ఇరవై కథలతో ఎండపల్లి భారతి రెండవ కథా సంకలనం'' బతుకీత " హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ వారి ద్వారా వెలువడింది. మూడేళ్ళ ముందర వెలువడిన భారతి మొదటి కథా సంకలనం "ఎదారి బతుకులు " సాహిత్య ప్రియులను అలరించింది.
భారతి నాకు 20 సంవత్సరాలుగా పరిచయం. రచయిత్రిగా ఐదేళ్లనుంచీ చూస్తున్నాను. కథలు చదివే వాళ్ళు ఎప్పుడూ కొత్త కథల కోసం, మంచి సాహిత్యం కోసం ఎదురు చూస్తుంటారు. ఆ కొరతను తగ్గించడంలో నాకు భారతి కథలు సహాయపడ్డాయి. అంతే కాకుండా ఒక రచయిత్రిని దగ్గరగా చూడటం, ఆమె రాసిన కథలను చదవటం ద్వారా నాకు కొత్త జ్ఞానం వచ్చింది. నాకు తెలియని అనేక జీవితాలను చూడగలిగాను. అనేక తెలుగు పదాలు, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు తెలుసుకున్నాను.
భారతి శైలి ఒక ప్రత్యేకం .తన పల్లెభాషలో కథ చెబుతుంది. జానపద శైలిని పోలి ఉంటుంది. తిట్లు, సామెతలు, జాతీయాలు, పిట్ట కథలుఊరుతూ వస్తాయి. కథలో కథలుంటాయి, సర్వ ప్రకృతి పైన ప్రేమ,మమైకం కనిపిస్తాయి. కోపం, ద్వేషం, తీర్పు ఏమీ ఉండదు.అంత భారమైన జీవితాల్లో కూడా ఒక మాట విరుపుతోనో ఒక సామెతతోనో హాస్యాన్ని, వ్యంగాన్నిఅంతర్లీనంగా చూపిస్తూ ఆ భారాన్ని తేలిక చేస్తుంది. ఆ తాత్వికత వల్లనేమో భారతి కథల్లో స్త్రీలందరూ అలా సజీవంగా మనకి గుర్తుండి పోతారు. వాల్ల భాధ మనదవుతుంది.
ఆమెలో కలిగే ప్రతి ఆలోచన, వేదన, పల్లెలో జరిగే ప్రతి సంఘటన ఆమె కథా వస్తువులు. వ్యక్తి గత మేదీ లేదు అంతా రాజకీయమే అన్నట్టు తన కథలన్నీ మొత్తం ప్రపంచానికి చెందిన కథా వస్తువులే!
భారతి కథ తనే చెబుతుంది .ఒక దళిత మహిళగా ,రైతుగా ,రైతు కూలీగా తన అనుభవాలనుంచి కథలు వస్తుంటాయి. వ్యవసాయం,జీవాల పోషణ ,చుట్టుపక్కల సంఘ జీవనం,ఆడవాళ్ళ కస్టాలు, మగవాళ్ల పాట్లు, బిడ్డలు, పేదరికం, కులం, లైంగికత, హింస, సారాయి, ఆడవాళ్ళ సంఘాలు ఇలా ఎన్నోఆమె కథా వస్తువులు. వీటిలో స్త్రీల నిరంతర శ్రమ, అమానుషంగా ప్రవర్తించే పితృస్వామ్య సమాజం, కుల వివక్ష, పేదరికం, దోపిడీ చేసే వ్యవస్థలు, స్త్రీలపై నిరంతరం జరిగే ఆర్ధిక, భౌతిక, మానసిక దాడి కనిపిస్తుంది.
ఇంత సంక్లిష్ట సమస్యలను అలవోకగా తన పల్లె భాషలో కథగా చెప్పేసి రెండు సామెతలో, ఒక పిట్టకథనో విసిరేసి ఆ బరువుని మన తలపైకి నెట్టేసి నింపాదిగా తన ఆవును మేపుకోను చేను గట్టుకు వెళ్లిపోతుంది భారతి.
ఆమె కథల్లో నెత్తురుచ్చలు పోసుకొని పొలం లో కష్టపడే స్త్రీ పురుషులు కనిపిస్తారు.
క్యారియర్లు ఎత్తుకొని చొక్కాలు తగిలించుకొని కూలికి పోయే ఆడోల్లు మగోళ్ళు కనిపిస్తారు.
వంట చేసి కూలిచేసి బిడ్డల్నిసాకి, జీవాల్ని సాకి సంసారానికి అన్నీకూర్చి నిస్సత్తువగా కూలబడే అమ్మలు పెద్దమ్మలు, వొదినలు, అత్తలు, ఆడబిడ్డలు ఉంటారు.
పోరంబోకు మొగుళ్ళు, ఉడాలు మొగుళ్ళు, తాగుబోతు మొగుళ్ళతో పాటు మంచి మనసున్న మగవాళ్ళు కూడా కనిపిస్తారు.
స్త్రీలు నిరంతరం పడే అనంత వేదనని అర్థం చేసుకుని అనుభవిస్తూ రాస్తుంది భారతి. రోజూ కనపడే స్త్రీల భాధ తాను అర్థం చేసుకున్నంతగా ఇంకెవరు అర్థం చేసుకోగలరు. పేదరికాన్ని, హింసను, అణచివేతను, కష్టాన్ని, శ్రమని అనుభవించిన తనుకాకపోతే ఇంకెవరు రాస్తారు ఇంత లోతైన కథల్ని.
'ఆడదాన్ని నమ్మితే సొమ్ము' కథలో అనుమానించే మొగుడు,'అదవ బతుకు'కథ లో అబద్దాలు చెప్పే మొగుడు, 'మల్లన్నకే మా ఓటు' లో ఒక మంచి మొగుడు, 'ఎవుని సట్లో ఉప్పేసే రాత అడిగొచ్చిందో' కథలో అమ్మను వెనకేసుకొచ్చే కొడుకు ఇలా ఎందరో మనుషుల అనేక స్వభావాలను విడమర్చి చెబుతుంది తన కథల్లో.
జూదం, ఈటి నోటి ముసరపెరికిందెవరు, ఎబుడూ ఎక్కని గుర్రమెక్కితే, సుక్కలపూట కథలలో టమోటా క్యాలీఫ్లవర్ రైతుల వెతల గురించి ,తిండి కోసం పంట పై ఆధారపడిన ఇతర జీవాల గురించి ఎన్నో విషయాలు చెబుతుంది. స్వయంగా మహిళా రైతుగానే కాక రైతు కూలీ గా కూడా భారతికి ఉన్న అనుభవాలు మనకి పంచుతుంది
తాగు నీరు సమస్య , లెట్రిన్ లు కట్టుకోవటంపై ప్రజల స్పందనలు,రోజూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన సంఘ మహిళలకు బ్యాంకుల్లో మరుగుదొడ్లు లేకపోవటం, పనులు లేక మనుషులు ఎలా (జవిరి)మెత్త పడతారో, ప్రతి వేసవిలో పల్లెల్లోకనిపించే దొంగలభయం ఇలా అనేక సామాజిక సమస్యలను కథలుగా మలిచింది ఈమె.
'ఎవుని సట్లో ఉప్పేసే రాత అడిగొచ్చిందో' కథలో మొగుడ్నివదిలి వేరేవానితో వెలిపొయినస్త్రీని వెంటాడే సమాజం, 'కమ్మం నిలేసిన తొలిసొదిన'లో సంసార భాదలు పడీ పడీ పరమ సంసారి అని స్తంబం నిలబెట్టాలనుకునే ఆడోళ్ళ గురించి, 'పేగుల్లేని ఆడోల్లు' కథలో ఆఊరి రెడ్డి లైంగిక దోపిడీ గురించి చెబుతుంది. కూటికుంటే కోటికున్నట్లే అని కరోనావైరస్ మొదలైన కొత్తల్లో ఉన్న పరిస్థితి పైన, అత్తిరసాలు కథలో ఆడవాల్లు పండగలు వస్తే పడేపాట్లు గురించి చెబుతుంది. చాలా కథల్లో జానపద పిట్టకథలు మనల్ని అలరిస్తాయి.
చివరిగా 'నల్లపెట్ట' అని ఒక పెద్ద కథ ఉంది. తాను పెంచుకున్న నల్లపెట్ట బతుకు గురించి దాని పిల్లల గురించి తనకు ఆ కోడికి ఉండే సంబంధం గురించి, తన ఆలోచనలన్నీ కూర్చి అద్భుతమైన కథ నిచ్చింది భారతి.
భారతి కథల్లో తాను వాడే సామెతలు, వాక్య ప్రయోగాలు, జాతీయాలు ఒక ఎత్తు .వాటిల్లో ఎంత తాత్వికత చతురత కనిపిస్తాయో! ఉదాహరణకు కొన్ని ..
'కూడుగుడ్డ అడక్కుంటే సిలుకను సాకినట్టు సాకతాను' అంటాడు నా మొగుడు.
'పట్టెడు బంగారు చేతిలో ఉన్నట్టు వాళ్ళ ఎచ్చులు చూడలేమమ్మా' అని బేల్దారుల గురించి ఒగాయమ్మ.
'మా ఊరి మల్లిగాడు ఎద్దుల్లో తోలినా పోతాడు ఎనుముల్లో తోలినా పోతాడు అంత కలుపుగోలు మన్సి' ఒకాయమ్మ.
'ఈడు ఏడస్తా రైక ముడ్లు ఇప్పే రకం
కాలితో చెబితే చేత్తో చేసే రకం' ఇంకొకాయమ్మ.
'వాడు సిన్నబుడు వాళ్ళమ్మ దగ్గర తాగిన సనుబాలు కూడా ఎల్లబీకేది'
'చెప్పుకుంటే మానం బోతుంది చెప్పుకోకపోతే పానం బోతుంది'
'ఆడతనాన్ని గౌరవంగా చూపించుకోలేక ఒదిగి ఉండే రొమ్ముకట్టు'
'చావుకు భయపడితే అవుతుందా ఏ పొద్దయినా ఒగ గుంత బాకీనే'
'మా ఇంటికి ఈ కులపనాబట్ట పిల్లే గతం వచ్చినాడు'
'ఆ యమ్మ మా ఇంటికి వచ్చిందంటే నా మొగునికి సరాయిలు నిలదు .ఇంగ కాసింత ఉబ్బుతాడు' ఒక పెళ్ళాము.
'టీవీ ముందర గూసుంటే గుద్ద చెదులు బట్టినా లెయడు'
''ఒగరు పెట్టింది తిని సచ్చిపోయినోల్లనుదేవుడు వాళ్ళ సేతులు నరికి పొయ్యిలో కట్ల మారిగా మంటేస్తాడట.నాకదే బాద నా మొగుని సేతులు దేవుడు ఏడ నరికేస్తడో అని ''
' మనం వద్దంటే పుట్టినోళ్లం '
' ఆ పొద్దు రెయ్యే కొండ్లపొడవాన జొరమొచ్చేసింది'
'మా ఉరి మల్లి బీములో మెరుకు నూరుమందిలో ఉన్నా ఏరుపడిపోతుంది'
'ఎలుంగొడ్డుకు ఆతులు చపాతులు ఒకటేనంట '
''అరువై న ఆడది ఇంట్లో ఉంటే అటవకట్లకు ముప్పు అన్నట్లు"
'ఎవుని సట్లో ఉప్పేసే రాత అడిగొచ్చిందో''
పిండి బియ్యంఎత్తుకుని పిన్నమ్మఇంటికి పోయినట్టు'
భారతి కథలు చాలా విలువైనవి. అవసరమైనవి. చివరంచుకు నెట్టబడిన అట్టడుగున ఉన్న దళిత స్త్రీ చెప్పే నిజ జీవిత కథలు అవి.
భారతి ఒక విధంగా మొత్తం పరిణామాల్ని రికార్డు చేస్తూ పోతోంది తన కథల ద్వారా. అది చాలా అవసరం.ముందు ముందు పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ 'బతుకీత 'లోని అన్ని కథలూ వైవిధ్యమైనవి. సాహిత్యపరమైన దాహాన్ని తీర్చటమే కాక అంత త్వరగా మర్చిపోలేని కథలుగా నిలబడిపోతాయి. భాషా పరంగా ఎన్నో కొత్త తెలుగుపదాలను, సామెతలు, జాతీయాలు చూస్తాము. భారతి కథలు ఓపిగ్గా ధ్యానంగా చదవాలి, అప్పుడే భారతి మన చెయ్యి పట్టుకుని వాళ్ళ ఊరికి తీసుకెళుతుంది. ఆ జీవితాలను మనం అలా చూస్తూ వాళ్లలో భాగమైపోతాం!.
'బతుకీత' , 'ఎదారిబతుకులు' కథల సంపుటి కోసం హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ వారిని సంప్రదించవచ్చు. అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంది.