సాహిత్య వ్యాసాలు

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

‘కొండ పొలం’ తెలుగు నవలా సాహిత్యానికి కలికి తురాయి

                   సుమారు ఇరవై ఏళ్లగా రాయలసీమ నుంచి ఆ ప్రాంత అస్తిత్వాన్ని ధృవపరచే కథలు, నవలలు వస్తున్నాయి. మరీ ముఖ్యం గత నాలుగైదేళ్లలో ఆ ప్రాంతం నుంచి వస్తున్న నవలలకు సాహిత్యపరంగా  ఎంతో గుర్తింపు లభిస్తున్నది. రాయలసీమ చారిత్రక వారసత్వం, సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, ప్రజల అలవాట్లు, వేషభాషలు, నమ్మకాలు, వైఖరులు, దృక్పథాలు ప్రతిబింభించేలా సాహిత్యం ఉండాలన్న స్పృహ, చైతన్యం ఆ ప్రాంతపు సాహిత్యకారులలో రావడం దీనికి కారణం కావొచ్చు. తన శప్తభూమినవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు డిసెంబరు 2019లో ఎంపికైన సందర్భంగా డిసెంబరు 23న ఆంధ్రజ్యోతికిచ్చిన ఇంటర్వ్యూలో రచయిత బండి నారాయణస్వామి “తెలంగాణ ఉద్యమక్రమంలో తెలంగాణ ప్రాంతం చారిత్రకంగా, సాంస్కృతికంగా దాదాపు పునరుజ్జీవం పొందింది. కానీ తెలంగాణ విడిపోయిన క్రమంలో రాయలసీమ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమ ప్రాంత మూలాలను సామాజికంగా, రాజకీయంగా చారిత్రకంగా, సాంస్కృతికంగా పరిచయం చేయాలనే ఉద్దేశమే ఈ శప్తభూమినవలను రాయించింది’’ అన్నారు.  ఆయన మాటలు పై పరిశీలనను ధృవపరుస్తున్నాయి.

            రాయలసీమ జీవన విధానాన్ని సమర్థవంతంగా, సరైన అవగాహనతో, వాస్తవానికి దగ్గరగా ఆ ప్రాంతపు మాండలికంలో రాసిన నవలాకారులలో పేర్కొనదగినవారు కేశవరెడ్డి, పొలాప్రగడ సత్యనారాయణమూర్తి, స్వామి పేరుతో రాస్తున్న బండి నారాయణస్వామి, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, చిలుకూరి దేవపుత్ర, శాంతినారాయణ, జి.కల్యాణరావు, కొలకలూరి ఇనాక్‍ మొదలైనవారు. రాయలసీమ నవలా పక్రియలో తనదైన ముద్రవేస్తూ, ఆ ప్రాంతపు జీవనరీతిని వెలుగులోకి తెస్తూ నవలలు రాస్తున్న మరొక నవలాకారుడు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. 1998లో వచ్చిన ఆయన నవల కాడి: రాయలసీమ రైతు జీవితంలో రెండు దశాబ్దాల కాలం (1980 - 1998)లో వచ్చిన మార్పుల్ని సమగ్రంగా చిత్రించిన నవల. రైతులకు (రెడ్లకు) దళితులకు మధ్య ఆర్థిక, సామాజిక సంఘర్షణను కూడా సమర్ధవంతంగా చిత్రించిన  ఈ నవలకు  ఆటాబహుమతి లభించింది.  2017లో వచ్చిన ఆయన నవల ఒంటరిప్రకృతిని అర్థం చేసుకున్న వాడెవడూ దాన్ని విధ్వంసం చెయ్యడన్న సందేశాన్నిచ్చింది. మనిషికి తనచుట్టూ ఉన్న పర్యావరణాన్ని కొంతైనా అధ్యయనం చేయించే ఒక చిన్న ప్రయత్నమే ఈ ఒంటరి’ నవల అంటారాయన. ఇది తానా బహుమతి పొందిన నవల.

            2019లో వచ్చిన ఆయన నవల కొండపాలంమరోసారి తానా  బహుమతి గెలుచుకుంది. గొల్లలు, కాపులు సగం సగంగా ఉన్న ఊరు ఆయనది. అది కడప జిల్లాలో ఉన్న బాలరాజు పల్లె. చిన్న తనం నుండి గొల్లలతో కలసి మెలసి బతుకుపయనం సాగిస్తున్నప్పటికీ, వాళ్ల జీవితాన్ని అర్థం చేసికొని, వాటిని సాహిత్యంలోకి తీసుకురావాలనే తలంపుతో ఈ నవల రాయడానికి ఆయనకి పదిహేను సంవత్సరాలు పట్టింది. వ్యవసాయ వృత్తిని జీర్ణించుకొన్నంతగా గొర్లకాపరితనాన్ని  జీర్ణించుకుని ఈ నవల రాసారు. తన కులానికి, వృత్తికి సంబంధించిన  పొరలన్నీ వదల్చుకుని అవతలిగట్టుకు నడవగలిగిన స్థితికి వచ్చినపుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయం.

            ఈ నవలలో ముఖ్య పాత్రదారి రవీంద్రయాదవ్‍, యాదవుల  ఇళ్లల్లో మొదటి ఇంజనీరింగ్‍ ‘‘గ్రాడ్యుయేట్‍’’.  ఉద్యోగం సంపాదించుకోడానికి నాలుగేళ్లగా హైదరాబాద్‍ అమీర్‍ పేటలోని సాఫ్ట్వేర్‍ సొల్యూషన్స్లో కోచింగ్‍ తీసుకుంటున్నాడు. కానీ ఉద్యోగం సంపాదించుకోలేక పోతున్నాడు. నగరాల్లో పిల్లల ఆంగ్ల వాగ్ధాటి ముందు గుంపు తర్కంలో నిలబడలేక పోతున్నాడు. ఇంటర్వ్యూగదిలోకి పోకముందే వెన్నెముక జలదరింపుతో, ముఖాముఖి చెమట భయంతో, న్యూనతతో ఢీలా పడిపోతున్న పల్లె యువకుడు. తండ్రి గురప్ప నాలుంగేండ్లయితాంది సదవైపోయి...’’ అనే ప్రశ్నలకు జవాబియ్యలేక సతమతమవుతున్నాడు.

            వంద గొర్రెలున్న గొర్రెల కాపరి గురప్ప. వర్షాలు పడేదాకా ఎండాకాలం వాటి మేత, నీళ్లు పెద్ద సమస్య.  సాధారణంగా కాపర్లు పదిమైళ్ల దూరంలో ఉన్న నల్లమల కొండల మీద మంచి వాన పడ్డ తర్వాత గొర్రెల మందల్ని తోలుకుపోయి కొండలమీద అడవుల్లో మేపుతారు. పల్లెల్లో వర్షాలు పడిన తర్వాత తిరిగివస్తారు. అలా పోవడాన్ని కొండపొలం వెళ్లడం అంటారు. గొర్రెల కాపర్ల కొండపొలానికి బత్తెం తయారు చేస్తారు ఇంటి ఆడపడుచులు.   సజ్జరొట్టెలు, బియ్యం, బెల్లపుండలు, ఉల్లిగడ్డలు, చింతపండు, వెరుశెనగ గింజలు, ఎండు మిరపకాయలు దంచి, ఉప్పుకలిపిన ఉండలు మొదలైనవి మూటగట్టి ఇస్తారు. అవి బత్తెపు  కాలానికి అంటే ఎనిమిది రోజులకు సరిపోతాయి. అవి అయిపోగానే మళ్లీ బత్తేలు తయారు చేసి పంపుతారు.

            రవితాత రవితో ‘‘మీ నాయనతో పాటు నువ్వూ కొండపొలం చేసిరాపో. గొర్లపానాలు నిలబెట్టు. ఆర్నెల్లల్లో నీకు  ఉద్దేగం రాకుండ నా మొగం సూడగాకు’’ అని ప్రతిజ్ఞ చేసినట్లుగా చెప్పాడు. అన్న శంకర్‍కి కొత్తగా పెళ్లయింది. పెళ్లయిన ఏడాది కొండపొలం చెయ్యకూడదన్న నియమంవల్ల అతన్ని మినహాయించారు. చివరికి రవి తండ్రికి సహాయంగా వెళ్లక తప్పలేదు. తల్లి గురమ్మ చిన్నప్పటి నుంచి రవిని గారాంగా పెంచి, దూరంగా పంపి చదివించింది. వాడికి ‘‘పల్లగొర్రెకు, బొల్లిగొర్రెకు తేడా తెలీదు. కారుపొట్టేలికి, దొడ్డిపొట్టేలికి భేదం కనుక్కోలేడు. తాపుడు పిల్లను దాని తల్లికాడ చేర్చలేడు. అడ్డాలు తాగే పిల్లను కొనుక్కొని పక్కకు లాగలేడు’’ అని మొదట్లో ఒప్పుకోలేదు. చివరికి తన భర్తకి తోడవసరం అని గ్రహించి మరీమరీ జాగ్రత్తలు చెబుతూ కళ్లనీళ్లతో సాగనంపింది. రోజంతా భుజాన్నేసుకునే ఎవరి బత్తెం వాళ్లు మోసకపోతూ బయలు దేరారు తండ్రి కొడుకులు.

            ఏభైరోజుల కొండపొలం అనుభవాన్ని రచయిత వర్ణించినతీరు అద్వితీయం! ఉత్కంఠ భరితంగా, ముందు ముందు ఏమవుతుందోనన్న ఆరాటంతో చివరివరకు చదివిస్తుంది. గొర్రెకాపరుల అనుభవాన్ని ఇంత చక్కగా వర్ణించిన ఇటువంటి నవల ఇంత వరకు రాలేదు. ఈ 21వ శతాబ్దంలో కూడా గొర్రెకాపరుల జీవితాలు ఇలా ఉంటాయా అన్న అశ్చర్యంలో మనల్ని ముంచెత్తుతుందీ నవల! ఈ నవల చదివేటప్పుడు నాకు నచ్చిన అంశాలు, సన్నివేశాలు, వచ్చిన ఆలోచనలు, అడవితో మమేకమైన నా మనస్థితి మీతో పంచుకోవాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం!

            మొదట్లో రవి కొండల్లో ఇతర గొర్రెకాపర్లతో పాటు తను అన్ని రోజులు జీవించగలడా అని సందేహపడ్డాడు. రోజూ స్నానం చెయ్యడానికి నీళ్లుండవు. స్నానం కాదుగదా కాళ్లు కడుక్కున్నా వెంటనే చలిజ్వరం వస్తుంది ఆ నీళ్ల తత్వానికి. పురుగుపుట్రా ఆలోచన లేకుండా నేలమీద పడుకోవాలి. రాళ్లు విసిరి చప్పుళ్లు చేస్తూ అడవుల్లోకి చొచ్చుకుపోతూ ఉండాలి. ఏ క్షణాన్నయినా క్రూరమృగాల దాడి జరగవచ్చు, వానొచ్చినా ఆశ్రయం ఉండదు. గొర్రెల్లాగా ఆరుబయట గడపాల్సిందే. గుండెల్లో దడుపు, అలజడి వలన అడవి అందంగాని, వెన్నెల చల్లదనం గాని ఆస్వాదించలేక పోయాడు. భయం రకరకాల జంతువుల రూపాలెత్తుతూ నిద్రను దూరం చేసేది.

            నెమ్మది నెమ్మదిగా అతనిలో ధైర్యం వచ్చింది. ఎన్నోసార్లు పెద్దనక్క (పులిని గొల్లకాపర్లు అలాగే పిలుస్తారు) దర్శనం అయింది. ఒకసారి చంటిపిల్ల తల్లియైన ముచ్చుగొర్రెను, మరోసారి తనతండ్రి పెంపుడికుక్కను పులుల పాలబడకుండా సాహసంతో వాటిని ఎదుర్కొన్నాడు. ‘‘పెద్దపులి వస్తేరానీ...ఒక గొర్రెను కొరకుతింటది. అంతే గదా!’’ అనేంత నిర్లిప్త మనస్థితికి చేరుకున్నాడు. అడవిలో ఇతర జంతువులైన చిరుత, చిలువ, ఎడగండు (బూడిద రంగు శరీరం మీద నల్ల చారల చిరుబులి) ఎలుగుబంటిలు ముఖాముఖి అవ్వడం వల్ల కూడా అతనిలోని అదురుని తుడిచి పారేసింది. అడవి సౌందర్యం, గొర్రెకాపరుల జీవనసరళి, కొండపొలం అనుభవాలు అతనికి ఎంతో ఇష్టంగా అనిపించి అనుభవించడం అలవాటయింది. అడవి అంటే అయోమయమని, భయమని అనుకున్న అతనికి అడవి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి అడవిని ప్రేమించే మనిషిని తయారు చేసింది. అతనిలోని నిద్రాణమైన మానవత్వాన్ని జాగృతం చేసింది. చివరికి అతని జీవిత గమ్యాన్నే మార్చివేసింది. మొదట్లో అతని పిరికితనాన్ని చూసి నవ్వుకున్న సాటి గొల్లకారపుర్లు అతనిలో వచ్చిన ధైర్యానికి, మార్పుకి అబ్బురపడి వాటిని కథలు కథలుగా చెప్పుకున్నారు.

            నవల చదువుతున్నప్పుడు ప్రకృతి రహస్యాలు, విన్యాసాలు, సౌందర్యాలు, వివిధ రూపాలు మనకళ్ల ముందు నాట్యం చేస్తాయి. వెన్నెలని, ఆకాశాన్ని, అడవిని రచయిత వర్ణించిన తీరు మన మనస్సుల్లో చెరగని ముద్రవేస్తుంది.        ఉదాహరణకి  వెన్నెల వర్ణన: తెల్లని వెన్నెల అడవి అంతటా పరుచుకోవడం, నిశ్శబ్దం దాని కొక ప్రత్యేక అలంకారంగా ఉడటం, పలుచని నీళ్ల మజ్జిగ లాంటి పంచమి వెన్నెల, ఉల్లిపొర లాంటి తెల్లని వస్త్రాన్ని అడవంతా కప్పినట్లుగా వ్యాపించివున్న వెన్నెల,  తెల్లవెన్నెల కొండంతా పరచుకోవడం...      ఆకాశం వర్ణన: ఆకాశం నిండా తెల్ల జొన్నలు ఆరబోసినట్లు చుక్కలు ఉడండం, ఉతికి ఆరేసిన నీలంరంగు ముత్యాలచీరలా అందంగా ఉన్న ఆకాశం, చెట్టు కొమ్మల రెమ్మల సందుల్లోంచి దోబూచులాడే ఆకాశం, నిశ్శబ్దపు భాషతో చీకట్ల నిండావూగే ఆకాశం...  అడవి వర్ణన: ఎతైన శిఖరాల మీద పడుకుని కిందవైపున్న కొండల వరసల్ని చూడటం, చిన్న బోటి మీద పడుకుని చూట్టువున్న ఎత్తుకొండల్ని చూడటం, లోయల్లో ఎక్కడో చిన్న పక్షి అరిచినా ఆ శబ్దం అలలు అలలుగా ప్రతిధ్వనిస్తూ వచ్చి చెవులను సోకడం, మనిషి చేసిన శబ్దం ప్రతిధ్వనిగా మారి చివరికి వాని చెవుల్లోకి వచ్చి చేరడం, కోడిపుంజులు ఎగిరే విన్యాసం, వెదురు పొదల చాటునుంచి తల్లి నెమలి ముచ్చటగా వెంబడి ఐదారు పిల్లలు రావడం, రెండు కొండ చిలువల రతిక్రీడ, పెద్దపెద్ద వృక్షాల మొదళ్లకు కరచుకుని కొమ్మలకేసి పాకే బెట్టుడతలు, వాన కురిసిన తర్వాత కొత్త గుడ్డలు కట్టుకుని పూలు పెట్టుకుని కూచున్న పెండ్లికూతురులావున్న అడవి, అద్భుత సంగీత కచేరి నిర్వహిస్తూ అడవినంతా సంగీత మాధుర్యంతో నింపుతున్న పక్షులు, లోయలోంచి పెద్దపులి వేసిన రంకె గాల్లో తేలి వచ్చినపుడు పక్షులన్ని మూగబోయి నిశ్శబ్దం నిండటం, చివురించిన చెట్లతో అద్భుతంగావున్న అడవి, ఎతైన కొండమీద నిల్చుని చూస్తుంటే అమాయకంగా కనిపించే అడవి, వృక్షాలనిండా దట్టంగా ఆవరించుకుని అద్భుత సౌందర్యాన్ని ప్రసాదించే నిశ్శబ్దం, ఎన్నో కొత్త అనుభవాల్ని అందించే అడవి, ఇలా రాసుకుంటూ పోతే వర్ణనలు కోకొల్లలు!

            రచయిత అడవిలోని రకరకాల చెట్లతో, పళ్లతో, జంతువులలో మనకి పరిచయాలు చేస్తారు.

            చెట్లలోని రకాలు:  ఎర్రపొలిక చెట్లు, తెల్లపొలిక చెట్లు, ఏపచెట్లు, ఇనుమద్ది, భిల్లు, సీకిరేణి, ఉసిరికి, దాదిర, ఎలమ, కొండగోగు, పొలిక చందనపు చెట్లు, తాండ్ర, మద్ది, సండ్ర, వెదురు, సిరిమాను, కొండగోగు చెట్లు, చందనపు చెట్లు...

            పళ్లలోని రకాలు: మోవిపళ్ళు, వెలగపళ్లు, ఈతపండ్లు, టూకిపళ్లు, పరికపళ్లు, అల్లనేరేడు పళ్లు, కొండీతపళ్లు...

            జంతువుల్లోని రకాలు: కడుతులు, గండంగులు, పులులు, కొండచిలువులు, ఎలుగుబంట్లు, ఒంటిపందులు, ఏదు పందులు, రేచులు, చెట్టుడతలు, నెమళ్లు, కోతులు, మేక చిరుతలు.

            నవలలో వచ్చిన రకరకాల సామెతలు కూడా మనకి గిలిగింతలు పెడ్తాయి. కడపజిల్లా మాండలికంలోవున్న ఆ సామెతలు పల్లెటూరి తత్వాన్ని, లోకంపోకడని, జ్ఞానాన్ని మనకి పంచిపెడతాయి. ఉదాహరణకి కొన్ని...

1) నీల్ల కుండ నెత్తిన పెట్టుకుని పుట్టచెండు ఆడగూడదంట,

2) ఒకూరి రెడ్డి ఇంగోకూరికి పసలపోలుగా ఉంటడు  

3) ఇయ్యాల ఇంట్లో రేపు మంట్లో

4) గుడ్డొచ్చినపుడు గూడెతుక్కున్నెట్టుంది యవ్వారమంతా

5) గోడరాయి గోడకు చేర్చటమే మంచిగాని తీసిపారెయ్యడం ఎంతసేపు?

6) కక్కొచ్చినా కళ్యానమొచ్చినా ఆగదని

7) చిక్కి ఇగిలించేదానికన్నా వెల్లి ఎక్కిరించేది మేలు

8) గొర్రెల కాసేవాన్ని కొట్టనివాడు బర్రెల కాసేవాన్ని తిట్టనివాడులేడు

9) చాకలి తెలుపు మంగలి నునుపు

10) తీటవున్నేంక గీరుకోకుంటే ఎట్టా

11) రాత గొట్టినా సేత గొట్టినా దెబ్బ గుర్తుండిపోవా....

            ఇక గొల్లకాపరుల మనస్తత్వాలను, వ్యక్తిత్వాలను, జీవితం పట్ల వాళ్లకున్న అవగాహన గురించి చెప్పుకోకపోతే ఈ సమీక్షకి న్యాయం చేకూర్చినట్లుకాదు. కొండ పొలం వెళ్లిన గుంపందరిలో పుల్లయ్య పెద్దవాడు. ఎన్నో ఏళ్ల కొండపొలం అనుభవంగల ముసలికాపరి. అడవి చరిత్ర సాంతం తెలిసిన వాడు. గుంపులోని కుర్రకారు తొందరపడితే వాళ్లకి నచ్చజెప్పి గొర్రెమంద రక్షించుకునే బాధ్యతను తనమీద వేసుకున్నాడు. అడవి న్యాయం అంటే ఏమిటో అతని సంభాషణల వలన మనకు తెలుస్తుంది. గొర్రెలు కాసేటప్పుడు పులులొస్తాయి. కొండసిలవులొస్తాయి. చిరుతలొస్తాయి, వాటిని తప్పించుకుని పోవాలిగాని, సంపి మందను బతికించుకోవాలని అనుకోకూడదు! పెద్దనక్క రాజ్జెం అడవి.  గొర్రెలు మేపుకుందికి పుల్లరి తీసుకుంటది. గొర్రెనో, పొట్టేలినో పుల్లరిగా చెల్లించి దూరంగా పోవాల. కొండకొచ్చినాంక జీవాలను నష్టపోయేది మామూలే. ఆ నష్టాన్ని కాపరులందరూ భరిస్తారు. భాస్కర్‍ గొర్రెను కొండసిలువ లాక్కేళ్లినప్పుడు, దాని ధర లెక్కవేసి, ఆ నష్టాన్ని అందరూ పంచుకునేలా చేశాడు పుల్లయ్య. అంతే కాకుండా గొర్రెకాపర్లు తమ ప్రాణాలు కాపాడుకుని క్షేమంగా ఇళ్లకు పోవాల.  పెద్దనక్కకు నాలుగైదు గొర్రెలు బలయినా పర్వాలేదు. ఆ సమయంలో పట్టువిడుపులుండాల. ప్రాణం మీదికి తేచ్చుకోకూడదన్నది అతని హెచ్చరింపు. చెట్లను నరికి అడవులను నాశనం చెయ్యగూడదు. పొలం దున్నే నాగలికోసం కొమ్మను నరకవచ్చు. ఐదారేండ్లకు నాగలి అరిగి పోతే మళ్లీ కొమ్మను కొట్టుక్కతెచ్చు. అంతే గాని అనవసరంగా కొమ్మల్ని నరికి అడవిని నాశనం చెయ్యకూడదన్నది అతని సిద్ధాతం.

            గొల్ల కాపరికి తన గొర్ల మీదుండే ప్రేమని కూడా ఎంతో హృద్యమంగా వర్ణించాడు రచయిత. గొర్రెకు ముల్లు గుచ్చుకుని నడవ లేనప్పుడు గొర్రకాలుని పళ్లతో కరచిమరీ ముల్లు తియ్యడం, సేవచేసేటప్పుడు మనిషికీ, జంతువుకీ తేడా చూపించక పోవటం, స్వంత బిడ్డలా చూసుకోవడం, మధ్యాహ్నం తిండి తినేటప్పుడు తప్ప మిగతా సమయమంతా గొర్రెల వెనక తిరిగి తిరిగి, వాటిని ఏమారకుండా కాపాడుకోవడం, గొర్రెలకు పుల్లిక చేసి మేపుకుంటూ తినకుండా వున్నప్పుడు సూదిమందు ఎక్కించడం, గొర్రె ఈనేటప్పుడు మర్ధన చేస్తూ అండగా నిలబడటం - ఇలాంటివి ఎన్నో!

            ఇవిగాక నవలలో అక్కడక్కడా మనస్సును కదిలించే సంఘటనలు తారసపడతాయి. సేద్యగాడయిన కొండా నారాయణ అప్పుపాలై అప్పులు తీర్చలేక పొలందగ్గర గుడిసెలో మందుతాగి మరణించిన వైనం హృదయాలను విషాదభరితం చేస్తుంది. గొల్లకాపరి అంకయ్య గొర్రెలను సాకే పనిలోబడ్డ భార్య సుభద్ర కోరిన చిన్న చిన్న కోరికలను తీర్చలేకపోవడం, ఆమె అలిగి పిల్లాడిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడం, ఆమె ఎడబాటుని అంకయ్య భరించలేక పోవడం, రవితోపాటు కొండదిగి వచ్చినపుడు టెలిఫోను బూతులో ఆవేదనతో భార్యతో మాట్లాడిన వైనం మనసుల్ని ఆర్థ్రతతో నింపుతుంది. పెళ్లికి ముందే తల్లయిన కూతురు తనని చూసి దు:ఖపడి, క్షమించమని అడిగిన విధానం, దానికి రామయ్య పశ్చాత్తాపంతో కరిగి నీరై కన్నీళ్లు కార్చిన సంఘటన మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసి కళ్లనీళ్ల పర్యంతం చేస్తుంది.

గొర్ల కాపర్ల కుటుంబాలలో ఆడవాళ్లదే పెత్తనం అని మనకి నవల చదివేటప్పుడు అర్ధం అవుతుంది. గొర్లకాపర్లు గొర్లను కాస్తూ చాలా వరకూ బయట తిరుగుతుంటారు కాబట్టి ఇంటిపెత్తనమంతా భార్య తీసుకుంటుంది. అంటే మేట్రియార్కల్‍ కుటుంబవిధానం అన్నమాట!

            గొర్రలు కాసేటప్పుడు అక్కడక్కడా ఎర్రచందనపు చెట్లు నరికినట్లు రవికి కనిపించాయి. కొన్ని చోట్ల చందనపు మొద్దులు ఎర్రగా పేర్చబడి ఉన్నాయి. ఎర్రచందనపు దొంగరవాణా గురించి పేపర్లో చదివాడు చాలా సార్లు. ఇప్పుడు కళ్లారా చూశాడు. ట్రాక్టరు కదలికలు కూడా పసిగట్టారు. వాటిని నరికి పెట్టిన ఎర్రచందనం దుంగల్ని తరలించేందుకు తెచ్చారని తెలిసి వచ్చింది. అందమైన ప్రకృతిని అమానుషంగా రాక్షసంగా విధ్వంసం  చేస్తున్నారని బాధపడ్డాడు.

            వానకోసం రైతులేకాదు, గొర్రెకాపర్లు కూడా ప్రాణాలు ఉగ్గబెట్టుకుని ఎదురుచూస్తారు. అడవి వర్ణన లాగే వానల్ని వర్ణించడం ఈ పుస్తకంలోని మరో ప్రత్యేకత! ఆకాశం అంతా మేఘాలు అలుముకున్నాయి. ఉరుములు, మెరుపల సందడి మొదలయింది. మేఘాలు చెట్లను తాకినంతగా కిందకు వంగుతున్నాయి. గొర్రెలు చిందులేస్తూ మోరలు పైకెత్తి ఆకాశం కేసి చూస్తున్నాయి. రాబోయే వానని, ఊహించుకుని ఎగిరెగిరి పడ్తున్నాయి. వాతావరణంలోని తేమశాతంలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల్ని పసిగట్టి వానరాకడ తెలుసుకుంటాయి గొర్రెలు.  రాత్రి చందమామ గాని, పగలు పొద్దుగాని కనిపించని ఆకాశం చాలా ఆహ్లాదకరంగా వుంది. రాత్రంతా వాన కురిసింది. గొర్రెలు తెల్లవార్లూ నిలబడి, చెట్లలాగా, రాళ్లలాగా వానకి తలొంచాయి. ఏ కొండమీద చూసిన నీటి జాలులే. సెలలన్నీ ప్రాణం వచ్చి కొండ చిలువలై పరుగులు తీస్తున్నాయి. చెట్లన్నీ తడిచి శుభ్రపడి పసరు కక్కుతూ వున్నాయి. పర్వతాలకూ, సెలయేర్లకూ నోరోచ్చింది. వాన కురిసిన ఆనందం అన్ని బాధల్నీ మింగేసింది. మిట్టపల్లాలను ఏకం చేసింది. వంకల్నీ, వాగుల్నీ చెరువులతో కలిపింది. చేలల్లో ఎటుచూసినా మనషులే! ఎద్దులతో, ట్రాక్టర్లతో నేలను దున్నుతున్నారు. ‘‘ఒక్కవాన ఎంత మార్పు తెచ్చింది’’ అనుకున్నాడు రవి.

ఏభైరోజుల శ్రమంతా కరిగిపోయింది. కొండనించి వచ్చిన మనషులకు ఉలవ గుగ్గిళ్లు, ఉలవచారుతో తొలి భోజనం పెట్టారు. అది గొల్లల ఆచారం. అడవి నుండి వెంట తెచ్చుకున్న చాలారకాల శారీరక రుగ్మతల్ని అది తొలగిస్తుందట!

            ఇక రచయిత నవల చివరిలో ఇచ్చిన ముగింపు ఎంతో ఆదర్శప్రాయంగా ఉంది. కొండపొలం అనుభవం రవిని ఆధ్యంతం మార్చివేసింది. నాలుగు గోడల మధ్య ప్రాణంలేసి కంప్యూటర్లతో చేసే సాఫ్ట్వేర్‍ ఉద్యోగం తనకి సరిపడదని గ్రహించాడు. మనుషులు చెట్లు, చేమలు, జంతువులు ఉన్న ప్రాణమున్న ప్రపంచం కావాలనిపించింది. అటవీశాఖలో జిల్లా స్థాయి అధికారి కావాలన్న ధ్వేయం పెట్టుకుని రెండేళ్లు కష్టపడ్డాడు. నేరుగా డిఎఫ్‍ఒ ఉద్యోగాన్ని సాధించగలిగాడు. అధికారిగా మొదటిసారి అడవిలోకి అడుగుపెట్టినపుడు అమ్మ ఒడిలోకి వెళ్లినంతగా అనుభూతించాడు. గిరిజనులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. అడవి నరికేవాళ్ల ఆగడాలను అరికట్టగలిగాడు. తన పరిధిలో నిజాయితీ పరుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు. పల్లె టూరి పిల్లనే పెళ్లి చేసుకుని ప్రతి పండుగకు పల్లె వెళ్తున్నాడు. అది అతనికి కొత్త శక్తి ఏదో ఇస్తున్నది. ఆ శక్తే అధికారుల వొత్తిళ్ళనూ, రాజకీయ నాయకుల బెదిరింపులను, స్మగ్లర్లను ఎదుర్కునేందుకు ధైర్యాన్నిస్తున్నది.

            చివరగా రచయిత తన ముందు మాటలో అన్న వాక్యాలను గుర్తు  చేసుకుందాం. ‘‘నా కాళ్ల కింద నేల, నాచుట్టూవున్న జీవితాలు కలిసి నాచేత రాయించిన మరో నవల యీ కొండపొలం.  సగిలేటి నుంచి నల్లమలదాకా వున్న బరక పొలాలూ, మెరక నేలలూ, రకరకాల జీవరాశులతో కూడిన యీ నేలకు నేను ఆస్థాన లేఖకుడ్ని. నిరంతరం వాటి ముందు కూచుని అవి చెప్పే విషయాల్ని శ్రద్ధగా వింటూ రాసి ప్రకటించటం నా పని. ఆ పరంపరలో ఇప్పుడు నల్లమల కొండల వంతు వచ్చింది”. ఈ పరంపరలో భాగంగా ఇంకెన్నో ఆణిముత్యాలు ఆయన కలలనుండి ఒలుకుతాయన్న ఆశాభావాన్ని మనలో కరిగించాయి యీ మాటలు! చూపులు ముందుకు సాగించి ఎదురు తెన్నులు చూద్దాం మరి!


ఈ సంచికలో...                     

Jan 2021

ఇతర పత్రికలు