నవలలు

(January,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సైరన్ (నవల)

సైరన్‌  గురించి....

21.03.1977 అత్యయిక పరిస్థితి ఎత్తి వేసిన తరువాత తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్‌, ఆదిలాబాదు జిల్లాల్లో రైతాంగ విప్లవోద్యమాలు ఆరంభమయ్యాయి. 1974లో ఏర్పడి పని చేస్తున్న రాడికల్‌ విద్యార్థి సంఘం, జననాట్యమండలి(1972) ప్రజలతో మమేకమయ్యాయి. అప్పటికీ తన అన్ని రకాల పోరాటాల అనుభవంతో - భారత కమ్యూనిస్టు పార్టీ సివోసి తన కార్యకలాపాలను తిరిగి సమీక్షించుకున్నది.  ఫ్యూడలిజాన్ని , భూస్వామ్య హింసావాద వర్గ శత్రు నిర్యూలన అనే ఏకైక కార్యక్రమంతో తుద ముట్టించలేమని అది విప్లవానికి బాట కాదని, గుణపాఠం తీసుకున్నది.  'విప్లవానికి బాట' రచించుకొని వ్యవసాయ విప్లవానికి పూనుకున్నది. 

చరిత్ర నిర్మాతలు కొంతమంది వీరులు కాదని- ప్రజలే చరిత్ర నిర్మాతలని, రైతాంగంతో పాటు కార్మికవర్గం కూడా విప్లవ చోదక శక్తులుగా గుర్తించి రైతాంగ, కార్మిక వర్గంలో పనిచేయనారంభించింది.  ఈ రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద పరిశ్రమ అయిన సింగరేణిలో రాడికల్‌ విద్యార్థులు- కార్మికులను నూతన ప్రజాస్వామిక  విప్లవోద్యమానికి సిద్దం చేసే పనికి పూనుకున్నారు.  పేరుకు పెట్టుబడిదారి ఉత్పత్తి విధానమే అయినా - సింగరేణిలో అటు కార్మికులల్లోను - ఇటు యజమానుల ప్రతినిధులైన అధికారుల్లోనూ భూస్వామిక భావజాలం, ఆచరణ ఉండేది.  విచిత్రంగా చుట్టుపక్కల ఊళ్ళలోని దొరలే గూండాలను పోషిస్తూ కార్మిక ప్రాంతాలల్లో అన్ని రకాల చిల్లర దుకాణాలు, వైన్‌ షాపులు, వడ్డీ వ్యాపారం నుండి చిట్టీ, సినిమా వ్యాపారాల దాకా దోపిడి, దౌర్జన్యాలను సాగిస్తూ ఉండేవారు.  కార్మిక సంఘాల నాయకులుగా దొరలే అధికారం చెలాయించేవారు. కరీంనగర్‌, ఆదిలాబాదు జిల్లాల్లోని పేద దళితులే కాకుండా, వ్యవసాయం కుప్పకూలిన బహుజనులు, అగ్రకులాలు కార్మికులుగా సింగరేణిలో చేరారు.  సరిపడ ఇంటి వసతి లేక చిన్న చిన్న మురికి గుడిసెల్లో - ఏ మాత్రం సౌకర్యం లేకుండా - పందులతో, దోమలతో సహజీవనం చేసేవారు.  పై అధికారులు దొరలల్లాగా ఏ కార్మిక చట్టాలు పాటించకుండా అధికారం చెలాయించేవారు.  బయట బస్తీలు, మార్కెట్‌ మొత్తం దొరల వాళ్ల తాబేదార్ల గూండాలతో భయానక వాతావరణంలో నిండిపోయి భయంభయంగా బతికేవాళ్ళు.

దుర్భరమైన పని పరిస్థితులు - హీనమైన కనీస వసతులు, దోపిడి, దౌర్జన్యాల మధ్య కార్మికులు అసంఘటితంగా,  అభద్రతగా ఉండేవారు.

అట్లాంటి కార్మికుల్లోకి రాడికల్‌ విద్యార్థులు వెళ్లి పని చేయడం - సింగరేణి కార్మికులు తమ శక్తేమిటో తెలుసుకొని - కాలరీ ప్రాంతంలోని అన్ని రకాల కార్మిక వ్యతిరేక శక్తులతో పోరాడటం - తమకంటూ ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకునే  దిశగా ఎదగడం వరకే నేను రాయాలనకున్నాను. అనగా సింగరేణిలో దుర్భరమైన కార్మిక జీవితం ఒక్క కుదుపుతో కదలడం ఆరంభ

రైతాంగ పొరాటాల ఆరంభం - ఎదుగుదల గురించి  'కొలిమంటుకున్నది' నవల రాశాను.  నేను ఉద్యోగరీత్యా కార్మికులల్లో ఉండటం - విప్లవోద్యమాలను ఆరంభించి కొనసాగిస్తున్న నా తరం ఉద్యమ సహచరుల మధ్య జీవించడం, వారి అనుభవాలు తెలుస్తుండటం - రకరకాల పనులరీత్యా మొదటి దశలో సింగరేణి కార్మికుల అనేక మీటింగుల్లో - పనులల్లో కలిసి తిరగడం వలన కార్మిక జీవితం - పోరాటం నా లోపల ఒక రూపం తీసుకోసాగింది.  అట్లా 1978లో ఈ నవల మొదలు పెట్టాను.  రకరకాల పనుల ఒత్తిడి వలన కొంత రాసి వొదిలేశాను. 

ఆ తరువాత సింగరేణి కార్మికోద్యమాల గురించి పాటలు, కథలు ఆరంభమయ్యాయి.  సహచరులు, మిత్రులు వూరుగొండ యాదగిరి ( పి చంద్‌), తుమ్మేటి రఘోత్తమ రెడ్డి గారలు అప్పటికే సింగరేణి ఉద్యోగులు.  రాయడం ఆరంభించారు.  దాదాపుగా మేం ముగ్గురం కలిసి చర్చించుకొని సింగరేణికి సంబంధించిన చాలా పుస్తకాలు తెచ్చాం.  అమరుడు శేషగిరి, నల్లకలువలు, నల్ల వజ్రం, బొగ్గు పొరల్లో లాంటి పుస్తకాలు తెచ్చాం.  నాకన్నా ఎక్కువ ప్రత్యక్ష అనుభవం గల్గిన వారైన నా సహచరులు చాలా రాశారు. పని ఒత్తిడిలో - పోరాటాలు సంఘటితపడి ఉన్నతరూపంలోకి ఎదగడం వలన ఈ నవల వెనుకబడిపోయి పూర్తి చేసే అవకాశం రాలేదు. శేషగిరి నవల తరువాత - సింగరేణి మొదటి దశ ఉద్యమాలకు సంబంధించినది ఈ నవల సైరన్‌.  సింగరేణి కార్మిక సమాఖ్య ఏర్పడి పని చేయడం - రెండవ దశకు సంబంధించిన నవలలు రాయవల్సినవి.  అవి రాయతగినవారు నా సహచరులు.  తప్పక రావాల్సియే ఉన్నవి.

కోల్‌బెల్టు పత్రిక - ఈ నవలను ' సింగరేణిలో సిరియాలుడు' పేర అతికొంత భాగం సీరియల్‌గా వేసింది.  పత్రిక ఆగిపోయింది. నేను ఎంచుకున్న పనుల్లో మిగిలిపోయిన పని పూర్తి చేయాలనుకున్నాను.

 

06 డిశంబర్‌- 2019                                                                            

అల్లం రాజయ్య

 

సైరన్ నవల ప్రారంభం.....

ఎర్ర బస్సు దుమ్ము రేపుకుంటచ్చి వేపచెట్టుకిందాగింది. బస్సుల నుంచి ఓ కుంటి ముసల్ది గుడ్డల ముల్లె బట్టుకొని ''నారాయణ - నారాయణ'' అనుకుంట దిగింది. ముసల్దానెనుక ఓ కర్రె పడుసోడు ''దిగుదిగవే ముసల్దానా!'' అనుకుంట దిగిండు...

పడుసోడు పిక్కుటం పైంటేసుకున్నడు. పిక్కుటం పైంటు నల్లది. పిర్రలమీద తెల్లబడ్డది. దాని మీద ఓ పూలంగి. పూలంగి మీదిగుండి తీసున్నది. లోపల ఆకుపచ్చబనీను మెడదాకున్నది... ఛాతీ విరుసుకుంట రోడ్డు మీద నిలుసున్నడు. నెత్తిమీది తాటికమ్మ టోపి తీసి పట్టుకున్నడు. మనిషి సగం కాలిన తునికి మొద్దు తీర్గ కాకి నలుపు... కుడిసేతికి గడియారం. కాళ్లకు చెప్పులు - కండ్లు తాగినోని తీర్గ ఎర్రగున్నయి...

ఏపచెట్టుకింద కూలిపోయిన మొండిగోడల్ల చెక్కబొమ్మలున్నయి. సెక్క బొమ్మల ముంగట కడుపీడ్సుకపోంగ పన్న కుక్క సెవులు రిక్కించి వచ్చినతన్ని సూసి గర్రుమని, మొరుగ సేతకాక కాళ్ల మీద తల బెట్టుకున్నది. ఆ మొండిగోడల పక్క సిన్న గుడిసే, గుడిసెల ఎర్రతేలు లాంటి మొటిమెల ముఖపు పడుసోడొకడు లుంగీ సెక్కి కట్టుకొని బండమీద కూకున్నడు. అతని ముంగట గాజు గ్లాసులున్నయి. గ్లాసుల పక్కన సారా క్యానున్నది - గుడిసె ముంగట తొర్రోడొకడు బబ్బెర గుడాల మీది ఈగలను విసురుతండు - గుడిసెల నలుగురైదుగురు కూర్చున్నారు. ఏపచెట్టు వెనుక బాగంల సిన్న గూన కప్పటిల్లు. అందట్ల పెండ్లాం మొగడు కొట్లాడుతండ్లు.

కర్రెవాడు అటిటు చూసి ఠీవిగా నడుస్తూ సారా గుడిసెకేసి వచ్చిండు...

''ఓరినీ లింగన్న అల్లునివా? శెంకరేగదూ నీపేరు'' కొమురయ్య మీసాలు తుడుసుకుంట సారా ఘాటుకు గొంతు మండంగన్నడు.

''ఔ నే మామ''  శంకరయ్య వరుస గలుపుతూ...

''మాలచ్చి మొగడు''  ఇంకో పెయికంగిలేనివాడు...

''దో సౌ...''  శంకరయ్య...

''జెర తామూలు - తామూలు... సౌ..సౌ ఏసుకో...'' అన్నాడు కొమురయ్య...

''మా బావది పెద్ద బుక్క...''  ఇందాకటి వాడు. ఎర్రటోడు సర్రున నల్లా తిప్పిండు... గ్లాసులో నురుగచ్చింది...నూరుగ్రాముల  సారా.

''దండె గొడుతన్నావుర పోడా...'' అన్నాడు శంకరయ్యగొంతులో పోసుకొని - గుటిక్కిన మింగి... ''ఇంకో సౌ... పైసలెన్నిరా?''

''రొండు రూపాలు...''

పిర్రమీది జేబుల నుంచి నల్ల పాకెటు తీసి పటపట లాడే రెండు రూపాయల నోటుతీసి గిరాటేసిండు...

''బావ కత జోరు మీదనే ఉన్నది... నాకో సౌ చెప్పు బావో...''  ఒకడు...

ఇంకో రూపాయితీసి పడేసిండు

''నేనేం పాపం జేసిన అల్లుడా! '' కొమురయ్య.

ఇంకో రెండురూపాలు తీసియిచ్చి శంకరయ్య బయటకొచ్చిండు. హోటల్ల కొచ్చి పొడుగు సిగరెట్టు తీసి ముట్టిచ్చిండు - అడుగేసి మళ్లేమనిపిచ్చిందో - ఇంకో దో సౌ దెమ్మని తన టోపిని విచిత్రంగా చూస్తున్న అంగిలేని పోరన్ని పంపిండు. ఆ దో సౌ తాగిండు - కొద్దిగా తూలుతున్నాడు... కండ్ల మీద మాపటెండ... ఏదో హిందీ పాట గొనగబోయిండు - రాలే.. టోపి నెత్తిమీద పెట్టుకున్నడు - మళ్ళా తీసి ఎనుకకు ఏలాడేసుకున్నడు - అది నడుత్తంటే సప్పుడుయితంది. తీసి సేతుల బట్టుకున్నడు... అట్లా నడుస్తూ వాగుల దిగిండు. వాగుల కొంత దూరం నడిచిండు... వాగొడ్డుకున్న మిరుపతోట్లనుంచి గమోగ్జిన్‌ వాసన గప్పున కొట్టింది...మోట బాయికాడెక్కన్నో పొట్టి కొమురయ్య కొండపొడుగురాగం తీసి ఏదో పాట పాడుతండు. వాగు ఆవలొడ్డుకు తొండం తెగిన కొట్టోదెలు మోట ఆగున్నది. మడుగుల బొమ్మేడి సెట్ల నీడకు సాపపిల్లలెగురుతన్నయి. నీల్ల సెలిమెల కాడికచ్చిండు - సాకలోల్లు ఆరిన బట్టలు కుప్ప జేసుకుంటండ్లు - మీసాలరాజం సెప్పులేసుకొని సారా దుకానంకెల్లి పోతూ ఎదురైండు...

''శంకరయ్య పటెలేనా? ఇప్పుడే రాకటా? పూజైపోయినట్టున్నది బాంచెన్‌...'' ముసిముసినవ్వుకుంటడిగిండు...  '' నీ యింట్ల పీన్గెల్ల బట్లన్ని గట్లనే ఉన్నయి... జెప్పన కాలబడు... పోరనికి కొయ్యగుచ్చి కాలొదుల కిచ్చింది దవఖాన్లకు దీస్కపోయి సూదేపిచ్చుక రమ్మంటే పైసలేడియే అన్నడు - గిప్పుడెమొ సారకురుకుతండు...'' భార్య ఆగమ్మ కోపంకొద్ది బట్ట జాడిచ్చింది...

ఆగమ్మ కోడలు సంటమ్మ రయికెలేకుంట నీళ్ల మడుగుల తానం జెత్తంది... శంకరయ్య అటుకేసి చూసి చూడనట్టు చూసిండు...

తొవ్వల బరిసిన బట్టలు ఎంతతొక్కద్దనుకున్నా తొక్కనే తొక్కిండు...

                ''ఏంది బాంచెన్‌ జెరంత సూసుకుంట నడువుండ్లి'' ఆగమ్మ

                ''సూసెటట్లున్నదా పనివరుస...'' మంచినీళ్లచెలిమె కాడ ముసలమ్మ  అన్నది...

                ఆడనిలుసున్న పడుసు పోరగండ్లు కిసకిసనవ్విండ్లు. పోసాని ముఖం మాడిపోయింది.

                బిందె తోముతన్న కోమట్లవరమ్మ ''పోసీ అల్లుడత్తండు - అల్లుడు అన్నది...

                ''అత్తేంభాగ్గెం...'' ఇందాకటి ముసులమ్మ...

                ''బిడ్డకు దిగేత్తలేడు - కాలేర్లపని - బిడ్డ కాలు కిందబెట్టకుంట కూకుంటలేదు. ఎయ్యిరూపాల జీతం...'' వరమ్మ. ''ఔ బాంచెన్‌... ఈనికే తవ్వెడ్ది సాలది - సీసగావాలె - మాంసంగావాలె - ఇత్తుకులేకుంట దింటడు - ఎనుకా ముంగటసూడకుంట '' ముసలవ్వ...

                '' ఔ గని దానికేమన్న'' వరమ్మ...

                ''ఏడ?...''

                ''బగుళ్ల సామి మందుబోత్తడట..గదా?''

                ''ఆనింట్ల పీనిగెళ్ల ఆనిపాటిదప్పింది...'' అన్నదిపోసాని...

                శంకరయ్య ఆడినుంచి తప్పుకోవాల్నని ముందటికి నడిచిండు... నీల్లచ్చినయ్‌ - పైంటు పైకి ఎత్తరాలేదు... సెప్పులు సేతుల బట్టుకొని ఆనీళ్లల్ల నుంచే నడిచిండు... ఒడ్డుకెక్కి నంక వాగుల తడిసిన లాగుకు దుమ్ము అంటింది...

                ఎనక సెలిమెకాడ ఆడోల్లు ఇంకా నవ్వుతూనే ఉన్నారు. ''లింగయ్య అల్లుడు శంకరయ్యచ్చిండన్న'' వార్త శంకరయ్య కన్నా ముందే ఊళ్లె తెలిసింది...

                శంకరయ్య అత్తగారింటికొచ్చేసరికి మామలింగయ్య బండికి జనుమేత్తండు. బామ్మర్ది మొండోడు కందెన గొట్టం బట్టుకొనున్నడు. కొండి జడల పిల్ల  బండి మిఠాయి లేవకుంట నొగలమీద కూసున్నది...

                ''బావచ్చిండు - బావచ్చిండు...'' పిల్ల బండిమీదినుంచి లేసింది - బండి నొగలు మీదికి లేసినయ్‌

                '' నీ బొందమురుగ కసేపుకూకోరాదే...'' అని అల్లున్ని చూసిండు లింగయ్య.

                ''గిదేనా రాకడ... లచ్చవ్వమంచిగున్నదా? '' అని అల్లున్నడిగి ''మొండీ బావకు గడంచ తెచ్చేయిపో'' అన్నాడు. మొండోడుకందెన గొట్టం బండి గుజ్జులకు తగిలేసి ఇంట్లనుంచి గడంచ తెచ్చేసిండు.

                పిల్ల శంకరయ్య చేతులల్ల ఊగులాడబడ్డది. ''రిబ్బెన్లు దెచ్చినవాబావా?'' అన్నదిపిల్ల...

                అప్పుడు యాదికొచ్చింది శంకరయ్యకు పిల్లలకేమన్న తేకపోతినే అనుకున్నాడు.

                ''ఈపారి తెత్త...మర్సిన''

                ''నువ్వెప్పుడుగంతే....'' పిల్ల గునిసింది.

                శంకరయ్యకు చివుక్కుమనిపించింది. గడంచలో కూర్చున్నాడు...లోపలినుండి పునుక్కుంట ముసల్ది లింగవ్వచ్చింది.

                ''బిడ్డా లచ్చవ్వ బాగున్నదా? మీ సడ్డకుడు కలుత్తడా? మల్లవ్వ బిడ్డ మంచిగున్నదా? '' అడిగింది...

                ''మొన్న జీతాలనాడు బజాట్ల కలిసిండ్లు మంచిగనే ఉన్నరు...నేను అధాతుగచ్చిన...''

                ''దేవుని గుళ్లె రాయివడ - లచ్చవ్వకు కడుపుబండక పాయె - దానితోటోల్లంత...'' ముసలమ్మ

                ఇంతలోకే పోసాని నీల్ల కడువెత్తుకొని వచ్చింది...ఆ తరువాత పోసాని  కాపు ఎంకటమ్మింటికి  అల్లుని కోసం బోయి తవ్వెడు బియ్యం చేబదులు తీసుకొని కొంగు సాటుకు బట్టుకచ్చింది. లింగయ్య కోమటి రాజీరింటికిపోయి బండెడు పెంటమ్మి నలుబై రూపాయలు తీసుకొని మాదిగిండ్లల్లకు బోయి పన్నెండు రూపాలు బెట్టి కోడి పుంజును తెచ్చిండు... అయిదురూపాలది కల్లు దెచ్చిండు...

                ఈ సంగతులేవి శంకరయ్యకు తెలియదు...

  2  

ఎన్నీల చింతమీదికెక్కింది... ఏసంగి పెరడికి నీళ్లు గట్టి అయ్య కొడుకులిద్దరు ఎడ్లు ముందునడువంగ ఇంటికేసి నడుస్తున్నారు...

                సాంబయ్యది సింతగింజ రంగు... దవడలు పీక్కుపోయినయి. దవడ పండ్లూసిపోయినయ్‌... అమ్మ చీకినట్టు ఎప్పుడు నోట్లె పొగాకుండాలె - అయినెపుట్టిన కాన్నుంచి అంగి మాటెరుగడు. నోట్ల్లె పొగాకున్న లేకున్న ఎప్పుడూ నములుతూనే ఉంటాడు...

                ''వారీ! శంకరిగాడు జాడపత్తలేకుంట బాయె'' అన్నడు దేకీసపార ఎడం భుజం మీది నుంచి కుడి భుజం మీదికి మార్సుకుంట...

                ''నాకేమెరుకనే - '' అన్నాడు కొడుకు మొగిలి. అతనికి ఒళ్ళంతా చీదర చీదరగున్నది. నెత్తిమీద ఎంటికలు పని తీరికలేక కత్తిరించక పెరిగినయ్‌... సెముటకంపు - మంచాలనుంచి లేత్తెనే పని - మల్ల పెరడికాడికి పండబోవాలె - పెండ్లాం రాయేశ్పరి గునుత్తంది - '' నేను ఊడ్సి సల్లనేనా'' అంటది. ఏనాత్రో గుట్టకింది నుంచి నడిసిరావాలె.

                అయ్య నిదుర లేత్తే తిట్లు...

                ''అదిగాదుర - అగ్గెన గాండ్ల అయిదునూర్లు  బోత్తిమి అతీలేదాయె గతీలేదాయె - కరువుల కక్కుడు పారుడైనట్టున్నదికద  '' ఈ మాట కొడుక్కుచెప్పిండు.

                ''నీ తల్లి జిరాయితు సేసుడు గట్టుకు కట్టెలు మోసినట్టుగున్నది. రైతును దేకినోడే లేడాయె - ఇత్తునం బెట్టిన కాన్నుంచి పీకులాటేనాయె - కడుపునిండ తిన్నదిలేదు - ంటినిండ పన్నది లేదు... కాకులగొట్టి గద్దలకేసిట్టున్నది పనివరుస... ఆనల కగ్గిదల్ల కొట్టేటప్పుడు కొట్టయాయె - అసలేట్ల బుసబుస నాలుగానలు గొడితె - నాటుకు సేతికర్సులే ఊసే - నోట్లె కచ్చినంక కుంటెండిపాయె - ఎకురం పొలం ఎండిపాయె. గీంత ఎకురం పెరడన్న సక్కగ జేసేకుందామంటే బాయిల నీళ్లెల్లి సావవాయె. కర్రకు బొక్కెడు    నీళ్లుబోసి పండుతే - మక్కలసీదె గాడ్ది కొడుకే లేక పాయె... అందట్ల కాని మీదెద్దు - ఇసపుపరుగు ముట్టిసచ్చె. ఉరిబెట్టుకునే కాలమచ్చింది... మా అయ్య పదెకురాలిత్తె నాకాలానికే సిప్ప సేతికచ్చేటట్టున్నది.. పుట్టి మునుగుతది గని ...'' ఇటా ్లగాసాంబయ్య వదురుతానే ఉన్నడు....

                ఈ మాటలు మొగిలయ్య వినివినీ ఉన్నయే - ఆ మాటలు ఇంకా ఎట్లా సాగుతాయో కూడా తెలుసు - ఆఖరుకు తనపెండ్లి చెల్లె పెండ్లస్తది గా మాటల్ల.

                ''దెహె, ఉండరాదే... ఊకనుకుంటె అత్తదా, సత్తదా?'' మొగిలి కసురుకున్నడు.

                సాంబయ్య మాట్లాడలేదు.

తండ్రి కొడుకులిద్దరు ఊరు సొచ్చిండ్లు... కోమటోల్ల పెరట్ల మల్లేశడు ఆర్సి కేక బెట్టిండు.. అంటే బువ్వకు పోతడన్నమాట - ఆరోల్ల కొట్టంల గొడ్లల్ల ఏదో గొడ్డు బొనుగూపుతోంది... ఆ రోల్ల పాటకులల్లో నుంచి తెల్లటి పడకలు గన్పిచ్చినయ్‌... ఆ మంచాలు చూసి మొగిలికి నిద్ర ముంచు కొచ్చింది... ఎన్నీల ఎలుగులో మంచమ్మీద కూకున్న వాణి ఎందుకో వక్కడ వక్కడ నవ్వుతంది. ''బతుకుంటే గట్లా ఉండాలె -'' ననుకున్నడు మొగిలి - చెప్పుల్లేని పాదానికి ముల్లు గుచ్చింది...

                ''అన్నన్న సత్తి... గొల్లలమ్డికొడుకులు మేకలకు తుమ్మమండ గొట్టినట్టున్నది...'' అనుకున్నాడు...

                ''పెద్దిగాని దగ్గెరికి బోయి సెప్పులు తెచ్చుకొమ్మంటె తెచ్చుకోవైతివి... సీకుడం ముల్లేనా?'' సాంబయ్య.

                ''అయ్యో సెప్పులా? ఇంకెన్ని పారీలు ముడిపియ్యాలె కొత్తయి కొనుమంటె ఎప్పుడు పీసుకమేనాయె''

                ''ఇగోరా నా తోలు గట్టిగున్నది - పెద్దిగాన్నిడిపిచ్చి సెప్పులు గుట్టుమను...'' అన్నాడు.

                కాలు ఎగేస్తూ ముంగటికి నడిచాడు. కోమటోని దొడ్డికాడి జంబిచెట్టు కింద ఏదో ఆకారం వీళ్లను చూసి నిలుచున్నది...

                ''తొవ్వల దప్ప ఏర్గవోను జాగ దొరకది గదా'' సాంబయ్య అటేటుబోయినంక అన్నడు...

                కోమట్ల కొట్టంముందు లాలయ్య కట్టె గదువ కింద బెట్టు కొని కాల్లమీద కూర్చున్నాడు. అతని ముందు దుమ్మలో పాలేరోల్లు కూర్చున్నారు. వడ్లాయినే ఊరపిచ్చుక పిటపిట లాడినట్టు... ''మారేనయ్యా ! నానుంచి గాదు... నలుగురున్నరు. ఏదో ఓటిసెయ్యిండ్లి...''అంటున్నాడు...

                ''నలుగురు పోరగండ్లు పుట్టినంక నాకునీకు బనావు గాదంటె ఏడ బోతది పెండ్లాం... గొంతికెలకచ్చెదనుక తాగ పైసలుంటయి - కూడేదని పెండ్లామంటె  రేషమత్తది... నలుగురికెర్కలేద అరమ్మ రంకులతనం'' దడిమీది నుంచి చేతులు చాపుతూ చెప్పుతోంది వడ్ల వరమ్మ...

                మూలమలుపు కాడి గుడిసెల మధునమ్మ ఎప్పుడో సచ్చిన సెట్టెత్తు కొడుకును తలుచుకొని తలుచుకొని ఏడుస్తోంది.

                ''బొడ్డి ఏడ్సేడ్సి సత్తది...దానిది కట్టప్పుటుకు...'' సాంబయ్య అనుకుంటనే ముందటికి నడిచిండు...

 

                చింతకింది గౌరయ్య సాదుకపు అల్లుడు రాయేశడు ''దీదీ'' అని కొట్లాడుతండ్లు... రాయేశడుతాగున్నడేమొ ఇంటిసుట్టు గడిగొయ్య పీక్కోని తిరుగుతండు.

                ''నాకెరికే ఆళ్లుతన్నుకుంటరని... పోశమ్మ సూపుతప్పింది - నేను మా అన్న కెప్పటి నుంచో సెప్పుతన్న ఇంటెనా...'' పిస్స బొందాలు ఆడికీడికి తిరుగుతండు.

                ''వారీ బొందిగ...'' తమ్మున్ని పిలిసిండు సాంబయ్య... బొంద్యాలు సాంబయ్య మాట పట్టించుకోనే లేదు...

                తండ్రి కొడుకు లిద్దరు ఇంకా ముందుకు నడిచే సరికి అంజనేయుని గద్దెమీద కిట్టయ్యగారు కూకుండి '' ఇయ్యేడు నక్కమీదొచ్చింది కాలం... శివశివ.. ఇంత ఘోరం నేనిన్నడూ చూడలేదు...'' అంటున్నాడు.

                ''అదిగాదు పంతులు మా అవ్వ చెప్పుతది... ఎనుకట కరువత్తె రేగడిమన్ను ముద్దలు పిసుక్క తిన్నరట...'' రామయ్య వెనకకు చేతులు కట్టుకొని తలపాగ అటుయిటూ ఊగంగ చెప్పిండు....

                ''ఏంరాసాంబడు... కనపడుటమే లేదు...'' అన్నాడు కిట్టయ్యగారు...

                ''ఏడిదుండి... సత్తా మంటె తీర్తలేదు...''

                ''రేపు సోమవారం - కాయిదం తిరుగబెట్టుకోకపోతివి'' అన్నాడు కిష్టయ్య...

                ''అట్లనే నుండ్లి...'' అనేసిండు సాంబయ్య...

                 మరికొంత దూరం నడిచేసరికి వెంకటనర్సు ఎదురొచ్చిండు...

                ''సాంబుమామ... కోపరేట్విలోన్‌ కిస్తుగట్టన్నట... సాగర్‌రావు దొర కలువుమన్నడు'' అన్నాడు...

                ''అట్లాగే లేరా?'' అన్నాడు సాంబయ్య...

                కుడిచేతుల దోవతి సింగు ఎగిరేసి ఎడం వేలుముక్కులో పెట్టుకొని ఎద్దును చూసిండు వెంకటనర్సు.

                ''మడి కట్టు మీది తెచ్చింది గిదేనాయె - ఎద్దుకగ్గిదల్గ సవ్వన గుంజింది... తూర్పెడ్లు మనకాడ ఆగయి. అవి కుష్కి దున్ని అడివిల బొంగు గడ్డి తిన్నయాయె...''

''అవురా! ఎనుకట మా అన్న తాడిసెర్లన ఎద్దును దెత్తె గట్లనే అయ్యింది. ఆడికి మా అన్న అననే అన్నడు - కానిసందాయె రెక్కిరిగినట్టాయె...''

                తండ్రి కొడుకులిద్దరు ముంగటికి నడిచారు...

                వాకిట్లోనే రాయేశ్వరి ఎదురైంది... ఎన్నీల ఎలుక్కు భార్యను చూసిండు మొగిలి. ఊతికిన కోక - తలకుబోసు కున్నదేమొ... మొగన్ని చూసి గిరుక్కున లోపటికి బోయింది...

                ఇంటి ముందు గడంచల శంకరయ్య కూకుండి పిలగాడు రమేశ్‌తోని బాతఖానీ కొడుతున్నాడు...

                ''నీకు నూరేండ్లాయిస్సురో?'' అన్నాడు సాంబయ్య...

                ''ఔ బాంచెన్‌ మొండిగాడు నూరేండ్లు బతుకుతడు గాదూ'' అన్నది నశం పీర్పుకుంటన్న ముసిల్ది...

                ''అయితేనేను మొండెగాన్నే అంటవ్‌ '' అన్నాడు శంకరయ్య.

                ''సాకల్దాన్నవ్వ'' అన్నది సాకలిగౌరు...

                ఆ మాటలో శంకరయ్య మాట వినపడనేలేదు...

                ''ఏందిరో తమ్మి ఎట్లెట్లనో అయినవ్‌ ఈకలు దీసిన తాంబుర్ర తీర...'' అన్నాడు శంకరయ్య.

                ''ఎప్పుడచ్చినవే?'' మొగిలి.

                ''పెండ్లామోమొ ఉనుక బంతి పువ్వుతీరుగైతంది మొగడేమొ ములక్కాయ తీర్గ అడ్లనే ఉంటండు'' ఇందాకటి ముసల్ది...

                ''దుడ్తు....'' పందిరిగుంజ సాటుకు ఒదిగినిలబడ్డ రాయేశ్వరి ముసల్దాన్ని మొగోళ్లకు విన్పించకుండాకసిరిండు.

                ''అగ్గిగావన్నా బిడ్డా!'' లోపటినుంచి భూదేవి తడు ముక్కుపోగు ఊగంగ బయటికొచ్చింది...

                సాంబయ్య ఎడ్ల కట్టేసి వాటి ముంగట ఇన్ని జాడు కర్రలేసి వచ్చి శంకరయ్య పక్కకు కూర్చున్నాడు... మొగిలి మరో పక్కకు కూర్చున్నాడు. భూదేవి తెచ్చిన నిప్పును అట్లాగే పెట్టి శంకరయ్య జేబులోనుంచి సిగరెట్టు డబ్బా తీసి సాంబయ్య కియ్యబోయాడు

                ''అద్దద్దు... మాకేంవాక గొడ్డటి పురాండం - రమేశ దిగుట్లె సుట్టుండాలె తేపో'' అన్నాడు.

శంకరయ్య సిగరెట్టు ముట్టిచ్చిండు. మొగిలి చిత్రంగా చూస్తున్నాడు.

                ఎన్నీల చింతల మీది నుంచి బయటికొచ్చింది. శంకరయ్య గొంతు కొద్దిగా తడబడుంతోంది.

                ''సిన్నాయిన బుధారంనాడు మొగిలికి ఇంటర్యూన్నది. బర్తీలున్నయి... ఇంటన్నవే? రెండువేల రూపాలు పట్టుకొని మొగిలిని తోలియ్యాలె - గందుకోసమే నాత్రి బజిలిజేసి ఉరికచ్చిన'' అన్నాడు.

                భర్తీ అనేటాల్లకు అందరి ముఖాలల్లో ఎన్నీలెలుగు - మల్లా రెండు వేలనేటాల్లకు సాంబయ్య మొఖం మాడిపోయింది.

                ''నెలకిందనే అయిదు నూర్లిత్తిమి గాదుర'' అన్నాడు నూతిలో నుంచి మాట్లాడినట్టు.

                ''అయిదునూర్ల - గయ్యేడికి సరిపోతయి. అసలు మూడువేలు నడుత్తంది - ఆడు నాకెరుకున్నోడయేపటికే రెండువేల అయిదు నూర్లకు ముక్కిరుసుకుంటనే  ఒప్పుకున్నడు. అదిగాక గియ్యంతెనే. తమ్ముడైతే పనిమీది కెక్కనీయ్‌ - నెలకు వెయ్యిరూపాలు - మీకట్టాలు కడతేరుతాయి'' శంకరయ్య.

                ''నిచ్ఛమేననుకో - కని ఈడ ఉరికచ్చిందిరా?''  సాంబయ్య.

                ''ఓ సిన్నాయిన ఎనక ముందాడకు - ఎనుకటిదినాలు గాదు... భూమిని నమ్ముకుంటె బతుకులేదు. ఇన్నావే - రైతును దెకెటోడెవ్వడులేడు... దున్నాలే.. దోకాలె ఇత్తునం బెట్టాలె. పసి గుడ్లోలె సాది సవరచ్చెన జెయ్యాలె - ఆఖరుకచ్చిందాంట్లనే బతుకాలె... ఇన్నావే...'' శంకరయ్య చెప్పుకపోతున్నాడు.

                సాంబయ్యకీ మాటలు మనుసుకు బట్టలేదు కాసేపు... లచ్ఛిమికి పిలగాన్ని సూడబోయిననప్పుడు - సర్పంచ్‌ ఎడ్ల కొట్టంల మాసిన గుడ్డపేగుగట్టుకొని, నల్లగ ఒంటినిండ దుమ్ము నిండి - ఎంటికలుపెంచి కడుపీడ్సుపకపోతూ కనిపించిన శంకరగాడనే పాలేరోనికి ఇప్పటి శంకరయ్యకు పోలికలు కడుతున్నాడు.

                భూదేవి వచ్చి కూర్చుండి - ''అయితే బిడ్డా మావోనికి నౌకరి దొరుకుతదంటవు... నీ బాంచెన్‌ బిడ్డా!  దేవుడు సాయకారమైనట్టు అయితన్నవ్‌... మావోనికి జెప్పన దొరికిందంటె ఎములాడ రాయన్నకు కోల్లాగెను కట్టేసి లింగం మీద రూపాయిబెడ్త...'' అని మొక్కింది...

                రాజేశ్వరికి యమ సంతోషంగా ఉన్నది...మొగనికి కొలువు దొరుకుతే ఈ సాకిరి తప్పుతది - తన పెద్దవ్వ బిడ్డ తీర రంగుసీరెలు కట్టచ్చు...అవేందో సినిమాలు చూడచ్చు - ఇంతకన్నా రాజేశ్వరి ఆలోచనలు ముందుకు సాగలేదు...

మొగిలయ్య కైతే గుర్రానెక్కినంత సంతోషంగా ఉన్నది. శంకరయ్య ఆమాట ఈ మాటామాట్లాడి, బుదారం పైసలు బట్టుకొని పస్టు బస్సుకు రమ్మని చెప్పిపోయిండు .

                మొగిలి ఆదరబాదరగా మొఖం కడుక్కొని జొన్న గడుకతిని పెరట్లకు పండబోయిండు... పుచ్చపువ్వు లాంటి వెన్నెల పైరగాలి బొయ్యిమంటూ...మంచెలో చాలా సేపుకూర్చుండి తలాతోక లేని ఆలోచనలు చేశాడు - రాళ్లగెర్రె మీద తీతువపిట్ట ''కిక్కిరీకీ ీకిక్కిరీకీ''అంటూ ఉలికులికి పడి గూసింది.

                మక్కపెరట్ల సప్పుడచ్చింది...''నీ తల్లి నక్కచ్చినట్టున్నదని మంచెదిగి సప్పుడచ్చిన దిక్కు నడిసిండు - ఏమిలేదు - దట్టమీద కూర్చున్నాడు - ఎక్కడా మనుషుల అలికిడిలేదు. తన మనుసులో పోటెత్తే ఆలోచనలు ఎవరికన్నా చెప్పుకుంటె బాగుండు.. రాజేశ్వరి కనిపించింది. గాలికి వెంట్రుకలెగురుతున్నాయి. మొగిలి అధాతుగా లేచి ఇంటితొవ్వబట్టిండు. చెప్పుల్లేని కాళ్లకు రాళ్లు రప్పలు తాకినా ధ్యాసేలేదు...

                ఇంటి ముందటికి వచ్చేసరికి సాంబయ్య అదే గడంచలో తలపట్టుకొని కూర్చున్నాడు... వంగిపోయిన వెన్నీల వెలుగు సాంబయ్య ముఖం మీద ప్రతిఫలిస్తోంది.. సాంబయ్య కండ్లల్లో నీళ్లు... అదెన్నేండ్ల దుక్కమో? తాతలు తండ్రుల కాన్నుంచి భూమిని నమ్ముకొని బతికిన కుటుంబం. చరిత్రలో నమ్ముకున్న భూమిని కాదని తన కొడుకు తరం బయటికి పోతోంది... మళ్ళా తనరెక్కలకట్టం తనకే...

                మొగిలికి తండ్రి దు:ఖం అర్థంకాలేదు...

                కొడుకును చూసి సాంబయ్య కండ్లు తుడుచుకున్నాడు.

                ''మొగిలి ఇగరారా... ఇట్లాకూకో -'' అన్నాడు...

                మొగిలి తండ్రి పక్క గడంచలో కూకున్నాడు.

                జీరబోయిన గొంతుతో...'' నాయినా ! మా నాయిన గుర్తున్నాడురా? ఎట్ల గురుతుంటడు. నేను ఆరేండ్లపోరనప్పుడు కాలం జేసిండు. అంతెత్తు మనిషి - అయినె ఎప్పుడు ఇల్లు మొఖం సూసెరుగడు. ఒక్క పూటన్నా సరింగ తినెరుగడు. పొద్దున పండ్ల పుల్లేత్తేె మాపటికే కడిగెటోడు.. అప్పుడు గీ మోటర్లు, రైల్లు లేకుండె - పేటకు వరంగల్‌కు బండిల సామానేసుకపోతే ఆరందినాలు బోయెటోళ్ల  - ఎంత కిరాయని అయిదురూపాలు... తను తిన్నడు తినలేదు - సావంగ మాకు భూమిచ్చి పోయిండు - మీ పెద నాయిన ఏది మా  అన్న మమ్ముల బొచ్చెకు గట్టుకొని సాదుకచ్చిండు. నన్ను బామని ఎంకటరాజయ్యకు పాలేరుంచుతనని అవ్వంటె - మా నాయిన్నుండంగ మమ్ముల పాలేరుంచలే దని సతి పోరాడిండు... ఓరి కొడుకా మన మక్క పెరడేసిన రేగడి పన్నెండెకరాలు ఉపాస ముప్పిడుండి కొన్నం...'' ఇట్లా చెప్పి చెప్పి  ''సరె ఇకబో...'' అని గడంచలో పన్నాడు...

                మొగిలికి సిగ్గనిపించింది.. తండ్రి పడుకున్నాడని నిర్దారణ అయ్యేదాక కూర్చున్నాడు. ఆ తరువాత తలుపు తట్టిండు - తలుపు తీసింది రాయేశ్వరే...

                సాంబయ్యకు నిదుర బట్టలేదు... ఈ ఆలోచనలన్నీ అన్నకు చెప్పాలనే ఉన్నది... కని మూడేండ్లనుంచి అన్నకు తనకు మాటలు లేవు. కొడారిల చొప్పకట్టలెత్తుక పోయిండ్లని అదినె తిట్టింది. ఆడోల్లు ధీంటె ధీ అన్నరు. అట్లా మాటలు బందయినాయి. ''ఎంత కొట్లాడిన ఆడు మా అన్న గాదా!'' అనుకున్నాడు. లేచి కూర్చున్నాడు. వాకిట్లోకొచ్చిండు. తన అన్న ఇంటి ముంగటి దాకా నడిచిండు... తలుపులు మూసున్నాయి... కాసేపు తటపటాయించి తలుపుల దగ్గరే కూర్చున్నాడు... ఆఖరుకు ధెర్యంచేసి తలుపు గొట్టిండు...

                ''ఎవలదీ? '' లోపలినుంచి మల్లయ్య.

                ''నేనే అన్నా'' సాంబయ్య

                ''నేనే అంటే?''

                ''సాంబయ్యను''

                మల్లయ్య తలుపు తీసిండు - ఎదురుగ తమ్ముడు ''గింత నాత్రి దనుక ఏంజేత్తన్నవ్‌రా? '' అనిలోపటికి నడిచిండు. అన్న వెనుకనే సాంబయ్య లోపటికొచ్చిండు.

                నిజానికి మల్లయ్య నిద్రపోలేదు. సదువుకునే సిన్నకొడుకు  నాగయ్య  రంధితోటి మనిషి సగమయ్యిండు. డిగ్రీ సదువు మధ్యలో ఒదిలి పెట్టి ఆరు నెల్లు జాడా పత్తాలేదు. కాలుకు బట్టకట్టుకుంట తిర్గిండు. ఆఖరుకు రామడుగు ఠానాల ఉన్నడని కబురు దెల్సింది. అడుక్కుంటపోతే - పోలీసోల్లు సూడనియ్యలేదు. ఆన్నుంచి - మరో దిక్కు. తొమ్మిదిమంది - వాళ్ల తండ్రులతోటి తను  ఠానాల సుట్టు తిర్గుతనే ఉన్నడు.

                ''ఏందిర సాంబయ్య?''

                ''ఏంలేదన్న - మా మొగిలిగానికి బాయిపని  దొరుకుతదట''

''మంచిదే గాదుర...''

                ''అదిగాదే లింగులు అల్లుడు శంకరి జెప్పిండు''

                ''ఎంతవరకు బెడ్తండ్లు?''

                ''అయిదునూర్లిచ్చిన - ఇంక రొండువేలు గావాలె అంటండు.''

                ''దొరుకుతే మంచిదేగని - ఆని ఖ్యాల్లి మంచిగ లేదు జేగర్త...''

                మాటలయి పోయినయ్‌... మల్లయ్య తలపట్టుక కూర్చున్నాడు...

                ''నాకు నాయిన్న కలల గన పడ్డడే...''

                ''ఏమన్నడురా?''

                ''భూమి నిడిసిపోతండ్లారా అన్నడు''

                ''కాలంరా... ఏ ఎండ కాగొడుగు బట్టాలెగదరా? ఒకప్పుడు మనూరు కలకల లాడేది... కనిఇయ్యల్ల ఊళ్లె దిర్గన్నంటే దప్పులుగొడ్తయి. ఎల్లిపోయి నూరు తీర్గయిపోయింది - మనూళ్లె నుంచి ఎంతమరది బోయిండ్లు. పడుసోల్లంత ఏడ కములం దొరుకుతె ఆడికిబోతండ్లు. అద్దంటవా? అద్దంటె కడుపు నిండే దారేది? ఊళ్లె ఉన్నోన్ని పీక్కతినేటందుకు ఊళ్లె పెద్దమనుషులున్నరు...  మనమేనత్త కొడుకులలిద్దరియే ఊరిడిసిపోయిన బతుకలై పోయినయ్‌. తొందురు గట్టు మల్లి ఎర్రలింగనికి జెట్టమ్మ తీర్గ దల్గింది. ఇంట్ల యింట్లనే మాయం - మన కండ్ల ముంగట ఆని కడుపు ఈడుండుగ ఎప్పుడన్న నిండిందా? సరె సరె... గయ్యన్నెందుకు గని... రూపాలేడ జూసినవ్‌...''

                ''బామనోనికి ఎద్దు బాపతియి ఎనిమిది నూర్లియ్యాలె - అడ్డీ ఎంతయ్యిందో? మల్ల ఆన్నే అడుగుత''

                ''అడు ఏదన్న  కుదువ పెట్టుకోందిత్తడా?''

                ''పెరడి రయిను బెడ్త...'' గొంతు వనికింది...

                మల్లయ్య గుండు దెబ్బతాకిన వానిలాగా కాసేపు మాట్లాడలేదు... చివరకు దీర్ఘంగా నిట్టూర్చ...

                ''భగవంతుడేం సంకల్పంలున్నడో... కానియ్యిరా....'' అన్నాడు...

నిజానికి సాంబయ్య అన్నతో ఇంకా మనుసువిప్పి చాలా మాట్లాడాలను కున్నాడు. మనుసులో మెదిలే సంగతులు బయటికి రాలే. '' సరెనే నేబోయత్త...'' అని లేచి బయటకొచ్చిండు...

                గడంచంలో వెల్లకిలా పండుకున్నాడు. కండ్లు మూతలు పడ్డాయి. కలలు - కలలో తండ్రి....

 

  3  

                అంబటేల్లయ్యింది... ఆడోల్లు వాక్కు మంచినీల్లకోసం పోతున్నారు... సఫాయి సాయిలు పొలికట్టందుకొని దమ్మురేగంగ వాడలు ఊడుత్తండు... అడ్లధాతికాడ రాజయ్య నాలెకు మొఖమేసుకొని మోట బొక్కెనకు పెండెలు బెడ్తండు... రాజయ్య అల్లుడు రాసోడి పెయికంగి లేకుండ దడికాడ పుల్ల లిరుత్తండు...

                మోట బొక్కెన కాడకూసున్న రాయలింగు ఓటుగాలు సాపి ''అడ్లపుటుకు బుట్టినవా? మాదిగి పుటుకురా? '' అని రాసోడిని తిట్టి - అటునుంచి సాంబయ్య రావడం చూసిండు.

                ''సాంబయ్య నీ కొడుక్కు బాయి పనచ్చిందట నిచ్ఛమేనా?'' అన్నడు.

                ''ఏది గుర్రం కడుపుల గుడ్డు'' అన్నాడు సాంబయ్య

                '' మారే... అయితది. ఏగిర్తపడ్తె అయితాది.'' అన్నాడు.

                ''నీకేందే... ముగ్గురు కొడుకులు జెమ్మకదరి అమాలి పనిజేసుకుంట కోరుట్లనున్నరు'' వడ్ల రాజయ్య..

                ''కొడుకులా ఆళ్ల జోలితియ్యకు'' రాయలింగు...

                ''ఆ సంపాయిత్తలేరా?''

                ''మా సంపాయిత్తండ్లు ఎంటికలు... ముగురు ఎడ్ల కెడ్లు కొడుకుల బెట్టుకొని నాతిప్పలైతే తప్పలేదు. ఒక్కన్ని సత్తన్న.. పెద్దలమ్డి కొడుకంటడు - భూమమ్ముకోని ఆనిదగ్గరికి బోవన్నట.. ఆనికేమెరుక భూమి సంగతి?''

                ''ఏం జేత్తరే ఈడుండంగ సేతకగ్గిదల్గ కడుపుకే సాలక పాయె - లచ్చిరాజం పాపం కోమట్ల సేతల సచ్చిండు.''సాంబయ్య...

''ఆడగంతేరా? నీ కొడుకు బోతండేమొ గనపడదా? ఉప్పుతోని టోకటొంబయి కొనుక్కోవాలె... నూటికి సెలుగమనకట్టం మనమీన్నే ఏత్తండ్లు - మొగోడు బుడితె అయ్యకాసర - ఆడిది బుడెతె తల్లి కాసర అన్నరు.. నీతల్లీ కొడుకులు బుట్టి భూమినమ్ము మంటండ్లు ఆన్నే సింగ సానమెసుకొని ఎంతకాలముంటరు?'' రాయలింగు.

 

                ''నా గొంత పనున్నది...'' సాంబయ్య అక్కడి నుంచి కదిలిండు..

                ''మనిషి అంగిపేండు'' రాయలింగం. బిచ్చెగాళ్ల లింగం బజాట్ల బర్రెను పండబెట్టి కొనుపులు ఎర్రగ గాల్చి  ఎడమ తొంటిమీద కాలుత్తండు - బర్రెనాలికెల్ల బెట్టి పీండ్రీలుతంది... కోమటాయినె సింగులు మీదికెత్తి పట్టుకొని బర్రె సుట్టు దిరుగతండు... తనను ఆన్నే ఉండు మంటరేమొనని తప్పిచ్చుకొని ముంగటికి నడిచిండు. మూడు పానాదుల కాడ పోరగండ్లు ఏదో ఆటాడుతండ్లు..

                మాదిగి పెద్దులు పాత పేగుల వడ్లోజొడ్లో మూట గట్టుకొని భుజం మీదేసుకొని పోతండు..

                ''సాంబయ్య పటేలా! మోట బొక్కన సెవ్వబేయిందని మొగిలయ్య పటేల్‌ గిప్పుడే అచ్చిపేండు. గీ ఇత్తులు ఇంట్ల బానపోసి మోట కాడికి పోత పటేలా? అవుగని పటేలా బాయి పని దొరికిందట నిచ్చమేనా?''

                ''నిచ్చమేగనీ జెర జెలిబో - ఇప్పటికే తూర్పు బాజు పెరడెండిపోయింది. సూడు... మా కోడలు పిల్ల ఎండకోర్సది - బాయిల నీల్లొడిసేదను మోట కొట్టుమను - మాపటించి నేనే పోత..''

                అనుకుంటనే ముంగటికి నడిచిండు... పలుకలు పట్టుకొని సీమిడిముక్కు పోరగండ్లు బల్లెకు పోతండ్లు. అందట్ల తనకొడుకు రమేశడున్నడు.

                ''నాయిన్న బలుపం లేదు - పదిపైసలియ్యే కొనుక్కుంట '' పిలగాడు తండ్రిని చూసి గునిసిండు.

                ''ముల్లె గట్టుకచ్చిన్నారా? పో - ఉద్దెర తీసుక పో - లాపోతే అవ్వను జొన్నలు బెట్టుమని కొనుక్కపో'' అన్నాడు.

                ''నాకుటయిమైతందిపో - సారుగొడుతడు''

                ''గంగలపడు...''

                సాంబయ్య కొడుకును తప్పించుకున్నాడు. కిట్టయ్య గారి ఇల్లచ్చింది. పెద్దరువాజ రేకు తలుపులు తెరిచున్నాయి. లోపట అరెకురం ఆకిట్ల - తూర్పు పక్క ముసలితులిసె చెట్టు - కిట్టయ్య పంతులు పెండ్లాం సుగుణమ్మ ఎంటెకలిరబోసుకొని తులిశమ్మ చెట్టు సుట్టు తిరుగుతంది... నెత్తిల ఎర్ర పువ్వొకటున్నది. మనిషి ఎర్రగ పొట్టిగా ఉంటుంది...

                ఆకిట్ల కచ్చినిలుసున్నడు... కిట్టయ్య బంకుళ్ల తట్టుకుర్చీలో కూర్చుండి బెల్లపురంగు కాయిదాలు ముంగటేసుకొని సదురుతండు...

                అరుక్కింద సుంకరి నర్సిమ్ములు బర్సెకట్టె బట్టుకొని నిలుసున్నడు.

                సాంబయ్య ముంగటికి నడిచిండు....

                ''దండాలు పంతులూ....'' సాంబయ్య...

                ''ఊ...దండం...దండం...'' అనుకుంటనే కాయిదాలు సదిరిండు.

                సుగుణమ్మ ఇంట్లకు బోయింది...

                ''దూరం దూరమే..రామి... మడి...మైలబడిపోతే మళ్లీ నీళ్లు బోసుకొని చావలేను'' లోపలినుంచి.

                ''ఏమే... వంటయ్యిందా? నేను కచ్చీరుకు బోవాలె'' పంతులు ఇంట్లకు కేకేసిండు...

                ''ఎక్కడా?... ఔతుంది...'' ఇంట్లనుంచి...      

                ''నర్సిమ్మ... నువ్వురుకు... పల్లెమీని ఎంబడోల్ల రాయడు. ఎవడు ఆ పొడుగుటోడు - వాన్ని కచ్చీరుకు రమ్మను... నువ్వు తినిరా... జెప్పన రావాలే..''

                నర్సిమ్ములు వెళ్లి పోయాడు...

                ''సాంబయ్య ఇయ్యల్ల తీరదు.. రేపు... రేపు వర్జం...లెక్కపక్క అయిరాదు..సరె... నీకాయిదమే కదా!..'' అన్నాడు మళ్లీ కాయిదాల్లో చూస్తూ...

                ''అదిగాదుండ్లి... మావోనికి బాయిపని...''

                ''మంచిదే... మంచిదే... నీకేందిరో నక్కను తొక్కినవ్‌...''

                ''రెండువేలు గావన్నట...''

                ''మంచిదే పెట్టక పోయినవా?''

''తమరికెరుకలేందేమున్నది...''

                ''సూర్యారావు దొర వారినడుగక పోయినవా? మావోడు సత్య నారాయణకు నిన్ననే మున్నూరు బంపిన మా పెద్దది లేదు కామేశ్వరి... దానికి ఇల్లు గొనుక్కుంట నంటే నెల కింద అయిదువేలిచ్చిన... సరే లాలయ్య నడగక పోయినవా? సర్పంచ్‌ వీరయ్య దగ్గర కొట్టటం అమ్మిన బాపతు పైసలుండే...''

                ''మానాయిన్న కాన్నుంచి తమరిదగ్గర్నే...'' సాంబయ్య గునిసిండు...

                ''లేవ్వురా? లేవంటే ఇనవ్‌...'' అన్నాడు ఖచ్చితంగా

                ''తమరు కాదంటెట్ల?''

                కిట్టయ్య పంతులు బీడిముట్టిచ్చి ''ఏమేయ్‌... సుగుణాబాయి ఇలారా! సాంబయ్యచ్చిండు.'' అనికేకేసిండు.

                ''వస్సున్నా వస్సునా! పని తెములనియ్యరు. వంటయ్యిందంటారు...మళ్లీ మర్సిపోసానోయేమొ? విస్సుకు ఉత్తరం రాసిండ్లా..'' మడిగుడ్డతోనే బయట కొచ్చింది...

                ''సాంబయ్య కొడుక్కు బొగ్గుబాయిల పనిదొరికిందట...''

                ''శుభం... సాంబడు. నీకోడలు కన్పిస్సలేదు... అప్పటికొచ్చి ఉప్పుడు బిండిబెడ్త తీసుక పొమ్మను... రాము బాసండ్లు తోమే...'' బయటికి ఇంట్లకు ఒకేమాట

                ''వాడంటడు...  రెండువేలు గావాలట''

                ''నాదగ్గెరెక్కడున్నయి? నీకళ్లు మంచియే... డబ్బుసూస్సే...''

                ''అదే మొన్న నీ బాపతు కోళ్లాగెలనమ్మి తిమిగదా?'' పాపం గీ మాలుతండు... ఏదన్న రాపిచ్చుకో...''

                ''మారే నయ్యా నాదగ్గరలేవు'' లోపలికి పోబోయింది...

                ''పెరడిరైను బెట్టురా?'' అన్నాడు...

                ''నాదగ్గర లేవంటే వినరు'' లోపలికి వెళ్లిపోయింది. ఆమె వెంటనే కిట్టయ్యలోపలికి వెళ్లి అర్దగంటకు తిరుగొచ్చి

                ''అయిదు రూపాల వడ్డి సొప్పున తీసుకోమంటంది...పెరడిరైను బెట్టుకుంటదట''

''నేనేమిదినాలె పంతులూ?''

                ''సావొచ్చిందే?''

                ''ఎంతుండ్లి ఏడాదిగడువు - ఏడాదికియ్యకపోతే అట్లనే కానియ్యిండ్లీ'' సాంబయ్య.

                ''సరె పెరడిరాసియ్యి - ఏడాదికియ్యక పోతే ఇచ్చేదనుక దున్నుకునుడు - ఏడాదికి వడ్డీ అసలు గలుపుడు.. రూపాలకు వడ్డిలేదు - పెరడికి మునాఫలేదు.. నేను జెప్పన్నే కచ్చీరుకు బోయత్త - బువ్వదినిరాపో...'' అన్నాడు

                సాంబయ్య నిట్టూరుస్తూ పోబోయాడు...

                ''ఔరా! మీ అన్న కొడుకు సంగతేమన్న తెల్సిందా? వాడు రంకుల పోరడు...సరెగని  లాలయ్యను తీసుకొచ్చుకో...'' అన్నాడు...

                సాంబయ్య బయట కొచ్చాడు... అప్పటికే బువ్వలుదినే యేల్లయ్యింది..

  4  

                అరుగుమీద స్తంభానుకానుకొని సాంబయ్య బెల్లం గొట్టిన రాయితీరుగా కూర్చున్నాడు.

                లాలయ్య కాయిదం రాసిండు... వినిపిచ్చిండు... అంతా విన్నడు...

                ''ఇగో సాంబయ్య కాయిదం నాకిచ్చిపో -  పైసలు దీస్కపో'' అన్నాడు కిట్టయ్య రెండుసార్లు లెక్కబెట్టి రెండువేలిచ్చిండు.

                బజాట్లకొచ్చి నిలుచున్నాడు... కుక్కలు కుయ్యికుయ్యి మంటున్నాయి. తొవ్వల ఎవరు మందలిచ్చినా సాంబయ్య పలుకనే లేదు... ఇల్లు చేరుకొని పంచెమీద కప్పుకొని మునగదీసుకొని పడుకున్నాడు..రాత్రయ్యింది.. అందరు తినిపోయిండ్లు...

                ''ఏంది మునిమాపు ముసుగు బెట్టుకొని పన్నవ్‌'' భూదేవి పంచె తొలిగించింది.

                సాంబయ్య కళ్లల్లోనీళ్లు... భూదేవి మనుసు కలికలైపోయింది...

                ''అదులుతారులే...లే..'' అన్నది భూదేవి...

                ''నీ కెరికలేదే?'' అన్నాడు సాంబయ్య...

''ఎదిగిన కొడుకు కాలేర్ల మీదికి బోతె సేతెట్లని గాదు నీ పీకులాట - మన కట్టం మనకుండనే ఉన్నది...''అన్నది.

                సాంబయ్య ఇంకా పొడిగించలేదు. ఏదో తిన్నాడనిపించి మళ్లీ పడుకున్నాడు - తన చిన్నతనం యవ్వనం పంటలు కరువులు, కాటకాలు, వర్షాలు అన్న ఒక్కక్కటే గుర్తొస్తున్నాయి... ఆ రాత్రంతా సాంబయ్య నిదుర పోనేలేదు...

   5  

 

                మొగిలి ఏదో కూని రాగం తీసుకుంట తొండం తాడిగ్గి మోట పోనిచ్చిండు - కందెనలేక గిరుక కిర్రుకిర్రు మని రాగం తీత్తంది. అంబటేల్లయిపోయింది. బాయిల నీళ్లొడిసిపోయినయ్‌ ''ఇగో మోటిడుత్తన్న - గ కాలువకేసి పార పెరట్లదాసి రా '' పెరట్లకు కేకేసిండు....

                రాజేశ్వరి సప్పుడు చెయ్యలేదు. మొగిలి మోటవిడిచి ఎడ్ల మూతులకు బుట్లు గట్టిండు... ఇంతలోకే రాయేశ్వరొచ్చి బొదట్ల నీళ్లల్ల కాల్లు చేతులు కడుక్కుంటున్నది. వెనుక నుంచి మొగిలి రాయేశ్వరిని పట్టుకున్నాడు.

                ''ఇడువ్‌...ఇడువ్‌... ఎవలన్న సూత్తే'' రాయేశ్వరి

                ''నేను మొగన్ని గాదా? నువ్వు పెండ్లానివిగాదా?''

                ''మోటుసరసం...'' దూరంగా జరిగింది...తను జరిగాడు...''సూడు...సూడు'' రాయేశ్వరి వెక్కిరింతగా నవ్వింది.

                మొగిలి బిత్తరపోయి చూసిండు...

                ''బాయిపనికి గిట్లనే పోతవా - సెవుల మీదికి సౌరం బెరిగింది - పెంటరదీయించుకో - జుట్టు సూడు - గది సూత్తే అడివిలనుంచి తప్పచ్చిండంటరు - జుట్టు కత్తెరేపిచ్చుకో...

                ''జుట్టా - మా అవ్వ సీపురుకట్టమర్రేత్తది ఎరికేనా?''

                ''అట్లనే ఉంచుకో - పోయేటప్పుడు సెప్పు నూనె బెట్టి నున్నగ దువ్వి కొసకు బంతిపువ్వు గడుత'' అన్నది ఇంకా నవ్వుతూనే...

''ఏయి ఏమనుకుంటన్నవో...'' రాయేశ్వరి మీది కురికుండు..

                రాయేశ్వరి అందకుండా గెట్టు మీది నుండి పరుగెత్తింది... మొగిలి వెంటపడ్డాడు...

                ''అగో అటు చూడు '' అన్నది...

                మొగిలి ఆగి చూసిండు ఎడ్లు పెరట్లో తడితొక్కుడు తొక్కుతున్నాయి.

                రాయేశ్వరి ఎగపోస్తూ కూలబడిపోయింది. మొగిలి ఎడ్లను కొట్టుకొచ్చాడు.

                ఇద్దరు ఇంటితొవ్వ బట్టారు.

                ''ఔగని నన్నెప్పుడు తీస్కపోతవ్‌...?''

                '' ఆలు లేదు సూలులేదు కొడుకు పేరు సోమలింగం '' అన్నాడు మొగిలి...

                రాయేశ్వరికి బుగ్గలు ఎరుపెక్కినయ్‌... తనకు నెలతప్పిన సంగతి మరిచేపోయింది...

                ''ఔ...'' అన్నది...

                ''ఏందే...?'' మొగిలి...

                ''ఏమి లేదేమిలేదు...'' రాయేశ్వరి మాటమార్చింది...

                ''ఇగో నన్ను జెప్పన తీసుకపో... నాకు నువ్వులేకుంటె ఎట్లనో ఉంటది...'' రాయేశ్వరి...

                ఇద్దరు నడుస్తున్నారు... మొగిలి కొంత దూరం నడిచి మళ్లీ ఆగి ''అయితె జుట్టు కత్తెరేపిచ్చుకోమంటవ్‌?''

                ''ఔమల్ల...''

                ''మా నాయిన బడికే పంపకపాయె. సదువుకుంటే గియ్యన్ని తెలిసేది. నువ్వు మూడో తరగతి చదివినవన్నరు''

                ''ఔ. సదివిన పిల్లకు మనతగ్గ పిలగాడు దొరకడని మాన్పిచ్చిండ్లు''

                నెత్తి గోక్కున్నడు... ఆదారంట మాదిగోళ్లు తంగెడు కట్టెత్తుకొని వచ్చారు...

                ''ఏమవ్వో రాయేశ్వరవ్వ... ఎప్పుడు నీల్లుపోసుకుంటవవ్వో.'' బాన పోసు అడిగింది...

                ''పోయే..'' అన్నది...

                '' అవ్వ ఇదేం సోద్దెమవ్వ... నువ్వసలు బిడ్ల గనవా?'' అన్నది పొట్టి బాను...

                వాళ్లు వెళ్లిపోయారు... మొగనికి చెప్పాలనుకున్నది...

                ఊరచ్చింది. ఇద్దరు ఏమెరు

                ఇల్లచ్చింది... ఇంటి ముంగట రమేశ్‌ పుస్తకాలు పట్టుకొని ఎదురయ్యిండు...

                ''నువ్వు అయ్య వైతన్నవ్‌'' అనేసింది తలవంచుకొని లోపలికి పోయింది రాయేశ్వరి...

                మొగలి నిలబడిపోయిండు. చప్పున అర్థం గాలేదు. అర్థమై ముసిముసి నవ్వుకుంట ఎడ్ల కట్టేసిండు...

                ''ఇగో అఅవ్వా నేను మంగలోనికాడికి పోతన్న సౌరం తీయించుకుంట నీళ్లు కాగబెట్టు '' అనికేకేసిండు...

                ''మంగళారంరా?'' అన్నది భూదేవి

                ''సోమారం సొతుకు, మంగళారం మటుకు... అన్నీ అంకలే నేనుబోతన్న...'' అని బజాట్లకొచ్చిండు మంగళాయన సర్పంచ్‌ వీరయ్యకు గడ్డం గీకిరాను బోయిండు. మొగిలి పోయిన గంటకొచ్చిండు.. మిగతా ముగ్గురికి చేసినంక మొగిలికి చేసిండు...

                మంగలాయనికి కటింగ్‌ చెయ్యరాదు.. పేండ్లుకొరికి నట్టు దాట్లు దాట్లు చేసిండు - కత్తిరిచ్చిన జుట్టు చూసి మొగిలికి బాధ కలిగింది...

                వాకిట్లకే భూదేవి ఎదురచ్చింది..

                ''అయ్యయ్యో తురుకోనివా? దూదేకులోనివా జుట్టేదిరా?'' నోరునొక్కుకున్నది...

                ''తియ్యి తియ్యే - జుట్టు బెట్టుకొని కాలేరు మీనికెట్ల బోవాలె?'' అన్నడు.

                ''అదెరా కాలేరుకు జుట్టేం అడ్డమురా?''

                ''నీకెరుక లేదు లేయే''

మొగన్ని చూసి రాయేశ్వరికి నవ్వాగింది కాదు.... అత్త కోప్పడుతుందని నవ్వాపుకున్నది...

  6  

                తెల్లారితె బుదవారం... మొగిలి పెరట్లకు పండబోనే లేదు... సాంబయ్యే పండబోయిండు. ఆ రాత్రంతా సాంబయ్య నిదుర పోనేలేదు... అర్థ రాత్రి దాటినంక ఇంటికచ్చి అందరిని ఆదర బాదరగ లేపిండు...

                ''ఏమే లే..లే. ఎసరుబెట్టు - ఆడ అవ్వోడ అయ్యోడ.. కాసిన్ని బియ్యం బెట్టు... తిని పోతడు బస్సచ్చే యాల్లయ్యింది - మొగిలి లేరా.... మొఖం కడుక్కో...'' లేపిండు. భూదేవి లేచి బయటకొచ్చి సుక్కలు చూసి'' ఇంకా తెల్లారే సుక్క పొడువనే లేదు బస్సుగిప్పుడే వత్తదా?'' అన్నది ఆవులిస్తూ...

                ''మొగిలీ.... చెప్పద్దే అనుకున్న..కని చెప్పకపోతే ఎల్లేటట్టులేదు. కాలేరంటే కండ్లు మెరిసే దినుసుంటయి. ఇగో నన్ను మతికి బెట్టుకో... మనం కాలేరును నమ్ముకునేటోల్లంగాదు - భూమిని నమ్ముకునేటోల్లం - అయిదారేండ్లు జెర పెయిల భయంబెట్టుకొని సెయ్యి. అప్పు సప్పులు దేరనంక ఇంకో ఎకరం పొలం తీసుకుందాం! ఇన్నవా? నీ కొలువు కోసం పెరడి రయిను బెట్టి రెండు వేలు అప్పు దెచ్చిన - గది మతికుంచుకో.. అందరి తీరు కొత్తలు సేతులకు రాంగనే సింగన మద్దీలాడకు''

                మొగలి కివన్ని తలకెక్కడమేలేదు.

                ''సరెసరెనయ్య పోరన్ని పోకముందే గిన్నికట్టడి జేత్తన్నవ్‌...'' భూదేవి...

                ''నేనేమంటన్ననే... సెప్పద్దా? ఆడో సిన్నపోరడు గాదు. ఆయింక మానాయిన సెప్పలేదనే సొడ్డెందుకు?'' రాయేశ్వరి ఆకిలూడిసింది. పొయ్యంటుబెట్టింది.

                 మొగిలి పండ్లు దొముకున్నాడు...

                ఈగడబిడకు రమేశ్‌ లేచిండు...

                ''అన్నా! అన్న నాకు మాంచి అంగిలాగు దేవాలె'' అన్నాడు సాంబయ్య దగ్గరకూకుంటు -

                ''మాతెత్తడులేరా? నువ్వెందుకులేసినవ్‌ - అల్లుకు బోతే పిల్లిని సంకల బెట్టుకపోయినట్టు తుమ్ముతవో దగ్గుతవో పండుకో'' తల్లి.

''నేనేం తుమ్మ.నువ్వే నశం బీర్సుకొని తుమ్ముతవు'' అన్నాడు పిలగాడు...

                తెల్లారే సుక్క బొడిసింది. మొగిలి పెండ్లిల్ల అత్తగారు బెట్టిన దోతికట్టుకున్నడు. కమీజేసుకున్నాడు. నెత్తికి నూనెరాసుకున్నాడు...

                సుక్క బొడువంగనే తండ్రి , తల్లి, తమ్ముడు వెంటరాగ ఇల్లు బయలెల్లిండు.

                ''పెదనాయినకు జెప్పిరాపోర'' అన్నాడు సాంబయ్య...

                ''అయినెందుకుమజ్జెన'' భూదేవిగునిసింది.

                ''నీకెరుకలేదే - మమ్ముల ఇంతప్పటి నుంచి సాది సవరచ్చెన జేసిండు'' సాంబయ్య

                ''మీరుమీరొక్కటె - మజ్జెన నేనేఏరుడ్డం'' భూదేవి

                ''పెదనాయినా ఓ పెదనాయినా'' పిలిసిండు మల్లయ్య. తలుపులు తీసిండు. అతనివెనుక అతని భార్య లింగమ్మ నిలుచున్నది...

                ''పెదనాయిన నేనుబోతన్ననే''  వంగి కాళ్లు మొక్కుతూ.

                ''పోయిరా కొడుక! క్షేమంగబొయి లాభంగ తిరిగిరా. మీకురెక్కలచ్చినయ్‌ - మమ్ములిడిసి పోతండ్లు మా కట్టం మాకే       ఉన్నది. జెర ఎవ్వల తెరువుకు బోకు'' అన్నాడు మల్లయ్య.

                ''పెద్దవ్వ నేను బోయత్తనే...''

                ''పొయిరా బిడ్డా''

                బజాట్లకొచ్చిండు. అప్పుడు యాదికొచ్చింది ఎంప్లాయ్‌మెంటు కార్డు - లోపటికిబొయి తెచ్చుకున్నడు.

                ''శంకరి ఇల్లు మతికున్నది గదా?''

                ''గుడికాడ దిగుతే ఎడంసెయ్యిబాజు మామతికున్నది...''

                ఊళ్లె నుంచి అటేటు బోంగనే బర్ల పాలుబిండుతన్న సాయమ్మ ఈతలికచ్చింది.

''అయ్యో బిడ్డా పోతన్నవా? మావోడు దుర్గయ్య సుత రకం బట్టుక పోయిండు. ఆరం దినాలాయె అతీగతీ తెలువలేదు. రెండు బర్రెకుక్కలమ్మిచ్చిన... జెరంత ఉత్తురం రాయిమను కొడుకా? సదివి సదివి బేకారై పోయిండు...'' అన్నది....

                                ''అరె రకం మంచిగ బెట్టుకున్నవ - నడికట్ల బెట్టుకో - బస్సుల్ల జేబులు కోసెటోల్లుంటరు.'' సాంబయ్యకు రకం యాదికొచ్చింది...

                ''రాయేశ్వరీ - నువ్వు జెర ఇంటికాడుండు పో ఈన్ని బస్సెక్కిచ్చత్తా'' అన్నది భూదేవి...

                రాయేశ్వరి విధిలేక ఎనకెనుకకు సూసుకుంట ఇంటికి బోయింది.

                మొగిలి వాళ్లు బస్సుస్టేజీ కొచ్చేసరికి ఆడ మాదిగోళ్ల పెద్దిరాజాలు, ఆని పెండ్లాం కూసుండి ఉన్నరు. బస్సు ఇంకా రాలేదు.

                కాసేపటికి లింగయ్యచ్చిండు...

                'మాలచ్చిమికి మల్లచ్చే సోమారమత్తనని చెప్పు'' అన్నాడు...

                కోళ్లు గూసినయ్‌. సాంబయ్య ఏం మాట్లాడకుండ వేపచెట్టుకింద కూర్చున్నాడు... బస్సచ్చేవేళయింది. తూరుపు రేకలు వారుతున్నాయి. అప్పటికే సుట్టుపక్కల ఊళ్లోల్లు మరికొంత మంది వచ్చి చేరిండ్లు...

                ఇంతలో రాయేశ్వరి ఎగపోసుకుంటూ వచ్చింది. ఆమె చేతిలో చిన్న గుడ్డ మూటున్నది...

                ''అత్తా సర్వపిండి మర్సిపోయిండ్లు'' అన్నది.

                ''అయ్యో నామతిమండ...'' అన్నది... భూదేవి.

                ''అద్దులేవే...'' అన్నాడు మొగిలి.

                రాయేశ్వరి తీసుకొమ్మన్నట్టుగా చూసింది. విధిలేక తీసుకున్నాడు.

                ఇంతలోకే బస్సచ్చింది...

మొగిలి బస్కెక్కిండు.... బస్సుకదిలింది... సాంబయ్య బస్సుదగ్గర నిలుసున్నాడు. అతని కండ్లల్లో గుబగుబ నీళ్లూరినయ్‌. బస్సు కదిలింది. కిటికీ లోనుంచి మొగిలి వంగి చూసిండు - తల్లి కొంగుతో కళ్లు తుడుచుకుంటోంది. రాయేశ్వరి ఎగిరెగిరి చెయ్యూపుతోంది... తండ్రి అట్లాగే  నిలుచున్నాడు...

                మొగిలికి ఎక్కన్నో కలుక్కుమన్నది...

                                                                                           (తరువాయి భాగం వచ్చే సంచికలో)


ఈ సంచికలో...                     

Mar 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు