బొత్త కొమురయ్యనే నా గురువు
జనవరి నెలలో కరీంనగర్ వచ్చిన ప్రముఖ రచయిత అల్లం రాజయ్య గారితో కవి, విమర్శకులు కందుకూరి అంజయ్య జరిపిన ముఖాముఖి.
1. మీరు రచనలు చేయాలని ఎందుకు అనుకున్నారు?
మా కుటుంబంలో పూర్వం ఎవరూ రచయితలు కారు. మా పాలేరు మాదిగ గడ్డం రాజయ్య, ఆయన హీరో. ప్రపంచం గురించి మనుషుల ప్రవర్తన గురించి చెప్పేటోడు. నేను గాంధీని చదివి మరిన్ని పుస్తకాలు చదివి మా ఊరి బతుకులు మారడం గురించి రంధి పడేటోన్ని. 1970-71 కి వచ్చే వరకు 1972 ఎన్నికల సభ P.V.నరసింహారావు పెట్టిండు. ఆ సభలో బొంత కొమురయ్య పి.వి.ని నిలదీసిండు. “ఊరంతటికీ కరెంటచ్చింది మాదిగావాడకు ఎందుకు రాలేదని” గాజుల పల్లెలో కరెంటు వచ్చింది. మాదిగవాడలో కరెంటు బుగ్గ వెలిగింది. అప్పుడు “ఎదురు తిరిగితే?” కథ బొత్త కొమురయ్య మీద రాసిన. మార్పు మా వూల్లెనే మనుషుల్లనే ఉన్నదని అర్థమయ్యింది. గురి చూసి కొట్టగల మొనగాడు కొమురయ్య.
మా గ్రామాల్లో పాలేర్లు చాల దారుణమైన పరిస్థితుల్లో ఉండేవారు. నాలుగు కుంచాల జీతం (50కిలోల ధాన్యానికి) నెల రోజులు పని చేయాలి. పాలేర్ల సంఘం ఏర్పాటు చేసి వాళ్ళ జీతం పెరగాలని పోరాటం చేసినం. ఇగట్ల మొదలైనయ్ రైతు కూలీ సంఘాలు.
2. మార్క్సిజం యూరోపు సమాజాన్ని సాధారణీకరణ చేసి వచ్చిన సిద్ధాంతం! ఇది భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు ఎలా వర్తిస్తుంది?
అన్ని దేశాల తత్వ శాస్త్రాన్ని, ప్రకృతిని, సామజిక, పరిణామ క్రమ, శాస్త్రీయ ఆవిష్కరణల అధ్యయనం చేసి వచ్చిన సిద్ధాంతం మార్క్సిజం. భారతీయ బ్రాహ్మణీయ భూస్వామ్య సమాజం మిగతా యూరప్ దేశాల కంటే భిన్నమైనది కనకా, భారతదేశంలో ఆస్తి మిగతాదేశాల్లోలా కాకుండా కుల ప్రాతిపదికగా పంపకం జరిగింది కనక, మార్క్సిజం భారతీయ సమాజాన్ని అంచనా వేయటంలో సరియైన ప్రాతిపదిక గతంలో తీసుకోలేదు. మార్క్సిజం ఆయా దేశాల భౌతిక పరిస్థితులను శాస్త్రీయంగా అధ్యయనం చేసే, అంచనా వేసే శాస్త్రం. అది స్థల కాలాల్లో జరిగిన, జరుగుతున్న పరిణామాలను గతి తార్కిక చారిత్రికంగా అర్థం చేసుకునే శాస్త్రం.
3. యస్.ఏ.డాంగే “ప్రిమిటివ్ కమ్యూనిజం టు స్లేవరి” అనే పుస్తకం రాసిండు. దీన్ని D.D కోశాంబి తీవ్రంగా ఖండించిండు. భారతదేశంలో యూరోపు నమూనా బానిసత్వం లేదని తేల్చి చెప్పిండు కదా! దీని మీద మీ అభిప్రాయం?
యస్.ఏ.డాంగే చరిత్రను ఆర్యుల పరంగా, బ్రాహ్మణీయ సిద్ధాంతం ప్రకారం తప్పుడు వ్యాఖ్యానం చేసిండు. ఆర్యులకంటే ముందు ఈ దేశంలో అనేక మంది భూమి పుత్రుల, అసురుల (లోకాయతులు, చార్వాకులు) సామ్రాజ్యాలు ఉన్నాయి. వీళ్ళకంటే అనాగరికులు, అశాస్త్రీయులు, హేతు విరుద్ధమైనవారు ఆర్యులు.
4. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మ శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు వాటిలో ఉన్న సామాజిక విలువలు ప్రజల్లో ప్రచారం చేసి, వాటిని కింది స్థాయి వరకు తీసుకపోయి, వాటిని ప్రజలు అనుసరించే విధంగా చేసిన బ్రాహ్మణీయ భావజాలాన్ని, ఈనాడు దళిత బహుజనులు ఎలా ఎదుర్కోవాలి?
రాజ్యం భాషను, భావజాలాన్ని ప్రజల మీద రుద్దింది. కానీ, ప్రజలు హేతు విరుద్ధమైన పుక్కిటి పురాణాలను ఎన్నడూ నమ్మలేదు. ఉత్పత్తికి సంబంధించిన జ్ఞానం శాస్త్రీయమైంది. ఉత్పతిని, శాస్త్రీయ జ్ఞానాన్ని పుక్కిటి పురాణాలతో ఉత్పత్తి చేయలేం. ప్రజలు ఎప్పుడూ ఉత్పత్తి, శాస్త్రీయ జ్ఞానంతోనే ఉన్నరు. బౌద్ధం నుంచి ఈనాటి వరకు ప్రజలు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని కాపాడుకుంటూ వస్తున్నరు. It is a wonderful scientific experience of the people. 1860 వరకు భారతదేశం ప్రపంచంలో ధనిక దేశం. ఇప్పుడు పేద దేశం. అయితే – అలాంటి అభివృద్ధి క్రమాన్ని, ప్రజల చరిత్రను నాశనం చేశారు. తిరిగి ప్రజల చరిత్రను నిర్మించవలసి ఉన్నది.
5. నక్సల్బరి, శ్రీకాకుళం, తెలంగాణ రైతాంగ పోరాటాల నుండి ఉద్యమం ఇప్పుడు దండకారణ్యానికి చేరుకుంది. దండకారణ్యం లోపల అదనపు విలువ దోసేవాడు లేడు. ఇది భారతదేశానికి సాధారణీకరణ ఎట్ల అయితది?
దండకారణ్యంలో దోపిడీ స్వరూపాలు వేరైనా దోపిడీ ఉంది. భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు వర్గ, కుల సంబంధాలు లేకున్నా, ఎత్తుగడల రీత్యా, వ్యూహం రీత్యా ఉద్యమం వేళ్ళూనుకుంది. కానీ, అదే భారతదేశానికి విప్లవోద్యమం కాదు. భారతదేశంలో ఉండే నిరుపేదలైన దళితులు, సగభాగమైన మహిళలు, మతపరమైన మైనార్టీలు, బహుజనులు మొత్తంగా భారతదేశంలోని అనేక రకాలుగా నిరుపయోగంగా ఉన్న ఉత్పత్తి వనరుల పంపకం, ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఉత్పత్తి శక్తుల అభివృద్ధి, ఉత్పత్తి సంబంధాల్లో నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించకుండా ఈ దేశం ఒక అడుగు కూడా ముందుకు పోలేదు.ఈ ఎదుగుదలను, దుర్మార్గమైన బ్రాహ్మణీయ హిందుత్వ భూస్వామ్యం, దళారీ పెట్టుబడిదారీ వర్గం అడ్డుకొంటున్నాయి. అన్నిటికంటే అమానవీయంగా, అశాస్త్రీయంగా భారతదేశం ఉండటానికి కారణం ఇదే. అయితే ఈ మార్పులేవి కూడా సాధించజాలము. ప్రజల పార్టీ, ప్రజా సైన్యం, ఐక్య సంఘటన అనే మూడు ఆయుధాలతో – రాజ్యాధికారం ప్రజలు సాధించే దిశలో యభైయేండ్లు, మూడు తరాలు పోరాడి నిలుపుకున్న ప్రజాయుద్ధభూమి.
6. 1980ల తర్వాత స్త్రీ వాదం, దళిత వాదం, మైనార్టీ వాదం, బహుజన వాదం సారాంశంలో అస్తిత్వ ఉద్యమాలు. ఇవి తమకు ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాల్లో (ముఖ్యంగా రిజర్వేషన్లు) ఎక్కువ భాగం కావాలని డిమాండు చేస్తున్నాయి. కానీ, ఇవేవీ ప్రజలకు దక్కకుండా చేస్తున్న నయా ఉదార వాద ఆర్ధిక విధానాన్ని వీరు ఎందుకు ప్రశ్నించడం లేదు?
భారతదేశంలోని వైరుద్ధ్యాలను వాడుకొని సర్వం కొల్లగొట్టాలని, దోపిడీ కొనసాగించాలని ప్రపంచ ఆర్ధిక సంస్థలు పనిచేస్తున్నయి. ఆర్ధిక భాగస్వామ్య డిమాండ్ ను వాయిదా వేయడానికి ఇవి పని చేస్తున్నయి. అస్తిత్వ ఉద్యమాలు వ్యక్తిగత, సామూహిక ఉద్యమాలు – అవి గతి తార్కికంగా అభివృద్ధి చెంది సామాజిక ఉద్యమాలుగా మారుతున్నాయి.
7. పౌరసత్వ సవరణ చట్టంలాంటిది ప్రజలను విడదీస్తుందా? ఏం చేస్తుంది?
భారతీయ పాలక వర్గం ఎవరితోనైనా సఖ్యతగా ఉంటుంది. కానీ ఇక్కడ దళితులను మహిళలను ముస్లింలను కలవకుండా చేస్తుంది. అందుకోసం నెహ్రూ మార్క్ సోషలిజం ముసుగు తీసి – తమ కనుగుణంగా రాజ్యాంగం సవరణలు చేయాలనుకుంటోంది.
8. భారతదేశంలో ప్రజలకు ప్రత్యామ్నాయం ఏంటిది?
ఈ దేశ సంపద దేశ మూలవాసులైన దళితులు, ఆదివాసులు, మహిళలకు చెందవలసిందే. అందుకోసం తగిన ఎత్తుగడలతో ప్రజలు పోరాటములో తర్ఫీదు చెంది – వ్యూహాత్మకంగా కార్మిక కర్షక రాజ్యం గెలుచుకోవాల్సిందే.
9. దీర్ఘ కాలిక ప్రజా యుద్ధ పంథా అని అన్నరు. దీన్ని కొందరు ఎన్ని తరాలు త్యాగాలు చేయాలి. “విప్లవ విధికి” వదిలివేద్దామా అంటున్నరు. మీ సమాధానం?
ఈ దేశంలోపల ఏ మార్పు రావాలన్నా దళితులు, మహిళల మీద ఆధారపడి ఉన్నది. 55 శాతం మహిళలు ఇప్పుడు విప్లవోద్యమంలో ఉన్నరు. దళితులు విప్లవోద్యమాల నాయకత్వంలోకి వస్తున్నారు.
10. విరసం ప్రజా సంఘం ప్రణాళికలో మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం గీటురాయిగా ఉండాలని చెప్పుతుంది. ప్రజా సంఘానికి ఇది అవసరమా!
ఒక ప్రజా సంఘానికి ఇది అవసరం లేదు. ఒక చారిత్రిక సమయములో విరసం అనేక కర్తవ్యాలు నిర్వహించింది.... ఏ ప్రజా సంఘానికైనా అంతిమ కర్తవ్యం అదే అయినా – అది ఇంకో రూపం.
11. భారతదేశంలో మార్పు రావాలంటే ఏం జరగాలి?
ఉత్పత్తి శక్తుల అభివృద్ధి, ఉత్పత్తి వనరుల పంపిణీ జరగాలి. ఉత్పత్తి సంబంధాల ప్రజాస్వామ్యీకరణ జరగాలి.
12. బహుజన సమాజ్ పార్టీ ఆచరణ మీద మీ అభిప్రాయం?
ప్రజాస్వామిక పద్ధతుల్లో పోరాడాలా, వ్యతిరేకంగా పోరాడాలా అన్నది సమస్య. రాజ్యాంగ పద్ధతుల్లో ఉత్పత్తి సంబంధాల్లో మార్పు రాదు. ఉత్పత్తి వనరుల పంపిణీ కాదు. ఉత్పత్తి శక్తులు అభివృద్ధి కావు. UP లో BSP అధికారంలోకి వచ్చింది. బ్రాహ్మణీయ భూస్వామ్యాన్ని నిరోధించడం, దళారీ పెట్టుబడిదారి విధానాన్ని ఎదుర్కోవడం ముఖ్యమైన సమస్య. విప్లవ పార్టీలన్నీ కులమే ప్రధానమని తీర్మాణించుకున్నాయి. అంబేద్కర్ ను ఈ దేశంలో చాలా ప్రమాదకారిగా బ్రాహ్మణీయ భూస్వామ్యం భావిస్తుంది. ఈ దేశాన్ని లోతుగా అధ్యయనం చేసిన వారు. అయితే అయన కాలం నాటికి ప్రజలను విప్లవ పోరాటాలల్లో సమీకరించడానికి చాలా పరిమితులున్నాయి. ఆయనకు ఉన్నాయి.
13. ఈ రోజు తెలంగాణ – ఆంధ్రలో వస్తున్న సాహిత్యంపై మీ అభిప్రాయం?
ప్రజలకంటే రచయితలు వెనుకబడి ఉన్నరు. ప్రజలను, ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడం లేదు.
14. భారతదేశంలోపల కుల సమస్య ఎట్లా పరిష్కరించాలి?
యూరప్ లాంటి దేశాల్లో భూస్వామ్యం అవశేషాలను నిర్మూలించి, పెట్టుబడిదారి సమాజం ఏర్పడింది. భారతదేశంలో బ్రాహ్మణీయ భూస్వామ్యం పెట్టుబడిదారులతోని మిలాఖత్ అయింది. కింది కులాల శ్రామిక ప్రజల్ని కులాల పేరుతోని విడదీసింది. అంబేద్కర్ అన్నట్టుగా అదనపు విలువ కుల ప్రాతిపదిక మీద సమీకరించబడ్డది. ఈ దేశంలో సంపదంతా అగ్రకులాల చేతిలోనే ఉంది. కింది కులాల నుండి దోపిడీ చేసి అగ్రకులాలు పంచుకున్నయి.
బ్రాహ్మణీయ భూస్వామ్య వర్గం బయటనుండి వచ్చిన ఎవరితోనైనా మిలాఖత్ అవడానికి సిద్ధమే! కానీ, శ్రామిక కులాలైన దళితుల పట్ల, మహిళల పట్ల, ఆదివాసుల పట్ల హింసాత్మకంగా క్రూరంగా వ్యవహరిస్తూ వస్తున్నది. కనుక, భారతీయ భూస్వామ్యం ద్వంద్వ స్వభావం కలిగి ఉంది. అంబేద్కర్ అన్నట్టుగా వేరు తొలిచే పురుగైన కులాన్ని నిర్మూలించకుంటే ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కాదు.
ఆ ప్రయత్నం మొదలైంది కనుకనే మునుపెన్నడూ లేనంతగా పాలక వర్గాలు, అగ్రకులాలు, సామ్రాజ్యవాద దేశాలు భారతీయ ప్రజల మీద అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఒక పక్క లోపాయికారిగా అనేక ఎన్ జి వో సంస్థలు పెట్టి – కోట్లాది రూపాయలు వాళ్ళకిచ్చి తప్పుడు ఉద్యమాలతో ప్రజలను చీలుస్తున్నారు. శ్రమశక్తిని, ఖనిజ వనరులను కొల్లకొడుతూ – లోపాయికారిగా ప్రజలను తైలాలతో లబ్దిదారులను చేస్తున్నారు. ఆదివాసులు, దళితులు, మహిళలు, మేధావులు, యువకుల మీద తీవ్ర నిర్భందం ప్రయోగిస్తున్నారు. రాజ్యాంగాన్ని ప్రజలకు చూయిస్తూ – మధ్య యుగాల భుస్వామిక పరిపాలన గ్రామాలల్లో – అయితే మునుపెన్నడూ లేని విధంగా, వ్యవసాయం, పరిశ్రమలు దెబ్బతిని దాదాపు ముప్పై కోట్ల మంది యువకులు నిరుద్యోగులుగా – పేలబోయే అగ్ని పర్వతంలాగున్నారు. ఇలాంటి పరిస్థితులను నిర్మాణయుతమయిన పోరాటాలుగా మలుచుకోగలగాలి.
నేను నవలా ప్రక్రియలో అనేక ప్రయోగాలు చేయడం వలన నవలాకారునిగానే గుర్తింపు పొందాను
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ గారితో గోదావరి పత్రికాల్ కోసం గట్ట్టు రాధిక మోహన్ చేసిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి కొద్దిగా చెప్పండి?
నేను 1941,డిసెంబరు 24న జనగాం తాలుకా,బమ్మెర గ్రామానికి(పోతన పుట్టిన ఊరు) కి దగ్గరలో ఉన్న వావిలాల గ్రామంగా జన్మించాను. నా అసలు పేరు దొంగరి మల్లయ్య,అది మా తాతగారి పేరు. నవీన్ అనేది నా కలం పేరు. ఈ పేరును వరవరరావు సూచించారు. అంపశయ్య అనేది నా మొదటి నవల.దానికొచ్చిన గుర్తింపేనా ఇంటిపేరుగా మారింది. మాది మధ్య తరగతి వ్యవసాయిక కుటుంబం.మా ఊరిలో మూడవ తరగతి వరకే ఉండేది.అక్కడ మూడవ తరగతి వరకు చదివి, పక్క ఊరైన కొడకండ్ల లో నాల్గవ తరగతి, మా అమ్మ వాళ్ల చెల్లె మా చిన్నమ్మ ఊరు కొరివి లో అయిదవ తరగతి, ఆ తర్వాత పాలకుర్తి దగ్గరున్న తిరుమలగిరి మిడిల్ స్కూల్ లో ఆరేడు తరగతులు చదివిన.ఆ తర్వాత వరంగల్ కి వచ్చిన...వరంగల్ లోని ఏవి స్కూల్ లో ఎనిమిది నుండి హెచ్చెస్సి వరకు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో పియుసి మరియు బిఎ పూర్తి చేసిన. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ చేసిన.నాకక్కడి నుండె నా లైఫ్ లో మార్పులు చోటు చేసుకున్నవి.
2. మీరు సాహిత్యంలోకి రాకముందు మీ చుట్టూ సాహిత్య వాతావరణం ఎలా ఉండేది?
మా ఊరు పక్కనే బమ్మెర గ్రామం ఉండేది.పోతన పుట్టింది అక్కడే.మా నాన్న గారు పోతన భాగవతం లోని పద్యాలను చాలా చక్కగా రాగయుక్తంగా పాడుతుండే వారు. ఆ ప్రభావం నాపై బాల్యంలోనే పడింది. నాల్గవ తరగతి, అయిదో తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్ లైబ్రరీ లోని చందమామ కథలు, జానపద కథలను నేను బాగా చదివే వాన్న. చదివి ఊరుకోకుండా చిన్న చిన్న కథలను కూడా రాసేవాన్ని.
3. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక,రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని సాహిత్యం వైపు నడిపించాయి?
అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న రోజులవి.భూస్వాముల పెత్తనం,రజాకార్ వ్యవస్థ కింద సామాన్య ప్రజలు అన్ని రకాలుగా బాధలు పడేవాళ్లు. ఒకరోజు నేను పదకొండో ఆంధ్ర మహాసభని ప్రత్యక్షంగా చూసిన.ఆ సభకి పదకొండు జతల ఎడ్లబండ్ల మీద అతిధులను ప్రజలందరూ సభా ప్రాంగణానికి తీసుకురావడం,వాళ్లకు జేజేలు కొట్టడం నా మనసుకు బాగా తాకింది. ఈ చరిత్రను రికార్డు చేయాలని అప్పుడే అనుకున్నాను. తర్వాత ఆ సంఘటనల మీద నవల రాయడం జరిగింది.
4. మీ సాహిత్యం పై,మీ వ్యక్తిగత జీవితం ఎంత వరకు ప్రభావితం చేసింది?
నా సాహిత్యంపై నా వ్యక్తిగత జీవితం తప్పకుండా ఉంది. నా చుట్టూ జరుగుతున్న సంఘటనలు, అనుభవాలనే వస్తువుగా తీసుకుని మలచడం జరిగింది.
5. అంపశయ్య నవల రాయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన పరిస్థితులు ఎలాంటివి.ఆ నవల మీకెలాంటి స్థానాన్ని ఇచ్చిందనుకుంటున్నారు?
ఉస్మానియా విశ్వవిద్యాలయం లో నేను ఎంఏ చదువుకున్న రోజులవి...అక్కడంతా రకరకాల మనస్థత్వాలు కలిగిన విద్యార్థులుండే వాళ్లు. ఫీజు కట్టకపోతే పేరు నోటీసు బోర్డు పైకి ఎక్కేది. పరీక్షలు రాయనిచ్చేవారు కాదు.ఆర్థికంగ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను.నా చుట్టూ ఉన్న సహ విద్యార్థుల మనస్థత్వాలను కలుపుకొని ఒక రోజులో జరిగిన సంఘటనలను...అనుభవించిన అంతర్మథనాన్ని ఒక నవలగా రాయాలనుకున్నాను. దానికి శ్రీకారం చుట్టింది మాత్రం నేను నల్గొండలో అధ్యాపకుడుగా పనిచేస్తున్నప్పుడు.
అది పూర్తయ్యేసరికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇదే నా మొదటి నవల. దీన్ని చైతన్య స్రవంతి శిల్పంలో రాయడం జరిగింది.రాసేటపుడు అది చైతన్య శిల్పమనే తెలువదు. దాన్ని చదివిన వాళ్లు కొందరు చెప్పడం జరిగింది.మన ఆలోచనా ప్రవాహాన్నే ఉన్నదున్నట్లుగ అక్షర రూపంలో పెట్టడం. ఆంగ్ల సాహిత్యంలో జేమ్స్ జాయిస్ రచించిన "యులిసెస్" లో ఇదే శిల్పం ఉంటుంది.తెలుగులో బుచ్చిబాబు రాసిన కొన్ని కథలల్లో,శ్రీ శ్రీ గారి "ఒసే తువ్వాలందుకో"కథలో కొంత వరకు మాత్రమే ఈ శిల్పం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ శిల్పంలో రాయబడిన మొదటి నవల అయితే అంపశయ్య మాత్రమే.అప్పుడు ఈ నవలనొక సారి చూడమని ఆంధ్రజ్యోతి ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారికి, యువ మాసపత్రిక ఛీఫ్ ఎడిటర్ చక్రపాణి గారికి పంపించడం జరిగింది. కానీ వాళ్లు కొన్ని పేజీలను చదివి ఇది నవలనేనా అని తిరిగి పంపించారు.ఆ తర్వాత వరవరరావు,నేను కలిసి "సృజన" అనే త్రైమాసిక పత్రికను ప్రారంభించాము. మూడు నెలలకో సారి వచ్చే ఈ పత్రికలో ఒకేసారి అరవై నుండి డెబ్బై పేజీల వరకు ప్రచురించాము. ఆ తర్వాత రవిబాబు సహాయంతో ఫెయిర్ కాపీ తీసుకురావడం జరిగింది.1968 లో ప్రింట్ కాపీ వచ్చింది. నేను రాసేటప్పుడే అనుకున్నాను ఈ నవల తప్పకుండా యువతీ యువకుల మీద ప్రభావం ఉంటుందని.ఊహించినట్టే జరిగింది. అది నా ఇంటి పేరుగా మారింది. ఈ మధ్య యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది.కాపీల కొరత వల్ల పదమూడవ ప్రచురణ కూడా జరిగింది.
6. మీ సీక్వెల్ నవలల గురించి చెప్పండి.
నేను సీక్వెల్ నవలలు రాయడానికి ముందు హిందీలో సత్యజిత్ రే గారి "పథేర్ పాంచాలి" చిత్రానికి సీక్వెల్ గా "అపరాజిత", " అపూర్ సంసార్" చిత్రాలు రావడం జరిగింది. అప్పుడే నాకొక ఆలోచన వచ్చింది తెలుగులో సీక్వెల్ నవలలను ఎందుకు రాయకూడదని.ఆ ఆలోచనె నన్ను రెండు నవలాత్రయాలు రాసేలా చేసినాయి. నా మొదటి నవల "అంపశయ్య" కి సీక్వెల్ గా "ముళ్లపొదలు", "అంతఃస్రవంతి" ని తీసుకొచ్చాను. "అంపశయ్య" ఒక స్టూడెంట్ ని సబ్జెక్టు గా తీసుకుని రాయబడితే "ముళ్లపొదలు", "అంతఃస్రవంతి" లలో నిరుద్యోగిని,వివాహం తర్వాత కొనసాగే జీవితాన్ని తీసుకుని రాయడమైంది. ఇది నా మొదటి నవలాత్రయం.ఇదే స్ఫూర్తితో మరో నవలాత్రయంగా "కాలరేఖలు-చెదిరిన స్వప్నాలు-బాంధవ్యాలు" లను తీసుకొచ్చాను. ఈ మూడు నవలలు ఇటు తెలంగాణ ప్రాంతంలోను, అటు భారతదేశంలోను, 50 సంవత్సరాలలో, (1944–1994) జరిగిన అనేక సంఘటనల్ని ఈ కాలంలో ప్రజల ఆర్ధిక, రాజకీయ, సాంఘిక, జీవనాల్లో ఉత్పన్నమైన పరిణామాల్ని చిత్రిస్తాయి. 1996లో కళాశాల అధ్యాపక వృత్తికి పదవీ విరమణ చేశాక రాయడం మొదలు పెట్టాను.50 ఏళ్లలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన మూడో నవల ‘కాలరేఖలు.’
7. మీ "చీకటి రోజులు" నవల నేపథ్యం చెప్పండి.
ఈ నవలా 1975 సంవత్సరం ఎమర్జెన్సీ పీరియడ్ ఆధారంగా రాయబడింది. రచయిత మెట్టు తిరుపతయ్యను విరసం తో సంబంధమున్నదని అరెస్టు చేసి దాదాపు ఇరవై మూడు రోజులు పోలీసు క్యాంపులో ఉంచుకొని రిలీజ్ చేసినారు.నిజానికి తిరుపతయ్యకి విరసం తో ఎలాంటి సంబంధాలు లేవు. అతను పోలీస్ కస్టడిలోని తన అనుభవాలను నాతో పంచుకున్నప్పుడు ఇదంతా కూడా ఒక నవలగా రాయాలనిపించింది. ఒక ప్రత్యేక శైలితో రాయాలనుకొని ఆలోచించి డైరీ రూపంలో రాయడానికి నిర్ణయించుకున్నాను.ఈ నవలంతా కూడా పందొమ్మిది రోజుల దినచర్య గా కొనసాగుతుంది. ఇందులో ఒక తిరుపతయ్య గురించే కాకుండా యావత్ దేశంలోని సంఘటనలను కూడా చిత్రించాలనుకున్నాను. అందుకే కొంతమంది అమాయకులు ఎదుర్కొన్న సంఘటనలను తీసుకున్నాను.కేరళ లోని లెనిన్ కాలేజ్ స్టూడెంట్ రాజన్ గురించి, సోషలిస్ట్ పార్టీకి చెందిన స్నేహలతా రెడ్డి గురించి, కొంతమంది ఆరెస్సెస్ నాయకుల గురించి ప్రస్థావిస్తూ ఎమర్జెన్సీ పీరియడ్ తరువాత తీసుకురాబడింది ఈ నవల.
8.మీరు నవలలే కాక అనేక కథలు, వ్యాసాలు, సాహిత్య విమర్శలు కూడా రాసినారు కదా...కానీ విమర్శకులచే మీరు నవలాకారుడు గానే గుర్తింపు పొందారు. దీనిపై మీ అభిప్రాయం ?
సాహిత్య ప్రక్రియలో ఇప్పుడు మీరు చెప్పిన ప్రక్రియలన్నీ ఉంటాయి. దాదాపు ప్రతీ రచయిత ఒక్క ప్రక్రియనే కాకుండా అనేక ఏవో కొన్ని ప్రక్రియల్లో ప్రవేశముంటూనే ఉంటుంది. వాటిలో ఏది ఎక్కువ ప్రభావితం చేస్తే ఆ ప్రక్రియలోనే పేరొస్తుంది.నాది కూడా అంతే....నేను నవలా ప్రక్రియలో అనేక ప్రయోగాలు చేయడం వలన నవలాకారునిగానే గుర్తింపు పొందాను.
9. ఇప్పటి వరకు మీరు రాసిన రచనల గురించి చెప్పండి.
ఇప్పటి వరకు ముప్పై రెండు నవలలు, ఏడు కథా సంకలనాలు,ఐదు వ్యాస సంకలనాలను తీసుకురావడం జరిగింది.
10. మీ కవిత్వం గురించి చెప్పండి.
నేను మొదటి ఛందోబద్దమైన కవిత్వాన్ని రాసేవాన్ని. అది కుదిరింద లేదా అని మా తెలుగు మాస్టర్ కి చూపించి సరిచేసుకునేది. ఆ తర్వాత నేను నవలా ప్రక్రియపై శ్రద్ద పెట్టడం వల్ల కవిత్వం గురించి పట్టించుకోనే లేదు.వచన కవిత్వమైతే ఎప్పుడూ రాయలేదు.
11. కాళోజీ గారితో..."మిత్ర మండలి" తో మీ అనుబంధం ఎలాంటిది?.
నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ (హన్మకొండ) లో చదువుతున్న రోజుల్లోనే నాకు కాళోజీ సోదరులతో మంచి అనుబంధం ఏర్పడింది. వారి ఆధ్వర్యంలో నడుపబడిన "మిత్ర మండలి" కి మొదటి కన్వీనర్‌గా వరవరరావు గారు పనిచేస్తే,రెండో కన్వీనర్‌గా నేను పని చేసాను. వారింటికి ఎప్పుడూ తరచుగా వెళ్లుతూ ఉండేవాన్ని.
12. కాళోజీ గారు మిమ్మల్ని "పద్మశ్రీ" అవార్డు కోసం రికమెండ్ చేసారని తెలిసింది.దాని గురించి వివరాలు చెప్పండి.
1992 సంవత్సరంలో కాళోజీ గారు "పద్మ విభూషణ్" అవార్డును అందుకున్నారు. మరుసటి సంవత్సరం అంటే 1993-94 కు గాను కాళోజీ గారిని అవార్డు కమిటీ వారు మీకు తెలిసిన వారిలో ఒకరిని "పద్మశ్రీ" కి రికమెండ్ చేయమని అడిగారట. అప్పుడు కాళోజీ గారు నా పేరు రాసి పంపించారట. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పూర్తి వివరాలు రాసి పంపించమన్నారట. కాళోజీ గారు కొంచెం ముక్కోపి, రెండో సారి పంపించడమేందని కోపంతో వివరాలు పంపించలేదట.ఇదంతా కూడా నాకు ఆ తర్వాత ప్రస్తుత కాళోజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగిళ్ల రామశాస్త్రి గారు చెప్పారు.
13. మీపై ఏ రచయితల ప్రభావం ఉందంటారు?
చలం గారు,బుచ్చిబాబు గారు,శ్రీ శ్రీ గారు నా అభిమాన రచయితలు.వీరి రచనల ప్రభావం నాపై ఉందనే చెప్పుతాను.
14. మీరు ఈ మధ్య చలం గారి మీద ఒక నవల తీసుకొచ్చారు కదా...దాని గురించి చెప్పండి.
అవును అది చలం గారి జీవితాత్మక నవల."ప్రేమకు ఆవలి తీరం " పేరుతో తీసుకొచ్చాను. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన మొదటి జీవితాత్మక నవల ఇది. చలం గారు తన ఆత్మకథను తను రాసుకున్నారు.కానీ అందులో తన స్వంత అభిప్రాయాలే ఎక్కువగా కనిపిస్తాయి.ఆ బుక్ రాసే నాటికి చలం గారు వయసు రీత్యా రాసే స్థితిలో లేరు. తను డిక్టేట్ చేస్తుంటే విశ్వం గారు రాసారట.అందువల్ల తన ఆత్మకథ చాలా మంది అభిమానులకు నిరాశనే మిగిల్చింది. నేను రాసిన "ప్రేమకు ఆవలి తీరంలో" చలం గారి స్పష్టమైన జీవిత చిత్రం కనిపిస్తుంది.
15. సాహిత్యంలోకి యువతరం,కొత్త తరం ఎందుకు రాలేకపోతున్నది?
దీనికి ముఖ్యమైన కారణం కుటుంబ వాతావరణమనే చెప్పుకోవాలి. ఈ రోజు తల్లిదండ్రులు తమ పిల్లలను ఐఐటి, మెడిసిన్ అంటూ ర్యాంకుల కోసం ప్రైవేటు విద్యాసంస్థలపై ఆధారపడి వాళ్ల బాల్యాన్ని బంధించేస్తున్నారు. అలాచేస్తే పిల్లవానికి సామాజిక స్పృహ ఎలా వస్తుంది. ఇంకా చెప్పాలంటే విపరీతమైన మొబైల్ ఫోన్ల వాడకం. తల్లిదండ్రులే వీటిని అతిగా వాడుతుంటే పిల్లవాడు కూడా వాళ్లనే అనుకరిస్తున్నాడు.ఎప్పుడైతే తల్లిదండ్రులు సాహిత్యం చదువుతుంటారో పిల్లలు కూడా వాళ్లను అనుకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవిగాక ప్రస్తుతం తెలుగు భాష అస్థిత్వ పోరాటం జరుగుతుంది. పాఠశాలల్లో తెలుగు మీడియాలే కనబడ్తలేవు. దీనివల్ల మాతృభాష తెలుగులో పట్టు తప్పుతున్నాడు. ఈ సమస్యలను గ్రహించి ఇప్పటి కైనా సరైన పరిష్కసరాలను తీసుకుంటె రేపటి సమాజంలోనైనా సాహిత్య ప్రపంచానికి యువతరాన్ని అందించినవాళ్లమవుతాము.
16. ప్రస్తుతం ఉన్న తెలుగు సాహిత్యాన్ని మీరెలా చూస్తున్నారు?
సాహిత్యంలో కుల,మతాలకతీతంగా రచనలు చేయాలి. కాని ఇప్పుడలా కనిపించడం లేదు. గ్రూపులు గ్రూపులుగా విడిపోయి రాస్తున్నారు. లౌకిక సాహిత్యం లోపిస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి.
17. మీ యాభై సంవత్సరాల సాహిత్య జీవితంలో నెమరువేసుకునే సంఘటన /రచన/అవార్డు ఏదైనా ఉందా?
నా జీవితంలో మరపురాని సంఘటన అంటే,నాకు "కాల రేఖలు" నవలకు గాను "కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం" వచ్చిందని ప్రకటించినప్పుడు, ఆ పురస్కారంను ఢిల్లీలో అందుకుంటున్నప్పుడు. ఈ అవార్డు ఫంక్షన్ మూడు రోజుల పాటు జరిగింది. అక్కడ ప్రతీ భాష నుండి ఒక్కరు ఉంటారు.ఆ వాతావరణం ఎంతో బాగా నచ్చింది. అవార్డు తీసుకోబోయే ముందు కొందరికి మాట్లాడే అవకాశం కల్పిస్తారు. ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను. ఇదంతా కూడా నా జీవితంలో ఒక తీయని అనుభూతిగా ఉండిపోయింది.
18. ప్రస్తుతం కొత్తగా వస్తున్న నవలాకారులకు మీరిచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా?
కొంత మంది చాలా అద్భుతంగా రాస్తుంటే...మరికొందరైతే ఏం రాస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉంది.వారి రచనలలో శిల్పం కనబడట్లేదు. కవిత్వానికి శిల్పం ఉన్నట్టే నవలకు,కథకు కూడా శిల్పం ఉంటుంది. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు రచించిన "నవలా శిల్పం", " కథాశిల్పం" బుక్స్ ని చదివితే శిల్పం ఎలా ఉంటుందో ఒక ఐడియా వస్తుంది.
19. గోదావరి అంతర్జాల మాస పత్రిక ద్వారా పాఠకులు, కవులు,రచయితలు, సాహితీ వేత్తలకు మీరేం చెప్పదలచుకున్నారు?
ఇంతకుముందు "గోదావరి త్రైమాసిక పత్రిక" ను నడిపించినట్టు తెలుసు.ఒక పత్రిక ను నడిపిస్తున్నప్పుడు తలెత్తే సమస్యలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు. కొంత విరామం తర్వాత ఇప్పుడు "గోదావరి అంతర్జాల మాస పత్రిక" గా అందరిముందుకు తీసుకొచ్చినందుకు సంపాదక వర్గాన్ని అభినందిస్తున్నాను.
పాఠకులైనా,కవులు,రచయితలెవరైనా వారికి ముఖ్యంగా నేను చెప్పేది ఒక్కటే విషయం ...పుస్తకాలు ఎక్కువ చదవాలి. చదవడంలో ఉన్న ఆనందం దేనిలో దొరకదనే చెప్పొచ్చు. పఠనం వల్ల మనల్ని మనం తెలుసుకోగలుగుతాము. అందుకే ఎక్కువ సాహిత్యాన్ని చదవాలని కోరుతున్నాను.
కథలో లోతు ఉంటుంది. నవలలో విస్తృతి ఉంటుంది
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ బండి నారాయణ స్వామి గారితో గోదావరి పత్రిక కోసం అక్షర మాలి చేసిన ఇంటర్వ్యూ..
1. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆనందాన్నిచ్చిందా?
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆనందాన్ని ఇచ్చింది అనడం కంటే ,ఎందుకు ఆనందాన్నిచ్చింది అనే ప్రశ్న నాకు ఇష్టం.అవార్డుల గురించి నాకు ముందు నుంచి పెద్దగా ఆసక్తులు లేవు.సమాచారం లేదు. కానీ శప్తభూమి చదివిన తర్వాత చాలామంది పాఠకులు ఈ నవలకు అవార్డు వస్తుంది. వస్తే బాగుంటుంది. అని చాలామంది అన్నారు ఫోను ద్వారా చాలా మంది ఇదే అభిప్రాయాన్ని చెప్పారు. అంతవరకు నా మైండ్‌లో అవార్డు అన్నది లేదు. ఈ నవలను నేను దళిత బహుజన అస్తిత్వం తోను రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వమ్ తోనూ రాయడం సంభవించింది.అవార్డు వచ్చిన తర్వాత నా రాయలసీ మ పాఠకులు ఎక్కువగా సంతోషపడ్డారు. నా కులానికి సంబంధించిన పాఠకులు, వర్గానికి సంబంధించిన పాఠకులు ఎక్కువగా సంతోషపడ్డారు. ఈ నవలను నేను ఏ అస్తిత్వ వాదాల తో అయితే రాసినా నో ఆ అస్తిత్వానికి సంబంధించిన పాఠకులు ఆనంద పడినప్పుడు రచయితగా నాకు కూడా సహజంగానే ఆనందం వేసింది. అది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినందుకు జరిగిన ఆనందం, అనుభవం.
2. మీ బాల్యం, కుటుంబ నేపథ్యం చెప్పండి?
నేను శ్రామిక కులంలో పుట్టినాను. శ్రామికులైన బంధు వర్గాల మధ్య పెరిగాను. అనంతపురం పాతూరు లో పుట్టి,బీరప్ప గుడి కట్టలమీద ఆడుకున్నాను. బీరప్ప గుడి లోని రావి చెట్టు నా శ్రామిక ప్రజల జీవన స్పందనలను వినిపిస్తూ ఉండేది. మా తాత రైల్వే కూలి.మా అమ్మ పుట్టింటి వాళ్ళు గొర్రెల కాపరులు. ఇతర బంధువులు ఇ ళ్లు కట్టే వాళ్ళు, పొలాలు దున్నేవాల్లు,బండి తోలే వాళ్ళు,, సున్నం వేసే వాళ్ళు ఇట్లా అనేకమైన శ్రామిక వృత్తుల మధ్య పెరిగి పెద్దయిన వాణ్ని.మా అప్ప డ్రిల్లు టీచర్ నుండి రైతుగా మారడంతో రైతు బిడ్డ అనుభవాలు అయిన గాలి, వాన , చలి , ఎండ అన్ని నా అనుభవంలోకి వచ్చినాయి.కాయకష్టం ఎట్లా ఉంటుందో తెలిసింది. నీళ్లు లేని వ్యవసాయం లో ఎంతటి విషాదం ఉందో అర్థమైంది. నా బాల్య జీవితం నుంచి నాలో కుల అస్తిత్వం,ప్రాంతీయ అస్తిత్వం, గ్రామీణ అస్తిత్వం బలపడి భవిష్యత్తులో నా రచనకు గరిమనాభి గా మారింది.
3. మీరు రచనా వ్యాసంగం వైపు రావడానికి స్ఫూర్తి ఎవరు? ఏమిటి?
బాల్యంలో అంటే ఐదో తరగతి చదివే రోజుల్లో నాకు ఒక తమిళ కుటుంబం తో పరిచయమైంది. ఆ తమిళకుటుంబంలోని పిల్లవాడు దక్షిణామూర్తి అని నా సహాధ్యాయి. ఆ కుటుంబం బాగా చదువుకుంది వారి ఇంటి నిండా చందమామలు, బాలమిత్రలు గూళ్ళలో పేర్చి ఉండేవి.వారం వారం చక్రభ్రమణం, శంకు తీర్థం, సమాంతర రేఖలు వంటి వివిధ సీరియల్స్ మోసుకొని ఆంధ్రప్రభ వారపత్రిక వారి ముంగిట కొచ్చేది.ఆ తమిళ కుటుంబంలో క్లియోపాత్ర , హెర్క్యులస్ వంటి సినిమాలను, సత్యజిత్ రే వంటి సినిమా డైరెక్టర్లను ప్రస్తావిస్తూ ఉండేవారు." కణ్ణగి " కేంద్రంగా తమిళ సంస్కృతిని చెప్పుకొచ్చేవాళ్ళు. వారి ఇంట్లో గోడకు వయోలిన్ వేలాడుతూ ఉండేది.సంగీత సాహిత్య పరిజ్ఞానం నుంచి సాహిత్యం పట్ల మక్కువ ఏర్పడింది. మడికట్లలో బొమ్మా బొరుసు, వీధుల్లో గోలి గుళ్లు, బొంగరాలు ఆడుకుంటూ కాలం గడిపే నన్ను మా అప్ప జిల్లా గ్రంథాలయంలో సభ్యుడిగా చేర్పించడం నా జీవితంలో ఒక పెద్ద పరిణామం.తమిళ బ్రాహ్మణ కుటుంబ వాతావరణం, ఈ గ్రంథాలయ పరిచయం రెండూ నాలో సాహిత్యం పట్ల అనురక్తిని కలిగించాయి. ఇంకా చెప్పాలంటే సాయిబాబా హై స్కూల్ లో పని చేసిన అప్పటి డ్రాయింగ్ టీచర్ చెప్పిన కథలు నన్ను చాలా ఉత్తేజితు న్ని చేసినాయి.ఇప్పటి స్కూల్లో మాదిరి కాకుండా అప్పట్లో సాయి బాబా హై స్కూల్ లో ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ ఎక్కువగా నిర్వహించేవారు.వక్తృత్వం వ్యాసరచన, పద్య పఠనం, డిబేట్ లు ఇలాంటివన్నీ నాలో జీవితం పట్ల జ్ఞానం పట్ల కళల పట్లఆసక్తిని పాదు కొలిపి నాయి.
4. మీలోని కథకుడిని గురించే ప్రపంచానికి తెల్సు, మరి మీలో గొప్ప కవి వున్నాడని విన్నాం . ఇంతకూ ఆ ఇద్దర్లో ఎవరిష్టమో చెప్పండి?
నేను నిజానికి కవిత్వంతో మొదలైన వాడిని. నేను, పాటిల్ చంద్రశేఖర్ రెడ్డి జిల్లా గ్రంథాలయంలో "అరుణిమ" అనే పేరుతో లిఖిత మాస పత్రికను నడిపిన అనుభవం ఉంది.కవిత్వం నుంచి నన్ను కథలోకి అనువదించిన వాడు నా స్నేహితుడు దేవపుత్ర. కవిత్వం రాసిన నేను కథ రాస్తానని అనుకోలేదు, కథ రాసినప్పుడు నవల రాస్తానని అనుకోలేదు.ఆ తర్వాత వ్యాసరచనకు కూడా పోతానని నాకు తెలియదు.కవి నుంచి కథకుడిగా నవలా రచయితగా విమర్శకుడిగా మారడం నాలో ఒక పరిణామం.కానీ కథకుడిగా మారిన తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే నా భౌతిక జీవిత మూలాలకు వచన రచన దగ్గర కానీ కవిత్వం కాదు అని. నేను చెదురుమదురుగా నా వచనంలో కవిత్వం రాస్తే రాసి ఉండవచ్చు గానీ కవుల కవిత్వంలో ఒక మొత్తానికి సంబంధించిన శిల్పాన్ని సాధించలేకపోయాను. ఠాగూర్, ఇస్మాయిల్, పల్లవ హనుమయ్య వంటి వారి కవిత్వం చదవడం నాకిష్టం.
5. మీ తొలినాళ్ల నాటి అనంత పురం సాహిత్య వాతావరణం ఎలా ఉండేది?
మంచి రెడ్డి శివారెడ్డి అనే ఒక పెద్దాయన ఉండేవాడు.ఆయన అటు తిరిగి ఇటు తిరిగి అంతో ఇంతో రాసే కుర్ర వాళ్లను పట్టుకొని ఒక చోట చేర్చి సాహిత్య చర్చలు చేసేవాడు . అట్లా అతని దగ్గర చేరిన గుంపులో దేవపుత్ర, బద్వేలి రమేష్, కార్తికేయ శర్మ ,రాయుడు ,రమణ, కైలాష్ నాథ్, వై శ్రీరాములు ,మల్లెల వంటి కాబోయే రచయితలు, కవులు పరస్పరం పరిచయం అయినాము.వెన్నెల క్లినిక్ అని డాక్టర్ దక్షిణామూర్తి నడిపే ఒక క్లినిక్ ఉండేది. గ్రంథాలయం ఆవరణలో ఒక పెద్ద శిరీష కుసుమ వృద్ధ వృక్షం ఉండేది. పెద్ద వేపచెట్టు ఉండేది. గ్రంథాలయంలో స్నేహితులు ముందు వెనక పోయి పుస్తకాలు చదివే వాళ్ళం.క్రిందికి దిగి వచ్చి గౌసియ కాకా హోటల్ లో టీలు తాగి,వేప చెట్టు కింద కూర్చుని చర్చలు జరిపే వాళ్ళం. మరొక గొప్ప సంఘటన ఏమిటంటే గ్రంథాలయం లో మా లిఖిత మాసపత్రికకు తోడుగా మరో రెండు లిఖిత మాస పత్రికలు కూడా ఉండేవి. ఈ లిఖిత మాస పత్రికల వెనక ఉన్న వర్ధమాన కవులు రచయితల్ని గ్రంథాలయమే కలిపింది. లలిత కళా పరిషత్ లో అష్టావధానాలు జరిగేవి. గ్రంథాలయ వరండాలో సాహిత్య సమావేశాలు జరిగేవి. పాతూరి గాంధీ పార్క్ వద్ద తరిమెల నాగిరెడ్డి ఉపన్యాసాలు, హోటల్ ఆరామ్ లో వామపక్ష భావాల స్నేహితుల మధ్య పంచాది నిర్మల, వెంపటాపు సత్యం ల గురించిన చర్చలు జరిగేవి. సమాంతరంగా జిడ్డు కృష్ణమూర్తి, భగవాన్ రమణ మహర్షి, బౌద్ధం గురించిన చర్చలు జరిగాయి. రకరకాల సిద్ధాంతాలు, భావజాలాలు, అభిప్రాయాల మధ్య ఏదో ఒక జ్ఞాన సర్వస్వం మా వర్ధమాన కవులు రచయితలతో దోబూచులాడుతున్నట్లు ఉండేది. వాటి ఆధారంగానే పుస్తకాలు సంపాదించే వా ళ్ళం. చదివేవాళ్ళం. చర్చించే వాళ్ళం.ఘర్షణ పడే వాళ్ళం. అనంతపురం సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ వాతావరణం నుంచి ఇక్కడ ఒక రసాయనిక చర్య మొదలైంది ఈ రసాయనిక చర్యల్లో భాగంగానే ఎంతోమంది రచయితలు కవులు తో పాటు ఈ రచయిత కూడా పుట్టుకొచ్చినాడు. తిరుమామిళ్ల సుబ్బారావు గారి నేతృత్వంలోని లిటరరీ వర్క్ షాపుల్లో బోసు, జూపల్లి ప్రేమ్‌చంద్ వంటి మరికొందరు మాతో కలవడం జరిగింది.
6. ఇప్పటి దాకా ఎన్నో గొప్ప కథలు రాశారు అయితే మీకథల్లో మీకు సంతృప్తినిచ్చిన కథ ఏది ?
మీకు ఇష్టమైన కథ ఏది అని చాలా మంది అడుగుతుంటారు నేను రాసిన వాటిలో నాకు ఇష్టమైన కథ ఏదో నేను చెప్పలేను. నాకు ఇష్టంలేని ఒకటి రెండు కథలు మాత్రం ఉన్నాయి . మాస్టర్ పీస్ అంటారు కదా అలా ఈ మధ్య చాలామంది 'శప్త భూమి' ఈ రచయిత మాస్టర్ పీస్ అంటున్నారు. కానీ నాకు ఒక శిల్ప కారుడు గా ఎక్కువ సంతృప్తినిచ్చిన నవల "రెండు కలల దేశం" అని చెబుతుంటాను.
7. కథా,నవలా రచనలో రచయితగా ఎక్కడ మీరు స్వేచ్ఛను అనుభవిస్తారు?
నా స్నేహితుడు గురువు అయిన దేవపుత్ర ఒక మాట అంటుండేవారు" కథ తాడు మీద నడవడం లాంటిది. నవల విశాలమైన మైదానంలో అరబ్బు గుర్రం మీద స్వారీ చేయడం లాంటిది" అని. నవల రాయడం కంటే కథ రాయడం కష్టం భౌద్ధిక శ్రమ ఎక్కువ. కథలో లోతు ఉంటుంది. నవలలో విస్తృతి ఉంటుంది. కథలో వ్యక్తీకరించలేని సిద్ధాంతాలు భావజాలం నవలలో ఒక విశాలమైన కాన్వాస్ మీద వ్యక్తీకరించడానికి అవకాశం ఉంటుంది.కథా ప్రత్యేకత కథ ది. నవల ప్రత్యేకత నవలది.ఈ రెండు రుచులలో ఏది సంతోష పెడుతుంది అంటే దానికి కూడా జవాబు చెప్పడం కుదరదు.
8. ప్రస్తుత రాయలసీమ అస్తిత్వవాద రచయితలకు మీరిచ్చే సూచనలు ఏమిటి?
"జీవితంలో కలం అద్ది రాయి"అంటాడు చలం. జీవితం అంటే ఏమిటి భౌతిక జీవితంలో కులం, వర్గం, భాష, ప్రాంతం, జెండర్ ఈ అస్తిత్వాలన్నీ కలిసి ఉంటాయి. జీవితంలో కలం అద్ది రాయడమంటే ఈ అస్తిత్వాలతో నిర్మించబడిన జీవితాన్ని వ్యక్తీకరించడమే. ఈ విధంగా రాయలసీమ లో ఒక రైతుబిడ్డగా పుట్టినందుకు రాయలసీమే నా సాహిత్య వస్తువు అయింది. రాయలసీమలోని వర్షాభావం, కరువులు, వలసలు, అప్పులు,ఆత్మహత్యలు, రైతులు ఇతర రాష్ట్రాలకు పోయి యాచకులుగా మారడం, కరువులో పుట్టిన పిల్లలను అమ్ముకోవడం, ఇటువంటి దుర్భర విషయాలు రాయలసీమ రచయితలకు సాహిత్య వస్తువులుగా మారుతాయి. తెలంగాణ విడిపోయిన తర్వాత కథారచనలో వస్తు పరంగా పెద్ద మార్పు వచ్చింది.నూరు సంవత్సరాల రాయలసీమ కథ ఒకచోటికి వచ్చి ఆగిపోతే , 2014 నుంచి రాయల సీమ కథ కొత్త మలుపు తీసుకుంది. రాయలసీమ కథా వస్తువులకు 2014 నుంచి చారిత్రక జ్ఞానం అబ్బింది. రాయలసీమ వందేళ్ళ కథ, జీవితం ఇట్లా ఉంది అని రాయలసీమ జీవితాన్ని చిత్రీకరిస్తే, 2014 నుంచి మొదలైన కథ జీవితం ఇట్ల ఎందుకు ఉంది అనే చారిత్రక జ్ఞానం తో కొత్త పుంతలు తొక్కింది.జీవితం ఇట్లా ఉంది, జీవితం ఇట్ల ఎందుకుంది,జీవితం ఏమి చేస్తే బాగుంటుంది, అనే ఈ మూడు సాహిత్య సూత్రాలను ప్రాంతానికి అన్వయిస్తే
- రాయలసీమ ప్రాంతం ఇట్లుంది.
- రాయలసీమ ప్రాంతం ఇట్లా ఎందుకు ఉంది.
- రాయలసీమ ప్రాంతం ఏమి చేస్తే బాగుంటుంది.
అనే ఈ మూడు సాహిత్య సూత్రాలు రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వ రచనలను బలోపేతం చేస్తాయని భావిస్తాను.
9. బహుజన సాహితీవేత్తలు తమ కలాలను ఎలా పదును పెట్టుకోవాలి ?
బహుజనులు మొదటగా తమ కుల అస్తిత్వాన్ని గుర్తించాలి. కులం తో ముడిపడిన వృత్తిని గుర్తిం చాలి. ఆ వృత్తి తో ముడిపడిన సంస్కృతిని గుర్తించాలి. చరిత్రలో తన కులం యొక్క సామాజిక అస్తిత్వాన్ని గుర్తించాలి. అంటే తన కులం యొక్క చరిత్రను, భాషను, సంస్కృతిని, ఆర్థిక స్థాయిని అవగాహన చేసుకుని వివిధ పార్శ్వాలలో తనకులపు శ్రమ జీవితాన్ని చిత్రించ వలెను. " He may born in Church,but don't die in church "అని ఇంగ్లీషులో ఒక ప్రోవేర్బ్ వుంది. కాబట్టి కులంలో పుట్టిన రచయిత కులంలోనే మిగిలిపోకుండా ఇతర శ్రామిక కులాల లోకి ప్రయాణించి ఒక ఉమ్మడి శ్రామిక భావనను సృష్టించే ప్రయత్నం కూడా అవసరం.ఇది శ్రామిక కులాల రాజ్యాధికారానికి ఒక ఓటు బ్యాంకుగా ఐక్యం అవుతుంది, అనడంలో సందేహం లేదు. ఈ చారిత్రక అవసరం కోసం బహుజన రచయితలు కృషి చేస్తారని ఆశిస్తా..
10. శప్తభూమి రచనకు నేపథ్యం ఏమిటి
శప్తభూమి రచన ఈ రచయిత చేసింది కాదు. ఈ రచయిత చేత రాయలసీమ రాయించింది. రచయిత ఆకాశం నుండి ఊడి పడడు. సామాజిక సందర్భాలే ఏది రాయాలో రచయితను శాసిస్తాయి. తెలంగాణ పోరాట నేపథ్యంలో రాయలసీమ అస్తిత్వం ప్రశ్నార్థకమైన సమయంలో రాయలసీమను సాంస్కృతికంగా చారిత్రకంగా సామాజికంగా రాజకీయంగా ఇతర ప్రాంతాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో శప్త భూమి నవల రాయడం జరిగింది. ఈ రచయిత రాయలసీమలో పుట్టి ఉండకపోతే ఈ ప్రాంతీయ అస్తిత్వ నవల రాసే వాడు కాడు అని మాత్రం చెప్పగలను.
11. యువ రచయితలకు మీరిచ్చే సూచనలు ఏమిటి?
ఈ రచయిత ఎదుగుతున్న క్రమంలో చాలా విషయాలు, పెద్ద వారి ముఖతః విని నేర్చుకున్నాడు. ఇస్మాయిల్ గారు, సుదర్శనం గారి వంటి మహానుభావుల సమక్షంలో ఇతడు ఒక సాహిత్య సంస్కారాన్ని అలవర్చుకున్నాడు. ప్రస్తుతం గూగుల్ గురువైన ఈ ప్రపంచంలో సమాచారమే జ్ఞానం కాదని, సమాచారాన్ని విశ్లేషించడం రచనకు అవసరమని ఇప్పటి ఆధునిక యువ రచయితలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఆడతనం
ముల్లీలగ్గారి కిట్టమ్మతో ఒచ్చిన బెడద ఏందంటే . . . ఆ పాపను ఎబ్బుడూ 'కిట్టమ్మా!' అనే పిలల్ల, ఇబ్బుడు... అనమగారి కట్టిగోడు ఉండాడు. ఉండాడా ! వానికి 'డామోడు' అని మారు పేరు ఉండాది. వాని 'ఒరే డామిగా!' అని పిలచ్చు. మా రెడ్డి గోడే ఉంటాడు. వానికి మెల్లకన్ను ఉండాది. వాని 'ఏంర్యా గుడ్లో డా!' అని పిలచ్చు. ఇంగ వంకలో రామన్నగారి నరిసిమ్ములు ఉండాడు. వాడు ఉత్తారెడ్డి గారి ఎనుం మాదిరి నల్ల...గ ఉంటాడు. వాని 'ఒరే మసోడా!' అని పిలచ్చు. ఆడోల్లనే తీసుకున్యా రెడ్డెమ్మత్త ఉండాది. ఆయమ్మను గుడా మారు పేర్తో ' మ్మోవ్ ! పంగనామాల పతివర్తా...!' అని పిలిసి, ఆయమ్మ “ఉండు నా బట్టా" అని సుట్టింట్లోకి బొయ్యి, పరక్కట్ట ఎత్తకచ్చే లోపల ఎగిసి గెంతేసి ఆ పక్కన్యాడా పత్తా ల్యాకుండా ఉరకచ్చు.
కిట్టమ్మ సంగతి అట్లగాదే. కిట్టమ్మకు పెద్ద సొట్టేందీ లేదు. అట్లని ఆ పాప పెద్ద అందగత్తీ గాదు. పిలకెంటికులు, బుడిగి దూడ మాదిరి సద్ది మగము, పిల్లి మాదిరి దొంగ కండ్లు ఆ పాపను జూస్తే గిచ్చబుద్దీ, గిల్లబుద్దీ ఐతుందేగిని అదేపనిగా చూడబుద్ది గాదు. అందువల్ల కట్టమ్మకు మారు పేరేందీ కుదర్లా. పోన్లే 'కిట్టమ్మా!' అని పిలుస్టాంలే అంటే ఆ పాప నాకంటే పెద్దదీ గాదు. నాకంటే రొండు మూడేండ్లు చిన్నదైపాయ. ఐనా ఊరికే సప్ప...గ కిట్టమ్మా! అని పిలిస్తే ఏమంత బాగుంటుంది. నోటి ఉలవరమూ తీరదు. న్యాలికి జిల గూడా తగ్గదు.
ఈ మజ్య కిట్టమ్మ కొంచిము మార్తాంది. ఆ పాప రెయిక్క జాం చెట్టు అందాలు ఒస్తాండాయి. ఇబ్బుడిబ్బుడే అవి దాలిమ్మర చెట్టు అందాలుగా మారి పాతాండాయి. అందుకేనేమో ఆ పాపను చూసినబ్బుడంతా ఇంగా చూడల్లనీ, ఆ పాపకు ఆనుకోని కుచ్చోవల్లని అనిపిస్తోంది.
ఒగనాపొద్దు పొలికిమాని కింద ఇసకలో కండ్లే మూసాట ఆడతాండాము. నేనే దొంగోని. నా కండ్లకు రూంచెం గూడా కనపడకండా గెట్టిగా టువ్వాల గట్టినారు. అందురూ దాంకోని ఉండారు. కొందురు ముక్కు గిల్లి, నేను చేతులు జాంపి పట్టుకునే లోగా దొరక్కండా పూజాపలే కట్టు జారిపా తాండారు. కొందురు చెవి నులిపి, కొందురు జుట్టు పీకి, కొందురు ముడ్డిమీద తన్ని ఉరకతాండారు. నేను గ్యాల్లోనే చేతులు పుటుకుతా “ ఆ...మ్ , ఆ...మ్ "అంటా ఒగరన్నా దొరక్కపోతారా! అని ఎతక తాండా.. రూంచేపులుకు నా రొండు స్యాతలకు ఏంటివో రౌండు సల్లగ, మెత్తగ తగిల్న్యాయి. ఎవురిదో నిట్టూర్పు. అబ్బ...! ఎచ్చగ తగిలింది.
“ఏం రాగము సీనా నీకూ..." అన్యారు ఎవురో, ఎవురో గాదు, అది కట్టమ్మ గొంతే. “ అవునూ...కిట్టమ్మ అట్లాటలో లేదు గదా! ఇబ్బుడెట్టొచ్చిందబ్బా...?" అనుకుంటా టువ్వాల పీకేసి చూసినా. ఇంగేముండాది. దాలిమ్మర చెట్టు! అదే కిట్టమ్మ, దాలిమ్మర కాపంతా నా రొండు స్యాతల్లో ఉండాది. నాకుమాతరము జడుపు ఎత్తుకున్యాది. చేసింది గబ్బుపని గదా! ఎగిరిపడి, గబుక్కున కవైప్పలెత్తి, పుటుకు పుటుకుమని పులకరిచ్చి చూస్తే కిట్టమ్మ తలకాయి మింద ప్యాడతట్టి, రొండు స్యాతలో దాని పట్టుకోని దిగులుగా కిట్టమ్మ. వాల్లమ్మ గాన కొట్టిందేమో!
“ఆఁ ఏంల్యా. ఏంల్యా. మేము గుడ్యాట ఆడుకుంటాండాము" అనేసి ఉరికెత్తినా, అగ్గిరామన్న గారి ఇంటి మొటుకులేకి పొయ్యి ఎనిక్కి తిరిగి చూస్తే కిట్టమ్మ నగతా నగతా పాతాండాది పేడకాల్ల తట్టెత్తుకోని దిబ్బకల్ల. ఆ పాప ఎందుకు నగతాందో నాకర్తం గాలా.
ఒగనాడు నేను, డామోడు బోడెన్నగారి ఇంటి ముందర కంజు మింద కుచ్చోండాము. కంజంటే అది మావూరు బడికి చుట్టూరా కట్టిండే రాతికంజు. “ఒరేయ్ మాండ్లోల్ల సీనా!" అని ఆ ఈది కొన్నుంచి ఒగ ఇనసొంపైన పిలుపు ఇనొచ్చింది. ఆ పక్క తిరిగి జూస్తే ఆ ఈది సివర కొండకిందోల్ల ఎంగటేసు గారి ఆడబిడ్లు రొండు ఉండాయిలే. అవి వాల్ల మేకలే కట్టు కర్రీ....గ ఉన్యా చూసేదానికి రూంత మినమినా తనతనా అంటాంటాయిలే. దాండ్లలో చిన్నది ప్రేమి ఉందే! దాని పిలుపది. “ఏమ్మే కొవ్వా!" అన్యా, ఆ కర్రి ప్రేమి ఒయ్యారంగా ఒగ నగువు నగి పొడువు పాపన్నగారి ఇంటి దొడ్లోకి పరిగెత్తింది. మా అట్లాటల్లో మేం బన్యాము. అది మల్లా ఈదిలేకి ఒచ్చి 'రేయ్" అన్యాది. “ఏమ్మే పొసరమా!" అన్యా. అదిమల్లా పాపన్నగారి దొడ్లోకి పరిగెత్తింది. ఈ సారి మల్లా ఈదిలేకి ఒచ్చి “రేయ్" అనింది. ఈ గబ్బుదాంతో మనకేంపన్లే అని నేను చూల్లా.
అది ఈసారి “ ఒరేయ్ చూర్రా ! " అని అరిసింది. ఆ పక్క తిరిగి చూస్తే ఇంగేముంది . ఆది ఊర గొండ కల్ల మల్లుకోని కుంచిలిగుడ్డ పైకికి మాకు ముడ్డి చూపిస్తా. కాల్ల మజ్యలో నుండి మమ్మల్ను తొంగిచూస్తా, న్యాలికితో అల్లాడా...ల్యా ! అవ్వావ్వా...వ్యా ! అని ఎక్కిరిస్తా , నగతా ఉంది .. దాని కర్రి ముడ్డి చూసేలకో బొగ్గిలి కాన్నించి తన్నకచ్చింది వాంతి . " తుపూ " అని గెట్టిగ ఉంచినా. అది మల్లా కిలకిలానగతా పాపన్నగారి దొడ్లోకి పరిగెత్తింది.
ఈ సారి మల్లా “ రేయ్ అనింది. తిరిగి చూస్తే మల్లా అదే చూపడం. కానీ ఈ సారి చూపిస్తాండేది ప్రేమి గాదు. వాల్లక్క, మల్లా “తువూ" అన్యా గినీ ఆ తుఫూలోనే నగువు గుడా కలిసింది. ఇంగ అదోగ తమాసా ఐపొయ్యింది. ఒగసారి చిన్నది. ఒగసారి పెద్దది. ఒచ్చేది. కుంచిలి ఎత్తేది, ముడ్డి చూపిచ్చేది అయోల్లో...ల్యా ! అవ్వావ్వా...వ్యా ! అని ఎక్కిరిచ్చేది. నగేది, ఉరికేది. ఇంగ నేనూ, డామోడు జూడు పడిపడి, నగి నగి సహిందాము. ఇట్ల మేం నగతా ఉంటే ఏందబ్బా అని కిట్టమ్మ ఆడికి ఒచ్చి చూసింది. చూస్, " తుపూ గబ్బు లంజలు. చూపిచ్చే దాండ్లకైనా సిగ్గుండల్ల. చూసే వాల్లకైనా సిగ్గుండల్ల " అనేసి ఎల్లిపాయ . కిట్టమ్మకు వాల్లిద్దురు దగ్గరి బందుగులు. చెల్లిలు వరస. ఇంతలో యాన్నుంచి ఒచ్చిందోగిని ఆ పిల్లముండ్ల వాల్లమ్మ మల్లమ్మత్త ఒచ్చి జులుకు బర్ర తీసుకోని "తుపూ నా సొయితుల్లాలా!" అని చెరు రొండు పీకులు పీకింది. అవి రొండూ అల్లల్ల...మని ముడ్డు గీక్కుంటా ఇంట్లోకి పరిగెత్య. అది జూసి మేము పకపక నగతా ఉంటే మల్లమ్మత్త “తుఫూ నా బట్టకున్నల్లారా ! అవంటే పిల్లముండ్లు. అవి సిగ్గిడిని పెట్టి ముడ్డు సూపిస్తా ఉంటే మీరు తమాసా జూస్తాండారా! ఉన్నండి" అని జులుకుబర్ర ఎతుకోని మారెమ్మ ఒచ్చినట్లు వస్తోంది. ఇంగజూడు నేను, డామోడు మా ఈదిలేకి ఉరుకో ఉరుకు.
ఒగనాపొద్దు కిట్టమ్మ వాల్లింటి పంచలో ఎందుకో బండి మక్కిరి బోర్లిచ్చినారు. దాని లోపలనే కిట్టమ్మ ఉంది. “ ఒరే...! " అని ఆశ్రీకం పడి దగ్గిరికి బొయ్యినా. లోపల ఒరిగెడేసి , దాని మింద కానగాళులు పరిసి, దాండ్లమింద దుప్పటి గప్పుకొని ఏం కేలీ ఇలాసంగా ఉందో కిట్టమ్మ.
“ ఐ...నేనూ వస్తా. లోపలికీ..." అని అడుక్కున్యా. “ చీ . . . మగోల్లు రాగూడదు " అనింది కిట్టమ్మ, “ అబ్బా అట్లాడుకునేదానికి ఎవురైతే ఏమి " అని అన్యా. ఇంతలో లచ్చుమత్త ఇంట్లో నుంచి సంగటి బోకి ఎత్తుకోని బచ్చల్లోకి బోతా నా యవ్వారం జూసింది.
" తుపూ . . . గబ్బు నా బట్టా ! ఎదిగి బయటపడిండే ఆడబిడ్డ మక్కిర్లోకి పొయ్యి అట్లాడతావా ? తాలు . పరక్కట్ట తెస్తా " అని గబుక్కున ఇంట్లేకి పొయ్యింది. నా కెందుకో బయమేసింది. ఉరికితీ . . . మా యింటికి. అమ్మ సద్ద సంగటి చేసేసి , తెద్దిగ తీసుకోని కూరటకలో పుల్లగూర ఎనుపుతా . . . ఉండ్య . నేను గెస పెడతా పరిగెత్తి పొయ్యింది జూసి, “ ఏం నాయినా అట్లోస్తాండావు ? " అనింది అమ్మ.
“ చూడుమా ! నేను అట్లాడుకుండేదాని కోసము కిట్టమ్మ దగ్గరికి పాతాంటే ముల్లీలగారి లచ్చు మత్త తరుముకుంటాంది " అంటి. “ ఎందుకూ . . . ? " అనింది అమ్మ.
“ ఎందుకో ఆ పాప ఎదిగి బయట పడిందంట " అంటి.
“ అట్లనా ! అయితే వాల్లింటికల్ల పావద్దు నాయినా ! " అనింది అమ్మ గుడా.
“ ఏమ్మా ! ఎదిగిందంటే ఏందిమ్మా ! అంటి. “ ఓరి నీయమ్మ నా కొడకా ! అది గుడా తెల్గా, ఎదిగిందటే సమర్తయిందని అర్థం ".
“ సమర్తయిందా ? అట్లంటే ఏందిమా ! " అంటి.
“ ఓరి తిక్కల్నా కొడకా . అంటే రజస్తల అయిందనిరా ! " అనింది. “ అంటే . . . ” “ పుస్పవతి అయిందని " “
అబ్బ ! సంపితివి గదమ్మా ! నీ మాట్లు ఒగటన్నా అర్ధమయి సస్తాండాయా ? " అంటి.
“ అంటే ఆ పాప పెద్దమనిషి అయిందని అర్తంరా " “ అబ్బ ! ఏమబద్దాలు చెప్పుతావుమా ! ఆపాప ఏలుడంత గుడా లేదు పెద్దమనిషి ఎట్లయిపోతుందిమా ! అంటి . “ అ . . . బ్బ నీ కెట్ల చెప్పల్నో నా కర్తం గాలా. పోరా ! " అనింది అమ్మ.
ఊర్లో కొంతమందే తిక్కలోల్లు అనుకున్యా. అమ్మగుడా తిక్కట్టే అనుకోని ఎదిమ్ము మింద సూపు డేల్లతో పలకేకట్టు “ జగ్గునాం, నింగునాం " ఆని దరువేసుకుంటా ఎగురుకుంటా ఎక్కన్నో ఎల్లిపోతి.
ఒగా నొగనాడు కిట్టమ్మ మా ఇంటికల్ల ఒచ్చింది. బోడిమామ వాల్లింటి సూరు పట్టుకోని ఏలాడి నట్టు ఉండాది. మాయక్క సందులో బోకులు తోమతాంది. నేను దొడ్లోకి రాంగనే కిట్టమ్మ ఒల్లంతా కూడగట్టుకొని మెల్లిగ " స్సీ . . . నా ! " అని పిలిసింది. నేను అక్కడా ఇక్కడా చూసి “ య్యే . . . మి " అన్యా . “ పచ్చారిమాని కిందికి పోదాం రా చెప్పుతా ” అనింది. ఇద్దరం ఒంకలో పచ్చారిమాని కిందికి పొయ్యి దాని చల్లని నీడలో ఇసకలో కుచ్చున్యాం.
ఇంగజెప్పు అన్యా “ ఏం ల్యా . నాకోగ మాడికాయి ఈవా ! " అనింది. “ ఇబ్బుల్లేవ్ . మల్ల తోపుకాడికి బోతా పీక్కస్తాలే ” అన్యా. కిట్టమ్మ ఇంగా మాటల్లోకి దింపతాంది. రూంచేపు ఆమాట ఈమాటా మాట్లాడి “ నీకొగటి తెల్సా ! " అనింది “ ఏందది " అన్యా . కిట్టమ్మకు అంత పెద్ద మాట్లు ఎవురు నేర్పిచ్చినారో గినీ “నీకు సర్గం తెల్సా!" అనింది. “ఓ తెల్సు" అన్యా. “యాడ జూసినావ్" అనింది. అదే కాలవపల్లి సాయిబులు ఈడియో ఏస్తారే దాంట్లో యందరమరాజు సిమ్మాసనమ్మీద కుచ్చోంటాడు. ఒగపక్క గండు మీసాలోల్లు కొంతమందిని కొరడాలో కొడతాంటారు. ఇంగోపక్క తంతాంటారు. ఇంగోపక్కకొంతమందిని రంపాలో కోస్తాంటారు . . . " అంటాండా.
అంతలోనే కిట్టమ్మ " తుపూ సరగమంటే అదికాదు . అది నరకం " అనింది . “ ఇంగ సరగమంటే ఏంది ? " అని అడిగినా. “ మా వారపాకులేకి పదాం పా చూపిస్తా " అన్యాది. “ కిట్టమ్మోల్ల వారపాకులేకి ఎన్నో సార్లు పొయ్యినా. ఆడ ఎద్దల గ్యాడి, ఒగపక్క అరుగు, దానిమింద బండి మక్కిరి , పైన ఉలవ పొట్టు బోసుకుండే అటవ తప్ప సరగమనేది యాడా కనపల్లేదే. ఇబ్బుడు యాన్నుంచి చూపిస్తుంది బా ! ఈ పాప " అని మనుసులో అనుకుంటానే ఆ పాప ఎనకాల పొయ్యినా . ఆ పాప వారపాకు దగ్గరికి పిల్పకపొయ్యి , సిన్నగ బందిరి తడక తీసింది. లోపలికి పొయ్యినాము. నా రబ్బసానికి తడక కిర్రు మన్యాది. ఆ పాప “ ఇస్స్ . . . . " అంటా బాలీబక్కల ఏసిండే బండిమిక్కిర్లేకి పొయ్యింది.
నేను పాకుండా దిక్కుల్గిక్కులు చూస్తాంటే “ ర్రా . . . " అన్యాది . నేను “ యాడుందిబ్బా ! సరగం ” అనుకుంటా దిక్కులు జూస్తా మక్కిర్లేకి బొయ్యినా . ఆ పాప మక్కిర్లో ఎల్లెలకల పండుకున్యాది. నేను “ య్యేదీ సరగం అన్యా ".
" పండుకో ! చూపిస్తా " అన్యాది.
నేను “ ఇంగా యాడుంది ఈ గబ్బు సరగం " అనుకుంటా, అక్కడా ఇక్కడా చూస్తా పండుకున్యా . బండి మక్కిర్లో జాగా తక్కవ గదా ! ఇద్దురం అనుకోని ఆనుకోని ఉండాము.
“ య్యే . . . . దీ " అన్యా. ఆ పాప రోండు స్యాతల్లో నా కుడి చెయ్యి తీసుకోని మింద బెట్టుకుంటాంది . నేనేమో “ ఈ సరగము యాడుందో ఏమో " అని కండ్లింతింత జేసుకోని గ్యాట్లేకి ఒంగి ఒంగి చూసినా . బండి మక్కిరి మూలల్లోకి తొంగి తొంగి జూసినా. కనపల్లా. “ పైన అటవలో ఉందేమో " అని అర్రు సాంచి, మెడకాయి పైకెత్తి చూసినా . ఊహూ . . . . లాబం లేదు.
కిట్టమ్మ నాకు తెలకుండానే నా చెయ్యి నలపతా ఏందో చేస్తా ఉంది . నేను ఈ సారి “ వారపాకు పైన యాడన్నా ఉందేమో " అని పైన కనబడతాండే , వాసాలు , బాదెన్నులు , సాలీడు బూజులు, చూస్తా ఉండా. “ ఇంగా కనపలేదా ! " అన్యాది. నా కేమో కనపడి సావ్లా. ఇంగా కనపలేదంటే ఈ గొనవదాని దగ్గిర అలుసైపోతానని “ ఆఁ . . . కనపడింది . కనపడింది " అంటా కిందికి చూసినా . కిట్టమ్మ పావడా రూంత వైదొలిగి నున్న . . . గ మినకొడతా మాకాల్లదంకా కనబడతాంది . “ తుపూ . . . నీ కుంచిలి పైకి లేసి పొయ్యింది . సరింగా ఏసుకో " అన్యా.
కిట్టమ్మ బిత్తర పొయ్యింది. మగం పాలిపొయ్యింది. గబుక్కున కండ్లు ఎర్రబడి ఇంతింత అయి పొయ్యినాయి. ఎల్లమ్మసామే కట్టు కోపంగా గుడ్లురిమి చూసి, బుసకొడతా “ లై . . . య్ రా ! " అన్యాది. ఇంతకు ముందెబ్బుడూ ఆ పాప నన్ను ఒరే తరే అన్లా. బయిపడిపొయ్యి లేసి నిలబన్యా . కానీ సరగం కనపడలేదు గదా ! చూపిస్తుందేమో అని బయిపడతా, బయిపడతా కొంచెం సేపు నిలబడి జాలిగా ఆ పాప కండ్లల్లేకి జూసినా. ఈ సారి ఇంకొంచెం మరియాద పెంచి “ ర్యా . . . య్ ! ప్పో . . . రా ! " అన్యాది. ఈ పాపకు దమ్మే పట్టిందో, గంగంమ్మే ఒల్లుకొచ్చిందో అని జడుసుకోని బందిరి తడక తీసి ఎనిక్కి తిరిగి చూడకుండా ఉరికెత్తినా. .
కిట్టమ్మతో యవ్వారం అట్లయినంక ఇంగ ఆ పాపతో మాట్లాడేది గాని, అట్లాడేది గాని, ఏమీ పెట్టుకోలా.
నీను సౌడసంద్రంలో ఆరో తరగతి చదివేసి , ఇంగా ఏడు, ఎన్మిది , తొమ్మిది, పది గుడా చదివేసి మదనపల్లిలో ఇంట్రమింట్లో చేరినా. అబ్బున్నుండి మనె విలు పెరిగిపోయిందిలే. ఒగసారి సంకు రాతిరి సెలవల్లో మా ఊరికిపొయ్యి, మంగడుక్కోని ఈదిలేకి పొయ్యినా.
కిట్టమ్మోల్ల ఇంటికాడ పంది లేసి, దాని మింద కానగాకులు, టెంకాయికితలు కప్పి, గుంజలకు సున్నం, ఎర్రమన్ను చార్లు చార్లు పూసినారు. ఇంగేముంది కిట్టమ్మ పెండ్లి ఐపోయింది. కిట్టమోల్ల బజారు బండ మింది అందురూ పెండ్లి మాటలే చెప్పుకుంటాండారు. కిట్టమ్మ మొగుడు వాల్ల కడప్మాన్లో మెటికిలుమింద కుచ్చోని ఎవురితోనో తమాస బడతాండాడు. నేను ఆటికి పొయ్యినబ్బుడే ఆ పాప ఇంట్లో నుంచి ఒచ్చింది. కిట్టమ్మ మొగుడు స్యానా మంచోడంట. వాయనది అన్నగారిపల్లి.
కిట్టమ్మ నన్ను కంతారక లేకండా చూసింది. నా పుల్లమీసం కల్లా, పిల్లిగడ్డం కల్లా ఎగతాలిగా చూసింది. ఎంటనే ఆ పాప మొగుని గుబురు గడ్డం కల్లా, కోరమీసం కల్లా గర్వంగా చూసింది. చూసింది గమ్మునుండకుండా ఎవురుకీ తెలకుండా, నాకు మటుకే తెలిసేటిగా కనైప్ప లెగరేసింది. ఏందోలే ఆ పాప పాకలు. నేను ఓడిపోయినట్లు. ఆయమ్మ గెలిసినట్లు.
నాకు సిగ్గయింది. పిసకరాన్చోట యాన్నో మిరక్కాయి పిసికినట్లైంది. “ ఈ గబ్బుదాని మొగుడు ఎట్లుంటే నాకేమి. నేనేమన్నా దీని చేసుకుంటానని చెప్పినానా ? అయినా నేను చేసుకోబోయ్యేది యట్లుండల్లని. యా ఇజయశాంతో, రాదా మాదిరో ఉండల్ల. కనీసం సుహాసినీ , రమ్యక్రిస్న కట్టు ఉన్యా పరవాల్యా.
అయినా మాకు ఎకనామిక్సు చెప్పే రుసీందరబాబు , ప్రకాసు సారోల్లకు ముప్పైయ్యారు , ముప్పైయ్యేడేండ్లు అయింటాయి. ఇయ్యారవ వరకు వాల్లకే పెండ్లిండ్లుల్యా, గిండ్లిండ్లుల్యా. నాకు అబ్బుడే పెండ్లింది. ఎవురికన్నా చెప్పితే . . . లతో నగుతారు " అనుకుంటి.
కిట్టమ్మ మొగున్తో న్యాస్తం జేసుకోని, వాయనా నేనూ ఇద్దరం గలిసి మెలికులు మింద కుచ్చోని కిటమ , ఆటబడితిమి. కిటమ్మను రూంచేపు ఏడిపిచ్చి, రూంచేపు నగపిచ్చి ఇంటికెలిపోతి . .
ఇంగోసారి దశారా సెలవలు ఒచ్చినాయి. ఊరికి బొయ్యినా. మావిటేల అట్లా బజార్లోకి బోతి. కిట్టమ్మోల్ల ఈదిబండ మింద పిల్లనాయాండ్లంతా తమాసా బడతాండ్రి. నేనూ బోయ్యి కుచ్చుంటి. కిట్టమ్మ పుట్టింటికి ఒచ్చింది. పగులంతా చేండ్లో దొంగగా కడుపు నిక్క మేసిండే దొంగావే కట్టు ఇట్లా అట్లా పొనుగుతా కిట్టమ్మ సిన్నగ దొడ్లో కదల్తాంది.
కిట్టమ్మను చూసి నాకు అర్సోజ్యమైపాయ. " ఆడోల్లకు కడుపొస్తే లావుయితారు గిని. ఇదేందబ్బా ఈ కిట్టమ్మ ఇంత లావయింది. అనుకుంటి. “ ఆ కనైప్పల మింద ఎర్ర . . . గ ఆ పొడలేంది. ఆ చెక్కులు ఆ పకుర్తుము పైకెక్కి పోవడమేంది ! ఆ గదగలు ఒగొగటి జాను జాను కిందికి దిగజారి పోడమేంది ! ఆ రొమ్ముకట్టు అట్ల రెయికి పట్టకండా మిడిమ్యాలంగా నిక్కబొడుచు కోడమేంది ! అ . . . బ్బ ! చూసే దానికి గాలా. ఓర్నాయినో అందుకేరా ఆడదంటే ఆది సెక్తి అంటారు " అనుకోని ఇంటికెల్లిపోతి.
మల్లా మజ్యలో ఒగనాడు బియ్యమైపోతే తెచ్చుకుందామని మదనపల్లి నుండి ఇంటికి బోతి. కిట్టమ్మోల్ల బజారుబండ మింద, పోలుమాను కాడ, బడి మెటికులు మింద జానాలు గుంపులు గుంపులుగా ఉండారు. కొందురు ఏందో గుట్టుగా మాట్లాడతాండారు. ఇంకొందురు “ ఆ పాపకు దేవుడు ఆటికి రాసినాల్లేరా ఇసి పెట్టండి " అంటాండారు. నాకేందో ఇచ్చింతరంగా అయితాంది. బెరుక్బెరుగ్గానే పొయ్యు కిట్ట ల్ల బండమింద గుచ్చుంటి. ఆడ చెప్పుకుంటాండేదంతా ఇంటాంటే ఎంత ఉగ్గబట్టుకున్యా గుండికాయి తల్లడిల్లిపోతాంది. మనుసు మరిగిపాతాంది. వాల్లు చెప్పుకున్ని దాంట్లో సారమేందంటే . . . .
కిట్టమ్మ కడుపొచ్చి కాగూడనంత లావయిపొయ్యిందంట. అట్ల ఇపరీతంగా లావు కాగూడదంట. ఇంగా అందురి కండ్లు బడి జిప్ తగిలిందంట. అందుకే కిట్టమ్మకు దనుర్వాత మొచ్చిందంట. పురుడుకు పుట్టింటి కొచ్చిన కిట్టమ్మ నట్టింట్లో మల్లాడతా మల్లాడతా ఉండి ఉన్నట్లుండి కండ్లు తిరిగి న్యాల పడిపొయ్యిదంట. కిట్టమ్మ పడిపాతానే ఎవురో అన్నగారిపల్లికి పరిగెత్తా బొయ్యి చెప్పితే కిట్టమ్మ మొగుడు ఒచ్చినాడంట. ఇంగా దగ్గిరి దగ్గరి బందుగులంతా ఒచ్చినారంట. ఎందుకొచ్చినా ఇంగా ఎవురో రావల్ల, నేను కడసారి చూపు చూడల్లన్యట్లు కిట్టమ్మ వాగిట్లోకల్ల చూస్తానే ఉందంట. చూసి . చూసి . . చూసి . . . కన్ను కొలకల్లో నుంచి నిండా పొంగిన కన్నీల్లు నిజా . . . నంగా ఒగ తొటుకు కార్చి పానాలిడిసిందంట. కిట్టమ్మ కండ్లు మాతరము గౌడిచెరువులో కలుంపూలే కట్టు ఇంతింత రెప్పలు తెరుసుకొని ఎవురి కోసమో గినీ కడపమాన్లో కల్ల ఎదురు చూస్తా . . . నే ఉండాయంట !
ప్రతిక్షణం
ఏకాంతాన్ని ఇష్టపడు...
అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది..
కాలం తో స్నేహం చేయి
ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది..
భవిషత్తుకి గమ్యం చూపిస్తుంది...
నీ ప్రయత్నంలో నమ్మకం ఉంచు... విజయాన్ని సాదిస్తుంది
ప్రకృతికి దగ్గరగా... ఒక ప్రయాణం!
దూరంలో పెదవాగు గట్టుపైన కొన్ని పక్షులు. పెద్ద ఆకారంలో గల శరీరం, రెక్కల పరిమాణం,పొడవాటి ముక్కు మరియు ఆకాశంలో ఎక్కువ ఎత్తులో నుంచి నేలమీద పక్షులు మరియు జంతువులు కనిపెట్టగల గుంపులుగా ఉన్నాయి.కళేభారాన్ని ముక్కుతోటి పొడుచుకుంటూ తింటున్నాయి.నీరు తాగడానికి పెద్దవాగులో వస్తున్నాయి. మధ్యలో ఆకాశానికి రివ్వున ఎగురుతున్నాయి ఆ పక్షులు. అవి "రాబందులు"అని గుర్తుపట్టాను.
వాటిని నేను చిన్నప్పుడు చూశాను. పొలంలోకి గుంపులుగా వచ్చేవి.మళ్ళీ ఇప్పుడు అంతరించి పోతున్న అరుదైన పక్షి జాతి అనవాలు ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ , నందిగామ పాలరాపు గుట్టలు దగ్గర కనిపించింది.
తెలంగాణ రాష్ట్రంలోని "ఆసిఫాబాద్- కుం రం భీం జిల్లా" అటవీశాఖ ఆధ్వర్యంలో "బర్డ్ వాక్ ఫెస్టివల్"ను డిసెంబర్ 14,15 తేదీలు 2019వ కాగజ్‌నగర్ ,పెంచికల్ పెట్,బెజ్జూర్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
కాగజ్ నగర్ కోసిని, సిర్పూర్ (టి )మాలిని గుట్టలు,బెజ్జూరు పాలరాపు గుట్టలు,మెర్లిగూడ అటవీప్రాంతం మరియు ఆసిఫాబాద్ అడ "కుం రం భీం ప్రాజెక్టు" బర్డ్ వాక్ ఫెస్టివల్" సందర్శనం ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ మొదలు ఔత్సాహికులైన నూటయాభై మంది పాల్గొన్నారు. పక్షుల ప్రేమికులకు, ప్రకృతి ప్రేమికులకు ఈ అడవిలో గల పక్షుల జాతులను గుర్తించి ఫోటోగ్రఫీ, డాక్యుమెంటరీ రూపోందించడానికి, బయట ప్రపంచానికి పరిచయం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది.
నేను ప్రకటన చూడగానే అటవీ శాఖవారికి ఫోన్ చేశాను. వివరాలు నమోదు చేసుకున్నాను. పత్రికా ప్రకటన చాలా మందికి ఫేస్బుక్, వాట్సాప్ పంపడం జరిగింది .కొంతమంది రావడానికి ఆసక్తి కనబరిచారు.
నాకు"బర్డ్ వాక్ ఫెస్టివల్" ప్రోగ్రాం మీద ఆసక్తిగా వెళ్ళడానికి బలమైన కారణాలు అమ్మ నాన్న చెప్పిన సంగతులన్నీ యాదికొచ్చాయి.
చిన్నప్పుడు నాన్న చదివించిన పద్యం ,దాని భావం గుర్తుండిపోయాయి.
"అంజన గందీ, సౌరభం వ్యాపింపచేసేది చేసేది పుష్కలంగా ఆహారం ప్రసాదించేది. కృషి చేయకనే ఫలమిచ్చే శక్తి కలిగినది. మృగాలకు తల్లి అయినఅరణ్య దేవికి మొక్కుతున్నాను."
నా చిన్నతనంలో ఊర్విశకలు గూనపెంకల ఇంట్ల సందుల్ల గూళ్ళు కట్టుకొని ఉండేవి.కంచలా అన్నం ఏసుకుని కూసుంటె చుట్టూ కిచు కిచుమని ముద్దు ముద్దుగా తిరిగేవి. ఊర్విశకలు చూర్ల కింద నివాసం ఏర్పరుచుకుని గుడ్లను పెట్టిపొదిగి పిల్లలు చేసేవని నాన్న చెబుతుంటె నాకదంతా కోల్పోయిన బాధ ఒకటి గుండెను తొలిచింది.
కొన్ని రకాల పిచ్చుకలు ఇప్పుడు కాంక్రీటు ఇంటిలో వస్తుంటాయి.గూళ్ళు పెట్టడానికి శాయశక్తులా కృషి చేస్తాయి.కానీ వాతావరణం వేడిగా ఉండటంతో జాగ దొరుకకా అనూకూలం ప్రదేశం కోసం వెళ్ళిపోతాయి.
ఒకసారి ఇంటిలో పిచ్చుక నేను చూడగానే ఎగిరింది.ఫ్యాన్ రెక్కలు తగిలి మెడ తెగి దూరం పడింది.అప్పుడు నా కన్నీళ్ళ ఆగలేదు.
అది నన్ను వెంటాడుతునే ఉంది.
నా చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడూ ముప్పై కోళ్లు ఉండేవి. పుంజులు, పెట్టలు అన్నీ కలిపి ఓ ముప్పై పైనే ఉండేవి. మా అమ్మ వాటికి నూకలు వేసి ప్రేమగా పెంచేది.ఎర్రకోడి పుంజు, తెల్లకోడి పెట్ట అని వాటి రంగుల్ని బట్టి వాటి గురించి నేను అమ్మ మాట్లాడుకునేవాళ్ళం.
కోడిపెట్ట రోజుకో గుడ్డు పెట్టేది. పొద్దున్న లేచి కోళ్ల గంపని ఎత్తగానే కోళ్ళన్నీ 'కోకొకొ' అని ఒక్కసారిగా ఎగిరిపోయేవి. గంప కింద కోడిపెట్ట గుడ్డు పెట్టిందా లేదా అని ప్రతిరోజూ ఆసక్తిగా చూసేవాడిని. ఆ గుడ్లన్నీ మా అమ్మకి ఇచ్ఛేవాడిని. కోళ్లకు,పుంజుల కాళ్ళకు రంగులు పూసేది.మా అమ్మ వాటిపై 1, 2, 3 అని అంకెలు వేసేది. కొన్ని గుడ్లని నాకు పొరటు చేసి పెట్టేది. కొన్ని గుడ్లని కోడి పొదగడానికి దాచిపెట్టేది. కోడి పొదిగేటప్పుడు దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. గంపకింద వరిగడ్డి వాసన వేసేది.బడి మధ్యాహ్నం సమయంలో భోజనం వచ్చి వాటిని చూస్తూ పొదిగిన గుడ్లను లెక్కలేసుకుని మరీ వెళ్ళెవాణ్ణి . కొన్ని సార్లు అయితే స్కూలు ఎగ్గోట్టెటోణ్ణి.
కోడిపెట్ట పొదిగాక చిన్న చిన్న కోడి పిల్లలు గుడ్ల నుండి బయటకు వచ్చేవి. వాటిని తొలిసారిగా చూడటం, ముద్దుగా చేతిలో ఆడటం, వాటికి కోడి గింజలు తినడం నేర్పించడం, వాటిని రెక్కల కింద దాచిపెట్టడం, వాటిని కాపాడటానికి కుక్కలతో, పిల్లులతో యుద్ధం చేయడం ఇదంతా ఎంతో ఆసక్తిగా ఉండేది. నా కళ్ళ ముందే కొన్ని కోడి పిల్లల్ని పిల్లులూ కుక్కలూ తినేసేవి. కొన్ని జబ్బు చేసి చనిపోయేవి. వాటిని చూసి ఏడ్చేవాడిని. చివరకు కొన్ని మిగిలేవి. పెరిగి పెద్దవయి గర్వంగా మా ఇంట్లో మనుషుల్లా తిరిగేవి.
రామచిలుకను పంజరంలో బంధించి,జ్యోతిష్యుడు వాడ వాడ తిరిగి జ్యోతిష్యం చెబుతుంటె, ఆసక్తిగా రామచిలుక చిట్టిపొట్టి మాటలను వినడానికి వెళ్ళి ఆనందం పొందేవాడిని.
రామచిలుకలు కూడా ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కడా కనబడటం లేదు.
ఆ విధంగా పక్షులతో నా అనుబంధం పెరిగింది.నా లాంటి వాడికి ఇది మంచి అనుభవం.
వారం రోజుల ముందుగానే అటవీ శాఖ జారీచేసిన షరతులతో పాల్గోనడానికి తయారు అయినాను.
ట్రావెలింగ్ బాగ్, ట్రెక్కింగ్ షూ,కాయిల్,చద్దర్లు,పలుచని రెండు జతల డ్రెస్ మరియు టీ షర్ట్ అంతా సిద్దంగా ఉన్నాను.
మేము మంచిర్యాల నుంచి రూపక్ రొనాల్డ్ , సంతోష్ పడాల మరియు హైదరాబాద్ నుంచి విజయ్, హేమంత్ ఒక గ్రూపులో ఉండాలని నమోదు చేసుకున్నాం.
మంచిర్యాల నుంచి పొద్దున్నే ఐదు గంటలకు డిసెంబర్ పద్నాలగవ తేదీ కాగజ్ నగర్ అటవీ శాఖ-పెంచికల్ పేటకు ప్రయాణమయ్యాం. హైదరాబాద్ మిత్రులు కాగజ్ నగర్ కు రైల్ మార్గం ద్వారా చేరుకున్నారు. దారిలో వారిని ఆత్మీయంగా పలకరించుకున్నాం.
కాగజ్ నగర్ నుండి పెంచికల్ పేట్ ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉంది.రోడ్డు మార్గం సరిగా లేని కారణంగా కారు ప్రయాణం నెమ్మదిగానే వెళ్ళడం వల్ల అరగంట ఆలస్యంగా చేరుకున్నాం.
షెడ్యూల్ ప్రకారం ఆరుగంటలకు బ్రృందంతో కలిసి రేగుచెట్టు మడుగు వెళ్లి పక్షులు సందర్శనచేయాలి. మేం చేరుకున్న విషయం పర్యవేక్షాణాధికారికి తెలియజేయడానికి ఫోన్ అడవిలో కలవలేదు.గోస పడ్డాం.
ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి?ఆలోచన రాకముందే "ఎలూరు చెరువు" వైపుకి కారుని దారిని మళ్లించాడు-సంతోష్ పడాల.
పెంచికల్ పేట మండలంలోని "ఏలూరు చెరువు "చాలా సువిశాలమైనది మరియు అవతలి వైపు కొండలకు వరకు అనుకుని ఉంది.ఐదుతరాల చెరువులాగా ఉంది. దిగువన ఉన్న భూములకు ధాన్యం రాశి పంచేది.రైతన్నలా జీవితాలకు భరోసా ఇచ్చేదిగా ఉంది.వివిధ రకాలైన పక్షులకు విడిదిగా ఉంది.చెరువులో నీటి పక్షులు గుంపులు జట్టిలు, రణగొణ ధ్వని.ఒక తెల్లని కొంగు ఒడ్డున ఒక ఎత్తైన చెట్టు మీద కొమ్మపైన కూర్చుని ఆటలాడుతుంది.మాలో కొంతమంది చెరువును,చెరువులో వాలిన అందమైన రకరకాల పక్షులను క్లిక్ చేసారు.
చెరువు దగ్గర ఇద్దరు మహిళలు అటవీ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
వారు మాకు పక్షులు గుంపులుగా ఉండే ప్రదేశాన్ని చూపారు.మేమంతా కెమేరాలతో అటువైపు కదిలాం.
మా దగ్గరికి జీపులో అధికారి వచ్చారు. పెంచికల్ పేట పర్యవేక్షణ అధికారి వేణుగోపాల్ సాట్లకి మా మిత్రులను పరిచయం చేశాను .
అడవి లాగా విశాల ద్రృష్టి ఉన్నవాడు.
అడవిని ఇంచుమాత్రం వదలకుండా ,ఆకలింపు చేసుకున్నవాడు.అనుక్షణం అడవి గురించే ఆలోచిస్తాడు.
ఏలూరు చెరువు దగ్గర మరికొద్దిసేపట్లో
ఫిసిసిఎఫ్ శోభ గారూ,ఐ.ఎఫ్. స్ రంజిత్ నాయక్ మరియు ఇతర అటవీ అధికారులు బర్డ్ వాక్ కార్యక్రమంలో భాగంగా మీటింగ్ ఇక్కడే ఉందని చెప్పాడు.
దగ్గరలోని "లోవ "గ్రామం వెళ్ళమని సూచించారు. హైదరాబాద్ నుంచి ఇంకొంతమంది కలిశారు .అందరం కలిసి లోవ్వ దారి వైపు అడుగులు వేశాం.
ఎక్కడ చూసిన మట్టిరోడ్లు ,గొండు మరియు కోయ గ్రామాలను దాటుకుంటూ అగర్ గూడ వైపు వెళ్ళి దారి పక్కన వాహనాలను ఆపాం.
రెండు కిలోమీటర్ల దూరంలో "లోవ్వ" ఉందని స్థానికులు చెప్పారు.
అడవి ఆరంభమైంది.కీకారణ్యం . రోడ్డు మలుపులో పెద్దబోర్డు దానిమీద పరుగెత్తుతున్న జింక పిల్ల బోమ్మ "అభయారణ్యం వన్యమృగ సందర్శనం చూసి ఆనందించండి"అని పెద్ద బోర్డు రాసి ఉంది.
కాలినడకన చీమల్లాగ ఒకరెనుక ఒకరు వరుసగా పత్తిచేన్లు , పంటపొలాలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళినాము.
వయ్యారంగా పాములెక్క సుడులు తిరుగుతూన్న వాగు కళ్ళకు కనిపించింది.
వాగు పేరు "పెద్దవాగు" . చుట్టూ అందమైన అడవిలో పారే వాగు.
అవతలి తీరాన దిగంతం దాకా వ్యాప్తమైన అరణ్యాలు, ఆసిఫాబాద్ జిల్లాలోని అరణ్యాలు ఆకుపచ్చని కాన్వాస్ అయ్యాయి.నగరాలతో ఏమాత్రం సంబంధం లేని కనుచూపు మేరలో వ్యాపించిన అడివి.
పెద్దవాగు దాటుతున్న వేళ చిన్నప్పుడు వాగులో సోపతిగాళ్లతో ఈతకొట్టింది అనుభూతి యాదికొచ్చింది.
పెద్దవాగు పెద్దమ్మలా అక్కున చేర్చుకుంది. ఇసుక దిబ్బలో కాళ్ళను తడుముతూ పాలనురగల నీటిని దోసిళ్ళతో చేతుల్లో తీసుకుని ఒకరిమీద ఒకరు పరాశికంగా నీళ్లు చల్లుకుంటూ ఉంటె కరకర కాగే ఎండలో ఎంతో గమ్మతే.చెలిమలో నీళ్ళని దోసిట్లో తాగాను.ఒడ్డున కొంచెం సేపు కూర్చున్నాం.పెదవాగు ఇసుక తిన్నెలు పైన ఆవు అడుగుపెట్టింది.నీళ్ళకోసం రెండు కాళ్ళు వాగులో దించి త్రృప్తిగా నీరు తాగుతోంది.
పెదవాగును చూస్తుంటె కడుపు నిండా కవిత్వం మనసు నిండా కమ్మని పాట జలధారలా...
"వాగు వాగు సిగలోనా అందమైన అడవి
పాట పాడు పాయలోనా కొండ కోన అడవి
ఇసుక తిన్నెల గూళ్లు పక్కనే అదివాసుల ఇళ్ళు
పక్షుల కూతల సాళ్ళు ప్రపంచాన వెలసిన నాగరికత అనవాళ్ళు"
మనసు పలక మీద అక్షరాలు రాసుకున్నాను.
పెద్దవాగు దాటాం.అడవి తీరు చల్లని నీడ నిచ్చే చెట్లు లాగా అక్కున అలైబలాయ్ ఇచ్చి అలుముకున్నారు.
"లోవ్వ "మరియు లోహ అటవీగ్రామాన్ని ఆదిమ కోయజాతి గ్రామాన్ని ఐదుతరాల చరిత్ర ఉన్న మట్టి మనుషులను కలిశాం. డెబ్బై మందికి మించి ఉండరు.
పూరిపాకలు, ముంగిట్లో బురద ,మురికి, పశువులు.రెబ్బెన అటవీ పరిధిలోకి వస్తుంది.ఎనిమిది వందల హెక్టార్లలో అటవీ వీస్తీర్ణం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని అతి దట్టమైన అడవిగా గుర్తింపు పొందిన ప్రాంతం.
వేసవికాలంలో అతిశీతల ప్రదేశం మరియు చలికాలంలో గజగజ వణికే మంచు కప్పుకుంటుంది.మూడు వందల అరవై దినాలు నీరు పుష్కలంగా ఉండటంతో దుప్పులు, కొండ గొర్రెలు, కోతులు మరియు ఆసిఫాబాద్( ఎ1),కడంబా(కె6) పులులు సంచరిస్తాయి.
గుట్టల మీద నుంచి పారే నీటిలో ఐరన్ ధాతువు చాయలచూపించారు.ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.లోవ ప్రజలు అటవీ ఉత్పత్తులు, వ్యవసాయం మీద ఆధారపడిన కోయజాతులు.అడవి తీరు మాత్రం ఎక్కడో మొదలయ్యి ఎక్కడో అంతమయ్యే అరణ్యంగా సిద్ధపరిచిన యుద్దరంగంలా సాక్షాత్కరిస్తుంది.ఈ ప్రాంతంలో ఊటనీరు ఎక్కువగా ఉండడం వల్ల జీవన వైవిధ్యం ఉంటుందని చదివాను.ఊట నీరుతోనే పంటలు పండిస్తారు.
పక్షుల కిలకిల రావాలు, అరణ్యం భాష మనసుకి హత్తుకునేలా ఉంది.అరుదైన పక్షులను జాడ వెతుకే క్రమంలో "బ్లాక్ డొంగ్రో"కనిపించింది.ఇది అరుదైన పక్షి జాతిగా గుర్తింపు పొందింది.ఎంతటి గాఢ ప్రశాంతతో,ఎంత అద్భుతమైన ఏకాంతం.ఎనిమిది గంటలకు తక్కువేం కాదు మొదటిరోజు అడవిలో గడిపాం.పక్షుల చప్పుడు, గలగల ఎండుటాకులతో మాట్లాడే అవకాశం దొరికింది.
ఇంకా పక్షులు చూడటానికి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అడవిలో ఈశాన్య దిశలో నడుస్తూ "కళ్ళను చెవులుగా ,చెవులను కళ్ళుగా మార్చుకుని ముందు సాగుతున్నాం.
పాలపిట్టలు శుభాలకు, విజయాలకు చిహ్నం. దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తే అనుకున్నవి జరుగుతాయనీ మొక్కుతారు. మన ఆచారాలూ, సంస్కృతి మరియు సంప్రదాయాలో పాలపిట్టకు ప్రత్యేక స్థానం ఉంది.
దీన్ని దసరా రోజున చూడడానికి
పురాణంలో చాల సిరియస్ పిట్ట కథే ఉంది.
పాండవులు అరణ్య, అజ్ఞాతవాసం వీడి ముగించుకుని తిరిగి వస్తుండగా పాలపిట్ట కనిపించిందట అందుకే విజయాలు కల్గియాని జానపదుల నమ్మకం. అప్పటినుంచి దసరా పండుగ రోజు మగవారు అడవులకెళ్ళి పాలపిట్టను చూసివచ్చె ఆచారం మొదలైంది.
ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక,బీహార్ మరియు ఒడిస్సా రాష్ట్రాల్లో మొక్కుతారు. పాలపిట్టను దసరా పండగ సమయంలో కొంతమంది పంజరంలో చూపించి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొంతమంది పాలపిట్టలను కొని వాటిని ఊరిలోగాని పొలాల మధ్యలో వదిలేస్తారు.పల్లెటూరిలో అక్కడక్కడా మెరుస్తున్నాయి.
కానీ సిటిలో కనబడటం లేదు.
మా నాన్నతో సింగరేణి మైన్ మీదికి వెళ్ళినపుడు ఒక పంజరంలో "స్కేర్లీ బ్రీస్టెడ్ మైనా" పక్షిని ఉంచి మైన్ లోపల ఒక పొడవైన పొల్ ఉంచేవారు.పక్షి కాన్సియస్నెస్ కోల్పోతే ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉందని భావించేవారు.అది అప్పుడు గాస్ టెస్టింగ్ బర్డని అర్థమైంది.
మాతో పాటు గుడిసె వొదిలి, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ చేతిలో ఈటెను మార్చుకుంటూ మాకంటె ముందుగా నడుస్తున్నాడు ఆరడుగుల ఉన్న ఆరవై ఏళ్ల పైబడిన ముసలివాడు పుల్లయ్య.
అడవంతా కలియతిరుగుతున్నాడు.
చేమ,వాగు,వంక ,రెమ్మలు,కోమ్మలు ,ఆకులు మరియు జంతు జీవాలుసందేశం ఇస్తాయి. అడవిలో చెట్లు అతనికి గల ఆనందోత్సాహాలతో ఇతరులకు కూడ ప్రేరేపించే విధంగా ఉంది .వనంలో వారి చలనం చూడముచ్చటగా ఉంది. కనులు మూసి తెరిచెంతలో చాలా దూరం వెళ్ళగలరు.
చూస్తుండగానే ఎంతో సమీపానికి రాగలరు.
అందరికీ ఒక "పుల్లతీగ" తినమని ఇచ్చాడు.నేను దాన్ని నోట్లో వేసుకుని కర్ర కర్ర నమిలాను చాలా తియ్యగా ఉంది.ఇది ఔషధ గుణాలు మొక్కని చెప్పాడు.అడవిలో నెమళ్ళు, పావురాలకు కొదువలేదు.
తుమ్మకోమ్మలకు జిలుగు బంగారు రంగులో గడ్డిపోచలను తెచ్చి
పడకటిళ్ళు రచించి మానవులు సాద్యం కానీ పాన్పు తయారు చేసుకోనగా గాలి ఊయల ఊపుతుంటె హాయిగా నిద్రపోతున్న "గిజిగాళ్ళు"దారిలో పోతావుంటె అందమైన దృశ్యంలా అనేకం తారసపడ్డాయి.
అటవీశాఖ అధికారులు ముందు మేమంతా వెనక నడుచుకుంటూ వారు చెప్పేది ప్రతి ఒక్కటీ వింటూ... తెలియనిది అడిగినా వాళ్లు ఓపిగ్గా సమాధానం చెబుతున్నారు.
లోహ బుడగ అడవిలో అరుదైన వృక్షాలను రేలా (క్యాష్ ఫిస్టుల) "నల్లమద్ది" దేవాలయాలకు ధ్వజస్తంభం ఉపయోగించే చెట్టు గురించి చెప్పారు.వివిధ జిల్లాల నుంచి ఇదివరకు దేవుడి ధ్వజస్తంభం కోసం చాలా అప్లికేషన్లు వచ్చాయి.వాటిని పరీశీలించి ఎక్కడైనా చెట్లు పడిపోతే వాటిని అందజేస్తాం..అంటూ ఆ వివరాలు చెప్పుకొచ్చారు.
యువ రాజకీయ స్పోక్ పర్సన్ క్రిషాంక్ పక్షుల సందర్శనంలో భాగస్వామ్యం అయినాడు.
ఆంధ్రజ్యోతి పేపర్ మండల ఇంచార్జ్ నారా తిరుపతి అడవిలో మాతో పాటు తిరుగుతూ కొత్త సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు.
నలభై ఎనిమిది సంవత్సరాల సన్నగా చలాకిగా ఉన్న శంకరయ్య అడవిలో ఒక్కోక్క చెట్టు గురించి వివరంగా చెబుతున్నాడు పులుపు తీపి కలిసిన పరికిపండ్ల పండేరోజులవి. చెట్టు మీద నుంచి ఒడుపుగా దులిపి కొన్ని పండ్లు ఒక్కొక్కరికి తినమని ఇచ్చాడు. పరికిపండ్ల మీద జర్రున " కర్రె ఎద్దు ముట్ట పోతే ఎర్రెద్దు పొడవబట్టె" అడవికి సంబంధించిన సాత్రం వదిలిండు. మమ్మల్ని కడుపుబ్బా నవ్వించాడు.
కేవలం అరణ్యప్రాంతమే కాదు. ఎన్ని తరహా మనుషులను చూశానో జ్ఞాపకం వచ్చింది.
"బర్డ్ వాక్" ఫెస్టివల్ లో భాగంగా అడవి ప్రాంతాల్లో సుమారు రెండు వందల నలభై ఎనిమిది రకాల పక్షి జాతులు ఉన్నాయని "కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్ బుక్లెట్ "చూపించారు.
చెట్ల కిందనే పొయ్యి పెట్టి,గంజులు బియ్యం ,పప్పులు ,ఉప్పులు చికెన్ "పెంచికల్‌పేట" మండల కేంద్రం నుంచి తీసుకొచ్చారు. అటవీశాఖ అధికారులు దగ్గరుండి రుచికరమైన భోజనం వండించారు .
అడవిలో కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టిన వారికి మనసుల అభినందనలు చెప్పుకున్నాను. రోజు తినే భోజనం కన్నా ఆరోగ్యానికి బలవంతమైన పోషక విలువలు ఆహారం దొరికిందని సంబర పడ్డాం.ఏ ఫారెస్ట్ ఆఫీసులో అయినా చేయి తిరిగిన వంటచేసే మనుషులుంటారని నాకర్థమైంది. ఒకప్పుడు విన్నాను.ఇప్పుడు స్వయంగా చూశాను.
అడవి అందరిని ఒకే గొడుగుకింద కలిపింది.జీవన సరళి, బతుకుదెరువు కోసం వారు చేసే కఠోర శ్రమ ,వారి జీవన శ్రమ కష్టంగా ఉంది.
మైదానవాసుల జీవన విధానానికి, అరణ్య వాసుల జీవన విధానానికి స్పష్టమైన తేడా ఉంది . ఒళ్లంతా హూనమయే కష్టానికి తోడు అడివి పందులు వంటివి పంట నాశనం చేయడం ఒక పక్క ,సర్పాలతో పెద్ద పుల్ల వంటివి క్రూర మృగాలతో సహజీవనం మరోపక్క గిరిజనులను ప్రమాదం అంచున నిలబెట్టింది.
అంతటి దుర్భర దారిద్ర్యంలో కూడా జీవితాన్ని గురించి వారు ఒక వేదాంత తత్వం అలవరుచుకుంటారు. దీనివల్ల,ఎక్కడా ఎన్నడూ ఆశాకిరణం చొరబడనివీలుకాని అర్ధిక దుస్థితిలో ఉన్న దానితోనే సరిపెట్టుకుని సద్వినియోగం శక్తి కూడ వారికి అలవడి ,కష్టాలు దారిద్ర్యమూ ఆరని ఆకలిమంటలు కూడా వారినంత బాధించవు . ఒక గొప్ప పోరాటపటిమను కొత్త శక్తిని ఎప్పటికప్పుడు అడవి ఇస్తూనే ఉంటుంది. జీవించే శక్తి పోరాడే శక్తి నిరంతరం ఇస్తూ ఉండటం అడవికే సాధ్యమేమో!?
లోవ గ్రామ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను "మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని తినే పెద్దపులి ఒకటి తిరుగుతుందో తెలుసా? మనుషులు తినే పెద్దపులి అంటే చాలా ప్రమాదం. దానికి రోషం ఎక్కువ గుడిసె ముందు మంట వేసుకొండి.వేసుకుని గుడిసే లోపల పడుకోండి. అడవి బాగా దగ్గరలో ఉంది.నిన్న గాక మొన్ననే మేకను పులి చంపి తిన్నది ఇంటి దగ్గరలోనే."
"ఇవన్నీ మాకు అలవాటైపోయింది" అని ఒకామె బదులిచ్చింది.
లోవ అడవి పక్షులకు నివాస స్థానం అని ముందే చెప్పారు. అక్కడ ఎన్ని రకాల పక్షులో.. లెక్కేలేదు. పిచ్చుకలు పాలపిట్టలు, కపోతాలు, పెద్ద ముక్కు కొంగలు,ఎర్రముక్కు హంసలు, గద్దలు,డేగలు, కొంగలు, నీటి బాతులు మొదలైనవి తోపులోన పెద్ద చెట్లు చిటారు కొమ్మల్లోనా , నీటి ఒడ్డున నీళ్లను సంచరించే అనేక రకాలున్నాయి.
చిరాకెత్తించెలా గోల చేస్తున్నాయి .
ఉల్లాసభరితమైన వాటి కూజితాలకూ చెవులు చిల్లులు పడుతున్నాయి. అవి మనిషి ఉనికిని గమనించవు .నేను చూస్తూనే ఉన్నాను నా చుట్టూ నాలుగు పక్కల రెండు, రెండున్నర అడుగుల కొమ్మ మీద ఊగులాడుతూ కిచకిచమంటున్నాయి. నా వైపు చూస్తూ పక్షులు పిట్టలు నిర్భయంగా సమీపంలో సంచరించడం ఎంతో ఆనందంగా ఉంది. లేచి కూర్చుని చూసాను భయం లేదు.
నేటి కాలంలో ప్రకృతి ఆరాధకులు అరుదు కారు. ప్రకృతిమాత పవిత్ర ప్రాంగణం మీదికి నానాటికి విజ్రృంభించి వస్తున్న ఆధునిక నాగరికత మూలంగా చెట్లు, పుట్టలు ,అడవులు, ఆరుబయలు కొండలు, గుట్టలు,పక్షులు నిగూఢ అంతరాలలో జలజలా ప్రవహించే సెలయేళ్లు ,నదులు దీనితో సన్నిహిత సహచర్యం నేడు మనకు కరువైంది.
పెద్ద పెద్ద నగరాల్లోని ఊపిరాడని వాతావరణం నుంచి విడివిడి బయటపడాలనే ఆరాటం వల్ల,మనకు ప్రకృతి అంత ఆకర్షణీయం మౌతుంది. భూములు కొన్ని వరదలో మునిగి పోవడం వల్ల అక్కడి జనం వేరు నివాస ప్రాంతాలు ఏర్పరుచుకున్నారు. ఆ గ్రామం కూడా స్థానిక ద్వారా ఈ విషయం తెలుసుకున్న మార్గం మధ్యలో గిరిజనులకు కిలో పత్తి ఏరితే ఆరు రూపాయలు కూలీ దొరకటం "అరచేతిలో స్వర్గం దొరికేంతగా సంబరపడె పేదల బాధలు చూసి మనసు కుత కుత లాడింది."ఈనాటికి వ్యాపారుల చేతుల్లో గిరిజనులు ఉత్పత్తులు తక్కువ ధరకు అమ్ముకుని దోపిడీకి గురవుతున్నారు. పెదవాగు అరణ్యం దాటిన తర్వాత ఏడు మైలు పెంచికల్పేట్ క్షేత్రం వచ్చాము. సాయంత్రం సుమారు ఏడు ఏడు గంటలకు చేరుకున్నాము.
పొద్దున్న ఆరుగంటలకు నందిగామ పాలరాపు గుట్టలకు చూడడానికి ప్రయాణం అయ్యాము.
దారిపొడుగునా అంతటా కొండలు గుట్టలు మైదానాలు మధ్యమధ్య అడవులు మార్గాన్ని రెండు పక్కల నుంచి వేస్తూ కొంతదూరం ఇస్తూ ఈ విధంగా ఉంది. పగటివేళ ఒక తీరుగా ఉంది .వెన్నెల వచ్చిన తర్వాత ఏదో తెలియని అద్భుత సౌందర్యం. సౌందర్యభరితమైన అజ్ఞాత దేవలోకంలో వెడుతున్నామా! అనిపించింది.
పోతూ పోతూ మార్గమధ్యలో "రేగు చెట్టు మడుగు " .
జీప్ అపి కొంతసేపు అక్కడ అ వాతావరణం చూసి ఆనందించాం. పెద్దవాగులో రాత్రి "నెగడు మంట" పెట్టారు. చుట్టూ ఆటలు ఆడుతూ,
పాటలు పాడుతూ గడిపారు. పెద్దపులిని దగ్గరగా చూసామని చెప్పారు. చరవాణిలో తీసిన పులి అడుగులనుచూపించారు. అమ్మో ....అని నా పక్కనున్న యువతి భయపడింది.
జీపు కదిలింది.అద్దంలో -మట్టిరోడ్డు, రాళ్ళు, చెట్లు వలయాలువలయాలుగ వెనుకబడిపోతున్నాయి.ఎవరి మీదనైనా పులి దాడి చేస్తే ఆ వ్యక్తిని దేవుడిగా పూజిస్తారు .మరియు గుడి కడతారు. అదిగదిగో అదే ముసలమ్మ గుట్ట చూడండి.అక్కడ ఏలాంటి నావిగేషన్ పరికరాలు పని చేయదు. కొండల్లో దారీ!దారిలో ఎక్కడా మనుషులుండరు. పులులు తిరిగే చోటని అధికారి చెప్పాడు.
నందిగామ గ్రామం చేరుకున్నం. ప్రాణహిత పెద్దవాగు ఒకే దగ్గర కలిసి చోట దట్టమైన అరణ్యంలో పాలరాపు గుట్ట ఉంది. ఆ గుట్ట కన్నెత్తి చూడగా కొంతదూరం వెళ్ళేసరికి ఆ దారి దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది . రెండు పక్కల బాగా ఎత్తైన ఇసుక ఒడ్డు పెద్దగా నీటిలోతు దిగితే గానీ నీటి అంచు తగలదు .వెడల్పైన ఇసుక ఎండకి ఎండకి కళకళలాడుతుంది .అవతలి తీరాన మహారణ్యం ఈనాడు ఉంది .వాగులోనే మొక్కజొన్న పంటలను పండిస్తున్నారు .
లోవ పాలరాపు గుట్టనీ కలిపేది .పెదవాగు,ప్రాణహిత నదులూ గోదావరికి తోబుట్టువులుగా ఉన్నాయి.
సుమారుగా వాగు మధ్యలో కిలో మీటరు నడిస్తే పాలరాపు గుట్ట చేరుతాం.పెదవాగు ప్రాణహితలో కలుస్తుంది.రెండు నదులు గోదావరి గంగమ్మ తల్లి ముద్దాడుతాయి.
ప్రాణహిత అటువైపు గ్రామాలు ఉన్నాయి.
గోదావరి లోయ
ప్రాణహిత పాయ
ప్రక్రృతి దోయ
పక్షులకు కూయ
అదివాసుల కిరిటం నాగరికత చాయ
ప్రాణహిత అలల మీద పాలరాపుగుట్ట
జీవధార కనుల చూడ మెరిసే పూలబుట్ట
నెమలికిరిటమైన నెలవంక హారం పూసే మెట్ట
ఇప్పటికి నాటు పడవల మీద ప్రయాణమే శరణ్యం.
నాలుగు రోజుల క్రితం డ్యూటీలో నది దాటుతుంటె ఇద్దరు కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు మృత్యవాత పడడం చాల బాధనిపించింది.
ప్రతి శీతాకాలంలో దేశ విదేశాల నుండి వివిధ ప్రాంతాలలో అరుదైన పక్షులు వస్తున్నాయి ఇటీవల అముల్ పాల్కన్ పక్షి ఆడ, మగ రెండు కలిసి వచ్చాయి. చైనా రష్యా దేశాల నుంచి దక్షిణ ఆఫ్రికా మీదుగా వలస వెళ్లేటప్పుడు ఇండియన్ దాటే సమయంలో బెజ్జూర్ లోని మత్తడి వాగు స్ప్రింగ్ ఆనకట్ట ప్రాంతాల్లో ఈ పక్షులు అటవీ అధికారుల కంట పడ్డాయి. ఈ పక్షి రెండు నెలల్లో లక్ష కిలోమీటర్లు తిరుగుతాయి.
చిన్నప్పుడు రాబందులు గుంపులు గుంపులుగా పంట పొలాలకు వచ్చేటివి. నేను గట్లమీద వెళ్తున్నపుడు ఆవుల మృతకళేబరాల మీద వాలి మాంసం తినేవి. మళ్ళీ కొన్ని ఏండ్లు అవుతుంది. వాటి జాడ కనిపించడం లేదు. అంతరించే దశలో ఉన్నాయి .
బెజ్జూర్ మండలం లోని నందిగామ గ్రామం "పాలరాపు గుట్టల్లో" రాబందులకు నివసించడానికి అనుకూలంగాఈ ప్రాంతం ఉంది.స్థానికంగా రాబందులను "రాగపంతా " అని కోయలు అంటారు.
ఇటీవల అటవీశాఖ అధికారుల బృందం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా డివిజన్ బెజ్జూర్ మండలం ,నందిగామ గ్రామం లో( లాంగ్ బెల్డ్ వల్చర్/ ఇండియన్ వల్చర్ (gyps indicus) గుర్తించారు.
ఆవరణ వ్యవస్థలో రాబందుల పాత్ర ఎంతో కీలకమైంది. ఇవి ప్రాకృతిక విచ్ఛిన్నకారులు గా పేరొందాయి. ఈ భూ ప్రపంచంలో మృతదేహాలను ఖననం చేయడానికి ఒక మనుషులు మాత్రమే చేస్తారు. ఏ ఇతర జీవి కూడా ఖననాన్ని ఒక ప్రక్రియగా చేపట్టలేదు. మానవేతర మృతదేహాలను ప్రకృతి లోనే ఇలా వదిలివేయబడతాయి.ఇలా వదిలివేయబడిన మృతకళేబరాలను కుళ్లిపోక ముందే వాటిని రాబందులు ఆహారంగా స్వీకరించి ప్రకృతి నుంచి తొలగించే పారిశుద్ధ పనిచేస్తాయి. ఒకవేళ ఆ పనిని సక్రమంగా జరగనట్లయితే కళేబరాలు కుళ్లిపోయి బ్యాక్టీరియా వైరస్ నెలవుగా మారి కలరా , ఆంత్రాక్స్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ సలీం మాటల్లో చెప్పాలంటే "రాబందులు దేవుడు సృష్టించిన ప్రాకృతిక విచ్చిన్నకారులు(incinators) భవిష్యత్తులో అధునాతన యంత్రం వీటి స్థానాన్ని భర్తీ చేయలేదు. ఇంతటి శక్తి కలిగిన రాబందుల మనుగడ ప్రమాదంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అంతరించి పోవడానికి ప్రధాన కారణం పశువుల జబ్బులు నయం చేయడానికి వాడే నొప్పి నివారిణి డైక్లోఫెనాక్ ఔషధం పశువులకు విరివిగా వాడడం వల్ల జరుగుతుంది . పశువులు చనిపోతే వాటికి ఈ మందు అవశేషాలు మిగిలి ఉంటే సందర్భంగా ఆహారం మృత్యువాత పడుతున్నాయి.ఈ ఔషధ మందును 2006లో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీని స్థానంలో " మోలాక్సికమ్" సూచించారు.
కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర ,హిమాచల్ ప్రదేశ్ మరియు అస్సాంలో మాత్రమే రాబందులు ఉన్నాయని గణాంకాలు చెబుతోంది .
పశ్చిమ బెంగాల్ లో రాజా అస్సాంలో రాణి వద్ద సంరక్షణ ఉత్పత్తి కేంద్రాలు అంతరించిపోతున్న రాబందులు తెలంగాణ రాష్ట్రంలో కనిపించడం శుభపరిణామమే.
బెజ్జూర్ అడవుల్లో రాబందులు ముప్ఫై వరకు పాలరాపు గుట్టలో గుహ ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. కదలికలు ఆహారపు అలవాట్లు ప్రత్యుత్పత్తి మొదలైన అంశాలకు సంబంధించి అటవీశాఖ అధ్యయనం జరుగుతుందని అధికారి చెప్పారు . కొండపల్లిలో వృక్షశిలాజాల అవశేషాలు సుమారు ఆరువేల కోట్ల సంవత్సరాల కిందటి "కొనిఫర్"జాతికి చెందినవి ఉన్నాయి.మంచిర్యాల వేమన్న ప ల్లిలో కూడా ఉన్నాయి. వీటిని ఇదివరకు చూశాను .
"ఫాసిల్ వుడ్"పార్క్ మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రతిపాదన ఉంది.
రాబందులను మూడవసారి చూసే అవకాశం నాకు కలిగింది .యాభై మంది వివిధ రంగాలకు చెందిన వారితో ఈ యాత్ర మరిచిపోలేనిది.
బెజ్జూర్ అడవుల్లో రాబందులు ముప్ఫై వరకు పాలరాపు గుట్టలో గుహ ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి.2013 సంవత్సరాలో
అప్పటి అటవీ శాఖ రేంజ్ అధికారి రామ్మోహన్ గారూ రాబందులు ఉన్నాయని గుర్తించారు.
ప్రొఫెసర్ అంజలి పాండే,జెన్‌టియు భరత్ సింహం,బయోలజిస్టు , అగ్రికల్చర్ ప్రొఫెసర్, ఫారెస్ట్ కాలేజీ స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో కలిశాం.
రెండు రోజుల పాటు జరిగిన" బర్డ్ వాక్ ఫెస్టివల్"పక్షుల జాతులు ,జీవన విధానం మరియు వాతావరణం అనుకూలత వివరించారు.
ఈ అడవిలో రెండు వందల నలభై ఎనిమిది రకాలు పక్షి జాతులు రికార్డు చేశాం. అందులో అరవై ఒకటి జాతులు కామన్(సి) అసాధారణమైనవి(యుసి) అరవై ఐదు, సీజనల్ అరుదైనవి ఇరవై ఐదు రకాలు, వెరీ రేర్ ఇరవై ఐదు జాతులు, అరవై ఏడు రకాల నీటి పక్షులు, పది పక్షి జాతులు టెర్రిస్టిరియల్,నూట ముప్పయి అరొబియర్ పక్షుజాతులు మరియు పదిరకాల ఎరియల్ బర్డ్స్ ,రాప్ట్రస్ ఉన్నాయని గణాంకాలు చెప్పారు.
పర్యావరణ వ్యవస్థలో పక్షుల పాత్ర ఎంతో కీలకమైంది .
ముఖ్యంగా పరాగసంపర్కం విత్తనం ఫలదీకరణం, జీవవైవిద్యంలో కీలక పాత్ర పోషిస్తాయి .చిన్న క్షీరదాలను పక్షులను సరీసృపాలను కీటకాలను తిని వాటి సంతతిని తగ్గించి రైతుకు ఎంతో మేలు చేస్తాయని అటవీ అధికారుల అధ్యయంలో తేలింది.
నేనీ ప్రాంతాలకి రాకపోయినట్లయితే ఆసిఫాబాద్ జిల్లాలో ఇటువంటి పర్వత శ్రేణులు ,పక్షుల జాతులు ఉన్నాయని, అమెజాన్ అడవికి ఈ ప్రాంతం సౌందర్యతలో ఎంత మాత్రం తీసిపోనిదని ఎవరైనా చెబితే నమ్మలేక పోయే వాడిని. ప్రమాదాల భయాన్ని బట్టి చూసినా ఇవి తీసిపోవు.ఇక్కడ పులులు, ఎలుగుబంటి భయం వల్ల జనం ఈ అడవుల్లో తిరగరు.
ఈ అడవుల్లో పచ్చని ప్రకృతే కాదు.
ఎర్రని మందారాలు నెత్తుటి మడుగులో
ప్రజలు కోసం పోరాడి అమరులైనారు.
కార్మికులు, కర్షకులు మరియు ఆదివాసుల పోరాటం అంతా అడవులే ముందుండి నడిపించాయి.
ఆసిఫాబాద్ జిల్లా దట్టమైన అరణ్యం,కొండలు, వాగులు వంకలు,జలపాతాలకు నిలయమైంది.సప్తగుండాల,కెరమేరి, జోడేఘాట్,కుం రం భీం ప్రాజెక్టు, నందిగామ పాలరాపు గుట్టలు, వివిధ రకాల పక్షుల జాతులు,టైగర్ ఆవాసం ,ప్రాణహిత నది" ఆసిఫాబాద్ కుం రం భీం"టూరిజం సర్క్యూట్ విస్తరణ వీలు కల్గిన ప్రాంతం.
పర్యాటకం విహార యాత్ర ప్రదేశాలు అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోనే ఆసిఫాబాద్ జిల్లా ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతుంది.
ఈ "బర్డ్ వాక్ ఫెస్టివల్" అనంద,విజ్ణానధాయకమైంది మరియు దుఃఖమైనది. నేను అడవులో యాత్ర చేసినపుడు అక్కడ అక్కడ పక్షులు మృత్యువాత పడడం చూశాను.చాల బాధనిపించింది .అంతేకాదు ప్లాస్టిక్ భూతం అడవుల్లోకి వీపరితంగా విస్తరించడం వల్ల పర్యావరణానికి పెనుముప్పు కలుగుతుంది. పర్యావరణ పరిరక్షణకు స్వచ్చంద సంస్థలతో కలిసి నేను సైతం అవగాహన కార్యక్రమాలు చేసుంటే పక్షులను కాపాడటంలో సఫలీకృతం అయ్యేవాళ్ళం.అలాంటి ప్రయత్నం చేయకపోవడం స్వయంగా అపరాధమే.
ప్రక్రృతి వినాశనానికి ప్రత్యక్షంగానో , పరోక్షంగానో నేను కూడ భాద్యుణ్ణి. అందువల్ల అరణ్యదేవతలు నన్నెప్పుడూ క్షమించరని నాకు తెలుసు.
"ఓ అరణ్యమా!
ఓ ఆదిమ దేవతలారా! పక్షులారా క్షమించండి,
నన్ను క్షమించండి.
ఇదే వీడ్కోలు మీకు "
.............
(వ్యాసకర్త సినిమా గీత రచయిత)
FEB 2020
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు