సాహిత్య వ్యాసాలు

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

చరిత్ర గతిలో తెలుగు భాష

తెలుగు భాషను ప్రజలు కాలం నుంచి  మాట్లాడే వారు? తెలుగువారు ద్రావిడులా? వేదకాలం ముందు నుండి తెలుగువారు ఉండేవారా? తెలుగు లిపి ఎప్పుడు ఏర్పడింది?తెలుగు భాష ఎందుకు మధురమైన భాషగా పేరొందింది?తెలుగు భాష 2000 సంవత్సరాలకు పూర్వం లేదా? ఇలాంటి ప్రశ్నలకు   సమాధానాలను వెదుక్కోవడమే  వ్యాసం ప్రధాన ఉద్దేశం.

బౌద్ధ సాహిత్యంలో బుద్ధుని చూడటానికి అంధక రట్టం నుండి బావరి అనే బౌద్ధ భిక్షువు వచ్చాడని పేర్కొన్నారు. అంధకరట్టం అంటే అంధక ప్రాంతం అని అర్థం.    బుద్ధఘోషుడు  రాసిన 'మజ్జినికాయం'పై ప్రపంచ సూదని అనే పేరుతో ఒక వ్యాఖ్యానం వచ్చింది. దానిలో తమిళ,అంధకాదిభాషలోకి బౌద్ధ పిటకాలను అనువదించారని పేర్కొన్నారు. అంటే క్రీస్తు పూర్వం 400 నాటికే అంధక భాష సాహిత్య భాషగా ఉందని తెలుస్తోంది. తెలుగు భాష ప్రాచీన రూపమే అంధకభాషయని  పాళీ భాషా పండితుడు నళినాక్షి దత్తు పేర్కొన్నారని జయధీర్ తిరుమలరావు తన భాషా ఆవరణంలో పేర్కొన్నారు.   క్రీ.పూ. 500 లో బుద్ధుడు ఉన్నప్పటి నుండి క్రీ.పూ.400 వరకు పదాన్ని వాడారు. సుత్తనిపాతంలోని పరాయనవర్గంలో వత్తుగాథలో అస్సక, అశ్మకులు,అంధక రాజుల గురించి రాసినారు.

అస్సక అశ్మక (క్రీ.పూ. 700_ 300) అనే జనపదం తెలంగాణలోని నిజామాబాద్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోధన్ గా చరిత్రకారులు గుర్తించారు.దీనికి సంబంధించిన నాణేలు లభించడంతో జనపదాల గురించి తెలిసింది.నాణేల ద్వారా తెలుగు భాష  చరిత్ర ను కనుగొన్న వివరాల గురించి వ్యాసం లో మరోచోట చూస్తాం

క్రీ.పూ.2 శతాబ్దానికి చెందిన బౌద్ధ గ్రంథం సమంత పాసాధికంలో  తమిళులతో  పాటు ఆంధ్రుల ప్రసక్తి కూడా ఉంది. జైన జాతక కథ సెరివాణిజ కథలో ఆంధ్రులు తేల్ నదీ తీరాన అంధకపురం నిర్మించినట్లు ఉంది. తేల్ నది ఒరిస్సాలో  ప్రవహిస్తున్న మహానదికి ఉపనది.

ఆంధ్రులు మౌర్య సామ్రాజ్యంలో నివసించేవారని క్రీ.పూ.256 లోని అశోకుని శాసనంలో ఆంధ్రుల ప్రసక్తి ఉంది శాసనంలో అంధ్ర శబ్దమే నేటి ఆంధ్ర శబ్దమని తుర్లపాటి రాజేశ్వరి తెలుగు ధనంలో పేర్కొన్నారు.

      ఐతరేయ బ్రాహ్మణం ( క్రీ.పూ. 800) లో ఆంధ్ర అనే పదం వాడారు. దీనిని జాతి అనే అర్థంలో  వాడివుంటారని చరిత్రకారులు భావించారు. పదమే ప్రాకృతంలో అంధక గా మారిందిఅంధకరట్టం అంటే అంధక ప్రాంతమని అర్థం.   'అంధకరట్ట'నే 'ఆంధ్రాపథం' గా  క్రీ. . 300 నాటి పల్లవరాజుల కాలం  నాటి  గుంటూరు దగ్గర ఉన్న మైదవోలు శాసనంలో రాశారని చరిత్రకారులు గుర్తించారు

  ప్రాచీన నాణేలపై కనిపించిన పులుమావి పదం తెలుగు భాషా పదమేనని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆనాటి తెలుగు భాష, ప్రాకృతం లో కలిసి ఉండేదని హాలుడు రాసిన "గాథాసప్తశతి" ద్వారా తెలుస్తోంది. పైశాచిక భాష ప్రాకృతం లో ఒక భాగంగుణాఢ్యుడు రాసిన బృహత్కథను పైశాచీ భాషలో రాశాడు.ఆనాటి ఆంధ్రుల భాష దాదాపు పైశాచిక భాషకు దగ్గరగా ఉండేది.తెలుగు భాషపై సంస్కృతం, ప్రాకృత భాషల ప్రభావం ఎక్కువగా ఉంది. క్రీ. పూ. 1వశతాబ్దం నాటి బ్రాహ్మీ లిపిలో  ఉన్న తంబయ్య శాసనం విశాఖ జిల్లా కొత్తూరు సమీపంలో బయటపడింది. తంబయ్య అన్నది పూర్తిగా తెలుగు పదం. క్రీ.. 100 నాటి అమరావతి స్థూపం లో నాగబుద్ధ అనే తెలుగు శబ్దం లభించింది.    

కృష్ణా  ముఖద్వారాన్ని బౌద్ధ సాహిత్యంలోశ్రీలంక థాయిలాండ్ దేశాల  ప్రాచీన సాహిత్యంలో నాగ భూమని, వజ్ర దేశమని, మంజీర దేశమని పిలిచేవారు. నాగులు, శబరులు, యక్షులు అశ్మకులు తెలుగులో ఇక్కడ జీవించేవారు. ఆర్యుల దండయాత్రల వల్ల ఆంధ్రులనే తెగ ఉత్తరదేశంనుండి ఇక్కడకు వలస వచ్చారు.మొదట్లో వారి   క్కడ తెలుగువారితో  ఘర్షణ పడి తర్వాత కలిసిపోయారు. కృష్ణ గోదావరి తీర ప్రాంతంలో క్రీ. పూ.ఐదవ శతాబ్దం నాటికే వారిక్కడ స్థిరపడ్డారు. వీరు రాకపూర్వం కృష్ణా గోదావరి రాయలసీమ ప్రాంతాల జనపదాల ప్రజలు తెలుగు వారని, వారిభాష తెలుగని కోరాడ రామకృష్ణయ్య పేర్కొన్నారు.ఆంధ్రులు వింధ్య (దక్షిణ ఉత్తర దేశాల మధ్య సరిహద్దు మధ్యప్రదేశ్ )కు దక్షిణ ప్రాంతంలో పుండ్ర, పులింద,శబర,మూతిబుల తో కలిసి జీవించినట్లు ఐతరేయ బ్రాహ్మణంలో కూడా వర్ణించారు. బ్రాహ్మణాలు క్రీ.పూ. 900_700 మధ్య కాలం నాటివి.

తెలుగు మాట్లాడే ప్రజల్లో చాలామంది నాగజాతి వారే.ఆంధ్రదేశంలో అమరావతిలో క్రీ..ఒకటవ శతాబ్దానికి సంబందించిన ఒక రాతిపలకపై నాగబు అనే పదం ఉంది.దాని కింది లైనులో 'ద్ది గానం'అని వుంది. దాని పూర్తి పదం 'నాగబుద్ది దానం'. నాగ అనే పదం తెలుగు ప్రాంతం లో ఎక్కువ వాడుకలో ఉంది. నాగభవనం (నాగుల చోటు), నాగమాణవక (నాగ యువకుడు), నాగరాజు పదాలు శాసనాలలో ఉన్నాయి. నాగరాజును వైదిక సాహిత్యం 'దాహక'గా  చెప్పింది. కాలక్రమంలో దాహక పదం దాస గా అయిందన్నాడు అంబేద్కర్.

దక్షిణాపథంలోని స్థానికులను  ఆంధ్రులను ఆర్యులు రాక్షసులుగా చిత్రీకరించారు తాము రాసిన ఇతిహాసాలలో, పురాణాలలో. ఆంధ్రులు తమ సంస్కృతిని రక్షించుకోవడానికి ఆర్యుల తో ఘర్షణ పడ్డారు 

అందువల్ల వారిని  రాక్షసులుగా పేర్కొన్నారు.దాంతో వీరి భావజాలం జైన బౌద్ధ ధర్మాలకు ప్రాతిపదిక అయింది. క్రీ.. 5 శతాబ్దంలో మతంగముని రాసిన 'బృహద్దేశి' లో దేశీయ ప్రబంధాలు ఉండేవని,వాటిల్లో కందాలు,వృత్తాలు, గద్యం, దండకం మొదలైనవే కాక ద్వి పద,త్రిపద,పాట,పదం, ఏలలు వంటి దేశీ ఛందోరీతులు ఉండేవని అవి ప్రజలు పాడుకునే వారని జయధీర్ తిరుమలరావు పేర్కొన్నారు.దీనిని బట్టి నన్నయ కు ముందే చాలామంది కవులు ఉండేవారు.వారంతా అలిఖిత కవులు.

'కుమారసంభవం'లో నన్నెచోడుడు రాసిన "మును మార్గ కవిత లోకం/బున   వెలయగ దేశి కవిత బుట్టించి తెనుం/గును  నింపి రంధ్ర విషయం /బున జన చాళుక్యరాజు మొదలుగ పలువుర్" పద్యంలో మొదటి పాదంలో చెప్పినట్లు మార్గ కవిత కంటే దేశి కవిత ముందే ఉండేదని తెలుస్తోందని తెలుస్తోందిదేశి కవిత ను ముందుకు తెచ్చింది జైనులని భాగవతుల ఉమామహేశ్వర శర్మ భావించారు. తెలుగు కన్నడ రాష్ట్రాల నేలిన బాదామి చాళుక్యుల కాలంలో పెరిగి పెద్దదయిన దేశి కవిత,వేంగి చాళుక్యుల కాలానికి (క్రీ. . ఏడవ శతాబ్దం) ఆంధ్రం అయ్యిందని శర్మ భావించారు.

దేశి కవిత నన్నెచోడుని నాటికీ తెలుగు కవితకు వర్తించిన పేరు. ఇది  అలిఖిత సాహిత్యం. దీన్ని ఆశుసాహిత్యం అన్నాడు వేల్చేరు నారాయణరావు. ఆశు కవి సహజ కవి.అతను రచిస్తూ పాడతాడు. పాడుతూ రచిస్తాడు. సాహిత్యమంతా కథాగేయాలుంటాయి. కథ ఒకే మార్గంలో సాగదు. లిఖిత సాహిత్యంలో లాగా ఏక ముఖంగా కాక వర్తుల క్రమంలో ఉంటుంది. ఆశుకవితకు తన గొంతు మించిన ఆధారం లేదు. తన పాత్రకు మించిన ప్రమాణం లేదు. బొబ్బిలి యుద్దం కథ, పల్నాటి కథ ఇలాంటివే. తర్వాత శైవకవులు దేశికవిత నుండి మార్గ కవితకు అంటే ఛందోబద్ధమైన కవితకు మల్లారు.

నన్నయ కంటే ముందే అనేక పద్యాలు, శాసనాలు జానపద సాహిత్యంలో ఉన్నాయి. వాటి ఆధారంగానే నన్నయ తన రచనలు కొనసాగించాడు. నన్నయకు పూర్వం కవిత పైన చెప్పుకున్నట్లు మౌఖికంగా జానపదం లో ఉండేది. నన్నయను ఆదికవిగా చెప్పడం వల్ల తెలుగు సాహిత్యానికి తీవ్ర అన్యాయం జరిగింది. దాని వల్ల తెలుగు ప్రాచీన హోదాకు చాలా కాలం పాటు విఘాతం కూడా ఏర్పడింది. కాకపోతే నన్నయ తెలుగు  లిఖిత కవిత్వానికి మొట్టమొదటి పెద్ద కవిగా నిలిచారని వర్ణించాడు వేల్చేరు.          

శాతవాహనుల కంటే ముందు అంటే క్రీ.పూ.200 లనే నిశంభుడనే రాజు తెలుగు జనపధాన్ని  కృష్ణా తీరాన ఉన్న శ్రీకాకుళంను రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. ఆంధ్ర విష్ణువు అనే రాజు నిశంభుడనే నాగజాతికి చెందిన తెలుగు రాజును ఓడించి తన రాజ్యాన్ని విస్తరించినట్లు, ఆయన ఆంధ్ర ప్రాంతాన్ని చాలాకాలం పరిపాలించినట్లు  పురాణాలు చెబుతున్నాయి.    ఆంధ్రవిష్ణువు రాయలసీమలోని శ్రీశైలం,కోస్తాలోని భీమేశ్వరం, తెలంగాణాలోని కాళేశ్వరం లను కలుపుతూ తన రాజ్యాన్ని  నిర్మించుకొన్నాడని అంటారు. వీటి మధ్య ఉన్న ఆయన రాజ్యాన్ని త్రిలింగదేశం అన్నారు. వారి భాషను త్రిలింగ భాష అన్నారుకాలక్రమంలో త్రిలింగ ,తెలింగ ,తర్వాత అది తెలింగ, తెలుంగు గా మారి తెలుగు అయిందని భావిస్తున్నారు.

క్రీస్తుశకం 4 శతాబ్దానికి చెందిన నాట్యాచార్యుడు భరతుడు తన కాలంలో రంగస్థల కళాకారులు వాడే భాషలో ఆంధ్ర ఒకటని రాసుకున్నారు.  

శ్రీకృష్ణదేవరాయలు కన్నా 95 సంవత్సరాలకు ముందే ఇటలీ భాషా శాస్త్రజ్ఞుడు నికోల డి కోంటే    క్రీ.. 1420-21 లోరాయలసీమ ప్రాంతంలో తిరిగి తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కొనియాడారు. తెలుగు ఇటలీ భాష లాగా అజంత భాష కావడం వల్ల నూ, తెలుగులో సంగీత ధారా ప్రవాహం ఉండటం వల్లనూ ఆయన భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఉంటారని పరిశోధకులు భావించారు. ఇది  తెలుగుకు ఒక బిరుదుగా మారింది.

తెలుగు తేనెకన్నా తియ్యనిది. అది మధురమైన భాష. తెలుగు భాషకు ఉన్న వైదుష్యాన్ని శ్రీనాథుడు ఏనాడో చెప్పాడు చెప్పాడు. పాల్కురికి సోమనాథుడు చెప్పాడు. శ్రీనాథుడు అయితే "జనని సంస్కృతంబు సకల భాషలకును/ దేశ భాషలందు తెలుగు లెస్స " అనంటే కృష్ణదేవరాయలు అదే విధంగానే తెలుగు విశిష్టతను చెబుతూ

" తెలుగదేల యన్న దేశంబు తెలుగేను/ తెలుగు వల్లభుండ తెలుగొకండ /ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి/ దేశ భాషలందు తెలుగు లెస్స" అంటూ తెలుగును దేశవ్యాప్తం  చేశాడు. పాల్కురికి ప్రజల భాషకు పట్టం కడుతూ "ఉరుతర గద్య  పద్యోక్తుల కంటే సరసమై పరిగిన జానుతెనుగు లో  ద్విపదలు" రాస్తానన్నాడు.

క్రీస్తుశకం 1020 ప్రాంతంలో నన్నయ వైదిక మతోద్దరణ కోసం సంస్కృత భారతాన్ని తెలుగులో కి అనువదించాడు.ఆయన దేశి మార్గాన్ని వదిలి మార్గ పద్ధతికి బాటలు వేశాడు. సంస్కృత పదాలకు చివరిలో డుమువులు చేర్చి తెలుగు పదాలుగా మార్చి వేసి తెలుగును సంస్కృతీకరణ చేశాడు. దీంతో తెలుగు పలుకు బడులు నాశనమయ్యాయి. వ్యవహారిక భాషకు తగిన తెలుగు పదాలు ఉన్నాయి. కానీ వాటికి సమానంగా సంస్కృత భాషలో లేవు.తల, కాలు, చేయి, గుండె ,పల్లె ,అమ్మ ,చెల్లి,మామ, బువ్వ,చెరువు, గాలి, వాన, రాయి,తిను ఇలాంటి తెలుగు పదాలను వదిలేసి సంస్కృత పదాలను దిగుమతి చేశాడు  తెలుగులోకి. దాంతో తెలుగు భాష కృతకభాషగా తయారైంది. 

కృష్ణా జిల్లాలోని నందిగామ మండలంలో సింగవరం గ్రామం లో అంధక తెలుగు జనపదానికి చెందిన తవ్వకాల్లో వెండి నాణేలు బయటపడ్డాయి. వీటిని సింగవరం నాణేలు అంటారు. నాణేలలలో నొక్కుడు గుర్తు గల నాణేలు  మౌర్యుల  కన్నా ముందుకాలానివిగా ఉన్న ట్లు గుర్తించారు. అందువల్ల తెలుగు జనపదం మౌర్యలకన్నా  ముందున్న రాజవంశాల పాలనలో ఉన్నట్లుగా  డా!!దెమో రాజారెడ్డి భావించారు.

అదే విధంగా కరీంనగర్ కు దగ్గర 72 కిలోమీటర్ల దూరంలో కోటిలింగాల గ్రామం ఉంది. కోటిలింగాలలో  నొక్కుడు నాణేలు దొరికాయి.ఇవి లిపిగల నాణేల కన్నా ముందువి. సింగవరం లో దొరికిన కొన్ని నాణేల పైన లిపి లేదు. వివరాలు లేని నాణేలు రాజు ముద్రించాడో చెప్పడం కష్టమని అభిప్రాయపడ్డాడు డాక్టర్ రాజా రెడ్డి. కాకపోతే లిపిలేని నాణేలను మొదట, తర్వాత లిపిగల నాణేలను  మొట్టమొదట విడుదల చేసిన రాజు గోభదుడు. నాణాలలో బొరుసు ఖాళీగా ఉంది.ఇతని తర్వాత వచ్చిన రాజుల్లో చివరివాడు సమ గోపుడు.ఇతను విడుదల చేసిన నాణేలపై గల  అక్షరాలు లిపి శాస్త్రాల ప్రకారం  క్రీ. పూ. మూడవ శతాబ్ది గాని లేదా అంతకు ముందు కాలానికి గాని చెందినవని తేల్చారు.నాణేల ఆధారంగా తెలుగు భాష  క్రీ.పూ. మూడు శతాబ్దం నాటికే ఉందని  నిరూపించారు డాక్టర్ రాజా రెడ్డి తన పరిశోధన ద్వారా.

హైదరాబాద్ దగ్గరున్న కీసరగుట్ట దగ్గర ఒక రాతి గుండుపై క్రీస్తుశకం 4 శతాబ్దానికి చెందిన తొలుచు వాన్రు( బండలు తొలిచే వాళ్ళు) అనే చిన్న శాసనం లభించింది. ఇక మూడవ శతాబ్దంలో పాలించిన ఇక్ష్వాకుల శాసనాలలో ప్రాకృత భాషలో చాలా తెలుగు పదాలు ఉన్నాయి

తెలుగు భాష ప్రాచీనతను తెలుసు కోవడం అంటే మన అమ్మ భాష పుట్టు పూర్వోత్తరాలను మనం తెలుసు కొని దాన్ని కలకాలం కాపాడుకోవాలి.