(February,2020)
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
గత సంచిక తరువాయి భాగం
బస్సు అక్కడక్కడ ఆగుతూ - మందిని దించుతూ, ఎక్కించుకుంటూ సాగిపోతోంది. మొగిలి అత్తగారింటికి పోతున్న కొత్త కోడలులా బితుకు బితుకు మనుకుంటూ బసస్సులో కిటికీపక్క కూర్చున్నాడు. గుడిమెట్టుదూరమైపోతోంది... కంచెలు, చేండ్లు - వాగు అన్నీ దూరమై పోతున్నాయి. ఆనకాలం అదే గుడిమెట్టుకింద - టేకు చెట్ల అడివిలో తుపతుప సినుకులు బడంగ తవిసి గడ్డలు తవ్వుక తినడం - ఎంకట్రాజయ్య మాట్లె సేపలు పట్టడం - నెత్తిమీదికి వంగిన మబ్బుకింద - జలజల తెల్లగ పారే నీళ్లల్ల మడి దున్నడం - సలి... వరి కుప్పలు - కుప్పల కాడి ముచ్చెట్లు -సలికాలపు నెగల్లు ఎండకాలం -బజార్గల్ల ఆటలు- అయ్యగారి మామిడితోట్ల మోరుగాళ్ల తెనుగు బాలయ్యను ముప్పు తిప్పలు బెట్టి మామిడి కాయలు దొంగతనం చెయ్యడం - ఎన్నెల రాత్రుళ్లు కోలాటాలు, నాగన్నతో కలిసి ఊర్లు తిర్గడాలు - కొడార్లు - కొడార్లలల్లో ముచ్చెట్లు - రాయేశ్వరి... గుండె గుబగుబలాడింది....
అప్పటికే బస్సు పైవింక్ లైను దగ్గర ఆగింది... సైకిల్లమీద బొక్కటోపీలు బెట్టుకొని మసి బట్టలేసుకొని కార్మికులు బాయికేసి ఉరుకులు పరుగులు బెడ్తండ్లు - పట్నంతుమ్మ చెట్టుకింద తట్టలన్నీ పర్సి ఉన్నాయి - బొగ్గులా నల్లగా ఉన్న ఒకామె చాయ్ అందిస్తోంది - అక్కడ డ్యూటీ దిగినోల్లు నీర్సంగా మాట్లాడుకుంట చాయ్ తాగుతండ్లు. దూరంగా కనిపించే గొట్టాలల్లి నుంచి పొగ నీర్సంగా లేత్తోంది. బీరపువ్వురంగు లారీలు దబడదిబడ ఉరుకుతన్నయ్... బస్సుకదిలింది... మోరీ దగ్గర బర్ల మంద ఎదురచ్చింది. అటెటు బోతె లుంగీలు గట్టుకొని సానామంది తిరుగుతండ్లు - బస్సు హస్పటల్ దాటింది - ఎంతపెద్ద బంగుళలో అనుకున్నడు మొగిలి...
''ఓ పటేలా ఇంకేడదిగుతవ్ - రామ్‌మందరమచ్చింది'' అన్నాడు కండక్టరు...
మొగిలి ఉలిక్కిపడి లేచిండి. బస్సుదిగబోయిండు. సర్వపిండి ముల్లె మరిచిపోయి మళ్లీవెనక్కి ఉరికి తెచ్చుకున్నాడు. డోరుపక్కనున్న కళ్లద్దాలవాడు కిసుక్కున నవ్విండు...
బస్సు కింద దిగంగనే మొదట ఏమి కన్పియ్యలేదు. బొగ్గు పొగ మావురుగప్పినట్టు... ఒకల మొఖలొకలికి కన్పియ్యకుంట - కమురు కమురువాసన... సైకిల్లు వస్తూ పోతున్నాయి.. పట్నంతుమ్మ సెట్టు మోరీ కింద పందులు ఘర్‌గర్‌మంటున్నాయి... ఆపొగకు మొగిలి కండ్లు మండినయ్ - దగ్గచ్చింది.. కాసేపునిలబడి పట్నం తుమ్మచెట్లల్ల గుడిసెలను పోల్చుకున్నాడు.. ఎడంబాజు నడిచాడు..
రోడ్డుకింద సెట్లకింద పోరగండ్లు ఏరుగబోతండ్లు. 'పోరగండ్ల కగ్గిదల్గ అటేటన్న బోలేదు' అనుకున్నాడు - గబ్బువాసన గప్పున కొట్టింది. ముక్కుమూసుకున్నాడు. అటేటు నడిచేసరికి భూమిలనుంచి పొడుచుకొచ్చిన నల్ల - నల్లసుట్టూ నీల్ల మడుగు. నీల్ల మడుగులనే కుండలు బిందెలు బెట్టుకొని ఆడోల్లు కొట్లాడుతండ్లు.
''నీ మొగడే పోతడుగని డ్యూటీకి మా మొగలు సాపుక పంటరా?'' ఓ కర్రెపడుసామె ముఖమంతా రెచ్చిపోంగ అంటున్నది...
''సాపుకపన్నది సాల్లేదా?'' అన్నది ఇంకోముసలమ్మ....
''లంజె నా సవితి... లాకలాంపంటం'' అన్నది ఇందాకటామె. బిందెలు తోసేస్తూ తను జబర్దస్తీగా బిందె నల్ల కింద బెట్టింది.
''దానికియ్యిండ్లి నీళ్ళు- దానిమొగడు బుడ్డలీడర్ సాబాయె'' అన్నారెవరో?
''ఎవలకు లీడరు?''
''ముప్పయారు జుట్లు గల్సుంటయిగని మూడు సికెల్ గల్సుండయట - జెరతాములుగ ఒక లెనుక ఒకలు పట్టుకుంటేందో?'' అనుకున్నాడు మొగిలి...
ముందటికి నడిచాడు. ఇరుకువాడ.. గుడిసెల ముంగట చెత్తా చెదారం నిండున్నది. - నల్లనీల్లు రోడ్డుమీదనే పారుతున్నాయి. ఆడాడ బొందలు జేసి పందులు తొక్కుతున్నాయి...
ఓ గుడిసెకు ముందు - చెక్కుకపోయిన కంకబద్ద లాంటి వాడొకడు డ్యూటీ బట్టలు ఇడువకుండానే గడంచలో కూర్చుండి కడుపుల పేగులు బయటకొచ్చేలాగా దగ్గుతున్నాడు - ఆ ముఖంలో నెత్తురు పేరుకొచ్చింది. కండ్లు పేలిపోయే విధంగా పొడుచుకొచ్చినయ్..
''అదెనయ్యా తాగుడింట్ల పీనిగెల్ల తాగద్దంటె ఇనవ్..దగ్గిదగ్గి మమ్ముల గంగల గలుపుతవ్‌గని'' ఇంకో జెరంత ఒత్తు పెయ్యామె గులుగుతోంది
''తాగకుంటెందో?'' అనుకున్నాడు మొగిలి.
మరికొంత దూరం నడిచేసరికి శంకరయ్య ఇల్లచ్చింది. రెండు గుడిసెమధ్య మనిషి బోయేంత సందులనుంచి తొవ్వ... ఆ గుడిసెలెనుక శంకరయ్య గుడిసున్నది... మొగిలి పోయెటాల్లకు... గుడిసెముందు అంపుల కాడ లక్ష్మి కూకుండి బాసండ్లు తోముతోంది. ముఖమంతా ఉబ్బున్నది... ముక్కుకింత మసున్నది...
''అన్నున్నడా! అదినే'' మొగిలి నిలబడి...
''ఓ నువ్వా మొగిలి...'' అన్నది ముఖం మీదికి సంతోషాన్ని తెచ్చుకుంటూ... ఇంటెనుక ఇనుపపొయ్యిల బొగ్గుమండుతంది.
''లక్ష్మి లేచి చేతులు కడుక్కొని కొంగుకు తుడుసుకున్నది.. కాళ్లకు నీల్లిద్దామని చూస్తే ఒక్క కుండలోనన్నా నీళ్లులేవు ఏది కరువే'' అని గొనుగుతూ...అడుగులు బొడుగులు జమచేస ియిచ్చింది. చేతులున్న మూటెక్కడ బెట్టాలో తెలువక దిక్కులు చూసిండు...
''ఏందది - నా కోసం తెచ్చినవా?'' అన్నది నవ్వుతూ లక్ష్మి. ఆ నవ్వు నవ్వులాగా లేదు...
''మాఅవ్వ గట్టింది. సర్వపిండి...'' అన్నాడు సిగ్గుపడుతూ...
ఇటియ్యి అని చొరవగా గుంజుకున్నది...
మొగిలి కాళ్లు కడుక్కున్నాడు - నవారు మంచం లోపలేసింది... అంగి గుడిసెలకు బొవాలె... గుడిసె ఎత్తు లేదు. లోపటికి నడిచిండు... కాసేపు ఏమి కన్పించలేదు. ఆ తరువాత మంచం కన్పిచ్చింది - కూర్చున్నాడు... ఇల్లంత బోసిగున్నది... ఒకపక్క పొగచూరిన పోటో ఒకటున్నది. అందట్ల లక్ష్మి, శంకరయ్య సగమే ఉన్నారు. నిట్టాడు దగ్గెర తడుక గట్టున్నది - తడుకకు మాసిన బట్టలున్నాయి...తాటికమ్మటోపి...లోపట బోళ్లుబొక్కలేవి ఎక్కువ లేవు...
''ఏందట్లా సూత్తన్నవ్...'' అన్నది లక్ష్మి
''అన్నలేడా?'' అన్నాడు...
''నాత్రి బజిలికి బోయిండు... అత్తడు...కూకో'' అన్నది...
బొగ్గుపొయ్యి ఇంటి ముందటికి తెచ్చి చాయ్‌కు నీల్లు బెట్టింది...
''నేను బువ్వదినచ్చిన'' అన్నాడు మొగిలి...
''ఏమరిగిపోవులే...'' అన్నది లక్ష్మి...
మొగిలికి ఏం మాట్లాడాలో తెలియలేదు. నిజానికి లక్ష్మి తనకన్నా ఒక్కేడు చిన్న... మనిషి అట్టకట్టుండేది ఇప్పుడో ఎండిపోయింది...
''మా అవ్వ, తమ్ముడు గినమంచిగున్నరా?'' అడిగింది లక్ష్మి..
''ఆ మీ నాయిన మల్లచ్చే సోమారమత్తనన్నడు...'' అన్నాడు...
లక్ష్మి పేగుల సర్వపిండి విప్పుకొని కొంచెం తిన్నది.
''అత్త సర్వపిండి బెడితే బాగుంటది - నేను తింటున్న'' అన్నది.
మరికాసేపు వాగు గురించి, మనుషుల గురించి, పంటల గురించి, పేరుపేరున అడిగింది. మొగిలి సిగ్గుపడుతూనే చెప్పుకొచ్చిండు...
గాజుగ్లాసులో చాయ్ తెచ్చియిచ్చింది... ఊదుకుంట తాగిండు...
''సెల్లె నీళ్లు బోసుకున్నదా?'' అన్నది లక్ష్మి గడుప అవతల కూర్చుండి తను చాయ్ తాగుతూ...
''ఎహె...ఎహె....నాకేమెరుక'' అన్నాడు మొగిలి - ఆ సిగ్గులో నాలిక చురుక్కుమన్నది...
లక్ష్మి, మొగిలి సిగ్గును చూసినవ్వింది...
''మీ అన్నచ్చే ఏల్లయ్యింది... తానానికి ఉడుకునీళ్ళు లేకుంటే సింగిబింగాడుతడు'' అనిలేచి నీల్ల బిందె బట్టుకొని నల్లకాడికి పోయింది...
చాయ్‌తాగి మొగిలి బయటకొచ్చిండు...అంత మాలోకంలో ఉన్నట్టున్నది... నడికట్టుకు కట్టుకున్న డబ్బుతీసి జేబులో పెట్టుకున్నాడు...వాకిట్లో తిరుగుదామన్నా మూడడుగులే లేదు...
టయిమెంతయ్యిందో? పొద్దు అంబటేల్లయ్యింది... అప్పుడు వచ్చిండు శంకరయ్య.
శంకరయ్యను మొగిలి గుర్తుపట్టనేలేదు. పెద్దబొగ్గుపెళ్ల నడిసచ్చిట్టచ్చిండు. నెక్కరంతామసే - కాళ్లకు తక్కెడుతక్కెడు బూట్లు - నెత్తిటోపిసుత నల్లటిదే...
''ఎప్పుడచ్చినవ్ తమ్మీ?'' అన్నాడు శంకరయ్య.
అప్పుడుగుర్తుబట్టిండు మొగిలి - ''పొద్దటి బస్సు కచ్చిన్నే'' అన్నాడు...
''ఏదీ లచ్చేది?'' అన్నాడు.. చిరాకుగా...
''నల్లకాడికి నీళ్లకు బోయిందే''
''ముండ తెల్లారెదనుక బంటది... కలువ కొయ్య బెడితెనే మంచి గుండె..''బూట్లిడుసుకుంట...
మొగిలికి ఏమనాలో తోచలేదు...
''మందికి మార్నగాలంబుట్ట ఒక్క బిందెడన్న పట్టుకోనిత్తలేరుగద'' అనుకుంటొచ్చింది లక్ష్మి...వాకిట్లో మొగన్ని చూసి నోరు మూసుకున్నది.
''నీల్లేసినావే'' దాదాపుగా అరిచినట్టుగా
''మా ఏసిన'' అన్నది లక్ష్మి....
''పట్టు...బయటికి బట్టు ఊళ్లెకు బోవాలె - మొగిలికి చాయిచ్చినవా? చాయ్ తాగినవా?'' అడిగిండు
''మా తాగిన్నే''
శంకరయ్య స్నానం చేసి పైంటేసుకున్నాడు.. బుస్సర్టేసుకున్నాడు - తాటికమ్మ టోపీ పెట్టుకున్నాడు
''ఎరుకల బుట్ట తీర్గ ఏం మంచిగున్నది'' అనుకున్నాడు మొగిలి...
''పైసలు దెచ్చినవా? పోదాంరా? లీడరోనికి గలువాలె'' అని బయటికి దారి తీసిండు.
ఇద్దరు కలిసి సందుగొందులు దాటిండ్లు - మూల మలుపు దగ్గర పాన్ టేల ఒకటున్నది... టేలాలో గుండ్రగ కుది మట్రం గా ఉన్న గడ్డపాయనొకడు కూర్చున్నాడు...
''క్యా బయి...'' అన్నాడు టేలాయన...
టేలా ముందు నలుగురైదుగురు నిలుచున్నారు...ఒకడు ఏదో పైటింగ్ సినిమా గురించి చేతులు తిప్పుతూ చెప్పుతున్నాడు...
''నువ్వెన్ని చెప్పునాకు దర్మేంద్రంటే పడదు...'' అన్నాడు పొడుగు వెంట్రుకలవాడు.
''ఆడిగుల్ల్లోకు గట్లనే ఉంటది... ఇన్నవా? ధర్మేంద్ర పైటింగ్ నీకేమెరుక...'' అన్నాడు కుడిచేతికి ఉన్న కడాన్ని రాసుకుంట ఇంకోడు...
''నమస్తే శంకరన్నా'' అన్నాడు బక్కటోడు...
''నమస్తే.. పనికి బోతన్నవ'' అన్నాడు శంకరయ్య
''ఏడ - ట్రేనింగయిపోయి దగ్గెర దగ్గెర నాలుగునెల్లయిపోయినయ్...''
''ఇప్పుడేంజేత్తన్నవ్?''
''ఏమున్నది - ఏజెంటాఫీసు ముంగట పులిజూదమాడబోతండు.. హేమమాలిని బొమ్మలు సూసుకుంట తిరుగుతండు'' అన్నాడెవడో...
''యాకుబ్..దోపాన్ బనావో...'' అన్నాడు శంకరయ్య.
''పత్తి జర్ద అయిపోయింది.... మాక పొట్టేగాన్ని తోల్తే ఇంకారాలేదు... ఇంకోటి ఎట్ల సార్....'' పాన్‌షాప్‌వాలా... శంకరయ్య మొగిలి మొఖంలోకి చూసిండు...
''మీఠా...'' అన్నాడు...
''నయాచోకరా?'' అన్నాడు పాన్‌వాలా...
''మావోడే...'' అన్నాడు శంకరయ్య...
''అబ్బో శంకరన్నకు బాగనే పతారున్నదే'' అనుకున్నాడు మొగిలి.
తనోటివేసుకొని మొగిలి కొకటిచ్చిండు - '' నాకద్దన్న నాకద్దనుకుంటనే -'' తీసుకున్నాడు మొగిలి - ఓ పొడుగుసిగరెట్టు ముట్టిచ్చిండు శంకరయ్య - గణేశ్ బీడికట్ట జేబులేసుకున్నాడు... ఇంకో సిగరెట్టు మొగిలికిచ్చిండు.
''నాకదన్న''
బాయిపనికి మొదలిది... సిగిరెట్టు తాగనోనివి బాయిల పనేం జేత్తవ్... నేర్సుకో..'' జబర్దస్తీగా యిచ్చిండు...బుక్కనిండా ఉమ్మి ఊంచాలో వద్దో - సిగరెట్టు ముట్టిచ్చిండు -ఎట్లా తాగడం చూయించిండు శంకరయ్య. మొగిలికి మొదటిబుక్కలో దగ్గచ్చింది... కండ్లల్లకు నీల్లచ్చినయ్... పాన్ ఊంచిండు...
ఇద్దరు రోడుమీద నడుస్తున్నారు. కొంత దూరం నడిచిన తరువాత ఏందో యాదికొచ్చినట్టు ఆగిపోయి మళ్లీ వెనక్కి నడిచాడు శంకరయ్య... రోడ్డుమీద నిలుసుండి బిక్కిరిబిక్కిరి చూసి జేబులోనుంచి పైసలు దీసి లెక్క బెట్టిండు...ఎనిమిదో తొమ్మిదో రూపాయలున్నాయి...'' తమ్మీ నీ దగ్గరేమన్నా ఉన్నాయా?... ఇంటికి బోయినంకిత్త...'' అన్నాడు శంకరయ్య...
''పదిరూపాలల్ల టికట్టుబోను సిల్లర ఉన్నది...'' అని జేబులనుంచి తీసిచ్చిండు...
''ఇగో ఆరున్నరున్నది..'' అనుకుంట మార్కెటుకేసి నడిచిండు... మొగిలి వెంట బడ్డాడు. మార్కెట్ల వాడిపోయిన కూరగాయలు - గుడ్లు - ఈగలాలే చేపలు - ఓమూలకు గుంగురెంటికల కటికయిన దగ్గర మాంసం - జనం తొక్కిసలాడుతండ్లు. ఆడోల్లు ఏర్రగబుర్రగున్నోల్లు ఆ దుమ్ముల్నే దస్తిగుడ్డలు ముక్కుల కడ్డంపెట్టుకొని సింగులెత్తి పట్టుకొని బేరాలు చేస్తండ్లు - డ్యూటీల మీదచ్చిన కార్మికులు సేతుల్ల సైకిల్లు బట్టుకొని కొంటండ్లు
''బాలకిట్టు - జెరంత మంచిది సూసి కిలో మాంసమియ్యి...'' శంకరయ్య దుబ్బల మోకాళ్లమీద కూకుండి కుడిచేత అటిటు తిప్పుతూ...'' అగో గ బరిబద్ద బొక్కలేం జేసుకోను... కారం గంతెందుకు..నల్లి బొక్కతియ్యి... అరెజెరంత తామూలుగ జోకు...''
''బయికన్పిస్తలేవ్...అయిదుకిలోల పైసలు రావాలె...''కటికాయన.
''ఇత్తయిత్త - దెంకపోతనా? ఆరు తారీకురానియ్యి అన్నీ ఇచ్చేత్త...'' అన్నాడు.. పైసలు దీసి యిస్తూ ''ఎట్లనే '' మొగిలి...
''కిలోలసొప్పున - కిలోకు పదిరూపాలు'' .
''అబ్బో'' అన్నాడు మొగిలి.
''బాయిపనోడు తగినట్టు కూరాకు దినకుంటే సేదగ్గు లేసి సత్తడు''
కూరబట్టుకొని ఇద్దరు మరల ఇంటికొచ్చారు. లక్ష్మి అప్పటికి స్నానం చేసింది.
8
సైకిలు దీసుకొని బజాట్లకచ్చిండ్లు - మొగిలికి సైకిలు ఎనుకెక్క రాలేదు - ముందట కూసుండ బెట్టుకున్నాడు...శంకరయ్య మొగిలి యూనియన్ ఆఫీసుకు చేరుకొనే సరికి పదైపోయింది. అప్పటికే అక్కడ పదిపదిహేను మంది జమై ఉన్నారు..
యూనియన్ ఆఫీసు ముంగట ఒక సిమెంటు గద్దె ఉన్నది. గద్దె నడిమధ్యన జెండా ఒకటి ఉన్నది. మీద ఎర్రరంగు నడుమ తెల్లరంగు కింద పచ్చరంగు - మద్దెన చక్రమున్నది...
శంకరయ్య సైకిలు నీడకు బెట్టచ్చిండు - యూనియన్ ఆఫీసుకు ఎడంగా ఒక వేప చెట్టున్నది. వేపచెట్టు కింద నల్లగ వాడిపోయిన అరటి పండ్లు బెట్టుకొని ఒక ముసలమ్మ కూర్చున్నది.. చెట్టు కింద కొంత మందిమట్టిలో కూర్చున్నారు. వాళ్ల మధ్యలో చెక్కుకపోయిన మొఖపోడు కూర్చుండి ''నమ్మినాన బోత్తె పుచ్చిబుర్రలయినట్టున్నది ఎవారం ఈలంజకొడుకుల ముడ్డిమూడు సుట్లు దిరిగేటాల్లకే గూట నరాలు గుంజుకత్తన్నయ్ - ఇగత్తదంటరు - అగచ్చే నంటరు.. రెండు వేలు రూపాలు దీసుకున్నరు. బాయి దొరలు పిలిసిరి. ఎద్దును సూసినట్టు పిక్కలు సూసిరి దోతిడిపిచ్చి సూసిరి - కండ్లు సూసిరి - అన్నీ సూసి బరువు లేవట్టిచ్చిరి ఆ - డాక్టరోడు మల్లా సూసె - ఇరవైయొక్కదినాలు. దినానికి మూడురూపాలిచ్చి ట్రేనింగు చేపిచ్చిరి... ఇగో అచ్చెననిరి ఈడికి మూన్నెల్లు గడిసిపాయె - అచ్చిందిలేదు సచ్చింది లేదు -'' అంటున్నాడు...
''అయ్యో అత్తది... అదేమన్నలం....? నౌకరీ గిట్లేగిరపడ్తె అయితదా?'' రాగెంటికలవాడు...
''నువ్వింక ట్రేనింగ్ జెయ్యలేదా?''
''రేపు మాపత్త దంటడు...''
ఇందాకటోడు సిత్రంగా నవ్విండు...'' పొగాకున్నదా?'' ఎవడో పొగాకు చిన్నముక్కిచ్చిండు....దవడకేసిండు...
వాళ్లకు కొంచెందూరంలో నిలుచున్నతను.. దారిలకు నిక్కి - నిక్కి సూత్తండు...
మొగిలి వాళ్లకు కొంచెం దూరంలో నిలుచున్నాడు.
''ఈడిప్పుడిప్పుడచ్చేటట్టులేదు... దా అట్ల బొయి చాయ తాగిత్తామురా?'' అని మొగిలిని తీసుకపోయాడు శంకరయ్య. ఇద్దరు చాయ తాగచ్చేటల్లకు ఆఫీసుముంగట స్కూటరున్నది. ఆఫీసు తలుపు తెరిచున్నది - ఇద్దరు లోపటికి నడిచారు...
ఆపీసులో టేబిల్ - టేబిల్ ముందు కుర్చీలో కర్రెగా తునికిమొద్దు తీరంగున్నోడు కూర్చున్నాడు.
''నమస్తేసార్'' అన్నాడు శంకరయ్య...
''దాదాశంకరయ్య..కూకో...'' అన్నాడు...
టేబిల్ మీద కాయిదాలున్నాయి... లీడరు నున్నగా దువ్వుకున్నాడు. తెల్ల ఖద్దరు బట్టలు. లీడరు నెత్తిమీద అంగేలేని ముసిముసినవ్వుతండు. ఇంంకో పక్క పిక్కుటం లాగేసుకున్నోడు టోపిపెట్టుకున్కోడు. అయినెనుక ఈ ముసలాయన నడుత్తండ్లు.
''అయతె అయింది లాపోతె లేదని సెప్పరాదుండ్లయ్య ఊకె కొలువా కుమ్మరియ్య - నాకు బాయి పని బాకి లేదని మల్ల మావూరికే పోయి పాలేర్తనం జేసుకుంట...'' ఇందాకటి చెక్కుకపోయిన మొఖపోడు...
''అయితది...ఎట్లనయ్య? ఉరుకులాడ్తె అయితాది. దేనికైనా యాల్ల రావాలె - నీ ముంగట నేను ఏజెంటుకు చెప్పలేదా? నామాటటుంచు దొరగూడ చెప్పె..'' ముఖంమీద పట్టిన చెమట తుడుచుకుంటూ -'' ఉఫ్ ఎండలు గిప్పుడే గింత గనమున్నయి... వీరసామిగా ప్యానేయి.. ఎడందిక్కు తింపు..వారీమొండోడ...'' పిలిచిండు - మొండోడనే పిల్లవాడొచ్చిండు...
''చాయ్‌లు పట్టుకరా?'' అన్నాడు.
మొండోడు బయటికి నడిచిండు...
''సరే రేపొద్దున మల్లగలువు నేను ఏజెంటాపీసుకత్త... దొరగూడత్తడు.. అడుగుదాం..'' అన్నాడు.వీరసామి సల్లబడిపోయిండు...
ఇంతలోకే పోనచ్చింది... ''నేను రాఘవులును...ఇంతకు మునుపే వచ్చిన్నుండి..కె.కె 2 బాయినా? రొయ్యకాళ్లోడా? లేబరొచ్చిండ్లు.. మాట్లాడిపోత...అట్లెట్ల సార్... స్ట్రయికంటె పదిహేను రోజులు ముందు నోటీసియ్యాలె... సరె నేను బోత సార్...''ఫోన్ పెట్టేసి కెకె2 బాయిమీద వోర్‌మెన్ ఎవన్నో కొట్టిండట - సమ్మెలకు దిగిండ్లట - కానియ్యిండ్లి నేను అర్జంటుగ పోవాలె...'' అన్నాడు...
శంకరయ్య మాట్లాడాలని నోరు తెరిచిండు...
''శంకరయ్య ! సరే... కొద్దిగ మీరంతా ఆఫీసు బయటుండి ఒక్కొక్కరు వస్తే పనైతది....అందరిక్కన్నే కూకుంటె ఏది మనుసున బట్టది'' అన్నాడు రాఘవులు. అందరు బయటకు నడిచారు... ముగ్గురి తరువాత శంకరయ్య మొగిలి లోపటికి నడిచారు...
''ఇగో నీ పేరేంది?'' అన్నాడు మొగిలినుద్దేశించి.
''మొగిలి''
''మొగిలి తీసెయ్యి నీ పేరు రాజయ్య తండ్రి పేరు అయిలయ్య''
''కాదుండ్లి...'' మొగిలి...
''శంకరయ్య ఎక్కన్నుంచి తెచ్చినవోయి..నీ పేరు మీద కాల్‌రావాలంటే...ఇంక పదేండు ్లగావాలె...''అప్పుడు మొగిలికి ఎంప్లాయ్‌మెంటు కార్డు గుర్తొచ్చింది. తీసివ్వబోయాడు.
''ఉంచుకో - ఇగో నేనిచ్చేకార్డు తీసుక పో - నీ పేరు రాజయ్యని చెప్పు...తండ్రి పేరు అయిలయ్య వింటన్నవా?...''
మొగిలి కిదంతా అర్థంగాలేదు..శంకరయ్య డబ్బుతియ్యమన్నాడు. తీసి శంకరయ్యకిచ్చిండు. శంకరయ్య రాఘవులుకిచ్చిండు రాఘవులు నల్లటి కాష్ బ్యాగులో డబ్బు కుక్కుకున్నాడు. ఏందో కాయిదం మీద రాసుకుంటూ..'' ఇదంతా మాకనుకునేవు శంకరయ్యా నీ కెరుకలేందేమున్నది - కిందినుంచి మీదిదాక ముట్టజెప్పాలే - మజ్జెన గీ పీకులాట మీకెందుకనేరు...ఏవున్నది యూనియనొకటే డిసింది గదా! మంచికో సెడ్డకో గిందట్ల సొచ్చినం - నడిపిచ్చుకరావాలె... బాయిమీద ఏమంటండ్లు శంకరయ్య. రావాలె... అన్నట్లు మన యూనియన్‌కు మీలాంటోల్లుంటేనేగదా! లట్టుగాడుపొట్టుగాడత్తరు - అది తెత్తము ఇది తెత్తమంటరు... అగెనిస్టోలు ఎన్నంటేంది. మీద ఎవరున్నరన్నదే కావాలే...ఇందిరమ్మ ఉన్నంత సేపు కార్మికుల హక్కులు గావాలంటే మన యూనియనే ముందట బడంది కలువది...'' అన్నాడు...
శంకరయ్య మొగిలి మళ్లీ నమస్తే చెప్పి బయటకొచ్చారు...
బయటకొచ్చిన తరువాత ''ఈనెవ్వలే?'' అన్నాడు మొగిలి...
''కాంగిరేసులీడరు...''
''గీనే బాయిలపనిత్తడా?''
''బాయిదొరలిత్తరు.. ఆళ్లకీళ్లకు కన్సల్టు రేపు ఇంటర్యూ..బర్తీరేపే...ఇంటన్నవా?''
''అట్లయితే మనమే బోయి గ పైసలు ఆళ్లకిత్తె గాదా?''
శంకరయ్య బిగ్గరగా నవ్విండు...
''మొగిలీ గీడంత సాటుమార్గర - లీడరోడు సుత ఒక్కక్కలను సాటుకు బిలిసే తీసుకున్నడు...బాయిదొర గట్లనే తీసుకుంటడు. - నువ్వు లంచమిత్తనన్నవంటె మెడలమీద కట్టేసి ఈవలికి దొబ్బిత్తడు...''
''ఎందుకని?''
''లంచం తప్పు''
''తప్పయితే ఎందుకు తీసుకోవాలె?''
''లంచం నేటుకు తీసుకుంటె తప్పు...ఆడు ఊకెనే ఎందుకిత్తడు నౌఖరీ...''
మొగిలి మరింక లాభంలేదని నోరుమూసుకున్నాడు...
9
జనరల్ మేనేజర్ ఆఫీసు ముంగట నూరు మంది దాకా కూసుండో నిలబడో ఉన్నారు... ఇంకా పగలు కాందే ఎండ దంచేస్తోంది.. ఆఫీసు కవతల వేపచెట్ల రోడ్డు మీద దబడ దబడ లారీలు వస్తూ పోతున్నాయి...దూరం గుడిసెలు ఎండలో కాలిపోతున్నాయి. దూరంగా నేలంతా బొగ్గు దుమ్ముతో నిండిఉంది. ఆఫీసు ముంగట ఒకటి రాలచేట్టు రెండు కానుగు చెట్లున్నాయి. రాల చెట్టుకింద రెండు పులిజూదం ఆటలు మాంచి జోరుమీద నడుస్తున్నాయి... ఆ ఆటల సుట్టూ పదిపదిహేను మంది నిలుసుండో కూర్చుండో పులి మేకలను తినడం చూస్తున్నారు.. కానుగు చెట్టుకింద నలుగురైదుగురు దుబ్బలో అడ్డదిడ్డంగా పడుకున్నారు... లాగులేసుకున్నోల్లు పదిమంది కన్నా ఎక్కువుండరు. మిగతా వాళ్లంతా దోతులోల్లే. కాల్లకు చెప్పులు లేనోల్లు - ముడుతలు బడ్డముతక బట్టలోల్లే ఎక్కువ...
తీరిగ్గా పాన్‌లు నములుతూ ముచ్చెట్లు బెట్టుకుంట - నవ్వుకుంట కొందరు వీళ్లను చూసి చూడనట్టు చూస్తూ ఆఫీసులోనికి పోతున్నారు.. స్కూటర్ల మీద కొందరు, కార్లమీద కొందరు వస్తున్నారు.. కార్లవచ్చినోల్లకు లోపలనిలుచున్న గూర్ఖా సలాములు కొడుతున్నాడు.
ఆ మందిలో మొగిలి, శంకరయ్య ఉన్నారు. మొగిలి ఆఫీసు సుట్టున్న పడారి గోడ చూసిండు. గేటునుంచి లోపట నవనవలాడ్తన్న పూలచెట్లను - గాలికి కదులుతున్న నీలగిరి చెట్లను - పచ్చగా ఉన్న గడ్డిని చూసిండు. లోపట పచ్చరంగు బంగుళాలను వచ్చిపోయే వాళ్లను చూస్తున్నాడు.
రెండోకానుగు చెట్టుమొదట్ల తోపుడు బండిమీద పండ్లు బెట్టకొచ్చిండెవడో? పండ్లు కొనేటోడు లేనేలేడు.
రాల చెట్టు మొదులు కొరిగి కూచున్న సుక్కబొట్టోడొకడు.. ఆవుళించి పెద్దగొంతుకతో..'' గిదేదన్న అయితే బాగుండు.'' అన్నాడు.
అతని పక్క కూర్చుండి కునికి పాట్లు పడుతున్నోడు ''రోట్లే తలబెట్టి రోకటి పోటుకు బెదురుతెట్ల''అన్నాడు కండ్లు మూసుకొనే...
''మొన్న గీన్నే ఏమయ్యిందంటే - అడెవడో ఎర్రజెండ లీడరోడట - ఆడచ్చినంక - గీన్నీ నీతీరుగనే కూరుకుపట్లు బడుతున్న సోరొకడు అధాటున లేసిండు. అమాంతం లీడరు గళ్ల బట్టిండు - నీతల్లి నా పైసలు నాకు పారసి మాట్లాడు... నీతల్లి ఎకురం సేనమ్ముకోనచ్చిన. కొలువు లేదు గంగరాయి రాలేదు. మల్ల మావూరికి బోతనన్నడు'' ఒక నడీడాయన చెప్పవట్టిండు.
లీడరోడు ఇడిపిచ్చుకున్నడు. ''ఎవనికిచ్చినవ్ పైసలు... రసీదున్నదా? ఈడ నీ అయ్యవ్వదాస బెట్టిండా నౌకరి?'' అని అడిగిండు. ఆఫీసులకు తప్పిచ్చుకోనుబోతే ఈడ కూసున్నోల్లు ఇడిపిచ్చిండ్లు...''గదే ఎవనయ్యవ్వదాసబెట్టిండో? మీదిమీదికురికిండు'' సోరోడు.
ఓ నడీడోడు చెప్పుకొచ్చిండు సేతులు తిప్పుకుంట.
''మంచి పనైంది - లాపోతేంది?'' అన్నాడెవడో...
''అది నిచ్చమేగని పనిబాయెగదా?''
''ఎటయినపోయేదే - సచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చిందని - ఈడున్నోల్లందరికి కొలువు దొరుకుదా? - ఏ సగం మందికో పావు మందికో దొరకుద్ది. దొరికినోడు మురుసుకుంట బోతడు - దొకరనోని కడుపు మసులుతది - ఆగనోడు గట్లనే సేత్తడు...'' ఆఖరు మాట చెప్పి ఆటేటు నడిచిండు.ఎవలేం మాట్లాడలేదు...
మొగిలికి ఈ మాటలు వినబుద్ది కావడం లేదు.
శంకరయ్యకు రెండు దినాల నుంచి నిదురలేక తిక్కతిక్కగా - ఉన్నది....
మొగిలి అందరి మొఖాలు చూసుకుంట కాసేపు చెట్ల కింద ఆడికీడికి దిరిగిండు - రాలచెట్టుకింద దుమ్ములో పన్నతని మొఖంలోకి చూసిండు.. అది తనకు తెలిసిన మొఖమే ఉన్నట్టున్నది.. దగ్గరి దాకాపోయి వంగిచూసిండు! శాయమ్మ మనుమడు దుర్గయ్య...తనకు తెలిసినోడు కనిపించినందుకు సంబురపడి లేపిండు... ఆట్లా పండుకున్న మనిషి నిదురపోవడంలేదు కండ్లు తెరిచి మొగిలిని కాసేపు అయోమయంగా చూసిండు.
''నేను దుర్గయ్యా! మొగిలిని -''అన్నాడు.
దుర్గయ్య లేచి కూర్చున్నాడు - బుస్సర్టుకు అంటిన దుమ్ము దులుపుకున్నడు.. ఆకుచెప్పులేసుకున్నాడు.
''మా శాయవ్వగలిసిందా?''
''ఓ వచ్చేటప్పుడు నీగ్గలువుమని చెప్పింది - ఏమయ్యింది?'' అన్నాడు...
''ఏమయితది - మా బాపు ముంచిండు - బలార్షల మా అన్న తీర్గ సిన్నప్పుడే ఏదన్న పనిసూసుకుంటే ఒడిసిపొయ్యేది.. సదివిచ్చి బొగ్గు పనికి బెట్టద్దనుకున్నడు... నేను గాలపు సాపలమ్మి దొరల ఇండ్లల్ల బోల్లు కడిగి సదువుకున్న. సదివినోనివి ఏంపని జేత్తవంటారు.. సదివినోనికి సదివే పని ఇప్పియ్యరు - ఆఫీసుల చుట్టు పుచ్చిన కుక్కతీర్గ తిరిగి తిరిగి యాష్టచ్చింది''
''గమద్దెన మా మనుమనికి కొలువు దొరికిందనె గదా!''
''మా దొరికింది - కాయిదం కంపెనోడు ఉద్యోగమిచ్చిండు''
''దాని పేరేందో చెప్పింది మీ అమ్మ''
''మూడుపత్తాల కంపెనీ - బల్లర్షలున్నది. ఎవడో సేటు పత్తాలాడి గిదీన్ని ఓడిపోయిండట - పత్తాలల్ల వచ్చింది గన్క గదే పేరుబెట్టిండు.. అయితే ఉజ్జోగం రాజోర అడువుల్ల. గోండోలల్ల - ఆర్నెల్లు జేసిన ఆళ్లతోని పొద్దందాక కంక బొంగు గొట్టిచ్చుకోని లారీలు నింపిచ్చుకొని - లారీలు నడిసేటందుకు రోడేపిచ్చుకొని బల్లార్షకు దేవాలి. ఆళ్లకిచ్చేది మొగోనికి రెండున్నర ఆడిదానికి రూపాయినర - నాతోటి సేరినోల్లు ఆయింత ఇయ్యకుంట బాగనే సంపాయించిండ్లు - నాకే ఆళ్లను, ఆళ్ల ఆకటి సావుల్ని - గుడిసెల్ని సూత్తే కడుపుల దేవినట్టయ్యేది... మాతాత సచ్చి నప్పుడు మాసాయవ్వ మా నాయిన్నలను దంచబోయి ఇసుర బొయి సాదుకచ్చిందని మా నాయిన్న జెప్పంగిన్న ... ఆళ్ల మొఖాలల్ల మా శాయవ్వ గనిపిచ్చేది - సరే నా పనేదో నేను సేసుకోక కంపిని పెద్దొర బిలిసినప్పుడు పుసుక్కున అన్న - మొగకూలి మూడు రూపాలన్న బెంచండ్లి అని... అచ్చా సూద్దాం అన్నడాడు.. మరోరేన్నెల్లకు గొండోల్లకే మయ్యిందో లారీలల్ల వచ్చినోల్లను కూలీలు బెంచుమన్నరు... అప్పటికే పర్మినెంటయిన...నన్ను తీసేటందుకు ఎటూసాతగాలే... ఓనాడు జీతాలపైసలు పంచేదినం - నేనున్న గుడిసెమీద గుండగాళ్లతోలిచ్చి లూటీ చేపించ్చిండు - మీదికెల్లి తన్ని చ్చిండు - నౌఖరి ఊడింది''
''ఓర్నీయవ్వ...''అన్నాడు మొగిలి...
ఇగమరింక సదువు తోని లాభంలేదని సదువు రానోని తీరుగ ఎంప్లామెంటు కార్డు తీసినా - బల్లార్షల గట్ల చెయ్యబుద్దిగాలే - ఆడమీది బాయిల్ల పనైపోయి, మాసిన్నాయిననే మాంజిరి బంపిండ్లు మల్ల నాకేడదొరుకుద్ది... గీడ మా అక్కున్నదనిచ్చిన...''
''అయిపోయిందా?''
''అన్నయిపోయినయ్.. ఇంటర్వూల బరువెత్తరాదని బనికి రావన్నడు...''
''సరే నాపైసలు నాకియ్యిమంటే - ఏడియి బాయిదొరకిచ్చిన మంటరు లీడరోడు...''
''మరేంచేత్తమనుకుంటన్నవ్?''
దుర్గయ్యలేచి నిలుచున్నాడు.. అతనికండ్లు మండుతున్నాయి. గొంతు గుడగుడలాడింది - ''అదేతెలుత్తలేదు - మా శాయవ్వ బర్లను సుత అమ్మిచ్చిన - మరింక రెండే రెండు - ఒకటి రాఘవులుగాని బొండిగ బిసుకుడు - లేదా ఇట్లనే సీదాబోయిరైలు పట్టాల మీన తలబెట్టుడు...''
''ఛ...గయ్యేం మాటలు...''
దుర్గయ్య నవ్విండు.. ఒకే ఒక నిముషం మొగిలి లేత కళ్లల్లోకి ఇంకా డక్కా మొక్కీలు తినని కళ్లల్లోకి చూసిండు... తలంచంకొని ఆకు చెప్పులు దుమ్మును వెనుక చల్లు తుండగా వేపచెట్లరోడ్డు కేసి నడిచాడు.
మొగిలి ఆఎండలో నడిచిపోతున్న దర్గయ్యను చూస్తూ నిలుచున్నాడు...
''దొరచ్చిండు - దొర'' అన్నారెవరో.
మందిలో కలకలం బయలు దేరింది - గోధుమ రంగు కార్ల ఎద్దు తలకాయంత తలకాయోడు కూసున్నడు - ఎనుకబాజు రాఘవులు కూసుండి కారుకిటికీల నుంచి తల ఈతల బెట్టి - చెయ్యూపుతండు - చెట్ల కిందోలల్లో కొందరు వంగివంగి దండాలు చెట్టిండ్లు - శంకరయ్య భీరిపోయి నిలుసున్న మొగిలి భుజంతట్టి క్రిష్ణారావు దొరే అచ్చిండు. నీ రొట్టిరిగి నెయ్యిల బడ్డదనుకో? దొరమాట కెదురుండదు?'' అన్నాడు.
''గయినే బాయి దొరా?'' అన్నాడు మొగిలి...
''ఎట్ల చేత్తవోఏమో? జంగల్ల నుంచి వచ్చినట్టు మాట్లాడుతున్నవ్... గయినెగీడ దొర - మందమర్రిలుంటడు... గీ ఊళ్లే కల్లుదుకాండ్లన్ని ఆయినెయే - సినిమాటాకీసాయినేదే - బ్రాండి షాపు లాయినయే - ఎనకట గీ కంపిని బడ్డ భూమంత ఆళ్లదేనట - గిప్పుడుసుత సుట్టుపక్కల ఇరవైఅయిదుల్లల్ల జమీనున్నది...''
''అట్లనా?'' అన్నాడు...
కారు ఆఫీసుముందాగింది. రాఘవులుదిగి కారుడోరు తెరిచిండు - క్రిష్ణారావు కార్లోనించి దిగిండు. అంతెత్తుమనిషి... ముద్దసెంపల్లు - ఎదుకండ్లు...గుంగురెంటికలు - దొరదొర తీరుగానే ఉన్నాడు... నిలబడి జేబులనుంచి బంగారంగు సిగేరెట్టు డబ్బాతీసి సిగరెట్టు ముట్టిచ్చుకున్నాడు... వాచ్‌మెన్ వంగగివంగి సలాములు చేస్తుండగా లోపలికి నడిచాడు.....
జనరల్ మేనేజర్ పి. యస్. శాస్త్రి రూంలోకి అడుగు పెట్టాడు. రాఘవులు రూంబయటే ఆగిపోయి పర్సనల్ మేనేజర్ ఆఫీసుకేసి నడిచాడు..
క్రిష్ణారావు ''కులాసేనా?'' అంటూ కనీకనిపించని నవ్వునవ్వి మెత్తటి ఫోంకుర్చీలో కూర్చున్నాడు. క్రిష్ణారావు కూర్చున్న తరువాత తనూ కూర్చుండి టేబుల్ మీది కాగితాలు సదిరి పెన్ను టేబుల్ మీద పడేసి...
''చాలా రోజులయ్యింది.. పేదవాన్ని అప్పుడప్పుడు కరుణించాలి...'' శాస్త్రి...
''పేదవారా ఎందులో?''
''పీకాట - తాగుట్లో...'' అన్నాడు శాస్త్రి నవ్వుతూ....
''కనిపించడం లేదు... ఊళ్లో లేవనుకున్న...''
''ఏది లీవుమీద పోవాలనే.మైసూర్లో మా పెద్దమ్మాయుంటది. ఊటికి పోదాం రా నాన్నా అంటుంది. సరే... అదొద్దు అనుకుంటే సిమ్లా అన్నాపోవాలి.. ఢిల్లీ వాళ్లు ఏదో మైన్సు మీటింగేస్తే యం.డి..తన మనిషిని పంపుకున్నడు...''
''మేనేజింగ్ డైరక్టర్‌కి నీకు మంచిగలేదా?''
''కాదు ఆయనోరకంలెండి... మీకు తెలియని దేమున్నది? పొలిటికల్ ఇన్‌ప్లూయెన్సు ఉంటుందిగదా? బొగ్గు బాయిల మనగ్రిప్పుల నుండి పోతన్న యనికదా? నేషనలైజుచేసింది...''
''ఏంచేసినా ఏలేవాళ్లు మీరేకదోయి శాస్త్రీ...''
''అన్నారు... నిష్ఠూరం బెట్టారన్నమాట - మీరులేకుండానా''
''ఉన్నా లేనట్టేలెక్కా...''
''మీ మాట అట్లాగే ఉంటుంది.'' అనుకుంటూనే బజ్జురునొక్కాడు...
ప్యూన్ పరుగెత్తుకొచ్చాడు... చూడు - ''మోహన్‌ర్రావున్నాడా?... అర్జెంటుగ రమ్మను'' ప్యూన్‌పోబోయాడు.. ''రాములు కూల్‌డ్రింక్స్ పట్టుకరా?''
కాసేపు ఇద్దరు మాట్లాడలేదు.. ఏర్‌కండీషనర్ ధ్వని. పైన పంఖా చాలాస్లోగా తిరిగుతోంది - నెత్తికి టోపీ బెట్టుకున్న కోల్ కార్మికుని బొమ్మ క్యాలెండరు గోడమీద.
మోహన్‌ర్రావొచ్చాడు - ఎర్రగా ఉన్నాడు - వయసులో ఉన్నాడు. ఇద్దరిని చూసి వంగివంగి సలాములుచేసి నిలుచున్నాడు...
''కిశోర్ రూంలో ఇంటర్వూ అరేంజు చేయండి క్వీక్...'' శాస్త్రి
''ఓకే సార్...'' పోబోయాడు...
''మోహన్‌ర్రావు మాయూనియనోల్లకు చార్జ్‌సీట్లు బాగిస్తున్నవట...''
''సార్...'' అన్నాడు...
''నువ్వువెళ్లు....'' అన్నాడు శాస్త్రీ
''అంతా ఏదో పార్మాలిటీస్...అట్లా లేకుంటే కార్మికులకు మనమెందుకు? ఆఫీసు బీకేయ్యరు...ఇప్పటికే కంట్రోల్‌తప్పుతోంది... రైవల్ యూనియన్ గ్రూపులున్నాయి మరి... మీ వాళ్లకే కాదు - మేం అందరితోటి బాగుండకపోతే మీరు సమ్మె అంటరు. మాపైవాళ్లు ఇనెఫిసియెన్సి అంటారు...''
''ఏదో ఇంటర్వ్యూ...''
''అదేనండీ - బదిలీ పిల్లర్సు తీసుకోవాలి. చాలా ఖాళీలున్నాయంటారు మీరు - ఎంప్లాయిమెంటు వాళ్లు అదే అంటారు. మా పరిస్థితేమో ఉన్న లేబర్‌కే వర్కులేదు... కండీషనేం బావుండలేదు -ఇప్పటికే లాసుల నడుపుతున్నం. పొజీషనేం బావుండలేదు...''
''శాస్త్రీ నువ్వెప్పుడన్నా బాగున్నాయంటావా?''
''ఏదో ఉద్యోగపు అలవాటు...''
''అదిసరే... మావాళ్లో ముప్పయి మందున్నారు అంటాడు రాఘవులు...ఏదోమేంటైన్ చెయ్యాలె...కదా? యూనియన్ వ్యవహారాలు...''
''అసలు వెకెన్సీసే నలుబై ఉంటాయండీ - అందులో మీకు తెలియనిదేమున్నది? మిగతా ప్రెషర్స్ ఉంటాయి'' ఇంతలోనే కూల్‌డ్రింక్స్ వచ్చాయి. తాగిండ్లు...
''ఇంకో నలుబై పెంచు... డాక్టరు ఫిట్‌ల పోయే వాళ్లు పోతారు - నీరిస్కుపోతుంది కదా?''
''డాక్టరు ఇట్లాగే అనుకుంటే ''
''మీసబార్డినేటేకదా? అదిగాక ... ట్రేనింగ్ మళ్లీ తతంగమంతా ఉండనే ఉండే...''
''సరే ఇంకా చెప్పండి...మీమాటకాదన వశమా? ఒకటి అరా రిజెక్టయితే...సరే..చూశారా.. ఆఫీసులో ఏర్‌కండీషనర్ మార్పించా. ఇంట్లోకి కూడా మార్వాలని. చిన్నమ్మాయికి సంబంధం కుదిరింది - వైజాగ్‌డాక్ యార్డులో ఇంజనీరు... కట్నం కొంచెం ఎక్కువే అనుకోండి..'' అన్నాడు.
''ఎంతుంటుంది?''
''లక్షనర...''
''అదే ఎక్కువా?''అన్నాడు రావు...
''ఏదో ఉద్యోగస్తులం కదండీ ''
''మీ పనే హాయి... సాయంత్రం రాఘవులును మీయింటికి పంపిస్త...''
''లిస్టు వస్తుందిగదా?''
''ప్యూనును పిలువండీ...''
మళ్లీ బజర్ నొక్కాడు.. ప్యూనొచ్చిండు...
''రాములు రాఘవులును పిలూ''
రాఘవులొచ్చాడు ''సార్‌కు లిస్టియ్యి'' అన్నాడు...
''అందరికి కాల్స్ వచ్చినయే కదా?''
''ఎంప్లాయిమెంటు వ్యవహారం రాఘవులుకే తెలుసు''
''అంతా వాళ్లే సార్...''
రాఘవులు లిస్టు తీసియిచ్చాడు క్యాష్ బ్యాగ్‌లో నుంచి. ''సాయంత్రం సారింటికి ఓ మారుపో.... సార్ కొంచెం పరెషాన్లున్నడు...'' అన్నాడు...
''అచ్చా మై చల్‌తూం - ఫిర్‌మిలేంగే... రండి మీరులేక ఆటరక్తి కట్టడంలేదు...''
క్రిష్ణారావు, రాఘవులు లేచి బయటకొచ్చారు. కారెక్కారు. కారు వెళ్లిపోయింది - చిరునవ్వులు నవ్వుతూ రాఘవులు అందరికి చెయ్యూపిండు...
అప్పుడే ఇంకో కారొచ్చింది - ఆకారులోనుంచి దిగింది బాస్కర్‌రావు, స్వామి దిగారు - బాస్కర్‌రావు బక్కగా లేడు - లావుగాలేడు - బట్టలుసాదా - స్వామి ఎర్రచొక్కావేసుకున్నాడు.
వాళ్లిద్దరు శాస్త్రీ రూంలోకి అడుగుబెట్టారు మళ్లీ. అవే మాటలు.... కూల్‌డ్రింక్స్... మామూలే చెట్లకింద కూర్చున్నోల్లు కడుపుల్లో ఆకలి మండిపోతోంది. నెత్తిమీద సూర్యుడు మండుతున్నాడు వాచ్‌మన్‌వచ్చి ''ఇంటర్యూ'' సాయంత్రం మూడు గంటలకు అన్నాడు.
Mar 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు