గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు భూమన్ ఇచ్చిన ఇంటర్వ్యూ
చాలామంది బాల్యం గురించి చాలా మురిపెంగా చెప్పుకోవడం విన్నప్పుడు, చదివినప్పుడు నాకు అలాంటి బాల్యం లేనట్టు గట్టిగా అనిపించింది. మా నాన్న రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేసేవాడు. అతని క్లాస్మేట్లు కొందరు ఆల్ ఇండియా సర్వీసెస్‌లో పనిచేయటం గమనించినాయన తన పిల్లలు తప్పకుండా సివిల్ సర్వీసెస్ బండి ఎక్కాల్సిందేనని గట్టి పట్టుదలతో ఉండేవారు. చాలా స్ట్రిక్ట్. మేం ఐదుగురం అన్నదమ్ములం. ఒక చెల్లెలు, అతని డిసిప్లెన్ వల్ల బడి, చదువు, మార్కులు తప్పిస్తే మరొక్కటి ఉండేది కాదు.
నా సెవెన్త్ ఫారమ్ లో మంచి మార్కులతో పాసవుతానని గట్టి నమ్మకంతో ఉండేవాడు. సరిగ్గా పరీక్షల సమయానికి ఒక విపత్కర పరిస్థితిలో ఇంటినుండి పారిపోయి (ఆ నేసథ్యమంతా ఆసక్తి కలదే. ముందెప్పుడైనా చెబుతా) మద్రాస్‌లో ఒక పది రోజులు టీ, మిల్క్ దుకాణంలో పనిచేసినాను. వెదికి వెదికి మా నాన్న పట్టుకొచ్చినాడు. సెవెన్త్ ఫారమ్ అంతా ఇదీ తనూ పానయినాను. దాంతో మా ఊరు నందలూరు నుండి ఫ్యామిలీ తిరుపతికి షిఫ్ట్ చేసి ఇక్కడే సెటిల్ అయ్యేట్టు నిర్ణయించుకున్నాడు.
తిరుపతి యస్ వి యులో డిగ్రీ పి.జి చేసినపుడే నాలో పెనుమార్పులు. సాహిత్యం, చలం ప్రభావం, ఉద్యమాలు, విరసం అన్నీనూ. విద్యార్థిగా ఉన్నపుడే రివల్యూషనరీ స్టూడెంట్స యూనియన్ ఏర్పాటు చేస్తే - ఆ పేరుతో విద్యార్థులు అట్రాక్ట కారని కె యస్ అంటే రాడికల్స స్టూడెంట్ యూనియన్ గా పేరు మార్చినాను. ఆ తర్వాత రాడికల్ ఎంత సంచలనమో - అనుకుంటే ఆశ్యర్యం. నిజానికి విప్లవ విద్యార్థి ఉద్యమానికి రాడికల్ ఏ కోశానా పొసగదు. అలా జరిగిపోయింది.
1972లో యం.ఏ. పొలిటికల్ సైన్స్ పూర్తయింది. అప్పటికీ చాలా యాక్టివ్. విప్లవ రాజకీయాల్లో, టి టి డిలో లెక్చరర్ పోస్టు పడితే ఎలాగూ రాదులే అటెండ్ అవ్వు చూద్దాం అని అంటే అప్లయి చేసినాను. ఇంటర్వ్యూలో ఎలాటూ వచ్చేది కాదని ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా చేసినాను. అపుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన. టి టి డి ఇ ఓ గా సుబ్రమణ్యం గారు ఉండేవారు. సిఫారసులకు లొంగేవాడు కాదు. ఈయన ప్రస్తావన ఆర్ బి ఐ రిటైర్డ గవర్నరు వై వి రెడ్డి గారి ఆత్మకథలో ఉంది. ఇంటర్వ్యూలో భూమన్ అనే ఇతడు రాడికల్, ఉద్యోగం యిస్తే విద్యార్థులను చెడగొడుతాడని బోర్డులోని సభ్యులందరూ ఇవ్వరాదని గట్టిగా పట్టుబడితే అట్లా జరిగినపుడు చూసుకోవచ్చులే అని గట్టి నిర్ణయంతో ఉద్యోగంలో సెలెక్ట చేసినాడు. పూర్తిగా ఆయన గట్టి వైఖరి వల్లే సాధ్మమైంది. సెలెక్టు అయినా వివిధ రాకాల ఒత్తిల్ల కారణంగా ఆరు నెలల తర్వాత అపాయింట్మెంటు ఆర్డర్ ఇచ్చినారు.
ఉద్యోగం ముందు ఎట్లున్నానో అట్లాగే ఉద్యోగంలోనూ ఉన్నాను. ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి విరసం సభలు, సమావేశాలకి తిరుగుతున్న రోజుల్లో మదనపల్లిలో పలవలి రామకృష్ణా రెడ్డి గారితో పరిచయం కావడం, వారి పెద్ద కూతురు పలవలి కుసుమకుమారి అనంతపురం సత్యసాయి ఇనిస్టిట్యూట్ లో పనిచేయటం తెలిసింది. వారి ఇంటికి శ్రీశ్రీ, కెవిఆర్, త్రిపురనేని, ఐ వి సాంబశివరావు, నేను పోయినప్పుడు ‘పెళ్లి’ ప్రస్తావన రావడం, ఆమె యూనివర్సిటీలో నా బ్యాచ్ మేటు. ఆమె తెలుగు, నేను పొలిటికల్ సైన్స్. ఐ వి పెళ్లి ‘ఝంఝాటం ’ వద్దని గట్టిగా వారించడం ఒక జ్ఞాపకం. 1974 లో శ్రీశ్రీ, కెవిఆర్, త్రిపురనేని, కాశీపతి, డా. యం వి ఆర్ ల సమక్షంలో మీటింగు పెళ్లి. ఆ రోజుల్లో అదొక సంచలనం. కుసుమకుమారిగారికి తండ్రి వల్ల కమ్యూనిస్టు భావాలు ఉన్నాయి. బాగా చదువుకున్న వ్యక్తి. ధైర్యస్తురాలు. అన్నీ తెలిసి అంగీకరించింది.
పెళ్లయిన సంవత్సరానికే చిత్తూరు కుట్రకేసులో అరెస్టు చేసినారు. ఉద్యోగం నుండి సస్పెండు చేసినారు. బెయిల్ మీద వచ్చి అనంతపురంలో ఉండేవాణ్ణి. అప్పుడు మంచి మిత్రుడు ఇమాం పరిచయం. ఇతని మూలాన అనంతపురం జిల్లా అంతటా తిరిగినాను. ఎన్నో సభల్లో ఉపన్యసించినాను. ఇతని వల్లనే రాయలసీమ సమస్యల గురించి లోతుగా తెలుసుకున్నాను. ఇమామే తరిమెల నాగిరెడ్డి గారిని పరిచయం చేసారు. తరచూ ఆరాం హాస్టల్లో కలుసుకునేవాళ్ళం. టి యన్ మంచి చదువరి. శివసాగరర్, చెరబండరాజుల రచనల గురించి మెచ్చుకునేవారు. ఒకమారు పాతూరులో ఆయన బహిరంగ సభకు పోతే స్వయంగా ఆయనే చెయిర్ తీసుకొచ్చి నా భార్యకు అందించటం - అనుకుంటే ఆశ్యర్యంగా ఉంటుంది. ఇట్లా మేం తిరుపతి, అనంతపురంలో ఉండటం గమనించి భూమన్ అనంతపురంలోనే ఉద్యోగం చూస్తాం - ఆగు అని అనటం గుర్తుంది. ఈ లోగా ఎమర్జెన్సీలో అరెస్టు. ఈ అరెస్టుతో ఉద్యోగం నుండి డిస్మిస్ చేసినారు. ఎమర్జెన్సీలో నాతో పాటు నా విద్యార్థులు ఇద్దరు అరెస్టయినారు. ఒకరు నా తమ్ముడు భూమన కరుణాకర రెడ్డి. మరొకరు శైలకుమార్. మా మామ పలవలి రామకృష్ణా రెడ్డి గారిని కూడా అరెస్టు చేసి ముషీరాబాదు జైటుకు తీసుకొచ్చినారు. (జైలు అనుభవాల గురించి మళ్ళీ ఎప్పుడయినా రాస్తాను).
జైలు నుంచి విడుదలయిన తర్వాత మద్రాసులో లా లో చేరదామని అప్లై చేసుకున్న. ఉద్యోగం పోయినందున నా భార్య మాత్రం అధైర్యపడలేదు. ఆమె ఉద్యోగం ఉంది కదాని అభయమిచ్చింది. ఈ లోగా విషయం తెలుసుకున్న సత్యసాయిబాబా ( వీరి కళాశాలలోనే నా భార్య పి జి లెక్చరర్ గా పనిచేస్తున్నది) అభ్యంతరం లేకపోతే వైట్ ఫీల్సలో ఉద్యోగం ఇప్పిస్తానని చేరతాడేమోన కనుక్కోమని ఆమెతో చెప్పినాడు, ఆ రోజుల్లో సత్యసాయిబాబా తరచూ అనంతపురం కాలేజీకి వచ్చి కొంత సమయం గడిపేవాడు. నేను చేరేదిలేదు పొమ్మన్నాను.
ఈ లోగా జైల్లో మాతో పాటు ఉన్న సి కె నారాయణరెడ్డి గారు, యస్ ఆర్ శంకరన్ గారితో కలిసి గట్టి ప్రయత్నంతో నన్ను రీఇనిస్టీట్యూట్ చేసినట్టుగా ఆర్డర్ తెప్పించినారు. దాంతో మళ్లీ లెక్చరర్ గా కొనసాగవల్సి వచ్చింది. లేకుంటే నా జీవితం మరొకలా ఉండేది.
1977 అక్టోబరులో తిరిగి ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఏ పి టి యఫ్ సభలు, సమావేశాలకు తిరుగని వారం లేదు. కాలేజీలో మంచి పేరే ఉండటం వల్ల లీవులకు పెద్ద ఇబ్బందులు రాలేదు. 1980లో జన సాహితీతో రాష్ట్రమంతా పర్యటన. 1983 నుండి రాయలసీమ ఉద్యమంలో కీలకమయిన పాత్ర. ఉద్యోగం చేస్తూనే సభలు, సమావేశాలు, పాదయాత్రలు విస్తృతంగా చేసే వాణ్ణి. 1983లో వరంగల్ లో డి యస్ ఓ రాష్ట్ర మహాసభల్లో చేసిన ప్రసంగం గురించి ఇప్పటికీ చాలా మంది ప్రస్తావిస్తుంటారు. వరవరరావు చాలా మెచ్చుకొనేవాడు. అదే సంవత్సరం తెనాలిలో జరిగిన హేతువాద మహాసభల్లో గద్దర్, కత్తి పద్మారావులతో పాటు చేసిన ప్రసంగం కూడా చాలా మంది మెచ్చుకునేవారు. దాన్న సి డి చేసి పద్మారావు చాలామందికి పంచేవాడు. ఆ ఉపన్యాసాన్ని ఇప్పటికీ ప్రతిసభలో ప్రముఖ విమర్శకుడు తిరుపతిరావు గుర్తు చేస్తుండటం గొప్ప సంతోషాన్నిస్తున్నది.
1980 - 83లలో నా భార్య పి హెచ్ డి కోసం తిరుపతి రావటం వల్ల ఫ్యామిలీ కుదుట పడింది. 1984లో శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పడిన తర్వాత ఆమె అతికష్టం మీద లెక్చరర్ గా సెలెక్టు అయ్యింది. నక్జలైట్ భార్య అని సెలెక్టు చేయొద్దని చాలా ఒత్తిడి. ఆ ఇంటర్వ్యూ బోర్డులో విద్వాన్ విశ్వంగారు ఉండటం, అప్పటి వి సి వనజా అయ్యంగార్ అభ్యుదయవాద భావాలు కలిగి ఉండటం ( ఆమె మోహిత్ సేన్ భార్య) వల్ల సాధ్యమైంది.
ఆమె అనంతపురంలోనే పి జి లెక్చరర్. తెలుగు తెలుగు అని అరిచే ప్రభుత్వం విశ్వవిద్యాలయంలో యం.ఏ. తెలుగు కోర్సును అడ్డుకుంది. ఐదేళ్ల పాటు ఏ బోధనా లేకుండా ఉండి 1989 నుంచి యం.ఏ. తెలుగు ఇంట్రడ్యూస్ చేయడంతో రీడర్ గా ప్రొఫెసర్ గా స్థిరపడింది. ఆ తెలుగు పెట్టించటం కోసం అదోక పోరాటం. ఎంతో మందిని కలిసి సాధించినట్టే లెక్క, ఆమె డిపార్టుమెంటు ఫౌండర్ హెడ్డుగా విశ్వవిద్యాలయానికి పిలవని సాహితీ ప్రముఖులు లేరు. కారా, ఓల్గా, జ్వాలా దగ్గరనుండి దాదాపు అందరూ స్త్రీ వాద, మైనారిటీ కవులందరూ వచ్చినారు. ఆమె విశ్వవిద్యాలయంలో దాదాపు అన్ని విభాగాల్లో పని చేసినారు. ఇంగ్లీష్‌లో మంచిపట్టు ఉండటం వల్ల దేశమంతా తిరగ్గలిగినారు.
అల్టిమేట్ గా 2008లో అనంతపురం ఎస్ కె యు వైస్ చాన్సలర్ అయినారు. ఇక్కడా పోరాటమే. చాలా కాంప్లికేటేడ్ యూనివర్సిటీ. ఈమె భయపడే వ్యక్తి కాదు. ఈమెకు ముందు ఉన్న వి సి కొన్ని పోస్ట్సు భర్తీ చేయబోతే అక్కడి దుష్టశక్తులు అడ్డుకున్నాయి. అవి దళిత, మైనారిటీలకు చెందిన పోస్ట్సు. ఈమె అన్ని అనుమతులు పొంది పోస్ట్సు ఫిలప్ చేస్తే, తట్టుకోలేని దుష్టశక్తులు వాటిని అడ్డుకోవాలని నానావిధాల ప్రయత్నం చేసినారు. అవి 21 పోస్ట్సు మాత్రమే. వారు అందరూ దళితులు, మహిళలు. ఈమె ఉద్యోగం పోయినా ఫర్వాలేదు, ఆ పోస్ట్సు ఇచ్చి తీరటమే లక్ష్యం అని గట్టిగా నిలబడింది.
అప్పటికీ నిజం చెప్పొద్దూ, నాలోనూ మార్పులు. పోతే పోతాయి వదిలెయ్యమని నా అభిప్రాయం. ప్రభుత్వం రీకాల్ చేసేంతా ఒత్తిడి తెస్తున్నాయి ఈ దుష్టశక్తులు. వద్దని నా విన్నపం.
ఆమె ఒకే మాట అన్నది అభ్యుదయం, విప్లవం అని చెప్పిన మీరే తీరా ‘నిర్ణయం’ తీసుకోవాల్సిన సమయంలో ఇట్లా అయితే ఎట్లా - ఒకవేళ మీ ప్రతిష్టకు ఇబ్బందిగా మీరు ఫీల్ అయితే ‘విడాకులు’ ఇస్తాను గాని రీకాల్ కు జంకేది లేదని తెగేసి చెప్పి పోస్ట్సు ఇచ్చేసింది.
నేనే ఆత్మవిమర్శ చేసుకుని నా ఆలోచనను తప్పుగా గ్రహించి అండగా నిలబడ్డాను. హైకోర్టు లో న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్మింది. దురదఋష్టవశాత్తు మేం నమ్మి కేసు ఇచ్చిన లాయర్ చేసిన మోసం, ద్రోహం వల్ల కేసు వీగిపోయింది. ఎస్ కె యు విషయం బాగా తెలిసిన జస్టీస్ రాములు బెంచ్ లో ఉండే అతనిముందు కేసు వేయకుండా జాప్యం చేసి కేసును తప్పుదోవపట్టించి ప్రభుత్వానికి లాలూచీ అయినాడు. వాని పేరు ప్రస్తావించటానికి కూడా ఇవ్వాళ మనస్కరించదు.
ఏమయితేనేం ఆమె ఇచ్చిన పోస్ట్సు, మిగిలిన అన్నీ కొనసాగుతున్నాయి. అదే గొప్ప తఋప్తి. ఆమెతో పాటు ఒక మారు ఎస్ కె యుకి వెళితే అప్పటి వి సి ఒక్కమాట అన్నాడు. ఎవరైన పదవి తర్వాత తిరిగి వస్తే వాళ్లకాడికి ఒక్కరూ రారు. ఏంది మేడం మీరు వస్తే వందల మంది ఇట్లా మీ వెంట వస్తున్నారని. ఇంతకంటే మించింది ఏముంటుంది.
మా అబ్బాయి యు ఎస్ ఎలో యం.యస్ చేసిన తర్వాత హైదరాబాదులో మేనేజ్మెంటు చేసి టెక్ మహేంద్రలో వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నాడు. ఇతనే హైదరాబాదులో టెక్ మహేంద్ర వారి ఎకోలా ఏర్పాటు చేయటంలో కీలక నాత్ర నిర్వహించినాడు. ప్రస్తుతం కాలీఫోర్నియాలో ఉంటున్నాడు. ఇతని భార్య కూడా యు ఎస్ లో యం యస్ చేసి హైదరాబాదు ఐ యస్ బిలో మేనేజ్ మెంటు కోర్సు చేసింది. షి ఈజ్ ఏ నోటేడ్ ఆర్టిస్ట్ . రాహూల్ భూమన్ శ్వేత.
మా అమ్యాయీ నీలూభూమన్. యాక్టివిస్ట్. ఫిల్మ్స తీస్తుంది. కొన్న సినిమాలు ఇంటర్నేషనల్ గా చాలా నగరాల్లో ప్రదర్శింపబడ్డాయి. యల్ జి బి టి క్యూ, బ్లాక్స్, మైనారిటీ రైట్స్ కొసం కొట్లాడతా ఉంటుంది. ఇద్దరూ అమెరికా మరియు యు కె సిటిజన్ షిప్. అమెరికాన్ ను పెళ్లాడి ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. ఆమె భర్త అండ్రూ నికోల్సన్ గూగుల్ లో పనిచేస్తున్నారు. ప్రపంచ దేశాలు తిరగటం, పుస్తకాలు విరివిగా చదవటం, మార్జినలైజ్డ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడటం ఈమె చేస్తున్న పని. ‘విపశ్యన’ కోర్సులు తరుచూ చేస్తుంటారు.
బిట్వీన్ ద లైన్స చాలా గ్యాప్స ఉన్నాయి. తీరిగ్గా వీలుచూసుకొని చెబుతా.
కొన్నయినా చెప్పే అవకాశం కల్పించినందుకు గోదావరి అంతర్జాల పత్రికకు, సంపత్ గారికి ధన్యవాదాలు.
2. మిమల్ని ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి?
నా డిగ్రీ రెండవ సంవత్సరంలో చలం, ఆనందం, విఫాదం పుస్తకాలు చదివి అత్యంత తీవ్రమైన ప్రభావానికి గురై ఇంట్లో చెప్పా పెట్టకుండా తిరుపతి నుండి విల్లుపురం పాసింజర్ రైల్లో టిక్కెట్టు లేకుండా ప్రయాణించి నేరుగా తిరువణ్ణామలై స్టేషన్లో దిగి నడుచుకుంటూ పోయి చలం గారి ఇంటికి చేరుకున్నాను. చలంగారు సాదరంగా చేరదీసినారు. ఏమీ ప్రశ్నంచలేదు. వారి మనిషిగా చూస్తున్నారు. సౌరీస్, కృష్ణారావు గార్లతో సాన్నిహిత్యం అక్కడనే. రోజూ సాయంకాలం చలంగారు వాకింగ్‌కు పిల్చుకుపోయి దగ్గర్లోవున్న ఒక పాడు బడ్డ మండపం వద్ద కూర్చోపెట్టుకుని వారికి వచ్చిన ఉత్తరాలు చదివించుకునేవారు. అక్కడే శీశ్రీ, జల సూత్రం రుక్మిణీశాస్త్రి, చింతా దీక్షితులు పేర్లు విన్నాను. నెల రోజులుండి తిరుపతి వచ్చేసాను. చలంగారితో ఉత్తర ప్రత్యుతరాలు ఉండేవి. వారు, వారి రచనలే నన్ను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసినాయి. మల్లొక్క మారే చలం దగ్గరికి వెళ్లింది.
అది 1968వ సంవత్సరం. నగ్జల్బరీ వసంత మేఘగర్జన రోజులు. శ్రీకాకుశ పోరాటం ఉవ్వెత్తున లెగుస్తున్న సందర్భం. నాకు 18సంవత్సరాలు. బి.ఏ. రెండవ సంవత్సరం. నా క్లాసుమేటు జి.సుబ్రమణ్యం రెడ్డి నగ్జల్బరీ దారి చూపించినవారు. ఇక వెన్వెంటనే చలంను వదిలేసి ఇక మీ దగ్గరకు రానని ఉత్తరం రాస్తే కమ్యూనిస్టులు నా దగ్గరకు వస్తుంటారు. నీకు బుద్ధి పుట్టినప్పుడు రావచ్చునన్నారు. నగ్జల్బరీ ప్రభావంతో చలం పూర్తిగా మరుగున పడిపోయినారు. ఈ క్రమంలోనే త్రిపురనేని మధుసూదనరావుతో పరిచయం, గాఢమైన స్నేహం కుదిరింది. త్రిపురనేని పరిచయంతో సాహిత్యం, తత్త్వం, రాజకీయం ఇష్టం కలిగిన అంశాలైనాయి. త్రిపురనేని ఆధ్వర్యంలో యువకులం కొందరం కలిసి ‘లే’, ‘విప్లవం వర్ధిల్లాలి’ కవితా సంకలనాలు తీసుకొచ్చినాము. ‘లే’ ముందు మాటకోసం మద్రాసుకు పోయి మహాకవి శీశ్రీని కలిసి రావటం ఒక గొప్ప అనుభవం. ఆ తర్వాత శీశ్రీ మాకు అత్యంత ఇష్టుడు. మా కోసమే తిరుపతి వచ్చిన సందర్భాలు అనేకం. 1970లో విరసం ఏర్పిడినప్పుడు మేమీద్దరమూ చేరలేదు. ఆ తర్వాతనే చేరింది. విరసం చాలా ఇన్ప్లూయన్స్ చేసింది. శీశ్రీ ‘మహాప్రస్థానం’, ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’ ఇష్టమైన పుస్తకాలు. అప్పట్లో ఫ్రాంటియర్, ఎకనమిక్ మరియు పొలిటికల్విక్లీ బాగా ప్రభావితం చేసిన పత్రికలు.
3. మీ రచనల గురించి చెప్పండి?
నగ్జల్బరీ ప్రభావమే నన్ను రచనలవైపు పురిగొల్పింది. 1970లలో తిరుపతి నుండి ‘రాయలసీమ’ అనే పత్రిక వచ్చేది. అందులో విపరీతంగా రాసేవాణ్ణి. కవితలు, వ్యాసాలు విరివిగా వచ్చేవి. ‘లే’, ‘విప్లవం వర్ధిల్లాలి’, ‘రక్త గానం’లో నా కవితలు ఉన్నాయి. తర్వాత తర్వాత ఇది కవిత్వంగా లేదేమోననే బెంగతో ఆవైపే పోలేదు. కవిత్వం అంటే చాలా ఇష్టమున్న రాయబుద్దేయలేదు. మంచి కవిత్వం రాసే శివారెడ్డి, మహెజబీన్ లాంటి వాళ్ల కవిత్వం మహా ఇష్టం.
విరసం, జనసాహితి నుండి బయటకి వచ్చిన తర్వాత రాయలసీమ కరువు, కాటకాల గురించి నా మిత్రుడు ఇమాం ద్వారా తెలుసుకున్నాను. 1983లో ఇమాం సారధ్యంలో ‘కదలిక’ అనే పత్రిక వచ్చేది. వివిధ రకాల పేర్లతో విరివిగా వ్యాసాలు రాసేవాణ్ణి. ‘కదలిక’కు మంచి పేరు ఉండేది. రాయలసీమ సమస్యలు తెలుసుకోడానికి ‘కదిలిక’ బాగా ఉపకరించింది. తర్వాత రాయలసీమ మీద వ్యాసాలతో ‘చరిత్రలో రాయలసీమ’, ‘రాయలసీమ ముఖచిత్రం’ పుస్తకాలు తీసుకొచ్చినాను.
4 మీ ఆలోచనల్లో సాహిత్య అధ్యయనం ఎలాంటి మార్పుతెచ్చింది?
సాహిత్య అధ్యయనమే నాకు ఆలోచించటం, అర్థం చేసుకోవటం, విశ్లేషించుకోవటం నేర్పింది. సాహిత్య అధ్యయనానికీ నేను రుణపడి ఉంటాను. కందుకూరి, గురజాడ, శీశ్రీ, చలం, కొడవటిగంటి, రావిశాస్త్రీ, బీనాదేవి, రంగనాయకమ్మ,, దాశరథి రంగాచార్య, ఆరుద్ర, సోమసుందర్, సుంకరలాంటి వారు నాకు దారిదీపాలు.
5 మీ చుట్టు ఉన్న ఏ సామాజిక, ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?
ఫలానా అని చెప్పలేను. వివరంగా చెప్పడానికేమీ లేదు. స్కూలు విద్యార్థిగా శరత్ నవలలు, అంతటి నరసింహం రచనలు సమాజం గురించి ఎంతో కొంత నాకు అర్ధమయినట్టుగా చెప్పినట్టు గుర్తు. ఆ తర్వాత చలం, శీశ్రీ, కమ్యూనిస్టు ప్రణాళిక సమాజం గురించి చాలా చెప్పినాయి. వాటి ద్వారా సమాజం, రాజకీయం, ఆర్థికం తెలుసుకున్నాననుకుంటున్నాను. నాకు ఉన్న పరిస్థితులు ప్రోద్బలం చేయలేదు.
6 మీ మొదటి రచన ఏది? అది ఏ సందర్భంలో వచ్చింది?
‘లే’ కవితా సంకలనంలో వచ్చిన కవితలే నా మొదటి రచనలు. నక్షల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాట నేపథ్యమే నా రచనలకు నేపథ్యం.
7 ఇటివలి మీ రచన ఏది? దాని నీపర్యం ఏమిటి?
పర్స్పెక్టివ్స్వారు విరసం ఎలా ఉండాలి అనే అంశం మీద ఒక వ్యాసం రాసివ్వమంటే రాసిచ్చాను. విరసం వారు అడిగితే ఒక వ్యాసం రాసాను. అరుణతారలో వచ్చింది. విరసం 50 వసంతాల సందర్భంగా వచ్చింది. కె.వి.ఆర్ మీద ఒక వ్యాసం రాసాను.
8 విరసం ఆవిర్భావం నాటికి రాయలసీమలో ఉన్న సాహిత్య వాతావరణం ఏమిటి?
కె. సభాగారు రాయలసీమ గురించి రాస్తున్నారు. ముధు రాంతకం రాజారాంగారు మధ్య తరగతి జీవితాలతో పాటు మా ప్రాంతం గురించి రాస్తున్నారు. పుట్టపర్తి నారాయణ చార్యులు గారు నేరుగా రాయలసీమ గురించి రాయకపోయినా ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఉండేవారు. నా ‘చరిత్రలో రాయలసీమ’ పుస్తకాన్ని పుట్టపర్తి వారే ఆవిష్కరించినారు.
ఆ రోజుల్లో సంప్రదాయవాదులు అధికంగానే వున్నా, విరసం పట్ల వ్యతిరేకంగా మాత్రంలేరు. సాహిత్య వాతావరణం స్నేహాపూరితంగా ఉండేది. సహన వాతావరణం చూసినాను. మమ్మల్ని ఎందరో సాంప్రదాయవాదులు ఆదరించిన మాట నిజం. మా అభిప్రాయంతో ఏకీభావం లేకపోయినా ఇడారే వీళ్లు చెబుతున్నది సబబుగా ఉన్నట్లున్నదేననే ధోరణి.
9 విరసం ఆవిర్భావం తరువాత రాయలసీమ సాహిత్యంలో వచ్చిన మార్పులు ఏమిటి?
సరిగ్గా ఆ రోజుల్లోనే రాచమల్లు రామచంద్రారెడ్గి గారి సారధ్యంలో ‘సంవేదన’ వచ్చేది. ఆ పత్రిక ఒక సంచలనం. అభ్యుదయ రచనలు చేసే చాలా మంది విరసం ప్రభావం వల్ల విప్లవ రచనలే చేసినట్టు జ్ఞాపకం.
విరసంలో లేకపోయినా కేతు విశ్వనాథ రెడ్డి, వల్లంపాటి వెంకట సుబ్బయ్య, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, సింగమనేని నారాయణ లాంటి వాళ్లు అద్భుతమయిన సాహిత సృజన చేసినారు. మధురాంతకం రాజారాంలాంటి వారు విరసం నిర్భందానికి గురైనపుడు నిరసించినారు. రాయలసీమ సాంప్రదాయ ధోరణినుండి బయటపడిందని గట్టిగా చెప్పవచ్చు. విరసం ప్రభావం వల్ల ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా చాలా మంది రచయితలు సామాజిక స్పృహతోనే రచనలు చేస్తూ వస్తున్నారు.
10 విరసంలో మీరు ఏ సందర్భంలో విభేదించారు?
నేను విభేదించలేదు. వర్గ శత్రునిర్మూలన సరైంది కాదు అనే ఆలోచనతో ఉన్నందుకు, విరసంతో ఉండనక్కరలేదని జైల్లో ఉండగా విరసం పెద్దలే చెప్పి విరసం నుండి వైదొలిగేట్టుగా చేసినారు. అప్పట్లో అనుమానాలు, అపార్థాలు ఎక్కువ. సరైన అంచనా లేకుండా నిర్ణయాలు జరిగేటివి.
11 విరసం నుండి బయటకు రావడాన్ని ఆలోచిస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది?
నేను బయటకు వస్తేకదా? బయటకు పంపించినారు. విరసం మంరికొంత ప్రజాస్వామికంగా వ్యవసహరించి వుంటే నేనేకాదు, చాలామంది బయటికి వచ్చినవారు విరసంలోనే ఉండే వారేమో?
12 విరసం 50 సంవత్సరాల సందర్భాన్ని ఎలా చూస్తున్నారు చూడాలంటారు?
ఈ 50ఏళ్ళల్లో విరసం తెలుగు సమాజాన్నే కాదు, మిగిలిన భారత భూభాగాన్ని అత్యంత తీవ్రంగా ప్రభావితంచేసింది. అరెస్టులతో, నిర్భంధాలకు, చావులకు భయపడని ధీర సంస్థ విరసం. ఎదిరించటంలో, ప్రజల్ని సమీకరించడంలో ముందు పీఠాన నిలచింది విరసం.
మతం,కులం, అసహన ధోరణులు పెచ్చరిల్లుతున్న ఈ తరుణంలో మరింత పటిష్టంగా, మొక్కవోని ధీరత్వంతో పనిచేయాల్సివుంది. ప్రజాస్వామికంగా ఆలోచించే ప్రతి ఒక్కరిని కలుపుకొని ఒక విశాల వేదికను ఏర్పరచేందుకు కృషిచేయలి. ఇవ్వాళ కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక ధొరణుల్ని ఎదుర్కోవాలంటే విరసం ఒక్క దాని వల్లే అయ్యే పని కాదని గుర్తించి కలిసివచ్చే వారినందరినీ కలుపుకుని ఒక బ్రాడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పరచాటానికి కృషిచేయాలి. చొరవ తీసుకోవాల్సింది విరసమే. వర్తమానంలో చాలా మంది మేధావులు, లౌకిక వాదులు, కవులు, రచయితలు, ప్రజాస్వామిక వాదులు సరైన తీరులోనే సృందిస్తున్నారు. అంది పుచ్చుకోవాల్సిన బాధ్యత విరసందే. ఏ అరమరికలూ లేకుండా మన దేశంలోనే పెచ్చు మీరుతున్న అసహన, మత, మౌఢ్య ధోరణుల్ని ఎదుర్కోన తప్పదు.
13 మీరు మొహమాటం లేకుండా వ్రాస్తారు. మాట్లాడతారు అని అంటారు. దీని వల్ల మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు?
ఏమీలేవు. ఈ ప్రశ్న భళేగా ఉంది. 1970లలో ఇట్లాంటివి ఎదుర్కొన్నాను. ఇప్పుడనిపిస్తుంది కొంత సర్దుకుపోవడమే మంచిదని.
14 శీశ్రీ, కె.విఆర్, వి.వి. త్రిపురనేని, చెరబండరాజులతో మీకున్న పరిచయాన్ని చెప్పండి? వీరితో మీ మీద తీవ్రంగా ప్రభావితం చేసిందెవరు?
‘లే’ కవితా సంకలనానికి పీఠిక రాయించుకోటానికి మద్రాస్ పోయి శ్రీశ్రీతో రాయించుకున్నప్పటి నుంచి శ్రీశ్రీతో సన్నిహిత సాంగత్యం ఏర్పడింది. మా పెళ్లి పెద్ద కూడా శ్రీశ్రీ. ఆ రోజు మీటింగు పెళ్లికి శ్రీశ్రీ, కెవిఆర్, యంవిఆర్, కాశీపతి, త్రిపురనేని పెద్దలు. ఫోటోలు కూడా తీయించుకోని పెళ్లి. అన్నింట పట్ల అంత వ్యతిరేకత ఆ రోజుల్లో. నక్సలైట్లు మా పెళ్ళికి సహకరించినారని ఆ తర్వాత మా మీద ప్రభుత్వం పెట్టిన చిత్తూరు కుట్ర కేసులో వొక ఆరోపణ. శీశ్రీని చిత్తూరు జిల్లాలో తిప్పని ప్రదేశం లేదు. విరసం సభలన్నింటికి హాజరయ్యేవారు. పైగా అతనికి మద్యం అలవాటు వుండటం వల్ల మా తిరుపతితో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకున్న మాట వాస్తవం. 1983లో మా తమ్ముడు కరుణాకర్‌రెడ్డి మీటింగు పెళ్ళికి ఆహ్వానించటమే చివరి పలకరింపు. పెళ్ళి సమాయనికి శీశ్రీ ఆసుపత్రిలో ఉన్నారు.
త్రిపురనేని, నేను అత్యంత సన్నిహితంగా మెలగినవాళ్ళం. స్నేహితం కన్నా మించిన అనుబంధం మాది. త్రిపురనేని వల్లనే తత్తత్వం. రాజకీయం, సాహిత్యం, సామాజికం నేర్చుకున్నాను. వారు, నేను కలిసి కొన్ని వందల సభల్లో పాలుపంచుకున్నాము. మేము కలుసుకోని రోజు ఉండేదికాదు. ఎప్పుడు కలిసిన ఏదో ఒక అంశం గురించి చర్చించుకోవటం, మాట్లాడుకోవటమే గాని, పొద్దు పోని మాట మాట్లాడం ఒక్క క్షణమూ లేదు. ఒక వక్తగా ఎదగటానికి త్రిపురనేని చాలా సహకరించినాడు. ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలను త్రిపురనేని పరిచయం గాకుండా వుండే నా జీవితం ఇలా వుండేది కాదు. చిత్తూరు కుట్రకేసులో నిందితులం. అత్యావసర పరిస్థితిలో నిర్భందితులం. మా కుటుంబం నుండి నేను, మా తమ్ముడు భూమన కరుణాకర్ రెడ్డి, మామ పలవలి రామకృష్ణారెడ్డి అత్యవసర పరిస్థితుల్లో ముషీరబాదు జైల్లో ఉన్నాం. ముగ్గురికి కావాల్సిన వ్యక్తి త్రిపురనేని.
కె.వి.ఆర్. తిరుపతి మిత్రులకు చాలా సన్నిహితుడు. వారి వల్ల సాహిత్య చరిత్ర బాగా తెలిసింది. బాగా చదువుకున్న వారని మాకు ప్రత్యేక గౌరవం. వారి ‘ఎర్రపిడికిలి’ కవితా సంకలనాన్ని తిరుపతి మిత్రులమే ప్రింటు చేసినాము. తిరుపతి నుండి మేం ప్రచురించిన నాలుగు పుస్తకాలకు బాధ్యుణ్ణి నేనే. మద్రాస్‌లో క్రాంతి ప్రేస్కు పోయి ధనికొండ హనుమంతురావు గారిని కలుసుకోవటం, చర్చించుకోవటం మంచి జ్ఞాపకం. కె.వి.ఆర్.ని పెద్ద దిక్కుగా చూసేవాళ్ళం. మద్రాస్ పోయినప్పుడల్లా పాండీ బజారులో ఉండే రాణి బుక్ స్టాల్, ఆరుద్ర గారిని కలిసి వచ్చేవాణ్ణి.
చెరబండరాజు గారి ఇంట్లోనే మొట్టమొదట గద్దర్, భూపాల్‌ను కలుసుకొంది. గొప్పమిత్రులు. హైదరాబాదులో వాళ్ళింట్లో తరచుగా కలుసుకునే వాళ్ళం. మేము దిగంబర కవులను తిరుపతికి పిలిపించి సభలు పెట్టినప్పటి నుండి చెరబండరాజు మంచి ఆత్మీయ స్నేహితుడు.
వరవరరావు గారు ‘సృజన’తో మాకు చాలా దగ్గరవారు. నిబద్ధరచయితగా మేమంతా ఇష్టపడేవాళ్ళం. అందరికన్నా ఉద్యమంలో ముందు పీఠాన ఉన్న వ్యక్తి వరవరరావు. ఆ రోజుల్లో జిల్లా పరిషత్ ఛైర్మ్న్ ప్రతిష్ట కన్నా వరవరరావు ప్రతిష్ట ఎక్కువని అనుకునేవాళ్ళం.
త్రిపురనేని తర్వాత నాకు అత్యంత సన్నిహిత మిత్రులు నిఖలేశ్వర్, జ్వాలాముఖి.
నా మీద చలం ప్రభావం తప్ప మరెవరి ప్రభావంలేదు.
15 త్రిపురనేని మధుసూదన్‌రావు ప్రభావం ముఖ్యంగా తిరుపతి కేంద్రంగా ఉన్న యువకుల మీద, సాహిత్యాకారుల మీద ఎలా ఉండేది?
త్రిపురనేని రాకతోనే తిరుపతిలోఅభ్యుదయ, నాస్తిక, విప్లవ భావాలు వరుస క్రమంలో ప్రవేశించినాయి. ఆ రోజుల్లో సి.పి.ఐ, సి.పి.యం పార్టీల ఉనికి తిరుపతి. త్రిపురనేని అత్యుత్తమ వక్త. ఆలోచనాపరుడు. కళాశాలలో లేడు. అధ్యాపకుడిగా అతనికి చాలా మంచిపేరు. త్రిపురనేనితో పరిచయమైన చాలా మంది విద్యార్థులు, యువకులు విప్లవ భావజాలానికి మళ్ళిన మాట వాస్తవం. ఆ రోజుల్లో తిరుపతిలో ప్రతిరోజు ఏదో ఒకచోట ప్రతిపురనేని ఉపన్యాసం ఉండేది. పోటిపడి హజరయ్యేవారు. మా వూళ్ళో కొనేటి కట్ట బహిరంగ సభల వేదిక. మేమిద్దరం స్నేహితులమైనాక మేం కలిసి అనేక సభలు, సమావేశాలు, సాంప్రదాయవాదులు కూడా త్రిపురనేని ఉపన్యాసాలు వినాడానికి ఆసక్తి చూపేవారు. విప్లవాభిమానులు ‘తిరుపతి మావో’గా త్రిపురనేని గుర్తుంచుకున్నారు.
త్రిపురనేనిని రాయటం వైపు మళ్ళేలా చేసింది తిరుపతి మిత్రులే. రాయటానికి చాలా బద్ధకం. ఎంత సేపయినా మాట్లాడతాడు కాని రాయటం అంటే మొరాయిస్తాడు. 1971 నుండి అనుకుంటా రాయటం మొదలయింది. ప్రతివ్యాసం మొదటనేనే చదివేవాణ్ణి. ‘కవిత్వం - చైతన్యం’ మా తిరుపతి మిత్రులమే ప్రచురించింది. క్రిటిక్ ఆఫ్ ద టైం అని నేనంటే ఏటుకూరి బలరామమూర్తి గారు తీవ్రంగా స్పందించటం జ్ఞాపకం.
నేను తి.తి. దేవస్థానం కాలేజిలో అధ్యాపకుడిగా చేరిన తర్వాత ఇద్దరం కలిసి అనేక సభలు, సమావేశాల్లో పాల్గోన్నాము. దిగంబర కవుల్ని మొట్టమొదట తిరపతి ఆహ్వానించి యస్.వి. యూనివర్సిటిలో, త్యాగరాయమంటపంలో అద్భుతమైన సభలు ఏర్పాటుచేసింది. త్రిపురనేని గారే తిరుపతి చాలా జీభవన్లో మొట్టమొదట సారిగా శీశ్రీ, కొడవటి గంటి కుటుంబరావుల్ని పిలిపించి విప్లవ జేగంటలు మోగించింది త్రిపురనేనిగారే.
త్రిపురనేనిని తిరుపతి ఎప్పటికీ మరవదు.
త్రిపురనేని మధుసూదనరావు పర్సన్ టు పర్సన్ రిలేషన్షిప్ అట్టర్ ఫెయిల్యూర్. పెళ్లిళ్లు, చావులు, చిన్న చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స కు కూడా వెళ్లేవాడు కాదు. ఆ కొన్ని సంవత్సరాలు బావుందేమోకానీ, ఆ తర్వాత వాటినే పట్టుకున్న మేము చాలా ఇబ్బంది పడ్డాం. వ్యక్తిగత సంబంధాల్లో అపార్థాలు, అపోహలు చేటు చేసుకొని చాలా నష్టపోయినట్టే లెక్క.
తిరుపతిలో ఉన్నన్ననాళ్లు తిరుమలకొండ కూడ చూసిన వాడు కాదు. కూతురు బీనా పెళ్లిలో మాత్రమే తప్పని పరిస్థితుల్లో కొండెక్కినాడు.
త్రిపురనేని అంటే మహాకవికి, కె.వి.ఆర్, కొ.కు,కు చాలా ఇష్టం. కొ.కు.తో ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా కొనసాగేవి.
త్రిపురనేని లానంటి హాస్యప్రియుణ్ణి , చతురుణ్ణి మళ్లీ చూడలేదు.
ఉద్యమంలో ప్రత్యక్షంగా పాలుపంచుకోకపోయినా ఆనాటి నగ్జలైటు వీరులందరూ త్రిపురనేనిని మెచ్చుకునేవారు. చర్చల సందర్భంగా జరిగిన ఒక బహిరంగసభలో ఆర్. కె., త్రిపురనేని గురించి మాట్లాడిన మాటలు చాటా గొప్పవి. అప్పటికి త్రిపురనేని చనిపోయి వున్నారు.
త్రిపురనేని తిరుపతిలో ఆ అంశాన్ని వదిలినవాడు కాదు. స్థానిక సమస్యలతో పాటు, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమస్యలన్నింటినీ పట్టించుకుని యువతను చైతన్య పరిచేవాడు. కె జి సత్యమూర్తిని, కొండపల్లి సీతారామయ్యను బాగా ఇష్టపడేవాడు. ఆ రోజుల్లో అండర్ గ్రౌండులో ఉన్న చాలా మంది అగ్రనాయకులు త్రిపురనేనిని కలిసేవారు. నాకు తెలిసి చారు మజుందారు, కానూ సన్యాల్ లాంటి వారిని కూడా కలిసినట్టు జ్ఞాపకం. ఎక్కడికి పోయినా ఇద్దరం కలిసే.
సాహిత్యపరంగా కేతవరపు రామకోటిశాస్త్రి గారిని బాగా ఇష్టపడేవాడు. వారు తిరుపతి వచ్చినప్పుడల్లా కలిసేవారు.
గోపిగారి నేతృత్వంలో గురజాడ అధ్యయన కేంద్ర ఏర్పాటయి ‘‘100 ఏళ్ల కన్యాశుల్కం’’ సభలను చిత్తూరు జిల్లాలో దాదాపు 75 నిర్వహించటం ఒక అపురూపం. ప్రతి సభకు త్రిపురనేని వచ్చినాడు. ‘‘దేశచరిత్రలు’’ గేయాన్ని ఊరురా పాడటం ఒక అద్వితీయమయిన జ్ఞాపకం. ప్రతి కార్యక్రమాన్ని నావల్ గా చేసేవాడు.
16 ఇప్పుడు వెలువరుతున్న రాయలసీమ సాహిత్యమును ఎలా చూడాలంటారు?
ఇప్పుడు వస్తున్న రాయలసీమ సాహిత్యం రాయలసీమ నిజ జీవితాన్ని ప్రతిఫలిస్తున్నది. రాయలసీమ సేద్యం, నీళ్ళు, కరువు, వలసలు, అణిచివేత, లేకుండా సాహిత్యలేదు. అద్భుతమయిన కథ, నవల మా రాయలసీమ నుండి వస్తున్నాయి. సీనియర్ రచయితలయిన కేతు విశ్వనాథ రెడ్డి, సింగమనేని నారాయణలతో పాటుగా నన్నపరెడ్డి వెంంకట్రామిరెడ్డి, స్వామి, దేవపుత్ర, సడ్లపల్లి, వెంకటకృష్ణ, మారుతి, పౌరోహితం, రాసాని, వెంకటకృష్ణ, పాణి, శాంతినారాయణ, దాదాహయాత్లాంటి వారెందరో అద్భుతమయిన సాహితీ సృజన చేస్తున్నారు. రాయలసీమ వారిని చూసి గర్వపడుతున్నది. ఉద్యమాల వెంట పయనిస్తున్న మా రాయలసీమ రచయితలు మా సీమ సమస్య పరిష్కరానికి చేయుతగా ఉంటారనటంలో సంందేహం లేదు. రాయలసీమ అస్థిత్వ పోరాటంలో భాగంగానే మా సాహిత్యాన్ని చూడాలంటాను.
17 ప్రస్తుతం రాస్తున్న రచయితలలో మీరు ఇష్టపడే రచయితలు - ముఖ్యంగా రాయలసీమ రచయితలు ఎవరు?
రంగనాయకమ్మ, ఓల్గా, కుప్పిలి పద్మ, మహెజబీన్, నామినీ, ఖాదర్, కె. శివారెడ్డి, నాగసూరి వేణుగోపాల్, ‘కథ’, ‘అన్వీక్షకి’, ఎన్. వేణుగోపాల్, ఖదీర్‌బాబు, రాచ పాళెం చంద్రశేఖర్‌రెడ్డి, కొలకలూరి ఇనాక్, జి ఆర్ మహర్షి - ఇంకా ఎందరో, మరెందరో??
స్వామి, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, రాసాని, జి. వెంకటకృష్ణ, ‘‘నేలంకని రచయితలు’’, మారుతి పౌరోహితం, మధురాంతకం నరేంద్ర,, కేతు విశ్వ నాథరెడ్డి, సింగమనేని నారాయణ, శాంతినారాయణ, వేంపల్లి షరీఫ్, సాకం నాగరాజు మొదలైనవారు.
18 ఒక రచయితగా ప్రస్తుత సామాజికోద్యమాలను ఎలా అర్థం చేసుకుంటున్నారు?
ప్రస్తుత సామాజిక ఉద్యమాలు సరైన మార్గంలోనే నడుస్తున్నాయి. శత్రువు బలంగా ఉండటం మెయిన్ స్ట్రిమ్ మీడియా వాళ్ళకు బాకాగా తయారు కావటం వల్ల మిగిలిన రంగం బోసిగా అనిపించవచ్చు. విడివిడిగా చాలా బలంగా ప్రజావ్యతిరేక వ్యవస్థను వ్యతిరేకిస్తున్న ఒక వర్గం వుంది. మొన్నటికి మొన్న కా( సి ఎ ఎ) కు వ్యతిరేకంగా ఢిల్లీలో మహిళలు కదలి రావటం అపూర్వంకదా? ముస్లిం వ్యతిరేకతను, అసహనానికి, కులవివక్షకు, మహిళా అణిచివేతకు వ్యతిరేకంగా కలిసి వస్తున్న జనసముహం గొప్ప ఆశాజనకంగా ఉంది.
ప్రస్తుత సామాజిక ఉద్యమాలు ఒక సరైన నాయకత్వంలో మలుపు తిరిగే రోజు ఎంతో దూరంలేదు.
19 సామాజిక ఉద్యమాలలోనికి యువతరం, కొత్తతరం ఎందుకు రాలేక పోతున్నది?
యువతరానికి, కొత్త తరానికి ప్రస్తుత నాయకత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. పాత తరానికన్నా వీరు బాగా ఆలోచిస్తున్నారు. విశ్లేషించుకుంటున్నారు. సరైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నట్టుంది.
తెలంగాణా ఉద్యమంలో యువకుల కొత్త తరం పాత్ర ఎంత క్రియాశీలకంగా ఉందో చూసినాము.
మా రాయలసీమ ఉద్యమంలో యువతరం, కొత్త తరం చాలా ఆశాజనకంగా ముందున్నది.
జల్లి కట్టు ఉద్యమంలో కాని, పౌరసత్వ బిల్లుకు వ్యతిరేక ఉద్యమంలో గాని అస్సలు ఊహించని జనం ఎట్లా కలిసి వస్తూన్నారో చూస్తున్నం.
నూతన పరిస్థితి, కొత్త సవాళ్ళు భవిష్యద్దర్శనం, శాస్త్రీయత కలిగిన నాయకత్వంకోసం ఈ తరం ఎదురుచుస్తున్నది.
మనం సెకండరీ స్థాయి పుస్తకాలు చదివి అవగాహన కలిగి వుంటే ఈ తరం ఒరిజినల్ రైటింగ్స్ చదువుతూ మరింత పదునెక్కుతున్నారు.
ప్రపంచం మొత్తంగానే యువకుల్ని చూస్తుంటే ముచ్చటేస్తున్నది. యల్ జి బి టి క్యూ లాంటి ఉద్యమాలు ఎంత ముందుకు పోతున్నాయో గమనించండి. సంకీర్ణ ఆర్థిక, సామాజిక విశ్లేషణలో ఈ తరం రాటు తేలుతున్నది. అది ఉద్యమ రూపం తీసుకోవటం ఎంతో దూరంలేదు. కాకపోతే విడివిడిగా అస్థిత్వ ఉద్యమాల్లో ఉన్న వారినందరినీ కలుపుకుని ఉద్యమబాటను ఏర్పరచవలసిన తరుణం ఇది. ఎదురుచుస్తున్నది ఆ నాయకత్వం కోసం ఈ తరం.
20 సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనంటారా? మీ అనుభవం ఏమిటి?
ప్రపంచ విప్లవ పోరాటాల్లో స్వాతంత్య్ర పోరాటాల్లో సాహిత్యం, రచన కీలక పాత్ర పోషించినాయి. చైనా విప్లవంలో మావో రచనలు, కవితలు, వియాత్నాం హోచీమన్ రచనలు, రష్యా విప్లవంలో లెనిన్ రచనలు, టాల్‌స్టాయ్, మయకోవిస్కీ, మాక్సింగోర్కీ రచనలు, మనదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ, నెహ్రు రచనలు తెలంగాణా పోరాటంలో బొల్లిముంత, సుంకర, దాశరథి, సోమసుందర్లాంటి వారి రచనలు ఎంతో ప్రేరణ కలిగించినాయి. సాహిత్యం సామాజిక మాతృకకు ఒక చోదక శక్తి. ఒక దీవధారి. నేనూ సాహిత్యపఠనం ద్వారానే ఉద్యమరంగంలో అడుగు పెట్టిన వాణ్ణి.
21 శ్వేత ప్రాజెక్టు గురించి చెప్పండి? మీరు చేసిన ప్రయోగాలు, అనుభవాల గురించి చెప్పండి?
శ్వేత - శ్రీవెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణా సంస్థ. తిరుమల - తిరుపతి దేవస్థానం 2002లో ఉద్యోగుల్లో క్యూ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, ఫైల్ రైటింగ్. సంస్థ పూర్వోపరాలు తదితర అంశాల్లో అవగాహన కలిగించటానికి ఏర్పండింది. నేను 2005లో సంచాలకుడిగా బాధ్యతలు తీసుకున్నాను. ఉద్యోగులకు సుశిక్షుతులైన అధ్యాపకులను పిలిపించి అనేక అంశాల గురించి తరగతులు ఏర్పాటు చేసేవాణ్ణి. రానురాను పరిధి విస్తృతమై గ్రంధాయం, డిజిటల్ లైబ్రరీ, తరిగొండ వేంగమాంబ ప్రాజెక్టు, వేటూరి ప్రభాకర శాస్త్రీ ప్రాజెక్టు, కొన్నాళ్ళు అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడిగా పనిచేసే అవకాశం కలిగింది.
ఉద్యోగులకు తెలుగులో ఫైళ్ళు రాయటం అంకౌట్స్ మరియు అడిట్, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాలతోపాటూ మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరుపుకొనేలా ఊతమివ్వగలిగినాను.
లైబ్రరీకి ఒక ఉచిత బస్సు ఏర్పాటు చేయించి తిరుపతిలోని అన్ని పాఠశాల విద్యార్థులను పిలిపించి చదివించే అలవాటు చేయగలిగినాను. ఉద్యోగ విరమణ చేసిన వారికి, వృద్ధులకు ఈ సౌకర్యం ఏర్పరచకలిగినాను.
ప్రతి సంవత్సరం, పుస్తక పఠన దినోత్సవాన్ని, గాడిచర్ల హరిసరోత్తమరావు జయంతి, కందుకూరి జయంతిని క్రమం తప్పకుండా జరిపించేవాడిని. మహిళా దినోత్సవం ఇప్పటికీ కొనసాగుతుండటం సంతోషంగా ఉంది.
డిజిటల్ లైబ్రరీ సంచాలకునిగా రాష్ట్రమంతటా తిరిగి చాలా పుస్తకాలు సేకరించి డిజిలైజేషన్ చేయించినాను. ఈ ప్రాజెక్టు యూనివర్సల్ డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్టుకు అనుబంధం. దీని వ్యూహకర్త ప్రొ. రాజ్‌రెడ్డి. వీరు కార్నెగల్ యూనివర్సిటీలో ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్సి మరియు కంప్యూటర్ సైన్స్‌లో ఆచార్యులు. నిష్ణాతులు. అప్పట్లో దాదాపు 60 ప్రభుత్వలకు కంప్యూటర్ సలహదారునిగా వుండేవారు. వీరు డిజిటల్ లైబ్రరీకి కావాల్సిన ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అంతా ఉచితంగా సమకూర్చినారు. టి.టి.డి చేయవల్సిందల్లా పుస్తకాల్ని డిజిటలైజేషన్ చేయటమే. దీన్ని నాకు ఉన్న ఆసక్తి వల్ల ఒక ఉద్యమంలా చేయగలిగాను. మద్రాసులో కన్నెమరా గ్రంథాలయం, తంజావూరులోని సరస్వతీ గ్రంథాలయం వేటపాలెంలోని కొన్ని పుస్తకాలు, మచిలీపట్టణంలోని విక్టోరియా గ్రంథాలయం, నెల్లూరులోని వర్దమాన సమాజం లాంటివన్నీ తిరిగి, వారిని ఒప్పించి డిజిటల్ లైబ్రరీ ఖర్చులతో డిజిటలైజ్ చేయగలిగాను. విశాలాంధ్ర మేనేజర్ పి. రాజేశ్వరరావు గారి సౌజన్యంతో తరిగొండ వేంగమాంబ జీవిత చరిత్రను హిందీ, ఇంగ్లీషులోనూ వచ్చేలా చేయగలిగినాను. రాసాని నాటకం రాస్తే, దాన్ని హిందీలోకి తర్జుమా చేయించటం జరిగింది. విశాలాంధ్ర ప్రచురణలను కూడ కొన్నింటిని చేయించకలిగినాను.
అన్నింటి కన్నా ముఖ్యం ‘చందమామ’ అన్ని సంవత్సారాల, అన్ని భాషల కాపీలను డిజిటలైజ్ చేయించటం ఒక అపురూపమయిన అనుభవం. అందుకు బి. విశ్వనాథరెడ్డి గారి సహకారం మరువలేనిది. ‘చందమామ’ 60 వసంతాల పండుగను ‘శ్వేత’ నే ఘనంగా తిరుపతిలో నిర్వహించింది.
అంతేగాకుండా చాలా మంది రచయితలను వొప్పించి వారి గ్రంథాలయాలను శ్వేత గ్రంథాలయానికి చేర్పించగలిగినాను. సి.ఆర్. రెడ్డి గ్రంథాలయం, బాలశౌరి రెడ్డి గారి గ్రంథాలయం లాంటి వెన్నో శ్వేత గ్రంథాలయంలో చేరిపోయినాయి. విడిగా ఎంతో మంది వ్యక్తులద్వారా పుస్తకాలు సేకరించేవాణ్ణి, విద్యార్థులు పొటి పరిక్షలకు సిద్ధంకావటానికి వారికి అవసరమయిన కరిక్యూలర్ ఆర్.సి.రెడ్డి ఐ.ఎ.యస్. స్టడి సర్కిల్ నుండి ఉచితంగా తెప్పించి అందుబాటులో ఉంచేవాణ్ణి.
నా ఆ మూడేళ్ళల్లో తరిగొండ వేంగమాంబ సినిమా వచ్చేలాగా చేయటంలో నా కృషి కూడా కొంత ఉంది. అందుకు దొరస్వామి రాజుగారి ఉదాత్తతను గుర్తుచేసుకొవాలి.
అన్నింటికన్నా ముఖ్యమయిన విషయమేమిటంటే శ్వేత ద్వారా రాష్ట్రంలోని ప్రతి దళిత వాడ, మత్స్యకార గ్రామాలనుండి ఎంపిక చేసిన వారికి వారం రోజలు పాటు పూజా విధానంలో శిక్షణ ఇవ్వటం. దీనికి బోర్డు అనుమతి లేకపోయినా కె.వి. రమణచారి గారి సాంగత్యం వల్ల చేయగలిగాము. వారికి రానుపోను ఛార్జీలు ఇప్పించి, శ్వేతలోనే వసతి సౌకర్యం, అక్కడే భోజనాలు ఏర్పాటు చేయించగలిగినాము.
మనకు భక్తి లేక పోయినా సమాజంలో భక్తి కలిగిన అణగారిన వర్గాలకు ఆ అవకాశమే లేకుండా పోయిందికదా అనేదీ నా ఆలోచన. ఆ ఊళ్ళన్నీ తిరిగి పిలిపించేవాణ్ణి. తరువాత గిరిజన గ్రామాలనుండి కూడ, ఇదొక పెద్ద సంచలనంగానే జరిగింది.
టివి9 వారు నన్ను ఆ రోజుల్లో ఇంటర్వు చేస్తూ ఈ శిక్షణ పొందిన దళితులు, గిరిజనులు తిరుమల దేవాలయంలో మాకూ అవకాశం ఇవ్వాలని డిమాండు చేస్తే ఎట్లాని అడిగితే ‘‘అంతకుమించిని డిమాండు మరే ముంటుందని’’ జవాబిచ్చాను. ఎన్నో కంట్రావర్సిస్ మధ్య ఆ కార్యక్రమం కె.వి. రమణచారి గారి ప్రోత్సహంతో ఘనంగా జరిగింది.
ప్రతి ఒక్కరికీ అవకాశం అనే సిద్ధాంతంతోనే ఎవరెన్ని రకాలుగా విమర్శించినా ముందుకు పోగలిగినాను.
వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రాజెక్టు ప్రారంభ సంచాలకుడిగా వారి పుస్తకాలన్నింటిని వేటూరి ఆనంద మూర్తి గారిని వొప్పించి శ్వేతకు తెప్పించి కలిగినాను. మిగిలిన పుస్తకాలను పరిష్కరింపజేసి ప్రచురించటమే గాకుండా, అన్ని గ్రంథాలయ పుస్తకాలను డిజిటలైజ్ చేయించకలిగినాను. విశ్వ విద్యాలయాల్లో వేటూరి పేరిట సదస్సులు నిర్వహంచకలిగినాను. వారి విగ్రహం కూడా శ్వేత ఎదురుగా ప్రతిష్టింపచేయటం జరిగింది. తరిగొండ వేంగమాంబ విగ్రహం, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, సాధు సుబ్రమణ్యం శాస్త్రి గార్ల విగ్రహాలు కూడా శ్వేత గుండానే ప్రతిష్టింపబడినాయి.
చివర్లో సారంగపాణి ప్రాజెక్టు ఏర్పాటు చేయటానికి పాటు పడ్డాను కాని, కుదరలేదు. నేను వైదొలిగిన తర్వాత కార్వేటి నగరంలో ప్రతిష్టింపచేసినారు.
అప్పటి కార్యనిర్వహణాధికారి సారంగపాణి శృంగార కీర్తనలు రాసినాడంట కదా అంటే అన్నమాచార్య శృంగార కీర్తన రచనల పుస్తకాలు చూయించి మారు మాట్లడకుండా చేయగలిగినాను గాని, ప్రాజెక్టు మాత్రం సాకారం కాలేకపోయింది.
తి.తి. దేవస్థానం మహాభారతం అన్ని సంపుటాలు ప్రచురించిన తర్వాత ‘శ్వేత’ ఆధ్వర్యంలో తిరుపతి, వరంగల్, రాజమహేంద్రవరం, డిల్లీ, హైదరాబాదు, అనంతపురంలో ఘనమైన సదస్సులు నిర్వహించి ఒక మంచి సావనీరు తీసుకురావటం విలువైన జ్ఞాపకం.
సాదా సీదాగా ఉన్న ‘శ్వేత’ ఆధ్వర్యంలో తీరిక లేనన్ని కార్యక్రమాలు నిర్వహించటం విశేషంగా అనిపిస్తుంది.
తి.తి.దేవస్థానపు యస్.వి. ఆర్టస్ కాలేజిలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా పనిచేస్తూ డిప్యూటేషన్‌పైన శ్వేత సంచాలకుడిగా ఐదు సంవత్సరాలు పనిచేసినాను. శ్వేత సంచాలకుడిగా అదనంగా నాకు వచ్చిన ఆర్థిక లాభాలు, అధికార వసతులుగాని లేవు. అవకాశం వచ్చింది చేయగలవన్నీ అప్పటి కార్యనిర్వహణాధికారుల సహకారం, ప్రోత్సాహం వల్ల చేయగలిగినాను.
నేను లెక్చరర్‌గా వున్న ఆ రోజుల్లో మధ్య సంచాలకుడిగా పోత్నుప్పుడు నా విద్యార్థి ఒకరు ఒక మంచి ప్రశ్న వేసినాడు. అభ్యుదయ భావాలతో, చైతన్యపూరితమయిన ధోరణితో పాఠాలు చెప్పే మీరు మమ్ముల్ని మధ్యలో వదిలేసిపోతే ఎట్లా సార్ అని. అందుకు మాత్రం వొకింత దిగులే. నా విశ్వాసాల్ని కాపాడుకుంటూ ‘‘శ్వేత’’ ను అందల మెక్కించగలిగినాను. తిరుమల - తిరుపతి దేవస్థానంలో త్రిపురనేని మధుసుదన్ రావు, డి. నాగసిద్ధారెడ్డి, నేను హేతువాద, అభ్యుదయ విప్లవ భావాలు కలిగిన వాళ్ళం పూరి్త సర్వీసు పని చేసినాము. తి.తి.దే. ప్రజాస్వామికంగా వ్యవహరించిందే గాని మమ్ముల్ని వేధించే అసహనాన్ని ఎన్నడూ ప్రదర్శించలేదు. మేము కేసుల్లో నిర్భంధించబడినప్పుడు, అత్యవసర పరిస్థితిలో అరెస్టుయినప్పుడు కూడ సహకరిచిందే గాని యాక్షన్ తీసుకొలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రోజులు ఉండవని ఇప్పుడు గట్టిగా అనిపిస్తున్నది. ఈ అసహన, మతధోరణుల మధ్యన ఆనాటిని ఊహించటం కష్టమే.
తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రారంభ సంచాలకుణ్ణి నేనే. తరిగొండ వెంగమాంబ మీద మొట్ట మొదట పి.హెచ్డి చేసిన ఆచార్య కె.వి. క్రిష్ణమూర్తి గారి సారధ్యంలో ఆమె రాసిన పుస్తకాలన్నింటినీ పరిష్కరించి ప్రచురించకలిగినాము.
తరిగండ వెంగమాంబ ఆ రోజుల్లోనే సామాజిక దుష్టాచారాన్ని ఎదిరించిన ధీర వనిత. పుష్కర పీఠాధిపతిని ప్రశ్నించిన వైనం ఆదర్శప్రాయం. తిరుమలలో అన్న ప్రసాదాన్ని ప్రవేశ పెట్టిన వ్యక్తి ఆమె. తిరుమలలో తరిగొండ వెంగమాంబ ప్రవేశ పెట్టిన ముత్యాల హారతితోనే కార్యక్రమాలన్నీ ముగుస్తాయి.
వారు రాసిన పాటలన్నింటిని సి.డి.లుగా తీసుకొచ్చినాము. ఈ పనుల్లో మిత్రులు సాయికృష్ణ యాచేంద్ర గారి సహకారం అపూర్వం. వారు మంచి కళాకారులతో పాడించకలిగినారు.
ఆమె రచనల్లో చాలా ముక్తకాలని ఎవరో అడ్దుచెబతే, పాటకు వొదగ గలిగినప్పుడు ముక్తకాలైతే నేమని పాడించగలిగాను.
తరిగొండ వెంగమాంబ రచనల మీద పి.హెచ్డి చేసే విద్యార్థికి రూ. 6000 లు పారితోషికం ఇచ్చేట్టుగా ఉత్తర్వులు ఇప్పించినాను. ఏ విశ్వవిద్యాలయంలో చేసినా సరే.
తరిగొండ వెంగమాంబ సాహితీ సదస్సుకు దాదాపు ముఖ్య విశ్వవిద్యాలయాలన్నింటిలో జరిపించగలిగినాము.
తరిగొండ వెంగమాంబ నాటకాన్ని సురభి వారు ప్రదర్శించే ఏర్పాటు చేయగలిగినాను. అందులో అప్పుడు ఈ.ఓ. కె.వి. రమణాచారి గారి ప్రోత్సాహం మరువలేనిది.
నేను ఆర్ట్స కాలేజీ నుండి ‘శ్వేత’ సంచాలకుడిగా పోయేప్పుడు మంచి ప్రశ్న వేసిన నా విద్యార్థి వెంకటరమణ ఆ ఐదేళ్లు నా కార్యక్రమాలన్నింటినీ ఫాలో అయ్యి నేను రిటైరయిన రోజున, మీరు ‘నామం’ కూడ పెట్టుకోకుండా మీ అభిప్రాయాలను సంరక్షించుకుంటూనే నడిపినందుకు సంతోషంగా ఉంది సార్ అనటం - ఆదావ అనిర్వచనీయమయిన ఆనందం. ఒక స్టూడెంటు నుండి అంతకు మించిన సర్టిఫికేటు ఏముంటుంది?
మహిళలకు కూడా పూజా విధానంలో శిక్షణ ఇప్పించే కార్యక్రమం చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో కాలం మించిపోయింది. నిజానికి ఇంట్లో పూజా పునస్కారాలు చేసేది మహిళలే. తీరా బయట గుళ్లల్లో వారికి అవకాశమే లేదు. దేవాలయాల్లో మహిళలు కూడా పూజా విధానాలు నిర్వహించే రోజు రావాలి.
నా హయాంలో శ్వేతకు డా. యం వి ఆర్, బొజ్జా తారకం, జ్వాలాముఖి, కె. విశ్వనాథ్, సుధా నారాయణమూర్తి, విశ్వనాథరెడ్డి, సినారె లాంటి పెద్దలెందరో రావటం మరపురాని జ్ఞాపకం.
22 మీ ట్రెక్కింగ్ అనుభవలు- విశేషాలు ఏమిటి?
నేను లెక్చరర్‌గా పనిచేసే రోజుల్లో ప్రతిరోజు తిరుమల గాలి గోపురం వరకు ఎక్కి, దిగి వచ్చి కాలేజికి పోయి పాఠాలు చెపేవాణ్ణి. అట్లా అలవాటయిన ఆ తీరుతో చంద్రగిరి వైపున శ్రీవారి కాలిబాటకు దారి మళ్ళింది. ప్రతిరోజూ (అది నా 40వ ఏటనుండి అనుకుంటా) ఎక్కడం, దిగడం ప్రాక్టీస్ అయ్యి 20 నిముషాల్లో ఎక్కి 15 నిముషాల్లో దిగివచ్చేవాణ్ణి, నాతో పాటు జర్నలిస్టు మిత్రుడు ఆలూరి రాఘవశర్మ ఉండేవాడు. ధమ, ధమ దూకే వాళ్ళం. అట్లా మొదలయ్యి మా శేషాచలం అడవులన్నీ తిరగాలనే అభిలాషతో ప్రతి తీర్థం తిరిగినాను. తిరుపతి ఎదురుగా కనిపించే కొండ ఆ కొస నుండి ఈ కొస వరకు ఆ మాట కొస్తే ప్రతి అంగుళం తిరిగినట్టే.
అంతవరకు రాయలసీమ కరువు బండ యాత్ర 600 కి.మీ. చేసిన అనుభవం. 1980లలో శ్రీకాకుళం కొండలన్నీ దాదాపు 200కి.మీ. తిరిగిన అనుభవం ఉంది.
ట్రెక్కింగ్ నా జీవితంలో ఒక భాగమై ప్రకృతి కలయ తిరగటం, ఆ అందచందాలను ఆస్వాదిచటం గత నాలుగు సంవత్సరాలుగా ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నది. తిరుపతిలో మిత్రులు బి.వి. రమణ, బాలు సాధ్యంలో మొసాయిక్ అడ్వంచర్ కమ్యూన్ అనే సంస్థ ఏర్పడి ప్రతి ఆదివారం సన్రైస్ ట్రెక్కింగ్ నిర్వహిస్తూన్నాము. ప్రతి ఆదివారం తప్పని సరిగా ఎంతమంది వచ్చినా ఉదయం 5.30 నుండి 9.30 గం।।ల వరకు ఉంటాయి. తిరుపతి దాని చుట్టు పక్కల 20 కి.మీ. పరిధిలో ఉన్న ఒక 20, 25 ప్రాంతాలను ఎన్నుకున్నము. మా ఈ సంస్థలో ప్రస్తుతం దాదాపు 5000వరకు సభ్యులున్నారు. ప్రతి ఆదివారం 50 నుండి 100 వరకు వస్తారు. ఈ ట్రెక్కింగ్ గ్రూప్‌లో 70 ఏళ్ళ వయస్సు పై బడిన వాణ్ణి నేనొక్కణ్ణే,. యూత్‌కు ఇన్స్పైర్గా ఉంటుందని ఫేస్ బుక్‌లో ఫోటోలు షేర్ చేస్తూంటాను.
ట్రెక్కింగ్ వల్ల ఆరోగ్య నియమాలను సమస్థితిలో ఉంచుకోవటం, ప్రకృతితో మమేకం గావటం, ప్రకృతిలో మనం భాగం అని తెలుసుకోవటం, అందచందాలను ఆస్వాదించటం, అడ్వంచర్‌లో భాగస్వాములు గావటం మనిషిని స్మార్ట్‌గా ఉంచుతాయని నా నమ్మకం.
ట్రెక్కింగ్ అలవాటువటం వల్ల ఎక్కడికి పోయినా, అమెరికాకు పోయినప్పుడు తప్పనిసరిగా ట్రెక్కింగ్ చేస్తాను. భూటాన్ పోయినప్పుడు టైగర్నెస్ట్ అనే ప్రాంతానికి అద్భుతమయిన ట్రెక్ చేయటం ఒక గొప్ప అనుభవం. హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడా మంచుకొండల్లో చేసినాను. హైదరాబాదులో చార్మినార్ నుండి ప్రతి ఆదివారం ఉదయం హెరిటేజ్ వాక్స్ ఉంటాయి. నాలుగు వాక్స్ చేసినాను. ఏ నగరానికి పోయినా హేరిటేజ్ వాక్స్‌లో భాగస్వామినవటం ఒక అలవాటుగా మారింది.
మా కొండనే 20కి.మీ (రానుపోను) దూరం వుండే ట్రేకింగ్స్ అద్భుతమయినవి కొన్ని పదులసార్లు చేసినాను. అవి 1. శేషతీర్థం, 2. తుంబుర తీర్థం, 3. రామకృష్ణ తీర్థం, 4. తాంత్రిక లోయ, 5. కుమారధార మొదలైనవి.
ఐ లవ్ అండ్ రిలిష్ ట్రెక్కింగ్. ప్రతి ఒక్కరూ ట్రెక్కింగ్ అలవాటు చేసుకొమ్మని మా మనవి.
23 కదలిక పత్రిక ఏ సందర్భంలో పెట్టారు? మీ అనుభావాలు ఏమిటి?
‘కదలిక’ ప్రారంభ క్రెడిటంతా పూర్తిగా మిత్రుడు ఇమాందే. నేను, బాషా, ఏయన్ సహకరించినాము. ఇమాంకు రాయలసీమ సమస్యలు, నీటి పారుదల వ్యవస్థ మీద మంచి పట్టు ఉండేది. 1984ల తెలుగుగంగ పథకం మొదలయినప్పుడు రాయలసీమ సమస్యలు వెలుగులోకి వచ్చినాయి. డా।। యం.వి.ఆర్ చాలా ప్రశ్నలు సంధించినారు. సరిగ్గా ఆ సమయంలో ‘కదిలిక’ రాయలసీమ సమస్యలపై విస్తృతంగా పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించింది. ఎన్నెన్నో కొత్త సంగతులను ఆవిష్కరించింది. రాయలసీమ సమస్యలతో పాటు అనేక సాహితీ, సామాజిక, రాజకీయ వ్యాసాలను ప్రచురించింది. నేను వివిధ పేర్లతో విరివిగా వ్యాసాలు రాసేవాణ్ణి. నేను, ఇమాం కదలిక, రాయటమే గాకుండా రాయలసీమ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించినాము. పోతిరెడ్డి పాడు కరువు బండ యాత్ర మా ఆలోచనే. నేను మదనపల్లె నుండి కర్నూలు జిల్లా పోతిరెడ్డి పాడు వరకు సుమారు 550కి.మీ దూరం మిత్రులు సి.హెచ్, శ్రీధర్‌లతో పాటు పాద యాత్ర చేసినాను. 1986 జనవరి 1వ తారీకు నుండి 22వరకు. అది ఒక గొప్ప అనుభవం.
తెలంగాణా ఉద్యమం మొదలైనప్పుడు శ్వేత సంచాలకుడిగా ఉండినా ప్రత్యేక తెలంగానా రాష్ట్రనికి మద్దతును గట్టిగా సమర్థించటానికి ఈ నేపథ్యమే కారంణం. తెలంగాణాతో పాటు రాయలసీమ కూడ ప్రత్యేక రాష్ట్రం కావాలనేది నా డిమాండు.
1984 నుండి కదలికను మోస్తూ రాయలసీమ ఉద్యమంలో మేము తిరగని ఊరు, మాట్లాడని ప్రదేశంలేదు.
‘కదలిక’ ఎందరినో ప్రభావితం చేసింది. ఎంతగానంటే ప్రముఖ రచయిత స్వామి ‘‘రాయలసీమ సమాజము - సాహిత్యము’’ పుస్తక ఆవిష్కరణ సభలో ‘కదలిక’ ను సన్మానించేంత వరకు. కదలిక వల్లనే రాయలసీమ సమస్యలు బాగా అవగతమయినట్టు స్వామి సభా ముఖంగా చెప్పటం నిర్వాహకులంగా మా కెంతో గర్వకారణం.
24 పాఠకులు, కవులు, రచయితలు, సాహితీ వేత్తలకు గోదావరి అంతార్జాల పత్రిక ద్వారా మీరేం చెప్పదల్చుకున్నారు?
దేశంలో అసహన ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి. మత విద్వేషాలు పరాకాష్టకు చేరుతున్నాయి. ప్రజాస్వామిక ధోరణులు దాదాపు చంపబడుతున్నాయి. స్వేచ్చ, హక్కులకు భయంకరమయిన భంగం కలుగుతున్నది. ఈ పరిస్థితుల్ని అర్ధం చేసుకొని, శాస్త్రీయ దృక్పథం పెంచుకుని రచనలు చెయ్యండి. ఉన్న అందుబాటులో జరుగుతున్న మంచి రచనలను అధ్యయనం చేయండి. మనం రాసే రాతలు మన ముందున్న రాతకన్నా ఫర్వాలేదా అని విశ్లేషించుకొని ప్రచురించండి. రాయాలని రాయమాకండి. రాసి ఉన్న రాతల్ని అర్థం చేసుకొని అవగాహన పెంచండి. మన రాతలు సమాజంలో ప్రజావళిని చైతన్యపరుస్తాయి. ఆ చైతన్య సమరంలో సమిధలు కావటమే రచయితల ధర్మం, కర్తవ్యం.
గోదావరి అంతార్జాల పత్రిక ద్వారా స్వేచ్ఛాయుతమయిన, అణిచివేత లేని, ధనిక, పేద తేడాలేని ప్రజాస్వామ్య సమాజ నిర్మాణానికి అందరం కృషిచేయాలనేది నా ఆకాంక్ష.
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు హుస్సేన్ ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి కొంత చెప్పండి?
మాది కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణం. మా తల్లి దండ్రులైన రాజన్బీ, మహ్మద్ అంకూస్ గార్ల ముగ్గురు కొడుకులల్లో నేను చిన్న వాడిని. నాకు ఒక చెల్లెలు కూడా వుంది. మాది అర్దరైతు, అర్ద కార్మిక కుటుంబం. మహిళలు, పురుషులతో బాటు కుటుంబసభ్యులంతా వ్యవసాయ పనులు చేసేవాళ్ళం. విద్యార్థి దశలో నేను కూడా నాగలి దున్నడం, మోట కొట్టడం, నాట్లు వేయడం, కలుపు తీయడం, ఒడ్లు పెట్టడం, తవుటం పెట్టడం, వరి కొయ్యడం, మొయ్యడం, కావలి వుండటం, ఎడ్లు కాయడం, గడ్డి కోయడం లాంటి పనులన్నీ చేసేవాడిని. ఉదయం నాలుగున్నరకే నిద్రలేచి మా అమ్మ, వదినతో కలిసి విసుర్రాయితో మక్కజొన్నల గడుక విసరడం, కుందెనపెట్టి రోకండ్లతో వడ్లు దంచడం చేసేవాడిని.
వ్యవసాయ పనులతో బాటు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్టులో కార్మికుల్లాగా మా తండ్రి దడువాయి పని చేస్తుండగా, మా పెద్దన్న ఎడ్ల బండి (హమాలీ బండి) ద్వారా వ్యవసాయ మార్కెట్టు నుండి రైస్ - ఆయిల్ మిల్లులకు బస్తాలు రవాణాచేసేవాడు. అప్పుడప్పుడు నేను కూడా పెద్దన్నతో బాటు కార్మికునిలాగా ఆపనిలో పాల్గోనే వాడిని. ఆ విధంగా విద్యార్థి దశలోనే రైతుగా, కార్మికునిగా శ్రమలో పాల్గొనేవాడిని.
ఇంటి వద్ద చదువుకునేందుకు, ఆడుకునేందుకు సమయం లభించేది కాదు. బడిఫీజుల కోసం, బలుపాల కోసం, పుస్తకాల కోసం డబ్బులు అడిగినప్పుడుల్లా డబ్బులు ఇవ్వలేక బడిమానేయ్యమనేవాడు మా తండ్రి. మూడు పైసల బలుపం కోసం కూడా ఏడ్వవలిసి వచ్చేది. ఆ విధంగా ఎప్పుడూ ఫెయిల్ కాకుండా 1969లో పదవ తరగతి (యస్.సయ్.సి) పాస్ అయ్యాక చదువు ఆగిపోయింది. ఆ విధంగా విద్యార్థి దశలోనే శ్రమవిలువ, డబ్బువిలువ, పేదరికం గురించి తెలిసి వచ్చింది.
నేను పెండ్లి చేసుకుంటే వరకల్నంగా వచ్చే రెండు వేల డబ్బును వరకట్నంగా మా చెల్లెకు యిచ్చి వివాహం చేసేందుకు నిర్ణయం జరిగింది. మా మేనమామ కూతురైన జిలానీ బేగంతో నా పెండ్లి జరిగింది. 1971 నుండి 73 చివరి వరకు జమ్మికుంట బస్టాండ్‌లో టీ స్టాల్ నడిపాను. 1974 ప్రారంభం నుండి సింగరేణి ప్రాంతమైన మందమర్రిలో కార్మికునిగా జీవితం ప్రారంభించాను. రోజుకు నాలుగు రూపాయల జీతంతో కాంట్రాక్టు కార్మికునిగా మందమర్రి కోల్, స్క్రీన్ప్లాంట్లో ఒక సంవత్సరంపాటు పనిచేసాక 1975 ప్రారంభంలో సింగరేణి కార్మికునిగా (అతి తక్కువ జీతం లభించే జనరల్ మజ్దూర్‌గా) మందమర్రిలోని కళ్యాణిఖని రెండవ భూగర్భగని ఉద్యోగంలో చేరాను.
నేను మందమర్రికి మారిన తర్వాత జమ్మికుంట టీ స్టాల్లో పెట్టి అమ్మిన విస్లవ సాహిత్యాన్ని మందమర్రికి తెప్పిస్తూ మిత్రుడి హోటల్ వద్ద పెట్టి అమ్మడం, చదివించడం, పాటలు పాడి వినిపించడం 1975 ఎమర్జెన్సీ ప్రారంభమయ్యే వరకు సాగించాను. ఎమర్జెన్సీలో మందమర్రి, బెల్లంపల్లికి చెందిన నాతోటి సంబంధం ఉన్న రాడికల్స్‌ను, కార్మికుల్ని పోలీసులు అరెస్టు చేసారు. నా కోసం పోలీసులవేట కొనసాగుతుండగా అరెస్టుకు గురికాకుండా రెండు నెలలు డ్యూటీకి పోకుండా, ఇంటి వద్ద వుండకుండా తప్పించుకు తిరిగాక తిరిగి ఉద్యోగంలో చేరాను. ఎమర్జెన్సీ ఎత్తివేసాక బహిరంగంగా, జోరుగా సాగిన విప్లవ రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో, కార్మికుల సమ్మెలు, ఆందోళనల్లో చురుకుగా పాల్గొంటూ పోయాను. 1981 వరకు పార్ట్ టైమర్‌గా ఆర్గనైజేషన్ పనులు నిర్వహించి 1981 నుండి ఉద్యోగాన్ని వదిలి పూర్తికాలం కార్యకర్తగా మారాను. 1981 చివరలో సింరేణి బెల్ట్ కమిటీ సభ్యుడి గానూ 1992 లో బెల్ట్ కమిటీ కార్యదర్శిగానూ ఆ తర్వాత 1995లో ఏర్పడ్డ ఉత్తరతెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ (రాష్ట్ర స్థాయి కమిటీ) సభ్యుడిగానూ (బెల్ట్ కమిటీ కార్యదర్శి బాధ్యతతో సహా) బాధ్యతలు నిర్వర్తించాను. 1986లో అరెస్టుకు గురై రెండున్నర యేండ్లు జైలు జీవితం అనుభవించి నల్ల ఆదిరెడ్డితో బాటు నేను, మరో ఇద్దరు జైలు బంధనాలను బ్రద్దలు కొట్టుకొని తిరిగి విప్లవోద్యమ బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2004లో పార్టీ కేంద్ర కమిటీ నన్ను జార్ఖండ్ రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ రాష్ట్రంలో మితద్రోహంతో 2009 జనవరిలో బొకారో పట్టణం దగ్గర అరెస్టు అయ్యి, తీవ్రమైన చిత్రహింసలు పొంది 29 కేసులు పెట్టబడి బొకారో, రాంచీ, వరంగల్ జైల్లల్లో నాలుగున్నర సంవత్సరాలు గడిపాను. జైలులో వున్న కాలంలో అనారోగ్యానికి గురైన కారణంగా రహస్య విప్లవోద్యమంలో పనిచేయలేక 2013 మే చివరలో జైలు నుండి విడుదలైనప్పటి నుండి జమ్మికుంటలోనే జీవిస్తున్నాను. నేను ఇంటికి వచ్చేనాటికి 1978లో పంపకాలు జరిగి నా తల్లిదండ్రుల సంపాదనలో నా వంతుకు వారసత్వంగా వచ్చిన భూమిని నా సోదరులు అమ్ముకున్నారు. నా ఇల్లును తమపేర మార్చుకున్నారు. ప్రస్తుతం నాకు స్వంత ఆస్తులేవీ లేవు.
2 మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితల గురించి చెప్పాలి? అలాగే జమ్మికుంట ఆదర్శ కళాశాల విద్యార్థులు మీ ఆలోచనల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపారు? జమ్మికుంటలో ఆదర్శ కళాశాల విద్యార్థులు నడిపిన విద్యుల్లత పత్రిక ప్రభావం మీమీద ఏమైనా వుందా? మీరు జమ్మికుంటో హోలట్ నడుపుతున్న కాలంలో జమ్మికుంటలో పరిస్థితులు ఎలావుండేవో చెప్పాలి?
ఈ ప్రశ్నలన్నీటికి కలెగల్పుగా, సంక్షిప్తంగా జవాబు చెప్పుతున్నాను. నేను జమ్మికుంట హైస్కూల్లో 1968, 69 లో 9వ, 10వ (యస్.యస్.సి) తరగతి చదువుతున్నప్పుడు నా కన్న పై తరగతి చదువుతున్న మడిపెల్లికి చెందిన తిరుపతి ద్వారా శీశ్రీ రచనలు, నాస్తిక సాహిత్యం, సి.వి. రచించిన సత్యకామ జాబాలి లాంటి సాహిత్యం అంది చదివాను. 1970 నాటికే బీజప్రాయంలోనే దేవుళ్ళూ, పూజలు, నమాజ్‌లపై వ్యతిరేకత ఏర్పడింది. అంతవరకు రంజాన్, బక్రీద్ లాంటి సందర్భాల్లో సామూహిక నమాజ్‌లో పాల్గొన్న నేను 1971లో నా పెండ్లి సందర్భంగా తప్పనిసరై నమాజ్ చేసన నేను ఆ తర్వాత మరెప్పుడూ నమాజ్ చేయలేదు. దేవుళ్ళకు మొక్కుతూ పండుగ చేయలేదు.
నేను జమ్మికుంట బస్టాండ్‌లో 1971 నుండి 73 చివరి వరకు ఫ్రెండ్స్ హోటల్ పేరుతో టీ స్టాల్ నడిపాను. ఎలా ప్రారంభించానో ఇప్పుడు యాదికి లేదు కాని విప్లవ రాజకీయాలతో కూడిన ‘‘పిలుపు’’ పత్రికను పోస్టుద్వారా రెగ్యులర్‌గా తెప్పించి అమ్మడం ప్రారంభించాను. మడిపెల్లి తిరుపతి కూడా రచనలు చేసేవాడు. అతని ద్వారా విద్యుల్లత, బద్లా కథలు అందేవి. ‘నూతన’, తదితర సాహిత్య పత్రికలు తెప్పించి టీ స్టాల్ వద్ద పెట్టి అమ్మేవాడిని. శీశ్రీ, వివి, చెరబండరాజు తదితరుల ప్రసంగాలు, కవితలు, జననాట్య మండలి విప్లవ పాటలు విని ఉత్సహం పొందాను. వివి గారి ఇంటికి పోయి మాట్లాడి పోస్టుద్వారా ప్రతినెల 30 సృజన పత్రికలు తెప్పిస్తూ టీ స్టాల్ వద్దే పెట్టి అమ్మాను. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు తీసుకునేవారు. విద్యార్థుల రూముల కాడికి పోతూ కూడా జననాట్యమండలి పాటలు వినిపించడం, సాహిత్యం ఇవ్వడం చేసేవాడి. అలాగే ప్రతి ఆదివారం హుజురాబాద్‌కు పోయి విద్యార్థుల రూముల్లో పాటలు వినిపించేవాడిని. ఆవిధంగా ఆవునూరి సమ్మయ్య, తాడిగిరి పోతరాజు, విద్యుల్లత విజయకుమార్, పల్లె కనుకయ్య తదితరులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆవునూరి సమ్మయ్య, పోతరాజుల నేతృత్వంలో హుజురాబాద్‌లో జరిగే సాహిత్య సమావేశాల్లో పాల్గొనే వాడిని. నేను పాటలు పాడడం తప్ప రచయితను కాదు. జమ్మికుంట కాలేజీలో చదువుతున్న నల్ల సుధాకర్‌రెడ్డి ద్వారా అతని తమ్ముడైన నల్ల ఆదిరెడ్డితో బాటు సాహూ (శనిగరపు వేంకటేశ్వర్లు) తదితరుల పరిచయమై నా దగ్గరి నుండి సాహిత్యం తీసుకునేవారు. మా ఇంటికి దగ్గరలో వున్న విద్యార్థుల రూమును వ్యాయామ సెంటర్‌గా మార్చి, వ్యాయామం కోసం వచ్చే విద్యార్థులు చదువుకునేలా సాహిత్యం పెట్టేవాడిని.
నేను 1973 చివరి వరకు జమ్మికుంటలో వున్నాను. ఆ కాలంలో రాడికల్ విద్యార్థి సంఘం కాని, విద్యార్థుల పోరాటాలు కాని లేవు. కాలేజీ లెక్చరర్లు, విద్యార్థులు జరిపిన ఎలాంటి సమావేశాల్లో నేను పాల్గొనలేదు. నేను తెప్పిస్తున్న సాహిత్యం చదవడం, హుజురాబాద్ సాహితీ మిత్రులతో సంబంధాలు, విరసం పాఠశాల, జననాట్యమండలి పాటలు మాత్రమే ఆ కాలంలో నాపై ప్రభావం చూపాయి.
3 మీరు సింగరేణి ఉద్యోగంలో చేరేనాటికి సింగరేణిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
నేను ఉద్యోగంలో చేరేనాటికి సింగరేణి వ్యాప్తంగా కార్మికులలో సిపిఐ అనుబంణ ఏఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ ఐయన్టియుసి (రివిజనిస్టు, బూర్జువా) యూనియన్ల ప్రాల్యమే కొనసాగుతుండేది. కంక బొంగులతో నిర్మించిన గడ్డి లేదా డాంబర్ రేకులతో కూడిన చిన్న చిన్న గుడిసెల్లో మెజారిటీ కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తుండేవి. అలాంటి కార్మిక బస్తీల్లో కరెంటు, నీరు, రోడ్లు, మురికి కాలువలు గానీ, విద్య, వైద్య సౌకర్యాలు గానీ వుండేవికావు. వందలాది గుడిసెలతో కూడిన బస్తీకి ఒకటి, రెండు నల్లాలు మాత్రమే వుండేవి. కొన్ని బస్తీలలో ఒక్క నల్లా కూడ లేక కార్మికులు స్వయంగా బావులు తవ్వుకునేవారు. నీటి కోసం నల్లాల కాడ ప్రతి రోజూ మహిళలు కొట్లాడుకునేవారు. బస్తీల కాడినుండి గనుల వద్దకు ప్రయాణ సౌకర్యాలు లేక కొన్ని కిలోమిటర్ల దూరం కాలినడకన లేదా సైకిళ్లతో లేదా బొగ్గు లారీలపై ప్రయాణం చేస్తూ కార్మికులు డ్యూటీలు చేసేవారు.
గ్రామాల్లో భూస్వామ్య దొరలలాగే గనుల కాడ కంపెనీ అధికార్ల దౌర్జన్యాలు కొనసాగుతుండేవి. కంపెనీ అధికార్లను ‘‘అయ్యా దొరా’’ అంటూ కార్మికులు పిలుస్తుండేవాళ్ళు. అర్ధ బానిసల్లాగా అణగిమనిగి వుండేవాళ్ళు. గనుల్లోకి సరైన గాలి సప్లయి జరుగక, రక్షణ నియమాలు అమలుగాక కార్మికులు తొందరగా అలసిపోవడం, ప్రమాదాలకు గురికావడం, విషవాయువుల్లో పని చేయవల్సివస్తూ దీర్ఘ కాలిక రోగాల పాలవ్వడం, నష్టపరిహారాలు, వైద్యసదుపాయాలు సరిగాలేక పోవడం ఆనాటి పరిస్థితి. పనిభారం, వెట్టిచాకిరీలు అధికంగా వుండేవి. యేండ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగాలకు పర్మినెంటు ఉండేది కాదు. బాయి పనికి పోయినోళ్ళు ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో అనే భయంతో కుటుంబాలుండేవి. ప్రతి రోజూ యాక్సిడెంట్లు జరుగుతుండేవి. సంవత్సరంలో ఎంతోమంది కార్మికులు ప్రమాదాలకు లోనవుతూ, రోగాల పాలవుతూ చనిపోయేవారు. హక్కులు లేక, సౌకర్యాలు లేక, నిబంధనలు, చట్టాలు అమలుకాక, కార్మికులు, వారి కుటుంబాల బతుకులు చితికి పోతుండేవి.
సింగరేణిలోని అన్ని ప్రాంతాలలో రాజకీయ నాయకులు, యూనియన్ల నాయకులు పోషించేటి గూండాల అరాచకాలు ప్రజల పాలిట శాపంగా వుండేవి. మందమర్రిలో వేలాది ఎకరాల భూములు కల్గిన మాధవరావు కుటుంబం, ఆ కుటుంబంలోని శ్రీపతిరావు, అతని గూండాలు సాగించే గూండాయిజం, దోపిడీ, హత్యలు, అత్యాఆరాలకు అడ్డూ, ఆపు లేకుండేది.
కార్మిక వర్గ ప్రయోజనాల పరిరక్షణ కోసమే పుట్టుకొచ్చాయని చెప్పబడేటి ట్రేడ్ యూనియన్ల నాయకులు వారి సిద్దాంతాలకు, లక్ష్యాలకు, బాధ్యతలకు తిలోదకాలు యిచ్చి కంపెనీకి తొత్తులుగా, పైరవీకారులుగా, లంచగొండులుగా, వ్యాపారులుగా మారిపోయి కార్మికవర్గానికి ద్రోహం చేస్తూ వచ్చేవారు. ఎమర్జెన్సీ చీకటి కాలంలో ప్రభుత్వాల, కంపెనీ యాజమాన్యపు దొపిడీ పీడనలు, అణచివేతలు, ట్రేడ్ యూనియన్ల ద్రోహాలూ, అసమర్థతలు అనేక రెట్లు పెరిగిపోయి వారిపై కార్మికులకు వ్యతిరేకత, అసహ్యం పెరిగిపోయింది. సింగరేణి కార్మికుల సమస్యలు ఎంత చెప్పుకున్నా వొడిచిపోవు.
4 సింగరేణి ఉద్యోగం మీ ఆలోచనలలో ఎలాంటి మార్పులు తెచ్చింది?
గనులల్లో భయంకరమైన, ప్రమాదకరమైన పని స్థలాలు, పనిలో తీవ్రమైన కష్టాలు, ప్రమాదాలు, పనిభారాలు, శ్రమదోపిడీలు, అణచివేతలు, హక్కులు, సౌకర్యాల కరువు, ట్రేడ్ యూనియన్ల విద్రోహాలు తదితరాల గురించి ఎవరో రచయితలు రాసిన రాతలు చదివో, ఎవరో నాయకుల ప్రసంగాలు వినో కాకుండా నేను స్వయంగా గని భూగర్భంలో అతి తక్కువ జీతం లభించే జనరల్ మజ్దూర్‌గా అనేక పనులు చేస్తూ, అనేక సమస్యలను ప్రత్యేక్షంగా అనుభవిస్తూ గమనిస్తూ వచ్చాను. అప్పటికే నాకున్న సిద్దాంత రాజకీయ చైతన్యంతో అర్థం చేసుకుంటూ వచ్చాను. బస్తీలోని చిన్న గుడిసెలో, కరెంటు లేక, ఫ్యాను లేక, నీటి సప్లయిలేక, ఎండ వేడిమితో, వర్షాకాలంలో పై నుండి ఊరుస్తూ, నేలంత నీల్లు ఊరుతూ....భార్యా భర్తలం కష్టాలను భరిస్తూ జీవించాం.
ఫలితంగా ప్రభుత్వాలపై, కంపెనీ యాజమాన్యంపై, ట్రేడ్ యూనియన్లపై వ్యతిరేకత పెరిగింది. విప్లవకర నాయకత్వంలో కార్మిక వర్గం చైతన్యయుతంగా, సంఘటితంగా పోరాటాలు సాగించపూనుకుంటే తప్ప సమస్యలకు పరిష్కారంలేదని భావించాను. అయితే ఉద్యోగం చేస్తూ, ప్రమోషన్లు పొందుతూ, డబ్బులు కూడబెడుతూ, భార్యా పిల్లలతో, సుఖ సంతోషాలతో జీవిస్తూ, కడుపులో చల్ల కదలకుండా - ప్రజల కోసం, విప్లవం కోసం పనిచేయడం సాధ్యం కాని పని అని అర్థం చేసుకున్నాను. అవసరాన్ని బట్టి, పసరిస్థితులను బట్టి ఎప్పుడైనా ఉద్యోగం వదులుకోవాల్సి వుంటుందనే ముందు చూపుతో ఉద్యోగంలో ఉన్నంతకాలం సాధారణ కార్మికునిగా ఉండడమే ఉపమోగకరమని భావించి ప్రమోషన్ల అవకాశాలను కూడా నిరాకరించాను. కార్మికునిగా, రాడికల్‌గా, పార్ట్‌టైమ్ కార్యకర్తగా 1981 ఏప్రిల్ వరకు కార్మికుల్ని ఆర్గనైజ్ చేస్తూ వచ్చాను. 1981 ఏప్రిల్‌లో నేను పని చేస్తున్న గని నుండి నేను, నాతోటి కార్మిక మిత్రుల నాయకత్వంలో సమ్మె ప్రారంభమై అనేక ప్రాంతాలకు విస్తరించి, చారిత్రాత్మక సమ్మెగా సాగి విజయవంతమైన ఆ సమ్మె నుండే నేను పూర్తికాలం కార్యకర్తగా మారి విప్లవోద్యమంలో బాద్యతలు నిర్వర్తిస్తూ వచ్చాను. ఆ సమ్మె తర్వాతనే సి.కా.స. ను స్థాపించి గైడ్ చేయడం జరిగింది.
నాలోనూ, నాలాంటి కార్యకర్తలలోనూ సిద్దాంత రాజకీయ అవగాహన కల్పిస్తూ, ఆలోచనల్లో మార్పులు తెప్పించడంలో 1977 మధ్యకాలం నుండి కామ్రేడ్ గజ్జెల గంగారం, నల్ల ఆదిరెడ్డిలు కల్పిస్తూ వచ్చిన బోధనలు, గైడ్న్స్లు ఎంతో తోడ్పడ్డాయి. నాలో పట్టుదలను, త్యాగనిరతిని పెంచాయి.
5 మీరు సింగరేణి కార్మికునిగా ఉద్యోగం చేస్తున్నప్పుడు బెల్లంపల్లిలో లేదా మొత్తం సింగరేణిలో ఎలాంటి పిరిస్థితులు ఉన్నాయి?
ముందే చెప్పుకున్నట్లు ఎమర్జెన్సీ ఎత్తివేసే నాటికి అంటే 1977నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై, రివిజనిస్టు, బూర్జువా పార్టీలు వాటి అనుబంధ ట్రేడ్ యూనియన్లపై సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలోని కార్మిక వర్గానికీ ప్రజలందరికీ తీవ్రమైన వ్యతిరేకత, అసహ్యం పెరిగిపోయింది. సింగరేణి కార్మికుల్లోనైతే ఇక ఎంత మాత్రం భరించనంతగా అసహనం పెరిగింది. వర్గ కసి కట్టలు తెంచుకునేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘‘ఒక నిప్పురవ్వ దావానలం సృష్టించగలదు’’ అన్నట్లు పోరాడే విప్లవకర నాయకత్వం అండ లభిస్తే కార్మికోద్యమాలు ప్రజ్వరిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో విస్తృతంగా రాజకీయ ప్రచారం చేయాలని, ప్రజలను చైతన్య పర్చుతూ, సంఘటిత పర్చుతూ, సమస్యలని మా విప్లవ పార్టీ (సి.పి.ఐ-యంయల్- పీపుల్స్‌వార్ పార్టీ) తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా సింగరేణి ప్రాంతంలో రాడికల్ విద్యార్థి, యువజనులు, కార్మికులు, జననాట్యమండలి బృందాలు పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించాయి. నేనూ, నాలాంటి విప్లవాభిమానులైనా కార్మికులంతా రాడికల్స్ పేరుతో గనులు, బస్తీలు, విద్యాసంస్థలు, గ్రామల్లో రాజకీయ ప్రచారం కొనసాగించాం. కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, బస్తీ మీటింగులు, బహిరంగ సభలతో సింగరేణి ప్రాంతం ఎరుపెక్కింది.
ఫలితంగా అనేక సమస్యలపై రాడికల్స్ నాయకత్వంలో ఎక్కడికక్కడ పోరాటాలు బ్రద్దలవ్వడం ప్రారంభమైంది. కార్మికుల్లోనూ ఐక్యత, కార్మికులు, విద్యార్థి, యువకుల్లోనూ ఐక్యత పెరుగుతూ సంఘటిత పోరాటాలు సాగుతూ పోయాయి. ముఖ్యంగా గనులల్లో గాలి సప్లయి కోసం, బెల్లంపల్లి పట్టణాన్ని సుందరంగా మార్చే పేర గుడిసెలను కూల్చపూనుకున్న బెటర్మెంట్ కమిటీని వ్యతిరేకిస్తూ, ఎమర్జెన్సీ కాలంలో ‘‘కంపల్సరీ డిపాజిట్ స్కీం’’ సి.డి.యస్.- పేరుతో జీతాల్లో కోత విధించిన డబ్బును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ, తగ్గించిన బోనస్ శాతాన్ని తిరిగి పెంచాలనీ, బెల్లంపల్లిలో రాజేశ్వరీ అనే కార్మికుని బార్యను చెరచి చంపి ఆత్మహత్యగా చిత్రించిన కంపెనీ అధికారి కొడుకును శిక్షించాలనీ, బదిలీ కార్మికులను పర్మినెంటు చేయాలనీ, విద్య, వైద్యం, నీరు, కరెంటు సౌకర్యాలు మెరుగు పర్చాలని తదితర డిమాండ్లతో, పేరుకుపోయివున్న సమస్యలను పరిష్కరించాలంటూ సంఘటిత పోరాటాలు సాగుతూ పోయాయి. ప్రతి సమ్మె సందర్భంగా ఊరేగింపులు, ధర్నాలు, జననాట్యమండలి పాటలు, నినాదాలు మారుమోగాయి. దొంగ ట్రేడ్ యూనియన్ల నాయకత్వాలను కాలదన్నుతూ విప్లవకర నాయకత్వంలో నిరవధిక సమ్మెలు సాగుతూ విజయవంతమవుతుండడంతో కార్మికులకు తమ శక్తి ఎలాంటిదో తెలియవచ్చింది. కార్మికుల్లో, ప్రజల్లో రాడికల్స్ పై అభిమానం పెరుగుతూ పోయింది. రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, రాడికల్ కార్మిక యూనిట్ల నిర్మాణాలు బలపడుతూ పోయాయి.
అయితే ఈ పరిణామాలను ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం, జాతీయ దొంగ ట్రేడ్ యూనియన్లు, పాలకవర్గ పార్టీలు సహించలేకపోయాయి. తమ దోపిడీ వర్గ విధానాలను పరిరక్షించుకునేందుకు కూలిపోతున్న తమ పునాదులను, పలుకుబడులను కాపాడుకునేందుకు కల్సికట్టుగా కుట్రలు సాగించిండ్లు. వారి రక్షకులైన పోలీసుల అండతో ఉద్యమాలను, విప్లవ సంస్థలను, మిలిటెంటు నాయకులను దెబ్బతీసేందుకు పూనుకున్నరు. అందులో భాగంగా ‘‘స్ట్రయిక్ కంట్రోలింగ్ కమిటీల’’ పేర గనుల పై గూండాల కమిటీలను నిర్మించడం, అవి విఫలమైన తర్వాత ‘‘గ్రీవెన్స్ ప్రోసీజర్’’ (సమస్యలను పరిష్కరించుకునే పద్దతి) పేర తడి బట్టతో గొంతులు కోసే విధంగా సమస్యలను, చర్చలను సాగిస్తూ, పోరాట పటిమను దెబ్బతీసేటి విధానాన్ని ప్రారంభించిండ్లు. ఈ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాక ట్రేడ్ యూనియన్లు క్షమించరాని ద్రోహానికి పాల్పడుతూ - ‘‘మేము కొత్తగా డిమాండ్లు పెట్టమని, సమ్మెలకు పూనుకోమని, కార్మికుల సమ్మెలకు మద్దతివ్వమని, సమ్మెకారులపై మేనేజిమెంటు తీసుకునే చర్యలను వ్యతిరేకించం’’ అంటూ సిగ్గులేకుండా మేనేజిమెంటుకు రాసిచ్చిండు. ప్రతి అణచివేత రూపాన్ని పోరాటాల ద్వారా కార్మికవర్గం ఓడిస్తూ పోతుంటే తిరిగి కొత్తకొత్త అణచివేత రూపాలు అమలు చేయ పూనుకున్నారు. ఎనమిది మస్టర్ల జీతాల కోత చట్టం, అత్యవసర సర్వీసుల చట్టం (ఎస్మా) లాకౌట్ల ప్రకటన, అరెస్టులు, డిస్మిస్లు అమలుకు వచ్చాయి. ప్రతి అణచివేత రూపాన్ని, నిర్భంధాలను విప్లవకర నాయకత్వంతో కార్మిక వర్గం సంఘటిత పోరాటాల ద్వారా ప్రతిఘటిస్తూ, ఓడిస్తూ వచ్చింది. సమ్మెలకు, కంపెనీ పొందిన నష్టాలకు కారకులంటూ నన్నూ, నాతోటి మిలిటెంటు కార్మికుల్ని డిస్మిస్ చేసేందుకు పూనుకుని కార్మికుల వ్యతిరేకతకు భయపడి విరమించుకున్నారు.
‘‘తుపాకులతో దుక్కిదున్ని పంటలు పండించలేరు, తూటాలతో గనుల నుండి బొగ్గు వెలికి తీయలేరు. గనులకు తాళాలు వేస్తూ గన్నులతో అణిచేస్తే, చిచ్చురగిలి సింగరేణి నిప్పులయ్యి మండుతుంది’’ అంటూ నిర్భంధాలు ప్రతిఘటనకు దారితీస్తూ పోరాటాలు పెరుగుతూ పోయాయి.
7 మీ మొదటి రచన ఏది? కథనా, కవితనా, పాటనా? అది ఏ సందర్బంలో వచ్చింది?
నా మొదటి రచన పాటనే. 1974 ప్రారంభలో నేను మందమర్రికి పోయి రోజుకు నాలుగు రూపాయల వేతనంతో టెంపరరీ మజ్దూర్‌గా పనిచేస్తున్నప్పుడు సింగరేణి కార్మికుల జీవన పరిస్థితులను చూసాను. కార్మికుల బతుకులకు అద్దం పట్టే విధంగా ‘‘సింగరేణి బతుకులు’’ పేరుతో మొదటి సారిగా పాట రాసాను. భూమయ్య, కిష్టగౌడ్ల ఉరి శిక్షలను రద్దుచేయాలంటూ 1974 మధ్య కాలంలో రాష్ట్ర పౌరహక్కుల సంఘం బ్యానర్‌తో మందమర్రి, బెల్లంపల్లి, మంచిర్యాలలో బహిరంగ సభలు జరిగాయి. ఆ సభల్లో శీశ్రీ, పత్తిపాటి వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించగా హైదరాబాద్ జననాట్య మండలి బృందం సాంస్కృతిక ప్రదర్శన లిచ్చింది. ఆ సందర్భంగా ఆ వేదికలపై నేను రాసిన పాటను నేనే పాడి వినిపించాను. ఆ పాట కార్మికుల్లో మంచి ప్రాచూర్యం పొందింది. 1974, 75లలో హుజూరాబాద్, కరీంనగర్లో శీశ్రీ పాల్గొన్న బహింరగ సభలల్లో నేను పాటలు పాడిన తర్వాత తిరిగి ఈ సభల్లోనే పాడాను.
8 సమ్మె అనే కథను మీరు, నల్ల ఆదిరెడ్డి, చందు రాసారని విన్నాను. నిజానికి ఆ కథను మగ్గురూ రాయవల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
ఒక్క రోజు సమ్మె చేసినా కూడా చట్ట విరుద్ద సమ్మెల పేరుతో రోజుకు ఎనిమిది రోజుల జీతం కోత పెట్టేలా 1936లో బ్రిటీష్ ఇండియా పాలకులు అమలుకు తెచ్చిన ఫాసిస్టు చట్టాన్ని ‘‘స్వతంత్ర’’ భారతదేశపు పాలకులు కూడా అమలుచేయ పూనుకున్నందుకు నిరసనగా నేను పనిచేస్తున్న కళ్యాణిఖని రెండవ భూగర్భ గని నుండి నేను మరియు నాతోటి కార్మిక మిత్రుల ప్రత్యక్ష నాయకత్వంలో 1981 ఏప్రిల్ 18 నాడు సమ్మె ప్రారంభమై దినదినం విస్తరిస్తూ గోదావరిఖని గనుల వరకు విస్తరించి యాబై ఆరు రోజుల పాటు సంఘటితంగా, సమరశీలంగా సాగి విజయవంతమైంది. బొగ్గు ఉత్పత్తులు ట్రాన్స్ పోర్టులు ఆగిపోయిన ఫలితంగా ఆ సమ్మె ప్రభావం దక్షణ భారతదేశం పైపడింది. ఆ చారిత్రాత్మకమైన సమ్మె కార్మిక వర్గాన్ని, విప్లవ ప్రజానీకాన్ని, కవులూ, రచయితలను ప్రభావితం చేసింది. ఆ పోరాట గాథలను కథలుగా ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఆలోచన వచ్చింది. అప్పటికీ కథలు రాసిన అనుభవం లేకపోయినా కూడా కథలు రాసేందుకు నేనూ పూనుకున్నాను. ఆ సమ్మెలో మా వెనుకవుంటూ గైడ్ చేసిన నల్ల ఆదిరెడ్డితో బాటు సమ్మె పోరాటానికి ప్రభావితుడైన పి. చందు కూడ రాసేందుకు పూనుకున్నాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాన్ని కథగా మలిచారు. సమ్మె ప్రారంభం, సమ్మె విస్తరణ, నిర్భందంలో సమ్మె, సమ్మె విజయం, లీడర్ - ఇలా ముగ్గురు కలిసి రాసిన కథలకు రచయితగా ‘‘కార్మిక’’ అనే పేరును పెట్టడం జరిగింది. రహస్య విప్లవోద్యమంలో పనిచేస్తుండే కార్యకర్తలు రచయితలుగా తమ స్వంత పేర్లు పెట్టుకుని ప్రచారం పొందాలనుకోరు కాబట్టి చందు రాసిన కథను కూడా కలిపి కార్మిక పేరుతోనే ప్రచురించడం జరిగింది.
8 మీరు, చందు, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి ‘కార్మిక’ పేరుతోనే కథలు రాసారు కదా. ఒకే పేరుతో ఇంత మంది ఎందుకు రాసారు?
విప్లవోద్యమంలో కొనసాగుతుండే కార్యకర్తలు తమ కులం, మతం, స్వంత పేరు, స్వగ్రామం ప్రకటించుకోకుండా మారు పేర్లతో ఉద్యమంలో కొనసాగుతూ, మారు పేర్లతోనే రచనలు కూడా చేస్తుంటారు. వ్యక్తి గతమైన పేరు ప్రఖ్యాతుల కోసం, గొప్పలు పొగడ్తలు రావాలనే సంకుచితత్వంతో పనిచేయరు. రహస్య జీవితంలో లేని వారు కూడా కొందరు వేరే కలం పేరుతో రాసే వారుంటారు. నా సంపాదకత్వంలో పార్టీలో నడిచిన ‘‘నెత్తుటి గోదారి’’ సాహితీ పత్రికలో నేను కార్మిక, కర్షక, శ్రామిక, గెరిల్లా, బుల్లెట్ తదితర పేర్లతో రాసేవాడిని. కార్మిక పేరుతో అరుణతారలో కథలు జననాట్యమండలి పాటలు వచ్చాయి. కార్మిక పేరు మాత్రమే ప్రచారంలోకి వచ్చింది. నేను విప్లవోద్యమంలో రహస్య జీవితం పాటించడం వల్ల రెగ్యులర్‌గా సాహిత్య పత్రికలు చదువలేక పోయినందున అల్లం రాజయ్య, రఘోత్తమరెడ్డి, చందులు కూడా కార్మిక పేర్లతో రచనలు చేసినట్టు నాకు తెలియదు.
9 బెల్లంపల్లి అనగానే సుధ (సుందిల్ల ధర్మయ్య) గుర్తుకు వస్తాడు అంటారు. అలాంటి సుధతో మీకు పరిచయం ఉన్నదా వుంటే ఆ అనుభవాలు చెప్పగలరా?
‘‘సుధ’’ అంటే సుందిల్ల ధర్మయ్య. తన ఇంటిపేరు, తన పేరులోని మొదటి అక్షరాలను కలిపి ‘సుధ’ పేరుతో రచనలు చేస్తూ సుధగానే ప్రచారం పొందాడు. ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం మంచిర్యాల జిల్లా) లోని జయపూర్ మండలంలోని ‘గంగిపెల్లి’ వారి స్వగ్రామం. ఎంతోమందిలాగే బతుకుకోసం స్వగ్రామాలను వదిలిపెట్టి పారిశ్రామిక ప్రాంతాలకు పోయి కార్మకుల్లా మారిన ప్రజలలాగే సుందిల్ల ధర్మయ్య తల్లి దండ్రులు కూడ కాగజ్‌నగర్‌లోని బట్టల మిల్లులో కార్మికులుగా పనిచేస్తూ జీవించేవారు. ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు ధర్మయ్య. రెండవ వాడు రాజయ్య మూడవ చిన్న కొడుకు అంజయ్య కూడా తల్లి దండ్రులతోనే కాగజ్‌నగర్‌లో వుండేవాళ్లు. ధర్మయ్య కూడా మిల్లులో స్పిన్నర్‌గా పనిచేసేవాడు. కుటుంబాల్లోని ఆడా, మగా కార్మికులుగా పనిచేస్తున్నా కూడా కడుపేదరికంలో జీవించేవారు.
ఆ కుటుండంలోని ముగ్గురు అన్నదమ్ములు విప్లవోద్యమాల ప్రభావానికి విప్లవాభిమానులుగా, కళాకారులు, రచయితలుగా మారారు. 1979 నుండి 1990 వరకు దాదాపు 60 నుండి 70 పాటల వరకు జనాట్యమండలి పాటలను సుధ రాసివుంటడు. వీటిలో చాలా పాటలు ప్రజల్లో చాలా ప్రచారం పొందాయి. అలాగే ఆ రోజుల్లో రాష్ట్రంలో అనేక వేదికలపై జననాట్యమండలి బృందాలు ప్రదర్శించిన ‘‘రగల్‌జెండా బ్యాలె’’ ఒగ్గు కథ కూడా కామ్రేడ్ సుధ రాసిండు. ఎమర్జెన్సీ తదనంతరం బెల్లంపల్లిలో పాముల రాంచందర్ నేతృత్వంలో జననాట్యబృందం ఏర్పడి వందలాది ప్రదర్శనలిచిచ్చింది. ఆ బృందంలో సుధతో బాటు అతని తమ్ముడైన సుందిల్ల రాజయ్య కూడ సభ్యులుగా పనిచేసారు. (ప్రస్తుతం ఈ రాజయ్య మందమర్రిలో స్థిరపడి తెలంగాణ ప్రభుత్వ అనుకూల ప్రచార దళంలో పనిచేస్తూ ప్రభుత్వ కళాకారుడిగా పొట్టపోసుకుంటున్నాడు. నాడు హైదరాబాద్ కేంద్రంగా గద్దర్ నాయకత్వంలో నడిచిన జననాట్యమండలి బృదంలో దాదాపు మూడు సంవత్సరాలు సుధ పనిచేసాడు. అయితే ఆ బృదం నాయకత్వంలో కొనసాగిన అన్యవర్గ ధోరణులను తట్టుకోలేక ఆ జెయన్ఎమ్ ను వదిలివచ్చి ఏ నిర్మాణంలోనూ కొనసాగకుండా ఒంటరిగానే కాగజ్‌నగర్ మరియు సింగరేణి ఏరియాలలో తిరుగుతూ పాటలు రాస్తుండేవాడు. సుధకు చిన్న తమ్ముడైన అంజయ్యను విప్లవాభిమానిగా వున్నందుకే చంద్రబాబు ప్రభుత్వ పోలీసులు పట్టుకొని కాల్చిచంపారు.
సుధ కుటుంబం కడుపేదరికంతో జీవిస్తుండేది. భార్య కొడుకుతో కలిసి కొంతకాలం మహారాష్ట్రంలోని చంద్రాపూర్ కాలరీ ప్రాంతంలో, ఆ తర్వాత సింగరేణి ప్రాంతమైన రామక్రిష్ణాపురంలో ప్రయివేటు టీచర్‌గా పనిచేసిండు సుధ. మంచి విప్లవగేయాలు రాసిన, పాడిన రచయిత, కళాకారుడైన ధర్మయ్య (సుధ) కు మత్తు పానీయాలు సేవించేటి, తంబాకు సున్నం నలిసిన సుడితిని తినేటి చెడు అలవాటు ఉండేది. 1991లో కాగజ్‌నగర్‌కు పోయిన సందర్భంగా పోలీసులు పట్టుకుపోయి వేధించిండ్లు. ఆ సందర్భంగా మానసిక బాధకుగురై కల్తీ కల్లు తాగడం జరిగి ఆరోగ్యం దెబ్బతిన్నది. వెంటనే కుటుంబసభ్యులు హాస్పిటల్‌కు తీసుకుపోయినా ఫలితం లేక మరణించాడు. సుధ సజీవంగా లేకపోయినా కూడ అతను రాసిన, గానం చేసిన పాటలు ప్రజల హృదయాలలోనూ, జననాట్యమండలి పుస్తకాలలోనూ సజీవంగానే వున్నాడు.
10 ఇంకా ఇలా మరుగున పడివున్న కళాకారులు ఎవరన్నా వున్నారా?
గోదావరి కేంద్రంగా రాజన్న అనే కళాకారుని నేతృత్వంలో ఒక జననాట్యమండలి బృందం 1980 దశకం ప్రారంభంలో కొంత కాలం పనిచేసింది. సింగరేణి ప్రాంతంలో సాగిన సంఘటిత కార్మికోద్యమాలు, సింగరేణికి చుట్టూతా సాగిన రైతాంగ, ఆదివాసీ పోరాటాలు, గెరిల్లా దళాల కార్యకలాపాలవల్ల ప్రజానీకం ఎంతో ఉత్తేజితులవ్వడం ఎందరో రచయితలు, కళాకారులు ఉద్భవించడం జరిగింది. అయితే నిర్భందాలు, నిషేదాల వల్ల వారందరూ ప్రచారం పొందలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో కొందరు తమ కళలను ప్రదర్శించగలిగినప్పటికీ వారి గురించి నాకు తెలియదు.
11 మీ చుట్టూ వున్న ఏ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యంవైపు, ఉద్యమం వైపు నడిపించాయి?
విద్యార్థి దశలోనే రైతుగా, కార్మికునిగా శ్రమలో పాల్గొంటూ, పేదరికాన్ని అనుభవిసూ, బీజరూపంలో విప్లవ, నాస్తిక సాహిత్యం పఠిస్తూ చైతన్యం పొందిన నేను సింగరేణి కార్మికునిగా మారి, మందమర్రిలో జీవిస్తూ ఆనాటి భౌతిక పరిస్థితుల వల్ల అనేక మార్పులకు లోనయ్యాను. ముఖ్యంగా...
తమ కండలను కరిగిస్తూ, తమ నెత్తురు ధారబోస్తూ, ఉత్పత్తులు తీసి దేశానికి వెలుగునిచ్చేటి కార్మికులు చీకట్లో చితికి పోతుండటం, సకల ఉత్పత్తులను సృష్టిస్తుండేటి కార్మికులు, రైతాంగం కరువులతో, ఆకలి బాధలతో బతుకుతుండటం. అడ్డూ అదుపూ లేకుండా పారిశ్రామిక ప్రాంతంలో గూండాయిజం, అత్యాచారాలు, హత్యలు కొనసాగుతుండటం. గ్రామాల్లోని భూస్వాములలాగే కంపెనీ అధికార్ల దొరపెత్తనాలు, జులుం కొనసాగుతుండటం, కార్మికవర్గానికి ఉపయోగపడే చట్టాలు, రక్షణ చట్టాలు, ట్రేడ్ యూనియన్లతో జరిగే అగ్రిమెంట్లు, సంక్షేమ కార్యక్రమాలు కాగితాలకే పరిమితమవ్వడం, స్వాతంత్య్రం, గణతంత్రం, ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగించే పార్టీలు దళారీ పెట్టుబడి దార్ల, భూస్వాముల, సామ్రాజ్య వాదుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ ప్రజలను దోపిడీ పీడనలకు, అణచివేతలకు గురిచేయడం, కార్మికవర్గాన్ని చైతన్యపర్చుతూ, సంఘటిత పర్చుతూ, కార్మిక శక్తిని ప్రదర్శింపచేస్తూ కార్మికవర్గ ప్రయోజనాలను పరిరక్షించవల్సిన ట్రేడ్ యూనియన్లు ముఖ్యంగా ఎర్రజెండా యూనియన్లుగా చెలామని అయ్యేవారు కార్మికవర్గ ద్రోహులుగా, కంపెనీతొత్తులుగా మారడం. ప్రజలకోసం నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేస్తుండే వారిని, న్యాయం కోసం, హక్కులకోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రజలను చిత్రహింసలకు, నిర్భంధాలకు, హత్యలకు, అత్యాచారాలకు గురిచేస్తుండటం....అదిగో ఇలాంటి పరిస్థితుల మధ్య నేను జీవించాను. ఇలాంటి పరిస్థితులను గమనించాను. కార్మికునిగా దోపిడి పీడనలకు, అణిచివేతలకు, అసౌకర్యాలకు గురయ్యాను. అలాగే దేశంలోని పీడిత ప్రజానీకాన్ని ఉత్తేజపర్చిన నగ్జల్బరీ, శ్రీకాకుళ ఉద్యమాలు, జగిత్యాల జైత్రయాత్రలు, సింగరేణి సంఘటిత కార్మికోద్యమాలు, విప్లవరాజకీయ బోధనలు నన్ను ఉత్తేజపర్చుతూ, చైతన్యపర్చుతూ నన్ను రచయితగా, గాయకుడిగా, ఉద్యమకారునిగా, విప్లవకారునిగా మార్చాయి.
15 మీ సహచరి గురించి చెప్పండి? మీ సహచరి గురించి పి.చందు రాసిన నవల గురించి చెప్పండి?
లాకప్పులో చిత్రహింసలు పొంది కామ్రేడ్ క్రిష్టమూర్తితోబాటు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ, కదలలేని స్థితిలోవున్న కామ్రేడ్ జిలానీబేగం జ్ఞాపకాలుగా అనేక మంది విప్లవకారులను, వారి త్యాగాలను గుర్తుచేస్తూ ‘‘నెత్తుటి ధార’’ పేరుతో నవల రాసిన మిత్రుడు చందుకు అభినందనలు. నా సహచరి జిలానీ బేగంను చందు ఎరిగివున్నప్పటికీ ఆమె జీవిత చరిత్ర అతనికి పూర్తిగా తెలియదు. నెత్తుటిధార నవలలో ఎవరికి ఎలాంటి లోపాలు కనిపించినా కూడా ఆ నవల ద్వారా పాఠకులకు అనేకమంది అమరుల త్యాగాలను గుర్తుచేస్తూ, కన్నీళ్లు తెప్పించిండు రచయిత.
ఆ నవలలో ముద్రించబడిన నేను రాసిన కవితలో నేను చెప్పినట్లుగా - సజీవంగా ఉన్నప్పుడు కొందరికి మాత్రమే తెల్సిన జిలానీ బేగం, అసువులు బాసాక అమరురాలిగా ఎర్రజెండాలో వెలిగిపోతూ లక్షలూ, కోట్లాది మందికి తెలిసిపోయింది. విప్లవోద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా పాల్గొనేందుకు ఆమె పడిన తపన, ఉద్యమంలో ఆమె పాత్ర, త్యాగనిరతి గురించి ప్రస్తుతం నేను రాస్తున్న నవలలో పూర్తిగా పేర్కొంటాను. ముద్రణకు నోచుకుంటే చదవండి.
16 ప్రస్తుత కాలంలో మార్క్సిజం, లెనినిజం, మావోయిజం బలహీనపడింది. ఇది ప్రజల సమస్యలకు పరిష్కారంం చూపలేదని కొందరు అంటున్నారు. ఇది నిజం అంటారా?
ఈ ప్రశ్న చాల బరువైంది. మార్క్సిస్టు వ్యతిరేకులకు లేదా సామాజిక ఉద్యమాలు విప్లవోద్యమాలలో జరిగిన వైఫల్యాలు, ఓటములవల్ల నిరుత్సాహం చెంది ప్రజలపైన సిద్దాంతంపైన నమ్మకం కోల్పోయిన వారికి నేను చెప్పే జవాబు రుచించకపోవచ్చు. అయినప్పటికీ నాకున్న అవగాహన, నాకున్న పరిమితుల్లో నా మాటల్లో చెప్పుతాను.
మార్క్సిజం + లెనినిజం + మావోయిజం = మార్క్సిజం. మార్క్సిజం అనేది గతితార్కిక, చారిత్రక, భౌతికవాద సిద్దాంతం. అది ఒక సైన్సు, సిద్దాంతం లేదా సైన్సు బలహీనపడడం, పనికిరాకుండా పోవడం అంటూ వుండదు. ఆ సిద్దాంతం వెలుగులో జరిగే ఉద్యమాలు, విప్లవాలు బందు పడడం, బలహీన పడడం, విజయాలు సాధించడం, ఓటమికి గురికావడం జరుగుతుంటాయి. అందుకు ఆనాటి భౌతిక పరిస్థితులు, నాయకత్వ సమస్యలు, పరిస్థితులు సరిగా అధ్యయనం చేయకపోవడం, పరిస్థితులకు తగ్గట్టుగా సిద్దాంతాన్ని అన్వయించడంలో, వ్యూహం, ఎత్తుగడలు రూపొందించడంలో లోపాలు, విప్లవశక్తుల కన్న విప్లవ ప్రతిఘాతుల శక్తి బలంగా వుండడం లాంటివి ఉద్యమాలు, విప్లవాలు, విజయాలు బలహీనపడడానికి, దెబ్బతినడానికి కారణమవుతుంటాయి. విప్లవోద్యమాలు ప్రజ్వరిల్లడానికి భౌతిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, విప్లవకర సిద్దాంతం ఉన్నప్పటికీ, ఆ సిద్దాంతం వెలుగులో ప్రజల్లోకి పోయి పనిచేసే విప్లవకర నాయకత్వం లేకపోతే విప్లవాలు ఉండవు. మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పిన చారిత్రక సత్యాన్ని అర్థంచేసుకోకపోతే విప్లవకర సిద్దాంతమే పనికి రాదనో లేదా సిద్దాంతం బలహీనపడిందనో, దానికి కాలం చెల్లిందనో అనుకునే వారుంటారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ, కోట్లాది మందిని వ్యాధిగ్రస్తులను చేస్తూ, ఈ పాటికే లక్షమంది ప్రాణంతీసిన కరోనా వైరస్‌కు ప్రస్తుతానికి సరైన మందులేకపోతే వైద్యశాస్త్రం పనికిరానిదన్నట్లు, బలహీనపడినట్లు భావించలేం కదా. గతంలో కలరా, ప్లేగు, మసూచి, డెంగూ, ఎబోలా లాంటి అనేక వ్యాధులు పుట్టుకువచ్చి వేలూ, లక్షలాది మంది చనిపోయిన సంగతులు తెలిసిందే. ఆయా సందర్భాలలో ఆ వ్యాధులకు, మహమ్మారిని అరికట్టడంలో వైఫల్యం జరిగినప్పటికీ, ఆ తర్వాత సరైన మందులు కనుగొనడం, చికిత్సలో మెరుగుదల రావడం బరిగింది. ఈనాటి కరోనా వైరస్‌ను కూడా సైన్సు అరికట్టగలదు. వైద్య శాస్త్రాన్ని, సైన్సును కాదని చెప్పి యాగాలు, హోమాలు, దీపాల వెలుగులు, గోమూత్రాలు, ఆవు పేడతో కరోనా వైరస్‌ను నిర్మూలించగలమని చెప్పేటి భావవాదుల ప్రచారం తప్పు కదా. ఈ భావవాదులు కూడా తమ ప్రచారానికి, చిన్న చిన్న వ్యాధులకు గురైనప్పుడు కూడా సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు, విదేశాలకు పరిగెట్టుతూనే సైన్సును, వైద్యశాస్త్రాన్ని వ్యతిరేకిస్తుంటారు.... మార్క్సిజం బలహీనపడిందనో, పనికిరాని పాత చింతకాయ పచ్చడిగానో చెప్పేవారు మార్క్సిజానికి ప్రత్యామ్నాయంగా నేడు ఆధిపత్యంలో వున్న పెట్టుబడిదారి సిద్దాంతం అనుకుంటే అది ప్రపంచాన్ని పలు విధాలుగా విధ్వంసపరుస్తూ, కోలుకోలేని విధంగా సంక్షోభాలలో అతలాకుతల మవుతుండటం...అది విజయవంతమైనట్లా? సరైన సిద్దాతమన్నట్లా?....ఆలోచించండి. కుళ్ళి కంపుగొడుతున్న దానిని తొలగించి పాతరేసే శక్తుల బలహీనత వల్లే అది అస్థిత్వంలో వుండడం వాస్తవం కాదా.
17 సామాజిక ఉద్యమాల్లోకి యువతరం, కొత్తతరం ఎందుకు రాలేకపోతున్నారు?
నిజమే. సమాజంలో మార్పును కోరుకునే వ్యక్తులు, సంస్థలు, ఉద్యమకారులు ఆశించినట్లుగా సామాజిక ఉద్యమాల్లోకి యువతరం రాలేకపోతున్నారనేది నిజమే. అందుకు యువతరాన్ని తప్పుపట్టలేం. ఉద్యమాలు, విప్లవాలు కోరుకుంటేనేరావు కదా!
అన్నం కావాలి. అన్నంతిని ఆకలిని తీర్చుకుని ఆరోగ్యంగా వుండాలి అని కోరుకుంటేనే కడుపు నిండదు కదా. కంచంలోకి బువ్వ రావాలంటే - అంతకు ముందటి శ్రమలన్నీ జరుగాలి. అంటే - వ్యవసాయంలోని పనులన్నీ జరుగాలి. పారేటి నీటిని ఆనకట్టల ద్వారా పంటపొలాల వరకు మళ్లించాలి. నీరు వరదలా పారుతున్నప్పుడు నీటిని మళ్లించాం సరే కానీ....నదులు, వాగులు పారనప్పుడు ఎలా? వ్యవసాయం ఆపుకుంటామా? ఆకలితో బాధపడుతామా లేదు. బావులు తవ్వి, బోర్లు వేసి భూగర్బం నుండి నీటిని తోడుతూ పంటలు పండిస్తాం కదా! అంటే మన తండ్రులు, తాతల కాలంలోలాగ. వర్షం కొట్టి, వాగులు పొర్లి, చెరువులు నిండి, మత్తడి దుమికినప్పుడే, బావిలో నీరు ఊరినప్పుడే వ్యవసాయం చేయండం గాకుండా అనేక ప్రత్యామ్నాయ పద్దతులతో వ్యవసాయం చేయడం వుంటుంది. అయితే పంటపండగానే ఆకలి తీరదు. వడ్లను బియ్యంగా మార్చాలి. కర్రలు లేదా గ్యాసును సమకూర్చుకుని పొయ్యిని వెలిగించాలి. వంట పాత్రలో బియ్యం, నీరు పోసి, పొయ్యిపై పెట్టి ఉడికించాలి. వంట చెడిపోకుండా చూసుకునే వ్యక్తి ఉండాలి. ఆ తర్వాత అలా తయారైన భోజనాన్ని ఆరగించి, ఆకలి తీర్చుకోవచ్చు - అదే విధంగా ప్రజా ఉద్యమాల సంగతి కూడా.
నిబద్దతతో, నిమగ్నతతో ప్రజల్లోకిపోతూ చైతన్యపర్చడం, సంఘటిత పర్చడం, పోరాటాల్లోకి కదిలించడం లాంటి బాధ్యతలను నిర్విర్తించవల్సిన వ్యక్తులు, సంస్థలు ఆ బాధ్యతలను సరిగా నిర్వర్తించకపోతేనూ లేదా బాధ్యతలను వదిలివేస్తేనూ లేదా నిబద్దతతో పనిచేయ పూనుకున్న వ్యక్తులు, సంస్థలను పోలీసులు ఆటంకపర్చడం, నిర్భంధించడం, హతమార్చడం చేస్తూవుంటే....మనం ఆశింంచినట్లు ఉద్యమాలు సాగకపోతే అందుకు ప్రజలను తప్పుపట్టలేం. పంటలు పండించి, ఆకలి తీర్చుకునేందుకు రైతులు పలు రకాల పత్యామ్నాయమార్గాలను చేపడుతున్నట్లే ప్రజలను ఉద్యమాల్లోకి కదిలించాలనుకునేవారు అననుకూలతల్లో కూడ లభించగలిగే అనుకూలతను ఉపయోగించుకుంటూ ఉద్యమాల పంట పండించగలుగాలి. అయితే మీరన్నట్లు గతంలోలాగ సులువుగా ప్రజల్ని ఉద్యమాలలోకి కదిలించడం సాధ్యం కాదు. అందుకు కారణాలుగా చెప్పుకోవాల్సివస్తే...
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలు, విష సంస్కృతి వలన సమాజంలో అనేక దుష్పరిణామాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా మానవ సంబంధాలు, మానవీయ విలువలు దెబ్బతిన్నాయి. ఇంటర్నెట్ వలలో చిక్కుకుని మొబైల్ పోన్లను గెలుకుతూ కూర్చొనడానికే యువతకు సమయం చాలడం లేదు. యువతరం మాత్రమే కాదు పసిపిల్లలనుండి ముసలోల్ల వరకు టీవీలు, ఫోన్లకు ఆకర్షించబడ్డారు. సాహిత్యాన్ని, దిన పత్రికలను చదువేందుకు కూడా ఆసక్తి చూపడంలేదు. చదవడం సంగతి పక్కన పెడితే కనీసం భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులతోగాని, ప్రయాణంలో పక్కనున్న వ్యక్తితో గాని తీరిగ్గా మనుసు విప్పి మాట్లాడే పరిస్థితులే కరువయ్యాయి. చంటిపిల్లలు ఏడుస్తుంటే ఏడుపును ఆపించే ఓపిక సైతం లేక పిల్లలకు సెల్ఫోన్లు చేతికిస్తూ చూస్తూ సంతోషించమంటున్నారు. ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయతలు తగ్గిపోతూ అసహనం పెరుగుతున్నది. ప్రజల ఆలోచనలు, అలవాట్లు కలుషితమైపోతూ, కంపు గొట్టేలా మారుతున్నాయి. అవకాశవాదం, అవినీతి, లంపెనైజెషన్, మత్తుపదార్థాల వాడకం, నిరుద్యోగం, మార్కెట్టు సంస్కృతి తదితరాలతో యువతరం పక్కదారి పడుతున్నారు. మరో మాటలో చెప్పుకోవాలంటే కావల్సుకుని, పలువిధాలుగా పాలక వర్గాలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయి.
మానవ సమాజానికే కాకుండా మొత్తం ప్రపంచానికి, ప్రకృతికి సామ్రాజ్యవాదం కరోనా వైరస్‌లా పట్టుకుంది. దానితో బ్రాహ్మణీయ భావజాలం అంటకాగుతున్నది. కనిపించని వైరస్‌లా కాకుండా బాహాటంగా కనిపిస్తూ, బలాదూర్‌గా వ్యవహరిస్తూ పలురకాల విధ్వంసం సాగిస్తున్నప్పటికీ గత మూడు దశాబ్దాల క్రితం నాటిలాగా ప్రజల ప్రతిఘటనలేదు. అయినంత మాత్రాన ప్రజలు ఇక ఉద్యమించరని అనుకోవద్దు. బొగ్గుకు అగ్గితోడైతే, ఆక్సీజన్ వీస్తుంటే దావానలంగా మారుతుందన్నట్లుగా - వర్గ సమాజంలో వర్గపోరాటాలు సజీవంగానేవుంటూ, ఊహించని విధంగా ఉద్యమాలు పుట్టుకురావడం చారిత్రక సత్యం, అలా పరిణమించాలని ఆశిద్దాం.
18 సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమే అంటారా?
గతితార్కిక, చారిత్రిక భౌతికవాదం ప్రకారం వర్గపోరాటాల ద్వారానే సమాజంలో మార్పులు వచ్చాయి, వస్తుంటాయి. ఆ పోరాటాలకు సాహిత్యం దోహదపడాలి. పడుతుందికూడ. గత అనుభవాలు, వర్తమాన పరిస్థితులు, సమస్యలు, మూలాలను మార్క్సిస్టు దృష్టితో లేదా శాస్త్రీయ దృష్టిలో విశ్లేషిస్తూ వర్గపోరాటాలు మరోమెట్టు ముందడుగు వేసేలా సాహిత్యం దోహదపడుతుండాలి. పోరాటాల నుండి నాయకత్వం పుట్టుకచ్చునట్లుగానే సాహిత్యమూ పుట్టుకస్తూ తిరిగి ఆ పోరాటాల బలోపేతానికి దోహదపడుతుండాలి. ఏది ఏమైనా ప్రజా ఉద్యమాలు లేకుండా సాహిత్యమే సమాజంలో మార్పు తీసుకురాదు.
19 కొత్తగా మీరు ఏమి రాసారు? ఇంకా ఏమి రాయబోతున్నారు?
నేను నాలుగున్నర సంవత్సరాల జైలు జీవితం తర్వాత 2013 మధ్య కాలంలో విడుదలై వచ్చాను. దాదాపు రెండు సంవత్సరాలు గదిలో ఒంటరిగా కూర్చోని సింగరేణి విప్లవోద్యమ సంగతులు యాదికి చేసుకుంటూ ‘‘సింగరేణి కార్మికోద్యమ చరిత్ర - నెత్తుటి త్యాగాలు’’ అనే ఉద్యమ చరిత్ర రాసాను. సింగరేణి ప్రాంతంలో తిరగకుండా, ఎవరితోనూ, చర్చించకుండా రాసినందుకు అందులో ఇంకా పేర్కొనవల్సిన విషయాలు ఉన్నాయని తర్వాత అర్థమైంది. అది ఎంత అసమగ్రంగా వున్నా, లోపాలు వున్నా కూడ నెత్తుటి త్యాగాల కార్మికోద్యమ చరిత్రను రాసి ప్రజల్లోకి తీసుకుపోయినందుకు సంతోషపడ్డాను. అలాగే ఈ నవలను 40 రోజుల అతి తక్కువ కాలంలో పలువురు మిత్రుల ద్వారా ఇంగ్లీష్లోనికి అనువాదం చేపించి ‘‘ది హిస్టరీ ఆఫ్ సింగరేణి మైనర్స్ మూవ్మెంట్’’ పేరుతో ప్రచురించి ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది. గోదావరిఖనిలో జరిగిన అంతర్జాతీయ గనికార్మికుల సదస్సులో ఆవిష్కరించి అమ్మడం, పంచడం ద్వారా సింగరేణి కార్మికోద్యమ చరిత్ర 20 దేశాలకు, అలాగే దేశంలోని పలు ప్రాంతాలకు పోగల్గింది.
అలాగే 2017లో ‘‘జైలు కమ్యూన్’’ పేరుతో మరొక పుస్తకం రాసాను. కాని ఆర్థిక సమస్యల కారణంతో ఆ పుస్తకం ప్రచురణకు నోచుకోలేదు. 1980 నుండే వరంగల్ సెంట్రల్ జైలులో మావోయిస్టు పార్టీకి చెందిన రాజకీయ ఖైదీలకు విడిగా ఒక బ్లాకు వుండేది. ఆ బ్లాకులోనే విడిగా వంటగది వుంటూ వారి వంట వారే చేసుకోవడం జరిగేది. బయటి నుండి విప్లవ సాహిత్యం తెప్పించుకుంటూ వందలాది పుస్తకాలతో బ్లాకులోనే లైబ్రరీని నడుపుకునే వారు. జైలును రాజకీయ పాఠశాలగా మార్చుకుని, రాజకీయ ఖైదీలలో రాజకీయ చైతన్యం, క్రమశిక్షణ, నిస్వార్థం, నిజాయితీ, త్యాగనిరతిని పెంచేందుకు ఖచ్చితమైన నియమ నిబంధనలతో ‘‘కమ్యూన్’’ను నడుపుతూ రావడంజరిగింది. 2009మధ్య కాలం నుండి దాదాపు రెండు సంవత్సరాలు నేను వరంగల్ జైలులో విచారణ ఖైదీగా కమ్యూన్లో వున్నప్పుడు కమ్యూన్ బాధ్యునిగా, ఖైదీల హక్కుల వేదిక కన్వీనర్‌గా కొనసాగాను. ఆ విధంగా ప్రత్యక్ష అనుభవం ఉన్నందున జైలు కమ్యూన్ ఎందుకు, ఎలా నడిచిదో ప్రజలకు పరిచయం చేయాలనే ఆలోచనతో ‘‘జైలు కమ్యూన్’’ రాయడం జరిగింది. కాని ప్రచురణకు నోచుకోలేదు.
అలాగే ‘‘సాహితీ గోదావరి’’కి కొన్ని కవితలు రాసి పంపగా ప్రచురించారు. మరొక ప్రయత్నంగా ‘‘విప్లవమాత గజ్జెల లక్ష్మమ్మ స్మృతిలో’’ మరొక చారిత్రాత్మకమైన నవలను రాసే ప్రయత్నంలో వున్నాను. సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన బెల్లంపెల్లికి చెందిన గజ్జెల లక్ష్మమ్మకు - విప్లవోద్యమానికి వున్న సంబంధాలు, గాథలకు అక్షరరూపం ఇస్తున్న నా ప్రయత్నం త్వరలో పూర్తి కానుంది. ఆర్థిక సమస్యకు పరిష్కారం లభిస్తే ముద్రణకు నోచుకుని ప్రజల ముందుకు రాగలదు.
20 చివరగా మా ప్రశ్న ఏమంటే -పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు గొదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరు ఏమి చెప్పదల్చుకున్నారు?
కవులు, రచయితలు, సాహితీ వేత్తలకు చెప్పగలిగేంంతటి జ్ఞానవంతున్ని గాకపోయినా కూడ, నాకు తోచిన కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. నా మాటలను అభిప్రాయాలను మీకు తెలిపే అవకాశం లభింపచేసి, మీ వరకు అందిస్తున్న గోదావరి అంతర్జాల పత్రిక నిర్వాహుకకులకు అభినందనలు.
మిత్రులారా...!
కలలు, సాహిత్యం ప్రజల కోసమే ఉండాలని మార్క్సిస్టు మహోపాధ్యాయుడు మావో చెప్పిండు. ఆ ప్రకారం చూసినప్పుడు ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా రచయితలు, కవులు, కళాకారులు తదితరులు ఆయా సామాజిక సమస్యలు, చరిత్రలు, సిద్దాంతాలపై సమగ్ర అవగాహన కలిగి వుండాల్సిన అవసరం ఉంది. అనేక గ్రంధాలు, పత్రికలు చదువుతుండటం, సామాజిక అధ్యయనాలు జరుపుతుండటం కూడా చాల అవసరం. అయితే వాళ్ల్లు పాఠకుల కోసం రచనలు చేస్తున్నప్పుడు పాఠకులకు అర్థంకాని పాండిత్యంతో గాకుండా సరళమైన ప్రజల బాషలో స్పష్టంగా అర్థంచేసుకునే విధంగా రాయాలి. నేటి పాఠకులను దృష్టలో పెట్టుకుని చిన్న చిన్న కథలు, వ్యాసాలు, చిన్న నవలలు రాస్తే బాగుంటుంది. సామాజిక సమస్యలు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటి వార్తలు, నిన్నటి సమస్యలు పాఠకులకు పాసిపోయినవిగా అనిపిస్తుంటాయి. పూసల్లో దారంలాగా గతం గురించి చెప్పుతూ, వర్తమానంపై కేంద్రీకరిస్తూ భవిష్యత్తు పరిణామాల గురించి చెప్పుతుండాలి. ఈ రోజు సమాజంలో రగులుతున్న సమస్యలు, భవిష్యత్తులో తీవ్రతరం కానున్న సమస్యలు, అందుకు కారణాలు, పరిష్కారాలు ఏమిటి? ప్రజా ఉద్యమాలకు ఎవరు ఏ విధంగా ఆటంకంగా వున్నది, తక్షణ ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎలా సాధ్యం అనే విషయాలపట్ల ప్రజలకు కనువిప్పు కలిగేలా, ప్రజలను కదిలించేలా రచనలు వుండాలి. అది కూడా తక్కువ పేజీలతో సూటిగా, స్పష్టంగా అర్థమయ్యేలా వుండాలి. కీలెరిగి వాత పెట్టాలన్నట్లు సామాజిక రోగాలను గుర్తింపచేస్తూ రోగానికి తగ్గ మందును వాడించేలా సాహిత్యం వుండాలి తప్పితే రచయిత బుర్రలో పుట్టిన పాసిపోయిన పదార్థానికి సుగంధాలు, వర్ణనలు (శిల్పం) జోడించినప్పటికీ రోగులుగా వున్న పాఠకులు పొందే ఫలితం ఏముండదు. ఆశించిన ఫలితాలు రావు.
గత కొన్ని వారాలుగా కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలు, ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయమై నేను చెప్పుతున్పప్పటికి 210 దేశాలకు వైరస్ విస్తరించి దాదాపు 17లక్షల మందికి వ్యాధి సోకడం, ఒక లక్షమంది మరణించడం జరిగింది. టీవీ ఛానల్లు, దినపత్రికల్లో కరోనా ముచ్చట్లు తప్ప మరేమీ ఉండడంలేదు. సహజమే మరి. అయితే గత కొన్ని దశాబ్దాలనుండి ‘‘సామ్రాజ్యవాద వైరస్’’ స్పష్టంగా కనిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాన్ని, ప్రాణులను, ప్రకృతిని, పర్యావరణాన్ని, ప్రజల సంస్కృతిని....ఎలా విధ్వంసపరుస్తూ వస్తున్నదో, ఫలితంగా లెక్కించడానికి సాధ్యంగాని మరణాలు, వ్యాధులు, బాధలు ఎలా తీవ్రమవుతున్నాయో ప్రజా రచయితలు ప్రజలకు తెలుపాలి. ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్న ఆ సామ్రాజ్యవాద వైరస్‌ను అభివృద్దిగా వర్ణిస్తూ, నమ్మిస్తూ, దాన్ని భుజాలపై మోస్తూ, నెత్తినెట్టుకుని ఊరేగుతూ, దాని అగ్రనాయకుల చంకలు నాకుతూ, వారి చేయిని తాకడమే మహాభాగ్యమని తరించిపోతూ, వారు వచ్చినప్పుడు అంతులేని హంగామా చేస్తూ వస్తున్న వారి ( వైరస్ వందిమాగధుల) గురించి బట్టబయలు చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తుండాలి. కరోనా వైరస్ సమస్య కొంత కాలంలో సమసి పోవచ్చు కాని సామ్రాజ్య వాద వైరస్ సమస్య మిగిలే వుంటుంది. - కరోనా వైరస్ కారణంగా విధిస్తున్న లాక్డౌన్ వలన, నివారణ చర్యల వలన ఏం జరుగుతున్నదో, ఏం జరుగనున్నదో గమనించాలి.
పరిశ్రమల్లో ఉత్పత్తులు ఆగిపోతూ, అన్ని రకాల వ్యాపారాలు ఆగిపోతూ, ట్రాన్సపోర్టులు ఆగిపోతూ, కొనుగోళ్లు ఆగిపోతూ, నిర్మాణాలు ఆగిపోతూ, ఉద్యోగాలు ఊడిపోతూ, ఉపాధులు ఆగిపోతూ, ప్రజల ఆదాయాలు ఆగిపోతూ, ప్రభుత్వాల ఆదాయాలు కుంటుపడుతూ, ఖజానాలు ఖాళీ అవుతూ, ప్రజల ఆర్థిక స్థితి, కొనుగోలు శక్తి క్షీణిస్తూ - నిరుద్యోగం, పేదరికం, ఆకలిబాధలు, ఆకలి చావులు, అనారోగ్యాలు పెరుగుతుంటాయి.
ఈ పాటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు కరోనా వైరస్ దుష్పరిణామాలు భరించలేనివిగా మారతాయి. అలాంటి పరిస్థితుల్లోకూడ సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదార్లు, పాలకులు తమ విధానాలను మార్చుకోరు. ఫలితంగా ప్రజల అన్ని రకాల సమస్యలు మరెంతగానో తీవ్రమవుతాయి. - ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను చైతన్య పర్చుతూ కదిలించేలా రచయితలు తమ రచనలు చేయవల్సి వుంటుంది. ప్రజలతో కలిసి ఉద్యమాల్లో నడువవల్సి వుంటుంది.
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు పి. చంద్ ఇచ్చిన ఇంటర్వ్యూ
1 మీ వక్తిగత జీవితం గురించి చెప్పండి?
నేను 11-09-1954లో వరంగల్‌లోని ఉర్సు ప్రాంతంలో పుట్టాను. నా అసలు పేరు వూరుగొండ యాదగిరి. మా నాన్న మల్లయ్య అజాంజాహి మిల్లు కార్మికుడిగా పనిచేసారు. అమ్మ వీరమ్మ బీడి కార్మికురాలుగా పనిచేసేది. 1975లో డిగ్రీ తరువాత 1977లో సింగరేణిలో ఉద్యోగంలో చేరాను. దాదాపు మూడున్నర దశాబ్దాలు పనిచేసాను. ఆ విధంగా కార్మిక కుటుంబంలో పుట్టి కార్మికుల మధ్య పనిచేయటం వలన సహజంగానే అది నా అలోచనల మీద ప్రభావం చూపింది. కార్మికుల మీద ఎక్కువగా సాహిత్యం వ్రాయాటానికి కారణమైంది.
2 మీరు సింగరేణిలో ఉద్యోగం చేరునాటికి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ఆ రోజుల్లో కార్మికుల పరిస్థితులు చాలా దుర్భరంగా ఉండేవి. మురికి కూపాల్లాంటి కార్మిక వాడల్లో ఏ కనీస అవసరాలు ఉండేవి కావు. పిల్లలు చదువుకోవటానికి స్కూళ్లు కాని, రోగమొస్తే మందులు కాని ఉండేవి కావు. మేనేజుమెంటు, కార్మికుల సంక్షేమం ఏ మాత్రం పట్టించుకునేది కాదు. రక్షణసూత్రాలు కూడా సరిగా అమలు జరపకపోవటం వలన నిత్యం బొగ్గు బావుల్లో ఎక్కడో ఒక చోట ప్రమాదం జరిగి కార్మికుల రక్తం చిందని రోజు ఉండేది కాదు. బాయి దొరల (అధికారులు) దొరతనం ఎనకటి నిజాంకాలం నాటి ఫ్యూడల్ దొరల దొరతనం గుర్తుచేసేది. కార్మికులచే దొర అని పిలిపించుకుంటూ వారి మీద జులుం చెలాయించేవాళ్లు. కట్టు బానిసల్లా, ఇండ్లలో పని మనుషులుగా వాడుకునేవారు. కార్మికుల సంక్షేమం చూడాల్సిన కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలు పట్టించుకునే వాళ్ళుకాదు. మేనేజుమెంటుకు అమ్ముడుపోయి ఫక్తు పైరవీకారులుగా మారిపోయి, ప్రతి చిన్న పనికి కూడా కార్మికుల నుండి లంచాలు గుంజేవాళ్ళు. ఇందుకు కమ్యూనిస్టు యూనియన్స్ కూడా మినాహాయింపు కాదు. దాంతో మేనేజుమెంటు కార్మిక వ్యతిరేక చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దానికి తోడు బయట సామాజిక పరిస్థితులు కూడా అధ్వాన్నంగా ఉండేవి. వాడవాడన వెలిసిన సారా దుకాణాలు, బ్రాండిషాపులు, కల్లు దుకాణాలు కార్మికుల మూల్గుల్ని పీల్చాయి. కార్మికుల ఇల్లు, వొళ్ళు గుల్ల అయ్యేది. ఆ రోజుల్లో కాలరీ ప్రాంతంలో గూండాయిజం పెద్ద ఎత్తున కొనసాగింది. స్త్రీలపై అత్యాచారాలు, బెదిరించి డబ్బులు గుంజుకోవటం, కొట్టడం వంటివి యదేచ్చగా సాగినవి. గూండాల మధ్య తరుచు గ్యాంగ్ వార్లు జరిగి హత్యలు చేసుకొనేవాళ్ళు. గూండాలకు రాజకీయ నాయకుల, యూనియన్ నాయకుల అండదండలుండేవి. శాంతి భద్రతల రక్షణకు పోలీసులు ఉన్నమాటే కాని రాజకీయ జోక్యం వలన గూండాల జోలికి పోయేవాళ్ళు కాదు. దాంతో గూండాయిజం పెట్రేగి పోయింది. ఈ అస్తవ్యస్త సామాజిక పరిస్థితులే తదనంతరకాలంలో విప్లవ కార్మికోద్యమం ఆవిర్భవించటానికి కారణమైంది.
3 మీ సాహిత్యం ఎక్కువగా సింగరేణి కార్మికుల మీద వ్రాసారు. అందుకు కారణం ఏమిటి?
నా జీవితంలో ముఖ్యమైన భాగం సింగరేణి కార్మికుల మధ్య గడిచింది. వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు, ఆరాట పోరాటాలు, విప్లవోద్యమం ఆవిర్బవం, ఎదుగుదల, చివరికి అణిచివేతకు గురి కావటం వరకు జరిగిన పరిణామాలకు నేను సజీవ సాక్షిని.
ప్రజలు బ్రతుకలేని దుర్భర పరిస్థితుల నుండి పోరాటాలు పుడుతాయి. ఆ విధంగా విప్లవోద్యమం పుట్టుకొచ్చింది.1975 ఎమర్జెన్సీ కాలంలో కార్మికుల పరిస్థితి మరింత దిగజారింది. హక్కుల హరింపు, క్యాజువల్ వర్కర్స్, టెంపరరీ వర్కర్స్ పేర కార్మికులతో వెట్టిచారికి చేయించుకోవటం ఎక్కువైంది. అంతకు ముందు సాధించుకొన్న ‘బొనసు’ వంటి హక్కులు కోతకు గురైనవి. ఇట్లా అనేక రుపాల్లో కార్మికుల మీద తీవ్రమైన దాడి కొనసాగింది. అప్పుడు సింగరేణిలో గుర్తింపు సంఘాలుగా చెలామణి అయిన ఏఐటియుసి, ఐయన్టియుసి రెండు కూడా ఎమర్జెన్సీని సమర్థించటంతో అడిగేవారు లేక కార్మికుల పరిస్థితి అధ్వానమైంది. బాయి దొరల జులుం పెరిగి పోయింది. చార్జీషీట్లు, డిస్మిస్లతో అనేక మందిని వేధించారు. మరోవైపు బయిట గూండాయిజంతో కార్మికులను ఊపిరి సలుపనియ్యలేదు. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి కేంద్రంగా రాడికల్స్ కార్మికుల సమస్యలు తీసుకొని పోరాడటం మొదలైంది.1981 ఏప్రిల్‌లో జరిగిన మస్టర్ల కొత చట్టం వ్యతిరేకంగా యాబై అరురోజులు సుదీర్ఘ సమ్మె పోరాటం చేసి విజయం సాధించారు. ఆ పోరాట క్రమంలోనే విప్లవ కార్మిక సంఘమైన ‘‘సింగరేణి కార్మిక సమాఖ్య’’ అవిర్భవించింది. అటు తరువాత కాలంలో ‘‘సికాస’’ దాదాపు పాతిక ఏండ్లు కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించింది. జాతీయ సమస్యలైన ‘వేజుబోర్డులు’ వంటి వాటిని పరిష్కరించి సింగరేణిలో బలమైన విప్లవ కార్మికోద్యమాన్ని నిర్మించింది. భారతదేశ కార్మికోద్యమ చరిత్రలోనే నూతన అధ్యాయాన్ని సృష్టించింది. సికాస కేవలం కార్మికుల సమస్యలపైనే పోరాటాలు చేయలేదు. సారా వ్యతిరేక పోరాటం, ఇండ్ల స్థలాల కోసం, విద్య, వైద్య సౌకర్యాల మెరుగు కోసం, గూండాయిజంకు వ్యతిరేకం వంటి అనేక సామాజిక సమస్యలపై పోరాడింది. నూతన ప్రజాస్వామిక విప్లవ రాజకీయాలను ఎజండా మీదికి తెచ్చి వారిని చైతన్య పరిచింది. అందులో పాల్గోనెలా చేసింది.
అయితే ఈ పోరాటాలు ఏవీ యాదృచ్చికంగా వచ్చినవి కావు. అమరుల త్యాగాల ఫలితంగా ఇదంతా సాధ్యమైంది. సింగరేణిలో మొగ్గతొడుగుతున్న విప్లవ కార్మికోద్యమాన్ని మొగ్గలోనే త్రుంచి వేయాలని పాలకులు కౄర నిర్భంధం అమలు జరిపారు. దేశంలోని సకల సాయుధ బలగాలను కోల్ బెల్ట్‌లో మోహరించి కవాతు చేయించారు. దాదాపు వందమంది విప్లవకారులను బూటకపు ఎన్కౌంటర్ పేర కాల్చి చంపి ‘నల్లనేల’ ను రక్తసిక్తం చేసి అణిచివేసారు.
నా కండ్ల ముందు జరిగిన ఈ పరిణామాలు నన్ను బాగా కదిలించినవి. ఎప్పటికప్పుడు వాటిని రికార్డు చేసాను. అది కేవలం కథలు, నవలల రూపంలోనే కాదు వ్యాసాలుగా, పత్రిక రచనలుగా, కార్మిక ఉద్యమ చరిత్రగా అనేక రూపాల్లో ఆ చరిత్రను నమోదు చేసాను.
4 ఇంత వరదాక మీరు కథ నవలా రచయితగానే తెలుసు, మీరు వచన రచనలు కూడా చేసారని ఇప్పుడే తెలుస్తున్నది. మీ వచన రచనలు ఏమిటి?
వచన రచనలు చాలానే చేసాను. అప్పుడున్న పరిస్థితుల వల్ల అవేవి నా పేరు మీద వచ్చినవి కావు. వివిధ మిత్రుల పేరు మీద, సంస్థల పేరు మీద వచ్చినవి. అందులో కొన్ని...
1. సికాస రెండవ మహసభ సందర్భంగా విడుదల చేసిన ‘‘సింగరేణి బొగు్గ గనుల్లో రగిలిన పోరాటాలు వర్దిల్లాలి’’
2. పరస్పెక్టివ్ వారు ప్రచురించిన ‘‘సింగరేణి వాస్తవ పరిస్థితి ఒక నివేదిక’’
3. వనరుల తరలింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సింగరేణి నేపథ్యంలో వచ్చిన ‘‘చర్చ తెలంగాణ వ్యాసాలు’’
4. చర్చ సింగరేణి వ్యాసాలు
5. సంస్కరణలు వచ్చిన తరువాత ఒక ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో సంస్కరణలు ఎట్లా అమలు జరిపింది ఒక కేసు స్టడీలా తెలియచెప్పే ‘‘సింగరేణి సంస్కరణలు - ఒక పరిశీలన’’
6. మయూరి పబ్లికేషన్ ప్రచురించిన ‘‘తరతరాలపోరు’’
7. కోల్ పిల్లర్స్ అసోసియేషన్ మహసభల సందర్భంగా విడుదల చేసిన ‘‘నూతన స్టాడింగ్ అర్డర్ - ఒక పరిశీలన’’
8. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రచురించిన ‘‘బొగ్గుగని కార్మికుల వేతనాలు - ఒక పరిశీలన’’
9. ‘‘టిబియుకెయస్ పదేండ్ల ఉద్యమ ప్రస్థానం’’
10. సింగరేణి నేపథ్యంలో ‘‘శీక్రిష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్టు’’
11. హెచ్యంయస్ వాళ్లు ప్రచురించిన ‘‘వేజు బోర్డు ఒప్పందాలు ఒక పరిశీలన
పైన పేర్కొన్నవన్నీ పుస్తకాలుగా వచ్చినవి. ఇవి కాకుండా లోకల్ పత్రికలైన ‘న్యూస ఫోకస్’, ‘చర్చ’ ‘మావూరు’ వంటి పత్రికల్లో ‘లేబరోని గోడు’, ‘తుపాకి రామన్న కథలు’, ‘తట్టా - చమ్మాస్’ వంటి శీర్షికలు నిర్వహించాను. అనేక మంది పత్రికా విలేఖర్లకు ‘బినామి’ రైటర్‌గా వందలాది వ్యాసాలు వ్రాసి ఇచ్చాను.
5 మీ మొదటి కథ ఏ సందర్భంలో వచ్చింది?
మస్టర్ల కోత చట్టంకు వ్యతిరేకంగా కార్మికులు యాబై అరు రోజులు సమ్మె చేసి విజయం సాధించారని చెప్పాను కదా. ఆ సమ్మె సందర్భంలో అసలు సమ్మె ఎలా అరంభమైందో తెలియ చేస్తూ వ్రాసిన ‘‘సమ్మె’’ కథ నా మొదటి కథ. అది ‘కార్మిక’ పేరు మీద సృజనలో అచ్చయింది.
6 ‘‘కార్మిక’’ అన్నకలం పేరుతో అనేక మంది వ్రాయాటానికి గల కారణం?
‘‘కార్మిక’’ అన్న కలంపేరు నిర్ధిష్టంగా అనుకొని ప్రారంభించింది కాదు. నేను నా మొదటి కథ ‘‘సమ్మె’’ వ్రాసినప్పుడు తీవ్ర నిర్భంధం కొనసాగుతుండే. దాంతో స్వంత పేరుతో పంపటం ఇష్టంలేక కార్మికుల మీద వ్రాసిన కాబట్టి ‘‘కార్మిక’’ అనే కలం పేరుతో సృజనకు పంపాను. అది అట్లా అచ్చయింది. అటు తరువాత ఆ సమ్మెకు నాయకత్వం వహించిన నల్లా అదిరెడ్డి, మహ్మద్ హుస్సేన్ కూడా అదే సమ్మె మీద వరుసగా ‘‘నిర్భంధం’’, ‘‘విస్తరణ’’ అనే కథలు వ్రాసారు. వాటిని కూడా ‘‘కార్మిక’’ పేరు మీద పంపించటం అదే పేరు మీద అచ్చుకావటం జరిగింది. నాలుగు భాగాలుగా సాగే ‘‘సమ్మె’’ కథలోని చివరిబాగమైన ‘‘విజయం మనదే’’ అనే కథను మళ్ళీ నేను వ్రాసాను. ఆ విధంగా ‘‘సమ్మె’’ కథ, కార్మిక కలం పేరు రూపుదిద్దుకున్నది. తదనంతర కాలంలో ‘కార్మిక’ పేరు మీద వచ్చిన కథల్లో సగానికిపైగా నేను వ్రాసినవే ఉన్నాయి. ఒకే కలం పేరుతో అనేక మంది రచయితలు వ్రాయటం వలన సాహిత్య చరిత్ర వ్రాసేటప్పుడు ఎవరు ఏ కథ వ్రాసారో తెలియక తప్పుగా నమోదయ్యే అవకాశం ఉంది. ‘‘సమ్మె’’ కథ విషయంలోనూ అదే జరిగింది.
7 మీరు అనేక మారు పేర్లతో రచనలు చేయాటానికి కారణం ఏమిటి?
వాస్తవాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. దోపిడీ పీడనలతో కూడుకున్న సమాజంలో ప్రజలు జరిపే ఏ న్యాయపోరాటమైన పాలక వర్గాలకు మింగుడు పడవు. అటువంటి పోరాటాలను, వాటికి నాయకత్వం వహించిన నాయకులను ప్రభుత్వం సహించదు. భౌతికంగా నిర్మూలించటానికైనా వెనుకాడదు. అలాగే ప్రజా పోరాటాలను ఎత్తి పట్టిన రచనలను, రచయితలను కూడా సహించదు. అందుకే దాదాపు ఇరవై మారు పేర్లతో వ్రాయాల్సి వచ్చింది.
8 ఇంతవరకు మీరు సింగరేణి కార్మికుల మీద వ్రాసని నవలలు ఏమిటి?
సింగరేణి కార్మికుల మీద ఇంత వరకు పదమూడు నవలలు వ్రాసాను. అందులో ఎనిమిది నవలలు ప్రచురించబడినవి. మిగితావి ప్రచురించాల్సి ఉంది.
ప్రచురించిన నవలలు
1. సింగరేణిలో తొలినాటి కార్మికోద్యమాన్ని తెలిపే ‘‘శేషగిరి’’ నవల
2. విప్లవ కార్మికోద్యమంలో తొలి అమరురాలు జిలాని బెగంపై ‘‘నెత్తుటి ధార’’
3. సింగరేణి విప్లవ కార్మికోద్యమ నిర్మాణానికి పునాదులు వేసిన నాయకుడు నల్లా అదిరెడ్డి మీద ‘‘విప్లవాగ్ని’’
4. ఎన్కౌంటర్లో అమరుడైన ఏఐఎఫ్టియు నాయకుడు శ్రీదరి రాయమల్లు మీద ‘‘శ్రామిక యోధుడు’’
5. సింగరేణిలో రాజ్యహింసమ తెలియచెప్పే ‘‘హక్కుల యోధుడు బాలగోపాల్’’
6. గోదావరిఖని 8ఎ బొగ్గు గని ప్రమాదంలో ఒక సారి పదిమంది కార్మకులు చనిపోయిన విషాద సంఘటనను ‘‘ఒక కన్నీరు’’
7. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సింగరేణి కార్మికులు జరిపిన ‘‘సకల జనుల సమ్మె’’
8. సింగరేణి ప్రాంతకవి మల్లావఝుల సదాశివుని జీవితంపై వ్రాసిన ‘‘తలాపున పారే పాట’’ ప్రచురించబడినవి.
సింగరేణి నేపథ్యంలో వ్రాసిన నవలలు ఇంకా ప్రచురించాల్సినవి.
1. విప్లవ కార్మికోద్యమ అవిర్భవాన్ని తెలిపే ‘‘బొగ్గులు’’ నవల
2. ఓపెన్‌కాస్టు నిర్వాసితుల ప్రజల కన్నీటి కథ ‘‘భూ దేవి’’ నవల
3. తీవ్ర నిర్భంధాల మధ్య వేజుబోర్డు సాధనకోసం కార్మికులు జరిపిన మూడు రోజుల సమ్మెపై ‘‘స్ట్రయిక్’’ నవల
4. అరాచకవాది
5. మావూరి కథ - నవలలు ప్రచురించాల్సి ఉంది.
9 సింగరేణి నేపథ్యం కాకుండా మీ ఇతర నవలలు ఏమిటి?
1. ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడు కె.ఎల్. మహింద్ర జీవిత అధారంగా ‘‘అంతర్జాతీయ శ్రామిమ యోధుడు’’
2. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ‘‘బండ్రు నర్సింహులు’’ జీవిత కథ
3. కేంద్ర మాజీమంత్రి జి. వెంకటస్వామి జీవిత చరిత్ర ‘‘మేరా సఫర్’’
4. ప్రముఖ బిసి నాయకుడు తెలంగాణవాది ముచర్ల సత్యనారణ మీద ‘‘ధిక్కార కెరటం’’
5. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వ్రాసిన నవలిక ‘‘తెలంగాణ తల్లి’’
6. నల్లమల విప్లవోద్యమాన్ని చిత్రించిన ‘‘నల్లమల’’ నవలలు ప్రచురిచంబడ్డాయి.
ఇంకా గ్రానైట్ క్వారీలకు వ్యతిరేకంగా వ్రాసిన ‘‘దేవుని గుట్ట’’ వంటి నవలలు ప్రచురించాల్సి ఉంది.
10 మీ రచనల్లో ఎక్కువ భాగం జీవిత చరిత్రలున్నాయి. వాటిని ఎట్లా అర్థంచేసుకోవాలి?
నిజమే నేను వ్రాసిన వాటిలో ముప్పాతిక భాగం జీవిత చరిత్రలే ఉన్నాయి. అయితే ఆ జీవిత చరిత్రలు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావు. వివిధ సందర్భాల్లో ప్రజలు జరిపిన పోరాటాలు, ఆ పోరాటాల్లో పాల్గొని వాటికి నాయకత్వం వహించిన వ్యక్తుల జీవితం అధారంగా ఆ పోరాటాల చరిత్రను ముందు తరాలకు అందించాలనే తాపత్రయంలో వ్రాసాను.
11 ‘‘శేషగిరి’’ నవల ఎందుకు వ్రాసారు? అక్రమంలో ఎదురైన సాధకబాదకాలు ఏమిటి?
ప్రజా పోరాటాలు ముందుకు వచ్చినప్పుడు, ప్రజలు తమ గత పోరాటాల మంచి చెడ్డలను మననం చేసుకుంటారు. చరిత్ర మరుగున పడిపోయిన ప్రజా పోరాట యోధులను గుర్తు చేసుకుంటారు. మరోమాటలో చెప్పాలంటే ప్రజలు తమ చరిత్రను తామే తవ్వి తీసుకుంటారు. తద్వారా తమ పోరాటాలను మరింత పదును పెట్టుకుంటారు. అట్లా సింగరేణిలో విప్లవ కార్మికోద్యమ నేపథ్యంలోనే ‘‘శేషగిరి’’ నవల వచ్చింది.
1886లో సింగరేణి బొగ్గు గనులు ప్రారంభం జరిగినప్పటికీ 1940 వరకు ఎటువంటి యూనియన్ కార్యకలాపాలు లేవు. నాటి బ్రిటిష్ వలస వాద దోపిడి, నిజాం ప్యూడల్ దోపిడి కలగలిసి పోయి కార్మికుల్లో ఎటువంటి యూనియన్ కార్యకలాపాలు జరుగకుండా అణిచివేసారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో కా।। దేవూరి శేషగిరి రావు నాయకత్వంలో కమ్యూనిస్టులు తీవ్ర నిర్భంధాల మధ్య సింగరేణిలో యూనియన్ కార్యకలాపాలు ప్రారంభించి కార్మికులను సంఘటిత పరిచి తమ హక్కుల కోసం పోరాడే యోధులుగా తీర్చిదిద్దారు. 1948 మే 15న కా।। శేషగిరిరావు అతని ఇద్దరు అనుచరులను నిజాం పోలీసులు కాల్చిచంపారు. మహోజ్వలమైన ఆ పోరాటం గురించి చరిత్రలో పెద్దగా నమోదు కాలేదు. కాని కార్మికుల్లో శేషగిరిరావుకున్న పలుకుబడి అరాధన భావం నన్ను అశ్చర్యచకితున్ని చేసింది. ఆయన గురించి వ్రాయాలన్న పట్టుదలను పెంచింది. 1990 ప్రాంతంలో నేను నా ప్రయత్నం మొదలు పెట్టాను. ఆయనతో పనిచేసివారు అప్పటికింకా బ్రతికి ఉన్న వారిని అనేక మందిని కలిసాను, ఆయన కుటుంబ సభ్యులను కలిసి వారిచ్చిన సమాచారాన్ని దాదాపు ఐదారు వందల పేజీల సమాచారాన్ని సేకరించాను. అనాటి పని పరిస్థితులు, మేనేజుమెంటు విధానం, సామాజిక పరిస్థితులు, యూనియన్ జరిపిన పోరాటాలు గురించి సమగ్రమైన సమాచారం సేకరించాను. దాంతో పాటు ఆనాటి తెలంగాణ రైతంగ సాయుధ పోరాట క్రమాన్ని మొత్తంగా అధ్యయనం చేసి ఒక అవగాహనకు వచ్చిన తరువాత దాన్ని నవల రూపం ఇవ్వటానికి మొత్తంగా ఐదు సంవత్సరాలు పట్టింది. ఆ నవల మొదట స్థానికంగా వెలువడే ‘చర్చ’ అనే దిన పత్రికలో సీరియల్‌గా వచ్చినప్పుడు కార్మికులు బావుల మీద, ఇండ్లల్లో గుంపులు గుంపులుగా చదువుకున్నారు. పత్రిక సర్క్య్లేషన్ అమాంతం రెండింతలైంది. కార్మికుల నుండి వచ్చిన అదరణ నా శ్రమను మరిపించింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో అనేక నవలలు వచ్చాయి కాని కార్మిక నేపథ్యంలో వచ్చిన నవలగా ‘‘శేషగిరి’’ నవల ప్రత్యేక స్థానం పొందింది.
12 మీ నల్లమల నవలను ఏ సందర్భములో నుండి చూడాలి?
విప్లవోద్యమం సామాన్యులను అసమాన్యులుగా చేస్తుంది. వారి శక్తి యుక్తులను బయిటికి తీసి చారిత్రక పురుషులుగా చేస్తుంది. అందుకు సజీవ ఉదాహరణ ‘‘బుర్ర చిన్నన్న’’ జీవితం. పెద్దపల్లి తాలుకా మంగపేట కునారం గ్రామంలో ఒక సామాన్య గౌడ కులంలో పుట్టిన చిన్నన్న ఎడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. 1980 ప్రాంతంలో ‘పీపుల్స్‌వార్’ ఉద్యమంలోకి వచ్చి 2006లో ఎన్కౌంటర్లో చనిపోయే నాటికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ‘మాధవ్’ గా పనిచేసాడు ఆధ్యంతం త్యాగపూరితమైన ఆయన జీవితం నన్ను ప్రభావితం చేసింది. నల్లమల నవల వ్రాయటానికి కారణమైంది. ఆయన, ఆయనతో పాటు పనిచేసిన ఆయన జీవిత సహచరి ‘శాంతక్క’ ద్వారా, ఇంకా ఆయనతో కలిసి పనిచేసిన ఉద్యమ సహచరుల ద్వారా సమాచారం సేకరించాను. అదొక్కటే సరిపోదని నల్లమల భౌగోళిక, ప్రాకృతిక పరిస్థితులను, నల్లమల్లో నివసించే ప్రజల, ముఖ్యంగా చెంచుల జీవితాలను, ఉద్యమం సాగిన తీరుతెన్నులను మొత్తంగా అధ్యయనం చేసాను. ఆ ఉద్యమంలో పాల్గొని అమరులైన వందలాది మంది విప్లవ కారుల త్యాగాలను అధ్యయనం చేసాను. నవల వ్రాయాటానికి మూడు సంవత్సరాలు పట్టింది. విరసం ద్వారా ఆ నవల ప్రచురింపబడి జనాదరణ పొందింది.
13 మీ కథల గురించి వివరించండి?
దాదాపు వంద దాక కథలు వ్రాసాను. అందులో ఎక్కవ భాగం సింగరేణి కార్మికుల మీదే వ్రాసాను. అవి కాకుండా ఇంకా భూనిర్వాసితుల మీద పర్యావరణ విధ్వంసం మీద, గిరిజన పోరాటాల మీద, సారా వ్యతిరేక పోరాటం వంటి సామాజిక సమస్యల మీద వ్రాసాను.
ఇప్పటి వరకు
1. భూనిర్వాసితులు
2. జులుం
3. సమ్మెకథ
4. గుమ్మన్ ఎగ్లాస్పూర్ గ్రామస్థుడు - కథా సంపుటాలు వచ్చాయి. ఇంకా ఐదారు సంపుటాలుగా రావల్సిన కథలు మిగిలే ఉన్నాయి.
14 సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనంటారా?
తప్పకుండా సాధ్యమే. అద్దంలో మన ముఖం మనమే చూసుకొని మెరుగు పరుచుకున్నట్టుగా సాహిత్యం మానవ జీవితాన్ని, వాళ్ళ అలోచనలను ఉన్నతీకరిస్తుంది. ఎందుకంటే సాహిత్యం మనిషిని పట్టించుకుంటుంది. దేశ కాలాలకు అతీతంగా మానవ జీవితం మౌళికంగా ఒక్క తీరుగానే ఉంటుంది. మనిషి అకలి, దు:ఖం, సంతోషం, కోపం, అరాట పోరాటాలు ఒక్కతీరుగానే ఉంటాయి. అందుకే ప్రంపంచంలోని ఉత్తమ సాహిత్యమంతా ‘మనిషి’ కేంద్రంగా సాగిందే. అందుకే మనం వాటిని ఆస్వాదించగలుగుతాం. అనుభూతి చెందగలుగుతాం. మన అలోచనలు మెరుగు పరుచుకొని చైతన్యవంతమౌతాం. సాహిత్యకారుడు జీవితాన్ని ఎంతగా పట్టించుకుంటే సాహిత్యం అంత ఉత్తమంగా ఉపయోగకరంగా ఉంటుంది.
15 ప్రస్థుతం సింగరేణి కార్మికోద్యం ఎలా ఉంది? కార్మిక ఉద్యమంలోకి యువతరం ఎందుకు రాలేకపోతుంది?
ఇవ్వాళ ఒక్క సింగరేణి అనే కాదు. మొత్తం భారత దేశ కార్మిక ఉద్యమమే చాలా క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటుంది. ప్రపంచీకరణ మొదలైన తరువాత ప్రజల మీద ఒక ప్రణాళిక బద్దమైన భౌతిక మానసికమైన తీవ్రదాడి కొనసాగుతున్నది. ఆ దాడి కార్మిక వర్గం మీద కూడా సాగుతున్నది. కార్మికులు గతంలో పోరాడి సాధించుకున్న హక్కులను హరించి వేస్తున్నారు. కార్మికుల రక్షణ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. కంట్రాక్టీకరణ, ప్రయివేటీకరణ పెరిగిపోయింది. ఆ మేరకు పర్మినెంటు కార్మికులను తొలగించి వారి స్థానంలో ఏ హక్కులు లేని కంట్రాక్టు కార్మికులను తీసుకువచ్చిండ్లు. దోపిడి అణిచివేత తీవ్రరూపంలో సాగుతున్నది. ఈ తలక్రిందుల అన్యాయపురితమైన సమాజాన్ని చక్కదిద్దె శక్తి యువతరంకు ఉంది. కాని గ్లోబల్కల్చర్ యువతరాన్ని, వారి శక్తు యుక్తులను ఒక పద్దతి ప్రకారం నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ గ్లోబల్ కుట్రలను అర్థం చేసుకొని వాటికి వ్యతిరేకంగా పోరాడవలిసిన కర్తవ్యం యువతరం ముందు ఉన్నది. యువతరం మేల్కొని తప్పక తమ లక్ష్యం సాధిస్తారనే నమ్మకం ఉంది.
16 తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం వలన రైతులుగా బ్రతకాల్సిన వారు సింగరేణి కార్మికులుగా మారారు...ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?
నాటి తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం విఫలం చెందటంతో భూమి సమస్య పరిష్కరించబడలేదు. భూస్వాముల చేతిలోనే భూమి కేంద్రీకృతమై ఉంది. రూపం మార్చుకున్నది తప్ప గ్రామాల్లో దొరల దోపిడి యధాతధంగా ఉండి పోయింది. దానికి తోడు ఉమ్మడి అంధప్రదేశ్లో ఆంధ్ర పాలకుల వివక్ష వలన నీటి పారుదల సౌకర్యం మెరుగు పడలేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు లేక గ్రామాల్లో బ్రతకటం కష్టమైంది. దాంతో చాలా మంది గ్రామాలు వదిలి, పొట్ట చేత పట్టుకొని వచ్చి సింగరేణి కార్మికులుగా చేరారు. ఈ పరిస్థితి 1990లో సంస్కరణలు ఆరంభమయ్యే వరకు కొనసాగింది. కాని తదనంతర కాలంలో పరిస్థితులు మారాయి. ప్రంపచీకరణ, కంట్రాక్టీకరణ, ప్రయివేటీకరణ సింగరేణిలో ప్రవేశించి ఉపాధి అవకాశాలు లేకుండా చేసింది. ఒకప్పుడు లక్షాపదహరువేల మంది కార్మికులు పనిచేసిన సింగరేణిలో ఇప్పుడు నలబై వేల మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. అదే సమయంలో బొగ్గు ఉత్పత్తి నాల్గింతలు పెరిగింది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో బ్రతుకు ఎల్లక వలస వచ్చిన వారికి ఉపాధి కల్పించి అక్కున చేర్చుకున్న సింగరేణిలో ఇప్పుడు ఉన్న కార్మికులనే రకరకాల పేరుతో తొలిగిస్తుంటే బ్రతుకు తెరువు కానరాక కార్మికులు మళ్ళీ పల్లెబాట పడుతున్న విషాద పరిస్థితి నెలకొన్నది.
17 కొత్తగా మీరు ఏం వ్రాసారు. ఇంకేమివ్రాయబోతున్నారు?
రచనలు చేయాటానికి నేను ఎంతగా ‘అడిక్ట్’ అయ్యానంటే ఉద్యోగ ఒత్తిడిలో పడి రచన సాగటంలేదని ఉద్యోగాన్ని మధ్యలోనే వదిలేసాను. వ్రాయాటానికి చాలా విషయాలున్నాయి. కాని సమయం సరిపోవటం లేదు. వీలైనంత వరకు ప్రజలకు ఉపయోగపడే సాహిత్యం వ్రాయాలన్నదే నా అకాంక్ష. ఆ ప్రయత్నం ఇప్పటికీ కొనసాగుతున్నది. కొత్తగా రెండు నవలలు వ్రాసాను. అవింకా ప్రచురణకు సిద్దం చేయాల్సి ఉంది.
18 మా గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా యువ రచయితలకు ఇచ్చే సందేశం ఏమిటి?
నిత్యం రెక్కలు ముక్కలు చేసుకొనే ప్రజలకు తిండికి కరువై అకలిచావులు చస్తున్నారు.ఏ కష్టం చేయని వారు కొట్లు సంపాదిస్తూ భోగలాలస జీవితం గడుపుతున్నారు. ఈ తలక్రిందుల, అన్యాయపురితమైన సమాజాన్ని మార్చవలిసి ఉంది.
కొత్తగా వ్రాస్తున్న వారు ప్రజల జీవితాన్ని లోతుగా పరిశిలించాలి. ఉత్తమ పాహిత్యన్ని అధ్యయనం చేయాలి, నిరంతరం వ్రాయటం ద్వారా ఎవరైనా మంచి సాహిత్యం సృష్టించవచ్చు
తానొక ప్రధానమైన వార్తగా మారుతానని కోకిలవాణి ఏనాడూ అనుకోలేదు. కానీ అదే జరిగింది. ఆ వార్త వెలువడ్డ రోజు సెప్టెంబర్ 20, ఆదివారం, 1998. అప్పుడు ఆమె వయస్సు ఇరవైమూడేళ్లు.
కోకిలవాణిని ఇప్పుడు ఎవరికీ గుర్తుండదు. ఒకవేళ మీరు రోజూ వార్తాపత్రికను తప్పక చదివేవాళ్లయితే మీ జ్ఞాపకాలలో ఏదో ఒక మూలన ఆమె పేరు ముద్రింపబడి ఉండొచ్చు. కానీ రోజూవారి వార్తలను ఎవరు గుర్తుంచుకుంటున్నారు? అవి రోడ్డు ప్రమాదాలను కూడా ఆసక్తికరమైన సంఘటనలుగా మార్చేస్తున్నాయి. రక్తపు మరకలు లేని వార్తాపత్రికలే లేవు.
ప్రమాదంలో మరణించిన వాళ్ల ఫోటోలను వార్తాపత్రికలు ఎందుకు అంతంత పెద్దవిగా ప్రచురిస్తున్నాయి? దాన్ని చూడటానికి ఎవరు ఇష్టపడుతున్నారు. మనిషి, ఒకవేళ హింస యొక్క వికృత రూపాన్ని మనం లోలోపల ఇష్టపడుతున్నామా? కోకిలవాణిని ప్రధాన వార్తగా చేయటానికి మనం కారణం కాదని పక్కకు తప్పుకోవటానికి వీలులేదు. ఆమె మనల్ని నేరస్థులని చెప్పటం లేదు. కానీ ఆమె మనల్ని చూసి భయపడుతోంది. మనల్నందరినీ వదిలి దూరంగా ఉంటోంది.
ఇవ్వాల్టికీ ఆమె పాదాలు రోడ్డుమీద నడవటానికి భయపడుతున్నాయి. చేతులు తనకు తెలియకనే వణుకుతున్నాయి. ఎవరైనా దగ్గరికి రావటాన్ని చూడగానే కళ్లు గాల్లో ఊగిసలాడే దీపం జ్యోతిలా రెపరెపలాడుతున్నాయి. అంతెందుకు, ఆమెకు నిద్రలో కూడా ప్రశాంతత లేదు. క్రూరమైన కలల వల్ల కెవ్వుమని కేకలు వేస్తోంది.
ఆమె స్వేచ్ఛగా తిరుగాడిన ప్రపంచం ఒక్కరోజులో ఆమెనుండి దాన్ని లాక్కొని విసిరివేయబడ్డది. స్నేహితురాళ్లు, కుటుంబం, చదువు, ఉద్యోగం...అన్నీ ఆమెనుండి దూరమైపోయాయి. ఆయింటుమెంట్లూ, డజన్ల కొద్దీ మాత్రలూ, వ్రణచికిత్సా ఆమె రోజువారీ లోకమైపోయింది. ఏడ్చి ఏడ్చి నీరసించి ఒరిగిపోయింది. ఎన్నో సందర్భాలలో తనను టాయిలెట్ గది మూలలో విసిరి పారేసిన సగం కాలిన అగ్గిపుల్లలా గ్రహించింది.
ఒక సంభవం అని తేలికగా వార్తాపత్రికలలో వివరించబడ్డ ఆ హృదయ విదారకమైన సంఘటన... ఇలాగే వార్తాపత్రికలలో వివరించటం జరిగింది.
చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే కోకిలవాణి అన్న 23 ఏళ్ల యువతిమీద దురై అన్న యువకుడు ఆసిడ్ పోశాడు. దీనికి సంబంధించి గిండి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
విచారణలో... దురై అన్న వ్యక్తి కోకిలవాణిని తానుగా ప్రేమిస్తూ వచ్చాడు. కానీ కోకిలవాణి, మహేష్ అన్న కాలేజీ స్టూడెంట్ను ప్రేమిస్తున్నది.
తన ప్రేమను అంగీకరించకపోతే ఆసిడ్ పోస్తానని కోకిలవాణిని దురై చాలాసార్లు హెచ్చరించాడు. కానీ దురై ప్రేమను ఆమె అంగీకరించలేదు. దాంతో ఆవేశపడ్డ దురై తన స్నేహితులైన హరికృష్ణ, సంజయ్ మొదలైనవాళ్లతో కలిసి మాట్లాడుకొని కోకిలవాణి ముఖంలో ఆసిడ్ పొయ్యటానికి తంబుచెట్టి వీథిలోని ఒక అంగట్లో ‘సల్ఫ్యూరిక్ ఆసిడ్’ ను కొన్నాడు. మరుసటిరోజు ఉదయం గిండి రైల్వేస్టేషన్‌కు వెళ్లే దార్లో కోకిలవాణిని అడ్డగించి ఆసిడ్‌ను పోసి దురై తప్పించుకు పారిపోయాడు.
దాంతో కోకిలవాణి ముఖం కాలిపోయింది. సంఘటన జరిగిన చోటే కేకలు వేస్తూ స్పృహ తప్పి పడిపోయిన ఆమెను కొందరు ప్రజలు రక్షించి ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. 60 శాతం వరకూ ముఖం కాలిపోయిన ప్రమాదకరమైన స్థితిలో ఆమె చికిత్స పొందుతోంది. దురై మీద పోలీసులు కేసు నమోదుచేసి విచారణ కొనసాగిస్తున్నారు.
() () ()
పదిహేనేళ్ల వయసులో ప్రేమించటం గురించిన ఊహలు కోకిలవాణిలో మొదలయ్యాయి. పాఠశాల సమయాలలో దాని గురించే ఆమె, స్నేహితులూ రహస్యంగా మాట్లాడుకునేవాళ్లు. ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మంచుగడ్డను అరచేతిలో పట్టుకున్నట్టుగా ఆమె ఒంట్లో ఏదో తెలియని గిలిగింతలు ఏర్పడటం గ్రహించింది.
రోడ్డుమీద, ప్రయాణంలో, సామూహిక ప్రాంతాలలో కనబడే వయసుమీదున్న యువకులను చూస్తున్నప్పుడల్లా ఇందులో ఎవరు తనను ప్రేమించబోతున్నవాడు అని తహతహలాడేది. ఆమె ప్రేమించటం కోసం తపించింది. ఎవరి ద్వారానో ప్రేమించబడటానికి ఎదురుచూసింది. దాని గురించి తన నోటుపుస్తకంలో ఏవేవో రాతలు రాసిపెట్టేది. కవితలు కూడా రాసేది.
ఆమెకు దివాకర్ అన్న పేరు బాగా నచ్చింది. ఇంతటికీ ఆ పేరుమీద ఉన్నవాళ్లెవరినీ ఆమెకు తెలియదు. కానీ ఎందుకో ఆ పేరంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ పేరుతో ఉన్న ఒక్క వ్యక్తినైనా ప్రేమించగలిగితే ఎంత బాగుంటుందో కదాని కూడా అనిపించేది. కానీ అలా జరుగుతుందా ఏం?
ఆ పేరుతో తన పేరును జతచేసి దివాకర్ కోకిలవాణి అని రహస్యంగా రాసి చూసుకుంటూ మురిసిపోయేది. ఒకరోజు ఆమె స్నేహితురాలు ఇందిర, ‘‘ఎవరే ఆ దివాకర్?’’ అని అడిగినప్పుడు... ‘‘పక్కింట్లో ఉన్న కుర్రాడు. అతణ్ణి నేను లవ్ చేస్తున్నాను.’’ అని అబద్ధమాడింది.
ఆ అబద్ధాన్ని ఇందిర నమ్మటమేకాక ఆ ప్రేమ ఎలా మొదలయ్యింది, ఎంత కాలంగా జరుగుతోంది అంటూ అడగటం మొదలుపెట్టింది. ఆమె కోసమే కోకిలవాణి ఎన్నెన్నో ఊహించుకుని దివాకర్‌ను గురించి కథలు కథలుగా చెబుతూ ఉండేది.
వాటిని విన్నప్పటి నుండి ఇందిర కూడా తానెవరినైనా ప్రేమిస్తే బాగుణ్ణు అనుకుంది. కానీ ఎలా ప్రేమించాలి అని భయపడేది. వాళ్లు ట్యూషన్ చదువుకోవటానికి వెళ్లే ఇంట్లో ఉన్న మురళీతో ఇందిర జంకుతూ అతణ్ణి ప్రేమిస్తున్నట్టుగా చెప్పింది. అతను, తానుకూడా ఆమెను ప్రేమిస్తున్నట్టుగా చెప్పి మేడమీది గదికి రమ్మన్నాడు.
భయమూ, కుతూహలంతో మేడమీదికి వెళ్లిన ఇందిర అరిచి హడలెత్తిపోతూ క్రిందికి దిగి పరుగెత్తుకుంటూ వచ్చింది. ‘‘ఏం జరిగిందే?’’ అని కోకిల అడగినా, ఇందిర బదులేమీ చెప్పలేదు. ఏడుస్తూ ఉండిపోయింది. బస్సులో ఇంటికి తిరిగొస్తున్నప్పుడు, ‘‘లవ్ చేస్తున్నానని చెప్పి కిస్ చేసి పెదాల్ని కొరికేశాడే. అసహ్యంగా ఉంది.’’ అని చెబుతూనే కన్నీళ్లు కార్చింది.
కోకిలవాణికి అమ్మయ్య, మనం ఎవరినీ ప్రేమించలేదని అనుకుంది. మరుసటిరోజంతా ఇందిర లవ్ చెయ్యటం తప్పని చెబుతూనే ఉంది. లోలోపల దాన్ని అంగీకరించకపోయినప్పటికీ ఇందిర కోసం తానూ దివాకర్‌ను లవ్ చెయ్యటాన్ని మానేశానని చెప్పింది కోకిలవాణి. కానీ మనసులో... బలవంతంగా కిస్ చెయ్యని మంచి కుర్రాడిని చూసి లవ్ చెయ్యాలన్న ఆశ ఉంటూనే ఉండేది.
() () ()
కోకిలవాణి ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు పెద్దమనిషైంది. పదవ తరగతితో చదువును ఆపేసి కొన్ని నెలలు దగ్గరలోనే ఉన్న ఎస్.టి.డి. బూత్‌లో పనిచేసింది. అక్కడికొచ్చే యువకులలో ఒక్కడు కూడా ఆమెను పట్టించుకోలేదు. జిడ్డు ముఖంతో, సన్నని శరీరంతో ఉండటం వల్లనే తానెవరికీ నచ్చలేదేమోనని అనుకునేది. ఆమెకు రెండే రెండు మంచి చుడీదార్లు ఉండేవి. దాన్నే మార్చి మార్చి వేసుకుని పనికి వెళ్లేది. జీతం డబ్బుతో పసుపూ చందనమూ కలిసిన టర్మరిక్ క్రీమ్ కొనుక్కుని ఒళ్లంతా రాసుకునేది. ఫెయిర్ అండ్ లవ్లీ ని కొని రహస్యంగా ఉపయోగించి చూసుకునేది. పాలలో కుంకుమ పువ్వు వేసుకుని తాగి అందాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించేది. ఎలా చేసినప్పటికీ ఆమెమీద ఎవరికీ ఇష్టం ఏర్పడలేదు.
ఎస్.టి.డి బూత్ నడిపే చొక్కనాథన్ రోజూ ఆమెను పంపించి సిగరెట్లు తెమ్మనేవాడు. ఆమె ఒక ఆడది అని కూడా పట్టించుకోకుండా ఫోన్లో పచ్చి బూతులు మాట్లాడుతూ ఉండేవాడు. తనను ఒక ఆడదానిగా కూడా అతను చూడటంలేదన్న అక్కసు కోకిలవాణికి చాలానే ఉంది.
తనను అద్దంలో చూసుకుంటున్నప్పుడు ఎందుకు తనకు మాత్రం మెడ ఎముకలు ఇలా పొడుచుకొచ్చినట్టుంటాయి, దవడ ఇలా ఎందుకు కుంచించుకుపోయి ఉందని ఆత్రంగా వచ్చేది. తనను ఎలాగైనా అందంగా మలుచుకోవాలని కొత్తకొత్తగా వచ్చే సబ్బులు కొని వాడేది. తల వెంట్రుకలను చుట్టగా చుట్టుకునేలా ప్రయత్నించేది. మూడు నెలలు స్పోకెన్ ఇంగ్లీషు ట్రైనింగు క్లాసుకు కూడా వెళ్లింది. అయినా ఎవరూ ఆమెను ప్రేమించనే లేదు.
అయితే ఒకరోజు ఒక కుర్రాడు బైక్‌లో ఒక యువతిని తన వెనక కూర్చోబెట్టుకుని సినిమా థియేటర్ వైపు వెళుతుంటే ఆమెకేసి చెయ్యి చూపించి ఏదో ఎగతాళిగా చెప్పటం చూడగానే అతనిమీద కోపం ముంచుకొచ్చింది.
ప్రేమించటం మొదలుపెట్టక మునుపే ప్రేమలో ఓడిపోయిన కోపంతో ఆమె రెండుమూడు రోజులు మధ్యాహ్నం భోజనం కూడా తినకుండా విసిరి కొట్టింది. కానీ ఆకలిని ఆమె ప్రేమద్వారా గెలవలేకపోయింది.
కొన్ని సమయాలలో సముద్రతీరానికి వెళ్లినపుడు ఇంతమంది ఎలా ప్రేమిస్తున్నారాని ఆశ్చర్యపోయేది. సముద్రాన్ని వేడుక చూడ్డంకన్నా ప్రేమికులనే చూస్తూ ఉండిపోయేది. ఆమెకన్నా సుమారుగా ఉన్న ఆడవాళ్లు కూడా ప్రేమిస్తున్నారు. ఎందుకు తనను ఒక్కరుకూడా ప్రేమించటం లేదని అక్కసుగా ఉండేది. దాన్ని తలుచుకుని ఎంతో బాధపడేది. ఎక్కువ జీతం తీసుకునే ఆడదానిగా ఉంటే ప్రేమిస్తారని ఇందిర చెప్పిన మాటల్ని వినటం తట్టుకోలేని ఆవేదనగా అనిపించింది. ప్రేమ మాత్రమే ఆమె జీవితం యొక్క ఒకే ఒక లక్ష్యంలా భావించసాగింది.
చొక్కనాథన్, మాంబలంలో కొత్తగా ప్రారంభించిన జెరాక్స్ అంగడికి ఆమెను మార్పు చేసినపుడు రోజూ ఎలక్ట్రిక్ ట్రైన్లో వెళ్లి రావలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగానే మహేష్‌ను కలుసుకుంది. రెండు రోజుల్లోనే మాటలతో అలవాటుపడ్డారు.
మహేష్ ఆమెకన్నా సన్నగా ఉన్నాడు. ఎక్కువగా నీలిరంగు ప్యాంటునే తొడుక్కొని వచ్చేవాడు. ఓరియంట్ సెలూన్లో పనిచేస్తున్నట్టుగా చెప్పాడు. మహేష్ ఆమెకు బాగా నచ్చాడు. రోజూ మహాష్ ఆమెకోసం టిఫిన్‌బాక్స్‌లో ఏదోఒక తినుబండారం తీసుకొచ్చేవాడు. రైల్లో పక్కనే కూర్చున్నప్పటికీ అతని చెయ్యి ఆమె మీద పడకుండా చూసుకునేవాడు. ఆమె మంచినీళ్ల బాటిల్‌ను తీసుకొని తాగుతున్నప్పుడు కూడా దాన్ని దూరంగా పెట్టే తాగేవాడు. అన్నిటికన్నా ఆమె కొత్త దుస్తులో, కొత్త హేర్క్లిప్పో ఏది తొడుక్కుని వచ్చినా ఇది నీకు చాలా బాగుందని పొగిడేవాడు. అందుకనే తానొక మంచివాణ్ణి ప్రేమిస్తున్నట్టుగా గొప్పగా భావించుకుంది కోకిలవాణి.
ఒకరోజు సాయంత్రం మహేష్ రాకకోసం మాంబలం రైల్వేస్టేషన్ సమీపంలో ఎదురుచూస్తుంటే కాళ్లు నొప్పులుగా ఉన్నాయని ఒక బైక్‌కు ఆనుకొని నిలబడింది. ఎదురుగా ఉన్న అంగట్లో నుండి ఒకవ్యక్తి ఆమెనే చూడసాగాడు. అతను తనను చూస్తున్నాడని గ్రహించిన మరుక్షణం తన దుపట్టాను సరిచేసుకుని తల వంచుకుంది కోకిలవాణి. ఆ యువకుడు ఒక సిగరెట్‌ను వెలిగించుకుని ఆమెను చూస్తూ పొగ పీల్చసాగాడు. మహేష్ రావటం ఆలస్యమయ్యేకొద్దీ ఆమెలో కోపం అధికం కాసాగింది. అతను సిగరెట్‌ను ఆర్పేసి దగ్గరికొచ్చి నిలబడి... ‘‘ఇది నా బైక్. కావాలంటే ఎక్కి కూర్చోవచ్చు. లేదూ ఎక్కడికి వెళ్లాలో చెప్పండి, నేనే తీసుకెళ్లి దిగబెడతాను.’’ అని చెప్పి నవ్వాడు.
దాన్ని భవ్యంగా అతను చెప్పిన విధం ఆమెకు నవ్వును తెప్పించింది. దాన్ని విన్న ఆ యువకుడు, బైక్ తాళాలను తీసి ‘‘మీరే కావాలన్నా నడపండి.’’ అన్నాడు. కోకిలవాణి ‘‘వొద్దు’’ అని తిరస్కరించి నవ్వుతూ పక్కకెళ్లి నిలబడింది. ఆ యువకుడు ఆమెతో ‘‘ఇల్లు ఎక్కడ?’’ అని అడిగాడు. ఆమె బదులివ్వకుండా స్టేషన్కేసే చూడసాగింది. అతను తన పాకెట్నుండి దువ్వెన తీసి తలను దువ్వుకుంటూ ఒక బబుల్‌గమ్‌ను తీసి ఆమె ముందుకు చాపాడు.
ఆమె గబగబ రైల్వేస్టేషన్ లోపలికి నడవటం మొదలుపెట్టింది. అతను నవ్వటం వినిపించింది. మహేష్ వచ్చేంతవరకూ ఆమె తిరిగి చూడలేదు. మహేష్‌తో ఆ యువకుడి గురించి చెప్పాలా వద్దా అన్న సంధిగ్ధంలో పడింది. కానీ చెప్పలేదు.
రెండురోజుల తర్వాత ఆ బైక్ యువకుణ్ణి మళ్లీ రైల్లో చూసింది. అతను కదిలి దగ్గరికొచ్చి నిలబడి ఆమెనే చూస్తూ ఉన్నాడు. కోకిలవాణి అతణ్ణి ఓరకంటితో చూసినపుడు అతను పెదవిని కొరకటమూ, అరచేతిమీద ఐ లవ్ యూ, యువర్స్ దురై అని తన పెన్‌తో రాసి చూపించటమూ, వంకర నవ్వుతో చేతిని ఊపటం లాంటివి చెయ్యసాగాడు.
ఒక వారంరోజుల తర్వాత, ఒకరోజు ఉదయం ఆమె రైలు దిగి నడుస్తుంటే దగ్గరికొచ్చి ‘‘నీ కోసమే రోజూ తాంబరం నుండి ఇదే రైల్లో వస్తున్నాను.’’ అన్నాడు. కోకిలవాణి అతనితో మాట్లాడలేదు.
అతనేమో చాలాకాలం నుండి ఆమెకు పరిచయమున్నవాడిలా దగ్గరికొచ్చి... ‘‘సినిమాకు వెళదామా?’’ అని అడిగాడు. ఆమెకు ఆ మాటలు వినగానే భయం కలిగింది. దాన్ని ప్రదర్శించకుండా... ‘‘నాకు ఇవన్నీ నచ్చవు.’’ అంది.
దురై నవ్వుతూ... ‘‘అంటే నువ్వు నన్ను లవ్ చెయ్యలేదా?’’ అని అడిగాడు. కోకిలవాణి కోపంగా, ‘‘నేనెందుకు నిన్ను లవ్ చెయ్యాలి?’’ అని అడిగింది.
‘‘అంటే ఆ రోజు మాత్రం నవ్వావు. రోజూ లుక్స్ విసురుతున్నావే, అది ఎందుకు?’’ అన్నాడు దురై.
‘‘నేనేమీ నిన్ను లవ్ చెయ్యలేదు. నేను మహేష్‌ను లవ్ చేస్తున్నాను. గొడవ చెయ్యకుండా వెళ్లిపో.’’ అంది.
వెంటనే దురై ఆమెను పచ్చి బూతులు తిట్టటమే కాకుండా... ‘‘నువ్వు నన్ను లవ్ చేసే తీరాలి. నేను డిసైడ్ చేసేశాను.’’ అన్నాడు. అతనికి భయపడి కొన్నాళ్లుగా బస్సులో వెళ్లసాగింది.
ఒకరోజు మహేష్‌తో, ఒక యువకుడు తనను వెంటబడి తరుముతున్నాడని చెప్పింది. మహేష్ కాస్త కలవరపడి, ‘‘నేను మాట్లాడుతాను.’’ అని ఓదార్చాడు. ఆపై రెండురోజుల వరకూ మహేష్‌ను చూడ్డానికే వీలుకాకపోయింది. అతణ్ణి వెతుకుతూ ఓరియంట్ సెలూన్‌కు వెళ్లినపుడు మహేష్ ముఖంలో దెబ్బలు తిన్న వాపు కనిపించింది.
మహేష్ తల వంచుకుని, ‘‘ఆ రౌడీనాయాలు దురై నన్ను కొట్టాడు కోకిలా. మనిద్దరినీ ఒకటిగా చూస్తే చంపేస్తానని చెప్పాడు. ఏం చెయ్యాలో తెలీటం లేదు. సెలూన్ ఓనర్‌ను ఐడియా అడిగాను. లవ్ వ్యవహారాలన్నీ తనకు నచ్చవని అంటున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలీటం లేదు. ఒకటే అయోమయంగా ఉంది.’’ అన్నాడు. కోకిలవాణి అక్కడే ఏడ్చింది. మహేష్ సెలూన్ ఓనర్‌ను అడిగి ఆమెను తీసుకెళ్లి దగ్గరున్న టీ కొట్లో రాగిమాల్ట్ కొనిచ్చి ఎన్నో ధైర్యవచనాల్ని చెప్పి పంపించాడు.
ఆ తర్వాత మహేష్ ఆమెను కలుసుకోవటానికి రాలేదు. కానీ కోకిల ప్రేమను వదలలేకపోయింది. మళ్లీ ఒకనాడు మహేష్‌ను కలుసుకోవటానికి సెలూన్‌కు వెళ్లింది. అప్పుడు సెలూన్లో ఎవరూ లేరు. మహేష్ మాత్రం ఒంటరిగా కూర్చుని టి.వి. చూస్తున్నాడు. ఆమెను చూడగానే సెలూన్ కుర్చీలో కూర్చోమని చెప్పాడు. ఎదుటనున్న అద్దంలో ఆమె ముఖం కనిపించింది. మహేష్ నవ్వుతూ నీ వెంట్రుకల్ని కొద్దిగా ట్రిమ్ చెయ్యనా అని అడిగాడు.
కోకిలవాణి కోపంతో అతణ్ణి తిట్టింది. తర్వాత ఆవేశంతో అతణ్ణి కౌగిలించుకుని వెచ్చటి ముద్దిచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ చాలాసేపటి వరకూ మాట్లాడుతూ ఉండిపోయారు. ఆరోజు జతగా కలిసి ఇంటికి తిరిగొచ్చారు. కోకిలవాణి మళ్లీ ప్రేమించటం మొదలుపెట్టింది.
అయితే వాళ్లను జంటగా ఉదయం థియేటర్లో చూసిన దురై... ‘‘నేను మాత్రమే నిన్ను లవ్ చేస్తాను. ఇంకెవరు నిన్ను లవ్ చేసినా నువ్వు చచ్చినట్టే. నీమీద ఆసిడ్ పోస్తాను. చూసుకో.’’ అంటూ కఠినంగా తిట్టాడు. కోకిలవాణికి అది నిజమవుతుందని అప్పుడు తెలియదు.
అది జరిగిన రెండురోజుల తర్వాత దురై బాగా తాగి ఆమె పనిచేస్తున్న జెరాక్స్ షాపుకొచ్చి... ‘‘నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని ఇప్పుడే తేలాలి. చెప్పవే.’’ అని బెదిరించాడు. కోకిలవాణి అతనితో మాట్లాడలేదు. అతను అసహ్యంగా అరిచాడు. అతనికి భయపడి కొన్నిరోజులు పనికి కూడా వెళ్లకుండా ఉండిపోయింది. అయితే అతను వదిలిపెట్టలేదు. ఇంటి మందుకొచ్చి నిలబడుతూనే ఉన్నాడు. స్నానాల గదికి పక్కనున్న సందుకు మధ్యలో వచ్చి నిలబడి ఆమెనే చూస్తుండేవాడు. ఆమెకు భయంగానూ తడబాటుగానూ ఉండేది.
() () ()
దురై ఆమె మీద ఆసిడ్ పొయ్యటానికి ముందురోజు ఉదయం కోకిలవాణి తండ్రికి ఎవరో... ఆమె మహేష్‌ను ప్రేమిస్తోందన్న విషయం గురించి చెప్పారు. అందుకు ఆ తండ్రి తన కాలికి వేసుకున్న చెప్పును తీసి ఆమె ముఖమ్మీద ఎడాపెడా వాయించటంతోపాటు మహేష్ కులం పేరు చెప్పి నీచంగా తిట్టటమే కాక, ఆమె తన కూతురన్న విషయాన్ని కూడా మరిచిపోయి అసహ్యంగా పచ్చి బూతులు తిట్టాడు.
ఆయనతోపాటు సెల్వం అన్నయ్య కూడా కలిసి... ‘‘వాడు మాత్రమే కాదు నాన్నా, దురై అని ఇంకో కుర్రవాడూ దీని వెనక తిరుగుతున్నాడు. ఒకే సమయంలో ఇద్దరు మొగపిలకాయలతో తిరుగుతోంది.’’ అని మరింత రెచ్చగొట్టాడు.
నాన్న ఆమె జుట్టు పట్టుకొని లాగి గోడకు ఆనించి, ‘‘తిరగుబోతు లం....’’ అని మళ్లీ తిట్టటం మొదలుపెట్టాడు. అమ్మ ఆయన బలమైన పిడికిట్లో నుండి కోకిలను తప్పించి అన్నం గరిటెతో కాళ్లమీదా, కడుపుమీదా కొట్టింది. కోకిలవాణి ప్రేమకోసమే దెబ్బలు తింటున్నాననుకోవటంతో ఏడ్చి అరిచి గీపెట్టలేదు.
() () ()
ఆసిడ్ పోసిన రోజు ఉదయం దురై ఆమె ముందుకొచ్చి నిలబడగానే, ఎలాగైనా అతనితో జుజ్జగింపుగా మాట్లాడి తాను మహేష్‌ను ప్రేమిస్తున్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలని మనసులో అనుకుంది కోకిల.
అయితే దురై ఒక్కమాట కూడా ఆమెతో మాట్లాడలేదు. మాట్లాడటానికి అవకాశమూ ఇవ్వలేదు. ప్యాంటు ప్యాకెట్లో నుండి దువ్వెనను తీస్తున్నట్టుగా చిన్న ప్లాస్టిక్ బాటిల్ నొకదాన్ని బయటికి తీశాడు. దూరంగా ఎలక్ట్రిక్ రైలు వస్తున్నట్టుగా శబ్దం వినిపించింది. ఆమె రైల్వేస్టేషన్ మెట్లకేసి నడవటానికి ముందు ఆమె ముఖమ్మీద ఆసిడ్‌ను పోశాడు.
భగభగమంటూ దహిస్తున్న నిప్పులో ముఖాన్ని దోపినట్టుగా మండటం ప్రారంభించింది. చెవులు, ముఖము, ముక్కు, చెంపలు అంటూ అన్నీ మాడిపోతున్నట్టుగా తట్టుకోలేని బాధ కలగసాగింది. కోకిలవాణి గట్టిగా కేకలు పెట్టింది. గుంపును చీల్చుకుంటూ దురై పరుగెత్తటం కనిపించింది. తనముందున్న లోకం క్రమంగా మాయమవుతున్నట్టుగా ఆమెకు స్పృహ తప్పింది.
() () ()
కోకిలవాణి ఆరు వారాలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. కుడిపక్కనున్న ముఖం పూర్తిగా మాడిపోయింది. చెవి తమ్మలు కాలిపోవటంతో సగం చెవే మిగిలింది. ఆసిడ్ ముఖమ్మీద పడటంతో తల మధ్యభాగం వరకూ ప్రాకిన కారణంగా ఆమె తల వెంట్రుకలు సగం వరకూ కత్తిరించి ఉన్నాయి. ఆమె ముఖాన్ని చూడాలంటే ఆమెవల్లే సహించటానికి వీల్లేకపోయింది.
ఆమె ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో ఆమె తండ్రీ, తల్లీ, బంధువులూ మార్చిమార్చి ఆమెను క్రూరమైన మాటలతో తిడుతూనే ఉన్నారు. కోకిలవాణి మాడిపోయిన ముఖాన్ని చూసిన ఆమె తండ్రి... ‘‘అట్టా ఏంటే నీకు లవ్ కావాల్సి వచ్చింది. చచ్చిపోయుంటే శని వదిలిపోయిందని రెండు మునకలేసి ఊరుకునేవాణ్ణి. ఇకమీదట నిన్ను ఎవడే చేసుకుంటాడు. నిన్ను ఎక్కడికి తీసుకెళ్లి విడిచిపెట్టాలే...’’ అంటూ తన ముఖంలో తానే చరుచుకుంటూ ఏడ్చాడు.
ఎందుకు ప్రేమించాలని ఆశపడ్డాం. ప్రేమ అంటే ఇదేనా? దురై ఎందుకిలా తన ముఖంలో ఆసిడ్ పోశాడు. ఆమె ఆలోచింకొద్దీ దు:ఖమూ ఆవేదనా పొంగుకు రాసాగాయి.
ఆమెతోపాటు చదువుకున్న విద్యార్థులు, తెలిసినవాళ్లు, స్నేహితులు ఎవరూ ఆమెను చూడ్డానికి రాలేదు. ఆసిడ్ బాధితురాలి స్నేహితురాలిని అంటూ చెప్పుకోవటానికి ఎవరు ఇష్టపడతారు. మహేష్ కూడా ఆమెను చూడ్డానికి రానేలేదు.
లేడీ డాక్టర్ ఆమె ముఖాన్ని తుడుస్తూ... ‘‘నీకు ఎంతమంది లవర్స్ వే’’ అంటూ ఎగతాళిగా అడిగేది. కోకిలవాణి బదులేమీ ఇచ్చేదికాదు. కట్లుకట్టేవాడు ఆమె ముఖంలోని గాయాలకు ఆయింట్మెంట్ రాస్తూ... ‘‘ఇకమీదట ఒక్క మగపిలగాడు కూడా నీవైపు తిరిగి చూడడు. నువ్వు ఎక్కడికెళ్లాలన్నా వెళ్లొచ్చు. ఏ సమయానికైనా ఇంటికి తిరిగి రావొచ్చు. నిన్ను ఎవరు ఫాలో చేస్తారు.’’ అనేవాడు. కోకిలవాణికి ఆవేశం వచ్చేది. కానీ నోరు తెరిచి మాట్లాడదు. ఇలా అవమానాలపాలై జీవించటానికి బదులుగా నాన్న చెప్పినట్టుగా చచ్చిపోయుండొచ్చు. ఎందుకోసం బ్రతికిపోయాం. మిగిలిన జీవితాన్ని ఎలా గడపబోతున్నాం. ఆ బాధ ఆసిడ్ మంటకన్నా ఎక్కువగా ఉండబోతోంది.
() () ()
కోకిలవాణి ఆ కేసు నిమిత్తం ఇరవైఆరుసార్లు కోర్టుకు వెళ్లి రావలసి వచ్చింది. ప్రతిసారీ ఆమె ప్రేమను ఎవరో ఒకరు ఎగతాళి చేసేవాళ్లు. కాలిన ముఖాన్ని చూపించి ఆమె కథను చెప్పి నవ్వేవాళ్లు. విచారణ కోసం మహేష్ రావటానికి నిరాకరించటంతోపాటు, తాను ఆమెను ఎన్నడూ ప్రేమించలేదని పోలీసు అధికారుల దగ్గర ప్రమాణపూర్వకమైన వాగ్మూలం ఇచ్చాడు. దురై ఏమో, ఆమె తనను ఎన్నో నెలలు ప్రేమించి చివరకు మోసం చేసినట్టుగా పోలీసుల వద్ద వాగ్మూలం ఇచ్చాడు. కోకిలవాణి తాను ఎవరినీ ప్రేమించలేదనీ, దురై తనను ప్రేమించమని బెదిరించాడని చెప్పింది. వకీలు ఆమె ఎవరితోనైనా శారీరక సుఖాన్ని కలిగి ఉన్నదా, మగ స్నేహితులు ఎంతమంది ఉన్నారని పదేపదే ప్రశ్నించాడు. కోకిలవాణి న్యాయస్థానంలో చాలాసార్లు ఏడ్చింది. అయితే ఎవరూ ఆమెను ఓదార్చలేదు. చివరకు దురై శిక్షింపబడ్డాడు.
() () ()
సగం కాలిన ముఖంతో, ఎలకతోకకున్న వెంట్రుకల్లాంటి కొంచెం జుట్టుతో కోకిలవాణి ఇంట్లోనే పడి ఉంది. టి.వి చూడ్డం కూడా లేదు. తలలో పూలు పెట్టుకోవటమో, అద్దంలోకి చూస్తూ తిలకం దిద్దుకోవటమో కూడా చెయ్యటం లేదు. రెండుసార్లు ఆమెకు పెళ్లిమాటలు కొనసాగాయి. అయితే ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాలేదు. కోకిలవాణి ఒంటరితనాన్ని అలవాటు చేసుకోలేక ఇంట్లో ఉంటూనే పుట్టగొడుగుల్ని పెంచి అమ్మకం మొదలుపెట్టింది. అమ్మానాన్నలు రోజూ ఆమెను నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ఇంట్లో జరిగే ఏ శుభకార్యంలోనూ ఆమె పాలుపంచుకోవటానికి అనుమతించ బడలేదు. నవ్వును మరిచిపోయిన దానిలా కోకిలవాణి ఒక జీవచ్ఛవంలా బ్రతకసాగింది.
() () ()
ఉపాసన అన్న ఒక సేవాసంస్థ ఆమెను తమ సంస్థలో పనికి చేర్చుకున్నప్పుడు ఆమెకు ముప్పైరెండేళ్ల వయసు నడుస్తోంది. అది కళ్లులేని వాళ్లకోసం సేవచేసే సంస్థ. అంధత్వం కలిగినవాళ్లే అక్కడ ఎక్కువమంది పనిచేస్తున్నారు. అందుకని ఎవరూ ఆమెను ఎగతాళి చేస్తారన్న భయంలేకుండా ఆమె పనికి వెళ్లి రావటం మొదలుపెట్టింది. అక్కడున్న గ్రంథాలయంలోని ఎన్నో పుస్తకాలను తీసుకొచ్చి చదువుతూ ఉండేది.
కొన్నిసార్లు ఆమెకు తెలియకనే శారీరక సుఖం గురించి మనసు తహతహలాడేది. అప్పుడు వేళ్లతో ముఖాన్ని తడుముకునేది. కరెంట్‌లో చెయ్యి పెట్టినట్టుగా మనసు వెంటనే ఆ ఆలోచనల నుండి తనను తాను ఖండించుకునేది.
() () ()
గత సంవత్సరం ఒకరోజు సముద్రతీరాన యాథృచ్ఛికంగా దురైను చూసింది. అతనికి పెళ్లై పాపకూడాఉన్నట్టుంది. రెండేళ్ల వయస్సున్న ఆ పాప ఒక రంగురంగుల బంతితో ఆడుకుంటోంది. ఇసుకలో కూర్చున్నట్టుగానే దురై భార్యను గమనించింది. మంచి రంగు. ఆరెంజ్ కలర్ చీర కట్టుకుంది. చేతిలో ఒక హ్యాండ్‌బ్యాగ్. మెడలో చాలా నగలు వేసుకుంది. దురై ఫుల్‌హ్యాండ్స్ షర్ట్ ధరించి తలను చక్కగా దువ్వుకొని ఉన్నాడు.
ఎందుకో దురై భార్య దగ్గరకు వెళ్లి మాట్లాడాలనిపించింది. ఆ పసిపాపను ఒకసారి బుజ్జగిద్దామా అని కూడా అనిపించింది. ఆమె తమనే చూస్తూ ఉండటాన్ని దురై గమనించి భార్యతో ఏదో చెప్పాడు. వాళ్లు పైకి లేచి నిలబడ్డారు.
తానే కదా దురైమీద కోపమూ అసహ్యమూ కలిగి ఉండాలి. అతనెందుకు తనను చూడగానే లేచి పారిపోతున్నాడు? భయమా, గతకాలపు జ్ఞాపకాలు ఏవీకూడా తనముందుకొచ్చి నిలబడకూడదన్న తడబాటా... అన్న ఆలోచనతో వాళ్లు వెళ్లిపోవటాన్ని కోకిలవాణి చూస్తూ ఉండిపోయింది.
ఒక మహిళ మీద ఆసిడ్ పోసినవాడు అని అతణ్ణి చూసి ఎవరైనా అనగలరా ఏం? అతనికి ఆసిడ్ పొయ్యటం అన్నది ఒక సంఘటన. కానీ తనకు? కళ్ల ముందు నుండి దురై మరుగయ్యేంతవరకూ అతణ్ణే చూడసాగింది.
సముద్రతీరమంతా ప్రేమికులు నిండిపోయి ఉన్నారు. వీళ్లల్లో ఎవరో ఒక స్త్రీకి తనలాగా ముఖం కాలిపోవచ్చు లేదూ హత్య గావించబడనూ వచ్చు. నీచపు మాట, చెంపదెబ్బ, కాలితో తన్నటం, కాల్చటం, హత్య ఇవేనా ప్రేమకు చిహ్నాలు? హింసలోనే ప్రేమ వేళ్లు ఊనుకొని ఉన్నాయా?
ఆమె కడలి కెరటాలను చూస్తూ ఉంది. చీకటి పడేంతవరకూ ఇంటికి వెళ్లాలనిపించలేదు.
ప్రపంచం తన చేతిని వదిలిపెట్టి ఎవరూ లేని నిస్సహాయ స్థితిలోకి నెట్టేసిన వైనాన్ని గ్రహించిన దానిలా చాలాసేపటి తర్వాత రైల్వేస్టేషన్కేసి ఒంటరిగా నడవటం మొదలుపెట్టింది.
రైలుకోసం ఫ్లాట్ఫామ్మీద ఎదురుచూస్తుంటే, ఎందుకో తనకు ముప్పైఆరేళ్ల వయస్సు పూర్తయిందని గుర్తుకొచ్చింది.
రైలు వెళుతుండగా వీచిన సముద్రపు గాలులు మచ్చలు మిగిల్చిన ముఖానికి తగలగానే మనసు తానుగా ప్రేమను గురించి ఆలోచించటం మొదలుపెట్టింది. వెంటనే మనసులోనుండి ఇన్నేళ్లు గడిచినా మరిచిపోలేని ద్రావకపు మండే స్వభావమూ కాలుతున్న మంటా భయంకరంగా పైకి లేచింది. తనను మీరిన లోలోని బాధను ఆమె తట్టుకోలేకపోయింది.
కోకిలవాణి పక్కకు తిరిగి చూసింది, ఎదుటి సీటులో ఒక యువతి ఒక యువకుడి ఒళ్లో వాలిపోయి సన్నని గొంతుతో మాట్లాడుతూ ప్రేమిస్తోంది.
కోకిలవాణి వాళ్లను చూడకుండా బయట కనిపిస్తున్న చీకటినే చూస్తూ వచ్చింది. చీకట్లో ఎగురుతున్న ఒక మిణుగురు పురుగు ఆమె ముఖాన్ని రాసుకుంటూ వెళ్లింది.
ప్రేమికుల జంట మాట్లాడుతూ నవ్వుకోవటం వినేకొద్దీ కోకిలవాణి తనకు తెలియకనే వెక్కిళ్లు పెట్టసాగింది. తన ప్రేమను ప్రపంచం ఎందుకు అంగీకరించలేకపోయింది? ఎందుకని తనకు ఇంతటి క్రూరమైన శిక్షను వేసింది? అని ఆలోచించి ఆమె ఏడుస్తూ ఉంది. రైలుతో పాటుగా మిణుగురులు ఎగురుతూ వస్తున్నాయి. అవి చీకటికి కళ్లు మొలిచి ఆమె దు:ఖాన్ని చూస్తున్నట్టుగా ఉన్నాయి.
() () ()
ఆకలితో
దాహంతో
అలసటతో
కండ్లల్ల నీళ్లతో
వాళ్ళు వెళ్లిపోతున్నారు
సంకనపిల్ల
నెత్తినమూట
నెలలగుడ్డు
పగిలిన పాదాలతో
వాళ్ళు తిరిగి వెళ్లిపోతున్నారు
తమ ఊరిని తమ వాళ్ళని
కలుసుకునేందుకు
సత్తువనంతా కాళ్లలో నింపుకుని
వాళ్ళు తరలిపోతున్నారు
నెత్తి మీద భగభగమండుతున్న సూర్యున్ని
దారిమధ్యలో నీడనివ్వని ఏ చెట్టుని
సహాయం అందించని ఈ వ్యవస్థని
నిందించకుండా దేశరహదారిపై
నెత్తుటి పాదముద్రలు వేస్తూ
వాళ్ళు మరిలిపోతున్నారు
మనల్ని నిస్సహాయులని చేసి
వాళ్ళు వెళ్లిపోతున్నారు ...
వాళ్ళు వెళ్లిపోతున్నారు...
ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్రలో రచయితల పూర్వాపర నిర్ణయానికి వాళ్ళ పుట్టిన తేదీలు కాదు ప్రమాణం. ఎందుకంటే చరిత్రలో విస్మృతికి గురి అయిన స్త్రీల సాహిత్యం లభించటమే కష్టం అయిన పరిస్థితులలో వాళ్ళు పుట్టిన తేదీలు, పెరిగిన తీరూ, జీవిత విశేషాలు తెలుసుకొనటం మరీ కష్టం. అందువల్ల ఆయారచయితల రచనల ప్రచురణ కాలమే ప్రమాణంగా తీసుకోవాలి. ఆ రకంగా చూసినప్పుడు గుండు అచ్చమాంబ తరువాత రచయిత్రి పులుగుర్త లక్ష్మీ నరసమాంబ. 1898జూన్ (విళంబి ,జ్యేష్టం) చింతామణి పత్రికలో ‘మహిళా కళాబోధిని’ అనే శీర్షిక గల ఆమె పుస్తకం ఒకటి సమీక్షించబడింది. చింతామణి పత్రిక తొలుత 1874 అక్టోబర్ లో వీరేశలింగం ప్రారంభించిన వివేకవర్ధని పత్రికకు అనుబంధంగా మొదలై, మధ్యలో ఆగిపోయి, మళ్ళీ 1891-92 న్యాపతి సుబ్బారావు నిర్వహణలో పునరుద్ధరించబడి 1898 వరకూ కొనసాగింది. (పొత్తూరివెంకటేశ్వర రావు, తెలుగుపత్రికలు, 2004) ఆ పత్రికకు సమీక్షార్థం పులుగుర్త లక్ష్మీనరసమాంబ పుస్తకం వచ్చిందంటే అది సమీప కాలపు రచనే అయివుంటుంది. నూరు పద్యాలుగల ఆ పుస్తకం స్త్రీల ఉపయోగార్థం వ్రాయబడిందని సమీక్షకులు పేర్కొన్నదానిని బట్టి స్త్రీలు రచయితలు కావటంలో తెలుగునాట స్త్రీవిద్య కేంద్రకం గా వికసించిన సంఘసంస్కరణ ఉద్యమం ప్రభావం కాదనలేనిది అని స్పష్టం అవుతున్నది.
పులగుర్తలక్ష్మీనరసమాంబ 1878 లో జన్మించింది. తల్లి అగ్గమాంబ, తండ్రి చింతలపూడి నీలాచలం. తల్లి వైపు తాత నడకుదుటి రామన్న కవి. మేనమామ నడకుదుటి వీరరాజు కూడా కవి, విమర్శకుడు. ఈ వారసత్వం లక్ష్మీ నరసమాంబది. భర్త పులగుర్త వెంకటరత్నం. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారి శిష్యురాలు ఆమె. (ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, ఆంధ్ర కవయిత్రులు). సంస్కరణ ఉద్యమంలో ఆయన వీరేశలింగం గారి ప్రత్యర్థి. మిగిలిన విషయాల సంగతి ఎలా ఉన్నా స్త్రీవిద్య, స్త్రీల సామాజిక పాత్ర వంటి విషయాలలో మాత్రం ఆమె సంస్కరణ ఉద్యమకాలపు ఆధునిక భావాలను అందిపుచ్చుకొన్నది. ఆ మాటకు వస్తే సంస్కరణోద్యమం మార్పును ఎంతంగా ఆశించిందో అంతగా స్త్రీల విషయంలో గృహిణీధర్మాలు, పాతివ్రత్యం మొదలైన సంప్రదాయ భావాలను అంతగా అంటిపెట్టుకొనే ఉందన్నది వేరేవిషయం.
1898 నాటికి నూరుపద్యాల ‘మహిళా కళాబోధిని, వ్రాసిందంటే 20 ఏళ్ళవయసులో లక్ష్మీ నరసమాంబ సాహిత్య జీవితం మొదలైందన్నమాట. 1902 నుండి హిందూసుందరి పత్రికలో ఆమె రచనలు కనిపిస్తాయి. 1904 లో సంపాదకురాలుగా సావిత్రి అనే మాసపత్రికను ప్రారంభించిన నాటి నుండి ఆమె రచనలకు ఆ పత్రిక వేదిక అయింది.భారతి పత్రికలో కూడా ఆమె రచనలు కనబడతాయి.
1
పులగుర్త లక్ష్మీనరసమాంబ వాజ్ఞ్మయ పరిశీలనకు ముందుగా ఆమె సామాజిక నిర్మాణ నిర్వహణ సామర్ధ్యాల పరిచయం అవసరం.అవి ఒకటి సావిత్రి పత్రికానిర్వహణ. రెండు శ్రీ విద్యాభివర్ధనీ సమాజ నిర్మాణ నిర్వహణ. మూడు ఆంద్ర మహిళాసభ నిర్మాణ నిర్వహణ.
స్త్రీవిద్యావల్లికకు పాదు పత్రికలేనని, పత్రికాధి పత్య భారవహన సామర్ధ్యం తనలో లేకపోయినా స్వజాత్యభివృద్ధికి మూలాధారమైన పత్రికాధిపత్య బాధ్యత తీసుకున్నానని సావిత్రి పత్రికను ప్రారంభిస్తూ వినయంతో చెప్పుకొన్నది. జ్ఞానవిద్యా ధనములు చెలులకు పంచి ఇచ్చుటకు, చెలులు ఒసగేవాటిని స్వీకరించటానికి అసమాన సాధనం పత్రిక అని పేర్కొన్నది. ఆంధ్రదేశంలో చదువను, వ్రాయను శక్తిగల సతీమతల్లులు ఉన్నా తమ శక్తిని లోకముకొరకు ఉపయోగించటానికి ప్రధానసాధనాలైన పత్రికలకు అధిపతులు పురుషులే ఉండటం అవరోధంగా ఉందని -- స్త్రీవాద ఉద్యమం వల్ల తెలుగుసమాజంలో 1970 లతరువాత కల్గిన ఒక అవగాహనను ఆమె ఆనాడే కనబరచటం ఆశ్ఛర్యం కలిగిస్తుంది. సోదరీమణులు ఇంతవరకు తమ హృదయా లలో కాపురమున్న జంకుగొంకులను వెడలగొట్టి ధైర్యోత్సాహాలతో మంచి వ్యాసాలు వ్రాసి పంపమని విజ్ఞాపన చేసింది. (సావిత్రి ,జనవరి, 1904).ఒడిదుడుకులను తట్టుకొంటూ ఆరేడేళ్ళపాటు పత్రికను నడిపింది.
సావిత్రి పత్రిక1904 జనవరి లో ప్రారంభమైతే, మార్చ్ సంచికలోనే పులగుర్త లక్ష్మీ నరసమాంబ కార్యదర్శినిగా వున్న శ్రీ విద్యార్ధినీ సమాజము ప్రప్రథమ వత్సర విషయ జ్ఞాపనము(నివేదిక) ప్రచురించబడింది. అప్పటికి అయిదారు సంవత్సరాల నుండే స్త్రీలు ఒక సమాజంగా కూడి వారానికి ఒకటిరెండుసార్లు కలుసుకొంటూ విద్యాభివృద్ధిని, జ్ఞానాభివృద్ధిని కలిగించే మంచివిషయాలు మాట్లాడుకొంటుంటే బాగుంటుంది అని తనకు అనిపిస్తూ ఉండేదని అందులో ఆమె చెప్పింది. సత్కార్యాచరణకు సంఘం ఆవసరం అన్న భావం ఆమెలో ‘మహిళాకళాబోధిని’ రచనాకాలానికే బలపడిందన్నమాట. భండారు అచ్చమాంబ ఆంధ్రదేశంలో పర్యటిస్తూ సంఘాలు మహిళలను సమీకరించి సంఘాలు పెట్టిస్తున్న సందర్భంలో కాకినాడకు వచ్చినప్పుడు పులగుర్త లక్ష్మీనరసమాంబ చొరవతో 1903 జనవరి 30 వతేదీన శ్రీ విద్యార్థినీ సమాజం ఏర్పడినట్లు ఆ నివేదిక వల్ల తెలుస్తున్నది. ముప్ఫయిమందికి పైగా సభ్యులతో సమావేశాలు ప్రతిశుక్రవారం లక్ష్మీ నరసమాంబ ఇంట్లో జరిగాయి. ఆగస్టు తరువాత దుగ్గిరాల రమణమ్మ ఇంట్లోనూ , బాలాంత్రపు శేషమ్మ ఇంట్లోనూ మంగళవారాలలో జరుగుతూ వచ్చాయి. కాశీభట్ల సూరమ్మ ఇంట్లో ఆదివారం జరిగేవి. ఈ సమావేశాలలో పులగుర్త తో పాటు బాలాంత్రపు శేషమ్మ, దేవగుప్తాపు మహాలక్ష్మమ్మ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. పుస్తకాలు చదువుకొనటం కూడా ఒక కార్యక్రమమే. ఈ సంస్థ కొంతకాలం పనిచేసి ఆగిపోయింది.
శ్రీ విద్యార్థినీ సమాజం 1910 ఏప్రిల్ 8న పునరుద్ధరించబడింది. లక్ష్మీ నరసమాంబ అధ్యక్షులుగా, దామెర్ల సీతమ్మ కార్యదర్శిగా, బాలాంత్రపు శేషమ్మ సహాయకార్యదర్శిగా తిరిగి ప్రారంభమైన ఈ సంస్థ ప్రధానోద్దేశం దేశోద్ధరణకు ముఖ్యముగా కావలసినట్టి విద్యాధనం తెలుగుదేశపు స్త్రీలకు లభింప చేస్తూ వారిని నీతివిద్యాసంపన్నులుగా సత్కార్యాచరణ పరాయణులుగా, దేశోపకార ధురీణులుగా చేయటం. ప్రతిశుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట నుండి నాల్గుగంటలవరకు సభ్యులు సమావేశమై సాహిత్య సద్గోష్ఠి చేయటం, స్వీయ రచనలు చదువుకొనటం, లోకజ్ఞాన విషయాలు మాట్లాడుకొనటం, స్త్రీనీతిగీతాలు, మంగళహారతులు పాడుకొనటం, హార్మోనియం వంటి వాయిద్యాలను వాడుతూ పాడటం- చివరకు కుంకుమ తాంబూలాలు ఇచ్చి సభను ముగించటం - ఇది వారం వారం కార్యక్రమం. సమాజ సభ్యుల ఉపయోగం కొరకు గ్రంథాలయాన్ని అభివృద్ధి పరచటం, చందాలు వసూలుచేసి ధనికుల సహాయంతీసుకొని స్త్రీలకు విద్యాలయాలు ఏర్పరచి వేదశాస్త్ర పురాణాలు, దేశచరిత్రలు, భూగోళ గణితశాస్త్రాలు, సంగీతం మొదలైనవి బోధించటం, అందుకు స్త్రీలనే ఉపాధ్యాయులుగా నియమించటం, అనాధలకు అన్న వస్త్రాలు ఇచ్చి విద్య చెప్పించటం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు కూడా ప్రకటించబడ్డాయి. ఇవన్నీ ఆనాటి సంస్కరణోద్యమ సాధారణ లక్ష్యాలే. స్త్రీలను గృహిణీధర్మకోవిదులుగా చేయటం, వితంతుకాంతలకు వైరాగ్య బోధచేయటం, పవిత్రచారిత్రలుగా సుశిక్షితులను చేయటం వంటివి ఆ సమాజం కార్యక్రమాలలో ఉండటం స్త్రీల విద్యకు సంస్కరణోద్యమం ఇచ్చిన నిర్వచనాన్ని, లక్ష్యాన్ని ప్రతిఫలిస్తాయి. వీటిని ఆ సంస్థ ఎంతవరకు సాధించగలిగింది అన్నది ఇంకా శోధించవలసే ఉన్నది.
ఈ సంస్థ గురించి 1911 జులై సావిత్రి పత్రికలో ఒక ప్రకటన ప్రచురించబడింది. దీనిని బట్టి ప్రారంభమైనప్పుడు ఏర్పరచుకొన్న సమాజ నిబంధనలప్రకారం పునర్వివాహం చేసుకొన్నస్త్రీలకు ఇందులో ప్రవేశం లేదనీ, పునరుద్ధరణ తరువాత నిర్వాహకులు కొందరు ఆ నిబంధనను వ్యతిరే కించి పునర్వివాహిత స్త్రీలను చేర్చుకొనటం వలన చాలామంది సమాజ సమావేశాలకు రావటం మానేశారని,సమాజం ఇలా క్షీణదశకు రావటం చూసి సహించలేక అధ్యక్షురాలైన లక్ష్మీ నరస మాంబ దామెర్ల సీతమ్మను , బాలాంత్రపు శేషమ్మను కార్యదర్శి సహాయకార్యదర్శి పదవులనుండి తొలగించి సమాజాకార్యక్రమాలను చక్కబెట్టే బాధ్యత తీసుకొనాలని జులై 2 వతేదీనాడు జరిగిన సభలో నిర్ణయించినట్లు ఈ ప్రకటన ద్వారా తెలుస్తున్నది. ఆ తరువాత ఈ సంఘం ఎంతకాలం పనిచేసిందో తెలియదు.
ఆంధ్ర మహిళాసభ ఎప్పుడు ఏర్పాటయిందో ఖచ్చితంగా తెలియటంలేదు కానీ, దానికి కార్యదర్శి అయిన పులుగుర్త లక్ష్మీనరసమాంబ 1911 ఏప్రిల్ నెలలో కాకినాడలో జరగనున్న ఆంధ్రమహిళాసభ సమావేశాల గురించి చేసిన ప్రకటన ఒకటి 1911 మార్చ్ సావిత్రిలో ప్రచురించబడింది. దానిని బట్టి 1910జూన్ 2 వతేదీన గుంటూరులో స్త్రీ సనాతన ధర్మమండలి ఆధ్వర్యంలో ఇలాంటి సభను నిర్వహించినట్లు తెలుస్తున్నది. ఆ సభకు అగ్రాసనాధిపురాలిగా లక్ష్మీనరసమాంబ ఇచ్చిన ఉపన్యాసం సావిత్రి 1910 జులై సంచికలో ప్రచురించబడింది కూడా. ఈ ప్రకటనలో లక్ష్మీనరసమాంబ స్త్రీవిద్యాభివృద్ధికి అక్కడక్కడా సమాజాలు ఏర్పడుతున్నప్పటికీ ఆంధ్రదేశ స్త్రీలందరూ ఏకగ్రీవంగా పనిచేయ గలిగినప్పుడే దేశస్త్రీలలో విద్యాభివృద్ధి, సద్ధర్మాభివృద్ధి బలపడజాలవు అని అభిప్రాయపడింది. ఈ సందర్భంలో ఆమె అప్పటికి ఐదారేళ్లుగా దేశీయమహాసభలతోపాటు జరుగుతూ వచ్చిన హిందూదేశ స్త్రీల మహా సభలను ప్రస్తావించి,వేరువేరు ప్రాంతాలకు, భాషలకు సంబంధించిన ఆ మహిళలమధ్య ఒకరు చెప్పినది ఒకరికి అర్ధం కాకుండా పోతున్నదనిచెప్పింది. 1907 లో 1906 డిసెంబర్ 29 వతేదీన కలకత్తా లో జరిగిన హిందూదేశస్త్రీల సభలో పాల్గొని సంఘము యెడలను, ఇరుగు పొరుగు యెడలను మనమునెరవేర్చవలసిన విధులెవ్వి అన్న అంశం మీద ప్రసంగించివచ్చిన అనుభవం నుండి ఆమె అలా చెప్పి ఉంటుంది. ఆంధ్రదేశ మహిళల సభలు విరివిగా జరుగు తూ అవగాహన పెంచుకొనే క్రమంలో స్పష్టం, నిర్దుష్టం అయిన కార్యక్రమంతో సాగినప్పుడే జాతీయ స్థాయిలో జరిగే హిందూదేశస్త్రీల సభ వలన ప్రయోజనం నెరవేరుతుందని పేర్కొన్నది. ఇక్కడి నుండి ఆంధ్రమహిళాసభలను పెద్దఎత్తున నిర్వహించు కోవాలన్నది తన ఆలోచన గా ఆమె చెప్పటాన్నిబట్టి ‘ఆంధ్రమహిళాసభ’ పేరుతో జరిగిన మహాసభలకు కాకినాడ మహాసభే మొదటిది అనుకోవలసి ఉంది.
విద్యా విషయము, సంవిషయము, గృహ విషయము అనే మూడు శీర్షికల కింద వేరువేరుగా ప్రసంగాంశాలు ఇచ్చి వాటిలో తమకు ఇష్టమైన అంశము మీద మాట్లాడవచ్చని కూడా పేర్కొనటం జరిగింది. మే నెల సంచికలో వచ్చిన మహాసభ నివేదికను బట్టి కళ్లేపల్లి వెంకటరమణమ్మ అగ్రాసనా ధిపత్యంలో ఆ సభ జరిగిందని తెలుస్తున్నది. ఆ సభలో పులగుర్త లక్షీనరసమాంబ ఆధ్యాత్మ విద్యకును మనదేశప్రకృతికిని గల సంబంధము అనే అంశం మీద చేసిన ప్రసంగ పాఠం కూడా ఈ సంచికలో ప్రచురించబడింది.
ఈ సభకు ఆంధ్రదేశపు చాతుర్వర్ణ్యములలోని కులాంగనలగు ప్రియ సోదరీమణులను ఆదరణ పూర్వకంగా ఆహ్వానం చేస్తున్నామని చెప్పటం, వారు తమరాకను తెలియచేస్తూ తమతమ వర్ణాన్ని సైతం తెలియచేస్తే అందుకు అనుకూలంగా సదుపాయాలు జరిపిస్తామని పేర్కొనటం గమనించదగిన అంశాలు. కులాంగనలు అనే విషయం మీద తరువాత పెద్దవిమర్శే వచ్చిందని పులగుర్త లక్ష్మీనరసమాంబ దానికి సమాధానంగా జూన్ సంచికలో ప్రచురించిన వివరణను బట్టి తెలుస్తున్నది. పెద్దగా విద్యాబలంలేని స్త్రీల ప్రధమప్రయత్నం కాకినాడ మహాసభ అని చెప్పి లక్ష్మీనరసమాంబ దానిలో లోపాలు ఏమైనా ఉంటే చెప్పి నివారణోపాయాలు సూచించటం కాక పరిహాసంచేస్తూ, నిందిస్తూ, అపవాదాలు వేస్తూ వ్రాసినదానికి నొచ్చుకొంటూ ఇవి కొత్తగా ప్రారంభ మైన ఉద్యమానికి భంగం కలిగిస్తాయని, కులాంగనలు సభలుచేయరాదు అనేవాళ్లకు బలం చేకూరుస్తాయని, ఉద్యమశీలురైన స్త్రీలను భయపెడతాయని కనుక ఉపేక్ష చేయక ఆక్షేపణలకు సమాధానాలు ఇస్తున్నానని పేర్కొన్నది.
వాటిలో ముఖ్యమైంది పునర్వివాహితలైన స్త్రీలకుగానీ, ఆంధ్ర క్రైస్తవ స్త్రీలకుగానీ స్థానం లేని సంఘానికి ఆంధ్రమహిళామహాసభ అనే పేరు పెట్టిఉండకూడదని పునర్వివాహా స్త్రీనిషేధ ఆంద్ర బ్రాహ్మణ స్త్రీ సభ అని పెట్టుకొంటే సరిపోయేది అన్న ఆక్షేపణ. ఈ సభకు బ్రహ్మణస్త్రీలతో పాటు వైశ్య శూద్ర మహిళలు కూడా వచ్చారు కదా ఆంధ్ర బ్రాహ్మణ స్త్రీ సభ అని పెట్టటం ఎంత వరకు లక్షణంగా ఉన్నట్లు అని సవాల్ చేసింది. ఆంధ్రులు అంటే ఆంధ్రదేశంలో ఉన్న హిందూస్త్రీలే కానీ ఇరుతరులు కాదని అనేక ఉదాహరణద్వారా వాదించింది. ఆ క్షేపణలు ఆంధ్రపత్రికలో ప్రచురించబడ్డాయి కనుక అసలు ఆ పత్రిక ఆంధ్రదేశంలో గానీ ఆంధ్రులచేతగానీ ప్రచురించబడటం లేదు కనుక (అది బొంబాయి నుండి ప్రచురించబడేది) దానికి ఆంధ్రపత్రిక అనే పేరు చెల్లదని ప్రతివాదానికి దిగింది. దానికి “ఆంగ్లేయ భాషా సంస్కార సంకలిత సంఘ సంస్కార ప్రియామృతాంజన పత్రిక” అంటే సరిపోయేదికాదా అని ఎద్దేవా చేసింది. ఇక కులాంగనలకు ఆహ్వానం అన్నమాటను పట్టుకొని పునర్వివాహితలకు ఆహ్వానం ఇవ్వలేదని విమర్శించారు కదా! శృతి స్మృతి పురాణేతిహాస నిదర్శనాలతోస్త్రీ పునర్వివాహం కులస్త్రీ ధర్మం కాదని వితంతుస్త్రీలకు బ్రహ్మచర్యమే ఉత్క్రుష్ట ధర్మమని సుదీర్ఘంగా చర్చించింది. సాంఘిక నిబంధనలకు లక్ష్మీ నరసమాంబ స్త్రీవిద్యా విషయ సంస్కరణ అభిలాషి మాత్రమే కానీ పునర్వివాహ విషయంతో ఆమెకు ఆమోదంలేదన్నది స్పష్టం. అయితే సాంఘిక నిబంధనలకు మీరి సంఘముకొరకు పాటుపడుటవలన ప్రయోజనంలేదని నమ్మినవారమగుటచే మేము కులాంగనలను మాత్రమే ఆహ్వానించాము కానీ పునర్వివాహితల పొడగిట్టక కాదు అని వివరణ కూడాఇచ్చింది. ఇదంతా చెప్పటం ఎందుకంటే ఆ నాటి సంఘసంస్కరణోద్యమం ఎన్ని పరిమితులమధ్య విస్తరించిందో తెలుసుకొనటానికి. లక్ష్మీ నరసమాంబ అభిప్రాయాలతో అందరికీ ఏకీ భావం ఉండనవసరం లేదు కానీ ఏ అభిప్రాయాలనైనా కలిగి ఉండటానికి, వాటికి సమాజంలో ప్రచారంచేయటానికి సంఘాలు పెట్టుకొని బయటకువచ్చే స్త్రీలు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కో వలసి ఉంటుందో, తట్టుకొని నిలబడటానికి ఎంత తర్కబలం అవసరమో సూచించటానికి.
1911 ఏప్రిల్ లోకాకినాడలో సభలు జరిగిన తరువాత వార్షిక సభలు ఎక్కడెక్కడ జరిగాయో తెలియదు కానీ 1914 ఏప్రిల్ 11, 12 తేదీలలో విజయవాడలో జరిగిన అయిదవ ఆంధ్ర మహిళా సభల పూర్తి సమాచారం లభిస్తున్నది. కానీ ఆ సభలలో పులగుర్త ప్రమేయం ఏమీ కనిపించదు. ఆ సభలో బృందావనపుర స్త్రీ సమాజం కార్యదర్శి మోటుపల్లి రాజాబాయమ్మ ‘స్త్రీ యున్నతవిద్య’ అన్న అంశం మీద చేసిన ప్రసంగంలో స్త్రీల సాహిత్యకృషి గురించి చెబుతూ పులగుర్త లక్ష్మీ నరసమమాంబ సావిత్రి పత్రికాధిపురాలిగా, స్త్రీవిద్యాభివృద్ధికొరకు పట్టుదలతో పనిచేస్తున్న మహిళగా, మహిళా కళాబోధిని కావ్యకర్తగా ప్రశంశించబడింది. అంతే.
పులగుర్త లక్ష్మీ నరసమాంబ రచనలను పద్యకవిత్వం- పాటలు, కథారచనలు,నవలలు, వ్యాసాలు అని నాలుగు భాగాలుగా వర్గీకరించి పరిశీలించవచ్చు.
2
పద్య కవిత్వం - పాటలు
‘మహిళకళాబోధిని’ తో ఆమె కవితావ్యాసంగం మొదలైంది. కథాప్రధానమైన కవిత్వంకన్నా నీతిప్రధానమైన ముక్తకాలే ఎక్కువ. వేరువేరు శీర్షికలతో వచ్చిన ఖండికలు. ప్రారంభ ఖండకావ్యం నూరుపద్యాల మహిళాకళాబోధిని. . ఈ పుస్తక సమీక్షకులు ఆమె కవిత్వం మృదువు, మధురం, సుబోధకం, నిర్దుష్టం అని చెప్పి నిదర్శనంగా ఒక పద్యాన్ని ఉదహరించారు.
“పూనికతోడ నింట గల బోటులపైఁ బడద్రోయకుండ నా
మేనును వంచి యెల్లరును మెచ్చుగతిన్ గృహకృత్యముల్తగన్
బూని సుకీర్తి సౌఖ్యములఁ బొందెద నంచుఁ దలంపనీని య
జ్ఞాన దివాంధరాజమును జాటున నుంచెడి వెల్గు విద్యగా “
1898 నాటి ఈ పద్యాన్ని ఆనాటి సంస్కరణోద్యమ నేపధ్యం నుండి చూడాలి. సంస్కరణో ద్యమానికి కేంద్రం స్త్రీ. భావజాలపరమైన సంఘర్షణ అయినా, సామాజికమైన కొత్త నిర్మాణాల గురించిన ప్రయత్నాలైనా, ప్రభుత్వ పరమైన చట్టాల కోసం ప్రయత్నమైనా ప్రధానంగా సతీ సహగమనం , బాల్యవివాహం, స్త్రీవిద్య, స్త్రీ పునర్విహం వంటి విషయాలను చుట్టుకొనే సాగాయి. ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం స్త్రీవిద్య, వితంతువివాహం అనే రెండు అంశాలలో ఈ సమాజాన్ని సంస్కరించి ఆధునికం చేయటానికి పూనిక వహించాడు. స్త్రీవిద్య కోసం బాలికలకు పాఠశాలలు ఏర్పాటుచేయటమే కాదు, స్త్రీవిద్యకు అనుకూలభావజాలాన్ని అభి వృద్ధి చే య టానికి పత్రికలు స్థాపించాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు. వ్యాసాలు ప్రచురించాడు. 1885 నాటికి ఆయన వ్రాసిన వ్యాసాలు స్త్రీవిద్య ప్రయోజనాలుగా మూడింటిని నిర్ధారిం చాయి. అవి 1. స్త్రీలు విద్యా వంతులైతే ఇంట్లో తోటి స్త్రీలతో కలహాలు పెట్టుకొనటం మానుతారు. 2. పతివ్రతల కథలు చదివి తాముకూడా అట్లా ఉండటానికి ప్రయత్నిస్తారు. 3. ఇతర ప్రాంతాలలో ఉన్న భర్తలు వ్రాసే ఉత్తరాలు చదువుకోగలుగు తారు. అందువల్ల ఇంటిగుట్టు కాపాడబడుతుంది. ఆ సంస్కరణో ద్యమాన్నీ , ఈ రకమైన వ్యాసాలను పరిశీలిస్తూ, చదువుతూ పెరిగింది పులుగుర్త లక్ష్మీ నరసమాంబ. ఆ ప్రభావాల నుండి వచ్చింది ఈ పద్యం.
వీరేశలింగం స్త్రీవిద్య ప్రయోజనాలుగా చెప్పినవాటిలో మొదటిది స్త్రీలు ఇంట్లో తోటి స్త్రీలతో కలహాలు పెట్టుకొనటం మానేస్తారని. ఇంట్లో స్త్రీల మధ్య కలహాలు ఎలాఉంటాయి? అత్త, ఆడబడుచులు, తోడికోడళ్లు ఇదీ ఒక ఇంట్లో వుండే స్త్రీ సమూహం. వీళ్ళ మధ్యకలహాలు ఎందుకు వస్తాయి? వాళ్ళ సాధారణ ప్రపంచం ఇల్లు, ఇంటిపనులు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ చేస్తున్న ప్పుడు కలిగే అసహనం తరచు వాళ్ళ మధ్య కలహాలకు కారణం అవుతుంది. స్త్రీవిద్య దానికి పరి ష్కారం చూపిస్తుంది అన్నది ఈ పద్యం సూచిస్తుంది. కుటుంబంలో ఇతర స్త్రీలమీదకు తోసెయ్య కుండా ఒళ్ళువంచి అందరూ మెచ్చుకొనేట్లు ఇంటిపనులు చక్కబెట్టుకొనటం స్త్రీధర్మం అని సంప్రదాయం చెబుతుంది. ఆ ధర్మమే స్త్రీలకు కీర్తిని, సౌఖ్యాన్ని ఇస్తుంది. అయితే స్త్రీలు వాటిని పొందకుండా అడ్డుపడే అజ్ఞానం ఒకటి ఉంది. అది సోమరితనం కావచ్చు, ఈర్ష్య అసూయలు కావచ్చు. ఆ అజ్ఞానం అనే చీకటిని అభావం చేసే వెలుగు విద్య అని ఈ పద్యం తాత్పర్యం.
గృహకృత్యనిర్వహణ స్త్రీధర్మమని, అది తప్పరాదని సంప్రదాయం శాసించగా స్త్రీలు తరతరాలుగా దానిని అనుసరిస్తూనే ఉన్నారు. ఎవరో శాసించారని మనసులో ఇష్టం లేకున్నా, కష్టంగా ఉన్నాఇన్నాళ్లు గృహ కృత్యములను చేసుకొంటూ పోయిన వాళ్ళు ఇప్పుడు తమకు తామే గృహ కృత్యములకు నిబద్ధులయ్యే జ్ఞానం విద్య అనే వెలుగువల్ల లభిస్తుందని చెప్పినట్లయింది. వ్యక్తులుగా వాళ్లలో ఉండాటానికి వీలున్న పని ఎగ్గొట్టటం అనే బలహీనత ను సంస్కరించు కొనటానికి విద్య ఉపయోగ పడుతుందన్నమాట. ఇది ఆనాటి సంస్కరణోద్యమ చైతన్యస్థాయిలో భాగమే. స్త్రీలు విద్యావంతులు కావాలనటం వరకు అది అభ్యుదయ ఉద్యమం. మళ్ళీ ఆ విద్య స్త్రీల సాంప్రదాయ పాత్రను వివేకవంతంగా పోషించ టానికే అని అందరూ నమ్మారు. నమ్మింది చెప్పారు. అది తెలుగునాట సంస్కరణోద్య మానికి వీరేశలింగం పెట్టిన ఒరవడి. మహిళా కళాబోధిని కావ్యం లభించినట్లయితే ఆ విషయం మీద మరింత స్పష్టమైన నిర్ధారణకు రాగలం.
హిందూసుందరి పత్రికలో లభించిన ఖండికలు అయిదు. మొదటిదిప్రార్ధనాపద్యాలు (1902, మే) ఇవి మూడు కంద పద్యాలు. హిందూ సుందరి పత్రికను , స్థాపకులను భగవంతుడు దయాళువై కాపాడాలని ప్రార్ధించే పద్యాలూ ఇవి. “అనయాంధ కూపపతమగు వనితా సంఘంబు బయటపడ నూతగ’నున్నదని ఈ పత్రికను అభివర్ణించింది. హిందూ సుందరి ఏడాది పసికూన అయిన సందర్భంలో (1903,ఏప్రిల్) ‘శ్రీహిందూ సుందరీ జండిన మహోత్సవ సమయాశీర్వాదము’ అనే శీర్షికతో వ్రాసిన నాలుగు సీసపద్యాలు, ఒక మత్తేభం, ఒక ఉత్సాహం తో కూడిన ‘గజసుమాల’లో భగవంతుడు పూర్ణకరుణతో దానిని కాపాడాలని ప్రార్ధనాయుత ఆకాంక్షను వ్యక్తం చేసింది. పద్య రచనను ప్రోత్సహించటానికి సమస్యలు ఇయ్యటం, వాటిని ఉపయోగిస్తూ పద్యాలూ అల్లటం రెండూ ఆమెకు తెలుసు.
ఈ సంచికలోనే ‘స్త్రీవిద్యావిజయవార్త’ - A SUCCESS FULL NEWS OF FEMALE EDUCATION అనే ఆంగ్ల శీర్షికతో సహా - అనే ఖండిక ప్రచురించబడింది.ఇందులో అయిదు పద్యాలు ఉన్నాయి. కాకినాడలో లోవర్ సెకండరీ గ్రేడ్ పరీక్షలో విజయంసాధించిన ఒక స్త్రీని ప్రశంశిస్తూ వ్రాసింది. ఆమె పెద్దిభట్ల వెంకటప్పయ్య కూతురు. పేరు వెంకట సుబ్బమాంబ. “లోకోపకారకార్యాకర చణుడైన జనకుకీర్తిజ్యోతిచమురనంగ / గార్హస్త్య సౌఖ్య మార్గప్రదర్శక నిజపతి సదుద్యమ వృక్షఫలమనంగ” ఆమె పరీక్షలో ఉత్తీర్ణురాలైందని ’ అతివలు మందబుద్ధులను నందులకునిజదర్శనంబిడ’ సరస్వతీదేవి ఆమెతో చెలిమి చేసిందని అంటుంది లక్ష్మీనరసమాంబ.
సతీ ప్రార్ధన ఆమె వ్రాసిన 20 పద్యాల ఖండిక. (అక్టోబర్ 1902). ఆత్మశ్రయం. నేను అంటూ ఉత్తమపురుషలో ఒకస్త్రీ భగవంతుడిని ఉద్దేశించి చేసే ప్రార్ధన అంతా సతికి ఇహలోక దైవమైన భర్త చిరాయువు కలిగి నిరంతరం ఉన్నతిని పొందటమే ‘అతివకపారమై చెలగునైహిక సౌఖ్యసుధాబ్ధి’ కనుక తనభర్తను అట్లా చేయమని కోరుకొనటమే. అయిదవతనం ఇమ్మని, భర్త ఏ పాపాలు చేసినా పోగొట్టమని, ఏ పాడుపనులు చేసినా, చేయుచున్నా, చేయనున్నా వాటినుండి తొలగింపచేయమని, పరస్త్రీలు సహోదరులనే భావం అతని మనసులో ఉండేట్లు కరుణించమని, ఎప్పుడూ సత్పథంలోనే ప్రయాణిస్తూ ఉండేట్లు, భగవద్భక్తి కలిగివుండేట్లు తన భర్తను దయచూడమని ప్రార్ధించింది. అంతేకాదు, భగవద్భక్తి, పతిపాదసేవ తన బుద్ధిని వదలకుండా సతతం ఉండేట్లు చూడమని కూడా కోరింది. పరపురుషులు సహోదరులు, భర్త దైవం అనే భావాన్ని సదా తన అంతరంగంలో ఉండేట్లు చేయమని అడిగింది. పతిభక్తి, దైవభక్తి తనహృదయవీధులలో సదా సంచరించేట్లు చేయమని భగవంతుడిని ప్రార్ధించింది. సతి ప్రార్ధన భర్తకోసమైనా, తనకోసమైనా అంతిమమంగా భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలను,అభివృద్ధిని కోరుకొనేవే కావటం, స్త్రీలు భర్త ఆధిక్యతను అంగీకరించి పాతివ్రత్య నిబద్ధతను ప్రదర్శించేదే కావటం గమనించదగినది. ఇన్నాళ్లు మనుధర్మమో, మగప్రపంచమో స్త్రీ ఎలా వుండాలని నిర్దేశిస్తూ వచ్చిందో దానినే చదవటం, వ్రా యటం వచ్చిన స్త్రీలు తమ మాటగా, తమ ఆదర్శంగా చేసుకొని చెప్పే విచిత్ర సందర్భం ఇది.
శ్రీ విద్యార్థినీ సమాజ సభ్యురాలైన పోచిరాజు మహాలక్ష్మమ్మ భర్తకు రాజమండ్రిలో ఉద్యోగం వచ్చి కాకినాడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు జరిపిన వీడ్కోలు సమావేశంలో ఆమెతో స్నేహాన్ని గురించి లక్ష్మీనరసమాంబ ‘గజమాల’ అనే శీర్షికతో ఎనిమిది సీస పద్యాలు వ్రాసింది. “ అట్టిమైత్రికి నాటపట్టై సఖులను / బ్రాణములకన్న మిన్నగఁ గాన నేర్చు / మనదు చెలి మహాలక్ష్మ్యాOబ మనలవిడిచి /యన్య పట్టణమునకేగ నయ్యె నయోయో” అన్నపాదాలు చిన్నచిన్న మార్పులతో నాలుగైదు పద్యాలలో ఆవృతమవుతాయి. ‘అట్టిమైత్రికి ఆటపట్టై’ అని ప్రారంభమయ్యే ఈ భాగానికి ముందున్న సీసపద్య పాదాలలో ఆ మైత్రి ఎటువంటిదో వర్ణించటం ఉంది. మొదటి పద్యంలో అది కనిపెంచిన తల్లిదండ్రులను, తోడబుట్టినవాళ్లను, చుట్టాలను, చివరికి కన్నపిల్లలను మరిపించగల మైత్రి. మరొక పద్యంలో శక్తినిమించిన ఘనకార్యాలు చేయటానికైనా, దుష్టజనుల అపవాదులను చీల్చి చెండాడగలగటమైనా, మనసు చెడుదారులకు మళ్లినప్పుడు చిటికలో తిప్పెయ్యటానికైనా, సత్కార్యాలు చేయటానికి భయపడే జబ్బుకు ఔషధ మైనా స్నేహాబలమే అని నొక్కిచెప్పింది.
రెండవపద్యంలో కష్ట సాగరంలో ఉన్నప్పుడు ఆదుకొనే ఓడ, దిగులుమేఘాలు కమ్మినప్పుడు చెదరగొట్టే గాలి, పాపాలు బాధిస్తున్నప్పుడు సద్ధర్మ బోధ, పీడలనే చీకట్లు కమ్మినప్పుడు వెన్నెల ప్రసరించే చందమామ- అని ఆమె స్నేహాన్ని రూపకాలతో వర్ణించింది. మరొక పద్యంలో చిత్రవస్తువులు చూడాలన్న కుతూహలానికి సూర్యుడు, మనసులోని రహస్యాలను దాచుకొనగల రాతి పెట్టె, గ్రంథపఠన ఆనందం అనే పాలకు పంచదార, ఇష్టవిహారం వాళ్ళ కలిగే సంతోషం అనే బంగారానికి వాసన చెలిమి అని వర్ణించటంలోనూ రూపకాలతో చెప్పటమే కనబడుతుంది.
వర్ణనీయ వస్తుప్రాధాన్యతను స్థాపించటంలో వాటిని పోలిన ఉత్క్రుష్ట అంశాలను తక్కువ చేసి చెప్పటం మరొక పద్ధతి. స్నేహితుల మాటలు కలిగించే సుఖం చిలకపలుకులు ఇస్తాయా? స్నేహితులతో మాట్లాడటం కన్నా నాలుకకు అమృతం రుచిగా ఉంటుందా? స్నేహితు రాలిని చూసినప్పుడు కలిగే ఆనందం వెన్నెల కలిగిస్తుందా? స్నేహితురాలి స్పర్శ సుఖం మలయా నిలం ఇయ్యగలగదా? స్నేహితురాలి తలను వాసనచూడటంలో ఉన్న సుఖం పూలవాసన సమకూర్చ గలదా అన్న వరస ప్రశ్నలలో కాదు అనే సమాధానం గర్భితమయ్యే వుంది. అంతే కాదు చెవి, నాలుక ,కళ్ళు,చర్మం, ముక్కు అన్న పంచేద్రియాల ప్రస్తావన ద్వారా “ సఖులు పంచేంద్రియా నంద జనకులు” అని స్థాపించింది కవయిత్రి. సంపదలు ఎన్నయినా పొందవచ్చుగానీ ‘సఖ్యంబు బడయుట చాలనరిది’ అని స్నేహం యొక్క ఔన్నత్యాన్ని వర్ణించిన ఈ పద్యాలలో లక్ష్మీ నరసమాంబ భావుకశక్తి ని చూడవచ్చు.
సావిత్రి పత్రిక ప్రారంభ సంచికలోనే (1904 జనవరి) ‘దైవప్రార్ధనము’ అనే శీర్షిక క్రింద మూడు పద్యాలు వ్రాసింది లక్ష్మీ నరసమాంబ. సావిత్రి పత్రికను ఈశుండు ప్రేమగా చూడాలని, సావిత్రి అనే తీగపై కరుణాసుధారసం కురిపించాలని, విద్యాకల్పాభంబై ప్రకాశించేట్లు పెంచి పోషించాలని దైవాన్ని ప్రార్ధించడం ఇందులో విషయం. మొదటి పద్యం సావిత్రీవృత్తము. రెండవది జలధరమాలావృత్తం. మూడవది విద్యున్మాలావృత్తం. ఇవి మార్గఛందస్సులో విశేష వృత్తాలు. ఛందస్సుపై ఆమె సాధించిన సాధికారతకు ఇవి గుర్తు.
ఆ తరువాత ఉత్తమపద్ధతి, మాధ్యమపద్ధతి, అధమపద్ధతి అని మూడు శీర్షికలతో మూడు పద్యాలు వ్రాసింది.అవి మార్గ ఛందస్సులో ఉన్నాయి. పరనిందచేసేవారి మాటలు చెవిన పెట్టకుండా, ఆధైర్యానికి చోటీయక , సందేహాలకు తావియ్యక, ఆటంకాలకు జంకక కార్యఫలం పొందేవాళ్ళు ఉత్తములు అని, పెద్దకార్యాలు తలకెత్తుకొని కీర్తి వస్తే పొంగిపోయి, జననింద కలిగితే జడిసిపోయి వెనుకంజ వేసేవాళ్ళు మార్గం తప్పి ఫలం పొందలేనివాళ్ళు మధ్యములుఅని, ముందు ఉత్సాహపడి ఆ తరువాత అసలాపని గురించే పట్టించుకోనివాళ్ళు పైగా పనిలో ఉన్నవాళ్లను పక్కకు లాగేవాళ్ళు అధములు అని ఆ పద్యాలలో ఆమె ఉత్తమమధ్యమ అధమ మానవ స్వభావాలను నిర్వచించింది.
సావిత్రి పత్రిక ప్రారంభ సంచికనుండే ‘నీతి పదములు’, ‘సతీ ధర్మములు’ అనే రెండు శీర్షికలకింద ద్విపద కవిత్వం వ్రాసింది లక్ష్మీనరసమాంబ. రెండు పాదాల ముక్తకాలు ఇవి. ఏ ద్విపదకు ఆ ద్విపద అర్ధవంతంగా ఉంటుంది. తరువాతి ద్విపదతో దానికేమీ కథాసంబంధం, భావసంబంధం ఉండదు. 1904 జనవరి నుండి ఏప్రిల్ వరకు నాలుగు సంచికలలో ఇవి వరుసగా వచ్చాయి.మళ్ళీ సెప్టెంబర్ సంచికలో వచ్చాయి. నాలుగు సంచికలు కలిపి ‘నీతిపదములు’ లో 55 ద్విపదలు, ‘సతీధర్మములు’ లో 53 ద్విపదలు వున్నాయి. “ సూది లేకుండఁగ రాదుగా కుట్టు/ సాధనములు లేక సాగునే పనులు” వంటి లౌకిక వివేక జ్ఞానం కలిగించే నీతి వాక్యాలు సరళ సుందరంగా నీతిపదములు ద్విపదలలో ఒదిగిపోయాయి.” కత్తిఁ బోలే భువిని గలముఁ కాగితముఁ / గుత్తుకల నొకప్డు కోయఁ గాఁ జాలు” , “ఎవరి మాటయ వారి హృదయంబుఁ జూపు / ధవళ ముకుర
మనఁ దగియుండు సుమ్ము” వంటి ద్విపదలు నిశిత లోకాపరిశీలనా శక్తి నుండి వికసించిన బుద్ధి చాతుర్యాన్ని సూచిస్తాయి. “పాతివ్రత్యముఁ బూను నాతికెల్లప్పుడుఁ / జేతిలోనె యభీష్ట సిద్ధులుండుఁ గఁ ద” వంటి స్త్రీధర్మ ప్రబోధ ద్విపదలు కూడా ఇందులో అక్కడక్కడా ఉన్నాయి.
సతీధర్మములు శీర్షిక కింద ద్విపదలను “ శ్రీమల్లొక జనక! నే / నేమంబునఁ జిత్తసీమ నిల్పుకొనిన నీ / క్షేమంకర పాదయుగళి /కై మ్రొక్కి కడంగు దానఁ గార్యంబునకున్ “ అనే ప్రార్ధనా పద్యంతో ప్రారంభించింది లక్ష్మీనరసమాంబ. స్త్రీలు అనుసరించదగు ధర్మములను క్రోడీకరించిన ద్విపదలివి. స్త్రీ భర్తకు సగం శరీరం అన్నట్లుగా ఉండాలి, సేవలలో దాసిగా ఉండాలి, ఆలోచనలో మంత్రిలాగా ఉండాలి, పాతివ్రత్యంకన్నా సౌఖ్యమిచ్చే వ్రతం లేదు ఇలాంటి ధర్మాలు ప్రబోధించ బడ్డాయి. భర్త చేసిన నేరాలు కంటపడ్డా బయటపెట్టకపోవటం, భర్త మీద నేరాలు ఎవరుచెప్పినా వినకపోవడం, భర్తను ఇతరులు నిందిస్తుంటే అక్కడ నిలబడకపోవటం, భర్త తప్పుపడితే మారు మాటాడకపోవటం, కోపగించి దెప్పకపోవటం స్త్రీధర్మాలుగా చెప్పటం చూస్తే లక్ష్మీనరసమాంబ దృక్పథం మనుధర్మనీతి కన్నా భిన్నంకాదని అనిపిస్తుంది. భర్త ఇంటికివస్తున్నప్పుడు సంతోషం కనబరిచే ముఖంతో ఎదురువెళ్ళమని, రాగానే ఇరుగుపొరుగు వారి కయ్యాలను చెప్పవద్దని, చికాకులో ఉన్నప్పుడు సంసారపు బాధలు చెప్పవద్దని, భర్తచేప్పే పనులు ఆలస్యం లేకుండా చేయమని హితవు పలికిన తీరు స్త్రీ జీవితం భర్తకు ఎంతగా అంకితమై ఉండాలో నిర్దేశిస్తుంది.
నగలకై భర్తను వేధించటం నేరం. పతి అనాకారి అయినా మన్మథుడిగా భావించాలి. భర్త కోపాగ్నిని మాటలనే అమృతంతో ఆర్పాలి. భర్తను వశం చేసుకొనటానికి మందులు పెట్టవద్దు. - స్త్రీ ప్రవర్తన మీద ఇలాంటి నిషేధాలు ఎన్నో ఈ ద్విపదలలో చెప్పబడ్డాయి. భర్త మరొకరిని ప్రేమించినా , తనను నిర్లక్ష్యం చేసినా, ఆగ్రహించి మాట్లాడకపోయినా, తిట్టినా, కొట్టినా, కష్టాలు పెట్టినా, భార్యకు కోపం రాకూడదు. వినయంతో సేవలు చేయవలసినదే. సతుల చరిత్రలు స్మరించుకొంటూ కాలం గడపవలసినదే. ఇదీ సతీధర్మం అని ఈ ద్విపదలలో నొక్కిచెప్పింది కవయిత్రి.
లక్ష్మీ నరసమాంబ కు ఆంగ్లభాషాసాహిత్యజ్ఞానం కూడా ఉన్నది. ఆంగ్లంలో లాంగ్ ఫెలో అనే కవి వ్రాసిన సామ్ ఆఫ్ లైఫ్ అనే శీర్షికగల పద్యాలను అనుకరించి తెలుగులో మార్గఛందస్సులో పద్యాలు వ్రాయటమే అందుకు నిదర్శనం. ఇవి తొమ్మిది పద్యాలు. పద్యాలకు తాత్పర్యం కూడా ఇచ్చింది. ఆత్మకు నాశనంలేదని, జీవితమంటే సుఖదుఃఖాలను అనుభవించటం మాత్రమే కాదని, ఈశ్వర సాన్నిధ్యానికి చేరువచేయగల సన్మార్గంలో కష్టసుఖాలను లెక్కచేయకుండా పోవటమే అని, యుద్ధవీరులవలె కామక్రోధదశత్రువులను జయించాలని, సత్కార్య సాధనలో కాలం గడపాలని ఈ పద్యాలు స్థూలంగా ప్రబోధిస్తాయి.
1904 మే సంచికలో ‘సరస్వతీపరిదేవనమ’ అనే శీర్షికతో తొమ్మిది పద్యాల ఖండిక ఒకటి రచయిత పేరు లేకుండా ప్రచురించబడింది. 1907 జులై సావిత్రి వెనుకపేజీలో సావిత్రి కార్య స్థానమున వెలకొరకు దొరుకు పుస్తకాల జాబితాలో సుజ్ఞాననవరత్నములు తోపాటు అమూల్యము ,మధుపద్వయము, సరస్వతీ పరిదేవనము కలిపి ఒక పుస్తకంగా లభిస్తున్న సమాచారం ఉంది. దానిని బట్టి ఈ సరస్వతీ పరిదేవనము లక్ష్మీనరసమాంబ రచనే అని నిర్ధారణ అవుతున్నది.
పరిదేవనము అంటే దుఃఖంతోటి మాట. సరస్వతి దుఃఖంతో మాట్లాడే మాటలు ఈ పద్యాలన్న మాట. సరస్వతికి దుఃఖం ఎందుకు? సరస్వతి విద్యకు,జ్ఞానానికి అధిదేవత అంటారు. ఈ సమాజంలో విద్యావంతులు, జ్ఞాననవంతులు అందరూ పురుషులే. సరస్వతికి స్నేహితులు, సన్నిహితులు అందరూ పురుషులలో స్త్రీలు లేరు. అదే ఆమె దుఃఖానికి కారణం. “ ఏ నిటులెంత కాలమని యీదఁ గఁ జాలుదు నొడ్డు గానఁగా రాని సఖీ వియోగ జలరాశి” అన్నది ఆమె బాధ. బ్రహ్మ ముఖంలో నివాసమున్న సుఖం, వైభవం, కళా స్పదమైన పండితులసేవ అన్నీ ఉన్నా జీవితం అసలేమీ బాగాలేదంటుంది సరస్వతి. “…. కళాయి లేని ముకురంబటు తోఁచెడు నా వయశ్యలౌ/ శృతివిదుషల్ సతీమహిమ శోభితలున్ నానుబాయనక్కటా” అని వాపోయింది. సఖీవియోగం అంటే కేవలం స్నేహితుల ఎడబాటు అన్న సాధారణార్ధం కాదిక్కడ. ఆ సఖులు శృతి స్మృతి శాస్త్ర జ్ఞానులు.సతీ ధర్మం కలిగిన వాళ్ళు. రెండూ కలిసి గొప్ప సృజనకారులు. ఇదివరకు అలాంటి స్త్రీలతో తనకు సహవాసం ఉంది. ఇప్పుడు లేదు. లేకపోవటంవలన ఆమెకు జీవితం కళాయి లేని అద్దంలాగ అర్ధరహితమై తోస్తున్నది. ‘ఎన్నడు కూడి యాడితినో ఇష్టసఖీ నికరంబు తొడ’ అన్న పద్యంలో క్రీడాస్థలాలుగా పేర్కొన్న ఉన్నత శయ్యలు, అలంకారాలుగా పేర్కొన్న శ్రేష్టము, ఉచితమూ అయిన వృత్తులు, హారరీతులు, అలంకారాలు అన్నీ సాహిత్య శాస్త్ర సంబంధ పరికరాలే. స్త్రీలకు సహజ అలంకారాలుగా వాటిని చెప్పటం ద్వారా స్త్రీల సహజ సాహిత్య సృజన శక్తి ని అలవోకగా సూచించింది లక్ష్మీనర్సమ్మ. అయితే అలాంటి స్త్రీలు, వాళ్ళతో తన ఆటపాటలు ఎప్పుడు ఎక్కడ ఎలా మాయమయ్యారు? “ మూర్ఖజనైక వంచనన్” ఇదంతా జరిగిందని సరస్వతి స్పష్టంగా చెప్పింది. ఆ వంచన స్వరూప స్వభావాలు అర్ధం చేసుకొంటూ కోల్పోయిన దానిని తిరిగి పొందటానికి స్త్రీలు ప్రయత్నపరులవుతున్న సందర్భం నుండి వచ్చిన కవిత ఖండిక ఇది.
మధుపద్వయము 49 పద్యాల నీతికథ (సావిత్రి,1904,అక్టోబర్). మొదటి పద్యం ఇష్టదేవతాస్తుతి. ‘గోగణంబులు గృహంబుల జేరు’ వేళ కథ మొదలవుతుంది. శారద అనే అమ్మాయి కమలాంబ అనే తనస్నేహితురాలి దగ్గరకు వెళ్లి సూర్యాస్తమయ సౌందర్యం చూడటానికి తోటకు తీసుకొని వెళ్తుంది.వాళ్లిద్దరూ “దివి( జంద్రుఁ డొకండె, భూమిపై గనఁగ సుధాకరద్వయము గన్ప డెనంచు భ్రమించునట్లుగన్” ఉన్నారని వర్ణిస్తుంది లక్ష్మీనరసమాంబ. తోటంతా తిరుగుతూ తుమ్మెదలు చెలరేగి రొదపెడుతుండటం చూస్తారు. వాటిలో రెండు తుమ్మెదలు కేతకీ ప్రసవం మీద వాలి బయటకురాలేక అక్కడేఅటూఇటూ తిరుగుతూ బాధతో రొదపెట్టటం చూచి శారద వాటిస్థితికి కారణాన్ని ఊహించి చెప్పటం ఇందులో విషయం. మల్లియ మీద జీవించే తుమ్మెదలు కొన్ని మరొకచోటికి పోవటానికి బయలుదేరగా వాటిలో రెండుమిగిలిన తుమ్మెదలు అది పద్మం వాలే తేనె ఉన్న పువ్వు కాదని వారిస్తున్నా వినక కేతకీ పుష్పం పై ఆకర్షణ తో వాలాయని, మొగిలిరేకల ముళ్ళకు చిక్కి బయటకురాలేకపోతున్నాయని ముందుగతి తెలుసుకోక గర్వించి చేసిన పనికి ఫలితం అలాగే ఉంటుందని ఆమె కథనం.
ఇలబుధులెన్ను నీతి నిరసించుటయున్, దన దానిమేలుతాఁ
దలఁచి గ్రహింపలేకెదుటి దానికై భ్రమఁ బొందుచుంటయున్
గలిగి చరించువారలకుఁ గాంచన కేతకిఁ గాంచినట్టి య
య్యళుల యవస్థ చేకురు నటంచు నెఱింగి మెలంగఁ గావలెన్ -- ఇది ఫలితార్ధం అని లక్ష్మీ నరసమాంబ ఈ నీతికథను పూర్తి చేసింది. 1907 జులై సావిత్రి వెనుక పేజీలో పేర్కొనబడిన నరసమాంబ కవిత్వ సంకలనం లో ఈ మధుపద్వయం కూడా ఉంది.
1905 నవంబర్ - డిసెంబర్ సంచికలో అమూల్యము అనే శీర్షికతో 279 పంక్తుల తేటగీతి మాలిక ప్రచురించబడింది. తేటగీతులను దండవలె ఒకదాని సంబంధంలో మరొకటి కూర్చు కొంటూ పోవటం తేటగీతి మాలిక అనబడుతుంది. పద్యరచనలో లక్ష్మీనరసమాంబ సాధించిన పరిణితికి , ధారాళతకు ప్రతీక ఇది. రచయిత పేరు లేని ఈ కావ్యఖండిక సుజ్ఞాననవరత్నములు తో పాటు ప్రచురించబడిన లక్ష్మీనరసమాంబ ఖండికల సంకలనంలో పేర్కొనబడింది కనుక దానిని బట్టి (1907,జులై, సావిత్రి) ‘ అమూల్యము’ ఆమె రచనే అని నిర్ధారించవచ్చు. ఇది కూడా నీతి కథే.
ఒక సంధ్యాసమయంలో నది ఒడ్డున ఒక బిడ్డ ప్రశ్నకు తల్లి ఇచ్చిన సమాధానంగా సాగే కథనం ఇది. పక్షులు, పంటలు, పక్షులు, మృగాలు, కీటకాలు, కొండలుభూమి, అగ్ని, ఆకాశం, మైదానాలు, గాలి, నీరు మొదలైన అణువు నుండి బ్రహ్మానందం వరకు దైవ సృష్టిలోగల పదార్ధాలు అన్నీ ఒకటిని మించి ఒకటి ఎక్కువ ఉపయోగం వూన్నవిగా కనిపిస్తున్నాయి. వాటన్నిటిలో అమూల్యమైనది ఏదో తేల్చుకోలేకపోతున్నాను. తెలియచెప్పవా అని కూతురు అడిగితే తల్లి ‘ కాలమునకంటెనుపయోగకరములేదు / కాలమె యమూల్య మన్నిఁ టి కంటే జగతి’ అని నిర్ద్వంద్వంగా చెప్పింది. ఎన్నో చేయటానికి, సంపాదించటానికి వీలయిన కాలం ఎప్పుడూ వ్యర్థం చేయరానిదని, తిరిగిరాని కాలాన్ని సద్వినియోగం చేసు కొనటానికి మనుషులు ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలని నిరూపించిన కమల విమల అనే అక్కాచెల్లెళ్ల కథను ఉదాహరణగా చెప్పి అందువల్ల ‘జగతినమూల్యంబు-కాలమెసుమ’ అని నిర్ధారించి ఆతల్లి చెప్పటంతో ఈ ఖండిక ముగుస్తుంది.
ఇవికాక బందరులోని బృందావనపుర స్త్రీ సమాజము ఆరవ వార్షిక సభలకు హాజరైన సందర్భాన్ని పురస్కరించుకొని ఆశీర్వాదపద్యాలు (1911,జనవరి,ఫిబ్రవరి) విక్టోరియా రాణి మనుమడైన పంచమ జార్జిచక్రవర్తికి ఢిల్లీ లో పట్టాభిషేకం జరిగిన సందర్భంగా ఢిల్లీ పట్టాభిషేక పద్యాలు (1911, అక్టోబర్,నవంబర్, డిసెంబర్) కూడా ఆమె వ్రాసింది.
లక్ష్మీ నరసమాంబ చేసిన మరొక ప్రక్రియా ప్రయోగం పాట. పాట స్త్రీల విద్య. స్త్రీల సాంస్కృతిక భావజాలాన్ని తీర్చిదిద్దే నోములు,వ్రతాలకు అవి అనుబంధాలు. పూజ అంతా అయ్యాక భగవంతుడికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు , పేరంటాలలో స్త్రీలు మంగళహారతులు పాడుకొనటం సంప్రదాయంగా వస్తున్నది.స్త్రీలు సంఘాలు పెట్టుకొని సమావేశాలు జరుపు కొం టున్న ఆ తొలిదశలో స్త్రీల సమావేశాలు శుక్రవారం నాడు ఏర్పాటు చేసుకొనటం, భక్తి గీతాలు, మంగళహారతులు పాడుకొనటం, పసుపు కుంకుమలు, పండూ తాంబూలం ఇచ్చుకొనటం జరిగేది అంటే ఇప్పుడు ఆశ్ఛర్యంగా ఉంటుంది కానీ అదొక సామాజిక వాస్తవం. హిందూ సుందరి, సావిత్రి వంటి స్త్రీల పత్రికలు ప్రారంభమై స్త్రీలు రచనలు చేయటం మొదలుపెట్టిన ఆ కాలంలో స్త్రీలు చాలామంది మంగళ హారతులు వ్రాయటం కూడా ఆ సంస్కృతిలో భాగమే. ఈ నేపథ్యంలో లక్ష్మీనరసమాంబ పాటలు వ్రాసింది.
హిందూ సుందరిలో ప్రారంభమైన ఆమె పాటల రచన (1902,జూన్ & 1903, జులై) సావిత్రి పత్రికలో (1904, జనవరి మంగళహారతుల శతక రచన సంకల్పంగా మొదలై రెండుమూడేళ్లపాటు పత్రికలో వరుసగా ప్రచురితమవుతూ వచ్చాయి. పల్లవి చరణాలు -పాడుకోవలసిన బాణీ ఒకొకసారి రాగ తాళ సూచన … ఇదీ పాత సరళి. ఒకపంక్తి తో , ఒకటిరెండు చరణాలతో ముగిసే చిన్న పాటల నుండి మూడునాలుగు పంక్తులతో కూడిన అయిదారు చరణాలతో ముగిసే పెద్దపాటలు కూడా ఉన్నాయి. చివరిచరణం ‘నరసాంబ’ నామ ముద్ర ఉంటుంది. పాటలు చాలావరకు స్త్రీదేవతా సంబంధమైనవి. ఇవి ఆ తరువాత ‘మంగళహారతులశతకము’ పుస్తకంగా కూడా వచ్చింది. ‘పూజాతత్పరులగు సఖీమణుల విశేషోపయోగమునుద్దేశించి’ తాను ఆ శతకం వ్రాసానని, ఆమె చెప్పుకొన్నది (1910,జులై) ఆ పాటలు అనేకమంది స్త్రీలు, బాలికలు ఆ పాటలను విరివిగా పాడుకొనటం, హార్మోనియం వాడుతూ పాడటం తనకు ఇచ్చిన ప్రోత్సాహం తో ఇతరసమయాలలో పాడుకొనటానికి అనువగు గీతాలు వ్రాయాలన్న ఉత్సాహం కలిగి 1910 జులై లో “స్త్రీ నీతి గీతములు” అనే శీర్షికతో పాటలు ప్రచురించింది.‘నీతివిషయములుగాని, భక్తివిషయములుగాని గీతములు మూలమున జనసామాన్యము యొక్క హృదయానికెక్కినట్లు మఱి యేయితర సాధనములచేతను సులభముగా నెక్కఁ జాలవు అనిఆమె అభిప్రాయం. ఆత్మాభివృద్ధికరములైన భక్తి, శాంతం, భూతదయ, సత్యము, వినయము మొదలైన సుగుణాల గురించి మొదటి భాగంలో శరీర ఆరోగ్య గృహ విషయ సంబంధమైన అంశాలను రెండవభాగంలోనూ తెలిపానని ఆమె పేర్కొన్నది. ఇవి కూడా సావిత్రి పత్రికలో వరుసగా ప్రకటించబడ్డాయి. అన్నీ ప్రకటించబడ్డాయో లేదో తెలీదు. స్త్రీధర్మములు ఏవి ఇంతకు పూర్వం ఆమె ద్విపదల రూపంలో చెప్పిందో దాదాపు వాటినే స్త్రీనీతిగీతాలలో కూడా చెప్పటం గమనించవచ్చు.
3
కథారచనలు
కథలు అనటానికి పూర్తిగా వీలులేదు కానీ పులగుర్త లక్ష్మీనరసమాంబ కథ కలిగిన వచనరచనలు చేసింది. ‘బదరీఫలత్రయము’ వాటిలో మొదటిది. 1902 డిసెంబర్ లో,1903 జనవరి హిందూసుందరి సంచికలలో రెండుభాగాలుగా ఇది ప్రచురించబడింది. ముక్కలుగా నరకబడిన స్త్రీ శవం గల పెట్టె నదిలో దొరకటం, హంతుకుడు ఎవడో కనిపెట్టి శిక్షించాలని రాజు ఇచ్చిన ఆదేశాలతో మంత్రి ఆ ప్రయత్నం చేస్తూనే నేరస్థులను పట్టుకొని ప్రవేశపెట్టలేకపోతే ఆ శిక్ష ఎదో తానే పొందవలసి వస్తుందని ఆందోళన పడటం, చివరకు తానే హంతకుడిని అని మృతురాలి భర్తవచ్చి ఆ కధంతా చెప్పటం, అనుకూలవతి అయిన భార్యను హత్యచేయటానికి అనుమానమే కారణమని తెలియటం, ఆ అనుమానాన్ని కలిగించిన దుండగీడు సంగతి తెలియటం , అందరికీ తగినరీతి శిక్షలు విధించబడటం ఇందులో కథ. ఈ కథ బాగ్దాద్ దేశంలో జరిగింది. శవం దొరికిన నది టైగ్రీసు. కనుక ఇది దేశీయ కథ కాదు.ఇస్లామిక్ నాగరికత, అరబిక్ సంస్కృతి మెడిటరేనియన్ ప్రాంతాల రాచరిక సంప్రదాయం - ఈ మూడింటి సమ్మేళనం నుండి మధ్యయుగాలలో సంకలనం చేయబడి, అరేబియన్ నైట్స్ కథలుగా ప్రసిద్ధికి ఎక్కిన కథల నుండి ఆమె దీనిని తెలుగుచేసి ఉంటుంది. ఇది ఆమె బహుదేశభాషల సాహిత్య అధ్యయన ఆసక్తులను పట్టిచ్చే మరొక నిదర్శనం.
బదరీఫలాలు అంటే రేగుపండ్లు. జబ్బుపడి కోలుకుంటున్న భార్య కోరిందని కాలం కాని కాలమైనా వెతికి వెతికి అపురూపంగా తెచ్చిపెట్టిన మూడు రేగుపండ్లలో ఒకదానిని తల్లికి తెలియకుండా తిందామని బయటకు తెచ్చిన కొడుకు దగ్గరనుండి లాక్కొని పరిగెత్తిపారిపోతున్న బానిసవాడు కల్పించి చెప్పిన ఒక కథ వల్ల భార్యను అనుమానించి హత్యచేయటం,అందుకు మూలకారకుడైన దొంగ ను గుర్తించటం అనే ఘటనలతో సాగే ఈ జానపద కథలో కథ కన్నా ముఖ్యమైనది రచయిత్రి వర్తమాన సామాజిక దృష్టి. సంఘసంస్కరణ ఉద్యమ సందర్భంనుండి రచయితగా రెండు బాధ్యతలు తనకు ఉన్నాయని ఆమె నుకున్నది. అవి- ఒకటి ఉత్తమ స్త్రీ ధర్మాల ను నిర్వచించటం, వివరించటం. రెండు కుహనా సంస్కర్తలను, సంస్కరణలను విమర్శించటం. ఈ రెండింటి లో మొదటిదాన్ని కథలో భాగంగా చేసింది. రాజుగారి ముందర భార్యను తానే చంపానని ఒప్పుకొంటూ అందుకు దారితీసిన పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు అతను తనభార్య తనకు ఎంత ప్రియ మైనదో అందుకు తగిన అర్హతలు ఆమెలో ఎంతగా ఉన్నాయో వివరించిన తీరులో లక్ష్మీ నరసమాంబ సద్గుణవతి అయిన భార్య వర్ణచిత్రం ప్రదర్శనకు పెట్టినట్లయింది. కథలో హతురాలైన ఆ భార్య బ్రతికిన రోజులలో ఇంటిని భూలోక స్వర్గం చేసింది. భర్త ఎంత స్వల్ప పదార్ధం తెచ్చినా నూరురెట్లు చేసి ఇంటిని నడిపింది. బంధువులకు మర్యాదలు చేసేది. పిల్లలను నీతిమార్గంలో పెంచేది. విద్యావినయాలను నేర్పేది. భర్త వచ్చేసరికి ఇంటిని శుభ్రం చేసి, పిల్లలను అలంకరించి, తాను అలంకరించుకొని అతనికి కన్నుల పండుగ చేసేది. హృదయాహ్లాదకరమైన మాటలు చెప్పేది. సంసార దుఃఖాలు, ఇరుగుపొరుగువాళ్ళతో తగాదాలు, పిల్లల అల్లరి ఏవీ అతని వరకూ రానిచ్చేదికాదు. అవీఇవీ కావాలని అడిగేది కాదు. భర్త తప్పులు ఏమైనా ఉంటే బుజ్జగించి చెప్పేదికానీ స్నేహితులకు తనమీద నేరాలు చెప్పేది కాదు. ఎప్పుడూ భర్థక్షేమం కోరే దేవుడిని ప్రార్ధించేది. ఉద్యోగ భారం తప్ప అతనికి మరొక బాధ్యత లేకుండా సంసారమంతా తానే చక్క బెట్టేది.సతీధర్మములు అనే శీర్షికతో ఆ తరువాత లక్ష్మీనరసమాంబ వ్రాసిన ద్విపదలలో కూర్చబడిన ధర్మములు ఇవే కావటం గమనించవచ్చు.
ఇన్ని గుణాలు కలిగిన భార్యను రేగుపండు తీసుకొని పరిగెడుతున్నదొంగ తన ప్రేయసి భర్త తెచ్చి పెట్టిన మూడింటిలో ఒకటి తనకు ఇచ్చిందని చెప్తే నమ్మి వెంటనే కోపం ఆడుకోలేక చంపి వేసాడు ఆ భర్త. కొడుకు చెప్తే కానీ అతనికి అసలు విష్యం అర్ధం కాలేదు. అప్పుడు దుఃఖిస్తూ తప్పు ఒప్పుకొని శిక్షకు సిద్ధపడ్డాడు. ఎన్ని సుగుణాలు ఉన్నా, భర్తకు ఎంత సేవ చేసినా స్త్రీ జీవితం ఎప్పుడూ ఒక ప్రమాదం అంచున ఉండటం ఇక్కడ చూస్తాం. అయితే లక్ష్మీనరసమాంబ రచయితగా స్త్రీ ధర్మాల ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చిందే కానీ ‘లైంగికత’ విషయం లో ఎప్పుడూ అనుమానితురాలిగా అవమానించబడే ఆమె దుఃస్థితి గురించి, ఏ నేరమూ లేకుండా శిక్షకు గురయ్యే ప్రమాదం గురించి ప్రశ్నించలేక లేకపోయింది. అది ఆ కాలానికి ఉన్న పరిమితి.
ఇక కుహనా సంస్కర్తలపై విమర్శకు ఏ పాత్రనూ ఆశ్రయించకుండా ఆమే ప్రత్యక్షంగా దిగటం చూడవచ్చు. భార్యను చంపిన పురుషుడు తనకథను చెప్పి ముగించగానే వింటున్న రాజు ‘ఏదో యోచించు చుండెను’ అని కథనాన్ని అక్కడ ఆపి చదువరులగు సఖీమణులను సంబోధిస్తూ రేగుపండు తన ప్రేయసి ఇచ్చిందని కల్పించి చెప్పిన బానిసవాడు ఎటువంటి వాడో మీకేమైనా తెలుస్తున్నదా అని ఒక ప్రశ్న వేసి నాకు తోచిన సంగతి ఒకటి చెప్తా వినండి అంటూ పేరుకు స్త్రీ విద్యాభిమానులై వూరూరాతిరిగి స్త్రీవిద్యాది మహత్కార్యాలలో తమకు ప్రీతీ ఉన్నట్లు తేనెల మాటలతో ఉపన్యాసాలు ఇస్తూ ఆచరణలో దానిని ఎంతమాత్రమూ సహించని ‘రిఫార్మర్లు’ గుర్తుకు వస్తున్నారని చెప్పింది. వాళ్ళు బయట ఉపన్యాసాలు ఇస్తారేకానీ ఇళ్ళదగ్గర భార్యలను, చెల్లెళ్లను, కూతుళ్లను ఎంతమాత్రం చదువుకోనియ్యారని, వాళ్ళు నోరుతెరిచి అడిగినా చిన్నపత్రిక తెప్పించిపెట్టరని పేర్కొన్నది. వీళ్లది సద్విషయ వేషము కనుక మానుష హత్యలు జరగటంలేదు, అంతే కానీ స్త్రీమొహమైనా తెలియకుండానే ప్రేయసి అని కల్పించి చెప్పిన వాచలుడి కన్నా వీళ్లేంతమాత్రమూ తక్కువ కాదంటుంది లక్ష్మీనరసమాంబ. ఇది ఒక విప్లవకరమైన అభివ్యక్తే. ఇది ఆ నాటికి సాహసమే. గిరీశం వంటి కుహనా సంస్కర్తల బండారాన్ని గురజాడ ఇంకా పూర్తిగా బయటపెట్టక ముందే, ‘సంస్కర్త హృదయం’ (గురజాడ) కథ ఇంకా రాక ముందే లక్ష్మీనరసమాంబ కుహనా సంస్కర్తలను గుర్తించి తన అభిప్రాయాన్ని ఇలా నమోదుచేయాటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
లక్ష్మీనరసమాంబ వ్రాసిన మరొక కథ వంటి రచన ‘వజ్రపేటిక’ (సావిత్రి, 1904, సెప్టెంబర్). “ ఇది యొక మంచి నీతి కథ. చదివినకొలదిని చదువబుద్దిపుట్టించెడి చిన్నిచిన్ని కల్పనలతో మనోరంజకంగా వున్నది అని (1905 డిసెంబర్ సావిత్రి) కొనుక్కునే వాళ్ళ కోసం పరిచయం చేయబడిన పుస్తకం ఇది. ఇది తల్లీ కూతుళ్ళ సంభాషణగా సాగుతుంది. తల్లి కూతురికి వజ్రపేటిక గురించి చెప్పటం ఇందులో వస్తువు. వజ్రపేటిక అంటే వజ్రాలతో చేయబడిన పెట్టె, నగలు దాచుకొనటానికి ఉపయోగించే పెట్టె కాదని ఆమె కూతురికి చెబుతుంది. అది ప్రతివాళ్ళకు ఒక్కొకటి ఉంటుందని, ఆ పెట్టె తెరవటానికి మూడు తాళాలు ఉంటాయని ఆ తాళాలు సరిగా ఉపయోగించక పోతే వజ్రాలపెట్టెకు విలువే ఉండదని ఆ తల్లి చెప్తుంది. కూతురి సందేహాలు, తల్లి వివరణలతో సాగిన ఆ కథ చివరిలో హృదయమే వజ్రాలపెట్టే అని, హృదయంలోని సంగతులు ఏవి ఎప్పుడు బయటపెట్టాలో , ఏవి ఎలా దాచుకోవాలో తెలియటమే వివేకం అని, తాళాలు ఏవంటే ఒకటి ఇది అవసరమా కాదా అన్నది ఒక తాళం అని, ఇదినిజమేనా కాదా అన్నది రెండవ తాళం అని, దేనివలన ఎవరికైనా కష్టములు రావు కదా అన్నది మూడవ తాళమని వాటిని జాగ్రత్తగా వాడుతూ హృదయంలో విషయాలను బయటపెట్టాలని తెలియచెప్పింది. అలా చేయలేనివాళ్ళు తాళాలు సరిగా ఉపయోగించలేక వ్యర్ధంచేసుకొన్నవాళ్ళు ఇబ్బందులపాలవుతారని ఆ తల్లి కూతురికి హితోపదేశం చేసింది. పనిలో పనిగా నగలమీద మోజు మంచిదికాదని, ఆడవాళ్లు నగలే అలంకారం అనుకొనటం తప్పని ఆరోగ్య వినయవివేకాలను మించిన అలంకారాలు మరేవీ ఉండబోవని కూడా ఆ తల్లి కూతురికి గుర్తుచేసింది. పిల్లలకు నీతివిద్యాబోధలు గరిపి సానబెట్టటం తల్లుల కర్తవ్యంగా భావించి, దానిని స్త్రీధర్మంగా చెప్తూ వచ్చిన లక్ష్మీనరసమాంబ అందుకు నిదర్శనంగా వ్రాసిన సంభషణాత్మక కథ ఇది. ఈ కథ చివరలో ప్రవేశించే మరొక పాత్ర లక్ష్మీదేవమ్మ తల్లి శారదకు స్నేహితురాలు. ఆమెను చూడగానే ఆహ్వానిస్తూ శారద అన్న మాటలు గుండు అచ్చమాంబ ప్రణీతమైన రాణీ చరిత్రము మిగుల రమణీయముగా ఉన్నదని, ఆ నూతన గ్రంధరాజమును తెప్పించి , లక్ష్మీదేవమ్మతో కలిసి చదువుకొనటానికి ఉత్సాహ పడుతున్నదని తెలియచేస్తాయి. సమకాలపు రచయిత్రి రచనను గౌరవంగా ప్రస్తావించటం, స్త్రీలు సాహిత్య ఆసక్తులను అభివృద్ధి పరచుకొంటూ , సమిష్టి గా సాహిత్య పఠనానికి తయారవుతున్న దృశ్యాన్ని చూపించటం - ఇవి లక్ష్మీనరసమాంబ సంస్కారానికి, సంస్కరణాభిలాషకు చక్కటి నిదర్శనాలు.
లోకబాంధవి మరొక కథ (సావిత్రి 1904,నవంబర్ &డిసెంబర్) విద్యావతి, సుగుణవతి, స్త్రీధర్మములు తెలిసిన మంచి గృహిణి అయినా స్త్రీ అందరి మన్ననలు పొంది లోకబాంధవి గా పేరు తెచ్చుకొంటుందని, అట్లా పేరుతెచ్చుకొనే స్త్రీలపట్ల ఈర్ష్యపడటం, వాళ్ళను అవమానపరిచే పథకాలు రచించి వాళ్ళ పేరును చెడగొట్టాలనుకొనటం స్త్రీలకు మేలుచేయదని, సద్గుణములు, స్త్రీధర్మములు ఆచరించటం మాత్రమే ఎవరినయినా లోకబాంధవులుగా మన్ననకు పాత్రమయ్యేట్లు చేస్తుందని చెప్పటం ఈ కథ ఉద్దేశం. ఇంటికోడలైన లలిత పట్ల ఆడబడచు అయిన శ్యామలలో ఈ విధమైన స్పర్థను కలిగించి నౌకరు పాత్ర నెపంగా అది బయటపడేట్లు చేసి నడిపిన ఈ కథలో లలిత సహనం, శాంతం, తొణకని నిండుకుండ వ్యక్తిత్వం మహిళలకు ఆదర్శంగా సూచించబడ్డాయి. ఈ రచన కూడా పుస్తకరూపంలో వచ్చింది. (1905)
పులగుర్త లక్ష్మీనరసమాంబ కళావతీ అనే మరొక వచన రచన చేసింది. ఇది ఒక జానపద పౌరాణిక గాధ. పూర్వం ఎప్పుడో కాశీని పాలించిన రాజు కూతురు కళావతి జీవితం కథా వస్తువు దుర్వాసుడు వంటి పౌరాణిక పాత్రలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ వచనకథలో మధ్యమధ్య సంభాషణలు పద్యాలలో జరగటం ఒక విచిత్రం పద్యనాటకాలవలె పద్య వచనకథలన్నమాట ఇటువంటివి. భార్యభర్తల సంబంధ వైశిష్ఠ్యం చెబుతూ కథను ప్రారంభించిన రచయిత్రి ప్రారంభంలో ‘పతి చెడ్డవాడైతే మంచి మార్గానికి తిప్పుకొంటూ, తప్పులకు పాలపడితే ప్రసన్నభావం వదలక ఎప్పటివలెనే గౌరవించటం ,పరపురుషులను సహోదరులవలె భావించటం, పతిపట్ల ప్రేమతో అతనికి అనుకూలవతిగా ఉండటం’ సతీధర్మంగా చెప్పింది. అక్కడితో ఆగక ‘సతియెడలగూడ సర్వవిధములనట్లే ప్రవర్తింప వలయుట పతికిని ధర్మము’ అని చెప్పటం విశేషం. మీదుమిక్కిలి విద్యాస్వీకారంలో, లోకజ్ఞాన సంపాదనలో స్త్రీలకంటే పురుషులు అగ్ర స్థానం లో ఉండవచ్చుగానీ, నీతినియమాలు పాలించటం లో మాత్రం మొదటినుండి వారికంటే స్త్రీలే సమర్థులుగా ఉన్నారని నిర్ధారించి చెప్పింది. దీనిని నిరూపించటానికే కళావతి కథ వ్రాసింది. స్త్రీవిద్య ప్రాధాన్యతను నొక్కిచెప్పటం, విద్యావతి, సతీధర్మములు ఎరిగిన స్త్రీ భర్తలోని లోపాలను తన విశేష శక్తి చేత సవరించి అతనిజీవితాన్ని, తనజీవితాన్ని కూడా కృతార్ధం చేసుకొనటం ఇందులో చిత్రించబడింది.
‘క్షణకాల దివ్యచింతన’ అనే కథ ఒకటి 1910 అక్టోబర్, నవంబర్ సంచికలలో ప్రచురించబడింది. కోపం ఎంతదుర్గుణమో, దానిని వదిలించుకొనటానికి స్త్రీలు నిరంతరం చేయాలో ప్రబోధించే కథ ఇది. శారదాంబ తన తోడి కోడలు కమలాంబకు కోపాన్ని జయించటానికి బోధించిన సూత్రం ఒక క్షణకాలం ఆగి దేవుడి గురించి ఆలోచించమని. అప్పుడు కోపంవల్ల వచ్చే దుష్పరిణామాలను నివారించవచ్చని ఒక అంతర్నాటకంతో నిరూపించింది ‘క్షణకాల దివ్య చింతన’ . నిజానికి పత్రికలో ఈ కథ కు రచయిత పేరు ప్రచురించ బడలేదు. బొడ్డపాటి కుటుంబరాయ శర్మ యోగేశ్వరి నవల గురించి సందర్భంలో పులగుర్త లక్ష్మీనరసమాంబ గురించి ఇచ్చిన వివరాలను బట్టి అది ఆమె రచన అని తెలుస్తున్నది. సావిత్రి పత్రికలో ఇట్లా రచయితల పేర్లు లేని రచనలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎన్ని పులగుర్త లక్ష్మీనరసమాంబ రచనలో మరి. ఆధారాలు లేనంతవరకు ఏమీ చెప్పలేం.
4
నవలలు
పులుగుర్త లక్ష్మీనరసమాంబ నవలలు కూడావ్రాసింది. అయితే అవి ప్రధానంగా అనువాదాలు లేదా అనుకరణలు. పిఠాపురం రాణిగారికి వంగ భాష నేర్పటానికి వచ్చిన సుహాస అనే పండితురాలిదగ్గర ఆమె వంగభాషను నేర్చుకొన్నదని తెలుస్తున్నది. ఆమె వ్యాసాలలో వంగభాషారచయితల ప్రస్తావన, రచనల ప్రస్తావన ఎక్కువగా ఉండటానికి ఈ విధంగా వంగ భాషా సాహిత్యాల అధ్యయనానికి కలిసివచ్చిన అవకాశమే కారణం అయివుంటుంది. ఆ క్రమంలోనే ఆమె వంగభాషనుండి నవలలను అనువదించింది. అవి 1. సుభద్ర 2. యోగేశ్వరి 3. అన్నపూర్ణ 1932 నాటి నవలలు ఇవి. అమరవిజయము కూడా ఆమె వ్రాసినదే కానీ అది ఆమె పేరుతో ప్రచురించబడలేదని తెలుస్తున్నది. అయితే ఈ నవలలేవీ ఇప్పుడు లభించటంలేదు.
‘యోగేశ్వరి’ బంకించంద్రుని నవల. ‘అన్నపూర్ణ’ దామోదర ముఖ్యోపాధ్యాయుడి రచన. దీని రచయిత. యోగేశ్వరిలో స్త్రీ భర్తను అన్వేషించటం వస్తువు కాగా అన్నపూర్ణలో స్త్రీ అర్ధాంగి అయి భర్తను సేవించటం విషయం. అందువల్లనే యోగేశ్వరికి అనుబంధం వంటి నవల అయింది అన్నపూర్ణ. స్త్రీ ధర్మం ఈ రెండిటికి మధ్య వారధి. స్త్రీలు యోగశాస్త్రజ్ఞాన సంపన్నులైతే శక్తి మంతులు అవుతారని, పతిభక్తికి అవి మరింత బలం చేకూరుస్తాయని యోగేశ్వరి నవల ఇతివృత్త నిర్వహణలో సూచించింది. స్త్రీ ప్రధాన ధర్మం భర్తృసేవ అని అటు యోగేశ్వరి నవల, ఇటు అన్న పూర్ణ నవల నిరూపిస్తాయి. అనువాదనవలాసాహిత్యంలో పురుషులలో ఆనాడు వెంకట పార్వతీశ్వర కవులు ప్రసిద్ధులు. మహిళలలో ఆ ప్రసిద్ధి పులుగుర్త లక్ష్మీనరసమాంబకు ఉందని చెప్తారు. ( బొడ్డపాటి కుటుంబరాయశర్మ, ఆంధ్రనవలా పరిణామము, 1971,పు,136,396)
అంతేకాదు, ఈ సందర్భంలో కుటుంబరాయ శర్మ పులుగుర్త లక్ష్మీనరసమాంబ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. ఆ యన చెప్పినదాని ప్రకారం ఆమె కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి శిష్యురాలు కాదు. కాకినాడ నివాసం ఒక్కటే వాళ్ళిద్దరికీ సామాన్యాంశం. కందుకూరి వీరేశలింగం సంస్కరణలకు మాత్రం ఆమె ప్రతిద్వంద్వి అన్నది వాస్తవం. అది ఎంతదూరం పోయిందంటే సావిత్రి పత్రిక సంస్కరణ భావాలకు అడ్డుతగులుతున్నందువలన దానిని నిలవరించటానికి వీరేశలింగం స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది. పిఠాపురం రాజా కూడా ఈ విషయంలో లేఖలు వ్రాయటం వల్లనే సావిత్రి పత్రికను కొంతకాలం నిలిపివేయవలసి వచ్చింది. ( పైదే, పు, 196)
5
వ్యాసాలు
కవిత్వం తరువాత పులగుర్త లక్ష్మీనరసమాంబ ఎక్కువగా వ్రాసినవి వ్యాసాలు. ఇవి ప్రధానంగా ఉపన్యాసాలు. నిజానికి అప్పటికి వ్యాసం అనే ప్రక్రియ పూర్తి రూపాన్ని తీసుకోలేదు. పత్రికలలో ప్రచురించబడుతున్న వీరేశలింగం పంతులు వంటివారి ఉపన్యాసాలే వ్యాసం తొలి రూపాలు. పులుగుర్త వ్యాసాలు కూడా ఆ కోవలోవే. స్త్రీవిద్య, స్త్రీ స-మాజాల అవసరాన్ని గుర్తించి సంస్కరణలను ఆశిస్తూ చేసిన ఉపన్యాసాలు కొన్ని అయి--------తే స్త్రీపునర్వివాహం వంటి సంస్కరణలను వ్యతిరేకిస్తూ చేసిన ఉపన్యాసాలు మరికొన్ని. విషయ ప్రతిపాదన, తర్కంతో కూడిన వివరణ, ప్రతివాది వేయగల ప్రశ్నలను తానే వేసుకొని సమాధానాలు చెప్తూ సిద్ధాంతాన్ని స్థాపించటం ఆమె ఉపన్యాసపద్ధతి. ప్రాచీనసాహిత్యం నుండి పాత్రలను ప్రస్తావిస్తూ ,పద్యాలనూ ఉదహరిస్తూ సాగేవి ఆ ఉపన్యాసాలు. బహువిషయ జ్ఞానం, ఇంగ్లిష్ భాషా సాహిత్యపరిజ్ఞానం ఆమె ఉపన్యాసాల బలం. అయినప్పటికీ తనకు కడుపులో చాలా ఊహలు ఉన్నా బాలత్వం వల్ల మాటలు రావటంలేదని, బాగా అర్ధమయ్యేట్లు చెప్పలేకపోయానని,చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెప్పానని ఇలా తనకు ఉపన్యాసం ఇయ్యటం సరిగా రాదని చెప్పటం (సావిత్రి,జులై, 1904) ఒదిగిఉండటం, వినయం స్త్రీలకు సహజధర్మంగా ఉండాలి అనుకొనే సంప్రదాయదృష్టి వ్యక్తీకరణే కావాలి. ఆ నాటి స్త్రీలందరి ఉపన్యాసాలు ఇదే ధోరణిలో నడిచేవి అనటానికి ఎన్నో ఉదహారణలు కనిపిస్తాయి. ఏమైనా ఉపన్యాసం , వ్యాసం ఏదైనా ఆలోచనకు, మేధకు సంబంధించిన ప్రక్రియలు. కవిత్వం లోలాగా, కథలలోగా దానిలో తనను తాను మరుగుపరుచుకొనటం సాధ్యం కాదు. ఖచ్చితమైన అభిప్రాయాలు, నిర్దిష్ట దృక్పథం, వాటిని ప్రకటించటం పట్ల నిర్భయత్వం వెరసి వ్యక్తిత్వానికి వ్యాసాలు నిలువుటద్దాలు.
లక్ష్మీనరసమాంబ వ్యాసాలు ప్రాధమికంగా ఆమె భిన్న సందర్భాలలో స్త్రీల సమావేశా లలో చేసిన ప్రసంగ పాఠాలు. ఆమె తొలి ప్రసంగం భండారు అచ్చమాంబ కాకినాడకు వచ్చినప్పటిది. ఆమె రాకను పురస్కరించుకొని కొంతమంది స్త్రీలను సమావేశపరిచి శ్రీ విద్యార్దినీ సమాజం ఏర్పరచిన సందర్భంలోనిది. (హిందూ సుందరి, మార్చ్ 1903) స్త్రీలందరూ సమావేశం కావటాన్ని ‘సఖీ సందర్శనోత్సవం’గా సంభావించి చేసిన ఆ ఉపన్యాసంలో ఆమె స్త్రీలలోని సహజ శక్తులను గ్రహించలేక చేతులారా వాళ్ళను అజ్ఞానపు ముద్దలుగా చేసిన పురుషులే వాళ్లను మందబుద్ధులు, అజ్ఞానులు, వివేకహీనులు, సహజభీరువులు,దుష్టవర్తనలు అంటూ ప్రపంచంలోని నీచతను అంతా స్త్రీలపై ఆపాదించి చెప్తున్నారని దాని నుండి బయటపడటానికి సరస్వతీ మూర్తి అయిన అచ్చమాంబ ను ఆదర్శంగా చేసుకొని స్త్రీలు విద్యావంతులు కావాలని సంఘాలు పెట్టుకోవాలని సూచించింది. అచ్చమాంబ బహుభాషా జ్ఞానం, అబలా సచ్చరిత్ర రత్నమాల పుస్తక ప్రత్యేకత ఈ వ్యాసంలో ప్రస్తావించబడ్డాయి. భండారు అచ్చమాంబ అంటే ఆమెకు గల ఆరాధనా భావం ఇందులో వ్యక్తమవుతుంది.
భండారు అచ్చమాంబ గురించిన సమగ్ర సమాచారంతో ఆ తరువాత రెండేళ్లకే ఆమె మరొక వ్యాసం వ్రాసింది (సావిత్రి, మార్చ్- ఏప్రిల్1905) 1874 లో పుట్టింది మొదలు ఆమె జీవితంలోని అనేకఘట్టాలను, ఆమె విద్యావివాహ విషయాలను, వ్యక్తిత్వాన్ని, రచనా వైవిధ్యాన్ని, దృక్పథాన్ని, దాతృత్వాన్నిప్రస్తావిస్తూ అచ్చమాంబ మరణాంతరం నివాళిగా వ్రాసిన ఈ వ్యాసం చాలావిలువైనది. అచ్చమాంబను దగ్గరగా చూసి, ఆమె రచనలతో,, ఆదర్శాలతో ప్రభావితురాలైన ఒక సమకాలికురాలి రచనగా అచ్చమాంబ సాహిత్యజీవిత చరిత్ర నిర్మాణంలో ఈ వ్యాసానికి అనన్య చారిత్రక ప్రాధాన్యత వుంది. ఈ వ్యాసం చివరలో అచ్చమాంబ వియోగానికి పరితపిస్తూ ‘సతీలోక నాయిక రత్నంబు’ గా ప్రశంసిస్తూ లక్ష్మీనరసమాంబ వ్రాసిన అయిదు పద్యాలు కూడా ఉన్నాయి. పద్యంతో ప్రారంభించటమో ,ముగించటమో ఆమె వ్యాసాలలో కనబడే మరొక లక్షణం.
సోదరీమణుల విద్యాలాభం లక్ష్మీ నరసమాంబ జీవితాశయాలలో ఒకటి. శ్రీవిద్యార్ధినీ సమాజం పెట్టినా, ఆంధ్రమహిళాసభ కార్యభారం భుజాలకు ఎత్తుకున్నా అందుకే. అటువంటప్పుడు స్త్రీవిద్య గురించి ఆమె అభిప్రాయాలు తెలుసుకొనటానికి వ్యాసాలు మంచి మూలవనరు. విద్య గురించి ఆమె ఉపన్యాసాలు రెండు ఉన్నాయి. ఒకటి స్త్రీల ఉన్నతవిద్య గురించి (హిందూ సుందరి , మే, 1903). రెండవది ఆధ్యాత్మవిద్య గురించి (సావిత్రి, మే 1911). ప్రత్యక్షంగా విద్య గురించే వ్రాసినవి కాకపోయినా ప్రధానంగా విద్య గురించిన ఆమె అభిప్రాయాలను ప్రతిఫలించిన మరొక ఆరు వ్యాసాలను కూడా వీటితో కలిపి చూడటం ప్రయోజనకరం. సామాన్య విద్యనే ఎరుగని స్త్రీలకు ఏదో ఇంత చదవటం వ్రాయటం వస్తే సరిపోతుంది అన్న సంస్కరణ ధోరణిని దాటి స్త్రీలకు ఉన్నతవిద్య కావాలంటుంది లక్ష్మీనరసమాంబ స్త్రీల యున్నతవిద్య అన్న వ్యాసంలో. ఆమె చెప్పే ఉన్నత విద్య ఇంగ్లిష్ బడులకు పోయి చదువుకునేది కాదు. కావ్యాలు, లక్షణశాస్త్రాలు చదవటానికి సంబం ధించింది. ఇది పురుషవిద్యగా అప్పటికి వాడుకలో ఉన్నదే. సంస్కృత కావ్యాలను, ఛందోఅలంకార శాస్త్రాలను, తెలుగు కావ్యాలను పండితులు, నిష్ణాతులు అయిన గురువుల ముఖంగా నేర్చుకొనే పద్ధతి అది. లక్ష్మీనరసమాంబకు ఎలా లభించిందో కానీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి దగ్గర అలా కావ్యశాస్త్రాలు చదువుకొనే అవకాశం లభించింది. అటువంటి ఉన్నతవిద్య స్త్రీలకు ఎందుకు అవసరమో ఈ వ్యాసంలో ఆమె తర్కబద్ధంగా వివరించింది. కావ్యపఠనవిద్య కఠిన విద్య, స్త్రీలకు సులభ శైలిలో గల చిన్నచిన్నపుస్తకాలు సరిపోతాయి అనే వాదనను సమర్ధవంతంగా తిప్పికొట్టింది.
తెలిసినవన్నీ సులభములు, తెలియనివన్నీ కఠినములు అనుకొనటం తప్పు అంటుంది. సులభము, కఠినము అన్నవి సాపేక్షవిలువలని ఆమె భావం. ‘మనకు తెలిసినవి సులభ వాక్యము లని మనమెన్నుకొనుచున్నను మనకంటే తెలియనివారు మనకు తెలిసిన వానిని కఠినములని ఎంచరా’ అన్న ఆమె ప్రశ్న అందుకు నిదర్శనం. ఉన్నతవిద్య నేర్చి స్త్రీలు తమకంటే తెలియని స్త్రీ సమూహానికి దానిని బోధించాలనేది ఆమె ఆకాంక్ష. అందువల్ల ఉన్నతవిద్యా సంపాదనము నకు స్త్రీలు శక్తివంచన లేకుండా శ్రద్ధతో ప్రయత్నించాలని పిలుపునిచ్చింది. స్త్రీలు ఉన్నత విద్యా వంతులైతే పూర్వ సోదరీమణులైన గార్గి, మైత్రేయి వంటి వారివలె ‘భగవద్విషయాది నిజ ధర్మము’ లను తెలుసుకొని ఇహపరముల ధన్యత సాధించవచ్చని అభిప్రాయపడింది.
భారతదేశచరిత్రలో స్త్రీలు నిరుపమ విజ్ఞాన సంపదతో తుల తూగిన కాలం ఒకటి ఉండేదని వేదవిదుషులైన గార్గిమైత్రేయి సద్విద్యాసంపన్నులైన సీత సావిత్రి వంటి ఆర్యనారీమణుల వారసులు అయిన స్త్రీలు మధ్యలో ఎక్కడో ఆ మార్గం నుండి తప్పించబడ్డారని, విద్యాధిదేవత అయిన సరస్వతికి సజాతీయులై కూడా విద్యా విహీనులై దీనదశను పొందాల్సివచ్చిందని లక్ష్మీనరసమాంబ విశ్వాసం ఆంధ్రమహిళా సభ అధ్యక్షోపన్యాసం( 1910,జూన్ 2,గుంటూరు) ఆ దీనస్థితి నుండి స్త్రీలు తమను తాము ఉద్ధరించుకొనటానికి విద్యావంతులు కావాలని ఆమె ఆకాంక్ష. అయితే అది ‘స్వదేశభాషలోని పూర్వగ్రంధ సారం గ్రహిం చటం’గా ఉండాలని ఆమె భావన. అందువల్ల ఆమె స్త్రీలకు ఉన్నతవిద్య దేశభాషా పాండిత్యము మూలమున సంపాదింపవలెనని అంటుంది. సంస్కృతము అభ్యసించుటకు అనుకూల మార్గాలు నశించినందువలన ఆంగ్లేయభాషా పాండిత్యం అవసరమే నంటుంది. నిజధర్మములను గుర్తెరిగి వాటిని అనుష్టించటమే స్త్రీవిద్యా లక్ష్యం కావాలని అప్పుడే స్త్రీలు దేశాభిమానులు, దేశోద్ధారకులు అగు స్త్రీపురుషరత్నములను దేశమాతకు సమర్పించ గలరని జాతీయభావోద్దీపన కారక వాక్యాలను మాట్లాడింది. ( సావిత్రి, జులై 1910 )
ఏడాది తిరగకుండా కాకినాడ ఆంధ్రమహిళాసభ సమావేశాలలో ప్రసంగం చేసే నాటికి లక్ష్మీ నరసమాంబ ఆధ్యాత్మిక విద్యవైపు మొగ్గటం చూస్తాం. హిందూదేశ ప్రకృతికి ఆధ్యాత్మవిద్యకు సంబంధం ఉన్నది అన్న ప్రతిపాదనతో మొదలైన వ్యాసం “ఆధ్యాత్మవిద్యకును మన దేశ ప్రకృతికిని గల సంబంధము”. దేశప్రకృతి అంటే దేశముయొక్క స్వభావము, దాని నైసర్గిక గుణము అని చెప్పి ప్రకృతి శాస్త్రజ్ఞానం, శరీరశాస్త్ర జ్ఞానం ఇవన్నీ పరిమిత జ్ఞానాలని, ప్రకృతికంటె అతీతమైన జ్ఞానాన్ని అవి చూపలేవని అక్కడే ఆధాత్మిక విద్య అవసరం ఉందని పాశ్చాత్య దేశాల కు ప్రకృతి శాస్త్ర జ్ఞానం స్వభావం అయితే, హిందూదేశానికి మొట్టమొదటి నుండి ఆధ్యాత్మిక జ్ఞానమేస్వభావంగా ఉన్నదని తీర్మానించింది. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఇంద్రియాల వల్ల తెలుసుకొనటానికి అలివిగాని జ్ఞానమని ఆత్మవలన ఆత్మను తెలుసుకొనటమే ఆధాయాత్మిక విద్య అని నిర్వచించి గార్గి, మైత్రేయి, సీత, సావిత్రి, సుమతి, చంద్రమతి మొదలైన పౌరాణిక స్త్రీలను ప్రస్తావిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానం వల్లనే, మత విశ్వాసాలవల్లనే ప్రసిద్ధికి ఎక్కారని, కనుక మనదేశ ప్రకృతికి అనుగుణంగా ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక విద్య వల్లనే స్త్రీల అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడింది.
ఈ అభిప్రాయమే ‘మనుష్యనాగరికత’ అన్న వ్యాసం (సావిత్రి, మార్చ్,ఏప్రిల్,1912)లోనూ కనబడుతుంది. నాగరికతను చెందిన జంతువేది అని విచారించినప్పుడు ‘నేను’ అని ముందుకు వచ్చే నరజాతి స్వధర్మం, కర్తవ్యం ఎరిగి ప్రవర్తించినప్పుడు మాత్రమే నాగరికత చెందిన జాతి అవుతుందని అవుతుందని లేనియెడల పశుజాతికన్నఆధిక్యత దానికి ఎందులోనూ లేదని ఉదాహరణలతో హృదయానికి హత్తుకొనేట్లు చెప్పింది. నరజాతి నాగరికతకు గీటురాళ్ళుగా చెప్పిన స్వధర్మం, కర్తవ్యం అంటే ఏమిటో కూడా చెప్పింది. దేహముకన్నా, ఇంద్రియములకన్నా, మనస్సుకన్నా, సర్వ సామాన్యమైన తెలివితేటలకన్నా, అతీతమై సృష్టి స్థితి లయహేతువై పరి పూర్ణమైన ఆత్మజ్ఞానం ఎంత ఎక్కువగా ఉంటె మానవనాగరికతకు అంత ప్రకాశం అనీ ఈ జ్ఞానం సన్నగిల్లే కొద్దీ అది అనాగరికమని వివరించి చెప్పింది.
ఈ వ్యాసంలో చెప్పిన ‘స్వధర్మం’ గురించిన లక్ష్మీ నరసమాంబ ఆలోచనలు 1904 నాటి నాసికా స్త్రీ సమాజం ద్వితీయ వత్సరోత్సవ సభలో చేసిన ఉపన్యాసంలోనే కనబడతాయి. ‘విద్యావంతులయర్హకృత్యములు’ (సావిత్రి, నవంబర్, డిసెంబర్ 1905 ) పాతివ్రత్యానుచరణం , ఉన్నతవిద్యాభ్యాసాచరణం, గృహధర్మాచరణం అని ఆ ఉపన్యాసంలో పేర్కొన్నది.మొదటి దానికి తరువాతివి రెండూ అనుబంధాలు. పతివ్రతలకు మహిమలున్నాయనటం పిచ్చి, తాళికాట్టాడని భర్తను దైవమనటం వెర్రి, వివాహబంధానికి అర్ధం స్త్రీపురుషులిద్దరూ సమణబాధ్యతతో సంసారం చక్కదిద్దుకొనటం,భర్త స్నేహితునివంటివాడు, స్త్రీ పురుషుడితో సమానంగా సృష్టించబడింది కనుక లొంగి ఉండవలసిన అవసరం లేదు - ఇలాంటి వాదనలు, ప్రశ్నలు అభివృద్ధికి భంగకరం అని చెప్పింది. స్త్రీలజీవితానికి ఉన్నతి పాతివ్రత్యం వల్లనే సాధ్యం అని నొక్కి చెప్పింది. ఆ క్రమంలోనే పాతివ్రత్యాన్ని వ్యతిరేకమని వితంతువివాహాలను ఆమె నిరాకరించింది. స్త్రీలు ఉన్నతవిద్యావంతులు కావటం అంటే స్వధర్మం తెలుసుకొనటమే అని అది పాతివ్రత్యంకన్నా మరేమీ కాదని అభిప్రాయపడింది. స్త్రీల చదువు పతి సుతాదులను చూసుకొనటానికి, సమర్ధవంతంగా ఇంటిపనులు చక్కబెట్టుకొనటానికి మాత్రమేనని ద్రౌపది ని ఉదాహరణగా చూపిస్తూ చెప్పి స్త్రీలకూ ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేదని తీర్మానించింది.
1907 నాటి ‘సంఘము నెడలను, ఇరుగుపొరుగు వారియెడలను స్త్రీ నెఱవేర్చవలసిన విధులు’ అనే వ్యాసంలోనూ ఇలాంటి భావాలే కనబడతాయి. సంఘం పట్ల విధులను నిర్వర్తించే బాధ్యత స్త్రీ పురుషులకుసమానమే అయినా స్త్రీలకు ఎక్కువ అని లక్ష్మీ నరసమాంబ అభిప్రాయం. స్త్రీలకు గృహధర్మాచరణమే పెద్ద ఉద్యోగమని, ఆ ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నెరవేర్చటమే సంఘము పట్ల స్త్రీలు నిర్వర్తించవలసిన ప్రధాన విధి అని చెప్పింది.పరోపకారం, ఐకమత్యం, సత్యం, అహింస, భూతదయ, పూనిక, పాతి వ్రత్యం, వినయం, క్షమ మొదలైన సుగుణాలను సంఘంలో పాదుకొల్పటమే స్త్రీలు నిర్వహించ వలసిన విధులు అని, ఆ సుగుణాలు స్త్రీలలో సంపూర్ణంగా వికసించటానికి విద్య, పరార్ధపరత్వం అనేవి ప్రధాన సాధనాలు అని చెప్పి వాటిని గురించి వివరించింది. ఈ సందర్భంలో స్త్రీలకు చదువు చెప్పటానికి స్త్రీలే ఉపాధ్యాయులుగా ఉండాలని, అందుకు శిశుపోషణాది కుటుంబభారం గల కుటుంబినులకంటే బ్రహ్మచర్య వ్రతులైన స్త్రీలు ఎక్కువ అర్హులని, వితంతు స్త్రీలని అందుకు సిద్ధంచేయటం అవసరమని చెప్పింది.
‘స్వధర్మసేవ’ (భారతి, 1910,ఉగాది సంచిక) అనే వ్యాసంలో ఈ భావాలు మరింత స్పష్టంగా కనబడతాయి. ‘స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ‘ అన్న గీతా వాక్యాన్ని ప్రాతిపదికగా ఎవరు ఎందుకు సృష్టింపబడ్డారో ఆ ధర్మాన్ని నిర్వహించాలని, ఒక దేశం తనస్వాభావిక ధర్మమునకు భిన్నముగా ఉండే పరదేశ ధర్మము కానీ, స్త్రీజాతి తనకనువు పడని పురుషజాతి ధర్మములను కానీ, ఒక మతస్థుడు స్వమత విరుద్ధములగు పరమత ధర్మములను గానీ స్వీకరించాలని అనుకోకూడదు అని ప్రబోధించింది. స్వధర్మం నెరవేర్చటానికే మనసు, వాక్కు, కాయము ఇయ్యబడినాయని చెప్పటమే గాక లోకంలో పిల్లలు తల్లిని అనుకరించే అవకాశమే ఎక్కువ కనుక పురుష సంఘానికంటే స్త్రీ సంఘానికే ఈ ధర్మాచరణం హితమైనది అని పేర్కొన్నది. స్త్రీధర్మానికి పతిభక్తి, దైవభక్తి, సద్విద్యాభ్యాసం, సత్యం, శాంతం భూతదయ మొదలైనవి అంగములని చెప్పి వితంతు స్త్రీ ధర్మం ఇంతకన్నా భిన్నమైనదని మతబోధకులై, విద్యాబోధకులై, వైద్యులై వాళ్ళు తమధర్మం నిర్వహించాలని ఈ వ్యాసంలో ఆమె నిర్దేశించింది.
అదే సమయంలో శ్రీవిద్యార్ధినీ సమాజం సమావేశంలో’సమాజములు’ అనే అంశంమీద
చేసిన ప్రసంగంలో (సావిత్రి, ఆగస్టు, 1910) లక్ష్మీనరసమాంబ సంఘాలు పెట్టుకొనటం, సమావేశాలకు వెళ్ళటం పరదేశాచారమని, అది తమకు తగదని స్త్రీలు అనుకొనటం సమాజముల నిర్వహణకు అవరోధంగా ఉన్నదని గుర్తించి చెప్పింది. అయితే దానిని ఆమె తప్పుపట్టలేదు. గీతా వాక్యాన్ని ప్రస్తావిస్తూ వాళ్ళ స్వధర్మాభిలాష, పరధర్మభయమూ సమంజసమైనవే అని అన్నది. తగిన విద్యలేకపోవటం, మీటింగులు, సొసైటీలు మొదలైన పరభాషా ప్రయోగాలు వాళ్లకు భయం కలిగించి ఉంటాయని భావించింది. సమాజములు పెట్టుకొనటం పరధర్మంకాదు స్వధర్మమే అని వాళ్లకు నచ్చచెప్పగలిగితే ఈ అవాంతరాలు తొలగుతాయని అభిప్రాయపడింది. ఆ మేరకు ఆమె చేసిన వాదమే ఈ వ్యాసం. స్వీయధర్మం స్త్రీల విషయంలో గృహజీవితమే అన్న సంప్రదాయ భావన స్త్రీల సంఘాల ఏర్పాటులో చొరవ,ఉత్సాహం చూపిన లక్ష్మీనరసమాంబను కూడా వదిలకపోవటం గమనించవచ్చు.
లక్ష్మీ నరసమాంబ వ్యాసాలలో స్త్రీ గురించి మాట్లాడే ప్రతీసందర్భంలో పతిభక్తి ప్రస్తావన తప్పనిసరి. పతిభక్తిని స్త్రీధర్మంగా భావించింది ఆమె. అందువల్ల పాతివ్రత్యం గురించిన పట్టుదల చాలా ఎక్కువ. పాతివ్రత్యం గురించి ప్రత్యేకంగా ఆమె వ్రాసిన మూడు వ్యాసాలు అందుకు నిదర్శనం. ఉన్నత విద్యాకన్నాచర్చించవలసిన ముఖ్యాంశం పాతివ్రత్యం అనే ఆమె అభిప్రాయం మొదటి వ్యాసంలోనే కనబడుతుంది. ఈ వ్యాసంలో ఆమె స్త్రీలకు సర్వకీర్తి సౌఖ్యంబులను సంపాందించుకొనటానికి మొదటిరోజు పెండ్లి రోజే అని, అది మొదలు వాళ్ళ మంచిచెడ్డలకు, రక్షణ శిక్షణలకు తన యావఛ్ఛక్తినీ ధారపోసేవాడు భర్తతప్ప మరెవరూ లేరని అందువల్ల ‘పతియే సతికిహ లోక దైవమని’ బలంగా చెప్పింది. అందువల్ల పాతివ్రత్యమే స్త్రీలకు అసలైన అలంకారం అని నొక్కి చెప్పింది. పాతివ్రత్యం అంటే పరపురుషాపేక్ష లేకుండా ఉండటం మాత్రమే కాదని ఎల్లవేళలా పతి హితానుసారం నడుచుకొనటమే పాతివ్రత్యం అని నిర్వచిస్తూ సావిత్రి, సుమతి, మొదలైన స్త్రీలను ఆదర్శంగా చూపిస్తూ కావ్యపురాణేతిహాసాలలో చంద్రమతి, ద్రౌపది మొదలైన స్త్రీపాత్రల ముఖంగా చెప్పబడిన పతిపాదసేవాసౌఖ్యాన్ని, పతివ్రతాధర్మాలను గురించిన పద్యాలను ఉటంకిస్తూ ఈ వ్యాసం వ్రాసింది. (హిందూసుందరి, ఆగస్టు,1903).
1910 నాటికి ‘స్వధర్మం’ అనే భావనపై చర్చప్రారంభించిన లక్ష్మీనరసమాంబ అప్పటికే మను నిర్దేశిత స్త్రీధర్మములను ప్రబోధిస్తూ కవిత్వం వ్రాస్తున్న లక్ష్మీనరసమాంబ ఆ క్రమంలో పాతివ్రత్యం స్త్రీ స్వధర్మం అని నిర్ధారించి చెప్పింది. గృహస్థాశ్రమంలో చిక్కియున్న స్త్రీలు పాలింపవలసిన ధర్మం పాతివ్రత్యధర్మం అని ప్రతిపాదిస్తూ బృందావనపుర స్త్రీ సమాజపు ఆరవ సంవత్సరోత్సవ సభలో ఉపన్యాసం చేసింది. ఇందులో ఆమె పాతివ్రత్య ధర్మం లోనే బ్రహ్మచర్య ధర్మంకూడా ఉందని పేర్కొన్నది. పూర్వకాలంలో స్త్రీలకు పెళ్లి ఐచ్ఛికం అయిన కాలం ఒకటి ఉండేదని, అప్పుడు బ్రహ్మచారిణులు ఉండేవాళ్ళని కారణాంతరాలచేత అది నశించిపోవటంవలన గృహస్థాశ్రమ ముఖ్యలక్షణమైన పాతివ్రత్యం నుండే ఇప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమం కూడా స్త్రీలు సాధించుకోవాలని ఒక వింత ప్రతిపాదన చేసింది. శక్తులకు సకల సుగుణములు పొందగల శక్తి పాతివ్రత్యం వలననే లభిస్తుందని వివరించి కర్మవశాన భర్తను కోల్పోయిన సతి జీవితం దుఃఖభాజనమవుతున్న వర్తమాన స్థితిని ప్రస్తావించి ఆ వితంతువులు విద్యావంతులవుతూ నిజధర్మమునెఱిగి ప్రవర్తించవలెనని సూచించింది. వితంతుస్త్రీ ఆచరించదగిన నిజధర్మం బ్రహ్మచర్యం తప్ప మరొకటి కాదు. స్త్రీలు తమ వితంతు దశను పావన బ్రహ్మచర్యంతో ముగించుకోగలిగితే పాతివ్రత్యం సాంగముగా పరిపాలించబడుతుందని చెప్పి వితంతువివాహాలను నిర్ద్వంద్వంగా నిరాకరించింది. ( సావిత్రి ,జనవరి, ఫిబ్రవరి 1911)
పతియెడల సతినెరవేర్చవలసిన న్యాయం పాతివ్రత్యం అని నిర్వచించి, స్త్రీయొక్క ఉత్క్రుష్ట ధర్మములలోకెల్ల పరమోతృష్ట ధర్మం అదేనని ఢంకాబజాయించి చెప్పి ఆ ధర్మాన్ని నిలబెట్టటానికి వాదించే క్రమంలో తల్లిదండ్రులు కుదిర్చి చేసే బాల్య వివాహాలను సమర్ధించింది. స్వయంవరాలను, ప్రౌఢవివాహాలను తిరస్కరించింది. పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య తక్కువగా ఉందని చెప్పే ప్రభుత్వ సమాచారాన్ని ఉటంకిస్తూ వితంతువులకు మళ్ళీ పెళ్లి అన్నా, ఇష్టం లేని భర్త నుండి విడిపోయిన స్త్రీకి మళ్ళీ పెళ్లి అన్నా కన్యలకు భర్తలు దొరకకుండా పోతారని చెప్పటం ద్వారా లక్ష్మీనరసమాంబ వితంతువులకు నిర్బంధ బ్రహ్మచర్యం, వివాహితలకు నిర్బంధ సంసారం విధి అని చెప్పినట్లయింది ( సావిత్రి, జులై, 1911)
పాతివ్రత్యాన్ని గురించిన ఈ పట్టింపు, ప్రబోధమూ ఆ కాలంలో ఎందుకింత తీవ్ర స్థాయిలో జరిగాయనేది ఒక ప్రశ్న(డి. పద్మావతి, తెలుగులో స్త్రీలపత్రికలు-ఒక పరిశీలన, ఏప్రిల్ 1989) వయసులోగానీ, రూపంలోగానీ సమత్వంలేని పెళ్లిళ్లు, బాల వితంతువుల యవ్వన మోహాలు, అవసరాలు ఈ మొదలైనవాటిని సంబోధిస్తూ సంస్కరణోద్యమాలు ఒక వైపు నడుస్తుండగా ఒక మహిళ, ఒక పత్రిక ద్వారా మహిళలకు పదేపదే పాతివ్రత్య విలువలను అంతగా కీర్తించటం సంస్కరణలను కాదని యథాతథ స్థితి కొనసాగింపునే కోరుకొనే సంప్రదాయ వర్గపు ప్రయత్నాలలో లో భాగమే. అది ‘పాతివ్రత్యం’ అనే చివరి వ్యాసంలో స్పష్టంగా కనబడుతుంది. పేర్లు చెప్పకుండా పూర్వపక్షం చేయటానికి ఆమె ప్రస్తావించిన అనేక అభిప్రాయాలు ఆనాడు సమాజంలో స్త్రీల జీవితంలో సంస్కరణలను ఆశించి చర్చలో చలామణిలో ఉన్నవే. నిజానికి స్త్రీవిద్య, స్త్రీ పునర్వివాహం మొదలైన అంశాలలో సంస్కరణలకై నడుం కట్టిన వర్గం కూడా ‘పాతివ్రత్యం’ అనే భావనను ఏదో ఒక స్థాయిలో పోషించటం చూస్తాం. సంప్రదాయచట్రాన్ని పూర్తిగా బద్దలుచేసిన ఉద్యమంకాదు సంస్కరణోద్యమం. ఆ పరిధిలో లక్ష్మీనరసమాంబది మరింత సంప్రదాయ దృష్టి. అటువంటప్పుడు’ వ్రతములు’ వంటి వ్యాసాలు వ్రాయటం (సావిత్రి,జులై 1911) లో ఆశ్చర్యం ఏమీ లేదు.
సత్సహవాసం(సావిత్రి ఏప్రిల్ & జులై ,1904), ఐకమత్యం (సావిత్రి, సెప్టెంబర్,1910) శత హస్తులు (సావిత్రి, ఏప్రిల్ 1912) మొదలైన వ్యాసాలు స్త్రీల అభ్యుదయ మార్గ సాధనాల నిర్ధారణలో భాగంగా లక్ష్మీ నరసమాంబ రచించినవే.అట్లాగే ఆనాడు స్త్రీల జీవితంలో సంస్కరణలు ఆశించిన వారందరూ వారి శరీర ఆరోగ్యాలగురించి కూడా శ్రద్ధవహించారు.జీవితంలో పాటించవలసిన జాగ్రత్తలు సూచిస్తూ వ్యాసాలు వ్రాసారు. ప్రచురించారు. అందులో భాగంగా లక్ష్మీనరసమాంబ కూడా ఆరోగ్యదర్పణము అనే వ్యాసం ఒకటి వ్రాయటం గమనించవచ్చు. (సావిత్రి ,ఏప్రిల్, 1904)
లక్ష్మీనరసమాంబ వ్రాసిన సాహిత్య వ్యాసం ‘ద్రౌపది’ ( భారతి ,జనవరి & ఫిబ్రవరి,1925)ఒక్కటే. అది కూడా బెంగాలీ భాషలోని బంకించంద్రుని వ్యాసానికి అనువాదం. హిందూకావ్యనాయికల చరిత్రములన్నిటికి పతిపరాయణత, కోమల ప్రకృతి సంపన్నత లజ్జాశీలత,సహిష్ణుత సాధారణ విశేషాలే అని సాధారణంగా ప్రాచీనకవుల నుండి ఆధునికుల వరకు అందరూ సీతవంటి నాయికలనే సృష్టిస్తున్నారు అనీ అందుకు సీతా చరితం మధురమైనది, ఆర్యజాతి ప్రశంసను పొందినది కావటమే కారణం అయివుంటుందని చెప్పి రచయిత ద్రౌపది నమూనాను అనుకరించే పాత్రసృష్టి కనబడదని పేర్కొని ద్రౌపది వ్యక్తిత్వ ప్రత్యేకతను నిరూపిస్తూ వ్రాయబడిన వ్యాసం ఇది. అది లక్ష్మీనరసమాంబను ఆకర్షించినదాని ఫలితమే ఈ అనువాదం. స్త్రీలకు ఉండవలసిన కోమలగుణములన్నీ సీతలో ఉంటే నారీలోకమందలి కఠిన గుణము లన్నీద్రౌపదిలో మూర్తీభవించి ఉన్నాయని రచయిత అభిప్రాయం.
ద్రౌపదీ స్వయంవర ఘట్టం, ద్యూతక్రీడా ఘట్టం, జయద్రధుడు తీసుకువెళ్లే ఘట్టం విశ్లేషిస్తూ క్రమంగా ఆమె తేజస్విని, గర్విత అని, దర్పము, ధర్మజ్ఞానం ఆమెలో పోటాపోటీగా వ్యక్తమవుతుంటాయని నిర్ధారిస్తాడు రచయిత. ఆ తరువాత ఒక స్త్రీకి అయిదుగురుభర్తలు అన్న అసమంజస వ్యవహారంలోని సమంజసం ఏమిటి అన్న ప్రశ్న ప్రాతిపదికగా చర్చ సాగింది. అయిదుగురు భర్తలు ఉన్నందువల్ల పతివ్రత అనటానికి వీలులేని స్థితిలో ఉన్న ద్రౌపదిని పతివ్రతగా స్థాపించటానికి రచయిత చేసిన తర్కం లక్ష్మీనరసమాంబకు బాగా నచ్చి ఉంటుంది. ఆ తర్కక్రమంలో సామాజిక లౌకిక దృక్పథం నుండి మహాభారతం లో ద్రౌపది గురించి వచ్చిన విశ్లేషణలను, నిర్ధారణలను నిరాకరించి భారత జాతీయ సంప్రదాయ దృక్పథంతో ద్రౌపదిని ‘స్త్రీజాతియందు మూర్తీభవించిన అనాయాసంగా ధర్మస్వరూపంగా’ నిర్ధారించటం జరిగింది. ద్రౌపది వివాహధర్మం ప్రకారం ఒక్కొక్క భర్త యందు ఒక కొడుకును కని ఆ తరువాత వారిపట్ల ఇంద్రియలోలుపతను విచ్ఛిన్నం చేసుకొన్నదనీ, నిష్కామము, నిశ్చలము, నిర్లిప్తమూ అయిన గృహకర్మనిర్వహణ మాత్రమే చేసిందనీ అందువల్ల ఆమె ‘అనాసంగ ధర్మస్వరూపిణి’ అన్నది బంకించంద్రుడి తీర్పు.
సావిత్రి పత్రిక సంపాదకురాలిగా లక్ష్మీనరసమ్మ సమీక్ష కోసం పత్రికా కార్యాలయానికి వచ్చిన పుస్తకాలను సమీక్షించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1904 నవంబర్ సావిత్రిలో తాటికొండ తిమ్మారెడ్డి దేశాయి రచించిన నీతి గ్రంధమును సమీక్షించింది. 1905 మార్చ్ ఏప్రిల్ సంచికలో మంగిపూడి వెంకయ్య వ్రాసిన 300 పద్యాల స్త్రీధర్మబోధిని గ్రంధం, సత్యవోలు భగవత్కవి వ్రాసిన శ్రీ రుక్మిణీపరిణయం కావ్యం సమీక్షించబడ్డాయి.
ఈ విధంగా1898-1925 మధ్య కాలంలో లక్ష్మీనరసమాంబ, ఆధునికత వైపు తొలి అడుగులు వేస్తూ తనకాలపు సమాజాన్ని, స్త్రీలను తనమార్గంలో నడిపించటానికి తన సమస్త సాహిత్య శక్తులను సమీకరించి పనిచేయటం చూస్తాం.
`
.
MAY 2020
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు