"పక్కనున్న పసివాడి రోదన రోదసి నంటుతూ నన్ను నిట్టనిలువునా చీల్చేస్తుంటే అవేవీ పట్టని నువ్వు నా మైదానం పై నీకు నచ్చినట్టు సంచరిస్తావు
నీ ఎముకలుకొరికే చలిని వెచ్చబరచుకునే కుంపటిని నేను నీ సలసల మరిగే అగ్ని గుండాలను చల్లార్చుకునే సరస్సును నేను
నాలో ఎన్ని సునామీలు ఎన్ని భూకంపాలు సంభవిస్తున్నాయో ఎప్పుడైనా చూశావా
నీకు నా దేహమొక క్రీడాస్థలం ఎప్పుడుపడితే అప్పుడు నా ప్రమేయం ఏమీ లేకుండానేఅడుకొని నువ్వు మాత్రమే గెలిచి విజయగర్వంతో నీ నుదుటన మెరిసే చెమట చుక్కలను తుడుచుకుంటూ తృప్తిగా ఠీవిగా నడిచి పోతావు
నేను నా విరిగిపడిన ముక్కలను ఏరుకుంటూ నా సలపరించే పచ్చి బాలింత అవయవాలను పోగు చేసుకుంటూ రహస్యంగా కన్నీళ్ళు తుడుచుకుంటాను
నువ్వు మాత్రం నన్నొక అలను చేసి ఆనందాలనావ పై విహరిస్తూ నీ నీలి కలలను సిగ్గులేకుండా సాకారం చేసుకుంటూనే ఉంటావు" (కవిత..నీలికలలు పుట..43)
ఎవరిదీ నిర్భయ గళం? ఎవరిదీ నిర్నిద్ర వేదనా స్వరం? ఏ సగటు ఇల్లాలి పక్షాన ఈ ఆక్రోశం? ఈ కవితాస్వరమే.. పద్మావతి రాంభక్తగారిది. పోయినేడాది మా శిష్యత్రయం ఫోన్ చేసి మన'రాధేయదశాబ్దికవితాపురస్కారానికి' ముగ్గురి కవితల్ని ఎంపిక చేశాం సర్,వారేఅనిల్ డ్యానీ,పద్మావతి రాంభక్త,అఖిలాశ,. ఇందులోని పద్మావతే ..ఇవాళ నేను ప్రస్తావిస్తున్ననీలికలల కవయిత్రి.
కవితా విజేతలు ముగ్గురి కవితలు తెప్పించుకుని చదివాను.మంచి నిర్ణయమనిపించి ముగ్గుర్నీ ఫోన్ లో అభినందించాను.
తరతరాలుగా పితృస్వామ్య నీడలో పురుషాధిపత్య భావజాలం లో నలిగిపోతూ,రాజీపడుతూ,సర్దుకుపోయే సగటు ఇల్లాలికి ఈ నీలికలలుకవితరాయడానికి ధైర్యమే కాదు తెగువ కూడా కావాలి.ఆ నిర్భయ,నిర్నిద్ర ,ధైర్య స్వరం.. పద్మావతి రాంభక్త ది కావడంనాకు ఆశ్చర్యమనిపించినా,ఈ ధిక్కార స్వరాన్ని స్వాగతిస్తూ,మనసారా అభినందిస్తున్నాను.
అందుకే ఇవాళ ఒక కొత్త వేకువను,కొత్త చూపుతో ఒక కొత్త కవిత్వోదయం గా స్త్రీ కోణం లోంచీ దర్శిస్తున్నాను. కవయిత్రికి ఈ కొత్త చూపునిచ్చిన వారు - కొండేపూడి నిర్మల"లేబర్ రూమ్" కావచ్చు,విమల"వంటిల్లు" కావచ్చు, మందరపు'సర్పపరిష్వంగం"కావచ్చు,పాటిబండ్ల రజని "అబార్షన్ స్టేట్మెంట్'కావచ్చు,జయప్రభ "పైటను తగిలెయ్యాలి" కావచ్చు..ఇలా ఒకరి స్ఫూర్తి మరొకరికిఆచరణ కాగలిగి నప్పుడే కవుల, భవిష్యత్ స్వప్నం సాకార మవుతుంది.
దాంపత్య బంధం అమలిన శృంగారం లో దగ్గరౌతుంది.ఆత్మీయ స్పర్శ కావాలి
"నీ స్పర్శ నన్ను సేద తీర్చాలి నువ్వు నన్ను తాకగానే నా మనసు గాలిలో దూదిపింజలా తేలిపోవాలి స్పర్శ అంటే.చర్మంపై తేళ్ళూ,జెర్రులూ పాకినట్టు చీదరించేలా కాకుండా లోలోతుల్లోకి చొచ్చుకొనిపోయి హృదయవీణ సుతారంగా మీటాలి బ్రతుకు పోరు లోని బడలిక తగ్గిస్తూ అమలిన ప్రేమకు అద్భుత భాష్యం చెప్పాలి" (పుట..33)
పసుపు తాడుతో జీవన బంధంపరిమళాన్ని అందించకపోతే,ఎన్నాళ్ళని ఆశగా ఎదురు చూస్తుందిఏఇల్లాలైనా. తన బ్రతుకు మడిపై ఒక్క చినుకు పలకరింపు కైనా నోచుకోకపోతే ఆమె అతడికి శాశ్వతంగా దూరమై ఆమె ఒక అర్థం కాని కావ్యం లాగే మిగిలి పోతుందంటారు కవయిత్రి.
"ప్రతిరోజూ అతడి ముని వేళ్ళు ఆమెపై గొంగళి లా పాకుతూ చర్మలిపిని చదివి లోపలి తడిని ఒక్కసారైనా తాక లేకపోయాయి అతడి కనులలో కాస్తంత కాంతిపుంజానికై ఆమె ఆత్రంగా వెతికింది" (పుట..36)
జీవితంలో ఏబాధాసందర్భం కళ్లబడినా నేను కన్నీటి కుండ నై నిలువెల్లా వణికి పోతానంటోంది కవయిత్రి.అమ్మప్రేమగా ఆర్ధ్రంగా తలుచుకుంటుంది .
" ప్రతీ సాయంత్రం చిమ్నీ మసినంతా తన అందమైన చేతులతో తుడిచేసి ఇంట్లోనే ఏదో ఒక చంద్రుడిని వెలిగించేది మా అమ్మ వెన్నెలనంతా ముద్దచేసి నాకు ప్రేమగాగోరుముద్దలు తినిపించేది" పుట..39
ఒక వర్షం కురిసిన రాత్రిలో తనహృదయాన్ని తడుపుకుంటూ కలలు గంటుంది.ఒక సారైనా జ్వరమొస్తే బాగుండుననీ భావిస్తుంది.
"ఒకసారి జ్వరం వస్తే బాగుండును ఆకాశంలోంచి అమ్మ నడిచొచ్చి తన చల్లని స్పర్శతో నా ఒళ్ళంతానిమిరితేబాగుండును పనికి సెలవు పెట్టి మరీ శ్రీవారు కళ్లలో ఒత్తులేసుకుని నాకు సపర్యలు చేస్తే బాగుండును" (పుట..52)
అమ్మకోసం, అమ్మలాంటి ప్రేమకోసం తపన పడ్తుంది కవయిత్రి.అతివల దేహాల ఒంపుసొంపుల్ని మాత్రమే చూడగలిగే పురుష పుంగవులకుతీవ్రంగా వార్నింగ్ ఇస్తోంది.
'ఇకమీదట మీ నుండి వెలువడే మా బాడీ షేమింగుల దుర్గంధ పూరితమైన వ్యాఖ్యలకు చరమగీతం పాడేలా మరోమారు చెవిన బడితే మీ నాలుకలను తెగ్గోసికాకులకు గద్దలకు ఆహారంగా వేస్తాం జాగ్రత్త, (పుట..63)
ప్రతి ఇంట్లో కన్నీటికొలన్లు ఉంటాయని,వాటిని దర్శించాలంటే మనమనసులకు కళ్ళుండాలి.అద్దె ఇల్లు లాంటి గర్భాన్ని మోస్తున్న సర్గసీ మదర్ ను మరో కుంతి తో పోలుస్తుంది.
"తన రక్తమాంసాలతో అభిషేకిస్తున్న పిండానికి అమ్మ కాని అమ్మ గా మారి నవమాసాలూమోస్తుందామె మరో కుంతి కాకపోయినా ముఖమైనా చూడని పసి జీవాన్ని హృదయాన్ని చిక్కబట్టుకుని పరాయి చేతులలో పెట్టేస్తున్న ఇంతి ఆమె తనను తానే క్షమించుకోలేక అంతులేనిబాధను మోస్తూ బతుకు కీడుస్తుంది" (పుట..67)
మరోచోట గాయాల కథను వినిపిస్తుంది. బెస్తవాళ్లను గురించి రాస్తూ..వారు నిత్యంసముద్రపు పొత్తిళ్లలో జన్మించి, పోరులో కెరటాల కత్తులతోయుద్ధం చేసేవారుగా వర్ణిస్తుంది.
నీకూ నాకూ మధ్య మొలిచిన నిలువెత్తు గోడను ధ్వంసం చేసి సమస్త మురికినీ, మాలిన్యాలనూ కడిగేసుకొని మనసారా కౌగలించుకొందాం రమ్మని సహచరుని కోరుతుంది. కన్నీటి ఉప్పదనాన్ని ఒక్కసారైనారుచిచూడకుండా బతుకు నదిని దాటడం సాధ్య మవుతుందా నీకైనా,నాకైనా,నా మనసేమైనా గొర్రెపిల్లా? గుంజకు కట్టేస్తే పారి పోకుండా ఉండడానికి ? అనిసూటిగా ప్రశ్నిస్తుంది
రంగువెలిసిన నేత కార్మికుల దైన్య జీవితాలను అక్షర బద్దం చేస్తుంది.ఆకలిని ఆత్రంగా వెతుక్కుంటూ రోజంతా నిలబడి,నిలబడి తన బతుకులోకి ఆశగా తొంగి చూసుకొంటున్న సేల్స్ గర్ల్స్ ను పరామర్శిస్తుంది.
మాతృత్వపు అదృష్టం కోసం ,కొత్తజన్మ కోసం నరాలు చిట్లే నరక యాతనను భరించే స్త్రీ మూర్తిని ప్రశంసిస్తుంది. కొండేపూడి నిర్మల గారి లేబర్ రూమ్ ను తలపించే వేదన ఈ కవిత.
"కత్తుల నదిపై పయనించి కన్నీళ్ళ నదిని ఈదుతూ నరాలు చిట్లేయాతనను ఓర్వక తప్పదు కొన్ని నిమిషాలలో సునాయాసంగానో ఎన్నో గంటల పోరాటంతోనో, యమలోకపు ద్వారాన్ని తాకినంత పనై, వెనుదిరిగాకో కోరుకున్నంత కొండంత ఫలం నీ ఒడిలో చేరొచ్చు మాతృత్వపు కిరీటాన్ని ధరించి అమ్మగా పువ్వులాంటిపాపాయిని చూసి మురిసి పరిపూర్ణమైన స్త్రీ మూర్తిగా నీ జన్మకు ధన్యవాదాలు సాధించవచ్చు"( పుట.. 144).
ఇలా కవయిత్రి పద్మావతి రాంభక్త గారి కలందర్శించిన కొత్త వేకువలో ఎక్కువ కవితలు స్త్రీ పక్షపాతాన్నే వహించాయి. మిగిలిన కవితలు కూడా మానవీయ కోణం లోంచే మాట్లాడినై.
స్త్రీ పక్షాన మాట్లాడిన కవిత్వమంతా ధైర్యం కంటేదీనత్వం లోంచే పలికింది, ఆగ్రహం కంటే ఆవేదనగానే పలికింది, కరడు గట్టిన పితృస్వామ్య,పురుషాధిక్య సమాజం లో మార్పుకోసం,పాలక పక్షం కళ్ళు తెరిపించాలంటేధిక్కార స్వరం పలకాలి. రాబోయే రోజుల్లో ఈ స్వరం మరింత బలపడుతుంది.తాను కలలు గనే స్త్రీ స్వేచ్ఛకు పునరంకితం కాగలదని నా విశ్వాసం.
తొలి ప్రయత్నంలోనే సామాజికంగా ,స్త్రీ మనోభావాలను సూటిగా,స్పష్టంగా "కొత్త వేకువ"గా ఆవిష్కరించిన నవ కవయిత్రిపద్మావతి రాంభక్తఅభినందిస్తూ,2019 లోనే తన కవితకు 'రాధేయ కవితా పురస్కారం' అందుకొని,మా కుటుంబ ఆడపడుచు గా గౌరవం అందుకున్న ఈ కవయిత్రిని మరో సారి మనః పూర్వకంగా అభినందిస్తున్నాను.కొత్త వేకువ ను మనసారా స్వాగతిస్తున్నాను.