కొత్త పోస్టులు

శీర్షికలు

కథలు

నిండా కనికరం కలిగినోళ్లు  ఆ ఎరికిలోల్లు 

మా నాయిన  చేసింది ఫారెస్ట్ గార్డు, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగమే కానీ, ఆయనకి ఎందుకో ప్రభుత్వ ఉద్యోగస్తుల లక్షణాలు ఏమీ రాలేదు. ఆయన ఎప్పుడూ తనను తాను ఒక ఉద్యోగి అని అనుకోనేలేదు.

ఆ కాలంలో అడవుల్లో మేకలు, ఆవులు మేపే వాళ్ళ దగ్గర అడవిలో కట్టెలు కొట్టే వాళ్ళ దగ్గర ఫైన్ లు వేసి డబ్బులు ప్రభుత్వానికి కట్టాల్సిన టార్గెట్స్ ఉండేవి.

చాలామంది అటవీశాఖ ఉద్యోగస్తులు కట్టెలు కొట్టే వాళ్ళ దగ్గర వాళ్ళ కత్తులు తీసి,తమ వద్దే ఉంచుకుంటారు. కట్టెల వాళ్లు ఫైన్ లు  కట్టిన తరువాతనే ఆ కత్తుల్ని ఆ కట్టెల్ని విడిపించుకోవాల్సి ఉండేది.అప్పుడు కూడా అటవీశాఖ ఉద్యోగస్తులకు ఆ కట్టెలమోపులని ఇచ్చే వాళ్ళు ఉచితంగా. అయినా ఏ రోజు మా ఇంట్లో ఉచితంగా కట్టెలు తీసుకుంది లేదు. మేము అటవీశాఖ ఉద్యోగి  కుటుంబ సభ్యులమే అయినా, మేం సిగ్గుపడకుండా కట్టెలు కొనేవాళ్ళం. నేను అడవిలో కట్టెలు కొట్టే లేదుగానీ, సైకిల్ పైన అడవికి వెళ్లి, ఎండిపోయిన కట్టెలని తాడుతో కట్టి ఇంటికి కట్టెల పొయ్యి కోసం తెచ్చే వాడిని.

అలాంటి రోజుల్లో ఒకరోజు.. ఏం జరిగిందంటే?.. "మేయ్ జయా.. ఇంకో గ్లాసు బియ్యం పెట్టు  పొయ్యి పైన"అన్నాడు మా నాయన.

అప్పుడు సాయంత్రం నాలుగు గంటలు అవుతోంది.

"ఇప్పుడా.. ఎటూ కాని పొద్దులో బియ్యం ఏంది, పెట్టేది ఏంది , ఇంతకీ ఎవరికోసం ? ఇంటికి మళ్లింకా ఎవరైనా పిలిచినావా ఏంది "అని కసురుకుంది జయమ్మ.ఆమె  మా అమ్మ.

"తెల్లారి నుంచి సాయంత్రం దాకా ఫారెస్ట్ ఆఫీస్ లో కూర్చుని పెట్టేసినారు మే...పాపం. ఆ పల్లెటూరి మనుషులని.తిండీ నీళ్లు లేవు వాళ్ళకి. రూపాయి ఉంటే టీఇప్పించినా పోనీలే పాపం అని. అయినా‌ పాపం వాళ్లకు ఆకలి కాకుండా  ఉంటుందా. హోటల్లో తిండి పెట్టేదానికి నా దగ్గర డబ్బులు యాడుండాది? ఎట్లో ఒగట్లా నువ్వు ఏదో ఒకటి చేస్తావనే మన  ఇంటికి  పిలుచుకుని వచ్చినా. వాళ్ళు వీధిలో కూర్చుని ఉంటారు"మా నాయన కనికరంగానే అంటాడు గాని, మా అమ్మకి ఆ మాటలు వింటే ఎప్పుడూ

కోపం  ముంచుకు వచ్చేస్తుంది.

"మా యబ్బ కానీ మీయబ్బ గాని నా దగ్గర లబ్బి  ఏమైనా పెట్టిండారా? ఇట్లా దారిలో పోయే వాళ్లకంతా అన్నం పెట్టాలంటే  కొంపా గోడూ అమ్ముకోవాల్సిందే. ఇంట్లో  బియ్యం ఏడుండాయి? నాకు తెలియదు నువ్వు ఏమైనా చేసుకో ఫో.."

"మేయ్ నువ్వే అట్లంటే ఎట్లమ్మే? ఎక్కడో చోట అడుక్కు రా పో.,,"

"అంతే అంతే లే. దారిలో పోయే వాళ్లకంతా అన్నం వండిపెట్టతా ,టీ నీళ్లు పెట్టిస్తా ఉంటే.. నేను నా బిడ్డలు అడుక్క తినాల్సిందేలే. మాకు ఆగతే  రాసిపెట్టినట్లే ఉంది చూస్తా ఉంటే.."

ఆ మాట నిష్టూరంగా మాట్లాడతానే వంట గదిలోకిపోయి, ఒక పెద్ద ఖాళీ గ్లాస్ తీసుకొని, పక్కింట్లోకో,ఎదురు ఇంట్లోకో, వీధి చివర దాకా వెళ్ళిపోతుంది.మా నాయన ముసిముసిగా నవ్వుకుంటా గణేష్ బీడీనో, అశోకా బీడీనో ముట్టించుకుంటాడు.

అప్పుడు కిరసనాయిలు ఉండదు.  ఉన్నా.. స్టవ్వు పని చేయదు. కిరోసిన్ ఉంటే కదా పని చేసే దానికి. ఇంక  కట్టెల పొయ్యి పైనే అన్నీ..

"ఈ కట్టెల పొయ్యిలో ఊదీ ఊదీ నాకు ఊపిరితిత్తులు పోతా ఉండాయి. ఆ నవ్వు చూడు.. అంతా ముండమోపి నవ్వు." ఆ మాట అనేటప్పడు చూడాలి మా అమ్మ మొహం..

అప్పుడు ఆమె మొహంలో కోపం ఉంటుంది ,బాధ ఉంటుంది కానీ మొగుడి పైన ప్రేమ కూడా ఉంటుంది.

బీడీ పొగల మధ్య మా నాయిన  దగ్గుతా కొన్ని క్షణాలు విరామం తీసుకుని" మేయ్ జయా..టీ పెట్టు ముందు.. స్ట్రాంగ్ గా పెట్టు మే.."అని అనకుండా వుండడు.

మా నాయన ఆయన జీవిత కాలంలో మాట్లాడిండే అన్ని మాటల్లోకి లక్ష సార్లో, కోటి సార్లో చెప్పిన మాట ఏదైనా ఉందంటే ఆ మాట అదొక్కటే.

మా నాయన ఇప్పుడు లేడు, మా అమ్మా ఇప్పుడు లేదు. కానీ, మా ఇంట్లో ముఖ్యంగా మా వంట ఇంట్లో ఆ మాట ఎప్పుడు ప్రతిధ్వనిస్తూ ఉంటుందంటే అది అబద్ధం కాదు..

"మేయ్ జయా టీ పెట్టు..".

అదే ఆ మాట.!

నాకు మా పాత పెంకుటిల్లు అంటే చాలా ఇష్టం. అందుకే మా పాత ఇల్లు ఆరు దశాబ్దాలు అయిన తర్వాత, పడిపోయే దశకు చేరుకున్నప్పుడు, మా నాయన చని పోయిన 15 సంవత్సరాల తర్వాత, బ్యాంకు లోను తీసుకుని ఎట్లాగైనా ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు, ఆ పాత పెంకుటిల్లు కొట్టేస్తున్నప్పుడు మురిపెంగా ఫోటోలు తీసి పెట్టుకున్నాను. ఆ పాత ఇంటికి ఉన్న తలుపులు  కిటికీలు,పెంకులు, ఇటుకలు ఇతర సామగ్రి అమ్మగా వచ్చిన డబ్బే, మా కొత్త ఇంటి పునాది కి ఖర్చు పెట్టుకున్నాను. ఈ రోజు ఈ ఇంటి పునాది ఏంది అంటే, అది మా నాయన కష్టార్జితం తప్ప మరొకటి కాదు. అమ్మ నాన్న ప్రేమలు  అట్లాగే ఉంటాయోమో. ఇంటికి పునాదుల్లాగా పైకి ఎప్పుడూ ఎవరికీ కనబడవు కానీ అవి చాలా బలంగా ఉంటాయి. అవి బలంగా ఉంటాయి కాబట్టే , అంతో ఇంతో మనం కూడా ఎదుగుతా ఉంటాం.

ఈ కథలన్నీ ఇంతే .ఒక మనిషి గురించి నిజాలు మాట్లాడాలి అనుకుంటే ఒక వరుస క్రమంలో ఏమి మాట్లాడలేం. ఒకదాని తర్వాత ఒకటిగా ఏవేవో గుర్తుకు వస్తాయి. అన్నీ కలవర పెడతాయి. కన్నీళ్లు తెప్పిస్తాయి. ఊహించినవో,కల్పించినవో  అయితే ఆ కథలు  రచయిత చెప్పినట్లే ఉంటాయి. కానీ ఇవి కల్పితాలు కాదు కదా. ఇవి జీవితాలు కదా, మనం చెప్పినట్లు అవి ఉండవు. మా  ఎరుకల జీవితాలు ఎట్లా ఉంటాయో ఎట్లా కొనసాగాయో, మా తాత గాడిదల పైన ఉప్పు అమ్మే కాడ్నుంచి, మా నాయన ఎట్లా ఉద్యోగస్తుడు అయినాడో, అటవీశాఖలో గుర్రం పైన తిరిగే ఫారెస్టరు  చిన్నయ్య పెద్ద కూతురు జయమ్మను, కాబోయే మామ గారి ఇంటికి తిరిగి తిరిగి ప్రాధేయపడి, ఫారెస్టర్ చిన్నయ్య ను ఒప్పించి మరీ ఎట్లా పెళ్లి చేసుకున్నాడో అదంతా ఓ పెద్ద కథ.

ఎరుకల కుటుంబాల్లో ఒక్కొక్కరివి ఒక్కో కథ. ఎరుకల ఇళ్లల్లో పంచాయితీలు ఎలా జరుగుతాయో, ఎన్ని బాధలు పడి,ఆ  తల్లులు తమ పిల్లల్ని స్కూలుకి పంపి చదివించుకున్నారో, అటవీ శాఖ లో ఉద్యోగి అయి ఉండి కూడా, ఎప్పుడు కట్టెలమోపు వాళ్లకు ఫైన్  వేయకుండా, మేకల వాళ్ళ దగ్గర సంవత్సరానికోసారి ఈనామ్ గా మేకపిల్లనో, గొర్రె పిల్లనో తీసుకోకుండా, సంవత్సరం మొత్తంలో ప్రభుత్వానికి వసూలు చేసిన అపరాధ రుసుం చెల్లించే సమయంలో, ఆ అపరాధ రుసుం ని అడవుల్లో పల్లెల్లో ఎవరి దగ్గర వసూలు చేయకుండా, ఆ నెల జీతం డబ్బుతో ప్రభుత్వానికి అపరాధ రుసుం చెల్లించి, 'ఈ నెల జీతం లేదు మే. మొత్తం సీ ఫీస్ కట్టేశా.' అని అమాయకంగా అపరాధిగా మాయమ్మ ముందు నిలుచుండిపోయిన కనికరం గుండె కలిగిన మా నాయన కథ ఇది.ఏ  పొద్దు ఎవరికి  ఏం అవసరం వచ్చినా, తన చెవిలో కమ్మలు, ముక్కుపుల్ల కుదువపెట్టి, మా నాయనను  మాట మాత్రం అడగకుండా, తనకు తానుగా ఎన్నో కుటుంబాల్ని వడ్డీలు కట్టి ఆదుకున్న కనికరం గుండె కల మా అమ్మ కథ ఇది.

కొంచెం ముందు వెనక ఉండవచ్చు, సందర్భాలు అటూ ఇటూ ఉండవచ్చు. కానీ వాళ్ల ప్రేమలు నిజం, వాళ్ల పేదరికాలు నిజం, వాళ్ల కనికరం నిజం.

                                                                               ***

ఇంటి ముందు దూరంగా పల్లెటూరి వాళ్ళు కూర్చుని ఉంటారు.  అమ్మ ఉడుకుడుకు గా అన్నం చేసి  చెనిగి గింజల చెట్నీ నో, పచ్చిపులుసో, గొజ్జో, రసమో ఏదో ఒకటి చేసి వాళ్లకు పెడుతుంది.

"ఆయన ధర్మ ప్రభువు తల్లీ. నువ్వు కనికరంగల తల్లివి తల్లీ.మీరు సల్లగా ఉండాల్ల. మీ పిలకాయలు సల్లగా ఉండల్ల" అని వాళ్లు మా అమ్మ కు  నమస్కారం పెట్టి, తినేసి వెళ్ళిపోతారు.

అప్పటికి మా నాయన ఖాకీ యూనిఫామ్ వదిలిపెట్టి, బనియన్,  పంచ తో కూర్చుని ఉంటాడు.

"ఎన్నిసార్లు అబ్బా నీకు చెప్పేది ఆ బనీను  చూడు ఎంత బొక్కలు పడి పోయి ఉన్నాయో?. రెండు బనియన్ లు కొనుక్కోని  రమ్మని చెప్పినాను కదా"అని తల పట్టుకుంటుంది మా అమ్మ.

తాను చెప్పింది ఏ పొద్దూ వినడని మా ఆయన పైన మా అమ్మకు భలే కోపం.ఒక్కోసారి ఎడం చేత్తో ఖర్మ ఖర్మ అని కోపంతో నొప్పి వచ్చేలా , చాలా బలంగా నుదుటి  పైన కొట్టుకుంటుంది కూడా.

మా నాయన అప్పటికే వేడివేడి టీ తాగి గ్లాసు పక్కన పెట్టి, ఇంకోసారి బీడీ ముట్టించుకుని ఉంటాడు. బీడీ పొగల మధ్యలో ఆయన నల్లటి ముఖంలో తెల్లటి పండ్లు స్పష్టంగా కనపడతాయి. మా అమ్మ కోపం ఉందని తెలిసినా,  అయినా నవ్వుతాడు.

మా అమ్మకు కోపం వచ్చినప్పుడు నేను, మా తమ్ముడు భయపడతాం కానీ, మా నాయన ఎందుకో భయపడడు. మా నాయనకు కోపం వచ్చినా కూడా అంతే. ఆయన కోపంతో పండ్లు కొరుకుతాడు. ఆవేశంతో ఊగిపోతాడు. అప్పుడు కూడా మా అమ్మ భయపడినట్లు నటిస్తుంది కానీ, నిజానికి అసలు భయపడదు. ఆయన కోపం నిమిషాల పాటే అని ఆమెకు బాగా తెలుసు. ఆ తర్వాత మళ్లీ మామూలే. ప్రశాంతంగా నెమ్మదిగా ఈ ప్రపంచంలోని బాధలు ఏవి తనకు పట్టనట్లు, తన కుటుంబంలోని ఆర్థిక సమస్యలు ఏవి తనవి కానట్లు, ఏ బాధలు ఏ కన్నీళ్లు లేనట్లు, ఆయన ప్రశాంతంగా నవ్వుతాడు. ముఖ్యంగా మా అమ్మకు నిజంగా బాగా కోపం వచ్చినప్పుడు కూడా ఆయన అట్లాగే ప్రశాంతంగా నవ్వుతూనే ఉంటాడు. ఆ ప్రశాంతమైన నువ్వు చూసేకొద్దీ మా అమ్మకి ఇంకా కోపం బాగా పెరిగిపోతుంది.

ఆరోజు కూడా అట్లాగే బాగా కోపం వచ్చేసింది మా అమ్మకు.

ఉద్యోగం చేసే వాడివి నీకు గౌరవం ఉండాల్సిన పని లేదా? చినిగిపోయిన బనియన్ వేసుకొని ఎన్నిసార్లు తిరుగుతావు? నీ జన్మకు ఎన్ని సార్లు చెప్పినాను?ఈరోజు కచ్చితంగా బనీను కొనుక్కొని రావాల్సిందే అని చెప్పినాను కదా. నా మాటంటే లెక్కేలేదు. నేనంటే విలువే లేదు.ధూ.."

మా నాయన మెల్లగా లేచి వెళ్ళి, తను తీసుకు వచ్చిన ప్లాస్టిక్ కవర్లో ఉంచిన, పేపర్లో భద్రంగా చుట్టిన ప్యాకెట్ విప్పాడు.

"ఇది ఏందో తెలుసా? చాలా గొప్ప పుస్తకాలు. పెద్దపెద్ద ఆఫీసర్ల పిల్లకాయలు చదివేది. మన  ఎరికిలోల్ల ఇళ్ళల్లో ఎవరి పిల్లల వద్దా ఈ పుస్తకాలు ఉండవు.  ఇలాంటి పుస్తకాలు చదవతా వుంటే చాలు, పిలకాయలు చాలా గొప్పోళ్లు అయిపోతారు చూస్తా ఉండు.."

ఆయన దేన్నయినా చాలా భద్రంగా తెస్తాడు. ఎంత చిన్న వస్తువు అయినా సరే చాలా విలువైన వస్తువు లాగా అత్యంత జాగ్రత్తగా భద్రంగా తీసుకొస్తాడు. ఇంట్లో పిల్లలకు ఏదైనా తీసుకురావడం అంటే ఆయనకు మహా సరదా. అప్పుడు ఆయన మొహం లో ఏదో గొప్ప తేజస్సు కనబడుతుంది. అప్పుడు ఆయన ఎందుకో నల్లగా అనిపించడు.  ఎందుకో ఆ క్షణాల్లో ఆయన చాలా గొప్ప అందగాడుగా కనిపిస్తాడు. చూడండి ఆ ప్యాకెట్ విప్పేటప్పుడు ఆయన ముఖంలో ఎంత చిరునవ్వు ఉందో, ఎంత సంతోషం కనబడతావుందో..

 రెండు పుస్తకాలను అపురూపంగా బయటకు తీశాడు. నాకు ఒక పుస్తకాన్ని మా తమ్ముడు చేతిలో ఒక పుస్తకాన్ని ఉంచాడు. చిల్డ్రన్స్ నాలెడ్జ్ బ్యాంక్ పుస్తకాలవి.

నేనూ మా తమ్ముడు గబగబా పేజీలు తిప్పుతూ బొమ్మలు చూస్తూ అందులో ఉన్న సమాచారాన్ని చాలా ఆత్రంగా చదివే ప్రయత్నం చేశాం. అప్పుడు మాకు ఎట్లా ఉందంటే ఆ రాత్రికి రాత్రే మొత్తం పుస్తకాన్ని చదివేయాలి అన్నంత ఉత్సాహం కలిగింది. మొత్తం మీద చాలా విలువైన పుస్తకాలని అర్థం చేసుకున్నాం.

తలలు వంచి ఆ పుస్తకాల పండుగలో మేం ఇద్దరం నిండా మునిగి ఉన్నప్పుడు, మా అమ్మ అంతకు ముందు అన్నదే మళ్ళీ అనేది. అయితే ఈసారి మాత్రం ఆమె గొంతులో అస్సలు కోపం  ఉండేది కాదు.

"ఏమబ్బా.. ఇప్పుడీ పుస్తకాలు ఈ పిలకాయలకి అంత అవసరమా? వాళ్లు ఏమైనా ఇప్పుడు అర్జెంటుగా పరీక్షలు రాసి కలెక్టర్లు అయిపోవాలా?"

బీడీ తర్వాత బీడీ తాగడం మా నాయనకు అలవాటు.మధ్యలో కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు విరామం ఉంటుంది అంతే.

"ఎన్ని తూర్లు చెప్పినా ఇంట్లో బీడీ తాగవద్దని.  ఏదైనా ఒకసారి చెబితే అర్థం కాదా నీకు?. ఇంట్లో ఇంత కంపు కొడతా ఉంటే పిల్లకాయలు ఎట్లా చదువుతారు? ఎట్లా బాగుపడతారు."అని కసురుకుంది గట్టిగా.

"బయట వాన లో చలిలో తిరుగతావుంటా కదా. ఒంట్లో చలి ఎక్కువ ఉంటుంది కదమ్మే. అయినా పిల్లోల చదువు పాడవుతుందంటే ఇంట్లో ఇంక ఎప్పటికీ తాగనులే."

అంతే.   ఒక మాటే మా అమ్మ అనింది. కొన్ని ఏళ్లుగా మా నాయనకు ఉన్న ఆ అలవాటు ..ఇంట్లో బీడీ తాగే అలవాటును ఆ క్షణం మానేశాడు.ఆ రోజు నుండి మా నాయన చనిపోయేంత వరకూ , ఏ రోజూ  ఇంట్లో బీడీ ముట్టించింది లేదు. వర్షం పడుతుంటే గొడుగు తీసుకొని, ఇంటి బయటకు వెళ్లి బీడీ తాగి వచ్చేవాడు.అదీ ఆయన నిక్కచ్చితనం.

చలికి తట్టుకోలేడని, స్వెటర్ కొనుక్కోమని మా అమ్మ మా నాయనకు కనీసం లక్ష సార్లయినా చెప్పి వుంటుంది.

రెండు మూడు ఏళ్లకు మాకు కొత్త స్వెటర్లు తెచ్చేవాడు కానీ, అయినా స్వెటర్ కొనుక్కునే వాడే కాదు. చాలా ఏండ్లు స్వెటర్ కొనుక్కోకుండానే అట్లాగే గడిపేశాడు.

"బస్సులో కూర్చున్నప్పుడు కిటికీ అద్దాలు మూసేస్తే చలి రాకుండా ఉంటుంది కదా డాడీ" అని అమాయకంగా అడిగాను.

ఆయన తన సహజ ధోరణిలో నవ్వినాడు కానీ ఒక్క మాట కూడా బదులు మాట్లాడలేదు.

మా అమ్మ మొహం నిండా ఆ నాటి వెలుతురు ఇప్పటికీ గుర్తే నాకు.

"లారీ లో వస్తే  యూనిఫాం లో ఉంటాడు కాబట్టి చార్జీలు ఇచ్చే పని లేదు. ఆ బస్సు ఛార్జీలు మిగిలితేనే కదా,మీకు ఏదో ఒకటి తినటానికి  తెచ్చేదానికి  కుదురుతుంది".

నా మొదటి కథా సంపుటిని ఆయనకు అంకితమిస్తూ ఒక మాట అన్నాను. కనీసం వంద మంది అయినా నాకు ఫోన్ చేసి ఆ మాట గురించి మాట్లాడి ఉంటారు.

కొట్టి తిట్టీ

బలవంతంగా నా చేత

యాపిల్ తినిపించిన నాన్నా..

నువ్వెప్పుడైనా

ఒక్క పండైనా తిన్నావా తండ్రీ....

కవితలు

అనువాదం

సముద్రాల్లోంచి మండుటెండల్లో

నీళ్ళు ఆవిరై పైకి వెళ్లి

కరిమబ్బులై మళ్లీ కిందికి దిగొచ్చి

దాహంతో బీటల నోళ్లు తెరిచిన

భూమిని తడిపే

వాననీళ్ళుగా రావడం ఆర్ద్రమైన అనువాదం

 

అందమో అనాకారితనమో

ఏదైతేనేం అద్దంలో కనిపించే

ప్రతిబింబం అదో రకం అనువాదం

 

మన మనస్సుల్లో వూపిరి పోసుకుంటున్న

ఆలోచనలన్నీ ఏదో విధంగా

మాటలుగా బయటకు రావడమూ

రాతలుగా రూపుదిద్దుకోవడమూ అనువాదమే

 

పయనించి పయనించి అలసి సొలసి

బాటసారి శయనించి కాసేపు సేదదీరే

చెట్టుకు నీడ ఓ గొప్ప అనువాదం

 

రచయితలు రాసిన నవరసభరిత కథలన్నీ

వీక్షకులు మహదానందంతో చూసే

చలనచిత్రాలుగా మారడమూ అనువాదమే

 

కళ్ళకు కెమేరా అనువాదం

ఫోటో మనకు స్థావరమైన ఛాయానువాదం

వీడియో జంగమ సజీవ భ్రమానువాదం

పిల్లలు పెద్దల సృజనానువాదం

శిష్యులు గురువుల జ్ఞానానువాదం

చిన్నదే కావచ్చు చమురు దీపమో విద్యుత్ దీపమో

సూర్యునికి అనువాదం కదా!

 

గొంతుకు-

పియానో, పిల్లనగ్రోవి వంటి వాద్యపరికరాలన్నీ

అపురూప గానానువాదాలు

మూత్ర పిండాలు పూర్తిగా పాడైపోయిన రోగికి

జరుగుతున్న డయాలసిస్ అత్యంత దయానువాదం

 

అంతా అనువాదమయం

ఈ జగమంతా అనువాదమయం

 

సూర్యుని ఎండకు

చంద్రుని వెన్నెల ఎంత చల్లని అనువాదం!

అమ్మ ప్రేమకు

బిడ్డ నోట చనుబాల ధార ఎంత కమ్మని అనువాదం!!

నవలలు

సైరన్ నవల  రెండవ పార్ట్ –  ఆరవ   భాగం

(సైరన్ నవల గత సంచిక తరువాయి భాగం)                                                                                                                                     

                                                                             22

 

            రాత్రి పది గంటలకు మొగిలి సైకిలేసుకొనచ్చిండు. శంకరయ్యను పక్కకు తీస్కపోయి - ‘‘అన్నా! ఎర్రజెండోల్లు డెలిగేటు గంగరాజుం ఎగేత్తే ముప్పైనలుబైమంది తాగి బాయి మీనికి పోతండ్లట - షరీపన్న మనలను సుత రమ్మన్నడు’’ అన్నడు. చంద్రకళ మొగిలి గావర చూసి ‘‘ఏంది పిలడా! ఏమన్న గడబెడా! ఇంతకూ తిన్నవా? రాయేశ్వరి మంచిగున్నదా?’’ అడిగింది. ‘‘గాలి గురించి బాయి మీద గడబిడ జరిగింది. లోడర్లంత పని బందు వెట్టిండ్లు - పోశన్న నీకెరికే గద మా బాయి మీద దొర మనుసులకు మీ ఎర్రజెండోల్లకు పడది... రెండు షిప్టులు బందయినయి. మూడోషిప్టుకు కమునిస్టు గంగరాజుంను తాగవోయించి  నడిపిత్తనంటడ్లట - బాయిదాక పోయత్తం’’ శంకరయ్య బయలుదేరుతూ...

            ‘‘పొయిరాండ్లి -అసలే రోజులు మంచిగలేదు - జేగర్త - మొగిలీ - నువ్వే తొక్కు సైకిల్‍ - శంకరన్న ఒక్క పెగ్గేసుకున్నడు’’ పోశెట్టి...

            ‘‘ఎహె గదెంత -అరిగిపోయింది’’ శంకరయ్య... మార్గమధ్యలో శంకరయ్య లక్ష్మి కడుపుతోనున్న సంగతి రెకులషెడ్డు కట్ట సంగతి చెప్పిండు.

            మొగిలి శంకరయ్యను అలాయి బలాయి తీసుకున్నడు. ‘‘చెలో! వదిన మందిల గల్సింది. దునియ కగ్గితల్గ గిసోంటి బాధ చెప్పుకోరాదు. ఇనరాదు’’ మొగిలి.

            ఇద్దరు బాయిమీదికి చేరే సరికి పదకొండయ్యింది. ఎర్రజెండోల్లు ముప్పయిమంది ఊగుతండ్లు - షరీప్‍ వాళ్లు అంత రాత్రి యాబయి మంది వస్తరనుకోలేదు. బాయి బందయిన వార్త తెలిసి మూడోషిప్టువాళ్లు ఎవరు బాయిమీదికి రాలేదు. గీ పీడలెందుకని మొఖద్దమ్‍లు రూంలనుంచి కదులలేదు.

            ‘‘మేం అందరి కోసం కొట్లాడ్తన్నం. గాలి మీకు అవసరమే. ఎర్రజెండ పార్టీ పేరు చెప్పి - మీరేమాకు నాయకత్వం వహించాల్సింది. మేనేజుమెంటు తొత్తులుగ - తు మీ బతుకు సెడ మందిలో నుండి ఎవరో!

            ‘‘ఎర్ర జెండ ఎలిసిపోయి తెల్ల జెండయ్యింది’’ కార్మికులు గొనిగిండ్లు... ఇంతలోనే కాంగ్రెసు పార్టీ వాళ్లు ఇరువై మంది దాకా వచ్చిండ్లు. ‘‘ఎవలన్న బాయి దిగిండ్లో -అగో బొగ్గు కుప్పల కింద బొంద వెడ్తం’’ మల్లయ్య అరిచిండు.

            మొత్తానికి పన్నెండు గంటలకు అందరుబాయిల దిగకుండనే వెనుదిరిగిండ్లు.

            మూడు రోజులు బాయి నడువలేదు. బాయి కాడికి ప్రతిషిప్టుకు షరీప్‍, శంకరయ్య, మొగిలి మరో ముప్పైమంది కార్మికులు షిప్టుల వారిగా కావలున్నారు.

            నాలుగోనాడు పదిగంటలకు నోటీసు బోర్డు మీద పెద్దగా తెలుగులో...

            ‘‘మానవతా దృక్పథంతో గాలి, వెలుతురు, రేలింగు సమస్యలన్ని వెంటనే సరి చేయడానికి యాజమాన్యయం ఒప్పుకుంటున్నది. కార్మికులు రెండవ షిప్టునుండి తమ విధులకు హాజరు కావాల్సిందిగా ఇందు మూలకంగా కోరడమైనది’’.

            మల్లయ్యను భుజాలమీద ఎత్తుకొని షరీఫ్‍ గ్యాంగు పెద్ద ఊరేగింపు తీశారు. దప్పులు - శంకరయ్య బృందం ఆటపాటు...

            అన్ని యూనియన్లు విజయంమనదే విని ఊదరగొట్టాయి. మీటింగులు పెట్టాయి.

            రెండోషిప్టునుండి బాయి సైరన్‍ కూసింది. కార్మికులు గనిలో ఎప్పటిలాగే దిగారు.

            ఆ రాత్రి బాయి మైసమ్మ గుడికి, ఊళ్లో ముఖ్యప్రాంతాలల్లో పోస్తర్లు పడ్డాయి’’.

            ‘‘సిగరేణి చరిత్రలో మొదటి సారిగా తమ స్వంత శక్తితో యాజమాన్యంతో పోరాడి - కనీసవసతులైన, గాలి, వెలుతురు, రేలింగ్‍ సమస్యలను సాధించుకున్న కార్మికులకు విప్లవ అభినందనలు -రాడికల్స్’’

            కార్మికులు, పిల్లలు, ఆడవాళ్లు, వ్యాపారస్తులు గుంపులు గుంపులుగా విరగబడి పోస్తర్లను చదివారు. ఈ రాడికల్స్ ఎవరో? ఎవరికి చైతన్యాన్ని బట్టి వాళ్లు అర్థం చేసుకున్నారు.

 

                                                                        23

 

            తెలతెల వారుతుండగా, బట్టలన్నీ మాసిపోయి - ముఖమంతా పీక్కపోయి రఘు వచ్చిండు.

            లక్ష్మి నీళ్ల బిందెతో ఎదురచ్చింది.

            ‘‘అయ్యో అన్న ఎట్లనో తడక తడకైనవు - పాణం మంచిగలేదా?’’ లక్ష్మి... శంకరయ్యకు ఆ దినం సెలవు రోజు - గుర్రుకొట్టి నిదురపోతండు.

            ‘‘అయ్యో సెల్లె గింత సలిల నీళ్లు మోత్తున్నవ్‍’’ లక్ష్మి కడుపుకేసి చూస్తూ...

            ‘‘ఏంజెయ్యల్నన్న - అక్క వాళ్లింటికి రమ్మన్నది. గిప్పుడే పోయి ఆళ్లమీద పడి తినుడెందుకని ఇంట్లపని చేస్కోపోతే ఎల్లది గదా!’’

            ‘‘మరి శంకరయ్య బావను గీనీళ్లకన్న తోలక పోయినవా?’’

            ‘‘నీ కెర్కలేనిదేమున్నదన్న. నల్లకాడ ఆడోల్లు నలుగురు నాలుగు మాటలంటరు. ఇంట్ల పనంత అయినే చేత్తండు. నాకన్న ముందే లేత్తండు. ఇయ్యల్ల పండనియ్యని నేనే లేపలేదు’’.

            నీళ్ల తిప్పలు తప్పలేదా?’’

            ‘‘మునుపటంత తిప్పలు లేదు. పదిగుడిసెలకో నల్ల బెట్టిండ్లు.  కావాల్సినన్ని నీళ్లు దొరుకుతన్నయ్‍...సత్తవడుత గోళెం నింపుతె’’

            ‘‘నల్లెక్కడ సూపెట్టు’’

            రెండు ఇండ్లావల - రఘు చూసివచ్చిండు. నల్లా ఉట్టిగనే పోతంది.

            ‘‘అయినను లేపుతనన్న’’

            ‘‘వద్దు. మంచిపని చేసిండ్లు. రేకులేసిన మేస్త్రీ పనిమంతుడు. బాగ గట్టిండు. మొదలు బావపడుకున్న అర్రకు తలుపువెట్టు’’ అన్నాడు.

            లక్ష్మి వద్దన్నా వినకుండా బాకెట్టుబిందె తీసుకొని పావుగంటలో రెండు సింమెంటు నీళ్ల గోళాలె - నింపిండు. తన బట్టలు తుక్కున్నడు. స్నానం చేసిండు. అప్పటికి శంకరయ్య లేచి సిగ్గుపడుతూ - ‘‘అయ్యో కామ్రేడ్‍! నన్ను లేపద్దా! నెవ్వెందుకు నీళ్లు మోసినవ్‍?’’

            ‘‘కామ్రేడ్‍!’’ రఘు ఒత్తి పలికిండు.

            అప్పటికి లక్ష్మి ముగ్గురికి చాయ్‍ తెచ్చింది.

            ‘‘సర్సల్‍గున్నది. కామ్రేడ్‍ లక్ష్మి చాయ బాగున్నది’’ రఘు లక్ష్మి కలవెల పడ్డది. ఒళ్లంతా ఏదో పాకినట్టనిపించింది.

            ‘‘అయో అన్నా - నన్ను కామ్రేడ్‍!’’

            ‘‘అన్నకాదు. కామ్రేడ్‍’’ - అన్నకన్నా - తండ్రికన్నా - అన్నిబందుత్వాల రక్త సంబంధం, కులం, మతం, డబ్బు - వీటితో కూడుకున్నయి. అంటే వ్యక్తిగతమైనవి - ఒక్క కామ్రేడ్‍ రాజకీయమైంది. ప్రపంచ వ్యాపితమైంది వీటన్నిటి కన్నా ఉన్న తమైంది’’.

            ‘‘కామ్రేడ్‍!’’ లక్ష్మి తడబడ్డది.

            తను తెచ్చిన మూడు పుస్తకాలు ‘‘అమ్మ’’ లక్ష్మికిచ్చిండు. లక్ష్మి వనికే చేతులతో పుస్తకాన్ని తీసుకొని వొళ్లో పెట్టుకున్నది. చంటి పిల్లను తడిమినట్టు తడిమింది. గాలికి వంగిన చెట్టు బొమ్మ పుస్తకంమీద.

            ఇంకో రెండు పుస్తకాలు ఉక్కుపాదం’ ‘జననాట్యమండలిపాటలుశంకరయ్యకిచ్చాడు.

            శంకరయ్య ఆ పుస్తకాలను అపురూపంగా అందుకున్నాడు. ‘‘కామ్రేడ్‍! గుట్టలల్ల తిండిలేక నకనకలాడి పోయినం, పుట్నాలు, బిస్కెట్లే - పైగా నడక - మీరుంటరో ఉండరని -కామ్రేడ్‍ లక్ష్మిని చూసే సరికి పాణం పడ్డది అబ్బ అడివిల ఏంచలి?...కాలేరి మీద ఎచ్చగున్నది’’

            ‘‘అయ్యో ఉడుకు నీళ్లు పెడుతుగదా! సన్నీళ్లే పోసుకున్నవ్‍ - బొగ్గుపొయ్యి అంటేస్త’’ - లక్ష్మిలేచింది.

            శంకరయ్య లక్ష్మిని వారించి - బొగ్గుపొయ్యి అంటించిండు. లక్ష్మి పూరీలు చేస్తుంటే రఘు కాల్చిండు. దడిలో నుంచి లేత సొరకాయ తెచ్చి పెసరుపప్పుతో కలిపి రఘే కూర చేసిండు.

            ‘‘పప్పుతినక...మొఖం వాచిపోయింది’’.

            అప్పటికి ఎనిమిదియ్యింది. ‘‘తొమ్మిదింటిదాకా మాట్లాడుకుందాం మీ నుంచి వినాల్సినవి చాలా ఉన్నయి. తొమ్మిదింటికి కామ్రేడ్‍ శంకర్‍ బయటికి పోయి చిన్న పని చేసుకరావాలె - అన్నింటికన్నా ముఖ్యం. కామ్రేడ్‍ లక్ష్మి మా చిన్నాయిన బిడ్డ - నేను అన్నను...కంట్రాక్టర్‍ను - ఎవరన్నా అడిగితె చెప్పాలె...’’

            ‘‘దబ్బన వాళ్లు ఇంకా ఎక్కువడిగితే లక్ష్మి మనం సందియ్యద్దు - ఎక్కువ చెప్పద్దు’’

            ‘‘అట్ల నవ్వి ఊర్కొవడమే’’ రఘు.

            ‘‘కామ్రేడ్‍ లక్ష్మి, నీ చదువు, మీ బస్తీలో, మొగిలి వాళ్ల బస్తీలో నీకు తెలిసిన విషయాలన్ని చెప్పు’’?

            లక్ష్మి మొదట తను దవఖానకు పోయిన దగ్గర మొదలేసి - దవాఖానలో పొగరు బోతు కాంపౌండర్లు - పట్టించుకోని డాక్టర్లు - రోగాలు, మందులు - అన్ని చెప్పింది - తరువాత బయటకు దొడ్డికి పోవడం కష్టం రేకుల షెడ్డు కట్టాల్సి రావడం - అవన్నీ చెప్పుకచ్చింది. మరింక ఏమి చెప్పాలో తోచలేదు. మొత్తం ఊడ్చినట్టు అయిపోయినయ్‍ అరే తనకు గింతే ఎరుకా! గియ్యన్ని తన సంగతులే - తను తన చుట్టే గిరగిర తిరుగుతున్నట్టు లక్ష్మికి మొదటి సారిగా అర్థమయ్యింది.

            ‘‘మంచిగ చెప్పినవ్‍ కామ్రేడ్‍!’’

            ‘‘నాకెందుకో - మంచిగనిపిస్తలేదు. మీరంత గిట్ల తిరుగుతంటే మేం ఇండ్లు, పిల్లలని - మా సుట్టు మేమే తిరుగుతున్నం’’ శంకరయ్య...

            ‘‘నిజమే కామ్రేడ్‍! నువ్వు చేసేపని నువ్వు చేస్తున్నవ్‍ - పనిమొదలయ్యింది - బాయిపని చేస్తన్నవ్‍, నీరెక్కలకష్టం. పైగా ఆ కామ్రేడ్‍ ఉత్త మనిషి కాదు. అవును. కొత్తింట్ల కచ్చేటప్పుడు - బాగనే కర్సయ్యిందా?’’

            ‘‘లేదు కామ్రేడ్‍ - మా సడ్డకుడు ధూందాంగ చేసిండు. బాపనోడు పాలుపొంగిచ్చుడు’’

            ‘‘అయినే పేరు పోశెట్టికదా! అయినే కమ్యునిస్టు యూనియన్ల డెలిగేటుకదా!’’

            ‘‘పేరుకే - తెల్ల కమ్యూనిస్టులు - అయితే మా అన్న రెండిటి మధ్యలున్నడు. ఆడికి మా వదినె అన్నది - గియ్యన్ని అవసరమా?అని’’

            ‘‘చిత్రంగా ఉన్నదే గీ పట్టింపులన్ని మహిళలకే ఉంటయనుకున్న’’ లక్ష్మి కేసి ముసిముసి నవ్వుకుంట చూస్తూ.

            ‘‘కామ్రేడ్‍ మమ్ములను తక్కువనుకుంటండ్లు’’ లక్ష్మి.

            ‘‘లక్ష్మీ గవ్వన్ని వద్దన్నది. నాకెప్పటినుంచో ఉండే అందరికి బట్టలు తీసుకున్న.’’

            ‘‘కాదు కామ్రేడ్‍! లోకరివాజు’’ రఘు.

            ‘‘రివాజులన్ని మొగోళ్లు పెట్టినయే - మాకు ఏదన్న సొమ్ము ఉంటే గదా రివాజు సొమ్మున్నోడు సోకులవడుతడు ధూంధాంచేత్తడు’’ లక్ష్మి. కరక్టు కామ్రేడ్‍ రీతి రివాజులన్ని స్వంతాస్థి సూపెట్టుకోవటానికే - నాకు కూడా నువ్వు చెప్పేదాక తెలువదు. మంచి పాయింటు’’ రఘు.

            శంకరయ్య గాలి, వెలుతురు సప్లై కోసం జరిగిన బందుగురించి చెప్పిండు.

            ‘‘అది సరే ఇప్పుడు నీ అంచనా ప్రకారంగా పరిస్థితి ఎట్లా ఉన్నది?’’

            ‘‘కార్మికులు మసులుతండ్లు. సరైన నాయకత్వంలేదు. యూనియన్ల మీద నమ్మకం పోయింది. కోపమున్నది గని - పద్దతి లేదు. ఏమి చెయ్యాలో తెలియదు. ఎట్ల చెయ్యాలో తెలువదు’’.

            ‘‘అంటే?’’

            ‘‘నాకు ఒక రోజు లీవుగావాలనుకుందాం - సిన్న సంగతి - లీవలు నాయి క్లర్కుల సొమ్ముగాదు. మ్యాన్‍వేక్లర్కుల దగ్గరి నుండి జీతాలు కట్టేదాక తిరుగాలి - పిచ్చిసంతకాలు’’

            ‘‘మరి ఏంజెయ్యాల్నంటవు?’’

            ‘‘కార్మికులకు రావాల్సినవన్ని - లెక్కప్రకారంగా, మర్యాదతోటి యివ్వాలె - వాళ్ల తాత సొమ్ముగాదు....వాళ్లను నౌకరి బెట్టిందే గందుకాయె’’ వాళ్లే కార్మికుల కందుబాటులో లీవు కార్డులు పెట్టాలే...

            ‘‘మరి యూనియన్లు గీచిన్న విషయం పట్టించుకోకుండా ఎందుకున్నట్టు?’’

            ‘‘గిదొక్కటే కాదు.... లక్షా తొంబై - పిడుక్కి బియ్యానికి లొల్లి చేత్తే గాని కాదు.  ఆ లొల్లి ముదురుతది. మన చేతుల లేకుంట పోతది. గిది దుర్మార్గం - అని తెలిసి కోపంతోటి రగిలి పోతండ్లు. కని - ఒక పద్దతిగా ఎక్కడ మొదలు పెట్టాల్నొ - ఎక్కడ ఆగన్నో తెలవది - బస్తీలల్ల కమిటీలు పెట్టినం. కావలుంటన్నం - ఇప్పుడు సారలి గ్యాంగుకు బస్తీ లోల్లకు శానా కిరికిరి నడుత్తంది. ఎప్పుడో పెద్ద లొల్లయితది.

            మోహనన్న మురళన్న అందరిని కలుత్తండ్లు - మొన్న యాపలకాడ కలెవడ్డరు. మన షరీపన్నకు సానా సంగతులు తెలుసు - మమ్ములను కూసుండ వెట్టి ఎనుకట తెలంగాణా సాయుధ పోరాటం, శేషగిరి రావులు నడిపిన కార్మికుల పోరాటాల గురిచి చెప్పిండు ఒకనాడు.’’

            లక్ష్మి శంకరయ్యకు గియ్యన్ని సంగతులు తెల్సినందుకు విస్తు పోయింది. ఉత్త పాటలు పాడుతండుగని - ఇంకా అమాయకుడే అనుకుంట్నుది.

            ‘‘కామ్రేడ్‍! మీరే మంటారు?’’ రఘు లక్ష్మినడిగిండు. ఆ దినం గోదావరిఖనిల గంగన్న చెప్పలేదా? బాయిల           సంగతులు, బస్తీల సంగతులు, యూనియన్ల సంగతులు - పైసలు, దందాలు సంగతులు’’ ఆడోల్లకు శాన తిప్పలైతంది. సారలి         వాళ్లు సంపుక తింటండ్లు. లక్ష్మి....

            ‘‘అదే మనకు చాలా సమస్యలున్నయి. అవ్వన్ని తప్పకుండా మనం సాదించవల్సిందే -అవ్వన్ని పరిష్కరిస్తే ఇంకా సమస్యలు రావా?’’ సారలి గ్యాంగు దొరలకు వ్యాపారస్థులకు, యాజమాన్యానికి లోడ్‍చేసిన తుపాకి - అన్నడు కామ్రేడ్‍ నాగయ్య’’

            వస్తయి -ఎందుకు రావు - గంగన్న పూనుకొని పాయఖాన కట్టేదాకా మొగోళ్లకు గసంగతే ఎరుకలేదు’’ మేం సుత గంత తిప్పలువడ్డంగని పాయఖానలు గావాలని లొల్లిసెయ్యలే - లక్ష్మి...

            అప్పటికి తొమ్మిదయ్యింది. రఘు, శంకరయ్యను బయటకు పంపిండు.

            లక్ష్మి. రఘు మాట్లాడుకుంట వంట చేసిండ్లు. శంకరయ్య కవరులో తెచ్చినవి రఘు విప్పిచూసిండు. క్రాంతి పత్రికలు పది, అయిదు లెనిన్‍ ఏమిచేయాలి పుస్తకాలు కొన్ని ఉత్తరాలు.

            భోజనం అయిన తరువాత రఘు ఏదో రాసుకుంటూనే ఉన్నాడు. సాయంకాలం ఆరు గంటలకు ఆయన రాతపని పూర్తయ్యింది. శంకరయ్య చాయ్‍ పెట్టుక వచ్చిండు.

            ముగ్గురు కూర్చున్నారు. లక్ష్మి పీట మీద కూర్చున్నది. రఘు శంకరయ్య మంచంలో కూర్చున్నారు.

            ‘‘కామ్రేడ్స్ కాంత్రి పత్రిక చదవండి. మీకు చాలా విషయాలు అర్థమైతాయి... పల్లె టూళ్లలో ఇప్పుడు డిప్పుడే రైతాంగం, రూతుకూలీలు సంఘాలు పెట్టుకొని దున్నేవానికు భూమి, వెట్టిచాకిరి రద్దు, కూలిరేట్ల పెంపు, పాలేర్ల జీతాల పెంపు లాంటి విషయాల మీద మీలాగే పోరాడుతున్నారు. దొరలు పోలీసులు కలిసి నవంబరులో సిరిసిల్లాలో తిమ్మాపూర్‍ గ్రామంలో లక్ష్మిరాజంను, చంపారు. జగిత్యాలకన్నపురంలో పోశెట్టిని దొరల గుండాలు చంపారు. రఘు ముఖంలో విశాదం, ఆవివరాలన్ని క్రాంతి పత్రికలో ఉన్నాయి.అంటే ఏమిటన్నమాట - జనం దోపిడి, పీడన భరించలేక తప్పనిసరై పోరాటాలల్లోకి వస్తారు. కాని దొరలు, యాజమానులు ఊర్కొరుకదా! అదీ సంగతి.’’

            ‘‘కామ్రేడ్‍! మరెట్ల?’’ ఇక్కడ సుత దంచుతరా? లక్ష్మి...

            ‘‘వాళ్లు చంపనిది ఎన్నడు? ఆకలితో చంపుతరు. వాళ్లు దోచే ప్రతిరూపాయిమీద మన నెత్తురు అంటే ఉంటుంది.’’

            శంకరయ్య మాట్లాడలేదు. ఆయన మనుసులో ఇలాంటిదేదో రూపుకడుతూనే ఉన్నది. లక్ష్మికి రాబోయే ప్రమాదం గురించి అంతు పట్టలేదు.

            ‘‘కామ్రేడ్‍ లక్ష్మి మీ ఊరు అమ్మనాన్నల గురించి చెప్పు’’ వాతావరణాన్ని తేలిక చేస్తూ...

            ‘‘నాగన్న మామేన బావ -మావూరే’’

            ‘‘ఓహ్‍ అయితే మీవూరికి రెండు సార్లుపోయిన - గుడిమెట్టు - పచ్చిపాలతీర్గ నీళ్లు పారేవాగు, బాగుంటది కామ్రేడ్‍ మీ ఊరు - మనుషులు’’ లక్ష్మి ఏ ప్రత్యేకతలేని చిన్నతనం. తనకు తెలిసిదల్లా గొడ్డుచాకిరి - పదేండ్ల నుండే కలుపులకు నాట్లకు కోతలకు కూలికిపోవడం - ఎవరు అడగకుండానే పెండ్లి - కాలరీ బతుకు - ఆగమగం.

            పోయ్యిల నుంచి పెనంమీద పడ్డట్టు - తన చాతీమీద సారలి మోటుచేతులు - ఏదో సలుపుతోంది. ఆ తరువాత జరిగిందంతా కలలాగే ఉన్నది. గాయం గెలికి నట్టుయ్యింది. శంకరయ్య తన చిన్నతనపు చీకటి రోజుల గురించి చెప్పుతుంటే కంఠం పూడుకపోయింది. కండ్ల పొంట నీరు కారినయ్‍. కాలేరీకి వచ్చిన తరువాత లారీలోడింగు - ఉద్యోగం, కొట్లాటలు, తాగుడు - చీకటి రోజుల గురించి చెప్పుకచ్చిండు...

            ‘‘ఏముంటది? గింతే ననుకున్న. నాగన్న జైల్ల నుంచి వచ్చిండని తెల్సి నప్పుడు అందరం సూసెటందుకు పోయినం - ఆదినం మేం ముసుగులు కప్పుకొని తిరుగుతున్న మనిపిచ్చింది. పైసలు సంపాయించుడు అందుకు చెయ్యరాని పనులన్ని చేసుడు. కువారం లేకుంట మనుషులుంటరని తెల్సింది.’’ శంకరయ్య...

 

            ‘‘మనం బతికింది - మనచుట్టున్నది - మనకు కన్పిచ్చింది, వినిపించింది - అనుభవంలకు వచ్చింది -ఒక బతుకు - మనకు వేరే తెలవనప్పుడు చూపు లేనప్పుడు గంతే అనుకుంటం. కాని మనిషి సంఘజీవి - అంటే ఒక్కడు కాదు. మందితో - ఈమందిని కలిపేదేంటి? గది తెలుసుకోవాలె - దానికి పెద్ద చెరిత్రఉంది’’.

            ‘‘అఆలు దిద్దుకునేటప్పుడు సదవంటే గింతేననుకుంటం - గుణింతాలు - వామ్మో - లోపటియి, భయటియి చెప్పేమాటలు, దు:ఖం - మా చెక్రపాణి బావ కైతకాలోడు, మొన్న నాగన్న చెప్పిండు. బావయో బంగారయో అయినే కైగట్టిండట’’ -లక్ష్మి.

            రఘు లేచి బలపం తీసుకున్నడు. గచ్చు నెల మీద రెండు గుండాలు గీసిండు. ‘‘గిది ఉత్పత్తి శక్తులు, గిది ఉత్పత్తి సంబంధాలు’’ శంకరయ్య ముఖం తేలేసిండు. లక్ష్మి ముగ్గుల తీర్గ గీ గుండాలేందో’’ ననుకున్నది.

            ‘‘అర్థం కాలేదా?’’

            లక్ష్మి కనిగుడ్డు పెకిలించి, నాలిక బయట పెట్టింది.

            ‘‘శక్తంటే గిదేనా?’’

            ముగ్గురు నవ్విండ్లు.

            ‘‘ఉత్పత్తి శక్తులంటే, ఉత్పత్తి సాధనాలు - భూములు, అడవులు, మీ సింగరేణి గనులు, మళ్ళ రైతులు, కార్మికులు, మళ్ళ రెండు గుండాలు గీసిండు.  ఉత్పత్తి సంబంధాలంటే - గ్రామలల్లో భూసామ్యం, ఇక్కడ పెట్టుబడిదారి - అంటే ఉత్పత్తి శక్తులు ఏం చేస్తాయి - మళ్లీ ఒక గుండం పెద్దది గీచి సంపద సృష్టిస్తాయి ఆ పనిలో ఉత్పత్తి సంబంధా లేర్పడుతయ్‍ ఆ సంపదను ముడ్డి కిందేసుకున్న దొరలు, పెట్టుబడిదారులు ఒక వేపు - దిన దినగండం నూరేళ్ల ఆయుష్షుఅనే కార్మికులు, రైతులు మరో దిక్కు - ఇది రెండు వర్గాలు టగాపర్‍ - వీళ్లకు బతుకుగావాలె - వాళ్లకు సంపదగావాలె - దోపిడి దారులను రక్షించేందుకు, రాజ్యధికారం, చట్టాలు - వాటిని అమలు చేసేయాంత్రాంగం, కోర్టులు, పోలీసులు, మళ్లీ మసిబూసి మరెడుకాయ చేసే సాహిత్యం కళలు ఉంటాయి.

            పోగుపడ్డ సంపదంతా కార్మికుని అదనపు విలువే అన్నడు. గడ్డపాయన మార్క్సు.

            ప్రజలకు రాజ్యాధికారం తెచ్చిండు లెనిన్‍ - దోపిడి దొంగలంతా కలిసి రష్యామీద ఎగబడితే యుద్ధం చేసి గెలిసిండు స్టాలిన్‍ - మన లాంటి దేశం చైనాలో రైతులు, కార్మికులు కలిసి రాజ్యాధికారం సాధించిండ్లు మావో నాయకత్వంల’’ - భారతదేశంలో జరిగిన ప్రజాపోరాటాల గురించి చెప్పిండు. ఆఖరుగా - ప్రజలకు రాజ్యాధికారం గావాలె - గందుకోసం మనందంరం పోరాడేది - గిప్పుడు చెప్పుండ్లి - మనకే బాధలున్నాయా? అందరికున్నయా?’’ రఘు బీడి ముట్టించి బయటకు పోయిండు. మళ్లీలోపటికి వచ్చి’’ నాకు ఇంతకంటే అలుకగ చెప్పత్తలేదు. నేర్సుకోవాలె.

            ‘‘గిదీన్నే తార్కిక జ్ఞానమంటరు’’

            ‘‘మా పెద్దమామ ఇలె వరిసె అంటడు.’’ లక్ష్మి...

            మీ మెదడు తిన్నందుకు - ఏంచెప్పాలె - గియ్యన్ని చెప్పకపోతే నా మెదడు ఖరాబైంది. ‘‘కామ్రేడ్‍ నేను ఒక గంటలో పోవాలె - సూదిదారం ఉంటే యివ్వవా?’’

            లక్ష్మి సూదిదారం తెచ్చి ‘‘నీకు కుట్టరాదు. నేనుకుట్టిస్త’’ అన్నది.

            ‘‘నేర్సుకోవాలె కదా? - అంగీ అక్కడక్కడ అడివిల పొరకలు తాకి కొరతలు పడ్డది’’

            శంకరయ్య మనుసంతా నీళ్లు నీళ్లయ్యింది. లక్ష్మివంట చేస్తున్నది.

            ‘‘లక్ష్మి రఘున్న బట్టలు సినిగిపోయినయే - మనమేమొ కొత్త బట్టలేసుకొని తిరుగుతన్నమ్‍’’

            ‘‘నేనే అందామనుకున్న - మొన్నకుట్టించుకున్న బట్టల్ల కొత్తదిఒక జతయివ్వు’’ - అంది.

            లోపలికి వెళ్లి కొత్త అంగీలాగు తెచ్చియిచ్చిండు. శంకరయ్య...‘‘కామ్రేడ్స్! నాకు ఎల్తది వద్దు.’’ రఘు శంకరయ్య బలవంత పెట్టిండు. గదిలోకి వెళ్లి రఘు వేసుకున్నడు. సరిగ్గా తనకే కుట్టిచ్చినట్టు సరిపోయింది. అన్నం తిని - మరి కొన్ని ఉత్తరాలు శంకరయ్యకిచ్చి ఎక్కడివ్వాలో చెప్పిండు.

            ‘‘కామ్రేడ్స్ వీలైతే మనోల్లందరికి క్లాసులు పెడ్తం. లక్ష్మి కామ్రేడ్‍కు నాలుగు నెలలనుకుంట - ఔనా! కామ్రేడ్‍ - నువ్వు వెళ్లు. నువ్వువీళ్లకు చెప్పాలె - గందుకనే మీకు గంత చెప్పిన - అక్కడ గియ్యన్ని మంచిగ చెప్పుతరు.’’ ఎట్లా వచ్చిన వాడు అట్లాగే వెళ్లి పోయిండు. శంకరయ్య రఘు ఒదిలేసి వెళ్లిపోయిన అంగీ లాగు జాగ్రత్తగా మడతపెట్టి తన బట్టల్లో దాచుకున్నడు.

            ‘‘అంతా గుండు సున్న’’ లక్ష్మి...

            ‘‘మొదడంత తిమ్మిరెక్కింది’’ గల్లర గల్లర బాయి నడిసినట్టే అయ్యింది. శంకరయ్య...

 

                                                                   24

 

            జనవరి నెల ఆ అడవంచు ఊరును చలివనికిస్తోంది. ఆ ఊరి నుండి కొండల దాకా వ్యాపించిన అడివిలోని పల్లెలు నెగళ్ల చుట్టు చేరినయి. అలాంటి పుండు లాంటి చలిలో ముకుందరావు అయిదెకరాల గడి వెచ్చగా ఉంది.  గడి దీర్ఘ చతురస్ర ఆకారంలో కట్టారు. విశాలమైన వరండాలతో సుమారు ముప్పైగదులు - మధ్యలో పూలతోటలానేలు - విశాలమైన డైనింగ్‍హాలు మధ్యలో - చుట్టూ ఎత్తైన ప్రహారిగోడ - ఉత్తరం వేపు నివాసపు ఇండ్లనుండి పెద్దగేటు - దాటితే దాసీలు డ్రైవర్ల కోసం గోడకు దించి కట్టిన బెంగుళూరు పెంక పాయఖాన, దాన్యపు గదులు - వెనుక భాగంలో ఇంజెనుగల పెద్ద బావి - అన్ని రకాల కూరగాయ మళ్లు - మమిడి, జామ, దానిమ్మ, నిమ్మ, నారింజ చెట్లు - కోళ్లు, గొర్లు, మేకలకోసం ఇండ్లు లైట్లతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆవూరు నుంచి పెద్ద రోడ్డు దాకా అయిదు కిలోమీటర్లు -లైట్లు పెట్టారు సింగరేణివాళ్లు, వాకిలంతా షాబాదు బండ పరిచి ఉంది - మధ్యలో గడ్డి పూలచెట్లు, షామియానాలు వేసిండ్లు. షామియానాల పక్క రేకు డ్రమ్ములల్లో బొగ్గు వేసి మంట రాజేశారు. నిప్పుకనికెలు కనకణలాడుతున్నాయి దక్షిణం బాజుపొడువైన వంట శాలలో. వంట వాళ్లు రికాములేకుండా పని చేస్తున్నారు.

            కడెం నుండి తెచ్చిన రకరకాల చేపలు - చేపల వేపుడువాసన ఆ ఆవరణంతో నిండింది. నాటుకోళ్లు, పొట్టేలు వేపుడు - జెల్లల పులుసు - గారెలు చేస్తున్నారు. అక్కడ కుర్చీవేసుకొని కర్రెసత్తెన్న దొర అరుస్తున్నాడు....గదంతా మద్యం, మాంసం వేపుడు వాసనాలతో మత్తెక్కిఉంది.

            అప్పటికే రాత్రి తొమ్మిదయ్యింది. రావాల్సిన వాళ్లు వచ్చినట్టే లెక్క, గోదావరి ఆవలి - జగిత్యాల, మంథని, మహాదేవపూర్‍, నిజామాబాద్‍ ప్రాంతాల నుంచే కాకుండా ఈవలి ప్రాంతం నుండి చాలా మంద వెలమ దొరలు వచ్చారు. వారితోపాటు అతిముఖ్యమైన కాంగ్రెసుపార్టీ నాయకులు వచ్చారు. సింగరేణిపై అధికారులు ఇరువైమంది దాకా వారివారి భార్యలతో సహావచ్చారు. చుట్టాలు, పక్కాలు, అన్ని రకాల వ్యాపారాలు చూసే అతిముఖ్యమైన వాళ్లు - అంతా కలిసి మూడు వందలకు పైన్నే ఉంటారు.

            అతిథులకు వారివారి హోదాలనుబట్టి - రంగాన్నిబట్టి చిన్న చిన్న బృందాలుగా కుర్చీలు వేశారు. టేబుల్లు వేశారు. అదే పద్దతిలో వారి హోదాను బట్టి అన్నిరకాల బ్రాండి, విస్కీ - సింగరేణి గెస్టవుజులో పనిచేసే బేరర్లు పోస్తున్నారు. మాంసం వేపుడు, మద్యం వాసనలతో పాటు అంతూ పొంతూ లేని మాటలు - అకారణ నవ్వులు కలెగల్సి రొదగా ఉంది - గందర గోళంగాఉంది. దొరికిన చిన్న అవాకాశాన్ని విడువకుండానర్మ గర్భితంగా వారివారి గొప్పతనాలను ప్రదర్శించే ఆరాటంలో ఉన్నారు. దెప్పుకోవడాలు - చిత్రమైన భాషలో మాట్లాడుకుంటున్నారు. మద్యానికి తనదైన వ్యక్తీకరణ భాష ఉంటుందేమో?

            పొడువైన డైనింగ్‍ హాల్లో దొరసాన్లు, బాయిదొరల భార్యలు విందు ఆరగిస్తున్నారు. బంగారు, డైమండ్‍ నగల ధగధగలతో విలువైన రకరకాల బట్టలతో వగలుపోతూ - ఒకరినొకరు దొంగ చూపులు చూస్తూ అంచనాలు కడుతున్నారు. కొంతమంది తమ భర్తల హోదాల గురించి గొప్పలు చెప్పుతున్నారు. పాటలతో - కొంత మంది తాగుతున్నారు మరికొంత మంది.

            మొత్తానికి - ఆగడి - చుట్టూ ఇరువై ఊళ్లల్లోని పేదప్రజల రక్తమాంసాలు ఆరగించి పెరిగినగడి - గనులమీద కార్మికుల మాయో పాయాలతో దగా చేసి కూడ బెట్టిన డబ్బుతో ఉబ్బి పోయి, విలాసంగా ఉంది. - ఆ చరలికాలం రాత్రి వెచ్చగా హుశారుగా ఊగుతోంది.

            ఆ గడిలో పాతుకపోయి - బయటపడే మార్గంలేక - అక్కడ ఇముడలేక ఎప్పుడు రుసరుస లాడే ముసలి ముకుందరావుది. ఒకప్పుడు ఒంటి నాగలితో - తహసీలు వసూలుకోసం ప్రాంతానికి వచ్చిన ముకుందరావు ఇరువై ఊళ్లకు ఊడల మర్రిలో విస్తరించాడు. మరింకవిస్తరణ ఆగిపోయింది. అతనికి ఆరుగురు కొడుకులు - ఒక్కతే కూతురు. పెద్దకొడుకు నారాయణరావు రాజకీయాలల్లో చేరిండుగాని అందుకు తగిన అనుభవంలేక - రాక సతమౌతున్నాడు.

            అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించినందున ఎమ్‍ల్లేలుగా కాంగ్రెసు పార్టీ తరుపున నిలబడుతున్నాడు. గతంలో రెండు సార్లు ఓడిపోయాడు...ఇప్పుడు తప్పకుండా గెలువాలని - అందుకు ముఖ్యులందరిని పిలిచి ఈ విందు ఏర్పాటు చేశాడు...

            నారాయాణరావు పెద్ద కొడుకు- రాజకీయాలల్లో చేతులూపుకుంటూ తిర్గడు తప్ప ఆయన చేసే పనేమిలేదు. ముకుందరావు పిల్లల చదువులకోసమని హైదరాబాదులో మూడెకరాలల్లో పెద్దహవేలీ కట్టించాడు. ఆ నలుగురి కుటుంబాలు - పిల్లలు దాదాపుగా చదువుల కోసమని హైదరాబాదులో ఉంటారు.

            మొత్తం ఇంటి వ్యవహారాలు, డబ్బువ్యవహారాలు చూసేది నవనీతరావు - రెండో కొడుకు - ఆ జిల్లా మొత్తం పెద్దసారా కంట్రాక్టర్‍ - బ్రాండిషాపులు, కౌలు, వ్యవసాయం చూసేది నవనీత రావే - అతని దగ్గరే ఊరుకోషేరేదారుతో సహా మూడు వందల మంది పనిచేస్తారు.

            మూడవ కొడుకు క్రిష్ణారావు - సింగరేణిలో కార్మికనాయకుడు. విలాసపురుషుడు బొగ్గులారీలల్లో నింపే కంట్రాక్టుతో పాటు - సింగరేణిలో సివిల్‍, ఇంజెనీరింగు కంట్రాక్టువడ్డీ, బిట్టీ వ్యాపారులన్నీ అతనివే - పనోళ్ల సంగతి అట్లా ఉంచుతే - సూపర్‍వైజర్లు - గుండాలే మూడు వందల మంది ఉంటటారు.

            నాల్గవ కుమారుడు రాజేశ్వరరావు సినిమాటాకీసు చూస్తాడు. అదేగాక దగ్గరి పట్టణంలో కొత్తగా ఇంకో సినిమా హాలుకడుతున్నారు.

            ఇంకో ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు. వాళ్లకు అక్కడ తలా నాలుగువేల ఎకరాల ఎస్టేట్లు, హోటల్లు ఉన్నాయి. గోధుమరంగు సఫారి సూటేసుకున్న నవనీతరావు వెలిగి పోతున్నాడు - నున్నగాకొరిగిన మీసాలు గడ్డం - ఆరడుగుల మనిషి - చురుకు చూపులు...

            వాకిట్లో కొచ్చి, ఏమి దోచనట్టు నిలుచున్నాడు. అసిస్టెంటులు శ్రీధర్‍రావు, పాముల వెంకటేశం ఉరికచ్చిండ్లు.

            ‘‘సత్యనారాయణ దొరేడిరా?’’ అరిచిండు.

            వెంకటేశం ఉరికి వంటల కాడున్న సత్యనారాయణరావు అనే సత్యంను తీసుకొచ్చిండు.

            ‘‘అరేంజుమెంట్లన్ని చూసినవా? వంటలకాడ మందు గొడ్తన్నవా?’’

            ‘‘సత్యం నెత్తిగోక్కున్నడు. మందు గొట్టంది అతని మెదడు పనిచేయనేచేయదు.

            ‘‘నువ్వే మందు గొడితె అంత గోల్‍మాలయితది. నీ అసిస్టెంట్లేరి వాళ్లు తాగిపన్నర’’

            ‘‘అన్ని టేబుల్లకు ఒక్కొక్కలను పెట్టినుండ్రి అన్ని చూసి - ఇగోగిప్పుడే కూసున్న’’

            ‘‘ఇగో మా కృష్ణను, రాజేశ్వర్‍ను కనిపెట్టుకుంట ఉండు వాళ్లిద్దరి దగ్గర చెరొక్కని పెట్టు - వాళ్లు కిందపడే దాక సోయి లేకుంట తాగుతరు. కేరపుల్‍ - మనం చాలా కాస్ట్లీ బాటిల్స్ తెచ్చినం. ఎవలకి పంపే మందు వాళ్లకు పంపు. డ్రైవర్లు, వేటర్లు బాటిల్లు గయాబ్‍ చేస్తరు... ఏదన్న గడబిడ జర్గిందో నీకు తెలుసుకదా!’’

            ‘‘గీన్నే పంచాంగం ఇప్పుతరు. ఇజ్జెతుపోతది’’

            ‘‘ఔరా వెంకటేశా! సత్యం దొర రెండు పెగ్గులేసిండా? మూడా?

            మూతికి చెయ్యడ్డం పెట్టి నాలిక తిప్పి వెంకటేశంకు చూయించిండు.

            ‘‘వీడు పొద్దటి నుంచి బాటిల్‍ కన్న తక్కువ తాగుండడు’’

            శ్రీధర్‍రావు, వెంకటేశం వెంటరాగా అన్ని టేబుల్లుఅందరి దగ్గరికి వెళ్లి భుజాలు తట్టి - ‘‘కానియ్యిండ్లి’’ అన్నాడు.  క్రిష్టారావు రెండో పెగ్గు గ్లాసు అన్నను చూసి జనరల్‍ మేనేజర్‍ శాస్త్రి కిచ్చాడు. అతని దగ్గర రెండు గ్లాసులు

            ‘‘ఏంజియింసాబ్‍ - మీది డబుల్‍ డోసున్నట్టున్నది’’ నవనీత రావు పరాచికమాడిండు.

            శాస్త్రి ఆముదం తాగిన ముఖం పెట్టిండు.

            ‘‘క్యారీఆన్‍’’

            ముందటికి నడిచాడు. జగిత్యాల దొరల గ్యాంగులో రాజేశ్వరరావు మధ్యలో కూర్చుండి ఉన్నాడు.

            ‘‘ఊళ్లల్లోనక్సలైట్ల కార్యకలాపాల గురించి తామెట్లా ఎదుర్కుంటున్నది - ఆర్‍మూరు దొర చెప్పుతున్నడు’’

            నవనీతరావును చూసి మాటలు బందు చేసిండ్లు.

            ‘‘నడువనియ్యిండ్లి - ఈ రాత్రి కిక్కడే బస - సింగరేణి గెస్టవుజులన్ని మీ కోసం బుక్‍ చేయించిన - హోటల్లు కూడా ఆరాముగా మాట్లాడుకోండ్లి - కార్లున్నయి - డ్రైవర్లున్నారు’’ ఇంకొంచెం దూరం నడిచి ‘‘అరె వెంకటేశం డ్రైవర్లకు ఏర్పాట్లు - ఎవరు సూత్తండ్లురా’’

            ‘‘క్రిష్ణారావుదొర మొఖదమ్‍లు - రాఘవులు వాళ్లంతా కలిసి మనకొట్టాలు, సింతల కాడ వేరే ఏర్పాట్లు చేసినం - ఆడ ఇంక జోరుగ నడుత్తంది.’’

            ‘‘అంటే గాన బజానాపెట్టిండ్లా?’’

            ‘‘చిన్న డ్యాన్సు పోగ్రామునడుత్తంది’’ శ్రీధర్‍రావు.

            ‘‘మరి దొరసాన్ల సంగతేంది?’’

            వెంకటేశం సిగ్గుపడి మెళికలు తిరిగిండు.

            ‘‘నువ్వేందిర బీర్లుగొట్టినవా?’’

            ‘‘అక్కడ ఇందిరవ్వ దొర్సాని చూసుకుంటంది’’

            ‘‘ఆ హాలు సరిపోయిందారా మరి?’’

            ‘‘ఆడ నాలుగు గుంపులైనవి దొర’’

            ‘‘అంటే ఆడికి బీర్లు పోతన్నయారా?’’

            వెంకటేశం మాట్లాడలేదు.

            అరె  శ్రీధర్‍రావు ‘‘మా బావుండాలె...అదే పేరు మర్సి పోయిండు’’

            ‘‘నర్సింగరావు దొర’’

            ‘‘ఆ ఎక్కడున్నడుర. అయినెలావు పట్టింపుమనిషి’’

            శ్రీధర్‍రావు. నవనీతరావును నర్సింగరావు ఉన్న గదికి తీసుక వేళ్లిండు.

            అప్పటికే ఆయన తలుపులు మూసుకొని దుమదుమలాడుతున్నడు. ఆయన కామారెడ్డిల సర్జన్‍ - డాక్టర్‍ - యమస్ట్రిక్టు మనిషి.

            ‘‘తలుపులు తోసుకొని - నవనీతరావు లోపలికి ప్రవేశించిండు.

            ‘‘బావా! మస్తుకోపంగున్నట్టున్నది. కుర్చిల కూకోండ్లి’’

            కూర్చున్నాడు.

            నవనీతరావు తనో కుర్చిల కూర్చున్నాడు.

            ‘‘బావాతిన్నారా?’’

            ‘‘గీ రక్తపుకూడు. ఏందిదుబారా! ఆ తాగుడేంది? ఈ న్యూసెన్స్ంతా ఎంది? దుబారా - ఇంక ఎలక్షన్లు - ఎమ్మెల్లే’’ కోపంతో మాటలు రాక కూర్చున్నాడు.

            ‘‘కూల్‍బావా! మేం భూస్వాములం. మందు, మటన్‍ లేపోతే ముద్దదిగది. సదువు ఒంట బట్టలే. గిది మా బతుకు - బయట పడలేం బావా!’’

            గీ పిచ్చి పోగ్రాంకు నన్నెందుకు పిలిచిండ్లు?’’

            ‘‘పొరపాటే - క్షమించండి - మీకు తెలుసుగదా! మా బాపుటైగర్‍ - టైగర్‍కు అన్ని పట్టింపులే - ఆయన ప్రత్యేకంగ మిమ్ముల్ని పిలుమని మాకు చెప్పిండు. సదురుకోవాలె బావా ప్లీజ్‍ బయట నిలబడ్డ శ్రీధర్‍రావును పిలిచి - వెంకటేశంను పిలువు అన్నడు.

            ‘‘వెంకటేశం దొరకు ఏంగావాలో చూడు, దొర తిన్న తరువాత మన డ్రైవర్‍ను పిలిచి - నువ్వే స్వయంగ తీసుకొని పోయి మన మంచిర్యాల ఇంట్లో పడుకోబెట్టు - అక్కడో మనిషిని కారును ఉంచు.’’

            ‘‘అదిబెస్టు - అక్కడే తింట - వెంటనే అక్కడికి పంపించు.’’ బట్టలేసుకొనిరడీ అయ్యాడు...

            అతన్ని కారెక్కించి - వచ్చేసరికి అన్న నారాయణరావు ఎదురు చూస్తున్నడు.

            ‘‘బాపు వీల్లందరితోని ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నడు ఆ మర్సిపోయిన’’ - మర్చిపోయిందేమిటో గుర్తుకు రాక కుర్చీలో కూర్చున్నాడు నారాయణరావు.

            ‘‘నీ అసిస్టెంటు సుభాష్‍గాడెక్కడ?’’

            అదీ మర్చిపోయి నారాయణరావు కుర్చీలో దిగాలుపడి కూర్చున్నాడు. ధోవతి లాల్సీ వేసుకున్న ఆరడుగుల మనిషి  నారాయణరావు.

            ‘‘ఉత్త బోలాకోరు...’’

            ఇంతలోనే సుభాష్‍వచ్చి వంగివంగి అతివినయంగా నవనీతరావుకు సాల్యూట్‍ చేశాడు.

            అతివినయం దొంగ లక్షణం ‘‘ఏమయ్య - పియ్యే - అన్ననువిడిచి పెట్టిఏడతిరుగుతన్నవ్‍ - నువ్వు మందు గొట్టినవా? అన్నకోసం మినిట్స్ రాసినవా?’’

            సుభాష్‍ ఒక కాగితం తీసి ఇచ్చిండు.

            నవనీతరావు కిందా మీద చూసిండు.

            ‘‘ఓటర్లు, కులాలు, పార్టీలు - ఊళ్లు, దొరలు - గియ్యన్ని సరే - పైనాన్సు ఎట్లా? గది రాయలేదు. వీళ్లందరుగు...బలిసినోళ్లు - మీ బాస్‍ గెలిస్తే - లైనుగట్టి పనులకోసం, పదవులకోసం నిలబడ్తరు. గలిస్టు తయారు జెయ్యి - అన్నతో తిరుగు తన్నవ్‍ - ఎవనితాకతెంతో గాయింత దెల్వదా?’’

            జెబులో నుండి ఇంకో లిస్టు తీసిండు.

            నవనీతరావు అటిటు చూస్తూండగానే శ్రీధర్‍రావు ఒక కుర్చీ తెచ్చివేసిండు.

            వాళ్లిద్దరిని దూరం పొమ్మని - సుభాష్‍ దగ్గర పెన్ను తీసుకొని అడుగవల్సిన వారిపేర్ల కెదురుగా అడుగ వల్సినమొత్తం రాసిండు.

            ‘‘నాకంత గడబెడగున్నది. నువ్వు నాతో పాటు ఉండు. ఆ మతి కచ్చింది - బాపు మన నలుగుర్ని పదగొండు గంటలకు తనకు కలువుమన్నడు.’’

            ‘‘మరి ఇంత మంది సుట్టాలు -అధికార్లు వచ్చిండ్లు - ఒక సారి కల్సి పొమ్మనక పోయినవా?’’

            ఇంతలోనే రకరకాల మాటలతో ఒక రొదగా ఉన్న అక్కడి వాతావరణం గంభీరమైపోయింది.

            ముసలి దొర ముకుందరావు వెనక్కి చేతులు కట్టుకొని మేడ మీద నుండి దిగి బయటకచ్చిండు. వెంకటేశ్‍ వెనుక నిలుచున్నడు.

            ముకుందరావుకు డెభ్బైఏండ్లు - అయినా ముసలిపులిలా ఉన్నాడు. వంగిపోలేదు. చామనఛాయ, ఆరడుగుల ఎత్తు - పెద్దపెద్ద కండ్లు - చేతుల నిండా రోమాలు...

            ఏమనుకున్నడో ఏమో చేతులు జోడించి - టేబులు మధ్యం గ్లాసులు చూడ కుండాపై ముఖాలు చూస్తూ అన్నీ టెబుల్లు తిరిగిండు. పేరుపేరున పలకరించిండు. లేని నవ్వును ముఖం మీదికి తెచ్చిండు...

            ఆయన అన్ని టేబుల్ల దగ్గర మాట్లాడిన ఒకే ఒక్క మాట ‘‘పెద్దోడు ఎన్నికలల్ల నిలబడుతండు - జర సూసుకోండ్లి’’

            ముసలాయన వెళ్లిపోయిన తరువాత అందరు ఊపిరి పీల్చుకున్నారు. వాకిలి దగ్గరికి వెళ్లి ముఖం తిప్పుకొని నిలుచున్న కృష్ణారావు, రాజేశ్వరరావు లోపలికి వచ్చిండ్లు. అప్పటికి రాత్రి పదిగంటలయ్యింది.

            ఈ పార్టీ గతి క్రమం ఏమిటో అంతు పట్టకుండా ఉంది. వాళ్లకు కొద్ది దూరంలో ఉన్న దొరసాన్ల గదిలో నుండి పాటలు, నవ్వులు విన్పిస్తున్నాయి.

            ‘‘నాకిందంత రోతగా ఉంది. నాకు ఎమ్మెల్లే అవసరమా?’’ నారాయణరావు కక్కుకునే ముఖం పెట్టాడు.

            ‘‘మనందరిలో నిన్నే ధర్మరాజనుకుంటరు ప్రజలు మన బాపు లెక్క ప్రకారం మనకు ఇన్ని భూములు, వ్యాపారాలు, డబ్బు, దస్కం ఉన్నా - అధికారంలేకపోతే సున్నా- మన జీవితంలో ఇవ్వన్ని భాగం’’ నవనీత రావు గుసగుసలాడాడు.

            ‘‘గింత తెలివైనోనివి నువ్వే నిలబడవచ్చుగదా!’’

            ‘‘మరినేను చూసే బిజినెస్‍లు నువ్వు చూస్తవా? మన బాపు చెప్పిందిచెయ్యాలె - గీ మాట బాపుకు చెప్పగలవా?’’

            ‘‘తుపాకి తీసి కాల్చిపారేస్తడు’’. నారాయణరావు ఇద్దరు కలిసి ప్రతి గుంపు దగ్గరికి వెళ్లారు.

            మొదట జనరల్‍ మేనేజర్‍ శాస్త్రి టేబుల్‍ దగ్గరికి పోయారు. అప్పటికే శాస్త్రి ముందు చేపముళ్లు, ఎముకలు కుప్పబడి ఉన్నాయి.

            ‘‘మనిషి కక్కుర్తి తిండి దగ్గర తెలుస్తదంటరా. వీడు కక్కుర్తి గాడున్నట్టున్నదే’’ వీడు మొత్తంబొగ్గు బాయిలన్ని తినేటట్టున్నడు. నవనీతరావు లోపల అతని దగ్గర క్రిష్ణారావు తప్పదుగనుక కూర్చున్నాడు. అప్పటికే ఇద్దరికి మూడు రౌండ్లయి పోయాయి. వాళ్ల ముందు బ్లూటేబుల్‍ బాటలున్నది. ఒక మాట ఒకరు వినే పరిస్థితి దాటి పోయింది... గమ్మత్తేమంటే అక్కడ కూడిన వాళ్లెవరు ఒకరి మాట మరొకరు వినే రకంకాదు. అందరు చెప్పెటోల్లె కాని వినేటోల్లుకాదు. నారాయణరావు కుర్చీలో కూర్చుండి ‘‘మీరు మాకు షర్‍కత్‍ చెయ్యాలె’’ అన్నాడు. అప్పటికే నారాయణరావు మాటలన్ని మరిచిపోయాడు.

            ‘‘సహకారం చెయ్యాలె... సింగరేణిల బాగ ఓట్లున్నయి. వైట్‍ కాలరోల్లకు మీరు చెప్పాలె - అంతే కాదు... ప్రచారానికి మీకు దెబ్బరాకుంట హెల్పుచెయ్యాలె’’ నవనీతరావు సదిరిండు.

            ‘‘ఓషూర్‍! అబ్బో మీ తోటే మా బతుకుగదా!’’ అన్నాడు. వాళ్లిద్దరు వచ్చేకన్నాముందు కృష్ణారావుకు, శాస్త్రికి గుండాల విషయంలో పెద్ద బైస్‍నడుస్తంది.

            ‘‘రావు సాబ్‍! మా విజిలెన్సు డిపార్టుమెంటు రిపోర్టును బట్టి బస్తీలల్ల కమీటీలచ్చినయ్‍, సారలి గ్యాంగు ఇండ్లమీద బడి మహిళలను ఖరాబు చేస్తండ్లు. తాగుడెక్కువైతే మార్కెట్లనే పరేషాన్‍చేస్తండ్లు... సమ్‍థింగ్‍ డేంజర్‍’’ సత్యం మాంసం వేపుడు, చేపముక్కలు పంపాడు.

            ‘‘అది మేం చూసుకుంటం మీరు బేఫికరుండండి ఔర్‍ కుచ్‍ ఫరమాయియే’’ నవనీతరావు.

            అప్పటికే కృష్ణరావు ‘‘ఆ గాడ్ది కొడుకులను వీనింటిమీదికే పంపాలె - పీడా పోతది’’ మనుసులో అనుకున్నాడు.

            నారాయణరావు నవనీతరావు లేచి నిలుచున్నారు.

            ‘‘వీడు బాపనోడేమొ? నారాయణరావు.

            ‘‘గందుకే కక్కుర్తి’’ నవనీతరావు.

            నారాయణరావుకు అర్థంకాలేదు.

            మొత్తం టేబుల్లన్ని తిరిగే సరికి అరగంట పట్టింది...

            నారాయణరావు తన రూంలోకి వెళ్లిండు.

            నవనీతరావు కాసేపు ఒంటరిగా కుర్చీలో కూర్చున్నాడు...ఇంతలోనే దాసి జయమ్మవచ్చింది. జయమ్మకు యాభయేండ్లు. ఆమె ఆయింట్లనే పుట్టి పెరిగింది...ఆయింట్లనే వెంకటేశం పుట్టిండు...జయమ్మకు కారుడ్రైవరు నీలయ్యకిచ్చి పెండ్లి చేసిండ్లు...

            అదంతా గుర్తొచ్చింది.

            ‘‘దొర్సాని పిలుత్తందిదొరా?’’

            ఏదొర్సాని?’’

            ‘‘ఇందిరవ్వదొరా!’’

            లేచి తనగదిలోకి నడిచిండు. అక్కడ ధారలుకారుతుండగా ఇందిర ఏడుస్తోంది.

            ‘‘నువ్వక్కడ బీరుగొట్టిడాన్సు చేస్తున్నవనుకున్న’’

            ‘‘గదొక్కటేలేదు’’

            నవనీతరావు కుర్చీలో కూర్చున్నాడు. అతని మనసంతా పదకొండు గంటలకు పిలిచే తండ్రి మీదనే ఉన్నది.

            ‘‘సరే చెప్పు - సినిమా కథతీర్గ కాకుండ సూటిగ చెప్పు’’

            ‘‘ఏం చెప్పాలె? మనం డబ్బు తస్కం తాళపుచెవులు దగ్గరబెట్టుకుని లక్షలు వెనుకేసుకున్నమట’’

            ‘‘అయితే’’

            ‘‘విను - మీ వదినంటది బావ అమాయకుడట - ఆయనకు ఏం తెలువదట - మెహర్బానీకోసం వాళ్ల పిల్లలను హైదరాబాదుల పట్నంల ఉంటన్నట. సదువుకున్నని నాకు టెక్కట. పల్లెలు ఉండలేక పట్నంల ఉంటున్నట. వాళ్లిక్కడ సత్తండ్లట’’

            ‘‘ఇంకా’’

            ‘‘మీ తమ్ముడు క్రిష్ణ సిక్కులామె దగ్గర్నే ఉంటండట - రాజేశ్వర్‍ సినిమాటాకీసుల్నే తాక్కుంట కష్టపడుతున్నడట -వాళ్లందరు ఈ పల్లె టూల్లె దాసీల తీర్గ - ముసలోని కట్టడిల సస్తున్నరట’’

            ‘‘అది సరేగని - మా భారతి ఏంజేస్తంది?’’

            ‘‘ఆమె మొగుడు ధూంధాంలాడి పోయిండుగద - అలిగింది - కట్నాం యివ్వాలెనని - దిక్కుమాలిన డాక్టరుకిస్తే - పిసినారట - కంతిరోడట - అలిగి కూసున్నది’’

            ‘‘ఇంతకీ ఇందిరా! మీరు ఒక్క బీరన్నా తాగిండ్లా లేదా?’’

            ‘‘మనిషి మూడు తాగిండ్లు. ఆశాస్త్రి పెండ్లామైతే హాట్‍ నీటుగ కొట్టింది. పాటలు డ్యాన్సులు - ఒకటేనవ్వుడు.’’

            ‘‘మీరీ! తాగి నప్పుడు మస్తుయాదికొస్తయి - గియ్యన్ని కొత్తయి గాదు. దొరల ఇండ్లల్ల మామూలే - ఇది మన కల్చర్‍ మనకు డబ్బున్నది గని - మన యిష్టం వచ్చినట్లు బతుకలేం. పో - ముసలిపులి పిలిసింది - అగో అక్కడ తాగెటోల్లు చూడు - ఉత్తగ ఒర్లుతరు. కొట్టుకోరు - ఊదుగాలది - పీరిలేవదు - ఇందిరా! మనకు వేరే మాటలెట్లస్తయిచెప్పు - గీ సంగతులే తెలుసు - గియ్యే పంచాయతులు - ముచ్చెట్లస్తయి. పో మళ్లో బీరు గొట్టు - డ్యాన్సు చెయ్యిపో’’

            ‘‘నీకు ఎవతన్న ఉన్నదా?’’

            ‘‘పైసలు చూసేటోనికి గంతపుర్సతుండది. కలువది - బేఫికరుగుండు’’ ఇందిర హఠాత్తుగాలేచి నవనీతరావును ముద్దుపెట్టుకొని ఆడవాళ్ల గుంపు దగ్గరికి కదిలింది. దీని బాద అదన్నమాట తెరిమాకా కిరికిరి’’ నవనీతరావు. ముకుందరావు ముసలి పులిలా గురగురలాడుతున్నాడు. అతను ఉయ్యాల బల్లమీద కూచున్నాడు. అతని గది విశాలంగా ఉంది. అది మొదటి అంతస్థులో ఉన్నది - ఆగది నుండి మొత్తం ఇల్లే కాన్‍ కొండ దాకా విస్తరించి ఉన్నపంటపొలాలు కన్పిస్తాయి...

            నలుగురు ఎదురుగా కుర్చీల మీద కూర్చున్నారు. ముసలాయనకు దాదాపు ఎదురుపడి మాట్లాడటం అరుదు.

            ముసలాయన కాసేపు అటిటు తిరిగిండు.

            ‘‘దావత్‍ అయిపోయినట్టేనా?’’ ముసలాయన..

            ‘‘దగ్గరి కచ్చింది బాపు’’

            ‘‘దావతుల ఒక్కడు గూడ కాపోడు, పెర్కొడు కన్పియ్యాలేదు?’’

            ‘‘కావాలనే పిలువలేదు. వీళ్లంతా ఎక్కువ మంది మనకులపోల్లు’’

            ‘‘మంచిదే - కని ముఖ్యమైన ఊళ్లల్ల యాటల గోయించి దావతు లియ్యిండ్లి - అవతల నిలుసున్నోడు పెర్కొడు. ఈ ఇలాకల వాళ్లు ఇరువై వేలున్నరు. కాపోల్లు పదిహేను వేలున్నరు. వాళ్లు ఒక్కటైతే మన పనిటుప్పా. చుంచు లక్ష్మయ్య దగ్గర పైసలు లేవు. కోమటి రమణయ్యకు కోమట్లంత సపోర్టు చేస్తరు.’’

            నలుగురు తలలు వంచుకున్నారు.

            ‘‘పిస్స పనిజేసేరు లక్ష్మయ్యను గినముట్టుకునేరు రోజులు మునుపటి తీర్గలేవు.

            తపాలపూర్‍ తెలుసుగద - వింటన్నవక్రిష్ణ నీకే - ఉచ్చిలి పనిచేస్తే నీకే మొదటికి మోసమత్తది... పైగావాడు జనతాపార్టీలున్నడు. అదిమన పార్టే - కంపయితది.’’

            ‘‘ఈ అర్థరాత్రి గియ్యేం మాటలనుకుంటండ్లా?’’

            ‘‘వొరే జాగ్రత్తగావినుండ్లి’’ జాగ్రత్తగా వెతికి క్రాంతి పత్రిక తీసిండు. కళ్లద్దాలు పెట్టుకొని...

            ‘‘వెలుమల మీద రెడ్లు కోపంగున్నరు. వాళ్ల పిచ్చి  ప్రజలను ఎంటే సుకొని మీద బడ్తండ్లు - జగిత్యాల, సిరిసిల్లల  ఏంజరుగుతంది - కిరికిరి  - మనదగ్గర షురువైంది - మన ఇరువై ఊళ్లల్ల ఏం జరుగుతందో మీదాంట్ల ఎవనికి తెలువదు.  షేరెదార్లు దొంగలు, తాగుబోతులు, వాళ్లు రెండు దిక్కులుంటరు. వాళ్లను నమ్మకుండ్లి - అరెక్రిష్ణ జాగర్త - సింగరేణిల మీ యూనియన్లు ఏం చీకుతన్నయి -వాళ్లె బాయిలు బందుపెట్టిండ్లు. వాడు శాస్త్రీ గాడు డబుల్‍ గేమ్‍ గాడు’’ ఇట్లా క్రాంతిలో వచ్చిన వార్తలన్ని వాళ్లకు సంబంధించినవి చదివి విన్పించాడు.  నవనీతరావుకు  ఆశ్చర్యం మనిపిచ్చింది. ‘‘తమందరి మీద నిఘూ పెట్టి ఉంటడు. డ్రైవర్లతోటి అన్ని కనుక్కుంటడేమొ? ఎవలికి దొరకని నక్సలైట్ల పత్రిక తెప్పించుకున్నండంటే’’

            ‘‘పోండ్లి - పైసం, అధికారం ఉంచుకుంటే ఉంటది’’ ఇడిసిపెడితె చెంగోబిల్లంటయి కాలరీతి తెలుపక పోతే గంగల కలుత్తరు’’ ఆఖరుగా అన్నాడు.

            ముకుందరావు క్రిష్ణారావు, రాజేశ్వరావు తాగి ఉన్నారని వాళ్ల వాలకం చూసి అర్థంచేసుకున్నాడు. నారాయణరావు కు ఏమి చెప్పినా ఫలితంలేదు. మతిమరుపుగాడు. వాళ్ల ముగ్గురిని పంపంచి...

            ‘‘ఒరే నవనీతం - పెద్దోనికి లక్షరూపాలివ్వు - మనకుల పోల్లు ఎంతిత్తనన్నరు?’’

            ‘‘వాళ్లో లక్ష ఇస్తరనుకుంటబాపు’’

            ‘‘ఇంత పెద్ద సంసారాన్ని నువ్వే సూత్తన్నవ్‍ - కని నీకు దొర లక్షణాలులేవు. బేపారి లక్షణాలులేవు...అవసరమైతే పదిమందిని సంపైనా నిలబడాలె - గదిదొరతనం - ఇరువై ఊళ్లు - జమీను వట్టిగ ఆగలేదు. గయ్యన్ని మీకు తెలువదు. రాజకీయాలు గావాలె - మీ అన్న గెలువాలె - నువ్వేం జేత్తవో నాకెర్కలేదు. లేపోతే ఇయ్యన్ని పోతాయి. వాడు మంది ఇండ్లల్ల పడుకుంటండు.... పానానికే ముప్పు..సరే! అన్నీ నీకెరికే సూసుకోపో’’

            నవనీతరావు మెట్లు దిగి కిందికి వస్తే - దాదాపు అందరు వెళ్లిపోయారు. దూరంగా నెగడు దగ్గర వంట వాళ్లు పుర్సత్‍గ తాగుతున్నారు.

            కింద తన కోసం తననమ్మినబంటు సత్యనారాయణ కుర్చీలో కూర్చుండి కునికి పాట్లు పడుతున్నాడు...

            అలసటగా ఉంది - అస్తు బిస్తు గా ఉంది - రోతగా ఉంది. తన రూంలోకి వెళ్లి స్నానం చేసివచ్చాడు. హాయిగా ఉంది. టేబుల్‍ మీద కరిదైన విస్కీ, సోడా మటన్‍ వేపుడు, ఉడికిన పల్లీలు, ఆమ్లేట్లు ఉన్నాయి.

            చప్పుడు కాకుండా సత్యనారాయణ గదిలోకి వచ్చిండు.

            ‘‘పార్టీ అయిపోయినట్లేనా?’’

            ‘‘ఆ దొరా!’’

            ‘‘ఆడోల్లందరు పడుకున్నారా?’’

            ‘‘పడుకొని ఉంటరుదొరా!’’

            ‘‘మరి ముసలి సింహానికి తిండిపెట్టిండ్లా?’’

            ‘‘పెట్టకపోతే మనందరి మొదడు తింటడు. విజయమ్మతోని మందు, సరుజామాపంపిన’’

            ‘‘పొద్దుగాల్నే తింటడుగదా! అబ్బో మాదండోడు. ఆమేడమీది నుంచి కింద జరిగే పార్టీ ప్రతిదీ అర్థంచేసుకున్నడు. తొమ్మిది గంటల నుండి - ఆయన అంచనాలు ఆయనకున్నయి. తింటే తాగుతే - పార్టీ బేకారయితదని - మనం సరిగ్గా చేత్తన్నమో లేదోనని - అరగంట కోసారి వెంకటేశ్‍ ఇక్కడ జర్గేదంతా పూస గుచ్చినట్టు చెప్పాలె - లోపల ఆడోల్ల ముచ్చట్లు తో సహా సత్యనారాయణ...

            ‘‘కొంపదీసి వాళ్లు బీర్లు తాగింది కూడా’’

            ‘‘గడీల గియ్యన్ని మామూలే - కడెం దొర్సాని పేరిన్నరు గదా!’’

            సత్యనారాయణ హద్దుమీరుతండని

            ‘‘సరే! సరే’’ అన్నాడు. నవనీతరావు సత్యనీరాయణరావు తలుపువేసి బయటకు వెళ్లిపోయాడు. తెల్లవారు ఝామున రెండు దాకా ఒక్కడే తాగుతూ తింటూనే ఉన్నాడు నవనీతరావు..

                                                                                                            ( తరువాయి భాగం వచ్చే సంచికలో )

 

సాహిత్య వ్యాసాలు

స్త్రీ హృదయావిష్కరణం!   పద్మావతి రాంభక్త కవిత్వం!!

ఇవాళ ఒక "కొత్త వేకువ"ను  చూశాను, ఉలిక్కి పడ్డాను.  కంపించాను, కలవరపడ్డాను...
కలలు లేవు, గుస గుస లాడే ఊహలు లేవు, పలవరించే అనుభూతులు లేవు
ఒక నిలువెత్తు దుఃఖపు జీర,ఎదురుపడినట్లు, ఉల్లిపొరలాంటి వేదన వెంటాడు తున్నట్లుగా కల్లోల మేఘం ఉరుముతున్నట్లయింది.

"పక్కనున్న పసివాడి రోదన
రోదసి నంటుతూ
నన్ను నిట్టనిలువునా చీల్చేస్తుంటే
అవేవీ పట్టని నువ్వు
నా మైదానం పై
నీకు నచ్చినట్టు సంచరిస్తావు

నీ ఎముకలుకొరికే చలిని
వెచ్చబరచుకునే కుంపటిని నేను
నీ సలసల మరిగే అగ్ని గుండాలను చల్లార్చుకునే సరస్సును నేను

నాలో ఎన్ని సునామీలు
ఎన్ని భూకంపాలు సంభవిస్తున్నాయో ఎప్పుడైనా చూశావా

నీకు నా దేహమొక క్రీడాస్థలం ఎప్పుడుపడితే అప్పుడు
నా ప్రమేయం ఏమీ లేకుండానేఅడుకొని
నువ్వు మాత్రమే గెలిచి
విజయగర్వంతో
నీ నుదుటన మెరిసే
చెమట చుక్కలను తుడుచుకుంటూ
తృప్తిగా ఠీవిగా నడిచి పోతావు

నేను నా విరిగిపడిన ముక్కలను
ఏరుకుంటూ
నా సలపరించే పచ్చి బాలింత అవయవాలను
పోగు చేసుకుంటూ
రహస్యంగా కన్నీళ్ళు తుడుచుకుంటాను

నువ్వు మాత్రం
నన్నొక అలను చేసి
ఆనందాలనావ పై విహరిస్తూ
నీ నీలి కలలను
సిగ్గులేకుండా సాకారం చేసుకుంటూనే ఉంటావు"
(కవిత..నీలికలలు పుట..43)

ఎవరిదీ నిర్భయ గళం?
ఎవరిదీ నిర్నిద్ర వేదనా స్వరం?
ఏ సగటు ఇల్లాలి పక్షాన ఈ ఆక్రోశం?
ఈ కవితాస్వరమే.. పద్మావతి రాంభక్తగారిది.
పోయినేడాది మా శిష్యత్రయం ఫోన్ చేసి మన 'రాధేయ దశాబ్ది కవితాపురస్కారానికి' ముగ్గురి కవితల్ని ఎంపిక చేశాం సర్,వారే అనిల్ డ్యానీ,పద్మావతి రాంభక్త,అఖిలాశ,. ఇందులోని పద్మావతే ..ఇవాళ నేను ప్రస్తావిస్తున్ననీలికలల కవయిత్రి.

కవితా విజేతలు ముగ్గురి కవితలు తెప్పించుకుని చదివాను.మంచి నిర్ణయమనిపించి ముగ్గుర్నీ ఫోన్ లో అభినందించాను.

తరతరాలుగా పితృస్వామ్య నీడలో పురుషాధిపత్య భావజాలం లో నలిగిపోతూ,రాజీపడుతూ,సర్దుకుపోయే
సగటు ఇల్లాలికి ఈ నీలికలలు  కవితరాయడానికి ధైర్యమే కాదు తెగువ కూడా కావాలి.ఆ నిర్భయ,నిర్నిద్ర ,ధైర్య
స్వరం.. పద్మావతి రాంభక్త ది కావడం   నాకు ఆశ్చర్యమనిపించినా,ఈ ధిక్కార స్వరాన్ని స్వాగతిస్తూ,మనసారా అభినందిస్తున్నాను.

అందుకే ఇవాళ ఒక కొత్త వేకువను,కొత్త చూపుతో ఒక కొత్త కవిత్వోదయం గా స్త్రీ కోణం లోంచీ దర్శిస్తున్నాను. కవయిత్రికి ఈ కొత్త చూపునిచ్చిన వారు - కొండేపూడి నిర్మల"లేబర్ రూమ్" కావచ్చు, విమల"వంటిల్లు" కావచ్చు,
మందరపు'సర్పపరిష్వంగం"కావచ్చు, పాటిబండ్ల రజని "అబార్షన్ స్టేట్మెంట్' కావచ్చు, జయప్రభ "పైటను తగిలెయ్యాలి" కావచ్చు..ఇలా ఒకరి స్ఫూర్తి మరొకరికి  ఆచరణ కాగలిగి నప్పుడే కవుల, భవిష్యత్ స్వప్నం సాకార మవుతుంది.

దాంపత్య బంధం అమలిన శృంగారం లో దగ్గరౌతుంది.ఆత్మీయ స్పర్శ కావాలి

"నీ స్పర్శ నన్ను సేద తీర్చాలి
నువ్వు నన్ను తాకగానే
నా మనసు గాలిలో దూదిపింజలా తేలిపోవాలి
స్పర్శ అంటే.చర్మంపై తేళ్ళూ,జెర్రులూ పాకినట్టు చీదరించేలా కాకుండా లోలోతుల్లోకి చొచ్చుకొనిపోయి హృదయవీణ సుతారంగా మీటాలి బ్రతుకు పోరు లోని బడలిక తగ్గిస్తూ అమలిన ప్రేమకు అద్భుత భాష్యం చెప్పాలి"
(పుట..33)

పసుపు తాడుతో జీవన బంధంపరిమళాన్ని అందించకపోతే,ఎన్నాళ్ళని
ఆశగా ఎదురు చూస్తుందిఏఇల్లాలైనా. తన బ్రతుకు మడిపై ఒక్క చినుకు పలకరింపు కైనా నోచుకోకపోతే ఆమె అతడికి శాశ్వతంగా దూరమై ఆమె ఒక అర్థం కాని కావ్యం లాగే మిగిలి పోతుందంటారు కవయిత్రి.

"ప్రతిరోజూ అతడి ముని వేళ్ళు
ఆమెపై గొంగళి లా పాకుతూ
చర్మలిపిని చదివి
లోపలి తడిని ఒక్కసారైనా తాక లేకపోయాయి
అతడి కనులలో
కాస్తంత కాంతిపుంజానికై
ఆమె ఆత్రంగా వెతికింది"
(పుట..36)

జీవితంలో ఏబాధాసందర్భం కళ్లబడినా నేను కన్నీటి కుండ నై నిలువెల్లా వణికి పోతానంటోంది కవయిత్రి.అమ్మప్రేమగా ఆర్ధ్రంగా తలుచుకుంటుంది .

" ప్రతీ సాయంత్రం
చిమ్నీ మసినంతా తన అందమైన చేతులతో తుడిచేసి
ఇంట్లోనే ఏదో ఒక చంద్రుడిని వెలిగించేది మా అమ్మ
వెన్నెలనంతా ముద్దచేసి నాకు ప్రేమగాగోరుముద్దలు తినిపించేది"
పుట..39

ఒక వర్షం కురిసిన రాత్రిలో తన  హృదయాన్ని తడుపుకుంటూ కలలు గంటుంది.ఒక సారైనా జ్వరమొస్తే బాగుండుననీ భావిస్తుంది.

"ఒకసారి జ్వరం వస్తే బాగుండును ఆకాశంలోంచి అమ్మ నడిచొచ్చి
తన చల్లని స్పర్శతో నా ఒళ్ళంతానిమిరితేబాగుండును
పనికి సెలవు పెట్టి మరీ శ్రీవారు
కళ్లలో ఒత్తులేసుకుని
నాకు సపర్యలు చేస్తే బాగుండును"
(పుట..52)

అమ్మకోసం, అమ్మలాంటి ప్రేమకోసం తపన పడ్తుంది కవయిత్రి.అతివల దేహాల ఒంపుసొంపుల్ని మాత్రమే చూడగలిగే పురుష పుంగవులకు  తీవ్రంగా వార్నింగ్ ఇస్తోంది.

'ఇకమీదట
మీ నుండి వెలువడే
మా బాడీ షేమింగుల దుర్గంధ పూరితమైన వ్యాఖ్యలకు
చరమగీతం పాడేలా
మరోమారు చెవిన బడితే
మీ నాలుకలను తెగ్గోసికాకులకు గద్దలకు ఆహారంగా వేస్తాం జాగ్రత్త,
(పుట..63)

ప్రతి ఇంట్లో కన్నీటికొలన్లు ఉంటాయని,  వాటిని దర్శించాలంటే మనమనసులకు కళ్ళుండాలి.అద్దె ఇల్లు లాంటి గర్భాన్ని మోస్తున్న సర్గసీ మదర్ ను మరో కుంతి తో పోలుస్తుంది.

"తన రక్తమాంసాలతో అభిషేకిస్తున్న పిండానికి అమ్మ కాని అమ్మ గా మారి నవమాసాలూమోస్తుందామె
మరో కుంతి కాకపోయినా ముఖమైనా చూడని పసి జీవాన్ని హృదయాన్ని చిక్కబట్టుకుని పరాయి చేతులలో పెట్టేస్తున్న ఇంతి ఆమె
తనను తానే క్షమించుకోలేక అంతులేనిబాధను మోస్తూ బతుకు కీడుస్తుంది"
(పుట..67)

మరోచోట గాయాల కథను వినిపిస్తుంది.
బెస్తవాళ్లను గురించి రాస్తూ..వారు నిత్యంసముద్రపు పొత్తిళ్లలో జన్మించి, పోరులో కెరటాల కత్తులతో యుద్ధం చేసేవారుగా వర్ణిస్తుంది.

నీకూ నాకూ మధ్య మొలిచిన నిలువెత్తు గోడను ధ్వంసం చేసి సమస్త మురికినీ, మాలిన్యాలనూ కడిగేసుకొని మనసారా కౌగలించుకొందాం రమ్మని సహచరుని కోరుతుంది. కన్నీటి ఉప్పదనాన్ని ఒక్కసారైనారుచిచూడకుండా బతుకు నదిని దాటడం సాధ్య మవుతుందా నీకైనా,నాకైనా,నా మనసేమైనా గొర్రెపిల్లా? గుంజకు కట్టేస్తే పారి పోకుండా ఉండడానికి ? అనిసూటిగా ప్రశ్నిస్తుంది

రంగువెలిసిన నేత కార్మికుల దైన్య జీవితాలను అక్షర బద్దం చేస్తుంది.  ఆకలిని ఆత్రంగా వెతుక్కుంటూ రోజంతా నిలబడి,నిలబడి తన బతుకులోకి ఆశగా తొంగి చూసుకొంటున్న సేల్స్ గర్ల్స్ ను పరామర్శిస్తుంది.

మాతృత్వపు అదృష్టం కోసం ,కొత్తజన్మ కోసం నరాలు చిట్లే నరక యాతనను భరించే స్త్రీ మూర్తిని ప్రశంసిస్తుంది. కొండేపూడి నిర్మల గారి లేబర్ రూమ్ ను తలపించే వేదన ఈ కవిత.

"కత్తుల నదిపై పయనించి
కన్నీళ్ళ నదిని ఈదుతూ
నరాలు చిట్లేయాతనను ఓర్వక తప్పదు
కొన్ని నిమిషాలలో సునాయాసంగానో ఎన్నో గంటల పోరాటంతోనో, యమలోకపు ద్వారాన్ని తాకినంత పనై, వెనుదిరిగాకో
కోరుకున్నంత కొండంత ఫలం
నీ ఒడిలో చేరొచ్చు
మాతృత్వపు కిరీటాన్ని ధరించి అమ్మగా పువ్వులాంటిపాపాయిని చూసి మురిసి పరిపూర్ణమైన స్త్రీ మూర్తిగా నీ జన్మకు ధన్యవాదాలు సాధించవచ్చు"  ( పుట.. 144).

ఇలా కవయిత్రి పద్మావతి రాంభక్త గారి కలందర్శించిన కొత్త వేకువలో ఎక్కువ కవితలు స్త్రీ పక్షపాతాన్నే వహించాయి.
మిగిలిన కవితలు కూడా మానవీయ కోణం లోంచే మాట్లాడినై.

స్త్రీ పక్షాన మాట్లాడిన కవిత్వమంతా ధైర్యం కంటేదీనత్వం లోంచే పలికింది,
ఆగ్రహం కంటే ఆవేదనగానే పలికింది,
కరడు గట్టిన పితృస్వామ్య,పురుషాధిక్య
సమాజం లో మార్పుకోసం,పాలక పక్షం
కళ్ళు తెరిపించాలంటేధిక్కార స్వరం పలకాలి.
రాబోయే రోజుల్లో ఈ స్వరం మరింత బలపడుతుంది.తాను కలలు గనే స్త్రీ స్వేచ్ఛకు పునరంకితం కాగలదని నా విశ్వాసం.

తొలి ప్రయత్నంలోనే సామాజికంగా ,స్త్రీ మనోభావాలను సూటిగా,స్పష్టంగా "కొత్త వేకువ"గా ఆవిష్కరించిన నవ కవయిత్రి  పద్మావతి రాంభక్తఅభినందిస్తూ,2019 లోనే తన కవితకు 'రాధేయ కవితా పురస్కారం' అందుకొని,మా కుటుంబ ఆడపడుచు గా గౌరవం అందుకున్న ఈ కవయిత్రిని మరో సారి మనః పూర్వకంగా అభినందిస్తున్నాను.కొత్త వేకువ ను మనసారా స్వాగతిస్తున్నాను.
 

ఈ సంచికలో...                     

Jan 2021

ఇతర పత్రికలు