నవలలు

(April,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సైరన్ నవల నాల్గవ భాగం  

(గత సంచిక తరువాయి భాగం )

                                                                              15

                ‘‘ఇగో మొగిలి...నువ్వేం ఫికరు పడకు - దేంట్లనో దాంట్లె  ముందుగాల ఇరుకాలె ... ఇన్నవా? ఇంతట్లకాలం గడుత్తనే    ఉంటది. గిప్పుడు నువ్వింటికి బోయినవనుకో నువ్వాడ! నేనీడ! ఓపారి మతి కుండె. ఓపారి లేకపాయె - నాకండ్ల ముంగటుంటె - రాంగపోంగ రాఘవులు గానికి కండ్లబడి సెవుల జోరిగ తీర్గ తాపతాపకు మతికి జేత్తె - పీడ బోనియ్యని ఎప్పుడో పనిల పెడ్తడు..నేనైతే తిరుగంగ తిరుగంగ దొరికింది’’ అన్నాడు శంకరయ్య..

                మొగిలి ఏమనలేదు - ఇద్దరు బొగ్గుకుప్పల మధ్యనుంచి నడుస్తున్నారు. సి.యస్‍.పి.(కోల్‍ స్క్రీనింగ్‍ ప్లాంట్‍) దగ్గర గల్లర గల్లర సప్పుడైతంది - బొగ్గు కుప్పల్ల బొగ్గు పెళ్లలు కదులుతున్నట్టు బట్టలు, పెయ్యంతా బొగ్గు దుమ్ముబడిన వాళ్లు లారీలు లోడ్‍ చేస్తున్నారు...ఎవడో తెల్ల బట్టలోడు వాల్ల పక్కన సైకిలు బట్టుకొని నిలబడి ముక్కు కడ్డంగా దస్తీ బెట్టుకొని మాట్లాడ్తండు.

                ఇద్దరు బొగ్గుకుప్పలు దాటి రోడ్డెక్కారు... జనరల్‍ స్టోరచ్చింది. వాచ్‍మన్‍ వచ్చిపోయే లారీల తనఖీ చేస్తున్నాడు. రోడ్డు మీద నడుస్తుండగా...

                ‘‘ఓ మొగిలయ్య బావ గీడికచ్చినవేందే?’’ అన్నా డెవడో పక్కనుంచి.

                మొగిలి ఉలిక్కిపడి చూసిండు - బోడగుండు, ఎత్తు చెప్పులు - కర్రెగున్నవాడు. ఎర్ర దస్తీ ఒకటి మెడదగ్గర బెట్టుకొని దోవతి చింగులు అచ్చం పట్వారి పట్టుకున్నట్టు పట్టుకొని అడిగిండు.

                ‘‘అయ్యో నన్ను గురుతు బట్టలేదా? ఏల్పుల సమ్మన్ని. కుంటిమల్లవ్వ కొడుకును’’ అన్నాడు..

                మొగిలికి యాదొచ్చింది. చిన్నప్పుడు ఇద్దరు ఎడ్ల కాసేటోల్లు - వాడు కిట్టయ్య పంతులుకు పాలేరు...ఎప్పుడు కడుపీడుసక పోంగ ఏదో పదం - ఆయాది కొచ్చింది ‘‘వానికడుపుడికినాది - వాని కండ్లు మండినాయి. పాలేర్లు రాలేదని పండ్లు గొరికినాడు - అయ్యలేని పోరన్ని, దిక్కులేని పోరన్నిధీములేని పోరన్ని’’ అంటూ కైగట్టి పాడేటోడు...

                ‘‘ఏడున్నవురా?’’ మొగిలి...

                ‘‘మా బావ రప్పిచ్చిండు. కొలువు కోసం దిరుగుతన్న’’ అన్నాడు.

                ‘‘మా లింగు మామ బిడ్డ లచ్చిమి మొగడు’’ అని శంకరయ్యను చూపెట్టిండు.

                ‘‘లచ్చవ్వ మంచిగున్నదా? మీది బేగంపేట గాదుండ్లి’’ అన్నాడు సమ్మయ్య

                ‘‘ఔ..’’ నన్నట్టు తలూపిండు శంకరయ్య. ఇద్దరు మరికొంచెం నడిచేసరికి చిన్న బ్రిడ్జి వచ్చింది. బ్రిడ్జికిందా మురుగు    నీళ్లు పారుతన్నాయి... వాగుదాటిన తరువాత క్వార్టర్లు... ఎడంబాజు దొరలయి. కుడిబాజు రైటర్లయి, వోర్‍ మన్లయి...

                క్వార్టర్ల దాటి మార్కెట్లకొచ్చిండ్లు - మార్కెట్లో తట్టుబొంతలు కొయ్యల మీదేసుకొని కూరగాయలమ్మేటోళ్లు ముందు వాడిపోయిన కూరగాయలు బెట్టుకొని తాపతాపకు నీళ్లు జల్లుతున్నారు...కొనే వాళ్లు దుకానం నుంచి దుకానానికి తిరుగుతున్నారు...

                ‘‘అగో మీతమ్ముడు..’’ అన్నారెవరో.

                పేడి మూతి నూనె రాసిన ఎంటికలుగల ఎర్ర టాయన సంకల పిల్లనెత్తుకొని ‘‘ఒరే శంకరీ’’ అని పిలిచిండు.

                శంకరయ్య ఆగి పోయిండు...

                ‘‘అయ్యో! నువ్వెప్పుడచ్చినవు పిలడా? ఊళ్లంత మంచి గున్నరా? మా అవ్వ నాయిన్న - ఇటుతొంగన్న సూత్తలేరు?’’ భర్తకన్న ఎత్తున్నామె లక్ష్మి అక్క చెంద్రకళ అడిగింది...

                ‘‘మొన్ననే వచ్చిన’’ అన్నాడు మొగిలి.

                ‘‘మా యింటి దాకన్నా రాపోతివి...’’

                ‘‘నాకెర్కలేదు?’’

                ‘‘నువ్వన్న చెప్పద్దా...?’’ అన్నది మరిదికేసి చూసి...

                ‘‘ఏడది? తీరికబడలే - ఇయ్యల్ల అత్తామనే బయలెల్లినం’’అన్నాడు శంకరయ్య.

                ‘‘రాండ్లి....రాండ్లి...’’ అన్నదామె

                ‘‘ఇయ్యల్ల మామత్తనన్నడు’’అనేమాట నోట్లెనే అగిపోయింది - శంకరయ్య మందిల కలిసిపోయిండు -

                మొగిలి తత్తరపడి మందిని దాటుకుంటూ పోతూ ఓ ఎర్ర చీరామెకు గుద్దుకున్నడు. ఆమె గయ్యిన అంతెత్తులేచి ‘‘కండ్లు గన్పడ్తలేవ్‍ బాడ్‍కావ్‍’’ అన్నది. చుట్టు పక్కలోల్లు మొగిలిని వింత మృగంలాగ చూసిండ్లు.

                ‘‘లమ్డికొడుక్కు రెండేత్తె కండ్లు కన్పడ్తయి’’ అన్నాడెవడో...మొగిలి మొఖం నల్లబడి పోయింది....

                ఆ గడబిడలోనే శంకరయ్యచ్చి మొగిలి చెయ్యిబట్టుకొని గుంజుకపోయాడు...

                ఇద్దరు మార్కెటు దాటి మల్లీ రోడ్డెక్కారు...

                ‘‘ఇంకానయం -అది తన్నలేదు’’ అన్నాడు శంకరయ్య.

                ‘‘ఎందుకుతన్నుద్ది?’’

                ‘‘అంతే -గీడ గట్లడుగద్దు’’

                పెద్దపెద్ద దుకానాలొచ్చాయి - దుకాన్ల మధ్యలో ఓ పెద్ద బంగళా ఉన్నది- దాని చుట్టు ప్రహారి గోడున్నది. గేటు లోపల ఖాళీ స్థలంలో కుర్చీలు వేసున్నాయి. ఓ కుర్చీలో క్రిష్ణారావు దొర కూర్చుండి సిగరెట్టు తాక్కుంటూ ముక్కుల్లో నుంచి పొగ వదులుతూ ఏదో అంటున్నాడు- అతని ముందు అమ్మోరు మొఖపు నడీడు మనిషి నిలబడున్నాడు.. దూరంగా జాజితీగ పందిరికింద ఎర్రగ ఎత్తుకెత్తున్నామె నిలబడున్నది...

                ‘‘రాయమల్లూ - ఆలోచించాలే’’ - ఎనకాముందు ఆలోచించాలె - విన్నవా. మనుషులన్న దగ్గర వ్యవహారాలుంటాయి.. ఇచ్చుడు పుచ్చుకునుడు లేకుంటే ప్రపంచం నడువది. కాని నీతి ఉండాలె - వింటన్నవా? కొంతకాక పోతె కొంత యివ్యాలె...’’

                ‘‘యిస్తూనే ఉన్నదొర’’ రాయమల్లూ.

                ఆ పక్కనే నిలబడ్డ పొట్టి గడ్డపువాడు పిడికిలి బిగించి - కుడి చేతి కడెం ఊగుతుండగా ‘‘అరెబయి జూటా మత్‍ బోలనా... నేను నీ చుట్టు తిరిగి తిరిగి పరిషానయితి.... వడ్డీలేదు, అసలులేదంటే మాదీ దంద ఎట్ల నడువాలె?’’ సిక్కులాయినె.

                ‘‘నేను ఉత్తగనే అన్ననా? నాగళ్లబడితె అన్ననా? నెలా నెలా వడ్డి యివ్వనే పడ్తి. పోయిన నెలల తఖిలీబున్న దంటె వినకపోతివి. నువ్వే గుండాలతోని తన్నిస్తనంటవి.’’

                ‘‘తెరి మాకా బోసిడికె మెరీపైసే పారేసి మాట్లాడు’’

                ‘‘ఖామోస్‍...మధ్యలో నేనెందుకు...? చూడు రాయమల్లూ. కొట్లాటలు ఉండయనీకాదు - నువ్వు మొదటి నుంచి నా యూనియన్‍ మనిషివి - నా మనిషివి. ఎవడు కొట్టినా నాకు కష్టంగుంటది బై...పో...మళ్లీ నాదగ్గరకి కిస్సా రావద్దు... నువ్వేం చేసుకుంటవో నీయిష్టం.. సింగ్‍బై జెర ఆలోచించి వసూలు చేసుకో...’’ఇంకా మాట్లాడడానికేమి లేనట్టు - అగ్గిపెట్ట గీసాడు        క్రిష్ణారావు.

                రాయమల్లు అనే కార్మికుని ముఖం ముడుచుక పోయింది. తలెత్తి సింగ్‍ను, క్రిష్ణారావును చూసి బయటకు నడిచాడు...

                ‘‘వీనవ్వల గాడ్దులు దెం....లంగ లం... కొడుకులు. తోడు దొంగలు. దొరోని పైసలు వీడు వడ్డీకి తింపుతడు.  మళ్ల దొరోడు పంచాయితీ తెంపుతడు.  ఇప్పటికే నా యిల్లు ముంచిండ్లు...’’ అన్నాడు... కాళ్లునేలకేసి బాదుతూ వెళ్లి పోయాడు.

                శంకరయ్య మొగిలి లోపలికడుగు బెట్టారు...

                ‘‘ఎవర్రా మీరు ?...’’ క్రిష్ణారావు..

                ‘‘నేను కెకె -2 లోపని చేస్తున్నదొర - వీడు మా సిన్నాయిన కొడుకు... మొన్నటి భర్తిల రాఘవులు సారు బెట్టిత్తనన్నడు - కని కాలేదు దొరా’’

                ‘‘అయితేం జెయ్యమంటవ్‍?’’ అప్పటికే క్రిష్ణారావుకు కేసు అర్థమైంది.

                ‘‘రాఘవులు సారు నడిగినం దొరా! ఏదో తమరికి గలిసి లోడింగు పనిలనన్న బెడ్తె...’’

                ‘‘ఇగో అట్లబోయి - టాకీసుకాడ మా మొఖద్దమ్‍ నరేందర్‍ గాడుంటడు - నేను రమ్మన్నని చెప్పు’’ అన్నాడు...

                శంకరయ్య టాకీసు కాడికురికిండు.. మొగిలి అక్కడే నిలుచున్నాడు

                ‘‘ఏమోయి నీపేరేంది? ఏవూరు’’

                మొగిలి చెప్పిండు....

                క్రిష్ణారావు అచ్చం ఇంటర్వూలోల్లు చూసినట్లే పిక్కలు చూసిండు...

                ఇంతలోనే నరేందర్‍ అనే మొఖద్దమ్‍, శంకరయ్య వచ్చారు....

                ‘‘నరేందర్‍ వీడు ఫిల్లింగు పనిల కొస్తడట. రేపటి నుంచి తీసుకో - సి.యస్‍. పి దగ్గర ట్రక్కులోడింగ్‍ల బెట్టు... ఇక మీరు పోవచ్చు’’ అన్నాడు...

                శంకరయ్య దండం బెట్టిండు - మొగిలి తను దండం బెట్టిండు ఇద్దరు బయటకొచ్చారు...

                వాళ్లిద్దరు గుడిసె చేరుకునే సరికి పల్లెనుంచి లింగయ్య వచ్చున్నాడు...

                ‘‘ఏమిర మొగిలి పనైనట్టేనా? అడిగిండు.

                ‘‘అయినట్టేననుకో’’ అన్నాడు శంకరయ్య

                ‘‘ఆ అనుకో’’’ అన్నమాట తీరుచూసి లక్ష్మి మొగిలి కళ్లల్లోకి చూసింది...

                ‘‘ఇగో మీనాయిన తీరుపాటం జూసుకొని రమ్మన్నడు... ఏ సంగతి చెప్పుమన్నడు...?’’ లింగయ్య... వాళ్లట్లా మాట్లాడుతుండగానే మామకు సారాతేవడానికి సైకిలు తీసుకొని బయలు దేరిండు శంకరయ్య.

                ‘‘ఏందట్లా దీర్ఘంతీత్తడు ’’ అన్నది లక్ష్మి

                ‘‘ఈ భర్తీల దొరుకలే - మల్లచ్చే భర్తీరెన్నెల్లకున్న దంటండ్లు - అంతదనుక లోడింగు పనిల చెయ్యిమన్నడు దొర’’

                ‘‘ఓ గ పనినువ్వేం జేత్తవ్‍’’ అన్నమాట లక్ష్మి నాలిక చివరిదాకా వచ్చింది కాని అనలేదు...

                లింగయ్య ఊరు సంగతులు చెప్పుతుంటే మొగిలి ఎన్నడో ఆ ఊళ్లె నుంచి వెళ్లి వచ్చినంత ఉత్సాహంగా దిగులుగా మోకాళ్ల మీద కూర్చుండి వింటున్నాడు.

                మొగిలి ద్యాసల్లా ఆ ముచ్చెట్లల్లో ఎక్కడన్నా రాయేశ్వరి గురించి చెప్పగలడేమోనని - అడగుతే వదిన నవ్వగలదేమొనని.. లింగయ్య రాజేశ్వరి సంగతి ఎత్తనేలేదు...

 

                                                           16

 

                శంకరయ్య  సైకిలు మీద మొగిలిని తీసుకపోయి  మసుకు మసుకుండంగనే సి.యస్‍.పి. దగ్గర దించిండు. ఆడ  చాలా  లారీలాగున్నయి ఒకటెనుక ఒకటి.  మొగిలి అన్నిలారీలు ఒక్క దగ్గరచూసెరుగడు...

                ‘‘ఇగ్గో గ లారీల నేం జూత్తన్నవ్‍...?’’ శంకరయ్య.

                లారీలు తప్పించుకుంటూ బొగ్గు కుప్పల దగరికి నడిచారు. అప్పటికే అక్కడ రెండు వందల మంది దాకా జమై                     ఉన్నారు...పది పన్నెండు మంది గుంపు గుంపులుగా కూర్చుండోనిలబడో బీడీలు తాక్కుంటూ ముచ్చెట్లు బెట్టుకుంటున్నారు...

                ఆ మందిలో మొఖద్దమ్‍ నరేందర్‍ కోసం వెతికిండ్లు...

                ‘‘ఏవూరు తమ్మి కొత్తగచ్చినవా? బర్లగాసినవంటే మొగతనముండది’’ అన్నాడో తొర్రోడు.

                ‘‘పెండ్లయ్యిందా తమ్మి’’ అన్నాడింకొకడు...

