సాహిత్య వ్యాసాలు

సాహిత్య వ్యాసాలు

 మరాఠీ రచయిత్రుల ఆత్మకథలు

                                                                       మరాఠీ మూలం : పు. ద. హాతకణగతీకర   

                                                                             కన్నడానువాదం: చంద్రకాంత పోకళె

                                                                                            తెలుగు : ఘట్టమరాజు

            కొన్నేళ్ళ నుంచి మరాఠీలో మహిళల ఆత్మకథలు విరివిగా వెలువడుతున్నాయి. ఈ పరంపర దళిత ఆత్మకథలతో మొదలైంది. హైందవ సమాజంలో స్త్రీకూడా దళిత వర్గానికి చెందిందే అనే ఒక వాదం వుంది. అలా అని స్త్రీల ఆత్మకథలన్నీ పీడిత వర్గాల వాళ్ల కథలని చెప్పలేం. యాభై అరవై ఏళ్ల క్రిందట ఐదో పదో మహిళా ఆత్మకథలు మాత్రమే లభించేవి. లక్ష్మీబాయి తిలక్, రమాబాయి రానడేల స్వీయ చరిత్రలు తప్పితే మూడో ఆత్మకథ అగుపించేది కాదు. తర్వాత నర్సు సుందరాబాయి ఆత్మకథ మాత్రమే జ్ఞప్తికి వచ్చేది. 1940-45 మధ్యకాలంలో నే నా పుస్తకాన్ని చదివాను. సుందరబాయి రోగులకు సేవ చేసే సమయంలో అనుభవించిన వేదన మనోవ్యథ, అవమానాలూ, అవహేళనలు గుండెల్ని పిండివేసేవి. పురుషస్వామ్యయుగంలో స్త్రీలు ఎన్నో వెక్కిరింతలు, వేదనలకు గురవుతారన్న సంగతి నాకు అప్పుడే తెలిసి వచ్చింది.

            స్త్రీలు వ్యక్తిగత గౌరవాదరాల్ని కాపాడుకోలేని దుస్థితి దాపురిస్తున్నదన్న విషయం కూడా నాకు అప్పుడే బోధపడింది. ఇలాంటి వెన్నో బాధల గాథలు నాకు మహిళల ఆత్మకథల్లో తారసిల్లాయి. నన్ను వేదనకు గురి చేశాయి కూడా. తర్వాతి యాభై ఏళ్ల అవధిలో వెలువడ్డ ఆత్మకథల్లో ఇలాంటి ఎన్నో సన్ని వేశాలూ, సందర్భాలూ కనపడ్డాయి. క్రమక్రమంగా స్త్రీలు సంఘంలో గౌరవ ప్రతిష్టలు గడిస్తూ, తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకో గలిగారనీ, అధికార, బాధ్యతాయుత పదవులు పొంద గలిగారన్న విశ్వాసం కలిగింది. సమాజంలో పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమానమైన హక్కులు ఇవ్వాలన్న చట్టాలు రావడం వల్ల వనితలకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభించసాగాయి. మహిళలు ఎన్నో రంగాల్లో కృషి చేయగలిగారు. గౌరవ మర్యాదలు పొందగలిగారు. ఇలా మహిళల ఆత్మకథల్లో వైవిధ్యం, వైశాల్యాలు వ్యక్తం కాసాగాయి. ఇవి చర్చనీయాంశాలు అయ్యాయి కూడా. మాధవి దేశాయి ఆత్మకథ ‘నాచ గె ఘమా’ (ఆడవే ఆటబొమ్మా) సునీతాబాయి ‘ఆహేమనోహరతరి’ (ఎంత్తసొగసుకత్తెఐనా) ఇటీవల పెద్ద చర్చకు గురైన కమలా పాధ్యే ‘బంధ – అనుబంధ’ (బంధం- అనుబంధం) ఆత్మకథలు, ఆ రచయిత్రుల భర్తలు ప్రసిద్ధ సాహిత్యవేత్తలు కావడం కూడా అవి సాహిత్య ప్రపంచంలోసంచలనం సృష్టించడానికి కారణాలని చెప్పొచ్చు. పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న రచయితల జీవిత విశేషాల గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఉబలాటం పాఠక మహాశయులకు వుండటం సామాన్యమే కదా! ఆత్మకథల్లో రచయితల, రచయిత్రుల ఆత్మ నివేదనం వుండనే వుంటుంది. అలాగే వాళ్లు తమను లోతుగా విశ్లేషించుకొని, సమర్థించుకోవడమూ కద్దు. ఈ అభిప్రాయంతో అందరూ ఏకీభవించక పోవచ్చు. అందువల్ల ఈ అభిప్రాయం సరైనదనీ, కాదనీ నిఖార్సుగా చెప్పడం కుదరదు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఇలా అనొచ్చు. ఆత్మకథల్లో కటు సత్యం వుండదు. వ్యక్తిగత జీవితంలోని పచ్చినిజాల్ని ఇతరులకు చెప్పడం సాధ్యమా? ఈ విషయం గురించి తగినంత చర్చ ఇంకా జరగలేదు. కాని ఏదైనా ఓ వరిష్టమైన ఆత్మకథను పనికి మాలిన దనో, నాసిరకందనో నిరూపించదలచుకొన్నప్పుడు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఆ వ్యక్తి (ఆత్మకథారచయిత్రి) జీవితం లోని కటు సత్యం ఇదేనని నిరూపించడం విమర్శకులకు సాధ్యం కాని పని. విమర్శకుడు తన వాదాన్ని బలపరుచుకొనేందుకు లేదా సమర్థించు కొనేందుకు కొన్ని ఆధారాల్ని సూచించినా అతను నెగ్గుకు రాలేక పోతాడు. ఆత్మకథలు సత్యాన్ని కనుగొనే లేదా వెతికేందుకు చేసిన కొన్ని ప్రయోగాలు మాత్రమే అని భావిస్తే, ఏ సమస్యా వుండదు. ఇతరుల జీవితం గురించి అంతిమ నిర్ణయం తమదే అని భావిస్తే, అది తప్పే.

            ఇటీవల మాధవీ దేశాయి ఆత్మకథ ‘నాచ గె ఘమా’ మరాఠీ సాహిత్య ప్రపంచంలో అల్లోలకల్లోలం సృష్టించింది. స్త్రీవాద హుంకారం ప్రతిధ్వనించిన మొట్ట మొదటి మరాఠీ మహిళా ఆత్మకథ ఇదే. ఈ పుస్తకం రెండు భిన్న సంస్కృతుల మిశ్రణం బానదాని శ్రీమంత జమిందారీ కుటుంబానికి చెందిన వ్యక్తి, సమాజంలో పేరు ప్రతిష్ఠలు గల రచయిత. అతని రెండవ భార్యగా వచ్చి, ఆ కుటుంబం సరి సంపదలు, ఆచార వ్యవహారాలు, పెత్తందారీ విధానాల్ని ఎదిరించే ధైర్యం లేని ఓ మహిళ కరుణా కథ ఈ స్వీయచరిత్ర. ఆమె తన భర్తతో కలిసి వేరే కాపురం పెట్టాలని ఆశించినా, విఫలమైంది. ఆమె ముగ్ధతకు సంతోషించి ఆమెను రెండవ భార్యగా స్వీకరించి, ఆ గర్భ శ్రీమంతమైన అత్తవారింట్లో ఆమె సమస్యలకు పరిష్కారం కలిగించలేని భర్త నిస్సహాయకత – ఇవన్నీ ‘నాచగె ఘమా’ ఆత్మకథలో శక్తిమంతంగా చిత్రించబడ్డాయి. రచయిత్రి మాధవీ దేశాయి తన వాదాన్ని సమర్థవంతంగా పాఠకుల ముందుంచింది. పుట్టింటి వాతావరణం, సంప్రదాయాలు, నమ్మకాలు, ఆశయాలు – ఆచరణలు వీటి మధ్య స్వతంత్రమైన ఆధునిక భావాలతో ముందడుగు వేస్తున్న ఓ నవయువతి వూపిరాడని అత్తింటి కాపురంలో ఎలా విలవిలలాడి పోయిందో మాధవీ దేశాయి హృదయానికి హత్తుకునేలా చిత్రించారు. శక్తిసామర్థ్యాల్ని కూడగట్టుకోకుండా, ఈ బంధనాల నుంచి విముక్తి పొందడమెలా అన్నదే రచయిత్రి పాఠకుల ముందుంచిన ప్రశ్న.

            ఆత్మకథ ఆత్మపరిశీలన, ఆత్మ విమర్శ చేసుకునే ఓ సాహిత్య ప్రక్రియ అన్న మాట  వాస్తవమే. కొన్ని స్వీయచరిత్రల్ని చదివినప్పుడు మనకు అలా అనిపించడమూ నిజమే. ఆత్మకథలో ప్రత్యేక వ్యక్తిత్వం, తప్పులు, మోసం, దగాలకు లోనైన వైనం వివరంగా రచయిత్రి చెప్పివుంటారు. రచయిత తాను సౌందర్యానికి మోహితుడై, పెళ్లాడిన నేపథ్యాన్ని తన దృష్టిలో వివరిస్తాడు. అతను కూడా నిజాయితీగా, ప్రామాణికంగా తన వాదాన్ని ప్రతిపాదించడమూ కద్దు. రచయిత్రుల ఈ ఆత్మ పరిశీలన, మనోవైజ్ఞానిక అంశాల తైపారును మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సి వుంటుంది.

            నేను పైన కొన్ని పాఠకుల ఆదరణ పొందిన, చర్చలకు గురైన మహిళల కొన్ని ఆత్మకథల్ని ప్రస్తావించాను. వాటిని సంక్షిప్తంగా చెప్పడం సముచితం అని భావిస్తాను. ‘ఆహే మనోహరతరి’ (ఎంత సొగసుకత్తెఐనా) ఆత్మకథ రచయిత్రి (శ్రీమతి సునీతా బాయి. ఈమె ప్రసిద్ధ నాటక కారుడు, కళాకారుడు ఐన పు.ల. దేశపాండే భార్య. ఈమె వేలాది పాఠకుల మెప్పు పొందిన రచయిత్రి. ఈమె సమాజవాద భావాలు కల కార్యకర్త. తన అభిప్రాయాల్ని జంకుగొంకు లేకుండా, వాడిగా వేడిగా, స్పష్టంగా మౌఖికంగానూ, రచనల ద్వారానూ చెప్పగల దిట్ట. కార్యక్రమాల నిర్వహణలోనూ. సమాజసేవలోనూ నిరతురాలైన మహిళ. భర్త పు.ల. దేశపాండే ఆర్థిక వ్యవహారాల్ని చక్కగా నిర్వహించగలిగిన వ్యవహార చతుర కూడా ఈమె పు. ల. దేశపాండే ట్రస్టు స్థాపించి, దాని నిధుల్ని సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకై సద్వినియోగం చేసిన సేవాతత్పరురాలు. బహుముఖ ప్రతిభావంతుడైన భర్త పు.ల. దేశపాండే వ్యక్తిత్వం గురించి ఈమె తన ఆత్మకథలో ఏమి చెప్పిందో అన్న తహతహ పాఠకులకు వుండింది. ఆత్మకథ పేరు ఎంతో మనోహరంగా వుండటం వల్ల పు. ల. దేశపాండే జీవిత విశేషాల్ని, తెలుసుకోవాలనే ఉత్కంఠ వల్ల ఈ ఆత్మకథ అపారమైన పాఠక వర్గంలో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించింది. కాని ఈ పుస్తకం చదివిన తర్వాత పాఠకుల్లో వున్న ఆసక్తి కాస్తా చల్లబడింది. చప్పబడింది. పురుషాధిక్యం వల్ల స్త్రీకి అన్యాయం జరిగేది సామాన్యమైన విషయం అని భావించిన పాఠకుల అభిప్రాయం తలకిందులయింది. వాళ్లకు ఎంతో నిరాశ కలిగింది కూడా. ఈ ఆత్మకథ లోని పూర్వార్ధం చాలా ఆసక్తికరంగా సాగింది. రచయిత్ర సునీతాబాయి పుట్టిన వూరు, తల్లిదండ్రులు, బంధుబలగం, ఇంటితనం, చిన్నప్పటి మధుర స్మృతులు వగైరా విషయాల్ని రచయిత్రి ఎంతో చక్కగా చిత్రించారు. రచయిత్రి తనలో బాల్యం నుంచి కలిసి స్వాభిమానం, స్వతంత్రమైన భావాలు, అభిప్రాయాలు, దేశభక్తి, సమాజసేవ పట్ల ఆసక్తి, అనురాగం, జ్ఞానతృష్ణ మొదలైన విషయాల్ని ఎంతో కుతూహలం కలిగేలా, చదివించే ఆకర్షణీయమైన శైలిలో రాశారు. తర్వాత ఆమె సేవాదళంలో చేరడం, బొంబాయి ప్రయాణం, అక్కడ గడిపిన గడ్డురోజులు, సమాజ సేవకుల, సహ చరులతో తాను చేసిన చర్చలు, గోష్ఠులు వీటి వివరణ నాటకీయంగా చిత్రించగలిగారు. కాని ఇవి పాఠకుల్ని ప్రభావితం చేయలేక పొయ్యాయి. పు. ల. దేశపాండే పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి, రచనా వ్యాసంగం – ఇవన్నీ వర్ణింపబడ్డాయి ఈ ఆత్మకథలో. భర్త  వ్యవహారంలో సానుభూతి లోపించడం, తనను నిర్లక్ష్యం చేయడం, ఇతరుల కష్టసుఖాల్ని పట్టించుకోక పోవడం, తోడి కళాకారుల ప్రతిభను గుర్తించినా, చిన్న చూపు చూడటం మొదలైన విషయాలన్నీ ఇందులో ప్రస్తావింపబడ్డాయి. అంతేకాదు, రచయిత్రి తానే యింటి బాధ్యతనంతా నెత్తిమీద వేసుకోవడం. భర్త ఆర్థిక వ్యవహారాల్ని చక్కపెట్టడం, భర్త తన్ను లెక్కపెట్టకున్నా, తాను మాత్రం అతన్ని గౌరవంగా చూశానని చెప్పుకోవడం – ఈ విషయాలకే ఈ పుస్తకంలో ప్రాధాన్యం ఇయ్యబడింది. ఈమె చిత్రించిన సంగతులన్నీ అసత్యాలని చెప్పలేం. కాని సమయాసందర్భాల్ని వర్ణించేటప్పుడు రచయిత్రి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్ని విషయాలపై పక్షపాతం చూపించడం మాత్రం క్షమార్హం కాదు. ఈమె కొన్ని సందర్భాల్లో తన భర్తకు ప్రతికూలంగానూ, తనకు అనుకూలంగానూ, రాయడం సమంజసంగా లేదు. ఈ రాతల వల్ల రచయిత్రి సునీతాబాయిపై మెప్పులు కురిసినా, పు.ల. దేశపాండే తన గృహస్థధర్మాన్ని సరిగ్గా నిర్వహించ లేదన్న బాధ దేశపాండే అభిమానులకు కలుగుతుందన్న, సంగతి మరువలేం. పు.ల. దేశపాండే పాఠకులు, అభిమానులు ఎన్నడూ సునీతాబాయికి ఆత్మీయులు కాలేదు. ఈ ఆత్మకథ చదివిన తర్వాత పు.ల. దేశపాండే అభిమానులూ, పాఠకులూ ఉద్రేకానికి లోనయ్యారన్న సంగతి సహజమే. సునీతాబాయి ఆత్మకథకు మరాఠీ సాహిత్య ప్రపంచంలో సకల గౌరవ మర్యాదలు కల్పించేందుకు నానావిధ ప్రయత్నాలూ జరిగాయి. సునీతాబాయి తన వాదనల్ని సమర్థించేందుకని పాశ్చాత్య రచయితల భార్యల, తనకు అనుకూలులైన రచయిత్రుల వ్యాసాల్నీ, కథనాల్ని మరాఠీ పాఠకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు కూడా. మరాఠీ సాహిత్య ప్రపంచంలో కొంత కాలం పాటు అనుకూలంగానూ, ప్రతికూలంగానూ వాదప్రతివాదనలు జరిగి, గొప్ప సంచలనం కలిగిన మాట వాస్తవమే. ఈ రభస వల్ల మరాఠీ సాహిత్య ప్రపంచానికీ, పాఠక సముదాయానికీ ఓ మేలు కూడా జరిగిందన్న సంగతి గమనించదగ్గ విషయం అదే సుమిత్రాబాయి ఆత్మకథ ‘ఆహే మనోహర తరి’ మరాఠీ సాహిత్యానికి ఓ కొత్త  చూపు, ఓ కొత్త వరవడి ప్రసాదించిందన్న సంగతి.

            కమల పాధ్యె గారి ‘బంధ అనుబంధ’ (బంధం – అనుబంధం) ప్రసిద్ధ మరాఠీ రచయిత ప్రభాకర సాధ్యెగారి భార్య ఆత్మకథ. శ్రీ పాధ్యె ‘కాంగ్రెస్ ఫార్ కల్చరల్ ఫ్రీడమ్’ అనే అంతర్జాతీయ సంస్థ  ఆసియాప్రాంత సంచాలకులు ఈయన సగం ప్రపంచం తిరిగి, చూసిన ఘనుడు, ప్రఖ్యాత పత్రికాసంపాదకుడు, వ్యాఖ్యాత, సౌందర్యశాస్త్రవేత్త. సమకాలీన దేశవిదేశ విద్వాంసుల, రాజకీయవేత్తల స్నేహం సంపాదించిన వ్యక్తి. అప్పట్లో ఆయన పెద్ద సదస్సును నిర్వహించాడు. మహారాష్ట్రలో బౌద్ధిక చైతన్యం వ్యాపింపచేయాలనిప్రయత్నించాడు. ఆ సందర్భంలోనే ఆయనకు కమలగారి పరిచయం కలిగింది. కమల పాధ్యె ఆత్మకథలో ప్రభాకర పాధ్యె పరిచితులైన జయప్రకాశ్ నారాయణ్ దంపతులు, రామమనోహర లోహియా, ఎస్. ఎమ్. జోషి, నాథపై, దయాకృష్ణ మొదలైన మహనీయులు జాతీయ స్థాయిలో కలిగించిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక చైతన్యం గురించి తెలుసు కోవచ్చన్న జిజ్ఞాన పాఠకులకు కలిగించి. పాఠకులకు కొంత వరకు వూరట కలిగింది కూడా. కాని రచయిత్రి వుద్దేశ్యం వేరేగా వున్నట్లు తోచింది. ఆమె వేసుకొన్న ప్రణాళిక మొదటి భాగంలో స్త్రీల సమాన హక్కులు, సమాజంలో స్త్రీ భూమిక, అభ్యుదయ దృక్పథం ఇవి ముఖ్యస్థానం ఆక్రమించాయి. ఆత్మకథ మొదటి అధ్యాయం ‘స్పర్శాలు లైంగిక సంవేదనల్ని అణచివేయడం వల్ల కలిగే మానసిక వేదనల్ని రచయిత్రి చిత్రించారు. దీన్ని చదివిన తర్వాత, మరాఠీ సాహిత్య చరిత్రలో ఈ ఆత్మకథ ఓ కొత్త ప్రయోగం కాగలదని నేను ఆశించాను. ఈ అధ్యాయంలో రచయిత్రి కమలా పాధ్యె చింతనాశక్తి, ఆత్మపరిశీలనా దృష్టి చాలా శక్తిమంతంగా వ్యక్తమయ్యాయి. కాని ఆమె నూతన దృక్పథం కొనసాగ లేక పోయింది. మిగతా భాగమంతా పాత పద్ధతి లోనే సాగింది. పాఠకులు ఈ ఆత్మకథకు, రచయిత్రి స్త్రీవాద దృక్పథానికి స్వాగతం పలికారు. శ్రీమతి కమలా పాధ్యె. తన భర్త ప్రభాకర పాధ్యె గుణశీలాల గురించి ధ్వని పూర్వకంగా రాశారు. ఆయన తనను ప్రోత్సహించలేదనీ, పూజారి కూతురి ననీ నన్ను చీటికిమాటికీ హేళన చేసే వారనీ, తనకు ఇంటా బయటా సమాన స్వాతంత్ర్యం ఇవ్వలేదనీ ఆమె అన్నారు. అయితే ఈ ఆత్మకథ పాఠకులకు ఆక్రమణకారి అనిపించలేదు. కాని ఈ పుస్తకం భావప్రకటనలో, అనుభవ నిరూపణలో కొత్త పుంత తొక్కిందని చెప్పొచ్చు. మరాఠీ సాహిత్యంలో ఇక మీదట ఇలాంటి విశేషమైన రచనలు వెలువడగలవన్న అభిప్రాయం పాఠక వర్గానికి, ప్రచురణ సంస్థలకు కలిగింది. కీర్తిశేషుడైన భర్త గురించి భార్య వ్యక్తం చేసిన ఆత్మ నివేదన సంప్రదాయం నెలకొనడం ప్రారంభమయిందనడానికి ఇది సూచన. కొంత వరకు ఇది అవసరమే, తగిందే కాని అది ఒక వేళ సాహిత్యంపై వెలుగు ప్రసరింప చేయలేకపోతే, ఆత్మకథ ప్రక్రియను పటిష్టం చేయలేకపోతే, అది ప్రయోజనకారి కాలేక పోతుంది. దివంగతులైన విద్యాధర పుండలీక గారి పత్ని శ్రీమతి రాగిణిగారు తమ సహజీవనం గురించి ఓ పుస్తకం రాశారు. ఇది ఆమె తొలి రచన. ఇందులో ఈమె తన భర్త వ్యక్తిగత వ్యవహారాల గురించి ఎక్కువగా రాసిందంతే.

            ఆనందీబాయి శిర్కెగారి ‘సాజవాత’ (సాయంకాలపుగాలి) ఆశాలత సావే గారి ‘పానా ఆడచేపూల’ (ఆకుచాటుపువ్వులు) పార్వతీబాయి ఆరవలె గారి ‘మాఘ కహాణి’ (నా కథ) మాలతీబాయి గారి ‘సహవాస’ (సాహసం) మరాఠీ మహిళలు రాసిన మరి కొన్ని ఆత్మకథలు. ఈ రచయిత్రులు తమ ఆత్మకథల్లో మారుతున్న కాలపు పరిస్థితుల్ని చిత్రించారంతే.

            ఈ రచయిత్రుల ఆత్మకథల కంటే ముందు వెలువడ్డ మహిళల స్వీయ చరిత్రల గురించి తెలుసుకొనడం అవసరం. శీలవతితాయి కేత్కర్ గారు విజ్ఞాన సర్వస్వకర్త కేత్కర్ తో గడిపిన జీవితాన్ని ‘మీచ హే సాగితలే ఆహే’ (నేనే ఇది చెప్పాను) చక్కగా నిరూపించారు. డా కేత్కర్ గారు సహృదయులే ఐనా విచిత్రమైన గృహస్థుడు. అతను దత్తత తీసుకున్న కొడుకు అనారోగ్యదశలో వున్నప్పుడు ఎలాంటి అడ్డుచెప్పక సేవ చేసింది. ఆ కాలంలో స్త్రీవాదం, అస్మిత, -లు ఇంకా ఉదయించ లేదని అనాలా? సుధా ఆత్రే గారి ‘గోదా తరంగ’ (గోదా, అల), ఉషా డాంగే (పణ ఐకతో కోణ) (కాని ఎవరు వింటారు), ముక్తా దీక్షిత్ గారి ‘హో తో ప్రచితిచె బోలణె’ (ఆమె అనుభవాలు), లీలాబాయి పట్వర్ధన్ – మాధవ జోలియన్ గారి భార్య రాసిన ‘ఆమచి ఆకరా వర్షే (మా పదకొండేళ్లు)

ఈ ఆత్మకథల్లో ప్రసిద్ధ వ్యక్తులైన భర్తల కరాళ ఛాయల్లో భార్యలు అనుభవించిన హింస, దుఃఖం, వేదనలు శక్తిమంతంగా వ్యక్తమయ్యాయి. పురుషాధిక్య పాలనలో వాళ్లు అనుభవించిన యాతన, నారకీయ జీవితాలు హృదయ స్పర్షిగా చిత్రించబడ్డాయి. పురుషాధిక్యానికి వ్యక్తమైన స్త్రీల ప్రతిక్రియల నేపథ్యంలో మరాఠీ సాహిత్యంలో స్త్రీవాదం రూపుకొనిందని భావించవచ్చు. ఈ సందర్భంలో మరో రెండు మహిళా ఆత్మకథల్ని పేర్కొనడం అవసరమని తోస్తుంది. యమునాతాయి ఖాడిల్ కర్ గారి ‘వటవృక్షాచా ఛాయేత’ (మర్రిచెట్టు నీడలో) సరోజినీ సారంగపాణి గారి ‘దుర్దైవాచి దోన పాథ’ (దురదృష్టం రెండు చేతులు), ఈ రెండు పుస్తకాల్లో పురుషుల పెత్తనంలో నోరు విప్పలేని స్త్రీల బతుకులు, వాళ్లపై ఆరోపింపబడ్డ అనైతిక సంబంధాలు వగైరాల హృదయవిధారక చిత్రణ లభిస్తుంది.

            ఇక దళిత స్త్రీల ఆత్మకథల గురించి పరిశీలిద్దాం. ఇవి చాలా తక్కువగా వెలువడ్డాయి. దళిత స్త్రీలు అనుభవించే కష్టాలు, ఇతర కులాల మహిళల బాధల కంటె భిన్నమైనవి. మొగుళ్ల దౌర్జన్యం, వ్యసనాలు, సోమరితనం, పగలు రాత్రి పని చేయాల్సిన అవసరం, పిల్లల బరువు బాధ్యతలు, వాళ్ల అనారోగ్యం- లెక్కలేనన్ని కష్టాలమయం దళిత స్త్రీల జీవితం. వీళ్ల జీవితాలు – దళితేతరులకు ‘షాక్’ తినిపించాయి. దళిత స్త్రీల దురవస్థ, పాఠకులకు మొట్టమొదటి సారిగా కానవచ్చింది. బేబి కాంబళె బతుకు మన లాంటిదే. కాని శాంతాబాయి కాంబళె (ప్రొఫెసర్. అరుణ కాంబళె గారి తల్లి) రాసిన ఆత్మకథ మాఝా జన్మాచి చిత్తర కథా (నా జీవితపు బొమ్మలాటకథ) కాస్త భిన్నమైనది. శాంతాబాయి కష్టాల-కడగండ్ల పాలైనా, కొంత కాలం తర్వాత ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేసిన పరిస్థితుల్ని తెలియచేస్తుంది. ఈ పుస్తకం సాహిత్య స్పర్శతో, హృదయానికి హత్తుకునేలా రాయబడినందువల్ల విశాల పాఠక సముదాయాన్ని ఆకర్షించగలిగింది. పైగా ‘దూరదర్శన్’ లో ప్రసారం చేయబడి నందువల్ల పాఠకులకు, ప్రేక్షకులకు మరింత దగ్గర కాగలిగింది ఈ ఆత్మకథ. బేబి కాంబళె ఆత్మకథ సొంత అనుభవం మీద ఆధారపడ్డ రచన. వేలాదిమంది పాఠకుల్ని ఆకర్షించగల దళిత స్త్రీల ఆత్మకథలు వెలువడాల్సిన ఆవశ్యకత వుంది. ఈ సందర్భంలో శ్రీమతి మల్లికా అమరశేఖర్ ఆత్మకథ ‘ఉధ్వస్త వయాచి ఆహే మలా ( చితికిన నా బతుకు) శీర్షిక లాగానే గొప్ప సంకలనం కలిగించే, ప్రభావకారియైన రచన. ఆమె కవయిత్రి కూడా. ఆమె శైలి కూడా విశిష్టమైనది. పురుషుల దర్పం, ప్రవర్తన, స్త్రీవాద భూమిక, తరతరాలుగా కొనసాగుతున్న కట్టుబాట్లు, ఆర్థిక సమస్యలు, వీటివల్ల దాపురించిన మానసిక ఆందోళనలు ఈ ఆత్మకథల్లో మనస్సుకు హత్తుకునేలా చిత్రింపబడ్డాయి.

            మన మిప్పుడు సినిమా, నాటక రంగాల్లో పని చేస్తున్న మహిళలు రాసిన ఆత్మకథల వైపు దృష్టి సారిద్దాం. ఇలాంటి స్వీయ చరిత్రలకు ఇటీవల గొప్ప ప్రచారం లభిస్తోంది. పేరు ప్రసిద్ధులు కూడా బాగా దొరుకుతున్నాయి. వీటిని రాసి పెట్టడానికి చెయ్యి తిరిగిన రచయితలు కూడా తెరమీదికి వస్తున్నారు. ఇలాంటి ‘ఘోస్టు రైటర్స్’ పాశ్చాత్య దేశాల్లో చాలా కాలం నుంచి వుంటున్నారు. కాని మనదేశంలో వీళ్లు కొంత కాలం కిందటే అవతరించారు. ఇలాంటి రచయితలు మన దేశంలో తక్కువే అనుకోండి.మరాఠీలో‘ఘోస్టు రైటర్స్’ సృష్టించిన మహిళల ఆత్మకథలు ఏ వొకటి రెండో వున్నాయి. వీటికంటె ముందు మరో రకమైన ఆత్మకథల గురించి తెలుసుకోవాలి. ఉన్నత వర్గాల్లోని కొందరు స్త్రీలు వివాహబంధంలో చిక్కుకోకుండా తమకు నచ్చిన పురుషునితో సహజీవనం చేస్తూ వుంటారు. ఆనందిబాయి విజాపురై రాసిన ‘అజుని చాలతేచవాట’ (ఈ దినానికీ నడుస్తున్న బాట) లో స్త్రీ పురుషుల స్వతంత్ర సహజీవితం గురించి వర్ణింపబడింది. రచయిత్రిలో పాపం లేదా తప్పు చేస్తున్నావనే స్పృహ లేకుండా తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా, ధైర్యంగా, దాపరికం లేకుండా ఆనందిబాయి విజాపురె తమ అభిప్రాయాలు, భావాలు వెల్లడించారు. మరాఠీ నాటక రంగంలో నటించే స్త్రీల గుణశీలాల గురించి తరతరాలుగా వినవస్తున్న వ్యాఖ్యలు, టీకలు ఇంకా మాసిపోలేదు. శాంతాఆప్టే స్వీయచరిత్ర ‘జావు మీ సినేమాత’ (నేను సినిమాలో పోయేదాన్ని) 1940 లో వెలువడినప్పటి నుంచి రంగస్థల నటీమణుల గుణ శీలాల గురించి వూహాపోహలూ, వూహాగానాలు, నిందలు- ఆరోపణలు సంఘంలో మొదలయ్యాయి. శాంతాఆప్టే తన నటజీవితంలో ఎన్నో ఆటుపోట్లని ధైర్యంగా ఎదుర్కొనగలిగింది. ఆమె నిర్భీకత, స్వతంత్ర వ్యక్తిత్వం ఈ పుస్తకంలో చక్కగా వ్యక్తమయింది. హంసా వాడ్ కర్ ఆత్మకథ ‘సాంగతే ఐకా’ (చెప్తాను వినండి) 1970లో అచ్చయింది. ఈ స్వీయ చరిత్రలో వ్యక్తమైన ఆమె స్వతంత్ర భావాలు మరాఠీ సాహిత్యంలోఅల్లకల్లోలం సృష్టించాయి. ఈమె చదువుసంధ్యలు లేనిదైనా, సంస్కార వంతురాలు, గుణవంతురాలు, మంచి అభినేత్రి కూడా. ఎంతో మంది వ్యసన పరులైన పురుషుల మధ్య బతుకుతూ, అడకత్తెరలో చిక్కిన పోక చెక్క వలె దురవస్ధలు పడుతూ ఆమె ఆ అగ్ని జ్వాలల్లోంచి బయట పడిన వైనం ఈ పుస్తకంలో మనం గమనించవచ్చు. హంసా వాడ్ కర్ నిర్భయంగా, నిస్సంకోచంగా తన అనుభవాలు, అవస్థలు వాడిగా వేడిగా, వెల్లడించడం వల్ల ఈ పుస్తకం గొప్ప సంచలనమే కలిగించింది. ఇవే కాక స్నేహ ప్రభా ప్రధాన్ ఆత్మకథ ‘స్నేహాణిత’ (స్నేహబంధం), లీలా చిట్నీస్ రాసిన ‘చందేరి దునియేత’ (వెండితెర ప్రపంచంలో)  ఆత్మకథలు కూడా పేర్కొనదగినవే. తర్వాత చాలా మంది సినిమా నటీమణులు తమ తమ అనుభవాల్ని వెల్లడిస్తూ రాయడం వల్ల మహిళల ఆత్మకథల సంఖ్య పెరుగసాగింది.

            మరాఠీ, హిందీ సినిమాల్లో నటించి పేరు ప్రసిద్ధులు గడించిన దుర్గాఖోటె ఆత్మకథ విశిష్టమైనది. ఈమె చారిత్రక, సాంఘిక చలన చిత్రాల్లో ప్రధాన పాత్ర ధరించిన అభినయ విశారద. ఆమె పేరు మోసిన నటులతో, దర్శకులతో, నిర్మాతలతో తనకు గల పరిచయం, వాళ్ల నుంచి తాను నేర్చుకున్న పాఠాలు, మరాఠీ సినిమా పుట్టుక, ప్రగతి, వికాసాల గురించి తన ఆత్మకథలో చాలా విషయాలు చెప్పింది. సమకాలీన చలన చిత్ర కళాకారుల జీవిత విశేషాలు, సినిమారంగ అనుభవాలు, బొంబాయి నగర జీవితం, కుటుంబ నిర్వహణ మొదలైన విషయాలు ఆసక్తిదాయకంగా వెల్లడించారు. ఈ ఆత్మకథలో మరాఠీ మహిళల ఆత్మకథల్లో ఇదొక శ్రేష్ఠమైన రచన.

            ఈ వ్యాసం సంక్షిప్తమైనది. అందువల్ల ఎన్నో మహిళల ఆత్మకథల గురించి ప్రస్తావించలేక పొయ్యాను. గోదావరీ బాయి పరుళేకర్ గారి ‘జెహ్యా మణ్ణూస జాగా హోతో’ (మనిషి మేల్కున్నప్పుడు)

అనుతాయి వాఘెయ గారి’ కోస బాడచ్సా టెకడి వర్ణ’ (కొసవాడ కొండ దృశ్యాలు) ఈ స్వీయ చరిత్రలు సామాజిక స్పృహతో కూడుకొన్న ఆత్మనివేదనా పరమైన రచనలు. ఇలా సామాజిక దృక్పథం వెల్లడించే మహిళల ఆత్మకథలు మరాఠీలో మరింత ఎక్కువ సంఖ్యలో రాగల అవకాశముంది ఇది నిజంగా సంతోషదాయకమైన సంగతి.

            (కన్నడ మాసపత్రిక ‘హోసతు’) కొత్త- మార్చి 2001 సంచిక నుండి అనువదించబడింది.)

 

 

సాహిత్య వ్యాసాలు

కలకంఠి కలాల - కరోనా కాలం కథలు

ముఖచిత్రం నుంచి ముద్రణ సంస్థ దాకా ..... సంపాదకత్వం నుంచి రచనల ద్వారా.... ఆవిష్కరణ నుండి సమీక్షదాకా .... అంతేందుకు ఆఖరికి రోగం కూడా స్త్రీ జాతి .... కరోనా మహమ్మారి.

కరోనా కాలం కథలు..... శతాధిక రచయిత్రుల కథలు, కధనాల బృహత్ గ్రంధం 630 పేజీలు, 106 మంది రచయిత్రులు, అ కథలు 24 కథనాలు, గౌరవ సంపాదకులుగా డా॥ తిరునగరి దేవకిదేవి సంపాదకులు, అనిశెట్టి రజిత, డా॥ కొమర్రాజు రామలక్ష్మి, డా॥ బండారి సుజాత, సహ సంపాదకులుగా డా॥ మురాడి శ్యామల, తమ్మెర రాధికా గార్లు, ముఖచిత్రాలు చిత్రకారిణి డా॥ జి. అవనీరావుగారు, రుద్రమ ప్రచురణ సంస్థ, 21,11,2021న కరీంనగర్ ప్రెస్ భవన్లో డా॥ కాత్యాయనీ విద్మహే గారి చేత పుస్తక ఆవిష్కరణ జరిగింది.

ఒక సాహసోపేత శ్రమ, ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన చారిత్రక ఘటనల గ్రంధస్థం చేయడం. అది సంపూర్తిగా మహిళల భాగస్వామ్యంలో జరగడం హృదయ పూర్వకంగా గర్వించదగ్గ అభినందించ దగ్గ దృగ్విషయం.

ఒక రకంగా వేల సంవత్సరాలుగా కాలపు పొరల క్రింద అణచి వేయబడ్డ, అక్షరీకరింపబడిని, అంధకారంలోనివెలుగు చూడని విప్పిచెప్పబడని అంశాలు, దృశ్యాలు, ఘటనలు, సత్యాలు కథలుగా, కథనాలుగా మొదటిసారిగా ధైర్యంగాసున్నితంగా, వేదనాభరితంగా మానవీయంగా చూపబడ్డాయి.

ముఖచిత్రంలో ఎక్కువ భాగాన్ని గద్దమొహం ఆక్రమించుకోగా, మన నాలుగుసింహాల రాజముద్ర మధ్యగాను ఓ ప్రక్క రెక్కలుసాచి వేటకు సిద్ధమైన గద్ద, పి.పి. సూట్స్‌లో ఉన్న వైద్యసిబ్బంది, వెనక పేజీలో పి.పి. సూట్స్‌లో మహిళ, గ్లోవ్స్ ఉన్న చేతులు, కరెంటు తీగలపై పక్షుల సమూహం వలసలకు సింబాలిక్ కావచ్చు లేదా.... గద్దరూపంలో ఉన్న వ్యవస్థలకు ఎరలుగా మారే పక్షుల రూపంలో కావచ్చు..... అర్థవంతమైన చిత్రీకరణ డా॥జి. అవనీరావుగార్కికి అభినందనలు.

ముఖాచిత్రంలో గద్దమొఖపు వైశాల్యముందు మన రాచముద్ర తక్కువ వైశాల్యాన్ని కలిగి ఉండటం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల వైఫల్యానికి సూచిక కాబోలు.

కారోనా కాలం కథలు తొలిదశ లాక్ డౌన్ వరకు గల కాలాన్ని మనముందుంచాయి. ఈ గ్రంధం నుండి అనేక అంశాల విభిన్న కోణాలపై అనేక చర్చలు చేయవచ్చు.

ప్రఖ్యాత రచయిత్రులు, ఆచార్యులు, సంస్థల స్థాపకులు, జాతీయస్థాయి అవార్డులు పొందినవారు, అనేక సాహితీ ప్రక్రియల్లో ఆరితేరినవారు, సామాజిక సేవలకే అంకితమైనవారు అనేక విద్యా, వైద్య, విభిన్న రంగాలలో పేరు ప్రతిష్ఠలు కలిగిన వారి నుండి మొదలుకొని మొదటిసారిగా వ్రాసిన పిన్నవారి వరకు రచయిత్రులున్నారు. మేలిమి, వజ్రాలు కొందరయితే సానపెట్టుకొని వేలుగులీనాల్సిన ముడివజ్రాలు కొందరు. 18 మందికి పైగా డాక్టరేట్స్ చేసిన వారి నుండి గృహిణులు, విద్యార్థులు వరకు ఉన్నారు. విభిన్న అస్తిత్వవాద దృక్కోణపు రచయిత్రుల నుండి మైనారిటీ వర్గ వాద రచయిత్రుల వరకు ఉన్నారు. విభిన్న కోణాల్ని ప్రతిఫలించిన ఈ గ్రంధం సాహిత్య ప్రపంచంలో తన ప్రత్యేక అస్తిత్వాన్ని నిలుపుకొందని చెప్పవచ్చు.

పుస్తకంలోని కొన్ని ఛాయాచిత్రాలు, వర్ణచిత్రాలు కరోనా కల్లోలాలను మన కళ్ళముందు ఆవిష్కరించి మన హృదయాల్ని కల్లోల పరచుతాయి.

దాదాపుగా కథలన్నింటిలో కరోనా కాలమనేకాదు ఈ కోణంలోనైనా, అనాదిగా మహిళల జీవితాలపై గల అణచివేత వివక్ష, హింస, దోపిడిల తాలూకు అన్ని రకాల సమస్యల చర్చ జరిగింది. రచనల్లో చాలా భాగం స్త్రీవాద దృకోణంలోనే చర్చ జరిగింది. ఆ చూపు తనని దాటి వలస కార్మికుల, భవన నిర్మాణ, అవ్యవస్థీకృత రంగ, ప్రజల, ప్రైవేట్ రంగంలో ఉపాధులు, ఉద్యోగాలు కోల్పోయిన వారి, పల్లె పట్టణాల, విభిన్న రాష్ట్రాల మొత్తంగా భారతదేశం నుండి ప్రపంచ దేశాల దాక కథలు కథనాలు కొనసాగాయి.

ఏ కథాకథనంలో కృతక లేదు. ఎందుకంటే అన్ని  వారి అనుభవాలు, పరిశీలనలు కాబట్టి సత్యం ఎలా చెప్పినా సత్యమే కనుక అవాస్తవికత ఎక్కడ కానరాదు.

స్త్రీ జీవితపు అన్ని కోణాలు ఆవిష్కరింపబడ్డాయి. అన్ని రకాల వివక్షలు, అణచివేతలు చూపబడ్డాయి. దేశ మేదయినా, మతం, ప్రాంతం, ఉపాధి, ఉద్యోగం ఎదైనా స్త్రీల స్థితిగతులస్థాయి అదే అధోస్థాయి అని తెలుస్తుంది.

పుట్టుక, బాల్యం, కౌమారం, యవ్వనం, వైవాహిక, గృహస్త జీవినాలు, నెలసరి రోజులు, గర్భిణిగా, చూలింత, బాలింతగా, ప్రసవ వేదనలు, వైధవ్య బాధలు, విడిచివేతల వ్యధలు, విడాకుల, ఒంటరి మహిళల జీవితాలు, వృద్ధాప్యపు తిరస్కారాలు, బలత్కారాలు, బలవన్మరణాలు..... వంటిల్లు నుండి జీవితపు అన్ని రంగాలదాకా మహిళలుగా వారి వారి కుటుంబాలు, సమాజాలుగా సమస్త ప్రపంచపు స్థితిగతులు నగ్నంగా ఆవిష్కరింపబడ్డాయి.

పల్లె, పట్టణ విశ్వనగరాల నుండి విదేశాలదాకా, గుడారాలు, గుడిసెలు, గూనపెంకులు, మిద్దెలు, అద్దె ఇల్లు, అపార్ట్‌మెంటుల నుండి రోడ్డు ప్రక్క, చెట్ల క్రింది ఆవాసాల దాకా అనేకానేక ఇతివృత్తాలతో కథాకథనాలు కొనసాగాయి.

కరోనా కాలం కధలన్నింటిలో ద్వితీయశ్రేణి జీవితాలే, ఈ సంపుటిలోని కథలో లాగా స్త్రీలంతా ద్వితీయశ్రేణీ కదా అందులో మళ్ళీ అత్తా, ఆడబిడ్డల కంటే దిగువజాతి కదా !

ఈ కథలన్నీ మధ్య తరగతి, దిగువ మధ గతి, పేద, నిరుపేద, దళిత, ఆదివాసీ, మైనారిటీ వారి కరోనా కష్టాల్ని, నిత్య కష్టాల్ని ఆవిష్కరించింది. జీవితాల్ని కలలోకాల్లో తేలించే సినిమాల, సీరియళ్ళ స్వప్న లోకాల పూలపాన్పులపై నడిచే ప్రేక్షకుల్ని కఠినాతి కఠిన, కన్నీటి పర్యంతపు వాస్తవాల ఎండకు కాలిబొబ్బలెక్కిన అరిపాదాల నెత్తుటి రహదారులపై నడిపించి ఒక్కింత ఆర్ద్రతను, మానవీయతను తట్టి లేపడంలో సార్థకతను సాధించింది.

అట్టడుగు జీవనాలైనప్పటికి అసూర్యంపశ్యల అతిగుప్త వెలుగుచూడని జీవన చిత్రాల కఠిన సత్యాల్ని జాతీయ రహదారుల్లోకి నగ్నంగా ఆవిష్కరింప చేసి, సమాజపు ఆలోచనకు మరింత కొనసాగింపును, చూపును అందించింది.

ప్రపంచపు 80% ప్రజల జీవితాల చిత్రణ ఇదే కదా ఒక మహవిపత్తు ప్రపంచవ్యాప్తంగా సంభవించినప్పుడు జరిగిన విపరీత పరిణామాల అఘాతం నుండి తేరుకొని, సవరణలు, సంక్షేమాలు, రక్షించడాలు దాకా ప్రభుత్వం నుండి వివిధ వ్యవస్థలదాకా (కుటుంబ కూడ) జరిగిన పరిణామాల్ని, జరగకూడని, జరగాల్సిన, ఇకముందు సంస్కరించుకోవాల్సిన, ఆలోచించాల్సిన అంశాల, స్పష్టీకరణలు కూడా కరోనా కాలం కథలు మనకు తెలుపుతాయి.

శాంతిశ్రీ బెనర్జీ (4) ఆత్మస్థైర్యంలో 500 కి.మీ.లపైగా మల్లీశ్వరి గాయపడిన తండ్రిని కూర్చోబెట్టుకొని చేసిన సైకిల్ ప్రయాణంలో ఆడపిల్లలు తలుచుకొంటే ఎదైనా చేయగలరని చెబుతూనే వలస కష్టాలు చూపుతూనే సాటి మానవులలోని మానవీయతను దర్శింపచేసారు.

టీ, యాకమ్మగారి 8వ కథ దుఃఖనదిలో...... అత్తాకోడళ్ళ విషాద విలాపంతో.... ఆమె ఆకలి చచ్చిపోయింది..... కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టారు.... కాని ఆకలికి ఎవరైనా లాక్డౌన్ పెట్టుంటే బాగుండు...... జూపాక సుభద్ర గారి (23) కొన్ని నూకలు మిగిలే ఉండోచ్చులో..... ఆకలికి మించిన వ్యాధి లేదంటారు. ప్రపంచంలోని అతి పేద వర్గాలన్ని 360 రోజులు ఈ బాధితులే అంటారు. ఎండ్లపల్లి భారతిగారి కూటికుంటే కోటికున్నట్లే (9) లో దొంతులే నా బింకం....... నా సంపాదన అంతా ఆ దొంతులలోనే అంటూ స్త్రీల అతిపెద్ద సమస్య కుటుంబ ఆకలి తీర్చడమేనంటూ, కరోనాకు ముందైనా ఆ తరువాతైనా అత్యధిక శాత ప్రజలది ఆకలి బాధేనంటూ చెబుతుంది. తిరనగరి నవతగారి (10) గౌరమ్మ కథ.... ప్రభుత్వ ఖజానా నింపడం కోసం...... కొడుకు తలకు కొరివి పెట్టిన తల్లికథ ప్రభుత్వ విధాన వైఫల్యం కారణంగా.... తాగుడుకు లాక్ డౌన్ లేని కారణంగా ఎన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయో తెలుపుతుంది. శైలజామిత్ర గారి (25) నడిచే యంత్రంలో.... కరోనాతో ప్రపంచానికి విశ్రాంతి వచ్చినా తల్లికి, వంటింటికి రాలేదని..... వెలకట్టని మహిళల అవిశ్రాంత శ్రమ నిర్వేదపు కథ..... ఇదే అంశంతో గట్టురాధికా మోహన్ గారి (60) కొంచెం రెస్టుకావాలి...... రోబోకాయినా కొంత సమయం...... చార్జింగ్ కోసం..... కనీసం మాకు అది లేదంటూ.........

నెల్లుట్ల రమాదేవి గారి (29) తల్లివేరులో మానవ సంబంధాలలోని డొల్లతనాన్ని, ఆర్థికంగా నిలవలేని స్త్రీల అగచాట్లని, వృద్ధ మహిళల దైన్యాన్ని తెలుపుతుంది. డా॥ త్రివేణి గారి (35) ముళ్ళల కంచె, డా॥ తెన్నేటి సుధాదేవి (39) నిరీక్షణలో కరోనా క్వారంటైన్ గూర్చి వృద్ధాప్యంలో కొడుకు వద్ద సేద తీరాల్సిన తల్లి, ప్రసవ సమయంలో భర్త తోడును, కాన్పు అనంతరం బిడ్డకౌగిలిని ఎంత నిర్ధయగా దూరం చేసిందో చూపుతాయి.

మల్లవరపు విజయ (48) కరోనా కౌగిట్లో మనీషాలో, అమానవీయ, ఆర్థిక దురాశలకు ప్రతి సందర్భం కలిసివచ్చేది. ఒంటరి అమాయక బాలిక దయనీయ స్థితిని ఆమె కిడ్నీని అపహరించేందుకు వాడుకొనే వారి పాశవికతను తెలుపుతుంది. బాలబోయిన రమాదేవి (52) స్త్రీల నెలసరి సమస్యనే శీర్షికగా చేసిన కథ.... కరోనాకు భయపడి ఆ అవసరం ఆగేనా... సహచరులకే అర్థంకాని సమస్యను వెలుగులోకి తెచ్చిన కథ.

పాఠకుల హృదయమంతటిని కదిపి కుదిపి, కన్నీటిని రాల్పించే కథ, అమ్మతనపు ఔన్నత్యాన్ని, పసితనపు సున్నితత్వాన్ని, మానవత్వాన్ని మానవుల అమానవీయతను, స్త్రీల జీవన చిత్రంలో తాను మాత్రమే మోసే బాధ్యతల్ని సూటిగా, స్పష్టంగా చిత్రించిన కథ పద్మ VLS సత్తిరాజుగారి (65) ఎంతెంతదూరం కథ..... జీవిత భారం మోయలేక పారిపోయిన భర్త తలపై మోత, కడుపులో బిడ్డ, చేయందుకొని సరిగ్గా నడవనైనా నడవలేని మరో బిడ్డ.... తల్లి చాకచక్యంగా నడవ అలసిన బిడ్డను ఎంతెంత దూరం అంటూ పరుగెట్టించిన విధం అటు పాత్రల్ని, పాఠకుల్ని, ఆలోచనల్ని చాలా చాలా దూరం నడిపిన అద్భుత కథా చిత్రణ.

మామిడాల శైలజగారి విధివిలాసం (78) శైలజా శేఖరల్ అపురూప దాంపత్యం, కరోనాకాటు ఆర్థిక పరిణామంగా రైల్వే ట్రాక్‌పై శేఖర శవంగా మారటం, సంధ్య ఒంటరిగా మిగలటం..... ఆత్మహత్యల కారణాల్ని చూపుతుంది.

కరోనాకు చైనా కారణమంటూ, మర్క్ సమావేశం కారణమంటూ ముస్లింలపై మతకోణంలో జరిగిన అమానవీయత వారి బ్రతుకుల్ని ఎలా కాకవికలం చేసిందో, ముస్లిం సమాజాన్ని ఎంత అభద్రతకులోను చేసిందో తెలిపిన కథలు 19, 21 వ కథలు, డా|| షాజహానా గారి పరించాలో.... ముస్లింల వెనకబాటుతనం గూర్చి ... నేను నమ్మకం అనే పదాన్ని సింక్ లో వేసి నీళ్ళదిలాను...... కరోనా కంటే విషపూరిత వ్యాధి మతం అన్నారు...... ఎంతటి విషాదమిది. మనం ఎన్నిగా చీలిపోదాం, మతం, కులం, వర్గం, వర్ణం, లింగ, ఆర్థికపరులు.

కనీజ్ ఫాతిమా గారి (27) అపనమ్మకంలో పాల్షాప్ సలీమ్న మరణ్కు పోకున్నా క్వారంటైన్‌కు తీసుకుపోవడం, వారికి పనులు ఇవ్వకపోవడం...... ఒక రకంగా ...... వెలివేయటం.

డా॥ జయంతి గారి కథనం (90) నేనో విషాద కావ్యాన్నిలో ప్రజాస్వామ్య రాజకీయాలు మైనారిటీ, మధ్య దిగువ మధ్య తరగతి దళితులకు ఎంత అందనంత దూరంలో ఉన్నాయో...... 33% రిజర్వేషన్ కారణంగా సర్పంచ్ అయిన కవిత ప్రజల బాధ్యతా రహిత్యం, అధికారుల అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరుల కారణంగా జరిగిన నేపథ్య చిత్రీకరణల చూపుతుంది. కవితచే చెప్పించబడిన... మానవతకు, వైద్య, ఆర్థిక వ్యవస్థలకు కరోనా ఒక మచ్చ అంటూ......

11 వ కథ 33, 72, 82, 91 కథల్లో చివరిదైన డా॥ కొమర్రాజు రామలక్ష్మి గారి (86) మళ్ళీ చిగురించాలి కథలు పాజిటివ్ దృకోణంలో కరోనా కాలంలో వెల్లివిరిసిన మానవత్వాన్ని, బలపడిన కుటుంబ బంధాల్ని, ప్రకృతి, గాలి, నీరు స్వచ్ఛంగా మారటాన్ని, వైద్య, పోలీసు, మున్సిపాలిటి, స్వచ్ఛంధ వ్యక్తిగత సేవల ఔన్నత్యాల్ని, కరోనాను జయించి ఆత్మ విశ్వాసాన్ని నింపే కథలు.

రేహనాగారి (93) వలసవెనక్కిలో కరోనాకారణంగా వివిధ దేశాల వారీగా ఆయా వలస కార్మికులు వెనక్కిరావటాన్ని చెప్పడంతో పాటు లాక్డౌన్ ప్రకటనకు ముందు ప్రభుత్వం ఏ ఏర్పాట్లు లేకుండా చేసిన అనాలోచిత చర్య సృష్టించిన విధ్వంసం గూర్చి తెలిపారు.

కొండవీటి సత్యవతి గారి (96) కరోనా కష్టకాలంలో సమాంతా సాహసం నిజాంగా ఓ సాహసోపేత కథనం ఒక స్త్రీవాద కోణపు విశాలతను, ట్రాన్స్ జెండర్స్‌ను తమ సమాజంలో భాగంగా స్వీకరించటం కన్పిస్తుంది. 3000 కి.మీ. తన ఆటోలో తిరిగి 2500 మంది ట్రాన్సజెండర్స్‌కు నిత్యవసరాల్ని అందించటం..... మీ వాళ్ళు భిక్షాటన చేస్తారనే అపవాదు వాడేందుకు ఆటోనడపడం..... వారివైపుగా వారి కష్టాలు, ఆత్మగౌరవాల వైపుగా మన చూపును తిప్పన కథనం.

103వ కథ మేడ్చల్ ఫుడ్ & ట్రావెల్ క్యాంపు గూర్చి భూమిక సౌజన్యంతో జరిగిన స్వచ్ఛంద కార్యక్రమాల గూర్చి వచ్చిన కథనాలు మనలో మనకు ఒక నమ్మకాన్ని, మానవత్వం బతికే ఉందన్న ధైర్యాన్ని ఇస్తాయి.

108, శాంతిరెడ్డి గారి కరోనా రక్కసి కోరలు 110 అనిశెట్టి రజితగారి ఇదేం బతుకులో వలస కార్మికుల్ని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి కొన్ని నెలలపాటు ఉండే విభిన్న ఆదివాసి, దళిత ప్రజలను ఇక్కడి ప్రజలు వారి సమాజంలోకి స్వీకరించరన్ని నగ్న సత్యం వలసలకి ఒక ముఖ్య కారణంగా చూడవచ్చు.

అనిశెట్టి రజిత గారు తన కధనపు స్వగతంలో తనలో తాను, తానుగా సమస్య అంతటిని అవలోకనం చేసుకొని అర్థాలు, అంతరార్థాలు, అనర్థాలు, జరగాల్సిన విధానాల అంతర్మధనంలోని చింతనలో ఒక నిర్వేదం, మనుషుల, ప్రభుత్వాల వ్యవస్థల తప్పొప్పుల తర్కం, తాత్వికతాలను తన నుండి మనలోకి ప్రవహింప చేస్తుంది. నిశ్శబ్దాన్ని ఇష్టపడే నేను..... ఖాళీతనాన్ని భరించలేనంటూ, మనంగా మానవీయంగా ఏం చేయాలో ఒక ఆశవహదృక్పధంతో ముగించారు.

కరోనా కాలం కథల శతాధిక రచనల్లో బహుశా మనం వెయ్యికి పైగా కుటుంబాల్ని చూసి ఉంటాం. అన్ని రకాల అట్టడుగు వర్గాల జీవన చిత్రాల్లో ప్రతికథలో కనీసం వందలకు పైగా మహిళల జీవితాల్ని, అన్ని వ్యవస్థల పని విధానపు డొల్లతనాన్ని, ఆర్థిక, మత కోణాల్ని ప్రభుత్వ పనివిధాన వైఫల్యాల్ని, అంగీకరించి అర్థం చేసుకొంటాం.

ఒక అతిపెద్ద కరోనా విపత్తు మరణాలకన్నా, మానవ పని విధానాలు, పథకాల విలువల, వ్యవస్థల ఆలోచనా రాహిత్యం, ఆర్థిక కారణాల వల్లనే ఎక్కువ వేదన, హింస, మరణాలు సంభవించాయన్నది సత్యం, ముందు మనందరం, సిగ్గుతో తలదించుకోవాల్సిందే.

వైద్య, ఫార్మసీ, ప్రైవేట్ కార్పోరేట్ రంగాలలో ఎంత విలువల పతనపు అమానవీయతను, పై వ్యవస్థలని నియంత్రించలేని ప్రభుత్వ అసమర్థత ఎంతగా గ్రహించామొ అంతే స్థాయిలో వ్యక్తిగత, స్వచ్ఛంద సంస్థల స్థాయిలో మానవీయ కోణాల్ని దర్శించాం.

పై చాలా కథల్లో కుటుంబ పనిలో మహిళలకు సహాయంగా పనిచేసే మహిళల్ని చాలా సహృదయతతో పనికి రాకున్నా జీతం ఇవ్వడం, ఆదుకోవడం గమనించిన మనం, పదులు, ఇరవై సంవత్సరాలపైగా కార్పోరేట్, ప్రైవేట్ కళాశాలలలో తమ సేవల ద్వారా యాజమాన్యానికి కోట్లాది రూపాయల లాభాల్ని చేకూర్చిన ప్రైవేట్ సంస్థలపై ప్రభుత్వం చర్య తీసుకొని వారికి కనీస 30 నుండి 40% జీతం అన్నా ఇప్పించకుండా ముష్ఠిలాగా అది చాలాకాలం తరువాత 2,000 రూపాయలు, 50 కిలోల బియ్యంతో సరిపెట్టడం శోచనీయం. మనం మనంగా, వ్యవస్థలుగా, ప్రభుత్వాలుగా ఎంత ఎదగాలో పై కథల్లో మన చూస్తాం..

ఈ కరోనా కాలం కథల్లో ఎక్కడా భాషాడంబరం లేదు. అతి సహజంగా, సరళంగా స్పష్టంగా చెప్పదలచుకొన్నది పాఠకుల మనసుల్ని చేర్చడం ద్వారా ఈ పుస్తకం తన గమ్యాన్ని చేరిందన్నది అభినందనీయ విషయం. ముందుకాలంలో కరోనా విపత్తుకు సంబంధించిన అనేక విషయాల్ని తెలుసుకొనేందుకు ఈ గ్రంధం ఉపకరిస్తుంది.

సంపాదక, రచయిత్రులంతా తిరిగి మరిన్ని గ్రంధాలను రూపొందిస్తారని ఆశిస్తూ అందరికి అభినందనలు.

 

 

సాహిత్య వ్యాసాలు

ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర -20

పోతం జానకమ్మతో ఆధునిక స్త్రీల సాహిత్య చరిత్ర 1874 లో  మొదలవుతున్నదిఎవరీ జానకమ్మ ? ఏమివ్రాసింది? ఎక్కడ ప్రచురించబడ్డాయి?

పోతం జానకమ్మ మద్రాసు నివాసి. ఆమె భర్త రాఘవయ్యతో  కలిసి  1873 లో ఇంగ్లండ్ వెళ్లి 1874 ఫిబ్రవరి 1 కి తిరిగి వచ్చింది. వచ్చిన తరువాత తన భావాలను, అనుభవాలను, తెలియపరుస్తూ తెలుగులో  లేఖ రూపంలో ఒక  వ్యాసం వ్రాసి  ‘శ్రీ ఆంధ్ర భాషా సంజీవని’  పత్రిక కు పంపింది. అది  ప్రచురించ బడిందిఅయితే  తెలుగులో ఆంధ్ర భాషా సంజీవని అనే పత్రిక ఉంది కానీ  ‘శ్రీఅనే ప్రారంభ వర్ణం దానికి లేదు. అది మద్రాస్ నుండే వచ్చేది. 1871 నవంబర్ నుండి ఆ  మాసపత్రిక ను  కొక్కొండ వెంకటరత్నం పంతులు నడిపాడు.( పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికలు, 2004, పు;113) దానినే జానకమ్మ  ‘శ్రీ  ఆంధ్ర భాషా సంజీవనిఅని చెప్పి ఉండవచ్చు. ఈ వ్యాసం 1874 ఫిబ్రవరి లేదా మార్చ్ నెల సంచికలో వచ్చి ఉండాలి. ఎందుకంటే  దీని  ఇంగ్లిష్ అనువాదం మద్రాసు నుండి వచ్చేఎథినీయం అండ్ డైలీ న్యూస్పత్రికలో 1874  ఏప్రిల్ 15  సంచికలో విపులమైన సమీక్షతో ప్రచురించబడింది కనుక. ఆ రకంగా తెలుగులో తొలి వ్యాస రచయిత్రి పోతం జానకమ్మ. ఆమే తొలి తెలుగు రచయిత్రి కూడా.  

 అండ్ డైలీ న్యూస్పత్రికలో వచ్చిన ఆవ్యాసం, ఈ సమీక్ష మొదటి అధ్యాయంగా చేసి మొత్తం పన్నెండు అధ్యాయాల ఇంగ్లండ్ యాత్రా చరిత్రను Pictures Of England అనే శీర్షికతో 1875 అక్టోబర్ లో  ప్రచురించింది  జానకమ్మ. అసలు ఈ యాత్రా చరిత్రను ఆమె మొదట  తెలుగులోనే వ్రాసింది. అలా అనుకొనటానికి ఆధారం ఈ పుస్తకానికి జానకమ్మ వ్రాసిన  ముందుమాటలోనే ఉంది

తాను తన కళ్ళతో చూసింది, తన ఆలోచనకు అందినది మాత్రమే వ్రాయటం వలన ఇందులో ఏమైనా తప్పులు, అక్కడి స్థలాలను , ప్రజలను వర్ణించటంలో లోపాలు ఉంటే క్షమించమని పాఠకులను కోరింది. ప్రత్యేకించి దీనిని దేశీయ మహిళలకోసమే వ్రాస్తున్నా వాళ్లలో ఎక్కువమంది ఇంగ్లీష్ భాష చదవడంలో  ప్రగతి సాధిస్తున్నారు కనుక కొన్నేళ్లలో ఈ పుస్తకంలోని విషయాలను గ్రహించగలరన్న విశ్వాసం ప్రకటించింది.అయితే అవసరాన్ని బట్టి, ఇంగ్లీషు భాష నేర్చుకోని వాళ్ళ కోసం  తెలుగు అనువాదం ప్రచురించటం గురించిన  ఆలోచన ఆమెకు ఉన్నది. “In due course the original  with a Telugu translation of English passages quoted in this book , shall be  published, when there is a  pretty  good demand and not before”  అని  ముందుమాటలో చెప్పిన విషయం గమనించదగినది. దీనిని బట్టి ఆమెఒరిజినల్అని చెప్పింది  తెలుగులో వ్రాసిన అసలు ప్రతి గురించే అనుకోవచ్చు. ఆమె మొత్తం పుస్తకాన్ని తెలుగు చేస్తానని అనలేదు. యాత్రానుభవాల వివరణ క్రమంలో అవసరమైన చోట్ల ఇతర గ్రంధాల నుండి ఎత్తి  యథాతథంగా ఇందులో చేర్చిన ఇంగ్లీష్ పేరాలను తెలుగు చేసి ప్రచురించటం గురించి మాత్రమే చెప్పింది. అందువల్ల జానకమ్మ ఈ పుస్తకాన్ని తెలుగులోనే వ్రాసింది అని రూఢి అవుతున్నది. సమకాలపు  సమాజంలో తన స్థానం , అవసరాలు , ప్రయోజనాలు ఏవో ఆమెను ఈ రచనను  ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించేట్లు ప్రేరేపించి ఉంటాయి.

ఆ రకంగా ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర యాత్రాచరిత్ర ప్రక్రియ తో ప్రారంభమైంది.

                                                            1

 పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్(Pictures Of England) పుస్తకానికి వ్రాసుకొన్న ముందుమాట   (preface)  కింద సంతకం స్థానంలో జానకమ్మ  పేరు పక్కన చేరిన రాఘవయ్య( POTHAM JANACUMMAH RAGAVIAH )  ఆమె  భర్త పేరుఅంతకు మించి ఆయన వృత్తి ఉద్యోగ వివరాలు ఏమీ లేవు. ఫామిలీ మెంబర్స్ , రిలేషన్స్   , ఫ్రెండ్స్ అంటూ సాధారణ వాచకాలతో పేర్కొన్నదే కానీ , ఎవరి పేరును గానీ  ఎవరితోనైనా తనకు ఉన్న రక్త బంధుత్వ సంబంధాలను గానీ ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చేటప్పుడు స్టీమర్ నుండి బయటకు రాగానే  భర్త సోదరుడు మిస్టర్ పి. వెంకటచెల్ల చెట్టి కనిపించేసరికి తనకు ఆనందం కలిగిందని చెప్పుకొన్నది. ఇదొక్కటే ఆమె బంధుత్వ పరంగా పేర్కొన్న పేరు. అది ఆధారంగా జానకమ్మ చెట్టి కులానికి చెందినది అనుకోవచ్చు. సాధారణంగా చెట్టి వైశ్యుల పేర్లలో కనిపిస్తుందికనుక జానకమ్మ కోమటి కులస్థురాలుమద్రాస్ లో ఆనాడు ప్రముఖ వ్యాపారవేత్త , సంఘ సంస్కర్త గాజుల లక్ష్మీ నరుసు చెట్టి బలిజ కులస్థుడు. దానిని బట్టి  జానకమ్మ బలిజ కులానికి చెందినదైనా కావచ్చు అని ఒక వూహ

వ్యాపార కార్యకలాపాల కోసం భారతదేశానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీ సముద్రతీరపు చెన్నపట్నాన్నికొనుక్కొని ఓడరేవును , కోటను  నిర్మించటంతో 1650 నాటికి అది ఒక వ్యాపార కేంద్రమై  క్రమంగా మద్రాసు నగరంగా విస్తరించింది. తూర్పు ఇండియా కంపెనీ ప్రభుత్వ పాలనా కేంద్రమై అటు  కర్ణాటక, కేరళ, తెలుగు, నైజాం ప్రాంతాల పై అదుపు సంపాదించగలిగిందిదీనితో మద్రాసులో పెరిగిన ఉద్యోగ  వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొనటానికి  వలసలు  ప్రారంభం అయినాయి. అట్లా వెళ్లినవాళ్లలో తెలుగు ప్రాంతాల బ్రాహ్మణులూకోమట్లు, బలిజలు కూడా ఉన్నారు. ( కాళిదాసు పురుషోత్తం -ఇంగ్లీషు జర్నలిజం లో తొలి వెలుగు దంపూరి నరసయ్య 2007)

1930 లనాటికి తూర్పు ఇండియా కంపెనీ పాలనలో స్థానిక ప్రజల హక్కుల కోసం, సంస్కరణల కోసం విద్యావంతులు సంఘాలు పెట్టి , పత్రికలు పెట్టి ప్రయత్నించసాగారు. వారిలో ఒకడైన గాజుల లక్ష్మీ నరుసు చెట్టి తండ్రి సిద్ధుల చెట్టి అలా నెల్లూరు ప్రాంతాల నుండి  వలస వెళ్లిన వాడే. మద్రాసులో నీలిమందు వ్యాపారం చేసి సంపన్నుడైనాడు. లక్ష్మీ నరసు చెట్టి తండ్రితో కలిసి నీలిమందు వ్యాపారం తో పాటు పత్తి ఎగుమతి వ్యాపారం కూడా చేసాడు. పోతం జానకమ్మ అత్తింటి కుటుంబం కూడా అట్లా వలస వచ్చి  వ్యాపారం లో కుదురుకుని మద్రాసులో స్థిరపడినదై ఉంటుంది. జానకమ్మకు కూడా పరిశ్రమలకు, వ్యాపారానికి సంబంధించిన ఆసక్తి, పరిజ్ఞానం ఉన్నాయని  ఈ యాత్రాచరిత్రలో అనేక సందర్భాలు సాక్ష్యం ఇస్తాయి. ఈ ఆసక్తి , ఈ పరిజ్ఞానం కుటుంబంలోని  ఆ వ్యాపార వాతావరణం నుండే ఆమెకు లభించి ఉంటాయి, ఆ క్రమంలోనే  వ్యాపారలావాదేవీలమీద ఇంట్లోని మగవాళ్ళు ఇంగ్లండ్ కు వెళ్లిరావటం చూస్తున్న  జానకమ్మలో  విదేశాయానం పట్ల  ఆసక్తి  కలిగి ఉంటుంది.

హిందూ ప్రజలు   ఓడలు నిర్మించి ఇతరదేశాలకు ప్రయాణాలు చేసిన చరిత్ర , అక్కడి  ప్రత్యేకతలను తెలుసుకొన్న  చరిత్ర లేదన్నది ఆమె అభియోగం. పైగా హిందువులు సముద్రాలు దాటి ఇతరదేశాలకు పోరాదనే నిషేధం ఒకటి. అందువల్ల కులం పోతుందన్న బెదిరింపు, ప్రాణాలకే ముప్పు అని భయపెట్టి వెనక్కిలాగాటం..  వీటిపట్ల ఆమెకు కినుక. అందువల్ల జరిగిన మేలు ఏమీ లేక పోగా జాతి సమున్నత నాగరికతా సాధనకు అవరోధం అయినాయని ఆమె అభిప్రాయం. ఇప్పుడిప్పుడు హిందూ వ్యాపారులు సరుకులను ఓడలలో రవాణా చేయటం మొదలు పెట్టారు కానీ మిగిలిన దేశాలవాళ్ళ లాగా పెద్దపెద్ద ఓడలను నిర్మించి విదేశాలతో వాణిజ్య సంబంధాలు అభివృద్ధి పరచుకోలేక పోయారు కదా అని బాధపడుతుంది. ఇవన్నీ ఇంగ్లాండ్ యాత్ర ముగించుకు రాగానే తెలుగు పత్రికకు వ్రాసిన  వ్యాసంలో ఆమె పేర్కొన్నది.

ఈ నిషేధాలు, అవరోధాలు వ్యాపార రంగంలో ఎదిగి స్థిరపడే క్రమంలో తన  కుటుంబం ఎదుర్కొనే ఉంటుంది. ఆ అనుభవమే  అభివృద్ధికి అవరోధంగా ఉండే సంప్రదాయాల పట్ల ఆమెలో ప్రశ్నలను రేకెత్తించి ఉంటుంది. వాటిని అధిగమిస్తూ అవసరాన్నిబట్టి వ్యాపారవర్గ పురుషులు ఇంగ్లండ్ వెళ్లిరావటం కొంత అలవాటు అవుతున్నది. దేశ క్షేమం కోసం అప్పుడప్పుడు ఇంగ్లండ్ వెళ్లివస్తున్న కొద్దిమంది హిందూ సుజనుల గురించి ఆమె తన వ్యాసంలో పేర్కొన్నది. అలా  పేర్కొనబడిన  హిందూ సుజనులలో  జానకమ్మ భర్త, ఆయన సోదరులు కూడా ఉన్నారుఇంగ్లండ్ ప్రయాణంలో సౌతాంఫ్టన్ లో తమను ఎదుర్కొనటానికి వచ్చిన భారతదేశపు స్నేహితులు అని జానకమ్మ పేర్కొన్న  పి. వెంకటకృష్ణమనాయుడు, పి. రతనావలో చెట్టి  కూడా అలా వ్యాపార లావాదేవీలమీద వెళ్లినవాళ్ళే అయివుంటారు. ఇలాంటి వాళ్ళ సంఖ్య బహుళం అవుతూ సముద్రయానం నిషేధం అన్న మాట కాస్త వెనకబడుతున్న తరుణంలో ఒక స్త్రీకి  తానూ  సముద్రం దాటి ఇంగ్లండ్ కు పోవాలని అనిపించటం జానకమ్మ తోనే మొదలు. మగవాళ్ళు సంపాదన కోసందూరభూమి లేదుఅని వెళ్లటాన్ని చూసీ చూడనట్లు వదిలివేయవచ్చు. కానీ కుటుంబ సంస్కృతికి, సంప్రదాయాల కొనసాగింపుకు సంరక్షకులుగా భావించబడే స్త్రీలు పోతామంటే ఎట్లా? . ఈ పరిస్థితులలో భర్త తో కలిసి ఇంగ్లండ్ వెళ్లాలన్న జానకమ్మ అభిలాషకు  సహజంగానే వ్యతిరేకత ఎదురైంది. తల్లిదండ్రులు, సోదరీసోదరులు, చుట్టాలుప్రతిఒక్కరూ ఎవరి కారణాలు వాళ్ళు చెప్తూ ప్రేమతోనే  అడ్డుపడిన సంగతి, కన్నీళ్లు పెట్టుకొన్న సంగతి, తిండి మానేసి ఏడుస్తూ కూర్చోటాన్ని గురించి  చెప్పింది. అయినా ఇంగ్లండ్ వెళ్లాలన్న తన బలమైన కోరిక వదులుకొనటానికి తగిన కారణం ఏదీ కనబడలేదంటుంది జానకమ్మ. వాళ్ళ వైపు నుండి ఆలోచిస్తూ ఇంతకు ముందు ఎవరైనా ఆడవాళ్లు ఇంగ్లండ్ వెళ్ళి వుంటే వాళ్లింతగా బాధపడివుండే వాళ్ళు కాదని కూడా అంటుంది. ఆరకంగా ఇంగ్లండ్  వెళ్లిన తొలి భారతీయ మహిళా తానే అని జానకమ్మ చెప్పకనే చెప్పింది.  

జానకమ్మ 1871 లోనే ఒకసారి భర్తతో కలిసి  బొంబాయివరకూ వెళ్లి, ఇంగ్లండ్ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని మూడురోజుల ముందు విరమించుకొని తిరిగి వచ్చింది. ఆ ఏడు స్వదేశీయులు అనేకమంది కుటుంబాలు లేకుండానే ఇంగ్లండ్ వెళ్తున్నారు కనుక  జానకమ్మ దంపతులు  ప్రయాణం మానుకోవటం మంచిదని కుటుంబంవారు , స్నేహితులు చేసిన సూచన బాగుందనిపించి తక్షణమే ప్రయాణం విరమించుకున్నామని ఆమె చెప్పింది. ఇంగ్లండ్ కు వెళ్తున్న చాలామంది ఆ సంవత్సరం కుటుంబాలను ఎందుకు వెంటబెట్టుకు పోవటం లేదు? కుటుంబం తో ఇప్పుడు ప్రయాణం వద్దు అన్న బంధువుల మాట తగిన కారణం లేనిదే నిర్ణయాలు మార్చుకొనటానికి  ఇష్టపడని జానకమ్మ కు తక్షణం ప్రయాణం విరమించుకొనేంత సకారణం ఎలా అయిందివాళ్ళు ప్రయాణానికి సిద్ధమైన ఆ 1871  సమకాలీన అంతర్జాతీయ రాజకీయ పరిణామాలలో   కీలకమైనది కావటం తప్ప మరొక కారణం కనిపించదు.

ఇంగ్లండ్ కు పొరుగుదేశం ఫ్రాన్స్.  1789- 1799 మధ్యకాలంలో ఫ్రాన్సులో వచ్చిన విప్లవాలు రాజరికాన్ని కూలదోసి సామాజిక సమానత్వం, ప్రజా సార్వభౌమాధికారం ప్రాతిపదికగా కొత్త ప్రభుత్వాన్నిఏర్పరిచాయి.19 వ శతాబ్ది తొలి అర్ధభాగం  ఫ్రాన్స్ లో రాచరికానికి స్వేచ్ఛను , సమానత్వాన్ని కోరే బూర్జువా శ్రామిక వర్గాలకు మధ్య నిరంతర ఘర్షణలతో గడిచింది. ఓటు హక్కు దగ్గర నుండి పారిశ్రామిక వ్యాపార హక్కులు అన్నిటికోసం పోరాటాలు అవసరమయ్యాయి. సామాజిక రాజకీయ అసంతృప్తులు 1830 నుండి 1848 వరకు అనేక విప్లవకర ఘటనలకు కారణమైంది. ప్రభుత్వాలు ఆ మేరకు మారుతూ వచ్చాయి. ఆ క్రమంలో శ్రామిక వర్గం బలపడుతూ వచ్చింది. యూరప్ అంతటా దాని ప్రభావం పడసాగింది. 1870 యుద్ధంగా చెప్పబడే ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం (ఫ్రాంకో జర్మన్ యుద్ధం) లో ఫ్రాన్స్  జర్మనులచేతిలో ఓడిపోయి వర్సైల్స్ సంధికి ఒడంబడవలసి వచ్చింది. అయితే శ్రామికవర్గ చైతన్యం పొందిన జాతీయ మిలటరీ జర్మనీతో సంధిచేసుకొని ఏర్పడ్డ మూడవ రిపబ్లిక్ ని ఆమోదించటానికి సిద్ధపడక చేసిన తిరుగుబాటు ఫలితంగా స్వతంత్ర ప్రభుత్వంగా పారిస్ కమ్యూన్ ఏర్పడిన సంవత్సరం 1871. మార్చ్ 18 నుండి మే 21 వరకు మాత్రమే మనగలిగినప్పటికీశ్రామిక వర్గ నియంతృత్వానికి’  తొలి నమూనాగా అభివర్ణించబడిన ఘటన అది. యుద్ధాలు, ఆహారపదార్ధాల కొరత, అనిశ్చిత, అంతర్గత పోరాటాలు, విప్లవకర  జాతీయ సైన్యానికి, జాతీయ ఫ్రెంచ్ సైన్యానికి మధ్య ఆధిపత్య పోరుతో నిప్పులగుండంగా ఉన్న ఫ్రాన్స్ సెగలు బ్రిటన్ కు సోకుతున్న ఆ సమయంలో కుటుంబాలతో ఇంగ్లండ్ వెళ్ళటం క్షేమకరం కాదని జానకమ్మ వాళ్ళు భావించి వుంటారు. అందువల్లనే 1871 లో తలపెట్టిన ప్రయాణం జరగలేదు.

 అప్పుడామె ఇంగ్లండ్ వెళ్లి ఉంటే బ్రిస్టోల్ లో మిస్ మేరీ కార్పెంటర్ ను కలిసి ఉండేది. ఆమెను సంబోధిస్తూ తమను పరిచయం చేసే ఉత్తరాలు డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ గారి అమ్మాయిలు ఇచ్చి ఉన్నారని చెప్పింది జానకమ్మ. మిస్ మేరీ కార్పెంటర్ బ్రిటన్ కు చెందిన ఉదారవాద సంఘసేవకురాలు. పేదలకు, ఆడపిల్లలకు విద్య అందుబాటులోకి తీసుకు రావటానికి  ప్రత్యేక పాఠశాలలు ఏర్పరచింది. రామమోహన్ రాయ్ వలన 1833 నాటికే  ఇండియా పై ఆమెకు  ఆసక్తి కలిగింది. నాలుగుసార్లు వచ్చి వెళ్ళింది.1866 లో తొలిసారి వచ్చినప్పుడు మద్రాస్ , బొంబాయి, కలకత్తాలకు వెళ్లి బాలికల విద్య గురించి ప్రముఖులతో చర్చించింది. జానకమ్మ మద్రాస్ లో మేరీ  కార్పెంటర్  రాక గురించి విన్నదో  , ఆమె సంభాషణల సారం తెలుసుకొన్నదో , ప్రత్యక్షంగా చూసిందో  తెలియదు కానీ ఇంగ్లాండ్ వెళ్ళినపుడు ఆమెను కలవాలనుకొన్నది. లేక ఆమెను కలిస్తే బాగుంటుందని ఆత్మరామ్ పాండురంగ గారి అమ్మాయిలు చెప్తే తెలుసుకొని ఉంటుంది. ఏమైనా ఆ మేరకు వాళ్ళ నుండి మేరీకార్పెంటర్ కు పరిచయ లేఖలు కూడా సిద్ధం చేసుకొంది. ప్రయాణం ఆగిపోవటం వల్ల ఆమెను కలుసుకొనే అవకాశం కోల్పోయాను కదా అన్న బాధా స్వరం ఆమె వాక్యాలలో వినబడుతుంది.

మొదటిసారి ఇంగ్లండ్ ప్రయాణపు ఏర్పాట్ల సందర్భంలో జానకమ్మ ఆత్మరామ్ పాండురంగ గారిని ఆయన కూతుళ్ళను ప్రస్తావించింది. ఆత్మారామ్ పాండురంగ తుర్ఖడ్ 1823- 1898 మధ్యకాలంలో జీవించిన  వైద్యుడు. విద్యావేత్త. సంఘ సంస్కర్త. బాల్యవివాహాలను వ్యతిరేకించాడు. ఆడపిల్లలకు 20 ఏళ్ళు వచ్చేవరకు పెళ్లి చేయరాదన్నది ఆయన అభిప్రాయం. ఆడపిల్లల చదువును ప్రోత్సహించాడు. కులవ్యవస్థను నిరసించాడుబ్రహ్మ సమాజ ప్రభావాలతో తన ఇంట్లో ప్రార్ధనా సమాజం ఏర్పాటు చేసాడు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న సంస్కర్తలతో ,మేధావులతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఆయనకు ఇద్దరు కొడుకులు , ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు మనేకా తండ్రివలెనే వైద్యం చదివింది. చిన్నకూతురు అన్నపూర్ణ ఇంగ్లీష్ భాషా సాహిత్యాలు చదివింది. జానకమ్మ “ accomplished daughters of  Dr. Atmaram Pandoorung of Bombay” అని  పేర్కొన్నది వీళ్ళను. మేరీకార్పెంటర్ కు జానకమ్మ వాళ్ళను పరిచయం చేస్తూ ఉత్తరం  వ్రాయ గలిగిన  స్నేహం , చనువు  వాళ్లకు ఎలా వచ్చాయి.? 1866  ఇండియా పర్యటనలో మేరీకార్పెంటర్ బొంబాయి వెళ్లిన విషయాన్ని, అలా వెళ్లిన   సంస్కరణవాదులు ఎవరైనా బొంబాయిలో ఆత్మరామ్ పాండురంగ ను కలవకుండా ఆయన ఆతిధ్యం పొందకుండా  రాలేరు రారు అనే విషయాన్ని కలిపి ఆలోచిస్తే ఆమెకు ఆయన కూతుళ్ళకు మధ్య స్నేహం ఏర్పడగల అవకాశాలు అర్ధం అవుతాయి. ఆ క్రమంలో జానకమ్మ  కూడా వాళ్ళ కుటుంబంతో సంబంధాలు, ఆయన కూతుళ్లతో స్నేహం సాధ్యం అయ్యాయి. అయితే జానకమ్మ వాళ్ళను అత్మారామ్ కూతుళ్లు అనే చెప్పింది కానీ  పేర్లతో  వాళ్ళను గుర్తించి చెప్పలేదు.

1871 ఇంగ్లండ్ ప్రయాణం ఆగిపొయ్యాక కూడా జానకమ్మ మరికొన్ని రోజులు అక్కడే ఉన్నది. భారత గవర్నర్ జనరల్ లార్డ్ నార్త్ బ్రూక్ వచ్చి బొంబాయిలో  మహారాణి విగ్రహాన్ని ఆవిష్కరించే ఉత్సవంలో ఆత్మారామ్ గారి కూతుళ్లతో కలిసి పాల్గొన్నది. బొంబాయిలో దేశీయ నూలు తీత ,నేత మిల్లులను చూడగలిగింది. మద్రాస్ ను మించిన నగరమని చాలావరకు ఇంగ్లీష్ టౌన్ గా ఉంటుందని  బొంబాయిని మెచ్చుకొన్నది.

జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర 1873 జులై 20 న మద్రాస్ లో మొదలై  1874 జనవరి 31 న బొంబాయిలో దిగటంతో ముగిసింది. అప్పటికి జానకమ్మకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? పిల్లలు ఉన్నట్లు లేదు. ఉత్సాహం, ఆలోచనారీతి, ప్రశ్నించే తీరు పాతిక ముప్ఫయ్యేళ్లు దాటవని పిస్తుంది. ఈ ఆలోచనారీతి, ప్రశ్నించి తర్కించే పద్ధతి ఆమెలో ఎలా వికసించాయిఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీ లో విద్య, ఉద్యోగ రాజకీయ మత సాంస్కృతిక రంగాలలో హిందూ సమాజ ప్రయోజనాలకోసం,ప్రత్యేకించి స్త్రీవిద్య, పునర్వివాహ విషయాల కోసం జరుగుతున్న చర్చోప చర్చలతో వేడెక్కుతున్న  సంస్కరణఉద్యమ నేపథ్యం కారణం కావచ్చు. ఒక సంపన్న వ్యాపారవర్గ స్త్రీగా నాటి నాగరిక స్త్రీ సమాజంతో ఏర్పడిన సంబంధాలు, చేసిన సంభాషణలు కారణం కావచ్చుసమకాలపు ఆ జీవన సంఘర్షణను  అవగాహన చేసుకొనే  విద్య, ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం ఉండటం వల్ల కావచ్చు. ఏ విధమైన జంకు గొంకులు లేక పూర్తిగా అపరిచితమూ, భాషా సాంస్కృతిక భిన్నత్వము కల ఇంగ్లండ్ సమాజంలో తిరగటం, ఇంగ్లీషులోకి తన వ్యాసాన్ని అనువదించు కోగలగటం, ఇంగ్లీష్ లో యాత్రా చరిత్ర వ్రాయటం కన్నా అందుకు  ప్రబల నిదర్శనం మరేమి కావాలి!? ఇంగ్లండ్ ప్రయాణంలో  ఆమె అనేకమంది ఆంగ్ల మహిళల స్నేహం సంపాదించింది. వాళ్ళందరూ హిందూ మహిళా సమాజ సంక్షేమాన్ని కోరుతున్న వాళ్ళని గుర్తించింది. వాళ్ళ సూచనమేరకే ఆమె ఈ యాత్రాచరిత్ర వ్రాస్తున్నట్లు చెప్పుకొన్నది కూడా.

ధనికులకు , విస్తృతంగా వ్యాపారంచేయాలను కొనేవాళ్లకు, తమ విదేశీ భాషా పరిజ్ఞానంతో లోకోత్తరవిజయాలను కాంక్షించే వాళ్లకు  సముద్రాలు  దాటి విదేశాలకు వెళ్ళటం అవసరం, అనివార్యం అంటూ ప్రబోధించటానికి, విదేశాయానం  ప్రయాసకరం కాదు , ప్రమాదకరం కాదు అన్న నైతిక ధైర్యాన్ని ఇయ్యటానికి జానకమ్మ ఈ యాత్రాచరిత్రను రచించింది

జానకమ్మ ‘pictures of  England’ అనే తన ఈ రచనను లేడీ జులియా రాబిన్ సన్  కు అంకితం ఇచ్చింది. అంకిత వచనాలలోలేడీ షిప్అనే మాటతో  ఆమెను  పదేపదే  సంబోధించటాన్ని బట్టి , హిందూ స్త్రీల సంక్షేమం పట్ల ఆమె చూపిస్తున్న శ్రద్ధ, వాళ్ళ సామాజిక మేధోపర స్థాయి కోసం నిరంతరం  చేస్తున్న ప్రయత్నాలు ఈ  పుస్తకాన్ని ఆమెకు అంకితం ఇయ్యటానికి తనను ప్రేరేపించాయి అని చెప్పిన దాన్ని బట్టి జూలియా రాబిన్ సన్ మద్రాసు లో ఉన్నత సామాజిక స్థాయిలో ఉన్న స్త్రీ అని అర్ధం అవుతుంది. అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీ కి  యాక్టింగ్ గవర్నర్ గా ఉన్న విలియం రోజ్ రాబిన్ సన్ భార్య ఆమె అని అన్వేషణలో తేలింది. 1822 లో పుట్టిన విలియం రోజ్ రాబిన్ సన్ 1842 లో ఇండియన్ సివిల్ సర్వీస్ లో చేరి భారతదేశానికి వచ్చాడు. 1865 నాటికి మద్రాస్  ప్రెసిడెన్సీ కి ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయినాడు. వివిధ హోదాలలో పనిచేస్తూ 1875 లో ఏప్రిల్ నుండి నవంబర్ వరకు గవర్నర్ బాధ్యతలను కూడా నిర్వహించాడు. ఆ నాటి ప్రభువర్గ మహిళకు వలెనె జూలియా రాబిన్ సన్ కూడా ఉన్నత హోదాలో ఉన్న ప్రభుత్వాధికారి  భార్యగా  మద్రాసు లో స్త్రీ సంస్కరణలకు పనిచేయటం అతి సహజం. పోతం జానకమ్మ ఆమె హిందూ స్త్రీల సంక్షేమం కోసం పనిచేయటాన్ని ఎంతకాలంగా గమనిస్తూ వచ్చిందో కానీ  హిందూస్త్రీల అభ్యుదయానికి అంకితం అయినందుకు  కృతజ్ఞతా పూర్వకంగా సగర్వంగా తన పుస్తకాన్ని ఆమెకు కానుకగా సమర్పిస్తున్నాను అని చెప్పుకొన్నది. సంపన్న వ్యాపారవర్గాల స్త్రీలకూ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగ వర్గాల స్త్రీలకూ ఉండే మర్యాదాపూర్వక సామాజిక సంబంధాలకు ఇది ఒక సంకేతం

ఈ యాత్రాచరిత్రను ఇంగ్లండ్ యాత్రా విశేషాలతో పాటు  ఆయాప్రాంతాల ఆర్ధికరాజకీయ సంస్కృతిని తెలుసుకొనటానికి చదవాలిఅదే సమయంలో   రచయిత్రి జీవిత చైతన్యాన్ని , చారిత్రక  భావజాల దృక్పథాన్ని అంచనా వేసే పని  చేయాలిప్రత్యేకించి రచయితలుగా స్త్రీలు తమను తాము వ్యక్తీకరించుకొన్న తీరును  పరిశీలించాలి.

 

    ----------------------------------------------------------------------                                      

                                                                                                            (ఇంకా ఉంది)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఈ సంచికలో...                     

JAN 2022

ఇతర పత్రికలు