సాహిత్య వ్యాసాలు

(April,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

తెలంగాణ భాషాకవిత్వ జెండా

తెలంగాణ భాషల కవిత్వం రాసిన మొదటి తరం కవి డా. దేవరాజు మహారాజు. 1969లనే “బతుకు కొస” పేరుతోని ఆయన రాసి, చదివిన కవిత బొమ్బాట్గ ప్రచారమైంది. 1970ల బి. విద్యాసాగర్ సంపాదకత్వంల వచ్చిన “కొత్త గళాలు” సంకలనంల అచ్చైంది ఈ కవిత.1971 ల “ఉగాదుర్కొచ్చింది” కవిత “జ్యోత్స్న” పత్రికల అచ్చైంది. 1972 ల జీవనాడి పత్రికల “లొట పెట” కవిత అచ్చైంది. 1974 జనవరిల “గుడిసె గుండె” పేరుతోని కవితల పుస్తకం వచ్చింది. ఈ నడుమ ఇదే పుస్తకం 2015ల రెండో సారి అచ్చుగ వచ్చింది.

ఈ కవితా సంపుటి నిండా తెలంగాణ ప్రజల భాష గుండె మీద జెండా లెక్క రెపరెపలాడుతది.దీంట్ల ఆయన రాసిన పద్దెనిమిది కవితలు చదువుతే మనసు నిండ ముచ్చట పెట్టినట్టుంటది. మన ఊరికి పోయి మనోల్లతోని గడిపినట్టుంటది. తెలంగాణ ముచ్చటకున్న తీపి, నెనరు, పదును, శక్తి తెలిసి వస్తది. దీన్ని చదివిన శ్రీ శ్రీ అంతటి వాడు “you are fulfilling the expectations of down trodden people” అన్నడు. ఆరుద్ర “ప్రామిసింగ్ పోయెట్” అని కితాబిచ్చిండు. సంపుటి మొత్తం భావం శిల్పం ప్రబలంగా అల్లుకున్న కవిత్వానికి ప్రతీక అని చెప్పిండు డా. సినారె.“గుడిసె గుండె” అనే ఈ పేరును శివారెడ్డి సారు ఖాయం జేసిండు.

ఈ సంపుటిల సామాజిక వాస్తవికత ప్రధానంగ కనిపిస్తది. అరవై డెబ్బై దశకాలల్ల దేశం పరిస్థితి ఎట్లున్నది అనేది చూడచ్చు. నాటి రాజకీయ నాయకుల భాగోతాన్ని చూడచ్చు. స్వాతంత్ర కాలం నాటి ఆశలు ఎట్లా అడియాసలైనాయో తెలుసుకోవచ్చు. సామాన్య ప్రజల దుస్థితిని చూడచ్చు. వ్యక్తి మంచితనానికి విలువ నియ్యాల్నని, శ్రమించి, పోరాడి జీవితాన్ని నిలబెట్టుకోవాలని, అవినీతిని ఎదుర్కోవాలని పిలుపునియ్యడం కనిపిస్తది. ఝూటా దేశభక్తితో జెండాను ఎగరేసుడు కాకుండా గుండెనే దేశంకోసం ఎగరెయ్యాల్నని, ఆచరణ ప్రధానంగా ఉండాల్నని చెప్పడం కనిపిస్తది. డూ డూ బసవన్నల్లా లంచాల గడ్డికి తలకాయలూపద్దని, ఎవని పాటకో మనం ఆటాడద్దని, సొంత వ్యక్తిత్వం నిలుపుకోవాల్నని హితబోధ ఉన్నది.

ముఖ్యంగ, ఇది తెలంగాణ భాష గౌరవాన్ని నిలబెట్టిన కవిత్వం. కనుక, దీన్ల ఉన్న భాషను కొద్దిగ ప్రత్యేకంగ చూద్దాం.“నవ్వులు” అనే కవిత జీవితాన్ని చిరునవ్వుతో ఎదుర్కొనే అమాయకుల గురించి రాసింది. నవ్వించేటోడు మల్లె పువ్వసొంటి మనుసున్నోడు.వాని గుండెల ఉన్న దుఃఖపు కథ చెప్పి మనల నవ్విస్తడు అంటడు. దీన్నే ప్రామాణిక భాషల విషాద మోహనం అంటరేమో. ఐతే, ఈ నవ్వుల మనిషి ఎసొంటోడు అంటే “దేవ్డు కష్టాల మంచె మీదేశినా/ ఆడు లోకం మీద నవ్వులిసురుతడు/ ఇంకోల్ల తక్లీబుల పిట్టల్నెగర గొడ్తడు/ ఆల్ల సంబ్రాల పంట గాస్తడు”. మన భాషతోని పాటు మన చుట్టూ ఉన్న వస్తువులతోని అలంకారాలు వేసుట్ల ఎంత మంచిగ అనిపిస్తున్నది. కని, అందరు వాణ్ని బఫూన్ గాని లెక్క, ఎడ్డోని లెక్క చూస్తరు. ఇంత మంచి మనిషి గుండె కష్టాల కొలిమిల కమిలి పోయింది, అందుకే, కవి “ఆని గుండె గన్లె తవ్వినా కొద్దెల్తయ్/ నవ్వుల బొగ్గులు/ ఆన్ది కమిల్న గుండె గన్క/ నవ్వులు మాడి బొగ్గులయినయి గావొచ్చు/ తోటోని బత్కు రైలింజన నడ్శేటంద్కు/ ఆన్నవ్వుల బొగ్గులేస్తడు”అని విషాద వాస్తవంతోని ముగింపు ఐతది.తెలంగాణ భాషను వాడి ఎంత గొప్పగ కవిత్వం జేసిండు దేవరాజు మహారాజు.

“ఉగాదుర్కొచ్చింది” అనే కవితల కారెడ్డం జూత్తె ఔ ఎంత నిజమనిపిస్తది. సామాన్యుని బతుకుల ఏం మార్పు లేకుంటనే ఉర్కి ఉర్కి వచ్చిన ఉగాది ఏం తెచ్చిందని అడిగే పని లేదు. నిరుడు, మునుపు ఎట్ల ఏడ్సుకుంట నవ్వినమో ఇప్పుడు గూడ గట్లనే ఉన్నం అని ప్రజల జీవితాల్ల బాధల తేడా లేదని వాస్తవాన్ని చెప్తది ఈ కవిత.  “ఉర్కిరాండ్రి ఉర్కిరాండ్రి/ మీ గుండె ఎన్క దిక్కుల/ మన్సు లేని మోడ్ల శిక్కుల/ మొరటుతనం మోద్గు నీడల/ అమురుతపు యిసం తాక్కుంట/ కరుకుతనం శెర్కు మేస్కుంట/ కూకున్నారెందుకూ” అని నిజం చెప్తడు. విషాన్ని అమృతంగ తాగడం, కరుకుతనాన్నే చెరుకుగా తినడం వంటివి విరోదాభాసాలుగా వాడి వాస్తవాన్ని కండ్లకు కట్టిండు కవి. ఏడ్సుకుంట నవ్వుడు అనేది కూడ ఇసొంటిదే. అట్లనే “నయనాల నార్కేలాలు/ పగ్లగొట్టి/ డొక్కల డొకడొకల డప్పులు గొట్టి/ పేగుల పాటలు సొన్నాయి/ కుతికెగ్గట్టి/ ఉగాదినూరేగిద్దాం రాండ్రి”అని రూపకాలను వాడి ఉన్నదాన్ని ఉన్నట్టుగ చూపిస్తడు. అదే కవితలో “తెల్గోన్వని/ నీ పేరాజ్జెయ్యటాన్కొచ్చింది/ పతోనింట/ పొయ్యి రాజెయ్యటాన్కొచ్చింది” అని యమకాలంకార సామీప్యతను సాధించడం అద్భుతమే.

ఎన్నో కవితలల్ల తెలంగాణ భాష శక్తి కనిపిస్తది. “బరివాతల” అనే కవితల దేశం దొరల గుంపుల దొంగలు దోస్కోంగ బిచ్చప్పోరి లెక్క ఉన్నదని, బరివాతల ఆడుక్కుంట తిరుగుతున్నదని, ప్రణాళికలు విఫలమైన పరిస్థితిని చెప్తడు. ఆ ఆడిపిల్ల బట్టల్లేకుంట నడుస్తాంటే “వొనికే సలికే ఏల్లు ఒంకర్లు వోతయ్/ మండే ఎండ కండ్లే మాడిపోతయ్” అని విరోధాభాసలో చెప్పడం తెలంగాణ కవిత్వానికి కొత్త. ఆ బిచ్చప్పిల్ల “గాలుల మీద సంకురాతిరి ముగ్గు లేసుకుంట” పోతున్నదన్నప్పుడు, దేశపు కలలు కల్లలైనాయని తెలుస్తది.

స్వాతంత్రం వచ్చినంక తయారైన రెండో తరం నాయకుల ప్రవర్తన పసురాని కన్న హీన గుణం కలిగిందనే నిజాన్ని ముందుంచుతాడు. ముందు తరాల నాయకుల త్యాగాలు సమాధైనప్పటికీ “ఆల్ల మంచితనం ఎలుగిస్తనే ఉంది, లోకాన్కి/ గోరీలు పలగ్గొట్టుకోని మంటలోలె” అనే దృశ్యీకరణ కండ్లకు వెలుగునిస్తుంది. గాడిదల్లాంటి నాయకులు రాజకీయం మందు తిని లొటపెట ల రూపంలో వచ్చి మోసం చేస్తున్నరని ఆనాటి ప్రజలను మేల్కొల్పడం చూడవచ్చు.లొటపెటబాసలు చేసి అవినీతి కంపుల బొర్లి, తెల్లని చిరునవ్వుల బట్టలు వేసుకున్నదని, బుర్ర, బొర్ర పెంచుకున్నదని, కాళ్ళను స్తంబాలు చేసుకున్నదని వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా చెప్పడం కనిపిస్తది. కడుపు మండితే ప్రజ లొటపెట పుర్రె పగలగొడ్తది అని చైతన్యపు దారిని చూపించడం చూడవచ్చు.మరికొందరు నాయకులు దీపాల లెక్క ఉండి ఎండే కడ్పున్నోల్ల నోర్లు కాల్శి, గుడిసెలు కాల్శి, సామాన్యుల శ్రమను నూనె లెక్క పీలుస్తున్న విషయాన్ని గుర్తించాడు కవి.“పెంటల్నించి పొడ్సుకోనొచ్చే/ బలం గల మొక్క లెక్క/ లోకమంత కాంతిచ్చే సుక్క/ మెర్సుకుంట ఒత్తది” అనే ఆశా భావాన్ని ఈ భావ చిత్రంల చూడచ్చు.

పుట్టిన ప్రతి మనిషి కొసాకరుకు చేరే స్మశానం వస్తువుగ, మనుషుల మంచి చెడ్డల నిర్ణయాన్ని చెప్తూ స్మశానం “దరమతల్లోలె/ కోడి పెట్టోలె అందర్నీ/ రెక్కల కింద పొదుగుకుంటది” అని సహజాభివ్యక్తితో కనిపిస్తది. “ఈ వొల్లకాడు ఒడబోత/ గుడ్డోస్ శిన్నోడ” అని మంచి చెడ్డల వడపోత గుడ్డగా చెప్తాడు. చచ్చినోడు మంచోడైతే “ఆని దిబ్బ మీద మల్లె తీగ మొలుత్తది”, నమ్మించి గొంతు పిసికే వాడైతే “గీని సమాది సుట్టు జిల్లెడ్లు” అని అన్నప్పుడు ఏ మాత్రం ఆటంకం లేకుంట తెలంగాణ భాష కవిత్వాభివ్యక్తికి ఎంతమంచిగ ఒదుగుతదో అనిపిస్తుంది. స్మశానాన్ని ఆత్మలు ఎగిరిపొయ్యే ఎయిర్ పోర్ట్ గ భావించి “ఈ బత్కు తోక పటాకిని/ అంటిత్తడు దేవ్డు/ తోకంత కాలుకుంట వోయి శివర్న/ ఎప్పుడో ఆత్మీయుల గుండెల ఢాంమ్మంటది” అన్నప్పుడు శబ్ద శక్తి నిరూపితమైంది. దీపానికీ తాగుబోతుకు అభేదం చేసి చెప్పిన అద్భుతమైన కవిత అవ్యక్తానందాన్నిస్తది.

వస్తువులను మానవీకరించి చెప్పిన చోట్లు ఎన్నో ఉన్నయి. “ఈడ దీపాలు వేశాలు వేసుకున్న లోపాలు- ఆటి ఎన్క కోపం తాపాలు రగులుతానయ్”, “దీపాల దొంగ జపాలు”, “మన్శి మడిమోల్గె పల్గిన బూమి”, దూపతోటి నోల్లు దెర్సుకున్న సెల్ర”, “ఆకాసంల మెర్శిన మెర్పు ఆరతివట్టి పోతాంది” “కంచు ఉరుముల కంఠాలు పాటలు పాడుతానయ్””బజ్జోమని గాలి జాలిగా/ ఈల్లందర్నీ జోకొడుతూ పాట పాడుతది”, “పూలు శవాలయితయి”, “దేసం ఓ మెట్టు కిందికి జార్తాంది”, “ఎలుగు వొనుకుతాంది”, శీకటి శేతులల్ల ఎలుగు నలుగుతాంది, ఆ శిన్న దీపం పానాలకు తెగించి కొట్లాడుతాంది”, “శీకటిని జూస్తేనే దీపం వొల్లంత మండ్తాంది” మొదలయినయి కొన్ని ఉదాహరణలు.

ఎన్నో కవితల్ల అంత్య ప్రాసను సమజ్దార్గ వాడుడు చూడచ్చు. “నర్కబడితే, మాడిపోతే, ఆసనొత్తే, పారితే, కనిపిత్తే” అని ఒక కవితల, మరో కవితల “పొంగకు, వొంగకు, లొంగకు” అని, ఇంకో కాడ “దయ కార్తాంది, బయమూర్తాంది, అత్కోలె మార్తాంది, కిందికి జార్తాంది” వంటివి ఎన్నో కనిపిస్తయి.

దేవరాజు మహారాజు కవిత్వం ఆశయం ఆయన కవితల్నే గిట్ల సదువుకుందాం...

“మెదడు మబ్బులల్ల మెర్పులు మెర్వంగనె

ఏడి ఏడి మాటల్ని జోడి జేస్కొని

లోకమంత కుదించెటట్టు

బొర్రపెంచుకున్నన్నేయకత్వం

వొల్లొంచుకునేటట్టు

కవిత్కాల ఉరుములురుమాలె

నిద్రొచ్చెటట్టు జోల పాటలేమొద్దు

మేల్కొచ్చెటట్టు

ఎన్నో సర్పులు గావాలె

 


ఈ సంచికలో...                     

Jan 2021

ఇతర పత్రికలు