                ‘‘మొఖద్దమ్‍ నరేందరింకారాలేదా? ’’ శంకరయ్య...

                ‘‘అయినా? ఆయినెకేంది మారాజు - లేవాలె - నాష్టజెయ్యాలె పవ్వ గొట్టాలె గప్పుడిటత్తడు...’’ అన్నాడు తొర్రోడు...

                ‘‘ఇగో ఈడుండు ఈల్లతోనేపని జేసుడు - నాకు డ్యూటికి యేల్లయితంది’’ అని సైకిలెక్కిండు శంకరయ్య.

                తెల్లవారింది. పొద్దు పొడిసి బారెడెక్కింది - ఎండపొడ బొగ్గుపొగలో చిక్కుబడిపోతంది...మొగిలికి తెలిసిన వాళ్లెరులేరు... చేతులు కట్టుకొని వనమిడిసినకోతిలాగా, తప్పిపోయిన పక్షిలాగా అందరిముఖాలల్లోకి చూశాడు...అందరి ముఖాలల్లో అలసత్వం పేరుక పోయున్నది. పెరిగిన గడ్డాలు - కండ్ల బూసులన్న సరిగా కడగని ముఖాలు, మసి బట్టలు - పెదువులు తెరుచుకొంటూ మూసుకుంటూ ఎవడో అకారణంగానే ఎన్నో సంత్సరాలనుంచినవ్వు మొఖం ఎరగని వానిలాగా నవ్వుతాడు.... ఎవడో తనచిన్నతనం పదహారేండ్ల పడుచుపిల్ల గురించి వర్ణించి చెప్పుతున్నాడు..మిగతా వాళ్లు లొట్టలు వేస్తూ వింటున్నారు...

                అంతలోకే ఖనేల్లు ఖనేల్లుమని దగ్గుతూ ఒక ముసలి వాడొచ్చాడు...ముఖమంతా జేవురించింది - వాని చేతిలో గిలేటు టిఫినున్నది. అందులో నుండి పప్పుకారిన చారికలున్నాయి.. వాడొచ్చి టిఫిన్‍ కిందబెట్టి బొగ్గుకుప్పమీద కంకెడు ఖల్లు ఊంచిండు.

                ‘‘దగ్గులోడా గటేటన్న ఊంచరాదుర’’  - అన్నాడెవాడో... ఆ మాట పట్టించుకోనేలేదు..

                ‘‘దీపాంతెల సమురైపోతంది...’’ అన్నాడు  దగ్గులోడు...

                మొగిలి దగ్గులవాని మొఖంలోకి చూశాడు - కండ్లు మండే నిప్పుల్లాగా...నిజానికి ముసులోడు కానే కాదనిపించింది. ఈ మనిషిని ఎక్కన్నో చూసినాననుకున్నాడు. ఎక్కడో గుర్తుకు రాలేదు...

                ఇంతలోకే ముచ్చెట్లాగి పోయినయ్‍...సైకిలుగంటలు వినిపించినయ్‍..అందరి కన్నా ఆఖరుగావచ్చాడు నరేందర్‍...

                మొఖద్దమ్‍ల చుట్టు లారీల వాళ్లు మూగిండ్లు...ఎవడో లెక్కేసి నూటా నాలుగు లారీలున్నయన్నాడు...

                కర్రెగా సుండకుసుండున్నోడు... మొదటి రెండు లారీలు తనయనిచెప్పి ‘‘పూసల మల్లిగాడేడి?’’ అన్నాడు - ఆకంఠంలో కరుకుదనం...

                ‘‘ఇగో ఈన్నె ఉన్న...ఇగో ముందుటి ఎనిమిది లారీలు మనయి - నింపుండ్లి..నేనుమల్లత్త’’ అన్నాడు

                ‘‘సరే యాకోబన్నా’’ అన్నాడు మల్లయ్య...

                ‘‘చంద్రమొగిలి గాడేడి?’’ అన్నాడు నరేందర్‍...చంద్రమొగిలి ముందుకు వచ్చిండు - అప్పటి దాకా ఎట్లా కలువాలా అని ఎనకా ముందు చేస్తున్న మొగిలి నరేందర్‍ ముంగటచ్చి నిలుసున్నాడు...

                ‘‘గీడెవ్వడో కొత్తోడున్నట్టున్నది’’ నరేందర్‍...

                ‘‘పనిగావాలె..’’ మొగిలి

                ‘‘గీడ పనిలేదు గినిలేదుపో - ఏ ్య ంగుల తక్కువలేరు... గీడగాదు - దారి దప్పచ్చినట్టున్నది పో పో’’ అన్నాడు యాకోబు...

                ‘‘నిన్న దొర మీకు చెప్పలేదా? ’’ అన్నాడు మొగిలి నరేందర్‍నుద్దేశించి.

                ‘‘ఓ నువ్వా డోకిలిగాని లెక్క నిలబడ్డవు పనిజేయచ్చినవా? సూసిపోనచ్చినవా? దండంబెట్టుడేలేదు - గిప్పుడేగంత పొగరు మీదున్నవేంరో?’’ అన్నాడు నరేందర్‍ -

                ‘‘మన గాంగుల మనుషులు బరుపూరనే ఉన్నరు కాదుండ్లి’’ చెంద్ర మొగిలి.

                ‘‘ఉంటేంది మీద మిండడు దోలిచ్చిండు...ఎరికయ్యిందా?’’ నరేందర్‍..

                ‘‘నిజమే కానుండ్లి ఉంటె ఇద్దరుండాలె గీడు ఎక్కువేగదా?’’

                ‘‘ఏడి? దగ్గులోడేడబోయిండు.. ఆడు దగ్గుడుకే గంట గావాలె - ఆడు పుసుక్కున సత్తె పీకులాట ఆన్నాగుమను’’ అన్నాడు నరేందర్‍...

                బొగ్గుకుప్పమీద ఇంకా దగ్గుతున్న దగ్గుల వాడికి ఎవరో ‘‘ఒరే కాసింగా, నిన్ను పనిల నుంచి తీసేసిండ్లు...’’ అన్నారు...

                అప్పుడు లేచిండు దగ్గులవాడు... ఈడిగీలబడి నరేందర్‍ ముంగటి కొచ్చిండు. ఒకే ఒక్క నిముషం నిశబ్దంగా నరేందర్‍ ముఖంలోకి చూసిండు - ఆ పక్కనే నిలుసున్న మొగిలి దిక్కు చూసి కాండ్రకిచ్చి ఊంచి...

                ‘‘నీ అవ్వ మిండడు సంపాయించిండా బాడ్‍కావ్‍ - నడువ్‍’’ అని మొగిలి దిక్కు పీలచేయెత్తి చూయించి నరేందర్‍ దిక్కుతిరిగి....

                ‘‘మొఖద్దమ్‍... నా బొచ్చె సీరి సూడు - నా కడుపు చింపి సూడు - ఆడ బొగ్గు, బూడిది పేరుకపోయినయి. నా నెత్తురు బూడిదై పోయింది. నా మాంసం బొగ్గయిపోయింది - నా బతుకు మసై పోయింది. ఒరే లంజ్జకొడుకుల్లారా నేను గీడికి ఇరువై యేండ్లకిందచ్చిన - ఓ మొఖద్దమ్‍ నువ్వు గుద్దకడుగక ముందు నీ నీడ బొగ్గుతట్ట మోసిన - నువ్వు నిన్న మొన్నచ్చినవ్‍.. ఆని కాళ్లీని కాళ్లుమొక్కి’’

                ‘‘అరె దగ్గులోడా నడువ్‍ ఈడినుంచి నడువ్‍’’ నరేందర్‍ మెడల మీద చెయ్యేసి దొబ్బిండు.

                దగ్గులవాడు కింద దుమ్ములోపడ్డాడు. వాని టిఫిన్‍ ఊడిపోయి మక్కజొన్న గడుగ పప్పు ఎర్రగా కింద బడ్డది. లారీలోల్లు చుట్టూ మూగిండ్లు...

                ‘‘నీయవ్వల కుక్కల్‍ దెం...తయి - ఒరే బద్మాషి లంజకొడకుల్లాలా - నా తనువుల నెత్తురు పీల్సేసిండ్రు. నేను మిమ్ముల గావుబడ్త’’ లేచి పిడికిల్ల నిండా బొగ్గుతీసి విసిరికొట్టాడు...

                ‘‘కయికురే కాసిం - జావ్‍ - గుండగాళ్లతో నేంది? - ఎందరు బోంగ చూల్లేదు’’ ఇంకో తురకవాడు టిఫిన్‍ మడిచిచేతికిస్తూ.

                ‘‘ఒరే లంజకొడుకుల్లాలా మీరు మనుషులుకాదు కుక్కలు -ఇరువై ఏండ్లు కలిసి పని సేస్తిమే - ఒక్కడు ఒక్కడన్న నా ఎనుక నిలబడరా?... దెబ్బల్ల, కట్టంల కలిసున్నగురుత్తంలేదు.. తుమ్‍సైతాన్‍లోగు బంచత్‍... సైతాన్‍కే బచ్చే నాతీర్గ మీరు గిట్లనే పోతరు బిడ్డా! యాద్‍రక్‍నా..’’ దగ్గులవాడు ఇంకా వదిరేవాడే కాని వానికి దగ్గుతెరొచ్చిది...

                ఎవరో ఇద్దరు దూరంగా తీసుకపోయార...

                మొగిలి నాభిలో అతకంతకు దూరమయ్యే కాసిం దగ్గు గడ్డపారేసి పెకలిస్తోంది... ఆ కండ్లు, ఆసెత్తఆమాటలు.

                ‘‘బతుకవ్వను గాడ్దులుదెం...’’ అన్నాడేవడో మందిలనుంచి..

                ‘‘ఎవడుబే - పుర్రెలగిన పురుగు మెసులుతాందిబే...మాకె...దవడ పండ్లూడాలె...’’అన్నాడు పొట్టిగా గుండ్రంగా ఉన్న మొఖద్దమ్‍...

                ‘‘మిమ్ముల గాదుండ్లి - బతుకునంటన్న...’’ అన్నాడెవడో.

                ‘‘అబ్బోబాంచెన్‍ ఈ ఇలాకాల తమరిని మాటని బతికేటోడున్నారు బాంచెన్‍..’’

                ‘‘అదిరా...హన్‍మాన్‍ బస్తీమే మేరా నామ్‍ లియేతో బచ్చీరోనా బందుకర్‍నా సమ్‍ఝే’’ అన్నాడు పొట్టివాడు....

                మొఖద్దమ్‍లు లారీడ్రైవర్లతోని మాట్లాడుతుండగానే ఎటుగ్యాంగటు పనిమీదికి పోయింది...

                చెంద్రమొగిలి గ్యాంగు మూడో బొగ్గుకుప్ప దగ్గర చేరింది..ధోవతుల వాళ్లు కాసెలు చెక్కిండ్లు - తువ్వాలున్నవాళ్లు, తుండుగుడ్డలు న్నవాళ్లు నెత్తులకు చుట్టుకున్నారు...

                ‘‘మోత్తవా? ఎత్తుతవా?’’ అన్నాడు చంద్రమొగిలి...

                ‘‘మోత్త’’నన్నాడు మొగిలి...

                ‘‘మరి సుట్టబట్ట తెచ్చుకోలే...ఆతువ్వాల పేగు సుట్టబట్ట చేసుకో - బొగ్గుకుప్పల వైర్లుంటయి ఏరుక తెచ్చుకొని కట్టుకో’’ అన్నాడు...

                ‘‘పోశవ్వతల్లి మైసవ్వతల్లి!’’ అనుకుంట బొగ్గు కుప్పను తాకి భుజానికి చేయి తాకిచ్చుకున్నారు...

                ‘‘పటుండ్లి...జెరంత కాలాడియ్యిండ్లి’’ చంద్రమొగిలి

                మొదటిలారచ్చి గద్దెదగ్గెర ఆగింది...

                సెమ్మాసులతోని తట్టలునింపిండ్లు - మొగిలి నెత్తి మీదికి తట్టెత్తిండ్లు - తట్ట బరువుకు మెడ జువజువలాడింది - కాళ్లు వనికినయ్‍...బొగ్గు పొడినెత్తి మీదినుంచి సన్నగా రాలుతోంది. లారీదగ్గర దాకా నడిచి గద్దెమెట్లు ఎక్కంగ పిక్కెలెక్కచ్చినయ్‍ - మొదటి తట్ట లారీలో పోసిండు... నిలబడ్డడు - ఇంకో తట్ట తెచ్చిన వాడు గద్దె దగ్గెర నిలుసుండి ‘‘ఏం జూత్తన్నవ్‍ - అయినట్టే నడువ్‍’’ తొందరజేసిండు -

                దబడదిబడ లారీలల్లో బొగ్గుపెళ్లలు బడుతున్నాయి. చెమ్మాసులు కసుకు కిసుకు మంటున్నాయి -పక్క గ్యాంగులో ఎవడో మూలుగుతుండు - లారీలో నుంచి రేడియోలో ఏదో తురకంపాట. అక్కడెక్కన్నో సిక్కుల డ్రైవర్‍ కొసమొదలులేని పాటెత్తుకున్నాడు.

                ఫిబ్రవరి నెలలోనేఎండెక్కుతోంది - ఆ ఏరియా అంత భగభగ మండుతోంది - బొగ్గు నెరుసులు, దుమ్ము ఒకల మొకం ఒకలకు కనిపించకుండా...మొగిలి  తలనుంచి కాళ్లదాకా చెమటలు కారి బొగ్గుపొడంటుకొని కారం రాసినట్టుగా మండుతోంది.. దు:ఖమొచ్చింది. అక్కడెక్కడనో తన తండ్రి సాంబయ్య దున్నుతున్నట్టుగా మనుషులంతా మసక మసకగా - తిన్నదరిగి పోయింది. మూడు లారీలు లోడు చేసే సరికి ప్దొంగి పోయింది.

                గ్యాంగోళ్లు లారీల నీడలకు చేరిపోయి తెచ్చుకున్న క్యారియర్లిప్పుకున్నారు - దగ్గర్లో ఒక్కనల్లా నన్నాలేదు.  ఒక్కడు మాట్లాడలేదు. నాలికెండిపోతంది - తిరిగి తిరిగి సి.యస్‍.పి లోపలికి బొయ్యి కడుపునిండా నీల్లు తాగిండు...మిషన్ల మోతకు చెవిగూబలు బద్దలౌతున్నాయి.

                మళ్లీ లారీ కాడికొచ్చాడు...

                లారీ వెళ్లి పోయింది. అన్నాలుదినే వాళ్లు ఎర్రటెండలో మిగిలిపోయారు.

                ‘‘నీతల్లి అన్నాలు దినేటందుకు ఒక్కరేకుల షెడ్డన్నాకట్టియ్యరు’’ అన్నాడెవడో.

                బుక్కనిండా అన్నం కుక్కుకున్నవాడు గుడ్లుతేలేసి టిఫిన్‍ బట్టుకొని సి.యస్‍.పి లోపలి కురికిండు.

                ‘‘షెడ్డుకచ్చిందా నీళ్ల నల్లాకు దిక్కులేదు...’’

                ‘‘వానావ్వల కుక్కల్‍దెం...- లారికి నూరు దెం....పోబట్టిరిగని - మరి నల్లేపియ్యండ్లని అడిగిండ్లా?’’ ఓ బక్క వాడు...

                ‘‘అగో! రాయలింగడు ఇటేసూత్తండు -కడుపుబ్బుతది- పవ్వకాశపడి మొఖద్దమ్‍ల సెవులేత్తడు - ఆడి నుంచి దొరదాక పోతది... దగ్గులోడు’’ గుసగుసగా పక్కవాడు..

                ‘‘లొట్టపీసు. తియ్యితియ్యవోయి - మాంటె పీకి పారేత్తరు గదా! ఈ పాటి దెబ్బలు ఎవడైనా కొడుతడు... కని మతికుంచుకో... బొండిగ పిసుకంది విడిచి పెడ్తనా?’’ ఇందాకటతను...

                రాయలింగు అనేవాడు గుడ్లు మిటకరిచ్చిండు.

                తనకు టిపిన్‍ లేక ఆ అన్నం వాసన, కూర వాసన భరించలేక లోడు కోసమొచ్చిన లారీ నీడకు బోయి కూర్చున్నాడు మొగిలి - లారీవెనుక డ్రైవర్లు పత్తాలాడుకుంటండ్లు - కాంటా క్లర్కు ఎండలో ఆడికీడికి తిరుగుతండు. ఎండలో అన్నాలు దినే వాళ్ల దగ్గర కుక్కలు కాళ్ల మీద కూర్చుండి నోర్లకేసి చేతుల కేసి చెవులు రిక్కించి చూస్తున్నాయి.

                లారీ నీడ కొరిగిండు మొగిలి...కండ్లు మూతలు పడ్డాయి...మీయవ్వల కుక్కల్‍దెం...’’ దగ్గులోడు తిడుతున్నాడు...ఎవరో పిలుస్తున్నారు - మొగిలి లేచికూర్చున్నాడు - ఎండతగ్గింది...

                ‘‘నీపేరేంది?...లేలే...పని షురువయ్యింది..రేపటి నుంచి టిఫిన్‍ దెచ్చుకో...ఇంటన్నవా?’’ చెంద్రమొగిలి.  మొగిలి లేవబోయాడు...ఒళ్లంతా నలుగురు తన్ని ముగ్గురీడ్సినట్టుగా....

                మళ్లీ పని మొదలయ్యింది - ఒక లారీ నింపేసరికి చీకటైపోయింది. కరంటు బుగ్గ లెలిగినయ్‍..

                నరేందర్‍ ముడితె మూసిపోయేతెల్లబట్ట లేసుకొని వచ్చిండు...వాసన నూనె బెట్టుకున్నడు..కండ్లు ఎర్రగా మండుతున్నాయి  - బుక్కనిండా ఎర్రగా అప్పుడే కోసిన గొర్రెను పీక్కతిన్నట్టు పాన్‍..

                ‘‘చెంద్రమొగిలి...ఇగరా’’ అని పిలిచిండు..చెంద్రమొగిలి అతనిచుట్టూ మిగతా ఏడుగురు నిలుచున్నారు. కొందరు బట్టలు జాడిచ్చుకుంటున్నారు...

                ‘‘ఇగో మొండోనికి మొన్న దెబ్బ తాకిందంటే ఇచ్చిన అయిదు రూపాలు బట్టుకొనిడెబ్బైయైదు ఇత్తన్న...’’ అని రూపాలు యిచ్చిండు...

                ‘‘జెర కట్టంలున్న సార్‍ వారం దినాలకు దీసుకోండ్లి’’ మొండయ్య.

                ‘‘నీ అయిదు రూపాలకు వారం రోజులా! జాన్తనయి...’’ సైకిలెక్కి వెళ్లిపోయిండు...

                డెబ్బై అయిదు ఎనిమిదిగురి మీద పంచిండ్లు - కాసేపు పిటపిట లెక్కలు - మనిషికి తొమ్మిది రూపాయలు రాగ మూడు రూపాయలు మిగిలినయి. మొండికి మూడు రూపాయలు ఇచ్చిండ్లు.

                తొమ్మిది రూపాయలు పట్టుకొని మొగిలికి సంతోషమో మరేమి కలిగిందో చెప్పలేం... ఈడ్సుకుంట బొగ్గు కుప్పలు దాటి రోడ్డు మీది కొచ్చిండు...

                మొగిలి కాలరీ బతుకు అట్లా మొదలయ్యింది... మొగిలి చెట్ల నీడల కింది నుండి - కరంటు బుగ్గల వెలుగుల తొక్కుకుంటూ..చీదర చీదరగా అలిసిపోయి నడుస్తున్నాడు.. ఆకాశంలో అప్పటికే చుక్కలు రగరగ లాడుతున్నాయి...

                ఆ నల్లని రోడ్ల మీద పాములా మెలికలు తిరిగిన రోడ్ల మీద నెత్తురు తాగేయ బడ్డవాళ్లు చాలా మంది అచ్చంగా మొగిలిలాగే నడుస్తున్నారు... కాకపోతే మొగిలికిది కొత్త - వాళ్లకదిపాత...

 

                                                             17

 

                తూరుపురేకలు బారుతున్నాయి. మొగిలి ఇంకా లేవనే లేదు.. నిన్నటి అలవాటు లేని పనికి ఒళ్లంతా బరువుగా నొప్పిగా ఉన్నదేమొ ఆదమరిచి నిదురబోతండు

                ‘‘ఓ మరిదీ లేలే యాల్లయితంది - పనికి బోవా?’’ లక్ష్మి లేపింది...

                మొగిలి దిగ్గున లేచి కూర్చున్నాడు...ఇంతలోనే ‘‘ఇగో పిల్లా’’అంటూ కొంపలంటుకపోయినట్టు గడ కర్రలాగా ఎత్తుగున్న పక్కింటామె వచ్చింది..

                ‘‘కాసిం ఉరిబెట్టు కున్నడట! సూద్దాంరా! అందరు బోతండ్లు’’ అన్నది ఆదర బాదరగా

                ‘‘అయ్యో! వాడకట్టు కంత పెద్దదిక్కు ఎట్లయ్యింది?’’ అన్నది లక్ష్మి ఖాళీ నీల్లకడవ అక్కడ పడేసి తను, వచ్చినామె వెంట నడిచింది...

                మొగిలికి నిద్ర వదిలిపోయింది.  తను లేచి ఆదర బాదరగా బయట కొచ్చిండు. అప్పటికే ఆ గుడిసెల సందుల నుంచీ మనుషులు ఆదర బాదరగా రోడ్డు కేసి నడుస్తున్నారు. మనుషులంతా పోయే దిక్కు  బడి మొగిలి నడిచిండు -  వాడ చివరన గుడిసె - గుండిసె ముందు జనం మూగిండ్లు - గుడిసెకు  గోడల వంతుకు పాత తట్టలు, సంచి బొంతలు కట్టున్నాయి - గుడిసె కప్పు చిరిగిపోయున్నది. కప్పుకు అట్టముక్కలున్నాయి. అట్టలు లేని దగ్గర కంకబొంగులు తేలున్నాయి. ఆ వాడకు అది ఆఖరి గుడిసె - ఆ గుడిసె దాటితే పట్నం తుమ్మచెట్లు. గుడిసె పక్క నుంచి బొలబొల మురికి నీల్ల కాలువ.. కాలువలో పందులు..

                ఎవరో పచ్చచీర ముక్కు పోగామె చేతులు తిప్పితూ - ‘‘ముంత బట్టుక పోదామని బయలెల్లిన - తెల్లారె సుక్క పొడవక ముందే లేసి దగ్గుకుంట గుడిసె ముంగట కూకుండే టోడు లేడేందనుకున్న - మల్లరాంగ ముసలోని కేమయ్యిందని గుడిసెలకు తొంగి సూసిన. ఇగ నాకు దప్పులు గొట్టినయ్‍’’

                ‘‘నిన్న పది గంటలకే గుడిసెకచ్చిండు -‘‘ఏందే కాసీమన్న ఒంట్లె బాగలేద! పనికి బోలేద!’’ అనిఅడిగిన. ఎన్నడైనా కడుపునిండ మాట్లాడెటోడు. ఆగకుంటనే బోయిండు.

                మొగిలి మందిల నుంచి గలుమ దగ్గరికి నడిచి గుడిసెలకు తొంగి చూసిండు - గుడిసెలో దరిద్రం తాండవిస్తోంది.  గుడిసె మధ్యలో కాసిం తాడుకు వేల్లాడుతండు...కనిగుడ్లు అసహ్యంగా పొడుచుకొచ్చినయ్‍ - నాలిక బయటికెల్లింది - పెదవులు నల్లబడ్డాయి - సిరిగినగుడ్డలు ...ముడ్డిబట్ట ఊసిపోయింది - గప్పున వాసన గొట్టింది - చతికిన పిర్రల మధ్య మలం...

                మొగిలి అంతకు ముందెన్నడు ఉరి బెట్టుకొని సచ్చినోల్లను చూల్లేదు - ఆ ఆకారం చూసి భయమయ్యింది -

                ‘‘అరె దించుండ్లిర్రా! దించుండ్లి’’ అన్నాడో కార్మికుడు.

                ‘‘మనం దించుతెట్ల? - పోలీసోల్లు రావద్దా?’’

                ‘‘ఎవడన్నా! పోలీసు టేషన్‍కురికిండ్లిరారో...ఉరుకుండ్లి’’ అన్నాడో ముసలివాడు -

                మొగిలి పోతాన్నాడు. ‘‘నీకేమెరిక’’ అన్నాడెవడో...

                ‘‘బవు కట్టపు పుటుకు - మనిషి జల్మమే గంత - నా ఎరికల నేను గీడికచ్చినపుడు గీడ గీ గుడిసొక్కటే ఉండే - నన్ను తీసుకచ్చి ఏంగాదని ఈడ గుడిసేపిచ్చిండు... ఏమయ్యిందో? ఏమో? ఈని పెండ్లాం మూడేండ్ల కొడుకును విడిచిపెట్టి ఎవనితోనో లేసి పోయింది... అప్పటినుంచి సూత్తన్నా గదే బతుకు ’’ ముసలోడు...

                ‘‘ఒక్క కొడుకు వలీగాడు అట్లతేలే...జేబులు కత్తిరిచ్చి బతుక వట్టె - ఈడు ఉపాస ముప్పుడుంటె ఆడు తొంగన్న సూడడు...’’

                ‘‘నిన్న ఈన్ని పనిల నుంచి తీసేసిండ్లట?’’ అన్నారెవరో.

                ‘‘అదెనో? గంతే బంచత్‍ నియ్యతి లేదు - అవసరమున్నంత సేపు నెత్తురు పీల్సుకుంటరు. బొక్కయి పోయినంక తన్ని తగిలేత్తరు...’’

                ‘‘ఈని జాగల ఇంకెవడో కొత్త పోరడచ్చిండట’’

                మొగిలికి నిన్నటి ఉదయం కాసిం మాట్లాడిన మాటలు యాదికొచ్చినయి. ఎవడన్నా గినే అందుకు కారకుడని చూపెడుతరేమొనని భయపడ్డడు.

                ‘‘కొత్త నెత్తురు గావాలెగదా?’’

                లక్ష్మి! కళ్లల్లో నీళ్లూరినయ్‍ - కొంగుతో కళ్లొత్తుకున్నది ముక్కుచీదింది...

                ఇంతలోకి పోలీసులొచ్చిండ్లు - అమీన్‍ గుడిసెలోకి తొంగి చూసి ‘‘లమ్డికొడుకు ఖరాబు చేసిండు’’ అన్నాడు ముక్కు మూసుకుంటూ .

                పోలీసులను దించుమన్నాడు. పోలీసులు లోపలికి పోనే లేదు... ఆఖరుకు మొగిలి మరిద్దరు కార్మికులు దించి కింద పండబెట్టిండ్లు - కట్టెలాగా బిగుసుక పోయున్నాడు.

                ఎక్కడిదో కుర్చీ తెప్పిచ్చుకొని ముండ్ల మీద కూర్చున్నట్టు కూర్చుండి పంచనామా రాసిండు-ఎవేవో అడిగిండు...

                ‘‘వీనిపేరు?’’

                ‘‘కాసిం’’

                ‘‘తండ్రిపేరు?’’

                ‘‘ఏ తల్లి గన్నదో, ఏ తండ్రి గన్నడో ఎవలకెరుక?’’

                ‘‘ఎవలన్న ఉన్నరా?’’

                ‘‘వలీ అని ఓ కొడుకున్నడు - జేబులు కత్తిరిత్తడు’’

                ‘‘ఓ! అసీ - వాడిప్పుడు సబ్‍జేల్లున్నడు’’

                ‘‘వీని కేమన్న రోగమున్నదా?’’

                ‘‘కడుపున్నది - ఆకలి రోగమే అన్నిటికన్నా పెద్దది’’

                ‘‘ఎక్కడ పన్జేస్తడు?’’

                ‘‘క్రిష్ణారావు దొర కింద లోడింగ్‍ పని జేసెటోడు - నిన్న పీకేసిండ్లట -’’

                ‘‘ఎన్నేండ్లబట్టి? ’’

                ‘‘ఎవలకెరుక...?’’

                ఇట్లాంటివే ఎన్నోఅడిగి రాసుకున్నాడు - అక్కడున్న నలుగురి సంతకాలు దీసుకున్నాడు...పోలీసులు వెళ్లిపోయిండ్లు ...

                ‘‘వాడకట్టుకు శపమున్నది - దానం జెయ్యాలె - గుడిసెల ఏన్నన్న ఏమన్న ఉన్నయో లేవో సూడుండ్రి’’ అన్నారు.  గుడిసెలో చూసిండ్లు - ఓ మూల రేకుడబ్బాల సోడన్ని మక్కలున్నాయి. - మరికొన్ని నూకలింకో డబ్బాలో - గిలేటు టిపిన్‍... మూడు రూపాల చిల్లర - సుట్ట ముక్కలు - చిరిగిన పాత గుడ్డలు - ఎప్పటిదో కొడుకు, భార్య, తను కలిసి దిగిన ఫోటో...

                ‘‘ఎట్లా...?’’ అన్నారు కొందరు.

                ‘‘చందాలు అసూలు సేద్దాం’’ అన్నారు...

                అప్పటికప్పుడు ఎవలకు దోసినంత ఆళ్లిచ్చిండ్లు.  ఇంతలోనే నూరుమంది దాకా లోడింగోలొచ్చిండ్లు... .వాళ్లో కొంత యిచ్చిండ్లు...

                పదిగంటల ప్రాంతంలో లారీల లాగిపోయినయని పదిమంది తప్ప గ్యాంగు కొకడుండి మిగతా వాళ్లు లోడింగ్‍ కాడికి పోయిండ్లు. వాళ్లతోపాటు మొగిలి నడిచిండు -

                మొగిలి మనుసు కోళ్లు తవ్విన పెంటయిపోయింది...

                శవంకండ్లు - ఖనెల్లు ఖనెల్లు దగ్గులు - ఉమ్మిన ఖల్లు - నాలికెవెల్ల బెట్టి - పిర్రల్ల మధ్య మలం..గబ్బువాసన బతుకుంతా వాసనే.... తట్ట మోస్తున్నాడు... చిత్రంగా అందరి ముఖలల్లోకి చూసిండు - ఆ చితికిన చెంపల్లో - బొగ్గు పొడి అంటుక పోయిన దవడలు - ఎర్రగా మండే ఆ కండ్లు - కాసిం కండ్లలాగే అచ్ఛంగా ...వీళ్లంతా గట్లనే ఉరి బెట్టుక సత్తరేమొ?

                రెండువేలనర లంచం బెట్టి కొలువు దొరుకుతదని - కొలువు బాయిల దొరుకుద్దని - రాత్రి పగలు మన్నుబుక్కి మన్నేర్గే బదులు ఏదో ఆడత పాడత సేత్త ననుకుంటే - గీడి కచ్చింది పనివరుస..తను రావడం. ఒకడు ఉరి బెట్టుకున్నడు. ఈడ పని చేసే వాళ్లంతా వచ్చినప్పుడు గట్లెనే ఎవడో ఒకడు ఉరి బెట్టుకున్నాడా? పెండ్లా మెందుకు లేసి పోయింది? కొడుకు దొంగెందుకయ్యిండు? ఇట్లాగా విచారాలు సాగినయ్‍... ఈ విచారాలు మిగతా వాళ్లకున్నయోమొనని పరిశీలనగా చూసిండు - ఆ సంగతే మరిచి పోయినట్టు అంతా అతి మామూలుగానే పని చేస్తున్నారు. - ఎత్తేవాళ్లు తిడుతూనే ఉన్నారు..మోసేవాళ్లు ఈడిగీల బడి మోస్తునే ఉన్నారు - లారీడ్రెవర్లు పత్తాలాడుకుంటనే ఉన్నారు....

                పొద్దునెత్తి మీది కొచ్చింది - పనాపిండ్లు - గిలేటు టిపిన్లు విప్పుకున్నారు... మల్ల మాటలు...

                నీళ్లకోసం సి.యస్‍.పిలోనికి నడిచాడు.. సి.యస్‍.పి - ఆగున్నది... లొల్లిలేదు... లోపల బెల్టుదగ్గర నలుగురు కూకుండి ముచ్చెట్లు బెట్టుకుంటున్నారు.. పేడిమూతోడొకడు  ఊరిచ్చి ఊరిచ్చి ఏదో చెప్పుతండు... మిగతా వాళ్లు ఆసక్తిగా వింటున్నారు. పేడిమూతి వాడు కీచుగొంతుకతో ‘‘నిన్న ఓ ఫవ్వగొట్టిన.. సీకటియ్యింది... రోడ్డు దిగిన... చెట్లల్ల పందులు గురుమంటన్నయి.... సడీ సప్పుడేంలేదు. సైకిలు పోతంది... నేనేమో రాందిపోంది పద మెత్తుకున్న... సైకిలు ఎత్తుగడ్డ తాకినట్టు టక్కునాగిపోయింది...’’ పేడిమూతివాడు టక్కున ఆపేసిండు...

                ‘‘ఏమయ్యింది సెప్పురాదుర?’’ అన్నాడు సస్పెన్సు భరించలేక వింటున్నోడు...

                ‘‘టక్కున సైకిలు దిగిన గీడెత్తుగడ్డలేడియని - అటొకలు ఇటొకలు ఉరుకుతండ్లు’’

                ‘‘ఓర్నితల్లి! పట్టుకోకపోయినావు?’’

                ‘‘నీకు ఓ సాన్సు’’

                ‘‘మారే గీడేం జేసుకుంటడు...?’’

                మొగిలికి రోతగా తోచింది... నీల్లుదాగిండు - లారీల దగ్గరికి పోయిన ఇలాంటివెవో ముచ్చెట్లుంటయి - కాసేపు ఏడనన్న ఒంటిగ కూకోవాలనుకున్నాడు...సి.యస్‍.పిలో కొద్దిగా లోపల చిన్నగది లాంటి దున్నది...దాని పక్క కూర్చున్నాడు...ఏదో పరపర సప్పుడత్తె తిరిగి చూసిండు - గదిలాంటి దానిలో సిమెంటు గోడకు గడ్డంపెరిగిన వాడొకడు పండ్లు గిలకరిచి బొగ్గుతో ఏదో గీస్తున్నాడు... బొమ్మయి పోయింది... ఒక మనిషి బోర్ల బొక్కలో, ఇంకొక మనిషి వానిమీద - ఛీఛీ అనుకున్నాడు మొగిలి...

                వాడు బొమ్మదించి - ‘‘వీడు కంపినోడు’’, ‘‘వీడు యూనియనోడు’’ అనిరాసి చేతులు దులుపు కొని సీరియస్‍గా వెళ్లి పోయిండు...

                మొగిలికి అక్కడ ఉండబుద్ది కాలేదు... మొగిలి ఆ మనిషి వెళ్లిన దిక్కు చూసిండు - ఆ మనిషి వెనుదిరిగి ‘‘వానవ్వల..వోర్‍ మెన్‍గాన్ని తిట్టిన్నని - నెలరోజులు సస్పెండు చేసిండ్లు - యూనియనోని సుట్టు తిరిగితే లీడరోడు గది నీతప్పే అన్నడు... అనడుమరి- కంపినోని దగ్గర అంగుమంటె అంగటోడాయె - ఆఖరుకు గీడ సి.యస్‍. పి. లేసిండ్లు. వానవ్వల కచ్చ...కచ్చ ఇంకా దెం...త. ఏమనుకున్నరో’’ అని పిడికిలి బిగించి అరచేతిలో రెండు సార్లు గట్టిగా గుద్దుకొని సి.యస్‍.పి బంకరు మీదికి నడిచిండు...

 

                ‘‘ఈడ ఎవడేం సక్కగలేడు’’ అనుకుంట బయటికి ఎండలోకి నడిచిండు..మొగిలి...

 

                                                             18

 

                వారం రోజులు గడిచిపోయినయ్‍ - ఐదు రూపాయలతో గిలేటు టిపిన్‍ కొన్నాడు - ఇంకో అయిదారు రూపాయిలు ఖర్చయిపోయినయి అన్నిపోను నలుబై  రూపాయలు మిగిలినయ్‍ ఎప్పటిలాగే ఆ దినము పనిమీదికి పోయాడు...

                కాని ఆ రోజు ఒక్కలారన్నా లేదు -ఎప్పుడు ఇంజన్‍ రొదతో డ్రైవర్ల కేకలతో అయిల్‍ మరకల క్లీనర్ల అరుపులతో సందడిగా ఉండే లారీ స్టాండు బోసిగా ఉన్నది - ఇదివరకు లారీలు నిలబడే స్థలంలో రెండు గాడిదలు నిలబడి ఒకటి నొకటి నాక్కుంటున్నాయి...

                లోడర్లంతా గుంపులు గుంపులుగా కూర్చుండి మాట్లాడుకుంటున్నారు - మొగిలి చెంద్రమొగిలి గ్యాంగు కూర్చున్న దగ్గరికి నడిచిండు...

                ‘‘శీనివాస్‍ టాకీస్‍ల ఏ మాట ఆడుతందోయి పిలడా?’’ అన్నాడొకడు.  మొగిలి తికమక పడ్డాడు...

                ‘‘మారే ఇంక గంత దాక రాలే -’’ అన్నాడు ఒకడు...

                టిపిన్‍ కింద బెట్టుకొని మొగిలి తనూ కూలబడ్డాడు..

                ‘‘ఇయ్యల్ల కూలి మునిగినట్టే లెక్క - లారీల కేం బుట్టిందో?’’ అన్నాడొకడు...

                కోటేసు సైకిలి మీద రివ్వున వచ్చిండు. కోటేశు టిప్‍టాఫ్‍ బట్టలేసుకున్నాడు.. వచ్చీరావడంతోటే ‘‘ఇయ్యల్ల లారీలోల్లు స్ట్రైకు చేత్తండ్లు - యాపలకాడ లారీలన్ని ఎక్కడి యక్కడ ఆగిపోయినయ్‍’’ గుక్క తిప్పుకోకుండా అన్నాడు.

                ‘‘స్ట్రైకెందుకర్రా...’’ చంద్రమొగిలి...

                ‘‘ఏదన్నుంటెనే స్ట్రైకుచేత్తరు - ఉత్తగెందుకు చేత్తరు..?’’ అన్నాడు అర్జయ్య ముడ్డికింది తువ్వాల తీసి దులుపుకొని లేచి నిలబడుతూ...

                ‘‘ఏదో ఉంటదని మా ఎరికే గని గదేందోనని?’’ ఇంకెవడో...

                ‘‘జీతాలు బెరుగన్నట - ’’ కోటేసు...

                ‘‘నీయక్క ఎప్పుడు సూసిన పత్తాలాడుకుంటుంటరు. లారీలల్ల మందిని తీసుక పోతరు. అట్ల పైసలచ్చే. గాళ్లే జీతాలు బెరుగన్నంటె ఎట్ల ?’’ చంద్రమొగిలి...

                ‘‘మందినెక్కిచ్చుకుంటె మాత్రం - డ్యూటీ మీదికి ఎక్కిండ్లంటె ఆరం దినాలు ఇల్లనేరా? పెండ్లా మనేరా? ఓటల్లదిని మోటబర్ల పండుడేనాయె - ఊరికింత దినుడు. బీడి, కాడి - అదిగాక పోలీసోల్లు మామూల్లు గుంజిరి...’’ అర్జయ్య.

                ‘‘ఆళ్లకు దినానికి ఆరు రూపాయలు బ్తరాదా?’’

                ‘‘అన్ని బొందలకే పోతయి...తిరుపతి కూడుకు బర్కతి లేదంట - వచ్చినట్టే వత్తయి - పోయేటియి బోతయి - మా సడ్డకుడు శంకర్‍లాల్‍ దగ్గర జేత్తడు - అని పెండ్లాం మీద గోరెడు బంగారంలేదు’’ అర్జయ్య..

                ‘‘ఆళ్ల సంగతి మనకెందుకు గని మనం ఉండుడా! పోవుడా! - మొఖద్దమ్‍లు జాడా పత్తాలేరు...’’యాకూబు...

                ‘‘స్ట్రైకు ఎప్పుడు బందయితదో ఎవలకెరుక లారీలు ఎప్పుడన్నా రావచ్చు’’ దావూద్‍ పిర్రలగోక్కుంటూ.

                ‘‘తియ్యి - ఆడినుంచి సెయ్యిదియ్యి లైసెన్సున్నదా?’’ ఎవడో అన్నాడు.

                 దావూదు గోకుడాపిండు - అందరు నవ్విండ్లు...

                మొఖద్దమ్‍లు రాలేదు. నెత్తిమీదికి పొద్దచ్చింది. లోడర్లు బొగ్గు కుప్పల చుట్టూ -సి.యస్‍.పి చుట్టు - రోడ్డు మీది హోటల్‍ చుట్టు తిరుగుతండ్లు... కొందరు ఏదైతే అదయితదిని వెళ్లి పోయారు...మొగిలి తను కూడా పోవాలను కున్నాడు. కాని కొత్త...

                కోటేసు మళ్లీ సైకిలెక్కి ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రం వరకు మళ్లో వార్త దెచ్చిండు - ‘‘కనీసం మూడు నాలుగు దినాల కన్నా ఎక్కువే ఉంటుందట - డ్రైవర్లు ఊరేగింపు తీసిండ్లు ’’ అని చెప్పుకొచ్చాడు.

                అప్పటికి యాభయి మందే మిగిలిండ్లు - పచ్చరి చెట్టు కింద కూర్చున్నారు. అప్పటికే కొందరు చెట్టునీడకు నిదురలు తీసిండ్లు - వాళ్లను లేపిండ్లు -

                అర్జయ్య నేలమీద దుబ్బల పుల్లతోని గీతలు బెడుతూ - ‘‘ఇగో మనసుట్టు పక్కల అంతా ఏదో విధంగా కలిసి కట్టుగుండి జీతాలు బెంచుకుంటండ్లు మనం సూత్తనే ఉన్నాం’’ అన్నాడు...

                ‘‘గిదేమన్న సాటు మాటు ఎవారమా?’’  దావూదు .

                ‘‘కాదు నిచ్ఛమే...మన సంగతి ఎప్పుడన్న ఇసారం జేసిండ్లా?’’ అన్నాడు.

                ‘‘సాలు సాలురొరే - ఇంకేదన్న మాట్లాడు. తన్నంగ తన్నంగ గీడికచ్చినం - గీడ సుత గీంత పని బోగొట్టే ఉపాయాలు చేయకు - మనల్నెవడు అలిమి బలిమి చెయ్యలేదు...’’యాకూబు...

                ‘‘ఏందన్న నీ భయం...?’’

                ‘‘నాభయంగాదు గీడ ఒక్కనికి బుట్టినోల్లులేరు...’’ అన్నాడు రాయలింగు కేసిచూస్తూ...

                ‘‘చూడన్నా గిది నావొక్కని గురించి గాదు చెప్పేది.. అందరి గురించే... అయినా నేను తప్పేం మాట్లాడిన.. గిట్ల భయపడుకుంట  ఎన్నిదినాలు బతుకుతం...? పుట్టిందో నాడు సచ్చేదోనాడు.. అసలు ఉన్నూరు నిడిసి పెట్ట గీడ అడుగు బెట్టిన్నాడే తాడు లేని బొంగురమై పోయింది. - ఉన్నది బోయింది ఉంచుకున్నది బోయింది. ఎవడు చెప్పినా ఎంటిక లేం బీక్కుంటడు’’ అన్నాడు అర్జయ్య...

                ‘‘సరే! సరే తెగవడ్డోనికి తెడ్డే లింగమంట - మేం బోతం’’ అన్నాడు చంద్రమొగిలి లేచినిలబడి కదులబోతూ...

                కాని అక్కడ కూర్చున్న వాళ్లెవరు కదల లేదు...

                ‘‘ఇగో ఇనుండ్లి... గీడ మనం ఎండల కర్రెపిట్టలోలె మాడి నీల్లు నిప్పులు దాక్కుంట భగభగ మండే బొగ్గు లారీకి ఎనిమిది మందిమి లోడుచేస్తే, లారీకి రెండు వందలు వసూలు జేసి అందట్ల నూరు రూపాలు దొర తీసుకొని తను, బాయిదొరలు      పంచుకుంటండ్లు.- మనకెంతిత్తండ్లు?- ఎనుభై రూపాలు - వింటండ్లా!  పొద్దు నోపారి మాపటీలోపారి వచ్చిపోయినందుకు మొఖద్దమ్‍లు ఇరువై తీసుకుంటడ్లు -ఎంతలేదన్న ఒక్కొక్క మొఖద్దమ్‍కు రోజుకు నూరుకన్నా ఎక్కువే - ఎంత పెద్ద గుండగాడయితె అన్ని రూపాలెక్కువ - దెం..తిని దేవల్ల భారతిచ్చి గొంతికలకచ్చె దనుక తాగి దొర కుక్కలైపోయి నీ నా అసొంటోల తన్నుతరు... ఈల్లన్నా మాపటీలో పొద్దున్నో ఈడికత్తండ్లు గని - దొరయితే మనం చేసే పని సూడకుంట కాలు మీన కాలేసుకొని దినానికి వేలు  తింటండు - మనం పంచుకుంటె రోజుకు మనిషికి పదిరావు.... అదె మనం జేసిన పనికి ఆళ్లు దినిపోవు డెందోంట?’’ అర్జయ్య లేచి  నిలుచున్నాడు.  అతని ముఖంలో ఎక్కడో నిప్పు రవులుకుంటోంది....

                చంద్రమొగిలి పోనేలేదు - దూరంగా నిలబడి ‘‘నిరుడు కొండడు గిట్లనే అన్నడు - నెలకింద మైసడు పొద్దునత్తె పనిలేదు పొమ్మన్నరు... గిదెట్ల అన్నరు? ‘బాగిచ్చేకాడ చెయ్యిపో’ - అన్నరు.. లొల్లిబెడితే మెడలు బట్టి నూకేసిండ్లు - తిడితె - సాయంత్రం సినిమూ టాకీసుకాడ పెండ్లం పిల్లలతోటుండంగనే నెత్తుర్లు కారంగ తన్నిండ్లు...’’ గొనుక్కున్నాడు...

                ‘‘అది నిచ్ఛమే గాడిదాక మా అందరి• •రికే  కాదుర రాయిలింగం’’ దావూదు కిసకిస నవ్వుతూ...

                ‘‘ఓరి బాడ్‍కావ్‍ నవ్వులుగాదు...’’యాకూబు...

                ‘‘మనం కలిసి  కట్టుగ నిలబడితె -’’ అర్జయ్య...

                ‘‘ఎట్ల నిలబడ్తం - మనకెవడన్న సాయకారముండాలె’’ గంగులు...

                ‘‘ఎవడుంటడుయూనియన్‍ బెట్టింది దొరేనాయె...ముడ్డిమీద తన్నెటోడు - పంచాతు జెప్పెటోడు ఒకడేనాయె...’’ దావూదు...

                ‘‘మనం మొదట నిలబడితె - ఎవలన్న సాయకార మత్తరు - అదిగాక కడుపు నొచ్చేదెవలకు నీకా? మందికా? కడుపునొచ్చినోడు ఓమ బుక్కాలే’’ అర్జయ్య...

                ‘‘ఆ గిదంత అచ్చేదా సచ్చేదా? ఉత్త పున్నానికి కోండ్రిగాడు దెబ్బలు దిన్నట్టు’’ - ఎవడో పెద్దగా అని ఆడినుంచి వెళ్లి పోయిండు...

                ఒక్కొక్కరే ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.  మొగిలి తను ఇంటి దారి బట్టిండు.. ‘‘అదినిచ్చమే - ముమ్మాటికి నిచ్చమే కని నాకెందుకీ పీకులాట - ఏదో మల్ల భర్తీదాక ఎల్లదీత్తె - గీపీడబోతది...దొరకు కంటయితె ఇంకేమన్న ఉన్నదా? నౌఖరి టుప్పా? ఇప్పిత్తడా? ఈల్ల మాటలు సూత్తె గయ్యన్ని సొచ్చెల్లినోల్ల తీర్గనే ఉన్నరు- నౌఖరి దొరకకుంటే?’’ మొగిలికి ఊపిరాడలేదు... ఆగిపోయాడు..                   అప్పుడే పట్నం తుమ్మ చెట్లకింద - గుడిసెల చూర్ల కింద తాగొచ్చి తన్నే మొగల్లను ఊహించుకొనే ఇల్లాల్ల మనుసుల్లోలాగా చీకటి గూడు కడుతోంది... తన చుట్టు పక్కలంతా రణగొణ ధ్వని - మంది తిరుగుతున్నారు - స్కూటర్లమీద తిరిగేవాళ్లు కబుర్లాడుతూ పోతున్నారు...

                                         (తరువాయి భాగం వచ్చే సంచికలో)


ఈ సంచికలో...                     

Mar 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు