సాహిత్య వ్యాసాలు

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

రెబెల్ ఒక జ్ఞాపకం 

జ్ఞాపకం మనిషి సంపాదించుకున్న సంపద.దాంట్లో ఏ స్వార్థముండదు. అందరికీ పంచాలనుకుంటారు. పంచుకోలేకపోతే ఏమవుతానోనని గాభరా పడుతుంటారు.ఎవ్వరైనా తమ జ్ఞాపకాలను పంచుకునేటప్పుడు పసిపిల్లలై పోతారు.వాళ్ల జ్ఞాపకాలకు తగ్గట్టుగా ముఖ కదలికల్ని, భాషని,భావావేశాల్ని వ్యక్తపరుస్తుంటారు. చెప్తూ చెప్తూ వినే వారి ముఖాల్లోకి తొంగి చూస్తుంటారు.అలా తమ జ్ఞాపకాల మూటని ఒక్కొక్కటి విప్పిజెప్తూ సంతోషపడి, దుఃఖపడి తన సొంతాస్తి లాగే మళ్ళీ మూట గట్టుకొని తమ గుండె గదిలో పదిలపరుచుకుంటారు.నిజానికి జ్ఞాపకాలకు న్యాయ నిర్ణేతలుండరు. మార్కులుండవు. సత్కారాలుండవు. బిరుదులుండవు. ఎవరికి వారుగా ఆస్వాదించుకోవడం తప్ప.

అటువంటి జ్ఞాపకమే రెబల్.ఈ నవలను హెచ్చార్కె గారు 1960 చరిత్రని 2020 లో రాశారు. హెచ్చార్కె గారు ఇందులో కథానాయకుడైన పవన్ కుమార్ జీవితంలోని  "బాల్యం,విద్యాభ్యాసం, సాహిత్యాభిరుచి, పెళ్లి, ఎమర్జెన్సీ క్రూరత్వం, విమోచన పత్రిక తో ప్రయాణం, పార్టీ చీలికల దుఃఖం, చివరిగా రాజీనామా"లాంటి ప్రధానమైన సంఘటనల అనుభవాల్ని, 1961-85 మధ్య కాలంలోని రాజకీయ పరిస్థితుల్ని రచయిత టోన్ లో, పవన్ కుమార్ తనకు చెప్పినట్టుగా చెప్తాడు. ఈ ప్రక్రియ పాఠకునిగా నన్ను బాగా ఆకట్టుకుంది. అట్లాంటి ఈ నవల గురించి నా అనుభూతిని పంచుకుంటున్నా.నేను తడమని జ్ఞాపకాలు ఇంకా ఎన్నో ఇందులో మిగిలేవున్నాయి.

నిస్సహాయురాలైన అమ్మ, అసహనపు ములుగర్రైనా నాన్న, వెన్న పూసిన జొన్న రొట్టె నిచ్చే నానమ్మ పవన్ కుమార్ జీవితం లో చెరగని ముద్రలు. తన బాల్యంతో పెనవేసుకున్న నాలుగూర్లు, అక్కడి ప్రకృతి, మిత్రులు, బర్రెలు కాసిన జ్ఞాపకాలు, కథ జెప్పే పుల్లన్నతో తియ్యని రాత్రులు, కథల పుస్తకాలతో తీరని ఆకలి,వీపుపై నాన్న ములుగర్రతో చేసిన సత్కారాలు,రమణమూర్తి మాస్టారు,ఆయనిచ్చిన శ్రీశ్రీ-మహాప్రస్థానం, అడుగడుగున భుజం తట్టిన తీరు, ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షల్లో జరిగిన అవమానం,అయినప్పటికీ పాసై స్టడీ సర్టిఫికేట్ లో "ఇంటలిజెంట్ బట్ గల్లిబుల్"అని రమణమూర్తి సర్ రాసిన పదాలు. ఇలా లెక్కలేనన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తాడు, భయపడతాడు, సంబరపడుతాడు. పెద్దయ్యాక తన జీవితాన్ని జాక్ లండన్ నవలలోని పాత్రలతో పోల్చుకుంటూ తనని తానే తత్వవేత్తల భుజం తట్టుకుంటూ జాక్ లండన్ గామారిపోతాడు. అట్లా సాహిత్యాన్ని తన జీవితంలోకి వంపుకొన్నాడు.

పవన్ కుమార్ ఉన్నత విద్య కోసం విజయవాడలోని లాహిరి పట్నంలోని లయోలా కాలేజ్ లో చేరాడు.నాలుగేళ్ళ కళాశాల విద్యను "జైలు జీవితం"తో పోల్చుకున్నాడు.ఎందుకంటే తనకు అధ్యాపకుల తీరు,తన అభిరుచుల ఆకలిని తీర్చలేని విద్యా విధానం నచ్చలేదు.అయిష్టంగానే చదివాడు. పవన్ కుమార్ పి.యు.సి లో ఉండగానే 'జ్వాల' పత్రిక కు,డిగ్రీలో లో 'జ్యోతి', 'మార్చ్' పత్రికలకు కవితలు రాశాడు. అయినా కూడా ఆ కాలేజీలో ఉన్న సాంస్కృతిక వేదికైన 'ఎలైట్ క్లబ్' తనను గుర్తించలేదని బాధపడతాడు. ఇంకా తెలుగు గొప్పతనాన్ని చెప్పిన విశ్వనాథ సత్యనారాయణ ఉపన్యాసం, అసహనంలో ఉన్న చండ్రపుల్లారెడ్డిని కలిసి అసంతృప్తితో వెనుతిరిగి రావడం గుర్తు చేసుకున్నాడు.ముందే ప్లాన్ చేసుకోలేదు. తన యెద ఒత్తిడి పెరిగితే స్వేచ్ఛ కావాలని కోరుకుంటాడు. అది తనంతట తానే రాదనుకుంటాడు.ఎన్ని ఆటంకాలు ఎదురైనా దాన్నీ సాధించుకోవాలనుకుంటాడు.

తన కాలేజ్ అనుభవాలు చెప్తుంటే నాకు నేటి విద్యా వ్యవస్థ గుర్తొచ్చింది.ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల అభిరుచుల్ని చంపేసి, ఒత్తిళ్ళతో చదివించడం, ర్యాంకుల్లో బంధించడం,లేదంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి ఆశాస్త్రీయమైన విద్యను ప్రభుత్వాలే ప్రోత్సహించడం తప్పని ఎన్ని పోరాటాలు చేసినా ప్రశ్నించే గొంతుల 'దేశ ద్రోహులంటూ' జైళ్ల పాల్జేయడం జరుగుతున్నది. ఇది ముమ్మాటికీ ప్రగతినిరోధకం. ఇకనైనా ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ప్రజాస్వామికంగా విద్య కొనసాగుతే దేశ ప్రజలు బాగుపడతారు.

ఆ తరువాత పవన్ కుమార్ పీజీ చదవడానికి విశాఖపట్నం వెళ్ళాడు.ఆంధ్ర యూనివర్సిటీలో MA తెలుగు. ఆ రెండేళ్ళు తన పన్నెండేళ్ల జీవితాన్ని మార్చింది.విశాఖలో విప్లవాభిమానిగా మొదలై సాహిత్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు.అందుకోసం విశాఖపట్నం లో తనకు నచ్చిన రామకృష్ణ బీచ్ లో నారాయణ మూర్తి,గంటి ప్రసాదం,వంగపండు ప్రసాదరావు,సి.వి.సుబ్బారావు, కృష్ణ బాయి,చలసాని ప్రసాద్ ఇంకా ఇతర విశాఖ విరసం యూనిట్ సభ్యులను కలుసుకునేవాడు. సహచర్యం బలపడింది. అక్కడి ప్రతి అనుభవాన్ని మనసులో ఇమిడించుకున్నాడు. రోజుల్లో పాత సాంప్రదాయాలతో వ్యక్తి పూజలతో,భక్తి రక్తి లో,తూలుతున్న కవులను వ్యతిరేకిస్తూ "రచయితలారా మీరెటువైపు"అనే చారిత్రక కరపత్రం వేసిన విశాఖ విద్యార్థుల్లో ఒకరైన N.S. మరణం యాది చేసుకుని కుమిలి పోయాడు.పార్వతీపురం కుట్రకేసు కోర్టు ఆరుబయట జరుగుతుండగా అక్కడికొచ్చిన శివసాగర్ ను చూసి మురిసిపోయాడు. రమణారెడ్డి ప్రసంగం విని ఎంతో స్ఫూర్తి పొందాడు. విశాఖలో నేర్చుకున్న ప్రతిదీ తన గ్రామంలో అప్లై చేశాడంటే ప్రజా ఉద్యమాల పట్ల తనెంత ప్రేరేపించబడ్డాడో తెలుస్తుంది.ఇదే శాస్త్రీయ విద్య అంటే. పుట్టినూరికి ఉపయోగపడేది.

తన విద్యానంతరం విద్యార్థి ఉద్యమంలో క్రియా శీలకంగా పని చేస్తూ,  తన జీవితం ప్రజా పోరు బాటలో రూపుదిద్దుకుంటున్న క్రమంలోనే తను ప్రేమించిన మరదలు విజయ ను పెళ్లి చేసుకున్నాడు."కట్నకానుకలు లేవు,సాంప్రదాయ క్రతువులు లేవు, ఆడంబరాలు,అనవసర విందు వినోదాల్లేవు.అసలు పంతులే లేకుండా పెళ్లి జరిగింది. పెళ్లికి ముందే పవన్ కుమార్, విజయ లు "ఎవరు కూడా గిఫ్టులు తీసుకు రావద్దు, భోజనాలు ఉండవని" ముందుగానే కార్డు లో రాసి పంపడం ముచ్చటైన ముచ్చట. ఎవ్వరూ రారనుకున్నారు. హాలంతా నిండింది. ప్రగతిశీలతని ప్రజలు ఎప్పుడూ స్వాగతిస్తూనేవుంటారని చెప్పడానికి ఇలాంటి ఆదర్శ వివాహాలు నిదర్శనం.కుల వర్గ నిర్ములానకి, ఆదర్శ వివాహాలు నేటి అవసరం.అందుకు ప్రత్యేక రక్షణ చట్టాలు కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయాలి.

దేశమంతా ఎమర్జెన్సీతో అట్టుడికిపోతున్నది.ప్రభుత్వ విధానాలను ఏమాత్రం ఈసడించుకున్న అరెస్టులు చేయబడుతున్నారు.అలాగే  పెళ్లయిన కొద్ది రోజులకే పవన్ కుమార్ అరెస్ట్ చేయబడ్డాడు. అప్పటి పరిస్థితిని చెప్పడానికి పవన్ కుమార్ విలియం శీరర్ అనే జర్నలిస్టు రాసిన "ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది థర్డ్ రీక్"అనే పుస్తకాన్ని చదివాడు. దాన్ని ఇందిరమ్మ ఎమర్జెన్సీ తో పోల్చిండు.అహంకారంతో చేసిన దుర్మార్గాలను కప్పిపుచ్చుకోవడానికి పాలనాధికారాలు దక్కించుకోవడానికి "నాజీజం" తో హిట్లర్ 12 సంవత్సరాలు, "నేషనల్ సోషలిజం" తో ఇందిరమ్మ 21 నెలలు ప్రజలపై ధమనకాండ సాగించారు. ప్రభుత్వ విధానాలను ఏ కొంచెం వ్యతిరేకించిన అరెస్టులు, అత్యాచారాలు,హత్యలు,ఎన్కౌంటర్లు తప్పలేదు. చెల్లాచెదురైన జీవితాలు లెక్కేలేదని చెప్పాడు. ఇంకా ఎమర్జెన్సీ నేటికీ ఆగలేదని గుర్తు చేస్తూ "నేషనల్ సోషలిజం ఇందిరా నుంచి రాజీవ్ ద్వారా వాజ్ పై నుండి మోడీ వరకు కాంతులీనుతూ నే ఉంది. ఇండియా మరో థర్డ్ రీక్ అయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంది.ఈసారి 21 నెలలు ఉండదు.అంత బహిరంగంగానే ఉండదు"అంటాడు.  అవును నేడు కళ్ళ ముందు జరుగుతున్న నిర్బంధాన్ని ప్రతీ ఒక్కరు చూస్తున్నారు. ప్రాథమిక హక్కులు దక్కించుకోను పోరాడుతున్నారు. పీడించబడుతున్నారు,ప్రశ్నిస్తూనే చంపబడుతున్నారు. ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఫాసిస్ట్ విధానాలకు,నిర్బంధాలకు వ్యతిరేకంగా అందరూ మాట్లాడితేనే మానవ మనుగడ సాధ్యం.

పవన్ కుమార్ రెండేళ్ల ముషీరాబాద్ జిల్లా జైలు లో ఎంతోమందిని చూశాడు. ఎమర్జెన్సీ లో అరెస్ట్ చేయబడింది కమ్యూనిస్టులే కాదు ఆర్ ఎస్ ఎస్ వాళ్లు,జమాతే ఇస్లామ్,ఫ్యాక్షనిస్టులు,ఆనంద మార్గ్ వాళ్ళు,వంగవీటి రంగా లాంటి వాళ్ళు.వ్యవస్థ మారకుండా ప్రభుత్వ అధికారానికి రావడానికి అవకాశం ఉన్న వాళ్లంతా అరెస్టు చేయబడ్డారు. అక్కడ చాలా మంది అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్ పార్టీ వాళ్ళను, వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్నాడు. కాశీపతితో ఇంగ్లీష్ సాహిత్యం పై చర్చించాడు.ఎన్కౌంటర్ పత్రిక పింగళి దశరథరామ్ ను,సోషలిస్ట్ నేత సత్యనారాయణ రెడ్డి లాంటి ఎంతో మంది తో మాట్లాడాడు. పవన్ కుమార్ కు  జైలు జీవితం పోరు జీవితాన్ని నేర్పింది.  రెబల్ గా మారాడు.పార్టీలో ఫుల్ టైమర్ గా పని చేయాలనుకున్నాడు.

విప్లవోద్యమం చాలా బలంగా పుంజుకుంటున్న ఆ దశలోనే పవన్ కుమార్ జైలు నుండి విడుదలైన తర్వాత చండ్రపుల్లారెడ్డి తో పరిచయం బలపడింది.పార్టీ తనకు  'విమోచనా' పత్రిక భాద్యతలు అప్పగించింది. ఇక పవన్ విజయ లు ఎనమిదేళ్ళు విమోచన పత్రికతో నడిచారు. పవన్ కుమార్ రచయితగా, కవిగా,  కథకుడిగా, ఉపన్యాసకుడిగా ప్రజల మధ్య గడిపాడు.ప్రజల్లోకి వెళ్లి గ్రామ సీమల్లో నిర్మాణాలు చేసి 'ప్రతిఘటన' పోరాటాల్లో పాల్గొన్నాడు. వరవరరావు తో సాన్నిహిత్యాన్ని పంచుకున్నాడు. ఎందరో అమరుల అమరత్వాన్ని గుండెల్లోకి హత్తుకున్నాడు. ఎంతో మంది రెబెల్స్ సహచర్యంలో తనో రెబల్ గా జీవించాడు. అలా జీవించడం ప్రతీ మనిషికి వచ్చే అవకాశం. ప్రగతిశీల చరిత్రను నిర్మించే సదవకాశం.ఆ అవకాశం పవన్ కుమార్ కొచ్చిందని సంతోషపడ్డాడు.

ఆ సంబరమెంతో కాలం లేదు. ఎన్నికలు,సాయుధపోరాటం,ప్రజాసంఘాల అవసరం లాంటి అంశాలతో విప్లవ పార్టీల్లో చీలికలొచ్చాయి. సి.పి పార్టీ రెండుగా, ఆ తర్వాత నాలుగుగా చీలిపోయింది. దాంతో పవన్ కుమార్ ఘర్షణ మొదలయింది.  రోజులు గడిచే కొద్దీ పార్టీలో జరిగే వ్యక్తిగత వైరుధ్యాలతో ఘర్షణ ఇంకా పెరిగింది.అది తట్టుకోలేక సహచరులిద్దరూ చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చాక పార్టీకి రాజీనామా పత్రం రాశారు.ఆ పత్రంలో "పాలక పాలిత బలాబలాల రీత్యా చూసినా, ఇప్పటివరకు ఉన్న మన అనుభవాలను బట్టి చూసినా,ఈ మార్గంలో 'ప్రజలకు రాజ్యాధికారం' అనేది జరిగే పని కాదు.ప్రజల కోసం పనిచేసే వ్యూహం, ఎత్తుగడలు మౌలికంగా మారాలి. ఈ మార్పుకి దోహదం చేసేలా పని చేయగలిగితేనే విప్లవోద్యమంలో పని చేయాలి.ప్రస్తుతం మన పని ఆ మార్పుకి దోహదం చేయదని మేము అనుకుంటున్నాము. మీరందరూ మా వలె కాకుండా, ప్రస్తుత పని ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తున్నాం.మీ నిమగ్నతా,నిబద్ధతలను గౌరవిస్తున్నాం. మీతో స్నేహసంబంధాల్ని ఉంచుకుంటూ మా జీవితం మేము జీవించడానికి ప్రయత్నిస్తాం"అని రాశారు. అలా ఉద్యమానికి దూరమయ్యారు. ఎంత దుఃఖమో తన ఆలోచనలు,ఆశయాల నడకను వదిలి మరో జీవితంలోకి పోవడం.ఆ తర్వాత కొద్ది రోజులకు పవన్ కుమార్ తన వ్యక్తిగత జీవితంలోకి ఒదిగి పోయాడు. నిజమైన ధనవంతుడు రామోజీరావు 'ఈనాడు' పత్రిక లో చేరాడు.

 పవన్ కుమార్ తన జ్ఞాపకాల ప్రయాణంలో తన సహచరిని అప్పుడప్పుడు 'అమ్మ' అని పిలిచేవాడు. ఇది "ఆడవాళ్ళ శ్రమను దోచుకునే ఒక ఎత్తుగడ అని స్త్రీ వాదుల నిజమైన విమర్శ" అని గుర్తుచేసుకున్నాడు. స్త్రీలపై జరిగేటి భరించరాని హింసని చాలా సందర్భాల్లో వ్యతిరేకిస్తాడు. పవన్ కుమార్ పెద్దయ్యాక కూడా చాలా సార్లు వేధనపడ్డాడు.  జైల్లో వున్నప్పుడు పుట్టబోయే బిడ్డను, తన సహచరిని తలుచుకొని పొరుగు వారి సూటుపోటీ మాటల్తో తనెంత క్షోభ అనుభవిస్తుందోనని కుంగిపోయాడు.  మరొకసారి తనకు ప్రాణమైన వాళ్ళమ్మ నాకు "ముగ్గురు కొడుకులే" అంటే నేనింత పరాయి వాన్నయ్యానా? అని కుమిలిపోయాడు.  ఆ తర్వాత విరసంకు,తన పార్టీకి ఇంకా కన్న ఊరికి దూరమయ్యానని దుఃఖ పడ్డాడు.  ఆ దుఃఖంతోనే పరాయి వాడై విజిటర్ గా తన బిడ్డ దగ్గరకు అమెరికా వెళ్ళాడు.అమెరికా నుండి కన్న ఊరిని ఇట్లా కలబోసుకున్నాడు.

పవన్ కుమార్(పేరు వేరైనా) నిజం.అతని జీవితం,జీవించింది నిజం.  అతని పోరు నిజం.అతని బాధ నిజం.  అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మద్యే జీవించాడు.  సమాజాన్నిమార్చాలనుకున్నాడుమారదని ఆగిపోయాడు. కారణాలు కాదనలేం. అయితే సమాజాన్ని మార్చాలనుకున్న జీవితమే నేటి తరానికి కావాలి.అదే 'రెబెల్' తత్వం కావాలి.

పవన్ కుమార్ లాంటి ఎందరో ఒకానొక దశలో రెబెల్ గా బతికినోళ్ళంతా తమ జ్ఞాపకాలను చరిత్ర మాలలో గుదిగుచ్చాలి. భవిష్యత్ తరాలకు కానుకగా ఇవ్వాలి. ఆ నిజాయితీ పరమైన జ్ఞాపకాల బాటలో సమసమాజ నిర్మాణంకై పోరాటం నడవాలి.

 

 


ఈ సంచికలో...                     

May 2021

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు