సాహిత్య వ్యాసాలు

(February,2021)

ఎడిటోరియల్ బోర్డు

గౌరవ సంపాదకులు :            ప్రొ. కాత్యాయనీ విద్మహే

సంపాదకులు :                           వంగాల సంపత్ రెడ్డి 

సంపాదక వర్గం :                       దాసరి మల్లయ్య

                                                             ఉప్పులేటి సదయ్య

న్యాయ సలహాదారులు :     ఈదుల మల్లయ్య

మానవీయ సంవేదనా ప్రపంచం  ఏనుగు నరసింహారెడ్డి కవిత్వం!

గడుసైన కవి ఏనుగు నరసింహారెడ్డి. సాహిత్య ప్రపంచానికి చాలా దగ్గరైన వాడు ఇతని కవిత్వంలో ఆగని కవిత్వ ధార కనపడుతుంది. అది ప్రజల భాషలో వినబడుతుంది.సీరియస్ విషయాలే కాకుండా వాటి మధ్య జారిపోతున్న దయనీయ జీవన దృశ్యాన్ని పట్టుకోవడం, అనేక వాదాలు, ధోరణులు, ఉద్యమాల్లో ఇమడ కుండా సమకాలీన సాహిత్య చరిత్రలో మానవీయ సంఘర్షణలను పట్టుకోవడం నరసింహారెడ్డి ప్రత్యేకత.  - డా. సుంకిరెడ్డినారాయణరెడ్డి.

కవి నిరంతర చైతన్య శీలి. నిత్య సృజనాత్మక శీలి.అతని కవిత్వం సమస్త మానవీయ సంవేదనా శీలి. అతని కవిత్వం ఏ భాషలో కి అనువదింపబడినా,తనదైన భావస్ఫూర్తి మెరుస్తూనే ఉంటుంది.

తనదైన శైలితో, తనదైన ప్రాపంచిక దృక్పథంతో, సమాజాన్ని జాగృత పరుస్తూనే ఉంటుంది తను ఏ స్థాయిలో నిలబడినా, తన మూలాల్ని మరువడు.  తన గ్రామీణ జీవననేపథ్యాన్ని మరువడు. తనలో భావ సంచలనం కల్గినపుడు,పురిటి నొప్పులు పడుతూనే కొత్తకవితకు జన్మిస్తాడు.  సామాజిక బాధ్యత కలిగిన కవి చైతన్య రహితంగా ఉండలేడు. సమాజ హితం కోసం, నిత్య చైతన్య శీలిగా, సాహిత్య వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. అలాంటి నిత్య చైతన్య శీలి, నిగర్వి, నిష్కపటి, తెలంగాణ సామాజిక చింతనా పరుడు, డా.ఏనుగు నరసింహారెడ్డి గారు.

తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖలో, ఒక బాధ్యతాయుతమైన ఉన్నతాధికారిగా నిత్యం ప్రజాక్షేత్రంలో విధులు నిర్వహిస్తూనే, పై అధికారుల ఒత్తిళ్ల మధ్య ఊపిరి పీల్చుకునే వ్యవధి కూడా లేని రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తూ, ఏమాత్రం తీరిక సమయం దొరికినా కవిత్వ రచనకు అంకితమైన  అరుదైన కవి, డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి గారు. వీరితో నాకు 1995 నుండి గాఢమైన పరిచయం. ఆత్మీయమైన కవితానుబంధం   మాది.

2018లో నేను మా "ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు'త్రిదశాబ్దిఉత్సవాలనుఅనంతపురంలో ఒక రోజంతా నిర్వహించాను వారిని ఒక  ఆత్మీయ అతిథిగా ఆహ్వానించాను. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఆనాటి సభలో వారు వర్తమాన కవులకు చక్కటి దిశానిర్దేశం చేస్తూ ప్రసంగించారు. 

ఒక కవిగా,సాహితీవేత్తగా,తాను ఎక్కడా ఆగిపోలేదు.విశ్రాంతి తీసుకోలేదు. తనదైన సైద్ధాంతిక దృక్పధాన్ని విరమించు కోలేదు భావ సాంద్రత లో తనదైన అభివ్యక్తిని మెరుగు పర్చుకుంటూ,నిబద్ధతతో సాగిపోతూ ఉన్నారు. వారిని కవిత్వ కోణం లోంచీ, పాతికేళ్ల  వారి కవితా ప్రస్థానాన్ని గురించి విశ్లేషించే  ప్రయత్నమే ఇది.

కవి ఏనుగు నరసింహా రెడ్డి గారు 1968లో యాదాద్రి భువనగిరి జిల్లా లోని 'కల్లోల కుంట'లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మమ్మ, కృష్ణారెడ్డి దంపతులు.వీరి ప్రాథమికవిద్య, ఉన్నతవిద్య చిట్యాల, రామన్నపేట, నల్గొండలో, సాగింది.

1998లో హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో "తెలుగు హిందీ జాతీయోద్యమ తులనాత్మక అధ్యయనం" అనే అంశం మీద పీహెచ్ డి  పొందారు.

వీరి సృజనాత్మక  నేపథ్యంలోంచీ నిరంతరం పదునెక్కుతున్న కవిగా, విమర్శకుడిగా, తెలుగు సాహితీ రంగంలో అలసట లేని విరామం లేని సాహిత్య ప్రస్థానం వీరిది.

మీరు ప్రస్తుతం విభక్త తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూ నిన్నటి వరకూ తెలంగాణా సాహిత్య అకాడమీ కార్యదర్శి కొనసాగుతూ ఉండడం వీరి వ్యక్తిత్వం, అంకితభావం, ఒక  కారణం కావచ్చు.

ఒక స్థితిలో తను తాను పరిచయం చేసుకుంటూ... "నేను పుట్టిన నేల,నేను నడిచిన బాటలు, నేను కలిసిన వ్యక్తులు, నన్ను దిద్దిన పుస్తకాలు, నేను చేసిన పనులు,అవి ఇచ్చిన అను భూతులు ఒక చోట రాసి పోస్తే అది నేనే "అని ప్రకటించడం  వెనుక ఈ కవి కి ఎంతటి ఆత్మవిశ్వాసం ఉందో, మనకు ఇట్టే అర్థమవుతుంది

డా.ఏనుగు నరసింహారెడ్డి గారి రచనలు

ఇవి..

1 సమాంతర స్వప్నం...కవిత్వం... (1995)

2.నేనే ... కవిత్వం .................(2002)

3.మట్టిపాట...కవిత్వం ............(2008)

4.కొత్తపలక.... కవిత్వం...............(2013)

5..హైద్రాబాద్ విషాదం...అనువాదం.. (2016)

6.అంతరంగం...ఆధునిక కవిత్వ విమర్శ...(2018)

7.మూలమలుపు...కవిత్వం...(2018)

8.సమాహార...........(2019)

9.తెలుగు రాష్ట్రాల.. రెవిన్యూ వ్యవస్థ..నిన్న నేడు రేపు (2019 )

10.కవిత్వం లో బాల్యం..ఎంఫిల్ గ్రంథం  ( 2019)

11.తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు

(తులనాత్మక పరిశీలన)....(2019)

12.తెలంగాణా రుబాయిలు...(2020)

-----------------------

 నిరుద్యోగ, నిరాశా పర్వం  సమాంతర స్వప్నం (1995)

 ------------------------

 ఆకలి కి పర్యాయపదమైన, నిరుద్యోగ దశాబ్దంలో, ఆకలిలోంచి అభద్రత లోంచీ ఎలుగెత్తి కవిస్వరమే ఈ "సమాంతర స్వప్నం"

తన సామాజిక అవగాహన గురించీ, జీవితం లోంచీ, కవిత్వం గురించీ ఇలా నిర్వచిస్తున్నాడు కవి..

నిజానికి దబాయింపులూ, స్ట్రాటజీల్లేని కవిత్వమే నాకిష్టం. జీవితానికి విధేయం కాని కవిత్వాన్ని నేనూహించలేను. రాయ కుండా ఉండలేని అనివార్యతా గుణం, పొగలు కక్కే నిజాయితీ ఇటువంటివి అరుదవుతున్న కాలంలో, అలసిపోయి పలకరించే నిరుద్యోగిలా, నాయీ "సమాంతర స్వప్నం".

 59 కవితలున్న ఈ సంపుటిలో ఒక్క నిరుద్యోగ పర్వాన్ని గురించే పది కవితలు దాకా ఉండటం ఓ విశేషం.

 వృద్ధాప్యం లేత చెట్టుపై

 నాలాంటి గొడ్డలి దెబ్బల్ని దయతో భరించు

 నేనసలే రాకపోవచ్చు

 అమ్మా!

 నువ్వు ఎదురు చూడకు     (పుట- 2 )

ప్లాట్ ఫారం మీద తన గొంతు రైలు కూతవు తుందని క్వాలిఫైడ్ టీచర్లకు మద్దతుగా నిలుస్తాడు కవి.ఒంటరి భూతాన్ని నిరంతర సామూహికత్వం తో చిత్తు చేస్తానని ప్రతిన బూనుతాడు. ఇరానీ చాయ్ తీపెక్కుతున్నా, బతుకు మాత్రం చేదెక్కు తుందంటాడు.

తప్పని దుఃఖం

దిగమింగుకున్న కొద్దీ ఎగదన్నుకొస్తున్న

వింత దుఃఖం

కాలం మెరుపు కత్తుల్ని దూసి

ఎన్నినిలువు కోతల్ని కోస్తున్నా

 గూడు వీడిన పిచ్చుకను కావడం

 మాను కోలేక పోయాను.  ( పుట- 17)

చాకిరీతనాన్ని స్త్రీత్వంగా అలంకరించుకున్న క్షమయాధరిత్రిని కొనియాడుతున్నాడు కవి.భగ్గున మండే చౌరస్తాలో రసం పిండుతున్న చేతుల్ని చూసి ఆర్ధ్రంగా ద్రవిస్తాడు.ఉస్మానియా

యూనివర్సిటీ లో పరిశోధకుల బతుకు కూడలి ఎన్.సీ.పీ చౌరస్తా పై రాస్తూ...

నా ప్రాణమా ఎన్.సీ.పీ

 నువ్వెన్ని కన్నీటి బొట్లను

 ఎన్ని వేదనామయ జాలి చూపులను

 ఎన్ని తరంగిత హృదయ విన్యాసాలను తీర్థమాడించుకున్నావు

 నీ స్పర్శ లేని రోజు

 దినచర్య మిగిలిపోయిన

 అనుభూతుల ఆస్తుల నిస్తున్న ఎన్.సీ.పీ

  దినదిన గండమైన ఈ చేప పిల్లలకు

 నువ్వే కదమ్మా ఎన్.సీ.పీ.చల్లటి కొల్లేటి సరస్సు ( పుట-23)

బతుకునే పద్మవ్యూహం లో నిలిపి ఆత్మబలిదానాలతో,చిత్ర హింసల నరక యాతనల్ని భరించే త్యాగమూర్తులను

స్మరించుకుంటాడు కవి.గల్లంతైన హృదయపు చిరునామాను గురించి వాకబు చేస్తాడు.

ఏ మాట వెనకాల ఆ వాసన లేదు

ఏ పలకరింపులో ఆ చెమ్మ లేదు

కాస్త వెతకండి

హృదయం చిరునామా గల్లంతయింది  ( పుట-29)

కవీ, నువ్వెప్పుడూ వేదనకు మరో రూపానివే నంటాడు. అమ్మ ఒడి నుండి అనుభవాల ఆస్తులను తీసుకున్నా నంటాడు  వందలు,వేల బతుకుపుస్తకాలను ఆ ఒడిలో నుండి  నేర్చుకున్నా నంటాడు. మా బతుకు దీక్ష మారదు,మా చెమట బట్టలు మారవు, మేంమారం అంటాడు.

ఇక్కడి భక్తి అంటే రాజకీయం,ఆలయాలు ఓట్లకు నిలయాలు అని ప్రకటిస్తాడు.

ఇక్కడి ఆలయాలు

ఓట్ల మొగ్గలేసి

సీట్ల పూత పూసి

పవర్ ఫలాలను పంచుతాయనే కదా

క్షుదార్తుల ఉదరాలను

కరసేవ కంపుతో నింపేస్తారు ( పుట..39)

నిరుద్యోగ నిర్వేద యువకుడిగా శివారెడ్డి కవిత్వంతో చైతన్య స్పూర్తితో ఒక కవిత  రాస్తాడు.

"సహజ సామర్థ్యం పెల్లుబికిన ప్రతిచోటా ఓవర్ క్వాలిఫికేషనై వెక్కిరిస్తుంది

గొంతునొక్కి మనసు చంపుకు

కనిపించిన నాడు

అసమర్థతగా ధృవీకరించబడుతుంది ఒక్కోసారి

అప్రయోజకమైన సానుభూతి తుఫాను కొన్ని రోజుల పాటు మనిషిని కానీయదు నాకేసి చూసుకుంటే

తెగిపోయిన పతంగాలు గుర్తుకు వస్తాయి బతకడానికి ఓ పెద్ద బండ బరువు చేసిన బతకడానికి ఓ బడా వ్యాపారం చేసిన సుందరమయ వ్యవస్థలో

బతకును మోయలేక మోస్తూ

 రాయలేక రాస్తూ

 కవిని నేనే

 చదువు కునే వాళ్ళుంటే 

 కవిత్వాన్ని నేనే

 నేను నవ యోగి

 నా పాత పేరు నిరుద్యోగి"    ( పుట..95 )

 

ఈ కవిత్వం రాసిన కాలం నాటికి నిరుద్యోగ యువకుడైన ఈ కవి చాలా కవితల్లో  తన మానసిక నిర్వేదం ప్రకటిస్తూ ఉంటాడు. ఇంట్లో,బయటా,స్నేహితుల మధ్య అన్నీ ప్రశ్నలే.వారి పలకరింపులన్నీతనకు శూలాలు గుచ్చుకున్నట్లు ఉంటాయి  కవికి.

"ఉపాధి వృక్షం చేసుకోలేని నాకు

ఇంట్లో

ప్రశ్నఅమ్మ  మొహమవుతుంది

నాన్న వయసవుతుంది

అన్నింటి కన్నా పెద్ద ప్రశ్న

నా చదువవుతుంది".  (పుట..50)

కవికి గ్రూప్2ఎ లో స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు తనఇల్లు, కాలేజ్, యూనివర్సిటీ  నదీనదాల్లోపడవై కేరింతలు కొట్టిన ఆనందాన్ని అనుభవించాడు కవి.తనకూ బాల్యానికీ నడుమ తెగిపోని హోమ్ వర్క్ ల రాగ బంధమనీ,యాభై అక్షరాల గందర గోళమని అంటాడు కవి.

ఇలా "సమాంతర స్వప్నం" లోని కవిత్వమంతా కవి నేటివిటీని, బాల్య, యవ్వనోద్రేకాల మధ్యబతుకు కష్టాన్ని వివరిస్తుంది.నిరుద్యోగ పర్వంలో కష్టాల కడగండ్లను ఆర్ధ్రంగా వివరిస్తాడు కవి.

-------------------------

ఒక అసందర్భ వ్యంగ్య చిత్రం-'నేనే' (2002)

--------------------------

ఎవరూ అందుకోలేని ఒక ఆదర్శవాది, ఒక ఉదాత్త మూర్తి ,జ్ఞాన గ్రంథాలయ సర్వస్వం మధురకవి తన గురువు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారికి అంకితమిచ్చిన కవిత్వమే 'నేనే'

 తొలి కవిత తెలంగాణ గ్రామ సేవకుల, వెట్టిచాకిరీల, వేతనము లేని ఉద్యోగుల గురించి,దయనీయంగా రాసిన కవిత-

'నీటిపిట్ట'

 వీరిని నీరుడీలని, కావలికార్ లని ఇంకా వివిధ పేర్లతో పిలువబడుతుంటారు.

 ఓ నీటి పిట్టా

 చిలికి చిలికి వెల్లువెత్తిన ఉప్పెనలో

 కట్టగండికి గడ్డివామువై ఇసుక బస్తావై నిలువరించి ప్రాణాలిచ్చే జలదాతా తూముల్లో మరణ పిట్ట వేదన తెలిసీ

నీరుడీ వారసత్వం చేపట్టిన

నీ సుగుణమే జ్ఞానం

నువ్వూ నీచేతి కర్రా అంగిబిళ్ళా

గంగ చుట్టూరా ఓ వెట్టి కాపలా

నువ్వు నిజమైనమట్టి బావుటా  ( పుట.. 2 )

ఉగ్గ బట్టుకున్న దుఃఖంతో భవానీ స్మృతి మీద రాసిన కవితే 'వాలు గులాబీ' చిక్కబట్టుకున్న తరిమివేత మీద,అక్కరకు రాని చుట్టము మాదిరి అశోక చక్రం తలలు వంచేసుకున్నప్పుడు పజ్జమే నా గుండె చుట్టూ తారాడుతూ,నాలో కొత్త ఆశల్ని పూయిస్తుందంటాడు కవి.

వానాకాలం అంటే ఇష్టపడని కవి ఎవడుంటాడు?  మన కవి నరసింహారెడ్డి కూడా పల్లె మూలాల నుండి ఎదిగి వచ్చిన వారే కనుక వానంటే పరవశించి పోతారు.

''ఆకాశం జల్లెడ లోంచీ

 పైకెగసిన సముద్రం

 అడవి తల్లికి తెగని చినుకులు చీరలిచ్చి పులకింత వాగులై సాగింది

వర్షం కురుస్తుంటే

చినుకుల వెనకాల

మసక మసకగా గుట్టరాళ్లు

ప్రతిదీ ఓ అద్భుత కళాఖండమే

విశ్వం విలాస హాసం వానకాలం

వన్నెల బహుమానం"

(పుట..11)

మానవత్వం లేని మత దురభిమానుల మధ్య, సరికొత్త క్షమాగుణాన్ని సృష్టించి, వ్యాధుల్ని నిర్భీతిగా నయం చేస్తూ పేదల గుండెల స్టెతస్కోప్ అయిన 'స్టీవర్ట్  స్టెయిన్' ను,1999 లో ఒరిస్సాలో సజీవ దహనం చేసిన ఘటనను తలుచుకుంటూ, వారి స్మృతి లో రాసిన కవితే 'అంగార శయ్య'.

'బంజారా హిల్స్ చుట్టూరా'  కవితలో ఖాళీ కడుపులు, కళ్ళనిండా నీళ్లున్న ఎండు గడ్డి గుడిసెల్నిబీపరామర్శిస్తాడు కవి.

జీవితమే ఓ అసందర్భ వ్యంగ్య చిత్రమనీ, ఇందులో నిందార్హుడెవడూ లేడని అంటాడు   శంకర్ మట్ రైల్వే ట్రాక్ దగ్గర ఫ్లూట్ వాయించే బిక్షగాడి పాటకు ద్రవించి పోతాడు కవి.

పాటగాడా  నా పాటగాడా

పడిలేచే కెరటాల మధ్య పదిలమైన సముద్రంలా

 పగలూ రాత్రీ ఏకం చేస్తూ

 మా ఆనందాల కోసం

 మా విషాదాల కోసం

 పాడే పాటగాడా

 సైరాపాట గాడా

 సై సైరా పాట గాడా  ( పుట..19)

శాంతి కపోత సౌందర్యాన్ని చూస్తూ గడుపుతాడు కవి.ఎంతకీ తెగని కలను గురించి వివరిస్తాడు

కేవలం రెవెన్యూ రికార్డుల్లో కనిపించే గ్రామాలు కొన్నిఉంటాయి.అలాంటి వాటిని గురించి రాసిన కవితే 'తహసిల్ తరీఖా'

'బతుకమ్మ కల' లోతెలంగాణ బతుకమ్మ పండుగ గురించి అపురూపంగా రాస్తూ బతుకమ్మ దాపకం చీరలో జరీ అంచునై పోదామని ,ఒళ్లంతా కళ్లు చేసుకుని రెల్లు గడ్డి ఎదురుచూస్తుందట.

ఈ పండుగ అక్కలకు బదులు మాకే రెండు వారాల ముందు మొదలవుతుందంటాడు కవి. దేవ కాంతలు ప్రత్యక్షమై బంగారు బతుకమ్మను బహుకరిస్తే చెరువులో వదిలేయ బతుకమ్మను బహుకరిస్తే  చెరువులోవదిలేయ మనసురాక ఊగిస లాడుతూ మెలకువలో కొచ్చే వాళ్లమని తన అనుభవం గురించి రాశాడు కవి.

"దూరంగా కొండ నింగిని కలిసేచోట

 సృష్టిలోతుల్ని  కొలవాలని

 పండిన గోరింటల పరువం మీంచి

 నీట వాలి లోనికి దారేది బతుకమ్మ

 తొడలోతునీళ్లలో

 తరలిపోయే గౌరమ్మా

 మళ్ళొచ్చే  పండుగకు

 మళ్లీ మళ్లీ రావమ్మా  ( పుట..34)

డా.కూరెళ్ల విఠలాచార్య గారు ఒక మేధావి, ఒక సాహితీ ఝరి, ఒక తొణకని సముద్రం, ఈదురు గాలికి చెదరని ఓసాహితీ మహా వట వృక్షం.

అంతటి వారు ఈ కవి గురువుగారు కావడం వారికి ఈ పుస్తకం అంకితం చేయడం ఎంతో సముచితంగా ఉంది ఎందుకంటే తెలంగాణలోని వెల్లంకి అనే ఒక కుగ్రామంలో గ్రామీణ పేద విద్యార్థుల కోసం తన ఇంటిని మహా గ్రంధాలయం గా మార్చిన మానవతా మూర్తి. సాహితీ వదాన్యులనుండి  67,000 గ్రంథాలను సేకరించి అందులో పదిలపరచి విద్యా దానం అద్భుతంగా నిర్వహిస్తున్న మహానుభావుడాయన.

తనకున్న కొద్దిపాటి భూమిని కూడా పేదవారికి పంచిపెట్టి 83 ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం అలసట లేకుండా తన గ్రంథాలయ నిర్వహణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సాహితీ భీష్ములు విఠలాచార్య గారు.

నేను స్వయంగా వెల్లంకి వెళ్లివచ్చాను వారి గ్రంథాలయాన్ని దర్శించే భాగ్యం నాకు కలిగిందని చెప్పడానికి ఎంతో గర్వ పడుతున్నాను ఆరోజు వారు నా పట్ల చూపిన ప్రేమను ఎన్నటికీ మరువలేను.

 నా వంతుగా వారి గ్రంథాలయానికి ఆరు వందల పుస్తకాలను విరాళంగా పంపించాను .వారు గొప్ప సాహితీవేత్తలు కవి పండితులు వారు స్వయంగా ఎన్నో విలువైన గ్రంథాలను రచించారు వారి కృషిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రజా కవి కాళోజీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.

వారి "విఠలేశ్వర శతకము" గురించి మన కవి ఏనుగు నరసింహారెడ్డి అభివర్ణిస్తూ...

తలబిరుసు లేని పద్యం

లోతైన సాదు వ్యక్తీకరణ

మీ వ్యక్తిత్వమంత సమున్నత కవిత చదివాక ఏం రాసినా

పగలు దివిటీలు పట్టినట్లే గురువుగారూ మీరిలాగే ఉండి తీరాలి

మేము నమూనాగా చూపించగలిగే

సమున్నత వ్యక్తిత్వం

తలెత్తుకు చూసే కవిత్వం

లోకాన్ని నిజంగా శాసించ గలిగేకవిత్వం

వెల్లంకికి జేజే లు  (పుట.. 37)

పద్యాన్ని మరువకండని,అతికష్టం మీద దాన్ని మర్చిపోయినట్టు నటించకండి అంటూ కవుల్నీ, కళాకారుల్నీ హెచ్చరిస్తున్నాడు.పరాయీకరణ  ప్రారంభమయ్యాక మన పల్లెటూళ్లు జ్ఞాపకంగా మిగిలి పోయాయని ఆవేదన పడుతున్నాడు.

ఉద్యోగం బదిలీ గురించి కాదని బదిలీ కాలేని మనసు గురించి బాధపడు తున్నానని కవి ప్రకటిస్తాడు.

కాలం నది ముందు మోకరిల్లి

కాస్త ముందుకు పోతున్నట్లు నటిద్దాం సరళీకృత ప్రపంచం

ఇప్పుడు దుఃఖ సౌఖ్యపు అజెండా

ఎంతకీ దొరకని కన్నీటి జాలు  ( పుట..62)

బదిలీ పేరుమీద మజిలీ పూర్తయినప్పుడు ఎవరికైనా కళ్ళవెంట నీటి బిందువులు రావలసిందే,జీవితాన్ని మరణం దిశగా తెంపు లేని పరుగు నిర్వచిస్తాడు కవి.

కన్ను మూస్తే ఎవరి జీవనయానంలో వారే తీరిక లేకుండా ఉంటారు. ఆశ మాత్రమే మనకున్న ఆస్తి అంటారు. కొత్తగూడెం లో ఆర్టీసీ బస్సు ఎలక్ట్రిక్ షాక్ కు గురై 14 మంది మరణించినప్పుడు కవి కూడాఎంతో షాక్ కు గురవుతాడు.

బహుశా మన ప్రాణాలింక

సామూహికంగా హనన మవటం

ఓ గంట చర్చ కూడా కాదు

ఓ క్షణం నిట్టూర్పు కూడా కాదు

గుండె ఆగుతున్నప్పటి

ఆజీవన ఆక్రందన

ఏదీ.. ఏ చోట స్మరణకు రాదు  ( పుట..84)

షేక్స్ పియర్లు,షెల్లీ, కీట్స్, కాళిదాసులూ పాళీపల్లకిలో ఊరేగే యువరాజులని కీర్తిస్తాడు. మన లోక వ్యవహారం లో అందరూ అపూర్వమైన ప్రేమను నటించే వారే. నువ్వు మాత్రం ఒంటరి వాడవే నంటాడు.

 కాలం జారిపోతుంది

గుండె పగిలిపోతుంది

దిగులు దుప్పట్లు కప్పుకొని

పాత జ్ఞాపకాలుమీంచి

ముఖం చాటేసే దొంగ ప్రేమల్నుంచీ అవసరాల్ని దిగేసుకున్న

అభిమానాల్నుంచీ

 ఒంటరిగానే నువ్వు ( పుట.. 92)

ఇలా "నేనే" కవితా సంపుటిలో అనేక సామాజిక,సాంస్కృతిక,విషయాలను ప్రపంచీకరణ కోణం లోంచీ విశదీకరిస్తాడు కవి.

--------------------------

పల్లె కడగండ్ల మీద పద్య సమరం- మట్టిపాట శతకం (2008)

--------------------------

ఒకనాడు పసిడి పంటల తో, కుల వృత్తుల తో కళకళలాడిన పల్లె తీరు మారింది.  జీవనశైలి మారింది. కుల వృత్తుల విధ్వంసమైనాయి. అన్నదాతల దైనందిన జీవితాన్ని చూస్తే గుండె చెదిరి పోతుంది

అన్నదాతల దీన దశను చూసి కవి గుండెల్లో ప్రతిధ్వనించిన  పద్యమే మట్టిపాట శతకం. ఈమట్టి పాట ఈ శతక పద్యాలు ఆడియో క్యాసెట్ గా రూపొందింది, తెలంగాణ జనజీవనంలో మమేకమై ప్రతిధ్వనిస్తున్నాయి 'పల్లె బతుకు మాది పాడు గాను' అనే మకుటం తో అలరించే చక్కటి  పద్యరచన ఈ పుస్తకం.

 

ఉన్న ఊరు నిడిసి కన్నతల్లి నిడిసి

పంట చేలనిడిసి పనులనిడిసి

బోరు బండ్లమీద ఘోరంగ తిరిగేము

పల్లె బతుకు మాదిపాడుగాను   (పుట.. 7 )

ప్రపంచీకరణకు స్థానికతే పరిష్కారం. అటువంటి విధ్వంస వినాశనాన్ని ధిక్కరిస్తూ  ఈ శతక పద్యాలు రూపొందిందాయి.

రేయి పగలు యనక రెక్క విరుచుకున్న పుట్టవేమి బువ్వ బట్టలైన

శ్రమను జేయువాడుకుమిలి యేడ్చుటఏమి పల్లె బతుకు మాది పాడు గాను (పుట..10)

నేడు పల్లె తన ఉనికిని కోల్పోయింది టీవీలు మొబైల్లు తెచ్చిన నాగరికతతో మన పల్లె సంస్కృతి బాగా మారిపోయింది.

ఈ  మార్పు జీవితాన్ని మనిషిని విడదీసి చూపుతున్నది.

చేనేత బతుకులకు చేటు గాల మొచ్చింది. కులవృత్తులు కూలిపోయి బతుకు దుర్భరమైందనికవివాపోతున్నాడు

పద్మశాలి బతుకు బహుదుర్భరంబాయె  వారమంత వడికి చీరె నేయ

పడుగు పేకలాయేబతుకు దారిద్ర్యాలు

పల్లె బతుకు మాది పాడుగాను  ( పుట..16)

ఓట్ల బిచ్చగాండ్లు వచ్చారు పోయారు ఐదేళ్ల వరకు మళ్ళీ పల్లెలో అడుగుపెట్టరు. అన్ని కులాలు పల్లెలో ఐకమత్యంగా జీవిస్తారు.

పండిన పంటలు పట్నాలు చేరుతాయి.

చదివినోళ్లు ఉద్యోగం వేటలో పట్నాలకు పోతారు. ఇంకేముంది మా పల్లెలో ఎండిన చేలు తప్ప ,అంటున్న కవి.

పల్లె తరుగుతోంది పట్నమెదుగుతోంది

కన్న తల్లి గుండె కరుగుతోంది

నగర కన్నె వన్నె  నానాడు పెరిగెరా

పల్లె బతుకు మాది పాడు గాను  ( పుట..19)

ఏరు పొంగితే ఊరు మునిగిపోతుంది. ఎండ మండితే ఎడద మండిపోతుంది. పల్లె జీవిత మంటే అరటి ఆకు ముళ్లుతో సమానం. పల్లెటూరి లో శ్రమజీవులే  కనిపిస్తారు. నిత్యం బతుకు పోరులో బండ బతుకులు పల్లెటూర్లు. రామారావు గెలిచినా,రాజీవ్ గాంధీ గెలిచినా పల్లె బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదు.

 ఏలి నోళ్ళ మాట లెంత గానో తీపి

 చేతలేమొ సున్న చేయరేమి

 మాట తోడ మమ్ము మాయజేసిరి చాల

 పల్లె బతుకు మాది పాడు గాను ( పుట..22)

 

చదువుకున్నవారు పదవులున్నవారు సంపాదన కొరకు పట్నం చేరినారు తల్లినొ దలినారు,  పల్లెనొదలినారు,ఆడబిడ్డ పెళ్ళికి ఐదెకరాల పొలం పోయే.కొడుకు చదువు కోసం కొంత,ఉన్న ఆస్తులెల్ల  ఊడ్చి పెట్టిన బతుకాయే..

ఎల్ల బాధలకును పల్లెలే నిలయాలు

పల్లె బాధ లెవడు బాపడాయే

ఉండి చావలేక ఊళ్ళు వురుకు చుండె

పల్లె బతుకు మాది పాడుగాను  (పుట..33)

వైద్య సేవలు లేవు.  పొలాలు ఫ్యాక్టరీలకై అమ్ముకోవడం,పనులు లేక అర్ధాకలితో

బతకడం,వృద్ధులంతాపల్లెటూరిలో,  కొడుకులంతా పట్టణాల్లో ఉంటారు. వరుస కరువులతో,పంట మీద ఆశ సన్నగిల్లే.రైతుల బతుకులన్నీ అప్పుల పాలే గదా..

 

అప్పు జేసి నీరు ఆశించి బోర్లేయ

గంటే డైనరావు కండ్ల నీరు

పరగ దయ్యెమాయె  పాతాళ గంగమ్మ

పల్లె బతుకు మాది పాడుగాను    (పుట..38)

కరువు పనులు వల్ల వచ్చే గింజలు ప్రభుత్వబ్రోకర్ల పాలాయె.ఫ్లోరైడ్ పీడతో  నానాటికీ ఊర్లన్నీ తరిగిపోతున్నాయి పట్టించుకునే నాధుడే లేడు.

 

తాగు బాధ సాగుతూనే ఉండ

సాగునీటి పనులు సాగు చుండె

దీర్ఘ వ్యూహమేది దరిదాపులో లేదు

పల్లె బతుకు మాది పాడుగాను   (పుట..43)

ఇలా ఈ శతకం లోని ప్రతి పద్యం పల్లె దయనీయ  జీవితాలను తెలియజేస్తుంది. విచ్ఛిన్నమవుతున్న గ్రామీణతకు రూపు కట్టిన అక్షర సాక్ష్యం ఈ శతకం.

పాడుబడిన పల్లె జీవితం పరిమళాలతో పాడిపంటలతో, పరవశించాలని ప్రపంచీకరణ కుట్రలు కుతంత్రాలు లను పల్లెలు జయించి పునర్వికాసం పొందాలని ఆశిస్తున్నాడు.మన కవి ఏనుగు నరసింహా రెడ్డి గారు

--------------------------

బతుకు పోరు చెలక లో ఒక గుండె ధైర్యం 'కొత్త పలక' (2013)

--------------------------

బతుకు పోరులో రేకు పలక గుండె ధైర్యాన్ని నింపిన 'కొత్త పలక'గా కవికి జీవిత పాఠాలు నేర్పింది. శీతాకాలం సాయంకాలం నల్లటి కాన్వాసు మీద నల్ల రంగు బొమ్మేసినట్టు మనుషులంతా మసక చీకట్లో కలుస్తుంటారు.జీఓ 610 పట్ల ఆగ్రహం ఉండొచ్చు కానీ జీవోలో అధర్మం లేదని పెద్దన్నల కు తెలియజేస్తున్నారు.రేకు పలక  మీద ఎక్కాలు దిద్దుకున్న 'పలక' జీవితం గురించి ఎన్నో పాఠాలు చెప్పింది అంటాడు.

పలకను తల్చుకుంటే

నల్లని చీకట్లనుతరిమేసేందుకు

ఒక తెల్లని దీపంలా ఎదురొచ్చిన

అక్షరం గుర్తొస్తుంది

ఇప్పుడొక పలక దొరికితే బాగుండు

చెరిపి  రాయాల్సిన జీవిత పాఠాలు

చాలా గుర్తుకొస్తున్నాయి    (పుట..28)

వాక్యం రసాత్మకం కావ్యం కదా, వ్యవసాయానికి విద్యుత్తు ఉచితం కావడం ఎంతో గొప్ప రససిద్ధి కావ్య ఖండం గా  భావిస్తూ, కవిత్వమిచ్చే ఉచిత విద్యుత్తును సమర్పి స్తున్నాడు .

చక్రంతిప్పి కుండల్ని తీర్చిదిద్దినంత నేర్పుగా   కణ కణ మండే కొలిమిలో 

పనిముట్లను వంకీలు తిప్పినంత ఒడుపుగా

మగ్గంమీద మేలిమి చీరల్ని నేసినంత ప్రేమగా 

దార్శనికులు ధర్మం కోసం పోరాడతారు   (పుట..31)

వెనకట ఇక్కడొక ఊరుండేది. మనుషులకు రక్షణ కవచంగా ఎవరైనా చూపిస్తారా? అంటూ పల్లెల గతకాలపు వైభవాన్ని మన ముందుంచు తున్నాడు కవి.

కరువంటేఎలా ఉంటది? వలస బతుకులంటే ఎలా ఉంటాయి? బతికే టోళ్లుఎవరు? బలయిపోయే పోరలు ఎవరు? అంటూ ప్రశ్నిస్తాడు.

 ఊరి మొగసాల కింద

 రావియాకుల గలగల కింద

 రాలిపోయే కన్నీటి కింద

 చెప్పుకోలేని బాధ బిడ్డా! కరువు

 వెంటవస్తే నేను కూడా మీకో బరువు     (పుట..39)

పని లేక పోవడమంటే జీవితం లేక పోవడమే లేకపోవడమే నంటాడు  ఈ కవికి నాన్నంటే ఆరబెట్టిన నీటిరంగుల వర్ణ చిత్రం లా, ఒక స్పష్టత జ్ఞాపకం.

వలస కాలంలో నాగలి కర్రు నీటి మట్టం నిర్దయగా జారుకుంటుంది .డుద్దు కూడా దొరకని పరిస్థితి, ఆడవాళ్లు పని దినమంతా మైళ్ళ కొద్దీ మంచినీళ్లకు నడకలు. నూకల్లేని   ముసలి యచన కలవరపెడ్తుంది.

ఖజానాలో ధనం మూలుగుతుంది గిడ్డంగుల్లో ధాన్యం మురుగుతుంది. కాలే కడుపుల మీంచి రోజుకో శవం లేస్తుంది. ఇదీ వలసల కాలమంటే.

సర్కస్ జీవనంలోని విషాదాలను వివరిస్తాడు ఒక చోట కవి. కొల్లేటి కలెక్టర్ గారి పేరు పొందిన అగర్వాల్ గారిని కవి   ప్రశంసిస్తాడు.

 1983లో విడిపోయిన పదవ తరగతి సహ విద్యార్థులు మళ్లీ 21 ఏళ్ల తర్వాత కుటుంబాలతో సహా ఆత్మీయంగా కలుసుకున్నప్పుడు, కవి హృదయం కాడ మల్లెపూలచెట్టయి, పట్టలేని పరవశంతో అవధులు దాటిన ఆనందంతో ఫ్లాష్ బ్యాక్ చైల్డ్ హుడ్ మెమరీస్ ను నెమరేసు కుంటాడు.

  కాలం ముందుకు గడిచినప్పుడు ఖచ్చితమైన వీడ్కోలు తప్పనప్పుడు పట్టపగ్గాలు లేని విశ్రాంతి లోనూ ఊహాతీతమైన శూన్యంలో

 బరువైన జ్ఞాపకాలతో

 చిట్యాల నుండి చిత్ర చిత్ర ప్రదేశాలకు  అంతుచిక్కని ఆకాశంలోఊర పిచ్చుకలమై  లోతెరుగని సముద్రంలో చేపపిల్లలమై..   (పుట..78)

 

సురక్షిత కలశాలతో

గట్టు మీద కూర్చున్న వాళ్లేవరైనా

నా బాధ్యతల యుద్ధరంగంలో

మునిగితేలే వారిని గాయపరచడం

సులువే మరి    (పుట..80)

కట్టుబట్టలకోసం,కడుపు కోసం పునాదులు తవ్వే  దిన కూలీలు వ్యవస్థ చక్రబంధంలో కేవలం ఆకులుగా మిగిలిపోతారని, వేదన పడతాడు కవి.

అవకాశవాద రాజకీయాల్ని కూడా మహా త్యాగమయ పోరాటాలు నిర్వహిస్తాడు పోరాటాలు చిత్రించగల పత్రికాధిపతుల చర్యలను నిరసిస్తాడు కవి.

ప్రభుత్వ శాఖల అన్నింటిలోనూ కుంటిసాకులతో ప్రమోషన్ అడ్డుకునే పరిస్థితిని చూసి,దిగులుగా నిట్టూరుస్తాడు కవి. కాలం ఆకాశం కింద కోటి ఆశలతో ఉగాదులు వస్తూ పోతుంటా యని,అప్పుడప్పుడు ఎవరి వ్యక్తిత్వాన్ని వారే తూకం వేసుకోవాలని సలహా ఇస్తాడు.

చిత్ర కారుడు కాపు రాజయ్య మరణానికి నివాళి సమర్పిస్తాడు. మనుషులంతా కలిసి నడవాలని భుజకీర్తులు లేకుండా కలవాలని ఆశిస్తాడు. తన బాల్యంలోకి మళ్ళీ వెనక్కి పోవాలని ఆశ పడుతున్నాడు నేల మీద పూచిన పూల సోయగాలను చూడాలని ఆశ పడుతున్నాడు.

 అక్కడికి

 ఎలాగైనా మళ్లీ పోవాలె

 చిగురుమామిళ్ల కింద గుసగుసలు

 గుట్టల కింద జ్ఞాపకాలు మల్లెలు

 తలుపుల వీణపై

 తట్టి చూడాలె

మళ్ళీఅక్కడికే పోవాలె    (పుట..127)

 

నల్గొండ జిల్లా చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల1982 -83 బ్యాచ్ పదవ తరగతి స్నేహానికి అంకితమిచ్చిన జ్ఞాపికగా ఈ 'కొత్త పలక'ను ఆవిష్కరించారు కవి

 ఇందులో మట్టి నుండి ఉదయించిన ఊహలు చీల్చుకుని అనుభూతులు అనుభవాలు ఆశయాలు ఈ కొత్త పలకపై మెరుస్తాయి.

--------------------------

గెలుపు కోసం నిరంతర శోధనే   "మూల మలుపు" (2018 )

--------------------------

సృజన లోకములో నిరంతరం కవి అంతరంగ శోధనే ఈ మూల మలుపు.

అసలు 'మలుపు' అంటేనే ఒక అధ్యాయం మొదలు కావడం లేదా జీవితంలో ఒక కొత్త  దశ ఆరంభం కావడం అనే అర్థం లో వాడుతూ ఉంటాం. వాడి జీవితం మలుపు తిరిగింది అంటూంటాం.అంటే వాడికి ఒక  కొత్త జీవితం,లేదా ఒక సంతోషకరమైన అధ్యాయం మొదలైందన్న అర్థంలో వాడుతాం.

కొన్ని పదాలకు, పదబంధాలకు ప్రాంతాలను బట్టి  లౌకిక అర్థాలు మారుతూ ఉంటాయి.

కవి వాడిన 'మూలమలుపు' అనే పద బంధానికి నలిమెల భాస్కర్ గారు రూపొందించిన తెలంగాణా పదకోశంలో (మూల మల్గుడు), వీధి మలుపు, అనే అర్థాన్ని సూచించారు. 

కవి కూడా ఈ అర్థప్రయోగం లోనే పుస్తకానికి పేరు పెట్టినట్లు భావిద్దాం 2013లో వెలువడిన "కొత్త పలక" తర్వాత మరో ఐదేళ్ల కు వచ్చిన కవిత్వమే ఈ "మూల మలుపు' మార్కెట్ మాయాజాలం లో  మనుషులంతా తప్పిపోతూ, ఎదురుచూస్తూ తడబడుతూ పారిపోతున్న నేటి కాలానికి  ప్రేరణగా నిలిచిన కవిత్వమే  "మూలమలుపు".

నడిచొచ్చిన నేను తిరుగాడుతున్న ని తీరం చేరువయ్యే దాకా కన్నీటిని ఆపుకుంటూ భావిస్తాడు. మార్కెట్ ప్రపంచంలో లోకమంతా వచ్చిన దారిని మర్చిపోతూ ఉంటారు. తాము ఉన్నచోటే ఉండి ఒక్కొక్కరే తప్పి పోతూ ఉంటారని కవి భావన.

 మనం ఉన్నచోటే ఉండి

 ఒక్కొక్కరం తప్పి పోతూఉంటాం

 ఎవరూఎవరికీ కనిపించే టట్లు లేరు.

 మనం అక్కడే తిరుగాడుతూ ఉంటాం తిరిగిన ప్రదేశంలోనే

 పదే పదే కలుస్తూ ఉంటాం  (పుట..25)

జీవన వేదనలన్నీ గుక్కపట్టిన   మరణమని, ఒంటరి దుఃఖాన్ని ఎవరూ పంచుకోలేమని అంటాడు కవి. నిద్రలో నవ్వు గురించి అద్భుతంగా నిర్వచిస్తాడు. కవిత్వం చెప్పడం కష్టమని అది నవ్యత్వ ఆలోచననీ, జడత్వ విమోచననీ,చెబుతూ కవి ఎప్పుడూ ప్రజల పక్షమే నని ఢంకా బజాయించి మరీ చెబుతాడు కవి.

జాలువారుతున్న పంటకాలువ గట్లమీద, పూల తీగల పులకరింతలు, తల్లి ఒడిలో ఖుషి చేసే పిల్లవాడిలా, జలదృశ్యం ముంగిట్లో ఉన్న  ఊరును మన కళ్ళ ముందు దృశ్యమానం చేస్తాడు కవి.

 జ్ఞాపిక అంటే

 కాలం వెనక్కి తిరిగి

 ప్రేమాత్మకంగా చేసే మువ్వల శబ్దం

 ఇంటి నిండా జ్ఞాపికలు సరే

 మదిలో చాలాకాలం నిలిచే జ్ఞాపకాలు కొన్నైనా ఉండితీరాలి   (పుట.. 45)

రాతిని ఉలితో చెక్కి శిల్పంగా మలిచినట్లు  కవిత్వాన్ని  చెక్కాలి.చిరకాలం గుర్తుండిపోయే వాక్యాల్ని పోత పోయాలని వర్ధమాన కవులకు సలహా ఇస్తాడు. అంటాడు.అన్నిచోట్ల దేవుడు ఉండలేక అమ్మను సృష్టించినట్లు అమ్మకు శక్తి నిమ్మ ని నాన్నను పంపించాడని చమత్కరిస్తారు   కవిత్వం ఒక ప్రత్యేక ప్రపంచమనీ,అందులో నేనుంటాననీ  సెలవిచ్చాడు. భయానికి ఒక రూపం ఉంటుందని భ్రమ లో ఉండేవాళ్ళం భయం అనేది మహా మాయావి అంటాడు.  కొందరికేమో జీవితమే క్రీడ మరి నాకేమో రెవిన్యూ బాధ్యతల క్రీనీడ అంటాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం విడిపోయింది ఈ పది జిల్లాల తెలంగాణ ముప్పై ఒక్క దీపాలుగా వెలుగొందుతుందని తన ఆశావహ దృక్పధాన్ని తెలియజేస్తాడు.

కవిగా కవి నందిని సిద్ధారెడ్డి గారి నిబద్ధతను కవి  కొనియాడు తాడు.  పుస్తకాలు లేని ఇల్లు ఎడారి వంటిదని, కవి అన్నవాడు రోజు ఏదో ఒకటి రాయాలంటాడు.

ఇరానీ చాయ్ లేని హైదరాబాద్ ని ఎలా ఊహించగలం? గాయపడకుండా ఉండాలి అనుకుంటాను చివరికి గాయపడ్డ కే ఇల్లు చేరుకుంటాను గెలవడం మన చేతుల్లో లేనట్లే ఇతరుల్ని గెలిపించడం అంత సులభం కాదు.

రెప్పలు గాయపరిచిన కంటినిండా ఉద్వేగం జారి పోతున్నట్లు, చెదిరిపోతున్న సౌందర్యం కనిపించని భాషలతో మనల్ని కట్టేస్తుంది

2014 జూన్ 2న ఆంధ్ర ప్రదేశ్ నుండి కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ మనసారా స్వాగతిస్తూ తన ఆనందాన్ని ప్రకటించే సన్నివేశాన్ని పారవశ్యంతో కవితాగానం చేస్తున్నాడు కవి.

కాల యవనిక మీద

సప్తవర్ణాల అద్దకం దిద్దినట్లున్నది

నవ తెలంగాణ పురోగామి ద్వారం తెరుచుకున్నట్లుంటుంది.  (పుట..90)

చిన్నప్పటి సినిమా సంబరాన్ని  ఇప్పటి ప్రపంచంతో పోల్చి చూపాడు. సారస్వత పరిషత్  నిత్య చైతన్య శీలిగా రూపొందించే  సాహిత్య,సాంస్కృతిక కార్యక్రమాల్ని  ఎంతగానో కొనియాడారు.

భారత ప్రధాని పెద్ద నోట్ల రద్దు మంత్రం ఏ మాత్రం పని చేయలేదన్నాడు. రెక్కలు విరిగితే పక్షి ఎగరలేదు, ఆయుధం లేని వీరత్వం ఎందుకు కొరగాదు. ప్రతి ఉగాదికి ముస్తాబై సాహితీ కళా సాంస్కృతిక సంబరాలతో కళ కళలాడే రవీంద్ర భారతిని ఇష్టంగా తలుచుకుంటాడు.

ఏదీ మిగలదనితెలిసీ

ఏదో మిగిలించుకుందామని

ఒక్క చోట కాలు  నిలువకుండా

నడయాడే నది, మనిషి  (పుట..116)

పూల పూల పరిమళమున్నట్లే  నేలకు కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. చందమామను కిందికి దింపిన చార్మినార్ ను హైద్రాబాద్ కు తలమానికం గా భావిస్తాడు.నడుస్తున్న తొవ్వ లో మలుపుదాటాలి,ఎట్లున్నా ప్రయాణం సాగించాలి. 

నడుస్తున్న తొవ్వ

కోరుకున్నది కాదు

మలుపుల దగ్గరి దుఃఖం

 దింపుకోవడం

 గుండె కోతే

 శరీరం మీద దాని

 దాడి కనిపిస్తది

 మనో శకలం మీద దాని నాడి

 స్వారీచేస్తది

 మనకో మనసుంటది

 తన దారిలోనే అది నడిపిస్తది    (పుట.. 124)

 

ఆసిఫా హత్య పట్ల తీవ్రంగా స్పందిస్తాడు కవి.

గోవుల్ని ప్రేమించే పులి

పసి బాలికల్ని కామించే మూకల

మాతృభక్తి కి

మోజు పడుతుంది

దేవుడు జీవుల్ని కోరే వ్యవస్థ

ప్రతీకలు కదా

ప్రాణం కన్నా శీలం

కీర్తించబడే దేశంలో

 ఆసిఫాను దళిత ద్రౌపదిని చేసి

 పగలబడి నవ్వుతుంటే 

 వ్యవస్థ అంతా పులి ముట్టించిన

 వెలుగు లోనే వికృత నృత్య మాడుతుంది

పులి గోవుల కనికరపు గొంగడి కప్పుకొని మనిషుల్ని వెంటాడుతుంది  మనుషులంతా

ఒక్కటి కావాలె

పులిని బోనులో పెట్టాలె   (పుట..145)

ఇవాళ పులి గోవుల కనికరం గొంగడి మనుషుల్ని వెంటాడుతుంది కావున మనుషులంతా ఒక్కటి కావాలి పులి బోనులో పెట్టాలి అంటున్నాడు కవి.

కవి ఏనుగు నరసింహా రెడ్డి గారి  మూలమలుపు కవిత్వంలో సమకాలీన తెలంగాణా జీవితం మనల్ని తట్టి లేపుతుంది .

తెలంగాణ జన జాగృతికి అద్దం పడుతుంది ఒకప్పటి పల్లెటూర్లు ఇప్పుడు నగరానికి వలస వచ్చిదుర్భర జీవితాల్ని గడుపుతున్న ఉదంతాల్ని  ఇందులో కవిత్వం గా మలిచారు.

 

కవి తన బాల్య జీవనం గురించి నెమరువేసుకోవడం మనం ఇందులోనూ గమనించగలం.

-------------------------

మానవీయ తాత్విక భావాలు  తెలంగాణ రుబాయిలు (2020)

--------------------------

మూల మలుపు తర్వాత మరో రెండేళ్లకు 'తెలంగాణ రుబాయిలు' పేరుతో ఒక బృహత్ గ్రంథం తీసుకురావడం కవి గారి కవితా చైతన్యంలో  నిజంగానే ఒక కొత్తమలుపు. 'మూలమలుపు'  కవిత్వానికిది పొడిగింపు గా నేను భావిస్తున్నాను. పేరుకు ఇది తెలంగాణ రుబాయిలు గానీ ఇందులో తెలంగాణా ప్రాంతీయ జనజీవనం గానీ, భౌగోళిక చారిత్రిక విశ్లేషణలు గానీ ఇందులో మనకు కనిపించవు.కవి సార్వజనీన హృదయావిష్కరణమే వినిపిస్తుంది.

కవి తెలంగాణా ప్రాంతీయుడు గనుక బహుశా అందుకు సంకేతార్థంగా ఈ పేరు పెట్టి ఉండవచ్చు.ఒక అవిశ్రాంత ఉద్యోగిగా,ప్రభుత్వ పాలనా యంత్రాంగం లో కీలక బాధ్యతలు నిర్వహించే ఒక అధికారి కవి గా తనదైన సమయాన్ని కేటాయించుకొని కవిత్వం రాయడం అరుదైన విషయమే అయినప్పటికీ కవి గా ఏనుగు నరసింహారెడ్డి గారు ఒక కొత్త కళాత్మక ప్రక్రియ రుబాయిలు వైపు ఆసక్తిగా తలొగ్గి ఏకధాటిగా 536 రుబాయిలు  రాయడం,వాటిని మళ్ళీపుస్తక రూపం తేవడం, నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది.  ఇందుకు ప్రధానంగా ఆంధ్రప్రభ పత్రిక ఇచ్చిన ప్రేరణ కావచ్చు.

ఆంధ్రప్రభ దినపత్రిక,ఆదివారం సంచికలో 2016 ఫిబ్రవరి28 నుండి 2019 మార్చి3వ ఆదివారం వరకు అంటే మూడు సంవత్సరాల ,ఒక్కనెల దాకా సీరియల్ గా  ప్రచురిస్తూ వచ్చినట్లు కవి మాటల్లో తెలిసింది.పత్రికా ప్రేరణ లేకుంటే కవి

500 పైగా రాసుండేవారు కాదు.

ఇటీవల చాలా మందిని చూస్తున్నాం.ఓ యాభయ్యో,వందో రాసి, పుస్తకం గా వేసి,ఆ ప్రక్రియకు తనవంతుగా న్యాయం చేసినట్లుగా ఫీలైపోతున్న కవుల్ని రచయితల్ని ఇవాళ మనం చూస్తున్నాం.

అలా కాకుండా పత్రిక ఇచ్చిన స్ఫూర్తితో పాటు,తనలో ఇంకి పోని చెలిమగా స్రవించే  భావోద్వేగం వల్లనే ఐదువందలకు పైగా ఈ రుబాయిలు రాయగలిగారంటే కవిలో రగిలిన ,భావోద్వేగం ప్లస్ భావ స్పూర్తికీ హ్యాట్సాఫ్ చెబుతున్నా.

ఇకపోతే అసలు విషయానికొస్తే రుబాయీ అనేది అచ్చమైన  ఒక ఫారసీ  ఛందస్సు ప్రక్రియ.ఈ రుబాయీలో నాలుగు పాదాలుంటాయి.ఈ నాలుగు పాదాలు ఒకే భావాన్ని వ్యక్తం చేయాలి.నిర్దిష్టమైన ఛందో నియమాలతో 1,2,4,పాదాలలో రదీఫ్,కాఫియా లను పాటిస్తూ ఒకే విషయాన్ని చమత్కారపూర్వకంగా వ్యక్తపర్చడం కవి నైపుణ్య ప్రదర్శనకు ఆస్కారం కలిగిస్తుంది.మూడవ పాదం భావ పరిణామ సూచకంగా ఉంటుంది.

నియమాలను,మూల సూత్రాలను చక్కగా ఆకళింపు చేసుకొని, తనలోని సృజన కు పదును పెడ్తే రుబాయీల రచన  కవి భావనలో కొత్త అభివ్యక్తి లో రాటుదేలి తనదైన ఒక రుబాయీల ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు కవి.

ఇలా తెలంగాణా రుబాయిల్లో తనదైన సరికొత్త భావనా ప్రపంచం లో విహరించాడు ఈ కవి.నాకు తెలిసినంతలో  డా.దాశరథి,డా.తిరుమల శ్రీనివాసాచార్య తర్వాత రుబాయీలను సంఖ్యా పరంగా, ఇంత విస్తృతంగా రాసిన వారు ఈ కవే నని చెప్పవచ్చు.

ఇంక రుబాయిల లోకి ప్రవేశిద్దాం..

పాపాయి ఆటా, పాటా, నవ్వూ, ఇలా ఉందన్న చమత్కారం...

వీణ మోగినట్లు పాడింది పాప

కొమ్మ ఊగినట్లు ఆడింది పాప

వాణీ విలాసం ఆమె చుట్టూర

ఆత్మ వెలిగినట్లు నవ్వింది పాప

చిట్టి నడకలు,మాటలు,వాళ్ళున్న ఇల్లు ఇలా ఉంటాయట...

చిన్ని నడకల పడవలే పిల్లలు

చిట్టి మాటల వరదలే పిల్లలు

ఇల్లు ఒక ద్వీపం వాళ్ళు దీపం

రంగురంగుల మల్లెలే పిల్లలు   (పుట..29)

మన అనుభవానికి మించిన గురువు లేడుఅనుభావాలన్నీమనకు జీవిత గుణపాఠాలే నంటాడు కవి..

ఖాళీ కడుపులతో అలసినప్పటి రోజులు ఖాళీ జేబులతో తిరిగినప్పటి రోజులు చెప్పిన పాఠాలు ఏ గురువు చెప్పలేడు దిక్కుతోచని పక్షులైనప్పటి రోజులు      (పుట..31)

కవిత్వం వచనం కాకూడదనీ,భాష్యానికి తగ్గట్టు భావన సాగాలనీ,మొక్కకు అవసరమైనంత నీరు,అవసరానికి మించిన సంపద ప్రేమల్ని దూరం చేస్తుందని జీవన సత్యం బోధిస్తాడు కవి...

వచనం ఎక్కువైతే కవితా తగ్గుతుంది భాష్యం ఎక్కువైతే భావనా తగ్గుతుంది మొక్కకు నీరుండాలి ముంచేట్టుగా కాదు

సంపదలు ఎక్కువైతే ప్రేమ తగ్గుతుంది   (పుట..33)

మతములన్నియు మాసి పోవును,  జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును అన్నాడు గురజాడ..ఈ  కవి కూడా కులమతాలు,

భేషజాలు అన్నీ మాసిపోతాయన్న తాత్విక భావాన్ని ప్రకటిస్తాడు.

ఈ కులము ఈ మతము మాసి పోతవి

ఈ హంగూ ఆర్భాటం సమసి పోతవి భేషజాలు ఎన్నున్నా నేల మీదనే

పై లోకంలో నిజాలు తెలిసిపోతవి   (పుట..47)

అమ్మ మాట,నాన్న నడక మన జీవన సంస్కారానికి బాటల నేర్పరుస్తాయి అంటున్న కవి...

అమ్మ నేర్పిన మాట గొప్పది

నాన నేర్పిన నడక గొప్పది

నడుమ విద్యలు ఎన్ని ఉన్నా

తొలుత నేర్చిన నడత గొప్పది   (పుట..73)

ఎవరి నొప్పి వారి హృదయానికే తెలుస్తుంది.పరుల సానుభూతి కి గాయం  మానదంటాడు కవి..

ముళ్ళు దిగిన పాదానికె నొప్పి

తెగిన చేతి చుట్టూనే నొప్పి

పరుల సానుభూతంతా ఊహ

 గాయపడిన హృదయానికె నొప్పి

తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు, ఆశకు మించిన దరిద్రం లేదు అన్నా డొక కవి

మరి ఈ కవి కూడా ఏమీ తక్కువ తినలేదు..నీ మాటల్లో నిజముండాలి,నీ చేతల్లో సాయం ఉండాలి,నీ ఘనత అక్కర్లేదు నిజాయితీ చాలు అంటాడు..

నిజమొకటి మాట్లాడు నీతులు అక్కరలేదు/ చిన్న సహాయము చేయుఖ్యాతులు అక్కరలేదు/ సంతృప్తి యన్న దొకటే స్వర్గలోక  నకలు

సహజ వర్తన మేలు,ఘనతలు అక్కరలేదు   (పుట..103.)

సొంత ఊరిపట్ల మమకారం,బాల్య దోస్తులపట్ల యౌవనోత్సాహం, పొక్కిళ్ళయిన  వాకిళ్ల లో పొర్లిపోయే కన్నీళ్లు, బాల్య జీవిత ఆనవాళ్ళంటాడు కవి.

ఒక్కసారి ఊరికెళ్తే కొత్త జీవమొస్తుంది దోస్తులతో కీచులాడ నవయవ్వన మొస్తుంది/ పొక్కిలైన వాకిళ్ళు పొర్లి పోయిన కన్నీళ్లు/ గుర్తుకొచ్చి మరోసారి నవజీవన మొస్తుంది.  (పుట..125)

పక్షి కన్నీరు కన్పించదు,చెట్టు దుఃఖం విన్పించదు.మన లోలోపలి దుఃఖం ఎవరికీ అంతుచిక్కదంటాడు కవి.

 పక్షి కంట కన్నీరు ఎవరు చూతురుల

చెట్టు కార్చు మున్నీరు ఎవరు చూతురు మన కొరకే ఈ లోకం అనుకుంటం 

మన లోపలి దుఃఖఝరి ఎవరు చూతురు  (పుట..145)

ఇవ్వడమే తెలిసిన పల్లెకు చేయి సాచే గుణం తెలియదు.పట్నాలకు గుంజుకోవడమే తెలుసు,ఉపకారమంటే ఏమిటో తెలియదు అంటున్నాకవి...

పాలవాడు ప్రతిరోజూ పల్లె పరిమళము

తెస్తడు/కాయగూర కాపుబిడ్డ మట్టి మధురిమలు తెస్తడు/ రెండు చేతులా పట్నం గుంజుకొనుడె ఉంటెట్లా /

 ప్రతి రైతూ పండించీ పంట మోసుకుతెస్తడు    (పుట..183)

మరో రుబాయీలో పల్లె త్యాగాన్ని గురించి ఇలా అంటాడు.

పట్నానికి శ్రమ ఫలాలు పంపుతుంది ఊరు పట్నానికి చెమ్మటనే ఒంపుతుంది ఊరు కలకాలం పల్లెలకె రుణ పడ్డది నగరం పట్నానికి ప్రాణవాయువు నందిస్తది ఊరు   (పుట..189)

సహజీవనమే జీవన సౌందర్యమనీ,  అనుబంధాలకు,ఆనందాలకు ప్రోత్సాహం,  ఉత్సాహం టానిక్కులంటాడు కవి.

నలుగురితో కలవడమే నిజమౌ టానిక్  పలువురితో సంభాషణ నిజమౌ టానిక్  కొంటే దొరికేది కాని బలవర్ధకమూ ఉత్సాహం, ప్రోత్సాహం, నిజమౌ టానిక్  (పుట..297)

సంఖ్యాపరంగా ఈ 536 తెలంగాణ రుబాయిల్లో  అన్నీఆణిముత్యాలు కాకపోవచ్చు, కొన్ని సామాన్య నీతి బోధకాలు గా అనిపిస్తాయి.కానీ చాలావరకు సంతృప్తి కరంగా,వాస్తవికంగా ఉన్నాయి.తాత్త్విక చింతనకు సంబంధించివి తక్కువగా కనిపిస్తాయి.

నేను స్థాలీ పులాక న్యాయంగా నేను అతి తక్కువగానే ఉటంకించాను.సమయా భావం, స్థలాభావం వల్ల కేవలం అయిదు శాతం రుబాయిలను మాత్రమే కోట్ చెయ్యగలిగాను.  ఇందులోని రుబాయిలు కొన్ని గతంలో తాను రాసిన మట్టిపాట శతకానికి పొడిగింపుగా మనకు అనిపిస్తాయి.

ముందే చెప్పాను,పేరుకే తెలంగాణ రుబాయిలు తెలంగాణా జీవితానికి సంబంధించి గానీ,ఉద్యమ,పోరాటాల గురించి గానీ, ప్రస్తావనలు నాకు కన్పించలేదు.

అందుక్కారణం ఇవి రాస్తున్నకాలం నాటికే (2016-2019) తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడి పరిపాలన లో తనదైన ఉనికి చాటు కుంటూ ఉంది.కాకపోతే తెలంగాణ వ్యవహార భాషా శైలికి ఈ రుబాయిలు అద్దం పడుతున్నాయి.

మొత్తంమీద రుబాయీల సృజనలో కవి సాగించిన అనితర సాధ్యమైన ఈ కృషి తెలుగు సాహిత్య చరిత్రలో నిల్చిపోగలదు.

డా.ఏనుగు నరసింహారెడ్డి గారు ప్రధానంగా కవి,సామాజిక దృక్పథమున్న రచయిత.సాహిత్యం పట్ల నిశితమైన పరిశీలనా దృష్టిగల వివేచనా పరుడుగా అన్పిస్తాడు .తన కవిత్వానికి అనుబంధ రచనలు కొన్ని వెలువరించాడు.వాటిని గురించి కూడా సంక్షిప్తంగా తెలుసు కోగలిగితే వారి బహుముఖ ప్రజ్ఞ మనకు క్తెలుస్తుంది.వారి సమగ్ర కవితా ప్రస్థానం మనకు కూలంకషంగా మనకు అర్థమౌతుంది.

--------------------------

ఒక చారిత్రక అనువాదం  హైద్రాబాద్ విషాదం(2016)

--------------------------

మీర్ లాయక్ అలీ గారి ట్రాజెడీ ఆఫ్ హైద్రాబాద్ ఓ చారిత్రక విలక్షణమైన ఆంగ్లా నువాద రచన. ఆనాటి నిజాం రాష్ట్ర ప్రధానిగా, హైదరాబాద్ దేశభక్తుడిగా  హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్ర్యం కోసం తీవ్రంగా ప్రయత్నించి, విఫలమైన వ్యక్తి ఆనాటి న్యాయాన్యాయాలను తనదైన తూనిక రాళ్లతో బేరీజు వేసి ఆవేదనతో వ్రాసిన గ్రంథమిది.

ఆంగ్లములోని ఈ పుస్తకాన్ని కవి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు తెలుగులోకి అనువాదం చేశారు. ఇది కవి గారి అనువాద రచన మాత్రమే.

హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరగడానికి దోహదపడిన కారణాలను  జరిగిన సంఘటనలను,జరిపిన సంప్రదింపులను అర్థం చేసుకోవడానికి ఈ అనువాదం ఎంతగానో దోహదపడుతుంది. తెలంగాణ చరిత్రనీ,ప్రత్యేకించి హైదరాబాద్ చరిత్రనీ  అధ్యయనం చేయడానికి ఉపకరించే తెలుగు అనువాద గ్రంథమిది.

1947 ఆగస్టు 15 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు నడిచిన ఉద్విగ్నభరితమైన హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈ అనువాద గ్రంథం ఎంతగానో ఉపకరిస్తుంది.

--------------------------

ఆధునిక కవితావిమర్శ లో ఒక పార్శ్వం  'అంతరంగం'( 2018)

--------------------------

కవి డా.ఏనుగు నరసింహారెడ్డి కేవలం కవిగానే కాకుండా,తనలో విమర్శకుడు కూడా ఉన్నాడని ప్రకటించిన ఆధునిక కవితా విమర్శ పుస్తకమే ఈ 'అంతరంగం' ఇది 2018 లో వెలువడింది ఇందులో కవి కవిత్వం పై చేసిన విశ్లేషణాత్మక వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలు కవిగారి నిశిత పరిశీలనా దృష్టిని,తనలో ఉన్న లోతైన అవగాహనను సూచిస్తాయి. ఈ వ్యాసాలన్నీ హైదరాబాద్ కవుల కవిత్వం మీదనే సాగుతాయి. కవిత్వంపై ఆయాకవుల అభివ్యక్తి,శిల్పం, దృక్పథం మొదలైన అంశాలపై దృష్టి సారించారుఇందులో 26 మంది తెలంగాణా కవుల  కవిత్వంపై నిశిత పరిశీలనా దృష్టితో రాసిన సమీక్ష వ్యాసాలుంటాయి.

ఇందులో మహాకవి దాశరథి, అమ్మంగి వేణుగోపాల్ ,సదాశివ డా.కూరేళ్ళవిఠలా  చార్య, విశ్వంభర సినారె, ప్రజా కవి కాళోజీ ఆధునిక తెలంగాణఅస్తిత్వ కవి నందిని సిథారెడ్డి ,ఆశా రాజు, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, మొదలైన 26 మంది ప్రముఖుల కవిత్వ తత్వం గురించి విశ్లేషించిన పుస్తకమిది.

--------------------------

కవి సాహిత్య నిబద్ధతకు సాక్ష్యమే 'సమాహార'(2019)

--------------------------

కవి ఏనుగు నరసింహా రెడ్డి గారి సాహితీ వ్యక్తిత్వానికి నిదర్శనమే ఈ సమాహార సాహిత్య వ్యాసాల రచన. రాయకుండా ఉండలేని భావోద్వేగం కవిని సాహిత్య విమర్శకుడిగా కూడా నిలబెట్టింది.స్వయం ప్రతిభతో ఎదిగిన కవిగా, గ్రామీణ ప్రాంత నేపథ్యం నుంచి వచ్చిన కవిగా, విభిన్న సాహితీవేత్తల సమాహార దర్శనంగా  26 వ్యాసాల సంకలనం గా మనకు అందించారు.. ఇందులో ప్రధానంగా బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవలలో స్త్రీ పాత్రల పరిశీలన మొదలుకొని భాను ప్రకాష్ హృదయ పథం.. వరకు వైవిధ్యభరితమైన వ్యాసాలున్నాయి

--------------------------

కవి పరిశీలన లో విలక్షణ సంస్కరణల ప్రతిపాదనలే...

"తెలుగు రాష్ట్రాల రెవిన్యూ వ్యవస్థ"  నిన్న నేడు రేపు (2019)

--------------------------

కవి ఏనుగు నరసింహా రెడ్డి గారు రెవిన్యూ  శాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ అందులోని అంతర్ బహిర్ స్వరూపాలు స్వయంగా చూసినవారు గనుక,అంతేగాకుండా, జనసామాన్యం పట్ల ఆసక్తి కలిగిన ఉన్నతాధికారిగా, రెవెన్యూ శాఖలోని అవగాహనతో, విశ్లేషణతో ఈ పుస్తకం రాసినట్లుగా మనం భావించవచ్చు

ప్రజా యోగ్యమైన సంస్కరణలను కొన్ని ఇందులో ప్రతిపాదించారు. ప్రజలకు జవాబుదారీ తనంతో పనిచేసే వ్యవస్థగా కలగంటూ రాసిన గ్రంథమిది. ప్రజల సాధకబాధకాలను, రెవెన్యూ శాఖలో రావలసిన సంస్కరణలను, సూచించారు. అటు రెవిన్యూ శాఖ ,ఇటు పాలక వ్యవస్థ ఈయన ప్రతిపాదించిన సంస్కరణలను మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ గ్రంథం చదివితే మనకు అర్థమౌతుంది. ఇందులో రెవెన్యూ శాఖ పై పది అంశాల గురించిన సమగ్ర విశ్లేషణలు ఉన్నాయి.

--------------------------

తులనాత్మక సాహిత్యంలో భాగంగా గుఱ్ఱం జాషువా: డిలాన్ థామస్ ల కవిత్వం లో బాల్యం..(2019)

కవి  ఏనుగు నరసింహారెడ్డి గారు హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో 1991-93 సం.లలో ఆచార్య మృణాళిని గారి పర్యవేక్షణలో సమర్పించిన ఎం,ఫిల్., సిద్ధాంత గ్రంథ రూపమే ఈ.. గుఱ్ఱం జాషువా:డిలాన్ థామస్ ల కవిత్వంలో బాల్యం.(తులనాత్మక సాహిత్యం).

తెలుగులో జాషువా కవితల్లో బాల్యాన్ని గురించి, ఆంగ్లంలో డిలాన్ కవిత్వంలో బాల్యం గురించి తులనాత్మకంగా అధ్యయనం చేశాడు కవి.

 జాషువా కవిత్వం భావ ప్రధానమైంది భావాన్ని అనుసరించి ఆయన భాష ఉంటుంది. భాష మీద మక్కువతో  విషయాన్ని దారి మళ్లించడు. ఏ విషయాన్ని తీసుకుని కవిత్వ రచన చేసినా, తన పరిధి దాటకుండా ముగించడం ఆయన లక్షణం.

 అందుకు భిన్నమైన వాడు డిలాన్ భాష పట్ల ఆసక్తి ఎక్కువ. ఆయనకు ఒక కొత్త పదం కనిపిస్తే దాన్ని ఆలంబనగా చేసుకుని కవిత్వ రచన చేస్తాడు. ఒక కొత్త భావాన్ని ఏర్పరచుకొని కాదు, అందువల్ల కవిత్వం ప్రారంభమైన తర్వాత అది కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది .

జాషువా కవిత్వం రచనా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. జాషువా కవితల్లో సామాజిక సంఘర్షణ కనిపిస్తుంది డిలాన్ కవిత్వంలోనూ అది కనిపించదని పరిశోధకుడు గా నరసింహారెడ్డి గారు నిరూపిస్తారు.

ఈ ఎం,ఫిల్., సిద్ధాంత వ్యాసమే 2019 లో గ్రంథ రూపంలో వెలువరించారు కవి.

 -------------------------

తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు (తులనాత్మక పరిశీలన ) -పిహెచ్,డి., గ్రంథం (2019)

--------------------------

కవి ఏనుగు నరసింహారెడ్డి గారు 1993-98సంవత్సరాల  మధ్యకాలంలో హైద్రాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ఆచార్య పి.మృణాళిని గారి పర్యవేక్షణలో తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు (తులనాత్మక పరి శీలన)అంశం గా  పిహెచ్,డి.,పూర్తి చేశారు.ఈ సిద్ధాంత గ్రంథమే 2019 లో పుస్తక రూపంగా వెలువరించారు.

తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలపై చేసిన పరిశోధనలో ప్రధానంగా గమనించదగిన అంశం.. ఏక వస్తుకత. తెలుగు హిందీ లలోనే కాకుండా ఇతర భారతీయ భాషలలో కూడా జాతి విముక్తి పోరాట గీతాలు ఉద్యమ కాలం లో ముమ్మరంగా వెలువడిన గీతాలను పరిశీలించినప్పుడు ఈ విషయమై మరింత స్పష్టత పడిందని నిరూపించాడు పరిశోధక కవి.

జాతీయోద్యమంలో పోరాట వాదులు మితవాదులు మధ్యేమార్గం అవలంభించిన నట్లే జాతీయోద్యమ గేయ కారులో మూడు వర్గాల కవులున్నాలు న్నారని ఈ అధ్యయనం ద్వారా స్పష్టత నిచ్చాడు  పరిశోధకుడు.  జాతీయోద్యమం చూపిన గొప్ప ప్రభావం అన్ని ప్రాంతాల, వర్గాల, వయసుల, ప్రజల్ని కదిలించింది. స్వాతంత్రోద్యమం ఒక గొప్ప పోరాట గీతాలతో సాహిత్యాన్ని సుసంపన్నం చేసిందని ఇందులో పరిశోధకుడు వివరించారు. ఈ సిద్ధాంత పరిశోధనా గ్రంథం 2019లో  పుస్తక రూపం గా వెలువడింది.

-డా.ఏనుగు నరసింహారెడ్డి సమగ్ర కవిత్వ అధ్యయనం,పరిశీలన,విశ్లేషణల అనంతరం నాలో కల్గిన భావ సంచలనాలు,

ప్రతిస్పందనలు కొన్ని పాఠకులతో పంచుకోవాలనిపిస్తుంది నాకు.

-  52 ఏళ్ల జీవన యానం లో 27ఏళ్ల కవితా ప్రస్థానం కవిది.

తొలిసారిగా కవిగా రెక్కలు విచ్చుకున్న నాటికి వీరి వయస్సు 27 ఏళ్ళు,  అప్పటికియువకుడిగా నిరుద్యోగిగా కవిత్వంలోకి అడుగు పెట్టినప్పుడు వారి హృదయాకాశంలో  యవ్వనం తాలూకు సహజంగా ఉండే ప్రేమ భావనలు గానీ అనుభూతుల పరవశం గానీ లేక పోవడం ఒక విశేషం. పల్లెజీవనం,మధ్యతరగతి రైతు కుటుంబజీవనం ,నిరుద్యోగిగా తన అంతరంగ అలజడిని కవిత్వం గా  అవిష్కరించుకున్నారు.

తొలి కవితా సంపుటిలో నిరుద్యోగ పర్వంలోంచీ పెల్లుబిన వేదనే ప్రధానం గా  ప్రతిధ్వనించింది.  - తర్వాత ఏడేళ్లకు వచ్చిన కవిత్వం 'నేనే'లో కాలం తెచ్చిన మార్పులతో బాధ్యత గల ఉద్యోగం కవి భావజాలం లోనూ కొంత పరిణతి తెచ్చింది.సామాజిక అవగాహన పెరిగింది,కవిత్వంలోనూ సాంద్రత పెరిగింది. - తర్వాత ఆరేళ్లకు వచ్చిన 'మట్టి పాట' పద్య శతకం తో కవిత్వం లో కొంత వైవిధ్యం చోటు చేసుకుంది. - మట్టి పాట తర్వాత ఐదేళ్లకు వచ్చిన 'కొత్త పలక'(2013) లో వస్తువు ఎంపిక లోనూ,భావప్రకటనలోనూ,సామాజిక, రాజకీయ అవగాహననువిస్తృతం చేసిందనే చెప్పాలి.ఉద్యమాల పట్ల సంఘీభావం ఏర్పడింది.

-రాష్ట్రంవిడిపోయి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన  నాలుగేళ్ళ తర్వాత వచ్చిన కవిత్వం "మూల మలుపు" లో ప్రాంతీయ చైతన్యం పట్ల అవగాహన పెరిగింది.

-నాకు తెలిసిన,నాకు పరిచయమున్న కొందరు  రాష్ట్రం విడిపోయాక కూడా తెలంగాణా కవులు,రచయితలు  సీమాంధ్రుల పట్ల అవమాన కరంగా రాయడం నేను గమనించాను గానీ ఈయనెక్కడా అలాంటి పదజాలం వీరి కవిత్వం లో నాకు కనపడలేదు.

-కాకపోతే..ఒక కవితలో ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రముఖ్యమంత్రిగాఉండి, కార్యదక్షుడిగా ప్రశంసలు పొందిన ఒక రాజకీయ మేధావిని ఒక చరిత్ర హీనుడిగా  అభివర్ణించడం అస్మదీయులకు బాధాకరంగా తోచింది .ఆ కవితను సంకలనం లో చేర్చకుండా ఉంటే బావుండు ననిపిస్తుంది. -అదొక్కటే తప్ప, తన కవిత్వంలో మరెక్కడా సీమాంధ్రుల పట్ల అధిక్షేపం ప్రకటించలేదు.

-తాజాగా వచ్చిన "తెలంగాణ రుబాయిలు'.  కవిగారి విలక్షణ సృజన.500 లకు పైగా రుబాయిలు రాయడం వెనుక కవిగారి నిబద్ధతను కవిత్వం పట్ల అపారమైన ప్రేమను  మనం అర్థం చేసుకోవచ్చు .

డా.ఏనుగు నరసింహారెడ్డి వ్యక్తిగా సహృదయుడు,ఏమాత్రం భేషజాలు లేని కవి,నాకు గత పదిహేనేళ్ళుగా ఆత్మీయుడు,

నేను బాగా ప్రేమించే వారిలో ఒకడు, వారి 27 ఏళ్ల కవితాప్రస్థానంలో,అయిదు కవితా సంపుటాలు+తెలంగాణ రుబాయిల బృహద్గ్రంథం తో కలిసి ,మరికొన్ని ఆనుబంధ గ్రంధాలను ఆసాంతం చదివి,  విశ్లేషించే అవకాశం నాకు కల్గించినందుకు కవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

వయసులో నాకంటే పదేళ్లకు పైగా చిన్నవారు కావడంవల్ల వారిని ఇష్టపూర్వకంగానే అక్కడక్కడా ఏకవచనం లోనే సంభోదించాను.

ప్రముఖ కవి, విమర్శకులు, డా.సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారన్నట్లు.. నిబద్ధుడైన,చురుకైన కవిగా  సాహితీప్రపంచంలోకి దూసు కొచ్చిన కవిగా డా.ఏనుగు నరసింహారెడ్డి గారిని మనసారా అభినందిస్తూ,సుంకిరెడ్డి మాటలతో నేనూ ఏకీభవిస్తున్నాను.

 

 

 

 


ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు