సాహిత్య వ్యాసాలు

సాహిత్య వ్యాసాలు

స్త్రీ హృదయావిష్కరణం!   పద్మావతి రాంభక్త కవిత్వం!!

ఇవాళ ఒక "కొత్త వేకువ"ను  చూశాను, ఉలిక్కి పడ్డాను.  కంపించాను, కలవరపడ్డాను...
కలలు లేవు, గుస గుస లాడే ఊహలు లేవు, పలవరించే అనుభూతులు లేవు
ఒక నిలువెత్తు దుఃఖపు జీర,ఎదురుపడినట్లు, ఉల్లిపొరలాంటి వేదన వెంటాడు తున్నట్లుగా కల్లోల మేఘం ఉరుముతున్నట్లయింది.

"పక్కనున్న పసివాడి రోదన
రోదసి నంటుతూ
నన్ను నిట్టనిలువునా చీల్చేస్తుంటే
అవేవీ పట్టని నువ్వు
నా మైదానం పై
నీకు నచ్చినట్టు సంచరిస్తావు

నీ ఎముకలుకొరికే చలిని
వెచ్చబరచుకునే కుంపటిని నేను
నీ సలసల మరిగే అగ్ని గుండాలను చల్లార్చుకునే సరస్సును నేను

నాలో ఎన్ని సునామీలు
ఎన్ని భూకంపాలు సంభవిస్తున్నాయో ఎప్పుడైనా చూశావా

నీకు నా దేహమొక క్రీడాస్థలం ఎప్పుడుపడితే అప్పుడు
నా ప్రమేయం ఏమీ లేకుండానేఅడుకొని
నువ్వు మాత్రమే గెలిచి
విజయగర్వంతో
నీ నుదుటన మెరిసే
చెమట చుక్కలను తుడుచుకుంటూ
తృప్తిగా ఠీవిగా నడిచి పోతావు

నేను నా విరిగిపడిన ముక్కలను
ఏరుకుంటూ
నా సలపరించే పచ్చి బాలింత అవయవాలను
పోగు చేసుకుంటూ
రహస్యంగా కన్నీళ్ళు తుడుచుకుంటాను

నువ్వు మాత్రం
నన్నొక అలను చేసి
ఆనందాలనావ పై విహరిస్తూ
నీ నీలి కలలను
సిగ్గులేకుండా సాకారం చేసుకుంటూనే ఉంటావు"
(కవిత..నీలికలలు పుట..43)

ఎవరిదీ నిర్భయ గళం?
ఎవరిదీ నిర్నిద్ర వేదనా స్వరం?
ఏ సగటు ఇల్లాలి పక్షాన ఈ ఆక్రోశం?
ఈ కవితాస్వరమే.. పద్మావతి రాంభక్తగారిది.
పోయినేడాది మా శిష్యత్రయం ఫోన్ చేసి మన 'రాధేయ దశాబ్ది కవితాపురస్కారానికి' ముగ్గురి కవితల్ని ఎంపిక చేశాం సర్,వారే అనిల్ డ్యానీ,పద్మావతి రాంభక్త,అఖిలాశ,. ఇందులోని పద్మావతే ..ఇవాళ నేను ప్రస్తావిస్తున్ననీలికలల కవయిత్రి.

కవితా విజేతలు ముగ్గురి కవితలు తెప్పించుకుని చదివాను.మంచి నిర్ణయమనిపించి ముగ్గుర్నీ ఫోన్ లో అభినందించాను.

తరతరాలుగా పితృస్వామ్య నీడలో పురుషాధిపత్య భావజాలం లో నలిగిపోతూ,రాజీపడుతూ,సర్దుకుపోయే
సగటు ఇల్లాలికి ఈ నీలికలలు  కవితరాయడానికి ధైర్యమే కాదు తెగువ కూడా కావాలి.ఆ నిర్భయ,నిర్నిద్ర ,ధైర్య
స్వరం.. పద్మావతి రాంభక్త ది కావడం   నాకు ఆశ్చర్యమనిపించినా,ఈ ధిక్కార స్వరాన్ని స్వాగతిస్తూ,మనసారా అభినందిస్తున్నాను.

అందుకే ఇవాళ ఒక కొత్త వేకువను,కొత్త చూపుతో ఒక కొత్త కవిత్వోదయం గా స్త్రీ కోణం లోంచీ దర్శిస్తున్నాను. కవయిత్రికి ఈ కొత్త చూపునిచ్చిన వారు - కొండేపూడి నిర్మల"లేబర్ రూమ్" కావచ్చు, విమల"వంటిల్లు" కావచ్చు,
మందరపు'సర్పపరిష్వంగం"కావచ్చు, పాటిబండ్ల రజని "అబార్షన్ స్టేట్మెంట్' కావచ్చు, జయప్రభ "పైటను తగిలెయ్యాలి" కావచ్చు..ఇలా ఒకరి స్ఫూర్తి మరొకరికి  ఆచరణ కాగలిగి నప్పుడే కవుల, భవిష్యత్ స్వప్నం సాకార మవుతుంది.

దాంపత్య బంధం అమలిన శృంగారం లో దగ్గరౌతుంది.ఆత్మీయ స్పర్శ కావాలి

"నీ స్పర్శ నన్ను సేద తీర్చాలి
నువ్వు నన్ను తాకగానే
నా మనసు గాలిలో దూదిపింజలా తేలిపోవాలి
స్పర్శ అంటే.చర్మంపై తేళ్ళూ,జెర్రులూ పాకినట్టు చీదరించేలా కాకుండా లోలోతుల్లోకి చొచ్చుకొనిపోయి హృదయవీణ సుతారంగా మీటాలి బ్రతుకు పోరు లోని బడలిక తగ్గిస్తూ అమలిన ప్రేమకు అద్భుత భాష్యం చెప్పాలి"
(పుట..33)

పసుపు తాడుతో జీవన బంధంపరిమళాన్ని అందించకపోతే,ఎన్నాళ్ళని
ఆశగా ఎదురు చూస్తుందిఏఇల్లాలైనా. తన బ్రతుకు మడిపై ఒక్క చినుకు పలకరింపు కైనా నోచుకోకపోతే ఆమె అతడికి శాశ్వతంగా దూరమై ఆమె ఒక అర్థం కాని కావ్యం లాగే మిగిలి పోతుందంటారు కవయిత్రి.

"ప్రతిరోజూ అతడి ముని వేళ్ళు
ఆమెపై గొంగళి లా పాకుతూ
చర్మలిపిని చదివి
లోపలి తడిని ఒక్కసారైనా తాక లేకపోయాయి
అతడి కనులలో
కాస్తంత కాంతిపుంజానికై
ఆమె ఆత్రంగా వెతికింది"
(పుట..36)

జీవితంలో ఏబాధాసందర్భం కళ్లబడినా నేను కన్నీటి కుండ నై నిలువెల్లా వణికి పోతానంటోంది కవయిత్రి.అమ్మప్రేమగా ఆర్ధ్రంగా తలుచుకుంటుంది .

" ప్రతీ సాయంత్రం
చిమ్నీ మసినంతా తన అందమైన చేతులతో తుడిచేసి
ఇంట్లోనే ఏదో ఒక చంద్రుడిని వెలిగించేది మా అమ్మ
వెన్నెలనంతా ముద్దచేసి నాకు ప్రేమగాగోరుముద్దలు తినిపించేది"
పుట..39

ఒక వర్షం కురిసిన రాత్రిలో తన  హృదయాన్ని తడుపుకుంటూ కలలు గంటుంది.ఒక సారైనా జ్వరమొస్తే బాగుండుననీ భావిస్తుంది.

"ఒకసారి జ్వరం వస్తే బాగుండును ఆకాశంలోంచి అమ్మ నడిచొచ్చి
తన చల్లని స్పర్శతో నా ఒళ్ళంతానిమిరితేబాగుండును
పనికి సెలవు పెట్టి మరీ శ్రీవారు
కళ్లలో ఒత్తులేసుకుని
నాకు సపర్యలు చేస్తే బాగుండును"
(పుట..52)

అమ్మకోసం, అమ్మలాంటి ప్రేమకోసం తపన పడ్తుంది కవయిత్రి.అతివల దేహాల ఒంపుసొంపుల్ని మాత్రమే చూడగలిగే పురుష పుంగవులకు  తీవ్రంగా వార్నింగ్ ఇస్తోంది.

'ఇకమీదట
మీ నుండి వెలువడే
మా బాడీ షేమింగుల దుర్గంధ పూరితమైన వ్యాఖ్యలకు
చరమగీతం పాడేలా
మరోమారు చెవిన బడితే
మీ నాలుకలను తెగ్గోసికాకులకు గద్దలకు ఆహారంగా వేస్తాం జాగ్రత్త,
(పుట..63)

ప్రతి ఇంట్లో కన్నీటికొలన్లు ఉంటాయని,  వాటిని దర్శించాలంటే మనమనసులకు కళ్ళుండాలి.అద్దె ఇల్లు లాంటి గర్భాన్ని మోస్తున్న సర్గసీ మదర్ ను మరో కుంతి తో పోలుస్తుంది.

"తన రక్తమాంసాలతో అభిషేకిస్తున్న పిండానికి అమ్మ కాని అమ్మ గా మారి నవమాసాలూమోస్తుందామె
మరో కుంతి కాకపోయినా ముఖమైనా చూడని పసి జీవాన్ని హృదయాన్ని చిక్కబట్టుకుని పరాయి చేతులలో పెట్టేస్తున్న ఇంతి ఆమె
తనను తానే క్షమించుకోలేక అంతులేనిబాధను మోస్తూ బతుకు కీడుస్తుంది"
(పుట..67)

మరోచోట గాయాల కథను వినిపిస్తుంది.
బెస్తవాళ్లను గురించి రాస్తూ..వారు నిత్యంసముద్రపు పొత్తిళ్లలో జన్మించి, పోరులో కెరటాల కత్తులతో యుద్ధం చేసేవారుగా వర్ణిస్తుంది.

నీకూ నాకూ మధ్య మొలిచిన నిలువెత్తు గోడను ధ్వంసం చేసి సమస్త మురికినీ, మాలిన్యాలనూ కడిగేసుకొని మనసారా కౌగలించుకొందాం రమ్మని సహచరుని కోరుతుంది. కన్నీటి ఉప్పదనాన్ని ఒక్కసారైనారుచిచూడకుండా బతుకు నదిని దాటడం సాధ్య మవుతుందా నీకైనా,నాకైనా,నా మనసేమైనా గొర్రెపిల్లా? గుంజకు కట్టేస్తే పారి పోకుండా ఉండడానికి ? అనిసూటిగా ప్రశ్నిస్తుంది

రంగువెలిసిన నేత కార్మికుల దైన్య జీవితాలను అక్షర బద్దం చేస్తుంది.  ఆకలిని ఆత్రంగా వెతుక్కుంటూ రోజంతా నిలబడి,నిలబడి తన బతుకులోకి ఆశగా తొంగి చూసుకొంటున్న సేల్స్ గర్ల్స్ ను పరామర్శిస్తుంది.

మాతృత్వపు అదృష్టం కోసం ,కొత్తజన్మ కోసం నరాలు చిట్లే నరక యాతనను భరించే స్త్రీ మూర్తిని ప్రశంసిస్తుంది. కొండేపూడి నిర్మల గారి లేబర్ రూమ్ ను తలపించే వేదన ఈ కవిత.

"కత్తుల నదిపై పయనించి
కన్నీళ్ళ నదిని ఈదుతూ
నరాలు చిట్లేయాతనను ఓర్వక తప్పదు
కొన్ని నిమిషాలలో సునాయాసంగానో ఎన్నో గంటల పోరాటంతోనో, యమలోకపు ద్వారాన్ని తాకినంత పనై, వెనుదిరిగాకో
కోరుకున్నంత కొండంత ఫలం
నీ ఒడిలో చేరొచ్చు
మాతృత్వపు కిరీటాన్ని ధరించి అమ్మగా పువ్వులాంటిపాపాయిని చూసి మురిసి పరిపూర్ణమైన స్త్రీ మూర్తిగా నీ జన్మకు ధన్యవాదాలు సాధించవచ్చు"  ( పుట.. 144).

ఇలా కవయిత్రి పద్మావతి రాంభక్త గారి కలందర్శించిన కొత్త వేకువలో ఎక్కువ కవితలు స్త్రీ పక్షపాతాన్నే వహించాయి.
మిగిలిన కవితలు కూడా మానవీయ కోణం లోంచే మాట్లాడినై.

స్త్రీ పక్షాన మాట్లాడిన కవిత్వమంతా ధైర్యం కంటేదీనత్వం లోంచే పలికింది,
ఆగ్రహం కంటే ఆవేదనగానే పలికింది,
కరడు గట్టిన పితృస్వామ్య,పురుషాధిక్య
సమాజం లో మార్పుకోసం,పాలక పక్షం
కళ్ళు తెరిపించాలంటేధిక్కార స్వరం పలకాలి.
రాబోయే రోజుల్లో ఈ స్వరం మరింత బలపడుతుంది.తాను కలలు గనే స్త్రీ స్వేచ్ఛకు పునరంకితం కాగలదని నా విశ్వాసం.

తొలి ప్రయత్నంలోనే సామాజికంగా ,స్త్రీ మనోభావాలను సూటిగా,స్పష్టంగా "కొత్త వేకువ"గా ఆవిష్కరించిన నవ కవయిత్రి  పద్మావతి రాంభక్తఅభినందిస్తూ,2019 లోనే తన కవితకు 'రాధేయ కవితా పురస్కారం' అందుకొని,మా కుటుంబ ఆడపడుచు గా గౌరవం అందుకున్న ఈ కవయిత్రిని మరో సారి మనః పూర్వకంగా అభినందిస్తున్నాను.కొత్త వేకువ ను మనసారా స్వాగతిస్తున్నాను.
 

సాహిత్య వ్యాసాలు

హృదయ సంభాషణ

కవి కంటికి మనసుకు జరిగిన సహజమైన సంభాషణే ఈ"దృశ్యం నుండి దృశ్యానికి" కవిత్వం. ఇందులో 46 కవితలున్నయి.ఇవి ఒక వర్గానికో,కులానికో ఏదో ఒక దానికో మాత్రమే పరిమితమై రాసినవి కావు.విశాలమైన భావనల అనుభూతి.ఇందులో ప్రధానంగా కాలానికి మనిషికి మధ్య జరిగిన ఘర్షణ,మనిషితత్వం-జీవితం,ప్రకృతి,స్త్రీ సమస్య,సామాజిక అంశాలు,ప్రకృతి విపత్తులు వంటివి ఉన్నయి.ఇవి ఏక కాలంలో,ఒక ప్రాంతంలో నిలకడగా కూర్చొని రాసినవి కావని అనిపిస్తుంది.అందుకే కవితలన్నీ ఆకట్టుకునే విధంగా ఆలోచింపజేసే విధంగా ఉన్నయి.కవి మనసుతో చూసిన దృశ్యాలను కళ్లకు కట్టినట్టుగా అక్షర రూపంలో చూపిస్తడు.చాలా కవితల్లో చివరి వాక్యం పూర్తి కవితను ఆవిష్కరించేవిధంగా ఉంటది.నాకైతే భిన్నమైన కవిత్వంగా భావిస్తున్న.ఇందులోని కొన్ని దృశ్యాలను మీ ముందుంచడానికి చిన్న ప్రయత్నం చేస్తున్న.

 ఈ కవిత్వం రాసింది వి ఆర్ విద్యార్థి.తెలుగు సాహిత్యానికి సుపరిచితులు.రిటైరయ్యాక కూడా సాహిత్యం పై తనకున్న శ్రద్ధతో దీన్ని మన ముందు ఆవిష్కరించాడు.నేర్చుకునే వాళ్లకు ఉపయోగపడే విధంగా మలిచాడు.

 "ఒక మహా విస్పోటనమే కదా

 నీకు నాకు జన్మనిచ్చింది"

 అంటూ ఒక బలమైన వాస్తవాన్ని చెబుతూ కాలానికి మనిషికి అనునిత్యం జరిగే ఘర్షణ గుర్తు చేస్తూ...

"హిమాలయం శ్వేత కమలమై

 భూగోళమంత వికసించాలి

సింధు జలది ధరణి చుట్టూ

శాంతి వలయాలుగా విస్తరించాలి"

 అంటూ స్వచ్ఛమైన కలగంటాడు.ఉగ్రవాదం,హింసమత్తు ఎప్పుడు అంతరిస్తాయోనని కాలాన్ని ప్రశ్నిస్తాడు."ఇప్పుడు" అనే మరో కవితలో తనే సమాధానంగా ఈ మాట చెప్తాడు 

"ఇక ఇప్పుడు మనం

యుద్ధాన్ని ప్రకటించాల్సింది

దేశాల సరిహద్దుల మధ్య కాదు

మనిషి ఉన్మాదపు ఆలోచనల మీద"

 అంటూ మనిషి ఆలోచనలు క్రూరంగా మారాయని,2021 వచ్చినా మనిషి ఇంకా కులం,మతం,లింగం,ప్రాంతం,వంటి వివక్షల పేర్చుతూనే ఉన్నాడని,అలాంటి అజ్ఞానాన్ని విషంలా ఎక్కించే ప్రగతి నిరోధక శక్తుల ఆలోచనలపై యుద్దం తప్పదని చెప్తాడు. 

 ఇంకా మనిషి దిగజారిన విధానాన్ని  చెప్తూ 

"ఏకంగా తనే దేవుళ్లను సృష్టించి

తన రుగ్మతలన్నీ నింపి

రాజ్యం చేయడం మొదలుపెట్టాడు

దేవుళ్ళయితే అడుగడుగునా వున్నారు

మనిషే కనిపించకుండా పోయాడు"

ఈమాట  నిజం కాదని అనగలమా?.దేవుళ్ళ పేర జరిగే మూఢనమ్మకాలు ఆఖరికి మనిషి ఉనికినే లేకుండా చేస్తాయనేది ఈ కవితలో చెప్తాడు.

ఇంతలో కవి హృదయం మరో ప్రపంచాన్ని కాంక్షిస్తుంది.

"కులం లేదు మతం లేదు

జాతి లేదు జాతీయత లేదు

కృత్రిమ సరిహద్దులెన్నో

అధిగమిస్తాం

దేశికుల మాటలన్నీ 

డొల్లలు

వొస్తావా

నేనొక ప్రపంచాన్ని కనుగొన్నాను" అంటూ మరో ప్రపంచంలోకి మనిషిని ఆహ్వానిస్తాడు.

ఇంకా ఇందులో కొందరు వ్యక్తుల్నికొన్ని సంఘటనల్ని యాది చేసుకుంటాడు.అవి తన హృదయాన్ని ఎంతగా కదిలించాయో రాసుకుంటాడు. రాజస్థాన్ కార్మికుడు,హిందుస్తానీ గాయకుడు "సికిందర్"ను తన ప్రతిబింబంగా "అద్దం"అనే కవితలో ప్రేమతో రాస్తాడు.కళల బాకీ తీర్చడం కోసం ఇద్దరు ఎంత వేదన పడ్డారో చెప్తూ

"ఐనా చివరి బాకీ తీరదు

కాలం మన విషయంలో

తేల్చాల్సింది చాలా ఉంది

పద మలుపు మలుపులో నిలదీద్దాం"

అంటాడు.

 సుప్రసిద్ధ చలన చిత్ర దర్శకులుకవి బి నరసింగరావు గారికి అభివాదములతో ముచ్చటిస్తూ తనలోని సాహితీ ప్రయాణపు వేదనని తనముందు పరిచినప్పుడు అదంతా ఓపిగ్గా విని నర్సింగరావు గారు నవ్విన నవ్వు గురించి రాస్తూ...

"అది నా లోకాల్ని కంపింప జేసింది

 నా చుట్టూ నిర్మించుకున్న

 అభిప్రాయాల కుడ్యాల్ని కూల్చివేసింది

విశ్వాసాల సంకెళ్లను రాలగొట్టింది"

 అని నర్సింగరావు గారి చేత మళ్ళి కోత్తగా ప్రేరేపించబడతాడు. 

 సమ్మక్క సారక్కల అమరత్వాన్ని స్మరించుకుంటూ ఆదివాసుల పై జరిగే దాడిని చెప్తూ

"నీతి నిత్యం పరిమళించే గిరిజాతులు

బతుకు లోకానికి చక్రవర్తులు

ఓర్వగలదా దళారి లోకం!

మతపు మాయ మెరుపుల బేహార్లుగానో

పురందుల దండమయ్యో

దండెత్తి వొస్తుంది

ఓనరులన్నీ కబళించి వేస్తుంది

 అంటూ శతాబ్దాలనుండి ఆదివాసీ ప్రజలపై జరుగుతున్న హింసాకాండను,ప్రకృతి విద్వాంసాన్ని,దళారి పెట్టుబడి దారుల కుట్రలను బట్టబయలు చేస్తాడు. 

అనాది నుండి ప్రపంచమంతా విశాల మనసున్న పల్లెలు, మనుషుల అన్ని అవసరాలు తీర్చేవి.కానీ ప్రపంచీకరణ వచ్చి పల్లెలనెట్లా వల్లకాడులా మార్చాయో చెప్తూ 

"ఇప్పుడు చూడు ప్రపంచీకరణ

గ్రామాల్ని ఎలా ఒంటరితనంలోకి నెట్టిందో!

ఎలా ఎడారుల్ని చేసిందో

చిన్నబోయిన గ్రామాలకు

తిరిగి చిరునవ్వు లెప్పుడో?

పూర్వవైభవాలెప్పుడో?" అని వలపోస్తాడు.

 హుద్ హుద్ తుఫాన్ విపత్తు ధాటికి బలైన వారిని తలచుకొని విలపిస్తాడు.తుఫాన్ ఉత్తరాంధ్రకు చేరిందని వార్త వినగానే విశాఖపట్నం గుర్తుకొచ్చి

"నిరంతరం కలల అలలతో రెపరెపలాడే ఆ తీరం

ఎలా గాయపడింది...

విశాఖ ఆత్మ ఎంత ఘోషిందో

కృష్ణక్కా ఎలా ఉన్నావు?

చలసాని క్షేమమేనా

మాస్టారు మంచేనా

ఏమైనా ఇది చేదు కాలం...

ఓదార్చలేనంత దూరంగా వున్నాను"

 అంటూ అమెరికా నుండి రాలేని,ఓదార్చలేని నిస్సహాయతను అక్షరరూపంలో రాసుకుంటాడు.

మహిళా సమస్యపై మాట్లాడుతూ....

"ఆడది చెడిపోయినప్పుడు

తోడుగా చెడింది చెట్టా పుట్టా?

మగవాడికి లేని శీలము

ఆడవాళ్ళకే అవసరమేమిటో"

 అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,హత్యలు నిరసిస్తూ పితృస్వామ్య భావజాలం ఉన్న మనుషులకు సూటి పదునైన ప్రశ్న వేస్తాడు.

 మరో కవితలో కామందుల క్రూరత్వాన్ని చెప్తూ

నిర్భయ చట్టం ముందుగూడా

వాడు నిర్భయంగా గంతులేస్తాడు

 పైశాచికంగా ప్రవర్తిస్తాడు"

అంటూ ఉన్మాది స్వరూపాన్ని చెప్తూ

 ఆడపిల్లలకు ఏడవకండి,మీలో అంతులేని పోరాట శక్తి ఉందని

"ధైర్యమే మీ కవచం

తిరుగుబాటు మీ ఆయుధం"

అని ధైర్యాన్ని చెప్తాడు.

చివరగా సాహితీ ప్రపంచానికి వద్దాం.నా ఇంట్లో గ్రంధాలయముంది,మెదట్లో అంతులేని జ్ఞానముంది,నా ఉపన్యాసాల్లో చాతుర్యముందని భ్రమపడే "అజ్ఞాన సామ్రాట్టు" గురించి చెప్తు

"చర్చలకు పిలిచిన నీలి సరస్సులోని

తెల్ల హంసల్ని

పూల తోటలోని గొంగలిపురుగుల్ని

ఆకాశంలో ఎగిరే పక్షుల గుంపుల్ని

ఎప్పుడూ పట్టించుకోను" అని ఆ అజ్ఞాన సామ్రాట్టు అనుకుంటాడని, 

ఇంకా తను అహంకారంతో

"గంగాజలం గూడా

నా శంఖంలో పోస్తేనే

అది తీర్థమవుతుంది

ఏ జెండా ఎగరాలన్నా

నా పెరట్లో పెరిగిన

గడకర్రయే మూలాధారం"

అని విర్రవీగుతాడు.

 కానీ ఇప్పుడు కావల్సింది నిజమైన ప్రజాకవని.అతనెలా ఉంటాడంటే ఒక వర్గానికి మాత్రమే చెందకుండా,ప్రలోభాలకు లొంగకుండా ఉంటూ

"దేశాలు చీలినా

 ఎల్లలన్నీ చెదిరినా

 ప్రభుత్వాలు కూలినా

విధానాలు మారినా

జనం వెంట నడిచేవాడు

ప్రజా గళమై పలికేవాడు

ప్రజల చరిత్ర నిక్షిప్తం చేసేవాడు

అతడే సుమీ! ప్రజాకవి"

 

అంటూ ప్రజాకవికి నిజమైన నిర్వచనాన్ని చెప్తాడు.అది అందరూ ఆచరించాలని చెప్తూనే "నువ్వు నువ్వుగా రాయి" అంటూ ముందు తరపు భాద్యునిగా నేటితరానికి మార్గదర్శకం చేస్తాడు.

"నువ్వు దిగివచ్చిన లోకాల్ని రాయి

 నీ వెంట తెచ్చిన అనుభూతుల్ని రాయి

మా అజ్ఞానపు అంధకారాన్ని తెంపు

మా ఎదల పాచుట్టు దులుపు

మా హృదయాల్లో నవ వసంతాల్ని చిలుకు"

అంటూ నేటి తరాన్ని మీకు చేతనైనంత వరకు ప్రగతిశీల భావంతో చరిత్రను,మమ్మల్ని కూడా నడిపించండి, మీ అనంతరం మరో తరం  ఆ బాధ్యతను తన భుజాలకి ఎత్తుకుంటది అని చెప్తాడు.

విశాలమైన అంశాల పట్ల విశాల దృక్పథంతో ఉన్న కవిత్వమిది.ఈ కవితలు చదువుతుంటే దృశ్యాలు కండ్ల ముందటే తిరుగుతుంటాయి.అదే ఈ కవిత్వం గొప్పతనం.అదే కవి ఊహ శక్తి. కవి అనే వాళ్లు ఎంతగా ఆలోచించవచ్చో,ఎంతగా ఆలోచించగలరో "దృశ్యం నుండి దృశ్యానికి" చెప్తుంది.వి ఆర్ విద్యార్థి గారు ఇంకా "విద్యార్థి"నే అని మన తరానికి ఈ పుస్తకం ద్వారా సంకేతమిచ్చాడని అనిపిస్తుంది.

 

 

                                                                                                                   

సాహిత్య వ్యాసాలు

భారతీయ సాహిత్యంలో సృష్టి పరిణామవాదం

          క్రీ.పూ. 1500లోని రుగ్వేదంలో 164వ సూక్తంలోని కవితల్లో దివి, పృథ్వి ఎవరు ముందుపుట్టారు? ఎవరు తరువాత పుట్టారు? పృథ్వి నుంచి ప్రాణం ఎలాపుట్టింది? ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమికి అంతం ఎక్కడ? లోకాలు ఎక్కడ నుంచి వచ్చాయి? అన్న ప్రశ్నలు ప్రాచీన మానవుడు వేసుకున్చాడు. ఆనాటికి విజ్ఞానం వికసించని దశలో సమాధానంగా అంతా దేవుడే అన్న విశ్వాసంలోకి వెళ్ళిపోయినాడు.

      భారతదేశంలో క్రీ.పూ. 1000-600 మధ్య కాలంలో వచ్చిన ఉపనిషత్తులలో బృహదారణ్య కోపనిషత్ సృష్టి ఎలా జరిగిందనే విషయంపై పెద్దగా చర్చ చేశారు. ఈ ఉపనిషత్తులో (1-2-2)లో విశ్వమంతా శూన్యంగా ఉండేదని అందులో జీవరహితమైన ఆకలి మృత్యు రూపంలో ఉండేదని చెప్పారు. ఆకలి శరీరం కావాలనుకొంది. దాంతో బ్రహ్మ నీటిని సృష్టించాడు. దాని నుండి నేలను సృష్టించాడు. బ్రహ్మ తేజస్సు (వీర్యం)అగ్నిగా మారిపోయింది. ఇందులో మొదటి భౌతిక పదార్థం నీరుగా చెప్పినారు. వీరి ప్రకారం సృష్టికి మూలం నీరే.

     ప్రకృతిలోని భౌతిక పదార్థం, దానిలోని జీవం కలయిక వల్లే జీవం ఏర్పడుతోందని ప్రశ్నోపనిషత్  (క్రీ.పూ. 500-400) చెపుతుంది. ఇలా కొన్ని ఉపనిషత్తుల్లో దార్శనికులు కొద్దిపాటి భౌతికవాద దృష్టితో చెప్పినారు.

            ప్రాచీన సాహిత్యంలో సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రకృతి విషయాలను ప్రపంచ విషయాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ప్రారంభదశ అని భావించారు. దీన్నే ప్రత్యక్ష ప్రమాణం అన్నారు.ప్రత్యక్ష పరిశీలన ద్వారా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వస్తువు గురించి కొంత జ్ఞానంఏర్పడుతుంది. ఏ కారణం ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు సూత్రీకరణ చేయమన్నారు. దీన్నే అసమాన ప్రమాణంఅని అన్నారు. ఈ సూత్రీకరణలు వాటంతటవే సత్యాలు కాజాలవు. వీటిని ఆచరణలో చూసి రుజువైతే సత్యంగా అంగీకరించమని చెప్పినారు. ఇది నేటి పరిశీలన, విశ్లేషణ, ప్రయోగం, సూత్రీకరణ పద్ధతులను పోలి ఉంది.  చరకుడు, అసితకేశ కంబరుడు, కణాదుడు మొదలైన భౌతికవాదులు మత గ్రంధాలలో  చెప్పిన వాటికన్నా భిన్నమైన అభిప్రాయాలు చెప్పినారు. ప్రధానంగా అవి;

1.       భూమి, నీరు, అగ్న్ని ఆకాశం, గాలి కలయికతో (పంచభూతాలతో) ప్రకృతి ఏర్పడింది.

2.       ఈ పదార్థాల విభిన్న కలయికల వల్లే ప్రకృతిలోని విభిన్న వస్తు జాలం ఏర్పడింది.

నిర్దీవదశనుండి సజీవదశకు, సజీవదశనుండి నిర్దీవదశకు నిరంతరం రూపాంతరం చెందుతాయి. ఇది నేటి వస్తు నిత్యత్వ సూత్రాన్ని పోలివుంది.

3.       నిరంతరం మార్పు చెందే లక్షణం వాటిసహజ లక్షణం. నిప్పువేడిగా, నీరుచల్లగా  ఎట్లానో అట్లా మార్పుకూడా.

4.       ప్రకృతిలోని పంచభూతాలలో మనిషి తయారుచేయబడినాడు. దీనిని రసోత్పత్తి అన్నారు.రసమంటే నిరంతర చలనం అని అర్థం. అగ్ని వలన ఆహారం రస గా మారుతుంది. ఈ రస మరల రక్తం, మాంసం, కొవ్వు, మూలుగ, ఎముక, నీరులాగా మారుతుంది.

బుద్ధుడు (క్రీ.పూ. 563–483) ఒక పదార్థం వేరొక పదార్థంగా మారుతుందేగాని ఎన్నటికీ ధ్వంసం కాదని చెప్పాడు. మార్పునకు లోనుకానిదేదీ లేదు. ప్రపంచమంతా చలసశీలమైనది. మార్పు ప్రపంచ అస్థిత్వానికి మూలసూత్రమని చెప్పాడు. గ్రీసు దేశపు ' హెరాక్లిటస్' కూడా ఇదే సూత్రాన్ని చెప్పినాడు. 

  ‌‌     క్షణక్షణం మనం చూసే ప్రపంచం కొత్తదని బుద్ధుని భావన. ప్రపంచం గతిశీలమైనదని (మార్పుకు లోనవుతుందని) చెప్పిన బుద్ధుడు పరిణామవాదాన్ని అంగీకరించాడు.కార్యాకారణ సంబంధ సూత్రాన్ని ప్రతిపాదించాడు.

   పూర్తిగా భౌతిక వాదంతో చెప్పినాడు అసితకేశకంబరుడు. ఇతను బుద్ధునికి (క్రీ.పూ. 500) సమకాలికుడు. ఇతను జీవం అనేది నీరు, నిప్పు, గాలి, మట్టి కలయికతో ఏర్పడిందన్చాడు. ఒకజీవి మరణిస్తే ఆజీవిలోని నీరు నీటిలో, గాలి గాలిలో నిప్పు నిప్పులో మట్టి నేలలో కలిసిపోతుందన్నాడు. స్వర్గం, నరకం, దేవతలు అంటూఏమీలేవు. ఉన్నవి ఈనాలుగే అని అన్నాడు.

            ప్రకృతి కాత్యాయనుడు బుద్ధుని సమకాలికుడు. ఇతని ప్రకారం ప్రకృతి  అచంచలమైనదీ,  నిత్యమైనది. ప్రకృతిని ఎవరూ సృష్టించలేదు, ఎవరిచేతా నిర్మింపబడలేదు, అది స్వయం సిద్ధంఅని చెప్పినాడు. ప్రకృతి 7 తత్వాలుగా ఉందన్నాడు. పృథ్వీతత్వం, జంతు తత్వం, వాయుతత్త్వం, సుఖం, దు:ఖం, జీవితం. ఇవి ఒకదానికొకటి కారణం కావు. పరస్పరం హాని చేసుకోవు. నీరు నిప్పు, గాలి నేలతోపాటు సుఖం, దుఃఖం, చైతన్యంల కలయికతో జీవం పుట్టిందన్నాడితను.

   క్రీ.పూ. 400లో కపిలుడు సాంఖ్య దర్శనాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన ప్రకారం ప్రకృతి ముందువుంది. ఇప్పుడూ ఉంది. భవిష్యత్తులో ఉంటుంది. అది నిత్యమైనది. ఈ సృష్టంతా దాని రూపాంతరాలేనన్నాడు.  నీరూ, గాలి, నిప్పు, నేల - ఈ నాలుగు అంశాలతో జీవం (చైతన్యం) పుడుతుందని చెప్పారు చార్వాకులు.

కొంత మంది అభిప్రాయంలో క్రీ. శ. 150లో కణాదుడనే రుషి పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతను వైశేషిక దర్శనానికి కర్త. ఇది షడ్దర్శనాలలో ఒకటి. ఇతని సిద్ధాంతం ప్రకారం ప్రతిపదార్థం పరమాణువులనే చిన్న చిన్న కణాలతో నిర్మితమైంది. సృష్టికర్తను ఆమోదించలేదు. సృష్టి నిర్మాణానికి పరమాణువుల్లో చలనం అవసరమన్నాడు. కణాదుడు వైశేషిక దర్శనంలో ప్రతిపదార్థం పరమాణువు అనే చిన్న చిన్న కణాలతో నిర్మితమైనదన్నాడు. పరమాణువులో చలనం ఉంటుందన్నాడు. ఇదే సృష్టికి మూలం అన్నాడు. అణువుల సంయోగవియోగాల వల్ల పదార్థాలు ఏర్పడుతున్నాయన్నాడు. ఇవి నేడు కనుగొన్న అనేక సైన్సు సత్యాలకు దగ్గరగా ఉన్నాయి. ప్రతి పదార్థంలో పరమాణువు ఉంటుంది.పరమాణువులో న్యూక్లియస్‌ ఉంటుంది. న్యూక్లియస్‌ వెలుపల ఎలక్ట్రాన్లు చలిస్తుంటాయి. న్యూక్లియస్‌ లోపల ప్రొటాన్లు, న్యూట్రాన్లు చలిస్తుంటాయి. ప్రతి అణువు పరమాణువుల ద్వారా ఏర్పడి ఉంటుంది. అణువుల కలయికల వలనే పదార్థాలు ఏర్పడుతున్నాయి.

      అణువుల సంయోగ వియోగాలవల్లే పదార్థాలు రూపొందుతాయన్నది కణాదుడి దృఢమైన అభిప్రాయం. ఇలా సాగిన భారతీయ భౌతికవాదం శంకరుని మాయావాదంతో మళ్లీ భావవాదంలోకి కూరుకుపోయింది. భగవద్గీతతో అది పరాకాష్టకు పోయి తిరిగి లేవలేనంతగా చతికిలపడిపోయింది. భారతీయ విజ్ఞానాన్ని అంధకారం అలుముకుంది. ఇదంతా మాకెప్పుడో తెలుసు, అన్ని వేదాల్లోనే ఉన్నాయంటూ నైరాశ్యంతో మాటలు వల్లించే అజ్ఞానులుగా మతఛాందసవాదం తయారుచేసింది భారతీయులను.

        బుద్ధుని కాలంలోనే పాయసి అనే రాజు ఇహ పరలోకాలు లేవన్నాడు.  చనిపోయినవారు తిరిగిపుట్టరు. ఇంతవరకు చచ్చిన వాడెవుడూ తిరిగి వచ్చి పరలోకముందని చెప్పలేదు. ధర్మాత్ములు, ఆస్తికులు (దేవుని నమ్మేవారు) చావంటే భయపడుతున్నారు. నిజంగా మోక్షం ఉన్నదని నమ్మితే చావంటే వారికి భయమెందుకు? చనిపోయిన శరీరాలనుండి ఆత్మ వెళ్ళినట్లు గుర్తు ఎక్కడుంది?అని ప్రశ్నించాడు.

     చార్వాకులు, లోకాయతులు కూడా సృష్టి పరిణామాన్ని చెప్పినారు. వాక్చాతుర్యం గలవారిని చార్వాకులు అన్నారు. లోకమంతా విస్తరించినవారిని లోకాయతులు అన్నారు. వీరి ప్రకారం ఈ ప్రపంచం నిత్యం, సత్యం. ఈ ప్రపంచాన్ని గాని మానవున్ని గాని ఎవరూ సృష్టించలేదు. ప్రపంచం తనకు తానుగా ఆవిర్భవించింది.

        జ్ఞానం పొందాలటే ఆచరణలో చూడాలన్నారు. ఆత్మ ప్రబోధం, అంతర్‌ దృష్టి వలన జ్ఞానం రాదన్నారు. అగ్ని, నీరు, భూమి, గాలి పదార్థానికి మూలం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అచేతన పదార్ధాలకు చెతన్యం వస్తుంది. ఆత్మ చైతన్యంతో ఉంటుంది. అది శరీరాన్ని విడిచి బయట విడిగా ఉండలేదు. మనిషి మరణిచగానే శరీరం, ఆత్మ రెండూ నశిస్తాయని చెప్పినారు. ఇది నేడు ప్రాణం   ఎలా ఆవిర్భవించిందో చెప్పే దానికి దగ్గరగా ఉంది. నీటిలో కొన్ని వాయువులు ప్రత్యేక పరిస్థితుల్లోకలిసినపుడు ప్రోటోప్లాజం ఏర్పడి ప్రాణం వచ్చిందని నేడు సైన్సు చెపుతోంది.

      సృష్టిని గురించి ప్రాచీన సాహిత్యంలో రెండు రకాలు వాదనలు సాగినాయి. పై వాదనలు  ప్రజాసామాన్యంలో ప్రచారంలో చాలా తక్కువగా ఉన్నాయి. కానీ పైవాదనలకు భిన్నంగా ఉన్నవన్నీ మత సాహిత్యంలో భాగంగా ఉండి పోయినాయి. మొట్టమొదటగా హిందూ మతంలో ఉన్న భావనలు పరిశీలిద్దాం.

      హిందూమతం  ప్రకారం ప్రారంభంలో విశ్వం ఓంకారం నుంచి జనించిందన్నారు. ఓంకారం నుంచి ఆదిశక్తి పుట్టిందన్నారు. ఆదిశక్తి నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వచ్చారు. బ్రహ్మ సృష్టికర్త పాత్రను, విష్ణువు పాలననూ మహేశ్వరుడు లయకారకుని పాత్రను తీసుకున్నారన్నారు.బ్రహ్మ తన ముఖం నుంచి బ్రాహ్మణులనుభుజాల  నుండి క్షత్రియులను, తొడలనుండి వైశ్యులను, పాదాల నుండి శూద్రులను సృష్టించినట్లు చెప్పినారు. చండాలుర గురించి, గిరిజనుల గురించి ఎక్కడా చెప్పలేదు.

     బ్రహ్మఆకాశాన్ని సృష్టించాడు. దాని నుండి జలం, జలం నుండి అగ్ని దాని నుండి వాయువు పుట్టించినాడు.  అగ్ని వాయువుల కలయికతో భూమి ఏర్పడింది. ఈ విషయాన్నే శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు.

బైబిల్‌ ప్రకారం దేవుడు ఒకరోజు ఆకాశాన్ని, మరోరోజు భూమిని, ఇలా సముద్రాన్ని, వృక్షాలను, జంతువులను చివరిగా ఆడమ్‌, ఈవ్‌లను సృష్టించాడు. వారిని ఒక ఆపిల్‌ పండు తినొద్దని చెప్పినాడు. కానీ వారు దేవుడు పంపిన దేవదూతల్లో ధిక్కార స్వరం వినిపించిన ఒకదేవదూత(దయ్యం) ఆ ఆపిల్‌ను తినమని చెపుతుంది. ఆడమ్‌, ఈవ్‌లు ఆపిల్‌ తినడంతో జ్ఞానం కలుగుతుంది.తాము దిగంబరులమని తెలుసుకుంటారు. వారి మధ్య సెక్సు కోరికలు ఏర్పడతాయి. వారికలయికతోమానవులు పుట్టుకొచ్చారు. ఇలా సృష్టి జరిగిందని క్రైస్తవ మతం చెపుతుంది.

ఇస్లాం మత (గ్రంథం ఖురాన్‌ (ప్రకారం సృష్టినంతా ఇల్లాహ్‌ ఎనిమిది రోజులలో చేశాడు.ఆకాశాన్ని, భూమిని, తన రాజ్యపీఠాన్ని సృష్టించాక సూర్యున్ని, చంద్రున్ని నక్షత్రాలను సృష్టించాడు.తరువాత మానవున్ని మట్టితో తయారుచేసి అతనిలో ఇల్లాహ్‌ తన ఆత్మను ఊదాడని రాసినారు.   ఆ మానవుని పక్కటెముక నుంచి ఒక స్త్రీని తయారుచేసి ఆమెకు కూడా తన ఆత్మను ఊదినాడు. ఇలా స్త్రీ పురుషులను దేవుడు సృష్టించాడని ఖురాన్‌ చెపుతుంది.

          క్రీ.శ. 1440లో యూరప్ సమాజం సాంస్కృతిక పునరుజ్జీవనం పొంది చీకట్లను తెంచుకొని విజ్ఞానపు వెలుగులోకి దౌడుతీస్తే భారతదేశం  మాత్రం  ఛాందసవాదపు చీకట్లలోనే ఉండిపోయింది.

       డార్విన్  ప్రకృతిని విపరీతంగా పరిశీలించి, శోధించి చివరకు జీవజాతుల పుట్టుక (ఆరిజన్‌ ఆఫ్‌స్పీషీస్‌)ను ప్రపంచానికి అందించాడు. సృష్టికి సంబంధించిన అన్ని సిద్ధాంతాలను తోసేసి అదికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఆ తరువాత జరిగిన అనేక పరిశోధనలు ఆయన  సిద్ధాంతాన్ని నిరూపించాయి.  ఇప్పుడు అందరూ ఆమోదిస్తున్న  పరిణామ వాదం ప్రకారం ప్రకృతిలో ఉన్న కార్బన్‌, హైడ్రోజన్‌, ప్రాణవాయువు(ఆక్సిజన్‌), నైటోజన్‌ ఇవి అనేక విధాలుగాకలియడం వల్ల సేంద్రీయ పదార్థాలు వాతావరణంలో ఏర్పడి, అవి వానలతో పాటూ కలిసిసముద్రంలో చేరివుంటాయి. ఆ సేంద్రీయ పదార్థాలు తిరిగి అనేక విధాలుగా కలవడం వల్ల  సంకీర్ణమైన కొత్త పదార్థాలు ఏర్పడినాయి. అలా ఏర్పడిన క్రమంలో ఆల్టిహైడ్స్‌, కీటోన్స్‌, ఎమైనోయాసిడ్స్‌ మొదలైనవి ఏర్పడినాయి. జీవానికి కావలసిన ఎమైనోయాసిడ్లు (ప్రోటీన్లు) ఏర్పడటం తద్వార ప్రాథమిక జీవలక్షణాలను ప్రదర్శించే కణాలు ఏర్పడటం జరిగింది. 1924లో రష్యాకు చెందిన శాస్త్రవేత్త 'ఒపారిన్', 1929లో ఇంగ్లాండుకు చెందిన శాస్త్రవేత్త హాల్డెన్ 'లు  నిర్జీవ పదార్థం నుంచే జీవం ఆవిర్భ వించిందనే దానికి బలమైన ఆధారాలు కనుగొన్నారు. దానితో దీన్నే ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రసమ్మతంగాఆమోదిస్తున్నారు. 1995లో బైబిల్ చెప్పింది మాత్రమే నమ్మేమ పోప్ జాన్ పాల్ (వాటికన్ సిటీ)పదార్థం నుంచే జీవం వచ్చిందని, భగవంతుని సృష్టికాదనే వాదనతో ఏకీభవిస్తున్నట్లు ప్రకటించాడు కూడా.

         జీవానికి ప్రోటీన్ల వలెనే న్యూక్లియోటైడ్స్‌ కూడాచాలాఅవసరం. న్యూక్లియోటైడ్స్ రకరకాలుగా  చేరడం వల్ల డి.ఎన్‌.ఎ, ఆర్‌.ఎన్‌.ఎ మాలిక్యూల్స్‌ఏర్పడతాయి. ఇవి జీవుల వారసత్వాన్ని నిర్ణయిస్తాయి. ఇవి ఎలా ఏర్పడతాయోతెలుసుకోవడమేగాకుండా వాటిని కృత్రిమంగా ప్రయోగశాలలో సృష్టించారు. భారతీయ శాస్త్రవేత్తహరగోవింద ఖొరానా అమెరికాలో కృత్రిమ జీన్స్‌ సృష్టించాడు.ఈ రకంగా జీవం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తలు కనుగొని ప్రపంచానికి సృష్టి ఎలా ఏర్పడిందో చెప్పడంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు

ఈ సంచికలో...                     

JAN 2021

ఇతర పత్రికలు