ఇంటర్వ్యూలు

ఇంటర్వ్యూలు

ప్రజా ఉద్యమం “నిప్పు”  అయితే ఆ నిప్పును  మరింత  జ్వలింపజేసే “గాలి” సాహిత్యం – గంటేరు గౌరునాయుడు&nb

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు గంటేరు గౌరునాయుడు  గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

 

1.    మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి?

ఇప్పటి విజయనగరం జిల్లా కొమరాడ మండలం నాగావళీ నదీ తీరాన గల దళవాయి పేట అనే చిన్న పల్లెటూరు లో మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో 1954 ఆగస్టు 7న పుట్టాను.  మా అమ్మ సోములమ్మ, బాపు తండ్రి సత్యం నాయుడు.  నెలలు నిండకుండానే ఏడో నెలలో పుట్టిన కారణంగా బతుకుతానని అనుకోలేదట.  ప్రాథమిక విద్య మా  ఊళ్ళోనే. ఉన్నత పాఠశాల చదువు కోసం మా నాగావళి నది ని దాటి నాలుగు మైళ్ల దూరం నడిచి కోటి పాం  పెళ్లి వచ్చేవాళ్ళం.  ఇంటర్మీడియట్ మాకు సమీప పట్నం పార్వతీపురం జూనియర్ కళాశాలలో తెలుగు హిస్టరీ సివిక్స్.  ప్రధానంగా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అట్టాడ అప్పల్నాయుడు (ప్రముఖ కథా  నవలా రచయిత) పక్క పక్క గదుల్లో అద్దెకు ఉండే వాళ్ళం.  అప్పలనాయుడు కూడా కోటి పాం హై స్కూల్ లో చదివాడు. నాకంటే ఒక ఏడాది పెద్ద తను. ఇంటర్మీడియట్ పరీక్ష తప్పడంతో  (సినిమాలు, స్నేహితులు అని సరిగా కాలేజీ కి వెళ్లకపోతే తప్పక ఏమవుతుంది) చదవడానికి ఇష్టపడక వ్యవసాయంలో కుదిరిపోయాను. కీర్తిశేషులు శ్రీ సామవేదుల  రామ గోపాల శాస్త్రి గారు చూపిన దారిలో ప్రైవేటుగా తెలుగు పరీక్షలు రాసి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయున్నయినాను.  2011  సంవత్సరం లో ఉద్యోగ విరమణ చేశాక ఇప్పుడు పార్వతీపురంలో విశ్రాంత జీవితం గడుపుతున్నాను.  నా భార్య పేరు జానకి. ఇద్దరు కొడుకులు. కిరణ్  కుమార్, క్రాంతి కుమార్.  నేను ఇద్దరు తమ్ముళ్లకు, ఇద్దరు చెల్లెళ్లకు అన్నయ్యని. నా మనవరాళ్లిద్దరు (పెద్దోడి పిల్లలు) ఆడిస్తుంటే వాళ్లతో ఆడుతూ గడిపేస్తున్నానిప్పుడు.  కోడళ్ళి ద్దరి పేర్లు  పెద్ద కోడలు లావణ్య, చిన్న కోడలు స్వప్న.

2.    మిమ్మల్ని ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి?

 నిజానికి నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు అంటే ఎనిమిదో తరగతి లో  నాటిక రాసి  ఊళ్లో ప్రదర్శించాను.  స్కూల్లో ఎవరో ఒకతను ఫిరదౌసి ఏకపాత్రాభినయం ప్రదర్శించాడు. అప్పుడు అనిపించింది కవి కావాలని. మా బాపు నటుడు, గాయకుడు, హార్మోనిస్ట్, వేణు అద్భుతంగా పలికించే వాడు, పాటలు బొమ్మలు నా బాల్యంలో నన్ను కళా రంగంలోకి  ఆకర్షించాయి. ప్రభావితం చేసిన సాహిత్య సంస్థల గురించి మాట్లాడితే మా పార్వతీపురంలో మిత్ర సాహితీ సాహితీ సంస్థ ప్రతి నెలా ఒక సమావేశం జరిపేది.  దానికి ప్రధాన వ్యక్తి ప్రముఖ కథా రచయిత పి వి బి  శ్రీరామమూర్తిగారు.  1988లో ఒక సమావేశంలో ఒక కథ చదివాను.  ఆ సభకు ముఖ్య అతిథి ప్రముఖ కవి రచయిత  శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు.  ఆ కథ రేపటి  ఉదయం కోసం.  ఆ కథ ఆకాశవాణి (విశాఖపట్నం) లో ప్రసారం అయ్యింది.  అదే కథను పార్వతీపురం లోని మరో సాహిత్య సంస్థ సాహితి లహరి  అధ్యక్షులు శ్రీ మంచిపల్లి శ్రీ రాములు గారి సంపాదకత్వంలో ప్రచురించిన ప్రచురించిన కథాలహరి కథా సంకలనంలో ప్రచురితమైంది.  అలా నన్ను ప్రోత్సహించిన తొలి సాహితీ సంస్థలు మిత్ర సాహితీ, సాహితీ లారీ ప్రభావం మర్చిపోలేనిది.  శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు పార్వతీపురంలో గిరిజన సంక్షేమ అధికారి గా పని చేసేవాడు.  ఆయన అప్పటికే “నిర్వికల్ప సంగీతం”, “అరణ్యం” పుస్తకాలు రాసారని  తెలిసి ఆశ్చర్యపోయాను.  తరువాత వారి స్ఫూర్తితో సాహిత్య ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించాను.  అట్టాడ అప్పల్నాయుడు ప్రచురించిన “పోడు – పోరు”  కథా  సంకలనం 1988లో నా చేతుల్లోకి వచ్చింది.  ఆ కథలు నన్ను కథారచయితగా నిలదొక్కుకునేందుకు పునాది వేసాయి.  “పోడు-పోరు” కథా సంకలనం లేకపోతే నా “ఏటి పాట” వచ్చి ఉండేది కాదు.  “ఏటి పాట” కథా సంకలనాన్ని శ్రీకాకుళ సాహితి ప్రచురించింది.  1997 ఫిబ్రవరి 17న కథానిలయం ప్రారంభోత్సవంలో గౌరవ కాళీపట్నం రామారావు మాస్టారు ఆవిష్కరించారు.  ప్రముఖ రచయిత శ్రీపతి గారు ఈ పుస్తకాన్ని  పరిచయం చేశారు.  ఆ సభకి  అధ్యక్షులు గౌరవ గూటాల కృష్ణమూర్తి గారు.  ఆ సభ  నాకు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది.  శ్రీకాకుళ సాహితీ నెలనెలా జరిపే సమావేశాలు సాహిత్యం సామాజిక బాధ్యత అని చెప్పి నాకు చూపును  ఇచ్చాయి.  శ్రీకాకుళ సాహితి స్ఫూర్తితో నేను కురుపాంలో (అప్పటికి నేను కురుపాంలో ఉండేవాడిని) స్నేహ కళా సాహితి అనే సంస్థను కొద్ది మంది మిత్రులం  ఏర్పాటు చేసుకున్నాం.  గౌరవ కారా మాస్టారు  ముఖ్య అతిథిగా వచ్చి ఆశీర్వదించారు.  ఇప్పుడు స్నేహ కళా సాహితీ పార్వతీపురంలో ఒక లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటిదాకా 25 పుస్తకాలను ప్రచురించాం.  స్నేహ కళా సాహితీ పేరుతో శ్రీకాకుళ సాహితీ స్ఫూర్తితోనే స్నేహ కల సాహితి నడుస్తుంది.  కొత్త తరం కవుల్ని, కథకుల్ని  తయారు చేసే లక్ష్యంతో వారం వారం సమావేశాలు నిర్వహిస్తోంది.

3.      ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు సాహిత్యం వైపు నడిపించాయి?

 ఉత్తరాంధ్ర విశాలమైన సముద్ర తీర ప్రాంతం, విస్తారమైన అడవులు, నాగావళి, వంశధార వంటి నదులు, పచ్చని మైదాన ప్రాంతం తో సుభిక్షంగా ఉండాల్సింది.  కానీ రైతుల  కూలీల వలసలతో, అన్య ప్రాంత పెట్టుబడిదారుల రాకతో మా అస్తిత్వానికి ఉనికి లేకుండా పోయే ప్రమాదంలో పడింది.  అందుకే ఇక్కడి నుంచి ( ఏ కకవైనా ఏ రచయితయినా ) ఆ వెనుకబాటుతనాన్ని తమ రచనల్లో చిత్రిస్తున్నారు.  నా దరి కూడా అదే కదా. ఇక్కడే  మా ఊరికి సమీపంలోనే ఒకనాడు శ్రీకాకుళ గిరిజన ఉద్యమం జరిగింది.  అది  అణిచి వేయబడినా  ఆ పోరాట స్ఫూర్తి సాహిత్యం ద్వారా అందుకున్న రచయితలు వర్తమాన కళింగాంధ్ర  వెనుకబాటుతనాన్ని రికార్డు చేస్తూ ప్రజల తరఫున నిలబడి  తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.

 

4.    మీ రచనల గురించి చెప్పండి?

 కారా మాస్టారు, అట్టాడ అప్పల్నాయుడు , చినవీరభద్రుడుల పరిచయం,  స్పూర్తి, ప్రోత్సాహం లేకుంటే బహుషా ఒక దృక్పథం లేని  కాలక్షేపం రచనలు చేసే రచయితగా మిగిలిపోయే వాడిని.  నా మొదటి కథా సంకలనం “ఏటి పాట”. రెండో కథాసంకలనం “ఒక రాత్రి రెండు స్వప్నాలు”.  “పాడుదమా స్వేచ్ఛా గీతం”, “ప్రియ భారత జనని”, “గీతాంజలి” పాటల పుస్తకాలు,  “నదిని దానం చేశాక”, “గిరిపోతున్న పిట్టల కోసం”. రెండు కవితా సంకలనాలు “నాగేటి చాలు కు నమస్కారం”,  “నాగలి” రెండు దీర్ఘ కవితలు. “నాగావళి అలల సవ్వడి”, “ఉన్నమాట”, “సేద్య గాడు”(ముద్రణ కావాల్సి ఉంది ).  పద్య రచనలు కలింగోర (ప్రాసంగిక వ్యాసాలు). ఆంధ్రప్రభలో “వ్యాసపీఠం” పేరుతో కాలం నిర్వహించాను  ఒక ఏడాది పాటు.  అవే కలింగోర పేరుతో  పేరుతో పుస్తకంగా వేశాం.  ఇక కొన్ని పుస్తకాలకు ముందుమాటలు, అప్పుడప్పుడు  పత్రికలకు వ్యాసాలు, గజల్సు మీద మక్కువతో “మనసు పలికే” పేరుతో పుస్తకం వేశాను.  నేను ఒక పరిమిత ప్రాంతానికి పరిమిత జ్ఞానంతో నా చుట్టూ ఉన్న ప్రజాజీవితాన్ని చిత్రించడంతో పాటు కొత్తతరం కవులు, రచయితలు తయారు కావాలన్న లక్ష్యంతో స్నేహ కళా సాహితీ సంస్థను  నిర్వహిస్తున్న మిత్రుల సహాయంతో పార్వతీపురంలో.

5.      మీ మొదటి రచన ఏది అది ఏ సందర్భంలో వచ్చింది?

అచ్చులో వచ్చిన మొదటి కవిత “ఇదేనా”.  శ్రీకాకుళం నుండి వెలువడే నాగావళి వారపత్రికలో 1979 డిసెంబర్ లో అచ్చయింది.  నాగావళి  పత్రికకు సంపాదకుడిగా అట్టాడ అప్పల్నాయుడు రచన ఇవ్వమంటే పంపించాను.  అచ్చులో వచ్చిన మొదటి కథ “శారద పెళ్లి”  కథాంజలి   1983.  1979 సంవత్సరానికి ముందు ఎన్ని వేల పేజీలు చిత్తుకాగితాలు ఎగిరిపోయాయో.  వాటిలో నాటకాలు ఉన్నాయి. నవల ఒకటుంది

6.      ఉత్తరాంధ్ర సాహిత్యం మిగతా ప్రాంతాల నుండి భిన్నంగా ఉంటుంది ఎందుకు?

ప్రతి ప్రాంతానికి దానిదయిన  ఒక చరిత్ర ఉంటుంది కదా. పేదరికం దేశంలో ఏ ప్రాంతానికైనా ఒక సమస్య అయినా  దాడిని ఎదుర్కోవడంలోనూ స్వీకరించడం లోనూ ప్రాంతీయ ప్రత్యేకతలు ఉంటాయి.  పూర్వ రచయితల, కవుల ప్రభావం ప్రతి రచయిత మీద ఉంటుంది.  గురజాడ నుండి అందుకున్న చైతన్యం అదే అడుగు జాడ గా సాహిత్యం సృష్టిస్తూ వస్తున్నారు కవులు, రచయితలు.  వ్యవహారిక భాషా ఉద్యమం జరిగింది ఇక్కడ.  శ్రీకాకుళం రైతాంగ పోరాటం జరిగింది ఇక్కడ.  స్వాతంత్ర సముపార్జనకు  ముందే ఇక్కడ ఎన్నోన్నో  తిరుగుబాట్లు జరిగాయి. జమీందారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి.  వీటన్నింటికంటే ముందర చరిత్రలో నెత్తుటి మరకగా  మిగిలిపోయిన అశోకుడి దుర్మార్గ దండయాత్రకు బలైపోయిన లక్షల్లో కళింగ యోధుల పోరాట స్ఫూర్తి చైతన్య పరుస్తూ వచ్చింది రచయితలను కవులను.  కళింగ యుద్ధం నుండి  మొన్నటి సోంపేటలో  థర్మల్ విద్యుత్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం దాకా ఈ నేలకు ఒక ప్రత్యేకత ఉంది.  ఆ ప్రత్యేకతే ఈ ప్రాంత  సాహిత్యం  మిగతా ప్రాంతాల నుండి భిన్నంగా ఉండడానికి కారణం కావచ్చు. ముఖ్యంగా గిడుగు, గురజాడల ప్రభావం అని నా విశ్వాసం. ఇక్కడి ప్రజల భాష సంస్కృతి జీవన విధానంలోని విలక్షణత్వం, యాస, వెటకారం, వ్యంగ్యం  ఇవన్నీ గురజాడ నుండి సంక్రమించిన సాహిత్య వారసత్వ సంపద. బహుశా ఇవే మిగతా ప్రాంతాల నుండి కళింగాంధ్ర ను ప్రత్యేకంగా నిలుపుతున్నవని  అనుకుంటాను.

7.      ఇప్పుడు వస్తున్న సాహిత్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు?

ఏ కాలంలో వచ్చిన సాహిత్యం ఆ కాలపు రాజకీయ ఆర్ధిక సామాజిక పరిస్థితులకు దర్పణంగా నిలుస్తుంది. సమస్యలను కళాత్మకంగా చిత్రిస్తుంది, ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.  ఉత్తరాంధ్ర కళింగాంధ్ర వర్తమాన సాహిత్యం కూడా అదే చేస్తుంది.  ఏ ప్రాంతానికి తీసిపోని సాహితీ సృజన నిరంతరం కొనసాగుతూనే ఉంది.

8  సాహితీవేత్తలకు కవులకు రచయితలకు పాఠకులకు మీరు ఏం చెప్పదలచుకున్నారు? కొత్తగా రాస్తున్న వాళ్ళ గురించి  మీరేమంటారు?

సాహితీవేత్తలకు, కవులకు, రచయితలకు ఏం చెప్పగలను?  అంత జ్ఞానము లేదు.  అయితే ఒకటి మాత్రం అనుకుంటున్నాను. వర్తమాన కవులు రచయితలతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది వారు తమ పూర్వ కవుల, కథకుల రచనలు అధ్యయనం చేయలేదని.  ఊహశాలిత, రాసే నేర్పు ఉండటం మాత్రమే కాదు రచయితకు ఉండాల్సింది తమ పూర్వ రచయితలు ఏమి రాశారో, తాము ఏమి రాయాల్సి ఉంటుందో అంచనా వేసుకోవడానికి అధ్యయనం  ముఖ్యమని భావించకపోవడం.  అలాగే భాష, వాక్య నిర్మాణం పట్ల సాధికారత  లేకపోవడం.  అయితే అందరూ ఇలాగే ఉన్నారు అని కాదు అని నా భావన.  చాలా ఎక్కువ మందిలో నేను గమనించింది.  కవుల్లో అయితే అస్పష్టత గమనించాను. ఇతరులకు అర్థం కాకుండా రాస్తేనే అది గొప్ప కవిత్వంగా ప్రశంసిస్తారు అనే భావన కొందరిలో గమనించాను. ఇలా చెబితే కొందరికి ఆగ్రహం కలగొచ్చు గానీ రాసిన అక్షరాల తడి ఆరకుండానే అచ్చయి పోవాలననే  తపన చాలామందిలో (ఇప్పుడెవరూ కలం పట్టుకుని రాసే వారు లేరు అనుకోండి).  రాసినదాన్ని పదేపదే సరిచూసుకొని తనకు తానే ఎడిట్ చేసుకుని ఆచ్చుకి పంపించడం చేస్తున్నారా అంటే అది అనుమానమే.  అచ్చులో కంటే ఫేస్బుక్ , వాట్సాప్ లో అచ్చవుతున్నాయి కదా.  సమస్యలేదు. రాసినదంతా  కవిత్వంగా లైక్ లు,  ఆహా ఓహో, అద్భుతం అంటూ  కవిత్వంగా చలామణి అయిపోతుంది.  కొత్త వారిలో కొద్దిమంది మాత్రమే భాషపట్ల,  వాక్య నిర్మాణం పట్ల , అభివ్యక్తి శిల్పం పట్ల జాగురూకులుగా  ఉండటాన్ని గమనించాను.  ఇవన్నీ నేను గమనించిన అంశాలుగానే చెబుతున్నాను తప్ప ఇవి సలహాలు ఇస్తున్నట్టుగా ఎవరూ భావించనక్కరలేదు.  ముందే చెప్పాను కదా అంత జ్ఞానం లేదని.

9       యువతరం సాహిత్యంలోకి రావాలంటే ఏం చేయాలి?

యువతరాన్ని సాహిత్యంలోకి ఆకర్షించాలంటే ముందు బాష పట్ల వారికి ఆసక్తి, అభిరుచి కలిగించాలి.  ఇది పాఠశాలల్లోనే జరగాలి, కళాశాలలో జరగాలి.  అది జరిగే అవకాశం ఎక్కడుంది? ర్యాంకుల గొడవలో పడి సతమతమై పోతుంటే?  భాషల గురించి పట్టించుకునేదెవరు? ఇక ఆంగ్ల భాష మాధ్యమంగా చదువుకొని వర్తమానంలో భాషల పట్ల పిల్లలకు ఆసక్తి ఎలా కలుగుతుంది?  ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఒక అమ్మాయి బాపు బొమ్మకి చేసిన అనువాదం “గాంధీ టాయ్”  అని.  మాతృభాషలో ఉన్నత పాఠశాల వరకూ బోధన జరగాలి.  పై తరగతుల్లో కళాశాలల్లో తెలుగు భాష తప్పనిసరిగా బోధించ బడాలి.  ప్రైవేట్ కళాశాలల్లో కూడా తెలుగు భాషా బోధన జరగాలి.  కళాశాలలు వేదికలుగా సాహితీ సంస్థలు కార్యక్రమాలు నిర్వహించుకుంటే విద్యార్థులకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించవచ్చు.  ముఖ్యంగా యువతరం కవులు, రచయితలు తాము అధ్యయనం చేస్తూ కళాశాలలని  సాహిత్య వేదికలుగా మార్చుకొని అనుభవం గల  రచయితల్ని కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తే యువతరం సాహిత్యానికి చేరువ  కాగలుగుతారు.

10      కొత్త రచయితలకు మీరిచ్చే సూచనలు?

సూచనలు స్వీకరించే స్థితిలో కొత్త రచయితలున్నారా?   చాలామంది రచయితలు సాహిత్యం కోసం, కొత్తవారి కోసం ఉపయోగపడే పుస్తకాలు  వేస్తున్నారు.  అవి కొత్త రచయితలు చదువుతున్నారా? రాసినదంతా సాహిత్యమే అనుకోకుండా తోటి మిత్రులతోనూ అనుభవంపండిన  వారితోనూ రచన గురించి మాట్లాడుతుంటే అదే వారిని ముందుకు నడిపిస్తుంది

11       ఈ మధ్య మీరు చదివిన మంచి కథలు చెబుతారా?

కథలు ఎంత ఇష్టంగా చదివే వాడిననో.  ఇటీవల అసలు కథలు (ఇటీవల వచ్చిన కథలు) చదవలేకపోయాను.  ఆంధ్రజ్యోతి ఆదివారం, సాక్షి ఆదివారం,  ప్రజాసాహితి, నవ్య వీక్లీ, పాలపిట్ట  ఇంకా ఆయా రచయితల కథా సంకలనాలు  చదివేవాడిని.  కరోనా కాలంలో కథలు చదవ లేదనే చెప్పాలి. పద్దం అనుసూయ కోయ ఆదివాసి కథలు చదివాను. కోయ  జీవితాల్లోని చీకటి కోణాలు బయటి ప్రపంచానికి తెలియజేసిన ప్రత్యేక గిరిజన కథలు. కోయ గిరిజన తెగకు చెందిన రచయిత్రి రాసిన ఈ కథలు పుస్తకం లో ఉన్నవి నాలుగే  అయినా చదవాల్సిన పుస్తకమే.  లైబ్రరీ కి వెళ్లడం కుదరక (కరోనా కాలం) కథల్ని  చదవలేదు.  ఈ కరోనా కాలంలో “వందేళ్ల కథకు వందనాలు” పుస్తకంలోని కథలు చదవడం పూర్తి చేశాను. నవలలయితే”పర్వా” (రెండోసారి) “అమృతసంతానం”(రెండోసారి) చదివాను. కల్లూరి భాస్కరం గారి “మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మనదే” చదవడం పూర్తి చేశాను నిన్ననే.  చాలా రోజుల కిందట  మిత్రులు దాట్ల దేవదానంరాజు గారిచ్చిన  “ గోదావరి కథలు”,  మిత్రులు చిరంజీవి వర్మ కథల పుస్తకం “కాకి బొడ్డు” చదవడానికి తీశాను బయటకి.  ప్రస్తుతం చదువుతున్నది దీవి సుబ్బారావు గారి కవిత్వం” ఇంకొకప్పుడు”. ఈ వారం క్రితం అందుకున్న మోదుగు శ్రీ సుధ గారి విహారి (కవిత్వం) పుస్తకం అడుగుతోంది నన్ను ఎప్పుడు చదువుతారు అని.

12.     తెలుగులోకి వస్తున్నంతగా  అనువాద సాహిత్యం తెలుగు నుండి బయట భాష లోకి వెళ్లడం లేదు.  ఏం చేయాలి?

ఇది ఆలోచించాల్సిందే.  ఇతర భాషలలోకి అనువదించ దగ్గ  రచనలు రాకపోవడమా  లేదా తెలుగు భాషతో పాటు పర భాషలు తెలిసిన అనువాదకులు శ్రద్ధ పెట్టకపోవడమో.  నాకైతే గొప్ప రచనలు రాలేదేమో అనిపిస్తుంది.  అయితే ఇటీవల వచ్చిన “శప్తభూమి”(స్వామి) “ కొండపొలం”(సన్నపురెడ్డి) నవలలు ఇతర భాషలలోకి వెళ్లవలసిన మంచి రచనలు.  మరి ఎందుకు శ్రద్ధ చూపలేదు అనువాదకులు?  కథలు ఇంగ్లీషులోకి అనువదించచే  ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది.  అది సంతృప్తి కలిగించే రీతిలో కాదు.  పేరున్న సాహితీ సంస్థలు శ్రద్ధ తీసుకోవాలి

13    ఇదివరకు పత్రికలు పోషించిన పాత్రను ఇప్పుడు అంతర్జాల పత్రికలు,  ఫేస్బుక్ పోషిస్తున్నాయి కదా.  ఈ మార్పు వల్ల కొత్త తరం పాఠకులు సాహిత్యంలోకి వచ్చారంటరా?

పత్రికలు పోషించిన పాత్రను ఇప్పుడు అంతర్జాల పత్రికలు, ఫేస్బుక్ పోషిస్తున్న మాట వాస్తవమే గానీ అంతర్జాల పత్రికలో వస్తున్న సాహిత్యం చదువుతున్నది పరిమితమే  అని నేను అనుకుంటున్నాను.  అభిరుచి ఉన్నవారు, సాహిత్య పరిచయం ఉన్నవారు చదువుతున్నారేమో? వారు కూడా స్మార్ట్ ఫోన్ లోని ఇతరేతర దృశ్యాల పట్ల చూపిన ఆసక్తితో  అంతర్జాల పత్రికలు తెరుస్తున్నారు అంటే అనుమానమే.  అంతర్జాల పత్రికలో ఈ కథ చదివాను బాగుంది అని నాతో అన్న వాళ్ళు అతి తక్కువ  (నా దరిదాపుల్లోనే రచయితలు మిత్రులు).  కథ రాసిన రచయిత మిత్రుడు ఫేస్బుక్లో కోరడం వల్ల గానీ ఫోన్లో చెప్పడం వల్ల గాని చదివిన  సందర్భాలు   ఉండొచ్చు.  నాలాంటి వాడు ఫోన్ లో చదవడం కష్టం.  అందరికీ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఉంటాయా? కొత్త తరం పాఠకులు, రచయితలు ఫేస్బుక్లో  కనిపిస్తున్నారు అది కవితలకు పరిమితమై అని నా అభిప్రాయం.  కథలు, వ్యాసాలు సాహిత్య జీవులైన పెద్దలు కొందరు చదువుతారు ఏమో? నిన్నటి తరం పత్రికలలో సాహిత్యాన్ని చదివినట్టు అంతర్జాల పత్రికల్లో సాహిత్యం చదువుతున్నా కొత్త తరం తక్కువే అనిపిస్తుంది.  నా అభిప్రాయం, అంచనా తప్పయినా కావచ్చు

14.    మీకు బాగా నచ్చిన ప్రజల నాలుకలపై కదలాడే  పాట?

నాకు నచ్చిన ప్రజల (ఎక్కువగా ప్రజల్లో గాయకుల్లో) నాలుకల పైన కదలాడే  పాట దాశరధి గారి రచన “ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో” పాట.  నేను ఎక్కువగా ఇష్టపడి పాడుకునే పాట ఇది

15.     ప్రజా ఉద్యమాలకు సాహిత్యం ఎంతవరకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు?

 ప్రజా ఉద్యమం “నిప్పు”  అయితే ఆ నిప్పును  మరింత  జ్వలింపజేసే “గాలి” సాహిత్యం.  సాహిత్యం లేకుండా ఉద్యమాలు వేగవంతం కాలేవని నా అభిప్రాయం.

 16.      స్థానిక ప్రాంతీయ అస్తిత్వ లకు సంబంధించిన కథా సాహిత్యం ఈ మధ్యకాలంలో ఏ స్థాయిలో వస్తోంది ? దాని ప్రభావం ఇతర అస్తిత్వ ఉద్యమాల పై ఉన్నదా?

ఈ మధ్య కాలంలోనే కాదు స్థానిక ప్రాంతీయ అస్తిత్వ లకు సంబంధించిన వాదాలు సాహిత్యంలో ఊపందుకున్న నాటి నుంచి అదే సాహిత్యం వస్తోంది.  ఇది సాహిత్య ప్రపంచాన్ని చీలికలుగా చేస్తున్న ప్రమాదం దాపురించింది.  “మా కులం వాళ్లమే మా సాహిత్యం రాసుకోవాలి.  ఇతరులు ఏం రాయగలరు? అన్నంత  వరకూ వచ్చి మా కోసం ఆ మహా రచయిత ఏం రాశాడు? ఈ మహాకవి ఏం చేశాడు?” అని వారిని తక్కువ చేసే స్థితి ఉంది.  ఇది సాహిత్య లోకానికి మేలు చేయదనుకుంటాను. కవులు, రచయితల మధ్య సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది.

ఇంటర్వ్యూలు

సాహిత్య విమర్శది మొదట్నించీ బలహీన స్వరమే - డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

 

 

1          మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి?

మాది నల్లగొండ జిల్లా కనగల్‍ మండలంలోని పగిడిమర్రి గ్రామం. అమ్మానాయినలు కోటమ్మ, మారయ్య (నాగరీకరణ లో మాధవరెడ్డి అయ్యిండు). దీపావళి ఎల్లిన తెల్లారి పుట్టిన్నని అమ్మ చెప్పేది. సంవత్సరం ఆమెకు తెల్వదు కనుక చెప్పలేదు. 12-03-1954 అని స్కూల్‍ సర్టిఫికెట్‍ చెప్తుంది. మా నాయిన మధ్య తరగతి రైతు. నలుగురు చెల్లెండ్లు. నా సదువు తెలంగాణ వర్షాధార వ్యవసాయం. అందు వల్లనేమో మేము దారిద్య్రమనుభవించలేదు గాని భోగాల్లో కూడ పెరగలేదు. స్కూలు లేని, కాలేజిలేని కాలమంతా వ్యవసాయపనులు చేసేది. ప్రతి ఎండకాలం గొర్లు కాసేది. మిగతా సెలవుల్లో పసుల గాసేది. వరాలు దీయడం, నాగలి దున్నడం వరి కోయడం మొదలగు అన్ని పనులు చేసేది (ఈ పనులన్ని లెక్చరర్‍ అయినంక గూడ చేసేది). పగిడిమర్రి నుంచి నల్లగొండకు 12 కి.మీ వారంవారం నడిచి వెళ్ళొచ్చేది. డిగ్రీలో రూం కిరాయి, కిరాణం మొదలగు అన్నీ కలిపి నెలకు 20 రూపాయలతో కష్టకష్టంగా ఎల్లదీసేది. పి.జి, యం.ఫిల్‍ కాలంలో మెస్‍ లేనప్పుడు ఎన్నో సార్లు   ఉపాసముండేది. ఇదంతా ఎందుకు చెప్తున్ననంటె జీవితంలో కాయకష్టం తెలుసునని, తర్వాతి కాలంలో ఇది కష్టజీవుల పట్ల సానుభూతి కలగడానికి ఒక కారణమై ఉండొచ్చునని చెప్పటానికే.

            మా నాయిన ఊర్లో మంచిపేరుగల పెద్దమనిషి. మా యింటిముంగట  ఎప్పుడూ పంచాయితీలు జరుగుతుండేవి. మా నాయిన చెప్పేదానిని అందరూ అంగీకరించే వాళ్ళు. ఎందుకంటే ఆయన న్యాయంగా తీర్పుచెప్పేవాడు (అందుకే ఆయన ఏకగ్రీవంగా సర్పంచ్‍ అయ్యిండు). బహుశా ఇది తర్వాతి కాలంలో నేను న్యాయంవైపు నిలబడడానికి ఒక కారణమై ఉండొచ్చు.

            సక్రమ మార్గంలో డిగ్రీ కాలేజీ లెక్చరర్‍గా ఎన్నికైన. లెక్చరర్‍గా ప్రిన్సిపాల్‍గా ఏమేంజేసిన అనేది నేను చెప్పుకుంటే గొప్పలు చెప్పుకున్నట్టుంటది. మొత్తానికి యాంటీ ఎస్టాబ్లిష్‍మెంట్‍గా ఉన్నననే అనుకుంట.

            మా అమ్మ బతుకమ్మలప్పుడు, నాట్లేసేటప్పుడు, పచ్చగలుపు తీసేటప్పుడు, వరిగోసేటప్పుడు, వడ్లు దంచేటప్పుడు పదాలు పాడేది. కథలు చెప్పేది. భాగోతాలకు, శారదగాండ్ల  కథలకు నన్ను తీసుకపోయేది. ఈ బాహిర ఆంతర డియన్‍ఏ నన్ను కవిత్వం వేపు మళ్ళించిందేమో.

 

 1. మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు    నడిపించాయి?

 

 తొలిదశలో పుస్తక పఠనం వైపు రావడానికి మీ ప్రశ్నలో పేర్కొన్న ఏ పరిస్థితులూ కారణం కావు. కేవలం వ్యక్తిగతం (వ్యక్తిగతం వెనుక అప్పటికి నాకర్థంకాని కారణాలున్నయేమో తెల్వవు). మూడు నాలుగేండ్లకు గాని నాకు నడక రాలేదట. నకిరెంబట్టి నల్లగా ఉండే వాడినట. ఎవ్వరూ నన్ను దగ్గరికి దీసేవారు కారట. కర్రోడా, బక్కోడా, నట్టలోడా అని ఎక్కిరించేవారట. ఇది నాకు తెలివొచ్చింతర్వాత (స్పృహ ) కూడా జరిగింది. ఈ పరిస్థితి నన్ను ఆత్మన్యూనతా భావానికి లోనుజేసి అంతర్ముఖుణ్ణి చేసి ఉంటుంది. బహుశా ఆ కారణంగానేనేమో ఎక్కువ మాట్లాడకపోయేవాణ్ణట. భగభగ మాట్లాడే వాణ్ణే తెలివగల్లోడని అంటరు గద. అందుకే అందరూ తెలివితక్కువోణ్ణి నాలుముచ్చోణ్ణి అని కూడ అనేవారట. అట ఏంది ఇప్పటికీ ఇది కొంత నిజమే. ఏడులో ఒకసారి, పదిలో ఒకసారి ఫెయిల్‍ కావడంతో ఈ లక్షణాలు ఇంకా ఎక్కువయి ఉంటయి. బహుశా దీన్ని జయించటానికి నేను పుస్తక పఠనంలోకి వచ్చి ఉంటాను. నాకు యాదికున్నంత వరకు ఇది ఎనిమిదో తరగతి నుంచి మొదలయి ఉంటుంది. పసుల గాయపోయినా, గొర్ల గాయపోయినా, శేను కావలి పోయినా ఎప్పుడూ చేతిలో పుస్తకం ఉండే. మిగతా సబ్జెక్టుల్లో ఫెయిలయినా తెలుగులో మాత్రం ఫస్టుండే వాడిని. అందుకే మా తెలుగు సార్లు నన్ను క్లాస్‍ లీడర్‍ను చేసిండ్రని అప్పటి క్లాస్‍మేట్స్ తర్వాత చెప్పగా గుర్తుకొచ్చింది. ఇది ఇంటర్‍లో, బి.ఏ.లో తెలుగును ఆప్షనల్‍ సబ్జెక్టు తీసుకోవటానికి ప్రేరకం అయి ఉంటుంది. ఇది కూడా నన్ను తెలుగు సాహిత్యం వైపు నడిపించి ఉంటుంది. డిగ్రీ అయ్యిందాకా చదివింది చందమామ లాంటి బాలసాహిత్యం, డిటెక్టవ్‍ నవలల లాంటి కాలక్షేప సాహిత్యం, ఠాగూర్‍లాంటి సీరియెస్‍ సాహిత్యం (ఈ విభజన అప్పుడు తెలియదు) ఉండేది. సిలబస్‍లో ఉండేవి సరేసరి.

            పూర్తిగా సీరియస్‍ సాహిత్యం చదివింది ఉస్మానియాలో ఎం.ఏకు వచ్చిన తర్వాతనే. ఇక్కడ మీ ప్రశ్నలో పేర్కొన్న పరిస్థితులు ప్రస్తావనకొస్తవి. ఉస్మానియా అంతా అప్పుడు విప్లవ భావజాల సంరంభంలో ఉండేది. పిడియస్‍యూ, ఆర్‍యస్‍యూ, డియస్‍ఓ, యస్‍ఫ్‍ఐ, ఎఐయస్‍ఫ్‍ లాంటి విద్యార్థి సంఘాలు అనేక ఉపన్యాస కార్యర్రకమాలు నిర్వహించేవి ( ఈ వివరాలు అప్పటి భావోద్వేగం వేరే ఇంటర్వూలలో, వ్యాసాలలో రాసిన కాబట్టి మళ్ళీ ఎందుకని వదిలేస్తున్న) పైన వివరించినట్టు గ్రామాల్లో చూసిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడి విప్లవ రాజకీయాల ప్రభావంతో సీరియస్‍ సాహిత్యంవైపు పయనించిన.

 

 1.   మిమ్ములను ప్రభావితం చేసిన సాహత్య సంస్థలు, పత్రికలు పుస్తకాల గురించి తెలపండి?

 నన్ను మొదట ప్రభావితం చేసింది విప్లవ విద్యార్థి సంస్థలు. తద్వారా సాహిత్యం, తద్వారా విరసం. విరసం మాచెర్ల , తిరుపతి సభల్లో ఉత్సాహంగా పాల్గొన్నం. హైదరాబాద్‍లో దశాబ్ది ఉత్సవాల్లో అంతే ఉత్సాహంతో పాల్గొన్నం. ఈ సభల ద్వారా అనేక మంది విప్లవ రచయితలు, కవులు పరిచయమయిన్రు. విరసంలో సభ్యులం కాకపోయినా సభ్యులంత నిబద్ధతతో అనేక విరసం కార్యక్రమాలకు అటెండయ్యేవాళ్ళం. వక్తలుగా, కవులుగా కూడా పాలుపంచుకునేవాళ్ళం. ఉస్మానియా రైటర్స్ సర్కిల్‍ స్థాపన నిర్వహణల్లో విరసం ప్రభావం నేపథ్యంగా పనిచేసింది. విరసం కార్యదర్శి కె.వి.రమణరెడ్డి ఉస్మానియా రైటర్స్ సర్కిల్‍ కన్వీనర్‍నయిన నాకు ఉత్తరాలు రాయడం, విరసం సభ్యుడైన ఆర్‍.కె. మాతో నిత్య సంబంధంలో ఉండడంవిరసం సభ్యుడైన చెరబండరాజుకు రైటర్స్ సర్కిల్‍ నుంచి వెలువడిన ‘‘ఈ తరం యుద్ధ కవిత’’ ను అంకితమివ్వడం, వరవరరావు, కె.వి. రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావులను వక్తలుగా పిలువడం మొదలయినవి విరసంతో మా అనుబంధానికి గుర్తులు.

            అరుణతార, సృజన, ప్రజాసాహితి పత్రికలను క్రమం తప్పకుండా చదివేవాళ్ళం. వాటిలో వచ్చే రచనలు మా ఆలోచనలకు పదును పెట్టేవి. నా తొలిదశ కవితలను అరుణతార, ప్రజాసాహితి అచ్చువేసి ప్రోత్సహించినవి.

            నండూరి ప్రసాద్‍రావు గారి డార్విన్‍ పరిణామవాదంచదివి నేను హేతువాదినయిన. బహుశా ఆయనదే ‘‘గతితార్కిక భౌతికవాదం’’ నన్ను మార్క్సిజం వైపు మళ్ళించింది. డిగ్రీలో ఉండగా చదివిన ‘‘పారిశ్రామిక విప్లవం’’(రచయిత పేరు యాదికి లేదు), సురవరం ‘‘ఆంధ్రుల సాంఘికచరిత్ర’’లతో ఈ పుస్తకాలు అనుసంధానం చేసినవి. ఇంకా ఆ క్రమంలో అనేక పుస్తకాలు చదివిన.

 

 1.   మీ రచనల గురించి చెప్పండి?

 

నా తొలి స్వీయ కవితా సంకలనం ‘‘తోవ ఎక్కడ’’(1994). కాని నేను వెలువరించిన తొలిపుస్తకం ‘‘1971 - 80 ఈ తరం యుద్దకవిత’’ (1982) మలిపుస్తకాలు గుడిహాళం రఘునాథం, గుంటూరు ఏసుపాదం, మర్రి విజయరావులతో కలిసి రాసిన సంయుక్త కవిత్వం ‘‘విపశ్యన’’ బులెటిన్లు (1986 - 91). ‘దాలి’,‘తావు’, ‘ముంగిలి’,‘మత్తడి’ ‘‘తెలంగాణ చరిత్ర’’ ‘‘గనుమ’’ల గురించి తరువాతి జవాబుల్లో ఉంటుంది. (ఇవికాక చాలా పుస్తకాలు ఉన్నవి. ఆసక్తి ఉంటే వాటి గురించి అనుబంధంలో చూడొచ్చు). మిగతా కొన్ని పుస్తకాల గురించి ఇక్కడ కొద్దిగా చెప్త. ‘‘అభ్యుదయ కవిత్వంలో మధ్యతరగతి జీవిత చిత్రణ’’, ‘‘తెలుగు కవిత్వం - తాత్విక నేపథ్యం’’ ఇవి ఎం.ఫిల్‍, పిహెచ్‍.డి సిద్ధాంత గ్రంధాలు. ఇవి మార్క్సిస్ట్ దృక్పథంతో రాసినవి. ‘‘బహువచనం’’ నేను సంపాదకత్వం వహించిన సంకలనం. ఇది తెలంగాణ తొలి దళిత బహుజన వాద కవితా సంకలనం. చాలా పాపులర్‍ దీర్ఘకవిత. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో అనేక మందికి ప్రేరణనిచ్చిన కవిత ‘‘నల్లవలస’’. ఇది గుడిహాళం రఘునాథం, కె.శివకుమార్‍, కె.శ్రీనివాస్‍, నేను కలిసి రాసిన సంయుక్త కవిత.

 

 1.   మీ మొదటి రచన ఏది? అది కథనా? కవితనా? అది ఏ సందర్భంలో నుండి వచ్చింది?

           గోడ పత్రిక కూడ అచ్చు కిందికే వస్తే, నేను నర్సింహాచారి కలిసి రాసిన ‘‘అతి రహస్యం’’ అనే చందమామ తరహా కథ. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‍ గోడపత్రికలో వచ్చింది. పరిగణనకు తీసుకోదగిన రచన కాదు. ఇంటర్‍, డిగ్రీల్లో రాసినవి పోయినవి. ఎం.ఏలో ఉండగా నా తొలికవిత ‘‘ధ్వని’’ జయశ్రీ అనే పత్రిక నవంబర్‍, 1977 సంచికలో వచ్చింది. (తర్వాత వెంటవెంటనే ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, అరుణతార, అభ్యుదయ, భారతి మొదలగు పత్రికలలో వచ్చినవి). ఇది విప్లవ దృక్పథంతో రాసిన కవిత. సందర్భంలో నుండి అయితే ఎమర్జెన్సీ తర్వాత జరిగిన మొదటి ఎన్‍కౌంటర్‍ (నల్లగొండ జిల్లా మంచినీళ్ళ బావి గూడెంలో జరిగినప్పుడు,1980)  ‘‘అక్షరకటకం’’ రాసిన.

 

 1.  ఉస్మానియా రైటర్స్ సర్కిల్‍ స్థాపనలో మీ పాత్ర ఏమిటి? ఉస్మానియా రైటర్స్ సర్కిల్‍ మీ మీద ఎలాంటి ప్రభావాన్ని  చూపింది?

          దీని గురించి చాలా సందర్భాల్లో రాసిఉన్న. కాబట్టి సంక్షిప్తంగా చెప్త. నందిని సిధారెడ్డి, నేను, సలంద్ర, నాళేశ్వరం శంకరం, జింబో(మంగారి రాజేందర్‍), కె.ముత్యం ఇంకా కొందరం స్థాపక సభ్యులం. అయితే ఆవిర్భావ సభ జరుగకముందే కొన్ని అపోహలవల్ల సిధారెడ్డి పక్కకు జరిగిండు. నా మీద బాధ్యత పడింది. అప్పటికే విప్లవ నిబద్ధత ఏర్పడింది కాబట్టి కాడెత్తెయకుండా స్థాపనకాణ్నుంచి చివరి దాకా అంటే గుంటూరు ఏసుపాదం, కె.ఎన్‍. చారి కన్వీనర్లుగా ఉన్నప్పుడు గూడ అంటే 1983 దాకా ప్రధాన పాత్ర వహించిన.

            రైటర్స్ సర్కిల్‍తో ఉస్మానియాలో ఒక విప్లవ సాహిత్య సంరంభం ఏర్పడింది. అనేక కార్యక్రమాలు నిర్వహించినం. భావజాల పరంగా, సంస్థల నిర్వహణ పరంగా రైటర్స్ సర్కిల్‍ నిర్వహణ ద్వారా ఎంతో నేర్చుకున్న. ఈ అనుభవం అనంతరకాలంలో శ్రీకాకుళ సాహితి, నీలగిరి సాహితి, తెలంగాణ సాంస్కతిక వేదిక, సింగిడి (తెలంగాణ రచయితల సంఘం) లాంటి సంస్థల స్థాపనకు ఎంతో ఉపయోగపడింది. ప్రగతిశీల భావజాలాన్ని అనంతర తరాల వారికి అందించడానికి దోహదం చేసింది.

 1.   ‘‘ఈ తరం యుద్ధకవిత’’ గురించి చెప్పండి?

          1971 - 80 దశాబ్ది సంకలనమిది. దశాబ్ది సంకలనాలలో ఇది మొదటిది. ఆ రకంగా ఇది దశాబ్ది సంకలనాలకు దారి వేసింది. విరసం దందహ్యమాన దశాబ్దికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఆ దశాబ్దిలో వచ్చిన ఇతర ప్రగతిశీల కవిత్వానికి కూడ స్థానం కల్పించింది. ఆ రకంగా ఇది 1971 - 80 దశాబ్దికి సంపూర్ణ ప్రతిబింబం. ఆ దారిలోనే పాపినేని ‘‘కవితా ఓ కవితా’’, 1981 - 90 పెన్నా శివరామకృష్ణ, ఎస్వీల ‘‘1991 - 2000 కవితా సంకలనం, అఫ్సర్‍ ‘‘కవిత 2001 - 2009’’ లు వచ్చినవి. అందువల్ల ‘‘ ఈ తరం యుద్ధకవిత’’ ఒక ట్రెండ్‍ సెట్టర్‍.

 1.   జముకు గురించి చెప్పడి?

 కాలేజి సర్వీస్‍ కమీషన్‍ వారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు లెక్చరర్‍గా సెలెక్ట్ చేసి నన్ను శ్రీకాకుళం జిల్లాకు కెటాయించారు. శ్రీకాకుళ సాయుధ పోరాటాన్ని సుబ్బారావు పాణిగ్రాహిని, వెంపటాపు సత్యాన్ని మననం చేసుకుంటూ గొప్ప ఉద్వేగంతో అక్కడ అడుగుపెట్టిన. కాని ఆ వేడి వాడి ఏమీ కన్పించలేదు. ఉస్మానియా రైటర్స్ సర్కిల్‍ నడిపిన అనుభవంతో అదే లక్ష్యంతో రామారావు నాయుడు లాంటి ప్రగతిశీల వ్యక్తులతో అప్పల్నాయుడు, జోగారావు, బి ఎన్‍ స్వామి, బి పి శాస్త్రి లాంటి విరసం మిత్రులతో ఛాయారాజ్‍లాంటి జనసాహితీ మిత్రులతో కలిసి విశాల ప్రాతిపదికన ‘‘శ్రీకాకుళ సాహితి’’ని స్థాపించినం. ఆ ‘‘శ్రీకాకుళ సాహితి’’ నుంచి వెలువడిన సాహిత్య పత్రికే ‘‘జముకు’’.అది బులెటిన్ల కాలం కాబట్టి దాన్ని బులెటిన్‍ (సాంకేతిక కారణాల వల్ల కూడ) అన్నాం. దానికి ముందూ వెనకాల మంజీర, దిక్సూచి, చినుకు, ఉజ్వల, కంజర లాంటి అనేక బులెటిన్లు అప్పుడు వచ్చినవి. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు ప్రసాద్‍ లాంటి వాగ్గేయకారులు విప్లవ చైతన్యోద్దీపనకు సాధనంగా వాడిన వాయిద్య విశేషం ‘‘జముకు’’. స్థానిక ప్రగతిశీల భావనకు ప్రతీకగా ఆ పేరును ఎన్నుకున్నం. దీనికి నేను వర్కింగ్‍ ఎడిటర్‍ను. శ్రీకాకుళ సాహితి, జముకు అక్కడ ఒక కొత్త తరాన్ని నిర్మించినవి.

 1.   ‘‘మత్తడి’’ తెలంగాణ ఉద్యమానికి అందించిన స్ఫూర్తి ఏమిటి?

          తెలంగాణలో కవులు లేరన్న వారికి ఇక్కడి సాహిత్యాన్ని చిన్న చూపు చూసినవారికి గోలకొండ కవుల సంచిక మొదటి జవాబు కాగా, రెండవ జవాబు ‘‘మత్తడి’’. రెండంచుల కత్తి ఇది. సుమారు వంద సంవత్సరాల ఆధునిక తెలంగాణ కవిత్వ వైవిధ్యాన్ని విశిష్టతను ప్రతిబింబించి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం ఒక అంచు. వర్తమాన తెలంగాణ ఉద్వేగాన్ని, రాష్ట్ర ఆకాంక్షను గట్టిగా వినిపించడం రెండో అంచు. ఈ రెండు అంచులతో మత్తడి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినందించింది.

 1.  ‘‘ముంగిలి’’ రూపొందడంలో మీ అనుభవాలు చెప్పండి?

          మత్తడి ముందుమాటలో తెలంగాణ ప్రాచీన కవిత్వ సంకలనం తెస్తామని చెప్పినం. ముంగిలిని వెలువరించటానికి అదొక కారణం. ఉద్యమ క్రమంలో అనేక చోట్ల ఇచ్చిన ఉపన్యాసాల్లో ఒక ప్రాంత చరిత్రనే మొత్తం ఆంధ్రుల చరిత్రగా   ఆ ప్రాంత సాహిత్యచరిత్రనే మొత్తం తెలుగు సాహిత్య చరిత్రగా  చలామణి చేస్తున్నరని చెప్పినప్పుడు తెలంగాణ చరిత్ర, సాహిత్య చరిత్ర ఎందుకు లేవనే ప్రశ్నలు వచ్చినవి. అవి రావాలనే ఆకాంక్ష వ్యక్తమయింది. ముంగిలి గాని, తెలంగాణ చరిత్రగాని రావటానికి ఇది రెండవ కారణం. ముంగిలి ప్రస్తావన కాబట్టి దాని గురించి చెప్త. కాసుల ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో తెలంగాణ సాంస్కృతిక వేదికనుండి 2001లో వెలువడిన ‘‘తెలంగాణ తోవలు’’లో ‘‘లెక్కదప్పిన తెలుగు సాహిత్య చరిత్ర’’ అనే వ్యాసం రాసిన. ఆ వ్యాసంలో ముంగిలికి పునాది పడింది.పైన చెప్పినట్టు తొలుత ప్రాచీన కవిత్వ సంకలనం అనుకున్నం కాబట్టి కొందరికి కొందరు కవుల్ని కెటాయిస్తూ ఆ కవుల పద్యాలు ఎన్నిక చేసి పంపండి అని  ఉత్తరాలు రాసిన.శివరామ శర్మ, నేను కొందరు కవుల పద్యాలను ఎన్నిక కూడ చేసినం. కాని ఆ క్రమంలో అర్థం అయింది, కేవలం పద్యాలు వేయడం అసమగ్రమని. సాహిత్య చరిత్రలాగే కూర్చాలని నిర్ణయానికొచ్చిన. అప్పుడు అనేక సాహిత్య చరిత్రల్ని, పక్రియల చరిత్రల్ని, చరిత్ర గ్రంథాల్ని అధ్యయనం చేసిన. వీటికోసం మద్రాసు ఓరియంటల్‍ మ్యానుస్క్రిప్ట్లైబ్రరీ, తెలుగు విశ్వవిద్యాలయం గ్రంథాలయం, సుందరయ్య విజ్ఞానభవన్‍(ఆరుద్ర), స్టేట్‍ సెంట్రల్‍ లైబ్రరీ, సిటీ సెంట్రల్‍లైబ్రరీ, ఉస్మానియా లైబ్రరీ, శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం మొదలగు వాటిని సందర్శించిన. అనేక స్క్రిప్టుల తర్వాత రూపొందిన గ్రంథాన్ని ఎట్లా అచ్చువేయాలనే సమస్య వచ్చింది. నాకా ఆర్థిక స్థోమతలేదు. ప్రముఖ దర్శకులు కవి, రచయిత బి.నర్సింగ్‍ రావుగారికి చూయించిన. ఆయన అండదండలతో వేదకుమార్‍ గారి పూనికతో అది అచ్చయింది. తర్వాత తెలుగు అకాడమీ ఎనిమిదివేల ప్రతుల్ని అచ్చేసింది. కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ పాఠ్యపుస్తకంగా రిఫరెన్స్ గ్రంథంగా ప్రకటించినవి. కె.శ్రీనివాస్‍, అమ్మంగి వేణుగోపాల్‍, రామా చంద్రమౌళి, బాల శ్రీనివాసమూర్తి, లక్ష్మణచక్రవర్తి లాంటి ప్రముఖులు మంచి సమీక్షలు రాసిన్రు. తెలంగాణ ప్రాచీన సాహిత్య విజ్ఞాన సర్వస్వం అన్నారు. దాదాపు అన్ని పత్రికలు మంచి కవరేజీనిచ్చినవి. వందలమంది ఫోన్లు చేసిండ్రు.ఉత్తరాలు రాసిండ్రు. కొందరు అపర హాలుడు అనిఅపర సురవరం అని పొగిడిండ్రు. తెలుగు విశ్వవిద్యాలయంవారు ఉత్తమ గ్రంథంగా  ఎన్నిక చేయడం మరొక మంచి అనుభూతి. ముంగిలిని చదివి కెసిఆర్‍ ఫోన్‍చేసి ప్రశంసించడం మరిచిపోలేని అనుభూతి. వారందరికి చాలా చాలా కృతజ్ఞతలు. ఎక్కడ మొదలై ఈదుకుంటూ ఎక్కడ తేలిన్నో చూస్తే అద్భుతాశ్చర్యాలు ముంచెత్తుతాయి. ఒక బాధ ఏమిటంటే, ఒక రిటైర్డు ప్రొఫెసర్‍ ముంగిలిని కాపీ చేయడం, దాన్ని యూనివర్సిటీవారు ముంగిలికంటె ముందు వరసలో పెట్టడం. ఇలాంటి కాపీరాయుళ్లకు శిక్ష లేదా? కోర్టులో వేస్తానంటే ఇంకొక ప్రొఫెసర్‍ ఆపిండు. ఇంకొక బాధ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కోసం ముంగిలిఫైనల్‍కు రాగా కొందరు అడ్డుకోవడం.

 1.   గనుమ ఏ పరిస్థితుల్లో రూపొందింది?

           దళిత, బహుజన, ముస్లిం తెలంగాణ అస్తిత్వవాదాల నేపథ్యంలో వెలువడిన విమర్శనా గ్రంధం ఇది. ఆయా వాదాలు సృష్టించిన పుస్తకం ఇది. అంతేకాదు ఆయావాదాల్ని స్థిరపరచడానికుద్దేశించిన గ్రంధం కూడ ఇది. ఇందులోని మొదటి వ్యాసం 1992లో రాసిన. ఈ వ్యాసం తెలుగు సాహిత్యంలో రాబోతున్న, రావలసిన మార్పుల గురించి చర్చించింది. తెలంగాణ తొలిదళిత బహుజన కవితా సంకలనం ‘‘బహువచనం’’ గురించి రాసిన వ్యాసం, తొలి ముస్లింవాద సంకలనం ‘‘జల్‍జలా’’ గురించి రాసిన వ్యాసం, ఇవి రెండూ పెద్ద సంచలనాలని విమర్శకులు భావించినారు. ఈ పుస్తకంలోని రెండవ భాగం తెలంగాణ వాద వ్యాసాలు సంపుటి. ఇందులోని మొదటి వ్యాసం ‘‘ఎన్నాళ్ళీ వివక్ష’’ తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యంపట్ల గల వివక్ష విస్మరణ గురించి చర్చించిన వ్యాసం. ఇందులో పేర్కొన్న తెలంగాణ విస్మృత  కవులను గురించి రాసినవి మిగతా వ్యాసాలు. కరుణశ్రీ కంటే చాలా ఏండ్ల ముందటనే సుమవిలాపం రాసిన కోదాటి రామకృష్ణరావు ఎందుకు విస్మరణకు గురైండుతొలిసారిగా మాదిగలకు ప్రతీకగా ‘‘తొండం’’ కావ్యాన్ని రాసిన దైద వేములపల్లి దేవేందర్‍ ఎందుకు పేరుకు రాలేదు? దువ్వూరి లాగా రైతు జీవితాన్ని చిత్రించిన ‘‘కాపుబిడ్డ’’ కావ్యకర్త గంగుల శాయిరెడ్డిని కాల గర్భంలో ఎవరు కలిపేసిన్రు? తెలంగాణ రైతాంగ సాయుధపోరాట ఇతివృత్తంతో రాసిన సోమసుందర్‍, గంగినేని, ఆరుద్ర వంటి తెలంగాణేతరుల కొచ్చిన పేరు రాజారాం లాంటి ప్రజా కవులకు ఎందుకు రాలేదు? తొలి వచన కవితా కావ్యమైన ‘‘మహైక’’(1953) మరుగునపడి 1956లో వచ్చిన కుందుర్తి ‘‘తెలంగాణ’’ను తొలి వచనకవితా కావ్యంగా ప్రాచుర్యంలోకి ఎందుకు తెచ్చిండ్రు? ‘‘వైతాళికులు’’ (1935) కంటే ముందుగా వచ్చిన తెలంగాణ ఆధునిక కవితా సంకలనమైన ‘‘గోలకొండ కవుల సంచిక’’(1934)ను ఏ సాహిత్య చరిత్రలోను ఎందుకు స్పృశించలేదు? ఇలాంటి ప్రశ్నలతో తెలంగాణ సాహిత్యానికి జరిగిన అన్యాయంలోంచి, ఆవేదనలోంచి ‘‘గునుమ’’ పురుడు పోసుకుంది.

 1.   దాలి, తావుల గురించిచెప్పండి?

 దాలితెలంగాణ దీర్ఘకవిత. తెలంగాణ సాంస్కృతిక  వేదికనుండి వెలువడిన (2001) మొదటి పుస్తకం. ఆనాటి తెలంగాణ ఆగ్రహాన్నీ ఆవేదననీ సమగ్రంగా పలికిన కావ్యం. తెలంగాణ తొలి రెండు మూడు దీర్ఘకవితలలో ఒకటిగా ప్రసిద్ది  చెందింది. కె. శ్రీనివాస్‍, గుడిపాటి, కాసుప్రతాపరెడ్డి, హెచ్చార్కే, జింబో,ఎస్‍.రామకృష్ణ, జి.వెంకటకృష్ణ,సూరేపల్లి మనోహర్‍,వఝల శివకుమార్‍,బైరెడ్డి కృష్ణారెడ్డి, పగడాల నాగేందర్‍,కాలువ  మల్లయ్య లాంటి ఎందరో  విమర్శకుల, అనేక మంది పాఠకుల మన్ననలను పొందిన కావ్యం. ఇంకా నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం లాంటి అనేక మంది మిత్రులు వ్యాసాల్లో ఉపన్యాసాల్లో మెచ్చుకున్నరు.

      ‘తావుసంకలనంలోని వాగు,రోడ్డు,అవిద్య,పావురం లాంటి చాలా కవితలు చాలా మంది మన్ననలు పొందినవి.కె.శ్రీనివాస్‍,బైరెడ్డి కృష్ణారెడ్డి మంచి ముందుమాటలు రాసిండ్రు.పెన్నా శివరామకృష్ణ పావురం’, ‘హనన ద్రవం’,  కవితల నిర్మాణ శిల్పాన్ని విశ్లేషిస్తూ చక్కగా రాసిండు.ఎం.నారాయణశర్మ,శివరాత్రి సుధాకర్‍, తండా హరీష్‍ లాంటి వాళ్లు మంచి సమీక్షలు చేసిండ్రు.ఈ సంకలనానికి రంగినేని ఎల్లమ్మ పురస్కారం (సిరిసిల్ల) లభించింది.

         దాలి,తావు ల గురించి సీనియర్‍ కవి మాదిరాజు రంగారావుగారు ఒక ఉత్తరంలో విలువైన విశ్లేషణ చేశారు ఇలా ‘‘దాలి,తావు రెండూ అలజడిని ప్రతిఫలిస్తూనే రూపం(కవిత్వం) లక్ష్యం(టార్గెట్‍) రెండూ చక్కని పాళ్లలో సమన్వయం కలిగిన రచనలు.తావులో భావచిత్రాలకెక్కువ ప్రాధాన్యం కనిపించింది. దాలిలో తెలంగాణ భాషాసుందరతకు ఎక్కువ అవకాశం దృష్టికి వస్తుంది.....సహృదయుల్ని కట్టిపడేస్తుంది.......’’

 1.   తెలంగాణ సాహిత్యం ప్రత్యేకత ఏమిటి?

  చాలా లోతైన ప్రశ్న.  తెలంగాణ భాషకు, చరిత్రకు, సంస్కృతి కి ఒక ప్రత్యేకత ఉన్నట్లే సాహిత్యానికిఉన్నది. అందుకు అనేక కారణాలు.  కోస్తాంధ్ర సాహిత్యం ఎక్కువగా బయటి ప్రభావాల (సంస్కృతం,ఇంగ్లీషు)తో వస్తే తెలంగాణ సాహిత్యం ప్రధానంగా ఇక్కడి నేల సెగల్లోంచి వచ్చింది.  2001లో కాసుల ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వచ్చిన ‘‘తెలంగాణ తోవలు’’లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన.  ఇప్పటికీ ఇది సరైనదేనని అనుకుంటున్న.  ఇక్కడి సంస్కృత  రచనల అనువాదాలు భిన్నంగా వచ్చినవి.  పాల్కుర్కి సాహిత్యం భిన్నంగా వచ్చింది.  భావకవితాయుగం ఇక్కడ లేదు.  అభ్యుదయ కవిత్వం భిన్నంగా వచ్చింది.  ఇక్కడ స్త్రీవాదం అక్కడిలాగా ఎలైట్‍ స్త్రీవాదంగా రాలేదు.  ఇలాంటి వెన్నో? ఇక్కడి సాహిత్యాన్ని అక్కడి ప్రమాణాలతో కొలిచిండ్రు.  కొలమానాలే తప్పు.  జీవితం నిజం.  సాహిత్యం నిజం.  తెలంగాణ సాహిత్యానిది భిన్న నేపథ్యంభిన్న ప్రయాణం.  కొలమానాలు మారాలె.

 1.  ఒక తెలుగు లెక్చరరైన మీరు  తెలంగాణ చరిత్రను రాయడానికి కారణాలు ఏమిటివిమర్శకులు మీ తెలంగాణ చరిత్ర మీద ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చారు?

పదవ ప్రశ్నకు చెప్పిన జవాబులో పేర్కొన్నట్టు తెలంగాణ ప్రజల డిమాండు మొదటి కారణం.  బి.ఏ.లో ఇంకొక ఆప్షనల్‍ సబ్జెక్టు హిస్టరీ.మార్క్సిస్టు అధ్యయనశీలిగా చరిత్ర అధ్యయనం మామూలు విషయం. అందువల్ల చరిత్ర నాకు కొత్త అంశం కాదు.  ముంగిలి రూపకల్పనలో భాగంగా అనేక చరిత్ర గ్రంథాలు చదివిన.  ఇ.హెచ్‍.కార్‍ ‘‘చరిత్ర అంటే ఏమిటి?’’ లాంటి చరిత్ర రచనాశాస్త్ర గ్రంథాలు చదివిన. భారత జాతీయోద్యమ కాలంలో, ఆంధ్రోద్యమ కాలంలో, తెలంగాణ ఆంధ్ర జనసంఘం కాలంలో, ఆంధ్రమహాసభ కాలంలో ఆనాటి ఉద్యమకారులు ఏం చేసారో అధ్యయనం చేసిన.  బ్రిటీష్‍ చరిత్రకారులు భారతదేశ చరిత్ర రాసి భారతీయులు వెనుకబడినవాళ్ళు, అసమర్థులు అన్నారు.  అందువల్ల ఈ దేశాన్ని మేమే పాలించాలి అని అన్నారు.  సరిగ్గా ఇవే మాటలు కోస్తాంధ్రులు తెలంగాణనుద్దేశించి  అన్నారు.  ఆనాడు భారతీయ మేధావులు భారతదేశ చరిత్రను వెలికి తీసి చరిత్ర గ్రంథాలు రాసి గత ఘన వైభవాన్ని చాటి ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపినారు.  మనం గూడ అదేపని చేసి చూపాలనిపించింది.  అందుకే తెలంగాణ చరిత్రరాసిన.  మరిన్ని వివారాలకు తెలంగాణ చరిత్రకు నేను రాసిన ముందుమాట చూడండి.  ఇది తొలి తెలంగాణ చరిత్రగ్రంథం కావడం వల్ల కెసిఆర్‍, డా.దేమె రాజారెడ్డి వకులాభరణం రామకృష్ణ,అడపా సత్యనారాయణ,ఘంటా చక్రపాణి, టంకశాల అశోక్‍, సంగిశెట్టి శ్రీనివాస్‍, అమ్మంగి వేణుగోపాల్‍,కాసుల ప్రతాపరెడ్డి, కుర్రా జితేంద్రబాబు,ఏనుగు నరసింహారెడ్డి, జగన్‍ రెడ్డి,కాసుల లింగారెడ్డి- ఇట్లా ఎంతో మంది విమర్శకుల మన్ననలందుకుంది.  ఇది వచ్చిన తరువాత అనేక కాపీ చరిత్రలు వచ్చినవి. ఇది దాని ప్రసిద్దికి నిదర్శనం.  ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర, తెలుగు శాఖల్లో దీనిని రిఫరెన్స్ గ్రంథంగా పెట్టడం, బి.యన్‍. శాస్త్రి అవార్డ్ రావడం, లక్షల మంది విద్యార్దులకు ఉపయోగపడడం, నాలుగు సంత్సరాల్లో నాలుగు ముద్రణలు పొంది వేల ప్రతులు అమ్ముడు పోవడం విమర్శకుల, పాఠకుల మన్ననలు పొందిందనడానికి మరికొన్ని నిదర్శనాలు.

15.     తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సాహిత్యం మీద జరుగుతున్న అధ్యయనాలు ఎలా ఉన్నాయి?

మలిదశ తెలంగాణ ఉద్యమ క్రమంలోనే ప్రారంభమైన తెలంగాణ సాహిత్య అధ్యయన పక్రియ తెలంగాణ వచ్చిన తరువాత కూడా కొనసాగుతున్నది.అన్ని విశ్వవిద్యాలయాలల్లో తెలంగాణ సాహిత్యంలోని వివిధ అంశాల మీద, కోణాల మీద పరిశోధనలు చేయిస్తున్నారు. అయితే సంస్థల నుంచి ఆశించినంత స్థాయిలో జరగడంలేదని అనిపిస్తుంది.  కానీ వ్యక్తులుగా సంగిశెట్టి శ్రీనివాస్‍లాంటి వారు నిరంతరం ఏదో ఒకటి తవ్వుతూనే ఉన్నారు. ఏమనుకోమంటే ఇందులో నేను కూడ ఉన్న.

16.      తెలంగాణలో బలమైన సాహిత్యం వెలువడలేదని, అసలు కవులే లేరని ఎందుకు ప్రచారమయింది?

ఒకటి తెలంగాణేతరుల అజ్ఞానం. రెండు చూడదలచుకోకపోవడం.  మూడు వాళ్ళ ప్రమాణాలనుంచి కొలవడం.  నాలుగు పాలకులెప్పుడూ పాలితులను అత్మన్యూనతలో పడేటట్టు చేస్తారు.  ఈ కారణాల వల్ల పై విధంగా ప్రచారమయింది.

17.      తెలంగాణ వచ్చిన తర్వాత వెలువడుతున్న సాహిత్యం ఎలా ఉంది?

 దళిత, స్త్రీ, ముస్లిం వాదాలు అంతకుముందే వస్తురీత్యా ఎగ్జాస్ట్ అయినవి.  తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వస్తువు కూడా అయిపోవడంతో ఒక శూన్య స్థితి ఏర్పడింది. అందువల్ల చాలామంది కవులు మౌనం దాల్చినారు.  కొందరు అభివృద్ది గురించి  రాసినారు.  కొందరు డే టు డే సాధారణ సమస్యల గురించి రాసిన్రు.  మొత్తంగా ఉద్యమ స్ఫూర్తిగల సాహిత్యం వెలువడలేదు.  కాని రంగం ఖాళీగా ఉండదు కదా.

18.       ఇప్పుడు వెలువడుతున్న సాహిత్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు?

అనేక ఉద్యమ ప్రవాహాల్ని చూసినవాణ్ణి.  వాటితో సమాంతరంగా ఉప్పెనలా వెల్లువెత్తిన సాహిత్యాన్ని చూసినవాణ్ణి.  అలా  చూసినప్పుడు ఇప్పటి సాహిత్యం చడీచప్పుడు లేకుండా సాగుతున్నదనిపిస్తుంది.  అయితే జీవితంలోని పలుపార్శ్వాలను పలు పొరలను పట్టుకుంటున్నది.

19.      ఇటీవలి కాలంలో సాహిత్య విమర్శ ఎందుకు బలహీనపడింది?

సాహిత్య విమర్శది మొదట్నించీ బలహీన స్వరమే.  మీరన్నట్టు ఇప్పుడు ఆ బలహీనత ద్విగుణీకృతమైంది.  దీని బీజాలు 1980ల నుంచి ఉన్నయి.  అప్పట్నించి విమర్శకుల సంఖ్య వేళ్లమీద లెక్కబ్టెగలిగినంత మంది కూడా ఉండటం లేదు.  కవుల సంఖ్యేమో వందలకు ఫేస్‍బుక్‍, వాట్సాప్‍ వచ్చినంక వేలకు పెరిగిపోయింది.  మరీ ఇప్పటి కవులకు ఇన్‍స్టంట్‍ కీర్తి ఎక్కువయింది.  ఇది విమర్శ మీద ప్రభావం చూపిస్తుంది.  కాబట్టి అహా, ఓహోలే తప్ప విమర్శ ఉండటం లేదు.  అంటే ఒకవైపు  కవులు విమర్శను సహించడం లేదు.  రెండో వైపు అధ్యయనం ఉండటం లేదు.  ఎంత అధ్యయనం ఉంటే అంత గొప్ప విమర్శ వస్తది.  ఇంకొకవైపు తద్దినాలలాంటి సమీక్షలకు - నిజానికి అవి సమీక్షలు కూడా కాదు - తప్ప పత్రికలు స్థానమివ్వడంలేదు. ఫేసుబుక్కు, వాట్సాప్‍, వెబ్‍ పత్రికలలో స్పేస్‍ సమస్య లేకపోయినా దీర్ఘమయిన విమర్శలను చదవడం లేదు.  చదవడం లేదని రాయడం లేదు. కాబట్టి ఇప్పటి విమర్శ రూపాలు సూపర్‍, ఎక్సలెంట్‍, సుపర్బ్, వెల్‍, నైస్‍లు.  పుస్తకాల నుండి పేజీలకు, పేజీలనుండి పేరాలకు పేరాలనుండి ఇలాంటి పదాలకు విమర్శ ఎదుగుతూ వస్తుంది.  బలహీనపడిందంటారేమిటి?

20.     నందిని సిదారెడ్డి,గుడిహాళం రఘునాథం, నాళేశ్వరం శంకరంలతో మీకున్న అనుబంధం ఏమిటి?

ముగ్గురూ నాకు ఆత్మీయ మిత్రులు.  గొప్ప ప్రతిభావంతులు.  సిధారెడ్డి, గుడిహాళం ఎం.ఏ.లో నాకు ఒక సంవత్సరం సీనియర్లు. సిధారెడ్డి పరిచయంతోటే నాకు ఆధునిక సాహిత్య గవాక్షాలు పూర్తిగా తెరుచుకున్నయి.  ఉస్మానియా రైటర్స్ సర్కిల్‍ సహ వ్యవస్థాపకులం.  మళ్ళీ సుమారు ఇరవై ఏళ్ల తర్వాత తెలంగాణ సాంస్కృతిక వేదిక వ్యవస్థాపక భాగస్వాములమయినం. మధ్యలో కొన్ని విభేదాలు.  గుడిహాళం నేను ఇతరులతో కలిసి ‘‘విపశ్యన కవిత్వ’’ ‘‘నల్ల వలస’’ (తెలంగాణ తొలి సమగ్ర దీర్ఘకవిత) సంయుక్త కవులం.  సుదీర్ఘ స్నేహం మాది.  నాళేశ్వరం శంకరం నేను ఎం.ఏ. క్లాస్‍మేట్స్మి. మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి.పేరుకు తగ్గట్టే బోళాశంకరుడు. ఆయన కవితా, కందుకూరి శ్రీరాములు కవితా ‘‘ఈతరం యుద్ద కవిత’’లో లేనందుకు ఇప్పటికీ నా మీద గుర్రుగానే ఉన్నరు. కని స్నేహం స్నేహమే.

21.    పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరేం  చెప్పదలుచుకున్నారు?

ఒకరు చెప్పడం ఇంకొకరు వినడం భూస్వామ్య భావజాలం అవశేషం. దానికి కాలం చెల్లింది.  ఇప్పుడు మనకనిపించింది ప్రకటించడం వరకే.  నచ్చిన వాళ్ళు షేర్‍ చేస్తారు.

       ఏ భూస్వామ్య భావజాలాన్ని మనం దాటుకుని వచ్చామో ఆ భూస్వామ్యభావజాలం కొత్త రూపాలలో, ఆధునిక అత్యాధునిక వేషంతో వస్తున్నది.  మేం చెప్పేవాళ్ళం మీరు వినే వాళ్ళు అంటున్నది.  ఏ అసమ్మతి స్వరాన్ని వినం అంటున్నది.  అథ:పాతాళానికి  తొక్కేస్తానంటున్నది.  వందల ఏళ్ళనుంచి వందల పోరాటాల ద్వారా సాధించుకున్న కనీస ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాస్తానంటున్నది.  తీవ్ర జాతీయవాదం పేరుతో సకలజనుల ఆర్థిక సాంస్కృతిక సామాజిక పునాదులను పెళ్ళగించజూస్తున్నది.  ఇది సకల కళారూపాల్లో విజృంభించే తీరు ఎంతో దూరం లేదు. ఈ పరిశీలన సరైనదనిపిస్తే స్వీకరించొచ్చు.  అదే అత్యాధునిక రూపాల్లో నిరసించొచ్చు.

 

అనుబంధం:

రచయిత పరిచయం-ఇతర పుస్తకాలు

వ్యక్తిగతం     

            పేరు- డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి

            తల్లిదండ్రులు-కోటమ్మ , మాధవరెడ్డి.

            విద్య-ఎం.ఏ, ఎం.ఫిల్‍, పిహెచ్‍.డి.

            జననం-దీపావళి,1954, గ్రామం-పగిడిమర్రి

            మండలం-కనగల్‍,జిల్లా-నల్లగొండ 

వృత్తి                      

            1. 1984 నుండి 2010 వరకు వివిధ ప్రభుత్వ డిగ్రీకళాశాలల్లో తెలుగు బోధన,

            2. 2010 నుండి 2012 వరకుచండూరు ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‍గా,

            3. స్వల్పకాలం తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్‍ ప్రొఫెసర్‍ గా

కవిత్వం

            1. తోవ ఎక్కడ - 1994.

            2. దాలి-తెలంగాణ దీర్ఘకవిత -2001,2016

            3. నల్లవలస - తెలంగాణ దీర్ఘ కవిత (ఇతరులతో కలిసి)1998.

            4. విపశ్యన కవిత్వం(ఇతరులతో కలిసి)-1886-1991

            5. తావు - 2016

పరిశోధన-చరిత్ర

            1.ముంగిలి-తెలంగాణ ప్రాచీనసాహిత్యం-2009, తెలుగుఅకాడమీ వారి పునర్ముద్రణ రెండు సార్లు-2016

            2. తెలంగాణ చరిత్ర (క్రీ.పూ నుండి 1948 వరకు)-2011,2013,2014,2015.

                (హిందీ అనువాదం-డా.కొమ్మిశెట్టి మోహన్‍,ఆం.ప్ర.హిందీ అకాడమి-2015)                    

                (ఇంగ్లీషు అనువాదం త్వరలో వెలువడనున్నది)

            3. తెలంగాణ సాహిత్య చరిత్ర(ప్రాచీన,ఆధునిక సాహిత్య సంక్షిప్త చరిత్ర)తెలుగుఅకాడమి-2012

            4.తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర(ఇతరులతో కలిసి)-తెలుగు అకాడమి-2016

            5. తెలంగాణ సాహిత్య చరిత్ర (ప్రాచీన,ఆధునిక కవిత్వం,కథ,నవల)(సంగిశెట్టి తో కలిసి)-తెలంగాణ సారస్వత పరిషత్తు-2019

            6.అభ్యుదయ కవిత్వంలో మధ్యతరగతి జీవిత చిత్రణ(ఎం.ఫిల్‍)-1982  (త్వరలో అచ్చు కానున్నది).

            7.తాత్త్విక నేపథ్యంలో- తెలుగు కవిత్వ పరిణామం(పిహెచ్‍.డి)-1990 (త్వరలో అచ్చు కానున్నది)                  

విమర్శ

            1.గనుమ-దళిత, బహుజన, ముస్లిం, తెలంగాణ అస్తిత్వ సాహిత్య  వ్యాసాలు-2010

            2.వినిర్మాణం (తెలంగాణ అస్తిత్వ నిర్మాణ వ్యాసాలు)

            3.సురవరం ప్రతాపరెడ్డి(మోనోగ్రాఫ్‍)-తెలుగు అకాడమి-2017

            4.గురజాడ..మరికొన్ని వ్యాసాలు(త్వరలో అచ్చు కానున్నది)

సంపాదకత్వం

            1. 1971-80 ఈ తరం యుద్ధకవిత(ఇతరులతో కలిసి)1982,2017

            2. జముకు సాహితీ బులెటిన్‍-1986-1989.

            3. యానగాలి-శ్రీకాకుళ కవిత్వం(ఇతరులతో కలిసి)1991

            4. బహువచనం-దళిత బహుజన కవిత్వం-1996,2017

            5. మత్తడి-తెలంగాణ ఆధునిక కవిత్వం(సురేంద్రరాజు తోకలిసి) 2002.

            6. నల్లగొండ జిల్లా సాహిత్య సంచిక-మన తెలంగాణ (బైరెడ్డి కృష్ణారెడ్డితో కలిసి) 2007

            7.కమ్యూనిజమా?కోస్తా వాదమా?(సి.పి.ఎం.తెలంగాణవైఖరిపైవిమర్శ)(ఇతరులతో కలిసి)2008

            8.1969-73 తెలంగాణ ఉద్యమ కవిత్వం (సంగిశెట్టితో కలిసి)-2009

            9. సురవరం తెలంగాణ వ్యాసాలు (సంగిశెట్టితో కలిసి)-2010.

            10.సురవరందస్తూరి(సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు) O.M.L.R.I,A.P.Govt - 2010

            11. భాగ్యనగర వైభవం-దైద వేములపల్లి దేవేందర్‍ -2017

            12. సుజాత -గడియారం రామకృష్ణ శర్మ – 2017

            13. ఆదిరాజు వీరభధ్రరావు -పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు - 2017

            14. స్వాతంత్య్ర సమరంలో ముస్లింయోధులు-హీరాలాల్‍ మోరియా-2017

            15. కాపుబిడ్డ ,మావూరు -గంగుల శాయిరెడ్డి-2017

            16.‘‘తొలిసంజ’’ తెలంగాణ-తొలినాటి ఆధునిక కవిత్వం-మూటువూరు వెంకటేశ్వరరావు-2017

            17. భూగోళ విజ్ఞానం-సురవరం ప్రతాపరెడ్డి-2017

            18. ‘‘ధనాభిరామం’’-తొలి కల్పిత కావ్యం-నూతనకవి సూరన-2017

            19. జాతీయ గేయములు -మంతిప్రగడ వెంకటేశ్వరరావు-2017

            20. ‘‘గుంటక పురాణం’’-ఆధునిక అధిక్షేప పద్యాలు -గవ్వా మురహరిరెడ్డి-2017

            21. చరిత్రక్కని చరితార్ధులు-బిరుదురాజు రామరాజు-2017

            22.   భారతీయ సాహిత్య పరిణామ పరిశీలన-పాములపర్తి సదాశివరావు-2017

విశ్లేషణ: ఛీకృష్ణ కమిటీ(శ్రీకృష్ణ కమిటి రిపోర్ట్ మీద విశ్లేషణ)(సంగిశెట్టి శ్రీనివాస్‍తో కలిసి) 2011

పాఠ్యగ్రంథ రచన, సంపాదకత్వం

            1. భారతీయ వారసత్వం-సంస్కృతి -డిగ్రీ విద్యార్ధులకు,దూర విద్యాకేంద్రం,మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం-2014

            2.విఙ్ఞాన శాస్త్రం-నాగరికత- డిగ్రీ విద్యార్ధులకు,దూర విద్యాకేంద్రం,మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం-2014

            3.పర్యావరణ అధ్యయనం- డిగ్రీ విద్యార్ధులకు,దూర విద్యాకేంద్రం,మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం-2014

            4.   Indian Heritage and Culture-డిగ్రీ విద్యార్ధులకు,దూర విద్యాకేంద్రం,మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం-2014

            5.1-10 తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాల ఎన్నిక కమిటీ సభ్యుడిగా-2014-15

పాఠ్యగ్రంథాలుగా

                      1.‘ముంగిలి’ - కాకతీయ యూనివర్సిటీ తెలుగు ఎం.ఏ కు పాఠ్యగ్రంథం

                        2.‘ముంగిలి’- ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు ఎం.ఏ కు రిఫరెన్స్ గ్రంథం

                        3.‘‘తెలంగాణ చరిత్ర’’ఉస్మానియా యూనివర్సిటీ- చరిత్ర శాఖ ఎం.ఏ.కు రిఫరెన్స్ గ్రంథం

                        4.‘‘తెలంగాణ చరిత్ర’’ఉస్మానియా యూనివర్సిటీ-తెలుగు ఎం.ఏ.కు రిఫరెన్స్ గ్రంథం

పురస్కారాలు :

            1. ‘‘తెలంగాణ చరిత్ర’’ కు బి.ఎన్‍.శాస్త్రిపురస్కారం-2011

            2.‘ముంగిలికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథ పురస్కారం-2012                                                  

            3. ‘గనుమకు శాతవాహన విశ్వవిద్యాలయం ద్వారా ముదిగంటి వెంకటనర్సింహారెడ్డి పురస్కారం

              2014

             4. ‘ముంగిలికి ప్రొఫెసర్‍ ఎస్వీ రామారావు గారి పరిశోధనపురస్కారం-2014

            5. ‘ముంగిలికి ద్వానాశాస్త్రి పురస్కారం-2014.

            6. తెలంగాణ ప్రభుత్వం వారి‘‘రాష్ట్ర ఉత్తమ సాహితీవేత్త’’ తొలి పురస్కారం-2015

            7.‘‘తావు’’ కు రంగినేని ఎల్లమ్మ పురస్కారం -2017

ఇతరాలు                 

            1. 70-80 సెమినార్లలో కీలకోపన్యాసాలు,పత్ర సమర్పణలు

            2.ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్‍, శ్రీకాకుళ సాహితి, నీలగిరి సాహితి,

               తెలంగాణ సాంస్కృతిక వేదిక, సింగిడి లాంటి సంస్థల స్థాపన ,నిర్వహణ భాగస్వామ్యం.

            3. నా పర్యవేక్షణలో 5గురికి పిహెచ్‍.డి అవార్డులు.కొనసాగుతున్న మరొక ఆరుగురు .

            4. వివిధ టి.వీ ల్లో, రేడియోలో పాఠ్యాంశాల బోధన,సాహిత్య ప్రసంగాలు,చర్చలు.

            5.తెలుగు విశ్వవిద్యాలయంతెలుగు అకాడమితెలంగాణ సాహిత్య అకాడమీల కొన్ని కమిటీల్లో సభ్యుడిగా.

            6.‘సుంకిరెడ్డి నారాయణరెడ్డి నాలుగు దశాబ్దాల సాహిత్య సమాలోచన’ (11-12-2016) సంచిక రానున్నది.

ఇంటర్వ్యూలు

బోధనాభాషగా పాలనాభాషగా మాతృభాషను అమలు చెయ్యాలి –సాకం నాగరాజు

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు సాకం నాగరాజు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

1.       మీ బాల్యం గురించి.

          మావూరు పాకాలకు దగ్గర్లో వరదప్పనాయుడు పేట. మాది ఉమ్మడి కుటుంబం. గాండ్లకులస్తులమైనా వ్యవసాయమే. పిల్లలు పెద్దలు 21 మందిమి. మా పెద్దలు మమ్మల్ని బాగా చదివించారు. నేను లెక్చరర్‍, మా తమ్ముడు ప్రిన్సిపాల్‍, ఇంకో తమ్ముడు బ్యాంక్‍ ఆఫీసర్‍. మా అన్న వెంకటసుబ్బయ్య పి.యు.సి. వరకే చదివినా హోమియో రంగంలో కృషిచేసి తిరుపతి కొర్లగుంటలో డాక్టర్‍గా స్థిరపడినాడు. డాక్టర్‍ దేవుడుగా పేరు పొందాడు. ఇప్పుడు మా ఐదు కుటుంబాలూ తిరుపతి నగరంలో స్థిరనివాసం వుండే దాకా ఎదిగామంటే ఆశ్చర్యంగానే వుంటుంది.

2.       మీ విద్యాభ్యాసంలో చెప్పుకోదగిన విషయాలు...

          దామల్‍చెరువు హైస్కూల్‍కు రోజూ ఐదుమైళ్ళు నడిచి వెళ్ళిరావడం. రెండు సంగతులు ముఖ్యంగా చెప్పాలి. తొమ్మిదిలో వుండగా మాకు తెలుగు అయ్యవారు మధురాంతకం దొరస్వామి పిళ్ళై. పద్యంలో ప్రతి పదానికి అర్థం చెప్పేవారు. అర్థాలు తెలుసుకొని పద్యం చదువుకుంటే పద్యం నోటికి వచ్చేది. ఇలా తెలుగుభాషపట్ల ఏర్పడిన మమకారం వల్లనో ఏమో మా తమ్ముడు సుధాకర కామర్స్లో పి.జి. చేస్తే నేను తెలుగులో చేశాను. తెలుగు పట్ల ఈ మమకారాన్ని మరింత పెంచి పోషించింది యూనివర్శిటిలో తుమ్మపూడి కోటేశ్వరరావు మేష్టారు పాఠాలు.

3.       మీ ఉద్యోగ జీవితం...

          దీనికంటే ముందు నా విద్యార్థి దశ గురించి కొంత చెప్పాలి. కాలేజీ విద్య అంతా తిరుపతినే. డిగ్రీలో రెండు సంవత్సరాలు నేను మా హాస్టల్‍ సెక్రటరీని. ఈ సమయంలోనే త్రిపురనేని మధుసూదనరావు మా గోవింద రాజస్వామి కాలేజీ లెక్చరర్‍. నా దురదృష్టం కొద్దీ ఆయన మా క్లాసుకు పడలేదు. అయితే అదృష్టం కొద్దీ సంవత్సరం లోపే వారితో పరిచయానికి మించిన సాంగత్యం లభించింది. అప్పటికే దిగంబర కవుల కవితా సంపుటి ఒకదాన్ని లైబ్రరీలో చదివి వున్నాను. ఇక అప్పటి నుంచీ శ్రీశ్రీ, చలం, కొ.కు., రావిశాస్త్రి, శ్రీపాద.... ఇలా రచయితలు నాకు సరికొత్త దృక్పథాన్ని కల్పించారు. ఫలితంగా 1972 గుంటూరు సభల్లో విరసంలో ప్రవేశం. ఆ రోజుల్లో   ఉబలాటం కొద్దీ సృజన, అరుణతారల్లో ఐదారు కవితలేవో రాశాను తప్ప నేనేమీ కవినీ కాను, రచయితనూ కాను. ఈ కాలంలోనే తిరుపతిలో ఏర్పడిన రాడికల్‍ స్టూడెంట్స్ యూనియన్‍ వ్యవస్థాపక సభ్యుల్లో నేను కూడా ఒకణ్ని. ఎమెర్జెన్సీకాలం వరకూ రాడికల్స్ కార్యకలాపాలు బాగానే జరిగాయి తిరుపతిలో.

          ఇక నా ఉద్యోగ జీవితమంటారా, వృత్తి ధర్మాన్ని పాటించాను.  కానీ లెక్చరర్ల సంఘంలో తలదూర్చి ఇరవై ఏళ్ళ కాలాన్ని వృథా చేసుకున్నా. ఎక్కడ పనిచేసినా సాహితీ వేత్తలను కళాశాలకు పిలిపించి విద్యార్థులకు వారి   ఉపన్యాసాలు ఏర్పాటు చేసేవాణ్ణి. త్రిపురనేని, భూమన్‍, జ్యాలాముఖి, సింగమనేని, మృణాళిని, గరికపాటి, ఎండ్లూరి. సుధాకర్‍, అశోక్‍తేజ వంటి వారిని వినే అవకాశం మా విద్యార్థులకు కలిగింది. దీంతోపాటు ఉద్యోగజీవితంలో ఆరు కాలేజీ మేగజైన్లు నా చేతుల మీదుగా వచ్చాయి. ఈ మేగజైన్లు చూసిన జానుమద్ది హనుమచ్చాస్త్రి, వకుళాభరణం రామకృష్ణ, నిఖిలేశ్వర్‍, ఎం.వి. రమణారెడ్డి, యాకూబ్‍ వంటి మేధావులు ఇవి విశిష్ట సంచికలనీ, సాహిత్య సంచికలనీ అభినందించారు. విద్యార్థుల్లో సాహిత్య స్పృహ  కలిగించేందుకు కొంత మేరకు ప్రయత్నం చేశాననే తృప్తి మిగిలింది నాకు.

4        తిరుపతిలో తెలుగు భాషా బ్రహ్మత్సవాలు ఆ స్థాయిలో రాయలసీమలో మరెక్కడా జరగలేదేమో! మీ ఆశయాలేమిటి? ఎంతవరకు సాధించారు?

          ఇవి భూమన కరుణాకరరెడ్డి గారి నేతృత్వంలో జరిగిన తెలుగు పండుగలు. సంస్థకు ఆయన అధ్యక్షులు శైలకుమార్‍ నేనూ కన్వీనర్లము. 2004 నుంచీ నాలుగేళ్ళ పాటు ప్రతి ఏటా ఏడు ఎనిమిది రోజులపాటు నవంబర్‍ మాసంలో జరిగేవి. తెలుగు ప్రజల్లో భాషాస్ఫూర్తిని కలిగించడమే సభల ఆశయం. ఆ ఉత్సవాలను జనరంజకం కావడానికి కేవలం సినీ గ్లామర్‍కే పరిమితం చేయకుండా దాశరథి రంగాచార్య, జ్వాలాముఖి, కత్తి పద్మారావు, ఓల్గా, శివారెడ్డి, సింగమనేని, వంగపండు, గోరటి వెంకన్న, గరికపాటి వంటి సమాంతర రచయితలు, కళాకారులను పిలిపించి సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపాము. జనసందోహంతో మహతి సభామందిరం క్రిక్కిరిసి పోవడం మహదానందం కలిగించేది మాకు.

5        లెక్చరర్‍గా వుంటూనే ప్రచురణ రంగంవైపు మళ్ళినట్టున్నారు?

          అభినవ ప్రచురణలు పేరుతో మొదటి పుస్తకం తెలుగు కథకి జేజే’. మామూలుగా కథాసంకలనాలు చలం అనగానే ఓ పువ్వు పూసింది, శ్రీపాద అనగానే గులాబీ అత్తరు, రావిశాస్త్రి అనగానే కార్నర్‍ సీటు, ముళ్ళపూడి అనగానే కానుక తో కథాసంకలనాలు తేవడం తెలుగునేల మీద రివాజు. దానికి భిన్నంగా ఒక సంకలనం తెద్దామన్న ఆలోచనే తెలుగు కథకు జేజే’. నిజానికి చాసో వఱపు, కొ.కు. ఆదాయవ్యయాలు కథలకు ఒకరకంగా పాఠకుల్లో ప్రాచుర్యం కల్పించింది ఆ సంకలనమే. అంతకు ముందు పాఠక లోకానికి పెద్దగా తెలియని కథలవి. అంత పెద్ద కథాసంకలనంలో లబ్ధప్రతిష్టులకే పెద్దపీట వేయలేదు. తుమ్మపూడి భారతీ, ఒకే ఒక కథ రాసిన బాపూ, మోహనలూ ఇంకా మహాకవి అయిన శిష్ట్లా (గురివి కథ) చోటుచేసుకున్నారు. పెద్దప్రచురణ సంస్థలే వెయ్యికాపీలు వేస్తుండగా ఖరీదైన పేపరు మీద మూడువేల కాపీలు ముద్రించి నా ముచ్చట తీర్చుకున్నాను. కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయ చరిత్ర కూడా అభినవ ప్రచురణే. తెలుగు కథతో మొదలైన ఈ పుస్తక ప్రచురణ ఈ రోజు నా రచన మహాభారతం : సొగసులు - సూక్ష్మాలు దాకా కొనసాగుతూనే వుంది.

6        అన్నిటికంటే తెలుగుభాషోద్యమ సమితి కార్యక్రమాలే విశేషంగా చేసినట్టున్నారు మీరు...

          లెక్చరర్ల సంఘం తర్వాత సమితి పనులే నావి ఎక్కువ. 2006లో పిడికెడు మందితో ఏర్పడిన సంస్థ. తెలుగుభాషకు ప్రాచీన హోదా  కోరుతూ మా కార్యక్రమాలు ప్రారంభించాం. దాంతోపాటు రచయితల జయంతులు వర్ధంతులు, పుస్తక ఆవిష్కరణలు జోరుగా జరిగేవి. అడపాదడపా తెలుగుభాష పరిరక్షణ గురించీ గొంతు విప్పేవాళ్ళం. ప్రభుత్వానికి మహజర్లు, విజ్ఞప్తులు, దీక్షలు, ఊరేగింపులూ వంటివి. ఎక్కువగా కార్యక్రమాలు మొక్కుబడిగా సాగడంతో మాలో కొంత నిరాశ కలిగింది. ఆరుద్ర గారు ఒక సందర్భంలో మంచిమాట చెప్పారు. తెలుగులో అచ్చులు హల్లులు ఈ 56 అక్షరాలు - తెలుగు జాతికున్న గొప్ప సంపదఅని. కనుక ఈ సంపదను వీలైనంత, చేతనైనంత కొద్దికొద్దిగా కూర్చి విద్యార్థులకు చేర్చడానికి చిన్న చిన్న పుస్తకాలను సంకలనం చేసేపని తలపెట్టింది సమితి. ఇప్పటి వరకూ ఓ ఇరవైదాకా వేసివుంటాము : విద్యార్థుల కోసం శ్రీశ్రీ, చిత్తూరు కథ, రాజాచంద్ర ఫౌండేషన్‍ దుర్గాప్రసాద్‍ గారితో కలిసి నవ్యాంధ్ర ప్రత్యేక సంచిక... ఇలా సమితి చేతినిండా పనిబెట్టుకుంది. చాల పుస్తకాలు జిల్లాలోని పాఠశాలలు కళాశాలలకు వెళ్ళి విద్యార్థులతో చదివించాము,.. మాకు ఎంతో కొంత ప్రయోజనకరంగా కనిపించిన పని ఇదే అని ఘంటాపథంగా చెప్తున్నా.

7        ఉద్యోగ విరమణ తర్వాత చాలా పాఠశాలల్లో కోటపురుషోత్తంతో కలసి చేసిన ప్రసంగాల గురించి...

          పత్రికలు మా ఇద్దరికీ పెట్టిన పేరు అక్షరనేస్తాలు.  ఆరేడేళ్ళపాటు ఉమ్మడి రాష్ట్రంలో అనేక మార్లు  పర్యటన చేశాము. పురుషోత్తం పద్యాలకు ప్టెని కోట. వ్యక్తిత్వ వికాసం గురించి ఉపన్యాసం చెప్పడంలో దిట్ట. ఆయన    ఉపన్యాసాలు లక్షలాది మంది విద్యార్థులకు ప్రేరణ నిచ్చాయి. నిజానికి ఈ పర్యటనంతా సారథి  పురుషోత్తమైతే, సారథ్యం మాత్రమే నాది. బాగా వ్యయప్రయాసలతో సాగిన పర్యటన.

8        ఏదో ఒక పుస్తకం మీరు 20 వేల కాపీలు వేశారటగా !

          ఒకసారి బాపుగారు యేసోపు కథలకు వందకుపైగా బొమ్మలు వేసి నామినికి పంపించి ఆ కథలను అనువాదం చేసి పుస్తకం వేసి పిల్లలకు పరిచయం చేయండని చెప్పారు. నామిని అప్పటికే మా అమ్మ చెప్పిన కతలను శివకాశికి వెళ్ళి లక్షప్రతులను ముద్రించి చేతులు కాల్చుకొని వున్నాడు. ఈ పని ఇప్పుడు నావల్ల కాదనిఆయన చేతులెత్తేయడంతో నేను ముందుకు వచ్చి ఆ పుస్తకాన్ని ఏకంగా 20 వేల కాపీలు అచ్చువేసి చిలక ముక్కుల్లాంటి ఆ పుస్తకాలను పప్పులు బెల్లాల్లా పంచిపెట్టాము.

9        కనిపించిన వారందరికీ పుస్తకాలు ఇస్తారట కదా...

          నాకు పరిచయస్థులు అందరి ఇళ్ళల్లో నా పుస్తకాలు వుండే వుంటాయి. చివరకు నేను ఎక్కిన ఆటోలో డ్రైవర్‍ అయినా సరే, వాళ్ళ ఇంట్లో స్కూలూ కాలేజీ పిల్లలున్నారంటే నావద్ద వున్న ఏదో ఒక పుస్తకం ఇచ్చి తీరుతాను. పక్కన నా భార్య గనకవుంటే ఆమెకు తలగొట్టేసినంత పనే, ప్రిస్టేజ్‍ ఫీలవుతుంది. కొరియర్లకే వేల రూపాయలు ఖర్చు అయివుంటాయి నాకు. నన్ను అడిగిన వారిలో నేను పుస్తకాలు కొరియర్‍ చేయకుండా ఏ ఒక్కరూ లేరు ఈరోజుకీ. నా పిచ్చి నాకు ఆనందమే!

10.     స్వర్గీయులైన వారిపేరిట వారి వర్ధంతులకు కొన్ని పుస్తకాలు తెచ్చినట్టున్నారు!

          పేదల డాక్టర్‍గా పేరుపొందిన మా అన్న మరణిస్తే మంచి మంచి వ్యాసాలతో మా అన్న డాక్టర్‍ వెంకటసుబ్బయ్య పేరుతో సాహిత్య సంస్మరణ సంచిక తెచ్చాను. బ్యాంక్‍ ఆఫీసరైన మా తమ్ముడు మోహన్‍ అకాల మరణం చెందాడు. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డిగారి తమ్ముడి ఉత్తరంకథను ముద్రించాను. కంటతడి పెట్టే కథ, గుండెలను పిండివేసే కథ అన్నారు చదివిన వాళ్ళు. పుస్తకం వెయ్యడానికి చావుల కోసం ఎదురుచూసే నాగరాజు అని  కొందరు జోక్‍లు వేసినా సరే నేను వెరవలేదు. మిత్రుల కుటుంబాల్లోనూ - చావులకూ పెళ్ళిళ్ళకూ కథల పుస్తకాలు వేశాము. గిఫ్టుగా ఇచ్చే స్టీలు క్యారీర్ల కంటే పుస్తకం వేయివిధాల మేలని మా అనుభవం నేర్పింది.

11.      చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య ఏర్పాటులోనూ మీరే ప్రధానపాత్ర వహించారా?

          ప్రధానపాత్ర పలమనేరు బాలాజీ గారిది. కట్టమంచి బాలకృష్ణారెడ్డి, నాయుని కృష్ణమూర్తి, వేంపల్లి అబ్దుల్‍ ఖాదర్‍, టి.ఎస్‍.ఎ. కృష్ణమూర్తి వంటి పెద్దలు బాగా సహకరించారు. బాలాజీకి నేనూ తోడుగా నిలిచాను. నాలుగైదు నెలల కృషితో జిల్లాలోని దాదాపు ఇరవై సంస్థలు ఒక్కతాటి మీదకు వచ్చాయి. బాలాజీ నేనూ ఇద్దరం కన్వీనర్లుగా వున్నాము. 1968లో చిత్తూరు పట్టణంలో జిల్లా రచయితల తొలిమహా సభలు జరిగాయి. 2016లో సెప్టెంబర్‍ 10, 11 తేదీలలో సమాఖ్య ఆధ్వర్యంలో మళ్ళీ జిల్లా రచయితల సభల్ని వైభవంగా జరుపుకున్నాము. సభల ప్రత్యేక సంచిక కూడా తేవడం జరిగింది. త్వరలో చిత్తూరు కవితకూడా రాబోతోంది.

12.      ప్రభుత్వం భాషపరంగా ఏమి చేయాలని  మీరు అనుకుంటున్నారు?

          బోధనాభాషగా పాలనాభాషగా మాతృభాషను అమలు చెయ్యాలనే అందరూ కోరుతున్నది. గత ప్రభుత్వాలు చేస్తామంటూనే చెయ్యలేదు. ఈనాటి ప్రభుత్వమైతే చెయ్యము అని ఖరాఖండిగా చెప్తూ వున్నది. ఇదీ తెలుగు భాషకు పట్టిన దుర్గతి.

13.      మీరు చేసిన వాటిల్లో మరచిపోలేని పనులు ఇంకేమైనా వున్నాయా?

          ఆం.ప్ర. జన విజ్ఞాన వేదిక ప్రచురణ ఉపాధ్యాయ వృత్తి అనుభవాలూ జ్ఞాపకాలూ!పుస్తకానికి ప్రధాన సంపాదకుణ్ణి. ఇది నాకు గర్వకారణమైన పని. అలాగే ఈ వేదిక జిల్లా అధ్యక్షుడిగా ఆల్బర్ట్ ఐన్‍స్టీన్‍ కాంస్య విగ్రహాన్ని తిరుపతిలో ఎస్‍.వి. ఆర్టస్ కళాశాల ముంగిట నెలకొల్పడం. స్కూల్స్ కాలేజీల్లో మీటింగులు పెట్టి ఐన్‍స్టీన్‍ గొప్పదనం గురించి ఉపన్యాసాలు చెప్పి ఒక్కొక్కరి వద్ద రూ.10/-లు చొప్పున 30 వేల మంది విద్యార్థుల వద్ద విగ్రహం కోసం విరాళం వసూలు చేయడం అద్భుతమైన విషయం.  ఈ విగ్రహం కోసం రెండేళ్ళపాటు ఛాయామోహన్‍, మన్నెం వెంకటరామిరెడ్డి, వేణుగోపాలరావు గార్లతో కలసి పనిచేయడం మరచిపోలేని జ్ఞాపకం. అలాగే ప్రత్యేకంగా డిగ్రీ, పి.జి. విద్యార్థుల కోసం మూడులక్షలతో మూడు వేల కాపీలు వేసిన ప్రపంచకథా సాహిత్యం పుస్తకానికి వెల : కట్టలేనిది అని ప్రకటించడం ఇప్పటికీ నాకైతే పొగురుగానే జ్ఞాపకాల్లో మిగిలిపోయింది.

14.      ఇలా పుస్తకాల్ని నెత్తిన బెట్టుకుని చేతి చమురు వదిలించు కుంటూ శ్రమపడుతుంటే మీ కుటుంబ సభ్యుల సహకారం...

          నాకు ఇద్దరమ్మాయిలు. ఇంజనీరింగ్‍ చదివించాను, పెళ్ళిళ్ళు చేశాను. వాళ్ళు నా నుంచి పెద్దగా ఆశించేదేమీ వుండదు. నా తిరుగుళ్ళు నా భార్యకే పెద్ద అభ్యంతరం. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతాను. తెలుగు కథకి జేజే 3 వేలు, పిల్లల పుస్తకం 20 వేలు, మా అన్న పేరిట వేసిన వ్యాసాల సంకలనం 2 వేలు, ప్రపంచకథా సాహిత్యం 3 వేలు... ఇవన్నీ ఇంట్లోనే. ఇంట్లోనించే విద్యార్థి లోకానికి పంచేవాళ్ళము. ప్రచురణ ఖర్చు 10 లక్షలు చలవ అయివుంటే జిల్లా అంతటా, అప్పుడప్పుడు బయట జిల్లాలకూ ఈ పుస్తకాలను వాహనంలో తీసుకువెళ్ళడం అనేది పెద్ద ఖర్చు. మంచినీళ్ళలా పెట్టే ఈ ఖర్చులకు భయపడే నా భార్య శిశికళ ప్రతినిత్యం నాతో వాదులాట పెట్టుకునేది. మనకీ పనులు అక్కర్లేదు, సమాజం మారదు గాక మారదు, కుటుంబంతో హాయిగా గడపాలనేది ఆమె సిద్ధాంతం. ప్రజల సుఖం కోసం  ఆస్తులు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళున్నారు, వాళ్ళ త్యాగాల ముందర మనం సిగ్గుపడాలనేది ఆమెకు నా జవాబు. నేను చేసేవి చెడుపనులు కావని తెలిసీ కూతుర్లు అమ్మపక్షాన్నే నిలుస్తారు. అయినా నాకు తృప్తిగా వుంది. 70 వేల జీతంతో రిటైరై, వేల రూపాయల నెల పింఛను పొందే నాకు... పిల్లలకూ పుస్తకాలకూ చేసిన ఈ ఖర్చు చాలా మంచి ఖర్చు అని భావిస్తాను.

15      మీ భాషా స్ఫూర్తిని ఇతరులు అందుకోలేక పోయారని నిరాశా నిస్పృహలకు గురయ్యారా?

          కన్యాశుల్కం నాటకంలో మధురవాణి - ఈ ఊళ్ళో నారదుడు వచ్చి పాడితే నాలుగు దమ్మిడీ లివ్వరుఅని అంటుంది. వందేళ్ళ క్రితమే సమాజంలో ఆ పరిస్థితి వుందంటే ఇప్పటి కాలం గురించి చెప్పేదేముంది? ఈ కొద్ది పనులైనా నా తృప్తి కోసం నేను చేసినవే.

16      మీ భవిష్యత్తు కార్యక్రమాలేమిటి ?

          ఇప్పటి వరకూ చేసినవి అన్నీ కూడా చిన్న చిన్న పనులే. ఇక 70 ఏళ్ళ వయస్సులో ఇంతకంటే గొప్ప పనులు చేస్తామనే ఆశ ఏ కోశానా లేదు.

ఇంటర్వ్యూలు

కవీ, కథకుడూ, చరిత్రకారునిగా నా సాహితీయానం సంతృప్తికరం - దాట్ల దేవదానం రాజు

 

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు దాట్ల దేవదానం రాజు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

 

1          మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి?                                                                                        వ్యవసాయ కుటుంబం లోంచి వచ్చాను. తల్లిదండ్రులు సూర్యనారాయణమ్మ, వెంకటపతిరాజు. 1954 మార్చి 20 తేదీన  జన్మించాను. నా ముందు పదకొండు మంది పుట్టారు. నెల లోపే మరణించారట. 99 నెలల గర్భశోకం మా అమ్మది. ఎవరు ఎక్కడకు వెళ్ళి పురుడు పోసుకోమంటే అక్కడకు వెళ్ళి పురుడు పోసుకున్నారు. కడకు పిఠాపురం మిషనరీ ఆసుపత్రిలో డాక్టరు వైణింగమ్మ అమృత హస్తాలతో పురుడు పోస్తే నేను బతికి బట్ట కట్టాను. మా అమ్మ, బావజీ (క్షత్రియ కుటుంబాల్లో తండ్రిని బావజీ అంటారు) కృతజ్ఞతతో ఆవిడ పేరు పెట్టుకుంటామంటే వారించి నన్ను చేతుల్లోకి తీసుకుని ప్రార్థనలు చేసి దేవుడిచ్చిన దానం దేవదానం అన్నారు. చివర కులవాచకం తగిలించారు. లేక లేక కలిగినందున గారాబంగా పెంచారు. దిష్టి తగలకుండా ఒళ్ళంతా పూసల దండలు కట్టేవారంట మా అమ్మగారు. అందుకే చిన్నపుడు పూసలోడు అని పిలిచేవారు. చదవడం ఇష్టం. నలభై ఏళ్ళు వచ్చే వరకు రాయడం చేయలేదు. భార్య ఉదయ భాస్కరమ్మ. ముగ్గురు పిల్లలు- డి.వి.యస్‍ .రాజు, శశికాంత వర్మ, శిరీష. అందరూ జీవితాల్లో స్థిరపడ్డారు.

2          మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పుస్తకాలు గురించి చెప్పండి.

కోలంక ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడు పాఠశాల గ్రంథాలయంలో టామ్‍ సాయర్‍, అకిలుబెరిఫిన్‍, మౌంట్‍ ఆఫ్‍ కౌంటు క్రిష్టో వంటి పిల్లల సాహసకృత్యాల అనువాద పుస్తకాలు చదివాను. అవే గ్రంథ పఠనం పట్ల అభరుచిని కలిగించాయి. బాల్యంలో మా ఇంటికి వచ్చే గురువు గారి భార్య చేత చెప్పే కథలు, తరగతి గదిలో ఆఖరి పిరియడులో మాష్టారు చెప్పే కథలు నాకు కథల పట్ల ఇష్టాన్ని కలిగించాయి. క్రాంతి సాహితి ( కాకినాడు), ఆంధ్రీకుటీరం ( పల్లెపాలెం) వంటి సాహితీసంస్థలు, ఆద్దేపల్లి రామమోహనరావు, శిఖామణి కవులు నన్నెంతో ప్రోత్సహించారు.

3          మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని సాహిత్యం వైపు                    నడిపించాయి?

పిల్లల చదువుకోసం కోలంక గ్రామం నుండి ఏడు కిలో మీటర్ల దూరంలో ఉన్న యానాంకు మకాం మార్చడం నా జీవితం సాహిత్యం దిశగా పయనించడానికి అవకాశం కలిగించింది. 1992లో రాజమండ్రి కవిత్వ శిక్షణాతరగతులుకు వచ్చిన కె.శివారెడ్డి బృందం శిఖామణి ఆహ్వానం మీద యానాం వచ్చారు. ఆ బృందంలో ఈనాటి లబ్ధ ప్రతిష్టులైన అఫ్సర్‍, సీతారాం, దర్భశయనం శ్రీనివాసాచార్య, యాకూబ్‍, ఆశారాజు, మద్ధూరి నగేష్‍బాబు ఉన్నారు. మూడు రోజులు వారితో ఉండటం వల్ల కవిత్వం మత్తు ఆవహించింది. ఒక ఆకర్షణ ఏర్పడింది. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి స్మారక సభల్లో ప్రతినెలా కవితలు చదవడం, అద్దేపల్లి వారి కవిస్వరంలో కవితాపఠనం చేయడం ఆ కవితలు పత్రికలు ప్రచురించడంతో  కవిగా గుర్తింపు వచ్చింది. ఇక కథలు రాయాలనే తపన ముందు నుంచీ ఉంది. కవిత్వం మోజుతో కొన్నాళ్ళు కథలు రాయడాన్ని తగ్గించాను.

4          మీ మొదటి రచన ఏది? అది కథా కవితా? ఏ సందర్భంలో వచ్చింది? మీ రచనలు గురించి                    చెప్పండి? పురస్కారాలు కూడా తెలియజేయండి.

  ప్రచురింపబడిన నా మొదటి రచన కథే. పేకాట బాగోతం కథ ఆంధ్రజ్యోతికి పంపాను. సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యం గారి దగ్గర్నుంచి మీ కథను స్వీకరించాం. వీలు వెంబడి ప్రచురిస్తాం అని కార్డు వచ్చింది. అప్పట్లో అలాంటి సంప్రదాయాలు ఉండేవి. ఏడాది అయినా కథ ప్రచురించలేదు. కోపంతో నాలోని కథకుడ్ని చంపేస్తారా? ’అంటూ పురాణం వారికి ఉత్తరం రాసేను. వారంలో నా కథ ప్రచురించడం వల్ల నాలోని కథకుడు బతికాడు. నేనిప్పటి వరకు ఏడు కవితాసంపుటులు ( వానరాని కాలం, గుండె తెరచాప, మట్టికాళ్ళు, లోపలి దీపం, నది చుట్టూ నేను, పాఠం పూర్తయ్యాక.., దోసిలిలోనది), రెండు

దీర్ఘ కవితలు ( ముద్రబల్ల, నాలుగో పాదం), నాలుగు కథాసంపుటులు ( దాట్ట దేవదానం రాజు కథలు, యానాం కథలు, కళ్యాణపురం, కథల గోదారి) చరిత్ర గ్రంథం ( యానాం చరిత్ర), రాజకీయ వ్యంగ్య కథనం ( సరదాగా కాసేపు), యాత్రాకథనం ( చైనా యానం), ఆంధ్రపురాణకర్త చమత్కారాలు (మధు హాసం) . యానాం కథలు ఫ్రెంచి భాషలోకి డానియల్‍ నెజర్స్ అనువదించారు. వృద్ధాప్యం నేపథ్యంతో రాసిన నాలుగో పాదం దీర్ఘకవిత తమిళం, కన్నడం, మలయాళం, ఇంగీషు లోకి అనువాదం అయ్యాయి. అనేక కవితలు,కథలు ఇంగ్లీషు, ఫ్రెంచి, తమిళం, హిందీ భాషల్లోకి అనువాదం అయ్యాయి. పుదుచ్చేరి ప్రభుత్వం నుండి కళైమామణి, తెలుగురత్న పురస్కారాలు అందుకున్నాను. వివిధ సాహిత్య సంస్థల ద్వారా కథాసంపుటులకు, కవితాసంపుటులకు రాష్ట్రస్థాయిలో పురస్కారాలు అందుకున్నాను.

5          యానాం ప్రత్యేకత ఏమిటి?

భౌగోళికంగా ఆంధప్రదేశ్‍లో తూర్పు గోదావరి జిల్లా అంతర్భాగంగా యానాం ఉంది. అనాదిగా తన ప్రత్యేకతల్ని నిలుపుకుంటున్న ప్రాంతం ఇది. పుదుచ్చేరి, కారైకాల్‍, మాహే, యానాం వేర్వేరు ప్రాంతాల్తో కూడిన కేంద్రపాలిత ప్రాంతం.  తమిళ ప్రాబల్యం ఎక్కువ. రాజకీయంగా పుదుచ్చేరి లోని 30 నియోజక వర్గాల్లో యానాం ఒకటి. ఆర్థిక వనరులు కేంద్ర బడ్జెట్టు ద్వారా సమకూరుతాయి. సంక్షేమ పథకాలు బాగా అమలవుతాయి.

6          యానాం సంస్కృతికి తెలుగు సంస్కృతికి ఏమైనా తేడా ఉందా? ఉంటే ఆ తేడా మీ రచనల్లో ఏ మేరకు చిత్రించారు? లేకపోతే కారణాలేమిటి?

మంచి ప్రశ్న. యానాం ప్రజల సంబంధ బాంధవ్యాలన్నీ చుట్టూ ఉన్న ఆంధప్రదేశ్‍ తోనే. ఆచార వ్యవహారాలన్నీ సగటు తెలుగు వారివే. కాకపోతే పరిపాలనాపరంగా అంతా వేరే. ఫ్రెంచి వారు యానాంను స్థావరంగా ఏర్పరచుకున్నప్పటి చట్టాలుపరిపాలనా పద్ధతులు...అలాగే నేడు పుదుచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతం లోని యానాం ప్రత్యేకతలు నా యానాం కథలుద్వారా చెప్పడానికి ప్రయత్నించాను. తీర్పు వెనుక’, ‘ కొత్త నది’, ‘ఒప్సియం’, ‘ ఔను నిజంకథల్లో చరిత్రకు సంబంధించిన ఒకనాటి ఫ్రెంచి వారి పాలనకు అక్షరరూపం ఇవ్వడం జరిగింది. నేటికాలంలో ఆంధప్రదేశ్‍కు భిన్నంగా అమలౌతున్న సంక్షేమ పథకాలు, ఫ్రెంచి వారి కాలంలో పనిచేసిన వారి జీవనసరళి, మానవసంబంధాల్లో వచ్చిన వైవిధ్యమైన బతుకు బాటలు, యానాంలో జరిగిన సంఘటనలు గురించి కథలు రాసాను. యానాం కథలు రెండు సంపుటాలుగా  యానాం కథలు’, ‘కళ్యాణపురంపేరుతో వెలువడ్డాయి. తెలుగు సాహిత్యంలో ఆంగ్లేయులకు భారతీయులకు మధ్య సంబంధాలతో ఆంగ్లాంధ్ర కథలే ఉన్నాయి. కాని ఫ్రెంచి ఏలుబడిలో ఉన్న భారతీయులకు ఫ్రెంచి వారికి సంబంధించిన కథలు రాలేదని ఆ ఖాళీని యానాం కథలు పూరించాయని ప్రసిద్ధ సాహితీవేత్తలు చెప్పడం జరిగింది. ఇదొక గుర్తింపుగా భావిస్తున్నాను. ఇక పాలనాపరంగా ఎక్కడో 800 కి.మీ దూరంలో ఉన్న పుదుచ్చేరీ నుండి ఆదేశాలు...వినూత్న సంక్షేమ పథకాలు...రాయితీలు యానాం ప్రాంతం భిన్నమైన వాతావరణాన్ని కలిగి ఉంది. జీవన వాస్తవికత ప్రతిబింబించే కథలు రాయాలనీ బయటి ప్రపంచానికి తెలియని ఇక్కడి విషయాలు చెప్పాలనే... ఉద్దేశంతో యానాం కథలు రాయడం మొదలెట్టాను. స్థానికత ప్రతిబింబించే కథలు తెలుగులో వచ్చాయి. ఆ కథలకు వీటికి తేడా స్పష్టంగా కనిపిస్తుందని అనుకుంటుంటున్నాను. ఇందులో యానాం ప్రాంత భౌగోళిక పరిసరాలతో చరిత్రతో ముడివడిన ప్రజల జీవన పోరాటాల్నీ భావోద్వేగాల్నీ చిత్రించడానికి ప్రయత్నించాను. స్థానిక చరిత్రలు సామాజిక చరిత్రను అద్భుతంగా ప్రతిఫలిస్తాయని బలంగా నమ్ముతాను. యానాం సంస్కృతి తెలుగు సంస్కృతిఒకటే. పాలనాపరమైన వైవిధ్యాలున్నాయి. వాటినే చిత్రించాను.

7          కవిగా కథకుడిగా మీకు ఎదురైన అనుభవాలు చెప్పండి?

కథకుడిగా మరచిపోలేని అనుభవాలున్నాయండి. మొదటి కథ పేకాట బాగోతంనన్ను ఇబ్బందుల్లో పెట్టింది. ఆ కథ  ఆ రోజుల్లో నా పేకాట (రమ్మీ ) అనుభవమే. అందులో పాత్రల పేర్లు నిజమైన వ్యక్తుల పేర్లు. జరిగిన సంఘటన వాస్తవమైనదే. అదే రాసాను. ఎవర్నీ కించపరచలేదు. అయినా అన్న వరసయిన ఒకాయన తన పేరు యథాతథంగా ప్రస్తావించినందుకు చాలా నొచ్చుకుని కోపం తెచ్చుకున్నాడు. ఆయన జీవితాంతం నాతో మాట్లాడటానికి కనీసం నన్ను చూడటానికి కూడా  ఇష్టపడలేదు. ఆ తర్వాత ఎపుడూ అసలు పేర్లతో కథలు రాయలేదు. అలాగే పుష్కరాల సమయంలో యానాంలో జరిగిన సంఘటనకు అక్షరరూపంగా రాసిన గొ(వు)దారికథ వివాదాస్పదమైంది. ఇది నవ్య దీపావళి ప్రత్యేక సంచికలో అచ్చయ్యింది. కథను తప్పుగా అర్థం చేసుకున్న ఒకావిడ పురోహిత వర్గాన్ని అవమానించాననీ అపహాస్యం చేసాననీ ఫేసుబుక్‍ మాధ్యమంగా రాద్ధాంతం చేసారు. అనేక మంది విరుచుకుపడ్డారు. సంపాదకుల కోరికపై వివరణ కథ మూల ఉద్దేశాన్ని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మరొక కథ చూపుడు వేలుఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చింది. యానాంలో మా ఇంటికి దగ్గరలో జరగిన వాస్తవ సంఘటన ఇది.ఒక సామాజిక వర్గం వారు అర్థం చేసుకున్నవారు విపరీతంగా పొగిడినవారూ ఉన్నారు. అదే విధంగా అవగాహనా లోపం వల్ల తిట్టిన వారూ బెదిరించినవారూ ఉన్నారు. కథకుడిగా నాకెదురైన కొన్ని అనుభవాలు ఇవి. ఇవేమీ పెద్ద తీవ్రమైనవి కావు. కవిగా ఏ విధమైన సమస్యలు రాలేదు.

8          యానాంలో తెలుగు సాహిత్య వాతావరణం ఎలా ఉంది?

యానాంలో శిఖామణి పెళ్ళి పుస్తకం సమయంలోనూ నా కవితాసంపుటి వానరాని కాలంఆవిష్కరణ సందర్భంలోనూ సాహిత్య సభ అంటే ఒక పండుగ వాతావరణం కనిపించేది. సాహిత్యం పట్ల పెద్దగా అవగాహన లేనివాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు. స్ఫూర్తి సాహితీ సమాఖ్య తరపున మా ఇంటిలో నెలనెలా సమామేశాలు జరిపేవాడిని. యువకులు చాలామంది ఉత్సాహంగా పాల్గొనేవారు. తర్వాత కాలంలో కవులుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుత కాలంలో తక్కువ సంఖ్యలోనే వస్తున్నారు. కవితాశిక్షణాశిబిరాలు వంటివి ఏర్పాటు చేసినపుడు మాత్రం దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వస్తున్నారు.

9          యానాం చరిత్రను రాయాలని ఎందుకనుకున్నారు?

నేను చరిత్ర ఉపాధ్యాయుడ్ని. చరిత్ర పట్ల ఆసక్తి ఉంది. యానాం చరిత్ర గురించి ఏవో చిన్న చిన్న వ్యాసాలు తప్ప పుస్తకరూపంలో రాలేదు. ప్రాంతీయ అధికారిగా యానాంలో పనిచేసిన కవి ఆకెళ్ళ రవిప్రకాష్‍ మీరు యానాం చరిత్ర రాస్తే బావుంటుంది అని ఒక ఆలోచనను నా చెవిలో వేసారు. దేనికైనా ముందు ఆలోచన రావడమే ప్రధానం కదా. అది బలంగా మనసులో నాటుకోడానికి ఎంతో సమయం పట్టలేదు. విషయ సేకరణకు చాలా శ్రమపడ్డాను.  నేను చేస్తున్న పని పుదుచ్చేరీ మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు గారికి యథాలాపంగా చెప్పాను. ఆయన ఒక బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రకటించి తను ప్రచురిస్తున్నానని చెప్పేసారు. దాంతో నాలో దడ ప్రవేశించింది. ఉద్యోగానికి కొన్ని రోజులు సెలవు కూడా పెట్టాను. దాని ఫలితం ఎంతో సంతృప్తికరం. గతం తాలూకు చరిత్ర ఇపుడెందుకనే ప్రభుత్వాధినేతలు ఉన్నారు. వర్తమానం నుంచి భవిష్యత్తు లోకి పయనించడానికి చరిత్ర పాఠాలు పునాదులుగా ఉపయోగిస్తుందని ఆలస్యంగా తెలుసుకుంటారు. సైన్సు గతం ఆవిష్కరణల ఆధారంగానే నూతన ద్వారాలు తెలుస్తుంది. యానాం చరిత్రనా మొత్తం సాహీతీ జీవితంలో మరుపురాని ఘట్టంగా భావిస్తాను. దీని వల్ల అనేక చోట్ల గౌరవ ప్రతిష్టలు కలిగాయి. సత్కారాలు పొందాను. కొన్ని చరిత్ర సదస్సులకు హాజరయ్యాను. చరిత్ర కథలు రాయడానికి తగిన మానసిక స్థైర్యం కలిగింది.

10        యానాం నుండి వెలువడిన తెలుగు సాహిత్య ప్రత్యేకతను ఎలా అర్థం చేసుకోవాలి?

కవిగా లబ్ధ ప్రతిష్టుడైన శిఖామణి యానాంలో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉద్యోగ విరమణ చేసారు. హైదరాబాదులో స్థిరపడినప్పటికీ ఇప్పటికీ మూలాల్ని విస్మరించకుండా సాహిత్యపరంగా యానాం ప్రత్యేకతను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కవి సంధ్య కవిత్వ పత్రికను తీసుకొస్తున్నారు. ఇక నేను చరిత్ర రచన, కథలు, కవితలు రాయడంతో బాటు సాహిత్య కార్యక్రమాల నిర్వహించడం ద్వారా సాహిత్యవేత్తల చూపును యానాం వైపు ప్రసరించేలా చేయడం ధ్యేయంగా పెట్టుకున్నాను. మా రచనలే యానాం ప్రత్యేకతలను తెలియజేస్తాయి.

11  గోదావరి నదిలో సాహితీ కార్యక్రమం నిర్వహించారు కదా అనుభవాలు చెప్పండి?

నా జీవితంలో సాధించుకున్న కలల సాకారం గోదావరి నదిలో నిర్వహించిన కథాయానం’. ఈ అద్భుత జ్ఞాపకాల విహారం 10 నవంబరు 2012లో జరిగింది. ఒక చారిత్రక సందర్భాన్ని సృష్టించినట్టుగా ద్వానాశాస్త్రి అభివర్ణించారు. తెలుగు కథ పడవ ప్రయాణం అన్నారు మరొకరు. ఉమ్మడి ఆంధప్రదేశ్‍లో తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర నుండి నూటయాబై  మంది కథకులు దూరప్రాంతాల నుంచి శ్రమకోర్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. వర్తమాన కథపై అర్థవంతమైన ఆలోచనాత్మకమైన

విషయాల్ని ముచ్చటించారు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాలేకపోయిన వారు ఇప్పటికీ బాధను వ్యక్తీకరిస్తుంటారు. పాల్గొన్నవారు మొత్తం కథాప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని తెలియజేస్తుంటారు. అదే రోజు ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్‍ గారి చేతుల మీదుగా నా యానాం కథలుఆవిష్కరణ జరిగింది. కథాయానంఏదో సంస్థ తరపున కాకుండా నేనే నిర్వహించడం పట్ల చెప్పలేనంత సంతృప్తి ఉంది. ఆనాడు జరిగిన చర్చ సారాంశాన్ని వివరణాత్మకంగా చెప్పాలంటే పెద్ద వ్యాసమే అవుతుంది. ఈరోజు దాని గురించి స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.

12        కవిగా, కథకుడిగా, చరిత్ర రచయితగా విభిన్న పక్రియల్లో రచనలు కొనసాగిస్తున్నారు.                      ఇందులో ఏ పక్రియ పట్ల మీకు ఆసక్తిని సంతోషాన్ని కలిగించింది?

పక్రియ ఏదైనా సృజనాత్మక కళే. కవిత్వం లోకి నా ప్రవేశం ఏక్సిడెంటల్‍ అని చెప్పిన అఫ్సర్‍ మాట ముమ్మాటికీ నిజమే. అలా జరిగిన నా ప్రవేశం తొమ్మిది కవితాసంపుటుల కవిత్వ సంపన్నుడ్ని చేసింది. కథ జోలికి వెళ్ళకుండా ఓ దశాబ్దం పాటు కవిత్వం లోనే మునకలేసాను. అయితే చిన్నప్పట్నుంచీ కథ పట్ల ఇష్టం, ఆపేక్ష ఎక్కువ. కథలు రాసి కథకుడిగా రాణించాలనే కోరిక మనసులో ఉండేది. కథే ఎక్కువ ఆసక్తినీ సంతోషాన్నీ కలిగించిందని చెప్పాలి. స్థానీయత మేళవించి రాసిన యానాం  కథలు’ ‘ కథల గోదారినాకెంతో పేరు తెచ్చి పెట్టాయి. ప్రయోగం అనను గానీ కథల గోదారికథలన్నీ పేరొందిన రచయితలు కథాశీర్షిక ఇస్తే రాసాను. దాని వల్ల నేను శీర్షికను బట్టి ఇతివృత్తాన్ని నిర్ణయించుకుని ఊహించని కథల్ని రాసాను.

చరిత్ర గురించి ఇంతకుముందే చెప్పాను. నా రచనలన్నీ కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా అన్నీ నాకు సంతోషం కలిగించినవే.

13        సాహిత్య అకాడమీకి సంబంధించి మీ బాధ్యతలు, అనుభవాలు, మీరు చేసిన కార్యక్రమాలు                  గురించి చెప్పండి?

మా స్ఫూర్తి సాహితీ సమాఖ్య తరపున సాహిత్య అకాడమీ కార్యక్రమాలు నిర్వహించాం. తెలుగు-తమిళ కథల సదస్సు, తులనాత్మక అధ్యయనం వంటి సాహిత్య అకాడమీ కార్యక్రమంలో నేను కీలకోపన్యాసం ఇవ్వడం జరిగింది. పరిసర నగరాల కవులచే కవిసమ్మేళనం, కథకుల కథాపఠనం కార్యక్రమాలు జరిగాయి. పుదుచ్చేరి తమిళ రచయితలు అక్కడ సాహిత్య అకాడెమీ బాధ్యులతో మరో సదస్సు జరిగింది. మా ఊళ్ళో జరిగిన ఇవన్నీ నాకు అత్యంత ఆనందం కలిగించేవే.

14        దూరానికి దగ్గరగా వంతెన కవితలు ప్రత్యేకంగా అచ్చు వేసారు కదా. ఆ విశేషాలు             చెప్పండి?

వంతెన కవితలు దూరానికి దగ్గరగా ఒక ప్రత్యేక సందర్భంగా వచ్చింది. కోనసీమ, యానాం వాసుల చిరకాల స్వప్నం యానాం-ఎదుర్లంక బ్రిడ్జి. కోనసీమకు వెళ్ళాలంటే  పడవ, ఫంటులే ఆధారం. బోలెడంత సమయం పట్టేది. ఆనాటి లోక్‍సభ స్పీకరు జి.యం.సీ. బాలయోగి( వంతెనకు ఆయన పేరే పెట్టారు) పట్టుదలతో సాధించి సాకారం చేసారు. అద్దరికీ ఇద్దరికీ ఇనాళ్ళూ పడవ ఆధారం ఇక నుంచి కాంక్రీటు రహదారి మీద ప్రయాణం చేయాలి మీ అనుభూతిని అనుభవాల్నీ కవిత్వీకరించండని పత్రికాముఖంగా పిలుపు ఇచ్చాను. కవులు స్పందించి మంచి కవితలు పంపారు. మంత్రివర్యులు మల్లాడి కృష్ణారావు సహకారంతో వెలువడిందీ సంకలనం. వంతెన మధ్య సభ ఏర్పాటు చేసి ఆనాటి పుదుచ్చేరీ ముఖ్యమంత్రి రంగసామి చేతుల మీదుగా ఆవిష్కరించాం. ఈ సంకలనానికి ప్రశంసలతో కూడిన సమీక్షలొచ్చాయి. వంతెన కవితలు తీసుకు వచ్చి సంకలనం చేసి ఒక సందర్భాన్ని నమోదు చేయాలనే ఆలోచనే నాదే.

15        ముద్రణా సాహిత్యానికి అంతర్జాతీయ అంతర్జాల సాహిత్యానికి గీతలు చెరిగిపోతున్నాయా?           అంతర్జాల సాహిత్యం స్థానం ఏమిటి?

గీతలు చెరపడానికి రెండింటి మధ్య సరిహద్దులు లాంటివి లేవు. పత్రికల్లో ప్రచురణ జరిగితేనే కవిత, కథకు సాఫల్యం అనుకుంటారు రచయితలు. ప్రింటు మీడియా సామాన్యుల దృష్టికి వెళుతుందని ఒక నమ్మకం దానికి కారణం. కాలం తెచ్చిన  అనేక మార్పుల్ని మనం గమనిస్తున్నాం. అంతర్జాలం అనేది సాంకేతిక ప్రగతి ఫలం. నేడు రాసిందేదైనా బాగోగులుతో సంబంధం లేకుండా నిమిషాల్లో ప్రపంచానికి చేరిపోతోంది. మన రచనకు మనమే బాధ్యులం. మధ్యలో రచన ప్రామాణికతను నిర్ణయించే సంపాదకులు లేరు. ఫేసుబుక్‍, వాట్సప్‍ల ద్వారా ఇబ్బడిముబ్బడిగా రచనలు వచ్చేస్తున్నాయి. వాటి నాణ్యతల గురించి ఎవరికి వారే బేరీజు వేసుకోవాలి. ఇప్పటికీ సాహిత్య పేజీల్లో ప్రచురణను ప్రతి రచయిత కోరుకుంటాడు. అలా ముద్రణ అయినవాటిని సోషలు మాధ్యమాల్లో ఉంచడానికి ఇష్టపడుతున్నారు. ఏమైనా గానీ అంతర్జాల సాహిత్యం వెబ్‍ పత్రికల ద్వారా బాగానే వస్తోంది.ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే.

16        మీ కథలకు ఎక్కువ గుర్తింపు వచ్చిందా? కవితలకు ఎక్కువ గుర్తింపు వచ్చిందా?

ముందుగా సాహితీ లోకంలో కవిగా గుర్తింపు పొందాను. తీసుకున్న స్థానీయత వస్తువుతో కథలు రాసాను. కథల్లో మా ప్రాంతాన్ని ప్రతిఫలించాననే తృప్తి ఉంది. యానాం, గోదావరి ప్రత్యేక అంశాల ప్రాతిపదికగా కథలు రాసాను. కథలు అనువాదాల ద్వారా ఇతర భాషల్లోకి వెళ్ళడం కారణంగా నాకు కథారచయితగానే పేరొచ్చింది. కవిగా కూడా మంచి స్థానాన్నే పొందాను. పురస్కారాలూ స్వీకరించాను.

17        ఇపుడు వెలువడుతున్న సాహిత్యాన్ని మీరు ఎలా చూస్తున్నారు?

కథలూ కవిత్వమూ రెండు పక్రియల్లోనూ రచనలు విస్తారంగా వస్తున్నాయి. అభిరుచితో సాహిత్యం పండించడం కాకుండా పురస్కారాల కుతి పెరిగిందనిపిస్తోంది. మనం ఏరుకోవాలి గానీ మేలైన రచనలతో సాహిత్యం ఆశాజనకంగా ఉంది. నాకు మాత్రం మేలే జరిగింది. సంపద్వంతమైన అపార స్నేహం ఈ సాహిత్యం ద్వారా లభించింది.

18        పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రస్తుతం మీరేం రాస్తున్నారు?

ఆధ్యయనం పెంపొందించుకోవాలంటాను. చదవాల్సిన గ్రంథాల జాబితా తయారు చేసుకుని విస్తృతంగా చదవాలంటాను. భాష పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేలా తల్లిదండ్రులు కృషి చేయాలంటాను. వెంపర్లాటలకు పోకూడదంటాను. మంచి సాహిత్యం పట్ల అవగాహన కలిగించాలంటాను.

            ప్రస్తుతం నేను ఈ కరోనా కాలంలో నవల రాస్తున్నాను. చాల మటుక్కి అయింది. కరోనాకు ముందు 15 కథలు రాయడానికి ప్రణాళిక వేసుకుని సమాచారం సేకరించుకున్నాను. తర్వాత ఆత్మీయ మిత్రుల సలహా మేరకు కథలకు బదులుగా నవల రాస్తున్నాను. ఇంతవరకు తెలుగు సాహిత్యం స్పృశించని ఇతివృత్తం ఎన్నుకున్నాను. అదేమిటంటే కోడి పందేలు. ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలెన్నో ఉన్నాయి. వాటిని నవల ద్వారా చెప్పదలుచుకున్నాను.

            సంపత్‍రెడ్డి గారూ... నన్ను నేను విప్పుకోడానికి పునఃసమీక్ష చేసుకోడానికి నా గురించి చెప్పుకోడానికీ వీలు కల్పించిన మీకు ధన్యవాదాలు. మీ పత్రిక మంచి గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను.

 

చిరునామా:

దాట్ల దేవదానం రాజు

8-1-048, ఉదయిని,

జక్రియ నగర్‍,

యానాం- 533464

సెల్‍: 94401 05987

                                          --

ఇంటర్వ్యూలు

నా కథలన్నీ ప్రజలతో ఎదురైన అనుభవాలే – జి వెంకటకృష్ణ  

గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు జి వెంకటకృష్ణ  గారు ఇచ్చిన ఇంటర్వ్యూ

 

1.      మీ వ్యక్తిగత జీవితం గురించి  చెప్పండి.

మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి.

నాకు తాత తండ్రులు నుంచి సంక్రమించిన స్వంతూరంటూ లేదు. ఆస్తిపాస్తులు లేవు. వాళ్ళు గాజుల వ్యాపారం చేసుకుంటూ వూర్లో తిరిగే జీవనోపాధి గలవారు. యెలాగో మా నాన్న బడిపంతులయినాడు. మా నాన్న అనంతపురం జిల్లాలో బూడిదగడ్డపల్లె లో పనిచేస్తున్నప్పుడు నేను పుట్టాను. ఆతర్వాత చాలా వూర్లు తిరిగాం. ఇట్లా కాదని హైస్కూల్  చదువు ఒకచోట జరగాలనిబెస్తరపల్లి (కంబదూరు మండలం) సోషియల్ వెల్ఫేర్ హాస్టల్ లో చేర్పించారు . SC, ST, BC పిల్లలందరూ వుండే ఆ వసతి గృహమే నా భవిష్యత్తు జీవితాన్ని నిర్ధేశించిన మొదటి ప్రభావం. మా స్కూల్ లైబ్రరీ లోని చందమామ, బాలమిత్ర, కాశీమజలీ, యితర జానపద కథల పుస్తకాలు చదువుతూ చదువుతూ యెనిమిదీ తొమ్మిది తరగతులకు శ్రీ శ్రీ, తిలక్, దాశరథి, రంగనాయకమ్మ, లత,యుధ్ధనపూడివాసిరెడ్డి సీతాదేవి లాంటి రచయితలనూ చదివాను. పుస్తకాల పురుగుగా మారాను.  నేను డిగ్రీ, యీవినింగ్ కాలేజీ లో చదివాను. బెంగళూరు లో ఒక ఇండస్ట్రీ లో పనిచేస్తూ చదువుకున్నాను . ఆదివారాలలో   పబ్లిక్ లైబ్రరీ లలో యెన్నో పుస్తకాలు చదివాను. పబ్లిక్ లైబ్రరీలే నా తర్వాతి ప్రభావం. నాకు  విద్యార్థిగా ఏ రాజకీయాలతోనూ సంబంధం లేదు. నేను చదివిన పుస్తకాలే నేను  యిప్పుడున్న స్థితికి కారణం. డిగ్రీ రోజులకే 'ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ'  'టేల్ ఆఫ్ టు సిటీస్'  'జానకి విముక్తి' 'బలిపీఠం ' ' మట్టి మనిషి ' ' మరీచిక ' ' ఋక్కులు '    లాంటి పుస్తకాలు చదివి వాటి ప్రభావంలో పడ్డాను. డిగ్రీ లో ఒక సబ్జెక్టైన ఎనకనామిక్స్ లోని థీరీస్ లో భాగంగా మార్క్స్ కాపిటల్ గురించీ తెలుసుకున్నాను. ఇవన్నీ నా మీద ప్రభావం వేసినవే. 

2.   మీ చుట్టూ ఉన్న ఏ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు మిమ్ములను సాహిత్యం వైపు నడిపించాయి.

నేను చదివిన పుస్తకాలు, నా చుట్టూ వుండిన గ్రామీణ పరిస్థితులే నన్ను సాహిత్యం వైపు నడిపించాయి. నేను చదివిన పుస్తకాలలోని ఆదర్శాలే నా జీవితాన్ని నడిపించాయి. శ్రీశ్రీ ప్రభావంతో ఇంటర్ రోజుల్లోనే మహాప్రస్థానంను అనుకరిస్తూ కవిత్వం రాసాను. అప్పట్లో వస్తుండిన ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక లోని కథలు చదివి నేనూ కథలు రాయాలని అనుకున్నాను. నా డైరీలనిండా నాకు తోచిన రీతిలో కవిత్వం రాసుకున్నా. డిగ్రీ అయిపోయాక మా నాన్న వద్దంటున్నా బెంగళూరు లో వుద్యోగం (లేత్ మిషన్ మీద పనిచేసే టర్నర్) వదిలేసి అనంతపురం SK  యూనివర్సిటీ లో MA హిస్టరీ లో చేరా. మా నాన్న అర్ధాంతర మరణాన్ని యెదుర్కొని M. Phil చేస్తూ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తూ గవర్నమెంట్ వుద్యోగం తెచ్చుకున్నాను. నా MA రోజుల్లో చదివిన తుర్గినోవ్  'తండ్రులూ కొడుకులూఎమిలా జోలా 'ఎర్త్'   బుచ్చిబాబు 'చివరకు మిగిలేదినా మీద విపరీతమైన ప్రభావం వేశాయి.  ఈ పుస్తకాలే నాలాగే పుస్తకాలను యిష్టపడే నా జూనియర్ సుభాషిణి ప్రేమలో పడేసాయి. బాల్యం నుంచే నా చుట్టూ వుండిన బహుజన కులాల (ఈ పదం అప్పుడు తెలీదు) సాంగత్యం, నా చదువరితనం, నన్ను అభ్యుదయ భావాల వైపు నడిపించాయి. నేరుగా చెప్పాలంటే సాహిత్యం చదివి జీవితాన్ని మలచుకున్నాను. నా కులాంతర వివాహానికి నా సాహిత్యాభిలాష నే కారణం. రచయిత గా మారడానికి యే సంస్థలూ కారణం కాదు. నేను రచయితగా మారుతూ యితర రచయితల స్నేహం లోనుంచి వాళ్ళు సభ్యులైన సంస్థలను చూసాను. ఏ సంస్థ లోనూ సభ్యుడ్ని కాను. 

3. మీ రచనల గురించి చెప్పండిమీ మొదటి రచన ఏది? అది కథనా, కవితనా ? అది  ఏ సందర్భములో  నుండి వచ్చింది?

కవిత్వం ఇంటర్ రోజుల నుంచే రాస్తున్నాను. ఆ రోజుల నుంచే వారపత్రికలు చదువుతున్నాను. యండమూరి ఆంధ్రభూమి లో రాస్తుండిన తులసీదలాల ప్రభావంలో పడకుండా రంగనాయకమ్మ కాపాడారు. ఆంధ్రప్రభ లో మంచి కథలు వస్తుండేవి.90ల నుంచి కథలు రాయడం ప్రారంభించాను. నేను చూసిన మా వూర్ల కరువు మీద, నా సహచరి సుభాషిణి వూర్లలోని ఫ్యాక్షన్ మీదా కథలు రాసుకున్నా. 1994 నవంబర్ లో ఆంధ్ర ప్రభ లో నా మొదటి కథ 'పామును మింగిన కప్పఅచ్చయ్యింది. ఆత్మన్యూనతకు గురైన వ్యక్తి మానసిక స్థితి వస్తువుగా రాసింది. 2000సంవత్సరం లో నా డైరీలలోని కవిత్వం లోంచీ నలభై కవితలను (అన్నీ అచ్చుకానివే) లోగొంతుక పేరుతో సంపుటిగా ప్రకటించాను. అప్పటి నుంచి రెగ్యులర్గా రాస్తున్నాను. ఇప్పటికి నాలుగు కవితాసంపుటులు, రెండు దీర్ఘకవితలు, మూడు కథా సంపుటులు ప్రచురించాను. 

4. మీ కథల్లో రాయలసీమ  ప్రజల జీవితాలే కథా  వస్తువులు కదా. దీనికి కారణాలు ఏమిటంటారు?

   ముందే చెప్పినట్లు నేను పుట్టి పెరిగిన, తిరిగిన రాయలసీమ వూర్లలోని జీవితాలే నా కథలు. బహుజన అనే పదమే తెలియని రోజుల నుంచే నా కథల్లో SC BC సమూహాల బతుకులనే రాస్తున్నాను. దానికి పునాదులు నా హైస్కూల్ రోజుల నాటి సోషియల్ వెల్ఫేర్ హాస్టళ్లో వున్నాయి. నేను ఎదిగే క్రమంలో విప్లవ అభ్యుదయ శిబిరాల  మిత్రులతో తిరిగినా నా చూపులు సహజంగా నా ప్రాంతం, నా సహ సమూహాల జీవితమే నేను చెప్పదగిందనే ఎరుకతో వున్నాను. అరుణతార లో 1999 లో కాలినగూడు అనే కథ అచ్చయ్యింది. రాయలసీమ ఫ్యాక్షన్ లో రెక్కలిరిగిన ఒక చాకలి కులస్థుడి కథది. నాకు తెలిసినవస్తువురాయలసీమ అణగారిన కులాల వారి కథలు, ఆ జనాలు మాట్లాడే రాయలసీమ యాస. రాయలసీమ నిరాడంబర, నిష్టురతే నా కథల శిల్పం. సీనియర్ రచయితలను చదివి నేను నేర్చుకున్నదే నా దారి. 

5. కర్నూల్ సాహిత్య వాతావరణం మీ మీద చూపిన ప్రభావం ఏమిటి ? ప్రస్తుతం కర్నూల్ లో  సాహిత్య వాతావరణం ఎలా ఉంది ?

నేను, నా సహచరి సుభాషిణి వెంట కర్నూలు కు వచ్చాను. ఆమె కర్నూలు లోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల లో గణితంలో వుపన్యాసకురాలిగా వుద్యోగం చేస్తుంటే నేనూ నా ప్రభుత్వ వుద్యోగాన్ని కర్నూలు లో ఎంచుకోవాల్సి వచ్చింది. కర్నూలు లో నాకు తెలిసిన యేకైక వ్యక్తి కాశీభట్ల వేణుగోపాల్. ఆయన రచయిత కాని రోజుల నుంచే తెలుసు. ఆయన అజ్ఞాతంగా కవిత్వం, నవలలూ రాస్తున్న రోజుల్లో వాటి మొదటి పాఠకుడ్ని నేనే. ఆయనలోని చదువరి తనమే మేము కలవడానికి కారణం. 1993 లో కర్నూలుకు వస్తే, యింట్లో మా సుభాషిణి తోనూ బయట వేణుగోపాల్ తోనూ నా సాహిత్య సంభాషణ నడచేది. 1998 నుంచి కర్నూలు కథాసమయం మిత్రులు పరిచయం అయ్యారు. బృందంగా మా కథా ప్రయాణం మొదలైంది. 2000సంవత్సరంలో మా కథలతో   'కథాసమయం' కథాసంకలనం వేసాం. ఆ క్రమంలో హంద్రీకథలు, కర్నూలు కథ, గుర్నూలుపూలు వంటి కథాసంకలనాలు కథాసమయం మిత్రులనుండి వచ్చాయి. ఆ బృందం సభ్యులు హరికిషన్, తుమ్మల రామకృష్ణ, జి. వెంకటకృ‌‌ష్ణ, జి. ఉమామహేశ్వర్, నాగమ్మ ఫూలే, ఇనాయతుల్లా, కె. సుభాషిణి రాయలసీమ అధ్భతమైన కథకులుగా పరిచయమైనారు. నన్ను కథాసమయం చాలా ప్రభావం చేసింది. నేను కూడా కథాసమయానికి చిరునామాగా నిలబడ్డాను. సంస్థ కాని సంస్థ కథాసమయం. ఒక సంస్థ చేయవలసిన పనులన్నీ చేసింది. పుస్తకాల ప్రచురణ, వర్క్ షాపుల నిర్వహణ చేసింది. 1996నుండీ 2010 దాకా కర్నూలు కథాసాహిత్యాన్ని నడిపించింది. కథంటే బృందగానమని నిరూపించింది. ఇప్పుడు కర్నూలు సాహిత్యంలో కొత్త శక్తులు పనిచేస్తున్నాయి. కథా కవిత్వం విమర్శ యీ మూడు ప్రక్రియలతో ఒక వైపు(పాణి)   విరసం, మరోవైపు సాహిత్య ప్రస్థానం (కెంగార మోహన్ రఘుబాబు)  బృందాలు పనిచేస్తున్నాయి. సాహిత్య కార్యక్రమాలు కర్నూలు లో ముమ్మరంగానే జరుగుతున్నాయి. నేనూ అందులో భాగస్వామిని అవుతున్నాను. 

6.   తెలుగు సాహిత్యంలో రాయలసీమ సాహిత్యంకు గల  ప్రత్యేకతను ఎలా అర్థం చేసుకోవాలి

రాయలసీమ జీవితాన్ని రాయలసీమ సాహిత్యం మాత్రమే చెప్పగలదు. రాయలసీమకే ప్రత్యేకమైన కథావస్తువులైతేనేమీ, ఆ వస్తువుల్ని కథనం చేసిన రాయలసీమ భాషైతేనేమీ తెలుగు సాహిత్యానికి ఒక కాంట్రిబ్యూషనే కదా. రాయలసీమ నుడికారాన్నీ, సంస్కృతీ ఆచారవ్యవహారాలనూ పట్టుకున్న కథలు తెలుగు భాషకు గొప్ప సంపద. ప్రాంతీయ అస్తిత్వ కోణం నుంచి మాత్రమే ఆ ప్రత్యేకతనూ ఆ అరుదుతనాన్నీ అర్థం చేసుకోవాల్సి వుంటుంది. ఇంకొక విషయం, రాయలసీమ లో మొదట్నుంచీ బ్రాహ్మణ రచయితల ప్రభావం లేదు. దాదాపు రచయితలంతా శూద్రులే. అందుకే శూద్ర కులాల జీవిత చిత్రణ రాయలసీమ కథలో  అతి సహజంగా వుంది. 

7.  ప్రస్తుత సాహిత్యం  జీవ లక్షణాన్ని కోల్పోయిందని అంటున్నారు.  ఇది నిజమేనంటారా?

పాత సూత్రీకరణల్లోంచీ మనం యిలా అనుకుంటున్నామేమో. ఈ కాలపు సాహిత్య లక్షణాన్ని పట్టుకోవడానికి కొత్తగా ఆలోచించాలేమో. ఇప్పుడు నడుస్తోంది ఆన్లైన్ యుగం. దీన్ని ఆ కళ్లతోనే చూడాలి. ఏ కాలపు సాహిత్యమైనా ఆ కాలపు జీవలక్షణాన్ని కలిగివుంటుంది. ఏ కాలమైనా తనను తాను రికార్డు చేసుకుంటూ వుంటుంది. ఒక తలం మీద ఒక కోణంలో చూస్తున్నందువల్ల అది కనిపించకుండా వుండవచ్చు. మన దృష్టి కోణం మార్చి చూస్తే యీ కాలపు లక్షణం సజీవంగా అవగతమవుతుంది. 

8.  ఇప్పుడు వెలువడుతున్న సాహిత్యాన్ని  మీరు ఎలా చూస్తున్నారు?

సానుకూలంగానే చూస్తాను. ఇప్పటి ఆన్లైన్ యుగంలో తక్కువ నిడివి గల రచనలు అన్ని సాహిత్య ప్రక్రయలలోనూ వెలువడుతున్నాయి. సామాజిక మాధ్యమంలో పబ్లిష్ అవుతున్నాయి. చిన్న కవితలూ, చిన్న చిన్న రైటప్ లూ సూటిగా విషయం ను వివరించే లఘువచన (స్మాల్ నర్రేటివ్) కాలపు లక్షణం యిదే. ప్రింట్ మీడియా లో కూడా చిన్న కథలూ చిన్న నవలల కాలం నడుస్తోంది. ఇటీవల చతుర లో నూరు పేజీల పుస్తకంలో రెండు చిన్న నవలలు వేస్తున్నారు. దీనికి కారణం జీవితంలో వేగం. ఇటీవల షార్ట్ ఫిలిమ్స్ కు గిరాకీ పెరిగింది. వేలాది లఘు చిత్రాలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. వీటిని ఆహ్వానించక తప్పదు. 

9.  ఇప్పుడు వెలువడుతున్న తెలుగు సాహిత్య విమర్శను ఎలా చూడాలంటారు?

తెలుగు లో విమర్శ లేదు. తెలుగు లో కథా కవిత్వం, నవల విశ్వప్రదర్శన చేశాయి. ఆ స్థాయిలో కాదుగదా యే స్థాయిలోనూ విమర్శ లేదు. వున్నది కాస్తా పరామర్శ, ప్రశంస, కొండొకచో నిందా, అభిశంస. నిండైన విమర్శ యే రచయిత రచనపైనైనా తెలుగు లో అరుదు. యూనివర్శిటీ ఆచార్యులు మనకేమీ కొదవలేరు. వాళ్లంతా థీసిస్సులు రాయిస్తూంటారు. థీసిస్ అంటే అక్కడ తీసి కొంత, యిక్కడ తీసి కొంత రాసేదే. అదే మన విమర్శ స్థాయి. 

10. ఇంతవరకు నవల రాయకపోవడానికి కారణం ఏమిటి

నిజమే నవల రాలేకపోయాను. దీనికి కారణం నా బధ్ధకమే. ప్లాన్ లేకపోవడం. నా యవ్వన కాలం నుంచి నా సాహిత్య సంభాషణలో వుంటున్న స్వామి, కాశీభట్లా యిద్దరూ చెప్తూనే వున్నారు నవల యెత్తుకోమని. నేనే ప్లాన్ చేసుకోలేకపోయాను. తప్పకుండా రాస్తాను. 

11. కథకుడిగా, కవిగా, సాహిత్య విమర్శకుడిగా, సామాజిక కార్యకర్తగా మీ అనుభవాలు ఏమిటి?

కవిత్వంతో ప్రారంభమైనాను. తర్వాత కథాసాధన ఆరంభించాను. ఈ రెండింటిలో యేమీ అంతగా సాధించకుండానే విమర్శ అనే చేతగాని పనిలోకి దిగాను. ఇక సామాజిక కార్యకర్త అనే పదాన్ని వాడడానికి అర్హత లేనివాడ్ని. ఉద్యోగం చేసుకుంటూ భద్రజీవితంలో వుంటూ నేనేం సామాజిక కార్యకర్తను. కవిత్వం కంటే కథతో కొంత సంతృప్తి చెందాననిపిస్తుంది. కవిత్వంలో యెంతైనా అస్పష్టతకు చోటుంటుంది. కవి దాక్కోగలడు. కథతో అట్లా కాదు. నువ్వేమిటో నీ శక్తేమిటో అందరికీ తెలుస్తుంది. కథ రాయడం కష్టమని నా అనుభవం. 

 12.  కథా సమయం గురించి చెప్పండి.

కర్నూలు కథాసమయం -  ఒక కథకుల బృందం. రాప్తాడు గోపాలకృష్ణ, శ్రీనివాస మూర్తి, పూనికతో పుట్టింది. ఈ ఆలోచన వెనుక తుమ్మల రామకృష్ణ, పంచాగ్నల చంద్రశేఖర వున్నారు. 1994-2010 మధ్య కాలంలో కర్నూలు కేంద్రంగా ఆధునిక కథ కోసం యీ బృందం పనిచేసింది. సింగమనేనీ నారాయణ గారు 1990 లో సీమకథ కథాసంపుటి వేసినప్పుడు ఆ సంకలనంలో కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు. కర్నూలు లో ఆధునిక కథ లేదని సింగమనేనీ గారు చెప్పినప్పుడు  నుంచి రాప్తాడు గోపాలకృష్ణ గొడవపడ్డాడు. కథాసమయం బృందం ద్వారా ఆధునిక కథ కోసం ప్రయత్నాలు చేసాడు. ఈ బృందం, పల్లె మంగలి కథలూ, ఫ్యాక్షన్ కథలూ, కథాసమయం కథల సంకలనం, హంద్రీకథలు, కర్నూలు కథ, గుర్నూలుపూలు లాంటి కథాసంకనాలని వెలువరించారు. రాప్తాడు గోపాలకృష్ణ మరణంతోనూ, శ్రీనివాస మూర్తి వ్యక్తిగత కారణాల వల్ల దూరమైనా మిగతా సభ్యులు  రాయలసీమ లో కథకు కర్నూలును కేంద్రం చేసారు. వ్యక్తిగతంగా యీ బృంద సభ్యులు, గోపాలకృష్ణ, తుమ్మల రామకృష్ణ, హరికిషన్, వెంకటకృ‌‌ష్ణ, ఉమామహేశ్వర్, సుభాషిణి, ఇనాయతుల్లా తమ తమ కథాసంపుటులు ప్రచురించి కథకులుగా నిలబడ్డారు. 

13. మీరు వర్క్ షాపులకు హాజరయ్యారు కదా ఆ అనుభవాలు ఏమిటి?

లెక్కలేనన్ని కథా సమ్మేళనాలకు హాజరైవుంటాను. కథాసమయం తరఫున మేమూ అలాంటి సమావేశాలు నిర్వహించాము. ఖదీర్ బాబు - సురేష్ నిర్వహించిన మొదటి కీసర కథాసమావేశం నుంచి వాళ్ళవి ఏడెనిమిది సమావేశాలకు వెళ్లుంటాను. విరసం వాళ్ళు నిర్వహించిన అన్ని సమావేశాల్లోనూ పాల్గొన్నాను. వీటన్నింటిలో రచయితలను కలవడమే గొప్ప అనుభవం. అల్లం రాజయ్య, బండి నారాయణ స్వాములను వినడం, గొప్ప అనుభవం. కారా మాస్టర్ ను కలుసుకోగలిగాను. తెలుగు లో ప్రసిధ్ధులైన నా ముందు తరంనా తరం కథకులను యీ సమావేశాల్లోనే చూడగలిగాను, వినగలిగాను. ఎంతో నేర్చుకున్నాను. నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి యీ సమావేశాలు వుపయోగపడ్డాయి. 

14. మీ ప్రాంతం నుండి కొత్త రచయితలు అంతగా రాకపోవడానికి కారణం ఏమిటి

మా ప్రాంతమనే కాదు, యే ప్రాంతం నుంచి యే కాలంలో కూడా ఎక్కువ సంఖ్యలో రచయితలు రాలేదు. ఒకవేళ ఒక ప్రాంతంలో సంఖ్యలో యెక్కువ వున్నా, తప్పాతాలూ వుండేవుంటుంది. సీరియస్ గా, దృక్పథంతో, ఒక ఆత్మవిశ్వాసంతో తన కాలానికి ప్రతినిధిగా నిలబడేవాళ్లు యెప్పుడూ యెక్కడైనా తక్కువే. రాయలసీమ కూ యిది వర్తిస్తుంది. ఇప్పుడు కూడా పాత కథకులే రాయాల్సొస్తుంది. అయితే దృశ్యాన్ని యింకో కోణంలో చూస్తే, ఆన్లైన్ మాధ్యమాలలో రాయలసీమ నుంచి చాలా మంది రాస్తున్నారు. వందలాది మంది వుంటారు. అందులో యెంత మంది నిలబడతారు. ఏ దృక్పథంతో రాస్తున్నారు. అనేది చర్చనీయాంశమే అయినా వారు రాస్తుండటం, వాళ్ళ చుట్టూ పాఠకులుండటం మాత్రం నిజం. 

15.   యువ రచయితలు ఎక్కువమంది మీ ప్రాంతం నుండి రావడం లేదంటారా? కారణాలు గమనించారా?

రాయలసీమ నుంచి యువరచయితలు రాస్తున్నారు. ఎక్కువ మంది ఆన్లైన్ మాధ్యమాల్లో రాస్తున్నారు. కవిత్వం యెక్కువగా రాస్తున్నారు. ఎడిటింగ్ చేసుకుంటే, కొంత శిక్షణ తో నేర్చుకుంటే పరిణితి సాధించగలరు. సంస్థలు వారిని పట్టించుకోవాల్సుంది. 

 16.   దీర్ఘ కవితలు రాశారు కదా. ఎలాంటి స్పందన వచ్చింది?

రెండు దీర్ఘకవితలు రాసాను. మొదటిది, 2009లో కర్నూలు నగరాన్ని ముంచెత్తిన వరదలను చిత్రిస్తూ రాసింది. "నదీ వరదా మనిషి". రెండోది, రాయలసీమ వుద్యమానికి వెన్నుదన్నుగా రాసిన "హంద్రీగానం". ఈ ప్రాంతీయ అస్తిత్వఘోషను రాయలసీమ వాదులు బాగా ఆదరించారు. 

17. కోవిడ్ మీ జీవితం లో ఏమైనా మార్పు తీసుకు వచ్చిందా?

నా జీవితంలో యిప్పటికి నేను చూసిన రెండు అరుదైన సంఘటనలలో యిదొకటి. తెలంగాణ యేర్పడటం మొదటిది. వొళ్లంతా కళ్లు చేసుకుని ఆశ్చర్య ఆనందాలతో చూసాను దాన్ని. ఇప్పుడు కరోనా విజృభణనూ అలాగే చూస్తున్నా. ఈ వైరస్ వల్ల ఆగస్టు పదకొండు న మా అక్క చనిపోయారు. నిస్సహాయంగా అనాథలా పంపించాము. భయం నీడ అంటే యేమిటో కరోనా చూపిస్తోంది. కరోనా తాత్వికంగా మనిషి దుర్మార్గానికి, నిస్సహాయతకూ ప్రతీక. ఇంకా అర్థం కాని ప్రకృతి, మనిషి కి విసురుతున్న సవాల్ యిది. ప్రకృతి లోని అణువణువుకూ వినయంగా వుండి జీవించాలనే  సత్యాన్ని యింకో సారి కరోనా నేపథ్యంలో గుర్తుచేసుకుంటున్నాను. 

18.   అస్తిత్వ ఉద్యమాలను ఎలా అర్థం చేసుకోవాలంటారు

ఏ రచయిత కైనా అతడి ప్రాంతం, కులం, లింగభేదంలో వేళ్లుతన్నుకొని వుంటాయి . వ్యక్తి చైతన్యం యీ మూడింటినుంచీనే వస్తుంది. ఇట్లాంటి తన చైతన్యాన్ని అర్థం చేసుకోవడాన్ని సంకుచిత దృష్టిగా అపోహపడ్డారు విమర్శకులు. ఆధునికత రచయితలు అంతర్జాతీయ (మెగా కథనాల) అవగాహన పేరట, కమ్యూనిస్టు (మార్క్స్ చెప్పని) ఆదర్శాల పేరట హృదయవైశాల్యాన్ని రుజువు చేసుకొనే తొందరలో చిన్న చిన్న వే అయిన కీలకమైన విషయాలకు దూరమయ్యారు. ఆయా చిన్న చిన్న వుపాధులు ప్రాంతీయ అస్తిత్వ కోణం నుండే సాకారమవుతాయి. సాహిత్యం లో సూక్ష్మ అంశాలు అర్థం కావాలంటే అస్తిత్వవాదమే దారి. చిన్న చిన్న చిక్కుముడులు విడిపోతేనే మెగా అల్లికలూ విడిపోతాయి. తెలుగు సాహిత్యాన్నీ, సాహిత్య సంస్థలనూ అగ్రవర్ణాల భావజాలం నడపడం వల్ల వాళ్ళ నాయకత్వాలకు భంగం కలిగించే విషయాలను తక్కువ స్థాయీ విషయాలుగా చెప్తూ అపార్థం చేయించారు. అస్తిత్వవాద సమస్యలే మొదట తలకెత్తుకొని పరిష్కరించాల్సినవి. దాచేయాల్సినవీ కాదు. 

19.   రాయలసీమ అస్తిత్వ ఉద్యమంలో మీరు భాగస్వాములు కదా.  మీరు ప్రజల మధ్యకు వెళ్ళి వారితో మాట్లాడినపుడు మీకు ఎదురైనా అనుభవాలు ఏమిటి?

నా కథలన్నీ ప్రజలతో ఎదురైన అనుభవాలే. కరువుబారినపడ్డ రైతులూ రైతు మహిళలూ, ఫ్యాక్షన్ లో నలిగిపోయిన కింద కులాల వ్యక్తులూ, వూర్లల్లో యెదురై, మా కథల్లో పాత్రలుగా మారారు. అవి వస్తువులుగా అస్తిత్వవాదానికి చెందినా, ఆ కథల పరిష్కారాలు మాత్రం ఆదర్శీకరించబడినవే.  నిజానికి అవి పాత పరిష్కారాలు.   తెలంగాణ విడిపోయి కొత్త ఆంధ్రప్రదేశ్ యేర్పడ్డాక యిప్పుడు అసలు విషయాలు కన్పిస్తున్నాయి. అప్పుడు వాన రాని కథలు రాసి బాధ్యతల నుంచి తప్పించుకుని తిరిగామని యిప్పుడు అర్థమవుతుంది. కళ్ల ముందే కృష్ణ తుంగభద్ర ప్రవహిస్తూ వెళ్లిపోతున్నాయి గానీ  ఇక్కడ యెందుకు నిలబడడమే లేదనే ప్రశ్న యిప్పుడు ప్రజల్నుంచి స్పష్టంగా వినిపిస్తోంది. ఆ కథలు రాయమని నిలదీస్తోంది. 

20.  సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు సాధ్యమేనంటారా?

ప్రత్యక్షంగా సాధ్యం కాదు. సాహిత్యం వల్ల విప్లవం రాదు. విప్లవమోద్యమం వల్లే సమాజంలో మార్పులు వస్తాయి. అయితే సాహిత్యం మనుషుల్లో అనుభూతిని కలిగిస్తుంది. సెంన్సిటైజ్ చేస్తుంది. తద్వారా ఆలోచనల్లో మార్పుకు దోహదం చేస్తుంది. నా తండ్రి తరానికీ, నా తరానికీ స్త్రీలను చూడ్డంలో మార్పు వచ్చింది. నా ఆలోచనల్లో స్త్రీ వాద సాహిత్యం, ప్రవర్తన లో మార్పు కు దోహదం చేసింది. అట్లే దళితుల పట్ల సంవేదనల్ని పెంచింది. సాహిత్యం ఆధునిక విలువల్నీ, ఆకాంక్షలనీ ప్రసారం చేసి మార్పుకు తానూ ఒక కారణం అవుతుంది. 

21.  పాఠకులు, కవులు, రచయితలు, సాహితీవేత్తలకు  గోదావరి అంతర్జాల పత్రిక ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు?

సందేశాలిచ్చేంత వాడిని కాదు. అంత పరిజ్ఞానం లేదు. అయితే    గోదావరి పత్రిక యిటీవల విద్యార్థుల యువకుల రచనలను ప్రచురిస్తోంది. ఇది మంచి పరిణామం. రాసేవాళ్లు కొత్త తరం లోంచీ రావాలి. రాస్తూ రాస్తూ వాళ్లే మెరుగవుతారు. సాహిత్య సృజన వ్యక్తిగతమైందే, కానీ అదీ సమూహ క్రియగా మారిపోతుంది. రాసింది, రాసిన వాడిని మెరుగుపరుస్తుంది. చదివినవాడిని సంస్కరిస్తుందీ. యువతకు ప్రాధాన్యత యివ్వడం ద్వారా గోదావరి పత్రిక వాళ్ళను వాళ్ళ సామాజిక బాధ్యతకు దగ్గర చేసినట్లేనని నేను భావిస్తున్నాను. 

 

ఇంటర్వ్యూలు

ఉత్తమ సాహిత్యమెప్పుడూ మనిషిని ఆరోగ్యవంతం  చేసే ఉత్తమ ఔషదమే-  రామా చంద్రమౌళి

ప్రసిద్ధ కవీ, కథా రచయితా, నవలాకారులు, విమర్శకులూ ఆచార్య రామా చంద్రమౌళి గారు గోదావరి అంతర్జాల సాహిత్య మాస పత్రికకు  ఇచ్చిన ఇంటర్వ్యూ                                                                     

1.    మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి.   

      నేను వరంగల్లులో పుట్టి, పెరిగి చదువుకుని ఎదిగి.. ఎక్కువకాలం వరంగల్లులోనే ఉద్యోగించి.. ఇప్పుడు పదవీ విరమాణానంతరం వరంగల్లులోనే చరమజీవితాన్ని గడుపుతున్నవాణ్ణి. నా జన్మదినం 8 జూలై, 1950. అమ్మ రాజ్యలక్ష్మి, నాన్న కనకయ్య. నిజాం కాలంలో వరంగల్లు నగరంలో అతిపెద్ద వస్త్ర పరిశ్రమగా విలసిల్లిన     'ఆజం-జాహి మిల్స్' లో కప్డా కాతాలో మొకద్దమా( సూపర్వైజర్ ) గా మా నాన్న పనిచేసేవాడు. అమ్మ బీడీలు చేసేది. చాలా పెద్ద కుటుంబం మాది. మేము ఆర్గురం అన్నదమ్ములం ముగ్గురు అక్కాచెల్లెల్లు. నేను పెద్దవాణ్ణి. చదువు అందరికీ అందుబాటులో లేదప్పుడు. నాల్గవ తరగతి వరకు ఒక వీధి పంతులు.. రాజయ్య సార్ అని.. పుణ్యాత్ముడు ఆశువుగా చెప్పిన పాఠాలు. నాల్గవ తరగతి ఐపోయిందంటే.. ఒక ప్రవేశ పరీక్ష రాసి వరంగల్లు నగరంలో ప్రముఖమైన 'మహబూబియా ఉన్నత పాఠశాల' లో ఆరవ తరగతిలో చేరిన. అదొక గొప్ప మహానుభూతి. ప్రసిద్ధ విద్యావేత్త బజారు హనుమంతరావు గారు మా ప్రధానోపాధ్యాయులు. నా విద్య, జ్ఞాన సముపార్జనకు పాఠశాలే పునాది. కాళోజీ గారి గురువు శ్రీ గార్లపాటి రాఘవరెడ్ది గారుకూడా మా పాఠశాలలో తెలుగు టీచర్ గా బోధన చేస్తూండేవారు. గంధపు చెక్కతో సంపర్కంవల్ల ఒట్టి కర్రముక్కకు కూడా కొంత అవశేష పరిమళం అబ్బినట్టు బహుశా మహనీయుని శిష్యరికంవల్ల కావచ్చు సాహిత్యం వైపు నా మనసు మళ్ళింది. మా తరగతికి హెచ్ ఎస్ సి వరకు నేనే క్లాస్ మానిటర్ గా ఉండేవాణ్ణి. అప్పుడు ప్రతి తరగతికి ఒక చిన్న గ్రంథాలయం ఉండేది కనీసం ఒక వంద పుస్తకాలతో. దాని నిర్వహణను నేనే చేయాలె. అందువల్ల ఒకటొకటిగా ఎన్నో పుస్తకాలను చదివే భాగ్యం కలిగింది నాకు.      

            హెచ్ ఎస్ సి తర్వాత పాలిటెక్నిక్. మెకానికల్ ఇంజనీరింగ్. అప్పుడు చదువే ఎంతో గొప్పది. తర్వాత కొంత కాలం ' భిలాయ్ స్టీల్ ప్లాంట్, మధ్యప్రదేశ్ ' లో 'చార్జ్ మ్యాన్ ' గా ఉద్యోగం. ఒక యేడాది తర్వాత  రాష్ట్రేతర ఉద్యోగులను తొలగించాలని అప్పుడు అక్కడ చెలరేగిన ఒక ఉద్యమం వల్ల ఉద్యోగం పోయింది. ఉన్నత పాఠశాలలో ప్రసిద్ధ రచయిత, కమ్యూనిస్ట్ మేధావి మన పూర్వ ప్రధానమంత్రి శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు గారి సోదరులు శ్రీ పాములపర్తి సదాశివరావు పెద్ద కొడుకు శ్రీ నిరంజనరావు నాకు ఆరవ తరగతి నుండి హెచ్ ఎస్ సి వరకు, తర్వాత పాలిటెక్నిక్ లో కూడా సహపాఠి. నిరంజన్ రావు ద్వారా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న పి వి నరసింహారావుగారి అనుగ్రహంవల్ల ప్రభుత్వ సాంకేతిక విద్యా శాఖలో నిర్వహించబడే పాలిటెక్నిక్, వరంగల్లు లో 'డిమాన్స్ట్రేటర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్' గా ఉద్యోగం 23-02-1970 . ఇక అక్కడినుండి జీవన పోరాటం మొదలు. చదువు అనేది అస్సలే అందుబాటులో లేని దైవ దినుసు. పైగా ఉద్యోగం చేస్తూ చదువుకోవాలె. ఉద్యమాలు చేసి.. వరంగల్లు లో ఉన్న ' రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ' పార్ట్ టైం మొదటిబ్యాచ్ లో ఎంట్రన్స్ మొదటి ర్యాంక్ సాధించి.. బి టెక్ .. తర్వాత హైదరాబాద్ జె ఎన్ టి యు నుండి మొదటి బ్యాచ్ లో ఎం.ఎస్ డిగ్రీ. చివరికి పాలిటెక్నిక్ కాలేజ్ లో ' ప్రిన్స్పాల్ ( ఎఫ్ సి ) గా పదవీ విరమణ 31-01-2006 . అప్పటికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఇంజనీరింగ్ టీచర్ గా పురస్కారాలు.. ఎన్నో ఇంజనీరింగ్ పాఠ్య పుస్తకాలు రాయడం .. వేల వేల విద్యార్థులను తయ్యార్ చేయడం.. 2006 నుండి 2018 వరకు వరంగల్లు మహా నగరంలో వాగ్దేవి గ్రూప్ విద్యాసంస్థలలో ఒకటైన 'గణపతి ఇంజనీరింగ్ కాలేజ్' లో ప్రొఫెసర్ మరియు వైస్-ప్రిన్స్పాల్గా ఉద్యోగం చేయడం.. ఇదంతా నాకు అత్యంత ఇష్టమైన ఒక ఎడతెగని అధ్యాపక వ్యాపకం. మొత్తం కలిపి 50 సంవత్సరాల బోధనా వృత్తి.. తద్వారా మిగిలింది జన్మ సార్థకమైందన్న అనంతమైన తృప్తి.  

     నా మొట్టమొదటి రచన నేను తొమ్మిదవ తరగతిలో ఉండగా ' చందమామ ' పిల్లల మాసపత్రికలో వచ్చింది. దాని పేరు ' సువర్ణ శతదళ పుష్ప రహస్యం '. మహబూబియా పాఠశాలలోనే రాఘవరెడ్డి గారి వల్ల ఒకసారి కాళోజీ గారి మొదటి కవిత్వ సంపుటి 'నా గొడవ'ను మహాకవి శ్రీశ్రీ ఆవిష్కరించడం.. సభలో నెక్కర్లు తొడుక్కునే వయసులో మేమందరం పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో పాల్గొనడం.. అవన్నీ అద్భుతమైన మరుపురాని మధుర జ్ఞాపకాలు

2.         మిమ్ములను ప్రభావితం చేసిన సాహిత్య సంస్థలు, రచయితలు, పత్రికలు, పుస్తకాల గురించి తెలపండి 

            మహబూబియా ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుకుంటున్నపుడు సంవత్సర పరీక్షలు జరిగిన తర్వాత మా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ బజారు హనుమంతరావు గారు సంవత్సరం పరీక్షలన్నింటిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరి పేర్లను తానే స్వయంగా క్లాస్ క్లాస్కు వచ్చి ఒక్కొక్కరి పేరును గంభీరంగా చదివి వినిపించేవారు. అప్పుడు పిల్లల తండ్రులు క్లాస్ గది బయట ఎంతో ఉత్కంఠతో నిలబడి తన పిల్లవాని పేరు ఎప్పుడొస్తుందా అని గుండెలను అరచేతిలో పెట్టుకుని వినేవారు. విద్యార్థుల పరిస్థితైతే 'దేవుడా దేవుడా' నే. అప్పుడు 'డెటెన్షన్' విధానం ఉండేది. పేరు రాకుంటే 'ఫెయిల్' అని అర్థం. వాడిక అదే తరగతిని మళ్ళీ చదవాలన్నమాట. మా నాన్న తనూ, తన ఇద్దరు మిత్రులతో సహా వచ్చి.. చూడు మా వాని ఘనత అన్నట్టు వెనుక నిలబడి ఉన్నాడు. నాది ఐదవ పేరుగా చదివారు హనుమంతరావుగారు. ఇక సముద్రం పొంగింది నాలో. పట్టపగ్గాల్లేని ఆనందం. ఆరోజు విజయానికి చిహ్నంగా నాయిన నాకూ నాన్న మిత్రులందరికీ అప్పటి వరంగల్లో ప్రతిష్టాత్మకమైన ' రామా విలాస్' లో రవ్వా దోశ తినిపించి కానుకగా నాకు ఉత్పల సత్యనారాయణాచార్యులు రచించిన 'బాలల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల మహాభారతం, బాలల బొమ్మల భాగవతం' కొనిచ్చారు. అంతే.. రాత్రంతా ఎప్పుడు తెల్లారుతుందా.. ఎప్పుడెప్పుడు పుస్తకాలనూ. అక్షరాల అమృతపరిమళాలను ఆఘ్రాణిస్తానా అనే ఉత్కంఠ. పుస్తకాలు నా జీవితంలో మొట్టమొదట నాలో సాహిత్యం పట్ల ఇక ఏనాడూ వాడని ఒక మహానుబంధాన్ని ఏర్పర్చాయి. ప్రధానంగా 'మహాభారతం' ఒక భాషకందని ఆనందోద్వేగాలను నాలో స్థిరపర్చింది.           

              ఇప్పటికీ 'మహాభారతం' అనే భారతీయుల వ్యాస విరచిత మహాగ్రంథం నన్ను వివిధ దశల్లో ఆశ్చర్య చకితుణ్ణి చేస్తూనే ఉంది. బృహత్ నిర్మాణం, పాత్రల సృష్టి, నడక, ప్రతి పాత్ర వెనుక ఉన్న శ్రేష్టత, తాత్వికత, రాజనీతి సూత్రాలు, దాని ఔన్నత్యం ఇవన్నీ నన్ను గర్వపరుస్తూనే ఉన్నాయి. మొన్న మొన్న టి టి డి వాళ్ళు 15 సంపుటాలుగా ప్రచురించి వెలువరించిన నన్నయభట్టు ( కవిత్రయం ) రాసి వెలువరించిన నిజ మదాంధ్ర మహా భారతంను చదివాను.. ఉద్ధందుల వ్యాఖ్యా వివరణలతో. సమగ్ర కృతిని చదివిన తర్వాత ప్రపంచ సాహిత్యంలో భారతీయుల 'మహాభారతాన్ని' మించిన మహాద్భుత బృహత్ రచన మరొకటి లేదు అని బోధపడింది. బహుశా నేను వివిధ రచయితలతో రాయబడి వ్యాఖ్యానించబడ్డ పదిపదిహేను మహా భారతాలను చదివి ఉంటాను. ఐతే కథ, కథనం, పాత్రల సృష్టి.. చదరంగంలో పావులను ప్రజ్ఞతో కదుపుతున్నట్టు.. అబ్బో.. చదివిన ప్రతిసారీ అమృతపానమే. నన్ను పూర్తిగా ఆక్రమించి నన్ను రచయితగా, కవిగా, నవలాకారునిగా.. అన్నింటిని మించి సాహిత్య పఠితగా పరివర్తింపజేసిన మహాగ్రంథం ఒక్క 'మహాభారతమే'. మహాభారతం.. అనబడే ఒక అక్షరనిధి పుట్టిన పుణ్యభూమిలో నేను కూడా పుట్టినందుకే అనుక్షణం పులకించి పోతూంటాను. ఇక అక్కడినుండి నేను అక్షర సవ్యసాచిగా మారి తొమ్మిదవ తరగతినుండే రచయితగా శరపరంపరగా విస్తరిస్తూ పోయాను. చందమామ, బాలమిత్ర లతో మొదలుకుని అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు వాళ్ళ ప్రామాణిక మాసపత్రిక 'భారతి' లో నా రచనలు ఒక ఝరిలా వచ్చే స్థాయికి ఎదిగి వెలిగాను. విజ్ఞులు 'బాలమిత్ర టు భారతి' రచయిత అని శ్లాఘించేవారు.      

            ఎదుగుతున్నకొద్దీ నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు.. కవిగా  ఒకే ఒక్కడు.. కాళోజీ, కథా రచయితగా.. రాచకొండ విశ్వనాథశాస్త్రి, డి.జయకాంతన్. ఒక  నవలాకారునిగా..నన్ను నేనే నిర్మించుకున్నా. నాపై ఎవరి ప్రభావమూ లేదు. విస్తృతంగా చదవడం, భారతీయ తెలుగేతర రచయితలనూ, కవులనూ అధ్యయనం చేయడం, అంతర్జాతీయ పోకడలను ఆకళింపు చేసుకుంటూ ఎప్పటికప్పుడు నన్ను నేను ఉన్నతీకరించుకోవడం.. ఎప్పటికైనా నాదైన ఒక 'స్వంత గొంతు' ను సృష్టించుకోవడానికి కృషి చేస్తూండడం.. అనే దిశలో సాగినవాణ్ణి నేను. వృత్తి రీత్యా ఒక ఇంజనీర్నైన నేను తెలుగు భాషకు సంబంధించిన సంస్థలతోనూ సంబంధాన్ని కలిగిఉండే అవకాశం నాకు కలుగలేదు.       

            ఇక సంస్థలు.. సినిమా ఇండస్ట్రీ లో పనిచేయడం వల్ల అప్పుడు ఒకే ఒక సాహిత్య సంస్థగా ఒక వెలుగు వెలిగిన 'అభ్యుదయ రచయితల సంఘం' తో అనుబంధంగా ఉండేవాణ్ణి. వరంగల్లులో నేను ప్రధాన కార్యదర్శిగా, ఆచార్య పేర్వారం జగన్నాధం అధ్యక్షులుగా 'అభ్యుదయ రచయితల సంఘం కొన్నేళ్ళు పని చేసింది. ఒక సంవత్సరం చాలా భారీ ఎత్తున 'ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆడిటోరియం' లో సి. నారాయణరెడ్డి, గుమ్మడి, డా. ఆవంత్స సోమసుందర్ లతో సాహిత్య సభ, తర్వాత్తర్వాత గుంటూరు శేషేంద్రశర్మతో ఒకసారి భారీ సభలు ఏర్పాటు చేశాము. అప్పుడే 1971 లో నా మొదటి కవితా సంపుటి 'దీపశిఖ' వెలువడింది. ఇక పత్రికలు.. నా కథలు, కవితలు, నవలలు ప్రచురించని తెలుగు పత్రిక లేదు. 1970 నుండి 90 వరకు తెలుగు పత్రికా సాహిత్యానికి స్వర్ణయుగం. ప్రతి దీపావళికి ఐదారు ప్రత్యేక సంచికలు వెలువడేవి. వాటిలో తన కథో, కవితో రావడం ఒక రచయితకు ప్రత్యేక గుర్తింపుగా భావించబడేది. ఐతే.. అన్ని సంచికల్లోనూ తప్పనిసరిగా నా రచన ఉండేది. మహిళా రచయిత్రులు విజృంభించి ఒక వెలుగు వెలిగిన దశాబ్దాలు అవి. సాహిత్యానికీ, సినిమాలకూ ప్రధాన కేంద్రం 'విజయవాడ' అప్పుడు.  

            తుర్లపాటి కుటుంబరావు ( ఆంధ్రజ్యోతి ) , కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం ( ఆంధ్రప్రభ ), మద్దుకూరి చంద్రశేఖరరావు ( ప్రగతి ), శివలెంక రాధాకృష్ణ ( ఆంధ్రపత్రిక ).. వీళ్లు అప్పటి ఉన్నతస్థాయి పాత్రికేయ మిత్రులు నాకు. స్థానికంగా అప్పటి నా సన్నిహితులు శ్రీ సుప్రసన్న, డా. అంపశయ్య నవీన్, ఆచార్య మాదిరాజు రంగారావు, పేర్వారం జగన్నాథం, అనుమాండ్ల భూమయ్య తదితరులు. ఇప్పటి ప్రసిద్ధ  రచయితల్లో.. 'సృజనలోకం' వ్యవస్థాపక అధ్యక్షులు బహుముఖ ప్రజ్ఞాశాలి డా. లంకా శివరామప్రసాద్, ఆచార్య కాత్యాయనీ విద్మహే, ఆచార్య బన్న అయిలయ్య, జి. గిరిజామనోహరబాబు, వి.ఆర్.విద్యార్థి, చంద్, అన్వర్, పొట్లపల్లి శ్రీనివాసరావునెల్లుట్ల రమాదేవి, అనిశెట్టి రజిత తదితరులు నాకు సన్నిహితులు.  

             సవ్యాసాచిలా నేను పాఠకులకు అందించాలనుకున్న ఆలోచనలకు తగ్గట్టు ప్రక్రియను ఎన్నుకుని బహుముఖంగా రచనలను శరపరంపరగా వెలువరిస్తూ వచ్చాను.. మధ్య 1984 నుండి.. 2004 వరకు సాహిత్య అజ్ఞాతంలోకి (అంటే.. ఇరవై ఏండ్లు ) వెళ్ళి పూర్తిగా రాయడం మానేసి కూడా ఇప్పటిదాకా నేను మొత్తం 32 నవలలు, 483 కథలు, 14 కవిత్వ సంపుటాలు, 4 విమర్శా గ్రంథాలు, 3 నాటకాలు.. మొత్తం వెరసి ఇంతవరకు 63 పుస్తకాలు వెలువడ్డాయి నావి. అతి ఎక్కువ రచనలు నావి ఇంగ్లిష్ లోకి అనువదింపబడి అంతర్జాతీయ పాఠకులకు అందాయి. దాదాపు 19 మంది ప్రసిద్ధ అనువాదకులు నా రచనలను ఇంగ్లిష్ లోకి అనువదించారు. వాళ్ళు శ్రీశ్రీ, వేగుంట మోహనప్రసాద్, వి వి బి రామారావు, ఆచార్య ఎస్.లక్ష్మణమూర్తి, ఆచార్య కె. పురుషోత్తం, డా.లంకా శివరామప్రసాద్, రామతీర్థ, ఆచార్య ఇందిరా బబ్బెల్లపాటి, యు.ఆత్రేయశర్మ, ఆర్.అనంతపద్మనాభరావు, రావెల పురుషోత్తమరావు, ఎం.వి.ఎస్ ప్రసాద్, మైదవోలు వెంకట శేష సత్యనారాయణ. ఆచార్య కె.శ్యామల, డా. దినకర్, డా.పి వి.లక్ష్మీప్రసాద్ వంటి అనేకులు.  

            తెలుగేతర భారతీయ భాషల్లోకి కూడా నా రచనలనేకం అనువాదం చేయబడి యా ప్రాంత పాఠకులకు పరిచయమయ్యాయి. మొత్తం మీద మన దేశ సాహిత్యకారులనేకమందికి నేను ఒక వరిష్ఠ సాహిత్యకారునిగా పరిచయమై నా స్థానాన్ని పదిలపరుచుకున్నాను. ఇది నాకు సంతృప్తిని మిగిల్చిన సాహిత్య జీవితమే.

              అనేకానేక కారణాలవల్ల, అవకాశాలవల్ల నేను చాలా అంతర్జాతీయ వేదికలపై 'భారత ప్రతినిధి' గా పాల్గొని సమకాలీన సాహిత్యకారునిగా దేశ 'గొంతు' ను వినిపించాను

            ఐతే.. సాహిత్య ప్రక్రియ ఏదైనా పాఠకులకు ప్రయోజనాన్ని కలిగిస్తూ వాళ్ళను ఉన్నతీకరించేదిగా ఉండాలని నా విస్పష్ట భావన

3.          మీ మొదటి రచన సందర్భంలో వచ్చింది. మీ రచనల గురించి చెప్పండి.  

      నిజం చెప్పాలంటే.. చాలా మంది రచయితలు ఆరంభ దశలో పత్రికల్లో తమ పేరును అచ్చులో చూచుకోవాలన్న తపనతోనే రాయడం మొదలు పెడ్తారు. నేను దానికి మినహాయింపు కాదు. మొట్టమొదట తొమ్మిదవ తరగతిలో ఉండగా ' చందమామ ' పత్రికలో నా మొదటి కథ అచ్చయినప్పుడు ఎన్నిసార్లు నా పేరు అచ్చయిన అక్షరాలను తడిమి తడిమి ఆనందపడ్డానో. తర్వాత్తర్వాత రచయితకు అవగాహనా, ఆత్మవిమర్శా, తనను తాను తెలుసుకునే తత్వం పెరుగుతూ సమాజంపట్ల ఒక పౌరునిగా తన బాధ్యత తెలుస్తూ.. పౌరులూ, దేశం.. దోపిడీ.. పేదరికం, పేదలు ఎలా, ఎందుకు తయారౌతున్నారో నుండి మొదలై.. అందరూ ఒకే రీతిగా జన్మిస్తున్న వాళ్ళు ఇట్లా భిన్న భిన్నంగా ఎందుకు ఎవరివల్ల, ఎవరిచేత ఎట్లా ధనికులుగా, పేదలుగా మారుతున్నారో తెలుస్తున్నకొద్దీ.. వివక్ష గురించీ, విచక్షణ గురించీ.. క్రమక్రమంగా అర్థమౌతూ.. రచయిత ఎప్పటికైనా పీడితులవైపు నిలబడి పోరాటం చేయాలనీ.. అందరికీ సమ న్యాయం జరగాలనీ.. అసమ సమాజాన్ని మరమ్మత్తు చేయాలనీ.. ఒక ' ఎరుక ' అక్షరకారునిలో ఉదయిస్తుంది. అది పెరిగి పెరిగి రచయితకు ఒక మార్గ 'నిర్దేశన' చేస్తుంది.  

              విధంగా  రచయిత బాధ్యత తెలుస్తున్న తొలి దశలో, 1971 లో నా మొట్టమొదటి కవిత్వ సంపుటి 'దీపశిఖ' వెలువడింది. పుస్తకం ధర.. రూపాయి ముప్పావలా. దాని ప్రచురణకైన ఖర్చు తొమ్మిది వందల రూపాయలు. నావి ఐదువందలు. నా బాల్య స్నేహితుడు ఆర్.గిరి ఇచ్చినవి మిగతా నాల్గు వందలు. అది విత్తనం రాతి నేలలోనుండి మొలకగా తలెత్తుకుని నిలబడ్తున్న దశ

            రచయితకు ధైర్యంతో కూడిన ఒక లక్ష్యం ఉండాలని తెలుసుకుంటున్న సందర్భం

 4.        మీరు రాసిన అతి పెద్ద నవల 'కాలనాళిక '. నవలను సందర్భంలోనుండి రాశారు

         నేను వరంగల్లులో పుట్టి, పెరిగి, విద్యాభ్యాసం చేసి, ఉద్యోగం కూడా ఎక్కువ కాలం ఇక్కడే చేసి.. చాలా సుదీర్ఘ కాలం ఇక్కడి నేలతో, జీవితంతో, ఆచార వ్యవహారాలతో అనుబంధం కలిగి ఉన్నవాణ్ణి. ఒక రకంగా చెప్పాలంటే నేను ఇక్కడి పక్కా స్థానికుణ్ణి. అందువల్లనే 1969 లో జరిగిన తొలి ' ప్రత్యేక తెలంగాణ ' ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని పోలీసుల లాఠీ దెబ్బలు తిని కొద్ది రోజులు వాయిదాల పద్ధతిపై జైలుకెళ్ళి వచ్చినవాణ్ణి. విద్యార్థిగా అప్పటికే చైతన్యవంతమైన స్పృహ ఉన్న 'పాలిటెక్నిక్' కాలేజ్ విద్యార్థి సంఘ నాయకునిగా యువతను సమీకరిస్తూ ఉద్యమ బాటలో పయనిస్తున్నవాణ్ణి. దాదాపు అప్పటి తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్లమెంట్ స్థానాలను తెలంగాణ ప్రజా సమితికి ఓట్లేసి గెలిపిస్తే రాజకీయ ద్రోహులచేత  ఇక్కడి ప్రజలు వంచించబడి మహోగ్ర ఉద్యమం 369 మంది అమరులను కోల్పోయి మోసపోయిందో అర్థం కాలేని నిస్సహాయ పరిస్థితుల్లో.. నివురుగప్పిన నిప్పులా తెలంగాణ మిగిలి.. అంతఃచైతన్యంతో ఆలోచనాపరులైన యువత ' తీవ్రవాద ఉద్యమాల్లోకి ' తమ దారులను వేసుకుంటున్న సందిగ్ధ సమయం అది.. 1969 నుండి.. 1985 వరకు.. తెలంగాణ ఒక నిప్పుల సముద్రం.. కల్లోల కడలి.. హింస ప్రతిహింస తో కనలిపోతూ వసంత గర్జనతో లోలోపల ఉడికిపోయిన సమయం. అటు శ్రీకాకుల పోరాటాలు, ఇటు ఉత్తర తెలంగాణలో పీపుల్స్ వార్, అటు బి వి పి ప్రతిఘటనలు.. అంతా రక్తసిక్తమైన దశాబ్దిన్నర కాలం. మధ్యలో 'ఎమర్జన్సీ' దేశవ్యాప్త హక్కుల పోరాటాలు. అంతకు ముందు 1942 నుండి.. నిజాం ప్రభుత్వంలో రజాకార్ల నిత్య హింస.. మత మార్పిడులు. గ్రామాల్లో దొరల దోపిడీ పాలన. ఇక తట్టుకోలేని హింసలోనుండి పుట్టింది ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'తెలంగాణ సాయుధ రైతాంగ పొరాటం' ( సంగం). రావి నారాయణరెడ్డి, డి వి కె తదితరుల నాయకత్వంలో 1947లో ఆవిర్భవించి చెప్పా పెట్టకుండా ఆంధ్రా కమ్యూనిస్ట్ నాయకత్వం మోసం చేసి 1951లో అనివార్య పోరాట విరమణ.. ఇక పోలీస్ చర్యతో వేలమంది నిరక్షరాస్య అసహాయ గ్రామీణ ప్రజల ఊచకోత.   

             ఇదంతా 1934 లో వరంగల్లులో నిజాం ఆరంభించిన 'ఆజం- జాహి- మిల్స్' నుండి మొదలై 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 'బంగారు తెలంగాణ' వైపు అడుగులను సంధించుకుంటున్న సంధి కాలం.. అంటే 2017 దాకా .. మొత్తం 80 సంవత్సరాల చరిత్ర కథాత్మక నవలను డాక్య్మెంట్ చేస్తూ భావి తరాలకు అందివ్వాలన్న సంకల్పంతో.. దాదాపు రెండు సంవత్సరాల సమాచార సేకరణతో కష్టపడి రాసిన బృహత్ నవల 'కాలనాళిక'. దీంట్లో ఎందరో ఇప్పటికీ జీవించిఉన్న  ఉద్యమకారుల వాస్తవ జీవితాలున్నై. మన కళ్ళముందే ఇంకా సజీవంగా ఉన్న మనుషులు కూడా పాత్రలుగా ఉన్న నవలను రాయడం ఒక సాహసోపేత క్రియ. అందుకే దీన్ని ఒక వర్తమాన ' ఇతిహాసంగా ' అభివర్ణించారు విజ్ఞులైన విమర్శకులు

            ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక అసాధారణ రచన. దీన్ని రాసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది.   

5.         అనేక నవలలు, కథలు, కవితలు రాశారుగదా.. వీటికి అన్ని వస్తువులు ఎలా దొరుకుతాయి ?

          నిజమైన, హృదయమున్న, బాధ్యత తెలిసిన రచయిత సమాజాన్నీ, తన చుట్టూ ఉన్న మానవ ప్రవర్తనలనూ, మనుషులను నిద్రబుచ్చుతూ , ప్రజలను పనికిరాని సోమరిపోతులుగా మార్చుతున్న పాలకులనూ డేగకళ్ళతో గమనిస్తూ.. అత్యంత సునిశితంగా స్పందిస్తూ రచయితంటే ఒక సాంస్కృతిక సేనానిగా ఆలోచనాపరులైన పాఠకులను చైతన్యపరుస్తూ నాయకత్వం వహిస్తుంటాడు. అఫ్కోర్స్.. ఒట్టి కాలక్షేప సాహిత్యాన్ని సృష్టించే రచయితల గురించి మనకు పేచీయే వద్దు

            కోణంలో బాధ్యతాయుతంగా చూచినపుడు రచయిత యొక్క సామాజిక పాత్ర చాలా గురుతరమైంది. నేనెప్పుడూ రచనను ఒక పౌర బాధ్యతగా భావించే రాస్తాను నవలైనా, కథైనా.. కవితైనా. అట్లా స్వీకరిస్తున్నపుడు ప్రతి నిత్యం ఎదురయ్యే అనేక సందర్భాలన్నీ సాహిత్య వస్తువులుగానే కనిపిస్తాయి. తగు ప్రతిభగల సృజనాత్మకత ఉంటే అవి మంచి శ్రేష్ఠమైన రచనలుగాకూడా పాఠకుల మనసుల్లో మిగిలిపోతాయి. ఐతే ఇక్కడ ఒక ప్రాసంగికమైన విషయం కూడా ఉంది. రచయిత యొక్క వృత్తి కూడా అవ్యక్తంగానే రచయితయొక్క రచనల్లో వస్తువుగా చొరబడి వర్థిల్లుతూంటుంది. ఉదాహరణకు మంచి కథా రచయితలైన రా.వి శాస్త్రి, బీనాదేవి కథల్లో వాళ్ళిద్దరూ న్యాయవాద వృత్తిలో ఉండడంవల్ల చాలా కోర్ట్ కథలే వస్తువులుగా దర్శనమిస్తాయి.

            నేను ఇంజనీరింగ్ కాలేజ్లలో పనిచేసిన ప్రొఫెసర్ను కావడం వల్ల ఇంజనీరింగ్ విద్యా రంగంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు జరిపే దోపిడీ గురించి ఎన్నో కథలు రాశాను. క్షుణ్ణంగా తనకు తెలిసిన విషయం గురించే సాధికారికంగా రాయడం రచయిత యొక్క నిజాయితీని కూడా తెలియపరుస్తుంది.

6.         'సృజనలోకం'   సందర్భంలో వచ్చింది?

             2004 లో నాకు ఒక తీవ్రమైన వెన్నెముక యాక్సి్డెంట్ జరిగింది. అప్పుడు మన వరంగల్లు శివనగర్ లో ఉంటూ ప్రజావైద్యునిగా మంచిపేరున్న డా. లంకా శివరామప్రసాద్ గారు అప్పటికే నగరంలో ప్రసిద్ధులైన సాహిత్యకారులు డా. అంపశయ్య నవీన్, వి.ఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, డా. నేరెళ్ళ వేణుమాధవ్, ఆచార్య కోవెల సుప్రసన్న గార్లను సంప్రదించి వాళ్ళ ఆశీస్సులతో ఒక సాహిత్య సంస్థ 'సృజనలోకం' ను హోటల్ రత్న లో ఆవిష్కరించి డా.ప్రసాద్ రాసిన ఆరు పుస్తకాలను వెలువరించారు. తర్వాత నన్ను కూడా సంప్రదించినపుడు.. సంస్థకు ఒక చురుకైన రూపమిద్దామని అనుకుని కార్యాచరణకు పూనుకున్నాం. ఏదో కొత్త సాహిత్య వాతావరణాన్ని వరంగల్లు మహానగరంలో ఆవిర్భవింపజేయాలన్నది ఆనాటి సంకల్పం.

            శివరామప్రసాద్  ఒక అసాధారణమైన సాహిత్యకారుడు

7.         మీరు వేసిన ' కవితా వార్షిక ' గురించి చెప్పండి. సందర్భంలో ఒక ప్రధాన సంపాదకుడిగా మీ  అనుభవాలు కూడా చెప్పండి.

           ఇప్పుడే చెప్పినట్టు 2004 లో 'సృజనలోకం' ఆరంభమైన తర్వాత ఒక విలక్షణమైన నిరంతర సాహిత్య కార్యక్రమమేదన్నా మొదలుపెడ్దామన్న ఆలోచనలోనుండి 'కవితా వార్షిక' పుట్టింది. ఏమిటంటే.. ఏడాదికా ఏడాది తెలుగు పత్రికల్లో వెలువడ్తున్న వచన కవిత్వాన్ని సేకరించి అందులోనుండి చిక్కని కవిత్వంతో పరిపుష్టమైన కవితల్ని ఎంపిక చేసి, వాటిని అంతర్జాతీయ స్థాయిలో చదివి దాచుకోదగ్గ విధంగా వార్షికలను 'సృజనలోకం' ప్రచురించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం. అందుకు డా. అంపశయ్య నవీన్ గౌరవ సంపాదకులుగా, నేను ప్రధాన సంపాదకులుగా, వి ఆర్. విద్యార్థి, డా. లంకా శివరామ ప్రసాద్పొట్లపల్లి శ్రీనివాసరావు, శ్రీమతి నెల్లుట్ల రమాదేవి సంపాదకులుగా ఒక సంపాదక వర్గం వెన్వెంటనే ఏర్పడి చాలా క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో ప్రతి సంవత్సరం మార్చ్ మూడవ ఆదివారం నాడు ఉదయం 11.00 గంటలకు సంవత్సరపు 'కవితా వార్షిక' సంచికను ఆవిష్కరింపజేయాలని నిర్ణయించి మొదటి సంపుటి 'కవితా వార్షిక- 2004' ను  20-03-2004 వరంగల్లులో 80 మంది కవుల కవితలతో ఘనంగా అంతర్జాతీయ స్థాయిలో డా. నందిని సిద్ధారెడ్ది గారిచే ఆవిష్కరింపజేశాం. అదే విధంగా 19-03-2005 99 మంది కవుల కవితలతో 'కవితా వార్షిక - 2005' ను డా.ఎన్.గోపి గారు ఆవిష్కరించారు. 92 మంది కవితలతో 'కవితా వార్షిక- 2006' ను 18-03-2006 డా.పి.వరవరరావు ఆవిష్కరించారు. విధంగా 2007, 2008, 2009..మొత్తం 6 సంపుటాలు వెలువడి కవులకు ఎంతో కవిత్వ గౌరవంతో కూడిన ఒక ఆకర్షణగా స్థిరపడింది. ప్రతి సంపుటిలోనూ 'ప్రస్తావన' శీర్షికన ప్రధాన సంపాదకులు సంవత్సరం జరిగిన విశేష విషయాలను విశ్లేషించడం, 'సమాలోచన' శీర్షికన ఒక సీనియర్ కవి చేత విశేష అంశంపై లోతైన వ్యాసాన్ని ప్రచురించడం, తర్వాత 'కవితా గోష్ఠి' శీర్షికలో 'కవిత్వానువాదం' వంటి సంక్లిష్ట విషయం పై ప్రసిద్ధ అనువాదకులతో ఒక గోష్టిని ఆన్ లైన్ లో నిర్వహించి మొత్తం చర్చను అచ్చు వేయడం.. తర్వాత వరుసగా ఎంపిక చేయబడ్ద కవితలను హుందాగా ప్రచురించడం జరుగుతూ వచ్చింది.    

            ఐతే ప్రచురణ ఎంత గౌరవ చిహ్నంగా మారిందంటే.. సంవత్సరం 'కవితా వార్షిక' సంపుటిలో తమ కవిత ఎంపిక కాకుంటే కవులు నొచ్చుకునేవారు. అచ్చయితే కవులు పొంగిపోయేవాళ్ళు.  

            ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నపుడు ప్రత్యేకంగా ఉద్యమ కవితల తో 'కవితా వార్షిక- 2009' ని వెలువరించాం

            ఇతే పోనూ పోనూ కవిత్వాన్ని ఎంపిక చేయవలసిన సందర్భంలో.. నానాటికి వస్తున్న వచన కవిత్వం ఆశించిన స్థాయిలో తగు సంఖ్యలో కవితలు పరిపుష్టంగా రావడలేదనీ, తక్కువ సంఖ్యలో వస్తున్న ఉత్తమ కవితలతో ఇన్ని వ్యయప్రయాసలకోర్చి 'వార్షిక' లను వెలువరించడం అంత సంతృప్తికరంగా అనిపించక సంపాదకవర్గం  2009 తర్వాత వార్షికల ప్రచురణను నిలిపివేసింది.

            ఐతే.. ఆరు సంచికలూ విజ్ఞులైన పెద్దల, అకడమీషియెన్స్ యొక్క ప్రశంసలకు నోచుకుని ఒక ప్రత్యేక గుర్తింపును పొందాయి. వీటిపై కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఎం.ఫిల్ లు, డాక్టరేట్ పరిశోధనలూ కూడా జరిగాయి.  

8 .        వరంగల్ సాహిత్య వాతావరణం ప్రత్యేకత ఏమిటి? ప్రత్యేకత మీ సాహిత్యంపై చూపిన ప్రభావం ఎలాంటిది ?

           ఆదికవి పాలకుర్తి సోమనాథుడు పుట్టిన ఓరుగల్లు పుణ్యభూమిపై జన్మించడమే జన్మతః ఒక అదృష్టం. పుట్టుకతోనే మహాకవి బమ్మెర పోతన, కాకతీయ మహోన్నత సాంస్కృతిక వైభవం తదాదిగా అత్యంతాధునికులైన వానమామలై వరదాచార్యులు, కాళోజీ, సుప్రసన్న, విప్లవకవి వరవరరావు వంటి ఉద్ధండులకు చెందిన నేలపై ప్రభవించడమే నాకు ఒక వారసత్వంగా లభించిన గొప్ప వరం. ఇక్కడ శ్వాసిస్తూండడమే ఒక సుకృతం. వీళ్ళలో ద్విపద వంటి అత్యాధునికమైన ప్రక్రియను కనిపెట్టి జాను తెలుగు భాషతో నాట్యమాడించిన బసవపురాణ కర్త సోమనాథుడైతే.. తెలుగు ఇంటింట 'ఆంధ్ర మహా భాగవత' పద్యాలతో అక్షర పరీమళాలను గుబాళింపజేస్తూ దశదిశలను సంపన్నం చేసినవాడు పోతన. అందువల్ల ఇక్కడి ప్రతి వ్యక్తిలోనూ అజ్ఞాత సాహిత్య అభినివేశం గుప్తమై ఉంటుంది. అనేక భావజాలాలు, అనేకానేక ఆలోచనలు, భిన్న విభిన్న పదప్రయోగాలు జరిగి గొప్ప సాహిత్య సంపదతో తులతూగిన మట్టి ఇది. ఇక్కడినుండే 'నేనుకూడా' అన్న భావనే ఒక మహత్తర యోగ్యత నాకు.

            చిన్నప్పుడు.. నాతోపాటు జీవించి ఉన్న ప్రత్యక్ష సాహిత్య సంపద కాళోజీ, కోవెల సంపత్కుమార, కోవెల సుప్రసన్న, తెలుగు నవలకు అందమైన ముఖచిత్రంగా భాసిల్లే డా. అంపశయ్య నవీన్, తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అనేకసార్లు జైలు జీవితాన్ననుభవిస్తూ నమ్మిన సిద్ధాంత ఆచరణలో 'గాంధీ' తో సమానుడైన విప్లవకవి వరవరరావు .. ప్రపంచ ప్రఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ళ వేణుమాధవ్.. పత్రికా రంగ ప్రథముడు 'జనధర్మఎం.ఎస్ ఆచార్య..  వీళ్ళందరితో కలిసి జీవించడం నాకు సంక్రమించిన  ఆజన్మ సుకృతం. నేపథ్యంతో మొదలైంది నా సాహిత్య జీవితం.    

              అనుక్షణం  నాకు కరదీపికలుగా దారిచూపే మహనీయుల వారసునిగా బాధ్యతాయుతంగా ఒక విలక్షణ సృజన చేయాలె అన్న అంతఃభావన సరియైన దారిలోనే నన్ను నడిపిస్తూ వచ్చింది ఇన్నాళ్ళూ.. యాభై ఏళ్ళూ. అందువల్లనే నాదైన ఒక ప్రత్యేక గుర్తింపు గలిగి తలెత్తుకుని చెప్పుకోగల రచనలనే చేస్తూ వచ్చాను ఇన్నాళ్ళూ. నాపై వీళ్ళందరి ప్రభావమూ, ప్రేరణ ఉంది నిరంతర అంతఃజ్వలనగా

9.         ప్రస్తుతం వరంగల్ సాహిత్య వాతావరణంను ఎలా చూస్తున్నారు. తెలంగాణ సాహిత్యంలో రావలసిన మార్పులు ఏమైనా ఉన్నాయా

        వరంగల్లు మహానగరం తన సహజ సాహిత్య వారసత్వ వైభవాన్ని కాపాడుకుంటూ వస్తూనే ఉంది. కాళోజీ తర్వాత జాతీయ స్థాయిలో అనేక ప్రత్యేక గుర్తింపును సాధిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ వంటి అత్యున్నత స్థాయి పురస్కారాలను హస్తగతం చేసుకుంటూ డా. అంపశయ్య నవీన్, ఆచార్య ఎస్.లక్ష్మణమూర్తి, ఆచార్య కాత్యాయనీ విద్మహే, అచార్య కోవెల సుప్రసన్న, మహావక్తలు పి.వరవరరావు, నెల్లుట్ల వేణుగోపాల్, వరంగల్లు నగరానికి మొట్టమొదటిసారి ప్రభుత్వ 'స్వర్ణ నందిని  నడిపించుకుని తెచ్చిన, అనేక అంతర్జాతీయ వేదికలపై వరంగల్లు స్వరాన్ని వినిపిస్తున్న రామా చంద్రమౌళి, సాహిత్య విరించి, మంచి వక్త జి.గిరిజామనోహరబాబు, కళాప్రపూర్ణ నేరెళ్ళ వేణుమాధవ్.. తనదైన ఒక ప్రత్యేక కవిత్వ పంథా కలిగి ఉన్న ప్రపంచ స్థాయి కవి వి ఆర్. విద్యార్థి.. కాళోజీ పురస్కార గ్రహీత, ఉత్తమశ్రేణి పరిశోధకులు ఆచార్య బన్న అయిలయ్య, తనదైన విలక్షణ చూపుతో అద్భుత వచన రచనలు చేసిన పి.చంద్.. వీళ్ళందరూ ఇప్పటి తరపు అక్షర విజేతలు. ఇక పర్తమాన రెండవ తరం ప్రతినిధులుగా వారసత్వాన్ని భుజాలపై మోస్తూ ప్రయాణం కొనసాగిస్తున్న వాళ్ళు అనిశెట్టి రజిత, పొట్లపల్లి శ్రీనివాసరావు, నెల్లుట్ల రమాదేవి, సిరాజుద్దీన్, కోడూరి విజయకుమార్, అన్వర్, డా.పసునూరి రవీందర్, బిల్లా మహేందర్, బండారి రాజ్కుమార్, నందకిశోర్, బాలబోయిన రమాదేవి, దేవనపల్లి వీణావాణి, సింగరాజు రమాదేవి. పాత్రికేయ అక్షరధారులు గుండెబోయిన శ్రీనివాస్, శెంకేశి శంకరరావు, నూరా శ్రీనివాస్, వంగాల సంపత్రెడ్డి, సుధాకర్, పందిళ్ళ అశోక్కుమార్, డా.పాతూరి రఘురామయ్య తదితరులు. వీళ్ళు చేస్తున్న నిరంతర కృషి గణనీయమైంది. తెర వెనుక ఉన్న మరో సాహిత్యవేత్త , నడుస్తున్న ఎన్సైక్లోపీడియా నాగిళ్ళ రామశాస్త్రి. సినిమా రంగంలో గీత రచయితలుగా వరంగల్లు కుసుమాలుగా పరిఢవిల్లుతున్నవాళ్ళు చంద్రబోస్, డా. కందికొండ.         

             ఐతే.. వరంగల్లు నగరానికి చెంది వరంగల్ ఔన్నత్యాన్ని నగర సాహిత్య ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై నిరంతరం ధ్వనింపజేస్తూ.. అతున్నత స్థాయిలో బహుముఖ గుణాత్మక ప్రతిభను చాటి చెబుతున్నవాడు డా. లంకా శివరామప్రసాద్. ఆయన 'సృజనలోకం' వ్యవస్థాపకులు.. ఇప్పటిదాకా అనన్యసాధ్యమైన 160 విలక్షణ గ్రంథాలను విశ్వసాహిత్యానికి అందించినవాడు. తెలుగులో మొట్టమొదట పోతన విరచిత 'ఆంధ్ర మహా భాగవతాన్ని', ఆది శంకరాచార్య కృత 'సౌందర్య లహరి'ని, మొత్తం 'గ్రీకు' సాహిత్యాన్ని ఒక గుచ్ఛంగా అనువదించి. 'ఫ్రెండ్ ఆఫ్ గ్రీస్' పురస్కారాన్ని గ్రీక్ ప్రభుత్వంచే పొందిన వాడు, విశ్వవిఖ్యాత కవులైన షేక్స్పియర్, వర్జిల్, జాన్ మిల్టన్, గోథె, ఎమిలీ డికెన్సన్, దాంటే, బ్లేక్, ఇట్లా ఎందరివో రచనలను తెలుగులోకి అనువదించి పుస్తకాలను ప్రపంచదేశాలకు అందించినవాడు. మొన్నకు మొన్న 'కోవిడ్- 19' పైన సీరీస్ వెలువరించినవాడు. యమ ట్రెమండస్ వేగంతో పుస్తకాలను ప్రామాణికంగా వెలువరిస్తూ అందర్నీ చకితుల్ని చేస్తున్నవాడు. వేగం, నాణ్యత, ఉత్తమత అతని విలక్షణ లక్షణాలు. వేరే ఎవరికీ సాధ్యం కాని అసమాన ప్రతిభ ఆయనది.

            వీళ్ళుగాక అనువాద రంగంలోనూ, స్వయం ఆంగ్ల రచనల్లోనూ వరంగల్లు ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ప్రసిద్ధులు ఆచార్య కె. పురుషోత్తం, ఆచార్య ఎం. దామోదర్రావు, ఆచార్య మిట్టపల్లి దామోదర్, డా. పాలకుర్తి దినకర్. వీల్లందరు తరం వరంగల్లు సాహిత్య వారసులు.. విజయదీపికను మోస్తూ పరుగెత్తుతున్నవాళ్ళు.

            ముందే చెప్పినట్టు వరంగల్లు కవులూ, రచయితలూ ఆదినుండీ ఎవరికివారు తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. సాహిత్య వస్తువు ఎంపిక, దాన్ని ఉత్తమంగా వ్యక్తీకరించే స్వంత గొంతు, భిన్నమైన శైలి, రూపంలోనూ, సారంలోనూ, సామాజిక స్పృహలోనూ స్థానిక జనసామాన్యుల సమస్యలను ప్రస్తుతించే బాధ్యత.. వీటివిషయంగా అసమాన ప్రతిభను చూపుతూ వచ్చారు. కోణంలో వర్తమాన యువరచయితలు కేవలం శుద్ధ వచనాన్ని ఒక పోలీస్ రిపోర్ట్లా కుప్పబోస్తున్నరు తప్పితే ఒక ప్రత్యేకమైన వ్యక్తీకరణ భిన్నత గురించి పట్టించుకోవడం లేదు. ఇక కవిత్వ విషయంగా చిక్కదనం కోల్పోతూ కొన్నిసార్లు వచన వాక్యాలను విరిచి పేర్చినట్టుగా ఉంటున్నాయి. తరం  మనసుపెట్టి సృజన కార్యాన్ని నిర్వహిస్తూ మనదైన స్వంత గొంతును వృద్ధి పర్చుకోవాలె.

10.       అభివృద్ధి పేరుతో జరుగుతున్న వనరుల విధ్వంసంను తెలంగాణ సాహిత్యం ఎలా ఎత్తిపట్టింది.

       1991 తర్వాత ప్రపంచాన్ని కబళించి వేస్తున్న ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటైజేషన్ ఉప్పెన సకల దేశాలపై మహోధృత దాడి చేయడం ప్రారంభించిన తర్వాత ఒక్కసారిగా వ్యాపార శైలి అంతా 'దోపిడి' కి మారుపేరుగా రూపు దిద్దుకుంది. దురదృష్టవశాత్తు అన్ని ప్రపంచ దేశాలూ కార్యంలో పాలు పంచుకుంటూ 'అభివృద్ధి' పేర వనరులనూ, ప్రజలనూ, సకల సామాజిక సంపదలనూ దోచుకుని మోసం చేయడం మొదలుపెట్టినై. దీనికి అంతు అంటూ లేకుండా.. ప్రజలు దోచుకునేవారు, దోచుకోబడేవారు గా విడిపోయారు. ప్రజా సంక్షేమ పథకాల పేర ప్రభుత్వాలు ఓటర్లకు బహిరంగ లంచాన్ని ఇవ్వడం నేర్చుకున్నారు. రాజకీయాల్లో పూర్తిగా అనైతికత, నిస్సిగ్గుతనం ప్రబలిపోయి రాజకీయ వ్యభిచారం మొదలైంది. వీటి ఫలితంగా 135 కోట్ల మందికి చెందిన మన దేశ సంపదంతా కేవలం పదిరవై మంది కార్పోరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రధానంగా ఒక దేశ ప్రధాన ప్రజా రంగాలైన విద్య, ఆరోగ్యం, రవాణా వ్యవస్థలు పూర్తి అవినీతి రంగాలై జనాలను జలగల్లా పట్టిపీడిస్తూంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. దీనిక్కారణం అప్రత్యక్షంగా ప్రభుత్వాలే దోపిడీదారులుగా మారడం.

          అంశంపై నేను దాదాపు ఇరవై ఐదు కథలూ, ఏడు నవలలూ రాశాను. ఎంతో కవిత్వం వెలువరించాను. నా సహచర రచయితలు కూడ స్పృహతో దిక్కుమాలిన అభివృద్ధిని నిరసిస్తూ విపులంగా రాశారు. ఐతే స్థితి ప్రభుత్వాలు మాత్రమే తలుచుకుంటే ప్రక్షాళన ఔతుంది తప్ప అన్యధా కాదు. ఇప్పుడు 'కరోనా' మహమ్మారి ప్రపంచ దేశాలను మృత్యు గర్భంలోకి తోసుకుపోతూంటే.. విచక్షణా, బాధ్యతా లేకుండా ' తెలంగాణ సర్కార్ ' పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రక్క తెలుగు రాష్ట్రంలో చక్కని ప్రశంసనీయ చర్యలు ప్రజోపయోగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు 'ఎప్పటికెయ్యది ప్రస్తుతమో.. అప్పుడు పనిని తక్షణం చేపట్టకుంటే ' ఇట్లనే జనం అనాధలైపోతరు. దేశ నేలపైనుండి వందల గుట్టలను కబళిస్తూ రోజుకు వందల నౌకల నిండా గ్రానైట్ ను చైనాకూ ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్న ఇక్కడి మనుషులూ, ఇసుక దొంగలూ, మట్టి, బొగ్గు, కలప, ఇతర ప్రకృతి వనరుల దొంగలందరూ ఇక్కడి ప్రభుత్వాలేప్రజలు ఇంటి దొంగల భరతం పట్టనంత కాలం ఇదింతే. దోపిడీ ఇంతే.

11.       ప్రస్తుతం వెలువడ్తున్న సాహిత్యం ప్రజల ఆకాంక్షలను వ్యక్తపరుస్తున్నదా ?

         ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న. అసలు రచయితలందరికీ ప్రజల గురించీ, ప్రజల ఆకాంక్షల గురించీ శ్రద్ధ ఉండదు. అనేకానేక కోణాల్లో వ్యక్తులు జీవితాన్ని దర్శిస్తూంటారు. కాలక్షేప వ్యాపకంగా, వినోద ప్రధానంగా, ఏవేవో అవార్డ్ లను ఆశించి వాటికనుగుణమైన పద్ధతిలో రాస్తూ.. ఒక స్వంత నడక అని ఏదీ లేకుండా గాలివాటమైపోతూ.. తను ఎవరికోసం.. ఎందుకు రాయాలో కాకుండా.. పత్రికవాడో ' విధంగా రాయడి.. దాన్ని అచ్చేస్తాం.. డబ్బుకూడా ఇస్తం' అంటే వాడికి కావలసినట్టు అమ్ముడుబోయి రాయడం.. ఇట్లా రకరకాలుగా చాలా మందికి స్వంత వ్యక్తిత్వం అని ఒకటుండదు. అంతా గాలివాటం వ్యవహారమే. అది వ్యాపార, నిష్ప్రయోజన సాహిత్యం. అది మఖలో పుట్టి పుబ్బలో అంతరించి పోతుంది. వాళ్ళు చరిత్రకెక్కరు. కాని కొందరు ఒక కాళోజీ, వరవరరావు వంటివాళ్ళు ప్రజా రచయితలు. వాళ్ళకు ప్రజల కష్టాలే