సాహిత్య వ్యాసాలు

సాహిత్య వ్యాసాలు

ఊరి దస్తూరి- గ్రామ పరిణామం

గ్రామాన్ని ఎందుకు అధ్యయనం చేయాలె. దాన్ని మనుషుల సమూహంగా చూడాలెనా? లేక రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక అంశంగా చూడాలెనా అన్నది ప్రశ్న.

గ్రామ అధ్యయనాలు అనేకులు తమ అవసరాల రీత్యా చేసినారు.బ్రిటిషు వలస పాలకులు వారి పరిపాలన అవసరాల కోసం గ్రామాల్లోని సంస్కృతిని అధ్యయనం చేసినారు.సంస్కృతిని ఒక ఆయుధంగా ఉపయోగించి ప్రజలను పరిపాలించ వచ్చని భావించినారు. వలస పాలన పోయి దేశానికి స్వాతంత్రం వచ్చినంక అభివృద్ధి ప్రణాళికల అవసరం కోసం గ్రామాల అధ్యయనాలు జరిగినాయి. విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు వారి అధ్యయన అంశంలో భాగంగా గ్రామాలు అధ్యయనం చేసినారు. మార్క్సిస్టు సిద్ధాంత ఆచరణ లో భాగంగా గ్రామాల అధ్యయనం జరిగింది. ఇప్పుడు మార్కెట్ అవసరాల కోసం తమ వినియోగదారులను వెతికే వేటలో భాగంగా గ్రామాల అధ్యయనం జరుగుతున్నది.

అన్నవరం దేవేందర్ "ఊరి దస్తూరి- తెలంగాణ సాంస్కృతిక చిత్రణ" గ్రామానికి సంబంధించిన అధ్యయనమే. మన తెలంగాణ దినపత్రికలో ఆదివారం అనుబంధం,"హరివిల్లు", "దునియా" శీర్షిక కింద ఫిబ్రవరి 2015 నుండి డిసెంబర్ 2018 వరకు రాసిన కాలమ్స్ పుస్తకరూపంలో వచ్చింది.

రచయిత అనుభవ జ్ఞానం(Empirical knowledge) నుండి గ్రామాన్ని చూసినా, దీనిలో 1960 నుండి ఇప్పటి వరకు జరిగిన గ్రామ పరిణామాలు కనబడతాయి. "ఇదంతా కొత్త తరం కోసం గతం ముచ్చెట"(పుట 242) అని రచయిత చెప్పుకున్నాడు. వాటిని వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

మానవుడు ఆహార సేకరణ, వేటాడి జీవించే దశలు దాటి వ్యవసాయం నేర్చుకున్నంకనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. గ్రామం ఒక ఎత్తైన ప్రాంతంలో ఉంటే పల్లపు ప్రాంతాల్లో పంట భూములు ఉంటాయి. భారతీయ వర్ణ వ్యవస్థ ప్రకారం వైశ్యులు, శూద్రులు వ్యవసాయం చేసేవారు. రాన్రాను వైశ్యులు కేవలం వ్యాపారం మీదనే కేంద్రీకరించిన తర్వాత శూద్రులు వ్యవసాయం చేసి పంటలు పండించినారు. శిస్తు పంటలో ఆరవ భాగం వసూలు చేసేది. ఒక్కొక్కసారి పండిన పంట లో సగభాగం వరకు ఉండేది.

తెలంగాణలో ఎక్కువగా బ్రాహ్మణ, వెలమ, రెడ్డి భూస్వాములు ఉండేవారు. అక్కడక్కడ వెనుకబడిన కులాలు కూడా ఎక్కువ భూకమతాలు కలిగి ఉన్నారు.గ్రామంలో ఆధిపత్యం భూములు ఉన్నవారిదే. "దొరలు పటెండ్లు ఊరును ఏలుడు వాళ్లకే భూములు, జాగలు, పంటలు ఉంటయి" (పుట 102). గ్రామాల్లో పూర్వం జాజ్ మనీ(jajmani) లేక యజమాని ఆర్థిక వ్యవస్థ అమలులో ఉండేది. కింది కులాల వారు పై కులాల వారికి చేసిన అనేక పనులకు ప్రతిఫలంగా ధాన్యం చెల్లించేవారు. ఇది పెట్టుబడిదారీ పూర్వ దశ.

ఈ దశలో వ్యవసాయంలో మోటలు,యాతాలు,గూడలు ఉండేవి. వీటి ఆధారంగా బావుల నుండి వాగుల నుండి నీటిని పారించుకునేది. వ్యవసాయానికి అవసరమైన అనేక పరికరాలు అనేక కుల వృత్తుల వారు సరఫరా చేసేది.

మాదిగలు తాళ్లు, తనుగులు, దండేడలు, తొండపు తాళ్లు, పగ్గాలు, ముగుదాళ్ళు, నులక, చేంతాడు, చెప్పులు, తొండాలు చేసి ఇచ్చేది.

వడ్రంగులు నాగండ్లు, గుంటుకలు, జంబు, మోటా, బండి మొదలైనవి చేసేవారు.

కమ్మరలు కొడవండ్లు, గోడ్డండ్లు,కురిపెలు,నాగలి కర్రు మొదలైన వస్తువులు చేసేవారు.

మేదర్లు గంపలు, చాట్లు, గుమ్ములూ,కచ్చురానికి పోనుకలు చేసి ఇచ్చేది. ఇట్లా చేసిన పనికి ప్రతిఫలంగా పంట సమయంలో కొంత ధాన్యం పెట్టేది. దీనినే "బాపతు"(పుట 293) అంటరు.

ఈ విధంగా రైతు పండించిన పంట వినిమయానికి మాత్రమే. మార్కెట్లో అమ్మకానికి కాదు. మిగులు లేని తొలిదశ ఇది. వస్తువులు సరుకుగా మారని ఉమ్మడి సమాజం. స్త్రీ-పురుష కూలీలకు ధాన్యం రూపంలో కూలి చెల్లించేది. పాలేరు లకు జీతం కూడా ధాన్యమే. గొంగడి చెప్పులు  అదనం.

సామూహిక ఉత్పత్తికి అవసరమైన సహాయక అనుబంధ వృత్తులను గ్రామీణ సమాజం తయారు చేసుకుంది. వాటిని నిర్బంధం చేసింది. కూలీలు స్వేచ్ఛగా తమ శ్రమను బహిరంగ మార్కెట్లో అమ్ముకునే స్వేచ్ఛ లేని ఫ్యూడల్ నిర్బంధ సమాజం అది. దాదాపుగా ఆ కాలంలో వస్తు మార్పిడి అమల్లో ఉండేది. "సోలెడు వడ్లకు తక్కెడు జామ పండ్లు ఇచ్చే వీరమల్లవ్వలు" (పుట 32) ఉన్న కాలం.

భూమి సారాన్ని పెంచడానికి గొర్రె మేకల మందులు పెట్టించే వారు. "ఎండిపోయిన ర్యాగడి  మన్ను పొలాలకు ఎరువుగా వాడతరు"(పుట 38). వేసవికాలంలో చెరువు ఎండిపోయినంక చెరువు మట్టిని పంట భూముల్లో వేసేవారు.ఈ మెత్తని మట్టి భూమి లోపలి తేమను పట్టి ఉంచడంతో పాటు భూమిని సారవంతం చేసేది. ఇది ఎరుపు గా ఉపయోగపడి ఉత్పాదకతను పెంచేది. ఇట్లా లోతైన చెరువులో ఎక్కువ నీటి నిల్వకు అవకాశం ఏర్పడేది.

ప్రతి రైతు "ఇంటికి ఒక పెంట బొంద"(పుట 96) ఉండేది.అయిటి పూనంగానే ఎడ్లబండి తోని జారగొట్టి పంట భూమిలో పోసేది. "అవి సహజ ఎరువులు"(పుట 97).

పండించిన పంట నుండి "ఇత్తునం"(పుట 99) దాచి పెట్టేవారు. విత్తనాన్ని అమావాస్య రోజు ఎండబెట్టి దాచుకోవడం అలవాటు. ఆరోజు రైతుల ఇళ్ల ముందు విత్తనాలు దర్శనమిస్తాయి.అది మారకం కోసం కాకుండా వినియోగం కోసం పంటలు పండించిన కాలం. "కాపు దనపొల్ల తోటలకుపోతే సంబరంగా (కూరగాయలు) తెంపి ఇచ్చేది"(పుట 178)

1860-1900 వరకు గ్రామసీమల్లో కరువు రాజ్యమేలింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికలు రచించి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించే ప్రయత్నాలు జరిగినయి. కానీ మళ్లీ కరువులు రావడం తోని, విదేశాల నుండి ఆహారధాన్యాలు తెచ్చే ఓడల కోసం ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఈ సంకట పరిస్థితులలో స్వయం సమృద్ధిని సాధించడానికి 1966లో దేశంలో హరిత విప్లవం ప్రవేశపెట్టడం జరిగింది.

ఎక్కువ దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్ విత్తనాలు,రసాయనిక ఎరువులు, పురుగుమందులు వ్యవసాయం లోకి ప్రవేశించినయి. తక్కువ కూలి, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామీణ ధనిక రైతాంగాన్ని మరింత సంపన్నులను చేసింది.

హరిత విప్లవం అందించిన మిగులుతో  ధనిక రైతులు పట్టణాల్లో వ్యాపారాలు పెట్టుకున్నారు. ఈ సంపన్న వర్గం నుంచి వచ్చిన వారు ఉన్నత చదువులు చదివి చదువును సామాజిక పెట్టుబడిగా మార్చుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరి వ్యవసాయానికి పెట్టుబడి సమకూర్చే వనరుగా మారినారు. అమెరికా లాంటి విదేశాలకి పోయి డాలర్లు సంపాదించినారు.

ట్రాక్టర్ వచ్చినంక నాగలి మూలకు పడ్డది. ఎడ్లబండి అవసరం తీరింది. "సకలం పనులకు కూడా యంత్రాలే వచ్చినయి" (పుట 87). స్తోమత ఉన్నవారు ట్రాక్టర్, బోరు యంత్రం,కోత యంత్రం (హార్వెస్టర్) వరి గడ్డి కట్టలు కట్టే యంత్రం మొదలైనవి  కొని వాటిలోని  వాటితోని వ్యవసాయ పనులు చేయిస్తున్నారు.

వ్యవసాయం యంత్రికరణ వలన కూలీలకు పనులు దొరకక పనులు వెతుక్కుంటూ పట్టణాలకు వలసలు పోతున్నరు. ఈ విధంగా గ్రామాలు తరుగుతున్నయి. పట్టణాలు పెరుగుతున్నయి. ఇది హరిత విప్లవం తీసుకు వచ్చిన అసమ అభివృద్ధి.

హరిత విప్లవం తర్వాత గ్రామాన్ని ఎక్కువ ప్రభావితం చేసింది తెల్ల విప్లవం లేక ఆపరేషన్ ఫ్లడ్. దీన్ని పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రవేశపెట్టారు. వ్యవసాయంలో సంకరజాతి విత్తనాలు వచ్చినట్లే సంకరజాతి పశువులు వచ్చినవి. "మంచి ఇత్తునం కావాలని సంపర్కం లేకుండా ఎదకు వచ్చిన లేగదూడలకు కృత్రిమ గర్భధారణ చేస్తున్నారు.(పుట 55). దేశవాళి పశువులు అయినా ఆవు, బర్రెలకు ఎక్కువ పాలు రావు. అదే జెర్సీ ఆవు, ముర్రా జాతి బర్రెలు ఎక్కువ పాలు ఇస్తయి.ఈ జాతుల స్వచ్ఛతను కాపాడటానికి పశువుల మందలకు పంపకుండా దొడ్డి లోనే పెంచుతరు. ఒకవేళ ఎదకు వస్తే ఎద లక్షణాలు గుర్తించి కృత్రిమ గర్భధారణ కోసం విత్తనపు కోడె/పోతు వీర్యాన్ని ఎక్కిస్తారు. ఈ విధంగా కృత్రిమ గర్భధారణ తోటి వాటి సంతతి పెరుగుతుంది. ఎక్కువ పాలను ఇస్తయి.ఇట్ల వచ్చినవే కోళ్ల పరిశ్రమలు, డైరీ ఫామ్ లు, చేపల పెంపకం. చేపల్లో "రవు" (పుట 56) కృత్రిమంగా అభివృద్ధి చేసిన జాతి. దీనిలో పోషక విలువలు (ప్రొటీన్లు) అధికంగా ఉంటాయి.

పరిపాలన సంస్కరణల్లో భాగంగా మండల వ్యవస్థ ఏర్పడింది. గ్రామాలలోని ఆధిపత్య కులాలు రాజకీయ పదవులను చేజిక్కించుకున్నారు. ఒకవేళ ఈ అవకాశం లేని పరిస్థితుల్లో తమ దగ్గరి మనుషుల గెలిపించుకున్నారు. తమ పలుకుబడితో  కాంట్రాక్టు ,రాజకీయ పైరవీలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నారు.

వ్యవసాయం తర్వాత గృహ యాంత్రీకరణం జరిగింది. రోలు,రోకలి,ఇసుర్రాయి, పొత్తురం వస్తువుల స్థానంలో రైస్ మిల్, పిండి మిల్, గ్రైండర్, వాషింగ్ మిషన్, ప్రెషర్ కుక్కర్, వ్యాక్యూమ్ క్లీనర్, గీజర్, టీవీ, కూలర్, రిఫ్రిజిరేటర్ మొదలైన వస్తువులు ఇంటిని పూర్తిగా యంత్రికరణ చేసింది.  (పుటలు71,72,118,119,123,143,156).

శుభ్రం చేయకుండా నీళ్లు తాగితే కలరా లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వ్యాపార సంస్థలు ఒక ప్రచారం మొదలుపెడతాయి. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు లేకుండా చేసే ఫిల్టర్లు మొదలు వచ్చినయి. ఇప్పుడు గ్రామ గ్రామానికి ఇంటింటికి ఫిల్టర్లు వచ్చినయి. గ్రామంలో ఫిల్టర్ నీరు కొనుక్కొని తాగుతున్నారు. ఉచితంగా దొరికే నీరు ఇప్పుడు వ్యాపార సరుకు అయింది.నీళ్ల ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు ఇట్లా వ్యాపారం పెరిగింది. "మంచినీళ్లు సుత ప్యాకెట్లు గా మారుతున్నాయి"( పుట 36).

1991లో ప్రపంచీకరణ ప్రారంభమైన తర్వాత గ్రామం పూర్తిగా మార్కెట్ కు    అనుసంధానం అయింది. రహదారులు ఏర్పడ్డయి. సరుకుల రవాణా కొరకు ఆటోలు, టాటా ఏసీలు ప్రతి ఊరుకు రవాణా అందుబాటుకు తెచ్చినయి. గ్రామంలోని ప్రతి ఇంటికి రంగు రంగుల టెలివిజన్లు వచ్చినయి.(పుట 156 ) వినోదంతో పాటు సరుకుల వ్యాపార ప్రకటనలు తెచ్చింది. సినిమా, సీరియల్ పావుగంట, వ్యాపార ప్రకటనలు పదినిమిషాలు. వినోదం కంటే వ్యాపారమే మెదట్ల నిండిపోతది. తెల్లవారి ఏ వస్తువు కొనాలన్నా అవే వ్యాపార ప్రకటనలు మెదట్ల మెసులుతయి.   ఇల్లు పెట్టుబడిదారులు తమ సరుకులను అమ్ముకునే వేదిక అయింది టీవీ. సీరియల్స్ చూడాలంటే డిష్ కనెక్షన్ కావాలి. దానికి నెల నెలకు డబ్బు కట్టాలి. పొరుగు వాళ్లతోని మాట లేదు ముచ్చట లేదు. ఇంటిలోనే కుటుంబ సభ్యులు ఒకరితోనొకరు మాట్లాడుకునే పరిస్థితి లేకుండా చేసింది టీవీ."టీవీల ముందటనే తలెలు పట్టుకుని తినుకుంట సూస్థన్రు" (పుట 245- 46) ఇది మనుషుల మధ్యన ఉండే సామూహికతను దెబ్బతీసింది.

దీని తర్వాత సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ లకు నిరంతరాయంగా సిగ్నల్స్ అందించడానికి సెల్టవర్లు వచ్చినయి. ఫోన్ లో బ్యాలెన్స్ కోసం రీఛార్జి వచ్చింది. ఇప్పుడు ప్రపంచం పిడికిట్లోనే "స్మార్ట్ ఫోన్ వచ్చినంక అంతా నాశనం అవుతుంది"(పుట 344) ఫోన్ లో కాలక్షేపం కోసం వీడియోలు, చాట్ లు, పబ్జి గేమ్ లు వచ్చినయి. ఈ ఆటలో ఒక వ్యసనంగా మార్చేస్తున్నాయి. అది చూసి ఆడి ప్రపంచాన్ని మరిచి పోతున్నారు.సోయి లేని మనషులు తయారవుతున్నరు.

గ్రామాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చింది. ఎకరాలు కొని గజాల కొద్ది అమ్మె పద్ధతి వచ్చింది. సంపన్నులు ఈ వ్యాపారం చేసి ఇంకా సంపన్నులు అవుతున్నారు. భూమి కబ్జాలు, దందాలు పెరిగిపోతున్నాయి.అల్కగ  సంపాదించుడు"(పుట 246) నేర్చుకున్నారు.

రియల్ ఎస్టేట్ తో పాటు నిర్మాణ రంగం పెరిగింది. ప్లాట్లు కట్టి అమ్ముడు, అపార్ట్మెంట్లు కట్టి అమ్ముడు జరుగుతుంది. ఈ నిర్మాణ రంగానికి ఇసుక,మొరం, రాయి, కలప అక్రమ రవాణాలు పెరిగిపోయినయి. ఈ విధంగా సహజ వనరులను కొల్లగొట్టి సొమ్ము చేసుకోవడం మామూలు విషయం అయిపోయింది. గ్రామాల్లోని గుట్టలు పచ్చ నోట్ల కట్టలు గా మారుతున్నయి. "ఏ గుట్టనన్న గ్రానైట్ కు అక్కరకు వచ్చిందంటే సాలు దాన్ని కొనుక్కొని బయటి దేశాలకు అమ్మ వట్టిరి"(పుట 171)

గ్రామాల్లో సంస్కృతీకరణ, పాశ్చాత్యీకరణ పెరిగిపోయింది. బ్రాహ్మణుల ఆచారవ్యవహారాలను అనుసరించడం సంస్కృతీకరణ అంటారు. పాశ్చాత్యుల ను అనుకరించడం పాశ్చాత్యీకరణ. ఇవి రెండు గ్రామాల్లో జమిలిగా అమలు జరుగుతున్నాయి. పిల్లలు పుడితే "కొత్త నామకరణాలు"(పుట 89) సంస్కృతీకరణ లో ఒక అంశం.దోతులు కట్టుకోవడం పూర్తిగా తగ్గిపోయింది. ప్యాంటు షర్టు వేస్తున్నారు. మొదలు సమాజంలోని బ్రిటిష్ వారిని అనుకరించి ప్యాంటు టీషర్ట్ వేసుకున్నారు. అదే అనుకరణ తోని యువతరం అంతా జీన్స్ మీది కెళ్ళి టీషర్ట్ వాడుతున్నారు (పుట 332)

ఇప్పుడు గ్రామాలు పూర్తిగా పట్టణాలను అనుసరిస్తున్నాయి. కొత్త కొత్త పద్ధతులు ఏవి వచ్చినా గ్రామానికి చేరుతున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లకు వేదిక పూలతోని అలంకరణ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి అనేక అంశాల్లో పట్టణాలను అనుకరిస్తున్నారు. స్తోమత ఉన్నా లేకున్నా అప్పులు చేసి ఖర్చు పెడుతున్నారు. గ్రామం మొత్తం వినిమయ సంస్కృతిలో భాగం అయింది.

గ్రామంలోని మిగులును లిక్కర్ వ్యాపారం,బార్లు,మాల్స్ పట్టణాల్లో ప్లాట్లు, విందులు వినోదాలు,పండగలు పబ్బాలకు ఖర్చు పెడుతున్నారు.

ఎన్ని ఆధునిక సౌకర్యాలు వచ్చిన కట్టు బొట్టు, ఆహారం, ఆహార్యం మారిన గ్రామం మూల ధాతువు మారలేదు. ఎలాంటి సడలింపులు లేవు. నిచ్చెన మీద పెద్ద కులపాయన కూకుంటే కింది మెట్టు మీద ఆయనకన్నా తక్కువ కులపాయన ఆ కింది మెట్టుమీద అ చేతిపనోళ్లు, ఇంకా కింది మెట్టుమీద దళితులు కూకుంటారు.( పుట 3)

"భారతీయ పల్లెలే అభివృద్ధికి పట్టు  గొమ్మలు" అని గాంధీ అన్నాడు. అంబేద్కర్ దృష్టిలో గ్రామాలు "హిందూ సామాజిక వ్యవస్థ నమూనాలు. గ్రామాలు రెండు భిన్నమైన సమాజాల సమ్మేళనం. గ్రామంలో నివసించే సవర్ణులు, గ్రామం బయట నివసించే అంటరానివారు ఈ రెండు భిన్నమైన సమాజాలు"

"స్వయం సమృద్ధ గ్రామీణ సమాజాలు భారత దేశాన్ని నాశనం చేసినవి. గ్రామం లో ఏముంది? మురిగిపోయిన స్థానిక త్వం, అజ్ఞాన అంధకారం, సంకుచితత్వం, మతోన్మాదం" అన్నాడు అంబేద్కర్.

"ఎన్ని కులాలన్న ఉండనియ్యి ఊరంతా చుట్టాలు లెక్కనే వరుసతోనే పిలుసుకుంటారు. (పుట 31) ఇది గ్రామం సాధించిన కృత్రిమ సామరస్యం. గీత దాటితే కింది కులాల వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అందుకే వాళ్లు కూడా అనిగిమనిగి బతుకుతారు.

ఊరి దస్తూరి చాలా కాలం రాసిన కాలమ్స్ సమాహారం కావడం వలన కొన్ని పునరుక్తులు చోటుచేసుకున్నవి. గ్రానైట్ పరిశ్రమ గురించి (పుటల్లో 155, 171,240)ఉంది. "అరుగుల మీద కూకొని ముచ్చట్లు" (పుటలు 321,335)కనబడతాయి.

రైతు వృత్తి పనివారికి వస్తు రూపంలో చెల్లించే కూలిని "బాపతు" (పుట 293) అదే దాన్యం రూపంలోని కూలీని 'బిచ్చం" (పుటలు 320,337) అంటాడు.

అంబటాళ్ల సమయం గురించి ఒక చోట 11 గంటలకు (పుట 146) మరోచోట పన్నెండు గొట్టంగా (పుట 189) అంటాడు.

వాన కాలంలో బొడ్డు మల్లె చెట్టు పూస్తుందని (పుటలు 112, 256) చెపుతాడు, కానీ అది చలికాలం లో పూస్తుంది.

జొన్నలు మక్కలు ఇసురురాయి లో పోసి ఇసిరినంక వచ్చేదాన్ని తాల్చి పిండిని గటుకను వేరు చేస్తరు. మళ్లీ గటుకను కోడి పొట్టును వేరు చేస్తే గటుక వస్తది దాన్ని ఎసట్ల వేసి ఉడికించినంక గటుక తయారు అయితది. ఇదే గటుక క్రమం."ఇసిరి పిండి చేసి ఆ పిండిని ఉడకబెడితే మక్క గటుక అయితది" (పుట 306) అంటాడు.

అన్నవరం దేవేందర్ ఇప్పటి తరం వారికి గ్రామంలో చోటు చేసుకున్న మార్పులను వివరించాలని ఊరి దస్తూరి రాసిండు. సామాజిక శాస్త్రవేత్తలు చేయవలసిన పనిని ఒక కవి చేయడం అభినందనీయం. మలి ముద్రణలో పైన సూచించిన వాటిని సవరిస్తాడని ఆశిద్దాం.

 

సంప్రదించిన పుస్తకాలు

 1. విద్యాసాగర్  ఎస్.ఎ 2013 పల్లెను మింగిన పెట్టుబడి గ్రామీణ ఆర్థికం- ఒక పరిశీలన పికాక్ బుక్స్ హైదరాబాద్

2.వేణుగోపాల్.యన్ 2013 ఊరి దారి, గ్రామ అధ్యయనాల పరిచయం, వీక్షణం పబ్లికేషన్స్ హైదరాబాద్

3.పురేంద్ర ప్రసాద్ 2015 సమకాలీన భారత దేశంలో గ్రామీణ అధ్యయనాలు అవసరమా?(13- 26) మారుతున్న గ్రామీణ జీవితం ఒక అధ్యయనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్

4. బాలగోపాల్ .కె 2018  కరువు వ్యవసాయ సంబంధాలు మానవ హక్కుల వేదిక ప్రచురణలు హైదరాబాద్

5. నరసింహారెడ్డి డి 2018 తెలంగాణ పల్లెలు వర్గ సామాజిక విశ్లేషణ సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్

 6.Srinivas.M.N 1994, caste in modern india and other essays,india promoters and publishers pvt.ltd Bombay.

సాహిత్య వ్యాసాలు

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర -14

1903 నుండి రచనారంగంలో కనబడే స్త్రీలలో పాలేపు మాణిక్యాంబ ఒకరు. ఆమెవి రెండు పాటలు మాత్రమే లభిస్తున్నాయి. వాటిలో మొదటిది సరస్వతీ సంకీర్తనం (హిందూ సుందరి, సెప్టెంబర్& అక్టోబర్ 1903) రెండవది   లక్ష్మీ దేవికి మంగళ హారతి ( హిందూసుందరి ,డిసెంబర్, 1903)  ఆ నాడు వచ్చిన స్త్రీల పాటలు అన్నిటి వలెనె    ఈ రెండింటి లోను చివరి చరణాలు మాణిక్యాంబ అన్న కవయిత్రి  నామముద్రతో ఉన్నాయి.మొదటి పాటలో   “పాడుదమే రహి భామ లందరము వాక్సతినెదలో వదలక దలచుచుఅనే పల్లవి సామూహిక గానానికి స్త్రీలను సంసిద్ధం చేస్తున్నట్లుగా ఉంది.సారసలోచనా సంఘము ( బ్రోవను భారమునీదని పరిపరివిధముల పాడుదమేఅనే మొదటి చరణం స్త్రీల సంఘంలో భాగస్వామి గా  పాలేపు మాణిక్యాంబ స్త్రీల సంఘాల అభివృద్ధిని కోరుకొంటున్నదని చెబుతుంది. నాలుగవ చరణం లోనిరతము మంగళకరమగు విద్యనుకరుణనొసగుమని కోరటం ఆమె స్త్రీ విద్యా భిమానాన్ని వ్యక్తీకరిస్తుంది. సరస్వతీ ప్రార్ధన అయిదవతనం కొరకో, ఐశ్వర్యం కొరకో , మోక్షం కొరకో కాక స్త్రీల సంఘటిత శక్తిని నిలపటానికి స్త్రీ లకు విద్య కో రటానికి   సాధనం కావటం విశేషం. 

పాలేపు మాణిక్యాంబకు పద్యరచనా శక్తి కూడా ఉంది అనటానికి ఆమె సమస్యా పూరణ పద్యాలు వ్రాయటం నిదర్శనం.శునకమ్ములు పువ్వులయ్యేశోభ వహింపన్అన్న సమస్యను తీసుకొనిమును హిమవంతుని సుత నీశుని తోడం గూర్ప(దలచి  శుక వాహనుఁడే / పున నేయఁగ నప్పరమేశునకమ్ములు పువ్వులయ్యే శోభ వహింపన్అని అందంగా , అర్ధవంతంగా పూరించింది. ( హిందూ సుందరి , డిసెంబర్ ,1903) 

                                                            1

1903 లో రచనా రంగంలో కనబడే మరొక స్త్రీ ఉన్నవలక్ష్మీ బాయమ్మ. ఆమె  1882 లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలోని ఆమీనాబాద్ లో పుట్టింది. తండ్రి నడింపల్లి సీతా రామయ్యతల్లి రామలక్ష్మమ్మ . పదేళ్ల వయసులో   ఉన్నవలక్ష్మీనారాయణ తో అయిన పెళ్లి వల్ల ఆమె ఉన్నవలక్ష్మీ బాయమ్మ అయింది. భవిష్యత్తులో సంఘసంస్కర్త , జాతీయవాది , రచయిత కానున్న ఉన్నవలక్ష్మీ నారాయణతో 1900 నాటికి గుంటూరులో ఆమె కాపురం మొదలైంది. సామాజిక సేవారంగంలోకి ఇద్దరూ ఒకేసారి ప్రవేశించారు. 1902 లో గుంటూరు లో వితంతు శరణాలయాన్ని స్థాపించి వితంతువులకు పునర్వివాహాలు జరిపించారు. ఆవిషయంలో వాళ్ళ మీద వీరేశలింగం ప్రభావం బలంగా ఉంది. వయోజనులైన స్త్రీలకు విద్యాబోధన , చేతివృత్తులలో శిక్షణ ఇచ్చేందుకు   ఉన్నవ లక్ష్మీబాయమ్మ  కొండా వెంకటప్పయ్య ఇంట్లో ఒక  సంస్థను ప్రారంభించింది 1918లో అయినా అదే తరువాత శారదా నికేతన్ గా అభివృద్ధి చెందినా వితంతు శరణాలయ నిర్వహణకు, స్త్రీ పునర్వివాహాలకు అనుబంధంగా ఉన్నవలక్ష్మీబాయమ్మ  స్త్రీ విద్య గురించి ఆలోచించటం , పనిచేయటం మొదలు పెట్టారనటానికి 1903 , 1904 సంవత్సరాలలో లభిస్తున్న ఆమె రచనలే నిదర్శనం. 

 ‘స్త్రీవిద్య’   ( హిందూ సుందరి ,నవంబర్ 1903,  విషయసూచికలో   ఉన్నత విద్య)  సోదరీ మణులారా అనే సంబోధనను బట్టి  ఉపన్యాసం   అయి ఉంటుంది. ఇది అప్పటికే గుంటూరు లో జరిగే సభ సమావేశాలను, స్త్రీల సమస్యల మీద వాటిల్లో జరిగే చర్చలను ఎంత నిశితంగా గమనిస్తున్నదో , స్పందిస్తున్నదో తెలుపుతుంది అక్టోబర్ 27 న గుంటూరు మిషన్ కాలేజీలో ఒక మీటింగ్ జరిగింది. స్త్రీలకు బిఎ మొదలైన గొప్ప పరీక్షలు అవసరంలేదని ఆ సభలో ఎవరో అన్న మాటను ప్రస్తావిస్తూ దానిని ఆమె ఖండించినతీరు ఆసక్తికరం. స్త్రీలను ఇట్లుఅడుగంట పెట్టటంన్యాయమా అన్నది ఆమె ప్రశ్న. తాము  చదువుకొని స్త్రీ విద్యా ధ్వజం ఎత్తవలసి ఉండగా పబ్లిక్ మీటింగులలో ఇట్లా మాట్లాడటం ఏమిటి అని నిలదీసింది. భార్యలకు విద్య చెప్పవలసి ఉండగా మూలనణచి బుద్ధివికాసం కలగకుండా చేయటం అన్యాయం అంటూ అప్పటికే విద్యావంతులైన పండిత రమాబాయి వంటి రాష్ట్రేతర స్త్రీలను, భండారు అచ్చమాంబ కొటికలపూడి సీతమ్మ మొదలైన తెలుగు స్త్రీలను పేర్కొని వాళ్ళు స్వతంత్రంగానో , భర్తల తోడ్పడుతోనో చదువుకొని దేశాభ్యుదయానికి పాటుపడుతున్నారే !? వాళ్ళ చరిత్రలు చదివి అయినా ఈ పురుషులు నేర్చుకోరా అంటుంది. ఇంకా స్త్రీలకు గొప్ప చదువులు వద్దనడం దేశం యొక్క దురవస్థ అంటుంది. స్త్రీలు విద్య నేర్చుకొంటే వారి ప్రవర్తన మంచిదిగా ఉండదని కొందరు పురుషులు అంటుండటాన్ని ప్రస్తావించి దానిని ఆమె కొన్ని ఉదాహారణలతో విజయవంతంగా తిప్పికొట్టింది. కొందరు జంద్యంతో వురి వేసుకున్నారని వింటున్నాం కదా .. పురుషులు జంద్యం లేకుండా ఉండటం మంచిది అని తీర్మానిద్దామా ? కొందరు నూతుల్లో చెరువుల్లో పడి చనిపోతున్నారు కదా నూతులు , చెరువులు పూడ్చేస్తే మంచిది అందామా ? అని ప్రశ్నించి ఇవి ఎంత తెలివితక్కువ పనుల్లో   చదువుకొన్న స్త్రీలు చెడిపోతారని ఏ ఒకరిద్దరి గురించిన అనుమానం  వల్ల స్త్రీలకు చదువు వద్దనడం కూడా అంత తెలివితక్కువ పని తేల్చింది ఉన్నవబి లక్ష్మీబాయమ్మ. 

లక్ష్మీబాయమ్మ వ్యాసందేవుని యెడల మనము చెల్లించవలసిన విధులు’  1904 జనవరి జనానా పత్రికలో వచ్చింది . విగ్రహారాధన కన్నా విజ్ఞాన సంపదా సముపార్జన నిజమైన దైవారాధన అంటుంది లక్ష్మీబాయమ్మ. దేశాభివృద్ధికి పాటుపడాటాన్ని మించిన  దైవభక్తి లేదంటుంది.( జంధ్యాల కనకదుర్గ , స్వతంత్రత నుండి స్వాతంత్య్రనికి ) ఆ రకంగా ఆమె మానవసేవే మాధవసేవ అని చెప్పినట్లయింది. ఐకమత్యము అనే వ్యాసంలో (హిందూసుందరి , మార్చ్ 1904) ఎక్కువ తక్కువ భేదభావం లేక , ఎవరిపట్లా విరోధ బుద్ధి లేక స్త్రీలు పరస్పర స్నేహంతో  ఐక్యంగా ఉండటం అభివృద్ధి కారకం అవుతుందని పేర్కొన్నది లక్ష్మీ బాయమ్మ.నూరు జట్లు కూడవచ్చును గాని మూడు కొప్పులు కూడవన్న నింద బాపు కొనటానికి  స్త్రీలు ఎంత శ్రమకైనా ఓర్చి ప్రయత్నం చేయాలనీ అక్కడే ఐకమత్యం యొక్క అవసరం ఉందని పేర్కొన్నది.స్త్రీబుద్ధి ప్రళయాంతకఃవంటి స్త్రీలగురించిన వాడుకలు పోయేట్లు చేయటానికి స్త్రీలు ఐకమత్యంతో చేయవలసిన కృషి గురించి హెచ్చరించింది లక్ష్మీ బాయమ్మ. 

లక్ష్మీ బాయమ్మ స్త్రీ విద్య గురించి సంభాషణ తో కూడిన మరొక రచన చేసింది. ( హిందూ సుందరి ,మార్చ్ 1904)స్త్రీవిద్య మా కాలం నాడు లేదమ్మా అంటూ స్త్రీ విద్య వ్యతిరేక వాదం చేసే కామమ్మకు , స్త్రీలు విద్యనేర్చుకొని జ్ఞానాభివృద్ధి చేసుకొనడం ఈ నాటి ప్రపంచ అవసరం అని వాదించే శేషమ్మకు మధ్య సంభాషణగా సాగే ఈ కథ  ( దిద్దుబాటలు - దిద్దుబాటును ముందు కథలు 1992) లో విద్య అపకీర్తి కారణం అని స్త్రీల మానసలకు ఎక్కించ బడ్డ  మూఢ విశ్వాసాన్ని శేషమ్మ స్త్రీ చదువుకొంటే వినయాది గుణాలు, పరోపకారజ్ఞానాభివృద్ధి కలుగుతుందని తిప్పి కొట్టింది. కామమ్మ కాస్త దిగివచ్చి విద్య అనవసరం అని కాదు గానీ గొప్ప పరీక్షలు, పబ్లిక్ మీటింగులు , పత్రికలకు వ్రాయటం , పత్రికలు తెప్పించుకొని చదవటం దురాచారం అని మరొక వాదన లేవనెత్తింది. అంతే కాదు స్త్రీపురుష భేదం లేదు , అందరూ సమానులే అనటం కూడా అనర్ధకంగా ఉంది అని  ఆమె అభిప్రాయం. స్త్రీ పురుషులిద్దరినీ ఒక భగవంతుడే సృష్టించి పాలిస్తున్నాడు కదా అందువల్ల వాళ్లిద్దరూ సమానులే అంటుంది శేషమ్మ. 

ఆ సందర్భంలో స్త్రీపురుషుల మధ్య కామ మొహాలను మించి ఉండవలసిన స్నేహ సంబంధాల గురించి ఉన్నవలక్ష్మీబాయమ్మ ఆలోచించటం కనిపిస్తుంది. విద్య వల్ల కలిగే ఆత్మ విశ్వాసం స్త్రీలను నిర్భయులను చేస్తుందని , అదే స్త్రీలకు పురుషులతో స్వేఛ్ఛగా మాట్లాడే వివేకాన్ని ఇస్తుందని శేషమ్మ ముఖంగా చెప్పింది.  స్త్రీపుషులిద్దరిమధ్యా జ్ఞానవినిమయ సంభాషణ తప్పు పట్టవలసినది కాదు అని శేషమ్మ చెప్పటం అందులో భాగమే. ఆ స్నేహ సంబంధాలను గుర్తించే కొత్త సంస్కారం సమాజంలో వ్యాపించాలని ఆమె భావం. 

దొరసానులతో కలిసి  తెల్ల చీరా తెల్ల రవిక ధరించి నగలు పెట్టుకోకుండా కూర్చున్న వీరమ్మ ప్రస్తావన ఎత్తి స్త్రీలు చదువుకొని అంతామాలకూడుచేస్తున్నారన్న కామమ్మ ఆరోపణ కు శేషమ్మ స్పందించిన తీరులో    చదువుకొని విద్యావంతులు అయిన స్త్రీలు ఏ కులం వాళ్ళయినా ఏ మతం వాళ్ళయినా విద్యావంతుల సాంగత్యం, స్నేహం కోరటం  సమాజంలో మార్పుకు కారణం  కాగలదన్న అభిప్రాయం వినబడుతుంది.అలాగే స్త్రీలు చదువుకొని నగలు ధరించటం మానేస్తు న్నారని అదొక తప్పుగా ఎంచుతున్న కామమ్మకు విద్యా జ్ఞానాన్ని మించిన అలంకారం స్త్రీలకు లేదని సమాధానం ఇచ్చింది శేషమ్మ.  

  పురుషులతో పాటు విగ్రహాలను పూజించటం, నోములు వ్రతాలు చేయటం మానెయ్యటం స్త్రీల చదువు ఫలమా అని కామమ్మ వాపోవటం గమనించదగినది. విగ్రహారాధనను వ్యతిరేకించే బ్రహ్మసమాజ మతం అప్పటికే తెలుగు ప్రాంతాలలో బాగా వ్యాపించింది. స్త్రీలు కూడా ప్రార్ధనా సమాజాలకు హాజరుకావటం , ఆ సమావేశాల కోసం పాటలు వ్రాయటం , పాడటం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు మింగుడు పడని సంప్రదాయ వర్గపు ఆక్రోశం కామమ్మది. నూతనంగా రూపొందుతున్న సమాజం లోని అభ్యుదయ విలువలకు ప్రతినిధిగా శేషమ్మ నిర్ద్వంద్వం గా  విగ్రహారాధనను వ్యతిరేకించింది. లోహంతో చేసిన విగ్రహాల ఆరాధన, నోములు వ్రతాలు ఆచరించటం, ఉపవాసాలతో జీవాత్మను హింసించటం ఇవేవీ  భగవంతుడు కాదు అంటుంది. 

ఆ రకంగా లక్ష్మీబాయమ్మ స్త్రీవిద్య గురించి సమకాలంలో నడుస్తున్న సంఘర్షణను , సంవాదాన్ని వస్తువుగా చేసి వ్రాసిన కథ ఇది. 

ఆ తరువాతి కాలంలో ఉన్నవలక్ష్మీబాయి జాతీయ విధానంలో స్త్రీ విద్యా వ్యాప్తికి శారదానికేతనం ద్వారా విశేష కృషిచేసింది.  విదేశీ వస్తు వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నది  నూలు వడికి, ఖద్దరు ధరించింది. గాంధీ పిలుపు మేరకు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయింది. 1941 ఫిబ్రవరి లో రాయవెల్లూరు జైలులో మూడు నెలలు శిక్ష కూడా అనుభవించింది. ఇంత సంపన్నమైన సామాజిక రాజకీయ జీవిత అనుభవాలను  ఎందువల్లనో ఆమె సాహిత్యంగా చేయలేదు. నిజానికి ఆమె భర్త ఉన్నవలక్ష్మీ నారాయణ 1922 నాటికి మాలపల్లి నవల , నాయకురాలు నాటకం వంటి రచనలతో సాహిత్య రంగం లో పేరెన్నిక గన్నాడు. వితంతు పునర్వివాహాల దగ్గరనుండి , స్త్రీవిద్య ,శారదానికేతన్ నిర్వహణ, జాతీయోద్యమం అన్నిటిలోనూ ఇద్దరూ కలిసే పనిచేశారు. అయితే 1904 నాటికి నిర్దిష్టమైన చూపుతో , నిర్భయంగా తాను అనుకున్నది చెప్పి ఒప్పించగల రచనా ప్రతిభను పెంచుకున్న ఉన్నవలక్ష్మీబాయి   1956 లో మరణించేవరకు  రచనలు ఏవీ చేసినట్లు కనబడదు. ఎందువల్లనో మరి!?  

                                                2

1903 నుండి రచనలు చేసిన మరొక స్త్రీ బుర్రా బుచ్చి బంగారమ్మ. ఆమెను చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్న బుర్రా శేషగిరిరావు వ్రాసిన దానినిబట్టి ( హిందూ సుందరి , ఆగస్టు , 1912)  ఆమె దివాన్ బహద్దూర్ బుద్ధవరపు నారాయణమూర్తి పంతులు గారి కూతురు. భర్త బుర్రా వెంకటేశ్వరరావు పంతులు ఆనాటికి కర్నూలు లో డిస్ట్రిక్ట్ మునసబు. పెళ్లి బాల్యంలోనే అయింది. భర్త సంస్కరణాభిలాషి. స్త్రీవిద్య సంస్కరణ సాధనం అని ఆయన నమ్మకం. అది ఇంటి నుండే ప్రారంభించాలని భార్యకు చదువు చెప్పటం మొదలు పెట్టాడు. తెలుగు , ఇంగ్లీష్ సంస్కృతం నేర్చుకొన్నది. ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడగలిగిన విద్య వచ్చింది. సంస్కృతంలో ఆమె అభిలాష ను గుర్తించి భర్త ఒక పండితుడిని ఏర్పరచి సంస్కృతం ప్రత్యేకంగా చెప్పించాడు.యూనివర్సిటీ పరీక్షలకు సంస్కృతం చదువుకొన్న నా కన్న యామెకు సంస్కృత జ్ఞానమెక్కువగా కలదు.అని బుర్ర శేషగిరిరావు గారు చెప్పటం బంగారమ్మ గారి పాండిత్యానికి లభించిన బంగారు పతకం. నోములు వ్రతాలు, పూజా పునస్కారాలు , ఉపవాసాలకన్నా పతిసేవ , బంధు మిత్రులను ఆదరించటం పెద్దలయెడ గౌరవం , పేదలయెడ కరుణ ఆమె లో మిక్కుటమని పేర్కొన్నాడాయన. స్త్రీ జన విద్యాభివృద్ధి కొరకు, స్త్రీల అభివృద్ధి కొరకు కార్యమగ్నురాలైన బుచ్చిబంగారమ్మ ను  ఆయన  ఈ వ్యాసంలో  పరిచయం చేశారు. 

1912 నాటికి కర్నూలు లో ఉన్న బుచ్చి బంగారమ్మ సామాజిక ఉద్యమ జీవితం 1902 లో  అసికా హిందూ స్త్రీ సమాజ నిర్మాణంతో బరంపురంలో మొదలైంది.  నాటికి ఆమె నివాసం  అసికా పట్టణం బరంపురానికి దగ్గరలో ఉన్న ఊరు.  ఆ ఊళ్ళో ఆమె  స్త్రీ సమాజం ఏర్పరచటం గురించి ప్రధమ సంవత్సర నివేదిక వల్ల ( హిందూ సుందరి , డిసెంబర్ 1903) తెలుస్తున్నది . చదువుకొన్న స్త్రీలు , ఉన్న చదువును అభివృద్ధి పరచుకొనాలనుకొనే స్త్రీలు ఉండటం చూసి గృహకృత్యములు పూర్తయ్యాక సమయం వ్యర్థం చేయక స్త్రీలందరూ  ఒక చోట చేరి పుస్తకపఠనం మొదలైన వాటితో జ్ఞానాభివృద్ధి పొందాలని , బాలికా విద్యకు పాటు పడాలని  ఆశించి  1902 సెప్టెంబర్ 18 న బుచ్చి బంగారమ్మ తన  ఇంట్లోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరినీ పిలిచింది. తన ఉద్దేశాలను వివరించి వాళ్ళ అభిప్రాయాన్ని కూడగట్టింది.  అక్టోబర్  21 న అసికా ధర్మశాలలో జరిగిన సమావేశంలో  స్త్రీసమాజాల వల్ల లాభాలను గురించి మాట్లాడి  అసికాపట్టణ స్త్రీసమాజ నిర్మాణం  చేసింది .   దూరంగా ఉన్న బాలికా పాఠశాల దూరంగా ఉండటంవల్ల పాఠశాలలో చేరే  బాలికల సంఖ్య తక్కువగా ఉందని చేరిన వాళ్ళహాజరు కూడా  తక్కువగానే ఉంటున్నదని బాలికలకు ఒక బండి పెట్టి రవాణా సౌకర్యం కల్పిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని బండి ఎద్దుకు అయ్యే సొమ్ము తాను ఇస్తానని ప్రకటించి దాని పోషణకు, స్త్రీ సమాజానికి వార్తాపత్రికలు తెప్పించటానికి చందాలు వేసుకొంటే బాగుంటుందని ప్రతిపాదించి కార్యాచరణకు దిగింది. అక్కడి నుండి  అసికా పట్టణ స్త్రీ సమాజం కార్యదర్శిగా అనేక ప్రాంతాలకు తిరుగుతూ స్త్రీ జనాభ్యుదయాన్ని కాంక్షిస్తూ ఉపన్యాసాలు చేసింది . ఆయా ప్రాంతాలలో స్త్రీ సమాజాల ఏర్పాటుకు ప్రోత్సహించింది.

అసికా పట్టణ స్త్రీ సమాజం ప్రతినెలా సమావేశం అవుతుండేది.  స్త్రీలు పుస్తకాలు చదువుకొనటం, పుస్తకాల గురించి మాట్లాడుకొనటం మాత్రమే కాక  , దైవభక్తి, ప్రభుభక్తి, పతిభక్తి, హిందూ స్త్రీల దుస్థితి , స్త్రీవిద్య, స్నేహం, స్త్రీ సమాజాల అవసరం మొదలైన వాటి మీద ఉపన్యాసాలు  ఏర్పాటుచేసుకొనేవాళ్లు. బుచ్చి బంగారమ్మ తో పాటు న్యాపతి రాముడమ్మ , మోచర్ల లక్ష్మీ నర్సమ్మ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు.  మొదటి సంవత్సర సభకు విశాఖ పట్టణం నుండి వచ్చిన బుద్ధవరపు వీరలక్ష్మమ్మ( ఈమె సిద్దేశ్వరం జమీందారు గారి కూతురు. ఆమె భర్త అప్పుడు విశాఖపట్నం డిప్యూటీ కలెక్టర్)  ఆధ్యక్షత వహించింది.  ఖజానా సీతమ్మ, గాది సీతమ్మ, చిలుకా సీతమ్మ మొదలైనవాళ్లు చందాలు ఇచ్చి సమాజ నిర్వహణ కు తోడ్పడ్డారు. 

మొదటి సంవత్సరం 13 సమావేశాలు జరుపుకున్న అసికాపట్టణ స్త్రీ సమాజం రెండవ సంవత్సరంలో 36 సభలు జరుపుకొన్నదంటే ఎంత చురుకుగా పనిచేస్తున్నదో గ్రహించవచ్చు. ప్రతిసభకు సగటున 22 మంది స్త్రీలు, ఒక్కొక్కసారి 50 మందివరకు కూడా హాజరు అయ్యేవాళ్ళట. ఈ సభలలో బుచ్చిబంగారమ్మ దైవభక్తి, స్త్రీవిద్య, చరిత్ర, భూగోళశాస్త్రం , ఆచారాలు , హిందూ స్త్రీలు ఇంగ్లీష్ భాష నేర్చుకొనవలసిన అవసరం, మొదలైన అంశాలమీద ఉపన్యాసాలు ఇచ్చింది. శ్రీనివాస కళ్యాణము, అహల్యాబాయి చరిత్రము, అబలాసచ్చరిత్ర రత్నమాల , భక్తవిజయము, ఆరోగ్యశాస్త్రము , వీరమతి చరిత్రము మొదలైన సద్గ్రంధాల గురించి కూడా ఆమె ప్రసంగించింది. గ. లక్ష్మీ నరసమ్మ, న్యాపతి రాముడమ్మ , వల్లూరి జోగమ్మ , వల్లూరి మాణిక్యాంబ, మో. లక్ష్మీనరసమ్మ , ఎ. గిరిజాయమ్మ , రా. లక్ష్మీబాయమ్మ , త్రి. లక్ష్మీనరసమ్మ మొదలైన స్త్రీలు పుస్తకాల గురించి , స్త్రీ సమాజాల గురించి , అతిబాల్యవివాహాలగురించి మాట్లాడారు. అబలాసచ్చరిత్ర రత్నమాల  పుస్తకం అనేక మార్లు ప్రసంగానికి వస్తువు కావటం విశేషం. రెండవ వార్షిక సమావేశానికి పులుగుర్త లక్ష్మీనరసమాంబ అధ్యక్షురాలు. (  సావిత్రి అక్టోబర్ 1904)

రెండవ సంవత్సరం 36 సభలు జరుపుకున్న అసికా పట్టణ స్త్రీ సమాజం మూడవ సంవత్సరంలో 45 సభలు జరుపునుకొన్నది. హాజరైన స్త్రీల సంఖ్య సగటున 40 మందికి పెరిగింది. త్రి. సుందరమ్మగారి పోషకత్వంలో అధ్యక్షతలో జరిగిన సభలలో భాగవతం,భక్తవిజయం  కార్తీకమాస మాహాత్మ్యం, హరివంశం, సరసవాణి  చరిత్రము, అబలా సచ్చరిత్రరత్నమాల, కృష్ణమంజరి , లోకబాంధవి , స్త్రీ నీతిసారము , విక్టోరియా మహారాజ్ఞి చరిత్రము, గౌతమబుద్ధుని చరిత్రము, అనసూయాదేవి చరిత్రము, భక్తవిజయము, శ్యమంతకమణి నాటకం మొదలైన పుస్తకాలను చదువుకొని చెప్పుకొన్నారు. భక్తి , బ్రహ్మొపాసన ప్రార్ధన , కాలమును సద్వినియోగము చేయుట, స్త్రీవిద్య  మొదలైన విషయాల మీద ప్రసంగాలు చేసుకొన్నారు. వీటిలో బుచ్చిబంగారమ్మ చదివి చెప్పిన పుస్తకాలు , చేసిన ఉపన్యాసాలు  ఎక్కువ. మూడవ వార్షిక సమావేశానికి కళ్లేపల్లి వెంకటరమణమ్మ అధ్యక్షురాలు( సావిత్రి , సెప్టెంబర్, అక్టోబర్ 1905)

అసికా పట్టణ స్త్రీ సమాజం వారు చదువుకొని ప్రసంగించిన పుస్తకాలలో అబలా సచ్చరిత్ర రత్నమాలతో పాటు సమకాలపు స్త్రీల రచనలు లోకబాంధవి , విక్టోరియా రాణి చరిత్రము, శ్యమంతక మణి మొదలైనవి ఉండటం గమనించవచ్చు. లోకబంధవి పూలగుర్త లక్ష్మీ నరసమాంబ వ్రాసిన కథ. తరువాతి రెండూ గుండు అచ్చమాంబ రచనలు. 

బుర్రాబుచ్చి బంగారమ్మ ఉపన్యాసాలు వివిధపత్రికలలో ప్రచురించబడ్డాయి. కాలము సద్వినియోగమునకు దెచ్చుటెట్లు ( హిందూ సుందరి , ఫిబ్రవరి 1904)  అనే ఉపన్యాసాన్ని  హిందూ స్త్రీలకు విద్యనేర్చుటకు గానీ మరి ఏ ఇతర గొప్ప సంగతిని గ్రహించుటకు గానీ అవకాశము లేదని కొందరంటున్నారు మన అనుభవం చూడ  అదే వాస్తవం అన్నట్లుగా ఉంది అందుకు కారణాలు ఏమై ఉంటాయి అని ఒక ప్రశ్న వేసింది.  అట్టి అవకాశాలు పొందుటకు మనం తగినవారము కాదన్నది దైవోద్దేశమా లేక  మనకధిపులైన పురుషుల నిర్బంధమా అదీగాక మన స్వయంకృతాపరాధామా అన్నది ఆ ప్రశ్న. స్త్రీపురుషులు ఇద్దరినీ సృష్టించిన భగవంతుడు , ప్రజావృద్ధి భారం స్త్రీలపై పెట్టిన భగవంతుడు పురుషులే గొప్ప సంగతులు గ్రహించి స్త్రీలు అధములై ఉండాలని కోరుకోడు అని నిర్ధారించి మొదటి అనుమానాన్ని నిరాకరించింది. స్త్రీలు విద్యార్హులు కారని , వంట ఇల్లే వాళ్లకు సర్వస్వం అని ఇటీవలి కాలపు పురుషులు ఏర్పరచిన నియమమే  కానీ చరిత్ర అలా లేదని అది తెలిసి ఆ అజ్ఞానాన్ని తొలగించటానికి  ఈ నాటి పురుషులు పూనుకొంటున్నారు కనుక వాళ్ళనూ నిందించవలసిన అవసరం లేదని చెప్పింది. అయితే గొప్పసంగతులు గ్రహించగల అవకాశాలను అందుకోలేకపోవటానికి మనలను ఆవరించిన అజ్ఞానమే కారణమని స్త్రీలు దానిని ఒదిలించుకొనవలసి ఉందని అభిప్రాయపడింది.  

 అధిక ఆచారవంతులమన్న ప్రసిద్ధి పొందాలని లేచింది మొదలు కడిగిందే కడుగుతూ , తోమిందే తోముతూ సమయం వృధా చేస్తున్నారని చెబుతూ మడి ,ఆచారం పేరిట పదేపదే స్నానాలు , తడిగుడ్డలతో ఇల్లంతా రొచ్చు చేసుకొనటం, పదే పదే పవిత్రీకరణకు ఆవు పేడ నీళ్లు చల్లటం అశుభ్రతకూ , అనారోగ్యానికి కారణం అవుతున్నాయని , స్త్రీల కాలం అంతా అందులోనే వృధా అవుతున్నదని నిష్కర్షగా చెప్పింది. ఇలాంటి మూర్ఖాచారాలను వదిలి ఒక పద్ధతి ప్రకా రం పనులు చేసుకొన గలిగితే స్త్రీలకు సమయం మిగిలి విద్యావిజ్ఞానాల సముపార్జన సాధ్యం అవుతుందని ఆమె అభిప్రాయ పడింది. 

మడి , ఆచారం , అంటూ ముట్టూ దోషాలు ఇవన్నీ బ్రాహ్మణ స్త్రీల సమస్యలే అయినప్పటికీ స్వీయ జాతి మడి ఆచారాల పద్ధతిలోని అశాస్త్రీయతను గుర్తించి విమర్శకు పెట్టటం , స్త్రీల ప్రగతికి అవరోధంగా వాటిని గుర్తించి నిరాకరించటం ఆ నాటికి అభ్యుదయాంశమే. 

తెలుగు జనానా (1904 ఏప్రిల్ ) పత్రికలో హిందూ ఆచారాల మీద ఆమె చేసిన ప్రసంగం ప్రచురించబడింది. స్త్రీ సమాజం నిర్వహిస్తున్న సభకు వచ్చిన గాదె చూసి కుడుతమ్మ గురించి ఆమె చేసిన ప్రస్తావన ఆసక్తికరమైనది. మనమీద ప్రేమతో దూరమని కూడా వెనుదీయక వచ్చింది అని చెప్తూ  భర్తను ప్రార్ధించి వచ్చింది అని చెప్పటం గమనించ దిగింది. స్త్రీలు ఒక కొత్త సందర్భంలోకి ప్రవేశిస్తూ ఇళ్లల్లో దానికి సానుకూలమైన ఒక వాతావరణాన్ని కల్పించుకొనటానికి చేస్తున్న ప్రయత్నాలను అది సూచిస్తుంది. అది అలా ఉంటె తల్లితో పాటు ఆ సభకు వచ్చిన ఆమెకు తన ఇంట భోజనం పెట్టలేకపోయానే అని బాధపడుతుంది. అందుకు ఆచారమే అడ్డు అయిందని చెప్తుంది. కులంలో శాఖాభేదాలు ఎంత కరుడుగట్టి ఉంటాయంటే ఇతర కులాల ఇంట భోజనం చేయటం ఎంత తప్పుగా భావించబడుతుందో ఒకే కులంలో భిన్న శాఖల మధ్య భోజన వినిమయం అంతే దోషంగా భావించబడుతుంది. వైష్ణవులు వైష్ణవేతరుల ఇంట భోజనం చేయరాదన్న నియమం  కారణం గా చూడికుడుత్తమ్మకు బుచ్చి బంగారమ్మ తన ఇంట అన్నం పెట్టలేకపోయింది. ఇది ఆమెకు కష్టం కలిగించింది కనుకనేయావన్మంది బ్రాహ్మణులు సంఘీభవించుట కర్తవ్యం అని సభాముఖంగా చెప్పగలిగింది.  స్త్రీ సమస్య గురించి మాట్లాడటానికి ప్రారంభించి సామాజిక సంబంధాలలోకి వచ్చేసరికి స్త్రీలు శాఖాభేదాలతో కునారిల్లుతున్న కులవ్యవస్థలో సంస్కరణల గురించి ఆలోచించ వలసి రావటం అనివార్యం అయిందన్నమాట. 

అసికా స్త్రీ సమాజం ప్రధమ వార్షికోత్సవ సమావేశ ప్రసంగంలో  బుచ్చిబంగారమ్మ  ( తెలుగు జనానా 18 సెప్టెంబర్ 1904)  స్త్రీలు సమాజాలు పెట్టుకొని గొప్ప సంగతులను ఆలోచించటం అవసరమని , ఉపన్యాసాలు వ్రాయుట చదువుట అలవాటు చేసుకోవాలని , ఉత్తమమైన ఆలోచనల స్ఫురణకు అవి కారణం అవుతాయని, వాక్చాతుర్యం , సమయోచితంగా కార్యసిద్ధికి తగిన ఉపాయ సాధనాలు సమకూరుతాయని , అలా సమకూడిన స్త్రీలు తమ ప్రాణేశ్వరులకు సహాయభూతులుగా ఉండగలరని బుచ్చి బంగారమ్మ చెప్పింది. 

పునర్విహం చేసుకొన్న స్త్రీలు కులాంగనలు కారని అనే వాళ్ళకు , అవునాకాదా అనే సంశయంలో ఉన్నవాళ్లకు సమాధానంగా స్త్రీపురుషులు అనేకులు చర్చల్లో పాల్గొన్న కాలం అది. ఆ సందర్భంలో బుర్రబుచ్చి బంగారమ్మ తన అభిప్రాయాన్ని హిందూసుందరి పత్రికకు లేఖ ద్వారా తెలిపింది. ఆగస్టు 8 న ఆమె వ్రాసిన లేఖ హిందూ సుందరి 1911 అక్టోబర్ -నవంబర్ సంచికలో ప్రచురించబడింది. వైవాహిక ధర్మాన్ని అనుసరించి ఎన్ని మార్లు పెళ్లి చేసుకొన్నా వాళ్ళను కులటలు అనరాదు అంటుంది ఆమె. వ్యభిచారం దోషం కానీ వివాహం అది రెండవ వివాహమైనా స్త్రీల యందు దోషము ఆరోపించరాదు అని ఆమె అభిప్రాయం. మనుధర్మం ప్రకారం తప్పు అనేట్లయితే ధర్మశాస్త్రాలు తిరిగి రాసుకోవలసిందే అన్నది ఆమె ఆంతర్యం. ధర్మ శాస్త్రం అంటే సాంఘిక కట్టుబాట్లను అనుసరించి పూర్వులు ఏర్పరచిన ప్రవర్తనా విధులు అని నిర్వచించి ఎన్నడో పూర్వులు ఏర్పరచినవి ఈ నాడు అనుసరించాలటం ఉచితం కాదు అంటుంది.విధులు సంఘముతో కూడ వలయును, సంఘములు కాలముననుసరించవలెను.అని నిర్ధారించి చెప్పింది. నేటి పాలకులు  స్త్రీపునర్వివాహాలకు శాసనసమ్మతి ఇచ్చిన సంగతి గుర్తుచేసింది. ఆరకంగా బుచ్చిబంగారమ్మ ఉపన్యాసాలు  వ్యాసాలు  వాదనాపటిమతో అభ్యుదయ దృక్పథంతో ఉంటాయి. 

విజయనగరంలో సత్యసంవర్ధనీ సమాజం నాలగవ సంవత్సరం ప్రారంభ సభలో బుచ్చిబంగారమ్మ ఉపన్యాసం ఇచ్చింది. ( హిందూ సుందరి , జనవరి 1915) క్రిందటి రోజే అతివైభవంగా సమాజ తృతీయ వార్షికోత్సవం జరిగిందని ఆమె తన ఉపన్యాసంలో ప్రస్తావించింది.    హిందూ సుందరి సంపాదకులు కొన్ని మాసముల క్రిందట విజయనగర సత్యసంవర్ధినీ సమాజ సంవత్సరోత్సవం లో  అధ్యక్షురాలుగా బుచ్చిబంగారమ్మ చదివిన ఉపన్యాసం సకాలంలో చేరకపోవడం వల్ల వెంటనే వేయలేకపోయామంటూ సంపాదకీయంలో పేర్కొన్నారు. అంటే ఈ ఉపన్యాసం 1914 లోది అనుకోవచ్చు. విజయనగరం మాహారాజావారి కూతురు రీవా రాణి గారికి స్త్రీ సమాజాలపట్ల ఉన్న అభిప్రాయాన్ని గుర్తుచేస్తూ ఆమెను స్మరించుకొంటూ ఉపన్యాసం ప్రారంభించింది. ఒక వైపు సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం , పురాణేతిహాస పాండిత్యం కలిగించే విద్య, వైద్యవిద్య , దేహారోగ్య జ్ఞానంశిశుసంరక్షణ, నర్స్ శిక్షణ వంటివి   స్త్రీలు అభ్యసించాలనీ   మరొక వైపు ధర్మబుద్ధి, దైవభక్తి , పతిభక్తి, బంధుప్రేమ, ధైర్యం, కరుణ , గృహకార్య నైపుణ్యం మొదలైనవి స్త్రీలు అలవరచుకొనవలసిన ఉత్తమ గుణాలనీ చెప్పబడుతున్నాయని ఇవన్నీ వట్టి కోరికలు మాత్రమే కాదని సాధించవలసిన , సాధించగలిగిన లక్ష్యాలే అంటుంది బంగారమ్మ. కావలసింది పూనిక , పట్టుదల. అలాగే ఆమె  ఈ ఉపన్యాసంలో ఐకమత్యం గురించి కూడా చెప్పింది. పురాణకథలను ప్రస్తావిస్తూ ఐకమత్యం వల్ల సాధించగలిగిన విజయాలను సూచించింది. హిందూ యువతులు చదువుకొని పురుషులవలెనే మహామహులనిపించుకోవాలని అలా అనిపించుకొంటున్న విద్యావంతులైన స్త్రీలను ఉదహరిస్తూ ప్రబోధించింది. ఈ తరం బాలికలకు ఉన్నతవిద్యను అందించాలని గట్టిగా చెప్పింది . స్త్రీలు నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేసుకొంటాం గురించి కూడా ఆమె సూచనలు ఇచ్చింది . 

1912 సెప్టెంబర్ హిందూ సుందరి పత్రికలో కర్నూలు స్త్రీసమాజంలో పాటి రాజమ్మ చేసిన ఉపన్యాసం ప్రచురితమైంది. అందులో ఆమె బుర్రబుచ్చి బంగారమ్మను ప్రశంశిస్తూ మాట్లాడింది. దేశాభిమానంచేత ఆమె హిందూ స్త్రీల కొరకు శ్రమపడి సమాజం ఏర్పరచిందని చెబుతూ ఎంత కష్టపడిరోయని తన మనంబు ష్ణకించు చున్నదని అంటుంది.పశుప్రాయులగు పురుషులున్నూ , విద్యాగంధమెరుగని వనితలున్నూ యీ కాంతామ తల్లి  మది ఎంత నొప్పించిరో కదాఅనటం గమనించదగినది.ఇది ఒక బుచ్చిబంగారమ్మ సమస్య కాదు .  స్త్రీలు సంఘాలు పెట్టుకొనటం , స్త్రీలను సమీకరించటం ఎన్ని సామాజిక సాంస్కృతిక వ్యతిరేకతల మధ్య జరిగాయో లెక్క చూసుకోమంటుంది చూసు కొమంటుంది ఆ వాక్యం. ఆ రకంగా బుర్రా బుచ్చి బంగారమ్మ ఆనాటి మహిళాఉద్యమ నిర్మాణానికి , కార్యకర్తృత్వానికి ఒక బలమైన ప్రతినిధి. 

 

-------------------------------------------------------------------------------  

 

 

 

ఈ సంచికలో...                     

JUL 2021

ఇతర పత్రికలు