నవలలు

(June,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

సైరన్ నవల  ఆరవ  భాగం 

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)

వెంకులుతో పాటు వచ్చిన మొగిలికి తమ వాళ్లెవరు అక్కడ కనిపించలేదు... బితుకు బితుకుగా మందిలో తిరిగారిద్దరు...

            ‘‘మనోలెవలు రాలేదేంది ఎంకన్న’’ అన్నాడు మొగిలి...

            వేదిక మీద మరో నాయకుడు అర్జయ్య కుటుంబానికి సానుభూతి ప్రకటించాడు..

            అంతా చీకటిచీకటిగా ఉన్నది.

            వెంకులు మొగిలి చెయ్యి బట్టుకొని బయటకు తీసుకొచ్చాడు...రోడ్డుమీద మైసయ్య అనే లోడరు హడావిడిగా సైకిలు మీద పోవడం చూసి ఆపిండ్లు...

            ‘‘అరె మీరంతా గీడున్నరా? మార్కెట్ల మీటింగు దొరచ్చిండట...’’ అన్నాడు మైసయ్య...

            మొగిలి వెంకులు మార్కెటుకేసి నడిచారు...

            మార్కెట్ల్లో అట్లాంటిదే సభ...

            భారీగా లైట్లు పెట్టారు.  ఎత్తుగా వేదిక కట్టారు.

            వేదిక మీద క్రిష్ణారావు చెంపకు చెయ్యానించుకొని తన తమ్ముడో బామ్మర్దో చచ్చినంత విషాదంగా కూర్చున్నాడు -మైకు ముందు రాఘవులు నిలబడి చేతులు తిప్పుతూ...

            ‘‘అర్జయ్య గురించి ఏమని చెప్పాలె...ఎప్పుడో పదేండ్ల కింద మాట - చిరిగిన మాసిన బట్టలతో అడివిలో  తప్పిపోయినెద్దులాగా నాదగ్గరి కొచ్చిండు.  అప్పటి నుంచి ఇప్పటి దాకాఏది నిన్న పోయేదాక, అర్జయ్య ఎవరితోని పోట్లాడినట్టుగాని నేనెరుగను...తన పనేందో తనేందో...అలాంటి అర్జయ్య మనల్ని విడిచి పెట్టిపోయినాడు..మానవునికి మరణం అతిసహజం...అందరం ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లమే - మట్టిసెత్త మనది...కుటుంబమన్న కాడ ఏవో తగాద లుంటాయి. అంత మాత్రాన రైలు కింద పడతమా? పానం దీసుకుంటమా? మీలాంటి నాలాంటి మొండి వాళ్లు నెగ్గుకు వస్తారు... మన దొర వారిని చూసిండ్లా! తన వర్కర్   పోయినందుకు ఎంత బాధపడి పోతున్నారో?’’ ఇట్లా మాట్లాడి మాట్లాడి - చెప్పిందే చెప్పి మరింక చెప్పడానికి ఏమిలేక మైకును వొదలలేక వొదిలాడు...

            క్రిష్ణారావు లేచి నిలడడ్డాడు..ఎక్కన్నుంచో చప్పట్లు, అందరు చప్పట్లు కొట్టారు...

            జీరబోయిన గొంతుతో ‘‘ కార్మికులారా! ఈ విశాద సమయంలో మాట్లాడడానికి నాదగ్గర మాటలు లేవు..నేను హైద్రాబాదులో ఉండగా ఈ వార్త తెలిసింది... నా కార్మికుడు పోయినందుకు నాకక్కడ ఒక్క నిముషం ఉండ బుద్దికాలేదు...ఎన్ని చెప్పినా! అర్జయ్య భార్యకు మాంగల్యాన్ని మళ్లీ యివ్వలేం... కాని నానుంచి అయ్యేది.. అర్జయ్య కుటుంబానికి వెయ్యిరూపాయలు విరాళం ప్రకటిస్తున్న... మీతో మీ అందరితో కష్టంలో సుఖంలో పనిచేశాడు కనుక మీరు ఏదన్న సహాయం చేయండి. మనందరం కలిసి అర్జయ్య కుటుంబాన్ని ఆదుకుందాం’’ అని ముగించి కూర్చున్నాడు...

            రాఘవులు లేచి...’’ కొందరు గిట్టని వాళ్లు దొర వారిని బదనాం చేయడానికి యూపలకాడ మీటింగు బెట్టినారని తెలిసింది... కార్మికుల పట్ల ఆయన ఔదార్యగుణాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లే అలాంటి తప్పుడు కూతలకు జవాబు చెప్పగలరని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు...’’ ఇదే ధోరణి...

            దుబ్బలో కూర్చుండి ఒళ్లంతా చెవులు చేసుకొని ఆశగా చూస్తున్న లోడింగ్‍ కార్మికుల కనుబొమ్మలు ముడుచుకున్నాయి...

            ‘‘సావగొట్టి సెవులు మూసిండ్లు వీనవ్వల...మన కూలి సంగతెవడు మాట్లాడడే..’’ అన్నాడు వెంకులు...

            ఎవడో ‘‘మాకు కూలిబెంచాలె’’ అని అరువబోయాడు...

            పక్కవాడు నోరుమూశాడు...‘‘అవు నాటకాడాటడంగ మద్దెలగాన్ని తేలుగుట్టినట్టు - గిక్కడద్దు’’ అన్నాడువాడు...

            కార్మికుల్లో గుసగుసలు, సనుగుడు...ఇంతలో ఎవడో బక్క పిలగాడు ఎర్ర కాయిదాలు పంచుతున్నాడు...సభలో కలకలం  మొగిలి కూడా వనికే చేతులతో ఆ కాయిదం తీసుకున్నాడు.. నిప్పులాగా కాయిదాన్ని పట్టుకొని చూశాడు.. చెంపలకు రాసుకున్నాడు.... పునికాడు ..జేబుల పెట్టుకున్నడు. కనిపిస్తున్నదేమొనని జేబుకేసి చూసుకున్నడు...

            మీటింగు చివరన నిలబడిన వాడెవడో చూపుడు వేలు చూయించి... ‘‘అర్జయ్యను చంపిచ్చింది నువ్వే. మళ్ల సాకునాలు మాట్లాడ్తన్నవా?’’ అన్నాడు...

            ‘‘ అర్జయ్య హత్యమీద విచారణ జరిపించాలె ’’ పిలగాడు మొత్తుకున్నాడు.

            మందిలో నుంచి కొంత మంది లేచొచ్చి అతని నోరు మూసి అవతలికి ఎత్తుక పోయారు...

            రాఘవులు మాట్లాడుతూనే ఉన్నాడు..నరేందర్‍ తదితర మొఖద్దమ్‍లు మందిలో చెదిరిపోయి కూర్చుండి అప్పుడప్పుడు చప్పట్లు కొడుతూనే ఉన్నారు...కార్మికులందరిని గద్ద చూపులతో గమనిస్తున్నారు.

            మీటంగయి పోయింది... కార్మికులు చెదిరిపోయారు. రాత్రి పది గంటలు దాటింది - మొగిలి తనకు తెలిసిన ముఖంకోసం వెతుకుతూ రోడ్డుమీద నడుస్తున్నాడు. దుకాన్లు మూస్తున్నారు...

            మూలమీది టేల దగ్గరికొచ్చాడు - నల్లవాడు కూర్చున్నాడు. ఇతని కిద్దామా అనుకున్నాడు..‘‘నమ్మవశంగాదు’’ అనుకొని గుడిసెల్ల బడి నడిచాడు.. ఎంబడోల్ల ఇల్లచ్చింది.. వాకిట్లకు బోయి తొంగి చూశాడు.. ఎంబడోల్ల పిలగాడు ఏదో చదువుకుంటున్నాడు.. ఇంట్ల ఎవరున్నట్టులేదు..

            ‘‘ఏందే మొగిలన్న గింత నాత్రచ్చినవ్‍. మల్లా ఉత్తరమొచ్చిందా?’’ పిలగాడు...

            మొగిలి చప్పున కైనీడనుంచి పిలగాని దగ్గరికి నడిచి జేబులో నుంచి కరపత్రం తీసిచ్చిండు...

            ‘‘ఓ గిదా?’’ అన్నాడు పిల్లవాడు తనకు ముందే తెలుసునన్నట్టుగా...

            ‘‘ప్రియమైన కార్మికులారా!

            ఈ రోజు లారీ లోడింగ్‍ పనిచేసే అర్జయ్య అనే కార్మికుడు  రైలు పట్లాలదగ్గర చనిపోయిన సంగతి బస్తీ అంతా మసులుతోంది... అర్జయ్య పట్టాల దగ్గర చూసిన వారెవ్వరు ఇది ఆత్మహత్య అని నమ్మరు... ఎందుకంటే పట్టాల దగ్గర నెత్తురు చుక్కైనా లేదు.. అర్జయ్య ఒంట్లో నెత్తురు లేదా? అది ఎవరుతాగినట్టు? దొరా! దొర మొఖద్దమ్‍లా? కంపినా?

            అర్జయ్య  లోడింగ్‍ కార్మికులను గిట్టుబాటు కూలి యివ్వాలని సంఘటిత పరిచాడు.. ఒక ట్రక్కు నింపినందుకు ట్రక్కుకు రెండు  వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. అందులో  వాస్తవంగా ఆ రెండు వందల రూపాయలు  చెందాల్సిన లోడర్సుకు ఎనుభై రూపాయలు మాత్రమేయిచ్చి మిగతా దానిలో ఇరువై రూపాయలు మొఖద్దమ్‍లు తీసుకుంటున్నారు. దొర లారీకి వంద తీసుకుంటున్నాడు.   ఈ విధంగా రోజుకు సరాసరిగా నలుబై లారీలకన్నా ఎక్కువే లోడింగు చేస్తారు. ఎంతలేదన్న దొర ఆదాయం రోజుకు వేల రూపాయలు.  ఇందులో అందరు అధికారులకు వాటాలున్నాయి. ఈ ఆదాయం నికరంగా రావాలంటే అర్జయ్యలుండొద్దు....

            దొర పోలీసు అధికార్లకు డబ్బు పడేసి ఇది ఆత్మహత్యగా రిపోర్టు రాయించారు...

            కనుక ఈ హత్యమీద విచారణ జరిపించాలనీ, దోషులను శిక్షించాలనీ - అలా చేయని పక్షంలో ప్రజలే ప్రజాశత్రువులను శిక్షించగలరని ఇందు మూలకంగా హెచ్చరిస్తూన్నాం...’’

            మొగిలి ముఖంలో నెత్తురు చుక్క లేదు...మొదట కాళ్లల్లో వనుకు - ఆ తర్వాత ఒంట్లో ఎక్కడో సల్లగా జరజర పాకినట్టు...

            ‘‘ఎవలు తమ్మీగిది రాసింది...’’ అన్నాడు  వనికే కంఠంతో...

            ‘‘రాడికల్స్’’ అని చదివాడు ఎంబడోల్ల పిల్లవాడు...

            ‘‘గాల్లదేమన్న యూనియనా? ఏడుంటరు?’’ అన్నాడు మొగిలి...

            ‘‘నీకే తెలువాలె.. గిది నీకెవలిచ్చిండ్లు?’’అన్నాడు ఎంబడోల్ల పిలగాడు బయటకు చూస్తూ...

            మొగిలి బయటకొచ్చి నిలుచున్నాడు...

            ఆకాశం తేటగున్నది.. చుక్కలు బిక్కుబిక్కుమంటూ ఇంకా వందగజాలు నడిస్తే ఇల్లు... నడుస్తున్నాడు.. ఆ సందు.. దూరంగా చీకట్లో ఉరేసుకొని సచ్చిన కాసిం గుడిసె దయ్యంలాగా...

            తలవంచుకొని తను గుడిసెకేసి తిరిగాడు...

 

                                                                25

 

            మొగిలి ఖాళీ టిపిన్‍ ఊపుకుంటూ నడుస్తున్నాడు.. ఇయ్యల్ల లారీలన్ని నాలుగ్గంటలకే లోడింగయి పోయినయ్‍. ఒకటి అరా వస్తదేమొనని ఆరింటి దాకా చూసి మరింక రావని - వచ్చినా తెల్లారే లోడ్‍ చేద్దామని లోడర్లు ఆనాటికి పని చాలించారు...

            ‘‘ఓ మొగిలన్న నేను సుత అత్తనుండు’’ అన్నాడు వెనుకనే ఈడ్చుకుంట వచ్చే వెంకులు..

            రోడ్డు సందడిగా కలకలలాడుతోంది... రోడ్డు కిరు పక్కల కొత్త దుకాండ్లు వెలిసినయ్‍...నార సంచుల మీద కూర్చున్న బేరగాళ్లు వచ్చిపోయే కార్మికులను పిలుస్తూ... ‘‘ఓ అన్న ఇగరా!.. మాల్‍ చూసి పో.. అగ్గువ...’’ అరుస్తున్నారు..

            కొందరు డ్యూటీలు దిగిన కార్మికులు బొక్క టోపీలు నెత్తులమీద బోర్లించుకొని ముచ్చట్లు బెట్టుకుంటూ బలవంతపు నవ్వులు నవ్వుతూ నడుస్తున్నారు. మరికొందరు తెల్లటి ధోతులు  కట్టుకొని పిలగండ్ల నెత్తుకొని పెండ్లాల వెంట బెట్టుకొని బేరాలు చేస్తున్నారు...పాతబట్టల వాళ్లు, కొత్త బట్టలవాళ్లు, పండ్లవాళ్లు, సోడాలవాళ్లు, కండ్లద్దాల వాళ్లు, పౌడరు డబ్బీల వాళ్లు, పూసలవాళ్లు, కప్పుసాసర్లవాళ్లు, బనీన్లమ్మేవాళ్లు, ఇట్లా ఎటుచూసిన కండ్లు తిరిగేపోయేటట్టు రోడ్డంతా మెరిసిపోతోంది - జనం కాళ్ల దుమ్ము, బొగ్గు పొయ్యిల పొగ కలిసి అలలుగా లేస్తోంది...

            బేరగాళ్లు అరుపులు, జనం అంతుపొంతులేని మాటలు, స్కూటర్లు బరబర, ట్రక్కుల డబడిబ,సైకిలు గంటలు, సినిమా టాకీసు రికార్డులు - జనం మాటలు గోలీసోడా, కీసుకీసులు -  అన్నీ కలిసి గందర గోళంగా ఉన్నది.

            వెంకులొచ్చి ఓరగా చిత్రంగా వచ్చిపోయే జనాన్ని చూస్తూ నిలుచున్న మొగిలిని జబ్బపట్టి ‘‘దా పోదాం ఏం సూత్తన్నవ్‍ - ఇయ్యల్ల  బొగ్గు బాయిల దిగేటోల్ల జీతాలరోజు - గీ ఒక్కరోజె మనోల్లు నవ్వేది...ఇంటన్నవా? ఇయ్యల్ల సూస్కో, కల్లు సారా దుకానంబ్రాండిషాపులు బరుపూర్‍ - రేపొద్దున సూస్కుంటే పిల్లి బట్టిన కోళ్లయితరు’’ వెంకులు....

            ఇద్దరు నడుస్తున్నారు.. నడిరోడ్డు మీద ఒక తల నెరిసిన కార్మికడు బొక్కటోపి వెల్లకిలా పట్టుకొని అందులో నోట్లను కుడి చేత అదిమి పట్టుకొని ...‘‘ పోతన్నయి. లేసి పోతన్నయ్‍ - జెరంత పట్టుకోండ్లి’’ అనుకుంట ఏడుస్తున్నాడు...

            ‘‘గు...వలుగ తాగిండు లమ్డికొడుకు’’ ఎవడో జబర్దస్తీగా రూపాయి నోట్లు తెల్ల వెంట్రుకల వాని జేబుల కుక్కి...

            ‘‘డోకిలికే నడువ్‍..’’ అని గళ్ల బట్టి దొబ్బిండు...

            ‘‘నీకేందిర...నీయవ్వ’’ తెల్లవెంట్రుకల వాడు సొలుగుతూ తిట్టుకుంటూ వెళ్లిపోయాడు...

            మొగిలి మందిలో నడుస్తున్నాడు. ఉల్లిపొర చీరల వాళ్లు కులాసగా నవ్వుతూ రాక్కుంటనే పోతున్నారు. గోసులు బెట్టుకున్న ముద్ద సికలవాళ్లు బెదురు బెదురుగా ఓరోరగా నడుస్తున్నారు... ఆడోల్లను తాకడానికి కొందరు జులాయి వాళ్లు  అంగీల మీదిగుండి తీసి, చాతి విరుచుకుంటూ మందిలో నడుస్తున్నారు...

            ‘‘పక్కకు జరుగు...’’ వెంకులు మొగిలిని బయటకు లాగాడు...

            మందంతా దూరం తొలిగిండ్లు...ఒకడు చింత నిప్పుల్లాంటి ఎర్ర కళ్లున్నవాడు - చెవుల మీదికంటా వెంట్రుకలు పెంచి మందిలో నుంచి కనబడ్డాడు...

            ‘‘సారలిగాని గ్యాంగు’’ అన్నాడు వెంకులు.

            సారలిగాడనే గుండా వెనుక ఇంకా అయిదారుగురున్నారు. వాళ్లు అప్పటికే తాగున్నారు.   వాళ్లల్లో కొందరు రోడ్డు పక్క దుకాన్ల వాళ్ల దగ్గరిపోయి ఏదో మాట్లాడుతున్నారు - వాళ్లు సలాంలు బెడుతూ నోట్లు తీసియిస్తున్నారు.

            ‘‘దొర గుండగాళ్లు మామూల్లసూల్లు జేసుకుంటండ్లు..’’వెంకులు...

            వెనుకకు వెనుకకు చూస్తూ ఇద్దరు ముందుకు నడిచారు...నాలుగడుగులు వేశారో లేదో- కెవ్వున కేక విన్పించింది... గాలి దుమారం లేచినట్టు - సాయంత్రం పూట చింతమీద జేరిన గొర్రెంకల మందలోనికి పోరడు రాయిసిరినట్టు గొర్రె మందమీద తోడేలు బడ్డట్టు - లొల్లి...తొక్కుకుంట - గెబ్బడ గెబ్బడ ఉరుకులు పరుగులు... అంతా మూడు నిమిషాలే...

            ఉరుకులాగినయ్‍..లొల్లాగింది...టర్నింగ్‍దగ్గర... జనం కుప్పకూడిండ్లు - మొగిలి వెంకులు వెనుదిరిగి మంది మూగిన దగ్గరికొచ్చేసరికి - నడిమందలో...ఒక తెల్లటి దోతివాడు...‘‘అయ్యలారా! నా పెండ్లాన్ని గుంజుక పోయిండ్లు... ఆ లం...కొడుకు లెత్తుక పోయిండ్లు...’’ అరుస్తూ ఏడుస్తూ పిచ్చిలేచిన వానిలాగా మట్టిగీరుతూ ఉరుకులు పరుగులు పెడుతున్నాడు..

            మందిలో చప్పుడు లేదు. సారలిగ్యాంగు లేదు. మందికి అటువేపు ఇటువేపు లారీలాగినయ్‍...హారన్లు మోగుతున్నాయి...

            అయిదు నిమిషాలకు అమీన్  సాబ్  జీబులో పోలీసులొచ్చిండ్లు...ఏడిచే వాన్ని వెంట బెట్టుకొని ‘‘మాకానికాలో యహాంసే’’ అని కర్రలతోని జనాన్ని చెదరగొట్టిండ్లు..

            జనం చెదిరిపోయిండ్లు...దుకాన్ల వాళ్లు ‘‘అచ్ఛామాల్‍ హరేక్‍మాల్‍...మాల్‍దేఖనా?’’ అరుపులు...సోడాసీసాల కీసుకీసు సప్పుడు.

            వెంకులు మొగిలి చెయ్యిపట్టి గుంజిండు....పక్కకు తీస్కపోయిండు.

            మౌనంగా కొంత దూరం నడిచిండ్లు...‘‘వాళ్ల కొరితి కెయ్యాలె’’ అన్నాడు మొగిలి హఠాత్తుగా - వెంకులు ఆగిండు - అప్పుడు కరంటు బుగ్గ వెలుగు కింద మొగిలి మొఖం చూసిండు... కండ్లల్లో నీళ్లు...

            జవాబు చెప్పకుండా మరికొంత దూరం నడిచిన తరువాత రోడ్డు దిగిండ్లు - ‘‘గిదిక్కడ మామూలే...మొగిలీ.. గీడ ఏడ్వదలుచుకుంటె పుట్టెడు దు:ఖం  ఇంటన్నవా? గీడ గ గుండగాళ్లది, దొరలది, లుచ్చెలది, లఫంగులది రాజ్జెం.. ఆడెవడో దిక్కు మల్లోడు ఇయ్యల్ల పెండ్లాన్ని పోగొట్టుకున్నడు ఈన్ని ఠానాల తెల్లందాకుంచుతారు... వాళ్లు ఆ అక్కను రాత్రంతా సెరిచి రేపొద్దున ఇడిసి పెడ్తరు... మానవంతురాలైతే రేపొద్దున ఏ రైలుకట్టకాన్నో ఆమె శవం దొరుకుతది...లాపోతే గంతే...’’

            ‘‘పోలీసోల్లు పట్టుకోరా?’’

            ‘‘మల్ల రేపొద్దున ఆళ్లు గట్లనే గళ్లలెక్కిచ్చి తిరుగుతరు...కొత్తోడు గిన అమీను గాడత్తె పట్టుకుంటె దొరపోను జేసి ఇడిపిత్తడు...’’

            ‘‘అయితే పోలీసోల్లు ఇడువకుంటే..?’’

            ‘‘మళ్ల పని గంతే... నూటికి శెలుగ  తాబదలా చేస్తరు. లేకుంటె ఆనింటి మీన గుండాగాళ్లు బడ్తరు.. ఎవనికైనా పెండ్లాం పిల్లలుంటరు గదా! మొండెగాని తోని పెట్టుకునేటోడు మొండెగాడె గావాలే... ఈడికచ్చే అమీను గాళ్లంతా దొరకు దెలిసినోల్లె అత్తరు...’’

            ‘‘మరి గిదీని కుదరు లేదా?’’

            ‘‘దేనికున్నదని...మనోని అర్జయ్య గతేమైందో ఎరికేగదా! ఇబ్రహీంగాడు ఎన్నిమాటలు చెప్పిండు...నేను అర్జయ్యతోని ఇబ్రహీంను కలిసిన.

            ఉస్కో అన్నడు. దంగల్ల దిగినంక వాడు సెంగో బిళ్ల...అర్జన్న దొరికిపేండు.’’

            మొగిలి మాట్లాడలేదు...

            ‘‘గిది ఎప్పటినుంచి జరుగుతందో నాకు తెలువది కని నేనచ్చిన కాన్నుంచి గిసొంటియి సూత్తనే ఉన్న - ఆరం కింద అనుమాన్‍ బస్తిల మొగడు నాత్రి బజిలికి బోయినంక ఇంటిమీద బడి నోట్లె గుడ్డలు గుక్కి చెరిచిండ్లు...గీ గుండాగాళ్లే. గంతేనా? కల్లు, సారా, బ్రాండి తాగేటోడు మొదటి సీసా వీళ్లకు తీసిపెట్టాలి. పొద్దందాక తాక్కుంట తిరుగుతరు ఊరిమీద పడి. ఈడ గుడిసెలోల్లకు పాయకాన్లు లేవు.  ఆడోల్లంత పదిమంది గూడి చెట్లల్లకు పోయేటోల్లు.  సారలిగాడు మొదట లారీ లోడింగుల చేసేటోడు. ముఖద్దమ్  అయ్యిండు.  దొంగతనాలు చేసేటోడు.  ఓపారి జైలుకు పోయచ్చిండు.  మల్లచ్చినంక ఆనసంటోళ్లను పదిమందిని కుప్పేసుకొని ఆడోళ్లను చిడాయించుడు బెట్టిండు.  ఆడోళ్లు ఊకుంటరా? చెట్లల్లేసి దవడలు సదిరిండ్లు.  వీని గ్యాంగును దొర మల్ల దగ్గరికి దీసిండు.  దొర గసోంటోడే గదా!  ఇంకా ఎక్కువయ్యిండ్లు... బస్తీల పొంట తిరుగుడు ఆడోళ్లను గుంజుడు...తన్నులు దినుడు...ఎమర్జెన్సో గంగరాయో - గప్పుడు ఎదురులేకుంటయ్యిండ్లు.  సక్కగున్న అక్క బస్తీ దొరకబట్టి ఇంటికే పోయి ఖరాబు చేసేటోల్లు.  గిప్పుడు బజార్లోనే చేత్తండ్లు.  బస్తీలన్ని వనుకుతున్నాయి’’.

            ‘‘వానవ్వల గొడ్డలందుకొని రొండుగ నరుకుతే...’’

            ‘‘గదిజేత్తె మంచిగనే ఉండుగని ఎవడు జెయ్యాలె...? నువ్వు జేత్తవా?’’

            మొగిలి నక్కిల్లు దగ్గర బడ్డయి....

            ‘‘నిరుడు శంకర్రెడ్డని అమీన్‍ సాబచ్చిండు - పదిహేనొద్దుల దాకా ఉచ్చ దీటై మండింది...రాములవారి గుడి కాడ గిట్లనే పిట్టరు భార్య నెత్తుకపోతే - సారలిగాని గ్యాంగును ఠానాలేసి కొట్టిండట - కేసు బెట్టిండట - బేల్‍ దెచ్చుకున్నరు -ఆనాటి నాత్రే శంకర్రెడ్డి ఇంటి మీద బడి అమీన్‍ సాబు ముంగట్నె పెండ్లాన్ని ఆగమాగం జేసిండ్లు - ఆఖరుకు బిల్‍ పత్త లేకుంట బోయిండు...’’

            గుడిసెల్లకు బోయే అడ్డ తోవొచ్చింది. వెంకులు వెళ్లిపోయాడు -మొగిలి గుడిసె చేరేసరికి - లక్ష్మి బిక్కుబిక్కు మంటూ కూర్చున్నది... మొగిలి ముఖం చూసి లక్ష్మి బిత్తర పోయింది....

            ‘‘ఏంది మరిదీ గట్లున్నవ్‍...’’

            వనికే గొంతుతో జరిగింది చెప్పిండు...

            ‘‘బాయిలింట్ల పీన్గెల్ల ఆడిది బజార్ల దిరుగ వశమా? మొగ పుటుక బుట్టిండ్లు - గొంతికెలకచ్చె దాక తాగుడు పెండ్లాల గొట్టుడుగని - ఆళ్ల నాము నరుక నడిబజాట్ల దొరికిచ్చుకొని ఏ గాడ్ది  కొడుకన్నా పలుగజీరిండా?’’

            ‘‘అన్నింక రాలేదా?’’

            ‘‘ఇయ్యల్ల అన్న సత్తడో! అత్తడో! ఎవలకెరుక? దుబ్బల పడిపోయిండో - జీతాలు గద - ఎన్నో బ్రాండి షాపుల            కూకుండి -  తనసొంటి తాగుబోతుల కుప్పేసుకొని తాగుతండు గావచ్చు మొగిలీ!  నువ్వు సూత్తలేవా? ఈ బతుకు బతికే బదులు ఏ కయికిలి జేసుకొని బతికినా మేలు...’’ లక్ష్మి ముక్కు చీదింది...

            మొగిలి తలపట్టుకొని మంచంలో కూర్చున్నాడు...

            ‘‘నువ్వుతిని పందువురా? నాకు ఎప్పటి బాగోతమేనాయె...’’అన్నది...

            ‘‘నా కాకలయితలేదు...’’ మొగిలి పండుకున్నాడు...

            ‘‘బజార్ల ఏమన్న తిన్నవాతానం జేసి పండుకోరాదు... పెయ్యంత బొగ్గుగుడుతలేదా?’’

            ఆ మాట మొగిలి వినిపించుకోనేలేదు... లంచం యిచ్చిన మూడు వేల రూపాయలు - పెరడి గిర్వి - ఆడపిల్ల కేక...మొగిలి కిదంతా ఏమిటో అర్ధంకాలేదు....

            ఇంటెనుకకు పోయి సల్లటి నీళ్లు మీద కుమ్మరించుకున్నాడు.  పెయ్యంత పేరుకపోయిన బొగ్గుదుమ్ము. లోపల ఇడవారుతోంది...

 

                                                               26

 

            మార్చి నెలలో ఎండలు మండుతున్నాయి.  మండే ఎండల్లో లోడర్సు బొగ్గు లారీలు నింపుతూనే ఉన్నారు... చిటపొట లాడే ఎండలోపొగలు కక్కే ఎండలోబొగ్గు నెరుసులు చెమటతో కలిసి ఒళ్లంతా కంపరంగా ఉండగా లోడర్సు గొనుగుతాండ్లు ... వచ్చే డబ్బు సరిపోక ఇంటిదగ్గరి అశాంతి పనిమీద చూపెడుతారు..వాళ్లల్లో వాళ్లే తిట్టుకుంటారు. కసురుకుంటారు... ఊరు పేరు లేకుండా ఎవన్నో తిడుతారు...అప్పుడప్పుడు మరింక భరించలేక అర్జయ్య లాంటివాడు బయట పడతాడు...కల్లు సీసాకో మరిదేనికో ఆశించే ఏజెంట్లు, లోడర్ల లోనే ఉంటారు ... వార్తలు పొక్కుతాయి..అర్జయ్యలను గుంబనంగా చంపుతారు. మళ్లీ మామూలే...

            అలా మరో ఇరువై రోజులు గడిచిపోయాయి...మరో నలుగురు కార్మికులు తొలిగించ బడ్డారు... నలుగురు కొత్తవాళ్లు వచ్చారు...

            మిట్ట మద్యాహ్నం- బొగ్గు కుప్పకెగబడి బొగ్గుల్లాంటి కార్మికులు పని చేస్తున్నారు...రాయలింగు బొగ్గెత్తుతున్నాడు...కుప్పకింద భాగమంతా అయిపోయింది...మీది భాగం ఉన్నది...చిరాకుగా, కోపంగా సెమ్మాసు బొగ్గు కుప్పకు కుచ్చిండు   రాయలింగం - గలగల కుప్ప కూలింది...కుప్ప శిఖరంమీద పెళ్లలు దొర్లుతూ వచ్చి రాయలింగు కాళ్ల మీద పడ్డాయి.. అందరికి పాత బూట్లున్నాయి...ఎట్లాగో అట్లాగ బాయి కార్మికుల దగ్గర కొనుక్కున్న బాపతువే - రాయలింగు బూట్ల జత చిరిగి కొత్త జత బూట్లు దొరుకక బరికాళ్లతోనచ్చాడు...

            ‘‘అన్నన్న సత్తి’’ కూలబడి పోయిండు...

            నేలంతా నెత్తురే.. వేళ్లు కత్తిరించినట్టుగా అయిపోయాయి...ఎక్కడిపనక్కడ విడిచి కార్మికులంతా రాయలింగు చుట్టు మూగిండ్లు...

            ‘‘ఆనవ్వల..రోజుకు వేలకు వేలు దెం...వట్టిరి గాని మనకు బూట్లనేరా?’’ పానునగంటి పోచం అరిచిండు.

            ‘‘నా కొడుక్కు మంచిపనైంది...సాడుగొట్టు లమ్డికొడుకు గాదు - సావు..మేము గీడ ఏదన్న అనుకోను భయం - కొంటబొయి  దొర సెవులేత్తివి...నీకే గొంతికెలదాకా పెడుతడుండు...’’ అన్నాడింకొకడు....

            ‘‘నూతిల బడ్డోనిమీద నూర్రాళ్లన్నట్టు గిప్పుడు గవేందిరా?’’ చెంద్రమొగిలి...

            బొగ్గులోనుంచి రాయలింగును బయటకు తీశారు.  రక్తం కారిపోతోంది... ‘‘అయ్యయ్యో నెత్తురు పోతంది. గేరత్తది.  ఏదన్న కటు్ట కట్టండెహె ’’ యాకూబ్‍...

            ఎవడో ‘‘బొగ్గు పొడి దంచి పోయాల’’న్నాడు. 

            ‘‘అద్దద్దు గూడుకడ్తది..  గింతంత అయిడన్న లేకపాయె’’ నారాయణ.

            మొగిలి సర్రున చుట్టబట్ట చీరి రాయలింగు కాలుకు కట్టు గట్టిండు.  గుడ్డంతా రక్తంతో తడిసిపోయింది...

            ‘‘సత్తనే.... నేను బతుకనే...’’ రాయలింగు మూలుగుతుండు...

            ‘‘ఏం జూత్తర్రా- ఓ యిద్దరు సైకిలు మీద దవాఖానకు దీసుకుపోండ్లి...’’ చంద్రమొగిలి.

            కార్మికులు ఒకల మొఖాలొకరు చూసుకున్నారు...  ఎవల గ్యాంగుల  నుంచి పోవాలెచంద్రమొగిలి గ్యాంగులనుంచి  మొగిలి పోతనన్నడు.  కాని మొగిలికి సైకిలు తొక్కరాదు. 

            ‘‘రాయలింగని గ్యాంగోల్లే పోవాల’’న్నరు.

            ఆఖరుకు నర్సయ్య అనేవాడు తను తీసుకుపోత నన్నాడు.  అప్పుడు డబ్బుల సమస్య వొచ్చింది.  అందరి జేబులు వెతికితే పదిహేను రూపాయలు జమైనాయి.. నర్సయ్య, మొగిలి కలిసి రాయలింగును కంపినీ దవాఖానకు తీసుకుపోయారు.

            రాయలింగును తీసుకు పోయినంక మళ్ళీ పని సాగేసరికి పొద్దంగింది.

            వెంకులు మనసులో అనేక విచారాలు....

            సాయంత్రమైంది... మొగిలి, నర్సయ్య రాయలింగుకు కట్టుకట్టించి ఇంటి దగ్గర విడిచి వచ్చారు.  పనైపోయింది.

            లోడర్లు ఇండ్ల ముఖం పట్టారు.  రోడ్డు కవతల నీలగిరి చెట్లు పెండెలు పెండులుగా అప్పుడే పెరుగుతున్నాయి.  వెంకులుకు మొగిలికి దోస్తాని ఏర్పడ్డది.

            ‘‘యాపలకాన్నుంచి పోదామా?’’ అన్నాడు మొగిలి.  చాలామంది అటుకేసి నడుస్తున్నారు.

            ‘‘మనం బొయ్యేం చేస్తం- తాగేటోళ్ళు బోతరు...  నిజంగా ఆళ్లే అదృష్టవంతులు.. సౌ, దోసౌ యేసుకున్నరంటే లెల్లె పాటలు పాడుకుంట కుక్కలు మలుసుక పన్నట్టు పంటరు.  మొగిలి నా మొఖంలకు సూడు- నాకేది తెలిసి సావదు.  కని తెల్లందాక నిదుర బట్టది. తన్నంగతన్నంగ  గీడచ్చి పడ్డ.  మా వూల్లె మా అవ్వ ఒక్కతే ఉంటది.  మా అయ్య సచ్చినపుడు రెండెకరాల సేనుండె.  గద్దలు తన్నుక పోయినయి.  పోనీ మా అవ్వను గీడికి తీసుకద్దామంటే - నేను గీ మట్టిలనే పోతానంటది.  ఇంటికేమన్న పంపుదమంటే గీడ గీ బాగోతం...’’ వెంకులు నడుస్తున్నాడు.

            మొగిలికి చాలా చెప్పాలని ఉన్నది.  కాని మాట పెకలది.

            దూరంగా కొండలు కనిపిస్తున్నయి మసక మసకగా. ఆ కొండల కింద ఏవేవో పల్లెటూళ్లు...ఎత్తు వంపులున్న కాలి బాట మీద  నడుస్తున్నారు..  కొంత దూరం నడిచి సట్టున ఆగిపోయిండు వెంకులు.

            ఎడమ బాజుల నలుగురైదుగురు మనషులు తిరుగుతున్నారు.  అది పోగూడని డీ ఫిల్లరింగ్  జరిగిన  జాగా.  సుట్టూ ముళ్ల తీగ దడి - ఆ పక్కనే గుదిగుచ్చినట్టు గుడిసెలు.  ఆ జాగా డీ ఫిల్లరింగ్‍ జరిగి లోపటికి కూలిపోయింది.

            ‘‘ఏంది గాడ మనుషులు తిరుగుతాండ్లు?’’ మొగిలి.

            ‘‘ఎవల్లో ఏదో ప్లాన్‍  చేత్తాండ్లు.  గుడిసెలు గిన ఏసు కుంటరేమో?’’

            ‘‘నీకు సంత గుడిసున్నదా?’’

            ‘‘నాకు సంతగడిసా? కిరాయికున్న.  మరి నీకో?’’

            ‘‘నేనా మా సుట్టాలింటి దగ్గరుంటన్న...’’

            ‘‘మనం సుత ఏసుకుంటే బాగానే ఉండుగని- గుడిసంటే మాటలా? బొంగులు గావాలె.  తడుకలు గావాలె.  ఎంత లేదన్న ఇన్నూరు రూపాలు గావాలె’’ మొగిలి.

            ‘‘ఇన్నూరే గదా?’’

            ‘‘ఆడ ప్రమాదమంటరు.  కంపినోడచ్చి పీకేత్తడు..’’

            ‘‘అదే ఎందుకు, మరి జాగెక్కడున్నదిగుడిసెలు సూడు ఓటి మీదోటి ఎట్లున్నయోఓ గుడిసెల పన్నోని మొస ఇంకోని కినచ్చేటట్టు...’’

            ‘‘నీ తల్లి ఏ గులడిసెల ఎవడు సచ్చేది దెల్వది.  కంపినోడు కంపిన్ల పని చేసేటోనికి ఇల్లియ్యడు.   పెద్ద నౌకరి దొరలకేమో బంగుళాలు.  పోనీ కిరాయికో ఎట్లనో సత్తా మంటే ఇండ్లు లెవ్వు.  అంత కంపిని జాగేనాయె.  ఇల్లెవని కున్నది...?’’

            ‘‘మల్ల గట్లయితే సందున్నకాడ కట్టు కోకుంట ఏం జేత్తరు?’’

            ఇద్దరు అట్లా మాట్లాడుకుంటూ గుడిసెల్లో చొచ్చారు.  ఓ గుడిసె బయట పాత తట్టలు గట్టిన చిన్న జాగాలో ఒకామె స్నానం చేస్తోంది.  సాటేమి లేదు.  గుడిసెలు మోకా లెత్తులేవు.  బూడిద కుప్పలు చెత్తా చెదారం రోడ్లనిండా.  ఆ చెత్తలోనే  ఆ మసిలోనే పిల్లలు ఆడుకుంటున్నారు. 

            రైల్వేలైను దగ్గర నుండి బొగ్గు దొంగతనం చేసుకొచ్చే పోరగాండ్లు వెనకకు చూసుకుంట గుడిసెల కేసి నడుస్తున్నారు. 

            గుడిసెల్లో ఒకటే సందడి... ఎక్కడో ఏడుపు.  ఎక్కడో తిట్లు.  ఎక్కడో తాగుబోతు బూతుపాట.  కండ్లు కన్పించకుండా పొగ.  కమురు వాసన .. గుడిసెల ఆవల గాడుపు దుమారం పుట్టినట్టున్నది. కేకలు... గుడిసెల మీద కప్పిన అట్టముక్కలు ఎగురుతున్నాయి.  బూడిద దుమ్ము కప్పేసింది.

            వెంకులు, మొగిలి కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యారు.  ఎటూతోచక హోటల్‍ గుడిసెలో చొచ్చి నిలుచున్నారు.

            గాడుపు దుమారం హెచ్చింది.  గుడిసెల్లో కేకలు హెచ్చాయి.

 

                                                           27

 

            పిండార బోసినట్లుగా వెన్నెల. సాయంత్రం రేగిన గాలి దుమారం ఆగిపోయి గాలి బిగుసుక పోయింది.  ఉక్కపోత .. మొగిలి గుడిసె బయట వెల్లకిలా పండుకున్నాడు .   అతనికి బాయిల పని యాదికొచ్చింది.  ‘‘దొరుకుద్దో దొరుకదో.  రోజు పొద్దున లేత్తేనే లోడింగు పనికి బోవుడైతంది.  లీడర్లకు మల్లొక్కపారి కలువకపోతి.  ఏదన్న కాకపాయె.  ఈల్ల ఇంటి మీన బడి తిన బడితి.  ఎన్ని దినాలుండాలెరాజేశ్వరి యాదికొచ్చింది.  పన్నది గావచ్చు. ఎప్పుడు నౌఖరి దొరుకాలే, ఎప్పుడు తీసుకురావలె. ఏందో గీడికచ్చి తట్టుబడిపోతి.  ఉన్నదో లేందో దున్నుక  బతుకుతే  అయిపోవు... రూపాలు దెచ్చి ఆనికిచ్చి  ఇరుకున బడితి.  ఏ మొఖం బెట్టుకొని ఊళ్లెకు బోవాలె...’’ ఇట్లా మొగిలి ఆలోచనలు సాగుతున్నాయి...

            ‘‘గాలి  కగ్గిదల్గ...గింతన్న లేదు.  ఉబ్బరిచ్చి సత్తన్న’’ లక్ష్మి నిలువెల్లా చెమటకు తడిసి కొంగుతో విసురుకుంటూ బయటికొచ్చింది.

            ‘‘పన్నవా పిలడా?’’

            ‘‘లేదు వదినా..’’ మొగిలి మంచంలో లేచి కూర్చుంటూ.

            ‘‘మా సెల్లె యాదికచ్చిందా?’’ అన్నది లక్ష్మి నవ్వుతూ...

            ఇంతలోనే బాయిల మీదెక్కడో సైరన్‍ కూసింది.

            ‘‘మీ అన్న అచ్చే యాల్లయింది’’ అన్నది లక్ష్మి..

            మొగిలి తలవంచుకొని మంచంల కూర్చున్నాడు.

            ‘‘మొదట్ల మీ అన్న గిట్లనే నిదురబట్టక తండ్లాడెటోడు.  ఏమంట తాగుడలవాటయ్యిందో సచ్చినట్టు పంటడు.’’ లక్ష్మి అని కొంగుతో గాలిసురుకుంటూ కడప క్రింద కూర్చున్నది..

            ‘‘ఏమో అదినా చిక్కుల బడినట్టున్నది.  బాయి పని దొరకక పాయె.  అప్పు తెచ్చి రకం లీడరోనికిత్తిమి..’’ మొగిలి.

            ‘‘మా దొరుకుతది గప్పుడు కండ్లగాన్తవా?’’

            ‘‘గట్ల పరాయిదాని తీర్గ మాట్లాడ్తవ వదినా? తల్లిదండ్రి తీరుగ ఆదుకుంటండ్లు’’.

            ‘‘పరాయి దాన్ని కాదా? అయినా కాకున్న గీడ ఎవల కెవలు లేరు మరిదీ! ఒక తల్లి కడుపున బుట్టిన మా అక్కే! మరి సెల్లె బతికిందా సచ్చిందా అని తొంగన్న సూడదు.  నాకేమొ కాళ్లు సేతులు గట్టేసి గుడిసెల పారేసి నట్టుగున్నది.  తెల్లారి  లేసుడు.  కాకులోలె, గద్దలోలె నీళ్ళకోసం కొట్లాట.  డ్యూటీకి బొయ్యేదాక ఉరుకులు పరుగులు.  పోయినంక గుడిసెల ముక్కుతూ మూల్గుతూ పడుండుడు.  ఏ నాత్రికో మీ అన్నత్తడు.  గప్పగప్ప వాసన.  పెయ్యంత గొగ్గరిత్తది.  పంటే కుక్క తీర్గ పండి లాపోతే మీదబడి గొట్టె.   నా పెయ్యంత కాయగాసింది మరిదీ....’’ లక్ష్మి కంఠం వనికింది.

 

            ఆ ముచ్చట తప్పించాలని మొగిలి చిన్ననాటి సంగతు లెత్తుకున్నాడు.  ‘‘ఆ దినాలే బాగుండె కాదదినామనం ఆడిందాట పాడింది పాట. గిప్పటి పోరగాండ్లకు పాపం తీరికే లేదు.  ముడ్డికి పేగులేనోడు సుత ఏదో పనిజేయవట్టె.  మనం ఎన్నాటలాడేది?’’

            ‘‘ ఔ మరిదీ, నువ్వు గింతుండేది.  సీమిడిని ఎగపీల్చుకుంట మా యింట్ల తిర్గెటోనివి.  రాయేశ్వరి ఎట్ల మెచ్చిందిబ్బా!’’ అన్నది లక్ష్మి నవ్వుతూ.

            అట్లా చాలా సంగతులు మాట్లాడుకున్నారు.  లక్ష్మి పడిపడి నవ్వుతోంది.  ఎన్నో సంవత్సరాల నుంచి నవ్వుమొఖం ఎరుగనిదానిలా... ఆమె పైట ఒళ్లోకి జారిపోయింది.  చెమట కోసం జాకెట్టు హుక్కు  ఊడ దీసుకుందేమో వెన్నెల వెలుగులో ఛాతీ కన్పిస్తోంది.  మొగిలి ఇదేమి కనిపించకుండా చేతులు తిప్పుతూ ఏదో చెప్పుతున్నాడు.  సరిగ్గా అలాంటి సమయంలో శంకరయ్య వచ్చిండు.  అలసటగా కోపంగా చిరాకుగా ఇద్దరిని చూసిండు.  అతని ముఖం మరింత నల్లగయ్యింది.

            లక్ష్మి కొంగు సరి చేసుకొని నీల్లకుండ బయటపెట్టింది.   ఒక్క మాటన్నా మాట్లాడకుండా శంకరయ్య స్నానం చేసిండు.

            దీపం పెద్దది చేసి భోజనం పెట్టింది.  శంకరయ్య ముభావంగానే సగం తిని సగం అన్నంలోనే చేయి కడుక్కున్నాడు.

            ‘‘అయ్యయ్యో అట్లా ఉంచుతే ఏమయితది?’’ లక్ష్మి.

            శంకరయ్య దీపం వెలుగులో లక్ష్మి ముఖం చూసిండు.  లక్ష్మి ముఖంలో ఏ భావం లేదు.  కాని చెమటకు నుదుటి కుంకుంబొట్టు చెదిరున్నది..

            మొగిలికి ఇంకా నిదుర పట్టలేదు.

            లక్ష్మి  తను కొంత తిన్నది.  దీపం తగ్గిచ్చింది. శంకరయ్య మంచం పక్క సంచి బొంత పరుచుకొని పండుకున్నది.  శంకరయ్య చాలాసేపు కండ్లు తెరుచుకొనే ఉండి ‘‘అదినె మరిదికి బగ్గనే కుదిరింది’’ అన్నాడు కసిగా.  లక్ష్మి దిగ్గున లేచి భర్త ముఖంలోకి చూసింది.  ఆ కండ్లు తనెన్నడు సూడని కండ్లు.

            ‘‘ఇట్లనన్నా బతుకనియ్యవా? ఊకే ఉరిబెట్టరాదు పీడాబోతది.. నేనే తీసుకొచ్చిన్నా? నువ్వా? ’’ అన్నది.

            మొగిలికి ఈ మాటలు వినబడ్డాయి.  సలి పిడుగు మీద బడ్డట్టు వనికి పోయాడు.

            తన గుండె కొట్టుకోవడం తనకే విన్పిస్తోంది.  బయటెక్కడో కుక్కలు మొరుగుతున్నాయి.

            కాసేసటికి లక్ష్మి వెక్కిల్లు విన్పించాయి.

            ‘‘మరింక ఈడ సింగసానమేసి ఉండరాదు.  నా జాగల నేను ఏదన్నా సూసుకోవాలె’’ అనుకొని కండ్లు మూసుకున్నాడు మొగిలి.

 

                                                             28

 

            తెల్లారింది. ఉక్కిరి బిక్కిరి చేసే బొగ్గు పొగలు మనిషికి మనిషి కన్పియ్యకుంట మావురు గప్పినట్టున్నాయి.  ఆ పొగలనే వసుకూ వసుకూమని దగ్గుతూ ఆ కార్మిక బస్తీ మొత్తం తిట్లతో, అరుపులతో గోలగోలగా ఉంది.  ఉరుకులు పరుగులు మీదున్నది.

            రాత్రెడు నిద్ర బట్టిందో ఈ దగ్గులు, దనుసుడు ముక్కులు మండే పొగలకు కూడా లేవకుండా మొగిలి నిదురపోతున్నాడు.  చెంపల మీద సొల్లు కారంగా అడ్డదిడ్డంగా నులక మంచంలో గుర్రు కొడుతున్నాడు.

            శంకరయ్య ఏమి జరుగనట్టే ‘‘మొగిలి లే లే...పొద్దెక్కింది.  ఇయ్యల్ల డూటీకి బోవా?’’ అని ఊపి లేపిండు. 

            మొగిలి ఉలిక్కిపడి లేచి పక్క దులిపి మడతపెట్టి మంచం ఎత్తి గుడిసె చూరుకింద పెట్టిండు.

            ఆ దారంట నీళ్ల బిందెత్తుకొని వగలు పడుతూ పోతున్న పడుసుపిల్ల మొగిలి కండ్లల్లోకి ‘‘సంగతేందన్నట్టు’’ చూసి ముసి ముసి నవ్వుకుంటపోయింది.

            ‘‘వామ్మో దీని తెలివి తెల్లారి పోను - ఆడోల్లు కాలాంతకులు - ఎన్ని కనుక్కుంటరో?’’ - ఆదరాబాదరగా చెట్లల్లకు పోయచ్చి, పలకర పుల్లతోని పండ్లు తోమేటాల్లకు - ఎన్నడు లేందీ శంకరయ్య చూరుకింద మంచంల తీరిపారి కూసుండి, చాయ తాగుతే ‘‘ ఏమే...లచ్చిమీ మొగిలికి చాయ్‍ తే...’’ అన్నాడు.

            ఇందాకటి పిల్ల ఖాళీ బిందెతోటి పంపుకాడికి పోతూ - ‘‘తొవ్వల కట్టె బెట్టి తొక్కుకుమని - ఇద్దరుపోతులకు పోతులు తొవ్వలుంటెట్ల?’’ అన్నది.

            ‘‘పక్కనుంచి పోరాదు మరదలా? నీకడ్డ మత్తన్నమా?’’

            ‘‘మా పోతతీయ్‍ - బావో ఏందికత! డూటీకి పోవ?’’

            ‘‘ లే - నీకు ఇడెంబెడ్తామని ’’ శంకరయ్య....

            ‘‘మా అక్క ఎడ్డిది గన్క సేసుకున్నది.  ముకం అద్దంల సూసుకున్నవా?’’

            ‘‘నేను సూత్తగదాఎటువంటి మొగన్ని సేసుకుంటవో?’’ లక్ష్మి చాయ్‍ తెచ్చి చూరుకింద మొగని ముఖం పరిశీలనగా చూసింది.  మూమూలుగానైతే - పొద్గాల దానినోట్లే నోరేందుకు బెట్టినవ్‍ - దానికి తిక్కరేగిందంటే నిన్ను నన్ను ఉతికి ఆరేత్తది - అనేది.  గుడిసెలోకి వెళ్లింది.

            మొగిలి నిలబడే చాయ్‍ తాగిండు.  ‘‘ దా - కూసో మొగిలి’’ శంకరయ్య కొంచెం జరిగి చోటిచ్చాడు.  మొగిలి ముండ్ల మీద కూసున్నట్టు మంచంల కూర్చున్నాడు.

            శంకరయ్యకు తనమీద తనకే రోతగా ఉంది.  తాగింది దిగిపోయి మొదడంతా కోళ్లు తవ్విన పెంటలాగున్నది.  తాగినప్పుడే హుషారు, ఈ ఉతారు పొద్దందాకా వెంటాడుతూ ఉంటుంది.  గలీజుగా ఉంటుంది.  మరింక జన్మల తాగద్దనుకుంటరు.  మళ్ల సాయంకాలానికి పుర్రెల తాగుడు పురుగు మెసులుతది.  ఈ గడబిడంతా దూరం గొట్టి శంకరయ్య...‘‘ పేరు పెద్దిరికం చెప్పుల మోతైపోయింది గదా! ఆనవ్వ రాఘవులుగాన్ని నమ్ముకుంటే గీడికచ్చింది -   ఇయ్యల్లబొయ్యి నౌఖరిత్తడా! తీపుకున్న  పైసలలు పారేత్తడా అడిగత్త - అత్తగారూల్లె నల్ల మొకమైపాయె - గ  పైసలు ఎర్రజెండ భాస్కర్‍రావుకు పారేసినా గీ పాటికి పనైపోవు’’ అన్నాడు.

            ‘‘నాకు మంచిగనిపిత్తలేదు - అంత దుమాల్ల మోల్లెగున్నది’’ మొగిలి.

            ‘‘గట్లనే ఉంటది.  నాకిప్పటికీ మాపటేల్లకు సిమ్మం సీకటి కమ్ముకచ్చినట్లని పిత్తది.  గింతమంది గీడుండంగ దిక్కులేనికాడ అడివిల తప్పిపోయినట్టుగుంటది’’

            ‘‘ మీ యింట్ల ఎంతకాలముండాన్నే?’’

            ‘‘మొగిలీ! మేం పరాయోల్లమా? నేనంటే పరాయోన్ని గావచ్చుకని - లక్ష్మి మీ మేన వదినేనాయె.  నాదేమున్నదికర్సంతా  నీది నువ్వే పెట్టుకొనవడ్తివి...  గీడ మనకు మనం దిక్కుగాకపోతే - కోనాయెనేటోడుండడు... మొగిలీ! మన్నుల  మట్టిబెడ్డోలే రాత్రి పగలు  పాలేరుతనం జేసే నన్ను సాంబు సిన్నాయినే నాకు పిల్లను మాట్లాడి పెండ్లి జేసిండు. గాయింత మరుత్తనా?’’ శంకరయ్య.

            ‘‘ఈ మాటలు నిజంగానే అంటున్నడా? మనసులో మరేమన్నా ఉన్నదా?’’ అని మొకం చూసిండు మొగిలి...

 

            ‘‘తాగినప్పుడు - నేనేమన్న అంటే మనుసుల బెట్టుకోకు. రోజు నరాలు తిమ్మిరెక్కుతయి. మొసెల్లది.  గీ బాయిల పనిల సంపాయించే  సొమ్ము  పాపపు సొమ్ము. దక్కది. ఆడిచ్చి నట్టే ఇచ్చి - మళ్లీ గుంజుకోను కండ్లు సెదిరిపోయేటియన్నీ బజాట్ల  బెట్టిండ్లు - బాయిపైసలు బర్కతుండయి.  నా అసొంటోనికి పిల్లికి మెలతాడు తీర్గ - బీసకపోల్లు నూటికొక్కడో ఇద్దరో  పండ్లూటలు బట్టుకొని తినక తాగక సిట్టీలేసి - అడ్డీల కిచ్చి సంపాయిత్తరు. ఆళ్లకు పైస మీద కాయిస్  -   వానవ్వల పైస  బవురూపులది - సంపాయించి నెత్తిన బెట్టుక పోతమా? నా సిన్నతనంల ఆకట సచ్చిన - గిప్పుడు గొడ్డు కట్టం - తింటన్న.. తాగుతన్న - సూద్దాం - పిల్లాజెల్లా ...’’

            మామూలుగానైతే - లక్ష్మి తను ఏదో మాటనేది.  కాని ఆమెకు చెప్పరాని దు:ఖమేదో లోలోపల సుళ్లు తిరుగుతోంది.  మొగవాళ్లు చేసేటీయన్నీ చేసి - మీదికెళ్లి రంకు అంటగట్టి - పెత్తనం జేత్తరు.  మొద్దుబారిపోవాలె - ఈ బస్తీలో ప్రతి మొగోడు తన  భార్యను లంజెఅని తిట్టనోడు లేనేలేడు.  బయట ఏం పనిచేసికాల వడ్తరో - నవ్వుతరో తుళ్లుతరో - కని ఇంటికత్తె మాత్రం పొగసూరే బొగ్గు పెళ్లల్లాగా మొటమొటలాడుతుంటరు.  రాత్రయితే పెండ్లాను గుడిసెల సుట్టు తింపుకుంట కొట్టని మొగోడే లేడు.  ఇదో మాలోకం - ఇదో నరకం....

            లక్ష్మి బిందె తీసుకొని నీళ్ల పంపు కాడికి బయలుదేరింది...

            శంకరయ్యకు రెండో బజిలి - మామూలుగానైతే తయారూ బజారు మీద పడేటోడు. తల దిమ్మెక్కినట్టుగా ఉంది - కాళ్లు బార చాపుకొని కళ్లు మూసుకొని నులక మంచంలో పడుకున్నడు.

            మొగిలి డ్యూటీ బట్టలేసుకొని అప్పటికే తయారుగుంచిన టిఫిన్  తీసుకొని బజాట్ల కచ్చిండు...

            ఇరుకు సందులు - అందులో పందులు - పొద్దటి పూట నీళ్లకోసం ఆడవాళ్ల హడావిడి, అరుపులు - ఇంకా బొగ్గుపొగలు కరిగిపోయి ఎండ బయలెల్లనే లేదు.

            కొంచెం దూరంలో బురద గుంటలో నల్లా దగ్గర గుంపుగా ఆడవాళ్లు దుమదుమలాడే ముఖాలతో ‘‘జరుగు జరుగే - గొడ్డుటావు తీర్గ మీదికత్తన్నవ్‍ ’’ అన్నారెవరో?

            ‘‘దానికేంది ఇద్దరు మొగలు.  ఒకడు ఇంట్లుంటె మరొకడు డూటీలుంటడు’’ నల్లగా పొట్టిగా ఉన్నావిడ...

            లక్ష్మి చేతిలోని బిందె జారిపడ్డది. లక్ష్మి  ఆ బిందెతో ఆమె తల పగులగొడుతుందేమో అనుకున్నాడు.

            మొగిలి ఎవరో తరుముతున్నట్లుగా - తొవ్వలో కంటా పోసిన బొగ్గుపొయ్యిల బూడిద కుప్పలు తన్నుకుంటు తిరిగి చూడకుండా నడుస్తున్నాడు.

            కడుపుల తిప్పుతుంది - ‘‘ఆడోల్లకు నాలిక మీదనే మాటలు ఎందుకో? - పల్లెలగంతే’’ అనుకున్నాడు.

            గుడిసెలు దాటిండు. పెద్ద బజార్లకచ్చే సరికి మొస తిరిగినట్టయ్యింది -  మొదట యాపల కాన్నుంచి పోవాలనుకున్నడు.  ఇంతట్లకే  నిన్న గుడిసె కోసం చూసిన  జాగ మతికచ్చింది. ‘‘చేతుల  నూరునూటయాబయి రూపాయలున్నయి. ఇంటికాన్నుంచి ఇంకోనూరు దెచ్చుకుంటే - సిన్నదో పెద్దదో  గుడిసేసుకుంటే - ఈ కిరికిరి తప్పుద్ది - తన మూలంగా - శంకరన్న, లక్ష్మి వదినెకు కైలాటకాలు’’ అనుకున్నాడు మనసులో...

            నిన్న చూసిన జాగాలో అడ్డదిడ్డంగా - కొయ్యలు తడుకలు గట్టి పన్నెండు గుడిసెలు లేవనే లేసినయ్‍ - గుడిసెలు వెయ్యనే వేసిండ్లు గద’’ - కొంచెం దూరం నడిచేసరికి గుడిసెల ముందు తెల్ల బట్టలోల్లు ఏదో కాకిరి బీకిరి వదురుతండ్లు - వాళ్ల పక్క కాకి  బట్టల కంపినీ వాచ్ మండ్లు సేతుల్ల కట్టెలు బట్టుకొని - గుడిసెల కాడ నిలుసున్నరు - వాళ్ల పక్కనే అయిదుగురు పోలీసోల్లు – అమీన్  సాబ్ నిలబడి ‘‘ఆట్  బూట్ ’’ అని గరంగరంల తిరుగుతండ్లు - వాళ్లకు కొంచెం దూరంల బుల్ డోజర్  డుగ్ డుగ్  మని సప్పుడు చేత్తంది – డ్రైవర్  స్టీరింగు మీద చెయ్యేసుకొని ఉన్నడు.

            గుడిసెల ముందు ఆడమగ కార్మికులు, వాళ్ల భార్యలు, చిన్న పిల్లలు లైనుగా నిటుసుండి చేతులారుస్తూ సాపెనార్దాలు పెడుతున్నారు - ఈ గడబిడకు బిత్తిరి మొఖాలేసుకొని పిల్లలు భీరిపోయి నిలుసున్నరు.

            కార్మికులల్ల నుంచి ఒకాయన పోలీసు అమీన్‍ ముంగటికచ్చి పర్రుమని అంగీ చింపుకొని - నేల మీద మట్టితీసి తూర్పుకేసి విసిరేసిండు.

            ‘‘మీకే దమ్ముంటే - గరీబోల్లం, పనోల్లం, మా దిక్కు నిలబడి కంపినోన్ని అడుగాలె - బొగ్గుబాయిల అడివిల తుప్పల్ల బెట్టిండ్లు - మనుషులకు తిండి తిప్పలుంటయి.  పెండ్లాం పిల్లలుంటరు.  ఇండ్లు గావాలే - ఆడు కట్టియ్యాలే - ఆ సోయి లేదు. - దిక్కులేక వశపడక మేం తిప్పలు పడి గుడిసెలేసుకుంటే  పీకే సుండాదివయ్యాఇగో నా బొచ్చె మీన్నుంచి తోలిచ్చి కూలగొట్లుండయ్యా’’

            ‘‘అరే దేడ్‍ దిమాక్‍ గిది గోపచ్చిన ఏరియా కూలతది డేంజర్‍ జాగా ’’ - కంపెనీ తెల్ల బట్టలోడు.

            ‘‘సిపరాతి పిట్ట మంచి జాగా సూపెట్టవయ్యా కంపెనీ కట్టిచ్చిన క్వాటర్లుండుడుగాదు’’ - ఆడామె అరిచింది.

 

            ‘‘సత్తెసత్తిమి - కంపెనోడు  జాగా సూపెట్టమను’’ ఇంకొకడు.

            ‘‘గదంత మాకు దెల్వది - ఏజెంటుతోటి మాట్లాడుకోండ్లి – పర్మిషన్  తీసుకోండ్లి - గుడిసెలు కాదు బంగ్లాలు కట్లుకోండ్లి’’ ఇందాకటోడు.

            ‘‘ఏజెంటుగాన్ని గీడికి రమ్మనుపో’’ - మరొకడు.

            కంపెనీ వాచ్ మన్  అతని మీదికురికి పట్టుకున్నాడు - కొడుతరేమోననుకున్న అక్కడి వాళ్లు ఒక్క పెట్టున కంపెనీ వాళ్ల మీద పడ్డారు.  తెల్లబట్టలోల్ల బట్టలు చిరిగినయ్.

            పోలీసులు  కర్రలతోని పెడేల్లుపెడేల్లున కొడుతాండ్లు.  కొట్టుకోల్లు మొత్తుకోల్లు - కొందరు ఉరుకుతున్నారు.  తిట్లు...

            బుల్ డోజర్  కదిలింది.  పోలీసు అమీన్  బుల్  డోజర్  మీదికెక్కి పిస్టల్  తీసి కాల్చిపారేస్తాననిఅరుస్తున్నాడు.

            మొగిలికి కాళ్లు వనికినయ్. అక్కడి నుండి ఉరికిండు... వెనక్కిక తిరిగి చూసిండు.  బుల్ డోజర్  గుడిసెలను తొక్కుతోంది.

            గుండె కొట్టుకుంటోంది – బుల్ డోజర్ తన వెనుక బడి తరుముతున్నట్టుగానే ఉన్నది.


ఈ సంచికలో...                     

Mar 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు