(January,2021)
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
కూలి బతుకులు (నవల) – మొదటి భాగం
మూసివేతకు గురైన ఫర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చిమ్నీనీల మీదుగా సూర్యుడు ఉదయించిండు.
ఎన్టీపిసి ఫస్టుగేటు ముందున్న నేషనల్ హైవే రోడ్డుకు అవలివైపున ఉన్న మైదానంలో ‘లేబర్ అడ్డా’ కాడ దాదాపు రెండు మూడు వందల మంది కూలీలు పనుల కోసం ఎదురుచూస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలు అప్పటికింకా తెరుచుకోలేదు. రోడ్డు మీద ఎడతెగని ప్రవాహంలా వాహనాలు రోద పెడుతూ పరుగెడుతున్నాయి.
ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు పూట గడవని కూలీలు చాల మందే ఉన్నారు. కొంత మంది దూర ప్రాంతాలనుండి సద్దులు కట్టుకొని చీకటితోనే వచ్చిండ్లు. మరి కొంత మంది చుట్టుప్రక్కల ప్రాంతాలనుండి వచ్చిన వాళ్ళు... కూలీలలో ఆడవాళ్లు, మొగవాళ్లు ఉన్నారు. అందరి మొఖాల్లో ఆ రోజు కూలి దొరుకుతుందో లేదో అన్న అందోళన ఉంది.
‘‘రెండు రోజుల నుండి ఇక్కడే పడిచస్తున్నా. ఇవ్వాలైనా పని దొరుకుద్దో లేదో?’’ అంటూ ఓ యువకుడు నిరాశగా ప్రక్కనున్న మరో యువకుడితో అంటున్నాడు. ఆ యువకుడు నిర్లిప్తంగా ‘ఏమో’ అన్నట్టుగా తలాడించిండు.
గతంలో అయితే లెబర్ అడ్డాకాడ ఉదయం తొమ్మిది పది గంటలదాక మనష్యుల అలికిడి ఉండేది. కాంట్ట్రార్లు తమ దగ్గర పనిచేసే మేస్త్రీలను పంపి ఆ రోజు కావాల్సిన కూలీలను తీసుకపోయే వాళ్ళు. కాని ఇప్పుడు పరిస్థితులు మారినవి. ఉదయం ఏడు ఎనిమిది గంటల లోపే లేబర్ అడ్డా మీద కూలీలు ఎవరు కన్పించటం లేదు. ఇదివరలో అయితే తీరిపారి వచ్చే కాంట్రాక్టర్లు పొద్దున్నే వస్తున్నారు.
‘‘ఇదిగో ఇదివరకు లెక్క పదింటికి పని మెదలు పెట్టి అయిదింటికే పోతామంటే కుదరదు. ఎనిమిది గంటలకే పని మొదలు పెట్టాలి... సాయంత్రం అరుగంటల దాక పని చెయ్యాలి... అట్లా ఇష్టపడితేనే పనుల్లోకి రండి లేకుంటే లేదు’’ అంటూ కాంట్రాక్టర్లు కరాఖండిగా చెప్పుతాండ్లు. అట్లా ఇష్టపడ్డ వారినే పనులకు తీసుకుంటాండ్లు.
‘‘ఇదేందని’’ ఎవరన్నా అంటే...
‘‘ఇదివర లెక్క రూల్స్ లేవు. మోడి సాబ్ వచ్చిన తరువాత ఎనిమిది గంటల పని విధానం పోయింది. ఇప్పుడు కూలోల్లు పన్నెండు గంటలు పనిచెయ్యాలి. కాందంటే మీ ఇష్టం’’ అంటూ కాంట్రాక్టర్లు నిష్టూరంగా మాట్లాడుతాండ్లు.
కూలీలు చేసే ప్రతి పనిలో యంత్రాలు వచ్చిన తరువాత పనులు దొరకటం కష్టమైంది. గతంలో పదిమంది పనిచేసేకాడ ఇప్పుడు ఒకరిద్దరితోనే ఎల్లదీసుకుంటాండ్లు. దాంతో కూలీల మధ్య పోటీ పెరిగింది. ఎంతకైనా పనిచేయటానికి సిద్దపడుతాండ్లు. రూల్స్ సంగతి చాలా మంది కూలీలకు తెలియదు. గతంలో అయితే కాంట్రాక్టు కూలీ సంఘం వాళ్ళు ఏదైనా ఎటమటం అయితే వచ్చి మాట్లాడే వాళ్ళు... ఎనిమిది గంటల పని విధానం గురించి, కూలీ గురించి కొట్లాడేటోళ్ళు... కాని ప్రభుత్వం కొత్త రూల్స్ తెచ్చి వాళ్ళ కాళ్ళు, చేతులు కట్టేసింది. ఏమన్నా అంటే అంతా చట్టప్రకారమే జరుగుతాంది... మీరు పోయి ఎక్కడ చెప్పుకుంటరో చెప్పుకొండ్లీ మాకేమి భయం లేదు’ అంటూ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా మాట్లాడుతాండ్లు.
మాదిగ నాగన్న పొద్దున్నే చీకటితోని పనికోసం వచ్చిండు. రెండు రోజులుగా పనికోసం వచ్చి పోతున్నడు. కాని ఎవరు పనిలోకి పిలువలేదు. మేస్త్రీలు యువకులను, కాస్త నజర్గా ఉన్నవారిని తీసుకొని కాస్త వయసు మల్లిన వారిని ప్రక్కన పెడుతున్నారు. అయినా ఈ రోజైన పని దొరకుతుందనే అశ అతన్ని పొద్దున్నే మళ్ళీ వచ్చేలా చేసింది...
మాదిగ నాగన్న ఎన్టిపిసి పెద్ద బొంగు పడ్డప్పుడు రామగుండం వచ్చిండు. ఆయనది స్వంత వూరు సిర్పూర్కాగజ్ నగర్ దగ్గర మానేపల్లి.
అ రోజుల్లో ఎన్టీపిసికి అవసరమైన చెఱవుకట్ట నిర్మాణపు కంట్రాక్టు చేపట్టిన పి.కే రామయ్య దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ కూలీలు దొరుకుతరో ఆ ప్రాంతాలకు మనష్యులను పంపించి కూలీలకు అడ్వాన్స్‌లు ఇచ్చి, ఆశలు చూపి దాదాపు నాలుగైదు వేల మంది కూలీలను సమీకరించిండు. వాళ్ళు ఉండటానికి ఒక చోటు చూయించిండు. అదే పి.కె. రామయ్య కాలనీ... అక్కడ దేశంలో అన్ని ప్రాంతాలకు, రాష్ట్రాలకు చెందిన వలస కూలీలున్నారు... ఒక వైపు ఒరిస్సా కూలీలు గుడిసెలుంటే, మరోవైపున బెంగాలీ నుండి వచ్చిన కూలీల వాళ్ళు ఉండేది. ఇంకా పాలమూరు, ఒంగోలు, చత్తీస్ఘడ్, జార్ఖండ్ చెందిన వాళ్ళు ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే పి.కె. రామయ్య కాలనీ కష్టాలు కన్నీళ్ళతో కూడుకున్న మని భారతదేశంలా ఉండేది.
ఎన్టీపిసి నిర్మాణపు పనులున్నప్పుడు వేల సంఖ్యలో కూలీలు పనులు చేసేవాళ్ళు. దాదాపు ఐదు సంవ్సరాలు నిర్మాణపు పనులు జరిగినవి. అప్పుడు ఆ ప్రాంతమంతా కూలీలతో కళకళలాడింది. నిర్మాణపు పనులు అయిపోయిన తరువాత ఇప్పుడంతా మెయింటనేన్స్ వంటి చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలిపోయి చాలా మందికి కూలీ దొరకని పరిస్థితి ఏర్పడింది. దాంతో చాలా మంది వెళ్ళిపోయిండ్లు. ఎటు పోలేని వాళ్ళు మిగిలి పోయిండ్లు.
నాగన్న వచ్చిన కొత్తలో పి.కె. రామయ్య దగ్గర పనిచేసిండు. ఆయన భార్య శాంతమ్మ. ఇద్దరు కూలి చేసేవాళ్ళు. దాంతో కుటుంబం ఒకింత సాఫీగానే జరిగిపోయింది. అక్కడ పని అయిపోయిన తరువాత కొన్ని రోజులు ఇర్కాన్ కంపినిలో రైల్వే లైను పనులు చేసిండు. ఇట్లా ఎక్కడ పని దొరికితే అక్కడ పనిచేసుకుంటూ వచ్చిండు. కాని ఎన్నేండ్లు పనిచేసిన పొట్టకు గడిసింది తప్ప దమ్మిడి మిగిల్చుకున్నది లేదు. వయసు మీద పడ్డది కాని చేసుకుంటే తప్ప ఎల్లని పరిస్థితి ఏర్పడింది.
ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సత్తెయ్య పెండ్లి చేసుకొని కూలీపనులు చేసుకుంటూ వాని బతుకుకు వాడు బతుకుతాండు. చిన్నోడు శీను చదువు మధ్యలో ఆపి కాంట్రాక్టర్ దగ్గర ట్రాక్టరు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
సివిల్ పనులు చేసే కాంట్రాక్టర్ నర్సింగరావు దగ్గర పనిచేసే మేస్త్రీ తిరుపతి రెడ్డి వచ్చే సరికి కూలీలంతా దూరం దూరంగా ఉన్నవాళ్ళు వచ్చి ఆయన చుట్టు మూగిండ్లు.
‘‘అరేయ్ ఎంట్రా ఈగల్లా ముసురుతాండ్లు... దూరం దూరం జరుగుండ్లీ’’ అంటూ కసురుకొని అందరికేసి పరీక్షగా చూసిండు. ‘‘నాకు ఎనిమిది మంది కావాలి’’ అన్నాడు.
నేనంటే నేను అన్నట్టుగా అందరూ మరోసారి సొచ్చుకొచ్చిండ్లు...
‘‘అరేయ్ మీద మీద పడ్తాండ్లేందిరా దూరం జరగండి’’ అంటూ తిరుపతిరెడ్డి మరోసారి కసురుకొని అందర్ని పరీక్షగా చూస్తూ ‘‘అరేయ్ నువ్వురా... నవ్వురా’’ అంటూ వేలెత్తి చూయిస్తూ ఎనిమిది మందిని ఏరుకొని ‘‘అరేయ్ మీరంతా దొరల బంగ్లాకాడికి పొండి. అక్కడ పని చేయాలి’’ అంటూ పురమాయించిండు.
‘సరేనయ్య’ అంటూ వాళ్ళు తలలు ఆడించి బయలు దేరిండ్లు. అది చూసి తిరుపతిరెడ్డి మోటారు సైకిల్ స్టార్టు చేసిండు.
కూలీ దొరకని వాళ్ళు నిరాశగా చూసిండ్లు. మరోవైపు కూలీకోసం వచ్చి అరువై, డెబ్బైమంది స్త్రీ కార్మికులు పులుకు పులుకు చూస్తూ నిలబడి పోయిండ్లు.
‘‘ఏందే పెద్దయ్య! ఇవ్వాల కూడా ఉత్తదే అయ్యేట్టుంది’’ అంటూ రాధ నిరాశగా చూస్తూ నాగన్న దగ్గరికి వచ్చింది.
అంత వరదాక ఎటో చూస్తున్న నాగన్న ఆ మాటకు ప్రక్కకు తిరిగి చూసి ‘‘ఏమో బిడ్డా ఎమైతదో’’ అన్నాడు.
‘‘నిన్న కూడా వచ్చన కాని పనిదొరకలే’’ అంది.
రాధను చూసి నాగన్న మనసు భారమైంది. రాధ భర్త శశికుమార్ చాలా ఏండ్లు బొగ్గు ప్లాంటులో పనిచేసిండు. ఏడేండ్ల క్రింద బీమారి చేసి చనిపోయిండు. ఏండ్లకు ఏండ్లు బొగ్గు ప్లాంటులో పని చేయటం వలన బొగ్గు వాని ఊపిరి తిత్తులను తినేసింది. రెండు మూడేండ్లు వస్సర వస్సర దగ్గుతూ ఊపిరి సలుపక నానా అవస్థలు పడి చనిపోయిండు. ఒకప్పుడు అమురుకుంటే అమురనటువంటి వాడు చచ్చి పోయ్యేనాటికి కట్టెపుల్ల తీర్గ అయిపోయిండు. వారి ముగ్గురు పిల్లలను రాధ కూలీనాలి చేసుకుంటూ సాదుకొస్తాంది. పోయినేడు పెద్ద పిల్ల పెండ్లి చేసింది.
నాగన్న మాట మార్చుతూ ‘‘బిడ్డ అల్లుడు ఎట్లున్నడు?’’ అని అడిగిండు.
రాధ మొఖం విప్పారగా ‘‘మంచిగున్నరు’’ అంది...
‘‘ఏందో తీయ్బిడ్డా, నువ్వు కష్టపడ్డందుకు పొల్ల మంచిగ బతికితే సరిపాయే’’ అంటూ క్షణమాగి ‘‘పొల్లగాడు ఏం పని చేస్తాండు?’ అన్నాడు.
‘‘రైల్వేల కూలీ’’ అంది.
ఇంతలోనే కాంట్రాక్టర్ రంగయ్య గుమస్తా దాడి శ్రీను రావటం చూసి ఆడోల్లల్ల్లో కదలిక ఏర్పడింది. అది చూసి రాధ గబగబ అటు కేసి పరుగు పెట్టింది.
కాంట్రాక్టరు రంగయ్య ఎన్టీపిసిలో గడ్డిపని, తోటపని చెట్ల పెంపకం కాంట్రాక్టు పట్టిండు. ఎన్టీపిసిలో ప్రతి పని కాంట్రాక్టు కార్మికులే చేస్తారు. సివిల్ వర్క్, మెయిన్టనెన్స్ పనులు, బాయిలర్స్ క్లీన్ చేయటం వంటి అరొక్క పనిని కంపెనీ ఔట్ సోర్సింగ్ చేసింది. ప్లాంటులో పర్మినెంటు ఉద్యోగుల కంటే కంట్రాక్టు కూలీలు రెట్టింపు మంది పనిచేస్తరు.
ఎన్టిపిసి పచ్చని చెట్లలో విశాలమైన రోడ్లతో తీర్చి దిద్దినట్టుగా ఉంటుంది. మధ్య మధ్య వివిద స్థాయిలను బట్టి ఉద్యోగుల క్యాటర్స్ ఉంటాయి. అట స్థలాలు, క్లబ్‌లు పిల్లల పాఠశాలలు, పార్కులతో ఒక పచ్చిని తోటలా అహ్లదపూరిత వాతావరణం కల్గి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణలో చెసిన కృషికి గాను రామ గుండం ఎన్‌టిపిసికి వరుసగా రెండో సారి కేంద్ర ప్రభుత్వంచే బహుమతి పొందింది.
కాని ప్రతి సంవతకసరం పది మిలియన్ల బొగ్గును కాలుస్తూ, ఎన్టీపిసి చిమ్నీలు అకాశంలోని చిమ్మే బొగ్గుపులుసు వాయువుల గురించి కాని నిరంతరం వెలువడే వేల టన్నుల బూడిద, విషవాయువుల గురించి కాని, అవి సృష్టించే పర్యావరణ విధ్వంసం గురించి ఎవ్వరికి పట్టింపులేదు.
దాడి శ్రీను పొట్టి మనిషి, అంత పాతిక ముప్పయేండ్ల వయసుకు మించి ఉండదు. సన్నటి గడ్డం పెంచుకున్నాడు. మోటారు సైకిల్‌ను స్టాండు చేసి నేరుగా ఆడ కూలీలు ఉన్న దిక్కు పోయిండు.
గడ్డిపని తోటపని చేయ్యటంలో మొగొళ్ళకంటే అడోళ్ళే బాగా చేస్తరని అతని నమ్మకం.
ఎన్టీపిసిలో రక్షణ వారోత్సవాలు జరుగుతున్నాయి అందుకు సంబందించి సభలు సమావేశాలు జరుగనున్నాయి. ఫుట్‌బాల్ గ్రౌండ్ ప్రక్కన ఉన్న అడిటోరియంలో జరిగే సదుస్సుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువంటి ప్రత్యేక సందర్భంలో ఎక్కువ మంద కూలీల అవసరం ఏర్పడుతుంది. దాంతో ఆయన వచ్చి రావటంతోనే పాతిక ముప్పయి మంది అడ కూలీలను ఎరుకున్నాడు. అప్పాయమ్మ ముందుకు వస్తే అది చూసిన శ్రీను చేతిని గాల్లో ఆడిస్తూ...
‘‘ఏయ్ ముసల్దాన నువ్వెటు వస్తానవు... పోపో అవతలికిపో’’ అంటూ వారించిండు...
‘‘అదేబిడ్డా నేను పని చేయనా?’’ అంది అప్పాయమ్మ దీనంగా....
‘‘చూద్దామంటే చటాకు మాంసం లేదు... నువ్వేమి పనిచేస్తవు పోపో’’ అంటూ కసిరిండు.
‘‘లేదు బిడ్డా నే చేస్తా... చెయ్యకుంటే మరోసారి పిలువకు’’ అంటూ ఎండిపోయిన రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది.
‘‘ఏయ్ ముసల్దానా, నన్ను వొర్రియ్యకు’’ అన్నాడు మరోసారి చీదరింపుగా....
‘‘లేదు బిడ్డ రెండు రోజులుగా తిండిలేదు. ఇంటికాడ అందరికి అందరం అకలికి చస్తానం’’ అంది మరింత దీనంగా...
‘‘దానికి నన్నేమి చెయ్యమంటవు?’’ అంటూ కసిరిండు.
అయినా అప్పాయమ్మ ఇంకా దీనంగా బ్రతిమిలాడుతుంది. కాని దాడి శ్రీను మనసు కరుగటం లేదు. బంకలా పట్టుకున్న ముసల్దాన్ని చూసి కోపానికి వచ్చిండు.
‘‘నీయవ్వ ముసల్దాన చెప్పుతాంటే నీకు కాదు... నీ అటువంటి దాన్ని పనిలకు తీస్కపోతే మా సేఠ్ నన్ను పనిలనుండి తీసేస్తడు’’ అంటూ విసురుగా ముసల్దాన్ని ప్రక్కకు తోసి మిగితా వాళ్ళను వెంట తీస్కపోయిండు.
అప్పాయమ్మ పరిస్థితి చూసినాగన్న మనసు చివుక్కుమన్నది. కాస్త కుడిఎమలుగా తన పరిస్థితి అలాగే ఉంది. తననే తోసేసినట్టుగా అన్పించి ఖిన్నుడై పోయిండు.
అప్యాయమ్మ కారు సముద్రం భార్య. అంతర్గాంమిల్లులో వీవింగ్ సెక్షన్లో పనిచేసేవాడు. బర్మా కాందిశీకుడుగా వచ్చిండు. మిల్లు మూత పడ్డ తరవాత కొన్ని రోజులు ఎన్టిపిసి క్యాంటిన్లో కూలీగా పనిచేసిండు. ఒక రోజు రాత్రి పనిచేసి వచ్చే క్రమంలో కలు జారి పెద్ద మోరిలో పడి చనిపోయిండు. అప్పటి నుండి వాళ్ళకు కష్టాలు మొదలైనవి. వారికి ఒక కూతురు ఉంది. దానికి పెండ్లి చేసిండు. ముగ్గురు పిల్లలైన తరువాత కూతురుకు ఏదో మాయ రోగం తాకి నానా అవస్థ పడి చనిపోయింది. దాని మొగడు పెండ్లాం పిల్లలను వదిలేసి మరో దాన్ని లేపుకొని ఎటో బ్రతక పోయిండు. ఇప్పుడు పిల్లలకు ఆధారం అప్పాయమ్మే. అమె పని చేస్తే ఎల్లినట్టు లేకుంటే లేదు.
‘‘ఎవరిని చూసిన బ్రతుకు ఒక్క తీరుగానే ఉంది. ఏం పాపం చేసుకున్నమో బ్రతుకు ఇట్లా కాలబడ్డది’’ అనుకొని నిట్టూర్చిండు.
దూరం నుండి కొంత మంది హౌజ్ బిల్డింగ్ కంట్రాక్లర్లు వస్తూ కనిపించిండ్లు. వాళ్ళంతా ప్రైవేటుగా ఇల్లుకట్టే వాళ్ళు. రోజువారి పనులతో పాటు ఏదైనా ‘స్లాబ్’ పనులు జరిగినప్పుడు అదనపు కూలీలు అవసరం పడుతారు. ఎండకాలం సీజన్లో అయితే ఇంటి నిర్మాణపు పనులు జోరుగా సాగుతాయి. అటువంటప్పుడు కూలీలకు చేతినిండా పని దొరుకతది.
ఇండ్ల నిర్మాణపు పనులు గుత్తకు తీసుకొని పని చేసే కాంట్రాక్టర్లు చాలా మంది ఆంధప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు. మాములుగా అయితే ఇండ్ల నిర్మాణం ఫీటుకు ఇంత అని కూలీ లెక్కకట్టి తీసుకుంటారు. మరికొంత మంది మొత్తం ఇంటి నిర్మాణం గుత్తకు తీసుకొని పన్జేస్తారు. ఇట్లా గుత్తకు పట్టినవాళ్ళు తోటి కూలీలతో పాటు తాము కూడా పన్జేస్తారు. మరికొంత మంది రెండు మూడు దిక్కుల పని ఉంటే వాటి సూపర్వైజ్ చేస్తూంటారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు తమతో పాటు కూలీలను కూడా వెంట తెచ్చుకుంటారు. ఇక్కడి వాళ్ళయితే సరిగా పని చెయ్యరని వాళ్ళకో నమ్మకం. ఏ బిల్డంగ్లకు స్లాబులు పోయటం వంటి అదనపు పనులు పడ్డప్పుడు కూలీ అడ్డ మీదికి వచ్చి అవసరమైన కూలీలను అపూటకు తీస్కపోతరు.
వాళ్ళను చూసి మిగిలిన కూలీలల్లో ఆశలు రేగినవి. అట్లావచ్చిన వాళ్ళు పాతిక ముప్పయి మందిని ఏరుకొని వెంట తీస్కపోయిండ్లు.
ఈ సారి కూడా నాగన్న పని ఉత్తదే అయింది. కాంట్రాక్టర్లు ఎవరు తనవైపు చూడనైన చూడలేదు. వెనక్కి చేతులు కట్టుకొని ఎవరైనా కూలీకి పిలుస్తారమోనని ఆశగా చూసిండు. కాని ఎవరు పిలువలేదు.
ఎన్టీపిసిలోని పచ్చగా, గుబురుగా అకాశంలోకి ఎదిగిన చెట్లపైనుండి సూర్యుడు ఎగబాకుతున్నాడు. రోడ్డుమీద వాహనాల రోద పెరిగింది. రోడ్డు అవలవైపున కూరగాయలమ్మెకాడ జన సంచారం ఎక్కవైంది. రోడ్డు ప్రక్క చాయ్ అమ్మేవాడు నాలుగు గీరల బండి తీసుకొచ్చి సామాన్లు సర్దుకుంటాండు.
‘‘ఇక లాభం లేదు ఇవ్వాళ కూడా పని దొరికేట్టు లేదు’’ అంటూ దగ్గర వచ్చిండో ఓ వ్యక్తి... ఆయన మొఖంలో నిరాశ నిస్పృహలు కనిపించినవి.
నాగన్న అతనికేసి పరీక్షగా చూసిండు. కాస్త వయస్సు మళ్ళిన వాడు, నలుబై యాబై ఏండ్ల మధ్య వయస్కుడు. పీక్కపోయిన నల్లటి మొఖం. మొలకు పంచే కట్టుకొని పైన ‘బుషట్’ వేసుకొని ఉన్నాడు. సగం నెరిసిన తల... చేతిలో చెయ్యి సంచి ఉంది. బహుశా అందులో సద్ది తెచ్చుకున్నట్టుంది.
‘‘ఎక్కడి నుంచి వచ్చినవు?’’ అని అడిగిండు నాగన్న...
‘‘పారుపల్లి’’
‘‘అంటే మంథని దగ్గర పారుపెల్లా?’’
‘‘అవును’’
‘‘అంత దూరం నుంచి వచ్చినవా?’’ అంటూ నాగన్న అశ్చర్యపోయిండు.
‘‘మరి ఏం చెయ్యాలి... పనులేమి లేవు. బ్రతకటం కష్టమైతాంది.. ఇక్కడ కూలీపనులు దొరుకుతయంటే వచ్చుడైతాంది’’ అన్నాడు బాధగా..
‘‘ఇది వరకు ఏం పని చేసినవు?’’
‘‘వ్యవసాయం’’
‘‘మరి వ్యవసాయం చేసినోడివి గీ పనిలకు ఎందుకొచ్చినవు? వ్యవసాయం నడువటం లేదా?’’
‘‘కిందికో మీదికో మాగ నడుస్తుండే’’ అంటూ అతను అర్దోక్తిలో అగిపోయి దూరంగా ఎటో చూస్తుండిపోయిండు.
‘‘ఇప్పుడేమైంది?’’ అంటూ నాగన్న మాట పొడిగించిండు.
అతను భారంగా నిట్టూర్చిండు... క్షణకాలం ఏం మాట్లాడకుండా నిలువు గుడ్లేసుకొని బీరిపోయిండు. కండ్లలో ఏదో తడి... కాసేపటికి తేరుకొని చెప్పసాగిండు.
‘‘నాకు రెండు ఎకరాల చెలక ఉండేది. అందులో ఇంత మక్కలో, పెసర్లో వేసుకొని కాలం గడుపుకొస్తుంటి. పని పాటలేనప్పుడు బావులు తవ్వపోయ్యేది. నా పెండ్లం యింత కూలినాలి చేసేది. అట్లనో ఇట్లనో బ్రతుకు వెళ్ళేది’’
‘‘మరిప్పుడేమైంది?’’
ఎర్రటి ఎండ మొఖం మీద పడ్తుంటే అతను మరోసారి భారంగా నిట్టూర్చి ‘‘నా భూమి నాకు కాకుండా పోయింది’’ అన్నాడు భారంగా...
‘‘అదే...?’’
విషాదం అలుముకున్న మొఖంతో అతను మళ్ళీ చెప్పసాగిండు.
‘‘అ భూమి మా అయ్య ఇచ్చిందికాదు. ఆయన బ్రతుకంతా దొర దగ్గర పాలేరుగానే గడిచింది. ఆయన బ్రతికి ఉన్నప్పుడు మన కంటూ గుంటెడు భూమి ఉండాలని బమిసే వాడు. కాని ఆయన జీవితంలో ఆ కోరిక తీరకుండానే పోయిండు’’
‘‘మరైతే ఆ భూమి ఎట్లా వచ్చింది. నువ్వు సంపాదించుకున్నవా...?’’
అతన మొఖం ఒక్కసారిగా గంభీరమైంది. దృఢమైన స్వరంతో ‘అవును నేనే సంపాదించుకున్నా’ అన్నాడు.
‘‘ఎట్లా?’’
‘‘ఎట్లా అంటే ఏం చెప్పాలి?’’ అంటూ నిట్టూర్చి మళ్ళీ చెప్పసాగిండు.
‘‘ముప్పయేండ్ల క్రిందటి మాట... మా ఊర్లెకు అన్నలు వచ్చిండ్లు. ఊళ్ళో సంఘం పుట్టింది. అంత వరదాక దొర కబ్జాలో ఉన్న పొరంబోకు దొరల భూమిని స్వాధీనం చేసుకొని భూమిలేని పేదోళ్ళకు పంచిండ్లు... అట్లా నా పేరట రెండు ఎకరాలు వచ్చినవి’’ అన్నాడు.
నాగన్నలో ఆసక్తి రేగింది. తన ఊరిలో నాగన్నకు వారసత్వంగా ఎకరమంతా భూమి వచ్చింది. కూలీనాలి చేసుకొని మరో ఎకరం కొనుక్కుంటే హాయిగా వచ్చి ఊర్లో వ్యవసాయం చేసుకంటూ బ్రతక వచ్చని కలగన్నడు. కాని ఆ కల నేరవేరలేదు. అయినా భూమి మీద మమకారం చావక అది అట్లాగే ఉంచిండు. వాళ్ళు వీళ్ళు నాగన్న నువ్వు వచ్చి ఇప్పటికే ముప్పయేండ్లు గడిచిపాయే...ఇక నువ్వుపోయి మళ్ళీ వ్యవసాయం చేసేదెప్పుడు? ఉత్తగా పడావు పెట్టుడెందుకు? ఆయింత అమ్మకపోయినవా?’’ అని అన్నప్పుడు నాగన్న ‘‘భూమిని ఎవరైనా అమ్ముకుంటరా... నేను కాకుంటే ఎప్పుడో నా పిల్లలకు అక్కరకు రాకపోద్దా?’’ అని భూమిని అమ్మకుండా అట్టే పెట్టిండు. అలోచన నుండి తేరుకున్న నాగయ్య తర్వాత ‘‘ఏమైంది?’’ అని అడిగిండు.
‘‘చాన లొల్లులు జరిగినయి. దొర కోపానికి వచ్చి పోలీసులను తెచ్చిండు. కొట్లాటలు కేసులు జరిగినయి. అయినా భూమిని వదిలేది లేదంటూ సంఘం తీర్మానం చేసింది’’ అంటూ క్షణ మాగిండు. బాధతో గొంతు వణుకగా మళ్ళీ చెప్పసాగిండు.
‘‘సంఘంలో చురుగ్గా తిర్గే మాదిగ సాయన్న కొడుకు కొమురయ్య సంఘం నాయకుడుగా ఉన్నప్పుడు అంతా బాగానే జర్గింది. ఎప్పుడైతే పోలీసులు ఓ దొంగ రాత్రి వచ్చి కొమురయ్యను పట్టుకొని చెఱువు కట్టకాడ కాల్చిచంపిండ్లు. అయినా సంఘం ఎనకడుగు వెయ్యలేదు. అంత కంత ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించి దొర ఇంటిమీద ఊరోల్లంతా పోయి దాడి చేసిండ్లు. ఆ సంగతి దొర కెట్లా తెలిసిందో కాని తెలిసింది. రాత్రికి రాత్రే తట్ట బుట్ట పట్టుకొని పట్నం పారిపోయిండు. అటు తరువాత మళ్ళీ ఊరు మొఖం చూడలేదు’’ అంటూ భారంగా నిట్టూర్చిండు. దూరంగా దృష్టి సారించి మళ్ళీ చెప్పసాగిండు.
‘‘కాలం కలిసిరాలే... ఏండ్లకు ఏండ్లు ఎదురులేకుండా దొరతనం చెలాయించుకున్న దొరలు ఊళ్ళు విడిచి దెంక పోయే సరికి ప్రభుత్వం ఊళ్లమీదికి పోలీసులను పంపింది. గొర్రెల మంద మీద తోడేల్లు పడ్డట్టు పోలీసులు బారు తుపాకులు వేసుకొని ఊర్ల మీద పడి అయినొన్ని కానోన్ని కాల్చిచంపిండ్లు.. మొత్తానికి ఏమైతేనిమి ప్రభుత్వంది పై చెయ్యి అయ్యింది’’ అన్నాడు.
‘‘మరి ఆక్రమించుకున్న భూముల సంగతి ఏమైంది?’’ అన్నాడు నాగన్న. ఆసక్తిగా అతను మళ్లీ చెప్పసాగిండు.
‘‘కొన్ని దిక్కుల దొరలు పోలీసులను పట్టుకొచ్చి వాళ్ళ భూములు వాళ్ళు లాక్కున్నరు. మరికొన్ని ఊర్లల్ల పడావు పడ్డయి. కాని మా ఊర్లే మాత్రం ఆక్రమించుకున్న భూమిని వదలలేదు. సాయన్న కొడుకు కొమురయ్య పేరు మీదమేం ఆక్రమించుకున్న భూమిల స్థూపం కట్టినం. అందరికి అందరం ప్రాణాలు పోయిన భూమిని వదిలేది లేదనుకొని ఇన్నేండ్లు సాగు చేసుకున్నం’’ అన్నాడు.
‘‘ఇప్పుడేమైంది?’’
‘‘ఏం చెప్పాలే... అటు తరువాత తెలంగాణ లొల్లి వచ్చింది. తెలంగాణ వస్తే బ్రతుకులు బాగు పడ్తయని పోరగాండ్లకు ఉద్యోగాలు వస్తయని చిన్నా పెద్ద, ముసలి ముతక అనుకుంటూ తెలంగాణ లొల్లిలో పాల్గొన్నం... కాని తెలంగాణైతే వచ్చింది కాని మా బ్రతుకుల మన్ను పోసింది’’ అన్నాడు అవేశపడిపోయి...
‘‘ఏమైంది?’’
‘‘ఆ మధ్యన ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని రైతు బందు పథకం పెట్టింది. అబ్బో, మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని సంబర పడ్డం. కాని వాడు ఎరవేసి చాపను లాగుతాండని ఊహించలేదు’’ అన్నాడు బాధగా...
ఆయన మాటల కోసం నాగన్న ఆసక్తిగా చూసిండు అతను మళ్ళీ చెప్పసాగిండు.
‘‘మేం దొరల భూములు ఆక్రమించుకొని ఇరువై ఏండ్లుగా సాగు అయితే చేసుకుంటానం. కాని అ భూముల మీద పట్టా మా పేరు మీద లేదు. ఇంకా దొరల పేరు మీదే ఉంది. ఎప్పుడైతే రైతు బందు పథకం వచ్చి పట్టాదారులకు పైసలు పంచిందో ఆ పైసలన్నీ దొరకు ముట్ట చెప్పింది. భూములను మళ్ళీ దొరపేరు మీద మార్చిండ్లు’’ అన్నాడు.
‘‘మారిస్తే ఏమైంది?’’
‘‘ఎనకటి లెక్కన సంఘాలు లేవు. అన్నలు లేరు. అడిగే వాడు లేడు... దాంతో దొర పోలీసులను వెంటేసుకొని వచ్చి నా భూమిని మీరెట్లా సాగుచేస్తరని బలవంతంగా ఆక్రమించుకున్నడు. మేం ఎంతో ప్రేమతో కట్టుకున్న కొమురన్న స్థూపాన్ని బుల్డోజర్తో కూల్చివేసి భూమి చుట్టూ కంచె వేసుకున్నాడు’’ అన్నాడు బాధగా...
అదంతా విన్న నాగన్న మనసు కలత చెందింది. ఇంత పోరాటం చేసి ఇన్ని త్యాగాలు చేసినా బ్రతుకు మళ్ళీ మొదటికి వచ్చింది కదా అన్న బాధ కల్గింది. ఆ బాధలో అప్రయత్నంగానే
‘‘ఎవన్ని నమ్మెతట్టు లేదు. నమ్మించి గొంతులు కోస్తాండ్లు’’ అన్నాడు బాధగా...
అప్పటికి కూలి కోసం వచ్చిన వాళ్ళు నిస్పృహగా ఎటోల్లు అటు వెళ్ళిపోతాండ్లు...
‘‘అన్నా ఇక నేను పోతా’’ అన్నాడు అతను...
‘‘మళ్ళీ రేపు వస్తవా?’’
‘‘వచ్చి ఏం చెయ్యాలి... చార్జీలు దండగైతనయి. అక్కడే ఏదైనా పని చూసుకుంటా..’’ అంటూ అతను దూరంగా బస్సు వస్తున్నది కనిపెట్టి, వడివడిగా అడుగులు వేసుకుంటూ పరుగు పెట్టిండు..
(తరువాయి భాగం వచ్చే సంచికలో)
Aug 2022
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు