మా అన్న రెండిటి మధ్యలున్నడు. ఆడికి మా వదినె అన్నది - గియ్యన్ని అవసరమా?అని’’

            ‘‘చిత్రంగా ఉన్నదే గీ పట్టింపులన్ని మహిళలకే ఉంటయనుకున్న’’ లక్ష్మి కేసి ముసిముసి నవ్వుకుంట చూస్తూ.

            ‘‘కామ్రేడ్‍ మమ్ములను తక్కువనుకుంటండ్లు’’ లక్ష్మి.

            ‘‘లక్ష్మీ గవ్వన్ని వద్దన్నది. నాకెప్పటినుంచో ఉండే అందరికి బట్టలు తీసుకున్న.’’

            ‘‘కాదు కామ్రేడ్‍! లోకరివాజు’’ రఘు.

            ‘‘రివాజులన్ని మొగోళ్లు పెట్టినయే - మాకు ఏదన్న సొమ్ము ఉంటే గదా రివాజు సొమ్మున్నోడు సోకులవడుతడు ధూంధాంచేత్తడు’’ లక్ష్మి. కరక్టు కామ్రేడ్‍ రీతి రివాజులన్ని స్వంతాస్థి సూపెట్టుకోవటానికే - నాకు కూడా నువ్వు చెప్పేదాక తెలువదు. మంచి పాయింటు’’ రఘు.

            శంకరయ్య గాలి, వెలుతురు సప్లై కోసం జరిగిన బందుగురించి చెప్పిండు.

            ‘‘అది సరే ఇప్పుడు నీ అంచనా ప్రకారంగా పరిస్థితి ఎట్లా ఉన్నది?’’

            ‘‘కార్మికులు మసులుతండ్లు. సరైన నాయకత్వంలేదు. యూనియన్ల మీద నమ్మకం పోయింది. కోపమున్నది గని - పద్దతి లేదు. ఏమి చెయ్యాలో తెలియదు. ఎట్ల చెయ్యాలో తెలువదు’’.

            ‘‘అంటే?’’

            ‘‘నాకు ఒక రోజు లీవుగావాలనుకుందాం - సిన్న సంగతి - లీవలు నాయి క్లర్కుల సొమ్ముగాదు. మ్యాన్‍వేక్లర్కుల దగ్గరి నుండి జీతాలు కట్టేదాక తిరుగాలి - పిచ్చిసంతకాలు’’

            ‘‘మరి ఏంజెయ్యాల్నంటవు?’’

            ‘‘కార్మికులకు రావాల్సినవన్ని - లెక్కప్రకారంగా, మర్యాదతోటి యివ్వాలె - వాళ్ల తాత సొమ్ముగాదు....వాళ్లను నౌకరి బెట్టిందే గందుకాయె’’ వాళ్లే కార్మికుల కందుబాటులో లీవు కార్డులు పెట్టాలే...

            ‘‘మరి యూనియన్లు గీచిన్న విషయం పట్టించుకోకుండా ఎందుకున్నట్టు?’’

            ‘‘గిదొక్కటే కాదు.... లక్షా తొంబై - పిడుక్కి బియ్యానికి లొల్లి చేత్తే గాని కాదు.  ఆ లొల్లి ముదురుతది. మన చేతుల లేకుంట పోతది. గిది దుర్మార్గం - అని తెలిసి కోపంతోటి రగిలి పోతండ్లు. కని - ఒక పద్దతిగా ఎక్కడ మొదలు పెట్టాల్నొ - ఎక్కడ ఆగన్నో తెలవది - బస్తీలల్ల కమిటీలు పెట్టినం. కావలుంటన్నం - ఇప్పుడు సారలి గ్యాంగుకు బస్తీ లోల్లకు శానా కిరికిరి నడుత్తంది. ఎప్పుడో పెద్ద లొల్లయితది.

            మోహనన్న మురళన్న అందరిని కలుత్తండ్లు - మొన్న యాపలకాడ కలెవడ్డరు. మన షరీపన్నకు సానా సంగతులు తెలుసు - మమ్ములను కూసుండ వెట్టి ఎనుకట తెలంగాణా సాయుధ పోరాటం, శేషగిరి రావులు నడిపిన కార్మికుల పోరాటాల గురిచి చెప్పిండు ఒకనాడు.’’

            లక్ష్మి శంకరయ్యకు గియ్యన్ని సంగతులు తెల్సినందుకు విస్తు పోయింది. ఉత్త పాటలు పాడుతండుగని - ఇంకా అమాయకుడే అనుకుంట్నుది.

            ‘‘కామ్రేడ్‍! మీరే మంటారు?’’ రఘు లక్ష్మినడిగిండు. ఆ దినం గోదావరిఖనిల గంగన్న చెప్పలేదా? బాయిల           సంగతులు, బస్తీల సంగతులు, యూనియన్ల సంగతులు - పైసలు, దందాలు సంగతులు’’ ఆడోల్లకు శాన తిప్పలైతంది. సారలి         వాళ్లు సంపుక తింటండ్లు. లక్ష్మి....

            ‘‘అదే మనకు చాలా సమస్యలున్నయి. అవ్వన్ని తప్పకుండా మనం సాదించవల్సిందే -అవ్వన్ని పరిష్కరిస్తే ఇంకా సమస్యలు రావా?’’ సారలి గ్యాంగు దొరలకు వ్యాపారస్థులకు, యాజమాన్యానికి లోడ్‍చేసిన తుపాకి - అన్నడు కామ్రేడ్‍ నాగయ్య’’

            వస్తయి -ఎందుకు రావు - గంగన్న పూనుకొని పాయఖాన కట్టేదాకా మొగోళ్లకు గసంగతే ఎరుకలేదు’’ మేం సుత గంత తిప్పలువడ్డంగని పాయఖానలు గావాలని లొల్లిసెయ్యలే - లక్ష్మి...

            అప్పటికి తొమ్మిదయ్యింది. రఘు, శంకరయ్యను బయటకు పంపిండు.

            లక్ష్మి. రఘు మాట్లాడుకుంట వంట చేసిండ్లు. శంకరయ్య కవరులో తెచ్చినవి రఘు విప్పిచూసిండు. క్రాంతి పత్రికలు పది, అయిదు లెనిన్‍ ఏమిచేయాలి పుస్తకాలు కొన్ని ఉత్తరాలు.

            భోజనం అయిన తరువాత రఘు ఏదో రాసుకుంటూనే ఉన్నాడు. సాయంకాలం ఆరు గంటలకు ఆయన రాతపని పూర్తయ్యింది. శంకరయ్య చాయ్‍ పెట్టుక వచ్చిండు.

            ముగ్గురు కూర్చున్నారు. లక్ష్మి పీట మీద కూర్చున్నది. రఘు శంకరయ్య మంచంలో కూర్చున్నారు.

            ‘‘కామ్రేడ్స్ కాంత్రి పత్రిక చదవండి. మీకు చాలా విషయాలు అర్థమైతాయి... పల్లె టూళ్లలో ఇప్పుడు డిప్పుడే రైతాంగం, రూతుకూలీలు సంఘాలు పెట్టుకొని దున్నేవానికు భూమి, వెట్టిచాకిరి రద్దు, కూలిరేట్ల పెంపు, పాలేర్ల జీతాల పెంపు లాంటి విషయాల మీద మీలాగే పోరాడుతున్నారు. దొరలు పోలీసులు కలిసి నవంబరులో సిరిసిల్లాలో తిమ్మాపూర్‍ గ్రామంలో లక్ష్మిరాజంను, చంపారు. జగిత్యాలకన్నపురంలో పోశెట్టిని దొరల గుండాలు చంపారు. రఘు ముఖంలో విశాదం, ఆవివరాలన్ని క్రాంతి పత్రికలో ఉన్నాయి.అంటే ఏమిటన్నమాట - జనం దోపిడి, పీడన భరించలేక తప్పనిసరై పోరాటాలల్లోకి వస్తారు. కాని దొరలు, యాజమానులు ఊర్కొరుకదా! అదీ సంగతి.’’

            ‘‘కామ్రేడ్‍! మరెట్ల?’’ ఇక్కడ సుత దంచుతరా? లక్ష్మి...

            ‘‘వాళ్లు చంపనిది ఎన్నడు? ఆకలితో చంపుతరు. వాళ్లు దోచే ప్రతిరూపాయిమీద మన నెత్తురు అంటే ఉంటుంది.’’

            శంకరయ్య మాట్లాడలేదు. ఆయన మనుసులో ఇలాంటిదేదో రూపుకడుతూనే ఉన్నది. లక్ష్మికి రాబోయే ప్రమాదం గురించి అంతు పట్టలేదు.

            ‘‘కామ్రేడ్‍ లక్ష్మి మీ ఊరు అమ్మనాన్నల గురించి చెప్పు’’ వాతావరణాన్ని తేలిక చేస్తూ...

            ‘‘నాగన్న మామేన బావ -మావూరే’’

            ‘‘ఓహ్‍ అయితే మీవూరికి రెండు సార్లుపోయిన - గుడిమెట్టు - పచ్చిపాలతీర్గ నీళ్లు పారేవాగు, బాగుంటది కామ్రేడ్‍ మీ ఊరు - మనుషులు’’ లక్ష్మి ఏ ప్రత్యేకతలేని చిన్నతనం. తనకు తెలిసిదల్లా గొడ్డుచాకిరి - పదేండ్ల నుండే కలుపులకు నాట్లకు కోతలకు కూలికిపోవడం - ఎవరు అడగకుండానే పెండ్లి - కాలరీ బతుకు - ఆగమగం.

            పోయ్యిల నుంచి పెనంమీద పడ్డట్టు - తన చాతీమీద సారలి మోటుచేతులు - ఏదో సలుపుతోంది. ఆ తరువాత జరిగిందంతా కలలాగే ఉన్నది. గాయం గెలికి నట్టుయ్యింది. శంకరయ్య తన చిన్నతనపు చీకటి రోజుల గురించి చెప్పుతుంటే కంఠం పూడుకపోయింది. కండ్ల పొంట నీరు కారినయ్‍. కాలేరీకి వచ్చిన తరువాత లారీలోడింగు - ఉద్యోగం, కొట్లాటలు, తాగుడు - చీకటి రోజుల గురించి చెప్పుకచ్చిండు...

            ‘‘ఏముంటది? గింతే ననుకున్న. నాగన్న జైల్ల నుంచి వచ్చిండని తెల్సి నప్పుడు అందరం సూసెటందుకు పోయినం - ఆదినం మేం ముసుగులు కప్పుకొని తిరుగుతున్న మనిపిచ్చింది. పైసలు సంపాయించుడు అందుకు చెయ్యరాని పనులన్ని చేసుడు. కువారం లేకుంట మనుషులుంటరని తెల్సింది.’’ శంకరయ్య...

 

            ‘‘మనం బతికింది - మనచుట్టున్నది - మనకు కన్పిచ్చింది, వినిపించింది - అనుభవంలకు వచ్చింది -ఒక బతుకు - మనకు వేరే తెలవనప్పుడు చూపు లేనప్పుడు గంతే అనుకుంటం. కాని మనిషి సంఘజీవి - అంటే ఒక్కడు కాదు. మందితో - ఈమందిని కలిపేదేంటి? గది తెలుసుకోవాలె - దానికి పెద్ద చెరిత్రఉంది’’.

            ‘‘అఆలు దిద్దుకునేటప్పుడు సదవంటే గింతేననుకుంటం - గుణింతాలు - వామ్మో - లోపటియి, భయటియి చెప్పేమాటలు, దు:ఖం - మా చెక్రపాణి బావ కైతకాలోడు, మొన్న నాగన్న చెప్పిండు. బావయో బంగారయో అయినే కైగట్టిండట’’ -లక్ష్మి.

            రఘు లేచి బలపం తీసుకున్నడు. గచ్చు నెల మీద రెండు గుండాలు గీసిండు. ‘‘గిది ఉత్పత్తి శక్తులు, గిది ఉత్పత్తి సంబంధాలు’’ శంకరయ్య ముఖం తేలేసిండు. లక్ష్మి ముగ్గుల తీర్గ గీ గుండాలేందో’’ ననుకున్నది.

            ‘‘అర్థం కాలేదా?’’

            లక్ష్మి కనిగుడ్డు పెకిలించి, నాలిక బయట పెట్టింది.

            ‘‘శక్తంటే గిదేనా?’’

            ముగ్గురు నవ్విండ్లు.

            ‘‘ఉత్పత్తి శక్తులంటే, ఉత్పత్తి సాధనాలు - భూములు, అడవులు, మీ సింగరేణి గనులు, మళ్ళ రైతులు, కార్మికులు, మళ్ళ రెండు గుండాలు గీసిండు.  ఉత్పత్తి సంబంధాలంటే - గ్రామలల్లో భూసామ్యం, ఇక్కడ పెట్టుబడిదారి - అంటే ఉత్పత్తి శక్తులు ఏం చేస్తాయి - మళ్లీ ఒక గుండం పెద్దది గీచి సంపద సృష్టిస్తాయి ఆ పనిలో ఉత్పత్తి సంబంధా లేర్పడుతయ్‍ ఆ సంపదను ముడ్డి కిందేసుకున్న దొరలు, పెట్టుబడిదారులు ఒక వేపు - దిన దినగండం నూరేళ్ల ఆయుష్షుఅనే కార్మికులు, రైతులు మరో దిక్కు - ఇది రెండు వర్గాలు టగాపర్‍ - వీళ్లకు బతుకుగావాలె - వాళ్లకు సంపదగావాలె - దోపిడి దారులను రక్షించేందుకు, రాజ్యధికారం, చట్టాలు - వాటిని అమలు చేసేయాంత్రాంగం, కోర్టులు, పోలీసులు, మళ్లీ మసిబూసి మరెడుకాయ చేసే సాహిత్యం కళలు ఉంటాయి.

            పోగుపడ్డ సంపదంతా కార్మికుని అదనపు విలువే అన్నడు. గడ్డపాయన మార్క్సు.

            ప్రజలకు రాజ్యాధికారం తెచ్చిండు లెనిన్‍ - దోపిడి దొంగలంతా కలిసి రష్యామీద ఎగబడితే యుద్ధం చేసి గెలిసిండు స్టాలిన్‍ - మన లాంటి దేశం చైనాలో రైతులు, కార్మికులు కలిసి రాజ్యాధికారం సాధించిండ్లు మావో నాయకత్వంల’’ - భారతదేశంలో జరిగిన ప్రజాపోరాటాల గురించి చెప్పిండు. ఆఖరుగా - ప్రజలకు రాజ్యాధికారం గావాలె - గందుకోసం మనందంరం పోరాడేది - గిప్పుడు చెప్పుండ్లి - మనకే బాధలున్నాయా? అందరికున్నయా?’’ రఘు బీడి ముట్టించి బయటకు పోయిండు. మళ్లీలోపటికి వచ్చి’’ నాకు ఇంతకంటే అలుకగ చెప్పత్తలేదు. నేర్సుకోవాలె.

            ‘‘గిదీన్నే తార్కిక జ్ఞానమంటరు’’

            ‘‘మా పెద్దమామ ఇలె వరిసె అంటడు.’’ లక్ష్మి...

            మీ మెదడు తిన్నందుకు - ఏంచెప్పాలె - గియ్యన్ని చెప్పకపోతే నా మెదడు ఖరాబైంది. ‘‘కామ్రేడ్‍ నేను ఒక గంటలో పోవాలె - సూదిదారం ఉంటే యివ్వవా?’’

            లక్ష్మి సూదిదారం తెచ్చి ‘‘నీకు కుట్టరాదు. నేనుకుట్టిస్త’’ అన్నది.

            ‘‘నేర్సుకోవాలె కదా? - అంగీ అక్కడక్కడ అడివిల పొరకలు తాకి కొరతలు పడ్డది’’

            శంకరయ్య మనుసంతా నీళ్లు నీళ్లయ్యింది. లక్ష్మివంట చేస్తున్నది.

            ‘‘లక్ష్మి రఘున్న బట్టలు సినిగిపోయినయే - మనమేమొ కొత్త బట్టలేసుకొని తిరుగుతన్నమ్‍’’

            ‘‘నేనే అందామనుకున్న - మొన్నకుట్టించుకున్న బట్టల్ల కొత్తదిఒక జతయివ్వు’’ - అంది.

            లోపలికి వెళ్లి కొత్త అంగీలాగు తెచ్చియిచ్చిండు. శంకరయ్య...‘‘కామ్రేడ్స్! నాకు ఎల్తది వద్దు.’’ రఘు శంకరయ్య బలవంత పెట్టిండు. గదిలోకి వెళ్లి రఘు వేసుకున్నడు. సరిగ్గా తనకే కుట్టిచ్చినట్టు సరిపోయింది. అన్నం తిని - మరి కొన్ని ఉత్తరాలు శంకరయ్యకిచ్చి ఎక్కడివ్వాలో చెప్పిండు.

            ‘‘కామ్రేడ్స్ వీలైతే మనోల్లందరికి క్లాసులు పెడ్తం. లక్ష్మి కామ్రేడ్‍కు నాలుగు నెలలనుకుంట - ఔనా! కామ్రేడ్‍ - నువ్వు వెళ్లు. నువ్వువీళ్లకు చెప్పాలె - గందుకనే మీకు గంత చెప్పిన - అక్కడ గియ్యన్ని మంచిగ చెప్పుతరు.’’ ఎట్లా వచ్చిన వాడు అట్లాగే వెళ్లి పోయిండు. శంకరయ్య రఘు ఒదిలేసి వెళ్లిపోయిన అంగీ లాగు జాగ్రత్తగా మడతపెట్టి తన బట్టల్లో దాచుకున్నడు.

            ‘‘అంతా గుండు సున్న’’ లక్ష్మి...

            ‘‘మొదడంత తిమ్మిరెక్కింది’’ గల్లర గల్లర బాయి నడిసినట్టే అయ్యింది. శంకరయ్య...

 

                                                                   24

 

            జనవరి నెల ఆ అడవంచు ఊరును చలివనికిస్తోంది. ఆ ఊరి నుండి కొండల దాకా వ్యాపించిన అడివిలోని పల్లెలు నెగళ్ల చుట్టు చేరినయి. అలాంటి పుండు లాంటి చలిలో ముకుందరావు అయిదెకరాల గడి వెచ్చగా ఉంది.  గడి దీర్ఘ చతురస్ర ఆకారంలో కట్టారు. విశాలమైన వరండాలతో సుమారు ముప్పైగదులు - మధ్యలో పూలతోటలానేలు - విశాలమైన డైనింగ్‍హాలు మధ్యలో - చుట్టూ ఎత్తైన ప్రహారిగోడ - ఉత్తరం వేపు నివాసపు ఇండ్లనుండి పెద్దగేటు - దాటితే దాసీలు డ్రైవర్ల కోసం గోడకు దించి కట్టిన బెంగుళూరు పెంక పాయఖాన, దాన్యపు గదులు - వెనుక భాగంలో ఇంజెనుగల పెద్ద బావి - అన్ని రకాల కూరగాయ మళ్లు - మమిడి, జామ, దానిమ్మ, నిమ్మ, నారింజ చెట్లు - కోళ్లు, గొర్లు, మేకలకోసం ఇండ్లు లైట్లతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆవూరు నుంచి పెద్ద రోడ్డు దాకా అయిదు కిలోమీటర్లు -లైట్లు పెట్టారు సింగరేణివాళ్లు, వాకిలంతా షాబాదు బండ పరిచి ఉంది - మధ్యలో గడ్డి పూలచెట్లు, షామియానాలు వేసిండ్లు. షామియానాల పక్క రేకు డ్రమ్ములల్లో బొగ్గు వేసి మంట రాజేశారు. నిప్పుకనికెలు కనకణలాడుతున్నాయి దక్షిణం బాజుపొడువైన వంట శాలలో. వంట వాళ్లు రికాములేకుండా పని చేస్తున్నారు.

            కడెం నుండి తెచ్చిన రకరకాల చేపలు - చేపల వేపుడువాసన ఆ ఆవరణంతో నిండింది. నాటుకోళ్లు, పొట్టేలు వేపుడు - జెల్లల పులుసు - గారెలు చేస్తున్నారు. అక్కడ కుర్చీవేసుకొని కర్రెసత్తెన్న దొర అరుస్తున్నాడు....గదంతా మద్యం, మాంసం వేపుడు వాసనాలతో మత్తెక్కిఉంది.

            అప్పటికే రాత్రి తొమ్మిదయ్యింది. రావాల్సిన వాళ్లు వచ్చినట్టే లెక్క, గోదావరి ఆవలి - జగిత్యాల, మంథని, మహాదేవపూర్‍, నిజామాబాద్‍ ప్రాంతాల నుంచే కాకుండా ఈవలి ప్రాంతం నుండి చాలా మంద వెలమ దొరలు వచ్చారు. వారితోపాటు అతిముఖ్యమైన కాంగ్రెసుపార్టీ నాయకులు వచ్చారు. సింగరేణిపై అధికారులు ఇరువైమంది దాకా వారివారి భార్యలతో సహావచ్చారు. చుట్టాలు, పక్కాలు, అన్ని రకాల వ్యాపారాలు చూసే అతిముఖ్యమైన వాళ్లు - అంతా కలిసి మూడు వందలకు పైన్నే ఉంటారు.

            అతిథులకు వారివారి హోదాలనుబట్టి - రంగాన్నిబట్టి చిన్న చిన్న బృందాలుగా కుర్చీలు వేశారు. టేబుల్లు వేశారు. అదే పద్దతిలో వారి హోదాను బట్టి అన్నిరకాల బ్రాండి, విస్కీ - సింగరేణి గెస్టవుజులో పనిచేసే బేరర్లు పోస్తున్నారు. మాంసం వేపుడు, మద్యం వాసనలతో పాటు అంతూ పొంతూ లేని మాటలు - అకారణ నవ్వులు కలెగల్సి రొదగా ఉంది - గందర గోళంగాఉంది. దొరికిన చిన్న అవాకాశాన్ని విడువకుండానర్మ గర్భితంగా వారివారి గొప్పతనాలను ప్రదర్శించే ఆరాటంలో ఉన్నారు. దెప్పుకోవడాలు - చిత్రమైన భాషలో మాట్లాడుకుంటున్నారు. మద్యానికి తనదైన వ్యక్తీకరణ భాష ఉంటుందేమో?

            పొడువైన డైనింగ్‍ హాల్లో దొరసాన్లు, బాయిదొరల భార్యలు విందు ఆరగిస్తున్నారు. బంగారు, డైమండ్‍ నగల ధగధగలతో విలువైన రకరకాల బట్టలతో వగలుపోతూ - ఒకరినొకరు దొంగ చూపులు చూస్తూ అంచనాలు కడుతున్నారు. కొంతమంది తమ భర్తల హోదాల గురించి గొప్పలు చెప్పుతున్నారు. పాటలతో - కొంత మంది తాగుతున్నారు మరికొంత మంది.

            మొత్తానికి - ఆగడి - చుట్టూ ఇరువై ఊళ్లల్లోని పేదప్రజల రక్తమాంసాలు ఆరగించి పెరిగినగడి - గనులమీద కార్మికుల మాయో పాయాలతో దగా చేసి కూడ బెట్టిన డబ్బుతో ఉబ్బి పోయి, విలాసంగా ఉంది. - ఆ చరలికాలం రాత్రి వెచ్చగా హుశారుగా ఊగుతోంది.

            ఆ గడిలో పాతుకపోయి - బయటపడే మార్గంలేక - అక్కడ ఇముడలేక ఎప్పుడు రుసరుస లాడే ముసలి ముకుందరావుది. ఒకప్పుడు ఒంటి నాగలితో - తహసీలు వసూలుకోసం ప్రాంతానికి వచ్చిన ముకుందరావు ఇరువై ఊళ్లకు ఊడల మర్రిలో విస్తరించాడు. మరింకవిస్తరణ ఆగిపోయింది. అతనికి ఆరుగురు కొడుకులు - ఒక్కతే కూతురు. పెద్దకొడుకు నారాయణరావు రాజకీయాలల్లో చేరిండుగాని అందుకు తగిన అనుభవంలేక - రాక సతమౌతున్నాడు.

            అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించినందున ఎమ్‍ల్లేలుగా కాంగ్రెసు పార్టీ తరుపున నిలబడుతున్నాడు. గతంలో రెండు సార్లు ఓడిపోయాడు...ఇప్పుడు తప్పకుండా గెలువాలని - అందుకు ముఖ్యులందరిని పిలిచి ఈ విందు ఏర్పాటు చేశాడు...

            నారాయాణరావు పెద్ద కొడుకు- రాజకీయాలల్లో చేతులూపుకుంటూ తిర్గడు తప్ప ఆయన చేసే పనేమిలేదు. ముకుందరావు పిల్లల చదువులకోసమని హైదరాబాదులో మూడెకరాలల్లో పెద్దహవేలీ కట్టించాడు. ఆ నలుగురి కుటుంబాలు - పిల్లలు దాదాపుగా చదువుల కోసమని హైదరాబాదులో ఉంటారు.

            మొత్తం ఇంటి వ్యవహారాలు, డబ్బువ్యవహారాలు చూసేది నవనీతరావు - రెండో కొడుకు - ఆ జిల్లా మొత్తం పెద్దసారా కంట్రాక్టర్‍ - బ్రాండిషాపులు, కౌలు, వ్యవసాయం చూసేది నవనీత రావే - అతని దగ్గరే ఊరుకోషేరేదారుతో సహా మూడు వందల మంది పనిచేస్తారు.

            మూడవ కొడుకు క్రిష్ణారావు - సింగరేణిలో కార్మికనాయకుడు. విలాసపురుషుడు బొగ్గులారీలల్లో నింపే కంట్రాక్టుతో పాటు - సింగరేణిలో సివిల్‍, ఇంజెనీరింగు కంట్రాక్టువడ్డీ, బిట్టీ వ్యాపారులన్నీ అతనివే - పనోళ్ల సంగతి అట్లా ఉంచుతే - సూపర్‍వైజర్లు - గుండాలే మూడు వందల మంది ఉంటటారు.

            నాల్గవ కుమారుడు రాజేశ్వరరావు సినిమాటాకీసు చూస్తాడు. అదేగాక దగ్గరి పట్టణంలో కొత్తగా ఇంకో సినిమా హాలుకడుతున్నారు.

            ఇంకో ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు. వాళ్లకు అక్కడ తలా నాలుగువేల ఎకరాల ఎస్టేట్లు, హోటల్లు ఉన్నాయి. గోధుమరంగు సఫారి సూటేసుకున్న నవనీతరావు వెలిగి పోతున్నాడు - నున్నగాకొరిగిన మీసాలు గడ్డం - ఆరడుగుల మనిషి - చురుకు చూపులు...

            వాకిట్లో కొచ్చి, ఏమి దోచనట్టు నిలుచున్నాడు. అసిస్టెంటులు శ్రీధర్‍రావు, పాముల వెంకటేశం ఉరికచ్చిండ్లు.

            ‘‘సత్యనారాయణ దొరేడిరా?’’ అరిచిండు.

            వెంకటేశం ఉరికి వంటల కాడున్న సత్యనారాయణరావు అనే సత్యంను తీసుకొచ్చిండు.

            ‘‘అరేంజుమెంట్లన్ని చూసినవా? వంటలకాడ మందు గొడ్తన్నవా?’’

            ‘‘సత్యం నెత్తిగోక్కున్నడు. మందు గొట్టంది అతని మెదడు పనిచేయనేచేయదు.

            ‘‘నువ్వే మందు గొడితె అంత గోల్‍మాలయితది. నీ అసిస్టెంట్లేరి వాళ్లు తాగిపన్నర’’

            ‘‘అన్ని టేబుల్లకు ఒక్కొక్కలను పెట్టినుండ్రి అన్ని చూసి - ఇగోగిప్పుడే కూసున్న’’

            ‘‘ఇగో మా కృష్ణను, రాజేశ్వర్‍ను కనిపెట్టుకుంట ఉండు వాళ్లిద్దరి దగ్గర చెరొక్కని పెట్టు - వాళ్లు కిందపడే దాక సోయి లేకుంట తాగుతరు. కేరపుల్‍ - మనం చాలా కాస్ట్లీ బాటిల్స్ తెచ్చినం. ఎవలకి పంపే మందు వాళ్లకు పంపు. డ్రైవర్లు, వేటర్లు బాటిల్లు గయాబ్‍ చేస్తరు... ఏదన్న గడబిడ జర్గిందో నీకు తెలుసుకదా!’’

            ‘‘గీన్నే పంచాంగం ఇప్పుతరు. ఇజ్జెతుపోతది’’

            ‘‘ఔరా వెంకటేశా! సత్యం దొర రెండు పెగ్గులేసిండా? మూడా?

            మూతికి చెయ్యడ్డం పెట్టి నాలిక తిప్పి వెంకటేశంకు చూయించిండు.

            ‘‘వీడు పొద్దటి నుంచి బాటిల్‍ కన్న తక్కువ తాగుండడు’’

            శ్రీధర్‍రావు, వెంకటేశం వెంటరాగా అన్ని టేబుల్లుఅందరి దగ్గరికి వెళ్లి భుజాలు తట్టి - ‘‘కానియ్యిండ్లి’’ అన్నాడు.  క్రిష్టారావు రెండో పెగ్గు గ్లాసు అన్నను చూసి జనరల్‍ మేనేజర్‍ శాస్త్రి కిచ్చాడు. అతని దగ్గర రెండు గ్లాసులు

            ‘‘ఏంజియింసాబ్‍ - మీది డబుల్‍ డోసున్నట్టున్నది’’ నవనీత రావు పరాచికమాడిండు.

            శాస్త్రి ఆముదం తాగిన ముఖం పెట్టిండు.

            ‘‘క్యారీఆన్‍’’

            ముందటికి నడిచాడు. జగిత్యాల దొరల గ్యాంగులో రాజేశ్వరరావు మధ్యలో కూర్చుండి ఉన్నాడు.

            ‘‘ఊళ్లల్లోనక్సలైట్ల కార్యకలాపాల గురించి తామెట్లా ఎదుర్కుంటున్నది - ఆర్‍మూరు దొర చెప్పుతున్నడు’’

            నవనీతరావును చూసి మాటలు బందు చేసిండ్లు.

            ‘‘నడువనియ్యిండ్లి - ఈ రాత్రి కిక్కడే బస - సింగరేణి గెస్టవుజులన్ని మీ కోసం బుక్‍ చేయించిన - హోటల్లు కూడా ఆరాముగా మాట్లాడుకోండ్లి - కార్లున్నయి - డ్రైవర్లున్నారు’’ ఇంకొంచెం దూరం నడిచి ‘‘అరె వెంకటేశం డ్రైవర్లకు ఏర్పాట్లు - ఎవరు సూత్తండ్లురా’’

            ‘‘క్రిష్ణారావుదొర మొఖదమ్‍లు - రాఘవులు వాళ్లంతా కలిసి మనకొట్టాలు, సింతల కాడ వేరే ఏర్పాట్లు చేసినం - ఆడ ఇంక జోరుగ నడుత్తంది.’’

            ‘‘అంటే గాన బజానాపెట్టిండ్లా?’’

            ‘‘చిన్న డ్యాన్సు పోగ్రామునడుత్తంది’’ శ్రీధర్‍రావు.

            ‘‘మరి దొరసాన్ల సంగతేంది?’’

            వెంకటేశం సిగ్గుపడి మెళికలు తిరిగిండు.

            ‘‘నువ్వేందిర బీర్లుగొట్టినవా?’’

            ‘‘అక్కడ ఇందిరవ్వ దొర్సాని చూసుకుంటంది’’

            ‘‘ఆ హాలు సరిపోయిందారా మరి?’’

            ‘‘ఆడ నాలుగు గుంపులైనవి దొర’’

            ‘‘అంటే ఆడికి బీర్లు పోతన్నయారా?’’

            వెంకటేశం మాట్లాడలేదు.

            అరె  శ్రీధర్‍రావు ‘‘మా బావుండాలె...అదే పేరు మర్సి పోయిండు’’

            ‘‘నర్సింగరావు దొర’’

            ‘‘ఆ ఎక్కడున్నడుర. అయినెలావు పట్టింపుమనిషి’’

            శ్రీధర్‍రావు. నవనీతరావును నర్సింగరావు ఉన్న గదికి తీసుక వేళ్లిండు.

            అప్పటికే ఆయన తలుపులు మూసుకొని దుమదుమలాడుతున్నడు. ఆయన కామారెడ్డిల సర్జన్‍ - డాక్టర్‍ - యమస్ట్రిక్టు మనిషి.

            ‘‘తలుపులు తోసుకొని - నవనీతరావు లోపలికి ప్రవేశించిండు.

            ‘‘బావా! మస్తుకోపంగున్నట్టున్నది. కుర్చిల కూకోండ్లి’’

            కూర్చున్నాడు.

            నవనీతరావు తనో కుర్చిల కూర్చున్నాడు.

            ‘‘బావాతిన్నారా?’’

            ‘‘గీ రక్తపుకూడు. ఏందిదుబారా! ఆ తాగుడేంది? ఈ న్యూసెన్స్ంతా ఎంది? దుబారా - ఇంక ఎలక్షన్లు - ఎమ్మెల్లే’’ కోపంతో మాటలు రాక కూర్చున్నాడు.

            ‘‘కూల్‍బావా! మేం భూస్వాములం. మందు, మటన్‍ లేపోతే ముద్దదిగది. సదువు ఒంట బట్టలే. గిది మా బతుకు - బయట పడలేం బావా!’’

            గీ పిచ్చి పోగ్రాంకు నన్నెందుకు పిలిచిండ్లు?’’

            ‘‘పొరపాటే - క్షమించండి - మీకు తెలుసుగదా! మా బాపుటైగర్‍ - టైగర్‍కు అన్ని పట్టింపులే - ఆయన ప్రత్యేకంగ మిమ్ముల్ని పిలుమని మాకు చెప్పిండు. సదురుకోవాలె బావా ప్లీజ్‍ బయట నిలబడ్డ శ్రీధర్‍రావును పిలిచి - వెంకటేశంను పిలువు అన్నడు.

            ‘‘వెంకటేశం దొరకు ఏంగావాలో చూడు, దొర తిన్న తరువాత మన డ్రైవర్‍ను పిలిచి - నువ్వే స్వయంగ తీసుకొని పోయి మన మంచిర్యాల ఇంట్లో పడుకోబెట్టు - అక్కడో మనిషిని కారును ఉంచు.’’

            ‘‘అదిబెస్టు - అక్కడే తింట - వెంటనే అక్కడికి పంపించు.’’ బట్టలేసుకొనిరడీ అయ్యాడు...

            అతన్ని కారెక్కించి - వచ్చేసరికి అన్న నారాయణరావు ఎదురు చూస్తున్నడు.

            ‘‘బాపు వీల్లందరితోని ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నడు ఆ మర్సిపోయిన’’ - మర్చిపోయిందేమిటో గుర్తుకు రాక కుర్చీలో కూర్చున్నాడు నారాయణరావు.

            ‘‘నీ అసిస్టెంటు సుభాష్‍గాడెక్కడ?’’

            అదీ మర్చిపోయి నారాయణరావు కుర్చీలో దిగాలుపడి కూర్చున్నాడు. ధోవతి లాల్సీ వేసుకున్న ఆరడుగుల మనిషి  నారాయణరావు.

            ‘‘ఉత్త బోలాకోరు...’’

            ఇంతలోనే సుభాష్‍వచ్చి వంగివంగి అతివినయంగా నవనీతరావుకు సాల్యూట్‍ చేశాడు.

            అతివినయం దొంగ లక్షణం ‘‘ఏమయ్య - పియ్యే - అన్ననువిడిచి పెట్టిఏడతిరుగుతన్నవ్‍ - నువ్వు మందు గొట్టినవా? అన్నకోసం మినిట్స్ రాసినవా?’’

            సుభాష్‍ ఒక కాగితం తీసి ఇచ్చిండు.

            నవనీతరావు కిందా మీద చూసిండు.

            ‘‘ఓటర్లు, కులాలు, పార్టీలు - ఊళ్లు, దొరలు - గియ్యన్ని సరే - పైనాన్సు ఎట్లా? గది రాయలేదు. వీళ్లందరుగు...బలిసినోళ్లు - మీ బాస్‍ గెలిస్తే - లైనుగట్టి పనులకోసం, పదవులకోసం నిలబడ్తరు. గలిస్టు తయారు జెయ్యి - అన్నతో తిరుగు తన్నవ్‍ - ఎవనితాకతెంతో గాయింత దెల్వదా?’’

            జెబులో నుండి ఇంకో లిస్టు తీసిండు.

            నవనీతరావు అటిటు చూస్తూండగానే శ్రీధర్‍రావు ఒక కుర్చీ తెచ్చివేసిండు.

            వాళ్లిద్దరిని దూరం పొమ్మని - సుభాష్‍ దగ్గర పెన్ను తీసుకొని అడుగవల్సిన వారిపేర్ల కెదురుగా అడుగ వల్సినమొత్తం రాసిండు.

            ‘‘నాకంత గడబెడగున్నది. నువ్వు నాతో పాటు ఉండు. ఆ మతి కచ్చింది - బాపు మన నలుగుర్ని పదగొండు గంటలకు తనకు కలువుమన్నడు.’’

            ‘‘మరి ఇంత మంది సుట్టాలు -అధికార్లు వచ్చిండ్లు - ఒక సారి కల్సి పొమ్మనక పోయినవా?’’

            ఇంతలోనే రకరకాల మాటలతో ఒక రొదగా ఉన్న అక్కడి వాతావరణం గంభీరమైపోయింది.

            ముసలి దొర ముకుందరావు వెనక్కి చేతులు కట్టుకొని మేడ మీద నుండి దిగి బయటకచ్చిండు. వెంకటేశ్‍ వెనుక నిలుచున్నడు.

            ముకుందరావుకు డెభ్బైఏండ్లు - అయినా ముసలిపులిలా ఉన్నాడు. వంగిపోలేదు. చామనఛాయ, ఆరడుగుల ఎత్తు - పెద్దపెద్ద కండ్లు - చేతుల నిండా రోమాలు...

            ఏమనుకున్నడో ఏమో చేతులు జోడించి - టేబులు మధ్యం గ్లాసులు చూడ కుండాపై ముఖాలు చూస్తూ అన్నీ టెబుల్లు తిరిగిండు. పేరుపేరున పలకరించిండు. లేని నవ్వును ముఖం మీదికి తెచ్చిండు...

            ఆయన అన్ని టేబుల్ల దగ్గర మాట్లాడిన ఒకే ఒక్క మాట ‘‘పెద్దోడు ఎన్నికలల్ల నిలబడుతండు - జర సూసుకోండ్లి’’

            ముసలాయన వెళ్లిపోయిన తరువాత అందరు ఊపిరి పీల్చుకున్నారు. వాకిలి దగ్గరికి వెళ్లి ముఖం తిప్పుకొని నిలుచున్న కృష్ణారావు, రాజేశ్వరరావు లోపలికి వచ్చిండ్లు. అప్పటికి రాత్రి పదిగంటలయ్యింది.

            ఈ పార్టీ గతి క్రమం ఏమిటో అంతు పట్టకుండా ఉంది. వాళ్లకు కొద్ది దూరంలో ఉన్న దొరసాన్ల గదిలో నుండి పాటలు, నవ్వులు విన్పిస్తున్నాయి.

            ‘‘నాకిందంత రోతగా ఉంది. నాకు ఎమ్మెల్లే అవసరమా?’’ నారాయణరావు కక్కుకునే ముఖం పెట్టాడు.

            ‘‘మనందరిలో నిన్నే ధర్మరాజనుకుంటరు ప్రజలు మన బాపు లెక్క ప్రకారం మనకు ఇన్ని భూములు, వ్యాపారాలు, డబ్బు, దస్కం ఉన్నా - అధికారంలేకపోతే సున్నా- మన జీవితంలో ఇవ్వన్ని భాగం’’ నవనీత రావు గుసగుసలాడాడు.

            ‘‘గింత తెలివైనోనివి నువ్వే నిలబడవచ్చుగదా!’’

            ‘‘మరినేను చూసే బిజినెస్‍లు నువ్వు చూస్తవా? మన బాపు చెప్పిందిచెయ్యాలె - గీ మాట బాపుకు చెప్పగలవా?’’

            ‘‘తుపాకి తీసి కాల్చిపారేస్తడు’’. నారాయణరావు ఇద్దరు కలిసి ప్రతి గుంపు దగ్గరికి వెళ్లారు.

            మొదట జనరల్‍ మేనేజర్‍ శాస్త్రి టేబుల్‍ దగ్గరికి పోయారు. అప్పటికే శాస్త్రి ముందు చేపముళ్లు, ఎముకలు కుప్పబడి ఉన్నాయి.

            ‘‘మనిషి కక్కుర్తి తిండి దగ్గర తెలుస్తదంటరా. వీడు కక్కుర్తి గాడున్నట్టున్నదే’’ వీడు మొత్తంబొగ్గు బాయిలన్ని తినేటట్టున్నడు. నవనీతరావు లోపల అతని దగ్గర క్రిష్ణారావు తప్పదుగనుక కూర్చున్నాడు. అప్పటికే ఇద్దరికి మూడు రౌండ్లయి పోయాయి. వాళ్ల ముందు బ్లూటేబుల్‍ బాటలున్నది. ఒక మాట ఒకరు వినే పరిస్థితి దాటి పోయింది... గమ్మత్తేమంటే అక్కడ కూడిన వాళ్లెవరు ఒకరి మాట మరొకరు వినే రకంకాదు. అందరు చెప్పెటోల్లె కాని వినేటోల్లుకాదు. నారాయణరావు కుర్చీలో కూర్చుండి ‘‘మీరు మాకు షర్‍కత్‍ చెయ్యాలె’’ అన్నాడు. అప్పటికే నారాయణరావు మాటలన్ని మరిచిపోయాడు.

            ‘‘సహకారం చెయ్యాలె... సింగరేణిల బాగ ఓట్లున్నయి. వైట్‍ కాలరోల్లకు మీరు చెప్పాలె - అంతే కాదు... ప్రచారానికి మీకు దెబ్బరాకుంట హెల్పుచెయ్యాలె’’ నవనీతరావు సదిరిండు.

            ‘‘ఓషూర్‍! అబ్బో మీ తోటే మా బతుకుగదా!’’ అన్నాడు. వాళ్లిద్దరు వచ్చేకన్నాముందు కృష్ణారావుకు, శాస్త్రికి గుండాల విషయంలో పెద్ద బైస్‍నడుస్తంది.

            ‘‘రావు సాబ్‍! మా విజిలెన్సు డిపార్టుమెంటు రిపోర్టును బట్టి బస్తీలల్ల కమీటీలచ్చినయ్‍, సారలి గ్యాంగు ఇండ్లమీద బడి మహిళలను ఖరాబు చేస్తండ్లు. తాగుడెక్కువైతే మార్కెట్లనే పరేషాన్‍చేస్తండ్లు... సమ్‍థింగ్‍ డేంజర్‍’’ సత్యం మాంసం వేపుడు, చేపముక్కలు పంపాడు.

            ‘‘అది మేం చూసుకుంటం మీరు బేఫికరుండండి ఔర్‍ కుచ్‍ ఫరమాయియే’’ నవనీతరావు.

            అప్పటికే కృష్ణరావు ‘‘ఆ గాడ్ది కొడుకులను వీనింటిమీదికే పంపాలె - పీడా పోతది’’ మనుసులో అనుకున్నాడు.

            నారాయణరావు నవనీతరావు లేచి నిలుచున్నారు.

            ‘‘వీడు బాపనోడేమొ? నారాయణరావు.

            ‘‘గందుకే కక్కుర్తి’’ నవనీతరావు.

            నారాయణరావుకు అర్థంకాలేదు.

            మొత్తం టేబుల్లన్ని తిరిగే సరికి అరగంట పట్టింది...

            నారాయణరావు తన రూంలోకి వెళ్లిండు.

            నవనీతరావు కాసేపు ఒంటరిగా కుర్చీలో కూర్చున్నాడు...ఇంతలోనే దాసి జయమ్మవచ్చింది. జయమ్మకు యాభయేండ్లు. ఆమె ఆయింట్లనే పుట్టి పెరిగింది...ఆయింట్లనే వెంకటేశం పుట్టిండు...జయమ్మకు కారుడ్రైవరు నీలయ్యకిచ్చి పెండ్లి చేసిండ్లు...

            అదంతా గుర్తొచ్చింది.

            ‘‘దొర్సాని పిలుత్తందిదొరా?’’

            ఏదొర్సాని?’’

            ‘‘ఇందిరవ్వదొరా!’’

            లేచి తనగదిలోకి నడిచిండు. అక్కడ ధారలుకారుతుండగా ఇందిర ఏడుస్తోంది.

            ‘‘నువ్వక్కడ బీరుగొట్టిడాన్సు చేస్తున్నవనుకున్న’’

            ‘‘గదొక్కటేలేదు’’

            నవనీతరావు కుర్చీలో కూర్చున్నాడు. అతని మనసంతా పదకొండు గంటలకు పిలిచే తండ్రి మీదనే ఉన్నది.

            ‘‘సరే చెప్పు - సినిమా కథతీర్గ కాకుండ సూటిగ చెప్పు’’

            ‘‘ఏం చెప్పాలె? మనం డబ్బు తస్కం తాళపుచెవులు దగ్గరబెట్టుకుని లక్షలు వెనుకేసుకున్నమట’’

            ‘‘అయితే’’

            ‘‘విను - మీ వదినంటది బావ అమాయకుడట - ఆయనకు ఏం తెలువదట - మెహర్బానీకోసం వాళ్ల పిల్లలను హైదరాబాదుల పట్నంల ఉంటన్నట. సదువుకున్నని నాకు టెక్కట. పల్లెలు ఉండలేక పట్నంల ఉంటున్నట. వాళ్లిక్కడ సత్తండ్లట’’

            ‘‘ఇంకా’’

            ‘‘మీ తమ్ముడు క్రిష్ణ సిక్కులామె దగ్గర్నే ఉంటండట - రాజేశ్వర్‍ సినిమాటాకీసుల్నే తాక్కుంట కష్టపడుతున్నడట -వాళ్లందరు ఈ పల్లె టూల్లె దాసీల తీర్గ - ముసలోని కట్టడిల సస్తున్నరట’’

            ‘‘అది సరేగని - మా భారతి ఏంజేస్తంది?’’

            ‘‘ఆమె మొగుడు ధూంధాంలాడి పోయిండుగద - అలిగింది - కట్నాం యివ్వాలెనని - దిక్కుమాలిన డాక్టరుకిస్తే - పిసినారట - కంతిరోడట - అలిగి కూసున్నది’’

            ‘‘ఇంతకీ ఇందిరా! మీరు ఒక్క బీరన్నా తాగిండ్లా లేదా?’’

            ‘‘మనిషి మూడు తాగిండ్లు. ఆశాస్త్రి పెండ్లామైతే హాట్‍ నీటుగ కొట్టింది. పాటలు డ్యాన్సులు - ఒకటేనవ్వుడు.’’

            ‘‘మీరీ! తాగి నప్పుడు మస్తుయాదికొస్తయి - గియ్యన్ని కొత్తయి గాదు. దొరల ఇండ్లల్ల మామూలే - ఇది మన కల్చర్‍ మనకు డబ్బున్నది గని - మన యిష్టం వచ్చినట్లు బతుకలేం. పో - ముసలిపులి పిలిసింది - అగో అక్కడ తాగెటోల్లు చూడు - ఉత్తగ ఒర్లుతరు. కొట్టుకోరు - ఊదుగాలది - పీరిలేవదు - ఇందిరా! మనకు వేరే మాటలెట్లస్తయిచెప్పు - గీ సంగతులే తెలుసు - గియ్యే పంచాయతులు - ముచ్చెట్లస్తయి. పో మళ్లో బీరు గొట్టు - డ్యాన్సు చెయ్యిపో’’

            ‘‘నీకు ఎవతన్న ఉన్నదా?’’

            ‘‘పైసలు చూసేటోనికి గంతపుర్సతుండది. కలువది - బేఫికరుగుండు’’ ఇందిర హఠాత్తుగాలేచి నవనీతరావును ముద్దుపెట్టుకొని ఆడవాళ్ల గుంపు దగ్గరికి కదిలింది. దీని బాద అదన్నమాట తెరిమాకా కిరికిరి’’ నవనీతరావు. ముకుందరావు ముసలి పులిలా గురగురలాడుతున్నాడు. అతను ఉయ్యాల బల్లమీద కూచున్నాడు. అతని గది విశాలంగా ఉంది. అది మొదటి అంతస్థులో ఉన్నది - ఆగది నుండి మొత్తం ఇల్లే కాన్‍ కొండ దాకా విస్తరించి ఉన్నపంటపొలాలు కన్పిస్తాయి...

            నలుగురు ఎదురుగా కుర్చీల మీద కూర్చున్నారు. ముసలాయనకు దాదాపు ఎదురుపడి మాట్లాడటం అరుదు.

            ముసలాయన కాసేపు అటిటు తిరిగిండు.

            ‘‘దావత్‍ అయిపోయినట్టేనా?’’ ముసలాయన..

            ‘‘దగ్గరి కచ్చింది బాపు’’

            ‘‘దావతుల ఒక్కడు గూడ కాపోడు, పెర్కొడు కన్పియ్యాలేదు?’’

            ‘‘కావాలనే పిలువలేదు. వీళ్లంతా ఎక్కువ మంది మనకులపోల్లు’’

            ‘‘మంచిదే - కని ముఖ్యమైన ఊళ్లల్ల యాటల గోయించి దావతు లియ్యిండ్లి - అవతల నిలుసున్నోడు పెర్కొడు. ఈ ఇలాకల వాళ్లు ఇరువై వేలున్నరు. కాపోల్లు పదిహేను వేలున్నరు. వాళ్లు ఒక్కటైతే మన పనిటుప్పా. చుంచు లక్ష్మయ్య దగ్గర పైసలు లేవు. కోమటి రమణయ్యకు కోమట్లంత సపోర్టు చేస్తరు.’’

            నలుగురు తలలు వంచుకున్నారు.

            ‘‘పిస్స పనిజేసేరు లక్ష్మయ్యను గినముట్టుకునేరు రోజులు మునుపటి తీర్గలేవు.

            తపాలపూర్‍ తెలుసుగద - వింటన్నవక్రిష్ణ నీకే - ఉచ్చిలి పనిచేస్తే నీకే మొదటికి మోసమత్తది... పైగావాడు జనతాపార్టీలున్నడు. అదిమన పార్టే - కంపయితది.’’

            ‘‘ఈ అర్థరాత్రి గియ్యేం మాటలనుకుంటండ్లా?’’

            ‘‘వొరే జాగ్రత్తగావినుండ్లి’’ జాగ్రత్తగా వెతికి క్రాంతి పత్రిక తీసిండు. కళ్లద్దాలు పెట్టుకొని...

            ‘‘వెలుమల మీద రెడ్లు కోపంగున్నరు. వాళ్ల పిచ్చి  ప్రజలను ఎంటే సుకొని మీద బడ్తండ్లు - జగిత్యాల, సిరిసిల్లల  ఏంజరుగుతంది - కిరికిరి  - మనదగ్గర షురువైంది - మన ఇరువై ఊళ్లల్ల ఏం జరుగుతందో మీదాంట్ల ఎవనికి తెలువదు.  షేరెదార్లు దొంగలు, తాగుబోతులు, వాళ్లు రెండు దిక్కులుంటరు. వాళ్లను నమ్మకుండ్లి - అరెక్రిష్ణ జాగర్త - సింగరేణిల మీ యూనియన్లు ఏం చీకుతన్నయి -వాళ్లె బాయిలు బందుపెట్టిండ్లు. వాడు శాస్త్రీ గాడు డబుల్‍ గేమ్‍ గాడు’’ ఇట్లా క్రాంతిలో వచ్చిన వార్తలన్ని వాళ్లకు సంబంధించినవి చదివి విన్పించాడు.  నవనీతరావుకు  ఆశ్చర్యం మనిపిచ్చింది. ‘‘తమందరి మీద నిఘూ పెట్టి ఉంటడు. డ్రైవర్లతోటి అన్ని కనుక్కుంటడేమొ? ఎవలికి దొరకని నక్సలైట్ల పత్రిక తెప్పించుకున్నండంటే’’

            ‘‘పోండ్లి - పైసం, అధికారం ఉంచుకుంటే ఉంటది’’ ఇడిసిపెడితె చెంగోబిల్లంటయి కాలరీతి తెలుపక పోతే గంగల కలుత్తరు’’ ఆఖరుగా అన్నాడు.

            ముకుందరావు క్రిష్ణారావు, రాజేశ్వరావు తాగి ఉన్నారని వాళ్ల వాలకం చూసి అర్థంచేసుకున్నాడు. నారాయణరావు కు ఏమి చెప్పినా ఫలితంలేదు. మతిమరుపుగాడు. వాళ్ల ముగ్గురిని పంపంచి...

            ‘‘ఒరే నవనీతం - పెద్దోనికి లక్షరూపాలివ్వు - మనకుల పోల్లు ఎంతిత్తనన్నరు?’’

            ‘‘వాళ్లో లక్ష ఇస్తరనుకుంటబాపు’’

            ‘‘ఇంత పెద్ద సంసారాన్ని నువ్వే సూత్తన్నవ్‍ - కని నీకు దొర లక్షణాలులేవు. బేపారి లక్షణాలులేవు...అవసరమైతే పదిమందిని సంపైనా నిలబడాలె - గదిదొరతనం - ఇరువై ఊళ్లు - జమీను వట్టిగ ఆగలేదు. గయ్యన్ని మీకు తెలువదు. రాజకీయాలు గావాలె - మీ అన్న గెలువాలె - నువ్వేం జేత్తవో నాకెర్కలేదు. లేపోతే ఇయ్యన్ని పోతాయి. వాడు మంది ఇండ్లల్ల పడుకుంటండు.... పానానికే ముప్పు..సరే! అన్నీ నీకెరికే సూసుకోపో’’

            నవనీతరావు మెట్లు దిగి కిందికి వస్తే - దాదాపు అందరు వెళ్లిపోయారు. దూరంగా నెగడు దగ్గర వంట వాళ్లు పుర్సత్‍గ తాగుతున్నారు.

            కింద తన కోసం తననమ్మినబంటు సత్యనారాయణ కుర్చీలో కూర్చుండి కునికి పాట్లు పడుతున్నాడు...

            అలసటగా ఉంది - అస్తు బిస్తు గా ఉంది - రోతగా ఉంది. తన రూంలోకి వెళ్లి స్నానం చేసివచ్చాడు. హాయిగా ఉంది. టేబుల్‍ మీద కరిదైన విస్కీ, సోడా మటన్‍ వేపుడు, ఉడికిన పల్లీలు, ఆమ్లేట్లు ఉన్నాయి.

            చప్పుడు కాకుండా సత్యనారాయణ గదిలోకి వచ్చిండు.

            ‘‘పార్టీ అయిపోయినట్లేనా?’’

            ‘‘ఆ దొరా!’’

            ‘‘ఆడోల్లందరు పడుకున్నారా?’’

            ‘‘పడుకొని ఉంటరుదొరా!’’

            ‘‘మరి ముసలి సింహానికి తిండిపెట్టిండ్లా?’’

            ‘‘పెట్టకపోతే మనందరి మొదడు తింటడు. విజయమ్మతోని మందు, సరుజామాపంపిన’’

            ‘‘పొద్దుగాల్నే తింటడుగదా! అబ్బో మాదండోడు. ఆమేడమీది నుంచి కింద జరిగే పార్టీ ప్రతిదీ అర్థంచేసుకున్నడు. తొమ్మిది గంటల నుండి - ఆయన అంచనాలు ఆయనకున్నయి. తింటే తాగుతే - పార్టీ బేకారయితదని - మనం సరిగ్గా చేత్తన్నమో లేదోనని - అరగంట కోసారి వెంకటేశ్‍ ఇక్కడ జర్గేదంతా పూస గుచ్చినట్టు చెప్పాలె - లోపల ఆడోల్ల ముచ్చట్లు తో సహా సత్యనారాయణ...

            ‘‘కొంపదీసి వాళ్లు బీర్లు తాగింది కూడా’’

            ‘‘గడీల గియ్యన్ని మామూలే - కడెం దొర్సాని పేరిన్నరు గదా!’’

            సత్యనారాయణ హద్దుమీరుతండని

            ‘‘సరే! సరే’’ అన్నాడు. నవనీతరావు సత్యనీరాయణరావు తలుపువేసి బయటకు వెళ్లిపోయాడు. తెల్లవారు ఝామున రెండు దాకా ఒక్కడే తాగుతూ తింటూనే ఉన్నాడు నవనీతరావు..

                                                                                                            ( తరువాయి భాగం వచ్చే సంచికలో )

 

నవలలు

కూలి బతుకులు (నవల) 

కూలి బతుకులు (నవల) – మొదటి భాగం

            మూసివేతకు గురైన ఫర్టిలైజర్‍ కార్పోరేషన్‍ ఆఫ్‍ ఇండియా చిమ్నీనీల మీదుగా సూర్యుడు ఉదయించిండు.

            ఎన్టీపిసి ఫస్టుగేటు ముందున్న నేషనల్‍ హైవే రోడ్డుకు అవలివైపున ఉన్న మైదానంలో లేబర్‍ అడ్డాకాడ దాదాపు రెండు మూడు వందల మంది కూలీలు పనుల కోసం ఎదురుచూస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలు అప్పటికింకా తెరుచుకోలేదు. రోడ్డు మీద ఎడతెగని ప్రవాహంలా వాహనాలు రోద పెడుతూ పరుగెడుతున్నాయి.

            ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు పూట గడవని కూలీలు చాల మందే ఉన్నారు. కొంత మంది దూర ప్రాంతాలనుండి సద్దులు కట్టుకొని చీకటితోనే వచ్చిండ్లు. మరి కొంత మంది చుట్టుప్రక్కల ప్రాంతాలనుండి వచ్చిన వాళ్ళు... కూలీలలో ఆడవాళ్లు, మొగవాళ్లు ఉన్నారు. అందరి మొఖాల్లో ఆ రోజు కూలి దొరుకుతుందో లేదో అన్న అందోళన ఉంది.

            ‘‘రెండు రోజుల నుండి ఇక్కడే పడిచస్తున్నా. ఇవ్వాలైనా పని దొరుకుద్దో లేదో?’’ అంటూ ఓ యువకుడు నిరాశగా ప్రక్కనున్న మరో యువకుడితో అంటున్నాడు. ఆ యువకుడు నిర్లిప్తంగా ఏమోఅన్నట్టుగా తలాడించిండు.

            గతంలో అయితే లెబర్‍ అడ్డాకాడ ఉదయం తొమ్మిది పది గంటలదాక మనష్యుల అలికిడి ఉండేది. కాంట్ట్రార్లు తమ దగ్గర పనిచేసే మేస్త్రీలను పంపి  ఆ రోజు కావాల్సిన కూలీలను తీసుకపోయే వాళ్ళు. కాని ఇప్పుడు పరిస్థితులు మారినవి.    ఉదయం ఏడు ఎనిమిది గంటల లోపే లేబర్‍ అడ్డా మీద కూలీలు ఎవరు కన్పించటం లేదు.  ఇదివరలో అయితే తీరిపారి వచ్చే కాంట్రాక్టర్లు పొద్దున్నే వస్తున్నారు. 

            ‘‘ఇదిగో ఇదివరకు లెక్క పదింటికి పని మెదలు పెట్టి అయిదింటికే పోతామంటే కుదరదు.  ఎనిమిది గంటలకే పని మొదలు పెట్టాలి... సాయంత్రం అరుగంటల దాక పని చెయ్యాలి... అట్లా ఇష్టపడితేనే పనుల్లోకి రండి లేకుంటే లేదు’’ అంటూ కాంట్రాక్టర్లు కరాఖండిగా చెప్పుతాండ్లు. అట్లా ఇష్టపడ్డ వారినే పనులకు తీసుకుంటాండ్లు.

            ‘‘ఇదేందని’’ ఎవరన్నా అంటే...

            ‘‘ఇదివర లెక్క రూల్స్ లేవు. మోడి సాబ్‍ వచ్చిన తరువాత ఎనిమిది గంటల పని విధానం పోయింది. ఇప్పుడు కూలోల్లు పన్నెండు గంటలు పనిచెయ్యాలి. కాందంటే మీ ఇష్టం’’ అంటూ కాంట్రాక్టర్లు నిష్టూరంగా మాట్లాడుతాండ్లు.

            కూలీలు చేసే ప్రతి పనిలో యంత్రాలు వచ్చిన తరువాత పనులు దొరకటం కష్టమైంది. గతంలో పదిమంది పనిచేసేకాడ ఇప్పుడు ఒకరిద్దరితోనే  ఎల్లదీసుకుంటాండ్లు. దాంతో కూలీల మధ్య పోటీ పెరిగింది. ఎంతకైనా పనిచేయటానికి సిద్దపడుతాండ్లు. రూల్స్ సంగతి చాలా మంది కూలీలకు తెలియదు. గతంలో అయితే కాంట్రాక్టు కూలీ సంఘం వాళ్ళు ఏదైనా ఎటమటం అయితే వచ్చి మాట్లాడే వాళ్ళు... ఎనిమిది గంటల పని విధానం గురించి, కూలీ గురించి కొట్లాడేటోళ్ళు... కాని ప్రభుత్వం కొత్త రూల్స్ తెచ్చి వాళ్ళ కాళ్ళు, చేతులు కట్టేసింది. ఏమన్నా అంటే అంతా చట్టప్రకారమే జరుగుతాంది... మీరు పోయి ఎక్కడ చెప్పుకుంటరో చెప్పుకొండ్లీ మాకేమి భయం లేదుఅంటూ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా మాట్లాడుతాండ్లు.

            మాదిగ నాగన్న పొద్దున్నే చీకటితోని పనికోసం వచ్చిండు. రెండు రోజులుగా పనికోసం వచ్చి పోతున్నడు. కాని ఎవరు పనిలోకి పిలువలేదు. మేస్త్రీలు యువకులను, కాస్త నజర్‍గా ఉన్నవారిని తీసుకొని కాస్త వయసు మల్లిన వారిని ప్రక్కన పెడుతున్నారు. అయినా ఈ రోజైన పని దొరకుతుందనే అశ అతన్ని పొద్దున్నే మళ్ళీ వచ్చేలా చేసింది...

            మాదిగ నాగన్న ఎన్టిపిసి పెద్ద బొంగు పడ్డప్పుడు రామగుండం వచ్చిండు. ఆయనది స్వంత వూరు సిర్‍పూర్‍కాగజ్‍ నగర్‍ దగ్గర మానేపల్లి.

            అ రోజుల్లో ఎన్టీపిసికి అవసరమైన చెఱవుకట్ట నిర్మాణపు కంట్రాక్టు చేపట్టిన పి.కే రామయ్య దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ కూలీలు దొరుకుతరో ఆ ప్రాంతాలకు మనష్యులను పంపించి కూలీలకు అడ్వాన్స్లు ఇచ్చి, ఆశలు చూపి దాదాపు నాలుగైదు వేల మంది కూలీలను సమీకరించిండు. వాళ్ళు ఉండటానికి ఒక చోటు చూయించిండు. అదే పి.కె. రామయ్య కాలనీ... అక్కడ దేశంలో అన్ని ప్రాంతాలకు, రాష్ట్రాలకు చెందిన వలస కూలీలున్నారు... ఒక వైపు ఒరిస్సా కూలీలు గుడిసెలుంటే, మరోవైపున బెంగాలీ నుండి వచ్చిన కూలీల వాళ్ళు ఉండేది. ఇంకా పాలమూరు, ఒంగోలు, చత్తీస్‍ఘడ్‍, జార్ఖండ్‍ చెందిన వాళ్ళు ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే  పి.కె. రామయ్య కాలనీ కష్టాలు కన్నీళ్ళతో కూడుకున్న మని భారతదేశంలా ఉండేది.

            ఎన్టీపిసి నిర్మాణపు పనులున్నప్పుడు వేల సంఖ్యలో కూలీలు పనులు చేసేవాళ్ళు. దాదాపు ఐదు సంవ్సరాలు నిర్మాణపు పనులు జరిగినవి. అప్పుడు ఆ ప్రాంతమంతా కూలీలతో కళకళలాడింది. నిర్మాణపు పనులు అయిపోయిన తరువాత ఇప్పుడంతా మెయింటనేన్స్ వంటి చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలిపోయి చాలా మందికి కూలీ దొరకని పరిస్థితి ఏర్పడింది. దాంతో చాలా మంది వెళ్ళిపోయిండ్లు. ఎటు పోలేని వాళ్ళు మిగిలి పోయిండ్లు.

            నాగన్న వచ్చిన కొత్తలో పి.కె. రామయ్య దగ్గర పనిచేసిండు. ఆయన భార్య శాంతమ్మ. ఇద్దరు కూలి చేసేవాళ్ళు. దాంతో కుటుంబం ఒకింత సాఫీగానే జరిగిపోయింది. అక్కడ పని అయిపోయిన తరువాత కొన్ని రోజులు ఇర్కాన్‍ కంపినిలో రైల్వే లైను పనులు చేసిండు. ఇట్లా ఎక్కడ పని దొరికితే అక్కడ పనిచేసుకుంటూ వచ్చిండు. కాని ఎన్నేండ్లు పనిచేసిన పొట్టకు గడిసింది తప్ప దమ్మిడి మిగిల్చుకున్నది లేదు. వయసు మీద పడ్డది కాని చేసుకుంటే తప్ప ఎల్లని పరిస్థితి ఏర్పడింది.

            ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సత్తెయ్య పెండ్లి చేసుకొని కూలీపనులు చేసుకుంటూ వాని బతుకుకు వాడు బతుకుతాండు. చిన్నోడు శీను చదువు మధ్యలో ఆపి కాంట్రాక్టర్‍ దగ్గర ట్రాక్టరు డ్రైవర్‍గా పనిచేస్తున్నాడు.

            సివిల్‍ పనులు చేసే కాంట్రాక్టర్‍ నర్సింగరావు దగ్గర పనిచేసే మేస్త్రీ తిరుపతి రెడ్డి వచ్చే సరికి కూలీలంతా దూరం దూరంగా ఉన్నవాళ్ళు వచ్చి ఆయన చుట్టు మూగిండ్లు.

            ‘‘అరేయ్‍ ఎంట్రా ఈగల్లా ముసురుతాండ్లు... దూరం దూరం జరుగుండ్లీ’’ అంటూ కసురుకొని అందరికేసి పరీక్షగా చూసిండు. ‘‘నాకు ఎనిమిది మంది కావాలి’’ అన్నాడు.

            నేనంటే నేను అన్నట్టుగా అందరూ మరోసారి సొచ్చుకొచ్చిండ్లు...

            ‘‘అరేయ్‍ మీద మీద పడ్తాండ్లేందిరా దూరం జరగండి’’ అంటూ తిరుపతిరెడ్డి మరోసారి కసురుకొని అందర్ని పరీక్షగా చూస్తూ  ‘‘అరేయ్‍ నువ్వురా... నవ్వురా’’ అంటూ వేలెత్తి చూయిస్తూ ఎనిమిది మందిని ఏరుకొని ‘‘అరేయ్‍ మీరంతా దొరల బంగ్లాకాడికి పొండి.  అక్కడ పని చేయాలి’’ అంటూ పురమాయించిండు.

            ‘సరేనయ్యఅంటూ వాళ్ళు తలలు ఆడించి బయలు దేరిండ్లు. అది చూసి తిరుపతిరెడ్డి మోటారు సైకిల్‍ స్టార్టు చేసిండు.

            కూలీ దొరకని వాళ్ళు నిరాశగా చూసిండ్లు. మరోవైపు కూలీకోసం వచ్చి అరువై, డెబ్బైమంది స్త్రీ కార్మికులు పులుకు పులుకు చూస్తూ నిలబడి పోయిండ్లు.

            ‘‘ఏందే పెద్దయ్య! ఇవ్వాల కూడా ఉత్తదే అయ్యేట్టుంది’’ అంటూ రాధ నిరాశగా చూస్తూ నాగన్న దగ్గరికి వచ్చింది.

            అంత వరదాక ఎటో చూస్తున్న నాగన్న ఆ మాటకు ప్రక్కకు తిరిగి చూసి ‘‘ఏమో బిడ్డా ఎమైతదో’’ అన్నాడు.

            ‘‘నిన్న కూడా వచ్చన కాని పనిదొరకలే’’ అంది.

            రాధను చూసి నాగన్న మనసు భారమైంది. రాధ భర్త శశికుమార్‍ చాలా ఏండ్లు బొగ్గు ప్లాంటులో పనిచేసిండు. ఏడేండ్ల క్రింద బీమారి చేసి చనిపోయిండు. ఏండ్లకు ఏండ్లు బొగ్గు ప్లాంటులో పని చేయటం వలన బొగ్గు వాని ఊపిరి తిత్తులను తినేసింది. రెండు మూడేండ్లు వస్సర వస్సర దగ్గుతూ ఊపిరి సలుపక నానా అవస్థలు పడి చనిపోయిండు. ఒకప్పుడు అమురుకుంటే అమురనటువంటి వాడు చచ్చి పోయ్యేనాటికి కట్టెపుల్ల తీర్గ అయిపోయిండు. వారి ముగ్గురు పిల్లలను రాధ కూలీనాలి చేసుకుంటూ సాదుకొస్తాంది. పోయినేడు పెద్ద పిల్ల పెండ్లి చేసింది.

            నాగన్న మాట మార్చుతూ ‘‘బిడ్డ అల్లుడు ఎట్లున్నడు?’’ అని అడిగిండు.

            రాధ మొఖం విప్పారగా ‘‘మంచిగున్నరు’’ అంది...

            ‘‘ఏందో తీయ్‍బిడ్డా, నువ్వు కష్టపడ్డందుకు పొల్ల మంచిగ బతికితే సరిపాయే’’ అంటూ క్షణమాగి ‘‘పొల్లగాడు ఏం పని చేస్తాండు?’ అన్నాడు.

            ‘‘రైల్వేల కూలీ’’ అంది.

            ఇంతలోనే కాంట్రాక్టర్‍ రంగయ్య గుమస్తా దాడి శ్రీను రావటం చూసి ఆడోల్లల్ల్లో కదలిక ఏర్పడింది. అది చూసి రాధ గబగబ అటు కేసి పరుగు పెట్టింది.

            కాంట్రాక్టరు రంగయ్య ఎన్టీపిసిలో గడ్డిపని, తోటపని చెట్ల పెంపకం కాంట్రాక్టు పట్టిండు. ఎన్టీపిసిలో ప్రతి పని కాంట్రాక్టు కార్మికులే చేస్తారు. సివిల్‍ వర్క్, మెయిన్‍టనెన్స్ పనులు, బాయిలర్స్ క్లీన్‍ చేయటం వంటి అరొక్క పనిని కంపెనీ ఔట్‍ సోర్సింగ్‍ చేసింది. ప్లాంటులో పర్మినెంటు ఉద్యోగుల కంటే కంట్రాక్టు కూలీలు రెట్టింపు మంది పనిచేస్తరు.

            ఎన్టిపిసి పచ్చని చెట్లలో విశాలమైన రోడ్లతో తీర్చి దిద్దినట్టుగా ఉంటుంది. మధ్య మధ్య వివిద స్థాయిలను బట్టి ఉద్యోగుల క్యాటర్స్ ఉంటాయి. అట స్థలాలు, క్లబ్‍లు పిల్లల పాఠశాలలు, పార్కులతో ఒక పచ్చిని తోటలా అహ్లదపూరిత వాతావరణం కల్గి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణలో చెసిన కృషికి గాను రామ గుండం ఎన్టిపిసికి వరుసగా రెండో సారి కేంద్ర ప్రభుత్వంచే బహుమతి పొందింది.

            కాని ప్రతి సంవతకసరం పది మిలియన్ల బొగ్గును కాలుస్తూ, ఎన్టీపిసి చిమ్నీలు అకాశంలోని చిమ్మే బొగ్గుపులుసు వాయువుల గురించి కాని నిరంతరం వెలువడే వేల టన్నుల బూడిద, విషవాయువుల గురించి కాని, అవి సృష్టించే పర్యావరణ విధ్వంసం గురించి ఎవ్వరికి పట్టింపులేదు.

            దాడి శ్రీను పొట్టి మనిషి, అంత పాతిక ముప్పయేండ్ల వయసుకు మించి ఉండదు. సన్నటి గడ్డం పెంచుకున్నాడు. మోటారు సైకిల్‍ను స్టాండు చేసి నేరుగా ఆడ కూలీలు ఉన్న దిక్కు పోయిండు.

            గడ్డిపని తోటపని చేయ్యటంలో మొగొళ్ళకంటే అడోళ్ళే బాగా చేస్తరని అతని నమ్మకం.

            ఎన్టీపిసిలో రక్షణ వారోత్సవాలు జరుగుతున్నాయి అందుకు సంబందించి సభలు సమావేశాలు జరుగనున్నాయి. ఫుట్‍బాల్‍ గ్రౌండ్‍ ప్రక్కన ఉన్న అడిటోరియంలో జరిగే సదుస్సుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువంటి ప్రత్యేక సందర్భంలో ఎక్కువ మంద కూలీల అవసరం ఏర్పడుతుంది. దాంతో ఆయన వచ్చి రావటంతోనే పాతిక ముప్పయి మంది అడ కూలీలను ఎరుకున్నాడు. అప్పాయమ్మ ముందుకు వస్తే అది చూసిన శ్రీను చేతిని గాల్లో ఆడిస్తూ...

            ‘‘ఏయ్‍ ముసల్దాన నువ్వెటు వస్తానవు... పోపో అవతలికిపో’’ అంటూ వారించిండు...

            ‘‘అదేబిడ్డా నేను పని చేయనా?’’ అంది అప్పాయమ్మ దీనంగా....

            ‘‘చూద్దామంటే చటాకు మాంసం లేదు... నువ్వేమి పనిచేస్తవు పోపో’’ అంటూ కసిరిండు.

            ‘‘లేదు బిడ్డా నే చేస్తా... చెయ్యకుంటే మరోసారి పిలువకు’’ అంటూ ఎండిపోయిన రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది.

            ‘‘ఏయ్‍ ముసల్దానా, నన్ను వొర్రియ్యకు’’ అన్నాడు మరోసారి చీదరింపుగా....

            ‘‘లేదు బిడ్డ రెండు రోజులుగా తిండిలేదు. ఇంటికాడ అందరికి అందరం అకలికి చస్తానం’’ అంది మరింత దీనంగా...

            ‘‘దానికి నన్నేమి చెయ్యమంటవు?’’ అంటూ కసిరిండు.

            అయినా అప్పాయమ్మ ఇంకా దీనంగా బ్రతిమిలాడుతుంది. కాని దాడి శ్రీను మనసు కరుగటం లేదు. బంకలా పట్టుకున్న ముసల్దాన్ని చూసి కోపానికి వచ్చిండు.

            ‘‘నీయవ్వ ముసల్దాన చెప్పుతాంటే నీకు కాదు... నీ అటువంటి దాన్ని పనిలకు తీస్కపోతే మా సేఠ్‍ నన్ను పనిలనుండి తీసేస్తడు’’ అంటూ విసురుగా ముసల్దాన్ని ప్రక్కకు తోసి మిగితా వాళ్ళను వెంట తీస్కపోయిండు.

            అప్పాయమ్మ పరిస్థితి చూసినాగన్న మనసు చివుక్కుమన్నది. కాస్త కుడిఎమలుగా తన పరిస్థితి అలాగే ఉంది. తననే తోసేసినట్టుగా అన్పించి ఖిన్నుడై పోయిండు.

            అప్యాయమ్మ కారు సముద్రం భార్య. అంతర్గాంమిల్లులో వీవింగ్‍ సెక్షన్లో పనిచేసేవాడు. బర్మా కాందిశీకుడుగా వచ్చిండు. మిల్లు మూత పడ్డ తరవాత కొన్ని రోజులు ఎన్టిపిసి క్యాంటిన్‍లో కూలీగా పనిచేసిండు. ఒక రోజు రాత్రి పనిచేసి వచ్చే క్రమంలో కలు జారి పెద్ద మోరిలో పడి చనిపోయిండు. అప్పటి నుండి వాళ్ళకు కష్టాలు మొదలైనవి. వారికి ఒక కూతురు ఉంది. దానికి పెండ్లి చేసిండు. ముగ్గురు పిల్లలైన తరువాత కూతురుకు ఏదో మాయ రోగం తాకి నానా అవస్థ పడి చనిపోయింది. దాని మొగడు పెండ్లాం పిల్లలను వదిలేసి మరో దాన్ని లేపుకొని ఎటో బ్రతక పోయిండు. ఇప్పుడు పిల్లలకు ఆధారం అప్పాయమ్మే. అమె పని చేస్తే ఎల్లినట్టు లేకుంటే లేదు.

            ‘‘ఎవరిని చూసిన బ్రతుకు ఒక్క తీరుగానే ఉంది. ఏం పాపం చేసుకున్నమో బ్రతుకు ఇట్లా కాలబడ్డది’’ అనుకొని నిట్టూర్చిండు.

            దూరం నుండి కొంత మంది హౌజ్‍ బిల్డింగ్‍ కంట్రాక్లర్లు వస్తూ కనిపించిండ్లు. వాళ్ళంతా ప్రైవేటుగా ఇల్లుకట్టే       వాళ్ళు. రోజువారి పనులతో పాటు ఏదైనా స్లాబ్‍ పనులు జరిగినప్పుడు అదనపు కూలీలు అవసరం పడుతారు. ఎండకాలం సీజన్‍లో అయితే ఇంటి నిర్మాణపు పనులు జోరుగా సాగుతాయి. అటువంటప్పుడు కూలీలకు చేతినిండా పని దొరుకతది.

            ఇండ్ల నిర్మాణపు పనులు గుత్తకు తీసుకొని పని చేసే కాంట్రాక్టర్లు చాలా మంది ఆంధప్రాంతం నుండి వచ్చిన      వాళ్ళు. మాములుగా అయితే ఇండ్ల నిర్మాణం ఫీటుకు ఇంత అని కూలీ లెక్కకట్టి తీసుకుంటారు. మరికొంత మంది మొత్తం ఇంటి నిర్మాణం  గుత్తకు తీసుకొని పన్జేస్తారు. ఇట్లా గుత్తకు పట్టినవాళ్ళు తోటి కూలీలతో పాటు తాము కూడా పన్జేస్తారు. మరికొంత మంది రెండు మూడు దిక్కుల పని ఉంటే వాటి సూపర్‍వైజ్‍ చేస్తూంటారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన         వాళ్ళు తమతో పాటు కూలీలను కూడా వెంట తెచ్చుకుంటారు. ఇక్కడి వాళ్ళయితే సరిగా పని చెయ్యరని వాళ్ళకో నమ్మకం. ఏ బిల్డంగ్‍లకు స్లాబులు పోయటం వంటి అదనపు పనులు పడ్డప్పుడు కూలీ అడ్డ మీదికి వచ్చి అవసరమైన కూలీలను అపూటకు తీస్కపోతరు.

            వాళ్ళను చూసి మిగిలిన కూలీలల్లో ఆశలు రేగినవి. అట్లావచ్చిన వాళ్ళు పాతిక ముప్పయి మందిని ఏరుకొని వెంట తీస్కపోయిండ్లు.

            ఈ సారి కూడా నాగన్న పని ఉత్తదే అయింది. కాంట్రాక్టర్లు ఎవరు తనవైపు చూడనైన చూడలేదు. వెనక్కి చేతులు కట్టుకొని ఎవరైనా కూలీకి పిలుస్తారమోనని ఆశగా చూసిండు. కాని ఎవరు పిలువలేదు.

            ఎన్టీపిసిలోని పచ్చగా, గుబురుగా అకాశంలోకి ఎదిగిన చెట్లపైనుండి సూర్యుడు ఎగబాకుతున్నాడు. రోడ్డుమీద వాహనాల రోద పెరిగింది. రోడ్డు అవలవైపున కూరగాయలమ్మెకాడ జన సంచారం ఎక్కవైంది. రోడ్డు ప్రక్క చాయ్‍ అమ్మేవాడు నాలుగు గీరల బండి తీసుకొచ్చి సామాన్లు సర్దుకుంటాండు.

            ‘‘ఇక లాభం లేదు ఇవ్వాళ కూడా పని దొరికేట్టు లేదు’’ అంటూ దగ్గర వచ్చిండో ఓ వ్యక్తి... ఆయన మొఖంలో నిరాశ నిస్పృహలు  కనిపించినవి.

            నాగన్న అతనికేసి పరీక్షగా చూసిండు. కాస్త వయస్సు మళ్ళిన వాడు, నలుబై యాబై ఏండ్ల మధ్య వయస్కుడు. పీక్కపోయిన నల్లటి  మొఖం. మొలకు పంచే కట్టుకొని పైన బుషట్‍ వేసుకొని ఉన్నాడు. సగం నెరిసిన తల... చేతిలో చెయ్యి సంచి ఉంది. బహుశా అందులో సద్ది తెచ్చుకున్నట్టుంది.

            ‘‘ఎక్కడి నుంచి వచ్చినవు?’’ అని అడిగిండు నాగన్న...

            ‘‘పారుపల్లి’’

            ‘‘అంటే మంథని దగ్గర పారుపెల్లా?’’

            ‘‘అవును’’

            ‘‘అంత దూరం నుంచి వచ్చినవా?’’ అంటూ నాగన్న అశ్చర్యపోయిండు.

            ‘‘మరి ఏం చెయ్యాలి... పనులేమి లేవు.  బ్రతకటం కష్టమైతాంది.. ఇక్కడ కూలీపనులు దొరుకుతయంటే వచ్చుడైతాంది’’ అన్నాడు బాధగా..

            ‘‘ఇది వరకు ఏం పని చేసినవు?’’

            ‘‘వ్యవసాయం’’

            ‘‘మరి వ్యవసాయం చేసినోడివి గీ పనిలకు ఎందుకొచ్చినవు? వ్యవసాయం నడువటం లేదా?’’

            ‘‘కిందికో మీదికో మాగ నడుస్తుండే’’ అంటూ అతను అర్దోక్తిలో అగిపోయి దూరంగా ఎటో చూస్తుండిపోయిండు.

            ‘‘ఇప్పుడేమైంది?’’ అంటూ నాగన్న మాట పొడిగించిండు.

            అతను భారంగా నిట్టూర్చిండు... క్షణకాలం ఏం మాట్లాడకుండా నిలువు గుడ్లేసుకొని బీరిపోయిండు. కండ్లలో ఏదో తడి... కాసేపటికి తేరుకొని చెప్పసాగిండు.

            ‘‘నాకు రెండు ఎకరాల చెలక ఉండేది. అందులో ఇంత మక్కలో, పెసర్లో వేసుకొని కాలం గడుపుకొస్తుంటి. పని పాటలేనప్పుడు బావులు తవ్వపోయ్యేది. నా పెండ్లం యింత కూలినాలి చేసేది. అట్లనో ఇట్లనో బ్రతుకు వెళ్ళేది’’

            ‘‘మరిప్పుడేమైంది?’’

            ఎర్రటి ఎండ మొఖం మీద పడ్తుంటే అతను మరోసారి భారంగా నిట్టూర్చి ‘‘నా భూమి నాకు కాకుండా పోయింది’’ అన్నాడు భారంగా...

            ‘‘అదే...?’’

            విషాదం అలుముకున్న మొఖంతో అతను మళ్ళీ చెప్పసాగిండు.

            ‘‘అ భూమి మా అయ్య ఇచ్చిందికాదు. ఆయన బ్రతుకంతా దొర దగ్గర పాలేరుగానే గడిచింది. ఆయన బ్రతికి ఉన్నప్పుడు మన కంటూ గుంటెడు భూమి ఉండాలని బమిసే వాడు. కాని ఆయన జీవితంలో ఆ కోరిక తీరకుండానే పోయిండు’’

            ‘‘మరైతే ఆ భూమి ఎట్లా వచ్చింది. నువ్వు సంపాదించుకున్నవా...?’’

 

            అతన మొఖం ఒక్కసారిగా గంభీరమైంది. దృఢమైన స్వరంతో అవును నేనే సంపాదించుకున్నాఅన్నాడు.

            ‘‘ఎట్లా?’’

            ‘‘ఎట్లా అంటే ఏం చెప్పాలి?’’ అంటూ నిట్టూర్చి మళ్ళీ చెప్పసాగిండు.

            ‘‘ముప్పయేండ్ల క్రిందటి మాట... మా ఊర్లెకు అన్నలు వచ్చిండ్లు. ఊళ్ళో సంఘం పుట్టింది. అంత వరదాక దొర కబ్జాలో ఉన్న పొరంబోకు దొరల భూమిని స్వాధీనం చేసుకొని భూమిలేని పేదోళ్ళకు పంచిండ్లు... అట్లా నా పేరట రెండు ఎకరాలు వచ్చినవి’’ అన్నాడు.

            నాగన్నలో ఆసక్తి రేగింది. తన ఊరిలో నాగన్నకు వారసత్వంగా ఎకరమంతా భూమి వచ్చింది. కూలీనాలి చేసుకొని మరో ఎకరం కొనుక్కుంటే హాయిగా వచ్చి ఊర్లో వ్యవసాయం చేసుకంటూ బ్రతక వచ్చని కలగన్నడు. కాని ఆ కల నేరవేరలేదు. అయినా భూమి మీద మమకారం చావక అది అట్లాగే ఉంచిండు. వాళ్ళు వీళ్ళు నాగన్న నువ్వు వచ్చి ఇప్పటికే ముప్పయేండ్లు గడిచిపాయే...ఇక నువ్వుపోయి మళ్ళీ వ్యవసాయం చేసేదెప్పుడు? ఉత్తగా పడావు పెట్టుడెందుకు? ఆయింత అమ్మకపోయినవా?’’ అని అన్నప్పుడు నాగన్న ‘‘భూమిని ఎవరైనా అమ్ముకుంటరా... నేను కాకుంటే ఎప్పుడో నా పిల్లలకు అక్కరకు రాకపోద్దా?’’ అని భూమిని అమ్మకుండా అట్టే పెట్టిండు. అలోచన నుండి తేరుకున్న నాగయ్య తర్వాత ‘‘ఏమైంది?’’ అని అడిగిండు.

            ‘‘చాన లొల్లులు జరిగినయి. దొర కోపానికి వచ్చి పోలీసులను తెచ్చిండు. కొట్లాటలు కేసులు జరిగినయి. అయినా భూమిని వదిలేది లేదంటూ సంఘం తీర్మానం చేసింది’’ అంటూ క్షణ మాగిండు. బాధతో గొంతు వణుకగా మళ్ళీ చెప్పసాగిండు.

            ‘‘సంఘంలో చురుగ్గా తిర్గే మాదిగ సాయన్న కొడుకు కొమురయ్య సంఘం నాయకుడుగా ఉన్నప్పుడు అంతా బాగానే జర్గింది. ఎప్పుడైతే పోలీసులు ఓ దొంగ రాత్రి వచ్చి కొమురయ్యను పట్టుకొని చెఱువు కట్టకాడ కాల్చిచంపిండ్లు. అయినా సంఘం ఎనకడుగు వెయ్యలేదు. అంత కంత ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించి దొర ఇంటిమీద ఊరోల్లంతా పోయి దాడి చేసిండ్లు. ఆ సంగతి దొర కెట్లా తెలిసిందో కాని తెలిసింది. రాత్రికి రాత్రే తట్ట బుట్ట పట్టుకొని పట్నం పారిపోయిండు. అటు తరువాత మళ్ళీ ఊరు మొఖం చూడలేదు’’ అంటూ భారంగా నిట్టూర్చిండు. దూరంగా దృష్టి సారించి మళ్ళీ చెప్పసాగిండు.

            ‘‘కాలం కలిసిరాలే... ఏండ్లకు ఏండ్లు ఎదురులేకుండా దొరతనం చెలాయించుకున్న దొరలు ఊళ్ళు విడిచి దెంక పోయే సరికి ప్రభుత్వం ఊళ్లమీదికి పోలీసులను పంపింది. గొర్రెల మంద మీద తోడేల్లు పడ్డట్టు పోలీసులు బారు తుపాకులు వేసుకొని ఊర్ల మీద పడి అయినొన్ని కానోన్ని కాల్చిచంపిండ్లు.. మొత్తానికి ఏమైతేనిమి ప్రభుత్వంది పై చెయ్యి అయ్యింది’’ అన్నాడు.

            ‘‘మరి ఆక్రమించుకున్న భూముల సంగతి ఏమైంది?’’ అన్నాడు నాగన్న. ఆసక్తిగా అతను మళ్లీ చెప్పసాగిండు.

            ‘‘కొన్ని దిక్కుల దొరలు పోలీసులను పట్టుకొచ్చి వాళ్ళ భూములు వాళ్ళు లాక్కున్నరు. మరికొన్ని ఊర్లల్ల పడావు  పడ్డయి. కాని మా ఊర్లే మాత్రం ఆక్రమించుకున్న భూమిని వదలలేదు. సాయన్న కొడుకు కొమురయ్య పేరు మీదమేం ఆక్రమించుకున్న భూమిల స్థూపం కట్టినం. అందరికి అందరం ప్రాణాలు పోయిన భూమిని వదిలేది లేదనుకొని ఇన్నేండ్లు  సాగు చేసుకున్నం’’ అన్నాడు.

            ‘‘ఇప్పుడేమైంది?’’

            ‘‘ఏం చెప్పాలే... అటు తరువాత తెలంగాణ లొల్లి వచ్చింది. తెలంగాణ వస్తే  బ్రతుకులు బాగు పడ్తయని పోరగాండ్లకు ఉద్యోగాలు వస్తయని చిన్నా పెద్ద, ముసలి ముతక అనుకుంటూ తెలంగాణ లొల్లిలో పాల్గొన్నం... కాని తెలంగాణైతే వచ్చింది కాని మా బ్రతుకుల మన్ను పోసింది’’ అన్నాడు అవేశపడిపోయి...

            ‘‘ఏమైంది?’’

            ‘‘ఆ మధ్యన ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని  రైతు బందు పథకం పెట్టింది. అబ్బో, మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని సంబర పడ్డం. కాని వాడు ఎరవేసి చాపను లాగుతాండని ఊహించలేదు’’ అన్నాడు బాధగా...

            ఆయన మాటల కోసం నాగన్న ఆసక్తిగా చూసిండు అతను మళ్ళీ చెప్పసాగిండు.

            ‘‘మేం దొరల భూములు ఆక్రమించుకొని ఇరువై ఏండ్లుగా సాగు అయితే చేసుకుంటానం. కాని అ భూముల మీద పట్టా మా పేరు మీద లేదు. ఇంకా దొరల పేరు మీదే ఉంది. ఎప్పుడైతే రైతు బందు పథకం వచ్చి పట్టాదారులకు పైసలు పంచిందో ఆ పైసలన్నీ దొరకు ముట్ట చెప్పింది. భూములను మళ్ళీ దొరపేరు మీద మార్చిండ్లు’’ అన్నాడు.

            ‘‘మారిస్తే  ఏమైంది?’’

            ‘‘ఎనకటి లెక్కన సంఘాలు లేవు. అన్నలు లేరు. అడిగే వాడు లేడు... దాంతో దొర పోలీసులను వెంటేసుకొని వచ్చి నా భూమిని మీరెట్లా సాగుచేస్తరని బలవంతంగా ఆక్రమించుకున్నడు.  మేం ఎంతో ప్రేమతో కట్టుకున్న కొమురన్న స్థూపాన్ని బుల్‍డోజర్‍తో కూల్చివేసి భూమి చుట్టూ కంచె వేసుకున్నాడు’’ అన్నాడు బాధగా...

            అదంతా విన్న నాగన్న మనసు కలత చెందింది. ఇంత పోరాటం చేసి ఇన్ని త్యాగాలు చేసినా బ్రతుకు మళ్ళీ  మొదటికి వచ్చింది కదా అన్న బాధ కల్గింది. ఆ బాధలో అప్రయత్నంగానే

            ‘‘ఎవన్ని నమ్మెతట్టు లేదు. నమ్మించి గొంతులు కోస్తాండ్లు’’ అన్నాడు బాధగా...

            అప్పటికి కూలి కోసం వచ్చిన వాళ్ళు నిస్పృహగా ఎటోల్లు అటు వెళ్ళిపోతాండ్లు...

            ‘‘అన్నా ఇక నేను పోతా’’ అన్నాడు అతను...

            ‘‘మళ్ళీ రేపు వస్తవా?’’

            ‘‘వచ్చి ఏం చెయ్యాలి... చార్జీలు దండగైతనయి. అక్కడే ఏదైనా పని చూసుకుంటా..’’ అంటూ అతను దూరంగా బస్సు వస్తున్నది కనిపెట్టి, వడివడిగా అడుగులు వేసుకుంటూ పరుగు పెట్టిండు..

 

(తరువాయి భాగం వచ్చే సంచికలో)

ఈ సంచికలో...                     

JAN 2021

ఇతర పత్రికలు