సాహిత్య వ్యాసాలు

సాహిత్య వ్యాసాలు

వచన కవిత - వస్తు శిల్పాలు

          వచన కవితకు నిర్దిష్ట చట్రముండదు. వృత్త, గీత, మాత్రా ఛందో పద్యాలకున్నట్టు ముందే నిర్ణయింపబడిన రూప సంబంధి చట్రముండదు. అసలు చట్రానికే వ్యతిరేకం వచన కవిత. అందుకే దీనిని  ఆంగ్లంలో Free verse, verse libre అన్నారు. అంటే ఛందస్సు నుంచి, నియతి నుంచి విముక్తమైన కవితారూపం అని భావం. అందుకే దీనిని తొలి రోజులలో తెలుగులో ముక్త చ్ఛందం, స్వచ్ఛంద గీతం,స్వచ్ఛంద కవిత అన్నరు.అంటే దీనికి మాత్రల నియమం గాని, అక్షర నియమం గాని, పద నియమం గాని, గణ నియమం గాని, యతి ప్రాసల నియమం గాని ఉండవని అర్థం

          ఏ చట్రం, ఏ నియమం ఉండదు గనుక వచన కవిత రాయడం చాలా సులభం. అందుకే ఈ కవితా రూపం వచ్చిన తర్వాత కవుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రతి కవి, ప్రతి కవితకు దానిదైన ప్రత్యేకమయిన చట్రం ఎప్పటికప్పుడు రూపొందించుకోవాలె. ముందే నిర్ణయించబడిన చట్రమేదీ సహాయంగా రాదు. అసహాయ శూరుడిగా ముందుకెళ్ళాలి. అందుకే వచన కవిత రాయడం ఎంత ఈజీనో అంత కష్టం.

ఆశలేదు ఆస్కారం లేదు                                                        

ఫలానా రాజు శాపం ఆఖరవుతుందనే హామీ లేదు                                     

ఫలానా రోడ్డు గమ్యం చేరుస్తుందనే సూచన ఎక్కడా ఏమీలేదు                        

జీవితం ఎప్పుడూ ఇలా కన్నీళ్ళ ప్రవాహంగానే సాగుతుందనుకుంటాను             

రోడ్డు పొడుగునా చెట్లు కూలుతున్న దృశ్యాలనే చూపుతుందనుకుంటాను           

పోతే ఇప్పుడు అక్షరాలా నిజం                                                   

మిత్రుడు వెంకట్రావు జీవితంలో చెట్లు కూలుతున్న మాట నిజం                      

లేకుంటె ఎంతో అందమైన సాయంత్రం కూడా ఇలా                            

అపస్వరాలు వినబడటం జరగదు.

రోడ్ల మీద ధూళీ దారిద్య్రం సమస్తం                                              

వెంకట్రావు ముఖం మీదనే టచ్చాడుతూ ఉండడం సంభవం కాదు          

.......’’

          ఇది ఒక అచ్చమైన వచన కవిత. ఇందులో పాద నియమంగానీ, అక్షర నియమంగానీ, గణ,యతి ప్రాస నియమంగానీ లేదు. అంటే పూర్వ నియత చట్రం ఏదీ లేదు. అంటే వచన కవిత రాయటానికి ముందే రూపపరంగా ఒక చట్రం రూపొందించుకోవడం కుదరదు. కవిత రాస్తున్న ప్రాసెస్‍లోనే అది ఏర్పడుతుంది. మిగతా అంశాలు కూడా ముందే అనుకోవడం కూడ కుదరదు. ఒక వస్తువు గురించి మాత్రం ముందే రేఖామాత్రంగా ఒక చట్రాన్ని రూపొందించుకునే అవకాశం ఉంటుంది.

వస్తువు ఎంపిక

          కవి తాను రాయబోయే కవితకు వస్తు నిర్దేశంచేసుకోవడం, అంటే వస్తువు ఎన్నిక చాలా ముఖ్యం. బిచ్చగాడి గురించి రాయొచ్చు. రైతు గురించి రాయొచ్చు. రిక్షా తొక్కే వాడి గురించి రాయొచ్చు. సెక్స్ వర్కర్‍ మీద రాయొచ్చు. అమ్మ గురించి, చెల్లె గురించి, పల్లె గురించి, మారుతున్న మానవ సంబంధాల గురించి గ్లోబలైజేషన్‍ గురించి రాయొచ్చు. సమాజ పరిణామంలో తలెత్తే విభిన్న సంఘర్షణల గురించి రాయొచ్చు. అయితే ఇంతకుముందు ఏ కవీ స్పృశించని  అంశాన్ని కొత్త అంశాన్ని ఎన్నుకోవాలె. ఇందుకు ఎంతో అధ్యయనం అవసరం. కనీసం కవి ఏ భాషలో రాస్తున్నాడో ఆ భాషా సాహిత్యాన్నైనా అధ్యయనం చేయడం అవసరం. అంటే ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని మొత్తం (కనీసం ఆధునిక సాహిత్యాన్నైనా) అధ్యయనం చేయాలె. అలా చేసినప్పుడే ఇంతకుముందున్న కవులు ఏయే అంశాల మీద రాశారు, మనం ఏ అంశం మీద రాయాలనేది బోధపడ్తుంది.

          ఒక కొత్త కవి రైతుమీద ఓ కావ్యం రాయాలనుకుంటాడు. అంతకుముందే వచ్చిన గంగుల శాయిరెడ్డి కాపుబిడ్డ’, వానమామలై జగన్నాధాచార్యులు రైతు రామాయణం’, దువ్వూరి రామిరెడ్డి కృషీవలుడులాంటి కావ్యాల్ని చదవకపోతే వాటిల్లో లేని కొత్త అంశాల్ని ఏం చెప్పగలుగుతాడు?

          ప్రపంచీకరణ గురించి రాయాలనుకుంటే,  ప్రపంచ సాహిత్యాన్ని పక్కనబెడితే కనీసం తెలుగులో రాసిన జూకంటి జగన్నాధం, నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పగడాల నాగేందర్‍ (పరాయి స్పర్శ), కాసుల ప్రతాపరెడ్డి, నాళేశ్వరం శంకరం లాంటి కవుల కవిత్వాన్ని చదవకుంటె కొత్తగా ఏం చెప్పగలడు. అందుకని వస్తువు ఎన్నికకు సాహిత్య అధ్యయనం తప్పనిసరి షరతు.

          సామాజిక అధ్యయనం లేదా పరిశీలన మరొక షరతు. సమాజాన్ని లోతుగా పరిశీలించినప్పుడు అనేక కొత్త అంశాలు స్ఫురిస్తాయి. ఈ లోతుగా చూడడాన్నే మన ప్రాచీనాలంకారికులు దార్శనికత అన్నారు. (కవయః క్రాంత దర్శినః; నా-నృషి కురుతే కావ్యం, దర్శనాత్‍ వర్ణనాత్‍) పాశ్చాత్యులు Vision nH•sÁT. Insight  అన్నారు. తమ లోతు కనుక్కోమంటాయి.’ ‘కళ్ళంటూ వుంటే చూసీఅనే పాదాలు అదే చెప్తున్నవి. రవి కానని కవి కాంచే చూపు అది.

          ‘‘వస్తువు మీద యవనికును తొలగించడం ఆవిష్కరణ

           కంటి మీది పొరను కరిగించడం సత్యావిష్కరణ ’’

కవి తనతో పాటు పాఠకుడి చూపుకు నైశిత్యాన్ని అందించే లోచూపు అది. సాధారణ మానవుడికన్న మిన్న అయిన లోచూపు కవి కుండాలె.

          గరకపోసను సామాన్యులు చూసే చూపుతో కాకుండా దానిలో తిరుగుబాటును దర్శించిండు నారాయణ బాబు. సామాన్యుడు సౌందర్యాన్ని చూసే తాజ్‍మహల్‍లో శ్రీశ్రీ రాళ్ళెత్తిన కూలీలను దర్శించిండు. బైరాగి రాయీ రాయీ విడగొట్టమన్నాడు. అలానే అని కాదు, మామూలు చూపుకంటె భిన్నంగా అర్ధవంతంగా కవి చూపు ఉండాలని.

          వస్తువు ఎంపికలో అంశంతోపాటు మరొక ముఖ్యమైన విషయం దృక్పథం. ఒక కవి ఒక అంశాన్ని, సంఘటనను చూసే దృష్టి కోణం. దీన్ని తాత్త్వికత, Outlook, poetic justic,  Ideologyభావజాలం,ప్రాపంచిక      దృక్పథం  - ఇలా అనేక పదాలతో పిలుస్తరు. ఈ దృక్కోణం లేదా దృక్పథం కూడ వస్తువులో భాగమే.

          ఉన్నతమైన వ్యక్తుల్ని, జీవితాల్ని, విషయాల్ని కవితా వస్తువుగా స్వీకరించాలనేది చాలా కాలం రాజ్యమేలింది. ప్రజాస్వామిక భావన వస్తు స్వీకరణలో మార్పు తెచ్చింది. ఉదాహరణకు గాడిద అనగానే చిన్న చూపు చూస్తరు అసహ్యించుకుంటరు. కవిత్వానికి అనర్హమనుకుంటరు. కాని సురవరం ప్రతాపరెడ్డి-

జడదారులెల్ల నీ నడవడి గాంచియే                                                                                                       బూడిద మైనిండఁ బూసి కొనిరి                                                                                                                  భవదీయ గాత్ర సంస్పర్శచే పూతమౌ                                                                                                       నుడుపుల నందరు తొడిగికొనిరి

          అని గాడిదకు కావ్య గౌరవం కలిగించిండు.

అగ్గి పుల్లా                                                                                                                                                    కుక్క పిల్లా                                                                                                                                                    సబ్బు బిళ్ళా                                                                                                                                              కాదేదీ కవిత కనర్హం. అని శ్రీశ్రీ మార్కిస్టు దృక్పథంతో అల్ప విషయాలూ కవిత్వాని కర్హమేనని చెప్పడమే కాక కళ్ళంటూ వుంటె చూసిఅని దృష్టి కోణం ప్రాధాన్యతను చెప్పిండు.

          కులాంతర ప్రేమను, అసలు ప్రేమనే తక్కువ చేసి మాట్లాడే రోజుల్లో కులాంతర వివాహాన్ని సమర్ధిస్తూ -

కులముగాని సర్వం సహాబలముగాని                                                                                                    ధనముగాని నిశిత ఖడ్గధారగాని                                                                                                                    లేశమై నిరోధింపలేవు సుమ్ము                                                                                                                      నిర్మల ప్రేమశక్తిని నిశ్చయముగ

          అని సురవరం ప్రతాపరెడ్డి రాయడానికి ప్రజాస్వామిక దృక్పథమే (అన్ని కులాలు, స్త్రీ పురుషులు సమానమని, వివాహానికి స్త్రీ పురుషుల పరస్పర ఇష్టం తప్ప మరేదీ కారణం కారాదని ఈ దృక్పథం చెప్పింది) కారణం. కార్లు కడిగే, ఇళ్లు తుడిచే, విత్తనాలు నాటే మామూలు చేతులను గురించి చెప్తూ -

అన్నలు తోడుగా ఉంటె కత్తుల్తో కాలాన్ని కడిగేందుకు                                                                                    మాకున్నవి ఆ రెండు చేతులే

          అని చేతుల్లో సాయుధ విప్లవ సాధనాల్ని చూస్తూ నందిని సిధారెడ్డి రాయడానికి విప్లవ దృక్పథమే కారణం.

           గులాబీలా, మల్లెలా, మందారంలా, పద్మంలా, కలువలా, ఏ విలువకూ నోచుకోని  తంగేడు పువ్వును -

 తంగెడు పూలు అంటె ఒప్పుకోను                                                                                                          బంగారు పూలు...                                                                                                                                        వాసన లేకున్నా వలపు                                                                                                                                  బాసలు నేర్చిన పూలు                                                                                                                                     పేద పూలు...                                                                                                                                            పేదల పూలు...

          అని ఎన్‍.గోపి పేద స్త్రీకి, తెలంగాణకు ప్రతీకగా చేసి కవిత్వార్హత కల్పించడం అభ్యుదయ దృక్పథ  ఫలితమే.

          ఇట్లా సరైన అంశాన్ని సరైన దృక్పథం ఎంచుకోవడమే వస్తువు ఎంపిక. ఇది సరిగ్గా జరిగితే కవితలో సగ భాగం విజయవంతం అయినట్టే. మిగతా సగ భాగం కవిత్వ రూపానికి సంబంధించింది. ఇందులో చాలా అంశాలు ఉంటవి.

శీర్షిక

          ఏ కవిత్వంలోనైనా ముఖ్యంగా వచన కవిత్వంలో కవితా శీర్షికకు కీలకమైన స్థానం ఉంది. కవితాసారభూతం శీర్షిక. కవి శక్తికి నిదర్శనం శీర్షిక. నదీప్రవాహ తీరునుబట్టి, నదీ జల గుణాన్ని బట్టి ఒక నదికి పేరు నిర్ణయమైనట్టు, ఒక పర్వత సముదాయానికి దాని స్వరూప స్వభావాలననుసరించి పేరు నిర్ణయమైనట్టు కవిత మానవ హృదయాల్ని ఒరుసుకుని ప్రవహించే తీరునుబట్టి, అది తాకే హృదయాలను బట్టి తాకాల్సిన హృదయాలను బట్టి, దానిలో నిక్షప్తం చేసిన తాత్త్వికతను బట్టి, అప్పటి సామాజిక, రాజకీయ Context ను బట్టి కవిత పేరు నిర్ణయమవుతుంది. ఒక్కోసారి అది వాచ్యంగా ఉంటుంది. ఒక్కోసారి ధ్వని గర్భితంగా ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి ఉండాలె.

          నేను శీర్షికను ముందు నిర్ణయించుకుని కవితనెప్పుడూ రాయలేదు. రాసింతర్వాత తగిన పేరు నిర్ణయించలేక దానిని బయటకు వదలడానికి నెలలు సంవత్సరాలు ఆగిన సందర్భాలున్నవి. దాలిదీర్ఘకవిత రాసిన. దాని పేరు కోసం చాలాకాలం ఆగిన, ఎందుకంటే శీర్షిక నవ్యంగా ఉండాల్సిరావడమేగాక ఆ కవితకి టోటల్‍గా ప్రాతినిధ్యం వహించాలె. ఒక టాబ్లెట్‍ పేరులా, ఒక మనిషి స్వభావాన్ని తెలిపేదిలా వాచ్యంగానైనా, వ్యంగ్యంగానైనా ఉండాలె. శ్రీశ్రీ కవితా ఓ కవితాలా, గురజాడ దేశభక్తిలా, సురవరం హంవీర సంభవంలా. అపు డెప్పుడో జాగ్వార్‍ స్మైల్‍ అనే నవల పేరును చూసి అచ్చెరువంది ఆ నవలను తెప్పించిన. అదీ పేరు మాహాత్మ్యం.

          నగ్నముని కొయ్యగుర్రంకవితా శీర్షికల్లో తలమానికం. శ్రీశ్రీ మహాప్రస్థానంఅలాంటిదే. దాశరథి అగ్నిధారఅలాంటిదే.

          తెలంగాణ అంశం రగులుతూనే ఉందని ఇంకా రగులుతూనే ఉంటదని చెప్పే శీర్షిక దాలి’ (2001). ఇవి, పుస్తకాల శీర్షికలు. శీర్షిక ప్రాధాన్యతను చెప్పటానికి వీటిని పేర్కొన్న.

గింజను కొరికి పండిన భూమేదో

రేకను సప్పరించి తాటి తావేదో చెప్పగలడు

 నాలుకలో రసశాల గలవాడుఇలా అనేక రకాలుగా రైతు ఔన్నత్యాన్ని వర్ణించి,

 గింజమీద ధరనీ                                                                                                                                         గంజిమీద పేరునీ                                                                                                                                           రాయలేని ఏగానిఅని ముగిస్తడు.  దీనికి ఏగానిసరైన శీర్షిక.

          పైన పేర్కొన్నట్టు కవిత సారాంశాన్ని ప్రతిబింబించాలె శీర్షిక. లేదా కవిత తాత్వికతను చెప్పాలె. కవి ఉద్దేశాన్ని చెప్పాలె. కవి హృదయాన్ని విప్పాలె. కవిత రచనా కాలపు రాజకీయ, ఆర్థిక ఘర్షణల లోతుల్ని విడమర్చాలె. మనిషి అంతరంగానికి సూచిక కావాలె. ఇట్లా ఎన్నో రకాలుగా ఉంటుంది శీర్షిక. సూటిగా ఉండొచ్చు. ప్రతీకాత్మకంగా ఉండొచ్చు. ధ్వని గర్భితంగా ఉండొచ్చు.

          కోదాటి రామకృష్ణరావు సుమవిలాపం’, కరుణశ్రీ పుష్పవిలాపం’, తిలక్‍ నా అక్షరాలు’, గార్లపాటి రాఘవరెడ్డి ధనగర్వితులు’, పల్లా దుర్గయ్య సెలయేరు’, రాజారాం రంగూ రంగులమారి నెవురయ్య’, చిత్రం ప్రసాద్‍ సిచ్చ’, కె.శ్రీనివాస్‍ కొంచెం నీరు కొంచెం నిప్పు’, గఫార్‍ అంగట్లో దొరికే కుంకుమ కాదు దేశభక్తి’, గోరటి వెంకన్న పల్లె కన్నీరు’, స్కైబాబ సాంచ’ - కొన్ని మంచి శీర్షికలు. ఎన్‍.గోపి అరుగుసూటిదనానికి మంచి ఉదాహరణ. సాంచప్రతీకాత్మకమైన శీర్షికకు మంచి ఉదాహరణ. అన్నవరం దేవేందర్‍ మంగులంధ్వనాత్మకమైన శీర్షికకు ఒక మంచి ఉదాహరణ. తెలంగాణ ప్రజలు మంగులంలా వేడి మీద   ఉన్నరనేది ధ్వని.

           ‘పిల్ల పుట్టక ముందు పేరు పెట్టినట్టుఅని ఒక తెలంగాణ సామెతలో అన్నట్టు, శీర్షికను ముందే నిర్ణయించుకోకూడదు.కవిత రాయడం పూర్తయిన తర్వాతనే పేరు పెట్టాలె. కాల సందర్భాన్ని బట్టి, కవిత్వ వస్తువును బట్టి, చేరాల్సిన పాఠకుడిని బట్టి, కవి ఉద్దేశాన్ని బట్టి పేరు పెట్టొచ్చు.

          మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో వచ్చిన దీర్ఘకవిత నల్లవలస’ (గుడిహాళం రఘునాథం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కె.శివకుమార్‍, కె.శ్రీనివాస్‍). ఉత్తమ శీర్షికకు ఉదాహరణ ఇది. తెలంగాణ గురించిన కవిత అని వాచ్యం చేయలేదు. ఆంగ్లేయుల దురాక్రమణను ఆనాడు తెల్లవాడి వలస అన్నారు. వలస పాలన అన్నారు. తెల్లవాళ్ళు భారతదేశానికి వలస వచ్చినట్టు ఆంధ్రవాళ్ళు తెలంగాణకు వలస వచ్చి అన్ని రంగాలలో తెలంగాణను ఆక్రమించినారు. ఆధిపత్యం చెలాయించినారు. తెలంగాణ ఉద్యమానికి మూలకారణమిదే. ఇక్కడికి వలస వచ్చింది నల్లవాళ్ళు (తెల్లవాళ్ళతో పోల్చి చూస్తే). దీన్నంతటినీ ఈ దీర్ఘకవితలో చిత్రీకరించినారు కాబట్టి దీనికి నల్లవలసఅనే  ఔచిత్యవంతమైన పేరు పెట్టిండ్రు.

          మరొక మంచి శీర్షిక పెన్నా శివరామకృష్ణ వైరస్‍’. పాత అర్థంలో కాకుండా కంప్యూటర్‍ పరిభాష అర్థంలో ఈ పేరు పెట్టిండు కవి. కంప్యూటర్‍ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే అర్థచ్ఛాయను మాత్రమే తీసుకొని దాన్ని వవిస్తృతం  చేసి మానవ సంబంధాలను, దేశీయ మూలాలను విచ్ఛిన్నం చేసే, స్థానికతను విచ్ఛిన్నం చేసే స్థాయికి తీసికెళ్లి ప్రపంచీకరణకు ప్రతీకగానూ అమెరికా సామ్రాజ్య వాదానికి గురిపెట్టే విధంగాను అనేక పొరలుగా అనేక అర్థాలు స్ఫురించేవిధంగా ఈ పేరు పెట్టిండు. Depth ఉన్న శీర్షిక ఇది.

          ఈ చర్చ ఏం చెప్తుంది? వచన కవిత్వ నిర్మితిలో కవిత పేరుకు అడవిలో పువ్వు పేరుకున్నంత, ఆకసంల సుక్క పేరు కున్నంత, నీళ్ళల్ల చేప పేరుకున్నంత, ప్రాధాన్యత ఉందని.

ఎత్తుగడ

          కవిత ప్రారంభాన్ని ఎత్తుగడ అంటం. దాన్నే ఎత్తుకోవడం అంటం. నిజంగా వేరే అర్థంలో అది ఎత్తుగడే. శీర్షిక కవితకీ, కవికీ, కవితల సారాంశానికీ సంబంధించిందయితే, ఎత్తుగడ కవికీ పాఠకుడికి మధ్య వారధిలాంటిది. కవీ పాఠకుల ప్రధమ సంబంధం. కవి, పాఠకుల సంభాషణలో మొదటి వాక్యం. పాఠకుణ్ణి తన కవిత్వంలోకి తీసుకెళ్ళే మ్యాజిక్‍. మాంత్రిక వాక్యం. అంతుపట్టని పాఠకుడి గుండెలోతులోకి పాతాళ గరిగను వేసి అతణ్ణి బయటికి తేవడమో, వెంట తీసుకెళ్ళడమో కవి చేస్తాడు.

          ఒక సినిమా ఓపెనింగ్‍కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కవిత ప్రారంభానికి అంత ప్రాధాన్యత ఉంటుంది.

          నా కవితల డైరీ చూస్తే తెలుస్తుంది ఒక్కో కవితను ఎన్ని రకాలుగా మొదలుపెట్టి చూసిననో. ఒక్కసారి ఏ మొదలూ నచ్చక ఆ కవితను ఎంతకాలం ఆపిననో. ఊర్లల్లో మొదలేయడం అంటారు. ఒక అల్లికను సాప,శిబ్బి, మంచం నులక, నవారా మొదలైనవి మొదలేసి ఇస్తే ఎవరైనా దాన్ని పూర్తి చేస్తారు. అలా కవితకు మంచి మొదలు వస్తే గొప్పగా పూర్తవుతుంది. అందుకే మొదలేస్తే సగం కవిత పూర్తయినట్టే అంటరు. పాఠకుణ్ణిలోగొనే టెక్నిక్‍ అది.

          ‘‘అట్లా అని పెద్ద బాధా ఉండదు’’ - వేగుంట మోహన్‍ ప్రసాద్‍ ఒక కవిత ప్రారంభం ఇది. పూర్వాపరాలు చెప్పకుండా ఇలా ఎత్తుకోవడం వల్ల పాఠకుడిలో ఒక ఆసక్తి కలుగుతుంది. ఇక పాఠకుడు తతిమ్మ పాదాల వెంట పడతడు.

          ‘‘కాల్వ జాగేనా గండయ్య’’ ఎం.వెంకట్‍ దీర్ఘకవిత వర్జితొలిపాదం ఇది. తెలంగాణ సందర్భాన్ని గుర్తుంచుకుంటె కాలమై కరువు దీరి కాల్వ సాగుతదా? ఆంధ్రోళ్ళు కాల్వను సాగనిస్తరా? తెలంగాణ ఉద్యమకాలువ కొనసాగుతదా అనే ప్రశ్నలు పాఠకునిలో కలుగతయి. ఇగ పాఠకుడు జవాబుకోసం కవిత యెంట ఎల్తడు.

          సింబోర్స్కా అనే పోలండ్‍ కవయిత్రి కవిత ఒకటి ఇలా మొదలవుతుంది.

 ‘‘ఏదీ మారలేదు                                                                                                                                                శరీరం బాధల చెరువు’’

          ఆదిమ కాలం నుంచి ఇప్పటిదాకా ఎన్నిమారినా బాధమాత్రం మారలేదు అంటూ సాగుతుందీ కవిత, ఎత్తుగడలోని బిగువును కోల్పోకుండా.

          మెక్సికన్‍ కవి ఆక్టేవియా పాజ్‍ కవిత వంతెనఇలా మొదలవుతుంది.

‘‘ఇప్పటికి ఇప్పటికి మధ్య                                                                                                                                   నీకూ నాకూ మధ్య                                                                                                                                           పదం వంతెన’’

          పదం భౌతిక పదార్థం కాదు. అది వంతెన కావడమేమిటి? అనే ఆశ్చర్యం కలుగుతుంది పఠితకు. అలా ఆశ్చర్యానికి గురి చేసే మాంత్రిక శక్తి ఆ పద బంధంలో ఉంది. అది పఠితను లోగొంటుంది.

 దానిలోకి ప్రవేశిస్తే                                                                                                                                         నీలోకి నువ్వు ప్రవేశిస్తావు                                                                                                                           ప్రపంచం చట్రంలా                                                                                                                                  కలుపుతుంది మూస్తుంది                                                                                                                              ఒక తీరం నుండి మరో తీరానికి                                                                                                                        ఒక శరీరాన్ని అలా సాగదీస్తే                                                                                                                  ఇంద్రధనుస్సు                                                                                                                                                నేను దాని కమూనుల కింద నిద్రపోతాను.                                                                                                                                               (అనువాదం - ముకుంద రామారావు)

          బెల్లి యాదయ్య కవిత పాదాలు...మొదలు ఇదీ.

                   ‘‘పాదాలు చాలా గొప్పవి’’

          శరీరంలో హీనంగా చూడబడేవి పాదాలు. బ్రహ్మ పాదాల నుంచి పుట్టిన శూద్రులులాంటి సూక్తుల వల్ల ఈ హీన భావన ఏర్పడింది. ఈ ఇంప్రెషన్‍తో ఉన్న చదువరికి ఈ పాదంవింతగా అనిపిస్తుంది. ఆ వింతను కలిగించిన కవి, చదువరిని తనవెంట తీస్కపోయి, అనేక రకాలుగా వాటి  ఔన్నత్యాన్ని వర్ణించి

 ‘‘పాదాలు చాలా గొప్పవి                                                                                                                                    పాదాల నుంచి పుట్టినందుకు                                                                                                                 చరిత్ర హీనున్ని కాదు నేను చరిత్రకారుణ్ణి’’

          ముగించడంతో, అరె బలె మొదలుబెట్టిండె కవితను అనుకుంటడు చదువరి. మోహన రుషి కవితలన్నీ ఇట్లా ఆశ్చర్యాన్నీ, ఆసక్తినీ రేకెత్తిస్తూ హఠాత్తుగా మొదలవుతయి.

 

నిర్వహణ :

ఎంపిక చేసుకున్న వస్తువును పాఠకుడికి తాననుకున్న పద్ధతిలో చేరవేసే విధానమే నిర్వహణ. శీర్షికతో, ప్రారంభంతో మొదలుబెట్టిన వ్యూహాన్ని ముగింపు దాకా కవిగా తననూ, వస్తువునూ, పాఠకుణ్ణీ ముప్పురిగా పేనుకుంటూ తీసికెళ్ళడమే నిర్వహణ.       

          ఈ నిర్వహణ తీరును బట్టే అనేక కవితా నిర్మాణ పద్ధతులు ఏర్పడుతవి. వాటిలో కొన్ని ఇవి :

 సంభాషణాత్మకం                                                                                                                                             ధ్వని గర్భితం                                                                                                                                             రసాత్మకం                                                                                                                                       ఆలంకారికం                                                                                                                                           ప్రతీకాత్మకం                                                                                                                                           వర్ణనాత్మకం

          నిర్వహణ, వస్తువును వస్తువులో భాగమైన దృక్పథాన్ని బట్టి కూడ ఉంటుంది. అది ఎవరికి చేరాలో ఆ పాఠకుడిని బట్టి కూడ ఉంటుంది. ఈ అన్నింటిని అనుసరించి కవిత నిడివి రూపొందుతుంది.

          నిర్వహణా సామర్ధ్యానికి గురజాడ దేశభక్తి’,‘పూర్ణమ్మ’, శ్రీశ్రీ దేశ చరిత్రలు’  ‘కవితా ఓ కవితా’, సురవరం పద్మినీ పరిణయం’, చెరబండరాజు వందేమాతరం’,  నగ్నముని కొయ్యగుర్రం’, శివారెడ్డి వృద్ధాప్యం’,నందిని సిధారెడ్డి చేతులు’, గుడిహాళం మంచు’, సుంకిరెడ్డి నారాయణరెడ్డి వాగు’, జూకంటి జగన్నాధం వాస్కోడిగామా.కాం’, బైరెడ్డి కృష్ణారెడ్డి వీడ్కోలు నామా’, సతీశ్‍ చందర్‍ పంచమవేదంకొన్ని  ఉత్తమ ఉదాహరణలు.

          నిర్వహణ పద్ధతిని శివసాగర్‍ కుట్రఅనే కవిత నిర్మాణం ద్వారా విశ్లేషించొచ్చు. విప్లవ రచయితల మీద, కార్యకర్తల మీద, విప్లవకారులమీద అప్పటి ప్రభుత్వం పెట్టిన పార్వతీపురం, సికింద్రాబాద్‍ కుట్ర కేసులు, ఈ కేసుల గురించి న్యాయమూర్తుల ముందు హాజరయి ‘‘విప్లవం కుట్రకాదు, రచయితలు కుట్రదారులు కాదు’’ అని చేసిన వాదన ఈ కవిత నేపథ్యం. ఈ అంశాన్ని ఇలాగే చెప్తే కవిత అయ్యేది కాదు. తద్భిన్నంగా ఇలా మొదలు పెట్టి డ్రై సబ్జెక్టును కవితాత్మకం చేసిండు కవి.

‘‘న్యాయమూర్తులుంగారూ                                                                                                                        సూర్యోదయం కుట్ర కాదు                                                                                                                  సూర్యుడు కుట్రదారుడు కాదు’’

          కుట్రపదానికున్న నెగెటివ్‍ అర్థాన్ని విచ్ఛిన్నం చేసి, సమాజ వైరుధ్యాల ఫలితంగా జరిగే సహజ పరిణామాన్ని సూర్యుడుఅనే ప్రతీక ద్వారా స్పష్టం చేసిండు. ఈ మార్పు (విప్లవం) రాకుండా చేసే ప్రయత్నాలను -

‘‘భూమిని చాప చుట్టగా చుట్టి                                                                                                                           చంకనపెట్టుకున్న రాక్షస భూస్వామ్యం కుట్ర                                                                                                     నా దేశాన్ని విదేశాలకు తెగనమ్మే దళారీదనం కుట్ర                                                                                         భారత మహతంత్రం కుట్ర, బాలెట్‍ బాక్స్ కుట్ర                                                                                                   గరీబు హఠావో కుట్ర ఇందిరమ్మ మందహాసం కుట్ర’’

          అని చెప్పి ఒక సంఘర్షణను( conflict ) ను చెప్పడం ద్వారా కవితాంశాన్ని పతాకస్థాయికి తీసుకెళ్ళిండు. సాధారణ అర్థంలో మొదలుపెట్టి పాఠకుడి సమ్మతిని సాధించుకుంటూ నిర్ధిష్టతకు తీసుకొచ్చి,

‘‘శ్రీకాకుళ సూర్యోదయం కుట్ర కాదు

 గెరిల్లా సూర్యుడు కుట్రదారుడు కాదు’’

      అని నక్సల్బరీ, శ్రీకాకుళ, తెలంగాణ విప్లవోద్యమం జరగాల్సిందేనని పాఠకుడి చేత అనిపిస్తూ ముగిస్తాడు. ఇక్కడ కవి, పాఠకుడు తాదాత్మ్యం చెందుతరు. ఈ నిర్వహణ ద్వారా కవి సాధించిన విజయం ఇది. వ్యంగ్యాత్మక నిర్వహణకు ఒక మంచి ఉదాహరణ ఏనుగు నరసింహారెడ్డి రాసిన వాళ్ళు కష్టపడతరు సార్‍ అనే కవిత.

ముగింపు

          సాంప్రదాయికార్థంలో ముగింపు అంటే సందేశం. ఆధునికార్థంలో కవి దేనిని లక్ష్యిస్తున్నడో అది, పాఠకుణ్ణి చేరడం. ఏ అంశం కవిని కలవరపరుస్తుందో కల్లోలం రేపుతుందో ఒక చోట కూసోనివ్వకుండ నిలబడనివ్వకుండా చేస్తుందో దానిని అదే స్థాయిలో పాఠకుడిలో కలిగించడం. కవీ పాఠకుడూ కలగలిసిపోయి ఏకీకరణ చెందడం. దీన్నే ప్రాచీనులు సాధారణీకరణం అన్నరు. ఆధునికులు ఐడెంటిఫై కావడం అన్నరు. ఇద్దరూ అద్వైత స్థాయిని పొందడం ముగింపు. నాకు తెలిసి సిద్ధాంత కర్తలు తప్ప ముగింపును ముందే నిర్ణయించుకొని రాయరు. రామాయణం అట్లా రాసింది. భారతం తద్భిన్నంగా రాసింది. అందుకే రామాయణం మూస. భారతం ఆర్గనిక్‍.

          ముగింపు కవి నిర్ణయం కాక కవిత్వ నిర్ణయం కావాలె. కవితలోంచి Evalve కావాలె.అదే సహజమైన ముగింపు. అట్లా లేనివి సినిమాటిక్‍ ముగింపులనిపించేది అందుకే.

          నేను విప్లవ తాత్వికత ప్రభావంలో ఉన్నంత వరకు రెడీమేడ్‍ ముగింపుల్నే ఇచ్చేవాడిని. అది తోవ ఎక్కడసంకలనంలో తొలిదశ కవితల్లో కనబడుతుంది.

          తదనంతర కవితల్లో ఆ కవిత అంశం దాని పరిణామం ముగింపును నిర్ణయించింది.

          ముగింపు కవిత మూలాల్లోంచి చెలిమెలోంచి మొదలు కావాలె. అది తంగెడ పూలనందిస్తుందా, మోదుగు పూల నందిస్తుందా, గోగుపూల నందిస్తుందా, గునుగు పూలనందిస్తుందా-నేల ప్రతిఫలనం పువ్వు.

           ముగింపు అనేది ఎత్తుగడలా టెక్నిక్‍ కాదుకవికీ పాఠకుడికీ సంగమ స్థలం.ఇరు హృదయాల ఐక్యతా స్థలం.

          90 దశకంలో పెనుగాలిలా వీచిన దళిత కవిత్వం అగ్రవర్ణాలను బోనులో నిలబెట్టింది. అది తట్టుకోలేని ఒక అగ్రవర్ణ కవి నేనూ దళితుణ్ణేఅని ఒక డిఫెండింగ్‍ కవిత రాసిండు. దీనికి సమాధానంగా పగడాల నాగేందర్‍ Offencive tone లో రాస్తూ

 ‘‘ఆ రోజే మీతాత                                                                                                                                                 నా కుల కవి పాదానికి గండపెండేరం తొడిగితే’’                                                                                                   ‘‘వైతాళికులు’’లో నా జాషువా లేడెందుకని?..’’. అని ప్రశ్నిస్తూ -

’’నువ్వు నాలాగా సహ బాధితుడివైతే                                                                                                              నిత్యం ఆకలితో చస్తున్నవాడివైతే                                                                                                                    ధైర్యంగా నాయింటికి రారా                                                                                                                          గుండెల్నిండా ప్రేమ నింపుకొని                                                                                                                        గొడ్డు మాంసంతో అన్నంపెడతాను...                                                                                                            తరతరాలుగా అస్పృశ్యుడ్ని చేసిన                                                                                                                    ఆ శాస్త్రగ్రంథాలనూ వేదపఠనాలనూ                                                                                                              ఎడమకాలతో తన్ని                                                                                                                                      మనిషిగా బతకడానికి నాతో కలిసి రారా’’

          అని ముగిస్తాడు. ఈ ముగింపుతో నేనూ దళితుణ్ణేఅనే అగ్రవర్ణ కవి బాధలో నిజంలేదుఅని స్ఫురింపజేస్తాడు. అది పాఠకుడికి కూడ అవుననిపిస్తుంది. అట్లా అవుననిపించేలా చేయడం మంచి ముగింపు.

కాళ్లు కవాతులై                                                                                                                                            చేతులు ఎక్కుపెట్టిన ప్రశ్నలై                                                                                                                  దేహమంతా ఒక పేరిణి తాండవమై                                                                                                                    ఆర్తిలోంచి                                                                                                                                              ఆత్మలోంచి వెలువడే                                                                                                                                      సప్త సముద్రాల హోరుపాట

          అని పాటను గురించి వివిధరకాలుగా వర్ణించిన ఎన్‍.గోపి ఆ కవితను ఇలా ముగిస్తాడు.

‘‘తెలంగాణ పాడిందే పాట                                                                                                                      తెలంగాణను కాపాడిందే పాట’’

          ఈ ముగింపుతో పాఠకుడు ఝటిత్‍ స్ఫూర్తికి లోనౌతడు.

          ఒక కోస్తాంధ్రుడు మంగలి వృత్తిని అవహేళన చేసినప్పుడు వనపట్ల సుబ్బయ్య ఆత్మవిశ్వాసంతో జవాబుగా రాసిన కవితను ఇలా ముగిస్తాడు -

నీ కుర్చీలో                                                                                                                                                  నీ వొక్కడివే రాజు                                                                                                                                            నా కుర్చీలో                                                                                                                                                  జనమంతా రాజులే                                                                                                                                          నీ కుర్చీకి ఐదేళ్ళే                                                                                                                                              నాకుర్చీ                                                                                                                                                        అనంతం’’

          మంచి ముగింపు కొక ఉదాహరణ ఇది.

శిల్పం

          కవితా శిల్పంలో పైన పేర్కొన్న అన్ని అంశాలు భాగాలే.  ఆలంకారికతకూడా  శిల్పంలో భాగమే.కవిత్వ అభివ్యక్తి పద్ధతులలో ఆలంకారికమార్గం ఒకటి.

          మామూలు Communicative  భాష నుంచి కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే ఉపకరణాల్లో ఆలంకారికత ఒకటి.

          ఒక ఊర్లో పెండ్లం మొగల పంచాయితీ నడుస్తుంది. పెద్దమనిషి అడిగిండు.

          మొగుడ్ని ఎందుకొద్దంటున్నావమ్మా

          ఆమె అన్నది -

          ‘‘మూడు సొప్పకట్టల్దినే ఆవుకు ఒక్క సొప్పకట్టి ఏస్తే సాల్తదా? అది అవతలి దొడ్డికై జూస్తదా లేదా’’ (నా చిన్నప్పుడు విన్న మాటలివి.అప్పుడర్థం కాలేదు. మా నాయనకు పెద్దమనిషిగా మంచి పేరు కాబట్టి తలాకిట్ల ఇసొంటి పంచాయితీలు చాలా నడ్సేయి.)

          ఇక్కడ అలంకార ధ్వని ఉన్నది.అంటే చెప్పదల్చుకున్నదాన్ని వాచ్యం చేసి (అంటే బాహాటంగా చెప్పి) తనను పల్సన జేసుకోకుండా, పోలిక ద్వారా అర్థం కావలసిన వాళ్ళకు అర్థమయ్యే ఆలంకారిక భాషను ఆమె వాడింది. ఇది ఆలంకారిక భాష. దీనినే కవిత్వ భాష అంటరు. (ఇలాంటివి వెనుకుబడిన సమాజాల్లో కోకొల్లలు. అసొంటి సమాజానికే చెందిన గాథాసప్తశతిలో ఇసొంటి వెన్నో ఉన్నయి)

          కవి చెప్పదల్సుకున్న విషయాన్ని (వర్ణనీయ అంశాన్ని) వినేవానికి (పాఠకుడికి) కళ్ళకుకట్టినట్లు చెప్పడానికి అంటే దృశ్యమానం చేయటానికి వినేవాడికి తెలిసిన పోలిక తెచ్చి అతనికి అర్థమయ్యే విధంగా (హృదయాని కత్తుకునే విధంగా) వర్ణిస్తడు. ఈ పోలికే (ఉపమానం) అన్ని అర్థాలంకారాలకు మూలం.  పాశ్చాత్య సాహిత్యంలో వచ్చిన Imagism ఉద్యమ ప్రభావంతో మన   ఉపమ, రూపకాలంకారలను మిళితం చేసి ఇమేజ్‍ అంటున్నరు. దీన్ని భావచిత్రం, పదచిత్రం, భావ ప్రతిమ అని తెలుగులో అంటున్నరు. ఇందులో కూడ పోలికే ముఖ్యం.

          ఈ పోలిక తేవటానికి కవికి గొప్ప భావనాశక్తి (Imaginative eye) నిశితపరిశీలనా శక్తి అవసరం. ఇవి ఉన్నవాడే కవి.

‘‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాయి                                                                       నా అక్షరాలు ప్రజాశక్తులనావహించే విజయ ఐరావతాలు                                                                             నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమయిన ఆడపిల్లలు’’ (తిలక్‍)

          ఇక్కడ కవి తన కవిత్వం ఎలాంటిదో చెప్పడానికి మూడు పోలికల్ని తెచ్చిండు. తన కవిత్వం కరుణరసాత్మకం, ఉత్తేజాత్మకం, ఆనందదాయకం అని చెప్తే అది కవిత్వమయ్యేదికాదు. ఆ మూడు పోలికల్ని తేవడం వల్లే కవిత్వమయ్యింది. అట్లా చెప్పడం వల్లే హృదయానికత్తుకుంది. అందుకే ఇంతకాలమూ పాఠకులకు గుర్తుంది. ఈ పోలికలు తేవడం వల్ల కవిత్వ ప్రయోజనంలోని మూడు పార్శ్వాలను చెప్పడం సాధ్యమయింది.

సింధూరం రక్తచందనం                                                                                                                            బంధూకం సంధ్యారాగం                                                                                                                       ఎగరేసిన ఎర్రని జెండా...                                                                                                                          కావాలోయ్‍ నవ కవనానికి’’             (శ్రీశ్రీ)

          ఇవన్నీ అప్పుడు కొత్తగా రాబోతున్న అభ్యుదయ కవిత్వానికి వస్తువులు. కాదు ఆ కవిత్వం ఎలా ఉండాలో చెప్పే పోలికలు.

          ‘‘ప్రజలను సాయుధం చేస్తున్న రెవెల్యూషనరీ నేడు కవి’’ విప్లవ కవి ఎలా ఉండాలో చెప్పడానికి రెవెల్యూషనరీపోలికను తెచ్చిండు.

          దళిత కవిత్వం ఎలా ఉండాలో, ఉంటుందో చెప్పడానికి మరొక కవి ఇలా అనేక పోలికలు తెచ్చి చెప్పిండు.

‘‘కవిత్వమే నా ఎండు తునకలదండెం                                                                                                              కవిత్వమే నిప్పుల సెగ మీద కాపబడ్తున్నడప్పు                                                                                            కవిత్వమే మా తోలు చెప్పు మీది ఉంగుటం                                                                                                అగ్రవర్ణాల దాడిలో గాయపడ్డ దళితవాడ                                                                                                  కార్చుతున్న నెత్తుటి మరకా కవిత్వమే’’   (పసునూరి రవీందర్‍)

          ఈ అన్ని కవితల్లో కవిత్వం ఎలా ఉంటుందో చెప్పటానికి తెచ్చిన పోలికలు తెలుగు కవిత్వ పరిణామాన్ని గూడ సూచిస్తున్నవి.

          కవిత్వం నిరంతరం మారుతుందని, అనవరతం నవనవంగా వస్తుందని అట్లా ఎప్పుడూ కొత్తగా వచ్చేదే కవిత్వమవుతుందని సూచించడానికి ఒక కవి ఇలా పోలికలు తీసుకొచ్చి మన కళ్ళముందు పరిచిండు.

‘‘స్వరాలన్నీ నెమలిరెక్కలైతే                                                                                                                          అపస్వరమై పలికే కాకి కవిత్వం                                                                                                                  కాకులన్నీ కలభాషిణులైతే                                                                                                      కనుమరుగైతున్న కోయిల గండస్వరమే కవిత్వం                                                                                          కప్పలకు రెక్కలొచ్చి ఆకసంలో ఎగరడం                                                                                                      పక్షులకు మొప్పలొచ్చి సంద్రంలో ఈదడం కవిత్వం’’                                                                                       అద్దం అద్దకంగా మారితే                                                                                                                              బద్దలు చేసే రాయి కవిత్వం

          భావ కవులంతా పదలాలిత్యంతో కవిత్వం రాసి అది చర్విత చర్వణమైనప్పుడు

పమోధర ప్రచండ ఘోషం                                                                                                                                ఖడ్గ మృగోదగ్ర విరావం                                                                                                                            ఝంఝానిల షడ్జధ్వానం

          అని రాస్తే కవిత్వం అయింది. మళ్ళీ అందరూ అదే పద్ధతిలో రాసి అది పాతబడ్డప్పుడు, తిలక్‍ మృదువుగా రాస్తే కవిత్వం అయింది. ఇది అలంకారలకు, ఇమేజ్‍లకూ వర్తిస్తుంది. ఒకప్పటి కవికి స్త్రీ కళ్ళు చేప ఆకారంలో కనిపించి ఆమె ఆకర్షణీయంగా ఉందనేదాన్ని దృశ్యమానం చేయడానికి మీనాక్షిఅన్నడు. మీన నయనఅన్నడు. ఇమేజ్‍లు పాతబడి దృశ్య ప్రసారం చేయలేని స్థితి ఏర్పడినప్పుడు  కవి కొత్త పోలికలను తేవాలె.కవి భాషా సృష్టికర్త అయ్యేది అలాంటి సందర్భంలోనే. ఇప్పుడు కొన్ని అలంకారల సొగసులను చూద్దాం -

‘‘తంత్రి నుండి నువ్వొక                                                                                                                                    నవ్వు రువ్వుతావు                                                                                                                                         ఆకాశం నుండి                                                                                                                                             మృదుల సాంద్రపు                                                                                                                                        వడగండ్లు కురిసినట్లు                                                                                                                                       నేల నీటి నిశ్చలత్వం మీద                                                                                                                               ఒక వింత అలజడి మొదలవుతుంది’’ (ఏనుగు నరసింహారెడ్డి)

          నవ్వు అది కలిగించిన అలజడి -ఇవి అమూర్తమైనవి. ఎన్ని పదాల్లో చెప్పినా నవ్వు స్వభావం, అలజడి స్వభావం అభివ్యక్తం కావు. అందుకే కవి మృదుల సాంద్రపు వడగండ్లపోలిక ద్వారా నవ్వు స్వభావాన్నీ, ‘నిశ్చలమైన నీటిలో కలిగిన ప్రకంపనపోలిక ద్వారా అలజడి స్వభావాన్నీ దృశ్య మానం చేసినాడు. అలంకారం వల్ల కలిగే ప్రయోజనమిదీ.

కూరల్లోకి తలా ఒక రెమ్మా తుంచుకెళ్ళితే                                                                                                  మిగిలిన కరేపాకు మొక్కలా వున్నాడు   (శివారెడ్డి)

‘‘కళ్ళు చూపుల ముత్యాలు పొదిగిన చర్మపు దోనెలు                                                                                       చర్మపు పత్రాలు తొడిగిన చైతన్యపుష్పాలు                                                                                                   గుండెల సముద్రాల బాధల బడబాగ్నుల్ని తోడి                                                                                             బొట్టు బొట్లుగా కార్చే అనుభూతుల ఏతాలు కళ్ళు’’ (నిజం)

               ఇక్కడ కవులు వాడిన అద్భుతమైన పదచిత్రాల వలన వారు చెప్పదలచుకున్న భావం ఎఫెక్టివ్‍గా చదువరిని తాకింది.

క్లుప్తత

              నిజానికి క్లుప్తత, గోప్యత రెండు వేరు వేరు లక్షణాలు. కొన్ని సందర్భాల్లో రెండూ మిళితమవుతవి. ముందు క్లుప్తత గురించి మాట్లాడుకుందాం. కవిత్వ అభివ్యక్తిలో రెండు రీతులున్నవి. ఒకటి Discriptive రీతి, రెండు Prescriptive  రీతి. మొదటిది వర్ణనాత్మకం. ఈ రీతిలో అలంకారాల ఉపయోగానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ప్రతి సూక్ష్మాంశ వర్ణన ఈ రీతిలో ఉంది. కాబట్టి అలంకార మయంగా ఉంటుంది. రెండవది సూచనాత్మక రీతి. ఈ రీతిలో క్లుప్తతకు లేదా సంక్షిప్తతకు అవకాశం ఉంటుంది. పద్య ఛందస్సులో సీసం, వృత్తాలు వర్ణనాత్మక రీతికి వాహికలైతే కందం, తేటగీతి ఆటవెలదులు సూచనాత్మక రీతికి వాహకాలు అని అందరికీ తెలిసిందే. వచన కవిత్వంలో మినీ కవితలు, హైకూలు, నానీలు క్లుప్తతకు వాహికలు. పెద్ద కవితల్లో కూడ విడి అంశాత్మక భాగాలు కూడ వాహికలే. వర్ణనాత్మక రీతికి ఊహ,భావుకతలు(Imagination), రసాత్మకత, కాల్పనికతలు ప్రాతిపదికలు. సూచనాత్మకరీతికి ఆలోచనాత్మకత, వాస్తవిక దృష్టి, సూత్రీకరణ, తాత్వికీకరణ, సాధారణీకరణ, ధ్వన్వాత్మకత ప్రాతిపదికలు. ఈ రీతిలో కవికి దార్శనికత, ఎంతో పరిశీలనా శక్తి అవసరం. మానవుల అనుభూతుల్లోని,ఉద్వేగాల్లోని, ఆలోచనల్లోని Generality ని కవి పట్టుకోవాలె. సామాజిక పరిణామంలోని ఘర్షణని గుర్తించాలె.సామాజిక చలన దిశను పసిగట్టాలె. అప్పుడు ఒక తత్త్వవేత్తలా సూత్రీకరించాలె. ఇక్కడే కవి తాత్త్వికుడు కావాలె. తాత్త్వికుడు కవి కావాలె. ప్రజల్లోని వేలాదిమంది అజ్ఞాత కవులు, తాత్వికులు రూపొందించిన సామెతలు, జాతీయాలు, పలుకుబళ్ళ క్లుప్తతకు తిరుగులేని ఉదాహరణలు.

 ఆకలి తీరిన వాడికి తెలుసు                                                                                                                           గురి పేల్చే గుండె ఏ గుండెను చీల్చనుందో                                                                                                    ట్రిగ్గర్‍ నొక్కే వెలికి తెలుసు                                                                                                                         హంతకులెవరో నాకు తెలుసు (నగ్నముని - కొయ్యగుర్రం)

          ఇక్కడ కవి ఒక సూత్రీకరణ చేసిండు. అంటే ఎన్నో పేజిల్లో చెప్పవలసిన విషయాన్ని అయిదు వాక్యాల్లో చెప్పిండు. అయితే అందువల్లనే ఇది కవిత్వం కాలేదు. ఆ అంశాన్ని తార్కికంగా చెప్పినందువల్ల గూడ కవిత్వం కాలేదు. క్రమబద్ధమైన వాక్యాల్లో చెప్పినందువల్ల కవిత్వమయింది. అది క్లుప్తతకూ కారణమైంది.

తనుపుండై                                                                                                                                                      వేరొకరికి పండై 

తను శవమై                                                                                                                                              వేరొకరికి వశమై

తను ఎడారై                                                                                                                                               ఎందరికో ఒయాసిస్సై     (అలిశెట్టి ప్రభాకర్‍)

          బాగా ప్రసిద్ధి చెందిన ఈ కవిత, దేశంలోనే కాదు ప్రపంచంలోని వేశ్యలందరికీ ప్రాతినిధ్య కవిత. వెయ్యి పేజీల వేశ్యా జీవితాన్ని ఆరులైన్లలోకి కుదించి క్లుప్తతకు ఉదాహరణగా నిలబెట్టిన కవిత. (అయితే ఈ కవిత నిర్మాణాన్ని కొద్దిగా మార్చి ప్రతి రెండు పాదాలయూనిట్‍లో పై పాదం కిందికి వస్తే మరింత ఔచిత్యవంతమూ మరింత కరుణ రసాత్మకం అయి ఉండేది. ఎందుకంటే తను పుండైన తరువాత పండుకాలేదు. పండైన తర్వాతే పుండయింది. తను శవమై వశం కాలేదు. వశమయినంకనే శవమయింది. తను ఎడారైనంక ఒయాసిస్సు కాలేదు. ఒయాసిస్సైనంకనే ఎడారైంది.)

‘‘అప్పుడు                                                                                                                                                      గడీని చూస్తే                                                                                                                                                         ఉచ్చ బడేది                                                                                                                             ఇప్పుడు                                                                                                                             గడీలోనే                                                                                                                                             ఉచ్చబోస్తున్నరు’’ (అన్నవరం దేవేందర్‍)

          ఇది సామాజిక పరిణామాన్ని నిశితంగా పరిశీలించినందువల్ల వచ్చిన క్లుప్తత. ఇక్కడ గూడ క్రమబద్ధమైన (Rythematic) పదాల ఎన్నిక, వాక్య నిర్మితి వల్ల కవిత్వమైంది. ఇక్కడే తాత్వికుడి కంటె కవి ఉన్నతుడయ్యేది. తాత్వికుడు ఇంత కన్నా గొప్పగా సూత్రీకరించగలడు కాని ఇలా హృదయాన్ని తాకేలా చెప్పలేడు. వినసొంపుగా చెప్పలేడు.

ఉదయం కానేకాదనడం నిరాశ                                                                                                                    ఉదయించిన సూర్యుడు                                                                                                                                         అలానే ఉండాలనడం దురాశ     (కాళోజీ)

          ఇలాంటివెన్నో కవితలు - శ్రీశ్రీ ‘‘ఆః’’, స్మైల్‍‘‘ఈ బాధకు టైటిల్‍ లేదు’’, నా.రా ‘‘అపస్వరాలు’’ కొన్ని. అలాంటి కవితల్ని లోతుగా చదివితే క్లుప్తతను ఎలా సాధించవచ్చో అవగతమవుతుంది.

గోప్యత

          ఇక గోప్యత గురించి, గోప్యత అంటే వాచ్యానికి విరుద్ధమయినది. బయటికి చెప్పే అర్థం వాచ్యార్థం. దీని వెనుక దాగి ఉండే మరొక అర్థమే గోప్యం. దీనినే లాక్షణికులు వ్యంగ్యం, ధ్వని అన్నరు. పాశ్చాత్య విమర్శకులు suggestion అన్నరు. ఈ రీతిని సి.నారాయణరెడ్డి గారు కప్పి చెప్పడంఅని సరళంగా చెప్పిండ్రు. దీనివల్ల కూడ కవితకు క్లుప్తత సమకూరుతుంది. పైన పేర్కొన్న అన్నవరం నా.రా కవితలు ధ్వనికి కూడ మంచి ఉదాహరణలు. గాథాసప్తశతిలోని అనేక పద్యాలను ఆనందవర్ధనుని లాంటి లాక్షణికులు ధ్వనికి ఉదాహరణలుగా తీసుకున్నరు. అలాంటి పద్యమొకటి ఇది.

‘‘ఇచట నే పరుందు, నిచ్చట నత్తగా                                                                                                                        రిచట పరిజనంబుల్లెల; వినుము                                                                                                                          రాత్రి నీకు గానరాదు; నా పడుకపై                                                                                                                    తప్పి పడెదవేమొ దారికాడ!’’(గాథా సప్తశతి)

          ఇక్కడ వాచ్యార్థం (పైకి చెప్పేది) మీద పడొద్దని, స్ఫురింప జేసే అర్థం (ధ్వని) మీద పడుము అని. దీనిలోని స్వారస్యమేమిటంటే వాచ్యార్థం తన అత్త, పరిచారికుల కోసం. వ్యంగ్యార్థం బాటసారి కోసం. ఎవరికి అర్థం కావలసింది వారికి అర్థమవుతుంది.

తమిళ తంబికి భయపడి                                                                                                                                        మా నగరానికి                                                                                                                                                       వలస వచ్చిన వాడా                                                                                                                                               నగరం మాది                                                                                                                                                          భాగ్యం మీది                  (నల్లవలస)

          భాగ్యనగరం (హైదరాబాద్‍) శబ్దాన్ని విరవడం ద్వారా సంపదంతా కోస్తాంధ్రుల వశమైందన్నది ఇక్కడ గోప్యంగా చెప్పబడినది.

ఇద్దరి కిద్దరం వొక అబద్దాన్ని మోస్తూనే                                                                                                              భరిస్తూనే ఖర్మ ఖర్మ అంటూనే...                                                                                                                       చూడూ ఈ చరిత్రలోకి మనిద్దరం                                                                                                                          ఎవరో తోస్తే ఎక్కినట్టు ఎక్కి తకధీమ్‍ తకధీమ్‍ తై                                                                                                    నీ పాత్ర నేనూ                                                                                                                                                     నా పాత్ర నువ్వు                                                                                                                                                 ఎవరూ ఎవరి పాత్రకి న్యాయం చేయలేక                                                                                                      ఇద్దరికిద్దరం అన్యామయ్యి తోస్తూనే ఉన్నాం’...

చూడు, ఈ విస్తరిలోకి మనిద్దరం మనికి తెలియకుండానే వచ్చాం..

‘‘నువ్వు నాకు కనీసం ఎంగిలిమెతుకులు కూడా                                                                                          విదిలించని ఉషారు పిట్టవని నాకూ తెలుసు                                                                                                        నేను నీమోచేతి నీళ్ళ కోసం కాచుక్కూచోని                                                                                                   కావు కావుమనే పిచ్చికాకి కాదని నీకూ తెలుసు                                                                                                  సర్లే ఈ నాటకం ఆడింది చాలు                                                                                                                          నన్ను నాదారిన పోనీ                                                                                                                                      నీకెటూ వందదారులు’’            (అఫ్సర్‍)

          ఇట్లా ఈ కవితను చదువుకుంటూపోతే, పోసగని సంసారం లేదా సహజీవనం చేస్తున్న స్త్రీ పురుషుల గురించి రాసినట్టు అనిపిస్తుంది. పురుషుడి మీద స్త్రీ ఆరోపణలు చేస్తున్నట్టు అనిపిస్తుంది.

          నవంబరు వొకటి రంగస్థలమ్మీదకిఅనే  పాదం ద్వారా ఇది సంసారంగొడవ కాదని తెలంగాణ - ఆంధ్ర గొడవని స్ఫురించడం మొదలవుతుంది. ఇద్దరికిద్దరం అన్యాయమయ్యిఅనే మాటల ద్వారా పొసగని భార్యాభర్తల (ఎందుకంటె నవంబర్‍ 1, 1956లో జరిగిన తెలంగాణ ఆంధ్రల విలీనం తర్వాత నష్టపోయింది ఇద్దరు కాదు. తెలంగాణ ఒక్కటే) గొడవ అని అనిపింపజేస్తాడు. కాని -

నా పొలాల్నీ                                                                                                                                                     నా నీళ్ళన్నీ నువ్వు                                                                                                                                             నా చేతుల్లోంచీ మోచేతుల్లోంచీ కాలివేళ్ళలోంచీ                                                                                                     కంటి నీడల్లోంచీ ఎటుకనిపిస్తే అటు దోచేస్తూపోతావ్‍

          అనే మాటల ద్వారా తెలంగాణ వేదనని స్ఫురింపజేస్తాడు. అంటే ఈ కవితలో తెలంగాణ అంశం వాచ్యంగా కాక ధ్వన్యాత్మకంగా చెప్పడం జరిగింది.

          పొడుపు కథలు ధ్వన్యాత్మకతకు లేదా గోప్యతకు గొప్ప ఉదాహరణలు. ఒక ఉదాహరణ;

          ఒక స్త్రీ విటుడితో ఇంట్లో ఉంటుంది. అప్పుడు దూర ప్రాంతాలకెళ్ళిన భర్త వచ్చి తలుపు కొడతడు. అప్పుడామె తలుపు తీయడానికెల్తూ ఈ పాట పాడ్తది.

సగం జచ్చేను నీ కోసం (ఎర)                                                                                                                               సాంతిం జచ్చేవు నాకోసం (చేప)                                                                                                 వచ్చికూసున్నడు మన కోసం’ (భర్త)

          బ్రాకెట్లో రాసిన అర్థం భర్త కోసం చెప్పే వాచ్యార్థం. తన భర్త వచ్చాడు పారిపొమ్మని చెప్పే హెచ్చరిక గూఢార్థం. కవిత వాచ్యమైతే పేలవమవుతుంది. సూచ్యంగా రాస్తే సొగసుగా ఉంటుంది.

సంపూర్ణత-సమగ్రత

          కవితకు సంపూర్ణత, సమగ్రతలను చేకూర్చే అంశాలు ప్రతీకలు, పదచిత్రాలు, అభివ్యక్తులు మాత్రమే కాదు. వస్తువును బట్టి ఉంటుంది అది.   conflictను ప్రెజెంట్‍ చేసే వస్తువైతే అనుకూల ప్రతికూల వాదనను ఉద్వేగాత్మకంగా నిలబెట్టే పద్ధతి ద్వారా  సమగ్రత సిద్ధిస్తుంది. వస్తువు పాతదైనప్పుడు పై మూడింటి(ప్రతీకలు, పదచిత్రాలు, అభివ్యక్తులు)కి ప్రాధాన్యత ఉంటుంది. సమగ్రత దృష్ట్యా మాత్రమేగాక ఇతరత్రా కూడ వీటికి సముచిత స్థానం ఉంది.

          అసలైతే కవితను ఒక ప్రాణిగా, ఒక జీవిగా భావించాలె. తల్లి నవమాసాలు మోసి తన సమస్తాన్ని ఆ జీవిలోకి ప్రసరించి సలక్షణమైన ( సకల అవయవాలు సమనిష్పత్తిలో ఉండే ఒక ప్రాణి) బిడ్డకు జన్మనినిచ్చినట్టు,కవి నుంచి పుట్టిన కవితకు కూడా ఆ సలక్షణత ఉండాలె. ఈ సలక్షణతనే సమగ్రత లేదా సంపూర్ణత అనొచ్చునేమో. చిత్రకారుడికి కన్ను ఇష్టమైతే కన్నును చన్ను  ఇష్టమైతే చన్నును Unproportionate గా గీస్తే అది అనౌచిత్య చిత్రమవుతుంది. సకలవయవాలు  తగిన నిష్పత్తిలో ఉంటేనే ఆ చిత్రానికి సమగ్రత చేకూరుతుంది. లేకపోతే అది అతని వికృత మనస్సుకు ప్రతిరూపమై ఎబ్బెట్టుగా ఉంటుంది.

          ఈ దృష్టితో పై మూడింటిని గురించి మాట్లాడుకోవాలె

ఒకటి తెలుసా                                                                                                                                                          నేను రాయి విసిరినపుడు                                                                                                                                      నీకు పగిలిన అద్దం మాత్రమే కనిపిస్తుంది                                                                                                               నాకు తెలంగాణ చిత్రపటం కనిపిస్తుంది’’ (అంబటి వెంకన్న) 

‘‘ఈ దాడి పరాయీకరణ మీద ఓ ప్రతీకారం ’’(వఝల శివకుమార్‍)                  

‘‘ప్రజాగ్రహానికి పరీక్షపెడితే                                                                                                                          విగ్రహాలేం కర్మ విద్రోహులూ నేలకూలక తప్పదు’’ (గాజోజు నాగభూషణం)

కాకి కన్ను ఎండుగు మీదున్నట్లు                                                                                                                 గద్దకన్ను కోడిపిల్లల మీదున్నట్లు                                                                                                          మొగకండ్లు ఆడోళ్ళమీదనే బిడ్డా  (శ్రీదేవి)

మా ఊరు మధ్య ఓ బురుజు                                                                                                                            బురుజు మీద ఒక చెట్టు                                                                                                                                    మహా గొప్ప దృశ్యం                                                                                                                                          మనిషి గొడుగు పట్టుకుని                                                                                                          నిలుచున్నట్టుండేది                (కందుకూరి శ్రీరాములు)

 నేలతల్లి గుండెల్లో నిక్షిప్తమయిన                                                                                                                     నల్ల వజ్రం కాంతి వాడు                                                                                                                               జీవితాన్ని చుట్టచుట్టి                                                                                                                                       బరువు నెత్తుకున్న                                                                                                                                       చూలాలి తట్ట కింద                                                                                                                                       మెత్తగా ఒత్తుకున్న చుట్టబట్ట వాడు       (దేశపతి శ్రీనివాస్‍)

నిత్య విస్ఫోటనం చెందనిదే                                                                                                                        సూర్యుడు నిప్పులు చెరిగేనా                                                                                                                      తనువు నిలువెల్లా చీలనిదే                                                                                                                        భూమి ప్రాణదాతయై నిలిచేనా    (గాజోజు నాగభూషణం)

          ‘‘అరవయ్యేళ్ళ క్రితం ముందు అరవయ్యేళ్ళ క్రితం అరవై నెలల క్రితం అరవై వారాల క్రితం నన్ను చంపేశారు. అరవై రోజుల క్రితం అరవై గంటల క్రితం అరవై నిమిషాల క్రితం అరవై ఘడియల క్రితం నన్ను చంపేశారు. రేపూ ఎల్లుండీ వచ్చేవారమూ వచ్చే నెలా వచ్చే సంవత్సరమూ చంపేస్తారు నన్ను                                                                              (దెంచనాల శ్రీనివాస్‍)

‘‘ఉలి నాదే నేర్పు నాదే శిల్పమూ నాదే                                                                                                            శిల్పిని తానంటడు ’’          (కాసుల ప్రతాపరెడ్డి)

లేగదూడ నాలుకపై                                                                                                                                      పాల పొదుగు కురిసినట్లు                                                                                                                            తుమ్మెద నోరు తెరిస్తే                                                                                                                                  పువ్వులో తేనె ఊరినట్టు                                                                                                                            మేఘంతో వాగు జతగూడిన చోట                                                                                                                      నా తెలంగాణ                                                                                                                                               తంగెడు పువ్వులా పలకరించేది            (సి.కాశీం)

 పజ్జొన్న విత్తుల్లో పలికి పగిలి దాక్కున్న                                                                                                       పొద్దులం మనం                                                                                                                                             పోరులం మనం                    (సిద్దార్థ)

యేండ్ల నుండి సున్నం జాజుల్లేక                                                                                                                  పాతమట్టి గోడల యిల్లు                                                                                                                              అల్‍కబకు తీసుకుపోతున్న                                                                                                                  బక్కావులెక్క బొక్కల్దేలింది                  (నారాయణస్వామి)

ఇంటింటికో ఇంజినీరు అమెరికా వెళ్తాడు                                                                                                    వలస వస్తున్న డాలర్లు కన్నీళ్ళను మోసుకొస్తాయి         (రామా చంద్రమౌళి)

‘‘ఆర్థిక వచనమే రాస్తానిక నుంచి రూకలిస్తావా                                                                                               తోడేళ్ళు తప్ప ఏవీ తినకుండా ఈ మేకలకు కాపలా వుంటాను                                                                   మానాలు అమ్ముతాను నా ఇష్టానికి కొంటాను                                                                                         మలమూత్ర పిండాల్ని ఏదో ధరకి గిట్టించుకొంటాను సరేనా’’ (సీతారాం)

కోట్లు గడించినా                                                                                                                                                చీట్ల పేక మేడ నీ బతుకు                                                                                                                    అద్దరూపాయి సంపాదించినా                                                                                                                 అమృత తుల్యం నా మెతుకు...                                                                                                             జ్వలించడం తెలియని మంచు ముద్దవు                                                                                                 గమించడం తెలియని గోడ సుద్దవు                  (నీకూ నాకూ ఏం పోలిక- సి.నారాయణరెడ్డి)

పశువుల కాపరి                                                                  

అనుభవ గీతాన్నె                                                                 

రైతు వేసిన పోలికేక పిలుపునై                                                   

వేసవినై వెన్నెల వన్నెలు కురిసిన పువ్వునై                                             

వడ్ల పిట్టనై వర్షం బొట్టునై                                               

వెలుగు చుక్కనై                                                                   

చలినై చాపబొంతనై                                                                

గొంగడి కొప్పెరనై                                                                  

వేడినై కాలిబేడినై                                                                  

దండెకడియాన్నై                                                                  

చెవిపోగునై కరుకు చుట్టనై                                                       

ఆకునై                                                                    

ఆకుసందుకాయనై                                                                

పండునై.... బండినై                                                                

బండి చక్రం చప్పుడునై                                                           

తాడునై తాడు ఒరుస్తున్న చేతినై                                                

పదం అందుకున్న నోటి తమలపాకు వాసనై                                             

దగాపడ్డ గుండెలో ఊసునై  (రంగులూ రాగాలు - బి.నరసింగరావు)

 తన్నుకొచ్చే ఏడ్పుని కంటి పెదాల కింద దాచడం                                                                                    సూర్యుణ్ణి కొండల వెనుక దాచినంత కష్టం

 కన్నీటి తడి గడియారం ముళ్ళకి దొరక్కుండా                                                                                                నన్ను నాలోని సుడిగుండాల్లోకి విసిరేశారు (జిలుకర శ్రీనివాస్‍)

నీటి ధార కింద                                                                                                                                         సాలె గూడల్లుతున్నం   (జ్వలిత)

‘‘ముల్లు గుచ్చుకున్న పాదమే గొంతు విప్పాలె                                                                                                   అరిటాకే ముల్లు గురించి తీర్పు చెప్పాలె’’(సుంకిరెడ్డి నారాయణరెడ్డి)

          ఇన్ని ఎందుకు పేర్కొన్న అంటే ఈ ప్రతీకలు పదచిత్రాలు అభివ్యక్తి విభిన్నతలు ఆయా కవుల కవితలకు పుష్టిని చేకూర్చినవి కాబట్టి.

          ఒక్కోసారి కవిత ఉత్తవచనమైనప్పుడు, కేవలం Skeletin గా ఉన్నప్పుడు, ఇలాంటివి ఆ కవిత మొత్తాన్ని వెలిగిస్తవి. దానికి రక్తమాంసాల పుష్టి నిస్తవి.

          కవిత శీర్షిక, ప్రారంభం, ముగింపు- ఇవికాక మిగతా కవిత Body ని structure ని  నింపి పాఠకుడిని తాధాత్మ్యం చెందే దిశగా కవితాంశాన్ని నడిపే చట్రం ఇది. కవీ పాఠకుడూ సమాంతరంగా నడిచి ఇద్దరూ వాహ్‍ అనే స్థాయి వరకూ తీసికెళ్ళే నిర్మాణమిది. మన ఆలంకారికులు చెప్పిన విభానుభావ వ్యభిచారీ భావాల మీదుగా peak దశకు తీసికెళ్ళే పూర్వరంగ మిది. కవి అందించదల్సిన అంశాన్ని పాఠకుడి గుండెలో ముద్రించే దిశగా సాగే నిర్మాణమిది. ప్రాచ్య, పాశ్చాత్య లాక్షణికులందరూ వేరువేరు పారిభాషిక పదాల్లో చెప్పింది దీన్ని గురించే. విభావానుభావాలు అంటె తికమక పడాల్సిందేమీ లేదు.కవితాంశాన్ని పాఠకుడి అనుభవంలోకి చేర్చే దిశగా ఒక వాతావరణాన్ని కల్పించి ఆ వాతావరణంలోకి పాఠకుణ్ణి గుంజుకొచ్చి కొలిమిలో మండించి అంశ శిఖరాగ్రం, పాఠకుడి అనుభూతి ఒకే దగ్గర Orgasm చెందే దిశగా సాగే ప్రయాణం. అలా జరిగినప్పుడు అది గొప్ప కవిత. ఆ దిశగా తీసికెళ్ళేవే అభివ్యక్తులు పదాచిత్రాలు తదితరాలు.

పదాల ఎంపిక

          పదాల ఎంపిక, Better word in better place కవిత్వ నిర్మాణంలో ముఖ్యమైంది అంటాడు రోమన్‍ జాకొబ్‍సన్‍. కవి అందివ్వదలచిన అర్థాన్ని సూచించడానికి అనేక పర్యాయ పదాలుంటవి. వాటిలో ఏ శబ్దం తన భావాన్ని సరిగ్గా బట్వాడా చేయగలదో ఆ శబ్దాన్ని కవి ఎన్నుకోవాలె.పాతబడి అర్థస్ఫురణను  కోల్పోయిన పదాలను వదిలేయాలె.

విరిదండలు దాల్చిన వాడూ                                                     

అరి గుండెలు చీల్చినవాడూ                                                                         

అందరూ ధరించే నగయిది  (చిరునవ్వు - సి.నారాయణరెడ్డి)

          పూలను ఆఘ్రాణిస్తూ ఆనందం పొందేవాడు కాదు ఎప్పుడూ సీరియస్‍గా ఉండే వీరుడు కూడ ధరించేది నగ చిరునవ్వు అని కవి చెప్పదలచుకున్నడు.ఈ  ఉద్దేశాన్ని ఎన్నో పర్యాయపదాలతో చెప్పొచ్చు. ఎన్నో రకాల వాక్యాలలో చెప్పొచ్చు.

          విరిదండలు దాల్చినవాడుఅన్న తర్వాత అరి గుండెలు చీల్చినపదాల్ని కవి జాగ్రత్తగా ఎన్నుకున్నడు. అందువల్ల కవితకు (ప్రాస, పదాల, అక్షరాల, సమతూకం కుదిరి) శ్రవణ సుభగత్వం సిద్ధించింది.

          అట్లాగే పదాల ప్లేస్‍మెంట్‍ కూడ ముఖ్యమైంది.వేరే సందర్భంలో పైన పేర్కొన్న కొయ్యగుర్రంకవితా పాదాల్లోని ఒక పాదం ఇలా ఉంది.

                   హంతకులెవరో నాకు తెలుసు

          ఇందులోని నాకుఅనే శబ్దాన్ని ఆ ప్లేస్‍ నుంచి ఎక్కడికి మార్చినా ఫోర్స్ దెబ్బతింటుంది. అదీ suitable place అంటే.

ప్రామాణిక భాష మాండలికం

      ప్రామాణిక భాషలోనే రాయాలనే రూలేమీ లేదు.వచన కవిత లక్ష్యమే కవితా రూపంతో పాటు భాఫను కూడా ప్రజాస్వామికీకరించడం కాబట్టి  ఏ భాషలోనైనా రాయొచ్చు. ఈ వ్యాసంలో పేర్కొన్న కవితలను పరిశీలించినా మిగతా కవితలను పరిశీలించినా తెలుస్తుంది. ఈ రెండు భాషలో రచించి మెప్పించవచ్చని. 

          ఈ విభజనంతా అవగాహన కోసమే. ఇట్లానే ఉండాలనడం వచన కవితకు మరో చట్రంఅనే గుదిబండను కట్టినట్లే.ఇట్లానే రాయాలనడం వచన  కవితా తత్త్వానికే విరుద్ధం. ఇట్లా ప్రణాళికాబద్ధంగా కాక గుండె నుంచి ఎట్లా పొంగితే అట్లా పారే వచన కవిత కూడ ఉంటది. కాలాన్నిబట్టి, context ను బట్టి, భాషాపరిణామాన్ని బట్టి, భావజాల ప్రభావాన్ని బట్టి, ఒక నదిలా ఎన్నో రూపాల్ని సంతరించుకుంటది. కన్పించకుండా కూడా గాలిలా మనల్ని తాకుతది. నీరు ఎన్ని మూసల్లోనైనా ఒదిగినట్లు, ఏ మూసలోనూ బందీకానట్లు - flexibility వచన కవిత ప్రాణవాయువు.

          కవిత్వానికి ఇప్పటికిది అంతిమ రూపం. కేవలం రూప సంబంధి చర్చ వచన కవిత సారం కాదు. రూపానికే పరిమితమయితే ఆనంద పర్యవసాయి అయి ప్రబంధ, భావకవితగా పరిణమిస్తుంది. అందువల్ల వచన కవితకు సంబంధించిన రూపచర్చకు మాత్రమే పరిమితం కాకూడదు. వస్తురూప సమన్వయంగా ఈ చర్చ సాగాల్సి ఉంటుంది.

ఒక కవిత విశ్లేషణ

          ఈ అంశం కింద నా వాగుకవితను విశ్లేషిద్దామనుకున్న. అది సముచితం కాదని భావించి ఈ కింది కవితను విశ్లేషించిన.ఇది చైతన్య ప్రకాష్‍ కవిత

                               అర్హత

నేనేమంటి నేనేం పాపంజేత్తి                                                      

నాకు నీకూ పోలికేడిది పోటేంటిది                                                

సీసపక్కలేరితివా ఐస్‍క్రీట్లమ్మితివా                                                        

పార్కుల పొంటి బటానిలమ్మితివా                                                         

ఊరవతల నా పొంటి గుడిసేసుకుంటివా                                         

ఎండ్రికాయలు, శాపలు, బుడుబుంగలు పడ్తివా,                                        

ముంగీసలు, ఎలుకలు దింటివా                                                 

నీ బల్లెకత్తిమా? గుళ్ళెకత్తిమా?                                                                

నీకు నాకూ పోటేంది దొరా? సోపతేంది పటేలా                                  

ఎవ్వన్నో మరిచి నన్ను తిట్టుడేంది పటేలా?                                                          

సాపలల్లితివా సారద కథలు చెప్తివా                                                       

సలి బువ్వడుక్కుంటివా                                                          

సిన్గిన పేల్కలు దొడుక్కుంటివా                                                  

పదవంటిమా? పదెకరాల పొలం మలుపు కొంటిమా?                                            

నీ అంటేంది? పొంటేంది?                                                              

నా జోలేసుకుంటివా? నీ జోలికొస్తిమా?                                                     

ఇంకెందుకు దొరా?                                                                                

ఒచ్చోరకున్నోళ్ళ బజార్లేసి పజీత దీసుడు                                       

ఇగ ఎప్పుడైనా మాట్లాడెటప్పుడు                                                         

పదవి పొందినట్టు పైసలు సంపాదించినట్టు

పెద్ద కులంల పుట్టినట్టు                                                           

మూతినాకుడు ముచ్చట్లు వెట్టినట్టు                                                      

మాయజేసి ఓట్లు గుంజుకున్నట్టు కాదు                                        

రోకలి బండలు మోసి                                                             

ఇనుప రేకులేరుకచ్చి                                                             

అక్రమ దొంగకేసుల్లో ఇరికి                                                        

చావతన్నులు పడి సిప్పకూడు తిని                                                      

చచ్చిబతికి బతికిచచ్చిన జైలు                                                   

పుట్టుడు సచ్చుడు ఒక్కటే తీర్గ                                                  

బతికినన్నాళ్లు పాడె మీద పన్నట్టు                                                       

ఇంక చెప్పలేనన్ని అర్హతలుండాలె                                                        

ఇగ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు                                                         

యాది మర్వకు                                                                    

నువ్వెన్నన్న ఇద్దెలు నేర్చుకో                                                   

నా లెక్క కాలేవుగాక కాలేవు                                                    

మాట మాటకు నన్ను తిట్టకు                                                   

నువ్వు సచ్చి మళ్ళా పుట్టినా                                                    

పిచ్చకుంట్లోనివి కాలేవు గాక కాలేవు                                           

పిచ్చకుంట్ల పనులు నీకు రానేరావు                                                      

నువ్వు నేను కావాలంటే                                                          

ఉత్త ముచ్చట గాదు                                                              

పుట్టెడు తవుసెల్లదీయాలే                                                                  

ఈ తాప మళ్ళ గిట్ల పిచ్చకుంట్లోడివంటే                                         

సి..... పలగొడ్తం....                    (చైతన్య ప్రకాశ్‍)

       ఎవరూ ముట్టని పిచ్చకుంట్లోని జీవితాన్ని ఎన్నుకొని వస్తు నవ్యతను  ప్రదర్శించి,సరియైన దృక్కోణంతో కవితను నడిపి కవి తన ప్రతిభను చాటుకున్నడు. అర్థవంతమైన శీర్షిక.కవితలోని వాద ప్రతివాదులకిరువురికీ వర్తించే శీర్షిక,ఒకరికి పాజిటివ్‍ అర్థంలో మరొకరికి నెగెటివ్‍ అర్థంలో.

       ‘‘నేనేమంటి నేనేం పాపంజేత్తి’’ ఆసక్తిని రేకెత్తించే మంచి ఎత్తుగడ.

        మంచి నిర్వహణ.ప్రతివాది కవితలో కనిపించకున్నా

‘‘ఎండ్రికాయలు, శాపలు, బుడుబుంగలు పడ్తివా,                                    

ముంగీసలు, ఎలుకలు దింటివా                                                 

నీ బల్లెకత్తిమా? గుళ్ళెకత్తిమా?                                                                

నీకు నాకూ పోటేంది దొరా? సోపతేంది పటేలా                                  

ఎవ్వన్నో మరిచి నన్ను తిట్టుడేంది పటేలా?                                                          

సాపలల్లితివా సారద కథలు చెప్తివా                                                       

సలి బువ్వడుక్కుంటివా                                                          

సిన్గిన పేల్కలు దొడుక్కుంటివా                                                  

పదవంటిమా? పదెకరాల పొలం మలుపు కొంటిమా?                                            

నీ అంటేంది? పొంటేంది?                                                              

నా జోలేసుకుంటివా? నీ జోలికొస్తిమా?’’      అంటూ సంభాషణాత్మకంగా  సాగి పాఠకుడిలో ఆసక్తిని కొనసాగిస్తుంది.ఇట్లా కవిత నిర్మాణమంతా ఎక్కడా పక్కకు జరగకుండా కవి చెప్పదలచుకున్న అంశాన్ని జస్టిఫై చేస్తూ పాఠకుడిలో ఒక ఉద్వేగాన్ని క్రియేట్‍ చేస్తుంది.

      ‘‘నువ్వెన్నన్న ఇద్దెలు నేర్చుకో                                                       

        నా లెక్క కాలేవుగాక కాలేవు                                                       

        మాట మాటకు నన్ను తిట్టకు                                                       

        నువ్వు సచ్చి మళ్ళా పుట్టినా                                                       

        పిచ్చకుంట్లోనివి కాలేవు గాక కాలేవు                                              

        పిచ్చకుంట్ల పనులు నీకు రానేరావు’’ అని

                    పిచ్చకుంట్లోని పట్ల సమాజంలో ఉన్న నెగెటివ్‍ భావనను  పాజిటివ్‍గా మార్చి

       ‘‘ఈ తాప మళ్ళ గిట్ల పిచ్చకుంట్లోడివంటే                                           

          సి..... పలగొడ్తం....’’ అని అర్థవంతమైన ముగింపుతో  పిచ్చకుంట్లోని వేదనతో పాఠకుడు తాదాత్మ్యం చెందేటట్లు చేస్తడు కవి.

(ఈ వ్యాసం రాయించిన తెలంగాణ సారస్వత పరిషత్‍ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లూరి శివారెడ్డి, జె.చెన్నయ్య గార్లకు ధన్యవాదాలతో)

(తెలంగాణ సారస్వత పరిషత్ “వచన కవిత్వం  - వస్తు శిల్పాలు”  తెస్తున్న సందర్భంగా )

 

 

         

         

         

         

సాహిత్య వ్యాసాలు

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర - 6

 “హర్షదాయక చిత్ర కథాళి తోడ నవ్యగతిహిందూ సుందరినడిపి మిగుల 

  ఖ్యాతి గనిన శేషమ్మ(కు గడు బ్రియముగ గరమునం దొడ్జి నాడను గంకణమ్ము” 

1928 నుండి స్త్రీలకోసం గృహలక్ష్మి పత్రికను నడుపుతూ 1934 లో సాహిత్య సామాజిక రంగా లలో విశేషకృషి చేస్తున్న మహిళలను సన్మానించి గౌరవించటానికి  గృహలక్ష్మి స్వర్ణకంకణాన్ని ఏర్పరచి ప్రతియేడూ ఒకరికి  ఇస్తూ వస్తున్న డాక్టర్ కె.ఎన్ కేసరి గంటి కృష్ణవేణమ్మకు ఇస్తున్న సందర్భంలో ( 1949 -1950)  మొదటి నుండి అప్పటి వరకు స్వర్ణకంకణం ఎవరెవరికి ఇచ్చాడో ఆయన మాటల్లోనే చెప్తున్నట్లుగా ఎవరో వ్రాసిన పద్యాలలో ఒకటి ఇది.  కర్త ఎవరో తెలియదు. కానీ హిందూ సుందరి పత్రిక నడిపినందుకు గృహలక్ష్మి స్వర్ణకంకణం పొందిన ఈ శేషమ్మ ఎవరు

శేషమ్మకు గృహలక్ష్మి స్వర్ణకంకణం లభించింది 1939లో. గృహలక్ష్మి పత్రిక కార్యాలయం అయిన మద్రాసు లోని కేసరికుటీరంలో జరిగిన ఆ సభలో కాంచనపల్లి కనకాంబ స్వాగత వాక్యాలు పలుకుతూ శేషమ్మ నుషష్టిపూర్తి ముత్తయిదువఅని ప్రస్తావించింది. శేషమ్మ 1878 బహుధాన్య సంవత్సర జ్యేష్ఠ బహుళ అష్టమి నాడు తణుకు తాలూకా వేలవెన్ను గ్రామంలో జన్మించింది. తల్లి మహలక్ష్మమ్మ. తండ్రి సత్తిరాజు వెంకటరామకృష్ణయ్య పంతులు. పది నెలల వయసులోనే తండ్రిని కోల్పోయింది. అక్క బావల దగ్గర కొంతకాలం పెరిగింది. తరువాత మేనమామ వెలిచేటి భద్రాచలం ఆమె బాధ్యత తీసుకొన్నాడు. ఆయన అమలాపురం బాలికా పాఠశాల ప్రధానో పాధ్యాయుడు. మేనగోడలిని బడిలో చేర్చి చదవనూ వ్రాయనూ నేర్పించాడు. ఆయన శిక్షణలో శేషమ్మకు భారత భాగవతాది గ్రంధాల జ్ఞానం అబ్బింది. పదకొండవ ఏట బాలాంత్రపు సుందర రామయ్యతో పెళ్లి అయింది. అక్కడినుండి ఆమె బాలాంత్రపు శేషమ్మ. 

రాజమండ్రిలో భర్తతో కలిసి జీవిస్తున్న కాలంలో  ఆమె విద్యను అభివృద్ధి చేసుకొన్నది. దేవగుప్తాపు మహలక్ష్మమ్మతో సాహచర్యం కావ్యప్రబంధ పరిజ్ఞానాన్ని పెంచింది. ఆ కాలంలో విజ్ఞానచంద్రికా పరిషత్తు వారు స్త్రీలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించేవాళ్ళు. నరసాపురం లోనూ అటువంటి పరీక్షలు నిర్వహించేవాళ్ళు. శేషమ్మ ఆ పరీక్షలకు చదివి ఉత్తీర్ణురాలయింది. కందాళ నరసింహాచార్యులుగారి దగ్గర సంస్కృతం నేర్చుకొన్నది. 1903 లో కాకినాడలో విద్యార్థినీ సమాజ స్థాపనలో పులుగుర్త లక్ష్మీ నరసమాంబతో పాటు శేషమాంబ కూడా ఉన్నది. ఆమె దగ్గర కావ్యాలు కూడా చదువుకున్నది. కాకినాడ విద్యార్థినీ సమాజానికి అనుబంధంగా స్థాపించబడిన రాజ్యలక్ష్మీ పుస్తక భా0డాగారాన్ని నిర్వహించింది. హిందూసుందరి పత్రికకు మూలధనం, చందాలు సేకరించి పంపటం నుండి, విద్యార్ధినీ సమాజ పునర్నిర్మాణం, దానికి అనుబంధంగా   మహిళా విద్యాలయం నిర్వహణ, హిందూసుందరి సంపాదకత్వం వరకు అన్నీకూడా బాలాంత్రపు శేషమ్మ కార్య కర్తృత్వ లక్షణానికి, కార్యదీక్షకు, నిర్వహణ సామర్ధ్యానికి గీటురాళ్ళు.

 1904 నాటి  విద్యార్థినీ సమాజం కొద్దికాలంలోనే మూతబడితే చిన్నచిన్న పట్టణాలలోనే  స్త్రీ సమాజములు ఎన్నో అభివృద్ధి చెందుతుండగా కాకినాడ వంటి పెద్ద పట్టణంలో  స్త్రీ సమాజం లేకపోవటం ఏమిటని దామెర్ల సీతమ్మతో కలిసి 1910 లో దానిని పునరుద్ధరించింది శేషమ్మ. శ్రీ కాకినాడ విద్యార్థినీ సమాజంగా 1911 సెప్టెంబర్ 27న ఇది రిజిస్టర్  చేయబడింది.  శేషమ్మ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం తనశక్తి యుక్తులను ఆ సంస్థ అభివృద్ధికి వినియోగ పరిచింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం సమావేశాలు నిర్వహించటం, స్వామి విద్యానంద పరమహంస స్వాములు,   ఆంద్రయోగినీ మణులుమొదలైన వారి  ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించటం, విద్యార్థినీ సమాజం స్వంత భవనం, సభాభవనం మొదలైన వాటి నిర్మాణాలకు శ్రీశ్రీ పిఠాపురం మహారాణి, లక్ష్మీ నరసాపురం జమిందారిణి శ్రీశ్రీ రావు రామయ్యమ్మ బహద్దూర్ మొదలైన వారిని కలిసి   విరాళాలు సేకరించటం, వార్షిక సభలు నిర్వహించటం, నివేదికలు సమర్పించటం వంటి పనులలో తలమునకలైంది ఆమె. శ్రీకాకినాడ విద్యార్థినీ సమాజం వార్షిక నివేదికలు ఆమె చారిత్రక దృష్టికి నిదర్శనాలు.1916 లో ప్రచురించిన ఆరవ వార్షిక నివేదిక అందుకు ఒకఉదాహరణ.మొట్టమొదటి సంవత్సరపు వార్షిక సభకు బుర్రా బుచ్చిసుందరమ్మ, రెండవ వార్షికసభకు కాంచనపల్లి కనకాంబ, మూడవ వార్షికసభకు వల్లూరిరాజేశ్వరమ్మ, నాలుగవ వార్షికసభకు ఆచంట రుక్మిణమ్మ, అయిదవసభకు కొటికలపూడి సీతమ్మ అధిపతులుగా వుండి విజయవంతం చేసిన విషయాన్ని ఈనివేదికలో నమోదుచేసింది. 

1910లో గుంటూరులో,1911 లో కాకినాడలో ఆంధ్రమహిళాసభ ప్రధమ ద్వితీయ మహాసభలు జరుగగా శేషమ్మ ఆహ్వానసంఘ అధ్యక్షులుగా 1912 మే నెలలో తృతీయ ఆంధ్రమహిళాసభ నిడదవోలులో నిర్వహించబడింది. 1913లో బందరులోను, 1914లో విజయవాడలోను, నిర్వహించ బడిన చతుర్థ  పంచమ ఆంధ్ర మహిళా సభలలో, 1916 లో జరిగిన  సప్తమ ఆంధ్రమహిళా సభ మొదలైన  అన్నిటిలోనూ ఆమె చురుకైన భాగస్వామ్యం ఉంది. అవసరాలకు తగిన తీర్మానాలను ప్రవేశ పెట్టటం,ఆమోదింప చేయటం చూస్తాం.  స్త్రీల విద్యకు, గౌరవకరమైన జీవనోపాధుల ఏర్పాటుకు తీర్మానాలు ఉండటం విశేషం. నరసాపురపు తాలూకాభివృద్ధి సంఘపు పరీక్షలో, విజ్ఞానచంద్రికా మండలి నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణతను  మహిళలను  బాలికా పాఠశాలలో  ఉపాధ్యాయులుగా  నియమించటానికి అర్హతగా గుర్తించాలని ప్రభుత్వ విద్యాశాఖ కు సిఫారసు చేస్తూ తీర్మానం చేయటం అటువంటి వాటిలో ఒకటి.

 ఇక విద్యార్ధినీ సమాజానికి అనుబంధంగా మహిళా విద్యాలయాన్ని నిర్వహించటంలో కూడా శేషమ్మ కృషి చెప్పుకోతగినది. 1928 జులై హిందూసుందరి లో కాకనాడ విద్యార్థినీ సమాజం కార్యదర్శిగా శేషమ్మ చేసిన విన్నపం సంపాదకీయం స్థానంలో ప్రచురించబడింది. బాలికలకు, యువతులకు జాతీయ విద్యనేర్పటానికి  మహిళా విద్యాలయం ఏర్పరచి అప్పటికి నాలుగేళ్లు అయినట్లు దానివలన తెలుస్తున్నది. శిరోమణి పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఉపాధ్యాయులుగా నియమించి ప్రభుత్వ గుర్తింపును పొంది ప్రభుత్వ నిర్దేశిత పాఠ్య ప్రణాళికతో  నిర్వహించ బడుతున్న సంస్థ అని కార్యదర్శి ప్రకటన( హిందూసుందరి, 1928, మే) వల్ల స్పష్టం అవుతున్నది. పన్నెండేళ్ళు వచ్చేసరికి బాలికలకు పెళ్లిళ్లు చేయటం, విద్యాప్రతిబంధకమైన సాంసారిక కృత్యాలు మీదపడిన ఆ పిల్లలు అర్ధాంతరంగా విద్యను విడిచి వెళ్ళటం జరుగుతున్నందున వితంతు యువతుల చదువు మీద కేంద్రీకరించింది ఈ విద్యాలయం. 18 ఏళ్ల నుండి 20 ఏళ్ల లోపు బాలవితంతువులకు ఐదేళ్లు అగ్రిమెంట్ వ్రాసినవాళ్లకు నెలకు 8 రూపాయల చొప్పున, మూడేళ్లు అగ్రిమెంట్ వ్రాసినవాళ్లకు నెలకు 5 రూపాయల చొప్పున ఉపకారవేతనం ఇచ్చి ఉచిత వసతి కల్పించి విద్వాన్, శిరోమణి మొదలైన పరీక్షలకు సిద్ధంచేసే శిక్షణ ఇప్పించటం, గౌరవపూర్వక జీవనం ఏర్పరచుకొనటానికి సహాయపడటం ఈ విద్యాలయం పెట్టుకొన్న కార్యక్రమం. 

 శేషమ్మ సంస్కరణాభిలాషి. స్త్రీలు చదువుకొనాలని ఆశించింది. అందుకోసం మాట్లాడి  వ్రాసి ఊరుకోలేదామె. బాలవితంతువులను చేరదీసి ప్రోత్సహించి విద్య చెప్పించింది. అలా ఆమె  చదువు చెప్పించిన ఇరగపరపు  వెంకటరత్న మద్రాసు క్షయ వైద్యశాలలో మేట్రన్ గా వైద్యసహాయం అందిస్తూ, భావరాజు రంగనాయకమ్మ ఉభయభాషాప్రవీణ అయి బెంగుళూరు ఉన్నత పాఠశాలలో అధ్యాపకురాలుగానూ స్వతంత్ర జీవనం సాగిస్తున్నట్లు  కాంచనపల్లి  కనకాంబ పేర్కొన్నది. ( గృహలక్ష్మి, 1939, ఏప్రిల్ )  

 మొసలికంటి రామాబాయమ్మ సంపాదకత్వంలో సత్తిరాజు సీతారామయ్యనడుపుతున్న హిందూ సుందరి పత్రికను కాకినాడ విద్యార్థినీ సమాజం పక్షాన నడపటానికి  ఆ విద్యార్థినీ సమాజ కార్యదర్శిగా చొరవ తీసుకున్నది శేషమ్మ. ఫలితంగా  1913 లో విద్యార్థినీ సమాజం యాజమాన్యం లోకి వచ్చిన ఆ పత్రికకు దాదాపు పదిపన్నెండేళ్ళు  కళ్లేపల్లి  వెంకట రమణమ్మ, మాడభూషి చూడమ్మ సంపాదకులుగా ఉన్నప్పటికీ బాలాంత్రపు శేషమ్మ కుదానితో నిత్యసంబంధం .1925 తరువాత ఆమే సంపాదకురాలు. ఆపత్రికకు ఆమెవ్రాసిన సంపాదకీయాలు సమకాలీన సమస్యలను సంబోధిస్తూ ఉండేవి. 1940 జనవరి సంచికకు కృతజ్ఞత అనే శీర్షికతో వ్రాసిన సంపాదకీయం చాలా విలువైనది.1939 సంవత్సరంలో పత్రికకు రచనలను ఇచ్చినవాళ్ళను ప్రస్తావిస్తూ వాళ్ళగురించి ఆమె ఇచ్చిన సమాచారం ప్రత్యేకించి స్త్రీల సాహిత్య చరిత్ర నిర్మాణానికి దిక్సూచిగా ఉంటుందనటంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. కాంచపల్లి కనకాంబ,పులుగుర్తలక్ష్మీనరసమాంబ, చిల్కపాటి సీతాంబ, కనుపర్తి వరలక్ష్మమ్మ, పొణకాకనకమ్మ, సత్తిరాజుశ్యామలాంబ, కాళ్ళకూరి మహాలక్ష్మీ సుందరమ్మ, సమయమంత్రి రాజ్యలక్ష్మి, కావలిసుబ్బలక్ష్మి పిశుపాటి అనసూయాదేవి, చల్లమాణిక్యాంబ,సి.వి.మీనాక్షి, జి.వి.శాంతరత్నం, బుర్రా కమలాదేవికొలిచినపద్మిని, విద్వాన్ రామరత్నమ్మ,కొత్తపల్లి వెంకట రత్నమ్మ, పి.వెంకటసూరమ్మ, భువనగిరి లక్ష్మీకాంతమ్మ, అల్లం రాజు వెంకటసుబ్బమ్మ, కౌ.చంద్రమతి, దివాకర్ల సూర్యకాంతమ్మ, కావలిశేషమ్మ, ఎ .స్వరాజ్యలక్ష్మి, చె .వెం .ర.జగదీశ్వరి, ద.సీతాసుందరమ్మ, గుడిపూడి ఇందుమతీదేవి, వారణాసి సుభద్రమ్మ-  1939 లో హిందూసుందరికి వ్రాసిన 29 మంది మహిళల పేర్లు ఇట్లా  ఒక చోట నమోదు చేసి వాళ్ళ రచనలు సేకరించి చదవటానికి ప్రేరణ ఇస్తున్నది బాలాంత్రపు శేషమ్మ.   

 

బాలాంత్రపు శేషమ్మ కాంగ్రెస్ రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసింది. 1923లో బొంబాయి లో జరిగిన అఖిల భారత మహిళా సభకు ఆంధ్రదేశ ప్రతినిధిగా వెళ్ళింది. కాకినాడ కాంగ్రెస్ మహిళా సభాకార్యదర్శిగా సభలను చక్కగా నిర్వహించింది.1928 లో మద్రాస్ లో జరిగిన జాతీయ మహాసభలో స్వచ్ఛందంగా సేవలు అందించింది. కాకినాడలో ఉప్పుసత్యాగ్రహ ప్రారంభ కురాలు. కాకినాడ పురపాలక సంఘానికి మహిళాప్రతినిధిగా ఎంపిక అయి నాలుగేళ్లు పనిచేసింది. కాంగ్రెస్ సభలు  కలకత్తా, బెల్గామ్ వంటి చోట్ల ఎక్కడికైనా ఉత్సాహంగా  వెళ్ళేది. ( గృహలక్ష్మి, 1939, ఏప్రిల్) కానీ అందుకు సంబంధించిన వార్తలు గానీ, ఆమె రచనలు గానీ ఏమీ లభించటం లేదు. 

            శేషమ్మకు లేక లేక కలిగిన కూతురు మహాలక్ష్మీసుందరమ్మ. ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ హిందూసుందరి మిత్రులు అనేకులు పద్యాలు వ్రాసారు. తన సంఘసంస్కరణ ఆదర్శానికి దీటుగా కూతురిని  సంస్కృతంలో ఉన్నత విద్యావంతురాలిని చేసింది శేషమ్మ. తనతో పాటు కాంగ్రెస్ మహిళా సభలకు తీసుకువెళ్లేది. ఉప్పుసత్యాగ్రాహంలో పాల్గొనటానికి కూతురిని కూడా ప్రోత్సహిం చింది. భాగస్వామి అయ్యేట్లు ప్రోత్సహించింది. రజస్వల పూర్వ వివాహపద్ధతిని కాదని పదహారేళ్లు వచ్చాక కూతరుకి పెళ్లిచేసిన ( 1932, మార్చ్) ఆచరణ వాది బాలాంత్రపు శేషమ్మ. ( గృహలక్ష్మి, 1932, మార్చ్)  పాతికేళ్ల వయసులోనే  ( 19 - 7- 41)    కూతురు మరణించటం శేషమ్మ జీవితంలో పెద్ద విషాదం. ఆ తరువాత శేషమ్మ రచనలు, ప్రస్తావన పెద్దగా తెలియరావడం లేదు. 

                                                            1 

            బాలాంత్రపు శేషమ్మ జీవితంలో  ప్రధానభాగం కాకినాడ విద్యార్థినీ సమాజంతో  దానికి అను బంధంగా నడిచే మహిళా విద్యాలయంతో, హిందూసుందరి పత్రికతో పెనవేసుకొని పోయింది. ఏ   మహిళాభ్యుదయాన్నికాంక్షించిందో దాని  ప్రచారానికి ఉపన్యాసాలు  ఇవ్వటం, వ్యాసాలు వ్రాయటం ఆమె జీవితంలో మరొక భాగం. ఆమె రచనావ్యాసంగంలో సృజన సాహిత్యం పాలు తక్కువే. 

            1903 లోకాకినాడ విద్యార్థినీ సమాజం ఏర్పడి వారంవారం జరిగే సమావేశాలలో ఉపన్యాసాలు ఇయ్యటాని కంటే ముందే శేషమ్మ హిందూసుందరి పత్రికకు వ్రాయటం మొదలు పెట్టింది. హిందూసుందరి పత్రిక 1902 జనవరి సంచికలోస్త్రీవిద్యాభిమానులకు ఒక విన్నపముఅనేశీర్షికతో శేషమ్మ వ్రాసిన వ్యాసం ప్రచురించబడింది. హిందూసుందరి పత్రికలో స్త్రీలు వ్రాసిన సంగతులు చూచుటచేత ఉత్సాహము కలిగి తాను ఇలావ్రాయటానికి సాహసిస్తున్నాని ప్రారంభంలో పేర్కొన్న మాటలు గమనించదగినవి.ఈ 1902 జనవరి  హిందూసుందరి మొదటి టైటిల్ పేజీపై సంపుటి 1 సంచిక 10 అని ఉన్నది. అంటే అప్పటికి పదినెలలుగా ఈపత్రిక వస్తున్నదన్నమాట. ఆ పత్రికను  బాలాంత్రపు శేషమ్మ చదువుతూ తన భావాలు పంచుకొనటానికి ఒకవేదికగా భావించి తొలిప్రయత్నంగా వ్రాసిన వ్యాసం ఇది. అక్కడి నుండి ప్రారంభించి శేషమ్మ రచనలలో  వ్యాసాలు, ఉపన్యాసాలు తో పాటు సంస్థలకు, సమావేశాలకు సంబంధించిన నివేదికలు ప్రకటనలు కూడా ఉన్నాయి.

            ఈ సందర్భంలో ప్రస్తావించవలసిన విషయం మరొకటి ఉంది. 1902 జనవరికి 10   సంచిక వచ్చిందంటే అది 1901 లోనే ప్రారంభించబడి ఉంటుంది. కానీ ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు (పొత్తూరి వెంకటేశ్వర రావు, 2004) పుస్తకంలో హిందూ సుందరి 1902 ఏప్రిల్ లో మొదలైనట్లు ఉన్నది.1904 ఏప్రిల్ సంచికలో స్వవిషయము అనే శీర్షిక తో పత్రికాధిపతులు వ్రాసిన విషయాలను బట్టి, అంతకు ముందరి సంచికలు ఏవీ దొరకకపోవటాన్నిబట్టి ఇలా పొరపడి ఉండవచ్చు.పత్రిక ఉద్దేశాలను, విధానాలను పేర్కొంటూఈ మాసపత్రికను వెలువరించ ప్రారంభిం చినాముఅని పత్రికాధిపతి వ్రాసిన వాక్యంఅప్పుడేప్రారంభమైనట్లు అర్ధంచేసుకొనటానికి వీలిచ్చేదిగా ఉంది.అప్పటికి ఏడాది అయింది పత్రిక ప్రారంభమై. ఏడాది అయిన సందర్భంగా తన అనుభవాలను చెప్పుకొంటున్నట్లుగా వ్రాసిన స్వవిషయం ఇది. 

            స్త్రీ విద్య బాలాంత్రపు శేషమ్మకు ప్రాధాన్య అంశం. దాదాపు ఆమె వ్యాసాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్త్రీవిద్యను చర్చించాయి. ఆ క్రమంలో స్త్రీపురుషుల మధ్య అసమానతలను, స్త్రీల పట్ల అమలవుతున్న వివక్షను ఆమె నిరసించింది. స్త్రీల అభ్యుదయాన్ని ఆశించి ఆధునిక పురుష ప్రపంచం సంస్కరణ ఉద్యమాలకు పూనుకొనటాన్ని అభినందించింది.స్త్రీవిద్యాభిమానులకొక విన్నపముఅనే వ్యాసాన్నిస్త్రీలమగు మనయెడల ఆర్యులు విధించిన కట్టుబాట్లు తలచుకొన్న నొడలుకంపమెత్తి వడకసాగెనుఅనిప్రారంభించింది శేషమ్మ. ఈ వ్యాసంలో ఆమె పురుషులను రెండు రకాలుగా విభజించింది. స్త్రీలు పాటలు పడకూడదు, అట్లా పాడేవాళ్లు వేశ్యలు కానీ సంసార స్త్రీలు కారు అని, స్త్రీలు స్వతంత్రులు కారు, గౌరవపాత్రులు కారు, వాళ్ళ మాట వింటే చెడిపోతారు ఇలాంటి విధి నిషేధాలతో, స్త్రీలను బుద్ధిహీనులుగా చేసి చూపిన వెనుకటి పురుషులు ఒకరకం. ఈ కట్టుబాట్లు వట్టి పిచ్చివి అని, స్త్రీల యెడ గౌరవం కలిగి వారివిద్యాభ్యాసాలకు ఏర్పాట్లు చేస్తున్న సమకాలీన సంస్కర్తలైన పురుషులు మరొకరకం. వెనుకటిపురుషులు భార్యలను తమకు లోకువవారని తలచి అహంకరించిన దానిఫలితం స్త్రీలు విద్యావిహీనులు, జ్ఞానశూన్యులు కావటం. పురుషులు స్త్రీలు సమమనే భావం పెంపొందాలని, విద్యా ధనం  పక్షపాతం లేక  సమంగా భాగించి పంచాలని ఆమె ఆకాంక్షించింది. 

            1904 జనవరి నుండి పులగుర్త లక్ష్మీనరసమాంబ కాకినాడలో సావిత్రి పత్రికను ప్రారంభించింది. మార్చ్ సంచికలో ఆప్రయత్నాన్ని అభినందిస్తూ బాలాంత్రపు శేషమ్మ వ్రాసినతెలుగుదేశమందలి స్త్రీల విద్యఅనే ఒక రచన ప్రచురితమైంది. స్త్రీలు స్త్రీలకొరకు ఒకపత్రికను ప్రారంభించటం ఉన్నతవిద్యాభివృద్ధికి సూచికగా భావిస్తూ ఆమె ఈ వ్యాసం వ్రాసింది. స్త్రీలలో ఉన్నతవిద్యాభివృద్ధి కొత్తగా పొందినదా పూర్వము ఉన్నదేనా అనిఒక ప్రశ్న వేసుకొని పురాతన గ్రంధాలవలన స్త్రీలు రాజ్యాలు ఏలి, యోగులై జ్ఞానబోధ చేసి , ఉద్గ్రంధాలు రచించి కీర్తి పొందిన విషయం తెలుస్తున్నది కనుక స్త్రీలు ప్రాచీనకాలం నుండి ఔన్నత్యం కలిగిఉన్నారనేది నిర్వివాదం అంటుంది. ముస్లిముల దాడులతో స్త్రీలకు జరుగుతున్నమానహానిని సహించలేక ఘోషా విధించటం తోమొదలై క్రమంగా చదువు, స్వేచ్ఛ స్వాతంత్య్రం మొదలైనవి వాళ్లకు నిషేధించబడ్డాయి అన్న వాదాన్ని శేషమ్మ కూడా నమ్మి మాట్లాడటం కనిపిస్తుంది.హూణుల రాజ్యపాలన మొదలైన తరువాత స్త్రీపురుష సమానత్వాన్నిప్రచారం చేస్తూ స్త్రీవిద్యాభివృద్ధికి దోహదం చేశారని అభిప్రాయపడింది. స్త్రీవిద్యకు కందుకూరి వీరేశలింగం చేసిన కృషిని ప్రస్తావించి స్త్రీల కోసం రాయసం వెంకటశివుడు, సత్తిరాజు సీతారామయ్య జనానా , హిందూసుందరి పత్రికలను ఏర్పరచిన విషయం కూడా చెప్పి పురుషులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుటకు సందేహించి వ్రాయ సామర్ధ్యం గల స్త్రీలు కూడా వ్రాయటం మానేస్తున్నారని దానిని పరిష్కరించటానికి పులుగుర్త లక్ష్మీనరసమాంబ సావిత్రి పత్రికను ప్రారంభించిందని ఆమె ఈవ్యాసంలోపేర్కొన్నది.

ఉత్తరాంధ్ర సరిహద్దులలోని గంజాం జిల్లాలో ఆసికా అనే పట్టణం లో బుర్రబుచ్చిబంగారమ్మ స్థాపించిన ఆసికా స్త్రీసమాజం ఏర్పాటు చేసిన సభలో చేసిన ప్రసంగాన్ని( హిందూ సుందరి,1907, జనవరి) శేషమ్మకారణాంతరల చేత అంతరించిన స్త్రీస్వాతంత్య్రమును దిరుగ మనకొసంగి స్వేచ్ఛనిచ్చుటకు గాను కొందరు పుణ్యపురుషులను సృజించాడని భగవంతుడిని కొనియాడుతూ ప్రారంభించింది. ఆ పుణ్యపురుషులవలనే వంట పొయిలు తప్ప వేఱుస్థలమెరుంగని స్త్రీలు సమాజాలు పెట్టుకొని సమావేశం కాగలుగుతున్నారని ఆనందపడింది. స్త్రీలకు విద్య ఆవశ్యకమని అది ఎంతవరకు సాధ్యం? ఎట్టి విద్య స్త్రీలకు తగినది? విద్యాస్వాతంత్య్రం ఎంత వుంది? అన్నమూడు ప్రశ్నలను వేసి చర్చింది శేషమ్మ. వేదఋక్కులు, వివాహమంత్రాలు వ్రాసిన వేదకాలపు స్త్రీల శక్తి సామర్ధ్యాలు, సులభ మొదలైన పురాణకాలపు స్త్రీల శక్తిసామర్ధ్యాలు ప్రస్తావిస్తూ స్త్రీలు ఎట్టివిద్య సంపాదించాలని ఎంత కృషిచేస్తే అంత పొందగలుగుతారనటంలో సందేహం ఏమాత్రం లేదని చెప్పింది. భాగవత కథలను, ఉత్తర రామ చరిత్ర నాటకాన్నిదేవహూతి, ఆత్రేయి  మొదలైన స్త్రీలను ప్రస్తావిస్తూ వేదాంత విద్య యందు స్త్రీల ఆసక్తిని, కృషిని పేర్కొని స్త్రీలకు ఈవిద్య తగును, ఈవిద్య తగదు అనే వివాదమే అవసరం లేదంటుంది శేషమ్మ. భాగవత సత్యభామ ను ప్రస్తావిస్తూ స్త్రీలుయుద్ధవిద్యలు కూడా నేర్చిన విషయాన్ని గుర్తుచేసింది.భండారు అచ్చమాంబ అబలా సచ్చరిత్ర రత్నమాల లో యుద్ధము మొదలైన ఘనకార్యాలు నిర్వహించిన స్త్రీల సంగతి విశేషంగా వ్రాసిన సంగతిని కూడా పేర్కొన్నది. ఇక స్వాతంత్య్రం విషయానికి వస్తే సమాజాలుగా ఏర్పడే స్వాతంత్య్రం పొందటం లోనే స్త్రీలకు ఉన్నతవిద్యను పొందే స్వాతంత్య్రం, బాధ్యత సమకూడాయని అభిప్రాయపడింది.

ఆదిభాష, జ్ఞానమూలము అయిన సంస్కృతం, ప్రస్తుత రాజభాష అయిన ఇంగ్లీషు, దేశభాష అయిన తెలుగు స్త్రీలు నేర్చుకోవాలని, సజ్జన సహవాసం, పరస్పర సహకారం స్త్రీలకు ఉన్నత విద్యావంతులు కావటానికి మార్గం సుగమం చేస్తాయని చెప్పింది శేషమ్మ.

            ‘నవీనోద్యమముఅనే ఉపన్యాసంలో ( హిందూసుందరి, 1914, మార్చ్)  బాలాంత్రపు శేషమ్మ నూతన ధర్మములగు కార్యములచేతను,తత్ఫలములచేతను, భావములచేతను, ఉద్యమములచేతను ఉద్విగ్నంగా ఉన్నకాలాన్ని గురించి ప్రస్తావించింది.స్త్రీలు సమాజములు స్థాపించటం, విద్యను వ్యాపింపచేయటం, బాలికా పాఠశాలలు ఏర్పరచటం, వాటినిర్వహణకు దానం ఇయ్యటం, గ్రామగ్రామాలు తిరిగి విరాళాలు సేకరించటం , స్త్రీలకు వృత్తి నైపుణ్యాలు అలవరచే పనులు చేయటం మొదలైన కొత్తఉద్యమాలకుదిగారని, పురుషులు కూడా స్త్రీవిద్యాభిమానులై తోడ్పాటును అందిస్తున్నారని పేర్కొన్నది. ఆనాటి లెక్కలప్రకారం ఒకకోటి ఎనిమిది లక్షలు మించిన బాలురలో ప్రయిమరీవిద్యలో ముప్ఫయి లక్షలమంది మాత్రమే ఉన్నారంటే ఇక ఆడపిల్లల చదువు ఎంత అధ్వానస్థితిలో ఉందో వూహించునంటుంది శేషమ్మ.విద్యావతియగు తల్లిగల బిడ్డ మాత్రమే బడికిపోతుంది గానీ తక్కిన బాలికలుఎందరో ఇంటిపనిపాటలకే బందీలైపోతారని బాధపడింది. బాలికల పరిస్థితి ఇలావుంటే ఇక వితంతు స్త్రీలకు విద్యావకాశాలు ఎంతగా మూసివేయ బడతాయోకదా  అని వేదన పడింది. వాళ్ళకోసం జాతీయ విద్యాలయాల ఏర్పాటు అవసరాన్నిసూచించింది. ఆవిధంగా వేటపాలెంలో కొండ వెంకటప్పయ్య నడుపుతున్నశారదా నికేతనం గురించి కూడాపేర్కొన్నది.

1911 ఏప్రిల్ ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకు శేషమ్మమనకు గావలసినదేది? పరార్ధపరత్వముఅనే వ్యాసం వ్రాసింది.పరార్ధతత్వము అంటే పరుల ప్రయోజనములందు ఆసక్తి కలిగిఉండటం అనినిర్వచించి, మిత్రలక్షణం, సోదరప్రేమ మనుషులయందు ఉండవలసిన గుణాలుగా పేర్కొన్నది.పదార్ధపరత్వం పలురకాలుగా ఉంటుందని చెప్పి ఆబాలసచ్చరిత్ర రత్నమాలను ఆంద్రస్త్రీలకు కానుకగా ఇచ్చిన  బండారు అచ్చమాంబలో అది గ్రంధరూపంలో ఉందని, డొక్కాసీతమ్మలో అది అన్నదానరూపంలోఉంటే పోలవరం జమీందారు స్త్రీలు అత్తాకోడళ్లు అయిన కామాయమ్మ బంగారమ్మలలో అది దానదయా వితరణ గుణాల రూపంలోఉన్నాయని కొన్నిఉదారణలతో చెప్పింది.

శేషమ్మ వ్రాసిన మరిరెండు వ్యాసాలు స్నేహానికి, ఐకమత్యానికి సంబంధించినవి. స్త్రీలు అభివృద్ధిలోకి తేగలిగినది స్నేహం ఒక్కటే అంటుంది. జీవితంలో స్నేహం యొక్క ప్రాధాన్యతను రకరకాలుగా వర్ణించి స్త్రీలపట్ల స్నేహభావంతో నీతిదాయకములైన సంగతులు అనేకం వ్యాసాలుగా వ్రాస్తున్న కొటికలపూడి సీతమ్మ, భండారు అచ్చమాంబ, పులుగుర్త లక్ష్మీ నర్సమాంబ మొదలైన స్త్రీలను ఆదర్శంగా చూపి స్త్రీలు పరస్పరం స్నేహంగా ఉండాలని దానికి మూలాధారం సమాజమేనని ప్రబోధించింది. (హిందూసుందరి,సెప్టెంబర్& అక్టోబర్ 1903) భగవంతుడు, విక్టోరియా మహారాణి , కందుకూరి వీరేశలింగం వంటి వారిని ప్రస్తావిస్తూ స్త్రీవిద్యకు దేశంలో ఏర్పడుతున్న అనుకూల వాతావరణాన్ని గురించి చెప్పి ఈ సందర్భంలో స్త్రీలు ముఖ్యముగా నేర్చుకోవలసినది ఐకమత్యము అంటుంది శేషమ్మ. ఇదివరకు పదిమందితో కలిసి తిరుగుట, పదిమందితో ఏకభావంతో ఒక ఘనకార్యం చేయటం మొదలైన పనులు స్త్రీలకు అలవాటు లేకపోవటం వలన ఐకమత్యం గురించి పట్టించుకోలేదని కానీ కొత్తగా సమాజాలు పెట్టుకొని విద్యాసామాజిక సాహిత్య రంగాలలో అభివృద్ధి చెందాలన్న తలంపుతో ఉన్న స్త్రీలకు ఐకమత్యమే అనుసరణీయం అని ఈ వ్యాసంలో వివరించింది శేషమ్మ ( హిందూ సుందరి, సెప్టెంబర్ 1906). దానిని జీవితాచరణ వాస్తవం నుండి నిరూపిస్తున్నట్లుగా ఉంది ఆమె 1938  ఫిబ్రవరి హిందూసుందరి సంచికకు సంపాదకీయం స్థానంలో మాడభూషి చూడమ్మ గురించి వ్రాసిన సంస్మరణ వ్యాసం. 

మాడభూషి చూడమ్మ హిందూసుందరి పత్రికకు కొన్నేళ్ల పాటు కళ్లేపల్లి వెంకటరమణమ్మతో కలిసి సంపాదకురాలిగా వ్యవహరించింది. ఉన్న 1938 జనవరిలో ఆమె మరణించింది.అప్పుడు సంపాదకురాలిగా  బాలాంత్రపు శేషమ్మ వ్రాసిన వ్యాసం చూడమ్మ గురించే కాదు శేషమ్మ గురించి కూడా చెప్తుంది.స్నేహం యొక్క విలువకు వ్యాఖ్యానం అది. బాల వింతతువు అయిన చూడమ్మ తానూ కందాళ నరసింహాచార్యులు వద్ద కలిసి కావ్యాలు చదువుకొనటం, కలిసి విజ్ఞానచంద్రికా పరిషత్తు వారు, నరసాపురం వారు నిర్వహించిన పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణులు కావటం, ఇద్దరూ కలిసి కాకినాడ విద్యార్థినీ సమాజాన్నిపునరుద్ధరించడం, కలిసి యాత్రలుచేయటం, కలిసి హిందూ సుందరి పత్రికను నడపటం, తానుకన్నకూతురిని ఆమెపెంచి పెద్దచేయటం వంటి విషయాలను ఎన్నింటినో ఇందులో ప్రస్తావించింది శేషమ్మ. విద్యా సామాజిక సాంస్కృతిక రంగాలలో పనిచేసే స్త్రీలమధ్య ఉండవలసినవిగా శేషమ్మ పదేపదే చెప్తూ వచ్చిన సహకారానికి, ఐక్యతకు నమూనా చూడమ్మతో శేషమ్మ స్నేహ సాహచర్యాలు. 

                                                  2

బాలాంత్రపు శేషమ్మ సృజన రచన ఒకటి మాత్రమే కనబడుతున్నది.అదిధైర్య స్థైర్యములు’  సంభాషణాత్మక కథనం. ధైర్యవతి, పార్వతి బడికివెళ్ళేపిల్లలు. చదువుపట్ల వాళ్ళశ్రద్ధ, వాళ్ళలోని మంచిగుణాలను వర్ణించటం ఈకథనానికి లక్ష్యం. పిల్లలకు ధైర్యంస్థిరప్రవృత్తి రెండూ ఉండవలసిన గుణాలు అని ఆరెండింటినీ ఈఇద్దరు బాలికల యందు నిరూపిస్తూ చేసిన రచన ఇది. ధైర్యవతి పొద్దున్నేచద్ది అన్నం తిని పలక పుస్తకాలు తీసుకొని బడికి బయలుదేరుతూ పార్వతివాళ్ళంటికి వెళ్లి తనను తీసుకొని బడికి వెళతానని తల్లిని పిలిచి చెప్పి వీధి తలుపు వేసుకోమని చెప్పటం దగ్గర మొదలై పార్వతి ఇంటికివెళ్ళే లోపల ఆమెఎంతధైర్యవంతురాలో నిరూపించబడుతుంది. ధైర్యవతి వాకిట్లోకి వస్తూనే ఎదురింటి ఆమె కొడుకును రెక్కపట్టుకొని లాక్కువచ్చి బడికిపొమ్మని కోప్పడటం చూస్తుంది. బడికి పోవాలంటే ఏడ్చే కొడుకును విసుక్కొంటూ ఆతల్లిపనికిమాలిన యాడుదైనా ఇప్పుడు చదువుకొనుచున్నదిమగవాడివి కూడా , పెళ్ళానికి తిండి అయినా పెట్టాలికదా రెండుముక్కలు చదువుకోకపోతే ఎలాబ్రతుకుతావురాఅని మందలించటం గమనించవలసిన విషయం. మగవాళ్ళు పెళ్ళాన్నిపోషించుకొనటానికి చదువుకోవాలి. ఆడపిల్లలు పోషింపబడేవాళ్లు కనుక వాళ్లకు చదువుఅక్కరలేదు.ఇది అప్పటివరకు ఉన్నస్థితి.ఇప్పుడు దానిలో చలనం తెస్తున్నారు ఆడపిల్లలు ఉత్సాహం గా చదువులకు ముందుకువస్తూ. అందుకే ఆతల్లి ధైర్యవతిని చూపిస్తూ చూడు నీఈడుపిల్ల ఎంతచక్కగా బడికివెళుతున్నదో అనిచెప్పి కొడుకును ప్రోద్బలంచేస్తుంది. బడికి వెళ్లే వీధిలో కాట్లాడుకుంటున్నకుక్కలు కరుస్తాయి నేనుపోను ఆపిల్లవాడు మొరాయిస్తుంటాడు.

ధైర్యవతి ఆమెను వారిస్తూ మాట్లాడినమాటలు పిల్లలలో లేనిపోనిభయాలు కల్పించేది తల్లిదండ్రులే అని చెప్పకనే చెప్తాయి.కుక్కలు కరుస్తాయిఅన్నది ఒక బెదిరింపు మాట గా వాడేటప్పుడు ఆతల్లిదండ్రులు ఆమాట పిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందన్న విషయం విస్మరిస్తారు. ధైర్యవతి అప్పారావు కు కుక్కలాభయంలేకుండా బడి వరకు తోడువస్తా పదమని  మొరాయించే ఆపిల్లవాడితోస్నేహంగా మాట్లాడి తీసుకు వెళుతుంది. ధైర్యం లేకపోతే  ప్రాణంలేని చెట్లుకూడా మనలను భయపెడతాయి అంటూ మనతోపాటు ఈ ప్రపంచంలో ఉండే జీవరాసులతో మనం ఏరకంగా ప్రవర్తించాలో చెపుతూ ఆపిల్లవాడినే కాదు మరికొందరినికూడా బడిదగ్గర విడిచి వెళ్తుంది ధైర్యవతి. పార్వతి ఇంటికి వెళ్ళేలోపల ఒక అపరిచితుడు ఆమెను మాటలలో పెట్టి మేడలో గొలుసు కాజేయాలని చూస్తే చాకచక్యంగా అతని నుండి తప్పించుకొనటంలో కూడా కీలకమైనది ధైర్యం , అందువల్ల కలిగిన వివేకం. ఆడపిల్లలలో చదువు ధైర్యం అనే సద్గుణాన్నిపాదు కొల్పుతుందని చెప్పటం శేషమ్మ ఉద్దేశం.

ఇక పార్వతి సంగతి. చక్కగా చదువుకొనే అమ్మాయి. ఆరోజు కూడా చేయవలసిన లెక్కలు, నేర్వవలసిన పాఠాలు నేర్చుకొన్నది. వాళ్ళ అక్కగారింట్లోదొంగలుపడి, ఇల్లుకాలిపోయిందని తల్లిఏడుస్తున్నా ఆమెనుపరామర్శించటానికి ఎవరెవరో వచ్చి పోతున్నా అవేవీ ఆమెచదువుకు ఆటంకాలుకాలేదు. కాకుండా చూసుకొన్నది. అదిఎలాసాధ్యమైంది? ఏడుస్తూ కూర్చొనటం వృధా పని.చదువును మించిన సంపద మరొకటి లేదు అన్నతత్వం ఒంటపట్టించుకొనటంవలన అదిసాధ్యమైంది. ఆతత్వం బడిలో ఉపాధ్యాయులు చెప్పే మంచిసంగతులవలన, హిందూ సుందరి వంటి పత్రికలు చదవటం వలన, బండారు అచ్చమాంబ వంటి స్త్రీలను ఆదర్శంగా తీసుకొనటం వలన. ఆ తత్వం స్థిరసంకల్పానికి కారణమవుతుంది. మేనమామ ఇచ్చిపోయిన రూపాయి ఇల్లుకాలి బట్టలు కాలిపోయిన అక్క కూతురికి పరికిణీలు కుట్టించటానికి తల్లి ఇమ్మంటే తనకొత్తపరికిణీలలో రెండింటిని ఇయ్యటానికైనా సిద్ధపడింది కానీ ఆ రూపాయిని సావిత్రి పత్రికకు చందా కట్టటానికి తప్పమరిదేనికీ ఖర్చుపెట్టనని తల్లితో వాదించి ఒప్పించ గలిగింది. అందుకే ఆమెస్థిరచిత్త. విద్యావిజ్ణాన సాధనకు అవసరమైన గుణం అది. స్త్రీల చేత స్త్రీల కొరకు నిర్వహించబడే పత్రికలకు స్త్రీలు తప్పనిసరిగా పాఠకులు కావటం అనే విలువ స్త్రీల మధ్య ఒక ఐక్యతకు దారితీస్తుందన్న  శేషమ్మ అవగాహనను కూడా ఈ సంభాషణ లో గుర్తించవచ్చు. 

శేషమ్మ శేష జీవిత వివరాలు ఇంకా లభించవలసే ఉంది. 

                                                           

 

 
 

సాహిత్య వ్యాసాలు

మాదిరెడ్డి సులోచన కథల్లో భిన్న కోణాల మానవ నైజ చిత్రణ

అరవై డెబ్భై దశకాలలో చదువుకున్న వాళ్ళు సరే, రోజంతా ఇంట్లో పనీపాటలతో సతమతమయ్యే సాధారణ గృహిణులు సైతం కాస్తంత సమయాన్ని సమకూర్చుకుని సీరియల్స్ చదువుతూ పత్రికల సర్క్యులేషన్ ను అమాంతం పెంచేసిన రోజుల్ని తలచుకుంటే అది పబ్లిషర్లకు బంగారుపంటని అందించిన స్వర్ణయుగం. ఉత్కంఠని రేపే నవలలను విస్తృతంగా రాసి కీర్తినీ, ధనాన్నీ సాధించిన రచయిత్రుల కాలమది. అటువంటి కాలంలో కేవలం పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఒకవైపు సాహిత్యాన్నీ, మరోవైపు ఉపాధ్యాయవృత్తినీ సమతూకంగా చేసుకొని తనకంటూ ఒక ముద్రని సాహిత్యరంగంలో వేసుకుంటూ అనేక నవలలు, కథలూ రచించిన రచయిత్రి మాదిరెడ్డి సులోచన.

            మాదిరెడ్డి సులోచన 1965లో జీవనయాత్రపేరుతో నవలాప్రయాణం ప్రారంభించి 72 నవలలూ, రెండు నాటికలూ, పది ఏకాంకికలూ రాశారు. పది నవలలు వెండితెరకెక్కాయి. వీరికథల గురించి చెప్పాల్సివస్తే ఆంధ్రజ్యోతిలోప్రచురితమైన మదిరామదవతిమొదటి కథగా భావించవచ్చు. దాదాపు 150 కథలు రాసారని సాహిత్య పరిశోధకుల ద్వారా తెలుస్తున్నా, శ్రీకాకుళంలోని కథానిలయం వెబ్సైట్ నమోదు చేసినవి మాత్రం అరవై ఏడు కథలు. 1975లో మాదిరెడ్డి సులోచన కథలు’, ‘అక్కయ్య చెప్పిన కథలుసంపుటాలుగా వచ్చాయని తెలుస్తోంది. ఇటీవల సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఎంపిక చేసిన ఇరవై కథల్ని మాదిరెడ్డి సులోచన కథలుగా వెలువడ్డాయి.

రచయిత్రి రాసిన కథలో సింహభాగం ఉత్తమ పురుషలోనే రాయటం ఒక ఎత్తైతే, ఆ పాత్ర ఉపాధ్యాయినిగానీ, రచయిత్రిగానీ కావటం మరో విశేషం. అటువంటి చాలా కథలలో ఆ పాత్ర పేరు క్రాంతి అని గానీ, మాలతి అని గానీ కావటం మరింత విశేషం. కథల నేపథ్యం, చిత్రణ చాలావరకు తెలుగు ప్రాంతాల్లో అదీ జంటనగరాల పరిసరాలలోనే కాక విజయవాడలో కూడా కథా వాతావరణం కనిపిస్తుంది. మరికొన్ని కథలు మాదిరెడ్డి సులోచన ఉద్యోగరీత్యా దర్శించిన, నివసించిన ఇథియోపియా, జాంబియా వంటి విదేశాల్లోని జీవన విధానం, అక్కడ స్థిరపడిన భారతీయులు, తెలుగువారి మానసిక ప్రవృత్తుల చిత్రణతో కథల్ని అల్లారు. అందుచేత కథలలోని పాత్రలు యథార్థ వ్యక్తులేననీ, వారి జీవనచిత్రణ, మాతృభూమి వదిలినా మారని మానవ దృక్పథాల్నీ వాస్తవికంగా చిత్రించారని పాఠకులు కథలో మమేకం అయ్యేలా అక్షరబద్ధం చేశారు. కాల్పనిక చిత్రణలో కేవలం ఊహనే జోడించినట్లు కాకుండా మానవీయ విలువల్నీ, వాటిని కలుషితం చేసే పరిస్థితుల ప్రభావాల్నీ సమర్థవంతంగా చొప్పించి పాఠకుల మన్ననలందుకున్నారు రచయిత్రి.

కేవలం కాల్పనిక సాహిత్యంగానే మాదిరెడ్డి సులోచన రచనల్ని గుర్తించటానికి వీలు లేదు. కథానికలలో ఊహాజనిత చిత్రణకన్నా వాస్తవిక జీవిత చిత్రణకు ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. కథల్లో ఆనాటి కథానికా సాహిత్యంలోలాగ కథాంశాల్ని కేవలం ప్రేమలూ, పెళ్ళిళ్ళ చుట్టూ కాక కుటుంబం జీవితంలోని అనేక కోణాల్ని చిత్రించటానికే ఉత్సుకత చూపారు. వీరి రచనల్లో మహిళా పాత్రలన్నీ విద్యావంతులో, ఉద్యోగినులో, రచయిత్రులుగానో ఉంటారు.

స్త్రీని వ్యక్తిగత ఆస్థిగా భావించే పురుషుల దృక్పథాన్నీ, చదువుకుని స్వయంశక్తితో నిలదొక్కుకున్న స్త్రీల దృక్పథాల్నీ కొన్ని కథలు వెల్లడిస్తే; స్త్రీకి స్త్రీయే శత్రువుగానూ, అసూయాద్వేషాల్తో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి రక్త సంబంధీకుల్ని సైతం అంతం చేయగల కుత్సిత బుద్ధిగల స్త్రీల దుష్టత్వాన్ని మరికొన్ని కథలలో చిత్రించారు రచయిత్రి.

ప్రగతివాద ధోరణిలో మాట్లాడుతూనే ఆచరణలో మాత్రం తప్పించుకు తిరిగే కుహనా అభ్యుదయ వాదుల్ని చురకలు అంటిస్తూ కొన్ని కథల్లో ఎండగడతారు మాదిరెడ్డి సులోచన.

సౌందర్యవతి అయిన చెల్లెలు పట్ల తన భర్త ఆకర్షింపబడుతున్నాడేమో అనే భ్రమతో అసూయ పెచ్చరిల్లి నిద్రమాత్రలు కలిపి చెల్లెల్ని చంపటం ఒక కథలోనూ, తనకు పిల్లలు లేకపోవటంతో ఆస్థి తనకు రాదేమోనని తన చెల్లెలినే భర్తకు కట్టబెట్టిన అక్క, తీరా చెల్లెలు గర్భవతి కాగానే భర్త తన చెల్లెలిని అపురూపంగా చూడటం భరించలేక చెల్లెలిని హత్యచేయటం – ‘తప్పు నాదా’ (1971), ‘స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః’ (1969) ఈ రెండు కథలు సుమారుగా అసూయ ఎంత దుర్మార్గానికైనా ఒడికట్టేలా చేస్తుందనే విషయాన్ని సమర్థిస్తూ రాసిన కథలే అయినా; అప్పటికే రచయిత్రి నవలలు సినీమాలుగా రూపొందటంతో ఆ ప్రభావంతో నాటకీయతతో రాసిన కథలుగానే తోస్తాయి. కానీ సమాజానికి ఒక చెడు సందేశాన్ని ప్రసరింపచేసే కథలు రచయిత్రలు నుండి రాకూడదనిపించినా మనిషి విభిన్న పరిస్థితులలో ప్రవర్తించే విధానానికి, తనకున్న మంచి గుణాలు ఛిద్రం కావటానికి కారణాలను అన్వేషించేలా మనస్తత్వ విశ్లేషణకూ, పరిశీలనకు  ఈ కథలు ఉదాహరణలుగా నిలుస్తాయనవచ్చు.

మాదిరెడ్డి సులోచన కథలలో విదేశీ పర్యటనల నేపథ్యంలో రాసిన కథలు చాలా ఉన్నాయితిరిగి స్వదేశం వచ్చాక ఉద్యోగంలో చేరటానికి ఏర్పడిన అవాంతరాల నేపథ్యం, అందులోనూ ముఖ్యంగా విద్యాశాఖలో జరిగే అవినీతి భాగోతాలను బట్టబయలు చేసిన కథ – ‘ఇదీ భారతం’ (1974) – ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఉన్నా, ఇంటర్వ్యూలో సెలెక్టు అయినా కూడా విద్యాసంస్థలలో ఉండే రాజకీయాలు, ఏ విధంగా ఉద్యోగంలో నియమించేందుకు అడ్డంకిగా మారిందో తెలిపే కథ ఇది. అదేవిధంగా రైల్వేలలో చోటుచేసుకున్న అవినీతినీ, రైల్వే ఉద్యోగుల లంచగొండితనాన్నీ ఎత్తిచూపుతూ ప్రయాణీకులు సిన్సియర్ గా ఉందామనుకున్నా పరిస్థితులను ఎలా ఎక్స్ ప్లాయిట్ చేస్తాయో తెలియజేస్తుంది. ‘సిన్సియారిటీ ఖరీదు’ (69). ఒకే అంశాన్ని రెండు వేర్వేరు శాఖలలో సమాజంలో పెచ్చుపెరిగిపోతున్న జాడ్యాలను ఎత్తిచూపి చాకచక్యంగా కథనాన్ని నడిపించారు రచయిత్రి.

ఇల్లరికపుటల్లుళ్ళ కథలు రెండు రాసారు సులోచన.  ఒకటి తమ కూతురు చనిపోతే ఆమె పిల్లల్ని చూసుకునేందుకు పేదింటి పిల్ల సరితను తెచ్చి తమ ఇల్లరికపుటల్లుడికి ఇచ్చి పెళ్ళి చేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు. కానీ తమ కూతురు అనుభవించని సుఖాలూ, సౌభాగ్యాలూ సరిత అనుభవించటం భరించలేక అల్లుడు లేనప్పుడు ఆ పిల్లను దాసీకన్నా హీనంగా చూస్తుంది అత్త. అది గమనించిన అల్లుడు చంద్రశేఖరం ట్రాన్సుఫర్ చేయించుకుని అత్తకు దూరంగా తన కుటుంబంతో వెళ్తాడు ఓ తల్లి కథలో. రెండవ కథ ఇల్లరికపుటల్లుడులో తన ధనవంతుల ఇంటికి ఇల్లరికం వచ్చిన లక్ష్మీపతి ఎదుర్కొన్న అవమానాల గురించి రాస్తారు. మాదిరెడ్డి సులోచన గారి చాలాకథల్లో ఒకే అంశాన్ని బొమ్మాబొరుసుగా రెండు కథలుగా రాయటం ఆమెకు ఇష్టమైన విధానంగా అనిపిస్తుంది.

సమాజంలోని విభిన్న మనస్తత్వాలు కలిగినవారు స్త్రీలైనా పురుషులైనా వారి నైజంగానీ, ప్రవర్తనగానీ, స్పందించే తీరుగానీ ఒకేలా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాలైనా, ఆస్తిపరులైనా, ధనానికి దాసోహులే స్వార్థం వారిని ఎటువంటి నేర ప్రవృత్తికైనా పురిగొల్పుతుంది. కాలం మారుతున్నా మానవ నైజంలో మారని విలువలు గురించిన కథలు మాదిరెడ్డి సులోచన కథలు.

స్త్రీలలో పఠనీయత పెంచి చైతన్యవంతుల్ని చేసే యజ్ఞంలా నాటి పత్రికలు యధోచితంగా రచయిత్రులను ప్రోత్సహించి నవలలు ప్రచురించాయి. అదేకోవలో వీరు కూడా నవలలు విస్తృతంగా రాసినా, పాఠకులను ఆలోచింపజేసే కథల్నీ సైతం రాసారు రచయిత్రి.

పాఠశాల, కళాశాల నేపథ్యంలో రాసిన చాలాకథలు కేవలం ఆంధ్రప్రాంతం, హైదరాబాదు, సికిందరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా పలు విదేశాలలో కూడా కథని నడిపించారు.   వేరే దేశాలలో ఉన్నా భారతీయులు అందులోనూ తెలుగువారి మనస్తత్వ విశ్లేషణ వారి ఆలోచనా విధానం ఎంత చదువుకున్నా మారని నైజం చిత్రించారు.

ఆడంబరమైన జీవితాన్ని ఆశించి, ప్రగతిపథంలో ఆధునికంగా ఆలోచిస్తున్నాననుకొని తనను తాను పతనం చేసుకున్న పద్మకి, అభ్యుదయ భావాలు గల రచయిత్రేకాక ఉపాధ్యాయినికి మధ్య జరిగే సంఘర్షణని చిత్రిస్తూ, ఎప్పటికప్పుడు పద్మని మంచిదారిలోకి మళ్ళించలేక అశక్తురాలు అయిన విధానం రాయటంలో రచయిత్రి నేర్పరితనం తెలుస్తుంది. ఆస్తిపాస్తులపై ఆశతో డబ్బున్న వయసు మీరిన వాడితో వెళ్ళిపోయి, మరింత పతనమైన పద్మని బ్రోతల్ కేసు నుండి బయటకు తెచ్చి చదివిస్తుంది ఆ రచయిత్రి. ఆ సందర్భంలో చీకటి చీకటి అని అరచేవారు సమాజ శ్రేయస్సు కోరేవారుకాదు. తన శక్తియుక్తులతో ఆ చీకట్లో చిరుదీపం పెట్టేవారు కావాలి. ప్రగతి, స్వేచ్ఛ అని పేరు కోసం ప్రాకులాడటానికికాక నిర్మాణాత్మకమైన అభివృద్ధి జరగాలి అనే నమ్మికని కథల్లో రచయిత్రి చాలాచోట్ల వ్యక్తపరుస్తుంది.

దోషులెవరు (1981)’ నలభై ఏళ్ళనాటి కథ ఇంటర్ బోర్డులోని నిర్లక్ష్యం, వైఫల్యం ఒక ప్రతిభ కల విద్యార్థి చావుకి ఎలా కారణం అయ్యాయో తెలియజేసే కథ. ఒక ఉద్యోగి రిటైర్ అయితే అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసినా చెప్పులరిగాకో, మరణించాకో పెన్షన్ వస్తే అందుకు దోషులెవ్వరు? అదేవిధంగా స్కాలర్ షిప్ ల విషయంలో కూడా లభ్యం కాకపోతే దోషులెవరు? ప్రభుత్వం అలసత్వమా, శాఖలోని ఉద్యోగులా ఎవరిని తప్పు పట్టాలి అనే ప్రశ్నలతో కొంత ఆవేదన, మరి కొంత ఆవేశంతో సమాజంలోని బాధ్యత పట్టించుకోని వ్యవస్థలపై గురిపెట్టి సంధించారు రచయిత్రి మాదిరెడ్డి సులోచన.

చదువుకున్న, ధనవంతుల అమ్మాయి శోభాదేవి(1976)’ సోషలిజాన్ని వంట పట్టించుకుని, తన యింటిలో పనివాళ్ళూ, యజమానుల మధ్య సమానత్వం సాధించాలని అనేక మార్పులు చేయాలని ప్రయత్నించి విఫలమవ్వటమేకాక తిరిగి ఆమె ఎదురు విమర్శలు ఎదుర్కొంటుంది. కష్టపడి సంపాదించుకునే అవకాశమిచ్చినప్పుడే శ్రమ విలువ, డబ్బు విలువ తెలుస్తుందనీ, అవసరాన్ని మించి దానాలు చేయటం వారిని సోమరులుగా తయారుచేయటమేననీ, అపాత్రదానం కూడదనేది తెలియజేసేలా సంఘటనల కూర్పుతో సహజసిద్ధంగా కథారచన చేసింది రచయిత్రి.

నైజీరియాలో ఉపాధ్యాయపోస్టుకి అప్లై చేస్తే, ఢిల్లీలో ఇంటర్వ్యూకి పిలుపు వస్తుంది. ఒంటరిగా నైజీరియాకి వెళ్ళటానికి సిద్ధపడిన దాన్ని ఢిల్లీ వెళ్ళటానికి భయపడటమేమిటని బయల్దేరింది కథానాయిక. ఆమెకి తెలిసిన ఢిల్లీ మిత్రులు ఊళ్ళో లేకపోవటంతో ఆ మిత్రులు ఆమె బాధ్యతను ఒకరికి అప్పగించుతారు. ఆమెని హోటల్ లో దింపేవరకూ సహాయం చేసిన వ్యక్తి తిరుగుబోతు వ్యసనపరుడని తెలుసుకుంటుంది కథానాయిక. అతనితో కలిసి అతనింటికి వెళ్ళి అనుమానం, నిరసన, అవమానానికి గురౌతుంది. తన తప్పేమీ లేకపోయినా అందరి నిరసన దృక్కులు ఆమెని బాధిస్తాయి. ఏ మనిషి అయినా తన పరిసరాలను బట్టీ, స్నేహితులను బట్టీ గౌరవింపబడతాడనే సత్యం ఆమెకు అవగాహన అవుతుంది తాడికింద పాలు కథలో.

అక్క సౌందర్యరాశి, చెల్లెలు అందవిహీన అయినప్పుడు చెల్లెలి మనస్సంక్షోభం తప్పెవ్వరిదికథ. ఇంటిలోనూ బయటా ఆఖరికి వివాహ వ్యవస్థలోనూ అనుభవించిన వివక్ష ఆమెను ఎలా దుర్మార్గురాలిని చేసిందో తెలుపుతుంది.

డబ్బు తోబుట్టువుల మధ్య కూడా మానవ సంబంధాల మధ్య ఎలా చిచ్చు పెట్టగలదో తెలియజేసే కథ డబ్బు. డబ్బు. డబ్బుమానవ జీవితం గురించి రచయిత్రి తనకు ఉన్న అవగాహనను పరిశీలనాత్మకంగా అధ్యయనం చేసుకుంటూ, విస్తృతం చేసుకుంటూ అనుభవాల లోతుల్ని స్పృశిస్తూ రాసే రచయిత్రిగా మాదిరెడ్డి సులోచన కనిపిస్తుంది. మానవ దృక్పథాన్ని అనుసరించి సమస్య, సంఘర్షణ పరిష్కారం- ఈ క్రమంలోనే ఆమె కథలన్నీ తీర్చబడ్డాయి.

నిత్యజీవితంలో తెలియక చేసే పొరపాట్లు గానీ, క్షణికోద్రేకంలో జరిగే సంఘటనలు గానీ అన్యోన్య దాంపత్యాలను కూడా తలకిందులు చేస్తాయి. స్వార్థం, ధనాశ బాల్యమిత్రుల మధ్య కూడా విభేదాలు సృష్టిస్తాయి. ఏ దేశంలోకి ఉపాధి కోసం వెళ్ళినా మానవ మనస్తత్వాలు, విధానాలూ మారవు. జీవితాల్ని ఆనందమయం చేసుకోవటానికి ఏ కుటుంబమైనా ఏ విధంగా సంయమనం సమకూర్చుకోవాలో, అదేవిధంగా స్నేహబంధం నిలవాలన్నా అదే ధోరణి అలవరరచుకోవాలనేది మాదిరెడ్డి సులోచన కథలలో బాధ్యత గల రచయిత్రిగా, ఉపాధ్యాయినిగా ఉద్భోధిస్తారు.

నిజానికి తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల సమాజంలో, ప్రేమాభిమానాలు ఉండాలి కానీ ఆడపిల్లలని ఎప్పటికైనా పరాయిదేననీ, తమని జీవితాంతం చూసుకొని తల కొరివి పెట్టే వాడనే దృష్టితో కొందరు మగపిల్లల పట్ల అతిప్రేమని ప్రదర్శిస్తారు. ముగ్గురు మగపిల్లల తర్వాత పుట్టినదే అయినా దేవయాని పట్ల వివక్ష చూపుతాడు తండ్రి. కొడుకుల ఉద్యోగరీత్యా దూరంగా స్థిరపడటంతో తండ్రి బాధ్యత దేవయాని స్వీకరించి ఎంత సేవలు చేసినా తనని పట్టించుకోకపోగా కొడుకులను తలచుకుని మురిసిపోయే తండ్రిని చూసి విరక్తి చెందుతుంది హక్కుకథలో దేవయాని. తనని ప్రేమించని తండ్రిని ఏ విధమైన హక్కుతో బాధ్యత పడాలి అనే నైరాశ్యానికి గురికావటం కథలో చక్కగా పాఠకులకు కనువిప్పు కలిగేలా దృశ్యీకరణ చేశారు రచయిత్రి.

చాలాకథలు  ఉత్తమ పురుషలోనే చెప్పటం వలన రచనలో వైయక్తిక ఛాయలు కనిపిస్తాయి. రచయిత్రి సందర్శించిన ఇథియోపియా, జాంబియా దేశాలలోని సామాజిక స్థితిగతులు, జీవన విధానం, అక్కడ స్థిరపడ్డ భారతీయులు అందులోనూ తెలుగువారి మానసిక ప్రవృత్తులు చర్చించబడతాయి. ఇతర వృత్తులకన్నా ఎక్కువగా మాదిరెడ్డి సులోచన చాలాకథల్లో ఉపాధ్యాయవృత్తికే ప్రాధాన్యం ఇవ్వటమేకాకుండా అందులో ఎదురైన సమస్యలనూ, ఒడిదుడుకులనూ అనుభవ పూర్వకంగా కథలలో ఒదిగించారు, పరిష్కార మార్గాలనూ సూచించారు.

రచయిత్రికి పూజలూ, వ్రతాల పట్ల నమ్మకం లేనట్లుగా, ఆమె కథలలో ఆయా చోట్ల రాసిన ప్రస్థావనలను చదివితే అనిపిస్తుంది. ‘హరివిల్లుకథలో కథానాయిక అమరావతిలో ఏర్పాటైన రచయితల సమావేశానికి వెళ్ళి అక్కడ తన పిన్నికూతురు సుగుణ ఇంటికి పలకరింపుకై వెళ్తుంది. సుగుణభర్త కథానాయికకు చాలాకాలం కిందట స్కూలులో సహ ఉపాధ్యాయుడు. అప్పటికే అతను గ్రంథసాంగుడు తప్పని పరిస్థితులలో ఒక పెద్ద వయస్సామెని పెళ్ళిచేసుకుంటాడు. అప్పట్లో ఒకసారి వాళ్ళింటికి పేరంటంకి వెళ్ళిన కథానాయిక అక్కడ అమ్మలక్కల కబుర్లకి చికాకు పడి వెళ్ళిపోబోతుంటేవరలక్ష్మీ వ్రతంకి వచ్చి తాంబూలం తీసుకోకుండా వెళ్ళకూడదుఅంటుంది ఆమె. దానికి కథానాయిక నాకా నమ్మకాలు లేవనివెళ్ళిపోతుంది. అదేవిధంగా పూజలంటే తప్పించుకు తిరుగుతానుఅనే అర్థంతోని సంభాషణలు కూడా వేర్వేరు కథల్లో కనిపిస్తాయి. హేతువాదదృక్పథం కల రచయిత్రి అనే భావన కలిగించిన మాదిరెడ్డి సులోచన దెయ్యం కథల్ని రెండింటిని రాయడం విశేషం!

బీరూట్ లోని కోరల్ బీచిలో కొన్ని క్షణాలుకథలో బీచిలో పర్ష్యన్ అందగత్తెతో అనుభవం తలచుకొని కథానాయకుడు ఆనంద్ తన్మయుడైన సమయంలో ఆ అందగత్తె పదేళ్ళ క్రితమే చనిపోయిందని కథగా మిత్రుడి ద్వారా తెలుసుకుని, అదంతా భ్రాంతేనా అని నివ్వెరపోతాడు. ఇదేవిధంగా మరో కథలో మిత్రులతో ఒక గుడికి వెళ్ళి తనకు గుడిలోకి వెళ్ళే ఆసక్తి లేదని వాళ్ళని దర్శనానికై లోనికి వెళ్ళమంటాడు కోనేరు గట్ల మీద కూర్చున్న కథానాయకుడి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి తనకు ముసలివాడితో వివాహం చేస్తున్నారని తాను మరొక వ్యక్తిని ఆరాధిస్తున్నానని తన కథంతా చెప్పుకొని వెళ్తుంది. అంతలో తిరిగి వచ్చిన మిత్రులు అదే కథని స్థల పురాణంగా చెప్పి ఆ అమ్మాయి కోనేరులో దూకి దేవతగా మారిందని చెప్పుకుంటారు. దాంతో ఆ కథానాయకుడు తనతో ఇంత సేపూ మాట్లాడినది గుడిలో దేవతా అని ఆశ్చర్యపోతాడు. ఈ రెండు కథలలోనూ దెయ్యం, దేవతల కథగానే చెప్పినా దైవభావన గురించి దైవచింతన గురించి హేతువాద భావ ప్రకటన గల సంభాషణలతోనే కథంతా చర్చింపబడుతుంది.

రచయిత్రి కథలలో వాదాలేవీ స్పష్టంగా లేకపోవచ్చు కానీ కొన్ని కథలలో సూచనప్రాయంగా కథానాయిక జీవితం, సంఘటనలూ, అభిప్రాయ ప్రకటనలోలను మహిళా సాధికారతగల పాత్రగా చిత్రిస్తారు. కథానాయికలందరూ విద్యావంతులు, ఉద్యోగస్తులు, రచయిత్రులు కావటం వలన ఆనాడు అప్పుడప్పుడే సమాజంలోనూ, సాహిత్యంలోనూ మొలకలెత్తుతున్న స్త్రీ చైతన్యస్ఫూర్తి మహిళా పాత్రలన్నింటా గోచరిస్తాయి.

ఒక సందర్భంలో ‘‘సాహిత్యంలో మానవత్వాలు, వాస్తవికత హేతుబద్ధమైన దృక్పథం పెరగాలని మాదిరెడ్డి సులోచన అంటారు.

మాదిరెడ్డి సులోచన 1965-83 మధ్య స్వల్పకాలంలోనే అంత విస్తృతంగా, అన్ని రచనలు చేయటం తన సమకాలీన రచయిత్రులలో పోల్చి చూస్తే ఒక రికార్డుగానే పరిగణించాలి. ఒకవైపు దేశంలోనే కాకుండా విదేశాలలో సైతం ఉపాధ్యాయ ఉద్యోగ బాధ్యతలలో తలమునకలుగా ఉండటం, మరోవైపు కుటుంబ బాధ్యతల మధ్య ఒత్తిడులను అధిగమిస్తూ రెండు దశాబ్దాల కాలంలో పాఠకులను అలరించేలా రెండు మూడు పత్రికలలో ఒకేసారి ధారావాహికలనూ, అంతే విస్తృతంగా కథలనూ రాయటమనేది అంత సులభ సాధ్యమేమీ కాదు.

1978లో గృహలక్ష్మి స్వర్ణ కంకణం పురస్కారంగా పొందిన మాదిరెడ్డి సులోచన 1984లో వారి యింటిలో వంటగేస్ దుర్ఘటనలో తమ భర్తతో సహా భౌతికంగా దూరమైనా, వారి కలం నుండి మరిన్ని రావలసిన రచనలు చేజారిపోయినా, సుమారు ముప్పై ఏళ్ళు గడిచినా వారి రచనలు పాఠకుల హృదయాలలో పదిలంగానే ఉన్నాయి.

 

సాహిత్య వ్యాసాలు

     తెలంగాణ గుండెనే ఈ రుబాయీలు

గజళ్లను కొత్త వస్తువు దిశగా దారిమళ్లించి సినారె గారు విజయం సాధించారని అందరికీ తెలిసిన విషయమే. సాహిత్యంలో...అందులో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక లక్షణాలతో కూడిన అనేక కొత్త ప్రక్రియల ప్రయోగాలు ఎన్నో జరుగుతున్నయి.అందులో కొన్ని విజయవంతంగా ముందుకు సాగిపోతున్నయి.అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రక్రియ... ఈ మధ్య ఎక్కువ వినబడుతున్న ప్రక్రియ "రుబాయిలు." ఈ రుబాయి ప్రక్రియ పారసీ ఉర్దూ నుంచి వచ్చిందని కొందరు, అరబ్బీ నుంచి వచ్చిందని ఇంకొందరి వాదన.ఏదేమైనా అనువాదం ద్వారా ఈ ప్రక్రియ తెలుగు వారికి పరిచయమైందని చెప్పాలి.ఉమర్ ఖయ్యాం రాసిన రుబాయిలు తెలుగు,ఇంగ్లీషు భాషలలోకి అనువాదం జరగడం వల్ల భావకవులనెంతో ఆకర్షించింది ఈ ప్రక్రియ.

ఈ రుబాయిలను తెలుగులో రాస్తున్న... సింగిల్ డిజిట్ కూడా దాటని అతిముఖ్యమైన వారిలో ఏనుగు నరసింహా రెడ్డి గారొకరు.తెలంగాణ లోని బతుకు చిత్రాలను నేపథ్యంగా తీసుకొని,వినూత్న వస్తువులను ప్రకటిస్తూ విభిన్న ఆలోచనలు రేకెత్తేలా రాసిన 536 రుబాయిలతో "తెలంగాణ రుబాయిలు" అనే పుస్తకాన్ని ఈ సాహిత్య లోకంలోకి తీసుకొచ్చారు ఏనుగు నరసింహా రెడ్డి గారు.

రుబాయిలు కొన్ని ప్రత్యేక లక్షణాలను కల్గిఉండి చదువుతున్నప్పుడు ప్రత్యేకతతో ఆకర్షింపబడతాయి.

రుబాయి అనేది ఒక పారసీ ఛందస్సు పేరు.అదే... పారసీ కవితా ప్రక్రియకు పేరుగా మారింది.దీనిలో నాలుగు పాదాలుంటాయి.ఈ నాలుగు పాదాలు కూడా ఒకే భావాన్ని వ్యక్తం చేయాలి.

1,2,4 పాదాలలో రదీఫ్, కాఫియాల నియమాలతో ఒకే భావాన్ని చమత్కార పూర్వకంగా వ్యక్తపరచాలి.ఈ మూడు పాదాలలో రదీఫ్ కు ముందున్న పదాన్ని కాఫియా అంటారు.రదీఫ్ గా ఒకే పదాన్ని కల్గి ఉండి కాఫియాతో అంత్యప్రాస నియమాన్ని పాటించాలి.అన్ని పాదాల్లో సమాన మాత్రలు తప్పనిసరిగా కల్గిఉండాలి.అలాగే 3వ పాదంలో ఎలాంటి నియమం లేకుండ స్వతంత్ర వాక్యమై ఉంటు భావపరిణామ సూచన చేస్తూండాలి.అందుకే ఈ 3వ పాదాన్ని రుబాయి అనే భవనానికి పునాది లాంటిదని,ఉరుము ముందు వచ్చే మెరుపు లాంటిదని పెన్నా శివరామకృష్ణ గారు ముందు మాటలో అంటారు. ఈ మూడవ పాదంతోనే మిగిలిన పాదాలకు అర్థం, అందం,బలం,ధైర్యం చేకూరుతుందని చదివే వాళ్లకు కూడా అర్థమవుతూనే ఉంటది.

  ఈ "తెలంగాణ రుబాయిలు" లో మొత్తం పధ్నాలుగు వస్తువుల కింద 536 రుబాయిలు రాయబడినవి. ఆ వస్తువులనొకసారి చూస్తే... వలయంలోపల వలయం, దూదిపింజ లాంటి నవ్వు, స్వరం పొంగినపుడు, ఇంటిమీద ఇల్లు,నింగి మురిసిన వేళ, తూర్పు తేనె, అనుసంధానం, ఎర్రెర్రని చెల్కల్లో,

ఎత్తొంపుల నేలల్లో, వరణ భంగం, క్రమాక్రమం,పాసంగం, కౌశల,పుడమి అంచులు.

  కొన్ని రుబాయిల్లోకి వెళ్లితే....

ఒక చుక్కకు ఒక చుక్కకు ఎంతటి దూరం

గ్రహరాశికి గ్రహరాశికి ఎంతటి దూరం

ఎవరైనా నా వారని చెబుతాం కానీ

మనుషులకూ మనుషులకూ ఎంతటి దూరం

  పై రుబాయిలో కొలవలేనంత నిగూడార్థాన్ని నాలుగు పాదాలో ఇమడ్చబడింది.అది సామాన్య విషయం కాదనే చెప్పాలి. ఆకాశంలోకి చూసినప్పుడు చుక్కలన్ని ఒకదానికొకటి ఇంటిపక్కనె ఉన్నంత దగ్గరగా కనిపిస్తాయి.గ్రహరాశులూ అంతే ..వాటి మధ్య అసలు దూరాన్ని తెలుసుకుంటే ఆశ్చర్య పడాల్సిందే మరి.అయినను మనకు మాత్రం ఒక దగ్గరున్నట్లు కనబడుతూ ఒక నీతినందిస్తాయి.

ఎందుకంటే దగ్గరగా ఉన్నామనుకునే  ఈ మనుషుల మధ్య దూరాన్ని కొలవడానికి ఎన్నైనా కాంతి సంవత్సరాలు పట్టొచ్చును కదా.. !

ఇంకో రుబాయిని చూస్తే...

ఎడారిలోకీ తరిమితే ఇసకతో ఆడుకుంటా

తీరానికీ నెట్టేస్తే గవ్వలతో ఆడుకుంటా

గీతలోపల ఆడనిస్తే వాళ్లకే మరి మంచిదీ

అన్నిచోట్ల నెట్టివేస్తె మనసులోతులొ ఆడుకుంటా

ప్రస్తుత మానవాళి స్వార్థపు తత్వాన్ని తెలుపుతుంది ఈ రుబాయి.  పక్కోడు బాగుపడితె ఓర్వలేని మనుషుల మధ్య బతకాలంటే తెగింపునిధైర్యంని కల్గిఉండాల్సిందే మరి! "ఆడువారి మాటలకు అర్థాలే వేరులే..." అనే పాట నిత్యం వినబడుతుంటది. ఆడవాళ్ళ మాటలను,మనసును అర్థం చేసుకోలేమని ఈ విషయం మీద మనకెంతో సాహిత్యం కూడా కనబడుతుంటది.  కానీ ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమనే విషయాన్ని పురుష ప్రపంచం మరిచిపోతారు.  నరసింహా రెడ్డి గారు దీన్ని సాధించడానికి ఒక టెక్నిక్ ని ఈ రుబాయిలో చెప్పుతరు..

సింధూలో చిత్రలిపీ అర్థమైతది

అరచేతిలో బ్రహ్మలిపీ అర్థమైతది

ఆమె చూపులోతు మనకు ఎలా తెలియడం

హృదయంలో చూడు దూరి అర్థమైతది

కోకొల్లలుగా పుట్టుకొస్తున్న పురస్కారాలు,అవార్డులు ప్రస్తుత సాహిత్య ప్రపంచంలో కొంత అలజడిని,నిరుత్సాహ వాతావరణాన్ని సృష్టిస్తుంది.ఒక పురస్కారమైన,అవార్డైన ఏ విధంగ ఉండాలి.తీసుకునే వాళ్లు కూడా ఏ విధంగ ఉండాలో కింది రుబాయిలో చెప్పుతరు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇది చాలా అవసరమైన రుబాయిగా భావించొచ్చు..

పురస్కారమంటే వన్నెలు ఉండాలె

సన్మానానికి నవవెలుగులు ఉండాలె

స్వీకర్తలవల్ల అవార్డులు వెలగాలె

బహుమతులె నిను కోరేటట్లు ఉండాలె

ఈ మధ్య దంచికొడుతున్న వానలకు ఇండ్లు,వీధులు,ఊర్లు,పట్టణాలు,నగరాలన్నీ కూడ తప్పిపోయిన చెరువులను గుర్తు చేస్తున్నయి.విశ్వనగరమని గొప్పగా చెప్పుకుంటున్న మన హైదరాబాదు అయితే మొదటి స్థానంలోనె ఉంటుందని చెప్పొచ్చు. ఈ విశ్వనగరం చెరువు కావడానికి పెద్ద వానలేమి అవసరమే ఉండదు.చిన్నపాటి నాలుగు చినుకులు పడితే చాలు. ఈ నగరంలోని ట్రాఫిక్ సమస్యనైతే చెప్పవశం కాదు.ప్రసవ వేదనతో బాధపడే స్త్రీ అయితే హాస్పిటల్ కి చేరుకోక ముందె గంటలు గంటల ట్రాఫిక్ లోనే ఆ రణగొణ ధ్వణుల మధ్య పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటిముఖం పట్టొచ్చనడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు.ఈ సమస్యల మీద ఓ రుబాయి లో నరసింహా రెడ్డి గారు ఇట్లంటారు...

ఒక్క వాహనమాగిపోయెను,

బిర్రబిగిసెను ట్రాఫికంతా

ఒక్కడొచ్చెను రాంగురూటున ఇరికిపోయెను ట్రాఫికంతా

ఎవ్వడో విసరేయు రాయి ఎన్ని తలలను

గాయపరచునో

అర్థగంటే వాన కురిసెను,ఆగిపోయెను

ట్రాఫికంతా

ఈ టెక్నాలజీ యుగంలో చాలా ఫాస్ట్ గా హార్డ్‌వేర్ ,సాఫ్ట్‌వేర్ లనుపయోగించి దేన్నైనా కలిపేస్తున్నారు. తక్కువ టైం లో ఎంతో ప్రాడక్టివిటీని సాధిస్తున్నారు.  ఇదంత కూడా సాంకేతిక దయనేనని తెలుసు. ప్రతీ ఒక్కరికీ కూడా ఇది సుళువుగా దగ్గరవుతుంది.ఇంతటి ఘనమైన నైపుణ్యం కల్గినటువంటి ఈ నిపుణులకు ఒక రిక్వెస్ట్ ని చేస్తు ఎంతో ఆలోచింపదగిన రుబాయిని అందించారు...  

ఇనుము గూడ ఇరగదీసి అతుకేసే యంత్రాలు

కట్ పేస్టులతొ టెక్స్టులనూ కలిపేసే యంత్రాలు

లక్షలాది నిపుణులున్న సాంకేతిక యుగంలో

ఎపుడు సృష్టి చేయుగలడొ మనసతికే యంత్రాలు

మన దేశంలో ఎలక్షణం ఏ లక్షణాలతో సాగుతుందో తెలిసిందే.మనకెన్ని పండగలున్నా ఈ ఎలక్షణం పండుగ ముందు బలాదూరే అవుతుంది.  ఎందుకంటే ఈ పండగెప్పుడు ఏదో మూలన ఏదో ఎన్నిక రూపంలో జరుగుతనే ఉంటుంది.  తెల్లారి లేవంగనే ఓటరు ముఖంనే సూడాలనుకుంటాడు.  మురికి వాడల దర్శనాన్నే చేయాలనుకుంటాడు. ఇదెన్ని రోజులో కాదు ఓటరు సూపుడు వేలు మీద నల్లసుక్క పొడిచేంత వరకే.  ఆ తర్వాతంతా షరా మామూలే ఉంటది.ఇట్లాంటి ఎలక్షణం మీద ఓటరేమనుకుంటాడో తన రుబాయిలో ఈ విధంగ చెప్తరు...

ఏటేటా ఎన్నికలూ ఉంటె ఎంత బాగుండు

నెలానెలా నేతలిలా తిరుగ ఎంత బాగుండు

మాటల్లొ మనసుల్లొ ఏకత్వం వచ్చునేమో

ధనం ఎలక్షణం లంకె విడితె ఎంత బాగుండు

చట్టానికి కండ్లు లేవనే నానుడి కలదు.ఆ నానుడి ఇప్పట్లో అయితే అదెంత నిజమవుతుందో చెప్పలేమిక.కొన్ని చట్టాలెందుకు చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు.అర్థమయ్యేలోపు జరిగేదంత జరిగిపోతనే ఉంటది.ఇంకొన్ని చట్టాలయితే మేకప్ ఏసుకొని ఫ్యాషన్ షో చేస్తున్నట్లుంటాయి.మరికొన్నైతే ఉన్నట్లు కూడ తెల్వదు.ఈ చట్టాలెన్ని రకాలున్నా..ఎన్ని చట్టాలొచ్చినా ... దానివల్ల ఉపయోగమైతే సామాన్య జనానికేమి ఉండకపోగా సామాన్యుడే బలైపోతుంటడు.ఒక రుబాయిలో ఇదే విషయాన్ని ఇలా ప్రస్తావిస్తారు...

పది మొనలున్న కత్తి లాంటిది చట్టం

అమాయకుల పైనే దిగేది చట్టం

పెద్దలెట్లయినా తప్పించుకుంటరు

చిన్నోల్లను సతాయించేది చట్టం

ఇట్లాంటి ఆలోచనాత్మకమైన రుబాయిలెన్నో ఈ "తెలంగాణ రుబాయిలు పుస్తకంలో కనబడుతుంటాయి. ఈ రుబాయిల నాడీననుసరించి అందమైన చిత్రాలను కూరెళ్ల శ్రీనివాస్ గారు పుస్తకం నిండుగ అందించారు.కవర్ పేజీ ఈ పుస్తకానికి మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. పర్షియన్ చిత్రకళలోని లతలు, అల్లికల కలబోతగా కవర్ చిత్రం కనబడుతుంటది."రుబాయిలు" ప్రక్రియ చరిత్రను అంచనా వేయడానికి పాఠకులు ఈ చిత్రాన్ని పట్టుకుంటే సరిపోతుందనిపిస్తది. పెన్నా శివ రామకృష్ణ గారు నరసింహా రెడ్డి గారి రుబాయి నాడీ పట్టుకొని ముందుమాటలో "కొత్త పోలికలతో, చమత్కారంగా సరికొత్తగా వ్యక్తీకరించడం వీరి రుబాయీలలోని ఒక ప్రత్యేకత" అంటారు.  ఈ రుబాయీలన్నీ చదివినంక ప్రతీ పాఠకుడు ఇదే మాటను  తప్పక అనుకుంటాడు. తెలుగులో ...తెలంగాణ నాడీని,గుండెను రుబాయీలుగా మలిచినందుకు ఏనుగు నరసింహా రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

 

 

                        

సాహిత్య వ్యాసాలు

పురాణాల ప్రాచీనత  -  ఒక పరిశీలన

మనదేశ లిఖిత చరిత్ర అంతా పురాణాల్లో నిండిపోయింది. అయుతే ఆ పురాణాలలో కర్మకాండలు, ధార్మిక విషయాలకు సంబంధించినవే ఉన్నాయి. పురాభవ ఇతిపురాణం అన్నారు. అంటే పురాణాలు ప్రాచీన కాలానికి చెందిన అంశాలు చెపుతాయని అర్ధం. పురాణాల్లో చెప్పే ప్రాచీనతను పురావస్తు పరిశోధనలు కనుక్కోవడానికి ప్రయత్నించారు. పురాణాలను మతధార్మిక విషయాలను శాస్త్రీయ దృష్టితో పరిశీలించి పునర్మూ ల్యాంకనం చేయాల్సిన అవసరం వుంది.

ప్రాచీన మైనవని ఎంతగా చెప్పినప్పటికీ పురాణాలలో  ఆధునిక విషయాలు ఉన్నాయి. రుగ్వేదంలోని కవితల్లో ఉన్న రెండు లైన్ల కథలకు పురాణాలు విస్తృత రూపాన్నిచ్చాయి.

పురాణాలు 18. ఉపపురాణాలు 18 ఉన్నాయి. కానీ 22 మరో పురాణాలు, లెక్కలేనన్ని ఉపపురాణాలు కూడా ఉన్నాయి.

పురాణాలను సంస్కృతంలో రాశారు. వాటిని తెలుగులోకి చాలా మంది కవులు అనువ దించారు. వేములవాడ భీమకవి అనువ దించిన నృసింహ పురాణాన్ని మొదటి అను వాదంగా భావిస్తున్నారందరూ. పురాణాల్లో 4,11,000 కవితలు (శ్లోకాలు) ఉన్నాయి. ఉపపురాణాల్లో ఎన్నో చెప్పలేం. ఈ పురాణాలు కాలానుగుణంగా మారుతూ వచ్చాయి.

పురాణాల్లో ఉన్న ఈ కథల ఆధారంగా చాలా మంది కవులు అనేక కావ్యాలు సృజించారు. పెద్దన మనుచరిత్రకు మార్కండేయ పురాణంలోని కథ ఆధారం. తెనాలి రామకృష్ణుని పాండురంగమహత్యానికి స్కంద పురాణం ఆధారం.రాయల ఆముక్త మాల్యదకు విష్ణుపురాణం ఆధారం.

బ్రహ్మ పురాణాన్ని కుంపిణీ యుగం (క్రీ.శ. 1750-1850)లోనూ, పద్మపురాణాన్ని కాకతీ యులు, రెడ్డిరాజుల కాలంలో అనువదించారు. రెడ్డిరాజుల కాలంలో విష్ణుపురాణాన్ని పశుపతి నాగనాథుడు, భాగవత పురాణాన్ని బమ్మెర పోతన, స్కంద పురాణాన్ని శ్రీనాథుడు, కాకతీయుల కాలంలో మార్కండేయ పురాణాన్ని మారన, మలినాయక రాజుల కాలంలో భవిష్యత్ పురాణాన్ని కాకునూరి అప్పకవి  తెలుగులోకి అనువదించారు.  తిమ్మరాజు లక్ష్మణరావు కూర్మ, మార్కండేయ పురాణాలను వచనంలో రాశాడు. ఆయనే పువ్వాడ వెంకటరావుతో కలిసి మత్స్య పురాణాన్ని కూడా రచించారు.

పురాణాలు కుంఫిణీ యుగం వరకు ప్రబంభాలుగా, ద్విపద వచ్చిన కావ్యాలుగా వచ్చాయి. తర్వాత కాలంలో స్టేజి నాటకాలు గా వచ్చాయి. ఆధునిక కాలంలో ఇవే సినిమా కధలుగా వచ్చాయి. పురాణాలు భారతీయ సాహిత్య వారసత్వ సాహిత్యంగా పరిగణించ వచ్చు.

చాలా పురాణాలు ఆంగ్లంలోకి అనువదించబడినాయి. కెన్నడీ క్రీ.శ. 1800లో పురాణాలను అధ్యయనం చేసి 'ఏనిషియంట్ హిందూ మైథాలజీ' అనే గ్రంథాన్ని  రాసినాడు. దాదాపు ఇదే కాలంలోనే విష్ణు పురాణాన్ని విల్సను అనే ఆంగ్లేయుడు అనువదించాడు. ఇతనే ఇతర పురాణాలను కూడా అధ్యయనంచేసి తులనాత్మకంగా విశ్లేషించాడు.

పురాణాలను చెప్పేవారిని పౌరాణికులనేవారు. వీరు ఇద్దరు. ఒకరు వాచకులు - పురాణాలను చదువుతారు.

మరొకరు ఉపబ్రహ్మకులు - క్రొత్త విషయాలను చేర్చి పురాణాన్ని చెపుతారు. ఇలా చేయబడిన వాటిల్లో భవిష్యపురాణం ఒకటి.    భవిష్య పురాణంలో గత కాలపు రాజుల వివరాలేగాక కొత్తగా వచ్చిన రాజుల వివరాలు కూడా చెప్పినారు. చంద్రగుప్తుడు సెల్యూకస్ కూతురుని వివాహమాడటం, భర్తృహరి, క్రీస్తు, శంకరాచార్యుడు, మధ్వాచార్యులు, కీచడు, అన్వరు, ఔరంగజేబు, శివాజీ, నాదిర్‌షా మొదలగువారి గురించి వర్ణించారు. ఇంగ్లీషు వారి గురించి వికటావతి పేరుతో విక్టోరియా ప్రభుత్వం గురించి వివరించారు.

పురాణాలను వ్యాసుడే రాసినట్లు చెపుతారు. జయం(భారతం) రాసిందీ వ్యాసుడే. ఇతనే వేదాలను వింగడించి నాలుగు భాగాలుగా అక్షరబద్ధం చేశారు. ఇన్నింటిని ఒకే వ్యక్తి రాయడం సాధ్యం కాదు. వ్యాస అంటే నేడు మనం చెప్పే సంపాదకుడు అని  అర్థం చేసుకోవాలని ఆరుద్ర అన్నారు.

ప్రతి పురాణంలోనూ నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మునులకు పురాణాలు చెప్పినట్లు ప్రారంభమవుతుంది. మహాభారతం లోనూ ఇంతే. ఆ రోజుల్లో కథలు చెప్పే వాడిని సూతుడు అనేవారు.

ప్రధానమైనవి గా భావించేవి 18 పురాణాలు వున్నాయి. అవి 1. మార్కండేయ, 2. మత్స్య, 3. భవిష్య, 4. భాగవత, 5.. బ్రహ్మ, 6. బ్రహ్మరైవర, 7. బ్రహ్మాండ, 8. విష్ణు, 9. వాయు, 10. వరాహ, 11. వామన, 12. అగ్ని, 13.నారదీయ, 14. పద్మ, 15. లింగ, 16. గరుడ, 17. కూర్మ, 18. స్కాంద పురాణాలు. ఇవేగాక శ్రీ దేవి భాగవతం, శివపురాణం, ఆది జాంబవ పురాణం, డక్కలి పురాణం వంటివి కూడా ఉన్నాయి. జైన బౌద్ధ ధర్మాలలో బౌద్ధ జాతక కథలు  పురాణాలు వంటివే.

ప్రతి పురాణాంలో ఐదు అంశా లుంటాయి. అవి సర్గ(సృష్టి),ప్రతి సర్గ (ప్రతిసృష్టి), వంశం, మన్వంతరం. ఒక్కో యుగానికి మనువుల పుట్టుక,వంశాను చరిత్ర (సూర్యవంశాల చరిత్ర).

సర్గ అంటే పరమాత్ముని గురించి ఆలోచన. ప్రతి సర్గలో మనిషి సృష్టి క్రమం - ప్రళయం, జీవుల గురించి  ఊహలు, బ్రహ్మ నుంచి ప్రజాపతులు వచ్చారనడం లాంటివి చెపుతారు.  వంశంలో మొదటి రాజుల గురించి, మునుల గురించి వారి వంశాల గురించి, ప్రచారంలో ఉన్నవి. మునులు చెప్పుకున్నవి మొదలైనవి వుంటాయి.  మన్వంతరంలో మనువులు, దిక్పాలకులు, వారి కాలంలో జరిగిన విశేషాలు, మునుల కథలు మొదలగునవి వుంటాయి.  వంశానుచరితంలో భూగోళ, ఖగోళ వ్యవస్థలు, నిధులు, కొండలు, వాటి వివరాలు, విశేషాలు, తీర్థయాత్రలు, దేవుళ్లు, వారి అవతార మహిమలు, పాపపుణ్యాల జాబితా, మరణానంతర అవస్థలు వాటిని జయించిన వారి కథలు వినోదాత్మకంగా వర్ణించి చెపుతారు.

పురాణాలను మూడు రకాలుగా విభజించారు. అవి సాత్త్విక, తామస, రాజస పురాణాలు. పురాణంలో ప్రతి కథకు ఒక ఫలశ్రీతి ఉంటుంది. ఫలాన ఫలితం కావాలంటే ఫలాన నోము నోచమన్నారు. ఫలనా గంగలో మునిగితే ఫలానా పాపం పోతుందని చెపుతారు.

పురాణాలపై చాలా మంది పరిశోధనలు చేశారు. ఆరుద్ర, త్రిపురనేని రామస్వామి చౌదరి, నార్ల, కుసుమధర్మన్న, భాగ్యరెడ్డివర్మ, బోయి భీమన్న మొదలైనవారు హేతువాద దృష్టితో పురాణాలను అధ్యయనం చేశారు.

పురాణాలలో చెప్పిన కథలను ఆర్య, ఆర్యేతర సంఘర్షణలను ఆధిపత్య వర్గాల వారు తమ ప్రయోజనాలకు అనుగుణంగారూపొందించు కున్నారని వీరు గుర్తించారు. పురాణాల ద్వారా  ప్రజల సామాజిక సాంస్కృతిక జీవితాన్ని వారి ప్రవర్తనను నియంత్రించారు. పురాణాలు ఇలా చెప్పాయి, అలా చెప్పాయని భక్తి, కర్మ సిద్ధాంతాలను మేళవించి విద్యా వంతుల కులాలు, ఇతర కులాలను శాసించాయి. ఇవన్నీ బ్రాహ్మణ మతాన్ని, కులవ్యవస్థను నిలబెట్టే లక్ష్యంతోనే రాయబడి నాయి.

పురాణాలు ఎవరు రాశారో తెలీదుగాని, ఎప్పుడు రాశారో పరిశోధకులు వాటిలో చెప్పిన రాజుల కాలాల ఆధారంగా గుర్తించారు. మత్స్య, వాయు, విష్ణు, భవిష్య పురాణాలలో, భారతం, భాగవతంలాంటి పురాణాలు,

మగధరాజుల గురించి వివరించారు. అందువలన పురాణాలన్నీ వీరి కాలంలో గానీ, తరువాత కాలంలోగాని రాసివుంటారని భావిస్తున్నారు. మగధ రాజులు 187 సంవత్సరాలు పాలించారు. భాగవతం ద్వాదశ అధ్యాయంలో జనపదం నుండి మహా సామ్రాజ్యంగా మారిన  మగధ చక్రవర్తుల గురించి చెపుతూ,వారు 137 సంవత్సరాలు పాటించారని చెప్పినారు. మగధను పాలించిన శిశునాగులు, నందుల తరువాత క్షత్రియ ప్రభువులు నశించారని చెప్పినారు.

నందుల వంశంలో మహాపద్మనందుడిని హంతకుడుగా, శూద్రుడిగా పేర్కొన్నారు. దీనికి కారణం ఏమిటంటే మహానందుడికి శూద్ర స్త్రీ వలన మహాపద్మనందుడు పుడతాడు. దానితో నందవంశం అపవిత్రం అయినట్లు పురాణ  రచయితలు రాశారు. ఈ మహాపద్మనందుడే చాణిక్యున్ని అవమాన పరిచింది. చాణిక్యుడు అందుకు ప్రతీకారంగా నందవంశాన్ని నాశనం చేస్తానని ప్రతినబూని, నంద వంశపు చివరిరాజు ధననందుడిని పదవీచ్యుతున్ని చేయించి చంద్రగుప్తునికి  రాజ్యాభిషేకం చేయిస్తాడు.  చంద్రగుప్తుడు కూడా శూద్రుడని పురాణాలు చెపుతున్నాయి. చంద్రగుప్తుని తల్లి మొర. ఈమె కొండజాతి వనిత.నంద వంశపు చివరి రాజు ధననందుని తమ్ములలో ఒకడైన నందవంశపు రాజుకు మొరకు కలిగిన  పుత్రుడే చంద్రగుప్తుడు. అందువలన చంద్రగుష్మన్ని శూద్రుడన్నాయి పురాణాలు. ఆమె తల్లి పేర చంద్రగుప్తుని రాజ్యం మౌర్య సామ్రాజ్యమైంది. అంటే మౌర్యులది మాతృస్వామిక గణరాజ్యం.

పురాణాలలో మగధ, శాతవాహనుల గురించి రాయడాన్ని బట్టి అవి క్రీ. శ. 600-300 మధ్య కాలంలో రాయబడి వుంటాయని పరిశోధకులు గుర్తించారు. ఇవి 10 నుండి 19వ శతాబ్దాల వరకు మార్పులు, చేర్పులు జరుగుతూ వచ్చాయి. విష్ణు పురాణం క్రీ.శ. 6వ శతాబ్దం నాటిది. భాగవతం క్రీ.శ. 11, 12 శతాబ్దాల నాటిది. అలాగే ఇతిహాస కావ్యమైన రామాయణం క్రీ.పూ. 200 - క్రీ. శ. 250 మధ్య కాలాల్లోనూ, మరో ఇతిహాసమైనమహాభారతం  క్రీ.పూ. 400 - క్రీ.శ. 400 మధ్య కాలంలోనూ గ్రంధస్తమయ్యాయని చరిత్ర పరిశోధకులు, పండితులు పేర్కొన్నారు.

వేదాలు కూడా క్రీ.పూ.500 తర్వాత కాలంలోనే గ్రంథమయ్యాయి. అప్పటి వరకు అవి మౌఖికంగానే ఒకరి నుండి మరొకరికి సాగాయి.వీటిని క్రీ.శ. 1850లో ఆంగ్లంలోకి అనువదించారు.

పురాణ కథలలో సృష్టి స్థితిలయల వృత్తాంతాలున్నాయి. ఇవన్నీ సునామీ లాంటి జల ప్రళయాలు సంభవించినప్పుడు జీవజాలం నశించిపోవడం, కొంత మంది మనుషులు మరణించడం వంటి సంఘటనలను పురాణాలలో వర్ణించారు. వీటికి సంకేతాలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా తమ కథల్లో పేర్కొన్నారు. బ్రహ్మను జ్ఞానానికి, సృష్టికి సంకేతంగా చెప్పినారు. వేదకాలంలో నగరాలను ధ్వంసం చేసిన దేవుడిగా కీర్తించిన ఇంద్రున్ని తరువాత కాలంలో ఆయన స్థానాన్ని విష్ణువుకు ఇచ్చారు. విష్ణువును ఉపేంద్రు డన్నారు. అంటే ఇంద్రునికి సోదరుడున్న మాట. అలా విష్ణువును మరో ఇంద్రునిగా చేసి దేవునిగా కీర్తించారు. వీరిద్దరూ ఆర్యదేవతలు.

పురాణాలన్నీ దాదాపు ఆర్య, ఆర్యేతర ఘర్షణల కథలుగా రూపొందాయి. ఆర్యులుఆర్యేతరులతో ఘర్షణపడడం మాని వారిని మెల్లగా తమలో కలుపుకొనే క్రమంలో సింధూ, హరప్పా కాలం నుండి కొనసాగుతున్న అనార్యుల దేవతైన పశుపతిగా పేరుగాంచిన శివునికి దైవం హెూదా ఇచ్చి, పురాణాలలో బ్రహ్మ విష్ణు,మహేశ్వరులుగా కీర్తించారు.

రుగ్వేద సూక్తాల్లో (కవితల్లో) కనిపించే చాలా కథల్లో ఆర్యుల దేవుడు ఇంద్రుడు. దాసులుగా ముద్రవేయబడివారు ఆర్యేతరులు.  రుగ్వేదం లో ఆర్యులకు ఆర్యేతరులైన ద్రావిడులకు మధ్య ఘర్షణలు కనిపిస్తాయి. వాటినే మరో రూపంలో పురాణాల్లో దేవాసుర సంగ్రామాలుగా రాయబడినాయని, ఇవన్నీ సింధూ, హరప్పా సంస్కృతిలో ఆర్య దస్సులకు మధ్య జరిగిన ఘర్షణల జ్ఞాపకాలుగా భావించాలని విజయభారతి పేర్కొన్నారు. హరప్పా నాగరికత క్రీ.పూ. 2000 నాటికి అత్యున్నత దశలో వుంది.మెల్లగా ఆర్యుల రాకతో క్రీ.పూ. 1500 వాటికి అది పతనమైందని చరిత్రకారులు భావిస్తున్నారు.

వేదకాలం నాటి ఆర్యులు ఇరాన్ నుండి వలస వచ్చి మొదట ఉత్తరభారతదేశంలో స్థిరపడ్డారు. వీరి జీవనం ఆహారసేకరణ దశ నుండి వ్యవసాయదశలోకి మారుతున్న క్రమంలో వీరు రాధించే దేవతల రూపాలు కూడా మారాయి. వీరి కంటే ముందుగా వలసవచ్చిన వారిలోనూ ముందు నుంచి వున్న అటవిక జాతి వారితోనూ సంఘర్షించారు. అభివృద్ధికర పనిముట్లు కలిగిన ఆర్యులు ఆధిపత్యం సాధించగలిగారు. నాగ, యక్ష, రాక్షస మొదలైన గణ సమాజాలను తమ ఆర్యగణంలోకి కలుపుకున్నారు. కలుపుకునే క్రమంలో ఆధిపత్య స్థాయిలో వున్న విద్యావంతులైన ఆర్యులు అనేక కథలను పురాణాలుగా ప్రచారం చేశారు.

         పురాణాల్లో చెప్పిన దేవలోకం, బ్రహ్మ లోకం, ఇంద్రలోకం, పాతాళలోకం అన్నీ మానవ లోకాలే. సరస్వతీ,దృషద్వతీ, నదుల మధ్యనున్న ప్రదేశాన్ని బ్రహ్మావర్తమన్నారు. ఇది దేవగణాలతో నిర్మితమైందన్నారు. అంటే  దేవలోకమన్నమాట. మనుస్మృతిలో ఈ ప్రస్తావన ఉంది. దీనికి దిగువన కురుక్షేత్రం ఉండేదన్నారు. అక్కడున్న మత్స్య పాంచాల, శూరసేనక జనపదాలను బ్రహ్మర్షిలోకం అన్నారు. అంటే అది బ్రహ్మలోకం అన్నమాట. లడాఖ్ ప్రాంతంలో సురూ లోయ వుంది. అక్కడ నివసించే వారిని సురులన్నారు. కార్గిల్ నుంచి 140 కి.మీ. దూరంలో వున్న 'పెంజలా వాటర్ షెడ్ ప్రాంతం నుంచి సురునది పుట్టిందట. పురాణాలలో చెప్పిన 'సురాపగ' నదే సురునది. ఈ నది, దానిఉపనదులు కొన్ని వేల కి.మీ. విస్తరించివున్నాయట. ఇదంతా సురులోయ ప్రాంతం. ఆర్యగణాలు తమను దేవగణాలుగా చెప్పుకున్నాయి.  బహుశా వీరు సురులోయలో మొదట నివసించి ఉండటంవల్ల అలాచెప్పుకొని వుంటారని పరిశోధకులు భావిస్తున్నారు. కాలక్రమంలో దేవ అనే పదాన్ని దేవతకు పర్యాయపదంగా వాడినారు.

ఉపనిషత్తుల్లో పరమాత్మ అంటే దేవుడని,అతడు ఒక్కడేనని చెప్పారు. కాని పురాణాల కథలలో మాత్రం ముప్పైకోట్ల దేవతలను వర్ణించారు. పురుష దేవతలందరూ ఒక్కడే దేవుడైన పరమాత్మ స్వరూపాలుగా, స్త్రీ దేవత దేవి ఒకటేనని, ఇతర దేవతలందరు ఆమె ప్రతి రూపాలుగా భావించాలని పండితులు పేర్కొన్నారు.

బౌద్ధమత ప్రభావంతో ఆనాడు సన్యసించే ధోరణులు ఎక్కువగా ఉండేవి. మరోవైపు రకరకాల శాఖలుగా బ్రాహ్మణమత విస్తరణలు ఉండేవి. వీటి సమన్వయం కోసం అనాటి ధర్మశాస్త్ర కర్మలు ఆనాటి  వైదికేతర సంప్రదాయాలను కూడా పురాణాల కథల్లోకి తీసుకొచ్చారు. నిమ్న జాతికులాలను గిరిజన కులాలను తమలోకి కలుపుకునే సందర్భం లో వారికి సంబంధించిన జానపదకథను  పురాణంగా మార్చేవారు. ఆ కధలో నిమ్నజాతి పేరుకు బదులు వైశ్యకులాన్ని తెచ్చి పెట్టేవారు. జానపదకథల్లో స్త్రీకి నిర్ణయాధికారం వుంటే పురాణాలలో స్త్రీ బదులు బ్రాహ్మనుని పెట్టి దాన్ని అతని నిర్ణయాధికారంగా మార్చారు.  స్థానిక జాతుల దేవతలందరూ పురాణాల్లోకి వచ్చారు.

వైదిక కర్మకాండలకు బదులు పురాణ కర్మకాండలు అమలులోకొచ్చాయి. దాంతో పురాణాలు చదివిన వారిని, విన్నవారికి మోక్షం లభిస్తుందని అవి చెపుతాయి. పురాణాలలో ప్రతి సమస్యకు, ప్రతి అపరాధానికి ఒక పరిష్కారం ఉంటుంది. జనాభా పెరిగే కొద్ది దేవతల సంఖ్య పెరగడంతో పురాణాల ఉపయోగం పెరిగింది. పురాణ పఠనం చేసేటపుడు ఇతర కులాలతోపాటు, నిమ్నజాతి కులాల స్త్రీలు కూడా ఉంటారు. వేరేవేరు విశ్వాసాలు, సంప్రదాయాలు పురాణాల్లోకి రావడంవల్ల పురాణాలలో పేర్కొన్న పూజావిధానాలలో బ్రాహ్మణుల పాత్ర చాలా వాటిల్లో లేదు. అయినప్పటికీ బ్రాహ్మణ పురోహితులే ప్రస్తుతం చేస్తున్నారు.

రుగ్వేదంలో ఉష, సంధ్య, అశ్విని వంటి స్త్రీ దేవతలు మాత్రమే ఉండేవారు. కానీ పురాణాలలో స్త్రీ దేవతల కథలు అనేకం వున్నాయి. స్త్రీ దేవతలలో ముఖ్యులు సదాదేవి (శివుని భార్య), పార్వతి (శివుని రెండో భార్య), చంద్రిక(మహిషాసురమర్ధని), వీరి ఆరాధన ఎప్పటి నుండో తెలియడం లేదు. కుషానుల కాలంలోని నాణాల పై దుర్గ, పార్వతి చిత్రాలున్నాయి. క్రీ.శ.ఒకటో శతాబ్దానికి చెందిన కుషాణుల శిల్పాలలో వృక్షదేవత యక్షిణి చిత్రం వుంది. ఆమె పాదాల క్రింద ఒక పురుషుడు వుంటాడు. బహుశా దుర్గకు తొలి రూపమై వుండవచ్చని పరిశోధకులు చెపుతున్నారు.

స్త్రీ పూజకు సంబంధించిన ఆధారాలు సింధూ నాగరికతలో వున్నాయి. దీని తరువాత మహాభారతంలో మాతృకల ప్రస్తావన వుంది. వీరిలో మహాకాళి, మృత్యుదేవత, నిశాదేవి మొదలగువారున్నారు. మార్కండేయ పురాణంలో చాలా మంది స్త్రీ దేవతల గురించి వుంది. దేవి మహత్యం కావ్యం స్త్రీ దేవతలకు సంబంధించిన దీర్ఘ కవితాకావ్యం. పురుష దేవతలకు వాహనాలున్నట్లే స్త్రీ దేవతలకు వాహనాలున్నాయి. శివునికి నంది, స్కంధునికి నెమలి, గణేశునికి మూషికం వుంటే పార్వతికి సింహం, చండిక, కాళిక పులిని కలిగి వుంటారు.

చండిక అనేక స్త్రీ దేవతల ఉమ్మడి శక్తి స్వరూపం. మహీషునిపై దండయాత్ర చేస్తున్న సమయంలో చండికకు ఇతర దేవతలు తమ  కమల పుష్పాలను కంఠమాలగా, సింహాన్ని వాహనంగా ఇస్తారు. చండిక మహిషున్ని (దున్న) మెడపై కాలితో తన్నుతుంది.దాని నోటి నుండి అసురుడు సగం మేర బయట పడతాడు. అప్పుడు అతని శిరస్సును ఖండిస్తుంది. మనదేశంలో మహిషాలను బలిచ్చే సంప్రదాయం వుంది. ద్రౌపదిని దేవతగా ఆరాధించే వారు ద్రౌపదికి,కాళీమాతకు బలులిస్తారు. జానపదుల కథలను పురాణాల్లోకి తీసుకువచ్చినపుడు చండిక కథను రాసివుంటారని వెండీడోనిగర్ అభిప్రాయ పడ్డారు.

 

చండిక మహిషుని చంపేశాక, శంభుకుడు ఆమెను మోహించి వివాహం చేసుకుంటానని వెంటపడతాడు. తనను ఓడించినోడినే వివాహమాడతానని ఆమె చెపుతుంది. దాంతో వారిద్దరి మధ్య పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు ఆమె వైపు నిలబడి తమ శక్తులను ఆయుధాలను, వాహనాలను ఆమెకిస్తారు. దాంతో ఆమె శంభుకున్ని వధిస్తుంది. ఈ చండికనే దుర్గ అని కూడా పిలుస్తారు. స్కంధ పురాణాల్లో దుర్గ మహిషున్ని సంహరిస్తుందని రాశారు. దేవి స్తుతిలో చండిక రక్తభోజుడనే అసురుడితో‌ పోరాడుతుంది. అతని రక్త బిందువు నుంచి అనేక మంది రక్తభోజులు పుడుతుంటారు. ఇటువంటి కథలు పురాణాల్లో కి రావడానికి కారణం అనేక తాంత్రిక పూజలు ఆనాడు పుట్టుకు రావడం వల్లనే. దేవిపూజ, శృంగారపర కార్యకలాపాలు ఈ తాంత్రిక పూజలలో వుంటాయి. ఇవి హిందూ, బౌద్ధ సంప్రదాయాలో క్రీ.శ. ఆరు, ఎనిమిది శతాబ్దా లలో ప్రారంభమైనాయి. వీటికి రాజుల అండకూడా వుండేది. ఇవి కాశ్మీర్, నేపాల్, అస్సాం, బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లోజరిగేవి. ఈ పూజల ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకొని తాము రాజులు, చక్రవర్తులు కాగలమని భావించేవారు.

ఇలా పురాణాలు ఆనాటి ఆదివాసి తెగలను, అనార్యులైన ద్రావిడులను వైదిక మతంలోకి కలుపుకొనే క్రమంలో ఆనాటి విద్యావంతులు రాసినారని వీటిని మనదేశ సాహిత్య వారసత్వ సంపదగా పరిగణించాలని పరిశోధకులు భావించారు. మనకు తెలియని చరిత్రను నిర్మించడానికి పురావస్తు పరిశోధన లలో పురాణాలు కూడా కొంత మేర తోడ్పడు తున్నాయి.

 

ఆధార గ్రంథాలు

1.పురాణాలు మరో చూపు__డా.విజయభారతి

2.హిందువులు_ వెండీ డోనిగర్

3.ప్రాచీన భారతదేశ చరిత్ర  కోశాంబి పరిచయం_ బాలగోపాల్

4. సమగ్రాంధ్ర సాహిత్యం_ ఆరుద్ర

5.మన చరిత్ర_ సంస్కృతి __ శైలజ బండారి

ఈ సంచికలో...                     

OCT 2020

ఇతర పత్రికలు