1903 లో హిందూసుందరి పత్రికలో ఒక రచన మాత్రమే ప్రకటించబడి తెలుస్తున్న స్త్రీలు 16 మంది ఉన్నారు. వీళ్ళ సమకాలపు సావిత్రి వంటి పత్రికలలో గానీ తరువాతి కాలంలో మరే పత్రికలో గానీ వాళ్ళ రచనలు కనబడవు. ఈ మొత్తం రచనలలో ఎక్కువభాగం ఉపన్యాసాలు, వ్యాసాలు. తరువాతి స్థానం కవిత్వానిది. కథ ఒకే ఒకటి.
ఆ కథ పేరు లోభివాని కథ. ( ఆగష్టు 1903) రచయిత్రి శ్రీధర సీతాదేవమ్మ. అప్పటికే భండారు అచ్చమాంబ ఆధునిక కథకు అంకురార్పణ చేసినా స్త్రీలు నీతికథల మూసలోనే కథలు వ్రాసారు. లోభివాని కథ ఆ కోవలోదే. ఒక వూళ్ళో ఒక లోభివాడు. కొబ్బరి పచ్చడి తినాలనిపించి కొబ్బరి కాయ కొనటానికి బయటకు వెళ్ళాడు. బజారు లో కొబ్బరి కాయ ధర ఎక్కువ అనిపించి తక్కువకు దొరికే ప్రాంతాన్ని వెతుక్కొంటూ రాజమండ్రి , అమలాపురాలు మీదుగా హైదరాబాద్ వరకూ వెళ్లి అక్కడ కానీ ఖర్చు లేకుండా ఒక సరస్సు ఒడ్డున సరస్సు పైకి వంగిన కొబ్బరి చెట్టు కాయలు కోయటానికి ఎక్కి జారి పడిపోతున్న తరుణంలో కూడా డబ్బు ఆశ వదలక చేతి పట్టు వదిలి తనను కాపాడటానికి ప్రయత్నించిన నవాబును, రాజును కూడా తనతో పాటు నీళ్లలో మునిగి చనిపోయేట్లు చేసిన లోభివాడి కథ ఇది. ఉన్నవూళ్ళో కొబ్బరి కాయ కొనటానికి డబ్బు కోసం చూసుకొన్న వాడు, చౌకగానో , అసలు డబ్బే పెట్టకుండానో దానిని సంపాదించటానికి చేసిన ప్రయత్నంలోని ప్రయాసను, నష్టాన్ని పతాక స్థాయిలో చూపించిన ఈ కథ లోభత్వం వినాశకరం అని చెప్తుంది. ఇంత సాధారణమైన నీతి కథను ఆధునిక అవసరానికి ముడిపెట్టి వ్యాఖ్యానించటం ఈ కథకు కొసమెరుపు. ఒక్క రూపాయి పెట్టి హిందూసుందరిని తెప్పించి తమ స్త్రీలకు విద్యనేర్పించని లోభుల ఇల్లాండ్రు మూఢురాండ్రై తుదకు ఇలాంటి కీడే తెచ్చిపెడతారన్న నీతి తో ఈ కథను ముగించటంలో ఉంది రచయిత్రి చమత్కారం.
1903 నాటికి స్త్రీలు సంప్రదాయ ఛందో రీతులలో కవిత్వం వ్రాస్తూనే ఉన్నారు. వాటితో పాటు స్త్రీలకే ప్రత్యేకమైన మంగళహారతులు , కీర్తనలు వ్రాస్తున్నారు. అయినారపు వెంకట రమణమ్మ స్త్రీల విధేయత అనే శీర్షిక కింద ( నవంబర్ 1903) నాలుగు పద్యాలు వ్రాసింది. మొదట చివర సీస పద్యాలు , మధ్య రెండూ ఉత్పలమాల ఒకటి, తేటగీతి మరొకటి. “ జనని గర్భమునందు జన్మించినది మొదల్ యత్తవారింటికి నరుగువరకు … “ అని మొదలయ్యే ఈ పద్యం తల్లిదండ్రుల ఆజ్ఞ కాదనక బుద్ధిని విద్యయందు హద్దు పరచి వినయం, నమ్రత, లజ్జ , శీలం, సత్యం , శాంతం, దయ, ఉపకారం , నిర్మలత్వం మొదలైన గుణాలను అభివృద్ధి పరచుకొని మెలిగితే తల్లిదండ్రులకు పేరు , ప్రజల మెప్పూ లభిస్తాయి కనుక బాలికలకు అలాంటి జ్ఞానం ఇచ్చే చదువు నేర్పాలని చెప్పింది వెంకట రమణమ్మ. పిల్లలను గారాబం చేసి పాడు చేయవద్దని తల్లిదండ్రులను హెచ్చరించింది ఒక పద్యంలో. మరొక పద్యంలో స్త్రీలు అత్తమామల మీద భక్తి , భర్త మీద మనసు పెట్టి అతనే దైవమని పూజించే స్త్రీకి భగవంతుడు సర్వ సంపదలు ఇస్తాడని ఆశపెడుతుంది. చివరి సీసపద్యంలో ఏ తీర్ధ యాత్రలు, జపతాపాలు, ఉపవాసాలు, దేవతా పూజలు, పుణ్య తీర్ధ స్నానాలు పతి పాదపూజతో సరి రావని కనుక “ప్రాణేశు పాదసేవ మానవలదు” అని స్త్రీలకు హితవు చెప్తుంది. ఎంతో కాలంగా గతానుగతికంగా స్త్రీధర్మాలుగా ప్రబోధించబడుతున్న వాటినే మళ్ళీ చెప్పింది.
పద్యరచనా శక్తి పరీక్షలలో సమస్యా పూరణ ఒకటి. ఒక పద్య శకలం సమస్యగా ఇచ్చి మిగిలిన భాగాన్ని పూరిస్తూ అర్ధవంతమైన పద్యం వ్రాయమనటం ఒకటి. ఆధునిక యుగపు తొలినాళ్ళ స్త్రీల పత్రికలలో సమస్యా పూరణ పద్యాలు వ్రాసిన మహిళలు చాలామంది కనబడతారు. శ్రీ రాజా బొడ్డు రాజ్యలక్ష్మమ్మ ( రాజ్య లక్ష్మీ దేవమ్మ ) ఒకరు. ఇచ్చిన సమస్య “ శునకమ్ములు పువ్వులయ్యె శోభావహించన్” ( డిసెంబర్ 1903)దానిని కలుపుకొని ఆమె రామాయణార్ధంలో పద్యం వ్రాసింది. “కనకాంగి వినుము రామునినని మార్కొని రావణుడు శరావళి గురియన్ \ ఘన శూరుడైన సీతే శునకమ్ములు పువ్వులయ్యె శోభావహించన్” అన్నది ఆమె వ్రాసిన పద్యం. సీతేశునకు +అమ్ములు అని విడదీసి రావణుడు వేసిన బాణాలు సీతకు ఈశుడు , భర్త అయిన రాముడి మీద నాటుకొని పువ్వులై శోభించాయని చమత్కరించింది. ఆ సంచికలోనే పాలేపు మాణిక్యాంబ అదే సమస్యను తపస్సులో ఉన్న శివుడి మనసు పార్వతిపై లగ్నం కావాలని మన్మధుడు వేసిన బాణాలు శివుడి పై పూలై శోభావహించాయని పూరించింది.
వేప గుప్తాపు మహాలక్ష్మమ్మ ( జులై 1903 ) యే. కనకమ్మ ( సెప్టెంబర్&అక్టోబర్ 1903) కీర్తనలు వ్రాసారు. మహాలక్ష్మమ్మ కీర్తన సరస్వతీ స్తుతి. స్త్రీల కీర్తనలు సాధారణంగా లక్ష్మీ పార్వతుల స్తుతి రూపకంగా ఉంటాయి. ఎందుకంటే నోములకు, వ్రతాలకు అధిదేవతలు వాళ్ళే కనుక. ఈ నేపథ్యంలో సరస్వతీ స్తుతి అరుదైనదే. “వందనంబులందు (ఓ) వారిజాసను రాణి వందనంబు లంది నా వంత దీర్పవమ్మ” అన్న పల్లవితో ప్రారంభమైన ఈ కీర్తనలో అయిదు చరణాలు ఉన్నాయి. కవుల చెంత చేరి ఉంటుందని, విదుషులను బ్రోచు విద్యా కల్పవల్లి అని సరస్వతి స్థానాన్ని , దయను గురించి చెప్తుంది. “విద్యలేని స్త్రీ వెతల బాపవమ్మా” అని కోరటం లో “విద్యాశ్రీ నొసగి వేగ బ్రోవరమ్మా” అని ప్రార్ధించటంలో స్త్రీవిద్య పట్ల రచయిత్రి ఆర్తి కనబడుతుంది. యే. కనకమ్మ కీర్తన లో “ సత్యముగాను పణతూ లందరికీ పతిభక్తి భూషణమూ బాగుగానుండవలెన్” అన్న పల్లవే చెబుతుంది దాని స్వభావాన్ని. సావిత్రి మొదలైన సతులు పతిభక్తి వల్లనే గణనకు ఎక్కారని ఆడవాళ్లు అబద్ధాలు ఆడరాదని నీతులు చెప్తుంది ఈ కీర్తన.
టి. రామలక్ష్మమ్మ (ఆగష్టు 1903), పేరు లేకుండా ఒక స్త్రీ అనే సర్వనామంతో మరొక స్త్రీ వ్రాసిన మంగళ హారతులు రెండు ఉన్నాయి. రామలక్ష్మమ్మ వ్రాసినది భగవంతుడి గురించిన కీర్తన కాదు. అప్పుడు భారతదేశపు బ్రిటన్ ప్రభువుగా ఉన్న 7 వ ఎడ్వర్డ్ గురించి. అతని పూర్తి పేరు ఆల్బర్ట్ ఎడ్వర్డ్. క్వీన్ విక్టోరియా పెద్దకొడుకు. 1901జనవరి 22 న అతను అధికారంలోకి వచ్చాడు. “ మంగళమని, మంగళమని మంగళమనరే మంగళమని పాడరే ఎడ్వర్డ్ గారికి” అనే పల్లవితో మొదలయ్యే ఈ పాటలో అయిదు చరణాలు ఉన్నాయి. భారతీయుల కోర్కెలు తీరేట్లుగా అతను ఇండియాకు ప్రభువు అయ్యాడని మహిళలందరిని అతనికి మంగళ హారతులిమ్మని పిలుపు ఇచ్చింది ఈ పాటలో . సమకాలీన రాజకీయాల పట్ల స్త్రీలలో ఆసక్తి ని , ప్రతిస్పందనను నమోదు చేసిన పాట ఇది . ‘ఒక స్త్రీ ‘ వ్రాసిన మంగళహారతి( సెప్టెంబర్ 1903) “మంగళమూ నీకంబా మాతల్లీ జగదాంబా …” అనే పల్లవి తో అయిదు చరణాలలో పార్వతికి ఎత్తిన హారతి. ఈ మంగళ హారతి కర్తగా ఆమె తనపేరు చెప్పుకొనటానికి ఇష్టపడలేదు కానీ ఆమె పేరు వెంకటరత్నము అని ఆ మంగళహారతే చెప్తున్నది. వరము లిచ్చి బ్రోవమని , దీన జనులను బ్రోవమని వేడుకొంటూ ‘దాసాను దాసురాలగునట్టి వెంకటరత్నము నే బ్రోవు మరి మరీ వేడేదా’ అని తనగురించి చెప్పుకొన్నది. మంగళహారతి, కీర్తన రచనలలో చివరి చరణాన్ని రచయిత నామాంకితంగా వ్రాసే సంప్రదాయాన్ని పాటించటం వల్ల ఇలా ఆమె పేరు వెంకట రత్నము అని తెలుస్తున్నది. కానీ ‘అదే సంచికలో ‘“రామ రామ నన్ను నీ రచ్చశాయనేలరా , తామసంబు మానుమా కామితార్ద దాయక” అనే పల్లవితో ప్రారంభించి ఒక సుందరి’ వ్రాసిన నాలుగు చరణాల పాట రచనలో ఈ సంప్రదాయం పాటించబడలేదు కనుక ఆమె అసలు పేరు ఏమిటో మనకు తెలియకుండానే పోయింది.
కథ, కవిత్వం, కీర్తనలు , మంగళ హారతులు వ్రాసిన ఈ ఎనిమిది మంది రచయితల తరువాత మిగిలిన వాళ్ళు తొమ్మిది మంది. వీళ్ళు వ్రాసినవి వచన రచనలు. వాటిలో వ్యాసాలు ఉన్నాయి. ఉపన్యాసాలు ఉన్నాయి. స్త్రీలకు సంబంధించిన సమస్యలపై స్త్రీల అవగాహనకు ఇవి అద్దం పడతాయి. ప్రధానంగా ఇవి విద్యకు సంబంధించినవి. అందుకు మినహాయింపు రెండు వ్యాసాలు.
ఒకటి వైధవ్య సమస్యను చర్చించింది.ఆ వ్యాసం ‘నిజమైన జననీ జనకులు.’ (జూన్, 1903). రచయిత్రి పార్నంది వెంకట రమణమ్మ. ఈ వ్యాసంలో ఆమె ఆడపిల్లలకు , మరీ ముఖ్యంగా వైధవ్యం పొందిన స్త్రీలకు నిజమైన జననీ జనకులు కందుకూరి వీరేశలింగం , ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ అని అంటుంది. కూతుళ్లు భర్త మరణించి వైధవ్యం పాలైతే తల్లిదండ్రులు అల్లుడి సొమ్మును అపహరించి పిల్లకు జుట్టు తీయించి ముసుగేసి వంట పొయ్యిదగ్గర ఉంచి ఒంటిపూట తిండి పెట్టి ఏకాదశి ఉపవాసాలు చేయించి, ఆమె అత్తవారింటి రొక్కంతో వడ్డీవ్యాపారం చేస్తూ బాలవితంతువు ఘోష పుచ్చుకొని వాళ్ళు తల్లి దండ్రు లు ఎలా అవుతారన్నది ఆమె తర్కం. తల్లిదండ్రులు, బంధువులు ఎవరు వెనుకంజ వేసినా వితంతువులను చేరదీసి , ఆదరించి, జీతాలు కట్టి చదువులు చెప్పిస్తూ వాళ్ళ మంచి చెడ్డలు చూస్తున్న, వాళ్ళ జీవితానికి ఒక మార్గం చూపుతున్న వీరేశలింగం దంపతులే నిజమైన జననీ జనకులు అవుతారని ఆమె తేల్చి చెప్పింది.
మరొకటి దేవగుప్తాపు మహాలక్ష్మమ్మ ది కాకినాడ శ్రీ విద్యార్థినీ సమాజం లో చేసిన చిన్న ప్రసంగం. (డిసెంబర్ )పోచిరాజు మహాలక్ష్మమ్మ అనే మహిళ ఉన్నతోద్యోగి అయిన భర్త తో ఆ వూరు వదిలివెళ్తున్న సందర్భంలో ఏర్పరచిన వీడుకోలు సభలో ఆమె ఈ మాటలు మాట్లాడింది. రక్త సంబంధాలకన్నా , బంధుత్వాల కన్నా ఆధునిక యుగంలో స్నేహ బంధాలు బలవత్తరం అవుతున్న విషయాన్ని, ఆ స్నేహాలు సాధారణ ఆసక్తులు, పాల్గొనే కార్యక్రమాలను బట్టి ఏర్పడుతాయన్న విషయాన్ని ఈ ప్రసంగం సూచిస్తుంది. శ్రీ విద్యార్థినీ సమాజంలో స్త్రీల ప్రయోజనాలకోసం పనిచేయటమే వాళ్ళ స్నేహ సూత్రం. తమతో కలిసి పనిచేసిన స్త్రీ , స్త్రీల విద్యకోసం ఇంకెంతో పని చేసి సమాజానికి మేలు చేకూరుస్తుంది అను కొన్న నెచ్చలి వియోగానికి విచారం ఇందులో వ్యక్తం అయింది.
1903 ఫిబ్రవరి సంచికలో రుద్రవరపు కామేశ్వరమ్మ , వేమరుసు మహాలక్ష్మి స్త్రీవిద్యను ప్రస్తావిస్తూ వ్రాయటం మొదలుపెట్టారు. ఒక సుందరి అనే సర్వనామంతో ‘నీతిని గూర్చి’ అనే వ్యాసం ( ఏప్రిల్) ప్రచురించబడింది.సమాజ ప్రార్ధనకు స్త్రీలను ఇంటికి ఆహ్వానించిన ఒక స్త్రీ చేసిన ఉపన్యాసం ఇది. . సమాజ ప్రార్ధన అంటే బ్రహ్మసామాజికులు సామూహికంగా చేసే ఏకేశ్వరోపాసన. అందుకోసం స్త్రీలు తోటి స్త్రీలను తమ ఇళ్లకు ఆహ్వానించటం, స్త్రీలకు ప్రయోజనకరమైన మాటలు మాట్లాడుకొనటం, ప్రార్ధనలు చేసి కీర్తనలు పాడుకొనటం అదొక అలవాటుగా మారిన కాలం అది. అలా ఈ సుందరి కూడా తన ఇంట్లో సమాజ ప్రార్థనకు స్త్రీలను పిలిచింది. వాళ్ళను ఆహ్వానిస్తూ ఆమె చేసిన చిన్న ప్రసంగమే ఈ వ్యాసం.
అబలా సచ్చరిత్ర రత్నమాల వ్రాసిన భండారు అచ్చమాంబ సకుటుంబంగా తమ నగరానికి వచ్చిన విషయం ప్రస్తావించింది. అచ్చమాంబ నాగపూర్ లో ఉంటున్నా రచయిత్రి గా స్త్రీ జనాభ్యుదయ ఆకాంక్ష కలిగిన వ్యక్తిగా తెలుగు దేశపు స్త్రీలతో సంబంధాలు ఏర్పరచుకొన్నది. 1902 డిసెంబర్ నుండి కుటుంబంతో ఆంధ్రదేశంలోని వివిధ నగరాలను సందర్శిస్తూ కాశీకి వెళ్ళింది. బందరు లో మొదలుపెట్టి 1903 జనవరి ,ఫిబ్రవరి నెలలలో ఏలూరు, రాజమండ్రి కాకినాడ మొదలైన నగరాలలో పర్యటించి స్త్రీల సమావేశాలలో ప్రసంగాలు చేసింది. ఆమె తమ నగరానికి వచ్చి ఆనందం కలిగించిందని ఈ సుందరి చెప్తున్నదంటే ఈమె నివాసం ఏలూరు , రాజమండ్రి , కాకినాడ లలో ఎదో ఒకటి అయి ఉంటుంది. అచ్చమాంబ సద్గ్రంధాలు చదివితే ఆమె ఉన్నతమైన ఉద్దేశాలు అర్ధం అవుతాయని, విద్యామహత్యం వల్లనే ఆమె అందరి హృదయాలను ఆకర్షించగలిగిందని అంటుంది ఈ సుందరి.
చోరులు తస్కరించరానిది, పరులకు ఇచ్చినా తరగనిది విద్య అని , అలాంటి విద్య పురుషులకు మాత్రమే అందుబాటులో ఉందని, క్రైస్తవ స్త్రీలు కూడా ఉన్నత విద్యలో కనిపిస్తారని చెప్పి , ఇరుగుపొరుగు వారి అభ్యంతరాలకు, ఇంట్లో ముసలమ్మల సణుగుడుకు భయపడి ఆడపిల్లల చదువు మూడు నాలుగు తరగతుల లోనే మాన్పిస్తున్నారని ఒక వాస్తవాన్ని చెబుతూ స్త్రీలే చదువు చెప్తున్న బడులకు ఆడపిల్లలను పంపక పోవ టాన్ని ప్రశ్నిస్తుంది. ఆడపిల్లలు చదివిన ఆ కాస్త చదువు కూడా పెళ్లిళ్లు అయి సంసారాలు మీదపడిన తరువాత పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతున్నదని బాధపడుతుంది. ఇంటి పనులు అయినా తరువాతనైనా సరే కాస్త సమయం కేటాయించి సద్గ్రంధాలు చదువరాదా అని వేడుకొన్నది. చదువు జనాభివృద్ధి సాధకం అని పేర్కొన్నది. విద్య కన్నా విలువైనది నీతి అని దానివలన విద్యకు వన్నె చేకూరుతుందని సీతను ప్రస్తావిస్తూ నీతి శ్రేష్ఠతను వక్కాణించింది.
‘దేశాభిమానము గల స్త్రీలకొక ప్రార్ధన’ అనే వ్యాసంలో (జూన్ ) గొడవర్తి బంగారమ్మ దేశంలో అనేకరకాలైన పేదరికాలు ఉన్నాయని , విద్యలో ప్రత్యేకించి స్త్రీ విద్యలో దేశం కడు పేదరికంలో ఉందని కనుకనే ఈ దేశంలో స్త్రీలు బానిసలవలె ఏలబడుచున్నారని చెప్పింది. న్యాయంగా స్త్రీపురుషుల మధ్య ఉండవలసిన స్నేహం కొరవడటానికి విద్య లేకపోవటమే కారణం అంటుంది. నాగరికతకు మూలభూతమైన విద్యను స్త్రీలలో వృద్ధిచేయటానికి మహా జనసభలు పూనుకోవాలని , గడచిన సంవత్సరం కలకత్తా సభ స్త్రీవిద్య గురించి ప్రస్తావించటం సంతోషం కలిగించింది అని చెప్పింది.
స్త్రీవిద్యకు తగిన వసతులు లేవని, క్రిస్టియన్ మిషనరీలు అందుకు కొంత పనిచేశాయని స్త్రీలకు బడులు పెట్టి స్త్రీలను ఉపాధ్యాయులుగా నియమించి నిర్వహిస్తున్నారని వాళ్ళ ప్రేరణతో విజయనగరం మహారాజా ఆనందగజపతి రాజు వంటి వారు అలాంటి పనికి పూనుకున్నారని ఆయన బాలికల విద్య కొరకు చెన్నపురిలో నాలుగు , విజయనగరంలో ఒకటి పాఠశాలలు ఏర్పరచాడని పేర్కొన్నది. విజయనగరంలోని బాలికా పాఠశాలలో నాలుగేళ్ల క్రితం 150 మంది బాలికలు చదువుకోగా ఇప్పుడా సంఖ్య బాగా పడిపోయిందని సమాచారం ఇయ్యటమే కాదు అందుకు కారణాలను కూడా ఆమె వాస్తవ భూమిక మీద ఊహించింది. పదేళ్లు దాటినా ఆడపిల్లను బడికి పంపటానికి అవసరమైన సంస్కారం సమాజంలో లేకపోవటం దానికి తోడు ఆ పాఠశాలలో అధ్యాపకులు అందరూ పురుషులే కావటం అందుకు కారణం అంటుంది.
గొడవర్తి బంగారమ్మ కు స్త్రీవిద్య గురించి ఉన్న ఈ ఆరాటం ఆమెను ఆచరణలోకి నడిపింది. ఈ వ్యాసాన్ని బట్టి ఆమె 1897 లోనే ఒక బాలికా పాఠశాల ఏర్పరచినట్లు తెలుస్తున్నది. పదిమంది తో ప్రారంభమై ఇప్పుడు అందులో చదువుతున్న బాలికల సంఖ్య యాభైకి చేరిందని దానిని తాను ఒక్కతే నిర్వహించటం కష్టంగా ఉందని తెలుగు, ఇంగ్లీష్ చెప్పటానికి ఇద్దరు, కుట్లూ అల్లికలు నేర్పటానికి ఒకరు సహాయకులు కావాలని అందుకు విజయనగరం మాహారాణి అయిదువందల రూపాయల చందా , నెలకు 20 రూపాయలు ఇయ్యటానికి అంగీకరించిందని ఈ వ్యాసంలో ఆమె పేర్కొన్నది. స్త్రీలందరినీ తమతమ ప్రాంతాలలో స్త్రీ విద్యకు తోడ్పడాలని కోరుతూ ఈ వ్యాసాన్ని ముగించింది.
విద్య సమానత్వ సాధనమని , స్త్రీ పురుషులమధ్య స్నేహం అనే విలువను అభివృద్ధి చేస్తుందని భావించిన గొడవర్తి బంగారమ్మ అభివృద్ధికి తనదయిన నిర్వచనాన్ని ఇయ్యటం ఈ వ్యాసంలో గమనించవచ్చు. ఏది అభివృద్ధి కాదో చెప్పటం ద్వారా ఆమె ఈ పని చేసింది. ఆమె దృష్టిలో అభివృద్ధి అంటే
కేవలం విద్య మాత్రమే. అంటే ఆమె అభివృద్ధి నిర్వచనం పరిధి లోకి స్త్రీ పునర్వివాహాలు, పురుషులతో సామాజిక సంబంధాలు, మత సమానత రావన్న మాట. అది గొడవర్తి బంగారమ్మ సంస్కరణ పరిమితి. అయినప్పటికీ స్త్రీ విద్య వరకు ఆమె ఒక ఆచరణ వాది అన్నది స్పష్టం.
వలివేటి బాలాత్రిపుర సుందరమ్మ రాజము నందలి జనానా సభలో చేసిన ప్రసంగం ( జులై ) కూడా స్త్రీ విద్య కేంద్రంగానే సాగింది. స్త్రీలు సభలకు రావటం వల్ల ఇంటిపనులు కాస్త ఆలస్యం అయితే కావచ్చు కానీ అందరూ చేరి మాట్లాడుకొనటం వలన కలిగే లాభం అంతకంటే గొప్పది అని చెప్తూ ఆమె ప్రసంగాన్ని ప్రారంభించింది. మానవ జాతిలో పురుషుడు మొదటివాడుగా శరీరదారుఢ్యం , విద్య కలిగి ఉండగా స్త్రీ రెండవది గా అబల గా విద్య లేనిదానిగా ఉండిపోవటం గురించిన ప్రశ్నతో దానిని కొనసాగించింది. విద్య లేకపోతే జీవనం లేదా? లేకుండా ఆడవాళ్లు ఇప్పుడు జీవించటంలేదా? చదువుకొని ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలాలా అంటూ స్త్రీలకూ చదువు చెప్పించకుండా నిరుపయోగులుగా చేస్తున్నారని నిరసన వ్యక్తం చేసింది.
విద్య అంటే తెలుసుకొనటం అని తెలుసుకొనటానికి విస్తృతమైన జ్ఞాన ప్రపంచం ఉందని బాలా త్రిపుర సుందరమ్మ అంటుంది. జీవ పదార్ధాలు , నిర్జీవ పదార్ధాలు అని పదార్ధాలు రెండురకాలు అని మొదటి దానిలో మనుషులు, జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు మొదలైనవి ఉంటే రెండవదానిలో భూమి, ఆకాశం, నీరు, గాలి , అగ్ని మొదలైనవి ఉంటాయని ఇవన్నీ తెలుసుకోవలసినవే అంటుంది. చదువు ఉంటే అన్నీ తెలుస్తాయని చెప్పింది. ప్రపంచంలో స్త్రీపురుషులకు ఏర్పాటైన పనులు సక్రమంగా నిర్వహించటానికి విద్య అవసరమని చెప్తూ చివరకు ఇల్లు చక్కదిద్దటం, పిల్లలను పెంచటం వంటివి చక్కగా చేయటానికి స్త్రీలకు విద్య అవసరమని చెప్పటంలో మళ్ళీ స్త్రీ విద్యను ఇంటి పనులకే పరిమితం చేయటం కనబడుతుంది. ఏమైనా స్త్రీలు తరచు కలుసు కొనటం కలిసి చదువుకొనటం ప్రయోజనకరమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించింది.
మొసలికంటి రమణాబాయమ్మ ( వెంకట రామణాబాయి ) కూడా రాజమునందలి జనానా సభలో చేసిన ప్రసంగం స్త్రీవిద్య గురించే( సెప్టెంబర్ &అక్టోబర్). అందరికీ తెలిసిన విషయమే అయినా తన మాటలు బాలభాషితాలవలె ఆనందపరచగలవని అంటూ ఉపన్యాసం ప్రారంభించింది. తల్లిదండ్రులు చదువు చెప్పించకపోవటం వల్ల ఆడపిల్లలు కాపురంలోని కష్ట సుఖాలను అన్నదమ్ములకు ఉత్తరం వ్రాసి తెలుపుకొనటానికి వీల్లేక పోతుందని , ఎవరికైనా చెప్పి వ్రాయిద్దామంటే ఆ విషయం అత్తమామలకు తెలిసి పోతుందన్న భయంలో నిర్బంధంలో జీవితాలు గడిపేస్తున్నారని తనకెదురైనా ఒక స్త్రీ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ చెప్పింది. ఇది అర్ధమైతే దానిని దాటటానికి ఇప్పుడు ప్రయత్నించి అయినా విద్య నేర్చుకోవచ్చని చెప్పింది. విద్యా స్పర్శ వల్ల స్త్రీల చిత్తం పరిశుద్ధం అవుతుందని స్త్రీలకు అత్యంత ఆవశ్యకమైన పతిభక్తి , దైవ భక్తి, సత్యశీలత మొదలైన సద్గుణాలు సాధించటానికి సాధనం అవుతుందని , గృహకృత్య నిర్వహణ సమర్ధవంతంగా చేసుకొంటారని బాలా త్రిపుర సుందరమ్మ వలెనే అభిప్రాయపడింది.
కసవరాజు రంగమ్మ స్త్రీవిద్య గురించి వ్రాసినది ఈ వరుసలో చివరిది ( డిసెంబర్ ) చిన్న విన్నపం పత్రికాముఖంగా ప్రచురించండి అని కోరుతూ ఆమె వ్రాసిన అభిప్రాయాలు ఇందులో ఉన్నాయి. ఆమె భర్త పేరుమీద దేశోపకారి అనే పత్రికను తెప్పించుకొని కొన్ని నెలలుగా చదువుతున్నానని అందులో హిందూ సుందరి పత్రిక గురించి వ్రాసినది చూసి తెప్పించుకొని చదివానని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ సంచికలు చదివాకా తనకు కూడా వ్రాయాలనిపించి వ్రాస్తున్నానని పేర్కొన్నది.
తనకు విశేష విద్య పరిశ్రమ లేదని , ఉన్న స్వల్ప విద్యనయినా అభివృద్ధి చేసుకొనటానికి ఎక్కువకాలం సంసార విషయాలలో వ్యయం అయిపోతున్నదని తప్పులెంచక తన వ్యాసం చదవమని కోరింది. వ్రాయటం, వ్రాసిన దాన్ని చదవటం మాత్రమే విద్య కాదని సత్యం , వినయం , వివేకం, భక్తి , పరోపకారం, పత్ని వ్రతం ,పాతివ్రత్యం మొదలైన సద్గుణ సముదాయాలను పెంచుకొనటమని అభిప్రాయపడింది. ఇప్పటి వరకు స్త్రీలకు పాతివ్రత్యం గురించి చెప్పిన వాళ్ళే కానీ స్త్రీలకూ పత్ని వ్రతం గురించి చెప్పిన వాళ్ళు, ప్రత్యేకించి స్త్రీలు ఎవరూ కనబడరు. దానిని చేర్చటం ద్వారా రంగమ్మ గుణాలను స్త్రీపురుషులిద్దరికి సమానమైనవిగానే భావించినట్లు. అందువల్లనే ఇటువంటి విద్య స్త్రీపురుషులిద్దరూ పొందవలసినదే అని, అది పురుషులకు మాత్రమే హక్కు కాదని చెప్పగలిగింది. విద్యాస్వాతంత్య్రం అందరికీ హక్కు అయిఉండగా మగపిల్లల చదువులో శ్రద్ధపెట్టి ఆడపిల్లలను నిర్లక్ష్యం చేయటం ఏమని ప్రశ్నిస్తుంది. ఆడపిల్లలను చదువు చెప్పించక పోవటం వల్ల వాళ్ళు కూపస్థ మండూకాలై , విద్యాగంధం లేని జ్ఞాన హీనులై అందరికీ సంతాపకారకులు అవుతున్నారని అందువలన స్త్రీల చదువుకు సౌకర్యాలు కల్పించాలని అంటుంది. ఉత్తర సర్కారు జిల్లాలలో చదువుకొన్న స్త్రీలు ఎక్కువ కనబడతారని పరిశీలన మీద చెప్పింది. స్త్రీలకు చదువు పట్ల ఆసక్తిని పెంచే స్నేహం, సహవాసం, ప్రొత్సాహం ఇయ్యాలని పేర్కొన్నది. భండారు అచ్చమాంబను స్త్రీలు అనుసరించవలసిన నమూనా గా పేర్కొన్నది. భర్త కేశవరాజు నరసింగరావు తనకు రచనా స్వాతంత్య్రం ఇచ్చారని చెప్పుకొన్నది.
రంగమ్మ అభిప్రాయాలను ఆమె చదివానని చెప్పుకొన్న హిందూసుందరి (1903, ఆగస్టు , సెప్టెంబర్, అక్టోబర్) సంచికలలో స్త్రీ విద్య గురించి వచ్చిన రచనలపై ప్రతిస్పందనగా పేర్కొనవచ్చు. వాటి మీద కొంత మెరుగైన అవగాహన , స్త్రీపురుష సమానత్వ భావన, హక్కుల స్పృహ ఈ వ్యాసంలో కనబడతాయి.
----------------------------------------------------------------------------------
పోతం జానకమ్మ తన ఇంగ్లండ్ యాత్రలో బ్రామ్ ప్టన్ నుండి మాంచెస్టర్ కు వెళ్ళింది. రైలు మార్గంలో ఏడుగంటల ప్రయాణం తరువాత మాంచెస్టర్ చేరుకొన్నది. పత్తివ్యాపారానికి కేంద్రం అని , ఇంగ్లీష్ సామ్రాజ్యం లో గొప్ప వస్తూత్పత్తులకు ఆటపట్టని ఆ నగరాన్ని పరిచయం చేసింది. ఇర్వెల్ నదికి పశ్చిమ తీరంలో ఆ నగరం ఉందని, కొన్ని వీధులు విశాలంగా చక్కటి ఇళ్లతో ఉంటాయని, మరి కొన్ని ఫ్యాక్టరీలతో, దుకాణాలతో , సరుకు నిల్వచేసే గోదాములతో క్రిక్కిరిసి ఉంటాయని చెప్పి అక్కడ అందమైన శిల్పకళతో ఉన్న అతి పురాతన చర్చిలను గురించి చెప్పింది. విద్యా వైద్య అవసరాలకోసం పనిచేసే దాతృత్వ సంస్థలు అనేకం ఉన్న పట్టణం అని, ప్రత్యేకించి పేద స్త్రీల సహాయార్ధం ఏర్పడిన లేడీస్ ఆక్జిలరీ సొసైటీ గురించి చెప్పింది. ఆసుపత్రులు, పాఠశాలలు నిర్వహించబడుతున్నాయని తెలిపింది. ఆదివారం నడిచే స్కూళ్ల గురించి చెప్పింది. సాహిత్యం, విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధికి ఏర్పడిన లిటరరీ అండ్ ఫిలసాఫికల్ సొసైటీ ( 1781) గురించి , రాయల్ మాంచెస్టర్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పింది. అందులోని పెద్ద భవనాలను, గ్రంథాలయాన్ని సమావేశాలకు ఉద్దేశించబడిన విశాలమైన గదులను వాటి నిర్మాణ రీతులను గోథిక్ , డోరిక్ ఇలాంటి పేర్లతో పేర్కొన్నది.
మాంచెస్టర్ వెళ్లటంలో తమ ప్రధాన ఉద్దేశం నూలు మిల్లులను చూడటమే అంటుంది జానకమ్మ. 14 వ శతాబ్ది లో ఊలు ఉత్పత్తులతో మొదలై మాంచెస్టర్ ఆర్ధిక ప్రగతి 18 వ శతాబ్దికి పత్తి దిగుమతులను పెంచుకొంటూ వస్త్ర పరిశ్రమ లో కి విస్తరించి శిఖర స్థాయికి చేరిందని చెప్తుంది. పారిశ్రామిక విప్లవపు ప్రారంభంలో(1760- 1840) ఊలు , పత్తి మొదలైన వాటి నుండి నూలు తీసే ఆవిరి యంత్రాలను కనుగొన్న ఆర్క్ రైట్, హర్ గ్రీవ్ వంటి వారిని ప్రస్తావించి వారి ఆవిష్కరణలు నూలు తీయటంలో నైపుణ్యాలను పెంచాయి అనీ .ఉత్పత్తి విస్తృతం కావటానికి అవి ఎంతో దోహదం చేశాయి అని పేర్కొన్నది. సిల్క్ వస్త్రాల ఉత్పత్తి క్రమంగా ప్రాధాన్యతను సంతరించుకొని పెద్ద పెట్టుబడితో అనేకమంది పనివాళ్ళతో నడుస్తున్నదని చెప్పింది. వెల్వెట్, కాలికో , మస్లిన్ , ఫాన్సీ కాటన్ , జీన్స్, మొదలైన అనేక రకాల వస్త్ర ఉత్పత్తులు జరుగుతున్నట్లు పేర్కొన్నది. వాటితో పాటు బట్టల పై అద్దకాలు, ప్రింటింగ్ , బ్లీచింగ్ వంటి అనుబంధ పరిశ్రమలు అనేకం అక్కడ ఉన్నాయని , కాలువల ద్వారా తూర్పు పడమర సముద్ర ఓడరేవుల నుండి, ఎగుమతి దిగుమతులకు వున్న అవకాశాల గురించి, రైలు రోడ్డు రహదారి మార్గాల ద్వారా చుట్టుపక్కల వ్యాపార బస్తీలతో ఉన్న సంబంధాల గురించి వివరించింది.
లెక్క పెట్టటానికి వీలు లేనన్ని నూలు తీసే యంత్రాల నిరంతర చలనం, వేలకొద్దీ జనానికి బతుకుతెరువు ను ఇచ్చే ఫ్యాక్టరీలు , నిమిషాలలో వస్త్రాలపై అద్దకం చేసే ఫ్యాక్టరీలు, తడి అద్దకపు వస్త్రాలను ఆరబెట్టటానికి పక్కనే ఉన్న వేడి ప్రసారమయ్యే గదులను, నిమిషాలమీద ఆరిపోయి బయటకు వచ్చే వస్త్రాలను చూసి తనెంతగా ఆశ్చర్య పోయిందో చెప్పింది ఆమె. ఒక ఫ్యాక్టరీలోఇలాంటి ఒక మిల్లును స్థాపించటానికి ఎంత డబ్బు అవసరమవుతుందో కూడా వివరంగా తెలుసుకొనటానికి ఆమె చూపిన కుతూహలం చూస్తే వ్యాపారవర్గ మహిళగా ఆమె అస్తిత్వం అవగతం అవుతుంది.
ఇంగ్లండ్ సాధించిన పారిశ్రామిక ప్రగతికి అబ్బురపడుతూ ఆరాధనా భావంతో చెప్పుకుపోయిన జానకమ్మలో అదే సమయంలో భారతీయ అస్తిత్వం మేల్కొనటం కూడా చూస్తాం. భారతదేశ మార్కెట్ లో విస్తృతంగా అమ్ముడవుతున్న మాంచెస్టర్ ఉత్పత్తులను తలచుకొని దానిని బట్టి మాంచెస్టర్ వర్తకులు రెండింతలు లాభాలు పొందుతున్నట్లు తెలుసు కోవచ్చు నంటుంది.ముడిసరుకు- పత్తిని కొని- తీసుకుపోవటం, తయారైన వస్తువును తెచ్చి అమ్మటం - ఈ రెండింటి ద్వారా లాభపడుతున్న బ్రిటిష్ వారి వ్యాపార రాజకీయం ఆమెకు అర్ధమైనట్లుగానే కనబడుతుంది.అయినా వాళ్లపట్ల ఆమె చాలా ఆశలే పెట్టుకున్నట్లు కనబడుతుంది. విదేశీ వస్త్రం కొనుగోలు చేయటానికి బదులు భారతదేశంలో మిల్లు యజమానులు సమస్యలను సంబోధించి పరిష్కరించగలిగితే దేశ ప్రజల అవసరాలకు తగినంత ఉత్పత్తులు వాళ్ళు అందించగలరని నమ్మకాన్నిప్రకటించటమే కాదు. పాలకులలో అంటే బ్రిటిష్ వారిలో కూడా ఆ నమ్మకం కలిగి అవకాశం ఇస్తే భారత వస్త్ర పరిశ్రమ దానిని వాస్తవీకరించి చూప గలదు అని చెప్పటంలో అది కనబడుతుంది.
జానకమ్మ మాంచెస్టర్ వర్ణన చదువుతుంటే ఎంగెల్స్ గుర్తుకు వస్తాడు. జానకమ్మ మాంచెస్టర్ వెళ్ళటానికి (1873-74) మూడు దశాబ్దాల ముందే ఫ్రెడరిక్ ఎంగెల్స్ తండ్రి పంపగా మాంచెస్టర్ జౌళి పరిశ్రమలో పని చేయటానికి వెళ్ళాడు. అక్కడి తన అనుభవాలను వ్యాసాలుగా వ్రాసి ప్రచురించాడు. ఆ వ్యాసాల సంపుటి 1845 లో “ ది కండిషన్స్ అఫ్ ది వర్కింగ్ క్లాస్ ఇన్ ఇంగ్లండ్” అనే పేరుతో అచ్చు అయింది. ఎంగెల్స్ పారిశ్రామిక వేత్తల కుటుంబానికి చెందినవాడే అయినా అయన మాంచెస్టర్ ను శ్రామికుల కోణం నుండి చూసాడు. ఆకలిచావులు, అపరిశుభ్రత, ఇరుకు వీధులలో , చీకటి గుయ్యారాలలో నివాసం, దుర్భరమైన దారిద్య్రం, తీవ్రమైన అసమానతలు ఇవి ఆయన పుస్తకం నిండా కనబడతాయి. జానకమ్మ ఏ పెట్టుబడిని,అధిక ఉత్పత్తులను, వాటికి కారణమైన యంత్ర ఆవిష్కరణలను అభిమానంతో వర్ణించిందో ఆ పెట్టుబడి యొక్క వికృత ముఖాన్ని ఎంగెల్స్ బయట పెట్టాడు. పరిశ్రమలలో పెరుగుతున్న యంత్రాల ప్రాధాన్యం మనిషిని పని నుండి తరిమి వేయటాన్ని చూసాడు ఎంగెల్స్. నిరుద్యోగం , దరిద్రం ఆ స్థాయిలో పెరగటాన్ని గమనించాడు. నూలు తీయటానికి, బట్టనేయటంలో తెగిన పోగులను ముడిపెట్టటానికి తక్కువ కూలీకి స్త్రీలను పిల్లలను తీసుకొనటం చూసాడు ఆయన. మొత్తం శ్రామికులలో 52 శాతం మహిళలే అని ఎంగెల్స్ పేర్కొన్నాడు. ఇంటి పని మనుషులలో స్త్రీలు ఎక్కువ అని గుర్తించి చెప్పిన జానకమ్మ ఇన్ని మిల్లులు చూసింది కానీ కార్మికుల గురించి, ప్రత్యేకించి మహిళా కార్మికుల గురించి ఒక మాటైనా మాట్లాడలేదు. ఆమె కు ముఖ్యం అనిపించిన మత సాహిత్య సంస్థలు ఆయనకు అవసరమే లేకపోయాయి. ఆమె పేర్కొన్న దాతృత్వ సంస్థలలో ఆదివారపు బళ్ళు ఉన్నాయి. అవి వారమంతా ఫ్యాక్టరీలలో పనిచేస్తూ బాల్యానికి చదువుకు దూరం అవుతున్న పిల్లల కోసం ఏర్పాటు చేసినవి. వాటిని గురించి ఎంగెల్స్ ప్రస్తావిస్తాడు. పెట్టుబడిదారీ కూటమిలో చేరటానికి తహతహ లాడుతున్న భారతీయ సంపన్న వర్గానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిత్వం జానకమ్మది అని ఆమె మాంచెస్టర్ అనుభవాలు తెలియ చేస్తాయి.
జానకమ్మ ఇంగ్లండ్ నుండి భర్తతో, పరివారం తో కలిసి పారిస్ వెళ్లివచ్చింది. ఇంగ్లండ్ లో చలికాలపు తీవ్రతను, విపరీతంగా కురిసే మంచును తప్పించుకొనటానికి పారిస్ పోతుంటారని తెలిసి జానకమ్మ దంపతులు కూడా నవంబర్ లో అందుకే పారిస్ బయలుదేరారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ అనీ ఇటీవల జరిగిన పర్షియా యుద్ధంలో పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్న దేశం అని పరిచయం చేసింది. 1873 నవంబర్ లో రైలు మార్గంలో విక్టోరియా స్టేషన్ నుండి బయలుదేరి న్యూ హెవెన్ చేరి అక్కడినుండి స్టీమ్ బోటు లో ప్రయాణించి డిప్పీ లో దిగి మళ్ళీ రైళ్లు మారుతూ పారిస్ చేరుకొన్నది జానకమ్మ. అందమైన పారిస్ నగరం యుద్ధంవల్ల, కమ్యూనిస్టుల విధ్వంసకర చర్యలవల్ల పాడైపోయినట్లు తెలిసింది అంటుంది జానకమ్మ. తాము వెళ్ళినాటికి వెళ్లే నాటికి పారిస్ లో వెండోమ్ స్థంభం తో పాటు కమ్యూనిస్టుల దురాక్రమణకు గురై దెబ్బతిన్న భవనాలు, నిర్మాణాలు తిరిగి వేగవంతంగా నిర్మించబడుతున్నాయని ఆమె చెప్పింది.
ఐరోపా దేశాల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధాలలో ఫ్రాన్స్ పాలకుడు నెపోలియన్ కీలక పాత్ర వహించాడు. రష్యా ఆస్ట్రేలియా కూటమి మీద 1805 డిసెంబర్ నెపోలియన్ సాధించిన విజయానికి గుర్తుగా పారిస్ లో వెండోమ్ అనే విశాల చతురస్ర ప్రదేశంలో 1806 లో మొదలు పెట్టి 1810 నాటికి పూర్తి చేసిన విజయ చిహ్నం వెండోమ్ స్థంభం. జర్మన్ ప్రష్యన్ కూటమితో జరిగిన 1870 యుద్ధంలో కుప్పకూలిన పారిస్ ను కాపాడుకొనటానికి శ్రామిక వర్గ రాజకీయాలతో ప్రభావితమైన దేశీయ సైన్యం ముందుకు వచ్చింది. 1871 మార్చ్ 18 న పారిస్ ను స్వాధీనం చేసుకొన్నది. కొత్తగా ఏర్పడిన మూడవ రిపబ్లిక్ అధికారాన్ని అంగీకరించం అని ప్రకటించి స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పరచి రెండు నెలలు పాలించింది. అది పారిస్ కమ్యూన్ గా ప్రసిద్ధి. కమ్యూనిస్టు సిద్దాంతం వెలుగులో పాలనకు ప్రపంచంలో జరిగిన తొలి ప్రయత్నం అది. ఆ రెండు నెలల పాలనా కాలంలో వాళ్ళు చేసిన పనులలో సామ్రాజ్య వాద యుద్ధ చిహ్నాలను తొలగించటం ఒకటి. అందులో భాగంగానే యుద్ధకాముకుడైన నెపోలియన్ ను అంత ఎత్తున నిలబెట్టిన వెండోమ్ స్తంభాన్ని కూల్చివేశారు. అది తిరిగి నిలబెట్టబడుతున్న కాలానికి ఆమె ప్రత్యక్ష సాక్షి. ఫ్రాన్స్ కు నష్టం కష్టం కలిగిస్తున్న ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధానికి ముగింపు పలకటానికి జర్మనీతో నష్టపరిహారం చెల్లింపుకు అంగీకరించి సంధి చేసుకొన్న అడాల్ఫ్ థియర్స్ మూడవ రిపబ్లిక్ ప్రెసిడెంట్ కావటం ఫ్రెంచ్ ప్రభుత్వంలో అతి గొప్ప మార్పు అంటుంది ఆమె.
విశాలము, సుందరమూ అయిన ఈ వీధులలో పెద్దపెద్ద భవనాలను, దుకాణాలను చూస్తూ తిరిగిన జానకమ్మ ఆసక్తితో తాను చూసిన అనేక స్థలాలలో కొన్నిటి గురించి చెప్పింది. ప్రతి చోటా కమ్యూనిస్టుల వలన జరిగిన హాని గురించి చెప్పటం గమనించదగినది. రాయల్ పాలెస్ 1633-39 లలో నిర్మించబడిన రాజభవనాల సముదాయం. జానకమ్మ దానిని చూసింది. 1871లో కమ్యూనిస్టులు అంత గొప్ప భవనంలో అనేక భాగాలను తగలబెట్టారని, కింది దుకాణాలను దోచుకొన్నారని చెప్పటం మరువలేదు. పోర్ట్ సెయింట్ మార్టిన్ ను దర్శించినప్పుడు కమ్యూనిస్టులు ఆ సమీపంలో చేసిన దారుణ హత్యా కాండ కు నిదర్శనంగా దానిమీద బుల్లెట్ గుర్తులు ఉన్నాయని చెప్పింది.
పారిస్ నగర నిర్మాణంలో రెండువైపులా చెట్లు బారులుగా నాటబడిన పొడుగాటి వీధులు ప్రత్యేక ఆకర్షణ. వీటినే బులెవర్డ్స్ అంటారు. అద్భుతమైన ఈ నిర్మాణాలు దశలు దశలుగా అభి వృద్ధి చేయబడ్డాయి.లెస్ గ్రాండ్స్ బులెవర్డ్స్ (Les Grands Boulevards) అటువంటి వాటిలో ఒకటి. దాని నిర్మాణ వైభవాన్ని , ప్రపంచంలో మరే నగరంలోనూ లేనంత ఆకర్షణీయమైన అక్కడి దుకాణ సముదాయాల గురించి చెప్తూ జానకమ్మ ఫ్రెంచ్ విప్లవ కాలంలో 1789 లో జులై 14 న విప్లవకారులు దానిని ఆక్రమించి నాశనం చేసారని 1871 లో కమ్యూనిస్టులకు ఇది పెట్టని కోట అయిందని వర్సైల్స్ బలగాలు మే 25 న దాన్ని స్వాధీనం చేసుకున్నాయని తన సమకాలపు చరిత్రను ప్రస్తావించింది.
1830 లో ఫ్రెంచ్ విప్లవం ముగిశాక జులై 26 నుండి మళ్ళీ అదే తరహాలో అలలాగా లేచి ప్రభుత్వ అణచివేతకు గురైన జులై విప్లవంలో మరణించిన వారి స్మారకార్థం ది బులెవర్డ్ రిచర్డ్ లీనియర్ లో స్వేచ్చకు సంకేతంగా ఒక చేతిలో తెగిన సంకెల ఒక చేతిలో కాగడ ఉన్న ఆకారం చెక్కబడిన 164 అడుగుల ఎత్తయిన ఇనుప స్థూపం గురించి చెప్తూ .ప్రభుత్వ దళాలకు , తిరుగుబాటుదారులకు జరిగిన కాల్పుల గుర్తులను ఆ స్థూపం మోస్తున్నదని, 1848 ఫిబ్రవరి విప్లవానికి,, 1871 లో కమ్యూనిస్టు దురాగతాలకు కూడా ఆ ప్రదేశంతో ఉన్న సంబంధాన్ని ప్రస్తావించింది.
ఆమె సందర్శించిన మరొక స్థలం ‘ప్లేస్ డు చాటే డి ఇయు’ ప్లేస్ డి లా రిపబ్లిక్ అనే సమకాలపు స్థల నామానికి అది పూర్వపు పేరు. అతివిశాలమైన మూడు హెక్టార్ల చదరపు ప్రాంతం . కమ్యూనిస్టులు దీనిపై ఆధిపత్యం సంపాదించి ఎక్కడిక్కడ ప్రవేశ ద్వారాల దగ్గర బారికేడ్లు నిర్మించి రక్షణ ఏర్పాట్లు చేసుకొన్నారు అని వీటిని ఒక్కొక్కటిగా ఆక్రమిస్తూ వర్సైల్స్ దళాలు తిరుగుబాటు దారులు తిరోగమించేట్లు చేశాయని పేర్కొన్నది. 1871 , మే 24 న ఆ రెండు పక్షాలకు జరిగిన యుద్ధానికి అది మౌన సాక్షి అంటుంది ఆమె. ఆ యుద్ధం వల్ల ఆ చుట్టుపక్కల అనేక ఇళ్ళు తగలబడిపోయాయని , బాగా దెబ్బతిన్నాయని కూడా చెప్పింది.
మాంచెస్టర్ లో పెట్టుబడిని ప్రేమించి,పారిశ్రామిక వేత్తలను ఆరాధించిన జానకమ్మ పారిస్ లో కమ్యూనిస్టుల పట్ల అసహనం ప్రకటించటంలో ఆశ్చర్య పడవలసినది ఏమీ లేదు. వాళ్ళ విప్లవ చర్యలను విధ్వంసకర చర్యలుగా, వాళ్ళను అణచివేయటానికి పాలకవర్గం, పరాయి దేశపు సైన్యం జరిపిన దాడులు, చేసిన విధ్వంసం శాంతి స్థాపన గా ఆమెకు అనిపించటం ఆమె వర్గ స్వభావాన్ని సూచించేవే.
ఏమైనా 1874 నాటికి ఒక తెలుగు మహిళ రాజకీయాల గురించి , చరిత్ర గురించి గొప్ప విశ్వాసంతో మాట్లాడగలగటం అపురూపమే. పారిస్ లో అటు పర్షియన్ ఇటు కమ్యూనిస్టు యుద్ధకాల దృశ్యాల భీభత్స చిత్రాలను తాను చూశానని ఆమె చెప్పుకొన్నది.
ఆ నాటి యుద్ధాలలో కీలక పాత్ర వహించిన వర్సైల్స్ కు కూడా ఆమె వెళ్ళింది. అక్కడ తాను చూసిన ఒక చారిత్రక చిత్ర శిల్ప ప్రదర్శన శాలను గురించి చెప్తూ బహుళ అంతస్థుల అనేక భవనాలను తిరిగి రావటానికి కొన్ని గంటలు పడుతుందని, యుద్ధకాలంలో( 1871) పర్షియా రాజు దానిని తన ప్రధాన కార్య స్థానంగా చేసుకున్నాడని, యుద్ధంలో గాయపడ్డ తన సైన్యానికి చికిత్స కోసం ఆ ప్రాంతంలో చాలా విశాల ప్రాంతాన్ని ఆసుపత్రిగా మార్చాడని తెలిసిందని, అయినా అతను అక్కడి చిత్రాలను , శిల్పాలను ఏ మాత్రం పాడు చేయలేదని రక్తపాతం జీవితంగా ఉన్న వాడిలో కళాప్రియత్వం ఆశ్చర్యకరమని అంటుంది జానకమ్మ. ఆమె అక్కడ ఒక ఫ్రెంచ్ నాటకాన్ని చూసి అది తనకు నచ్చలేదని చెప్పింది. పారిస్ అందమైన నగరం అని ఇంగ్లండ్ లో కన్నా జీవన వ్యయం అక్కడ తక్కువ అని చెప్పింది.
లండన్ ప్రపంచం తనకు ఎలా అనిపించిందో జానకమ్మ ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది ఈ యాత్రా చరిత్రలో. ఆమె దృష్టిలో అది ప్రపంచంలోనే అత్యంత గౌరవించ దగిన అద్భుత నగరం. ప్రపంచ సంపదకు, వ్యాపారానికి ఆకర్షక కేంద్రం. భోమి మీద ఉత్పత్తి అయ్యే అనేక రకాల సరుకులతో వస్తూ పోతూ ఉండే వేలకొద్దీ ఓడలతో , ప్రయాణీకులతో సందడిసందడిగా ఉంటుంది. అక్కడ వ్యాపారస్తులు రాజుల్లాగా ఉంటారు - సంపద సమృద్ధి చేత, పలుకుబడి చేత. అయితే అక్కడ కళ్ళు చెదిరే సంపదతో పాటు అతి క్రూరమైన దారిద్య్రం, విశాలమైన జ్ఞానంతో పాటు అజ్ఞానం కూడా ఉందని ఆమె గుర్తించి చెప్పటం విశేషం.
లండన్ లో మనుషులు దయగలవాళ్ళు అని, కొత్తవాళ్లను ఆదరించి ఆతిథ్యం ఇచ్చే సంస్కారులని, స్త్రీలు పురుషులతో సమానులు అని పురుషులకు మంచి సలహాదారులు కూడా అని చెప్తుంది. ఇంగ్లండ్ లో స్త్రీలు అన్ని రకాల గౌరవ మర్యాదలు పొందుతుండగా సలహాదారులుగా ఉండవలసిన స్త్రీలు భారతదేశంలో మగవాళ్ల ఇచ్ఛానుసారం బానిసల వలే పది ఉంటున్నారని బాధపడింది. నా భారతీయ సోదరీమణులు గృహనిర్వాహణలో ఇలా పాశ్చత్య సోదర స్త్రీలవలె గౌరవకరమైన స్థానాన్ని ఎప్పుడు పొందుతారో కదా అని చింతించింది. నా దేశస్థులైన పురుషుల కళ్ళు ఇటువంటి విషయాలమీద ఇప్పుడిప్పుడే విచ్చుకొంటున్నాయని భవిష్యత్తు పట్ల ఆశను ప్రకటించింది.
చాలామంది మన వాళ్ళు ఇంగ్లండ్ వెళితే అక్కడ వాళ్ళ కులం మతం వదులుకోవలసి వస్తుందనే భయాన్ని వ్యక్తపరుస్తుంటారుకానీ అది ఊహే కానీ వాస్తవం కాదంటుంది జానకమ్మ. మత వ్యాప్తి కాంక్ష వారిలో ఉన్నమాట నిజమే కానీ ఎవరినీ అందుకు బలవంత పెట్టరు అని చెప్తుంది. ఎవరి మతాభిప్రాయాలు వాళ్ళు కలిగి ఉండే హక్కు ఇంగ్లండ్ లో ఉందని చెప్పింది.ఏమైనా యుద్ధాలకు,రక్తపాతాలకు, చెడుకు, ద్వేషానికి , అన్ని రకాల చెడు మనోవికారాలకు మతం కారణమని అభిప్రాయపడుతుంది. ఇంగ్లండ్ కు వెళ్ళండి. ,చూసిన దానితో ,విన్నదానితో సంతోషంగా సంతృప్తిగా తిరిగి రాకపోతే వాళ్ళు పుట్టు గుడ్డి, చెవుడు అనుకోవలసిందే అని చెప్పటంలో ఆమె విదేశాయానం , మరీ ముఖ్యంగా ఇంగ్లండ్ యాత్ర జీవితంలో అభివృద్ధి వికాసాలకు అవసరమైన సంస్కార వివేకాలను కలిగిస్తుందని దృఢంగా విశ్వసించటం కనిపిస్తుంది. “అన్నిదేశాల్ క్రమ్మ వలనోయ్/ దేశి సరుకులనమ్మవలనోయ్” అని దాదాపు నలభయ్ ఏళ్ల తరువాత గురజాడ ఏది చెప్పాడో దానిని అభివృద్ధి సూత్రంగా జానకమ్మఆనాడు గుర్తించగలగటం గొప్ప విషయం.ఒక తెలుగు మహిళ 1875 నాటికి ఇంగ్లండ్ వెళ్లిరావటం అదేదో భర్తచాటు భార్య చర్యగా కాక ఒక స్వతంత్ర వ్యక్తిత్వంతో దేశ ఆర్ధిక రాజకీయ అభివృద్ధి ఆకాంక్షలను ఏర్పరచుకొని వ్యక్తీకరించ కలిగిన మేధో చర్యగా ఉండటాన్ని జానకమ్మ యాత్రాచరిత్ర రచన ‘పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్’ నిరూపించింది.
ఆమె మగవాడై ఉంటే టాటా బిర్లా అయ్యే అవకాశాలు అందుబాటులోకి వచ్చి ఉండేవి. ఇంగ్లండ్ వెళ్ళివచ్చిన తరువాత జానకమ్మ ఆలోచనలు , ఆచరణ అంతా విస్మృత చరిత్రే.
(అపురూపమైన , అవసరమైనా ఈ పుస్తకాన్ని సంపాదించి ఇయ్యతమే కాక తమ సంభాషణలతో ఈ వ్యాసం వ్రాయటానికి ప్రేరేపించిన కాళిదాసు పురుషోత్తం గారికి, పి. మోహన్ గారికి కృతజ్ఞతలు )
---------------------------------------------------------------------------------------
కర్ణాటక కాలేజీల్లో మొదలైన హిజాబ్ ఇష్యూ... కర్నాటక విద్యార్థుల్ని రెండు మతాలుగా విభజించి అగ్గిపుట్టించింది. కాలేజీల్లో అమ్మాయిలు హిజాబ్ ధరించి రావడాన్ని వ్యతిరేకిస్తూ.. కాషాయ జెండాలతో చాలా చోట్లో విద్యార్థులు నిరసనలకు దిగారు. అవి ఎంత ఉన్మాదంగా మారాయంటే... షిమోగాలోని గవర్నమెంట్ కాలేజీలో.. జై శ్రీరాం నినాదాలు చేస్తూ కాషాయ జెండా ఎగరేశారు...
మాండ్యలోని ఓ కాలేజీలోకి ఒక స్టూడెంట్¬ని హిజాబ్¬తో రాగానే.. జై శ్రీరాం నినాదాలతో వందల మంది ఇలా వెంటపడ్డారు..
బాగల్కోట్¬లో హిజాబ్¬కి నిరసనగా.. పోలీసులపై కొందరు రాళ్లు విసరడంతో ఈ నిరసన ఉద్రక్తంగా మారింది..
అమ్మాయిలు హిజాబ్¬తో కాలేజీకి రావడంపై ఇంతకాలం లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకు..? హిజాబ్ ఇష్యూ.. హిందు ముస్లిం విద్యార్థుల మధ్య ఘర్షణగా ఎందుకు మారింది..?
జనవరి 1, 2022న.. ఎప్పట్లాగే వచ్చిన ముస్లిం గర్ల్స్¬ని కాలేజీ సిబ్బంది అడ్డుకున్నారు. కాలేజీలోకి వెళ్లాలంటే హిజాబ్ తీసెయ్యాలన్నారు. అమ్మాయిలు అలా కుదరదు అని చెప్పడంతో.. మీరు క్లాసులకు అటెండవడానికి వీళ్లేదని ప్రిన్సిపాల్ అభ్యంతరం చెప్పడంతో వివాదం మొదలైంది. మర్నాడు తల్లిదండ్రులతో కలిసి కాలేజీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తే గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఇంతలో తళతళలాడే కొత్త కాషాయ కండువాలు వేసుకొని అబ్బాయిల బృందం ఉడిపి కాలేజీలోకి వెళ్లేందుకు ట్రై చేసింది. అమ్మాయిల్ని హిజాబ్¬తో క్లాస్¬లోకి రానిస్తే.. మమ్మల్నీ కాషాయ కండువాలతో రానివ్వాలని పట్టుబట్టారు.
ఉడిపి ఇష్యూ కొనసాగుతుండగానే... జనవరి 3న కొప్ప జిల్లాలోని ఓ గవర్నమెంట్ కాలేజీలో, జనవరి 6న చాలా మంగుళూరు కాలేజీల్లో హిజాబ్¬కి వ్యతిరేకంగా కాషాయ కండువాలతో పెద్ద ఎత్తున విద్యార్థులు జై శ్రీరాం నినాదాలతో ఆందోళనలకు దిగారు.
ఇక్కడ మనకొక సందేహం రావాలి.. విద్యాసంస్థల్లో యూనిఫాం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ యూనిఫాం వేసుకోవాల్సిందే. విద్యాసంస్థలు యూనిఫాం వేసుకునేలా చూడాల్సిందే. కానీ కర్ణాటకలో ఇప్పుడే ఈ ఇష్యూ ఎందుకు రైజ్ అయ్యింది. ఇది అకడమిక్ ఇయర్ స్టార్టింగ్ టైం కాదు.. ఎండింగ్ టైం.. పోనీ.. ముస్లిం యువతులెవరైనా యూనిఫాం వేసుకోము బురఖాలే వేసుకుంటాం అంటే అప్పుడు కచ్చితంగా ఖండించాల్సిందే. కానీ కర్ణాటకలో ముస్లిం యువతులంతా కాలేజీ యూనిఫాంలోనే వస్తున్నారు. యూనిఫాంతో పాటు.. తల, మెడ కవర్ అయ్యేలా ఒక చిన్న గుడ్డ చుట్టుకుంటున్నారు. హెడ్ స్క్రార్ఫ్ చుట్టుకోవచ్చు అని కాలేజీ నిబంధనల్లో కూడా ఉంది.
ఉన్నట్టుండి కర్ణాటక ప్రభుత్వం యూనిఫాంను స్ట్రిక్టుగా అమలు చెయ్యాలని విద్యాసంస్థలకు ఆర్డర్స్ పాస్ చేసింది. ఉడిపి కాలేజీ సిబ్బంది.. వెంటనే హిజాబ్ బ్యాన్ అన్నారు. హిజాబ్ వేసుకొని కాలేజీకి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రన్సిపల్ చెప్పాడు. ఉడిపి సహా అనేక జిల్లాల్లోని కాలేజీలోకి కాషాయ కండువాలతో విద్యార్థులు రావడం.. హిజాబ్¬ ధరించడానికి వ్యతికేకంగా నిరనసలు మొదలయ్యాయ్.
జనవరి 26న ఈ ఇష్యూ సాల్వ్ చేయడానికి ఒక ఎక్స్¬పర్ట్ కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేదాకా.. యూనిఫాం రూల్స్ పాటించాల్సిందే అని చెప్పింది. దీంతో జనవరి 31న ఉడిపికి చెందిన ఒక విద్యార్థి హిజాబ్ ధరించడం మా ప్రాథమిక హక్కు అని కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది.
ఫిబ్రవరి 5న కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై ఈ ఇష్యూ మీద విద్యాశాఖ మంత్రితో మీటింగ్ పెట్టారు. విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్... విద్యాసంస్థల్లో హిజాబ్¬నీ అనుమతించమూ.. కాషాయ కండువాలనూ అనుమతించమూ అన్నారు.. అంటే.. ఎప్పటినుంచో అమ్మాయిలు ధరిస్తున్న హిజాబ్¬ను.. ఇప్పటికిప్పుడు రంగంలోకి దించిన కాషాయ కండువాలనూ ఒకే గాట్లో కట్టేసి మాట్లాడారు. అయితే.. సీఎం మీటింగ్ తర్వాత... ఉడిపిలో హిజాబ్¬తో వచ్చిన ముస్లిం అమ్మాయిల్ని కాలేజీలోకి రానివ్వాలని నిర్ణయం తీసుకున్నారు కానీ... క్లాసులోకి రానివ్వకుండా వాళ్లను విడిగా కూర్చోబెట్టారు. దీంతో ఇదేం అంటరానితనం అంటూ.. చిక్ మంగులూరులో ముస్లిం యువతులకు మద్దతుగా దళిత్ స్టూడెంట్స్ జై భీమ్ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు..
అదే సమయంలో ఉడిపి కాలేజీకి దగ్గర్లో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు మారణాయుధాలతో తిరుగుతుండటంతో పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు. వాళ్లు ముస్లింలు కావడం కూడా వివాదాన్ని పెంచింది.
ఈ ఇష్యూపై కర్ణాటక హైకోర్టులో వాడీ వేడి వాదనలు జరిగాయి. సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ ముస్లిం విద్యార్థుల తరఫున వాదించారు.
నాలుగు అంశాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
బాలికలు తలచుట్టూ కట్టుకున్నహిజాజ్, బురఖా ఒక్కటి కాదు.. హిజాబ్ అనేది ఇస్లాంలో ఒక భాగం. ఆయన ఇంకో విలువైన మాటకూడా అన్నారు. నేను బ్రాహ్మణున్ని కాబట్టి.. నా కొడుకు రేపు నామం పెట్టుకొని స్కూలుకు వెళ్తే అది నేరమౌతుందా..? నామం పెట్టుకున్న నా కొడుకు క్లాస్ రూంలోకి వచ్చి చదువుకోవడానికి వీలుండదా అని ప్రశ్నించారు.
అలాగే... హిజాబ్ ధరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 రైట్ టు ఎక్స్ ప్రెషన్ కిందికి వస్తుందీ.. ఆర్టికల్ 21 కింద రైట్ టు ప్రైవసీ కిందికి వస్తుందన్నారు.
ఒక మతానికి సంబంధించి ఏది ఆచరించాలో ఏది వద్దో రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెప్తుందని న్యాయవాది అన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని కోర్టు సూచించింది.
అదే సమయంలో... ఈ వివాదం కర్ణాటక మొత్తానికి వ్యాపించింది. చాలా చోట్ల భజరంగదళ్ కార్యకర్తలు, హిందుత్వ గ్రూపులు ప్రవేశించాయి. కాషాయ జెండాలు, తలపాగాలు పంచిపెట్టి విద్యార్థుల్ని రెచ్చగొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మత సంప్రదాయాన్ని తెలిపే వస్త్రధారణను ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుందాం.
సంప్రదాయాలు, ఆచారాలేవీ ఇవాళ కొత్తగా వచ్చినవి కావు.. కాషాయ కండువాలతో హిజాబ్¬పై యుద్ధం ప్రకటించడమే ఇప్పుడు కొత్తగా వింతగా తెరపైకి వచ్చింది.
మనందరికీ తెలిసిందే.. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సరస్వతి దేవి విగ్రహాలుంటాయి. అక్కడ ముస్లిం, క్రిస్టియన్ పిల్లలు చదువుకుంటారు.
వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేసి నిరసనలు తెలిపిన దాఖలాలుండవు.
అంతెందుకు ఆగస్టు 15, రిపబ్లిక్ డే రోజున కొబ్బరికాయలు కొట్టి, అగర్ బత్తులు వెలిగించడం, చిత్రపటాలకు పూలమాలలు, కుంకుమ బొట్లు పెట్టడం చాలా సహజంగా జరిగిపోతుంది. అది మతాచారమే అయినా అక్కడ ఎవరూ పాయింట్ ఔట్ చెయ్యరు.
అసెంబ్లీకీ, పార్లమెంటు చట్టసభలు. కులమతాలకు, ఆచార సంప్రదాయాలకు అతీతం. అలాంటి చోట కూడా మహిళా ప్రజా ప్రతినిధులు బొట్టు, తాళిబొట్టు, మెట్టెలు, సింధూరంతో కనిపిస్తారు. ముస్లింలైతే బుర్ఖాలతో, క్రైస్తవులైతే మెడలో శిలువతో అసెంబ్లీకీ పార్లమెటుంకు వస్తారు. వాళ్లు పుట్టిపెరిగిన ఆచార సంప్రదాయాలు కాబట్టి పాటించాలనుకున్న వాళ్లు పాటిస్తారు.
అంతెందుకు... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సిక్కుమతాచారంలో భాగంగా తలపాగ పెట్టుకుంటారు. తలపాగా లేని మన్మోహన్ సింగ్ ఎలా ఉంటారో కూడా ఎవరికీ తెలియాదు. ఆయనకు అది కంఫర్ట్. సిక్కు మతస్తుల్లో ఎల్ కే జీ పిల్లలు కూడా తలకు టర్బన్¬తోనే కనిపిస్తారు. అంతెందుకు యూపీలో యోగీ ఆధిత్యనాథ్ ఏ బట్టలు వేసుకుంటారు.. ప్రజ్ఞాసింగ్ సాధ్వి వేసుకునే బట్టలేవి.. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలకు అనుకూలంగా ఎన్ని రంగుల బట్టలు మారుస్తారో.. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తారో చూస్తూనే ఉంటాం.. మరి ఆయన ప్రధాని పదవికి అనర్హుడా ?
హిందువుల్లో కొందరు మగ పిల్లలకు చెవి పోగులు, కమ్మలు, నుదుటిపైన నిలువు నామాలు, అడ్డనామాలు పెట్టుకొని స్కూలుకు కాలేజీకి వెళ్తుంటారు. అయ్యప్ప మాలలు వేసుకున్న పిల్లలు స్కూలు, కాలేజీలకు వెళ్తారు. అలాంటివాళ్లను స్కూలుకు రావద్దని అడ్డుకోం కదా..
ఇంకో ఎగ్జాంపుల్.. సానియా మీర్జా, పీవీ సింధు లాంటి స్పోర్ట్స్ స్టార్స్-గానీ.. సినిమా స్టార్స్¬, టీవీల్లో పని చేసే న్యూస్ రీడర్స్ ఏ మతాల్లో పుట్టినా వాళ్ల వృత్తికి తగిన డ్రెస్సింగ్¬తో ఉంటారు.. అది వాళ్ల కంఫర్ట్. మహిళల పట్ల వివక్ష అన్ని మతాల్లో ఉంది. ఉపవాసాలు... వ్రతాలు నోముల పేరుతో హిందుమహిళలు అనారోగ్యంపాలౌతుంటారు. ఇష్టంలేకపోయినా కట్టుబాటు కాబట్టే తాలిబొట్టును వేసుకునే వాళ్లుంటారు. అలాగే ముస్లిం మహిళలు సంప్రదాయం పేరుతో కట్టుబాటు పేరుతో బుర్ఖా వేసుకుంటారు. కానీ ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు వస్త్ర ధారణతో ఏంటి సంబంధం.
ఇప్పుడు కాషాయ కండువాలను విద్యార్థులకు సప్లై చేస్తున్న వాళ్లే.. గతంలో మహిళలు జీన్స్ వేసుకోకూడదనీ.. పబ్బులకు వెళ్లకూడదని గొడవలు చేశారు. అంటే బట్టలు ఎక్కువ వేసుకున్నా.. తక్కువ వేసుకున్నా వీళ్ల గొడవ మహిళల్ని అణచివేయడం.. వాళ్లకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం విద్య దూరం చెయ్యడం.
పరీక్షలకు రెండు నెలల ముందు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఈ వివాదం రాజుకుందంటే.... ఇది కచ్చితంగా యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం రాజేసిన నిప్పే. ఈ నిప్పు మిగతా దేశమంతా విస్తరించడానికి ఎంతో సమయం పట్టదు..
చివరిగా ఒక్క మాట... భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేముందు బ్రిటీషర్లు మన నాయకుల ముందు ఒక ప్రశ్న పెట్టారంట.. మీరు అనేక కులాలు, మతాలుగా విడిపోయారు. మేం మీ దేశాన్ని వదిలి వెళ్లిపోయిన మరుక్షణం.. మతఘర్షణలతో దేశం అల్లకల్లోలమైపోతుందని హెచ్చరించారట. బ్రిటీషర్ల ఆలోచన తప్పు అని... భారతదేశం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. ఇన్ని మతాలు, భాషలు, సంస్కృతులు కలిసి కూడా ఉండగలవు అని ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసిన దేశం మనది.
అలాంటి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు... ఎంఐఎం ముస్లింలను రెచ్చగొడుతోంటే... బీజేపీ మెజారిటీ హిందువుల్ని రెచ్చగొడుతోంది. లేని భయాలను వీళ్లు సృష్టిస్తున్నారు.
కర్ణాటక హిజాబ్ ఇష్యూ కచ్చితంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకీ, ఎంఐఎంకీ ఓట్లు తెచ్చిపెడుతుంది. కానీ.... హిజాబ్ ఇష్యూ మత ఘర్షణల్లోకి రూపం మార్చుకుంటే...భారత ప్రజాస్వామ్యం ఘోరంగా ఓడిపోతుంది. అలా ఓడనివ్వకుండా చూడాల్సిన బాధ్యత భారతీయులందరిదీ. మతోన్మాదాన్ని శాస్వతంగా ఓడించడానికి ఇదే సరైన సమయం.
పెనుగొండ సరసిజ ‘‘ కాగితాన్ని ముద్దాడిన కల’’ కవితా సంకలనంతోని కవితా క్షేత్రంలో అడుగుపెట్టింది. ఇప్పుడు ‘‘ మారాల్సింది నువ్వే ’’ కవితా సంకలనంతో ఒక స్పష్టమైన పెమినిస్టు దృక్పథంతో ముందుకు వచ్చింది.
స్త్రీ, పురుష సంబంధాల విషయంలో పాశ్చాత్య సమాజాలకు, భారతీయ సమాజానికి తేడా ఉంది. అక్కడ సామాజిక అంతరాలు లేవు. ఆర్థిక అంతరాలు తప్ప. అమెరికన్ సమాజంలో జాతివివక్ష ఉంది. భారతదేశంలో స్త్రీలు, దళితులు సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారు.
భారతదేశంలో మనుషులు ఏదో ఒక కులంలో పుడతారు. కులంలోనే పెరుగుతారు. కులంలోనే తుది శ్వాస విడుస్తారు. కులం, పితృస్వామ్యం మనదేశంలో సామాజిక మార్పు జరగకుండా, సామాజిక సమానత ఏర్పడకుండా కట్టడి చేస్తున్నాయి.
పుట్టిన పిల్లలకు సామాజికీకరణ (Socialization) లో భాగంగా కులాచారాలు, కట్టుబాట్లలో శిక్షణ ఇస్తారు. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనే ఎరుకను కలిగిస్తారు. కింది కులాలవారితో, పై కులాల వారితో ఏ విధంగా మెదులుకోవాలో వివరిస్తారు. చిన్నప్పుడే ‘‘ మనం’’ ‘‘వాళ్ళు’’ అనే భావన తలకెక్కుతుంది. సాధారణంగా తమకులంలోనే పెండ్లి చేసుకుంటారు. కుల కట్టుబాట్లను ఎదిరించినవారు కుల బహిష్కరణకు గురి అవుతారు. కులబహిష్కరణకు గురి అయిన వారికి చావులకు, పెండ్లీలకు తమ కులం నుండి ఎలాంటి సహకారం దొరకదు. అందుకే ‘‘ కులం విడిచిన పక్షి, వనం విడిచిన కోతి’’ అన్న సామెత ప్రాచుర్యంలోకి వచ్చింది.
మన సమాజంలోని స్త్రీలందరిలో ఏకరూపత లేదు. సంపన్న, అగ్రకుల స్త్రీలు కింది కులాల స్త్రీలను అణచివేస్తారు, దోపిడి చేస్తారు, చిన్న చూపు చూస్తారు. వివక్షకు గురిచేస్తారు. మధ్యతరగతి విద్యావంతులైన స్త్రీలు, శ్రామిక స్త్రీలు ఒకటి కాదు. వాళ్ళ సమస్యలు, ఆకాంక్షలు, అనుభూతులు వేరు. కిందికులాల శ్రామిక స్త్రీలకు తాము వివక్షకు, దోపిడీకి గురి అవుతున్నామనే సోయి ఉండదు. వాళ్ళకు నిత్యం పని కల్పించిన వారినే ఆరాధనా భావంతో చూస్తారు. పని ప్రదేశంలో దళిత, బి.సి. కులాల స్త్రీల సద్దులు ఇప్పటికీ వేరువేరుగా పెట్టుకొంటున్నారు. దళిత మహిళలకు నీళ్ళు బి.సి. మహిళలతో పోయిస్తారు. ఇదంతా సద్దులు, నీళ్ళు మైలపడకుండా చూడటంలో భాగమే.
మన ధర్మ సూత్రాలు, ధర్మ శాస్త్రాలు స్త్రీలకు కొన్ని నిషేధాలు విధించినవి. వాటినే మన పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు అదర్శీకరించినాయి. వాటిలో ప్రబోధించిన విలువలనే సమాజం ఈనాటికీ అనుసరిస్తుంది. ఈ విలువలే సామాజిక మానసిక స్థితిలో భాగంగా ఉన్నాయి.
మన దేశంలో భూస్వామ్య శిథిలాల మీద పెట్టుబడిదారి వ్యవస్థ ఏర్పడలేదు. భూస్వాములను ప్రోత్సహించి పెట్టుబడిదారులుగా ఎదగడానికి మన ప్రభుత్వాలు ప్రోత్సహించినాయి. భూస్వామ్య భావజాలం నుండి పెట్టుబడిదారులు పూర్తిగా తెగదెంపులు చేసుకోలేదు. భూస్వామ్య పెట్టుబడి దారి భావాల సాంకర్యంగా మన దేశంలో పెట్టుబడిదారి విధానం కొనసాగుతుంది. దీన్ని Reactionary Transition అన్నారు.
ఈనాటి వినియోగదారి సంస్కృతిలో మనిషికి విలువలేదు. మనిషికి ఎన్నో విలువైన వస్తువులు ఉంటే అంత విలువ. ఆపిల్ గడియారం, సెల్‍పోన్, వేళ్ళకు ఉంగరాలు, మెడలో చైన్, చేతికి బ్రాస్‍లెట్, కారు, బైక్, బంగ్లా దానిలో విలువైన టి.వి. వగైరాలు. వీటితోనే మనిషికి విలువ. ఇది పెట్టుబడిదారి సంస్కృతి కల్పించిన విలువ. ఈ వస్తువుల్లో భార్య, పిల్లలు వస్తువులే. పిల్లలు ఐ.ఐ.టి లో చదివి అమెరికాలో సెటిల్ అయి డాలర్లు సంపాదిస్తే ఆ తల్లిదండ్రులకు విలువ.
అందమైన భార్య కావాలని అందరు కోరుకుంటారు. అట్లాంటి వారు సౌందర్య ఆరాధకులు కారు. భార్యను అందంగా అలంకరించుకొని బజార్లు తిప్పడం వినిమయదారి సంస్కృతే.
‘‘అందంతో నీకేంపని’’ కవిత వినిమయదారి సంస్కృతిని ప్రశ్నిస్తుంది. అందం ప్రదర్శనకే కదా అని కవయత్రి అంటుంది.
స్త్రీలకు దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. సంప్రదాయ పద్ధతులు పాటించే కుటుంబాలలో మరీ ఎక్కువగా సమస్యలు ఉంటాయి. స్త్రీకి సహజంగా జరిగే రుతుక్రమానికి నియంత్రణలు ఉంటాయి. వ్రతాలు, పూజలు చేసుకోవడానికి ముహూర్తాలు నిర్ణయించుకొన్న సమయంలో పీరియడ్ రాకుండా ‘‘ ప్రిమోలేట్ ’’ మాత్రలు వేసుకుంటారు. వాయిదా కవిత ఈ అంశాన్ని వర్ణిస్తుంది.
‘‘ రుతు చక్రం రూటు మార్చి
వాయిదావేసిన సంగతి ’’
ఆధునిక మహిళలు చదువుకొని సంపాదిస్తున్నారు. అయినా జీతం భర్త చేతిలో పెట్టవలసిందే. అవసరాలకు చేయిసాపి అడగవలసిందే. ఇంటిలో పని మామూలే. ‘‘కిటికీ’’ కవిత ఇంటి పనిని చిత్రిస్తుంది.
‘‘ మసి గిన్నెలను మెరిపిస్తున్న మట్టి గాజులు
రేపటి మెరుగులకై మురికితో తలపడుతున్న
తల్లుల తపనలు ’’
‘ బలం లేని బలం ’ కూడ ఇంటిపని మీద రాసిందే. మధ్య తరగతి కుటుంబాలలో వంటగది యంత్రీకరణ జరిగింది. అయినా ఆ యంత్రాలను స్త్రీలే నడిపించాలి.
‘‘ గిర్ని, మిక్సి, వాషింగ్ మెషిన్
ఇన్ని ఇసిరెలు ఆమె ముందు ఓడిపోయినమో !
ఆమెను జూత్తే పని పారిపోయేట్టు........... ఆమె పని’’
‘‘ వట్టిహౌజ్‍వైఫ్ ’’ కూడ ఇంటి మని మీద రాసిందే. ఆమెను ఇంటిముందు వాకిట్లో కూర్చోబెడితే ‘‘అన్నం మూతనుండి రాలే ఆవిరిచుక్కల్లా, ఆమె నుదుటిపై చెమటలు’’ కనబడతాయి.
క్షణం తీరిక లేకుండా
పనికి మాలిన పనో
పని కొచ్చెపనో
పని మాత్రముంటుంది’’
ఆడవాళ్ళు చేసే ఇంటిపనికి ఇంత అంత అని కొలమానాలు ఉండవు. పొద్దంతా ఒడువని పని చేసినా తీరా ఏ పని చేసినవంటే చూపించడానికి ఏది ఉండదు. House Makers మీద ఒక రకమైన చులకన భావం ఉంటుంది. ‘‘మామూలు మనిషి’’ కూడ ఇంటి పనిమీద రాసిందే.
స్త్రీపురుష సంబంధాలు ప్రజాస్వామికమైనపుడు ఎలాంటి అరమరికలు ఉండవు. చిన్న చిన్న బేధాభిప్రాయాలు వస్తే మాట్లాడి చర్చించుకొని పరిష్కరించుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటే ఎలాంటి పొరపొచ్చాలు ఉండవు. నిజానికి ఇది ప్రజాస్వామిక పద్ధతి ‘‘మాట్లాడుకుందామా’’ కవితలో మాటే కదా మనలను కలిపేది. కళ్ళు కలిస్తేనే కదా కలతలు దూరమైపోతాయి ప్రాణమున్నంతవరకే పంతాలు పట్టింపులు. శ్వాస ఆగినంక వెతికే చోటు ఉండదు అంటుంది కవయిత్రి.
‘‘కలుసుకోవాలి’’ కవితలో ‘‘మనం కలిస్తే మననవ్వులు నదులై నాట్యమాడతాయి. కళ్ళు కంచికి చేరని కథలు చెప్పుకుంటాయి. ఆలింగనాలు ఆత్మను స్పృశిస్తాయి’’ అంటుంది.
ఒక అత్యాచారానికి గురియైన కూతురును, ఆమె తల్లిని ఊహించి వారి మధ్యన జరిగిన సంభాషణగా ‘‘శీలమంటే’’ కవిత రాసింది. శీలమంటే శరీరంలోని అవయవాలేనా అని కూతురు ప్రశ్నిసుంది. చెడిపోయిన పండ్లను బయట పారేసినట్టు, చెడిపోయిన నన్ను బయట పారేస్తావా! అని ఆందోళన పడుతుంది. ‘‘రక్తస్రావం జరిగే ఆ ఒక్క భాగమే శీలమైతే’’ గాయపడ్డ రక్తం కారుతున్న పెదవులను, బుగ్గలను, చేతులను శరీరంలోని అన్ని అవయవాలను ఏమంటారని ప్రశ్నిస్తుంది.
ఒక తల్లి తన కడుపున పుట్టిన మగవాడిని ‘‘ నువ్వు వెంటుండే తోడువనుకున్న, కాని, నన్ను వేటాడే తోడేలు వైనావు’’ లోపం ఎక్కడ జరిగింది అని తర్కిస్తూ నీ పుట్టుకనే ఆపేయాలా, నా శ్వాసనే ఆపేయాలా అంటుంది.
‘‘ స్నానం కవిత స్త్రీ జననేంద్రియం గురించి మాట్లాడుతుంది.
‘‘ వాడిపుట్టుకే
పుణ్యక్షేత్రమని
కొత్త పాఠాలతో వాడికి
సరికొత్త జన్మ నివ్వాల్సిందే ’’
ఈ వ్యక్తీకరణ ‘‘ ప్రతిఘటన ’’ సినిమాలోని వేటూరి పాటను గుర్తుకు తెస్తుంది.
‘‘ మర్మస్థానం కాదది నీ జన్మస్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం’’.
‘‘తెల్లరక్తం’’ (Fungus infection) గురించి రాస్తుంది.
‘‘ ఉల్లిపాయ పొరలు
ఒలిచినట్టు
చిట్లుతున్న చర్మం
ప్రమాదమని
పసిగట్టలేని తెల్లరక్తం ’’
రుతుక్రమంలో అనుభవించే భాధను ‘‘ విస్పర్ ’’ కవిత కళ్ళకు కడుతుంది.
‘‘ గునపాలు గుచ్చుతున్నా
నా అవస్థ ఎప్పుడు
అక్కకు రానిదే ’’
స్థూల దృష్టితో చూసినప్పుడు స్త్రీలు ఎదుర్కొనే బాధలకు అణచివేతకు, వివక్షకు, అసమానతలకు పురుషుడే కారణంగా కనిపిస్తాడు. ‘‘ అందరూ అంతే ’’ కవిత అదే చెప్పుతుంది. సమాజంలోని చట్టాలు, సామాజిక సంస్థలు (Social Institutions) అన్నీ పురుషాధిక్యతను నిలబెట్టేవే అని తీర్మాణిస్తుంది కవయిత్రి.
‘‘ నీతులన్నీ నీకోసమే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి
ధర్మాలన్నీ నీకోసమే దారి కాచుక్కూసుంటాయి ’’
అందుకే ఇక, మారాల్సింది, నువ్వే అని తీర్మాణిస్తుంది కవయిత్రి.
సాంకేతికంగా చూసినప్పుడు మనం ఆధునిక ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాము. కాని సమాజంలో ఆధునిక పూర్వ, భూస్వామ్య భావజాలం రాజ్యమేలుతుంది. ఈ వైరుధ్యాలు తొలగిపోవలసి ఉంది. ఎన్ని ప్రగతిశీల చట్టాలు చేసినా, వాటిని అమలు చేసేవారు అదే భూస్వామ్య విలువలతో కూడిన భావజాలం నుంచే ఎదిగి వస్తున్నారు. సెల్‍పోన్, ఫేస్‍బుక్, ఇన్‍స్టాగ్రామ్ లాంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన మనిషి భావజాలపరంగా భూస్వామ్య యుగంలోనే జీవిస్తున్నాడు. సమాజం చట్టం, సామాజిక విలువలు ఒకే దారిలో నడిచినపుడు సమస్త అంతరాలు పోతాయి.
సమాజంలో ఏ మార్పు రావాలన్నా స్త్రీ, పురుషులు ఇద్దరు కలిసి కృషి చేయవలసిందే. ఇది ఇద్దరికి అవసరం. స్త్రీ, పురుష సంబంధాలు శత్రువైరుధ్యం కాదు. మిత్రవైరుధ్యం. ఐక్యత ఉంటుంది. ఘర్షణ ఉంటుంది.
తమ జీవితావసరాలను తీర్చుకొనే ఉత్పత్తిని, తమ సంతతిని కొనసాగించే పునరుత్పత్తిని కలిసి కొనసాగిస్తారు. ఇవి రెండూ లేకుంటే మానవ సమాజం లేదు.
సమాజంలోని స్త్రీ పురుషులు సమానం అనే విలువలు పాదుకొనాలంటే ఒక ప్రత్యామ్యాయ సంస్కృతి నిర్మాణం అవసరం. ఈ ప్రత్యామ్నాయ సంస్కృతి కొరకు మార్పును ఆశించే వారంతా కలిసి పని చేయవలసి ఉంది. అప్పుడే
‘‘ స్త్రీలు పురుషులు మనుషులు అందరు
సమానమన్నా సమాజ ముండాలే ’’ అని ప్రబోధించిన కలెకూరి ప్రసాదు.
కల నిజమవుతుంది.
పోతం జానకమ్మ( POTHUM JANAKUMMAH , అప్పటి కాలపు స్పెలింగ్ ఇది ) 1873 జులై 29 నుండి 1874 ఫిబ్రవరి 1 వరకు చేసిన ఇంగ్లండ్ యాత్రాకాలపు అనుభవాల , పరిశీలనల , ప్రభావాల కథనం 1875 లో ప్రచురించిన ‘పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్’ . ఈ పుస్తకంలో పన్నెండు చాఫ్టర్లు ఉన్నాయి.
శ్రీ ఆంధ్ర భాషా సంజీవిని ( Sriandrabhashasunjivini అని పుస్తకంలో ఉంది.) పత్రికలో జానకమ్మ లేఖ గా వ్రాసిన యాత్రా సంబంధి రచనకు ‘ఎథినీయం అండ్ డైలీ న్యూస్’ పత్రిక( 1874 ఏప్రిల్ 15) పత్రిక ప్రచురించిన ఇంగ్లీషు అనువాదం ,దానిపై విపుల సమీక్షతో సహా మొదటి చాప్టర్ లో ఉంది. దేశీయ దురభిమానాన్ని అధిగమించగలిగిన జానకమ్మ ఉదార బుద్ధి ని, నిర్భయతను, తనదేశం మూర్ఖమైన పిరికితనాన్ని వదిలేసి ఇతరదేశాలు సంపాదించిన వైజ్ఞానిక కళావిషయ జ్ఞాన సముపార్జనకు ప్రయత్నాలు చేయాలని ఆశించిన విశాల దృష్టిని, ప్రశంసించింది ఆసమీక్ష.
కలకత్తా నుండి సుయెజ్ కెనాల్ మీదుగా సౌతాంప్టన్ వెళ్తున్న స్టీమర్ లో ప్రయాణ కాలం పూర్తిగా ఒక నెల. తిరుగు ప్రయాణం నెల. ఈ ప్రయాణ కాలపు అనుభవ కథనాన్ని ఇక ఆమె ఇంగ్లండ్ లో ఉన్న నాలుగు నెలల అనుభవ కథనాన్ని విడివిడిగా పరిశీలిస్తే జానకమ్మ వ్యక్తిత్వం దృక్పథం అర్ధం అవుతాయి.
1
ఈ యాత్రా చరిత్రలో రెండవ చాప్టర్ అంతా సముద్రయానకాల అనుభవ కథనం. ప్రయాణీ కులు ఎక్కువమంది ఐరోపా వాళ్ళే అయినప్పటికీ దేశీయులకు కూడా వారితో సమానమైన సౌకర్యాలు ఉండటాన్ని ఆమె గుర్తించింది. తోటివాళ్లపట్ల యూరోపియన్లు చూపించే సామాజిక మర్యాద, చొరవ వల్ల ప్రయాణంలో ఒంటరితనం అనేది తన అనుభవానికి రాలేదని కూడా చెప్పింది. యూరోపియన్ల దైనందిన జీవనశైలిని, అలవాట్లను, అభిరుచులను ఆసక్తితో సన్నిహితంగా పరిశీలిస్తూ ఆరాధనాపూర్వకంగా వాటిని ప్రస్తావించింది.
రోజుకు అయిదుసార్లు తినే యూరోపియన్ ల పద్ధతి, వండి టేబిల్ మీద తినటానికి సిద్ధపరిచే పద్ధతిని వివరిస్తూ టేబిల్స్ ను అలకరించే పద్ధతి, రుచికరమైన వంటలను ఏర్పాటుచేసే పద్ధతి, పండ్లు మొదలైనవి అమర్చే తీరు , తేలివచ్చే వాసనలు ఎవరికైనా ఆ ఆహారం రుచి చూడాలనిపించేట్లు ఉంటుందని అంటుంది. అలా అని నేను నా కుల నియమాలు ఉల్లంఘించానని అనుకోవద్దు అంటూ తాను పాలు, వైన్ , పండ్లు మాత్రమే తీసుకొన్నానని చెప్పింది. ఆహారానికి సంబంధించిన కుల నియమాల ప్రస్తావను బట్టి జానకమ్మ శెట్టి బలిజ కులానికి కాక కోమటి కులానికి చెందినదై ఉంటుంది అనుకోవచ్చు.
భోజనాల సమయంలో బల్లల దగ్గర కూర్చొని తింటూ స్త్రీపురుషులు రకరకాల విషయాల మీద మాట్లాడుకొంటూ మూడు నాలుగు గంటలు గడపటం, సంగీతం వచ్చినవాళ్లు పియానో వాయిస్తూ పాడటం చప్పట్లతో , నవ్వులతో శ్రోతలు వాళ్లకు అభినందనలు చెప్పటం అవన్నీ ఆమెకు నచ్చాయి. మిగిలిన సమయంలో డెక్ మీదకు వెళ్లి సముద్రపు గాలి పీలుస్తూనో , పుస్తకాలు చదువుకొంటూనో కాలం గడుపుతారని, చదువుకొనటానికి స్వల్ప మొత్తానికి పుస్తకాలు అద్దెకిచ్చే వ్యవస్థ కూడా స్టీమర్ లో ఉందని చెప్పింది. క్షణం వృధా చెయ్యని యూరోపియన్ల దినచర్య చూసిన జానకమ్మ ‘టైమ్ ఈస్ మనీ’ (సమయమే డబ్బు ) అన్న వాళ్ళ తత్వమే అందుకు కారణం అంటుంది.
ఈ ప్రయాణంలో ఆమెను బాగా ఆకర్షించింది ఆలోచింపచేసింది క్రైస్తవం. స్టీమర్ లో ప్రతి ఆదివారం జరిగే క్రెస్తవ మత ప్రార్ధనల గురించి చెప్తూ హోలీ బైబిల్ లోని భాగాలు చదువుతుంటే అర్ధం హృదయాన్ని తాకుతుందని అంటుంది. స్టీమర్ లో సంభవించిన ఒక మరణం గురించి చెబుతూ చర్చ్ నుండి పొందిన అధికారంతో మరణించిన వ్యక్తి పట్ల చేయవలసిన కార్యక్రమాన్ని బైబిల్ చదువుతూ కెప్టెన్ నిర్వహించటాన్ని , డాక్టర్ సంతాప ప్రసంగం చేయటాన్ని ఆ తరువాత శవ పేటికను సముద్రంలోకి జారవిడవటాన్ని గురించి చెప్తూ పురోహితుడు, సంస్కృత మంత్రాలు అవసరంలేని ఆ కార్యక్రమంలోని సారళ్యం తనకు నచ్చింది అని చెప్పింది. అందరికీ అర్ధమై భాషా సారళ్యం , హృదయానికి తాకే సౌందర్యం , ఆర్ద్రీభూతం చేయగల సత్తా ఉన్న క్రైస్తవ ప్రార్ధనల వంటివి హిందువులకు లేకపోవటం గురించి విచారపడింది. ఇది మనం కూడా అలవరచు కొన వలసిన విధానం అంటుంది. ఇలా అన్నానని క్రైస్తవాన్ని ప్రచారం చేస్తున్నాని అనుకోవద్దు, పరిస్థితులు , అవసరాలు ఆ అవగాహనను కలిగించాయి అని చెప్పింది. త్వరలో మన మంత్రాలను కూడా అందరికీ తెలిసే భాషలోకి అనువాదం చేసే రోజు వస్తుందని ఆశాభావం కూడా ప్రకటిస్తుంది.
బైబిల్ గురించిన అవగాహనా కూడా ఆమెకు బాగానే ఉంది. ఎఱ్ఱసముద్రం గుండా ప్రయాణం సాగుతున్నప్పుడు ఆ పేరు ఎలా వచ్చిందో సూచించే కథనాలు బైబిల్ లో ఉన్నాయని చెప్పటం అందుకు నిదర్శనం.ఈ ప్రయాణంలోనే ఒక నెలరోజులలోనే క్రైస్తవం పట్ల ఇంత ఆరాధన, బైబిల్ విషయాలపట్ల ఇంత అవగాహన కలగటం సాధ్యకాదు. మద్రాస్ లో కులీన వ్యాపారవర్గ స్త్రీగా పాలకవర్గాల మతం తో మెలగవలసిన పరిస్థితులు, అవసరాలు అందుకు దోహదం చేశాయి అన్నది స్పష్టం.
ఈ ప్రయాణంలో మూడు సందర్భాలలో బ్రిటిష్ పాలకుల పట్ల జానకమ్మ గౌరవాభిమానాలు వ్యక్తమయ్యాయి.శ్రీలంక నుండి బయలుదేరి ఎడెన్ దిశగా స్టీమర్ పోతుండగా జబ్బు పడి కలకత్తానుండి స్వస్థలానికి ఒంటరిగా బయలుదేరిన ఒక యూరోపియన్ ప్రయాణీకుడు మరణించాడు. దానికి సానుభూతితో స్పందిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా యూరప్ నుండి తమ ఇళ్లను, కుటుంబాలను వదిలి భారతదేశానికి రాగలిగిన వాళ్ళ ధైర్యాన్ని. యువకులైనా, వయసుమీరిన వాళ్ళైనా ఒకేరకం ఉత్సాహంతో పనిచేస్తున్న తీరును మెచ్చుకొన్నది.
సముద్రంలో ప్రయాణిస్తూ ఓడలను నడిపే సాంకేతిక జ్ఞాన విషయాలను తెలుసుకొంటూ , పరిశీలిస్తూ అబ్బురపడుతూ ఆమె వెలి బుచ్చిన అభిప్రాయలు గమనించదగినవి. ఓడలను గమ్యాన్ని చేరేట్లు దిశా నిర్దేశం చేసే కంపాస్ గురించి వివరించి ఇలాంటి ఆవిష్కరణలు లేకపోతే సరుకుల రవాణా , ఇతరదేశాలతో సంబంధాలు అభివృద్ధిచెందవు కదా అంటుంది. ఒక ఓడ ఒక స్థలం నుండి ఎంతదూరం వచ్చింది? నిర్దేశిత ప్రాంతం చేరటానికి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలి వంటివి నిర్ణయించే పరికరాలు కూడా వాడుతున్నట్లు పేర్కొన్నది. దేశవికాసం, సుసంపన్నత ఇలాంటి ఆవిష్కరణలలోనే ఉందని కూడా అభిప్రాయపడింది. ఈ సందర్భంలో ఇంగ్లీష్ జాతి వైజ్ఞానిక తత్వాన్ని ఆరాధనా భావంతో ప్రశంసించింది.
ఇక్కడ జానకమ్మ ఓడలను రేవుకు అనుమతించటానికి సంబంధించిన పాలనా పద్ధతిని కూడా ఆమె అభినందన పూర్వకంగా పేర్కొన్నది. ఓడ తీరాన్ని సమీపిస్తున్నదంటే కంపెనీకి చెందిన డిప్యూటీ ఏజంట్ ఓడ తో కలిపి కట్టబడి పక్కనే వస్తున్న పడవలోకి దిగి కంపెనీ జండాను ఎగరేసి తన విధులలోకి దిగుతాడని , అప్పుడు పోర్ట్ సర్జన్ వచ్చిప్రయాణంలో ఏవైనా మరణాలు సంభవించాయా , ఎవరైనా త్వరగా సమూహాలలో వ్యాపించగల అంటూ వ్యాధులతో బాధపడుతు న్నారా అని ఓడ డాక్టర్ ను అడిగి తెలుసుకొంటాడని, అలాంటి వాళ్లు ఉన్నారని తెలిస్తే క్వారంటైన్ నియమాలను అమలు పరుస్తాడని, దానిప్రకారం ఆ ఓడను ఒడ్డుకు రానీయకుండా సముద్రం లోనే నిలిపివేస్తారని చెప్పి ఇలా పాలకులు వొడ్డున ఉన్న వేలాదిమంది ప్రాణాలను కాపాడే క్వారంటైన్ నియమాలు పాటించటం తెలివైన ముందు జాగ్రత్త చర్య అని అభినందిస్తుంది.
బ్రిటిష్ పాలకుల జీవన విధానం, మతం, వైజ్ఞానిక పురోగతి, పాలనా దక్షతలను మాత్రమే కాక వివిధప్రాంతాలను వాళ్ళు ఆక్రమించుకున్న చరిత్రను కూడా ఆమె ఏవిధమైన ఫిర్యాదీ స్వరం లేకుండానే ప్రస్తావించటం చూస్తాం. దక్షిణ అరేబియా (యెమన్) ఓడరేవు ఎడెన్ లో ఓడ ఆగిన సందర్భంలో 1839 నాటికే బ్రిటిష్ వాళ్ళు ఎడెన్ పై దాడిచేసి వశంచేసుకొని బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం చేసుకొన్న చరిత్రను చెప్పింది. మెడిటరేనియన్ సముద్ర ద్వీప దేశం మాల్టా రేవును చేరిన సందర్భంలో ఒడ్డున ఉన్న యూరోపియన్ జనాన్ని చూస్తే అది ఐరోపా భూభాగమే అన్నట్లుగా ఉందని అంటుంది జానకమ్మ. యూరోపియన్ మహిళల దుస్తులకు విరివిగా వాడబడే లేస్ అక్కడినుండే వస్తుందని ఆమెకు తెలుసు. నీలిమందు, కుంకుమ పువ్వు అత్యధికంగా ఎగుమతిచేయబడే పత్తి పంటలకు ప్రసిధ్ధప్రాంతం అయిన మాల్టా తొలుత నెపోలియన్ బోనపార్టే వశమై 1800 లలో వచ్చిన కరువు కాలంలో బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చి 1814 పారిస్ ఒప్పందంతో బ్రిటిష్ వారికి దఖలు పడిన చరిత్రను ప్రస్తావిస్తుంది. సముద్ర మార్గ వ్యాపారంపై ఆధిపత్యాన్ని స్థిరీకరించుకొనే క్రమంలో బ్రిటిష్ వారు తమ ప్రయోజనాల కోసంసముద్ర తీర ప్రధాన ఓడరేవులను ఆక్రమించటం కూడా జానకమ్మకు వాళ్ళ సామర్ధ్యంగానే అర్ధం అయింది అనిపిస్తుంది.
సముద్రయాన అస్వస్థతకు తాను గురి కాలేదని , ఒడ్డున ఉన్నంత స్వేచ్చగా , హాయిగా సముద్ర మధ్యలో కూడా ఉండ గలిగానని , తోటి స్త్రీలు ఎవ్వరు డెక్ మీదకు రాకపోయినా తాను ఒక్కతే వచ్చి ఓడ కదలికలకు అనుగుణంగా బ్యాలెన్స్ చేసుకొంటూ తిరుగుతుంటే సంతోషించి కెప్టెన్ అభినందించాడని ఎవరితోనైనా తనగురించి మంచి సముద్ర ప్రయాణీకురాలని చెప్పేవాడని చెప్పుకొన్నది.
తనకు వచ్చిన ఇంగ్లీష్ కాస్తే అయినా వివరించటంలో భర్త చేసే సహాయం , ఆయన లేనప్పుడు తన వచ్చీరాని ఇంగ్లీష్ తో ఆయా చేసే సహాయం వల్ల మొత్తం మీద తన ఆలోచనలను చక్కగానే వ్యక్తం చేయగలిగేదానిని అని చెప్పింది. ఆ రకంగా ఆ నెల రోజుల ప్రయాణ కాలం ‘నీటిలో కదిలే ఇళ్లల్లో’ చేసిన అందమైన కాపురంగా భావించింది ఆమె. సముద్రం నుండి బయటకు పొడుచుకు వచ్చిన చిన్నచిన్న పర్వతాలను చూస్తూ రామాయణం లోని మైనాక పర్వత ఉదంతాన్ని గుర్తుచేసుకొనటం ఆమె సంప్రదాయ సాహిత్య పాండిత్యానికి గుర్తు మాత్రమే కాదు, ఆమె నిశిత పరిశీలనాశక్తికి , పోల్చి చూసి సంబంధ వైరుధ్యాలను గుర్తించగల సూక్ష్మ దృష్టికి కూడా నిదర్శనం.
2
లండన్ ను గంధర్వ లోకంగా సంభావించింది జానకమ్మ. లండన్ కు చేరాక హోటల్లో దిగి అతి కొద్దీ కాలంలోనే బ్రామ్ ప్టన్ ప్రాంతంలో నాలుగు అంతస్థుల నివాసగృహం లో అద్దెకుచేరారు. నాలుగు నెలల నివాసకాలంలో ఆమె కు ఆ ఇంటితో ఎంత గాఢమైన మోహం ఏర్పడిందో కానీ తిరిగివచ్చాక మద్రాస్ లో ఎగ్మూర్ లోని తమ ఇంటికి బ్రామ్ ప్టన్ హోమ్ అని పేరుపెట్టుకొన్నది. ఈ యాత్రాచరిత్రను లేడీ జులియా రాబిన్ సన్ కు అంకితం ఇస్తూ వ్రాసిన వాక్యాల కింద తన ఇంటి ని ఆ పేరుతోనే పేర్కొన్నది.
లండన్ లో ఆమె మొదటి పరిశీలన పనివాళ్లకు సంబంధించినది. భారతదేశంలో ఇళ్లల్లో ఎప్పుడూ ఉండే పనివాళ్ళు కూడా నేల మీద పడుకొనటమే ఆమెకు తెలుసు. కానీ లండన్ లో పనివాళ్ళ కు పడుకొనేందుకు మంచాల ఏర్పాటు ఉండటం ఆమెను ఆశ్చర్య పరిచింది. వాతావరణ ప్రత్యేకతలు వల్లనే ఆ ఏర్పాటు జరిగివుంటుందని ఆమె అభిప్రాయపడింది. ఆమె తనవెంట ఎంత మంది సేవకులను తీసుకొనిపోయిందో కానీ ఒక్క వంటకు తప్ప వాళ్లేందుకూ ఉపయోగపడరని తేల్చుకొన్నది. ఇంగ్లిష్ పనివాళ్ల సామర్ధ్యాన్ని ప్రశంసాపూర్వకంగా పేర్కొన్నది. ఇంగ్లండ్ గృహజీవితంలో ఆడపనివాళ్లకు , మగపనివాళ్లకు వేరువేరుగా ఉండే పై స్థాయి పనివాళ్లు - హౌస్ కీపర్, బట్లర్. సరుకులు తెప్పించటం దగ్గరనుండి పిల్లలపోషణ కు ఉండే నర్సులతో సహా అనేకపనులు చేయటానికి నిర్దిష్టమైన పేర్లతో ఏర్పడి ఉన్న పనివాళ్ళ వ్యవస్ధను గురించి జానకమ్మ చెప్పినది అంతా అత్యంత ధనికవర్గ కుటుంబాలకు సంబంధించినదే కానీ సామాన్య కుటుంబాలకు సంబంధించింది కాదు. ఈ వ్యవస్థలో యజమానులకు తమంతట తాము చేసుకోవలసిన పనులే ఉండవు. అక్కడ పనివాళ్లకు జీతాలు ఎక్కువని, ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నదేశీయ గుమస్తా జీతం అంత జీతం వాళ్లకు లభిస్తుందని , స్త్రీ జనాభా ఎక్కువ కావటం వల్ల పనివాళ్లలో ఎక్కువమంది స్త్రీలే కనబడతారని చెప్పింది.
పంజరం విడిచిన పక్షిలాగా తనవంటి వాళ్ళు విసుగు , ఆకలి లేకుండా లండన్ అద్భుతాలను చూడటానికి రోజంతా తిరగటానికి ఇష్టపడతారని అంటుంది. స్వదేశంలో ఎప్పుడూ తన ఆలోచనకే రాని శారీరక వ్యాయామం వైపు ఇక్కడ తన దృష్టి మళ్లిందని హైడ్ పార్క్ లో అనుదినం ఎంతెంతో దూరాలు నడిచే అవకాశాన్ని సంపూర్ణంగా వాడుకొన్నాని చెప్పింది. ఇళ్లల్లో స్త్రీలు అతిధులను ఆనందపరచటానికి పియానో వాయిస్తూ పాడతారని, అతిధులు వెళ్తుంటే పండో, వైనో , టీనో , బిస్కెట్లో ఇయ్యటం అక్కడ మర్యాద అని అది స్వదేశంలో తాంబూలం ఇచ్చి పంపించే ఆచారం వంటిదని చెబుతుంది.
అదే సమయంలో ఇంగ్లండ్ ప్రత్యేకత దేశంలో దాదాపుగా స్త్రీలందరూ విద్యావంతులు కావటం అనిపేర్కొన్నది జానకమ్మ. అలాంటి విద్యావంతులైన స్త్రీలలో కొందరు భారతీయుల సంక్షేమం కోసం పనిచేశారని చెబుతూ లేడీ వాటర్ లూ, మిస్ మేరీ కార్పెంటర్, మిసెస్ ఆర్నాల్డ్, మిస్ మన్నింగ్ తదితరులను కృతజ్ఞతతో తలచుకొన్నది
నాలుగు అయిదు అధ్యాయాలలో లండన్ అద్భుతాలను వివరించింది. లండన్ పోలీస్ ఫోర్స్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనది అంటుంది. వర్తకం గురించి చెప్తూ ఇంగ్లీషువారికి ఇతరదేశాలతో సంబంధ సాధనం వ్యాపారమే అంటుంది. ఇండియా తదితర దేశాలనుండి ముడి సరుకుని దిగుమతి చేసుకొని మాంచెస్టర్ , బర్మింగ్ హామ్, షెఫల్డ్ తదితర ప్రాంతాలలో పెద్ద పెద్ద యంత్రాలతో వాటిని వస్తువులుగా మార్చి మళ్ళీ ఆదేశాలకే ఎగుమతి చేసి ఇబ్బడిముబ్బడి లాభాలను పొందుతున్న ఇంగ్లండ్ వ్యాపార సూత్రం సరిగానే గ్రహించి చెప్పింది. లండన్ ఒక వ్యాపార ప్రపంచం అంటుంది. లెక్కలేనన్ని బాంకులు దాని ఫలితమే అంటుంది.
బజార్లలో ఎక్కువభాగం దుకాణాలను స్త్రీలే నడుపుతారని వాళ్ళు ధరలు చెప్తూ వస్తువులను అమ్మే తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పింది. చాసర్, షేక్స్ పియర్, మిల్టన్, జాన్సన్, స్పెన్సర్, డ్రైడన్ , బట్లర్ మొదలైన వారి సమాధులున్న పోయెట్స్ కార్నర్ గురించి చెప్పటం ఆమె సాహిత్య ఆసక్తులను సూచిస్తున్నది.
లండన్ లోని అద్భుతాలకు అబ్బురపడుతూ ఆరాధనగా చెప్పుకువచ్చిన జానకమ్మ విశ్వాసాలు ది టవర్ అఫ్ లండన్ చూసినప్పుడు కొంత కదలబారటం చూస్తాం. చారిత్రకమైన ఆ కట్టడం గురించి, అక్కడ సంభవించిన అనేక ఘటనల గురించి అక్కడి కావలివాళ్ళు 12మంది సందర్శకులను ఒక సమూహంగా వెంటపెట్టుకొని ఆ టవర్ లోపల భాగాలను చూపిస్తూ అనర్గళంగా చెప్పిన విషయాలు విన్నాక తనకు కలిగిన భావాలను పేర్కొన్నది. అది పురాతన కాలంలో ఒక కోట. తరువాత జైలుగా మార్చారు. ఆ తరువాత అది అనేక టవర్లుగా విడగొట్టబడిన భవనం. ఆ టవర్లను చూస్తూ ఒక చోట ఆయా చారిత్రక కాలాలకు సంబంధించిన రకరకాల ఆయుధాలు చూశానని వాటిని ఎప్పుడెప్పుడు ఎవెరెవరు వాడుతూ ఎన్ని అత్యాచారాలు చేశారో కావలి వాళ్ళు వివరిస్తుంటే తాను వినలేకపోయానని అంటుంది జానకమ్మ. ఇంగ్లీషు వాళ్ళు దిగ్భ్రాంతికరమైన ఇలాంటి పనులు చేయగలరని తాను ఎప్పుడూ ఊహించలేదు అంటుంది. అయితే నేరస్థులజీవితాన్ని పాశవికంగా అనాగరికంగా హింసకు గురిచేయడం లేదా నేరస్థులను గొడ్డలితో నరికెయ్యటం ప్రాచీనకాలాల బ్రిటిష్ పాలకుల నైజంగా తాను ఊహిస్తున్నాను అని చెప్పటం ద్వారా సమకాలీన బ్రిటిష్ పాలకవర్గాల పట్ల తన విశ్వాసం చెదరలేదనే సంకేతాన్ని ఇచ్చినట్లయింది.
లండన్ అద్భుతాలు అనే ఉపశీర్షిక లేకపోయినా ఆరు, ఏడు, ఎనిమిది అధ్యయాలలో కూడా ప్రధానంగా లండన్ లో జానకమ్మ తాను చూసిన ఇంగ్లండ్ రాణి వంటి వ్యక్తులను, అక్కడ జరిగే ఆధికారిక ఉత్సవాలను, స్థలాలను, పార్కులను, వివిధ వస్తు కళా ప్రదర్శన శాలలను, రాజభవనాలను, వినోద వికాస కేంద్రాలను, వ్యాపార కూడలులను, అనాథ సంక్షేమ గృహాలను- ఇలా అనేక స్థలాలను పరిచయం చేసింది. ఇక అక్కడి కట్టడాలగురించి, కళా వస్తు ప్రదర్శన శాలలగురించి సూక్ష్మ వివరాలతో ఆమె ఎంతో సమాచారం ఇచ్చింది. ఈ విషయంలో ఆమె పాఠకులను పర్యాటకులనుచేసి వెంటపెట్టుకొని తిప్పుతూ ఇంగ్లండ్ అద్భుతాలను చూపిస్తూ వివరించే ఒక టూరిస్ట్ గైడ్ పాత్రను నిర్వహించింది.
ఈ మొత్తం పర్యటనలో ఏది చూస్తున్నా బ్రిటిష్ సంస్కృతీ సంపదల పట్ల ఎంత అభిమానం వున్నా తన భారతీయ అస్తిత్వం జానకమ్మ మరిచిపోలేదు. హౌస్ అఫ్ పార్లమెంట్ ను చూస్తున్నప్పుడు ఇండియాతో ప్రత్యక్ష సంబంధం ఉన్న సంస్థ అదొక్కటే అనుకొన్నది ఆమె. భారతదేశ శ్రేయస్సుకు సంబంధించి గానీ, శోకానికి సంబంధించిగానీ అక్కడ జరిగే నిర్ణయాలే కీలకమైనవి అని భారత దేశ అదృష్ట దురదృష్టాలను నిర్ణయించేవి అవే అని ఆమె అభిప్రాయం పడింది. అలాగే ఇన్స్ ఆఫ్ కోర్ట్ ( INNS OF COURT ) గురించి చెప్పినది కూడా భారతదేశ సంబంధంలోనిదే. ఇన్స్ ఆఫ్ కోర్ట్ అంటే న్యాయ విద్యా సంబంధమైన వసతి గృహ సముదాయం.
ఇండియన్ సివిల్ సర్వీస్ లో ఉన్నత పదవులు పొందటానికైనా పై స్థాయి న్యాయస్థానాల్లో వాదించటానికి అవసరమైన అర్హత సంపాదించటానికైనా బ్రిటిష్ ఇండియాలో భారతీయులు ఇంగ్లండ్ లో చదివి ఉత్తీర్ణులు కావలసిన పరిస్థితులలో బెంగాల్ సంపన్న వర్గం నుండి అటువైపు కదలిక మొదలైంది. 1860 లలో మన్మోహన్ ఘోష్ అలా ఇంగ్లండ్ లో బారిస్టరైన మొదటివాడు. కలకత్తా హైకోర్టులో 1867 లో ప్రాక్టీస్ చేసినవాడు. ఆతరువాత ఐదారేళ్లకే జానకమ్మ లండన్ వెళ్ళింది. ఇన్స్ ఆఫ్ కోర్టు ను చూసింది. వాటి గురించి ఆమె చెప్పిన విషయాలు ఆసక్తి కరమైనవి.
లండన్ లో న్యాయస్థాన ఆవరణలో మూడు వసతి గృహాలు ఉన్నాయని అవి ఇన్నర్ టెంపుల్ ( లోపలి ఆలయం ), గ్రేస్ నిలయం.( Gray’s Inn ) లింకోలన్స్ నిలయం( Lincoln’s Inn) అని చెప్పి భారతదేశం నుండి బారిస్టర్ చదవటానికి వెళ్లే వాళ్ళు వీటిలోనే చదివి ఉత్థర్ణులు కావలసి ఉంటుందని చెప్పింది. (మన్మోహన్ ఘోష్ లింకోలన్స్ నిలయం లో చదివాడు) ఈ ఆవరణలో చదువుకొంటున్న పి. వెంకట కృష్ణమ నాయుడు అనే మిత్రుడు తమను తీసుకొనివెళ్ళి చూపించాడని అక్కడ తాను చూసినవి గ్రహించినవి చెప్పింది. భవనాలు విశాలమైనవి, ఉదాత్తంగా నిర్మించబడినవి. ఒక పెద్ద హల్ లో ప్రపంచంలో గొప్పగొప్ప జాతులకు చెందిన న్యాయసూత్ర నిర్మాతల చిత్రపటాలు ఉన్నాయని వాటిలో భారతదేశ న్యాయసూత్ర దాత మనువు బొమ్మ ఉందని పేర్కొన్నది. అనుబంధంగా ఉన్న గ్రంథాలయాన్ని , అక్కడ చదివే విద్యార్థులు , న్యాయవాదులు మొదలైనవాళ్ళ భోజనాల కోసం ఏర్పాటైన వంటశాలను ఆమె చూసింది. అక్కడ చదివే హిందూ విద్యార్థులు కులం వల్ల బ్రాహ్మలు కావచ్చు, బలిజలు కావచ్చు ఎవరైనా తమ అధ్యయన కాలం పూర్తి చేసుకొనటానికి ఇంగ్లీష్ వాళ్ళతో ఒకే బల్ల మీద భోజనం చేయటం తప్పనిసరి అని అక్కడ అమలవుతున్న ఒక నియమాన్ని చెప్పింది. ఈ విధమైన కుల మత హద్దులను చెరిపివేసే ఈ విధమైన సామాజికీకరణ ప్రక్రియ భారతదేశ చరిత్రలో భక్తిఉద్యమాల చాపకూటి భోజనాలను , సంస్కరణోద్యమ కాలం నాటి సహపంక్తి భోజనాలను గుర్తుకు తెస్తుంది.
ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. హిందూ విద్యార్థులలో అతను బ్రాహ్మడు కానీ బలిజ కానీ ( be he a Brahmin or Bulga ) అని రెండు కులాలనే ప్రస్తావించింది. తాను బలిజశెట్టి కావటం వలన అలా అన్నదా అని అనుమానం రాక మానదు. ప్రయాణ సందర్భంలో కుల సంబంధ ఆహారపుటలవాట్ల గురించి మాట్లాడిన సందర్భాన్ని ఈ సందర్భాన్ని కలిపి చూస్తే మళ్ళీ ఆమె కులం ఇది అని నిర్ధారించలేని సందిగ్ధ స్థితే ఎదురవుతుంది. అదలా వదిలేద్దాం.
లండన్ లో ఉన్న కాలంలో జానకమ్మ అక్కడి నుండి మాంచెస్టర్ కు , పారిస్ కు వెళ్లివచ్చింది. ఆ ప్రయాణ కాలపు ఆమె అనుభవాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, మొత్తంగా లండన్ ప్రపంచం ఆమె మీద వేసిన ముద్ర ఈ యాత్రాచరిత్రలో కీలకమైనవి. వాటి గురించి వచ్చే నెలలో మాట్లాడుకుందాం.
ప్రసిద్ధ కవి ఎండ్లూరి సుధాకర్ మరణం తెలుగు దళిత సాహితీ లోకానికి తీరని లోటు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా వారితో నాకు పరిచయం ఉంది. ఇంకా వారు ‘వర్తమానం’ కవితా సంపుటిని ప్రచురించక ముందే నేను ‘రహస్య చిత్రం’ కవితా సంపుటి వెలువరించాను. దాన్ని వారు పోస్టులో తప్పించుకొని, చదివి, బాగుందని ఒక కార్డుముక్క రాశారు. ఆ తర్వాత వారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు కావడం, నేను కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యుడిగా అపాయింట్ కావడం వలన మా స్నేహం బలపడింది. వివిధ ప్రాంతాల్లో జరిగిన సదస్సుల్లో కలుసుకున్నప్పుడు సాహిత్య చర్చలు చేసుకునేవాళ్ళం. నేనెప్పుడూ రాజమండ్రికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేసే వాడిని. తర్వాత వారు రైల్వే స్టేషన్ వరకు వచ్చి రైలు ఎక్కించి వెళ్లేవారు. వారెప్పుడూ వరంగల్ కు వచ్చినా మా ఇంటికి వచ్చి భోజనం చేసి ఇ వెళ్లేవారు. ఒకసారి సుధాకర్ గారు, వారి శ్రీమతి హేమలత గారు కూడా మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లారు. తరచూ సెల్ ఫోన్ లో సంభాషించే వాళ్ళం. వారి పెద్దమ్మాయి మానస వివాహం రాజమండ్రి లో జరిగింది. ఆ వివాహానికి వారు ఆహ్వానిస్తే వెళ్లి వచ్చాను.
కొన్నాళ్లకు హేమలత గారు మరణించడం, వారు మానసిక వేదనకు గురి కావడం, ఒకటి రెండు సార్లు ఆ బాధను కూడా పంచుకున్నారు.
సుధాకర్ గారికి షుగర్ తీవ్రంగా ఉండడం వలన వారి కాలు తీసేసిన విషయం సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్య మిత్రుడొకరు చెప్పగా చాలా బాధపడినాను. వారికి ఫోన్ చేసి మాట్లాడాలని ఒకటి రెండు సార్లు ప్రయత్నించి మానేశాను. కాలు తీసేశాక మాట్లాడే ధైర్యం చేయలేక పోయాను. వారు ఎక్కడో ఒక చోట కలుస్తారు, అప్పుడు మాట్లాడవచ్చు అని అనుకున్నాను. కానీ సుధాకర్ గారు శాశ్వతంగా ఈ లోకంలోంచే వెళ్లిపోయాక వారితో ఒక్క మాటైనా మాట్లాడాల్సి ఉండే కదా అని బాధపడుతున్నాను.
మంచి కవి, మంచి వక్త, స్నేహశీలి మరణం వ్యక్తిగతంగా నాకు సాహిత్యపరంగా అందరికీ తీరని లోటే. వారి ఆత్మకు శాంతి చేకూరాలి; వారిద్దరి పిల్లలకు నా ప్రగాఢ సానుభూతి.
కాకతీయ విశ్వవిద్యాలయం
వరంగల్
‘‘రాజు మరణించె నొకతార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగనమేగె’’
కవి ఎండ్లూరి సుధాకర్‍గారి అకాల మరణం సాహితీ లోకాన్ని విషాదంలో ముంచింది. సాహితీ సాగరంలో శూన్యాన్ని మిగిల్చింది. జి.లక్ష్మి నరసయ్యగారన్నట్లు కవి ఎండ్లూరికి అధిక పాఠకలోకముంది. వారి బాధాతప్త హృదయాలలో కలిగిన ప్రకంపనలే ఎండ్లూరి అనురాగ మూర్తిత్వానికి నిదర్శనం. దళితకవిగా, తెలుగుకవిగా,ఎంత చెప్పుకున్నా ఆచార్య దార్ల వెంకటేశ్వర్లుగారు చెప్పినట్లు ఎండ్లూరి సుధాకర్ సార్ మానవీయ మూర్తిగా,ప్రేమమూర్తిగా కనబడుతాడు.
మా తెలుగు విభాగం ఆచార్యులు బన్న అయిలయ్యగారు బి. వో.ఎస్.గా ఉన్న కాలంలో రాజమండ్రి నుండి కాకతీయ విశ్వవిద్యాలయం తరచుగా వచ్చేవారు ఎండ్లూరి సుధాకర్ సార్. కాకతీయ విశ్వవిద్యాలయంలోని గెస్టుహౌజ్‍లో బస చేసే సుధాకర్ సారుకు నేను బ్రేక్‍పాస్టు తీసుకెళ్ళేవాణ్ణి. ఉదయం ప్రశాంతంగా ఏం చేస్తున్నావు,ఏం చదువుతున్నావు అని అడిగి దళితులకు చదువును నమ్ముకోవడం తప్పా వేరే మార్గంలేదని మనల్నీ మనమే నిరూపించుకోవాలని చెప్పాడు. ఆచార్యులు బన్న అయిలయ్యగారితో ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారికున్న స్నేహంవల్ల అయిలయ్యగారి శిష్యుడినైన నాకు సుధాకర్ గారితో కొంత సన్నిహితం ఏర్పడింది.విశ్వవిద్యాలయం గెస్టుహౌజ్‍లోనే తన ‘‘కావ్యత్రయం’’ను ఆత్మీయంగా అందజేసాడు. అయితే ఇదే మా మొదటి పరిచయం కాదు. నేను పరిశోధన చేస్తున్న సమయంలో ‘‘సమాంతర వాయిస్’’అనే పత్రికలో‘‘దిగిరాకు దిగిరాకు’’ అనే దండోర కవిత ‘మమత’ అనే కలం పేరుతో అచ్చయింది. ఈ కవితను చూసి ఎండ్లూరి సుధాకర్ గారు ఫోన్ చేసి నీ కవిత బాగుంది, ఇలాంటివి ఆంధ్రజ్యోతి పత్రికకు పంపించు,ఇలా దండోర కవిత్వం రాస్తూవుండమని అభినందనలు తెలిపి, కలం పేరు కాకుండా స్వంత పేరుతో కవిత్వం రాయమని ప్రోత్సాహించాడు. అయితే 2017లో వెలువడిన నా తొలి కవితా సంపుటి ‘‘తునకలందని దండెం’’లో చాలా దండోర కవితలు చోటు చేసుకున్నాయి. దీనికి ఎండ్లూరి సుధాకర్ సార్ ‘‘కవితా శంకరం’’అనే ముందుమాట రాసాడు. నా రెండవ కవితా సంపుటి ‘‘నల్ల రక్తకణాలు’’పంపినపుడు ఫోన్ చేసి మాట్లాడిన మాటలు మెలకువలు ఇంకా గుర్తున్నాయి.
మాతెలుగు విభాగం శాఖాధ్యక్షులుగా ఆచార్య కాత్యాయని విద్మహే గారు, బి.వో.ఎస్.గా ఆచార్య బన్న అయిలయ్యగారున్న సమయంలో అంటే 2013లో పి.జి. సెలబస్ మార్చే క్రమములో ‘మహిళా జీవితం-అధ్యయనం-సాహిత్యం’, దళిత సాహిత్యం రెండు పేపర్లు పెట్టారు. పి.జి. విద్యార్థులకు దళిత సాహిత్యంలో ఆచార్య ఎండ్లూరి సుధాకర్ సార్ రాసిన ‘‘నల్ల ద్రాక్ష పందిరి’’ పాఠ్యాంశంగా వుంది. మొదట ఆచార్య బన్న అయిలయ్యగారు బోధించిన, కొంత కాలానికి దళిత సాహిత్యం బోధించే అవకాశం నాకు లభించింది. అప్పటి నుండి నేటి వరకు ‘‘నల్ల ద్రాక్ష పందిరి’’కావ్యాన్ని బోధిస్తున్నాను. అమ్మగాజులు, ఆత్మకథ, గూర్కా, డక్కలిపిల్ల, దాసును చూడాలి. నల్లతల్లి, నాన్న, నీలిక, నెత్తుటి ప్రశ్న, మైసమ్మమరణం, వర్తమానం మొదలగు కవితలల్లో దళిత సామాజిక జీవన అభివ్యక్తి నిండివుంది కనక నేను బోధించే సమయంలో కొంత ఆర్థ్రతకు లోనైయ్యేవాడిని. విద్యార్థులకు ‘‘నల్ల ద్రాక్ష పందిరి’’ చెబుతుంటే నా గురించి నేనే చెప్పుకున్నట్లు నామూలాల గురించి నేను చెప్పుకున్నట్లే ఉండేది. సుధాకర్ సార్ ఫోన్ చేసినపుడు నేను పి.జి విద్యార్థులకు ‘‘నల్ల ద్రాక్ష పందిరి’’ కావ్యాన్ని బోధిస్తున్నాను అన్నపుడు సంతోషంగా అభినందనలు తెలియజేస్తూ పఠనంలో మెలకువల గూర్చి తెలిపాడు. ఏది చెప్పాలనుకున్న ఎవరితో చెప్పాలనుకున్న విషాయాలను వెంటనే వ్యక్తపరచేవారు. ఇలా వారితో నాకున్న అనుబందం తక్కువే అయినా గుర్తుండి పోయేవిగా వున్నాయి.
సుధాకర్ సార్ సతీమణి హేమలత మేడంగారు మరణించిన తరువాత హేమలత గారిపై స్మృతి కవితలు రాస్తూ వడ్సఫ్ మెసేజీలు వచ్చేవి. ఆ కవితలు చదివితే హృదయం భారమయ్యి కరుణారస భరితమయ్యేది.వాటికి బాధగా నేను స్పందించేవాణ్ణి. ఇలా మనుషుల మనుసులనే ప్రబంధాలుగా చదివిన సుధాకర్‍సార్.అక్షరాలను మెతుకులుగా తిన్న సుధాకర్‍సార్ దళిత సాహిత్యాన్ని,తెలుగు సాహిత్యాన్ని తన కవిత్వం ద్వారా కథల ద్వారా సుసంపన్నం చేసాడు.
‘‘అగ్రహం రాని అక్షరం జ్వలించదనీ
ఆర్థ్రత లేని వాక్యం ఫలించదనీ’’
చెప్పి తెలుగు సాహితీ లోకాన్ని విషాదంలోకి నెట్టివేసి ఇప్పుడు తనే ఈ లోకానికి దూరంగా కొత్త గబ్బిలమై గగన వీధిలోకి జనవరి 28న ఎగిరిపోయారు సుధాకర్‍సార్. వారి ఆశయాలకు అనుగుణంగా తెలుగు సాహితీ క్షేత్రం ముందుకు సాగాలని కోరుకుంటూ, వారి కూతుర్లు మానసకు మనోజ్ఞకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
-డా।।మంథని శంకర్
తెలుగు విభాగం
కాకతీయ విశ్వవిద్యాలయం
వరంగల్
మరాఠీ రచయిత్రుల ఆత్మకథలు
మరాఠీ మూలం : పు. ద. హాతకణగతీకర
కన్నడానువాదం: చంద్రకాంత పోకళె
తెలుగు : ఘట్టమరాజు
కొన్నేళ్ళ నుంచి మరాఠీలో మహిళల ఆత్మకథలు విరివిగా వెలువడుతున్నాయి. ఈ పరంపర దళిత ఆత్మకథలతో మొదలైంది. హైందవ సమాజంలో స్త్రీకూడా దళిత వర్గానికి చెందిందే అనే ఒక వాదం వుంది. అలా అని స్త్రీల ఆత్మకథలన్నీ పీడిత వర్గాల వాళ్ల కథలని చెప్పలేం. యాభై అరవై ఏళ్ల క్రిందట ఐదో పదో మహిళా ఆత్మకథలు మాత్రమే లభించేవి. లక్ష్మీబాయి తిలక్, రమాబాయి రానడేల స్వీయ చరిత్రలు తప్పితే మూడో ఆత్మకథ అగుపించేది కాదు. తర్వాత నర్సు సుందరాబాయి ఆత్మకథ మాత్రమే జ్ఞప్తికి వచ్చేది. 1940-45 మధ్యకాలంలో నే నా పుస్తకాన్ని చదివాను. సుందరబాయి రోగులకు సేవ చేసే సమయంలో అనుభవించిన వేదన మనోవ్యథ, అవమానాలూ, అవహేళనలు గుండెల్ని పిండివేసేవి. పురుషస్వామ్యయుగంలో స్త్రీలు ఎన్నో వెక్కిరింతలు, వేదనలకు గురవుతారన్న సంగతి నాకు అప్పుడే తెలిసి వచ్చింది.
స్త్రీలు వ్యక్తిగత గౌరవాదరాల్ని కాపాడుకోలేని దుస్థితి దాపురిస్తున్నదన్న విషయం కూడా నాకు అప్పుడే బోధపడింది. ఇలాంటి వెన్నో బాధల గాథలు నాకు మహిళల ఆత్మకథల్లో తారసిల్లాయి. నన్ను వేదనకు గురి చేశాయి కూడా. తర్వాతి యాభై ఏళ్ల అవధిలో వెలువడ్డ ఆత్మకథల్లో ఇలాంటి ఎన్నో సన్ని వేశాలూ, సందర్భాలూ కనపడ్డాయి. క్రమక్రమంగా స్త్రీలు సంఘంలో గౌరవ ప్రతిష్టలు గడిస్తూ, తమకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకో గలిగారనీ, అధికార, బాధ్యతాయుత పదవులు పొంద గలిగారన్న విశ్వాసం కలిగింది. సమాజంలో పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమానమైన హక్కులు ఇవ్వాలన్న చట్టాలు రావడం వల్ల వనితలకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభించసాగాయి. మహిళలు ఎన్నో రంగాల్లో కృషి చేయగలిగారు. గౌరవ మర్యాదలు పొందగలిగారు. ఇలా మహిళల ఆత్మకథల్లో వైవిధ్యం, వైశాల్యాలు వ్యక్తం కాసాగాయి. ఇవి చర్చనీయాంశాలు అయ్యాయి కూడా. మాధవి దేశాయి ఆత్మకథ ‘నాచ గె ఘమా’ (ఆడవే ఆటబొమ్మా) సునీతాబాయి ‘ఆహేమనోహరతరి’ (ఎంత్తసొగసుకత్తెఐనా) ఇటీవల పెద్ద చర్చకు గురైన కమలా పాధ్యే ‘బంధ – అనుబంధ’ (బంధం- అనుబంధం) ఆత్మకథలు, ఆ రచయిత్రుల భర్తలు ప్రసిద్ధ సాహిత్యవేత్తలు కావడం కూడా అవి సాహిత్య ప్రపంచంలోసంచలనం సృష్టించడానికి కారణాలని చెప్పొచ్చు. పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న రచయితల జీవిత విశేషాల గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస, ఉబలాటం పాఠక మహాశయులకు వుండటం సామాన్యమే కదా! ఆత్మకథల్లో రచయితల, రచయిత్రుల ఆత్మ నివేదనం వుండనే వుంటుంది. అలాగే వాళ్లు తమను లోతుగా విశ్లేషించుకొని, సమర్థించుకోవడమూ కద్దు. ఈ అభిప్రాయంతో అందరూ ఏకీభవించక పోవచ్చు. అందువల్ల ఈ అభిప్రాయం సరైనదనీ, కాదనీ నిఖార్సుగా చెప్పడం కుదరదు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే ఇలా అనొచ్చు. ఆత్మకథల్లో కటు సత్యం వుండదు. వ్యక్తిగత జీవితంలోని పచ్చినిజాల్ని ఇతరులకు చెప్పడం సాధ్యమా? ఈ విషయం గురించి తగినంత చర్చ ఇంకా జరగలేదు. కాని ఏదైనా ఓ వరిష్టమైన ఆత్మకథను పనికి మాలిన దనో, నాసిరకందనో నిరూపించదలచుకొన్నప్పుడు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఆ వ్యక్తి (ఆత్మకథారచయిత్రి) జీవితం లోని కటు సత్యం ఇదేనని నిరూపించడం విమర్శకులకు సాధ్యం కాని పని. విమర్శకుడు తన వాదాన్ని బలపరుచుకొనేందుకు లేదా సమర్థించు కొనేందుకు కొన్ని ఆధారాల్ని సూచించినా అతను నెగ్గుకు రాలేక పోతాడు. ఆత్మకథలు సత్యాన్ని కనుగొనే లేదా వెతికేందుకు చేసిన కొన్ని ప్రయోగాలు మాత్రమే అని భావిస్తే, ఏ సమస్యా వుండదు. ఇతరుల జీవితం గురించి అంతిమ నిర్ణయం తమదే అని భావిస్తే, అది తప్పే.
ఇటీవల మాధవీ దేశాయి ఆత్మకథ ‘నాచ గె ఘమా’ మరాఠీ సాహిత్య ప్రపంచంలో అల్లోలకల్లోలం సృష్టించింది. స్త్రీవాద హుంకారం ప్రతిధ్వనించిన మొట్ట మొదటి మరాఠీ మహిళా ఆత్మకథ ఇదే. ఈ పుస్తకం రెండు భిన్న సంస్కృతుల మిశ్రణం బానదాని శ్రీమంత జమిందారీ కుటుంబానికి చెందిన వ్యక్తి, సమాజంలో పేరు ప్రతిష్ఠలు గల రచయిత. అతని రెండవ భార్యగా వచ్చి, ఆ కుటుంబం సరి సంపదలు, ఆచార వ్యవహారాలు, పెత్తందారీ విధానాల్ని ఎదిరించే ధైర్యం లేని ఓ మహిళ కరుణా కథ ఈ స్వీయచరిత్ర. ఆమె తన భర్తతో కలిసి వేరే కాపురం పెట్టాలని ఆశించినా, విఫలమైంది. ఆమె ముగ్ధతకు సంతోషించి ఆమెను రెండవ భార్యగా స్వీకరించి, ఆ గర్భ శ్రీమంతమైన అత్తవారింట్లో ఆమె సమస్యలకు పరిష్కారం కలిగించలేని భర్త నిస్సహాయకత – ఇవన్నీ ‘నాచగె ఘమా’ ఆత్మకథలో శక్తిమంతంగా చిత్రించబడ్డాయి. రచయిత్రి మాధవీ దేశాయి తన వాదాన్ని సమర్థవంతంగా పాఠకుల ముందుంచింది. పుట్టింటి వాతావరణం, సంప్రదాయాలు, నమ్మకాలు, ఆశయాలు – ఆచరణలు వీటి మధ్య స్వతంత్రమైన ఆధునిక భావాలతో ముందడుగు వేస్తున్న ఓ నవయువతి వూపిరాడని అత్తింటి కాపురంలో ఎలా విలవిలలాడి పోయిందో మాధవీ దేశాయి హృదయానికి హత్తుకునేలా చిత్రించారు. శక్తిసామర్థ్యాల్ని కూడగట్టుకోకుండా, ఈ బంధనాల నుంచి విముక్తి పొందడమెలా అన్నదే రచయిత్రి పాఠకుల ముందుంచిన ప్రశ్న.
ఆత్మకథ ఆత్మపరిశీలన, ఆత్మ విమర్శ చేసుకునే ఓ సాహిత్య ప్రక్రియ అన్న మాట వాస్తవమే. కొన్ని స్వీయచరిత్రల్ని చదివినప్పుడు మనకు అలా అనిపించడమూ నిజమే. ఆత్మకథలో ప్రత్యేక వ్యక్తిత్వం, తప్పులు, మోసం, దగాలకు లోనైన వైనం వివరంగా రచయిత్రి చెప్పివుంటారు. రచయిత తాను సౌందర్యానికి మోహితుడై, పెళ్లాడిన నేపథ్యాన్ని తన దృష్టిలో వివరిస్తాడు. అతను కూడా నిజాయితీగా, ప్రామాణికంగా తన వాదాన్ని ప్రతిపాదించడమూ కద్దు. రచయిత్రుల ఈ ఆత్మ పరిశీలన, మనోవైజ్ఞానిక అంశాల తైపారును మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సి వుంటుంది.
నేను పైన కొన్ని పాఠకుల ఆదరణ పొందిన, చర్చలకు గురైన మహిళల కొన్ని ఆత్మకథల్ని ప్రస్తావించాను. వాటిని సంక్షిప్తంగా చెప్పడం సముచితం అని భావిస్తాను. ‘ఆహే మనోహరతరి’ (ఎంత సొగసుకత్తెఐనా) ఆత్మకథ రచయిత్రి (శ్రీమతి సునీతా బాయి. ఈమె ప్రసిద్ధ నాటక కారుడు, కళాకారుడు ఐన పు.ల. దేశపాండే భార్య. ఈమె వేలాది పాఠకుల మెప్పు పొందిన రచయిత్రి. ఈమె సమాజవాద భావాలు కల కార్యకర్త. తన అభిప్రాయాల్ని జంకుగొంకు లేకుండా, వాడిగా వేడిగా, స్పష్టంగా మౌఖికంగానూ, రచనల ద్వారానూ చెప్పగల దిట్ట. కార్యక్రమాల నిర్వహణలోనూ. సమాజసేవలోనూ నిరతురాలైన మహిళ. భర్త పు.ల. దేశపాండే ఆర్థిక వ్యవహారాల్ని చక్కగా నిర్వహించగలిగిన వ్యవహార చతుర కూడా ఈమె పు. ల. దేశపాండే ట్రస్టు స్థాపించి, దాని నిధుల్ని సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకై సద్వినియోగం చేసిన సేవాతత్పరురాలు. బహుముఖ ప్రతిభావంతుడైన భర్త పు.ల. దేశపాండే వ్యక్తిత్వం గురించి ఈమె తన ఆత్మకథలో ఏమి చెప్పిందో అన్న తహతహ పాఠకులకు వుండింది. ఆత్మకథ పేరు ఎంతో మనోహరంగా వుండటం వల్ల పు. ల. దేశపాండే జీవిత విశేషాల్ని, తెలుసుకోవాలనే ఉత్కంఠ వల్ల ఈ ఆత్మకథ అపారమైన పాఠక వర్గంలో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తించింది. కాని ఈ పుస్తకం చదివిన తర్వాత పాఠకుల్లో వున్న ఆసక్తి కాస్తా చల్లబడింది. చప్పబడింది. పురుషాధిక్యం వల్ల స్త్రీకి అన్యాయం జరిగేది సామాన్యమైన విషయం అని భావించిన పాఠకుల అభిప్రాయం తలకిందులయింది. వాళ్లకు ఎంతో నిరాశ కలిగింది కూడా. ఈ ఆత్మకథ లోని పూర్వార్ధం చాలా ఆసక్తికరంగా సాగింది. రచయిత్ర సునీతాబాయి పుట్టిన వూరు, తల్లిదండ్రులు, బంధుబలగం, ఇంటితనం, చిన్నప్పటి మధుర స్మృతులు వగైరా విషయాల్ని రచయిత్రి ఎంతో చక్కగా చిత్రించారు. రచయిత్రి తనలో బాల్యం నుంచి కలిసి స్వాభిమానం, స్వతంత్రమైన భావాలు, అభిప్రాయాలు, దేశభక్తి, సమాజసేవ పట్ల ఆసక్తి, అనురాగం, జ్ఞానతృష్ణ మొదలైన విషయాల్ని ఎంతో కుతూహలం కలిగేలా, చదివించే ఆకర్షణీయమైన శైలిలో రాశారు. తర్వాత ఆమె సేవాదళంలో చేరడం, బొంబాయి ప్రయాణం, అక్కడ గడిపిన గడ్డురోజులు, సమాజ సేవకుల, సహ చరులతో తాను చేసిన చర్చలు, గోష్ఠులు వీటి వివరణ నాటకీయంగా చిత్రించగలిగారు. కాని ఇవి పాఠకుల్ని ప్రభావితం చేయలేక పొయ్యాయి. పు. ల. దేశపాండే పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి, రచనా వ్యాసంగం – ఇవన్నీ వర్ణింపబడ్డాయి ఈ ఆత్మకథలో. భర్త వ్యవహారంలో సానుభూతి లోపించడం, తనను నిర్లక్ష్యం చేయడం, ఇతరుల కష్టసుఖాల్ని పట్టించుకోక పోవడం, తోడి కళాకారుల ప్రతిభను గుర్తించినా, చిన్న చూపు చూడటం మొదలైన విషయాలన్నీ ఇందులో ప్రస్తావింపబడ్డాయి. అంతేకాదు, రచయిత్రి తానే యింటి బాధ్యతనంతా నెత్తిమీద వేసుకోవడం. భర్త ఆర్థిక వ్యవహారాల్ని చక్కపెట్టడం, భర్త తన్ను లెక్కపెట్టకున్నా, తాను మాత్రం అతన్ని గౌరవంగా చూశానని చెప్పుకోవడం – ఈ విషయాలకే ఈ పుస్తకంలో ప్రాధాన్యం ఇయ్యబడింది. ఈమె చిత్రించిన సంగతులన్నీ అసత్యాలని చెప్పలేం. కాని సమయాసందర్భాల్ని వర్ణించేటప్పుడు రచయిత్రి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొన్ని విషయాలపై పక్షపాతం చూపించడం మాత్రం క్షమార్హం కాదు. ఈమె కొన్ని సందర్భాల్లో తన భర్తకు ప్రతికూలంగానూ, తనకు అనుకూలంగానూ, రాయడం సమంజసంగా లేదు. ఈ రాతల వల్ల రచయిత్రి సునీతాబాయిపై మెప్పులు కురిసినా, పు.ల. దేశపాండే తన గృహస్థధర్మాన్ని సరిగ్గా నిర్వహించ లేదన్న బాధ దేశపాండే అభిమానులకు కలుగుతుందన్న, సంగతి మరువలేం. పు.ల. దేశపాండే పాఠకులు, అభిమానులు ఎన్నడూ సునీతాబాయికి ఆత్మీయులు కాలేదు. ఈ ఆత్మకథ చదివిన తర్వాత పు.ల. దేశపాండే అభిమానులూ, పాఠకులూ ఉద్రేకానికి లోనయ్యారన్న సంగతి సహజమే. సునీతాబాయి ఆత్మకథకు మరాఠీ సాహిత్య ప్రపంచంలో సకల గౌరవ మర్యాదలు కల్పించేందుకు నానావిధ ప్రయత్నాలూ జరిగాయి. సునీతాబాయి తన వాదనల్ని సమర్థించేందుకని పాశ్చాత్య రచయితల భార్యల, తనకు అనుకూలులైన రచయిత్రుల వ్యాసాల్నీ, కథనాల్ని మరాఠీ పాఠకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు కూడా. మరాఠీ సాహిత్య ప్రపంచంలో కొంత కాలం పాటు అనుకూలంగానూ, ప్రతికూలంగానూ వాదప్రతివాదనలు జరిగి, గొప్ప సంచలనం కలిగిన మాట వాస్తవమే. ఈ రభస వల్ల మరాఠీ సాహిత్య ప్రపంచానికీ, పాఠక సముదాయానికీ ఓ మేలు కూడా జరిగిందన్న సంగతి గమనించదగ్గ విషయం అదే సుమిత్రాబాయి ఆత్మకథ ‘ఆహే మనోహర తరి’ మరాఠీ సాహిత్యానికి ఓ కొత్త చూపు, ఓ కొత్త వరవడి ప్రసాదించిందన్న సంగతి.
కమల పాధ్యె గారి ‘బంధ అనుబంధ’ (బంధం – అనుబంధం) ప్రసిద్ధ మరాఠీ రచయిత ప్రభాకర సాధ్యెగారి భార్య ఆత్మకథ. శ్రీ పాధ్యె ‘కాంగ్రెస్ ఫార్ కల్చరల్ ఫ్రీడమ్’ అనే అంతర్జాతీయ సంస్థ ఆసియాప్రాంత సంచాలకులు ఈయన సగం ప్రపంచం తిరిగి, చూసిన ఘనుడు, ప్రఖ్యాత పత్రికాసంపాదకుడు, వ్యాఖ్యాత, సౌందర్యశాస్త్రవేత్త. సమకాలీన దేశవిదేశ విద్వాంసుల, రాజకీయవేత్తల స్నేహం సంపాదించిన వ్యక్తి. అప్పట్లో ఆయన పెద్ద సదస్సును నిర్వహించాడు. మహారాష్ట్రలో బౌద్ధిక చైతన్యం వ్యాపింపచేయాలనిప్రయత్నించాడు. ఆ సందర్భంలోనే ఆయనకు కమలగారి పరిచయం కలిగింది. కమల పాధ్యె ఆత్మకథలో ప్రభాకర పాధ్యె పరిచితులైన జయప్రకాశ్ నారాయణ్ దంపతులు, రామమనోహర లోహియా, ఎస్. ఎమ్. జోషి, నాథపై, దయాకృష్ణ మొదలైన మహనీయులు జాతీయ స్థాయిలో కలిగించిన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక చైతన్యం గురించి తెలుసు కోవచ్చన్న జిజ్ఞాన పాఠకులకు కలిగించి. పాఠకులకు కొంత వరకు వూరట కలిగింది కూడా. కాని రచయిత్రి వుద్దేశ్యం వేరేగా వున్నట్లు తోచింది. ఆమె వేసుకొన్న ప్రణాళిక మొదటి భాగంలో స్త్రీల సమాన హక్కులు, సమాజంలో స్త్రీ భూమిక, అభ్యుదయ దృక్పథం ఇవి ముఖ్యస్థానం ఆక్రమించాయి. ఆత్మకథ మొదటి అధ్యాయం ‘స్పర్శాలు లైంగిక సంవేదనల్ని అణచివేయడం వల్ల కలిగే మానసిక వేదనల్ని రచయిత్రి చిత్రించారు. దీన్ని చదివిన తర్వాత, మరాఠీ సాహిత్య చరిత్రలో ఈ ఆత్మకథ ఓ కొత్త ప్రయోగం కాగలదని నేను ఆశించాను. ఈ అధ్యాయంలో రచయిత్రి కమలా పాధ్యె చింతనాశక్తి, ఆత్మపరిశీలనా దృష్టి చాలా శక్తిమంతంగా వ్యక్తమయ్యాయి. కాని ఆమె నూతన దృక్పథం కొనసాగ లేక పోయింది. మిగతా భాగమంతా పాత పద్ధతి లోనే సాగింది. పాఠకులు ఈ ఆత్మకథకు, రచయిత్రి స్త్రీవాద దృక్పథానికి స్వాగతం పలికారు. శ్రీమతి కమలా పాధ్యె. తన భర్త ప్రభాకర పాధ్యె గుణశీలాల గురించి ధ్వని పూర్వకంగా రాశారు. ఆయన తనను ప్రోత్సహించలేదనీ, పూజారి కూతురి ననీ నన్ను చీటికిమాటికీ హేళన చేసే వారనీ, తనకు ఇంటా బయటా సమాన స్వాతంత్ర్యం ఇవ్వలేదనీ ఆమె అన్నారు. అయితే ఈ ఆత్మకథ పాఠకులకు ఆక్రమణకారి అనిపించలేదు. కాని ఈ పుస్తకం భావప్రకటనలో, అనుభవ నిరూపణలో కొత్త పుంత తొక్కిందని చెప్పొచ్చు. మరాఠీ సాహిత్యంలో ఇక మీదట ఇలాంటి విశేషమైన రచనలు వెలువడగలవన్న అభిప్రాయం పాఠక వర్గానికి, ప్రచురణ సంస్థలకు కలిగింది. కీర్తిశేషుడైన భర్త గురించి భార్య వ్యక్తం చేసిన ఆత్మ నివేదన సంప్రదాయం నెలకొనడం ప్రారంభమయిందనడానికి ఇది సూచన. కొంత వరకు ఇది అవసరమే, తగిందే కాని అది ఒక వేళ సాహిత్యంపై వెలుగు ప్రసరింప చేయలేకపోతే, ఆత్మకథ ప్రక్రియను పటిష్టం చేయలేకపోతే, అది ప్రయోజనకారి కాలేక పోతుంది. దివంగతులైన విద్యాధర పుండలీక గారి పత్ని శ్రీమతి రాగిణిగారు తమ సహజీవనం గురించి ఓ పుస్తకం రాశారు. ఇది ఆమె తొలి రచన. ఇందులో ఈమె తన భర్త వ్యక్తిగత వ్యవహారాల గురించి ఎక్కువగా రాసిందంతే.
ఆనందీబాయి శిర్కెగారి ‘సాజవాత’ (సాయంకాలపుగాలి) ఆశాలత సావే గారి ‘పానా ఆడచేపూల’ (ఆకుచాటుపువ్వులు) పార్వతీబాయి ఆరవలె గారి ‘మాఘ కహాణి’ (నా కథ) మాలతీబాయి గారి ‘సహవాస’ (సాహసం) మరాఠీ మహిళలు రాసిన మరి కొన్ని ఆత్మకథలు. ఈ రచయిత్రులు తమ ఆత్మకథల్లో మారుతున్న కాలపు పరిస్థితుల్ని చిత్రించారంతే.
ఈ రచయిత్రుల ఆత్మకథల కంటే ముందు వెలువడ్డ మహిళల స్వీయ చరిత్రల గురించి తెలుసుకొనడం అవసరం. శీలవతితాయి కేత్కర్ గారు విజ్ఞాన సర్వస్వకర్త కేత్కర్ తో గడిపిన జీవితాన్ని ‘మీచ హే సాగితలే ఆహే’ (నేనే ఇది చెప్పాను) చక్కగా నిరూపించారు. డా॥ కేత్కర్ గారు సహృదయులే ఐనా విచిత్రమైన గృహస్థుడు. అతను దత్తత తీసుకున్న కొడుకు అనారోగ్యదశలో వున్నప్పుడు ఎలాంటి అడ్డుచెప్పక సేవ చేసింది. ఆ కాలంలో స్త్రీవాదం, అస్మిత, -లు ఇంకా ఉదయించ లేదని అనాలా? సుధా ఆత్రే గారి ‘గోదా తరంగ’ (గోదా, అల), ఉషా డాంగే (పణ ఐకతో కోణ) (కాని ఎవరు వింటారు), ముక్తా దీక్షిత్ గారి ‘హో తో ప్రచితిచె బోలణె’ (ఆమె అనుభవాలు), లీలాబాయి పట్వర్ధన్ – మాధవ జోలియన్ గారి భార్య రాసిన ‘ఆమచి ఆకరా వర్షే (మా పదకొండేళ్లు)
ఈ ఆత్మకథల్లో ప్రసిద్ధ వ్యక్తులైన భర్తల కరాళ ఛాయల్లో భార్యలు అనుభవించిన హింస, దుఃఖం, వేదనలు శక్తిమంతంగా వ్యక్తమయ్యాయి. పురుషాధిక్య పాలనలో వాళ్లు అనుభవించిన యాతన, నారకీయ జీవితాలు హృదయ స్పర్షిగా చిత్రించబడ్డాయి. పురుషాధిక్యానికి వ్యక్తమైన స్త్రీల ప్రతిక్రియల నేపథ్యంలో మరాఠీ సాహిత్యంలో స్త్రీవాదం రూపుకొనిందని భావించవచ్చు. ఈ సందర్భంలో మరో రెండు మహిళా ఆత్మకథల్ని పేర్కొనడం అవసరమని తోస్తుంది. యమునాతాయి ఖాడిల్ కర్ గారి ‘వటవృక్షాచా ఛాయేత’ (మర్రిచెట్టు నీడలో) సరోజినీ సారంగపాణి గారి ‘దుర్దైవాచి దోన పాథ’ (దురదృష్టం రెండు చేతులు), ఈ రెండు పుస్తకాల్లో పురుషుల పెత్తనంలో నోరు విప్పలేని స్త్రీల బతుకులు, వాళ్లపై ఆరోపింపబడ్డ అనైతిక సంబంధాలు వగైరాల హృదయవిధారక చిత్రణ లభిస్తుంది.
ఇక దళిత స్త్రీల ఆత్మకథల గురించి పరిశీలిద్దాం. ఇవి చాలా తక్కువగా వెలువడ్డాయి. దళిత స్త్రీలు అనుభవించే కష్టాలు, ఇతర కులాల మహిళల బాధల కంటె భిన్నమైనవి. మొగుళ్ల దౌర్జన్యం, వ్యసనాలు, సోమరితనం, పగలు రాత్రి పని చేయాల్సిన అవసరం, పిల్లల బరువు బాధ్యతలు, వాళ్ల అనారోగ్యం- లెక్కలేనన్ని కష్టాలమయం దళిత స్త్రీల జీవితం. వీళ్ల జీవితాలు – దళితేతరులకు ‘షాక్’ తినిపించాయి. దళిత స్త్రీల దురవస్థ, పాఠకులకు మొట్టమొదటి సారిగా కానవచ్చింది. బేబి కాంబళె బతుకు మన లాంటిదే. కాని శాంతాబాయి కాంబళె (ప్రొఫెసర్. అరుణ కాంబళె గారి తల్లి) రాసిన ఆత్మకథ మాఝా జన్మాచి చిత్తర కథా (నా జీవితపు బొమ్మలాటకథ) కాస్త భిన్నమైనది. శాంతాబాయి కష్టాల-కడగండ్ల పాలైనా, కొంత కాలం తర్వాత ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేసిన పరిస్థితుల్ని తెలియచేస్తుంది. ఈ పుస్తకం సాహిత్య స్పర్శతో, హృదయానికి హత్తుకునేలా రాయబడినందువల్ల విశాల పాఠక సముదాయాన్ని ఆకర్షించగలిగింది. పైగా ‘దూరదర్శన్’ లో ప్రసారం చేయబడి నందువల్ల పాఠకులకు, ప్రేక్షకులకు మరింత దగ్గర కాగలిగింది ఈ ఆత్మకథ. బేబి కాంబళె ఆత్మకథ సొంత అనుభవం మీద ఆధారపడ్డ రచన. వేలాదిమంది పాఠకుల్ని ఆకర్షించగల దళిత స్త్రీల ఆత్మకథలు వెలువడాల్సిన ఆవశ్యకత వుంది. ఈ సందర్భంలో శ్రీమతి మల్లికా అమరశేఖర్ ఆత్మకథ ‘ఉధ్వస్త వయాచి ఆహే మలా ( చితికిన నా బతుకు) శీర్షిక లాగానే గొప్ప సంకలనం కలిగించే, ప్రభావకారియైన రచన. ఆమె కవయిత్రి కూడా. ఆమె శైలి కూడా విశిష్టమైనది. పురుషుల దర్పం, ప్రవర్తన, స్త్రీవాద భూమిక, తరతరాలుగా కొనసాగుతున్న కట్టుబాట్లు, ఆర్థిక సమస్యలు, వీటివల్ల దాపురించిన మానసిక ఆందోళనలు ఈ ఆత్మకథల్లో మనస్సుకు హత్తుకునేలా చిత్రింపబడ్డాయి.
మన మిప్పుడు సినిమా, నాటక రంగాల్లో పని చేస్తున్న మహిళలు రాసిన ఆత్మకథల వైపు దృష్టి సారిద్దాం. ఇలాంటి స్వీయ చరిత్రలకు ఇటీవల గొప్ప ప్రచారం లభిస్తోంది. పేరు ప్రసిద్ధులు కూడా బాగా దొరుకుతున్నాయి. వీటిని రాసి పెట్టడానికి చెయ్యి తిరిగిన రచయితలు కూడా తెరమీదికి వస్తున్నారు. ఇలాంటి ‘ఘోస్టు రైటర్స్’ పాశ్చాత్య దేశాల్లో చాలా కాలం నుంచి వుంటున్నారు. కాని మనదేశంలో వీళ్లు కొంత కాలం కిందటే అవతరించారు. ఇలాంటి రచయితలు మన దేశంలో తక్కువే అనుకోండి.మరాఠీలో‘ఘోస్టు రైటర్స్’ సృష్టించిన మహిళల ఆత్మకథలు ఏ వొకటి రెండో వున్నాయి. వీటికంటె ముందు మరో రకమైన ఆత్మకథల గురించి తెలుసుకోవాలి. ఉన్నత వర్గాల్లోని కొందరు స్త్రీలు వివాహబంధంలో చిక్కుకోకుండా తమకు నచ్చిన పురుషునితో సహజీవనం చేస్తూ వుంటారు. ఆనందిబాయి విజాపురై రాసిన ‘అజుని చాలతేచవాట’ (ఈ దినానికీ నడుస్తున్న బాట) లో స్త్రీ పురుషుల స్వతంత్ర సహజీవితం గురించి వర్ణింపబడింది. రచయిత్రిలో పాపం లేదా తప్పు చేస్తున్నావనే స్పృహ లేకుండా తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా, ధైర్యంగా, దాపరికం లేకుండా ఆనందిబాయి విజాపురె తమ అభిప్రాయాలు, భావాలు వెల్లడించారు. మరాఠీ నాటక రంగంలో నటించే స్త్రీల గుణశీలాల గురించి తరతరాలుగా వినవస్తున్న వ్యాఖ్యలు, టీకలు ఇంకా మాసిపోలేదు. శాంతాఆప్టే స్వీయచరిత్ర ‘జావు మీ సినేమాత’ (నేను సినిమాలో పోయేదాన్ని) 1940 లో వెలువడినప్పటి నుంచి రంగస్థల నటీమణుల గుణ శీలాల గురించి వూహాపోహలూ, వూహాగానాలు, నిందలు- ఆరోపణలు సంఘంలో మొదలయ్యాయి. శాంతాఆప్టే తన నటజీవితంలో ఎన్నో ఆటుపోట్లని ధైర్యంగా ఎదుర్కొనగలిగింది. ఆమె నిర్భీకత, స్వతంత్ర వ్యక్తిత్వం ఈ పుస్తకంలో చక్కగా వ్యక్తమయింది. హంసా వాడ్ కర్ ఆత్మకథ ‘సాంగతే ఐకా’ (చెప్తాను వినండి) 1970లో అచ్చయింది. ఈ స్వీయ చరిత్రలో వ్యక్తమైన ఆమె స్వతంత్ర భావాలు మరాఠీ సాహిత్యంలోఅల్లకల్లోలం సృష్టించాయి. ఈమె చదువుసంధ్యలు లేనిదైనా, సంస్కార వంతురాలు, గుణవంతురాలు, మంచి అభినేత్రి కూడా. ఎంతో మంది వ్యసన పరులైన పురుషుల మధ్య బతుకుతూ, అడకత్తెరలో చిక్కిన పోక చెక్క వలె దురవస్ధలు పడుతూ ఆమె ఆ అగ్ని జ్వాలల్లోంచి బయట పడిన వైనం ఈ పుస్తకంలో మనం గమనించవచ్చు. హంసా వాడ్ కర్ నిర్భయంగా, నిస్సంకోచంగా తన అనుభవాలు, అవస్థలు వాడిగా వేడిగా, వెల్లడించడం వల్ల ఈ పుస్తకం గొప్ప సంచలనమే కలిగించింది. ఇవే కాక స్నేహ ప్రభా ప్రధాన్ ఆత్మకథ ‘స్నేహాణిత’ (స్నేహబంధం), లీలా చిట్నీస్ రాసిన ‘చందేరి దునియేత’ (వెండితెర ప్రపంచంలో) ఆత్మకథలు కూడా పేర్కొనదగినవే. తర్వాత చాలా మంది సినిమా నటీమణులు తమ తమ అనుభవాల్ని వెల్లడిస్తూ రాయడం వల్ల మహిళల ఆత్మకథల సంఖ్య పెరుగసాగింది.
మరాఠీ, హిందీ సినిమాల్లో నటించి పేరు ప్రసిద్ధులు గడించిన దుర్గాఖోటె ఆత్మకథ విశిష్టమైనది. ఈమె చారిత్రక, సాంఘిక చలన చిత్రాల్లో ప్రధాన పాత్ర ధరించిన అభినయ విశారద. ఆమె పేరు మోసిన నటులతో, దర్శకులతో, నిర్మాతలతో తనకు గల పరిచయం, వాళ్ల నుంచి తాను నేర్చుకున్న పాఠాలు, మరాఠీ సినిమా పుట్టుక, ప్రగతి, వికాసాల గురించి తన ఆత్మకథలో చాలా విషయాలు చెప్పింది. సమకాలీన చలన చిత్ర కళాకారుల జీవిత విశేషాలు, సినిమారంగ అనుభవాలు, బొంబాయి నగర జీవితం, కుటుంబ నిర్వహణ మొదలైన విషయాలు ఆసక్తిదాయకంగా వెల్లడించారు. ఈ ఆత్మకథలో మరాఠీ మహిళల ఆత్మకథల్లో ఇదొక శ్రేష్ఠమైన రచన.
ఈ వ్యాసం సంక్షిప్తమైనది. అందువల్ల ఎన్నో మహిళల ఆత్మకథల గురించి ప్రస్తావించలేక పొయ్యాను. గోదావరీ బాయి పరుళేకర్ గారి ‘జెహ్యా మణ్ణూస జాగా హోతో’ (మనిషి మేల్కున్నప్పుడు)
అనుతాయి వాఘెయ గారి’ కోస బాడచ్సా టెకడి వర్ణ’ (కొసవాడ కొండ దృశ్యాలు) ఈ స్వీయ చరిత్రలు సామాజిక స్పృహతో కూడుకొన్న ఆత్మనివేదనా పరమైన రచనలు. ఇలా సామాజిక దృక్పథం వెల్లడించే మహిళల ఆత్మకథలు మరాఠీలో మరింత ఎక్కువ సంఖ్యలో రాగల అవకాశముంది ఇది నిజంగా సంతోషదాయకమైన సంగతి.
(కన్నడ మాసపత్రిక ‘హోసతు’) కొత్త- మార్చి 2001 సంచిక నుండి అనువదించబడింది.)
ముఖచిత్రం నుంచి ముద్రణ సంస్థ దాకా ..... సంపాదకత్వం నుంచి రచనల ద్వారా.... ఆవిష్కరణ నుండి సమీక్షదాకా .... అంతేందుకు ఆఖరికి రోగం కూడా స్త్రీ జాతి .... కరోనా మహమ్మారి.
కరోనా కాలం కథలు..... శతాధిక రచయిత్రుల కథలు, కధనాల బృహత్ గ్రంధం 630 పేజీలు, 106 మంది రచయిత్రులు, అ కథలు 24 కథనాలు, గౌరవ సంపాదకులుగా డా॥ తిరునగరి దేవకిదేవి సంపాదకులు, అనిశెట్టి రజిత, డా॥ కొమర్రాజు రామలక్ష్మి, డా॥ బండారి సుజాత, సహ సంపాదకులుగా డా॥ మురాడి శ్యామల, తమ్మెర రాధికా గార్లు, ముఖచిత్రాలు చిత్రకారిణి డా॥ జి. అవనీరావుగారు, రుద్రమ ప్రచురణ సంస్థ, 21,11,2021న కరీంనగర్ ప్రెస్ భవన్లో డా॥ కాత్యాయనీ విద్మహే గారి చేత పుస్తక ఆవిష్కరణ జరిగింది.
ఒక సాహసోపేత శ్రమ, ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన చారిత్రక ఘటనల గ్రంధస్థం చేయడం. అది సంపూర్తిగా మహిళల భాగస్వామ్యంలో జరగడం హృదయ పూర్వకంగా గర్వించదగ్గ అభినందించ దగ్గ దృగ్విషయం.
ఒక రకంగా వేల సంవత్సరాలుగా కాలపు పొరల క్రింద అణచి వేయబడ్డ, అక్షరీకరింపబడిని, అంధకారంలోనివెలుగు చూడని విప్పిచెప్పబడని అంశాలు, దృశ్యాలు, ఘటనలు, సత్యాలు కథలుగా, కథనాలుగా మొదటిసారిగా ధైర్యంగా, సున్నితంగా, వేదనాభరితంగా మానవీయంగా చూపబడ్డాయి.
ముఖచిత్రంలో ఎక్కువ భాగాన్ని గద్దమొహం ఆక్రమించుకోగా, మన నాలుగుసింహాల రాజముద్ర మధ్యగాను ఓ ప్రక్క రెక్కలుసాచి వేటకు సిద్ధమైన గద్ద, పి.పి. సూట్స్లో ఉన్న వైద్యసిబ్బంది, వెనక పేజీలో పి.పి. సూట్స్లో మహిళ, గ్లోవ్స్ ఉన్న చేతులు, కరెంటు తీగలపై పక్షుల సమూహం వలసలకు సింబాలిక్ కావచ్చు లేదా.... గద్దరూపంలో ఉన్న వ్యవస్థలకు ఎరలుగా మారే పక్షుల రూపంలో కావచ్చు..... అర్థవంతమైన చిత్రీకరణ డా॥జి. అవనీరావుగార్కికి అభినందనలు.
ముఖాచిత్రంలో గద్దమొఖపు వైశాల్యముందు మన రాచముద్ర తక్కువ వైశాల్యాన్ని కలిగి ఉండటం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల వైఫల్యానికి సూచిక కాబోలు.
కారోనా కాలం కథలు తొలిదశ లాక్ డౌన్ వరకు గల కాలాన్ని మనముందుంచాయి. ఈ గ్రంధం నుండి అనేక అంశాల విభిన్న కోణాలపై అనేక చర్చలు చేయవచ్చు.
ప్రఖ్యాత రచయిత్రులు, ఆచార్యులు, సంస్థల స్థాపకులు, జాతీయస్థాయి అవార్డులు పొందినవారు, అనేక సాహితీ ప్రక్రియల్లో ఆరితేరినవారు, సామాజిక సేవలకే అంకితమైనవారు అనేక విద్యా, వైద్య, విభిన్న రంగాలలో పేరు ప్రతిష్ఠలు కలిగిన వారి నుండి మొదలుకొని మొదటిసారిగా వ్రాసిన పిన్నవారి వరకు రచయిత్రులున్నారు. మేలిమి, వజ్రాలు కొందరయితే సానపెట్టుకొని వేలుగులీనాల్సిన ముడివజ్రాలు కొందరు. 18 మందికి పైగా డాక్టరేట్స్ చేసిన వారి నుండి గృహిణులు, విద్యార్థులు వరకు ఉన్నారు. విభిన్న అస్తిత్వవాద దృక్కోణపు రచయిత్రుల నుండి మైనారిటీ వర్గ వాద రచయిత్రుల వరకు ఉన్నారు. విభిన్న కోణాల్ని ప్రతిఫలించిన ఈ గ్రంధం సాహిత్య ప్రపంచంలో తన ప్రత్యేక అస్తిత్వాన్ని నిలుపుకొందని చెప్పవచ్చు.
పుస్తకంలోని కొన్ని ఛాయాచిత్రాలు, వర్ణచిత్రాలు కరోనా కల్లోలాలను మన కళ్ళముందు ఆవిష్కరించి మన హృదయాల్ని కల్లోల పరచుతాయి.
దాదాపుగా కథలన్నింటిలో కరోనా కాలమనేకాదు ఈ కోణంలోనైనా, అనాదిగా మహిళల జీవితాలపై గల అణచివేత వివక్ష, హింస, దోపిడిల తాలూకు అన్ని రకాల సమస్యల చర్చ జరిగింది. రచనల్లో చాలా భాగం స్త్రీవాద దృకోణంలోనే చర్చ జరిగింది. ఆ చూపు తనని దాటి వలస కార్మికుల, భవన నిర్మాణ, అవ్యవస్థీకృత రంగ, ప్రజల, ప్రైవేట్ రంగంలో ఉపాధులు, ఉద్యోగాలు కోల్పోయిన వారి, పల్లె పట్టణాల, విభిన్న రాష్ట్రాల మొత్తంగా భారతదేశం నుండి ప్రపంచ దేశాల దాక కథలు కథనాలు కొనసాగాయి.
ఏ కథాకథనంలో కృతక లేదు. ఎందుకంటే అన్ని వారి అనుభవాలు, పరిశీలనలు కాబట్టి సత్యం ఎలా చెప్పినా సత్యమే కనుక అవాస్తవికత ఎక్కడ కానరాదు.
స్త్రీ జీవితపు అన్ని కోణాలు ఆవిష్కరింపబడ్డాయి. అన్ని రకాల వివక్షలు, అణచివేతలు చూపబడ్డాయి. దేశ మేదయినా, మతం, ప్రాంతం, ఉపాధి, ఉద్యోగం ఎదైనా స్త్రీల స్థితిగతులస్థాయి అదే అధోస్థాయి అని తెలుస్తుంది.
పుట్టుక, బాల్యం, కౌమారం, యవ్వనం, వైవాహిక, గృహస్త జీవినాలు, నెలసరి రోజులు, గర్భిణిగా, చూలింత, బాలింతగా, ప్రసవ వేదనలు, వైధవ్య బాధలు, విడిచివేతల వ్యధలు, విడాకుల, ఒంటరి మహిళల జీవితాలు, వృద్ధాప్యపు తిరస్కారాలు, బలత్కారాలు, బలవన్మరణాలు..... వంటిల్లు నుండి జీవితపు అన్ని రంగాలదాకా మహిళలుగా వారి వారి కుటుంబాలు, సమాజాలుగా సమస్త ప్రపంచపు స్థితిగతులు నగ్నంగా ఆవిష్కరింపబడ్డాయి.
పల్లె, పట్టణ విశ్వనగరాల నుండి విదేశాలదాకా, గుడారాలు, గుడిసెలు, గూనపెంకులు, మిద్దెలు, అద్దె ఇల్లు, అపార్ట్మెంటుల నుండి రోడ్డు ప్రక్క, చెట్ల క్రింది ఆవాసాల దాకా అనేకానేక ఇతివృత్తాలతో కథాకథనాలు కొనసాగాయి.
కరోనా కాలం కధలన్నింటిలో ద్వితీయశ్రేణి జీవితాలే, ఈ సంపుటిలోని కథలో లాగా స్త్రీలంతా ద్వితీయశ్రేణీ కదా అందులో మళ్ళీ అత్తా, ఆడబిడ్డల కంటే దిగువజాతి కదా !
ఈ కథలన్నీ మధ్య తరగతి, దిగువ మధ గతి, పేద, నిరుపేద, దళిత, ఆదివాసీ, మైనారిటీ వారి కరోనా కష్టాల్ని, నిత్య కష్టాల్ని ఆవిష్కరించింది. జీవితాల్ని కలలోకాల్లో తేలించే సినిమాల, సీరియళ్ళ స్వప్న లోకాల పూలపాన్పులపై నడిచే ప్రేక్షకుల్ని కఠినాతి కఠిన, కన్నీటి పర్యంతపు వాస్తవాల ఎండకు కాలిబొబ్బలెక్కిన అరిపాదాల నెత్తుటి రహదారులపై నడిపించి ఒక్కింత ఆర్ద్రతను, మానవీయతను తట్టి లేపడంలో సార్థకతను సాధించింది.
అట్టడుగు జీవనాలైనప్పటికి అసూర్యంపశ్యల అతిగుప్త వెలుగుచూడని జీవన చిత్రాల కఠిన సత్యాల్ని జాతీయ రహదారుల్లోకి నగ్నంగా ఆవిష్కరింప చేసి, సమాజపు ఆలోచనకు మరింత కొనసాగింపును, చూపును అందించింది.
ప్రపంచపు 80% ప్రజల జీవితాల చిత్రణ ఇదే కదా ఒక మహవిపత్తు ప్రపంచవ్యాప్తంగా సంభవించినప్పుడు జరిగిన విపరీత పరిణామాల అఘాతం నుండి తేరుకొని, సవరణలు, సంక్షేమాలు, రక్షించడాలు దాకా ప్రభుత్వం నుండి వివిధ వ్యవస్థలదాకా (కుటుంబ కూడ) జరిగిన పరిణామాల్ని, జరగకూడని, జరగాల్సిన, ఇకముందు సంస్కరించుకోవాల్సిన, ఆలోచించాల్సిన అంశాల, స్పష్టీకరణలు కూడా కరోనా కాలం కథలు మనకు తెలుపుతాయి.
శాంతిశ్రీ బెనర్జీ (4) ఆత్మస్థైర్యంలో 500 కి.మీ.లపైగా మల్లీశ్వరి గాయపడిన తండ్రిని కూర్చోబెట్టుకొని చేసిన సైకిల్ ప్రయాణంలో ఆడపిల్లలు తలుచుకొంటే ఎదైనా చేయగలరని చెబుతూనే వలస కష్టాలు చూపుతూనే సాటి మానవులలోని మానవీయతను దర్శింపచేసారు.
టీ, యాకమ్మగారి 8వ కథ దుఃఖనదిలో...... అత్తాకోడళ్ళ విషాద విలాపంతో.... ఆమె ఆకలి చచ్చిపోయింది..... కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టారు.... కాని ఆకలికి ఎవరైనా లాక్డౌన్ పెట్టుంటే బాగుండు...... జూపాక సుభద్ర గారి (23) కొన్ని నూకలు మిగిలే ఉండోచ్చులో..... ఆకలికి మించిన వ్యాధి లేదంటారు. ప్రపంచంలోని అతి పేద వర్గాలన్ని 360 రోజులు ఈ బాధితులే అంటారు. ఎండ్లపల్లి భారతిగారి కూటికుంటే కోటికున్నట్లే (9) లో దొంతులే నా బింకం....... నా సంపాదన అంతా ఆ దొంతులలోనే అంటూ స్త్రీల అతిపెద్ద సమస్య కుటుంబ ఆకలి తీర్చడమేనంటూ, కరోనాకు ముందైనా ఆ తరువాతైనా అత్యధిక శాత ప్రజలది ఆకలి బాధేనంటూ చెబుతుంది. తిరనగరి నవతగారి (10) గౌరమ్మ కథ.... ప్రభుత్వ ఖజానా నింపడం కోసం...... కొడుకు తలకు కొరివి పెట్టిన తల్లికథ ప్రభుత్వ విధాన వైఫల్యం కారణంగా.... తాగుడుకు లాక్ డౌన్ లేని కారణంగా ఎన్ని కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయో తెలుపుతుంది. శైలజామిత్ర గారి (25) నడిచే యంత్రంలో.... కరోనాతో ప్రపంచానికి విశ్రాంతి వచ్చినా తల్లికి, వంటింటికి రాలేదని..... వెలకట్టని మహిళల అవిశ్రాంత శ్రమ నిర్వేదపు కథ..... ఇదే అంశంతో గట్టురాధికా మోహన్ గారి (60) కొంచెం రెస్టుకావాలి...... రోబోకాయినా కొంత సమయం...... చార్జింగ్ కోసం..... కనీసం మాకు అది లేదంటూ.........
నెల్లుట్ల రమాదేవి గారి (29) తల్లివేరులో మానవ సంబంధాలలోని డొల్లతనాన్ని, ఆర్థికంగా నిలవలేని స్త్రీల అగచాట్లని, వృద్ధ మహిళల దైన్యాన్ని తెలుపుతుంది. డా॥ త్రివేణి గారి (35) ముళ్ళల కంచె, డా॥ తెన్నేటి సుధాదేవి (39) నిరీక్షణలో కరోనా క్వారంటైన్ గూర్చి వృద్ధాప్యంలో కొడుకు వద్ద సేద తీరాల్సిన తల్లి, ప్రసవ సమయంలో భర్త తోడును, కాన్పు అనంతరం బిడ్డకౌగిలిని ఎంత నిర్ధయగా దూరం చేసిందో చూపుతాయి.
మల్లవరపు విజయ (48) కరోనా కౌగిట్లో మనీషాలో, అమానవీయ, ఆర్థిక దురాశలకు ప్రతి సందర్భం కలిసివచ్చేది. ఒంటరి అమాయక బాలిక దయనీయ స్థితిని ఆమె కిడ్నీని అపహరించేందుకు వాడుకొనే వారి పాశవికతను తెలుపుతుంది. బాలబోయిన రమాదేవి (52) స్త్రీల నెలసరి సమస్యనే శీర్షికగా చేసిన కథ.... కరోనాకు భయపడి ఆ అవసరం ఆగేనా... సహచరులకే అర్థంకాని సమస్యను వెలుగులోకి తెచ్చిన కథ.
పాఠకుల హృదయమంతటిని కదిపి కుదిపి, కన్నీటిని రాల్పించే కథ, అమ్మతనపు ఔన్నత్యాన్ని, పసితనపు సున్నితత్వాన్ని, మానవత్వాన్ని మానవుల అమానవీయతను, స్త్రీల జీవన చిత్రంలో తాను మాత్రమే మోసే బాధ్యతల్ని సూటిగా, స్పష్టంగా చిత్రించిన కథ పద్మ VLS సత్తిరాజుగారి (65) ఎంతెంతదూరం కథ..... జీవిత భారం మోయలేక పారిపోయిన భర్త తలపై మోత, కడుపులో బిడ్డ, చేయందుకొని సరిగ్గా నడవనైనా నడవలేని మరో బిడ్డ.... తల్లి చాకచక్యంగా నడవ అలసిన బిడ్డను ఎంతెంత దూరం అంటూ పరుగెట్టించిన విధం అటు పాత్రల్ని, పాఠకుల్ని, ఆలోచనల్ని చాలా చాలా దూరం నడిపిన అద్భుత కథా చిత్రణ.
మామిడాల శైలజగారి విధివిలాసం (78) శైలజా శేఖరల్ అపురూప దాంపత్యం, కరోనాకాటు ఆర్థిక పరిణామంగా రైల్వే ట్రాక్పై శేఖర శవంగా మారటం, సంధ్య ఒంటరిగా మిగలటం..... ఆత్మహత్యల కారణాల్ని చూపుతుంది.
కరోనాకు చైనా కారణమంటూ, మర్క్ సమావేశం కారణమంటూ ముస్లింలపై మతకోణంలో జరిగిన అమానవీయత వారి బ్రతుకుల్ని ఎలా కాకవికలం చేసిందో, ముస్లిం సమాజాన్ని ఎంత అభద్రతకులోను చేసిందో తెలిపిన కథలు 19, 21 వ కథలు, డా|| షాజహానా గారి పరించాలో.... ముస్లింల వెనకబాటుతనం గూర్చి ... నేను నమ్మకం అనే పదాన్ని సింక్ లో వేసి నీళ్ళదిలాను...... కరోనా కంటే విషపూరిత వ్యాధి మతం అన్నారు...... ఎంతటి విషాదమిది. మనం ఎన్నిగా చీలిపోదాం, మతం, కులం, వర్గం, వర్ణం, లింగ, ఆర్థికపరులు.
కనీజ్ ఫాతిమా గారి (27) అపనమ్మకంలో పాల్షాప్ సలీమ్న మరణ్కు పోకున్నా క్వారంటైన్కు తీసుకుపోవడం, వారికి పనులు ఇవ్వకపోవడం...... ఒక రకంగా ...... వెలివేయటం.
డా॥ జయంతి గారి కథనం (90) నేనో విషాద కావ్యాన్నిలో ప్రజాస్వామ్య రాజకీయాలు మైనారిటీ, మధ్య దిగువ మధ్య తరగతి దళితులకు ఎంత అందనంత దూరంలో ఉన్నాయో...... 33% రిజర్వేషన్ కారణంగా సర్పంచ్ అయిన కవిత ప్రజల బాధ్యతా రహిత్యం, అధికారుల అలసత్వం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరుల కారణంగా జరిగిన నేపథ్య చిత్రీకరణల చూపుతుంది. కవితచే చెప్పించబడిన... మానవతకు, వైద్య, ఆర్థిక వ్యవస్థలకు కరోనా ఒక మచ్చ అంటూ......
11 వ కథ 33, 72, 82, 91 కథల్లో చివరిదైన డా॥ కొమర్రాజు రామలక్ష్మి గారి (86) మళ్ళీ చిగురించాలి కథలు పాజిటివ్ దృకోణంలో కరోనా కాలంలో వెల్లివిరిసిన మానవత్వాన్ని, బలపడిన కుటుంబ బంధాల్ని, ప్రకృతి, గాలి, నీరు స్వచ్ఛంగా మారటాన్ని, వైద్య, పోలీసు, మున్సిపాలిటి, స్వచ్ఛంధ వ్యక్తిగత సేవల ఔన్నత్యాల్ని, కరోనాను జయించి ఆత్మ విశ్వాసాన్ని నింపే కథలు.
రేహనాగారి (93) వలసవెనక్కిలో కరోనాకారణంగా వివిధ దేశాల వారీగా ఆయా వలస కార్మికులు వెనక్కిరావటాన్ని చెప్పడంతో పాటు లాక్డౌన్ ప్రకటనకు ముందు ప్రభుత్వం ఏ ఏర్పాట్లు లేకుండా చేసిన అనాలోచిత చర్య సృష్టించిన విధ్వంసం గూర్చి తెలిపారు.
కొండవీటి సత్యవతి గారి (96) కరోనా కష్టకాలంలో సమాంతా సాహసం నిజాంగా ఓ సాహసోపేత కథనం ఒక స్త్రీవాద కోణపు విశాలతను, ట్రాన్స్ జెండర్స్ను తమ సమాజంలో భాగంగా స్వీకరించటం కన్పిస్తుంది. 3000 కి.మీ. తన ఆటోలో తిరిగి 2500 మంది ట్రాన్సజెండర్స్కు నిత్యవసరాల్ని అందించటం..... మీ వాళ్ళు భిక్షాటన చేస్తారనే అపవాదు వాడేందుకు ఆటోనడపడం..... వారివైపుగా వారి కష్టాలు, ఆత్మగౌరవాల వైపుగా మన చూపును తిప్పన కథనం.
103వ కథ మేడ్చల్ ఫుడ్ & ట్రావెల్ క్యాంపు గూర్చి భూమిక సౌజన్యంతో జరిగిన స్వచ్ఛంద కార్యక్రమాల గూర్చి వచ్చిన కథనాలు మనలో మనకు ఒక నమ్మకాన్ని, మానవత్వం బతికే ఉందన్న ధైర్యాన్ని ఇస్తాయి.
108, శాంతిరెడ్డి గారి కరోనా రక్కసి కోరలు 110 అనిశెట్టి రజితగారి ఇదేం బతుకులో వలస కార్మికుల్ని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి కొన్ని నెలలపాటు ఉండే విభిన్న ఆదివాసి, దళిత ప్రజలను ఇక్కడి ప్రజలు వారి సమాజంలోకి స్వీకరించరన్ని నగ్న సత్యం వలసలకి ఒక ముఖ్య కారణంగా చూడవచ్చు.
అనిశెట్టి రజిత గారు తన కధనపు స్వగతంలో తనలో తాను, తానుగా సమస్య అంతటిని అవలోకనం చేసుకొని అర్థాలు, అంతరార్థాలు, అనర్థాలు, జరగాల్సిన విధానాల అంతర్మధనంలోని చింతనలో ఒక నిర్వేదం, మనుషుల, ప్రభుత్వాల వ్యవస్థల తప్పొప్పుల తర్కం, తాత్వికతాలను తన నుండి మనలోకి ప్రవహింప చేస్తుంది. నిశ్శబ్దాన్ని ఇష్టపడే నేను..... ఖాళీతనాన్ని భరించలేనంటూ, మనంగా మానవీయంగా ఏం చేయాలో ఒక ఆశవహదృక్పధంతో ముగించారు.
కరోనా కాలం కథల శతాధిక రచనల్లో బహుశా మనం వెయ్యికి పైగా కుటుంబాల్ని చూసి ఉంటాం. అన్ని రకాల అట్టడుగు వర్గాల జీవన చిత్రాల్లో ప్రతికథలో కనీసం వందలకు పైగా మహిళల జీవితాల్ని, అన్ని వ్యవస్థల పని విధానపు డొల్లతనాన్ని, ఆర్థిక, మత కోణాల్ని ప్రభుత్వ పనివిధాన వైఫల్యాల్ని, అంగీకరించి అర్థం చేసుకొంటాం.
ఒక అతిపెద్ద కరోనా విపత్తు మరణాలకన్నా, మానవ పని విధానాలు, పథకాల విలువల, వ్యవస్థల ఆలోచనా రాహిత్యం, ఆర్థిక కారణాల వల్లనే ఎక్కువ వేదన, హింస, మరణాలు సంభవించాయన్నది సత్యం, ముందు మనందరం, సిగ్గుతో తలదించుకోవాల్సిందే.
వైద్య, ఫార్మసీ, ప్రైవేట్ కార్పోరేట్ రంగాలలో ఎంత విలువల పతనపు అమానవీయతను, పై వ్యవస్థలని నియంత్రించలేని ప్రభుత్వ అసమర్థత ఎంతగా గ్రహించామొ అంతే స్థాయిలో వ్యక్తిగత, స్వచ్ఛంద సంస్థల స్థాయిలో మానవీయ కోణాల్ని దర్శించాం.
పై చాలా కథల్లో కుటుంబ పనిలో మహిళలకు సహాయంగా పనిచేసే మహిళల్ని చాలా సహృదయతతో పనికి రాకున్నా జీతం ఇవ్వడం, ఆదుకోవడం గమనించిన మనం, పదులు, ఇరవై సంవత్సరాలపైగా కార్పోరేట్, ప్రైవేట్ కళాశాలలలో తమ సేవల ద్వారా యాజమాన్యానికి కోట్లాది రూపాయల లాభాల్ని చేకూర్చిన ప్రైవేట్ సంస్థలపై ప్రభుత్వం చర్య తీసుకొని వారికి కనీస 30 నుండి 40% జీతం అన్నా ఇప్పించకుండా ముష్ఠిలాగా అది చాలాకాలం తరువాత 2,000 రూపాయలు, ఓ 50 కిలోల బియ్యంతో సరిపెట్టడం శోచనీయం. మనం మనంగా, వ్యవస్థలుగా, ప్రభుత్వాలుగా ఎంత ఎదగాలో పై కథల్లో మన చూస్తాం..
ఈ కరోనా కాలం కథల్లో ఎక్కడా భాషాడంబరం లేదు. అతి సహజంగా, సరళంగా స్పష్టంగా చెప్పదలచుకొన్నది పాఠకుల మనసుల్ని చేర్చడం ద్వారా ఈ పుస్తకం తన గమ్యాన్ని చేరిందన్నది అభినందనీయ విషయం. ముందుకాలంలో కరోనా విపత్తుకు సంబంధించిన అనేక విషయాల్ని తెలుసుకొనేందుకు ఈ గ్రంధం ఉపకరిస్తుంది.
సంపాదక, రచయిత్రులంతా తిరిగి మరిన్ని గ్రంధాలను రూపొందిస్తారని ఆశిస్తూ అందరికి అభినందనలు.
పోతం జానకమ్మతో ఆధునిక స్త్రీల సాహిత్య చరిత్ర 1874 లో మొదలవుతున్నది . ఎవరీ జానకమ్మ ? ఏమివ్రాసింది? ఎక్కడ ప్రచురించబడ్డాయి?
పోతం జానకమ్మ మద్రాసు నివాసి. ఆమె భర్త రాఘవయ్యతో కలిసి 1873 లో ఇంగ్లండ్ వెళ్లి 1874 ఫిబ్రవరి 1 కి తిరిగి వచ్చింది. వచ్చిన తరువాత తన భావాలను, అనుభవాలను, తెలియపరుస్తూ తెలుగులో లేఖ రూపంలో ఒక వ్యాసం వ్రాసి ‘శ్రీ ఆంధ్ర భాషా సంజీవని’ పత్రిక కు పంపింది. అది ప్రచురించ బడింది. అయితే తెలుగులో ఆంధ్ర భాషా సంజీవని అనే పత్రిక ఉంది కానీ ‘శ్రీ’ అనే ప్రారంభ వర్ణం దానికి లేదు. అది మద్రాస్ నుండే వచ్చేది. 1871 నవంబర్ నుండి ఆ మాసపత్రిక ను కొక్కొండ వెంకటరత్నం పంతులు నడిపాడు.( పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికలు, 2004, పు;113) దానినే జానకమ్మ ‘శ్రీ ఆంధ్ర భాషా సంజీవని’ అని చెప్పి ఉండవచ్చు. ఈ వ్యాసం 1874 ఫిబ్రవరి లేదా మార్చ్ నెల సంచికలో వచ్చి ఉండాలి. ఎందుకంటే దీని ఇంగ్లిష్ అనువాదం మద్రాసు నుండి వచ్చే ‘ఎథినీయం అండ్ డైలీ న్యూస్’ పత్రికలో 1874 ఏప్రిల్ 15 సంచికలో విపులమైన సమీక్షతో ప్రచురించబడింది కనుక. ఆ రకంగా తెలుగులో తొలి వ్యాస రచయిత్రి పోతం జానకమ్మ. ఆమే తొలి తెలుగు రచయిత్రి కూడా.
అండ్ డైలీ న్యూస్’ పత్రికలో వచ్చిన ఆవ్యాసం, ఈ సమీక్ష మొదటి అధ్యాయంగా చేసి మొత్తం పన్నెండు అధ్యాయాల ఇంగ్లండ్ యాత్రా చరిత్రను Pictures Of England అనే శీర్షికతో 1875 అక్టోబర్ లో ప్రచురించింది జానకమ్మ. అసలు ఈ యాత్రా చరిత్రను ఆమె మొదట తెలుగులోనే వ్రాసింది. అలా అనుకొనటానికి ఆధారం ఈ పుస్తకానికి జానకమ్మ వ్రాసిన ముందుమాటలోనే ఉంది.
తాను తన కళ్ళతో చూసింది, తన ఆలోచనకు అందినది మాత్రమే వ్రాయటం వలన ఇందులో ఏమైనా తప్పులు, అక్కడి స్థలాలను , ప్రజలను వర్ణించటంలో లోపాలు ఉంటే క్షమించమని పాఠకులను కోరింది. ప్రత్యేకించి దీనిని దేశీయ మహిళలకోసమే వ్రాస్తున్నా వాళ్లలో ఎక్కువమంది ఇంగ్లీష్ భాష చదవడంలో ప్రగతి సాధిస్తున్నారు కనుక కొన్నేళ్లలో ఈ పుస్తకంలోని విషయాలను గ్రహించగలరన్న విశ్వాసం ప్రకటించింది.అయితే అవసరాన్ని బట్టి, ఇంగ్లీషు భాష నేర్చుకోని వాళ్ళ కోసం తెలుగు అనువాదం ప్రచురించటం గురించిన ఆలోచన ఆమెకు ఉన్నది. “In due course the original with a Telugu translation of English passages quoted in this book , shall be published, when there is a pretty good demand and not before” అని ముందుమాటలో చెప్పిన విషయం గమనించదగినది. దీనిని బట్టి ఆమె ‘ఒరిజినల్’ అని చెప్పింది తెలుగులో వ్రాసిన అసలు ప్రతి గురించే అనుకోవచ్చు. ఆమె మొత్తం పుస్తకాన్ని తెలుగు చేస్తానని అనలేదు. యాత్రానుభవాల వివరణ క్రమంలో అవసరమైన చోట్ల ఇతర గ్రంధాల నుండి ఎత్తి యథాతథంగా ఇందులో చేర్చిన ఇంగ్లీష్ పేరాలను తెలుగు చేసి ప్రచురించటం గురించి మాత్రమే చెప్పింది. అందువల్ల జానకమ్మ ఈ పుస్తకాన్ని తెలుగులోనే వ్రాసింది అని రూఢి అవుతున్నది. సమకాలపు సమాజంలో తన స్థానం , అవసరాలు , ప్రయోజనాలు ఏవో ఆమెను ఈ రచనను ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించేట్లు ప్రేరేపించి ఉంటాయి.
ఆ రకంగా ఆధునిక తెలుగు స్త్రీల సాహిత్య చరిత్ర యాత్రాచరిత్ర ప్రక్రియ తో ప్రారంభమైంది.
1
పిక్చర్స్ ఆఫ్ ఇంగ్లండ్(Pictures Of England) పుస్తకానికి వ్రాసుకొన్న ముందుమాట (preface) కింద సంతకం స్థానంలో జానకమ్మ పేరు పక్కన చేరిన రాఘవయ్య( POTHAM JANACUMMAH RAGAVIAH ) ఆమె భర్త పేరు. అంతకు మించి ఆయన వృత్తి ఉద్యోగ వివరాలు ఏమీ లేవు. ఫామిలీ మెంబర్స్ , రిలేషన్స్ , ఫ్రెండ్స్ అంటూ సాధారణ వాచకాలతో పేర్కొన్నదే కానీ , ఎవరి పేరును గానీ ఎవరితోనైనా తనకు ఉన్న రక్త బంధుత్వ సంబంధాలను గానీ ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చేటప్పుడు స్టీమర్ నుండి బయటకు రాగానే భర్త సోదరుడు మిస్టర్ పి. వెంకటచెల్ల చెట్టి కనిపించేసరికి తనకు ఆనందం కలిగిందని చెప్పుకొన్నది. ఇదొక్కటే ఆమె బంధుత్వ పరంగా పేర్కొన్న పేరు. అది ఆధారంగా జానకమ్మ చెట్టి కులానికి చెందినది అనుకోవచ్చు. సాధారణంగా చెట్టి వైశ్యుల పేర్లలో కనిపిస్తుంది. కనుక జానకమ్మ కోమటి కులస్థురాలు. మద్రాస్ లో ఆనాడు ప్రముఖ వ్యాపారవేత్త , సంఘ సంస్కర్త గాజుల లక్ష్మీ నరుసు చెట్టి బలిజ కులస్థుడు. దానిని బట్టి జానకమ్మ బలిజ కులానికి చెందినదైనా కావచ్చు అని ఒక వూహ.
వ్యాపార కార్యకలాపాల కోసం భారతదేశానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీ సముద్రతీరపు చెన్నపట్నాన్నికొనుక్కొని ఓడరేవును , కోటను నిర్మించటంతో 1650 నాటికి అది ఒక వ్యాపార కేంద్రమై క్రమంగా మద్రాసు నగరంగా విస్తరించింది. తూర్పు ఇండియా కంపెనీ ప్రభుత్వ పాలనా కేంద్రమై అటు కర్ణాటక, కేరళ, తెలుగు, నైజాం ప్రాంతాల పై అదుపు సంపాదించగలిగింది. దీనితో మద్రాసులో పెరిగిన ఉద్యోగ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొనటానికి వలసలు ప్రారంభం అయినాయి. అట్లా వెళ్లినవాళ్లలో తెలుగు ప్రాంతాల బ్రాహ్మణులూ, కోమట్లు, బలిజలు కూడా ఉన్నారు. ( కాళిదాసు పురుషోత్తం -ఇంగ్లీషు జర్నలిజం లో తొలి వెలుగు దంపూరి నరసయ్య 2007)
1930 లనాటికి తూర్పు ఇండియా కంపెనీ పాలనలో స్థానిక ప్రజల హక్కుల కోసం, సంస్కరణల కోసం విద్యావంతులు సంఘాలు పెట్టి , పత్రికలు పెట్టి ప్రయత్నించసాగారు. వారిలో ఒకడైన గాజుల లక్ష్మీ నరుసు చెట్టి తండ్రి సిద్ధుల చెట్టి అలా నెల్లూరు ప్రాంతాల నుండి వలస వెళ్లిన వాడే. మద్రాసులో నీలిమందు వ్యాపారం చేసి సంపన్నుడైనాడు. లక్ష్మీ నరసు చెట్టి తండ్రితో కలిసి నీలిమందు వ్యాపారం తో పాటు పత్తి ఎగుమతి వ్యాపారం కూడా చేసాడు. పోతం జానకమ్మ అత్తింటి కుటుంబం కూడా అట్లా వలస వచ్చి వ్యాపారం లో కుదురుకుని మద్రాసులో స్థిరపడినదై ఉంటుంది. జానకమ్మకు కూడా పరిశ్రమలకు, వ్యాపారానికి సంబంధించిన ఆసక్తి, పరిజ్ఞానం ఉన్నాయని ఈ యాత్రాచరిత్రలో అనేక సందర్భాలు సాక్ష్యం ఇస్తాయి. ఈ ఆసక్తి , ఈ పరిజ్ఞానం కుటుంబంలోని ఆ వ్యాపార వాతావరణం నుండే ఆమెకు లభించి ఉంటాయి, ఆ క్రమంలోనే వ్యాపారలావాదేవీలమీద ఇంట్లోని మగవాళ్ళు ఇంగ్లండ్ కు వెళ్లిరావటం చూస్తున్న జానకమ్మలో విదేశాయానం పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది.
హిందూ ప్రజలు ఓడలు నిర్మించి ఇతరదేశాలకు ప్రయాణాలు చేసిన చరిత్ర , అక్కడి ప్రత్యేకతలను తెలుసుకొన్న చరిత్ర లేదన్నది ఆమె అభియోగం. పైగా హిందువులు సముద్రాలు దాటి ఇతరదేశాలకు పోరాదనే నిషేధం ఒకటి. అందువల్ల కులం పోతుందన్న బెదిరింపు, ప్రాణాలకే ముప్పు అని భయపెట్టి వెనక్కిలాగాటం.. వీటిపట్ల ఆమెకు కినుక. అందువల్ల జరిగిన మేలు ఏమీ లేక పోగా జాతి సమున్నత నాగరికతా సాధనకు అవరోధం అయినాయని ఆమె అభిప్రాయం. ఇప్పుడిప్పుడు హిందూ వ్యాపారులు సరుకులను ఓడలలో రవాణా చేయటం మొదలు పెట్టారు కానీ మిగిలిన దేశాలవాళ్ళ లాగా పెద్దపెద్ద ఓడలను నిర్మించి విదేశాలతో వాణిజ్య సంబంధాలు అభివృద్ధి పరచుకోలేక పోయారు కదా అని బాధపడుతుంది. ఇవన్నీ ఇంగ్లాండ్ యాత్ర ముగించుకు రాగానే తెలుగు పత్రికకు వ్రాసిన వ్యాసంలో ఆమె పేర్కొన్నది.
ఈ నిషేధాలు, అవరోధాలు వ్యాపార రంగంలో ఎదిగి స్థిరపడే క్రమంలో తన కుటుంబం ఎదుర్కొనే ఉంటుంది. ఆ అనుభవమే అభివృద్ధికి అవరోధంగా ఉండే సంప్రదాయాల పట్ల ఆమెలో ప్రశ్నలను రేకెత్తించి ఉంటుంది. వాటిని అధిగమిస్తూ అవసరాన్నిబట్టి వ్యాపారవర్గ పురుషులు ఇంగ్లండ్ వెళ్లిరావటం కొంత అలవాటు అవుతున్నది. దేశ క్షేమం కోసం అప్పుడప్పుడు ఇంగ్లండ్ వెళ్లివస్తున్న కొద్దిమంది హిందూ సుజనుల గురించి ఆమె తన వ్యాసంలో పేర్కొన్నది. అలా పేర్కొనబడిన హిందూ సుజనులలో జానకమ్మ భర్త, ఆయన సోదరులు కూడా ఉన్నారు. ఇంగ్లండ్ ప్రయాణంలో సౌతాంఫ్టన్ లో తమను ఎదుర్కొనటానికి వచ్చిన భారతదేశపు స్నేహితులు అని జానకమ్మ పేర్కొన్న పి. వెంకటకృష్ణమనాయుడు, పి. రతనావలో చెట్టి కూడా అలా వ్యాపార లావాదేవీలమీద వెళ్లినవాళ్ళే అయివుంటారు. ఇలాంటి వాళ్ళ సంఖ్య బహుళం అవుతూ సముద్రయానం నిషేధం అన్న మాట కాస్త వెనకబడుతున్న తరుణంలో ఒక స్త్రీకి తానూ సముద్రం దాటి ఇంగ్లండ్ కు పోవాలని అనిపించటం జానకమ్మ తోనే మొదలు. మగవాళ్ళు సంపాదన కోసం ‘దూరభూమి లేదు’ అని వెళ్లటాన్ని చూసీ చూడనట్లు వదిలివేయవచ్చు. కానీ కుటుంబ సంస్కృతికి, సంప్రదాయాల కొనసాగింపుకు సంరక్షకులుగా భావించబడే స్త్రీలు పోతామంటే ఎట్లా? . ఈ పరిస్థితులలో భర్త తో కలిసి ఇంగ్లండ్ వెళ్లాలన్న జానకమ్మ అభిలాషకు సహజంగానే వ్యతిరేకత ఎదురైంది. తల్లిదండ్రులు, సోదరీసోదరులు, చుట్టాలుప్రతిఒక్కరూ ఎవరి కారణాలు వాళ్ళు చెప్తూ ప్రేమతోనే అడ్డుపడిన సంగతి, కన్నీళ్లు పెట్టుకొన్న సంగతి, తిండి మానేసి ఏడుస్తూ కూర్చోటాన్ని గురించి చెప్పింది. అయినా ఇంగ్లండ్ వెళ్లాలన్న తన బలమైన కోరిక వదులుకొనటానికి తగిన కారణం ఏదీ కనబడలేదంటుంది జానకమ్మ. వాళ్ళ వైపు నుండి ఆలోచిస్తూ ఇంతకు ముందు ఎవరైనా ఆడవాళ్లు ఇంగ్లండ్ వెళ్ళి వుంటే వాళ్లింతగా బాధపడివుండే వాళ్ళు కాదని కూడా అంటుంది. ఆరకంగా ఇంగ్లండ్ వెళ్లిన తొలి భారతీయ మహిళా తానే అని జానకమ్మ చెప్పకనే చెప్పింది.
జానకమ్మ 1871 లోనే ఒకసారి భర్తతో కలిసి బొంబాయివరకూ వెళ్లి, ఇంగ్లండ్ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని మూడురోజుల ముందు విరమించుకొని తిరిగి వచ్చింది. ఆ ఏడు స్వదేశీయులు అనేకమంది కుటుంబాలు లేకుండానే ఇంగ్లండ్ వెళ్తున్నారు కనుక జానకమ్మ దంపతులు ప్రయాణం మానుకోవటం మంచిదని కుటుంబంవారు , స్నేహితులు చేసిన సూచన బాగుందనిపించి తక్షణమే ప్రయాణం విరమించుకున్నామని ఆమె చెప్పింది. ఇంగ్లండ్ కు వెళ్తున్న చాలామంది ఆ సంవత్సరం కుటుంబాలను ఎందుకు వెంటబెట్టుకు పోవటం లేదు? కుటుంబం తో ఇప్పుడు ప్రయాణం వద్దు అన్న బంధువుల మాట తగిన కారణం లేనిదే నిర్ణయాలు మార్చుకొనటానికి ఇష్టపడని జానకమ్మ కు తక్షణం ప్రయాణం విరమించుకొనేంత సకారణం ఎలా అయింది ? వాళ్ళు ప్రయాణానికి సిద్ధమైన ఆ 1871 సమకాలీన అంతర్జాతీయ రాజకీయ పరిణామాలలో కీలకమైనది కావటం తప్ప మరొక కారణం కనిపించదు.
ఇంగ్లండ్ కు పొరుగుదేశం ఫ్రాన్స్. 1789- 1799 మధ్యకాలంలో ఫ్రాన్సులో వచ్చిన విప్లవాలు రాజరికాన్ని కూలదోసి సామాజిక సమానత్వం, ప్రజా సార్వభౌమాధికారం ప్రాతిపదికగా కొత్త ప్రభుత్వాన్నిఏర్పరిచాయి.19 వ శతాబ్ది తొలి అర్ధభాగం ఫ్రాన్స్ లో రాచరికానికి స్వేచ్ఛను , సమానత్వాన్ని కోరే బూర్జువా శ్రామిక వర్గాలకు మధ్య నిరంతర ఘర్షణలతో గడిచింది. ఓటు హక్కు దగ్గర నుండి పారిశ్రామిక వ్యాపార హక్కులు అన్నిటికోసం పోరాటాలు అవసరమయ్యాయి. సామాజిక రాజకీయ అసంతృప్తులు 1830 నుండి 1848 వరకు అనేక విప్లవకర ఘటనలకు కారణమైంది. ప్రభుత్వాలు ఆ మేరకు మారుతూ వచ్చాయి. ఆ క్రమంలో శ్రామిక వర్గం బలపడుతూ వచ్చింది. యూరప్ అంతటా దాని ప్రభావం పడసాగింది. 1870 యుద్ధంగా చెప్పబడే ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం (ఫ్రాంకో జర్మన్ యుద్ధం) లో ఫ్రాన్స్ జర్మనులచేతిలో ఓడిపోయి వర్సైల్స్ సంధికి ఒడంబడవలసి వచ్చింది. అయితే శ్రామికవర్గ చైతన్యం పొందిన జాతీయ మిలటరీ జర్మనీతో సంధిచేసుకొని ఏర్పడ్డ మూడవ రిపబ్లిక్ ని ఆమోదించటానికి సిద్ధపడక చేసిన తిరుగుబాటు ఫలితంగా స్వతంత్ర ప్రభుత్వంగా పారిస్ కమ్యూన్ ఏర్పడిన సంవత్సరం 1871. మార్చ్ 18 నుండి మే 21 వరకు మాత్రమే మనగలిగినప్పటికీ ‘శ్రామిక వర్గ నియంతృత్వానికి’ తొలి నమూనాగా అభివర్ణించబడిన ఘటన అది. యుద్ధాలు, ఆహారపదార్ధాల కొరత, అనిశ్చిత, అంతర్గత పోరాటాలు, విప్లవకర జాతీయ సైన్యానికి, జాతీయ ఫ్రెంచ్ సైన్యానికి మధ్య ఆధిపత్య పోరుతో నిప్పులగుండంగా ఉన్న ఫ్రాన్స్ సెగలు బ్రిటన్ కు సోకుతున్న ఆ సమయంలో కుటుంబాలతో ఇంగ్లండ్ వెళ్ళటం క్షేమకరం కాదని జానకమ్మ వాళ్ళు భావించి వుంటారు. అందువల్లనే 1871 లో తలపెట్టిన ప్రయాణం జరగలేదు.
అప్పుడామె ఇంగ్లండ్ వెళ్లి ఉంటే బ్రిస్టోల్ లో మిస్ మేరీ కార్పెంటర్ ను కలిసి ఉండేది. ఆమెను సంబోధిస్తూ తమను పరిచయం చేసే ఉత్తరాలు డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ గారి అమ్మాయిలు ఇచ్చి ఉన్నారని చెప్పింది జానకమ్మ. మిస్ మేరీ కార్పెంటర్ బ్రిటన్ కు చెందిన ఉదారవాద సంఘసేవకురాలు. పేదలకు, ఆడపిల్లలకు విద్య అందుబాటులోకి తీసుకు రావటానికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పరచింది. రామమోహన్ రాయ్ వలన 1833 నాటికే ఇండియా పై ఆమెకు ఆసక్తి కలిగింది. నాలుగుసార్లు వచ్చి వెళ్ళింది.1866 లో తొలిసారి వచ్చినప్పుడు మద్రాస్ , బొంబాయి, కలకత్తాలకు వెళ్లి బాలికల విద్య గురించి ప్రముఖులతో చర్చించింది. జానకమ్మ మద్రాస్ లో మేరీ కార్పెంటర్ రాక గురించి విన్నదో , ఆమె సంభాషణల సారం తెలుసుకొన్నదో , ప్రత్యక్షంగా చూసిందో తెలియదు కానీ ఇంగ్లాండ్ వెళ్ళినపుడు ఆమెను కలవాలనుకొన్నది. లేక ఆమెను కలిస్తే బాగుంటుందని ఆత్మరామ్ పాండురంగ గారి అమ్మాయిలు చెప్తే తెలుసుకొని ఉంటుంది. ఏమైనా ఆ మేరకు వాళ్ళ నుండి మేరీకార్పెంటర్ కు పరిచయ లేఖలు కూడా సిద్ధం చేసుకొంది. ప్రయాణం ఆగిపోవటం వల్ల ఆమెను కలుసుకొనే అవకాశం కోల్పోయాను కదా అన్న బాధా స్వరం ఆమె వాక్యాలలో వినబడుతుంది.
మొదటిసారి ఇంగ్లండ్ ప్రయాణపు ఏర్పాట్ల సందర్భంలో జానకమ్మ ఆత్మరామ్ పాండురంగ గారిని ఆయన కూతుళ్ళను ప్రస్తావించింది. ఆత్మారామ్ పాండురంగ తుర్ఖడ్ 1823- 1898 మధ్యకాలంలో జీవించిన వైద్యుడు. విద్యావేత్త. సంఘ సంస్కర్త. బాల్యవివాహాలను వ్యతిరేకించాడు. ఆడపిల్లలకు 20 ఏళ్ళు వచ్చేవరకు పెళ్లి చేయరాదన్నది ఆయన అభిప్రాయం. ఆడపిల్లల చదువును ప్రోత్సహించాడు. కులవ్యవస్థను నిరసించాడు. బ్రహ్మ సమాజ ప్రభావాలతో తన ఇంట్లో ప్రార్ధనా సమాజం ఏర్పాటు చేసాడు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న సంస్కర్తలతో ,మేధావులతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఆయనకు ఇద్దరు కొడుకులు , ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురు మనేకా తండ్రివలెనే వైద్యం చదివింది. చిన్నకూతురు అన్నపూర్ణ ఇంగ్లీష్ భాషా సాహిత్యాలు చదివింది. జానకమ్మ “ accomplished daughters of Dr. Atmaram Pandoorung of Bombay” అని పేర్కొన్నది వీళ్ళను. మేరీకార్పెంటర్ కు జానకమ్మ వాళ్ళను పరిచయం చేస్తూ ఉత్తరం వ్రాయ గలిగిన స్నేహం , చనువు వాళ్లకు ఎలా వచ్చాయి.? 1866 ఇండియా పర్యటనలో మేరీకార్పెంటర్ బొంబాయి వెళ్లిన విషయాన్ని, అలా వెళ్లిన సంస్కరణవాదులు ఎవరైనా బొంబాయిలో ఆత్మరామ్ పాండురంగ ను కలవకుండా ఆయన ఆతిధ్యం పొందకుండా రాలేరు రారు అనే విషయాన్ని కలిపి ఆలోచిస్తే ఆమెకు ఆయన కూతుళ్ళకు మధ్య స్నేహం ఏర్పడగల అవకాశాలు అర్ధం అవుతాయి. ఆ క్రమంలో జానకమ్మ కూడా వాళ్ళ కుటుంబంతో సంబంధాలు, ఆయన కూతుళ్లతో స్నేహం సాధ్యం అయ్యాయి. అయితే జానకమ్మ వాళ్ళను అత్మారామ్ కూతుళ్లు అనే చెప్పింది కానీ పేర్లతో వాళ్ళను గుర్తించి చెప్పలేదు.
1871 ఇంగ్లండ్ ప్రయాణం ఆగిపొయ్యాక కూడా జానకమ్మ మరికొన్ని రోజులు అక్కడే ఉన్నది. భారత గవర్నర్ జనరల్ లార్డ్ నార్త్ బ్రూక్ వచ్చి బొంబాయిలో మహారాణి విగ్రహాన్ని ఆవిష్కరించే ఉత్సవంలో ఆత్మారామ్ గారి కూతుళ్లతో కలిసి పాల్గొన్నది. బొంబాయిలో దేశీయ నూలు తీత ,నేత మిల్లులను చూడగలిగింది. మద్రాస్ ను మించిన నగరమని చాలావరకు ఇంగ్లీష్ టౌన్ గా ఉంటుందని బొంబాయిని మెచ్చుకొన్నది.
జానకమ్మ ఇంగ్లండ్ యాత్ర 1873 జులై 20 న మద్రాస్ లో మొదలై 1874 జనవరి 31 న బొంబాయిలో దిగటంతో ముగిసింది. అప్పటికి జానకమ్మకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? పిల్లలు ఉన్నట్లు లేదు. ఉత్సాహం, ఆలోచనారీతి, ప్రశ్నించే తీరు పాతిక ముప్ఫయ్యేళ్లు దాటవని పిస్తుంది. ఈ ఆలోచనారీతి, ప్రశ్నించి తర్కించే పద్ధతి ఆమెలో ఎలా వికసించాయి? ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీ లో విద్య, ఉద్యోగ రాజకీయ మత సాంస్కృతిక రంగాలలో హిందూ సమాజ ప్రయోజనాలకోసం,ప్రత్యేకించి స్త్రీవిద్య, పునర్వివాహ విషయాల కోసం జరుగుతున్న చర్చోప చర్చలతో వేడెక్కుతున్న సంస్కరణఉద్యమ నేపథ్యం కారణం కావచ్చు. ఒక సంపన్న వ్యాపారవర్గ స్త్రీగా నాటి నాగరిక స్త్రీ సమాజంతో ఏర్పడిన సంబంధాలు, చేసిన సంభాషణలు కారణం కావచ్చు. సమకాలపు ఆ జీవన సంఘర్షణను అవగాహన చేసుకొనే విద్య, ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం ఉండటం వల్ల కావచ్చు. ఏ విధమైన జంకు గొంకులు లేక పూర్తిగా అపరిచితమూ, భాషా సాంస్కృతిక భిన్నత్వము కల ఇంగ్లండ్ సమాజంలో తిరగటం, ఇంగ్లీషులోకి తన వ్యాసాన్ని అనువదించు కోగలగటం, ఇంగ్లీష్ లో యాత్రా చరిత్ర వ్రాయటం కన్నా అందుకు ప్రబల నిదర్శనం మరేమి కావాలి!? ఇంగ్లండ్ ప్రయాణంలో ఆమె అనేకమంది ఆంగ్ల మహిళల స్నేహం సంపాదించింది. వాళ్ళందరూ హిందూ మహిళా సమాజ సంక్షేమాన్ని కోరుతున్న వాళ్ళని గుర్తించింది. వాళ్ళ సూచనమేరకే ఆమె ఈ యాత్రాచరిత్ర వ్రాస్తున్నట్లు చెప్పుకొన్నది కూడా.
ధనికులకు , విస్తృతంగా వ్యాపారంచేయాలను కొనేవాళ్లకు, తమ విదేశీ భాషా పరిజ్ఞానంతో లోకోత్తరవిజయాలను కాంక్షించే వాళ్లకు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళటం అవసరం, అనివార్యం అంటూ ప్రబోధించటానికి, విదేశాయానం ప్రయాసకరం కాదు , ప్రమాదకరం కాదు అన్న నైతిక ధైర్యాన్ని ఇయ్యటానికి జానకమ్మ ఈ యాత్రాచరిత్రను రచించింది.
జానకమ్మ ‘pictures of England’ అనే తన ఈ రచనను లేడీ జులియా రాబిన్ సన్ కు అంకితం ఇచ్చింది. అంకిత వచనాలలో ‘లేడీ షిప్’ అనే మాటతో ఆమెను పదేపదే సంబోధించటాన్ని బట్టి , హిందూ స్త్రీల సంక్షేమం పట్ల ఆమె చూపిస్తున్న శ్రద్ధ, వాళ్ళ సామాజిక మేధోపర స్థాయి కోసం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలు ఈ పుస్తకాన్ని ఆమెకు అంకితం ఇయ్యటానికి తనను ప్రేరేపించాయి అని చెప్పిన దాన్ని బట్టి జూలియా రాబిన్ సన్ మద్రాసు లో ఉన్నత సామాజిక స్థాయిలో ఉన్న స్త్రీ అని అర్ధం అవుతుంది. అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీ కి యాక్టింగ్ గవర్నర్ గా ఉన్న విలియం రోజ్ రాబిన్ సన్ భార్య ఆమె అని అన్వేషణలో తేలింది. 1822 లో పుట్టిన విలియం రోజ్ రాబిన్ సన్ 1842 లో ఇండియన్ సివిల్ సర్వీస్ లో చేరి భారతదేశానికి వచ్చాడు. 1865 నాటికి మద్రాస్ ప్రెసిడెన్సీ కి ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయినాడు. వివిధ హోదాలలో పనిచేస్తూ 1875 లో ఏప్రిల్ నుండి నవంబర్ వరకు గవర్నర్ బాధ్యతలను కూడా నిర్వహించాడు. ఆ నాటి ప్రభువర్గ మహిళకు వలెనె జూలియా రాబిన్ సన్ కూడా ఉన్నత హోదాలో ఉన్న ప్రభుత్వాధికారి భార్యగా మద్రాసు లో స్త్రీ సంస్కరణలకు పనిచేయటం అతి సహజం. పోతం జానకమ్మ ఆమె హిందూ స్త్రీల సంక్షేమం కోసం పనిచేయటాన్ని ఎంతకాలంగా గమనిస్తూ వచ్చిందో కానీ హిందూస్త్రీల అభ్యుదయానికి అంకితం అయినందుకు కృతజ్ఞతా పూర్వకంగా సగర్వంగా తన పుస్తకాన్ని ఆమెకు కానుకగా సమర్పిస్తున్నాను అని చెప్పుకొన్నది. సంపన్న వ్యాపారవర్గాల స్త్రీలకూ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగ వర్గాల స్త్రీలకూ ఉండే మర్యాదాపూర్వక సామాజిక సంబంధాలకు ఇది ఒక సంకేతం
ఈ యాత్రాచరిత్రను ఇంగ్లండ్ యాత్రా విశేషాలతో పాటు ఆయాప్రాంతాల ఆర్ధికరాజకీయ సంస్కృతిని తెలుసుకొనటానికి చదవాలి. అదే సమయంలో రచయిత్రి జీవిత చైతన్యాన్ని , చారిత్రక భావజాల దృక్పథాన్ని అంచనా వేసే పని చేయాలి. ప్రత్యేకించి రచయితలుగా స్త్రీలు తమను తాము వ్యక్తీకరించుకొన్న తీరును పరిశీలించాలి.
----------------------------------------------------------------------
(ఇంకా ఉంది)
పశ్చిమ దేశాలలో వచ్చిన జాతీయోద్యమానికి, భారతదేశంలో వచ్చిన జాతీయోద్యమానికి స్వరూప స్వభావాల్లో స్పష్టమైన తేడా ఉంది. ఇంగ్లాండు మొదలైన దేశాల్లో భూస్వామ్య పీడనను చర్చి ఆధిపత్యాన్ని అక్కడి జాతీయోద్యమం ప్రశ్నించింది. యూరప్లో పెట్టుబడిదారి వ్యవస్థ ఎదుగుదలకు భూస్వామ్య వ్యవస్థ, మత ఛాందస భావజాలం అడ్డంకిగా నిలిచాయి. ఈ ప్రతిబంధకాలను జాతీయోద్యమం తొలగించి పెట్టుబడిదారి వ్యవస్థ ఎదుగుదలకు మార్గం సుగమం చేసింది.
భారతదేశంలో జాతీయోద్యమం వలస పాలనకు వ్యతిరేకంగా వచ్చింది. భూస్వామ్య వ్యవస్థను మత భావజాలాన్ని ఇక్కడి జాతీయోద్యమం తిరస్కరించలేదు. బాలగంగాధర్ తిలక్ నుండి గాంధీ వరకు గతం నుండి మతం నుండి ప్రేరణ పొందారు. హిందూమతం నుండి ప్రేరణ పొందిన జాతీయోద్యమ నాయకత్వం, హిందూమతం నుండి ఉత్పన్నమైన అస్పృశ్యత సమస్యను పట్టించుకోవడం ఒక వైరుధ్యంగా కనబడినా, అస్పృశ్యత సమస్యను ఒక చారిత్రక అవసరంగా జాతీయోద్యమ నాయకత్వం తన కార్యక్రమంలో అంతర్భాగం చేసుకొంది.
దళిత సమస్యను కాంగ్రెసు నాయకత్వం పట్టించుకున్న తీరు, దాన్ని తన కార్యక్రమంలో అంతర్భాగం చేసుకున్న తీరు, దానికి తెలుగు నవలలు స్పందించిన తీరును ఈ వ్యాసంలో పరిశీలించడం జరుగుతుంది.
1917 సంవత్సరంలో సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షతన కలకత్తాలో కాంగ్రెసు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారతదేశంలోని అస్పృశ్యులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను రూపుమాపటానికి కాంగ్రెసు పార్టీ చర్యలు తీసుకొంటున్నట్టు సురేంద్రనాథ్ బెనర్జీ ప్రకటించాడు. 37 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంగ్రెసు పార్టీ మొట్టమొదటిసారి అస్పృశ్యుల గురించి ఒక ప్రకటన చేసింది. కాంగ్రెసు పార్టీకి అంటరానివారి సమస్యలు గుర్తుకు రావటానికి కారణం ఉంది.
1917 సంవత్సరంలో బొంబాయిలో అణగారిన కులాల సంఘం మహాసభ జరిగింది. ఈ సభ అణగారిన కులాల ఉద్ధరణకు కొన్ని తీర్మానాలు చేసింది. 1917లో సర్నారాయణ చందావర్కర్ అధ్యక్షతన జరిగిన అణగారిన వర్గాల సంఘం మొట్టమొదటి సమావేశం తీర్మానాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఈ సమావేశం బ్రిటీషు ప్రభుత్వానికి విధేయతను ప్రకటించింది. ప్రభుత్వ నిర్వహణలో రావలసిన సంస్కరణల గురించి భారత జాతీయ కాంగ్రెసు అఖిల భారత ముస్లిం లీగు చేసిన సిఫారసులను ఈ సమావేశం ఆమోదించింది. భారతదేశంలో అణగారిన కులాలవారు అంటరానివారుగా పరిగణింపబడుతున్నారు. వారి సామాజిక స్థితి హీనంగా ఉంది. విద్యలో వారు వెనకబడి ఉన్నారు. వారు తమ అభివృద్ధికి అవసరమైన పరిస్థితులను కల్పించుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ దుస్థితి నుండి వారు బయట పడటానికి వారికి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని ఈ సమావేశం కోరింది. భారత ప్రభుత్వం నిర్బంధ ఉచిత విద్యను అస్పృశ్యులకు అమలు చేయాలని, సార్వత్రిక విద్యావిధానం వల్లనే అణగారిన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సమావేశం అభిప్రాయపడింది. అణగారిన వర్గాలపైన మతం. సంప్రదాయం విధిస్తున్న అనర్హతలను తొలగించటానికి త్వరలో జరగన్ను కాంగ్రెసు మహాసభలో ఒక తీర్మానాన్ని చేయాలని ఈ సమావేశం కాంగ్రెసు పార్టీకి విజ్ఞప్తి చేసింది. అగ్రకులాల వారు అణగారిన కులాలను ఉద్ధరించటానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేసింది.
ఈ సమావేశం జరిగిన కొద్ది రోజులకే అణగారిన వర్గాల రెండవ సమావేశం బ్రాహ్మణేతర పార్టీ నాయకుడు బాపూజీ నామవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం కూడా అణగారిన కులాల ఉద్ధరణకు తీర్మానాలు చేసింది. బొంబాయిలో నారాయణ చందావర్కర్ అధ్యక్షత జరిగిన అణగారిన వర్గాల సమావేశం చేసిన తీర్మానానికి ప్రతిస్పందిస్తూ 1917 సంవత్సరంలో కలకత్తా కాంగ్రెసులో సురేంద్రనాథ్ బెనర్జీ అణగారిన కులాల అభివృద్ధికి కాంగ్రెసు పార్టీ కృషి చేస్తుందని ప్రకటించాడు. 1917 సంవత్సరంలో బ్రిటీషు సామ్రాజ్యంలో భాగంగా భారతదేశంలో స్వపరిపాలన సంస్థలను, బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని మెల్లమెల్లగా ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నట్టు బ్రిటీషు కామన్స్ సభలో మాంటెగ్యూ (Secretory of state for India) ప్రకటించాడు. 1916 సంవత్సరంలో 19 మంది ఇంపీరియల్ కౌన్సిల్ సభ్యులు భారతదేశంలో ప్రాతినిధ్య ప్రభుత్వం, డొమీనియన్ ప్రతిపత్తి కావాలని వైస్రాయికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ డిమాండును అనుసరించి అందులో భాగంగానే మాంటెగ్యూ ప్రకటన వెలువడింది. కాంగ్రెసు, ముస్లింలీగు పథకాన్ని జాతీయ డిమాండుగ చేయటానికి కాంగ్రెసు పార్టీ ప్రయత్నించింది. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఇవ్వటానికి కాంగ్రెసు పార్టీ అంగీకరించింది. ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముస్లింలకు సీట్లను కేటాయించారు. ఈ పథకాన్ని కాంగ్రెసు లీగు పథకం లేక లక్నో ఒప్పందం అంటారు.
ఈ ఒప్పందం ప్రకారం ముస్లింలు కాంగ్రెసుకు మద్దతు ప్రకటించారు. ఇక మిగిలింది అస్పృశ్యులు, అస్పృశ్యుల మద్దతు కూడా కూడగట్టితే కాంగ్రెసు పార్టీ దేశంలోని ప్రజలందరి పార్టీగా గుర్తింపు పొందుతుంది. అణగారిన కులాల సంఘం అధ్యక్షుడైన సర్ నారాయణ చందావర్కర్ను తమకు మద్దతు ప్రకటించవలసిందిగా కాంగ్రెసు పార్టీ కోరింది. అణగారిన కులాల సంఘం కాంగ్రెసు లీగు పథకాన్ని కొన్ని షరతులతో అంగీకరించింది. "అంటరాని కులాల సాంఘిక అనర్హతల నిర్మూలనకు కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానాన్ని చేస్తే తాము కూడా కాంగ్రెసు-లీగు పథకాన్ని ఆమోదిస్తామని అణగారిన వర్గాల సంఘం ప్రకటించింది". ఈ ఒప్పందం ప్రకారం 1917 సంవత్సరంలో కలకత్తా కాంగ్రెసు సమావేశంలో సురేంద్రనాథ్ బెనర్జీ అణగారిన వర్గాల గురించి ప్రకటన చేశాడు. ఈ విధంగా అస్పృశ్యత సమస్య కాంగ్రెసు పార్టీ కార్యక్రమంలో అంతర్భాగమయింది. ఇదంతా గాంధీ కాంగ్రెసు నాయకత్వానికి రాకముందు జరిగిన చరిత్ర. నిమ్నవర్ణాల నుండి ఒత్తిడి రావటం వలన ఆ వర్గాలను వలస పాలకులకు వ్యతిరేకంగా కూడగట్ట వలసిన అవసరం ఏర్పడటం వలన అనివార్యమైన పరిస్థితుల్లో కాంగ్రెసు అస్పృశ్యత సమస్యను తన కార్యక్రమంలో భాగం చేసుకొంది.
దళిత జనోద్ధరణకు కాంగ్రెసు పార్టీ చేసిన కృషి :
గాంధీ 1919 సంవత్సరంలో కాంగ్రెసు పార్టీ నాయకత్వాన్ని స్వీకరించాడు. అప్పటివరకు మధ్యతరగతి మేధావులకు మాత్రమే పరిమితమైన కాంగ్రెసు పార్టీని గాంధీ సామాన్య ప్రజల వరకు విస్తరింప చేశాడు. 1922లో బార్డోలి కాంగ్రెస్ సమావేశంలో అస్పృశ్యులను సామాజికంగా, మానసికంగా, నైతికంగా అభివృద్ధి చేయటానికి నిర్ణయించారు. పంచముల పిల్లలను జాతీయ పాఠశాలల్లో చేర్పించాలని, అగ్రవర్ణాల పిల్లలతో సమానమైన సౌకర్యాలను వారికి కూడా కల్పించాలని తీర్మానించారు.
1922 సంవత్సరం జూన్లో జరిగిన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ అంటరాని వాళ్ళను ఉద్ధరించటానికి స్వామి శ్రద్ధానంద జీ, సరోజిని నాయుడు, యాగ్నిక్ మరియు దేశపాండే సభ్యులుగా ఒక కమిటీని నియమించారు. ఈ సభ్యులను దేశంలోని అంటరాని కులాల ఉద్ధరణకు ఆచరణాత్మకమైన కార్యక్రమం రూపొందించవలసిందిగా కాంగ్రెసు పార్టీ కోరింది. ఈ కార్యక్రమానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. 1922 సంవత్సరంలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశంలో ఈ నిధిని రెండు లక్షల నుండి ఐదు లక్షలకు పెంచారు. నిధుల సమీకరణకు ఒక ఉపకమిటీని కూడా నియమించారు.
ఈ కమిటీకి స్వామి శ్రద్ధానందజీ రాజీనామా చేశాడు. తరువాత ఈ కమిటీని పునరుద్ధరించ లేదు. 1923 సంవత్సరంలో బొంబాయిలో జరిగిన కాంగ్రెసు పార్టీ సమావేశం అస్పృశ్యతను రూపుమాపటానికి కృషి చేయవలసిందిగా హిందూ మహాసభను కోరింది. హిందూ మహాసభ క్రియాశీలమైన హిందూ మతతత్వ సంస్థ. "మతపరంగా, సాంస్కృతికంగా హిందూ వ్యవస్థను కాపాడటమే హిందూ మహాసభ ప్రధాన లక్ష్యం". అస్పృశ్యత సమస్య హిందూ మత వ్యవస్థ నుండి ఆవిర్భవించింది. అస్పృశ్యతను రూపుమాపాలంటే హిందూమత వ్యవస్థ తాత్విక భూమికను హేతుబద్ధంగా తిరస్కరించాలి. ఈ పని హిందూ మహాసభ చేయదు. కాంగ్రెసు పార్టీ అంటరానితనాన్ని రూపుమాపటానికి హిందూ మహాసభకు బాధ్యతను అప్పగించి చేతులు దులుపుకుంది. అస్పృశ్యుల సమస్య అలాగే మిగిలి పోయింది. కాంగ్రెసు పార్టీ తీసుకొన్న కార్యక్రమాలపైన ఖర్చు చేసిన నిధులను బట్టి చూస్తే, అంటరానితనాన్ని రూపుమాపటానికి ఆ పార్టీ ఎక్కువగా శ్రద్ధ తీసుకోలేదన్న విషయం సులభంగా అర్థమవుతుంది. తిలక్ స్వరాజ్యనిధికి కాంగ్రెసు పార్టీ కోటి ముప్పై లక్షల నిధి వసూలు చేసింది. 1921 నుండి 1923 వరకు నిర్మాణ కార్యక్రమానికి 45 లక్షల 50 వేలను ఖర్చు చేసింది. అస్పృశ్యత నిర్మూలనకు 43 వేల 381 రూపాయలను మాత్రమే కాంగ్రెసు పార్టీ ఖర్చు చేసింది. ఇది కాంగ్రెసు పార్టీ అంటరానితనాన్ని నిర్మూలించటంలో చూపిన ఉదాసీన వైఖరిని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా అస్పృశ్యత సమస్య పైన గాంధీ అవగాహనను తెలుసుకోవటం అవసరం.
గాంధీ - అస్పృశ్యత నిర్మూలన
అస్పృశ్యత సమస్యను గాంధీ హిందూయిజంలో భాగంగా పరిష్కరించాలనుకున్నాడు. అంటరానితనానికి తాత్విక పునాదియైన హిందూమతాన్ని ఆయన ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గాంధీ అంటరాని వారిని హరిజనులని పేరుపెట్టాడు. హరిజనులంటే దేవుని బిడ్డలు అని ఆయన వివరించారు. దేవుని బిడ్డలను అందరు ముట్టుకోవచ్చు. అస్పృశ్యులకు హరిజనులని పేరుపెట్టి వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి హిందూసమాజం నుండి వీరిని శాశ్వతంగా దూరం చేశాడు. హిందూ సమాజం కులవ్యవస్థపైన నిర్మించటం వలన అది మనగలుగుతుంది. కులవ్యవస్థ సహజమైనది (నాచురల్) అంటాడు గాంధీ. కులాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు మనిషిని ఆధ్యాత్మికంగా దిగజారుస్తాయి. మోక్షానికి దూరం చేస్తాయి అన్నాడు. వర్ణవ్యవస్థపైన ఆయనకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. చిల్లర కులాలు అన్ని కలిసి శూద్రవర్ణంగా ఏర్పడితే పూర్వకాలం నాటి చాతుర్వర్ణ్య వ్యవస్థను పునఃస్థాపించవచ్చు. అప్పుడు అస్పృశ్యత సమసి పోతుందని ఆయన భావించాడు. "The best remedy is that small castes should fuse themselves into one big caste. There should be four such big castes through that we may reproduce the old system of four varnas" గాంధీ వేద ప్రామణ్యాన్ని అంగీకరించాడు. కర్మ సిద్ధాంతాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. అనువంశికంగా కులాలకు సంక్రమించిన వృత్తుల మార్పును ఆయన వ్యతిరేకించాడు. "In the verna system no man has any liberty to choose his occupation. His occupation is determined for him by heridity" దళితులు శుచి, శుభ్రతలు నేర్చుకోవాలి. వారి పిల్లలను పాఠశాలల్లో చేర్చుకోవాలి. అంటరాని వారిని దేవాలయాల్లో ప్రవేశించనీయాలని గాంధీ చెప్పాడు. కులవ్యవస్థను పదిలంగా కాపాడుతున్న అంతర వివాహాన్ని (Endogamy) గాంధీ గుర్తించలేదు. అంటరాని వారిలోని పేదరిక నిర్మూలనకు గాంధీ ధర్మ కర్తృత్వ సిద్ధాంతాన్ని (Trusteeship) ప్రతిపాదించారు. అగ్రకులాల్లోని సంపన్నులు అంటరానివారి అభివృద్ధికి స్వచ్ఛందంగా ఆర్థిక సహాయాన్ని అందచేయాలని ఆయన కోరాడు. గాంధీ భావాలు సారంలో హిందూయిజమే. ఈ సందర్భంగా గాంధీ సమకాలికుడైన అంబేద్కర్ అంటరానితనాన్ని నిర్మూలించటానికి చేసిన సైద్ధాంతిక కృషిని తెలుసుకోవటం అవసరం.
అంబేద్కర్ · - కుల నిర్మూలన :
బ్రిటీషు వలస పాలకుల నుండి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం కాంగ్రెసు పార్టీ చేస్తున్నది. రాజ్యాధికారం విదేశీయుల నుండి స్వదేశీయులకు మార్పిడి జరిగితే అంటరాని కులాల పరిస్థితి ఏమాత్రం మారదు. పరిపాలనలో భాగస్వామ్యం లేని జాతులు పరిపాలన ఫలితాలను అనుభవించలేవు. అస్పృశ్యుల సామాజిక స్థితి బాగుపడాలంటే వారికి చట్టసభల్లో, విద్యా సంస్థల్లో, పరిపాలనా యంత్రాంగంలో తగిన ప్రాతినిధ్యం ఉండాలని అంబేద్కర్ భావించాడు. ఆయనభారతదేశంలోని కుల సమస్యను ప్రధాన సామాజిక సమ6 / 14 కుల వ్యవస్థలో వ్యక్తుల సహజసిద్ధమైన శక్తి సామర్థ్యాలను బట్టి కాకుండా ఎం తల్లిదండ్రులు అనువంశికంగా చేస్తూ వస్తున్న వృత్తిని మాత్రమే చేయాలి. "హిందువులలో కులం అనేది ఒక భావన, ఒక విశ్వాసం, ఒక మానసిక స్థితి. కుల నిర్మూలన అంటే భౌతికంగా ఉన్న ఒక అడ్డంకిని తొలగించటం కాదు. మనోభావనలోనే ఒక మార్పును సాధించగలగటం". కులం అంతర వివాహం (Endogamy) అనుకరణ (Imitation) వలన బతుకుతుంది. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు మాత్రమే సరిపోవని, కులానికి తాత్విక పునాదిగా నిలిచిన హిందూమత భావజాలాన్ని తార్కికంగా ఖండించిననాడే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డాడు.
దళిత జనోద్ధరణను చిత్రించిన నవలలు :
ఉన్నవ లక్ష్మీనారాయణ 'మాలపల్లి', రంగా 'హరిజన నాయకుడు', మహీధర రామరామోన రావు "కొల్లాయి గట్టితేనేమి?”; ఉప్పల లక్ష్మణరావు "అతడు-ఆమె” నవలలు దళిత జనోద్ధరణ సమస్యను చిత్రించాయి. ఈ నలుగురు రచయితల్లో ఉన్నవ, రంగా కాంగ్రెసు భావజాలానికి చెందినవారు. మహీధర రామమోహనరావు, ఉప్పల లక్ష్మణరావు వామపక్ష భావజాలానికి చెందినవారు. మహీధర, ఉప్పల వర్గ దృక్పథంతో దళిత సమస్యను చూడలేదు. ఆనాటి ఆధిపత్య భావజాలం (Dominent Ideology) అయిన గాంధీ భావజాలానికి మహీధర, ఉప్పల స్పందించారు.
ఉన్నవ 'మాలపల్లి'లో శుచి, శుభ్రత, ధర్మ కర్తృత్వ సిద్ధాంతం (Trusteeship), మతమార్పిడి వ్యతిరేకత, మత సమ్మె మొదలైన అంశాలు కనబడతాయి. రంగా 'హరిజన నాయకుడు' నవలలో అంటరాని వారు పాఠశాల, దేవాలయ ప్రవేశం, మతమార్పిడి వ్యతిరేకత, సైమన్ కమీషన్ మొదలైన అంశాలను చిత్రించాడు. మహీధర “కొల్లాయి గట్టితేనేమి?”, ఉప్పల “అతడు-ఆమె” నవలలు గాంధీ ప్రతిపాదించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని చిత్రించాయి.
ఉన్నవ లక్ష్మీనారాయణ సంఘ సంస్కర్త. సంఘ సంస్కరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. వితంతు వివాహాలను జరిపించి గుంటూరు వీరేశలింగంగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహానికి నాయకత్వం వహించి జైలుకు పోయాడు. వెల్లూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న కాలంలో ఆయన మాలపల్లి నవల రాశాడు. మాలపల్లి నవలలో నాయకుడు రామదాసు. ఆయన దళితుల్లో మాలదాసరి కులానికి చెందినవాడు. మాలపల్లెలను “మునిపల్లెలను చేయాలన్న తపన ఉన్నవాడు.
దళితుల్లో లేని శుచి, శుభ్రతల గురించి రామదాసు మాటల్లో తెలుస్తుంది. "మాల మాదిగ పల్లెల చుట్టు పారవేయబడ్డ యెముకల నుండీ, పసు కళేబరాలను కోసిన స్థలములో విడువబడ్డ మురికి నుండీ, తోళ్ళూనడానికి నానవేసే గాబుల నుండీ, దండెముల మీద ఆరవేసిన కుళ్ళు మాంసపు వరుగుల నుండీ, గౌలు బయలుదేరి నలుదిక్కులా వ్యాపిస్తున్నది. ఈ గబ్బుకు
చిన్నప్పటినుండి అలవాటు పడ్డ రామదాసుకు కూడా కష్టంగా వున్నది. ఇందుకోసమే కావాలె. మనవాళ్ళను ఊళ్ళో ఉండవద్దన్నారు. ఈ చండాలము వల్లనే వీండ్లకు చండాలురు అన్న పేరు వచ్చి ఉంటుంది. వీండ్లు చాలామంది నీళ్ళే పోసుకోరు. శాచ పద్ధతే యెరుగరు".
గాంధీ ప్రతిపాదించిన self purification భావనకు అనుకూలంగా ఉన్నాయి రామదాసు మాటలు. అంటరానివారు పరిశుభ్రత నేర్చుకోవటానికి అగ్రకులాల వారు తోడ్పడాలని గాంధీ సూచించాడు. అంటరానివారి జీవిత విధానమే దుర్గంధపూరితం కావటం వలన అగ్రకులాల వారు వారిని దగ్గరికి రానియ్యటం లేదు. వారిని అంటుకోవటం లేదు. వారు పరిశుభ్రతను నేర్చుకుంటే సవర్ణులు వారిని అంటుకోవటానికి, వారు గ్రామ మధ్యభాగంలో నివసించటానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు అని రామదాసు అభిప్రాయపడ్డాడు. ఈ ఆలోచనే గాంధీకి ఉంది. గాంధీ అనుచరుడు ఉన్నవ, గాంధీ అభిప్రాయాలకు అక్షరరూపం ఇచ్చాడు. అగ్రకులాల వారు దళితులను దగ్గరికి రానీయకుండా ఉంచటానికి మరొక కారణం రామానాయుడు మాటల్లో కనబడుతుంది. రామానాయుడు సంగదాసుతో హరిజనులు "మురికి మాంసము తినకూడదు. ఆ సంగతి నీవు వాండ్లకు గట్టిగా చెప్పాలె" అంటాడు. రామానాయుడు ఉదార భావాలు గల భూస్వామ్య కుటుంబ ప్రతినిధి. ఇంగ్లీషు విద్యవలన అబ్బిన ఉదారభావాలతో పాటు ఆయనపైన గాంధీ భావాల ప్రభావం ఉంది. ఆనాటి ఉదారవాదులు, గాంధీ అనుయాయులు దళితుల్లో ఈ సంస్కణలనే ఆశించారు. దారిద్ర్యాన్ని రూపుమాపే కార్యక్రమం లేకుండా కేవలం సంస్కరణలతో దళితులను ఉద్ధరించాలనుకున్న కాంగ్రెసు పార్టీకి సంగదాసు సరియైన సమాధానం ఇచ్చాడు.. "మాల, మాదిగ పల్లెల్లో నాలుగు నెలలు పూర్తైన భోజనమంటే జొన్నన్నం, గోంగూరకారం యివి కడుపునిండా తినడము, నాలుగు నెలలు అర్ధభోజనము, మిగిలిన రోజులు కటిక వుపవాసము" ఆకలితో అలమటించే జనం నాగజెముడు పండ్లు, బొద్దాకులు, చచ్చిన పశువుల మాంసం తింటారు. వారి ఆర్థిక పరిస్థితి బాగుపడితే శుభ్రమైన బట్టలు వేసుకొంటారు. రోజు స్నానం చేస్తారు. పరిశుభ్రమైన భోజనం తింటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొంటారు. ఈనాడు అభివృద్ధి చెందిన దళితులు అన్నింటిలో అగ్రవర్ణాలతో సమానంగా ఉన్నారు. అయినా వివక్ష పోలేదు.
అగ్రకులాలవారు దళితుల పట్ల అనుసరిస్తున్న వివక్ష ధోరణికి దృష్టాంతం ఒకటి మాలపల్లి నవలలో రచయిత చిత్రించాడు. పశువుల మేపటానికి పోయిన వారంతా మధ్యాహ్నం భోజనానికి ఒక్కదగ్గర చేరతారు. వెంకటదాసు "నా అన్నం పెడతా నీ రొట్టె ఇయ్యమని" సాయెబుతో అంటాడు. "మాలవాండ్ల అన్నంకి తినమంటావు" అంటాడు సాయెబు. ఇస్లాం మతంలో కులపట్టింపు లేదు. ఈ మతం సోదరత్వానికి పెద్దపీఠ వేసింది. భారతదేశంలో ఇస్లాం మతంపైన కులవ్యవస్థ ప్రభావం పడింది. సాయెబు వెంకటదాసును అంటరానివాడుగా పరిగణించాడు. ఈ విధంగానే భారతదేశంలోని క్రైస్తవమతంపైన కూడ కులవ్యవస్థ ప్రభావం పడింది.
గాంధీ భావజాల ప్రభావంతో ఉన్నవ మాలపల్లి నవల రాసారు. ఆయన ఈ నవలలో గాంధీ భావజాలాన్ని పూర్తి అనుకరించలేదు. సహపంక్తి భోజనాలను గాంధీ పూర్తిగా వ్యతిరేకించాడు. ఉన్నవ తన నవల మాలపల్లిలో సహపంక్తి భోజనాలను సమర్థించాడు. 1917వ సంవత్సరంలో విజయవాడలో ఆది ఆంధ్రమహాసభకు రామానాయడు, సంగదాసు హాజరయ్యారు. రైల్వే స్టేషనులో ఇద్దరు కలిసి భోజనం చేశారు. రామానాయుడు, సంగదాసు కలిసి భోజనం చేయటాన్ని చూసిన మంగళాపురం గ్రామస్థులు పెద్ద రాద్ధాంతం చేశారు. “వడ్డించేవాడు మతంలో కలిసిన మాదిగే, పంక్తిన భోజనం చేసేవాడు పచ్చి మాల. కాబట్టి ఇది మాదిగన్నం” అన్నారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన విషయంలో ఉన్నవ లక్ష్మీనారాయణ అభిప్రాయాలు గమనార్హం. "కులాలు నశించాలంటే సహపంక్తి భోజనాలు ప్రజాదరణ పొందాలి" అంటాడు. ఉన్నవ. ఈ భావానికి అనుకూలంగా రచయిత పై సంఘటనను చిత్రించాడు.
విజయవాడలో జరిగిన ఆది ఆంధ్రమహాసభలో వెంకటరెడ్డి ప్రసంగించాడు. ఈ సభలో పంచముల అభివృద్ధికి కొన్ని తీర్మానాలు చేశారు. విద్య. శుచి, శుభ్రత, తాగడం మానటం, పంచములకు వృత్తులను నేర్పటం, సంఘమందిర నిర్మాణం మొదలైన తీర్మానాలు చేశారు. ఈ సభ భాగ్యరెడ్డివర్మ నాయకత్వంలో విజయవాడలో జరిగిన ఆది ఆంధ్రమహాసభను గుర్తుకు తెస్తుంది. భాగ్యరెడ్డివర్మ సభను దృష్టిలో ఉంచుకొని రచయిత విజయవాడ సభను చిత్రించాడు.
రామదాసును క్రైస్తవమతంలో చేర్పించటానికి ప్రయత్నాలు జరిగాయి. రామదాసు క్రైస్తవ మతం స్వీకరిస్తే తన కూతురుకు, అల్లునికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. "హిందూమతం పనికిరాదని, క్రైస్తవ మతమే మంచిదని ఒప్పిస్తే తాను నిరభ్యంతరంగా కలుస్తానన్నాడు" రామదాసు. "ప్రాచీన సంస్కృతి అన్నా, సంప్రదాయం అన్నా ఉన్నవకు ఎనలేని ప్రేమ. క్రైస్తవ మిషనరీల మతాంతరీకరణలు ఉన్నవకు బాధ కలిగించాయి”. రామదాసు పాత్ర ద్వారా రచయిత మతమార్పిడిని వ్యతిరేకింపచేశాడు. క్రైస్తవ మిషనరీలు దళితులకు ఎంతో సేవ చేశాయి. మిషనరీల పుణ్యమా అని దళితులు ఆంగ్లవిద్యను నేర్చుకున్నారు. గాంధీ ఆశించిన శుచి, శుభ్రతలు నేర్చుకున్నారు. సాంఘిక అణచివేత తగ్గకున్నా, కనీసం ఆర్థికంగానైనా దళితులు అభివృద్ధి చెందారు. కోస్తా ప్రాంతంలో నిర్మించిన ఆనకట్టలు భూస్వాములకు ఉపయోగపడ్డాయి. ధనిక రైతులు కూడా ఆనకట్టల వలన లబ్ది పొందారు. ఈ ఆనకట్టలు దళితులకు ఉపయోగపడలేదు. ఎందుకంటే దళితులకు భూములు లేవు. క్రైస్తవ మిషనరీలు దళితుల పట్ల చూపించిన అనుకూల వైఖరిని రచయిత గుర్తించలేదు.
మంగళాపురం దొంగలకూ, కూలీలకు రామదాసు గురువని ఆయనను భార్య కూతుళ్ళతో సహా సెటిల్మెంటులో పెట్టారు. రామదాసు చెల్లెను బసివిరెడ్డి కొట్టి చంపినప్పుడు "మాల మాదిగలంటే అంత చౌకా" అని బాధపడతాడు. సంగదాసును చౌదరయ్య చంపినప్పుడు "సద్గురూ నీ దయ యిట్లా వచ్చిందా?" అంటాడు. రామదాసు భూమిపైన చౌదరయ్య వ్యాజ్యం తెచ్చినప్పుడు "మా సొమ్మయితే మాకుండేదే. విచారించి యేమి ప్రయోజనం?" అంటూ వేదాంతం వల్లిస్తాడు. తన కుటుంబానికి ఎన్ని అన్యాయాలు జరిగినా నిర్లిప్తత ప్రదర్శించిన రామదాసు సెటిల్మెంటులో క్రైస్తవ మతబోధకు వ్యతిరేకంగా మత సమ్మె చేయిస్తాడు. "రేపటినుంచీ వినదల్చుకున్న వాండ్లకు హిందూమతం నేను బోధిస్తాను" అంటాడు. పౌలు అనే ఒక క్రైస్తవ పాత్రను సృష్టించి వాని యొక్క వెకిలి చేష్టల ద్వారా క్రైస్తవ మతాన్ని రచయిత అపహాస్యం పాలు చేశాడు. దళితులు క్రైస్తవులుగా మారకుండా ఉండటానికి రచయిత పౌలు పాత్రను ఉపయోగించాడు. గుడిలోనికి, బడిలోనికి, బావి దగ్గరికి రానీయని మతాన్ని విడిచి క్రైస్తవ మతాన్ని స్వీకరించే బదులు రామదాసు హిందూ మతాన్ని గట్టిగా బలపరుస్తాడు. ఈ విధంగా రచయిత దళితులను హిందూమతంలోనే ఉంచే ప్రయత్నం చేశాడు. రామదాసు సమాజంలో అట్టడుగు స్థానాన్ని అంగీకరించిన వాడు. చౌదరయ్య రామదాసు భూమి మీద వ్యాజ్యం తెచ్చినపుడు నారాయణరావు అనే న్యాయవాదిని కలుస్తాడు రామదాసు. నారాయణరావుతో "మేము చెప్పరానివాండ్లమండి" అంటాడు.
సహపంక్తి భోజనాలను సమర్థించిన రచయిత వృత్తి విషయంలో గాంధీ సిద్ధాంతాన్నే అనుసరించాడు. సంగదాసు వృత్తి మార్పిడిని వ్యతిరేకించాడు. "హిందూ ప్రభువులు ఆర్థిక సంబంధమైన వృత్తి విభజనంలో జోక్యం కలిగించుకొన్నారు. దేశం యొక్క విత్త రక్షణ కొరకు వృత్తి రక్షా, వృత్తి రక్షణ కొరకు వృత్తి విభజనం జరిగినవి. ప్రభునొకనిని వొక వృత్తిలో వుండవలసిందని ఆజ్ఞ చేసి తక్కినవాండ్లను ఆ వృత్తిలో ప్రవేశించడానికి స్వాతంత్ర్యమిస్తే మొదటి వాడికి అన్యాయం చేసిన వాడౌతాడు. వొకనిని వృత్తిని విడువవద్దని రాజు యెప్పుడు శాసిస్తాడో రెండవ వాణ్ణి దాంట్లో ప్రవేశించవద్దని శాసించక తప్పదు. కనుక ధర్మశాస్త్రాలు వృత్తి సాంకర్యం చేసిన వాండ్లకు కఠినంగా శిక్షిస్తవి". ఇలా వృత్తి సాంకర్యం జరగకుండా కఠిన నియమాలు విధించటం వలన అనువంశిక ఆధిపత్యాన్ని కొన్ని కులాలు కాపాడుకున్నాయి. వృత్తి సాంకర్యాన్ని గాంధీ కూడా వ్యతిరేకించాడు. ఏ వృత్తిలో పుట్టినవాడు ఆ వృత్తిని విధిగా ఆచరించాలి అన్నాడు. గాంధీ, మాలపల్లి నవల గాంధీ సామాజిక సిద్ధాంతానికి సాహిత్య రూపం. ఈ నవలలోని ప్రధాన పాత్రలు, ఘటనలు గాంధీ సిద్ధాంతాల పరిధిని దాటి పోలేదు. సంగదాసు రగిలించిన జ్వాల చౌదరయ్య మరణించేవరకు మండుతూనే ఉంది. చౌదరయ్య మరణించిన తరువాత ఆయన కుమారుడు రామానాయుడు తన భూమిని సంఘపీఠానికి ఇచ్చి తన కుటుంబ సభ్యులందరూ దళిత జనోద్ధరణకు పాటుపడ్డారు. ఈ విధంగా సామాజిక సంఘర్షణ శాంతియుతంగా పరిష్కారమైనట్టు రచయిత చిత్రీకరించాడు.
నవల చివర రచయిత అగ్రవర్ణాల వారికి ఒక విజ్ఞప్తి చేశాడు. "మనము కలిసిమెలిసి యుండినచో ఉభయులకును లాభదాయకమే" అంటాడు. ఇది రచయిత ఆశించిన ప్రయోజనం. అగ్రవర్ణాల వారు దళితులు కలిస్తే వలస పాలకులను భారతదేశం నుండి తరిమి వేయవచ్చు. ఈ కలయిక కొరకు దళితుల్లో సంస్కరణలను ఆశించాడు రచయిత. ఈ సంస్కరణకు అగ్రవర్ణాల వారు ఉదారంగా తోడ్పడాలి. దళితులను దేవాలయాల్లోకి, పాఠశాలల్లోకి, వీధి బావుల దగ్గరికి రానీయాలని కాంగ్రెసు పార్టీ తీర్మానించింది. గాంధీ భావజాలాన్ని, కాంగ్రెసు కార్యక్రమాన్ని తీసుకొని రచయిత మాలపల్లి నవల రాశాడు.
గాంధీ దళిత జనోద్ధరణ సమస్యను తీసుకొని రంగా "హరిజన నాయకుడు" నవల రాశాడు. రంగా జాతీయోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. రైతు ఉద్యమాన్ని నిర్మించాడు. ఈయన మాలపల్లి నవలలోని వెంకటదాసు పాత్రకు ప్రతిస్పందనగా హరిజన నాయకుడు నవల రాసినట్టు కనబడుతుంది. రంగాకు వెంకటదాసు పాత్ర తిరుగుబాటు ధోరణి రుచించలేదు. అగ్రవర్ణాల సహకారంతో దళితులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్న అభిప్రాయం రచయిత ఈ నవలలో వ్యక్తం చేశాడు.
మాలపల్లి నవలలో నాయకుడు మాలదాసరి అయితే, హరిజన నాయకుడు నవలలో నాయకుడు మాదిగ కులానికి చెందినవాడు. ఉన్నవ లక్ష్మీనారాయణ, రంగా ఇద్దరు రచయితల్లోని భావసారూప్యత ఒక్కటే. ఇద్దరూ గాంధీ భావజాల ప్రభావంతో నవలలు రాశారు. ఇద్దరు రచయితలూ హిందూయిజం పరిధిలోనే అస్పృశ్యత సమస్యకు పరిష్కారాన్ని వెతికారు. దళితులు పాఠశాల, దేవాలయ ప్రవేశం, మతమార్పిడి వ్యతిరేకత, శుచి శుభ్రత, సైమన్ కమీషన్ మొదలైన వాటిని గురించి రచయిత నవలలో చిత్రీకరించాడు. దళితులు వెంకటదాసు వలె తిరుగుబాటు ధోరణి అనుసరిస్తారేమోనన్న భయం రంగాను పట్టి పీడించింది. అందువలన అగ్రవర్ణాల వారితో కలిసి, వారి సహకారంతోనే దళితులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చునన్న భావనకు ప్రతినిధిగా బసవ లింగయ్య పాత్రను రచయిత సృష్టించాడు.
పంచముల పిల్లలను పాఠశాలలోకి అగ్రవర్ణాల వారు రానీయలేదు. పంచముల పిల్లలను పాఠశాలలోకి రానీయాలని బసవ లింగయ్య వినతి పత్రాలు సమర్పించాడు. పంచాయితీ బోర్డు ప్రెసిడెంటు, ప్రభుత్వం పంచములు పిల్లలను పాఠశాలలోకి రానీయకుంటే గ్రాంటు నిలిపి వేస్తామని హెచ్చరించారు. పంచముల పిల్లలకు చదువు చెప్పటానికి నిరాకరించే ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఊడిపోతాయని చెప్పారు. అందువలన కమ్మవారు పంచముల పిల్లలను పాఠశాలలోకి రానిచ్చారు. ఇది బసవ లింగయ్య విజ్ఞాపనల ద్వారా సాధించిన తొలి విజయం. ఇక్కడ సంఘర్షణ లేకుండా నవలలో బసవ లింగయ్య మతమార్పిడిని వ్యతిరేకించాడు. అరుంధతి క్రైస్తవ మతం స్వీకరించటం వలన ఆమెను పెళ్ళి చేసుకోనని బసవ లింగయ్య చెప్పాడు. సుందరి బందరు మిషనరీ పాఠశాలలో చదివింది. ఆధునిక నాగరికతను అలవరుచకొంది. దళితులను అసహ్యించుకుంది. తరవాత “బస్తీ గుడ్డలు కట్టను చిన్నకోక చిన్నరవిక చాలు" అంటుంది. ఈ విధంగా రచయిత యధాస్థితి వాదాన్ని హరిజన నాయకుడు నవలలో సమర్థించాడు. రంగా హరిజన నాయకుడు నవల గాంధీ ప్రతిపాదించిన అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణికి అనుకూలంగా ఉంది. రచయిత హరిజన నాయకుడు నవల ద్వార జగ్గడి లాంటి తిరుగుబాటు ధోరణిని తిరస్కరించాడు. అగ్రకులాల వారు హరిజనుల అభివృద్ధికి కృషి చేస్తారని ప్రతిపాదించాడు.
మహీధర రామమోహనరావు తెలుగులో ఎక్కువగా రాజకీయ నవలలు రాశాడు. ఈయన “కొల్లాయి గట్టితేనేమి?” నవలను జాతీయోద్యమ ప్రభావంతో రాశాడు. ఈ నవలలో నాయకుడు రామనాథం గాంధీ పిలుపునందుకొని సహాయ నిరాకరణ చేశాడు. కళాశాలను బహిష్కరించి ముంగండ గ్రామం చేరుకొంటాడు. ఆ గ్రామం సనాతన ఆచారాలు గల గ్రామం. నోరు ఎండిపోతున్నా సరే దళితులు ఆ ఊరి చెరువు నీళ్ళు తాకరాదు. గ్రామంలో దళితుల నీటి సమస్య రామనాథాన్ని దళిత జనోద్ధరణ కార్యక్రమాన్ని రూపొందించుకునే విధంగా చేసింది.
"దేశమంతా తగలబడి పోనీ మా కంఠంలో ప్రాణముండగా అనాచారం మనవూళ్ళో అడుగు పెట్టడానికి వీలులేదు" అంటారు ముంగండ బ్రాహ్మణులు. ఆనాడు దళితులు ఎంత దయనీయ స్థితిలో బతుకున్నారో, సామాజికంగా ఎంత నీచంగా చూడబడుతున్నారో, అస్పృశ్యత అనేది మనుషుల్లో ఒక వర్గాన్ని అవమాన పరచటానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో రచయిత ముంగండలోని పంచముల నికృష్ట పరిస్థితిని చిత్రించటం ద్వారా నిరూపించాడు. ఊరి చెరువులో దళితులు నీరు తోడుకోవటం నిషిద్ధం. వీధులగుండా వారు నడవకూడదు. ఇంత కఠోర నియమాలు విధించినా, దళితులు కష్టపడనిదే చెరువులోనికి నీరు రాదు "వాళ్ళ కాళ్ళ మీదుగా దొర్లిన నీరు చెరువులో పడగానే వాళ్ళు ముట్టుకుంటే మైలపడి పోతుందా” అనుకుంటాడు రామనాథం. ఆయన కొద్దిరోజులు దళితులకు చెరువులోని నీరు తోడిపోస్తాడు. ఎంతకాలం ఇలా నీరు పోయటం అనుకుంటాడు. ఆయన తోటలోని బావిని దళితులకు ఇస్తాడు. గాంధీ ప్రతిపాదించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతం కూడా ఇదే. తన తోటలోని బావిని దళితులకు ఇవ్వటం వలన అగ్రకులాలలోని సంపన్నులు దళితులకు ఉదారంగా దానం చేయాలన్న సిద్ధాంతానికి అనుకూలంగా ఉంది ఈ చర్య.
ఉప్పల లక్ష్మణరావు "అతడు-ఆమె" నవలలో జాతీయోద్యమాన్ని సవిమర్శకంగా చిత్రించాడు. ఈ నవల దినచర్య కథనంలో నడుస్తుంది. ఈ నవలలో రచయిత కాంగ్రెసు పార్టీ దళిత జనోద్ధరణకు చేసిన కృషిని సవిమర్శకంగా చిత్రించాడు.
శాంతం జాతీయోద్యమంలో చిత్తశుద్ధితో పాల్గొంటుంది. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మనసుపూర్తిగా చేస్తుంది. గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెసు దళిత జనోద్ధరణకు పూనుకొంటుంది. దళిత జనోద్ధరణ కాంగ్రెసు పార్టీ సభ్యుల ఇళ్ళ నుండి ప్రారంభించాలని నిర్ణయించారు. కాంగ్రెసు పార్టీ సభ్యుల ఇళ్ళలోని బావుల నుండి దళితుల చేత నీళ్ళు తోడించాలి. ఈ కార్యక్రమం విజయవంతం కాలేదు. వివిధ కాంగ్రెసు సభ్యులు అనేక సాకులు చూపించి తప్పించుకున్నారు. "మా తల్లి ముసలావిడ ఒప్పుకోదండి" అంటాడు సుందరరామన్. "మా ఆవిడ మాలాడు నూతిగోడ ముట్టుకుంటే నూతిలో పడిచస్తానని ఒకటే బెదిరింపు, నన్ను మాత్రం ఇందులోకి లాక్కురాకండి" అని రంగనాథరావు అన్నాడు. "మాతోట నూతిలో చేదవేస్తే నాకేం అభ్యంతరం లేదు. వంటింటి పెరట్లో వున్న నుయ్యి మాత్రం వదిలిపెట్టండి" అన్నాడు మాధవరావు. “ఈ విషయం నాకెంత మాత్రం ఇష్టం లేదు" అన్నాడు భగవాన్దాసు. ఈయన దళిత జనోద్ధరణకు పాతికవేల రూపాయల విరాళం ఇచ్చాడు. సభవారిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ సమస్య
సాఫీగా సాగటానికి ఒక ఉపకమిటీని వేసి వచ్చే సంవత్సరానికి కార్యక్రమాన్ని వాయిదా వేద్దామని నిర్ణయించారు.
అగ్రకులాలలో మానసిక పరివర్తన, అస్పృశ్యుల్లో సంస్కరణ కోరింది కాంగ్రెసు పార్టీ. దళిత జనోద్ధరణ కొన్ని సంస్కరణలతో సమసి పోతుందని భావించారు. శుచి శుభ్రతలు నేర్చుకొంటే సమస్య పరిష్కారం కాదు. సంపన్నులు దళితుల కొరకు ఆర్థిక సహాయం చేయటం అయ్యే పని కాదు.
దళిత జనోద్ధరణ సామాజిక, ఆర్థిక, మానసిక సమస్య. ఈ సమస్యను కాంగ్రెసు పార్టీ సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి సరియైన పరిష్కారం చూపలేకపోయింది. ఉన్నవ 'మాలపల్లి', రంగా 'హరిజన నాయకుడు' నవలలు గాంధీ ప్రతిపాదించిన శుచి శుభ్రత, ధర్మ కర్తృత్వ సిద్ధాంతం, గుడి, బడి, బావి మొదలైన వాటిలోకి హరిజనుల ప్రవేశం గురించి చర్చించాయి.
మహీధర, ఉప్పల వామపక్ష భావజాలానికి చెందినవారు. వలసపాలనకు దేశప్రజలకు వైరుధ్యం ప్రధాన వైరుధ్యంగానూ మిగతా వైరుధ్యాలు అప్రధానమైనవిగానూ వీరు భావించినారు. ఇది ఆనాటి కమ్యూనిస్టు పార్టీ అవగాహన. కమ్యూనిస్టు పార్టీ కుల నిర్మూలన కొరకు ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకోలేదు. ఆనాటి ఆధిపత్య భావజాలం అయిన గాంధీయిజాన్ని కమ్యూనిస్టులు అనుసరించారు. కాంగ్రెసు పార్టీ, జాతీయోద్యమ నాయకత్వం, అస్పృశ్యత సమస్యను రూపుమాపటానికి అరకొర ప్రయత్నాలు చేసిన స్థితినే పై నవలల్లో చిత్రితమైంది.
జూలూరి తులశమ్మ వ్రాసిన వచన రచనలు లభ్యమైనవి రెండే. ఒకటి వ్యాసం , రెండవది సంభాషణాత్మక కథనం. రెండూ స్త్రీ జీవిత సంబంధ సంస్కరణల విషయం లో ఆమె ఆలోచనలను ప్రతిఫలిస్తాయి.
వ్యాసం ‘హిందూ స్త్రీల దుస్థితి’ హిందూసుందరి ( జులై 1912) పత్రికలో అచ్చు అయింది. పూర్వకాలం నుండి కొనసాగివస్తున్న స్త్రీల నిరంతర కష్టభూయిష్టమైన దుస్థితికి విచారిస్తూ వాటిని తొలగంచటానికి నవనాగరికులు ప్రారంభించిన ప్రయత్నాలను ప్రస్తావిస్తూ ఈ వ్యాసాన్ని ప్రారంభిం చింది ఆమె. కనిపెంచిన తలిదండ్రులే పాపపు ధనమునకు ఆశించి ఎవరికో ఒకరికి కట్టబెడతారని కన్యాశుల్క వివాహాల గురించి వేదన పడింది. తల్లిదండ్రులు కట్టబెట్టిన ఆ మొగుడు ఎటువంటి వాడైనా, ఏ వయసువాడైనా ఆయుష్షు ఉంటే కష్టంగానో , సుఖంగానో ఏదో ఒక తీరున ఆడవాళ్ళ దేహయాత్ర సాగిపోతుంది అని ఆమె చెప్పిన మాటలు స్త్రీల జీవితం ఎంత పరాధీనమో అంత ఉదాసీనంగా కూడా గడపవలసిన స్థితి లోని విషాదాన్ని సూచిస్తున్నాయి. భర్త ఆయుష్షు తీరిన ముక్కుపచ్చలారని బిడ్డల జీవితం దుర్భరం. ఆ దౌర్భగ్యానికి వాళ్ళు కర్తలు కారు , కారణమూ కాదు, అయినా బాధితులు అవుతారని తులశమ్మ గుర్తించి చెప్పింది. విద్యాబుద్ధులు చెప్పించవలసిన సమయంలో పెళ్లి చేసి అందువల్ల వచ్చిన అనర్ధాలకు ఆమె చేసుకొన్నపాప పుణ్యాల ఖాతాలో ఎక్కువతక్కువలను నెపంగా చూపే వైఖరి గురించి చెప్పింది. ఇహలోక సౌఖ్యం లేకపోయినందుకు ఊహతెలిసే నాటికే మరణించి మొహమైనా గుర్తు లేని భర్తను తలచుకొని జీవితకాలం దుఃఖించవలసిన స్త్రీల గురించి బాధపడింది. ఈ రకమైన తులశమ్మ అవగాహనకు స్వానుభవమూ లోకవృత్త పరిశీలనతో పాటు అంతకు మూడేళ్ళ క్రితమే వచ్చిన గురజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటక ప్రభావం కూడా కారణం కావచ్చు.
స్త్రీల కష్టానికి సంఘసంబంధ సూత్రాలే కారణమంటుంది తులశమ్మ . స్త్రీలకు విద్య లేకపోవటం, బాల్య వివాహాలు, బలవంత వైధవ్యం ఎక్కువైపోతున్నాయని వాపోతుంది. ఆడదానికి చదువెందుకు ఉద్యోగం చేయనా ఊళ్లేలనా అని అయిదారు సంవత్సరాలు రాగానే పెళ్లీడు వచ్చినదని , అష్ఠవృషభవత్కన్యా అన్నారు కనుక పెళ్లి చేయకపోతే అల్లరి పడతామని పెళ్లిళ్లు చేయటం, భర్త చనిపోతే జుట్టు తీయించకపోతే ఆమె తలవెంట్రుకల నీళ్లు భర్తను ఉత్తమలోకాలనుండి అధోలోకాలకు జారిపోయేట్లు చేస్తాయంటూ యేవో కల్పనా కథలు చెప్పటం, ఇంటాబయటా అజ్ఞానాంధకారంలో ఉన్న ఆడవాళ్లే ఈ ఆచారాల అమలు గురించి పట్టింపులకు పోవటం, సమస్త ధర్మాలు ఎరిగిన పురుషులు కూడా అట్లాగే మాట్లాడటం, ప్రవర్తించటం తులశమ్మ విమర్శకు గురి అయ్యాయి. శిరోజఖండనం అభిమానవతులైన స్త్రీలకూ శిరోఖండనమే తప్ప మరొకటి కాదని అంటుంది తులశమ్మ. పెద్దపెరిగి లోకం తెలుసుకొని, ఏది సుఖమో, ఏది కష్టమో తెలుసుకోగల జ్ఞానం సంపాదించి తన ఇఛ్చను బట్టి పెళ్లికి అంగీకరించిన స్త్రీలకు భర్తృ వియోగం వంటి సమస్యలు రావా అని ఎవరైనా వేయగల ప్రశ్నను తానే వేసుకొని అప్పుడైనా శిరోముండనం వంటి కర్మకాండలు విడువవలసినవే అంటుంది.
బాల్యవివాహాలవల్ల సంఘానికి అనేక అనర్ధాలు కలుగుతున్నాయని , బాలికలకు రజస్వలానంతర వివాహాలు చేయాలనీ వేదికలు ఎక్కి ఉపన్యసించు సంస్కరణ వాదులు, రాజకీయ వాదులు వేదిక దిగినతరువాత ఆ విషయం విస్మరించటాన్ని కూడా ఆమె ఎత్తి చూపింది. కార్యరూపం పొందని చర్చలు ఎందుకని నిస్పృహను వ్యక్తపరుస్తూనే చర్చించగా, చర్చించగా ఎప్పటికైనా అది కార్యరూపం చెందకపోతుందా అన్న ఆశను వ్యక్తపరుస్తుంది. మనుస్మృతి రజస్వలాపూర్వ వివాహం, రజస్వలానంతర వివాహం రెండిటినీ చెప్తున్నది కనుక సముచిత పద్ధతిని అనుసరించి పెళ్లిళ్లు చేయాలనీ, బాలికలకు విద్యాబుద్ధులు చెప్పించాలనీ , శిరోముండనాది కర్మలు వారించాలనీ తీర్మానించుకుని ఆచరించాలని చెప్తూ ఈ వ్యాసాన్ని ముగించింది.
ఈ వ్యాసాంశాన్నే జీవిత సంబంధాలలో నిరూపించటానికి చేసిన సృజనాత్మక ప్రయత్నం ‘కమలాకాంతా సంభాషణ’. కమల చిన్నబోయిన మొహంతో వున్న కాంతను కారణం అడుగుతూ పలకరించడంతో మొదలయ్యే సంభాషణ 1914 నాటి హిందూసుందరి పత్రిక ఆగస్టు , సెప్టెంబర్ సంచికలలో ప్రచురించబడింది. కాంత ఆడపుట్టుక ను ఏవగించుకొంటుంది. సృష్టి కార్యం కోసం సృష్టించబడిన స్త్రీ పురుషుల విషయంలో భగవంతుడికి ఎటువంటి భేదభావం లేదని కమల అంటే కాంత కానీ పెంచిన తల్లిదండ్రులు మాత్రం భేదభావంతోనే చూస్తున్నారని బాధపడుతుంది. వాళ్ళ సంభాషణ క్రమంలో కాంత బాలవితంతువని, పెళ్లయిన తోటి ఆడపిల్లలు నోచే చిట్టిబొట్టి , కాటుక గౌరీ వంటి నోములు తానూ నోస్తానని అడిగే కూతురిని నీకు పెళ్లే కాలేదు , నోములు ఎట్లా నోస్తావని తల్లి సమాధానపెడతూ వచ్చిందని తల్లి మరణించాక తండ్రి తన పసుపు కుంకుమలు , తల జుట్టూ తీయించే ప్రయత్నానికి పూనుకొన్నాడని తెలుస్తుంది.
వితంతు వైన స్త్రీ జుట్టు తీయించకపోతే స్త్రీలు మడి వంటకు పనికిరారు అన్నది బ్రహ్మణాచారం. ఆ ప్రస్తావన తేవటానికి ముసలమ్మ పాత్ర ఒకటి ప్రవేశపెట్టబడింది. కాంత తల్లి మరణించాక వంటపని ముసలమ్మ మీద పడింది. ఆమె కూడా వితంతువే. కాంత తండ్రికి పిన్ని వరస బంధువు. ఏ వయసులో వితంతువు అయిందో , ఎన్నాళ్ళు ఎవరెవరి అవసరాలకు ఏ ఇంట ఉంటూ చాకిరీ చేస్తూ బ్రతుకు ఈడ్చిందో కానీ ఈ వయసులో కాంతా వాళ్ళ ఇల్లు చేరింది. కాంత తలవెంట్రుకలు ఉన్నందువలన వంటకు పనికిరాకుండా పోయి తాను చేయవలసి రావటం ఆమెకు కంటగింపు అయింది.” నెత్తి మీద ఉన్న ఆ గంపెడు తుక్కు తగల వేసి వంటలో పెట్టు” అంటూ కాంత తండ్రిని ఒత్తిడి పెట్టింది. వితంతు తలవెంట్రుకలనుండి కారే నీరు చచ్చినవాడికి ఉత్తమలోకాలు కలగనియ్యదు అంటూ బతికివున్న కాంత జుట్టు తీయించవలసిందే నంటూ వేధించింది. జపం, దేవుడు , దీపం, నోము , వ్రతం అని ఏదో ఇహపర సాధనమైన త్రోవ చూసుకోవాలి గానీ మగడు చచ్చిన మగువకు లౌకిక చదువులు కూడవని ఆ ముసలమ్మ అభిప్రాయం. ఈ రకంగా తనకు ఆ ముసలవ్వ వలన కలిగిన కష్టాన్ని కాంత కమలకు చెప్పుకొంటుంది. సుఖంగా ఉన్న కమలకు తనబాధలు అర్ధం కావని కాంత అనుకొంటుంది. కమలతో అంటుంది కూడా. అదే కష్టాలు అనుభవించిన ముసలమ్మ దానిలో బాధ తెలిసిన మనిషిగా కాంత గురించి ఆలోచించిందా అంటే లేదు. నిజానికి కమలే కాంత పట్ల సానుభూతితో ఉంది. ఎప్పుడు అవసరమైనా కమల పక్షాన నిలబడటానికి తాను సిద్ధంగా ఉండాలని కూడా అనుకొంది . కేవలం ఆడది కావటం వల్ల కాక అభివృద్ధి చేసుకొన్న కొత్త చైతన్యం వల్ల అది ఆమెకు సాధ్యమైంది. స్త్రీలమధ్య ఈ సహోదరత్వం గురించిన ఆకాంక్ష స్త్రీలకు ఎంత పాతదో దేనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
ఈ సంభాషణలో రచయిత్రి సనాతన వాదానికి ప్రతినిధిగా కాంత తండ్రిని, నవనాగరిక యువతకు ప్రతినిధిగా కాంత అన్నను నిలబెట్టింది. తండ్రి పేరు వ్యాఘ్రేశ్వర సోమయాజులు.అన్న పేరు భాస్కరుడు. అన్న పట్నంలో చదువుకొంటున్నాడు. భూగోళం మొదలైన ఆధునిక విద్యావిషయాల అధ్యయనానికి చెల్లెలిని ప్రోత్సాహపరిచింది అతనే అయిఉండాలి. అందువల్లనే తండ్రి తన తల జుట్టు తీయించటానికి చేస్తున్న ప్రయత్నాలను పసిగట్టిన కాంత వ్రాసిన ఉత్తరానికి జవాబుగా మర్నాడు ఉదయానికి ఇంటికి వచ్చేసాడు అతను. ఆ సందర్భంగా తండ్రీ కొడుకుల మధ్య జరిగిన సంభాషణ ను కాంత కమలకు తెలియచేసింది.
కాంత జుట్టు తీయించటం అవశ్యం జరగవలసిన పనిగా తండ్రి చేసిన వాదన ఏమిటి? ఇంట్లో వంటావార్పుకు పెద్దవారెవ్వరూ లేరు. అందుకు కూతురిని అర్హురాలిని చేయటానికి ఈ ఏర్పాటు. తాను ఆహితాగ్ని. చేయవలసిన యజ్ఞయాగాదులు అనేకం ఉన్నాయి. భార్య లేకపోవటం వలన తాను వాటిని పూర్తిచేయలేడు. అట్లా పూర్తి చేయకుండా చావటం అతనికి ఇష్టం లేదు. అందువల్ల అతను మళ్ళీ పెళ్లి కి సిద్ధం అయ్యాడు. అరవై ఏళ్ళు నిండిన ఆయన కర్మల పేరిట పెళ్ళికి సిద్ధపడటం , కూతురి శిరోజాలు తీయించటానికి నిర్ణయించటం రెండూ కూడా భాస్కరం విమర్శకు గురి అయ్యాయి. ఈ క్రమంలో ధర్మ శాస్త్రాలను స్వప్రయోజనాలకు అనుకూలంగా వ్యాఖ్యానించి ,ఉల్లంఘించగల వర్గాలు దిక్కు మొక్కు లేక చిక్కులు పడుతున్న అబలల ఎడ దాటరానివిగా చేయబడుతున్న ద్వంద్వ విలువల సమాజ వైఖరి ని రచయిత్రి ఈ సంభాషణాత్మక కథనంలో స్పష్టం చేయటం విశేషం.
శిరోజాలు లేని నెత్తిమీద తెల్లముసుగు ధోవతి కట్టుతో జీవించిన తులశమ్మ దానిని ఎంత అవమానకరంగా భావించి బాధపడిందో , గాయపడిందో ఆ ఆక్రోశాన్ని వినిపించే రెండు వచన రచనలు ఇవి.
------------------------------------------------------------------------
ఇరవై కథలతో ఎండపల్లి భారతి రెండవ కథా సంకలనం'' బతుకీత " హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ వారి ద్వారా వెలువడింది. మూడేళ్ళ ముందర వెలువడిన భారతి మొదటి కథా సంకలనం "ఎదారి బతుకులు " సాహిత్య ప్రియులను అలరించింది.
భారతి నాకు 20 సంవత్సరాలుగా పరిచయం. రచయిత్రిగా ఐదేళ్లనుంచీ చూస్తున్నాను. కథలు చదివే వాళ్ళు ఎప్పుడూ కొత్త కథల కోసం, మంచి సాహిత్యం కోసం ఎదురు చూస్తుంటారు. ఆ కొరతను తగ్గించడంలో నాకు భారతి కథలు సహాయపడ్డాయి. అంతే కాకుండా ఒక రచయిత్రిని దగ్గరగా చూడటం, ఆమె రాసిన కథలను చదవటం ద్వారా నాకు కొత్త జ్ఞానం వచ్చింది. నాకు తెలియని అనేక జీవితాలను చూడగలిగాను. అనేక తెలుగు పదాలు, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు తెలుసుకున్నాను.
భారతి శైలి ఒక ప్రత్యేకం .తన పల్లెభాషలో కథ చెబుతుంది. జానపద శైలిని పోలి ఉంటుంది. తిట్లు, సామెతలు, జాతీయాలు, పిట్ట కథలుఊరుతూ వస్తాయి. కథలో కథలుంటాయి, సర్వ ప్రకృతి పైన ప్రేమ,మమైకం కనిపిస్తాయి. కోపం, ద్వేషం, తీర్పు ఏమీ ఉండదు.అంత భారమైన జీవితాల్లో కూడా ఒక మాట విరుపుతోనో ఒక సామెతతోనో హాస్యాన్ని, వ్యంగాన్నిఅంతర్లీనంగా చూపిస్తూ ఆ భారాన్ని తేలిక చేస్తుంది. ఆ తాత్వికత వల్లనేమో భారతి కథల్లో స్త్రీలందరూ అలా సజీవంగా మనకి గుర్తుండి పోతారు. వాల్ల భాధ మనదవుతుంది.
ఆమెలో కలిగే ప్రతి ఆలోచన, వేదన, పల్లెలో జరిగే ప్రతి సంఘటన ఆమె కథా వస్తువులు. వ్యక్తి గత మేదీ లేదు అంతా రాజకీయమే అన్నట్టు తన కథలన్నీ మొత్తం ప్రపంచానికి చెందిన కథా వస్తువులే!
భారతి కథ తనే చెబుతుంది .ఒక దళిత మహిళగా ,రైతుగా ,రైతు కూలీగా తన అనుభవాలనుంచి కథలు వస్తుంటాయి. వ్యవసాయం,జీవాల పోషణ ,చుట్టుపక్కల సంఘ జీవనం,ఆడవాళ్ళ కస్టాలు, మగవాళ్ల పాట్లు, బిడ్డలు, పేదరికం, కులం, లైంగికత, హింస, సారాయి, ఆడవాళ్ళ సంఘాలు ఇలా ఎన్నోఆమె కథా వస్తువులు. వీటిలో స్త్రీల నిరంతర శ్రమ, అమానుషంగా ప్రవర్తించే పితృస్వామ్య సమాజం, కుల వివక్ష, పేదరికం, దోపిడీ చేసే వ్యవస్థలు, స్త్రీలపై నిరంతరం జరిగే ఆర్ధిక, భౌతిక, మానసిక దాడి కనిపిస్తుంది.
ఇంత సంక్లిష్ట సమస్యలను అలవోకగా తన పల్లె భాషలో కథగా చెప్పేసి రెండు సామెతలో, ఒక పిట్టకథనో విసిరేసి ఆ బరువుని మన తలపైకి నెట్టేసి నింపాదిగా తన ఆవును మేపుకోను చేను గట్టుకు వెళ్లిపోతుంది భారతి.
ఆమె కథల్లో నెత్తురుచ్చలు పోసుకొని పొలం లో కష్టపడే స్త్రీ పురుషులు కనిపిస్తారు.
క్యారియర్లు ఎత్తుకొని చొక్కాలు తగిలించుకొని కూలికి పోయే ఆడోల్లు మగోళ్ళు కనిపిస్తారు.
వంట చేసి కూలిచేసి బిడ్డల్నిసాకి, జీవాల్ని సాకి సంసారానికి అన్నీకూర్చి నిస్సత్తువగా కూలబడే అమ్మలు పెద్దమ్మలు, వొదినలు, అత్తలు, ఆడబిడ్డలు ఉంటారు.
పోరంబోకు మొగుళ్ళు, ఉడాలు మొగుళ్ళు, తాగుబోతు మొగుళ్ళతో పాటు మంచి మనసున్న మగవాళ్ళు కూడా కనిపిస్తారు.
స్త్రీలు నిరంతరం పడే అనంత వేదనని అర్థం చేసుకుని అనుభవిస్తూ రాస్తుంది భారతి. రోజూ కనపడే స్త్రీల భాధ తాను అర్థం చేసుకున్నంతగా ఇంకెవరు అర్థం చేసుకోగలరు. పేదరికాన్ని, హింసను, అణచివేతను, కష్టాన్ని, శ్రమని అనుభవించిన తనుకాకపోతే ఇంకెవరు రాస్తారు ఇంత లోతైన కథల్ని.
'ఆడదాన్ని నమ్మితే సొమ్ము' కథలో అనుమానించే మొగుడు,'అదవ బతుకు'కథ లో అబద్దాలు చెప్పే మొగుడు, 'మల్లన్నకే మా ఓటు' లో ఒక మంచి మొగుడు, 'ఎవుని సట్లో ఉప్పేసే రాత అడిగొచ్చిందో' కథలో అమ్మను వెనకేసుకొచ్చే కొడుకు ఇలా ఎందరో మనుషుల అనేక స్వభావాలను విడమర్చి చెబుతుంది తన కథల్లో.
జూదం, ఈటి నోటి ముసరపెరికిందెవరు, ఎబుడూ ఎక్కని గుర్రమెక్కితే, సుక్కలపూట కథలలో టమోటా క్యాలీఫ్లవర్ రైతుల వెతల గురించి ,తిండి కోసం పంట పై ఆధారపడిన ఇతర జీవాల గురించి ఎన్నో విషయాలు చెబుతుంది. స్వయంగా మహిళా రైతుగానే కాక రైతు కూలీ గా కూడా భారతికి ఉన్న అనుభవాలు మనకి పంచుతుంది
తాగు నీరు సమస్య , లెట్రిన్ లు కట్టుకోవటంపై ప్రజల స్పందనలు,రోజూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన సంఘ మహిళలకు బ్యాంకుల్లో మరుగుదొడ్లు లేకపోవటం, పనులు లేక మనుషులు ఎలా (జవిరి)మెత్త పడతారో, ప్రతి వేసవిలో పల్లెల్లోకనిపించే దొంగలభయం ఇలా అనేక సామాజిక సమస్యలను కథలుగా మలిచింది ఈమె.
'ఎవుని సట్లో ఉప్పేసే రాత అడిగొచ్చిందో' కథలో మొగుడ్నివదిలి వేరేవానితో వెలిపొయినస్త్రీని వెంటాడే సమాజం, 'కమ్మం నిలేసిన తొలిసొదిన'లో సంసార భాదలు పడీ పడీ పరమ సంసారి అని స్తంబం నిలబెట్టాలనుకునే ఆడోళ్ళ గురించి, 'పేగుల్లేని ఆడోల్లు' కథలో ఆఊరి రెడ్డి లైంగిక దోపిడీ గురించి చెబుతుంది. కూటికుంటే కోటికున్నట్లే అని కరోనావైరస్ మొదలైన కొత్తల్లో ఉన్న పరిస్థితి పైన, అత్తిరసాలు కథలో ఆడవాల్లు పండగలు వస్తే పడేపాట్లు గురించి చెబుతుంది. చాలా కథల్లో జానపద పిట్టకథలు మనల్ని అలరిస్తాయి.
చివరిగా 'నల్లపెట్ట' అని ఒక పెద్ద కథ ఉంది. తాను పెంచుకున్న నల్లపెట్ట బతుకు గురించి దాని పిల్లల గురించి తనకు ఆ కోడికి ఉండే సంబంధం గురించి, తన ఆలోచనలన్నీ కూర్చి అద్భుతమైన కథ నిచ్చింది భారతి.
భారతి కథల్లో తాను వాడే సామెతలు, వాక్య ప్రయోగాలు, జాతీయాలు ఒక ఎత్తు .వాటిల్లో ఎంత తాత్వికత చతురత కనిపిస్తాయో! ఉదాహరణకు కొన్ని ..
'కూడుగుడ్డ అడక్కుంటే సిలుకను సాకినట్టు సాకతాను' అంటాడు నా మొగుడు.
'పట్టెడు బంగారు చేతిలో ఉన్నట్టు వాళ్ళ ఎచ్చులు చూడలేమమ్మా' అని బేల్దారుల గురించి ఒగాయమ్మ.
'మా ఊరి మల్లిగాడు ఎద్దుల్లో తోలినా పోతాడు ఎనుముల్లో తోలినా పోతాడు అంత కలుపుగోలు మన్సి' ఒకాయమ్మ.
'ఈడు ఏడస్తా రైక ముడ్లు ఇప్పే రకం
కాలితో చెబితే చేత్తో చేసే రకం' ఇంకొకాయమ్మ.
'వాడు సిన్నబుడు వాళ్ళమ్మ దగ్గర తాగిన సనుబాలు కూడా ఎల్లబీకేది'
'చెప్పుకుంటే మానం బోతుంది చెప్పుకోకపోతే పానం బోతుంది'
'ఆడతనాన్ని గౌరవంగా చూపించుకోలేక ఒదిగి ఉండే రొమ్ముకట్టు'
'చావుకు భయపడితే అవుతుందా ఏ పొద్దయినా ఒగ గుంత బాకీనే'
'మా ఇంటికి ఈ కులపనాబట్ట పిల్లే గతం వచ్చినాడు'
'ఆ యమ్మ మా ఇంటికి వచ్చిందంటే నా మొగునికి సరాయిలు నిలదు .ఇంగ కాసింత ఉబ్బుతాడు' ఒక పెళ్ళాము.
'టీవీ ముందర గూసుంటే గుద్ద చెదులు బట్టినా లెయడు'
''ఒగరు పెట్టింది తిని సచ్చిపోయినోల్లనుదేవుడు వాళ్ళ సేతులు నరికి పొయ్యిలో కట్ల మారిగా మంటేస్తాడట.నాకదే బాద నా మొగుని సేతులు దేవుడు ఏడ నరికేస్తడో అని ''
' మనం వద్దంటే పుట్టినోళ్లం '
' ఆ పొద్దు రెయ్యే కొండ్లపొడవాన జొరమొచ్చేసింది'
'మా ఉరి మల్లి బీములో మెరుకు నూరుమందిలో ఉన్నా ఏరుపడిపోతుంది'
'ఎలుంగొడ్డుకు ఆతులు చపాతులు ఒకటేనంట '
''అరువై న ఆడది ఇంట్లో ఉంటే అటవకట్లకు ముప్పు అన్నట్లు"
'ఎవుని సట్లో ఉప్పేసే రాత అడిగొచ్చిందో''
పిండి బియ్యంఎత్తుకుని పిన్నమ్మఇంటికి పోయినట్టు'
భారతి కథలు చాలా విలువైనవి. అవసరమైనవి. చివరంచుకు నెట్టబడిన అట్టడుగున ఉన్న దళిత స్త్రీ చెప్పే నిజ జీవిత కథలు అవి.
భారతి ఒక విధంగా మొత్తం పరిణామాల్ని రికార్డు చేస్తూ పోతోంది తన కథల ద్వారా. అది చాలా అవసరం.ముందు ముందు పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ 'బతుకీత 'లోని అన్ని కథలూ వైవిధ్యమైనవి. సాహిత్యపరమైన దాహాన్ని తీర్చటమే కాక అంత త్వరగా మర్చిపోలేని కథలుగా నిలబడిపోతాయి. భాషా పరంగా ఎన్నో కొత్త తెలుగుపదాలను, సామెతలు, జాతీయాలు చూస్తాము. భారతి కథలు ఓపిగ్గా ధ్యానంగా చదవాలి, అప్పుడే భారతి మన చెయ్యి పట్టుకుని వాళ్ళ ఊరికి తీసుకెళుతుంది. ఆ జీవితాలను మనం అలా చూస్తూ వాళ్లలో భాగమైపోతాం!.
'బతుకీత' , 'ఎదారిబతుకులు' కథల సంపుటి కోసం హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ వారిని సంప్రదించవచ్చు. అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంది.
జూలూరి తులశమ్మ రచనలు 1903 నుండి మొదలై 1930 లలోనూ వివిధపత్రికలలో లభిస్తున్నాయి. ఆమె రచనా వ్యాసంగం 1903 జూన్ హిందూసుందరి పత్రికకు చారుపొడి, పులుసు పొడి, కూటుపొడి తయారీ విధానాలగురించి వ్రాయటంతో మొదలైంది. మొదటి రెండింటిలో ఇంటి పేరు లేకుండా తులశమ్మ పేరు ప్రచురించబడింది. 1905 మార్చ్ -ఏప్రిల్ సావిత్రి పత్రికలో ఆమె రచన ఇంటి పేరుతోనే కాదు, తణుకు అనే ఊరి పేరుతో సహా వచ్చింది. వీరు పీఠికాపుర వాసులని ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ ఆంధ్రకవయిత్రులు పుస్తకంలో పేర్కొన్నది (1980 ప్రచురణ, పు:143) 1931 సెప్టెంబర్ గృహలక్ష్మి పత్రికలో తులశమ్మ వ్రాసిన భారతేతిహాసములు ప్రధమ భాగం పై వచ్చిన సమీక్షను బట్టి ఈమె పిఠాపురం మహారాణి వారి గోషా స్కూల్ లో ఉపాధ్యాయిని అని తెలుస్తున్నది.1912 జూన్ హిందూసుందరి లోపలి కవర్ పేజీలో ప్రచురించబడిన ఫోటోలో నెత్తిమీద ముసుగుతో తెల్ల చీర కట్టిన పద్ధతిని బట్టి ఆమె సంప్రదాయ బ్రాహ్మణ వితంతువు కావాలి.
1
జూలూరి తులశమ్మ రచనలను పాటలు , పద్య కవిత్వం, వచనం అని మూడు భాగాలకింద పరిశీలించవచ్చు. హిందూ సుందరి పత్రికలో ఏడేళ్ల మీద ఆరు సంచికలలో ( సెప్టెంబర్&అక్టోబర్ 1903‘, డిసెంబర్ 1910, ఆగస్టు 1911, అక్టోబర్&నవంబర్ 1911, జూన్ 1912, జనవరి 1913) ఆమె వ్రాసిన పాటలు 23. కాపాడమని వేడితి నన్ను’ అని మొదలయ్యే కీర్తనలో గోపాల భూపాలుడే దిక్కని వేడుకొనటం ప్రధానం.’తులసిని సారసాక్షి బ్రోవరా’ అని స్వీయ నామాంకితంగా కీర్తనను ముగించింది.ఆ తరువాత ఆమె వ్రాసినవన్నీ పెండ్లి పాటలే. మంగళ స్నానాల నుండి మొదలుపెట్టి అప్పగింతలవరకు వివిధ ఘట్టాలలో వేడుకగా స్త్రీలు పాడుకొనే పాటలు అనేకం.సందర్భాన్ని బట్టి మంగళ హారతి పాటలు అదనం.
మంగళ స్నానాలు అంటే వధువును లేదా వరుడిని పీటలమీద కూర్చోపెట్టి మాడుకు నూనె పెట్టి, వంటికి నూనెరాసి నలుగు పెట్టి కుంకుడు కాయల రసంతో తలరుద్ది వేడి నీటితో స్నానం చేయించటం.ఈ ఘట్టంలో నలుగు పెడుతూ పాడే పాటలు నలుగు పాటలు. వధూవరులను లక్ష్మీ నారాయణులుగా సంబోధించటం సంప్రదాయం. అందువల్ల వివాహ సందర్భంలో పాడే పాటలు లక్ష్మీ నారాయణ వివాహ వేడుకల వర్ణాలుగానే ఉంటాయి. ఆ రకంగా ఆముష్మిక ధర్మ నిర్వహణ కూడా లౌకిక వ్యక్తుల వివాహం నిమిత్తంగా సాగుతూనే ఉంటుంది. జూలూరి తులశమ్మ పాటలను ఆ కోణం నుండి చూడాలి. రాసేవి పెళ్ళిపాటలే. పరోక్షంగా అవి లక్ష్మీనారాయణుల స్తోత్రాలు.ఆమె పేరులోని తులసి విష్షు పూజకు శ్రేష్ఠమైనదిగా ఉద్దేశించబడింది. ప్రతి పాట చివర వధూవరులకు తులసి మాలతో అలంకారం సాధారణం. అది తనపేరును పాటలో ఇమడ్చటమే కాదు తనదైన భక్తి ప్రకటన కూడా. “నలుగిడ రారంగ నలుగిడ రారంగ ననబోణికి వేగ నలుగిడరా “ అనే పల్లవితో మూడు చరణాల పాట లో ‘పుష్ప పరాగమూ, పూ రసమూ’ కలిపి పుష్పకోమలికి నలుగు పెట్టమని స్త్రీలను ఆహ్వానిస్తుంది. ఇక్కడ పుష్పకోమలి శ్రీ మహాలక్ష్మి. స్త్రీలు నలుగు పెట్ట రావటం ఆమె సేవకే. ‘నలుగందుకోరా జలజాసనార్చితా’ అనే పల్లవితో ప్రారంభమయ్యే మరొక పాట నలుగు సేవను స్వీకరించమని నారాయణుని వేడుకొనటమే. ఆయనకు నలుగు పెట్టేవాళ్ళు కూడా స్త్రీలే. ‘ అత్తరు పునుగును మొత్తముగా జేర్చి జిత్తజరూపమున చేడియ నల్గిడ అనే తొలి చరణం వరుడిది మన్మధరూపం అని చెప్తూనే ఆ నెపం తో ఆమె అత్యంత సుందరాకారుడిగా భగవంతుడిని స్మరిస్తున్నది.
పెళ్లయ్యాక వధూ వరుల మధ్య చనువును పెంచే వేడుకలు అనేకం. మంచం మీద కొత్తదుప్పటి పరిచి వధూవరులను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఒకరిచేత ఒకరికి గంధం పూయించటం, పన్నీరు చల్లించటం, పూలదండలతో బంతి కట్టి ఒకరి పై ఒకరు విసురుకొనెట్లు ప్రోత్సహించటం, తలుపుదగ్గర నిలబెట్టి ఒకరి పేరును మరొకరిచేత చెప్పించటం, పక్క పక్కనే భోజనానికి కూర్చోపెట్టి ఇద్దరినీ ఒకరి విస్తట్లో పదార్ధం మరొకరు తినేట్లు, తినిపించేట్లు చేయటం ఇవన్నీ ఆ కోవలోవే.
‘పూల బంతుల నాడ రాగదే , నీలవేణి నీదు పతితో’ అనే పల్లవితో మూడు ఏకవాక్య చరణా లతో ఒక పాట ‘చేమంతి చెండ్లాడనే’ చెలువుడు సత్యతో అనే పల్లవితో మూడు చరణాల మరొక పాట ఉన్నాయి.(డిసెంబర్ 1910).ఈ రెండూ దండాడింపు పాటలు. మొదటి పాట భర్తతో పూలబంతులాటకు స్త్రీని ప్రోత్సహించేది కాగా రెండవ పాట వరుడిని శ్రీ కృష్ణుడితో అభేదం చేసి సత్యతో చెండ్లు ఆడటాన్ని వర్ణించేది. మరొక పాటలో బొండుమల్లెల పూల చెండు, ఇంకొక పాటలో ‘మల్లె మొల్లలు జాజులు మరువంపు చెండులు’ అవి ఏ పూల చెండ్లయినా తులసీ దళాలు, తులసీ మాలలు తప్పనిసరి. ఈ చెండ్లాట ఆడే పురుషుడు శ్రీ కృష్ణుడు , శ్రీమన్నారాయణుడు ఇలా … అతని సహచరి ఒక సారి లక్ష్మి, ఒక సారి సత్య , మరొకసారి రాధ .. బ్రహ్మాది దేవతలు , సీత గౌరీ మొదలైన స్త్రీలు పూలు అందిస్తూ వేడుకలో పాల్గొనే సదస్యులు. ( ఆగస్టు 1911) ‘సందియమేలనే సరసకు రావే’, ‘ ఓ మందగమన నీ సామికి శ్రీగంధము లలదవే’ ( అక్టోబర్& నవంబర్ 1911) కలికీ పన్నీరు జల్లవే , కంజాక్షునిపై కులుకుచు హరిపై గొప్ప గిండియ తొడ’ (జనవరి 1913) జవ్వాది, బంగారు రజము కల్పి వెండి బంగారు గిన్నెలు తీసిన గంధం రాసి, పన్నీరు చల్లి పతితో కలిసిమెలసి జీవించమని వధువును ఉత్సాహపరుస్తాయి. ఇవి గాక హితమతి గై కొగదమ్మ ఇందిర జయ హారతినీ ( అక్టోబర్& నవంబర్ 1911), ‘జననీ పాదములకు జయ హారతిదే గొనుమా’ (జూన్ 1912) ఏమమ్మా కాత్యాయని నా మీదను దయరాదా! వంటి అమ్మవారి కీర్తనలు మరికొన్ని వ్రాసింది తులశమ్మ .
2
తులశమ్మ తొలి పద్యాలు భండారు అచ్చమాంబ మరణానికి ఖేదిస్తూ వ్రాసినవి. సావిత్రి పత్రిక 1905 మార్చ్- ఏప్రిల్ సంచికలో ‘సఖీవియోగ విచారము’ అనే శీర్షిక తో అచ్చు అయినాయి. ఒక సీసం , రెండు ఉత్పలమాలలు, రెండు గీతాలు మొత్తం అయిదు పద్యాలు. తెలుగు సమాజంలో 20వ శతాబ్ది ప్రారంభంలో స్త్రీల గురించి వ్రాయటం, స్త్రీలను సమీకరించటం అన్న రెండు పనులను తానొక్కతే ఉద్యమమగా నిర్వహించి స్త్రీలకు స్ఫూర్తి దాయకంగా నిలిచిన భండారు అచ్చమాంబ ముప్ఫయ్ ఏళ్ల వయసులో అకాలమరణం చెందింది. అప్పటి స్త్రీల సామూహిక దుఃఖానికి ప్రాతినిధ్యం వహిస్తుంది తులశమ్మ వ్రాసిన స్మృతి ఖండిక ఇది. అచ్చమాంబ 1903 లో కుటుంబంతో సహా యాత్రచేస్తూ ఆంధ్రదేశంలో వివిధ నగరాలలో పత్రికా సంపాదకులు , రచయితలు అయిన స్త్రీలను కలిసి స్త్రీవిద్య, స్త్రీల సంఘాల ఆవశ్యకత మొదలైనవాటి గురించి ప్రసంగించి వెళ్ళింది. దానిని ప్రస్తావిస్తూ ‘తరుణుల సోదరీ తతిగ’ నెంచిన ఆమె మరణం ‘సకియల దురదృష్టం’ అంటుంది. అబలా సచ్చరిత్ర రత్నమాల వ్రాసిన ఆమె ఆ పని ఆపేసి చెలులనందరిని వీడి తరలి పోయిందని వేదన పడింది. ‘మా మక్కువ సోదరీమణిని’ తీసుకువెళ్ళటానికి నీకు చేయట్లా ఆడిందని మృత్యువు ను నిలదీసింది. భూమి మీది పుణ్య స్త్రీల కథలు వ్రాసి ఇప్పుడు స్వర్గలోకపు పుణ్యస్త్రీల గురించి వ్రాయటానికి వెళ్ళావా అని అచ్చమాంబను సంబోధిస్తూ సమాధానపడే ప్రయత్నం చేసింది. స్త్రీల కోసం పనిచేస్తున్న సమకాలపు స్త్రీల గురించిన స్పృహతో 1905 నాటికే తులశమ్మ వ్యక్తిత్వం వికసించటం గమనించవచ్చు.
ఈ క్రమంలోనే ఆమె కందుకూరి వీరేశలింగం గారి భార్య రాజ్యలక్ష్మమమ్మ మరణానికి దుఃఖిస్తూ ‘జననీ వియోగ విచారము’. ( హిందూ సుందరి సెప్టెంబర్ 1910) అనే పద్య ఖండిక వ్రాసింది. శ్రీకరుడికి భక్తి మ్రొక్కి గానీ ఇతరమును తలవని తులసమ్మ మొదటి పద్యంలో దైవ ప్రార్ధన చేసి ఆ తరువాత ఎనిమిది పద్యాలలో రాజ్యలక్ష్మమ్మ వియోగ వ్యధను వ్యక్తంచేసింది. దయ , సౌశీల్యం , ధర్మవృత్తి , పాతివ్రత్యం , నీతి, సమత్వం, నిత్య తుష్టి, నిర్మల భావం, శాంతి మొదలైన గుణాలలో రాజ్యలక్ష్మమ్మకు భూమి మీద ఏ కాంతాలూ సాటిరారని సన్నుతించింది. ఆమెను దయమాలి తీసుకువెళ్లిన మృత్యువును దూషించింది. కిరీటంపైన ప్రకాశించే సన్మణిని దుర్మార్గుడేవడో తీసుకుపోతే నివ్వెరపోయి చూచే మాన్యుని వలే విభ్రాంతిలో మునిగిపోయామని అంటుంది.
“ గతిలేక కష్టముల్ గాంచి చింతించెడు గరితల దయఁజూచు కాంత యెవతె
తల్లిదండ్రి దయమాలి తరిమి పుచ్చిన యట్టి కాంతల బ్రేమించు గరిత యెవతె
వెలలేని సద్ధర్మ వితతిని బోధించి యజ్ఞానమడచిన యమ్మ యెవతె
అరలేని యనుకంప నారసి దుఃఖంబు లపనయించిన యట్టి అతివ యెవతె
అట్టి మా రాజ్యలక్ష్మమ్మన లఘుమతిని ,కాలగతినిట్లు నెడబాసి కనలవలసె
నకట కాలంబు దాటగా నలవి యగునె, ఫాలనేత్రునికయినను బ్రహ్మకైన “ ఈ సీస పద్యం లో తేటగీతి భాగం రామలక్ష్మమ్మ వియోగ దుఃఖం తో కాలం ఈదటం శివుడికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు అన్న విశేషణ వాక్యంతో తన లాంటి సామాన్యుల సంగతి చెప్పనక్కరలేదన్న విషయాన్ని సూచించింది. మరణం ఎవరికైనా అనివార్యం కదా? వియోగ వ్యధ దుస్సహమే కావచ్చు కానీ రామలక్ష్మమ్మ మరణ దుఃఖానికి అంత తీవ్రత ఎందుకు? అంటే అది వ్యక్తిగత సంబందం వల్ల కాదు. ఆమె ఇన్నాళ్లుగా నిర్వహించుకు వస్తున్న ఒక గొప్ప సామాజిక బాధ్యత - స్త్రీ సమాజం పట్ల తల్లివలె వ్యవహరిస్తున్న తీరు- వల్ల. వీరేశలింగం స్త్రీ పునర్వివాహ ఉద్యమం ప్రారంభించాక వివాహాలు కోరి ఇళ్ళనుండి బయటకు వచ్చిన స్త్రీల కొరకు వీరేశలింగం శరణాలయం స్థాపిస్తే ఆ శరణాలయంలోని స్త్రీలను ప్రేమతో దగ్గరకు తీసి తల్లివలె సంరక్షించింది. చదువుచెప్పి జ్ఞానవంతులను చేసింది. పీటలమీద కూర్చుని పెళ్లిళ్లు చేసింది. వీరేశలింగం ఉద్యమం ఆమె సాహచర్యంవల్లనే సంపూర్ణంగా సాఫల్యం అయింది. ఆరకంగా స్త్రీజనోద్ధరణ ఉద్యమంలో ఆమె నిర్వహించిన చారిత్రక పాత్రను ఈ సీస పద్యం లో నమోదు చేసింది తులసమ్మ. లోకంలో ఎన్నో సభలు చూసిన రాజ్యలక్ష్మమ్మ స్వర్గ సభల సంగతి తెలుసుకొనటానికి వెళ్లిందని సంభావించింది.
ఈ విధమైన స్మృతి కవితలలో మరొకటి మోతీలాల్ మరణానికి చింతిస్తూ వ్రాసినది( గృహలక్ష్మి , మార్చ్ 1931). పదకొండు పద్యాల ఖండిక ఇది.
3
డిసెంబర్ - జనవరి 1906 హిందూసుందరిలో సతీహితబోధిని అనే శీర్షికతో జూలూరి తులసమ్మ వ్రాసిన పద్యాలు ఉన్నాయి. భారతం అరణ్య పర్వం పంచమాశ్వాసంలోని సత్యాద్రౌపదీ సంవాదం ఆధారంగా వ్రాసిన చిన్న కావ్యం ఇది. అరణ్యవాసం చేస్తున్నపాండవులను చూడటానికి వెళ్లిన శ్రీకృషుడితో సత్యభామ కూడా వెళ్ళింది. ఏకాంతంలో సత్య ద్రౌపదిని నీ అయిదుగురు భర్తలు నీ యందు అంతగా అనురక్తులు కావటానికి నీవు ఏమందులు పెట్టావు ఏ మంత్రాలు వేశావు? తెలుసుకొని నేను కూడా కృష్ణుడిని వశవర్తుడిని చేసుకొంటాను చెప్పవా అని అడిగింది. దానికి ద్రౌపది సతులకు ఏది హితమో వివరిస్తుంది. అక్కడ 32 పద్యగద్యలతో ఉన్న విషయాన్ని తులశమ్మ 60 పద్య గద్యలలో కథనం చేసింది. అంటే భారతకథా ఘట్టాన్ని ఒకదానిని స్త్రీల హితోపదేశానికి అనుకూలంగా ఉంది కదా అని స్వీకరించి సమకాలపు చైతన్యంతో తన మాటలలో తిరిగి చెప్పిందన్న మాట.
సతీహితబోధినిలో మొదటి రెండు పద్యాలు దైవ స్తుతి. “ఎవ్వడనంత శక్తి మయు( డెవ్వనిచేఁ జనియించు విశ్వమిం/కెవ్వని మాయ … వంటి పద్యాలు పోతన భాగవత పఠన పారణ ప్రభావాలను చూపిస్తాయి. మూడవ పద్యంలో కథ మొదలు. ‘నిజదార సహోదర సంయుతుండు’ అయి స్త్రీ కృష్ణుడు బావలను చూడటానికి అడవులకు వెళ్ళటం, అతిధి సత్కారం మామూలే. “ తరుణీ లోకభీకర రుల నే తంత్రంబులం బన్నితో / వారదివ్యౌషధమేది యేని యిడితో వశ్యంబు గావించితీ” అన్న సత్యభామ కుతూహల వకాయం దగ్గర అసలు కథ మొదలవుతుంది. మందులు పెట్టి మాలిమి చేసుకొనటం మానహాని, ప్రాణహాని అని మందలించి ద్రౌపది ‘తానెరింగిన ధర్మంబు దాటె నేని సఖికి రౌరవ నరకం’ అని సత్యకు స్త్రీ ధర్మం ఏమిటో బోధిస్తుంది. అన్నం పెట్టేటప్పుడు స్త్రీ తల్లికావాలి, తాంబూలం ఇచ్చేటప్పుడు వెలయాలు కావాలి, పనులు చేసేటప్పుడు బానిస కావాలి అని చెప్తుంది. “ వ్రతములు పెక్కులు గలవా
వ్రతములలో వనితలకును వరుసేవయే మేల్” అని బోధించింది. భర్త కురూపి అయినా, రోగి అయినా జారుడైనా, చోరుడైనా , కోపిష్టి అయినా అతనే దిక్కని తలచే తరుణులకు కీర్తి లభిస్తుందని అంటుంది. భర్త పరదేశాలకు వెళ్ళినప్పుడు గంధ పుష్పాది అలంకారాలు స్త్రీకి తగదని చెప్తుంది.మగనికి లోబడి ఉండాలి.వాకిలి దాటరాదు. మాట బయటకు రారాదు. మగడిచ్చిన అణువైనా మేరుపర్వతం అంత అని తృప్తి పడాలి.సేవకులు ఎందరు ఉన్నా, తనకు ఎన్ని పనులున్నా భయభక్తులతో స్వయంగా భర్తకు సేవచేసే స్త్రీకి అభ్యుదయం. రోజుకొకరకంగా భర్త స్నాన పానాలకు, భోజనానికి ఏర్పాట్లు చేయాలి. స్త్రీకి అందగత్తెను అనే అహం, గర్వం , కోపం వుండరానివి. జపతప ఉపవాస వ్రతాలు ఎన్నయినా పతి సేవకు సాటిరావు. దైవ భక్తి , ధర్మవర్తనం స్త్రీల కు నిత్యం అనుష్టించదగినది. ఇలా సతికి హితము చేకూర్చే నీతులు అనేకం బోధిస్తూ తదనుగుణంగా ప్రవర్తించే స్త్రీలకు మెప్పు , చేయని స్త్రీలకు అపకీర్తి అని హెచ్చరించింది. భారతంలో సత్యకు ద్రౌపది బోధనగా చెప్పబడినవన్నీ మనుస్మృతి ‘స్త్రీ ధర్మములు’ గా పేర్కొన్న వాటికి కల్పించిన ప్రాచుర్యమే. ద్రౌపది బోధ ఆధారంగా తులశమ్మ వ్రాసిన ఈ ఖండిక అందువల్ల ఆధునిక మహిళకు అత్యంత ప్రాచీన మనుధర్మాన్ని ఆదర్శంగా చూపేదే అవుతున్నది. ఆధునిక యుగం స్త్రీని ఉదారవాద దృక్పథంతో పబ్లిక్ ప్రపంచంలోకి అయితే తెచ్చింది కానీ మనుధర్మ మూలం నుండి వేరు చేయలేకపోయింది అన్నది స్పష్టం.
అయితే తులశమ్మ వ్రాసిన సతీహిత బోధినిలో ప్రత్యేకత సమకాలపు స్త్రీ విద్యా ప్రాధాన్య ప్రస్తావన ఉండటం. ద్రౌపది బోధ విన్నాక సత్యభామ ఆమె మాటలవల్ల తన హృదయ తాపం అంతా తీరిపోయిందని తన మనస్సు ధర్మపథంబు పొందిందని చెప్పి ఒక్క సందేహం వ్యక్తం చేసింది.
“ విను చెలి వనితలకెల్లను
ఘనమనుచున్ విద్దె నెఱపి గాంతురు ప్రేమన్
జనదని కొందరు బల్కెద
రనుమానము దీర్చి పరమ హర్షంబిడదే” అని స్త్రీవిద్య గురించి ప్రశ్న వేసింది.
“ఒక్కరు గల్గి స్త్రీలకికనొల్లదు విద్య యటంచు బల్క బె
న్మక్కువ తోడ వేరొకరు మానక విద్య నొసంగుడంచనన్
బెక్కురు పెక్కు మార్గముల నేర్చిన వారల బ్రీతి గాంచినన్
చక్కని విద్య ఎప్పుడిల జక్కని శ్రేయ మొసంగు చుండ దే “ అని విద్య శ్రేయో కారకం కదా అని తన అభిప్రాయాన్ని కూడా జోడించింది. మంచి ప్రశ్న వేశావు అంటూ ద్రౌపది విద్య ప్రయోజనం గురించి చెప్పిన మాటలు సమకాలీన సంఘ చైతన్యం నుండి తులశమ్మ చేసిన భావనలే. “ అజ్ఞానంబను జీకటిం దునుము నత్యాశాగ్ని జల్లార్చు సు
ప్రజ్ఞంజింతను వార్ధి దాటనగు నా ప్రజ్ఞాతమౌ విద్యచే
సుజ్ఞానంబు నొసంగి సూరి జన సం స్తుత్యంబు మోదంబునౌ
నజ్ఞల్ గొందరు విశ్వసింపరిది యానందంబె యార్యాళికిన్” అని విద్య అజ్ఞానాన్ని , అత్యాశను పారద్రోలే శక్తి విద్యకు ఉందని , అది బుద్ధిమంతులు అయినవాళ్ళచే ప్రశంసించబడుతున్నదని చెప్పి స్త్రీలకు ఆభరణాలు ఎన్ని ఇచ్చినా ఆశతీరదు, అజ్ఞానం పెరుగుతుందీ కనుక “...... విద్యా విభూషణంబు / గల్గి యుండిన కాంతలు కాంతృ యశము” అని నిర్ధారించింది. ఆ రకంగా తులశమ్మ సమకాలీన స్త్రీవిద్యా ఉద్యమానికి తన స్వరాన్ని ఇచ్చింది. వీరేశలింగం పంతులు ఇదే భారతాంర్గత ద్రౌపది ప్రబోధం వస్తువుగా 1900 లో సత్యా ద్రౌపది సంవాదం పాటగా వ్రాసాడు. ద్రౌపది చేసిన హితబోధ మదినుంచుకొని సత్య పతి మనసెరిగి మెసలి సుఖించిందని చెప్పటమే కాక ఈ పాట చదివి స్త్రీలు వరగుణములు కలిగి వర్తిస్తే సకల శుభాలు , సత్కీర్తి పొంది ఇహపరాలలో సుఖిస్తారని ఫల శృతితో దానిని ముగించాడు వీరేశలింగం. ఆరేళ్లకు మళ్ళీ తులసమ్మ దానినే వస్తువుగా ఎంచుకొనటానికి వీరేశలింగం రచన కూడా ఒక ప్రేరణ అయిందేమో. పతులపట్ల స్త్రీలు ఎట్లా మెలగాలో పురుషులు చెప్పటం ఒక పద్ధతి. అందులో శాసనం ధ్వనిస్తుంది. స్త్రీలే స్త్రీలకు చెప్పటంలో అనుభవ కథనం ఉంటుంది. శిక్షణపొందిన పద్ధతి ఉంటుంది. స్త్రీలు స్త్రీలుగా జీవించవలసిన పద్ధతిలో శిక్షణ ద్రౌపది నుండి తులశమ్మ వరకు ఒకే రకంగా ఉందన్నమాట. వేల ఏళ్ళు గడిచినా శిక్షణలో రాని మార్పు విచారణీయం.
4
ఋతుచక్రవర్ణనము పేర జూలూరి తులశమ్మవ్రాసిన పద్యాలు 32.(1914, ఆంధ్రపత్రిక, ఉగాది సంచిక) “శ్రీల నలరారునట్టి యీ క్షితిని పెంపు / సొంపు వెలయించు దినముల సొరిది వినుడు”అని మొదటి రెండు పాదాలలో చెప్పి తరువాతి రెండు పాదాలలో మధుమాస వర్ణన కు శ్రీకారం చుట్టింది. 23 పద్యాలలో మధుమాస వర్ణన చేసి, తరువాతి ఆరు పద్యాలలో వర్షరుతు వర్ణన చేసి చివరి పద్యాలలో ఒక తాత్వికమైన ముగింపును ఇచ్చింది. చెట్లు కొత్త చిగుళ్లు వేయటం, మొగ్గ తొడగటం, తుమ్మెదల ఝుంకారాలు, కోకిలల కూతలు, వికసించిన మల్లె, మొల్ల మొదలైన పుష్పజాతులు, పక్షుల కిలకిలలు అనేక రకాలుగా మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి అని ‘ ఆ దినంబులలోనే హాయి కలుగు’ అని మధుమాస సౌఖ్యాన్ని వర్ణిస్తూ ఆ వెనువెంట పద్యంలో ‘ ఆ దినాంబులనిఎండలధికమౌను/ తనకు ( బూర్వము గల్గు శాంతమును బాసి / భాను డెంతయు గ్రోధ సంధానుడగుచుఁ …. ‘ అంటూ అంత సౌఖ్యాన్ని ఇచ్చే మధుమాసపు మరొక ముఖం బాధాకరమైన -ఎండ, నీటి ఎద్దడి, విసనకర్రలతో విసురుకొనటం వంటి అనుభవం అని వర్ణిస్తుంది. ఒక సౌఖ్యాన్ని ఆనుకొని ఒక బాధ ఉండటాన్ని ఫోకస్ లోకి తేవటంలో ఒక జీవనతాత్వికత అందివస్తుంది. ఎండా కాలం పోయి వానాకాలం వచ్చింది. దానిని వర్ణిస్తూ ఉరుములకు , పిడుగులు భయపడటం, వానలో తడిసి చలికి వణుకుతూ ఇంతలో ఇట్లా వర్షం వస్తుందని తెలియదు అంటూ జనం మాట్లాడుకొనటాన్ని ప్రస్తావించి ఇట్లా బహుభంగుల కనిపించే ప్రకృతిని , ప్రపంచాన్ని చూస్తుంటే ఏదీ స్థిరం కాదని తెలుస్తున్నదని నిర్ధారించి “ స్థిరముగా నుండు వస్తువు (దెలియవలయు /జ్ఞాన యుతులారా! సద్గుణ చతులార !/అన్నలార !సుపూజ్యత ప్రసన్నులార!” అని కర్తవ్యం ఉపదేశించింది.అనుభవాలు అనేకం. అస్థిరం. స్థిరంగా ఉండేది ఏదో ఈ చిత్రంపు సృష్టికి కర్తయైన సత్య చారిత్రుని ఎదలోన నిలుపుకొనటం వల్ల తెలుసుకొనేదే అని ఆమె కవిత్వ తాత్పర్యం. అట్లా ఋతుచక్రవర్ణన ఋతువర్ణన కోసమే కాక దానిని ఒక ఆధ్యాత్మిక తాత్విక భావ స్ఫూర్తి దిశగా నడిపించటం విశేషం.
ఈ పద్యాలలో తులశమ్మ భావుకత్వ శక్తి ఆహ్లాదకరంగా వ్యక్తమైంది. మధుమాసంలో చెట్లు పాత ఆకులు రాల్చి కొత్త ఆకులను తొడుక్కొనటం స్త్రీలు “ ప్రా(త చీరలు విడనాడి… / పట్టు పుట్టంబులను” కట్టుకొన్నట్లు ఉందని అంటుంది. మధుమాసాన్ని వర్ణించినవాళ్లు ఎందరో ఉన్నారు కానీ పాత చీరలు విడిచి కొత్తచీరెలు కట్టడాన్ని ఉపమానంగా చేసినవాళ్లు ఎవరయినా ఉన్నారా అంటే అనుమానమే. సంధ్యాసమయపు ఎర్రడాలు సూర్యుడు అక్కడక్కడా తిరిగి ఇల్లు చేరుతున్న కొడుక్కు దృష్టి తీయటానికి తల్లి తెచ్చిన ఎర్రనీళ్ళ పళ్లెం లా ఉన్నాడట. కమ్ముకొస్తున్న చీకట్లు రాత్రి అనే స్త్రీ జుట్టు లాగా ఉందని , ఉదయిస్తున్న చంద్రుడు ఆమె తలదువ్వుకొనటానికి కాలపురుషుడు ఇచ్చిన అద్దం అన్నట్లుగా ఉన్నాడని ఉత్ప్రేక్షిస్తుంది. భావుకత వాస్తవికత పరుగు పేకలవలె అమరిన పద్యరచన తులశమ్మది. ఒక పద్యం నుండి మరొక పద్యానికి కొనసాగింపు పద్ధతి వల్ల పాట లక్షణం కొంత పట్టుబడింది.
తులశమ్మ ప్రకృతి ప్రేమ , పారవశ్యం ఋతుమాల అనే శీర్షికతో (ఆంధ్ర సర్వస్వం 1925 మే, జూన్ , జులై సంచికలు ) ప్రచురించబడిన పద్యాలలో ప్రగాఢమై కనిపిస్తుంది. ఋతుచక్రవర్ణము పద్ధతిలోనే ఋతువులను వర్ణించే పద్యాల మాల ఇది. మధుమాసం తో మొదలై వర్షఋతువు రాకడ వరకు నడిచిన వర్ణన జులై సంచికలో సశేషం అని ప్రకటించబడింది. ఆ తరువాత ఎన్ని సంచికలలో ఇంక ఏయే ఋతువుల వర్ణన జరిగిందో తెలుసుకొనటానికి ఆ సంచికలు అలభ్యం. 1926 ఫిబ్రవరి సంచికలో లేవుకనుక ఋతుమాల పద్యాల ధారావాహిక 1925 ఆగస్టు నుండి జనవరివరకు ఆ ఆరు నెలల లోపల ఎప్పుడో ముగిసి ఉండాలి.
అప్పుడప్పుడే వికసిస్తూ ప్రచారంలోకి వస్తున్న భావకవిత్వం ధోరణి తులశమ్మకు పట్టు బడింది అనటానికి నిదర్శనం ఋతుమాల. “ చైత్ర రాజింక రామికి చింత తొడ / నున్న వనకాంత కొక వార్త విన్నవింప / వచ్చి కోయిల యెంతయో మచ్చికలర/ కొలది ధ్వనితోడ ( గూసె కుహూ యటంచు” అని చైత్రాన్ని పురుషుడితోటి వనాన్ని స్త్రీతోటి రూపకం చేసి చైత్రం కోసం ఎదురు చూస్తున్న వనకాంతకు చైత్రుడి రాక గురించి చెప్పటానికి వచ్చి కోకిల కూత మొదలుపెట్టింది. ప్రేమ , ఎదురు చూపులు అన్న భావాలను చుట్టుకొని కారయిత్రీ ప్రతిభ తీగలు సాగి కవిత్వానికి పందిళ్లు వేయటం ఈ కవితలో కనబడుతుంది. కోకిల కూత వనకాంత లో కలిగించిన సంచలన వర్ణన తరువాతి పద్యం. “ అట్టి యవ్యక్త మధురిమ నాలకించి /యెంతొ రహిమించి పులకించి సంతసించి / వింత దళుకొత్త ననలెత్తి వేడ్క హత్తి /పోవనున్నట్టి ప్రాణంబు పొందు పరుచు” కోకిల నాద మధురిమ అంచలంచెలుగా కలిగించిన ప్రభావం వర్ణితం. పులకింత , సంతోషం , కొత్త మెరుపు , మైమరపు , ఉత్సాహం కలిగిస్తూ కోకిల నాదమాధురిమ అంతిమంగా పోతున్న ప్రాణాలను నిలిపింది. ఈ రకమైన మానసిక అవస్థా వర్ణన, ఒక భావాన్ని దశా పరిణితివరకు తెగకుండా సాగించటం కృష్ణశాస్త్రి కవిత్వంలో కనబడే లక్షణాలు. యెంత మృదుతర గానమో అంటూ కోకిల గానానికి పరవశించి పోతుంది. ఆ పారవశ్యంలో అది మోహన మంత్రమో , చక్కని రసమో , ఎంత హాయో, ఎంత రుచో ఎంత విలువో ఎరుకపడదు అని ఆ ఆనందానుభవాన్ని పేరుపెట్టి తెలుసుకొనటానికి తాపత్రయ పడుతుంది. శిశువులకు , పశవులకు, పాములకు మాత్రమే ఆ నాదం ఎక్కడ పుట్టి ఎలా వ్యాపిస్తున్నదో తెలుసు నని , తెలుసుకోలేకపోయిన తన నిస్సహాయతను చెప్పుకొంటుంది. ఎండిన మోడులను చిగురింప చేసే శక్తి పాట అని సంభావిస్తుంది.మధుమాసం రుతువులలో హృద్యమైనదని చెప్తూ దాని విలాసాన్ని పరిపరివిధాలుగా వర్ణించింది తులశమ్మ.
మధుమాసం ఎండాకాలాన్ని వెంటపెట్టుకొని వస్తుంది. సూర్యుడు సహస్ర కిరణాలతో విజృభించి తాపం కలిగించే కాలం అది. ‘చండతరవర్తి , ప్రచుర మార్తాండ మూర్తి’ అంటుంది సూర్యుడిని. సూర్యకిరణాల వేడికి నీరు ఆవిరై పైకి తేలి ఘనీభవించి మేఘమై గాలి తాకిడికి కదులుతూ ఎక్కడో వర్షిస్తుంది. ఇది ప్రకృతి చక్రం. ఈ క్రమంలో వర్ష దాత పరోక్షంగా సూర్యుడు. “ “ “ “తానొసగిన రసరూప ధనము మరల గైకొనుటకు వేయికరములు సాచి సూరీడు ఎండాకాలంలో విజృంభిస్తున్నట్లు ఒక కార్యకారణ సంబంధ భావన చేసింది తులశమ్మ. భావకవిత్వానికి నిలువుటద్దం వంటి ఖండకావ్యం ఈ ఋతుమాల. ఆధునికులలో ఋతువర్ణనకు విశ్వనాథ సత్యనారాయణ పేరు ప్రసిద్ధి. ఆ రకంగా చూసినప్పుడు జూలూరి తులశమ్మ చేసిన ఋతువర్ణన తప్పని సరిగా చెప్పుకోవలసినది.
--------------------------------------------------------------
(ఇంకావుంది)
కళ్లేపల్లె వేంకట రమణమ్మ కవిత్వం ఖండికల రూపంలో లభిస్తున్నవి ఆరు. శతకం ఒకటి. ఖండికలు ప్రధానంగా ఆశీర్వచన ,అభినందన పద్యమాలలు. కాకినాడ విద్యార్థినీ సమాజం ,ఆ సమాజం వల్ల ఏర్పడ్డ సంబంధాలు ఆమెకు ఎంత ప్రియమైనవో చెబుతాయి అవి. 1904 లో ఏర్పడిన కాకినాడ విద్యార్థినీ సమాజం పులగుర్త లక్ష్మీనరసమ్మ నాయకత్వంలో నాలుగైదేళ్లు వర్ధిల్లి తరువాత నామ మాత్రావశిష్టమై ఉండగా 1910 లో బాలాంత్రపు శేషమ్మ , దామెర్ల సీతమ్మ కలిసి పునరుద్ధరించినది మొదలు కళ్లేపల్లి వేంకట రమణమ్మ దానికి అధ్యక్షురాలు. 1916 వరకు ఆ పదవిలో ఆమె కొనసాగింది. అందువల్ల ఆమె మేధో సృజనలకు అదే ఆలంబన కావటంలో ఆశ్చర్యంలేదు.
1
1910 లో రెండవ జన్మ ఎత్తిన శ్రీ విద్యార్థినీ సమాజం ద్వితీయ జన్మదిన మహోత్సవ సమయంలో వేంకటరమణమ్మ సంస్థను ఉద్దేశించి వ్రాసిన తొమ్మిది పద్యాల ఖండిక ( హిందూ సుందరి , 1911, సెప్టెంబర్) లో మూడు శార్దూల వృత్తాలు, మూడు ఉత్పలమాల వృత్తాలు, ఒక చంపక మాల , ఒక సీసం, ఒక పంచచామర వృత్తమూ వున్నాయి. ‘శ్రీవిద్యార్ధిని యన్సమాజమ’ అని సంబోధించి దేవుడు సదా నిన్ను పాలిస్తాడు అని ప్రార్ధనారూప ఆశీస్సుతో ప్రారంభించి రెండవ పద్యంలో ఖ్యాతి , అపఖ్యాతి అనేవి పని ఆరంభించకపోతే లేనేలేవు , ఆరంభించిన తరువాత దారి తప్పితే అపఖ్యాతి, ధైర్యంతో ఆరంభం అయ్యావు కనుక చివరివరకు నడవాలి అని ఆకాంక్షించింది. ఇంతకు ముందు ఈ నగరంలోని స్త్రీలందరినీ ప్రోగుచేసి ప్రసిద్ధికెక్కావు, ఏ మాయలోనో పడి మరుగై ఇన్నాళ్లకు ఈ రూపంలో మళ్ళీ అవతరించావు. ఏడాది శిశువువు అయ్యావు. గట్టెక్కవలసిన బాలారిష్టాలు ఎన్నిఉన్నాయో తెలివిగా ఉండాలని చెబుతూ “ నీలోనే ప్రతిసంఘమేర్పడును జుమ్మీ జంకి వెన్నీకుమీ” అని హెచ్చరించింది.
ప్రారంభమైనప్పుడు ఏర్పరచుకొన్న సమాజ నిబంధనల ప్రకారం పునర్వివాహం చేసుకొన్నస్త్రీలకు ఇందులో ప్రవేశం లేదనీ, పునరుద్ధరణ తరువాత నిర్వాహకులు కొందరు ఆ నిబంధనను వ్యతిరేకించి పునర్వివాహిత స్త్రీలను చేర్చుకొనటం వలన చాలామంది సమాజ సమావేశాలకు రావటం మానేశారని,సమాజం ఇలా క్షీణదశకు రావటం చూసి సహించలేక దామెర్ల సీతమ్మను , బాలాంత్రపు శేషమ్మను కార్యదర్శి సహాయకార్యదర్శి పదవులనుండి తొలగించి సమాజకార్యక్రమాలను చక్కబెట్టే బాధ్యత పులగుర్త లక్ష్మీ నరసమాంబ తీసుకొనాలని జులై 2 వతేదీనాడు జరిగిన సభలో నిర్ణయించినట్లు 1911 జులై సావిత్రి పత్రికలో వచ్చిన ప్రకటనను దృష్టిలో పెట్టుకొనే రమణమ్మ ఈ హెచ్చరిక చేసి ఉంటుంది. ఆ ప్రకటనను ఖండిస్తూ బాలాంత్రపు శేషమ్మ , దామెర్ల సీతమ్మ తాము ఏర్పరచకుండా , తాము లేకుండా కార్యవర్గ సమావేశం ఎలా జరిగిందని, ఆ తీర్మానానికి విలువ ఏమిటని, పులుగుర్త లక్ష్మీ నరసమాంబకు దానితో సంబంధం ఏమిటని సవాల్ చేస్తూ వ్రాసిన నేపథ్యంలోనే “కొందరి మెప్పుకై జనులకుం దలకంటకమైన తోవలన్ ముందడు గుంచ( బోకుము” అని ప్రారంభమయ్యే తరువాతి పద్యాన్ని “ నిన్నుఁ బాసిన బ్రయత్నములెట్లు ఫలించు సోదరీ” అని ముగించినట్లు తోస్తుంది.
తరువాతి సీసపద్యంలో స్త్రీలు విద్యా స్వాతంత్య్రముల రుచి ఎరగటానికి, సంఘాలు పెట్టుకొనటానికి ఏ సంస్కర్తలు కారకులు, ప్రేరకులు అయ్యారో వాళ్ళు తలపెట్టిన ‘ సంఘ సంస్కా రములకు నీ శక్తి ( కొలది తోడుపడ ( జూడు యే మార్పు (గూడదనకు మమ్మ యదియె కృతజ్ఞత సుమ్ము కొమ్మ’ అని హితవు చెప్పటంలో పునర్వివాహిత స్త్రీలను సంఘంలో చేర్చుకొనరాదు అన్న పక్షం పట్ల రమణమ్మ వైఖరి స్పష్టమే. ఆ రకంగా ఆశీస్సు రూపంలో ఉన్న ఈ ఖండిక విద్యార్థినీ సమాజ చరిత్రకు సంబంధించిన ఒక ఘటనకు వ్యాఖ్యానం కూడా అయింది.
చెలులు స్వతంత్ర హీనులు అని , చెంచలమతులని, నీచులని గ్రంధాలలో వ్రాసిపెట్టిన ‘పుణ్యపురుషుల’ వూహ, మాట, చర్య అన్నీ మిధ్య అనుకొనేట్లు శ్రీ విద్యార్థినీ సమాజం పనిచేయాలని ఆకాంక్షించింది రమణమ్మ, చివర వ్రాసిన ‘పంచ చామర’ వృత్తంలో సమాజపు రెండవ పుట్టిన రోజు ఉత్సవం కలిగించిన తృప్తి నుండి సంతోషపడిన ఆత్మ తో వారణాఖ్యమాలికను ఇస్తున్నాను తీసుకోమంటుంది. అంటే తాను వ్రాసిన ఈ పద్యాల మాలను ఆమె ‘వారణ మాల’ అన్నది. పద్య రచనా సంప్రదాయంలో వారణ మాల ఒక రూపమా ? వారణ మాయిరం అని తిరుపతిలో వెంకటేశ్వరస్వామికి చేసే ఆరాధన ఒకటి ఉంది. అమ్మవారు స్వామివారికి తాను ధరించిన పూలమాలను సమర్పించటం ఇందులో విషయం.( గిరిజామనోహరబాబు గారి సౌజన్యంతో) శ్రీ విద్యార్థినీ సమాజాన్ని దేవుడు కాపాడాలి అని ప్రారంభంలోను పార్వతి, సరస్వతి, లక్ష్మి - ఈ ముగురమ్మల దయతో శోభిల్లుతుందని చివరి పద్యంలోను చెప్పిన కవయిత్రి ఈ పద్యమాల ను పవిత్రమైనదిగా సంభావించిందేమో దానికి వారణ మాల అని పేరు పెట్టింది.
మళ్ళీ సమాజ ‘తృతీయ జన్మ వాసరోత్సవాన్ని’ పురస్కరించుకొని 1913లో ( హిందూ సుందరి , జూన్ ) ఆశీర్వచన పద్యాలు వ్రాసింది రమణమ్మ. వీటిని ఆమె ‘పంచరత్నములు’ అన్నది రెండు కందపద్యాలు, ఒక ఉత్పలమాల, ఒక సీసం , ఒక చంపకమాల మొత్తం అయిదు పద్యాలు కనుక పంచరత్నాలు. ఉత్సాహ వృత్తంలో నీ పుట్టిన రోజు సంబరాలు నన్ను సౌఖ్యవార్ధిలో తెల్చాయి కనుక నీ కోసం ఈ పంచరత్నాలు కానుకగా ఇస్తున్నాను అని చెప్పుకొన్నది. సాధించిన విజయాలకు సంతోషపడుతూ మెచ్చుకొంటూనే భవిష్యత్తులో సాగించవలసిన ఉద్యమాల విషయంలో శ్రద్ధతో పనిచేయాలని సూచించింది. ఏమి పనిమీద ఎక్కడికి వెళుతున్నదో గానీ మూడునెలలు విద్యార్థినీ సమాజాన్ని వదిలి వెళ్ళటానికి ఆమె పడిన వేదన తరువాతి సీసపద్యంలోని విషయం. శరీరాలు వేరైనా తనకూ సమాజానికి అభేదమని చెప్పుకొన్నది. కనుక ఎడబాటు బాహిరమే కానీ ఆంతరికం కాదని సమాధానపడింది.
శ్రీవిద్యార్ధినీ సమాజ అయిదవ వార్షికోత్సవానికి కూడా గజమాల అనే శీర్షికతో కళ్లేపల్లె వేంకట రమణమ్మ ఏడు పద్యాలు వ్రాసింది. సాధారణంగా ప్రశంసాపూర్వకమైన పద్యాలు చాలా ఎక్కువగా వ్రాసినప్పుడు దానిని గజమాలగా చెప్తారు. మరి ఏడూ పద్యాలే వ్రాసి రమణమ్మ ఆ పేరు ఎందుకు పెట్టిందో తెలియదు. ఇందులోనూ సమాజ చరిత్ర గురించిన సీస పద్యం ఒకటి ఉంది. తొలుదొల్త భండారు అచ్చమాంబ చేత స్థాపించబడింది కానీ ‘స్వాస్థ్యంబు లేక నామా వశిష్టవై నవయుచుండ శేషమాంబ జాలిపడి చేరదీసిందని, అందరూ కలిసి సంస్థకు ఒక భవనాన్ని ఏర్పరచి రిజిస్టరు చేశారని , హిందూ సుందరి పత్రికను తెచ్చి జత చేశారని ఆ కార్యంలో తన భాగస్వామ్యాన్ని కూడా సూచిస్తూ వ్రాసింది. ఈ సంస్థను స్థాపించింది భండారు అచ్చమాంబ కాదు.ఆమె కాకినాడకు వచ్చిన సందర్భంలో పులుగుర్త లక్ష్మీ నరసమాంబ ఆ పని చేసింది. ఆమె పేరును పూర్తిగా విస్మరించటానికి సంస్థ కార్యదర్శి ఉపకార్యదర్శుల మీద వచ్చిన వ్యతిరేకత విషయంలో లక్ష్మీ నరసమాంబ హస్తం ఉందన్న అనుమానం కారణమై ఉంటుంది.వివాదాల సంగతి ఎలా ఉన్నా -నిజానికి 1911 లో వచ్చిన ఆ వివాదం వెంటనే సమసిపోయినా - సంస్థ వ్యవస్థాపక సభ్యురాలిగా లక్ష్మీ నరసమ్మ పేరు ప్రస్తావించకపోవటం చరిత్రను మరుగుపరచటమే.
విద్య, వినయం , వివేకం అలవరచుకొనవలసిన గుణములని చెప్తూ ఆ పంచమ వార్షికోత్సవ సదస్సుకు అధ్యక్షురాలిగా కొటికలపూడి సీతమ్మ వచ్చిన విషయాన్ని కూడా నమోదు చేసింది కవయిత్రి ఈ పద్యాలలో.
ఆరవ వార్షికోత్సవంలో ‘పారితోషికంగా’ గీతామాలిక అల్లి ఇచ్చింది. ( హిందూసుందరి , 1916, జూన్) గీతపద్యంతో మొదలుపెట్టి నాలుగు పాదాలు దాటి దానిని అలాగే కొనసాగిస్తే అది గీత మాలిక. ఇది 92 పాదాల గీతమాలిక . యథాపూర్వకంగా దైవప్రార్థనా పూర్వకమైన ఆశీస్సుతో మాలిక ప్రారంభం అవుతుంది. అప్పటికి దేశీయ రాజకీయాలలో వికసిస్తున్న ఆంధ్రజాతి ఆంధ్ర రాష్ట్ర, ఆంధ్ర మాత భావనలు వెంకట రమణమ్మ వరకు అందివచ్చాయి. విద్యార్థినీ సమాజాన్ని ఆంధ్రమాత కన్న బిడ్డ అంటుంది. ‘పతనమైన తల్లిని పైకి లేవ నెత్తుటకు తగిన సామర్ధ్యం కలదానిగా సమాజాన్ని సుశిక్షితం చేయటానికి’ అబలలం అశక్తులం అనుకోకుండా ఆంధ్రసోదరులను ఆశ్రయించి అవసరమైన ధనం సమకూర్చుకొని భవనం కొని గ్రంధాలయం, ముద్రాలయం ఏర్పరచుకొన్న విషయాన్ని చెప్తుంది. సభ్యత్వం విషయంలో సంతృప్తి కూడదంటుంది. పట్టణంలోని వనితలందరూ వారానికి ఒక మారైనా సమాజానికి వచ్చేట్లు చేయాలంటుంది. సమాజానికి వచ్చే పుస్తకాలు, పత్రికలు అందరి వినియోగంలోకి రావాలంటుంది. బాలికలకు నూతన జ్ఞానం సంపాదించటానికి అనువుగా నెలకొకసారి వచ్చే హిందూసుందరిని పక్షపత్రికగా వచ్చే మార్గం చూడాలని సూచించింది. అజ్ఞాన మయతిమిరంలో ఉన్న స్త్రీలను ఆకర్షించి సంఘంలోకి రావటమే తెలివిడి అని బోధపరచాలని పేర్కొన్నది. నిందకు కృంగక , ప్రశంసకు పొంగక ఓరిమితో మెలగాలని ‘శాంతమే భూషణమ్ము మన కాంతలకు’ అని చెప్తుంది . ‘వినయమే నగ మన యాంధ్రవనితలకును’ అని కూడా చెప్పింది.
మరో రెండు పద్యఖండాలకు సందర్భం శ్రీ విద్యార్థినీ సమాజం కార్యదర్శి బాలాంత్రపు శేషమ్మ. ఆమె పురుడు పోసుకొనటానికి మద్రాస్ వెళుతున్నప్పుడు వీడ్కోలు ఇస్తూ చదివిన ఆశీర్వచన పద్యాలు ఐదు.(హిందూసుందరి, 1914, అక్టోబర్) సంతానం కోసం పడిన చింత ఇకలేదు కదా అంటూ చాలాకాలం సంతానం లేదని ఎంతో చింతించిన కౌసల్య రాముడిని కని ఆనందపడినట్లుగా మంచి కొడుకు నీకు పుట్టి ఆనందం కలిగించాలని లక్ష్మిని ప్రార్థిస్తున్నా అని శేషమాంబను ఉద్దేశించి చెప్పింది.ఇంతవరకు సామాన్యమే. ఆ తరువాతి పద్యంలో ఉంది విశేషమంతా.
“ సుందరి” దెచ్చినందులకు సుందరుడౌ సుతు గాంచగల్గునో
“ సుందరి” దెచ్చినందులకు సుందరి యౌ సుత గాంచగల్గుదో
“ సుందరి” దెచ్చియున్ సతము సుందరులన్న భివృద్ధి ( జేయుటన్
సుందరియౌ సుపుత్రికను శోభన మొప్పగ గాంచుమో చెలీ” రాముడి వంటి కొడుకు కలగాలని కోరుకొనటం సరే… పుట్టేది కొడుకో కూతురో నిర్ణయించలేం కదా అన్న ఆలోచన వచ్చి ఉంటుంది. హిందూసుందరి పత్రికను స్త్రీ విద్యార్థినీ సమాజం కోసం తెచ్చిన శేషమాంబ కృషి గుర్తుకువచ్చి ఉంటుంది. సుందరి ని తెచ్చినందుకు సుందరుడైన కొడుకు పుడతాడా? సుందరి అయిన కూతురు పుడుతుందా అని విచికిత్స చేసి సుందరిని తెచ్చి సుందరులను అభివృద్ధి చేస్తున్నావు కాదా మంచి కూతురు పుడితే బాగుంటుందని తీర్మానించటం ఈ పద్యంలో చూస్తాం. స్త్రీసమాజం తో పాటు హిందూ సుందరి పత్రిక రమణమ్మ భావప్రపంచాన్ని అంతగా ఆక్రమించిందన్నమాట. ఈ పద్యంలో ఆడపిల్ల పుట్టుకను ఆకాంక్షించిన ఆమె తరువాతి పద్యంలో మళ్ళీ మాయ కమ్మినట్లుగా సుఖప్రసవమై కొడుకునెత్తుకొని రావాలని సమాజమునకు తీసికొనివచ్చి తమకందరికీ చూపాలని శ్రీమహా విష్ణువు ను ప్రార్ధిస్తున్నానంటుంది. చైతన్యంతో ఆడపిల్ల పుట్టుకను ఆకాంక్షించటం సంప్రదాయపు అలవాటు చొప్పున అప్రయత్నకృతంగా మగపిల్లవాడి పుట్టుకను కోరటం ఇక్కడ చూస్తాం. శేషాంబకు పుష్పాలంకృతి వేళ అంటే సీమంతపు వేడుకలో రమణమ్మ ఈ పద్యాలు చదివింది.
మరుసటి నెల సంచిక( నవంబర్ 1914) వచ్చే నాటికి శేషమాంబ ప్రసవించి ఆడపిల్లను కనటం , ఆపిల్లను ఉయ్యాలలో వేసే వేడుక జరగటం కూడా అయ్యాయి. ఉయ్యాల ఉత్సవ వైభవ వేళ తాను బాలికకు చేసి ఇచ్చిన రత్నమాల ఈ పద్యమాల అంటుంది వెంకటరమణమ్మ చివరి పద్యంలో మొదటి ఐదు పద్యాలలో మొదటిది ఉత్పలమాల.తరువాతి రెండు కందాలు. ఒక గీత పద్యం తరువాత మళ్ళీ ఒక కందం. సుందరరామయ్య శేషమాంబల పుత్రికకు దీవనలీయమని స్నేహితులను ఆహ్వానిస్తుంది. హిందూసుందరి పత్రిక యందున్న అభిమానం ఈ ఖండికలో కూడా ప్రతిఫలించింది. హిందూసుందరే మన మీద దయతో సుందరరామయ్య శేషమాంబల కూతురిగా పుట్టింది అంటుంది. హిందూసుందరి పత్రికయందు అభిమానమున్న అందరమూ కలిసి సుందరిని ఉయ్యాలలోవేసి జోలపాటలు పాడటంలో ఆనందం పొందాము అని సంబరపడుతుంది.
“స్వస్తిరస్తు శుభొస్తు సౌభాగ్యమస్తు
చిరతరాయుష్యమస్తు భాసుర గుణోస్తు
భాగ్యమస్తు నిరంతరారోగ్యమస్తు
శేషమాంబా కుమారియౌ శిశువునకున్” అని బిడ్డకు ఆశీర్వచనం పలికింది.
2
కళ్ళేపల్లె వేంకటరమణమ్మ వ్రాసిన శ్రీవరలక్ష్మీ శతకం హిందూసుందరి పత్రికలో 1914 మే జూన్ నెలలలో ప్రచురితం. ‘శ్రీ వరలక్ష్మీ’ అన్నది మకుటం. 108 పద్యాలు. ఎంచుకొన్న వృత్తం కందం. శతకాలు భక్తి ప్రధానమైనవి. ఇష్టదైవాన్ని సంబోధిస్తూ లీలావర్ణన చేయటం ఎక్కువ. అది నెపంగా సామాజిక విషయాల విమర్శ సమాంతరంగా సాగుతుంటుంది. స్త్రీలకు శ్రావణమాసం మంగళగౌరీ , వరలక్ష్మీ వ్రతాలతో, పేరంటాలతో సందడి సందడిగా సాగే మాసం. శ్రావణమాసం రెండవ శుక్రవారం నాడు చేసుకొనే వరలక్ష్మీవ్రతం అధిష్టాన దేవత వరలక్ష్మి . వరలక్ష్మీ పూజావిధానం యక్షగానంగా కూడా వ్రాసింది రమణమ్మ . ( యస్వీ . జోగారావు , యక్షగాన వాజ్మయ చరిత్ర ) అది ఈ శతకం కంటే ముందు వ్రాసిందో తరువాత వ్రాసిందో తెలియదు.
సాధారణ శతక పద్ధతిలో కాక శ్రీ వరలక్ష్మీ శతకాన్ని కళ్ళేపల్లె వేంకట రమణమ్మ కావ్య పద్ధతిలో ప్రారంభించింది. “ శ్రీరామామణి నాహృ
త్సారసమున నిలచి నీదు చరణ యుగళి సే
వారతి నా చిత్తమ్మున(/
జేరిచి రక్షింపుమమ్మ శ్రీవరలక్ష్మి” అని ప్రార్ధనతో ప్రారంభించింది. కులదైవానివని మా పూర్వీకులు నిన్ను సేవించారు. వారి మార్గంలోనే నేనూ కనుక వాళ్లకు వలెనె నేనూ వర్ధిల్లేట్లు చేయమని తరువాతి పద్యంలో వేడుకొన్నది. ఆదికవులు శతకం గొప్ప ప్రక్రియ అని నుతించారు కనుక భక్తితో నేనీ ‘నూతనశతక’ రచన చేయాలనుకొంటున్నాను , భారం నీదే అని వరలక్ష్మీదేవికి విన్నవించుకొన్నది.
“ మృదు మధుర వచన రచనల
కుదురెఱిగిన దానఁగాను కొలఁది ( జదివితిన్
జదువను ఛందము ( గావిం
చెదనని కడఁగితిని గవిత శ్రీవరలక్ష్మీ “ రచనా నైపుణ్యం లేదని, చదువు కొద్దిగానే అని , ఛందస్సు అసలే చదవలేదని అయినా కవిత వ్రాసే సాహసానికి దిగుతున్నానని వెంకట రమణమ్మ చెప్పుకొన్న మాటలు తనకు పూర్వపు మహిళాకవులు చెప్పుకొన్న పద్ధతిలోనే ఉన్నాయి. పెద్దగా విద్యావంతురాలిని, జ్ఞానవంతురాలిని కాదని అల్పజ్ఞత్వాన్ని ప్రదర్శించి లోకపు విమర్శలకు ఒక కవచం సిద్ధం చేసుకొన్నదన్నమాట.
ఆ తరువాత పద్యాలలో ఆమె తనకు కవిత్వం వ్రాసే శక్తి కలిగించిన శివరామ కవీంద్రునికి(6)తనను విద్యాన్వితగా చేసిన మామగారు సీతారామశాస్త్రికి(11) నమస్కరించింది. తండ్రి కురవి రామశాస్త్రిని ( 8) తలచుకొన్నది. “ముద్దులుగులుకు కవిత్వము సిద్ధింపగ” విద్దెలకధిదేవత అయిన వాణిని , తాను అనుకొన్న శతక రచనకు విఘ్నాలు రాకుండా హేళనలకు గురి కాకుండా ఉమా భావానిని స్తుతించింది. ఇలా కావ్యాలలో ఉండే గురు దైవ ప్రార్ధనల సంప్రదాయాన్ని శతకంలోకి తీసుకురావటమే కాదు పూర్వకవి స్తుతి సంప్రదాయాన్ని కూడా పాటించింది. అందులోనూ ఒక విశేషం వుంది. ‘తొలి చదువుల కర్తలు, ద్రష్టలు’ అయిన మైత్రేయి సూర్య శ్రద్ధ మొదలైన వాళ్ళ నుండి మొదలుపెట్టి సంస్కృత తెలుగు కావ్యాలు వ్రాసిన భామతి, మొల్ల , తరిగొండ వెంగమాంబ మొదలైన కవయిత్రులను స్తుతించింది. వ్యాస వాల్మీకాదులను, నన్నయ తిక్కనాదులను కాక కావ్యరచనా కారులైన స్త్రీల పరంపరను స్తుతించటం ఆత్మగౌరవ స్పృహతో కూడిన కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించటమే.
అంతే కాదు సమకాలికులు సంస్కరణవాదులు, రచయితలు అయిన మహిళలను కూడా వేరువేరుగా ప్రస్తుతించింది. బాల వితంతు వివాహ ఉద్యమంలో భాగమైన కందుకూరి రాజ్యలక్ష్మ మ్మను నుతించింది. అబలాసచ్చరిత్ర రత్నమాలను ఇచ్చిన బండారు అచ్చమాంబను స్నేహంతో స్మరించుకొన్నది. తెలుగు గీర్వాణభాషల లో ప్రజ్ఞ గలిగిన కవయిత్రి , స్నేహితురాలు అయినా పులుగుర్త లక్ష్మీనరసమాంబను ప్రేమతో ఎప్పుడూ తలచుకొంటూనే ఉంటానని చెప్పుకొన్నది.’ దేశసేవారతయౌ నాతి’ అని కొటికలపూడి సీతమ్మను తలచుకొన్నది. గతంలోనూ , ఇప్పుడూ కూడా విద్యావంతులైన స్త్రీలు ఎందరో ఉన్నారని కానీ వాళ్ళను అందరినీ చెప్పటానికి ఈ శతకం సరిపోదని ఆగుతున్నాని చెప్పింది. ఈ రకంగా శతకంలోని మొదటి 20 పద్యాలు కావ్యావతారికా ప్రాయంగా రచించబడ్డాయి.
21 వ పద్యం నుండి 59 వ పద్యం వరకు శతకం ఆధ్యాత్మిక భావభూమికలో నడిచింది. సృష్టిస్థిలయ మూలం వరలక్ష్మి అని, ,అది, ఇటువంటిది, అటువంటిది, తుదిమొదళ్లు కలదన్నట్లు కనిపించేది , మనస్సుకు తోచేది అన్నీ వరలక్ష్మి లీలావిలాసమేనని , సుజ్ఞానులకు వశీకరమయ్యే బ్రహ్మం, శ్రీకైవల్య సుఖం అన్నీ శ్రీవరలక్ష్మే అని స్తుతిస్తుంది. త్రిగుణాతీతము, పరిపూర్ణము, జగదాధారము అయి వ్యష్టిగా సమిష్టిగా కనిపించే సమస్తం వరలక్ష్మి అని ప్రవిమలం, అవిమలం అని, మాయ అని విద్య అని రెండురకాలుగా భాసించే శ్రీమహాలక్ష్మి శక్తి శివుడికైనా తెలియశక్యం కాదంటుంది. (44) “ అవివేకులునినుఁ గమలో
ద్భవునిగ నింద్రునిగ హరి(గ (బక్ష్మీం ద్రునిగా
రవిఁగా విఘ్నేశ్వరుఁగా
శివుఁగా నజ్ఞత నుతింత్రు శ్రీవరలక్ష్మీ (50) అనే పద్యంలో అన్ని దైవాలకు మూల రూపం శ్రీమహాలక్ష్మి అని ప్రతిపాదించింది. అవివేకం వల్ల మూల శక్తిని వదిలి వేరు రూపాలను ఆరాధించటం జరుగుతున్నదని చెప్పినట్లయింది. శ్రీవరలక్ష్మి పరమాత్మ మాత్రమే కాదు, సూక్ష్మ స్థూల కారణం తనువులు కలిగిన జీవాత్మ కూడా అని భావిస్తుంది. ( 53) పంచభూతాల సృష్టికర్త శ్రీమహాలక్ష్మే అని చెప్తుంది.
60 వ పద్యం నుండి కొంతకొంతగా లౌకిక జగద్విషయ చర్చ చేసింది. కనబడుతున్న ప్రపంచాన్ని సృష్టించినవాడు ఎవడో ఉంటాడు అతడు పురుషుడు శ్రీహరి అనుకుంటారు కానీ వాళ్ళు దారి తప్పిన వాళ్ళు అంటుంది రమణమ్మ (60) ఎందుకంటే సృష్టికర్త పురుషుడు కాదు ,స్త్రీ అన్నది , ఆ స్త్రీ మహాలక్ష్మి అన్నది రమణమ్మ విశ్వాసం. ఈ విశ్వాస మూలం దేవీభాగవతంలో ఉంది. శైవ వైష్ణవ భక్తి మార్గాలను ప్రస్తావించి విష్ణువు గొప్పవాడని కొందరు , శివుడు గొప్పవాడని మరికొందరు అట్లాకాదు , అసలు వాళ్ళిద్దరికీ భేదమే లేదు అని కొందరు అంటారని చెప్తూ ద్వైత అద్వైత విశిష్టాద్వైత మతాభిమానులై వాదవివాదాలు చేసేవాళ్లు వాటన్నిటికీ అతీతమైన వరలక్ష్మి రీతిని తెలుసుకోలేకున్నారని అంటుంది. అందరూ దేవుడు మగవాడనుకొంటారు, స్త్రీయే దైవం అనేవాళ్ళు ఎందరు? అని ప్రశ్నిస్తుంది.
“నేనేనీ వీవే నే
నైనప్పుడొక చెలివి దైవమైనప్పుడు నా
ప్రాణేశ్వరుండవు సృ
ష్టే నీవైనన్ముదంబు శ్రీవరలక్ష్మి” (71) వరలక్ష్మి తో అభేదం భావించినప్పుడు ఆమె తానూ స్నేహితులట .. ఆమె తనకన్నా భిన్నమైన దైవం అని సంభావించినప్పుడు ఆ స్థానంలో తన భర్త ఉంటాడట , సృష్టి మొత్తం వరలక్ష్మే అయినప్పుడు మహా సంతోషమట .. లౌకిక పారలౌకిక పరమార్ధాలకు కవయిత్రి వారధి కట్టటం కనిపిస్తుంది ఈ పద్యంలో. “…. నువిదలకువిదను నుతించు టుత్తమమని నిన్నువిద(గ నమ్మి భజించెద” అని ( 71) తాను వరలక్ష్మిని పూజించటానికి స్త్రీ కావటం కారణమని ఒక తర్కం చెప్పటంలో ఆమె చమత్కారమే కాదు స్త్రీలు స్త్రీలగురించి ఆలోచించటం , పనిచేయటం అనే సామాజిక అవసరం తాలూకు తత్వం ఆమెలో ఎంతగా నాటుకుపోయిందో కూడా తెలుస్తుంది.
74 వ పద్యం నుండి ఈ శతకం లోని పద్యాలు పూర్తిగా లౌకిక విషయాలను , అందులోనూ స్త్రీల విషయాలను ప్రస్తావిస్తాయి. భక్తి శతకం సామాజిక సంస్కరణ దృక్పథ రచనగా తేలి కనిపిస్తుంది.
“ మాత నెఱింగిన గతిఁ దమ
తాతం దెలిసికొనవశమె తల్లి జనకుఁడం
చేతని ( జూపునో యాతని (
బ్రీ తిం గనవలయుగాక శ్రీ వరలక్ష్మీ “ (74) నవమాసాలు మోసి కంటుంది కనుక శిశువుకు తల్లి ఎవరో సహజంగా తెలుస్తుంది. తండ్రి అలా కాదు. తండ్రి అని తల్లి ఎవరిని చూపిస్తుందో అతనే తండ్రి. తల్లి సత్యం, తండ్రి విశ్వాసం అన్న వాడుక అక్కడి నుండే వచ్చింది. స్త్రీ దేవతా ప్రాధాన్యాన్ని, స్త్రీ ప్రాధాన్యాన్ని స్థాపించటానికి అక్కడ ప్రారంభించింది వెంకట రమణమ్మ. జనకుని కన్నా గురుత్వం జనని యందే అని శ్రుతులు చెప్తున్నాయి కనుక నీవు వినా వేరెవ్వరూ అధికులని నేను అనుకోలేను అని చెప్తుంది రమణమ్మ. వనితల మహత్యం చెప్పటానికి అనసూయ, సుమతి, సావిత్రి , ద్రౌపది మొదలైన స్త్రీలను తలచుకొంటే సరిపోతుంది అంటుంది.
డబ్బు సంపాదించటం తమవంతు అని పురుషులే విద్యనేర్చుకొని అబలలు అని స్త్రీలను ఇంటి పనులు చేసేవాళ్లుగా చేసారని ఆరోపించింది. (86) స్త్రీలతో స్నేహం మరిచి దాసులుగా చేశారని అంటుంది. దాసికి ఎంత మర్యాదో సతికి కూడా అంతే మర్యాద ఉందని చివరకు రాకాసిగా పేరు పెడతారు స్త్రీ చేసుకొన్నా పాపం ఏమిటి అని వరలక్ష్మీదేవిని ముందు పెట్టుకొని తన వేదన వ్యక్తం చేస్తుంది.
లోకంలో స్త్రీలు సాధారణంగా ఐదవతనాన్ని, సంతాన సౌఖ్యాన్ని , సిరిసంపదలను కోరి వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారు. కళ్ళేపల్లె వెంకటరమణమ్మ అటువంటి కోరికలు కోరలేదు. ఆమె కోరినవన్నీ స్త్రీని అసమానురాలిగా చూసి అవమానం చేసే సామాజిక రుగ్మతలకు పరిష్కారాన్ని. సుగుణవతియైన భార్యామణి కన్నా అధికతరమైనది ఏదీ లేదన్న స్థిరబుద్ధి మగవాళ్లకు ప్రసాదించమంటుంది. (89) ” చదువెప్పుడు కీడొనరిం /పదు మేలొన( గూర్చు(దమకు వలెనని పురుషుల్ /మదినమ్ము కొనఁగ వే ( జేసెదవేని సుఖింతుమమ్మ శ్రీవరలక్ష్మీ “ (91) స్త్రీల చదువువల్ల కీడు లేదని మగవాళ్లకు అర్ధం కావటం పై స్త్రీల అభివృద్ధి, సుఖం ఆధారపడి ఉన్నాయి కనుక ఆ పరిస్థి చక్కబడటం ముఖ్యం. వెంకటరమణమ్మ ప్రార్ధన సమిష్టి కోసం. స్త్రీలు విదుషీమణులైతే అది తమకు కూడా సౌఖ్యకరమని పురుషులకు అర్ధమయ్యేలా చేయమంటుంది.( 92)
స్త్రీలు కొమలులు, అబలలు కావచ్చు కానీ అందరూ ఏకమైతే సబలలు , సామాజికురాండ్రు అవుతారు. అనుకొన్నది సాధిస్తారు. చీమలను చూస్తే ఈ విషయం తెలుస్తుంది (93) అని చెప్తుంది. లోకాలను కనిపెంచే స్త్రీల వరకు వెళ్లకపోతే సంస్కరణలు సార్ధకం కావు (94) స్త్రీలను చులకనగా చూడటం తగదు (97) నారీమణులు గృహాలంకరములు కారు , మూల స్తంభాలు (98) మనుజుఁడొనరింప జాలని పనినైనా చేయగల స్త్రీలు అబలలు ఎట్లా అవుతారు? (99) ఇలాంటి ప్రశ్నలు , అభిప్రాయాలు శ్రీవరలక్ష్మీ శతకం పద్యాలలో కనబడతాయి.
డబ్బుకోసం చిన్నపిల్లలను వృద్ధులకు ఇచ్చి పెళ్లిచేసే అధమాధమవృత్తిని అడుగంటా ఛేదించగలిగితే అదే పదివేలు అని వరలక్ష్మికి విన్నపం చేసింది. ఆడపిల్లల వివాహ వయో పరిమితి పెంచటం గురించి ఆలోచిస్తే దేశాభ్యుదయం సమకూడుతుందని కోరింది. చేయవలసిన మార్పులు ఎన్నో ఉన్నాయి అన్నిటినీ పరిష్కరించి మా కష్టాలను తీర్చమని వరలక్ష్మిని వేడుకొన్నది. ఆ రకంగా పితృస్వామ్య అధికార విలువలకు కట్టుబడి తమ జీవితాలు గడపటానికి స్త్రీల కోసం రూపొందించబడిన వ్రతాన్ని, దైవభక్తిని స్త్రీల సమిష్టి సామాజిక ప్రయోజనాలకోసం కొత్తపద్ధతిలో ఉపయోగించుకొన్నది కళ్ళేపల్లె వెంకట రమణమ్మ.
--------------------------------------------------------------------------------
1990 వ దశకంలో షాజహానా నఖాబ్ కవితతో ముస్లిం స్త్రీలకు ప్రాతినిధ్యం వహించే కవితా స్వరం సవరించుకొంటూ సాహిత్య రంగంలోకి ప్రవేశించింది. అతికొద్దికాలంలోనే కథలు వ్రాయటం మొదలుపెట్టి ఇప్పుడు ‘మేరా జహా’ నవల తో తనను తాను ఆవిష్కరించుకొన్నది. తాను కేంద్రం. తన అనుభవాలు,జ్ఞాపకాల కథనం ప్రధానం. అందులో భాగంగా ఆమె పుట్టి పెరిగి, చదువుకొన్న ఖమ్మం జిల్లా పాల్వంచ , కొత్తగూడెం చుట్టుపక్కల ఊళ్ల భౌగోళిక వాతావరణం, ప్రకృతి పరిసరాలు, తన జాతి స్త్రీల కష్టసుఖాల కలనేత జీవితం శకలాలు శకలాలుగా కనబడతాయి. అందువల్ల ఇది షాజహానా ప్రపంచం. ఆమే దానికి వ్యాఖ్యాత. ఆ రకంగా ఇది ఆత్మ చారిత్రాత్మక నవల.
విస్తృతమైన తెలుగు సాహిత్య ప్రపంచంలో మన జీవితాలు ఎంతవరకు ప్రతిఫలించాయి? ఏ రకంగా నిర్వచించబడ్డాయి? అవి మన అనుభవానికి ఎంత దగ్గరగా ఉన్నాయి లేదా ఎంత దూరం అయినాయి అన్న విచికిత్స బహుళ అస్తిత్వాల గుర్తింపు చైతన్యం యొక్క ఫలితం. సమాజంలో రెండవ స్థాయి పౌరులుగా స్త్రీలు, వర్ణ వ్యవస్థలో అట్టడుగు స్థాయికి నెట్టబడిన దళితులు, అల్ప సంఖ్యాక వర్గాలుగా క్రెస్తవులు, ముస్లిములు ఈ క్రమంలోనే ఆ ఖాళీలను పూరించటానికి తెలిసి కలం పట్టిన కాలం 90వ దశకం. బాబ్రీ మసీదు కూల్చివేత , గుజరాత్ మారణకాండ ఘటనలు రగిలించిన కసి నుండి వచ్చిన కవిత్వం సరే.. వాటితో పాటు తీవ్రవాద దాడుల సందర్భాల నుండి నిత్య అనుమానాలకు, అసహనానికి గురి అవుతూ స్వదేశానికి పరాయివాళ్లుగా అవమానింపబడుతున్న దుఃఖాగ్ని నుండి వ్రాసిన కథల సంగతి సరే… ముస్లిం జీవితాన్నివిస్తృత కాన్వాస్ మీద ప్రదర్శించటానికి నవలను మించిన ప్రక్రియ లేదు కనుక ఆ దిశగా సృజన ఒక అవసరమై సలీం వెండి మేఘం , స్కై బాబా ఆపా , అన్వర్ జమీలాబాయి నవలలు వ్రాసారు. ఆ వరుసలో ముస్లిం మహిళల కౌటుంబిక సామాజిక జీవితాన్ని ఇతివృత్తంగా మలుస్తూ మేరా జహా నవల వ్రాసింది షాజహానా. ఆమె కన్నా ముందు 80 వదశకంలోనే కథలు మాత్రమే కాక మౌన పోరాటం వంటి నవలలు వ్రాసిన షహనాజ్ ఉన్నది. కానీ ఆమె కథలకు గానీ, నవలకు గానీ ముస్లిముల జీవితం వస్తువు కాలేదు. స్త్రీపురుష సంబంధాలలోని అధీన ఆధిపత్యాల నొప్పినే చిత్రించినా జీవితం మాత్రం హిందూ కుటుంబాలకు చెందింది. అందువల్ల తెలుగు నవలా సాహిత్య చరిత్రలో ముస్లిం స్త్రీల జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొన్న తొలి ముస్లిం మహిళా రచయిత్రిగా షాజహానా తన పేరును నమోదు చేసుకొన్నది.
నిజానికి నవల, స్వీయ చరిత్ర వేరువేరు ప్రక్రియలు. నవల కల్పన ప్రధానమైన సృజన రచన. స్వీయ చరిత్ర వ్యక్తి జీవితానికి సంబంధించిన ఘటనల కథనం. నవలలో కల్పన నేల విడిచిన సాము కాదు. రచయిత చూసిన జీవితం, మానవ ప్రవృత్తులు , రచయిత అవగాహనకు అందివచ్చిన సామాజిక చలన చైతన్యాలు కల్పనకు ప్రాతిపదికలు అవుతాయి. ఆ మేరకు నవలలో రచయిత జీవితం, జీవితానికి సంబంధించిన దృక్పథం భాగం అవుతాయి. ఆత్మచరిత్రాత్మక పరిమళాన్ని అద్దుతాయి.
స్వీయ చరిత్ర అంటే రచయిత పుట్టిన నాటి నుండి తన జీవితంలో సంభవించిన ఘటనలను వాటి పరిణామాలను గుర్తు చేసుకొంటూ నిర్దిష్ట లక్ష్యంతో చేసే కూర్పు. స్వీయ చరిత్రలో జీవితంలోని ఘటనల ఎంపికకు , ఎడిటింగ్ కు సంబంధించిన రచయిత వివేకానికి అనితర ప్రాధాన్యం ఉంటుంది. తనను , తన అనుభవాలను వస్తుగత దృష్టితో విమర్శనాత్మకంగా బేరీజు వేసుకోగలిగిన పరిణితి సాధించిన రచయిత వివేకం స్వీయచరిత్రలను సామాజిక చరిత్రలుగా చేస్తాయి. తన ఎదుగుదలకు సంబంధించినవి , తన వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రభావశీలమైన పాత్ర నిర్వహించినవి, చారిత్రక అనుభవంగా అందరికీ అంది రావలసినవి, లోకానికి మంచి చెడుల వివేకాన్ని ఇయ్యగలిగినవి, వ్రాస్తున్న కాలపు సమాజ జ్ఞాన విషయాలకు అవసరమైనవి ఒక పద్ధతిలో కూర్చబడటం అప్పుడే సాధ్యం అవుతుంది. తనను గురించే కాదు , తనకాలాన్ని గురించి , తన కాలపు సమాజాన్నిగురించి, ఆ సమాజంలోని మానవ సంబంధాల గతి క్రమాన్నిగురించి , సంస్కృతిని గురించి గతం నుండి అవి ఎలా భిన్నంగా పరిణమిస్తున్నాయో , వర్తమానంలోకి ఏ మార్పులతో కొనసాగి వస్తున్నాయో నిరూపిస్తూ అనుభవాలను , అభిప్రాయాలను గుది గుచ్చటంలో సృజనాత్మకత కీలకమైన పాత్ర వహిస్తుంది. సృజనాత్మకత వల్లనే స్వీయ చరిత్రలు వ్యక్తిగత అనుభవానికి చెందినవి అయినా పరమ ఆకర్షణీయంగా రూపొందుతాయి. అంటే స్వీయచరిత్ర రచనలో నవల కు ఉండే కాల్పనిక రమణీయత ఆ మేరకు భాగం అవుతుందన్న మాట.
నవలా ప్రక్రియలోని కాల్పనిక సృజన శీలతను, స్వీయ చరిత్ర ప్రక్రియలోని జీవిత ఘటనల వాస్తవికతను సమ్మేళనం చేసుకొంటూ షాజహానా చేసిన రచన ‘మేరా జహా’. ఒక నాటి రాత్రి తన ఇద్దరు స్నేహితురాళ్ళతో కలిసి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ లో కాకతీయ ఫాస్ట్ పాసెంజర్ ఎక్కిన సలీమా ఆ రాత్రంతా తన నలభై ఏళ్ల జీవితాన్ని తిరిగి జీవిస్తున్నట్లు స్నేహితులకు చెప్పుకుపోవటం ఈ నవల. అందువల్ల ఉత్తమపురుష కథనంగా కొనసాగుతుంది. సందర్భం సలీమా తన నవలకు వచ్చిన అంతర్జాతీయ బహుమతి అందుకొనటానికి హైదరాబాద్ వెళ్ళటం. ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో రైలు దిగేవరకూ గతం తాలూకు కథనం. కనుక అది ఉత్తమ పురుషలో సాగుతుంది. ఆ కథనంలోని విషయాలపట్ల ఆసక్తినో , కుతూహలాన్నో, సందేహాన్నో వ్యక్తంచేస్తూ స్నేహితులు అరుణ , లక్ష్మి వేసే ప్రశ్నలు , చేసే వ్యాఖ్యలు సలీమా కథన ప్రవాహ గతిని ఆపి భిన్న మార్గాలు పట్టిస్తుంటాయి. సలీమా ను వర్తమానానికి లాక్కొచ్చే ఆయా సందర్భాలలో కథనం ప్రధమ పురుషకు మారుతుంటుంది. ప్రధమ పురుష , ఉత్తమ పురుష కథనాల జమిలి నేతగా ఒక కథన శిల్పాన్ని షాజహానా నవలగా వ్రాయాలనుకొన్న స్వీయ చరిత్రకు అవసరమైన శిల్పంగా ఎంచుకున్నది. తెలతెలవారుతుండగా రైలు సికింద్రాబద్ స్టేషన్లో ఆగే ముందు సలీమా చెప్పిన ముక్తాయింపు మాటలలో ఆనాడు ప్లవ నామ సంవత్సర ఉగాది అన్న ప్రస్తావన వస్తుంది. అంటే నవలకు వర్తమానం 2021 ఏప్రిల్ 13.
మేరా జహా అంటే నా లోకం , నా ప్రపంచం అని అర్ధం. ఇందులో మూడు ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి రచయిత్రి వ్యక్తిగత ప్రపంచం. రెండు ఆమె సంబంధంలోకి వచ్చిన లేదా ఆమే తన పరిధిలోకి లాక్కొన్న సాటి ముస్లిం స్త్రీల ప్రపంచం. మూడవది సామాజిక ఉద్యమాల ప్రపంచం. వ్యక్తిగత ప్రపంచంలో ఆమె పుట్టిన పెరిగిన ఊళ్ళు, తన కుటుంబం , నాయనమ్మ , అమ్మమ్మల కుటుంబాలు, ఇరుగూ పొరుగూ , స్నేహితుల కుటంబాలు, తన సహచరుడు యూసఫ్ కుటుంబం ఉంటాయి. ఆయా కుటుంబాలలోని జనసందోహపు సంరంభం , వాళ్ళ మధ్య సంబంధ వైరుధ్యాలు, వాటన్నిటి నుండి రూపొందుతున్నకథకురాలి వ్యక్తిత్వం జాగ్రత్తగా అర్ధం చేసుకో వలసినవి. ప్రకృతితో సంబంధం , చెట్లు పెంచటం, వికసించిన పూలకు , కదిలే నీటి ప్రవాహాలకు పరవశించటం, పండ్ల మాధుర్యాలను , రకరకాల శాకాహార మాంసాహార వంటల రుచులను ఆస్వాదించటం, కాయకష్టం ఇష్టంగా చేయటం ఇవన్నీ అందులో భాగం.
రెండవ ప్రపంచం పూర్తిగా స్త్రీల ప్రపంచం.యూసఫ్ చెల్లెలి దగ్గర మొదలు పెట్టి అమ్మీ, ఆపా, దాదీ , మేనత్త పుప్పమ్మ, నానీ, పెద్దమ్మ బడెమ్మ, పిన్నమ్మ కాలమ్మ , మేనమామ భార్యలు, వాళ్ళ బిడ్డలు, కోడళ్ళు ఇలా అనేకమంది స్త్రీలు ప్రత్యక్షంగా ఆమె ప్రపంచాన్ని ఆవరించి ఉన్నారు. పుప్పమ్మ చెప్పే అనుభవ కథనాల వల్ల పరోక్షంగా మరింతమంది ముస్లిం స్త్రీల జీవితాలు ఆమెకు తెలిసి వచ్చాయి. ఈ అన్నీఆమె మెదడులో ప్రతిఫలించి చైతన్యంగా పదునెక్కే క్రమం సమాంతరంగా మనకు కనబడుతుంది. స్త్రీల జీవితాలు ఎందుకు ఎప్పుడూ ఇలా అధికారం కింద , అవమానాల కింద నలిగిపోతుంటాయి ? ఇది ఇలా ఎంతకాలం సాగుతుంది? ఎప్పటికయినా ఈ హింస నుండి వాళ్ళు బయటపడతారా? అన్న వేదన ఆమెను వెన్నాడుతూనే ఉంటుంది. అదే సమయంలో అన్ని ఒత్తిడుల మధ్య , తిరస్కారాల మధ్య, రాజీల మధ్య , ఓటముల మధ్య కూడా వాళ్ళు కూడగట్టుకొనే సహనం, కుటుంబం కోసం చేసే విరామం ఎరుగని శరీర కష్టం, త్యాగం, ఆమెను అబ్బుర పరుస్తుంటాయి. జీతా జాగ్ తా ముస్లిం మహిళలుగా వాళ్ళ పట్ల గౌరవాన్ని , ఆరాధనను కనబరుస్తుంది. నిజానికి షాజహానా బాల్యం అనేక హిందూ కుటుంబాల మధ్య, హిందూ స్నేహాల మధ్య గడిచింది. అందువల్ల హిందూ స్త్రీల జీవితం కన్నా ముస్లిం స్త్రీల జీవితంలోని అదనపు లేదా ప్రత్యేక సమస్యలు ఏమిటో , అందుకు మూలాలు ఏమిటో నిగ్గుతేల్చటానికి, నిర్ధారించటానికి ఉన్న అవకాశం మీదకు తను దృష్టి సారిస్తే బాగుండేది.
ఇక ఆమె మూడవ ప్రపంచంలో వ్యక్తిగత సామాజిక తిరుగుబాట్లు. ఉద్యమాలు ఉన్నాయి. కుటుంబాలలో బలీయమైన పితృస్వామిక మత సంప్రదాయాల కారణంగానో , ఆర్ధిక కారణాలవల్లనో తన ఈడు పిల్లలు, ప్రత్యేకించి ఆడపిల్లలు చదువులకు దూరం చేయబడటం ,సెంటర్లలో కుట్టు అల్లికలకు వాళ్ళ జీవితం కుదించబడటం, చిన్నతనానే పెళ్లిళ్లు చేసి పంపటం - ఇవన్నీ చూస్తుండటం వల్ల తన చదువు గురించి లోలోపల ఏర్పడ్డ సందేహాల వల్ల కావచ్చు, దానికి తోడైన యవ్వనోద్రేకాల ఆవేశాల ఆదర్శాల పరిపూర్తి తొందరల వల్ల కావచ్చు తాను ఎంచుకొన్న యువకుడితో పెళ్ళికి స్వతంత్రించటం ఆ తిరుగుబాట్లలో భాగంగానే చూడాలి.
ఇక ఆమె సామాజిక ఉద్యమాలకు చేరువ అయింది యూసఫ్ సాహచర్యంలోనే. అవి ప్రధానంగా ముస్లిం అస్తిత్వానికి సంబంధించినవి , తెలంగాణా ప్రాంతీయ అస్తిత్వానికి సంబంధించినవి. వాటిలో తన భాగస్వామ్యం గురించి కొంత ప్రస్తావించింది. అయితే ముస్లిం అస్తిత్వ రాజకీయాల మీద ఫోకస్ మరింత నిశితంగా ఉండాలని, ఉంటుందని . షాజహానా రచన అనగానే ఎవరైనా ఆశించటం సహజం . నేనూ అందుకు మినహాయింపు కాదు.
స్త్రీవాదం నుండి ముస్లిం స్త్రీవాదాన్ని వేరు చేసి నిలబెట్టటంలో కీలకమైన పాత్ర తనది. దానికి సంబంధించి తాను గుర్తించిన వైరుధ్యాలు, పడిన సంఘర్షణ ఇతివృత్తంలో భాగం అయితే బాగుండేది. అట్లాగే సమకాలపు దళిత బహుజన ఉద్యమాల ప్రస్తావన, ముస్లింలు వాటితో కలిపి నిర్మించవలసిన విశాల ప్రజా ఉద్యమాల గురించి సూచన ఉన్నది కానీ ఎందుకో ఎలాగో దాని వైపు దృష్టి సారించలేదు. అట్లాగే తీవ్రవాదం పేరుతో ముస్లిముల పట్ల పెరుగుతన్న అసహనం గురించి మంచి కవిత్వం వ్రాసిన షాజహానా జీవితంలోనూ , నవలలోనూ కూడా దానిపట్ల తన కోణం ఏదో ఇతివృత్తంలో భాగమై ఉండాలనుకొంటాం. బాబ్రీ మసీదు విధ్వంసం నుండి నిన్న మొన్నటి పౌర సత్వ సవరణ చట్టం వరకు భారతదేశ మత రాజకీయ చరిత్రను ముస్లిం మహిళా కోణం నుండి వ్యాఖానించగల ఆవేదనా శీలి, ఆవేశ శక్తి అయిన షాజహానా అందుకోసం మరొక నవలను రచిస్తున్నదేమో తెలియదు.
ఈ రచనలో షాజహానా ఇళ్ల గురించి మాట్లాడుతుంది. ఆమె దృష్టిలో ఇళ్ళు అంటే ఆడంబరంగా కట్టుకొని అట్టహాసంగా గృహప్రవేశాలు చేసుకొనే ఇళ్ళు కావు. అవి నాలుగు గోడల ఇళ్లా గుడిసెలా మేడలా మిద్దలా అన్నది కాదు ప్రశ్న . ఇల్లు అంటే మానవ సంబంధాల నిర్మాణ కేంద్రాలు. ఆ నిర్మాణంలో ఆడవాళ్ళ పాత్ర, త్యాగం ముఖ్యమైనవి. ఇంతాచేసి ఆ ఇంట్లో మౌనంగా జీవిస్తూ ఉండేవాళ్ళు, జీవితమే కోల్పోయినవాళ్లు , తనకంటూ చోటులేనివాళ్ళు, పరాయీ కరింపబడిన వాళ్ళు, తనకంటూ ఒక ఇంటికోసం ఆర్తిపడిపడీ ఊపిరే విడిచినవాళ్లు ఇలా ఎంతోమంది స్త్రీలు ఆమెకు ఇల్లంటే గుర్తుకువస్తారు. అందుకనే తనలోపల ఎన్నో ఇళ్ళుఒకదానిపై ఒకటి అంటుంది షాజహానా. ఇది చదువుతుంటే నాకు కవన శర్మ వ్రాసిన ‘ఆమె ఇల్లు’ కథ పదేపదే గుర్తుకువచ్చింది.
నిజానికి ఇల్లు అంటే ఇటుకలు కాదు, సిమెంటు కాదు. తమ శ్రమతో , చాకిరీతో, త్యాగంతో నిర్మించి నిర్వహించుకువచ్చే మానవ సంబంధాల నిర్మాణం. కానీ స్త్రీలు ఎప్పుడూ తాము సృష్టించి నిర్మించిన దానిపట్ల ఏ హక్కులూ లేని పరాయివాళ్లే.అదే షాజహానా దిగులు. నిర్మించేవాళ్లకు మిగిలేదేమీ లేదే అన్న వేదన. స్త్రీల సృజన శక్తులచేత అందగించబడ్డాయి కనుక ఇళ్లంటే షాజహానాకు ఇష్టం . కానీ స్త్రీలను ప్రేమరాహిత్యంలోకి నెట్టేది కూడా ఆ నాలుగు గోడల ఇంటిని శాశించే కుటుంబ నియమాలు , నియంత్రణలే కనుక ఇళ్లంటే షాజహానా కు భయం కూడా. దాని నుండి విముక్తి కావాలి . స్నేహం , స్వేఛ్చ , ప్రేమ అనే మూడు అంశాలగురించిన రచయిత్రి నిరంతర చింతన ఒకటి ఈ ఈ రచన మొత్తంలో అంతః సూత్రంగా కొనసాగివస్తుంటుంది. ఈ మూడు విలువలు మనుషులందరూ సాధించే క్రమంలో ఇళ్ళు ప్రజాస్వామికీకరించబడతాయి అన్నది షాజహానా ఆశ. ఆశ వాస్తవీకరించబడాలంటే నిర్దుష్టమైన ఆచరణ దిశగా గమనం ఉండాలి.
షాజహానా బాల్యాన్ని వర్ణించినంత విస్తృతంగా కాలేజీ చదువుల కాలాన్ని వర్ణించలేదు. నిజానికి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే సామాజిక సంబంధాల సంయోజనకు అనువైన కాలం అది. ఆశయాల ఆదర్శాల స్థిరీకరణ, క్రియాశీల చైతన్యం పరిఢవిల్లే డిగ్రీ, పిజి , పరిశోధన అధ్యయనాల కాలం నాటి సంబంధాలు, సంఘర్షణల చిత్రణకు సమ ప్రాధాన్యత ఇచ్చి ఉంటే నవలగా ఇది సమగ్రం అయ్యేది. అయినా ఇలా మైనారిటీ ప్రజాసమూహాలనుండి, వాళ్ళలోనూ రెండవస్థాయి పౌరులుగా చూడబడే మహిళల నుండి వచ్చే ఇలాంటి రచనలను స్థిరపడిన ప్రక్రియల మూసతో తూచకూడదేమో..!?
ఏమైనా సాహసి షాజహానా నవలా రంగంలోకి ఒక అడుగువేసింది. అందుకు ఆమెను మరొకసారి మనసారా అభినందిస్తూ ఇక్కడ నుండి తాను వ్రాయవలసిన నవలలు మరిన్ని ఉన్నాయని గుర్తు చేయటం పెద్దరికంతో కాదు. ఈ నాటి యువతపై ఉన్న నమ్మకంతో. మనం చేయలేని పనులన్నీపిల్లలు చేయాలని ఆశపడే తల్లి తత్వంతో ..
షాజహానా ప్రపంచంలోకి మీరు కూడా ప్రవహించండి మరి ..
పశ్యంతి
27- 8- 2021
కళ్ళ ముందు జరిగిన సంఘటనలను చిత్రించిన “వక్ర గీత”
డాక్టర్ వి ఆర్ రాసాని (డా.రాసాని వెంకట్రామయ్య) తమ ఊరిలో చుట్టుపక్కల పల్లెలలో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని కథలు, నవలలు రాయడంలో స్రష్ట. అలా అని వార్తలలాగా రాయరు. కథ, నవలా, శిల్పం, వర్ణనలు, స్థానిక మాండలిక సంభాషణలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా అణగారిన వర్గాల దీన బాధామయ గాథలను వస్తువుగా ఎంపిక చేసుకుంటారు.
ఈ 'వక్ర గీత' నవల ఆయన చెప్పుకున్నట్లు గానే చిత్తూరు జిల్లాలోని పల్లెలలో జరిగిన ముగ్గురు అమ్మాయిల బాధామయ గాథ.