కథలు

కథలు

దిద్దుబాటు 

పెదమామ కిషన్ చనిపోయాడని ఫోన్ వచ్చింది. ఆ మాట వినగానే "పెద్దబాపూ ఎంతపని జేస్తివే? అప్పుడే నీకు అవుసు మూడినాదే" అంటూ మంజుల గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. ఎనిమిది, పదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు అమ్మ ఏడుస్తోందని వాళ్లు కూడా శోకం పెట్టారు. వాళ్లను చూస్తూ రఘు, రామ్ పైకి కన్నీళ్లు కనిపించకుండా బాధను అదుముకుంటున్నారు. రామ్ భార్య సుజిత కూడా పసివాణ్ణి ఎత్తుకుని తోడి కోడలు పక్కన చేరి ఓదార్చుతోంది. ఇల్లంతా ఏడుపులతో గొల్లుమంటోంది. సుజిత పక్కనే కూర్చున్న ఐదేళ్ల కుమార్తె లలీ ఏమీ అర్థం కాక అటూ ఇటూ బిత్తర చూపులు చూస్తోంది. ఇంట్లోని ఏడుపుల చప్పుడు వాడకట్టు అంతా వ్యాపించింది. దీంతో ఇరుగుపొరుగు అమ్మలక్కలు ఏమైందంటూ వచ్చి ప్రశ్నిస్తున్నారు. "మా పెద్దమామ కాలంజేశిండు" అని వాళ్లకు రఘు సమాధానం చెప్పిండు. "ఊకో బిడ్డా.. కిషన్‌కు అప్పుడే నూరేండ్లు నిండినయా.. నా కండ్లముంగటి పోరగాడు. లారీ నడిపిచ్చి నడిపిచ్చి కిడ్నీలు ఫెయిల్ చేసుకున్నడు. శిన్న బిడ్డె లగ్గమన్న సూడకపాయె పోరడు" అంటూ మంజులను హత్తుకుని శోకం పెట్టి ఏడుస్తోంది మేదరి నర్సమ్మ. ఆమెను మరింత గట్టిగా పట్టుకుని మంజుల వలవలా ఏడుస్తోంది. తన కొంగుతో మంజుల కన్నీళ్లు తుడుస్తూ "ఊకోయె పోరీ.. ఎప్పటికున్న ఎవలమైన పోవల్శిందే" అంది. తొంభై ఏళ్లుంటాయి నర్సమ్మకు. తన పెద్దకొడుకు, కిషన్ ఒకటే తోటోల్లు అనేది. "బతకవోయిన ఊర్లనే సందం జేశెటట్టున్నరు గదా" వెక్కుతూ అడిగింది రఘును చూస్తూ. అవునన్నట్టు తలూపాడు రఘు. 

"ఈడ మాయిముంతను ఇడ్సవెట్టి పోయి బతకవోయిన జాగలనే ఇంత ఇల్లు కట్టుకున్నడు గదా.. ఆడనే బొందవెడ్తరు. కనీ సూశినవా మీ అవ్వ సచ్చి యాడాది తిర్గకుంటనే వీడు పాయె. ఏం సూశిర్రని పోరగాండ్లు అప్పుడే నూరేండ్లు నిండినయి" అంటూ మళ్లీ ఏడుపందుకుంది నర్సమ్మ. గోపాల్ పేట్ నుంచి ఎల్లారెడ్డికి పోవాలిప్పుడు. రామ్ ఫోన్‌లో కిరాయికి ఉమ్నీ మాట్లాడుతున్నాడు. సాయంత్రం సందం అని చెప్పారు. అరగంట జర్నీ కాబట్టి బయలుదేరాల్సిందే. పది నిమిషాల్లోనే ఉమ్నీ వచ్చి ఇంటి ముందు ఆగింది. అందరూ అవే అవతారాల్లో వెళ్లి ఉమ్నీలో కూర్చున్నారు. ఉమ్నీ కదిలింది. 

* * * 

పసితనంలోనే నాన్నను పోగొట్టుకున్న రఘు, రామ్‌లకు పెద్దమామ కిషనే తండ్రి అంతటి ప్రేమను పంచాడు. ఏ పండగ వచ్చినా వాళ్ల పిల్లలకు సరిగ్గా తమకూ కొత్తబట్టలు తెచ్చేవాడు. తన చెల్లెలు భర్తను పోగొట్టుకుని పుట్టింటికి వచ్చి కూలీనాలీ చేస్తూ అష్టకష్టాలు పడుతోందని పెద్దన్నగా కిషన్ అండగా నిలిచాడు. చెల్లెలి పిల్లలు బాధ్యతను కూడా తీసుకున్నాడు. చదువులు, పుస్తకాలు, బియ్యం, ఉప్పూకారం ఇలా సకలం కిషనే సమకూర్చాడు. జీవితం అనే సినిమాలో రఘు, రామ్ చూసిన మొట్ట మొదటి హీరో కిషన్. యుక్త వయసులో ఉండగా కిషన్ మెలితిప్పిన మీసాలతో ముఖంలో రోషం ఉట్టిపడేది కానీ, కొండంత ప్రేమ మయుడు, సముద్రమంత విశాల హృదయం కలవాడు. లారీ డ్రైవర్‌గా కిషన్‌కు ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో మంచి పేరు ఉంది. లారీ డ్రైవర్ అనగానే బీడీలు తాగుతారని, మద్యంలో జోగుతారని, ట్రిప్పుకు వెళ్లిన చోటల్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని ఒక ప్రచారం ఉంది. కానీ కిషన్ ఒక్క దురలవాటులేని నికార్సయిన మనిషి. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండో అమ్మాయి సరిత మినహా అందరి పెళ్లిళ్లు చేశాడు. ఎల్లారెడ్డి టౌన్ కావడంతో తన లారీ పని అక్కడ బాగా సాగడం, పిల్లల చదువూ బాగుండటంతో అక్కడే సెటిల్ అయిపోయారు. గోపాల్ పేట్‌లో ఉన్న ఇల్లును చెల్లెలి కోసం వదిలేశాడు. 

ఎలాంటి అనారోగ్యం లేని కిషన్‌కు ఊరికే కూర్చుని రాత్రింబవళ్లు డ్రెవింగ్ చేసి చేసి మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. ఆ నొప్పులు కొంత కాలానికే ఎక్కువయ్యాయి. మోకాలి చిప్పలు అరిగి పోయాయని డాక్టర్లు మందులు ఇస్తే వాడుతున్నాడు. అయినా తగ్గకుండా మోకాళ్ల నొప్పులు కిషన్‌ని బాగా బాధించాయి. అప్పటికి కొడుకులిద్దరూ పెద్దవారై ఒకరు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా మరొకరు నాన్న సంపాదించిన రెండు లారీల మెయింటెయినెన్స్ చూసుకుంటున్నారు. ఇంతలో కరోనా సోకింది కిషన్‌కు. ఎలాగోలా దానిని ఎదుర్కుని నిలిచాడు కానీ రెండు కిడ్నీలు ఫెయిల్ అవడంతో చాలా నీరసించి పోయాడు. వైద్యానికి శరీరం సహకరించకుండా అయిపోయింది. బాడీ సహకరిస్తే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేద్దామని వైద్యులు చెప్పారు. ఇంతలో కోమాలోకి వెళ్లిపోయి వారం వ్యవధిలోనే కిషన్ తన 60వ ఏట ఈ ప్రపంచాన్ని వీడాడు. అంతకుముందు ఏడాది తన చెల్లెలు రఘు, రామ్‌ల అమ్మ లలిత రోడ్డుప్రమాదంలో చనిపోయింది. 

* * *

పడుకున్నాడేమో అన్నట్టుంది మామయ్య మృతదేహం. "పెద్ద బాపూ" అని శవం మీద పడి లబోదిబోమంటోంది మంజుల. కిషన్ తలాపున సరిత కూర్చుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. రఘు, రామ్ మామయ్యను అలా చూసి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. అక్కడే నిల్చుని మౌనంగా రోదిస్తున్న మామ కొడుకులు సురేష్, మధులను చెరొకరు పట్టుకుని ఏడ్చేస్తున్నారు. ఒక శిఖరం నేలకొరిగినట్టు శాశ్వత నిద్రలోకి జారుకున్న మామను చూస్తుంటే రఘు దుఖ్ఖం ఇంకా కట్టలు తెంచుకుంటోంది. చుట్టాలు, బంధువులతో ఇల్లంతా కిక్కిరిసి పోయింది. ఏడుపులు పెడబొబ్బలతో వాడకట్టు అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. కిషన్ తమ్ముడు, మంజుల నాన్న పండరి, ఆయన భార్య.. వదినను ఓదారుస్తూ ఆమె పక్కన కూర్చున్నారు. మరోపక్క కిషన్ చిన్న చెల్లెలు సరోజ కూర్చుని బాధ పడుతోంది. రఘుకు మామయ్యతో తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుని మరింత ఏడ్చేస్తున్నాడు. ఆఖరి నీళ్లు పోసి కడసారి అందరూ కిషన్ ముఖం చూసి సాయంత్రానికి అంత్యక్రియలు ముగించారు. మామకు చివరగా గుప్పెడు మన్ను సమర్పిస్తున్న రఘు ఆలోచనలన్నీ సరిత గురించే సాగుతున్నాయి. 

* * * 

చీకటి పడుతోంది ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. మంజుల, సుజిత పిల్లలను తీసుకుని వెళ్లి తాము వచ్చిన ఉమ్నీలో కూర్చున్నారు. వెనకాలే రామ్ కూడా వచ్చేశాడు. రఘు సురేష్‌కు వెళ్తున్నానని చెబుతూ భుజం నిమిరాడు. ఆ చర్యకు భావోద్వేగంతో సురేష్ రఘును గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తున్నాడు. "పోయిండు బాపు. మనకు రేపటినుంచి మంచీ చెడ్డా చెప్పే పెద్ద దిక్కు పాయె బావా" అంటున్న సురేష్ కళ్లు ఏరుధారలు అయ్యాయి. రఘు కూడా దుఖ్ఖాన్ని ఆపుకోలేకపోయాడు. వాళ్లని చూసి మధు కూడా వచ్చి పట్టుకుని ఏడుస్తున్నాడు. అక్కడికి వచ్చిన పండరి వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. "ఊకోండ్రి బేటా అందరం పోయెటోళ్లమే. ఎవరు ఈడ ఎల్లకాలం ఉండనీకి రాలే. ఎనకా ముందు పోయెటోళ్లం" అంటున్న చిన్న మామ మాట విని రఘు తనని తాను సంభాళించుకుని, సురేష్, మధులను ఓదార్చ సాగాడు. ఇంతలో రఘు చూపు వేరే గదిలో నిల్చుని తననే తీక్షణంగా చూస్తున్న సరిత మీద పడింది. ఆమెను చూడగానే రఘు షాక్ అవుతూ మరింత ఉద్వేగానికి లోనయ్యాడు. సరిత రెప్ప కూడా కొట్టకుండా తననే చూస్తోంది. ఏడ్చి ఏడ్చి సరిత ముఖం అంతా పీక్కుపోయినట్టుగా అయింది. 

ఆ కళ్లలో తన మీద వీసమెత్తు కూడా తరగని ఆరాధనా భావం. తనను గుండెలకు హత్తుకుని ఇన్నేళ్లుగా తన మనసులో పేరుకున్న భారాన్నంతా చెప్పేసుకుని బోరున విలపించాలని.. తనకోసమే దశాబ్దాలుగా ఎదురు చూసీ చూసీ అలసిపోయిన కళ్లలా.‌. ఆమె కళ్లను చదవగలిగే ఏకైక వ్యక్తి రఘు మాత్రమే. సరిత తనకు ఏదో చెప్పాలనుకుంటోందనేది రఘుకు ద్యోతకమైంది. మరదలే కదా అని చనువుగా వెళ్లి మాట్లాడలేడు. వారి మధ్య ఇప్పుడు ఓ పెట్టని కోట లాంటి మౌనం నిలుచుంది. అది ఎప్పుడు కట్టలు తెంచుకుంటుందో తెలియని సందిగ్ధంలో ఉన్నారు ఇద్దరు. రఘు అటు ఇటు ఎవరైనా చూస్తారని చూపులు మరల్చుతూ సరితను మార్చి మార్చి చూస్తున్నాడు. కానీ సరిత మాత్రం అలాగే ఉంది. తనిప్పుడు పెళ్లి అయి ఇద్దరు పిల్లల తండ్రి. పదేళ్లు గడిచిపోయింది సరితను తన మనసులోంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు గానీ, తియ్యలేక విఫలం అవుతున్నాడు. తన మనో ఫలకం మీద పచ్చబొట్టులా ముద్రించుకుపోయింది సరిత పేరు, రూపం. ఇంతలో బాపూ అని తన కూతురు చేయి పట్టుకుని పిలిచింది. "మమ్మీ రమ్మంటున్నది బాపూ. పా పోదాం" అంది. "ఆఆ.. పోదాం బేటా" అంటున్న అతని కళ్లు సరిత వైపే లాగుతున్నాయి. అప్రయత్నంగానే కళ్లు వాటికవే సరిత మీద కేంద్రీకృతం అయ్యాయి. సరిత ముఖంలో రంగులు మారుతున్నాయి. దుఖ్ఖం దేవుతుంటే కరువైన కన్నీళ్లు ఆమెకు అరువు వచ్చాయి. టపటపా కన్నీళ్లు రాల్చుతూ తన ఊబకాయం వైపు చూసుకుంటూ, తనని తానే అసహ్యించుకుంటూ ముఖం తిప్పుకుని లోపలి గదిలోకి విసురుగా వెళ్లిపోయింది. ఆ చర్యకు రఘు మనసు చివుక్కుమంది. లాగిపెట్టి చెంప ఛెళ్లుమనింపించారెవరో అన్నట్టైంది.

తన జీవితం ఏంటి? శాసించడానికి నువ్వెవరు? తన జీవితం గురించి ఆలోచించే నాన్న వెళ్లిపోయాడు.. రేపటినుంచి తానేంటి? అమ్మ కూడా ఏదో ఒకరోజు పోవాల్సిందే.. అందరి పెళ్లిళ్లు అయిపోయి పిల్లలున్నారు. తన బతుకింక వారి పంచ మీద బల్లేనా??? అన్న ప్రశ్నలు సరిత గొంతులోంచి విన్నట్టుగానే ఉంది రఘుకు. కాళ్లకింద నేల కంపించినట్టు అయింది. ఇంతలో "బాపూ బాపూ" అంటూ చేయి ఊపుతున్న కూతురి వైపు చూశాడు. అంతే తన భావం మారిపోయింది. కూతురి వైపు ప్రేమగా చూస్తూ "పా బేటా" అని నడుస్తున్నాడు. సురేష్, మధులకు, చిన్న మామకు వెళ్తున్నానని చెప్పి భారంగా కదిలాడు రఘు.. బాధ్యతల గుండెను ప్రేమ తొలుస్తుండగా. ఉమ్నీ వచ్చేలోపు రఘు ఆలోచనలు వేగంగా మారుతున్నాయి. కూతురి చేయిని గట్టిగా పట్టుకుని మరో చేత్తో వేళ్ల మీద తనలోతాను ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. కూతురు కూడా తన చేయిని గట్టిగా పట్టుకున్నట్టు అనిపిస్తోంది. అయినా మనసు పందిరి గుంజరు పుచ్చు పురుగు తొలిచినట్టు తొలుస్తోంది. ఉమ్నీలో కూర్చోబోతూ ఆగిపోయాడు. ఏదో గట్టి నిర్ణయం తీసుకున్నట్టు స్వరం పెంచుతూ "రామ్ నువ్వు దిగు ఓసారి" అన్నాడు స్థిరంగా. అందరూ షాక్ అయ్యారు. మంజులను చూస్తూ "మంజుల మీరు బైలెల్లుర్రి. నేను తమ్ముడు పెయింట్ డబ్బాలకు ఆర్డర్ ఇచ్చి వస్తం. వారం తర్వాత మనూర్ల ఎంపీటీసీ ఇంటికి పెయింట్ చేశేది గుత్తకు పట్టుకున్నం గదా.. ఆ కలర్లు ఉన్నాయో లేదో అరుసుకొని వస్తం సరేనా. మల్ల ఈ ఎల్లరెడ్డిల గూడ ఓ ఆర్డర్ వచ్చింది. అది గూడ ఫైనల్ జేసుకుని బయానా తీసుకొని వస్తం" అంటున్న రఘు గొంతులో గాబరాను మంజుల కనిపెట్టింది. తన మూడ్ బాధలో ఉండటంతో మరేం మాట్లాడకుండా సరేనని తలూపింది. 

ఉమ్నీ కదిలింది. పిల్లలకు బై చెప్పారు ఇద్దరూ. రామ్‌కు రఘు ప్రవర్తనలో మార్పును చూసి ఏదో అనుమానంగా ఉంది. "ఏందన్నా.. గిప్పుడు మనకు ఆర్డర్లు ఉన్నయని వదినకు అవద్దం ఎందుకు చెప్పినవు?" భృకుటి ముడివేస్తూ అన్నాడు రామ్. "అంత ఖుల్లంఖుల్ల చెప్తగనీ పా గా గోపాలస్వామి గుడి తంతెల కాడ కూసుండి మాట్లాడుదాం" అంటూ తమ్ముడి చేయి పట్టుకుని గుడి వైపు కదిలాడు రామ్. మామ ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న గుడి ఆవరణలోకి అడుగు పెట్టగానే రఘులోకి పాజిటివ్ వైబ్స్ వచ్చేశాయి. రావి చెట్టు గాలి రివ్వున వీస్తోంది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. రామ్‌కు ఏం అర్థం కావడం లేదు. రఘు కూడా ఎలా చెప్పాలా అని కాసేపు తటపటాయించాడు. కాసేపు మౌనం. తర్వాత రఘు తననితాను సిద్ధం చేసుకుని పూడుకుపోతున్న గొంతును సవరించుకుంటూ "నేను సరితను రెండో పెండ్లి చేసుకుందాం అనుకుంటున్న తమ్మీ " అన్నాడు మరో మాటకు ఆస్కారం లేకుండా. ఒక్కసారిగా ఆ మాట వినగానే రామ్ షాక్ అయ్యాడు. వెంటనే తేరుకుంటూ ఆనందంతో ఉబ్బితబ్బివసాగాడు. "అన్న నిజమా నువ్వు చెప్పేది?" అన్నాడు. "అవున్రా.. మనకు తండ్రి లేని లోటును మరిపిచ్చిన మామకు ఎంతో కొంత చెయ్యల్నని ఈ నిర్ణయం తీసుకున్న" అంటున్న రఘు భుజాలు తడుతూ "శభాష్ అన్నా.. లేటుగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నవు. నువ్వీ పని చేస్తే అమ్మ, మామల ఆత్మలు మస్తు ఖుష్ అయితయి" అనునయంగా అన్నాడు రామ్. "చిన్నప్పటినుంచి సరితకు, నాకు పెండ్లి జేస్తమని అమ్మ, మామ మాట ఇచ్చిపుచ్చుకున్నరు. కానీ ఆ మాట మీద నిలవడలేకపోయిర్రు. ఊర్ల పెద్దల నసలైన ఆ ఇల్లును పోనియ్యద్దని అమ్మ జిద్దు వట్టింది. అప్పుడు మామ పెద్దబిడ్డె లగ్గాన్కి పైసల్లేక ఇల్లు అమ్మల్శిన పరిస్థితి. ఇల్లు అమ్మద్దని అమ్మ అమ్ముతనని మామ మాట మాట పెంచుకున్నరు. నువ్వు ఒకింటికి పోయిందానివి ముండమోశి అచ్చి అన్ల మాలాస్క దినాలె ఉన్నవు. నువ్వు ఎల్లు ఇగ ఆ ఇంట్లకెల్లి అని మనలను బయటకు పంపి మామ ఇల్లు అమ్ముకునే. బయిటోనికి ఎందుకు మనమే కొంటమని మామకు జెప్పినా ఇనక ఇల్లు అమ్ముకునే. అప్పుడు మనం వేరే ఇల్లు కట్టుకుంటిమి. అగో గా ఇల్లు ఆళ్లిద్దరు అన్నాచెల్లెళ్ల నడుమ ఆరని చిచ్చు వెట్టె" గతాన్ని చెబుతున్న రఘు ముఖంలోకి చూస్తూ అవునన్నట్టు తలూపుతున్నాడు రామ్. 

ఈసారి రామ్ అందుకుంటూ.. "ఇల్లు పొడగొట్టిండని అమ్మ మంకుపట్టు వట్టె. నాలుగేండ్లు వాళ్లకు మనకు మాటల్లేవు. నీకు, సరితకు లగ్గం అనే మాటను గూడ తీశి గట్టు మీద పెట్టేశిండ్రు. తప్పు అయింది నన్ను మన్నించి నా బిడ్డెను నీ కొడుకుకు చేస్కో అని మామ ఎంత బతిలిమిలాడినా అమ్మ మచ్చంవోయిన ఇనకపాయె. జిద్దుతోని చిన్న మామ బిడ్డె మంజులను నీకు చేస్కచ్చింది. పాపం సరిత అందరి నడుమల బలిపశువు అయింది" విచారిస్తూ అన్నాడు రామ్. "అవున్రా చిన్నప్పటి సంది ఆడుకునే జాగల, పెద్దగైనంక ఏ ఫంక్షన్ల కలిసినా మేమిద్దరం ఆలుమగలమే అనుకున్నం. ఒకరి మనసుల ఒకోళ్లను దేవుండ్ల లెక్క పూజించుకున్నం. కనీ అమ్మ మాటను జవదాటుడు ఇష్టంలేక మనసు సంపుకొని మంజుల మెడల పుస్తెలతాడు కట్టిన. పిల్లలు పుట్టి వాళ్లల్ల పడి సరితను యాదిమరుస్తున్న. కనీ సరిత ఇంకా నన్ను తన మనసులకెల్లి తీశెయ్యలేదుర. మామ గూడ పంతానికి పోయి బయిటి సంబంధాలు సూశిండు గనీ పిల్ల దొడ్డుగ ఉందని ఎవరు మెచ్చకపాయె. వచ్చినోళ్లంత గదే పేరు పెట్టిర్రు. రోజులు గడిచిన కొద్ది పిల్ల ముదిరిందని ముక్కు ఇరిశిర్రు. ఇప్పుడు నేనే ముప్ఫై ఐదేండ్లకు అచ్చిన. సరిత నాకన్న యాడాదే శిన్నది. మీదికెల్లి ఈ వయసుల రెండో పెండ్లి సంబంధాలు వస్తుంటే మామ మెచ్చకపోయె. నా బిడ్డెను ముసలోల్లకు ఎందుకిస్త అనుకున్నడు. ఇట్ల ఈల్లకు నచ్చుతే వాళ్లకు నచ్చకపోవుడు వాళ్లకు నచ్చితే వీళ్లకు నచ్చకపోవుడుతోని పదిహేనేండ్లు ఇట్ల ఎల్లిపోయినయి" దీర్ఘశ్వాస వదులుతూ అన్నాడు రఘు.

"మ్యారేజ్ బ్యూరోలల్ల గూడ పెట్టిర్రు గదా?" సంశయించాడు రామ్. "అక్కడ గూడ పిల్ల తొంబై ఐదు కిలోల బరువుందని, ఎనిమిదో తరగతే సదివిందని చాలా సంబంధాలు రిజెక్ట్ అయినయి. ఎందుకో సరితకు సదువు అబ్బకపాయె. పాపం సరిత బరువు తగ్గనీకి ఒక్కపూటనే అన్నం తిని కడుపు సంపుకున్నది. పొద్దుగాల్ల ఇన్ని ఓట్స్, మధ్యాహ్నం అన్నం, రాత్రి జొన్న రొట్టెలు తిన్నా మోటుతనం పోకపాయె. మన కాన్‌దాన్ల ఎవరికి అట్ల అంబటి పెయి లేకపాయె. మామ సరిత గురించే బగ్గ పికర్ జేశిండు. తనకన్న చిన్నోళ్లయి అందరి పెండ్లీలు అయి పిల్లలు పుట్టి పెద్దగ గూడ కావట్టె. పాపం ఆడివిల్ల తన నెత్తి మీద అక్షింతలు పడ్తలేవని ఎంత రంది వెట్టకుందో. ఇంట్లకెల్లి కాలు బయటవెట్టదాయె. ఇంకా ఈ పిల్లకు పెండ్లి అయితలేదని, పెండ్లి అయ్యే యోగం లేనట్టుందని లోకం సూటిపోటి మాటలతోని పొడుస్తరని ఇంట్ల కాలు బయటవెడ్తలేదు" రఘు గొంతులో జీర. "అవును అన్న. ఆడివిల్లలు బయటకు చెప్పుకోక లోపటలోపట నవుస్తరు. కొనజాలకు సరిత నీకే రాశిపెట్టినట్టుంది" అంటున్న తమ్ముడి ముఖంలోకి చూస్తున్న రఘు ముఖం చిన్నగా విచ్చుకుంది. జీవితంలో ఏదో సాధిస్తున్నాననే భావం ప్రస్ఫుటమౌతుంది. 

"నాకెందుకో ఇయ్యాల్ల మామ మొకం లాస్టుసారి జూస్తుంటే నాకు మస్తు బాధ అనిపిచ్చిందిర. మనకు ఎంతో జేశిన మామ రుణం తీర్చుకోవాలని మన్ను వోసుకుంట నిర్ణయించుకున్న. అప్పుడేదో మాట పట్టింపులకు పోయిర్రు గనీ అమ్మ ఎన్కశీరి మా విషయంల తప్పు జేస్తినని మస్తు కుదెవడ్డది. కనీ, అప్పటికే నా లగ్గం అయిపాయె. తప్పు దిద్దుకునే ఛాన్స్ లేదని అమ్మ బాధవడె. ఇయ్యాల్ల కోపాలు రేపు ఉండయి. కోపంల ఏ నిర్ణయం తీసుకోవద్దని గిందుకే అంటరుగావచ్చు. మామ గూడ నన్ను అల్లునిగ పొందకపోతినని శాన బాధవడ్డడు. కనీ ఏం జేస్తం అంత మన కర్మ అంతే" ముభావంగా అన్నాడు. "పెద్దలు జేశిన తప్పును పిల్లలమైన మనం దిద్దుబాటు జెయ్యలంటవ్?" రామ్ ప్రశ్నకు అవునన్నట్టు తలూపాడు రఘు. "తప్పు అనద్దురా.. అది మన పెద్దమనుషుల పొరపాటు అంతే. దాన్ని మనం దిద్దాలంతే" అంటున్న రఘును ఓ మహానుభావుడిని చూస్తున్నట్టు చూస్తున్నాడు రామ్. ఇంతలో ఓ అనుమానం కలిగింది. "అన్నా అంత మంచిగానే ఉంది గానీ.. సరిత మనసుల ఏముందో తెల్సుకోకుంట మనకు మనం ఇట్ల ఏకపక్ష నిర్ణయం తీసుకునుడు కరెక్ట్ కాదేమో. ఇన్నేండ్లు గడిశిపోయినయి గావట్టి తనకు నిన్ను రెండో పెండ్లి చేసుకునుడు ఇష్టమో లేదో తెల్సుకోవాలి. మల్ల ఏ ఆడది గూడ తనకు కాబోయే మొగుడు సెకెండ్ హ్యాండ్ ఉండాల్నని కోరుకోదు" అన్నాడు రామ్. "అవును అది కరెక్టే. కనీ సరిత మనసుల నేను ఇంకా ఉన్నరా. తన కండ్ల నిండ నేనే ఉన్నరా" గుండెల్లో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసుకుంటూ అన్నాడు రఘు. రామ్ మళ్లీ అందుకుంటూ "అన్నా నాకు ఇంకో అనుమానం ఎందంటే.. ఈ పెండ్లికి సరిత ఒప్పుకునుడు ఒకెత్తు అయితే వదిన ఒప్పుకునుడు మరొక ఎత్తు. తన భర్తను ఇతర స్త్రీతో పంచుకోవుడు ఏ భార్యా ఒప్పుకోదు. భర్త చేశే పనిల న్యాయం ఉన్నా ఒప్పుకోదు. అండ్ ఇంకో ప్రాక్టికల్ సమస్య ఏందంటే రెండో పెండ్లి చేసుకున్నంత ఈజీ గాదు రెండు ఫ్యామిలీలను లీడ్ జేసుడు. పిల్లలు, ఖర్చులతోని అదనపు భారం పెరుగుతది. మనం మిడిల్ క్లాసోళ్లం. మల్ల ఇల్లు అన్నజాగల చిన్న చిన్న గడ్‌బడ్‌లు జరుగుతుంటయి. అవి పెద్దగ గూడ కావచ్చు. పైగా ఒక భార్య ఉండంగ ఇంకో పెండ్లి జేసుకునుడు చట్టం దృష్టిల తప్పు అయితది. ఇవన్నీ నేను ముందుగాల్లనే ఎందుకు చెప్తున్ననంటే కీడెంచి మేలెంచాలని మన పెద్దమనుషుల ఊకెనే అనలేదు గదా. మీదికెల్లి ఈ లోకం గూడ శితాం పేర్లు పెడ్తది. అంకుల్ వయసుల రెండో పెండ్లి చేసుకున్నడేంది అని ఎక్కిరిస్తరు. నువ్వెందుకు రెండో పెండ్లి చేసుకుంటున్నవో ఈ లోకానికి తెల్వది గదా. ఇంకో సమస్య ఏందంటే సరితోళ్ల అన్నదమ్ములు, మన పెద్దత్తమ్మ ఇట్ల అందరు ఒప్పుకోవాలె. ఎంత సుట్టీర్కం అయినా ఒప్పుకుంటరని నాకు నమ్మకం లేదన్న" కుండబద్దలు కొట్టినట్టుగా అన్నాడు రామ్. తమ్ముడి మాటలు విని ఆలోచనలో పడ్డాడు రఘు. గందరగోళంగా మారింది అతని మస్తిష్కం. 

మళ్లీ మౌనం ఆవహించింది వారి మధ్య. గాలి తెరలుతెరలుగా వీస్తోంది. వారి మనసుల్లో అంతులేని ప్రశ్నలు. కాసేపటి తర్వాత రఘు మాట్లాడుతూ "నువ్వు అన్నయన్ని సైమాటలే. కనీ ఇప్పుడు మనముంగట ఉన్నది ఒకటే తొవ్వ. వేరే సంబంధాలను మనం లెంకి తెచ్చినా వాళ్లు మస్తు ఈర్నాలు తీస్తరు. ఇప్పటికే ఎంతోమంది ఎన్నో పేర్లు పెట్టి సరిత మనసును పొడిశిర్రు. ఆడజన్మల ఇన్ని లోపాలా అని అనుకునేటంత దిగజారింది మన పురుష సమాజం. ఏజుబారు అయిందని ఎవరు చేసుకోరు గూడ. ఇయ్యల్ల రేపు ల్యాత పిల్లలు కావాలంటున్నరు. వాన్ది కర్రె బుడుసు మొకం అయినా అప్సరస కావాలనుకుంటడు. సరిత ఆ స్టేజ్ దాటిపోయింది. గందుకే ఏదేమైనా అందర్ని ఒప్పిచ్చి సరితను నాదాన్ని చేసుకుంటనని నాకు కాన్ఫిడెన్స్‌గ ఉందిరా. నాపేరు మీదనే ఉండిపోయింది గావట్టి ఆల్శమైనా సరే నాదాన్ని చేసుకుంట. నా ప్రేమను పొందుత. మా ఇద్దర్కి అయితేనే జోడి కుదురుతది. ముసలోనికి ఇచ్చిర్రు అని ఎవ్వరు అనరు. ఎందుకంటే ఇద్దర్కి యాడాది వయసే ఓర్పాటాయె" అంటూ అప్పటికప్పుడు ఏదో తోచినవాడిలా టక్కున తన ఫోన్ తీసి పిన్ని నంబర్‌కు ఫోన్ చేశాడు రఘు. "గోపాలస్వామి గుడి దెగ్గర్కి ఒక్కదానివే రా పిన్ని ఎవరికి చెప్పకుంట" అని చెప్పి కట్ చేశాడు. అన్నట్టుగానే పిన్ని సరోజ అరగంట వ్యవధిలోనే వచ్చింది. మెట్లు ఎక్కడం వల్ల దమ్ము ఎగబీలుస్తోంది సరోజ. వరుసకు పిన్నే అయినా సరోజ రఘు కన్నా ఓ పదేళ్లు పెద్దది. కిషన్, పండరి, రఘు వాళ్లమ్మ లలిత తర్వాత చివరగా పుట్టిందామె. రఘు సరోజకి పదేళ్ల వయసు తేడా ఉంటుంది. రఘు పక్కన సరోజను చూస్తే ఎవరైనా అక్క అనుకుంటారు గానీ పిన్ని అనుకోరు. ఇద్దరు అన్నదమ్ములను చూసి ఆమె షాక్ అయింది. "ఏమైందిరా పోరగాండ్లు మీరు గోపాల్ పేట్ పోయిర్రేమో అనుకున్న. సరే గానీ, ముచ్చటేందో చెప్పు. నువ్వు అట్టిగనే నన్ను పిల్వవని తెలుసులే" అంది సరోజ. రఘు ఇందాక రామ్ ముందు చెప్పిందంతా పిన్నికి వివరించి చెప్పేశాడు. అంతా విన్నాక పిన్ని ముఖంలో ఆనందం. "అరే మాకన్న చిన్నోనివి ఎంత సక్కగ ఆలోచించినవుర. పాపం సరిత లగ్గం ఇగ ఈ జన్మకు కాదనుకున్నం గనీ నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నవుర బేటా. పెద్దన్న సచ్చిపాయె.. రేపటి దినం వదిన గూడ వోయేదె. ఒకోల్ల ఎన్క ఒకోళ్లం అందరం పోయెటోళ్లమే. ఇంట్ల పెద్దమనుషులు పోయినంక ఆ పోరి బతుకు అర్వంద్రం అయితదని పెద్దన్న మస్తు పికర్ జేశిండు. సరిత పికరే అన్నకు మాలాసుండె. రేపటికి లగ్గాలు జేస్కున్న అన్నలు చెల్లె అని మంచిగ జూస్తుండచ్చు గనీ.." అంటూ ముఖానికి కొంగు అడ్డం పెట్టుకుని వెక్కసాగింది సరోజ. రఘు, రామ్ ఆమెను ఓదార్చసాగారు.

"ఏ ఆడివిల్ల బతుకైనా చేసుకున్న మొగోనితోనే శింగారం ఉంటది. ఇంటిమీద బెలుగు లెక్కట ఉంటే ఎప్పుడో ఒగనాటిక వదిన ఒగ మాట అంటది. అగో మీ అమ్మను అనలేదా అన్న. ఇంట్ల కెల్లి ఎల్లుమనలే. అక్క గా ఒక్క మాటకాడనే మనసు ఇరగొట్టుకొని సరితను కోడలిగ చేసుకోకపాయె. మొగోని బతుకైనా పెండ్లాం ఉంటేనే మంచిగుంటది. తనకొక మొగోడు, పిల్లలు, ఇల్లు ఉండాలని ఏ ఆడదైన కోరుకుంటది. కనీ బేటా నువ్వు మంచిగ ఆలోశించినవురా. నేను ముంగట నడిశి అందర్ని ఒప్పిచ్చి మీ లగ్గం జేస్త. మంజులను, మా వదినెను అందర్ని ఒప్పిస్త సరేనా" ధీమాగా చెప్పింది సరోజ. ఆమె ఇచ్చిన భరోసాతో వాళ్ల మనసులో ఉన్న గందరగోళం అంతా ఎగిరిపోయింది. మనసులు నిర్మలంగా మారాయి. 

* * * 

కిషన్ పెద్ద కర్మ రోజున చుట్టాలు బంధువులు అందరూ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయాక సరోజ ఈ విషయాన్ని ఇంటి సభ్యుల ముందు ప్రస్తావించింది. తొలుత సురేష్, మధులు తిరస్కరించారు. సరోజ వారికి అర్థం అయ్యే రీతిలో సముదాయించగా ఎట్టకేలకు ఒప్పుకున్నారు. ఇక తానే మధ్యవర్తిత్వం తీసుకుని గోపాల్ పేట్ వచ్చి మంజుల ముందు కూడా చెప్పింది. ఆ మాట విని మంజుల కుప్పకూలిపోయింది. ఇక అప్పటినుంచి తను ఎలాంటి సమాధానం చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉండసాగింది. నిర్ణయం తీసుకోవడానికి తనకు కొంత సమయం ఇవ్వాలనుకుంది సరోజ. మంజుల పిల్లలతోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. ఇక రఘునైతే కొన్ని రోజులు శతృవు కన్నా హీనంగా చూసింది. పిల్లలను తీసుకుని విడిగా నిద్రపోతోంది. తోడికోడలితోనూ ఏదైనా అవసరం ఉంటే తప్ప ఏం మాట్లాడటంలేదు. ఇంట్లో వసపిట్టలా ఉండే మంజుల తీరు నచ్చక రఘు మాట్లాడటానికి ప్రయత్నించాడు కానీ, దగ్గరికెళ్లినప్పుడల్లా గిన్నెలు కింద పారేస్తూ తనతో మాట్లాడొద్దని నిరసన తెలుపుతోంది. దీంతో రఘు ఆమెను మాట్లాడించి ఎందుకు ఇబ్బంది పెట్టాలని మిన్నకుండిపోయాడు. రాత్రుళ్లు నిద్రపట్టక అదే విషయమై మంజుల దీర్ఘంగా ఆలోచించడం రఘు దృష్టిని దాటిపోలేదు. రఘుకు, సరితకు పెళ్లి చేస్తారని తను చిన్నప్పటినుంచి విన్నది. తానే వారి మధ్యలోకి వచ్చానని చాలాసార్లు అనుకుంది. కానీ ఇప్పుడు జీవితాలు మారిపోయాయి. ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతోంది తను. మరోవైపు ఇప్పుడీ విషయంలో మంజుల ఒప్పుకోకపోతే ఏం చేయలేమని రఘు అవే ఆలోచనలతో తన పని చూసుకుంటున్నాడు. అలా మూణ్ణెల్ల కాలం గడిచిపోయింది. 

* * *

ఆ రోజు రఘు సరితకు ఫోన్ చేశాడు. సరిత ఫోన్ ఎత్తి "హలో బావా" అంది. ఓ గదిలో గడియ పెట్టుకుని చిన్నగా మాట్లాడుతోంది సరిత. తన పెళ్లి అయ్యాక సరితతో మాటలు లేవు రఘుకు. ఏవైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు దూరం నుంచే చిన్నగా పలకరించడం అంతే. ఇన్నేళ్లకు రెండో పెళ్లి ప్రస్తావనతో మాట్లాడుతుంటే రఘులో ఏదో అలజడి రేగుతోంది. "ఎలా ఉన్నావ్" అన్నాడు. ఆ ప్రశ్నకు సరిత నుంచి సమాధానం లేదు. కాసేపు మౌనం. "నాకు అనిపిచ్చింది నిర్ణయించుకుని ఇతరుల మీద రుద్దుడు కరెక్ట్ అనిపిస్తలేదు. ఎందుకంటే ఇది జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి. నీకు ఇష్టమైతేనే మన పెండ్లి. మల్ల ఇక్కడ గూడ మీ చెల్లె మంజుల ఒప్పుకోవుడు గూడా ఇంపార్టెంట్" నిదానంగా అన్నాడు రఘు. "నాకు నువ్వంటే మాటలల్ల చెప్పలేనంత ప్రేమ బావా. మన పెద్దోళ్లు మనిద్దరికి పేరు పెట్టినప్పటి సందే నువ్వూ నేను మొగుడు పెండ్లామే అనుకున్న. కనీ విధి ఎంత పని జేశింది సూడు. నువ్వు మంచిగ మంజులను మనువాడినవు, పిల్లలను కన్నవు, నన్ను మరిచిపోయినవు. కనీ నా కర్మనో ఏందోగనీ.. నాకు ఒక్క సంబంధం కాయంగాకపాయె. నాగ్గూడ లగ్గమై మొగోడు, పిల్లలు ఉండుంటే నేను గూడ నిన్ను మర్శిపోద్దునేమో. కనీ ఎక్కడా.. దినాం నిన్ను యాజ్జేస్కుంట కుమిలిపోతున్న. నేనిట్ల ఎందుకు దొడ్డుగైన్నో తెల్వది. నా మోటుతనం సూశి ఎవరు మెచ్చకపాయె. థూ ఏం బతుకని సచ్చిపోదామని గూడ అనుకున్న గనీ ధైర్నం సాలలేదు బావా. నాకంటే చిన్నోళ్లయి పెండ్లీలై పిల్లలు, సంసారం అని ముద్దుగ ఉంటున్నరు. నా తలరాతనే ఆ భగవంతుడు ఎందుకిట్ల రాశిండో అర్థంకాదు" అంటున్న సరిత కళ్లు ఏరుధారలయ్యయి.

రఘు కళ్లు కూడా చెమర్చాయి. తనను ఎలా ఓదార్చాలా అని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. "నన్ను క్షమించు సరితా.. ఆనాడు నేను మా అమ్మకు ఎదురు మాట్లాడి నిన్నే పెండ్లి జేసుకుంటనని గట్టిగ మాట్లాడేదుండె. కనీ అమ్మను నొప్పియ్యద్దని నిన్ను జీవితకాలం నొప్పిచ్చిన సరితా. నన్ను క్షమించు. ఆ తప్పును ఇప్పుడు సరిదిద్దుకుందాం అనుకుంటున్న" బావురుమన్నాడు రఘు. "ఊకో బావా ఏడ్వకు. నువ్వు తప్పు దిద్దుకుంటనని అంటున్నవు గనీ.. మంజులకు నేను అన్యాయం జేశినట్టు అయితది. అది నా కాక బిడ్డె. నా సొంతశెల్లె కన్నా ఎక్కువ. వద్దు బావా నాకోసం పెండ్లాం పిల్లలకు అన్యాయం చెయ్యద్దు. నేను సరోజ అత్త ముంగట ఇదే మాట చెప్పిన" అంది. ఇంతలో బయటి నుంచి "సరితా" అమ్మ పిలిచింది. "ఆ వస్తున్నా అమ్మా.. బావా ఫోన్ పెట్టేస్తున్న. తర్వాత మాట్లాడుత" అంటూ ఫోన్ కట్ చేసింది సరిత. రఘు తల దించుకుని కుమిలిపోతున్నాడు. మనసు కకావికలం అవుతోంది. అటు మంజుల, ఇటు సరితలు నిత్యం మనసులో మౌనయుద్ధం చేసుకుంటున్నారు. 

* * *

రెండో పెళ్లి కాబట్టి ఆడంబరాలకు పోకుండా అతికొద్ది మంది సమక్షంలో రామాలయంలో పెళ్లి జరుగుతోంది. పంతులు మంత్రోచ్ఛారణ చేస్తుంటే సరిత మనసులో తెలియని ఆనందం వెల్లి విరుస్తోంది. సరిత పక్కనే మంజుల ఉండి అన్నీ ఏర్పాట్లు చూసుకుంటోంది. రఘు మార్చి మార్చి సరితను, మంజులను చూస్తున్నాడు. మంజుల ఈ జన్మకు ఒప్పుకోదు అనుకున్నాడు గానీ, ఒప్పుకుంది. మనసులో మంజులకు ఎన్నో థాంక్స్‌లు చెప్పుకుంటున్నాడు. అటు నుంచి చూస్తే సరితకు మంజుల చెల్లెలు అవుతుంది. ఇప్పుడు కొత్త వరసలో సవతి (అక్క) అవుతోంది. అందుకే పెళ్లి బాధ్యత అంతా తానే తీసుకుంది. రఘు మెడలో మూడు ముళ్లు వేస్తుంటే సరిత ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి‌. ఆ తాళిబొట్టును చేత్తో తాకుతూ ఆనందభాష్పాలు కారుస్తోంది. అరుంధతి నక్షత్రం చూడటానికి దంపతులిద్దరూ తల పైకెత్తారు. ఆకాశం నుంచి అన్నాచెల్లెలు (కిషన్, లలిత) ఆనందంతో శతమానంభవతి అని దీవిస్తున్నట్టు ఇద్దరికీ కనిపిస్తున్నారు. "మా అన్నాచెల్లెళ్ల పంతానికి మీరు మంచి ముగింపు ఇచ్చిరు" అంటున్నట్టుగా వినిపిస్తోంది వారికి.

 

----------+++++++++/////

 

 

 

కథలు

ఉడుకోడు (ఎరికిలోల్ల కథలు – 7)

(ఎరికిలోల్ల కథలు – 7)

ఆదివారం ఉదయాన్నే చావు కబురు.ఉడుకోడు చనిపోయాడు.ఊరు ఉలిక్కిపడింది. అసలు పేరు ఎరుకల రామచంద్రుడు అయినా గవర్నమెంటు లెక్కల్లోనే ఆ పేరు. అందరూ పలికేది మాత్రం ఉడుకోడు అనే.

చాలామందికి తెలిసినవాడు, కావాల్సినవాడు, పదికాలాల్లో పదిమందికీ మంచి చేసినవాడు.డెబ్బైఐదేళ్ళు దాటివుంటుంది వయసు. ఎడమచేతికి ఆరువేళ్ళు అతడికి.యస్టీకాలనీ  ఎగువ వీధిలో చివరి ఇల్లు. గుడిసెలో రాత్రి  పడుకున్న వాడు పడుకున్నట్లే పోయాడు.  నిద్రమధ్యలోనే  ప్రాణం పోయినట్లు వుంది. హాస్పిటల్ కు పోనే పోను అని మొండికేసిన వాడు, జన్మంతా ఒక్కసారైనా ఇంజెక్షన్  వేసుకోని వాడు, డాక్టర్ను చూసే పనిలేకుండానే చివరిదినాలు గడిపేసాడు.

చావుకబురు ఇండ్లు, వీధులు, ఊర్లు దాటే పనిలో వుంది.

అసలే పెద్దచావు. పెద్ద కులాల వాళ్ళు , సాటికులాల వాళ్ళు, కింద కులాల వాళ్ళు, పెద్దవాళ్ళు, నడివయసు వాళ్ళు , ఆడవాళ్ళు, మగవాళ్ళు , వీధిలోని వాళ్ళు, ఊరిలోని వాళ్ళు, చుట్టుపక్కల  ఊరి వాళ్ళు, మున్సిపాలిటి మనుషులు, టీచర్లు , ఎవరెవరో ఉద్యోగస్తులు,ఇంకాఎవరెవరో వస్తున్నారు, దండలు వేసేసి దండాలు పెట్టేసి పోతున్నారు. కొంతమంది ఫోటోలు తీసుకుoటున్నారు. ఫోన్లు,  వాట్సాప్ లు, మెసెంజర్ లు , ఫేస్ బుక్ లో ఆయన ఫోటోలు ఏవేవో సమూహాల్లోకి వెళ్లి అక్కడినుంచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి.ఆయన ఫోటో కింద నలుగురూ  నాలుగు మాటలు రాసినట్లున్నారు.చూస్తూ ఉండగానే గంటల వ్యవధిలో  చాలామంది వచ్చేసారు. కాలనీలో మనుషులకి అదొక పెద్ద పండుగలాగా జతరలాగా వుంది.

కాలనీలో ఆయనకు అందరూ బంధువులే కానీ ఆయనకంటూ ఒక కుటుంబం లేదు.పెళ్లి అయిందో లేదో ఈ కాలం వాళ్లకి సరిగా తెలియదు కానీ పిల్లలు అయితే లేరు.తోడబుట్టిన వాళ్ళు  ఎప్పుడో దేశాంతరం వెళ్ళిపోయి ఆయన ఒక్కడే ఇక్కడే మిగిలిపోయాడని అంటారు. పెళ్లి అయిందని  భార్య ఎవరితోనో లేచిపోయిందని కొందరు...లేదు, అతడే ఆమెకు నచ్చిన వాడితో ఆమె ఇష్ట ప్రకారం  పంపించేసాడని కొందరు అంటూ ఉంటారు.

అంత్యక్రియలు ఏ పద్దతిలో ఎలా చెయ్యాలో , ఎవరెవరు ఏమేం చెయ్యాలో కొందరు ముసలివాళ్ళు చెపుతున్నారు.వాళ్ళ మాటలకు  కొందరు నడివయసు వాళ్ళు మౌనంగా తలలూపుతూ వుంటే, ఇంకొందరు రకరకాల సందేహాలు అడిగి వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు.  కొందరు యువకులు బ్యానర్లు కట్టాలని , ట్రాక్టర్లో ఊరేగింపు జరపాలని మాట్లాడుకుంటున్నారు. కొందరు ఆడవాళ్ళు గుంపులో వున్నారు కానీ, నోర్లు తెరవడం లేదు. వక్కాఆకు నములుతూ తలలు నిలువుగా, అడ్డంగా అటూ ఇటూ ఆడిస్తున్నారు.

“ఎట్లో ఇప్పుడు  కరోనా భయం తగ్గింది . అయినా  దూరాభారం వచ్చిపొయ్యే వాళ్ళు ఎవరుoడారు? ఎక్కువగా రారులే. ఈ పక్క చిత్తూరు, మదనపల్లి, బంగారుపాళ్యం, వి,కోట రామాపురం వాళ్ళు ,ఆ పక్క అరవదేశం నుంచి వానియంబాడి వాళ్ళు,  ఆలంగాయం వాళ్ళు, ఆ పక్కనే అంబూరు వాళ్ళు.. అంతే కదా అందరూవచ్చేస్తార్లే  సాయంత్రానికి.”

“ కులం మొత్తం తెలిసినోడు. అందరికీ  కావాల్సినోడు, మనజనం చాలా మంది వస్తార్లే. బయటనుంచి అన్నాలటయానికి సరస్వతి  హోటల్లో ఆర్డర్ చెప్పేయండి. దూరంగా ఆ పక్క వీధిలో ఒక చోట పెట్టేస్తే తినే వాళ్ళు తినేసి పోతారు. ”

వరసలతో సంబంధం లేకుండా కాలనీలో ఎవరు చనిపోయినా, బయట ఊర్ల నుండి వచ్చేవాళ్ళ  కోసం అందరూ కలసి మధ్యాహ్నంఒక పూట భోజనాలు తెప్పించేయడం- ఈ మధ్య వచ్చిన కొత్త కట్టుబాటు అది.అన్నం పెట్టడానికి వరుసలేంది అని వాదించినవాడు ఉడుకోడే.!

బాధల్లో వున్నప్పుడు భోజనాల ఏర్పాటు ఇబ్బంది ఉండరాదని, ఉన్నవాళ్ళు పెట్టగలిగినా లేనివాళ్ళు చావులప్పుడు భోజనాలకి ఇబ్బంది పడకూడదని, అన్ని రకాలుగా అలోచించి, ఇక్కడున్న వాళ్లకు, బయటినుంచి వచ్చే వాళ్లకు ఇబ్బంది ఉండకూడదని అట్లా ఏర్పాటు అలవాటు చేసింది కూడా ఆ పెద్దాయనే. ఆఉడుకోడే.!

“మూడుదాకా రాహుకాలం కదా .మూడునుంచి మొదులు పెడితే నాలుగున్నరకు అంతా అయిపోతుంది. బయటినుంచి వచ్చినోళ్ళుమళ్ళిoకా ఎవురి తావులు వాళ్ళు చేరుకోవల్ల కదా..  ”

అంతా సిద్దం చేస్తున్నారు. ముందు షామియాన వద్దు అనుకున్నారు కానీ, వచ్చే  జనం అంతకంతకు పెరిగిపోతావుంటే షామియానా వెయ్యక తప్పింది కాదు. ముందు కుర్చీలు  అవసరం లేదు అనుకున్నారు, కానీ నూరుకుర్చీలు కూడా చాలలేదు.   పొలీసు  సైరన్ వినిపించే సరికి కాలనీలో అప్పటిదాకా అక్కడకి ఇప్పుడే కడులుదామా వద్దా అని తటపటాయిస్తున్న జనం మొత్తం గుంపులు  గుంపులుగా వచ్చేశారు.

 ఎండ పెరిగిపోతున్నా చమటలు కారిపోతున్నా ఉక్కపోస్తున్నా జనం కదలడంలేదు.  ఎవరు తెప్పిస్తున్నారో ఎవరు తెస్తున్నారో అక్కడ ఉంటున్న వాళ్లకి తెలియడం లేదు కానీ బ్యానర్లు వచ్చేసాయి. ముఖ్యమైన కూడళ్ళలో కట్టేశారు.  మైక్ సెట్ వచ్చింది, సంచుల నిండా  మంచి నీళ్ళ ప్యాకెట్లు, వాటర్ క్యాన్లు , ప్లాస్టిక్  గ్లాసులు వచ్చాయి.గుడిసె నుండి వీధి మొదలుదాకా రెడ్కార్పెట్ వేసారు.మైక్ ముందు నిలబడి నివాళి చెప్పడమో, ఆ పెద్దయన గురించి నలుగురూ మాట్లాడటం , కాలనీ మొత్తం ఇంటింటా వినపడుతోంది. ఆ కాలనీలో ఇదంతా కొత్త వ్యవహారం.అంతకు ముందు ఎప్పుడూ ఎవరికీ ఇలా జరగలేదు. అందరికీ విచిత్రంగానే వుంది.

ముందు పోలీసులు తర్వాతనాయకులు , ప్రజాప్రతినిధులు వచ్చారు. పొలీసు అధికారి  పెద్దదండ వేసి మౌనంగా వెళ్ళిపోయాడు, నాయకుడు కూడా కాస్సేపు  మౌనం  పాటించాడు కానీ మాట్లాడక తప్పలేదు. ఆయన అందుకు సిద్దపడే వచ్చినట్లుంది.పెద్దగా ఎవరూ బ్రతిమలాడకుండానే, గబగబా మైక్ అందుకున్నాడు.

“ నేను ఎంతోమందిని చూసాను. అందరూ నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగినవాళ్ళే కానీ మీకు ఏం సప్పోర్ట్ కావాలో చెప్పు , మంచికి నేను ఎప్పుడూ ముందు వుంటాను అని నేను రాజకీయాల్లోకి రాకముందే నాకు ధైర్నం చెప్పిన మంచి మనిషి మేనపాటి రామచంద్రుడు . ఎంతమంది కింద కులాల వాళ్ళు బడికి పోలేని స్థితిలో అయన వద్ద చదువుకుని బాగుపడినారో లెక్కే లేదు. గవర్నమెంటుటీచర్ కాకపోయినా, అంతకన్నా ఎక్కువే కష్టపడినాడు కదా?ఆయనకి కులం మతం జాతి, నాది నీది అనే బేధమే  లేదని నాకన్నా ఇక్కడ వుండే వాళ్ళకే తెలుసు. అయన శిష్యులు ఎంత మంది ఆయన్ను నీకు ఏం కావాలని అడిగినా అయన ఏ పొద్దూ నాకు ఇది కావాలని చెప్పింది లేదు. స్కూల్లోపిల్లోల్లకి పుస్తకాలు పెన్నులు బ్యాగులు బట్టలు అడిగినాడే కానీ , స్కూల్లో టేబుళ్లు బెంచీలు, కుర్చీలు  అడిగినాడే కానీ ఇంకొకటి అడిగినోడు కాదు.” నాయకుడి  ఆవేదన.

“  పేదోల్లు సార్, ఇండ్లకు పట్టాలు లేవు అని అర్జీలు ఆయనే రాసి మాతో బాటూ   ఎన్నిసార్లు యoఆర్ఓ వద్దకి  తిరిగినాడో లెక్కే లేదు. ఈ కాలనీ ఇండ్లు సాంక్షన్ అయ్యేదానికి మూలం కూడా ఆయప్పే కదా.పిడుగు పడి మండీపేటలో గొర్రెలు చనిపోయినా ముందుగా కదిలేది ఆయనే. కరెంటు షాక్ కొట్టి ఎరుకల వెంకట్రాముడికి కాళ్ళు చేతులు కాలిపోయినా ఆదుకోవడానికి ముందుకొచ్చి సరుకులు తెప్పించి ఇచ్చేది ఆయనే.అంత ఎందుకు? ఆడోల్లు డ్వాక్రా  గ్రూపుల్లో కరెక్టుగా లోన్లు కట్టకుండా వుంటే బ్యాంకు వాళ్ళు వచ్చి అడిగేది కూడా  ఈ పెద్ద మనిషినే కదా. నచ్చ చెపుతాడో, భయపెడతాడో, అధికారుల వల్ల కానిది, నాయకుల వల్ల కానిది చేసి  చూపిస్తాడు.  ” కౌన్సిలర్ సుబ్రమణ్యం.

షామియానా చాలడం లేదు. కాలనీలో అన్ని వీధుల్లో జనం.. జనం.. జనం. ఆ కాలని పుట్టినప్పటి నుంచిఎప్పుడూ ఆ కాలనీ అంత మంది జనాల్ని ఎప్పుడూ చూడనే లేదు. జనం ఎండను ఉక్కపోతను పట్టించుకునే స్థితిలో లేరు.మాటలన్నీ ఉడుకోడి గురించే. ఆలోచనలన్నీ అతడి గురించే.

దారులన్నీ యస్టీ కాలనీ వైపే.ఒక్క మాటలో చెప్పాలంటేఆ రోజు ఉడుకోడిదే.!. ఎండ ఎంత మాత్రం వాళ్ళని భయపెట్టడం లేదు. వాళ్ళలో హుషారు తగ్గడం లేదు. ఏదో కదలిక, ఏదో చైతన్యం, వాళ్ళు ఎందుకో ఉడుగ్గా ఉన్నట్లున్నారు.ఉడుకుడుగ్గా ఉన్నట్లున్నారు.అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి.రహదారి కూడళ్ళలో ఇంకా అక్కడక్కడా ఊరంతా బ్యానర్లు గాలికి అటూ ఇటూ కదులుతూ చప్పుడు చేస్తున్నాయి.

“ పలక కొట్టేవాళ్ళు దుడ్లు వద్దు అనేసిరి. గుంత తవ్వినోల్లు దుడ్లు వొద్దు అనేసిరి. సావు సరుకులకోసం పోతే ఉడుకాయప్పకే కదా అని ఫ్రీగా ఇచ్చినారు. కొత్త పంచె టవలు కూడా ఫ్రీనే. ఊరంతా తెలిసిపోయింది కదా చావు ఎవరిదీ అని. ఇంకో ఇచిత్రం తెలుసునా..”వక్కాకు ఎంగిలి దూరంగా రోడ్డు పక్కకు వెళ్లి  సైడు కాలువలో  ఉమిసి వచ్చాడు.

“ అటో వాళ్ళ గురించేనా.. ? ”  వంగిపోయిన నడుము ఆడమనిషి కిసుక్కున నవ్వింది.

“నా కొడుక్కూడా ఆటో డ్రైవరే కదా వాడు చెప్పినాడులే. యూనియన్ మొత్తం ఒకే మాట అంట. ”

“ ఇచిత్రం కాక పోతే బస్టాండుముందు వుండే  ఆటోస్టాండు  వాళ్ళు అందరూ గట్టిగా అనుకున్యారంట. సావుకు వోచ్చినోల్ల కాడ ఎవరిదగ్గరా రూపాయి కూడా తీసుకోకూడదని. ”

“   అదే న్యాయం కదా నాయనా . యూనియన్ యెట్లా ఉండాలో చెప్పి మనోళ్ళకే కాదు, ఎంతో మందికి సబ్సిడీ లోన్లు తెప్పించినాడు. వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబెట్టడమే కాదు , చేతిలో పదిరూపాయలు పడితే చెయ్యికి నవ్వ రాకూదడురా కన్నా ... అని ఎంత బాగా వాళ్ళ మైండు సెట్టు మొత్తం  మార్చినాడoటే, చాల మంది  సారాయి తాగకుండా ఉండరంటే అదంతా ఈ ఉడుకోడి పుణ్యమే కదా నాయనా .ఎన్నితూర్లు వీధి  గలటాలప్పుడు పెద్దమనిషిగా  పోలీసు స్టేషన్కి పోయింటాడు?. ”

కాలనీలో కుక్కలు కొన్ని అటూ ఇటూ దిక్కు తోచనట్లు పరుగెడుతున్నాయి. బోరిoగు చప్పుడు రోద పెడుతోంది. కొన్ని ఇండ్లల్లోంచి వస్తున్న రకరకాల టీవిల చప్పుడు , కుక్కల అరుపులు,వీటి మధ్యలోనే ఒంటి కాలి బోయకొండప్ప సారాయి మత్తులో పడుతున్న పాట వికారాన్ని తెప్పిస్తోంది.

ఉడుకోడి గుడిసె ముందు లైటు వెలుగుతూనే ఉంది. ఎవరూ దాన్నే ఆర్పే పని చెయ్యలేదు.  లోపల ఎవరో పెట్టిన దీపం గాలికి అటూ ఇటూ కదులుతోంది. గుడిసె ముందు కొయ్యమంచం పైన వుంది ఉడుకోడి శవం.

దాని పక్కనే రాతి బండలు.అక్కడకి వచ్చే వాళ్లకి  అవే కుర్చీలు, బెంచీలు.దానిపైన కావాటి మునస్వామి,ఎరుకల  నరసింహుడు, నాగరాజు, కుయ్యప్ప, కపాలి , మేనపాటి గోవిందస్వామి కూర్చుని వున్నారు. కొందరి  చేతుల్లో బీడిలు వెలుగుతున్నాయి. వాళ్ళకు కొంచెం ఎడంగా డిగ్రీ చదివే ఆడపిల్లలు ఆ కాలనీ వాళ్ళే పార్వతి, భూమిక నిలబడి పూలహారాలు మంచం చుట్టూ పొందిగ్గా పేరుస్తున్నారు. 

వీధికాలువలో దొడ్డికి కూర్చోవడానికి వచ్చిన చిన్నపిల్లాడు ఒకడు వీళ్ళని చూసి బిత్తర పోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పరుగున వెళ్ళిపోయాడు.క్షణాల్లో వాళ్ళ అమ్మ కొంగు పట్టుకుని మళ్ళీ  ఇంట్లోంచి బయటకు వచ్చాడు. వాళ్ళ అమ్మఅలివేలమ్మ  ఉడుకోడి గుడిసె ముందు నిలుచున్న వాళ్ళని, కూర్చున్న వాళ్ళని అదేపనిగా చూస్తా మొహం ఎందుకో తిప్పి వంకరగా మాట్లాడింది.

 “ నువ్వు ఆ పక్క  పోరా..వూరికే వూరికే మనుషుల్ని, శవాల్ని చూసి  భయపడితే ఎట్లా? సైలెంట్ గా  నీ పని నువ్వు చూసుకోవల్ల.”

నరసింహుడికి ఆ మాటతో కోపం వచ్చేసింది. గభాలున మంచం దిగి వీధిలోకి వచ్చిఅలివేలమ్మ  పైకి గొంతు ఎత్తి  గలాటాకి వెళ్ళిపొయినాడు.

“ ఏమ్మే నీమొగుడు కడుపాత్రం దేశాంతరం పోతా ఉంటాడు, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు యాడికి పోతాడో వాడికే తెలిదు.ఉండేది ఒక్కదానివి.ఇంట్లో  నీకు తోడు ఉండేది  ఆ పిల్లోడు ఒక్కడే. ఇప్పుడు వాన్ని ఆ పక్కకు దూరంగాతీసుకోని పోయిరాలేవా.. బుద్ధి ఉందా లేదా నీకు ? దినామ్మూ కొంచెం ఆ ఉడుకోడ్ని.. ముసలాయన కదా కొంచెం చూసుకోమ్మే అని చెపితే ఇంటివా?ఆఖరి దినాల్లో కొంచెంకూడూనీళ్ళు ఆయప్ప మొహాన పోసి వుంటే బావుండేది కదమ్మే. అడిగినోల్లకి అడగనోల్లకి అందరికీ ఆయప్ప అన్నీ చేస్తాడు కానీ,  ఆయప్ప నోరు తెరిసి ఎవుర్ని చిన్న సహాయం కూడా అడిగే రకం కాదని అందరికీ తెల్సు కదా ? ”

చీరకొంగు నడుముకు బిగించి కట్టుకుంటూ వక్కాకు ఎంగిలి ఉమిసి ఇoత లావు నోరు వేసుకుని, చేతులు తిప్పతా అలివేలమ్మ నేరుగా గొడవలోకే దిగేసింది.

“నువ్వు ఒప్పుకుంటే కాగితం బాండు రాసి ఇచ్చేయి మామా.నీ  ఖాళీ జాగా మాకు ఇచ్చేయి అంటే ఒప్పుకోలేదు   నువ్వు పోయినంకకాలనీలో ఈ గుడిసె లో మేం ఇల్లు కట్టుకుంటాం. బదులుగా రోజూ మూడు పూటలా తిండి పెడతాం మామా.. అని చెప్పినా కదా. నా మాటకి ఒప్పుకున్యాడా ఆ మొండి మనిషి ? పస్తులైనా వుంటాను, నా జాగాలో ఎరికిల  పిల్లోల్లు చదువుకునేదానికి షెడ్ కట్టల్ల, నా జాగా అమ్మను, ఇంకెవరికి ఈను  అంటాడు.అట్లాంటి వానికి నేను ఎందుకు....?” ఆయాసం వల్ల ఆగింది కానీ అప్పటికే ఆమె భారీ శరీరంలో  ఆవేశం వళ్ళ ప్రకంపనలు మొదలయ్యాయి.గొంతు కూడా వణుకుతోంది.మనిషి నిలువెల్లా ఊగిపోతోంది.

“ అప్పుడికీ ఎన్నోతూర్లు చెప్పి చూసినా. అప్పుడప్పుడు గంజి నీల్లు టీలు ఇస్తానే కదా ఉండా కదా. ఆయప్ప అందరికీ ధర్మాత్ముడే కావచ్చు, కానీ నాకు మాత్రం దుర్మార్గపు ముండా కొడుకే.. అట్లాంటి వానికి నేను ఎందుకు తిండి పెట్టల్ల  అని? ”

ఆమె మాటలకి చుట్టుపక్కల వుండే వాళ్ళు కూడా ఇండ్ల లోంచి బయటకు వచ్చేసి, చుట్టూ నిలబడి ఆసక్తిగా వింటుండి పోయారు.

“ ముందు నుంచి ఆయప్ప చెప్తానే వుండాడుకదాఅలివేలమ్మా.. కాలనీలో  గుడి కట్టేటప్పుడు కూడా ఎంత గొడవ చేసినాడో నీకు తెలిదా? గుడి ఎందుకురా ఎరికిలి నా కొడుకులారా ? ఇంకెన్ని గుడులు కడతార్రా ? ఇంకెంత మంది దేవుళ్ళని మొక్కుతార్రా అని గట్టి గట్టిగా అందురని అరిసేసినాడు కదా? అప్పుడే  మర్చి పోతివా ?  మా పిల్లోల్లు కొంత మంది ఆ ఉడుకోనికే సప్పోర్టు చేసి గుడి వద్దు లైబ్రరీనే కట్టల్ల, పుస్తకాలు పెట్టల్ల, ఈ పిలకాయలంతా సదూకోవళ్ళ అని తెగేసి చెప్పినారు కదా. ఆ పొద్దు  మన పిల్లోల్లు గుడి వద్దని  అడ్డం తిరిగిన రోజే ఎంత గొడవ అయిందో ఊరంతా ఇచిత్రంగా  కాలనీ గురించి కతలు కతలు చెప్పుకున్యారు కదా. ” దగ్గుతెర అడ్డురావడంతో  ఆరిపోయిన బీడీముక్క పారేసి ,  క్షణం  ఆగి గొంతు సవరించుకున్నాడు నరసింహుడు . 

“ ఆ పొద్దే చెప్పెసినాడు కదా. ఆయన ప్రాణం పోయినంక ఆ  సగం కూలిపోయిండే కాలనీ  ఇల్లు , యీ గుడిసె మొత్తం కలిపి ఎప్పటికన్నా ఇక్కడ లైబ్రరీ కట్టల్ల అని, దాన్నిండా  మన పిలకాయలు పెద్ద పెద్ద పరిక్షలు రాసేదానికి  పుస్తకాలు ఉండల్ల అని పెద్దఆశ  కదా ఆయప్పకి. ”అన్నాడు కపాలి.

ఆ మాటలేవి నచ్చనట్లు అలివేలమ్మ  మొహం తిప్పుతా “ ఓహోహో.. మన ఎరికిల పిల్లోల్లు సదివి.. ఇంకచూడల్లా సంబడం  ” అని తేలిగ్గా మాట్లాడే సరికి , అప్పటిదాకా చేతులు నలుపుకుంటా  నోరు మెదపకుoడా మౌనంగా  నిలబడి చూస్తూ వున్న ఆ ఇద్దరు అమ్మాయిలలో ఉడుకు  వచ్చేసింది.  అంత కోపం అంత ఆవేశం అంత దూకుడు యెట్లా వచ్చాయో  తెలియదు కానీ వాళ్ళ గొంతుల్లోంచి మాటలు దూసుకు వచ్చేస్తున్నాయి.

“ మేం ఇంకా పందులు తోలుకుంటా గాడిదలు మేపుకుంటా , ఇంటికాడ బోకులు తోముకుండా ఉండల్లా అనే నీ కోరిక. థూ... మనకి సిగ్గువుండల్ల అత్తా. పది మందిలో తల ఎత్తుకుని బతికే పనులు చెయ్యాల్ల,కానీ మేం ఇంతే. ఇట్లే పుట్టినాం, ఇట్లే చస్తాం అంటే ఎవరు మారస్తారు మన బ్రతుకులు.అందుకే అత్తా ఆ తాత చెప్తా వున్యాడు కదా .దేశానికి ఒక్క  అంబేద్కర్ చాలడు. ఒక్కో కాలనికీ ఒక్కో ఊరికీ ఒక్కో  ఇంటికి ఒక్కో అంబేద్కర్ కావల్ల  అని , మీకే అర్థం కాలేదు ఆ తాత చెప్పేది. ఒక్క మాట అడగతా చెప్పు. ఈ తాతే అడ్డం పడకుండా వుంటే, మొండిగా ఊరoదర్నీ ఎదిరిoచి నిలబడకుండా వుంటే మన లింగాపురం  భూములు మనచేతుల్లో ఉండేవా? మన కాళ్ళు మన భూముల్లో నడిచేవా? మన భూములకు పొయ్యేదానికి మనకో ఓనిమి  ఉందంటే అది ఆ తాత వల్లే కదా ?   ” భూమిక.

ఎన్నేళ్ళ కథ అది. ఎంత పెద్ద కథ.ప్రభుత్వం యస్సీ యస్టీ లకు భూములు ఇచ్చిన తర్వాత  ఎందరు ఎరుకల వాళ్ళు రైతులుగా మారినారో, చివరికి ఎందరుఎరుకల వాళ్ళు రైతులుగా మిగిలినారో చెప్పే కథ.ఎరుకల వాళ్ళు వాళ్ళ భూములకి వాళ్ళు పోలేకుండా లింగాపురం లో ఓనిమి (దారి ) లేకుండా పెద్దోళ్ళు  యెట్లా  మాయo చేసారో  చెప్పే కథ.ఒకసాదా సీదా  మామూలు మనిషి పెద్దోల్ల అన్యాయాన్ని ఒప్పుకోకుండా  తిరగబడి ఎదిరించి నిలబడితే  ఉడుకుడుగ్గా మాట్లాడితే, ఆ మనిషిని జైలుకు పంపిన కథ. సాటి కులమోల్లకోసం జైలుకు వెళ్లి ప్రభుత్వ టిచర్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఉన్నత విద్యావంతుడైన,ఒక  గిరిజన ఉపాధ్యాయుడి  కథ.ప్రభుత్వఉద్యోగం పోయినా జీతం లేకుండానే కొన్ని సంవత్సరాలపాటూ  ఎంతో మంది పేద పిల్లలకి మంచీ చెడు చెప్పి, పాఠాలు నేర్పి, ప్రయోజకుల్ని చేసిన ఒక సృజనకారుడి కథ.

***

“ బిరిన్నే చెప్పండి మీ భూములు  అమ్ముతారా? అమ్మరా ?” పెద్ద కులపోల్ల గొంతులు ఎప్పుడూ పెద్దవిగానే వుంటాయి. ఆ వూర్లో అప్పటిదాకా  ఎప్పుడూ ఆ గొంతులకు అడ్డం చెప్పిన వాళ్ళు లేరు. కానీ ఆ రోజు మాత్రంలింగాపురం లో  ఒక విచిత్రం జరిగింది.

ఎరుకల కులంలో పుట్టి , ఊరు దాటి, జిల్లా దాటి హాస్టల్లో చదువుకుని టీచర్  ఉద్యోగంలో కొత్తగా చేరిన ఎరుకల రామచంద్రుడు ఆ నిముషం  గొంతు విప్పాడు.  గుండె విప్పాడు.

“ ఏం మీరు కొనాలంటే మాత్రం మేం మా భూములు చవగ్గా ఇవ్వాల్నా ? మీరు అమ్మాలంటే మాత్రం రేట్లు ఆకాశం లో ఉండల్నా? తక్కువ జాతోల్ల భుములకు రేట్లు తక్కువ అంటారా? ఇదేమి న్యాయం? మా పక్కన మీ భూములు వుండచ్చు . ఎంత మాత్రం తప్పు లేదంటారు. అదే మా భూములు మీ పక్కలో వుంటే మాత్రం  అది మీకు తక్కువనా? ఏమన్నా ? కులాన్ని బట్టి భూమి రేటు కూడా మారుతుందా ? మట్టికి కూడా కులం ఉందoటారా అన్నా ? ఇదెక్కడి న్యాయం ?  ”

ఉడుకురక్తం కదా అనుకున్నారు అందరూ.

 పెద్దవాళ్ళు కోపంతో  ఉడికిపోయారు.ఎరుకల వాళ్ళు అంతకంటే ఎక్కువగానే  ఆవేశంతో ఉడికిపోయారు.

అంత ఉడుకుడుగ్గా మాట్లాడాడు రామచంద్రుడు.

“ నువ్వు  ఉండరా అబ్బోడా .... నీది ఉడుకు నెత్తురు. తొందర పడొద్దు”కులపెద్ద నాగయ్య అడ్డు వచ్చేశాడు.

“ ఎరికిలోడు సేద్యం ఒక్కటే నేర్చుకుంటే సాలదు మామా , పోరాటం చెయ్యడం నేర్చుకోవల్ల, బ్రతకాలంటే కరువుతోనే కాదు, మొండి మేఘాలతోనే కాదు, మొండి మనుషులతో, పెద్ద కులమోళ్ళతో పోరాటాలు చెయ్యడం నేర్చుకోవల్ల. పందుల్ని మేపే వాళ్ళకు , ఊరూరా తిరిగి  గాడిదలపైన ఉప్పు అమ్మి , ఎర్రమన్ను, ముగ్గుపిండి అమ్మిబ్రతికే వాళ్లకు,అడవుల్లో బ్రతికే వాళ్లకు,ఎండకు వానకి పురుగూ పుట్రకిభయపడని వాళ్లకి ఇంకొకరు నేర్పించల్లనా? బ్రతికేదానికి వయసుతో పనేముంది మామా ? ఏ వయసోడికైనా బ్రతకాలంటే నెత్తురు ఉడుగ్గానే ఉండల్ల. అసలు మనిషి అనే వాడు ఎప్పుడూ ఉడుకుడుగ్గానే  ఉండల్ల.” కుండబద్దలు కొట్టినట్లు తెగేసి చెప్పేశాడు రామచంద్రుడు.అతడు అట్లాగే బ్రతికాడు. జీవితకాలం మొత్తం ఉడుకుడుగ్గానే బ్రతికాడు. ఎక్కడా ఎవరిముందు తల దిoచిన వాడు కాదు. పెద్దోల్ల కుట్రలకి పొలీసుకేసులకి ఉద్యోగం పోయినా  వెనకడుగు వేసినవాడు కాదు.

నెలలు కష్టపడి  రాళ్ళు తేలిన నేలలో అడవిలాగా పెరిగిపోయిన మొక్కల్నిమొత్తం పీకిపారేసి,  బండరాళ్ళు పగలగొట్టి, , రాళ్ళు  ఏరి, నేల చదును చేసి సాగుకు అనుకూలంగా మార్చిన తర్వాత ఆ భూముల రూపమే మారిపోయింది. ఎందుకూ పనికి రాదనుకున్న కొండనేల, బండనేల, ఆ భూములపైన కన్ను పడిన తర్వాత జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు.  ఊరి  పెద్దోళ్ళకు కంటి నిండా నిద్ర లేకుండా పోయింది. ఆ పొలాలను ఎట్లాగైనా చవగ్గా కొనేయ్యాలని విఫల ప్రయత్నo చేశారు.

 

ఊర్లోంచి ఆ పొలాలకి వెళ్ళే దారి ఉన్నట్లుండి ప్రభుత్వ రికార్డుల్లోంచి మాయమైపోయింది.

ఆ దారికి  ఒక చరిత్ర వుంది.

అది ఆ ఊరి  రక్తచరిత్రలో ఒక భాగం.చెరువు దాటి , పెద్దోల్ల పొలాలు దాటి, వాగు దాటి వంక దాటినా తర్వాతా , కొండల్లో గుట్టల్లో , పిచ్చి మొక్కల మధ్య గవర్నమెంటు ఎరుకల వాళ్ళు బాగుపడాలని ప్రభుత్వం ఇచ్చిన పొలం అది.ఆ రాళ్ళల్లో ఆ బండ రాళ్ళల్లో, ఆ దుమ్ములో, ధూళిలో, ముండ్ల చెట్లల్లో, పాముల పొదల్లో , విషపు పురుగుల మధ్య కొన్ని సంవత్సరాలు ఎరుకల వాళ్ళు మనుషుల్లాగా కాక, యంత్రాల్లాగా  పని చేస్తే ఆ నేల అంత మాత్రం చదును అయ్యింది.ఎరువులు తోలినారు, ఎద్దులని తోలినారు, గంపల కొద్ది రాళ్ళు మోసినారు, ఒళ్లంతా రక్త గాయాలే.  ముందుతరం వాళ్ళ రక్తంతో చమటతో తడచిననేల అది.ఆ పొలాలకి వెళ్ళే దారి కోసం యుద్దాలే జరిగాయి, తలకాయలు పగిలాయి.పోలీసు కేసులు అయ్యాయి.

ఎన్నో పంచాయితీలు, రాజకీయాలు  నడిచాయి.చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ కు, మదనపల్లి సబ్ కలెక్టర్ వద్దకు  వెళ్లి అర్జీలు ఇచ్చి వచ్చారు.ఆ అర్జిలన్నీ తిరిగి తిరిగి  ఇక్కడికే వచ్చాయి.   కొన్ని తరాలుగా కొన్ని దశాబ్దాలుగా వుండిన ఆ డొంక దారి రెవిన్యూ రికార్డుల్లోంచి ఎందుకు యెట్లా మాయమైoదో తెలియదు. దారి మూసి వేసిన రైతుల్ని గట్టిగా అడిగితే వాళ్ళు మొహాలు చూపకుండా కనపడకుండా పోయారు.

ఆ రోజు పెద్ద గొడవ అయింది.వీఆర్వో ను అడిగితే ముందు నోరు తెరవలేదు. అది దారి కాదు , అక్కడ దారే లేదు అనేశాడు. అందరూ ఎంత మాట్లాడినా , ఎంత బ్రతిమలాడినా  దిగి రాలేదు ఆయన.

“ఓపిక లేదా నీకు?. ఇంత తొందర పెడితే ఎలా ? మేం కూడా మనుషులే కదా మాకేమన్నా నాలుగు చేతులున్నాయా?  “ మొహం చిట్లించేశాడు. అవలింతను ఆపుకునే ప్రయత్నం కానీ, నోటికి చెయ్యి అడ్డం పెట్టుకునే పని కానీ చెయ్యకుండా మొహం అంతా పెద్దది అయ్యేలా నోరంతా తెరిచి పెద్ద చప్పుడుతో ఆవులించాడు  వీఆర్వో రంగారెడ్డి .  సన్నగా వున్నాడు కానీ అతడి గొంతు చాలా కరుగ్గా వుంది, మాట కటినంగా వుంది.నోట్లోంచి సిగెరట్ పొగతో ఇంకేదో కలసి మొత్తానికి వెగటు వాసన వస్తోంది.

మొహం పక్కకు తిప్పుకుంటే ఏమనుకుంటాడో అని సందేహిస్తూనే , ఒక అడుగు  వెనక్కు  వచ్చి, ఊడి పోయిన  అతడి చొక్కా గుండిల వైపు, ఉబ్బి పోయిన అతడి కడుపు వైపు  చూస్తూ  మెల్లగా ఇంకోసారి మెత్తగానే అడిగాడు ఎరుకల రామచంద్రుడు. 

“ దారి కోసం జనం అల్లల్లాడతా వుండారు  సార్, కొన్నేండ్లు వానల కోసం ఎదురు చూసినాం సార్ .ఇంకోన్నెండ్లు పట్టాలకోసం చూసినాం సార్. మా బావులన్నీ పూడిపోయక, రాళ్ళు తేలిపోయిన బావుల్లో పాములు పురుగు పుట్రా ఇన్నెండ్లూ వుoడి పోయినాయి సార్, ఇప్పుడైనా వానలు పడినాకే ఇంత మాత్రం నీళ్ళువచ్చి మా బావులు కళకళ్ళాడతా వుండాయి సార్, ఇప్పుడు గానా మాకు మా పొలాలకి పొయ్యేదానికి దారి వదల్లేదంటే మొత్తం మా పొలాలు అన్నీ మళ్ళీ బీడు పడిపోతాయి సార్, మా బ్రతుకులు మళ్ళీ  పందుల పాలు అవతాయి సార్.మీరు మా పరిస్థితి అర్థం చేసుకోండి..ప్లీజ్    ”

“ఊర్లో పందులు వుంటే ఊర్లో వుండే  వాళ్లoదర్కీ  వ్యాధులు వస్తాయి అంటారు సార్, నిజమే. పందులతో బాటూ మమ్మల్ని కూడా వూర్లోంచి వేలేస్తామని దండారా కొట్టి చెప్తావుండారు, బావుంది సార్, మీరు అందరూ ఎప్పుడూ బావుండల్ల. మేమే చెడిపోవల్ల. అంతే కదా సార్. మేం  అడవుల్లోకి పోకూడదు, వెదుర్లు కొట్టకూడదు, చెట్లు కొట్టకూడదు, మేకలు తోలుకుని అడవిలోపలికి పోకూడదు అంటారు.అప్పుడు  అడవులనుండి తరిమేస్తిరి,  ఇప్పుడు సేద్యం   చేసైనా పొట్ట పోసుకుందాం అనుకుంటే అదీ కాకుండా చేస్తా ఉండారు . ఇప్పుడు సేద్యం నుండి కూడా తరిమేస్తేఇంకా మేం యెట్లా బ్రతకాలని మీరంతా అనుకుంటా వుండారు? మీరు మాత్రం బ్రతికితే సాల్నా ? తక్కువ కులం లో పుట్టినామని ఇంత అలుసా సార్  మేమంటే ?”

“ ఏయ్ ఒక్కసారి చెపితే అర్థం కాదా మీకు ?మీ పొలాలకు ముందునుంచే ఎక్కడా  దారి  లేదు. రికార్డుల్లో ఎక్కడా మీ పొలాలకు దారి  వున్నట్లు ఎక్కడా ఆధారాలే లేవు. లేని దారిని ఇప్పుడు మీరు అడగతావుండారు.ఇదేమి న్యాయం?మల్లింకా  గట్టిగా ఎవరైనా   పెద్ద మనుషులు మాట్లాడితే మాత్రం కిందకులాలంటే అంత చులకనా మీకు అని నిలదీస్తారు.మీదే తప్పు. అసలు తప్పంతా మీదే.పెద్దోల్ల పొలాల్లోకి పోకండి. వాళ్ళు మంచోళ్ళు  కాబట్టి మీపై కేసు పెట్టకుండా మాటల్లోనే హెచ్చరిస్తా వుండారు. మీరంతా బాగుపడాలనే  కదా, పైకి రావాలనే కదా యస్సీ యస్టీలకు   ఇంత  నేల చూపిస్తుంది ప్రభుత్వం.ఇంత మాత్రం కొండలో గుట్టలో ఏదో ఒక  భూమి  ఇచ్చేదే గొప్ప, ఇంకా దారికూడా కావాలంటే యెట్లా?   ” 

“ రాళ్ళూ రప్పలు ఉండే చోట  కొండ తవ్వి సేద్యం చేసుకోవాల్నా మేం  ? దారి లేకుండానే  భూములిస్తే మేo ఏమైనా  గాల్లో ఎగిరి పోయి సేద్యం చేసుకోవల్నా ? ఎందుకు పనికి రాని భూముల్ని యా మూల్లోనో  మాకు ఇస్తానే  వుంటారు. కింద కులాలోల్లు యాడికి పోయ్యేదీ  లేదు, సేద్యం చేసుకునేదీ లేదు. కింద వుండే వాళ్ళు కిందనే ఉండిపోతాo. అయినా ఏంది సార్ అంత  అన్యాయంగా మాట్లాడతా వుండారు ?ఇన్నెండ్లూ మా పొలాలకి దారి  లేదంటే, మేమంతా గాల్లోకి పొయ్యి సేద్యం చేసినామా ఇన్నేండ్లు ?   ”

 మాటా మాటా పెరిగింది. ఉడుకోడు ఊరుకోలేదు.

ఆఖరికి  ఉడుకోడు పెద్దగా గలాటా చేస్తే వీఆర్వో అడ్డం తిరిగేశాడు.

“ పోనీలే...  అని మర్యాద ఇస్తా వుంటే ఏందిరా  ఎదురు మాట్లాడేది నేరిస్తా వుండారు? మాలోల్లు మాదిగోల్లే అనుకుంటే, ఇప్పుడు తిరగబడి మాట్లడేదానికి ఎరికిలోల్లు కూడా తయారవతా వుండారు.ఏం తెలుసురా మీకు? చట్టం తెలుసా , గవర్నమెంటు అంటే తెలుసా ? అధికారులంటే అంత అలుసా మీకు? నాతో జాగ్రత్తగా ఉండండి. ముందుగానే చెప్తా ఉండా. నాకు తిక్క రేగిందంటే కేసులు పెట్టి మీకు భవిష్యత్తే లేకుండా చేసేస్తాను బద్రం..   ” అది అతడి ఒక్కడి మాటే కాదు. పెద్దోల్ల మాట కూడా అదే. వాళ్ళ మాటలే అతడి నోటి వెంట...

వాళ్ళ  బెదిరింపులకు ఉడుకోడు అస్సలు లొంగలేదు. వీఆర్వో మొత్తానికి  అంతా తారుమారు చేసేశాడు. అది డొంకదారి కాదని, దొంగదారి అని తేల్చేశాడు.మారింది మార్చింది ఒక్క అక్షరాన్నే. కానీ  మారింది పాడయింది..ఎన్నో జీవితాలు.కొంతకాలం వరకూ  ఆ పొలాలు కొన్ని బీడుగానే ఉండిపోయాయి.కొన్ని  పెద్దోల్ల బలవంతాన ఆ దారిలేక,  వేరే దారీ..లేక తక్కువ ధరలకే అమ్మకానికి వెళ్ళాయి.కొన్ని పొలాలు  చేతులు మారాయి.ఇంకొన్ని పొలాలు వాళ్ళు చేసిన అప్పులకీ వడ్డీలకీ పెద్దోళ్ళ వద్దకే తాకట్టులోకి వెళ్ళిపోయాయి.

“ ఇదొక పనికిమాలిన రూలు. మన గవర్మెంటు వస్తానే దీనెబ్బా.. ఎదవ రూలు మార్చి పడేద్దాం అన్నా. అదేంది.. యస్సీయస్టీ ల  డికేటి భూముల్ని వేరే కులాలోల్లు  కొనకూడదoటే యెట్లా కుదురుతుంది? రిజిస్ట్రేషన్ చేసేది లేదంటే ఎట్లా ? ” పెద్దోల్ల బాధలు పెద్దోల్లవి.

తొంభైతొమ్మిది సంవత్సరాలకు లీజుకు పత్రాలు రాసుకున్నారు కొందరు. బాండుపేపర్ పైన అగ్రిమెంట్ చేసుకుని అమ్మకాలు జరుపుకున్నారు కొందరు. ఇచ్చిన సొమ్ముకు ఎక్కువగా బాండ్ పేపర్లో తెలివిగా  సంతకాలు తీసుకున్న పెద్దోళ్ళు  కొందరు. తాము ఇచ్చిన దానికన్నా తక్కువకే అతి తెలివిగా  బాండు పేపర్ రాసుకున్నపెద్దోళ్ళుఇంకొందరు .

నాగయ్య అడగనే అడిగేశాడు ” ఎందుకురా మన పొలాలు అమ్మకానికి పెడతారు. ఈ భూములు మళ్ళీ కొనాలంటే జీవితాంతం  మన బ్రతుకులన్నీ కలిపినా  సాలవు.అందరం కలసే  భూములు సాగు చేసుకుందాం .అందరూ ఒక్క మాట మీదే నిలబడదాం. ” ఆ మాటలు ఎవరూ పట్టించు కోలేదు. ఆయనంటే గౌరవం ఉన్న వాళ్ళు మాత్రం ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

“ పెద్దాయనా నువ్వు సెప్పేది వినేడానికి బాగానే వుంది. రైతుల్ని చూడు.ఉండేవాడు బాగానే వుండాడు. వుండే రైతుకు వాన వచ్చినా ఒక్కటే, రాకపోయినా ఒక్కటే, ఎందుకంటే ఉండేవానికి పది రకాల సంపాదనలు వుంటే అందులో సేద్యం ఒక్కటి మాత్రమే. జరుగుబాటు లేని రైతును సూడు. వానికి వానొస్తేనే సేద్యం వుంటుంది. వానొస్తేనే బ్రతుకు వుంటుంది, వాళ్ళ ఇంట్లో వానొస్తేనే పండగలు అయినా  దేవరలు అయినా  టయానికి జరగతాయి.టయానికి వానలు లేవు అంటే అదును తప్పేది వానోక్కటే కాదు. మొత్తం రైతు బ్రతుకే అదుపు తప్పుతుంది. వాళ్ళ పరిస్థితే అట్లా వుంటే ఇంక మనం ఎంత? మన బ్రతుకులెంత ?   ”అనేసారు.

“ అయినా మనకు వేట తెలుసు, జీవాల్ని మేపడం తెలుసు,అడవులు తెలుసు, తేనే,మూలికలు ఆకు పసుర్లు తెలుసు. అడవులు, ఊర్లు,వీధులు  తిరిగి తిరిగి బ్రతకడమే తెలుసు.వెదుర్లు  చీల్చి దబ్బలు, బుట్టలు అల్లడం తెలుసు,   మనం మానంగా బ్రతికే బ్రతుకు వదిలేసి,ఇప్పుడు మడక కట్టు, దుక్కి దున్ను, విత్తనాలు ఎయ్యి, కలుపు తియ్యి అంటే అదంతా కుదిరే పనేనా ?అయినా  సేద్యం పనులకి కూలికి పోయ్యేదానికే మనకు  అలవాటు కానీ ఇప్పుడు నువ్వే రైతువి, నువ్వే సేద్యం చెయ్యల్ల అంటే ఎరికిలోడికి గుoడె జారి పోతా వుండాదిరా అబ్బోడా.నీకు ఎన్ని తూర్లు చెప్పినా అర్థమే గావడం ల్యా... మార్చల్ల అంటావు, మారల్లఅంటావు,ఇదంతా అయ్యే పనే అంటావా?   ”నాగయ్య ఎంత చెప్పినా ఉడుకోడు వినలేదు. అప్పుడు మొదలు పెట్టిన పోరాటాన్ని ఆపనే లేదు.

***

ఉడుకోడు జీవితకాలం అట్లాంటిపోరాటాలు చేస్తూనే ఉండిపోయాడు.ఎప్పుడూ ఎక్కడా చల్లబడలేదు.

వయసు మళ్ళినా ముసలితనం వచ్చినా, చూపు మందగించినా, వినికిడి శక్తి తగ్గినా, కీళ్ళనొప్పులు సతాయించినా అతడిలో పట్టు తగ్గలేదు.ఇప్పటికీ అతడు ముసలివాడు కాలేదు, ముసలివాడని ఎవరి దగ్గరా అనిపించుకోలేదు. మార్పు కోసమే అతడి పోరాటం.అన్యాయాన్ని ఎదిరించడమే  అతడి జీవన విధానం. 

ఆ ఊరికి  పంచాయతి కేంద్రం ముందు నుండీ చాలా  దగ్గర. తర్వాత అది  మండలకేంద్రం అయింది, మున్సిపాలిటీ అయింది. పొలాలకు మనుషులు దూరమయ్యాక , కొత్త కొత్త పనులకు, కొత్త ఉపాధులకు వాళ్ళు అలవాటు పడ్డాక టౌన్ లో  కాలనీ ఇండ్లు మంజూరు అయ్యాక వాళ్ళ స్థావరాలు మారాయి.ఉపాధులు మారాయి. కొన్నేoడ్లకు  పందులు వూరికి దూరం గా ఉండాలనే ఆంక్షలు వచ్చాక, కొందరు పందుల తో బాటూ ఆ ఊరు వదిలిపెట్టేసారు.

ఉన్న అప్పులకి తోడు ఇంకా అప్పులు చేసి కొoదరు,  గవర్నమెంటు ద్వారా బావులు తవ్వుకొని కొందరు, బోర్లు వేసుకుని కొందరు మాత్రం  వ్యవసాయానికి అలవాటు పడిపోయారు. ఎంత లోతుకు వెళ్లి వేసినా  వాటిల్లో ఫెయిల్ అయిన బోర్లే ఎక్కువ. బోర్ ఫెయిల్ అయినా బ్యాంకు అప్పులు వడ్డీలు  కట్టాల్సిందే అని బ్యాంకులు తెగేసి చెప్పినప్పుడు, ఆ అప్పులు తీర్చేదానికి మిగిలిన పందుల్ని, మేకల్ని , ఆవుల్ని  అమ్ముకున్నవాళ్ళు కొoదరు.ఇన్ని బాధలూ పడిన తర్వాతా కూడా ఆ పొలాలకి వెళ్లి వచ్చేదానికి దారి లేదంటే వాళ్లకు ఏడుపే వచ్చింది. అట్లా  ఏడ్చుకున్న వాళ్ళు ఎందరో.  అటూ వ్యవసాయమూ చెయ్యలేక,ఇటు కులవృత్తులు చెయ్యలేని పరిస్థితిలో...అయోమయంలో వుండిపోయారు.. చాలా కాలం.

ఇప్పుడు వాళ్ళ వద్ద పందులు లేవు, ఆవులు వున్నాయి.

వాళ్ళ పిల్లలు వూరు దాటి హాస్టల్లో ఉండి చదువుకుంటూ సెలవుల్లో మాత్రం ఇండ్లకు వస్తారు. అప్పుడైనా వాళ్ళు ఎక్కువ మాట్లాడేది, ఎక్కవ సేపు వుండేది ఉడుకోడి వద్దే. చిన్నప్పటి నుండి వాళ్లకు అక్షరాలు నేర్పి,చదువుతో బాటూ మంచీ,చెడు చెప్పిందీ ఆయనే, బాగా చదవాలనే తపన కలిగించిoదీ ఆయనే. వాళ్ళల్లో కొందరు మైక్ ముందు నిలబడి కొత్త బాషలో కొత్తగా మాట్లాడుతూ వుంటే కాలనీ వాళ్లకి ఆశ్చర్యంగానే ఉంది.  

“ మనం ఎప్పుడూ వెనక అడుగు వేసే ప్రశ్నే లేదు. ఎంత కాలం ఈ వెనుకబాటుతనం.ఇంకెంత కాలం ఈ కుల రాజకీయాలు ? ప్రతి ఇంట్లో దేవుడి ఫోటోలు కాదు వుండాల్సింది, మంచి పుస్తకాలు ఉండల్ల.మనలో  ఏ ఒక్కడూ తక్కువ చదివే దానికి లేదు.ఎరికిలోల్లు అందరూ  ఎక్కువే చదవల్ల. ఉడుకాయన పోటీపరీక్షలకి పుస్తకాలు కావాలని మా సీనియర్లకి చెప్పినాడు, ఉద్యోగాలు వచ్చినోళ్ళంతా పుస్తకాలు కొనిస్తామన్నారు.గుడి బదులు లైబ్రరీ కడితే చాలు. అందరూ ముందుకు వచ్చి తలా ఒక చెయ్యి వేస్తే కానిది ఏముంది ? ” ఉడుగ్గానే ఉన్నాయి ఆ మాటలు.

అప్పుడు వచ్చింది భూమిక మైక్ ముందుకు.”  అన్నా మొన్న కూడా ఉడుకాయన ఆ ఓనిమి గురించే... ఆ దారి గురించే బాధ పడినాడు. ఏదో ఒకటి చేసి ఆ సమస్య పరిష్కరించాలి. అప్పుడే ఆయనకు శాంతి. ”

అప్పుడు చాలాకాలం తర్వాత మళ్ళీ ఆ దారి గురించి మాటలు మంతనాలు మొదలయ్యాయి.గవర్నమెంటు మారినప్పుడల్లా ఆ దారి కూడా  తన రూపు రేఖలు మార్చుకుంటుంది. మనిషి నడవడానికి మాత్రమే కుదిరే  దారి అప్పుడు మాత్రం  విశాలమవుతుంది!అంత వరకూ  అడ్డుగా వుండిన రైతులు అప్పుడు  మాత్రం  దారి వదలతారు,అప్పుడుఆ దారిగుండా  ఎద్దుల బండ్లు పోతాయి. ట్రాక్టర్లు పోతాయి, జేసిబిలు పోతాయి. ఆ కాలం లోనే ఎరుకలవాళ్ళు బోర్లు వేసుకోవాలన్నా , కలుపు తీయాలన్నా , నేల చదును చేసుకోవాలన్నా కుదురుతుంది.

ఇదేండ్ల తర్వాత ప్రభుత్వం మారితే దారి కూడా మారిపోతుంది. ఒక్కోసారి ఆ దారి కాలిబాట లాగా కుంచించుకు పోతుంది. అప్పుడు ఇక ఎద్దుల బండ్లు పోలేవు.ట్రాక్టర్లు , జేసిబిలు పోలేవు. సైకిళ్ళు పోవచ్చు, నడచి పోవచ్చు అంతే, అంతకు మించి పోవడానికి కుదరదు. అదే లింగాపురం  రాజకీయం.

పరుగులాటి నడకతో కొందరు అప్పుడే బస్సు దిగి వచ్చారు కాలనీ లోకి. 

 “ఎవరికి  ఏం కావాలన్నా ఉడుకోడి వద్దకే కదబ్బా అందరూ వస్తారు. గవర్నమెంటులో ఏ పని యెట్లా చెయ్యాలో ,చేయించుకోవాలో, పని కాక పోతే ఎవుర్ని కలవాలో, యెట్లా కంప్లైంటు చెయ్యాలో ఆయనే కదా నేర్పించేది. యస్టీ కార్పోరేషన్లో ఎంత మందికి ఎన్నెన్ని లోన్లు తీపిచ్చినాడో లెక్కేలే . మనోళ్ళవద్ద  ఏ ఆఫీసర్ అయినా లంచాలు అడగల్ల  అంటేనే  భయపడి పోతారంటే  వాళ్లకి ఉడుకోడు అంటే వుండే భయమే కదా కారణం.పద పదా .. చివరి చూపు చూసి ఆయనకో దండం పెట్టుకుని రావల్లనే కదా ఇంతదూరం వచ్చిండేది. బిరిన్నే పదా ..”  

ప్పుడు మైక్ ముందుకు పార్వతి వచ్చి నిలబడి చుట్టూ చూసింది.

పార్వతి పొడవుగా వుంటుంది. వాళ్ళ నాన్నకు అక్కడపొలం వుంది. కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయింది కానీ యస్ఐ కావాలని పోటీ పరిక్షలకు చదువుకుంటోంది. ఆమె తల తిప్పుతూ అక్కడ గుమిగూడిన వారిని చూస్తూ మాట్లాడుతోంది...

“ఒక్కటే మాట.  అంబేద్కర్ చెప్పినాడో , ఇంకొకాయన చెప్పినాడో  ఉడుకాయన చెప్పినాడో ఒక్కటే మాట..” ఎడమ చెయ్యి పైకి ఎత్తి మిగతా నాలుగువేళ్ళు మడచి పెట్టుకుని  చూపుడు వేలు మాత్రం పైకి ఎత్తి  చుట్టూ  చూపిస్తూ అంటోంది...

 “అస్సలు ఈ కులం ఎవడికి పుట్టింది? మన భూమి అనేది మన ఆత్మగౌరవం. ఎవరు ఏం చేసినా సరే మన భూములు అమ్మడానికి లేదు. మందు, బిర్యానీ,డబ్బులేకుండా ముందు  ఓటేద్దాం.అప్పుడు వాళ్ళే దారికొస్తారు.

మనది దొంగదారి అంటారా వాళ్ళు.. చూద్దాం..దాన్ని మళ్ళీ డొంక దారి చేసుకుందాం.ఇది మన దారి.. రహదారి.ఏమంటారు ? అన్నతమ్ముల్లారా , అక్క చెల్లల్లారా.. ఏమంటారు? ”

“అంతే అంతే.. “ జనం ఉడుగ్గా ఉన్నట్లున్నారు.

మనుషులు వడివడిగా నడుస్తున్నారు.అక్కడ ఎండవల్లో, ఎందువల్లో వేడి సెగ కొడుతోంది.గాలిలోనే  కాదు,మనుషుల నుండీ కూడా ఏదో వేడి సెగ మొదలయ్యింది.అక్కడి వాతావరణం ఉడుకెక్కిపోయింది.అక్కడున్న వాళ్ళు అందరూ ఉడుకెత్తి పోతున్నారు.
పలకల చప్పుడు ఎక్కువైంది. చప్పట్లు, ఈలలు, నినాదాలు, అరుపులు, ఏడ్పుల మధ్య  ఉడుకోడి శవం పైకి లేచింది.

@@@

 

కథలు

నెయ్యి బువ్వ

"ఇప్పుడు షాపింగ్ అని నా వీకెండ్ వేస్ట్ చేయకమ్మా"

"చెప్పేది విను. నీ వీకెండ్ ఏమీ వేస్ట్ అవ్వదు. ఇక్కడే హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో నల్గొండ జిల్లాలోనే పోచంపల్లి. 40 కిలోమీటర్లు ఏమో అంతే. మధ్యాహ్నానికి వచ్చేద్దాం"

"సరే పద, రానంటే ఊరుకోవు కదా" అని గొణుకున్నాను

సిటీ దాటి కాస్త దూరం వెళ్ళాక, ఎడమ చేతి వైపు 'భూదాన్ పోచంపల్లి' అని బోర్డు కనిపించింది. అక్కడ లెఫ్ట్ తీసుకుని కాస్త లోపలికి వెళ్ళాక ఒక మెయిన్ రోడ్డు, దానికి రెండువైపులా చిన్న చిన్న గల్లీలు. గల్లీకి రెండువైపులా పెంకుటిళ్లు. ప్రతి ఇంటి ముందు ఒక అరుగు, వసారాలో మగ్గం పనికి సంబంధించిన ఏదో ఒకటి కనిపించింది అక్కడ.

కార్ ఇంక ఆ గల్లీలో వెళ్ళేటట్టు లేదని తెలిసి, పక్కన పార్క్ చేసి, చీరలు ఎక్కడ కొనాలా అని వరుసగా చూసుకుంటూ వెళ్ళాం నేను, అమ్మ. ఒక ఇంటి దగ్గర నిలువు పేకల మగ్గంపై నేసిన నలుపూ తెలుపు రంగు చీర కనబడింది.

"అది బాగుంది, తీసుకో" అన్నాను .

"నలుపూ తెలుపు కాంబినేషన్‍లో ఏది చూసినా అదే ఫైనల్ అంటావు. ఇంకా చూద్దాం ఉండు" అంది అమ్మ.

వసారాలో ఒకతను రంగులద్దే పనిలో ఉన్నాడు. ఇదే కదా రంగు అని ఒక పెద్దాయన్ని అడుగుతున్నాడు.

"పసుపు రంగు తగ్గియ్. చీర కన్నా పెళ్లికూతురు ఎక్కువ మెరిస్తే బాగుంటది."

"అంచుకి కొండలు కాదు, కమలం వెయ్. కమలం విరబుయ్యాలె. ఆకులు రెపరెపలాడాలె. అట్లుండాలె. కొంగు రంగు మూర మూరకి మారాల. అది డిజైను" అని మగ్గం మీద కూర్చున్న ఇంకొక అతనితో చెప్తున్నాడు.

ఇంతలో మమ్మల్ని చూసి, "రా బిడ్డా రా, పోచంపల్లి చీరలు మస్త్ ఫేమస్ మాకాడ. ఓ నాల్గు చీరలు పట్కవోదువుతీయి" అని లోపలికి తీసుకువెళ్లాడు.

మూడు గదుల ఇల్లు అది. వంటింటి నుండి గిన్నెల చప్పుడు వినబడింది. కొత్త కోడలు అనుకుంటా, మెడలో పసుపు తాడు ఆమె మేని రంగుతో పోటీ పడుతోంది. చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చి పెద్దావిడ పక్కన కూర్చుంది. ఆసు పోయడం నేర్చుకుంటోంది. కాసేపటి తర్వాత "నెయ్యి బువ్వ బిడ్డా" అని పెద్దావిడ కోడలికి చెప్పి లోపలికి వెళ్ళింది.

"నెయ్యి బువ్వ ఏంటి? అప్పుడే భోజనం వేళ అయ్యిందా?" అనుకున్నాను చేతికున్న గడియారం వంక చూస్తూ.

"సూడు బిడ్డా. గీ చీరలకి పాత బస్టాండ్ల మా పట్కరోల్ల దుక్నంల మంచి గాజులు పట్కవోదు, మస్త్ ఉంటై, లచ్మి దేవి లెక్క." అని చీరలు పట్టుకొచ్చి మా ముందు పెట్టాడు ఆ పెద్దాయన.

ఆయన ప్రతి డిజైన్, ప్రతి రంగు తీసి చూపించి, భుజంపై వేసుకుని, అటు ఇటు తిప్పి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన కొడుకు వాటిని తిరిగి మడతలు పెడుతున్నాడు.

"ఇది ఇక్కత్ నేత బిడ్డా. మన బతుకుల్లో అంకాలున్నట్టే ఇందులో కూడా చానా ఉంటై. ఇవి రెడీ కావడానికే మస్త్ టైం పడ్తది. జీవితం లెక్కనే చిక్కులు చిక్కులుగా ఉంటది పట్టు దారం. ఒక్కో సమస్య తీర్చి ముందుకు పోయినట్టే ఒక్కో పోగును రాట్నంపై వడుకుతం. వడికిన పట్టు కండెలకు సుట్టి, ఆడ నుండి దారమంతా ఆసు పోస్తం. అగో అట్ల" అని కోడలు వైపు చూపించిండు. "ఆసుకు రంగు అద్దకముందే డిజైన్లు వేస్తం. మస్తుంటయి ఆ డిజైన్లు. నెమళ్ళ నాట్యం, చిలుకల నవ్వులు కానొస్తయి ఈ ఇక్కత్ నేతల. డిజైన్లు ఆసుపై వేస్కొని, మిగిలిన ఆసుకు రబ్బర్లు చుట్టేస్తం. అచ్చం మనం జీవితంల దేని మీద మనసుపెట్టాల్నో దాని మీదనే పెట్టి, మిగతాది ఇడ్సినట్టు. వేడి చేసిన రంగునీటిలో రంగులద్ది, అది ఆరినంక రబ్బర్లు విప్పి వార్పు పరుస్తరు, దాన్ని మగ్గంపై నేస్తరు. మగ్గం నేసేటప్పుడు చేనేత కార్మికుడి చేతులు, కాళ్లు పని చేయాల్సిందే. ఏ ఒక్కటి ఆగినా చీర రాదు."

ఇంత ఉంటదా ఒక చీర వెనక కష్టం అన్నట్టు ఆ పెద్దాయన్ని చూస్తూ కూర్చున్నాను. అమ్మ ఓ నాలుగు చీరలు సెలెక్ట్ చేసుకుని బిల్లు కట్టింది. మళ్ళీ కావాలంటే తప్పకరండి అని చెప్పి, ఫోన్ నెంబర్ ఇచ్చి గుమ్మం వరకు వచ్చి సాగనంపాడు పెద్దాయన.

రెండు వారాల తర్వాత, 'మండే బ్లూస్' అని ఫ్యాన్సీగా చెప్పుకునే ఓ సోమవారం. పది గంటల సమయంలో నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర క్యాబ్ దిగాను. సెక్యూరిటీ చెక్ దగ్గర బ్యాగ్ పెట్టి లోపలికి వెళ్తూ గ్లాస్ డోర్ అద్దంలో నేను కట్టుకున్న చీరని మరోసారి చూసుకున్నాను. మీటింగ్‍కి ఈ చేనేత చీర ఏంటని అమ్మని పదిసార్లు తక్కువ అడిగుండను. పెద్ద పెద్ద కంపెనీల నుండి సీనియర్ లీడర్స్, ఫారిన్ డిగ్నిటరీస్, ఎన్‌జిఓ నుండి ప్రతినిధులు, అందులోనూ ఆడవారు వస్తున్నప్పుడు కాస్త కనెక్ట్ అయ్యేటట్టు ఉండాలంటే చీర సరైన డ్రెస్ కోడ్ అని నచ్చజెప్పింది.

'అన్ని ఫ్యాన్సీ చీరలు ఉంటే ఈ ఓల్డ్ మోడల్ చీర ఇచ్చింది అమ్మ.. ఏముంది ఇందులో? జ్యామితి పుస్తకంలో బొమ్మల్లా చీర అంచులో కొండలు, కమలాలు. ఎలా దీన్ని క్యారీ చేయడం?' అని ఆలోచనలో పడ్డాను.

వెనుక నుండి సంయుక్త వచ్చి భుజం తట్టగానే ఆలోచనల్లో నుండి బయటపడి తిరిగి చూసాను.

"ఏంటే, నువ్వేనా? ఆఫీస్‍కి సూట్ అంటేనే చిరాకు పడేదానివి, ఇవ్వాళ ఏకంగా చీర, అది కూడా ఇక్కత్.. అద్దిరిపోయింది లుక్.."

"థాంక్యూ.."

"వెల్కమ్ వెల్కమ్, సరే పద, మనం వెళ్ళాల్సింది ఫస్ట్ ఫ్లోర్ కాన్ఫరెన్స్ రూమ్‍కి"

అప్పటికే లాబీలో హై టీ నడుస్తోంది.

"లూజ్ హెయిర్ మీద ఈ ఇక్కత్ చీర భలే ఉంది" అని తెలిసినావిడ షేక్ హ్యాండ్ ఇస్తూ మెచ్చుకుంది. ఆవిడ మాటలకి అప్పటివరకు పడ్డ టెన్షన్ కాస్త తగ్గింది.

లోపలికి వెళ్ళగానే ఒక ఫారిన్ డెలిగేట్ ఎదురొచ్చి తన కంపెనీ బ్రోచర్ ఇచ్చింది. "ఓహ్! ఐ లైక్ యువర్ స్టైల్. ది సారీ అండ్ ది సిల్వర్ జ్యువలరీ, జస్ట్ బ్యూటిఫుల్" అని చీర కొంగు చేతిలోకి తీసుకుని బట్టని సవరతీసింది. మనసు ఇంకా తేలిక పడినట్టు అయ్యింది.

ఒకావిడ ప్రోగ్రాం గురించి చెప్తూ, "ఇక పరిచయాలకు వస్తే, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ, ఇవ్వాళ మీరు వేసుకున్న డ్రెస్ గురించి లేక తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ గురించి, ఇక వేరే ఏదైనా సరే ఏమైనా స్పెషల్ ఉంటే మాట్లాడండి" అని చెప్పి ముందు వరుసలో కూర్చున్నావిడకి మైక్ అందించింది.

పరిచయాల పేరుతో వాతావరణం ఫ్రెండ్లీ గా అయేటట్టు, ఒకరినొకరు బాగా తెలుసుకోవచ్చని ఆవిడ ఉద్దేశం. ఏమి చెప్పాలా అని ఆలోచిస్తూ పక్కన పెట్టిన బ్యాగ్‍ని చూసాను. టీవీ యాడ్‍లో కరీనా కపూర్ ఆ బ్యాగ్ పట్టుకుని భలే స్టైల్‍గా నడిచిందని అమ్మ నాలుగు తిట్టినా, మూడు వేలు పోసి ఇనార్బిట్ మాల్‍లో కొన్నట్టు గుర్తు. అందులో ఏమీ స్పెషల్ కనిపించలేదు. ఇక చీర. ఇది అమ్మ చీర, అది కాక ఇందులో స్పెషల్ ఏముంది? తన కోసం, మేనత్తల కోసం ఇలాంటి చీరలు కొనడానికి వీకెండ్ పాడు చేసి మరీ పోచంపల్లి తీసుకెళ్లింది ఆ రోజు. ఆ చీరని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలీని అనుభూతి కలిగింది. ఎందుకో ఇక్కత్ ప్రక్రియ గురించి జీవితంతో పోల్చి ఆ పెద్దాయన చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి.

అంతే, ఆయన పూనుకున్నట్టు అనిపించింది. మైక్ నా చేతికి రాగానే..

"ఐ యామ్ వేరింగ్ ఇక్కత్ ఫ్రొం భూదాన్‌ పోచంపల్లి. ఇట్ ఈజ్ సిల్క్ సిటీ అఫ్ ఇండియా. ఎప్పుడో 1953లో మొదలయ్యింది ఈ కళ.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేసిన నేతన్నలు నిలువు - పేకల కలబోత ఈ ఇక్కత్. 2005లో పోచంపల్లి చీరకు భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ లేదా ఇంటలెక్చుయల్ రైట్స్ ప్రొటెక్షన్ లభించింది. ఈ రోజు నేను కట్టుకుంది కూడా అక్కడ చీరే. నేను ఈ ట్రెడిషనల్ చీరని మోడరన్ క్రొషే టాప్‍తో మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను, టు గివ్ ఇట్ ఎ ట్రెండీ లుక్" అని ఆ పెద్దాయన నుండి మాట అందుకుని చెప్పినట్టు, గడ గడ మైక్‍లో చెప్పేసాను. జోరున చప్పట్లు వర్షం కురిసింది. ఆ రోజు ఆ పెద్దాయన అమ్మకి ఈ కళ గురించి చెప్తూ, మధ్య మధ్యలో నన్ను చూస్తూ ఉన్నాడు. నీకు కూడా చెప్తున్నా విను, అనే అర్థం కనపడింది ఆ చూపులో. ఇది తెలీకపోతే ఇవ్వాళ ఏం చెప్పేదాన్ని?

ఇక సంతోషం పట్టలేక మీటింగ్ అయ్యాక బయటకి వచ్చి ఆయనకి కృతజ్ఞతలు చెప్పడానికని ఫోన్ చేశాను.

అటు వైపు నుండి, "హలో.. ఎవరు? బాపు లేరు మేడం. కోవిడ్ వచ్చి పోయిండు మేడం" అని ఆ అబ్బాయి గొంతు పూడుకుపోయింది.

"ఇప్పుడు మీ కుటుంబానికి ఎట్ల?" అని అడిగాను.

"నెయ్యి బువ్వ మేడం"

"నెయ్యి బువ్వ అంటే?"

"నేస్తేనే బువ్వ మేడం… మా బాపు నేర్పిందే"

 

కథలు

దేనికీ  భయపడొద్దు (ఎరికిలోల్ల కథలు – 6)

“ దీన్ని టీ అంటారా ?  ” మొగిలప్ప గొంతు మెత్తగా వుంది.

పైకి గట్టిగానే  అంటున్నట్లున్నా  ఆ గొంతులో ఏదో కోపం, ఉక్రోషం, నిరసన ఉన్నాయి,  కానీ అంతగా గట్టిగా మాట్లాడలేక పోతున్నాడు.ఆ  గొంతులో ఏదో మొహమాటం, బెరుకు.

నాకు చప్పున అర్థం కాలేదు. కానీ నేను ఆలోచించే లోపే మొగిలప్ప గొంతు సవరించుకుని  బెరుగ్గా  “ స్టీల్ గ్లాస్ లోనే టీ  ఇవ్వు రెడ్డీ , వేడిగా  వుంటుంది అని ఎన్నోసార్లు చెప్పింటా.  అయినా నువ్వు ఆ ప్లాస్టిక్ కప్పులోనో , పేపర్ కప్పులోనో ఇస్తావు. టీ అస్సలు తాగినట్లే వుండదు రెడ్డీ ..  ” అంటున్నాడు నంగి నంగిగా.

గల్లాపెట్టె వద్ద నింపాదిగా కుర్చుని విసనకర్రతో విసురుకుంటున్న  హోటలు ఓనరమ్మ వక్కాకు కసాబిసా నములుతూ  కొరకొరా చూసింది మొగిలప్ప వైపు.  ఆపక్క ఆ కుర్రాడేమో అస్సలు మొగిలప్ప మాటలు వినిపించుకునే స్థితిలో లేడు. వినడం వరకూ అయితే విన్నాడు కానీ అసలేమీ , విననట్లు, మొగిలప్ప మాటలకు ఎలాంటి స్పందనా లేనట్లు మా చేతుల్లోకి పేపర్ కప్పులు పెట్టేసి తలతిప్పుకుని , ఏదో పాట పాడుకుంటూ , బాయిలర్ లో బొగ్గులు కలబెట్టుకుంటూ ఉండిపోయాడు.

మొగిలప్ప అనింది  నిజమే.ఆ టీ టీ లాగా లేదు. టీ వేడిగా లేదు, అట్లాగని చల్లగానూ లేదు, ఎటొచ్చీ నాకు కావలసినంత వేడిగా మాత్రం లేదు.ఆ టీ లో రుచీ లేదు,ఏమీ లేదు.  మొగిలప్ప ఏదో అనబోయి, బస్తాoడులోకి వెడుతున్న బస్ డ్రైవర్ వేసిన హారన్ సౌండుకి  ఆగిపోయాడు.     

బస్తాoడు పక్కనే టీ హోటల్.  ఎంత మాత్రం రద్దీగా లేదు.

ఎండా ధాటికి జనం ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిచిపోయినట్లున్నారు. రోడ్డు పైన రద్దీ అంతగా లేదు. బస్టాండు కూడా దాదాపు నిర్మానుష్యంగానే వుంది.దుఖానాలు అన్నీ నీరసంగా కనిపిస్తున్నాయి.బస్సులు కూడా అయిష్టంగా బద్దకంగా కదులుతున్నాయి.

అయినా ఎండను ఎంత మాత్రం లేక్కచేసే అలవాటు లేని వాళ్ళు, లేదా ఎండలకు బాగా అలవాటు పడినవాళ్ళు మాత్రం ఎండను పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ  పనుల్లో వాళ్ళు హడావిడిగా వున్నారు. రెండు చక్రాల లాగుడుబండి లాగే ఇబ్రహీం ముసలితనాన్ని లెక్క చెయ్యకుండా నిర్లక్ష్యంగా తలను అటు ఇటూ తిప్పుతూ మొహానికి పట్టిన చమటను విదిలించి పారేస్తూ సరుకుల బండిని లాక్కుపోతున్నాడు. బజారు వీధి సందుల్లోకి ఆటోలు, లారీలు  వెళ్ళలేవు.బస్టాండులో కానీ,  లారీ పార్సిల్ ఆఫీసుల వద్దనుండి సరుకులు షాపుల్లోకి పోవల్లటే ఎడ్లబండి పురుషోత్తం అయినా  లాగుడుబండి ఇబ్రహీం అయినా  కదాల్సిందే. లేదంటే ఆ సరుకులు రోడ్డు దాటి, ఇరుకైన బజారు వీధుల్లోకి పోలేవు. హంగూ ఆర్భాటాలు కొత్తగా  ఎన్ని వచ్చినా వూరు మొత్తం మారిపోయినా , వూరి నడిబొడ్లో ఇప్పటికీ మారంది మూడే. ఆ ఎడ్లబండీ, ఆ లాగుడుబండి, బస్టాండు ముఖద్వారం వద్ద ప్రశాంతంగా నిలుచుని ఒక చెయ్యి పైకి ఎత్తి  నవ్వుతూ అభివాదం తెలిపే నెహ్రూ విగ్రహం.

టీ పూర్తయ్యే లోగా సెల్లు రింగ్ అయింది . ఈరోజుకు ఒకే నెంబర్ నుండి వచ్చిన పదహారో కాల్. 

అవతల వైపు మా పిన్నమ్మ “ పూజ సామన్లు అన్నీ తీసుకున్నారు కదా చిన్నోడా ?”

ఆ ప్రశ్నకు జవాబు చెప్పేలోగా ఆమె కొనసాగించింది..”  మొగిలప్ప నీతో బాటే వున్నాడు కదా. వాడికేమీ తెలియదు. నువ్వే బద్రంగా చూసుకోవల్ల.  ఎలాగైనా  సరే నా కొడుకు పొలీసు కావల్ల అంతే ..వాడికి అన్నీ భయాలే.  నువ్వు చెప్పినావనే హైదరాబాదుకు కోచింగు కోసం పంపినా. మా పొలీసు మునిరత్నం అన్న కూడా ఈ రోజు  మునిదేవరకు వస్తా వుండాడు కదా. వాడితో కూడా మాట్లాడిపించల్ల.నువ్వేం చెప్తావో నువ్వేం చెపుతావో, నేర్పుతావో   నా కొడుకు మాత్రం పొలీసు కావలసిందే. అయినా మొగిలప్పకి నువ్వంటే బాగా గురి. నీ మాట బాగా వింటాడు చిన్నోడా . నువ్వేం చెప్తావో  నువ్వేం చెపుతావో, నేర్పుతావో   నా కొడుకు మాత్రం పొలీసు కావలసిందే. ”

ఆమె ఆగదు, మనమే ఎక్కడో చోట ఆమెను ఆపాలి. “ పిన్నమ్మా నేను మాట్లాడతాలే. నువ్వు బాధ పడొద్దు.” అని చెప్పి ఆమె సమాధానం కోసం ఆగకుండా సెల్ కట్ చేసేశాను.అంత సేపూ మొగిలప్ప నా వైపే చూస్తూ వున్నాడు.వాడి మొహం నిండా నవ్వు.  వాడికి మొత్తం అర్థం అయిపోయింది.

మా పిన్నమ్మ మాట్లాడేటప్పుడు స్పీకర్ ఆన్ చెయ్యకపోయినా మాటలు బయటకే స్పష్టంగా వినిపిస్తాయి. ఆమె గొంతు అంతే. ఎదురుగా నిలబడి నేరుగా మాట్లాడినప్పుడు చూడాలి, చుట్టుపక్కల  వీధి మొత్తo  అందరికీ వినిపిస్తూ వుంటుంది. దీనికి పూర్తిగా వ్యతిరేఖం మా చిన్నాయన. గొంతు బాగా తగ్గించి మెల్లగా, నింపాదిగా మాట్లాడటం ఆయనకు ముందునుండీ వచ్చిన  అలవాటు. కొత్తవాళ్ళు అయన మాట్లాడేది కనుక విన్నారంటే , ఆయనేదో  చెప్పకూడని పరమ భయంకరమైన రహస్యం ఏమిటో చెపుతున్నట్లు పొరబడతారు.

“ చిన్నప్పుడు ఆటలోనే దొంగా పొలీసు అడుకోవల్ల. అంతే కానీ ఎరికిలోడు ఏంది.. పొలీసు కావడం ఏంది ?మనోల్లంటే ఆ డిపర్మెంటు లో  మర్యాద యాడ వుంటుంది? ’’ మా చిన్నాయన ఎప్పుడూ  మా పిన్నమ్మ  ఆశలపై నీళ్ళు  చల్లే  మాటే అది. మా పిన్నమ్మకు  ఆ మాటలు అస్సలు నచ్చదు. ఎట్లాగైనా వాళ్ళ కొడుకు మొగిలప్పను  పోలీసు చెయ్యాలనేది మా పిన్నమ్మకు ఎన్నో ఏళ్ళ కోరిక.

 ” పోయి  పోయి  ఆ పోలీసు మునిరత్నం గురిoచి చెప్తా ఉండాది సూడు. ఏ కాలం లోనో ఆయప్ప ఉద్యోగం పోగొట్టుకున్యాడు.పొలీసు ఉద్యోగం మనకులానికి అచ్చిరాదురా  అని మీ నాయన ఎంత చెప్పినా,  ఆమాట మీ తమ్ముడు ఏనాడైనా వినింటే  కదా. ఆయన మాటలు విని ఇంకేదైనా వేరే  ఉద్యోగంలో చేరింటే ఈ పాటికి మంచి పొజిషన్లో వుండేవాడు కదా. సంపాదించే రాత రాసి వుంటే కదా . తలపైన రాత బాగాలేనోల్లే కడాకి  తలలు చెడుపుకుంటారు. “ మా చిన్నాయన మాటలు ఇంకా పూర్తి కాకముందే, వక్కాకు తుపుక్కన ఉమిసి, మా పిన్నమ్మ అయన మాటలకు గబాలున అడ్డం వచ్చేస్తాది.

“ మా అన్నకి  ఇప్పుడేం తక్కువా అని ?ఎట్లైనా మా అన్న డ్యూటీ లో వున్నింటే ఇప్పుడు  ఇన్స్పెక్టరు ర్యాంకు కదా. వాని టైం బాగాలేక వాడు  బంగారం లాంటి ఉద్యోగాన్ని  వద్దనుకుని అట్లా వచ్చేసినాడు కానీ,  వాడి మోహంలో వుండే కళ ఈ ఇలాకాలో కానీ,  మనోల్లల్లో కానీ  ఎవరికీ వుందో సెప్పబ్బా? ఆ దిష్టే తగిలి వుంటుంది. అందుకే కడాకి యెట్లా కాకుండా అయిపోయినాడు మా మునిరత్నం అన్న.  ”

“ పొలీసు కావడం అంటే మాటలనుకున్నావా? మన ఇండ్లల్లో యాడ జరుగుతుంది.  ఆ మునిరత్నం   ఒక్కడే కదా పోలీసు, ఆయప్ప కూడా ఇప్పుడు  ఉద్యోగంలో లేడు. ” ఇదీ మా చిన్నాయన గోవిందయ్య వాదన.

          “ మా అన్న   ఏమన్నా కాని పని చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడా?ఎంతో పద్దతిగానో కదా ఉద్యోగం చేసినాడు. ఒంటినిండా భయంతోనే కదా నడచుకున్యాడు. వాడ్ని గానా  ఏమన్నా ఒక్కమాట అన్నావంటే బావుండదు. ఒక్క మాట అడ్డంగా మాట్లాడినా  నేను వూర్కోను ముందే సెప్తా ఉండాను. ” మొహం తిప్పుకుంటూ కళ్ళు తిప్పుతూ, చేతులు చూపిస్తూ పెద్ద గొంతుతో మా పిన్నమ్మ అలివేలమ్మ అట్లా   మా చిన్నాయనను చాలాసార్లు భయపెట్టడం నాకు బాగా గుర్తు వుంది.

అప్పటిదాకా ఎంత సేపు ఏమేం మాట్లాడినా, అట్లా మా పిన్నమ్మ కోపంతో విరుచుకు పడేసరికి మా చిన్నాయన మెత్తగా అయిపోయేవాడు. పైకి ఏమి మాట్లాడే వాడు కాదు కానీ, అక్కడినుండి బయటకు వచ్చి మెల్లగా గొనుక్కునే వాడు.ఇదంతా ఎప్పుడూ  ఉండేదే ! అయితీ ఈరోజు ప్రత్యేకం ఏమిటి  అంటే చాలా కాలంగా నేను వింటూ వుండిన  ఆ పొలీసు మునిరత్నం అనే పెద్దమనిషిని ఈరోజు కలవబోవటమే.                                                                  

హైదరాబాదు నుండి   కోచింగ్ పూర్తి చేసుకుని నెలప్పుడు ఇంటికి వచ్చాడు మొగిలప్ప. బాగా చదువుతానని  వాడికి నేనంటే చాలా  ఇష్టం. గ్రూప్ వన్ ఇంటర్వ్యూ లో పోయినా పట్టు విడవకుండ గ్రూప్ టూ జాబ్ కు సెలెక్ట్ అయ్యానని నేనంటే మంచి గౌరవం కూడా.

“ అన్నా పరసువేది చదివినావా , సీక్రెట్ చదివినావా, జోనాధన్ లివింగ్ స్టన్ సీగల్ చదివినావా ? నువ్వు ఏం చదివినావో చెప్పు, నేనూ నీలాగే కాంపిటిషన్ పరిక్షలు పాస్ అయిపోయి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయి ఉద్యోగం సంపాదిoచల్ల. మా నాయనను, అమ్మను అడవిలోకి పోనీకుండా , కంపా గోడూ తెచ్చే పనిలేకుండా, పందుల్ని మేపే పని చెయ్యనీకుండా బాగా చుసుకోవల్ల అన్నా. ఎట్లాగైనా గవర్నమెంటు జాబ్ కొట్టాల్ల అన్నా. నువ్వు చెప్పు యెట్లా చదవాలో,నీ టెక్నిక్ ఏందో చెప్పన్నా.” ఇట్లాగే మాట్లాడతాడు ఎప్పుడూ మొగిలప్ప. నేను నవ్వేసే వాడిని.

“ పుస్తకాలు చదివితేనే పరిక్షలు పాస్ అయ్యేట్లుంటే , కొన్ని లక్షల మందికి ఈ పాటికి పెద్ద పెద్ద ఉద్యోగాలే వచ్చి వొడిలో వాలిపోయి ఉండల్ల.కేవలం పుస్తకాలు చదివితే సరిపోదు. అధ్యయనం ముఖ్యం, సూక్ష్మ పరిశీలన  ముఖ్యం, పుస్తకం మనలో ఇంకి పోవల్ల.నేను పక్కాగా నా నోట్స్ నేనే ప్రిపేర్ చేసుకుంటా.ఇంతకు ముందు నాలాగా పరిక్షలు రాసి పాస్ అయిన వాళ్ళని కలసి వాళ్ళ అనుభవాలు తెలుసుకునే వాడ్ని.మనం ఎవ్వరిలా కావాలని అనుకుంటామో, అలాంటి వాళ్ళని కలసి వాళ్ళు యెట్లా ఈ ఉద్యోగాన్ని ఇష్టపడేవాల్లో, వాళ్ళు యెట్లా సక్సెస్ అయ్యారో  తెలుసుకునే వాడ్ని. వాళ్ళ అనుభవాలతో  మనకు ఎన్నో మెళకువలు నేర్పుతారు.” అని నేను చెప్పిన మాటల్ని అతడు బాగా గుర్తుపెట్టుకున్నాడు.

చుట్టుపక్కల ఇండ్లల్లోంచి యస్టీ కాలని పిల్లల్ని కొందర్ని గుంపుగా  చేర్చి సాయంత్రాలు గుడిసె ముందు నిలబెట్టి పందుల షెడ్ వైపు చెయ్యి చూపిస్తా మొగిలప్ప క్లాస్ చెపుతుంటాడు. మొదట్లో ఒక్క మాట అంటాడు ” ఈ జీవితం మారల్ల, బ్రతుకులు బాగు పడల్ల అంటే చదువొక్కటే మార్గం. “ అప్పుడప్పుడూ నేను కొంచెం దూరంగా నిలబడి అతడి మాటల్ని ఆసక్తిగా వింటూ వుంటాను.

“నిద్రపోతే  వచ్చేది కాదు కల అంటే .మీకు నిద్ర లేకుండా రాకుండా చేసేదే మీ అసలైన కల. మీ కలల్ని ముందుగా మీరు చూడగలగాలి .నిద్రలేవగానే  రోజూ అద్దం లో మిమ్మల్ని మీరు చూసుకోవాలి,  ఎప్పుడైతే మీ మొహం బదులు మీ లక్ష్యం, మీ భవిష్యత్తు మీకు కనపడతాయో.. ఆప్పుడు మీరు మీ లక్ష్యానికి చేరువలో వున్నారని అర్థం. మీకు కార్ కావాలి అంటే మీరు దాన్ని ముందుగానే ఊహించాలి. ఏరకం కారుఏ మోడల్ కొనాలో స్పష్టత వుండాలి.  అదే మాదిరి మీరు ఏ ఉద్యోగం కావాలి అనుకుంటున్నారో ఆ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళను కలవాలి. ఆ ఉద్యోగం గురించి ముందుగా తెలుసుకోవాలి.  మీ వాళ్ళల్లో అంటే మీ బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళల్లో కానీ మీరు కోరుకునే ఉద్యోగాలు చేస్తున్న  వాళ్ళతో మాట్లాడండి, నేరుగా వాళ్ళను కలవండి. ఉత్తుత్తి బంధుత్వాలు, పరిచయాలు, స్నేహితాలు వేరు. వాళ్ళ వృత్తిలో వాళ్ళ అనుభవాలు మీకు స్ఫూర్తి కలిగిస్తాయి.మీ కలలు త్వరగా సులభంగా నెరవేరుతాయి.” హైదరాబాద్ లో పోటీ పరిక్షల శిక్షణా కేంద్రం లో ఎప్పుడూ వినే మాటలే అతడిలో బలంగా జీర్ణించుకుని పోయాయి. మొత్తానికి అతడి  కల పొలీసు కావడం. 

అందుకే ఎప్పుడూ పొలీసు మునిరత్నం పేరు కలవరించేవాడు. మన బంధువుల్లో  ఒక్క పోలీసు ఉన్నాడు కదన్నా. ఎట్లాగైనా ఆయన్ని కలవాల్సిందే అనేవాడు. ఇప్పుడు అతడికి ఉద్యోగం లేదంట కదా . వేరే వాళ్ళను కలుద్దాం లే  అని నేను చెప్పినా, “ అది కాదన్నా, మనోడైతే మనకు అన్నీ చెప్తాడు కదా అని అనేవాడు.  

“ ఏం లేదన్నా. ఆయన ఎందుకు ఉద్యోగం మానేసాడో అదికూడా తెలుసుకోవల్ల కదా..ఎంతో కష్టపడితే వచ్చిన ఉద్యోగాన్నే వదులుకున్నాడు అంటే ఏందో బలమైన కారణమే వుంటుంది కదా. అది తెలుసుకోవాలి అనుకుంటున్నా. ఎవర్ని అడిగినా ఏదేదో చెప్తావుండారు, గానీ ఆయన్నే నేరుగా అడిగేస్తే అసలు కథ ఏందో ఆయనే  చెప్పేస్తాడు కదా “ అనేవాడు.  ఆ పోలీసు మునిరత్నం  గురించి అస్సలు ఏం జరిగిందో ఎవరికి తెలీదు. పొలీసు కావాలని అనుకునే వాడ్ని కదా..అయన పోలీసు ఉద్యోగం ఎందుకు వద్దనుకున్నాడో, ఎందుకు వదులుకున్నాడో.. తెలుసుకోవాలని మొగిలప్పకే కాదు నాకూ వుంది. అయితే ఇన్నేళ్ళకు ఈరోజే ఆ అవకాశం వచ్చింది. బజారుకు వెళ్లి ఇంట్లోవాళ్ళు చెప్పిన పూజ సామాన్లు , పూలు, పండ్లు తెస్తూ మధ్యలో బస్టాండు వద్ద ఆగి,  టీ తాగుతూ మరోసారి ఇవే విషయాలు మాట్లాడుకున్నాం.

అక్కడే వార్తలు అక్కడక్కడా చదువుతా, కొన్ని వార్తలు వదిలేసి , దినపత్రికలని అక్కడే పడేసి,  టీ తాగడం అయ్యాక  అక్కడినుండి కదిలాం.

అప్పటికి సమయం సరిగ్గా పన్నెండు గంటలు.

ముందు మా  ఇల్లు చేరి అమ్మ అడిగిన వస్తువుల్ని అమ్మకు అప్పకు అప్పగించాక మా చిన్నాయన వాళ్ళ ఇంటివైపు నడిచాం.  యస్టీ కాలనీలో దుర్గమ్మ గుడి ముందు కోలాహలంగా వుంది. గుడికి దగ్గరే మా చిన్నాయన వాళ్ళ ఇల్లు.  లౌడ్  స్పీకర్ లోంచి అమ్మ వారి శ్లోకాలు, పాటలు పెద్ద సౌండ్ తో వినిపిస్తున్నాయి. పిన్నమ్మ  మేం తెచ్చిన పూజ వస్తువులన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటా వుంటే, మా చిన్నాయన మెల్లగా నోరు విప్పినాడు.     

 “ సూస్తావుండు. ఈ దినం సూడు.. మొత్తం జాతర మాదిరి జనం ఉడ్డ చేరిపోతారు. యాడేడ వుండే వాళ్ళో దూరాభారం అని సూడకుండా వచ్చేస్తారు సూడు.నువ్వు ఎప్పుడూ అడగాతా ఉంటావే, పొలీసు మునిరత్నం ఎవురు ఎవురు అని, ఈ దినం సూపిస్తాలే. మొగిలప్ప డౌట్లు అన్నీ తీరిపోతాయి ఈ దినం ” అన్నాడు మా చిన్నాయన నవ్వుతా తన సహజ ధోరణిలో. ఈ సారి ఎందుకో ఆయన మాటలు ఎంత చిన్నగా మాట్లాడినా, అంత సౌండ్ లోనూ నాకు స్పష్టoగానే వినిపించాయి. అదే ఆశ్చర్యం.

ఆ మాట అనగానే నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది.ఎన్నాళ్ళ నుండో అడుగుతున్నాను, కానీ నాకు ఆ మునిరత్నం అనే అయనను కలుద్దామంటే  ఇప్పటిదాకా కుదరటమే  లేదు.ఎప్పుడైనా పండగలు దేవరలు, చావులు, పుట్టిన రోజులు, పెళ్ళిళ్ళు ఇలా అనేక సందర్భాల్లో బంధువులు అనే వాళ్ళు కలవడం మామూలే కానీ , అయన మా వూరు వచ్చినప్పుడు నేను హాస్టల్లో , లేదా నేను వచ్చిన సందర్భాల్లో అయన రాకుండా పోవడమో, నా చదువులు , పరిక్షలు, డిగ్రీ అయ్యాక గ్రూప్స్ కి  కోచిoగ్  కోసం నేను హైదరాబాద్ లో మూడేళ్ళకు పైగా ఉండిపోవడంతో నాకు ఆయన్ను కలిసే అవకాశమే లేకుండా పోయింది. చిన్నప్పుడు, మధ్య మధ్యలో కొన్ని సార్లు  ఆయన్ను చూసాను కానీ, అంతగా నేను పట్టించుకుంది లేదు.

నాకంటే ఎక్కువ  ఉత్సాహం , కుతూహలం మొగిలప్పలో కనిపిస్తున్నాయి.

“పోలీసు మునిరత్నం అన్న పేరు ఒక్కటే కాదు నాయనా , ఇంకా ముందు ముందు పోలీసు మొగిలప్ప అనే పేరు కూడా మన ఎరికిలోల్లు చెప్పుకోవల్ల. ఈ ఇలకలో మనోల్లల్లో పోలీసు అనే వాడు లేదు అని ఎవ్వరూ అనుకునే పనే లేకుండా చేస్తాను  , చూస్తా వుండు, మాటంటే మాటే. ”         మొగిలప్ప గొంతులో అప్పటిదాకా లేని స్పష్టత నాకు ఆశ్చర్యం కలిగించలేదు.ఆ మార్పు  నేను ఊహిస్తున్నదే. ప్రతి ఒక్కడికీ లోపల ఏదో సాధించాలి అనే తపన వుంటుంది,కొందరికి అది ఎప్పుడోసారి గబుక్కున వెలుగుతుంది. కొందరికి ఎవరో ఒకళ్ళు   అగ్నిలాగా దాన్ని వెలిగించే సందర్భాలు కొన్ని వుంటాయి.

నింపాదిగా అతడి వైపు చూశాను. మంచి పొడగరి, ధీశాలి గా కనిపిస్తాడు మొగిలప్ప. కురచగా జుట్టు కత్తరించుకుని, పోలీసు క్రాప్ తో ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు. అతడి కళ్ళల్లో వెలుతురు అతడు తప్పకుండా అనుకున్నది సాధిస్తాడు అనే నమ్మకాన్ని నమ్మకంగా చెపుతోంది.

మునిదేవర పండగ ఇంకా మొదలు కాక ముందే పొలీసు మునిరత్నం నేరుగా గుడి ముందుకు వచ్చేసాడు.  మనోళ్ళు అందురూ ఉడ్డ చేరినప్పుడైనా, వినిపించాల్సింది దేవుడి పాటలు కాదుకదా  అని క్యాసెట్టు మార్పించేసినాడు. ఆయనకి అడ్డు చెప్పే వాళ్ళు అక్కడ ఎవరూ లేరు. కులనిర్మూలన పాటలు, అంబేద్కర్ పాటలు యస్టీ కాలనీలో ..ఒళ్ళు జలదరించింది నాకైతే.. ! కొన్ని క్యాసెట్లు గుడికి తెచ్చినానని చెపుతూ గుడి పనులు చూసే ప్రకాష్ కి అందించాడు.మనిషిలో వయసు తెలియడం లేదు,  చురుగ్గా ఉత్సాహంగా వున్నాడు. అదే అతడి ప్రత్యేకతేమో అనిపించింది నాకు .

కుశల ప్రశ్నలు అయ్యాక మా చిన్నాయన వాల్ల ఇంట్లో అందరం మాటలకు దిగేసినాం.ఉండ బట్టలేక మొగిలప్ప అడగనే అడిగేసినాడు . పోలీసు ఉద్యోగం గురించి, డ్యూటీ గురించి, సాధక బాధకాల గురించి చెప్పుకొచ్చాడు ఆయన.   

“ ఏ తప్పు చెయ్యని, మనోల్లని తప్పుడు కేసు లేకుండా పోరాడి వాళ్లకి న్యాయం అయితే చేసినా కానీ నాపైన పెద్ద కులపోల్లకి, పై ఆఫిసర్లకి మంట మొదులైపోయింది. ఏందేందో డ్యూటీ లు వేసి, ఎక్కడెక్కడో తిప్పతా వున్యారులే. మనకి ఇది సెట్టు కాదని తేల్చుకున్యాక, మనకులపోల్లకే న్యాయం చెయ్యలేమని తెలుసుకున్యాక గట్టిగా ఎదురు తిరిగినాలే.” అని క్షణం  ఆగి కొనసాగించాడు.

“మన ఎరుకల కులాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకుంటానా? ఎరుకలోడు అయితే దొంగే అంటావా? ఎవడ్రా దొంగా.. దొంగ నాకొడకా అని యస్ ఐ చొక్కా పట్టుకునేస్తి. ఉద్యోగం అయితే పొయ్యింది కానీ నా పేరులోంచి పోలీస్ అనే మాటను పికేదానికి ఎవడి తరం కాలే. ఇదంతా చెప్పేది  నిన్ను భయ పెట్టాలని కాదు. అన్నిటికి సిద్దపడి ఉద్యోగం లో చేరల్ల అని హెచ్చరించేడానికి మాత్రమే . మన  కులం గురించి చెప్పకుండా ఉండలేం. కులాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎవరి కులం వాళ్లకు గొప్ప. ఎప్పుడో ఎవరో  ఏ  కాలం లోనో  దొంగతనాలు చేసినారని మొత్తం మన జాతినే దొంగలంటే యెట్లా ఒప్పుకుంటాం ?ఉద్యోగం కంటే గౌరవం ముఖ్యం. ఉద్యోగం వల్ల వచ్చేదే గౌరవం కాదు. తలపైన టోపీ పోయినా పర్వాలేదు కానీ తల దించుకునే ఖర్మ నాకు వద్దు అనుకున్నాను. పోయిన ఉద్యోగం గురించి నాకు ఎప్పుడూ బాధ లేదు.నేల తల్లిని  నమ్మినాను. మట్టికి కులం లేదు, మలినం తెలీదు . నా బ్రతుకేందో నేనే సొంతంగా బ్రతకతా ఉండాను.  రోజoతా  సెల్యూట్ కొట్టేది మానేసి ఇప్పుడు నేలతల్లికి దండం పెట్టుకుండా ఉండాను..”

అయన మాట తీరు స్పష్టంగా వుంది. ప్రశాంతంగా చూస్తూ మెల్లగా మాట్లాడుతున్నాడు.ఎక్కడా తడబాటు లేదు, మొహమాటం కానీ , జరిగిపోయినదాని గురించి బాధ కానీ అతడి మోహంలో కానీ, మాటల్లో కానీ, గొంతులో కానీ కనిపించడం లేదు.

మునిదేవర పూర్తి అయ్యింది, మధ్యాహ్నం ఆకలి వేళ. వడ్డనకి ఎవ్వరూ ముందుకు రావడం లేదు, మొహమాట పడుతున్నట్లు వున్నారు.మునిదేవర చేసిన ఇంటి వాళ్ళు కొందరు అటూ ఇటూ తారాడుతున్నారు.

ఎండ భీకరంగా వుంది.అందరికీ ఆకలి వేస్తా వుంది. ఇంకా భోజనాలకు పిలుపు రాలేదు. ఏ నిముషంలో అయినా పిలువు రావచ్చు అనే ఆశతో జనం భోజనాల బల్లల వద్ద షామియానా కింద ఆకలి మొహాలతో ఆశగా ఎదురు చూపులు చూస్తూ వున్నారు.

పోలీస్ మునిరత్నం మొహమాటం లేకుండా భోజనాల బల్ల వద్దకు నడిచాడు, మమ్మల్ని కూడా రమ్మన్నట్టు సైగ చేయడం తో మేం కూడా మొహమాట పడుతూనే అతడితో బాటూ ముందుకు నడిచాo.

“ ఈ బెరుకూ మొహమాటాలే కద చిన్నోడా ..  కొంపలు ముంచేది.నువ్వు ఏమైనా చెప్పు.. మనోళ్ళకు ఎక్కడికి పోయినా మొహమాటాలు బెరుకూ ఎక్కువే. ధైర్యం తక్కువ. టకా అని ముందుకు  దూసుకు పోలేరు. కొంచెం ఎదిగినోల్లని చూస్తే  మనోళ్ళే అయినా సరే, మనోళ్ళు ముందుకు పోలేరు. మనోల్లే మనోళ్ళతో కలవలేరు. కొంత మంది కొంచెం పైకి వచ్చినాక ఎరికిలోల్లు అనికూడా చెప్పుకోరు. థూ..కులం పేరు కూడా మార్చి చెప్పుకుంటారు బడాయికి .అట్లాంటి వాళ్ళని కులo లోంచే  వెలివేయల్ల చిన్నోడా. రా.... రా... తిoడికాడ మొహమాటం వుండకూడదు  ” ఆ మాటలు వింటూ అప్పటిదాకా అతడు భోజనాల కోసం వెడుతున్నాడని అనుకున్నాం కానీ,  అతడు నేరుగా వడ్డనలోకి దిగిపోయాడు. మమ్మల్ని చూసి ఇంకో నలుగురు కుర్రాళ్ళు ముందుకు వచ్చారు.

“ చూడండి ముసలివాళ్ళు, చిన్న పిల్లోల్లు, ఆడోల్లు పని చేసి చేసీ  బాగా ఆకలిపైన వుండారు. ఎండకు గాలికి  ఇంకా ఆకలి పెరకతా వుంటుంది కడుపులో. ముందు వాళ్ళని కూర్చో మని చెప్పండి.  ” అంటూనే చురుగ్గా అతడు కదిలాడు. నిముషాల్లో అక్కడ అంతా సద్దుమనిగింది. కుర్చీలు కొన్ని దూరంగా వేయించడం, చేతులు కడుక్కోవడానికి దూరంగా బకెట్ నిండా ఉప్పునీళ్ళు తెప్పించడం, తినేసిన ఆకులు, ప్లాస్టిక్ గ్లాసులు పడేయటానికి వెదురు గంపలు పెట్టించడం అంతా చకచకా  జరిగిపోయింది.గంటన్నరలో భోజనాలు ముగిసాయి. ఆఖరి బంతిలో మేం కూర్చునే సరికి మాకు వడ్డించడానికి చాలామంది పోటీ పడ్డారు.

అప్పుడు అక్కడ ఎలాంటి మొహమాటాలు లేవు.వాళ్ళు ఎవరో, మాకు వరసకి ఏమవుతారో  కూడా నిజానికి మాకు తెలియదు.  సందడిగా మనుషులు కొందరు  ముందుకు వచ్చారు అంతే.!. మనుషులు మనుషుల పట్ల యెట్లా ఎందుకు స్పందిస్తారో అప్పుడు అర్థం అయ్యింది నాకు.

అయన బయలుదేరుతున్నపుడు బస్టాండు వరకూ నేను, మొగిలప్ప తోడుగా వెళ్ళినప్పుడు, అయన మేం వద్దంటున్నా వినకుండా టీ హోటల్ కు తీసుకు వెళ్ళినాం. టీ హోటలు ఓనరమ్మ విసనకర్రతో మొహానికి అడ్డంగా విసురుకుంటూ ఉంది. మేం కాస్సేపు నిలబడి చూసాం కానీ, టీ వేసే కుర్రాడు భోజనానికి వెళ్లి ఇంకా వచ్చినట్లు లేదు. చెక్క బెంచి పైన కూర్చుని, అప్పటిదాకా అతడ్ని అడగలనుకుని, అడగలేక పోయిన ప్రశ్నని  బయటకు తీసాం.

“ మీరు ఎందుకు పోలీసు ఉద్యోగం  వదులుకున్నారు మామా ? ”

ఆయన మా నుండి ఈ ప్రశ్న వస్తుందని ముందుగానే ఊహించినట్లు ఉన్నాడు. మా వైపు చూస్తూ చిన్నగా నవ్వినాడు. హోటల్ ఆమె వైపు, రోడ్డు వైపు, బస్టాండు లోకి పోతున్న ఆటో వైపు , రోడ్డుకు అటు వైపుగా నిలుచుని అదే పనిగా తోక ఊపుతున్న కుక్కని చూసాడు.మళ్ళీ మా వైపు తల తిప్పి చూస్తా అదే మాదిరి మెల్లగా పైకి కనపడీ, కనపడకుండా నవ్వినాడు.

“ వానలో మోబ్బులో ఆరోజు రాత్రి కదా నాకు ప్రాణం పోయినంత బాధయ్యింది. స్టేషన్ లో డ్యూటీ లో వుండినప్పుడు మనిషి ఎట్లా వుండల్లో తెలుసా...?” అని క్షణం ఆగి మా వైపు తేరిపారా చూసాడు, చూసి అతడే ఎంత మాత్రం ఆలస్యం లేకుండా జవాబు చెప్పేసాడు.

” ఎట్లుండాలో తెలుసునా? మనిషి మనిషిగా మాత్రం వుండ కూడదు.మనిషి పోలీసులాగే  ఉండల్ల. రాయిలాగా గట్టిగా నిలబడల్ల. కళ్ళ ముందర అన్యాయమే  జరిగినా చూస్తూ నెమ్మదిగా గుడ్దోని మాదిరి ఉండల్ల, ఏడుపులు ఎంత మాత్రం  వినిపించనంతగా చెవులు మూసుకోవల్ల  చిన్నోడా.. కొత్తగా ఉద్యోగంలో చేరినా కదా. అప్పుడు నాకు అదంతా తెలీదు. ఆ గొంతు ఎక్కడో తెలిసినట్లే అనిపించింది. ఆ మొహం సరిగ్గా కనపడలేదు కానీ ఎక్కడో బాగా చూసినట్లే అనిపించింది. మా హెడ్డు అప్పటికే  నన్ను దూరంగా లాగతానే వున్యాడు కానీ నాకే అర్థం కాలేదు....”  అని కాస్సేపు ఆగిన్నాడు.

 బహుశా ఆయన కళ్ళల్లో కన్నీల్లు ఇమిరి పోయినట్లున్నాయి. మొహంలో మార్పు కనిపించింది. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. ఈ లోగా చాయ్ వచ్చింది. “ఇంకొంచెం డికాషన్ వేసి ఆకు మార్చి స్ట్రాంగ్ గా ఇవ్వు బాబు”  అని మాత్రం అన్నాడు.ఆ గొంతు లోని స్థిరత్వo , అజ్ఞాపిస్తున్నట్లు వచ్చిన ఆ మాటల  తీవ్రతకి ఆ హోటలు కుర్రాడు మాత్రమే కాదు , మేం కూడా ఉలిక్కిపడ్డాం.కొన్ని క్షణాల్లోనే అయన తన దుఖపు జ్ఞాపకాల్లోంచి  తేరుకోవడం నాకు ఆశ్చర్యం అనిపించింది కానీ,  అట్లా ఆయన  తనను తాను  అట్లా సర్దుకోవటానికి ఎన్ని ఏండ్లు ఎన్ని విధాలుగా తనను తానూ సర్దుకుని ఉంటాడో అని అనిపించింది.

ఏమనుకున్నాడో ఏమో, ఆ టీ హోటలు కుర్రాడు మా గ్లాసులు కూడా మౌనంగా  వెనక్కి తీసేసుకున్నాడు. ఏమీ మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు.

 పోలీసు మునిరత్నం ఇప్పుడు పోలీసు కాదు.అయినా  పోలీసు క్రాప్ అట్లాగే మైంటైన్ చేస్తున్నాడు.ఆయన ఇప్పుడు పొలీసు ఉద్యోగంలో లేక పోవచ్చు. కానీ ఆ  గొంతులో ఏదో వుంది. అది కేవలం అధికారానికి సంభందించింది కాదు.కొంచెం ప్రేమా, కొంచెం మార్దవం, కొంచెం అనునయం, ధైర్యం, తెగింపు,నిలదీసి ప్రశ్నించే నిక్కచ్చితనం,  అన్నీ కలసిపోయిన గొంతు అది.ఒక్క మాటలో చెప్పాలంటే అతడి గొంతులో, మాటలో ఏదో క్లారిటీ వుంది.  

ఈ సారి గ్లాసులు మారాయి.

ముందు మాకు ఇచ్చిన ప్లాస్టిక్ కప్పులో పేపర్ కప్పులో కావు.

వాటి బదులు   స్టీలు గ్లాసులు వచ్చాయి.

 టీ ముందులాగా నీళ్ళు నీళ్ళుగా లేదు. చిక్కగా వుంది. స్ట్రాంగ్ గా వుంది. టీ టీ లాగే  వుంది.రంగు రుచి చిక్కదనం..పరిమళం అన్నీ ఉన్నాయి.

“ చాలసార్లు చెప్పినా విల్లు వినలే.ఇప్పుడు సూడు.. దీన్ని కదా   టీ అంటారు.” అన్నాడు మొగిలప్ప కళ్ళ నిండా నవ్వుతూ టీ ని ఇష్టంగా, సంతోషంగా  చప్పరిస్తూ...

“ అవునవును ఇది కదా టీ...”  అన్నాను నేను కూడా నవ్వుతూ.

హోటల్ ఓనర్ వైపు చూశాం. ఆమె కళ్ళు కొంచెం పెద్దవి చేసి  మమ్మల్నే చూస్తా వుంది. ఆమె కళ్ళల్లో విస్మయం,భయం, కంగారు.

“మార్పును చూసి తట్టుకోవడం ఎవరికైనా వెంటనే కష్టమే.!కొంచెం టైం పడుతుందిలే ..” అంటున్నాడు మా పోలీసు కాని  పోలీసు మామయ్య మునిరత్నం.ఇంకో  మాట కూడా అన్నాడు మొగిలప్ప భుజం పైన చెయ్యి వేసి..

“ముందు నువ్వు ఒకటే నేర్చుకోవల్ల పిల్లోడా . ఏదైనా సాధించాలి అనుకునే ఎరుకలవాడి  జీవితంలో భయంవుండకూడదు...ముందు మనిషనే వాడు  భయాన్ని నరికేయ్యాల్ల. నువ్వు ఏదైనా కల గంటే ముందు నువ్వు దేనికీ  భయపడొద్దు . ధైర్యంగా వుండు. అదే అన్నిజబ్బులకి మందు “.

అప్పుడు చాలా కాలం  తర్వాత  మొదటిసారి నాకు ఇంకో టీ తాగాలనిపించింది. వాళ్ళిద్దరి వైపు చూసాను, వేడి వేడిగా అందరికంటే ముందు ఖాలీ అయిన నా టీ కప్పు వైపు చూస్తా నవ్వుతున్నారు ఇద్దరూ.

ఇబ్రహీం రోడ్డు దాటుతున్నాడు.  ముసలితనాన్ని లెక్క చెయ్యకుండా అదే నిర్లక్ష్యంగా తలను అటు ఇటూ తిప్పుతూ మొహానికి పట్టిన చమటను విదిలించి పారేస్తూ,ఎండని, చలిని పట్టించుకోనట్లు,దేనితో సంభందమే  లేనట్లు, దృష్టి మొత్తం వెడుతున్న దారి మీదే  నిలిపి ఇబ్రహీం ఏకాగ్రతతో సరుకుల బండిని లాక్కుపోతున్నాడు

” బాబూ ఇంకో స్ట్రాంగ్ టీ.. వేడిగా చిక్కగా..  ”

            

                          

కథలు

కాలు

       ఉన్నట్టుండి తాను ఎవరూలేని ఒంటరివాణ్ణని గ్రహించటానికి వీలైంది. నిదానంగా లేచి మేడమీది గదిలో నుండి బయటికొచ్చి వరండాలో నిలబడి ఎదురుగా వ్యాపించి వున్న మామిడి చెట్టును చూశాడు. గుత్తులు గుత్తులుగా కాయలు నిండివున్నాయి. ఆరేడు ఉడుతలు... అవి తమకోసమే వున్నాయన్న హక్కుతో ఆ కొమ్మలలో ఇటు అటు పరుగెడుతున్నాయి. చాలారోజులుగా గమనించకుండా వున్న ఆ చెట్టు నిండుదనం అతనిని ఆశ్చర్యపరిచింది.

            మేడమీది గదులలోనూ, కింది కార్యాలయంలోనూ తక్కువంటే ముప్పైమంది పని చేస్తున్నప్పటికీ, ఏ శబ్దమూ లేక వుడుతల శబ్దాన్ని ఇవ్వాళ మాత్రం ఒంటరిగా వినటానికి వీలైంది.

            ఇలాంటి ఒక ఏకాంతం ఏర్పడి చాలా కాలమైంది. కీర్తిప్రతిష్ఠల్ని పట్టుకొని మింగే మొదటి అంశం ఈ ఏకాంతమే. అది తనకు చిన్నవయసులోనే లభించటం అదృష్టంగానూ, దురదృష్టంగానూ చెప్పుకోవచ్చు. ఈ మేడమీది గది నుండి దిగి వెళ్లి, కారు అద్దం గుండా మాత్రమే చూసే ఆ మూలనున్న టీకొట్లో నిలబడి ఒక టీ తాగటానికి తనవల్ల వీలవుతుందా?

            గుంపు చేరిపోయి, ట్రాఫిక్‍ ఆగిపోయి, పోలీసులు రాకుండా అక్కణ్ణించి మళ్లీ రెండు నిమిషాల నడకలో అధిగమించి తన కార్యాలయానికి చేరుకోలేని కీర్తిప్రతిష్ట అది. గత పదీ ఇరవై ఏళ్లలో మరింకే తమిళ నటుడూ ఎంతగా పోటీ పడినప్పటికీ తానున్న స్థాయిలో సగం కూడా చేరుకోలేకపోయారు.  

            ఇప్పుడు ఒక చిరునవ్వు తననూ అధిగమించి పూయటం అంతరాత్మ ఆస్వాదించింది.

            తన అలవాటైన దినచర్యల నుండి ఇవ్వాళైనా దూరం కావాలన్న మనిషి భావనను మౌనంగా అంగీకరించాడు.

            తన సొంత గ్రామంలోని పెంకుటిల్లు, దాని వెనకున్న పెరడూ, దానికి మధ్యనున్న తులసికోట, తమ ఇంటి రాత్రి భోజనమూ అన్నీ గుర్తుకొచ్చాయి.

            ఇప్పుడే గమనించాడు, ఆరేడు కావు పదీ ఇరవైకి పైగానే ఉడుతలు ఆ చెట్టు కొమ్మల్లో అంతా వ్యాపించి వుండటాన్ని. ఒకప్పుడు తమ ఇల్లూ ఇలాగే ఉన్నది. అది తమందరినీ బయటికి పంపించే కదా తాళం పెట్టుకుంది. తర్వాత ఒక ప్రదర్శన వస్తువైంది. ఈ చెట్టు పచ్చదనం కోల్పోయి చెట్టు ఎండిపోతే, ఈ ఉడుతలూ ఇక్కణ్ణిండి వెళ్లిపోతాయి. దూరమై ఎక్కడెక్కడికో వెళ్లి అతుక్కుపోతాయి. బంధాలూ స్నేహమూ వాటి ఎడబాటూ, కనుమరుగైపోవటం కూడా ఈ కీర్తిప్రతిష్ఠల ముందు ఏమీ లేనిదైపోతుంది.

            కాసేపటి క్రితం మెరిసిన చిర్నవ్వు మాయమై ఇంకేదో మనసును తొలుస్తోంది. బర్మా టేకుతో చేసిన తమ ఇంటి డైనింగ్‍ టేబుల్‍ గుర్తుకొస్తోంది. ఒక దినాన్ని పూర్తిచెయ్యటం కోసం ఒక్కొక్క దినమూ జరిగే కోలాహలాన్ని స్వీకరించిన మంటపం అది.

            ఎప్పుడూ అక్కే సంభాషణల్ని ప్రారంభించేది. మాటల దొంతర అగ్గిపుల్లల్లా ఎప్పుడూ ఆమె వద్దే వుండేవి. లోతుగా ఆలోచిస్తే అవి సంభాషణలు కావు. కథలు. కథలు కూడా కావు. ఒకే ఒకరి జీవితంలోనుండి తొలిచి వెలికి తీసిన చేదుమాత్రలు. ఎందుకీమె చేదును ఇంతగా ఆస్వాదిస్తుంది.

            ఆ ఇంటి డైనింగ్‍ టేబుల్‍ దగ్గరున్న కుర్చీల్లో అక్క మాససికమైన ఆర్‍.కె.వి కీ ఒక చోటుంది. చెప్పాలంటే అక్క తన ఆదర్శ రచయితకు వేసిన సింహాసనం చుట్టూ వాళ్లందరూ వున్నారు.

            అక్కడ జరిగేదంతా వినోదంగా వుంటుంది. అన్నం, భోజనం బల్లమీదికి రావటానికి మునుపే అవ్వాళ అక్క కథ చెప్పటం కొన్నిసార్లు పూర్తయ్యేది. వడ్డించిన భోజనం నోటికి అందించటం మరిచిపోయి మాటలు విరిసేవి. భోజనం చివరలోనూ వివాదం ప్రారంభమయ్యేది. చిరు చిరు గొడవలు లేక రాత్రి నిద్ర వుంటుందా?

            పగటిపూట ఆర్‍.కె.వి. కథలు చదవటమూ, సాయంత్రం దాకా వాటి గురించే చర్చించే అక్కకు రాత్రి భోజనం రణస్థలమే. తన మేథస్సు ఈ వివాదాల ద్వారా పదును తేలటం ఆమె గ్రహించి ఒక్కో రాత్రికోసమూ ఎదురుచూసేది.

            నాన్న, అన్నా, ఎప్పుడూ ఆమె మాటలను వ్యతిరేకించేవాళ్లుగానూ, వదినా, అతనూ దాన్ని మౌనంగా భద్రపరుచుకునే  వాళ్లుగానూ వున్నారు. వదినె మౌనం ఎవరివల్లా కొలవటానికి వీలుకాదు.

            అప్పటివరకూ వున్న మొత్తం తర్కాన్నీ చెదరగొట్టేందుకు ఆమెకు ఒక వాక్యం కాదు, ఒక్క మాట చాలు. ఆమె ప్రదర్శించే ప్రశాంతత అందరినీ ఎప్పుడూ ఒక రకమైన అప్రమత్తతలోనే వుంచుతుంది.

            అతనికి చదవటంపై ధ్యాస పెట్టలేని కాలం అది. వినటం, చూడటం, దృశ్యీకరించటం. ఇది వరుస మారి మారి వస్తూ వెళుతుండేవి.

            అయితే, ఒక ముగింపుకు వచ్చేశాడు. ఈ ముఖం తెలియని ఆర్‍.కె.వి ఎప్పుడూ ఈ ఇంటి డైనింగ్‍హాల్లో కూర్చుని వివాదాల సంకెళ్లను తెంపేసేవాడు. అది స్వేచ్ఛగా పరుగులు తీసేవి. అవి కొలిక్కి రావటానికి ముందు రాత్రి తనలో అందరినీ పొదుపుకునేది. ఇది తీరని వ్యాధిలాగా వ్యాపించింది. చెన్నైకు వచ్చి, మొదటి ఆరేడు సినిమాలలోనే తారాస్థాయికి వెళ్లిక్షణకాల ఏకాంతానికీ తపించిన ఒక వర్షాకాల రాత్రిపూట, సినిమా షూటింగ్‍ రద్దయ్యి ఇదేవిధంగా జీవించిన ఒక ఏకాంతంలోనే ఆర్‍.కె.వి యొక్క మొదటి కథను అతను చదివాడు. ఆ సంపుటిని పూర్తి చేయటానికి అతనికి యేడాది సరిపోలేదు. ఇప్పుడు వివాదాలను మొదలుపెట్టేందుకు అక్క అవసరం లేదతనికి. అతను మాత్రమే చాలు. నాన్న, అన్నా తననుండి ఎంత దూరంలో నిలబడ్డారో కొలవటానికి వీలైందీ అప్పుడే.

            అక్క ప్రతిరోజూ ఆరోజుటికి తగ్గ అగ్గిపుల్లల్ని ఈ దాచిన దానిలో నుండే వెలిగించేటట్టుంది. వదినె తన మౌనంతో వాటిని మనసులోనే అంగీకరిస్తున్నట్టుంది.

            ఈ నిదానంలో, ఉడుతల ఉత్సాహంలో, ఒక పండిన మామిడికాయ రాలిన శబ్దంలో అన్నీ అర్థమవుతున్నాయి.

            జీవితం తనను మాత్రమే ఎందుకు ప్రారంభంలోనే తారాస్థాయికి తీసుకెళ్లి దింపి, మిగతా వాళ్లందరినీ వంగి చూసేలా చేసింది? పిచ్చిపట్టి చదివిన అక్కను ఏది దాన్ని విదిలించి పడేసేలా చేసింది? విని పెరిగిన నన్ను ఏది చదవటానికి ప్రేరేపించింది? అన్నీ ఎప్పుడూ మార్పుకు లోనయ్యేవే.

            ఇప్పుడు శబ్దం చేస్తూ నవ్వటానికి వీలైంది.

            నలభై ఏళ్లుగా చూడటానికి ఇష్టపడని ఆర్‍.కె.వి. ని ఇవ్వాళ చూడాలని ఇదిగో ఈ ఎవరూలేని ఈ తరుణం అతనిని ముందుకు నెడుతున్నది. ఆయనతో మాట్లాడటానికి, విమర్శించటానికి, గొడవపడ్డానికి, ఇప్పటివరకూ అడ్డుపడ్డ కాలం పరుగులు పగిలి చెదిరిపోతున్నాయి. ఆ జ్ఞాపకాల అంతంలో టి.నగర్‍లోని జగదీశ్వరన్‍ వీథిలో కాస్త లోపలగా వున్న ఆ ఇంటి ముందు అతని రేంజ్‍ రోవర్‍ కారు ఆగింది.

            దారంతా అతని ఎన్నో హావభావాలతో వున్న పెద్ద పెద్ద బ్యానర్లు అతనిని ఇంకా పారవశ్యానికి లోను చేసింది.

            కార్లో నుండి దిగి ఆ వీధిని చూశాడు. ప్రజలు తమ తమ దినచర్యలలో మునిగిపోయి వున్నారు. ఒక్కరూ తనను గమనించలేదని కదలగానే ఎక్కణ్ణించో నలుగురైదుగురు పరుగెత్తుకొచ్చి కరచాలనం చేశారు. ఎదురింటి నుండి ఒక స్త్రీ నలిగిన చుడీదార్‍తో  ఒక ఆటోగ్రాఫ్‍ కోరుతూ నిలబడింది. అంతా ఒక్క క్షణమే. వెంటనే ఆ ఇంటికి పక్కనే వున్న మేడమెట్లపై నడుస్తున్నాడు. తన షూల శబ్దం ప్రత్యేకంగా వినిపించటం గ్రహించాడు. ఇది తానుఅన్న గొప్పతనానికి చిహ్నం. నన్ను గమనించు, నన్ను గుమిగూడుఅన్న ప్రాబల్యపు ఆహ్వానం. ఆగి తన షూలను విప్పేశాడు. ఒక్కక్షణం వాటిని అక్కణ్ణించి అలాగే విసిరేద్దామనిపించింది. అయితే వీలుకాలేదు.      

            మెట్ల పక్కగా వాటిని వేరుగా పెట్టాడు. తనవాటితో పోల్చటానికి వీలుకాని ఇరవైకి పైగా చెప్పులు అక్కడున్నాయి. వాటిని బట్టి లోపలున్న వాళ్లను అంచనా వెయ్యటానికి ప్రయత్నిస్తున్న తన అజ్ఞానానికి తనకే వాంతి వచ్చేలా అనిపించింది.

            నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించాడు. అది మేడమీద కొబ్బరాకులతో కట్టిన ఒక కొట్టం. ఒక సౌకర్యవంతమైన కుర్చీలో ఆర్‍.కె.వి కూర్చొని వుండగా ఆయనకు ఎదురుగా కొందరు కూర్చొని కనిపించారు.

            ఎంతో వినయంగా ఆయనకు నమస్కరించాడు. ఈ వినయం తన జీవితంలోనే మొదటిసారి.

            ఆయనలోని అలక్ష్యాన్ని గమనించాడు. లేదూ తనముందు ఇప్పటివరకూ కొనసాగిన వంగొని వుండే స్థితికి ఇది మొదటిసారి వ్యతిరేకం.

            ‘‘కూర్చోండి.’’ అని ఎదురుగా వున్న ఒక పాత కుర్చీని చూపించారు.

            ఆయన ముందు వ్యాపించి వున్న మౌనంలో మాటలన్నీ కుమ్మరించి వున్నాయి. అందులో ఒక్కమాట కూడా అతనివల్ల ధైర్యంగా తాకటానికి వీలుకాలేకపోయింది. చాలాసేపటి తపన తర్వాత, ‘‘మీరెందుకు ఇప్పుడు ఏమీ రాయటం లేదు?’’ వరుసగా పేర్చిన మాటలు చెమర్చాయి.

            ‘‘రాసిందే ఎక్కువని ఇప్పుడనిపిస్తోంది.’’

            సన్నని చిరునవ్వు ఒకటి పూచేలా చేశాడు.

            ‘‘నేను మీ కథలను విని పెరిగినవాణ్ణి.’’

            ఆయన ఇప్పుడే అతణ్ణి ముఖాముఖి చూశారు. చూపులు చాలా దగ్గరగా వున్నాయి.

            ‘‘పెరిగాకే చదవటం మొదలుపెట్టాను.’’

            ‘‘ఎవరు పెరిగాక?’’

            మౌనాన్ని ఇద్దరూ ఆశ్రయించారు.

            ‘‘మీరు మీ గాయత్రిని ఒక రోల్‍మోడల్‍గా చేసి సమాజం ముందు నిలబెడుతున్నారు. అది నాకు సమంజసమనిపించటం లేదు. కేవలం  సంచలనాల కోసం కావాలనే సృష్టించారు. గాయత్రి మునుపటిలా లేదు.’’

            అతను మాట్లాడుతూ వున్నాడు. ఆయన అతనిని అధిగమించి తన చూపులతో దూరంగా వున్న ఒకరి దగ్గర ఆగారు. అతనూ ఆగకుండా ఆయన ముందు గుమ్మరించసాగాడు. చాలు అని భావించగానే ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. ‘‘రాసిన వాటిని గురించి మాట్లాడటమన్నది, శవం వెంట్రుకలను దువ్వటం లాంటిది. అది నాకెప్పుడూ ఇష్టం వుండదు.’’

            ‘‘మీరు రాసిన వాటికి మీరు బాధ్యులు కారా?’’

            ‘‘అది అచ్చుకుపోయిన వెంటనే నేను దాన్నుండి నన్ను ఖండించుకుంటాను. తర్వాత అది నీలాంటి పాఠకుడి బాధ్యత.’’

            ‘‘అయితే సమాజానికి సాహిత్యంపట్ల భాగస్వామ్యమెంత?’’

            ‘‘వీటికంతా సమాధానం నా దగ్గర లేదు.’’

            ఈ మాటలలో ఎన్నో ఏళ్ల విసుగుంది.

            ‘‘సరే, మీ కథలు ఒక సామాన్య మానవుణ్ణి ఏం చెయ్యగలుగుతుందని భావిస్తున్నారు?’’  

            ‘‘ఒక్క బొచ్చూ చెయ్యదని అనుకుంటున్నాను.’’ అని, తన ఎడమచేతిపై పెరిగి వాలిన వెంట్రుకలను పక్కకు తోశాడు.

            ‘‘అయితే ఎందుకు సార్‍ రాస్తున్నారు?’’

            ‘‘ఎందుకో రాస్తున్నాను. నిన్ను ఎవరు చదవమన్నారు? అంతటితో ఆగకుండా రాసినవాణ్ణి వెతుక్కుంటూ వచ్చి ఇలా రెచ్చగొట్టటం అనాగరికం.’’

            అతను నిశ్చేష్ఠుడయ్యాడు. ఇంకా మిగిలి వున్న మాటలూ లోలోపలే అణిగారిపోయాయి.

            గాజు గ్లాసులలో అందరికీ టీ వచ్చింది. ఆయన ఒకదాన్ని తీసుకొని అతనికీ ఇవ్వమని చెయ్యి చూపించారు.

            టీ తీసుకొచ్చిన పిల్లవాడి వెనకే ఎంతో హుందాగానూ, గంభీరంగానూ వున్న ఇంకొక వ్యక్తి లోపలికి ప్రవేశించాడు.

            ‘‘రండి బి.ఎస్‍!’’ అని ఎంతో ఆప్యాయంగా ఆయనను ఆహ్వానించి, తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇతనిని చూసి ఆయన ఒకింత కూడా ఆశ్చర్యపోయినట్టుగా అనిపించలేదు. అయితే అతను లేచి నిలబడ్డాడు.

            ‘‘ఈయన నా నలభైఏళ్ల మిత్రుడు. పేరు బి.ఎస్‍.’’

            ఆ మిత్రుడు ఎంతో హుందాగా కరచాలనం చేశాడు.

            ‘‘మీరు మాట్లాడుతూ వుండండి.’’ అని దూరంగా వున్న ఇంకో కుర్చీ దగ్గరికెళ్లాడు. జరుగుతున్నదంతా ఇంతకుమునుపు అతను చూడనటువంటివి.

            ‘‘నాకు తమిళనాడంతా రెండువేలకు పైగానే సామాజిక సేవా సంస్థలున్నాయి.’’

            ‘‘అభిమాన సంఘాలా?’’ అలక్ష్యానికి చిహ్నంగా మాటలు వెలువడ్డాయి.

            ‘‘మరో దారి లేదు. నేనూ వాటిని అలాగే స్వీకరించాల్సి వచ్చింది. అయితే వాటిని నేను వృద్ధి చెయ్యటానికీ, ఇంకా పై స్థాయికి తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తున్నాను.’’

            ‘‘చెయ్యండి.’’అలక్ష్యం కొనసాగింది.

            ‘‘వాళ్లు చదువుతారా, సమాజానికి ఏదైనా చెయ్యదగినవారేనా?’’

            ‘‘ఔను!’’

            ‘‘మంచిది.’’

            ‘‘అందుకు మీ సాయం కావాలి.’’

            ‘‘నేనేం చెయ్యగలనని మీరనుకుంటున్నారు.’’

            ‘‘ఏం లేదు, ఏం లేదు. మేం నడిపే ప్రాంతీయ మహానాడులో మీరొచ్చి మాట్లాడాలి!’’

            ‘‘సారీ. ఇలా అభిమాన సంఘాలకంతా వచ్చి మాట్లాడి నా సమయాన్ని వృథా చేసుకోవటం నాకిష్టం లేదు.’’

            ‘‘లేదు. మీరు అలా పక్కన పెట్టేయకండి. అభిమాన సంఘాలంటే అంత  కేవలమైంది ఏం కాదు. అందులోనూ చదువుకున్న వాళ్లు, సృష్టికర్తలూ, డాక్టర్లు, శాస్త్రవేత్తలూ అందరూ వున్నారు.’’

            ‘‘వాళ్ల ముందు నేనేం మాట్లాడతాను. నేను ఎనిమిదో తరగతి కూడా దాటలేదు.’’

            సంభాషణలోని తీవ్రతను గట్టిగా పట్టుకొని పైకెగబ్రాకాడు.

            ‘‘మీరిలా నిరాకరిస్తే నేనెలా సార్‍ వాళ్లను పై స్థాయికి తీసుకెళ్లేది. అలాగే అక్కడే వొదిలేస్తే...’’ అని కాస్త గొంతును పెంచాడు.

            అతనే ఊహించని ఒక తరుణంలో, ‘‘వస్తాను, ఏ రోజుటికి?’’ అని అడిగారు.

            ‘‘మీరు ఎప్పుడు చెబితే ఆ రోజు.’’ అని పరవశించాడు.

            ‘‘డిసెంబర్‍ 11 భారతియార్‍ పుట్టినతేదీకి, ఏ చోట్లో?’’

            ‘‘నేను కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను సార్‍. చాలా ధన్యవాదాలు.’’ అని చేతులు జోడించి లేచినవాణ్ణి మళ్లీ చెయ్యి చూపించి కూర్చోమని చెప్పారు.

            ఇప్పుడు అందరి చుట్టూ తిరుగుతూ వున్న ఆ పైపు(గంజాయి పైపు) మూడవసారి అతని దగ్గరకొచ్చింది. గాఢంగా ఒకసారి లోపలికి పీల్చి ఇచ్చినదాన్ని ఆనందంగా తీసుకునేందుకు రెండు చేతులు చాచి ఎదురుచూస్తున్నాయి.

            ఇతను సెలవుతీసుకున్నప్పుడు ఆ గదిలోని ఒకవ్యక్తి పాడటం మొదలుపెట్టాడు. దానికి బాక్‍గ్రౌండ్‍గా అక్కడ అలుముకున్న చిరు పొగమేఘాలు కమ్ముకుని కనిపించాయి.

            ‘ఉదయించటమూ లేదు అస్తమించటమూ లేదు ప్రకాశించే సూర్యుడు

            పెరిగేది లేదు తరిగేది లేదు పరిహసించే చంద్రుడు

            జీవితం ఒక రూపం, క్షణంలో ఎన్నో మార్పులు

            చదివిందీ లేదు, పరీక్షలూ లేవు నా జాతకం

            స్వశక్తి వుంది, ఇంకే బలమూ లేదు కవితా జీవితం

            మెట్లు దిగుతుంటే అతని పెదాలపై కవితా జీవితం...అని గొణుగుతూ వున్నాడు.

 

                                                                        () () ()

 

            అదొక ప్రవైటు పాఠశాల యొక్క విశాలమైన మైదానం. వేదిక అలంకరణలో ప్రతీచోటా ప్రత్యేక శ్రద్ధా, దృష్టీ పెట్టటం జరిగింది. అతని పదిరోజుల సినిమా చిత్రీకరణ పూర్తిగా రద్దైయింది. కొన్ని కోట్లు పక్కకు మళ్లాయి. అన్నింటిలోనూ తుది నిర్ణయం అతనిదిగానే వున్నది, వేదికమీద మూడు కుర్చీలు మాత్రమే వుండాలనేంత వరకూ.

            ఒకటి ఆయనకు, ఇంకొకటి తనకు, మూడవది సేవాసంస్థ ప్రాంతీయ అధ్యక్షునికి.

            ‘‘కారు పంపించనా సార్‍?’’

            ‘‘వద్దు. సరిగ్గా ఆరున్నరకు స్నేహితునితో కలిసి కార్లో వచ్చేస్తాను.’’

            అలాగే ఆరు ముప్పైఐదు నిమిషాలకు ఆ కారు మైదానంలోకి నిదానంగా ప్రవేశించింది.

            వేదిక పక్క నుండి పరుగుపెట్టి కారు ముందరి తలుపు తెరిచి ఆయనకు కరచాలనం చేసి, అక్కడే ఒక శాలువను కప్పి, గొప్ప కోలాహలం మధ్య ఆయనను గంభీరంగా వెంటబెట్టుకొని వచ్చాడు. వందలకొద్దీ కెమెరాలు పోటీలు పడి మెరిశాయి.

            వేదికమీద నిలబడి నమస్కరించారు. పక్కన నిలబడి అతను అందరినీ కూర్చోమన్నట్టుగా చేత్తో సైగచేశాడు. కాస్త కూడా విరామం లేకుండా అధ్యక్షుడు తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు.

            ‘‘మన కథానాయకుడు ఎంత గొప్పవారో చూడండి. ఆయనే కీర్తిప్రతిష్ఠలు తారాస్థాయిలో వున్న ఒక నటుడు. అయితే తన ఆదర్శ రచయితను మనకోసం ఆహ్వానించి ఆయన ఒక సేవకుడిలా దీనికోసం శ్రమించి...’’ మాటలు తడబడసాగాయి. ఇదివరకే విన్న హితవచనాలకు బలం చేకూరి, మొత్తం గుంపు నిశ్శబ్దాన్ని పాటించింది.

            ఈల శబ్దమైనా, అదెక్కణ్ణించి వచ్చిందో తెలిపేటంత నిశ్శబ్దం అది.

            ఆర్‍.కె.వి. తన కాలిమీద కాలు వేసుకొని ఆ కుర్చీలో వెనక్కు ఆనుకొని కూర్చొని వున్నారు. పకనే ముఖంలో ఆనందమూ, పారవశ్యమూ కలగలిసిన అతనున్నాడు.

            ‘‘కాలును తియ్యరా.’’ అని ఒక ఆవేశపూరితమైన గొంతు గుంపులో నుండి వచ్చింది.

            మాటలు తెగి పడ్డాయి. ఆదుర్దాగా లేచి అతను మైక్‍ ముందు నిలబడ్డాడు. ఆయన ఆ గొంతు వినవచ్చిన దిశగా చూస్తూ, తన చేతిని వుంచుకొని కాళ్లను దూరం పెట్టుకున్నారు. అన్నీ జరిగి పూర్తికావటానికి ఒకట్రెండు నిమిషాలు కూడా కాలేదు. ఎంతో ఆదుర్దాతో అతను మాట్లాడటం మొదలుపెట్టాడు.

            ‘‘ఏది జరగకూడదని నేను భావించానో అదే జరిగిపోయింది. అభిమాన సంఘాలంటే అది థర్డ్ రేట్‍ మనుషుల గుంపు అని ఆయన మొండిగా రావటానికి నిరాకరించారు. నేనే ఆయనను బలవంతం పెట్టి పిలుచుకొచ్చాను. మేమంతేరా అని మీరు నిరూపించేశారు.

            అయ్యో, నేను విని, చదివి, పెరిగిన ఒక జెయింట్‍ను ఇలా అవమానించేశారు కదరా. ఇంకో ఐదు నిమిషాలలో అలా అరిచిన వ్యక్తి ఈ వేదిక మీదికి రావాలి. మీ అందరి ముందూ సార్‍ కాళ్లమీదపడి క్షమాపణ అడగాలి. అప్పుడే ఈ కార్యక్రమం కొనసాగుతుంది.’’ అని మాట్లాడుతుండగా వేదికమీద నుండి వచ్చిన చిన్న కదలికను విని వెనక్కు తిరిగాడు.

            నలిగిన తెల్ల చొక్కాతో ఒక వ్యక్తిని నేలమీద కూర్చోపెట్టి వున్నారు. పెదవి చివరన సన్నని రక్త రేఖ కనిపించింది. కొట్టినట్టున్నారు. అతని చుట్టూ ఆరేడుమంది నిలబడి వున్నారు.

            ‘‘ముందు మీరందరూ కిందికి దిగండి.’’

            ‘‘ఆయనను అవమానించిన ఆ వ్యక్తి ఇప్పుడు ఈ సభలోనే ఉన్నాడు. ఇప్పుడు మనందరి ముందూ...’’

            అతను మాట్లాడుతూ వుండగానే, కింద కూర్చొని వున్నవాడు దూకి ఆయన ముందు టీపాయ్‍మీదున్న హ్యాండ్‍మైక్‍ను తీసుకున్నాడు. అది జారి క్రిందపడింది. అనవసరంగా అతని చేతులూ మాటలూ వణికాయి.

            ‘‘ఆయన మా వాడు, ఆయన మా వాడు.’’

            మత్తులో అతను గొంతెత్తి అరిచాడు. మొత్తం సభను లోబరుచుకునేంతగా అతని గొంతు ప్రతిధ్వనించింది. అతను టీపాయ్‍మీద తలను వాల్చి, వేదిక యొక్క నేలమీద దాదాపు ఒక వలయంలా మెలి తిరిగి విచిత్రంగా కూర్చొని వున్నాడు. తన రెండు సన్నని కాళ్లను పక్కకు పెట్టుకొని వున్నాడు.

            అతను ఇంకా ఏదో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నంతలో వేదికమీద నిలబడ్డవాడు దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించి ఆయనకేసి తిరిగి చూశాడు. ఆయన ఎంతో స్వాభావికంగా కాలిమీద కాలు వేసుకొని మునుపటికన్నా గాంభీర్యంగా కూర్చొని వున్నారు.

                                                           

() () ()

 

 

                                                                                               

           

కథలు

మాయావి 

ఆ నిశిరాత్రి ప్రపంచమంతా  నిద్రలో జోగుతున్నది. నిశాచర పక్షులు రెక్కలు తపతప లాడిస్తూ సంచరిస్తున్నాయి. కీచురాళ్ళు అదే పనిగా తమ రణగొణ సంగీతం వినిపిస్తున్నాయి 

ఆరుబయట అనువైన ప్రదేశంలో వైరస్ బృందం సమావేశమయ్యాయి. 

చాలాకాలం తర్వాత అనుకోకుండా కలిసిన బంధు -మిత్ర బృందం అలాయ్ బలాయ్ ఇచ్చుకొని ఒకరినొకరు అభిమానంగా నఖశిఖపర్యంతం పరీక్షగా చూసుకుంటున్నారు.  అంతలో  కోవిద్-19 కేసి చూస్తూ  "ఏమోయ్ మస్తు జోష్ మీదున్నావే . దునియా అంతా దున్నేస్తున్నావ్ గద.. ఇందుగలడందు లేనట్లు ఎక్కడ చూసినా అలలు అలలుగా ఎగిసిపడుతున్న నీ సంతతే. మీ తలపులే " అన్నది ఎబోలా.  

"మీరు నంగనాచిలా ఉంటారు కానీ .. ఒకటా రెండా... ఎన్నెన్ని సంక్షోభాలు మీ వల్ల.

ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, సామాజిక సంక్షోభం, సాంస్కృతిక సంక్షోభం ఇలా ఎన్నెన్నో సంక్షోభాలు సృష్టించేశావ్..ఘటికురాలివే .. " దీర్ఘం తీసింది మార్స్ 

"లోకంలో ఎక్కడ చూసినా నీ పాదముద్రలే. నీ గురించిన ఆలోచనలే.  గ్లోబంతా గిరగిరా తిరిగేస్తున్నావ్. అదీ..పైసా ఖర్చు లేకుండా' చిన్నగా నవ్వుతూ అన్నది ఇన్ఫ్లూయంజా     

కూర్చున్న చోటు నుంచి కొద్దిగా కదులుతూ "చూడడానికి నాజూగ్గా, అందంగా ఉంటావ్.  ఎక్కడేస్తే అక్కడ జంతువుల దగ్గర పడుండే సోంబేరువనుకునేవాళ్లం. ఇప్పుడేంటి ..?! నువ్వు నువ్వేనా.. నన్ను మించి పోయావ్ " ఎకసెక్కం గా నవ్వింది హెచ్ ఐ వి   

"ఊ..  ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, చదువులు లేవు, సినిమాలు లేవు, షికార్లు లేవు అన్నీ చట్టుబండలైపోయే.. జనం దగ్గర పైసలు లేవు. 

రోగం-రొష్టు,  ముసలి-ముతక అందర్నీ తుడిచేస్తున్నావ్.. ఓ యబ్బో..  

తమరి మహిమ అంతా ఇంతా కాదుగా .. "అందరి వైపు చూస్తూ అన్నది మార్స్. 

మళ్ళీ తానే  "ఆసుపత్రుల్లేవు. వైద్యం లేదు. చావుకి బతుక్కి మధ్య వేలాడుతున్న జనం.. ముఖ్యంగా వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, పేద వాళ్ళ త్యాగాలతో వారి సమాధుల వరుసల్లో రాళ్లు ఏరుకు తినే రాక్షసగణం  తయారయ్యారు.

ఆ అయినా ..  పోయేకాలమొస్తే మనమేం చేస్తాం.. " అన్నది మార్స్ 

నీ ధాటికి భయపడి సూర్యుడు వణుకుతూ సూర్య మండలంలోనే హోమ్ క్వారైటైన్ లో ఉండి పోయాడట కదా..  అనుకోగా ఆ నోటా ఈ నోటా అనుకోగా విన్నాలే.. నిజమేనా.." కళ్ళు పెద్దవి చేసి అడుగుతున్న ఎబోలా గొంతులో దాచుకుందామన్నా దాగని అసూయ కనిపించింది మిగతా వైరస్ లకు.

 నిన్ను కట్టడి చేయడానికి ప్రపంచమంతా కంకణం కట్టుకున్నదట కదా .. ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేయడం అంత సులభమా " దీర్ఘం తీసింది హెచ్ ఐవి 

 "అవును మరి, బుసలు కొట్టి కాటువేసే సర్పాన్ని ఎవరు మాత్రం ప్రేమగా పెంచుకుంటారు చెప్పండి. కోరలు పీకి పడేస్తారు. పీక నులిమి పాతరేస్తారు గానీ .. " తన వెనుక పుట్టిన దాని కింత పేరుప్రఖ్యాతులు రావడం కంటగింపుగా ఉన్న మార్స్ దీర్ఘం తీసింది. 

  "ఎందుకర్రా.. దాన్నలా ఆడిపోసుకుంటారు..అది పడగవిప్పి బుసలు కొడుతూ వెంటాడితే లోకమిలా ఉంటుందా .. లాక్ డౌన్ ఎత్తేస్తుందా .. ప్రపంచమంతా ఇప్పటికీ లాక్ డౌన్ లోనే మగ్గిపోయేది కదా .. 

జీవావరణం లో అన్ని జీవులతో పాటు, కణజాలం తో పాటు మనమూ ఉన్నాం. 

అదంతా ఇప్పుడెందుగ్గానీ ..  చాన్నాళ్ల తర్వాత కలిశాం . కాసేపు సరదాగా గడుపుదాం " అప్పటి వరకు అందరి మాటలు విన్న జికా అన్నది. 

కొన్ని క్షణాలు జికా వైపు అభిమానంగా చూసి "బంధు మిత్రులంతా  నన్ను తిడుతున్నారో పొగుడుతున్నారో అర్థం కావడం లేదు" అయోమయంగా అన్నది  కోవిద్19  . 

ఆ వెంటనే "కాలం నన్ను కౌగలించుకుంది. తనతోపాటు తీసుకు పోతున్నది. ఎటు తీసుకుపోతే ఆటుపోతున్నా అంతే.  నేను నిమిత్త మాత్రురాలిని ..

జనమే అనుకున్నా మీరు కూడా నన్ను కేంద్ర బిందువు చేసి ఆడిపోసుకుంటున్నారు" ఉక్రోషంగా మిత్ర బృందం కళ్లలోకి సూటిగా చూస్తూ అన్నది కోవిద్-19. 

మళ్ళీ తానే "ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టినట్లే నేను పుట్టాను. నాకు నేనుగా ఈ పుట్టుక కావాలని కోరుకుని పుట్టలేదుగా.. 

నా మనుగడ కి అనువైన ఆవాసాలు తెలియక ఎవరి కంట పడకుండా ఇన్నాళ్లు ఎక్కడెక్కడో అనామకంగా పడి ఉన్నానేమో..! 

మానవ శరీరంలో నా పునరుత్పత్తికి అనువైన కేంద్రాలున్నాయని తెలిసుకున్నా. 

 సృష్టి ధర్మం ప్రకారం జీవమున్న ప్రతి కణం చేసే పని నేనూ చేసుకు పోతున్నా..

అంతే తప్ప స్వార్ధంతో, ఎవరిమీదో కక్షతోకసితో కోపంతో కాదుగా.. " అదేమన్నా తప్పా అన్నట్లు అందరి వైపు చూస్తూ భుజాలెగరేసి చెప్పింది కరోనా అని పిలుచుకునే కోవిద్ 19. 

"రెచ్చిపో బ్రో.. రెచ్చిపో.. ఇంత మంచి తరుణం మళ్ళీ మళ్ళీ వస్తుందా..!

ప్రపంచ రాజ్యాలకు ప్రజల ఆరోగ్యం ఎలాగూ ప్రాధాన్యం కాదు. వాళ్ళ ప్రాధాన్యాలు వాళ్ళవి . 

యుద్ధాలు .. ఆయుధాలు.. వర్తక వాణిజ్యాలు .. ఎవరి ప్రయోజనాలు వారివి.  

హూ.. సామాన్య జనం, ఉంటే ఎంత .. పోతే ఎంత ... ఆఫ్ట్రాల్.. ఏం ఫరక్ పడదులే భాయ్.. విజృంభించడానికి మంచి సమయం ఎంచుకున్నావ్ "అన్నది మార్స్ 

"కోవిద్ 19 ఎంచుకున్నదనుకుంటున్నారా.. ఉహు లేదు లేదు.. 

నెత్తుటి కూడు తినే మానవ గణాలు కొన్ని ఉన్నాయి..  ఏమీ ఎరగని పత్తిత్తుల్లా కనిపిస్తాయి కానీ మహా జిత్తులమారులు. తమ పబ్బం గడుపుకునేందుకు తెరవెనుక పావులు కదుపుతుంటాయి . అవే ఒలిచిన పండును మన ముందు పెడతాయి.. మనకి పండగే పండుగ. తిన్నవాళ్లకు తిన్నంతని విజృభించేస్తాం" తన ధోరణిలో అన్నది హెచ్ ఐ వి

"నీలాగా, నా లాగా దీనిది ఉగ్ర తత్త్వం కాదులే.  సాధు స్వభావి.  దానికది పోయి మానవుడిని కౌగలించుకోదు. తనను కలిసిన వారినొదలదు.  తెలిసో తెలియకో మానవులే ఆకాశమార్గం పట్టిచ్చారు. నౌకల్లో మోసుకుపోయారు. సముద్రాలు దాటించారు. ఖండాంతరాలు విస్తరింపజేశారు.." ఎబోలా ను చూస్తున్న మార్స్  అన్నది 

"నిజమే..మానవుని నడక, నడతదే తప్పు. మనని  మనం ఆట పట్టించుకోవడం, నిందించుకోవడం సరైంది కాదేమో " పెద్దరికంగా అన్నది జికా 

"ఇదేమన్నా ఎడ్ల బళ్ళు , గుర్రబ్బగ్గీల కాలమా .. జెట్ యుగంలో ఉన్నాం మరి! 

మానవుడు రోదసీలో కెళ్లి వస్తున్నప్పుడు అతనితో మనం ఆ మాత్రం ప్రయాణం చేయలేమా ఏమిటిఎక్కడికైనా అలాఅలా వెళ్లిపోగలం" జికా మాటని పట్టించుకోని హెచ్ ఐ వి అన్నది

"అవునవును, కానీ .. జీవితంలో ఎన్నో గెలిచిన వాళ్ళు, అంటువ్యాధుల జాడలేని పూదోటగా మారాయనుకునే దేశాల వాళ్ళు కంటికి కనిపించనంత అతిసూక్ష్మ క్రిమికి  బెంబేలెత్తి పోవడంభయపడిపోవడం, మరణశయ్య నెక్కడం విచిత్రం!" బుగ్గన వేలేసుకుని ఎబోలా .

"అదే నాకు అంతు చిక్కడం లేదు. అసలు నేనెంత వాళ్ళ ముందు .. ఆ.. చెప్పండి. 

మానవ మేధజ్ఞానం, విజ్ఞానం ముందు మనమెంతనలుసులో వెయ్యోవంతో, లక్షోవంతో కూడా లేని నేనెంత? నాపై ఇంత ప్రచారమా.. ఎన్ని నిందలో.. మరెన్ని  కట్టుకథలో ..  

వింటుంటే మొదట్లో బాధేసేది. కానీ ఇప్పుడవన్నీ వింటూ నవ్వుకుంటూ నా పని నేను చేసుకు పోతున్నా.  

నాకా స్థితి కల్పించిన రాక్షసగణం మనోగతం అర్థమయింది. ఈ భాగోతంలో మనిషికీ మనిషికీ మధ్యదేశానికి దేశానికి మధ్య రాజకీయాలకి రాజకీయులకు మధ్య ,రాజ్యాల భౌగోళిక రాజకీయ ప్రయోజనాల మధ్య , వ్యాపార వాణిజ్య ప్రయోజనాల మధ్య  ఎన్ని రకాల సిద్ధాంతాలు .. మరెన్ని ప్రచారాలు .. ఎన్ని అపోహలు , ఎన్ని అపనమ్మకాలు ..  

ఏవీ నేను సృష్టించినవి కాదు.  నన్నడ్డం పెట్టుకుని కొన్ని గణాలు తెరవెనుక ఆడుతున్న పెద్ద ఆట.  

ఆ క్రీడలో భాగమే ఇప్పటి సంక్షోభాలు, విపత్తులు, యుద్ధాలు, దాడులు.. "వివరణ ఇస్తున్నట్లుగా అన్నది సార్స్ కోవిద్ 19 

"నీ ప్రతాపాన్ని, ప్రకృతి ప్రకోపాన్ని కూడా మానవుడికి అంటిస్తావేం .." కొంచెం విసుగ్గా అన్నది ఎబోలా 

" బ్రో .. ఆ జీవి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడేమైనా జరగొచ్చని అతని అతి తెలివితేటలే కాదు చరిత్ర చెబుతున్నది. చరిత్రలోకి తొంగి చూడండి.  వనరులకోసం, సంపద కోసం, స్వార్థం కోసం, అధిపత్యం కోసం జరుగుతున్న దేనని స్పష్టమవుతుంది" నిదానంగా అందరి కేసి చూస్తూ అన్నది కోవిద్ 2 

అప్పటివరకూ సరదాగా మాట్లాడుతున్న మిత్ర బృందం ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. కోవిద్ 19 మాటల్లో అంతరార్థం వెతకడానికి ప్రయత్నిస్తున్నారు .  

"ఆలోచిస్తే నువ్వన్నది నిజమేననిపిస్తుంది మిత్రమా..  చేతులతో గరళం విరజిమ్మదానికి సిద్ధమవుతూ  నాలుక నుంచి తేనెలూరించే మురిపించే  మాటలు, చేతలు ఎన్ని చూడడం లేదు" అన్నది జికా 

"ప్రజల అమాయకత్వాన్ని, అవగాహన లేమిని  ఆసరా చేసుకుని ఆందోళన సృష్టించారు. ఒక మామూలు వైరస్ ని బూచాడుని చేశారు. భూతద్దంలో చూపారు . 

బ్రహ్మాండంగా జేబులు నింపుకుంటున్నారు. ఒకప్పుడు నా విషయంలో జరిగిందదే" హెచ్ ఐవి 

"అయ్యో .. ఈ మనుషులు చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియలేదంటే నమ్మండి. 

మానవులలో కొందరు కొందరిని అంటరాని వారిగా  చూస్తూ, అవహేళన చేయడం గురించి చరిత్ర ఎన్నో సాక్ష్యాలు చూపుతుంది.  ఇప్పుడు కోవిద్ ఎవరితోనైనా కనిపిస్తే చాలు అలాగే వారిని అంటరానివారిగా చూస్తున్నారు.  బంధుమిత్రులు దూరంగా పెడుతున్నారు. 

నిన్నటివరకూ ఆత్మీయతానురాగాలు కురిపించిన వాళ్లే అంటరానివారిగా చూడటం భరించలేని కొందరు ప్రాణత్యాగం చేస్తున్నారట." అన్నది ఇన్ఫ్లూయెంజా  

"నిజమే.. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లికి పాజిటివ్ రాగానే నడిరోడ్డుపై అనాథలా వదిలేసిన ప్రబుద్ధుల్ని చూస్తున్నా.   

అంతేనా .. పాపం, ఆయనెంతో మందికి విద్యాబుద్ధులు చెప్పారు . ఇప్పుడు వాళ్లంతా ఆయన శవం ఖననాన్ని అడ్డుకున్నారు 

మరొకాయన గొప్ప వైద్యుడు. తుమ్మినా దగ్గినా ప్రజలకు ఉచిత వైద్యం చేసిన మహానుభావుడు నిన్నటివరకూ.. నేడాయన శవాన్ని అక్కడ కాల్చడానికి ఆ ప్రజలంతా వ్యతిరేకమే . 

ఊళ్ళ మధ్య ముళ్ళకంపలు, పాజిటివ్ ల వెలితోటి మనిషిని అక్కున చేర్చుకోలేనితనం... అయ్యో .. ఏమని చెప్పను .. ఎన్నని చెప్పను .. కొల్లలు కొల్లలుగా కథలుకథలుగా విషయాలు బయటికొస్తున్నాయి.   అయ్యయ్యో .. ఏది మానవత్వం..ఏవీ మానవీయ విలువలు..? మననంటారుగానీ మనకంటే తీవ్రమైన నీచమైన వైరస్ మనిషిలోని స్వార్థం. ఆ జబ్బుతో సహజీవనం చేస్తూ మనను ఆడిపోసుకుంటారు" వాపోయింది హెపటైటిస్. 

ఏ మాత్రం వైద్య సదుపాయాలు లేని రోజుల్లో కూడా వైరస్ జాతులున్నాయి.  కొన్ని వేల ఏళ్లుగా మనుగడ సాగిస్తున్నాయి. మనిషిలో మార్పు వచ్చినట్లు వాటిలో కొద్దోగొప్పో మార్పొచ్చిందేమో.. అయినా తట్టుకుంటూ, కాపాడుకుంటున్న మానవుడు ఇప్పుడెందుకు చిగురుటాకులా వణికిపోతున్నట్లు, రాలిపోతున్నట్లు

మానవ ప్రవృత్తిలో, ఆహార విహారాలలో మార్పు తెచ్చే కుట్రలు చాపకింద నీరులా సాగించిన రాక్షస మూకకి ఇప్పుడు పండుగగా ఉంది. 

  పెద్ద పెద్ద కబుర్లు చెప్పే గొప్ప దేశాలన్నీ చతికిలబడి అదృశ్యక్రిమిని ఎదుర్కోలేక పోవడం అభివృద్ధి నమూనా విచిత్రం. కారణం ఎవరు..

అలక్ష్యం, దాచివేత, దాటవేత, అలసత్వం, అసమర్ధత, నేరపూరిత నిర్లక్ష్యం కనిపించకుండా కళ్ళకు గంతలు కట్టి వైరస్ ని నిందిస్తున్నారు 

మెరుగైన ఆరోగ్య సదుపాయాలు  సాధించామనుకుంటూ ప్రజా ఆరోగ్య వ్యవస్థల విచ్ఛిన్నం చేసుకున్నారు.  

వైద్యం, ఆరోగ్యం లాభసాటి వ్యాపారంగా మార్చేశారు. జబ్బు పడితే జేబుకు చిల్లే నా యే.. ఐదు నక్షత్రాల వైద్యం, మూడు నక్షత్రాల వైద్యం కొనలేక కొందరు, తప్పని పరిస్థితిలోనో, బతుకుమీద తీపితోనో ఉన్నదంతా ఊడ్చి తర్వాత చిప్పట్టుకుంటున్న వైనం.. కళ్లారా చూస్తున్నా.. అయినా, గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు కార్పొరేట్ వైద్యం చుట్టూ తిరుగుతారు . ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారని అనుకుంది వైరస్ మిత్ర బృందం మాటలు మౌనంగా ఆలకిస్తున్న గబ్బిలం   

"ఎగిరే పక్షికి వల పన్నినట్టు మన చుట్టూ వలపన్ని మనను మట్టుబెట్టడానికి  యాంటీ బయోటిక్స్, యాంటీ వైరల్ డ్రగ్స్, వాక్సిన్స్ కోసం వాటిపై ఆధిపత్యం కోసం విచ్చలవిడిగా  ఖర్చు చేస్తున్నారు.   ఏవేవో కనిపెట్టామంటున్నారు.  అయినా అన్ని తట్టుకుని మనం పుట్టుకొస్తూనే ఉన్నాం.   మన ఉనికి వల్ల, మనం ప్రాబల్యం చూపడం వల్ల కొంతమంది జనం ఎప్పుడూ ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు.    

ప్చ్.. పాపం పుణ్యం ఎరుగని  బీదాబిక్కి బలైపోతున్నారు అది వేరే విషయమనుకో.. " అన్నది  కోవిద్ 19

"ఇందుగలడందు గలడు అన్నట్లు ఎక్కడ చూసినా నువ్వేనిరంతరంగా పరివర్తన చెందుతుంటే మేతావులు తయారు చేసుకున్న మందులు పనికిరాకుండా పోతున్నాయి.  హహ్హహ్హా ..." గుంపు లోంచి పగలబడి నవ్విందో వైరస్  

నిజమేనోయ్ .. మానవులెంతో తెలివిగలవారనుకున్నా.. మనని వల్లకాట్లో కలపడం వాళ్ళకి తెలియక కాదు. బాగా తెలుసు.  అయినా పీడకలలుగా కలవరిస్తూనే ఆదమరచి నిద్దురపోతారు.  

అప్పుడప్పుడు మొద్దు నిద్దుర లేచి హడావిడి చేస్తారు తప్ప నిజంగా కల్లోలాన్ని ఆపాలని చిత్తశుద్ధితో కాదు." అన్నది మార్స్   

" వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయిగా..  అవి తేలాలిగా.." నవ్వింది కోవిడ్ 19  

 పెరిగిపోతున్న జనాభాని తగ్గించడానికి దేవుడు కోవిద్ ప్రవేశపెట్టాడట..  

 చప్పట్లు , దివ్వెలు .. మంత్రాలకు చింతకాయలురాలడం ఎప్పుడైనా ఎక్కడైనా చూశామా

పిచ్చిమూక.  లోగుట్టు ఎరగక, మనుషుల పాపానికి దేవుడు విధించిన శిక్ష అనే మత గురువులు, ప్రార్థనలతో వైరస్ తరిమికొడతానని ప్రార్థనలు చేసే ఫాస్టర్, రాగి వస్తువులతో  నయం చేస్తాననే వైద్యులు, పూజలు, దైవప్రార్థన తో తగ్గిస్తానని పూజారిఎండమావుల్లో నీళ్లు తెస్తాననే ముల్లా  అందరూ బాధితులై మట్టిలో కలిసిపోతుంది మంత్ర తంత్రాలకు గిరాకీ తగ్గలేదు.  మనుషులు ఉన్నపళాన ఎగిరిపోతున్నా, పవిత్ర గంగానదిలో కళేబరాలు ప్రవహిస్తున్నా..  బుద్ది లేని జనం ఎట్లా నమ్ముతున్నారో.. 

కన్నీళ్లు పోగుపడుతున్నా వాక్సిన్ వేసుకోవడానికి మీనమేషాలు లెక్క బెడుతున్నారు. 

మాస్క్ లేకుండా  శానిటైజ్ చేసుకోకుండా ఎడం ఎడం లేకుండా తిరుగుతారు.  

కుంభమేళా, ఎన్నికల ర్యాలీలు, సభలు,  పబ్లిక్ మీటింగులు ఏవీ తగ్గవు.  కానీ ప్రాణం అంటే చచ్చేంత భయం.  డబల్ స్టాండర్డ్ మనుషులు .. థూ.. అంటూ తుపుక్కున ఊసింది మౌనంగా ఇప్పటివరకు వైరస్ ల మాటలు వింటున్న గబ్బిలం.   

అలలు అలలుగా కోవిద్ రాకపోయుంటే జనం వాక్సిన్ తీసుకునే వాళ్ళు కాదేమో.. అనుకుంది  నిద్ర లో మెలుకువ వొచ్చి వైరస్ బృందం మాటలు వింటున్న చీమ 

"నాది సమదృష్టి . కుల మత, వర్ణ, వర్గ, ప్రాంత, జెండర్ వివక్షతలు నాకు లేవు. నాకు అందరూ ఒకటే.  గుళ్లో పూజారి, చర్చి ఫాస్టర్, మసీదులో ముల్లా, దేశ ప్రధాని, ప్రెసిడెంటు ఎవరైనా నాకంతరం తెలియదు. నా దగ్గర కొస్తే.. నా పాత్ర నేను పోషిస్తా.  వారు నన్నెదుర్కున్న దాన్నిబట్టే ఫలితాలు.." తనని నిందిస్తున్నారని బాధ మొహం లో కన్పిస్తుండగా కోవిడ్ 19.  

మానవులలో ఉన్నన్ని తారతమ్యాలు మరెక్కడైనా ఉన్నాయా ..? వాళ్లలో కుల , మత , వర్గ , వర్ణ , రాజకీయ, ఆర్థిక, ప్రాంతం, జెండర్ ఇలా ఎన్నెన్నో వివక్షలు .. భేదాలు .. గురించి పుట్టెడు విని ఉంది .  మందిరాల్లోనో, మసీదుల్లోనో, చర్చిల్లోనో తమ గోడు వెళ్లబోసుకున్న వాళ్ళ ఊసులు ఎన్నో వింటూనే ఉన్నానుగా.. ఈ వైరస్ ల మాటల్లో అతిశయం ఏమి లేదనుకుంది గబ్బిలం . 

"కురచ మనుషుల వాదనలకు నువ్వేం బాధపడకు బ్రో.. ఇదేమన్నా ఇప్పటికిప్పుడు ఊడిపడిన ఉత్పాతమా.. నింగి నుంచి నేల రాలిన ఉల్కాపాతమా.. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత" ఊరడిస్తూ అన్నది మార్స్ 

"మానవ మనుగడకు, అస్తిత్వానికే ప్రమాదం తెస్తూ నెత్తుటి కూటి కోసం కాచుకునే మాయావుల ఇనుప డేగరెక్కల చప్పుడు వినలేదా ..   

ఆ మాయావులే కదా మన వ్యాప్తికి కారణమయ్యేది. ఆ మాయావి డేగలే వ్యాధి వ్యాప్తికి కారణమంటూ జాతి, మత దురహంకారాన్ని రెచ్చగొట్టేది.  విద్వేష ప్రచారం చేసింది. విషపూరిత వాతావరణం సృష్టించింది" అన్నది జికా 

 "అవును మిత్రమా, ఆ టక్కు టమారపు గారడీ విద్యలతో సముద్రంలో నీళ్లంతా తోడేసుకుందామని ఆశపడేది. అందుకోసం పావులు కదిపేది ఆ తాంత్రికులే " అన్నది హెచ్ ఐ వి   

ఆ ఆశతోనే కదా అభివృద్ధి మంత్రం జపిస్తూ  అధిక ఉత్పత్తి పేరుతో  అత్యాశతో సహజత్వానికి దూరమయింది.  సహజంగా, స్వచ్ఛంగా ప్రకృతి ఇచ్చే వాటిని తీసుకోవడం మానేసి ప్రకృతిని తమ చేతుల్లోకి తీసుకున్నారు.  కృత్రిమత్వాన్ని అలవాటు చేశారు.. 

సహజంగా తినే వాటిలో, సహజమైన గాలిలోఎండలో తిరిగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 

ఒళ్ళు కదలకుండా, కండ కరగకుండ కొత్త రుచులు, కొత్త కొత్త సుఖాలతో అంబర మెక్కి ఊరేగుతున్నామనుకుంటున్నారు కానీ అధః పాతాళం లోకి వెళ్తున్నామని తెలుసుకోలేకపోతున్నారు. 

పిచ్చి సన్నాసులు.  తాను చూస్తున్న మానవజాతిని తలచుకుని జాలిపడింది చీమ .   

  వైరస్ బృందం మాటలు వింటూ చప్పుడు చేయకుండా చుట్టూ చూసింది.  నిశాచరి గబ్బిలం కనిపించింది.  నెమ్మదిగా గబ్బిలం చెంతకు బయలుదేరింది చీమ . 

"ఎండమావుల్లో నీళ్ళెతుక్కునే వాళ్ళు కొందరయితే నేతి బీరకాయలో నెయ్యి పట్టుకుంటామనేవారు కొందరు .. మనమేం చేస్తాం ..

తన ఇంటిని తానే తగలబెట్టుకుంటూ మనమీద పడి ఏడుస్తున్నాడు .. "  వైరస్ మిత్ర బృందం నుంచి మాటలు వినిపిస్తున్నాయి  

 ఒకపక్క దట్టమైన మేఘంలా కమ్ముకొస్తున్న ముప్పుని కప్పేస్తున్న వ్యాపార, వాణిజ్య విధానాలతో పర్యావరణ విధ్వంసం నిర్విరామంగా జరిగిపోతున్నది. తమ చేతకానితనాన్నో, రాజకీయ ప్రయోజనాలకో, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికో, లాభసాటి వ్యాపారం కోసమో, ఒక మామూలు వైరస్ ని సంక్షోభంగా, పెను విపత్తు గా మార్చేసిన వారిని చూస్తే దుఃఖం గా ఉంది.  రేపు తమ గతేంటి..  గొణుక్కుంటూ గబ్బిలాన్ని చేరింది చీమ. 

"మిత్రమా.. ఈ దెబ్బతో ప్రపంచం మారిపోతుందా.. కొత్త యుగంలోకి ప్రవేశిస్తుందా.. భవిష్యత్ చిత్ర పటం ఎలా ఉంటుందంటావ్" గబ్బిలాన్ని ప్రశ్నించింది చీమ.

"నాకైతే ఏ మాత్రం నమ్మకం లేదురా... వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చి కోట్లాది మంది పోయారు.  అంతకు ముందు ఇలా చనిపోయి ఉంటారు. అయినా మనిషి బుద్ది మారిందా .. లేదే .. ప్రజాసమస్యల్లోనూ లాభాల వేట తప్ప ప్రజాసంక్షేమం శూన్య మైనప్పుడు, వ్యక్తిగత ప్రయోజనం ప్రాధాన్యం అయినప్పుడు పరిస్థితులు ఎలా మారతాయి

శవాల మీద నెత్తుటి పంట పండిద్దామనుకునే క్రూరులున్నారుగా.., వాళ్ళున్నది  పిడికెడే. కానీ ప్రపంచ సంపదంతా వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ అదుపాజ్ఞల్లోనే , అజమాయిషీలోనే .. 

ఆకలి కేకల చీకటి బతుకులకు బాసటై తమకు తోచిన విధంగా సహాయం చేసే వాళ్ళు మానవత్వం ఉన్నవారు పెరగాలి. 

అదిగో..  ఆ గుడిలో ఉండే దేవుళ్లు చేయలేని పనులంటే చెడ్డ పనులు కాదు మంచి పనులు చేస్తూ ఆపదలో ఉన్నవారికి ఎంతటి కష్టం లో నైనా తోడు ఉండేవాళ్లు పెరిగినప్పుడు, భరోసా ఇచ్చేవాళ్ళు పెరిగినపుడు మారుతుందేమో ..! " ఆశగా అన్నది గబ్బిలం 

ప్రతి ప్రయాణానికి అనివార్య ముగింపు ఉంటుంది అనుకుంటూ  చీకటిని చీల్చుకుని వచ్చే వెలుగు దిశగా కదిలింది చీమ.   

 

 

కథలు

గుణ పాఠం

సందీప్ చాలా సున్నిత మనస్తత్వం కలవాడు. ఇద్దరు అన్నలు మధ్య తను తన తర్వాత చెల్లి,కుటుంబం బాగానే స్థిరపడిన వాళ్ళు , ఊర్లో ఉండడం వల్ల చదువు కొనసాగదు అని వరంగల్ కి వచ్చి చదువుకుంటూ ఉన్నాడు.

ఇప్పుడు సందీప్ ఏం.బి.ఏ లో జాయిన్ అయ్యాడు. చదువుకుంటూనే అన్న మొదలు పెట్టిన మెడికల్ షాప్ లో అప్పుడప్పుడు ఉంటూ సాయ పడుతూ ఉండేవాడు.

అన్నలు ఒకరు మెడికల్ షాప్ రన్ చేస్తుంటే ఇంకొకరు మొబైల్ షాప్ రన్ చేస్తున్నారు. తల్లిదండ్రులు చెల్లెలు ఊర్లో ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉన్నారు.

మొత్తానికి సందీప్ కుటుంబం స్థిరంగా ఉన్నారు. ఎలాంటి గొడవలు , పొరపొచ్చాలు లేకుండా సంతోషంగా గడుపుతూ ఉన్నారు.

పొంగి పొరలే వయసు మనసు తో యువత కాలేజీలో ఉరకలు వేస్తూ ఉంటారు. మన సందీప్ మాత్రం సున్నిత  మనస్కులు కావడం వల్ల ఎవరితో ఎక్కువగా కలవకుండా , మాట్లాడకుండా తన పనేంటి, తన చదువు ఏంటో చూసుకుంటూ ఉండేవాడు.

కానీ కాలేజీ లో  ఇలాంటి వాళ్లను చూస్తే ఏదో ఒకటి చేయాలి అని అనిపిస్తుంది కదా ఇక్కడ కూడా అలాగే జరిగింది.

 

                                                                         **

మనుషులు తాము ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ దాని ఫలితం , పర్యవసానం ఎలా ఉంటుందో అని ఒక్క క్షణం కూడా ఆలోచించరు.

ఎదుటి వారు ఎంత బాధ పడుతున్నారు, వారు ఏం చేస్తారు అని ఆలోచించకుండా కేవలం తమ సరదా కోసం, ఒకరిని ఫుల్ చేయాలని కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.

 

                                                                            **

ఏయ్ అటూ చూడే ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు అంటూ మోచేత్తో పొడిచింది దీప రూప ను అవునే చూస్తూనే ఉన్నా , కానీ ఎవరితో మాట్లాడ డు , ఎవరితో కలవడు ఏం చేద్దాం మరి , తను అంటే నాకు ఇష్టమే తనని ఎలాగైనా  ముగ్గులోకి దింపి తనతో సినిమాలు ,షికార్లు చేయాలి అని ఉంది.

కానీ గురుడు అమ్మాయిలు అంటేనే ఆమడ దూరం పెడతాడు. ఎలాగే వాడిని మాట్లాడేలా చేయడం అంది రూప . నికు వాడు మాట్లాడడం కావాలి అంతే కదా నేను చేస్తాను ఏమిస్తావు చెప్పు అంది దీప.

ఎలనే నిజంగా మాట్లాడేలా చేస్తావా చెప్పు అంది రూప చేస్తా కానీ నువ్వు నేను చెప్పినట్టు చేయాలి దాంతో వాడు నీతోనే మాట్లాడుతూ ఉంటాడు మరి నీకు ok కదా అంది దీప .

 ఆ సరే మరి ప్లాన్ ఏంటో చెప్పు అంది .

 నువ్వు వెళ్లి సందీప్ తో  మన స్నేహితురాలు వీణ ఉంది కదా అది నిన్ను ప్రేమిస్తుంది అని చెప్పు , నువ్వంటే దానికి ప్రాణం అని చెప్పు అప్పుడు తను నీతో మాట్లాడతాడు. నీ వెనకే పడతాడు అంటూ చెప్పింది.

దానికి రూప కానీ వీణ ప్రేమించడం లేదు కదా అసలు తనకు మనకు ఏం సంబంధం లేదు కదా ఒక వేళ సందీప్ తనను అడిగితే ఎలా అంది రూప.

దానికి దీప నీ బొంద వాడు ఎవరితోనూ మాట్లాడడం చూశావా ఇంకా లవ్ మేటర్ అంటే ఇంకెక్కువ సిగ్గు పడి మాట్లాడడం అంటూ జరగదు.

కాబట్టి నువ్వు ధైర్యంగా వెళ్లి చెప్పు. నీ మాటల్లో అసలు భయం కనిపించకుండా నమ్మేలా చెప్పు సరేనా అంటూ రూప ను ముందుకు తోసింది దీప.

భయపడుతూనే వెళ్ళిన రూప కాస్త ధైర్యం తెచ్చుకుని సందీప్ అంటూ పిలిచింది బెంచ్ పై కూర్చుని బుక్ చదువుతున్న సందీప్ తలెత్తి చూసి రూప కనిపించడం తో  తడబడుతూ లేచి నిలబడ్డాడు.

అతని  తడబాటు చూసిన రూప ఇంకా జబర్దస్తీ గా వెళ్లి కూర్చుని నీతో ఒక మాట చెప్పాలి అంది. దానికి సందీప్ ఏంటో చెప్పండి అన్నాడు. కూర్చుంటే చెప్తా అనగానే తన పక్కన కాకుండా కాస్త దూరం లో కూర్చున్నాడు కానీ రూప అంతా దూరం వెళ్తే మైక్ లో అరిచి చెప్పాలా అంటూ తన ముందుకు వెళ్లి చూడు సందీప్ మన క్లాస్ లో వీణ ఉంది నీకు తెలుసా అని అడిగింది .

 లేదండీ తెలియదు అన్నాడు సందీప్ అదిగో అటూ చూడు అంటూ వీణ ఉన్నవైపు చూపించింది తల తిప్పి చూసాడు సందీప్ అవును తనెనా వీణ అన్నాడు అవును తానే వీణ , తను నిన్ను ప్రేమిస్తుంది తనతో నువ్వు మాట్లాడడం ఇబ్బంది గా ఫీల్ అవుతారు అని నన్ను చెప్పమని పంపింది .

కాలేజీలో చేరిన మొదటి సారి నిన్ను ప్రేమించడం మొదలు పెట్టింది. కానీ తనతో నువ్వెప్పుడు మాట్లాడలేదు కలవ లేదు . ఇక తను నిన్ను కలిసి చెప్పాలనుకున్న ప్రతిసారీ నువ్వు తనను అవాయిడ్ చేస్తున్నావు అని అనుకుంటుంది. తను నిన్ను ఇష్టపడుతుంది ఇక నీ నిర్ణయం చెప్పు అంది రూప.

అవునా నిజంగా తను నన్ను ఇష్టపడుతుంది అని నాకు తెలియదు అయినా ఇప్పుడే కదా తెలిసింది. నాకు కొంచం టైమ్ కావాలి ఆలోచించాలి కదా అన్నాడు . నిజంగా నన్ను ప్రేమిస్తుంది కదా అంటూ అడిగాడు. అవును బాబు అవును నిజంగానే ప్రేమిస్తుంది కావాలంటే చూడు నువ్వేం చెప్తావు అని ఇటే చూస్తుంది అంటూ వీణ వైపు చూపించింది రూప.

నిజంగానే వీణ రూప ,సందీప్ వంక చూస్తూ కనిపించడం తో నిజమే అని నమ్మాడు సందీప్. సరే క్లాస్ కు టైం అవుతుంది కానీ నీ ఫోన్ నంబర్ ఇవ్వు, తన గురించి నీకు అన్నీ చెప్తాను అంటూ ఫోన్ నంబర్ తీసుకుంది . తర్వాత మూసి మూసి గా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది రూప.

ఒక అమ్మాయి తనను ఇష్టపడుతుంది. తనను ప్రేమిస్తుంది అని తెలిసిన సందీప్ ఊహల్లో తేలిపోతూ ఇంటికి వెళ్ళాడు. ఒక అమ్మాయి తన జీవితం లోకి రావడం, తనంతట తానుగా ప్రేమిస్తున్నా అని చెప్పడం తో సంతోష పడి ఊహల్లో విహరిస్తూ ఇంటికి వెళ్ళాడు. తన ఇష్టాఇష్టాలు ఎంటి, తన అభిరుచులు ఏంటి తెలుసుకోవడానికి రూప తో మాట్లాడడం మొదలు e సందీప్.

                                                                             **

దీప చెప్పిన ప్లాన్ పని చేయడం వల్ల రూప సంతోషంగా ఉంది. తను సందీప్ తో మాట్లాడుతూ తన ఇష్టాలను వీణ ఇష్టలుగా అన్నట్టు చెప్తూ, అతనితో చాటింగ్ చేస్తోంది. రోజూ గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇద్దరు.

కానీ వీణ కు ఈ విషయాలు ఏవీ తెలియవు, తనకు తెలియకుండానే తను వారికి ఒక ఆట వస్తువు అయ్యింది. రోజులు గడుస్తున్నాయి.

వీణ తన ఊర్లో ఉన్న ఇంకొక అబ్బాయిని ప్రేమించింది కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన వీణ తల్లిదండ్రులు వీణ అతన్ని కలవకుండా చేశారు. కట్టడి ఎక్కువ అయ్యింది.

పెళ్లికి  ఇద్దరు తల్లిదండ్రులూ ఒప్పుకోక పోవడం వల్ల తాము ఎప్పుడూ కలవలేము అని అనుకున్నా వీణ ఆత్మహత్య చేసుకుంది. ఆ అబ్బాయి కూడా చనిపోయాడు.

విషయం తెలుసుకున్న సందీప్ చాలా బాధ పడ్డాడు. అయితే దీప, రూప ఇద్దరు ఈ విషయాన్ని తీసుకుని సందీప్ తో సరదాగా ప్రాంక్ చేయాలి అనుకుని , నీ వల్లనే తాను చనిపోయింది. నువ్వు ప్రేమిస్తున్నా అని చెప్పక పోవడం వల్లనే తాను సూసైడ్ చేసుకుంది అంటూ చెప్పడం మొదలు పెట్టారు.

విషయం తెలిస్తే పోలీసులు నిన్ను తీసుకుని వెళ్తారు. మీ ఇంట్లో ఎం చెప్తావు అంటూ సందీప్ ను అదరబెదర గొట్టారు. పాపం సున్నిత మనస్కుడు అయిన సందీప్ ఇది తట్టుకోలేక పోయాడు. నిజంగా నా వల్లే జరిగి ఉంటుంది .

 నేను నా అన్నల ముందు , తల్లిదండ్రుల ముందు , కాలేజీ లో ఉన్న స్నేహితుల ముందు తలెట్టుకొలేను అనుకున్నాడు. చాలా భయ పడ్డాడు. బాధ పడ్డాడు. పోలీసులు రాక ముందే ఏదైనా చేయాలి అనుకున్నాడు. అందుకే ఊరికి వెళ్ళిపోయాడు.

                                                                           **

అక్కడ ఊర్లో రాక రాక  హఠాత్తుగా వచ్చిన  కొడుకును చూసి తల్లి దండ్రులు, చెల్లి సంతోషించారు. సందీప్ కూడా ఏమి జరగనట్టు వారితో సంతోషంగా గడిపాడు. తల్లి చేసిన వంట తిన్నాడు. చెల్లి తో సరదాగా కబుర్లు చెప్పాడు. తండ్రితో తనివి దీరా మాట్లాడాడు.

తిన్న తర్వాత పొలానికి వెళ్లి చూస్తా అంటూ బయలుదేరాడు. వాళ్ళు కూడా సరే అని అన్నారు. పొలం లో మందు కొడుతున్నా బిడ్డ అంటూ తండ్రి చెప్పడం తో నేను మందు తీసుకుని వెళ్తా, నువ్వు కొంచం సేపు రెస్ట్ తీసుకో అని చెప్పి , పొలానికి వెళ్ళాడు సందీప్.

అంతకు ముందే ఫోన్ లో రూప పోలీసులు మీ ఇంటికి బయలుదేరారు అంటూ సందేశం పంపింది. సందీప్ కు ఏం చేయాలో అర్థం అయ్యింది. పొలానికి తీసుకుని వెళ్ళిన గుళికలు చేతిలో పోసుకుని ఒక్కసారిగా మింగేశాడు. మోటారు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగాడు. ఇక నా వల్ల ఎవరికీ ఏమీ నష్టం లేదంటూ, అక్కడే పడి పోయాడు.

ఇంట్లో ఉన్న తండ్రి పొలానికి మందు వేద్దామని వచ్చి , కింద పడి కొట్టుకుంటున్న కొడుకుని చూసి , గుండెలు బాదుకుంటూ కొడుకుని ఆసుపత్రి కి తీసుకుని వెళ్ళాడు. అక్కడ సందీప్ ప్రాణాలతో పోరాడి ఓడిపోయి చివరికి చనిపోయాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి సందీప్ ఫోన్ చెక్ చేశారు. దాంతో రూప బండారం బట్టబయలు అయ్యింది. దాంతో రూప దగ్గరికి వెళ్లారు. మేము కావాలని చేయలేదు ఏదో సరదాగా చేశాను.

అంటూ రూప ఏడుస్తూ చెప్పేసరికి పోలీసులు ఆమె అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్దం కాక బుర్రలు గిక్కున్ననారు. కానీ ఒక మనిషిని ఆత్మహత్యా చేసుకునేలా ప్రేరేపించడం వల్ల  వారీ ని అరెస్టు చేశారు.

ఏది సరదా గా చేయాలో , ఎది సీరియస్ గా చేయాలో తెలియని వయస్సులో ఇలా చేయడం అమ్మాయిలు చేసిన పొరపాటు , వారు ఒకటి అనుకున్నారు . జరిగింది ఇంకొకటి , ఇక్కడ మంచిగా ఉన్న వాడిని  ప్రేమలోకి దించాలని, తనతో ఆడుకోవాలని అనుకున్నారు. డబ్బు కోసం కూడా ఆశ పడ్డారు. అలాగే  సందీప్ దగ్గరి నుండి డబ్బులు గిఫ్ట్ ల పేరిట వసూలు చేశారు.

 ఇప్పుడు సందీప్ చనిపోవడం తో రూప ను , దీప ను కోర్టులలో ప్రవేశ పెట్టారు. దాంతో జడ్జ్ వారికి రిమాండ్ విధించారు. జైల్లో ఇక వాళ్ళు మగ్గ వలసిందే.

వాళ్ల జీవితాలు యువతరానికి ఒక గుణ పాఠం.

కథలు

గుడ్డిగొర్రె

          పొద్దుగూట్లె పడుతుంది. గొర్లు దొడ్లకు చేరుతున్నయ్‍. కొన్ని మందలు పానాది ఎక్కినయ్‍. ఇంకా కొన్ని అప్పుడప్పుడే కంచెలల్లకెల్లి ఎల్లుతున్నయ్‍. కొంరయ్య గొర్లు పానాది ఎక్కినయ్‍. ఒక గొర్రె ఒక్కటే ఇరాం లేకుంటా బే.. బే...అని ఒర్రుతుంది. దాని ఒర్రుడుకు మిగతా గొర్లు తొవ్వ సక్కగా సాగుతలెవ్‍ బెదురుతున్నయ్‍. ఉస్‍ఉస్‍స్సా అని గొర్లను మర్లేసుకుంటా ఒరెక్క ఎక్కడిపాడయిందిరో ఇదో దీని మొదలారా ఒక్కటే ఒర్రుడు ఒర్రుతుందని ఆ గొర్రెను తిడుతూ కొంరయ్య చిరాకు పడుతుండు.

          అది ఘనపురం గుడ్డిగొర్రె. చెట్లపొంటి గుట్టలపొంటి తిరుగుకుంటా అది కండ్లు కానొచ్చి కానరాక ఆ మందలకెల్లి ఈ మందలకెల్లి చివరకు కొంరయ్య గుంపుల కలిసింది. గొర్లు పానాది ఎక్కంగనే ఒక్కటే ఒర్రుడు ఒర్రుతుంది.

పక్కమంద బీరప్ప  ఎక్కడిదే ఈ సాటుగండ్లది ఒర్రుతావుంది.

ఏమో ఎక్కడిది తలుగవడ్డదో దీని పాడుగాను నా గుంపుల వచ్చి చేరింది.

బీరప్ప మనూరిది కానట్టుంది కదనే.

కొంరయ్య కాదుకాదు మనూరిది కాదు. ఘణపురపోల్లదే కావొచ్చు గిటు ఇంకోవ్వరి యెత్తయ్‍. ఇద్దరు మాట్లాడుకుంటా గొర్లను కొట్టుకొస్తుండ్రు. ఈ ముచ్కట ఆ ముచ్చట మాట్లాడుకుంటుండగనే గొర్లు దొడ్లకు చేరినయ్‍. గొర్లు దొడ్లల్ల తోలిండ్రు. పిల్లల కలేసిండ్రు.(పిల్లల పాలుశీకపెట్టిడ్రు). గొర్లు నిమ్మల పడంగనే గొంగడి భుజానేసుకొని, టిపిని చేతపట్టుకొని ఇంటి బాట పట్టిండ్రు కొంరయ్య, బీరప్ప.

          ఏంచేద్దాం ఈ గుడ్డి గొర్రెను. ఇయ్యాల పొద్డూకి అటికెల పెడుదామే మరి గుసగుస అంటుండు బీరప్ప. సప్పుడు చేయలేదు కొంరయ్య.

ఏమంటవే రాత్రి చేద్దామా దానిపని బీరప్ప అన్నడు. 

కొంరయ్య అలోచనలో పడ్డడు.

ఒదిక్కు అడుగుతుంటే సప్పుడుచెయ్యవేందే బీరప్ప.

కొంరయ్య కులపోని సొమ్ము గట్లచేస్తే ఏమంటర్రా...

నలుగురికి ఎరుకైతే  తుప్పుక్కున్నుచ్చంరా.

          కురుమలలో ఎవరిదైన గొర్రెగాని, మేకగాని తప్పిపోయి పక్క మందలకో పక్కూరి మందలకో పోతే తిరిగి వాళ్లది వాళ్లకు కొట్టిచ్చే సంస్కృతి  ఉంది. వాటి గురించి ఎవరు రాకపోతే కొన్ని రోజులు చూసి కులంల కలుపుకుంటరు.

          నీయవ్వ నీకు అన్ని ఇచ్చత్రమేనేమే అది గుడ్డిదేనాయే ఏ నక్కో కుక్కో తిన్నదను కుంటరు తియ్‍. గీ గుడ్డిగొర్రెను దేవులాడుకుంటా వొస్తారు. దీర్ఘం తీసుకుంటా  అన్నడు బీరప్ప. బీరప్పకు అప్పుడప్పుడు దొంగపనులు చేసిన అలవాటు ఉంది.

ఏమోరా నాకైతే ధైర్యం సాలుతలేదు. గీ లంగాదొంగ పనులు నాకు రావు గిసొంటి పని నావొల్లగాదురా.

          నీకు శాతగాకపోతే చెప్పే కొంరన్న గా పుల్లన్ని, పచ్చిపులుసు సామిగాన్ని పిలుద్దాం. నీయక్క వాళైతే గంటల కతం చేస్తరు. పోతూపోతూ వాళ్లిద్దరికి మెల్లగా చెవుల ఏశిండ్రు. బువ్వతిని ఒత్తొత్త కత్తులు పట్టుకొనే రాండ్రి మరి ఊకనే వొట్టిచేతుల ఉగులాడుకుంటా వచ్చేరు. ముత్తెమంత చేపట్లకతం చేయాలె. వాళ్లిద్దరు ఇంకో ఇద్దరికి చెంద్రయ్య, నర్సయ్యకు చెప్పిండ్రు.

          కొంరన్న ఇంటికిపోయి కాళ్లుచేతులు కడుక్కొని బల్లపీఠమీద కూసుండు. చిన్నబిడ్డ కేతమ్మ గొంగడి సూత్తుంది. శిలుపక్కపండ్లు (సీతాఫలాలు) తెచ్చిండేమో అని. రెండు చెట్టుమీది పండ్లు తీసుకొచ్చిండు. పోరగాండ్లు చెరొకటి తీసుకున్నరు. కురుమ సంఘం దగ్గర డోలు సప్పుడు అయితుంది. ఒరెక్కో...డోలు కొడుతుండ్రు ఎందుకో అన్నడు కొంరన్న. కురుమలు కులం గడ్డమీదికి రావాలంటే డోలు సప్పుడు చేస్తరు.

ఇయ్యాల పస్టు కాదయ్య బీరప్ప చిట్టేమో అన్నది అయిలమ్మ.

అవును కదా ఒరెక్కో... చ్టిని యాదిలేకపాయేగానే ఒక్క రూపాయి లేదు. కులంలా ఇజ్జతిపోతట్టుంది ఎట్లనే. మిత్తి పైసలన్నలేవు.  

          ఇప్పటికిప్పుడు ఎవలదగ్గర దొరుకుతయ్‍ అని ఆలోచన చేస్తుండగనే. అయిలమ్మ  గా మల్లయ్యను అడుగుపో బ్యారగాడెనాయే ఎప్పటికి ముల్లె (డబ్బులు) ఉంటదిగా ముల్లెలకెల్లి అన్న తీసి ఇయ్యమను ఎట్లనన్న చేసి. మంచిగనే యాజ్జేసినవే ఒక్కడుగు  పోయ్యోత్త. ఊళ్లే ఎవరికి ఆపతి సాపతి వచ్చిన అదలుకు బదలుకు మల్లయ్య దగ్గరికి పోతరు. పైసలు అడుక్కొచ్చుకుంటరు. గొర్లబ్యారం చేస్తడు కనుక ఎప్పటికి నడుముకు ముల్లె ఉంటదని ఊరంతా ఎరికే..

          కొంరన్న కాదుకక్కుసం అంటే రేపు రెండు బక్కగొర్లు ఇత్త అని చెప్త ఏంజేత్త మరి సావల్నా. గొర్లు అమ్ముత అనంగనే అయిలమ్మకు కోపమొచ్చింది. రెండు గాకపోతే నాలుగు అమ్ముకుందువుగాని ఇంత ఎత్తేసుకోని (తిని) పోరాదు మల్ల వచ్చేతోరకు ఏ నడుజామైతదో.

నీయక్క దుడ్డుగట్టె సూడు ఎట్లుందో

          నేను తిన్ననా? తాగిన్నా? పొల్ల పశిద్దయినప్పుడు తెచ్చిన పైసలేనాయే నువ్‍ లెస్సా ఎగురవడితివేమే. నీ అవ్వగారింటికాడికెల్లి ఏమన్న తెచ్చిఇచ్చినట్టే చెయ్యవడితివి. గాళ్లను నోట్లెపెట్టుకోంది నీకు నిదురపడుతదా.

          తినుకుంటా ఈల్లలొల్లి అయితుండగానే పెద్దపోరడు లింగడు అయ్యా రేపు పరిక్ష పీజు కట్టాలె. పెద్దసారు రేపు పైసలు తీసురమ్మన్నడు...

పరిక్ష పీసులేదు లొల్లపీసులేదుపో. ఓదిక్కు చిట్టిపైసలు ఎట్లరో అని నేను తిప్పల పడుతుంటే పరిచ్చపీసంటా లొట్టపీసంటా. గులుగుకుంటా తిని తువ్వాలతోని మూతి తూడుచుకుంటనే కుక్కకు గంజి పోసిరా అనుకుంటా బయటికెల్లిండు.

లింగడు ఏడుపుమొఖం పెట్టిండు.

పోరడు అనేటోరకే సైసవేందయ్యా అనుకుంటా లింగన్ని దగ్గరికి తీసుకుంది అయిలమ్మ.

కురుమ సంఘం దగ్గరికి ఒక్కొక్కొల్లు వొస్తుండ్రు..

చిట్టి పైసలు కట్టెటోల్లు కడుతుండ్రు. పైసలు లేనోల్లు అదలుకు బదలుకు తిప్పలపడుతనే ఉండ్రు.

కొంరన్న కూడా మల్లయ్యను కాళ్లోఏళ్లో పట్టుకొని చిట్టిపైసలు తెచ్చి కట్టిండు. ఇజ్జతి కాపాడుకుండు.

కాని ఎత్తుకున్నోళ్లు ఎవరైనా ఖచ్చితంగా కట్టాల్సిందే....

చిట్టి ఎత్తుకున్నోల్లు అందుబాటులో లేకపోతే పెనాల్టి కూడా ఏస్తరు.

ప్రతినెల చిట్టికాడ లొల్లి అయితనే ఉంటది.

లొల్లి పెట్టేటోడు పెడుతుండు. చిట్టి పైసలుకట్టెటోడు కడుతనే ఉంటడు. 

ఈ లొల్లి ఆ లొల్లి కాంగా చిట్టి అయిపోయేసరి పన్నెండు అయింది. చిట్టి అయినా తెల్లారి చిట్టికాడ లొల్లిపెట్టుకున్న మల్లోక పంచాది ఉంటనే ఉంటది.

చిట్టి సవాల్‍ పాడిండ్రు. ఎత్తుకునేటోల్లు ఎత్తుకుండ్రు. జమనాత్‍ పెట్టిచ్చుకోని ఎత్తుకునోన్నళ్లకు పైసలిచ్చిండు ఏజెంట్‍ ఎట్టయ్య.

బీరప్ప, పుల్లయ్య, పచ్చిపులుసు సామి, మిగతా ఇద్దరు కూడా చిట్టికాడికి వచ్చిండ్రు.

చిట్టి అయిపోంగనే ఈ ఆరుగురు గొర్లదొడ్డికెల్లి బయిలెల్లిండ్రు. గొర్ల దొడ్డికాడికి వీళ్లు పోంగనే కుక్క మొరుగుతుంది.

ఒరెక్కో కుక్కకు ఎవలైందిన తెలుస్తలేదురో. జూ... అనంగానే కుయ్యకుయ్య అనుకుంటా తోకుపుకుంటా కొంరయ్య దగ్గరికి వొచ్చింది.

రోజు గొర్లదొడ్లకాడ పండుకునేటోల్లు  ఆయెల్ల(ఆరోజు) గొర్ల దొడ్లకాడ ఎవరు పండు కోలేదు. అందరు బీరప్ప చిట్టికాడికే పోయిండ్రు.

దొడ్లెకు పోయిండ్రు గుడ్డిగొర్రెను పట్టుకుండ్రు. గుడ్డిగొర్రె మల్ల ఒక్కటే బే బే అని ఒర్రుతుంది.

బీరప్ప ఇంటెనుక గుడ్డిగొర్రెను కోసిండ్రు. తిత్తితీసిండ్రు. పేగులు కడిగేటోడు కడుగుతుందు. బొక్కలు, కూర కొట్టెటోళ్లు కొడుతుందు.

సామిగా మెల్లగా కొట్టురా. మా రుక్కమ్మ లేస్తే తిడ్తదిరా. మెల్లగా కొట్టు.  మొద్దుసప్పుడు బయటికి ఇనబడుతది. ఎవడన్న సూత్తె అడ్డంగా దొరికిపోతతమ్‍ సుమా. ఒకటికి రెండు దండుగకట్టాల్సి వస్తంది. కులంల ఇజ్జతిపోతది. అని బీరప్ప గదిరిస్తుండు.

ఇద్దరు రైతులు ఆశాలు, రామడు మోటరుపెట్టడానికి బాయికాడికి పోయోటోల్లకు ఆ సప్పుడు ఇనబడనే ఇనబడ్డది. గిప్పుడు యాటను కోస్తుండ్రు ఎందుకో అనుకుంటా వాళ్లు ఎల్లిపోయిడ్రు.

తెల్లారె వరకు ఎక్కడిదక్కడ చేసిండ్రు. కూర ఎవరి ఇండ్లళ్లకు వాళ్లు తీసుకపోయిండ్రు. అందాదా మనిషికి రెండుకిలోల మీదనే వచ్చింది. అరెయ్‍ పుల్లయ్య ఈ తలకాయ మంచిగా కాపిపెట్టురా పొద్దూకి మనమే దావత్‍ చేసుకుందాం అన్నడు బీరప్ప.

తెల్లారింది. పాలుపిండుకొచ్చేడోడు పాలుపిండుకొస్తుందు..పాలు పోషోచ్చెటోడు పోషోస్తుండు...

బీరప్ప పెండ్లానికి (రుక్కమ్మకు) ఓయ్‍ లోతుగిన్నెల కూరుంది ఒండుమన్నడు.

కూరెక్కడిదయ్యా. ఎవరిదన్న సచ్చిందా ఏంది అన్నది రుక్కమ్మ.

ఎక్కెడిదయితే నీకేందిగని ఒండరాదు. నీయక్క నీకు అన్నిగావాలె.

ఒశినిపాడుగానో గింతకూర ఏంజేసుకుంటాని తెచ్చినవ్‍ పోరగాళ్లు గూడ లేరైరీ.

సామి పెండ్లమయితె పొర్కపొర్క తిడుతుంది గింత కూర ఎందుకు తెచ్చినవని. బాడుకావ్‍ మీదికెల్లి దిగలె. ఆ తిట్టుడుకు సుట్టపక్కొళ్లకు అందరికి ఎర్కయింది. కూర తెచ్చిండని సగం ఊరు తెల్సింది. అమ్మలక్కలు గియ్యాల యాటను ఒవలు కోశిడ్రో అనుకుంటుద్రు.

అట్లా అందరి ఇండ్లళ్ల గదే లొల్లి కూర తీసుకపోయిన సుఖం లేకుంటయింది.

వండుకునేటోళ్లు వండుకున్నరు. కూర ఎక్కుకున్నదని సుట్టుపక్కొళ్లకు ఇచ్చేటోల్లు ఇచ్చుకున్నరు.

ఏడు, ఎనిమిది అయితుంది.

ఎవరో చెప్పంపినట్టే సైకిల్‍మీద రానే వచ్చిండు బండ కొమారు గొర్రెపోయిందని.

గొర్లకాడి అయిలయ్య గొర్లదొడ్డి ఊడుస్తుండు

బండ కొమారు ఒత్తొత్తనే సైకిల్‍ దిగముందుకే శెనార్థి అయిలయ్య బావ అన్నడు.

శెనార్థి శెనార్థి అంతాబాగేనానోయ్‍. పొద్దుగాలనె ఎల్లినేమోయ్‍ ఎటుపోతున్నవ్‍ అన్నడు అయిలయ్య. నీపాడుగాన్‍ నిన్న ఓ గుడ్డిగొర్రె కీతప్పింది బావ. ఎక్కదపాడయిందో ఏమో మీ గుంపులకు గిట్ల వచ్చిందా అని తిరుగుతున్నా.

ఏమోనోయ్‍ నేనైతే కానలేదు (కనబడలేదు)....

బండ కొమారు గొర్లదొడ్లు అన్ని తిరిగిండు ఏ గుంపుల గుడ్డిగొర్రె కనబడలేదు.

తిరుగంగా తిరుగంగా అమ్మటాల్ల అయింది.

కొమారకు ఊళ్లె సుట్టిర్కం (బందువులు) కూడా ఉన్నది అందరు నెలువున్నొల్లె. (తెలిసినోల్లె)

ఊరంతా తిరిగిండు వాళ్ల అల్లుడు భూపాల్‍ ఇంటికి పోయిండు...

ఇంటికాడ భూపాల్‍ లేడు. వాళ్ల అమ్మ ఉన్నది. ఇప్పుడే వత్తున్నవా తమ్మి అనుకుంటా డుక్కుందురారా అని బుడిగె చెంబుతో నీళ్లీంచింది. కాళ్లు కడుక్కుండు. ఇంట్లెకు కూడా పోకుంటనే అరుగుమీదనే కూసుండు. పోరగాళ్లు మంచిగున్నార్రా.. పెద్దోడు పట్నంల సదువుతుండేమో మంచిగ పోతుండా.. అవ్వకు శాతనైతుందా.... అని మంచి చెడు అర్సుకున్నది (తెలుసుకున్నది) అమురమ్మ.

అల్లుడు ఎటుపోయిండు అక్క అన్నడు కొమార..

ఆడు ఏడ పెత్తనం చేయపోయిండో... ఇంటికాడ ఉంటడా మీ అల్లుడు..

అల్లున్ని అడుగవడితివి ఎందుకురా?

ఏంలేదు అక్క నిన్న గుడ్డిగొర్రె పోయింది. మీ గుంపులల్లకు గిట్ల వచ్చిందేమో అని వచ్చినా యాడ దొరుకలె...

గది యాడికిపోతదిగని అమ్మటాల్లయింది తిందురారా.

అల్లుడు రానియ్యరాదు తింటగని.

ఆడు ఎప్పుడొస్తడో ఏమో నువ్‍ తిందురారా.

పోస్కతాగ (కూర) కూడా ఏంలేక దప్పుడం పెట్టిన ఏం కూరగాయలు దొరుకుతలేవ్‍. ఏమ్‍ దొరికి పాడయితున్నయ్‍ ఈ ఊళ్లె. కూరగాయలోడన్న అమ్మోస్తలేడు అన్నది అమురమ్మ.

ఊల్లెకెళ్లి అటుఇటు తిరిగి వచ్చిండు అల్లుడు భూపాల్‍.

ఎటుపోయినవ్‍రా మావొచ్చి గింతసేపాయో.

నేనెటు పోయిన్నె గడ్డమీదనే ఉన్న ఇంతసేపు. రాత్రి బీరప్ప చిట్టికాంగనే గొర్లకోస్క తిన్నరటా అని మాట్లాడుతుంటే గాన్నే ఉన్నా. రాత్రి గొర్రెను కోసిన విషయం పాలు పోసేకాడ శిలశిల తెలిసింది. అమ్మటాల్ల వరకే ఊరంత ఎరుకైంది.

ఎవడెవడురా అన్నది...

ఇంకెవడెవడో తేలలే.. ఇంకెడెవడు ఉంటరు గాళ్లే బీరప్ప, సాగ్యాడు గీ ఇద్దరు దొంగలు అయిఉంటరు..వాళ్లు ఇద్దరు కల్సి మిగతా ఇంకో నలుగురికి అంటిచ్చిర్రు....నోట్లె నాలుకలేనోడు కొంరి పెద్దయ్య కూడా దొంగయ్యేటట్లుండు.

మామది కూడా గొర్రె పోయిందటగారా. గదే కావోచ్చునా.

అది గదే అయి ఉంటది.

అల్లుడు నాది అయితే గొర్రె పోయింది. నేను పెద్దకురుమ బయన్నకు పిర్యాదు అయితా మరి నువ్వెంజేస్తవో నీఇష్టం అన్నడు బండ కొమారు....

నీయవ్వ నీ గొర్రెకు ఒక్కటికి రెండు ఇప్పిత్తపో నువ్వెం పికరు పడకు. అన్నడు భూపాల్‍.

మామ అల్లుడు దప్పుడం పోసుకొని తిన్నరు. పెద్దకురుమ ఇంటికి ఇద్దరు పోయిండ్రు.

శెనార్థి పెద్దకురుమ అన్నడు కొమార.

శెనార్థి శెనార్థి. ఏం సంగతి బాగేనానే అన్నడు పెద్దకురుమ.

బాగే అనుకుంటనే బండ కొమారు నా గుడ్డిగొర్రె పోయింది మీ ఊరోళ్లు కోసుకుండ్రటా అని పెద్దకురుమ బయన్నకు పిర్యాదు అయిండు.

కురుమలలో ఏ పంచాయతి అయినా పెద్దకురుమకు పిర్యాదు అయితరు.

పెద్దకురుమ కులాన్ని కూడగొట్టిండు. కులపోల్లు అందరు గడ్డమీద కూడిండ్రు.

రాత్రి పొరుగూరు కులపోని గొర్రెను కోసుక తిన్నరటా. నిమా? అబద్దమా?

అతగాడు వచ్చి పిర్యాదు అయిండు మరి ఏం చేద్దాం చెప్పుండ్రి.

ఎవడెవడో ఆ దొంగ పని చేసింది ఎవడో అనుమానం ఉంటే మరి పిలిపియ్యరాదే అన్నడు ఓ కులపాయినా.

బయటోడు ఎవడయ్య మనదాట్లెనే దొంగలు ఉన్నరు అని ఇంకో పెద్దమనిషి అన్నడు. తెల్లారంగనే సామిగాని పెండ్లం, బీరని పెండ్లంలొల్లి పెడుతనే ఉండే కూరెందుకు తెచ్చివని.

అట్లా వాళ్లంతటే వాళ్లే బయటపడ్డరు.

అనుమానితులను బీరయ్య, కొంరయ్య, సామి, పుల్లయ్య, చెంద్రయ్యనర్యయ్య అందరిని పిలిపిచ్చిండ్రు..

కులం గడ్డమీద కులపోల్లు అందరు కూడిండ్రు...

ఓ కొమార ఓ కొమార పిలుచుకుంటా  గుయ్యగుయ్య లొల్లి పెట్టకుర్రా అని పెద్దకురుమ గదిరిస్తూ ఓ కొమార మాకు పిర్యాదు అయిన సంగతి ఏందో చెప్పుమన్నడు పెద్దకురుమ బయన్న.

కొమార కులమా అందరికి శెనార్థి.

నాది నిన్న గుడ్డిగొర్రె (తప్పిపోయింది) కీతప్పిందే. మీ ఊరొళ్లు కొసుక తిన్నరు అని ఇప్పుడే తెలిసిందే. కోసుక తిన్నరా? లేదా మాకు ఏం తెల్వది అంటరా చెప్పుండ్రి.

గంతేనానే నువ్‍ అట్లా ఉండు అన్నడు పెద్దకురుమ.

పెద్దకురుమ ఆరీ బీరా ఓరి బీరా (బీరప్ప) నిన్న గుడ్డిగుర్రెను కోసుకు తిన్నది నిజమేనా ఎవడెవడు కూడిడ్రో. చెప్పు మరి బదునాం నువ్వొక్కని ఎందుకు మోత్తవ్‍.

బీరప్ప నాకు ఏం తెల్వదే.

పెద్దకురుమ అందరిని వరుసపెట్టి కొంరయ్యను, సామిని, పుల్లయ్య, చెంద్రయ్య, నర్సయ్యను అందరిని అడిగిండు.

అందరు మాకు ఏంతెల్వది మాకేంతెల్వది మేం ఏ గుడ్డిగొర్రెను సూడలేదు అన్నరు.

పొద్దుగాల సామి పెడ్లం ఇంటికాడ లొల్లిపెట్టినప్పుడే ఊరంత ఎరుకయింది. వీళ్లు దొంగగొర్రెను కోసుకున్నరని.

వీళ్లు గిట్లయితే చెప్పరు అనుకుండు పెద్దకురుమ చెప్పు అందుకుండు లం... కొడుకులారా....అని తిట్టుకుంటా కులపోని సొమ్ము దొంగరాత్రి  కోసుకతింటరు మల్లనాకు తెల్వదితెల్వది అంటార్రా అని మనిషి రెండుపెట్లు పెట్టిండు..

బీరప్పకు, పచ్చిపులుసు సామికి ఇద్దరికి చెప్పుదెబ్బలు పడుడు అలవాటే.

మిగతావోళ్లు ఒక్కటేదెబ్బకు ఒప్పుకుండ్రు మేమే కోశినం అని.

బండ కొమార లేషిలేషి ఎగురుతుండు ఇగ కులం మర్యాద గిట్లనే ఉంటాదే. రేపు గొర్లు గిట్లనే మా ఊళ్లెకు తప్పిదారి వొస్తయ్‍ మేము గిట్లనే చేయల్నా చెప్పుండ్రయ్యా అని లొల్లి పెడుతుండు.

అక్కడున్న కులపోల్లు ఓ కొమార నువ్‍ ఓపికపట్టు జెర ఆగు అని ఊకుంచ్చిండ్రు.

ఈల్లనోట్ల ఆల్లనోట్ల పడి ఊరంతా ఎరుకయింది మంది బాగనే కూడిండ్రు..

తల ఓమాట తిడుతుండ్రు. కడుపు కొట్టినాది వారవారం కోస్తనేవుండ్రి ఇంత కూర తెచ్చుకోపోయిండ్రు అని అమ్మలక్కలు తిడుతుండ్రు..

గొర్రెను కోసుకతిన్నోళ్లు ఇజ్జతికి తలలు కిందికేసుకుండ్రు.

సామి పెండ్లమయితే కూర వొండలే పచ్చికూరనే తెచ్చి కులం గడ్డమీద పెట్టింది.

బీరప్పను రుక్కమ్మ సిగ్గుతప్పినోడా. లజ్జతప్పినోడా..అని ఆగకుంటా ఒక్కటే తిట్టుడు.

కొంరయ్యకు గిసోంటి లంగదొంగ పనులు తెల్వయ్‍.. గీల్లు చెయ్యవట్కెనే గీ బదునాం మోస్తుండు..

లం...కొడుకులకు కడుపుకొట్టినాది అని తిట్టుకుంటా ఒక్కోక్కని రెండు గొర్లు దండుగెయ్యాలె అంటడు ఓ కులపాయిన యాదగిరి.

కులంల ఒక్కడు చేసిన అందరు చేసినట్టే ఏం తీర్మాణం చేస్తరో చేయిండ్రి అంటడు.. రాజయ్య.

అనుభవం అయినోల్లు పెద్దపెద్ద మనుషులు పక్కకు పోయిండ్రు.

ఒకరినొకరు అడుగుతుండ్రు ఎట్లాచేద్దాం అని.

నర్సయ్య అనే పెద్ద మనిషి అన్నడు పొరుగూరు బండ కొమారును ఒకటి రెండు ఇస్తం అని ఎల్లగొడ్త్తాం. తర్వాత మనం కులం కూసోని మాట్లాడుకుందాం అన్నడు.

అరె మంచిగనే ఉంది ఈ మాట గట్లనే చేద్దాం. ఇంకో పెద్దమనిషి వాళ్ల ముచ్చటకూడ ఇప్పుడే తెగగొట్టాలె అంటడు.

పొరుగూరోని ముందట మనలొల్లి ఎందుకే ఆయనను ఎల్లగొడ్తాం అంటరు.

అందరు ఒప్పుకుంటరు.

అందరు మళ్లీ కులం గడ్డమీదికి వొస్తరు.

పెద్దకురుమ తొప్పో ఒప్పో మా పోరగాళ్లు ఓ దొంగపని చేసిండ్రు...

నువ్‍ ఏమనుకోకు మేము నీకు ఒకటి రెండు గొర్లు కొట్టిస్తం అని కొమారకు చెప్పిండ్రు.

కొమార అంత అల్కగా ఏం ఒప్పుకోలె లొల్లి పెట్టుకుంటనే గిట్లనే ఉంటదా కులం మర్యాద అని కాసేపు లొల్లి చేసిండు..

సచ్చిందా రాదుగని నువ్‍ నిమ్మలపడు ఒకటికి రెండు ఇస్తమన్నరు కదా. ఇగ నువ్‍ ఊకోఊకో అన్నరు అందరు.

ఇగ నీపని మీద నువ్‍పో వారంలోపల నీకు రెండు గొర్లు కొట్టిస్తంగని అన్నరు.

పెద్దకురుమ మాటమీదికెళ్లి ఎల్లిపోయిండు బండ కొమార.

పెద్దమనుషులు అందరు గడ్డమీదనే కూసుండ్రు.

కులమా ఎట్లా చేద్దాం చెప్పుండ్రు మరి గొర్లు ఇడిసేయాల్లయింది పొద్దుపోతుంది అన్నడు పెద్దకురుమ.

అందరు కలిసి ఒక ఆలోచన చేసిండ్రు.

తప్పు ఒప్పుకోని కులం కాళ్లు పట్టుకోవాలె..

జుట్టుకు రెండు గొర్లు దండుగ ఎయ్యాలె అని తీర్మాణం చేసిండ్రు.

కొంరయ్య, సామి, పుల్లయ్య, చెంద్రయ్య, నర్సయ్య ఇజ్టతికి ఒప్పుకుండ్రు కాని బీరప్ప లేసిలేసి పోతుండు. ఏం చేత్తరో చేయుండ్రు. నేను ఏ దండుగా కట్టా అనుకుంటా.

కురుమ గడ్డమీద బీరప్పను తిట్టినోడే కాని తిట్టనోడు లేదు.

యాడికి ఉరుకుతడో ఉరుకనీయరాదు. ఒక పెద్ద మనిషి అన్నడు.

ఏ సమస్య వచ్చిన మళ్లీ కులంలకు రాకతప్పదు. కులం తప్పు తీస్తరు. పండుగ పబ్బం ఏ శుభకార్యం అయిన కులపోల్లు పోరు వాళ్లను పిలువరు...

బీరప్ప పాలోల్లు నచ్చచెప్పి తీసుకొచ్చి తప్పు అనిపిచ్చి దండుగ కట్టిపిచ్చే ప్రయత్నం చేస్తున్నరు. బీరప్ప ఇంటలేడు.

బీరప్ప అన్నదమ్ములు మా ఇజ్జతి తీస్తుండుగా మా ఇంట్లా చెడపుట్టిండు గీ ఇజ్జతితప్పినోడు అని తిట్టుకుంటా వాడు ఇయ్యక పోతే మేము ఇస్తం అని కులంల ఒప్పుకుంటరు. రుక్కమ్మ బీరప్పను తిట్టకుంటా పెద్దకురుమ కాళ్లమీద పడుతది.

నువ్‍ చెయవట్కినే మేము దొంగలమైతిమి కదరా..అని బీరప్పను మిగతా అయిదురుగు ఇంకోసారి గీ దొంగ లం....కొడుకు సోపతి కూడొద్దురా అని తిట్టుకుంటా ఎవరి ఇండ్లళ్లకు వాళ్లు పోయిండ్రు.

 

 

 

కథలు

మూడు బజట్ల కాడి ముచ్చట

చలికాలం, ఎండాకాలం మధ్య సంధి కాలం కావటం వల్ల  రాత్రంతా చలి, పొద్దంతా ఎండ  ఒకదానితో ఒకటి పోటీ పడి దంచికొడుతన్నయి.తెల్లారంగ ఐదు గంటలకు పొలం కాడికి పోవాలని అలారం పెట్టుకున్న కిరణ్ కు  కోడికూత తోనే నాలుగు గంటలకు తెలివచ్చింది. అటు బొర్రినా ,ఇటు బొర్రిన నిద్రపట్టలేదు. కళ్ళు తుడుచుకుంటా సెల్ఫోన్లో టైమ్ చూసిండు. ఐదుకు ఐదు నిమిషాలు  తక్కువ ఉన్నది. మంచాల కెళ్ళి లేసి అలారం ఆఫ్ చేసి బయటకు వచ్చాడు. చుక్కలు మిల్క్ మిల్క్ మంటూ వన్నె పోకుండా మెరుస్తున్నాయి. పడమటి దిక్కు వెన్నెలమ్మ వంగి కొంత కాంతి తగ్గి తొంగి తొంగి చూస్తుంది.

ఆదర బాధరగా సైకిల్ బయటకు తీసి  ఎక్కిండు  ఒక్కసారి ఇగం తలిగింది. రాత్రి మంచు పడి సీటు మీద లీళ్లు ఉన్నాయి. తూడుసుడు మర్చిపోయిండు కిరణ్. ఎనుక తడిమి చూసుకుంటే పాయింట్ అంత తడిసి పోయింది. రాత్రి ఒంటేలుకు లేవకుండా బట్టల్ల పోసుకున్నోని లెక్క అయింది అనుకున్నాడు. అయినా అదంతా ఖాతరు చేయకుండా మోటరు ఎయాలనె ధ్యాసతో ని పొలం కాడికి బయలుదేరిండు. ఇగం మంచిగానే పెడుతుంది. పలిగిన పెదవి ఒక్క సారి సులుక్కు మన్నది. తడిమి సూసుకున్నాడు. కొంచెం ఎండిపోయి ఉన్నాయిపలిగిన కాడ తోలు పక్కు కట్టి ఉన్నదిఇంకా నయం రాత్రి పండుకోంగా వాసులెన్ పెట్టుకున్నా లేకపోతె ఇంక ఎక్కువ పలిగి రక్తం కారేది అనుకున్నడు.

కొంచెం దూరం పోంగానే కుక్కలు ముడుసుక పన్నయి  అవి పొద్దందాక అచ్చిపోయెటోల్ల వాళ్ళ మీదికి మొరుగుకుంట  ఎంబడి పడుతయి.కిరణ్ కు కొంచెం భయమైంది కానీ చలికి అవి లేసి మొరిగే అంత సాహసం చేయలేదు.కిరణ్ ప్రయానం సుఖవంతమైంది.

సైకిల్ స్టాండ్ వేసి ఒకసారి చుట్టుపక్కల చూసిండు పక్క పొంటి పొలాలోల్లు అప్పటికే మోటార్లు ఏసిండ్లు , అక్కడక్కడ టార్చ్ లైట్ ఎలుగులు కనిపిత్తన్నయి. వీళ్లకు రాత్రంతా నిద్ర పట్టదా ..? పొద్ధుందాక ఈనే ఉంటారు రాత్రి ఎప్పుడు వస్తారో తెలువది నాకంటే ముందే ఈడుంటరు అనుకున్నాడు మనసుల.

రాత్రంత  మంచు పడి పొలాలు తెల్లగా మంచు కొండ లెక్క కనిపిత్తన్నయి. దీనికి తోడు సూర్యుడు కూడా రావటం మొదలైంది నీటి బిందువుల మీద సూర్యకిరణాలు పడి వజ్రం లెక్క మెరుస్తున్నాయి ప్రకృతి అందాన్ని చూసి కిరణ్ మనసు ఒక్కసారి పులకరించింది.కమ్మ (వరి ఆకు)  పదునెక్కి ఉన్నది, పయంటు లేకుంట  పోతే కాళ్లకు తలిగి కోసుకుపోయి రక్తాలు కారిన రోజులు గుర్తుకు అచ్చి పయంటు ఏసుకచ్చిందే నయం అనుకున్నాడు.   పొలం ఒడ్డు మీద నుంచి నడుస్తుంటే నీటి బిందువులతోటి   కిరణ్ పయంటంత తడిసింది. కిరణ్ తాకిడికి నీరు రాలిన ప్రాంతమంతా పచ్చగా చాలా అందంగా కనిపిస్తుంది.

మోటార్ ఏసీ పొలాన్ని తనివి తీరా చూసిండు , నిన్న మాపటికి ఇప్పటికి ఏం మారింది, పొలం ఇంత అందంగా కనిపిస్తుంది అనుకున్నాడు మనసులో. అందుకేనేమో పెద్దలు" పొద్దుగాల పొయి పొలం మొఖం సూడాలే , అంబటాల్లకచ్చి ఆడదాని మొఖం సూడాలే" అంటారు.  ప్రకృతిని  , ప్రకృతిలో భాగమైన ఆడవారిని ఏకకాలంలో అందంగా చూసిన ఘనత కేవలం రైతుకు మాత్రమే దక్కుతుందనుకుంట అనుకున్నాడు కిరణ్. రకరకాల ఆలోచనలు మనసులో మెదులుతూ ఉన్నాయి. పయంటు తడుత్తె  చిరాకు పడే కిరణ్ చిరాకు అంత  పక్కనపెట్టి పొలమంత తిరిగి చూడాలనుకుని  ఒడ్ల పొంటి తిరిగి చూస్తున్నడు ఏపుగా పెరిగిన పొలం  చల్లటి గాలికి వయ్యారంగా ఊగుతుంటే కిరణ్ దృష్టి మల్లించలేక పోయిండు. బహుశా రైతు లాభం లేకున్న వ్యవసాయం  ఈ అందాలను చూడటం కోసమే చేత్తడేమో అనుకుంటూనే అన్ని  వ్యసనాలకంటే వ్యవసాయంఅనే వ్యసనం మనిషికి అలవాటు కావద్దు  ఏ వ్యసనం నుంచి అయిన బయట పడవచ్చు కానీ వ్యవసాయం అనే వ్యసనం నుంచి  మాత్రం బయటపడటం సాధ్యం కాదు అనుకుంటు ఇంటి బాట పట్టిండు కిరణ్.

అప్పటికే కిరణ్ సైకిల్ కాడికి మల్లన్న అచ్చి నిలబడ్డాడు. చెవులకు తువ్వాలు చుట్టుకొని చేతుల గుతుప కట్టె పట్టుకుని అచ్చం బార్డర్లో సైనికుని లెక్క . మల్లన్న నమస్తే......ఎన్ని గంటలకచ్చినవే తెల్లందాక ఈన్నే ఉన్నవా ఏంది...అని అడిగిండు కిరణ్. తెల్లందాక  కాదు కిరణ్ తెల్లారంగ నాలుగు గంటలకు వచ్చిన. నిన్న పందులు తొక్కి పాడు సేసినై నాది  వరి గొలుక అంచింది కదా ఇప్పుడు పందులు నాశనం చేత్తే ఇగ రాత్రి కరెంటు పెట్టిన.  పది గంటల దాకా ఉన్న పొద్దుగాలనే మల్ల అచ్చిన దొంగ గొడ్లో , బర్లో  కరంటుకు పడి సత్తె మన మెడకు పడుతది.  పనిల పని ఇగ మోటర్ కూడ ఏసిన అని చెప్పుకచ్చిండు.ఇంతట్లకె రామన్న అచ్చిండు. సామాన్యంగా రామన్నకు తన సమయాన్ని వృధా చేయడం ఇష్టం ఉండది. మొన్న పెద్ద పంది పోతు పడ్డది అది చిన్నపాటి దూడంత ఉన్నది ముగ్గురు ఈడుసుక పోయి చెర్ర పారేసినం చెప్పుకచిండు రామన్న. ఇటు ఏరియాల కరెంట్ పెట్టి పందుల సంపాలంటే నువ్వే , నీ అంత ధైర్యం చేసెటోల్లు లేరు అని కితాబిచ్చిండు కిరణ్.  తన మెప్పలకు చిన్నగా నవ్వి నిజమే కానీ అయ్యి పాడువడ మనం పది సంపుతే  మల్ల అచ్చె ఏటికి ఇరువై పుడుతన్నయే అంటూ పల్ల పల్ల నవ్విండు.

వీళ్ళ ముగ్గురిని  చూసినా కుమార్, వెంకటేష్ లు కూడా సైకిల్ కాడ జమైండ్లు.సైకిల్ పేట్టేకాడ రోడ్డు విశాలంగా ఉంటది అది మూడు తొవ్వలు కలిసే ప్రాంతం. అక్కడ ఉండి  చూస్తే అందరికి పొలాలు కనిపిత్తయీ.

ఉరుకుల పరుగుల జీవితమో , డబ్బులు సంపాదించాలని వేటనో టీవీల ప్రభావమో కానీ ముగ్గురు కూడి ముచ్చట పెట్టుకున్నది లేదు నలుగురు కూడి నవ్వుకున్నది లేదు . ఒకల బాధ ఒకలకు పట్టనట్టు మనుషుల మధ్యనే ఉంటూ ఒంటరి బ్రతుకులకు అలవాటుపడ్డారు జనాలు. ఏదో ఒక సందర్భంలో   జమ కూడినప్పుడు ఊరి ముచ్చట్లు ,దేశం ముచ్చట్లు , అది ఇది అని తేడా లేకుండా మాట్లాడుకొని మల్ల ఎవల పనులల్ల వాల్లం తీరికలేకుంట జీవించేటోళ్ళం.

పొలాలు ఈసారి అందరియి మంచిగానే ఉన్నాయ్ కుమార్ అన్నాడు.

రెండు మూడు ఏండ్ల సంధి అందరియి మంచిగనే ఉన్నయి అనుకచ్చిండు వెంకటేష్. ఎవ్వల పొలాలు ఎట్ల ఉన్నా మీ ముగ్గురి  పొలాలు మాత్రం ఎప్పటికీ ఒక లెక్కనే ఉంటయి అన్న. మీరు మంచిగా చేత్తరు  మీ పొలాలు సూత్తే  ఆకలి కాదు తన మనసులో మాట చెప్పిండు కిరణ్.

ఆ  నువ్వు అన్నది నిజమే కానీ మేము ఎంత అరుసుకుంటే పొలం గట్ల ఉన్నది. దానిని ఎప్పటికీ పుట్టిన గుడ్డు లెక్క చూసుకోవాలె అప్పుడే మంచిగుంటది అక్కడిదాక  ఎందుకు నీ పొలం కూడా మస్తు పండుతది  కానీ నువ్వు కొద్దిగా ఖాతరు చేత్తలేవు అంటూ కిరణ్ చేయని పని ఎత్తి సూపిండు.....రామన్న.

అబ్బా అన్న నాకు మందులు ఎక్కువ ఏసుడు  , లీల్ల మందులు ఎక్కువ కొట్టుడు  ఇష్టం ఉండదే అని చెప్పుకచిండు కిరణ్.

గట్ల అయితే నీకేం బర్కత్ ఉంటది కిరణ్.. మల్లన్న అడిగిండు

నేను బర్కతి గురించి ఆలోసించుత లేనన్న కొంతల కొంతన్న  మందులు ఎయ్యాని తిండి తినాలె. నాకు సాధ్యమైనంత  వరకు నా భూమిని మందులు(ఎరువులు) ఏసి కరాబ్  చేయొద్దని నా ఉద్దేశం. తిండికైతె ఎల్లుతంది బతుకుతున్నాం ...గంతె సరిపోతదని నా ఆలోచన అన్న అంటు చెప్పకచిండు కిరణ్.

నువ్వు అన్నది నిజమే కానీ మాకు గట్ల ఎట్లా కుదురుతదె రామన్న అన్నాడు.

అబ్బో మీకు మాకు ఏడ దంట ఐద్దన్న   మీరేమో పెద్ద లెక్కనాయే  నాది గింతంత భూమేనాయె  ఏదో సావకుంట  బతుకకుంట  నా ఎవుసం  నడుత్తందీ  నా లెక్క మీరు ఉండాలంటే కుదురది అంటూ కిరణ్ చెప్పండూ.

ఈసారి పత్తులు  దెబ్బ తీసినట్టె  ఉన్నాయి అన్నాడు వెంకటేష్.

ఆ.... ఏడ చూసినా పత్తులు నాదాను ఉన్నై కానీ నా పత్తి  మాత్రం ఏం ఆశ కరం లేదుమల్లన్న బాధ వ్యక్తం చేసీండు. ఎందుకే గొడ్లు గిట్ట  మేసినయ  రామన్న  అడిగాడు

గొడ్లు , పందులేనంటే ఇప్పుడు కొత్తగా పోరగండ్లు తయారైండ్లు....మల్లన్న

పోరగండ్లేం చేత్తండ్లే....కిరణ్ ఆమాయక ప్రశ్న.

పత్తి మొత్తం ఆశకరం లేదు కిరణ్, ఎటుచూసినా బీరుసీసలే .... తాగుడు జరుగుతుంది,అండ్లనే  బొర్రుడు జరుగుతంది.మల్లన్న సమాదానానికి కిరణ్ బీరిపోయి సూత్తండు....

ఏందన్న గంత గోరమా......కిరణ్

నిజం తమ్మి నేను ఎందుకు అబద్దమాడుత.... మల్లన్న

మరి నువ్వేం అంటలేవా.... కిరణ్

తాగెటొన్ని  ఏమన్న  బెదిరియ్యచ్చు  గానీ ఆడు ఎప్పుడు తాగుతండో కనిపిత్తలేదు ఇగ బొర్రెటోల్లంటవ రెండు మూడు సార్ల  చూసిన.పాపం తలుగుతదని అటు దిక్కు పోలేదు. మల్లన్న చెప్పుకచ్చిండు.

నలుగురిలో కిరణ్ కే ఎక్కువ ఆచర్యం కలిగింది మిగిత ముగ్గురికి ఈ విషయం తెలిసిందే.

ఈ  టీవీలో సినిమాలు పోరగండ్లను నాశనం చేసినయన్నా ఏ మాత్రం బాధ్యత లేకుండుంటున్నరు అందరు ఆచర్యం నుంచి తేలుకొని  అన్నడు కిరణ్.

" సేసెటోనికంటె సూసెటోనికే పాపం" అంటారు. అందుకే అల్ల మొకాన పొలే, మల్లన్న అనంగానే... పాపమో , పుణ్యమో గాని నీ   పత్తి  కరాబైతంది కాదె  అనంగానే అందరూ గొల్లున నవ్విండ్లు.

పలకర పుల్ల (వేప పుల్ల)   నమిలి కింద ఉంచి కిరణ్ లీలు సాలుతనయ ఎండలు ముదురుతున్నాయి కదా అని అడిగాడు రామన్న.

ఏడ అన్న పైపు సాపిన రోజోదిక్కు ఏత్తన్న  కిరణ్  బదులిచ్చిండు

నువ్వు నాకు దగ్గర ఉంటే మా ఇత్తు లీల్లు కానీ నువ్వు దూరమయ్యే , ఏం చేద్దాం మెల్లమెల్లగ ఎల్లదీయ్యీ అన్నడు రామన్న

ఔనే మనకు డ్యాం గింత దగ్గెర కదా లీల్లెందుకు లెవ్వె కుమార్ అడిగిండు

మనకు డ్యాం ల లీల్లు ఊటలు పడయి...మల్లన్న

ఎందుకు పడయే వెంకటేష్ అడిగాడు.

మనము డ్యామ్ మీదికి ఉన్నము కదా అందుకె మనకు జలాలు పడయి...మనకు గుట్ట జాల పడుతది జవాబిచ్చిండు మల్లన్న

మరి నువ్వన్నది నిజమే అయితే డ్యాంకు కిందున్నోల్లకు లీల్లు ఉండాలే కదా మరి వాళ్ళకు కూడ బాయిలల్ల లీల్లు లేవు కదా కిరణ్ చూసిన సంగతి చెప్పిండు.

ఓపెన్ కాస్ట్లు  కిలోమీటర్లకు కిలోమీటర్ల దూరం తవ్వినంక లీల్లు ఉంటయానె భూమిల .... కుమార్

ఔ నిజంగనే కిలోమిటర్ల లోతు ఓపన్ కాస్టలు తవ్వి ఐదు ఫీట్ల లోతు ఇంకుడు గుంతలు తవ్వుమనవట్టిరి ఎట్లుంటై భూమిల లీల్లు....వెంకటేష్

గోదావరిల  మనభూమి , మన ఊరు పాయే .... ఇప్పుడు వాడు మనకు లీల్లు ఇయ్యకుండా ఎక్కడికో తీసుకపోవట్టె గిట్ల ఐతె మనం ఎట్ల బతుకుతం...కమార్

" నీ అవ్వ ఉన్నోడు పోయి ఉన్నోనికె పెడతడు లేనోడు పోయి ఉన్నోనికె పెడుతడు"  దొరలు తక్కువ రేటుకు భూములు అమ్ముతం అన్నప్పుడు మనల కొననియ్యద్ద...... వాళ్లు దొరల భూములల్ల  జండలు పాతి మనకు పట్టాలు చేపిత్తమనిరి  ఊల్లె ఆల్లు లేకుంట అయిరి , ఈల్లు లేకుంట అయిరి.ఈ డ్యాం పడుడు చేయపట్టి ఒక్కొక్కనికి గోనె సంచులల్ల రింపుక పోయేంత డబ్బచ్చింది.

మనకు చెందకుంట ఆ భూములన్నీ కాపాడి ఆళ్లకు సంపాయించి పెట్టినట్టయ్యింది  ఇప్పుడు దొరలంత నక్సలైట్ పార్టొల్లందరికీ దండం పెడుతండ్లు  ఈల్లు  మాకు లాభమే చేసిండ్లని...  కోపంగా చెప్పుకచ్చిండు రామన్న....

నువ్వున్నది నిజమే రామన్న మనకు చెందకుండా చేసి ఆల్లకు లాభం చేసినట్టయింది మల్లన్న జతకలిసిండు రామన్నతోని .

రామన్న నువ్వు అన్నమాట ఇంతకు ముందు ఊళ్ళె మనోళ్ళు అనంగా నేను ఇన్న ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావ్.. అందులో నువ్వు అన్ని తెలిసినోనివి . ఆల్లతోని తిరిగినవాట నువు గా మాట అనచ్చానే  కిరణ్ అడిగిండు.

నిజమే కిరణ్ తిరిగినం నువ్వు అపుడు గింతంత ఉంటివి కానీ ఆ భూములు మనకు చెత్తే ఎంతో కొంత లాభం జరుగు కదా అని బాధ అనిపిత్తంది...రామన్న అసహనం వ్యక్తం చేసిండు.

సరేఅన్న  నువ్వు అన్న దాంట్లో నీ ఆవేదన కనిపిత్తంది కానీ వాళ్లు మనకు నష్టం జరగాలని మాత్రం చేయలేదు కదా .ఒకవేళ నిజంగానే మనకు నష్టం జరగాలని వాళ్ళు అనుకుంటే మనమంత  ఎట్టి చేసినప్పుడు , మన భూములు గుంజుకున్నప్పుడు, మన ఆడోల్లను లొంగదీసుకున్నపుడు , మనం చేసిన  కష్టానికి తగినంత కూలి ఇయ్యనపుడు, అసలు మనల మనుసులుగా సూడనపుడు కూడ వాల్లు ఏం పట్టనట్టే ఉండాలె కద....ఇవన్ని మాట్లాడినందుకు ఎంత మందిని సంపిండ్లు ...మీరంత కండ్లరిండ సూసినోల్లె కదా...అన్ని రకాల దోపిడి నుంచి మనల కాపాడిండ్లు...అసలు ఆ పార్టీ పుట్టిందె మనకోసం కదనే ....ఏదో వాల్లు చెయ్యాలని చెయ్యలేదు దొరలకు లాభం జరిగింది గాయింత దానికె గంత పెద్ద నిందలేత్తరానే కిరణ్ గట్టిగానే అన్నాడు.

నువ్వు అన్నట్టు లం.... కొడుకులు బాగా గోస పుచ్చుకున్నారే... అవ్వన్నిటి నుంచి రక్షించిండ్లు కాని  ఈ భూములు యాదికచినప్పుడే పాణం కలుక్కుమంటది.నిదుర పట్టది ఎన్ని భూములు... ఎంతమంది భూమి  లేనోళ్లు కొనుక్కుందురు... మల్లన్న బదులిచ్చిండు.

మంచి చేద్దామనే ఉద్దేశ్యంతోనే మనల భూములు కొననియ్యలేదు ఇంతట్లకే వాళ్ళు వేరే ప్రాంతానికి పోయిరి , ఒకవేల వాల్లు ఇంకా కొంతకాలం ఉంటె భూములు మనకె  దక్కేది భూమి లేనోల్లందరికి న్యాయం జరిగేది...కిరణ్.

ఇప్పుడు చూడరాదే డ్యాంల పోయిన భూములకు పైసలచ్చె , ఉన్న భూములకు రైతుబంధు రావట్టె ఒక్కొక్క భూమిల చెట్లు మొలచి వృక్షాలైనయి  . అవి సాగుకు లేకున్న  లక్షలు లక్షలు అత్తన్నై. నీ అవ్వ ఒక్కోక్కన్ని పైసల్ల  కాలెయ్యచ్చు  మల్లన్న ఉగ్రమచ్చినట్టన్నడు.

మన దొర భూమిల చెట్లు పీకిచ్చి తొవ్వ కూడా ఏసిండు.... వెంకటేష్ చెప్పిండు

ఎక్కడి భూమిల పీకిచ్చిండు కుమార్ అడిగిండు.

చెరువు కింద భూమిల పీకిచ్చిండు చేత్తడో , అమ్ముతడో తెలువది .... వెంకటేష్.

భూమి సాగు చేసిన చేయకున్న వానికేం నష్టం ఉన్నదే ఎట్లా అయిన  పైసలు రానెపట్టే మన గౌర్నమెంట్ కూడా ఆల్లకే అండగా ఉండే .. ఇగ వాల్లు "ఆడిందె ఆట పాడిందే పాట"...కుమార్

నీ అవ్వ ఇది ఎటు సూత్తే అటె కనిపిత్తంది. ఇంతవరదాక నక్సలైట్లె అనుకుంటె  ఇప్పుడు గవర్నమెంట్ కూడా దొరలకే లాభం చేయబట్టే అని గట్టిగా నవ్విండు  రామన్న.

ఎటు చూస్తే అటు కాదన్నా నక్సలైట్లు అనేటోళ్లు గవర్నమెంటుకు ఉండుడే ఇష్టం వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ కు పుట్టగతులు ఉండవు కిరణ్ కొత్తవిషయం చెప్పిండు.

గదేందె నువ్వెందో గట్లా చెప్పబడితివి రామన్న ఆచర్యం తోని  అడిగిండు.

నిజంగానే అన్నా నక్సలైట్లు అనెటొల్లు పీడిత ప్రజల కోసం ఏర్పడిండ్లు. అయితే ఈ గవర్నమెంటు ఇగో మీకు అభివృద్ధి చేద్దామంటే వాల్లు అడ్డుకుంటండ్లు ఏం పనులు   చేయనిత్తలేరు .మేము మీ దగ్గరికి వస్తానంటే మమ్మల్ని చంపుతారు. అని రకరకాల దొంగ మాటలు చెప్పుకుంటా కోట్లకు కోట్లు వెనకేసుకొని వాల్లను బదునాం చేసుకుంట  తిరుగుతంది గవర్నమెంట్. అందుకే గవర్నమెంట్ ఏం పనులుచెయ్యకుంట ఉండాలంటే నక్సల్స్ ఉండాలే....

అంతేనా కిరణ్.... రామన్న అడిగిండు

అది ఒక్కటే కాదన్నా ఇప్పుడు గవర్నమెంట్ నౌకర్లకు

కులం రిజర్వేషన్,

మతం రిజర్వేషన్ ,

లింగం రిజర్వేషన్ ఉన్నది .

ఇప్పుడు కొత్తగా నక్సలైట్ రిజర్వేషన్ కూడ పెట్టిండ్లు  ......

ఇప్పుడు వాల్లున్న ప్రాంతం.వాల్ల అడుగులు పడ్డ ప్రాంత యువకులను ఈ కోటల రిక్రూట్ చేసుకుని మన కోసం పుట్టినోని మీదికి మనల పంపుతడన్న మాట.....మొన్న ఈ మద్యలనే మా దోస్తువాల్ల తమ్మునికి ఈ కోటలనే పోలీస్ నౌకరచ్చింది.....కిరణ్

నీ అవ్వ ఇదంత గమ్మత్తుంది నవ్విండు రామన్న పండ్లన్ని ఎల్లపెట్టి

ఇగ మనం గిట్లా ముచ్చట పెట్టకుంట ఉంటే బాగా విషయాలు  అత్తయి గాని ఏడి  పనులు ఆడ ఉన్నాయి మల్ల పొలం కాడికి రావాలి బుక్కెడంత  తిని నేను పోతా మరి అని లుంగీ సవరించుకున్నడు వెంకటేష్.

ముచ్చట్లపడి అన్ని పనులు మరిసినం నాకు పని ఉంది అంటే నాకు పని ఉందని అందరు పనులు గుర్తు చేసుకున్నరు.

పలకర ఏసుకుంటవా కిరణ్... రామన్న తన చేతిలో పల్లపుల్ల ఇస్తు అడిగిండు

ఏసుకుంటా ఆన్న అంటూ తన చేతిలో పల్లవుల తీసుకుంటు నవ్విండు కిరణ్.

మల్లన్న పొలం ఇంకో పదిహేను రోజులైతె  కోతకత్తది  అందరికీ అన్నం పెట్టే వరి గొలుక తలదించుకుని ఎంత వినయం గా ఉన్నది. అనుకుంటూ సైకిల్ ఎక్కి పల్లపుల్ల నోట్లో వేసుకుని బయలుదేరిండు.

చాలా రోజుల తర్వాత వేపపుల్ల వేయడం వల్ల నోరంతా మంట మండుతూ చేదుగా తలిగింది.

బహుశా నిజాలన్ని ఎప్పటికీ చేదుగా కటువుగానే ఉంటయేమో అనుకుంటూ సైకిల్ వేగంగా ఇంటికి తొక్క సాగాడు కిరణ్.

కథలు

భార్గవి

ఎప్పటిలాగానే  వేకువజామున  లేచి  కల్లాపు చల్లి ముగ్గు వేసి, వంటింట్లో కి వెళ్ళింది  భార్గవి. అప్పుడే భార్గవి  అత్తగారు తనకి ఎదురు వచ్చారు. 

ఏంటమ్మ  భార్గవి  ఇవాళ ఆదివారమే కదా ! అందరికీ సెలవే , నిమ్మలంగా నిద్ర లేవచ్చు కదమ్మా , ఎందుకీ ఆర్భాటం?” కటువుగా  తన సలహాను చెప్పింది భార్గవి అత్తగారు.

పర్వాలేదు అత్తయ్య, మీరు మామయ్య గారు , ఆయన , పిల్లలు  రోజు టిఫిన్ ఈ టైం కే చేస్తారు కదా అత్తయ్యఈ రోజు సెలవ అని ఆ సమయం తప్పకూడదు అత్తయ్యవివరంగా చెప్పింది భార్గవి ... భార్గవికి  కుటుంబం పట్ల ఉన్న బాధ్యత చూసి మనసారా మురిసిపోయింది రాజ్యలక్ష్మి .

అత్తమామల్ని అమ్మనాన్నలు గా చూసే కోడలు భార్గవి ,,,అమ్మానాన్నలు భార్య పిల్లలు తప్ప మరో లోకం తెలియని భర్త  అభిమన్యు,,, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు తప్ప రాజలక్ష్మి మామయ్య పాండురంగారావు.  

ఒకరోజు అభిమన్యు ఎప్పట్లాగానే ఆఫీసుకు వెళ్ళాడు. ఎప్పుడు ఏడు గంటలకల్లా  వచ్చే కొడుకు ,,9:30 అయినా రాలేదని అత్తమామలు కంగారు పడుతుంటే వారికి ధైర్యం చెబుతూ అభిమన్యు ఫోన్కు  ట్రై చేస్తుంది భార్గవి. కానీ ఎంత ప్రయత్నించినా ఫోన్ తీయడం లేదు అభిమన్యు .

ఆఫీసుకు ఫోన్ చేసిన అభిమన్యు ఎప్పుడూ వెళ్ళిపోయాడు అని చెప్పారు.

అబ్బాయి లేట్ అయితే ముందు చెప్పి వెళతాడు కదా రాజ్యం  ,,,”,కంగారు పడుతూ అన్నాడు పాండురంగారావు తన భార్య తో.

అవునండి!! నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పింది రాజ్యలక్ష్మి.

అప్పుడు టైం 10:30 , ఇంటి ముందు ఒక అంబులెన్స్ ఆగింది , దాన్ని చూడటంతో  భయంతో హడిలిపోయింది కుటుంబమంతా !!! 

కాంపౌండర్, అభిమన్యు శవం బయటకు తీశాడు. 

ఏడింటికి  ఇంటికి వస్తుంటే లారీ  గుద్దుంది అని చెప్పారు. 

ఒక్కసారిగా  కుటుంబం అంతా శోక సంద్రంలో మునిగింది. భార్గవి దుఃఖానికి అంతులేదు.

కర్మ కాండలు , తద్వారా  జరగవలసిన  కార్యక్రమాలు జరిగాయి . అభిమన్యు చనిపోయి 

నెల దాటింది. అభిమన్యు ఙ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ  కుమిలిపోతున్నారు కుటుంబం అంతా.... మా అమ్మాయి కీ ఇంత చిన్న వయసులో ఈ దుస్థితి పట్టింది అని విలపించసాగారు భార్గవి తల్లి దండ్రులు.

కాసేపటికి,  " అన్నయ్య గారు, వదినగారు!! మా అమ్మాయికి  మరో పెళ్ళి చేద్దామని 

నిర్ణయించుకున్నాం.  తన జీవితంలో ఇలా  సగంలో వర్థంమవ్వడం మాకు ఇష్టం లేదుఅని భార్గవి తల్లి శకుంతల తన మనసులోని  మాట పాండురంగారావు దంపతులకు వెళ్ళబుచ్చింది. 

ఎలాగో మీకున్న  ఒక్క  కొడుకు పోయాడు,, ఇల్లుఆ మూడు ఎకరాల పొలం అంతా పిల్లల పేరు మీదనోమా భార్గవి  పేరు మీదకు మార్చడం   ఇప్పుడు  మీరు చేయాల్సిన పని అన్నయ్య అని తన దురాశను  బయట పెట్టింది శకుంతల ..

ఈ పరిస్థితుల్లో ఏమి మాట్లాడాలో తెలియక పాండురంగారావు దంపతులు మౌనంగా ఉండిపోయారు...అప్పటివరకు ఓ మూలన దు:ఖ లోకంలో  కూరుకుపోయినా భార్గవి  ఒక  ఉదుటున తన తల్లి మీదకు లెచ్చింది. 

అమ్మా!! ఇప్పుడు నా దారి నేను చూసుకుంటే అత్తయ్య, మామయ్య పరిస్థితి ఏంటి? నా భర్త ఉన్నంత కాలం అందరం కలసి ఉన్నాముఇప్పుడు ఆయన పోయాక  నా దారి నేను చూసుకోవాలా?? వద్దు అమ్మా,  !! అత్తయ్యమావయ్య  వాళ్ళనుఆయన ఙ్ఞాపకంగా మిగిలిన పిల్లలని చూసుకుంటూ ఇలాగే  ఉండిపోతాను.  నాకు ఆస్తి  మీద , ఇంకో పెళ్ళి మీద ఆశ లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది భార్గవి .

" ఏంటి భార్గవి ఇలా మాట్లాడుతున్నావునీకంటూ ఒక జీవితం  ఒక తోడు అవసరం లేదా?? నీ పిల్లలకు నాన్న అవసరం లేదా??” ఆశ్చర్యంతో కూతురు మీదకు ప్రశ్నల బాణం వేసింది శకుంతల .

నాకు అమ్మనాన్నల్లాంటి  అత్తమామలున్నారు.  నాకు ఎవరి అవసరం లేదు.   ప్రాణంలా  చూసుకున్న ఆయన నన్ను  విడిచి వెళ్ళిపోయారు. ఆయన ప్రాణం అయినా ఈ కుటుంబాన్ని  చూసుకోవడం ఈ ఇంటికి కోడలిగా  నా బాధ్యత   తన నిర్ణయం ఇదే అని నిక్కచ్చిగా చెప్పింది భార్గవి. 

ఎంత చెప్పినా కూతురు వినకపోవడంతో అక్కడ్నుంచి వెళ్ళిపోయారు భార్గవి తల్లిదండ్రులు. 

కొన్ని రోజులు గడిచాయి,, శకుంతల వాళ్ళ బంధువులను పంపి భార్గవికి నచ్చజెప్పాలని చూసినా తన ప్రయత్నం ఫలించలేదు. కొడుకు పోయినా కోడలి రూపంలో కూతురిని ఇచ్చాడు ఆ పైవాడు,, అని మనసారా భార్గవి దీవించారు పాండురంగారావు, రాజ్య లక్ష్మి. ఇరుగుంటి వారు , పొరుగింటివారు భార్గవి మంచితనాన్ని మెచ్చుకున్న వాళ్ళు కొందరైతేఆస్తి కోసం తను వేసే ఎత్తుగడ అని నిందలు వేసిన వారు ఇంకొందరు. ఇవేవీ భార్గవి పట్టించుకోలేదు. ఉండబట్టలేక పాండురంగారావు దంపతులు భార్గవిని మరో పెళ్ళి చేసుకొమ్మని, ఆస్తి తన పేరున రాయబోయారు.  అందుకు భార్గవి ఒప్పుకోలేదు. పైగా ఇంటిని పోషణ తన బాధ్యతగా తీసుకొనితను ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది భార్గవి. ఒక రోజు భార్గవి ఆఫీస్ నుండి తిరిగి వస్తుండగా తనకు చదువు చెప్పిన జనార్ధన్ మాష్టారు కలిసారు. అభిమన్యు మరణ వార్త విని ఎంతో బాధపడ్డారు.

వేరు కాపురం పెట్టించే కోడళ్ళు ఉన్న ఈ రోజుల్లోనువ్వు కూతురుగా మారి నీ అత్తమామల్ని చూసుకుంటున్నావు చాలా గొప్ప మనస్సు అమ్మ నీది అని భార్గవిని ఆశీర్వదించారు జనార్దన్ మాష్టారు.

ఇందులో తన గొప్పతనం ఏమీలేదని , “మీరు చదువుతో పాటు నేర్పిన విలువలను నేను ఆచరించాను గురువుగారు.  మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ తోడు ఉంటాయిగా అని అన్నది భార్గవి....

తప్పకుండా ఉంటాయి అమ్మ భార్గవి,,,నేను ఒక రోజు వచ్చి మీ కుటుంబాన్ని కలుస్తాను. ఉంటాను భార్గవి అని చెప్పి జనార్ధన్ మాష్టారు ఎదో పని ఉన్నట్టుగా అక్కడి నుండి వెళిపోయారు. భార్గవి కూడా ఇంటికి వెళ్ళిపోయింది 

రెండు నెలల గడిచాయి. ఒక రోజు అభిమన్యు ఆఫీస్ నుండి భార్గవికి ఫోన్ వచ్చిందితను వెంటనే ఆఫీస్కు వెళ్ళింది. 

అమ్మా భార్గవి అభిమన్యు మరణం నాకు ఇప్పటికి  బాధగా ఉంటుందినేను ఇంకా ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను.  మీ వారి పిఎఫ్ కటింగ్స్ , ఆఫీస్ తరుపు నుండి  20 లక్షల దాకా వస్తాయిఆ చెక్  ఇవ్వడానికి  నిన్ను పిలిపించాను అని అన్నారు మేనేజర్. 

చెక్ తీసుకునిమేనేజర్ కి థ్యాంక్స్ చెప్పి, ఇంటికి చేరుకుంది భార్గవి. భార్గవి ఈ విషయాన్ని అత్తమామలకు చెప్పింది.  

అత్తయ్య గారుమామయ్య గారు , ఈ ఇరవై లక్షల డబ్బులో కొంత  పిల్లల చదువులకు , మరి కొంత మీ ఆరోగ్య రిత్యా  బ్యాంక్ లో డిపాజిట్ చేద్దాముఇక మిగిలిన డబ్బులతో  కిరాణం షాపు పెడితే బాగుంటుంది అని నా ఆలోచన.  మీ నిర్ణయమే నా నిర్ణయం అని వివరించింది భార్గవి

మంచి ఆలోచన అమ్మ భార్గవి, మాకు ఇంత గొప్ప కోడలు!! కాదు కాదు కూతురిని ఆ దేవుడు అందించాడు , ఇక కిరాణం షాపు బాధ్యత  మాది, నువ్వు ఉద్యోగం కొనసాగించు సంతోషంగా 

చెప్పారు భార్గవి అత్తమామలు. భార్గవి కూడా ఆనందంగా రాజ్యలక్ష్మిఒడిలో ఒదిగిపోయింది. 

 

 

 

 

 

కథలు

గతిలేక 

బత్కు మీద లాక్ డౌన్ తన్ను తంతే బర్ బాత్ అయిపోయింది బతుకంత. కలిగినోడు కరోనను తగిలించుకస్తే, కలిగిలేని కూలోడు నడిసి నడిసి కాళ్ళే కాదు కడుపు కూడ కాలిపాయే. ఐన గిప్పుడు గి దేశంలా అరగక ఆగిపోయిన ఊపిరి కొందరైతే, అన్నం దొరక్క పోయిన పానం ఇంకొందరిది.

దేశమంతట ఏడి పనులు ఆన్నే ఆగిపోతే కాంట్రాక్టు పనులు మాత్రం ఒగ ఉరుకుడు ఉరుకుతలేవు. మల్ల అందులోది రైల్ బండి కొత్త లైన్ పనులు మాత్రం కుక్కను కొడితే ఉరికినట్లు ఉరుకుతున్నాయ్. గి పనులకు పెట్టిన క్యాంప్, అల్ల ఉండే మంది, మిషిన్లను జూత్తే, జూసినోడికి ఈళ్లకు లేదా లాక్ డౌన్ అని అనిపిస్తది. ఐన గి పనులను ఏ పోలిసొళ్ళు అడగరు, అస్సలు ఆపారు ఎందుకంటే అదో జిమిక్కు. అగ్గువకు దొరికినోళ్ళను మాత్రం ఈపంతా మండ సంపుతరు. ఎంతైనా పోలిసొళ్ళు మరి, ఆళ్ళని అడిగేటోళ్ళు ఎవలున్నలు.

ఈ రైల్ క్యాంపులొనే జ్యోతి కూడ పనిజేస్తుండేది కానీ, ఇప్పుడు కాదు తను బంజేసి నెల అయితుంది. అనవసరంగా బంజేసాన అనుకుంటు, ఊరంతా పంటే "ఈ రాతిరి ఎట్ల గడత్తదిరా అన్నట్లు" తన కండ్లనిండా నీళ్ళు నింపుకొని ఆలోచిస్తూ కూసోని ఉంది జ్యోతి.

వున్న కాసింత బువ్వని తన ఇద్దరు పొరగాళ్ళకి పెట్టి, ఉత్త కాలి కడుపుతో ఉండడం వల్లనేమో, ఊర కుక్కల అరపుల్లా తన ఆకలిని  యాదిజేత్తనే ఉంది జ్యోతికి. క్యాంపుల పనైతే బంజేసింది కానీ, ఈ నెలరోజుల సంది లాక్ డౌన్ వల్ల పనుల్లేక పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది. తన మొగుడు సచ్చిపోయిన కానుండి ఇప్పటి దాకా ఇలాంటి పరిస్థితి రానేలేదు జ్యోతికి. ఎవరు ఎన్నిరకలుగా ఇబ్బంది పెట్టిన లెక్క చేయకుండా ఎంతకష్టమైన అనుభవిస్తూ ఇద్దరు పొరగాళ్లను మంచిగా సదివిపిస్తుంది. కానీ గిప్పుడు వేరయ్యింది కతంత ఈ లాక్ డౌన్ వల్ల, కనీసం పొరగాళ్ళకి ఇంత బువ్వ పెట్టె పరిస్థితి కూడ లేదు. అనవసరంగా క్యాంపుల బంజేసిసాన, అసలు ఇక్కడ ఏంది ఏడా కూడ ఉండే కతనేనే. రేపోసారి పోయి అడుగుతా అనుకుంటూ తన చెంపలపొంటి కారిన కన్నీళ్ళను తుడుసుకుంటూ, మల్ల పనిలోకి తీసుకుంటారో లేదోని నిద్రలోకి జారుకుంది జ్యోతి.

పొద్దు పొద్దున్నే లేసి పెండ నీళ్లతో ఇల్లంతా అలుకు సల్లి, పొరగాళ్ళు లేస్తే ఆకలంటరని ఉన్న కొద్ది కంట్రోల్ బియ్యంతో అన్నమండి పెట్టి, అరుగు మీద కూసోని సూస్తా ఉంది క్యాంప్ కాడికి పోవాల్న అద్దాని ?

ఇంతలో.... జోతవ్వ..ఓ జోతవ్వ ఉన్నవా అని పిల్సుకుంటా అచ్చింది ఇంటి పక్కన నర్సవ్వ.

"హ అవ్వ ఉన్న జెప్పు" ఏమన్నా పన అని అడిగింది జ్యోతి.

అదేం లేదు బిడ్డ ! ఊళ్ళ సూదరోళ్లేవలో సచ్చిపోయిండని ముసలోడు వంతుకు పోయిండు. నాకేం తోయక అచ్చిన అని సమాధానమిచ్చింది నర్సవ్వ.

అవునా అవ్వా !

హ బిడ్డ ఏం జేత్తనవ్ ?

ఏం లేదవ్వ ఊకనే ఇట్ల కూసున్న.

సరే బిడ్డ "నువ్వేం అనుకోనంటే నేనోటి అడగన" అంటూ వణుకుతూ అడిగింది నర్సవ్వ.

అడుగవ్వ నేనేం అనుకుంటా అని బదులిచ్చింది జ్యోతి.

పని ఎందుకు బంజేసినవ్ బిడ్డ ?

ఒక్కసారిగా చర్ల బర్ల మంద పడ్డట్లు జ్యోతి మదిలో మల్ల ఆలోచనలు లేపినట్లయింది. నర్సవ్వకు ఏం చెప్పాలో అర్థంకాక "ఏం లే అవ్వ నాకే పానం మంచిగా లేక "బంజేసిన, మల్ల పోయి మాట్లాడుకోవాలే అని సమాధానమిచ్చింది జ్యోతి.

ఆ మాటకు కూసున్న నర్సవ్వ లేస్తూ నీకో మాట జెప్తున్న ఇను బిడ్డ ! "మొగుడు లేని బత్కులో ప్రతివోడు మగాడు కావాలనే జూస్తరు" మనమే అన్నింటినీ పట్టుకొని ఏలాడకుండా ముందుకు పోవాలే బిడ్డ. నీ ఎన్క ఇద్దరు పొరగాళ్ళున్నారు ఓసారి యాదుంచుకో అంటూ అక్కడ నుండి కదిలింది నర్సవ్వ.

నర్సవ్వ మాటలకు జ్యోతికి తనలో తనకే ఎన్నో ప్రశ్నలు పుట్టుకచ్చినయ్. ఈ లాక్ డౌన్ ఎన్ని రోజులుంటదో తెలీదు, అప్పటిదాక పొరగాళ్ళను ఎండబెట్టి సంపలేను. ఏదైతే అదే అయితది ఇవాళ క్యాంపుకు పోయి పని మాట్లాడుకొని అత్తా అని అనుకుంటూ అరుగునుంచి లేసి ఇంట్లకు పోయింది.

తన చీర కొంగును, చిక్కేంటికలను సదురుకొని నర్సవ్వ ఇంటిదగ్గరకచ్చి " అవ్వా.. ఓ నర్సవ్వ " అని పిలిచింది.

ఎవల్లుళ్ళ....?

నేనవ్వా జ్యోతిని

ఏంది బిడ్డ గిట్లచ్చినవ్ ?

ఏం లేదావ్వ  నేను గి పనిదాక పోయేసి వత్తపోరగాళ్ళ అత్తె  తొక్కు ఇంత ఏశియ్యవ అని  అడిగింది.

గట్లనే బిడ్డ, గిది కూడ నువ్వు జెప్పల్నా నే జూసుకుంటా కానీ నువ్వు పోయిరా అని సమాధానమిచ్చింది నర్సవ్వ.

ఇంటిదగ్గర నుండి క్యాంపుకి కదులుతుంటే, తన కళ్ళలో కన్నీళ్లు కూడ కదులుతున్నాయి. దేవుని మీద మన్నుబోయ ఏం బత్కునిచ్చావురా అని తిట్టుకుంటూ క్యాంప్ దాక అచ్చింది జ్యోతి.

క్యాంప్ మెస్ దగ్గర కూరకాయలు కోసుకుంటున్న వంట మనిషి శ్రీను, జ్యోతిని జూసి " ఏంరా చెల్లె ఇట్ల అచ్చినవ్" అని అడిగిండు.

ఏం లే అన్న, "లాక్ డౌన్ కధ పనులేం లేవు, కొంచెం ఇంట్లకు ఇబ్బంది అయితుందే, మల్ల గిట్ల పనిలో పెట్టుకుంటారేమోని అడుగుదామని అచ్చిన" అని అచ్చిన ముచ్చట చెప్పింది జ్యోతి.

నే గప్పుడే జెప్పిన అనవసరంగా బంద్ అయినవ్ నువ్వు అని అన్నాడు శ్రీను.

నేనెందుకు బంజేసిననో నీకేం ఎరుకనే అన్న ? "నా లెక్క నువ్వు కూడ ఆడదానివైతే తెల్సు నా బాదేంటో" అని మనసులో అనుకుంటూనే, పటేల్ సార్ లేడా అన్న అని అడిగింది.

లేడురా చెల్లె, పొద్దున ఆనంగా క్యాంపర్ ఏసుకొని పోయిండు, ఈ పాటికళ్ళ అత్తనాలే అంటూ లేసి వంట రూంలోకి పోయిండు శ్రీను.

"పటేల్ సార్ క్యాంపుల ఎవరినైనా పనిలో పెట్టుకోవలన్న, తీసేయలన్న ఈనే చేతిల పనే, క్యాంప్ లో ఈనెను కాదని జరగదు, జరగనియ్యాడు. ఒకవేళ జరిగితే ఇక అంతే సంగతి "

లోపలి నుంచి శ్రీను చాయ్ తీసుకచ్చి జ్యోతికి ఇస్తూ, ఈ లాక్ డౌన్ ఎన్ని రోజులుంటదో తెలీదు. "పటేల్ సార్ ఏమన్నా అంటే నువ్వేం అనకు, మనకు పనికి ఎక్కుడు ముఖ్యం" ఇంతమందికి నేనొక్కణ్ణి అండి పెట్టాలన్న నాకు యాష్టకత్తదని తన మనసులో మాట చెప్పిండు శ్రీను.

జ్యోతి ఏం సప్పుడు జేయకుండా అట్లనే కూసోని ఉంది. ఇంతలో బ్లాక్ క్యాంపర్ స్పీడ్ గా దుమ్ములేపుకుంటూ వాళ్ళ దగ్గరకచ్చి ఆగింది. అందులోంచి పటేల్ దిగగానే శ్రీను, జ్యోతిలిద్దరు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు.

పటేల్ తన రూంకి పోతూ, అరేయ్ శ్రీను చాయ్ పెట్టురా అని జ్యోతిని అదో రకంగా జూస్తు ఆర్డర్ వేసాడు.

సరే సార్ అని చాయ్ తీసుకపోతు, చెల్లె నేను పటేల్ కి చెప్తా మల్ల పనిలో పెట్టుకోమని, నువ్వేం ఫికర్ జేయకు అని వెళ్ళాడు శ్రీను.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పని తప్పకుండ జెయ్యాలి కానీ, గి పటేల్ గాడు జెప్పిందల్లా జేయాలంటే నా మనసొప్పట్లేదని, ఎటు తేల్చుకోలేని స్థితిలో జ్యోతి ఆలోచిస్తుంది.

ఇంతలో జ్యోతి నిన్ను సార్ రమ్మంటుండు అని శ్రీను పిలిసిండు.

హ వస్తున్నా అన్న అని పటేల్ రూం వైపు కదిలింది జ్యోతి

నేను మాట్లాడిన, నువ్వు కూడ మంచిగా మాట్లాడు అని జ్యోతికి సైగ జేసీ జెప్పిండు శ్రీను.

ఏం జ్యోతి గిట్లచ్చినవ్ అని జ్యోతి రాగానే అడిగిండు పటేల్.

హ సార్ మీ జాడకే అచ్చిన, మల్ల గిట్ల పనిలో పెట్టుకుంటారేమోని అచ్చిన అని అసలు ముచ్చట జెప్పింది జ్యోతి.

జ్యోతి మాటలు ఇన్న పటేల్ " అరేయ్ శ్రీను, బ్లాక్ క్యాంపర్లో ఇంజిన్ ఆయిల్ బకెట్ ఉంటది. దాన్ని తీసుకపోయి స్టోర్ రూంలో పెట్టి రాపో అని అక్కన్నుండి శ్రీనును పంపిండు.

చూడు జ్యోతి మొన్నటి లెక్క నేనేదో అన్న అని చెప్పక, చేయక బంజేసి పోత అంటే కుదరదు.

మొన్న మీరేం జెసారో, నేనెందుకు బంజేసానో మీకు తెల్వదా సార్.

ఇగో గివన్ని అద్దు జ్యోతి నీకు ఈడ పని కావాలంటే,నువ్వు నే జెప్పినట్లు జెయాలే. నీకు పని కావలి, నాకు నువ్వు కావాలి అని జ్యోతిని కళ్ళతో తినేసేలా జూస్తు అన్నాడు పటేల్.

ఒక్కసారిగా జ్యోతికి లోపలనుండి తన్నుకస్తున్న ఏడుపును అనుసుకుంటూ, "మీకు ఇంతకు ముందు జెప్పాను, ఇప్పుడు జెప్తున్నాను నేను అసొంటి దానిని కాను సార్" అని సమాధానమిచ్చింది జ్యోతి.

జ్యోతి అసలే లాక్ డౌన్ ఏడా పనులు దొరకవు. నీకు నేను తప్ప నీకు వేరే దిక్కులేదు, ఐన నీ పిల్లల కోసమైన నువ్వు ఒప్పుకోవాలి. ఈ టైంలో బుక్కెడు బువ్వే దొరకట్లేదు ఇంకా నీకు పని దొరుకుతదా. నువ్వు ఇట్ల ఆలోచించుకుంటా ఉంటే రేపు గిట్ల నీ పిల్లలకు బువ్వ లేక ఏమన్నా అయితే దానికి నువ్వే బాధ్యురాలువైతావ్. అసలే నీ మొగుడు కూడ లేడు. అయిన మీకు, మీలాంటోళ్ళకి అలవాటేగా ఇవన్ని అని జ్యోతికి దగ్గరగా అచ్చి తన భుజం మీద చేతులేసాడు పటేల్.

ఆ మాటలకు మల్ల తన మీద చేతులు పడేసరికి ఒంట్లో సర్రుమని కోపం కంట్లో ఎర్రగా మారి " చేయి తీయ్ అంటూ పటెల్ ను నెట్టేసి, మంచిగా మాట్లాడండి సార్. మా గురించి మీకేం తెలుసు, పచ్చకామర్లు అచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడినట్లుంది. ఎవరు ఎట్లాంటోల్లో సూత్తనే తెలుతాంది. ఐన మేము, మీ అంతగనం కాదులెండి సార్. ఇంకోసారి మావోళ్ల గురించి తప్పుగా మాట్లాడితే మంచిగా ఉండదు అని కోపంగా మాట్లాడింది జ్యోతి.

అబ్బో రేషం బాగానే అస్తది. "నువ్వెంతా సంసారివైనా, నిన్ను పది అని పదిమందిలో మెప్పించుకుంటా నాకా తరికుంది. కానీ, నీకు ఈ పని తప్ప వేరే గతిలేదు ఆలోచించుకో, నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే రేపటినుండి పనికి వచ్చాయ్, లేకపోతే నీ కర్మ" అని రూంలో నుండి బయటకచ్చి క్యాంపర్ దగ్గరకు పోయిండు పటేల్.

జ్యోతికి ఇంకా ఎక్కువ కోపం పెరిగిపోతున్న, ఏం జెయ్యలేక మౌనంగా నిలబడిపోయింది.

అరేయ్ శ్రీను, జ్యోతికి రెండు అన్నం పార్సెలు కట్టి ఇయ్యరా అంటూ క్యాంపర్లో ఎల్లిపోయిండు పటేల్.

పార్సెల్లు కట్టి జ్యోతికి ఇచ్చుకుంటా ఏమన్నాడు చెల్లె, రమ్మన్నడా పనికి అని అడిగిండు శ్రీను.

ఏంది నా బత్కు గిట్ల అయిపోయింది. ప్రతోనికి లోకువైపోయినని ఏడ్సుకుంటు, శ్రీను మాట్లాడుతున్న పట్టించుకోకుండా ఇంటికెళ్ళచ్చింది జ్యోతి.

ఎడిసేది పొరగాళ్ళు జూత్తే బెంగ పడతరని తన కొంగుతో మొకమంత తుడుసుకొని, ఇంటెనక చింతచెట్టు కింద చింతపండు కొడుతున్న నర్సవ్వ దగ్గరకు పోయి కుసుంది జ్యోతి.

జ్యోతిని సూడగానే నర్సవ్వ "పోయిన పని ఏమైంది బిడ్డ" అని అడిగింది.

హ అయ్యింది అవ్వ!

అవ్వా......!

చెప్పు బిడ్డ.

ఇన్ని ఏళ్లలో నీకెప్పుడు ఆడదానిగా ఎందుకు పుట్టిన అని అనిపియ్యలేదా అని అడిగింది జ్యోతి.

ఎందుకు అనిపియ్యలేదు బిడ్డ మస్త్ సార్లు అనిపించింది. మనం ఇంట్ల లోకువే బయట లోకువే. ఎట్లనో చెప్పన ముసలోడు ఊళ్ళందరికి ఎట్టి చేత్తే, నేను మీ ముసలోనికి ఎట్టిచేసేది. పొద్దుగాల పనికి పోయినకానుంచి ఇంటికచ్చే వరకు, ఎవడో ఒకడచ్చి గుంజేదాక ఆడదానే అనే సంగతే యాదిరాని మన బత్కు గూర్చి ఇగ చెప్పు ఎట్లుందో. మల్ల అందరూ ఆడాళ్ళు ఒక్కతీరు కాదు బిడ్డ, అద్దాల రైకలు కట్టిన వాళ్ళు వేరు, ఉప్పుపెలిన కొంగులు కట్టిన మనం వేరు ఇవన్ని పోను పోను నీకే అర్ధం అయితదిలే.

ఐన గివన్ని అడుగుతున్నావ్ ఏమైంది బిడ్డ అని అడిగింది నర్సవ్వ.

ఏంలే అవ్వా ఊకనే అడిగిన అని సమాధానమిచ్చింది జ్యోతి.

సరే బిడ్డ ముసలోడు అచ్చె యాలయ్యింది, నేపోత అని అంత సదురుకోని వెళ్ళిపోయింది నర్సవ్వ.

అట్లనే చింతచెట్టు కింద కూసోని ఆలోచిస్తూ ఉండేసరికి చీకటయ్యింది. క్యాంప్ నుండి తెచ్చిన పార్సెల్లు పొరగాళ్ళకి తినబెట్టి, చెరోపక్కన ఏసుకొని పడుకోబెట్టింది. పొరగాళ్లనైతే పడుకోబెట్టింది కానీ, తన ఆలోచనలు మాత్రం మత్తడి పోషినట్లు పొంగిపొర్లుతున్నాయి.

సరిగా నిద్రపోకపోవడం వల్ల కళ్ళు ఎర్రగా అయి, ఆరిపోయిన ఏడుపుమొకంల ఉంది జ్యోతి. పని తీర్సుకొని, నర్సవ్వ దగ్గరకు పోయి " అవ్వ  నేను పనికి క్యాంప్ కాడికి పోతున్న పొరగాళ్ళు లేస్తే రమ్మని చెప్పు అని చెప్పింది జ్యోతి.

జ్యోతికి తనలో తనకే ఎన్నో తలంపులు, ఈ కరోనా వల్ల సత్తమో లేదో కానీ, ఇట్లనే ఉంటే ఆకలికే సచ్చేట్లు ఉన్నాం. దీనివల్ల నా పొరగాళ్ళకి ఏమైనా అయితే పాపం నాదే అయితది. నాకు దారిలేక పోతున్న, దారి కాదు గతిలేక వేరే గతిలేక పోతున్న, దీనికి సమాజం నాకేం పేరు పెడతారో తెల్సుకానీ, నా కడుపుకోతకు ఏం పేరు పెట్టగలరు అని తన బాధ నుండి అచ్చిన ఏడుపునంత అనుసుకుంటూ క్యాంప్ వైపు వేరే గతిలేక కదిలింది జ్యోతి.

 

కథలు

స్నేహం  

ఈ కథ ఇద్దరు ప్రేమికులది కాదు....

ఇద్దరు స్నేహితులది కాదు...

ప్రాణంతో కూడిన ఒక బంధానిది...

ఆ బంధం పేరు  అనురవళి

ఇది ఇద్దరి పేర్ల కలయిక మాత్రమే కాదు.

రెండు హృదయాలు ...

 స్నేహం కోసం పరితపించే ప్రాణాల కలయిక ఈ బంధం...

స్నేహం అంటే ఇచ్చి పుచ్చుకునే ఈ రోజుల్లో వీళ్ళ స్నేహ బంధంలో కష్టం, సుఖం, ప్రేమ, కోపం, అలకలు, కన్నీరు, కుటుంబం అన్ని  సరితూగాయి...

ఇంక మా అనురవళి కథ చూస్తే ....

ఇక్కడ అనురవళి అంటే అనుష, కుసుమ రవళి ఇద్దరు స్నేహితులు...

అందరు శ్రీ చైతన్య, నారాయణలో చదువు మాత్రమే ఉంటుంది అనుకున్నారు...

కానీ మా అనురవళి స్నేహం అంతకు మించిన బంధాన్ని ఏర్పరచుకున్నారు...

ఏ రోజు కాలేజ్ కి అంత శ్రద్ధ తీసుకుని వెళ్ళలేదు..

కానీ అను పరిచయం అయిన మొదటి రోజు నుండే కాలేజీ అంటే ఎంతో ఇష్టం మొదలైంది మరి....

అది వాళ్ళ మొదటి సంవత్సరం... అంటే మా కథ మొదలై ఆరు సంవత్సరాలు అయ్యింది...

నా స్నేహితురాలు "విహారిక" వలన "అను" తో నాకు స్నేహం మొదలైంది....

ఆ స్నేహం నన్ను వెనుక బెంచి నుండి తన పక్కకి వచ్చి కూర్చునే అంతలా మారింది... మా బ్యాచ్ ఏడుగురు అయితే మొదటి రోజు నుంచి మొదటి స్థానం ఆనూదే..

రోజులు గడిచే కొద్దీ నా నవ్వుకి తను రూపం అయింది...

నా కన్నీరు కి ఓదార్పు తను అయింది...

చాలా తక్కువ సమయంలో ఎంతో దగ్గర అయ్యాము...

మా స్నేహ బంధాన్ని చూసి మా చదువు ఏమైపోతుందో అని నన్ను బెంచి మార్చేవారు...

కానీ ‌అది(అను) కూర్చునే బెంచి వెనకాలే కూర్చునేదానిని...

మా బెంచీల మధ్య గ్యాప్ లేకుండా నా కాళ్ళు పెట్టేదానిని...

తరువాత క్లాస్ అయిపోయాక చూసుకుంటే ఆశ్చర్యం వేసేది...

అది నా కాళ్ళ మీద i miss u, i love u అని రాసి మా స్నేహ బంధానికి బలం చేకూరేలా చేసేది

అలా మొదటి సంవత్సరం గడిచింది...

ఎన్నో ఆటలు, అలకలు, కష్టాలు, జ్ఞాపకాలు అలా అన్ని దాటి పరిక్షల వరకు వచ్చాం...

వీటన్నిటి మధ్య ఒక "ప్రేమ జంట" ఉందండోయ్...

అర్విత, ఆశిష్... ఎవరూ అని ఆలోచించేలోపే నేనే చెప్పేస్తా... అర్విత నా కూతురు, ఆశిష్ అను కొడుకు...

ఇదేంటి కొడుకు, కూతురు అంటున్నారు ఎక్కడ నుండి వచ్చారు అనుకోకండి...

ఇవి మా కల్పితాలు మాత్రమే...

వాళ్ళు ఎవరో కాదండి మా ఫిజిక్స్ బుక్ మీద ఉన్న అమ్మాయి, అబ్బాయి ఫోటోస్...వాళ్ళకి పెళ్లి కూడా చేసేసాం మరి... ఇంక పరీక్షలు కూడా మొదలయ్యాయి...

కష్టపడి పరీక్షలు కూడా రాసేసాం... ఇంక తరువాత సెలవులు...

ఆ సెలవుల్లో కూడా ఒకే ఆలోచన కాలేజీ ఎపుడు స్టార్ట్ అవుతుందా.. అను ని ఎపుడు చూస్తానా అనే ఆలోచనే...

ఇక కాలేజీ స్టార్ట్ అయ్యే కొద్ది ఇంకా ఎపుడు చూస్తానా నా అను ని అనే ఆత్రం ఎక్కువ అవుతుంది..

కాలేజీ స్టార్ట్ అయ్యే లోపు అను ని ఎన్ని సార్లు తలుచుకున్నానో లెక్క లేదు... ఈ లోపు కాలేజీ స్టార్ట్ అయ్యింది... తనని చూసాక నా ముఖం నవ్వు తో వెలిగిపోతోంది...

ఇక రోజులు గడుస్తున్నాయి...

ఒక రోజు ప్రిన్సిపాల్ మా క్లాస్ కి వచ్చి ఇలా అంటున్నారు మీలో ఎవరికి అయితే మంచి మార్కులు వస్తాయో పై తరగతి కి పంపిస్తాం అని...

సార్ మాట్లాడుతున్న మా ఇద్దరి పని మాదే...

ఎందుకంటే మాకు తెలుసు మాకు మంచి మార్కులు వచ్చిన కూడా మేం వెళ్ళం అని...

రోజులు గడిచాయి ఫలితాలు వచ్చాయి..

చూస్తే క్లాస్ లో 2  స్థానం లో నేను ఉన్నాను.

సార్ వచ్చి వెళ్ళిపోవచ్చు అన్నారు.కాని నాకు వెళ్ళే ఉద్దేశం లేనే లేదు...

       ఎందుకంటే అను ని వదిలి వెళ్లే ఆలోచన లేదు... అలా వెళ్ళాల్సి వస్తే నా నవ్వుకి నేను దూరం అయినట్టే అదే జరిగితే నా అను కి దూరం అయినట్టే...

బాధ, కష్టం ఏది అయిన అను పక్కనే అని నిర్ణయించుకుని వెళ్ళను అని సార్ కి చెప్పేసా...

ఆ నిమిషం అను అడిగింది.. అక్కడికి వెళ్తే  ఇంకా బాగా చదువుకోవచ్చు వెళ్తావా అని దీనంగా అడిగింది??

నేను నవ్వుతూ అను ..అక్కడికి వెళ్తే నేను బాగా చదువుతాను కావచ్చు కానీ ఆనందంగా అయితే ఉండలేను అని...

ఆ రోజు నుంచి మేం ఇద్దరం ""అనురవళి"" గా మారాము...

నేను ఆ నిర్ణయం తీసుకుని 5 సంవత్సరాలు అయింది...

ఏ రోజు నా నిర్ణయం తప్పు అని అనిపించలేదు అంటే తను నన్ను ఎంత ప్రేమగా చూసుకుందో మీకు అర్థం అయి ఉంటుంది...

 ఈ లోపు పక్క సెక్షన్ నుండి ప్రమోట్ అయి వచ్చింది... మా అదృష్టం అనుకోవాలో మా నవ్వుని మరింత పెంచిన అల్లరి పిల్ల అనుకోవాలో... తనే ""జోష్న""....

ముగ్గురం తోడు దొంగలయ్యాం... అప్పటి నుంచి మా నవ్వులకు, అల్లరికి అదుపే లేదు...

అను నేను కలిసి జోష్న ని ఏడిపించడం... ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కదిలేవాళ్ళం.. అలా మా స్నేహం ఇంకా బలపడింది.

ఇంటర్ పూర్తి అయ్యింది.

ఇద్దరం కలిసే ఉండాలన్న ఆలోచన ఒక వైపు... కానీ భవిష్యత్తు కోసం వేరు వేరు దారులు ఎంచుకోవాల్సి వచ్చింది...

నేను BTech, తను degree. వేరు వేరు దారులు.. తనని చూడకుండా ఉండలేను నేను‌.. కానీ నెలల పాటు చూడకుండా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి...

కానీ కుదిరిన ప్రతి సారి కలిసేదాన్ని.

కానీ విచిత్రం ఏమిటంటే, ఎన్ని నెలల తర్వాత కలిసిన మా మాటల్లో ఏ మాత్రం తేడా లేదు, మా చేష్ఠల్లో మార్పే లేదు... ఎన్ని అనుకన్న జోష్న బలైపోయేది.

ఏ మాటకి ఆ మాటే , మేం ఒకరికి ఒకరు ఎంత దూరం ఉన్న మా మనసులు ఇంకా ఇంకా దగ్గర అయ్యాయి... ఎంతలా అంటే అను ఇంట్లో నేను సొంత కూతురు లాగా...

మా ఇంట్లో తను మా ఇంటి ఆడపిల్ల లాగా చూసుకునే అంత దగ్గర అయ్యాము...

 Btech జాయిన్ అయినా కానీ సంతోషంగా లేను కారణం అను కి నాకు మధ్య దూరం... అలా 3 సంవత్సరాలు గడిచాయి.. అను తన డిగ్రీ పూర్తి చేసింది...

ఇంతలో తనకి పెళ్లి అనే మాట నా చెవిన పడింది. ఒక్కసారిగా భయం, ఆందోళన, కన్నీటికి ఆనకట్ట లేదు...

ఏవేవో ఆలోచనలు, అను కి అపుడే పెళ్లి ఏంటి...

అందరిలా సంతోషపడటానికి తను నా స్నేహితురాలు కాదు నాలాగా మా ఇంటి ఆడపిల్ల...

ఒక్కసారిగా వేళ ప్రశ్నలు...

అక్కడ తను ఎలా ఉంటుందో?

నాలాగా చూసుకుంటారా లేదా?

తను లేని నా ప్రపంచం ఎలా ఉంటుందో?

వచ్చే అబ్బాయి బాగా చూసుకుంటారో లేదో?

ఆలోచిస్తూ ఉంటే నా కన్నీరు కి అదుపు లేదు..

వెంటనే ఫోన్ రింగ్ అవుతుంది... చూస్తే అను...

ఇదంతా చెప్పేసా...

ఇంతలో తను అంది కుసు మనం దూరంగా ఉంటున్నాం కానీ ఎన్నటికీ విడిపోతాం అనే ఆలోచనే వద్దు... అది జరగని పని అంది... సరే అని ధైర్యం తో అడుగు ముందుకు వేసా... ఎప్పటికి అను అనే నా నవ్వు నా నుండి దూరం అవదు అనే నమ్మకంతో...

 

 పెళ్లి సందడి మొదలైంది...ఇక పెళ్లి కూతుర్ని చేయాల్సింది నేనేగా.

నాలానే తన ప్రపంచంలో కూడా అన్ని బంధాలు నాతోనే ముడిపడి పోయాయి...

అంతా సంతోషంగా జరుగుతుంది. పెళ్లికి నాలుగు రోజుల ముందే నా హడావిడి మొదలైంది.

ఆ నాలుగు రోజుల్లో అను చుట్టాలు అందరూ నా బంధువులు అయిపోయారు. కుటుంబమంతా నన్ను సొంత కూతురులా చూసారు....

పెళ్లి లో అమ్మ నాన్న (అను తల్లిదండ్రులు) ఏడుస్తున్నారు....

అపుడు నేను ఒకటే చెప్పాను అది వెళ్ళిపోతే వెళ్లి పోనివ్వండి మీకు నేను ఉన్నాను అని... మనం రోజూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉందాం అని నవ్వించేదాన్ని.అలా నా ఆను పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

"అనురవళి" కాస్త అనుపృథ్వి గా మారింది...

అను జీవితంలో ఎన్నో కొత్త పాత్రలు - కొత్త బంధాల మధ్య తనని వదిలేసి వచ్చా...

కొన్ని రోజుల తర్వాత చాలా సేపు మాట్లాడుకున్నాం అపుడే తెలిసింది నా అను సంతోషంగా ఉంది అని...

అలా రోజులు గడిచాయి.

ఒక రోజు పొద్దున్నే అను ఫోన్ చేసింది.

 బంగారం..... అని పిలుస్తూ అరిచింది సంతోషంగా

అపుడే తెలిసింది అను గర్భవతి అని..

నా ఆనందానికి హద్దులు లేవు ఇంకా..

కళ్ళలో ఆనంద భాష్పాలు చేరాయి..

ఎంతో సంతోషంగా అమ్మకు చెప్పా...

కానీ వెళ్ళడం కుదర లేదు...

కానీ ఎప్పటికప్పుడు అమ్మ అను వాళ్ళ అమ్మ సొంత కుటుంబ సభ్యుల్లా మాట్లాడుకునే వారు అది చూసి చాలా సంతోషించే దానిని...

నెలలు గడిచాయి...

అను కి నెలలు నిండాయి...

అంత సవ్యంగా ఉంది అనుకొని లేచి ఫోన్ చూసా.

అను నుంచి మెసేజ్ అంతా ఓకే కదా అని..

ఇలా అంది జ్వరం గా ఉంది వారం రోజులుగా ఆసుపత్రిలో ఉన్న ఇవాళ డిస్చార్జ్ చేస్తున్నారు అని.

వెంటనే ఫోన్ చేసా కానీ నీరసంగా ఉందని మాట్లాడలేదు. ఇంటికి తీసుకుని వచ్చేసారు.

సరిగ్గా నాలుగు రోజుల తరువాత నొప్పులు మొదలయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించారు... మరుసటి రోజు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసారు... బాబు పుట్టాడు అను కి అని తెలిసింది.

అందరం సంతోషపడ్డాం...

మరుసటి రోజు మాట్లాడాను..

బాబు ని ఫోటోలో చూసాను.. ఎంత ముద్దుగా అచ్చం అను లాగ ఉన్నాడు..

ఎంతో సంతోషించాను...

అను ఫోన్ చేసింది చాలా నీరసంగా బెడ్ మీద ఉంది... ఆపరేషన్ వళ్ళ అనుకుని కోలుకుంటుంది లే అనుకున్నాను..

సరిగ్గా రెండు రోజుల తరువాత ఒక మెసేజ్ అను వాళ్ళ చెల్లి అక్క అను అక్క కి బాలేదు నీకు ఈ విషయం తెలుసా?? అని.

వెంటనే జోష్న తో మాట్లాడాను... అపుడు తెలిసింది నా అను బ్రతకదు అందుకే ఆపరేషన్ చేసి బాబు ని తీసారు అని.. ఈ విషయం తెలిస్తే నేనేం అయిపోతానో అని చెప్పనివ్వలేదు అని...

ఆ నిమిషం నుంచి జీవితంలో ఇంకేమీ వద్దు.. అను జాగ్రత్తగా ఇంటికి వస్తే చాలు అని అన్ని దేవుళ్ళకు మొక్కుకున్న... భయంతో నా గుండె ఆగిపోయే పరిస్థితి లో ఉంది. కష్టం అంచున నిల్చుని ఉన్నా, కన్నీరు ఆగడం లేదు..

 తరువాత రోజు అను లేచింది... గుర్తు పడుతోంది అని తెలిసింది... ప్రాణ గండం నుంచి బయట పడుతుంది అని ఎంతో ఆనందించా!!

ఆ దేవుడు చూడలేకపోయాడు ఏమో???

రెండు రోజుల తరువాత...

ఉదయం 5 గంటలకి ఫోన్ వచ్చింది..

రాత్రి సీరియస్ అయి ఊపిరి ఆగిపోయింది అని..

అను ఇంక లేదు, నా అను నాతో లేదు.....

కోపం,బాధ, కన్నీరు అన్ని నాలోనే...

ఏం చెప్పాలో?? ఏం చేయాలో తెలియక అక్కడే కూలబడిపోయాను..

పిన్ని బాబాయ్ కి ఏం చెప్పాలి??ఎలా ఓదార్చను??

అది లేకుండా ఎలా ఉండగలను??

దేవుడు అనురవళి లో అను ని ఎందుకు దూరం చేసాడు??

ఇలా ఎన్నో....ఎన్నెన్నో....

ఏడుస్తు కూర్చుండిపోయా...

 

 

పుట్టిన బాబుని చూసుకోలేదు...

మనసారా ఆనందంగా ఎత్తు కోలేదు...

అమ్మ లేకుండా అయిపోయింది.అందరిని వదిలి తిరిగి రానంత దూరం వెళ్ళిపోయింది...

 

అను నువ్వు నాతో ఉన్న లేకపోయినా...

మనం దూరంగా ఉన్నాం కానీ...

మనం విడిపోవటం లేదు...

ఆది జరిగని పని...

చివరిగా ఒక్క మాట ఆను...

We born for friendship...

We born for each other...

                      ఎప్పటికి నీ

                          అనురవళి

 

కథలు

అమరజీవి మా కాంతమ్మత్త !

ఎరికలోల్ల కథలు - 3 

అనుకుంటాం కానీ, అందరికీ ఆ భాగ్యం  దక్కదు.

ఆమె చనిపోయినప్పుడు ఆమె పాడె  వెనుక మూడు ట్రాక్టర్లు కదిలాయి. వాటినిండా పూలహారాలే.

అదీ సావంటే. పుణ్యాత్మురాలు. నిద్రలో నవ్వతా నవ్వతానే పోయింది, ఏమి జనం, ఏమి జనం! ఇంత మంది యాడాడి నుంచి  వచ్చిoడారో ?.ఆ మనుషులేమి? ఆ పూలహారాలేమి? ఏమి జనం, సావు కూడా పెళ్లి లాంటిదంటే ఇట్లాంటిదేనేమో. అని జనం నోర్లు నొక్కుకున్నారు. ఇంకో మాట కూడా అనేశారు .      ఎరికిలోలల్లో  ఏ సావుకైనా పై కులమోల్లు ఇంత మంది వచ్చిండేది చూసినారా ? అదీ కాంతమ్మంటే!   ”    

ఎంతో మందిలో కొందరికే ఆ భాగ్యం దక్కుతుంది. ఒకళ్ళ గురించి పదిమంది పదికాలాల బాటూ మంచిగా  చెప్పుకున్నారంటే, అదే వాళ్ళు చేసుకున్నభాగ్యం.అట్లా భాగ్యవంతురాలనిపించుకున్న వాళ్ళల్లో మా అత్త పేరు తప్పకుండా వుంటుంది. ఆమె పేరు కాంతమ్మ.

ఆ పేరు చెప్తే జనాలకు ఆమె ఎవరో  కొంతమంది తెలీదని  చెపుతారు, కానీ  కొళాయి కాంతమ్మ  అంటే మాత్రం, పాతపేటలోనే కాదు, కొత్తపేటలో కూడా జనం ఆమె గురించి కథలు కథలుగా చెప్తారు. ఇంకో చిత్రం ఏమిటంటే, పెద్ద పెద్ద నాయకులకు లాగా చాలా  మందికి ఆమె ముఖ పరిచయం లేకపోయినా, ఆమె పేరు, ఆమె గురించిన సంగతులన్నీ చెప్పేస్తారు.అదీ ఆమె ప్రత్యేకత.

అట్లాగని ఆయమ్మ పెద్దగా చదువుకునిందని కాదు, పెద్ద  ఉద్యోగం చేసిందనీ కాదు. ఆమె సంపాదించిన ఆస్థిపాస్తులు ఏమీ లేవు. నిజానికి ఆమె ప్రత్యేకత అంటూ   ఏమీ లేదు. అయినా  “  హోల్  ఇలాకాలోనే  ఎరికిలోల్ల కాంతమ్మ  అంటేనే  వుండే గౌరవమే వేరు. ఆయమ్మ సెయ్యి మంచిది, ఆయమ్మ నోరు మంచిది . ఆయమ్మ గుణం మంచిది అని జనం అనటం  వెనకాల ఆమె నిలుపుకున్న పెద్దరికం అలాంటిది. పది మందిని సంపాదించుకున్న ఆమె మంచితనం అలాంటిది .

చిన్న బoకుఅంగడి పెట్టుకుని, ఆ చిన్న బంకులోనే  అన్నీ పొందిగ్గా  అమర్చి పెట్టేసేది. పాతపేటలో అప్పట్లో అంగళ్లు తక్కువ ఉండేవి. పలమనేరు వూరి మధ్యలో నాలుగో నంబరు జాతీయ రహదారి వెడుతుంది. యo.బి.టి. రోడ్డు అంటారు.మద్రాస్, బెంగుళూరు  గ్రాండ్ ట్రంక్ రోడ్డు. ఆ రోడ్డుకు అటు వైపు కొత్తపేట, ఇటు వైపు పాత పేట వుంటాయి. యస్టీ కాలనీ వుండేది పాతపేటలోనే. కాలనీలో జనమే కాదు చుట్టూ పక్కల ఆరేడు వీధుల్లో వాళ్లకి, ఎవరికేం కావాలన్నా, పదో ఇరవయ్యో సరుకు అప్పు కావాలన్నా , ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కొళాయి కాంతమ్మ అంగడే .

రకరకాల  వస్తువులు, ఆకుకూరలు, కూరగాయలు, రోజువారీ, వారంవారీ కంతుల కింద  అప్పులు తీసుకునే వాళ్ళ కోసం , అప్పు జమా నిల్వలు చూపించే పాకెట్ సైజు  లెక్కల పుస్తకాలుబాండు పేపర్లు , రెవిన్యూ స్టాంపులు,స్కూలు పిల్లలకోసం పెన్నులు, పెన్సిళ్ళు, ఆడపిల్లలకు కావాల్సిన సామాగ్రి రకరకాల వస్తువులు ఆ చిన్నఅంగడి లోనే అందంగా అమర్చుకునేది.   ఆ కాలంలో నాల్గో, ఐదో క్లాసు చదివినారంటే ఈ కాలం డిగ్రీ వాళ్ళతో సమానం కదా ఆ చదువు. ఆమెకి లోక జ్ఞానం , జ్ఞాపకశక్తి రెండూ ఎక్కువే. ఏ లెక్క అయినా, ఎంత కాలం అయినా, ఎవురెవరు ఎంతెంత బాకీ వున్నారో ,ఆమె కాగితం , పెన్నూ వాడకుoడానే చెప్పేయగలదు. వినే వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళ నోటు పుస్తకాల్లోనో  , క్యాలండర్లోనో ,డైరీలలోనో వాళ్ళు రాసింది ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ  తిప్పించి మళ్ళించి చూసుకునే వాళ్ళు. అన్నీ చూసుకుని ఆయమ్మ చెప్పిందే కరెక్ట్ అని ఒప్పుకునే వాళ్ళు.

వీధి కొళాయి దగ్గర రోజూ జరిగే పంచాయతీలను పెద్దరాయుడి మాదిరి తీర్చేది మా అత్త . కొళాయి దగ్గర ఎవరికీ పెద్దరికాలు లేవు. అక్కడ అందరూ సమానమే. ఒకరు గొప్ప అని కానీ, ఇంకొకరు తక్కువ  అని కానీ  తేడాలు అక్కడ లేవంటే ఆమె దశాబ్దాలుగా అమలు చేసిన  ఆ సమానత్వమే అందుకు కారణం.గలాటాలు,తోపులాటలు మాటల యుద్దాలు లేకుండా , వచ్చే నీళ్ళను సక్రమంగా అందరికీ అందేటట్లు ఆమె చూసేది. కొళాయి దగ్గరికి వచ్చేటప్పుడు ఆడవాళ్ళు కాళ్ళు, చేతులు, మొహాలు కడుక్కుని తల దువ్వుకుని శుభ్రంగా రావాలని పట్టు పట్టింది. ఎరికిలోళ్లు ఎందులోనూ తక్కువ కాదని ఇండ్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలని, ఉన్నంతలో శుభ్రతలో కూడా ముందు ఉండాలని ఆమె తనకులపోళ్లకు శతవిధాలా చెప్పుకొచ్చింది. పందులు మేపేవాళ్లయినా సరే అది  వృత్తి వరకే పరిమితం కావాలని, వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు పిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళు శుభ్రంగా ఉండాలని, శుభ్రత ముఖ్యమని ఆమె ఆ కాలం నుంచే మనుషుల్ని మారుస్తూ వచ్చింది. పిల్లలు ఎవరు ఇంటిదగ్గర కనిపించినా బెత్తం తీసుకొని వాయించేది. ఎందుకు స్కూలుకు పోలేదా అని ఆరా తీసేది. ఆ పిల్లల అమ్మానాన్నలకు చదువు  విలువ గురించి హితబోధలు చేసేది.  కారణం లేకుండా ఒక పూట అయినా పిల్లలు స్కూల్ కు పోకపోతే ఆమె కంటికి కనిపించారంటే ఆమె అసలు ఒప్పుకునేది కాదు. ఆడపిల్లల్ని చదువు మానిపించే ప్రయత్నం చేసినా, చిన్న వయసులోనే పెళ్లి చేయాలని ప్రయత్నించినా, ఆమె ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేది. వాళ్ళ పైన తిరగబడేది. ఆమెకు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ విపరీతంగా కొట్లాడేది. రచ్చ రచ్చ   చేసేది. వాళ్లను బ్రతిమలాడేది, ఏడ్చి మొత్తుకునేది, చేతులు పట్టుకుని అడుక్కునేది. పిల్లల గొంతులు కొయ్యవద్దని భవిష్యత్తు నాశనం చేయొద్దని ఆమె నచ్చచెప్పేది. కొనే శక్తి లేని పిల్లలు ఎంతో మందికి ఆయమ్మ  పలకా బలపాలు, పుస్తకాలు, పెన్సిల్లు, పెన్నులు ఉచితంగా ఇవ్వడం అందరికీ తెలుసు.

ఆడపిల్లలు మొగుడి దగ్గర దెబ్బలు తిని ఏడుస్తా కనిపించినా, ఆమె దగ్గర సలహా కోసం వచ్చినా  ఆమె పూనకం వచ్చినట్లు ఊగిపోయేది.

“  ఆడదనిపైన చెయ్యి చేసుకోవడం కూడా ఒక  మొగతనమేనారా ?ఎంతో మురిపంగా సాకి బిడ్డను ఇచ్చేది మొగోడి  వంశాన్ని నిలబెట్టే దానికి. భార్య అంటే  తల్లి తర్వాత తల్లి మొగోడికి. ఆ బుద్ధి మొగోల్లకి  ఉండల్ల. అత్త కూడా ఆ  మాదిరే తన కోడలిని చూసుకోవల్ల.ఒక  ఆడదానికి ఇంట్లో వుండే  ఆడోల్లు సప్పోర్ట్ ఇస్తే సాలు, ఇంకేమి అవసరం లే ..అప్పుడు ఏ మొగోడి చెయ్యి అయినా  పైకి  లేస్తుందా  ? ” అని వాదించేది.

ఆడోల్లకు చెప్పాల్సింది అడోల్లకి, మొగోల్లకి చెప్పాల్సింది మొగోల్లకి చెప్పేది. కులపోల్ల ఇంటి గలాటాలకి ఆడోల్లు నోర్లు లేనోళ్ళు, గట్టిగా మాట్లాడనోల్లు, మొగోల్లని నిలదీసే ధైర్యం లేనోల్లకి ఆమే ఒక ధైర్యం . వాళ్ళ తరపున ఆయమ్మే పంచాయతీలో మాట్లాడేది, వాదించేది.

నమ్మినోల్లకి ప్రాణం  అయినా ఇస్తారు కానీ , ఎరికిలోల్లు ఎవురికీ నమ్మక ద్రోహం చెయ్యరు. ఎరికిలోల్ల ఇండ్లల్లో పుట్టుక పుట్టినాక ఒక తెగింపు ఉండల్ల బ్రతికేదానికి. మనం కరెక్టుగా వున్నప్పుడు ఏ ఆడదైనా ఏ మొగనాబట్టకైనా భయపడాల్సిన పనేముoడాది ? ”అని ఆడోల్లకి ధైర్యం చెప్పేది.

 

ఆడది వూరికే బోకులు తోమి, ఇల్లు వాకిలి పిల్లల్ని చూసుకుంటాను అంటే కుదిరే కాలం కాదుమ్మే ఇది. ఆడది కూడా ఏదో ఒక పని చెయ్యల్ల. కోళ్ళు పెంచుతారో , పందుల్ని  మేపుతారో, కూలికే పోతారో, ఆవుల్ని పెట్టుకుంటారో, గంపలు ,చేటలు, బుట్టలు అల్లుకుంటారో అది మీ ఇష్టం. మీ కష్టానికి ఓ విలువుండల్ల, మీ సంపాదనకో లెక్క వుండల్లoతే.   ఇదీ ఆమె అభిప్రాయం.

ఆమె ఇప్పుడు లేదు. చనిపోయి ఆరేళ్ళు అవుతోంది. ఎరుకల ఇండ్లల్లో ఎంతో మంది పిల్లల భవిష్యత్తును, ఎంతోమంది ఆడవాళ్ళ సంసారాలను కాపాడిన ఆమె గురించి దీపం పెట్టే ఏ ఇంట్లో అయినా తలుచుకోని వాళ్ళు ఉండరు.

మా నాయనకు వరసకు ఆమె చెల్లులు అవుతుంది. మా నాయనకు స్వంత అక్కా చెల్లెళ్ళు ఉన్నప్పటికీ, ఆ అత్తావాళ్ళకంటే కూడా  మాకు కాంతమ్మ అత్తే   ఎక్కువ. ఎందుకంటే ఆమె మా పట్ల కనపరచిన ఆపేక్ష అలాంటిది. మా అమ్మతో ఆమెకు గల స్నేహం అలాంటిది.  అందుకే  మా అత్త అంటే మాకు చాల ఇష్టం .

 “ ఆ యమ్మకు మనుషులంటే భలే ప్రీతీ నాయినా, మనుషులతో మాట్లాడకుండా వుండలేoదు.దారిలో పొయ్యేవాళ్ళు ఎవరైనా ఆయమ్మను మాట్లాడక పోయినా , ఆయమ్మే నొచ్చుకుని పిలిచి మరీ మాట్లాడేది. ఏం ఎత్తుకుని పోతామబ్బా.. ఉండేది నాలుగు నాల్లె. ఆ నాలుగు నాళ్ళు, నాలుగు నోళ్ళల్లో మంచి అనిపించుకుని పోతే పోలేదా. అంత మాత్రానికి కోపాలు, గొడవలు , అపార్థాలు దేనికి మనుషుల మధ్య ?“ అనేది.

అట్లా అనడటమే కాదు, అట్లానే బ్రతికింది కడదాకా . ఆయమ్మ ఎంత నిఖార్సైన మనిషంటే , ఒక్క ఉదాహరణ చాలు చెప్పటానికి.

ఎంత జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, ఎట్లాంటి అనారోగ్యం ఎదురైనా సరే ఒక్క పూటంటే ఒక పూట అయినా ఆయమ్మ ఎవరింట్లో ఇంత ముద్ద తిని, చెయ్యి కడిగింది లేదు. చేసుకునే శక్తి వున్నప్పుడు తనే వండుకుని తినింది.కానీ  ఒంట్లో ఆ శక్తి లేకపోతేఎంత సొంత మనుషులైన ఇంట్లో అయినా సరే, ఒక్క పూటైనా ఆమె  అన్నం తినింది లేదoటే ఆయమ్మ పట్టుదల ఏపాటిదో అర్థం అవుతుంది. ఆయమ్మకు ఒకరికి పెట్టడమే తెలుసు కానీ, ఒకరింట్లో తినడం తెలియదు. ఒకరికి ఇవ్వటమే కానీ ఇంకొళ్ల దగ్గర చెయ్యి చాపింది లేదు.

ఆమెకు అరవయ్యేళ్ళు కూడా రాకుండానే పెద్ద జబ్బు చేసింది. నోట్లో పుండు లేచింది. కొడుకులు, కూతుర్లకి ఆయమ్మ అంటే చాల ఇష్టం కదా, చాలామంది డాక్టర్ల వద్ద చూపించారు.పలమనేరు, చిత్తూరు, తిరుపతిలో పెద్ద పెద్ద ఆసుపత్రుల  వద్దే చూపించారు కానీ , డాక్టర్లు ఆమె బ్రతకదని చెప్పేసినారు.

 

చెప్పకూడదని అనుకున్నారు కానీ, ఆమెకు ఎవరూ  చెప్పకుండానే తన పరిస్థితి అర్థం అయిపోయింది. ముందు  బాగా ఏడ్చింది. ఆమెకు అసలే మనుషులంటే అకారణమైన ప్రేమ కాబట్టి , మనుషుల్ని తలచుకుని తలచుకుని , గుర్తు తెచ్చుకుని మరీ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఒక రాత్రి రెండు పగళ్ళు, తిండీ , నీళ్ళుమాని మరీ ఏడుస్తూ వుండి పోయింది . ఏమవుతుంది  ఈమె? అంత ధైర్యం గల మనిషి ఇట్లా అయిపోయిందే అని పిల్లలు భయపడిపోయారు.

కానీ ఏదో ఒక అధ్బుతం జరిగినట్లు ఆమెకు ఎక్కడినుంచి వచ్చిందో కానీ అంత ధైర్యం ఉన్నట్లుండి ఎక్కడి నుంచో వచ్చేసింది . అదిగో  ఆ మహత్తర క్షణం నుండి ఆమె మారిపోయింది.

అప్పటిదాకా ఆయమ్మతో యెట్లా మాట్లాడాలోఆమెకు ఏం చెప్పి ఎట్లా ఓదార్చాలో అర్థం కాని కూతుర్లు, అల్లుళ్ళు, కొడుకు కోడలికి ఆమెలో వచ్చిన మార్పు ఒక షాక్ లాంటిది  . అంత వరకూ ఆమెకు ఇంట్లో ఏమి కుదిరితే అది తినడటమే అలవాటు. అది సద్దిది కావచ్చు, సంగటి కావచ్చు, చారు, ఊరిబిండి కావచ్చు, పచ్చిపులుసు కావచ్చు.ఆమె చిన్నపటినుండే చాల కష్టాల్లో పెరిగిన మనిషి కదా ఆమెకు అన్నం విలువ, ఆకలి విలువా బాగా తెలుసు.

అప్పట్లో ఆమె చిన్నతనంలో కరువు కాలంలో గంజి తాగి  బ్రతికిన మనిషి.అడవికి వెళ్లి కాయలు పండ్లు, మూలికలు, తేనె  తెచ్చి అమ్మి బ్రతికిన మనిషి.

అత్తా చెట్లు కొట్టడం కూడా పాపమే కదా, తెలిసి నేను ఏ పాపం చేయాలేదురా అబ్బోడా .. అంటా  ఉంటావు కదా ఎప్పుడూ ..అని నేనోసారి మాటవరసకి ఆమెని అడిగేసాను.   

అప్పుడు ఆయమ్మ మొహంలోకి నవ్వు వచ్చింది.

ఎప్పుడూ వక్కాకు వేసుకుని నమిలి నమిలి ఆమె పళ్ళు ఎప్పుడో గారబట్టి పోయాయి.ఆమె నోరు అందుకే ఎప్పుడూ ఎర్రగానే వుంటుంది. వక్కా,ఆకూ లేకుండా ఆమెకు ఒక పూట కూడా గడవదు. ఆమె నడుముకు, ప్రత్యేకంగా టైలర్ ముందు నిలబడి మరి దగ్గరుండి కుట్టించుకున్న గుడ్డ సంచి వేలాడుతూ వుంటుంది ఎప్పుడూ. వక్కాకు తిత్తి అంటారు, దాన్ని నడుముకు ఎప్పుడూ చెక్కుకునే వుండేది. మూడు నాలుగు అరలు ఉండేవి ఆ సంచికి. ఒకదాంట్లో డబ్బు పెట్టుకునేది. ఇంకో దాంట్లో అవసరమైన మాత్రలు, ఇంకోదాంట్లో వక్కా ఆకు సరంజామా. ఆమెకు నైటీలు అలవాటు లేదు కాబట్టి రాత్రి నిద్రలో కూడా  వక్కాకు సంచిని ఆమె నడుముకే అంటిపెట్టుకుని  వుండేది .రకరకాల చీరరంగులకు జోడీ  కుదిరేవిధంగా ఆమె వక్కాకు తిత్తి  రకరకాల రంగుల్లో తయారుగా వుండేవి.

 “ అబ్బోడా నాకు ముందునుంచే పాప భయం ఎక్కువ, మీ తాత చిన్నయ్య మన  ఎరికిలోల్ల ఇండల్లో పుట్టల్సినోడు కాదు కదా, మమ్మల్ని యెట్లా పెంచినాడు అనుకున్యావు? చీమకు కూడా అపకారం సేయ్యకూడదని , పచ్చని చెట్టు  కొడితే మహా పాపం అని రోజూ పాఠo మాదిరి దినామ్మూ చెప్తానే కదా మమ్మల్ని పెంచినాడు.మీకు చెపితే నవ్వుకుంటారు కానీ,మా ఇంట్లోకి తేలు, జర్రి ఎన్నో మార్లు వచ్చింటాయి కానీ   ఒక్కసారి కూడా నేను చంపిన దాన్ని కాదు, పచ్చని మాను కొడితే పాపం అని కదా మా నాయన మాకు నేర్పించినాడు, అడవిలో ఎండుకట్టెలు ఏరుకుని సైకిల్ పైన పెట్టుకుని తోసుకుంటా తెచ్చేదాన్ని రా . సైకిల్ పైన ఫుల్లుగా కట్టెలు పేర్చుకుని తోక్కేది రాదు కదా అప్పట్లో , సైకిల్  తోసుకుంటా వచ్చేసే దాన్ని.మా వయసు మగోల్లకన్నా  నా సైకిల్ పైనే ఎక్కువ కట్టెలు ఉండేవి. ఏంమేం దేంట్లో తక్కువమాకూ మొగోల్లకి ఇంత తేడా ఎందుకని  పోట్లాడే దాన్ని  ? ఆ తర్వాత కాలంలో  సైకిల్ నేర్చుకున్నా కానీ, ఆ తర్వాత తర్వాత వయసు బిడ్డ అని, నన్ను అడవికి పంపడం మాన్పించేసినాడు మా నాయన. ”.

ఆమె చిన్నతనంలోనే అన్ని పనులు, అన్ని విద్యలు నేర్చుకుంది. ఆమెకి చెట్లు ఎక్కడం కాయలు, పండ్లు, చింతాకులాంటివి కోయడం తెలుసు. దోటీతో చింతకాయలు రాల్చడం తెలుసు. చింతపండు కొట్టటం తెలుసు, రకరకాల మూలికావైద్యం తెలుసు. రెండు కాన్పులు అయ్యాక, మంత్రసాని పని కూడా నేర్చుకుంది. ఎవరికి ఏం సహాయం చేసినా ఎప్పుడూ ఆమె డబ్బు తీసుకోదు. మనిషికి మనిషి సాయం కదా అంటుంది.

మా అత్త  చెప్పక పోయినా అవన్నీ నాకు బాగా తెలిసిన విషయాలే. చిన్నప్పటి  నుండి మేం ఆమె గురించి కథలు కథలుగా వింటూ పెరిగిన వాళ్ల మే కదా.

అయినా నాకు మా అత్త నోటివెంట ఆమె చిన్నప్పటి సంగతులు వినటం ఎప్పుడూ ఇష్టంగానే వుంటుంది. ఆమెకు కూడా వాళ్ళ నాయన గురించి, మా నాయన గురించి మా అమ్మ గురించి చెప్పటంలో ఆమె కళ్ళనిండా, గొంతు నిండా  సంతోషం కనిపించేది.ఆమెకు ఎవరికీ లేనంత ఇష్టం మనుషులంటే బంధువులంటే ఎందుకు వుందో మాకు అర్థం అయ్యేది కాదు.

మా  నాయన మాకు నేర్పింది ఒకటే అబ్బోడా ధైర్యంగా బతకడం.  అది చాలు  అబ్బోడా. ధైర్యం ఉంటే చాలు  ఎట్లాగైనా తెగించి బ్రతికేయొచ్చు!  దేంట్లోనూ ఆడోల్లు మొగోల్లకంటే తక్కువేమీ కాదురా, ఎరికిలోల్లల్లోనే కాదు ఏ కులం లో అయినా అంతే .! ఆడోల్లు మగోల్లకన్నా తక్కువేమీ కాదు.!  

ఆ మాట అంటున్నప్పుడు ఆమె  స్థిరత్వం, ఆమె ధైర్యం ఆమె తెగింపు నాకు ఆమె మొహంలో స్పష్టంగా కనిపించేది.

అయినా ఆమె చివరిదినాల్లో ఎందర్ని కలవరించిందో, ఎందుకు కలవరించిందో మాకు సరిగ్గా తెలియదు. ఎంత బాధలో వున్నప్పటికీ ఆయమ్మ నాకు ఈ నొప్పి వుంది, ఇంత కష్టం ఉంది  అని చెప్పిందే లేదు. నోట్లోంచి ఒక్కమాట కానీ అరుపు కానీ, ఏడుపు కానీ బయటకు వచ్చిందే మాకు తెలియదు.

ఆ కాలం లో మొగ పిల్లోల్లని మాత్రమే మీ  నాయిన సదివించినాడు కదత్తా? నీ అన్నతమ్ములు అదే మా  చిన్నాయన పెద్దనాయన వాళ్ళు మాత్రం బాగా  చదువుకుని  ఉద్యోగాలు చేస్తా వుండారు. నీకు మాత్రం చదువు లేకుండా చేసినాడని  మీ నాయన పైన నీకు ఎప్పుడూ బాధ అనిపించలేదా అత్తా, కోపం రాలేదా?  ” అని అడిగినాను.

ఒక్క మాట కూడా వాళ్ళ నాన్నను పడనిచ్చేది కాదు మా అత్త . మా మామయ్య వాల్ల  గురించి కానీ, వాళ్ళ అమ్మ నాయన గురించి కానీ ఎవురేం మాట్లాడినా ఆమె గొమ్మునా  ఊరుకునేది, వాళ్ళ అత్తామామల గురించి కానీ, ఆడబిడ్డల గురించి కానీ ఏనాడూ ఎంత కోపం వచ్చినా, ఎంత బాధ కలిగినా నోరు తెరిచి ఒక్క  మాటైనా అనకపోవటం , ఇంటికి దూరం వెళ్లిపోయి, తన దారి తాను చూసుకున్న మా మామయ్యను సైతం    ఒక్క మాటైనా అనకపోవడం ఆమె వ్యక్తిత్వం అనుకుంటాను. వాళ్ళ అమ్మ నాన్నల గురించి మాత్రం ఒక్క మాట కూడా పడనిచ్చేది కాదు.

 “ మా నాయన తప్పేమీ లేదు అబ్బోడా. మా నాయన్ను గానా ఎవరైనా యేమైనా  అంటే వాళ్లకు కండ్లు పోతాయి . మా నాయన ముందే  చెప్పినాడు కానీ నేనే సరిగ్గా సదువుకోలేదు, సరిగ్గా సదువుకొని వుంటే ఏదో ఒక వుద్యోగం గ్యారంటీగా కొట్టేసి వుంటాను . నా జాతకమే మారిపోయి వుండేది. నా  పిల్లోల్లు ఇంకా బాగా సెటిల్ అయిండే  వాళ్ళు. సదువే బ్రతుకు అని మా నాయిన చెప్తానే వున్యాడు కానీ నా బుర్రకే ఎక్కలే .  ఇదీ మా అత్త మాట.

పెండ్లి అయినప్పటి నుంచి ఒక్క రోజైనా  నువ్వు మీ నాయనను తలచుకోకుండా , పొగడకుంటా వుంటావేమో అని ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తానే ఉండాను కానీ, ఒక్క పొద్దైనా నీ నోట్లోంచి మీ నాయన మాట రాకుండా ఉన్నింది లేదు కదమ్మే.ఇంతగా ప్రేమించే కూతురు వుండటం మీ నాయన చేసుకున్న పున్నెం. ఇన్నేండ్లు గడచినా నువ్వు మీ నాయన్ని, ఇప్పుడికీ  తలచుకుంటా ఉండావు కానీ, నిన్ను నన్నూ ఇట్లా మన పిలకాయలు తలచుకుoటారంటావా ? మన పిల్లోల్లు రాబోయే కాలంలో ఎట్లుంటారో ఏమో “ ..అనే వాడు మా మామయ్య.

ఒకరిని ఆశించి ఏదైనా చేయడం దరిద్రం.పిల్లలు తమని  చూస్తారని ఏ  తల్లి తండ్రీ పిల్లల్ని  కనరు, పెంచరు . ఎవురి బ్రతుకు వాళ్ళదేబ్బా.. ”. ఇదీ ఆమె జవాబు, ఆమె వ్యక్తిత్వం కూడా!.

మా నాయన  చనిపోయినప్పుడు నేను తమ్ముడు  చాల చిన్న వాళ్ళం. మా అమ్మకు యెట్లా ధైర్యం చెప్పాలో, ఆమెను యెట్లా ఓదార్చాలో  మాకు తెలియదు. అదిగో సరిగ్గా అ సమయంలో మా అత్తే గనుక తోడు లేకుంటే మా అమ్మ ఏమై  పోయి ఉండేదో మాకు తెలియదు.

ఇప్పటికీ ఒక దృశ్యం నా కళ్ళ ముందు అట్లాగే  నిల్చిపోయింది. బహుశా ఆ దృశ్యం నేను బ్రతికి వుండేంత వరకూ  నాతోనే వుండి పోతుందేమో.!

బాగా వర్షం పడుతోంది. మా అమ్మ ఏడుస్తా పడుకుని వుంది. మాది పెంకుటిల్లు. అక్కడక్కడా కారుతోంది.  నేను, మా తమ్ముడు వాన నీళ్ళు  పడేచోటికి  బక్కెట్లు మారుస్తూ వున్నాం. నీళ్ళు నిండగానే రెండు చేతులతో బక్కెట్లు ఎత్తుకుని ఇంటి ముందు పారబోస్తున్నాం. ఆ రోజు మా అమ్మ ఉదయం నుండి అస్సలు ఏమీ తినలేదు. మేం ఎంత చెప్పినా  లేయ్యలేదు, ఏమీ  వండలేదు. హోటల్ నుండి అయినా ఏమైనా తెస్తాను మా అని అడిగినాను కానీ మా అమ్మ వద్దు అనింది.

వర్షం బాగా పెరిగి పోతోంది. చలి ఒక పక్క. అసలే మా ఊరిని పూర్ మెన్స్ ఊటి అంటారు, అంత చలి వుంటుంది  ఇక్కడ. మాకు ఆకలి అవతా  వుంది. నేను, మా తమ్ముడు ఇద్దరూ మగపిల్లలమే అమ్మకు. మగపిల్లమే అయినా మాకు ఇంటిపనులన్నీ  నేర్పించింది మా అమ్మ. చెత్తలు ఊడ్చటం , అంట్లు తోమడం, కల్లాపి చల్లి ముగ్గులు వెయ్యటం,వంట చెయ్యడo, బట్టలు ఉతకడం ఆన్నీ నేర్పింది మా అమ్మ. పని చేసేదాంట్లో  ఆడ పిల్లలు, మొగ పిల్లలు అనే  తేడా వుండకూడదు. మగపిల్లోల్లు పని చేసేదానికి నామోషి పడకుండా వుంటే చాలు, ఆడోల్ల జీవితాలు బాగుపడతాయి అనేదిమా అత్తయ్య అభిప్రాయం. మా అమ్మకు కూడా అదే నమ్మకం.

నిజానికి మా అమ్మకు ఆడపిల్లలంటే చాల ఇష్టం. అందుకే ఆడపిల్లలాగే  నాకు తలదువ్వి, రోజూ జడ వేసేది. మాకు మునిదేవర చేసి తల వెంట్రుకలు  మునీశ్వరుడికి సమర్పించే ఆనవాయితి ఉంది. తెల్లమచ్చ ఒక్కటి కూడా లేని నల్ల మేకపోతు కావాలి, పూజలు చేసి, అందరికి వండి పెట్టాలంటే విందుకు చాలా  డబ్బే అవుతుంది. అది లేక మా మునిదేవర వాయిదా పడుతూ వచ్చింది.ఆ మునిదేవర అయ్యేంత వరకూ తల వెంట్రుకలు  అట్లాగే వుంటాయి. జుట్టు కత్తరించడానికి వీల్లేదు. 

నేను ఉప్మా చేశాను కానీ అమ్మ తినలేదని మేం కూడా తినకుండా అట్లాగే ఉదయం నుండి పస్తు వుండి పోయాం.

అమ్మా నువ్వట్లా వుంటే మేం ఏం కావాలి, నిన్ను చూస్తా వుంటే  మాకు ఏడుపు ఆగడం లేదు , నువ్వు ధైర్యంగా  వుంటేకదా  మేo కూడా ధైర్యంగా వుంటాం, తినమ్మా ... ”  అని అప్పటికే చాలా సార్లు అమ్మను అడుకున్నాం..కానీ ఆమె మా మాట వినలేదు . మంచం పైనుండి లేవడం లేదు.

అంతకు ముందు రోజు రాత్రి కూడా ఆమె సరిగ్గా తినలేదు. కొన్ని సందర్భాలలో  ఆమె చాలా మొండి మనిషి.ఎవ్వరు ఎంత చెప్పినా వినే రకం కాదు.

యెట్లా చెయ్యాలి, ఆమె చేత ఇంత అన్నం తినిపించడం యెట్లా రా నాయనా అని మేం బాధ పడే టైంలో సరిగ్గా మా అత్త, భోరోమని కురుస్తున్న వర్షాన్ని అస్సలేమాత్రం లెక్క చెయ్యకుండా , చీరకొంగు తలపై కప్పుకుని, ఒడి లో రెండు స్టీల్ గిన్నెలు దాచి  పెట్టుకుని చీరకొంగు దాని చుట్టూ కప్పుకుని వర్షంలో తడుస్తా వేగంగా ఇంట్లోపలికి వచ్చింది. అప్పుడు వచ్చిన ఆ వాననీళ్ళ వాసన జీవితాంతం  చాల సందర్భాలలో నన్ను వెన్నాడుతూనే వుంది.అదొక వర్షం వాసనే కాదు, వర్షంలో తడచిన  మనిషి వాసన. పసి బిడ్డలాంటి, కన్నతల్లి లాంటి నిఖార్సైన మనిషి వాసన.!

“  వొదినా లెయ్యమ్మా, వేడి వేడిగా సంగటి, గురుగాకు తెచ్చినాను. అంగడి తలుపు కూడా ముయ్యలేదు. గభాలున తినేయ్యాల్లి. మా తల్లి కదా లేయ్యమ్మా. పిల్లోల్ల మొహాలు సూడు ఎట్లుoడాయో. నువ్వు అన్నమూ నీళ్ళు మానేసినంత మాత్రాన   , పోయిన మా అన్నేమైనా తిరిగొస్తాడా సెప్పు ?  ”

పసిబిడ్డను లేపినట్లు మా అమ్మను లేపి కూర్చోబెట్టింది. బలవంతాన మా అమ్మ చేత నాలుగు ముద్దలు తినిపించింది.

మా అమ్మ ఏమి చెప్పిందో ఏమో కానీ, మా అత్త ఆ రోజు నుండి మూడు నెలలు మా అమ్మకు తోడుగా పడుకునే దానికి, రాత్రి అన్నం తినేసి , మా అమ్మకు సంగటో, ఊరి బిండో, చింతాకు చారో, ఏదో ఒకటి అంత గిన్నెలో తీసుకుని మా ఇంటికి  వచ్చేసేది. అమ్మ  తినేసాక   ఇద్దరూ వక్కా ఆకు నమలుకుంటా, పాత  సంగతులెన్నో మాట్లాడుకుoటా రాత్రి పొద్దుపోయేదాకా మాట్లాడుకుంటా వుండి పోయే వాళ్ళు. వాళ్ళ బాల్యం వాళ్ళ కష్టాలు వాళ్ల దుఃఖాలు, వాళ్ల ఒంటరితనాలు ఆ కబుర్లు నిండా వినిపించేవి. ఒకరు ఏడిస్తే ఇంకొకరు ఓదార్చే వాళ్ళు. వాళ్ల తల్లిదండ్రుల్ని గుర్తుతెచ్చుకుని కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకునేవాళ్ళు. 

హరికథలకి , భజనలకి, గుడులకి, సావిత్రి సినిమాలకి వాళ్ళు  ఇద్దరే  వెళ్లి వచ్చే వాళ్ళు. మా నాయన పోయిన దుఖం లోంచి మా అమ్మ బయట పడిందంటే దానికి  ఒకే కారణం మా కాంతమ్మ అత్తే ! 

తనకంటూ ఎప్పుడూ ఏమీ ప్రత్యేకంగా వండుకొని తినే అలవాటు లేని ఆయమ్మ, ఎప్పుడూ సంగటి ముద్దాచెట్నీలు ఊరిబిండి, గొజ్జు, చింతపండు రసంతోనే కాలం గడిపేసిన మా‌ కాంతమ్మ అత్త చివరి రోజుల్లో మాత్రం మనసు మార్చుకుంది. ఆ పది పదిహేను రోజులు ఆమె రాజీపడనే లేదు. తను  జీవితాంతం ఏం తినాలని ఇష్టపడి, ఏం తినకుండా నిరాసక్తంగా ఉండిపోయిందో అవన్నీ  కూతురి దగ్గర అడిగి మరి చేయించుకుని తినింది.

ఒక శుక్రవారం రోజు తలంటు పోసుకుని, ఆమెకు నచ్చిన పసుపు రంగు చీర కట్టుకుంది. కూతురిని చింతాకు వంకాయ పుల్లగూర ఉడుకుడుకు సంగటి చేసి పెట్టమని  అడిగింది . పుష్పమ్మకు వాళ్ళ అమ్మ అంటే ప్రాణం కదా, ఊరంతా తిరిగి ఎక్కడా చింతాకు మార్కెట్లో దొరక్క పోతే, యూనివర్సిటీ దగ్గరకు పోయి, చింతచెట్టు కొమ్మల్ని  దోటితో కిందకు వంచి లేత చింతాకు కోసుకుని వచ్చి లేత వంకాయలు తెచ్చి  వాల్లమ్మ కోరినట్లే చింతాకు, వంకాయ పుల్లగూర , ఉడుకుడుకు సంగటి చేసి పెట్టింది. ఇష్టంగా తినేసి దూరంగా పడేసిన వక్కా ఆకు తిత్తి వెతికి మరీ నడుముకి దోపుకుంది. డాక్టర్లు వద్దంటే ఒక్క మాటతో మానేసిన వక్కా ఆకు ఆరోజు మాత్రం  తెప్పించి వేసుకుంది. చాలా కాలం తర్వాత ఆమె నోరు మళ్లీ ఎర్రగా పండింది. అంత నీరసంలోనూ ఆమెకి ఎక్కడినుంచి అంత ఓపిక వచ్చిందో తెలియదు.

అప్పుడు మా అత్త మా అమ్మనే గుర్తు చేసుకుని కళ్ళ నిండా నీళ్ళు  పెట్టుకుoదని పుష్పమ్మ ఏడుస్తూ ఆ తర్వాత మా అత్త చావు  రోజు ఏడుపుల మధ్య దీర్ఘాలు తీస్తాచెపుతా వుంటే నాకు , మా తమ్ముడికి  కన్నీళ్ళు ఆగనే లేదు.  

మా వదిన జయమ్మ ఈ లోకంలో, ఈ కులంలో ఈ కాలంలో ఉండాల్సిన మనిషే  కాదుమేయ్. అందుకే ఆ దేవుడు ఆయమ్మని తొందరగా పైకి తీసుకుని పోయినాడు. ఆ పిల్లోల్లు ఉత్త అమాయకులు. మంచి తప్ప చెడు తెలియయనోళ్ళు . ఈ మాయదారి  లోకంలో యెట్లా బ్రతకతారో ఏమో. కొంచెం వాళ్ళని  చూస్తా ఉండండి , అట్లాంటి అమాయకపు మనుషుల్ని కాపాడితేనే , దేవుడు మిమ్మల్ని సల్లగా చూస్తాడు. ఈ లోకంలో అమ్మా ,నాయన లేనోళ్ళకి చుట్టూరా  ఎంత మంది జనం వున్యా అనాధల కిందే లెక్క. ఆ బాధ  అనుభవించినోల్లకే  తెలుస్తుంది. ఆ బిడ్డలు జాగ్రత్తమేయ్. పైన నా కోసం మా జయమ్మ వక్కాఆకు తిత్తి చేతిలో పెట్టుకుని ఎదురు చూస్తా వుంటుంది. నేను పోయేటప్పుడు గుంతలో వక్కా ఆకుతో బాటూ  ఈ కూడే వేసి, మన్ను వేసేయ్యండిమేయ్. నేను కూడా  పోతాపోతా జయమ్మకి తీసుకుపోవల్ల కదా, ఏంతినిందో  ఎప్పుడు తింనింటుందో? మా వదిన సగం ఆకలి తోనే ఉంటుంది ఎప్పుడూ. వస్తా వస్తా నేను తప్పకుండా ఏదో ఒకటి తనకోసం తెస్తానని నమ్మకంతో ఎదురు చూస్తా వుంటుంది మే...    ”  

అంత స్నేహం, ఇష్టం మా అమ్మంటే .అంతటి అపేక్ష మా అమ్మంటే.ఆమె మాట ప్రకారమే, ఎవరు ఏమనుకున్నా, ఆకూవక్కా, దుగ్గూ సున్నం తో బాటూ, లేత  అరటి ఆకులో ఉడుకుడుకు సంగటి, కూరాకు గుంతలో ఆమెని పూడ్చేటప్పుడు ఆయమ్మ చెప్పినట్లే గుంతలో బద్రంగా  పెట్టేసినారు కాంతమ్మ బిడ్డలు. వాళ్ళ అమ్మ చెప్పిన మాట నిలబెట్టినారు. అంత ప్రేమ వాళ్లకు ఆయమ్మ అంటే.

బిడ్డలకు  ఆమె పెద్దగా ఆస్తుల్ని ఇచ్చింది లేదు. కానీ, లోకంలో చాలా మంది బిడ్డలకు ఇవ్వలేని ఆస్తిని మాత్రం ఆమె  ఇచ్చి వెళ్ళింది . అదేమిటి అంటారా ? ధైర్యంగా బతికే లక్షణం. మనుషుల్ని ప్రేమించే గుణం.! అంతకు మించి బిడ్డలకు తల్లి తండ్రులు ఇచ్చే ఆస్తి లోకం లో ఇంకేం ఉంటుంది ?

ఆయమ్మ సంపాదిoచుకున్నట్లే ఆయమ్మ బిడ్డలు కూడా చుట్టూ పది మందిని సంపాదించుకున్నారు.ఎరికిలోళ్ళు అనే పేరే లేకుండాఅన్ని కులాలోల్లు వాల్లని సొంత మనుషుల్లా చూసుకుంటారంటే , బంధుత్వాల్ని కలుపుకుని, కులాంతరo చేసుకున్నారంటే , కులాన్ని మించిన మంచిగుణం, మంచితనం, మనిషితనం  వాళ్ళల్లో కనిపించబట్టే అని అందరూ అంటుంటారు.      

ఒక పండగ వచ్చినా, ఒక దేవర వచ్చినా, ఒక గొడవ వచ్చినా, ఏదైనా పంచాయతి  జరిగినా, మా ఇంట్లోనే కాదు, మొత్తం  ఎస్టీకాలనీలోనే  ఇప్పటికీ దేనికో ఒకదానికి ఆయమ్మ పేరు చెప్పుకోకుండా ఉండలేరు.

మా కాంతమ్మత్త చనిపోయినా, మా మాటల్లో, మనస్సులో, జ్ఞాపకాల్లో ఆమె సజీవంగానే వుందిప్పటికీ . మనుషుల మాటల్లో, మనస్సుల్లో, జ్ఞాపకాల్లో   బ్రతికి ఉండటమే కదా అమరత్వం అంటే? !

కథలు

మా కతార్ బాబాయ్

"ఎట్లుందిరా రూమ్, ఫుడ్ గిట్ల? అంతా ఓకేనా?"

చాలా రోజుల తర్వాత అదే మొదటిసారి బాబాయిని నేరుగా కలవడం. అది కూడా వేరే దేశంలో. కొంచెం ఎక్సయిటింగా అనిపించింది.

"హా! ఓకే బాబాయ్. అంతా సెట్. ఒక రూమ్‌లో నలుగురు ఉండాలి. ఫుడ్ కూడా బాగుంది. నేపాల్ వాళ్లకి, మన ఇండియా వాళ్లకి, ఇంకా వేరేవాళ్లకి అందరికీ సపరేట్ ఫుడ్ కౌంటర్లు ఉన్నాయి మెస్‌లో. కూరలు కూడా మంచిగనే ఉన్నాయి. కాకపోతే కొంచెం సప్పగా ఉన్నయంతే!" 

బాబాయ్ కొద్దిగా లావయ్యాడు. కొంచెం రంగు‌ తేలాడు. బొర్ర దిగింది. బహుశా ఆ కార్లో కూచొని రోజంతా డ్రైవింగ్ చేయడం వల్లనేమో!

"మీ కంపెనీ మంచి కంపెనీరా. సెమీ గవర్నమెంట్ కంపెనీ ఈడ! నాకు తెల్సురా మంచిగనే ఉంటాయి మీకు ఫెసిలిటీస్ అన్నీ. అది సరే గానీ, నేను తెమ్మన్నయి అన్నీ తెచ్చినవా మరి?"

నేను వచ్చేటప్పుడు అందర్లాగనే ఇంట్లో పెట్టిన ఊరగాయ, పిండివంటలు తెమ్మని చెప్పిన బాబాయ్, ఇంకోటి కూడా తెమ్మన్నడు. కొత్తగా కొన్న బండ్లకి కట్టే దిష్టి పూసల దండ. మొదటిసారి వస్తున్నా, తెలియని దేశం. దిష్టి గిష్టి అంటే తెలియని ఇక్కడి కస్టమ్ ఆఫీసర్ దాన్ని చూసి ఏంటని అడిగితే ఏం చెప్పాలె? అది ఇంకేదో అనుకుని నాపై కేసు రాస్తే? అవసరమా? అందుకే నేను తేనని చెప్పా.

"అట్ల కాదులే! ఎవరేమనరు. మర్చిపోకుండా తీసుకరా" అని ఫోన్లో నమ్మకంగ చెప్పాడు. ఇప్పుడు నేనది తెచ్చానో, లేదో అని సందేహం బాబాయ్‌కి. సముద్రాలు దాటి ఇంత దూరం వచ్చినా తనకి ఆ నమ్మకాలు, చాదస్తం పోలే! నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో డ్రైవర్‌గా కతార్‌కి వచ్చి, ఇపుడు తనే సొంతంగా ఒక కార్ కొనుక్కొని ఉబర్‌లో నడుపుకుంటున్నాడు. మేము కూర్చుంది దాంట్లోనే. ఒక మాల్ పార్కింగ్ లాట్‌లో కార్ పార్క్ చేసుకొని మాట్లాడుతున్నం.

"హా! తెచ్చిన బాబాయ్. ఇంకా విప్పలే సామాన్. నావి కూడా కొన్ని ఉన్నయి దాంట్లో. రేపు అన్ని రూమ్‌లో సెట్ జేసుకున్నంక ఇస్తా నీ సామాన్ నీకు" అన్నా.

పొద్దున పది గంటలు కూడా కాలేదు. బయట ఎండ మాత్రం గట్టిగానే కాస్తుంది. కార్లో ఏసీ ఆన్ చేసుకొని కూచున్నం. రోడ్డు మీద కార్లు, పికప్ ట్రక్‌లు, బస్‌లు, ఇంకా పెద్ద పెద్ద ట్రక్‌లు తిరుగుతున్నయ్. అక్కడక్కడా ఒక్కొక్క బైక్ కనిపిస్తుంది. అవి ఫుడ్ డెలివరీ బైక్‌లు. ఇక్కడ జనాలు బైకులు ఎక్కువగా నడపరని విన్న! ఇదిగో ఇప్పుడు చూస్తున్నా నిజంగనే.

"సరే! ఇంకా మరి? ఇంట్ల అంతా మంచిదేనా? ఇంతగనం సదుకున్నావ్. రాకురా వారి ఇటు, ఆన్నే ఏదయినా జేసుకోరా అంటే ఇనక పోతివి. అచ్చినవ్ అట్లిట్ల జేసి. సరే కానీ!ఇంకా మరి?"

బాబాయ్ అలా మాటిమాటికి ఇంకా ఇంకా అనడం నచ్చలేదు. 'ఏంటి బాబాయ్ ఎటైనా పోవాల్నా' అని అడుగుదామనుకున్న. బాగోదేమో అని అడగలే ఇగ.

"హా! ఏం జేద్దం బాబాయ్? ఈ కరోన జెయ్యంగా అందరికీ బాగా కష్టమైతుంది ఇంటికాడ. నేనూ అందరి లెక్కనే కూసున్న ఏం పన్లేక కొన్ని రోజులు. ఇగ ఎన్ని రోజులు కూసుంటమిట్ల? ఏదైతే అదైతదని అచ్చిన ఇటు"

ఇంజినీరింగ్ అయిపోయి నాలుగు సంవత్సరాలవుతున్నా ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించలేకపోయా. ఇప్పటిదాకా చేసినవన్నీ కాంట్రాక్టు బేసిస్‌లోవే. ఇప్పుడంటే ఈ కరోనా ఉంది గానీ ముందు మూడు సంవత్సరాలు ఏం చేశా? ఇప్పుడేమో ఇలా కరోనా పేరు చెప్పుకొని నా అసమర్థతని కప్పి పుచ్చుకుంటున్నా. నన్ను చూస్తే నాకే ఏదోలా అనిపించింది.

"సరేరా కలుద్దాం. మల్ల వెళ్తా ఇగ! నిన్ను ఎక్కడ దించాలె?" అంటూ ఓ 50 రియల్ నా జేబులో పెట్టాడు. ఇండియాల వెయ్యితోటి సమానం అవి.

వద్దు బాబాయ్ అందమనుకున్న. 'వెళ్లిన కొత్తలో మనకు తెలిసిన వాళ్లెవరైనా డబ్బులు ఇస్తే వద్దనకుండా తీస్కో.‌ దేనికైనా ఉపయోగపడతాయి" అని ఇంటిదగ్గర మా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వద్దనలేదు. తీసుకున్నా.

" ఓకే బాబాయ్! నన్ను ఆ ఏషియన్ సిటీ గేట్ దగ్గర దింపేయ్"

నాకంటే అప్పుడప్పుడు ఇలా కలవడానికి బాబాయ్ ఉన్నడు. మరి బాబాయ్ వచ్చిన కొత్తల్లో ఎవరైనా వచ్చి కలిసారో లేదో బాబాయిని? ఒక్కడే ఒంటరిగా ఫీల్ అయ్యాడేమో? ఏషియన్ సిటీ గేట్ వచ్చింది. కారు దిగా.

"ఓకే బాబాయ్! ఉంటా మరి కలుద్దాం"

నా ఆలోచనల్లాగే కారు నన్ను దాటుకుని వేగంగా వెళ్తుంది. ఇంటి దగ్గరున్న ఇన్ని రోజుల్లో బాబాయ్‌కి కనీసం ఒక్క సారైనా ఫోన్ చేసింది లేదు. ఎట్లున్నవని అడిగింది లేదు. ఇదిగో ఇప్పుడిలా వస్తున్నా అని ఒక నెల ముందు నుండే స్టార్ట్ చేసిన ఫోన్లు చేయడం. అంతేలే! మనుషులకి ఎవరితోనైనా అవసరమొస్తే తప్ప వాళ్ళు గుర్తురారేమో? నేను కూడా అంతే కదా అనుకున్న. ఇంతలో నా ఫోన్ రింగైంది. అవతల బాబాయే మళ్లీ!

"చేరుకున్నావరా రూమ్‌కి? జాగ్రత్తగా ఉండు. నీకు ఏం అవసరమున్న అడుగు. బాబాయ్ ఏమనుకుంటడో అనుకోకు. సరేనా?"

నేనే గనక బాబాయ్ స్థానంలో ఉంటే నా ఆలోచనలు వేరేలా ఉండేవి. నాలోని ఆవేశాన్నంత సూటిపోటి మాటలతో చల్లార్చుకునేవాణ్ణి. కానీ బాబాయ్ అలా ఆలోచించినట్లు నాకైతే అనిపించలేదు. పెద్దరికం అని దీన్నే అంటారేమో! మా రూమ్ వచ్చింది.

 

కథలు

సమాధి తోట

ప్రతి ఆదివారంలాగే నిన్న కూడా ఇంట్లో చికెన్. ఎప్పుడులా కాకుండా సారి కూర బాగుందనిపించింది. కొంచెం పుల్లగా, కొంచెం ఘాటుగా. మధ్య తినేటప్పుడు నాకు అలవాటైన వంటని తిట్టే గొణుగుడు ప్రోగ్రాం కాకుండా, అమ్మకి ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చినా. ఎప్పుడూలేంది మారు అన్నం కూడా పెట్టుకున్నా. అంత నచ్చింది మరి. తిన్న పది నిముషాలకే టీవీ కట్టేసి, ముఖానికి ఆవులింతలు తగిలించుకుంది అమ్మ. లైటు ఆర్పేసి ఇవతలగదిలోకి పాకాను నేను. గచ్చుమీద బొంత, కాళ్ళ దగ్గర ఒక స్పాంజీ దిండు, తలదగ్గర ఇంకో మెత్త. కప్పుకోడానికి రెక్క దుప్పటి. దోమలు ఎక్కువ ఉన్నాయని కిటికీలు వేశా. లైటు తీసేసి ఫోన్ డిస్ప్లే వెలుతురులో పక్క సర్ది పడుకున్నా. నిద్రపోయ్యేముందు వాట్సప్ ఓపెన్ చేశా. చదవకుండా వదిలేసిన గ్రూప్ మెస్సేజులు మాత్రమే కనిపించాయక్కడ. ఒంటరోడినని గుర్తు చేసింది ఫోన్ మళ్లీ.

ఎంత తన్నుకులాడినా నిద్రరావట్లే. కొద్దిసేపయిన తరువాత పొట్టమీద మీద ఎవరో కూర్చున్నట్టు, లోపలికి గుండె అంతా బిగుసుకుపోతున్నట్టు అనిపించింది. గాలి సరిగా ఆడనట్టు, గొంతు ఎండిపోతున్నట్టు, ఇలా. గాలి పీల్చుకోడానికని నోరు తెరిచాను. రెండు నిముషాలు పర్వాలేదనిపించినా మళ్ళీ అదే ఇబ్బంది. గొంతు పట్టేసినట్టు, పీక ఎవరో నులుముతున్నట్టు అనిపించింది. భయం దాచుకుంటూ లేచి కూర్చున్నా. వీపు ఆనుకున్న గోడ కంపిస్తున్నట్టుగా గుండె దడ లోపల. చల్లగవుతున్న పాదాలను చేతులతో అదుముకుని, గోడవార  పడుతున్న సన్నని వెలుతురు దగ్గరికి వెళ్ళా. గదిలో గాలి తక్కువ ఉందేమోనని కిటికీలు తెరిచా. తెరలు తెరలుగా గాలొచ్చి మొహానికి తగిలింది. సారి ఇంకా గట్టిగా నోరు తెరిచా. గాలి నోట్లోకి పొయ్యి, వెంటనే బయటికి వస్తున్నట్టనిపించింది. కిటికీ దగ్గర నుంచున్నా, అంత గాలి బయటనుండి వస్తున్నా, వళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అటు ఇటు వేగంగా నడిచా గదిలో, చీకట్లోనే. ఊపిరాడటం లేదని స్పష్టంగా అర్థమయింది నాకు. కాళ్ళు వణకడం మొదలైంది. నడకలో తత్తర. గొంతు ఎండిపొయ్యి మాట పెగలట్లేదు సరిగా. భయం భయంగా లైటు వేసి అమ్మని లేపా. నా గోలకి గోపిగాడు కూడా లేచాడు. గాలాడటం లేదని సైగ చేశా. మెల్లగా నడిచి గాలి పీల్చుకో సర్దుకుంటుందని చెప్పారిద్దరు. ఎంత నడిచినా లాభం లేదు. నడిచే తొందరలో చావుమీద జడుపు పట్టుకుంది. చేతులు, కాళ్ళు సల్లబడుతున్నాయి. మంచం మీద పడుకోబెట్టారు. గోపి చేతులు రుద్దుతుంటే, అమ్మ కాళ్ళు రుద్దుతుంది. మెల్ల మెల్లగా కాళ్ళనుండి ఒకొక్క శరీరభాగం సల్లబడుతున్నాయి. నేను ఇలా అవుతుందని చెప్పేసరికి గోపిగాడికి కూడా భయం వేసినట్టయ్యింది. మనిషి దిట్టంగా ఉన్నా భయాన్ని మాత్రం లోపల దాచుకోలేడు వాడు. నా మొహంలో చావుని చూసినట్టున్నాడు. అమ్మని లోపలకెళ్లి మంచినీళ్లు తెమ్మన్నాడు. చల్లదనం గుండె దగ్గరికి చేరుకుంది. ఇలా కుదిరేట్టు లేదని మంట వేద్దామని అమ్మతో చెప్పాడు. అమ్మ కన్నీళ్లు దాచుకుంటున్నట్టుంది. నా కళ్ళు మూతలు పడుతున్నాయి. ఏదో కథల పుస్తకం పేజీలు చింపి మంట వేశారు ముందు గదిలో. మంచం మీద నుండి నన్ను లేపి మంట ముందు కూర్చోబెట్టారు. కూర్చొని కూర్చొని నీరసం ఎక్కువయ్యి కళ్ళు పూర్తిగా మూసుకుపోతున్నాయి. అదిగో అప్పుడే గోపి గాడు 'చొక్కా తీసేద్దాం, వేడి డైరెక్టుగా లోపలికి పోతుంది' అని, నా చొక్కా గుండీలు విప్పాడు. తరువాత అమ్మ ఏడుపు గట్టిగా వినొచ్చి, నా కళ్ళు మూతలు పడ్డాయి. మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తరవాతే నాకు మెలుకువ వచ్చింది. గుండె దడగా ఉంటునట్టు, గాలి సరిగా ఆడటం లేదని చెప్పా డాక్టర్ కి. ఇంకా ఏదో చెప్తుంటే నా మాటలేమి పట్టనట్టు గుండె మీద స్టెతస్కోప్ పెట్టి గట్టిగా అదిమాడు. కళ్ళు నొసలు చిట్లించి శ్రద్ధగా విన్నాడు గుండె చప్పుడిని. కంగారు పడాల్సింది ఏమి లేదని మందుల చిట్టి రాసాడు. అందులో స్ట్రెస్ కి కూడా మాత్రలు రాశానని, అవి వేసుకున్నప్పుడు మొదట్లో తిక్క తిక్కగా ఉండొచ్చని జాగ్రత్త చెప్పాడు.

ఏదీ సరిగా గుర్తుపెట్టుకోలేని నేను మందులు మాత్రం టైంకి తింటున్నా. మందులు వేసుకోవడం మొదలెట్టిన దగ్గరనుండి నాలో రెండు మార్పులొచ్చాయి. ఒకటి- ఎంత లేటుగా పడుకున్నా గంట కొట్టినట్టు తెల్లారుజామున నాలుగ్గంటలకే మెలుకువ రావడం. మరొకటి- గతంలో జరిగిన ఈవెంట్స్ ని తలచుకొని, వర్తమానాన్ని, భవిష్యత్తుని నిర్మించుకోవాలనుకోవడం. ఒకటి ఫిజికల్ మార్పు, రెండోది మెంటల్.

రోజు రాత్రి అలా జరిగిన దగ్గరనుండి అమ్మ నా మంచం పక్కనే పడుకుంటుంది. నిద్రపోయినా రాత్రుళ్ళు లైట్ ఆర్పడం మానేశారు ఇంట్లో. మా అన్న నా ఫోన్ కి కాల్ చేస్తున్నాడు కొత్తగా. అమ్మకి ఎవరూ లేవకముందే నిద్రలేచి పని చేయడం అలవాటు. కానీ మధ్య నాకు, అమ్మకి కూడా మెలుకువ రాని పొద్దప్పుడే నిద్ర తేలిపోతుంది. మొదటిరోజు అమ్మని లేపి చెప్దామనుకున్నా. కానీ ఇప్పటికే భయపెట్టింది చాలులే అని ఊరుకున్నా. ఇక మంచంలో అటు, ఇటు మెసలడమే తెల్లారేదాక. పెచ్చులూడుతున్న ఇంటి కప్పుని చూస్తూ ఒక రోజు, కిటికీ పక్కున్న నిమ్మచెట్టు మీద నాకు తెలీని పిట్ట అరుపు