నవలలు

(May,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సైరన్ నవల  ఐదవ  భాగం

సైరన్ నవల  ఐదవ  భాగం

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం )

‘‘వద్దు..’’ అనుకొంటూ ముందుకు నడిచిండు.  మనుసులోని ఆలోచనలు పారదోలడానికి కాళ్లెగరేస్తూ హుశారుగా కులాసగా ఉన్నట్టూ నడుస్తూ కాసేపు ఖాళీ టిపిన్‍ గిన్నె వేళ్లతో టకటక కొడుతూ   ‘‘లాల్లలా...లాల్లలా’’ అని గొనుగుతూ నడుస్తున్నాడు.

                అదిగో మూల మలుపు - పాన్‍టేలా! పాన్‍టేలాలోని తురక పిలగాడు ఎరెర్రగా నవ్వుతూ పక్కనే నిలబడిన కుంటి కర్రెపిల్ల తోని పరాచికాలాడుతున్నాడు...

                మొగిలి అదిచూసి చూడనట్టు చూసి, పందులను తప్పించుకుంటూ - బురద గుంటల మీద గంతులేస్తూ సాయంత్రపు బొగ్గు పొయ్యిల పొగకు కండ్లు నులుముకుంటూ గుడిసె చేరుకున్నాడు...

                అప్పటికింకా శంకరయ్య రాలేదు...

                ‘‘అచ్చినవా? మరిదీ - ఇగో ఉత్తురమచ్చింది. ఇంటికాన్నుంచే కావచ్చు’’ అని ఓ పచ్చకవరు అందిచ్చింది

                మొగిలికి ఎక్కకల్లేని సంతోషమొచ్చింది - తండ్రి, తల్లి, తమ్ముడు అంతా కనిపించారు... వెనువంటనే అది తనకు చదువరానందుకు ఎక్కడలేని బాధ కలిగింది...

                ‘‘మోటు గాని కేమెరుక మొగిలి పువ్వాసనంట  సదువత్తదా?’’ లక్ష్మి చిన్నగా నవ్వి  ‘‘నేను గ ఎంబడోల్ల పిలగాన్ని తీసుకత్త - నువ్వయితె కాళ్లు చేతులు కడుక్కో’’ అని బయటికి పోయింది...

                ఎంబడోల్ల పిలగాన్ని వెంట బెట్టుకొని వచ్చేసరికి అట్లాగే నేలమీద ఉత్తరం బట్టుకొని మొగిలి కూర్చుండి ఉన్నాడు...

                పిలవాడు పీలగా ఉన్నాడు... కాలుకు  వెండి బేడున్నది. ఉత్తరం చింపిండు.. లక్ష్మి దరవాజ కానుకొని కూర్చున్నది...

                ‘‘సిరంజీవి కుమారుడు మొగిలిని మీ నాయిన దీవించి వ్రాయుటం ఏమనగా! మేమంతా ఇక్కడ కులాస గానే దేవుని దయతోని బాగున్నం - నీ మంచిసెడ్డలు లింగులు తెలియజేసినాడు...

                మంతెనకు బొయి నల్లగొండ సాత్తుర్లతోని నీ పేరుమీద పంచాంగం చూపెట్టుకచ్చిన - ఆరింట శని ఉన్నదని -పాల్గుణ మాసమెల్లే దాక చేసేపని కుదరదని చెప్పిండు.  భగవంతుని సంకల్పం లున్నట్టుగనే జరుగుతది, గని మన మనుకున్నట్టు జరుగుతదా? కొలువు దొరకలేదని నువ్వేం రంధి పెట్టుకోకు - మీ అవ్వ మరీమరీ చెప్పుతున్నది. మక్కపెరడి రేపోమాపో కోత బడుదామనుకుంటన్నం... మనపక్క పెద్దనాయిన పెరడిగోసిండ్లు . ముఖ్యంగా వ్రాయించేదేమనగా చి।।ల।।సౌ।।మైన రాయేశ్వరికి కడుపు పోయింది...’’

                మొగిలి సర్రున ఉత్తురం గుంజుకున్నాడు...

                పెదవులు వనికినాయి...చేతులు వనికినాయి...

                ‘‘అయ్యయ్యో ఎంత పనైపోయింది పిలడా!’’ లక్ష్మి....

                వనికే చేతులతో మళ్లీ ఉత్తరం పిల్లవానికిచ్చాడు..

                ‘‘పూసిన పూలన్ని కాయలుగావు - కాసిన కాయలన్ని పండ్లుగావు...కనుక నువ్వేం ఫికరు పడకు - మీ అత్తగారచ్చి తీసుకపోతనంటే కోడలు పోనంది...నవ్వు నీపని సెడకుంటా వీలు సూసుకొని ఒక్క పారి వచ్చిపోగలవు - మీ అవ్వ కండ్లల్లో కనపడుతున్నాడంటంది...ఉత్తరం చూసిన వెంటనే మళ్లీ ఉత్తరం రాయించగలవు....’’

                మీ నాయిన

                మందలసాంబయ్య

                పిల్లవాడు ఉత్తరమిచ్చి వెళ్లిపోయాడు. కాసేపు లక్ష్మి గాని మొగిలి గాని మాట్లాడలేదు...

                ‘‘అదినే - గిప్పుడు మనూరికి రైలుందా?’’

                ‘‘ఉంటదిగని - నువ్వు పనికెక్కి ఆరంగాలె ’’

                ‘‘ఇయ్యల్ల పని నడువలే - ఎప్పుడు నడుత్తదో? తెలువది ఎల్లుండత్త’’

                ‘‘ఔగని మీ అన్నకు చెప్పిపోవా?’’

                ‘‘నువ్వే సెప్పు...గీ ఉత్తురం సూపెట్టు ’’ అని లేవబోయాడు..

                ‘‘అయ్యో జెరంత తిని పోవా! కాల్లు చేతులన్నా కడుక్కోవా?’’

                ‘‘ఇంటికాడ తింట వదినా!’’

                మొగిలి గుడిసెలనుంచి పైకం తీసుకొని వీధిలో కొచ్చిండు...

                కరంటు బుగ్గ లెలిగినయ్‍...రైలుస్టేషన్ కు పోయిండు...

మల్ల రైలు దిగి బస్సు పట్టుకోవాలె...

 

                                                         19

 

                మొగిలి బస్సుదిగి ఊళ్లె కొచ్చేసరికి ఊరులుకు మగ్గిపోయింది. తల్లి తలుపు దీసింది...తండ్రి తమ్ముడు పెరడి కాడికి    పండబోయిండ్లు...

                మొగిలిని చూసి భూదేవి చేటంత మొఖం చేసుకొన అచ్చి ‘‘అచ్చినవా కొడుకా! పదిహేనొద్దులకే బొగ్గయిపోయినవు - పానం మంచిగ లేదా? కొడుకా!’’ అన్నది ఒళ్లంత పునికి...

                రాజేశ్వరి లేచి దీపం కైనీడకు నిలబడి మొగిలిని పరిశీలనగా చూసింది... ఆమె ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు...

                ‘‘అద్దుమ నాత్రచ్చినవ్‍ బిడ్డా! తిన్నావా?’’

                ‘‘లేదవ్వా!’’ మొగిలి.

                ‘‘పో. గిన్నన్ని బియ్యంబెట్టుపో..’’ భూదేవి అనేసి మంచంల పన్నది.

                రాజేశ్వరి గుబగుబలాడే కన్నీళ్లతో గిరుక్కున లోపలికి పోయింది. దీపం ముట్టిచ్చింది. పొయ్యి అంటేసింది. బియ్యం పొయ్యి      మీద పెట్టింది.  మొగిలి ఒకసారి తొంగి చూసిండు. పొయ్యిలో వెలుగుతున్న కట్టెల మంట వెలుగులలో రాజేశ్వరి వెలుగునీడల దోబూచులాటలో..

                ‘‘కాళ్ళు కడుక్కో బిడ్డా!’’ భూదేవి.

                బయట అంపులకాడికి పోయి కాళ్లుముఖం కడుక్కొన్నాడు.  రాజేశ్వరికి కొద్ది దూరంలో పీటేసుకొని కూర్చున్నాడు.

                ఎట్లా మాట్లాడాలనో తెలియక మొగిలి మూగమొద్దయ్యాడు.

                రాజేశ్వరి కంచుతలెల బువ్వకొడిగుడ్డు కూర తెచ్చింది.  మొగిలి తనో ముద్ద తిని - గారువంగ రాజేశ్వరికో ముద్దపెట్లిండు.

                ‘‘ఇంటెనుక మంచమేసత్త నువ్వు తిను’’ రాజేశ్వరి తుర్రుమన్నది.

                మొగిలి తినే సరికి ఇంటేనుక మంచమేసి బట్టలు పరిచింది రాజేశ్వరి.

                లేచిపోయి ఇంటెనుక మొగిలి మంచం మీద కూర్చున్నాడు... అతని కాళ్ల దగ్గర కూర్చుండి ఎక్కెక్కి పడి ఏడుస్తొంది...రాజేశ్వరి.

                ‘‘లే - పిస్సదానా ఏడుత్తరా?’’ అన్నాడు మొగిలి గొంతు పూడుక పోయింది. లేవట్టి గుండెల కదుముకున్నాడు...

                ‘‘నన్ను నీఎంట తీసుకపో నాకీడ పిస్సలేసినట్టుగున్నది - ఆనాడు కడుపంతా గుంజుకపోయింది...ఒకటేనొప్పి...’’

                ‘‘ఔగని మీవోల్లింటికి పోకపోయినవా?’’ ముఖమంతా ముద్దులాడుతూ...

                ‘‘నువ్వెప్పుడత్తవో ఎరుక లేదాయె...కొండకెదురు సూసినట్టు సూసిన’’

                రాజేశ్వరి దు:ఖం పోగొట్టడానికి తను పోయిన దగ్గరి నుండి జరిగిన సంగతులన్ని చెప్పుకొచ్చాడు... అట్లా ఇద్దరు ఆ రాత్రంతా మాట్లాడుకుంటూనే కూర్చున్నారు...తొలి కోడి కూసింది... మొగిలికి మరింక నిదురబట్టలేదు. లేచి పెరడికేసి నడిచాడు...

                ఆదినమంతా ఊళ్లోల్లంత నౌఖరి గురించి అడుగుతనే ఉన్నారు...మొగిలి ఈడువాళ్లు మొగిలి అదృష్టానికి ఈర్ష్య పడ్డారు...

 

                మొగిలికి అతిదగ్గరి మిత్రుడు పెట్టెం లింగయ్య వచ్చి కలిసిండు - అతని వెనుకనే పిల్లవాన్నెత్తుకొని అతని భార్య వచ్చింది...

                లింగయ్య వెనుకనే అతని తండ్రి మల్లయ్య పెద్దపెద్ద జంగలేస్తూ గాలికి ఎగిరే జుట్టు పోస తీడుకుంట ‘‘వీనవ్వను...ఒక్క కొడుకు నన్ను పోరన్ని ఏరుబడగొట్టిండు - పాలేరున్న కాడ మానం బోగొట్టి కాలేరు మీనికి బొతడట - ఏడి సాంబయ్యేడి? సెప్పుతోని గొట్టిత్త’’ అనుకుంట వాకిలంతా ఆడికీడికి దిరిగిండు...

                ‘‘చిన్న కొడుకును మాగండాన్నే కన్నవా?’’ అంది పెట్టెం లింగయ్య భార్య కొరకొర లాడుతూ....

                ‘‘అగో సూసినవా? నిన్న గాక మొన్నచ్చింది...ఎంత మాటనే...ఇంటన్నవే భూదేవి...’’ అన్నాడు మల్లయ్య...

                ‘‘పోరీ నీకేందే నువ్వు పోరాదు’’ అన్నది భూదేవి...

                ‘‘సావనియ్యడు - లేవనియ్యడు’’ అనుకుంట పిలగాన్ని ఎత్తుకొని లింగయ్య భార్య వెల్లిపోయింది.

                శాయమ్మొచ్చింది. ‘‘అవుపిలడా! మావోని అతిగతీ దెలువలే - నీగ్గిన కల్సిండా?’’అన్నది...

                ఏజెంటాఫీసు నుంచి ఎండలో వెళ్లిపోయిన దుర్గయ్య  మళ్లీ కన్పించనే లేదు. దుర్గయ్య అన్న మాట ‘‘రెండేతొవ్వలు ఆని బొండిగపిసుకుడో - రైలుపట్టాల కింద తలబెట్టుడో?’’ యాదికచ్చింది.

                ‘‘కలువలేదా?’’ శాయమ్మ

                ‘‘కల్సిండు... మంచిగనే ఉన్నడు...’’

                ‘‘కొలువు దొరికితే కొడుకెత్తు బంగారం (బెల్లం) సమ్మక్కకు పంచిపెడ్తనని మొక్కిన బిడ్డా!’’ శాయమ్మ తూరుపు దిక్కు మొక్కుకుంట వెళ్ళిపోయింది.

                పెట్టెం లింగయ్య ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయిండు -

                అన్నాలు దినేదగ్గర సాంబయ్య నల్లగొండ శాత్రుర్ల గురించి, శని గురించి భారతం చెప్పుకొచ్చిండు.. ఆ దినమంతా ఆడికీడికి దిర్గడంతోనే సరిపోయింది...

 

                                                              20

    

                తెల్లారి సీకటితోనే బియ్యం, పప్పు బట్టుకొని మొగిలి బస్సెక్కిండు...

                మొగిలి బస్సు దిగి, బియ్యం మూట మోసుకొని తెచ్చి గుడిసెల బారేసిండు...

                అప్పటికి శంకరయ్య డ్యూటీకి తయారయ్యిండు..

                ‘‘ఇంటికాడంత మంచేనా? మరదలుకు కడుపు బోయిందట గద...ఏం జేత్తం? - తాకినేలుకే పోట్రాయి తాగుద్ది...ఇగో ఎంకడచ్చిండు. పని చాలయ్యిందట - జెప్పనబో - ఆళ్లతోని మంచిగుండు...ఇగ రెన్నెల్లయితె అలీ సాబటు పీర్‍ సాబిటు ఎట్లనోగట్ల బాయిల సొర్ర బడితె మనలను కోనాయనెటోడుండడు’’ శంకరయ్య...

                ‘‘మాయింట్ల అంత మంచిగున్నరా?’’ లక్ష్మి.

                ‘‘బాగనే ఉన్నరదినె’’.

                ‘‘బియ్యమెందుకు తెచ్చినవ్‍? ’’ అనుకుంటనే సైకిలెక్కి శంకరయ్క వెళ్లిపోయాడు...

                మొగిలి ఆదర బాదరగా టిపిన్‍ పట్టుకొని పని దగ్గరి కొచ్చేసరికి సందు లేకుంట లారీలు నిండున్నయి - బొగ్గుకుప్పలు కూడా పెరుగున్నయి. సి.యస్‍.పి. పట్ట (బెల్టు) బందయ్యిందట. కంపినీ లారీలన్నీ బయటనే బొగ్గు పోత్తన్నయి - కంపినీ లారీలు బర్రు బర్రున ఇరాం లేకుంట తిరుగుతన్నాయి. లోడర్లంతా కూర్చున్నారు....మొగిలి తమ గ్యాంగు దగ్గరికి పోయి వెంకులు పక్క నిలుచున్నాడు - వెంకులుది తన ఈడే - మూడేండ్ల నుంచి గీన్నే పనిచేస్తున్నడట. ఎవల ముచ్చెట్లాల్లయే. కాని ఈ ముచ్చెట్లల్లో ఎక్కడో వేడి...

                అర్జయ్య సన్నని గొంతుతోటి ‘‘సూసిండ్లా! లారీలోల్లకు యాభయి రూపాలు జీతం పెరిగిందట.  అంటే ఇన్నూట యాభయినుంచి మున్నూరయినవి.   రోజు బత్తా అయిదు నుంచి ఏడు రూపాలు పెరిగిందట - అడుగందే అవ్వయిన బెట్టది - మనం ఎప్పటి నుంచో గిదేఏషం - లారీ లోడింగ్‍ నేను కొత్తలచ్చినపుడు యాబై యుండే అప్పుడు మనకు ముప్పయిచ్చేవాళ్లు - అది ఇన్నూరయ్యింది - అంటే మూడు రెట్లు  బెరిగింది - ఎనుభై రూపాలున్నప్పుడు  బెంచిండ్లు. తరువాత తెడ్డు చూపిండ్లు.’’

                ‘‘ఎట్లయితె అట్లయితది. ఇయ్యలడుగుదాం’’ అన్నారు కొందరు...

                మరికొందరు ఎటూసప్పుడు చెయ్యలేదు...

                ఇంకొందరు ‘‘అందరు ఎట్లంటే గట్ల - నలుగురితోని నారాయణ’’ అన్నారు...

                ఎవలడుగాలనే కాడ పెద్ద రబస జరిగింది...

                చివరకు అర్జయ్య తనే అడుగుతానన్నాడు..

                ‘‘ఆళ్లు ఒప్పుకోరు అప్పుడేం చేద్దాం?’’ అన్నాడు చెంద్రమొగిలి...

                ‘‘ఏం జేద్దాం ? మనం సమ్మె జేద్దాం - గిప్పుడైతేనే మంచి గుంటది. దాదాపు ఇన్నూరు లారీలుంటయి మనం నింపకపోతే అటు లారీలోల్లు లొల్లి చేస్తరు...’’ అర్జయ్య...

                వాళ్లట్లా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక్కొక్క మొఖద్దమ్‍ దిగిండు... రాకడ రాకడే చిర్రుబుర్రు లాడుకుంటచ్చిండ్లు...

                ‘‘ఏమాయ్యెరో? ఆవలగన్ని లారీలు నిలబడుంటే తీరిపారి ముచ్చెట్లు బెడుతండ్లు.. లేండ్లి లేండ్లి ’’ నరేందర్‍...

                ఎవలు మాట్లాడలేదు. అర్జయ్య వాళ్ల గ్యాంగు మొఖద్దమ్‍ కరీం... ‘‘మాక - లమ్డికొడుకులకు గమండి బెరిగింది బంచత్‍... ఏమిరా అర్జా! లీడరువైతన్నవట హమ్‍కు లీడరునయివోనా బై... అమ్‍కు మజ్దూర్‍హోనా’’ అన్నాడు..

                అర్జయ్య మాట్లాడలేదు...

                ‘‘ఇయ్యల్టీ నుంచి అర్జయ్యను పనిలకు తీసుకునేదిలేదు’’ అన్నాడు నరేందర్‍...అర్థంచేసుకొని...

                అయినా లోడర్లు మాట్లాడలేదు - కదలలేదు..లారీ డ్రైవర్లు క్లీనర్లు మొఖద్దమ్‍ల చుట్టు మూగిండ్లు..తలో మాట...

                ‘‘బెల్లం గొట్టిన రాయోలె ఉలుకరు పలురు సి.యస్‍.పి బ్రేక్‍డవున్లుండి - కోల్‍ యార్డంత నిండి పోతంది’’ ఇంకో మొఖద్దమ్‍: అరిచిండు...

                అప్పుడు అర్జయ్య లేచి నిలబడి...’’కోప్పడకుండ్లి మాకిచ్చేటియి సరిపోత లేవు’’ అన్నాడు...

                ‘‘ఏందిబే - నువ్వేనన్నమాట లీడరువు గింతదాకచ్చిందా ఎవ్వారం - నువ్వు అసలుకే లేవు... మీకు సరిపోకుంటే పోండ్లి బై - గా రేటుకు పనిచేసేటోల్లనే తెచ్చుకుంటం...’’నరేందర్‍...

                ‘‘నడువుండ్లిరా? మనతోనై పోయిందట - కొత్తోల్లను దెచ్చుకుంటరట - కడుపు లేనోల్లు ఎవలన్న దొరకుతే గట్లనే తెచ్చుకోండ్లి...’’ అర్జయ్య.

                ‘‘ఏకు దమ్మున...’’నరేందర్‍ మాట పూర్తికాక ముందే - సగం మంది లేచి నిలబడ్డారు - సగం మందిలో కొంతమంది లేవాలా వద్దా అని అలోచిస్తున్నారు...

                ‘‘బంచత్‍... సమ్మె చెస్తండ్లన్నమాట’’ కరీం గడ్డం గోక్కుంటూ.

                ‘‘అన్న మాటేంది ఉన్నమాటే’’ మందిలో నుండి ఎవడో - ఆ ఎవడ్నో చూడాలని నరేందర్‍ ప్రయత్నం చేశాడు. కాని అందరి ముఖాలు ఒక్కలాగే ఉన్నాయి...

                ‘‘బాగా ఆలోచించుకోండ్లి.... మీ పని బోతే అర్జడు పనిప్పియ్యడు - మీరు ఆకట సత్తె అర్జడు కూడు బెట్టియ్యడు... వింటండ్లా? ’’ నరేందర్‍...

                ‘‘పుట్టిన కాన్నుంచి తమరే సాదవడ్తిరి... ఉత్తపున్నానికిచ్చినట్టు మాట్లాడవడ్తిరి... మేం పనిచేస్తేనే గదా మీరైనా మేమైనా బతికేది. గీ రెక్కలేడమ్ముకున్నా గీంత మాత్రం దొరకకపోదు...’’ మళ్లీ మందిలోనుంచే...

                నరేందర్‍కు చెమటలు పట్టాయి...ముసలం పుట్టనే పుట్టింది - పన్నెండు మంది మొఖద్దమ్‍లుండి కూడా ఎవడో ఒకడు పుల్లబెడితే పనాగి పోయింది...

                ఆ ఎవన్నో మసి సెయ్యడం సుతారం గాదు... కాని ఎట్లా? ఇప్పుడైతే పని ఆగిపోతది... దొర దెం...లు.. అంతా ఉల్టా సీదా.. మొఖద్దమ్‍లు ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు.

                కరీం జబర్దస్తీగా అర్జయ్య గల్ల బట్టిండు...

                ‘‘ఇడువ్‍... ఇడువ్‍....’’ తొక్కులాటలో లోడర్సుకు ఏం చేయాలో పాలుపోలేదు...

                ‘‘ఇడువ్‍ అర్జన్న గల్లా నిడువ్‍...’’ అన్నాడెవడో అందరు అదే అన్నారు... ఎవడో కలుగజేసుకున్నాడు... కరీంను బయటకి దొబ్బారు... ఇంకొంచెం ఆలిశ్యమైతే లేబరు కరీంను తొక్కేవాళ్లే.

                నరేందర్‍ పరిస్థితి చెయ్యిదాటిపోతున్నందుకు...గాబరాపడి... ‘‘ఆగండాగండి...’’ అని అరిచిండు

                ‘‘ఆగండి - సరే ఎట్లాగో సమస్య పుట్టింది మీరు మేము నౌఖరిగాళ్లమే - మనకు యజమానున్నడు...నేను ఫోనుల మాట్లాడివస్త. మీరంతా ఆగుండ్లి...’’ అన్నాడు...

                లోడర్సు సరేనన్నారు...

                నరేందర్‍ సైకిలెక్కి ట్రక్కులు చుట్టేసి రోడ్డు మీదికొచ్చి ఓ బ్రాండి షాపులో నుంచి క్రిష్ణారావుకు ఫోను చేసిండు...

                ‘‘నేను దొరా! నరేందర్‍ను... లోడర్సు సమ్మె చేస్తమంటున్నారు...’’

                ‘‘మీరంతా ఎందుకున్నరు? మొ... చీకుతండ్లా! ట్రక్కుకు ఇరువై రూపాలు దెం... వాడలు దిరుగుమనా మిమ్ముల బెట్టుకున్నది?...లం..కొడుకులారా. ఎవడేం మాట్లాడుతండో చూడొద్దా? చూడు - నరేందర్‍గ ఆ లమ్డికొడుకు లంతా బద్దిమాకోల్లు - సీసా కల్లు గప్పుచుప్పున గొట్టి గుర్రు కొట్టి పండేటోల్లు’’ అవతలినుంచి -

                నరేందర్‍కు చెమటలు పట్టాయి. చేతిలో ఫోను వనికింది... ముఖం మాడిపోయింది...  ‘‘దొరా! రెండు రోజుల నుండి పనిబందు గదా! ఈ విషయం మాదాక రాలేదు’’

                ‘‘రాస్కెల్‍...మొన్నటిరోజు అర్జడు చెట్టుకింద ఏం మాట్లాడిండో నాకు తెలిసింది... మీరేం చేస్తున్నట్లు ?- ఇలాంటి సమయంలో ఊరుమీద బడి అంబోతులోలె తిరుగకుండా పని మీదుండాలె... ఇంగ్లీషులో ఓ సామెతున్నది...ఎమ్టీ మైండ్‍ ఈజ్‍ డేవిల్స్ వర్కుషాపని. వాళ్లు పనిచేయకుండా కూర్చుంటే ఏదో ఆలోచిస్తరు. అది సరే! అర్జనికి ఎవరెవరితో సంబంధాలున్నాయో కనుక్కున్నారా? లేదు... అన్నీ నేనే చెప్పినంక మీరెందుకోయి...బాస్కర్రావు గాడు వాని ఆంధ్ర రాజకీయంతోటి పుల్లలు బెట్ట చూస్తండు - అంత దమ్మొచ్చిందంటే... వాని వెనుక ఏదో ఒకటుండాలె... చూడు...ఇప్పుడు గడబెడ కానియ్యకు. నేను హైద్రాబాదు పోయిన్నని చెప్పు...వారం రోజులు గడిచే దాకా నడిపించుండ్లి - ఆ తర్వాత సంగతి చూద్దాం ...’’

                ‘‘మా మాట నమ్మరు దొరా’’

                ‘‘సరేసరే! రాఘవులు గాన్ని తొలిస్త...నువ్వు పోయి వస్తున్నారని చెప్పు...’’

                ఫోన్‍ పెట్టేసి ఢీలాపడి సైకిలు దొబ్బుకుంటూ లోడర్ల దగ్గరికొచ్చాడు నరేందర్‍.

                ‘‘వస్తండ్లు -ఈలోగా పని గానియ్యిండి - మాట మాటేనాయె, పని పనేనాయె - ఇగో బై మద్దెన మమ్ముల అనకుండ్లి - వచ్చినంక అన్నిమాట్లాడుకోండ్లి - మీయిష్టం - వాళ్లిష్టం - మనదేందంటే కిరాయి వసూలు చెయ్యడం ఎవలకు పంచేదాల్లకు పంచడం’’ నరేందర్‍...

                ‘‘రానియ్యిండ్లి - దొర తోనే అన్ని మాట్లాడుతం’’ లోడర్సు...

                గంట గడిచిపోయింది. ఈలోగా లేబర్లలో ముసలివాళ్లు గునుపులను గుండెల్లోనే అదిమి పట్టుకున్నారు. అసలే రెండు రోజుల నుంచి పనిలేదు. ఇయ్యల్ల కూడాపోతే - ఎందుకొచ్చిన పీడ.  ఎద్దుపుండు కాకికి ముద్దన్నట్టు. కడుపు గాలినోల్లం మనం - రెండు రోజులు పనిబోతె ఉపాసముండుడే -కని దొరకు పోతేంది, ఉంటేందిఇట్లాగా ఆలోచించి..ఒక ముసలివాడు మొఖద్దమ్‍లకు వినిపించకుండా అర్జయ్య పక్కకుచేరి... ‘‘ఒరే అర్జన్నా! ఆళ్లు మా రాజులు - వాళ్లకు రెండురోజులు పోతేలెక్క గాదు...మరి మనకో రెక్కాడితె డొక్కాడ్తది...’’ అన్నాడు...

                ‘‘అవునిచ్చమే - మనకుబోతే మనిషికి పది రూపాయలు బోతయి... మనం కడుపు నిండ దిని కండలు బెంచుతన్నమా? గ లేమిడిలనే గిది గూడా - కని దొరకు ఒక్కనాడు ఆదాయం ఎంత లేదన్న మూడు నాలుగు వేలుంటది - అది ఎక్కువానా? మన పది  రూపాయ లెక్కువనా?’’ అర్జయ్య అంతే మెల్లగా చెప్పాడు...

                ‘‘కరీంగాడు చూడు  ఎట్ల చూత్తండో?’’ అన్నాడొకడు...

                  ‘‘ఏందిబే?’’ అన్నాడు  కరీం మొఖద్దమ్‍.

                ‘‘మిమ్ములగాదు బాంచెన్‍...మా కనకయ్య నంటున్న’’ అన్నాడు....

                ‘‘పిత్త బలిసినవ్‍ బిడ్డా ! నీ బలుపు దేవుడు తియ్యకపోడు గాడెవడో గట్లనే ఎగిరిండట ’’అన్నాడెవడో...

                మొఖద్దమ్‍లు ఆ మాటలు తమను కాదన్నట్లు ఎటో చూస్తూ నిలుచున్నారు.

                గంట గడిచింది. ఇలాంటి మాటలు - అర్జయ్య మనుసులో మాత్రం ఎన్నో విచారాలు...ఇంతలో గోధుమరంగు కారొచ్చింది...

                ‘‘దొరచ్చిండు దొరచ్చిండు’’ లోడర్సంతా తొక్కీస లాడుతూ కారు చుట్టూ మూగారు...

                కారాగింది. కారులోనుంచి దొర దిగలేదు రాఘవులు దిగిండు...చాలా ప్రశాంతంగా నవ్విండు. అద్దాలు తీసి జేబులో పెట్టుకున్నాడు... దొరకు దండాలు బెట్టాలనుకున్న కార్మికులు ఆగలేక రాఘవులుకే పెట్టిండ్లు...

                ‘‘అరె దొరరాక గీసుప్ప నాతోడచచ్చిండేందిరో?’’

                ‘‘ఏమయ్యో మేం దొరగావాలన్నం...’’ అన్నా డొకడు గుంపులోనుండి...

                రాఘవులు అదే చెక్కు చెదరని నవ్వును జీడిగింజ ముఖం మీద పులుముకొని కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో నిలుచున్నాడు...

                ‘‘కార్మిక సోదరులారా! దొర బొగ్గుబాయిల వాళ్ల సమస్యల గురించి మాట్లాడడానికి పట్నంబోయిండు...’’

                ‘‘అరే ఇగెట్లరా?’’

                ‘‘వినండి...అయితే దొరొచ్చేదాక మనకు పనులాగుతయా? ఆగయి...లారీలాగుతయా ఆగయి. రాజుబోతె రాజరికం పోతుందా? మీ సమస్య లేమిటో చెప్పండి ఈ సంగతి తెలిసిన వెంటనే నేను పట్నం ట్రంకాల్‍ చేసి దొరతో మాట్లాడిన... సంగతేందో నన్ను తెలుసుకొమ్మన్నాడు...’’ అన్నాడు...

                అర్జయ్య మందిలో నుంచే -  ‘‘సంగతే ముంటది సార్‍ కయికిలి గాళ్లకు... మాకు కూలి బెరుగన్నననే...పదేండ్ల కింద మేం తొలుత గీ పనిమొదలు బెట్టినప్పుడు లారీకి ఇరువై రూపలిచ్చేటోల్లు - అప్పుడు మనిషికి తక్కువల తక్కువ మూడు రూపాయలు ఎక్కువల ఎక్కువ  అయిదురూపాలు గిట్టేది - అది ముప్పయి చేసిండ్లు - నలుబై చేసిండ్లు - ఎనుబై చేసిండ్లు - కని ఆనాడు మూడు రూపాలల్ల గాసం గిన గొనుక్కోంగ ఆటాన మిగిలేది- ఇప్పుడు పదచ్చినా గాసానికే సరిపోతలేదు...’’ అర్జయ్య...

                ‘‘నిజమే నిజమే’’ అన్నాడు రాఘవులు...

                ‘‘తమరికెరుక లేనిదేమున్నది - మా కండ్ల ముంగట బొగ్గుబాయిలోల్లకు ఎన్నిపారీలు ఎంతెంత బెరిగినయ్‍. నిన్నగాక మొన్న లారీ డైవర్లకు యాభయి రూపాలు జీతం, బత్తల రూపాయి బెరిగే...’’

                ‘‘గది మేమే పెంచిపిచ్చినం..మా యూనియనే పోరాడి గెలుచుకున్నది...’’ రాఘవులు ఉత్సాహంగా చెప్పబోయాడు...

                ‘‘ఇగో పదేండ్ల కింద బీడి కట్ట ధర ఏకానుండె. ఇయ్యాల బీడికట్ట ధర ముప్పయి పైసలయ్యింది. ఏందన్న మాట బీడి కట్ట ధర నాలుగంతలయ్యింది - మరి మా జీతం రోజుకు పదన్న గిడ్తలేవు. అప్పుడు మూడురూపాలనుకున్న ఇప్పుడు పదిహేను గిట్టాలె’’ అన్నాడొకడు...

                ఇంకొకడు సబ్బు ధర జెప్పిండు - మరొకడు బియ్యం, పప్పు ధర చెప్పిండు...

                రాఘవులు అందరిని మాట్లాడనిచ్చి...

                ‘‘నిజమే కాదనను...కని దేనికైనా పద్దతుండాలె - విన్నరా? సమ్మె చేయదల్చుకుంటే ఖానూను ప్రకారంగా పదిహేను రోజుల ముందు నోటీసియ్యాలె’’

                ‘‘మాకేడ కానూండ్లు ఎరిక బాంచెన్‍...మాకు పర్మినెంటా? యూనియనా?’’

                ‘‘కనుక - మీరు పని మీది కెక్కుండ్లి - దొరచ్చిన తరువాత మీ తరపున అన్ని సంగతులు నేను దొరకు చెప్పుత...’’

                ‘‘మేము కూడా వత్తముండ్లి’’

                ‘‘సరే మీదాంట్ల ఓ ఇద్దరొచ్చేరు...కార్మికులారా ఏదైనా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. వింటండ్లా? మన దేశం నుండి ఇంగ్లీషోనంతటివాన్ని గాంధీ శాంతి యుతంగా వెల్లగొట్టగలిగాడు..ఎవరో వస్తారు..కామ్రేడ్సు అని మనదేశం మాట కాకుండా మాట్లాడుతరు - మనం పోరాడాలెనంటరు. మీరు వాళ్ల మాటలు నమ్మి పోరాటంలకు దిగిండ్లో? వాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఎనుకకు మర్రి ఉరుకుతారు. ఆఖరుకు మిగిలేదేమిటో? మీకు చెప్పాల్సిన పనిలేదు...’’

                ‘‘గియినే మన సంగతి మాట్లాడక ఎవల సంగతో చెప్పుతడేందిరా?’’ అన్నాడొకడు...

                ‘‘ఇగో గయ్యన్ని మాకేరుకలే - మా మొఖద్దమ్‍లు మమ్ముల కుక్కల సూసినట్టు సూత్తరు. ఊ అంటే  ఆ అంటే మీది కురికత్తరు. తంతండ్లు. గాళ్లకు గూడా జెరంత గదేందో శాంతి ముచ్చట చెప్పుండ్లి బాంచెన్‍’’ అన్నాడు ఒక పొట్టివాడు...

                అందరు నవ్విండ్లు...

                ‘‘ఏమయ్య తోటి కార్మికులతోని అట్లాగేనా వ్యవహరించుడు... సరే - ఇకముందు అట్లాంటియి జరుగుతే నాకు చెప్పుండ్లి’’

                ‘‘తమరేడ దొరుకుతరు బాంచెన్‍...?’’

                ‘‘నేను కార్మికుల్లోనే ఉంటగదా! అది సరే పని మొదలు బెట్టుండ్లి...’’ అన్నాడు రాఘవులు మొఖం మీద చెమట తుడుచుకుంటూ...

                అర్జయ్య ఏదో మాట్లాడబోయాడు. కాని లోడర్సు అప్పటికే సెమ్మాసులు, తట్టలు తీసుకొని పని మీదికి పోయారు...

                నిలబడిన అర్జయ్య కేసి అప్పుడు చూశాడు రాఘవులు... కత్తిరించిన మీసాలు...కనుబొమ్మలు ముడిచాడు...అతని మనసులో ఎక్కడో చిన్న ఘర్షణ... కారెక్కిండు... మొఖద్దమ్‍లు గ్యాంగుల చుట్టూ మిర్రి మిర్రి చూస్తూ కాసేపు తిరిగి ఎండకు అలిసిపోయి - సైకిల్లెక్కి వెళ్లిపోయారు...

                పని జోరుగా నడుస్తోంది. లారీలు నిండుతున్నాయి బొగ్గుకుప్పలు తరుగుతున్నాయి. అన్నాలకు దిగి నప్పుడు...

                ‘‘అర్రె అన్నాలుదినే టందుకు షెడ్డు గురించి మతికే లేకపాయె -’’ అన్నాడొకడు...

                ‘‘నల్ల కూడా...’’

                ‘‘అట్లా చూస్తే సానున్నయి. బూట్లుగావాలె - వారానికో సెలవు గావాలె - బట్టలు గావాలె- ప్రావిడెంటు ఫండు కట్టుగావాలె - జీతాలు ఏ రోజు కారోజుగాకుంట వారానికొక్క మారుగావాలె - పెళ్లలుబడి సితికిపోయిన మన కాళ్రెక్కలకు ముదరగట్టియ్యాలె - మనకు సుత కంపినీ దవకాండ్ల సూపిచ్చుకోనియ్యాలె - గ్లి సానున్నయి’’ అన్నాడు అర్జయ్య...

                ‘‘నీకు తెలివి బాగనే అచ్చిందిరో’’ అన్నాడో ముసలివాడు...

                ‘‘ఇది మన మొదటి అడుగు...’’ అన్నాడు వెంకులు...దాన్నెవడు వినిపించుకోలేదు...

                ‘‘ఇంతకూ మనం ఓడినట్టా? గెలిసినట్టా?’’

                మొగిలి ఎప్పటి నుంచో అనాలనుకున్న మాట గొంతులోనే ఉండిపోయింది...

                                                                          21

 

                ఆ గుడిసె ఎటూ నాలుగు గజాలు లేదు. కంకబొంగులతో వేసిన కప్పు ఎప్పుడో ఎగిరిపోయింది... అలాంటి గుడిసెలో నలుగురు మనుషులు కూర్చున్నారు... అప్పుడు సాయంత్రం నాలుగు కావస్తోంది. ఆ నలుగురిలో ఒకడు అర్జయ్య ఇంకొకడు వెంకులు... ఇంకోఇద్దరిలో ఒకడు చిన్నగడ్డం - బక్కమొఖం పెద్దపెద్ద కనిగుడ్లు - అతనిపేరు ఇబ్రహీం - రెండో అతనివి మొలితిప్పిన మీసాలు- కోలముఖం మనిషి బలంగా ఉన్నాడు...అతని పేరు కొమురయ్య.

                ఇబ్రహీం చాలా సేపటి నుండి మాట్లాడుతున్నాడు.. మధ్య మధ్యలో కొమురయ్య వివరించి చెప్పుతున్నాడు.. అర్జయ్య వాళ్ల మొఖాల కేసి చూడకుండా వింటున్నాడు... ఒక్క వెంకులు మాత్రమే ముగ్గురి మొఖాలు పరిశీలనగా చూస్తున్నాడు. వెంకులుకు ఆ మాటలు అర్థం కావడం లేదు...

                ‘‘చూడు కామ్రేడ్‍... ఒక పక్క గని కార్మికులు బ్రహాండమైన పోరాటాలు చేసి మొదటి వేజ్‍ బోర్డు సాధించుకున్నారు. బోనస్‍ సాధించుకున్నారు..మరో పక్క ఇదే ఏరియాలో బొగ్గు లోడింగు చేస్తూ  మీరు పశువుల్లాగా ఏ హక్కులులేకుండా తుమ్ముతే ఊడే ముక్కులాగా పని చేస్తున్నారు. మీరంతా ఒక్కటి కావాలి...అసలు మీరు ఇవ్వాల్ల సమ్మె నాపవలసిందిగాదు - దీన్నే డిలే పాలిటిక్సు అంటారు... అసలు చుట్టుపక్కల ఇరువై ఊళ్ళల్లో భూములు గలిగినవాడు భూస్వామి. పల్లెటూల్లో దొర కిరాతకమైన దొర. ఒక సంఘటన చెప్పుత వినండి... ఇది వారం రోజుల కింద జరిగింది - మొగుల్లపెల్లిలో ఈ దొరకు అరవ చాకిరి చేస్తున్న ఒక పాలేరు ఆ పని భారానికి కాగలేక అత్తగారింటికి పారిపోయిండు - మామ ఏదో కంపనీలో కంట్రాక్టరు లేబరుగా పనిచేస్తుంటే అక్కడే   ఉన్నాడు - ఈ లోగాఈ సంగతి వీడికి తెలిసింది - భార్య నెత్తిమీద కుండలు బోళ్లు పెట్టించి వాళ్ల స్వంత యింటిని ఖాళీ చేయించి - ఆ గుడిసెకు కంప దడి కట్టించి వెళ్లగొట్టాడు - అలాంటి దొర కొడుకు ఇక్కడి కొచ్చి లేబర్‍ నాయకుడి అవతారమెత్తి - లేబర్ల హక్కులకోసం పోరాటం చేస్తున్నట్టు ఫోజుపెడుతున్నాడు -చుట్టుపక్కల ఇరువై ఊళ్ల్లల్ల ఒకపక్క వందల పాలేర్లను - రైతులను దోపిడి చేసే ముకుంద రావు దొర - ఇంకో పక్క గీడ లేబరు మీద దోపిడి  జరుగుతుందని అయిన కొడుకు క్రిష్ణారావు చిలుక పలుకులు  పలుకుతున్నాడు - ఎందుకు? ఎప్పుడు కార్మికులు ఆలోచించరు. ఎందుకంటే  దొర కొడుకులే  ఇక్కడ సారా కంట్రాక్టు, బ్రాండిషాపులు, సినిమాటాకీసు, వడ్డీ వ్యాపారం -- ఇవేకాక బంగారు గుడ్లు పెట్టే లోడింగ్‍ కంట్రాక్టు ఉన్నాయి. ఇవ్వన్నిటికి అధికారం కావాలి -దానికి లేబర్‍ యూనియన్‍ - పై నుంచి చందాలు కావాలి. ఇది మనొక్క దేశంలోనే సాధ్యం...గుండా గ్యాంగును పెంచి పోషించి కార్మిక ప్రాంతాలలో గుండాగిరి చెలాయించుతండ్లు.’’

                ‘‘వాడు పొద్దున సింగ్‍ గానింట్ల కనిపించిండు’’ అన్నాడు కొమురయ్య

                ‘‘ఓర్నియవ్వ పట్నం బోయిండని - ఆ కర్రె మూతోడు చెప్పిండే ’’ వెంకులు...

                ‘‘గదే గమ్మత్తు...లెనిన్‍ ఏమన్నడో తెలిసిందా?’’.  లెనిన్‍ ఎవరో అక్కడున్నవారికి తెలియలేదు.  ఆయన భాస్కరరావు కన్న పెద్ద లీడరేమో అనుకున్నరు.

                ఈ మాటలు ఎంతకూ తెగేటట్లు లేదు...

                ‘‘మీరొక్కపారి లోడింగ్‍ కాడికొచ్చి మాట్లాడ్తె మంచిగుంటది. నాకేమో ఓటిదోస్తే ఓటి దొయ్యక పాయె! అది గాక            మావోళ్లు గూడ మా ఎనుక బలమున్నదని ముందు కత్తరు’’ అర్జయ్య...

                ‘‘కొమురయ్య రేపొద్దున నువ్వెళ్లు - నేను కెకెటూ మీదికి బోవాలె...సాధ్యమైనంత వరకు సామరస్యంగానే చూడండ్లి...

                ‘‘మల్ల గదేమాట - నేనాడికి బోతే ఆనిమొఖద్దమ్‍లు ఊకుంటరా?’’

                ‘‘నువ్వూ మన  వాళ్లను తీసుకపో... ఎందుకైనా మంచిది. మనం సమ్మె పద్దతిలోనే పోవాలె - ఏదన్న గడబిడ జరిగిందంటే వాడా రూలింగ్‍ పార్టీ - పోలీసులు కేసులు - ఓటిబోయి ఓటయితది...’’ ఇబ్రహీం...

                ‘‘మరి కానే అయితది...కాకుంటెట్లయితది...? కర్ర విరక్కుంట పాము సావకుంట వాని గుండాలు ఆడోల్ల నెత్తుకపోతే శాంతి అంటిరి. ఎట్ల పనైతది’’ కొమురయ్య

                ‘‘కామ్రేడు నువ్వు కమ్యూనిజాన్ని సరీగ అర్థం చేసుకోలేదు...కామ్రేడు లెనిన్‍ ఏం జెప్పిండు  ఒక్కడుగు వెనుకకు రెండుగులు   ముందుకు’’ ఇబ్రహీం...

                ‘‘పెద్దసారు గాలి సోకిందిగని’’ కొమురయ్య...

                ‘‘పార్టీ ఆదేశం మరి...కామ్రేడ్సు రేపు మేము తప్పకుండా వస్తాము...’’ ఇబ్రహీం లేచి నిలబడ్డాడు...

                మీటింగైపోయింది...వాళ్లతో పాటే వెంకులు వెళ్లి పోయాడు...

 

 

                                                           22

 

                అర్జయ్య మార్కెటు కేసి నడుస్తున్నాడు. అతని మనుసులో అనేక రకాల ఆలోచనలు...‘‘ఇంతకుముందు ఎంతో మంది గులిగిండ్లు - ఎదురుబడి అడిగిండ్లు.  ఎట్ల చేసేటోల్లను అట్లా చేసి మొత్తానికి అందరిని ఓడిచ్చిండ్లు - ఒకప్పుడు పిర్రల మీద సినిగిన కాకిరంగు  నెక్కరేసుకొని నరేదంర్‍ గిట్లనే లేబరుగ వచ్చిండు...వచ్చిన దగ్గరినుండి కూలి బెరుగాలని అనేటోడు... ఆఖరికి ముందటబడి అడిగిండు - ఎవడు సపోర్టు చెయ్యలే - పెరుగాలా వద్దా అనే మాట చెప్పకుండా కార్మికులు నిలుచున్నారు... తర్వాత మార్కెట్ల ఎక్కన్నో నరేందర్‍ను గుండగాళ్లు కొట్టిండ్లన్నరు. వారం రోజలకు ఏమయ్యిందేమో నరేందర్‍ మొఖద్దమ్‍  అవతారమెత్తిండు - ఇప్పుడు లోడర్లు అంతా కూలి పెరుగాలన్నరు -ఏమో విషప్పురుగులు - తన నేమన్నా చేస్తే తన పోరగండ్ల  గతేంగావాలె?’’  - అర్జయ్య కాల్లు వనికినయ్‍ - చెమట పట్టింది... ఎవరన్నా తనను వెంబడిస్తున్నారేమోనని చుట్టూ చూసిండు. ఎవరి పనుల మీద వాళ్లే వెళ్లి పోతున్నారు -

                దూరంగా బ్రాండిషాపు ముందు సారలిగాని గ్యాంగు ఒకల భుజాలమీద ఒకరు చేతులేసుకొని వచ్చేపోయే ఆడవాళ్లను చూస్తూ నవ్వుతున్నారు..వాళ్లు తనకేసి వస్తారని - ఇక్కడే తంతారని వనికి పోయిండు - కాని వాళ్లు అర్జయ్యను చూడనే లేదు...

                ‘‘గిట్ల బయపడితెట్ల - సచ్చిందోనాడు! పుట్టిందోనాడు. తనేం తప్పుచేసిండు - తనకు కూలిజాలదని అడగడు తప్పా! గుండాలకు తాగ పోపించకపోతే వాని పనులు చేసిపెడ్తరా? తనకు గుండాలకు పోలికెక్కడిది. తను మామూలు తిండి కోసం పని చేసే కాడ అడుగుతండు... అదీ వాని ఇంట్లసొమ్ము ఇయ్యిమంటలేడు - తను సంపాదించే దాట్ల వాటా పెంచుమంటండు? ఇది తనొక్కని సంగతిగాదు - పనిచేసే వాళ్లందరిది....

                ‘పోరాడాలె - సాధించుకోవాలె’ - కమినిష్టోల్లంటరు. మల్ల శాంతితోని పనులు జేసుకోవాలెనంటడు లీడరు - వాళ్లు వాళ్లొక్కటి గాదుగదా? అనవసరంగా లంపాటకంల ఇరుక్కుంటలేను గదా! ఏమో సాయంజేత్తమంటండ్లు! ఉత్తగెందుకు జేత్తరు? ఈడ గెలుస్తే ఇగో మేం కొట్లాడి సాధించినమంటరు? దొరకు ఈడపొక్క బొడుత్తే బాయిల మీద ఈల్ల యూనియన్‍లో ఎక్కువ మంది చేరుతారు. చందాలు వసూలు జేసుకుంటరు - పోనీ ఆని లాభమానిది - మా లాభం మాది - వాళ్లిద్దరికి బడది. గదాని మూలకంగా మాకింత లాభమైతే ఆయింక ఎవడే గంగల పోతేంది? కమినిట్టోల్లు మా ఎనుకుంటే దొరోనికి బాయిల కాడ దెబ్బత్తదని ఇసారంజేసి ఏమన్న పెంచక పోతడా? ఎట్లనో గట్ల సత్తవడుత ఈదుకత్తా మంటె ధరలు మండిపోవట్టే - ఏడికి సాల్త లేదాయె నీతల్లి - కాలేర్లమీద పచ్చిపియ్యి బంగారం - అందిన కాడికి ఎవడు గొరుక్కునేది ఆడు గొరుక్కుంటరు. అడిగే నాధుడు లేడు...నిన్నగాక మొన్న ఓటల్ల  సిప్పలు గడిగిన రామసాని గాడు బంగుళ గట్టె - బాయిల పనిసేసి నోడు - మీది పనిచేసినోడు - బిల్లింగ్‍ పనిచేసినోడు ఆఖరుకు మా లోడర్లు - అందరు లెక్కలు బెట్టుకుంటె అల్లి కల్లి సున్నకు సున్న - సేతుల పైసుండది - ఏదన్న గండమత్తె సిక్కులోనింటి కురికి నూటికి పది రూపాల వడ్డి సొప్పున అందరు అప్పు తెచ్చుకునిరి. వాడు దొరోని ఏజెంటేనాయె. - మల్ల ఎవన్నడిగిన బజాట్ల నిలబడి గింత దొపుకమా అని తిడుతరు.  - కిటుకేడనో సమఝ్‍కాదు - తిరుపతి కూడు బర్కతిలేదంట - గీడి సొమ్ము పాపపు సొమ్ము...’’

                ఇట్లా ఆలోచిస్తూ టక్కున ఆగిపోయి చుట్టూ చూసిండు... అప్పుడు కూరగాయల మార్కెట్లో మధ్యన నిలబడ్డాడు - ఓ దుకాణంలోకి  వెళ్లి టమాటలు అడిగిండు - కిలో రూపాయి...ఓర్నియవ్వ టమాటలకే అర్ధబెడితె మిగతా ఏం దినుడు?’’ అనుకుంట పక్క దుకాణం ఆడమనిషి దగ్గరికి నడిచిండు - ఆమె ఒకటో రెండో మంచి టమాటలు గలిపి మిగతా కుళ్లినవి గలిపి కుప్పలు బెట్టింది - కుప్పకు పావలా అన్నది...కుప్ప సూత్తే  కిలో అయేటట్టున్నది - పావలిచ్చి వాసన గొట్టే కుప్ప సంచిలెత్తుకున్నాడు. వాడిపోయిన వంకాయలో పావుకిలో పావులిచ్చి తీసుకున్నాడు...

                వెనుదిరిగి రెండుగులేశాడు...‘‘అర్జీ మార్కెటు కొస్తివా?’’ఎవరిదో ఎరుకున్న గొంతే - చుట్టూచూసిండు సైకిలు  పట్టుకొని నరేందర్‍ పరమ ప్రశాంతంగా నోటి నిండా పానేసుకొని -పొడుగు సిగరెట్టు తాగుతూ చిన్నగా నవ్వుతూ...

                ‘‘కలువనే కల్సిండు’’ అనుకొని ‘‘ఔ సారు’’ పోబోతూ అర్జయ్య...

                ‘‘నేను వస్తన్న పా... కూరగాయలు మందలియ్య వశంగాదు - ఈ మురిగినయ్‍... వాడినయి కొనేబదులు గుడ్లు దినుడే మంచిది...’’

                ‘‘మావోళ్లు ఇంటికాడెదురు సూత్తండ్లు - సుట్టాలచ్చిండ్లు’’ అర్జయ్య వేగిరపడుతూ....

                ‘‘అయ్యో గట్లేగిరపడ్తెట్ల - గీడ సుత మొఖద్దమ్‍గ సూత్తెట్ల ఇగో సిగరెట్టు తాగుతావా?’’

                ‘‘తమరిదేమొ సైకిలాయె - నాదేమొ కాళ్లాయె! పొత్తు కుదరది - సిగలెటు నాకు పడది - నాకు బీడున్నది...’’

                జేబులనుంచి గణేశ్‍ బీడి తీసి ముట్టిచ్చిండు...

                ‘‘ఆగరాదు - సూడోయి...’’వెంటనడుస్తూ.

                ఇద్దరు నడుస్నున్నారు...

                ‘‘సూడు అర్జన్నా! మనం గతికి లేకనే గీడికచ్చినం. వింటన్నవా? మనం పనేడ దొరుకక పుచ్చిన కుక్కతీర్గ దిర్గుతే దొరే ఆదుకున్నడా? కనుక నా అనుభవ మేందంటే ఈ లోకంల ఎవని ఏడుపు ఎవనికి బట్టది...

                మందేడుపులన్ని మనకే కావాలంటే మన పని గోవిందే.  నేను నీ తీర్గనే ఎగిరిన- ఎనుకకు పారజూసుకుంటే నా భార్యకు  రయికె గుడ ్డగతిలేదు - మనది మనం జూసుకున్నంక - ఆయింక మంది...’’ ఆగి అర్జయ్య ముఖంలోకి పరిశీలనగా చూసి...

                ‘‘ఏంది నరేందర్‍ గిట్లమాట్లాడ్తండని అనుకోవచ్చు మన దొర సంగతి నీకు తెలియంది కాదు - దగ్గెరికి దీసిండంటే ఆనన్నం కుక్కలు దినాలె - నా సంగతే చూడు - దేవుని దయవలన...’’

                ‘‘మానం అమ్ముకోవాల్నంటవు’’అర్జయ్య

                ‘‘నేనట్లా అన్ననా? మీ కమినిస్టులే చెప్పుతారు - శ్రమ, శ్రమ విలువ ఏందేందో? అని - శ్రమ విలువ అంటే ఏందో ఎరికేనా? నా రక్తం గింత నీకు కొలిసమ్ముతన్న నువ్వు గింత నాకియ్యిమని... అంటే తెలిసిందా? నువ్విప్పుడు కూరగాయలు గొన్నవే - గట్లనే మనల్ని మనం అమ్ముకోవడం - విన్నవా? కొనుడు అమ్ముడున్నంక - మార్కెట్ల ఏదున్నోడు అదమ్ముకుంటడు - ఏదిగావాల్సినోడు అది కొనుక్కుంటడు - వింటన్నవా? ఒకడు నెత్తురమ్ముకుంటె - ఇంకొడు మాటమ్ముకుంటడు ఇవి రెండు    లేనోళ్లు ఉన్నదమ్ముకుంటరు.. ఆడిది మానమమ్ముకుంటది. గిందట్ల రెండో వాని సంగతే లేదు తెల్సిందా?’’

                ‘‘ఇంతకూ నువ్వే మంటవు సారు నాకవతల పనున్నది...’’

                ‘‘గట్ల ఉరుకు లాడ్తె నీయిష్టం.. పట్నంల దొరకు పనైపోయి రెండు గంటల కొచ్చిండు - కరీంగానిది బద్దీమాకు. ఆడు లేబరు మీద పనికి రాడు -ఏదో పీకులాట తెస్తడు.  అదిగాక టాకీసుకాడ తాగి తడిసి లేబరోల్లు లొల్లి చేస్తండ్లు. ఆడికి వాన్ని మారుద్దాం...మీద్దాంట్లనే ఎవడన్నా ఉంటే చూడు. మొఖద్దమ్‍ చేద్దామన్నడు..ఈ పీకులాటేందుకు?’’

                ‘‘సాలు సాలయ్య... సారు! మాలోడర్లు పెండ్లామాలు దిడ్తరు...’’

                ‘‘ఊ అను నేను సూసుకుంట’’

                ‘‘ఇప్పుడు గాంకన్కన్నవుగని - నేను కట్టం జేసి బతికి నోన్ని మాటలు నేసిగాదు.. నీ తీరుగ నేను మాటలమ్ముకోను...’’

                ‘‘నీకు ముదిరింది కమినిష్టు పిచ్చి’’

                ‘‘సారు నాకు గయ్యన్ని దెలువయి - ఆళ్లేంపీకి పెట్టలే - మీరేం పీకి పెట్టలే....’’ అర్జయ్య రెండు చేతులెత్తి దండం బెట్టి చరాచరా నడిచాడు...

                ‘‘పులి పంజా దెబ్బ తాకుద్ది - నీయిష్టం...’’

                నరేందర్‍ పండ్లు గొరుకుతూ గొనగడం అర్జయ్యకు వినిపించింది.

                నరేందర్‍ ముఖం మాడిపోయింది.. కోపంగా సైకిలెక్కి సింగ్‍ ఇంటికి పోయాడు. అక్కడ చాలాసేపు క్రిష్ణారావుతో మాట్లాడిండు...చీకటైన తరువాత బ్రాండిషాపులోకి నడిచి పెగ్గుమీద పెగ్గు పోసిండు... కండ్లు మండుతన్నాయి. మాట తడబడుతోంది...అదే బ్రాండి షాపులో ఎప్పటి నుంచో తాగుతున్న సారలి గ్యాంగు వద్దకు వెళ్లాడు...

                థర్డు షిప్టుకు రమ్మంటూ బాయిలమీది సైరను కూసింది - ఒక్క సైరన్‍తో పాటు ఎనకాముందుగా  అన్ని బాయిల మీద  మరిన్ని సైరన్లు కూశాయి. వీధిలో కుక్కలు మోరలెత్తి సైరన్‍తో పాటు మొరిగినయ్‍..

                సారలిగ్యాంగు బయటికొచ్చింది... అప్పుడు పదకొండు గంటలు. రాత్రి - బ్రాండి షాపులో కూర్చున్నతను జోగుతూ తలుపులు మూశాడు...

                సారలిగ్యాంగు ఎనిమిది మంది తప్పడ తప్పడ అడుగులేస్తూ చెట్లనీడల కింద గుడిసెల కేసి నడస్తున్నారు...

 

                                                             23

 

                మిట్ట మధ్యాహ్నం మరింక లోడర్లు అన్నాలకు దిగే సమయంలో నల్లటి పిల్లవాడొకడు సైకిలు మీదొచ్చిండు...

                ‘‘అర్జన్న మీదాంట్లనే పనిజేస్తడా?’’ అని అడిగిండు..

                చంద్రమొగిలి ‘‘అదే ఏమయ్యింది...? ఇయ్యల్ల పనికి రాలే...’’

                పిల్లవాడు సైకిలు దిగి  ఎండకు ముఖానికి పట్టిన చెమట తుడుచుకొని ‘‘అర్జన్న రైలు కింద బడ్డడు’’ అన్నాడు...

                ‘‘ఏందేంది...?’’ అన్నరు కార్మికులు...

                పిల్లవాడు తను చూసిన సంగతి చెప్పిండు...

                ఎక్కడి తట్టలక్కడే విడిచి, ఎక్కడి సెమ్మాసులక్కడే విడిచి లోడర్లు రైలుకట్టకేసి పరుగెత్తారు.. వాళ్లతోపాటు మొగిలి పరుగెత్తాడు...

                వాళ్లు అర్జయ్య చనిపోయిన దగ్గరికి చేరుకునే సరికి అక్కడ అప్పటికే చాలా మంది పోగై ఉన్నారు.. మొఖద్దమ్‍లు   ఉన్నారు... రాఘవులు ఏడుపు గొంతుతో ఏదో అంటండు.  కుదిమట్రంగా ఉన్న ఇన్సెపెక్టరు మరో నలుగురు పోలీసులు నాన్ని శవం దగ్గరికి రాకుండా కర్రలతో అటకాయిస్తున్నారు...

                అర్జయ్య భార్య చెదిరిన వెంట్రుకలతో పిచ్చిదానిలా మాలు లేకుండా ఏడుస్తోంది...

                ఇన్‍స్పెక్టరును రాఘవులు ఏదో అడిగిండు.

                ‘‘మనం శవాన్ని తీయడానికి వీల్లేదు...ఇది సివిల్‍కు సంబంధించిన కేసుగాదు -- రైల్వే పోలీసులది...’’

                ‘‘వాళ్లెప్పుడొస్తారు...?’’ రాఘవులు...

                ‘‘కాగజ్‍నగర్‍ నుంచి రావాలి- అంతదాకా ముట్టటానికి వీల్లేదు...’’

                మొగిలి జనాన్ని తోసుకొని ముందుకు పోయాడు.  రైటు పట్టాల పక్క రెండు కాల్లు తెగి - తల తెగి.. అర్జయ్య  భయంకరంగా చనిపోయాడు. అతని కళ్లు ఇంకా తెరిచే ఉన్నాయి...

                ‘‘రైలు కడ్డం బడితే ఒక్క నెత్తురు చుక్కన్న పట్టాల మీద లేదు’’ చంద్రమొగిలి గులిగినట్టుగా...

                నిజంగానే అక్కడ నెత్తురు మరకలు లేవు... కంకరమీద గినబడ్డదేమొనని చూద్దామంటే పోలీసులు రానియ్యటం లేదు...

                ‘‘ఏం కట్టమచ్చిందో?’’

                ‘‘పెండ్లాం గయ్యాలిదేమొ?’’

                ‘‘అప్పులైనయేమొ? మొన్న రామకిట్ట పురమట సోరోడే - తాగితాగి రెండు వేలప్పు జేసిండట - అండ్ల వెయ్యి సిక్కులోనికేనట - ఇంటి మీదికచ్చి పెండ్లమాలు దిట్టిపోయిండట. సారలిగాడు పెండ్లాన్ని ఇంటికొచ్చి ఖరాబు చేసిండట  - డబ్బెడు గ్యాసునూనె మీద గుమ్మరిచ్చుకొని అగి్గ బెట్టుకున్నడట - రామరామ ఆ సావు సూడవశంగాదు - మాడిమసి బొగ్గయి పోయిండు’’

                ‘‘ఏందో ఇయ్యల్లింట్ల రేపు మంట్లె?’’

                ‘‘సత్తరు.. దేనికో దానికి గిట్లనే సత్తరు..వానవ్వల కుక్కలుదెం - సావకుంటె సంపుతరు...’’ కాండ్రికిచ్చి ఉమ్మేసి ఒక ముసలివాడు దుమ్మును తన్నుతూ వెళ్లి పోయాడు...

                ఇట్లాగే ఎవరికి దోచిన మాటలాల్లు...

                రైల్వే జమెదారు అయిదు గంటలకొచ్చి రాత కోతలు సేసిండు...

                లోడర్లు అర్జయ్య శవంతోపాటు  పెద్ద ఊరేగింపు తీసిండ్లు.  ఊరేగింపు అంతకంతకు పెద్దదైంది.  వందలు వేలయ్యింది.  లోడర్లంతా కలిసి తలా కొంత వేసుకొని అర్జయ్యను దహనం చేశారు. చాలా మంది తాగిండ్లు.  మొగిలి తాగిండు. గప్పుడు చాలామంది ఏడ్చిండ్లు.  అంతూపొంతూ లేకుండ, పేరుపట్టకుండా తిట్టిండ్లు.  కమ్యూనిస్టు పార్టీ వాళ్లు పాటలు పాడిండ్లు.  నినాదాలిచ్చిండ్లు.  మొగిలి మెదడు పచ్చి పుండులాగున్నది. 

 

                                                              24

 

                రాత్రి ఎనిమిది గంటలకు యాపలకాడ  కమ్యునిస్టు పార్టీవాళ్లు సభబెట్టారు.. ఆ సభలో బాస్కర్రావు ...

                ‘‘కామ్రేడ్‍ అర్జయ్య ఈ దుష్టవ్యవస ్థకోరల్లో బలైపోయిన మరో కార్మికుడు...కామ్రేడ్‍ అర్జయ్యంటే బతుకలేక ఆత్మహత్య చేసుకున్న వాడుగానే లోకానికి తెలుసు...కాని కామ్రేడ్‍ అర్జయ్య తనతోటి కార్మికులను గిట్టుబాటు కూలికోసం సంఘటిత పరిచి రెండు రోజుల క్రిందనే - పెత్తందార్ల భూస్వాముల కబంధ హస్తాల కింద నలుగుతున్న బొగ్గు లోడింగ్‍ కార్మికులను సమ్మె చేయించాడు....కాంగ్రెసు నాయకులు కల్లబొల్లి  మాటలు చెప్పి’’

                 మధ్యలో గుంపులెక్కన్నో ‘‘కామ్రెడ్‍ అర్జయ్య’’ అని మొత్తుకున్నారు. భాస్కర్రావు తను ‘‘అమర్‍ హై’’ అన్నాడు.  మందిలో కొందరు ‘‘అమర్‍హై’’ అన్నారు. ఆ నినాదాలు ఆగగానే ఉపన్యాసం కొనసాగించాడు.

                ‘‘నాన్పుడు రాజుకీయాలతో ఆ సమ్మెను తాత్కాలికంగా ఆపారు.  కాని కామ్రేడ్సు! అమరుడు అర్జయ్య పోరాటాన్ని కొనసాగించి కూలిరేట్లు గిట్టేదాక విశ్రమించేది లేదని అందుకు మా తరుపున అనగా కమ్యూనిస్టు పార్టీ తరపున పూర్తి సహాయ సహకారాలందించగలమని మనవి చేస్తున్నాను. ప్రపంచ కార్మికులారా ఏకం కండని మన మార్క్సు మహాశయుడు ఎప్పుడో చెప్పాడు  పోరాడితే పోయేదేమి లేదు.  బానిస సంకెళ్లు తప్ప’’ అంటూ ముగించాడు..


ఈ సంచికలో...                     

Mar 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు