(March,2020)
గౌరవ సంపాదకులు : ప్రొ. కాత్యాయనీ విద్మహే
సంపాదకులు : వంగాల సంపత్ రెడ్డి
సంపాదక వర్గం : దాసరి మల్లయ్య
ఉప్పులేటి సదయ్య
న్యాయ సలహాదారులు : ఈదుల మల్లయ్య
దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ రైతక్కల కృషి
పొయ్యివెలగని రోజుల్లో బుక్కెడు బువ్వ దొరకని కాలంలో కాళ్ల కింది మట్టినే బుక్కి మెలిపెడుతున్న పేగుల బాధ తీర్చిన ఆకలి పోరాటం వారిది.
రాళ్లురప్పలతో నిండిన బీళ్లలో అడవిని సృష్టించిన గొప్పదనం వారిది.
ప్రకృతితో మమేకమై, మరచిపోయిన పాత పంటలకి పునరుజ్జివనం ఇచ్చే వ్యవసాయం వారిది.
కాసుల కోసం కాదు, కడుపు ఆకలి తీర్చుకోవడం కోసమే వారి ఆరాటం.
సొమ్ముకోసం చేసే మాయాజాలం నుండి భూతల్లిని కాపాడుకోవడం, తమ చుట్టూ ఉన్న జీవావరణాన్ని సజీవంగా ఉంచుకోవడం కోసం ఎంత శ్రమైనా చేయడం వారి నైజం.
వారు నమ్మిన దాన్ని నలుగురికి పంచడం వారికి అలవాటు. ఆయితే, ప్రకృతికి, ప్రకృతి న్యాయానికి విరుద్ధంగా వెళ్ళరు.
జీవితాల్ని నిలుపుకునే ఆహారపంటలు, జీవావరణం కాపాడుకోవడమే ప్రథమ లక్ష్యం.
పనికిరాని భూముల్ని సాగులోకి తెచ్చి, రసాయనాల జోలికి వెళ్లకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తూ బతుకులో వెలుగులుపూలు పూయించడం వారి విజయం
అట్లాగని టెక్నాలజీ వాడరని కాదు. అధునాతన టెక్నాలజీ అంది పుచ్చుకుంటూనే ప్రకృతితో మమేకమవ్వడం వారికే సొంతం.
పాత కొత్త విధానాల మేలుకలయికతో ప్రపంచమంతా తమ గొంతు వినిపించడం ఆ భూమిపుత్రికలకే సాధ్యం.
అవును, అది కల కాదు నిజం.
అసాధ్యంగా కనిపించేదాన్ని సుసాధ్యం చేసిన వాళ్లెవరో కాదు, అతిసామాన్యంగా కనిపించే అసాధారణ మహిళలు.
అందరూ అసుంట .. ఇసుంట అంటూ చెరబెట్టిన వాళ్ళతోనే భేష్ అనిపించుకున్న ధీరలు.
అతిపేదరికంలోంచి నిలువెత్తు వృక్షాల్లా ఆకాశానికి ఎదిగిన దళిత రైతక్కలు.
వీళ్ళకి చిన్నా చితకా అవార్డు కాదు అంతర్జాతీయ అవార్డు ప్రకటించారు . ఆ ప్రకటన చేసింది ఊరూ పేరూ లేని వాళ్ళు కాదు, ఐక్యరాజ్యసమితి.
ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన బహుమతిగా భావించే నోబెల్ కు సమానంగా చూసే మహోన్నతమైన ఈక్వేటర్ పురస్కారాన్ని అందుకున్న పర్యావరణవేత్తలు ఆ మహిళలు.
ఆ మహిళల గురించి మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా స్ఫూర్తి నింపుకోవాలని వాళ్ళనిక్కడ పరిచయం చేస్తున్నాను.
2019 కి గాను దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డిడిఎస్ )కి ఈక్వేటర్ పురస్కారాన్ని ప్రకటించింది. రెండేళ్ళకొకసారి ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ UNDP ఈక్వేటర్ పురస్కారం ప్రపంచ దేశాల్లోని సంస్థలను ఎంపికచేసి పురస్కారం అందిస్తుంది. 127 దేశాలనుండి వచ్చిన 847 దరఖాస్తులనుండి కేవలం 22 సంస్థలను ఈ పురస్కారానికి ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసింది. అందులో ఒకటి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. ఈ ఏడాది మనదేశంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఒక్కటే ఈ పురస్కారానికి ఎంపికైంది. గతంలో తొమ్మిది సంస్థలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది.
స్థానిక వనరులతో ప్రకృతి సిద్దమైన పరిష్కారాలతో పర్యావరణాన్ని కాపాడుతూ, వారి ఆరోగ్యాన్నే కాక భూమి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ అభివృద్ధి సాధించడంలో అసాధారణ ఉదాహరణగా నిలిచినందుకు చేసిన కృషికి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళలకు ఈక్వేటర్ పురస్కారం అందజేస్తున్నామని జూన్ 5, 2019 న ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
'మేము డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సాధించిన ఘనకార్యాలు వ్యక్తిగతంగా అభినందించాలి . మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం. మీ ప్రయాణ ఖర్చులు , వసతి ఏర్పాట్ల బాధ్యత ఈక్వెటర్ ఇనిషియేటివ్ తీసుకుంటుందని ' అని ఐరాస బాధ్యులు స్పష్టంగా చెప్పారు.
ఈ క్రమంలో న్యూయార్క్ నుండి ఇద్దరు సభ్యుల బృందం డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కి వచ్చి 15 రోజులుండి ఇక్కడి గ్రామాలలో చేస్తున్న కార్యక్రమాలను సూక్ష్మ స్థాయిలో పరిశీలించి అంతా వీడియో చిత్రీకరించుకొని వెళ్ళింది. మూడున్నర దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణ, చిరుధాన్యాల సాగు, సేంద్రియ సేద్యం, మొక్కలు నాటడం వంటి వివిధ రంగాలలో ఈ మహిళలు చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చిందని సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు.
మూడుతరాల ప్రతినిధులైన అనసూయమ్మ, మొగులమ్మ, మయూరి లతో కూడిన ముగ్గురు సభ్యులను డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అవార్డు అందుకోవడానికి అమెరికా వెళ్లేందుకు ఎంపిక చేసింది. అవార్డు అందుకోవడానికి వెళ్లడం కోసం కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నప్పటికీ వీసా తిరస్కరణకు గురవ్వడంతో కొంత నిరాశ చెందారు. కానీ .. చివరికి సాధించారు. వారితో పాటు డిడిఎస్ కో డైరెక్టర్ చెరుకూరి జయశ్రీ వెళ్లారు.
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP ) వారి ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లి సెప్టెంబర్ 24 వ తేదీన న్యూయార్క్ లోని టౌన్ హాల్ లో జరిగే ప్రధానమైన కార్యక్రమంలో పాల్గొని పదివేల డాలర్ల బహుమతిని (దాదాపు ఏడు లక్షలు ) స్వీకరించారు డిడిఎస్ రైతక్కలు.
అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనడంతో పాటు 2019 ,సెప్టెంబర్ 19 నుండి 26 వరకూ న్యూయార్క్ లో జరగిన కమ్యూనిటీ వర్క్ షాప్స్ , చర్చా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
చిక్కపల్లి అనసూయమ్మ (50)
మూడున్నర దశాబ్దాల పర్యావరణ పరిరక్షణ, చిరుధాన్యాల సాగు, సేంద్రియ సేద్యం, మొక్కలు నాటడం అడవుల పెంపకంలో ద్వారా పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా, ముంచుకొస్తున్న ముప్పునుంచి బయటపడడం మొక్కలను నాటడం , చెట్లను పెంచడం ద్వారానే సాధ్యమవుతుందని ప్రపంచ వేదికపై చెప్పిందామె . తన తోటి మహిళలతో కలసి 1200 ఎకరాల పోరంబోకు భూముల్లో ఇరవై లక్షల చెట్లు నాటింది. అడవిని పెంచింది. ఇప్పుడు అది ఎంతో మంచి ఫలితాలను ఇస్తున్నదని ఆనందంగా తన అనుభవాలు ప్రపంచ వేదికపై పంచుకున్నది అనసూయమ్మ .
తొమ్మిదేళ్లకే పెళ్లయింది. భర్త సరిగ్గా చూడకపోవడంతో 14 ఏళ్లకే పుట్టింటికి చేరింది. కూలికి వెళ్ళేది. ఒకప్పుడు కడుపు నింపుకోవడం కోసం డిడిఎస్ సభ్యురాలిగా చేరింది. మొక్కల పెంపకంపై తీసుకున్న శిక్షణ ఆమె జీవిత గతినే మార్చేసింది. కొండప్రాంతాల్లోను జహీరాబాద్ ప్రాంతంలో గుబ్బడి అంటారు. ఆ గుబ్బడిల్లో మొక్కలు పెంచింది కాబట్టి జనం ఆమెను గుబ్బాడి అనసూయమ్మ అంటారు. ఇప్పుడామె నాటిన మొక్కలు వృక్షాలై మహా వృక్షాలై మనకగుపిస్తాయి.
"రేపు బయలుదేరతామనే వరకూ మేం పోతామో తెలియని పరిస్థితి . 18 వతేది మా ప్రయాణానికి ఏర్పాట్లయ్యాయి. 17 వ తేదీ మాకు వీసా మంజూరీ అయింది. గంటలకొద్దీ ప్రయాణం చేసి అమెరికా చేరాం. 22 సంస్థల నుంచి వచ్చిన వారిని కలిశాం. అందరినీ పరిచయం చేసుకున్నాం .
150 అంతస్థుల భవనంలో 46 అంతస్తులో మాకిచ్చిన బస. మూడునాలుగు కిలోమీటర్లు నడిచి మీటింగ్ దగ్గరకు వెళ్ళాం. అక్కడ మా అనుభవాలు పంచుకున్నాం. నాలుగు రోజులు మీటింగుల్లోనే ఉన్నాం . ఎప్పుడూ ఊహించని అవకాశం వచ్చినందుకు చాలా ఆనందం కలిగింది " అని తన ప్రయాణం గురించి చెప్పింది అనసూయమ్మ.
మొగులమ్మ (35)
అత్తాకోడళ్ల సంఘం ,భారతీయ చిరుధాన్యాల చెల్లెళ్ల సమాఖ్య అధ్యక్షురాలు మిల్లెట్స్ సిస్టర్స్ నెట్ వర్క్ లో కీలక పాత్ర పోషిస్తున్నది పొట్లపల్లి మొగులమ్మ. కేంద్రప్రభుత్వం వారి నారిశక్తి పురస్కారం రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ చేతులమీదుగా అందుకున్నది మొగులమ్మ. భారతదేశ చిరుధాన్యాల చెల్లెళ్ల సమాఖ్యలో 5000 మంది సభ్యులున్నారు. ,సేంద్రియ వ్యవసాయం, భూసారాన్ని పెంచడం, చిరుధాన్యాల సాగు, కలిపి పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలను అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించింది. సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాలతోనే దేశ భవిష్యత్ ఉన్నదని అందరూ గుర్తించాలని కోరింది.
మనదేశంలో అధికంగా వాడుతున్న పురుగుమందులు, రసాయన ఎరువుల వల్ల ఎదురవుతున్న అనర్ధాలు , మానవ మనుగడకు ముంచుకొస్తున్న ముప్పును వివరించింది.
అంతర్జాతీయ ఆహార భద్రత కమిటీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం చిరుధాన్య హక్కులు మహిళలకే చెందుతాయని మేము గట్టిగా నమ్ముతున్నామని అంటున్నది మొగులమ్మ.
అందరం ఐకత్యంతో ఉండి ఐకమత్యపు పంటలు మనం పండిస్తున్నం. అట్లనే అందరు పండించాలని కోరుకుంటున్నది మొగులమ్మ.
మయూరి (18)
మూడవ తరం ప్రతినిధి. మయూరి 18 ఏళ్ళ పస్తాపూర్ గ్రామస్తురాలు. మొదటిసంవత్సరం కమ్యూనికేషన్స్ డిగ్రీ విద్యార్థిని.
జీవవైవిధ్యంపై డాక్యూమెంటరీలు రూపొందిస్తుంది మయూరి. ఆసియాలో బయోడైవర్సిటీ ఫిలిం మేకర్ అవార్డు అందుకున్న పిన్న వయస్కురాలు మయూరి.
ప్రపంచంలోనే ఒక గొప్ప అవార్డు అందుకునే అసాధారణ అవకాశం నాకు వచ్చింది.
అక్కడ కూడా జరిగిన సమావేశాలను వీడియో డాక్యుమెంట్ చేశాను.
వాళ్ళ చేతిలో బంజరు నేలలు పంట భూములుగా మారిపోయాయి. ఎందుకూ పనికిరాని రాతినేలలు, గులకరాతి భూములు చేలుగా , చెలకలుగా, చిట్టడువులుగా, అడవులుగా దర్శనమిస్తాయి. వారి సంకల్ప బలం, శ్రమ శక్తి ఇచ్చిన ఫలాలు అవి.
బుక్కెడు బువ్వ కోసం, గుక్కెడు నీళ్లకోసం తన్లాడిన బతుకులు, చేయి చాచి చుట్టూ చూసిన బతుకులు ఇప్పుడు చెయ్యి చాచవు. చివరికి విత్తనాలు, ఎరువులు, కరెంట్, బోర్లు , మోటార్లు, నీళ్లు, మార్కెటింగ్ ఇలా వేటికీ బయటినుండి వచ్చే సహాయం కోసం ఎదురు చూడరు వీళ్ళు. ప్రభుత్వం నుండి ఏ పథకం వస్తుంది.. ఏమి సాయం వస్తుందని మోరలెత్తుకోని ఎదురుచూసే పరిస్థితే వీళ్లకు లేదు.
తామెవ్వరి ఆధీనంలో ఉండమని తమ స్వాధీనంలోనే ఉంటామని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు ఈ రైతక్కలు . తమకు కావలసిన ఆరోగ్యకరమైన తిండి, మందులు, ఎరువులు, పురుగుమందులు, మార్కెటింగ్ అంతా వారిచేతుల్లోనే ఉంది.
అంతేనా .. తమ పనిని, తమ పంటలని, తమతిండిని, తమ ఆరోగ్యాన్ని, తమ ఆచార వ్యవహారాలని, భాషా సంస్కృతుల్ని ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ చేస్తుంటారు వీళ్ళు. అందు వాళ్ళు వాడుకునే సాధనాలు రెండు. ఒకటి రేడియో. రెండోది వీడియో.
అక్షరం ముక్కరాకపోయినా అద్భుతంగా వీడియో డాక్యూమెంటరీలు చేస్తారు వీళ్ళు . డాక్యూమెంటరీ చేయడమొక్కటేనా .. ఆ డాక్యుమెంటరీ చేయడమెలాగో శిక్షణ ఇస్తారు. ఇక్కడి వాళ్ళకే కాదు బంగ్లాదేశ్ , పెరూ వంటి దేశాంతర వాసులకు కూడా శిక్షణ ఇచ్చి వచ్చారు.
అమాయక గ్రామీణ మహిల్లా కనిపించే వీళ్ళని కదిలిస్తే వినిపించే విజ్ఞానం అనంతం. కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోని పార్లమెంట్ హౌస్ లో కూడా తమగొంతు వినిపించే అవకాశం వారికి వచ్చింది.
ఆ మహిళల్ని కదిపితే ఒక్కొక్కరూ వాళ్ళు తిరిగిన దేశాల లిస్టు ఇరవయ్యో .. పాతికో ఉంటాయి . ఈ ముగ్గురే కాదు ఇలా చంద్రమ్మ, లక్ష్మమ్మ, అంజమ్మ, చిన్ననర్సమ్మ, పూలమ్మ, జనరల్ నర్సమ్మ, అల్గోల్ నర్సమ్మ, కమలమ్మ, మంజుల, నాగమ్మ, స్వరూపమ్మ .. ఇలా ఎందరో ...
వాళ్ళు చూసిన ప్రపంచం, అదిచ్చిన జ్ఞానం ముందు నేను మనం పుస్తకాల్లో చదువుకున్న జ్ఞానం చాలా చిన్నది ..
మీరెప్పుడైనా జహీరాబాద్ వైపు వెళితే దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ కి వెళ్లి అక్కడి రైతక్కల కృషిని చూడడం మరవకండి.
Oct 2023
కవిత్వం
కథలు
వ్యాసాలు
ఇంటర్వ్యూలు