(March,2020)
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
సైరన్ నవల
మూడయ్యింది. అయినా ఎండతగ్గలేదు - నేలంతా బగబగ మండుతూ పొగు కక్కుతోంది.. పల్లెలనుంచి వచ్చినవాళ్లు - బస్సు కిరాయలు కూడ లేనివాళ్లు అదే చెట్లకింద కునుకు తీశారు...కొందరు వాడిపోయిన ముఖాలుండొద్దని డబ్బున్నవాళ్లు అన్నమో టిపినో తినొచ్చారు.... ఏది లేనోళ్లు నల్ల నీళ్లు తాగారు... గుండెల్ల డుక్కుడుక్కు. ఇంతా చేస్తే తీసుకుంటారో లేదో
మొత్తానికి అందరి మొఖాల మీద పులిబోనుకు పోబోతున్న మేకపిల్ల బెదురు, దిగులు కనిపిస్తోంది...వాళ్లవెంట వచ్చిన వాళ్లు భరోసాయిస్తున్నారు. శంకరయ్య మొగిలికి పేరు, తండ్రి పేరు చెప్పాడు. ‘’భయపడద్దు - ఆడిగిన దానికల్లా టకాటకి చెప్పు...మనం పైసలిచ్చినం గద ఏం ఫికరు బెట్టుకోకు’’ అన్నాడు ఆఖరుగా.
ఇంకెవడో ‘‘నౌఖరి దొరుకుతే తిరుపతెంకన్నకు తల నీలాలిత్తనని మొక్కుకో బస్ - దేవుని మీద భారమేసి బేఫికరుగ పో’’ అన్నాడు.
ఈ మాటల్లనే మొదటివాడు బయటకొచ్చాడు... వీరాధి వీరునిలాగా...
మొగిలి అందరితోపాటు ఆఫీసువరండాలో కడుగుబెట్టాడు. శంకరయ్య ఆఫీసవతల నిుచున్నాడు. స్ప్రింగ్‌డోరు దగ్గర లైనుగ నిలుచున్నారు.
మొగిలికి సల్ల చెముటలు పెడుతున్నాయి. ఇటు నుంచిటే ఎవలకు కనిపియ్యకుంట ఊళ్లె బడేదాక ఉరుకుతే బావుండుననుకుంటున్నాడు.. అందరి మొఖాల్లోకి పులుకు పులుకున చూస్తున్నాడు...
ఆరుగురి తరువాత మొగిలి వంతచ్చిది. గదిలో కడుగుబెట్టాడు. ఎదురుంగా సన్నగా ఎర్రగా ఉన్నోడొకడు కూర్చున్నాడు. అతని ఎడమ పక్క మీసాలు నున్నగా కొరుక్కున నల్లటి సీమ కండ్ల వాడున్నాడు. కుడిపక్క తెల్లటి బట్టలోడున్నాడు...
‘‘నీ పేరేమిటి?’’ ఎర్రవాడు
మొగిలి తత్తరపడి గుటికిల్లు మింగిండు - నెత్తి గోక్కున్నాడు - పంఖాకేసి చూశాడు...
‘‘నీపేరు...’’నల్లవాడు
‘‘రా...రాజయ్య’’ అన్నాడు తడబడుతూ తొందర తొందరగా...
‘‘తండ్రి పేరు?’’
‘‘అయిలయ్య’’
‘‘అయిసీ - ఎర్ర వాడు పెన్నుతో పేపరు మీద ఏదో రాసిండు...
‘‘మీదేవూరు?’’
మొగిలి చెప్పిండు.
‘‘ఎంతదాక సదువుకున్నావు?’’
చదువుకోలేదని చెప్పిండు...
నల్లవాడు ధోవతి పైకి ఎత్తుమన్నాడు - పిక్కలు చూశాడు...
‘‘పైన్... కర్‌సక్‌తా...’’అన్నాడు ఎద్దును చూస్తున్నట్టు నోరు తెరువుమన్నాడు. ఇంకేదో అన్నాడు - దండలు చూశారు - చాతీ చూశారు... అక్కడే ఉన్న ఉసికెబత్త లేవట్టుమన్నారు. మొగిలి లేపి ఛాతీ దగ్గరిదాకా తెచ్చుకొని దించాడు.
అటిటూ లాడీస్ పయ్యున్న ఇరుసెత్తుకొని బస్కీలు తియ్యమన్నడు. మొగిలి తీత్తనే ఉన్నడు. చెమట కారిపోతుంది. ఇగ జెరంతయితే పడుతడు అనే సమయానికి ‘‘ఇక నువ్వువెళ్లచ్చు’’ అన్నారు...
మొగిలి బయటకొచ్చాడు. గుండెనిండా గాలి పీల్చుకున్నాడు - నెత్తి మీది నుంచి పెద్దగుండేదో దించినట్టు ఫీలయ్యిండు...
‘‘అంత బాగ చెప్పినవా?’’ శంకరయ్య ఎదురొచ్చిండు.
‘‘బాగనే చెప్పిన...’’
‘‘మల్ల రెండురోజులకు ఆఫీసుల లిస్టేస్తరు డాక్టరు ఫిట్‌కు బోవాలె’’ వాచ్‌మన్ చెప్పిండు - శంకరయ్య రెండు రూపాయ నోటుతీసి వాచ్‌మన్ చేతుబెట్టి ‘‘ పనైతే పార్టీ ఇత్తం’’ అన్నాడు.
‘‘అబ్బో అయెదాకనే తరువాత మా మొఖమెవడు సూత్తడు?’’ వాచ్‌మన్...
‘‘పుత్తెగట్టుకున్నట్టేనాయె - ఓసారి ముడివడితె ఎప్పుడు నీ కాడికి అచ్చుడే ఉంటది’’ శంకరయ్య...
ఇద్దరు బయటకొచ్చి సైకిలు మీదెక్కిండ్లు ` ‘‘శంకరన్నాకొలు వు దొరుకుత దంటవా?’’ మొగిలి అడిగిండు.
‘‘నువ్వయితే అన్ని చెప్పినవ్‌గదా? మా దొరుకుతది’’ అన్నాడు శంకరయ్య - శంకరయ్య మనుసులో డాక్టరు ఫిట్ గురించి అనుమానం లేకపోలేదు...
11
ఉదయం పదిగంటలయ్యింది. బొగ్గుపొయ్యి పొగ తగ్గి వాతావరణం తేటగయ్యింది.
మొగిలికి మూడుదినాల నుండి పనిలేకుండా కూర్చోవాలంటే బాగనిపించడంలేదు. తినడం... సూరుకింద మంచమేసుకొని పొద్దంగే దాక పండడం...
‘‘అట్ల బయిటికన్న పోయత్తేంది పిలడా?’’ లక్ష్మిఅంటూనే ఉన్నది...
‘‘వదినా నాకంత ఎటమటంగున్నది ` గీడ మనుసులు కొత్తంగున్నరు. ఆ లాగు, అంగీలు సూసెట్లాకే గీళ్లు మనోల్లు గాదని పిత్తంది - పల్లెలదిర్గినోన్ని’’
లక్మినవ్వింది. ‘‘అయ్యో గిదెంత సేపు ` మీ అన్న గిట్లెనే అనెటోడు ` దూదేకులోని తీర్గ ఏషాలని - గిప్పుడు సూడరాదు - సిన్నప్పుడు మనూల్లెకు పిర్ర మీన సినిగిన లాగేసుకొచ్చేటోడు టుపాకి రాముడు - గదేఏషం...? ఇన్నవా? నువ్వు గట్లనే అయితవు...’’
‘‘అదిగాదు వదినా ఎవన్ని మందలియ్య వశంగాదు - ఎవడు సూసినా సొలుక్కుంటనే పోతండు...’’
‘‘మనూల్లె సుత కల్లచ్చిందట గదా? నువ్వు తాగవా? అన్ని అయ్యే అత్తయిలే... తాగుడేనా? పెండ్లాన్ని గొట్టుడత్తది, తినుడత్తది. అప్పుల్లోల్లత్తరు... మా నాయిన అవ్వనుకుంటరు చ్చిమికేందని - మరిదీ మోసెటోనికెరుక కావడి బరువు’’ లక్ష్మి గొంతు వనికింది. కండ్లల్లోకి నీళ్లొచ్చినయ్ - సర్రున లేచి గుడిసెలకు బోయింది...
మొగిలి ఆ మాటలోని బరువుకు తికమకపడ్డడు ` ‘‘అన్నీ ఉన్నాయి - అయిదో తనందప్ప- ఇంతకన్నా నీళ్ళులేనడివిల బొండిగ గోసిందుత్తం... ఎక్కన్నో పల్లె సెరో సార్గం సేసుకొని బతికితేనే బాగుండు - ఈడికచ్చినంక రెక్కకు పనిలేదు - అడిగినోడసలేలేడు - తిన్నవా అన్నోడు లేడు - కాలునొచ్చిందా, ఏలునొచ్చిందా అన్నోడు లేడు...’’ లక్ష్మి గుడిసెలో సన్నగా వనికే గొంతుతో గొనుగుతోంది.
మొగిలి వచ్చిన దగ్గరి నుంచి చూస్తూనే ఉన్నాడు. శంకరయ్య ఇంటికి రాగనే నోరు దగ్గర బడ్డోనితీర్గత్తడు - మొఖం మారి పోతుంది. మందలిత్తె కరువత్తడు. వచ్చిన్నాడు లెల్లాయిపదాలు పాడుకుంట సొలుక్కుంటత్తడు. ఉట్టెగనే తిడుతడు - బట్టన్నా విప్పకుండా మంచాల ఎల్లొక బడి సచ్చినోని తీర్గ పడి నిదుర బోతడు - మళ్లీ పొద్దున్నే ఉరుకులు పరుగులు ... ఇదంతా మొగిలికి అర్ధం కాలేదు. ‘‘నాకెందుకులే ఎవల సంసారంల ఏమున్నదో?’’ అనుకొని లేచి ఎటూ దోసక కూలిపోయిన దడి కట్టడానికి పూనుకున్నడు...
కాసేపటికి లక్ష్మి బయట కొచ్చింది. ’’మనుసుల బెట్టుకోకు మరిదీ - అదంతే. రేపు నీకు తెలిసొత్తది...’’ అయ్యయ్యో గ పనెందుకు బెట్టుకున్నవ్ - పుల్లలన్ని పుచ్చిపోయినయి - ఆ దడి గంతే - కొత్తప్లు దేవాలె - పొరక దొరుకదు - కంపదెత్తే మనకే ముల్లు గుచ్చుతాయి’’ అన్నది లక్ష్మి...
‘‘ఊకే కూకుంటే యాష్టత్తంది ’’ అన్నాడు మొగిలి లక్ష్మి ముఖం చూడడానికి ధైర్యంలేక తలవంచుకొనే.
ఇంతలోనే సైకిల్ గంట చప్పుడొచ్చింది. లక్ష్మి గుడిసెలకు బోయింది...
శంకరయ్య చెమటలు కారంగ వచ్చిండు.
‘‘తమ్మీ నీ పేరెల్లింది - నడువ్ - తిన్నవా? దావాఖానకు బోవాలె...’’ అన్నాడు హడావిడిగా...
మొగిలికి మతిపోయింది.. ఆదరబాదరగా మొఖం మీద నీల్లు జల్లుకొని - ’’ వదినా నేనుబోయత్త’’ అన్నాడు వాకిట్లో నుంచే.
‘‘మీ అన్నతింటడేమొ అడుగు’’ అన్నది...
‘‘నవుదిను - నేను ఓటల్ల దిన్న’’ అన్నాడు శంకరయ్య
‘‘నువ్వు తిన్నవా’’ అన్నాడు మొగిలిని.
‘‘సూసిసూసి తిన్న...’’
‘‘సరే నడువ్...’’
ఇద్దరు సైకిలెక్కి హాస్పటల్ చేరుకునే సరికి పదకొండున్నర అయ్యింది. దవాఖానా అంటే అదేదో పెద్ద బంగళా అనుకున్నాడు మొగిలి. రెండు క్వార్టర్లు కలిపున్నయి. ముంగట ఏవేవో పచ్చటి చెట్లున్నయి. ఓ మూలకు కారు బెట్టుకోను చిన్న ఇల్లు లాంటిదున్నద -` వీళ్లు పోయోట్లాకే హస్పిటంతా మందే ఉన్నారు. వరండా చాలక ఎండలో నిలుచున్నారు. ఆడోల్లు, పిల్లలు - పిల్లలనెత్తుకున్న ఆడోల్లు, దెబ్బలు తాకినోల్లు , దగ్గులోల్లు, దమ్ములోల్లు వీళ్లంతా కాక కొత్తగా భర్తీ అయ్యేటోల్లు.
‘‘ఇగో కాయిదందీసుకపో ’’ అని జేబులోనుంచి కాయిదం తీసిచ్చిండు శంకరయ్య.
‘‘నువేరావాలన్నడు. చెప్రాసిగానికి మస్కగొట్టి కాయిదం పట్టుకచ్చిన..’’ అన్నాడు.
మొగిలి లైనుకు నిలుసున్నాడు...
‘‘ఏమాయెనమ్మ, సింగు సవరిచ్చుకునేట్లాకే నెత్తిమీదికి పొద్దచ్చేటట్టున్నది. జెరతొందర తొందరగానియ్యిండ్లి - పనాడ బెట్టచ్చిన’’ గుమ్మటం లాంటి ఆడిమనిషి ఆడ డాక్టరుకు వినబడేటట్టు అంటున్నది. ఆమె వెనుక పైటజారకున్న మాటిమాటికి సదురుకుంటున్న ఓ పడుసుపిల్ల నోటి దగ్గర దస్తీ బెట్టుకొని నవ్వింది.
‘‘సోగ్గా నవ్వేదేదో సీదానే నవ్వరాదు - ఇపసారిపిట్ట గోడకుగొట్ట - ’’ ఆమె వెనుకనున్న అమ్మోరు మచ్చల మొఖమామె.
మొగోల్ల లైన్ల ఒకడు ‘‘నీ బాంచెనుల్లా నన్ను కాసంతజెప్పన బోనియిండ్లి. కాలు యాలలు బార్తంది ` దవాఖానవ్వను...ఏం మందేత్తరోగని - మగ్గది - ఏడికన్నాబోదామంటె ఇయ్య్లరేపు పదిరూపాలు లేంది ఎవడు కండ్లగానడు’’
‘‘జీతమవ్వను..ఇచ్చినట్టే యిచ్చి తీసుకోనట్టే తీసుకునిరి - బొగ్గుపెళ్లబడి పది రోజులాయె - పదిరోజు నాగాలేనాయె - రోజు సేత్తేనే ఓదానికందుతే ఓదాని కందదు...’’
‘‘అన్నన్న’’ ఇంకెవడో కడుపుబట్టుకున్నాడు. లైను కదుదు. మొగిలి తల పక్కకువంచి డాక్టరును చూడాలనుకున్నాడు. లోపట ఎక్కడున్నాడో కనిపించలేదు.
‘‘ఏమాయెర్రా లైను కదులది?’’ కాలునొప్పోడు. ముందట నిుచున్న పన్నునొప్పోడు ‘‘డాక్టరు చాయ్ తాగుతండు’’ అన్నాడు అందరికి వినిపించేలాగున...
‘‘ఓర్నియవ్వ గిప్పుడు ఛాయా? ఎట్లనోగట్ల పొద్దుబుచ్చుదామని సూత్తరు లమ్డికొడుకు, నీతల్లి గర్మి సీకట్ల సచ్చేది మనం - పంఖ కింద కూసుండి సాయ్ దాగేదీళ్లు ’’ ఇంకెవడో.
ఆడ్లో లైన్ల కదిలికొచ్చింది. లైనుముందట మెడ మీది దాకా ఎంటికలు బెంచుకున్న కంపౌడరు గాడొచ్చి ఏదేదో సదిరిండు - పైట పిల్ల కండ్లు పులపొడిసింది - లైనులైను’’అని అటులోపటికి వచ్చి ఆడోల్లను సదిరి నట్టే సదిరిండు - పైటపిల్ల వానెనకనే పోయింది. లైనట్లా ఉండంగనే పిల్ల డాక్టరమ్మకు చూయించుకున్నది మల్ల మందుల కాడ - నర్సుతో ఏదేదో మాట్లాడిండు కాంపౌండరు. పిల్ల బయటకొచ్చింది.
మందంతా చూస్తుండగానే పైటపిల్ల రోడ్డుమీద అపసోపాలు పడుతూ నిలుచున్నది... కాంపౌండరు తీగలు సాగుతూ, ఎంటికలెగ దోసుకుంటూ ఏదో చెప్పుతున్నాడు...
అంతలోకే డగ్‌డగ్‌మని సప్పుడు చేస్తూ సైకిల్‌మోటారొచ్చింది. ఎర్రగాబుర్రగా ఉన్నవాడు దిగిండు. వాని బొటన వ్రేలుకు కట్టు కట్టున్నది. అంతమంది మొగోల్లు లైనులోఉండంగా వాడు సరాసరి లోపలికి బోయిండు - వంగివంగి సలాము చేస్తూ కాంపౌండరు వాని వెనుకే వెళ్లిండు. డాక్టరు కళ్లజోడు తగిలించుకొని కూర్చీలోనుంచి లేచి నిబడి వచ్చిన వానికి ఎదురుకుర్చీలో కూర్చుండబెట్టి తను లేచొచ్చి అన్నీ తనిఖీ చేసిండు. ఆ తరువాత ఎర్రవాడు కాంపౌండరు గదిలోకి నడిచిండు - కాంపౌండరుగాడు సుతారంగా కట్టువిప్పి మళ్లీ కట్టు కట్టిండు.
డాక్టరు హడావిడిగా వచ్చి ‘‘మిస్టర్, నీకు బుద్దుందా బాండేజి అట్లాగేనా చేసేది...అని స్వయంగా తను విప్పి....మళ్లీ కాంపౌండరు వేసిన మందే వేసి కాంపౌండరు కన్నా అధ్వాన్నంగా కట్టుగట్టిండు...ఎర్ర వాడు అందరు చూస్తుండగానే సైకిల్ మోటార్ డగ్‌డగ్ మనిపించుకుంటూ వెళ్లి పోయిండు.
లైనులైను దగ్గర్నే ఉన్నది...
లైనులో నిల్చున్న దొడ్డుటామె - గంపంత నోరుతెరిసి...‘‘ఈ దవాఖాన లంజెన్నా? లంజెకొడుకన్నా కాంది సూడరానామ్మో’’అన్నది...
లైను కదిలింది
మొగిలి డాక్టరు రూంలోకి అడుగు పెట్టేసరికి పన్నెండయిపోయింది...
డాక్టరు మొఖంనిండా మొటిమలే ఉన్నాయి - మళ్లీ పేరు, తండ్రి పేరు, ఊరు అడిగిండు - రాసుకున్నాడు... ఏదో మిషన్ మీద నిల్సోమన్నాడు, మొఖమంతా కోపంగా బెట్టుకున్నాడు...
దూరంగ గోడమీద బెట్టిన అక్షరాలను చూపిచ్చి ‘‘కనిపిస్తందా?’’ అన్నాడు. కాంపౌండరుగాడు లోపలికి తీసుకపోయి దోవతి విడువు మన్నాడు-
‘‘ఎహె..ఎహె.’’ అన్నాడు మొగిలి ధోవితి పట్టుకుంటూ.
‘‘అరె! ఎద్దులాగున్నవ్...చూపియ్యాలె..విప్పు - విప్పుమంటుంటే’’ కాంపౌండరు కసురు కొని ధోతి విప్పిచూసిండు... తరువాత స్టూలు మీద కూర్చుండ బెట్టిండు ` ఎడంకాలు నూసిండు, కుడికాలు చూసిండు.
‘‘వాటీస్‌దిస్...ఇదేమిటి?’’
‘‘బర్ర...’’
‘‘ఎట్లయ్యింది...?’’
‘‘తెల్లజొన్నకొయ్య కాలుగుచ్చింది.’’
ముట్టి చూసిండు..ఒత్తి సూసిండు..ఏదో అన్నడు.. పొమ్మన్నడు.
మొగిలి బయటకొచ్చిండు.. శంకరయ్య ‘‘ఏమడిగిండు ఏమడిగిండు?’’ అన్నాడు. మొగిలి అడిగిందంతా చెప్పిండు. శంకరయ్య ఊ అనలేదు ఆ అనలేదు...
‘‘గిదెప్పుడు దెలుత్తదే?’’
‘‘సోమారం బొర్డేత్తరాండాలె’’ అన్నాడు శంకరయ్య ఆలోచనగా...
‘‘అయినయా ఇంకేమన్నా ఉన్నయా?’’ అన్నాడు మొగిలి...
‘‘ఏడ ఇరువై ఒక్క దినాల ట్రేనింగ్ - రోజుకు మూడు రూపాలిత్తరు. అటెన్క స్పేర్ల బెడుతరు. ఆయింక’’
‘‘నీతల్లి - గిదంతా పీకులాటే ఉన్నది - మా వూల్లే గిట్లగాదు - పాలేరుంటవా అంటే ఉంటనంటే అయిపోయె’’
శంకరయ్య మాట్లాడలేదు ...సైకిలు నడిపిచ్చుకుంటూ ఇద్దరు నడుస్తున్నారు...రోడ్డు మీద ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చేట్లోల్లు వస్తున్నారు పోయే వాళ్లు పోతున్నారు.
12
ఆ రాత్రి మొగిలికి నిదుర బట్టలేదు... శంకరయ్య, లక్ష్మి గుడిసెలో పడుకున్నారు... చాలాసేపు ఊకినే కండ్లు తెరుచుకొని ఆకాశంలోకి చూస్తూ పడుకున్నాడు. ఆకాశంలో చుక్కలు జిగేలుమంటున్నాయి. వెన్నెల మీద మబ్బుతునక కప్పేసింది.. వాడకట్టుకు ఎక్కన్నో కుక్కలు మొరుగుతున్నాయి... ఎవరో పక్కింట్ల దగ్గుతున్నారు. మూడిండ్ల ఆవల కావచ్చు భార్య భర్తలు కాబోలు తగువులాడుతండ్లు - మొగగొంతు లొడలొడ వరుస క్రమంలేకుండా వదురుతున్నాడు... కాసేపటికి గిపగిప గుద్దిన చప్పుడు. ఆడామె తిడతూ ఏడుస్తోంది. చటుక్కున మంచంలోనుంచి లేచిండు - కొట్లాటకాడికి పోవానుకున్నాడు కాని ఎవరు పోతున్నట్లు లేదు - ఎవరిగుడిసెల్లో వాళ్లె అదెదో మామూలు సంగతన్నట్టు పట్టించుకోవడం లేదు. ఇదే మావూల్లెనైతే ఊరోల్లంత కుప్పయేటోల్లు - కొట్లాట సముదాయించెటోల్లు - అనుకున్నాడు...
మంచంలో కూర్చున్నాడు. లొల్లి మగ్గింది..కుక్క మొరుగుడు ఆగిపోయింది. ` గుడిసెలో నుంచి శంకరయ్య గుర్రు విన్పిస్తోంది...
మొగిలి కళ్ల ముందు పల్లె మెదిలింది - అక్కడి మనుషులు గొడ్డుగోదా పొలాలు చేండ్లు చెలుకలు, అడివి, గట్టు అన్నీ మెదిలాయి...
వర్షా కాలం తుపతుప చినుకులు పడుతూంటే - నెత్తిమీది కంటా వంగి మబ్బు గుడగుడలాడుతూ ఉంటే - బండమీది నుండి, చేండ్ల మీది నుండి నీళ్లు జలజల పారుతూ ఉంటే టేకుటాకు గొడుగు కుట్టుకొని నెత్తమీద బోర్లించుకొని.. టేకుటాకు గొడుగు కుట్టడంలో కొంగ పోశాలు దిట్ట - ఒక్క చినుకన్నా పడకుండా ...ఆరిద్ర పురుగులు – నేల కనిపించకుండా లేచే దువ్వెన్లు, బసవన్నలు పచ్చగడ్డి...
చలికాలం - గొంగడి కోలాట మేసుకొని చేండ్లు చెలుకలు దిర్గడం - అడ్ల ధాతి కాడినెగడు - నెగడి చుట్టూ కూకుండి విక్రమార్కుని కథలు - వడ్లీరయ్య లొడలొడ గొంతు... ఎండకాలం - కొడార్లు - వెన్నెట్లో చిరుతల రామాయణం కోలాటం, పాటలు ... ‘‘శివశివ మూర్తివయ్య గననాధ శివుని కొమారినివి గణనాథ..’’, ‘‘బంతిపువ్వు దండు దెచ్చితి బామరో తలుపులు దియ్యవే’’ - చిన్నప్పుడు ఆడిన ఆటు ఢీమ్మ ఢీలి - ‘‘పిల్లా కెంతెంతే ఢీమ్మఢీలి, పిలగానికెంతెంతే’’, కోడి పుంజులాట - గుయ్యోపుంజూ గుయ్యే కోక్కరోకో...కో...వాడు మొగిలి...’’
రాజేశ్వరి యాదికొచ్చింది. ఏం చేస్తున్నదో? నిదుర బోయుంటది. నిదురలో తనకు నౌఖరి దొరికినట్టు కలలు కంటుంటది... పాపం .....మొగిలి మనసులో తియ్యతియ్యగా రాజేశ్వరి జ్ఞాపకాలు ...
సాంబయ్య గుర్తొచ్చిండు - నాయిన రాత్రి నిదురబోయుండడు..గడంచలో కూర్చుండి తనకు నౌఖరి దొరికిందో లేదోనని ఆలోచిస్తూ ఉంటాడు...
నౌఖరి దొరుకుద్ది - ఈ గుడిసెల్లో తనోగుడిసెలో - శంకరన్న తీర్గనే...సీకట్లనే ఉరికి – మల్ల పొద్దుబొడిసినంక ఇంటికచ్చుడు - కొట్లాటు తాగుడు ` ఛ ` తను తాగద్దు - ఎవల జోలికి పోవద్దు మరింక ఎడ్లుండయి - పంటుండది ` పెరడుండది - మడికట్టు దున్నుడుండది - వానల్లో వనుకు బట్టుడుండది - సలిలో మంట కాగుడుండది - ఎండల్లో గుంటుక కొట్టుడుండది - మరింక పల్లె.. పెట్టెం లింగయ్య, అనుముల ఎంకటర్రాజం, సిందెంరాయమల్లు, అడ్డడు ` రొడ్డకొమురయ్య ఎవలుండరు.. పరాసికాలుండయి - బండిమీది పదాలుండయి - చెమ్మదిగిదిండదు - కోలాటపు పాటలుండయి.
మొగిలి మనుసులో ఎక్కడో సన్నగా దు:ఖంలాంటిది. అద్దు గీ నౌఖరి నాకద్దు - గీ సోకుటీకుద్దు - గీ గుడిసెద్దు గీ కొట్టాటద్దు... నాయిన్న ఊకుంటడా? అప్పులూకుంటయా? భూము బోతయి - జాగుబోతయి – మాదుగుల తీరుగ ఉపాసముప్పిడుండాలె - పిర్రగట్టయ్య తీర్గ ఒంటిమీదకి గుడ్డుండది...గుడిసె ముంగటి నుంచి ఎక్క్లిల్లు - ఎవలో సన్నగా ఏడుస్తున్నారు - మొగిలి తొంగి చూసిండు లక్ష్మి.. అరె వదినకేమయ్యింది.. మొగిలి మంచంలోనుంచి లేచి గుడిసె ముంగటి కొచ్చి నిలుచున్నాడు...లక్ష్మి చూసింది. ఉలిక్కి పడ్డది...
‘‘నువ్వింకా పండలేదా?’’ అన్నది లక్ష్మి
‘‘లేదదినా?...’’ అన్నాడు మొగిలి.
లక్ష్మి లేచి నిలబడి ` ‘‘మొగిలి బాయిపనద్దు మనూరికి బో - మొగిలి నువ్వీ రొంపిల దిగకు ’’ నెమ్మదిగా అనేసి లక్ష్మి గుడిసెలోకి వెళ్లిపోయింది.
మొగిలి మళ్లీ మంచంలో కూర్చున్నాడు –లక్ష్మికి తక్కువయ్యిందేమిటో మొగిలి ఎంతా ఆలోచించినా అర్థం కాలేదు... తలాతోకలేని ఆలోచనలు చేస్తూ మొగిలి నిదర రాక మంచంలో పొర్లుతూనే ఉన్నాడు..
13
సినిమా టాకీసు ముందు స్కూటర్ నిలబెట్టి రాఘవులు నిుచున్నాడు. చేతిలో క్యాష్‌బ్యాగ్...టాకీసుకు మొదటాటకు ఇంకా అర్థగంటే ఉన్నది - బుక్కింగ్ కాడ జనం తొక్కీసలాడుతండ్లు - రాఘవులు చేతులు తిప్పుతూ చుట్టు నిలుచున్న వాళ్లతో - ‘‘మరందుచేత ఉద్యోగాలు మన జేబుల్లున్నయా? ఉంటె గింత తతంగమెందుకు? దేనికైన ముహూర్తంగావాలె మానవప్రయత్నం - మనం చేసేదిచేస్తాం...ఆఖరు మినట్‌దాకా మనం కొట్లాడుతాం - కొందరికి దొరుకుతుంది = ఒకరిద్దరికి ఆగిపోతుంది - అదిగాక సంగతేందో తోసుకుందాం...’’ స్కూటర్ స్టార్టుచేసి కదలబోయాడు.
అప్పుడు వచ్చాడొకడు - దుమ్ము కొట్టుకపోయున్నాడు. కాళ్లకు చెప్పులు లేవు. చేతిలో సంచి ఒకటున్నది...
‘‘నీతల్లి గప్పుడు గీ మాటెందుకు చెప్పలేదు - చెట్టెక్కిచ్చి చేతులిడిపిచ్చినవ్ - ఆర్న్లెయె తిరుగబట్టి ’’ అనుకుంటనే రాఘవులు గల్లా పట్టుకున్నాడు...
రాఘవులు మిడిగుడ్లేసిండు... కాష్‌బ్యాగ్ కింద బడ్డది - స్కూటరాగిపోయింది.
‘‘ఇడువ్‌బే...’’ రాఘవులు పెనుగులాడిండు - అప్పుడు సినిమా దగ్గరి వాళ్లు - వచ్చిపోయే వాళ్లు మార్కెట్లోని వాళ్లు బ్రాండి షాపు వాళ్లు, బట్టషాపు వాళ్లు చుట్టూ మూగిండ్లు...
‘‘నా పైసలు నాకియ్యి ’’ గల్లా పట్టుకున్నవాడు...
సినిమా టాకీసు దగ్గరి నుంచి వచ్చిన గుండా సారలి ఝాడిచ్చి గల్లా పట్టుకున్నవాని దవడ మీద గుద్దిండు - దుమ్ములో పడిపోయిండు. గుద్దు వర్షం - సంచీ కిందబడి పోయింది - సంచిలోని కాయిదాలు కింద బడిపోయినయ్ - చుట్టూ నిలుచున్నవాళ్లు చోద్యం చూస్తున్నారేగాని ఎవరు విడిపించలేదు - ‘‘మార్ సాలెకు మార్’’ శంకరి గుండా వచ్చిచేరిండు.
రాఘవులు అంగి సరిచేసుకున్నాడు - ‘‘వాన్నిడువుండ్లి’’ అన్నాడు స్కూటర్‌స్టార్టు చేసివెళ్లిపోతూ...
సినిమా టాకీసు దగ్గర నుంచి ఎట్లా వచ్చిన వాల్లు అట్లాగే వెనుదిరిగి పోయారు..
కిందబడ్డోని దవడ ఉబ్బింది. ముఖమంతా దుమ్ము కొట్టుక పోయింది - రెండు దినానుంచి తిండిలేనట్టున్నది `- లేవలేక లేచిండు - లేచితూలి పడబోయిండు. చుట్టూ నిల్చున్న వాళ్లల్లో - ‘‘వాళ్ల జోలికెందుకు బోయినవు బై - వాళ్లు గుండాగాళ్లు’’ ఒకడు.
‘‘ఏ వూరో?’’ ఇంకెవరో?
‘‘అయ్యలాలా సూసిండ్లు గదా! సూసుకుంటనే ఉన్నరు. నామీద ఇద్దరు బడి తన్నంగ సూసుకుంటనే ఉన్నరు...నేను మూడువేల రూపాలు లంచం బెట్టిన. నౌఖరిప్పిత్తమని - తన్నిండ్లు - గిదీ రాజ్జం... ‘‘ ఏడుపు గొంతుతో అని... నోట్లో ఊరిన నెత్తురు ఉమ్మేసి బజారు వెంట నడువసాగిండు...
‘‘దొంగని తెలిసినప్పుడు ముందుగా డబ్బిచ్చుడు తప్పుగాదా?’’ ఓ దుకాణదారు...
‘‘దొంగని ముఖం మీద రాసున్నదా?’’ మరొకడు...
శంకరయ్య పక్క నిలుసున్న మొగిలికి కడుపు దేవినట్టయ్యింది... ముఖం మాడిపోయింది ` ‘‘అన్నా...’’ ఏదో అడుగబోయిండు.
శంకరయ్య మొగిలి రెక్కబట్టుకొని మందినుంచి బయట కీడ్సుకొచ్చిండు...
‘‘గిక్కడ గిది మామూలే - కడుపుగాలినోడు తన్నులు దినడం మామూలే - గుండగాళ్లు...ఆనిపున్నెం మంచిది – నాలుగుదన్ని ఇడిసి పెట్టిండ్లు...’’
‘‘లాపోతే సంపుదురా?’’
‘‘సంపుటమో లెక్క గాదు - ఆడు అంబోతు తీర్గ తాగినంత పోపిచ్చి ఉత్తగనే పెంచుతలేడు’’
మొగిలి మాట్లాడలేదు. ఇద్దరు మౌనంగా నడుస్తున్నారు - అదే వీధీలో జనం ఎప్పటిలాగే ఏమి జరుగనట్టే నడుస్తున్నారు - జంటలు జంటలుగా దుమ్మురేగంగా, ఆ దుమ్ములోనే లేని నవ్వు తెచ్చుకుంటూ నడుస్తున్నారు - రోడ్డుకు రెండు పక్కలా దుమ్ములో శద్దర్లమ్మె వాళ్లు, కప్పుసాసర్లమ్మె వాళ్లు, బనీన్లు జాంగాలమ్మే వాళ్లు, సోడావాళ్లు, పాన్‌షాపులోల్లు ఎప్పటిలాగే వచ్చి పోయేవాళ్లతో బేరాలు చేస్తున్నారు...
ఎవడో ఎర్రగా ఉన్న వాడు డ్యూటీ బట్ట మీదనే బొక్కటోపి మెడకేసుకొని పూట్‌గా తాగి సొలుగుతూ పాన్ ఉమ్మడం చేతగాక తన బట్ట మీదనే ఉమ్ముకుంటూ సిగిరెట్టు తాక్కుంటూ...’’ దొంగలు బంచత్ బాయి దొరలు దొంగలు. లీడరోళ్ళు దొంగలు – బంచత్, ఆళ్ల నమ్మే లేబరోల్లు దొంగలు ...’’ అంటున్నాడు.
వానికేసి చూసిన వాళ్లు చిరునవ్వు నవ్వుతూ వెళ్లిపోతున్నారు...
సైక్లిల్లు, కార్లు, జీపులు, లారీలు ఒకటే రొద...శంకరయ్య మొగిలి సి.యస్.పి రోడ్డు మీదినుంచి నడుస్తున్నారు...
శంకరయ్య ఎవరికో నమస్తేలు చెప్పుతున్నాడు. మరెవరో శంకరయ్యకు నమస్తేలు కొడుతున్నారు. ఇద్దరు అట్లా నడుస్తూ యాప కాడికొచ్చిండ్లు. శంకరయ్య కాసేపు రోడ్డు మీద నిలుచుండి ఏమి దోచని వానిలాగా నెత్తి గోక్కున్నాడు - జేఋపునికి చూసుకున్నాడు...
‘‘గురూ! ఇంకా పోలేదా?’’ అన్నాడొక గడ్డంవాడు అని ‘‘సిక్‌లో ఉన్న నువ్వు పోతె నేనొస్త డ్యూటీకి రానా...’’ అన్నాడు.
‘‘నేను పోతలేను సుట్టాలచ్చిండ్లు’’
‘‘సుట్టాలత్తెనే తడాఖా’’
‘‘సరెసరె నాకు జెరంత పనున్నది’’ అని అతన్ని తప్పించుకొని రోడ్డుదిగి గుడిసెల్లో నుంచి మళ్లీ యాప దగ్గరకి నడిచిండు. కొంచెం లోపలున్న గుడిసె ముందు చాలా మంది జనం నిలుచున్నారు - ఒకనిమాట ఒకనికి వినపడకుండా వదురుతున్నారు.
‘‘మా బాయిమీన ఆడుఎవడాడు నర్సొక్కులోడు... కోతిమొఖపోడు - నిన్న ఏమన్నడంటే ` హాలర్ కాడి నల్లా కాడ నీళ్లు దాగుతన్న - ఆడచ్చిండు. ‘‘ఎవడుబే’’ అన్నడు. నేను నీళ్లు దాగి వాన్ని చూసిన. నీదేసిప్టు – నీళ్ళ మడుగైంది ’’ అన్నాడు. ప్యూనుగాడచ్చి - అనిదే బాయి అయినట్టు ‘‘నడువ్ నడువ్’’ అన్నడు. గొడ్లునో బర్రెనో అదిలిచ్చినట్టు. ‘‘నీ తాత సొమ్మా, నల్లా ఉంటే నీలు తాగిన’’ అన్ననేను. ఆడు నామీదికురికచ్చిండు - ఇద్దరం తన్నుకున్నం ఆడి తోటయి పోయిందా? ఎవడు కోతిమూతోడు ఆనవ్వను కుక్కల్‌దెం... నాకు తెల్లారి బిలిసి సార్జి సీటిచ్చిండు... గది బట్టుకొని రాఘవులిగాని దగ్గెరికిపోతే - వాడే మంటడు? ‘‘ నల్లాకాడ నీల్లెందుకు దాగినవ్’’ - అని - నాకట్ల కోపమచ్చింది. ‘‘నల్లా కాడ నీల్లు దాగకపోతే ఏర్గబోతరా’’ అన్నా? లీడరోడు బాయోడు ఒకటే మాటంటే ఎట్ల చెప్పు? - గిదేమన్న నాయెమేనా?’’ పక్కనున్న వాన్ని నిలదీసి అడిగిండు.
‘‘కాదనుకో? కని నాయెం, అన్నాయెం చెప్పెటోడెవడు?’’అన్నాడు ఎదుటోడు...
‘‘నువ్వు గట్లనే అంటవా?’’
శంకరయ్య మొగిలిని తీసుకొని లోపలికి నడిచిండు - గుడిసె ముందు జాగాలో సాటు గట్టున్నది. లోపట చాలా మంది తీరిపారి కూసుండి ముంగట సీసాలు బెట్టు కొని తాగుతండ్లు - సారావాసన గప్పు మంటోంది - మాటలు - ఎడతెరిపి లేని మాటలు. ఇద్దరు ముగ్గురు ఒక దగ్గర కూర్చుండి తాగుతున్నారు. వాళ్ల దగ్గర సీల్లేసిన చిన్న సీసాలు, గ్లాసులు, మిరుప కాయబజ్జీలు, గుడాలున్నాయి.
గుడిసెలో ఒక పక్క నల్లగా తునికి మొద్దు తీరుగున్న వాడొకడు పైసలు దీస్కొని సీసాలిస్తున్నాడు - కొందరికి గ్లాసుల్లో పోస్తున్నాడు.
‘‘గిటెందుకు తీస్కచ్చినవే?’’ అన్నాడు మొగిలి..
‘‘ఎందుకంటవేంది?’’ శంకరయ్య ఓ సేర్ సీసా తెచ్చిండు. - గుడాలు తెచ్చిండు - మిరుపకాయ బజ్జీలు తెచ్చిండు.
ఇద్దరు ఎదురెదురుగా దుమ్ములో కూర్చున్నారు - దుమ్మంటే దుమ్ముగాదు - అది బొగ్గుదుమ్ము. సీసాలోది వంచి శంకరయ్య ఎత్తి గొంతులో తనే మొదట పోసుకున్నాడు.
మరోమారు గ్లాసులో పోసి మొగిలి కిచ్చిండు
‘‘అద్దద్దు నేను గుడాలు దింటగని - నాకద్దు’’
‘‘దుడ్తు ఎవడన్నింటే ముడ్డితోని నవ్వుతరు’’
‘‘తెల్లగల్లు దాగినగని గిది’’
‘‘తీసుకో సచ్చేంబోవు...’’
మొగిలి బలిమిటికి గొంతులో పోసుకున్నాడు. గొంతంతా మంట - కండ్లల్లోనుంచి పొగెల్లి నట్లనిపిచ్చింది శంకరయ్య చెప్పుతున్నాడు.
‘‘మొగిలీ నేను మొదట్లచ్చినప్పుడు నీ తీర్గనే అనుకున్న - తినద్దనుకున్న. తాగద్దనుకున్న. కని గిప్పుడు తినుడు తాగుడు తప్ప మరోలోకం లేదు - ఆఖరుకు గిదన్న మిగులుద్ది - సచ్చిన్నాడేం కొంటబోతం. సిన్నప్పుడు పల్లెల ఆకటికి సచ్చినం. గిప్పుడు గీడ - వారీ మొగిలి నావొంట్లె నెత్తురు కొలిసమ్ముకుంటన్న - మల్ల గపైసలు బెట్టి తాగుతన్న’’ లొడలొడ ఏదేదో సెప్పుతున్నాడు.
‘‘అంతే అన్న - కాకపోతేంది? ’’ అన్నా అన్నాడు పక్కవాడు...
‘‘నాకు పెయి దిరుగుతందన్నా’’ మొగిలి.
నువ్వేం భయపడకు `- మన పెయ్యిదిరుగక పోతే భూమి తిరుగుతదా? మిరుపకాయ దిను’’ అన్నాడు శంకరయ్య.
పైసలయిపోయినయ్ - ఇద్దరు లేచి బయటకొచ్చారు. అప్పటికి రాత్రయిపోయింది - బజాట్ల కరంటు బుగ్గ లెలుగుతున్నాయి. దుకాన్లు మూసున్నారు. శంకరయ్య తూలుతున్నాడు. మొగిలికైతే గిర్ర గిర్ర తిరుగుతోంది.
‘‘రారా...నా ఎంటరా?’’ మొగిలిని పట్టుకున్నాడు...
‘‘నాకు కక్కత్తందే...’’ అన్నాడు మొగిలి
‘‘అద్దద్దు కక్కకు - గీడ నీళ్లులేవు...’’ అన్నాడు.
ఇద్దరు నడుస్తున్నారు... మొగిలి కాళ్లు మడతలు బడుతున్నాయి. కరంటు బుగ్గల వెలుగు ముఖం మీద కొడుతోంది. రోడ్డంతా ఎగుడు దిగుడు. శంకరయ్య దారెంట ఏదేదో చెప్పుతూ మొగిలిని తీసుకొని గుడిసె చేరుకున్నారు...
లక్ష్మి ఇద్దరి వాలకం చూసింది...
‘‘నువ్వు సెడిపోయింది గాక మొగిలిని జెడగొడ్తన్నవ్.. నౌఖరిప్పిత్తనని తీస్కచ్చి గిదా?’’ అన్నది
‘‘లంజె...నడువ్ - నువ్వానాకు సెప్పేదానివి’’ అన్నాడు శంకరయ్య
మంచంలో మొగిలిని కూర్చుండ బెట్టిండు.
‘‘లంజె కూడేదే’’ అన్నాడు..
‘‘బజాట్లకేనా? కాళ్లుసేతులు కడిగేదున్నదా?’’
‘‘నాయిష్టం తే... మొగిలి లేరా’’ అన్నాడు – లక్ష్మి ఇద్దరికి భోజనం బెట్టింది - మొగిలి తల వేల్లాడేసిండు.. శంకరయ్య తీసుకొచ్చి అన్నం ముందు కూర్చుండ బెట్టిండు...
మొగిలి బల్లున అన్నంలో కక్కుకున్నాడు - శంకరయ్యకు సర్రున కోపమచ్చింది - ‘‘లమిడి కొడుకా?’’ నెత్తిమీద గుద్దిండు...
‘‘లంజే..గిదేంకూరే..’’ అని పల్లెం విసిరికొట్టిండు...
లక్ష్మి తల వంచుకొనే మొగిలి ముఖం కడిగి బయట మంచం మీద పడుకో బెట్టింది - శంకరయ్య బయటకొచ్చిండు..లక్ష్మి ఇంట్లో సాపు చేస్తోంది..
‘‘వారీ మొగిలిగా... నీకు బాయిపని రాలేదు’’ అన్నాడు అప్పుడు యాదికొచ్చి శంకరయ్య....
మొగిలికి మాట వినపడనే లేదు...నిద్రలోకి జారుకున్నాడు.
‘‘వీనవ్వ - పీకులాటే అచ్చేటట్టున్నది`’’ అనుకున్నాడు.
లక్ష్మి ఆ మాటవిని బయట కొచ్చింది. ‘‘నీ సావు నిర్సావుగాను. మాదండి మొగోన్నని ఊళ్లెకు బోయి పెగ్గెలకు బోయి పుల్లబెట్టి దున్నుక బతికెటోన్ని నౌఖరంట తీసుకత్తవి. గిప్పుడు రాలేదంటివి - ఆడ మన ఇజ్జత్ బోతది - నువ్వే పైసల్ తిన్నవంటరు...’’
శంకరయ్య కామాట నిజమే ననిపిచ్చింది...
‘‘నీసావు నిర్సావుగాను - గపైసలన్నా వాపస్ యిప్పియ్యి - ఆళ్ల మానాన ఆళ్లుబోతారు - మల్లగిసొంటి నడుమంత్రపు ఏషాలెయ్యకు’’ అన్నది...
‘‘లంజెకాన నీకెందుకు బంచత్’’ అన్నాడు శంకరయ్య రేషంగా...
లక్ష్మి మాట్లాడలేదు...
మొగిలి నిదురలో కలవరిస్తున్నాడు...
14
ఎప్పటిలాగే తెల్లారింది... శంకరయ్య ఎప్పటిలాగే ఆదరబాదర లేచిండు... అప్పటికే గుడిసెలన్నీ బొగ్గుపొగలో నిండిపోయాయి. అరుపులు, కేకలు, తిట్లు విన్పిస్తున్నాయి. మధ్యమధ్యలో పెద్ద రోడ్డు మీదెక్కడో దబడ దిబడ ఉరికే లారీ రొద...ఉరుకులు పరుగులు మీదనే ఇనుపలోటా బట్టుకున్నాడు.. నీల్లు లేవు...
‘‘ఒసే లచ్చి లంజె నీల్లేయే నీళ్లు’’ గావుకేక పెట్టిండు.
లక్ష్మి నీళ్ళ పంపు దగ్గరికి పోయింది. ఆ కేకకు మొగిలి లేచి కూర్చున్నాడు - రాత్రి జరిగింది కొంత జ్ఞాపకానికొచ్చింది. శంకరయ్య ముఖంలోకి చూడలేక పోయాడు...
ఇంతలోకే ముఖం మాడ్చుకొని ‘‘లంజెలు ఒక్కలన్నా సందియ్యరుగదా?’’ తిట్టుకుంట లక్ష్మి వచ్చింది.
‘‘కాళ్లు బార జాపుకొని తెల్లారే దాక పండకపోతే గదా! పొద్దుగాల్లేత్తేగాదా?’’ శంకరయ్య.
‘‘సీకట్లనే లేసిన - ఏవారాయె నల్ల కాడ కూకుండి’’ లక్ష్మి బిందెలో నీళ్లు తెచ్చి సిమెంటుగోళంలో పోసింది.
‘‘డ్యూటీకి బోతడని చెప్పద్దా?’’
‘‘నీ మొగడొక్కడేనా సిపరాతిపిట్ట - అందరు డూటీకే కాలబడతరనిరి’’
‘‘మాటకు మాట బంచత్...’’ అనుకుంటనే నీళ్లు తీసుకొని పట్నం తుమ్మ చెట్లకేసి పరుగెత్తిండు - మురికి కాలువలు గెంతుతూ చెట్లల్లోకి నడిచాడు - అప్పటికే చెట్లన్ని నిండిపోయాయి... వాళ్లందరిని తప్పిచ్చుకొని దూరం పోయేసరికి పందులు గురుకూ గురుకుమని వెంటపడ్డాయి...
శంకరయ్య మళ్లా గుడిసె కొచ్చేసరికి తొలి సైరన్ గాడిది గూసినట్టు కూసింది...
ఉలిక్కి పడి మొఖం మీద నీళ్ళు జల్లుకున్నాడు - ఆకుతూ ఆకుతూ అని ఊంచిండు - మొఖంమైపోయింది...
‘‘ఆ గబ్బు నోరు మంచిగ్గడుక్కుంటె గాదా?’’ అన్నది లక్ష్మి...
‘‘నీయవ్వ నాదా గబ్బునోరు తందునా?’’లక్ష్మి మీదికురికిండు...
‘‘ఇంటాడిదాన్ని గొట్టంది ఇది మీసం గాదని - తన్ను కొత్తా - తన్ను...’’అన్నది...
‘‘చాయ్..’’ అరిచిండు...
శంకరయ్య డ్యూటీ బట్టలేసుకొని చాయ్‌తాగే సరికే ఏడుగంటల సైరన్ కూసింది - శంకరయ్య బొగ్గుపొయ్యి మీద నీళ్లు గుమ్మరిచ్చినట్టు చప్పగా చల్లారిపోయిండు.
‘‘నీతల్లి మస్టర్ బోయింది...’’ గొనుక్నున్నాడు...బట్టలు విడిచాడు.అప్పుడు మొగిలి నౌఖరి సంగతి యాదొచ్చింది.. మొగిలి లోటా బట్టుకొని చెట్ల్లకు పోయిండు.
మంచంలో వెల్లకిలా పన్నాడు. సూర్యుడు పైకెక్కి వచ్చాడు. ‘‘పీకులాట బెట్టుకుంటినే - ఇజ్జత్ బోయే టట్టున్నది... ఇప్పుడే నౌఖరి దొరికినట్టు తీసుకత్తిని. రాఘవులు గాడెంత పనిజేసిండు - డాక్టరుగాడే పుల్ల బెట్టిండు. వాని కిచ్చిండ్లో లేదో పైసలు - లంగలు బంచత్... గిప్పుడెట్ల గిప్పుడు రాఘవులుగాన్ని తన్నేం ఫలం - వాడు సూత్తాం సూత్తామంటడు - బాయి మీదికి బోయి లీవు కాలబెట్టి దొర దగ్గెరికి పోయడిగితే - అదే మంచిది...’’
‘‘ఇగో లచ్చిమి - మొగిలిని తయారుగుండు మను నేను బాయి మీదికి బొయి లీవు బెట్టత్త ’’ అని సైకిలు దీసుకొని బయట కొచ్చాడు.
‘‘శంకరయ్య గుడిసెకు బాయికి మూడు మైళ్లు... లీవ్ క్లర్కుదగ్గర లీవు ఫాం అడుక్కున్నాడు. రాయిమంటే ‘‘మాకదేపని - పో - పో మ్యాన్‌వే క్లర్కు దగ్గరకి పొమ్మని ’’ కసురుకున్నాడు.
మ్యాన్ వే ముంగట మంది జమై ఉన్నారు. తలో మాట - తలో తిట్టు మందిలో రాఘవులు నిలుసుండి ` చేతులూపుతూ ‘‘సోదరులారా! నామాట వినుండ్లి - నల్లా దగ్గర నీళ్ళు దాగడం తప్పుగాదు - కని నిజమే - కాని ఆడ మడుగైందనుకో - ఎవడన్న జారిపడితె ఎవనికి పీకులాట’’
‘‘జారిపడకుంట సిమెంటు గద్దె గట్టియ్యాలె’’
‘‘కట్టిత్తరు అదివేరే సంగతి...’’
‘‘మరైతే చార్జిసీటు వాపసు దీసుకొమ్మను’’ ఓ దవడలు చెక్కుకపోయిన కార్మికుడు తెగేసి చెప్పిండు.
‘‘అదట్లా ఉంచుండ్లి - ఆ మడుగు ఈ కార్మికుడే - మన ఓదెలు చేస్తె అయ్యిందా అనేది దొరకెట్లా తొస్తది...’’
‘‘అదిగాదయ్య...’’
‘‘కార్మికులారా మీరట్లా మాట్లాడితే ఎట్లా? అందరు మాట్లాడతమంటే మాట్లాడుండ్లి - మద్దెన మేమెందుకు? ` చార్జి సీటు వాపస్ తీసుకొమ్మని మనం కోరుదాం - నేను పోయి మాట్లాడ్త - మీరంతా బాయి లోపలికి దిగండి’’
‘‘ఏదో ఒకటి తేలేదాకా దిగేది లేదు..’’ అన్నాడు శంకరయ్య.
తను ఎట్లాగు దిగేది లేదు కనుక - కొత్తసినిమా మీద మనుసు పీకిన వాడొకడు. ‘‘అంతే అంతే’’ అన్నాడు...
బదిలీ ఫిల్లర్స్ అదే అన్నారు.
హామర్ మన్స్, ఫిట్టర్స్ ` ‘‘దిగాలె’’నని అందామనుకొని మందికి భయపడి ఊకున్నారు...
‘‘ఇట్లా మధ్యన సమ్మె చేస్తే ఇల్లీగల్’’ అన్నాడు రాఘవులు.
‘‘అదేనోంట’’ అన్నాడో తొర్రోడు.
‘‘సమ్మె చేయాలంటే పదిహేను రోజు ముందు నోటీసిచ్చి చెయ్యాలె’’ రాఘవులు ...
‘‘బాగుంది ` మహా బాగుంది ` బాయిదొర పదిహేనొద్దులాగి చార్జి సీటిచ్చిండా? కడుపు ఇయ్యల్ల నొత్తె పదిహేనొద్దులకు ఓమ బుక్కుమంటవ్‌లే. లేవయ్య! మాంచి లీడరువు’’ అన్నాడెవడో...
‘‘రూల్స్ అంతే...’’
‘‘నీ రూల్స్ గీల్స్ గుద్దల బెట్టుకొమ్మను...మా రూల్స్ గిది...పో - పొయ్యి అడుగుపో’’ టింబర్‌మన్ ముసలోడు అన్నాడు ..
‘‘అయితే ఉండండి...’’ అంటూ రాఘవులు సూపరిడెంటు రూంలోకి పోయిండు - ఏదేదో మాట్లాడిండు ...
నవ్వు ముఖంతో మళ్లీ కార్మికుల దగ్గరికొచ్చిండు ‘‘కార్మికులారా మనం గెలిచాము... పోరాడితే మనం మన హక్కులు గెలుచుకోగలమని రుజువైంది. చార్జిసీటు వాపసు తీసుకోవడానికి బాయిదొర ఒప్పుకున్నాడు’’ అన్నాడు రాఘవులు.
‘‘పెనం గిటు బెట్టిండేంది. తింపేసినట్టున్నది కత’’ ఎవడో అన్నాడు...
‘‘గదే కదా అంపయితె మరదలు మిట్టయితే వదినె...’’
హాలరు తిరిగింది... పంఖాతిరిగింది - మ్యానువే తలుపు దబెల్లు దబెల్లున ఇగ్గుతో వేస్తూ ఒక్కొక్కలు బొగ్గుబాయిలకు దిగిండ్లు...
రాఘవులు చెమట తుడుచుకున్నాడు... స్కూటరు దగ్గరికి నడువబోయాడు. అప్పుడు శంకరయ్య తగులుకున్నాడు..
‘‘జెరంత లీవు గావాలె’’ అన్నాడు...
‘‘అయితే నువ్వీడుండు. నేను శాంక్షన్ చేయించుకొస్తా’’ నని రాఘవులు బోయి లీవు శాంక్షన్ చేయించాడు...
‘‘జెరంత ఆగుతరా?’’ అన్నాడు శంకరయ్య నాలె చూపు చూస్తూ...
‘‘మల్లేంముంచుకచ్చింది - మంగలోన్ని సూసి దున్నపోతు కుంటినట్టు’’ రాఘవులు అదో విధమైన నవ్వు నవ్వుతూ...
‘‘గదేనుండ్లి మావోనికి నౌఖరిరాలే...’’
‘‘ఓ మతికత్తలేదే - ఆనాడు తీసుకచ్చినోడా! ఇంకో పారి జూద్దాం...అట్ల రాంగనే ఇట్లయితదా?’’
‘‘రెండువేల అయిదువందలు ’’
‘‘ఇచ్చిండ్లోయి, ఇయ్యలేదని ఎవలంటండ్లు.? నేనిచ్చేకాడ ఇవ్వనే ఇస్తి. ఏడ జరిగిందో మిస్టేకు... జరిగింది . ఈ భర్తి కాకుంటే ఇంకో భర్తి’’
‘‘నాయింటి మీద బడున్నడు’’
‘‘ఇంటికి బొమ్మను మల్ల చాన్సచ్చినప్పుడు పిలుసు కొచ్చేవు’’
‘‘నేనాడ వస్తదని తీస్కచ్చిన...’’
‘‘ఓ సావొచ్చిందే... ఎట్లస్తదోయి ఎకాఎకిన...అది నౌఖరా మరోటా? చూస్తివిగదా? ఇంత జేస్తె మాకు మోఖ పడ్డప్పుడు గంజి ఈగ తీర్గతీసేస్తరు... వానికి అదే ఆ ముసలినాకొడుక్కు లక్ష సార్లు నేను సాయంజేసిన. వాడు మందిల ఎగిరెగిరి మాట్లాడిండు. - సూస్తివిగదా! మీ వర్కర్ల నమ్మవశం గాదు - అందుతే జుట్టు లాపోతే కాళ్లు బట్టుకుంటరు... మల్లగలువు’’ మని స్కూటరు స్టార్టు చేసిండు. కొంత దూరం పోయి స్కూటరాపి పిలిచిండు - శంకరయ్య దగ్గరికి పరుగెత్తిండు...
‘‘ఇగో మాపటించి దొరస్తున్నాడు... నువ్వుబొయ్యి అడుగు - నాపేరు దియ్యకు - మద్దెన నేనే తోలిచ్చినంటడు. లోడింగు పని అంతదనుక బెట్టుకొమ్మను...’’ రాఘవులు స్కూటర్ వెళ్లిపోయింది...
‘‘నీయవ్వ లోడింగు పనికి గుడుక దొరనే అడుగన్నట’’ అనుకున్నాడు శంకరయ్య...
Mar 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు