నవలలు

నవలలు

సైరన్ నవల  రెండవ పార్ట్ – పన్నెండవ  భాగం  

సైరన్ నవల  రెండవ పార్ట్ –  పన్నెండవ   భాగం  

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)                                                                                                                

        మొగిలి ‘‘జంబాయిరే’’ అంట అడుగులేస్తున్నడు...

            తన్మయత్వంతో పాడుతున్నాడు. తనూ పాడుతే బావుండు...లోపలి ఒత్తిడి కొంతైనా తగ్గిపోవును. సత్యంకు విచారం తొలిగిపోయింది.తను గుడిసెతడుక కొరిగి కూర్చున్నడు... తను మొగిలి చేతుల కాగితం తీసుకొని కవిత చదివినట్టు - పెద్దగా చదివిండు. ఎన్నెన్నో పోరాటాలు అందులో ఉన్నాయి.

            ‘‘బావయో బంగారయ్య పదాలు పాడి పాడి - బంగారయ్య పోలీసు ఠానల కూసున్నడు. సత్తెన్నా పాణానికి ఇంకో పాటల పిచ్చోడు తయారయ్యిండు.’’ లక్ష్మి...

            ‘‘వదినా! ఏది ఒక్క చరణం పాడు ఎంత కష్టమో? నాభిల నుంచి నరాలు తీగలు చేత్తే పాటత్తది’’ మొగిలి...

            ‘‘కామ్రేడ్‍ సత్తెన్నా - మా ఖాందానంత గిసొంటి పిచ్చి ఖాందానే నాగయ్య మా మేన బావ - ఏడదాకిందో అంతకు ముందో గని అయినెకు గీ రొగం తాకింది. అయిన తా చెడ్డ కోతి వనమెల్ల సెరిసిందని - ఇగో మా ఇండ్లల్ల కచ్చి గిట్ల మమ్ముల ఆగం జేసిండు. చెప్పుకుంటే మానం పోతది. చెప్పకపోతే పానం పోతది. ఇగోగీ పోరి సూడు ఎట్ల కాల్లెగరేస్తున్నదో దీనికి సుత వాళ్లనాయిన్న సాలుపడ్డది... దీనిపేరు స్నేహలత నోరు తిరుగని పేరు. గంగన్న పెట్టిండు. ఆయన మతికచ్చికాలవడే - అయ్యకు అవ్వకు బుట్టిన ఆరుగురు పరమ బాగోతులంట ఆళ్ల సెల్లె - ఓ అంతకు ముందు వాళ్లవ్వ లచ్చవ్వచ్చింది. గా ముసలవ్వను లోపటిసేదుండే పెండ్లి గావల్సిన పోరి నీకు గిదేందే - అని ఝాడిచ్చి బిడ్డను తీసుక పోతదనుకున్న -ఓ పావురం కారిపోంగ బిడ్డకు ముద్దిచ్చి పోయింది - అది మన గంగన్న కుటుంబం’’ లక్ష్మికి దు:ఖంతోనో - ఉద్విగ్నతతోనో కన్నీళ్లు కారుతున్నయి.

            ‘‘కామ్రేడ్‍! మరి మీ ఇద్దరు వాళ్లతోటుంటిరి గదా! మిమ్ముల్ని జీబుల ఎక్కించుకపోలె’’

            ‘‘మాపోదురు మమ్ముల్ని కవరుపెట్టిండ్లు గదా! మా అక్క చంద్రకళ వీళ్లకేం ఎర్రిలేసిందో - ఎవలు అర్థంకావటంలేదు. అది పెద్ద లీడరయ్యింది. దవాఖానంత ఒక్కటి చేసింది. మాతోపాటు పిల్లలున్నరని - వాళ్ల సుట్టాల మనుకున్నరు’’లక్ష్మి...

            ‘‘నాకైతే భయమయ్యిందక్కా - సిన్నపిలగాడు’’ రాజేశ్వరి...

            ‘‘అగో నీమొగుడు పాడుతండు. ఆకాలం వత్తది - తిరుగనేర్పినకాలు - పాట నేర్సిన నోరు ఆగుతదా? ఈ కామ్రేడ్‍ పిచ్చి సిన్నదిగాదు. నాకే గిట్లనే పోయి మార్కెట్ల నిలుసుండి గింతబట్టి బాజినడుత్తంటే - గీడ పీనుగల తీర్గున్నరు అని మొత్తుకోవాలని ఉన్నది’’ లక్ష్మి...

            ‘‘కామ్రేడ్‍ నాగయ్యమీకు’’ సత్యం

            ‘‘అదే మాకు దూలు దుమ్మ దురదరాసిండు’’ ఓహ్‍ రాత్రిపగలు మా సెవుల్ల కారం రాసినట్టున్నది. మా నాయిన - వీళ్లనాయిన - మా పెద్దమామను జేల్లకూసుండవెట్టి - తమజెంగల్లవడ్డడు’’

            ‘‘అయినెకు రఘన్ననట, ఆ అన్నకు ఎవరో పెద్దాయినెనట - సీతారామయ్యనట. ఆయనకు అరవై ఏండ్లు దాటినయట - ఆయినకు చారు బాబునట - మరి ఆయనకు మావోనట - ఆయనకులెనినట అయినకు. మరి ఆయనకు గడ్డాపాయన మార్క్సు - ఎంగిల్సట -నా మెదడు తినిటోడు బంగారయ్య. మరి అందరు మీ సాలోల్లే, గడ్డపోల్లే, ఆడోల్లెందుకులేరు. ఉన్నా ముంగటికి రానియ్యలేదా? లక్ష్మి ఎక్కడికో పోతంది.

            ‘‘వామ్మో కామ్రేడ్‍ నీకు అరెస్టుతప్పదు’’ సత్యం రవిని ముద్దుపెట్టుకుంటూ పిల్లాడు కేరింతలు కొట్టాడు.

            లక్ష్మి ముసి ముసి నవ్వి ‘‘మరి గడ్డపాయనకు మల్ల బంగారయ్య, రఘన్న, గంగన్న, నాగన్న, మొగిలి, సత్తెం - నానోరు తిరుగది - రైతులు కార్మికులు పిచ్చిలేపిండ్లట -గది సంగతి మాకు గుండాలు గీసి గిదంత రఘన్న జెప్పిండు. కామ్రేడ్‍ ‘‘మార్కెట్ల అందరు సుడంగ సారలిగాడు నామీద చేయ్యేసిండు. నెల రోజులు మనిషిని కాలేదు. అంతకన్నా రోతగా ఉన్నది. నాదానుగా ఉన్నది. ఆ ఆరుగురి శవాలు నాయే నన్నట్టుగున్నది సంపినోళ్లు మన ముంగట ముచ్చెట్లు చెప్పిండ్లు - కారం రాసి నట్టుగున్నది. చూసుకుంట నిలవడ్డందుకు నాదినాగే ఇనంగా ఉన్నది’’ లక్ష్మి ఏడుస్తోంది. వెక్కివెక్కి ఏడుస్తోంది. - వేడిగున్నప్పుడే సుత్తే దెబ్బ... మెడకు వడ్డపాము కరువక మానదు... అందరు రిలాక్సయ్యిండ్లు... అందరి కండ్లలో గుబగుబ నీళ్లు మొదట లక్ష్మి తేరుకున్నది. కన్నీళ్లు కొంగుతో తూడ్చుకున్నది. బయటకుపోయి ముక్కుచీదరిచ్చింది.

            ‘‘రవిని సత్తెన్న కియ్యి - కామ్రేడ్స్ - అరగంటలోఅన్నం అయిపోతది. ముచ్చెట వెట్టేటట్టులేదు’’  బంగారయ్య నాకు నిన్ననే చెప్పిండు. ఎనకకు పోరాదు. ముంగటికి పోవాలె - మనండ్ల వేలమందున్నరు.’’ లక్ష్మి...

            ‘‘సరే - మనం పోస్టర్లు వేయాలి. రేపు నిరవధిక సమ్మె... అరెస్టు చేసిన నాయకులందరిని విడుదల చేసే దాకా - సమ్మె - అన్ని డివిజన్లకు సమ్మె సత్యం లేచినిలబడి...

            ‘‘మనకు కాయిదాలు, బ్రషుషలు, లైకావాలె’’ అన్నాడు.

            ‘‘అన్నీ తెచ్చినం కామ్రేడ్‍ రాంగరాంగ మీరు కాయిదం మీద రాసియ్యిండ్లి మా రాత అడ్డ దిడ్డంగా ఉంది - నేను ఏమొ అనుకున్న నాగన్న మాకు పలు••లు దెచ్చి ఇచ్చినప్పుడు గిసొంటి యాళ్లల్ల .సోస్టర్లు రాస్తం...ఇప్పుడు ఏడయితంది. ఎడున్నర కల్లా మీ రద్దరు తిని పోండ్లి’’ లక్ష్మి...

పాట బాగున్నది - నువ్వు బాగపాడ్తన్నవ్‍ - జెమిడికె పంబాలగురవయ్య జబర్దాస్తీగ వాయించుతడు  రేపు వీలైతే పాడు’’ ఎవలతోనన్న చెప్పిపంపుదాం నాకెరికే... అందరు ఎవరి పనులు వాళ్లు చేయసాగిండ్లు...

            సత్యం, మొగిలి సైకిల్లు తీసుకొని చెరోసంచిలో పోస్టర్లు, సరంజామా పెట్టుకొని ఏడున్నరకే బయటు దేరిండ్లు.

            మొదటి పోస్టరు శిబిరం కాడే సిండ్లు - శిబిరం దగ్గర లోడర్లు వంద మంది దాకా చేరిండ్లు. వాళ్లు కొన్ని పోస్టర్లు తయారు చేసిండ్లు... ‘‘యాపల కాడి పంబాల గురువయ్యను రేపు మీటింగు కాడికి రమ్మని - జమిడికెవాయించాలని’’ ఒక కార్మికున్ని గురువయ్య దగ్గరికి తోలారు. రాత్రి రెండింటి వరకు అన్ని గనుల మీద - ఆఫీసుల దగ్గర పోస్టర్లు పడ్డాయి... అన్నిబాయిల ఆఫీసులు, వీలైన కాడికి ఫిట్‍ కమిటీల మొంబర్లను కలిశారు. మొగిలి, సత్యం తిరిగి తిరిగి వచ్చి శిబిరం దగ్గరే ఆ రాత్రి పడుకున్నారు.

 

            సరిగ్గా ఆరున్నర - కెకెటూగని జెండా గద్దెమీద సత్యం నిలుచున్నాడు, అతని ముఖం మీద సూర్యుని లేత ఎండ మెరుస్తోంది. నిద్రలేక అతని కండ్లు ఎండతో పోటీపడుతున్నాయి.

            ‘‘కామ్రేడ్స్ గతవారం దినాలనుంచి జరుగుతున్న దొంగనాటకాలన్ని మీ కందరికి తెలుసు... సుట్టుపక్క ఇరువై ఊళ్లు ఆక్రమించి మల్ల సింగరేణిలో అన్ని రకాల దందాలు చేసి - గుండాలను పెంచి దాదాగిరి చేసిన దొరలు ఈవారం లనేను - కార్మికులు చావు దెబ్బ కొట్టిండ్లు. ఇదే సందని - దొంగ కార్మికసంఘాలు, నక్కజిత్తుల యాజమాన్యం పోలీసులు కలిసి ఆరుగురు లోడింగు కార్మికులను దుర్మర్గంగా, అన్యాయంగా పట్ట పగలు కాల్చిచంపిండ్లు - నలుభై మంది కార్మికులు - యువకులు గాయాల పాలయ్యారు. ఇది దొంగల రాజ్యం. ఖూనీకోర్ల రాజ్యం. మన నాయకులు ఎప్పటికప్పుడు వీళ్లందరి ఎత్తులన్ని తిప్పికొట్టిండ్లు! మనకు నాయకత్వం ఉంటే సింగరేణిలో వాళ్ల ఆటలు సాగయని మన నాయకులను ఒక ప్లాను ప్రకారంగా అరెస్టు చేసి పోలీస్టేషన్ల పెట్టిండ్లు... అసలు ఏ హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపింది పోలీసులు... ప్రజలను ఈ సమయంలో దగ్గరికి తీసుకోవాలి - కాని పుండుమీద కారం రాసినట్టు అరెస్టులు.

            మనకు అరెస్టులు కొత్తకాదు. పోరాటాలు మనలను బొగ్గులవంటి మనలను అగ్గి చేస్తయి. ఇప్పుడు సింగరేణి కార్మికులు అమాయకులు కారు... రాజ్యం రీతి రివాజు తెలుసుకున్నవాళ్లు.

            మన అవసరాల కోసం అనేక సమ్మెలు చేసినం -గాలి సప్లైకోసం, నీళ్లకోసం, ఇండ్లకోసం, జీతాల పెరుగుదల కోసం మనకు సరైన నాయకత్వం - గంగాధర్‍, షరీప్‍, శంకరయ్య, రెహనక్క, సరితక్క లాంటి వాళ్లు ఉండటం వల్లనే మనకు   నాయకులను బేషరుతుగా విడిపించుకోవడం సాధ్యమైంది. నిన్న మొన్నటిదాకా మన ఊపిరైన నాయకులను అరెస్టు చేసి చిత్ర హింసలు పెడుతున్నారు. మన నాయకులను బేషరుతుగా విడిపించుకోవడంకోసం ఏంచేద్దాం?’’

            ‘‘సమ్మె’’ అక్కడ చేరిన అయిదారు వందల మంది కార్మికులు అరిచారు. ఆ అరుపు మారుమోగింది.. సమ్మె...సమ్మె...

            ‘‘నిరవధిక సమ్మె’’

            ‘‘ఎమర్జెన్సీ తరువాత భారతదేశంలోనే సింగరేణి కార్మికులు చేస్తున్న మొట్ట మొదటి రాజకీయసమ్మెఇది కొత్త చరిత్రను ఆరంభించిన కార్మికులందరికి శనార్తి కామ్రేడ్స్ - అన్ని గనుల పస్టుషిప్టుల నుండి సమ్మె చేస్తున్నాయి. మనందరం ఊరేగింపుగా రాష్ట్ర హైవే మీదయాపల కాడిచౌరస్తా దాకా వెళ్లుదాం - అక్కడికే అన్ని గనులవాళ్లు వస్తారు. ఇది ఆరంభం రెండు గంటలు రాస్తారోకో చేస్తాం - అక్కడ మనడిమాండు ప్రజలకు చెప్పుదాం - మన నాయకులను బెషరుతుగా విడుదల చేసేదాకా సమ్మెనడుస్తోంది. మన నిర్ణయాన్ని ప్రకటిద్దాం. మళ్లీ మొదటి షిప్టు కార్మికులతోనే సమ్మె ముగియాలి.’’

            ‘‘కామ్రేడ్‍ గంగారాంను’’

            ‘‘విడుదల చేయాలి’’

            ‘‘కామ్రేడ్‍ షరీపును’’

            ‘‘విడుదల చేయాలి’’

            ‘‘కామ్రేడ్‍ శంకరయ్యను’’

            ‘‘విడుదల చేయాలి’’

            ‘‘కామ్రేడ్‍ రెహనక్కను’’

            ‘‘విడుదల చేయాలి’’

            ‘‘కామ్రేడ్‍ సరితక్కను’’

            ‘‘విడుదల చేయాలి’’

            ‘‘వారితో పాటు అరెస్టు చేసిన అందరిని’’

            ‘‘బేషరతుగా విడుదల చేయాలి’’

            ఊరేగింపులో ఇవ్వవలిసిన నినాదాల గురించి రాంచందర్‍ అనే కార్మికుడు నినాదాలు చెప్పాడు.

            మరో గని మీది మొగిలి ఇంచుమించు ఇదే విధంగా మాట్లాడిండు. ఇంతలోనే ఏడుగంటల సైరన్‍ కార్మికులే మోగించారు. సైరన్‍ వేలాది గని కార్మికుల కోపోద్రిక్త అరుపులా - పెనుకేకలా మూడు సార్లు ఆగిఆగి మోగింది.... ప్రమాదం జరిగినప్పుడు మోగే సైరన్‍ అది.

            రాత్రి బజలీ కార్మికులు ఆదరబాదరగా ల్యాంపులు, సెమ్మాసులు ల్యాంపురూంల్లో పెట్టారు. అప్పటికే ఆ గని దగ్గర వెయ్యిమందికి పైనే కార్మికులు లైన్లు కట్టారు.

            క్లర్కులు, వోర్‍మన్లు, ఇంజెనీర్లు, అండర్‍ మేనేజరు రూంల్లో నుండి బయటకివచ్చి చూస్తున్నారు.

            ఊరేగింపు కదిలింది. రెపరెలాడే అతిపెద్ద ఎర్ర జండాను ముందువరుసలో ఉన్న కార్మికులు ఎత్తి పట్టుకున్నారు.

            వెయ్యిమంది కార్మికులు కదం తొక్కుతున్నారు. చాలా మంది సైకిల్లు నడిపిస్తూ వెనుక వరుసల్లో నల్లటి బొగ్గుతో నడుస్తున్నారు... దుమ్ము పొగలాగా ఆకాశంలోకి లేస్తున్నది... అగ్ని పర్వతం బద్దలై లాలా పొంగి ప్రవహించి నట్టు, కొండల మీదుగా వరదలొచ్చిన నది ప్రవహించినట్టు - బొగ్గు పెళ్లలు బాయిల నుండి ప్రవహించినట్టు బొగ్గులు మంటలై మండినట్టు - కార్మికుల ఊరేగింపు సాగుతోంది. వందలువేలయ్యారు. కరకర బూట్ల చప్పుడు ఒక లయగానేలను గుద్దు తున్నాయి. బురద బురదగా ఉన్న బూడిద కుప్పల గుడిసెల మద్యనుండి ఆడవాళ్లు స్కూలు పిల్లలు గుంపులు గుంపులుగా  యాపలకాడికి చేరుతున్నారు.

            బొగ్గు ప్రవాహం సింగరేణి కాలరీ చిన్న పట్నపు వీధులను ముంచెత్తుతూ పారుతోంది.

            వేలాది మంది కార్మికులు రాష్ట్రహైవే మీద నాలుగుకిలో మీటర్లమేర కదంతొక్కుతున్నారు. వందలాది సైకిళ్లు - లారీలు జీబులు ఆగిపోయాయి. పాటలు నినాదాలు, ‘మాకష్టంతో సృష్టిస్తున్నా’’ తిండి గింజలూ కట్టుగుడ్డలూ పెట్టుబడులతో దోచుకదాచే ద్రోహులు గుండెలో - అగ్ని కణములై చెరుగుతున్న జెండా! దండిగ ఎగురుతున్న జెండా’’ ముందువరుస కార్మికులు పాడు తున్నారు.తొమ్మిది గంటలకు రాష్ట్రహైవే మూడుదారుల కూడలిలో ముందు వరుస ఆగిపోయింది...అక్కడ కంకబొంగులతో చిన్నస్టేజీ లాంటిది కట్టారు... నాలుగు మైకులు ముందుకట్టారు. సత్యం స్టేజీమీదికెక్కిండు. మైకు చేతిలోకి తీసుకున్నాడు.

 

                                                                                        ( తరువాయి భాగం వచ్చే సంచికలో )

 

నవలలు

కూలి బతుకులు – ఆరవ  భాగం 

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                             6

          ‘‘ఎం నాగయ్య బాగున్నవా’’ అన్న పిలుపువిని ముందు మంచంలో కూచున్న నాగయ్య అటు వైపు చూసిండు.

            ఎంకటయ్య సారు చిర్నవ్వులు చిందిస్తూ ఇటే వస్తున్నాడు.

            ‘‘ఎన్నిరోజులాయే సారు మిముల్ని చూడక’’ అన్నాడు నాగయ్య అక్చర్యంగా...

            ‘‘గోదావరిఖనిల పనిబడి వచ్చిన... ఎట్లాగు ఇంత దూరం వచ్చిన కదా అని ఒక్క సారి మనోళ్లను చూసి పోదామని వచ్చిన’’ అంటూ వచ్చి మంచంలో నాగయ్య ప్రక్కన కూచున్నడు.

            ఎనుబై దశకంలో వెంకటయ్య కాట్రక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు. ఒక వెలుగు వెలిగిండు. ఆయన ఒక్క మాటంటే చాలు వెలాది మంది కూలీలు కదిలేది.

            ప్రాణం ఎట్టున్నది’’ అని అడిగిండు వెంకటయ్య...

            ‘‘ఏం ప్రాణమో ఎమో పోకుంటా రాకుంటా ఉంది’’ అన్నాడు నాగయ్య నిర్లిప్తంగా’’

            అదే ఏమైంది.. ఎవని బ్రతుకు వాడు బ్రతకటమే కష్టమైతాంది’’

            ‘‘సత్తయ్య మంచిగనే పని చేస్తాండుకదా.. వాడు ఇంట్లకేమి ఇస్తలేడా’’

            ‘‘ఎక్కడిది వాడు వాని పిల్లలు బ్రతుకుడే కష్టమైతాంది’’ ఇక మా మొఖం చూసేటట్టుఉందా’’

            ‘‘మరి చిన్నోడు’’

            ‘‘ట్రాక్టరు మీద పని చేస్తాండు’’

            ‘‘మరి నువ్వెమి పనిచేస్తలేవా’’

            ‘‘వయసు వయస్సు వాల్లకే పనులు దొరుకతలేవు నన్నెవ్వడు పనులకు పిలుస్తడు’’ అన్నాడు.

            వీళ్ళ మాటలు విని శాంతమ్మ ఇంట్లో నుంచి బయటికి వచ్చింది’’ వెంకటయ్య సారును చూసి ఎప్పుడొచ్చిండ్లు’’ అంది.

            ‘‘ఇప్పుడే’’

            ‘‘ఎక్కడుంటాండ్లు సారు కన్పిస్తలేరు’’ అంది మళ్ళి..

            ‘‘కరింనగర్‍ల’’

            ‘‘అక్కడికి ఎందుకు పోయిండ్లుసారు.. మీ అటువంటి వాళ్ళులేక పోయే సరికి ఇక్కడ ఎవ్వరు అడిగే టోళ్ళు లేకపోయిరి’’ అంది శాంత...

            ‘‘సారును ఏముండమంటవు... ఇక్కడ ఏమున్నది. అప్పుడంటే ఎక్కడ చూసిన జనం ఉండేది. అందరికి పనులు ఉండేది. సమస్యలు ఉండేవి. వాటిని పరిష్కరించాటానికి యూనియన్‍ అవసరమైంది. ఇప్పుడ జనంలేరు. యూనియన్లు  అ జోరు లేదు’’ అన్నాడు నాగయ్య నిర్లిప్తంగా...

            వెంకటయ్య ‘‘నిజమే’’ అన్నట్టుగా మౌనంగా తలాడించి ‘‘యూనియన్లు ఏడబోయినవి. మాగున్నయి. కాని నిజాయితీగా పని చేసేటోడులేడు’’ అన్నాడు బారంగా...

            ‘‘నిజమే సారు పర్మినెంటు లోకేషన్ల పని దొరకాలంటే ముప్పయి వెలు నడుస్తాంది’’

            ‘‘అ రోజుల్లో మనం ఎంత ంమందిని క్యాజువల్‍ వర్క్ర్కర్‍గా పెట్టించిలేదు... ఒకరి దగ్గర నయాపైస తీసుకున్నమా’’ అన్నాడు వెంకటయ్య పాత రోజులు తలుచుకొని...

            ‘‘నిజమే సారు ఆరోజులు వేరు...ఇప్పుడెమో నాయకులు పీతలపైస ఏరుకుంటాండ్లు’’ అన్నాడు నాగయ్య...

            అ రోజుల్లో నాగయ్య వెంకటయ్యతోని పనిచేసిండు వెంకటయ్య ఎంత చెప్పితే అంత బంద్‍ అంటే బందుండేది. ఒక విదమైన ఉండేది. నాగయ్య యూనియన్‍లో రాత్రింబవళ్ళు తిరిగేది.

            ఇద్దరు కాసేపు పాతరోజులు జ్ఞాపకం చేసుకున్నారు.

            1976లో ఐఫ్‍.సి.ఐ ఉత్తపత్తి ప్రారంభమైన తరువాత నాల్గెండ్లకు రామగుండం కంట్రాక్టు అండ్‍ క్యాజువల్‍ వర్కర్స్ యూనియన్‍ ప్రారంభమైంది. దాదాపు వెయ్యి మంది పని చేసేవాళ్ళు. ప్లాంట్‍ మెయిన్‍ టెనెన్స్ బాయిలర్స్, సివిల్‍, బిల్డింగ్‍ వర్క్న ఒక్కటేమిటి అరోజు పని కంట్రక్టు కూలీలు చేసే వాళ్ళు, వాళ్ళు మీద సూపర్‍వైజ్‍ చెసెందుకు మాత్రంకంపిని మనష్యులు ఉండేది.

            యూనియన్‍ ఎర్పడక ముందు కంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడిచేది. కనీస వేతనాలు ఇచ్చేవాళ్ళు కాదు. అదిరించి బెదిరించి పనులు చేసుకునేవాళ్ళు. కొంత మంది కంట్రాక్టర్లు కూలీలకు డబ్బులు ఎగ్గోటిన సందర్భలున్నాయి. ఎవరైనా ఎదురు మాట్లాడితే పనులనుండి తొలగించేవాళ్ళు... పంజాబ్‍కు చెందిన ‘‘సంగ’’ అనే ఎలక్ట్రిక్‍ కంట్రాక్టర్‍ మరి దుర్మార్గంగా ఉండేవాడు. అనేక సందర్భలలో కూలీల మీద చెయ్యి చేసుకున్నాడు.

            అటువంటి సమయంలో వెంకటయ్య నాయకత్వంలో యూనియన్‍ పుట్టింది. కంట్రాక్టు కూలీలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చెపట్టింది. దాంతో కంట్రాక్టర్లకు కన్నెర అయింది.

            కంట్రాక్టు కార్మికులను గవర్నమెంటు జి.వో ప్రకారం కనీస వెతనాలు చెల్లించాలనే డిమాండ్‍ మీద సమ్మె చేసినప్పుడు పెద్ద పోరాటమే జరిగింది.

            ‘‘చెప్పుకింద రాయిలాగా అణిగి మణిగి ఉండే కూలి నాలి కొడుకులు మాకు ఎదురు తిరుగుతారా’’ అని కంట్ట్రార్ల కోపానికి వచ్చి సంఘంలో ముందు నిలచిన వెంకటయ్య మీద తమ గుండాలను పంపి హత్యప్రయత్నం చెసిండ్లు.

            దాడికి వచ్చిన గుండాల మీదికి కూలీలు ఎదురు తిరిగిండ్లు. రోజంతా మొద్దు కష్టం చేసి దాటు దేలిన కూలీల ముందు గుండాలు నిలువలేక పోయిండ్లు. బ్రతుకు జీవుడా అంటూ పారిపోయిండ్లు.

            వెంకటయ్య మీద హత్యయత్నం చేసిన కంట్రాక్టర్లు తమ పలుకుబడి ఉపయోగించి ‘‘తమ అనుచరుల మీద దాడి చేసిండ్లని దొంగ కేసు పెట్టిండ్లు... పోలీసులు వచ్చి వెంకటయ్యతో సహా కొద్దిమందిని పట్టుక పోయి ఠానా లో వేసి కొట్టి కేసులు పెట్టిండ్లు.

            ఈ సంఘటన కూలీలకు పుండు మీద కారం చల్లినట్టయింది. అరెస్టు చేసిన వారిని విడుదల చేసే దాక, తమ న్యాయమైన డిమాండ్లను ఓప్పుకునేదాక సమ్మె విరమించేది లేదని కూలీలు తెగెసి చెప్పిండ్లు.

            సమ్మె వారం రోజులు సాగింది. ఎఫ్‍.సి.ఐ ప్రోడక్షన్‍ అగిపోయింది. కూలీలు పని చెయకుండా ఒక్క రోజు కూడా నడువని పరిస్థితి... దాంతో మెనేజుమెంటు దిగివచ్చి కంట్రాక్టర్ల మీద ఓత్తిడి తెచ్చింది.

            ‘‘కూలీలా గొంతమ్మ కొర్కెలు తీరుస్తూ ఇక మాకేమి మిగులు బాటు అయితది’’ అంటూ మొదట కంట్రాక్టర్లు మొండికేసినా మెనేజుమెంటు వారిని కన్విన్స్ చేసి ఒక ఓప్పందానికి వచ్చింది.

            అవిదంగా సమ్మె విజయవంత మైంది. కూలీల జీతాలు పెరిగినవి. యాడాదికి రెండు డ్రెస్‍లు, సేఫ్టీషూస్‍, క్యాంటిన్‍, ప్రావిడెంట్‍ ఫండు కట్టింగ్‍, యాడాది పన్నెండు లీవులు ఇచ్చెలా ఓప్పందం జరిగింది.

            అన్నిటి కంటె ముఖ్యమైంది. గతంలో కంట్రాక్టకూలీలకు నిర్దిష్టమైన పనిగంటలు అనేవి ఉండేవి కావు. కొన్ని సార్లు పన్నెండు గంటలు పని చేయించుకొనేది. ఓప్పందం తరువాత కూలీలను ఎనిమిది గంటలకంటే ఎక్కువ పనిచేయించవద్దని ఒక వేళ అనివార్యమై పనులు చెయించాల్సి వస్తే అదనంగా పని చేసిన గంటలకు ఓవర్‍టైమ్‍ పెమెంట్‍ చేయించాలని ఓప్పందం జరిగింది. అలాగే అరస్టు చేసిన నాయకులను విడుదలచేసారు. కూలీల డిమాండ్స్ ఏవి కొత్తవి కావు. గవర్నమెంట్‍ జివోతో ఉన్న అంశాలే కాని అమలు జరిగేవికావు. ఎప్పుడైతే కూలిసంఘం సమ్మె తరువాతనే అమలు లోకివచ్చినవి.

            సమ్మె విజయవంతం కావటంతో కూలిసంఘం బలపడింది. దీని ప్రబావం ప్రక్కనే ఉన్న ఎన్టిపిసి కార్మికుల మీదప్రబావం చూపింది క్రమంగా అక్కడ కూలి సంఘం బలపడింది. ఎన్టిపిసి లో కార్మికులు తమ సమస్యల మీద మూడు సార్లు సమ్మె చేసి విజయం సాధించారు.

            కూలీలు ఎక్కువగా నివసించే పికే రామయ్య కాలనీలో అంత వరదాక కరెంటు లేదు, యూనియన్‍ అందోళన పలితంగా కరెంటు వచ్చింది. మంచినీళ్ళ కోసం రెండు పంపులు వచ్చినవి. అయినా చాల సమస్యలు పెండింగ్‍లో ఉన్నాయి.

            పోయిన వర్షకాలం మురికి గుంలా ఉండే పికే రామయ్య కాలనీలో కలరా వచ్చి షహి దుర్గ తండ్రి భగవతి నాగమణి భర్త రామయ్య చనిపోయిండ్లు. అ సందర్భంగా యూనియన్‍ అందోళచేస్తె ‘‘ఎంమ్మార్వో’’ వచ్చిండ్లు.

            ఎంమ్మార్వో ముందు కాలనీ వాసులు చాల సమస్యలు ఎకరవు పెట్టిండ్లు. మాకు రెషన్‍ కార్డులు లేవు. ఉచిత బియ్యం వస్తలేవు. మేము ఈ దేశవాసులంకామా? మాకెందుకు ఇవ్వరు.. అని నిలదీసిండ్లు. కాని అన్ని చేస్తామని హమీ ఇచ్చిన ఎంమ్మార్వో అటు తరువాత తన మాట నిలుపుకోలేదు.

            ఉండి ఉండి వెంకటయ్య ‘‘చంద్రయ్య కన్పిస్తాండా’’ అని అడిగిండు.

            ‘‘ఏ చంద్రయ్య’’

            ‘‘అదే బొందయ్య కొడుకు’’

            ‘‘మొన్న బొందయ్య కన్పించిండు కాని కొడుకు సంగతి ఏం తెల్వలేదన్నాడు. అయినా కొడుకు ఎప్పటికైనా రాకపోతడా అని ఎంత కష్టం వచ్చినాభూమి అమ్మలేదట’’ అన్నాడు నాగయ్య...

            ‘‘బొందయ్య ఇక్కడ ఉంటాండా’’

            ‘‘చాల రోజులాయే ఎల్లిపోయి ఆయన భార్యకూడా చనిపోయిందట... ఊరిమీద తిర్గి అడుక్కొని బతుకుతాండు’’ అన్నాడు నాగయ్య...

            అమాటలకు ఎంకటయ్య మన సులో బాదేసింది. ఎక్కడి దక్కడ చిల్లం కల్లం అయ్యింది. గాలిలో దీపం లాంటి కూలీల బ్రతుకుల్ని కాపాడటానికి ఒక ప్రయత్నమైతే చెసిండు. కాని, తుపానులా వీచిన గాలికి ఆ దీపం అరిపోయింది. కూలీ బ్రతుకుల్లో మళ్ళి చీకట్లు కమ్ముకున్నాయి. కూలీల చమట చుక్కలను లాబాలుగా పిండుకోవటానికి అందరుకు అందరుతోడు దొంగలే. కూలీల బ్రతుకుల్ని బాగు చేస్తామని చట్టాలు చేసిన పాలకులు, అచట్టాలు ప్రభుత్వరంగ సంస్థలోనే అమలు జరుగకుంటే పట్టించుకొని లేబర్‍ అపీసర్లు...

            మొదటి సారి కూలి సంఘం మహాసభలు ఎంతో ఉత్సాహంగాజరిగినవి. ఎన్టిపిసి కమ్యూనిటి హాల్లో మీటింగ్‍ జరిగింది. సహజంగా అయితే మెనేజుమెంటు కూలీలను ఆ చాయలకు కూడా రానివ్వదు. అటువంటిది అందులో మీటింగ్‍ పెట్టుకోవటానికి పర్మిషన్‍ ఇచ్చిందంటే, ఆ రోజుల్లో కూలిసంఘం ఎంత బలంగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు.

            వెంకటయ్యకు చంద్రయ్య నల్లటి బక్క మొఖం గుర్తుకు వచ్చింది. దాంతో ఆయన అప్రయత్నంగానే ‘‘వాడు మొదటినుండి అంతే రాజీపడేవాడు కాదు. చెవసచ్చి ఒపిక నశించి మా అటువంటి వాళ్ళు వెనక్కి తగ్గినా... చంద్రయ్య ముందుకే పోయిండు’’ అన్నాడు బారంగా...

            ‘‘మరింక ఏం చేస్తడు. మనిషి ముందు అకలికి చచ్చుడో ఎదురుతిరిగి బ్రతుకుడో తెల్చుకోవాలన్నప్పుడు చంద్రయ్య లాంటి వాళ్ళు ఎదో తిరగటానికే సిద్దమైండ్లు’’ అన్నాడు నాగయ్య...

            కూలి సంఘం బలహినపడటానికి అనేక కారణాలున్నాయి. పనులు లేక చాల మంది బ్రతక పోవం ఒక కారణమైతే కూలి సంఘంలో అంతర్‍ కలహలు ఎర్పడటం మరో కారణమైంది.

            నిత్యం కూలీల మధ్య తిరుగుతు పని చేసేవాల్ళు కొందరైతే రాష్ట్ర నాయకులుగా కెంద్రనాయకులుగా చెలామణి అవుతు వారి మీద పెత్తనం చేసేవాళ్ళు మరికొందరు. సమాజంలో ఉన్న అన్ని రకాల అవలక్షణాలు సంఘంలోకి చొచ్చుకొచ్చింది.

            ఏ రోజుకు ఆరోజు పని చేసకుంటూ తిండికి తికానలేని కూలీల మధ్య పనిచేయటం అంటే మాములు విషయం కాదు. అందుకు ఏంతో ఓపిక పట్టుదల, సేవబావం కావాలి. కాని చాల మందినాయకులకు అలక్షణాలు లేవు. సభలు సమావేశాలప్పుడు తెల్ల బట్టలు వేసుకొని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు, క్రింది స్థాయిలో పని చేసే వారి మీదమాత్రం పెత్తనం చేసేవాళ్ళు. అంత వరదాక అందర్గతంగా జరిగే ఘర్షణ క్యాజువల్‍ వర్కర్స్ సమ్మె సందర్భంగా బయటపడింది.

            ఎన్టిపిసిలోని మెకానికల్‍ ఎలక్ట్రికల్‍ సెక్షన్‍లో లోడింగ్‍ అన్‍లోడింగ్‍ చేసే వంటి నిత్యం పనులు ఉండే చోట పనిచేసే కూలీలను క్యాజువల్‍ లెబర్‍గా పర్మినెంటు చేయ్యలనే డిమాండ్‍తో సమ్మె మొదలైంది.

            అయా పనులు స్వబావ రీత్య రోజు ఉండేవి. అయితే ఆ పనులు చేసే కంట్రాక్టర్లు మారి నప్పుడు మారిన కంట్రాక్టరు కొంతమందిని తీసివేసి, తనకు ఇష్టమైన వారిని మరి కొంత మందిని పెట్టుకునే వాళ్ళు. దీన్ని కూలీలలు వ్యతిరేకించిండ్లు. ఎంట్రాక్టర్లు మారిన పర్మినెంటు పనుల చేసే వారిని తీసివేయవద్దు అన్నది డిమాండ్‍. అట్లా చేయటం వలన సంస్థకు వచ్చే నష్టం ఏమి లేదు. కాకుంటే పర్మినెంటు పనులు చేసే కూలీలకు రోజు పని ఉంటుంది. అది కూడా కంట్రాక్టు కూలియే...

            ఎప్పుడైతే సమ్మె మొదలైందో పనులు సాగక మెనేజుమెంటు ఇరకాటంలో పడింది. కంట్రాక్టర్లెమో అందుకు ఓప్పుకోవటంలేదు. ఎందుకంటే కంట్రాక్టర్లు పర్మినెంటు పనులు కూలీలకు కేటాయించాలంటే కూలీల దగ్గర లంచాలు తీసుకొని పనుల్లో నియమించుకునేవాళ్ళు. చివరికి ఇది ఎట్లా పరిణామం చెందిందంటే కంట్రాక్టర్లు మారినప్పుడల్లా తమ పనిని కాపాడుకోవాటానికి సమ్మె ఉధృతి పెరిగే సరికి మెనేజుమెంటు కుట్రపూరితంగా వ్యవహరించింది. అగ్రనాయకులతో మంతనాలు జరిపి వారిని లోబర్చుకుంది.

            నలుబైశాతం మందికి క్యాజవల్‍ వర్కర్లగా పర్మినెంటు పేసుల్లో పనిచేయాటానికి మెనేజుమెంటు ఒప్పందాలు చేసుకున్నారు. ఇదే గణవిజయంగా నాయకులు చెప్పుకొచ్చిండ్లు.

            ‘‘పదకొండు వందల మంది పర్మినెంటు పనిస్థలాల్లో పనిచేస్తున్న వారిని పర్మినెంటు చేయాలని మనం సమ్మె చేస్తే కనీసం మనతోని విచారించకుండా నాయకులు విద్రోహ పురితమైన ఒప్పంద చేసుకున్నారు’’. అంటూ కూలీలు అవేశపడ్డారు.

            ‘‘ఇంకా నాలుగు రోజులు సమ్మె కొనసాగితే మెనేజుమెంటు అందరికి పర్మినెంటు ఫేసులు ఇచ్చేది. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని కూలీల మధ్యకు పోవాలి. నిత్యం కూలీల మధ్య తిరిగే వారి బాధలు వారికేట్లా అర్థమైతది. అంటూ వెంకటయ్య అవేదన చెందాడు.

            ‘‘లేదన్నా అందర్ని పర్మినెంటు చేసేదాక సమ్మె విరమించవద్దు’’అంటూ చంద్రయ్య అవేశ పడ్డాడు. కూలి సంఘంలో చీలిక వచ్చింది. వెంకటయ్య వర్గం సమ్మె కొనసాగించాలని పిలుపు ఇచ్చింది.

            ఒప్పందం చేసుకున్న నాయకులు తాము చేసుకున్న ఒప్పందాన్ని సమర్థించుకోవటానికి మీటింగ్‍ పెట్టిండ్లు.

            ‘‘పోరాటం అన్న కాడ సళ్ళుబిగు ఉండాలి. మొండికేస్తే మొదటికే మోసం. అందుకే ఈ సారి 40% మందిని పర్మినెంటు ఫేసులు ఇస్తారు. మిగితావారిని దశలవారిగా పర్మినెంటు చేస్తారు’’ అంటూ తమ తప్పును కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేసింది.

            ‘‘అట్లా ఏమన్నా ఒప్పందం ఉందా’’ అంటూ చంద్రయ్య సభలోనే నాయకులకు ఎదురు తిరిగిండు.

            కూలీల కోపంతగ్గించటానికి నాయకులు అట్లా చెప్పుకొచ్చిండ్లు కాని వాస్తవానికి అటువంటి ఒప్పందం ఏదీలేదు.

            ‘‘ఇటువంటి దుందుకుడు చర్యలే యూనియన్‍కు నష్టం చేస్తాయి’’ అంటూ నాయకులు అవేశపడ్డారు.

            సమావేశం కాస్త రసాబసాగా మారింది. ‘‘అందరిని పర్మినెంటు చేసేదాక ఎవరు పనులు చేయవద్దు’’ అంటూ వెంకటయ్య వర్గం సమ్మె కొనసాగిచింది.

            యూనియన్‍ విబేదాలు తారా స్థాయికి చేరింది.

            ‘‘యూనియన్‍ క్రమశిక్షణకు కట్టుబడ కుండా వ్యక్తిగత పని విదానంతో పనిచేస్తున్న వెంకటయ్య మరికొంత మందిని యూనియన్‍ బహిష్కరిస్తున్నట్టుగా అగ్రనాయకత్వం ప్రకటించింది.

            ‘‘పోరాడే వానికి వేదికలే కరువా, వాడు కాకుంటే మనమే ఒక పోటి యూనియన్‍ ఎర్పాటు చేసుకుందాం’’ అన్నాడు సమ్మెకారులు...

            అట్లా వెంకటయ్య నాయకత్వంలో మరో కూలిసంఘం అవిర్భవించింది.

            సమ్మెకొనసాగటం మెనేజుమెంటుకు ఇబ్బంది కల్గించి పోటి సంఘం ఎర్పడటం దాని నాయకత్వంలో సమ్మె కొనసాగటం అగ్రనాయకులకు మింగుడు పడలేదు. దాంతో వాళ్ళు ఏమి చెయ్యలేక వెంకటయ్యకు రాడికల్స్ సంబందం ఉంది’’ అంటూ పోలీసులకు లోపాయికారిగ ఎగదోసిండ్లు. ఒక రోజు పోలీసులు వచ్చి యూనియన్‍ అపీసుమీద దాడి చేసి వెంకటయ్య, చంద్రయ్య మరి కొంతమందిని అరెస్టు చేసి తీసుక పోయిండ్లు. అవిదంగా సమ్మెకు నాయకత్వం లేకుండా చేసిండ్లు.  మరోవైపు పర్మినెంటు అయిన వారికి కాని వారికి మధ్యన విబేదాలు సృష్టించిండ్లు. పలితంగా సమ్మె విపలమైంది.

            ఈలోపున కుక్కమూతి పిందెల్లా చాల కార్మిక సంఘలు పుట్టుకొచ్చినవి. బిజెపి నాయకుడు, కంట్రాక్టరు అయిన రంగయ్య తన అనచరుడు లక్ష్మన్‍ను  నాయకుడుగా చేసి భారతీయ మజ్దూర్‍ సంఘ్‍ అనుబందంగా కూలి సంఘం ఏర్పాటు చేసిండు. కంది చంద్రయ్య నాయకత్వంలో కాగ్రెసు వాళ్ళు ఒక సంఘం స్థాపించిండ్లు. ఏఐటియుసి వాళ్ళు ఏఫ్‍.సి.ఐలో అపరేటర్‍గా పనిచేసే రామయ్య అనే వాని నాయకత్వంలో కూలి సంఘం పెట్టిండ్లు. ఎవని దుకాణం వానిదైంది. ఇట్లా కూలీలు చీలికలు పేలికలైండ్లు.

            ఒకప్పుడు బలంగా పని చేసిన కూలి సంఘంబలహినమైంది. వెంకటయ్య తదితరులు బయిటికి పంపిన నాయకులు ఎన్టిపిసి ఎంప్లాయి ఈలోపున ఐఫ్‍సిఐ మూత పడింది. వాస్తవానికి ఎర్పాటు చేయాటమే లోపభుయిష్టంగా జరిగింది దానికి తోడు అడుగు అడుగున అవనీతి చోటు చేసుకున్నది. టెక్నాలజీ సప్లయి చేసిన  బహుళ జాతి సంస్థలు ఇచ్చె లంచాలకు ••క్కుర్తి పడిన అధికారంలో ఉన్న పెద్దలు పనికి మాలిన, అవుట్‍డేట్‍ అయిన సెకండరీగ్రెడ్‍ టెక్నాలజీని అంగట్టారు. ఎఫ్‍సిఐ చుట్టు సింగరేణి బొగ్గు గనులున్నా, ఏఫ్‍సిక్ష్మ గోడను అనుకొని 2100మెగావాట్ల విధ్యుత్‍ ఉత్పత్తి చేసే ఎన్టిపిసి ఉన్నా, బొగ్గు కొరత వలన కరెంటు కొరత వలన సంస్థకు వందల కొట్లు నష్టాలు సంభవించింది. పలితంగా ఎఫ్‍సిఐని మూసివేసిండ్లు.

            ప్యాక్టరీ మూత పడటంతో వందలాది మంది కూలీలకు పనులు లేకుండా పోయింది. దాంతో తట్టాబుట్టా పట్టుకొని చాల మంది కూలీలు మళ్ళీ వలస పోయిండ్లు.

            ఈ అటుపొట్ల మధ్య ఒంటరి పోరాటం చెయ్యలేక వెంకటయ్య సంఘం వదులుకొని కరింనగర్‍కు బ్రతక పోయిండు.

            ఎక్కడికి పోయినా కూలిల బ్రతుకు ఇంతేనని బావించిన చంద్రయ్య లాంటి అవేశపరుడు కూలి బ్రతుకులు మారలంటే కూలిరాజ్యం రావాలని అందుకు పోరాటమే మార్గమని అడవి బాట పట్టిండు.

            వెంకటయ్యకు గతమంత గుర్తుకు వచ్చి మనసు కకావికలమైంది. ఆయన మెల్లగా పోవటానికి లేచిండు. అది చూసి నాగయ్య ‘‘సారు పోతాండ్లా’’ అన్నాడు.

            ‘‘రాజయ్యను కలిసి పోతా’’

            ‘‘ఉన్నడో లేడో’’

            ‘‘అదే’’

            ‘‘ఎంలేదు. మనిషి పుర్తిగా చాతకాకుండా అయ్యిండు’’

            ఎప్పుడన్నా గట్లనే కన్పిస్తడు కాని రెండు మూడు రోజులాయే కన్పిస్తలేడు’’

            ‘‘సరే మనొళ్ళు ఎవరన్నా కలుస్తరో చూస్తా’’ అంటూ వెంకటయ్య లేచిండు.

            ‘‘అయ్యా చిన్న పని’’ అన్నాడు నాగయ్య...

            ‘‘ఎంటీ’’ అంటూ క్షణమాగి పరిక్షగా చూసిండు వెంకటయ్య...

            ‘‘పనులు లేక కష్టమైతాంది. మీరే ఎవరికైన చెప్పి పని ఇప్పించాలి’’ అంటూ నాగయ్య నసిగిండు.

            ‘‘ఎనకట అంటే నడిచింది. ఇప్పుడు మనమాట ఎవరు వింటరు. సరే ఒపని చేస్తాం’’

            నాగయ్య అసక్తిగా చూసిండు.

            ‘‘లక్ష్మన్‍ ఇప్పుడు స్వంతంగా బిల్డింగ్‍ కట్టి పనులు చేస్తాండు కదా వానితో చెప్పుతా... ఎదో ఒకపని వాడే చూయిస్తడు. నువ్వు పొయి ఆ యాన్ని కలువు’’ అన్నాడు.

            సరే అంటూ నాగయ్య రెండు చేతులు జోడించిండు.

            వెంకటయ్య బారంగా ముందుకు కదిలిండు.

       (తరువాయి భాగం వచ్చే సంచికలో)

ఈ సంచికలో...                     

JUL 2021

ఇతర పత్రికలు