పాత సంచికలు

కొత్త పోస్టులు

శీర్షికలు

కథలు

నియోగం

ఈ లోకం పైకి కనబడని సంకెళ్ళతో స్త్రీలను ఎంతలా బిగిస్తోందీ?

                ఆశ్చర్యమూ, విచారమూతో కూడిన ఆలోచన కుంతీదేవిని కలవరపరుస్తోంది. ఆడవాళ్ళు స్వతంత్రించడం ఈ క్షత్రియపుత్రులు  సహించలేరు. అందునా రాజ్యపాలకులకు అసలు  నచ్చదెందుకో! అనూచానంగా వస్తున్నదేకదా తాను అనుసరించిందీ? ఈనాటికి అది ఎందుకు కంటగింపైందీ?  నా అత్తనాటికీ, నా నాటికీ ఎంత అగాధం?... ప్రవాహసదృశమైన కాం ఎంత ఉత్థాన పతనా నెదుర్కొంటోంది.

                కృష్ణుడెంత నిర్దయుడూ?... మనసులో మారుమూలకు నెట్టబడి మరుపుపొరల్లో దాగిన వాటిని బలిమిన వెలికితీసి!... ఏం! సంతోషం?. మనసు మూగగా రోదించింది.

                సూర్యుడు పశ్చిమాద్రిలో నిద్ర కుపక్రమించబోతున్నాడు.

                వినీలాకాశం తన నిశీధి తెరలు  దించుతూ జీవ ప్రపంచానికి విశ్రాంతి నివ్వడానికి సమాయత్తమవుతోంది. కను చీకట్ల గోచరంతో పక్షు కిలకిలారావాను ముగించి గూటిని వెతుక్కుంటూ బారులు  తీరి ఆకాశవీధిలో వేగంగాపోతున్నాయి.

                ఆ ప్రశాంత నిశ్శబ్దంలో గంగానదీ జలాల  జలజలలు సహితం కుంతీదేవికి కల్లోల  తరంగాలుగా మారాయి.

                మరోసారి, ‘కృష్ణుడెంత నిర్దయుడూ’!` తలచుకుంది. అష్టపదులు  దాటి అంతిమ సమయానికి దగ్గరయిన ఈ వయస్సులో ఈ పరీక్షేమిటీ?

                ‘‘ఇది పరీక్షే కావచ్చు! కానీ తప్పదు అత్తా!’’` మేనల్లుడి మాటలు  మృదువుగా అనిపిస్తున్నా, అవి ములుకుల్లాగే వున్నాయి. ‘‘ఎవరైనా, ఏనాడైనా తాము నిర్వహించిన  చర్యకు ఫలితాన్ని స్వీకరించక తప్పదు అత్తా!’’....

                మేనల్లుడివి మామూు మాటలే కావచ్చు` కానీ అవి ఆజ్ఞల వంటివే, కలవక తప్పదు... కానీ ఏ మొహం పెట్టుకునీ?... వాడిపట్ల నేనేం నిర్వహించాననీ?....రాచరికానికి నీతి, న్యాయం వుండవుకదా!... ఆమెకు సిగ్గుగా అనిపిస్తోంది. ఈ ఆలోచనలతో కుంతీదేవి మనస్సు ద్వైదీభావంతో కొట్టుకులాడుతోంది. ‘రాధేయుడు’గా పెరుగుతున్నాడని తనకు తెలియదా? తానీ ఇంద్రప్రస్తావతికి వచ్చినపుడే - రహస్యంగా తమ పాత దాసీది కలిసి - చెప్పింది కదా! - అప్పుడుకూడా బిడ్డ ఎలా వున్నాడన్న ఆసక్తితో,  ఏదో మిషతోనైనా తనకు ఒక్కసారి చూపించమని చెప్పగలిగిందా? మమకారపు బంధనాలను తానై బవంతంగా తెంచుకుంది.

                అవును!... రాచరికపు ‘పరువు’ తననూ బంధించింది... జీవితమంతా ఈ రాచరికం దించరాని బరువును భుజాల మీద మోపి కృంగదీసింది. అందుకోసం బతుకంతా ఎదురుదెబ్బలే తప్ప పొందిందేమిటీ?... భోజరాజు కూతురిగా ఆ బాల్యంలో ఏం సుఖపడిందో! -  మిగిలిన ఈ ఏడు పదుల  జీవితంలో అన్నీ అడ్డంకులే, అంతా కల్లోలమే!.

                అయినా ఈ కృష్ణుడు వేటినీ వదలడుగదా! ఏ జ్ఞాపకాు తనను కల్లోలపరుస్తాయని అట్టడుగు పొరల్లోకి నెట్టివేసిందో... వాటినే పైకిలాగి ఎదురుగా నిలబెట్టి, తేల్చుకోమంటున్నాడు.

                ఏడుపదుల  వెనక్కు వెళ్ళమంటున్నాడు. తప్పదు.... పరాభవం మరోసారి నెత్తిన వేసుకోక తప్పదు. తల్లితనం కూడా రాచరికపు వస్తువే అయింది. ఎంత దురదృష్టం!

                గతం ముందుకు వచ్చి ప్రశ్నిస్తూ నిలబడింది.

                అవి తెలిసీ తెలియని తొలి యవ్వనపు వికసనాలు,  ప్రతిదీ ఆసక్తే, కుతూహలమే. చిరుగాలి సవ్వడికూడా మైమరపు గిలిగింతలే!. అది మధుమాసం. తోటంతా సువాసన భరితమైన సంపెంగ, పారిజాతం, మరువం, ఫలపుష్పాలే.  చెలులతో కసి వాటిని ఆస్వాదిస్తూ రాచనగరు దాటి బయట వనాలలోకి తెలియకుండానే వెళ్ళిపోయింది. ఒక్కొక్క పొదనూ పలకరిస్తూ తెలియని ఉన్మత్తతతో వనమంతా కలియతిరుగుతూ స్వప్నాలలో తేలియాడుతుండగా....

                ఆ చల్లని సాయంసంధ్య వనంలో దేదీప్యమైన వెలుగులు  విరజిమ్ముతుండగా` తననే తదేకంగా చూస్తున్న ఓ సమ్మోహన రూపసి, ఎట్టఎదుట ప్రత్యక్షమైంది. అదే ఆమెకు పరపురుషుని తొలి దర్శనం. ‘అయినా తాను భయపడి పరిగెత్తి పోయింది లేదు. భయం తనకు కొత్త పదం. అలాగే నిల్చుండిపోయింది.’

                ఇరువురూ బాహ్య స్మరణలేని ప్రతిమలయ్యారు.

                అతనే ముందుగా తేరుకున్నాడు. ‘‘పృధాదేవీ’’... అంటూ నెమ్మదిగా, ఆశ్చర్యంతో నిండిన పిుపు.

                ‘ఇతనేమిటీ ఇంత చొరవగా ఏదో పేరుపెట్టి పిలుస్తున్నాడూ!’ మౌనంగా, సూటిగా అతన్నే చూస్తోంది.

                ‘‘నీ పేరు తెలియదు` అయినా నిన్ను చూసాక ఆ పేరే నీకు తగినదనిపించింది. నిండుగా సమస్త లోకాన్ని భరించే పృదివికి మరో రూపంగా గంభీరమైన నీ విగ్రహం, విశామైన నీ పాలభాగం, నీ భువన మోహన సౌందర్యం -  నన్ను అలా పివడానికి ప్రేరేపించాయి కుంతల  మహారాణీ.!  నేను ఇంతవరకు మన గణాలలో ఈ అందాన్ని చూడలేదు పృధా! శ్రద్ధగా తీర్చి చెక్కిన శిల్పకారుడి సృష్టిలా వున్నావు.’’

                ఆమెను చూస్తూ అతనేమిటేమిటో మాట్లాడుతున్నాడు. అవన్నీ ఆమె చెవికి ఎక్కడం లేదు;  చూపు మరల్చాలని తోచలేదు. అతను తనకు దూరపువాడిలా అనిపించలేదు;  పచ్చని పసిమి రంగు కాంతులీనుతూ ఆజానుబాహు - భుజానికి విల్లంబు, వీపున అంబుపొది, చేతిలో బాణాలతో ఎట్టఎదుట చిరునవ్వుతో....

                ఇంతలో తనతో వచ్చిన దాసీలు  ఆమెను సమీపించి - ‘‘అమ్మా!, కుంతీదేవీ!... విహారానికి వచ్చిన సమయం మించిపోయిందమ్మా!  రాచనగరకు తిరిగి పోదాం దేవీ!’’ -  జ్ఞాపకం చేశారు.

                అప్పటికి మామూలు  స్థితికి వచ్చిన కుంతీదేవి చెలులతో కలిసి మరలిపోవడాని కుద్యుక్తురాలయింది.

                ‘‘దేవీ! మీరు కుంతి భోజరాజు పుత్రికలా! - మేం ఈ పొరుగునే వున్న సూర్యగణానికి చెందినవారం’ -  నా పేరు ఉదయుడు, వేటకోసం ఇలా వచ్చాను. మీ పాదస్పర్శతో పులకించిన ఈ నేలను విడిచి తిరిగిపోవాని లేదు.  నా జన్మ ధన్యమైంది. తిరిగి తమ దర్శనం కోసం ఈ చుట్టుపక్కలే తిరుగాడుతుంటాను.’’

 

                కుంతీదేవికి అతని మాటలు  లోలోపల  పులకింతలు  రేపాయి. అయినా చెలులతో కలిసి నెమ్మదిగా ఆ వనాల  నుండి రాచనగరు వైపు దారి తీసింది.

                ‘‘అమ్మా! వారు మన గణానికి చెందిన వారు కారమ్మా’’

                ‘‘ఆ మాట అతనే చెప్పాడుకదా! అయితే నేమిటి చెలీ! అతనెంత వున్నతంగా వున్నాడూ -  మనలను ఒక్క మాట మీరి మాట్లాడలేదు కదా!’’`

                ‘‘నిజమే దేవీ! కానీ ఇతర గణాల  పురుషులతో పరిచయాన్ని మన గణపెద్దలు  ఒప్పరు కదా’’...

                అప్పటికిక మౌనంగా తను సౌధానికి చేరింది. కానీ అతని రూపం, మాటలు  ఆమెను వీడలేదు.  కాలం  ఆమె ఆలోచనల్ని తుడిచి వేయలేకపోయింది.

                ఓ రోజు మెల్లిగా చెలులను ఏమార్చి తన సౌధం వెనకనున్న తోటలో నుండి బయుదేరి విశాల  వనాలలోకి కదిలింది. అతనిని మొదటిసారి చూసిన ప్రదేశం వైపు దారితీసింది.

                నిజంగానే అతను చెప్పినట్టుగా అక్కడే శిలాతల్పం  మీద ఎదురుచూస్తున్నట్టే కూర్చున్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతన్నే చూసింది.

                కుంతి రాకను గమనించి ఉదయుడు ఎదురేగి నిశ్శబ్దంగా ఆమెను అనుసరించాడు.

                ఇరువురూ మౌనంగా ఎంతో సమయం అలా వుండిపోయారు. ఉదయుడే ముందుగా తేరుకుంటూ, ‘‘దేవీ! అప్పటి నుండి ప్రతి దినం మీ రాకకోసం ఈ ప్రదేశానికి వచ్చి, సూర్యాస్తమయం వరకు వుండి, నిరాశగా తిరిగిపోతున్నాను. ఈ రోజు నిజంగానే ధన్యుడను.’’

                ఆ మాటకు జవాబివ్వలేదు... ‘‘మీరు, మా గణానికి చెందినవారు కాదు -  కదా!’’ -  ఎప్పటికో ఆమె పెగుల్చుకుంటూ తన సందేహాన్ని అతని ముందుంచింది.

                ‘‘అవును -  ఇన్నాళ్ళుగా ఆ ఆలోచనే నన్ను నిలవనీయడం లేదు, పృధాదేవీ - ఈ కట్టుబాట్లు వెనక లేవు. కొత్త కొత్త నియమాలు  ఎవరికోసం, ఎందుకోసం చేస్తున్నారో తెలియడం లేదు’’` విచారంగా అన్నాడు అతను.

                ఆ మాటతో ఇద్దరి మధ్యా తిరిగి మాటలు  కరువయ్యాయి. కుంతీదేవి మనస్సు కల్లోలమైంది. తానిలా రావడం తన తండ్రికి ఇష్టం వుండదని ఆమె మనస్సు చెప్తోంది. అయినా చలనం లేనట్లు అలాగే వుండిపోయింది. అప్పుడొకటీ, ఇప్పుడొకటీ చిన్న చిన్న మాటలేవో జరిగిపోతూ వున్నాయి. ఒకరిని వీడి ఒకరు వెళ్ళాలనిపించక అలాగే వున్నారు.

                చివరకు పడమట వెలుతురు తగ్గుముఖం పట్టడంతో,  నగరుకు తిరిగి వెళ్ళడానికి అడుగు ముందుకు వేసింది. ఆమెతో పాటు అతనూ వనాల  చివరిదాకా వచ్చి,  కుంతీదేవి నగరులో ప్రవేశించాక వెనుదిరిగాడు.

                ఆమె సౌధానికి చేరి తోటలోకి అడుగు పెట్టీ పెట్టగానే చెలులు  ఆతృతగా ఎదురువచ్చారు.

                ‘‘అమ్మా! మీరింకా పిన్నవయస్కులు,  స్వతంత్రించడం మంచిదికాదు.  అయినా గణనియమాలను దాటటం గణ పెద్దలు  సహించరమ్మా! ఎందుకు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారూ? ఇంతటితో దీనిని ముగించడం మంచిదమ్మా!,...’’ భయపడుతూ హెచ్చరించారు. ఏది ఎటుపోయినా ప్రమాదం తమకే ననేది వారి ఆందోళన.

                కుంతీదేవి మౌనంగా వుండిపోయింది.

                                                    * * * * *

                ఎన్నోయేళ్ళుగా ఈ లోలోపలి జ్ఞాపకాలు  మరుగున పడిపోయాయనుకుంది. కాని అవి ఎప్పటికీ మరుపురానివే అయ్యాయి.

                తొలి విరిసీ విరియని మధురిమలు -  నూతన కౌతుకం.  పైగా తనంతట తానుగా ఇష్టపడి ఏర్పరుచుకున్న బంధం;  అదో స్వప్నం. కాని ఆ స్వప్నం విరిగి తుళ్ళిపోనే పోయింది. దాదాపు తాను ఇంతకాలం  అది గుర్తుకు లేనట్టుగానే వుండిపోయింది.’  నిజంగానే తాను ఉదయుడిని మర్చిపోయిందా?... మర్చిపోవానుకుంది, అంతే! -  కానీ అంతా వట్టిదే అయిపోయింది. వివాహానికి ముందు మనస్సును కట్టడి చేసుకోవడానికే కృతనిశ్చయురాలైంది. రాచబిడ్డగా తండ్రి ఆజ్ఞను ఔదల  దాల్చింది.

                అయితే పాండువునితో వివాహమయి హస్తినావతికి వచ్చాకనే మానిన గాయం తిరిగి సలపరించినట్లయింది. పాండువు ప్రతి రాత్రీ తనను హింసపెట్టీ... అతను హింసపడీ... నిర్వీర్యుడుగా మిగిలిపోయిన ప్రతిక్షణం తానెంత శిక్షను అనుభవించిందీ? అప్పుడే ఉదయునితో తన అనుబంధం మనసులోకి వచ్చేది. అతని కలయికలోని మధురానుభూతి మనసును అగ్నిలా దహించేది. అతని జ్ఞాపకాలు  కాల్చివేస్తుండగా ఆమెకు తానెందుకు ఉదయుడిని వదులుకుందీ? అన్న ప్రశ్నలు  నిత్యమూ తొలిచేవి.

                ఆ కాలమంతా రాజ్యం... గణం, గౌరవ ప్రతిష్టలు  తనకూ సంకెళ్ళు వేసాయి. ‘ఉదయుడు మన ‘గణం’ కాదమ్మా!’, అంటూనే తండ్రి తనను కట్టడి చేశాడు. దీనికితోడు అప్పటికే ఏర్పడ్డ కొత్త నీతి నిబంధనాలు  స్త్రీకు బంధనాలయ్యాయి.

                ‘‘నీ వివాహం నీకు మాత్రమే చెందింది కాదు కుంతదేవీ! ఇది రాజ్యానికి సంబంధించినది. మన వివాహ బంధాలు -  రాజ్య రక్షణకోసం కొత్త బలగాన్ని, భాగ్యాన్ని చేకూర్చేవిగా వుండాలి... గణపెద్దల, తల్లితండ్రుల  అనుజ్ఞ లేకుండా నీ వివాహం ఎవరికీ సమ్మతం కాదు కుంతీ!’’ -  ‘‘స్త్రీలు  ఎల్లవేళలా అటు తండ్రో, భర్తో, ఇటు బిడ్డల  సంరక్షణలో వుండాలి తప్ప -  స్వతంత్రించడం ఎంత తప్పూ!’’-

                ‘‘ఈ నియమ నిబంధనన్నీ మనం ఏర్పరుచుకున్నవేగా పితామహా! శకుంతల  ఇష్టపడి దుష్యంతుల వారిని గ్రహించింది కాదా? ఆమెకు అనుమతి ఎవరిచ్చారనీ!’’

                ‘‘ఆనాటికి ఈ ప్రజ ఇంతగా కట్టుతప్పి లేరు కుంతీ! అప్పటికింకా దేవలోకంతోనూ, గంధర్వులతోనూ సంబంధ బాంధవ్యాలు  వుండేవి. మానవుల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పుల  వల్ల  ఆ లోకంతో సంబంధాు తెగిపోయాయి. దానితో మనం కొన్ని నియమాలు  ఏర్పరచుకోవాల్సి వచ్చింది.

                మేనక తన లోకానికి వెళ్ళిపోయింది. తిరిగి ఇంద్రుడి కొలువులో చేరిపోయింది. బిడ్డను పెంచింది కణ్వుడేకదా!... ఇటువంటివన్నీ జరిగాకే  -  గణాలు  తమలో తాము -  బయటి గణాలతోనూ కొన్ని నియమాలు  ఏర్పరచుకొన్నాయమ్మా. ఆ నియమాలు, పూజ్యులైన పెద్దలు  పెట్టిన కట్టుబాట్లు దాటటం నాకు కూడా శక్యం కాదు బిడ్డా!... ఇప్పుడింక  ఈ రాజ్యాలు  ఏర్పడ్డాక అవి మరింత కట్టుదిట్టమయినాయి తల్లీ.!’’

                ‘‘అంటే తండ్రో, అన్నో ఒప్పుకున్న బంధానికి తప్ప ఇష్టపడి ఏర్పరచుకున్న బంధం నిషిద్ధమైపోయిందా? ఉదయుడితో నా అనురాగం మీకు ఇష్టంలేకనే కదా! ఇదంతా! ఈ నీతి నియమాలు  ఎవరు ఏర్పరిచారు తండ్రీ! స్త్రీ పురుషుల అనుబంధం సహజమైంది. ఈ సహజమైన సంబంధం ఇన్ని కట్టుబాట్లతో ఎందుకు బిగించారు.’’

                తిరిగి భోజరాజు ఉపక్రమిస్తూ, ... ‘‘తల్లీ! నువ్వు చెప్పేది ఒకప్పటిది! వెనకటి రోజుల్లో ‘కానీనుడైన’ బిడ్డతో సహా తల్లిని వధువుగా అంగీకరించేవారు. ఇప్పుడు అటువంటి వధువును వివాహమాడటానికి ఏ రాజూ అంగీకరించడం లేదు. ఇప్పుడంతా కన్యావివాహానికే క్షత్రియ పుత్రులు  సంకల్పిస్తున్నారు.’’ -  ఆ మాట అని భోజరాజు మౌనంగా వుండిపోయాడు.

                ఓ క్షణం ఆగి ‘‘నువ్వేం ఆందోళనకు చెందకు తల్లీ! నీ బిడ్డను సురక్షితంగా పెంచే ఏర్పాటు చేస్తాను. తిరిగి నువ్వు వివాహానికి సిద్ధంకావాలి కుంతీ!’’` ఆజ్ఞతో కూడిన తండ్రి ఆదేశం. అప్పటి నుండి పాండురాజుతో వివాహం వరకు తను సౌధం దిగి రావడానికి లేకుండా పోయింది. అడుగుతీసి, అడుగువేయడానికి కాపలా! పాత దాసీలను మార్చి... ప్రతిరోజూ భోజరాజు పర్యవేక్షణలో తన జీవితం.

                ఈ ఆలోచనతో తమ బంధాన్ని ‘గణనీతి’కి బలిచేసిన పెద్దలపై పట్టరాని ఆగ్రహం కలిగేది. ఈ రాజుకూ, రాజరికానికీ కావల్సింది మనుషులూ, మనసుూ కాదు - పరువు, ప్రతిష్ఠలే!...

                ఆ కాలం  గుర్తు చేసుకుంటూ, ‘అయ్యో! ఎందుకు నాకీ విషమ పరీక్ష పెట్టావు కృష్ణా!’...దు:ఖం ముప్పిరిగొన్నదామెను. కర్ణుడిని కలవడం కంటే గడిచిపోయిన తన జీవితపు తలపులు  ఆమెను క్షోభకు గురిచేస్తున్నాయి.

                నీకిది చెయ్యలేని పనే! సంకట స్థితే. కానీ తప్పదు! నీ పుత్రులు  రాజ్యం పొందాలనీ, వారు జయించాలనీ నీకు లేదా?  పదమూడేళ్ళు పరాయి పంచలో ఎందుకు పడి వున్నావ్‌! నీ పుత్రులేం శౌర్యహీనులా, కార్య శూన్యులా! అయినా అన్ని అవమానాలను ఎందుక సహించారూ?.

                నిజమే! అకాలంగా భర్తను మృత్యువు కబళించడంతో ఒంటరిగా చంటిబిడ్డతో బావగారి దయాదాక్షిణ్యాల  మీద బతకటం మాటలా! నిజానికి భీష్మ పితామహులు  వుండబట్టి తమకీపాటి గౌరవమైనా దక్కింది. అప్పటికీ ఎన్ని చిచ్చులు  పెట్టారూ? ల క్క ఇల్లు  దహనం దగ్గర నుండి జీవితమంతా ప్రాణాలు  కాపాడుకోవడమే పనిగా మిగిలిపోయిందిగా!

                మనసు గట్టి చేసుకుంది. తప్పదు తమకు రాజ్యం రావాలనీ - మానవ సమూహాలను పీనుగు కుప్పలుగా మార్చి శ్మశానాలను ఏలుకోవాలని కాదు - కానీ జరిగిన అవమానాలు  బడబాగ్నిలా దహిస్తున్న ఈ లోలోపలి ఈ ఆవేదనలు  తీరేదెట్లా?

                తన కోడలిని నిండు సభలో ఏక వస్త్రను చేసి లాక్కురావడమే కాక, ఆమెను వివస్త్రను చెయ్యాలని నడిపిన అకృత్యం మర్చిపోయేదేనా? ఆడదాన్ని అవమానించిన మృషణ్ణులు  భూమికి కూడా భారం. వారికి తగిన దండన జరగాల్సిందే!

                పాండు పుత్రులను పట్టుకుని  - ‘మీరంతా నా పిన తండ్రికి పుట్టారా? నేనెందుకు రాజ్యమివ్వా’ని అంటే కిమ్మనకుండా మౌనంగా వుండిపోయిన ఈ పెద్దు నిజంగా పెద్దలేనా  -  ఆ ముసలి భీష్ముడికి మతిగాని పోయిందా? ఎంత అవమానం?  పాండు పుత్రులు  పాండురాజు బిడ్డలు  కారా?... కుంతి బిడ్డలు  మాత్రమేనా?

                క్షేత్రం ఎవరికి చెందుతుందో -  పంట వారికి చెందుతుందనే కదా! శాస్త్రాలు  చెప్పింది - తన బిడ్డలు  శాస్త్ర విరుద్ధంగా జన్మించలేదే?  ఆ శాస్త్రమే తప్పనుకుంటే తమ మామగారికే జన్మించారా వీరంతా?... ఆ ముసలి భీష్ముడు బలవంతంగా అంబ, అంబాలికను తీసుకురావడమేకాక, వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఆనాడు తన మారుటి తమ్ముడితో ఎందుకు నియోగింపచేశాడూ?... ముసలమ్మ సత్యవతి కానీన పుత్రుడితో కురు రాజును కన్నప్పుడు అది న్యాయమే అయిపోయిందా? ఆ తండ్రికి పుట్టిన బిడ్డలే కదా? వీళ్ళు!  వారికి చెల్లిన నియోగ పద్ధతి, తన బిడ్డల  కెందుకు చెల్లలేదూ?

                అసలు  ఈ కురువంశమే నిజమైన కురు బీజ పునాది మీద లేదు... ఈ మాట ఆ ముసలి భీష్మునికి తెలుసుగదా! ఆ ముక్క మనవళ్ళకు చెప్పి వారిని దండించలేడా?... కాదు,  కాదు అసలు  కీలకమంతా ఈ ముసలాడి దగ్గరే వుంది.

                పాండురాజుతో కలిసి వన విహారం నెపంతో హిమాలయాల వైపు వెళ్ళడం... కిరాతులు,  గంధర్వుల  పరిచయాలు -  అన్నీ ఆమె ముందు పరచుకున్నట్లయింది.

                ఆమెకు చనిపోయిన తన భర్త మొహం కళ్ళముందు నిలిచింది.

                పాండువు తన అశక్తతను పెద్దలకు చెప్పుకోలేక, తప్పంతా తనమీద వేసి, పెద్దల  ముందు దోషిగా నిబెట్టినప్పుడు -  తానెంతో ఘర్షణకు గురయ్యేది.  చివరకు భీష్మ పితామహుడు కూడా కళ్ళతో తనను ‘దోషి’ అన్నట్లుగా చూడడం!, అవమానంగా వుండేది.  కౌరవ రాజ్యానికి వారసులనివ్వలేని ‘సారంలేని క్షేత్రంగా’ అనుమానిస్తున్నప్పుడు క్షోభగా వుండేది. ఉదయుడి ఉదంతం, తన బిడ్డ గురించీ చెప్పాలన్నంత ఆవేశం వచ్చేది. అయితే ఎప్పుడూ తన బిడ్డ గురించి బయటపెట్టలేకపోయింది. అన్నిటినీ మౌనంగా, తిరస్కారంతో భరించింది.

                చివరకు పాండువు తనను నిందించీ, నిందించీ అన్నివిధాలా ఓడిపోయి  -  తన ఓటమిని అంగీకరించక తప్పలేదు.

                ‘‘కుంతీదేవి!... ఈ సువిశాల  కౌరవ సామ్రాజ్యం నిలబడాలి. ఈ హస్తినావతి వారసుల్లేని నిర్భాగ్యురాలు  కాకూడదు. అందుకు నీ సహకారం కావాలి’’ -  ప్రాధేయపూర్వకంగా పాండువు అడగడం తనకింకా తడి ఆరని జ్ఞాపకం.

                మనశ్సరీరాలు  రెండూ శత్రుభావం వహించినా  -  భర్త అనుజ్ఞ అంగీకరించక తప్పదు;  రాజ్యానికి వారసులను కనడం  బాధ్యతగా ‘నియోగాని’కి సిద్ధపడింది. ఇష్టపడ్డ ఉదయునిని వదులుకుంది -  పెద్దల అంగీకారం లేదని - ఇష్టంలేని నియోగం ఒప్పుకుంది ఆ పెద్దల  కోసమే.

                స్త్రీలది ఎంత గొప్ప జీవితం?  -  విచారంతో అలాగే వుండిపోయింది.

                అప్పటికే కనుచీకటి పడిపోయిందని, కుంతీదేవి కుటీరానికి ఇంకా చేరలేదని ఆమెను వెతుక్కుంటూ విదురుడు గంగానది ఘట్టానికి చేరాడు.

                అప్పటికే గంగా మహాజలం  చీకటిని నింపుకొని నీలవర్ణం నుండి కాటుక వర్ణానికి మారిపోయింది. ఆ నిశ్శబ్దంలో మహోధ్రుతమైన ఆ ప్రవాహాపు ఝరి, మనుషులనూ, వారి అంతరంగాలనూ తెలియని ప్రకంపనాలకు గురిచేస్తోంది.

                అనంతమైన ఆ ప్రకృతి విలయోద్వేగాన్ని వింటూ కుంతి చలనం లేనట్లు ఆ రాతిమెట్లపై కూర్చిండిపోయింది.

                కుంతిని గమనించిన విదురుడు... ‘‘ఆర్యాణీ! చీకటి చిక్కనవుతోంది, పద పోదాం!’’ అన్నాడు.

                ‘‘విదురా! నేను విన్నది నిజమేనా!’’...

                కుంతీదేవి ఏమడగబోతోందో అతడు ఊహించాడు.

                ‘‘నిండు సభ తీరి వుండగా ` దుర్యోధునుని వాచాలత్వాన్ని అటు మామగారుగానీ, ప్రపితామహుడుగానీ ఖండించలేదెందుకు?’’

                విదురుడు ఓ క్షణం మౌనంగా వుండి ‘‘నిజమే! ఆర్వాణీ! కానీ ఏదో మూల  భీష్ములవారికీ ఆ      పక్షపాత ముందేమోనని నా సందేహం!’’

                ‘‘అదే అయితే, బీజ ప్రధానాన్ని సమ్మతించేటట్లయితే అంబ, అంబాలికకు పుట్టిన మీరంతా ఏ గణానికీ, ఏ వంశానికీ చెందుతారూ?.. ఆనాడు క్షేత్రమే ప్రధానమని,  క్షేత్రం ఎవరికి చెందుతుందో ఆ సంతానమూ వారికే చెందుతుందని, కోడళ్ళ బిడ్డలు  మీ కౌరవ వంశానికి చెందినప్పుడు ... ఇప్పుడీ కుంతి పుత్రులు  ఎట్లా కాకుండా పోయారు. ఇదంతా తెలిసి వుండి కూడా పెద్దలు  నోరెత్త లేదంటే అర్థమేమని?...’’

                విదురుడు సమాధాన మివ్వలేదు. నిశ్శబ్దంగా వుండిపోయాడు.

                కుంతికి ఆలోచించే కొద్దీ సంభాషణ పెరిగేకొద్దీ ఆవేదన, ఆవేశం ముప్పిరి గొంటున్నాయి. ఇద్దరిదీ మౌన భాషే అయింది.

                ఆ మాట అంటూ కుంతి ఆ నదీ ఘట్టం మీద నుండి పైకి లేచింది. విదురుడు ముందుకు సాగుతుండగా - తల  దించుకుని కుంతి ఆలోచనల్లో మునిగిపోయింది.

                తనదెంత దురదృష్ట జాతకం అనుకుంటూ, తనదేనా! స్త్రీ జాతి అంతటిది కూడా కదా!... తన కోడలు  మాత్రం ఏం సుఖపడిందనీ -  నా తొందరపాటుతో తాను ఐదుగురికి భార్య అయి ‘‘పాంచాలీ పంచభర్తృక’’ అని అవమానాలు  మోయడం లేదూ!.  నవ్విందనో, ఏడ్చిందనో మరొకటో నెపం పెట్టుకుని రాబోయే యుద్ధనేరాన్ని ఆమె మీద మోపుతున్నారు పాపం! కానీ ఆమెదేం తప్పూ!...

                అసలు  కారణమంతా భీష్ముడి దుష్ట ఆలోచనలే! ఆ ముసలోడు శాసిస్తే ` ఈ దుర్యోధనాధులు  ఎదురు తిరగగలరా?... ఎంత ఉప్పుతిన్నామన్న విశ్వాసముంటే మాత్రం` అసలు  మూలాన్నే ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదూ?...

                స్త్రీలెంత పరాధీనులూ?  ఆనాడు తన తండ్రి, ఉదయుడు తమ గణానికి చెందినవాడు కాదని  -  తన అంగీకారం లేకుండా బిడ్డకు జన్మనిచ్చానని` తనకు ఉదయుడినీ, బిడ్డనూ ఇద్దరినీ దూరం చేశారు. ఇప్పుడు పాండురాజు అనుమతితో అతని ఆలోచనమీదనే అన్యమనస్కంగానే ఆ నియోగాన్ని అంగీకరించాను - అది శాస్త్ర సమ్మతమేనని -  ఇన్నేళ్ళుగా అంగీకరించి` ఈ రోజు బిడ్డలు  ఎదిగి రాజ్యంలో భాగం ఇవ్వాల్సి వచ్చేటప్పటికి ఈ ప్రశ్నలు  పుట్టుకు వచ్చాయా?

                కుంతికి తీరని అవమానంగా అనిపిస్తోంది. తన భర్త పాండువు ఆ రాజ్యం కోసమే తనను నియోగానికి పురికొల్పాడు. ఇప్పుడు ఆ రాజ్యం పంపిణీ అడ్డుకోవడానికి అదే నియోగం అడ్డు ప్రశ్నగా వస్తోంది.

                ఈ అంతటిలో స్త్రీలుగా తమ ప్రమేయం ఏ మాత్రం లేనేలేదు కదా!...

                ఈ ఘోర అవమానాల  నుండి తన కానీనుడు తనకు గౌరవం కల్పిస్తాడేమో?  ఆశగా అనుకుంది -  కృష్ణుడు ఎందుకోసం ఈ పనికి పురికొల్పాడో.  అయినా తను దాన్నుండి రక్షణ కవచాన్ని అందుకోగలిగితే?

                ఆ మాట అనుకుంటూ తనకు తనకే అవమానంతో ఆగిపోయింది.

                నిజంగా కర్ణుడు తనను ఆదరిస్తాడా? అసలు  ఏ మొహం పెట్టుకొని అతని వద్దకు వెళ్ళగలదు?... నిజమే! ఆదరించడు -  పైగా నిందిస్తాడు కావచ్చు. ఈ  రోజు నీ బిడ్డల  రక్షణ కోసం నన్ను అర్థించడానికి వచ్చావు కాని నేనే నీ కొడుకునన్న అభిమానంతో రాలేదనవచ్చు. అసలు  నా జన్మమేమిటి?  సూత పుత్రుడిగా నేను ఎన్ని అవమానాలు  పడ్డాను -  అప్పుడంతా నీ తల్లి మనసు ఏమైందని నిందిస్తే?

                అవును -  నేను నిందార్హురాలునే. వాడికి జరిగిన అవమానాలకు అన్యాయాలకు నేనే కారణం. కన్నబిడ్డను కన్నీట ముంచి - నదీ గర్భానికి అప్పగించిన పాపం ఊరికే పోతుందా? అయినా నా కడుపున పుట్టినవాడి ఆ నిందనలను నేను భరిస్తాను. వాడి న్యాయమైన ఆక్రోశానికి తలొగ్గుతాను. అయితే తల్లిగా తన అవమానాలకు లేపనం కావాలని బిడ్డను అర్ధిస్తాను. తప్పేముందీ?...

                ఏ రాజనీతి,  ఏ పురుషనీతి తన బిడ్డను తనకు దూరం చేసిందో  -  ఆ రాజ్యమే, ఆ పురుషనీతే మరింత వికృతంగా తననూ, తన బిడ్డనూ ప్రశ్నలు  వేస్తోంది.

                ‘‘కర్ణా! ఈ ఆధిపత్య పురుషనీతి విలువతో విలసిల్లే ఈ రాజ్యనీతిని ఎదిరించు బిడ్డా’’ -  అని చెప్పడానికైనా తన బిడ్డను కలవాలి. అందుకోసం అతనెంత అవమానంతో నిందించినా భరిస్తాను. ‘‘తల్లీబిడ్డ మధ్య ` మరే ఇతర జోక్యాలు  లేని ఉత్కృష్ట మానవ విలువల  కోసం సాధనచెయ్యి తండ్రీ!’’ అని చెప్పడం కోసం నా కర్ణుడిని కలుసుకుంటాను.

                ఆ మాట దృఢంగా అనుకుని కుంతి, విదురుడి వెనక స్థిరంగా అడుగు వేసింది.

కవితలు

ఉదయ దృశ్యం 
 

పూలంతే..!

మాట్లాడతాయి..

వూసులాడతాయి..

మనస్సుతో

 

రెండు వేళ్ళ కొనలనలా

అటు ఇటు తిప్పి 

దారం మధ్య   నిన్నలా  బంధీచేస్తూ

మాలలు  కడతాయి

 

కట్టు కదలకుండా నిన్నలా

కట్టి పడేస్తాయి

ఏమీతెలీయనట్లు

అమాయకంగా నవ్వేస్తాయి

 

చివరికి 

నువ్వో అందమైన పూలహారం

అయిపోతావు  ప్రేమతో...

 

సాహిత్య వ్యాసాలు

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర 

ఆధునిక స్త్రీల సాహిత్య చరిత్ర తెలుగు సమాజంలో ముద్రణ సౌకర్యాలు వృద్ధిచెంది, పత్రికారంగం  విస్తరించటంతోనూ, సామాజిక సంస్కరణ ఉద్యమాలతోనూ ముడిపడి అభివృద్ధి చెందింది. ఆ క్రమంలో స్త్రీలు రచయితలుగా, సమాజంలో స్త్రీల అభివృద్ధికి అనుకూలమైన మార్పులను ఆశించి వాదించే మేధావులుగా, మార్పు కోసం పనిచేసే కార్యకర్తలుగా, పత్రికా రచయితలుగా, స్త్రీలను సంఘటితపరిచే నాయకులుగా బహుముఖ పాత్రలను పోషించారు.

అయితే ఇంటి ప్రపంచం స్త్రీలదిగా, బయటి ప్రపంచం పురుషులదిగా చేయబడిన సమాజంలో సకల సంపదలకు, మేధో సృజనాత్మక శక్తులకు స్వంతదారులు అయినారు. దానిఫలితమే సాహిత్య కళా రంగాలు అన్నీ స్త్రీలకు ప్రవేశింప రానివి గానూ, ప్రవేశించినా చరిత్ర చివరి అంచులకు నెట్టి వేసేవిగానూ తయారు అయ్యాయి. దాని ఫలితమే స్త్రీల మేధోసృజన శక్తులపైన అయితే చిన్న చూపు. కాకపోతే మొత్తంగా నిర్లక్ష్యం. ఆ రకంగా   మహిళా వాజ్మయం పరిణామాత్మకంగా కానీ, గుణాత్మ కంగా కానీ సరైన మదింపుకునోచుకోలేదు. 

ఇట్లాచరిత్రలో ఉపేక్షితులైన కవయిత్రులకు సాహిత్య చరిత్రలో ఒక స్థానం కల్పించాలన్న ఆపేక్షతో 1951 లో ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ ఒక ప్రయత్నం చేసింది. చాటుపద్య రచయిత చానమ్మతో ప్రారంభించి, సంస్కృత కావ్యాలు వ్రాసిన వాళ్ళను కూడా కలుపుకొని దేశ కాల వివరాలు తెలిసిన 125 మంది కవయిత్రులను, చరిత్ర తెలియని మరొక 72 మంది కవయిత్రులను పరిచయం చేస్తూ ‘ఆంధ్రకవయిత్రులు’ అనే  పుస్తకం ప్రచురించింది. 70 ఏళ్లకు ఇప్పుడు ఆ వారసత్వాన్ని మరింత అభివృద్ధికరంగా ముందుకు తీసుకొని పోవటానికి సాహిత్య రంగంలో భిన్నప్రక్రియలలో ఒక మహిళ చేసిన కృషిని ఒక దగ్గర సమీక్షించటం, సాధ్యమైనంతవరకు చారిత్రకంగా  ఆధునిక మహిళాకవుల పూర్వాపరాలను నిర్ధారించటం, సమకాలీన సామాజిక సందర్భాలతో వాళ్ళు చేసిన సంభాషణను సాహిత్య సృజనలో గుర్తించటం, సామాజిక నిర్మాణాలను, నీతులను, ధర్మాలను పునర్నిర్వచించటంలో వాళ్ళు నిర్వ హించిన పాత్రను నిర్ధారించటం లక్ష్యంగా ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్రను సమగ్రం చేయటం అవసరం. 

ఆధునిక స్త్రీల సాహిత్య గతిని తెలుసుకొనటానికి పత్రికలు ప్రధాన మూలవనరు. 1838 లో ‘వృత్తాంతి’ పత్రికతో పత్రికల చరిత్ర ప్రారంభం అయినా ప్రారంభ పత్రికలలో చాలా వరకు ఏ రచనకూ రచయిత పేరు పేర్కొన బడలేదు.రచయితల పేర్లు ఇయ్యటం అలవాటైన తరువాత  కూడా ఇప్పటికి అందుబాటులో వున్న వనరులను బట్టి 1896 వరకు స్త్రీలరచనలు ఉన్నట్లు కనిపించదు. 1892 లో మొదలైన శ్రీ వైజయంతి పత్రిక( పొత్తూరి వెంకటేశ్వరరావు ,ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగుపత్రికలు, 2004,పు ,144)1986 నవంబర్ సంచికలో ఇద్దరు స్త్రీల రచనలు కనబడ తాయి. ఒకరు కమలాప్రియ. ఆ పేరు కింద A college student అని ఉంది. ఆమె వ్రాసింది వనభోజనము అనే శీర్షిక తో వ్రాసిన పదహారు పద్యాల ఖండిక. సత్యవంతుడు అనే రాజు విహారాటవి లో చేస్తున్న యజ్ఞం సంగతి, ఆ సందర్భంగా పెడుతున్న భోజన వైభవం గురించి, చేస్తున్న దానాల గురించి తెలిసి బ్రాహ్మణులు వెళ్ళటం, వాళ్ళు భోజనం చేసి భుక్తాయాసంతో ఉత్తరీయాలు తలకింద మడిచిపెట్టుకొని గురకలు పెడుతూ నిద్రపోవటం ఈ ఖండికలో వర్ణించబడింది. కవితా రచనాభ్యాసానికి ఆలంబనగా తప్ప ఈ అంశానికి మరి ఒక ప్రాధాన్యత ఏమీ కనిపించదు. ఇది తప్ప ఈమె  రచన మరొకటి ఇప్పటికి కనబడదు. 

గుండు అచ్చమాంబ 

ఇదే 1896 నవంబర్ శ్రీ వైజయంతి పత్రికలో  గుండు అచ్చమాంబ కవితాఖండిక  వసంతర్తు వర్షర్తు వర్ణనము వుంది. పేజీల సంఖ్య కొనసాగింపుగా లేకపోవటాన్ని బట్టి అవి ఆ పత్రికకు ఎవరైనా చేర్చి కుట్టి వుంటారా అని అనుమానించవలసి వస్తున్నది. అయితే ఆ తరువాత కాలంలో హిందూ సుందరి వంటి పత్రికలలో కూడా పుటల సంఖ్య ఏ రచనకు ఆ రచనగా వేరువేరుగానే  పేర్కొన బడటం కనిపిస్తుంది. మరి ఇది అప్పటి పత్రికల పద్ధతి ఏమో తెలియదు. వసంతర్తు వర్షర్తు వర్ణనము ఖండికకు కొనసాగింపుగా శ్రీవైజయంతి పత్రికలో సుఖము, మనీషాపంచకము, ధూమ శకటము, నక్షత్రశాల అనే ఖండికలు కూడా వేరువేరు పేజీ సంఖ్యలతో ఉన్నాయి. వాటికి రచయిత పేరు లేదు కానీ ఆవి అచ్చమాంబ రచనలే.  వసంతర్తు వర్షర్తు వర్ణనము సావిత్రి పత్రికలో 1904 ఫిబ్రవరి సంచికలోను ,మనీషాపంచకము 1904 మే సంచికలోనూ, సుఖము 1905 నవంబర్, డిసెంబర్ సంచికలోను  ప్రచురించబడ్డాయి. 1907లో ప్రచురితమైన సత్కథామంజరి వెనుక భాగాన ‘ఏ తద్గ్రంధ కర్తచే రచియింపబడిన గ్రంధములు’ అనే శీర్షిక క్రింద పేర్కొనబడిన వాటిలో వసంతర్తు వర్షర్తు వర్ణనము, మనీషాపంచకములతో పాటు సుఖము, ధూమశకటము,నక్షత్రశాల ఖండికలు కూడా ఉన్నాయి. వాటితో పాటు మోతీమహలు అనే ఖండిక కూడా ఉంది. అంటే ఇవన్నీ 1907 లోగా ప్రచురించబడ్డాయన్నమాట. వీటితోపాటు అప్పటికే ఆమె రామేశ్వర యాత్రాచరిత్ర, శ్రీకాళహస్తీశ్వర కల్యాణోత్సవము, శ్రీ విక్టోరియా మహారాజ్ఞి చరిత్ర, శ్యమంతకమణి నాటకం కూడా వ్రాసినట్లు  సత్కథామంజరి వెనుక పేజీ సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. 

ఆంధ్ర కవయిత్రులు రచయిత్రి కాళహస్తీశ్వర కల్యాణోత్సవం ఒకటే లభించినట్లు వ్రాసింది. అది శార్వరి నామ సంవత్సరం ప్రచురితమైనట్లు తెలిపింది. అది 1907 లోపే వచ్చిన రచన అన్నది రూఢం కనుక అది  ఆ శార్వరి నామసంవత్సరానికి  సరయిన ఆంగ్ల సంవత్సరం 1901- 1902 లో వచ్చి ఉంటుంది. ఊటుకూరి లక్ష్మీ కాన్తమ్మ ఇది కాళహస్తిలో స్వామి కల్యాణోత్సవం నాటి వేడుకలను,స్టేషన్ చిత్రాలను, స్థల మాహాత్మ్యమును వర్ణిస్తూ శ్రీనాధుని క్రీడాభిరామం వలే వ్రాయబడిన ఒక వీధి కావ్యం అని పేర్కొన్నది. 

వైజయంతి పత్రికను ప్రమాణంగా తీసుకొంటే గుండుఅచ్చమాంబ 1896 నాటికి సాహిత్య సృజన రంగంలో ఉన్నట్లు. దానిపట్ల అనుమానాలు ఉన్నా 1898 నాటికి ఆమె కవన రంగంలో ఉంద నటానికి 1898 జూన్ చింతామణి పత్రిక ప్రబల సాక్ష్యం. ఇందులో గ్రంథ విమర్శనము విభాగంలో ఆమె వ్రాసిన ‘పూజావిధానము’  అనే పుస్తకం  సమీక్షించబడింది.  ఇది 46 పుటల పుస్తకం.ప్రక్రియ  కీర్తనలు. స్త్రీలకు ఉపయుక్తంగా ,మనోహరంగా ఉన్నాయి కీర్తనలు అని సమీక్షకులు పేర్కొన్నారు. ఆమె మేనమామ విశాఖపట్టణ మండల రిజిస్ట్రారు గుండు వాసుదేవ శాస్త్రి ప్రచురించారని కూడా ఈ సమీక్షవల్ల తెలుస్తున్నది. అచ్చమాంబ కవనరీతికి నిదర్శనంగా పీఠిక నుండి ఆమె పద్యాన్ని ఒక దానిని ఉదహరించారు. ఆ పద్యం - “ ఎవని మది దలంప నుతియింప భజింప నమస్కరింప సం 

శ్రవణమొనర్ప లోకము కరంబతి కల్మషరాశి( బాయు న 
           ద్ధవుడసమాన కీర్తి సతత స్తుత వైభవమూర్తి, ధీర భ 
క్త వరమనోనువర్తి  నిరతమ్మోన గూర్చెడు మాకభీష్టముల్-  
ఎవరిని తలుచుకుంటే, స్తుతిస్తే, సేవిస్తే, నమస్కరిస్తే వింటే లోకంలో పాపాలన్నీ పోతాయో అటువంటి భగవంతుడు - సాటిలేని కీర్తీ , ఎల్లప్పుడూ స్తుతుల వైభవం పొందేవాడు, శ్రేష్ఠులైన భక్తుల హృదయాలలో తిరిగేవాడు అయిన భగవంతుడు నిరంతరం మాకోర్కెలు తీర్చుగాక అని అర్ధం ఇచ్చే స్తుతి రూపక పద్యం ఇది. కుతూహలాన్ని కలిగించే ఎత్తుగడ, అర్ధవంతమైన ముగింపు  ఈ పద్యాన్ని  సరళ సుందరం చేశాయి.

వసంతర్తు వర్షర్తు వర్ణనము తేటగీతులతో మొదలైనట్లు ఉండి ద్విపద పద్ధతిలో సాగే    రచన. వసంత వర్షా  కాలాలలో జనానికి సంతోషాన్ని సమకూర్చే కాలం ఏదని తమ్ముడు అడిగిన ప్రశ్నకు జవాబుగా అక్క వసంత రుతువు అవనిలో అగ్రగణ్యమైనదని చెప్తూ అందులోని శోభనంతా వర్ణించి వర్షాకాలం ఇటువంటి హర్షాన్ని ఇవ్వలేదంటూనే గ్రీష్మరుతు బాధలను తీర్చే దాని గొప్పతనాన్ని చెప్పకుండా ఉండలేకపోయింది. భూమి తాపాన్ని, జనుల తాపాన్ని, జంతుజాల తాపాన్ని తీర్చే వానాకాలం గురించి అయినా కొన్ని నష్టములు కూడా ఉన్నాయంటుంది. “ … జనులకు జలుబుచేసి జ్వరాది బాధలు కలుగును” అని మొదలుపట్టి “బీదసాదల బాధకు లేదు మేర”  అంటూ కొనసాగిస్తుంది. యెడ తగని వానలతో కొంపలు తడిసి గోడలు కూలుతూ బడుగుల పసిపిల్లలు చలికి వణికిపోయే దృశ్యాలగురించి ఆమె చేసిన వర్ణన వాస్తవికంగా ఉంది. సామాన్య జనజీవనాన్ని ఆమె ఎంత నిశితంగా పరిశీలిస్తున్నదో తెలుపుతుంది. వసంతవర్షర్తులను పోల్చి చూసి వానాకాలంలో  అధికవానలు, మురుగు, వ్యాధులు వంటి నష్టాలు ఉన్నా వసంతరుతువు సౌందర్యానికి ఆలవాలమై సంతోషం కలిగిస్తున్నా “పంటలకు నాకరంబయి యుంట జేసి /చాల లోకోపకారి వర్షర్తువు” అని నిర్ధారించి చెప్పగలిగిందంటే ఆ వాస్తవిక దృక్పథం వల్లనే. అందం సంతోషాన్ని ఇయ్యవచ్చుకానీ కడుపు నింపలేదు అన్న వాస్తవం అర్ధమైన కవిగా కనిపిస్తుంది గుండు అచ్చమాంబ.

సుఖము 16 కందపద్యాల ఖండిక. సుఖము అనే భావనను నిర్వచించటానికి చేసిన ప్రయత్నం ఈ పద్యాలు.సుఖం అంటే ఏమిటి? సుఖాన్ని పొంది ఆనందించిన వాళ్లెవరు? అని తమ్ముడు అడిగిన ప్రశ్నకు అక్క చెప్పిన జవాబుగా  ఈ పద్యాలు వ్రాయబడినట్లు చివరి పద్యం వల్ల తెలుస్తుంది. “ సుఖమన ననేక విధముల / నిఖిల జనానంద కారిణి యగుచు /ధర్మాధ్యఖిల పురుషార్ధములకున్/ సఖియై వర్ధిల్లుచుండు సతము ధరిత్రిన్ “ అని ప్రారంభించి సుఖాన్ని 14 రకాలుగా గుర్తించి పేర్కొన్నది రచయిత్రి ఈ ఖండికలో 1. ప్రాణ సములను, గొప్పతనాన్ని, అభిమానాన్ని, ఆరోగ్యాన్ని  కోల్పోకపోవటం 2. ధర్మమార్గం తప్పకుండా మంచిపనులు చేస్తూ సంతృప్తి గా జీవించటం.3. సంపదలకు కొరతలేని జీవితం  4. తనకృషి ఫలించి నలుగురి మెప్పు పొందటం  5.  పరతత్వం ఎరిగి ఇది కావాలన్న కోరిక లేకుండా బుద్ధిని నియంత్రించి జీవించటం  6. కష్టార్జితంతో బతుకుతూ కోరినవాళ్లకు అడిగినది ఇస్తూ సంతృప్తితో జీవించటం  7. తల్లిదండ్రుల ప్రేమ, సంపద, మంచి భార్య, ప్రాణమిచ్చే స్నేహితులు ఉండటం 8. నవరసభరితమైన నాటకంలో కావ్యమో చదువుకొనటం. 9. మనుమలు విద్యావంతులు అవుతూ  కొడుకులు సమర్ధులై కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే పరతత్వ చింతలో పొద్దుపుచ్చటం. 10. తన దగ్గర విద్య నేర్చిన శిష్యుడు పండితుడని ప్రశంసింప బడుతుంటే గురువుకు సుఖం.11. మల్లెల వాసనలు, చల్లని గాడుపులు వస్తుండగా భార్యతో కలిసి చక్కని పాత వినటం 12. తన  పాండిత్యం సభా  గౌరవం పొందటం.13. భగవంతుడు ఇచ్చిన జీవితం గొప్ప వరం అని జీవించటం 14. ఏ మలినమూ అంటక, నొవ్వక ఒకే విషయం మీద మనసును  కేంద్రీకరించటం. - వీటీలో కొన్ని పునరుక్తులు ఉన్నా  పరిశీలిస్తే  సుఖం అందరికీ ఒకటి కాదు అన్నది మాత్రం స్పష్టం.  వాళ్ళవాళ్ళ చిత్త వృత్తు లను బట్టి సుఖాలు వేరువేరుగా ఉంటాయి. భౌతిక సంపదలు, సంబంధాలు,కార్యాలు, కీర్తి ప్రతిష్టలు   సుఖం అనుకొనటం ఎక్కువ. పరతత్వ చింతన సుఖం అనుకొనటం తక్కువ. ఏమైనా అవి పూర్తిగా వ్యక్తిగతమైనవి. స్వార్ధ ప్రధానమైనవి. ఇతరులకు అవసరమైనది ఇవ్వటంలో సుఖం పొందటం, శిష్యుడి అభివృద్ధి తన సుఖం అనుకొనటం వంటివి  వాటికన్న విలువైనవి.   సంగీతం, సాహిత్యం వంటివి అభిరుచికి సంబంధించినవి. ఇంతకూ సుఖమనేదీ వ్యక్తికీ వ్యక్థకీ భేదిస్తున్నప్పుడు పురుషుడికి సుఖం అయినది స్త్రీకి సుఖం అవుతుందా అన్నది ఒక ప్రశ్న. అచ్చమాంబ గారి కవిత్వం అంతవరకూ పోలేదు. 
    ధూమశకటం, నక్షత్రశాల అచ్చమాంబ వ్రాసిన మరి రెండు ఖండికలు. ధూమశకటం లో 10 పద్యాలు ఉన్నాయి..” గుట్టలు మెట్టలు న్గుహలు గొండలు వాగులు దివ్యమౌ నదుల్ 
          పట్టణము ల్వనంబులును బల్లెలరణ్యము లొక్కరీతిగా
          దిట్ఠదనంబునం దిరుగు దివ్యమునీంద్ర చయంబు వోలె గ 
         న్పట్టుచు నగ్గిబండ్లు కనుపండువుగా ( జన జొచ్చె నెంతయున్”  -   వంటి 
పద్యాలు ఆమె భావుకతను పట్టిస్తాయి. రైలు వివిధ ప్రాంతాల జనాన్ని తెచ్చిస్టేషన్ లో దించటాన్ని   మల్లె మొల్లజాజి మాలతి సంపెంగ ల వాసనలన్నీ మోసుకొని వచ్చే  గాడ్పుతో పోల్చి చెప్పటం లోనూ  ఉపమలు ఎన్నుకొనటంలోని నవ్యత తెలుస్తుంది. నక్షత్రశాల లో పద్యాలు 27. ప్లానెటోరియం కు తెలుగు మాట నక్షత్రశాల. దానికి ‘చుక్కలమేడ’ అన్న చక్కనైన తెలుగు మాటతో చెప్పింది రచయిత్రి. అది విశాఖ పట్నం లోనిదన్న నిర్దేశం కూడా ఖండిక ప్రారంభంలో ఉంది.  “ఎట్టి విచిత్రముల్గనిన నింట సమస్త జనుల్గనుంగొనం/ గట్టడి చేసినిండుమది( గౌతుకమందెడి  మామగారు “ చుక్కల మేడ చూడటానికి ఏర్పాటుచేయడం ఆమె కూడా వారివెంట వెళ్ళటం సందర్భం. ఇందులో నక్షత్ర దర్శనం చేయించే యంత్రాన్ని వర్ణించిన పద్యాలు రెండు ప్రత్యేకం పరిశీలించవలసినవి   చూపిన నేర్పు గమనించదగినది. “ చాలఁ బ్రశస్తమౌనినుము ( జక్కని కంబమొనర్చి దానిలో       
                               మేలగు యంత్రసంతతులు మిక్కుటమై కనుపట్ట( బై దెసన్ / 
                               గీలమరించి దిగ్వితతికిం దిరుగంగల పెద్దగొట్టమున్ 
                               నేలకు నింగికి న్గురిగ నిల్పి రొకించుక నేటవాలుగన్” 
   “దానికి లోన దర్పణవిధానము లుండును వాని వెంబడిన్ 
భానుడు లోనుగాఁగల నభశ్చర సంతతి గానవచ్చు సు 
జ్ఞానులు జ్యోతిషజ్ఞులు నకంపనులై కనుగొంద్రు తక్కొరు 
ల్గానగ నిట్టి యంత్రతతి గల్గకయుండిన శక్యమెట్లగున్” ఈ రెండు పద్యాలూ అచ్చమాంబ యంత్ర నిర్మాణ పరిజ్ఞానాన్ని సూచిస్తాయి. దానిని అంత సరళంగా కవిత్వం చేయటం మరీ విశేషం. 1907 నాటికి ఒకస్త్రీ ఇలాంటి సాంకేతిక విషయాన్ని కవితావస్తువుగా చేసుకొనటం సాధారణ విషయమేమీ కాదు. 
 అచ్చమాంబ వ్రాసిన ఖండికలలో మరొకటి ‘మనీషా పంచకం’ ఆది శంకరాచార్యులు రచించిన అద్వైత సారాన్ని చెప్పే అయిదు శ్లోకాల రచన ఇది. ఆది శంకరుడు కాశీలో గంగాస్నానం చేసి వెళ్తుండగా ఒక చండాలుడు ఎదురుపడ్డాడట. అలవాటు ప్రకారం తొలగిపొమ్మని చెప్పాడట. తొలగిపోవలసినది శరీరమా? ఆత్మా ? అని చండాలుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా శంకరుడు లోకానుభవాన్ని పరామర్శిస్తూ ‘వీడు విప్రుడు వీడు అన్యుడు అనుకొనటం భ్రమ అని, జ్ఞానం ఇచ్చేవాడు బ్రాహ్మడు అయినా అంత్యజుడైనా తనకు గురువే’ అని చెప్పిన  అయిదు శ్లోకాలకు   ముగింపులో మనీషా అని వస్తుంది కనుక ఇవి మనీషాపంచకంగా ప్రసిద్ధికి ఎక్కాయి. గుండు అచ్చమాంబ వాటిని అదేపేరుతో అనువదించింది. “ … శ్రీ శంకరుల ద్వై/ తని రూఢిoబల్కి నట్టి తత్వార్థంబున్ / గని తెనిగించితిఁ గైకొను/ మనంత  తేజోనిధీ  మహాత్మా! చిదాత్మా! అన్న ముగింపు పద్యంలో శంకర తత్వార్థం తెలుగులో చెప్పాలన్నఅచ్చమాంబ కోరిక గమనించ దగినది. అచ్చ మాంబ  తాత్విక చింతన, సంస్కృత భాషా జ్ఞానం రెండూ ఈ ఖండిక రచనలో పరిగణించదగిన విలువలు. 
అచ్చమాంబ పద్య రచనలు మరోరెండు ఉన్నాయి. అవి  శ్రీ సత్కథామంజరి -మొదటిభాగం  శ్రీ సత్కథామంజరి రెండవ భాగం. మొదటిభాగానికి  మేనమామ గుండు వాసుదేవ శాస్త్రి  వ్రాసిన పీఠికను  బట్టి ఆమె ఆ కావ్యాన్ని అంతకు ఆరేండ్ల క్రితమే వ్రాసిందని, వాటిలో మొదటిభాగం ఇప్పుడు ప్రచురించబడుతున్నదని చెప్పిన మాటను బట్టి చూస్తే  దీని  రచనాకాలం 1901 అన్నమాట. ఆ పీఠికలోనే ఆయన ఇది మొదటి సంపుటి అని చెప్పాడంటే రెండవ సంపుటం అప్పటికే కూర్చబడి అయినా ఉండాలి లేదా అందుకు ప్రణాళిక అయినా సిద్ధమై ఉండాలి. ఈ మొదటి సంపుటం కాకినాడ నుండి ప్రచురించబడినట్లుంది,   ప్రతులను కాకినాడలో డిప్యూటీ రిజిస్ట్రార్ గా ఉన్న భువనగిరి కోదండపాణి కి వ్రాసి తెప్పించుకొనవచ్చునని వెనకపేజీలో  సూచన వున్నది.  కానీ ఆయనకు  అచ్చమాంబకు వున్న సంబంధం ఏమిటో తెలియదు.
 శ్రీ సత్కథామంజరి రెండవభాగం 1920 నవంబర్ లో గుంటూరు నుండి ప్రచురించబడింది. ఇది ప్రచురించబడేనాటికి ఆమె మేనమామ గుండు వాసుదేవశాస్త్రి కీర్తిశేషుడైనాడు. దీనికి పీఠిక రచయిత్రే వ్రాసుకొన్నది. గుంటూరు అరండల్ పేటలోని వాసుదేవ సదనం నుండి ఆమె ఈ పీఠిక వ్రాసినట్లుంది. మొదటి సంపుటానికి ఆయనవ్రాసిన పీఠికలోను, రెండవ సంపుటికి ఆమె వ్రాసుకొన్న పీఠికలోనూ సామాన్యంశం ఒక పద్యం. పండితాగ్రేసరులగు మహనీయుల కేతద్గ్రంధ కర్త్రి యొనరించు పద్యరూపకమగు విజ్ఞాపన అని మొదటి సంపుటంలో పీఠికాకర్త ప్రచురించిన పద్యాన్నే గుండు అచ్చమాంబ నా మేనమామ నా పేర పండితాగ్రేసరులకు చేసిన విజ్ఞాపననే తిరిగి వక్కాణిస్తున్నాను అని ప్రచురించింది. “...... కూర్మి పుత్రియుం / జెలియలు ( గా ( దలంచి నను ( జిత్తముల న్గరుణించి తప్పుల / న్గలిగినఁ జూచి దిద్దురుగాత క్షమింతురుగాత నిచ్చలున్” పద్యంలోని ఈ రెండవ అర్ధభాగం తాత్పర్యం పురుషులదైన సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకొన్న మొల్ల మొదలైన ప్రాచీన మహిళా కవుల వినయ విజ్ఞాపనల వారసత్వంగానే కనిపిస్తుంది. 
సత్కథామంజరి మొదటి సంపుటంలో  తొమ్మిదిమంది పురాణపురుషుల చరిత్ర కథనాలు  రెండవ సంపుటంలో తొమ్మిదిమంది ‘పతివ్రతామణుల’ చరిత్ర కథనాలు ఉన్నాయి. ఒక్కొక్క చరిత్ర మార్గ ఛందస్సులో 27 పద్యాలలో కూర్చబడింది. రామాయణ భారత  భాగవతాది పురాణ జ్ఞానం అచ్చమాంబకు ఎంత గాఢంగా ఉందంటే ఆయా కథల సారం చెడకుండా 27 పద్యాలకు పరిమితం చేసి చెప్పగలంత. కాండలుగా, పర్వాలుగా, స్కంధాలుగా వున్న ఆయా  ఉద్గ్రంధాలు చదవగల తీరిక, సమయమూ లేని స్త్రీల కు కాస్త వెసులుబాటు దొరికితే సులభంగా చదువుకొనటానికి వీలవు తుందని భావించి అచ్చమాంబ ఈ సంపుటాలు తెచ్చి ఉండవచ్చు. మొదటి సంపుటంలో బలరామ శ్రీకృష్ణులు, రుక్మాంగదుడు, ధ్రువుడు, శ్రీరాముడు, అంబరీషుడు, గజేంద్రుడు, మార్కండేయుడు, కుచేలుడు, ప్రహ్లాదుడు - వీళ్ళలో శ్రీకృష్ణ శ్రీరాములు భగవంతుని అవతారాలు. మిగతావారు ఆ భగవంతుని భక్తులై మహిమ చూపినవాళ్లు. భక్తిమార్గ బోధ సత్కథామంజరి మొదటి సంపుటం లక్ష్యం అని వేరే చెప్పక్కరలేదు.  సీత, శకుంతల, చంద్రమతి, దమయంతి, సుకన్య ,సావిత్రి పురాణ పతివ్రతలు. మంగళగౌరి వ్రతకథలో వచ్చే మంగళాంబను, అష్టపదులువ్రాసిన జయదేవుని భార్య పద్మావతిని, సమీపకాలపు సత్యవతి ని అదనంగా చేర్చి అల్లిన తొమ్మిది ఖండికల సంపుటి సత్కథామంజరి రెండవ సంపుటం. తూర్పు ఇండియా కంపెనీ పాలనలో లాహోర్ ప్రాంతంలో స్థానిక అధికారుల దౌర్జన్యాలకు గురై చెల్లాచెదురైన  కుటుంబాన్ని- తన  సహన సాహసాలతో మగవేషంలో దేశయాత్ర చేస్తూ - కూడగట్టిన  సత్యవతి చరిత్రను  వార్తగా చూసిందో, ఆ నోటా ఈ నోటా విన్నదో కానీ దానిమీద కల్పన చేసి వ్రాసిన ఖండిక సత్యవతి. పురాణ పతివ్రతల గురించి చదవటం, చెప్పటం, అనుసరించటం స్త్రీధర్మంగా చెప్పబడుతున్నది సరే .. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఎదుర్కొని చక్కదిద్దటానికి సంసిద్ధులవుతున్న సమకాలపు స్త్రీల గురించి చెప్పుకొనటం కూడా స్త్రీల సాహిత్యధర్మంగా రూపొందుతున్న దృశ్యానికి దీనిని ఒక సంకేతంగా భావించవచ్చు. 
సమస్యా పూరణ పద్యవిద్య అభ్యాసంలో ఒకభాగం.  సావిత్రి మొదలైన స్త్రీల పత్రికలలోనూ తొలినుండి వాటికి స్థానం ఉండేది. గుండు అచ్చమాంబ వ్రాసిన సమస్యా పూరణ పద్యాలు అనేకం. (సావిత్రి , మార్చ్ 1904 )
గుండు అచ్చమాంబ శ్యమంతకమణి అనే నాటకం రచించింది.దీనికి నీలాపనిందా హరణముఅని మరొక పేరు. సావిత్రి పత్రికలో 1904 నవంబర్  సంచికనుండి 1905 సెప్టెంబర్, అక్టోబర్ వరకు  ధారావాహికగా   ప్రచురించబడింది. ఆ తరువాత అది పుస్తక రూపంలో కూడా వచ్చింది. 1906 జులై సువర్ణలేఖ పత్రికలో కృతివిమర్శనము శీర్షిక కింద సమీక్ష చేయబడింది. . అయిదంకాల ఈ తెలుగునాటకానికి మూలం భాగవతంలోని కథ అని, కొన్నికొన్ని మార్పులతో నేర్పుగా నాటక రచనచేసిందని, ఇందలి శైలి మృదువై, ధారాళమై హృదయంగమంగా ఉందని వలయువారు నాటకాన్ని కాకినాడ లో భువనగిరి కోదండపాణికి రాసి తెప్పించుకొనవచ్చునని సమీక్షకులు పేర్కొన్నారు. స్త్రీలు విద్యావంతులై గ్రంధకర్త్రిణులు కావటం సంతసింపవలసిన విషయం  అంటూనే  సమీక్షకులు “ సంస్కృతనాటకములవలె నాంధ్ర నాటకములంత లక్షణ యుక్తముగా గుణ పోషణము చేయబడినవి పురుష విరచితములే విశేషముగా లేకుండునిప్పట్టున స్త్రీలు రచియించినదాని యందా విషయము విమర్శింప నగత్యము” అని అభిప్రాయపడ్డారు. 
తెలుగునాటకాలు సంస్కృతనాటకాల వలే లక్షణయుక్తమైనవి,  గుణ పోషణ చేయబడినవి కావు. పురుషులు వ్రాసిన నాటకాలలోనే అలా లక్షణయుక్తం, గుణ సంయుతం అయిన నాటకాలు ఎక్కువలేవు.అందువల్ల స్త్రీలు వ్రాసిన నాటకాలపై  ఆ విషయాల గురించి విమర్శ అనవసరం అన్నది అభిప్రాయం.  స్త్రీల సాహిత్యం పట్ల విమర్శలోకంలో మొదటి నుండి ఉన్న చిన్నచూపుకు, నిర్లక్ష్యానికి ఇది గుర్తు. అప్పుడప్పుడే రచన ప్రారంభించిన స్త్రీల కృషిలోని గుణదోష విషయాల పరామర్శ వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడుతుందన్న ఒక స్నేహపూర్వకమైన అవగాహన, వాతావరణం లేని ఈ దశ నుండి ఈ నూట ఇరవైఏళ్లలో  మన సమాజం ఎంత పురోగమించిందీ ఆత్మవంచన లేకుండా అంచనా వేసుకోవాలి. 
ఇంతకూ అసలు అచ్చమాంబ అస్తిత్వం ఏమిటి? గుండు వాసుదేవశాస్త్రి మేనకోడలు కనుక ఆమె పుట్టింటి వారి ఇంటిపేరు మరేదో అయివుంటుంది. మేనరికం వల్లనో మేనమామల ఇంటి పేరింటి సంబంధంకావటం వల్లనో ఆమె గుండు అచ్చమాంబ అయివుంటుంది. ఆమె జననం, తల్లి దండ్రుల వివరాలు,పెంపకం,చదువు, పెళ్లి, సంతానం మొదలైన వ్యక్తిగత వివరాలేవీ  ఇప్పటికి తెలియవు. పుస్తక ప్రచురణలనుబట్టి గోదావరి జిల్లాలోనూ, గుంటూరు లోనూ ఆమె ఉన్నట్లు ఊహించవచ్చు. 
 

ఈ సంచికలో...                     

MAR 2020

ఇతర పత్రికలు