సాహిత్య వ్యాసాలు

(March,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

పరిమితులు లేని ప్రేమనే నిజమైన  ప్రేమ

కె.ఎన్. మల్లీశ్వరి గారు రాసిన నీల నవల 2017లో తానా 40 వ వార్షికోత్సవం సందర్భంగా బహుమతి పొందిన నవల ఇది.

సముద్రము ఎందుకు వెనక్కి   వెళుతుందో తెలుసా నీల గారు అనే వాక్యంతో ప్రారంభించిన ఈ నవలనే ఒక పెద్ద సముద్రం. అనేక జీవన కెరటాలను మనం ముందుకు ప్రవహింప చేస్తుంది. తెలుగు నవలా ప్రక్రియలో ఈ నీల నవల ఒక కొత్త మలుపు మనకి చూపించింది. ఇది ఒక కాలక్రమ నవల.  ఒక స్త్రీ  జీవన గమనంలో ఆర్థిక, సాంఘిక సాంకేతిక మార్పులను మనముందు ఉంచడమే కాకుండా, మూడవ వ్యక్తి ప్రమేయం లేని ప్రేమ కోసం వెతికే క్రమంలో ఆ స్త్రీ మనస్సు ఎదురుకున్న సంఘర్షణ ఈ నీలలో మనం చూడొచ్చు.

ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ, పెరిగిన అభివృద్ధి, వ్యక్తుల జీవితాల్లో ఏ విధమైన మార్పు తీసుకువచ్చింది అన్నది కూడా గమనించవచ్చు.

నీల జీవితమంతా పోరాటం గానే సాగింది.అది సామాజిక పోరాటంగా మానసిక పోరాటంగా రెండు కోణాలలో జీవన గమనాన్ని మనం చూడవచ్చు. ఏ ప్రశ్నతో అయితే ఈ నవల ప్రారంభమైంది  అదే ప్రశ్నతో ముగింపు ఇవ్వడం రచయిత్రి చేయితిరిగిన తనానికి ప్రతీకగాచూడవచ్చు. సముద్రమంత స్వేచ్ఛ ఉన్నా కూడా సముద్రం ఎందుకు వెనక్కి వెళ్తుందో, ఎంత కలిసినట్టు ఉన్నా కెరటాలు తీరాన్ని  చేరవు అని దీనిని బట్టి అర్ధమవుతుంది.  జీవితాలు కొన్ని హద్దులలో తప్పనిసరిగా ఉండాలని ఈ నవల ఉద్దేశం కావచ్చు అనిపిస్తుంది కొన్నిసార్లు.

పుస్తకాలు మీకు శాంతి ని ఇస్తాయో లేదో కానీ ఖచ్చితంగా మీ అశాంతిని మాత్రం రివీల్ చేస్తాయి అనే  పరదేశి మాటలు ప్రతి స్త్రీ యొక్క మనసుకు ప్రతి రూపంగా  భావించవచ్చు.

స్త్రీలు వారి భావాలను  ధైర్యంగా వ్యక్తీకరించే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని పరిమితులు వారిని ఆపుతుంటాయి.

సామాజిక అంశాలు పురుషాధిక్య సమాజంలో వాళ్ళు ఎదుర్కునే ఆచారవ్యవహారాల పరిస్థితులు అన్నిటికంటేముఖ్యంగా ప్రకృతి అందించిన ప్రకృతిపరమైన సమస్యలు శరీర నిర్మాణము ఇవన్నీ కూడా స్త్రీలకు ఒక హద్దుని ఏర్పరుస్తాయి.. పురుషులతో పోల్చుకున్నప్పుడు స్త్రీలకు సోషల్ అవుట్లుక్ అనేది చాలా తక్కువ.  అందుకే చాలా మంది స్త్రీలు  టీవీ  సీరియల్స్ చూడడమో, ఎక్కువగా షాపింగ్ చేయడమో, పూజలలో మునిగిపోవడమో  చేస్తారు. కొంచెం చదువుకున్నవారు సాహిత్యం పట్ల అభిరుచి ఉన్నవాళ్లు ఆమె అశాంతిని చూపించే అక్షరాలను లేదా ప్రేమను పంచుతారు.
తల్లి అనుభవించిన  ప్రేమ తాలూకు ఫలితాలు చూశాక  నీల జీవితం అంత కూడా మూడవ వ్యక్తి ప్రమేయం లేని ప్రేమ,  వ్యక్తిగత  స్వేచ్ఛ, ఈ రెండింటికి ఉన్న పరిమితులు, ఈ మూడింటి చుట్టే తిరిగింది.  తనకు సంబంధం లేకుండానే ప్రసాద్ తో జరిగిన వివాహము, అతని నుండి ప్రేమను  పొందుతున్నా కూడా మరో స్త్రీతో అతని ప్రేమ ను పంచుకోవడం, అలాంటి జీవితానికి అంగీకారం లేకపోవడమే ఇలా  నీల వ్యక్తిత్వము ప్రతిచోట  సంఘర్షణ కు లోనయ్యింది. ఒక శాశ్వతమైన తనకే సొంత మైన ప్రేమ కోసమే అల్లాడింది నీల మనస్సు. ఆ ప్రేమ స్వేచ్ఛ కూడా ఇవ్వాలని కోరుకుంది.

బాల్యం  నుంచి చూసిన సంఘటనలను బట్టి మూడో వ్యక్తి ప్రమేయం లేని శాశ్వతమైన  సొంత మైన ప్రేమ కోసమే జీవితాంతం అల్లాడింది నీల. ఆ ప్రేమతో పాటు తనకి కావాల్సిన స్వేచ్ఛ కూడా ఇవ్వాలని కోరుతుంది. చివరికి వచ్చేసరికి పరిమితులు లేని ప్రేమనే నిజమైన  ప్రేమ  అనే భావాన్ని నీల రచయిత్రి గారు వెలిబుచ్చారు.


ఈ సంచికలో...                     

Jan 2021

ఇతర పత్రికలు