నవలలు

నవలలు

సైరన్ నవల  రెండవ పార్ట్ –  పదవ  భాగం

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)                                                           

                                                                           34

            టెంటు సామాన్లు తీసుకెళ్లి - షామియానాతాళ్లు బిగించేసరికి తెల్లారే సమయం మూడయ్యింది. గంగాధర్‍, షరీప్‍, శంకరయ్య, సత్యం టెంటులోనే నిద్రపోయారు.

            ఏడుగంటల వరకే లోడింగు కార్మికులంతా టెంటుకు చేరుకున్నారు. ఎప్పటిలాగే షామియానా నిలబడి ఉన్నది. కార్మికులు, విస్తుపోయారు.

            మొగిలి, వెంకులు వాళ్లనలుగురిని యాపలకాడికి తీసుకపోయి - టిపిన్‍, చేయించారు. అందరు టెంటు చేరే సరికి ఉదయం ఎనిమిదియ్యింది.

            నిన్న అక్కడేమి జరుగనట్లు - లోడింగు కార్మికుల నిరవధిక సమ్మె అందులోని భాగంగా ఎప్పటిలాగే కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.... వాల్‍పోస్టర్లు చూసి దాదాపు రెండు వందల మంది ఏఐటియుసి కార్యకర్తలు టెంటు దగ్గరికి చేరుకున్నారు.

            తొమ్మిది గంటలకు భాస్కర్‍రావు కారుమీద వచ్చికారు కొంచెం దూరంలో పెట్టి నలుగురు ఆపక్క ఈ పక్క నడువగా శిబిరం చేరుకున్నాడు.

            ‘‘కాలి కూలి కాముని పెంటయినంక దొరచ్చిండురా!’’ నారాయణ...

            ‘‘చెవులు గోసిన కుక్కలోలె ఏందిర్ర? ఒకల మాట ఒకలకు కలువది... బండ కింద సేతులు వెట్టి బండ మీద ఎక్కి కూసున్నట్టున్నది ఏనివరుస’’ దుర్గయ్య...

            ఎందుకైనా మంచిదని గంగాధర్‍, షరీప్‍, సత్యం, శంకరయ్య శంకర్‍ - వెంకులుతో సహా వేపలకాడికి పోయిండ్లు.

            భాస్కర్‍రావు ముఖంలో కోపం... దుమదుమలాడుతూ - కాసేపు నిలబడ్డాడు... ఎవరో బెంచీ తెచ్చివేశారు. పదినిమిషాలు కూర్చుండి - కోపం తగ్గించుకున్నాడు...డెలిగేట్సుతో పాటు చుట్టు పక్కల యాభైగజాలు తిరిగి చూశాడు. తెగిపోయిన చెప్పులు, నెత్తురంటిన బొగ్గుపెళ్లలు - చిరిగిపోయిన బట్టలు - కర్రలు,రాడ్లు - దొరికాయి. అన్ని తీయించి శిబిరం కాడ పెట్టించాడు.

            ‘‘అయ్యా కామ్రేడ్‍! నిన్నలారీడ్రైవర్లు రాకపోతే మమ్ములందరిని సంపి - బొగ్గుకుప్పలకు పెట్రోలు పోసి మమ్ముల కాలవెట్టేటోల్లు. ఇరువై ఏండ్ల సంది గీ బొగ్గుల బొగ్గైనం దొరా!’’ కాటం చెంద్రయ్య నడిమందిలోనిలబడి భాస్కర్‍రావు’’ కామ్రేడ్స్! మీ పోరాట స్పూర్తికి లాల్‍సలాం - వాళ్లు పిచ్చికుక్కల తీర్గున్నరు. వాళ్లు భూస్వాముల గుండాలు - వాళ్లకు కారణకారక సంబంధాలు, కార్మికులు, యాజమాన్యం చట్టాలు ఏమి తెలియదు.’’

            ‘‘అయ్యా మా పెయ్యంత అగ్గి తార్గ మండుతంది. గంగరాయి లొట్టపీసు గవ్వన్ని చెప్పకుండ్లి - వాళ్లు మనలను కొడితే మన యూనియన్‍ఏం చేసింది?’’ పోచం...

            ‘‘నిన్నంతా పోలీసు స్టేషన్ల చుట్టుతిరిగిన - మనప్రతి నిధులు ము్యమంత్రి దగ్గరికి పోయిండ్లు... గాయపడిన వాళ్లకు మన కామ్రేడ్స్ దగ్గరుండి ట్రీటుమెంటు చేయిస్తున్నారు. హైదరాబాదు నుండి డాక్టర్లను పిలిచాం’’

            ‘‘వాళ్లు సావగొట్టి సెవులు మూసినంక - మీరు కట్లు కడుతండ్లు - గంతేనా?’’ చంద్రయ్య...

            ‘‘ఆకలి దొర! మమ్ములాదుకునేటోడు లేడు. గ రాడికలోల్లు ఇంటికిన్ని బియ్యం పంచిండ్లు’’

            ‘‘మన కార్యకర్తలు మనిషి కోపది రూపాయులు ఇస్తారు’’

            ‘‘బస్‍ గది సంగతి - మరి మేనేజుమెంటు జంగవిల్లి తీర్గ నాసుబెట్టి కూసున్నది - మరి అడుగలేదా?’’

            ‘‘చర్చలు నడుస్తున్నయి, మీరు మీరు చూసుకొండ్లి యూనియన్ల కొట్లాటలకు మమ్ముల లాగకండి అన్నది మేనేజుమెంటు’’

            ‘‘ఇన్నారుల్లా మన పెద్దయ్య ముచ్చెట్లు - ఎవలేం చెయ్యరు? మనం పోరాటం చేయాలి’’

            ‘‘కామ్రేడ్స్ ఆవేశ పడకండి - వాళ్లు రెచ్చిపోయినప్పుడు మనం రెచ్చిపోతే - ఇదేసందని - యాజమాన్యం ప్రభుత్వం మనలందరిని మూసేత్తది.. ఈసమస్య కొలిక్కి వచ్చింది తీర నియ్యండి - మనం సింగరేణి అంతటా నిరవధిక సమ్మెకు పూనుకుందాం. శాంతించండి తప్పక విజయం సాధిస్తాం’’

            ‘‘మనం సచ్చినంక దినవారాలు సేత్తడట’’ తలో మాట - గోలగోలగా ఉంది. పదిగంటలయ్యిది. జనవరి మాఘీఎండలో కార్మికులు - ఆ బొగ్గుకుప్పలమధ్య శిబిరం దగ్గర ఏం చేయాలో తోచక - రాత్రి వాళ్లమీద జరిగిన దాడికి మండిపోతున్నారు.

            భాస్కర్‍ రావు అర్థాంతరంగా వెళ్లి పోయాడు... మరో పది నిమిషాలకు తలకు కట్టుకట్టుకొని ఇబ్రహీం చెయ్యికి పట్టేసుకొని - కొమురయ్య శిబిరం దగ్గరికి వచ్చారు. కార్మికులు వాళ్లను తడిమి తడిమి చూశారు. ఇంతలోనే గంగాధర్‍, శంకరయ్య, షరీప్‍, సత్యం, శంకర్‍, వెంకులు శిబిరం దగ్గరికి వచ్చారు. అక్కడున్న యూనియన్‍ వాళ్లంతా చుట్టు మూగారు.

            ‘‘ఊకే సిల్లర మాటలు, ఏతుల మాటలద్దు - మాశరీరం మండుతంది - ఊరేగింపు తీద్దాం - మేం ఇంక మీ గుండాతనం భరించమని చెప్పుదాం’’ నారాయణ ముందుకు నడిచిండు. డెలిగెట్లంత అరిచిండ్లు- గుండాగిరి నశించాలె’’ గూండాలు డౌన్‍డౌన్‍’’ ఇబ్రహీం ఏదో మాట్లాడుదామను కున్నాడు. ఇబ్రహీంను, కొమురయ్యను సైకిల్లమీద ఎక్కించుకున్నారు. కార్మికులు పదిగంటలకు ఊరేగింపు శిబిరం దగ్గరి నుండి బయలుదేరింది. శిబిరం దగ్గర పదిమంది కార్మికులు ఉండిపోయారు. ఊరేగింపు శిబిరం దగ్గరి నుండి మేన్‍రోడ్డెక్కే సరికి పదిన్నర అయ్యింది. ఎవరికి వారే అరుస్తున్నారు...ఎగురుతున్నారు. గంగాధర్‍, షరీప్‍, శంకరయ్య వాళ్ల ముందు నడుస్తున్నారు. ఊరేగింపును ఒక పద్దతిలో నడిపించడానికి సత్యం, శంకర్‍ ఎక్కడినుండో కంకకర్రలు తెచ్చారు... ఊరేగింపు నాపి ముగ్గురు ముగ్గురి చొప్పున సర్ది ఊరేగింపును సర్దేసరికి ఉదయం పదకొండు అయ్యింది. ఊరేగింపు దుమ్ము పొగలాగా ఆకాశంలోకి లేస్తున్నది. ఊరేగింపు పెద్ద మోరిమీదికచ్చింది. షరీప్‍ మోరీ మీదికెక్కి...

            ‘‘కార్మికులారా! నేను నినాదాలు చెప్పుతాను మీరు మళ్ల చెప్పండ్లి’’

            ‘‘పోరాడుతాం -పోరాడుతాం’’

            ‘‘ఆఖరుదాకా పోరాడుతాం’’

            ‘‘నిన్న జరిగిన దాడి మీద’’

            ‘‘విచారణ జరిపించాలి’’

            ‘‘ఐయన్‍టుయైసి గుండాలను’’

            ‘‘అరెస్టు చేయాలి’’

            ‘‘గుండాల నాయకుడు కృష్నారావును’’

            ‘‘అరెస్టు చేయాలి’’

            ‘‘యాజమాన్యం మొండి వైఖరి’’

            ‘‘విడనాడాలి’’

            ‘‘కంట్రాక్టర్‍ లేబర్‍ను’’

            ‘‘బదిలీ ఫిల్లర్లు చేయాలి’’

            ‘‘లారీ లోడింగు  కంట్రాక్టు పద్దతి’’

            ‘‘ఎత్తివేయాలి’’

            శంకర్‍ ఒక్కొక్క నినాదాన్ని కార్మికులతో మరోమారు అన్పించాడు.

            ‘‘దొరల జులుం’’

            ‘‘నశించాలి’’ కొత్త నినాదాలు పుట్టుకొచ్చాయి.

            ‘‘ఏఐటియుసి’’

            ‘‘జిందాబాద్‍’’

            ‘‘రాడికల్స్’’

            ‘‘జిందాబాద్‍’’

            మార్గమధ్యలో చేరేవాళ్లు వచ్చి చేరుతున్నారు... వీధులల్లో నడుస్తున్నప్పుడు అప్పటి కప్పుడు...

            ‘‘దుకాండ్లన్ని మూసేయాలి’’

            బందు బందు - అని కార్మికులు దుకాణాలను కొన్ని మూయించారు. క్వార్టర్లలో నుండి - గుడిసెలనుండి ఆడవాళ్లు వీధుల్లోకి వచ్చి చూస్తున్నారు. కొంత మంది అరిచే వాళ్లకు మంచి నీళ్లు తెచ్చిస్తున్నారు. ఊరేగింపుతో పాటు సోడా బండ్లు వీధుల్లో పెట్టుకున్నరు.  కార్మికులు నినాదాలిచ్చే వాళ్లు  తాగుతున్నారు. తుపాకులు పేలినట్టు సోడాలచప్పుడు ఊరేగింపు మార్కెటుకు చేరుకునే సరికి పదకొండున్నర అయ్యింది - భయస్తులైన కొందరు షట్టర్లు మూసి ముందునిలబడ్డారు. చాలా వరకు దుకాండ్లు బందయినాయి...

            అక్కడే మీటింగు పెడుదామని గంగాధర్‍ ప్రయత్నం చేశాడు. అక్కడ నుండి మళ్లీ కార్మికులను శిభిరం దగ్గరికి తీసుకపోవాలనుకున్నారు. యూనియన్‍ డెలిగేట్లు ఏఐటియుసి ఆఫీసు చెట్లకింద కాసేపు కూర్చున్నారు...ఇబ్రహీం కొమురయ్య, వాళ్ల మధ్యలో నిలబడి ఏదో మాట్లాడుతున్నారు. ఆతరువాత మెల్లెగా ఆఫీసు చెట్లకింది నుండి డెలిగేట్స్ కొంత మంది మార్కెట్‍ సెంటర్‍లో నిలబడి బిగ్గరగా నినాదాలవ్వడం షురు చేసిండ్లు...

            ‘‘గూండాల దౌర్జన్యం’’

            ‘‘నశించాలి - నశించాలి’’

            ‘‘పని పడుదాం -పనిపడుదాం’’

            ‘‘గుండాల పని పడుదాం’’

            చెట్లకింద మిగతా వాళ్లు అక్కడికి చేరుకున్నారు. మందిలో జోష్‍ పెరిగింది. మార్కెటంతా గజగజలాడేటట్లు నినాదాలు చేశారు...

            ‘‘గుండాలు సినిమాటాకీసులో ఉన్నరంట’’ మందిలో నుండి ఎవరో అరిచారు.

            గుంపు కదిలింది - సినిమా టాకీస్‍ కేసి నడిచింది. గుంపు ముందు ఇబ్రహీం, కొమురయ్యలను సైకిల్ల మీద తీసుకపోతున్నారు. సినిమా హాలు గేటు మూసిఉంది. కొంత మంది యువకులు గేటు ఎక్కివెనకకు దిగితాళ్లు విరగొట్టిండ్లు గేటును కార్మికులు తన్నిండ్లు. ఎన్నేండ్ల దు:ఖంమో, అవమానమే - కోపమో - సినిమా టాకీసే అడ్డాగా దొరలు, వారి గుండాలు ఎంతో మందిని చూస్తుండగా మీద పడికొట్టారు. సినిమాకు వచ్చిన ఆడవాళ్లను ఎత్తుక పోయి చెరిచారు. మంది కోపంబద్దలయ్యింది. అయిదు వందల మంది సినిమాటాకీసు లోపల చొచ్చారు. కుర్చీలు విరగ్గొట్టారు. పరదా చింపేశారు. ఏది దొరికితే అది - గోడలను తన్నారు గుద్దారు. కాండ్రకిచ్చి ఊంచారు. ఉచ్చలు పోశారు. రాళ్లు విసిరారు.  సినిమా టాకీస్‍ మేనేజర్‍ శ్రీనివాస్‍ అంతకు ముందే పరారై కృష్ణారావుకు పోన్‍ చేశాడు. కృష్ణారావు పోలీసులకు ఫోను చేసాడు.

            గుంపు అదుపు తప్పింది...

            గంగాధర్‍, షరీప్‍, ఇబ్రహీం అరుస్తూనే ఉన్నారు. గుంపులో ఎవరు ఎవరిమాటలు వినడంలేదు - కోపంతో యువకులు అడ్డదారుల గుండా - పాలవాగు దిక్కుసాగింది - పాలవాగు వాగొడ్డుకు నరేందర్‍, లాంటి గుండాల ఇండ్లుంటాయి. వందమంది యువకుల గుంపు ముందుపోయింది. నర్సింగం ఇండ్లు ఎదురెదురుగా ఉన్నాయి. ఇంట్లో వాళ్లు మొత్తుకుంటున్నారు. వాళ్లను బయటకు తీసుకొచ్చి కొంతమంది పట్టుకున్నారు. ఆరెండు ఇండ్లకు అగ్గి పెట్టారు. రెండు ఇండ్లు కాలుతున్నాయి. మంటలు ఆకాశంలోకి లేచాయి. నల్లటిపొగ వ్యాపించింది. రొద, ఏడుపులు - నినాదాలు - అంతా గదరగోళంగా ఉంది. వెనుక గంగాధర్‍ గుంపువచ్చింది. అయిదువందల మంది మూడు వందల మందే అయ్యిండ్లు. ఎవరు ఎటు ఉరుకుతున్నారో తెలియని పరిస్థితి.

            మూడు వందల మంది మేన్‍రోడ్డెక్కారు.

            ‘‘ఇక చాలు కామ్రేడ్స్’’ గంగాధర్‍ అరుస్తూనే ఉన్నాడు. షరీప్‍, శంకరయ్య, శంకర్‍, మొగిలి, సత్యం చెదిరిపోయిన వాళ్లందరిని ఏకం చేయడానికి అరుస్తున్నారు... చెతులెత్తి ఏవో మాటలు బిగ్గరగా అరుస్తున్నారు. యువకుల గుంపు మేన్‍రోడ్డుమీదుగా యాపలకాడికి చేరింది... అక్కడ మేన్‍రోడ్డుమీది కృష్ణారావు బ్రాండి షాపు కన్పించింది... కౌంటర్‍ మీద కూర్చున్నతన్ని బయటికిగ్గిండ్లు వందల సీసాలు పగులుతున్నాయి. కొందరు సీసాలెత్తి గటగట బ్రాండి, విస్కీ, బీరు తాగుతున్నారు...గుంపుకు మత్తెక్కింది.

            గూండాలకు వంతు సీసాయిచ్చిన సంగతి ఎవడో పెద్దగా లొడలొడగా చెప్పుతున్నాడు. నక్క పోశాలు కండ్లు పెద్దవి చేసి తనను గూండాలు కొట్టిన సంగతి చెప్పాడు. పది నిమిషాలల్లో బ్రాండి షాపు ఖాళీ అయ్యింది. చాలా మంది ఊగుతున్నారు. అరుస్తున్నారు. ఊరుపేరు లేకుండా తిడుతున్నారు. గుంపు ఇంకా ముందుకు ఉరికింది - అక్కడ బ్రాండి, కల్లు, సారా, పెద్దడిపో - డిపోమేనేజర్‍ సత్యనారాయణను పిడిగ్గుద్దులు గుద్దారు. అది దాదాపు ఎకరం జాగాలో విశాలంగా ఉన్నది. అక్కడ కర్రడమ్ములలో సారా వందలాది లీటర్లున్నది. వాటిని పగులుగొట్టారు. సారా వాసన నిండిపోయింది. కార్టున్లకు కార్టూన్లకు బయట ఎత్తేసి పగుల గొడుతున్నారు. తాగుతున్నారు. సీసాలు పళ్ల, పళ్ల పగులుతున్నాయి. ఇంతలోనే డియపిరెడ్డి నాయకత్వంలో పోలీసులు యాబై మంది దాకా వచ్చారు...

            లాఠీ చార్జి మొదలయ్యింది. గుంపురెచ్చి పోయింది...

            ‘‘రెడ్డి’’ పైర్‍...పైర్‍’’ అరిచాడు.

            తుపాకులు మొరిగినయ్‍ తుపాకి గుండ్లు తాకి కొంత మంది మొత్తుకుంటూనే నేలమీద పడిపోయారు. అరుపులు - యువకులు కొందరు చెట్ల మీదికెక్కారు - మరికొందరు సందుల గుండా పరుగెత్తారు. పది నిమిషాలల్లో కాల్పులు ఆగిపోయాయి... ఆ ఏరియా అంత రక్తాలతో ఆర్తనాదాలతో - గబ్బువాసనతో, గందకం వాసనాతో నిండిపోయింది. గంగాధర్‍ కౌంటర్‍ వెనుకాల నిలబడి ఇంకా అరుస్తున్నాడు.. ‘‘నేలమీద పడుకోండ్లి కామ్రేడ్స్’’ ఎవరి పరిస్థితి ఏమిటో ఎవరికి అర్థంకాని అయోమయ పరిస్థితి - గంగాధర్‍ చుట్టు కొందరు చేరుతున్నారు. దొరికిన వారిని దాదాపు పదిహేను మందిని జీబుల్లో ఎక్కించుకున్నారు. గంగాధర్‍, షరీప్‍, శంకరయ్య వాళ్లలో ఉన్నారు...

            మరో అరగంటలో సింగరేణి అంబులెన్సులొచ్చాయి. చనిపోయిన వారిని, గాయపడ్డవారిని హాస్పిటల్‍కు తరళించారు.

            మధ్యాహ్నం రెండు గంటలవరకు నెత్తురు మరకలతో ఆ ప్రాంతం మూగవోయింది. మొగిలి వేపచెట్టెక్కి  ఈ తంతగమంతా కండ్లాతోని చూసిండు. అతనికి ఏమయ్యిందో తెలియలేదు.కాల్పుల దిగ్భభ్రమ నుండి తేరుకొని మొగిలి వేపచెట్టు మీది నుండి కిందికి దిగాడు. అది కలోనిజమో - అతనికి అర్థంకాలేదు. ఆ ప్రాంతంలో నిలబడ్డాడు. పెద్ద పెట్టున ఒర్లిండు ఏడ్చిండు. పిచ్చివాని లాగా అంతటా వెతికిండు... సారాడ్రమ్ముల మధ్య భయంతో డిపోమేనేజర్‍ సత్యనారాయణ మొగిలి వెనకకు చూడకుండా ఎవరో తరుముతున్నట్టుగా - తన వెంట పోలీసులు పడుతున్నట్టుగా మురికి తుమ్మ చెట్ల కింది నుండి ‘‘మొగిలీ’’పిలుపు... సత్యం...మొగిలి సత్యంను బిగ్గరగా అలుముకున్నాడు.

            ‘‘మనోళ్ల సంగతేంది? కామ్రేడ్‍ చానా మందిని చంపిండ్లు... మొగిలి వనుకుతూ...

            ‘‘తెలువదు...హోష్‍కురా...తెలుసుకుందాం... కాల్పులు షురూ కాంగనే నేను చాలా మంది పడిపోయిన తరువాత ఇటు ఉరికచ్చిన’’ సత్యం... ఇద్దరు మురికి తుమ్మ చెట్ల కాలిబాటల నుండి నడుస్తున్నారు.

            ‘‘ఎటుపోదాం కామ్రేడ్‍’’ మొగిలి...

            పదినిమిషాలు విప్పచెట్టుకింద కూర్చున్నారు. సత్యం చెల్లాచెదరైన తన స్థితిని - కూడ దీసుకున్నాడు... అంతకలలో జరిగినట్లుగా ఉంది - మొదట్లో తుపాకి కాల్పుల మోతలు, తుపాకి గుండ్లు తాకి ఒర్రుతున్న కార్మికులు - చెట్ల మీదికి, చెల్లా చెదురుగా ఉరికిన మనుషులు - బ్రాండి, విస్కీ ఘాటువాసన - సార కర్రమొద్దులు పగిలి పారిన సారా నీచు వాసన...‘‘కామ్రేడ్స్ నేలమీద పండుకోండి’’ గంగాధర్‍ అరుస్తున్నాడు. కామ్రేడ్సంతా ఒక దగ్గరికి వచ్చి షట్టర్‍ లోని కౌంటర్‍లో రక్షణ తీసుకున్నారు... తను అక్కడికి వెళ్లాలనుకున్నాడు. తుపాకులు గురిపెట్టి పోలీసులు వాళ్లను కొట్టుకుంటూ జీబుల దగ్గరికి తీసుకపోతున్నారు. వాళ్లను కాల్చేస్తారా? తను కూడా పరుగెత్తాలా? జీబులో ఎక్కించారు. కాల్పులాగి పోయినయ్‍ - తనుడిపో గోడ దూకిండు - తన వెంట పోలీసులు పడ్డారు. మురికి తుమ్మ చెట్ల మధ్య నుండి పరుగు. పోలీసులు తనవెంట రాలేదు.

            ‘‘కామ్రేడ్‍ మొగిలీ మనవాళ్లను జీబులెక్కించిండ్లు. ఎంత మంది చనిపోయిండ్లో తెలువది...’’ సత్యం.

            ‘‘ఆడేంలేదు. అంతఖాళీ’’

            ‘‘పోలీసులు ఇంకా ఆ ఏరియాను తమాధీనంలోనే ఉంచుకున్నారేమో?’’ సత్యం.

            ‘‘లేదు అయ్యో చనిపోయినోళ్లను, గాయపడ్లోళ్లను అంబులెన్సులచ్చి తీసుకుపోయిండ్లు. అందరు పోయినంకనే సుట్టుదిగి వచ్చిన అక్కడ గజగజ వనుక్కుంట డిపో మేనేజరున్నడు’’

            ‘‘వాళ్లే చంపిండ్లు గనుక - వాళ్లు పోస్టుమార్టం చేయిస్తరు’’

            రాజేశ్వరిని మేనేజరు కొడుకు హత్య చేసి ఉరిబెట్టినప్పుడు గిట్లనే కాల్పులు జరిగినయ్‍...ఆ సమయంలో బెల్లంపల్లిల నలుగురు చనిపోయిండ్లు. అదేపని చేసిండ్లు’’ సత్యం.

            ‘‘మనం దవాఖానకు పోదామా?’’

            ‘‘అదే మంచిది - ఉన్నొక్క ఆధారం గదే’’ సత్యం...

            ‘‘మొదలు మనం కొద్దిగా తేరుకోవాలి.  జరిగింది - నా అనుమానం - భాస్కర్‍రావు వాళ్లు’’ సత్యం...

            ‘‘ఔ! కామ్రేడ్‍ -మార్కెట్‍ కాడ, మనం మళ్లా వెనక్కు వద్దామంటే - వాళ్ల డెలిగేట్సు - వాళ్ల ఆఫీసుకాడికి పోయి చెట్లకింద కూసున్నారు. వాళ్ల ఆఫీసుకాడ’’ మొగిలీ...

            ‘‘అసలు సినిమాటాకీసులో దొర గుండాలున్న సంగతి ఎవరు తెచ్చిండ్లు?’’

            ‘‘మందిల తెలువలే’’

            ‘‘నిన్న దెబ్బలు తిన్న ఇబ్రహీం - మళ్ల ఊరేగింపుకెందుకచ్చిండు. ఎన్నడు రాందీ శిబిరం కాడికి భాస్కర్‍రావు ఎందుకచ్చిండు. ఆ దినం రెండు వందల మందిదాకా వాళ్ల డెలిగేట్సు శిబిరం కాడికి వచ్చిండ్లు - రాత్రి మనం టెంటుకడుతుంటే  తొంగిన్నా చూడలే’’

            ‘‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు - మనలనువాడుకొని యూనియన్‍ కృష్ణారావును దెబ్బకొట్టిండ్లన్న’’ మొగిలి.

            ‘‘గంత మందిలో పోలీసోల్లకు మనోళ్లే ఎట్ల తెలిసిండ్లు?’’

            ‘‘కామ్రేడ్‍ మనకు పిచ్చిలేత్తది. ఇంకా తుపాకి మోత, మెరుపులు మెదట్ల సత్యం. ఇక్కడికి మాయిల్లు దగ్గరే ఆడికి పోయినంక మాట’’ మొగిలి దారితీసిండు.

            దారిపొడుగుతా కట్టతెగిన ప్రవాహంలా సత్యంమాట్లాడుతూనే ఉన్నాడు. సాయంకాలం మూడయ్యింది. మొగిలి గుడిసె చేరుకున్నరు. గుడిసెకుతాళమేసున్నది. మొగిలి ఇంటి వెనకకు వెళ్లి తాళం చెయ్యి పెట్టే చోటవెతికిండు తాళం చెయ్యికింద చిన్న చిట్టీ పెట్టిఉన్నది. తాళం తీసి మంచం వాల్సి దాని మీద కూర్చున్నారు. మొగిలి ఇంటి వెనుకకు వెళ్లి    నీళ్లు మీద గుమ్మరిచ్చుకున్నాడు. కొంత రొద తగ్గింది. సత్యం ఇంటి వెనుకకు వెళ్లి వాంతి చేసుకున్నాడు. బట్టల మీద చిల్లింది. నాలుగు చెండుల నీళ్లు కుమ్మరించుకొని - వచ్చిండు. మొగిలి ఇచ్చిన లుంగీ కట్టుకున్నడు. బట్టలు ఉతికి ఎండపొడకు ఆరేసుకున్నడు. మొగిలి చాయ్‍పెట్టుకచ్చిండు.

            ‘‘శంకర్‍ వచ్చిండట - శంకర్‍ రెహనక్కను, రాయేశ్వరిని -ఈ వాడకట్టు నలుగురైదుగురిని దవాఖానకు తీసుకపోయిండట - అన్న్ని సంగతులు శంకర్‍ చెప్పిండు - మీరేమిగాభరా పడద్దు - దవాఖానకు రండి లోపట మంచం షెద్దరు కింద నాగయ్య బావ ఉత్తరమున్నది - మనూరి ఏల్పుల సమ్మయ్యతోని పంపిండు’’

            ఇద్దరు చాయ్‍తాగిండ్లు.

            ‘‘ఇప్పుడు నిమ్మలంగా ఉన్నది. మెదడు పని చేస్తంది’’

            ‘‘నిమ్మరసం చాయ్‍ బాగున్నది’’ సత్యం...

