సాహిత్య వ్యాసాలు

సాహిత్య వ్యాసాలు

మనిషికి బాధ్యతను గుర్తు చేసే “అనిమేష”

"అనిమేష" అంటే రెప్పవాల్చనిది ప్రకృతి. కోట్ల సంవత్సరాల కాలం నాటి నుండి జీవకోటి కోసం విశ్రాంతి తీసుకొనిది.మనిషి పుట్టినప్పటి నుంచి అనేక బాధలను భరిస్తూ, ప్రేమను పంచుతూ మానవ మనుగడలో సంపూర్ణ భాగమైంది.కానీ ఇదంతా మరిచిన మనిషి, బుద్ధునికే అందని హద్దులేని ఆశతో ప్రకృతిపై అభివృద్ధి ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కాలమెంతో చెడ్డదని నిందిస్తున్నాడు.ప్రపంచ మార్కెట్ వస్తువే కాదూ మార్కెట్టే తానై అతి తెలివితో ప్రాణాంతకమైన విపత్తులకు, వ్యాధులకు కారణమవుతున్నాడు.శాస్త్ర విజ్ఞానంతో ఎంతెత్తుకెదిగినా తనను తాను కాపాడుకోలేని ప్రమాద అంచుకు నెట్టి వేయబడుతున్నాడు.చచ్చి బ్రతుకుతున్నాడు. ఒకవేళ బ్రతికి బట్ట గట్టినా ఆ తర్వాత జీవచ్ఛవంలాగా బ్రతికీడుస్తున్నాడు.ఈ క్రమం ఒక్కసారి పొరపాటున జరిగింది కాదు, అనేకానేక సార్లు ప్రకృతిని విధ్వంసం చేయడం,తప్పయింది అంటూ నేలకు ముక్కు రాయడం జరుగుతున్నది.  అట్లా ప్రకృతిపై ఎదగిన,అంతే వేగంగా పతనమైనా మనిషి గురించి ఈ కరోనా నేపథ్యంలో గత గుణపాఠాలను గుర్తు చేసేదే ఈ అనిమేషకావ్యం.

అనిమేషఉపద్రవ కావ్యం రాసింది తెలుగు సమాజానికి తెలుగు సాహిత్యానికి సుపరిచితులైన నందిని సిద్ధారెడ్డి. ఇది మంజీర రచయితల సంఘం ప్రచురించింది. ఈ "అనిమేష" 19 గాథల ఉపద్రవ గాథా కావ్యం.  ఇందులోని ప్రతి ఒక్కటి ప్రతి మనిషి గత, వర్తమాన అనుభవాలను తడుతుంది.  ఎనిమిది నెలలైనా ఆగని కరోనా విపత్తు అంశంగా మొదలై వేల ఏండ్ల నాటి గుణపాఠాలను మనిషికి గుర్తు చేస్తుంది.ఈ కావ్యం తపనంతా ప్రకృతి, మనిషి; మనిషి, ప్రకృతి. మనిషి ప్రకృతి పై ఎదిగిన విధానాన్ని, చేసిన విద్వంసాన్ని, ఆఖరికి మనిషి పతనాన్ని గురించి చెప్తుంది.అయినా మారని మనిషిని హెచ్చరిస్తుంది.మన కళ్ల ముందు జరిగిన విపత్తును ఒకే దగ్గర చూస్తే ఆ దుఖమెంత భారంగా ఉంటుందో ఆ బాధంతా  ఈ కావ్యం మోసింది.  ఇది ప్రపంచ ప్రజల దుఃఖం.కవి ఈ కావ్యంలో చేసిన పదాల ప్రయోగాలు, తెలవని పదాలేమున్నా తెలుసుకోవాలనే తపన పాఠకులను మరింత చదివించేలా చేస్తుంది. ప్రకృతిని ప్రేమించే,ప్రకృతిని కాపాడుకోవాలనుకునే ప్రతి మనిషి ఈ కావ్యాన్ని ఇష్టపడతారని నా భావన. నేనూ రాసింది ఈ కావ్యంలోని పదాలతోనే. ఇది నా అనుభూతి మాత్రమే. సమీక్ష కాదు.

ప్రకృతి పుట్టినప్పటి నుండే కోటానుకోట్ల బ్యాక్టీరియాలు, వైరస్ ల వంటి సూక్ష్మజీవులు పుట్టాయి. కొన్ని మానవ మనుగడకు అవసరమైనవి,కొన్ని హానికరమైనవి.కానీ మనిషి చేసిన వికృత చేష్టల వల్ల పుట్టినటువంటి వైరసొకటి నేడు మనిషిని భయపెడుతున్నది. ఎంతగా అంటే

తలుపులకవతల ఏ ద్రోహం తచ్చాడుతుందో తెలువదు

.....................

చేతుల్ని చూసి కళ్ళు భయపడతాయి

నులుముకోవడానికి లేవబోయి

మునివేళ్ళు చతికల బడతాయి

కడుక్కోవడానికి వెళ్ళినప్పుడల్లా”.  ఇది అందరూ అనుభవించిన భయం.ఇప్పటికి అనుభవిస్తున్న తెలియని భయం.

 "చంపడానికి కత్తే అక్కర్లేదు

 ఉరి తీయడానికి తాడే అక్కర్లేదు

ప్రపంచీకరణ యుద్ధానికి

అణుబాంబులు అక్కరలేదు

వైరస్ చాలు

ప్రపంచమే హడల్ అని "అపరిచిత గాథ"లో మనిషి భయాన్ని సరళంగా కవిత్వీకరిస్తాడు. మరి ఈ వైరస్ ఎక్కడ మొదలైందని ప్రపంచమంతా గుసగుసలాడుతుంటే వినిపించిన పేరు వూహన్.సుందరమైన, సౌకర్యవంతమైన, అధునాతన శాస్త్ర సాంకేతికత కలిగిన నగరం.  అటువంటి నగరంలో కరోనా సోకిన తర్వాత తలకిందులైన నగర పరిస్థితి ధైన్యమైనది.  ఇప్పుడు అది ఎంత దుఃఖంలో ఉందంటే

కాళ్ళ కింద నదులే

కళ్ళకింద నదులే అని రెండు వాక్యాల్లో నగర స్థితిని చెప్తాడు.  వూహాన్ లో వైరాలజీ శాస్త్రవేత్త షీ, డాక్టర్ లీ ఎవరు చెప్పినా ప్రభుత్వం వినలేదు.అందుకే వారిని

దగ్గి దగ్గి చచ్చేదాకా

దేశం చూడలేదు.  ఎందుకంటే అహంకారానికి నిజం నచ్చదు అధికారానికి ప్రాణం లెక్కే లేదు అని ప్రభుత్వ తీరును చెప్తాడు. కరోనా ప్రాణాంతక యాత్ర అక్కడితోనే ఆగలేదని

ప్రపంచీకరణ కదా/ విపణులతోపాటు/ విపత్తులు దిగుమతి చేసుకోవాల్సిందే”నని, అట్లా మనిషి కొనితెచ్చుకున్న విపత్తే ఈ కరోనా ని చెప్తాడు. ఎవరు, ఎలా తీసుకు వచ్చారో తెలియదు కానీ దేశాలు దాటి ప్రపంచవ్యాప్తం అయ్యింది.   ఎందుకంటే

వైరస్ కు సరిహద్దులు లేవు/వర్ణభేదాలు అంతకంటే లేవు/ వర్గం కులం మతం వరుసకైనా లేవు/.../శరీరమైతే చాలు.మనుషుల్లా తనకేమి భేదాల్లేవు.ఎవ్వరినైనా చంపడమే. అట్లాగే చంపుకుంటూ వస్తున్నది.  అలాంటి సందర్బంలో రాత్రికి రాత్రే ముందస్తు చర్యల్లేకుండా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.  దాంతో దేశంలో మారిన భౌగోళిక స్థితిని చెప్తూ  

“ఎయిర్ వేలు రైలు వేలు రోడ్డు వేలు

సీ వేలు స్కై వేలు

 ఏ వేలూ లేవు

వేలు లేని వేళ

 వేళకాని వేళ

వేల శవాలు కుప్పబడతాయి”.  ఎవరికీ ఎవరూ లేని అట్లాంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రతి రోగికి ఆత్మీయులై మునిసిపాలిటీ సిబ్బంది,అర్ధం కాని రోగంపై మనుషుల కాపాడాలనే తపనతో వైద్యంచేస్తున్న డాక్టర్లు,నర్సుల సాహసాన్ని మొక్కాలి అంటాడు కవి.ఇది నిజం.వాళ్లే గనుక లేకపోతే శవాల గుట్టలతో భూమంతా నిండిపోయేది.దాదాపు  200 దేశాల్లో ఇదే పరిస్థితి.ఇంకా లాక్ డౌన్ కాలంలో వైద్య,రక్షణ,రాజకీయపరమైన కొత్త పదజాలం అనివార్యంగా వచ్చిందని.

కొత్త భాష

కొత్త బాధ

కొత్త సంకెళ్ళు” అంటూ మూడు పదాల్లో క్లుప్తంగా కరోనా విపత్కాలన్ని వివరిస్తాడు. నిజానికి ఈ పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు.ఎన్నో ఏండ్ల నుండి మూఢనమ్మకాల్లో మగ్గుతున్న మనుషులకు ఈ నిజం అర్దమై వుండాలి. అదేమిటంటే టావో, బుద్ధుడు, అల్లా, క్రీస్తు, నారాయణుడు, షిరిడిసాయి, ఏడుకొండలస్వామి అందరూ మాస్కులేసుకొని తలుపులేసుకున్న సంగతి.  లేని దేవుళ్ళ పేరు జెప్పి నమ్మించి పబ్బం గడుపుకునే బాపతు గాళ్ళు చేసే నీచ రాజకీయల సంగతి ప్రజలంతా అర్థం చేసుకోవాలి.ఇలాంటి కుటిల రాజకీయాలు జేసే ప్రభుత్వాల, మతోన్మాదుల ప్రచారానికి కౌంటర్ గా చప్పట్లు కొడితేం 

పక్షులు లేవయి

గంటలు మోగిస్తేం

ధైర్యం పలుకదు అని శాస్త్రీయ దృక్పథాన్ని చెప్తాడు.

ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను గాలికోదిలి లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో ప్రాణాలను బిగపట్టుకొని తరలిపోతున్న వలస దుఃఖాన్ని 'వలస గాథ"లో చాలా ఆర్ద్రంగా గా వివరించారు.ప్రపంచంలోని అంతస్తులను, పట్టణాలను, చారిత్రక కట్టడాలను, సుందరమైన స్థలాలను తీర్చిదిద్దింది వలస కూలీలే.అలాంటి వలస జీవులు ఏమి పనుల్లేక, తినడానికి తిండి లేక పూట పూట గండంగా బ్రతుకీడుస్తున్నారు.ఆకలికి భరించలేని స్థితి వచ్చింది. ఆకలి చావుల పరంపర కొనసాగుతున్న దశలో కాయానికి తాళం వేయగలం/ కడుపుకు తాళం లేదుఅని అంటాడు.అందుకే బతికుంటే బచ్చలాకైన తిని బతుకోచ్చనుకుంటూ వలస జీవి కన్నూరికి పయనం గట్టాడు. రోడ్డు పొడుగునా వందలు వేల కిలోమీటర్లు నడిచారు.వాళ్ల రూపం పూర్తిగా మారింది.మూటాముల్లె తలమీద/ చంటి పిల్ల చంకలో/వేలు పట్టుకొని పిలగాడుతో నడక మొదలై తల్లిని,పిల్లల్ని,చుట్టాల్ని తలుచుకుంటూ వెళ్లే సందర్భంలో ఎన్నో విషాదకర ఘటనలు వలస జీవి కళ్లముందు సాక్షాత్కరించాయి.మనం కూడా ప్రత్యక్ష,పరోక్ష సాక్ష్యులం.అందులో మచ్చుకు కవి చెప్పిన వాటిలో... సాఫ్ట్వేర్ ఉద్యోగి మరణం,చంటి పిల్లల సంకలేసుకొని కిందపడిన భార్య,సోమయతండా ఆదివాసీ మహిళ బిడ్డకు పాలివ్వడానికి పాలు రాక గడ్డి తినడం,బిడ్డ ఏడుపు భరించలేక గుండె పగిలి రైల్వేస్టేషన్లో తల్లి మరణం,ఇలా నడుస్తూ నడుస్తూ మనుషులు హటాత్తుగా కూలిపోతున్నారు.బ్రతికుంటేనే భాద అనుకుంటూనే మళ్ళీ ఎలాగైనా బ్రతకాలనే చిన్నిపాటి ఆశతో ప్రతి ఒక్కరు కన్నూరికి చేరాలని నడుస్తూనే ఉన్నారు. అలా నడిచి నడిచి అలిసిన శరీరాలు రైలు పట్టాలపై సేద తీరుతుండగా గూడ్సు రైలెక్కి శవాలైన సందర్భమింకా కళ్ళ ముందట తిరుగుతూనే ఉంది.ఇంకా విదేశం నుండి కంటైన్ మెంట్ లన్ని దాటి చనిపోయిన తల్లిని చూడటానికి వచ్చిన కొడుకు స్థితిని చెప్తూ..

అక్కలుంటారు తమ్ములుంటారు

భారంగా బంధువులుంటారు

ఎవరి మీద పడి ఏడవటానికుండదు

ఎవరి కన్నీళ్లు తుడవటానికి లేదు

అనుమానితుడు”.  తల్లికి కొడుకు అనుమానితుడైన సందర్బం చరిత్రలో కనబడదేమో కదా.ఇంకా కరోనా సోకిన కొడుకుని హాస్పటల్లో చేర్పించగా డాక్టర్లు అతను చనిపోయాడని చెప్పగా తల్లిదండ్రుల ఆవేదన అదేదో మాకు సోకితే మంచిగుండు/మమ్ముల కదలనిస్తలేరుగనిఅని గుండె బండరాయి చేసుకున్న సందర్భాన్ని "ప్రాణగాథ"లో ఎంతో దీనంగా చెప్తాడు.

ఒకపక్క కరోనా ఎవరిని వదలకుండా చంపుతుంటే దేశాధినేతలు మాత్రం అహంకారాన్ని,నియంతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.ఒకరి దేశంపై ఒకరు బురద జల్లుకుంటున్నారు.కుల మత జాతి లింగ భేధాలతో మూర్ఖులవుతున్నారు.

మతం ఒక వైరస్

ఎప్పుడో  మెదడును కమ్మేసింది

రాజకీయం మరో వైరస్

రక్తనాళాల్లో చేరిపోయింది

వ్యాపారం వావిలేని జీవి

మనస్సును మత్పరించింది

ఇవ్వాల్ల మనిషి ఎక్కడ దొరుకుతాడు

ఒట్టి శరీరం తప్ప

అదీ బతకనివ్వకుండా

ఇప్పుడిదిగో ఈ వైరస్ అంటూ మనిషిని పీల్చి పిప్పి జేసిన ప్రపంచ పాలకవర్గాల పీడనని,మతోన్మాదాన్ని, వ్యాపారికరణ హీనత్వాన్ని, వైరస్ క్రూరత్వాన్ని ఈ ఒక్క పాదంలో చెప్తాడు. కాని మనిషి వినడు కదా అందుకే వేల సంవత్సరాల నుండి ప్రపంచ వ్యాప్తంగా రేబిస్,మీజిల్స్,స్పెయిన్ ఫ్లూ,స్పానిష్ ఫ్లూ,ఫ్రెంచ్ ఫ్లూ,ఆసియన్ ఫ్లూ,హాంగ్కాంగ్ ఫ్లూ,అమెరికన్ ఫ్లూ, చైనా వైరస్, కలరా,ఎబోలా,ఎయిడ్స్,స్వైన్ ఫ్లూ,బర్డ్ ఫ్లూ వంటి రోగాలతో లక్షల మంది చనిపోయారు.అలా సేవాగుణం,చిత్తశుద్ధి లేని నీచ రాజకీయ నాయకులు, బుద్ధిలేని కొందరు కుల మత జాతి లకు పుట్టిన కుల్లుగాల్లు వైరస్ లకు దేశాల పేర్లుపెట్టి ద్వేషాలకు దారులేస్తున్నారుఅని అంటాడు. ఇంకా "ప్రాణాలు గాల్లో వేలాడుతున్న వేళ/గందరగోళాలు మూర్ఖం అని చెప్తూ ప్రపంచ సంరక్షణ/ప్రపంచ దేశాల బాధ్యతఅనే సత్యాన్ని చెప్తాడు.                                     

మనిషి కోరికలు పరిమితికి మించినవి.చాలా ప్రమాదమైనవి. అయినా ప్రకృతి కొండలని,నదీజలాలను, జంతువులను, పక్షులను ముఖ్యంగా మనుషుల్ని సొంత బిడ్డల్లా చూసుకుంటూ వచ్చింది. ఇది ఎప్పటికీ మారదు.అందుకే మానవుడు ప్రకృతినెంత గాయం చేసినా పాల కోసం రొమ్ము కొరికిన/ పసిబిడ్డగా తలచి తల నిమిరిందిఅని చెప్తాడు. కానీ  అంతటితో ఆగకుండా పక్షిని చూసి విమానమై ఎగిరినవాడు/గుర్రాన్ని చూసి రైలయి ఉరికినవాడు/సింహాన్ని చూసి నియంతలా జూలు విదిల్చినవాడు సౌకర్యాన్ని మించి ప్రకృతిని వాడుకోవడం, తోటి వారికి గూడు లేకుండాచేయడం,స్వార్థంతో నన్ను మించినవాడు లేడని మనిషి అపోహాతో విర్రవీగడం.ఇది నిజంగా మనిషి బుద్దిలేని తనమే. అయినా చాలనట్టు ఇంకా ప్రపంచీకరణలో ప్రపంచ మార్కెట్ గా మారిన ఆశానుబావుడుమనిషని కవి చీదరించుకుంటాడు. అడవి పట్ల ఆదినుండి ఉన్న అభిప్రాయాల్ని చెప్తూ “అడవిని మొక్కింది ఆదిమం/అడవిని వేటాడింది రాచరికం/అడవిని నరికింది నాగరికం/అమాంతం ఆసాంతం  అడవిని/బాంబులతో బద్దలుకొడుతున్నది ప్రపంచీకరణఅంటాడు. నేడు మానవుడు క్రూర విద్వంసకుడుగా మారాడు.అందుకే మనిషి విలువలు మరచి స్వార్థంతో వికృతంగా బహురూపిగా మారి,వికృత ముఖంతో పిచ్చుకలను చంపి/ప్రపంచ పిచ్చుకల దినం ఆచరించేవాడు/ తల్లిని చంపి తల్లుల దినోత్సవం/నవ్వులు చిదిమి నవ్వుల దినోత్సవం/సర్వనాశనం చేసి/ సంరక్షణ దినం పాటిస్తాడు.  అట్లాగే ఒక చేతితో పర్యావరణ ఉద్యమానికి విరాళం ఇచ్చి/మరో చేత్తో పర్యావరణ విధ్వంసానికి దిగుతాడు అంటూ   ప్రకృతిని ఒలుచుకు తినేవాడు, ప్రకృతిని కాపాడుకునేవాడు ఒక్కటి కాదనే  ఎరుకను కూడా కవి మన ముందుంచుతాడు.

            చివరిగా... ప్రకృతిని అందంగా తీర్చిదిద్దింది మనిషి, మనిషి బ్రతుకును అంతకంటే అత్యద్భుతంగా తీర్చిదిద్దింది ప్రకృతి.దీనికి కాలమే సాక్ష్యం.గత కాలపు ప్రాణాంతక వ్యాధులను చైతన్యంతో పట్టుదలతో సాహసించి వ్యాక్సిన్లను కనిపెట్టి ఎందరినో కాపాడాడు.అలాగే ఈ కరోనా వైరస్ కు కూడా వ్యాక్సిన్ ని కనిపెట్టి త్వరలో చరిత్రలో నిలుస్తాడు.ఇది సత్యం.ఇది తథ్యం.ఎందుకంటే విధ్వంసం ఎప్పుడు చెల్లదు/విలయం ఎంతోకాలం నిలవదుఅనే ఆశవాదాన్ని ప్రజల్లో నింపి ప్రపంచ మానవాళికి ఈ మాటలతో కవి భరోసానిస్తాడు.ఇంకా కవి మాటల్లో మూడు అయితేనే మనిషి. బ్రతుకు/బతికించు/బతుకనివ్వు”;అందం/అనుబంధం/ఆదర్శం"-ఈ మూడు మూడింటితోనే జీవిత పరమార్థమని అందుకు మనిషి నిజమైన సంఘజీవిగా బ్రతకాలని చెప్తాడు. అట్లాగే గతకాలపు విపత్తులకు,వ్యాధులకు,యుద్ధాలకు మనిషే కారణం గనుక పరిష్కారం కూడా మనిషె.కాబట్టి మనిషితోనే ఎలాగైనా రేపు చరిత్ర ద్వారం/తెరుచుకుంటుంది/పేచీ లేదు/మనిషి బతుక్కి కాలం పూచీ/సమస్త ప్రాణి/ సహజీవనానికి/పూచీ పడాల్సింది మనిషి/ఈ తరానికి/ రాబోయే తరాలకు అది హామీ”. ఇది ప్రతి ఒక్కరు ఎరుకలో పెట్టుకొని బ్రతకాలి.బ్రతకనివ్వాలని దానికి మనిషి హామీ పడాలనే బాధ్యత గుర్తు చేస్తాడు.

పాలక వర్గాలు,ప్రపంచ మైనింగ్ మాఫియా తరాల సహజ సంపదను కాజేస్తూ,తోటి వారిని,ఆదివాసులను నిర్వాసితుల జేస్తున్నారు.ఇది తప్పని, అన్యాయమని ప్రశ్నిస్తే దోపిడీని, హింసని చట్టబద్ధత చేసి ప్రజల్ని నిర్బంధించడం, హింసించడం, చంపడం కూడా చేస్తున్నారు.ఇదంతా మనం తరాలుగా చూస్తూనే ఉన్నాం.మాట్లాడుతున్నాం. అయినా ఇంకా ఇంకా బిగ్గరగా మాట్లాడాలి.లేకుంటే మరో ఉపద్రవానికి మనమంతా నేల కూలిపోవాల్సి ఉంటుంది. తప్పెవరూ జేసినా శిక్ష అందరికనే విషయం మర్చిపోవద్దు. అందుకే ప్రకృతి పరిరక్షణకు మనిషైన ప్రతోడు నిజాయితిగా నడవాల్సిన, నిలబడాల్సిన భాద్యత, అనివార్యత ఉంది. లేకుంటే ఏ ఒక్కరం మిగలం. ఈ అనివార్యమైన మందలింపే ఈ కావ్యపు లక్ష్యం.

 

01.11.2020

సాహిత్య వ్యాసాలు

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర – 7

స్త్రీలలో  సాహిత్య వ్యవసాయం ఏ కొద్దిమందికో  తప్ప నిరంతరాయంగా సాగేది కాదు. శ్రావణమాసపు జల్లులా కురిసి ఆగిపోయే వాళ్ళే ఎక్కువ. 1902 లో అలా రచనా రంగంలోకి వచ్చి మెరుపులా మెరిసి వెళ్లిన ముగ్గురు  స్త్రీలు వడ్లమన్నాటి సుందరమ్మ, మండపాక జోహానమ్మ, ఓరుగంటి ఆదెమ్మ. 

వడ్లమన్నాటి  సుందరమ్మ రచనలు రెండు. ఒకటి సతీమణి అనే కథ. 1902 జనవరి హిందూ సుందరి పత్రికలో అచ్చయింది. రెండవది ఆచారము.  ఇది ఉపన్యాసం. మొదటి రచన వచ్చిన తొమ్మిదేళ్లకు ( మార్చ్ 1911) హిందూ సుందరి పత్రికలోనే ఇది ప్రచురించబడింది. మండపాక జోహానమ్మ రచనలు కూడా రెండే. 1902 హిందూ సుందరి పత్రికలో ఏప్రిల్ సంచికలో ఒకటి, జూన్ సంచికలో ఒకటి వచ్చాయి. పేరును బట్టి  జోహానమ్మ దళిత క్రైస్తవ స్త్రీ అయివుండాలి. ఆరకంగా ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్రలో ఈమె మొదటి దళిత రచయిత్రి అవుతుంది. ఓరుగంటి ఆదెమ్మ రచనలు ఆరు. వాటిలో అయిదు జూన్ 1902 నుండి 1903 ఏప్రిల్ వరకు హిందూ సుందరి పత్రికలో వచ్చాయి.  చివరిది కూడా హిందూ సుందరి పత్రికలోనే వచ్చింది కానీ, అది 1911 ఏప్రిల్ సంచికలో. 

వడ్లమన్నాటి సుందరమ్మ కథ సతీమణి ఆధునిక పద్ధతిలో కథ కాదు. రూపంలో అది అనగనగా ఒకరాజు పద్ధతిలో పిల్లలకు చెప్పే కల్పిత కథ. కానీ లోపలి విషయాలు ఆ నాటి మహిళా ఉద్యమ ఆకాంక్షలలో భాగమైనవే. స్త్రీల విద్యా వివేకాలగురించి, స్త్రీలధర్మాల గురించి ఆనాటి తోటి మహిళా రచయితల భావాలు అభిప్రాయాలు, అవగాహనే ఈ రచనలోనూ కనిపిస్తుంది. రత్నపురి అనే పట్టణనాన్నిపరిపాలించే రాజుకుపతియాజ్ఞ నతిక్రమించి వర్తించని అనుకూలవతి అయిన భార్య.వారికి లేకలేక కలిగిన కూతురు. ఆ కూతురి పేరే సతీమణి. ఆబిడ్డను చతుషష్టి విద్యలలోప్రవీణురాలిని చేయదలచి విద్వాంసులను పిలిపించి వేతనమిచ్చి విద్యాభ్యాసం చేయించారు. విద్యావంతురాలైన కూతురిని చూసి సంతోషిస్తూ తల్లి చేసిన సంభాషణ ఇందులో ముఖ్యమైంది.స్త్రీలకు విద్య భూషణము.విద్యవలన సకల గుణములు రాణించును. తండ్రి ఎంతగొప్పవాడయినా బిడ్డకువిద్యలేనిదే కీర్తి రాదు.జ్ఞానాభివృద్ధికి విద్యయే మూలముఅని ఆతల్లి చెప్పిన మాటలన్నీ ఆకాలంలోస్త్రీవిద్యావ్యాప్తికి రకరకాలుగా జరుగుతున్న భావప్రచార ప్రతిధ్వనులే.

అలాగే ఆనాడు మహిళలు చదువు కోవాలి, తోటిస్త్రీలను విద్యాభ్యాసానికై ప్రోత్సహించాలి, అందుకు సమాజాలు పెట్టుకొని కృషి చెయ్యాలి, పత్రికలకు వ్రాయాలి అన్నఆకాంక్ష ఎంత బలంగా వ్యక్తమైందో అదే సమయంలో వాళ్లలో ఆత్మానందందయ, దైవభక్తి మొదలైన గుణాలను పాదుకొల్పే నైతిక ప్రబోధం కూడా రకరకాలుగా సాగింది.సతీమణి కథలో తల్లి బిడ్డకు అటువంటి ప్రబోధం చేయటం చూస్తాం. ఆత్మకు సంతోషాన్నికలిగించేవి సుగుణములని దుఃఖాన్నికలిగించేవి దుర్గుణాలని ఆతల్లి నిర్వచనం. సత్యముశాంతము, ధైర్యము, వినయము, దయ, తృప్తి, మొదలైనవి మనస్సుకు సంతోషాన్ని వీటికి వ్యతిరేకమైన అనృతముకోపము, దీనత, గర్వము, క్రూరత్వము, ఆశ మొదలైనవి దుఃఖాన్నికలిగిస్తాయని వివరించింది. విద్య ముఖ్యసూత్రం సుగుణపుంజములను అలవాటు చేసు కొనటమే అని కూడా చెప్పింది.

స్త్రీ విద్యా చైతన్యాల గురించి ఒకవైపు బోధిస్తూనే మరొకవైపుస్త్రీలను ఒక అధికార వ్యవస్థకు లోబడి జీవించటానికి శిక్షణ ఇయ్యటం కూడా 1900 నాటి స్త్రీల రచనలలో ప్రస్ఫుటంగా  కనిపిస్తుంది . పుట్టుకకు కారణమైన తల్లిదండ్రుల, పరిపాలించే రాజుల ఆజ్ఞకు లోబడి నడుచుకోవలయునని  నీవెరుగుదువు కదా అని కూతురిని హెచ్చరిస్తూనే తల్లి అట్లాగే మన అందరి జన్మలకు ఆది కారణుడై పుణ్యపాపములనెఱిఁగి న్యాయము తీర్చి సుఖమోసగి రక్షించు భగవంతునికి  కూడా లోబడి నడుచుకోవాలని కూతురికి బోధిస్తుంది. తల్లిదండ్రులు ,ఆ పై రాజు, ఆపై భగవంతుడు మూడు అంతరువుల అధికారానికి లోబడి జీవించాలన్నమాట. ఈ నిచ్చెన మెట్ల అధికార వ్యవస్థ   మగపిల్లలకైనా వర్తించేదే కదా ఆడపిల్లలకు ఇచ్చే ప్రత్యేక శిక్షణ ఏముంది ? అనాలని అనటం తప్ప అని ఎవరైనా ఆక్షేపించవచ్చు.  పెళ్లయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సుగుణమణికి తల్లి అత్తవారింట మెలగవలసిన పద్ధతి గురించి చేసిన  బోధను దానికి సమాధానంగా చూపించవచ్చు . 

రాజుకంటె ప్రజలొకవేళ బుద్ధిమంతులయినను రాజునకు లోబడి నడచుకొనుట యెట్లు విధాయక కృత్యమో , అట్లే భార్య యొకవేళ  భర్తకంటె బుద్ధిమంతురాలుగాను, విద్యావంతురాలుగా ను  ఉండుట తటస్థించినను పెనిమిటి కణగియే యుండవలయునుఇది సుగుణ మణికి తల్లి చెప్పిన నీతి. స్త్రీలు అదనంగా భర్త అధికారానికి లోబడి జీవించాలి. ఆ క్రమం లో తమకు ఉన్న శక్తి సామర్ధ్యాలు లేనట్లుగా నటించటం నేర్చుకోవాలి. వాటిని లోలోపలే కుక్కుకొని అన్నిటా న్యూనంగా  కనబడుతూ అధీన పాత్రలలో ఒదిగిపోవాలి. చదువులు చదివినా, సమాజాలు పెట్టినా, ఉపన్యాసాలు ఇచ్చినా, పత్రికలను నడిపినా, పత్రికలకు వ్రాసినా స్త్రీల అంతిమ గమ్యం  అధీన తగా, గృహనిర్వాహణగా స్థిరీకరించిన విలువనే  నమ్మి చెప్పిన తల్లి మాట  1902 నాటిదే కానీ  శతాబ్దం గడిచిపోయినా సంస్కృతిగా, సంప్రదాయంగా కొనసాగి రావటమే విషాదం. 

ఆచారము  వ్యాసం విజయనగరంలో సత్యసంవర్ధనీ సమాజం సమావేశంలో చేసిన ప్రసంగ పాఠం  అని అంతర్గత సాక్ష్యాలు చెప్తున్నాయి. సుందరమ్మ నివాసం ఎక్కడో కానీ విజయనగరానికి ఏ బంధుత్వ కారణాలవల్లనో ఆమె తరచుగా వచ్చేది. అలా వచ్చిన ఒక సందర్భంలో ఆమె చేసిన ఉపన్యాసం ఇది.  “ నలువకు పత్నివైతి వల నారద సంయమి తల్లివైతివో!

                   పలుకులభామ నిన్నెపుడు పల్కగ శక్యమె పామరాళికిన్ !

                   బిలువగ నైన శక్యమె మహీధర కిన్నెర దేవతాళికిన్ !

                గొలిచెద నిన్ను నాకు గల కోర్కె లొసంగుము వాణి శారదా!” - అనే పద్యంతో ప్రారంభించింది సుందరమ్మ ఈ ఉపన్యాసాన్ని. ఆచారాలు సదాచారములు , దురాచారములు అని రెండు రకాలని చెప్పి మనసు, కట్టుకొనే బట్ట, ఉండే ఇల్లు, ఉపయోగించే పాత్రలు, తినే తిండి శుభ్రమంగా ఉండటం సదాచారం అని మురికి దైనా తడిబట్ట కట్టుకొనటం, ఇల్లు బూజులు పట్టి ఉండటం, వంటగిన్నెలు పాచి, మసి పట్టి ఉండటం వంటివి దురాచారాలని వివరించింది.  “ఆత్మశుద్ధి లేని ఆచారమది యేల! / పాత్రశుద్ధిలేని పాకమేల!/ చిత్తశుద్దిలేని శివపూజ లేటికి/అని సందర్భోచితంగా వేమన పద్యాన్ని ఉదాహరించి తన వాదాన్ని గట్టిగా వినిపించింది. ఆచారం వ్యాధికారకం కాకూడదని నొక్కి చెప్పింది. ఉపన్యాసం కూడా ఒక పద్యంతోనే ముగించింది. 

సత్యసంవర్ధనీ సమాజ సతులార! సర్వజ్ఞు సేవలు సలుపరమ్మ 

   స్త్రీ రత్నముల గూడి శీఘ్ర కాలంబులో స్త్రీ విద్య అభివృద్ధి సేయరమ్మ 

   పణతులందరు గూడి బాలికామణులకు భక్తి మార్గము బోధ పరుపరమ్మ 

   వివిధ దేశంబుల వింత చారిత్రముల్ వేవేగ తెప్పించి వెలదులార

అందుగల నీతి మార్గములరయరమ్మ 

సుందరీ రత్నములు సొంపు గాంచరమ్మ 

ఐకమత్యముతో మీరలతివలార 

వేళ తప్పక ఇటకు వేంచేయరమ్మఅని స్త్రీల విషయంలో ఆనాటి సంస్కర ణోద్యమ ఆదర్శాలను ప్రతిధ్వనించే పద్యం ఇది. 

మండపాక జోహనమ్మ మొదటి రచనసంభాషణను గూర్చినాప్రియ స్వదేశీ సోదరీలారా అన్నసంబోధనతో ప్రారంభం కావటం ఇది ఉపన్యాసం అని సూచిస్తున్నది. ప్రపంచంలో కొంతకాలం నివసించటానికి ఇయ్యబడిన జీవితాన్నిఎట్లా సద్వినియోగం చేసుకోవాలో చాలామందికి తెలియదంటుంది జోహానమ్మ. పదిమంది స్త్రీలు ఒకదగ్గర కూడినప్పుడు, ఇరుగుపొరుగుల గురించి దుర్భాషలాడుతూ వ్యర్ధప్రసంగాలతో పొద్దుపుచ్చరాదని చెబుతుంది. నాలుక బహువిచిత్రమైన అవయవం , దానిని బహుభంగుల వాడవచ్చని చెప్తూ ఇతరులకు విద్యనేర్పటానికి, ఆకార్యాన్ని గురించి ఇతరులతో మాట్లాడటానికి ఉపయోగించటం సముచితం అని చెప్పటం ఆమె స్త్రీవిద్యాభిమానాన్ని, స్త్రీవిద్యాప్రచార ఆదర్శాన్నిసూచిస్తున్నాయి. సంభాషణ ఎప్పుడూ జ్ఞానాభివృద్ధి సాధకంగా, ప్రయోజనకరంగా ఉండాలని అభిప్రాయపడింది జోహానమ్మ. విద్యగలవారి సహవాసం వల్ల విద్య వల్ల వాళ్లకు కలిగిన లాభాలేమిటో తెలుసుకొని మనము కూడా పొందటానికి ప్రయత్నించ వచ్చు కదా అన్నది  ఆమె వాదం. సత్యం మాట్లాడటం, సంయమనంగా మాట్లాడటం అవసరం అంటుంది. మంచిసహవాసం, మంచి సంభాషణ జీవితాధార విలువలని చెప్పి స్త్రీలు కాలాన్నివ్యర్ధపుచ్చక తమ  జ్ఞానాన్నితోటి స్త్రీలకు పంచటానికి వీలుగా వాటిని వినియోగించుకోవాలని చెప్తూ ఈ ఉపన్యాసాన్నిముగించింది జోహానమ్మ.

ఆమె రెండవ రచన రెండు సంచులను గూర్చిన కథ. ది స్టోరీ ఆఫ్ టు బాగ్స్ అని ఇంగ్లీషు శీర్షిక కూడా ఉంది. ముగ్గురు ముసలివాళ్ళు వెనుకకు ఒకసంచి, ముందుకు ఒక సంచి వేసుకొని ఉంటారు..ఒకరికొకరు తటస్థపడతారు.వారి అవస్థ, సంభాషణ కథా విషయం.మొదటివాడు తనస్నేహితుల సత్క్రియలు వెనుక సంచీలో వేసుకొని ముందు సంచీలో ఇతరులుచేసిన తప్పిదాలు వేసుకొని తిరుగుతున్నాడు.స్నేహితుల సత్క్రియల సంచీ వెనకవైపు ఉందికనుక అవి అతనికి అసలు కనబడవు. ముందుసంచీ లోని ఇతరుల తప్పిదాలే కనబడుతుంటాయి. రెండవవాడు ముందు సంచీ లో తన సత్క్రియలను, వెనక సంచీలో తప్పులను వేసుకొని తిరుగుతూ తన సత్క్రియలుఅందరికీ ప్రదర్శిస్తూ తిరుగుతుంటాడు. మూడవ వాడు ముందు సంచీలో ఇతరులు చేసిన సత్క్రియలు , వెనక వేలాడే రంధ్రం గల సంచిలో ఇతరుల గురించి తాను వినే చెడు మాటలు వేసుకొని తిరుగుతుంటాడు. ఈముగ్గురిని చూపి ఇతరుల మంచిని విస్మరించి, చెడును స్మరించుకొంటూ తిరగటం కానీ, తన చెడును దాచుకొని మంచిని ప్రదర్శించుకొంటూ తిరగటం కానీ మంచి విలువలు కావని ఇతరుల గురించిన మంచి విషయాలకు సంతోషపడుతూ స్మరించటం, ఇతరుల గురించి వినపడే చేదు మాటలను అప్పటికప్పుడే జారవిడవటం అవసరమైన , అభిలషణీయమైన విలువ అని చెప్పటం ఈ కథ ప్రయోజనం. మొదటి రచనలో  ఇతరుల అవగుణాలగురించి మాట్లాడుకొంటూ కాలం వ్యర్థం చేయవద్దని చెప్పిన జోహానమ్మ ఈ కథలో దానిని ఒక ప్రధాన విలువగా ప్రతిపాదించింది .   

ఇక ఓరుగంటి ఆదెమ్మ రచనలు ప్రధానంగా వ్యాసాలు. మొదటిది స్త్రీవిద్య( జూన్ 1902) ఓ సోదరీ రత్నములారా అన్నసంబోధనతో మొదలయ్యే ఈ వ్యాసం ఒకచోట సమావేశమైన స్త్రీ సమూహం ముందు చేసిన ఉపన్యాసం.కృష్ణవేణమ్మ మొదలైన స్త్రీల ప్రొత్సాహంతో చేసిన  మొదటి ప్రయత్నం. ఆ కృష్ణవేణమ్మ ఎవరో తెలుసుకోవలసి ఉంది. వ్యాసం ముగిశాక రచయిత్రి పేరుతో పాటు విజయనగరం అని ఉండటాన్ని బట్టి అదే ఆదెమ్మ నివాసం అయివుంటుందని అనుకోవచ్చు. సాంప్రదాయక ఆలోచన వల్ల కొందరు స్త్రీలు ఇంటివద్ద ఇతర స్త్రీలను గౌరవంగా చూడలేకపోతున్నారని అందుకు విద్యాలోపమే కారణం అంటుంది. స్త్రీలకు పురుషులవలెనే విద్యాభ్యాసం ఆవశ్యకమని , ఎవరెంత ప్రోత్సహిస్తున్నా హిందూ స్త్రీలలో నూటికి పదిమందైనా చదువుకొన్న వాళ్ళులేరని, వారిలోనూ మూడవవంతులు వానకాలపుచదువులవాళ్లేనని విచారంవ్యక్తంచేస్తుంది. స్త్రీలను పుత్రికల యందు కనికరము కలవాళ్ళై విద్యాచెప్పించవల్సినదిగా ప్రార్ధించింది. సమావే శాలు పెట్టుకొని సంఘ లోపములు జ్ఞాపకం తెచ్చుకొనటం వలన వాటినుండి బయటపడే అవకాశాలు కనుక్కొనే ప్రయోజనం ఉంటుందని సూచించింది. స్వజాతి వాత్సల్యం గురించిన హెచ్చరికతో ఈవ్యాసాన్ని ముగించింది.

రెండవ వ్యాసందక్షిణదేశపు మనదేశపుస్త్రీల తారతమ్యము’ ( అక్టోబర్ 1902) దక్షిణదేశం అంటే చెన్నపట్నం ( మద్రాస్). ప్రెసిడెన్సీ రాజధానిగా అది అభివృద్ధి చెందిన నగరం. విద్యా ఉద్యోగ సాంస్కృతిక రంగాలలో ప్రభావం తమిళులది గా ఉన్న ఆనాటి స్థితిగతుల గురించిన అవగాహన నుండి ఆప్రాంతపు స్త్రీల తో పోలిస్తే మనదేశపు - అంటే తెలుగు దేశపు స్త్రీలు ఎంత వెనకబడి ఉన్నారో అర్ధమై ఆదెమ్మ ఈవ్యాసం వ్రాసింది.సంఘ లోపములు,కొరతలు దాచుటకన్నా వెల్లడిచేయటంవల్ల మనస్సులు శుభ్రమై సుఖపడే మార్గాలు తెరుచుకుంటాయని నమ్మే ఆదెమ్మ ( స్త్రీవిద్య) ఈ వ్యాసం కూడా ఆ ఉద్దేశంతోనే వ్రాసింది. చెన్నపట్నపు స్త్రీల విద్యావైభవాన్ని, వారి సాంఘిక పద్ధతుల ప్రత్యేకతను ప్రస్తావిస్తూ తెలుగు దేశంలో అందువలన లాభాలను పరిగణించకుండా వాళ్ళ పట్ల మూఢం గా ప్రవర్తించే వాళ్ళు అధికంగా ఉన్నారని ఆమె అంటుంది. స్త్రీలకు స్వాతంత్య్రం లేకపోవటం వల్లనే పురుషులు స్త్రీలు సుఖంగా వున్నారని మనవాళ్ళు అనుకొంటున్నారని ఎత్తి చూపింది. స్త్రీలకు విద్య వలన జ్ఞానం తద్వారా స్వాతంత్రం చేకూరుతుందన్న భయంతోనే అల్పబుద్ధులు తమ బాలికలకు అక్షరాలు రాగానే చా లు చాలని విద్యాగంధం లేకుండా చేస్తూ స్త్రీల దైన్యస్థితికి కారణమవుతున్నారని ఇట్లాటి వాళ్లంతా విద్యానిధియగు దక్షిణ దేశాన్ని చూసి నేర్చుకోవలసినది ఎంతో ఉందంటుంది ఆదెమ్మ.

 దక్షిణదేశంలోవలే తెలుగుదేశంలో భార్యాభర్తలు కలిసి చల్లగాలిలో సుఖ సంభాషణ  చేయటంకానీ, షికారుకు పోవటంకానీ, గానకళా సౌందర్యాన్ని ఆస్వాదించటం కానీ లేవని గుర్తించిచెప్పింది.పాటలు పాడే మగవాళ్ళను పోకిరీలు అని ఆడవాళ్లను భోగం వాళ్ళని తక్కువచేసే కుసంస్కృతిని వేలెత్తి చూపింది. సంగీతం నేర్చుకొని పడగలిగిన బాలికల కళాశక్తులు పెళ్లి అయ్యాక అత్తవారింట భర్త పెత్తనం కింద అణగి పోవటం గురించి ప్రస్తావించి చెన్నపట్నం  కాంతామణులవలె గాత్రాన్ని, వాయిద్యాలను స్వేచ్ఛగా ఉపయోగిస్తూ సంగీత కళను ప్రదర్శించే భాగ్యం తెలుగుదేశపు స్త్రీలకు ఎప్పుడు కలుగుతుందో కదా అని ఆవేదన చెందింది.పంజరములో చిలుక వలె కారా గృహము లనదగు గృహములకు మనలను ముడిపెట్టి పురుషులకు పెద్ద దాసీలవలె మనలను చేసినకొలది మన యవివేకము వృద్ధి యగుచున్నది”  అని చెప్పిన మాట ఆనాటికి విప్లవాత్మకమైన వ్యక్తీ కరణే.  సంసార స్త్రీల అవివేకం కుటుంబానికే అరిష్టదాయకమని చెప్పి సంగీత సాహిత్యాలు నేర్పించటం ద్వారా దానిని అధిగమించవచ్చని, పురుషులలో    ఉత్తమాభిరుచులు  పెంపొందించి  భోగము వారిండ్లు చేరకుండా ఆపగల శక్తి దానికి ఉన్నదన్న సూచనతో ఈ వ్యాసాన్ని ముగించింది ఆదెమ్మ. 

పిల్లలను పెంచవలసిన మార్గములు ( 1903 ఫిబ్రవరి ) అనే వ్యాసంలో తప్పులు చేసినప్పుడు పిల్లలను శిక్షింపక దయ చూపే తల్లి తనం, అలాగే ఏడ్చినప్పుడల్లా చిరు తిండ్లు పెట్టి ముద్దు చేసే లక్షణం  పిల్లల మానసిక శారీరక ఆరోగ్యానికి భంగకరమని చెప్పింది. ఆడపిల్ల జన్మిస్తే ఖేదపడే దుష్ట సంస్కృతిలో ఆడపిల్లల పెంపకం మరీ నిర్లక్షానికి గురవుతుందని గుర్తించి  చెప్పటం విశేషం. వేళకు తినటం, నిద్రపోవటం అలవాటు చేయాలని, ఏడుస్తున్నారని ఎత్తుకునే అలవాటు మంచిది కాదని, నమ్రత , నీతి, దయ, సత్యం మొదలైన గుణాలను చిన్నప్పటి నుండే అలవాటు చేయాలని,వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనటం నేర్పించాలని, చదువుపట్ల శ్రద్ధ వహించాలని, ప్రత్యేకించి ఆడపిల్లలకు చదువు చెప్పించాలని సూచనలు చేసింది.హిందూదేశపు స్త్రీలకు  విద్య లేక మూఢ దశలో నున్నంత కాలం మన దేశము అనాగరిక దేశములలో మొదటిదిగా నెంచబడును.”  అని  ఆనాడు చెప్పినమాట ఇప్పటికీ ఆలోచించవలసిన అంశమే.

దంపతుల సుఖ మార్గములు’ ( 1903 ఏప్రిల్) అనేవ్యాసంలో భార్యాభర్తల మధ్యఉండవలసిన అన్యోన్య స్నేహం గురించి ఒకరినొకరు సుఖపెట్టుట యందు ఉండవలసిన శ్రద్ధ గురించి చెప్పి తనవారందరినీ వదిలి సమస్తమూ భర్తయే అని నమ్మివచ్చిన స్త్రీయందు భర్త  చూపవలసిన కరుణాదరణ ల గురించి ఆదెమ్మఈవ్యాసంలో చర్చించింది.చాకిరీచేయుటకు, సంభోగ సౌఖ్యమునకును తప్ప మరెందుకూ కొరగాని బానిసలు గా చేసి భార్యలనును చిన్నచూపు చూడటాన్ని గర్హించింది. భార్యలను కొట్టటం వంటి భర్తల దుష్చేష్టలు మానుకొనవలసినవి అనిపేర్కొన్నది.అన్నిటికంటే ముఖ్యము భర్తలు భార్యల పట్లనిజమైన ప్రేమకలిగి ఉండటం అంటుంది. నిజమైన ప్రేమ అంటే వేరొక స్త్రీమీదనో మనసు నిలపక సంపూర్ణంగా భార్యకు ఇయ్యటం.దానితో పాటు భార్యలను అనుక్షణం అనుమానించక నిర్మలమైన హృదయంతో ఉండటం అని ఆమె వ్యాఖ్యానించింది కూడా. భార్యలను నిర్బంధంలో ఉంచక ప్రేమతో బంధించి చేసే కాపురాలవల్లనే హిందూ సమాజానికి క్షేమముఅభివృద్ధి అని అభిప్రాయపడింది.అంతేకాదు, స్త్రీలను ప్రత్యేకంగా సంబోధించి భర్తలను సుఖపెట్టటానికి ప్రయత్నించమని ప్రబోధించింది. భర్త పనులు తీర్చుకొని ఇల్లు చేరే సమయానికి సంసార సమస్యలను ఏకరువుపెట్టవద్దని, నగల కోసం వేధించవద్దని, ఉన్నంతలో సంసారం చక్కదిద్దుకొమ్మని, శుభ్రంగా ఉండమని, శాంతంగా ఉండమని చెప్పింది.దంపతులమధ్య బంధాన్ని దృఢతరం చేసేది సంతానమే నని, వాళ్ళు విద్యావంతులు కావటం మరీ ముఖ్యమని, ఆడపిల్లల విద్య మరీ ఆవశ్యకమని చెప్తూ చదువుకొన్నస్త్రీ భర్తకు కష్టసుఖ ములలో మంచి సహచరి కాగలుతుందని అభిప్రాయపడింది ఓరుగంటి ఆదెమ్మ.

స్త్రీల విద్యావిజ్ఞానాలకు కుటుంబనిర్వహణలో  ఉన్న ప్రాధాన్యతను నొక్కిచెప్పటం సంస్కరణోద్యమంలో ఒక భాగం.కందుకూరి వీరేశలింగం స్త్రీల శరీర ఆరోగ్య ధర్మబోధిని రచించి అందుకు దారి తీసాడు. దానిని అందిపుచ్చుకున్నదా అన్నట్లుగా ఆదెమ్మ స్త్రీలకు ఆరోగ్య జ్ఞానం ఆవశ్యకతను నిర్ధారిస్తూ చేసిన రచనఆరోగ్యము’( 1911 ఏప్రిల్) తల్లీ పిల్లల సంభాషణ గా చేసిన ఈ కాల్పనిక రచన లో ఒంటి శుభ్రతవాయు శుభ్రత,మొదలైన విషయాలను, వాయుకాలుష్య కారణాలనుధారాళంగా ఇంటిలోకి స్వచ్చమైన గాలీ , వెలుతురూ వచ్చే మార్గాలను గురించి  సాగిన ఈ  సంభాషణ ఆరోగ్య పరిరక్షణ మనచేతిలో పని అని సూచిస్తుంది .  

ఓరుగంటి ఆదెమ్మ వ్రాసిన పద్యాలు మూడే కనబడుతున్నాయి.అవి హిందూ సుందరి పత్రిక జన్మదిన సందర్భంగా వ్రాసినవి ( 1903 ఏప్రిల్ ) ఒక సీస పద్యం. రెండు కంద పద్యాలు . తెలివి విద్య కలిగిన జవ్వనులకు మానస పుత్రిక అని , మగువలు ఇష్టపడేమొగమున శ్రీ గల ముదితఅని , మగువలకు ఠీవిని మప్పగలది అని హిందూసుందరి పత్రికను ప్రశంసిస్తూ వర్ధిల్లమని  సీస పద్యంలో ఆశీర్వదించింది. ఆ పత్రిక వస్తున్న ఏలూరు ప్రశంస మరొక పద్యంలో చేసి మూడవ  పద్యంలో ఆ పత్రికలో  ప్రచురించబడే తన కవిత్వ చాతుర్యాన్ని గురించి చెబుతుంది . 

ఆదెమ్మ బంపు పద్యము / లాదరమున జూచి చదివి- యతివలు హృదయా / 

మోదమున తనివి చానకా / స్వాదింతురు గాక కవన చాతురి నెపుడున్ “ -   అతివల హృదయానికి  సంతోషం కలిగించి ఆస్వాదనాపరులను చేయగల కవిత్వ శక్తి తనది అని ఇంత ఆత్మ విశ్వాసం తో ప్రకటించగలిగిన ఆదెమ్మ ఆ తరువాత ఎంత కవిత్వం వ్రాసిందో, ఎందుకు వ్రాయలేక పోయిందో అన్వేషించవలసే వుంది. 

           

                        --------------------------------------------------------------------

 

సాహిత్య వ్యాసాలు

సాహిత్యంలో శాస్త్రీయభావాలు

ఏది సత్యం ఏదసత్యం

ఓ మహాత్మా ఓ మహర్షి" అని శ్రీశ్రీ ప్రశ్నించాడు. మరి ఆ సత్యాన్ని తెలియజేసేదేమిటి ? సైన్సు. సైన్సు  అంటే శాస్త్రం.

      ప్రతి రోజు టీవీల్లో జ్యోతిష్యశాస్త్రం, హస్త సాముద్రిక శాస్త్రం ఇలా చెప్పింది, అలా చెప్పింది అని

చెబుతుంటారు. చాలా మంది అవి కూడా సైన్సే అనే భావించే అవకాశం ఉంది.

        సైన్సు ఆధునిక పరిణామం. పందొమ్మిదో శతాబ్దం వరకు సైన్సును తత్వశాస్త్రంలో భాగంగా చూశారు.

          అంతకుముందు కనుగొన్న సత్యాలను పందొమ్మిది శతాబ్దంలో విడదీసి వాటిని ప్రకృతి నియమాలుగా సూత్రీకరించారు.తరువాత కాలంలో భౌతిక ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడమన్న భావనతో సైన్సును పరిగణించారు. అప్పటి నుంచి శాస్త్రవేత్త, శాస్త్రీయత, శాస్త్ర పరిశోధన భావనలు రూపుదిద్దుకొన్నాయి.

        ప్రశ్నించడం శాస్త్ర విజ్ఞానంలోనూ శాస్త్రీయ భావనలోనూ ప్రథమ లక్షణం.

        ఎందుకని? ఎందుకని ? ఎందుకనెందుకని ? ఎందుకనెందుకని ?పస్తులెందుకని ? పేదరికం ఎందుకని ? అజ్ఞానం ఎందుకని ? అంటూ దేవి 'ఎందుకని' అనే పాటలో ప్రశ్నించడం ద్వారా ఆలోచింపజేస్తుంది.

     ప్రశ్నించడంతో మొదలైన శాస్త్రీయ విజ్ఞానం (సైన్స్) ప్రకృతిలో అంతర్గతంగా ఇమిడివున్న అనేక నియమాలనుకనుగొనేటట్లు చేసింది.

        ఆపిల్ కిందకే ఎందుకు పడుతోంది ? అని ప్రశ్నించిన న్యూటన్ భూమికి ఆకర్షణ ఉందని కనుగొన్నాడు. రాత్రి, పగలు ఎలా ఏర్పడుతున్నా యనే మథనం ద్వారా భూమి తన చుట్టూ తాను తిరగడమని  తెలుసుకున్నారు.ఇలా ప్రకృతిని పరిశీలించడం ద్వారా అనేక సత్యాలు ఆవిష్కృతమైనాయి.

       ముందు భూమి బల్లపరుపుగా ఉందన్నారు. తరువాత భూమి గుండ్రంగా ఉందన్నారు. భూమి చుట్టూ సూర్యుడుతిరుగుతున్నాడన్నారు. కాదు సూర్యుని చుట్టూ భూమి, ఇతర గ్రహాలు తిరుగు తున్నాయన్నారు. గెలీలియో కనుగొన్న దూర దర్శినితో ఇది నిర్ధారణయింది.

        ప్రకృతి నిరంతరం మారుతుందని, మార్పు నిరంతర ప్రక్రియ అని, ఏదీ శాశ్వతం కాదని సైస్సు గుర్తించింది.

         సైనులో (శాస్త్రీయ విజ్ఞానం)లో ఉన్న గొప్ప లక్షణం ఏమంటే.. పాత జ్ఞానం తప్పని తేలితే వెంటనే దానిని తిరస్కరించి కొత్తదాన్ని స్వీకరిస్తుంది. అందుకే కవి గుమ్మావీరన్న ..

"సత్యం సాపేక్షం/లేదు పూర్వ సత్యం/నిన్నటి జ్ఞానం కన్నా/నేటి జ్ఞానమే మిన్న"అనంటాడు.

       పరిణామక్రమంలో భాగంగానే జీవం పుట్టిందని తేల్చింది. జీవపరిణామక్రమంలో మనిషి రూపొందాడని, మనుషులంతా ఒక్కటేనని సైన్సు తేల్చింది.

         ఇవన్నీ ప్రశ్నించడంతో ప్రారంభమై పరిశీలన చేయడం, సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం దాకా సాగింది.తరువాత ప్రయోగం చేశారు. ఆచరించి చూశారు. ప్రయోగం ద్వారా వచ్చిన ఫలితం ఆధారంగా ఒక సూత్రీకరణ లేదా ఒక ప్రతిపాదన చేశారు. ఇలాంటి పద్ధతుల ద్వారా ఒక సత్యాన్ని తెలుసుకోగలిగారు. ఈ పద్ధతుల ద్వారా లభించిన జ్ఞానాన్ని శాస్త్రీయ విజ్ఞానం అన్నారు.

          శాస్త్రీయ విజ్ఞానం అందించిన సూత్రాలను నిత్యజీవితంలో మన జీవనానికి అన్వయిస్తే వచ్చినవే శాస్త్రీయ భావాలు. ఇవి మనలో తరతరాలుగా గూడుకట్టుకున్న మూఢవిశ్వాసాలను పటాపంచలు చేశాయి, చేస్తున్నాయి.

     ఒక వస్తువు ను సృష్టించలేం.నాశనం చేయలేం అని సైన్సు నిరూపించింది. ఒక పదార్థం మరో రూపంలోకి మారుతుందేగానీ అది పూర్తిగా నాశనం కాదని శాస్త్రవిజ్ఞానం నిరూపించింది.

       ఎవరైనా సైన్సు తెలిసినంత మాత్రాన వారికి శాస్త్రీయ భావాలు ఉంటాయని చెప్పలేం. శాస్త్రం రుజువు చేసిన వాటికి వ్యతిరేకంగా, రోజువారి జీవితంలో నమ్మినా, ఆచరించినా మూఢనమ్మకాల్లో ఉన్నట్లే లెక్క.

         మన దేశ సాహిత్యంలో  ఎలాంటి శాస్త్రీయ భావనలున్నాయో చర్చిద్దాం.  మనదేశంలో ప్రాచీన సాహిత్యం వేదసాహిత్యంతో మొదలవుతుంది. తెలుగు సాహిత్యం పాల్కురికి బసవపురాణం,

నన్నయ మహాభారతంతో మొదలవుతుంది.  

      వేదసాహిత్యం క్రీ.పూ. 2000 నాటిది. ఆనాటి ప్రజలకు ఆహార సేకరణ మాత్రమే తెలుసు. ప్రకృతి గురించి వారికున్న అవగాహనను కవితాత్మకంగా రుగ్వేదంలో చెప్పారు. వ్యవసాయం కూడా తెలీనిదశ అది. కానీ వేదాలోలనే అన్నీ ఉన్నాయని చాలా మంది ప్రకటిస్తుంటారు. 'వేదాల్లో అన్నీ ఉన్నాయష"

అంటూ ఉంటాడు గురజాడ రాసిన కన్యాశుల్కంలో 'అగ్నిహోత్రావధాన్లు'. ఇటీవల ఒక కేంద్రమంత్రి వేదాల్లో కోతి నుంచి మానవుడు వచ్చినట్లు చెప్పలేదు కాబట్టి డార్విన్ సిద్ధాంతం వాస్తవంకాదని ప్రకటించాడు. రోజూ టీవీల్లో చెప్పే ప్రవచనకారులు శాస్త్రం ఏం చెపుతుందంటే అని అంటుంటారు. వీరు చెప్పే శాస్త్రం 'వేదాలే'.

         క్రీ.పూ. 1000 నాటికి ఇనుము కనుగొన్నారు. దాంతో నాగలితో భూమిని దున్ని వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. అప్పటి నుంచి కొత్త భావాలు ఏర్పడ్డాయి. ఆత్మ, పరమాత్మ భావాలు ప్రవేశించాయి. కర్మ సిద్ధాంతం వచ్చింది. విత్తనం నాటితే అది మొలకెత్తి చెట్టుగా మారి ధాన్యాన్ని, ఫలాల్ని ఇస్తుంది. దీని ఆధారంగా ఈ జన్మలో మనం చేసేపని (కర్మ),మళ్లీ జన్మలో ఫలితాన్నిస్తుందనే భావన ఏర్పడింది. మంచి పనిచేస్తే వచ్చే జన్మలో మంచి ఫలితం, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం. ఇదేకర్మ సిద్ధాంతం.

         వృక్షాలు, వనస్పతులు, అంతరిక్షం నుండి ఆత్మ వస్తుందనుకున్నారు వేదకాలంలో. దీనినే భగవద్గీతలో'అన్నాధ్భవంతి భూతానీ' అనే శ్లోకంలో చెప్పారు. ఉపనిషత్తుల కాలానికి ఆత్మ,పరమాత్మ భావాలు ఏర్పడ్డాయి. ఇది జ్యోతి రూపంలో ఉంటుందన్నారు ముండకోపనిషత్తులో.ప్రతి జీవిలో ఆత్మ ఉంటుందన్నారు. ఇది నాశనం కాదు. ఏ  శాస్త్రం దీన్ని ఛేదించలేదు. అగ్ని దహించలేదు. నీరు తడపలేదు. వాయువు ఆర్పలేదు అంటూ దీని స్వభావాన్ని విపరించారు.

        ఈ ఆత్మ ఆధారంగా అనేక కథలు పుట్టాయి.  రామాయణం, భారతంలో చాలా ఉపకథలున్నాయి. పరకాయ ప్రవేశం అనే భావన కూడా వచ్చింది. కోరికలు తీరకుండా మనిషి మరణిస్తే ఆత్మ దయ్యంగా మారుతుందని ఇప్పటికీ చాలా మంది భావిస్తుంటారు.

        పల్లెల్లో ఆత్మలు దయ్యంగా మారి తిరుగుతుంటాయని భ్రమపడుతుంటారు. గతంలో కొరివి దయ్యాలుండేవని ఇప్పుడు కరెంటు రావడంతో అవి పోయాయని చెపుతుంటారు.  ఆత్మలను వీడియో తీశామని యూట్యూబుల్లో పెడుతుంటారు.

      ఆత్మ భావన ఎలా పుట్టిందంటే ఆదిమకాలంలో మనిషి శత్రువుల చేతిలో, జంతువుల చేతిలోనూ మరణించేవాడు. ఒక్కోసారి స్పృహ తప్పి పడిపోయేవాడు. అతను మళ్లీ మేల్కోనేవాడు. మరణించిన మనిషి కూడా మేల్కొంటాడనే భావన ఏర్పడింది. ఇదే మనిషిలో ఏదో తెలియని అదృశ్యశక్తి ఉందనే నమ్మకం ఏర్పడటానికి కారణమైంది. అలాగే మనిషి నిద్రించే సమయంలో కలలు కంటాడు. నిద్రించిన మనిషికి మరణించిన వారికి పెద్ద తేడా కనిపించదు.మనిషి నిద్రిస్తున్న ప్పుడు శరీరంలోని ఒక అదృశ్యశక్తి బయటకు వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి మళ్లీ నిద్రలేవగానే శరీరంలోకి వస్తోందనే భావన వచ్చింది. ఈ భావనే ఆత్మ భావనకు దారితీసిందన్నాడు గ్రాంటో అల్లెన్ తన  'ఎవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్'లో. ఉపనిషత్తుల తరువాత కాలంలో దర్శనాలు వచ్చాయి. ఇవి న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగ,పూర్వమీమాంస, ఉత్తరమీమాంస.

       మీమాంసలో చర్చించే వారు అంతకుముందున్న సిద్ధాంతాన్ని తీసుకుని,దాన్ని తర్కిస్తారు. దీన్ని పూర్వపక్షం చేయటం అన్నారు. తరువాత మరో సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. దీన్ని ఆధునిక తత్వవేత్తలు థీసిస్, యాంటి థీసిస్, సింథసిస్ అన్నారు.

        సాంఖ్యులు వేదాలను తిరస్కరించారు. సృష్టికర్తను తిరస్కరించారు. వీరు క్రీ.పూ. 600-500 కాలంనాటి వారు. వీరిలో కణాదుడు ప్రపంచమంతా కణముల సముదాయమన్నారు.   

        అసితకేశకంబరుడు నిప్పు, నీరు, మట్టి, గాలి కూడికతో జీవం ఏర్పడిందన్నారు. జీవి మరణించగానే ఆ జీవిలోని నీరు నీటిలో, గాలి గాలిలో, వేడి నిప్పులో,మట్టి నేలలో కలసి పోతుందన్నారు. స్వర్గం, నరకం, దేవతలు ఏమీలేవు. ఉన్నవి ఈ నాలుగే అని అన్నారు.

        ప్రకృతి కాత్యాయనుడు నీరు, నిప్పు, గాలి, నేలతో పాటు దు:ఖం, సుఖం, చైతన్యంల కలయికతో జీవి ఏర్పడుతుందన్నాడు.

           మీమాంసకులు ప్రతి ప్రదార్థంలో అణువు ఉంటుందన్నారు.

          బుద్ధుడు దైవభావనను తిరస్కరించాడు. ప్రకృతి నిత్యం మార్పు చెందుతూ వుంటుందన్నాడు. అయితే ఈ మార్పు సంఘర్షణ ద్వారానే జరుగుతుందని ఏంగెల్స్ చెప్పాడు. కార్యాకారణ సంబంధాన్ని ప్రతిపాదించాడు బుద్ధుడు.

       క్రీ.పూ. 300లో చార్వాకులు ఉండేవారు. వీరిని లోకాయతులు కూడా అంటారు. చార్వాకులు మంచివాక్చాతుర్యం గలవారని అర్థం. వీరు నాస్తికులు. పరమాత్మభావాన్ని తిరస్కరించారు. వీరు దేవుడు లేడు. ఆత్మలేదు. మరణానంతరం మిగిలేదేమిలేదు అంటూ బోధించారు.

        పరమాత్మను, ఆత్మను నమ్మేవారిని భావవాదులన్నారు. కనిపించే భౌతిక ప్రపంచాన్ని గురించి మాట్లాడేవారిని భౌతికవాదులన్నారు. భావవాదులు పరమాత్మను, ఆత్మను మానసికంగా నమ్మినా ఆచరణలో భౌతికవాదులుగా ప్రవర్తిస్తుంటారు.

 

        చార్వాకులు ఇలా చెప్పినారు ...

"కోదదర్శ ప్రథమం జాయామాస మస్థస్వంతం

యదన వస్థావిభక్తి భూమ్యా అసుర సుగాత్మా కృస్విల్ కోవిద్వాంస ముపగాత్ ప్రస్టుమేతత్"

 

ప్రకృతి సహజంగా ఈ ప్రపంచ నిర్మాణం జరిగేటప్పుడు ఎవడు చూశాడు ? చూసినవాడు న్నాడా ? ప్రాణంగాని రక్తంగాని ఈ భూమి నుండి ఏర్పడ్డాయి. వీటికి సృష్టికర్త భగవంతుడనేవాడు ఎవ్వడూలేడు. ఆత్మ అనేది లేదు. ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ అవివేకుల భావాలు' అన్నారు చార్వాకులు.

        ఈ ప్రపంచం వాస్తవమైనది. దీనికంటే భిన్నమైన మరోలోకం లేదు. పరలోకం ఉందని చెప్పేమాట అబద్ధం. మోసం. వంచన.కపటం. ఒక పురుషుడు స్త్రీకి తోడేలు పాదాలు చూపిస్తానని వేళ్లతో ఏదోచేసి చూపి భ్రమింపజేస్తాడు. అట్లాగే భావవాదులు పరలోకాలను కూడా భ్రమింపజేసి అమాయకులైన ప్రజల్ని మోసం చేస్తారన్నారు.

         జైనులు, బౌద్ధులు, చార్వాకులు (లోకాయతులు) వీరంతా ఆత్మ, పరమాత్మ భావాలను వ్యతిరేకించారు. వీరిని భౌతికవాదు లన్నారు.

           జనపదాల స్థాయి నుంచి రాజ్యాలు, సామ్రాజ్యాలు క్రీ.పూ. 600 నాటికి ఏర్పడ్డాయి. రాజరికపు వ్యవస్థ వేళ్లూనుకునింది. వారు తమ ఆధిపత్యాన్ని నిరంతరంగా ఉంచుకోవడానికి, దోపిడీని మరుగుపరచుకొనడానికి సాహిత్యాన్ని సాధనంగా చేసుకొన్నారు. వాటిని ప్రజల్లో ప్రచారం చేశారు. కర్మసిద్ధాంతం, తలరాత సిద్ధాంతం, జన్మ, పునర్జన్మ, పాపం, పుణ్యం, స్వర్గం-నరకం, ఆత్మ, పరమాత్మల భావాల్ని రామాయణ, మహాభారతాల్లో రచింపజేశారు. వాటిని నిరంతరం ప్రచారం చేస్తూ వచ్చారు.   

         కౌటిల్యుడు (చాణక్యుడు) తన అర్థశాస్త్రంలో రాజుకు మూఢవిశ్వాసాలుఉండరాదన్నాడు. ప్రజల్లో మూఢవిశ్వాసాలు ప్రేరేపించి వారిలో భయ భ్రాంతులను సృష్టించాలి. రాజే వాటిని మళ్లీ

రూపుమాపాలి. ఆవిధంగా తాను ప్రజల రక్షకుడని ప్రజలు భావించేటట్లు చేసుకోవాలని చెప్పాడు.

        మూఢ విశ్వాసాలకు అధికారానికి దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే (1) అధికారులిచ్చే ఆజ్ఞలకు ప్రజలు విధేయులుగా ఉంటారనుకునేవారు (2) దైవభక్తిని ప్రదర్శించేవారు ప్రతి విషయంలో చట్టబద్ధంగా వుంటారని ఆశించేవారు.  

          మధ్యయుగాల్లోని రాజరిక వ్యవస్థ ప్రజల్లో తార్కిక దృక్పథానికి అవకాశం లేకుండా చేసింది.

ఇలాంటి పరిస్థితి ఆంగ్లేయులు మనదేశానికి వచ్చేవరకు కొనసాగింది.అయితే వేమన, వీరబ్రహ్మంలు (17వ శతాబ్దంలో) మాత్రం వీరు రాకముందే అనేక సామాజిక మూఢాచారాల పైన, లోకరీతుల పైన ధ్వజమెత్తారు. వీరు ఆచరణాత్మకంగా కూడా చేసి చూపించారు. వీరు సాహిత్యాన్ని సాధనంగా చేసుకొన్నారు.

రాతిబొమ్మల కేల రంగైన వలువలు

గుళ్ళు గోపురాలు కుంభములను

కూడు గుడ్డ తాను కోరునా దేవుడు'

అని ఒక పద్యంలో చెపుతాడు. అలాగే మరో పద్యంలో

"తోలు కడుపులోన దొడ్డవాడుండగ

రాతి గుళ్ళలోన రాశిబోయ

రాళ్ళు దేవుడైన రాసులు మ్రింగునా " అని ప్రశ్నిస్తాడు.

వీరబ్రహ్మం కూడా తన తత్వబోధలో  ‘చిల్లర రాళ్ళకు మొక్కుతూ వుంటే చెడిపోదువురా ఒరే ఒరే' అని బోధ చేస్తాడు. వీరిద్దరూ విగ్రహారాధనను ఖండించారు.  తల్లిదండ్రులు బ్రతికుండగా చూడని వారుకూడా మరణించగానే పిండప్రధానం చేస్తారు. కర్మకాండ పేరుతో పెద్దగా కార్యక్రమాలు చేస్తారు. దీన్ని చూసిన వేమన

పిండములను చేసి పితరులందలపోసి

కాకులకును బెట్టు గాడ్దెలారా

పెంట దినెడు కాకి పితరుడెట్లాయెరా ? అంటూ ప్రశ్నిస్తాడు.

     వేమన శ్రమకు ప్రాధాన్యత నిచ్చాడు. శ్రమే సమాజానికి మూలమని ఆయన భావించాడు.

భూమిలోన బుట్టు భూసారమెల్లను

తనువులోన బుట్టు తత్వమెల్ల

శ్రమములోన బుట్టు సర్వంబుతానౌను'

అంటూ శ్రమ జీవన సౌందర్యానికి పెద్దపీట వేశాడు. దీన్నే ఆధునిక కవి గద్దర్

" నువ్వు భూమిదున్న కుంటే వాడు బువ్వ బుక్కలేడు' అంటూ పాట పాడారు.

వేమన కులవ్యవస్థను తిరస్కరించాడు.

'కులముచేత విర్రవీగువాగు వారు, గోత్రంబుగలవారు / విద్యచేత విర్రవీగువారు

/ పసిడి గల్గువాని బానిస కొడుకులు' అనన్నాడు.

అలాగే... 'మాలమాలగాదు మహిమీదనే ప్రొద్దు | మాట తిరుగువాడు | వానిమాలయన్న వాడెపో పెనుమాల' అంటూ ఆశాస్త్రీయంగా ఏనాడో ఏర్పడిన కులవ్యవస్థను తిరస్కరించాడు.

వీరబ్రహ్మం 'కులమెంచగానేల గుణమే కారణం' అన్నాడు. సిద్దయ్యను, కక్కయ్య మాదిగను తన శిష్యులుగా చేసుకున్నాడు.

'మతం మత్తుగూర్చు మార్గమ్ము కానరాదు

హితము కూర్ప వలయు నెల్లరకును

హితము కూర్పలేని మతము మారగవలె"

అని మతం మత్తుమందని మార్క్స్ చెప్పిన భావాన్ని పదిహేడవ శతాబ్దంలోనే వీరబ్రహ్మం చెప్పినాడు.

'సర్వమానవులను సమముగా ప్రేమించు

కులమతాలనెంచి కోపపడకు

కాపు జాతినెల్ల కరుణించుమనే శ్రుతుల్'

అంటూ కుల, మతాలకతీతంగా మనిషి మనుగడ సాగించాలనే ఆధునిక భావాలను వీరబ్రహ్మం తన కాళికాంబ శతకంలో చెపుతాడు.  19వ శతాబ్దంలో ఆంగ్లేయుల రాకతో ఆంగ్ల విద్య అభ్యసించిన పలువురు మనదేశంలో అనేక మూఢా చారాలను, ఛాందసభావాలను, అంధవిశ్వాసాలను ఖండించారు. వాటిని ఖండించడానికి ప్రాచీన సాహిత్యమైన వేదాలను, ఉపనిషత్తులను, దర్శనాలను ఆధారం చేసుకున్నారు. వీరు కూడా సాహిత్యాన్ని ఆధారం చేసుకొని ప్రజల్లో వీటికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

        బెంగాల్ లో రాజారామ్ మోహన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఉత్తరభారతంలో ప్రేంచంద్, ఆనాటి తెలుగు రాష్ట్రాలలో గురజాడ, వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి చౌదరి,దాశరథి, కాళోజీ, శ్రీశ్రీ మొదలైనవారు శాస్త్రీయ భావాలను ప్రచారం

చేశారు.

         ఫ్రాన్స్ రచయిత బోదిలేర్ సైన్సుతోనూ, తత్వంతోనూ కలసి కాలుకదపని సాహిత్యం మానవ హత్యా సదృశ్యమే,ఆత్మహత్యా సదృశ్యమే నంటాడు. ఇది వంటబట్టని చాలా మంది రచయితలు అనేక మూఢవిశ్వాసాలను ఛాందస  భావాలను తమ రచనల్లో ప్రతిఫలిస్తున్నారు. లేదంటే సూడో సైన్సును రాస్తున్నారు.

        ఐన్‌స్టీన్ కనుగొన్న సాపేక్షతా సిద్ధాంతం ప్రతి విషయాన్ని స్థలకాలాదుల్లో చూడాలన్న జ్ఞానం నేర్పింది.

            ప్రాచీన సాహిత్యం స్థలకాలాదులను విస్మరించింది. అందువల్ల పురాణాలను ప్రాచీనమైనవని చెబుతారేగాని అవి ఏ కాలానివో చెప్పరు. అవి క్రీ.పూ. 400 కాలం నాటివని వాటిల్లోని కథల ద్వారా తెలుసుకున్నారు. ఆధునిక రచయితలు స్థలకాలాదుల్లో చెప్పడం మొదలు పెట్టారు.

        సైన్సుకు మానవత్వ ముఖం ఉండదు. ఇది ఐనిస్టీన్  తన E=mc^2 సూత్రం ద్వారా రూపొందించిన ఆటంబాబునుఅమెరికా జపాన్ పై ప్రయోగించినప్పుడు గుర్తించాడు. ప్రకృతి విధ్వంసాన్ని గుర్తించాడు. దీన్ని ఆయన వ్యతిరేకించాడు.రచయితలు కూడా పర్యావరణ విధ్వంసాన్ని, అణుబాంబు ప్రయోగాన్ని, యుద్ధాలను నిరసించారు.

        చాలా మంది రచయితలు తలరాత సిద్ధాంతాన్ని, మిధ్యావాదాన్ని తిరస్కరిస్తూ రాశారు. సామాజిక మార్పును గుర్తిస్తూ సామాజిక స్పృహతో సామాజిక పురోగతిని ఆకాంక్షించారు.      అశాస్త్రీయంగా మనుషులలో విభజించిన వర్ణ

వ్యవస్థను ధిక్కరించారు. బాల్య వివాహాలను ఖండించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. పంచములుగా పిలువబడే దళితులకు మద్దతుగా నిలిచారు. వీరిని అభ్యుదయ రచయితలన్నారు.

       పాత సంప్రదాయాలను, ఛాందసభావాలను కీర్తించే వారిని సంప్రదాయ రచయితలన్నారు.

        గురజాడ శాస్త్రీయ భావాలను తన రచనల్లో ప్రతి చోటా ప్రతిఫలింపజేశారు.

'మనిషి చేసిన రాయిరప్పకి, మహిమ కలదని సాగిమొక్కుతు | మనుషులంటే రాయిరప్పల/

కన్న కనిష్టంగానూ చూస్తావేల బేలా ?' అంటూ గురజాడ ప్రశ్నిస్తాడు.

        బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణుడు, భుజం నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యుడు, పాదాల నుంచి శూద్రుడు వచ్చాడని మనుధర్మం చెపుతోంది. శూద్రులు తక్కిన వారందరికి సేవకులుగా ఉండాలని కూడా చెప్పింది.పంచములను ఊరికి దూరంగా ఉండాలని చెప్పింది. మనషులంతా సమానమేనని విజ్ఞాన శాస్త్రం తేల్చింది. అందరికీ అన్ని హక్కులున్నాయని, ఒకరినొకరు పరస్పర సహాయసహకారాలతో జీవించాలని అదే ప్రకృతి ధర్మమని ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పింది.

గురజాడ వీటిని అందిపుచ్చుకున్నాడు. అందువల్లనే 'తిండి కలిగితే కండ కలదోయి / కండ కలవాడేను మనిషోయి' .... అనడమేకాక 'అన్నదమ్ములవలెను జాతులు | మతములన్నియు మెలగవలెనోయి' అనన్నాడు. అంతేగాక 'మలిన దేహుల మాలలనుచును | మలినచిత్తుల కధికకులముల/ నెలవొసంగిన వర్ణధర్మ మధర్మ ధర్మంబే" అనంటాడు. అధర్మమైన వర్ణధర్మం ధర్మమైందా? అని ప్రశ్నిస్తాడు.

'ఎల్లెలోకము వొక్కయిల్లై / వర్ణభేదములెల్ల కల్లై / వేల నెరుగని ప్రేమ బంధము /వేడుకలు కురియ' ... అని కూడా చెపుతాడు  'మీ పేరేంటి, పెద్ద మసీదు' కథల్లో మత విశ్వాసాల్లోని అహేతుకతను తేటతెల్లం చేస్తాడు. 'మతములన్నియు మాసిపోవును / జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును' అని గురజాడ మత విశ్వాసాలు, దానికి కనుబంధంగా వున్న ఛాందస భావాలు పోయి మనుషుల మధ్య జ్ఞాన సంబంధాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తంచేశాడు. ఇటీవల జరిగిన ఒక సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింల తరువాత మానవవాదులు మూడవ స్థానంలో వున్నారు. విజ్ఞానం అందరికీ అందే కొద్దీ అజ్ఞానం పటాపంచలవుతోందని తెలుస్తోంది.

        తోకచుక్క అరిష్టమని సమాజంలో ఒక మూఢనమ్మకం ఉంది. టి.వీలలో నేటికీ కొంత మంది ఇదే చెపుతూవుంటారు. గురజాడ "హేలీ తోకచుక్క'ను దూరపు బంధువుగా ఇలా వర్ణించాడు.

"దూర బంధువు యితడు భూమికి / దారిచూపుచూ చూడవచ్చును / డెబ్బదెనుబది ఏండ్లకొక తరి/

నరుల కన్నుల పండువై".

          పురుషాధిక్య సమాజంలో భార్య, భర్తల సంబంధాలు ఎలా వుంటాయో అందరికీ తెలిసిందే.

కానీ గురజాడ మాత్రం భార్య, భర్తల సంబంధాన్ని స్నేహితుల మధ్య సంబంధంగా చూచాడు. భర్త దేవుడని చెప్పే మాటను తిరస్కరిస్తూ  'మగడు వేల్పన పాతమాటది / ప్రాణమిత్రుడనీకు.... అని చెపుతాడు. అంతేకాక "ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును / ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును..." అని చెపుతూ ప్రేమ భావన తోనే భార్య, భర్తల మధ్య సఖ్యత నిలుస్తుందంటాడు.

        గురజాడ కన్యాశుల్కం నాటకం బాల్య వివాహాల ద్వారా మహిళలకు జరిగే అన్యాయాన్ని ఎత్తి చూపుతుంది. ఇందులో బుచ్చమ్మ, మీనాక్షి, పూటకూళ్లమ్మలు బాల్య వివాహాల ద్వారా వితంతువులు, వారు పడే బాధలను నాటకంలో

వ్యక్తీకరించాడు.

       సి.వి. అనేక రచనలు చేశాడు. విషాద భారతం, జాబాలి మొదలైనవవన్నీ ప్రాచీన సాహిత్యంలోని ఆహేతుక విషయాలను ఎత్తిచూపుతాయి.

వర్ణవ్యవస్థను సంప్రదాయవాదైన విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలుగా కీర్తిస్తే, అదే వర్ణవ్యవస్థను బూషువా "కసరిబుసకొట్టు నాతని నాల్గు పడగల హైందవ నాగరాజు' అంటూ ఈసడించుకున్నాడు.

        శ్రీపాద రాసిన 'అరికాళ్ళ మంటలు, ఇళ్ళు పట్టిన వెధవాడ పడుచు కథలు' బాలవితంతువుల సమస్యలను చిత్రీకరించాయి.

       కొడవటిగంటి కుటుంబరావు జ్యోతిష్యం కథ జ్యోతిష్యంలో ఉన్న బూటకత్వాన్ని బయట పెడుతుంది. ఇందులో ఒక వ్యక్తి తన చనిపోయిన తమ్ముని జన్మ వివరాలిచ్చి జాతకం అడగుతాడు జ్యోతిష్యున్ని. అవేమి తెలియని జ్యోతిష్యుడు ఆ వివరాలు తెచ్చిన వ్యక్తివేననుకొని వంద సంవత్సరాలు జీవిస్తాడని జాతకం చాలా బాగుందని చెపుతాడు. ఈ కథ ద్వారా జ్యోతిష్యంలోని అశాస్త్రీయతను ఎత్తిచూపుతాడు కొడవటిగంటి.

'మనుష్యుడే నా సంగీతం | మానవుడే నా సందేశంఅని మానవుని కేంద్రంగా కవిత్వం రచించి శాసించిన శ్రీశ్రీ మిథ్యావాదంలోని మర్మాన్ని బయటపెడతాడు.  ఈ మిధ్యావాదాన్ని ఆదిశంకరుడు ప్రతిపాదించాడు. బ్రహ్మసత్యం జగన్మిధ్య అన్నాడు. రజ్జు సర్పభ్రాంతి  సిద్ధాంతం చెప్పాడు. తాడును సర్పం అనుకుంటారు చీకట్లో, వెలుగులో అది తాడని తెలుస్తుంది. అలాగే బ్రహ్మ జ్ఞానంతో ప్రపంచం మిథ్య అని తెలుస్తుందన్నాడు. నాశనమయ్యేది వాస్తవం కాదన్నాడు. ప్రదితీ మాయవుతుందని, రూపాంతరం చెందుతోందని చెప్పిన బౌద్ధులు, జైనులు, వైశేషకులు చెప్పిన వాటినివ్యతిరేకించాడు. ప్రపంచం మిథ్య అన్న శంకరుడు, విగ్రహాన్ని మాత్రం పూజించడం ఆయన సిద్ధాంతానికి విరుద్ధం. ఇతడు ప్రతిపాదించిన మిథ్యావాదం శాస్త్రీయ భావన వ్యాప్తికి అవరోధమైంది. దేశ పురోగతికి ఆటంకంగా నిలిచిపోయింది. దీన్ని బ్రద్దలు కొట్టడానికి తన కవిత్వంలో ఇలా చెపుతాడు శ్రీశ్రీ.

 

'మాయంటావా? అంతా

మాయంటావా ? ఓ మిధ్యా వేదాంతి ?

ఏమంటావూ ? లోకం మిధ్యంటావూ ?

జమిందారు రోల్సుకారూ

మహారాజు మనీపర్సు

మాయమంటావు ? స్వామీ ఏమంటావు ?

ఏయ్ ఏమంటావు?

పాలివాని నుదుటి చెమట

కూలివాని గుండె చెరువు

మాయంటావూ?

 

పాలు, పెరుగుగా మారటానికి మజ్జిగ తోడు ఎంత అవసరమో, మనిషిని సమాజాన్ని చైతన్యం చేసేందుకు శాస్త్రీయ భావాలూ అంతే అవసరం. ఈ భావాల వ్యాప్తి రచయితల ద్వారా జరుగుతుంది.

'జపతపంబుల కన్నా / చదువు సాములకన్నా ఉపకారమే మిన్న / ఓ కూనలమ్మా' ... అని ఆరుద్ర అంటే 'నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి / కవులు కంటున్న కలలు మనుషుల్లో ఫలిస్తాయి' అనంటాడు గుంటూరు శేషేంద్ర శర్మ.

సమాజంలో ఉన్న కులోన్మాదం పై కవితాగ్రహం ప్రకటిస్తాడు అశోక్ కుమార్ ఇలా...

'కమ్మో రెడ్డో కాపో అంటాడు కాని

మనిషని చెప్పడేం ? హిందువో, ముస్లీమో, క్రిస్టియనో

అంటాడు కాని మనిషని చెప్పడేం ?

అమెరికనో, రష్యనో, జపనీయో అంటాడు కాని

మనిషని చెప్పడేం ?

అసలిక్కడ మనుషులే లేరా ? లేక

ఉన్నవాళ్లు మనుష్యులు కారా ? "అని ప్రశ్నిస్తాడు ఆగ్రహంగా.

      విధిరాత, తలరాత సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ శ్రమతోనే చరిత్ర సృష్టించవచ్చని చెపుతాడు సినారె.

అంతా నుదుట రాసి వుందంటే

యంత్రాలు నడిచేవికావు

విధి పరిధిలో చంక్రమిస్తుంటే

వివేకం పెరిగేది కాదు

సంకల్పం నడుము చుట్టకుంటే

చరిత్ర తిరిగేది కాదు

మనిషి జీవితం / అనుభవాంకితం

శ్రమజీవన సౌందర్యఫలం.

      కాలానుగుణంగా ప్రకృతే కాదు సమాజంలోని భాషా సంస్కృతులు కూడా మారుతుంటాయని విజ్ఞానశాస్త్రం నిరూపించింది. ప్రస్తుతం ప్రపంచీకరణలో అన్నీ శరవేగంగా మారిపోతున్నాయి. కరోనా కాలంలో చాలా మార్పులు సంభవించాయి. పర్యావరణం విధ్వంసం ఆగిపోయింది. ఓజోను పొర రంధ్రం పూడిపోయింది. ఢిల్లీలో కాలుష్య స్థాయి తగ్గి సాధారణ స్థాయికి వచ్చింది. అందరినీ రక్షిస్తాడని నమ్మే అన్ని మతాల దేవుళ్ళ ప్రార్థనా మందిరాలన్నీ మూసివేయ బడినాయి.

        దేవరకొండ బాలగంగాధర తిలక్ శాస్త్రీయంగా ఆలోచించే కవి. సామాజిక సందర్భాలను చారిత్రక మార్పులను గుర్తించినకవి. అందుకే

'ఏ సంస్కృతీ కాదొక స్థిర బిందువు | అది నైకనదీనదాల అంత:స్సింధువు / కనిపించని ప్రభావాల కది లొంగుతుంది" అనంటాడు తన అమృతం కురిసిన రాత్రిలో...

         ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఏదో ఉందని చాలా మంది భావవాదులు భావిస్తుంటారు. కొంత మంది భగవంతుడన్నారు. మరికొంత మంది అదృశ్య శక్తి అన్నారు.

 

             చెరబండరాజు మాత్రం "నత్వం కామయే,

రాజ్యం వద్దు, స్వర్గం వద్దు, మోక్షం కూడా వద్దు

నాకు కావాల్సిందల్లా ప్రజల కష్టాలన్నీ తొలగించే శక్తి ఒక్కటే' అనంటాడు.

 

         అదే తిలక్ అయితే... "దేవుళ్ళని తన రూపంలో సృష్టించుకొని / తన భయాన్ని వాళ్ళకు తగించుకుని / అడిగినప్పుడెల్లా వరాలిమ్మని ఒప్పందం చేసుకుని పరవాలేదని ప్రమత్తుడయ్యాడు మానవుడు... "అని చెపుతాడు.

                మరో కవి రాచాపాళెం రఘు 'సర్వాంతర్యామి సామి వుంటే/ సామి శిలలు చౌర్యమందు టేల?/ సామిరక్షకు రక్షకభటులేల ?' అని ప్రశ్నిస్తాడు.

                ప్రజలంతా శాస్త్రీయ దృక్పథం తో  నడుచుకోవాలని చెప్పడమే గాక రాజ్యాంగంలోని ఆర్టికల్ 51-ఎ ప్రకారం శాస్త్రీయదృక్పథాన్ని ప్రజల ప్రాథమిక విధిగా పేర్కొంది.

        సమాజంలోని ఆకలి, దారిద్ర్యం, నిరక్షరాస్యత, అపరిశుభ్రత, వనరుల దుర్వినియోగం, పర్యావరణ విధ్వంసం వంటి వాటికి శాస్త్రీయ ఆలోచనే పరిష్కార మార్గాలను సూచించగలదు.

         దాశరథి తన అగ్నిధార కావ్యంలో రాసిన 'ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానల మెంతో | ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో / భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మనవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో' అనే గీతంలో మానవ పరిణామం పైన, భూమి పుట్టుక గురించి సమాజంలోని అసమానతల పైన స్ఫూర్తిదాయకమైన, శాస్త్రీయ భావాలున్నాయి.

         'రచయిత అన్నవాడు సైంటిస్ట్ కానక్కర్లేదు. కానీ అతడికి శాస్త్రీయ దృక్పథం ఉండాలి. ఇది లేకపోతే అతడి రచనలు అర్ధసత్యాలు - రసవిహీనతా సంక్రమిస్తాయి. జీవితానికి ప్రాణవాయువు ఎంత అవసరమో అలాగే రచయితలకు సైంటిఫిక్ దృక్పథం అవసరం' అని శ్రీశ్రీ ఏనాడో చెప్పినాడు.మతం ఓడిపోతూ వుంది. సైన్సు గెలుస్తోంది. ఇదే ఈనాటి చారిత్రక పరిణామమని నొక్కి వక్కాణించాడు.

 

'ఎక్కడ మనస్సు నిర్భయంగా వుంటుందో

ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతాడో

ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి వస్తాయో

ఎక్కడ అవిరామమైన సత్యాన్వేషణ పరిపూర్ణతవైపు చేతులు చాస్తుందో

ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని ఎలాంటి విశ్వాసపు దారిలో ఇంకిపోదో

అలాంటి స్వేచ్ఛాపథంలోకి పయనించాలి... దేశం మేల్కొనాలి' అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ కోరినట్లు

రచయితలు, సామాజిక కార్యకర్తలు, శాస్త్రీయ దృక్పథంలో సమాజాన్ని ముందుకు తీసుకెళతారని ఆశిద్దాం.

సాహిత్య వ్యాసాలు

ఇంకా కొనసాగుతూన్న 'విషాద కామరూప'

"విషాద కామరూప" నవల అస్సాం రాష్ట్రంలోని, కామరూప జిల్లాలోని, ఒక మారుమూల 'సత్త్ర' అని పిలువబడే వైష్ణవ మఠాల చుట్టూ ఉన్న చిన్న గ్రామం.
ఆనాటి సత్రాల దయనీయ స్తితితో పాటు, అస్సాం సంస్కృతిలోని ప్రతి సూక్ష్మ అంశాన్ని 'కామరూప' అనే మాండలికంలో ఇందిరా గోస్వామి "ఊనే ఖోవా హౌదా" అనే అద్భుతమైన నవలగా రాసారు. కామరూప మాండలిక భాష చాలా తక్కువ మందికి వచ్చు కాబట్టి. దానిని తిరిగి ఇంగ్లీషులోకి "ఏ సాగా ఆఫ్ సౌత్ కామరూప" అనే పేరుతో అనువాదం చేయవలసి వచ్చిందని రచయిత్రి తన ముందు మాటలో చెప్పుకున్నారు. దానికి తెలుగు అనువాదం చేసినవారు గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. 'కేంద్ర సాహిత్య అకాడమీ' 2002వ సంవత్సరంలో మొదటిసారి ఈ నవలను ప్రచురించింది.
19వ శతాబ్దం ప్రథమ భాగంలో 1820 మొదలు బ్రిటిష్ పాలన అంతరించి భారతదేశం స్వాతంత్రం పొందేదాకా సుమారు 125 ఏళ్ల పాటు ఈ నవల ఇతివృత్తకాలం.
అస్సాంలోని ప్రసిద్ధ వంశమైన ఒక గోసాయి కుటుంబంలో జరిగిన విషాద గాధ ఈ నవలకు ఇతివృత్తం. గోసాయిలు లేదా గోస్వామీలు అస్సాంలోని ఉన్నతమైన జాతి వారు. వారికి మతాధిపత్యం కూడా ఉండేది. సత్త్రల్లో ప్రజలు వారిపట్ల విశేష గౌరవం చూపేవారు. వైష్ణవ మఠాన్ని సత్త్ర అంటారు. గోస్వామీలే ఆ సత్త్రలకు అధికారులుగా ఉండి ఆధ్యాత్మిక, సామాజిక ఆధిపత్యాన్ని కలిగి, సంస్థానాధీశులుగా విస్తారమైన భూములపై ఆధిపత్యాలను కలిగి ఉంటారు. మఠంలోని భక్తులు శిష్యులే కాక అన్ని మతాల ప్రజలు వారిని గౌరవించేవారు. పాలనాధికారులు కూడా వీరీకి విశేషాదరణ కల్పించేవారు.
సత్త్రాలకున్న విస్తారమైన భూములు ఎక్కువ భాగం అస్సాంను పాలించిన "అహోమ్ మహారాజులు" దానంగా ఇచ్చినవే ఎక్కువ. వైభవంగా విలాసవంతంగా జీవించే గోస్వాములు స్వాతంత్ర్యానంతరం భూసంస్కరణల వలన వారి భూములపై అధికారాన్ని హక్కును కోల్పోయారు. అటువంటి 'రాజపుఖూరి సత్త్ర' అనబడే ఒక వైష్ణవ మఠంలో. జరిగిన కథాంశం "విషాథ కామరూప" నవల.
ఈ నవలలోని స్త్రీ పాత్రలన్నీ దాదాపు దక్షిణ కామ రూపాలో ఉన్న గోస్వామి కుటుంబాలలో స్త్రీలు, మరియు వారితో కలిసి సేవకులుగా ఉన్న స్త్రీలే. వితంతువులు, వారి అపరిమిత దుఃఖాలు, వారిని అణచివేసే సామాజిక నిర్బంధాలు ఆత్మీయంగా ఎంతో సహానుభూతితో చిత్రించారు రచయిత్రి.
అమెరికన్ బాప్టిస్టు మిషన్ 1936 లోనే అస్సాంలో అడుగు పెట్టి కామరూప జిల్లాలో కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించగలిగింది. అయితే బ్రహ్మపుత్ర లోయలోని ప్రజలలో మత మార్పిడి వారికి సాధ్యపడలేదు. కారణం, సత్త్ర అనబడే వైష్ణవ మఠాల వల్ల ప్రజలలో వైష్ణవం అధికంగా పాతుకుపోయి ఉండటం. అయితే భారతదేశ సాహిత్య సంపదకోసం ప్రాచీన వ్రాతప్రతులను, ముఖ్యంగా తంత్ర శాస్త్రం గ్రంథాలను సేకరించేందుకు బాప్టిస్ట్ కార్యకర్తలు వైష్ణవ మఠాలకు వెళ్లేవాళ్లు. ఆ విధంగా చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్న వైష్ణవ గోసాయిని గిరిబాల, మార్క్ అనే ఒక క్రిస్టియన్ మత బోధకుని ప్రేమకు ఆకర్షితురాలవుతుంది. చివరకు ఆమె ప్రేమ విషాదంగా ముగిసింది. ఒకరోజు రాత్రి మార్కుతో కలిసి ఒక కుటీరంలో వ్రాతప్రతుల గురించి మాట్లాడుతూండగా ఆమెను బయటకు ఈడ్చి, ఆమె చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలంటారు. ఆ ప్రాయశ్చిత్త కర్మలో భాగంగా మండుతున్న పాక నుండి ఆమె బయటకు రావాలి. కానీ ఆమె అందుకు ఇష్టపడక స్వచ్ఛందంగా మరణాన్ని ఆహ్వానిస్తుంది తప్పించుకునే అవకాశమున్నా పాక తోపాటు కాలిపోతుంది. అది ఆనాటి బహిరంగ పరువుహత్య.
మానవ సమాజంలో మనుషులను తోడేళ్ళుగా ఎనుములుగా విడదీసేది మతం ఒక్కటే.
ప్రస్తుత సమాజం మద్యం కబంధహస్తాల మత్తులో నలిగిపోతున్నట్టే, ఆ రోజుల్లో గ్రామాలన్నీ సత్త్రలతో సహా నల్లమందు విషపు కోరల్లో చిక్కుకొని ఉండేవి. భయంకరమైన నల్ల మందు అలవాటు దారిద్ర్యంలో మగ్గుతున్న స్త్రీ పురుషులను సర్వ నాశనం చేసేది. అధికారులు గోస్వాములు సంపన్న జీవితాలను గడిపే వారు. వారి శిష్యులైన జమిందారీ ప్రజలందరూ అజ్ఞానంతో మూఢనమ్మకంతో వారిని గుడ్డిగా అనుసరించే వారు.

నేటి ధనవంతులకు భారీ వ్యాపారులకు వ్యక్తిగత విమానాలు , కోట్ల ఖరీదైన వాహనాలు, విల్లాలు వారి అంతస్తులకు హోదాకు సూచికలైనట్టే, భారీ పనుల కోసం అధికారులు ఏనుగులను పోషించేవారు అవి వారి అంతస్తుకు అధికారానికి సంపదకు సంకేతాలుగా ఉండేవి. 'అధికార్' (ఆఫిసర్లు కాదు మఠాధిపతులు) పెళ్ళిళ్ళకు వెళ్ళేప్పుడు ఏనుగులను వైభవంగా అలంకరించి వాటిపై అట్టహాసంగా వెళ్లేవారు. వ్యాపార ప్రయోజనాల కోసం కూడా ఏనుగులను వాడేవారు. వాటిని ప్రయోగించి అడవి ఏనుగులను పట్టుకొని వాటికి కి శిక్షణనిచ్చి అమ్మేవారు లేదా వస్తు మార్పిడి విధానం క్రింద ఇచ్చేవారు. దక్షిణ కామరూపలోని రాణీలో ఏనుగులను పట్టుకొని శిక్షణనిచ్చే కేంద్రం ఒకటి ఉండేది, దానినే ఏనుగుల మహల్ అనేవారు. ఇటువంటి విషయాలన్నీ ఈ నవలలో ప్రస్తావించబడ్డాయి.
ప్రాయశ్చిత్తం, మనువు చెప్పాడు, పాప కర్మలు, నిషేధాలు వంటి మాటలు పదే పదే ఈ నవలలో మనకు కనిపిస్తాయి. ప్రతి సంఘటనకు ప్రాయశ్చిత్తం అనేది ఒక ప్రత్యామ్నాయంగా చూపి బ్రాహ్మణ సమూహాలు అధిక మొత్తంలో ధనం , భూమి , ఆహారధాన్యాలను దక్షిణగా గోసాయిల నుండి పొందేవారు.
ఈ నవలలో మతం యొక్క వివిధ కోణాలను కళ్ళకట్టినట్టు దృశ్యీకరించ గలిగారు రచయిత్రి. మతం పేరిట దోపిడీ, అధికార దుర్వినియోగం, అణిచివేత, వివక్ష చాలా స్పష్టంగా కనబడుతుంది.
భూసంస్కరణల వలన గోసాయీల వద్ద ఉన్న భూములను ఎర్ర జెండా పట్టుకున్న కొన్ని సమూహాలు ప్రజలకు పంచి పెట్టేందుకు ప్రయత్నించినట్టు. వర్గ సంఘర్షణ అనేక రూపాలలో ఈ నవలలో చిత్రీకరించబడింది.
గోసాయినీల అంటే గోసాయిల భార్యల పేర్ల ప్రస్తావన ఈ నవలలో కనిపించదు. అంటే వారి అస్తిత్వానికి ఏమాత్రం ప్రాధాన్యత లేదు. బాల్య వివాహాలు సర్వసాధారణం, చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి తల్లిదండ్రుల ఇళ్లకు చేరిన వారు కోకోల్లలు. అందుకు ఉదాహరణ గిరిబాల, దుర్గ వంటి పాత్రలు. వీరిద్దరూ సనాతన కుటుంబాల్లో పితృస్వామ్య నిషేధాల మాటున హింసకు గురైన వారే. పెద్దగోసాయిని, చిన్నగోసాయినీతో సహా. అయితే ఏ హింసకు తాము బలయ్యారో అదే హింసను తమ బిడ్డలు కోడళ్ళపై వారు ప్రదర్శిస్తారు, కుటుంబ పరువు కోసం. వుమెన్ ట్రాఫికింగ్ వ్యభిచార గృహాల నిర్వహణలో ప్రస్తుత సమాజంలో మహిళలు భాగస్వామ్యమైనట్టు , అయితే ఇప్పటి వీరిది చదువు ఇచ్చిన స్వార్థంతో కూడిన అజ్ఞానం నాటి గోసాయినీలది అజ్ఞానంతో కూడిన నిస్సహాయత. కొందరు ధైర్యంగా అత్తగారి ఇళ్లలోనే ఉండి క్లిష్టమైన జీవితాలను గడుపుతుంటారు అందుకు చిన్న గోసాయిని పాత్ర ఉదాహరణ.
ఇంథ్రనాథ్ గోసాయి ఆకాలంలో కూడ స్త్రీల పట్ల సానుభూతి దయకలిగిన యువకుడు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని ఇంటికి చేరిన అతని చెల్లెలు గిరిబాలపై దయతో ప్రాచీన వ్రాతప్రతులను సేకరించేందుకు సహకరించాడు. మార్కుతో చనువుగా ఉండే గిరిబాలను తప్పు పట్టలేదు. తన తల్లి రోజంతా చుట్టకాలుస్తూ తనను తాను కొద్ది కొద్దిగా కాల్చుకోకుండా సంగీతం , నృత్యం వంటివి ఆస్వాదిస్తూ ఊరట పొందవచ్చు కదా అనుకుంటాడు.
ఈ నవలలో ఇంథ్రనాథ్ గోస్వామి ఒక 'సత్త్ర' కు వారసుడు. అభ్యుదయభావాలు గల చైతన్య వంతుడైన యువకుడు. స్త్రీలు వితంతువులు పేదప్రజల పట్ల దయ, సానుభూతితో మెలిగేవాడు నల్లమందు నిషేధం కోసం ప్రయత్నిస్తాడు.
ఇంథ్రనాథ్ గోసాయి ఒక నిరుపేద, తల్లిదండ్రులు లేని ఎలియన్ అనే యువతిని ప్రేమిస్తాడు. కానీ పేద ప్రజల పక్షాన నిలబడి చేయవలసిన సంస్కరణల కోసం. ప్రేమను ఆమెకు వ్యక్త పరచలేడు. ఆసంధర్బంలో ఇంధ్రనాథ్ గోసాయి చేత రచయిత్రి చెప్పిన మాటలు ప్రేమ పట్ల ఆమెకున్న ఆర్తిని ఔన్నత్యాన్ని తెలుపుతాయి.
"పచ్చటి తీరాల మధ్య పాకిపోయె నీలిసర్పం లాంటి జగాలియా నది తన ప్రియమైన ఎలిమన్
నిడుబారు వెండ్రుకల్ని జ్ఞాపకం తెస్తోంది. అవును ఈ వంతెన మీదనే ఆమెను కలిసి కొన్నది!
ప్రేమ దివ్యమైనది !
అది దేన్నీ కోరదు! కావాలని ఆరాట పడదు!
అన్ని దారులు అక్కడ కలిసి అంతమై పోతాయి అతనికి అలా అగుపిస్తోంది!
గిరిబాల మార్క్ చిన్నగోసాయినీ....
వాళ్ళ జీవితాలు కూడా ఈ దివ్య మార్గంలో సమున్మీలిత మయ్యాయా?" (280వ పేజీ)"
ప్రస్తుతం సమాజాన్ని వణికిస్తున్న కరోనా వంటి వ్యాధులు అప్పుడు కూడా ఉండేవని ప్రజలు విష జ్వరాలతో చనిపోయే వారని రచయిత్రి ఒక సంఘటన ద్వారా వివరించారు.
"దేవదత్త మాటలకు నిస్పృహగా నిలబడిన ఇంద్రనాథ్ గోసాయి ముందునుండి, మౌర్య కొడుకు చావుకు వచ్చినవాళ్లు, జగాలియా నదిలో శౌచస్నానం ముగించుకుని, సన్నగా అస్తిపంజరం ఆకారాలు పరిగెత్తుతూ ఉంటాయి. వీళ్లు కొందరు వంగి అతనికి నమస్కరించి వెళ్ళారు.
" నేల మీద సాష్టాంగ పడి, చిన్న గోసాయి ఈ మలేరియా, ఈ కాలజోర్ అంటురోగం అన్ని చోట్ల చెలరేగుతోంది. ఎంతమందో చచ్చిపోయారు. ఎందరికో తగిలింది. సర్కార్ కాంపౌండర్ ఇచ్చే ఎర్ర నీళ్లు వాళ్లను కాపాడలేక పోతున్నాయి. వాంతులు చేసుకొని చచ్చి పోతున్నారు. ఈగల్లా ఎగిరి పోతున్నారు" అంటూ వెళ్లిపోయాడు సమాధానం కోసం అయినా చూడకుండా.
ఆ మనుషులందరూ అస్థిపంజరాలు గుట్టల్లా కనపడుతున్నారు. వాళ్ళందరూ నల్ల మందు గుప్పిట్లో చిక్కుపడ్డ వారే.( పేజి నెంబర్ 277)"
నాకైతే ఈ సంఘటన, ప్రస్తుతం కరోనా సమయంలో ప్రజల పరిస్థితి నల్లమందుకు బదులు మద్యం మట్టుబెట్టడం వంటిదిగా కనిపిస్తోంది. రచయిత్రి 1947 లో అస్సాంలోని కామరూప జిల్లాను గురించి రాసినప్పటికీ ఈ సంఘటన ప్రస్తుతం డెబ్బయి మూడు సంవత్సరాల తరువాత కూడా భారతదేశంలో అదే పరిస్థితి కొనసాగుతోంది అనిపించింది.
దేవదత్ అనే వ్యక్తి ఇంద్రనాథ్ గోసాయిని హెచ్చరించేందుకు వచ్చి‌, భూ సంస్కరణల వల్ల కోల్పోతున్న భూములను కాపాడుకోవాల్సినదని ఔదార్యంతో పేదలకు పంచ వద్దని హెచ్చరిస్తాడు. పైగా అమ్మ తలుచుకుంటే నాకే అమ్మమని డిమాండ్ కూడా చేస్తాడు.
పై మాటల ద్వారా భూ సంస్కరణలు గోసాయి కుటుంబాల్లో తెచ్చిన సమస్య అర్థమవుతుంది. భూములను పేదలకు పంచకుండా ప్రస్తుత రాజకీయ నాయకులు బినామీల పేరున ఆస్తులు ఉంచడం అనేది, ఆ కాలంలోనే జరిగాయని, వ్యవసాయ కార్మికులు, కమ్యూనిస్టుల పట్ల వారికి ఉన్నటువంటి చులకన, నీచమైన అభిప్రాయాలు దేవదత్ మాటల ద్వారా తెలుస్తోంది.
అంతేకాదు ఇంద్రనాథ్ చెల్లె గిరిబాల క్రిస్టియన్ మార్కును ప్రేమించడం మూలంగా ఆత్మాహుతికి గురికావడం వాటి గురించి ప్రస్తావిస్తాడు.
కానీ అభ్యుదయ భావాలున్న ఇంధ్రనాథ్ అప్పటివరకు మౌనంగా ఉన్నప్పటికీ గిరి బాల ప్రస్తావనకు సమాధానం చెప్తాడు.
ఇంద్రనాథ్ కు కులమతాల పట్టింపులు, వర్గ భేదాలు అహంకారము లేనటువంటి, ఒక మంచి మనిషిగా రచయిత్రి ఆ పాత్రను తీర్చిదిద్దింది.
ఆనాటి నవలలో చెప్పబడిన తంతులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దక్షిణలు గౌరవప్రదంగా పాపాలను తుడిచేందుకు సమర్పించ బడుతున్నాయి.
"బాముండి గోసాయికి మరో యజమాన్ బ్రాహ్మణుడికి జరుగుతున్న సంభాషణ. (134 పేజీలో)"
"ధర్మ శాస్త్రంలో మనవు సరిగ్గానే చెప్పాడంది..."

 "ఏమని"
" దేవతల శ్రాద్దాలయితే ఇద్దరు బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తే చాలన్నాడు. తండ్రికో, తాతకో, ముత్తాతకో అయితే ముగ్గురు చాలా అన్నాడు. దేవతకూ, తండ్రికి లేదా తాతకు కలిపి చేస్తే ఒక్క బ్రాహ్మడే సరిపోతాడన్నాడు.... ఇప్పుడీ గందరగోళం చూడండి.... మహల్లో అంతా బ్రాహ్మణ గుంపులే. ఇంత మంది అవసరం ఏమొచ్చింది చెప్పండీ!..."
ఉన్నట్టుండి పాదుకల గదిలో నుండి అధికారి మహాప్రభు మాటలు వినపడ్డాయి-
"తండ్రయినా తాతయినా, మృతుల ఆత్మ, శ్రాద్ధాననికి విచ్చేసిన బ్రాహ్మణుల శరీరాల్లో ఉద్దీప్తమవుతుందని ఆ మనువే కదా చెప్పాడు! వచ్చినవాళ్లు ఆ విషయం కూడా గుర్తుంచుకొని మాట్లాడితే హుందాగా గౌరవంగా ఉంటుంది" అంతా నిశ్శబ్దం.
మనువు చెప్పాడంటూ పై సంభాషణల వంటివి నవలలో చాలా చోట్ల కనబడతాయి
మార్కు "ఎంతోకొంత మనమందరం పాపులమే. భగవంతుని ఆలయంలో బలిపీఠం మీద పాత్ర పరిశుద్ధంగా ఉండేది కానీ దానితో ద్రాక్ష సారాయిని సేవించి, అపవిత్రం చేసాము. ఆ చిట్టా మనందరి తలమీద వేలాడుతూనే ఉంది. దానిమీద మన పాపాలు తీర్పులు శిక్షలు అన్ని రాయబడి ఉన్నాయి. ఇది ఇతరులకు కనపడదు. అంతే దాన్ని అదృశ్యంగా మోస్తూనే మనం తిరుగుతున్నాము. భగవంతుడి ఆదేశాలతో చూచినప్పుడు మనం ఎప్పుడూ తేలిపోతూనే ఉంటాము" ఇది క్రిస్టియన్ మతం లోని తీర్పు. పేజి నెంబర్ 134 వ పేజీలో మనువు చెప్పినా, 136 వ పేజీలో ప్రభువు చెప్పినా రెండు మతాల్లోనూ మూఢనమ్మకం దోపిడీకి సిద్ధపడ మని హెచ్చరించినట్టుగా ఉంటుంది.
దున్నే వాడిదే భూమి' అని నమ్మిన ఇంధ్రనాథ్ తమ ఆధీనంలో ఉన్న భూములన్నీ పొలాలుదున్నే ప్రజలవేనని ప్రకటించడానికి బయలుదేరుతాడు.
పందొమ్మిది వందల ఎనబై ఒకటి!
పెద్ద సుడిగాలిలా భూపరిమితి చట్టం వచ్చింది చట్టానికి ఎన్నో సవరణలు వివిధ గోసాయిల పుత్ర రత్నాలు న్యాయస్థానాల మెట్లమీద ఎన్నో పగళ్ళు రాత్రులు గడపాల్సి వచ్చింది, భూమినంతా శాశ్వతంగా పోగొట్టుకొని పుస్తకాల అంగళ్ళు, కడకు కసాయి అంగళ్ళు పెట్టాలనుకున్నారు.
1980లో సత్రా కు విద్యుత్తు వచ్చింది కానీ కొన్ని ఇళ్లలో మాత్రమే వెలుగు నింపింది. మిగిలిన ఇళ్లలో ఇంకా ఆవ నూనె దీపాలు, కిరోసిన్ దీపాలు వెలుగుతున్నాయి ఇప్పుడు జగాలియా తీరంలో గోసాయి, బ్రాహ్మణ కుటుంబాల లోని ఆడపిల్లలు తక్కువ జాతి వాళ్ళ ఇళ్ళకు వెళుతున్నారు. వాళ్ల అబ్బాయిలతో మూడు ముళ్ళు వేయించుకుంటున్నారు. చాలా సంసారాల్లో నల్ల మందు అలవాటు నుండి బయటపడ్డాయి. ఈ రోజుల్లో వ్యాపారులు నుండి వచ్చిన వర్తకులు అట్టహాసంగా సత్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఉన్నత పాఠశాల అభివృద్ధి పొందింది. ఇప్పుడు సత్రా దగ్గరగా మీర్జాలో కళాశాల కూడా వచ్చింది.
1981లో 30 ఏళ్ల తర్వాత మునుపు కర్ర వంతెన ఉన్నచోట ఇప్పుడు కొత్తగా వెలసిన కాంక్రీట్ వంతెన వద్ద చిన్న గోసాయిని చంపడానికి రెచ్చగొట్టిన కమ్యూనిస్టు నాయకుడు బలా ముఖాముఖి తారసపడ్డాడు. చాలా కాలం కిందట అతడు జైలు నుండి బయటకు వచ్చాడు.
పేదవాళ్ల కోసం బడుగు వర్గాల కోసం ఈ మనిషి పొందిన బాధ ఇంద్రనాథ్ గుండెల్లో ఉన్న బాధ కంటే తక్కువేమీ కాదు. పైపెచ్చు ఇతగాడు పెద్దగోసాయికి అక్రమ సంతానం. అతని తల్లిని బంగారు నగలు గుప్పించి పెద్దగోసాయి వదిలించుకున్నాడు.
ఇతడు బాల చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్ని ఒకరినొకరు పోల్చుకున్నారు. ఇద్దరికీ శరీరం తగ్గి చర్మం వదులుగా ఎలా అవుతుంది. ఇద్దరి జీవితం ఆఖరి మజిలీలో ఉన్నారు.
బలా చెయ్య తో ఆపాడు అతను కూడా ఇష్టంగా ఆగాడు.
"రక్తపుటేరులు పారించి భూమిని సాధించావు. అయితే పేద రైతులకు దానిని సరిగానే పంచి పెట్టావా . 30 ఏళ్లు అయ్యాక ఇప్పటికీ వాళ్ళు సంతృప్తిగా బాగా ఉన్నారా" అన్నాడు బలా.
నాయకుడు నిశ్శబ్ధంగా ఉండి పోయాడు.
" సరిగ్గా ఈ వంతెన దగ్గరే మా ప్రియాతిప్రియమైన గోసాయి శరీరానికి దహన సంస్కారం చేసాము" క్షణకాలం ఉద్వేగానికి లోనై ఒక్క అడుగు నాయకుడు దగ్గరగా జరిగి అతని నుదిటి పై వెల్లడిస్తూ బలా స్థిరంగా అన్నాడు . "నువ్వే నువ్వు చంపావు. నువ్వే ఆయన గొంతు కోసింది"
నాయకుడు గర్జించాడు "రైతుల కడుపులు ఖాళీగా ఉన్నాయి మీ గోసాయి అంబారీ ఎక్కి వచ్చాడు వరి కోతలకు. ఇలాంటి నాటకం ఇంకే గోసాయి వేయలేదు".
బలా అన్నాడు "నువ్వు సరిగ్గా చూసావా అది చెదలు పట్టి ఉంది. ఆయన అంతరంగంలో ఎన్ని గాఢమైన ఆలోచనలు, ఆవేదనలు ఉండేవో నాకు ఒక్కడికే తెలుసు. ప్రాణం వదలడానికి ముందు నాతో ఏమన్నాడు తెలుసా నేను చేద్దాం అనుకున్న పని ఫలించింది. ప్రయోజనం సిద్ధించింది. నా మాటలు నమ్ము. ఆయనకు అంబారీ మీద కూర్చోవాలని ఆశ ఏమాత్రమూ లేదు. ఆయన మనసులో ఎలాంటి తుఫాను చెలరేగుతున్నదో నాకు తెలుసు. నేను నా చేతులతో ఆ అంబారీని ఏనుగు కట్టడానికి తోడ్పడ్డాను. అది చెదలు పట్టిన హోదా బలా ఏడుస్తూ చెప్పిన సజీవ సాక్షం అది.

జీవితకాలం వివేకం లేని , పగ , ద్వేషం మాత్రమే తెలిసిన తొందరపాటు కలిగిన ఒక విప్లవ నాయకుని చేతిలో ప్రజలకు భూముల పంచా‌లనుకున్న ఇంధ్రనాథ్ హత్యకు గురవుతాడు. నవల ముగుస్తుంది.
సామాజిక చారిిత్రక అంశాలపై అవగాహన కలిగించే గొప్ప నవల ఇది.


.*****************


మూలరచయిత్రి గురించి......
ఇందిరా గోస్వామి కలం పేరు "మమోని రైసమ్ గోస్వామి", 'మమోని బేడియో' అనే పేరుతో సుప్రసిద్దులు. సంపాదకురాలు, కవయిత్రి , రచయిత్రి, ప్రొఫెసర్, స్కాలర్.
వారి జననం 14 నవంబర్ 1942 గోహతి.
మరణం 29 నవంబర్ 2011 గోహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గోహతి.
వారు పొందిన అవార్డ్స్ - కేంద్ర సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ అవార్డు, పద్మశ్రీ, అస్సాం రత్న అస్సాం సాహిత్య సభల పురస్కారాలను అందుకున్నారు
ఇందిరా గోస్వామి దిల్లీ విశ్వవిద్యాలయంలో ఆధునిక భారతీయ భాషా విభాగంలో ప్రొఫెసర్ గా పని చేశారు వందకు పైగా కథలు, 15 నవలలు రచించారు.
అనువాద రచయిత పరిచయం - తెలుగులోకి అనువాదం చేసిన డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం" లో "సెంటర్ ఫర్ కంపారిటివ్ స్టడీస్ డైరెక్టర్"గా తమ సేవలను అందించారు.

 

సాహిత్య వ్యాసాలు

నిజ జీవిత  గాథలకు అక్షరరూపం “హస్బెండ్ స్టిచ్”

ఆడపిల్ల పుట్టగానే ఋణావేశితంగా చూడడం ఈరోజుల్లో ఎక్కువగా తారసపడుతున్న సందర్భాలున్నాయి. మగపిల్లవాడు పుట్టంగనే వారసుడొచ్చాడని సంబరాలు చేసేవాళ్లే ఎక్కువ. అయినా...ఆడపిల్ల అయితేనేమీ...మగపిల్లవాడయితేనేమీ... మొత్తానికి కన్నబిడ్డలే కదా... చిన్నచూపు ఎందుకు..? అని తమనితాము ప్రశ్నించుకుంటే బాగుంటుంది.

డాక్టర్ భారతిగారు రచించిన హస్బెండ్ స్టిచ్-1లోని కథలన్నీ కౌన్సిలర్ గా దగ్గరికి వచ్చే ఆడవాళ్ళ యొక్క మనోవ్యధని తెల్సుకొని వాళ్ల జీవితగాధలని కథారూపంలో తీసుకురావడానికి చాలా ధైర్యం చేశారు. రచయిత్రి పొందుపర్చిన కథలలో ఎవర్ని కదిలించినా...దు:ఖం పొంగి పొర్లుతుంది. జరిగిన సంఘటనలను విశదీకరించడానికి రచయిత్రిగారు అక్కడక్కడ వాడిన శ్రుతిమించిన అసభ్య పదజాలం కాకుండా కలాన్ని కదిపితే ఇలాంటి కథలు "మచ్చలేని చంద్రుని"గా పాఠకుల మనసులో బలంగా నిలిచి,సాహిత్యం పట్ల మరింత గౌరవం పెరిగేదేమో అనిపించింది.

ఆధునిక ప్రపంచంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు,దారుణాలు పత్రికలలో తరుచుగా చూస్తున్నాం. కానీ... ఈ కథలలో మాత్రం కట్టుకున్న భార్యను రేప్ చేయడం జరిగింది. ఇలాంటి దుర్ఘటన ఒక మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడమేగాక ఇంటిల్లిపాది కలిసి ఆ అమ్మాయిని మంచంపై తాళ్ళతో కట్టి తన భర్తతో రేప్ చేయించడం దుర్మార్గం. విషయం తెల్సికూడా తన తండ్రి బిడ్డని తిడుతుంటే భరిస్తున్న... ఆ నొప్పి కంటే కన్న తండ్రి మాటలే తనని సచ్చిన శవంలా మార్చాయి.

పేదరికంలో పుట్టడమే అనసూయ పాలిట శాపమైంది. హరిజనుల ఇంత పుట్టిన ఆ బిడ్డని ఇంటి అవసరాల నిమిత్తం అందరు కడుపునిండ బువ్వ తినడానికి కొడుకుని చదివించడానికి పెద్దమనిషి కూడా కాని పిల్లను "జోగి"ని చేయాలని ఆ తల్లిదండ్రులు చేసిన నీచమైన పని. నువ్వు దేవుని భార్యవని చెప్పి తల్లిదండ్రులు ఇంటిముందట కావలి ఉండి బిడ్డ దగ్గరికి ఊళ్ళో మగవాళ్ళని పంపించి పైసలు తీసుకునుడేమోగానీ ఆ తల్లిదండ్రులు ఆ పైసల్ని సూశి కళ్లలో కాంతులు నిండేవి. ఆబిడ్డ జీవితం అంధకారం అయ్యిందన్న సోయిలేదు. ఒక డబ్బు సంపాదించే యంత్రంలాగ చూడడం...తల్లిదండ్రులు చేసిన తప్పుకు అనసూయకి సుఖవ్యాధులు  అంటుకుంటే దగ్గరికి కూడా తియ్యలేదు ఏం మనుషులో ఏమో!

ఇలా చెప్పుకుంటూపోతే కన్నతండ్రి కూతుర్ని పదేండ్ల సంధి అనుభవిస్తూ...కడుపు వస్తే గర్భం పోవడానికి అరకొర మాత్రలు వేసి మరీ అనుభవించడం ఒకడు చేస్తే..,ఇంకొకడు ఏకంగా కూతుర్ని రేప్ చేసి ఒక బిడ్డను కన్నాడు. ఇప్పుడు నాబిడ్డ...నా తండ్రిని తాత అని పిలవాలా..,లేక నాన్న అని పిలవాలా...అని ఆ ఆడబిఢ్ఢ ఏడ్చిన తీరు వర్ణనారహితం.

స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలు జరగకుండ ఆపాలంటే మొదటగా మార్పు రావాల్సింది  భార్యాభర్తల బంధములో...భార్యతో భర్త ఎలా మసులుకోవాలి? ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలన్న సంగతులు తెలిసి ఉండాలి. స్త్రీలను కేవలం పిల్లలను కనే యంత్రంలా కాకుండా  స్త్రీకి మనం ఇవ్వగలిగే గౌరవం ఇస్తే చాలు. పుట్టిన పిల్లలను పెంచే క్రమంలో తల్లిదండ్రులు ప్రతీ విషయాన్ని పిల్లలలో అవగాహన కల్పించడమే కాకుండా వాళ్లని స్వేచ్ఛగా ఉండేలా చేసి తప్పుడుదార్లు తొక్కకుండా గమనిస్తూ ఎప్పటికప్పుడు వాళ్లకి తెలియకుండానే  స్త్రీలపై గౌరవం,సమాజం పట్ల అవగాహన వచ్చేలా తల్లిదండ్రులే చేయాలి. ముందుగా తల్లిదండ్రులు మారి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి.

భారతిగారు రాసిన కథలే కాకుండా ఈ సమాజంలో ఇంకెంతమంది ఆడబిఢ్ఢలు తమ తండ్రి,అన్న,బావ,బాబాయి,మామ,భర్త లాంటి క్రూర జంతువుల నోటికి ఆహారమవుతున్నారో తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది.

రచయితలుగానీ..,రచయిత్రులుగానీ... ఇలాంటి మరెన్నో కథలను సమాజంలోకి తీసుకురావాలి. అలాగే ఇలాంటి ఆకృత్యాలను ఆపగలిగేటువంటి కథలను తీసుకువస్తే అటు మగవాళ్ళలోమార్పు... ఇటు ఆడవాళ్ళలో కొంతవరకైనా... చైతన్యం కలిగించినవారవుతాము...

ఇలాంటి నిజ జీవిత  గాథలకు అక్షరరూపం ఇచ్చిన  డాక్టర్ భారతి గారికి కృతఙ్ఞతలు.

 

ఈ సంచికలో...                     

NOV 2020

ఇతర పత్రికలు