గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు మల్లిపురం జగదీశ్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తి గత జీవితం గురించి చెప్పండి.
గుమ్మలక్ష్మీపురం మండలం, విజయనగరం జిల్లాలోగల ఆదివాసీ గ్రామమైన పి. ఆమిటిలో పుట్టేను. సుబ్బలక్ష్మీ రామారావులు అమ్మానాన్నలు. ముగ్గురు సంతానంలో మధ్యవాణ్ణి. శ్రీమతి శ్రీదేవి, ఇద్దరు పిల్లలు విష్ణుప్రియ, హర్షవర్ధన్. ఇద్దరూ ఇంటర్మీడియట్ చదువుల్లో వున్నారు. నాది మారు మూల ఆదివాసీ గ్రామ జీవితం. ప్రస్తుతం ఆంగ్ల సహోపాధ్యాయునిగా గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల, టిక్కబాయి లో పని చేస్తున్నాను. అది నేను చదువుకున్న స్కూలే.
2. మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.
నేను చదువుకునే స్కూల్లోనే ఉపాధ్యాయుడు (SGT) గా టిక్కబాయిలో చేరే సమయానికి గంటేడ గౌరునాయుడు మాష్టారు అక్కడే వుండడం... అప్పటికి ఆయన కథలు ఒకటి రెండు చదివుండడం, వాటి మీద నా సందేహాలూ...ఆయన సమాధానాలు, అసలు రచయితలు ఎలా వుంటారు? వాళ్ళెలా కధలు రాస్తారు? కధంటే ఏమిటి లాంటి చర్చలూ... ఆ సాన్నిహిత్యం నన్ను రచయితగా మార్చేయి.
మాష్టారి రచనా శైలి నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది. సాహిత్య సంస్థల విషయానికొస్తే స్నేహ కళా సాహితి ప్రొడక్ట్ ని నేను. అది తొలి అడుగు వేసినప్పటి నుండి నేటిదాక ఒక కార్యకర్తగా కొనసాగుతున్నాను. శ్రీకాకుళ సాహితి, సాహితి స్రవంతి, అరసం సంస్థలు నేనిలా నిలబడడానికి దోహదపడ్డాయి. ”ఏడు తరాలు’, ’అమృత సంతానం” పుస్తకాలు నా కళ్ళ ముందే కదలాడుతుంటాయి... అవి నాకో సవాల్ విసురుతున్నట్టుగానే భావిస్తుంటాను... అలాంటి రచనలు చేయగలవా అని అంటున్నట్టు.
3. మీ చుట్టూ ఉన్న ఏ పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి?
నా హైస్కూలింగ్ లో తరగతి గుర్తులేదు... ఒక తెలుగుపాఠం... అదీ గుర్తులేదు. అందులో రచయిత చెప్పిన విషయంలో ”అదెలా కుదురుతుందండీ?” అని మా తెలుగు మాష్టారు కాటమ రాజు గారికి అడ్దుతగిలాను. ’అది రచయిత భావన’ అన్నారు. ”దానికి నేనెందుకు ఒప్పుకోవాలి?’ అని వాదిస్తే...నీ వాదన ఎవడిక్కావాలి. శతకోటి లింగాల్లో బోడిలింగానివి. నీ ఇష్టం వచ్చినట్టు రాస్తే మార్కులు రావు, రచయిత చెప్పినట్టు రాస్తేనే మార్కు వస్తుంది అని చెప్తూ ”నీక్కావాలంటే వేరేగా రాసుకోవచ్చు. కానీ అది జనంతో పాటు ఈ పాఠ రచయిత కూడా ఒప్పుకునేలా వుంటేనే” అని చెప్పారు. (ఇప్పటిలా ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు అప్పుడు లేవు). బహుశా అప్పటి నుండి నేను ఆలోచిస్తున్నానేమో... రాయడం గురించి.
ఆ తరువాత మాష్టారి సాంగత్యంలో చాలా పుస్తకాలు చదివడంతో నా అడుగులు సాహిత్యం వైపు పడ్డాయి.
4. మీ రచనల గురించి చెప్పండి
రెండు కథా సంపుటులు వచ్చాయి. మొదటిది ”శిలకోల” రెండోది ”గురి”.
5. మీ మొదటి రచన ఏ సందర్భంలో వచ్చింది?
అచ్చయిన అక్షరాల బట్టి అయితే నా తొలి రచన ”తప్పదేమో...!” అన్న కవిత్వం. అది నాకు తెలీకుండా మా మాష్టారు కోకిల అనే పత్రికకు పంపించారు. అది అచ్చయి మా ఇంటి పెణక మీద వాలింది. రెండు రోజుల తర్వాత తెరిచి చూస్తే నా కవిత అందులో నా పేరున. అవొక ఉద్విగ్న క్షణాలు.
కథ విషయానికొస్తే...”అక్షరాల దారిలో...” ’అరణ్యరోదన” అనే రెండు కథలు మే 2000 లో ఒకే సారి అచ్చయ్యాయి. ఉత్తారాంధ్ర, ప్రజాసాహితి ల్లో. అక్షరాల దారిలో కథ నా స్వీయానుభవం. సన్నాయి అనే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విధ్యార్ధి బడి నచ్చక ఇంటికి పారిపోతాడు. వాడు తిరిగి రావడమే కథ. ఈ కథలో సన్నాయి నేనే. రెండోకథ ”అరణ్య రోదన” పోడు కొండమీద ఒంటరిగా నెలల బిడ్దతో నివశిస్తున్న ఒక ఆదివాసీ స్త్రీ పోలీసులు, మావోయిష్టుల ఎదురుకాల్పుల్లో మరణిస్తుంది. కాల్పులు జరిపిన ఇద్దరికీ అన్నం పెట్టి దాహం తీర్చిన ఆమె మరణంతో బాలుడు అనాధ అవుతాడు. సంఘటనా స్థలంలో వాడి రోదన ఇద్దరికీ ప్రశ్నిస్తూ కథ ముగుస్తుంది. ఈ కథ అటు పోలీసులకి, ఇటు మావోయిష్టులకీ మధ్య నలిగిపోతున్న గిరిజనుల స్థితిని చెప్పడానికి రాసినది.
6. తెలుగు సాహిత్యంలో ఆదివాసీ సాహిత్య స్థానం ఎక్కడ వుంది?
ఇంకా ప్రాధమిక దశలోనే వుంది.
7. గిరిజనులుగా వుంటూ గిరిజన సాహిత్యాన్ని రాస్తున్న తెలుగు వర్ధమాన రచయితలు, కవులు ఎవరెవరు? ఒక ప్రత్యేకమైన పరిస్థితులను రికార్డు చేస్తున్న ఈ సాహిత్యకారుల మధ్య ఒక చక్కటి వేదిక వుండాలి కదా ఉన్నదా?
గిరిజనులుగా వుంటూ గిరిజన సాహిత్యాన్ని రాస్తున్న తెలుగు వర్ధమాన రచయితలు, కవులు వేళ్ళ మీద లెక్కపెట్టినంత మందే వున్నారు. ఇక్కడ నేనూ, తిమ్మక రామ్ ప్రసాద్, పాల్వంచ నుంచి పద్దం అనసూయ, కుంజా కళ్యాణి, చిత్తూరు నుంచి పలమనేరు బాలాజీ, తెలంగాణ నుంచి వూకే రామకృష్ణ, రమేష్, కృష్ణ గుగ్గులోత్ లు మాత్రమే సృజనాత్మక రచనల్లో వున్నారు. గుమ్మడి లక్ష్మీనారాయణ, మైపాటి అరుణ్ కుమార్, నెహ్రు, రామారావు దొర లు వ్యాస రచయితలుగానూ ఆదివాసీ రచనలు చేస్తున్నారు. సుమన్ కొలామి కొలామీ భాషలో కవిత్వం రాస్తున్నాడు. ఈ సాహిత్యకారుల కోసం ”ఆదివాసీ రచయితల సంఘం” (ఆరసం) వుంది. రాష్ట్ర విభజనానంతరం చిన్న స్థబ్దత ఏర్పడింది. కార్యక్రమాలు వేగవంతానికి ఒక ప్రణాళిక వుంది.
8. గిరిజన చరిత్ర సంస్కృతి గిరించిన మీ పరిశీలనలు, పరిశోధనలు ఏమిటి?
సమాజ చరిత్రంతా ఆదివాసుల నుంచే అడవి దగ్గర మొదలయ్యింది. అడవుల్ని వదిలి నడిచిపోయిన వాళ్లు నాగరీకులుగానూ, అక్కడే వుండిపోయిన వాళ్ళు నేటి ఆదివాసులుగానూ మిగిలిపోయారు. సమాజ పరిణామ క్రమంలో ఎప్పుడూ ముందుకెళ్ళిపోయిన వాడు వెనకనున్నవాణ్ణి చిన్న చూపు చూడ్డమే జరుగుతున్నది.
సంస్కృతి మాటకొస్తే...వివిధ ఆదివాసీ తెగల భాషా, ఆచారాలూ, సంప్రదాయాలూ, పండుగల్లో వివిధ రూపాల్లో సజీవంగా వుండాలి. కానీ ప్రపంచీకరణ, నగరీకరణ దెబ్బకు వాటి మనుగడ ప్రశ్నార్ధకం అయికూచుంది. అవి పురాతనమైనవే కాక ప్రకృతి సంబంధ మరియు మానవీయమైన విలువలతో కూడుకున్నవని నా అభిప్రాయం. వీటి వెనుక మూఢ నమ్మకాలుంటే విస్మరించాల్సిందే. అది వేరే విషయం. మనం మాతృస్వామ్య వ్యవస్థ నుండి పితృస్వామ్య వ్యవస్థకు పరిణామం చెందిన వాళ్ళం. ఆదివాసీ తెగల్లోని స్త్రీ పురుషుని కంటే ఎక్కువగా శ్రమిస్తుంది ఇప్పటికీ. ఆదివాసీ స్త్రీ ఆదివాసేతర స్త్రీ కంటే స్వేచ్చగా వుండగలుగుతుంది, నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. ఈ లక్షణాలన్నీ ఒకప్పటి మాతృస్వామిక శిలాజ స్వరూపాలని నా విశ్వాసం. మా వూళ్ళో ఆవు, గేదెలకు పాలు తియ్యరు ఇప్పటికీ. ఎందుకంటే దూడ హక్కుని మనం కాజేయడం అన్యాయం కాబట్టి. కంది కొత్తల పండుగలో గొడ్డలిని పూజిస్తాం. గొడ్డలి శ్రమకు సంబంధించిన ఆయుధం. అంటే పండుగ పేరుతో శ్రమను గౌరవించడం అని అర్ధం. ఇవన్నీ నా పరిశీలనలే, ఇంకా పరిశోధిస్తే మరిన్ని విషయాలు రూఢి అవుతాయి.
9. గిరిజన జీవితాన్ని సాహిత్యంలోకి బలంగా తీసుకువచ్చిన రచయితగా మీ భవిష్యత్ రచనలు ఏమిటి?
ఒక నవల రాస్తున్నాను. కథకు అలవాటు పడిపోయాను కదా నవల రాతలో ఇబ్బందులెదుర్కొంటున్నా.
10. గిరిజన కళారూపాలకు సంబంధించి ఏమైనా చెబుతారా?
థింసా ఒక్కటే వెలుగులోకొచ్చింది. వెలుగులోకి రాని గిరిజన కళారూపాలు ఎన్నో వున్నాయి. కెరగా నృత్యం, నెమలి నాట్యం, నెయ్యి గుర్రం...లాంటి నృత్య రూపాలే కాకుండా లొల్లూచి పాటలు, నందెన్న పాటలు, ఉడుపుల పాటలు, సవర పాటలు, జాతాపు గీతాలు లాంటి ఆలాపనలు కూడా ఎన్నో వున్నాయి. కిన్నెర, టిల్లకాయ, గొగోయ్, తుడుము...డప్పు, సన్నాయి, కొమ్ము బూర, తుంబ బూర లాంటి ఆదివాసీ వాద్య నాదాలు మూగబోకుండా చూసుకోవాల్సి వుంది. ఆ కళాకారులు ప్రస్తుతం నిర్లిప్తంగా ప్రదర్శనా రహితంగా మౌనంగా వున్నారు వేదికలు లేక. వీటిని భద్రపరచాల్సివుంది.
11. కొన్ని గిరిజన భాషలు అంతరించి పోతున్నాయి కదా దాని గురించి ఏమంటారు?
ఇది ఖచ్చితంగా నేటి తరం వైఫల్యమే. ఏ భాష మనుగడ బాధ్యత ఆ తెగలదే. ఒకరి భాషని మరొకరు ఉద్ధరించలేరు. ప్రభుత్వం లాంటి ఇతరులు ప్రోత్సాహం ఇవ్వగలవు కానీ భాషని బ్రతికించాల్సింది వక్తలే. మన ప్రయత్నం మనం చేసిన తరువాత ప్రభుత్వాలని డిమాండ్ చేయగలం. ప్రతి ఆదివాసీ ‘’నా భాష నా బాధ్యత’’ అని అనుకోవాలి. అప్పుడే ఆయా భాషలు మనగలుగుతాయి.
12. గిరిజనులకు గిరిజన భాషలో చదువుకునేందుకు లిఖిత సహిత్యం అందుబాటులో ఉందంటారా?
చదువుకునేందుకు ”మౌఖికం” ఎంత ముఖ్యమో ”లేఖనం” కూడా అంతే అవసరం. అన్ని గిరిజన భాషలకు లిపి లేదు. కొన్నింటికే లిపి అందుబాటులో వుంది. ఇటీవల విధ్యాశాఖ సవర, కోయ లాంటి స్థానిక గిరిజన భాషల్లో పాఠ్యపుస్తకాల ప్రచురణ చేపట్టింది. దీనివల్ల చాలా ఉపయోగం వుంది. తమ మాట పుస్తక రూపంలో వుందంటేనే ఒక ఆకర్షణ కదా! మాతృభాషలో విద్యాభ్యాసం మంచి ఫలితాలనిస్తుంది. ఇది మినహా లిఖిత సాహిత్యం ఎక్కువగా అందుబాటులో లేదు.
13. దళిత వాదం, స్త్రీవాదం, ముస్లిం మైనారిటీ, బీసీ వాదాలు తెలుగులో ప్రభావితం చూపించినంతగా గిరిజనులకు ప్రత్యేక వాదంగా ఎందుకు ప్రభావితం చూపించలేకపోయింది?
గిరిజన వాదం ఇంకా పునాదుల స్థాయిలోనే వుంది. గిరిజన పోరాటాల లక్ష్యం హక్కుల సాధన. అందులో నాణ్యమైన విద్య కూడ ఒకటి. ఇదే రచయితల్ని తయారు చేసుకునే దిశ గా నడవాల్సి వుంది. మొత్తంగా చెప్పాలంటే వాదంగా వినిపడేంత మంది గిరిజన రచయితలు లేరు.
14. మీరు భావిస్తున్న ఆదివాసీ సమస్యలకు పరిష్కారాలు ఏమిటి?
స్వయం పాలన. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆదివాసీల్ని ఓటర్లు గానే చూస్తున్నాయి తప్ప సమాజంలో ఒక భాగమని గుర్తించడం లేదు. ఆదివాసుల కోసం ప్రత్యేకమైన చట్టాలున్నాయి... సమస్యల్లా వాటి అమల్లోనే. ఎక్కడైనా అమలు చేస్తున్నారూ అంటే అక్కడ నకిలీల రూపంలోనూ, అడ్డ దారుల్లోనూ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఉదాహరణకు పీసా, వన్నాఫ్ సెవంటీ, అటవీ హక్కులు... ఇవన్నీ ఆదివాసుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డవే. కానీ ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. కారణం ఆదివాసీ ప్రాంతాల్లో స్వయం పాలన లేకపోవడమే. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాకారం ఏర్పడ్డ ఆదివాసీ షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలు అన్నింటినీ కలిపి ఒకే ఆదివాసీ రాష్ట్రంగా ఏర్పాటు చేసి 6వ షెడ్యూల్ లో కలిపితే స్వయం పాలన సాధ్యమవుతుందనేది మా వాదన. డిమాండ్ కూడా. అప్పటికి గాని ఆదివాసీ సమస్యలకు పరిష్కారం దొరకదు.
15. తెలుగులో గిరిజన జీవితం ఇంకా రావాల్సినంతగా రాలేదు అని ఒక విమర్శ వున్నది. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?
నిజమే. గిరిజన జీవితం రికార్డు కావల్సినంతగా కాలేదు. ఈ రోజు సాహిత్యంలో ఎవరి గోడు వాళ్ళు చెప్పుకుంటున్న స్థితి. స్త్రీలు, దళితులు, ముస్లిమ్ మైనారిటీ, బహుజన... వాదాలుగా. ఎక్కడా ఆదివాసుల గురించి కనిపించదు. ఎక్కడైనా కనిపిస్తే అది అవుట్ సైడర్ వ్యూ. మరి మా గురించి ఎవరు రాస్తారు? ఆదివాసీల గిరించి అంటే అభివృద్ధి... దాని నిర్వచనం... ఆ వెనకే విధ్వంసం... నిరక్ష్యరాశ్యత... మూఢ నమ్మకాలు... ఉన్న వూళ్ళో పని లేకపోవడం... వలసలు... నిర్నైపుణ్యత... నిర్ధయ నగరీకరణ... మరో పక్క సౌకర్యాలు లేకపోవడం... మతమూ దాని వికృత రూపం... మావోయిష్టు సమస్య... ఎన్ కౌంటర్లూ... అడవి నుండి ఆదివాసుల్ని ఖాళీ చేయించడాలు...అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతి, పోరాటాలు సాహిత్యంగా ఎప్పుడు మారుతాయి? ఇవన్నీ రికార్డు చెయ్యడానికి జగదీష్ ఒక్కడు చాలడు. మాలోంచి ఉద్యమ స్థాయిలో రచయితలు తయారైతే ముందన్నట్టు అది వాదంగా బలపడి సాహిత్యంలో రికార్డు స్థాయిలో రికార్డ్ అవుతుంది.
16. కథలే కాకుండా కవితలూ పాటలు కూడా రాసారు కదా... కథకుడిగా కవిగా రెండు ప్రక్రియల్లో రచనలు చేస్తున్నపుడు ఈ రచన ఈ ప్రక్రియలో చేయటానికి ఎలా ప్రక్రియను ముందుగా మీరు నిర్ణయించుకుంటారు?
నేను ప్రాధమికంగా కథకుడిని. కవినని చెప్పుకోవడానికి ధైర్యం చాలడం లేదు ఇంకా. కానీ కవిత్వం అంటే ఇష్టంగా చదువుతాను. పాటలు పాడుతాను కానీ రాయలేదు...ఒకటీ అరా తప్ప. కథ రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటాను. కవిత్వం మాత్రం వన్ సిటింగ్ లో పూర్తి చేస్తాను. ఇన్ స్టంట్ ఎక్స్ ప్రెషన్ కోసం కవిత్వాన్ని ఎంచుకుంటాను. కథ నన్ను డిమాండ్ చేస్తూ... కూర్చోబెడితే తప్ప కథను ముట్టుకోను.
17. కవిగా పాఠకుడుగా మీ ప్రస్థానం ఏమిటి?
నా ప్రస్థానం ఇదీ అని ఎప్పుడూ ప్రశ్నించు కోలేదు. చిన్నవో పెద్దవో లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం ముందుకు పోవడమే నా పని. వెనక్కి ఎప్పుడూ చూసుకోలేదు.
18. గిరిజన సాహిత్యం కోసం ఇంకా ఏమి చెయ్యాల్సి వుంది?
చాలా వుంది. మౌఖిక రూపంలో వున్న ఆదివాసి సాహిత్యాన్ని రికార్డు చేయాలి. కొన్ని డాక్యుమెంటరీ లను తాయారు చేసుకోవాల్సి వుంది. కొత్త రచయితల్ని తయారు చేసుకోవాలి.
19. కొత్తగా గిరిజన రచయితలు రాకపోవడానికి కారణం ఏమిటి? ఆదివాసీ సాహిత్యం అంటే ఆదివాసేతరులు రాసిన సాహిత్యాన్నే రెఫర్ చేస్తారు. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది?
కొత్తగా గిరిజన రచయితలు రాకపోవడానికి కారణం గిరిజన విద్యార్ధుల్లో సాహిత్య వాతావరణం లేకపోవడం ఒక కారణం అయితే మరొకటి విధ్యలో నాణ్యత లేకపోవడం. (నాణ్యత’ విషయం ఒప్పుకున్నా లేకున్నా ఇది నిజం) ఇక ఆదివాసీ సాహిత్యం అంటే ఎవరు రాసినా అది ఆదివాసీ జీవితమై వుంటేనే అది ఆదివాసీ సాహిత్యంగా గుర్తించాలి కానీ రాసింది ఆదివాసీనా ఆదివాసేతరుడా అనేది ముఖ్యం కాదు. ఒక్కొక్క సారి గ్రామీణ కథని గిరిజన కథగా పొరబడుతుంటారు. ఆదివాసీ పేర్లున్నంత మాత్రాన ఆ కథ ఆదివాసీ కథ అయిపోదు.
20. కొమరం భీం, రాగో నవలలను ఆదివాసీ నవలలుగా చూడవచ్చా?
కొమరం భీం... ఆదివాసీ నవలే. రాగో నవల నేను చదవలేదు.
21. ఇప్పుదు వెలువడుతున్న ఆదివాసీ సాహిత్యం ప్రత్యేకతలు ఏమిటి?
ప్రస్తుతం తన అస్థిత్వాన్ని వెతుక్కునే పనిలో వుంది.
22. ఉత్తరాంధ్ర సాహిత్యంలో ఉన్న జీవత్వంకు గల కారణాలు ఏమిటి?
ఇక్కడి జీవితమే ఈ సాహిత్య జీవత్వానికి ప్రధాన కారణం. ఇక్కడ మాండలికం, భాషా ప్రత్యేకత సాహితీ వనరు. నదులూ, అడవులూ, తీర, మైదాన, ఏజెన్సీ ప్రాంతం వున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో వుంది ఉత్తరాంధ్ర. ఈ వనరులున్న ఏ ప్రాంతమైనా అభివృద్ధి లో ముందుంటుంది. ఈ వెనుక బాటుకి కారణం పాలకులే. ఈ నిర్లక్ష్య ధోరణిని సాహితీ కారులు పట్టుకోవడం వల్లే ఈ సాహిత్యానికి ఈ గుర్తింపు లభిస్తోందని నా అభిప్రాయం.
23. ఒక రచయితగా ప్రస్తుతం సాహిత్యాన్ని సాహిత్య విమర్శను ఎలా చూస్తున్నారు?
సాహిత్యం వస్తున్నంతగా సాహిత్య విమర్శ రావడం లేదనేది నా అవగాహన. సీనియర్ విమర్శకులను మినహాయిస్తే విమర్శలో కొత్త తరం రావడం లేదు. ఒక రచయిత విమర్శకుడిని అడిగి తన పుస్తకం మీద రాయించుకునే పరిస్థితి వుందనిపిస్తోంది. అప్పుడు ప్లస్సులే వస్తాయి తప్ప మైనస్సులు విమర్శలోకి రావు. ఇది సాహిత్యానికి మంచిది కాదు.
24. సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనంటారా?
సాధ్యమేనని నమ్ముతాను. ఆ మార్పు కాస్త ఆలస్యమైతే అవ్వొచ్చు గాని మార్పుకి సాహిత్యమే మూల కారణం.
25. సాహిత్య జీవితంలో మిమ్ములను కదిలించిన అనుభవం గురించి చెప్పండి
రాస్తున్నందుకు రచయితగా గుర్తింపు రావడం ఆనందమే. కానీ ఆదివాసీ జీవితం రాస్తున్నందుకు ఆదివాసిగా వివక్షనెదుర్కోవడం అక్కడక్కడా ఇబ్బంది పడ్డాను. వివరాలు అడగొద్దు కానీ...ఒక సంఘటన మీతో పంచుకుంటాను. అది గిడుగు రామ్మూర్తి పంతులుగారి జన్మదిన ఉత్సవం. 'మీకు సన్మానం చెయ్యలకుంటున్నాం' అని పిలుపొచ్చింది ఓ రోజు. వెళ్ళాను. ఆ సభలో మొత్తం పది మంది వివిధ రంగాలకు చెందిన వ్యక్తులకు సన్మానం చేస్తున్నారని తెలిసింది. అందులో తొమ్మిది మందికి పదివేల రుపాయలు, మెమెంటోలతో సత్కరిస్తే... నాకొక్కడికి మాత్రం మెమెంటోతోనే సరిపెట్టారు. దీన్ని నేను వివక్షగానే పరిగణిస్తాను. ఆ రోజు యాంకర్లు, మిమిక్రి ఆర్టిస్ట్ లు, పద్య కవులు వున్నారు ఆ తొమ్మిది మందిలో. ఆ ప్రత్యేక రోజు నిర్వహిస్తున్న ఆ సభలో... ఎవరూ ఆయన స్పూర్తికి గాని, ఆశయాలకు గాని దగ్గరగా వున్నవారు కాదు. ఆ రోజు ప్రాతిపదిక కులమే అని గ్రహించాను. ఏ సవరల మీద గిడుగు వారు కృషి చేసారో ఆ సమాజం నుంచి వచ్చిన వాణ్ణి. ఏ వ్యవహారిక భాష గురించి పాటు పడ్డారో ఆ వ్యవహారిక భాషలో రచనలు చేస్తున్న వాణ్ణి. నన్ను అలా మినహాయించడం చాలా ఇబ్బంది పడ్డాను. ఈ సంఘటన సాదా సీదా సభల్లో జరిగివుంటే పట్టించుకునే వాడిని కాదు గానీ... అది ఒక విశ్వవిద్యాలయం నిర్వహించిన సభ కాబట్టి ఎక్కువ గా కలచి వేసింది.
26. పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరేం చెప్పదలచుకున్నారు. లేదు?
సందేశాలివ్వగలిగినంతటి వాణ్ణైతే కాదు. అందరికీ నమస్కారం.
గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు డా. వి. ఆర్. రాసాని ఇచ్చిన ఇంటర్వ్యూ
1. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి?
నేను 1957లో చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలానికి చెందిన ‘కురవపల్లి’ అనే ఒక గ్రామంలో పుట్టాను. రాసాని యల్లమ్మ, రాసాని శిద్దయ్య నా తల్లి దండ్రులు. నాకు ఇద్దరన్నలు, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. నేను నాల్గవ సంతానం గొర్రెలు, మేకలు మేపడం కులవృత్తిగా కలిగిన వ్యవసాయ కుటుంబం మాది.
నేను పులిచెర్ల మండలంలోని ‘కమ్మపల్లె’ ఎలిమెంటరీ స్కూల్లో ప్రాథమిక విద్యను, పులిచెర్ల జడ్.పి. హైస్కూల్లో హైస్కూలు విద్యను పూర్తి చేశాను. పీలేరులో ఇంటర్ చదివాను. తిరుపతిలోని టి.టి.డి అధ్వర్యంలో నడిచే ప్రతిష్టాత్మక కళాశాల ఎస్వీ ఆర్టస్ కళాశాలలో బి.ఏ పూర్తిచేసి ఎస్వీ యూనివర్సీటిలో ఎం.ఏ (తెలుగు) ఎం.ఫిల్. పిహెచ్.డి. పట్టాలు పొందాను.
అ తర్వాత టి.టి.డి. కళాశాల అయిన ఎస్వీ జూనియర్ కళాశాలలో 1983నుంచీ తాత్కాలిక అధ్యాపకుడిగా చేరి అక్కడే పర్మనెంటు చేయబడి 2003 లో ఎస్వీ ఆర్టస్ కళాశాలకు ఉద్యోగోన్నతిని పొంది 2017లో రిటైరయ్యాను.
ఇక వివాహ విషయానికి కొస్తే 1989లో హోమియోపతి డాక్టరైన డా।। కె.ఉమాదేవితో వివాహమైంది. మాకు ఇద్దరు పిల్లలు యశ్వంత్ కుమార్, కాంచన్ క్రిష్ణ. యశ్వంత్ బిటెక్ తరువాత ఫ్రాన్స్‌లో ఎం.ఎస్ పూర్తి చేసి, ఎంబిఏను జపాన్‌లో పూర్తి చేసి ప్రస్తుతం దక్షిణ అమెరికాలోని కొలంబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. కాంచన్ డిగ్రీ చేసి ప్రస్తుతం మా దగ్గరే ఉన్నాడు. డాక్టరు ఉమాదేవి మంచి డాక్టరుగా, పత్రికా రచయిత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు. వారు హోమియో వైద్యం, ఇంటింట హోమియో వైద్యం, స్త్రీల వ్యాధులు -హోమియో వైద్యం, ఇన్ఫెక్షన్స్, పిల్లల పెంపకం లాంటి ప్రసిద్ధ గ్రంథాలు రాసారు. దాదాపు పది సంవత్సరాల నుంచీ వార్తా దినపత్రికలో ప్రతి సోమవారం వైద్య సంబంధ వ్యాసాల శీర్షికను నిర్వహిస్తోంది. అలాగే విశాలాంధ్ర దినపత్రిక ఆదివారం అనుబంధంలోనూ కొన్ని సంవత్సరాల పాటు హెల్త్ శీర్షికను నడిపినారు. ఈమె కవిత్వాలు కొన్ని, చిన్న పిల్లల కథలు కొన్ని ముద్రింపబడ్డాయి.
2. మిమల్ని ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి?
నన్ను ప్రత్యేకంగా ప్రభావితం చేసిన వ్యక్తులు లేరు గానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. మాపల్లె ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక నేపథ్యం గల ఊరు మా ప్రాంతంలో వీధి నాటకాలు ప్రదర్శించడంలో అప్పటి కాలంలో పేరు మోసింది. ఇక పొలంపనుల్లో సజ్జగూళ్లు కోసేటప్పుడు, చెనక్కాయాలు విడిపించేటప్పుడూ, లేదా రాత్రివేళ తీరుబడిగా వుండేటప్పుడు ఎన్నో జానపద కథలు ముసలివాళ్లు, ఆడవాళ్లు చెప్పేవాళ్ళు. ఆడవాళ్లు జక్కికి గొబ్బిళ్లు తట్టేవారు. కుంటాట, కుండలు తీసే ఆట, ముక్కులు బిళ్లాట ఆడేవారు. మగవాళ్లు కోలాటం, చెక్కభజన, పాండురంగ భజన, కులుకు భజనలాంటివి ప్రదర్శించేవారు. మగవాళ్లు బలిగూడు(కబడ్డీ), ఉప్పరబట్టెలు ఆడేవారు. రోజూ ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు ఒక జానపద కథో, జానపద పాటో వినిపిస్తుండేది. కూర్చుంటే చాలు విప్పుడు కథలు, దాగుడు మూతలు ఏదో ఒకటి వుండేటివి. పైగా నేను బాగా చదువుతానని మా ఎగువ వీధిలో కొందరు ముసలాళ్లు ఏడెనిమిది మంది సందేళ అన్నంతిన్నాక మా యింటిముందర స్టూలువేసి, దానిపైన లాంతర్ పెట్టి రోజూ కొంచెం కొంచెం చొప్పున భట్టి విక్రమార్క కథలు, కాశీమజిలీ కథలు, భోజరాజు కథలు, సహస్ర శిరచ్చేద చింతామణి వంటి పుస్తకాలు చదివించుకుని వినేవారు. బహుశా ఈ నేపథ్యమే నేను రచయిత కావడానికి పునాది అనుకుంటాను.
నేను చిన్నప్పుడు పద్యాలు రాసేవాన్ని. వాటిని చదివి హైస్కూల్లో గొప్ప మార్క్సిస్టు రచయిత, అనువాదకుడు అయిన ఏ.జి. యతిరాజులుగారు నన్ను కవితలు రాయమని ప్రోత్సహించారు. పైగా శ్రీశ్రీ ప్రస్థానం ఇచ్చి ఇలా రాయమన్నాడు. ఆయనే నేను కమ్యూనిస్టుగా మారడానికి కారణం. ఆయన ఇటీవల చనిపోయేంత వరకూ నాతో సన్నిహిత సంబంధాలే కలిగి ఉన్నాడు. కమ్యూనిజానికి చెందిన రచనలు, మార్క్సు, ఏంగిల్స రచనలు చదవడం ఆయన వల్లనే సాధ్యమైంది. బహుశా ఆ కారణంగానే నేను 1975 నుంచి విరసంలో ఉన్నాను. యాక్టివ్ గా కాదుగానీ వాళ్ళతోనే ఉండేవాన్ని. ఆ తర్వాత 1977 లో నేను బి.ఏ. మొదటి సంవత్సరం చదివేటప్పుడు విరసం నుంచీ విడిపోయి జనసాహితీలో చేరాను. దానికి పి.డి.ఎస్. యు. అనుబంధం. ముప్పాళ్ళ రంగనాయకమ్మ, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, తిరుపతిలో భూమన్ ...లాంటి జనసాహితీ వాళ్ళతో బాగా పరిచయం.
ఒకసారి భూమన్ గారి ఇంట్లో రంగనాయకమ్మతో వారం రోజులు సాహిత్య చర్చలు జరిగాయి. అప్పుడే ఆమె ప్రజాశక్తి ఎడిటర్ గా ఉండిరి. ఆ చర్చల్లో కె.యస్.వి.రమణ, కె.బి.తిలక్, ఏ.యన్. నాగేశ్వరరావు, రాఘవశర్మ లాంటి వారు చురుగ్గా పాల్గొన్నారు. వారిలో నేనూ ఒకన్ని. అప్పట్లో నేను రంగనాయకమ్మ గారితో చర్చించిన విషయాలు, వేసిన ప్రశ్నలు, ఆమె సమాధానాలు నాకింకా ఇప్పటీకీ గుర్తే. తిరుపతిలో భూమన్ గారి ఆధ్వర్యంలో ఎ.యన్., నేను జనసాహితీలో యాక్టివ్ గా ఉండేవాళ్ళం. ఆ తరువాత ఐదారేండ్లకు అరసంలో చేరి ఇప్పుడూ అందులోనే....
ఈ సంస్థలు, యతిరాజులుగారు నన్ను బాగా ప్రభావితం చేసిన అంశాలు. ఆ తర్వాత తిరుపతి మావోగా పేరుగాంచిన త్రిపురనేని మధుసూదనరావు, భూమన్, హేతువాది డి.నాగసిద్దారెడ్డిలాంటి వారి ప్రభావమూ నా పైన కాస్తోకూస్తో ఉందనే భావిస్తున్నాను.
ఆస్కార్ వైల్డ్, గోర్కి, తుర్గినేవ్. టాల్ స్టాయ్, మామ్, మపాసా లాంటి ఆంగ్ల రచయితల రచనలు, శరత్, ఠాగూర్, ప్రేమ్ చంద్ లాంటి ఇండియా రచయితలు, శ్రీశ్రీ, తిలక్, శివారెడ్డి, సౌభాగ్య కవితలు, గురజాడ, శ్రీపాద, కేశవరెడ్డి,మునిపల్లె రాజు, రావిశాస్త్రి, రారా, కారా, కేతు, కె.సభా లాంటి వారి రచనలు నన్ను ప్రభావితం చేసినట్లే లెక్క.
నన్ను బాగా ప్రోత్సహించిన పత్రికలు ఆంధప్రభ, చతుర, విపుల, ఆంధ్రజ్యోతి సాహిత్య ప్రస్థానం పత్రికలు.
ఆస్కార్ వైల్డ్ - ది పిక్చర్ ఆఫ్ డొరియన్ గ్రే, చార్లెస్ డికెన్స్ - ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ , అలెక్స హెలీ – రూట్స్, టాల్ స్టాయ్ - అన్నాకెరినీనా. గోర్కి – అమ్మ, మిరియం ఆలీ – వితౌట్ మెర్సి, నాన్ కంగ్ పో - ది రివర్ ఫ్లోస్ ఈస్ట్ వంటి నవలలు శూద్రకవి మఋచ్చకటికం, గురజాడ కన్యాశుల్కం వంటి నాటకాలు గోపిచంద్ అసమర్థుని జీవయాత్ర బుచిచ్చ బాబు చివనకు మిగిలేది చలం మైదానం, సూరి చెంగీజ్ ఖాన్ , స్వామి శప్తభూమి వంటి నవలలు నాకిష్టం.
3. మీరు నిర్వహించిన కాలమ్ రచనలు?
నేను నాలుగు పత్రికల్లో శీర్షిక రచనలు చేశాను. ఆంధ్రభూమి దినపత్రికలో సంవత్సరం పాటు ‘మావూరి కతలు’ మాండలిక రచనలు చేశాను. దీనికి మంచి పేరొచ్చింది. తిరుపతి నుంచి వెలువడిన ‘కామధేను’ దినపత్రికలో రాయలసీమ నటరత్నాలు ‘కళాదీపిక’ పక్ష పత్రికలో ఒక వాక్య కవితలు వ్యాఖ్యానంతో ‘లో క్యూలు’ పేరుతోను కొన్ని సంవత్సరాలు నడిపాను. ఇందులోనే తెలుగు నాటక పద్యాలు శీర్షికను కూడా నడిపాను.
వాకాటి పాండురంగరావు ఎడిటర్‌గా వున్నప్పుడు ఆంధప్రభ వార పత్రికలో ‘ఇది తిరుపతి’ ఫోటోఫీచర్ నడిపాను. ఇది వారానికొకరు చొప్పున రాసిన శీర్షిక. ఒక వారం బాపు శ్రీరమణలు చెన్నపట్నం సమాచారం పేరుతో రాస్తే వీరాజీ ఒక వారం ‘బెజవాడ కబుర్లు’ రాస్తే మరొక వారం మిరియాల రామకృష్ణ ‘విశాఖపట్నం’ విశేషాలు రాసేవారు. వారి సరసన నేను ‘ఇది తిరుపతి’ నడపడం మరిచిపోలేని జ్ఞాపకం.
4. మీ నిర్ధేశికత్వంలో పరిశోధనలు?
నా నిర్ధేశకత్వంలో ఏడు ఎం.ఫిల్ పట్టాలు, రెండు పిహెచ్ .డి. పట్టాలు వచ్చాయి. శ్రీరమణ ‘మిథునం’ కథలపైన కేశవరెడ్డి ‘మునెమ్మ’ నవల పైనా, వల్లూరి నాటికలపైన, అక్కినేని కుటుంబరావు ‘పనివాడితనం’ కథలపైన మంచి ఎం.ఫిల్లు వచ్చాయి.
అలాగే శ్రీపతి కథలపైన యం నరసింహులు, తెలుగులో గిరిజన సంచార తెగల కథలపైన వై.మోహన్ మంచి థీసిస్ లు సమర్పించారు. ఈ రెండిండటికి మంచి పేరొచ్చింది. ఇంకా ఇద్దరు చేస్తున్నారు.
5. ఇప్పుడు రచయితల్లో బాగా నచ్చినవారు?
సింగమనేని, కేతు, బండి నారాయణస్వామి, శాంతి నారాయణ, వెంకటకృష్ణ, కాశీభట్ల వేణుగోపాల్, చింతకింది శ్రీనివాస్, అట్టాడ అప్పలనాయుడు, శిరంశెట్టి కాంతారావు, ఖాదీర్, సన్నపరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటి అభ్యుదయ రచయితలందరూ ఇష్టమే.
6. మీకు వచ్చిన అవార్డులు, రివార్డులు?
నాకు మొదట 1996 విశాలాంధ్ర వారి ఉత్తమ రచయిత పురస్కారం చాసో చేతుల మీదుగా తీసుకోవడం, ఆ తర్వాత చీకటి రాజ్యం నవలకి కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం, విమలా శాంతి పురస్కారం తీసుకున్నాను. ఆ తరువాత రెండు సార్లు అధికారభాషా పురస్కారం, రెండుసార్లు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, రెండు సార్లు కందూకూరి నాటిక పురస్కారం, ఇంకా ప్రైవేట్ సంస్థల నుంచీ ఎస్.గంగాప్ప పురస్కారం, మండలి వెంకటకృష్ణరావు పురస్కారం, శీశ్రీ, గురజాడల పురస్కారాలు వంటివి చెప్పుకోదగ్గవి. బతుకాట పుస్తకాన్ని తెలుగువిశ్వవిద్యలయంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరధ్వాజ చేతుల మీదుగా జరిగిన అవిష్కరణ మరిచిపోలేనిది. అట్లాగే బతుకాట నవలకు తానా పురస్కారం లభించింది. ఇక్కడ తానా వారి గురించి ఒక మాట చెప్పాల్సి ఉంది. సుమారు పాతికేళ్ళ నుంచి ఉత్తమ కథలతో కథా సిరీస్ తేవడం లక్షలలో నవలా పురస్కారాలు అందివ్వడం చాలా అరుదయిన విషయం. వారు పురస్కారం ఇచ్చిన నా నవల డిగ్రీ కి పాఠ్యాంశంగా ఉండడం , స్వామి వ్రాసిన శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఇటీవల వారి మెప్పు పొందిన సన్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి కొండ పొలం నవల సంచలనం కావడం జరిగింది. ఈ విధంగా వారి సాహిత్య సేవ ప్రశంసనీయమైంది.
7. మీరు చాలా సభలు, సమావేశాలు నిర్వహించారుకదా. వాటి గురించి?
నేను చిన్న వయసునుంచీ కొన్ని సంస్థలు నడుపుతూ డిగ్రీ స్థాయిలో వున్నప్పుడే నాటక సమాజాన్ని నడిపాను. ఆ తర్వాత తిరుపతి కేంద్రంగా సాహిత్య కళాపీఠం, నవకవితా మండలుల స్థాపనల్లో నేనూ ఒక్కణ్ణి. అలాగే ఉప్పల నరసింహం అధ్వర్యంలో సాగిన ‘కథావేదిక’ సంస్థకు రాయలసీమ విభాగానికి కార్యదర్శిగా వున్నాను. పోయిన శతాబ్ది చివరి దశకంలో యం సుభ్రమణ్యం యాదవ్, మాజీ యం ఎల్ ఎ తలరి మనోహర్ నేను కలిసి తిరుపతిలో జానపద కళాసమితి స్తపించడం జరిగింది. దీని ద్వారా అనేక సభలు సమావేశాలు జరిపాము. ముఖ్యంగా ఒక విశావిద్యలయం జరుపాల్సిన జథేఎయ సదస్సు లాంటిది ఒక జానపద సాహిత్య సదస్సు జరిపాం . అందులో బిరుదురాజు రామర్జు యస్ గంగప్ప జీ నాగయ్య సినీ దర్శకుడు బీరం మస్తాన్ రావు మేధావులెందరో పాల్గొని పాత్ర సంపర్పణలు చేయడం ఒక విశేషం. ఆ తర్వాత మధురాంతకం రాజారాం చనిపోతే విశాలాంధ్ర మేనేజర్ పి. రాజేశ్వర్‌రావు, భూమన్, సింగమనేనిలాంటి వారి ప్రోద్బలంతో మధురాంతకం రాజారాం సాహిత్యసంస్థను స్థాపించి దాని ద్వారా కథాకోకిల పురస్కారాలను, కథకులకు, విమర్శకులకు ఇస్తూ ప్రతి సంవత్సరం ఉత్తమ కథలతో కొనసాగిన ‘కథావార్షిక’ కు సహ సంపాదకుడిగా పది సంవత్సరాలు చాలా సేవ చేశాను. దీనిక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. ఇందులోనూ కష్టమొకరిది పేరు మరొకరిదిగా అయిపోయి రాజకీయాలకు కుట్రలకు గురై ఆ సంస్థ మూలన పడింది. వీటి ద్వారా కొన్ని వందల సభలు, సమావేశాలు నిర్వహించి విసగైపోయి ఇప్పుడు అన్నింటికి దూరంగా వున్నాను.
8. మీరు నిర్వహించిన సదస్సులు?
నేను 2011లో మా కళాశాల ఎస్వీ ఆర్ట కళాశాల తెలుగు విభాగం ద్వారా యు.జి.సి. వారి ఆర్థిక సహాయంతో ‘తెలుగుకథ - దళిత, బహుజన, మైనారిటి, గిరిజన జీవితాలు అన్న అంశంపైన మంచి సెమినార్ జరిపాను. ఈ సెమినార్లో రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి కీలకోపన్యాసం చేసారు. ఈ సెమినార్లో జయధీర్ తిరుమలరావు, స్వామి, వల్లూరు శివప్రసాద్ కొలకలూరి మధుజ్యోతి, టి భారతి, యం. విజయలక్ష్మి లాంటి గొప్పవాళ్లంతా పాల్గొన్నారు. ఆ వ్యాసాలతో పుస్తకాన్ని ముద్రిస్తే చాలా మంచి పేరొచ్చింది. కత్తిపద్మారావు, కా.రా. కేతు, విహారిలాంటి మేధావులంతా ప్రశంసించారు. కా.రా. గారు ఆ పుస్తకాన్ని, ముద్ర నవలను ఇరవై ఐదు కాపీలు చొప్పున డబ్బులిచ్చి మరీ కొని ఇంటికి వచ్చే అతిధులకు కాపీ బదులు వాటిని ఇచ్చినట్టుగా ఎన్. వేణుగోపాల్ కోసం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇలా ఎందరో మేధావులను ఆకర్షించిన పుస్తకాలివి..అలాగే అదే కళాశాలలో తెలుగు శాఖ తరపున 2016లో నా రచనలపై యు జి సి సెమినార్ జరిగింది. మేడిపల్లి రవికూమా ఈ సెమినార్ లో కీలకోపన్యాసం చేసారు.
9. మీ రచనల గురించి చెప్పండి?
నా రచనల గురించి చెప్పాలంటే చాలా అవుతుంది అయినా అడిగారు కాబట్టి సంక్షిప్తంగా చెప్తాను.
కమ్యూనిస్టు మేధావులు చెప్పినట్లు ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా సమసమాజ నిర్మాణం వస్తుందో రాదో గానీ నేను ఆ అభ్యుదయ దృక్పథంతోనే రచనలు చేస్తున్నాను. పైగా నాకు తెలిసిన జీవితాలనే తీసుకుని రచనలు చేశాను. ఆ కారణంగా నా రచనల్లో నేను చిత్రించిన చాలా పాత్రలు ఇంకా జీవించేవున్నాయి.
నేను కథలు, నవలలు, నాటకాలు, విమర్శనా గ్రంథాలు వంటివి చాలా ముద్రించాను. వాటిలో ఎనిమిది కథాసంపుటాలు మెరవణి, పయనం, ముల్లుగర్ర, మావూరి కథలు, మృత్యుక్రీడ, విషప్పురుగు, మెరవణి మరికొన్ని కథలు, శ్రీకృష్ణదేవరాయకథలు, నవలలు తొమ్మిది. అవి చీకటిరాజ్యం, మట్టిబతుకులు, బతుకాట, ముద్ర, చీకటిముడులు, పరస, వలస, ఏడోగ్రహం, వంకరగీత.
నాటకాలు నాలుగు. కాటమరాజు యుద్ధము, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ, చెంచిత, అజ్ఞానం.
నాటికలు ఆరు. స్వర్గానికి ఇంటర్వ్యూ, జలజూదం, నేలతీపి, దృష్టి, మనిషిపారిపోయాడు.
మూలకథలతో కథారూపకాలు అన్న పేరుతో నాటిక నాటక పుస్తకం కూడా వేశాను.
లోచూపు, వేడుకపాటలు, పనిపాటలు, అమరజీవి పొట్టిశ్రీరాములు, భారత వీరనారీమణులు, ప్రసిద్ధ తెలుగునాటక పద్యాలు, జానపదగేయాలలో పురాణాలు వంటివి విమర్శనా గ్రంథాలు. ఇవిగాక ఇంకా ఇరవై దాకా రేడియో నాటికలు, రెండు దూరదర్శన్ నాటికలు ప్రసారమైనాయి.
నా రచనలపైన హైదరాబాదు, నాగార్జున, ఆంధ్ర, ద్రవిడ, మద్రాసు, ఉస్మానియా, ఎస్వీ, పద్మావతి వంటి విశ్వవిద్యాలయాల్లో దాదాపు 20 మంది దాకా పరిశోధనలుచేసి ఎంఫిల్., పి.హెచ్డి పట్టాలు పొందారు.
నేను ఉద్యోగ విరమణ చేసినప్పుడు మిత్రులు ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి డా।।పి.సి. వెంకటేశ్వర్లు నా సాహిత్యంపైన 56 వ్యాసాలతో ‘రాసాని సాహిత్య సమాలోచన’ పేరుతో వేసిన పుస్తకం బాగా పేరు తెచ్చుకున్నది.
10. ఇతర భాషల్లోకి పోయిన మీ రచనలు?
నా మొదటి నవల ‘చీకటిరాజ్యం’ ను ఇన్ ద రెజిమ్ ఆఫ్ డార్కనెస్ పేరుతో ఆచార్య తుమ్మపూడి భారతిగారు ఆంగ్లంలోకి అనువాదం చేస్తే ద్రవిడ విశ్వవిద్యాలయం వారు ముద్రించారు.
ముద్ర నవల మూడు భాషల్లో అనువాదమైంది. కన్నడ, హిందీ, ఉర్దూ భాషల్లోకి, ఆచార్య రాజన్న తగ్గి (కన్నడం) డా।। ఆర్.బి. వాణిశ్రీ (హిందీ), డా।। ఎస్. హసీనాబేగం (ఉర్దూ) గారు అనువాదం చేశారు. అలాగే ఆంధప్రదేశ్‌లోని డిగ్రీ మొదటి సంవత్సరానికి పాఠ్యంశంగా వున్న ‘బతుకాట’ నవలను రాజన్న తగ్గి ‘బణ్ణద బతుకు’ పేరుతో కన్నడంలోకి అనువాదం చేశారు. దీన్ని ద్రవిడ విశ్వవిద్యాలయం వారు ముద్రంచి అనువాద శాఖలో పాఠ్యాంశంగా కూడా పెట్టారు. అలాగే తగ్గి, కస్తూరి, కుం.వి లాంటి వారు నా కథలను కన్నడంలోకి అనువదించారు.
తరిగొండ వెంగమాంబ నాటకం, వలస నవల కూడ కన్నడంలోకి తర్జమా చేయబడినాయి. తరిగొండ వెంగమాంబ నాటకాన్ని వై.సి.పి. వెంకట్‌రెడ్డి హిందీలోకి అనువాదం చేసి జాతీయ స్థాయి పురస్కారాన్ని కూడా పొందారు. అలాగే అమెరికా వాసియైన డి కృష్ణ మూర్తి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల శాఖ అధ్యక్షురాలైన ఆచార్య టి భారతీగారు కొన్ని కథలను ఆంగ్లంలోకి అనువదించారు.
11. మీరు నటులు కూడా అని విన్నాము దాని గురించి కూడా?
నేను చిన్నప్పటి నుంచీ నాటకాలు వేశాను. 1978నుంచీ వెంకటరమణా ఫైనార్టస్ అసోసియేషన్ అన్న నాటక సమాజాన్ని స్థాపించి దాదాపు 70 - 80 నాటకాలను ప్రదర్శించిన అనుభవం వుంది. ఎన్నో సార్లుఉత్తమ నాటకరచయితగా, ఉత్తమ నటుడిగా, ఉత్తమ ప్రతినాయకుడు, గుణ నటుడిగా, హాస్యనటుడిగా బహుమతులందుకున్నాను. ఈ అనుభవంతోనే 2012లో అప్పటి సమైక్యాంధ్ర నిర్వహించిన సినిమా ‘నందిఅవార్డ్సు’ కమిటీలోను న్యాయనిర్ణేతగా ఉన్నాను. అలాగే రెండు సార్లు నంది నాటక పోటీలకు, మూడుసార్లు టి.టి.డి. వారి గరుడ నాటక పోటీలకు, మరికొన్ని జాతీయ స్థాయి నాటక పోటీలకు న్యాయనిర్ణేతగా కూడా వున్నాను.
‘స్వర్గానికి ఇంటర్వ్యూ’ అనే హాస్య, వ్యంగ్య నాటిక వందసార్లకుపైగా ప్రదర్శింపబడింది. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నాటకాన్ని టి.టి.డి. ద్వారా సురభి కళాకారులు 100సార్లకు పైగానే ప్రదర్శించారు. ఆ తర్వాతనే ఆమె గురించి అందరికి తెలిసింది.
12. మీ మొదటి రచన ఏది? ఏ సందర్భంలో నుండీ వచ్చింది?
నేను నాలుగో క్లాసులోనో, ఐదో క్లాసులోనో ఉన్నప్పుడునుకుంటా. మా వూరిలో మేజారి గోవిందయ్య అనే టైలర్ రాత్రివేళ మా వూరి విద్యార్ధులకు ఉచితంగా ట్యూషన్ చెప్పేవాడు. ఆయన ఒకసారి 8వ తరగతి విద్యార్ధులకు ఛందస్సు చెబుతూ ఒక రోజు కందపద్యం గురించి, దాని లక్షణాల గురించి చెప్పి మీరు ప్రయత్నించి ఒకటి రాసి చూపించండి అన్నారు. నేను అంతవరకూ ఏకాగ్రతతో ఆ లక్షణాలు విన్నాను. పది నిమిషాల తర్వాత పలకలో ఒక పద్యం రాసి ఆయనకు చూపించాను. ఆ పద్యం ఇప్పటికి గుర్తుంది.
శ్రీరామాయన్నంతనె
ఓరామా నొసగితౌర మోక్ష పదంబుల్
శ్రీరామా నిన్ను దలతు
నోరామానన్ను బ్రోవు మోరఘరామా!
ఇది నా తొలి రచన. ఆ తర్వాత ఇంతకు ముందు చెప్పినట్లు హైస్కూలుకు వచ్చింతర్వాత హిందీ టీచర్ ఎ.జి. యతిరాజులు సారు ద్వారా కవితలు రాయడం, నవలలు రాయడం ప్రారంభించాను. 8వ తరగతిలో పాత తెలుగు సినిమా లాంటి నవల ‘రాధా మాధవీయం’ అనేది రాశాను. ఆ తర్వాత ఒక కుష్ఠిరోగి గురించి ‘ఇది కథకాదు’ అనే నవలని, అలాగే డిగ్రీ మొదటి సంవత్సరంలో మరో నవల రాశాను. అవి ప్రింటింగ్ చేసే స్థాయిలో లేవు. దాని తర్వాత ఎం.ఏ. మొదటి సంవత్సరంలో వున్నప్పుడునుకుంటాను విజయవాడ పున్నమ్మతోట వీధిలోని ‘సాహితీకల్పన’ అనే సంస్థ నిర్వహించిన కథల పోటీకి ‘మధురక్షణం’ అనే కథరాసి పంపితే సాధారణ ప్రచురణకు ఎన్నికైంది. అదే నా మొదటి అచ్ఛయిన కథ. ఆ తర్వాత నాటకాలు వేసుకుంటూ మరికొన్ని కుటుంబ సమస్యలతో కథలు రాయలేదు. ఆ తర్వాత 1988లో ‘నేలరాలిన వసంతం’ కథతో తిరిగి కథా సాహిత్యంలోకి వచ్చాను. అ విధంగా ప్రారంభించి ఇప్పటి వరకు 150కి పైగా కథలు రాశాను.
13. ముద్ర నవల నేపథ్యం ఏమిటి?
చిత్తూరు జిలాల్లో ఆ మాటకొస్తే దక్షిణాదిలో చాలా రాష్ట్రాలలో అణగారిన కుటుంబాలలో కొన్ని మూఢాచారాలతో, మూఢ నమ్మకాలతో ఆడపిల్లల్ని ‘బసివిని’ పేరుతో ముద్రేసి వదిలేస్తారు. అలాంటి స్త్రీలు వాడకంతా వదినలుగా మారి కొంగుపట్టుకున్న ప్రతివాడితో పడుకొని చివరన చాలా దినావస్థలో చనిపోతుంటారు. అలాంటి వారిని కోస్తాలో ‘మాతంగి’ అనీ, తెలంగాణలో ‘జోగిని’ అనీ, కర్ణటకలో ‘జోగిత’ ‘దేవదాసీ’, ఒడిస్సాలోను దేవదాసి అని, తమిళంలో మరో పేరుతో పిలుస్తారు. మా పక్క వూరిలో మాదిగ కులంలో ఇలాంటి ఆచారం ఎక్కువగా వుంది. చిత్తూరు జిల్లాలో మరీ ఎక్కువ. అలాంటి వారిపైన రాయాలని రాశాను. ఇది చిత్తూరులో 1998 ప్రాంతంలో ముద్రితమై సంచలనం రేపింది. ఆ పుస్తకం చదివి తిరుపతిలో కోర్టు జడ్జి ఒకాయన జిల్లా అధికారులతో మహతిలో బసివినిలను పిలిపించి వేల మంది బసివినులకు పునరావాసం కల్పించాలని నిర్ణయించి,తిరుపతిలోని రాజీవ్‌నగర్‌లో కొన్ని వందల ఇండ్లు కట్టించి ఇచ్చారు. ఇప్పటికీ ‘మాతమ్మల’ కాలనీ పేరుతో ఆ కాలనీ వుంది. ఈ నవల చాలా భాషల్లోకి అనువాదం కూడా అయింది. ఉర్దూ, హిందీ, కన్నడ భాషల్లోకి అనువాదమైంది. కన్నడంలో అయితే ఆరునెలల్లోనే ద్వితీయ ముద్రణ కూడా అయింది.
14. తిరుపతిలో సాహిత్య వాతావరణం ఎలా వుండేది? ఆ వాతావరణం మీలో తీసుకొచ్చిన మార్పులు ఏమిటి?
ఒకప్పుడు చాలా బాగుండేది. పోయిన శతాబ్ధంలో సప్తదశకం ఉత్తరార్థంలో ఉద్యమాలు బాగుండేవి. ఎస్.ఫ్.ఐ., ఎ.ఐ.ఎస్.ఫ్, ఆర్. ఎస్.యు. లాంటి అభ్యుదయ సంస్థలు ముందుండి ఉద్యమాలు నడిపేవి. అప్పటి ఉద్యమాలకు మూల చైతన్యంగా త్రిపురనేని మధుసుధనరావు గారు, భూమన్ గారు నిలిచేవారు. ఆ రోజుల్లో వీరిద్దరి ఉపాన్యాసాలు వినడానికి సినిమా యాక్టర్‌ని చూడడానికి జనాలు ఎలా ఎగబడుతారో అలా ఎగబడి వచ్చేవారు. కొన్ని తరాలను ఆ విధంగా వారు ప్రభావితం చేశారు. రాను, రాను ప్రత్యేక ఉద్యమాలు తగ్గిపోయాయి. అయినా త్రిపురనేని చనిపోయేవరకూ మార్క్సిస్టు నిబద్దతతోనే వున్నారు. నా ‘‘చీకటి రాజ్యం’’ నవల ఒక గ్రామంలో రేగిన తెలంగాణ ఉద్యమం లాంటి తిరుగుబాటును చిత్రించిన నవల అనీ చాలా మీటింగులల్లో చెప్పే వారు. ఇప్పుడు ఆయన పోయినా ఇంకా ఇలాంటి చైతన్యాన్ని కొందరిలోనైనా కలిగించాలన్న తపన భూమన్ గారికి ఉంది.
ఇలాంటి సంస్థల్లో తిరగడం ద్వారాను, ఇలాంటి వ్యక్తుల అభిమానాన్ని చూరగొనడం వల్లనూ, నాలో శాశ్వతంగా అభ్యుదయ భావాలు స్థిరపడ్డాయి.
15. మధురాంతకం రాజారాం ప్రభావం మీ మీద ఉందంటారు. అది ఎంత వరకు నిజం?
రచనా పరంగా మధురాంతకం రాజారాం ప్రభావం నా పైన ఉందని నేను అనుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే ఏ ఇతర రచయితల ప్రభావానికీ నేను లోనయ్యానని భావించడం లేదు గానీ వారి రచనలు మాత్రం బాగా చదువుకున్నాను. అటాంటి వారు మరికొందరి ద్వారా నే నే దారిలో సాహిత్యపరంగా నడవాలన్నదీ, ఎవరి పక్షాన నా రచనలు ఉండాలన్నదీ మాత్రం నేర్చుకున్నాను. నిజానికి నావి పదైదు, ఇరవై కథలు ప్రింటైన తర్వాతగానీ రాజారాం లేదా ఇతర రచయితలతో నాకు పరిచయం బహిరంగంగా కలుగలేదు. నాకు ఫీలింగ్ వుండేది నేను పల్లెనుంచీ వచ్చినోన్ని అనే భావన. పైగా ఫ్రీగా ప్రవర్తించలేని మనస్తత్వం, షై వుండేది. న్యూనతా భావం వుండేది. ఆ కారణంగా మొదట నాకు ఎవరితోనూ పరిచయాలు లేవు.
రాజారాం ఆంధప్రభలో నా మెరవణి కథచదివి అప్పటి ఎడిటర్ వాకాటి పాండురంగారావు దగ్గర నా అడ్రస్ తీసుకొని మా తెలుగు డిపార్ట్మెంటుకు వెతుక్కుంటూ వచ్చారు. ఆ తర్వాత కాత్యాయనీ విద్మహే మేడం గారి తండ్రి రామకోటి శాస్త్రి గారు మా యింటికి నాకు కొత్తగా పెళ్ళయిన సంవత్సరం వచ్చి ‘నీ కథలు బాగున్నాయి. మీ మామగారు నాకు చాలా సన్నిహితుడు. నాకు సొంత తమ్ముడిలాంటి వాడు. అని చెప్పి ఆశీర్వదించి పోయారు. అలాగే కా.రా. మాష్టారూ, మునిపల్లి రాజుగారూ, అబ్బూరి ఛాయాదేవి, కేశవరెడ్డి, సింగమనేని, స్వామి, శాంతినారాయణ, విశాలాంధ్ర మేనేజర్ పి రాజేశ్వరరావు, చాసో, వల్లంపాటి వంటి వారు మా ఇంటికి వచ్చేవారు. కేతుమేష్టారు నాకు గురువు. మా మామగారి కొలీగ్ కావడంతో చాలా అభిమానంతో మా యింటికి వచ్చేవారు. ఆ విధంగానే ఇంకా చాలా మంది రావడంతోనూ, పరిచయాలు ఏర్పడడంతోనూ నాలోవున్న న్యూనతాభావమూ, షై తగ్గాయి.
కాకపోతే రాజారాం గారి అబ్బాయి తిరుపతిలో వుండడంతో తిరుపతికి వచ్చినప్పుడల్లా మా యింటికి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడే వారు. నేనంటే వారికి చాలా ప్రేమ ఏర్పడింది. నాతో ఎన్నో ఆంతరంగిక విషయాలు చెప్పుకునేవారు. అలా వారు నాకు సన్నిహితులే గాని వారి రచనల ప్రభావం నా పైన లేదు.
16. రాయలసీమ సాహిత్య ప్రత్యేకత ఏమిటి?
మొదటి నుంచీ రాయలసీమ కరువులతో ఒక వైపు కక్షలతో మరోవైపు అల్లాడుతూనే వుంది. దీన్ని గురించి పట్టించుకునే ప్రభుత్వాలేరాలేదు. రాయలసీమ నుంచీ ఎక్కువ మంది ముఖ్యమంత్రులయినా దీన్ని గురించి పట్టించుకోక పోవడం దురదృష్టం, మొదటి నుంచీ కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లా రాజకీయ నాయకుల అధిపత్యం మూలంగా అటు తెలంగాణా ఇటు రాయలసీమ, ఉత్తరాంధప్రాంతాలు వివక్షకు గురవుతూనే వచ్చాయి. కారణం అవి సంపన్న జిల్లాలు. మిగిలినవి పేదప్రాంతాలు ఉన్న వాళ్ళకి ఊడిగం చేసే ప్రభుత్వాలే ఎప్పుడూ వుంటాయి. ఆ కారణంగా తెంలంగాణా వేరు పడింది. రాయలసీమ ఎప్పుడో ఒకప్పుడు వేరు పడుతుంది. ఆ తరువాత ఉత్తరాంధ్రలోనూ చలనం వస్తుంది - గ్యారంటీ.
ఈ కారణాలవల్లనే ఈ ప్రాంతాలలో ఉనికి కోసం ఆరాటం కనిపించే సాహిత్యమే వచ్చింది. రాయలసీమలోనూ అంతే. ఈ ప్రాంతపు కథ అయినా, నవలయినా, కవిత్వమైనా ఇక్కడి జనాల బాధల్ని చిత్రీకరించి, రాయలసీమ ఉనికిని కాపాడుకోవాలన్న దృక్పథాన్నే వెలువరుస్తోంది.
17. ఇప్పుడు వెలువడుతున్న తెలుగు సాహిత్యాన్ని మీరెలా చూస్తారు?
ఇప్పుడు వస్తున్న సాహిత్యం తీవ్రత లేదా గాఢత తగ్గింది. కారణం రాసేవాళ్లకి తీరికలేదు. చదివే ఒపిక లేదు. కాబట్టి అధ్యయనం లోపించింది. అయినా స్వామి, శాంతికారాయణ, అట్టాడ అప్పలనాయుడు, సన్నపరెడ్డి వెంకట్రామిరెడ్డి, శిరంశెట్టి కాంతారావు, మల్లిపురం జగదీష్ లాంటివారు మంచి సాహిత్యాన్ని పుట్టిస్తున్నారు. ఆ కారణంగా కొంచెం ఆశాజనకంగానే వుంది. అయితే వారుగాక ఇప్పుడు రాస్తున్న వారిలో మాత్రం సామాజిక నిబద్ధత కరవైందనిపిస్తోంది.
18. ఇప్పటి సాహిత్య విమర్శను ఎలా చూడాలంటారు?
విమర్శ అంటే మంచిని పొగడడమే కాదు. రచనలోని లోపాలను చూపించి విశ్లేషించగలిగితే దాని వల్ల ఆ రచయితకీ, ఇతర సాహితీకారులకు మేలుజరుగుతుంది. అలాంటి విమర్శ రా.రా, చే.రా, లాంటి వారితోనే పోయింది. ఇప్పుడు రాచపాళెంగారు సాగిస్తున్న సాహిత్యవిమర్శ మెచ్చుకోలుగా వుంది. మిగిలినవాళ్లు వాళ్ళ మిత్రుల సాహిత్యంపైన, లేదా తమ వర్గంలోని వ్యక్తుల సృజనపైన పొగుడుతూ విమర్శానాగ్రంథాలు రాస్తున్నారు. దురదృష్టవశాత్తు సృజనకారులు తక్కువైనా వర్గాలు ఎక్కువ చేసుకున్నారు. తమవర్గం కాని వారు ఎంత మంచి రచన చేసినా కనీసం దాన్ని చదవడంలేదు. అవార్డులు రివార్డుల విషయంలోనూ ఈ వర్గాలు బలమైపోతున్నాయి. అదొక దురదృష్టం. ఇప్పుడొస్తున్న పురస్కారాలన్నీ అలాంటివే మరి.
19. సాహిత్యంద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనా?
తప్పకుండా సాధ్యమే. మంచి సాహిత్యం మంచి సమాజాన్ని నిర్మిస్తుంది అని నమ్మేవాళ్లల్లో నేనూ ఒకన్ని మంచి సాహిత్యం పఠితకు హృదయ సంస్కారాన్ని, సమాజం పట్ల అవగాహనని ఏర్పరుస్తుంది. మంచి పౌరుడిగా, మానవత్వంవున్న మనిషిగా మనిషిని తీర్చిదిద్దేది సాహిత్యమే. చూడండి ఒక ప్రదేశానికి పోయి చెడిపోయినవాన్ని చూస్తాం. చెడు స్నేహాలు చేసి చెడిపోయిన వాన్ని చూస్తాం. సినిమాలు చూసి చెడిపోయిన వాన్ని చూస్తున్నాం కానీ పుస్తకం చదివి చెడిపోయిన వాన్ని ఒక్కడంటే ఒక్కన్ని కూడా చూడలేం. అలాంటిది సాహిత్యం. అయితే నేడు బుక్ కల్చర్పోయి లుక్ కల్చర్ వచ్చేసింది. ప్రపంచీకరణ భూతం మనుషుల్లోని మానవత్వాన్ని మింగేసింది. అలాగే నేటి అంతర్జాలం పుణ్యమాని పూర్తిగా, అది తన ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చింది. వాట్సాప్‌లు, ముఖపుస్తకాలు, ట్విట్టర్లు అంతా గందరగోళం. మనషుల్లో సోమరి తనాన్ని, కళ్ళజబ్బుల్ని, మానసిక అనారోగ్యాన్ని ఇవి కలిగిస్తున్నాయి. మళ్ళీ వీళ్ళని పుస్తకం వైపు మళ్ళిస్తే గాని ఆరోగ్యకరమైన సమాజాన్ని ఊహించడం కష్టమే.
20. సాహిత్య జీవితం మీకు ఎలాంటి తృప్తినిచ్చింది?
నేను నా మేధస్సు అనుమతించిన మేరకు మంచి సాహిత్యాన్ని అందించాననుకుంటున్నాను. కానీ సాహిత్య జీవితం కాస్తా మంచిగానే వున్నా నాకింకా సంతృప్తి కలుగలేదు. చాలా సమస్యలపైన, జీవితంపైనా విభిన్నకోణాలలో సాహిత్యన్ని సృష్టించాలని ఉంది. సమాజంలో కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు అంతరించే వరకు ఇంకా రాయాలనే ఉంది. అలా రాసనప్పుడే నాకు సంతృప్తి.
దురదృష్టం ఏమిటంటే నా సాహిత్య జీవితంలోను కొన్ని ఎదురుదెబ్బలు, అవమానాలు, వివక్షతలు కూడా ఎదుర్కొన్నాను.
21 మీ సాహిత్యసేవను ఎలా చూడాలంటారు?
మంచిగా చూస్తే చాలు.
22. సాహిత్య విమర్శలో మీ రచనలు?
నేను ముందే చెప్పాను. లోచూపు పుస్తకంలో మాత్రం లోతైన విమర్శనా వ్యాసాలు వున్నాయి. మిగితావి పరిశోధనలు మాత్రమే.
అయితే తెలుగులో ఇప్పటికీ సరైన విమర్శ రాలేదనే నా భావన. అలాంటి సరైన విమర్శ అనిపించుకోవాలనే ఆ విషయాలు రాశాను.
23. తెలుగు నాటక చరిత్రలో మీ భాగస్వామ్యం? అవార్డుల ఎన్నికల్లో మీ పాత్ర?
నాటక సాహిత్య చరిత్రలోనూ నాకూ ఒక పుట వుండే విధంగానే రాశాననిపిస్తోంది. తరిగొండ వెంగమాంబ నాటకం, కాటమరాజు యద్ధం , చెంచిత పద్యనాటకాలు చాలా సార్లు ప్రదర్శించి మెప్పును పొందాను. అలాగే నా రేడియో నాటకాలు ఎన్.ఆర్. నంది, పి.వి రమణ లాంటి వారి ప్రశంసల్ని అందుకున్నాయి.
నేను రాసి ప్రదర్శించిన ‘నరమేధం’ నాటకం గత శతాబ్ది చివరి దశకంలో సంచలనమైన నాటకంగా పేరుతెచ్చుకుంది. ఇటీవల రాసిన ‘ప్రసిద్ద తెలుగు నాటకపద్యాలు’ అన్న పరిశోధనాగ్రంధం నాటకసాహిత్యంలో శాశ్వతంగా నిలబడిపోయేదే.
ఇక అవార్డుల విషయానికొస్తే నేను దేనికి న్యాయనిర్ణీతగా వెళ్ళినా లోపాలను, గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషణాత్మకంగా రాసిపెడతాను. ఆ కారణంగా నా న్యాయనిర్ణయం బాగానే వుంటుందని అంటారు. నా న్యాయనిర్ణయంలో పక్షపాతం, పైరవీ తత్వం ఏమీ వుండవు.... పెద్దపెద్దవాళ్ళే ఫోన్లు చేసి రికమెండషన్ చేస్తారు. వత్తిడి తెస్తారు. గానీ నేను ఏనాడు వత్తిళ్ళకు లొంగలేదు. నా సెలక్షన్ బాగానే వుంటుందన్న పేరు తెచ్చుకున్నాను. సాహిత్య పురస్కారాల విషయంలోను అంతే అది చాలు.
24. మీరు వ్రాసిన పాఠ్యాంశాల గురించి చెప్పండి
1990 లో విష్ణుశ్రీ వ్రాసిన జాణ పదాలు అనే పుస్తకానికి నేనే ముందుమాట వ్రాసి తిరుపతిలో అప్పుడు తెలుగు విశ్వవిద్యాలయానికి వి సి గా ఉన్న సినారె చేత అవిష్కరింప చేశాను. అందులో నా ముందు మాట చదివిన సినారె నా చేత బి ఎ డిగ్రీ రెండవ సంవత్సరినికి జానపద ప్రదర్శన కళలు అన్న పేపర్ కు విధి నాటకాలు అడే పద్దతి, విధి నాటకాల నిర్మాణం – పాడే పద్దతి అనే రెండు పాఠ్యాంశాలు వ్రాయించారు.
బతుకాట నవల ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరు సంవత్సరాలుగా డిగ్రీ మొదటి సంవత్సరినికి పాఠ్యాంశంగా పెట్టారు. అలాగే కొన్ని అటానమస్ కళాశాలల్లో ముద్ర నవల పాఠ్యాంశంగా ఉంది. కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో పి జి విద్యార్ధులకు కొంత కాలం ‘చీకటి ముడులు’, ‘పరస’ నవలలు పాఠ్యాంశంగా ఉండేవి . ప్రస్తుతం రాయలసేమ విశ్వా విద్యాలయంలో పి జి విద్యార్థులుకూ ‘వలస’ నవల పాఠ్యాంశంగా ఉంది .
25. సాహితీవేత్తలకు, గోదావారి అంతర్జాల పత్రిక ద్వారా మాకేం చెప్పదలుచుకున్నారు?
ఇప్పటి సాహితీకారులు ఒకరి చెబితే వినే స్థాయిలో వుంటారనుకోవడం అనుమానమే. రచయితలకి, కవులకు ఇగోలు ఎక్కువైపోయాయి. ఈ ఇగోలు పోయేంతవరకు వాళ్లు చెబితే వింటారనుకోను. అయినా ఎక్కువ చదివి తక్కువ రాయడం పటిష్టంగా ప్రయోజనకరంగా రాయాలి. రాశికాదు వాసి వుండేటిగా చూసుకోవాలి. మన చుట్టూ ఉన్న కష్టాల గురించి రాయండి అని మాత్రం చెప్పగలను. వర్గాలకి దూరంగా వుండాలని కూడా చెప్పాలనిపిస్తోంది.
అనగనగా ఓ జ్యోతిష్కుడు
సరిగ్గా మధ్యాహ్నం సమయానికి, అతడు తన మూటను విప్పి వృత్తిపరమైన వస్తువులను పరచాడు. అందులో, పన్నెడు గవ్వలు, ఓ నోటు బుక్కు మరియు వింతైన నమూనా చిత్రములు గీసివున్న ఓ గుడ్డ ముక్క, ఓ తాళపత్రములకట్ట వున్నాయి. అతని నుదురు పవిత్రమైన విబూది మరియు కుంకుమ పూతల తో వెలిగిపోతుంది. అతని కళ్ళు కస్టమర్లకొరకు వెతుకులాట ప్రయత్నం లో కలిగిన ఆతురతతో ప్రకాశించునున్నాయి. కానీ అమాయకులైన కస్టమర్లు దాన్ని అతని లోని ఓ దివ్య శక్తిగా భావించి ఆనంద పడతారు. రంగులద్దిన నుదురు మరియు పొడుగాటి నల్లని చెంపల జుట్టు మధ్యలో అమర్చినట్లున్నఅతని కళ్ల మహత్వము మరింత పెరగడానికి అతడు వాటిని పలువిధాలుగా తిప్పుతాడు. ఇటువంటి స్థితి లో ఓ పిచ్చివాడి కళ్ళు కూడా చమక్కు మంటాయి. అన్నింటికి మించి, అతడు కాషాయపు గుడ్డను తల పాగా చుట్టు కొన్నాడు. తన అలంకరణలో ఈ రంగులక్రమాన్నిఅతడెప్పుడు తప్పలేదు. దహిలియా కాండాలను లేదా కాస్మోస్ ను ముసురుకున్న ఈగల వలె, కస్టమర్లు అతని కి ఆకర్షితులవుతారు. టౌన్ హాలుకు వెళ్లే దారికి ఓ వైపునున్న విశాల మైన చింత చెట్టు కొమ్మ నీడలో అతడు కూర్చున్నాడు. అది అన్నిరకములుగా అనుకూలమైన స్థలము. ఆ ఇరుకైన మార్గము వెంట వివిధ రకాల వ్యాపారా లకు సంబంధించిన దుఖాణాలు ఉండడం వలన అక్కడ ఎప్పుడు జనముతో రద్దీగా ఉంటుంది. మందులు అమ్మేవారు, దొంగిలించిన వస్తువులు అమ్మేవారు మరియు ఓ పాతబట్టల వేలందారు రోజంతా జనాన్ని ఆకర్శించడానికి పెట్టే కేకలతో ఆ చుట్టుపక్కలు కోలాహలంగా ఉంటుంది. అతని పక్కనే ఒకరు పల్లీలు అమ్మేవాడున్నాడు అతను పెద్ద గొంతుతో పల్లీలను రోజుకో వింతైన పేరుతో పిలుస్తూ జనాన్ని ఆకర్షిస్తూ వున్నాడు. ఓ రోజు బాంబే ఐస్ క్రీము , మరో రోజు ఢిల్లీ ఆల్మండ్ ఇంకొక రోజు రాజా'స్ డెలికేసి అంటూ తన వ్యాపారాన్ని కసితో కొనసాగిస్తున్నాడు. ఎప్పుడూ చూసిన, జనం అతని చుట్టూ గుమిగూడి వుంటారు. పల్లీలకోసము వచ్చే వారు చాలామంది జ్యోతిష్కుని ముందునుంచే పోతూంటన్నారు. జ్యోతిష్కుడు ఆ పక్క కాలుతున్న పల్లీల కుంపటి వెలుగులో తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. కొంత వరకు మున్సిపాలిటీ దీపాల సౌకర్యము లేకపోవడం వలన ఆ ప్రాంతం ఓ రకమైన మార్మిక రూపును సంతరించుకొంది.
దుఖాణములోని లైట్లు , ఒకటి రెండు లాంతర్లు, అక్కడక్కడ కాగడాలు మరియు పాత సైకిలు డైనమోలు ఆ ప్రదేశాన్ని వెలుతురుతో నింపాయి. కొందరు జ్యోతిష్కునివలె ఎటువంటి దీపాలు లేకుండానే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నలు వైపుల నుండి వచ్చే కాంతిపుంజాల మెలికలతో అదొక వింత ప్రదేశములా కనిపిస్తుంది. ఇటువంటి వాతావరణము జ్యోతిష్కునికి బాగాకలిసివచ్చింది, ఎందుకంటే అతడు ఈ వృత్తి చేపడతాడని ఎప్పుడు అనుకోలేదు. అదియునుగాక ఇతరులకు ఏమి జరుగుతుందో తెలియడం కన్నా, , ముందు తనకు ఎప్పుడేమి జరుగుతుందో అసలు తెలియని స్థితి. అమాయకులైన తన కస్టమర్ల వలె తనకు కూడా తారాబలము గురించి తెలియదు. కానీ తను చెప్పే విషయాలు ప్రతివాడిని సంబ్రమాశ్చర్యానికి గురిచేసేవి. అదంతా తన ఉజ్జాయింపు మరియు కాస్త లోకజ్ఞానం తో సాధ్యమైన దే. ఏది ఏమైనా అతనుచేసే వృత్తి ఓ నిజాయితి పరుడి పనివంటిదే. సాయంకాలానికి ఇంటికి తీసుకుపోయే డబ్బుకు అతడు ఆర్హుడే.
అతడు ఎటువంటి ఆలోచన చేయకుండానే తన ఊరి నుండి వచ్చేసాడు. ఒకవేళ అక్కడే వుండి ఉంటే తన పూర్వీకులవలె వ్యవసాయము చేస్తూ పెళ్లి చేసుకొని ముసలి వాడయ్యే వరకు ఆ పాతకాలపు ఇంటిలో జీవనము సాగించేవాడు. కానీ అదిజరుగేది కాదు. అతడు ఎవరికీ చెప్పకుండానే ఇల్లువిడిచి దాదాపు రెండు వందల మైళ్ళు దూరం చేరేవరకు విశ్రమించలేదు. ఓ గ్రామస్థునికి ఈ దూరం అతి పెద్దది. తనకు తన ఊరికి మధ్య ఓ మహాసముద్రము పరచబడినట్లు వుంది!
మనుషులు సాధారనంగా జీవితంలో ఎదుర్కొనే సమస్యలు - పెళ్లి, డబ్బు మరియు మానవ సంబంధాల చిక్కుముడులు గూర్చి అతనికి అనుభవపూర్వ జ్ఞానముంది. బహుకాల అభ్యసనము వలన అతని అర్థము చేసుకునే శక్తి మరింత పదునెక్కింది. కేవలముఐదు నిమిషాల్లోనే సమస్య ఏంటో అతనికి బోధపడుతుంది. ప్రతి ప్రశ్నకు అతడు మూడు నయా పైసలు తీసుకొంటాడు. తన దగ్గరికొచ్చిన వ్యక్తి కనీసం పది నిముషాలు మాట్లాడేవరకు తాను నోరు విప్పుడు. ఆ సమయం లోనే తనకు ఓ పన్నెండు సమాధానాలకు సరిపడే సమాచారం లభ్యమౌతుంది. ఎప్పుడైతే ఎదుటివాని చెయ్యి తదేకంగా చూస్తూ " అన్నివిషయాలల్లో నీవు నీ శ్రమకు దగ్గట్టుగా ఫలితము పొందలేక పోతున్నావు" అని అతడు చెప్పినప్పుడు, పదిమందిలో తొమ్మండుగురు నిజమేనని వొప్పు కొంటారు. "మీ కుటుంబములో నీవంటే ఇష్టపడని స్త్రీ ఎవరైనా ఉన్నారా?" అని అతడు ఓ ప్రశ్న ను సందించేవాడు. లేక అతడు ఎదుటి వ్యక్తి యొక్క గుణ గణాలను పరిశీలన చేస్తూ, "నీ సమస్యలకు నీ వ్యక్తిత్వమే కారణమూ. శని ఆధిపత్య కారణంగా నీ స్థితి ఇంకొక విధంగా ఉండడానికి వీలులేదు.” "నీకు కాస్త దూకుడెక్కువ, నీవు పైకి కఠువుగా కనిపిస్తావు " అంటూ చెప్పుకుంటూ పోతాడు. అతని ధోరణి జనానికి బాగా నచ్చుతుంది. పల్లీల వాడు మంటనార్పి పోవడానికి సిద్ధమైనాడు. తన వ్యాపారాన్ని కూడా ఆపాలని జ్యోతిష్కునికి ఇదొక సంకేతము. ఎందుకంటే పల్లీలు అమ్మేవాడు వెళ్ళిపోతే దూరము నుండి వచ్చే వెలుతురు కిరణము తప్ప మొత్తము చీకటే. ఆ వెలుతురు కూడా తనకు కొద్దీ దూరములో ఆగిపోతుంది. గవ్వలు మరియు ఇతర వస్తువులను సంచిలో సర్దుతున్నపుడు వెలుతురు కు ఎవరో అడ్డంగా వచ్చారు. తలెత్తి చూసే సరికి తన ఎదురుగా ఓ వ్యక్తి నిలబడి వున్నాడు. మరొక బేరము దక్కిందని తలచి, "నీవు దుఃఖంలో ఉన్నట్లు గా కనిపిస్తున్నావు. ఇలా కూర్చోని నాకు చెప్పు నీకు ఉపశమనం దొరుకుతుంది" అన్నాడు జ్యోతిష్కుడు. ఎదురుగావున్నతను ఎదో నసిగాడు. తనకు చెప్పుమని జ్యోతిష్కుడు అతన్ని మరోమారు అడిగాడు. వెంటనే ఆ కొత్త వ్యక్తి తన హస్తాన్ని జ్యోతిష్కుని ముక్కు దగ్గర పెట్టి, " నిన్ను నీవు జ్యోతిష్కుడవని అనుకుంటున్నావా?" అని అన్నాడు. జ్యోతిష్కుడు దానిని ఓ ఛాలెంజ్ భావించి , అతని చెయ్యిని వడి పెడుతూ ఒంటరి కాంతి కిరణము వైపు తిప్పాడు: "నీ స్వభావము .... " అంటూ ఎప్పటిలాగా తన ధోరణిలో చెపుతుండగా, ఎదురుగావున్న వ్యక్తి "ఆపు," అని అన్నాడు. "పనికొచ్చేదేమైనా ఉంటే చెప్పు."
మన జ్యోతిష్కుడు కాస్త ఆసహనానికి గురై "నేను ప్రతి ప్రశ్నకు మూడు పైసల చొప్పున తీసుకొంటాను. నేనిచ్చే సమాధానాలు నీ పైసలకు సరిపోతాయి,” అని అన్నాడు. అటువైపునున్న మనిషి వెంటనే తన చేయిని వెనుకకు లాక్కొని ఒక అణా తీసి అతనివైపు విసిరి ఇలా అన్నాడు, "నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నీవు మోసం చేస్తున్నావని నేను నిరూపిస్తే న అణా డబ్బులు వడ్డీతో తిరిగివ్వాలి. "
"ఒకవేళ నా జవాబులు నిన్ను సంతృప్తి పరిస్తే నాకు ఐదు రూపాయలు ఇస్తావా ?"
“ఇవ్వను.”
"లేకపోతే ఎనిమిది అణాలైనా ఇస్తావా?"
“సరే. అయితే ఒక షరతు. నీవు తప్పు అని నిరూపించితే దానికి రెట్టింపు డబ్బు నాకివ్వాలి,” అన్నాడు ఆ కొత్త వ్యక్తి. కొంతసేపు తర్జన భర్జన తర్వాత ఇద్దరు ఓ ఒప్పందానికి వచ్చారు. జ్యోతిష్కుడు దేవుణ్ణి స్మరిస్తుండగా, కొత్త వ్యక్తి చుట్టను వెలింగించాడు. జ్యోతిష్కుడు అగ్గిపుల్ల వెలుగులో ఆ వ్యక్తి యొక్క మొఖం చూసాడు. కాస్త విరామం ....రోడ్డు మీద కార్ల హారన్ శబ్దాలు, జట్కా బండి చోదకులు తమ గుర్రాలను తిట్టడము మరియు జనం ఎడతెగని సంభాషణలతో ఆ సాయంకాలము ఆ పార్కు పరిసరాలు చికాకుగా అనిపించింది. కొత్త వ్యక్తి చుట్టను కాలుస్తూ పొగను గుప్పు గుప్పున వొదులుతూ జ్యోతిష్కుని ముందు కౌర్యంగా కూర్చుని వున్నాడు. జ్యోతిష్కుడు అసౌకర్యంగా కనిపించాడు.
“నీ అణా నీవు తీసుకో. ఇటువంటి పందేలు నాకెప్పుడూ తెలియవు. ఇప్పటికే ఆలస్యమైంది... ఇంటికి వెళ్ళాలి. “జ్యోతిష్కుడు మూట సర్దుకుంటున్నాడు. అవతలివాడు జ్యోతిష్కుని చేయి గట్టిగా పట్టుకొని "నీవు తప్పించుకోలేవు. నా దారిన నేను వెళ్తుంటే, నీవు ఇందులోకి లాగావు,” అని అన్నాడు. జ్యోతిష్కుని గొంతు భయముతో మూగపోయింది. "ఈ రోజు పోనివ్వు. నీతో రేపు మాట్లాడుతాను." అతడు తన చేయిని ముందు చాపుతూ " పందమంటే పందమే. కానివ్వు" అన్నాడు. తడారిన గొంతుతో జ్యోతిష్కుడు జోస్యాన్ని చెప్పడం మొదలెట్టాడు: “నీజీవితములో ఓ స్త్రీ…..”
"ఆపు"అన్నాడు అవతలివాడు. “అదంతా నాకవసరంలేదు. నేనిప్పుడు తలపెట్టిన పనిలో విజయము పొందుతాన లేదా ? దీనికి సమాధానము చెప్పి వెళ్ళిపో. లేకుంటే నువ్వు పైసలన్నీ కక్కే వరకు నిన్నొదలి పెట్టను.”
“సరే విను చెప్పుతాను. కానీ నేను చెప్పేది నీకు నిజమనిపిస్తే ఒక రూపాయి ఇస్తావా? లేకుంటే, నేను అసలు మాట్లాడను. నీకిష్టమైంది నీవు చేసుకో.” చాలాసేపు బేరమాడిన తర్వాత అవతలివాడు అంగీకరించాడు. “నువ్వు చచ్చిపోయావని వదిలేసారు. ఇది వాస్తవమా కాదా?”
“ఆహా! ఇంకా చెప్పు”
“నీ శరీరములో ఒకసారి కత్తి దిగింది?" అన్నాడు జ్యోతిష్కుడు
" భలే వాడివే" అంటూ తన రొమ్ము బాగాన వున్న కత్తి గాటును చూపించాడు.
"ఆ తర్వాత నిన్ను దగ్గరలో వున్నా వ్యవసాయ బావిలోకి తోసేసి నీవు చచ్చావని వదిలిపెట్టి వెళ్లారు."
“అప్పుడు ఆ మార్గములో వెళుతున్న ఓ మనిషి అనుకోకుండా బావిలోకి తొంగి చూడకపోతే నేను చచ్చేవాడినే.” అన్నాడు అవతలి వ్యక్తి ఆశ్చర్యంగా. “వాడిని నేనెప్పుడు పట్టుకుంటాను?,” అడిగాడుఅతను పిడికిలి బిగించుతూ.
"మరో జన్మలో ," సమాదానము ఇచ్చాడు జ్యోతిష్కుడు. "నాలుగు నెలల క్రితమే సుదూర పట్టణము లో అతడు చనిపోయాడు. నీవు అతన్ని ఎప్పటికి కలువలేవు." ఆ వార్త విని అవతలివాడు బాధతో మూలిగాడు. జ్యోతిష్కుడు చెప్పుకుంటూపోతున్నాడు.
“గురు నాయక్”
“నా పేరు నీకు తెలుసా?” అన్నాడు అవతలివాడు ఆశ్చర్యంగా.
“అన్ని తెలిసినట్టుగానే ..., నేను చెప్పేది జాగ్రత్తగా విను. గురు నాయక్. ఈ టౌన్ కు ఉత్తరము దిక్కున రెండు రోజులు ప్రయాణము చేస్తే మీ వూరు వస్తుంది. వచ్చే ట్రైన్ ఎక్కి ఎవరికి కనిపించకుండ పో. నీవు మళ్ళీఊరొదిలి వెళ్ళితే నీకు మరో గండము ఎదురయే అవకాశముంది. ” ఓ చిటికెడు పవిత్రమైన విభూదిని అతనికి ఇస్తూ "దీన్నీ నుదిటి మీద పూసుకొని ఇంటికెళ్ళిపో, ఎన్నడూ దక్షిణ దిక్కు ప్రయాణము చేయకు. నీవు వందసంవత్సరములు జీవిస్తావు. " అని అన్నాడు.
“మళ్లీ నేనెందుకు ఊరొదిలి పోతాను.” అన్నాడు అవతలివాడు ఆలోచిస్తూ. “వాడిని వెతికి పట్టుకుని చంపడానికి మాత్రేమే అప్పుడప్పుడు బయటకెళ్లుతున్నాను,” అన్నాడు అతడు, విచారంగా తల ఊపుతూ. “వాడు నా చేతుల నుండి తప్పించుకున్నాడు. కనీసము వాడు ఘోరమైన చావు చచ్చాడనుకొంటా!”
"అవును" అన్నాడు జ్యోతిష్కుడు. "అతడు లారీ కిందపడి నలిగి చచ్చిపోయాడు." అది విని అవతలివాడు సంతృప్తి చెందినట్లుగ కనిపించాడు.
జ్యోతిష్కుడు సరంజామాను తన సంచిలో సర్దుకునే సరికి ఆ ప్రాంతంమంతా నిర్మానుష్యమైంది. ఆకుపచ్చ వెలుతురు కిరణము కూడా పోవడము వలన అంతట చీకటి మరియు నిశ్శబ్దం ఆవరించింది. ఆ కొత్త వ్యక్తి జ్యోతిష్కుడికి సరిపడా నాణేలను ఇచ్చి చీకట్లో కి జారుకున్నాడు.
జ్యోతిష్కుడు ఇంటికి చేరే సరికి దాదాపు మధ్య రాత్రి కావస్తుంది. గలమ దగ్గర నిలబడి ఎదురుచూస్తున్న భార్య అతని ఆలస్యానికి కారణమడిగింది. చేతిలోని నాణేలను ఆమె వైపు విసిరి, "వాటిని లెక్కించు. అవన్నీ ఒకే మనిషి ఇచ్చాడు. " అన్నాడు జ్యోతిష్కుడు.
"మొత్తం పన్నెండున్నర అణాలు," అంది ఆమె లెక్కిస్తూ. ఆమెకు అమితానందమైంది. "రేపు బెల్లం, టెంకాయ కొంటాను. చిన్నది చాల రోజులనుండి మిఠాయిలు కావాలని అడుగు తూ వుంది. మంచి తీపి పదార్థం ఏదైనా చేసి దానికి పెడతాను."
"ఆ నికృష్టుడు మోసము చేసాడు! రూపాయి ఇస్తానని ఒప్పుకున్నాడు,,” అన్నాడు జ్యోతిష్కుడు. ఆమె అతని వైపు చూసింది. "నీవు కలత చెందినట్లు కనిపిస్తున్నావు. ఏమి జరిగింది?
“ఏమి లేదు.”
భోజనం తర్వాత మంచము మీద కూర్చొని, “నీకు తెలుసా? ఈ రోజు ఓ పెద్ద బరువు గుండెలమీదినుండి దిగిపోయింది. ఇంత కాలము నా చేతులకు ఓ మనిషి రక్తమంటుకుందని బాధపడ్డాను. ఆ కారణంగానే నేను ఇంటి నుంచి పారిపోయి వచ్చి నిన్ను పెళ్ళాడి ఇక్కడ స్థిరపడ్డాను. కానీ అతను బ్రతికే వున్నాడు,” అన్నాడు తన భార్య తో
ఆమెకు ఊపిరాగినంతపనైంది. "నీవు హత్యాప్రయత్నం చేసావా?"
“అవును. మావూరిలో నేను పనిపాట లేక వెర్రివానిగా తిరుగుతున్న సమయములో జరిగింది. ఒక రోజు మేము కొందరము యువకులము కలిసి తాగం. జూదమాడాం. తర్వాత బాగా దెబ్బలాడుకొన్నాం …. అవన్నీ ఇప్పుడెందుకులే! నిదురోస్తుంది. ఇప్పటికే ఆలస్యమైంది,” అంటూ అవలించుతు మంచంపైన ఒళ్ళువాల్చాడు .
పాలమూరి
పాలసముద్రం సురవరమే!
ప్రతాపరుద్రీయమనే
ఈ కథాకావ్యానికి ఇది అవతారిక మాత్రమే!
ఆయాన మేల్కొన్నతీరు
మేల్కొల్పినతీరు
మన ప్రాథస్మరణలో మమేకమైతేనే మంచిది
ఆయన మార్గదర్షే కాదు మానవతార కూడా!
నిరంకుశ నిజాం ప్రశ్నలనే కాదు
గెలికి కయ్యానికి కాలుదువ్వే వాళ్లను సైతం
మళ్లీ నోరెత్తకుండా చేసిన పనితనం వల్లనే
జనజీవన అస్తిత్వం చిగురించ గలిగింది
సంస్థానాల జీవ దారుల వల్లనే అనుకుంటా రామాయణంలో దాగిన
అలల ఆత్మల ఆణిముత్యాలను
వెలికితీసిన సముద్రగర్భంలో అతడే
నీళ్లులేని నేలవాడైతేనేమి
ఆయనలోని సృజనాత్మకత జీవనదివల్లనే
మన సాహిత్య నేల సస్యశ్యామలమైంది
ఉర్దూ రాజ్యమేలుతున్న సమయాన
నిరాయుధమైన తెలుగు భాషను తన పత్రిక ద్వారా
పరివ్యాప్తం చేసిన సంపాదక సమర వృక్షం అతడే
మన పర్వదినాలను భుజానవేసుకుని
వన్నె తరగని సంస్కృతికి
కళాకృతి కల్పవృక్ష మైన వాడు అతడే
గోల్కొండ కవుల సంచిక వల్లనే కదా
కవుల కళ్ళకు ఇంత వెలుగు దొరికింది
ఈ దీరో దాత్తుని
శాసనసభ ఆలింగనం చేసుకుని గానీ
అక్షరాన్ని వదిలి ఆత్మను అగమాగం చేసుకోలేదు గదా!
రాత్రనక పగలనక
చెరువులలో ఈదే చేపపిల్లలానే బతికాడు
ఎల్లవేళలా అడుగు తీసే అక్షర యోధుడు యోధులకు
లోలోని నల్లమల అరణ్య సోయగాల్ని అర్పించ గలడు
సంఘ సంస్కరణ ఉద్యమ కవయిత్రి వేమూరి శారదాంబ
“ తన తొమ్మిదవయేట ననుపమాన ప్రజ్ఞ
నింపుగా వీణ వాయింప నేర్చె
తన పదియవయేట సునిశితంబగు బుద్ధి
దా కొల్చె నేకసంథగ్రహణము
తన చతుర్దశ శరత్తున ముద్దుముద్దుగా
నల్లిబిల్లిగ ( బద్యమల్ల నేర్చె
తనదు పదార్వ వత్సరమున నగ్నజి
జ్జా వివాహ ప్రబంధంబు సెప్పె
తనదు పందొమ్మిదవ వర్షముననె మర్త్య
భావమును మాని శాశ్వత బ్రహ్మలోక
సిద్ధి( గనె శారదాంబ నా చిన్ని కూతు
ననుదినంబును మఱువక యాత్మనుంతు” -------- సంప్రదాయ శిబిరం నుండి బయటపడి కందుకూరి వీరేశలింగం గారి సంఘసంస్కరణ ఉద్యమానికి మద్దతుగా నిలబడిన కవి పండితులు, బహుగ్రంథకర్త అయిన దాసు శ్రీరాములు 1907 లో దేవీభాగవత అనువాదాన్ని ప్రచురిస్తూ అవతారికలో వ్రాసుకొన్న పద్యం ఇది. పందొమ్మిది ఏళ్లకే మరణించిన చిన్నకూతురు శారదాంబను తలచుకొంటూ వ్రాసిన పద్యం ఇది. దాసు శ్రీ రాములు పేర్కొన్న నాగ్నజితీ పరిణయము తో పాటు మాధవశతకము ఆమె కృతులు. దాసు శ్రీరాములు స్మారకసమితి పక్షాన దాసు అచ్యుతరావు నూటఇరవై సంవత్సరాల క్రితపు ఈ కృతులను సేకరించి ప్రచురించి (2019) ఈ తరానికి అందు బాటులోకి తెచ్చారు. ఆ పుస్తకాలకు ఆయన, ఉన్నం జ్యోతివాసు వ్రాసిన ముందుమాటలు శారదాంబ సమగ్ర జీవితవిశేషాలను తెలియచేస్తున్నాయి. ఈ రెండు కావ్యాలే కాక ఆమె కీర్తనలు కూడా రచించింది.
దాసు శ్రీరాములు, జానకమ్మ దంపతులకు కృష్ణాజిల్లా మచిలీపట్నం దగ్గర అల్లూరు అనే ఊళ్ళో 1881 మే 3వ తేదీన పుట్టింది శారదాంబ. ఆరుగురు మగబిడ్డల తరువాత పుట్టిన ఆడపిల్ల కావటంతో గారాబంగా పెరిగింది. సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యం గల తండ్రి ఐదారేళ్ళ వయసునుండే ఆమెకు సంగీతం చెప్పించాడు. వీణలో సుశిక్షితురాలిని చేసాడు. మైసూరు వంటి నగరాలలో కచేరీలు చేసే స్థాయికి తెచ్చాడు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా తహసీల్దారు వేమూరి రామన్న,నాగమ్మల రెండవ కొడుకు రామచంద్రరావు తో ఎనిమిదేళ్ల శారదాంబకు (1888) పెళ్లిఅయింది. అప్పటికి వీరేశలింగం సంస్కరణ భావజాలంతో ఏకీభావం ఉన్నపటికీ, బాల్యవివాహం వద్దని ఆయన అంటున్నా వినక దాసు శ్రీ రాములు ఈ పెళ్లి చేశాడు. 1895 లో కాపురానికి పంపేలోపల తాను స్వయంగా ఆమె చేత అమరకోశం చదివించాడు. రఘువంశం, కుమారసంభవం మొదలైన కావ్యాలు బోధించాడు. తత్ఫలితంగానే దాసు శ్రీరాములు పేర్కొన్నట్లుగా పదునాలుగేళ్ల వయసుకే ముద్దుముద్దుగా పద్యమల్లటం నేర్చింది. అయినా అందరు ఆడపిల్లలకు లాగానే కాపురం ఆమె సంగీత సాహిత్య కళా సృజన సామర్ధ్యాల ప్రకాశానికి అవరోధంగా మారింది. వీణ అటకెక్కింది. ఆలోచనలు వ్యక్తి నుండి వేరుచేయలేనివి కనుక ఏమో, ఆమె సాహిత్య సృజన చాటుగానో,నేటుగానో కొనసాగుతూనే వచ్చింది.పదిహేనేళ్ల వయసుకు ( 1896) బిడ్డ తల్లి అయింది. మరోమూడేళ్లకు (1899) మలి ప్రసవంలో పందొమ్మిదేళ్ళ అతి చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయింది. ఆమె కృతులు రెండూ మరణానంతర ప్రచురణలే.
1
దాసు శ్రీరాములు దేవీభాగవత అవతారికలో శారదాంబ గురించి వ్రాసిన పద్యంలో నాగ్నజితీ పరిణయము ప్రస్తావన ఉంది కానీ మాధవశతకము మాట లేదు. పదహారేళ్ళ వయసులో నాగ్నజితీ పరిణయం వ్రాసిన తరువాత మూడేళ్లకే ఆమె మరణించింది కనుక మాధవశతకం పదునాలుగేళ్ల ప్రాయంలో అల్లిబిల్లిగా అల్లిన పద్యాల సమాహారమే అయివుండాలి. 1901లో శ్రీపాదకృష్ణమూర్తి శాస్త్రి కలావతి పత్రికలో వరుసగా ఆ పద్యాలను ప్రచురించాడు.
శారదాంబ ఈ పద్యాలు పదునాలుగేళ్ల వయసులో వ్రాసిందంటే అది 1895 అయిఉండాలి. ఆమె పుట్టి పెరిగిన కాలం సంఘసంస్కరణ ఉద్యమంలో వేగం, విలువ రెండూ పెరుగుతున్న కాలం. అప్పటికే వీరేశలింగం పంతులు స్త్రీవిద్యకు అనుకూల భావప్రచారం ప్రారంభించాడు. వివేకవర్ధని పత్రిక ప్రారంభించి అందుకు స్వంత వేదికను ఏర్పాటు చేసుకున్నాడు. స్త్రీ విద్య శాస్త్ర సమ్మతమేనని ప్రజలలో నమ్మకం కలిగించటానికి పట్టుదలతో పనిచేస్తున్న కాలం అది. శారదాంబ పుట్టిన రెండేళ్లకు అంటే 1883లో స్త్రీల జ్ఞాన చైతన్యాల వికాసాన్ని ఆశించి స్త్రీల కొరకు ప్రత్యేకంగా సతీహితబోధిని అనే పత్రికను కూడా ప్రారంభించాడు వీరేశలింగం. ఆ క్రమంలో 1875 నుండి 1885 మద్య కాలంలో స్త్రీ విద్యపై ఆయన చేసిన ప్రధాన ఉపన్యాసాలు ప్రచురించబడి బుద్ధిజీవుల మధ్య చర్చకు వచ్చాయి.అదే సమయంలో వధూవరుల మధ్య వయో తారతమ్యం కల వివాహాలు దాంపత్యంలో స్నేహానికి అవరోధమని ,కన్యా శుల్కవివాహాలు నరమాంస విక్రయ వ్యవహారమేనని ఏవగించుకున్నాడు వీరేశలింగం. ఆయన ఆదర్శాలు సామాజిక మానవీయ సంస్కారాలలో, సంబంధాలలో ప్రతిఫలించే వాస్తవంగా పరిణమించటాన్ని కలగంటూ 1887 నాటికి గురజాడ కన్యాశుల్క నాటకంతో రంగంలోకి వచ్చాడు. ఐదారేళ్ళ పిల్లగా ఊహతెలిసే నాటికి శారదాంబ చుట్టూ ఉన్న వాతావరణం ఇది. ఈ నేపథ్యంలో ఆమెకు అందివచ్చిన విద్యావకాశాలు సంస్కరణభావాలను ఆమెలో పెంచిపోషించాయి. స్త్రీ జనాభ్యుదయం సహజ ఆకాంక్షగా ఆమె పద్య రచన సాగింది. అది మాధవ శతకము అయింది.
కథతో నిమిత్తం లేకుండా ఎక్కడికక్కడ ఒక భావాన్ని, అభిప్రాయాన్ని పూర్తి చేయటానికి వీలుగా చేసే వ్యస్త పద్యరచన శతకం. పద్య రచనాభ్యాసానికి అనువైన ప్రక్రియ. అయితే మాధవ శతకములో వ్యస్త పద్యాల మధ్య ‘స్త్రీజన క్షేమార్థక భగవత్ప్రార్ధన’ అనే ఏక సూత్రతను ఏర్పరచు కున్నది శారదాంబ. శతకం అంటే వందే . కానీ సాధారణంగా తెలుగు సాహిత్య సంప్రదాయంలో శతకం అంటే నూట ఎనిమిది పద్యాల రచన అన్న రూఢి ఏర్పడిపోయింది. మాధవ శతకంలో పద్యాల సంఖ్య నూట ఒక్కటి (101). మాధవా అన్న సంబోధన మకుటం.ఏక వృత్త నియమం పాటించలేదు. ఉత్పలమాల చంపకమాల వృత్తాలు ఎక్కువ. అక్కడక్కడా శార్దూల మత్తేభ వృత్తాలు కూడా ఉన్నాయి. మొదటి ఆరు పద్యాలూ ,చివరి దశావతార స్తుతి పద్యాలతో కలిపి పదకొండు పద్యాలు మినహా మిగిలినవన్నీ ‘స్త్రీజన క్షేమార్థక భగవత్ప్రార్ధన పద్యాలు.’ కనుక మాధవ శతకాన్ని భక్తి శతకం అనటం కన్నా సంస్కరణ భావ ప్రచార శతకం అనటం సముచితం.
ఈ శతకంలో మొదటి ఆరు పద్యాలూ పీఠిక వంటివి. దయతో తనను కాపాడమని శ్రీ రాముడిని స్తుతిస్తూ కోరటం ఆ పద్యాల సారం. అయితే వాటిలోనూ శారదాంబ వ్యక్తిత్వం ప్రతిఫలించిన తావులను గుర్తించవచ్చు. “శ్రీ రమణీ మనోహర సుశీల నిజాశ్రిత కష్టభంజనా”అని ప్రారంభం అయ్యే మొదటి పద్యం లో నాలుగవ పాదం “సారస నేత్ర నాదగు విచారములెల్లను దీర్చి మాధవా”. ఇందులో నాదగు విచారములెల్లను దీర్చమని మాధవుడిని కోరింది కవయిత్రి.నాదగు అనే మాట ఉత్తమ పురుష ఏకవచనమే. కానీ ఆమెకు వ్యక్తిగత విచారాలు ఉన్నట్లు తరువాతి పద్యాలలో ఎక్కడా కనబడదు. ఆమె విచారం అంతా స్త్రీలందరి కోసం. అందువల్ల ఆమె విచారం వ్యక్తిగతమైంది కాదు అన్నది స్పష్టం.
నాలుగవ పద్యం నాలుగవ పాదం ముగింపు లో “నీవగతి మాకిల వేఱిక లేరు మాధవా”అన్న వాక్యంలోని ‘మాకు’ అన్న ఉత్తమ పురుష బహువచనం ఆమె విచారాలన్నీ సమూహానికి సంబంధించినవే అని రూఢి చేస్తున్నది. అందువల్ల శారదాంబ ‘నేను’ అన్నా ‘మేము’ అన్నా ఆ మాటలన్నీ తనను తాను స్త్రీ జన ప్రతినిధిగా సంభావించుకొని అన్నవే. ‘నాదగు విచారాలు’ అంటూ స్త్రీల విచారాల గురించి తపన పడి కవిత్వం వ్రాసిన శారదాంబ నాగొడవ అంటూ లోకం గొడవను తన గొడవగా కవిత్వం చేసిన కాళోజి కి ఒక తరం వెనుకటి మనిషి. ప్రపంచపు బాధను తన బాధగా చేసుకొని మరో ప్రపంచాన్ని కలగంటూ శ్రీశ్రీ కవిత్వం రాసిన కాలం కంటే ముందే వివక్షకు గురి అవుతున్న మహిళల బాధను తన బాధగా చేసుకొని కవిత్వం అల్లిన మహిళ శారదాంబ.
సాధారణంగా భక్తి శతకాలలో మోక్షకాంక్ష ఉంటుంది. కానీ శారదాంబ తనను బుద్ధిశాలినిగ బ్రోవుమని(6) కోరింది.వ్యక్తిగత పారలౌకిక విలువలకన్నా లౌకిక సామాజిక విలువల కోసం ఆలోచించ గలిగే బుద్ధిని ఆకాంక్షించటంలో వుంది ఆమె విశిష్టత.అలాగే భగవంతుడు కాపాడిన పురుషులు ఎంతో మంది వుండగా ద్రౌపదిని, అహల్యను మాత్రమే ప్రస్తావించటం స్త్రీ కావటం వల్లనే అనిపిస్తుంది.
ఈ శతకంలో ఎక్కువ పద్యాలు ఆనాటి స్త్రీవిద్యా వివాదానికి సంబంధించినవి. స్త్రీవిద్య అవసరం, ప్రాధాన్యత, ప్రయోజనం నిరూపించటం, అందుకు మద్దతుగా చారిత్రక పౌరాణిక స్త్రీలను ఉదాహరణగా పేర్కొనటం, స్త్రీవిద్య వ్యతిరేక వాదనలను తిప్పికొట్టటం, స్త్రీవిద్య సాధనకు పూనుకొనమని పురుషులను ఉద్బోధించటం - లక్ష్యంగా శారదాంబ ఈ శతక పద్యాలు వ్రాసింది. శారదాంబ దృష్టిలో విద్య అంటే అక్షరాస్య విద్య. స్త్రీలను రోకటి పాటలు పాడుకొనే స్థితి నుండి రామాయణ భారతాది పురాణ కథలను గ్రంథ పరిశీలన చేత అర్ధం తెలిసి చదువుకునే దశకు చేర్చే విద్య (33). బాల చికిత్స, చరిత్ర, భూగోళ సమాచారం, లెక్కలు, దేశభాషలో చక్కగా వ్రాయగల నైపుణ్యం స్త్రీవిద్యకు ఆమె ఇచ్చిన సిలబస్.(57) సంగీత నాట్య చిత్రలేఖనాది లలితకళలు కూడా స్త్రీలు నేర్వవలసినవే అన్నది ఆమె అభిప్రాయం.ఈ క్రమంలోనే స్త్రీలకు విద్య అంటే పురాణ శ్రవణం, నోములునోచటం అనే సంప్రదాయ భావనను శారదాంబ తిప్పికొట్టింది. పురాణ శ్రవణం వల్ల బోధ కలగదని (54), నోములు నోచటం వృధాగా పొద్దు పుచ్చటమేనని(66) అంటుంది. సంగీత నాట్యాలు బోగం వేషాలుగా తిరస్కరింప బడుతున్న తరుణంలో శారదాంబ సంగీత నాట్య విద్యలు నేర్చుకొనే అవకాశం మహిళలకు ఉండాలి అనటం సాహసమే.
బోగపుసానుల పాట వింటూ ఇటువంటి పాట ఎక్కడా వినలేదని మెచ్చుకునే పెద్ద మను షులను గృహిణులకు ఆ సంగీతజ్ఞానం ఇచ్చేపనికి ఎందుకు ముందుకు రారని నిలదీసింది(29 ) ఉత్తర నాట్యం నేర్చుకోలేదా, యోగ్యురాలని కీర్తి పొందలేదా? స్త్రీలు నాట్యం నేర్చుకొనటానికి అభ్యంతరాలు ఎందుకు అంటుంది (32). ఉషా అనిరుద్ధుల కథలో చిత్రరేఖను ప్రస్తావించి ఆ నేర్పు ఉన్న స్త్రీలకు చిత్రలేఖనం నేర్పవచ్చు కదా అంటుంది. (48). ఈ అన్ని సందర్భాలలోనూ స్త్రీలసృజన శక్తి సామర్ధ్యాలను వెలికి రానీయకుండా చేస్తున్నసంప్రదాయం పట్ల, పురుష బుద్ధుల పట్ల ఆమె విమర్శ దృష్టి కనబడుతుంది.
స్త్రీలకు విద్య ఎందుకు అవసరం ?భర్తకు ఇంటి నిర్వహణలో చేదోడు ,వాదోడు కావటానికి, లేఖలు చదువుకొనటానికి, వ్రాయటానికి, వార్తాపత్రికలు చదివి వినిపించడానికి, పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పి పెంచటానికి , ఇరుగు పొరుగు స్త్రీ లతో కలహాలు మాని జీవించటానికి -ఇట్లా ఆనాటి సంస్కరణోద్యమం ఏమి చెప్పిందో దాదాపు వాటినే శారదాంబ తన పద్యాలలో ప్రస్తావించింది. కార్యేషు మంత్రి అంటారు కదా, విద్య లేని మహిళ మంత్రి ఎలా కాగలుతుంది అని ప్రశ్నించి పడతులు విద్య నేరిస్తే పతులకు సహాయపడతారని అంటుంది (27). మగవాడికి అర్ధ శరీరమైన ఆడది చదువు లేనిదైతే మగవాడి సగభాగం చచ్చు పడిపోయినట్లే అని ఆమె భావించింది. ఆడది చదువుకొంటేనే మగవాడు సంపూర్ణుడు సుందరుడు అవుతాడని చెప్పింది. అందువల్లనే స్త్రీ విద్య కు సుముఖులయ్యే సద్బుద్ధిని పురుషులకు ఇమ్మని భగవంతుడిని వేడుకొన్నది. స్త్రీలను జ్ఞాన వంతులను చేసే పనికి పూనుకొనమని పురుషులను ఉద్భోదించింది.
ఆడవాళ్లు చదువుకుంటే చెడిపోతారు , భర్తను గౌరవించరు, స్వాతంత్య్రం కోరతారు -అనే విద్యా వ్యతిరేక వాదుల అభ్యంతరాలను తగిన తర్కంతో తోసి పుచ్చింది శారదాంబ. స్వతంత్రం ఇమ్మంటే ఇచ్చేది కాదు, తమకు ఏది తగునో ఏది తగదో ఎరిగి పొందేదీ అన్నది ఆమె భావం. బాగా చదువుకున్న స్త్రీలకే ఆ వివేకం ఉంటుందని ఆమె నమ్మకం. (79) మహిళల చదువుకు ఉన్నఅభ్యంతరాలలో మగవాళ్ల వద్ద చదువు కోవాల్సి వస్తుందన్నది మరొకటి .ఆడవాళ్లు నోములు చేస్తున్నప్పుడు పూజ చేయించే పురోహితుడు పురుషుడు కాదా అప్పుడు లేని సందేహం ఇప్పుడు ఎందుకు వచ్చింది అని నిలదీసిన పదునున్న లౌకిక జ్ఞానం ఆమెది. మహిళలు చదివి ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళేలాలా అని ఎద్దేవా చేసేవాళ్లకు సమాధానం ఇచ్చేక్రమం లో విద్య అంతిమ ప్రయోజనం జ్ఞానం పెరగటమే నని (71) ప్రకటించింది.
అయితే శారదాంబ దృష్టిలో జ్ఞానం జ్ఞానం కోసం కాదు. జ్ఞానం సకల సృజన మేధో శక్తుల వికాసనానికి ,ఆవిష్కరణకు. మహిళల చదువుకు సమాజంలో ఒక ఆమోదాన్ని సంపాదించటానికి చరిత్ర నుండి , పురాణాలనుండి ఉదాహరణలుగా తెచ్చి చూపిన లీలావతి వంటి శాస్త్ర వేత్తలు , దేవహూతి వంటి వేదవేత్తలు, మొల్ల, తరిగొండ వెంగమాంబ వంటి కవులు, కైక ,సత్య వంటి యుద్ధ వీరులు - బహుముఖీనమైన శక్తి సామర్ధ్యాలు చూపగల స్త్రీల అస్తిత గురించిన శారదాంబ ఆత్మ గౌరవ చేతనకు ప్రబల సాక్షులు.
ఈ శతకం లో శారదాంబ ప్రస్తావించిన స్త్రీల జాబితా తయారు చేసి చూస్తే స్త్రీవిద్యకు స్ఫూ ర్తిని ఇచ్చే మహిళా శక్తుల సమీకరణకు ఆమె తీసుకున్న శ్రద్ధ అర్ధం అవుతుంది. సమకాలపు జనవ్యవహారం నుండి సేకరించి చెప్పిన విద్యావంతులైన మహిళల గురించిన సమాచారం మరీ ఆసక్తికరంగా ఉన్నది. వింజమూరి తిమ్మక్క ద్విపద ఛందస్సులో డోలాయాత్ర అనే గ్రంధం వ్రాసి నట్లు (65) ఆమె చెప్పినది ఏ సాహిత్య చరిత్రలోనూ నమోదు అయిన విషయం కాదు. పెద్ది భొట్లు సతి వంటి స్వంత పేరు లేని అంచులకు నెట్టివేయబడిన స్త్రీల పాండిత్యం గురించి- ఎక్కడ విన్నదో కానీ- ఆలోచించమని మనలను ప్రేరేపిస్తుంది.(21) అల్లసాని పెద్దన మనుచరిత్ర వ్రా స్తూ గర్భిణి స్త్రీని ఎలా వర్ణించాలా అని ఆలోచిస్తుండగానే ఆయన కూతురు ఆ పని విజయవంతంగా పూర్తి చేసి పెట్టిందని(44) చెప్పిశారదాంబ వినియోగంలోకి రాని స్త్రీల శక్తి సామర్ధ్యాల వైపు మన దృష్టిని మళ్ళించింది. అంతే కాదు స్త్రీల ప్రత్యేక శారీరక మానసిక సంస్పందనలను, జీవితాను భవాలను వర్ణించటం ఎంత పెద్ద కవికి అయినా అంత సులభం కాదని ,స్త్రీలు కవులైతే అలవోకగా ఆ పని చేయగలుగుతారని ఏక కాలంలో చెప్పినట్లయింది. పంథొమ్మిదివందల ఎనభైలలో తెలుగు సాహిత్య లోకంలో వ్యాప్తిలోకి వచ్చిన ఈ స్త్రీవాద భావనను వంద సంవత్సరాల క్రితమే ఒక తెలుగు కవయిత్రి పలికించ గలిగిందంటేస్త్రీవాదం విదేశీయం కాదని, తరతరాల ప్రపంచ స్త్రీల మనోభావాల అనుభవాల కోణం నుండి అభివృద్ధి చెందిన సిద్ధాంతమని రూఢి అయినట్లే కదా!
స్త్రీలపట్ల సమాజంలోవున్న వివక్ష పట్ల శారదాంబకు ఒక అవగాహన ఉంది. శివుడు గంగను నెత్తిన పెట్టుకుంటాడు. బ్రహ్మ సరస్వతిని నాలుక యందు, విష్ణువు లక్ష్మిని గుండెల్లోనూ పెట్టుకొంటే ఈ లోకం లో మగవాళ్ళు వాళ్ళను ఎందుకు చిన్న చూపు చూస్తారన్నది ఆమె వేదన(9). లింగ వివక్ష వల్ల జీవితంలోభాగమవుతున్న ద్వంద్వ విలువల గురించిన ఆవగాహన కూడా శారదాంబకు ఉంది. ‘వలదనుటెట్లు విద్య మగవారాల కెట్టుల నట్టులే కదా’అని(19) ఆడవాళ్లు మగవాళ్ళతో సమానమేనన్న సాధారణ సూత్రాన్ని సౌకర్యవంతం గా మరచిపోయిన పురుష సమాజానికి చురక వేసింది. లలనలు నాలుగక్షరములు చదివినంత మాత్రాన అది చదువు కాదు అని కూడా ఆమెకు తెలుసు. పురుషులతో పాటు సమంగా తెలివి పొందే అవకాశాల గురించిన స్వప్నం ఆమెది (19). చదువు వల్ల ఆడవాళ్ళు చెడి పోతారనే వాదాన్ని నిరసిస్తూ చదువు వల్ల చెడిపోతారంటే మగవాళ్ళు కూడా చెడిపోతారు కదా,మరి వాళ్ళెందుకు చదువుతున్నారు అని ప్రశ్నించింది.(72)
ఆడపిల్లలకు ద్రౌపది వంటి పేర్లు పెడితే బోగం కులం పేర్లు అని అంటారు కదా! మగవాళ్లకు కృష్ణుడి పేరు ఎలా పెడతారు అని ఆమె వేసిన ప్రశ్న లైంగిక ద్వంద్వ విలువల మీద ఎక్కు పెట్టిన బాణమే.(81) ఐదుగురు భర్తలు ఉన్నందున ద్రౌపది పేరే అపవిత్రం అయిపోతే పదహారువేల భార్యలు ఉన్న కృష్ణుడు ఎలా పూజ్యుడైనాడన్నది ఆమె ఆంతర్యం. అంతే కాదు , స్త్రీలకు గొడుగు పట్టుకొని వీధులలో నడవటాన్ని నిషేధించి, తలుపులు మూసిన పల్లకీలలో, బండ్లలో, బంధించి ప్రయాణాలు చేయించటంతో ఆగక బురఖా కూడా వేసి ఊపిరి ఆడనీయకుండా చేస్తున్న విధానాలమీద ఘాటైన విమర్శపెట్టింది. (82&83) బాల్య వివాహాలను,వృద్ధులకు ఇచ్చి చేసే వివాహాలను వ్యతిరేకించింది. తగిన వయసు వచ్చాక నచ్చినవాడిని పెళ్లాడే వెసులు బాటునిచ్చే స్వయంవర వివాహపద్దతిని విస్మరించటం పట్ల విచారం వ్యక్తం చేసింది (86).
శారదాంబ కోటికెలపూడి సీతమ్మ వలెనే వీరేశలింగం పంతులు గారి సంస్కరణోద్యమ భావజాల వారసత్వానికి, సమకాలంలో మొగ్గ విచ్చుతున్న మహిళా ఉద్యమ ఆకాంక్షలకు మధ్య బలమైన లంకె .ఈ శతకం చదువుతుంటే ఆ తరువాత పదిహేనేళ్లకు , 1914 ఏప్రిల్ 11&12 తేదీలలో బెజవాడలో జరిగిన అయిదవ ఆంధ్ర మహిళా సభ ఉపన్యాసాలు,తీర్మానాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా శారదాంబ తన పద్యాలలో స్త్రీల విద్యకు అభ్యంతరాలుగా వేటిని సంబోధించిందో ఖండించిందో అవన్నీమోటుపల్లి రాజబాయమ్మ ఉపన్యాసంలోనూ కనిపిస్తాయి. రాజా బాయమ్మ విద్యావంతులైన స్త్రీల వారసత్వాన్ని చెప్పటంలో భాగంగా -దేవహుతీ లీలావతులనుపాండిత్యాన్ని, ఉత్తరా చిత్రరేఖల కళాకౌశలాన్ని, గర్భిణీ స్త్రీ వర్ణన చేసిన పెద్దన కూతురి కవన నైపుణ్యాన్ని ప్రస్తావించటం శారదాంబ శతక పద్య ప్రభావాన్ని సూచించేవే.
అలాగే ఆ సభలో దాదాపు అందరి ప్రసంగాలలోను చర్చించ బడిన మరొక అంశం నగల పై మహిళల వ్యామోహం. దానిని మూఢత కింద జమకట్టి తిరస్కరించారు సంస్కరణాభిలాషులైన స్త్రీలు. అందుకు కూడా ఒరవడి పెట్టిన మహిళ శారదాంబ . స్త్రీలలో నగల మోజు, అలంకరణ ప్రీతి అభ్యుదయ కారకాలు కావని ఆమె అభిశంసించింది. సహజమైన తెలివి ఉండాలి కానీ నగలు ఎందుకు అంటుంది.(53)నగల మీద పెట్టె శ్రద్ధ చదువు మీద పెట్టమని మహిళలను హెచ్చరిం చింది(69). నగల కోసం చెవులు, ముక్కులు కుట్టించుకొని శరీరాన్ని హింస పెట్టుకొనటం కన్నా చదువు పై శ్రద్ధ పెడితే ప్రయోజనమని హితవు చెప్పింది.(70). తల దువ్వు కొనటానికి,బొట్టు దిద్ది చీర కట్టటానికి, నగలు పెట్టుకొనటానికి ---ఇలా అలంకరణకు గంటలు గంటలు కాలాన్ని వ్యయం చేసేవాళ్ళు అందులో కొంత సమయం విద్య కొరకు కేటాయిస్తే బాగుంటుందని సూచించింది. (68). నగలపట్ల అలంకరణల పట్ల స్త్రీలు విముఖులు కావాలని స్త్రీజన క్షేమార్ధం శారదాంబ ఏదైతే ఆశించిందో, దానితో పాటు ఆడవాళ్లు వీధుల్లో గొడుగులు వేసుకొని నడవరాదన్న నాటి సామాజిక వివక్షను దేనినైతే నిరసించిందో (82) ఈ రెండూ కూడా ఐదవ ఆంధ్ర మహిళా సభలో తీర్మానాలుగా ప్రవేశపెట్టబడి ఆమోదించ బడిన తీరు గమనిస్తే ఎంతో ముందుగా శారదాంబ వంటి మహిళా రచయితలు సాహిత్య రూపంలో నమోదుచేసిన స్త్రీల ఆకాంక్షలు,ఆదర్శాలు ఆచరణాభిముఖమైన ఉద్యమ రూపాన్ని తీసుకొంటున్న దృశ్యం దర్శనమిస్తుంది.
ఆ ఐదవ ఆంధ్ర మహిళా సభ కు అధ్యక్షురాలు కోటికెలపూడి సీతమ్మ. ఆమె తన ఉపన్యాసం ముగిస్తూ స్త్రీ విద్యా ద్వేషుల వాదములను జయించి, పుస్తకాలను రచించి , పాఠశాలలు స్థాపించి , తోడి పురుషులలో స్త్రీ విద్యాభిమానము పురికొల్పుటకు సభలలో ఉపన్యాసములు ఇచ్చిన పూర్వీకులను కృతజ్ఞత తో ప్రస్తావించింది.ఆ కృతజ్ఞతలలో వాటా శారదాంబకు కూడా ఉంది.
తెలుగు నాట తొలినాళ్ళ సంస్కరణోద్యమ వారసత్వాన్ని మాధవశతకము రూపంలో స్త్రీల కోణం నుండి అందించటం ద్వారా తన వంతు చారిత్రక పాత్రను నిర్వహించింది శారదాంబ.
2
శారదాంబ సంసార జీవితం ఐదారేళ్లను మించదు. కాపురానికి వెళ్లిన కాలం, కవితా వ్యవ సాయం ప్రారంభించిన కాలం దాదాపు ఒకటే. నాగ్నజితీ పరిణయము కృతి భర్త పార్ధ సారధి. చెన్నై లోని పార్ధసారధి కోవెల దేవుడు. భర్తతో మద్రాసులో కాపురమున్నకాలంలో శారదాంబ ఈ కావ్యం వ్రాసి వుంటుందని భావిస్తున్నారు. నాగ్నజితీ పరిణయము మూడా శ్వాసాల ప్రబంధం. పద్యాలూ , వచనాలు కలిపి 231 ఉన్నాయి ఈ కావ్యంలో. మూడు ఆశ్వాసాల చివర పునరావృతమయ్యే ఒక పద్యంతో కలిపితే ఆ సంఖ్య232 అవుతుంది. ఆ పద్యం ఇది.
“భాసురమైన నీవెడద వక్షమునందున శ్రీవె లుంగగా
దాసులకేకొఱంత సతతమ్మును సంతస మూరి శోభితా
వాసులుగారె విశ్వపరిపాలన సుందర రామ శారదా
భ్రాసమకీర్తి పూరిత దిగంతరవైభవ చంద్ర మాధవా”-
మాధవుడిని సంబోధించే స్తుతి రూపకమైన ఉత్పలమాల పద్యం ఇది. నీ వక్షస్థలం పై లక్ష్మి విలసిల్లుతుండగా భక్తులకు ఏ కొరతా లేదు. అంతటా సంతోషమే అని చెప్పటం, విశ్వాన్నిపాలించే సుందర రాముడని ,వైభవ చంద్రుడని మాధవుడిని స్తుతించటం ఇందులో విషయాలు. అంతే అయితే ఇది సాధారణ పద్యం. ఇందులో శారదాంబ తన భర్త పేరును నాలుగు పంక్తులలో గర్భితం చేసి చెప్పటం విశేషం. ప్రతి పాదం చివరి రగణం లో మొదటి రెండక్షరాలు శారదాంబ భర్త వేమూరి రామచంద్ర రావు పేరులోని (రావు అన్న తుది భాగాన్ని మినహాయించి) భాగాలను వరుసగా సూచిస్తాయి. గౌరవ చిహ్నమైన శ్రీ తో ప్రారంభించి వె అన్న అక్షరాన్ని కలుపుకున్న భాగాన్ని మొదటి పాదంలో,మూరి అన్న భాగాన్ని రెండవ పాదంలో రామ అన్న భాగాన్ని మూడవ పాదంలో , చివరి పాదంలో చంద్ర అన్న భాగాన్ని చూడవచ్చు. మాధవ శతకం కూడా ఈ పద్యం తోనే ముగియటం గమనించదగినది.
19వ శతాబ్ది కవయిత్రి వేమూరి శారదాంబ. ‘ నాగ్నజితీ పరిణయము’ రచన మాత్రం మధ్య యుగాలలో స్థిరపడిన కావ్యనిర్మాణ పద్దతిలో సాగింది. ప్రథమాశ్వాసంలో మొదటి 10 పద్యాలు కావ్యావతారిక వంటివి. ఇష్టదేవతా స్తుతి, కృతిభర్తను నిర్దేశించుకొనటం ఇందులో ప్రధానం. విష్ణువు, లక్ష్మి, శివుడు, పార్వతి, బ్రహ్మ, సరస్వతి, వినాయకుడు సత్యవాక్కును, భద్రతను ఇచ్చి రక్షించా లని కోరుకొంటుంది. తన కృతిని కన్యగా సంభావించి “తిరువలిక్కేణి దివ్యమందిరము లోన\ నింతి రుక్మిణితో సుఖియించుచున్న /నంద సుతుడైన సచ్చిదానంద మూర్తి” ని కృతి భర్తగా ఎంచుకున్నది. ఆ తరువాత ఉన్న కంద పద్యం ప్రత్యేకంగా పరిశీలించదగినది. స్త్రీల కావ్యావతారిక లలో మాత్రమే అటువంటి పద్యాలు కనబడతాయి.
“ఎన్నఁగల పోత్తములనేమి (గన్నదాన
విన్నదానను(గాను నే నెన్న(డైనఁ
గన్నవారెల్ల (గరుణనిందున్నయట్టి
యన్ని తప్పుల క్షమియింతురని తలంతు”--
ఏనాడూ చెప్పుకోదగిన పుస్తకాలేమీ చూచినదాన్ని గాను, విన్నదానను గాను, ఈ కావ్యం చూచిన వాళ్ళెవరైనా దయతో ఇందులోని తప్పులన్నీ క్షమిస్తారని తలుస్తాను అని శారదాంబ వినయంగా పాఠకోత్తములను, పండితులను వేడుకొన్నది ఈ పద్యంలో. ఏ మొల్ల కవితా శైలి అలవడిందని శారదాంబను మెచ్చుకొంటారో ఆ మొల్ల నుండి మొదలు పెట్టి ఏ కవయిత్రి అయినా పాఠకోత్త ములకు ఈ రకంగానే విన్నపాలు చేసుకొన్నది. మొల్ల తనకు తెలుగు సంస్కృత భాషలు, పద సంపద, వ్యాకరణ ఛందో అలంకార శాస్త్రాలు - ఏవీ తెలియవని, తన కవిత్వంలో తప్పులెంచవద్దని సాటి కవులను కోరింది. తరిగొండ వెంగమాంబ కూడా తాను గురువుల వద్ద చదువుకోలేదని ఛందస్సు తెలియదని, కావ్య నాటక అలంకార శాస్త్రాల గురించి వినను కూడా లేదని, ఇతిహాస పురాణాలు చదవలేదని పేర్కొనటమే కాదు, తనది బాలభాష అంటుంది. నా తప్పొప్పులే రీతిగానైనా గెలిసేయక చిత్తగింపవలయు నని కోరింది.
16వ శతాబ్ది నుండి మూడువందల ఏళ్ళు ముందుకు వచ్చినా సాహిత్యరంగంలో మహిళా కవుల మాటవరుస మారలేదంటే సాహిత్య సామాజిక రంగాలు యధాపూర్వకంగా పురుషుల రంగా లుగా ఉండటం వల్లనే. నన్నయ నుండి ఏ పురుష కవి అయినా తమ ప్రతిభా పాండిత్యాల గురించి చెప్పుకొన్న వాళ్ళే గానీ ఇలా తమకేమీ తెలియదని చెప్పుకోలేదు. తప్పులే చేయము అన్న ధిషణా శక్తి పరులు కనుక వాళ్లకు ఎవరినీ క్షమించమని కోరే అవసరం లేదు. ఏ పాండిత్యం లేకుండా కావ్యాలు వ్రాయటం స్త్రీలకు మాత్రం సాధ్యమా అంటే కాదు అనే సమాధానం. వేళ్ళ మీద లెక్కించ దగిన సంఖ్యలో మాత్రమే వున్న మహిళా కవులు అల్పసంఖ్యాక వర్గంగా పురుషులదైన కావ్య ప్రపంచంలోకి బెదురు బెదురుగా ప్రవేశిస్తున్నారనటానికి, వాళ్ళను ప్రసన్నం చేసుకొనటానికి వాళ్ళ కంటే తామెందులోనూ అధికులంకామని నమ్మబలికి వారి దయను పొందటానికి తాపత్రయ పడుతు న్నారనటానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదు. ఇదంతా స్త్రీలు కవులుగా తమ ఆస్తితను చాటుకొనే అవకాశాలను కల్పించుకొనటంలో పడిన తండ్లాటలో భాగమే. శారదాంబ ఆ వరుసలోని కవయిత్రే.
ఇతిహాస పురాణ కావ్య ప్రబంధ సాహిత్యరచన అంతా సూతుడు శౌనకాది మహామునులకు చెప్పిన క్రమాన్నో, శుకుడు పరీక్షిత్తునకు చెప్పిన క్రమాన్నో, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పిన క్రమాన్నో ప్రస్తావించి ఆ ప్రత్యేక క్రమంలో తాము రాస్తున్నట్లు ఆయా కవులు పేర్కొనటం గా ఉంటుంది. అదొక పద్ధతి. రాసే కవి సర్వానికి తానే కర్తనని అహంకరించకుండా పరంపరాగత మానవానుభవాలను ప్రజలకు అనుస్యూతంగా అందించే సాంస్కృతిక రాయబారిగా తనను తాను వ్యక్తీకరించుకొనటం ఈ పద్దతిలోని ఒక అందం. ఆ వరుసలోనే శారదాంబ తాను ఒనర్పం బూనిన నాగ్నజితీ పరిణయము కథా క్రమం ‘శుక మహర్షి పరీక్షిన్నరేంద్రున కెరింగించిన తెఱంగు’ అని చెప్పుకొన్నది.
నాగ్నజితి శ్రీ కృష్ణుడి అష్టభార్యలలో ఒకతె. నగ్నజిత్తుడి కూతురు కనుక ఆమె నాగ్నజితి. శ్రీకృషుడితో ఆమె వివాహమైన తీరు ‘నాగ్నజితీ పరిణయము’ కావ్య కథా విషయం. వేమూరి శారదాంబ కంటే పూర్వం ఈ ఇతివృత్తంతో కావ్యాలు రాసిన వాళ్ళు ముగ్గురు. రాజవోలు సుబ్బారాయుడు, వల్లూరి నరసింహ కవి ,వెలిదండ్ల అళగిరి. శారదాంబ సమకాలికులు ముగ్గురు. మాడభూషి నరసింహాచార్యులు, శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి, శ్రీనివాసాచార్యులు. శారదాంబతో కలిసి ఏడుగురు. ఒకే విషయాన్ని ఏడుగురు ఎట్లా కవిత్వంచేసారు? కావ్యాలల్లారు?- పోల్చి చూచి గుణగణాలను అంచనా వేయటం అది వేరే సంగతి. వీళ్ళ ఎవరికైనా మూల కథా వనరు భాగవతమే.
భాగవతం పురాణం. పురాణేతిహాస కథలను ప్రబంధాలుగా పెంచి వ్రాసే పద్ధతి మనువసు చరిత్రల కాలానిది. ఆ మార్గంలోనే వేమూరి శారదాంబ భాగవత పురాణంలోని నాగ్నజితీ పరిణయ కథను పెంచి ప్రబంధం చేసింది. భాగవతం దశమస్కంధం ఉత్తరభాగంలో 126 నుండి 144 వరకు 19 గద్యపద్యాలలో ఉన్న కథ ఇది. శ్రీకృష్ణుడి ఎనిమిదిమంది భార్యలలో ఆరవ ఆమె నాగ్నజితి. ఆమె అసలు పేరు సుదంత. శ్రీకృష్ణుడి పెళ్లిళ్లు దశమ స్కంధం పూర్వభాగం చివర రుక్మిణీ కల్యాణం తో ప్రారంభమై ఉత్తర భాగంలో కొనసాగుతాయి. రుక్మిణీ కళ్యాణం తరువాత వివరంగా చెప్పబడిన పెళ్లికథలలో లక్షణా పరిణయం. తరువాతది నాగ్నజితీ పరిణయం. స్వయంవరానికి వీరత్వ నిరూపణ షరతుగా ఉండటం, శ్రీకృషుడి విజయం, వైభవోపేతంగా వివాహం, భారీగా కట్నకానుకల చెల్లింపు రెండు పెళ్ళిళ్ళలోనూ సామాన్యమే.అయితే శారదాంబను ఆకర్షించిన అంశం ఏమిటో గానీ నాగ్నజితీ పరిణయ గాధను కావ్యరచనా విషయంగా స్వీకరించింది.
కోసలపుర రాజైన నగ్నజిత్తు, ఆయనభార్య మోహనాంగి సంతానం లేదని బాధపడుతూ, నారదుడి బోధతో సంతాన గౌరీ వ్రతం చేసి ఒక కొడుకును, ఒక కూతురిని కనటం,పెరిగి పెద్దదయిన కూతురు సుదంతకు తగిన మగడి కోసం వెతుకుతుండగా నారదుడు వచ్చి శ్రీ కృష్ణుడే ఆమెకు తగిన భర్త అని చెప్పి కొన్నిరోజులలో నగరానికి వచ్చి తోటలూ దొడ్లూ పాడు చేసే ఏడువృషభాలను పట్టి కట్టిన ధీరునకు కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని చాటింపు వేస్తే కృష్ణుడు వచ్చిఆ పని సాధించి సుదంతను పెళ్లాడతాడని చెప్పివెళ్ళటం శారదాంబ కావ్యకథా నిర్మాణంలో మొదటి అంతస్థు.
నగరానికి వచ్చిన శ్రీకృష్ణుడిని చూచి భాగవత సుదంత మాధవుడిని తనకారాధ్యుడైన నాధుడుగా కోరుకొన్నదన్న మాటను పట్టుకొని తండ్రి దగ్గర నారదుడు కృష్ణుడి గురించి చెప్పిన విషయాలు విని నాగ్నజితి మనసు కృష్ణుడిపై లగ్నమైనట్లు, ఆమె విరహ వ్యధ చూడలేక సుదంత చెలికత్తె ఇందుమతి యోగి వేషంలో ద్వారకకు వెళ్లి ఆ వార్త శ్రీకృష్ణుడికి చేరవేసినట్లు శారదాంబ దాని పై పెద్ద అల్లిక పని చేసింది. కృష్ణుడు కొమ్ములువంచి పట్టితెచ్చి స్తంభాలకు కట్టివేసిన ఏడు ఎద్దులు పరమశివుడి శాపం పొందిన కుబేర అనుచరులన్నకల్పన కూడా అదనమే. అస్థిపంజరం వంటి భాగవత కథను మాంసలం చేసి జీవవంతం చేసింది శారదాంబ.
ఈ క్రమంలో కావ్య లక్షణాలుగా దండి చెప్పిన అష్టాదశ వర్ణలలో నగరవర్ణన, ఉద్యాన వనవర్ణన, సూర్యాస్తమయవర్ణన, ఋతువర్ణన, విరహవర్ణన, వివాహవర్ణన, కుమారోదయ వర్ణన , నాయకాభ్యుదయం వంటి వాటికి అవకాశం కల్పించుకొన్నది శారదాంబ. నగరవర్ణనలో భౌగోళిక విశేషాలు , జలవనరులు , తోటలు , పంటపొలాలు , పశు సంపద మొదలైన వాటితో పాటు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వారి వర్ణన సర్వసాధారణం. శారదాంబ ప్రత్యేకత ఆ నగర ఇల్లాళ్లను వర్ణించటం.
ఆధునిక స్త్రీ సహజ ఆత్మ చేతన నుండి నగరం అన్నతరువాత మహిళలు ఉండరా? వాళ్ళను ఎందుకు ప్రధాన స్రవంతి జనం నుండి మినహాయించారు? అన్న కొత్త ప్రశ్నలతో సాంప్రదాయ నగరవర్ణనకు ఆమె చేసిన చేర్పుఇది. ఆ ఇల్లాళ్లు పతిని దైవంగా పూజించేవాళ్ళు, అత్తమామల యందు అణకువ చూపేవాళ్లు, బంధుమిత్రులను ఆదరించేవాళ్లు , బీదవాళ్ళపట్ల దయ చూపే వాళ్లు, పనులకు బద్ధకించనివాళ్ళు అని ఆమె చేసిన వర్ణన సంప్రదాయ స్త్రీ నమూనాకు భిన్నమైం దేమీ కాదు. అదివేరే సంగతి. అయినా సంగీత సాహిత్య విద్యలు తెలిసినవాళ్లుగా వాళ్ళను పేర్కొనటం మాత్రం ఆమె ఆధునిక దృష్టిని సూచిస్తుందని చెప్పక తప్పదు. సుదంత పెరిగిన తీరు వివరించే పద్యాలలో అది మరింత స్పష్టంగా రుజువైంది.
పురాణ ప్రబంధాలలో బాలికలను వర్ణించే వేళ బొమ్మలపెళ్ళిళ్ళు చేయటం , చిలకలకు పాఠాలు చెప్పటం, పాటలు పాడటం, వీణ వాయించటం, బొమ్మలు గీయటం తరచు వాళ్ళ కార్యకలాపాలుగా చెప్పబడ్డాయి. నగ్నజిత్తు కూతురైన సుదంత కూడా ఇవి చేస్తూనే పెరిగింది. అంతవరకే చెప్తే శారదాంబ గురించి చెప్పుకోవలసిందేమీ లేదు. అంతకు మించి సుదంత ‘..... మృదు కావ్యములన్ బఠియింప నేర్చెగా\ పూని సునీతిమంతములఁ బొత్తములన్ రచియింపనేర్చె ..’ నని చెప్తుంది కవయిత్రి. కావ్య పఠనా రచనాదులు శారదాంబ అనుభవ విషయాలు. ఆడపిల్లలు అవి నేరుస్తూ పెరగటాన్ని ఆధునిక సంస్కరణ దృక్పధం నుండే ఆమె సంభావించింది.
నాగ్నజితీ పరిణయము కావ్యం ముగింపులో భాగవత మూలానికి భిన్నంగా శారదాంబ చేసిన ఒక మార్పు ప్రత్యేకం పరిశీలించదగినది. శ్రీకృష్ణుడు భార్యలందరి పట్ల సమతా భావంతో మెలిగాడని చెప్పిన భాగవతమే ఆయన ‘సత్యభామా ప్రియకరుడ’ ని చెప్తుంది. భాగవతంలో నాగ్నజితీ పరిణయ కథకు ముగింపుగా ఉన్న ‘ఇట్లు హరి నాగ్నజితిo బెండ్లియాడి యరణముల పుచ్చుకొని, ద్వారకా నగరంబునకు వచ్చి సత్యభామతో గ్రీడించు చుండె’ అన్న వాక్యం అదే సత్యమని ,సమత్వం భ్రమ అని స్పష్టం చేయనే చేసింది. నాగ్నజితిని పెళ్ళాడి రావటం ఏమిటి? సత్యభామతో క్రీడించటం ఏమిటి? ఈ అసంబద్దత నాగ్నజితికే కాదు ఆత్మగౌరవం కల ఏ స్త్రీకి అయినా అవమానకరమైనదే. ఈ స్పృహ మెండుగా ఉండటం వల్లనే శారదాంబ ‘… జగములెల్ల \ నేలుచును దంపతులు సుఖి యించి రెలమి’- అని నాగ్నజితీశ్రీకృష్ణుల దాంపత్య జీవితం గురించే చెప్పి ఈ కావ్యాన్ని ముగించింది.
ఆ రకంగా సంప్రదాయ కథలను ఆ చట్రంలోనే అయినా సంస్కరణోద్యమ ప్రభావంతో, సామాన్య లౌకిక స్వీయ జీవితానుభవ జ్ఞానం నుండి, అభివృద్ధి చెందిన ఆధునిక దృష్టి కోణం తో మార్చి రాయటానికి స్త్రీలు చేసిన ప్రారంభ ప్రయత్నాలకు ఈ నాగ్నజితీ పరిణయ కావ్యం ప్రాతి నిధ్యం వహిస్తుంది. సరళ సుందరమైన పద్యరచన, కథనరీతి శారదాంబ కావ్యలక్షణం. పందొమ్మిదవ శతాబ్ది చివరి భాగంలో తెలుగు కవితాకాశంలో మెరుపై మెరిసిన శారదాంబ వారసత్వం 20వ శతాబ్దిలోకి ఎంతగా విస్తరించిందో ఇలాంటి కవులను వెలుగులోకి తెచ్చి అధ్యయనం చేసే క్రమంలో అర్ధం అవుతుంది.
JUN 2020
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు