నవలలు

నవలలు

సైరన్ నవల  రెండవ పార్ట్ –  ఏడవ   భాగం

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)                                                           

                                                                                   25

            జనవరి నెలంత ఎన్నికల ప్రచారాలు ముమ్మరంగా నడిచాయి. కార్మికులంతా తిన్నరు - తాగిండ్లు - పల్లెలన్ని మేక మాంసంతోని, సారా, బ్రాండిలతోని ఊగిపోయినయి.

            సింగరేణిలో బస్తీ కమీటిలు అన్ని బస్తీలల్లో ఏర్పడ్డాయి. రాడికల్‍ పిల్లలు అక్కడక్కడ మీటింగులు పెట్టి ఎన్నికలు బహిష్కరించాలని, రాజకీయఖైదీలను విడుదల చేయాలని ప్రచారం చేసిండ్లు.

            శంకరయ్య కాళ్లకు గజ్జెలు గట్టి గొంగడేసి బస్తీలల్ల పాటలు పాడిండు. పుస్తకాలు చదవడం, పాటలు కట్టడం, డ్యూటీతో ఊపిరి సలుప కుండా తిరుగుతున్నాడు.

            లక్ష్మికి ఎనిమిది నెలలు ఏడవ నెల నుండి చంద్రకళ దగ్గరే ఉంటోంది. మొగిలి సింగరేణికి వచ్చి ఏడాది గడిచిపోయింది... మొత్తానికి కిట్టయ్యకు రెండు వేలు అప్పుకట్టారు. పోశెట్టి దగ్గర చేసిన అప్పు అట్లాగే ఉంది. డ్యూటీకి పోవడం ఇల్లు రాజేశ్వరికి రెండో నెల. అంతా బాగున్నట్టుగానే ఉందిగాని - ఏది అర్థం గాదు... గంటల తరబడి షరీప్‍ వెంట తిరుగుతండు. షరీప్‍ అప్పుడో మాట ఇప్పుడో మాట.. శంకరయ్య, పోశెట్టి మొగిలి కలిసి తలా ఓ చెయ్యోసి షరీప్‍ గుడిసె బాగు చేసి, బాత్‍రూం, పాయఖానా కట్టారు. ‘‘మా అందరికి పిల్లలున్నరు’’ మొగిలి ఒకనాడు...అర్దమయ్యింది మొగిలి - మనకామ్రేడ్స్ ఇల్లు - సంసారం, స్వార్థమస్తదని - ముందే ఆపరేషన్‍ చేయించుకుంటరు. మీరంత మా పిల్లలుగాదా? అన్నడు షరీప్‍...

            షరీప్‍గనులమీద తిరుగుతున్నాడు. రెహనా బస్తీ కమీటీలు - మహిళా సంఘాలతో కలుస్తోంది. ఎవరి పనులు వాళ్లు బిజీగా ఉన్నారు. ఎన్నికలల్లో జనతాపార్టీ తరపున చుంచు లక్ష్మయ్య గెలిచిండు - నారాయణరావు అదే రాత్రి హైదరాబాదు పోయిండు - నవనీతరావు వారం రోజులు ఇల్లు కదలలేదు. వ్యాపారాలదిక్కు పోలేదు.

            కృష్ణారావు ఇంటికి రాకుండా సిక్కులామెతోనే ఉన్నాడు. రాత్రి పగలు తాగుడే తాగుడు. రాజేశ్వరరావు ఇల్లు కదలలేదు...

            ముసలి ముకుందరావు పత్రికల మీద పత్రికలు తెప్పించి చదివిండు. ‘‘మొత్తానికి - జారుడు మొదలైంది’’ గొనుక్కుంటూ గదిలో ముసలి పులిలా తిరుగుతున్నాడు.

            మార్చిలో వెంగలరావు పోయి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు.

 

                                                                                    26

 

            నక్కపోశం బావ మరిది శేఖర్‍ను తీసుకొని మార్కెటుకచ్చిండ. కిలో నర మేక మటన్‍ కొనుక్కున్నడు.

            ‘‘అరే! బామ్మర్దీ - మందుగావాలె - సైకులాపుర’’ అన్నాడు పోశం...

            శేఖర్‍ సైకిలాపిండు. అటిటు చూసి ‘‘గట్ల బ్రాండి షాపుకాడికి పోనియ్యి’’ అన్నాడు.

            ‘‘ఔ బావా! లేటయితంది - ఇంటికి బోదాం అక్క కోపానికత్తది’’

            ‘‘నేను మీ అక్కకు బయపడుతానుర - నాకంటె జెరంత ఎత్తున్నదిగని’’

            శేఖర్‍ ఆరడుగులెత్తు, ఎత్తుకు తగ్గ శరీరం. అట్టకట్ట గుంటడు. నక్కపోశం శేఖర్‍ ముందు పిలగాని తీర్గుంటడు. ఉదయం పదిగంటలకే బ్రాండిషాపు ముందు ఇరువూ మంది దాకున్నరు. ‘‘శేఖర్‍ అయ్యిందయ్యింది - సెరో బీరు గొట్టిపోదాం - ఎండలుముదురుతన్నయ్‍. సల్లగుంటది - ఇగో ఎనుకకురా - అక్కడ వేప చెట్ల కింద సల్ల గుంటది - నువ్వు తీసుకొనిరా. అట్లనే బరండిఆప్‍ బాటిల్‍ తీసుకో - నేను పోతే ఆడ లట్టుగాడు పొట్టుగాడు కల్సి నాతోని పైసలు పెట్టిత్తరు’’ యాభైరూపాల నోటుతీసి ఇచ్చిండు నక్కపోశం.

            పది నిమిషాలకు రెండు బీర్లు, ఆప్‍ బాటిల్‍ బ్రాండి బాటిల్‍ తెచ్చి హాప్‍ బాటిల్‍ సంచిల బెట్టిండు శేఖర్‍.

            ఇద్దరు గల్సి చెరో బీరు తాగిండ్లు.

            పైసలు తీసి బావకిచ్చిండు.

            ‘‘అరె అయిదు రూపాలు ఎక్కువత్తన్నయ్‍. బీర్ల ధర తగ్గిందారా’’ నక్కపోశాలు...

            ‘‘లేదాబావా - మూడు బీర్లపైసలు తీస్కుంటనన్నడు’’

            ‘‘లెక్కే - ఎవడుతాగినా ఒక బీరు పోశమ్మకు దీసుడే’’

            ‘‘పోశమ్మేంది బావా! గుండా గాళ్ల మామూల్లట’’

            ‘‘ఇయ్యలేదా?’’ నక్క పోశాలు తాగిన బీరు మొత్తం దిగిపోయింది.

            ‘‘ముంచినవ్‍రా! బామ్మర్దీ! పా - వాళ్లత్తే - మనవీపులు సాపుజేత్తరు’’

            ‘‘షాపుముందటున్నరు. సారలి గాడు నాగళ్ల పట్టిండు. నేను వాన్ని దొబ్బేసిన - ఇయ్యపోరా ఏంబీక్కుంటవో పీక్కో పోరా అన్న’’

            నక్క పోశాలు తెరిసిన నోరు మూయకముందే - సారలి, శంకర్‍ లోపలికొచ్చిండ్లు...శేఖర్‍ను సారలి గుద్దిండు. శంకర్‍ నక్క పోశాలును గుర్తిపట్టి

            ‘‘అన్నా వీడు కన్నాల బస్తీ వోడు. మనలను నరుకుత మని గీబస్తీలోల్లు - బస్తీ కమిటీ పెట్టుకున్నరన్న’’

            నక్కపోశాలుపై ప్రాణాలు పైన్నే పోయినయ్‍. అక్కడ తాగుతున్నవాళ్లు ఎవరూ వాళ్ల దగ్గరికి రాలేదు లొల్లి ముదిరింది.

            శేఖర్‍ సెలిపిచ్చుకొని బయటపడి బావను గుంజుకొని బయటికచ్చిండు.

            సైకిల్‍ తీసుకున్నరు. వెనుక ఉరికొచ్చిన సారలి, శంకర్‍ ‘‘అరె! గిప్పుడే నీ పెండ్లాన్ని...’’ సారలి బూతులు తిడుతున్నాడు. శంకర్‍ ఎక్కన్నుంచో గొడ్డలి తెచ్చిండు.

            ‘‘బావా! వాన్ని నరుకుత’’ సైకిల్‍ తొక్కుతూ - దిగ చెమటలు కారిపోతుండగా - గజగజ వనుకుతూ నక్క పోశాలు ‘‘వద్దురా! పోనియ్యి - వాళ్లు మన ఇంటి కత్తరు’’ అన్నాడు.

            వాళ్లు గావరగావరగా మేన్‍రోడ్డు దిగి కన్నాల బస్తీ గల్లీలకు తిరిగిండ్లు - మూలమీది వేప చెట్టుకింద లుంగీలు కట్టుకొని, మురళి, మోహన్‍, గంగాధర్‍ ఎన్నికలమీద ఏదో మాట్లాడుతండ్లు నక్క పోశాలు సైకల్‍ దిగి కింద కూసున్నడు. శేఖర్‍ బజార్ల, బ్రాండి షాపు దగ్గర జరిగిందిచెప్పిండు....

            ‘‘వాళ్లు గొడ్డండ్లు బట్టుకొని మా ఇంటి కత్తనన్నరు.’’ పోశాలు ఏడుస్తూ నూతిలో మాట్లాడినట్టు...

            ‘‘భయపడకు - మేం చూసుకంటం - శేఖర్‍ మీ బావను ఇంటికాడ పడగొట్టు’’ మోహన్‍...

            శేఖర్‍ గడ్డపార తీసుకొని వచ్చిండు.

            అప్పటికప్పుడు పదిహేను మంది బస్తీ కమిటి వాళ్లు జమైండ్లు.

            ‘‘వాడు గీ పట్టపగలు గంతపనిజేత్తడా? రాములు గొనిగిండు.

            ‘‘వానికి మెదడు లేదు?’’

            ‘‘వాళ్లెంత మంద వస్తరోకదా?’’ మురళి...

            ‘‘గింత తొందరగ జమైతరా! సూద్దాం. వాళ్లెంత మందచ్చినా మన బస్తీ మీద పట్టపగలు - ఆడోల్లమీద దాడి చేస్తే చూస్తూ కూర్చుండలేంగద’’ గంగాధర్‍... అందరు కలిసి గల్లీల నుండి మేన్‍ రోడ్డు మీది కచ్చిండ్లు - ‘‘అందరం ఒక్క సారి కన్పియ్యద్దు - నేను చూస్త సంగతేందో?’’ మోహన్‍ అందరిని అక్కడున్న పాలచేట్ల గాడ నిలుసుండుమన్నడు.

            రోడ్డు మీద సైకిల్లు వస్తూపోతున్నాయి. యాభయిగజాల దూరంలో సైకిల్లు ఆపుకొని సారలి, శంకర్‍లు నిలుచున్నారు. మోహన్‍ను వాళ్లు చూసిండ్లు - కాసేపు ఏదో మాట్లాడు కున్నారు. ఎడం చేత హాండిల్‍ పట్టుకొని కుడిచేతలో గొడ్డండ్లున్నాయి.

            మోహన్‍ బెదురలేదు. వాళ్లిద్దరు వేగంగా సైకిల్లు తొక్కుకుంటూ ముందుకు వచ్చిండ్లు...

            మోహన్‍ సీటి గొట్టిండు. పదిహేనుమంది పాలచెట్లల్ల నుంచి బయటకు వచ్చిండ్లు - వాళ్లు మూడు గజాల దూరంలో ఉన్నారు. రాములు గడ్డ పార విసిరిండు. గూండా శంకర్‍ నడుములో గడ్డపారదిగింది. శంకర్‍ గూండా గావుకేక వెట్టిండు. శంకర్‍  చేతుల శేఖర్‍ గొడ్డలి గుంజుకున్నడు. సారలి భయంతోని పాడుబడిన గుడిసెల కురికిండు. అందురు వెంటపడ్డారు.

            పెనుకేకలు విన్పించాయి - అంతా మూడు నిమిషాలల్లో ముగిసింది. సారలిని ఈడ్చుకుచ్చి శంకర్‍ పక్కదుబ్బలో పడెసిండ్లు. వాళ్లి ద్దరి శరీరాలు దుమ్ములో కొట్టుకొంటున్నాయి. ఆ దారంట వచ్చే సైకిల్లు ఆగిపోయినయ్‍...

            అక్కడ ఇరువై మంది మూగిండ్లు...

            పదిహేను మంది నడుచుకుంటూ మేన్‍ రోడ్డుదాటి అడివిలాగాపెరిగున్న మురికి తుమ్మల్లోకి వెళ్లిపోయారు.

                                                                                    27

 

            మొగిలి ఆదరబాదరగా షరీప్‍ ఇంటికి వచ్చిండు. రాజేశ్వరి అక్కడే ఉన్నది.. షరీప్‍ది నైటు షిప్టు - గుర్రుకొట్టి నిదురపోతండు.

            ‘‘అక్కడ కన్నాల బస్తీ మేన్‍ రోడ్డుమీద సారలిగాన్ని శంకర్‍ గాన్ని నరికేసిండ్లు’’ మొగిలి వేగంగా సైకిలు తొక్కడం వలన మొసపోస్తున్నాడు.

            ‘‘మంచి పనిచేసిండ్లు’’ రెహనా రాజేశ్వరిని పట్టుకొని డాన్సు చేసింది.

            షరీప్‍ను లేపింది. షరీప్‍ ఉలిక్కి పడిలేచి కండ్లు నులుపుకున్నాడు. నెత్తి గోక్కున్నాడు. ‘‘సారలి గాళ్లను ఖతం చేసిండ్లట’’ రెహనాచెప్పింది. ‘‘ఎప్పుడు ఎక్కడ’’ షరీప్‍ మంచంలో నుండి లేచిండు. మొగిలి మంచి నీళ్లయితే తాగు. రెహనా మంచినీళ్లు తెచ్చి మొగిలికిచ్చింది. గటగట తాగిండు.

            ‘‘ఏమన్న తెల్సిందా?

            ‘‘పొద్దుగాల పదిన్నరకట - కన్నాలబస్తీ  కలిసే మేన్‍రోడ్‍మీద కన్నాల బస్తీ కమిటోల్లేనట’’

            ‘‘అయితే మన గంగాధర్‍ మోహన్‍ మురళి ఉంటరు’’ షరీప్‍...

            ‘‘సునోజీ’’షరీప్‍...

            ‘‘ఇగో మీరిద్దరు చంద్రకళ అక్క దగ్గరకిపోండ్లి. శంకరయ్య మొగిలి నేను ఈదినం ఏడనన్న పంటం - ఎటుబొయి ఎటత్తదో?’’ షరీప్‍ బట్టలేసుకున్నాడు.

            రెహనా రాజేశ్వరి బయలుదేరిండ్లు - రాజేశ్వరి ఇంటిదగ్గర సదిరి తాళమేసి తాళం చెయ్యి - మొగిలికి తెలిసినకాడ బెట్టింది.

            ‘‘వదినే అంత అమ్మల వయిల జరిగినట్టే జరుగుతందిగదా!’’ రాజేశ్వరి మెదట్లో రీబిన్‍ వాళ్ల కలిసి రోడ్డుమీద వీళ్ల గురించి పోలీసులకు చెప్పిన వాన్ని చంపినదిగుర్తొచ్చింది.

            ‘‘వాళ్లు వేరు. మన దగ్గర ఇంక గంతలేదు. వాడు గూఢాచారి - వీళ్లు లుచ్చాగాళ్లుతోబా రాయేశ్వరీ ఎంత మంంది ఆడోల్లను కరాబు చేసిండ్లో! మొదట్ల దొడ్డికి పోయేటోల్లను చిడాయించడంతోని మొదలయ్యింది. ఆడోళ్లు మర్ల బడ్డరు.       వాళ్లు ఎంట బడ్డరు. అట్ల ఒకలనో ఇద్దరినో మురికి తుమ్మ చెట్లల్లకు గుంజకపోయి ఖరాబు చేసిండ్లు దొరోని బంట్లు - దొరోడు గసోంటోడే - తాగుడుకు ముడుపు సీసాయివ్వాలె - మార్కెట్ల దుకాణంకు ఇంతాని యివ్వాలె ఆతరువాత నచ్చిన బహెన్‍ వెంటపడి - రాత్రి ఇంటిమీద కచ్చిఖరాబు చేసేటోల్లు - గిప్పుడు బాజాప్త మార్కెట్లనే షురు చేసిండ్లు’’

            ‘‘ఔనట - లక్ష్మక్క చెప్పింది. ఆదినం గ ఎర్ర జెండ యూనియాఫీసుల సొర్రకపోతే’’ లక్ష్మిక్క బతికేది కాదట రాజేశ్వరి - రెహనా చెవులు మూసుకున్నది - వాళ్లు మేన్‍రోడ్డు మీద కచ్చిండ్లు - ఆగమాగంగ ఉన్నది - పోలీసోల్లు దుకాండ్లు మూసేపిస్తున్నారు.

            ఒక పోలీసాయాన ఆపిండు.

            ‘‘ఏడికి పోతండ్లమ్మ - అంత గడబెడ గున్నది’’ పోలీసు...

            ‘‘ఆ బాడ్‍కావులు సావనే సచ్చిండ్లటకద’’ రెహనా...

            ‘‘ఇంకా చానా మందున్నరు’’ అన్నడు పోలీసు.

            ‘‘మా సెల్లెకు నొప్పులత్తన్నయట’’ రెహనా...

            ‘‘పోలీసు వేగిరంగాఉన్నడు. ఏదో బూతు మాట తిట్టిండు. వాళ్లకు వినపడలేదు. అంత ఆగమాగంగ ఉన్నది. సైకిల్లమీద మొగవాళ్లు ఆదర బాదరగా పిస్సలేసినట్టు ఉరుకుతండ్లు...

            ‘‘వదినా! మనం చూసొత్తామా?’’ రాజేశ్వరి...

            ‘‘బాగనే ఉంటది - కని ఎట్లుంటదో - ఈ దొరోని గుండాగాళ్లు ఊరంత అంగడంగడి చేత్తరమొ?’’ ఇంతలో సైకిల్‍ షాపు పాషా వీళ్లను చూసి ఉరికచ్చిండు.

            ‘‘అంత గడబెడ గున్నది - ఎటు పోతండ్లు?’’

            ‘‘వాళ్లను సూద్దామని’’ రెహనా - ఒకసారి తలెత్తి ఇద్దరి ముఖాలు చూసి’’ ఇక్కడుండుండ్లి - మా దోస్తును తీసుకవస్త - ఎండదంచి కొడ్తంది - సైకిల్ల మీద పోదాం’’

            మరో అయిదు నిమిషాలల్లో సైకిల్ల మీదకూర్చుండి పోతున్నారు.

            ‘‘పాషాగడబెడగున్నదన్నవ్‍ - వాళ్ల గుండాగాళ్లత్తే’’

            ‘‘రారు. షాకుదిన్నరు. వాళ్ల దొర హైదరబాదుకార్ల దెంకపోయిండట - ఏదన్నయితే జలాదేంగే పూరా’’ పాషా ఉద్రిక్తింగా ఉన్నాడు.

            వాళ్లు పోయ్యేసరికి వందలాది మంది జమై ఉన్నారు. చిత్రంగా ఆడవాళ్లు ఎక్కువ మందున్నారు...

            మందిలో చంద్రకళ కల్సింది. ఎండకు ముఖం మాడిపోయి చెమట కార్తంది.

            ‘‘కిరణ్‍ను సెల్లె దగ్గరుంచచ్చిన - తనత్తనన్నది - బావ తిట్టిండు. అదేమన్న సినిమా సూడటానికన్నడు’’ చంద్రకళ - పోలీసులు శవాల చుట్టుగుండ్రంగా నిలుచుండి కర్రలతో మందిని చెదురగొడుతున్నారు.

            వ్యాన్లల్లో తుపాకులు పట్టుకున్న చాలా మంది పోలీసులుదిగారు.

            ‘‘రాజేశ్వరి - నువువత్తమనిషివి కాదు. పీడ పోయింది. ఎంత గజగజ వనుక్కుంట బతికినమో? మేమైతే’’ - తూరుపు దిక్కుదండం బెట్టింది చంద్రకళ...

            యాభై గజాల దూరం నుండి దుబ్బలో పడున్న - నల్లగ నెత్తురు గడ్డకట్టి జొబ్బజొబ్బఈగలు వాలుతున్న శవాలను చూసింది.

            రాజేశ్వరి వాంతి చేసుకున్నది...

            ‘‘పాండ్లి - సూసిందిసాలు’’ పోశెట్టి...

            రెహనా రాజేశ్వరి, చంద్రకళ - మూడు సైకిల్లమీద పోశెట్టి ఇంటికి చేరుకున్నారు...

            ‘‘అంత మంచిగలేదు. ఇయ్యల్ల ఈడనే పండు కోండ్లి - బావ వోయి ఇంటికాడ చెప్పస్తరు.’’ చంద్రకళ - పాషా వాళ్లు వెళ్లిపోయారు.

            ‘‘చంద్ర... మందున్నదా?’’ పోశెట్టి...

            ‘‘ఎందుకు మా నలుగురికి తాగిపిస్తవా?’’

            ‘‘మజాకు చెయ్యకుఅంత ఎట్లనో ఉన్నది’’

            ‘‘దిగుట్లె ఉన్నదేమొ సూడు మొన్పెప్పుడో సుట్టాలచ్చినప్పుడు తెప్పిస్తివిగదా?’’

            ఆడవాళ్లు రాత్రంతా నిదుర పోకుండా ముచ్చెట్లు పెట్టుకుంటనే ఉన్నారు.

            ‘‘వాళ్లెట్ల సచ్చిండ్లు’’ లక్ష్మి అడిగింది.

            ‘‘శంకరి గానికి కడుపుల గడ్డపారున్నది - భూమిలదిగిందేమొ? సారలి గాన్ని నరికిండ్లు’’

            ‘‘ఎవరు నరికిండ్లు?’’ లక్ష్మి...

            ‘‘మన గంగాధర్‍ అన్న మోహనన్న మురళన్ననట’’ - రెహన...

            ‘‘చిత్రంగ ఉన్నది - అంత అమ్మపుస్తకంల జరిగినట్టే ఉన్నది’’

            ‘‘నేను గదే అన్నఅక్క - చంద్రకళ అక్క చదువలేదు’’

            ‘‘ఎప్పుడో చదివిన’’ చంద్రకళ

            ‘‘అక్కా మా అందరి కన్న నువ్వే హుశారుగున్నవు’’ రాజేశ్వరి

            ‘‘మరిఇప్పుడేమయితది?’’ లక్ష్మి...

            ‘‘ఇప్పుడు అరెస్టులు జరుగుతయి’’ రెండు పెగ్గులేసి పోశెట్టి సైకిల్‍ తీసుకున్నాడు.

            ‘‘గది మొగాళ్లు చేసిండ్లు గని మనం చెయ్యవల్సి ఉండె - మొగోళ్లందరికి మన సంగతి తెలుసెది లక్ష్మి’’

            ‘‘అయ్యో - తాగున్నవ్‍ మమ్ములనొదిలి పెట్టి ఎటుపోతున్నవ్‍’’ చంద్రకళ...

            ‘‘మీరే సైన్యం - రెహనక్క తుపాకి’’

            ‘‘మొగిలి, శంకరయ్య, మా షరీప్‍ వేరే కాడికి పోయిండ్లు గందుకనే మీ యింటికచ్చినం’’ రెహనా...

            ‘‘మంచిపని చేసిండ్లు’’ చంద్రకళ...

            ‘‘బావా జాగర్త’’ లక్ష్మి...

            పోశెట్టి సందుల్లబడి సైకిలేసుకొని ఇబ్రహీం ఇంటికి పోయిండు. ఇబ్రహీం ఇంట్లాలేడు... అక్క న్నుంచి బయలు దేరుతుండగా - బాయి మొఖద్దమ్‍ వీరసామి ఎదురయ్యిండు.

            ‘‘మేస్త్రీదా - అందరు మా యింటికాడున్నరు’’ ఇంటికి తీసుకపోయిండు.

            అక్కడ కమ్యూనిస్టు యూనియన్‍ ముఖ్యనాయకులందరు ఉన్నారు. వీధి మొదట్లో కావలి పెట్టారు. చర్చోపచర్చలు నడుస్తున్నాయి.

            సాయంత్రం ఏడయ్యింది...పార్టీఆఫీసు అటెండరు సైకిల్‍ మీద వచ్చిండు.

            ‘‘పదిహేనుమంది కన్నాలబస్తీ వాళ్లు పోలీసు స్టేషన్‍కు వచ్చి లొంగిపోయిండ్లట’’ - చెప్పిండు.

            అందరు గండం గడిచినందుకు ఊరిపితీసుకున్నరు.

            ‘‘ఎందుకైనామంచిది. ఎవరి నాటకాలు వాళ్లకుంటయి. దొరల పాలనకు గొడ్డలి దెబ్బ వడ్డది - వాడు పారిపోయిండు. వాళ్లకు సిద్దాంతముండదు - పిరికిగొడ్లు - అయిన పోలీసోల్లు ఇదే సందని - కొంత నాటకం జేత్తరు అరెస్టులు చేస్తరు. ఈ రాత్రి తేలిపోతది. సేప్‍సైడు. ఈ రాత్రి జేగర్త గుండాలె’’ ఇబ్రహీం చెప్పుకొచ్చిండు...

            ఆ రాత్రి ఒక్కకన్నాల బస్తీలోనే మరో ఇరువై మందిని పోలీసులు అరెస్టు చేసిండ్లు - మిగితా బస్తీల వాళ్లనెవరిని ముట్టుకోలేదు.

బస్తీ సంఘాలన్ని కలిశాయి. చిన్న దుఖానదారులు, చోటామోటా లీడర్లు అందరు కలిసి కొంతడబ్బు వసూలు చేసి పెద్దవకీలును పెట్టిండ్లు... వారం దినాలు లాకప్‍లో అందరిని చిత్రహింసలు పెట్టి - ఎనుక ఎవరున్నరో ఆరాతీసి - తరువాత అందరిని ఒదిలిపెట్టి సహా పదిహేను మంది మీద పోలీసులు కేసు గంగాధర్‍, మోహన్‍ మురళి, రాములుతో అసిఫాబాదు సబ్‍జైల్లో వేశారు.

 

                                                                        28

 

            ఉదయం తొమ్మిది గంటలకు రాజకీయ తరగతులు ప్రారంభమయ్యాయి. రాజకీయ తరగతులకు సింగరేణి ప్రాంతం నుండి, విద్యార్థులు, యువకులు, కార్మికులు ఇరువై మంది హాజరయ్యారు... తరగతులు ఒక ఆదివాసి గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేశారు. పిల్లలంతా వేసవి సెలవులకు ఇండ్లకు వెళ్లి పోయారు... హాస్టల్లో వారం రోజులు వంట చేయడానికి సర్పంచ్‍ దేవ్‍రావు వంటాయనను తెచ్చాడు.  దేవ్‍రావు అక్కడికి రెండు కిలో మీటర్ల దూరంలో గల ఇంకో ఊర్లో ఉంటాడు.

            యాభై ఇండ్లు గల ఆవూరులో దాదాపు అన్ని గుడిసెలే - ఆశ్రమపాఠశాల బిల్డింగు తప్ప - తూరుపున పెద్ద చెరువు ఎండాకాలమైనా నీటితో నిండిఉంది. పెద్దగా రైతులు ఆ నీటిని వ్యవసాయానికి వాడుకున్న దాఖలాలులేవు. ఆదివాసులు అలాంటి పంటలకు ఇంకా అలవాటు పడలేదు. ఉత్తరాన కొండ - ఆకురాల్సిన అడవి - పడమరలోయ - దక్షణం అడవి వ్యాపించి ఉన్నాయి. విప్పపుల సీజను కనుక గాలిలో ఒక రకమైన మత్తు వాసన తేలివస్తోంది. విద్యార్థులంతా తమతమ మారుపేర్లు చెప్పుకున్నారు.

            ఆ సమావేశానికి శంకరయ్య, షరీప్‍ హాజరయ్యారు. షరీప్‍ తనపేరు మధుకర్‍గా చెప్పుకున్నాడు. శంకరయ్య తన పేరు వలీగా చెప్పుకున్నాడు.

            క్లాసులో పిల్లలు కూర్చుండే బెంచీలున్నాయి. రాసుకోవడానికి బెంచీలకీ పెట్టిన డెస్కులున్నాయి. ఒక ఫీటు ఎత్తు గద్దెమీద చిన్న టేబుల్‍ - రెండు కుర్చీలు వెనుక గోడకు సిమెంటు చేసిన నల్ల బోర్డుఉన్నాయి.

            ఒక కుర్చీలో సర్పంచ్‍ దేవ్‍రావు - మరొక కుర్చీలో బి.యన్‍ కూర్చున్నారు.

            బి.యన్‍. ముందుగా లేచి తరగతిగదుల్లో చదువు కోవడానికి వీలుకాని యువకులకు - మారుతున్న కాల పరిస్థితుల్లో చదువుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇరువై మంది యువకులకు - ఉపాధ్యాయులుగా ఉచితంగా సాంఘిక శాస్త్రం చెప్పడానికి ఈ పాఠశాల - అడుగగానే చదువు పట్ల ఎంతో శ్రద్ద గల దేవ్‍రావు సర్పంచ్‍ - వేసవి సెలవుల్లో కూడా అన్ని వసతులు కల్పించినందుకు - విద్యార్థులంతా చప్పట్లుకొట్టి అభినందించండి చప్పట్టు మారుమోగాయి.

            ఆ తరువాత దేవ్‍రావు లేచి నిలబడి ‘‘అందరికి రాంరాం! మావూల్లే సదువు నేర్సుకున్నందుకు మంచిగనిపించింది.   మంచిగ సదువుకోండ్లి’’ గురువులందరికి రాంరా. అందరికి నమస్కారాలు చేసి వెళ్లిపోయాడు.

            ఆ స్కూలుకు చుట్టూ ప్రహారి గోడ ఉంది. వంట నారాయణ గేటు మూసి వచ్చిండు. ఎత్తు గద్దెమీది రెండు కుర్చీలు తీయించి బి.యన్‍. టేబుల్‍ వెనుక నిలబడి -  ‘‘కామ్రేడ్స్! వారం రోజుల రాజకీయ పాఠశాల ఇది. మీకందరికి తెలిసిందే మేం టీచర్లంకాదు. తెల్సిన కొన్ని విషయాలు మనందరం చెప్పుకుందాం - నేర్చుకుందాం. రేపటి నుండి క్లాసులు పొద్దున ఏడు గంటలకు మొదలౌతాయి. ఎనిమిది గంటలకు చాయ్‍కోసం పదినిమిషాలు, మళ్లీ తొమ్మింటికి టిపిన్‍ కోసం ఇరువై నిమిషాలు తప్పిస్తే ఒకటిదాకా మొదటి విడత పాఠాలు ఉంటాయి. ఒకటి నుండి రెండు గంటలవరకు తిండి. రెండింటికి క్లాసులు - మళ్లీ నాలుగింటికి చాయ్‍. ఆరుగంటల దాకా రెండో విడిత పాఠాలుంటాయి. ఏడు గంటలనుండి తొమ్మిది గంటల దాకా స్కూలు కాంపౌడులోనే ముగ్గురు నలుగురు కలిసి చర్చించుకోండ్లి టీచర్లతోటి ఫ్రీగా చర్చించవచ్చు. రాత్రి తొమ్మిదింటికి భోజనం తర్వాత పడక - ఇది టైంటేబుల్‍’’ బి.యన్‍. అందరికి టీ, బిస్కట్లు ఇచ్చారు.

            మరో పది నిమిషాలకు బి.యన్‍. ప్రధానంగా మూడు విషయాల మీద ఒక్కొక్కదానికి రెండు రోజుల చొప్పున పాఠాలుంటాయి. నిజానికి ఇందులో ఒక్కొక్క అంశానికే నెలరోజులు చెప్పవచ్చును. మూడు విషయాలు - మార్కిస్టు తత్వశాస్త్రం - నేను రెండు రోజులు మీతో ఉంటాను. నాతరువాత గతితార్కిక చరిత్ర చెప్పడానికి మరో టీచర్‍ వస్తారు. ఆయన రెండు దినాలు మీతో ఉంటారు. మూడో విషయం - రాజకీయార్థిక శాస్త్రం ఆయన రెండు రోజులుంటారు.

            ఒక ముఖ్యవిషయం గమనించాలి. టీచర్లుగా వచ్చే మేం ముగుర్గం మీకన్నా తెలివైన వాళ్లంకాదు. మీరు ఇరువై మంది రకరకాలగా ప్రజా రంగాలల్లో ఎంతో కొంత పోరాట ఆచరణ ఉన్నవారు... మేం మన పూర్వీకులు ఆచరించిన విషయాలను మీతో పంచుకుంటాం. మీరు మీ అనుభవాలను మనకు ముందు తరం వాళ్ల పోరాట అనుభవంతో పోల్చుకోవడం. ముందుకు పోవడం అంటే పరస్పరం నేర్చుకోవడమన్న మాట...’’

            ఇప్పుడు మన కార్యక్రమం ఆరంభమౌతుంది.... అందరు క్లాసురూంనుండి బయటకు వచ్చారు. స్కూలు ముందు జెండా గద్దె దగ్గర కంకబొంగుకు ఎర్రజెండా కట్టారు. అందరు అమరవీరులకు రెండు నిమిషాలు మౌనంగా శ్రద్దాంజలి ఘటించారు.

            వలీ, మధుకర్‍ కలిసి

            ‘‘సుత్తీ కొడవలి

            గుర్తుగవున్నా!

            ఎర్రనిజెండా!

            ఎగురుతున్నదీ!’’ పాడారు.

            ‘‘తరువాత ఎర్రజెండెర్రజెండెన్నియలో’’ పాడారు. అమరవీరులకు జోహర్లు నినాదాలిచ్చారు.

            అందరు మళ్లీ క్లాసరూంలోకి వచ్చారు. అందరికి రాసుకోవడానికి పెన్ను, నోటుబుక్కులుయిచ్చారు.

            బి.యన్‍ నల్లగా ఆరడుగుల ఎత్తుగా ఉన్నాడు. అతని ముఖంలో ఏముందో విద్యార్థులకు అంతు బట్టలేదు. వివాలమైన నుదురు.

            ‘‘కామ్రేడ్స్! యుద్దరంగం పదునెక్కుతున్నదశలో మనం ఇక్కడ సమావేశంమయ్యాం. ఆ విషయాలు యుద్దరంగంలో ఉన్న మీకేబాగా తెలుసు. బహుశా నాకు తెలిసి  సింగరేణిలో ఇలాంటి సమావేశం ఇది మొదటిది...

            ‘‘తత్వవేత్తలంతా ప్రపంచాన్ని విశ్లేషించారు. కాని దీన్ని మార్చాలి’’ కారల్‍మార్క్సు దాదాపు నూటాముప్పై సంవత్సారాల క్రితం అన్నమాట.

            బి.యన్‍ తత్వశాస్త్రం అంటే ఏమిటి? అని మొదలేసి చెప్పుకపోతున్నాడు. మధ్యమధ్యలో నల్ల బోర్డుమీద గొట్టు పదాలను, పేర్లను రాస్తున్నాడు. వలీ, మధుకర్‍ పక్కపక్కనే కూర్చున్నారు. మధుకర్‍ పుస్తకంలో ఏదో రాస్తున్నాడు.

            వలీపుస్తకం తెరిచిండు కండ్లల్లోకి గుబగుబ నీళ్లు చేరినయ్‍. అక్షరాలు అలుక్క పోయాయి. తనకు ఆమాటలు అర్థమౌతున్నా రాయరావడంలేదు. ఇప్పుడిప్పుడే చదువ గలుగుతున్నడు. రామగిరి గుట్ట పక్క ఊరు, తాళ్లతోపు అవ్వనాయిన లేని బాల్యం, షావుకారి దగ్గర పాలేరు - బర్రెల కాసి, పొలాలు దున్ని - ఊళ్లో చాలా మంది ఉన్నా -తనతో మాట్లాడే   వాళ్లు తక్కువ - పిల్లలెవరు తనను తమతో కలువనియ్యలేదు. తనకు చెప్పుకోవాలని చాలా ఉండేది. పల్లెల్ల పాడుకునే పదాలు తనను ఓదార్చినయి. పెండ్లి - అకారణంగా మనుషులంటే ద్వేషం... మొదట ట్రక్కులోడింగు కార్మికుడిగా - బదిలీ ఫిల్లరు. ఫిల్లరు గర్మీ ఫేసుల పని, తాగుడు - లక్ష్మిని కొట్టుడు. తనను భరించలేక - ఆ చీకటిరాత్రుల్ల బయటకు పోలేక - రాత్రంతా లక్ష్మి చూరుకింద కూర్చునేది గుర్తొచ్చింది... తన ఆకారం - నలుపు శరీరం రంగును అందరు గేలి చేస్లున్నట్లనిపించేది. మార్కెట్లో సారలిగ్యాంగు లక్ష్మిమీద చెయ్యేస్తే - కొట్లాట గుర్తుకొచ్చినయ్‍, తనను తన బతుకులో నుండి ఎక్కడెక్కడికో తీసుకపోతున్న బి.యన్‍ను చూశాడు. ఆయన రంగు నలుపే కాని ఆముఖం చీకటి రాత్రి మెరుపులా మెరిసిపోతోంది... బయటకు చూశాడు. ఎండలో దూరంగా కొండ అడవి మెరుస్తున్నాయి.

            కాళ్లు ఆడిస్తూ - పిడికిల్లు బిగించి కేర్‍కేర్‍మనే కూతురు గుర్తొచ్చింది. బిడ్డ పుట్టివారంలోనే - హాస్పటల్‍లోనే ఒదిలేసి వచ్చాడు.

            తను తల వంచుకొని హాస్పిటల్లో లక్ష్మి బెడ్డుపక్క నిలబడి - ‘‘వారం దినాలు ఊరికి పోతన్న’’

            వారం రోజుల నుండి ఆపురిటిస్థితులను అనుభవించడం - ఆస్థితులు చంద్రకళకు, పోశెట్టికి, మొగిలికి, రాజేశ్వరికి తెలియకుండా దాచుకోవడం తన వల్లకాలేదు.

            చంద్రకళ, రాజేశ్వరి భార్య భర్తలు మాట్లాడుకోనియ్యని కొంచెం దూరంలో ఉన్నారు.

            లక్ష్మికి అర్థమౌతోది, తనకు చెప్పరాని అనేక ఉద్వేగాలు కలుగుతున్నాయి. కొన్ని ఉద్వేగాలు మనిషికి చెప్పుకోవడానికి మాటలుండవు.

            ‘‘ఏడికి పోతన్నవ్‍?’’

            ‘‘మన కామ్రేడ్‍ మనకు చెప్పిండే రాజకీయ పాఠశాలకు’’

            లక్ష్మి పొడుగ్గా నిట్టూర్చింది.

            లక్ష్మి పక్కనే పడుకున్న పిల్ల నిద్రలో నవ్వుతోంది.

            ‘‘చూడు దీన్ని చూడు ఎట్ల నవ్వుతందో?’’

            తను మంచం మీద కూర్చున్నాడు. కన్నీళ్లుటపటపరాలి పిల్లమీద పడ్డయి.

            ‘‘మనం ఎట్లుంటిమి? దరువాజులు, కిటికీలు లేని సీకటి గుడిసెల - ఒకలనొకలం తిట్టుకుంట- కొట్టుకుంట - ‘‘అగ్గితోని కల్సినట్టు-- లక్ష్మి శంకరయ్య వనికే చెయ్యిని చేతిలోకి తీసుకున్నది.

            ‘‘మనం సీకట్ల నుంచి ఎలుగలకు వచ్చినం. గీ ఎలుగు ఏడికి తీసుకపోతదో? కలో నిజమో తెలువదు. గొడ్రాలిగ పేరు పడ్డదాన్ని - ఇగో నా పక్కన గీపిల్ల - మన గురించి మనమే కాదు - లోకం గురించి తెలువాలె’’

            ‘‘గది తెలుసుకోవడానికి చానున్నది’’

            ‘‘నువ్వేం ఫికర్‍ పడకు అక్కున్నది, బావున్నడు...మొగిలి రాయేశ్వరి, రెహనా - మనకు గిప్పుడు చానామంది మందిల గల్సినం’’ తను వంగి పిల్లలేత కాల్లమీద ముద్దు పెట్టుకున్నాడు.

            ‘‘జాగ్రత్త కామ్రేడ్‍!’’లక్ష్మి...

            కామ్రేడ్‍ వలీ, బి.యన్‍. పిలిచేదాకా తను ఈలోకంలోలేడు. వలీకి కన్నీళ్లు కారుతున్నాయి. అందరు అతనికేసి చూశారు. అతనికి కన్నీళ్లెందుకు కారుతున్నాయో ఎవరికి అర్థంకాలేదు. బి.యన్‍. కు అర్థమై వలీ దగ్గరికి నడిచివచ్చి బిగ్గరగా కౌగిళించుకున్నాడు.

            వలీ బెక్కుతూ బి.యన్‍ ను బిగ్గరగా కౌగిలించుకొని ఏడ్చాడు.

            తేరుకున్న తరువాత - కళ్లు తుడుచుకొని

            ‘‘నన్ను మన్నించండి కామ్రేడ్స్’’ అన్నాడు వలీ...

            వెలుగు రాసిన గొంతుతో బి.యన్‍ - ‘‘సామాజిక కార్యకలాపాలల్లో మానవుడు వ్యక్తిగా - మానవులు గుంపుగా పొందిన ఉద్వేగాలను - అనుభవాలను శాస్త్రీయంగా స్థలకాలాల నేపథ్యంలో గతితార్కికంగా విశ్లేషించేదే తత్వశాస్త్రం’’ ఆచరణకు పురికొల్పేదే తత్వశాస్త్రం అన్నాడు. వలీకి అర్థమౌతోంది..

                                                                                                        ( తరువాయి భాగం వచ్చే సంచికలో )

 

ఈ సంచికలో...                     

FEB 2021

ఇతర పత్రికలు