            ‘‘గంగాన్న వాళ్లింటికాన్నుంచి నాలుగేండ్ల జామసెట్టు, నిమ్మసెట్టు తెచ్చి పెట్టిండు - కాయలు గాత్తన్నయి’’ మొగిలి.

            ‘‘చెలోపోదాందావాఖానకాడికి’’ సత్యం...

            మొగిలి గిన్నెలు వెతికాడు. ఒక్కరికి సరిపోయే అన్నం కూర ఉన్నది... సత్యం, కూర  అన్నం గంజు ల్నేవేసికలిపి - మొగిలికి సగం పెట్టిండు. తను సగం తిన్నడు.

            ‘‘మా నాగన్న ఉత్తరం రాసిండంట’’ మొగిలి ఉత్తరం తెచ్చిండు.

            ‘‘నువ్వే చదువు కామ్రేడ్‍’’ నాకు జెప్పన సదువరాదు. మొగిలి.

            ‘‘మీ అన్న ఏం రాసిండో - అట్ల సదువద్దు’’ సత్యం...

            ‘‘కాదు కామ్రేడ్‍ - గంగన్న మా అన్న ఎనిమిది నెళ్లు రావాలల్ల ఉన్నరు మూడు నెళ్లు జైల్లున్నరు. మంచి దోస్తులు. గంగన్నను - నాగన్ననే ఎరుక జేసిండు’’

            ‘‘గంగన్న ఇంటికాడ నేను కల్సిన. మాకు పాటలు నేర్పిండు. మాకు ఒక దినం తెలంగాణ సాయుధపోరాటం గురించి పాఠం జెప్పిండు. సత్యం  ఉత్తరం చేతిలోకి తీసుకొని..

            ‘‘కామ్రేడ్‍ మొగిలికి అభినందనలు - మీ విషయాలన్నీ ఎప్పటి కప్పుడు తెలుస్తున్నయి. నువ్వు కామ్రేడ్‍ శంకర్‍, లక్ష్మి, రాజేశ్వరి పుస్తకాలు చదువుతున్నందుకు చాలా సంతోషం... ముఖ్య విషయం. మీరు క్రాంతి పత్రిక చూసే ఉంటారు.రైతాంగ పోరాటాలు మన ప్రాంతంలో ముమ్మరంగా జరుగుతున్నయి. మన ఊళ్లో పదిరోజుల కింద - లొల్లి జరిగింది. లక్ష్మి పెండ్లికి అప్పు కిందమూడెకరాల పెరడి బాపనోల్ల కిట్టయ్యదొర గుంజుకున్న సంగతి ఎరికేగదా! లింగుమామ మీ నాయనీ వడ్డీ అసలు కట్టినా కాయిదాలు ఇయ్యలేదు. రైతుకూలి సంఘం ఆ భూమి లింగుమామకు ఇప్పించి నాగండ్లు కట్టిచ్చింది. అట్లాగే నీ నౌఖరి కోసం చిన్నాయినె రయిను బెట్టిన భూమి దున్నిచ్చిండ్లు - అట్లా యాభై ఎకరాలు మనూళ్లే దున్నిండ్లు - పోలీసులచ్చిండ్లు - అందరిని కుప్పేసి కొట్టిండ్లు - నాలుగొద్దులకింద కిట్టయ్య ఇంటిమీద దాడి జరిగింది. అప్పుకాయిదాలు కుప్పేసి కాలబెట్టిండ్లు. వాన్ని వాకిట్ల కట్టేసిండ్లు... పోలీసులచ్చిండ్లు - పడుసోల్లు గుడిమెట్టు అడివిల బడ్డరు. మా నాయినను, మీ నాయినను లింగు మామతో సహా పది మందిని అరెస్టు చేసి కేసుబెట్టిండ్లు - నన్నుకూడా కేసుల బెట్టిండ్లు. మేం దొరికేది లేదు. మన వకీలు బేల్‍కోసం తిరుగుతండు. రేపోమాపో బేలు వస్తుంది. సాగర్‍రావు దొర ఊళ్లె నుంచి దెంకపోయిండు. మీరంతా ధైర్యంగా, క్షేమంగా ఉండాలని కొరుకుంటూ పాట పంపుతున్న శంకరన్నయితే మంచిగ పాడ్తడు. కొంచెం సల్లవడ్డంక వచ్చి సూసిపోండ్లి.

            ‘‘లాల్సలామ్‍’’

            సత్యం పాట మొత్త ఉత్తరం లాగనే సదివిండు.

            ‘‘మన కన్న ఘోరంగ ఉన్నదిగదా అయినా ముందే ఉన్నరు. పాట జెబర్దస్తీగ ఉన్నది. మంచిపాట  - జిమిడికి మీద ఊగిపోతది’’ సత్యం...

            మొగిలి నెత్తిగోక్కున్నడు...పాట కాయిదంలాగుజేబుల పెట్టుకున్నడు.

            ‘‘సరే కామ్రేడ్‍! నీబట్టలు ఆరలేదు. అట్లనే ఉండనియ్యి ఇగో నా అంగీ లాగువేసుకో’’ మొగిలి బట్టలు తెచ్చియిచ్చాడు.  ఇద్దరు డబుల్‍ సవారి సైకిల్‍ మీద మేన్‍రోడ్డు మిదికొచ్చారు. తన సైకిల్‍ సత్యం కిచ్చి - పాషా దుకాణం దగ్గరకుపోయిండు. పాషా దుకాణం మూసుకొని తనండ్లతనే ఎదో గొనుక్కుంటున్నడు.

            ‘‘అన్నా సైకిల్‍ గావన్నా! పాణంబడ్డది. అందరు మంచి గున్నరుగదా! మంది నోటికొచ్చినట్టు చెప్పుకుంటండ్లు’’

            పాషా ‘‘బాగుంటేనేకదా! నీకాడికచ్చింది - సైకిల్‍ గావాలె’’

            ‘‘నేను రావన్నా - దిమాక్‍ పని చేస్తలేదు. ఎవన్నన్న ఏసియ్యాల న్నంత గాయిగత్తరగున్నది.’’ పాషా... మొగిలికి నిజంగా అట్లాగే ఉన్నది....ఇద్దరు బయలుదేరిండ్లు...

            ‘‘తొవ్వల్నే గన్క శిబిరం దగ్గరినుంచి పోదాం’’ సత్యం...

            ‘‘మరిచేపోయిన -వాళ్లెట్లున్నరో - శిబిరంల పదిమంది ఉండిరి’’ సైకిల్లు నడుస్తున్నాయి...

                                                                            35

            శిబిరం దగ్గరికి పోయేసరికి పదిమంది లేచి వచ్చిండ్లు. వాళ్లు భయంతో గడ్డకట్టుకపోయున్నారు. ఏమైతదో తెలియదు. వాళ్లకు సంగతులన్ని ఎవరో ఒకరు వచ్చిచెప్పుతున్నరు గని ఏమి చేయాలో? ఎవరు చెప్పడంలేదు... శిబిరం ఎత్తేయడమా? ఉంచడమా? పోలీసులు ఇక్కడికి వస్తరా?

            సత్యం, మొగిలి అందరిని ఆలింగనం చేసుకున్నారు. చనిపోయిన వాళ్ల పేర్లు వనికే చేతులతో చిన్న చిట్టీని ఇచ్చారు. లోడింగు కార్మికులు, కాటం చంద్రయ్య, శీలంశెట్టి నారాయణ, పానుగంటి పోచం, దుర్గయ్య, చంద్రయ్య - వాళ్లయిదుగురు లోడింగుకార్మికులు - ఇంకొకరు చనిపోయినట్టుగా అందరు అంటున్నారు. అతని గురించి తెలియడంలేదు.

            సత్యం మొగిలిని నాలుగుమాటలు మాట్లాడు మన్నాడు.

            మొగిలికి ఉద్వేగంతో మాటలు రాలేదు. తనులోడింగు లేబరుగా చేసినరోజులు గుర్తొచ్చినయ్‍..‘‘మన కోసం అమరలైన మన అన్నలు తమ్ములకోసం రెండు నిమిషాలు తలుచుకుందాం’’ అన్నాడు. అందరు లేచి నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించిపేరు పేరున మొగిలి పేర్లు చెప్పుతుంటే అందరు జోహర్లు చెప్పారు.

            ‘‘మనం మంది సొమ్ములు కుప్పేసుకోను గిందులకు దిగలేదు. చావకుండా బతకడానికి ఇగో గిక్కడ మనం పనిచేపే కాడ నిలబడ్డం. ఈ బొగ్గు మనది - ఈ భూమి మనిది... మనం కట్టంజేసి మందిని బతికిత్తం - మనలను బతకనియిమంటన్నం - మనం గెలువాలె - గెలుత్తం. అవద్దం నాశినమైపోతది. నిజం గెలుస్తది. మనం....‘‘మొగిలి మాట ముందుకు సాగలేదు’’

            ‘‘మనం మనసమస్య తీరేదాకా - పోరాటం ఆపేదిలేదు. అన్ని డివిజన్లలో నిరవధిక సమ్మె నడుస్తంది... అమరుల సాక్షిగా పోరాడుదాం - ఇంతకన్నా మనలను ఇంకా వాళ్లేం చేస్తరు? శిబిరం కోనసాగిత్తం. మిగతా మన కార్మికులంతా దవాఖానకాడున్నట్టు తెలిసింది. ఆడికే పోతన్నం.. మన కార్మికులందరిని ఇక్కడికే తోలుతం. మళ్లీ మేమువస్తం’’ సత్యం చినపోయినవారికి, గాయపడ్డవాళ్లకు పాయమాలుకట్టయ్యాలని చెప్పుండ్లి’’ అన్నారు కార్మికులు సాగదోలుతూ...

( తరువాయి భాగం వచ్చే సంచికలో )

 

నవలలు

కూలి బతుకులు – నాల్గవ  భాగం 

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                                            4

            పొద్దున్నె చీకటితోని శ్రీను బయటుదేరి కంట్ట్రార్‍ దివాకర్‍రావు ఇంటికి పోయిండు. అప్పటికే అక్కడికి చేరుకున్న భగవాన్‍ మేస్త్రీ ఎదురొచ్చి ‘‘ఇవ్వాళ పనులు బాగున్నాయి. నువ్వుతొందరగాపోవాలి’’ అంటూ క్షణమాగి జెబులోని చిన్న నోట్‍ బుక్‍తీసి లావు పాటి కండ్లద్దలనుండి ఒక సారి పరిక్షగా చూసి.

            ‘‘ఎలుకలపల్లి గేటు కాడ రోడ్డు పనులు జరుగుతానయి అక్కడ నాల్గు ట్రాక్టర్ల కంకరపోయ్యాలి. పొద్దున పదిగంటలకల్లా తిలక్‍ నగర్‍లో కన్‍స్టక్షన్‍ జరుగుతున్న బిల్డింగ్‍ల కాడికి బండ తీసుకపోవాలి. మధ్యహ్నం వరకల్లా పని పూర్తియితే అతరువాత ఏం చెయ్యలన్నది నేను వచ్చి చెప్పుతా అంటూ పని పురమాయించిండు.

            రోడ్డుకు కంట్రాక్టర్‍ బంగ్లాకు మధ్యన వేప చెట్టునీడలో నిలిపి ఉన్న ట్రాక్టర్‍ను తీసుకోవటానికి ముందుకు కదిలిన శ్రీనుకు హరత్‍గా ట్రాక్టర్‍ జాకిలు సరిగా పనులు చేస్తలేవన్న సంగతిగుర్తుకు వచ్చింది.

            ‘‘మెస్త్రీ జాకీలు సరిగా పనిచేస్తలేవు’’ అన్నాడు.

            ‘‘మెకానిక్‍ జానిమియాగానికి చూపించక పోయినవా’’

            ‘‘చూయించిన బాగా అరిగిపోయినవట కొత్తది మార్చాలంట’’

            ‘‘సరే ఈ పూటకు ఎట్లాగో నడవనియ్‍... సాయంత్రం దాని సంగతి చూద్దాం’’ అన్నాడు మెస్త్రీ...

            భగవాన్‍ మెస్త్రీ కంట్ట్రారు దివాకర్‍రావుకు నమ్మకమైన వ్యక్తి రామగుండాం కాడ కంట్రాక్టరుకున్న రెండు క్రషర్‍లు  ఆయనే చూస్తడు. అర్డర్‍ తీసుకోవడం, పనులు చేయించటం, సప్లయిచేసి వాటికి డబ్బులు వసలు చేయటం, వర్కర్స్ మంచి చెడు అన్ని ఆయనే నడిపిస్తడు.

            భగవాన్‍ మెస్త్రీ కూడా అందరిలాగే ఓరిస్సా నుండి బ్రతక వచ్చిండు. కాస్త రాతపూత తెలిసినోడు ఏ పని చేసిన ఓళ్ళుదాచుకోకుండా పనిచేస్తడు. అటు వంటి పని మంతుడు దొరకంటంతో కంట్రాక్టరుకు ఏ చీకు చింత లేకుండా పోయింది.

            శ్రీను ట్రాక్టర్‍ తీసుకొని బయలు దేరిండు.

            ట్రాక్టర్‍ మెయిన్‍ రోడ్డు దిగి మట్టి బాటలో కాస్త దూరం పోయే సరికి ‘‘శీనన్నా శీనన్నా’’ అన్న పిలుపు విన్పించి అటువైపు చూసిండు.

            దావన్‍ కూతురు హీరా, పదమూడు పద్నాల్గెండ్లు ఉంటాయి. కాని అంత వయస్సు ఉన్నట్టు అన్పించదు. బక్కగా ఉంటుంది.  నెత్తంతా దుమ్ముకొట్టుక పోయి,మసి బారిన బట్టలో ఉంది.

            ‘ఏంటిఅన్నట్టుగా చూసిండు శీను.

            ‘‘అన్నా జర మా ఇంటిదాక తీసుకపోవా’’ అంది.

            అతను పోయే తోవలోనే క్రషర్‍ నగర్‍ ఉంది. హిరా వాళ్ళు ఉండేది అక్కడే దాంతో శ్రీను ట్రాక్టరు అపి ‘‘అయితేరా’’ అన్నాడు.

            ‘‘ఒక్క క్షణం’’ అంటూ అంత వరదాక రోడ్డు దిగువన మొదుగు చెట్టు గుబురుకాడ ఉన్న బొగ్గు బస్తాను బలవంతంగా ఎత్తుకొని వచ్చి ట్రాక్టర్లోవేసి ఎక్కింది.

            ‘‘ఇంత పొద్దున్నే ఎటు పోయినవు బొగ్గుకా’’ అని అడిగిండు.

            ‘‘అవునన్నా రెండు రోజులనుండి తిరుగుతాంటే ఇవ్వాళ దొరికింది’’ అంది.

            ఇబ్బందేకాని దివాకర్‍రావు బండ్లను ఎవరు అపరు.

            దావన్‍ ఆయన భార్య ఇద్దరు క్వారీలో పనిచేస్తరు వాలికి ముగ్గురు పిల్లలు కూతురు హీరా పెద్దది. అతరువాత ఇద్దరు మగపిల్లలు భార్య భర్తలు ఇద్దరు పనిలోకి పోతే హీరాఇంటికాడ పనులు చేస్తది. తమ్ముల్లను చూసుకుంటది.

            వర్షకాలం కన్‍స్ట్రక్షన్‍ పనులు పెద్దగా సాగవు. వర్షలు పోయి ఎండకాలం మొదలవటంతోనే కూలీలకు క్రషర్‍నగర్‍ గుట్టబోరు మీద ఉంది. అక్కడ ఒక చెట్టు చేమలేదు. ఓరియా కూలీలు వంట చేసుకోవటానికి బొగ్గు పొయ్యిలను వాడుతారు. గతంలో అయితే ఏది ఇరువై రూపాయలకే సిమెంటు బస్తానిండా బొగ్గు దొరికేది. సింగరేణికంపినికి చెందిన డంపింగ్‍ యార్డులనుండి, సీలు కుప్పల నుండి పనిపాటలేని పిల్లలు బొగ్గు ఏరుకొని సైకిల్ల మీద తెచ్చి అమ్మెవాళ్ళు. వారికి అదోరకమైన  ఉపాధి. కాని ఎప్పుడైతే సింగరేణి కంపిని బొగ్గు దొంగతనాలు అరికట్టడానికి డంపింగ్‍ యార్డుల చుట్టు పెన్సింగ్‍ వేసి, అక్కడ మూడు పూటల వాచ్‍మన్‍ను పెట్టడంతో డంపింగ్‍ యార్డుల నుండి బొగ్గుతేవటం కష్టమై పోయింది. దాంతో సేలు కుప్పల కాడ బొగ్గు ఎరుకొని వచ్చేవారు. అక్కడేమో విపరీతమైన పోటి బొగ్గు బాయిలో బొగ్గుతో పాటు సేలుబండలు కూడా వస్తవి. అటువంటి సేలు బండలను ఏరి ఒక చోట కుప్పగా పోయే కంపిని తప్పిదారి పోయి అబండాల మధ్య అక్కడోకటి ఇక్కడోకటిగా మిగిలిపోయిన బొగ్గును ఏరుకొనేందుకు అడమగా పిల్లలు అనకుండా సంచులు పట్టుకొని పోయేవాళ్ళు. పొద్దంతా ఏరినా ఒక బస్తనిలడటం కష్టమయ్యేది.  దాంతో మునపటిలా బొగ్గు దొరకటం కష్టమైపోయి బస్తాబొగ్గు ధర యూబై రూపాయలకు పెరిగింది. అంత ధర పెట్టి బొగ్గు కొనే స్థోమతలేక వంట చెఱుకు కోసం అనివార్యంగానైనా బొగ్గు దొంగతనంగా తెచ్చుకోవలిసి వచ్చింది.

            ఎన్టిపిసిలో అకలోడింగ్‍ కోసం అగిన వ్యాగన్ల నుండి దొంగతనంగా బొగ్గు తెచ్చుకునేవాళ్ళు. దీన్ని అరికట్టడం కోసం ఎన్టిపిసి అక్కడ ముసలి వాచ్‍మెన్‍ పెట్టింది. వాడేమో కర్రపట్టుకొని ఇయ్యర, మయ్యర కొట్టెవాడు. దాంతో బొగ్గు కోసం వచ్చే పిల్లలకు వాడంటే ఎక్కడ లేని భయం. అయిన బొగ్గు తెచ్చుకోవటం అనివార్యమై వానికంట్లె పడకుండా బొగ్గు దొంగతనం చెయ్యాల్సి వచ్చెది. క్రషర్‍ నగర్‍లో నివసించే కూలీలు పనులు లేనప్పుడు తిండికి కటకట లాడుతారు. ఇతరత పనులు ఎమన్నా దొరికితే చేస్తరు లేకుంటే లేదు. అటువంటి సమయంలో ఇండ్లు సగబెట్టు కుంటూనో, సామాన్లు బాగు చేసుకుంటూనో కాలం గడుపుతారు. లేదంటే ఏ చెట్టుక్రిందనో కూచొని పొగాకు నములుతు ప్యాకాట అడుకుంటారు.

            హీరాను చూసే సరికి శీనుకు తులసిగుమారి గురించి అడగాలనిపించింది.

            ‘‘హీరా’’ తులసి కన్పిస్తలేదేమి’’ అన్నాడు యధాలాపంగా అడుగుతున్నట్టు...

            ‘‘ఉంది... తులసక్క ఇప్పుడు ఇటుకబట్టిల పనికి పోతాంది కదా’’ అంది.

            ‘‘ఇటుక బట్టిల పనికా’’

            ‘‘అవును’’

            ‘‘అదే ఎందుకు’’

            ‘‘కంట్ట్రారుతోని లొల్లి అయ్యింది కదా ఇక అపని బందుపెట్టింది’’ అంది.

            అ మాటలు విని శ్రీనుకు మనసులో బాధనిపించింది.

            తులసి గుమారిని మొదటి సారి కలిసింది. సుబాస్‍ నగర్‍లోని బాల కార్మికుల పాఠశాలలో కూలీల పిల్లలకు చదువు చెప్పాకే లక్ష్యంతో అంతార్జాతీయ కార్మిక సంఘం నిధులతో ఎర్పాటు చేసింది. దానికి హిందు మజ్దూర్‍ సంఘంకు చెందిన నరెందర్‍ దానికి బాధ్యుడు. ఆయనేమో ఎన్టిపిసిలో ఉద్యోగి, పైగా యూనియన్‍ నాయకుడు వాళ్ళ నాయకత్వాన్ని పట్టుకొని పాఠశాలను సాంక్షన్‍ చెయించిండు. అందుకోసం దాదాపు ఇరువై లక్షల దాక నిధులు వచ్చాయి,

            దాన్ని ఎర్పాటు చేసిన తనికి పిల్లలలకు సేవ చేయాటం కంటే వచ్చే నిధులమీదే అశ ఉండి పోయింది. అర్భాటంగా పాఠశాలను ప్రారంభించిండు. దాన్ని నిజాయితీగా నిర్వహించలేదు. పాఠశాల ఎర్పాటు చేసిన కొత్తలో పిల్లలను చేర్పించటం కోసం, కూలీలు ఎక్కువగా ఉండే వికే రామయ్య కాలని క్రషర్‍నగర్‍, కాకతీయనగర్‍, సుభాస్‍ నగర్‍ ఇంటింటికి తిరిగి పిల్లలకు ఉచితంగా చదువు చెప్పుతాం. మధ్యహ్నం తిండి కూడా పెడుతాం, పుస్తకాలు బట్టలు అన్ని ఫ్రీ అని నచ్చచెప్పి దాదాపు యాబై అరువై మంది పిల్లలను జమ చేసిండ్లు.

            ఎట్లాగు చదువు లేక తమ బ్రతుకులు అగమైనవి పిల్లలు చదువు కుంటేనైనా బాగు పడ్తరని నాగయ్య తన చిన్న కొడుకు శ్రీను ఆ పాఠశాలకు పంపించిండు.

            పరదేశిరాం కూడా తనకూతురు తులసి కుమారిని స్కూలుకు పంపించిండు. ఇద్దరు ఒక్కటే క్లాసు చేరిండ్లు అట్లా వారికి పరిచయం ఎర్పడింది.

            సుభాస్‍ నగర్‍ ఓర్రె ఓడ్డున ఉన్న విశాలమైన మైదానంలో ఒక్క గుడిసే వేసి అందులో స్కూలు నడిపించేది. చదువు కొని ఏం పనిలేకుండా తిరుగుతున్న ఇద్దరు యువకుల్ని తాత్కలిక టీచర్‍గా పెట్టిండ్లు.

            కొన్ని రోజులు స్కూలు బాగానే నడిచింది.  క్రమంగా నిధులు రాక క్రమంగా స్కూలు మూతపడింది. ఒకప్పుడు  స్కూలు ఉన్న చోట ఇప్పుడు మొండి గోడలు మిగిలాయి.

            తులసి కుమారిది మాతృబాష తెలుగు కాకున్నా తెలుగు చాల స్పష్టంగా మాట్లాడేది. చదువులో అందరి కంటే ముందు ఉండేది. నల్లగా బక్కగా, గుండ్రటి మొఖంతో మెరిసే కండ్లతో హుషారుగా ఉండేది. శ్రీను ఎంత కష్టపడ్డా అమెకు మించి పోలేక పోయేవాడు. ఇద్దరి మధ్య చదువులో పోటి ఉండేది.

            అశ్రామ పాఠశాలలో ఐదవ తరగతి చదివిన తరవాత శ్రీను రామగుండంలోని ప్రభుత్వ పాఠశాలకు పోయిండు. కాలి నడకన రోజు ఐదారు కిలో మీటర్లు పోయి రావల్సి వచ్చేది. అంత దూరం పంపలేక పరదేశిరాం తులసిని బడి మాన్పించిండు. ‘‘అరే మంచిగా చదివే పిల్లను బడి మాన్పిస్తే ఎట్లా’’ అని సార్లు ఎంత చెప్పిన పరదేశి వినలేదు.

            పరదేశీరాంది రాజనంద్‍ గారి నుండి బ్రతక వచ్చిండు. ఆయన భార్య ఈశ్వరి బాయ్‍... వారికి ఇద్దరు పిల్లలు పెద్దవాడు శత్రుఘన్‍ క్వారిలో బాల కార్మికుడుగా బండరేపని చేసేవాడు. కాస్త రెక్క ముదిరే సరికి బండలు కొట్టె పనికి కుదిరిండు. తల్లి దండ్రులు ఇద్దరు పనిలోకి పోతే తులసి ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులు చూసేది. శత్రుఘన్‍కు పెండ్లి అయిన తరువాత వేరు కాపురం పెట్టిండు.

            అప్పుడప్పుడు తులసి కన్పించి మాట్లాడేది. ఆమె మాట్లాడుతుంటే ఎందుకోగాని శ్రీను మంచిగ అన్పించేది. ఎంత సేపు మాట్లాడిన ఇంకా మాట్లాడాలనిపించేది. ఆమెలో చదువు పట్ల అసక్తి తగ్గలేదు. శ్రీను ఎప్పుడు కలిసిన చదువు గురించి అడిగేది. అసక్తిగా పుస్తకాలను చూసేది.

            తులసి పాటలు బాగా పాడేది. ఓరియావాళ్ళు తీరిక సమయాల్లో భారత, రామాయణగాధలు పాడుకోవటం వారి సంప్రదాయం అ పాటలేవి చదివి నెర్చుకున్నవి కావు. తరతరాలుగా పాడే వాడు. చాల ఎండ్లు ఆయన బండ పని చేసిండు కాని ఇప్పుడుచాత కాకుండా అయిపోయిండు. కండ్లు కూడా సరిగా కన్పించటం లేదు. ఆయన కొడుకు కిషన్‍ వద్ద ఉంటున్నాడు. ఎదైనా పండుగ పబ్బం అప్పుడు సామూహికంగా కోలాటం అడుతూ మహిర్‍తాతతోని పాటలు పాడించుకునే వాళ్ళు. ప్రతిరోజు దుర్బర మైన జీవితం గడిపినా, పండుగలప్పుడు మాత్రం ఉన్నంతలో గనంగాజరుపుకునే వాళ్ళు. అట పాట వాళ్ళజీవితంలో బాగం హోలి పండుగ అడమగ అనకుండా చాల సంబంరంగా జరుపుకుంటారు.

            తులసి మాహర్‍ తాత దగ్గర చాల పాటలు నేర్చుకున్నది. మహర్‍తాత చాల పెద్ద మనిషి కావటంలో ఇప్పుడు ఎదైనా పండుగలప్పుడు తులసి తోని పాటలు పాడించుకుంటున్నారు. సన్నటి శ్రావ్యమైన గొంతుతో పాడే తులసి పాటంటే అందరు ఇష్టపడేవాళ్ళు.

            ఒక సారి హోలి పండుగా రోజున ఎదో పనిబడి శ్రీను  మార్కెటుకు పోయినప్పుడు నిండారగా రంగు చల్లుకొన్న గుంపు ఒకటి క్షణాల్లో శ్రీనును చుట్టుముట్టెసి రంగుల్లో ముంచేసింది. తీరా చూస్తే వారితో కిలకిల నవ్వుతు తులసి కన్పించింది.

            ఒక విదంగా సాపిగా జరిగిపోతున్న వారి కుటుంబంలో పరదేశిరాంకు క్యారీలో దెబ్బతాకటంతో పరిస్థితులన్ని తలక్రిందులైనవి. అరోజున క్వారీలో ఎత్తయిన బండలను కూల్చటానికి నడుముకు తాడు కట్టుకొని వ్రెలాడుతు బ్లాస్టింగ్‍ కోసం బండకు రంద్రాలు చేస్తుంటే తాడు తెగి పరదేశి అంతఎత్తునుండి క్రిందపడ్డాడు. నడుముకు బలమైన దెబ్బతాకింది. కంట్రాక్టర్‍ నష్టపరిహరం ఏమి ఇవ్వలేదు. అడిగేవారు లేరు. అప్పటి నుంచి బండ పనులు చెయ్యలేని పరిస్థితి వచ్చింది. ఆయన పనులు ఆయన చేసుకో గలడు కాని బరువు పనులేమి చెయ్యలేడు.

            దేవునింట్ల మన్నుబోయా రాత ఇట్లా రాసేనని దు:ఖాన్ని దిగమింగుకొని ఈశ్వరిబాయి రాళ్ళు కొట్టె పనికి పోతుంది కాని ఇద్దరు చేస్తనే అంతంత మాత్రంగా వెళ్ళె సంసారంలో ఒక్క దానిసంపాధన ఎటు చాల కుండా పోయే సరికి తులసి ఊడా కొన్ని రోజులు బండ కొట్టె పనులకు పోయింది.

            వయస్సు తెచ్చిన అందంతో చూడచక్కగా ఉన్నా తులసి పై రంగయ్య అనుచరుడు మంగలి లక్ష్మన్‍ గాని కన్నుపడింది. వాడుత్తలంగ, అడది కనిపిస్తే చాలు చిత్తకార్తెకుక్కలా మారిపోతాడు. జీవనోపాధిలేని వాళ్ళును, భర్తలు చనిపోయి ఓంటరిగా  బ్రతికే వారిని, తిరుగుబోతు స్వబావం కల్గిన వారిని నిస్సయులను నయనా భయానా లొంగదీసుకోనేవాడు.

            అటువంటి వాడు ఒక రోజు తులసిని చూసి ‘‘క్యారిలో అ బండ పని ఏంచేస్తవు అపీసులో పనుంది చేస్తావా రోజు కూలి దొరుకుద్ది’’ అంటూ మెల్లగా మాట కలిపిండు.

            తులసికి చిన్నప్పటి నుండి అలవాటు లేనేఇ బండపని చేయటం కష్టంగా ఉంద. ఎదో తప్పని సరై అపనిలోకి పోతుంది. ఎప్పుడైతే లక్ష్మన్‍ అపీసు పని ఉంది చేస్తావా అనే సరికి నీడపాట్టున ఉండి పనిచేయ్యవచ్చు అని అశపడింది. అట్లా పనిలోకి కుదిరింది. నాల్గురోజులు బాగానే గడిచింది. కాని మెల్లగా లక్ష్మన్‍ దుర్భుద్ది బయట పడసాగింది.

            ఒక రోజు ఎవరు లేందీ చూసి తులసి మీద చెయ్యి వేసిండు. ఊహించని పరిణామానికి తులసి మొదట కంగుతిన్నా మరుక్షణం తెరుకొని ఎదురు తిరిగింది. అది తెలిసి ఓరియా కూలీలంత లొల్లి చేసిండ్లు. లొల్లి పెద్దదై పోలీసుస్టెషన్‍ దాక పోయింది. కాని కంట్రాక్టరు రంగయ్య తన పలుకుబడితోని పోలీసుల నోళ్ళు మూయించిండు. పైగా కంట్రాక్టరు దగ్గర డబ్బు గుంజటానికి తులసి అడిన నాటకంగా ఉల్టాకేసు బనాయించిండ్లు పోలీసులు. అక్కడి నుండి భయటపడటమే గగనమైంది.

            అలోచనలో పడిపోయిన శ్రీనుకు క్రషర్‍ నగర్‍ వచ్చింది గుర్తులేదు.

            ‘‘అన్న ఆపు’’ అని హిరా పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ట్రాక్టర్‍ను అపిండు.

            హిరా క్రిందికి దిగి తన బొగ్గుల సంచి ఎత్తుకొని గుట్టమీద దొంతర్లుగా ఉన్న గుడిసెలకేసి పోయింది.

            మళ్ళీ బండి స్టార్టు చేస్తుంటే... దూరం నుండి అర్జున్‍ చూసి ‘‘శ్రీనన్న బండి ఆపు మేము అటే వస్తానం’’ అంటూ కేకేసిండు.

            అర్జున్‍, అత్మరాం, ఈశ్వరిబాయ్‍, భగవతిమరికొంతమంది సద్దులు పట్టుకొని బయలు దేరినవాళ్ళు పరుగు పరుగున ఉరికి వచ్చి ట్రాక్టర్‍ ఎక్కిండ్లు. లేకుంటే వాళ్ళు ఉండే చోటు నుండి క్వారీకి దాదాపు నాల్గుకిలో మీటర్లు నడిచి పోవలసివ చ్చేది. కూలీలు పొద్దున సద్దికట్టుకొని వస్తే మళ్ళి సాయంత్రం చీకటి పడ్డతరువాతనే ఇంటికి తిర్గివచ్చేది.

            ‘‘ఎంటీ ఇవ్వాళ పొద్దు పోయింది’’ అన్నాడు శ్రీను అర్జున్‍తో మాటకలుపుతు.

            ‘‘లలేచి వండుకొని తినివచ్చే సరికి ఈ యాల్ల అయ్యే’’ అన్నాడు అర్జున్‍.

            ఇవ్వాళ భగవాన్‍ మెస్త్రీ వస్తడా! అని అడిగిండు అత్మారాం...

            ‘‘అదే ఎందుకు’’

            ‘‘నిన్న కూలీ పైసలు ఇవ్వాల్సి ఉండే నిన్న రాలేదు ఇవ్వాలైనా వస్తడా లేదా’’ అన్నాడు.

            కరకరలాడుతు తుర్పున సూర్యుడు పొడుచుకొచ్చిండు.ఈ సారి ఎండలు తొందరగానే వచ్చినవి. బారెడు పొద్దు ఎక్కెసరికి ఎండ సురసుర లాడుతున్నది.  ఇక బండల మీద పని చేయ్యటం అం నిప్పుల కొలిమిలో మెసిలినట్టే అందుకే కూలీలు ఎంత పొద్దున వీలైతే అంత పొద్దున పని ముగించుకోవాలని చూస్తరు.

            ‘‘నిన్న ఎందుకు రాలేదో ఎమోకాని...భగవాన్‍ మెస్త్రీ మాట తప్పె మనిషికాదు. ఇవ్వాళ తప్పకుండా వస్తడు’’ అన్నాడు శ్రీను.

            మాటల్లో పడిపోయి క్వారీ వచ్చింది తెలియలేదు.

            రామగుండంలోని రాముని గుండాలు గుట్టకు దివాకర్‍రావుకు మొదట ఒక్కటే క్వారీ ఉండేది కాని గిరాకి ఎక్కువగా ఉండటంతో గుట్టకు మరో వైపున ఇంకో క్వారీ మొదలు పెట్టిండు.

            రాముని గుండాల గుట్టకు తూర్పువైపున ఒక దోనే (చిన్నగుహ) ఉంది. పెద్ద బండ రాయికి  దిగువన నిలువెత్తున  దాదాపు పెండు గజాల వెడల్పున దోనే ఉంది. అందులోని ఒక చిన్న బండ మీద మారెండంత ఎత్తుఉండే రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రాహలున్నాయి. సెలవు రోజుల్లో ప్రతి శ్రావణ మాసంలో అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అగుహకు ఒక వైపున బండల మీద ప్రాకిన రాళ చెట్టు ఒకటి ఉంది. గుహకు ఎదురుగా కొద్ది దూరంలో నీటి బుంగ ఒకటి ఉంది. వలయాకారంలో ఏటు జానెడువెడల్పు జానెడు లోతు ఉండే బండరాలయి మీద తొలి చినట్టుగా ఉండే బుంగలో ఎప్పుడు నీరు ఉంటుంది.  ఆ బుంగలో అనీటిని తోడితే మళ్ళి అంతే నీరు ఊరుతుంది తప్ప అంతకంటే ఎక్కువ నీరు ఊరదు. దాని మీద స్థానికుల్లో ఒక కథనం ఉంది. రాముడు అరణ్యవాసం చేసినప్పుడు కొన్ని రోజలు అక్కడ గుహలో ఉన్నాడని  అ సందర్భంగా ఒక సారి సీతకు దాహం వేస్తే రాముడే స్వయంగా నీటికోసం ఆ బుంగను తొలిచాడని చెప్పుతారు. ఇటువంటి నమ్మకాలకు ప్రజల్లో కొదవలేదు. కాని అట్లా నీరు ఊరడం అంతా రాముని మహిమ అని నమ్ముతారు. శ్రావణ మాసంలో జాతర జరుగుతుంది. చుట్టు ప్రక్క గ్రామాల నుండి జనం వస్తారు. అ సమయంలో గుళ్ళో అయ్యగారు రోజు ఉంటాడు. మిగితా సమయంలో ఉండేది తక్కువ.

            రాముని గుండాలగుట్ట చాల విశాలంగా పరుచుకొని ఉంటది. గుట్టకు దక్షణం వైపున మొదటి సారీ క్వారీమొదలైనప్పుడు దేవుని గుట్టకు క్వారీ ఎట్లా నడిపిస్తరు అంటూ జనం నుండి వ్యతిరేకత వచ్చింది. కాని దివాకర్‍రావు తన పలుకుబడి ఉపయోగించి ఆ ఉద్యమంలో ముందు పీటన నిలచిన వారిని నయనా భయానా లొంగదీసుకొని క్వారీ మొదలు పెట్టిండు.

            ఇటువంటి సంఘటనలు కరింనర్‍ జిల్లాలో చాల జరిగినయి. ము్యంగా గ్రానైట్‍ పరిశ్రమ పుట్టుకొచ్చిన తరువాత చాల గుట్టలు మాయమైనవి. ఎంతో చారిత్రక ప్రాదన్యం కల్గిన గుట్టలు దేవుని గుట్టలు కూడా వదలకుండా క్వారీలు చేసిండ్లు. పెద్ద పెద్ద బండరాలను సైజుల వారిగా కట్‍చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేసి గ్రానైట్‍ పరిశ్రమాధిపతులు వందల కొట్లు సంపాధించిండ్లు. ఇట్లా సంపాధించిన డబ్బులతో తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా గ్రానైట్‍ పరిశ్రమాధినేతలు రాజకీయ నాయకులై, ఎమ్మెల్యెలుగా ఎంపిలుగా గేలిచి మంత్రులు అయ్యిండ్లు.  గుట్టల విద్వంసం వలన ఎర్పడుతున్న పర్యావరణన విద్వంసం గురించి పర్యావరణ ప్రేమికులు ప్రజాస్వామిక వాదులు అనేక మార్లు అందోళన చేసిండ్లు. కాని గ్రానైట్‍ పరిశ్రామధిపతులు ప్రభుత్వా అండతో వాటిని అణిచి వేసిండ్లు. వారి నిరసనలు అరణ్యరోదనే అయ్యింది.

            వీళ్ళు అక్కడికి పోయే సరికి అప్పటికే కూలీలు పనులు మొదలు పెట్టిండ్లు. పెద్ద  పెద్ద బండలను క్రషర్‍లోనే వేయాటానికి వీలుగా చిన్నచిన్న ముక్కలుగా కొడుతున్నారు కొందరు. వాటిని తీసుక పోయి క్రషర్‍ బంకరులో వవేయాటానికి దాదాపు అరువై డెబ్బయి మంది పిల్లలు పనులు చేస్తున్నారు. గుట్టకు కాస్త దిగువన అకాశం కంటూ పొడుచుకున్న క్రషరు పెద్దగా చప్పుడు చేస్తూన్నది. బండాలు చుర అయ్యే క్రమంలో ఎగిసిన దట్టమైన దూళి ఎగజిమ్ముతు అక్కడి వాతవరణం అంతా పేరుకపోయింది. అక్కడ పనిచేస్తున్న వారంత తలకు ,ముక్కుకు మూతికి గుడ్డలు కట్టుకొని ఉన్నారు. అక్కడ పని చేస్తున్న వారంత తెల్లటి బూడిద దుమ్ముతో నిండిపోయింండ్లు.

            మరో దిక్కున క్రషర్‍ బెల్టునుండి చిన్న చిన్న ముక్కలుగా బయిటికి వస్తున్న బండ రాళ్లను కాస్త పెద్ద సైజుబండలను ఏరుతు మరికొంత మంది పిల్లలు పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత వేగంగా పని చేస్తున్నరంటే బెల్టు ఎంత వేగంగా తిరుగుతుందో అంతే వేగంగా చెతులు అడిస్తూ సైజుల వారిగా బండలు ఏరే పనిలో ఉన్నారు.

            అట్లా పని చేసే పిల్లలకు ఇచ్చే కూలి చాల తక్కువ. వాస్తవానికి పిల్లలతో పనులు చేయించటం చట్టరీత్య నేరం. అటు వంటి నేరాలను అరికట్టడానికి ప్రభుత్వ లేబర్‍ డిపార్టు మెంటు ఉంది కాని అది నామ మాత్రమే. లంచాలకు ఎగబడిన అధికారులు అవేవి పట్టించుకోరు. ఎదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఎక్కడలేని హడావిడి మొదలైతది. అటు తరువాత వాటికి దాతు పిర్యాదు ఉండదు.

            లోడర్‍ వెంకటెశం చెయ్యెత్తి ట్రాక్టర్‍పోను కాస్త ముందుకు తీసుక రమ్మన్నట్టుగా సైగలు చేసిండు.

            శ్రీను ట్రాక్టరును కాస్త ముందుకు తీసుకపోయి కుప్పగా పోసిన కంకర కుప్ప ముందు నిలిపిండు. గతంలో అయితే లోడింగ్‍, అన్‍లోడింగ్‍ అంతా కూలీలే చేసేవాళ్ళు. ఇప్పుడు యంత్రాలు వచ్చిన తరవాత అపని తెలికైంది. కాని అమేరకు కూలి దొరకని పరిస్థితి ఎర్పడింది.

            నిముషాల్లో లోడర్‍ ట్రాక్టర్‍లో కంకరలోడు చేసింది. ఎక్కువ అలస్యం చేయకుండా శ్రీను ట్రాక్టర్‍ను ఎల్కపల్లి గేటు కేసి పరుగులు పెట్టించిండు.

            మద్యాహ్నం వరకు నాలుగు ట్రిప్‍లు కొట్టిండు ఎండ ముదిరింది. కడుపులో అకలి సురసుర లాడసాగింది. పొద్దున వెంట తెచ్చుకున్న సద్దితిని మళ్ళి పనిలో పడ్డడు.

            గతుకుల రోడ్డు మీద ట్రాక్టరు ఎగిరి ఎగిరి పడుతు ముందుకు పోతున్నది.

            కాస్త దూరం పోయే సరికి దిలీప్‍ కన్పించిండు. దీలీప్‍ని చూసి శ్రీను మనసులో జాలి అన్పించింది. అంత పది పన్నెండు సం।।రాలు మించి ఉండదు. దీలిప్‍ తల్లి మూడెండ్ల క్రింద దేవ్‍ చనిపోయింది. దీలిప్‍ తండ్రి వాళ్ళు వీళ్లు’’ ఎమంత వయస్సు పోయిందని, మళ్ళీ పెండ్లి చేసుకొమ్మన్నరు. కాని భార్య చినపోయిన తరువాత దేవ్‍ కు జీవితం మీద అసక్తి పోయింది. పిల్లవాన్ని చూసుకుంటు బ్రతుకు తున్నాడు.

            దీలిప్‍ ప్రక్కగా ట్రాక్టరు అపి శీను. ‘‘ఎక్కడికి క్వారికేనా’’ అని అడిగిండు.

            ‘‘అవును’’ చిన్నగా నవ్వుతు తాలాడించిండు. దిలీప్‍...

            ‘‘అయితే ఎక్కు’’

            దిలిప్‍ బండి ఎక్కిండు. చేతిలో సంచి ఉంది. అది చూసి..

            ‘‘ఏంటది’’ అన్నాడు శ్రీను.

            ‘‘నాన్నకు సద్దీ’’

            ‘‘ఎవరు వండిండ్లు’’

            ‘‘నేనే’’ అన్నాడు మెరిసే కండ్లతో...

            ‘‘నీకు వంట కూడా వచ్చా’’ అన్నాడు అక్చర్యంగా...

            ‘‘దీలిప్‍ తలాడించి’’ రోజు పొద్దున్నె నాన్నె వండి పోతడు కాని ఇవ్వాల వీలు కాలేదు. అందుకే నేను వండిన’’ అన్నాడు.

            శ్రీనుకు నిజమే అన్పించింది. పిల్లవాడు అంత దూరం పోయ్యి రావటం కష్టమే అనుకున్నాడు. ఎన్టిపిసిలో పెరెన్నిక పొందిన రెండు స్కూల్లు ఉన్నాయి కాని అందులో కూలి పిల్లలకు సీటు దొరకయి. దాంతో చాల మంది కూలీల పిల్లలు చదువు కునెందుకు అవకాశాలు లేకుండా పోయింది. చెల్డు వెల్ఫేర్‍ వారి స్కూలు మూత పడ్డతరువాత అంతంత మాత్రంగా ఉండే అవకాశాలు కూడా లేకుండా పోయింది. ఒక లిద్దరు కాని గిరి బడి పెట్టిండ్లు. కాని అది సరిగ్గా నడవక మూసెసిండ్లు. దాంతో కూలిల పిల్లలకు చదువు లేకుండా పోయింది.

            ఇంట్లో అడవాళ్ళు ఉంటే అదోతీరు కాని అడదిక్కులేని కాడ, అందులో క్రషర్‍నగర్‍ వంటి చోట నీళ్ళు కావాలన్నా పోయిలోకి బొగ్గులు కావాలన్నా ప్రతిది సమస్యే. దేవ్‍ పనికి పోతే దిలీప్‍ అ చిన్న వయస్సులోనే ఇంటికాడ పనులన్ని చేసేవాడు.

            సైట్‍మీదికి చేరుకున్నారు. ట్రాక్టర్‍ను మళ్ళి లోడ్‍కోసం నిలిపి దీలిప్‍ను ఉద్దేశించి ‘‘మళ్ళీ పోయేతప్పుడు  వస్తవా’’  అన్నాడు బొమ్మలు ఎగరెసి...

            ‘‘కాసేపు అడుకున్నంక వస్తా’’

            ‘‘అయితే  రెండో ట్రిప్‍లో తీసుకపోతాలే’’ అన్నాడు శ్రీను...

            అన్నాలు తినే వేళ కావటంతో షెడ్డులో చాల మంది కూలీలు ఎక్కడికి అక్కడ కూచొని బోజనాలు చేస్తున్నారు. ఇంతలోనే బుర్‍ బుర్‍ లాడుతు భగవాన్‍ మెస్త్రీ మోటారు సైకిల్‍ చప్పుడు విన్పించింది.

            భగవాన్‍ మెస్త్రీ బండిని క్రషర్‍ అపీసు ముందు నిలిపి అపీసులోకి వస్తూ శ్రీనును చూసి

            ‘‘అరేయ్‍ శ్రీను ఎంత వరకు వచ్చింది పని’’ అని అడిగిండు. ఎల్కలపల్లి గేటుకు కంకర కొట్టుడు అయిపోయింది’’ అంటూ బదలిచ్చిండు.

            ‘‘కంట్రాక్టరు పోన్ల మీద పోన్లు చేస్తాండ్లు. తిలక్‍నగర్‍కు (బెందడి) బెస్‍మెంట్‍ రాయి తీస్కపోవాలి. తొందరతినిపో...’’ అని పురమాయించి మళ్ళి వెనక్కి తిర్గి అపీసుకు పోబోతుంటే అత్మరాం ‘‘మెస్త్రీ ఇవ్వాళ పైసలు ఇస్తరా’’ అని అడిగిండు.

            ‘‘అరే ఇస్తం బిడ్డా.... నీపైసలు ఎక్కడికి పోవు... కూలి ఇచ్చినంకనే ఇక్కడి నుంచిపోత సరేనా’’ అన్నాడు నవ్వుతూ...

 

(తరువాతి భాగం వచ్చే సంచికలో )

 

ఈ సంచికలో...                     

MAY 2021

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు