సాహిత్య వ్యాసాలు

సాహిత్య వ్యాసాలు

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర -16

 కళ్లేపల్లె వెంకట  రమణాంబ - 1

1903 నుండి కీర్తనలు, కవిత్వం, వ్యాసాలు విస్తృతంగా వ్రాసిన కళ్లేపల్లె  వెంకట రమణమ్మ   హిందూసుందరి పత్రికకు మొసలికంటి రామాబాయమ్మ తరువాత 1913 నుండి  మాడభూషి చూడమ్మ తో పాటు సంపాదకురాలు.

  పత్రికను  స్థాపించిన  సత్తిరాజు సీతారామయ్య 1913 మార్చ్ సంచికలో స్వవిషయము అనే శీర్షికతో  సంపాదకీయ ప్రాయమైన రచన ఒకటి చేసాడు. అందులో ఆయన తాను 1902 ఏప్రిల్ నుండి   ఏలూరులో హిందూసుందరి పత్రికను నడుపుతున్న విషయాన్ని చెప్పికాకినాడలో స్త్రీవిద్యాభివర్ధనీ సమాజాన్ని(నిజానికి ఇది కాకినాడ విద్యార్థినీ సమాజంస్థాపించి దానిని రిజిస్టర్ చేసి నిర్వహిస్తున్న కళ్లేపల్లి వెంకటరమణమ్మ(కొన్ని రచనలు కళ్లేపల్లె వెంకట రమణమాంబ అనే పేరుతో ప్రచురించబడటం , కొందరు ఆమెను అలాగే వ్యవహరించటం చూస్తాం) బాలాంత్రపు శేషమ్మ, మాడభూషి చూడమ్మ , దామెర్ల సీతమ్మ మొదలైన సోదరీమణుల సమూహం హిందూసుందరి పత్రికను నిర్వహించటంలో ఆసక్తి చూపి అడిగినందువల్ల ముద్రాయంత్రంతో సహా ఇచ్చివేస్తున్నట్లు పేర్కొన్నాడు. స్త్రీలకొరకు ఉద్దేశించబడిన హిందూసుందరి పత్రిక స్త్రీలే సంపూర్ణాధిపత్యం వహించి ప్రచురించ కంకణం కట్టుకొన్నందువల్ల మరింత అభివృద్ధిలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసాడు. సుందరి కార్యస్థానం కాకినాడకు మారుతున్నదని చిరునామా మార్పును సూచిస్తూ ఒక ప్రకటన చేసాడు.

1913 జూన్ లో  11 వ సంపుటం ఒకటవ సంచిక వచ్చింది. జులైలో వచ్చిన  రెండవ  సంచిక పై సంపాదకులుగా మాడభూషి చూడమ్మ, కళ్ళేపల్లె వెంకటరమణమ్మల పేర్లు ఉన్నాయి. అందువల్ల పొత్తూరి వెంకటేశ్వర రావు గారు అన్నట్లుగా ఈ మార్పు 11 వ సంపుటి 9 వ సంచిక నుండి కాక 2 వ సంచిక నాటికే జరిగింది. ( ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు , 2004, పు; 207 )1925 వరకు దాదాపు పన్నెండు ఏళ్ళు వాళ్ళే ఆ పత్రిక సంపాదకులు. ఆ తరువాత బాలాంత్రపు శేషమ్మ  సంపాదకత్వంలోకి మారింది ఆ పత్రిక.

సంపాదకులు  కావటానికి పదేళ్ల ముందు నుండే కళ్ళేపల్లె వెంకట రమణమ్మ  రచనలు హిందూసుందరి పత్రికలో ప్రచురించబడుతూ రావటం గమనించవచ్చు.ఆమె సాహిత్య జీవిత వివరాలు తెలుసుకొనటానికి  హిందూసుందరి 1910 డిసెంబర్ సంచిక లో మాడభూషి చూడమ్మ వ్రాసిన (‘శ్రీమతి కళ్లేపల్లె వెంకటరమణాంబ’) పరిచయ వ్యాసం ఒక్కటే ఆధారం. ఇద్దరూ స్త్రీవిద్యాభివర్ధినీ సమాజం కొరకు , హిందూ సుందరి పత్రిక కొరకు కలిసి పని చేశారు కనుక ఇది సాధికార సమాచారం. గంజాం జిల్లా బరంపురం మునసబు కోర్టులో ప్లీడరుగా పనిచేసిన కురవి రామశాస్త్రి వెంకట రమణమ్మ తండ్రి. తల్లి కామేశ్వరమ్మ.  1864 సెప్టెంబర్ 9 ( రక్తాక్షి నామ సంవత్సర భాద్రపద శుక్ల నవమిరమణమ్మ పుట్టింది. కానీ యక్షగాన వాజ్మయ చరిత్రలో యస్వీ జోగారావు వెంకట రమణమ్మ వరలక్ష్మీ పూజావిధానం అనే యక్షగానం వ్రాసిందని పేర్కొంటూ ఆమె పుట్టింది 1875 అని , తల్లి పేరు కామనాంబ అని పేర్కొన్నారు.

వెంకట రమణమ్మ  తండ్రిది ఆధ్యాత్మిక చింతనా మార్గం. తల్లిది సద్గ్రంథ పఠన ప్రీతి. కూతురికి 8వ ఏట ఇచ్ఛాపురం కాపురస్తులైన కళ్లేపల్లె శివరామయ్య తో  పెళ్లి జరిపించారు. అత్త గారింట ఉండి ఆంగ్ల కళాశాలలో చదువుకొంటున్న శివరామయ్య భార్యకు ఇంటివద్ద చదువు చెప్పించటానికి అత్తమామలను ఒప్పించాడు.కాపురానికి వెళ్ళాక రమణమ్మ సంగీత విశారద అయిన అత్తగారు రత్నాచలాంబ వద్ద సంగీతం, ఆరుశాస్త్రాలలో పండితుడు అయిన మామగారు సీతా రామశాస్త్రి వద్ద సాహిత్యం అభ్యసించింది. కవిత్వం వ్రాసే విద్య పట్టుబడింది. లక్ష్మీ పూజ పాటల రచనతో కవితా వ్యాసంగం ప్రారంభమైంది. 14 ఏళ్ళ వయసుకు ఆమె చేసిన కృషి ఇది.

1878 నుండి ఇరవై ఏళ్లపాటు సంసార సంబంధ సమస్యలు , బరువు బాధ్యతల మధ్య గడిచింది. మరిది అకాల మరణం, ఆ దుఃఖంలో మునిగిన అత్తమామల సేవ, తల్లి మరణం , తండ్రి సంరక్షణ బాధ్యత , అత్తమామల మరణం, తండ్రి మరణం, అన్నగారి భార్య మరణం, పునర్వివాహం, ఆమె కాపురానికి రాకముందే అన్నగారి మరణం, వదిన గారికి తనకొడుకును దత్తత ఇయ్యటం ఈ మొదలైనవన్నీ జరిగాయి. 1898 నుండి మళ్ళీ ఆమె విద్య వ్యాసంగం , రచనా వ్యాసంగం కొనసాగాయి. శశిలేఖ, దేశోపకారి, కల్పలత  మొదలైన పత్రికలకు వ్రాస్తుండేది. అవి లభించి ఉంటే బహుశా తొలి ఆధునిక తెలుగు రచయిత్రిగా ఆమె పేరు ముందు చెప్పుకోవాలి అనుకొంటా. పెళ్లయి పిల్లలువున్న పెద్ద కూతరు , అయిదేళ్ల కొడుకు అకాల మరణం కృంగదీసినా కంటి చూపు దెబ్బతిన్నా విద్యావిషయ వ్యాసంగమే అన్నిటికీ ఊరటగా భావించింది. రచనలు చేస్తూ పత్రికలకు పంపుతూ వచ్చింది. లభిస్తున్నంతవరకు 1903 ఏప్రిల్ హిందూసుందరిలోని మంగళ హారతి ఆమె తొలి రచన.

1909 ఏప్రిల్ లో భర్త ఉద్యోగరీత్యా కాకినాడ రావటం ఆమె జీవితంలో ఒక మలుపు. పులుగుర్త లక్ష్మీ నరసమాంబ స్థాపించిన 1904 నాటి కాకినాడ విద్యార్థినీ సమాజం 1910లో పునరుద్ధరించబడే నాటికి కళ్లేపల్లె వెంకట రమణమ్మ కాకినాడలో ఉందన్నమాట. బాలాంత్రపు శేషమ్మ, మాడభూషి చూడమ్మ , దామెర్ల సీతమ్మలతో కలిసి దాని కార్యకలాపాలలో ఆమె చురుకైన పాత్ర నిర్వహించింది. అయిదుగురు కూతుళ్లు , ఇద్దరు కొడుకులుమనుమలు, మనుమరాళ్ళు ఉన్న  పెద్ద సంసారం నిర్వహించుకొంటూనే సమాజ దైనందిన వ్యవహారాలలోనే కాక కాకినాడలోనూ ఇతర ప్రాంతాలలోనూ జరిగే స్త్రీల సభలకు అధ్యక్షత వహించటం( 1910 జులై 8 న కాకినాడలో నర్సాపుర సంఘంవారి పరీక్షలలో ఉత్తీర్ణులైన స్త్రీలకు బహుమతి ప్రధానం చేసే సభకు  1913 జనవరి 3,4 తేదీలలో విజయనగరంలో  శ్రీ సత్య సంవర్ధినీ సమాజ ద్వితీయ వార్షిక సదస్సుకు అద్యక్షత వహించటం అలాంటి వాటిలో కొన్నిఉపన్యసించటం, వ్రాయటం, పత్రికా సంపాదకత్వం మొదలైన పనులతో తనను తాను నిలబెట్టుకొని నిరూపించుకున్నది వెంకట రమణమ్మ.  

  కళ్లేపల్లె  వెంకట రమణమ్మ రచనలను కీర్తనలు, కవిత్వం , వ్యాసం అని మూడు శీర్షికల క్రింద పరిశీలించవచ్చు.

                                                           1

స్త్రీల జీవితంలో ఇంటి పని , పిల్లల పెంపకంతో పాటు పూజలు, వ్రతాలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మగవాళ్ళు చదువుకొని ఉద్యోగస్తులై ఆధునిక జీవన మార్గంలో ఉన్నా కుటుంబ సం ప్రదాయ సంస్కృతులు కాపాడవలసినవాళ్లు మహిళలే అయ్యారు. నిత్య పూజ తో పాటు  ఐదవతనాన్ని , ఐశ్వర్యాన్ని, బిడ్డల క్షేమాన్ని ఆశించి స్త్రీలు పెట్టవలసిన నోములు, వ్రతాలు ఎన్నో రూపొందాయి. ఆధునిక యుగంలో వ్రత  విధానాలను  అచ్చువేసి మరీ ప్రచారం చేశారు. ఆయా సందర్భాలలో స్త్రీలు అల్లుకొని పాడే పాటలు కూడా ఆ క్రమంలోనే పత్రికలు ప్రచురించ దగినవి అయినాయి. అట్లా కళ్లేపల్లె వెంకట రమణమ్మ వ్రాసిన పాటలు హిందూసుందరి పత్రికలో ప్రచురించబడ్డాయి. 1903 ఏప్రిల్, మే , సెప్టెంబర్ అక్టోబర్  సంచికల లో ఆమె వ్రాసిన మూడు  మంగళ హారతులు అచ్చు అయ్యాయి. వ్రతవిధానం  అంతా పూర్తయ్యాక నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇస్తూ పాడే పాటలు మంగళ హారతులు.

మంగళ హారతులీరె మాహాలక్ష్మికి రంగని పట్టంపు రాణి కి రాజీవాక్షికిఅనే పల్లవితో ప్రారంభమై అయిదు చరణాలతో   ఉన్న మంగళ హారతి ఒకటి ( ఏప్రిల్ , 1903). అయిదవ చరణంలో లక్ష్మికి గరితలందరును హారతి ఇయ్యాలని చెబుతూ ఆ లక్ష్మికి  ‘ కరుణ కళ్లేపల్లె వేంకట రమణమను - నిరతము రక్షించునది అన్న విశేషణాన్ని చేర్చింది. ఆ రకంగా పాటతో పాటు తన పేరునూ అక్షర బద్ధం చేసింది.   భ్యాగ్ రాగంలో రూపకతాళం లో ఈ పాట పాడుకోవాలన్న సూచన కూడా వుంది. రెండవ మంగళ హారతి ( మే , 1903) కొంత ప్రత్యేకమైనదిమంగళ హారతి ఇయ్యవలసినది   శ్రీమహావిష్ణువుకు. కానీ ప్రత్యక్షంగా ఆయన విశేషగుణాలను స్తుతిస్తున్నట్లు కాక పాత్రలను ప్రవేశపెట్టి , సంభాషణలతో కూడిన నాటకాన్ని దృశ్యమానం చేస్తున్నట్లు ఈ మంగళ హారతిని రచించటం విశేషం.

వనజయో గిరిజయో వాణియో యనదగి జనుచున్నావిపుడు రుక్మిణిరొ ఎక్కడికేఅని ఒక ప్రశ్న … “వనధి దాగిన సోమకుని జంపి శ్రుతులు దెచ్చిన మత్స్యమూర్తి శ్రీ నరుని సన్నిధికే”  అని రుక్మిణి జవాబు మొదటి చరణం అది కాగానేమంగళం మంగళం భవంతువేఅన్న పల్లవి. అష్టభార్యలలో మిగిలిన  సత్యభామ, జాంబవతి , లక్షణ, మిత్రవింద, కాళింది, నాగ్నజిత్తి , భద్ర లతో పాటు నీళా , రాధ లను కూడా సంబోధిస్తూ ఇలాంటి ప్రశ్నలు, వాటికి వాళ్ళ సమాధానాలు ఒక్కొక్క చరణంగా మొత్తం పది చరణాల పాట ఇది. ప్రతి చరణం తరువాత  “మంగళం మంగళం భవంతువేఅన్న పల్లవి పునరావృతమవుతుంది. పది చరణాలలో పదిమంది స్త్రీలను ప్రత్యేక విశేషణాలతో సంబోధిస్తూ ఎక్కడికి వెళ్తున్నావు అనే ప్రశ్న ఉంటుందిరుక్మిణి ముగురమ్మల మూలపుటమ్మ , సత్యభామ మన్మధుడి చేతి బాణం, జాంబవతి శృంగార మూర్తి, చేతిగాజుల చరణమంజీరముల రవళి లక్షణ, చీకటిలో మెరిసే పాపిటబొట్టు కలిగిన మిత్రవింద, కొప్పులో పూలు కదిలే కాళింది, చెలికత్తె భుజం మీద చెయ్యివేసి వెళ్లే భద్ర , ముత్యపు ముక్కెర మెరిసే నాగ్నజితి , అద్దంలాంటి చెక్కిళ్ళ నిగనిగల నీళా , ముస్తాబైన రాధ చలన చైతన్యాలతో  సందడి చేస్తుంటారు ఈ చరణాలలో. ఆ పదిమందీ  శ్రీ కృష్ణుడిని  ప్రియుడు అని ఆరాధించే స్త్రీలు. వాళ్ళతో ఈ మంగళ హారతి పాడుకొనే స్త్రీలు ఐక్యత సంభావించటానికి వీలుంది.

స్త్రీలు అనేకులు. వాళ్ళ ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు ఒక్కడే. ప్రతి స్త్రీ కృష్ణుడిని సంభావించే తీరు భిన్నభిన్నం. రుక్మిణికి ఆయన మత్స్యావతారమెత్తిన వేదో ద్ధారకుడు. సత్యకు దేవతల కు అమృతం సంపాదించి పెట్టటానికి కూర్మావతారం ఎత్తిన మూర్తి. జాంబవతికి హిరణ్యాక్షుడిని చంపటానికి వరాహావతారం దాల్చినవాడు. లక్షణకు ప్రహ్లాదుడిని కాచిన నరసింహమూర్తి. మిత్రవిందకు బలిని పాతాళానికి తొక్కిన వామనమూర్తి. కాళిందికి రావణ సంహారం  చేసిన శ్రీరామచంద్రుడు. భద్రకు పరశురామ అవతారం. నాగ్నజిత్తి కి గోపాలకృష్ణుడు. నీళా దేవికి బుద్ధుడు. రాధాదేవికి కళ్లేపల్లె వేంకటరమణాంబను బ్రోచే కల్కి అవతారం. పదిమంది ప్రియులైన స్త్రీల ముఖంగా శ్రీమహావిష్ణువుకు సంబంధించిన పది అవతారాలను స్తుతియింప చేసి ఒక్కొక అవతారానికి మంగళం మంగళం అని హారతి ఇయ్యటం ఈ రచనలోని విశేషం. మధురభక్తిదశావతార కథన స్తోత్రాల కదంబ  కథన గానం ఈ మంగళ హారతి.

ఒక నాయకుడు పదిమంది నాయికలు. ప్రియుడి కోసం బయలుదేరిన నాయికను ఎక్కడికి అని ప్రశ్నించి నాయికా ముఖంగా నాయకుడిపట్ల అభిమాన అనురాగాల ప్రదర్శన పద్ధతి భామాకలాపం వంటి నృత్య రీతిలో , యక్షగాన సంప్రదాయంలో ప్రముఖంగా ఉంటుంది. కళ్లేపల్లె వెంకటరమణమ్మ వ్రాసినట్లు చెప్పబడుతున్నవరలక్ష్మీ పూజావిధానంయక్షగానం లభించటం లేదుగానీ ఈ మంగళ హారతి వెంకటరమణమ్మ యక్షగాన రచనా సామర్ధ్యాన్ని తెలుసుకొనటానికి చక్కగా ఉపయోగపడుతుంది. సురట రాగం, ఆట తాళం లో పాడవలసిన మంగళహారతి ఇది.

మూడవ మంగళ హారతికి ( సెప్టెంబర్- అక్టోబర్ 1903) ఉద్దిష్ట దైవం శివుడు. మంగళ మనరె యో యంగనామణులారా అంగజహరునకు గంగోత్తమాంగునకు అనే పల్లవి, ఏడు చరణాలు ఉన్నాయి. హిమాలయాలలో తపస్సుచేసి మన్మధుడిని చంపిన శివుడు, దక్షుడిని శిక్షించిన శివుడు, త్రిపురాసుడిని సంహరించిన శివుడు, అమృతమధనం సందర్భంలో పుట్టిన విషాన్ని తగిన శివుడు, బాణుని కొరకు హరితో పోరిన శివుడు, కిరాతరూపుడైన శివుడు  ఈ మంగళ హారతిలో  ప్రస్తుతించబడ్డారు. కళ్లేపల్లె వేంకట రమణాంబను ఏలే చంద్రశేఖరునికి మంగళం అంటూ ముగుస్తుంది.

మంగళ హారతులతోపాటు రమణాంబ కీర్తనలు కూడా రచించింది. కీర్తనకు మంగళహారతికి వలే పూజా సందర్భం ఉండదు. అవి కేవలం ఇష్ట దైవం పట్ల తన భక్తి ప్రపత్తులను వ్యక్తీకరిస్తూ గానం చేయబడేవి. పల్లవి , చరణాలు వీటిలో కూడా ఉంటాయి. ‘శరణు శరణు శ్రీలక్ష్మీ- మాహాలక్ష్మి శరణు శరణు శ్రీలక్ష్మిపల్లవిగా అయిదుచరణాల శ్రీలక్ష్మీ సంకీర్తన ఒకటి ( ఏప్రిల్ 1903)  వందనమే యిందిరా వందనమే అనే పల్లవితో నాలుగు చరణాల కీర్తన మరొకటి. ( సెప్టెంబర్, అక్టోబర్ 1903) రెండింటిలోనూ చివరి చరణం లో రచయిత్రి పేరు వస్తుంది.

తులసి పూజా విధానాన్ని పాటగా చేసింది వెంకట రమణమ్మ ( 1903 మే) శ్రీ రమేశ మస్తకంబునా శోభిల్లు వారిజాక్షి బృందావతీ అని మొదలై ధ్యానం , ఆవాహనం, ఆచమనం, వస్త్రం ఇచ్చి నగల అలంకరణ , పుష్పాలంకరణ చేసి  ఆవు నేతి దీపంపెట్టి పూజించి   నైవేద్యంమంచినీళ్లు  ఆకువక్కలు  సమర్పించి మంత్రపుష్పం చదివి నమస్కరించి అపరాధ క్షమాణాలు కోరి ఐదవతనం, విద్య , భక్తి , సంతానం, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కోరుతూ పూజ పూర్తి చేయాలని ఈ పాటలో ఆమె చెప్పింది. కళ్లేపల్లె వేంకట రామణమాంబ  సాటిలేని భక్తితో చేసిన ఈ పద్ధతిలోనే స్త్రీలు తులసిని పూజించి ఆమె దయను, కోరిన వరాలను పొందవచ్చునని పాటను ముగించింది.

జీవితంలో స్త్రీల పనులన్నీ పాటలతో ముడిపడ్డవే. నాట్లు వేయటం, కలుపుతీయటం దంచటం, విసరటం, చల్ల చిలకటం, పిల్లలను లాలించటం, పోషించటం అన్నిటినీ అనుసరించి వచ్చేది పాట. ఈ గానోత్సవం పెళ్లిళ్లు మొదలైన సందర్భాలలో ప్రవాహమై సాగుతుంటుంది. ఇందుకు సంగీతం నేర్చుకున్నారా అన్నదానితో ప్రమేయమే లేదు. మా అమ్మ చెప్తుండేది పెళ్లి అంటే వరసైన వాళ్ళను ఆటపట్టించేవి, భోజనాలు తదితర సందర్భాలలో పాడటానికి అనువైన పాటలు పెద్దవాళ్ళనో , సావాసకత్తెలనో అడిగి రాసుకొనటం , అభ్యాసం చేయటం తో ముందు నుండే సందడి గా ఉండేదని. ఆమె చేతివ్రాత పాటల పుస్తకం కూడా ఒకటి నాకు గుర్తు. ఇదంతా చెప్పటం ఎందుకంటే ఇలా జీవిత చక్ర సంబరాలలో భాగంగా పాటలు మూడు రమణమ్మ వ్రాసింది కనుక.

వాటిలో మేలుకొలుపు పాట( డిసెంబర్, 1903) ఒకటి . లాలిపాట( జనవరి 1904)  మరొకటి. పిల్లలను లేపటం, నిద్రపుచ్చటం ఇవి రెండూ తల్లులు చేసే పనులు. ఆ పనులను అందగింప చేసుకొనటానికి పాట అనుబంధం అయింది. ఇవే భగవంతుడికి సేవలు అయ్యాయి. రాజులకు భోగాలయ్యాయి. వెంకట రమణమ్మ వ్రాసిన మేలుకొలుపు పాట గానీ , లాలి పాట గానీ పిల్లల కోసం వ్రాసినవి కావు. రెండూ శ్రీమహాలక్ష్మి దేవిని సంబోధిస్తూ సేవించటంగా వ్రాసిన పాటలు. భూపాళ రాగం , ఆట తాళంలో పాడుకొనటానికి వ్రాసిన మేలుకొలుపు పాట సరళ సుందరం. తెల్లవారవచ్చెను మహాలక్ష్మి తెల్లవారవచ్చెను పల్లవి.  ‘తెల్లవార వచ్చె దిశల తెలుపు హెచ్చెబల్లవపాణిరో లేవమ్మా/ మల్లెపూల పరిమళముతో గాలి చల్లగావీచెను లేవమ్మా’   అని ప్రారంభించి మొత్తం పది చరణాలతో వ్రాసిన ఈ పాటలో  తెల్లవారేవేళ కోల్లా కొక్కొరోకోలు, , పూలవికాసం వాటిపై వాలే తుమ్మెదల రొద , పక్షుల కువకువలు, కాంతి తగ్గిన దీపాలుచంద్రాస్తమయ సూర్యోదయాల సొగసు  సహజసుందరంగా వర్ణితమయ్యాయి. మహాలక్ష్మి ఎందుకు లేవాలంటే  తన మదిలో  కోర్కెలు తీర్చటానికి, సేవించవచ్చిన చెలులను దయచూడటానికి, ‘సీతారామశాస్త్రి శిష్యురాల్గ వితమువినటానికి  అని చెప్తుంది. సీతారామ శాస్త్రి శిష్యురాలు వెంకట రమణమ్మే. సీతారామశాస్త్రి ఆమె మామగారు. ఆయన వద్దనే ఆమె కవిత్వం చెప్పగల ప్రతిభావ్యుత్పత్తులను సంపాదించుకున్నది.

ఇక లాలిపాట ( జనవరి 1904 ) శ్రీమహాలక్ష్మికి పవళింపు సేవ. లాలి శ్రీ మహాలక్ష్మి లాలి జయలక్ష్మి లాలి మోక్షలక్ష్మి  లాలి వరలక్ష్మీ అన్న పల్లవితో ఆరు చరణాలతో ఈ పాటను రచించింది. స్త్రీలు ఉయ్యాల బంగారు గొలుసులు పట్టుకొని చిరునవ్వులతో పులకాకంకిత శరీరులై , తల నుండి పూలు జారుతుండగా , నొప్పులు మెడమీద కదులుతుండగా చిరుచెమటలు జారగా  భక్తితో ఉయ్యాల వూపుతున్నారు నిదురపొమ్మని కోరుతుంది. ఈ పాటలోనూ మామగారి ప్రస్తావన ఉంది. కళ్లేపల్లె సీతారామకవిని వరములిడి రక్షించమని మహాలక్ష్మిని వేడుకొంటుంది. వరములిచ్చి  రక్షించమంటున్నది అంటే అప్పటికి ఆయన జీవించి ఉన్నట్లే. 1881లో  ఆయన చనిపోయినట్లు మాడభూషి చూడమ్మ వ్యాసం సాక్ష్యమిస్తున్నది. ( డిసెంబర్ 1910) కనుక ఈ  లాలిపాట 1881 కి ముందు రచన అయి ఉండాలి. అట్లగాయితే 1896- 98 లలో రచనలు చేసిన గుండు అచ్చమాంబ కన్నా పూర్వపు రచయిత్రి అవుతుంది కళ్లేపల్లె వెంకట రమణమ్మ.

స్త్రీల పాటలలో తలుపుదగ్గర పాటలు ఒకరకం. పెళ్లిళ్లలో వధూవరులను బయటి గడప దగ్గర ఆగి పేర్లు చెప్పించే వేడుక సందర్భగా పాడే పాటలు ఉంటాయి. ఏదో కారణాన అలిగిన భార్య గదిలోకి వెళ్లి తలుపు గడియపెట్టుకొన్నప్పుడు తలుపులోపల భార్యకు , బయటి భర్తకు జరిగే సంవాదం  రూపంలోనూ పాటలు ఉంటాయి. భర్త భార్యను తలుపుతీయమని వేడుకొనటం అందులో ప్రధానం. కళ్లేపల్లె వెంకటరమణమ్మ అలాంటి పాట  ఒకటి వ్రాసింది( జులై 1903) ఇది శివ పార్వతుల సంవాదం. పార్వతి శివుడి తలమీద గంగను చూచి కోపించి తలుపువేసుకొన్నది. శివుడు మూసిన తలుపు ముందు నిలబడి తన మీద అలక ఎందుకు  తలుపు తీయమని కోరతాడు. ఒక అందగత్తెను నెత్తిమీద పెట్టుకొని వస్తే తలుపెందుకు తీస్తాను అని ఆమె పంతాలాడుతుంది. తన నెత్తిమీద వున్నది గంగానది నమ్మమంటాడు. ఆమె నుదురు కనిపిస్తున్నదంటే అది సిగలోని చంద్రవంక అంటాడు. అలా నుదురు నుండి ప్రారంభించి ఆమె చెవులు, జడ, కనుబొమలు, ముఖము, ముంగురులు, ముక్కు , కన్నులు , ఆధరములు, చెక్కులు, కంఠము , చేతులు , పాలిండ్లు మొదలైన పాదాలవరకు , పాదాల గోళ్లవరకు ఉన్న అవయవాలను అన్నిటినీ గుర్తించి చెబుతూ అవి  స్త్రీవే   కాదా అని గౌరీ వేసే ఒక్కొక్క  సవాల్ కు శివుడు అవి స్త్రీ అవయవాలు కాదు నదీ సంబంధమైన పద్మాలుతుమ్మెదలు , నల్ల కలువలు, చేపలు, పగడపు తీగెలు, చేపల పొలుసులు , శంఖం , తామర కాడలు, పక్షులు, పర్వతాలు , ఇసుకతిన్నెలు అంటూ   నమ్మబలుకుతూ గంగానది నీ స్నేహాన్ని కోరుతున్నది అంగీకరించమని అడుగుతాడు. గంగతోడ రావోయి అని గౌరి  తలుపు తీయటంతో ఈ పాట  ముగుస్తుందిసాహిత్య ప్రపంచంలో స్త్రీల అవయవాలకు ఉపమానాలుగా స్థిరపడిన కవిసమయాల గురించిన సంపూర్ణ అవగాహనతో రూపకాలంకారాన్ని మొదటినుండి చివరివరకు ప్రయోగిస్తూ చేసిన చమత్కార రచన ఇది.

 

                                                                                               ( ఇంకా ఉంది )

సాహిత్య వ్యాసాలు

వృద్ధిని బహిష్కరించిన వృద్ధి

ప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ఇటీవల రచించిన ‘వృద్ధి’ కథపై ప్రస్తుతం పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లడవుతోంది. తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ కథ రాసింది ఇనాగ్గారేనా? ఆయన ఒక దళిత రచయితేనా? అని చాలామంది విస్తుపోతున్నారు. ఈ కథలో కథానాయికలైన లింగి, సౌందర్యలు పనిదొంగలుగా, సోమరిపోతులుగా, తిండిపోతులుగా, తిరుగుబోతులుగా, పోకిరీలుగా చిత్రింపబడినట్లు కనబడుతున్నది. అందువల్ల రచయిత ఈ కథలో దళితస్త్రీ స్వాతంత్ర్యాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడని చర్చలు చేస్తున్నవాళ్లు అపోహపడుతున్నారు. ఇనాగ్గారు వాడిన భాష కూడా ఈ సందిగ్ధతకు కొంత కారణమయింది. అందువల్ల ఇనాగ్గారిని చాలామంది నిరసిస్తున్నారు. సదరు కథని భేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు. ఇది ఎంతవరకు పోయిందంటే “ఇలాంటి కథ రాసిన పెద్దమనిషిని ఇంకా గారూ గీరూ అనడం ఏంటి?” అనేంతవరకూ పోయింది. పాఠకుడి నుండి రచయితల వరకు కథను సరిగా అర్థం చేసుకోలేక పోవడం వల్లే ఈ దుమారం రేగుతోంది. కానీ ఈ కథ వెనుక చాలా మర్మం ఉంది. వ్యంగ్యం ఉంది. వెటకారం ఉంది. అన్నిటికన్నా గొప్ప విరోధాభాసం దాగుంది. అనాది నుండి స్త్రీలని మరబొమ్మల్లా చూసిన పురుషాధిక్యతపై ఆగ్రహముంది. మాదిగల్ని బానిసలుగా చూసిన ఆధిపత్యవర్గాలపై తీవ్రమైన తిరుగుబాటుంది. ఇన్నాళ్ళూ దళితస్త్రీల శ్రమని దోచుకోవడమే తప్ప వాళ్ళ సంక్షేమం చూడని వ్యవస్థపట్ల ఎనలేని అక్కసుంది. ఎవరి పక్షాన వకాల్తా పుచ్చుకుని ఇనాగ్గారు కథ రాశారో ఆ బడుగువర్గాలవాళ్ళే అపార్థం చేసుకునేంత చిక్కదనం చిక్కుదనం ఈ కథలో ఉన్నాయి. విరోధాభాసంతో కూడిన ఈ శిల్పాన్ని పట్టుకుని విశ్లేషించుకుంటే కథ యొక్క గొప్పతనం తెలుస్తుంది. 

వృద్ధి కథలో లింగి, ఆమె కూతురు సౌందర్యల్లో కనిపించే మొదటి లోపం శ్రమించకపోవడం. పని చెయ్యాల్సిన వేళల్లో ఒంటినిట్టాడి గుడిసెల్లో సోమరిపోతులుగా నిద్రపోవడం. పనిచేసి సంపాదించి పైకి వద్దామనే ఆశావహ దృక్పథం లేకపోవడం. ఒకప్పుడు వేజండ్ల మాదిగలు కూలి దొరక్క కష్టాలు పడ్డారు. ఆసాములు ఇంటి వద్దకి వస్తే చేతులు కట్టుకుని “అట్టాగే సోమీ, వత్తాం దొరా” అనేవాళ్ళు. మంచం దిగి చేతులు నలుపుకుంటూ నిలబడేవాళ్ళు. ఇప్పుడు నారయ్య లాంటి ఆసాములు వచ్చి కూలికి రమ్మని అడుక్కుంటుంటే లింగి, సౌందర్య రామని నిర్భయంగా చెబుతున్నారు. మంచంపై నుండి లేవకుండా సమాధానం చెబుతున్నారు. “మాకేం గాడు బట్టిందా? మేం రాం” అంటున్నారు. వాళ్ళు బతిమాలుతుంటే వీళ్ళు తుస్కారిస్తున్నారు. నారయ్యని లింగి “నువ్వూ నీ పెళ్ళమూ నీ నలుగురు పిల్లలు వంగితే ఆ కలుపు తీయటం ఎంతసేపు?” అని ప్రశ్నించిది. “ఆళ్ళు పొలం పనులు ఎరగరే” అంటే “ఆళ్ళేమో నీడపట్టునుండాలా? మేమేమో ఎండనకా వాననకా పనిచేయాలా? మావల్ల గాదు. పొండి” అని కరాఖండిగా చెప్పేసింది. ఇంకా పల్లెలోని మాదిగలు ఆసాములకు కూలికి పోవడం మాని గుంటూరులో రకరకాల పనులకు పోతూ, సొంతంగా పాడి పితుక్కుంటూ సుఖపడుతున్నారు. ఒకప్పటి మాదిగల దీనస్థితికి, ఆసాముల దోపిడీకి అలవాటు పడ్డ చింతయ్యతాతకు ఇది విడ్డూరంగా కనబడింది. అతడు కాలమహిమ అని ఆశ్చర్యపోయాడు. చింతయ్యతాతలో రచయిత ఉన్నాడని అతని భావాలే రచయితవని చాలామంది చదువర్లు అపోహపడ్డారు. ఎంత కష్టపడ్డా ఆసాములు తమ శ్రమని దోచుకోవడమే గానీ తాము బాగుపడేదేమీ లేదని, తమని వాళ్ళు బాగుపడనివ్వరని, అందువల్ల ప్రభుత్వ పథకాల ద్వారా చేకూరిన లబ్ధితో ఉన్నంతలో ఇల్లు గడుపుకుని పనిపాట లేకుండా, వళ్ళు గుల్లచేసుకోకుండా ఇంటిపట్టున హాయిగా ఉండడం మేలని మాదిగల్లో మాదిగస్త్రీలల్లో వచ్చిన చైతన్యాన్ని, వాళ్ళ భౌతికవాద దృక్పథాన్ని రచయిత సానుకూల భావంతో కథలో అంతర్లీనం చేసారు. దాన్ని పాఠకులు గుర్తించలేదు. అందుకే కథని, రచయితని అపార్థం చేసుకున్నారు.   

కథలో లింగి, ఆమె కూతురు సౌందర్యల్లో కనిపించే మరో లోపం వాళ్ళు తమ మొగుళ్ళు పోయి విధవలయ్యాక మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళకపోవడం. మొదట లింగి తన మొగుడు పోయినందుకు బాధపడకపోగా సంతోషించింది. “పీడ ఇరగడైపోయింది” అనుకున్నది. పెళ్ళయి కార్యం కాకనే తన అల్లుడు జమాల్సుగాడు పోయాక కూతురు సౌందర్యలో ఆ భావననే నూరిపోసింది. మళ్ళీ పెళ్లి జోలి ఎత్తకుండా చేసింది. దానికి కారణం మగాడి స్వయంకృతాపరాధం. లింగి భర్త తాగుబోతు. ఇల్లూ వళ్ళూ గుల్లచేసుకుని ఇరవై ఏళ్లకే వల్లకాటికి చేరాడు. తన రెండేళ్ళ కాపురంలో లింగి నరకం చూసింది. అందువల్ల మగాళ్ళ పట్లా, సంసారం పట్లా లింగికి విరక్తి కలిగింది. అది తరతరాలుగా తనపై పెత్తనం చేస్తున్న మగాడిపట్ల సగటుస్త్రీకి ఉన్న విముఖతే గాని పెళ్లిపై సంసారంపై సంసారసుఖాలపై ఉన్న వ్యతిరేకత కాదు. మొగుడు లేకుంటే ఏ గోకుడూ లేదు కదా అని ఆమె భావించింది. దాన్నే తన కూతుర్లో ప్రోదిచేసింది. మగవాళ్ళు రాక్షసులని నమ్మించింది. ఏ బాదరాబందీల్లేని సుఖవంతమైన జీవనానికి వాళ్ళు అలవాటు పడ్డారు. నాగరిక వర్గాల్లో మాత్రమే సాధ్యమైన ఈ పక్కా భౌతికవాద చైతన్యం ఏ ఎదుగుదలా లేని వేజండ్ల దళితస్త్రీల్లో వచ్చింది. దాన్ని రచయిత కథాగతం చేశారు. కాగా రచయిత తల్లీకూతుళ్ళని ఎప్పుడూ పెళ్లి చేసుకొమ్మని ఎబ్బెట్టు మాటలతో పోరే చింతయ్యతాతలో ఉన్నాడని పాఠకులు అనుకున్నారు. అందువల్లే కథ పట్ల వ్యతిరేకత వచ్చింది. కానీ ఇనాగ్గారు కథానాయికల తాత్వికతలో ఉన్నాడే గాని చింతయ్యతాతలో లేడు. అందువల్ల ఈ కథలో సమస్య కూడా లేదు.

కథానాయికల్లో మనకు కనిపించే మరో లోపం వాళ్ళు విధవలై, మరో పెళ్లిని నిరాకరించి కూడా శారీరక సుఖాలకు అతీతులు కాకపోవడం. వాళ్ళు శారీరక సుఖాలు అనుభవిస్తూనే ఉన్నారు. ఏ మగాడైనా వెంటబడితే ఇంత బిక్ష వేసినట్లు వాడి కక్కుర్తి తీర్చి తమ అవసరమూ  తీర్చుకుంటున్నారు. (ఈ సందర్భంలో ఇనాగ్గారు లింగీ సౌందర్య తమ ‘కుతీ’ తీర్చుకుంటున్నారు అని వాడిన మాట చాలా వివాదాస్పదమైంది) కానీ ఏ మగాడికీ కట్టుబడలేదు. వాళ్ళు ఇవ్వజూపే కాసులకు చెయ్యి చాపలేదు. వాళ్ళకి బానిసలు కాలేదు. పైగా ఎప్పటికప్పుడు కొత్తదనం గమ్మత్తుగా ఉంది. డేటింగుల పేరుతో సంపన్న నాగరికుల్లో మాత్రమే కనబడే ఈ స్వతంత్రేచ్ఛ వేజండ్ల మాదిగస్త్రీలో రావడం అద్భుతం. దాన్ని రచయిత గుర్తించి ధ్వనించారు. కానీ పాఠకులు వాళ్ళని తిరుగుబోతులుగా పోకిరీలుగా తూలనాడిన చింతయ్యతాతలో రచయితని చూసినారు. రచయిత గొంతుని గుర్తిస్తే ఏ సమస్యా లేదు.

లింగి సౌందర్య ఇద్దరూ పని చెయ్యడానికి, పిల్లల్ని కనడానికి సిద్ధంగా లేరు. అదే వాళ్ళలో చింతయ్యతాతకి ప్రధానమైన అభ్యంతరం. అతడు “మానన్నాక కాయలు కాయాలి. ఆడదన్నాక పిల్లల్ని కనాలి” అంటాడు. “కష్టపడాలి, కూడు తినాలి. ఇష్టపడాలి, పిల్లల్ని కనాలి” అంటాడు. “నువ్వు పనిచేసే శక్తివి మాత్రమే కాదు. పిల్లల్ని ఉత్పత్తి చేసే ప్రాణయంత్రానివి కూడా” అంటాడు. కానీ వాళ్ళ తత్వం వేరు. “ఒకడికి చాకిరీ ఎందుకు చెయ్యాలి? ఒకడికి పిల్లల్ని ఎందుకు కనాలి?” అంటారు. తమ బతుకులే భారమైనప్పుడు ఇంకా పిల్లలెందుకంటారు. పిల్లల్ని కనడం అంటే ఈ భూమ్మీద మానవుడి మనుగడని కొనసాగనివ్వడం. తమని మనుషులుగా చూడని పురష ప్రపంచానికి, ఆధిపత్య పెత్తందారీ ప్రపంచానికి నిరాఘాటంగా కొనసాగే అవకాశం ఇవ్వడం. అందువల్ల వాళ్ళు దాన్నే దెబ్బకొట్టాలని భావించారు. అందుకే వాళ్ళు వాళ్ళ వృద్ధినే కాదు జనవృద్ధినే నిరాకరించారు. వాళ్ళు తమ శ్రమశక్తిని దాచుకోవడం ద్వారా అర్థవృద్ధిని, పిల్లలు కనే తమ ప్రాకృతికమైన సృష్టిశక్తిని త్యజించడం ద్వారా జనవృద్ధిని బహిష్కరించారు.    

లింగి డ్వాక్రా సభ్యురాలిగా కష్టపడి కొంత డబ్బు కూడబెట్టుకున్నది. వైధవ్య ఫించను రెండువేలు అయ్యాక కూరగాయలగంపని మూల పడేసింది. తల్లీకూతుళ్ళు నెలనెలా చెరో రెండువేలు చొప్పున వైధవ్య ఫించను తీసుకుంటారు. చౌకధరల దుకాణం ద్వారా వాళ్లకి  చవగ్గా ఇంటిసరుకులు లభిస్తాయి. ఓపిక ఉంటే వండుకుంటారు. లేకుంటే గుంటూర్లో సినిమా చూసి ప్రభుత్వ క్యాంటీన్లోనో గుళ్ళోనో చర్చిలోనో తిని వస్తారు. అందువల్ల వాళ్లకి ఆసాములకు వెట్టిచాకిరీ చేయాల్సిన అవసరం లేదు. ఒక మగాడి కింద బానిసలా పడి ఉండాల్సిన అగత్యం లేదు. ఇప్పుడు వాళ్ళకి మగాళ్ళు కుక్కల్లా కనబడుతున్నారు. చింతయ్యతాత వాళ్ళ భవిష్యత్తుపై బెంగపడ్డ భయాలన్నింటికీ వాళ్ళు తమదైన తాత్వికశైలిలో సమాధానాలు చెప్పారు. అది సమాజం పట్ల వాళ్ళలో పేరుకున్న అక్కసు. తేరగా వచ్చే వైధవ్య ఫించను తీసుకోవడంలోనూ, ప్రభుత్వ క్యాంటీన్ భోజనం తినడంలోనూ వాళ్ళు తమ అక్కసుని తీర్చుకుంటున్నారు. తమకు తమ కాళ్ళపై నిలబడేటట్లు ఉపాధి కల్పించకుండా ఓట్ల కొనకం లాంటి ఫించను ఇవ్వడం పట్ల వాళ్లకు కసి ఉంది. ఎన్నాళ్ళు ఇస్తావో ఇవ్వు అన్న కక్షసాధింపు ఉంది. ఇలాంటి తత్వచింతనా నేపథ్యం ఉన్న ఒక సరికొత్త తరం ఇప్పుడు పుట్టుకొస్తోంది. ఇది తమని భౌతిక వస్తుసంపదలతో ఎదగనివ్వని సమాజాన్ని ఎదిరించడానికి వాళ్ళలో కలిగిన ప్రగతిశీలం. మానసికమైన వృద్ధి. దాన్ని రచయిత పసిగట్టారు. దాన్నే కథనం చేశారు. పైకి కథానాయికల్లో లోపాలు చూపిస్తూ అంతర్లీన శిల్పం ద్వారా వాటిని ఆభాసం చేశారు. అందువల్ల చదువరులు కథలో ఉన్న విరోధాభాసాన్ని గుర్తిస్తే అది ఇచ్చిన సందేశం తెలిసొస్తుంది. రచయిత చింతయ్యతాత అనుభవాల్లో ఉన్నాడే తప్ప ఆచరణలో లేడు. అతని భాషలో ఉన్నాడే తప్ప అతనిదైన ఫ్యూడలిస్టు భావజాలంలో లేడు.

 

వృద్ధి ద్వారా రచయిత నిమ్నకులస్త్రీల్లో వచ్చిన చైతన్యాన్ని నిరూపించారు. భూస్వాములూ ఆస్వాముల ఆగడాలు ఇక చెల్లవని సందేశం ఇచ్చారు. ఆడతనంపై మగపెత్తనం ఇక కొనసాగదని హెచ్చరించారు. ఐతే వస్తు నేపథ్యపు అవసరం కొద్దీ దాన్ని ఎబ్బెట్టు పదజాలంతో బీభత్సపాకంలో పండించారు. ఎందుకంటే సక్రమమైన సంసారసుఖాలకు నోచుకోని ఆ బతుకుల నిండా బీభత్సం దాగుంది కాబట్టి. ఆసాముల శ్రమ దోపిడీల్లో, ఓట్లకోసం కమీషన్ల కోసం ప్రవేశపెట్టే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మనిషి జీవితం ఒకానొక వికృతరూపం దాలుస్తోంది కాబట్టి. అంతేగాని ఆయనకు దళితస్త్రీలపట్ల గాని, వాళ్ళ నూతన జీవన తాత్వికత పట్ల గాని ఎలాంటి వ్యతిరేకతా లేదు. వాళ్లకి జరుగుతున్న అన్యాయం పట్ల ఆగ్రహంతోనే ఆయన అలాంటి భాషని ఎన్నుకున్నారు. ఈ కథలోని వస్తువు దళితస్త్రీలని, దళితుల్ని ఎక్ష్ప్లొయిట్ చేస్తున్న వ్యవస్థాగత రుగ్మతలకి రచయిత కనుగొన్న ఒక సరికొత్త ఔషధం. నోటిని చేదు చేసే ఔషధం చెడ్డది కాదు. అది పుష్టిదాయిని. కథకుడైన రచయిత ఒక సామాజిక వైద్యుడు. పుచ్చిపోతున్న సమాజానికి చురుక్కుమని సూదిమందు వేస్తున్న ఆ వైద్యుడు చెడ్డవాడు కాడు. దాని రోగాల్ని నయం చేసి స్వస్థత చేకూర్చుతున్న ఆరోగ్య ప్రదాత. అందువల్ల వృద్ధి కథలోని వ్యంగ్యాన్ని, విరోధాభాసాన్ని అర్థం చేసుకుని స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

                    చ.వా: 9494696990   

సాహిత్య వ్యాసాలు

ఆర్ద్రత హరికిషన్ కథల అంతఃసూత్రం 

ఏకోరసః కరుణ ఏవ నిమిత్త బేధాద్భిన్నః...

నీటిసుడులకు, తరంగాలకు, నురగలకు రూపం వేరైనా జలమే ఆధారమైనట్లు, ఎంత వైవిధ్యభరితమైన కథావస్తువుల్ని హరికిషన్ స్వీకరించినా అన్ని కథలసారం భాదాతప్త జీవితచిత్రణే. మానవాళికి అందాల్సిన న్యాయాన్ని, జీవించేహక్కును శిల్పించే ప్రయత్నంలో హరికిషన్ కథాసంవిధానానికి సహకరించింది కరుణార్ద్రతలే. అందువల్లనే ఈయన కథలకు పరుషస్పర్శ వుండదు. కొన్ని లోకస్పర్శ కలిగి పరుషములుగా మారతాయని అందుకు ఆధారం కరుణమేననివీర రాఘవ పండితుడు చెప్పారు. ఈ ఆలంకారిక  వ్యాఖ్యానం సరిగ్గా హరికిషన్ కథలకు సరిపోతుంది. బలహీనవర్గాల జీవితం సృజించినా, బహుజన జీవితం చిత్రించినా, రాయలసీమ రాజకీయ విద్రోహాలు బహిర్గతం చేసినాఅపసవ్యతల మూలాలు పాఠకుల మనసు ఆర్ద్రతా సంచలనాలకు గురవుతాయి.

ఇతని కథల్లో ప్రధానంగా కనిపించే వైవిధ్యం రాయలసీమ వాసుల దారిద్ర్యానికి కారణమైన న్యాయమైన నీళ్ళవాటా గురించి కథనంచేశారు. అలాగే బహుజనులుగా వృత్తిజీవితంలో అనుభవిస్తున్న కడగండ్లుఆధిపత్య సామాజిక వర్గంనుండి ఎదుర్కొంటున్న దాష్టీకాన్ని సీమ నేపథ్యంలో చిత్రించారు. మూడవ అంశం స్త్రీలు, పిల్లల దుఃఖమయ జీవితంలో చోటుచేసుకున్న దయనీయత, అలాగే విద్యావ్యవస్థలో చొరబడిన వ్యాపారాంతరీకరణ. ఈ ఇతివృత్తాలన్నింటిలో కనిపించే ప్రధాన లక్షణం ఆర్ద్రత. అందుకే హరికిషన్ కథల్లోని పాత్రలు అన్యాయాల్ని ఎదురించే పాత్రలుగా దర్శనమివ్వవు. పాఠకుల అవగాహనా స్థాయిని పెంచే క్రమంలో, తమ జీవన గమనంలో ఒలికే కన్నీళ్ళను నివేదిస్తాయి. ఇవి ఏం చేయాలో, ఏం చేయకూడదో పాఠకుల నిర్ణాయక శక్తికి వదిలేస్తాయే కానీ జీవితాన్ని మించిన సందేశాలు, పరిష్కారాలివ్వవు. ఈలక్షణమే హరికిషన్ పాఠక ప్రపంచాన్ని విస్తరించగలిగింది.

రాయలసీమ దుర్భిక్షానికి ఒక్క జీవనది కూడా లేకపోవడం భౌగోళికంగా దారిద్ర్యానికి దారితీస్తే, విభజన రాజకీయాంశాలు కరువు కాటకాలను, ఫ్యాక్షనిజాలనూ నేటి రాయలసీమ ముఖచిత్రంగా మార్చాయి. 1956లో జరిగిన భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన 1956లో జరిగిన ఒకానొక చారిత్రక తప్పిదం. అనంతపురం, కర్నూలు జిల్లాల  సరిహద్దు ప్రాంతాల విభజనలో జరిగిన మోసం, కర్నాటక, తమిళనాడు ప్రాంతాల సరిహద్దు జిల్లాలైన బళ్ళారి, హోస్పేట, చింతామణి, కోలార్, కె.జి.ఎఫ్, కృష్ణగిరి, హోసూరు ప్రాంతాలను కోల్పోవడం. కృష్ణగిరి, హోసూరు తమిళనాడులో కలవటం వల్ల జరిగిన నష్టం అక్కడ నివసించే తెలుగు ప్రజల కంటే, రాయలసీమ వాసులకు బళ్ళారిని కోల్పోవటం వల్ల జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా బళ్ళారిని కోల్పోవడం వలన హోస్పేట్ ను కోల్పోయాం. హోస్పేట్ ను కోల్పోవడమంటే తుంగభద్ర డ్యాంను కోల్పోవటం. దాంతో తుంగభద్ర నీటి ఆయకట్టును కోల్పోవటం. అటు కృష్ణా - పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణం జరగక పోవడం వలన జరిగిన నష్టం, ఇటు తుంగభద్ర ప్రాజెక్టు నుండి 350 టి.యం.సి.ల నీటిని కూడా పొందలేని దౌర్భాగ్యాన్ని రాయలసీమ ప్రజలు తరతరాలుగా అనుభవిస్తూనే వున్నారు.

రాయలసీమ కథకులలో మొదటి, రెండవ, మూడవతరం కరువు కారణాలు నైసర్గికతలో వెదికారు. కానీ, నాలుగోతరం  కథకులు కరువుకు కారణమైన   రాజకీయ విద్రోహాలను, నీటి వనరుల పంపిణీలో జరిగిన కుట్రలను, పరాయి ప్రాంత పెట్టుబడిని బయట పెట్టారు. ముఖ్యంగా కందనవోలు సీమనుండి వచ్చిన కథకుని కంఠస్వరంలోని సంయమనం ఒక గొప్ప సామాజిక సంధర్భం దిశగా అడుగేసింది. ఈ క్రమంలో యం. హరికిషన్ -  తరతరాల దుఃఖం”, “జై తెలంగాణా”, “కొత్తకల”, కథలు  వచ్చాయి.

'జై తెలంగాణా' కథ కోస్తాంధ్ర ప్రాంతీయుల వ్యవసాయ విధానాలను చర్చించిన కథ. వ్యవసాయం చేయడానికి పెట్టుబడి, శ్రమల పాత్రను కోస్తాంధ్ర ప్రాంతం వాళ్ళు చేసినట్లుగా వ్యవసాయం చేయడం.రాయలసీమ వాసులకు తెలియనట్లుగా చెప్పడంలోని మర్మాన్ని గ్రహించడానికి, తెలంగాణాలో మొదలైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రాయలసీమ వాసుల ఆలోచనల్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో హరికిషన్ చిత్రించారు.

కోస్తాంధ్ర వాళ్ళు రాయలసీమ భూమిని కౌలుకు తీసుకోవడంలోనూ, ఆ భూముల్ని కొని వ్యాపార వేత్తలుగా ఎదుగుతున్న క్రమాన్ని రాయలసీమ వాసులు వ్యవవసాయం చేయలేని సోమరిపోతులుగా వ్యవహరింప బడుతున్న క్రమాన్ని అర్థం చేయించడానికి రచయిత చేసిన ప్రయత్నం, స్పష్టమైన అతని కథనాత్మక వ్యూహం. గుంటూరోళ్ళ వ్యవసాయ పద్దతుల వలన ఎగువ ప్రాంతంలో కౌలుకు తీసుకొన్న వీళ్ళ భూములు పచ్చగా వుండడానికి కారణం, రాత్రివేళల్లో గ్రామీణుల కళ్ళు కప్పి, అధికార్లకు లంచాలిచ్చి, తమ పొలాలకు నీళ్ళు మళ్ళించుకునే తెలివితేటల వలన పక్క ఊర్ల పొలాలకు నీళ్ళు తక్కువ కావడం, చిన్న పిల్లల్ని వ్యవసాయ కూలీలుగా మార్చడం, పత్తి, మిర్చి లాంటి వ్యాపార పంటలకు నీటి వాడకం ఎక్కువ. ఎరువులు, మందులు, విత్తనాలకు పెట్టుబడి ఎక్కువ పెట్టడం అనే అంశాలు దిగుబడిని పెంచేందుకు కారణాలుగా హరికిషన్ గుర్తించారు. ఈ అన్ని ప్రతిఫలనాలకు మూలకారణం నీళ్ళ దొంగతనం. అందుకే ఆయకట్టు రైతులంతా నీళ్ళ దొంగతనాన్ని ఆపి తమ భూముల్ని పంటల్ని కాపాడుకోవటం కోసం ఉద్యమించడానికి ఉద్యుక్తులవుతారు. అయితే కోస్తాంధ్ర వాసుల తెలివిలేటల్ని మున్ముందుగా గుర్తించినవారు తెలంగాణా వాసులు. రాయలసీమలో కోస్తాంధ్ర రైతుల పెట్టుబడి ప్రాబల్య ప్రారంభానికి, తెలంగాణాలో కోస్తాంధ్రుల ప్రాబల్య నిరాకరణకు కారణమైన ములాలు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో వున్నాయన్న స్పృహ ఈకథకు 'జై తెలంగాణా' శీర్షిక పెట్టడంలోని ఉద్దేశం. అంటే వాళ్ళ ఉద్యమానికి రచయితగా తన మద్దతును పరోక్షంగా ప్రకటిచండం, రాయలసీమలో ఉద్యమం మొదలవ్వాల్సిన స్ఫూర్తిని కూడా ఈ కథ అందిస్తుంది.

జై తెలంగాణా' కథ ప్రారంభం, ముగింపు, కొనసాగింపులో మంచి పటుత్వం సాధించిన కథ. కథకుడుగా హరికిషన్ ఎంచుకున్న పాత్ర ఒక ఉపాధ్యాయుడు.  ఒక ఉపాధ్యాయుడి అనుభవం, ఆలోచనలతో కథ నడవడం వలన ఎక్కడా కోపం, ఉద్రిక్తతా, అసహనం, అవేశకావేశాలు చోటు చేసుకోలేదు. అదే ఒకరైతుగా కోస్తాంధ్ర రైతుల దురాగతాన్ని చర్చించినట్లయితే ఇంత సహనంగా కథనం కోనసాగేది కాదు. ఉపాధ్యాయుడి పాత్రలోనే రచయిత కంఠస్వరం కూడా వ్యక్తమవుతోంది. రచయిత తన కంఠస్వరాన్ని వ్యక్తం చేసేందుకు ఎంచుకునే పాత్ర వలన కథా స్వభావం, స్వరూపంలో ఒనగూడే మేలు ఆధారపడి వుంటుదనడానికి ఈ కథ ఉదాహరణ.

మావూర్లో సోమరిపోతుల్రా"(పేజీ నం.11) అని ఉరుకుందన్న అనటంలో, తమని తాము నిందించు కోవడంలోని ఆత్మన్యూనతా వ్యక్తమవుతుంది. కథకుడు వాళ్ళనుసోమరిపోతులు కాదు, నిజాయితీ పరులు" అని గుర్తించడం ద్వారా వెనుకబడిన ప్రాంతంలోని ప్రజల ఆలోచల్లో అసంబద్ధతను సవరించే ప్రయత్నం కనబడుతుంది. పచ్చని పంట పొలాలతో సువిశాలంగా కనిపించే భూములకు కారణం కె.సి.కెనాల్ పారకం వల్లనే అని అనుకొనేవాళ్ళే కానీ పరాయి ప్రాంతాల ప్రాబల్యం అని రాయలసీమ పొరుగు జిల్లాల వాళ్ళకు కూడా తెలియదు., కోస్తాంధ్ర రైతుల వ్యవసాయ పద్ధతుల వలన పెరుగుతున్న పెట్టుబడి, రాయలసీమ వాసులలో పెరుగుతున్న పరాయీకరణను మొట్టమొదట"జై తెలంగాణాకథ నమోదు చేసింది. పరాయి ప్రాంతాల ప్రాబల్యం పట్ల నిరసనను నమోదు చేసింది. రాయలసీమ వాసులలో ప్రాంతీయ అస్తిత్వ స్పృహను చిత్రించిన కథఇది.

తెలంగాణేతర సమైక్యాంధ్ర ఉద్యమంలో కోస్తాంధ్ర అజెండానే అన్ని ప్రాంతాల అజెండాగా కొనసాగడంపై పెట్టిన విమర్శ "కొత్త కలఇతివృత్తం. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రధానంగా బాధించిన అంశం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కంటే, హైదరాబాదు వదులుకోవడం. ఈ అంశంపై చేసిన సవివరమైన చర్చ. రాయలసీమ వాసులకు సమైక్యాంధ్ర ఉద్యమంలోని లోటుపాట్లను చర్చించింది. న్యాయంగా తమ ప్రాంతానికి జరిగే నష్టంపైన ఉద్యమ అజెండా రూపొందాలన్న ఆకాంక్ష ఈ కథలో వ్యక్తమవుతుంది.

రాయలసీమలో సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగిన వైనాన్ని అంచెలంచెలుగా నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు, మానవహారాలు, స్థానిక మంత్రుల రాజీనామా డిమాండులు, రాజీనామా చేయని రాజకీయ నాయకుల ఇళ్ళ ముట్టడి, వాల్ పోస్టర్ల దగ్గర నుండి హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండు వరకువచ్చిన అన్ని వేరియేషన్స్ ఈ కథలో హరికిషన్ చర్చించారు.

ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాన్ని వదులుకోవడానికి కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులెవరూ సిద్ధంగా లేరు. హైదారాబాద్ అంటే అందరికీ కలల ప్రపంచం, ఆశల నిచ్చెన. అయితే కోస్తా పెట్టుబడిదారులకు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులకు స్విస్ బ్యాంక్ లాంటిదని వాళ్ళకు మద్దతు పలకాల్సిన అవసరం ఎందుకున్న చైతన్యప్రకాష్ ప్రశ్న పాఠకులమెదళ్ళను ఉత్తేజపరిచేందుకు సంధించిన ప్రశ్న. విద్యార్థి ప్రాతినిధ్య పాత్ర విజయ్ ను ఆలోచనల్లో పడేస్తుంది. ప్రజల ఉద్వేగాలను తమ స్వార్థ ప్రయోజనాల లబ్దికోసం, వుపయోగపడే రాజకీయాల నుండి బయటపడి, రాయలసీమ వాసులుగా సరైన ఉద్యమ పంథా తొక్కాల్సిన అవసరాన్ని "కొత్తకలడిమాండ్ చేస్తుంది.

రాయలసీమ, కోస్తాంధ్ర వాసుల భయాల్లోని అంతరాలను రాయలసీమ కరువు స్థితిపై పరిశోధన చేస్తున్న చైతన్యప్రకాష్ పాత్ర ద్వారా వ్యక్తం చేశారు. కోస్తాంధ్రులు హైదరాబాద్ లో ఏర్పరచుకొన్న ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం, తెలంగాణాపై ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ఆందోళనలుగా గుర్తింప చేస్తాడు. రాయలసీమ వాసులు చేయాల్సిన పోరాట అజెండా అరవై సంవత్సరాలుగా కృష్ణాజలాల కింద జరిగిన అభివృద్ధిలో వాటా అడగడం, కరువు సీమలో పెట్టుబడుల విస్తరణ, కృష్ణా నికర జలాల పంపిణీ, పోలవరం ప్రాజెక్టు మిగులు జలాల కోకం కాకుండా శాశ్వత నికర జలాల వాటా పంపకం గురించి అడగడం వలన మన ప్రాంత అభివృద్ధి సాధన కోసం వుద్యమం నడపాలని చాలా స్పష్టంగా సమైక్యాంధ్ర వుద్యమ అజెండా, పోరాట పోకడలపై ఖచ్చితమైన దృష్టికోణాన్ని 'కొత్త కలఅందిస్తుంది.

రాయలసీమకు జరిగిన విద్రోహాన్ని శ్రీకృష్ణ కమిటీనివేదిక బయటపెడుతుందని హరికిషన్  సూచించారు. అలాగే, ఇమాం కోటి గొంతుకల ఆక్రందన”, , బాల గోపాల్ జలపాఠాలులాంటి రచనలు గురించి, సాహిత్యకారులు చేసిన  కృషిని గురించి ఈకథ ప్రస్తావించడంలో రచయిత  పాఠక చైతన్య దిశానిర్దేశకత్వాన్ని సూచించారు.

కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణం కావడం వలన జరిగిన అనర్ధాలను, శ్రీశైలం డ్యాం కర్నూలు జిల్లాలో వున్నా అది కేవలం జలవిద్యుత్ ప్రాజెక్టుగా పరిమితమవడం వలన రాయలసీమ మూడు తరాలవాళ్ళు అనుభవించిన దుఃఖాన్నితరతరాల దుఖంకథ చిత్రించిందినీళ్ళ రాజకీయాలను పసికట్టిన చిన్నా, పెద్ద రాజకీయ నాయకులు సైతం లబ్ది పొంది, సామాన్య జనాన్ని మాత్రం గాలికి వదిలేసిన బాధ్యతారాహిత్యాన్ని ఈ కథ నమోదు చేసింది.

అప్పులవాళ్ళ బాధ భరించలేక ఒకే కుటుంబంలోని ముగ్గురు మగాళ్ళ అస్తిత్వం ఇంటి గోడలపై మాత్రమే మిగిలిన గతం, వర్తమానంలో కూడా వాళ్ళ బాటనే ఎంచుకున్న దరిద్రనారాయణుల కన్నీటి కథా చిత్రం, వలస పాలకులు కట్టడానికి ఉద్యుక్తులై సర్వేలు నిర్వహించి, పచ్చని పంటపొలాలుగా మార్చేందుకు చేసిన ప్రయత్నాలు ఎందుకు వెనక్కు మళ్ళాయి? అని ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఈ కథ కల్పిస్తుంది.

కృష్ణా - పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణంలో రాయలసీమలోని కడప, కర్నూలు, నెల్లూరు, తమిళనాడులోని చాలా ప్రాంతం సాగులోకి వస్తుందని భావించిన కోస్తాంధ్ర నాయకులు దానికి గండికొట్టిన నేపథ్యాన్ని ఈ కథ గుర్తు చేస్తుంది. మన నీళ్ళు తమిళులకెందుకివ్వాలి అన్నవాళ్ళు, రాయలసీమ వాళ్ళు ఆ నీళ్ళు లేకపోతే ఎలా సాగుచేస్తారని ఆలోచించలేదు. సీమనాయకులు ఈ విద్రోహాన్ని ప్రశ్నించలేకపోయారు. ఈ ప్రాజెక్టుకు పురిట్లోనే సంధి కొట్టిన సంగతి తెలియని నాయకులు ప్రాజెక్టు నిర్మాణంలో వందల ఎకరాలు కొన్నవారు, గుట్టుచప్పుడు కాకుండా కొన్న భూముల్ని అమ్మేస్తే ఆ సమాచారం తెలియని బడుగు బలహీన వర్గాలు బంజరు భూముల్ని కొని, వాటిని ఏమీ చేయలేక అప్పుల పాలైన విషాద విధ్వంసాన్ని ఈ కథ చిత్రిక పట్టింది. వలస పాలకులు వెళ్ళిపోయినా, స్వతంత్ర పరిపాలనలో కూడా రాయలసీమవాసుల సాగునీటి ప్రయోజనాల నిర్లక్ష్యంతో కుటుంబంలోని మగవాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోయే ఒక అనివార్య సందర్భాన్ని హరికిషన్ పాఠకుల  ముందుంచారు.

బంజరు భూముల్ని అప్పులు చేసి సాగులోకి తెచ్చిన రైతు కుటుంబాలు పంట పండించి అప్పు తీర్చేలోగా, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూముల్ని కోల్పోవల్సి వచ్చింది. వూరితో తమకున్న అనుబంధాలు, విషాదాల ఉద్వేగాల్ని, సాంస్కృతిక మూలాల్నివదులుకోవాల్సి రావడంలోని హృదయగత వేదనలను, తాము పుట్టిన వూరితో శాశ్వతంగా తెగదెంపులు చేసుకోవడంలోని నిస్సహాయ స్థితి.

 “ఎవరూ త్యాగం చేయకపోతే అభివృద్ధి ఎట్లా సాధ్యం. మర్యాదగా ఖాళీ చేస్తారా... లేక..." అంటూ పోలీసుల బెదిరిపుల మధ్య కొట్టుమిట్టాడే ప్రాణాలు. ఎవరికోసం వాళ్ళు త్యాగం చేయాలి? ఎవరి అవసరాలు తీర్చడం కోసం ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది అన్నప్రాధమిక ప్రశ్నలు వేసింది జవాబులు తెలియక కాదు.  అన్నీ తెలుస్తూనే వున్నాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత, ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకించలేక పోయామన్న పూర్వ తప్పిదాలవలన కలిగిన  ఆశక్తత వారిని నిరాశా నిస్పృహల్లోకి నెట్టేసింది. భూములకు నిర్ణయించిన మూడు, నాలుగు వేల నష్ట పరిహారం, మళ్ళీ భూమిని కొనేందుకు, కుటుంబాన్ని స్థిరంగా కాపాడుకోవటానికి ఏపాటి ? అని రైతులు ఆలోచనల్లోని పరాధీనత్వం. వ్యవసాయ కులాల్ని ఆశ్రయించిన చాకలి, మంగలి, వడ్రంగి వృత్తి కులాల వాళ్ళ పరిస్థితి మరింత ఘోరంగా వాళ్ళ బతుకులకు ఏ నష్ట పరిహారం లేకుండానే ఊరు వదలి పోవాల్సిన అగత్యాన్ని ఆనకట్ట నిర్మాణం కల్పించిందని బహుజన కులాల దైన్యంపట్ల రచయిత తన సానుభూతి వ్యక్తం చేశారు.

కోస్తాంధ్ర నీటి ప్రయోజనాలు ప్రకాశం బ్యారేజ్ తీర్చినా మిగిలిన అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టును కూడా వాళ్ళ పొలాలకే ఉపయోగించడం, జల విద్యుత్ ప్రాజెక్టుగా రూపకల్పన చేయడం, నాగార్జున సాగర్ కు ఓవర్ హెడ్ ట్యాంకుగా మారిపోవడాన్ని రచయిత గొంతు వరకూ నీళ్ళున్నా సీమకు ఒక్క చుక్క నోటికందడం లేదన్నఆవేదన సీమవాసుల ఆక్రందనల ప్రతిఫలన రూపం.   వాయిదాల పద్దతిలో నష్టపరిహారం ఇస్తే అవి రైతులకు ఎలా ఉపయోగపడతాయి. తమ కళ్ళముందే నీళ్ళున్నా తమ నీటి కష్టాలు తీరడం లేదన్న సీమ వాసుల ఆక్రందనలు గోపాల్ పాత్రచిత్రణలో రూపు కట్టాయి. తమ వూళ్ళలో పారేనీళ్ళు తమకెందుకు చెందవని, శ్రీశైలం డ్యాంను బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మార్చాల్సిన అవసరాన్ని ప్రాంతీయ పోరాటాల ద్వారానే సాధ్యం చేసుకోవాలన్న ఆకాంక్షను ఈ కథ బహిర్గతం చేస్తుంది.

రాయలసీమలోని మగవాళ్ళు ఫ్యాక్షన్ వల్లనే కనుమరుగవుతున్నారని సీమేతరులు కూడా గుర్తించారు. అయితే రాయలసీమ కుటుంబంలోని మగవాళ్ళ అదృశ్యానికి, కోస్తాంధ్ర రాజకీయ నాయకుల వ్యుహాత్మక రచన కూడా కారణమన్న నగ్నసత్యాన్ని మొట్టమొదట బట్టబయలు చేసిన కథ తరతరాల దుఃఖం".

నీటివనరులు లేని రాయలసీమలో వ్యవసాయం చేయడం జూదం ఆడడమంత ప్రమాదమని రాయలసీమ కథకులు ఇంతకు ముందే రాశారు. అయితే నీళ్ళు లేక పంటలు పండక కరువు రావడం ఒక యెత్తయితే, అల్పపీడనాలు వాయుగుండాలు చెలరేగితే తప్ప రాయలసీమలో వానలు పడవు. అప్పులు చేసి, డ్రమ్ములతో నీళ్ళు తెచ్చి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి రాయలసీమ వాసులలో తప్ప ఆంధ్రదేశంలో మరో ప్రాంతలో కనిపించని అంశం. అకాల వర్షాలు, అల్పపీడన వర్షాలతో నేల తడిగా, పచ్చిగా మారి పంట నష్టపోయిన సందర్భంపచ్చికరువుకథలో వ్యక్తమౌతుంది. అంతేకాక రైతు తానింత నష్టపోయినా మళ్ళీ మళ్ళీ వ్యవసాయం చేస్తునే వుంటాడు కానీ పంటలు పండించకుండా వుండలేని రైతుతత్వాన్ని కూడా ఈకథ అక్షర బద్దం చేసింది.

'కొత్త కల' కథలో బడీడు పిల్లలందరూ ఆటోల్లో కిక్కిరిసి వెళుతున్నారని చదివినపుడు వాళ్ళంతా బడికి పోతున్నారేమో అని అనుకుంటాం. కానీ పత్తి, మిరప చేలల్లో పనిచేయడానికి వెళ్తున్నారని తెలుస్తుంది. కరువు వలన డ్రాపవుట్ శాతం పెరగటాన్ని చూశాం. కానీ ముఖ్యంగా మిర్చి, పత్తి లాంటి పంటలు బాగా పండటం కూడా విద్యార్థులు గైర్ హాజర్ కు కారణమైన విషయం, పెద్దలకంటే పిల్లలకే ఎక్కువ డిమాండు వుండటం  ఉపాధ్యాయ కథకుని దృష్టి పథం నుండి తప్పించుకోక పోవడాన్ని పాఠకులు గుర్తిస్తారు.  తక్కువ కూలీరేట్లకు పనిచేయించుకొనేందుకు పిల్లల్లో కనబడే ఉత్సాహం, ఉత్తేజం పెద్దలలో తక్కువ. అలసట అనేది తెలియకుండా ఆడుతూ, పాడుతూ ఎక్కువ శ్రమపడతారు. (గుంటూరోళ్ళ) కోస్తా వ్యవసాయ పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తరువాత బాల(వ్యవసాయ)కార్మికులు గణనీయంగా పెరగడాన్ని గుర్తించారు.

విద్యను లాభాలార్జించే ఒక వ్యాపారంగా చూస్తున్న కార్పొరేట్ విద్యా వ్యవస్థలో కనిపించని దోపిడి, అవలంభించే ఎత్తుగడలు ప్రదర్శించే పోకడలు(షోలు) కళ్ళముందు కనిపించే మాయాజాలాన్ని గుర్తుపట్టిన ఒక స్కూల్ టీచర్ సంఘర్షనాత్మక మనోగతాన్ని మోనోలాగ్ రూపంలో, చైతన్య స్రవంతి శిల్పంలో రచించిన కథ కాంక్రీట్ జంగిల్". ఆశలు, నిరాశలు, కలలు, కన్నీళ్ళు ఒక సుదీర్ఘ కథనంలొ ప్రయోగాత్మకంగా సాగిన కథ ఇది. సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ప్రైవేట్ రంగం మనదేశంలో అనూహ్యంగా విస్తరిస్తున్నది. పబ్లిక్ రంగ ప్రాధాన్యత నానాటికీ తగ్గిపోతున్న క్రమాన్ని నమోదు చేశారు.

1960ల నుండి 1980ల కథా సాహిత్యాన్ని పరిశీలిస్తే అందులో మధ్య తరగతి సగటు గుమాస్తాలు, బడుగు జీవుల గానుగెద్దు జీవితాలు కనిపిస్తాయి. కానీ నేడు 1990ల తర్వాత పిల్లల చదువుల్లో పెరిగిన వేగం యాంత్రికత వాళ్ళ జీవితంలో సృజనాత్మకతకు అవకాశం లేకుండా గానుగెద్దుల్లాగా చట్రాల్లో బంధింపబడిన వైనాన్నిహరికిషన్ తన కథల్లో చిత్రించారు.

కథలకోసం కలవరించే పిల్లల జీవితాలకు ప్రతీకగా, కథ వినాలనే తీరని కోరికతో చనిపోయిన కావ్య, కథ చెప్పించుకోవాలని పరితపించే మంజులాంటి పిల్లల జీవితంలో లోపించిన కావ్యానందాన్ని ప్రకటించిన కథ 'ఒక్క కథ". యాభైదాకా పిల్లల పుస్తకాలను ప్రచురించిన హరికిషన్ ఎందుకాపనికి పూనుకున్నారో ఈ కథ చదివితే అర్ధమవుతుంది. ఈకథలో పిల్లల కథలను కమ్మని పూర్ణం నిండిన కర్ణికాయలతో, మధురమైన చెరుకు రసంతో పోలుస్తూ పిల్లల్లోని శ్రవణాసక్తిని ఎలా ఇనుమడింపజేయవచ్చో కథగా మలిచారు. ఉపాధ్యాయ పాఠకులకు ఈ కథ ఒక ఉపకరణ కాగలదు. హరికిషన్ పిల్లల కోసం తపించి రాసిన కథలలో 'ఒక్క కథ' భిన్నమైనది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి ప్రైవేట్ పాఠశాలల్లో చదివే వారికి మధ్య ఇరవై ఏళ్ళ క్రితం కనబడే అంతరాన్ని 'చూపు' కథలో చిత్రించారు. ఒకప్పుడు కాన్వెంట్ చదువులు చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు రావని, ప్రైవేట్ ఉద్యోగమంటే సంబంధాలు రావని కూడా వుండేదని తెలుస్తుంది. మళ్ళీ అలాంటి నిషేదాలు అమలు పరిచే రోజులు వస్తే బాగుండనిపిస్తుంది. కార్పోరేట్ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వరంగంలో పనిచేసే ఉద్యోగులకు మధ్య ఆర్ధిక స్టోమత, వ్యత్యాసాలను బేరీజు వేసుకుంటాడు కథకుని అన్న. ఆ పాత్ర పడిన సందిగ్గావస్థ, మానసిక సంఘర్షణలకు కారణం జీవితాన్ని మనం ఏ దృష్టికోణం నుండి చూస్తున్నామో, అలాగే కనబడుతుంది. మన ఆలోచనలోని స్పష్టతే మనుషులలో మానసిక శాంతికి కారణం అన్న అవగాహన కలుగు తుంది ఈ కథ చదివితే.

బహుజన జీవితాన్ని చిత్రించిన కథలలో చిచ్చు”, “తెరవని తాళం”, “మాయమైన గానంప్రధానమైనవి. 'చిచ్చు' కథలో గొర్రెలు, మేకల పెంపకం వృత్తిలో వున్నవారు ఎదుర్కొంటున్న సమస్యలను చిత్రించిన కథ.  బోయ కుల అస్తిత్వాన్ని రామన్న లక్ష్మన్న అడిగిన తన కుల వృత్తాంత ప్రస్తావన, వేంకటేసులు దాన్ని గుర్తుచేసుకోవటం, ఆ తరువాత గొర్రెలు చనిపోవడం  ఈ రెండు సంఘటనలకు లంకె వుంది. గొల్ల రామన్న లక్ష్మన్నలతో పాటు రెడ్డికి కూడా తప్పెవరిదో తెలుసు. మరి రెడ్డికి జరిగిన సంఘటన వివరించాలనుకున్నాడు? అని ప్రశ్నించుకుంటే తప్ప రచయిత ఉద్దేశ్యం బోయ వెంకటేశే ఎందుకు ఎదిరించాడు? రామన్న లక్ష్మన్నలు ఎదిరించక పోవడానికి  మధ్య కార్యకారణ సంబంధిత ఎరుకవల్ల పాఠకులలో  ఏలాంటి సందిగ్దతకు రచయిత అవకాశం ఇవ్వలేదుఈ కథే కాదు అన్ని కథాంశాలు చాలా స్పష్టంగా రచయిత మనస్తత్వాన్ని బహిరంగ పరుస్తాయి.

సాధారణంగా గొర్రెల్ని మేపేవారికి ఆధిపత్య కులాలకు చెందిన సామాజిక వర్గం గొర్రెపిల్లల్ని పెంపకానికి ఇవ్వడం జరుగుతుంది. పెంపకంలో జీవాలకి ఏ ప్రమాదం సంభవించినా, చచ్చిపోయినా కాపరులదే బాధ్యత. గొర్రెల పెంపకంలో దశలవారిగా తమ కష్టార్జితాన్ని పెంపకానికిచ్చిన వారికి వాళ్ళ గొర్రెల్ని లెక్కగట్టి వాళ్ళకు అప్పగించాల్సిన దుస్థితి నుండి తప్పించుకోలేని నిస్సహాయత ఈ కథలో వ్యక్తమవుతుంది. వాళ్ళు పొందే దురన్యాయం సైతం హరికిషన్ సూక్ష్మ పరిశీలన నుండి తప్పించుకోలేదు.         

చిన్న చిన్న గొర్రె పిల్లల్ని మందలో వదిలిచనిపోయిన పెద్ద గొర్రెలకు సమానంగా తీసుకోమనటం ఎంత వరకు సబబు అన్నప్రశ్నలు పాఠకుల దృష్టికి  అందకుండా పోవు, ఇంత దుర్మార్గమైన తీర్పుల్నిఇవ్వగల ఆధిపత్యకులాల నైజానికి బహుజన కులాలు గురికావడం సర్వ సామాన్యం. ఆ వూరి రెడ్డి మనస్తత్వాన్ని ఎరిగిన రామన్న, లక్ష్మన్న నువ్వు ఎట్ల చెబితే అట్లనే రెడ్డిఅంటూ అతని తీర్పును ఆమోదించడంలో వాళ్ళ అలసత్వమే కనబడుతుంది. యాదవులు రెడ్డి తీర్పును అంగీకరించడానికి, బోయ వెంకటేశు రెడ్డి తీర్పును వ్యతిరేకించడానికి కుల అస్తిత్వాలలో గల సర్వ సాధారణ  స్వభావం కారణమేమో అనే అవగాహన కలుగుతుంది. ఈఅంశాన్ని హరికిషన్ ఒకసారి పునరాలోచించాల్సి వుంటుంది.         

 “తెరవని తాళంకథలో దూదిని ఏకే వృత్తిలో జీవిస్తున్న పక్కీరప్ప జీవితాన్ని, తాళాలు (బీగాలు రాయలసీమ ప్రయోగం) తయారు చేసే వారి జీవితంలోని హింసను చిత్రించిన కథ ఇది. ఈపనిలోఎంత వేదన వున్నా అదే వృత్తి కోల్పోవడం కూడా వేదనకే గురిచేయడంలోని దైన్యం పాఠకుల గుండెను ఆర్ద్రం చేస్తుంది. జీవనోపాధికి మరో వృత్తి చేయలేని నిస్సహాయత. కానీ జీవనోపాధికై అవస్థలు పడే తరుణంలో తాళాలు బాగు చేసే పనిలోకి దిగాల్సివచ్చింది.        

అధునికీకరణతో బహుజన వృత్తి కులాలకు జీవనోపాధి దొరకని పరిస్థితి ఏర్పడిన క్రమాన్ని ఈ కథలో చర్చించారు. బహుజన కులాల వారు కొత్త వృత్తులు నేర్చికొని, జీవనోపాధి వెతుక్కుంటూ పల్లెల్ని ,వ్యవసాయ దారుల్ని వదలి పట్నం బాట పట్టిన ఒక సామాజిక క్రమాన్నిరచయిత ఈ కథలో నిక్షిప్తం చేశారు. ఇన్ని ఒడిదుడుకులకు గురైన ఫక్కీరప్ప తాళాలు బాగుచేసే వృత్తిలోని కనిపించని హింసను గుర్తు పట్టలేదు. ఎక్కడ ఏ దొంగలు తాళాలు తెరిచినా ఫక్కీరప్ప లాంటి తాళాలు రిపేరు చేసే వారిని పట్టుకొని జైలుపాలు చేస్తున్నారని ఈ కథ గుర్తు చేస్తుంది. నిన్న రాత్రి వెంకటరమణ కాలనీలో తలుపులు తెరిచింది నువ్వేనా, ఎప్పట్నించి మొదలు పెట్టినావురా దొంగలకు సాయం సేయడం... నీ తోడు దొంగలు యాడున్నారు సెప్పుఅంటూ పోలీసుల వేధింపులకు గురయ్యే బహుజన కులాలలోని కంసలి వారితో పాటు దూదేకుల ఫక్కీరప్ప లాంటి వారు కూడా చేరడమే జీవన వైరుధ్యాలలోని విషాధం.        

ప్రతిరోజూ తాళాలు పోగొట్టుకునేవాళ్ళు వుండరు కదా! మరలాంటప్పుడు  బహుజనులు ప్రత్యామ్నాయ వృత్తుల్లోకి ఎందుకు ప్రవేశిస్తున్నారు అనే ప్రశ్న వేసుకుంటే, అసంఘటిక వృత్తులలో ఏ వృత్తైనా దాని పరిధిలో అది బతుకు భయాన్ని పెంపొందిస్తుందే కానీ భద్రమైన జీవన భత్యానికి భరోసాను అందించవు.

బహుజనుల బ్రతుకుల్ని చిద్రంచేసే ఆధునిక యంత్ర పరికరాలను దేశంలోకి అనుమతించే ముందు బహుజన కూటములతో, సంఘాలతో విస్తృతమైన సర్వేలు,చర్చలు నిర్వహిస్తే, బహుజన వృత్తి కులాలకు ప్రత్నామ్యాయ వృత్తి నైపుణ్యాలను అందజేయడం లాంటి భద్రతా చర్యలతో సమగ్ర అభివృద్ధి, జీవన వికాసం జరిగేది. కానీ అలాంటి ప్రయత్నాలుకానీ, సంఘాల ప్రమేయం కానీ లేకుండానే పాలకవర్గాలు తీసుకున్న నిర్ణయాలు బహుజనులు జీవన భృతిని కోల్పోయి వలసపోవాల్సిన స్థితిలోని అభధ్రతను, ఏదారి దొరక్క అనుభవించే అవస్థను హరికిషన్  చిత్రించారు. దూదేకుల పక్కీరప్ప జీవితం  డిమాండు చేస్తుంది. పాఠకులలో బహుజన వృత్తికులాల పట్ల చైతన్యాన్ని ప్రోది చేస్తుంది. రాయలసీమ ప్రాంతం నుండి దూదేకుల జీవితాన్ని సృజించిన మొట్టమొదటి కథ ఇది.      

బిక్షమెత్తి జీవించడం, పిట్టల దొరలుగా చిన్నకథలు, పాటలు, పద్యాలు, పగటివేషాలు వేస్తూ, సంచార జీవనం గడిపే బుడగజంగాల జీవనవైవిద్యాన్ని, ఆశ్రిత కులాల వేదనను మాయమైన గానంకథ వ్యక్తం చేసింది. సూరయ్య పాత్ర సూచించిన ప్రత్యామ్నాయం అందుకోవటానికి సన్నద్ధం కావడం తప్ప వాళ్ళ సాంస్కృతిక జీవనవైవిద్యాన్ని పరిరక్షించే దిశగా వెళ్ళే మార్గం మూసుకుపోయింది. తప్పనిసరి పరిస్థితులలో తరతరాలనుండి వస్తున్న కులవృత్తి జీవితాన్ని కొనసాగించే కళ జమ్మన్నకు లేనందువలన ఇంటింటికి వెళ్ళి బిక్షమెత్తి జీవించడమే తన కులవృత్తిగా భావించాడుకానీ వృత్తి కళాకార జీవితం గల తాటికొండ సూరన్న మాత్రం తన కులవృత్తి జీవితాన్ని వదులుకోలేదు. పగటి వేషగాళ్ళ ప్రత్యేక ఆహార్య వర్ణన కూడా ఈ కథలో రచయిత  నమోదు చేశారు.     

సినిమాలు, టీ.వీ.లతోనే జానపద వృత్తి కళాకారులజీవితం ఆదరణ తగ్గి వీధుల పాలయిందన్న వాస్తవాన్ని ఈకథ ఎరుక పరుస్తుంది. వీళ్ళు  కళా ప్రదర్శన ఇచ్చినా ఆదరణ గౌరవం మాట అటుంచితే, అడుక్కుతినేటోళ్ళు వచ్చినారంటున్నారు కానీ కథలు చెప్పేటోళ్ళు వచ్చినారన్నమాట కూడా దక్కలేదన్న ఆవేదన సూరన్న పాత్రచిత్రణలో వ్యక్తమవుతుంది.               

కోర్టులకెళ్ళడం కన్నా స్థానిక నాయకుల దగ్గరకు వెళ్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఒక న్యాయవాది పాత్రే అనడంలోని అసంబద్ధత 'సత్వర న్యాయంకథ చిత్రించింది.     

మనిషి తత్వానికి దూరం చేస్తున్న యాంత్రికత నుండీ మనిషి తన సహజసిద్ధమైన సున్నితత్వాన్ని తిరిగి పొందటంలో తమ ప్రవర్తనలోని అపసవ్యతను సవరించుకోడానికి పశ్చాత్తాపం మించిన రెమిడీ లేదు. అమ్మమ్మ ప్రేమ ముందు తన స్వార్థం ఛిన్నాభిన్నమై పోవడం, తిన్నతిండి వమనంకావడం అతనిలోని మానసిక పరివర్తనకు సంకేతం. అమ్మమ్మ చావుని క్యాజువల్ గా తీసుకొన్న అతను అమ్మమ్మ తన కోసం ఆమె చూపించిన వాత్సల్యం , ప్రస్తుతం తాననుభవిస్తున్న జీవితం అని గుర్తించడం వల్లనే, ఆమె స్వభావం ముందు అతని స్వభావం మరుగుజ్జు స్వరూపంగా కనబడుతుంది. ఈ సంఘటన అమ్మమ్మ చావుకు ముందు, తల్లికి తండ్రి కట్టించిన ఇంటిచుట్టూ అల్లుకున్న జ్ఞాపకాల సజీవత్వాన్ని సిల్లీగా, సెంటిమెంటల్ గా భావిస్తాడు. పై సంఘటన తర్వాత ఇల్లు అమ్మమని అడగడని, ఆమె భావాలపట్ల గౌరవం పెరుగుతుందని రచయిత కథలో వాచ్యం చేయలేదు. కానీ ఈ కథ చదివిన పాఠకులు తల్లిదండ్రుల అనుబంధాల పట్ల హృదయ స్పందన భిన్నంగా వుండగలదన్న విశ్వాసం కలుగుతుంది. మానవత్వం మృగ్యమవుతున్న క్రమంలో సహృదయత పెంపొందింపజేసే బాధ్యతాయుత సంస్కారానికి ఈకథ నిదర్శనం.      

సర్పంచ్ ఎన్నికల్లో స్త్రీలకు రిజర్వేషన్ ప్రకటించినా స్త్రీలకు దక్కని రాజకీయ హోదా గురించి చర్చించిన కథ పొద్దుపోని పంచాయతి”. ఈ దేశంలో ఆడవాళ్ళకు అధికారం రావాలంటే మొగుళ్ళు జైలుకన్నా పోవాల, పైకన్నా పోవాల" అన్న రాజమ్మ మాటల్లో స్త్రీల రాజకీయ ప్రవేశానికి పురుషాధిక్య వ్యవస్థ ఆచరణలో శూన్యమైన నేపధ్యంనుండి మహిళా సర్పంచుల రిజర్వేషన్ల మీద మహిళా సాధికారికత మీద సంధించిన వ్యంగ్యాస్త్రమిది.

బసివిరాలు బరి తెగించింది”, “బంగారంకథలు స్త్రీల దైన్యత నుండి రాసిన కథలు ఆలూరుఒకప్పుడు కర్ణాటకలో వుండేది. . భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనలో భాగంగా ఆం

ధ్రప్రదేశ్ ల్ కలిసింది. ఆదోని, ఆలూరు సాంస్కృతిక జీవితం కర్నూలు సాంస్కృతిక జీవితంతో సంబంధమే వుండదు.ఆలూరులో బసివినిగా మార్చడం మాదిగల కులాచారం. ఇది కర్నాటక ప్రాంతీయ ప్రభావం కలది. కర్నూలు, నంద్యాల డివిజన్ లలో బసివిని ఆచారం కనిపించదు. అందుకే ఆదోని, ఆలూరు ప్రజలు కర్నూలు వాళ్ళతో లింక్ అప్ అవరు. ఏ అవసరాలకైనా సంబారాలకైనా బళ్ళారి , సిరిగుప్పకే వెళ్ళడం రివాజు. ఇప్పటికీ అక్కడ బసివిని ఆచారం, బాల్యవివాహాలు బహిరంగంగా కాకపోయినా రహస్యంగా జరుగుతూనే వున్నాయి.ఆంధ్రదేశంలోనే అరుదైన ప్రాంతీయ వైవిధ్యం ప్రతిబింబించే ఇలాంటి అరుదైన  సంఘటనలను హరికిషన్ కథలుగా మలిచారు.వార్తపత్రికల కథనం ప్రకారం ఆదోనిలోని శుక్రవారపేటలోనే దాదాపు యాభై కుటుంబాలున్నాయని తెలుస్తుంది. అలాంటి వెనుకబడిన  మిశ్రమ సాంస్కృతిక ప్రాంతీయ జీవితంను కేంద్రంగా చేసుకొని రాసిన కథలు  బసివిరాలు బరి తెగించింది”, “బంగారం” . నిమ్నకులాలలోని ఆచారాలు ,వాళ్ళ పేదరికం ఉత్పత్తి, అగ్ర కులాల ఆధిక్యతా, దోపిడి స్వభావం వలనే ఏర్పడినవే.      

మెర్సీ”, “రాజమ్మ”, “పొద్దు పోని పంచాయితీకథలు రాయలసీమ కరువు స్త్రీ, పురుష సంబంధాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో స్త్రీల లైంగికతలోని ఫ్యూడల్ చట్రం ఏర్పరచిన విలువలు ఎంత బలహీనమైనవో రాజమ్మకథలో హరికిషన్ చిత్రించారు. ఈ కథ చదువుతుంటే సత్యజిత్ రే ఫతేర్ పాంచాలి"( బెంగాలీ సినిమా) గుర్తుకొస్తుంది.మగవాళ్ళ అండలేనిదే, స్త్రీలు బ్రతకలేరన్న పితృస్వామిక వ్యవస్థ ఏర్పరచిన లోకనీతి కౌటుంబిక చట్రం నుండి బయటపడటమే స్త్రీలు అనుభవిస్తున్న హింస నుండి విముక్తం కాగలరన్న సూచన రాజమ్మకథ అందిస్తుంది.          

స్త్రీవాదం ఒక బలమైన ధోరణిగా తెలుగు కథాసాహిత్యంలో ప్రవేశించింది. స్త్రీలలైంగికతను ఆధారం చేసుకొని ఒకరు మరొకరిపై అధికారం చేయడాన్ని అణచివేత రాజకీయాలుగా గుర్తించి, వాటిని ప్రశ్నిస్తూ రచనలు చేశారు. నాలుగు దశాబ్దాల స్త్రీవాద ఉద్యమ భావాల ప్రభావం ఆతరువాతి తరం స్వీకరిస్తుందా? స్వీకరిస్తే ఆ ప్రతిఫలనాల రూపం ఎలా ఉంటుంది అన్న ప్రశ్నలు మొదలైనాయి. సమాధానంగా ప్రముఖ స్త్రీవాద రచయితలు పి. సత్యవతి దమయంతి కూతురు”, విమల నువ్వేం చేస్తావ్కథలు రాశారు. మరి పురుష రచయితల ప్రతిస్పందనల విషయానికొస్తే, “మెర్సీకథతో మొట్టమొదట స్పందించిన రచయిత యం. హరికిషన్.          

స్త్రీలు కౌటుంబిక చట్రంలో నుండే తమ స్పేస్ ను తాము వెదుక్కొనే క్రమంలో పిల్లలు, తల్లుల అంతర్గత లైంగిక జీవితం పట్ల తీసుకోవాల్సిన ఒక బాధ్యయుతమైన అవగాహనను అందించే కథ 'మెర్సీ'. పురుషుల లైంగిక జీవితాన్ని, వైవాహిక స్వేచ్చను ఆమోదించినంతగా  స్త్రీల లైంగికత్వాన్ని ఆమోదించలేరు. అందుకే శంకర్ ను వాళ్ళక్క నువ్వు కూడా మగవానివేగాఅని అంటుంది. ఆచట్రం నుంచి బయటపడిన అక్క తన అనుభవాన్ని, ఆనందాన్ని వివరిస్తుంది. తల్లి కోల్పోయిన ఆనందం పట్ల అవగాహనను అందిస్తుంది. శంకర్ తల్లి జీవితంలో అనుభవించిన ఒడిదుడుకులను, పితృస్వామ్య రాజకీయ చర్యల్లో భాగంగా తండ్రి చేసుకున్న రెండవపెళ్ళి, శారీరక హింస, అవమానాలు అన్నీశంకర్ ఆలోచనలరూపంలో రచయిత  చర్చకు పెడతాడు.  

స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోవడానికి శరీరాన్నీ, మనసునూ ఏకకాలంలో ఒకే రీతిగా ప్రేమించగలిగే హృదయం జాస్మిన్కథలో పరిమళిస్తుంది. ఈనాటికి స్త్రీకి గుర్తింపు భౌతికం గానే వుంది. స్త్రీశరీరం కోసం వేరేదారులు వెదుక్కొనే మగవాళ్ళు ఈనాటికీ కొత్తగాదు. కానీ పరిస్థితుల ప్రమేయంతో మరోదారిలేక తమ అందాన్నే జీవనోపాధిగా చేసుకొన్న స్త్రీల బతుకు గమ్యం బస్టాండులో భిక్షువర్షీయసై దర్శనమిస్తే, పగిలింది ఆ ప్రేమికుని ఒక్క గుండేనా?... పాఠకుల గుండెలు కూడా.

సమాజం స్త్రీలకు పురుషులతో పాటు సమాన హోదా కలిగించడానికి ఆమెను చైతన్యవంతురాలిని చేయడానికి విశాలభావాలుగల సహృదయులకు ఎలాంటి పేచిలేకపోయినా, ఎంతమంది ఆమోదిస్తారనేది సందేహాస్పదం. హృదయం పలికే మాటల్ని అలంకారాలూ, చందస్సులతో ప్రమేయం లేకుండా అదేతీరున కాగితం పైన పెట్టగలగడంలోనే రచయిత నేర్పు వుంటుంది.  హృదయంలోని లయ రాతల్లో కనపడాలి. ఏం ఆలోచిస్తున్నాడో, ఏమి అనుభవిస్తున్నాడో దానిని అందరికీ అర్థమయేలా రాయడం హరికిషన్ కు తెలుసనడానికి  ఈకథే ఒక ఆనవాలు.

కరుణ రసాత్మకమైన జాస్మిన్కథ మంచితనం, ఔచిత్యం నిలకడతనం లక్షణాలకు ప్రాతినిధ్యంగా నిలబడే కథ.  ఆమె పేరు కూడా తెలియని ప్రేమికుడు ఆమెకు పెట్టిన పేరు జాస్మిన్”. అతనిలో ప్రేమ పరిమళాలను విరిజిమ్మిన స్త్రీమూర్తికి ప్రతీకగా ఒక పార్శ్వంలో ధ్వనిస్తేమల్లెపూవులా పరిమళించాల్సిన ఆమెజీవితం కొన్నిరోజుల్లోనే వాడినపూవుగా పరిణమించిందనేది మరో పార్శ్వంలో ద్యోతకమయ్యే ప్రతీకాత్మకత. ఏ సృజన సాహిత్య ప్రక్రియలైనా మనిషిలోని అపసవ్యతలను, అక్రమ ఆలోచనలను ప్రక్షాలనం(కెథార్సిస్) చేయగల శక్తి వుంటుంది. ఏ సంఘటనైతే మరో సంఘటనను పరస్పరాశ్రయంగా మలచుకోగల శక్తి వుంటుందో, అది మానవున్ని దయార్ద్రతల దిశలో మార్పు చెందించే తత్వం కలిగివుంటుంది. ఈస్థితి జాస్మిన్”, మెర్సీకథల్లో కనబడుతుంది. స్త్రీ పురుషులలో వ్యక్త ప్రేమలున్నట్లే, అవ్యక్త ప్రేమలూ వుంటాయి. చాలా ప్రేమలు  నిద్రాణంగా అణిగిపోయి, ఆగిపోయినవే. సాంఘిక అమోదం లభించదన్న అనుమానంతో చొరవ తీసుకోలేక పోవడం, తామున్న పరిస్థితులలో  ప్రేమసంబందాలను నిలబెట్టుకోలేని ఆర్థిక అసహాయ స్థితికి కథారూపమిది. హరికిషన్ రచనా వ్యక్తిత్వం బాధితుల పక్షమని ఆయన ఎన్నుకొన్న కథావస్తు,శిల్పాలే విశదం చేస్తాయి.

హరికిషన్ ప్రతికథలోనూ స్పష్టమైన కంఠస్వరముంది. ఒక తాత్విక భూమిక వుంది. పాఠకుడి చైతన్యాన్ని పెంచే సామాజిక స్పృహ వుంది. రంగుల ప్రపంచం  నుండి పాఠకున్ని వాస్తవిక ప్రపంచంలోకి తీసుకెళ్ళే శైలీ శిల్పం వుంది. ఏ అలంకారాలు, ఉపమానాలు, డొంకతిరుగుడు లేకుండా సూటిగా, స్పష్టంగా తను చెప్పదలచుకొన్న దాన్ని కథాంశంగా మలచగల నైపుణ్యం వుంది. సుదీ ర్ఘం గా సాగదీసి రెండు మూడు కథాంశాలను ఒకే కథగా చేయకుండా (ఒక్క కథ తప్ప) క్లుప్తంగా చెప్పగలడు. ముఖ్యంగా హరికిషన్ కథల్లో ఆవేశం వుండదు. ఆలోచనాత్మకంగా సహనంగా జీవిత పాఠాల్ని బోధించే ఒక ఉపాధ్యాయ అనుభవం వుంటుంది. ఈకథల్లో కృత్రిమమైన అనవసరమైన వర్ణనలుండవు. ప్రతి పదం ఉపయోగితా విలువ కలిగి వుంటుంది. అందుకే ఇతని కథనం చిక్కగా ఉంటుంది.  రాయలసీమ జీవితాన్ని కందనవోలు నేపథ్యంలో చిత్రించడం వలన ఆ స్థానీయతా పరిమళం ఈకథలకు అందిన అదనపు గౌరవం.   ఉరుకుందప్ప, భైరాపురం, వీరేశం లాంటి పేర్లు కర్నూలులోని ఆదోని, ఆలూరు ప్రాంతాలు కర్నాటక సరిహద్దు ప్రాంతాలలో వీరశైవ సిద్ధాంత ప్రాబల్యంగల ప్రాంతీయ చారిత్రక అస్తిత్వాన్ని చాటే పేర్లు. మిగిలిన మూడు రాయలసీమ జిల్లాల్లో ఎక్కడో ఒక చోట  వినిపించినా, కర్నూలు జిల్లాలో కనిపించినంత ప్రాంతీయతాధిక్యాన్ని సూచించవు.

హరికిషన్ కథల్లో రచయితగా అతను కలలుగన్న స్వప్నం, సాహిత్య దృక్పధం. ఏంటి? అని ప్రశ్నించుకుంటే,

•  రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలకు రాజకీయ నాయకులు చేస్తున్న విద్రోహాలను ప్రధానంగా ఎత్తిచూపడం.

•  వ్యదా భరితమైన స్త్రీలు, పిల్లల పట్ల గల పితృస్వామిక దృష్టికోణాన్ని బహిర్గతం చేయడం.

•  కార్పొరేట్ విద్యావ్యవస్థ స్వరూపాన్ని విమర్శనాత్మకంగా చర్చించటం.

•  బహుజనులపై ఆధిపత్య కులాల అభిజాత్యాన్ని ప్రశ్నించటం, ధ్వంసమవుతున్న  వృత్తి కులాల  జీవిత భద్రతను డిమాండ్ చేయడం.

•   మృగ్యమౌతున్న మానవీయ కోణాన్ని అందించటం.

•  రాయలసీమలోని స్థానిక సాంస్కృతిక వైవిధ్యమైన వాతావరణాన్ని పరిచయం చేయటం.

•  స్థానిక, స్థలనామాల పరిచయం, మాండలిక భాషా వినియోగం. ఇవి హరికిషన్ కథల విశిష్టతలు.                

హరికిషన్  కథల్లోని  ఆర్ధ్రతా లక్షణం మనసును క్షాళనం చేస్తుంది. ఏకో కరుణేవ రసం కావ్యంఅన్న లాక్షణికులు ప్రతిపాదించిన కెథార్సిస్ సిద్ధాంతంలోని మెలుకువలు ఎరిగిన కథకుడుగా జాస్మిన్”, “బంగారం”, “జీవనస్పర్శ”, “మెర్సీకథలు రుజువుచేస్తాయి. సాహిత్య సృజనకారుల సభ్యత వాళ్ళు సృజించే సాహిత్యం పైనే ఆధారపడివుంటుంది. సాహిత్యం సామాజిక ఆదర్శాలకు ప్రతిబింబం. జీవిత సమస్యలను పరిష్కరించ డానికి, జీవితాన్ని సుఖవంతంగాను, అర్థవంతంగానూ చెయ్యటానికి సాహిత్యం వుపయోగపడటం కంటే మించిన ప్రయోజనం ఎముంటుందీ. మనిషిలోని కొన్ని అనుభూతులను జాగృతం చేయడం ద్వారా మనిషి తత్వాన్ని పెంపొందించే ఆర్ద్రత హరికిషన్ కథలకుంది.

సాహిత్య వ్యాసాలు

వెంటాడుతున్న నల్లమల సహచర్యం 

నల్లమల అరణ్యంలోని కృష్ణ నది అలల్ని దాటి తూర్పు  కొండల అంచులకి చేరిన ఈ క్షణం వాతావ"రణం" రణం ముగిశాక స్తబ్ధంగా ఉన్నట్టుంది. అన్ని పరిచయం ఉన్న ప్రదేశాలే కానీ ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి, ప్రదేశాల ఆనవాళ్లను పోల్చుకోవడం ఇప్పుడు నా వంతు. ఆకలితో ఎండిన అస్తిపంజారములా కనిపించే మనిషి రూపంలా ఉంది, ఎండిపోయిన చెట్ల ఆకులు రాలిపోయి దళసరిగ ఉండే చెట్ల బేరడు చిట్లిపోయి అడివంతా అస్తిపంజరంలా నీలమయమై కనిపిస్తుంది....! మానవ సంచారం లేకపోవడంతో ప్రకృతి మౌన రోదన చేస్తోంది! వారి చేతిని తాకి స్పర్శించి గాఢంగా విచే పవనాలు బందించబడ్డాయి! కాళ్ళ క్రింద నేల ఆకలి దేశం సోమాలియాలోని నేర్రలు బారిన నేల వలె గుక్కబట్టి రోదిస్తుంది. ఈ ప్రదేశంను ఎలా  పోల్చుకోగలను! దాహం తీర్చుకోవడానికి నది ప్రవాహం అంచుకి చేరినప్పుడు క్షీరదాలు రోధచేస్తూ నా శీరస్సుపై గాలిలో చక్కర్లు కోట్టాయి. ప్రమాదానికి సంకేతాలుగా నది అవతలి వైపు రెండు ఎలుగుబంట్లు రావడం గమనించి ఆ పక్షులు అలా రొద చేస్తున్నాయి. ఈ తిరుగుబాటు నేరస్తుడిని తమ సోదరుడు అని గుర్తించి ఈ చీకటి కోండలో దాక్కోమంటూ హెచ్చరించాయి. ఈ ప్రకృతికి రూపం మారింది, కానీ స్వభావం కాదు. ఇది నా నేలనే. మోడుబారిన కోండల నడుమ ముదురు ఎరుపు వర్ణంతో నన్ను తాకి పలకరించిన సూర్యం మామ ....

ఇప్పుడు నేను పోల్చుకుంటున్న ఇది నా నేలనే. నా ఆలోచనలు ఎర్రనక్షత్రం నవలలోని సీతాబాబు {వింటర్ బాయ్}యనాన్ నది ప్రవాహాన్ని దాటినప్పుడు సీతాబాబుకి కలిగిన అనుభూతిలా ఉంది నాకు. నా శరీరం అణుఅణువు పులకిస్తుంది.

యుద్ధ సమయంలో ఓ సాయంకాలం ఫీనిక్స్ యుద్ధ వీరుడితో సంభాషించిన మాటాలు నా మెదడులో తెరలుతెరలుగా జ్ఞాపకంగా మెదులుతున్నాయి.

నల్లమల నువ్వు నా తల్లీవే

ఈ దేహం ఆలోచన ప్రేరణ

ప్రేమ త్యాగం తెగింపు అన్ని నీవే

నీవంటు లేని నాడు నిస్సందేహంగా

ఈ దేహన్ని కండ కండాలుగా వధించుకుంటా!

 Live long Nallamala......

                                      

ఈ సంచికలో...                     

SEP 2021

ఇతర పత్రికలు