సాహిత్య వ్యాసాలు

(July,2020)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

"దాహం" దక్కేది 

ప్రియమైన నా తరం పాఠకులారా...

మీకో నాటకం గురించి చెప్పాలనుకుంటున్నా. నేను రాసింది కాదు,చదివింది. అద్భుతమైనదని చెప్పడానికి కాదు, చాలా చాలా అవసరమని చెప్పడానికి.ఎందుకంటే ఇందులో సజీవమైన రచన వస్తువు ఉంది. సజీవమైన ప్రజల భాష ఉంది.మనువు కుట్రతో పెట్టిన కట్టుబాట్లతో కనీస అవసరాలకు దూరమైన మనిషి బాధ సజీవంగా ఉంది.అందుకే ఈ రచన ఈ తరం పాఠకులకు,రచయితలకు చాలా అవసరమని భావిస్తున్నా.మూడు వంతుల నీరున్న భూమిపై త్రాగేందుకు నీరు తాకని ప్రజలున్నారు. నీళ్లను తాకనివ్వని మూర్ఖులున్నారు.ఈ కుట్రను తిప్పికొడ్తూ ఫూలే దంపతులు అంటరానివాళ్ల కోసం బాయి తవ్వించారు.బి ఆర్ అంబేడ్కర్ మహాద్ చెరువు(1927.మార్చి.20) పోరాటం చేసిండు.అయినా వివక్షా పోలేదు.అందుకే మళ్ళీ మళ్ళీ ఈ మను కుట్రలను చేధించాల్సిన అవసరమూ ఉంది.అంతేకాదు నేటికి దాహంతో నిస్సహాయంగా ఎదురుచూసే గొంతులు తడపాల్సిన బాధ్యత ఈ తరం మనుషులపై ఉంది.దాన్ని గుర్తు చేద్దామనే ఈ ప్రయత్నం.ఇందులో నా అనుభూతి తప్ప మొత్తమంతా రచయిత అక్షరాల అల్లికనే.ఇది సమీక్ష కాదు,కేవలం నా అనుభూతి మాత్రమే...

 

 2004లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు "THIRST" పేరుతో అచ్చువేశారు. HCU లో M.A ఇంగ్లీష్ సాహిత్యంలో, ఎంఫిల్ సెమినార్ పేపర్ గా ఉండటమే కాదు,తమిళనాడులోని తిరువళ్వార్ విశ్వవిద్యాలయం M.A సిలబస్ గా ఉంది. అంతే కాదు చదివిన వారి గుండెల్లో... వివక్షననుభవిస్తున్న దళితుల జీవితాల్లో ఉంది... ఇదే నేను మీకు చెప్తానన్నా "దాహం" ...డాక్టర్ M.M వినోదిని గారు రాసింది. 31 పేజీల్లో, 20 పాత్రలతో,5 సీన్లలో సజీవంగా అద్దిన దళిత మహిళ ఆత్మగౌరవ పోరాటం దాహం. వాస్తవ రూపం...

 

దాహం నాటకం కాదు, జీవితం. చేయని నేరానికి ఊరికి దూరంగా వెలివాడ లో ఉంటూ శిక్ష అనుభవిస్తున్న వారి జీవితం.హక్కుగా దక్కాల్సినది అగ్రకులాలు లాక్కుంటే దక్కించుకొను నేటికీ న్యాయంగా పోరాడుతున్న వారి జీవితం. దాహం తీరనిది కాదు,తీరేదే,అంతకన్నా దక్కేది.దక్కించుకునేది.

 

రచయిత దాహం నాటకంలో గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. నాటకం కథా  విషయానికొస్తే దళితవాడలో చీరగ్గట్టిన ఉయ్యాలలో పిల్లవాడు ఏడుస్తున్నాడు...పెద్ద రెడ్డి కోడలికి పాలు పడకపోతే ఆయన మనవడికి పాలివ్వడానికి గంగమ్మ వెళ్ళిపోతుంది...తాగే మంచినీళ్ల కోసం పొద్దున వెళ్లి మిట్ట మధ్యాహ్నమైన నీళ్లు దొరక్క తన్నులు తిని "సంపుతున్నర్రో" అనే కేకలతో... శౌరమ్మ ఏడుపు తో దాహం మొదలవుతుంది.వాడ ఇట్లాగే దుఃఖంతో వాస్తవంగా మేల్కొంటుంది...

 

గ్రహాలన్నీ గుద్దుకున్నట్టు, భూగోళం బద్దలైనట్టు వార్త ఊరంతా పాకింది. వాడ పైకి వచ్చింది. పెద్ద మాల వచ్చిండు ఎట్లా జరిగిందని అడగడమే కాదు, పెద్ద రెడ్డికి కోపం వచ్చిందని నీ భర్తను రమ్మన్నాడటాని అన్నాడు. శౌరమ్మకు అర్థం కాలేదు"నేనేం జేశానయ్యా... పొద్దుట్నుంచి నిలబడి నిలబడి ఎండకి  తులూడోస్తంది.ఇంకా మొయినంగా లేసి జూశా...బాయి ఖాళీగా ఉంది అటూ ఇటూ జూశా... యెవురు గనబళ్ళా.. గబగబా గట్టెక్కి తూర్పు గిలక మీద చేదేశా అంతే...యాడ్నుంచి వూడి పడ్డాయో గాని... గద్దలు ధట్టెం మీద వాలినట్టు వచ్చి పడ్డయ్.. లంజలు... ముందు ఆ దూడ బాతు మొకంది వొచ్చింది నోటికొచ్చినట్టు తిట్టుకుంట... కుక్కలెగబడ్డట్టు ఎగబడినయ్. నా కులం తక్కువ దాన్నంట. కట్ట యెక్కగూడదంట.ముట్టగూడదంట.అసలూ బాయి వాళ్ళదేనంట.నాకు మండిపోయిందనుకో...ఇగ ఆపుకోలేకపోయ్యా..యెవురి బతుకులేందో అందరికి తెలుసన్నా. కుట్ర చేస్తే ఏదైనా అప్పనంగా నే వచ్చుద్దన్న. మేం కూడా ఊరోళ్ళమే... బాయి మాదిగోడా అన్న.. ఊర్లో మడుసులది గాని వూరి చివరి పందులది గాదన్నారు. మడుసులు సత్తన్న నీళ్లు బొయ్యరు మీరే పందులన్న... అంతే ఇంగా వజాన మీదకి దూకి యెదర్రొమ్ము మీద చెయ్యేసి కిందికి నెట్టేశారు.బిల్ట ఈటుగా పడ్డా... ఇష్టం వచ్చినట్టు కుమ్మేరు. కాళ్లతో ఎగిరెగిరి తన్నేరు.. జుట్టు పట్టి ఈడ్చేరు..  కుండెత్తి పగలనూకి దిక్కున్నకాడ చెప్పుకోమన్నారు దుఃఖం ఆగలేదు" అంటూ ఏడుస్తుంది...శౌరమ్మ.

 

 కుండ నీళ్లు దక్కకుండా చేసిన కుట్ర. కుళ్ళిన హృదయాలున్న అగ్రకుల భావజాలపు మనుషులు. శౌరమ్మ నోటికొచ్చినట్టు తిట్టింది. మొదలే తిట్టలేదు. అదే ప్రపంచ నేరం అయింది. మెదడున్న ఎవరైనా ఆలోచిస్తే శౌరమ్మ తప్పు లేదని తెలుస్తోంది. కానీ ఇది కట్టుబాట్లకు పుట్టినోనికి జరిగిన నేరం. క్షమించరాని నేరం. శిక్ష వేయాల్సిందే. ఇలాగే చిన్నగా మొదలవుతుంది.నేరం మోపడానికి వాళ్లకు సాకుకావాలి.దొరకబట్టారు.

 

ఊరి కట్టుబాట్లు తెంపింది కాబట్టి పంచాయతీ చేయాలన్నారు పెద్ద రెడ్డి,వెంకట్ రెడ్డి... పది వేల జరిమానా లేదంటే బట్టలిప్పి శౌరమ్మను ఊరంతా తిప్పు తామన్నడు.శౌరమ్మ భర్త నర్సయ్య పెద్ద రెడ్డి ని ఎంత ప్రాధేయపడినా ఒప్పుకోలేదు.అగ్రకుల తత్వం అంటే ఇదే. అగ్రకుల భావజాలాన్ని మోస్తూ తమ సంపదను పెంచుకోవడం, అధికారాన్నీ అహంకారాన్నీ, జులుం ని ప్రదర్శించడం.నీతిమాలిన తత్వం.చదివే వాళ్లకు పిచ్చి కోపమొస్తుంది.నువ్వు మనిషివేనారా...అని గళ్ళ పట్టి తన్నాలనిపిస్తది.నిజాన్ని రచయిత అలా రాసారు మరి...

 

దళితవాడ సమీక్షించుకుంటున్నది. గతాన్ని తడుముకుంటున్నది.మా అమ్మ చేసింది తప్పు కాదని వాళ్లను ముక్కలు ముక్కలుగా నరుకుతానని ఆవేశంతో ఉరకలేసే దాసుకు గతం ఆలోచింపజేయడమే కాదు ఇంకా పదునెక్కిస్తుంది.ఆవేశంతో వూరి దొరలకి ఎదురు పోయిన చిన్నాన్న ఏమయ్యాడో? తాత కన్నీటితో చెప్తాడు. ఎవరు చంపారో? ఎందుకు చంపారో?పుష్పమ్మ, పున్నెమ్మ లు,మాలపల్లి పెద్దలు విడమర్చి వివరంగా చెప్పారు. కన్నీటితో చెప్పారు.కల్పించి కాదు వాస్తవాన్ని వాస్తవంగా నిజాయితీగా చెప్పారు.

 

 భగభగ మండే ఎండాకాలంలో ఊరంతా గుక్కెడు నీళ్లకోసం రోదిస్తుంటే పెద్ద రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి మాలపల్లి వచ్చిండు ఆశ్చర్యమే! ఊరంతా తిరిగినా(భూమి ఎవ్వరూ ఇవ్వలేదు కావొచ్చు) నీళ్ళు ఎక్కడ పడకపోతే మన వాడకొచ్చిండు. అందరికీ నీళ్ల కోసం బాయి తవ్వుదామని మన మంచం లో కూర్చొని మాట్లాడి, తెల్లారి కొబ్బరికాయ కొట్టిండు మరోమారు రాలేదు.ఊరంతా నాలుగు రోజులు బాయి చుట్టూ పెకిలించి పోయారు.వాళ్లు కూడా మళ్ళీ రాలేదు. మాలపల్లె మొత్తం రెక్కలు ముక్కలు చేసుకొని పిల్ల జల్లతో చెమట చిందించి బావి తవ్వారు.పుష్కలంగా నీళ్లు పడ్డాయి.ఊరి బాయికి నాలుగు గిరకలు కాదు, మాకు ఐదో గిరకుండాలి.రేపు రేపు ఎట్లా ఉంటుందోనని దాసు చిన్నాన్న పట్టుబట్టిండు. విషపు మనిషి సుబ్బారెడ్డి మనసులొకటి పెట్టుకొని సరేనన్నాడు.బావిపై గిరకేసి చేదెయ్యగానే కొయ్య విరిగింది.పురోహితుడు వచ్చాడు. కడజాతి వాడు ఊరోళ్లతో సమానంగా నీళ్ళు తాకరాదు. గంగమ్మకు కోపం వచ్చింది. కాదని తాకితే గంగ లోపలికి వెళ్ళి పోతుందని కుట్ర రాజేసిండ్రు.

 

 ఎంతటి దుర్మార్గం? ఎన్నో రోజుల నుండి కష్టపడి తవ్విన బాయి లోని పుష్కలమైన నీళ్లు దూరమయ్యాయి.కాదు కాదు దూరం చేశారు.ఎంతటి మూఢ నమ్మకాన్ని పేర్చారు చూశారా... తాగితే నీళ్లు లోపలికి పోవడమేంటీ? గుండె రగులుతోంది కదా నాకైనా మీకైనా.దాసు చిన్నాన్న సుబ్బారెడ్డిని నిలదీసిండు. కొయ్య కొత్తదె య్యకుంటే బాయి పూడుస్తానన్నాడు.అన్యాయాన్ని ప్రశ్నించాడు ఇదీ నేరమే.తెల్లారి చెట్టుకు శవమై వేలాడాడు చిన్నాన్న.దాసు రక్తం  ఇంకా ఇంకా మరుగుతున్నది.గతాన్ని చూసి భయపడుకుంటా మీరు బ్రతికిండ్రు కానీ నీ మేం అలా బతుకం. పోరాడుతాం అన్నాడు దాసు. యువకులంతా ఏకమయ్యారు. రేపు పంచాయతీలో మేమే మాట్లాడుతమన్నారు. ఏం చేయాలో వాడ ప్రజలకు వివరంగా చెప్పిండు దాసు.తెల్లారి గుంపుగా వాడంతా వెళ్లారు.

 

 నేరస్తులు రాజ్యమేలుతున్నారు కులమే అధికారంగా బ్రతుకుతున్నారు.రాజులాగా తీర్పిచ్చేందుకు సిద్దంగానున్న పెద్ద రెడ్డి సీన్ రివర్స్ అయ్యింది."అయ్యా బాంఛాన్ " గాకుండా ఏయ్ రెడ్డి అన్నారు. పెద్ద రెడ్డి గుండెఝల్లుమంది కావచ్చు. అయినా కూడా సవరించుకొని జరిమానా అడిగిండు పెద్ద రెడ్డి.దాసు,చంద్రయ్య,రాజు, దిబ్బడు, ప్రసాద్ లు ప్రశ్నల బాణాలు కురిపిస్తున్నారు.జరిమానా ఎక్కడిది?భరించలేకపోతున్నారు. పెద్ద రెడ్డి,వెంకట్ రెడ్డి,చిన్న రెడ్డి. ఏంరా పాత కథలు మర్చిపోయిండ్రారా?అంటే అందుకే వచ్చినమన్నరు మాలపల్లె యువకులు. అంతేకాదు ఏయ్... పిల్ల రెడ్డి, పిచ్చి రెడ్డి ఎక్కువ మాట్లాడకండి. మీకంటే మాకు బాగోచ్చు మాటలు.చేతలంటావా మేం రోజు చేసేది అదే.జాగ్రత్త లేదంటే నరుకుతామంటున్నారు యువకులు.ఇదంతా కాదురా జరిమానా ఏది రా?అని మళ్ళీ అడిగిండు పెద్ద రెడ్డి. జరిమానా ఎందుకు దాసు మళ్ళీ ప్రశ్నించాడు.బాయి ఎక్కడమే కాకుండా మా పెద్ద కులం ఆడోళ్ళను మీ అమ్మ పందులని తిట్టింది.అందుకే అన్నాడు పెద్ద రెడ్డి.కాదు... మా అమ్మని కొట్టి కుండ పలగ్గొట్టినందుకు మీ ఆడోళ్లే క్షమాపణ చెప్పాలి.అందుకే ఒక్కొక్కలుగా రాలేదు. వాడ వాడంతా వచ్చినం.న్యాయం జరిగేదాకా కదిలేది లేదన్నడు దాసు.

 

 మీరు బాయి ఎక్కితే గంగమ్మ లోపలికి పోతదని పూజారి చెప్పిండు కదా అని పెద్ద రెడ్డి అనగానే పుష్పమ్మ,పున్నెమ్మలు మీరు ఇద్దరు(బ్రాహ్మణులు,రెడ్లు) ఆడిన నాటకం అంటూ---

 పుష్పమ్మ- "యెంది మేం గట్టెక్కితే బాయ్ యెండిపోద్దా?మేం చేదేస్తే గంగమ్మ లోపలికి యెల్లిపోద్దా? అసలు ఈ బాయి తొవ్విందేవురూ? మీ పెద్ద కులపోళ్ళందరూ గొంతు తడుపుకొను సుక్క నీళ్లు లేక అల్లాడిపోతుంటే గంగమ్మని పాతాళం నుండి పైకి తెచ్చిందేవురూ? నువ్వా? మీ నాయనా? మీ పెద్ద జాతోల్లా"

 

 పున్నమ్మ --"నువ్వాగుమే  పుష్పమ్మ (పెద్ద రెడ్డి వైపు తిరిగి ఎగతాళిగా) యెందయ్యా పెద్ద రెడ్డి "గంగమ్మ లోపలికి యెళ్లిపోద్ది" (పెద్ద రెడ్డి కంఠాన్ని అనుకరిస్తుంది) యెందయ్యా యెల్లేది,యాడికి దాని జుట్టు పట్టుకొని పైకి లాకొచ్చింది మేవు.. కడుపునిండా ఇసం పెట్టుకొని మీ నాయనా నవ్వుకుంటూ మాలపల్లెకొచ్చిండు.మేం బాయి తవ్వడం మొదలు పెడితే కొబ్బరికాయలు గొట్టి పసుపు కుంకుమలు జల్లినప్పుడు దప్ప ముందుకొచ్చాడా? కనీసం కనబడ్డాడా? ఒక్కసారన్నా గడ్డపలుగేశారా?ఒక్క  తట్ట మన్నన్నా ఎత్తి పోశారా? కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని బాయి తవ్వింది మేవు.. మట్టి ఎత్తి పోసింది మేవు.. గంగమ్మ గొంతును చెమట చుక్కల తో తడిపి పాతాళం నుంచి పైకి ఈడ్చుకొచ్చి బాయిలో కట్టేసింది మేవు. బాయిలో బిందెలు పారేసుకొని ఎక్కడన్నా దిగి దీశాడా? ఎన్నిసార్లు దిగి మావొళ్ళు దీశారు.. ఎన్నిసార్లు పూడిక తీయడానికి మా వొళ్ళు దిగలేదు.మీ పెళ్లి గాని ఆడపిల్లలు వురికొచ్చి దూకితే పైకెత్తకొచ్చి  పేణం నిలిపిందెవరు? మా పిల్లలు గారు... అంతెందుకు పోయినేడాది పంతులు గారి కోడలు ఉబ్బి మూడో రోజు పైకి తేలి గవులు కొడతంటే తీసిందెవరు? నీళ్ళని ఎత్తి పోసి బాయిని కడిగిందెవరు" పున్నెమ్మ అన్నది.అప్పుడు పోనీ గంగమ్మ ఇప్పుడు లోపలికెట్లా పోతుందని చిన్నెంకటి అన్నాడు.ఒక్క సమాధానం లేదు. నిజానికి నిజమే సమాధానం...ఆ అబద్ధపు కట్టుబాట్లన్నీ కట్టుకథలని తేలింది...

 

 పంచాయితీ అనగానే "మీకేం తెలుసు", "మీరు ఆడోళ్ళు", "మీరు లోపలికి పొండి", "మీరు మాట్లాడకండి", "ఇది వేరే విషయం" తీర్పు ఇవ్వడం మగవాని హక్కు అంటూ మీసం తిప్పే పితృస్వామ్య వ్యవస్థలో ఈ మాలపల్లి తల్లుల ధైర్యం స్ఫూర్తినిస్తుంది.ఆ ధైర్యం అణిచివేత,అవమానాల నుండి ప్రతీకారంగా వచ్చింది.ఇంకా ఆ ధైర్యానికి ఉద్యమ నేపథ్యం లేకపోలేదు.అస్తిత్వ ఉద్యమాల నుండి విప్లవోద్యమాల వరకు ముందుండి నడిచింది దళిత వాడలే. వెట్టి చాకిరి,అంటరాని తనం,సారా,గుట్కా సామాజిక రుగ్మతలన్నింటికి వ్యతిరేకంగా పోరాడారు.అంతే గాకుండా భూమి భుక్తి విముక్తి పోరాటాలు చేశారు..

అచ్చం ఆ ధైర్యంతోనే నిజాయితీగా,పదునుగా మాట్లాడారు...

 

ప్రశ్న అంటే ఆకాశం నుండి ఊడి పడేది కాదు. చాలా సహజంగా... అంటే ఆకలంత సహజంగా వచ్చేది. పెద్ద రెడ్డి ఇంకా కొనసాగిస్తూ బాయెక్కద్దనేది ఊరి కట్టుబాటు.మన పెద్దోళ్ళు పెట్టిందంటాడు.ఒక సెకండ్ విరామం లేకుండా దాసు కాదు మీ పెద్దోళ్ళు మా పెద్దోళ్ళు కాదు అన్నాడు ఇంకా "బాయికట్ట యెక్కగోడదా... యెక్కుతే మీరు జరిమానా యేస్తారా?యేవురు యెక్కగోడదు?కట్టుబాటు యెవురు పెట్టారు?యెవరి కోసం పెట్టారు? కట్టుబాటు యిట్టా ఉండాలని యెవురు నిర్ణయించారు? జరిమానా ఇంత కట్టాలని యెవురు నిర్ణయించారు? యిట్టా జెయ్యడానికి మీకు హక్కెవరిచ్చారు... అసలు?

ఇది మారాలి అన్నాడు దాసు... చిన్నాన్న అడిగిందే దాసు అడిగాడు.ప్రశ్నించడం లో తప్పేముంది. ఇది ఇప్పటిది కాదు.తరాలది. ప్రశ్నించడం మనిషి భావజాలం కానీ నేరమంటోంది మను భావజాలం...

 

చివరి కొచ్చాం పంచాయతీ మధ్య మధ్యలో ఒకామే గంగమ్మ దగ్గరికి వచ్చి చిన్నమ్మ(పెద్ద రెడ్డి కోడలు) కొడుకు పాల కోసం ఏడుస్తున్నాడు రమ్మంటుంది. గంగమ్మ దిక్కరిస్తుంది.వచ్చినామే అయ్యా నువ్వైనా చెప్పయ్య అనగానే పెద్ద రెడ్డి ముఖం కింద కేస్తాడు..సిగ్గుతో. అంతలోనే పాల కోసం ఏడ్చే పిల్లవాడిని పంచాయతీ మధ్య బండపై వేసి గంగమ్మను బతిమిలాడుతున్న పెద్ద రెడ్డి భార్య,పెద్ద రెడ్డి కోడలు.చిన్న రెడ్డి మాల పెద్ద కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతుంటాడు.కోరలు ఊడిపోయిన అగ్ర కుల పెద్ద మనుషులు. మీరు చెప్పినట్టే కొయ్య యేపిచ్చి ఐదో గిరక పెడతానంటాడు పెద్ద రెడ్డి.పిల్లగానికి పాలియ్యమని బతిమిలాడుతుంటాడు.గంగమ్మ "యెందయ్యా మీరనేది ఇంకా మీకర్థం కాలేదా? మేం పంచాయతికి యెందుకొచ్చామో? మేవొచ్చింది బాయి గిలక్కొసం కాదు.గిలక మీరిచ్చిన యియ్యక పోయినా యేసుకుంటాం... నీలు చేదుకుంటాం.. అందుగ్గాదు మేము పంచాయతీకొచ్చింది... మాయత్తని కొట్టినందుకు.. కుండ పగలనూకినందుకు... మొత్తం మా జాతిని పందులని తిట్టినందుకు తప్పొప్పుకుంటే పాలిస్త..."అప్పటిదాకా కదిలేది లేదంటది.పెద్ద రెడ్డి తప్పయింది అంటడు.చెప్పేది నువ్వు కాదు నీ మరదలు చెప్పాలంటే వెంటనే పెద్ద రెడ్డి మరదలు ఉరికొచ్చి శౌరమ్మ ముందు చెంపలు వాయించుకుంటూ తప్పయింది క్షమించమంటుంది. ప్రేమ పంచడమే తెలిసిన గంగమ్మ పిల్లోడిని ఒడిలోకి తీసుకుని పాలిస్తుంది...ఇది దళిత మహిళల ఆత్మగౌరవ పోరాటం.ఈ విజయానికి గింత చరిత్ర ఉంది.రేపు గంగమ్మ కడుపులో పుట్టిన కొడుకు,పాలిచ్చిన కొడుకు సమానంగా బ్రతకలనేదే ఈ పుస్తక లక్ష్యం.

 

ఇది ఒక్క మాలపల్లి,మాదిగ పల్లి వ్యధ మాత్రమే కాదు.ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో దళితవాడలు దాహంతో ఎదురుచూస్తున్నాయి...వివక్షతో పీడించబడుతున్నాయి...ఈ వివక్షను రూపుమాపడానికి ఎన్నో చట్టాలున్నాయి ఒక్కటీ అమలు కావడం లేదు.ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని పక్కనబెట్టి మనుధర్మమే రాజ్యాంగంగా చేసుకొని ఆర్ ఎస్ ఎస్  ఆంగమైన బిజెపి పాలన సాగిస్తున్నది. వేల యేండ్ల కిందటి కట్టుబాట్లను ఆంక్షలను శిక్షలతో విధిస్తున్నది.వేధిస్తున్నది. ఉత్తర ప్రదేశ్ లో మంచి నీళ్లు తాగితే తక్కువ కులపోళ్లని బట్టలిప్పి కొట్టారు.మను భావజాలం దేశమంతటా తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఇంకా రెండు గ్లాసుల పద్ధతి, జోగిని బసివిని మాతంగిని దురాచారాలు పోలేదు...అత్యాచార హత్యలు ఆగలేదు..తినే ఆహారం, వేసుకునే బట్టల పైన ఆంక్షలు,అంబేద్కర్ రింగ్టోన్ పెట్టుకుంటే చావ గొట్టిన సాక్షాలు... అగ్రకులం అమ్మాయిల/అబ్బాయిల ప్రేమిస్తే కులోన్మాద హత్యలు...విద్యను బ్రాహ్మణీకరించి విద్యార్థులను అజ్ఞానం వైపు మళ్లిస్తు ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నారు... ప్రశ్నించిన విద్యార్థులపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు...జైళ్లలో నిర్బంధించి వేధిస్తున్నారు.పౌరసత్వాన్నే తొలగించే కుట్ర చేస్తున్నారు.ప్రాణమున్న మనుషుల జీవశ్చవాలుగా చేస్తున్నారు....

 

ఇటువంటి సందర్భంలో ఈ పుస్తకం చదువుతుంటే ఇవన్నీ గుర్తొచ్చాయి అందుకే పీడితులందరూ ఏకమవ్వాలి...బూర్జువా రాజకీయ పార్టీల,డ్వాక్రా గ్రూపుల ఓట్ బ్యాంకు గా కాకుండా,స్త్రీ పురుషులు ప్రజాస్వామిక పోరాటాల్లో చైతన్య సంఘాలుగా ఎదగాలి. మను వారసుల ఫాసిస్ట్ పాలనా విధానాలను ప్రశ్నించాలి... ఎండగట్టాలి... పడగొట్టాలి... ఎలాగైనా ఎలాగైనా భూమిపై మనిషిని బతికించేందుకు పంచాయతీ చేయాల్సిందే.... ఆత్మగౌరవ పోరూ కేతనం ఎగరేయాల్సిందే....దాహం తీర్చుకోవాల్సిందే....

 

(M.M వినోదిని గారు రాసిన "దాహం" నాటకం చదివిన తరువాత)

 

 


ఈ సంచికలో...                     

May 2021

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు