నవలలు

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

కూలి బతుకులు – ఏడవ భాగం 

కూలి బతుకులు ఏడవ   భాగం

(కూలి బతుకులు  నవల  గత సంచిక తరువాయి భాగం )     

                                                                                   7                                                                        

            ఒక రోజు పొద్దున్నె నాగయ్య కంట్రాక్టర్‍ లక్ష్మన్‍ కలువటానికి పోయిండు. ఆయన ఉండేది గోదావరిఖనిలోని మార్కెండేయకాలనీ.

            గోదావరిఖని బొగ్గు గని కార్మికులు ఉండే పారిశ్రామిక ప్రాంతం. కార్మికులు పని చేసే బొగ్గు గనులు చాల వరకు దూర ప్రాంతంలో విసిరి వేసినట్టుగా ఉండటం వలన అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండే గోదావరిఖని పట్టణంలోనే ఎక్కువ మంది కార్మికులు నివాసం ఉండి డ్యూటీలకు పోయి వస్తుంటారు. కంపని క్వార్టర్‍ ఉన్నా కొద్ది మంది తప్ప మేజార్టీ కార్మికులకు దొరవు. దాంతో ఎక్కడిక కాస్తంతా ఖాళీ స్థలం దొరికితే అక్కడల్లా కార్మికులు గుడిసెలు వేసుకున్నారు. అట్లా ఇందిరానగర్‍ తిలక్‍నగర్‍, బాపుజీనగర్‍ అంటూ దేశంలోని ప్రముఖలపేరుమీద దాదాపు పాతిక ముప్పయి వాడలున్నాయి. ఇటివల ఫైవ్‍ ఇంక్లయిన్‍ మోరికి అవల వైపున కేసిఆర్‍ పేరు మీద కూడాఒక వాడ వెలిసింది.

            పట్టణంలోని చౌరస్తా మీదుగా పైకిపోతే బస్టాండు వస్తుంది. బస్టాండుకు పోయ్యేతోవలో ఎడమ వైపున రాజెష్‍ టాకీసు ఉంది. దాని ప్రక్కనుండి పోయ్యే రోడ్డు మార్కెండెయ కాలనీ మీదగా ఇంకా పైకి పోయేదుంటే మూత పడిన ఎఫ్‍సిఐకి పోతుంది. చౌరస్తాకు ఎడమవైపు రోడ్డు గోదావరిఖనిలో అతిపెద్ద బిజినెస్‍ సెంటర్‍ అయిన లక్ష్మినగర్‍కు పోతుంది. మార్కెండేయ కాలనీ మిగితా కాలనీలకంటే కాస్త బిన్నమైంది.

            ఇతర కాలనీలన్ని గుదిగుచ్చినట్టుగా ఇరుకు ఇరుకుగా మురికి మురికిగా ఉంటే మార్కెండయ కాలని మాత్రం తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది. అక్కడ ఎక్కువగా కాలేజి విధ్యాసంస్థలు ఉన్నాయి. దానికి తోడు ఇటివల కాలంలో సంపన్న వర్గాలుగా ఎదిగిన వాళ్ళు రాజకియంగా ఎదిగినవాళ్ళు ఎక్కువ మంది అప్రాంతంలో ఇండ్లు కట్టుకోవటంతో దాని స్వరుపం మారిపోయింది.

            నాగయ్యకు లక్ష్మన్‍ మార్కెండెయా కాలనీలో ఉంటాడని తెలుసుకాని ఎక్కడ ఉంటడో తెలియదు. అక్కడికి పోయిన తరువాత ఎవరినైనా అడుగుతే చెప్పక పోతారా అన్న ధైర్యంతో బయలు దేరిండు. దానికి తోడు వెంకటయ్య ‘‘పొద్దున్నే ఎడుగంటటలోపు పోయ్యికలువు లేకుంటే దొరకడు పన్లపడుతడు’’ అని చెప్పిండు. అందుకే చీకటి తోని బయలు దేరి వచ్చిండు.

            కాలనీలోని ఇండ్లన్ని చాల వరకు ఇటివల కాలంలో కట్టుకున్నవి. ఏ ఇల్లుకు ఆ ఇల్లు ప్రత్యెకంగా తీర్చి దిద్దినట్టుగా ఉన్నవి. అక్కడికి కూత వెటు దూరంలోనే పికేరామయ్య కాలనీ ఉంది.కాని చాల రోజులుగా నాగయ్య అటు వూపు రాలేదు. అంత అవసరం కల్గలేదు. ఇప్పుడు చూస్తే ఇంతలో ఎంత మారి పోయింది. అనుకున్నడు.

            రోడ్డువారి న ఒక చిన్న డాబా హోటల్‍ ముందాగి ఆ హోటల్‍ అతన్ని లక్ష్మన్‍ గురించి అడిగిండు. హోటల్‍ అతను మరుగుతున్న చాయ్‍ కలుపుతూ...

            ఇక్కడ చాల మంద లక్ష్మన్‍లున్నారు ఏ లక్ష్మణ్‍’’ అన్నాడు.

            నాగయ్యకు ఒక్కక్షణం ఏం చెప్పాలో అర్థంకాక’’ అందే బిల్డింగ్‍లు కట్టి కంట్రాక్టు పనులు చేస్తడు అ లక్ష్మణ్‍’’ అన్నాడు.

            ‘‘ఎర్రగుంటడు’’ ఆయనా అన్నాడు హోటల్‍వాడు.

            వెంకటయ్య కూలి సంఘం వదిలి పోయిన తరువాత నాగయ్య లక్ష్మణ్‍ను చూడలేదు. బక్కగా పొడుగ్గా ఎర్రగా ఉండే లక్ష్మణ్‍ గుర్తుకు వచ్చి’’ అవును అయనే’’ అన్నాడు.

            ‘‘అదిగో అక్కడ కరెంటు స్థంబం ఉంది చూడు, అక్కడ కుడివైపు సంది ఉంటది. అ సందిలో రెండో ఇల్లే’’ అంటూ హోటల్‍ అతను చెయ్యెత్తి అటు వైపు చూయించిండు.

            నాగయ్య అటువైపు కదిలి సందు తిరిగి రెండు ఇల్లుకున్న గేటు ముందు నిలిచిండు. గేటు మూసేసి ఉంది. ఇదే ఇల్లు అవునో కాదో ఎట్లా తెలియాలిఅని గుంబాటన పడుతూనే అ సందిలో ఎదురైన ఓ వ్యక్తిని లక్ష్మణ్‍ ఇల్లు ఇదేనా’’ అని అడిగిండు.

            అతను అవునన్నట్టుగా తలాడించి ముందుకు పోయిండు.

            నాగయ్య చిన్నగా గేటుతోసుకొని లోపలికి పోయిండు. బయటనుండి చూస్తే పెద్దగా స్థలంలేనట్టు అన్పించినా లోపల విశాలంగా ఉంది. రెండు అంతస్థుల డాబా ఇల్లు కొత్తగా వేసిన రంగులతో మెరిసిపోతుంది.

            నాగయ్య లోపట అడుగు పెట్టెసరికి అప్పటికే తయారైన లక్ష్మణ్‍ ముందు వసార బూట్లు తొడుక్కుంటు కన్పించిండు. తెల్లటి సలువ బట్టల్లో మెరిసి పోతున్నాడు. అప్పుడెప్పుడో చూసిన లక్ష్మణ్‍ ఇప్పటి లక్ష్మణ్‍కు పోలికే లేదు. అప్పుడు చురుకైన చూపులతో బక్కగా ఉండే లక్ష్మణ్‍ ఇప••డు కాస్త వొళ్ళు చేసి నిగనిగలాడుతున్నాడు.

            నాగయ్య లోనికి వస్తున్నది కనిపెట్టి, రారా నాగయ్య చాల రోజులాయే నిన్ను చూసి అంటూ నిండుగా నవ్విండు.

            లక్ష్మణ్‍ అప్యాయంగా పలకరిచే సరికి నాగయ్యకు అంత వరకు ఉన్న బెరికి పోయింది.

            ‘‘రాట్లా కూచో’’ అంటూ లక్ష్మణ్‍ కుర్చి చూయించిండు.

            నాగయ్య వచ్చి కూచోగానే ‘‘మన్నొల్లంతా బాగున్నరా’’ అన్నాడు నవ్వుతూ...

            నాగయ్యకు ఏం చెప్పాలో అర్థంకాక అన్నాడు ముక్తాసరిగా....

            అక్ష్మయ్య ఎనకటి రోజులు తలుచుకొని ‘‘ఒక విదంగా అ రోజులే బాగుండేవి. పైసలకు కటకట లాడినా! ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండేది. డీ అంటే డీ అనేది. ఏ ఒక్కరికి అపద వచ్చినా అందరం కదిలేది. కాని ఇప్పుడేముది. ఎవనిలోకం వానిది. ప్రక్కన ఉన్నొడు సచ్చిన పట్టించుకొవటం లేదు. ఎవడో ఎట్లా సచ్చిన మనం బ్రతికితే చాలు అనుకుంటాండ్లు’’ అన్నాడు బాధగా...

            ‘‘మన సంఘంల తరిగే ఓదెలు మెన్న చనిపోయిండు తెలుసా’’ అన్నాడు మళ్ళి..

            ‘‘ఏ ఓదేలు’’

            ‘‘అదే కూలీల మీద పాటలు వ్రాసేవాడు’’

            నాగయ్యకు గుర్తుకు వచ్చింది. ఓదెలు పెద్దగా చదువుకోలేదు. కాని, ఆయన వ్రాసిన పాటలు ఎంత అద్భుతంగా ఉండేవి. కూలీల పీవితాలను వాళ్ళ అశలను అకాంక్షలను కళ్ళ ముందు నిలిపి మనసును కదిలించేవాడు. ఓదెలు సన్నని జీరగొంతులో అ పాటలుఒక్క సారి మనసులో సుళ్ళు తిరిగింది.

            ‘‘ఎట్లా సచ్చిపోయిండట’’

            ‘‘ఎట్లా సచ్చిండు అంటే ఏం చెప్పుతం పేదరికం కంటే పెద్ద రోగం ఏముది. పనులు వేవాయే... చేయ్యకుంటేనో బ్రతుకు ఎల్లదాయే ఎదో పని చేసుకుందువు రారా అన్న... నాల్గు రోజులు వచ్చిండు. మళ్ళీ ఎమైందో ఎమో పత్తలేడు’’ నేను పన్లోపడి వాన్ని పట్టించుకోలే. అన్నాడు విచారంగా...

            మళ్ళితానే ‘‘మొన్న చనిపోయిండని తెలుసి వాడు ఉండే కాకతీయ నగర్‍కు పోయిన. పోయ్యే సరికి ఏముంది. ఇంటి ముందు శవాన్ని వేసిండ్లు. వాని భార్య ముగ్గురు పిల్లలు ఒక దిక్కు ఎడుస్తాండ్లు.. దహనం చేస్తామంటే ఇంట్లో చిల్లిగవ్వలేదు. బాదేసింది. మనోల్లను విచారించి కార్యక్రమం నిర్వహించమని చెప్పి పదివేలు ఇచ్చి వచ్చిన’’ అన్నాడు కండ్లు చమర్చుగా...

            ఆ రోజుల్లో చంద్రయ్య, లక్ష్మణ్‍, ఓదేలు ఒక జట్టుగా తిరిగేది. యువకులు దేన్ని లెక్క చెయ్యని మొండితనంతో ఏ చిన్న అన్యాయం అనిపించినా ముందునిలిచే వాళ్లు. అదరి తలలో నాలుకలా ఉండే వాళ్ళు. ఏ పని పడ్డా ముందు పడే వాళ్లు.

            విచారం నుండి తెరుకొన్న లక్ష్మణ్‍ ఏం చెద్దాం కాలం అట్లా గడిచి పోయింది. చంద్రన్న లాగా అన్ని తెగించలేక పోయిన, ఓదెన్న బ్రతకలేక పోయిన కూలిపనులు చేస్తూ మెల్లగా ఇండ్లు గుత్తకు తీసుకొని పనులు చేసిన, అట్లనే ఇప్పుడు బిల్డింగ్‍లు కడుతున్న నాలుగు పైసలైతే సంసాదించిన కాని మునపటి తృప్తిలేదు’’ అన్నాడు.

            ఇంతసంపాదించిన మనిషితను చంపుకోలేని లక్ష్మణ్‍ చూసి నాగయ్యకు అశ్చర్యం అన్పించింది.

            ఉండి ఉండి లక్ష్మణ్‍ అన్నాడు కదా’’ మొన్న వెంకటన్న కన్పించనప్పుడు నీ విషయం చెప్పిండు. సరే అన్న నువ్వు వస్తవేమోనని నిన్న మొన్న చూసిన... ఇవ్వాళ వచ్చినవు’’ సరే ఏం పని చేస్తవు’’ అని అడిగిండు.

            ‘‘ఇండ్లకు ఎల్తలేదు...ఏ పనైనా చేస్తా’’

            లక్ష్మణ్‍ సాలోచనగా దృష్టిసారించి’’ పెద్ద మనిషివైనవు ఇప్పుడేం పని చెస్తవు కాని ఒకపని చెయ్యి.. ప్రగతి నగర్‍లో అపార్టుమెంటు పని నడుస్తాంది... అక్కడ వాచ్‍మన్‍ పనిచేస్తవా’’

            ‘‘చేస్తా’’

            ‘‘నెలకు అరువెలు ఇస్తా.. అరేడు నెల్లపని ఉంటది. కాకుంటే ఈ మధ్య దొంగలు ఎక్కువైండ్లు... మనం ఇట్లా కన్ను ముస్తే చాలు అట్లా వస్తువులు మాయం అవుతున్నాయి. సామన్లు పోకుంటా జాగ్రత్తగాచూసుకోవాలి. ప్రతిరోజు పొద్దున, సాయంత్రం నీళ్ళు కొట్టాలి’’ పొద్దున్నె మెస్త్రీ యాదగిరి వస్తడు. ఆయనే అన్ని పనులు చూసుకుంటడు అ సమయంలో నువు ఇంటికి పోయి తిని మళ్ళి సాయంత్రానికి టిపిన్‍ పట్టుకొని రావాలి’’ అంటూ ఇరువై నాలుగు  గంటలు అక్కడే ఉండాలి. అందుకు నీకు ఇష్‍టమైతే రేపు పొద్దున సైట్‍ మీదికి రా. పదిగంటలకు నేను వస్తా’’ అన్నాడు.

            నాగయ్యకు అదేమహబాగ్యం అన్పించింది. ‘‘సరే’’ అన్నాడు.

            ‘‘నాకు వేరే పని ఉంది. రేపు సైట్‍ కాడకలుస్తా’’ అంటూ లక్ష్మణ్‍ తన మోటారు సైకిల్‍ స్టార్టు చేసిండు.

            ఒకప్పుడు రామగుండం మేజర్‍ గ్రామపంచాయితీగా ఉండేది తరువాత మున్సిపాట్టిగా మారింది. దానికి తోడు గోదావరిఖని, ఎన్టిపిసి టౌన్‍షిప్‍ అంత కలగలిసి పోయింది. పారిశ్రామిక ప్రాంతం విస్తరించి, జన సాంద్రత పెరిగిపోయి రామగుండంమున్సిపాల్టీ కాస్త గ్రెటర్‍ మున్సిపాల్టీగా మారిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భూములకు విలువ పెరిగింది. మధ్య తరగతిజనం భూములుకొని, ఇల్లు కట్టుకోవటం అనేది గగనకుసుమం అయ్యింది. అపార్టు మెంటు కల్చర్‍ వచ్చింది.

            ఎన్టిపిసి మీదుగా గోదావరిఖనికి పోయే నేషనల్‍ హైవేకు ఎడమ వైపున మెయిన్‍రోడ్డుకు అనుకొని ప్రగతి నగర్‍ కాలని వెలిసింది. ఒకప్పుడు అక్కడంతా ఖాళీస్థలం ఉండేది కాని ఇప్పుడు అక్కడ భూముల ధరలు అగ్గయి మండుతనయి. మధ్య తరగతికి అందు బాటులో లేకుండా పోయింది. ఇప్పుడా రోడ్డులో కిలో మీటర్‍ పోతే లక్ష్మణ్‍ నిర్మిస్తున్న ప్రగతి నగర్‍ అపార్టుమెంటు వస్తుంది. అపైన ఇంకాస్త ముందుకు పోతే గొధావరినది వస్తుంది. నదికి అపార్టుమెంటుకు మధ్య దాదాపు  రెండు కిలోమీటర్ల దూరం ఉంది. భవిష్యత్‍ను పట్టణం అటువైపు కూడా విస్తరించే అవకాశం ఉంది.

            వాచ్‍మన్‍ డ్యూటిలో నాగయ్యకు పెద్దగా పని ఉండదు. కాకుంటే బిల్డింగ్‍ నిర్మాణం కోసం ఉపయోగించే సిమెంటు, ఇనుప సామాన్లు, కర్రలు వంటివి ఎవరు ఎత్తుక పోకుండా నిగరాణఉండాలి. దొంగలేమో కన్నుమతి పరిస్తే చాలు ఇనుపసామన్లు మాయం చేస్తాండ్లు. దాంతో రాత్రుల్లు దొంగల బయానికి నిదుర కాయాల్సిన వచ్చేది.

            లక్ష్మణ్‍ వాచ్‍మన్‍ ఉండటానికి ఒక గుడిసే వేసిండు. అందులో కరెంటు పెట్టిండు. మొదట్లా అగుడిసెలో ఒక వైపు సిమెంటు బస్తాలు స్టోర్‍ చేసేవాళ్ళు, కాని అటు తరువాత గ్రౌండ్‍ప్లోర్‍ స్లాబ్‍ పడిన తరువాత సిమెంట్‍ బస్తాలను అక్కడ నిలువ చేయటం మొదలైంది. దాంతో అంత వరదాక సామన్లతో ఇరుగ్గా ఉన్న గుడిసే కాస్త విశాలమైంది.

            పొద్దున పనొల్లు వచ్చే వరకు అక్కడ ఉండి, పనిస్టార్టు అయిన తరువాత మెస్త్రీ యాదగిరికి చెప్పి ఇంటికి బయలు దేరివస్తడు. వచ్చి స్నానం గిట్లా చేసి ఇంత అన్నం తిని టిఫిన్‍ పట్టుకొనిపోతే మళ్ళి మరునాడే ఇంటికి వచ్చేది.

            మొదట్లో శాంతమ్మ ‘‘ఏపనోఎమో పోయిన గుత్తా మళ్ళి రేపటి దాక కన్పించేది లేదాయే’’ అంటూ సణిగింది. ఎందుకంటే నాగయ్య పనిలకు పోయిన తరువాత రోజంతా అమె ఒక్కతే ఉండాలి. పోనియ్‍ ఆమె కూడా పోయి అక్కడే ఉందామంటే పిల్లగాడు (శ్రీను) ఉండే వానికి వండి పెట్టాల్నా.. ఈయన వచ్చెసరికి తిండికి ఎర్పాట్లు చేయాల్నాయే దాంతో ఆమె సతమతమైంది.

            ‘‘పనిపాట లేక ఇంటికాడ ఉండి ఏంచేస్తా... ఆ ఉండేది ఎదో అక్కడే ఉంటే రోజుకు రెండు వందలు ఇవ్వబట్టె’’ అన్న నాగయ్య మాటలు శాంతమ్మకు నిజమే అన్పించింది. పైసలు లేకుంటేనెమో ఎల్లుతలేదాయో.. శ్రీనుకు వచ్చె ఎనిమిది వేలు ఎటు సరిపోతలేవు. దాంతో ఆమె సర్దుకపోయింది.

            కాలం గడిచే కొద్ది నిర్మాణపు పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రతిరోజు వందలాది మంది కూలీలు వచ్చి పనిచేస్తాండ్లు. యాదగిరి మెస్త్రీ దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటాడు. కంట్రాక్టరు లక్ష్మణ్‍ రోజు పొద్దుమాపు వచ్చి పనులు చూసుకొని పోతాడు. అట్లా వచ్చినప్పుడు ఒక్క సారన్న కనిపించకపోతే ఎట్లా అనుకొని నాగయ్య ఇప్పుడు ఎక్కువ సమయం సైట్‍కాడే ఉంటున్నాడు. లక్ష్మణ్‍ వచ్చినప్పుడు మొఖం చాటేసుకోకుండా లక్ష్మణ్‍ మంచిగ పలుకరిస్తరు. అట్లాపలరించే సరికి నాగయ్యకు ఎంతో ఉత్సాహం అన్పించేది. దాంతో ఆయన పని బాగా ఉంటే ఒక్కొక్కసారి ఇంటికి కూడా పోకపోయేది. అటువంప్పుడు అ తిండి వ్యవహరాలేవో కంట్రాక్టరే చూసేవాడు. ఎప్పుడైనా ఇంటికి పోయినా అక్కడ ఎమైతాందోనని తొందరగా తిర్గి వచ్చేవాడు.

            పని జోరందుకొని స్లాబ్‍ మీద స్లాబ్‍ పడేసరికి వాటికి నీళ్ళు కొట్టెపని కూడా ఎక్కువై క్షణం రికామిలేకుండా పోతుంది. దానికి తోడు దొంగలు కూడా తెలివి మిరిపోయి ఎదన్న ఎమరు పాటు ఉంటే చాలు.. ఎదో ఒకటే మాయంచేస్తాండ్లు. అటువంటి ఒకటి రెండు సంఘాటనలు జరిగిన తరువాత ఒసారి లక్ష్మణ్‍ మందలించిండు కూడా...

            దాంతో నాగయ్య ఎక్కువ సమయం సైట్‍ మీదే ఉండి పోవల్సి వస్తుంది.

            నాగయ్య ఒక రోజు ఉదయం ఇంటికి వచ్చే సరికి వాళ్ళ ఇంటికి నాల్గిండ్ల అవల జనం గుమికూడి ఉన్నారు.

            ‘‘ఎమైంది’’ అని భార్యను అడిగిండు.

            ‘‘ఆదినారయణ రాత్రి చనిపోయిండు’’ అంది...

            ‘‘అయ్యో ఎట్లా’’

            ‘‘ఎట్లా అంటే ఏం చెప్పుతం.. వాడికి తాగుడు తప్ప వేరే లోకం లేకపాయే... ఎం తిన్నడోలేదో... ఏ రాత్రి సచ్చిండో ఎమో పొద్దున్నే ఎవరో చూసే సరికి మనిషికట్టె సరుసుక పోయిండు.’’

            ఇంట్లోకి అడుగు పెట్టకుండానే నాగయ్య అటువైపు నడిచిండు.

            మనసులో ఎన్నో అలోచనాలు...సికే రామయ్య కాలనీలో చావులు కొత్తకాదు. తిండి లేక మలమల మాడి సచ్చే వాళ్ళు పనులు లేక సచ్చేవాళ్ళు ఒకరా ఇద్దరా! బొగ్గు బంకర్‍ కాడ పనిచేసే చిన్నులాల్‍ అంత ఇరువై ఎండ్ల యువకుడు బొగ్గు వాని ఊపిరితిత్తులను తినేసింది. టి.బి. లాంటి రోగమెదో వచ్చి నవిసి నవిసి చనిపోయిండు. బ్రతుకు దామని ఎక్కడి నుంచో వచ్చిండు. కాని చచ్చిన తరువాత వాని శవం అయిన వాళ్ళకు చేరలేదు. ఇక్కడే అందరు కలిసి బొందపెట్టిండ్లు. అంత్మరాం మిల్లు మూత పడ్డ తరువాత బ్రతుకు తెరువు లేక చాల మంది అకలి చావులు సచ్చిండ్లు. యువకుడైన అనంద్‍ ఉరేసుకున్నాడు. శివరావు, పోలారపు రాజు ఇలా ఎంతో మంది తమ కండ్ల ముందే అర్థంతరంగా చనిపోయింది గుర్తుకు వచ్చి మనసుకు బాదేసింది.

             ఆదినారాయణ శవం ఇంటి ముందున్న యాపచెట్టు క్రింద చాప పరిచి అందులో పండుకోబెట్టి పాత దుప్పటి ఒకటి కప్పిండ్లు. ఎప్పుడు చనిపోయిండో ఎమో కాని కండ్లు బూసులు తెలి మనిషి పచ్చబారి పోయిండు. దూరం దూరంగా నిలుచున్న అడోళ్ళు కొంగు మూతికి అడ్డం పెట్టుకొని దు:ఖంచిండ్లు...

            రెండు రోజులాయే మనిషి ఎప్పుడోస్తాండో ఎప్పుడు పోతండో కన్పించలేదు’’ పొద్దున చూస్తేఇంకేముంది కట్టె సరుసక పోయిండు. అంటూ పక్కంటి అవిడ కండ్లలల్లో నీరు తీసుకున్నది.

            రాంలాల్‍ను సమీపించిన నాగయ్య ‘‘ఎట్లా జరిగిందే’’ అని అడిగిండు.

            రాంలాల్‍ విషాదంగా చూసిండు.

            ‘‘పొద్దున చూసినోళ్ళు మనిషి ఉలుకు లేదు పలుకు లేదు అంటే ఓ పొల్లగాన్ని ప్రసాద్‍ డాక్టరు దగ్గరికి పంపించిన అయిన వచ్చి చూసి ఏప్పుడో అయిపోయింది ప్రాణం అన్నాడు’’

            కాలనీలో ఎవరిక ఏ ఆపద వచ్చిన రోగం వచ్చినా పెద్దదిక్కు ప్రసాద్‍ డాక్టర్‍. ఆయన ఆర్‍.యం.పి చెసిండు. కాలనీలోని జెండా గద్దె కాడ చిన్న రేకుల షెడ్డుతోనే ఆయన దావఖాన. పొద్దు మాపు అక్కడ రోగులతో కిటకిటలాడుతుంది. ఆయన ఎవరిని ఇంత ఇవ్వమని అడుగడు. ఎంత ఇస్తే అంత తీసుకుంటడు. ఇయ్యకున్న ఎమనడు. తనకు వచ్చిన విద్యతో ఆయన ఇంకెక్కడైనా ప్రాక్టీస్‍ పెట్టుకుంటే నాల్గు పైసలు సంపాదించుకునే వాడు కాని ఆయన అట్లా చెయ్యలేదు. ఏదిక్కు లేని వాళ్ళకు సేవ చేయటమే లక్ష్యంగా పికే రామయ్య కాలనిలో ప్రాక్టీసు పెట్టిండు. ఆయన అక్కడి వారికి వైద్యము చేయటమే కాదు. వాళ్లకు ఏ అపదవచ్చిన మీదేసుకొనే వాడు.

            ప్రసాద్‍ డాక్టర్‍ ప్రక్క ఇంటి ముందు ఒక కుర్చిలో కూచొని ఉన్నాడు. ఆయన చుట్టు జనం గుమికూడి ఉన్నారు.

            ‘‘తాగుతే సచ్చిపోతవురా అని ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. మన ముందే సరే అంటడు. కాన ఎప్పటి అటె అడుతడు’’ అంటూ ఎవరికో చెప్పుతున్నాడు.

            ‘‘ఎదైనా పెద్ద హాస్పటల్‍కు తీస్కపోతే బ్రతికే వాడేమో’’ అన్నారు ఒకరు...

            ‘‘అది చెప్పిన నీకు వీలుకాకుంటే నేనే తీస్కపోతనన్నా రేపు మాపు అంటడు కాని కదలడు’’ అన్నాడు డాక్టర్‍. అయన గుండ్రటి మొఖంలో విషాదం అలుముకొన్నిది.

            ‘‘ఇంతకు వానికేమైంది సార్‍’’ అని అడిగిండో యువకుడు...

            ‘‘బాగా తాగే సరికి లివర్‍ ఖరాబు అయింది. తాగుడు బందు పెట్టి మందులు వాడితే నయం అయ్యేది’’ కాని వాడు వినలేదు. తాగుడు బందు చెయ్యలేదు’’

            తలో మాట మాట్లాడుతున్నారు.

            విషయం తెలిసి సత్తయ్య వచ్చిండు. శవాన్ని చూసి దు:ఖం అపుకోలేక పోయిండు.

            ‘‘తాగుడింట్ల మన్నుబొయ్య... కల్లు సీసా అగుపించందంటె పిచ్చి లేసేది కుక్కల మందు ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తదో’’ అంటూ ఒక నడీడు ఆడామే తిట్టి పోసింది.

            ‘‘చూస్తాంటే పొద్దు పొతలేదా అయ్యే పనేదో చూడాలి’’అన్నాడు రాంలాల్‍ రెండు చెతులు వెనక్కి కట్టుకొని...

            ‘‘వాని పెండ్లాంకు కబురు చేసిండ్లా’’

            ‘‘పొద్దున వెంకటేశం తాళ్ళపల్లికి పంపించినం. వాడింకా రాకపాయే... వాడు వచ్చెదాక చూద్దాం’’ అన్నాడు మరో పెద్ద మనిషి...

            అది నిజమే అన్పించింది. ఈలోపు శవాన్ని చూసి పోయేవాళ్ళు చూసి పోతాండ్లు. పనులకు పొద్దుపొతందని మరి కొంత మంది వెళ్ళి పోయిండ్లు. కొద్ది మంది మాత్రం మిగిలి పోయిండ్లు.

            చావు ఎట్లా చేసుడు అన్న సమస్యవచ్చింది. ఇంట్లా ఏమన్నా ఉన్నాయోనని వెతికిండ్లు. కాని ఇల్లంతా వెతికిన ఎర్రపగాణి దొరకలేదు. కొన్ని బోళ్లు పాత పడి పోయిన బట్టలు చిరికి మంచం తప్ప ఏం కనిపించలేదు.

            ‘‘ఏం చెద్దాం’’ అన్నారోకరు...

            ‘‘మున్సిపాల్టీ వాళ్లకు చెప్పితే’’ అంటూ ఉచిత సలహ ఇచ్చిండు ఒకరు...

            సత్తయ్య అందుకు ఓప్పుకోలేదు. ‘‘మంచో చేడో ఇంత వరదాక మనతోని బ్రతికిండు... అనాద శవంలా వాన్ని అట్లా వదిలేస్తామా మనమే ఎదో ఒకటి చెద్దాం’’ అన్నాడు.

            ప్రసాద్‍ డాక్టర్‍ ‘‘అదే మంచిది’’ అన్నాడు.

            అందరు ఒక నిర్ణయానికి వచ్చి ఆదిలక్ష్మి వస్తుందోనని ఎదురు చూస్తుండి పోయిండ్లు.

            చావు కబురు చేర వేయాటానకి పోయిన వెంకటేశం మధ్యాహ్నం వెలకు ఒక్కడే తిరిగి వచ్చిండు.

            ‘‘ఎమైంది’’ అని అడిగారు జనం అత్రంగా...

            వెంకటేశం మొఖంలో విషాదం అలుముకున్నది. ఆయన మెల్లగా చెప్పసాగిండు.

            ‘‘నేను పోయి చెప్పెసరికి ఆదిలక్ష్మి దు:ఖం అపుకోలేక మీద పడి ఏడ్చింది. ఆమె రావటానికి తయారు అవుతుంటే ఆమె అన్న దమ్ములు ఏముందని పోతవు... వాడు నిన్ను ఏం సుఖం పెట్టిండని పోయి ముండమోస్తవు.. వాడు మాదృష్టిలో ఎప్పుడో సచ్చిండు. సచ్చినోడు సచ్చినట్టే పోనియ్‍’’ అంటూ ఎదురు తిరిగిండ్లు’’

            ‘‘పాపం ఆదిలక్ష్మికి రావాలనే ఉండేకాని వాళ్ళు దాన్ని రానియ్యలే... ఇక లాబం లేదని చూసిచూసి వచ్చెసరికి ఈయాల్ల అయ్యింది’’ అంటూ చెప్పుకొచ్చిండు.

            భర్త చనిపోయిండని తెలిసి రాలేదంటే అదేమి మనిషి అని కొందరు దాన్ని ఏసుఖ పెట్టిండని వస్తది అని మరికొందరు తలో తీరుగా అనుకున్నారు.

            ఆదినారాయణ తల్లి దండ్రుల వైపునుండి ఒకరిద్దరు చుట్టాలు వచ్చిండ్లు. ఆయన తల్లి దండ్రులు లేరు. తమ్ముడు ఉన్నాడు కాని వాడు ఎక్కడికో బ్రతక పోయిండు. వాని అడ్రసు తెలియలేదు.

            జనమే తలింత వేసుకొని రైల్వెకట్టకు ఉన్న స్మశాన వాటికకు తీసుక పోయ్యిండు.

            శవయాత్ర ఊరు దాటే దాక వెంట పోయిన నాగయ్య... మళ్ళీ పనికి పోవాలనే తొందరలో వెనక్కి వచ్చిడు. అన్నం ముందు కూచున్న నాగయ్యకు ముద్ద మింగుడు పడటంలేదు. తాపతాపకు ఆదినారాయణ మొఖం గుర్తుకు రాసాగింది. ఎప్పుడు పెద్దయ్య పెద్దయ్య అంటూ అప్యాయంగా పలకరించేవాడు. మంచి పనోడు ఉండే అంతా పాతికేండ్లకే వని కథ ముగిసింది. అనుకున్నడు బాదగా...

(తరువాయి భాగం వచ్చే సంచికలో)

 


ఈ సంచికలో...                     

Jun 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు