కవితలు

కవితలు

కొడుకా...

కొడుకా...

ఎట్లున్నవో.

మీ అమ్మ

కంటికి పుట్టెడు దారలు కారుతున్నాయి

నీ జాడ కోసం.

 

కొడుకా.. ఓ కొడుకా

కండ్లల్ల నీరూపే మెదులుతుంది

కాళ్ళల్ల చేతుల్లో తిరిగినట్లున్నది

చాత కానీ ముసలి దాన్ని

కండ్లు లేవు

కాళ్ళు లేవు

నువ్వు యాడ ఉన్నవో చూద్దామన్నా.

 

ఏ యమ కింకర్ల చెరలో చేరితో

ఏ చిత్ర హింసల కొలిమిలో

కాగుతున్న వాడివో కొడుకా.!

 

కొడుకా

అవ్వకు చిన్నొడివి

బుద్దులు నేర్చినొడివు

అందరిలో కలుపుగోలుపుతనము ఉన్నోడి

నీ మీదనే పంచ ప్రాణాలు పెట్టుకున్న అమ్మకు

కన్నీళ్ళ బాటను తెస్తివా కొడుకా

 

ఏ గ్రహణం వెంటాడింది నిన్ను

అమ్మకు కొడుకు యెడ బాటు

చెరసాలనే నీన్ను బందీని చేసేనా

కొడుకా...!!

 

కొడుకా

నీ ప్రేమగల్ల మాటను

నీ రూపును

నేను కన్ను మూసే లోపు చూస్తానా..!?

అవ్వ అన్న పిలుపు

అమ్మమ్మ అనే నీ ఆప్యాయతను

నా గుండెలకు హత్తుకొని

నా కండ్ల నిండా నీ రూపాన్ని

మీ అమ్మతోడు చూసుకొని

మా అమ్మ చెంతకు పోతాను కొడుకా..

 

కొడుకా

రాళ్ళ మీద పూలు పూసే రోజులు రావాలి

మీరు చల్లగ బతుకుండ్రి కొడుకా..

 

(అమ్మమ్మ గంగవ్వ బాధను చూడలేక, అక్రమంగా అరెస్టు చేసి చర్లపల్లి సెంట్రల్ జైళ్లలో ఉన్నప్పుడు అమ్మ ములాఖాతుకు వచ్చిన సందర్భంతో (feb 8,2019)పాటు,చివరగా (Feb 17,2022) అమ్మమ్మను చూసి అప్పటి జ్ఞాపకాన్ని ఇప్పటి తల పోతాను కలుపుకొని అమ్మమ్మ మాటనే ఇలా రాసుకున్నది......)

 

 

కవితలు

ధీర..

తనకు ధైర్యం ఉంది..

అందుకే వందలమంది మందగా

హక్కులకు అడ్డుగా వచ్చిన

గొంతెత్తి అరిచింది..

 

ఆధిపత్యం పై

ధీక్కారం ప్రదర్శించింది..

 

అణిచివేత పై

ఆయుధం అయింది..

 

కాషాయోన్మాదాన్ని

కసితీరా దిగ్గొట్టింది..

 

అలుముకున్న చీకటి కి

చివాట్లు పెట్టింది..

 

ఆమె పట్ల సానుభూతి

ప్రకటించడం మన పని కాదు..

 

ఆ ధీర నిరసన లో భాగం కావడం

మన బాధ్యత....

 

"అల్లాహ్ హు అక్బర్" దైవం కోసం

పిలుపుకాదిప్పుడు..

ఫాసిస్ట్ రాజ్యంపై పోరాటం..

 

 

        09/02/2022

(For the Solidarity Of Hijab and Muslim Girls)

 

 

 

 

 

           

           

కవితలు

మరిచిపోకు....

సైనికుడా....

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

కాసిన్ని తెల్ల గులాబీలుంటే తెంపుకురా

యుద్ధంలో మరణించిన మనవారి సమాధులపై ఉంచి

ఓ.. కన్నీటి నివాళినర్పిద్దాం

 

సైనికుడా....

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

నెత్తురంటని మట్టుంటే మూటగట్టుకురా

పోరుకు బలైన ఆత్మీయుల గురుతుగా

ఇంటిముందర ఓ మల్లె మొక్క నాటుదాం

 

సైనికుడా....

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

చెమ్మగిళ్ళని కళ్లేవైనా ఉంటే ఓ ఫోటో తీసుకురా

తనివితీరా నా యదలకద్దుకుని

నీ పడక గదిలో వేలాడదీస్తా

 

సైనికుడా...

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

గాయపడని తెల్లపావురమేదైన ఉంటే పట్టుకురా

యుద్ధంలో అలసిపోయావు కదా!

దానితో ఆడుకుని కాసింత సేదధీరుదువు

 

సైనికుడా...

యుద్ధం ముగిసాక నువ్వొచ్చేదారిలో

శవాల మధ్యన ఆనంద గీతమాలపించే

ఆత్మీయ గొంతెదైనా ఉంటే రికార్డ్ చేసుకురా

నిదురపోయే వేళ నీకు జోలపాటగా వినిపిస్తా....

 

(రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని నిరసిస్తూ....)

 

 

 

 

 

కవితలు

ఏమని రాయను - మీరెవరంటే...

నా అక్షరాలకు ఆనవాళ్లు

మీరని రాయనా....

నా ఆలోచనలకు ఆదర్శాలు

మీరని రాయనా....

 

తిరగబడేతనమంటేనే తెలియని నాకు

ధిక్కారస్వరాన్నిచ్చి

పోరాటపటిమను నేర్పింది

మీరని రాయనా... !!

రేపటి తరానికి  - ప్రశ్నించేతత్వానికి

వారధులు మీరని రాయనా...

 

ఏమని రాయను

మీరెవరంటే.....!

ఎంతని రాయను

మీరెవరని అడిగితే....!!

 

రెక్కలిరిగిన పక్షులను

గగన విహంగాలను చేసిన

అరుదైన వైద్యులు మీరని రాయనా....

 

రెక్కలిరిచిన రాబందుల మీద

సమర శంఖాలు పూరించేలా

విప్లవాభ్యాసం చేసింది

మీరని రాయనా....!!!

 

ఏమని రాయను

మీరెవరంటే

ఎంతని రాయను

మీరెవరని అడిగితే.....!!!

 

స్వేచ్ఛ నిషిద్ధమైన నేలమీద

నిర్భయంగా పోరాట పిడికెళ్ళెత్తింది

మీరని రాయనా ...!!

 

నవ్వులే నిషిద్ధమైన నేరమీద

నిర్భందాన్నే నవ్వుల్తో తెంచేసింది.

మీరని రాయన.....

 

ఏమని రాయను

మీరెవరంటే

ఎంతని రాయను

మీరెవరని అడిగితే....

 

విప్లవ గురువులైన

వరవరరావు  అభిమాని 

కాశీం సార్ శిష్యుడు  

 

 

కవితలు

యుద్ధం

ప్రపంచ దేశాల

అధికార దాహానికి

రోజుకో దేశం

తన సుందర భసవిష్యత్తును

శిథిలాల్లో దాచుకుని

ప్రపంచ ఆధిపత్యాన్ని

శవాల గుట్టల్లో వెతుకుతూ

ప్రజల నెత్తుటితో

మరణ వాంగ్మూలం

రాస్తున్నది యుద్ధం

కవితలు

ఈ సమాజానికి

ఈ సమాజానికి నువ్వా - నేనా కాదు

నువ్వు నేను కావాలి.

బలం - బలహీనత కాదు

భాద్యత కావాలి.

సొంతం - పంతం కాదు

చెడు పై అంతం కావాలి

My dear comrade

You are a dynamite

Make your path wide and bright

Decide and activate

The power within you

For a better visionary side

And make the country pride.

           

కవితలు

కావాలి  

మతోన్మాదమెంత

మొరిగినా

రవ్వంత బెదరని

చూపులు

కావాలీ లోకానికి

 

నిషేధాజ్ఞలెంత

నీల్గినా

నిన్నుగా నిలబెట్టే

నినాదమే

కావాలీ జగానికి

 

విద్వేషమెంత

రెచ్చినా

భిన్న సంస్కృతుల

ప్రేమించే రాజ్యాంగమే

కావాలీ దేశానికి

 

09.02.2022

 

 

 

 

 

 

 

 

 

 

కవితలు

పల్లె బాలుడి దినచర్య

ఆడుకునే నన్ను పిలిచి

అవ్వ

సద్దిగిన్నింత చేతికిచ్చి పొద్దేక్కుతాంది

అయ్య

ఆకలికి

అలమటిత్తడని

పొలానికి సాగనంపింది

తొవ్వపొంటి

ఆటపాటలతో

పొలం చేరేసరికి

దాహమేసిన జింకపిల్ల

ఏరు కోసం ఎతుకుతున్నట్లు అయ్యా నా వంక చూసి

 కోడెలను దూపకిడిసి

ఆరంఎక్కి  సద్దనారగించి గొడ్లకు ఏలాయే

బిడ్డ

జాగ్రత్త అంటూ

ఇంటికి పయనమవ్వగా

అలసిన నేను

మంచెక్క గానే

అడవి నుంచి వచ్చే

పక్షుల రాగాల

సూర్యోదయ కిరణాల

సెలయేటి సరిగమలు

నన్ను జోల పాడి

 నిద్రపుచ్చాయి

చేను కంచలో శబ్దం

లేచి చూస్తే నిశ్శబ్దం

ఒడ్డు దాటి గొడ్డు చేనులో...

నిద్రలో కల నిజం

మంచదిగి

 గొడ్డును చేను దాటించే సరికి అడవి నుండి గొడ్లడెక్కల శబ్దం సూర్యుడు నిద్ర కోసం

 కొండ చాటు పయనం

బంధించిన ఖైదీకి

బేయిలు వచ్చినట్లు

పాటలతో

 నేను ఇంటికి పయనం

 

కవితలు

ఒకటి  "నేను".....రెండు " నీవు లేని నేను"...

వాడేదో..వాడికేదో ....
లోపల...బయట
ముందు...వెనుక
లోపమో?... శాపమో?
భారమో?..నేరమో?

ఆ రెండు పదాలకే అల్లుకొని
పూత లేయని శబ్దాలకు
చిగురించని తరంగాలకు
చెవులు నోళ్లు తెరుచుకోవడం
అవసరమో?...అగత్యమో?...

పుస్తకంలా...మస్తకంలో
పుట్టుమచ్చలా....మనసుముద్రలో
ఆ పదాల గుర్తులే
కళ్లకు గుచ్చుకునే బాధలు.

వాడేదో......వాడికేమిటో
నేల గిట్టడం లేదు..
నింగి నచ్చడం లేదు..
వానతో మాట్లాడడు
తేమతో కలిసుండడు.

ఆ రెండు పదాలే
ప్రకృతిని శత్రువుగా
తనను మోసగించుకోవడమే
రుచి ముందు
ఆకలి మారిపోయింది
దప్పిక దూరమైనది.

ఆకారం మార్చుకొని
ఆలోచన కొట్టే  దొంగదెబ్బకు
ప్రత్యక్ష సాక్ష్యాలైన
అరుపుల్లేని బాధ
ఆవిరౌతున్న కన్నీరు
సొంత దేహంలో
పరాయిలా తప్పించుకుని
ఎప్పుడూ చివరే ఉంటాయి.
ముందుకొచ్చి కాపాడింది లేదు.

ఎంత లోతుకు మునిగాడో
ఈ మాటల గజఈత ...
ఏ ఒడ్డుకు తేలేనో..
ఏ అర్థం ఎప్పటికో...

ఏ దూరం పిలుపో
ఈ అడుగుల అలసట
ఏ వేళకు ఈ దప్పికను
ఏ గమ్యం తీర్చునో...

దారివ్వండి వాడికి.
కెరలించడం దేనికి?
జరుగుతున్న కాలాన్ని
వాడిలోనే జారనీయండి.

జాలితో మనసుని
చిలికి చిలికి చంపొద్దు
ప్రేమ మనిషిలో
పొగిలి పొగిలి  పారనీయండి.

ప్రశ్నలతో  గుండె తలుపు కొట్టొద్దు
కాలంలోని జుట్టుపట్టుకొని ముంచొద్దు. కసిగా చూడద్దు..
కక్షను నేర్పద్దు..

బయటకు లాగొద్దు
బయటపడేద్దు
చీకటి చిత్తడిలో కూరుకపోతే
వెలుగు వెలికి వెలివేస్తే
ఆ పాపం గొంతులో కట్టడి కాదు.

ముక్కలైన ముఖంలో
ఆనందాలను వెతకొద్దు
ఒక్కడిని చూసి
వెన్నుపోటు పొడవద్దు.

సందుచూపులతో
మర్మాలను మరిగించి
ముఖాలపై పోయొద్దు.
మనసులు మాడ్చద్దో.

వాడేదో
వాడిలోఏదో
ఈ కాలపరీక్ష  వ్రాయలేక
కూరుకుపోతున్నాడు...
తేల్చుకులేకపోతున్నాడు...

జీవితాన్ని మరణిస్తూ
బతుకుతున్నాడు..
బతుకును చంపుకుంటూ
జీవిస్తున్నాడు...

పొందిన ఆ రెండు పదాలకు
అర్థాలను వెతకలేని అనుభవం
చేతకాక చేతులు కట్టుకున్నా

ఆ రెండు పదాలు కింద పడ్డ
చచ్చిపోయిన ఆ నిజమంటే
ఇప్పటికీ ఇష్టమే..

..

 

కవితలు

సూరిగోడు చేదబావిలో

సూరిగోడు చేదబావిలో

 "పాతాళభేరి" వేశాడు

బిందెలు బొక్కెనలు 

చేంతాళ్ళు చానా వచ్చాయి

ఊరూరంతా వుండజేరి 

వారోరి సామాన్లు ఏరుకొని 

ఇండ్లకు పోయినారు 

పరంటన పొద్దుగుంకతావుంది

సూరిగోడి కాలికి 

నా కంచుబిందె తగిలి ఖంగ్మంది

చీకట్లు ముసరతావుండాయి 

యీదరగాలీస్తావుంది

నా పైట గాలికెగిపోయింది 

సూరిగాడు చూపులు 

యాడో చిక్కుకున్నాయి 

క్షణంలో నే పైట సర్దుకున్నా

నా కళ్ళు 

సిగ్గుతో వాలిపోయాయి

మా అమ్మ అరుపుతో

నా గుండె గుభేళ్లంది

కంచు బిందెను ఎత్తుకుంటుంటే

సూరిగోడి వూపిరి వెచ్చగా తగిలింది

వాడెప్పుడూ గొంతిప్పి చెప్పనూలేదు

నేనూ నా గుండెలోని 

మాటను వినిపించనూ లేదు

ఊరిడిచొచ్చి ఎన్నోయేళ్ళు గడిచినా

ఏ పాతాళభేరి వేసి లాగినా

నా గుండెపాతాళంలో 

దాగిన వాడి జ్ఞాపకం 

గుండెసడిని వీడి బయటికి రాదు !

 

 

కవితలు

ఉద్యమ బావుటా

  నేను.. సావిత్రీబాయిని

  స్త్రీ విముక్తి వ్యూహానికి కేంద్ర బిందువును

  సనాతన పిడివాదుల మత మౌఢ్యాన్ని

  ధిక్కరణ పిడికిలితో మట్టికరిపించిన ధీరవనితను

  అసమానతలు మొలిచిన ముళ్ల సంస్కృతిలో

  విద్యయే ఆయుధంగా

  ముందుకురికిన చైతన్య సెగను 

  బాలికల విద్యకై పోరుసల్పి

  విద్యాలయాలు నెలకొల్పిన శారదమ్మను

  భర్త ఒడిలో అఆ లు దిద్దుకున్న తొలి ఆడపిల్లను

  సాటి మగువలకు అక్షరాల అడుగులు నేర్పిన

  ఆదర్శ అధ్యాపకురాలిని

  అంధకార సంకెళ్లను తుంచుకొని

  కులవివక్షపై కన్నెర్ర జేసిన సమరశంఖాన్ని

  అతివలను అణచివేసే అహంకారానికి

  ఎదురుతిరిగిన ఎర్ర కాగడాను

  దురాచారాలను దాటి నడిచిన

  తొలితరం నాయికను

  కట్టుబాట్ల కంచెలను కలంకత్తితో దునుమాడి

  నవశకానికి నాందిపలికిన నవకవితను

  మృగాలను తరిమికొట్టే మనిషి హక్కుల కోసం

  పైకెగసిన ఉద్యమ బావుటాను..!

 

                      *****

( సావిత్రీబాయి ఫూలే..191 వ జయంతి సందర్భంగా ..)

 

   -

 

కవితలు

ఆకలి జోలె

జోలెకు

అటు అతడు

ఇటు నేను..

 

మా ఇద్దరి మధ్య

జోలె పెరు ఆకలి..

 

అల్యూమినియం బిళ్ళ కోసం

ఇద్దరిని దేహీ అంటూ అడిగింది

దేశ భవిష్యత్తు..

 

జోలెకు అటువైపు వ్యక్తి..

ప్రభువు దుఃఖంతో నిండిన

దరిత్రి మీదికి వస్తున్నాడని చెప్పాడు..

ఇటు వైపు నేను..

వస్తే ఛిద్రమైతూ

మన

మద్యున్నా ఈ దేశ భవిష్యత్ తో మాట్లాడే ధైర్యం చెయ్యమన్నాను..

 

రాం, రహీం,జీసస్

ఎవరచ్చిన అంగట్లో

అర్థకలితో,ఆర్తితో  పోటీపడుతున్న

భవిష్యత్ భారతవనిని పలకరిస్తారా..?

అంతటి ధైర్యం చేస్తారా..?

(కరీంనగర్ బస్ స్టాండ్ లో జోలెతో ఉన్న చిన్నారితో ఎదురైనా సంఘటన పై)

      -

కవితలు

నిర్ణయించుకో

వ్యవస్థ స్త్రీని వ్యర్థంగా చూసిన వేళ

తల్లి జాతికి చెందిన అమ్మాయి కి

నువ్వు రక్షణ గా ఉంటే

మీ అమ్మ కడుపు చల్లగుండ అంటుంది

 

అదే అమ్మాయి కన్నీళ్లకు కారణమైతే

మీ అమ్మ కడుపు కాల అంటుంది

నిర్ణయించుకో మిత్రమా......

వివక్ష చూపి నీచుడివి అవుతావా...?

వివక్షను ఎదిరించడం లో భాగమవుతావా ...?

 నిర్ణయించుకో మిత్రమా.......

 నీకు ప్రపంచాన్ని పరిచయం చేసిన అమ్మని ఏ స్థాయిలో ఉంచాలో ...

కవితలు

ప్రశ్న

మన సరాగాల సయ్యాటను వీక్షించుటకై

నిలువెల్లా కనులతో దోబూచులాడుతోంది రేయి

సరాగాల మధురిమల జ్ఞాపకాలను

నెమరువేసుకుని పులకించి పోవాలని ఉవ్విళ్లూరుతోంది  పగలు.

నీ స్పర్శ కోసం తహతహలాడే

తనువి తపన రేయి భరిస్తుందా!

నీ నిర్లక్ష్య వైఖరి ఆనవాళ్ల వేదనని

పగలు పలకరిస్తుందా!

నా కంటి చెలమ చెక్కిల్లను దాటి నా యదలను తడుపుతూ ఉంటే, తన ఒడిలోకి తీసుకున్న

రేయి సాక్ష్యం గా నిలిచింది.

నా నిశ్శబ్ద మౌనం నీ నిరాదరణకు ఆనవాళ్ళు

పడతి పరిమళాల కోరికల సెగలు

నీ నిద్రకు భంగం  కలిగించ లేదా!

సిగ్గుతో నీ ఎదుట కూడా పైట జార్చని

కోమలి కోరిక నీకు కానరాలేదా!

గొంతులోకి ఇంకిపోయిన కన్నీటి చారికలు సముద్రపు నీరే చాలవు అంటున్నాయి

మూడుముళ్ల బంధంతో, పెళ్ళినాటి ప్రమాణాలతో ఇదే! "నా" జీవితం అనుకున్న నాకు

"ఇదేనా?"  జీవితం అన్న ప్రశ్న మిగిలిపోయింది.

 

 

 

కవితలు

దాసోహం

నమ్మలేని
రహస్యం వాళ్ళ తీరు.

మనసులు నిర్మించుకున్న
కలల కోటలో
కిక్కిరిసిన రాత్రులు

సముద్రం సహితం
చూడని లోతును
ప్రేమలో చూసి ...

భరించలేని ఆశ్చర్యాన్ని
భూమితో
పంచుకుంటే...

సహనాన్ని అస్త్రంగా
ప్రయోగించిన
భావఫలితం...

ప్రేమకు దాసోహం
 " మనిషి, మనసు, మనుగడ".

             * * *

 

కవితలు

ఆమెను చూసావా

నువ్వు ఉదయాన్నే పచ్చి శ్వాసకై

సముద్రపు ఒడ్డుకు వెళ్ళి ఉంటావు

 

రెక్కలు విప్పి హాయిగా 

నింగిలో గిరికీలు కొడుతున్న పక్షులు

కనపడ్డాయా నీకు

 

బంధించిన గదుల నుండి

బయటపడ్డాననుకుంటూ 

నీకున్న స్వేచ్ఛనే

మరింతగా  రుచి చూద్దామనే

ఆరాటం నీది

 

ఒకసారి చెవినొగ్గి విను

సముద్రం ఘోషిస్తూ 

తనదైన భాషలో

నీతో ఒంటరిగా

సంభాషించాలనుకుంటుంది

 

తన లోపల గుట్టుగా

దాచిన రహస్యాలను

నీకు చూపాలని

ఎంతో ఆరాటపడుతుంది

 

ఎన్నాళ్ళుగానో  

లోపల పోటెత్తుత్తున్న సునామీలతో

పోరాడిన వైనం

నీకు వివరించాలనుకునే

తపన తనది

 

ముందుకీ వెనక్కీ ఊగిసలాడుతూ

నీకు చేరువవాలనే ప్రయత్నంలో

తలమునకలౌతున్న తనని చూస్తే

నీకు ఏమనిపిస్తోంది

 

తనపై నుండి తేలివచ్చే గాలి

తనలోని తడిని తెచ్చి

నీకు పూస్తోంది

గమనించావా అసలు

 

హోరున నవ్వుతున్నట్టే

అగుపిస్తున్న సముద్రం

నీటి చేతులతో

తీరంపై ఏదో దుఃఖలిపిని రచిస్తూ

మళ్ళీ తనే తుడిపేస్తోంది 

 

అలలను ఒకమారైనా

నువ్వు తిరగేసి ఉంటే

నీకు తెలియని కథ

వివరించి ఉండేది

 

నువ్వు ఒడ్డు వరకూ

వెళ్ళినట్టే వెళ్ళి

కనీసం కాళ్ళు తడుపుకోకుండా

వచ్చేయడం చూసి

నీకు బాగా దగ్గరకు

వచ్చేసిన సముద్రం

ఒక్కసారిగా వెనక్కి మళ్ళిపోయింది

 

నిరాశతో గుంభనంగా బిడియంగా

తనలోకి తాను

నీటిపువ్వులా ముడుచుకుపోయింది

 

ఒక్క క్షణమాగి

నువ్వు సరిగ్గా దృష్టి సారించి ఉంటే

సముద్రపు ముఖంలో

ఆమెను తప్పక

స్పష్టంగా చూసి ఉండేవాడివి

కెరటాల పుటలు తిప్పుతూ

ఆమె మనసును కాస్తైనా

తెలుసుకునే వాడివి కదా

 

 

 

కవితలు

తరగని నిధులు స్త్రీలు

కారే రాణుల్..

రాజ్యముల్ ఏలిరే..వారేరి?!

భారతజాతి నాగరికత సంస్కృతిని

నడిపిన  నారీమణుల 

రుధిర పాదముద్రలేవి?

 

ఊయలనుండి  వివక్షలతో కష్టాలతో

కన్నీరు కార్చిన తడి హృదయాలు

అతివిధేయతతో తమ పేగు తెగిన

వెచ్చని రుధిరంతో  నిర్విరామంగా

మానవ సమూహాల పంటలను 

పండించిన  అతివలేరి…?!

 

 ..సహనం,త్యాగ నిరతి తరతరాలుగా

ప్రవహిస్తూనే ఉంది అతివలలో

అందుకే నేమో ధరణిపై 

మానవ సమూహాల పంటలు  

పుష్కలంగా పండుతూనే ఉన్నాయి..,

 

కాలం కని పెంచిన  స్త్రీలు

 సనాతన జాతికి మూలస్థంబాలు 

ఆయాకాలపు కష్టాల కొలిమిలో కాలి

రాటుదేలిన వీరనారీమణులు

వారే తరతరాల నాగరికతకు 

ప్రతినిధులు తరగని నిధులు

వారి కఠిన జీవితాలు 

వ్యక్తిత్వ వికాస పాఠాలు?!!

*******

 

 

కవితలు

లెక్కలు

అధరణ తాపడం చేయబడ్డ చేతులు

ఆ తనువు అణువుల్లోంచి 

జాలువారే నమ్రత..భావాల నాన్యత

అనుభూతుల సౌకుమార్యం..మమతల సోయగం

అవ్యక్త సౌందర్య మామెది

 

ఊపిరి నింపి..జగతినంతా ఎత్తుకు ఆడించిన

బ్రహ్మణి తాను

 

రోజూవచ్చే తొలి మలి సంధ్య వర్ణాల్ని

సరికొత్తగా పరిచయం చేస్తుందామె

 

దారమై అనుబంధాల పువ్వుల్ను గుదిగుచ్చే

నేర్పుల ఓర్పుల పల్లకి..మమకారాల పాలకంకి 

 

చూడగలిగితే..నిండుగా ప్రవహించే ఆవేదనలు..

అచ్చాదన లేని ఆ మనసు పరిచే ఉంటుంది

 

ఆ అభిమానాల సృజన శీలిపై

దాడులు..ఆకృత్యాలు..అల్లరులు

 

ఆనందాలను లెక్కకట్టుకుంటూ

లోటును పూడ్చుకునే క్రమంలో భంగపడి 

 

అందిపుచ్చుకోలేక

ఆమె అడుగుల్లో..ఆమెను పొందనీక

ఆ మనసుకెన్నిసార్లు సిలువ లేసారో..

లెక్కలెవరు కట్టగలరు..?

 

ముద్రల్ని మోస్తూన్న

ఆ అడుగుల భారాన్ని ఎవరు తూచారు..?

 

అదో..ఆచూకీ లేని వెతల ఉనికి..!

 

ఎన్నో..బలత్కార శిశిరాలను భరించిన

ఆ చెట్టుపై ఎన్ని బంధాల పక్షులు వాలినా..ఇంకా పొదుపుకుంటూనే

కలలు చిగుళ్ళేస్తుంటుంది

సాకాలపు ఫలాలు రాకనే..రాలి నేలపాలౌతుంటాయ్

 

అపుడపుడూ

ఆ ఆశయాలన్నీ భయం లోయలో పడి

ఆనవాళ్లు కోల్పోతుంటాయి

 

మళ్ళీ ఆశల బొమ్మల కొలువును

అతి నేర్పుగా పెట్టుకుంటుంది

 

అలుసుచేసి అగ్గువచేసిన ప్రతిసారీ

వెక్కిళ్ళు పెడుతూ..బద్దలవుతూనే..కట్టుకుంటుంది

 

గుహలను గృహాలుగా మలచిన

ఆమె వెంటే..నడచిన ఒకనాటి మానవ సమాజం

 

అంచెలంచెలుగా చేజారిన..ఆ మాతృస్వామికం

 

ధూషణల తిరస్కారాల ముళ్ళు గుచ్చి గాయం చేస్తున్న

ఆ ఆధిపత్యపు అంపశయ్యపైనే తను

 

నరుక్కుంటున్న..తాము కూర్చున్న కొమ్మ ఆమేనని

వాళ్ళకింకా తెలియదు

 

ఊపిరి సలపనీయనీక ఉక్కిరిబిక్కిరి చేస్తున్న 

పరిది పరిమితుల నుంచీ...

కఠిన కచ్చడాల నుంచీ..

ఇనుప కౌగిళ్ళనుంచీ..

తనను తను విముక్తించుకుని..

 

తన వేదనల అగాధాలను

అంచనా వేసుకోవడం.. ఇపుడిపుడే నేర్చుకుంటోంది

తన జీవన మడిలో..తనకోసం

కాసిన్ని చిరునవ్వుల నారును నాటుకుంటోంది

 

కవితలు

అవసరమే ఎవరికైనా..!

కాలంతో..
భూగోళంతో కలిసి నడవడమే
అప్డేట్ అవ్వడమంటే..!

ఆకులు రాలాయనో
సాయంసంధ్య ఎదురొచ్చిందనో ముడుచుకోక
తాజాగా చివుర్లను మొళిపించుకోవడం
అవసరమే ఎవరికైనా

రాగంలో రాగమై వర్ణంలో వర్ణమై
అడుగు కలపి సాగితేనే
సరికొత్త కాంతులమై ప్రజ్వలించేది.

పరిణామక్రమాన్ని అంగీకరించిన
ఒకనాటి అగ్నిశకలమే
ప్రాణిని ఆవిష్కరింప చేసిన జీవగ్రహం

తనను తాను
సంస్కరించుకోకుంటే ఇంకేముందీ
పుట్టలు పెరిగి పాకురుపట్టి పోమూ.!?

గొంగళి పురుగు నవీకరించు కుంటేనే
రంగుల సీతాకోకై రెక్కవిచ్చేది
రాగి పాత్రలని  రుద్ధి మెరిపించకుంటే
బొగ్గుల మయమే కదా

ఎప్పటికీ ముట్టని  మంచిల్లబాయి
మర్లబడి తెర్లయిపోదూ
భూకేంద్రక సిద్ధాంతమే ఇంకా సరియైందంటూ
ఆదిమయుగాల్లోనే జీవిస్తుంటారు కొందరెందుకో
వాడకుంటే మెడదుకూడా
అంతరించిపోతుంది సుమా..!

నవీకరించుకోవడం అంటే..
రంగుల రెక్కలను అతికించుకొని
గాల్లో విహరించమని కాదు.
రంగు వెలిసిపోకుండా నీకు నువ్వు పరిమళించమని

ఒక్క మనుషులకే కాదు
సర్వోపకరణాలకు నవీకరణ ఆవశ్యకమే..!
మానవ సృష్టి మన చరవాణీ
ప్రాధేయపడుతోంది
అప్డేట్ అయ్యేందుకు అనుమతి నియ్యమని.!
ప్రాణం లేని పరికరమే
అదేపనిగా ఆరాటపడుతుంటే
నన్ను నేను నవీకరించుకోవద్దూ.!?


 

 

కవితలు

నేను నేనుగా

కనులుమూసీ కల కన్నాను

బ్రమలుతొలగీన నేను

ఇప్పుడు కనులుతెరిచి

వాస్తవాలను చూస్తున్నాను

నేను ఆడపిల్లగా

పుట్టీ పెరిగీ నా

ఆడపులిగా పెరగాలనుకుంటున్నాను

ఈ రంగుల ప్రపంచంలో

ఈబ్రమల లోకంలో

మాయల సమూహంలో

నేనిలా వుంటే నామనుగడ సాథ్యమానీ నన్ను నేనే

ప్రశ్నించుకున్నాను

అమ్మ పొట్టలో వూపిరీ

పోసుకుంటున్నప్పుడే

నా జీవన సమరం మొదలు

అల్ట్రా సౌండ్ కోరలకు

చిక్కకుండా

తప్పీంచుకునీ

ఉమ్మనీటీ ని నివాసం చేసుకుని శ్వాసించటం

నేర్చుకునీ

బయటీప్రపంచంలోకీ

వచ్ఛీన బుజ్జీమేకపిల్లనీ

రాజుగారి తోటలోకీ

మేత కోసం వెళ్లగానే

కంచెలుమేస్తున్న చేలనీ

చూసీ అవాక్కయినాను

చెట్టు మీద పండుకు

రాళ్లు దెబ్బలు తగులుతాయని

తెలియక

అమాయకంగా చెట్టునే ఆశ్రయించీన అమాయకురాలనీ

రాజ్యంఏలుతున్న

రాక్షసమూకల

రాజ్యం లో

పహరా లేనీ

ఆసరాలేనీ

మృగాల మథ్య

నేను కుందేలు పిల్లనై

గంతులువేయాలంటే

నేను ఆడపులిలా

కాలుదువ్వాల్సందే

ఉగ్గు పాలు తోకలిపి

ధైర్యం పాలు నింపీన అమ్మ

వొడీనిండా థీమా థీరత్వమే

దివిటీవెలుగులో

నాప్రయాణం సాగీంచాలంటే

నేను నేనుగా నిలబడాలంటే

నేను ఆడపులిగా మారాలి

 

కవితలు

జీవితం 

ఉదయం ఏడైనా పోదు

మనలో లేజీ

కళ్ళముందు ప్రత్యక్షం కాలేజీ

పైగా చేతిలో పుస్తకాల లగేజీ

దాని బరువు మినిమమ్ ఓ కేజీ

 

పైకి కఠినంగా మా గురూజీ

"లోపల మనసు మాత్రం స్పాంజీ

 

చేస్తున్నాము కానీ పిజీ

అంతులేని సిలబస్తో గజిబిజీ

 

ఉద్యోగం లేదంటే అవ్వదు మ్యారేజీ

దాంతో పడలేం రాజీ  

అందుకే ఎక్కువైన పోటీల రేంజి

ఎలాగైనా తిప్పాలి ఉద్యోగాల పేజీ

లేదంటే దూకాలి ప్రకాశం బ్యారేజీ

 

కవితలు

పరువు

మనిషికి డబ్బు

ఎంత ముఖ్యమెా

పరువు అంతే

 

డబ్బు లేకుంటే

రేపటి రోజు సంపాదిస్తాం

కాని పరువును

సంపాదించలేము మిత్రమా

 

ప్రాణం పోయిన సరే

పరువు ముఖ్యం అన్నారు

పెద్దలు నిజమే కదా

 

పరువు లేని చోట

ఒక్కక్షణం ఉండనివ్వదు

నీ మనస్సు

 

అడ్డదారిలో కోట్లు

సంపాదిస్తే ఏం

పరువు లేనప్పుడు

 

గాజులా మేడలో

ఉంటే ఏం

పరువు లేనప్పుడు

 

జేబులో చిల్లిగవ్వ

లేకున్నా సమాజంలో

కొంత పరువు ఉండాలి

మిత్రమా

 

పరువు లేని బ్రతుకు

ఉంటే ఎంత

పోతే ఎంత

 

 

 

 

 

కవితలు

మృత్యు సమీరం

మూతబడని కనురెప్పల కాగితాలపై

ఎన్నెన్నో కథలు కావ్యాలు రాసుకుంటూ ఉంటాను

నిశీధి దేహంపై నీ జ్ఞాపకాల కొవ్వొత్తులు వెలిగిలినపుడు

పట్టెడు దోసిలితో

నా పుట్టెడు దుఃఖాన్ని

పతంగంలా ఎగరేయాలని అనుకుంటాను

అంతటా పరుచుకున్న నలుపులో

నాకు తెలియకనే నేనూ కాలిపోతూ

పొగతెరలానో

పగలు చూడని పొరలానో

సూక్ష్మ తరంగంలానో ఎగిరిపోతాను

అప్పుడు

అంతరిక్షపు వీధుల్లో ఏ మేఘాల కొమ్మలకో

ఉరి వేసుకుని

తెల్లని ధూళి కణమై వేలాడుతూ కనిపిస్తాను

నువ్వెప్పుడైనా తలపైకెత్తినప్పుడు

శ్రీశ్రీ గేయాన్నో

కృష్ణశాస్త్రి గీతాన్నో

చలం భావుకత్వాన్నో

ముద్దగా చుట్టి

నావైపు విసిరికొట్టూ....

 వాటితో మాట్లాడుతూ  నొప్పి తెలియకుండా మెల్లమెల్లగా  మరణిస్తాను!!

కవితలు

విజయం

ప్రతి మనిషి జీవితంలో విజయం

ప్రతి నిమిషానికి ఇస్తుంది ఎంతో ఆనందం,

కదిలే కాలం లో

విజయ పునాదులు బలం గా వేస్తే

శ్రద్ధ శక్తులు పట్టుదల ప్రహరీలు గా

సంకల్పం దృడ సంకల్పం తో అవుతుంది

విజయ భవనం

ఉత్తేజ శక్తి తో చేస్తే ఏదైనా పట్టవదలక

విజయం పొందేవరకు నిరంతర కృషి తో

తప్పక కాలమే అందిస్తుంది నిజమైన

విజయానందం

నక్షత్ర నివాస స్వప్నములు

గాలి మేడల స్వప్నము లు  వీడి

నిజమైన విజయంకోసం అంకిత భావంతో

ప్రణాళిక నియమనిబంధనలు తో పని

ప్రారంభించిన విజయంత తథ్యం

అపజయ తాలూకు ను దాటుకుంటూ

విజయ తాలూకు వెతుక్కుంటూ

కష్టనష్టాలు చవిచుస్తూ

నిలదొక్కుకుని ధృఢ సంకల్పంతో

ముందడుగు అదే విజయపు తొలి అడుగు

అంతులేని ఆనంద సరిహద్దు.

 

కవితలు

గాంధీకోరిన రాజ్యమా ఇది?

అర్థరాత్రి ఆడపిల్ల ఒంటరిగా సాగాలన్నావు

పగలు బయట పడాలంటేనే భయం  భయం

శాంతి శాంతి అని ప్రభోధించావు 

అనునిత్యం అశాంతి అడుగు జాడలలోనే జనం

మైత్రిభావం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నావు 

ఒకరికొకరు కొట్టుకు చూవటమే ఇప్పటి నేపధ్యం

ప్రేమైకజీవులుగా బ్రతకాలని పలికావు

స్వార్థపు ప్రేమలో నిత్యం ఓల లాడుతోందీ లోకం

నిజమైన సంతోషం సంతృప్తిలో ఉందన్నావు

సిరితో ఆనందాన్ని కొనుక్కోవాలనే సమాజం నేడిక్కడ 

మంచి చెడు ప్రక్క ప్రక్కనే ఎప్పుడూ

దేన్ని పక్కకు తోసెయ్యాలో

దేన్ని మనసున నిలుపు కోవాలో 

అర్థం చేసుకుని ముందుకు సాగటమే జీవితం

గాంధేయం ఎప్పటికీ భవితకు మార్గదర్శకమే

ఏది అసలైన నిజమో

చెప్పక తప్పదు ఈ నాటి యువతకు

ఇదే ఎన్నటికీ చెరగని సత్యం !

 

 

కవితలు

ఓ శిఖరం నీవు

నీవు లేనిదే క్షణం లేదు
నివురు గప్పిన నిప్పుకైనా
నీలాల దాగున్న జలముకైనా
నిరాడంబరాన్ని నిశ్చలతను
మౌనంగా దార పోసే అమృత బాంఢం నీవు...

ఆకాశ పొరల్ని దాటినా
అంతరంగాన్ని విశ్లేషించినా
అనురాగాన్ని అంకితమిచ్చినా
ఆత్మీయతకు ఆలవాలమై
మమతను పెనవేసే మల్లె పందిరి నీవు...


అవమాన భారాన్ని మోసినా
అర్థశాస్త్రమే తనదైనా
అవరోధాల బాటలో నడిచినా
అమ్మ తనాన్నీ అరువిచ్చే
అలుపెరుగని గుండె చప్పుడు నీవు... 


సహనానికే సహస్రనామమై
సామరస్యతను సాధించే సంకేతమై
సౌరభాన్ని వెదజల్లే సృజనియై
సంసార సాగర మథనంలో
సాహోయనే సార్వత్రిక రూపం నీవు


వేకువ సింధూరమై...
వెన్నెలద్దిన జాబిలివై...
విశాల జగతిలో విరిసే మందారమై
మురిపాల పాల వెల్లిలో
కడిగిన ముత్యమంత మనసు నీవు


అడుగడుగునా కన్నీటి కాలువలున్నా
అలవి కానీ ఆటవికమై వెంటాడినా
అత్యాచార చారికలెన్నో వెలివేసినా
అగాధాలనూ దాటేసే
అమలిన ప్రేమలో  పండిపోయిన శిఖరమే నీవు


నీవు లేనిదే క్షణం లేదు...
ఓ మహిళా వందనం!!!

************************

 

 

కవితలు

ఆమె..!

పరుల క్షేమమే తపమై

పరాయిగా జీవించే ఒంటరి

సృష్టికి మూలమైనా

అస్థిత్వమెరుగని బాటసారి

 

తన ఆశలను అదిమిపట్టి

తనవారి ఆశయాలకు ఊపిరిపోసే తపస్వి

అభిరుచులను మరిచి

అలవాట్లను మార్చుకుని

కుటుంబానికై కరిగిపోతున్న క్రొవ్వొత్తి

 

త్యాగాల వారధిగా

వారసుల అభివృద్దికి

నిరంతరం తొడ్పడే కల్పతరువు

అవమానాలెదురైనా

సహనం కోల్పోని ధీరమేరువు

 

నిర్లక్ష్యానికి నిరాదరణకు ఆయువుపోసే

నేటి సమాజంలో

కర్తవ్యదీక్షనెత్తుకొని

సాధికారదిశగా సాగుతుతున్న 

అలుపెరుగని  ప్రవాహం ఆమె

అణచివేతకు ఆజ్యం పోస్తున్న

మగాధిపత్యపు పీఠాన్ని పెకిలిస్తూ

గుర్తింపుతొవ్వ తవ్వుకుంటున్న

సంకల్పగునపం ఆమె

అణువణువునా ఆత్మవిశ్వాసాన్ని ఒంపుకొని

సడలని ధైర్యాన్ని గుండెపొరల్లో నింపుకొని

తీరంచేరే దాక

ఆగని కెరటం ఆమె

 

కవితలు

కలల లాంతరు దీపం

మనసు కసుగాయాల 

ఊసులు ఇంకెలా ఉంటాయి

మంకెన పూవులా కాక!

ఉనికి పోరాటంలో 

ఎరుపెక్కిన మనసుతో

బాధ్యతల బంధీగా 

కలల రెక్కలను జీవిత చెరసాల 

ఊచలకు కట్టుకొని...

కరిగే క్షణక్షణమూ

నీవేంటని ప్రశ్నిస్తూనే ఉంటుంది

ఏమి చెప్పను.... 

నాకంటూ నేనుగా 

ఏమీ మిగలని అస్థిత్వపు 

పూదోటననా 

ఒక గ్రీష్మం ఒక శిశరం

ఒక మానని గాయం

అప్పుడపుడూ కురిసే చల్లని వాన కాలం

మారే మనసుల మధ్య తారాడే 

అలుపెరుగని రుతురాగం

అలజడి అలల ఆశల మధ్య ఊగిసలాడే 

మనసు యుద్ధ గీతం... 

రేపటికీ నేటికీ మధ్య మునిమాపు వేళ

నిశ్శబ్దంగా నిష్క్రమించే సూరీడి రెక్కల కెరటం

ఉషస్సులో కన్నీటి చుక్కలా 

చెక్కిలిపై వాలుతుందిలే

గెలవాలని తపిస్తూ చీకటి రహదారిలో 

నాతో కలిసి నడిచే 

గుండె భావోద్వేగాల గుర్తుల నేస్తం....

ఆశకు శ్వాసకూ నడుమ 

వేలాడే కలల లాంతరు దీపం

వేకువకూ సాయంసంధ్యలకూ

నడుమ గమ్యం వైపు ఒకసారైనా కదలాలని 

నలిగి ఓడే కాంక్షల హృదయం 

 

కవితలు

ఐశ్వర్యమంటే

1.చదువు కొన్న పార్థు చెడ్డబుద్ధితోడ

   అడ్డ దార్లు వెదికి అధిక సొత్తు 

   పొంద ఆశ్రయించె బూటకపు గురుని;

   చెప్పెనంత మూర్ఖ  చిటుకులతను.

 

2. వాటియందు ఒకటి వైవాహికమనగ

    పెండ్లి యాడె మంచి పిల్ల జూసి;

   కట్టుకున్న గౌరి కష్టమేనాడును

   పట్టకుండ తిరిగె భర్తగారు.

 

3.గర్భవతిగ నుండ గంతులేసిన పార్థు

   నెలలు నిండు చుండ కలత చెందె

   గురుడు చెప్పినట్లు కొమరుడు కలుగునా?

   కొడుకు పుట్టితేను కోట్లు తనకు!

 

4.పిల్లవాడు పుడితె పెరుగును సంపద

   పిల్లవాడు కలుగ పెద్ద పేరు;

   గుర్తు కొచ్చు కొద్ది గుండెలుప్పొంగెను

   ఎదురు చూసె బిడ్డ ఏడ్పు కొరకు

 

5.అతని ఆశలన్ని అడియాసలాయెను

   ఆడపిల్ల పుట్టెఅంత సతిని

  పుట్టినింట విడిచి పొసగదు కాపుర

  మనగ గాయ పడెను కాంత మనసు!

 

6.ఊరి పెద్ద లెల్ల ఉపయుక్త మాటలు

   ఎన్ని చెప్పి నేమి? ఎద్దు వాడు.

   ఆడపిల్ల అన్న అష్ట లక్ష్ములనిన

   వినక పోయె నిజము కనకపోయె!

 

7.అర్ధ మయ్యె సరికి అంతా ముగిసిపోయె

   కుళ్ళికుళ్ళి గౌరి కుమిలి పోయె.

   బోధపర్చె లక్ష్మి బోసి నవ్వు భవిత

  లక్ష్య మెంచు కొనియె లక్ష్మి కొరకు

 

8.కాయ కష్ట మెరిగి కార్యము సాధించ 

   బతుకు బండి నడిపె భార్య గౌరి

   నక్క జాతి వంటి నరులెందరున్ననూ

   నెగ్గుకొచ్చె లక్ష్మిని గెలిపించ

 

9.ఆడ బతుకునకును అర్థము చెప్పగ

   తల్లి మనసు తీర్చ తనయ తలచె

   పట్టు బట్టి చదివి పతకాలు సాధింప

   అంతరిక్ష యాన మంది వచ్చె

 

10.దేశమంత మెచ్చు ఆశలపట్టిగా 

     లక్ష్మి నిలిచె ధరను లక్షణముగ

     ఆమెజూచితండ్రి అనుకొనె మనసులో

     ఆడపిల్లయనగ అబలకాదు!

 

11. కన్నబిడ్డ చేరి కౌగిలించిన పార్థు

       కండ్లనీరునిలిచె కంఠమొణికె

       తప్పుకాయమంచు తనభార్యనూ వేడె

       గౌరి మనసు కూడ కరిగెనంత!

 

భావం:

     పార్ధు అనే అతను చదువుకున్న వాడైననూ అజ్ఞానంతో అధిక సొమ్ము సంపాదించటం కోసం మాయ గురువుని నమ్ముతాడు. అతను పెళ్ళి చేసుకుంటే మగపిల్లవాడు పుడితే దశ తిరుగునని చెబుతాడు. అతను గౌరి అనే అమ్మాయిని పెళ్ళాడతాడు కానీ ఆమె  బాగోగులు పట్టించుకోడు. గౌరి గర్భం దాల్చిందని తెలిసి ఆకాశమంత పొంగి గరువు చెప్పింది నిజం కాబోతుందని ఆన పడతాడు. కానీ ఆడ పిల్ల పుట్టిందని తెలిసి భార్యా బిడ్డలను పుట్టింట వదిలి వేస్తాడు. పెద్ధలు ఎంత సర్ధి చెప్పినా వినడు. గౌరి మనసు గాయపడి కుమిలి పోతుంది. కానీ పసిబిడ్డ లక్ష్మి నవ్వులు చూసి కర్తవ్యం గుర్తుతెచ్చుకుని  ఆడపిల్ల ప్రాముఖ్యతని తెలపటానికి అష్ట కష్టాలు పడి ఆత్మస్థర్యంతో లక్ష్మిని చదివిస్తుంది. తల్లి మనసు గ్రహించిన లక్ష్మి బాగ చదివి అంతరిక్షంలోకి వెళ్ళడానికి అర్హత సాధిస్తుంది. దేశం మొత్తం గర్వ పడేలా చేస్తుంది. అప్పుడు ఆ తల్లి బిడ్డలకు కలిగిన మర్యాద, గౌరవం, సంతోషం చూసి ఆడ పిల్ల వుంటే అష్టలక్ష్ములు వున్నట్లేగా అని తెలుసుకుని తను చేసిన తప్పుకు కుమిలిపోయి క్షమించమని వేడుకుంటాడు. క్షమాగుణం స్ర్తీ సహజమే కదా.

                         

                           ***

    

కవితలు

ఆమె నది

ఆమె నది...

గలగలాపారుతూ జీవితంలో

ఎదురయ్యే ఆటుపోట్లకు ఎదురునిల్చి

విజయశిఖరాలను అధిరోహిస్తుంది.

ఆమె నది...

కష్టాలను,కన్నీళ్ళనీ తనలోనే

ఇముడ్చుకొని అందరికి 

ప్రశాంతతను అందిస్తుంది.

ఆమె నది...

తనపై ఆధారపడేవారికి

బాసటై నిలుస్తుంది.

తనవారికి కీడుతలపెట్టేవారిని

ఉప్పెనై కబళిస్తుంది.

ఆమె నది...

తన పయనంలో ఎదురయ్యే

ప్రతిబంధకాలను అనుబంధాలుగా

మార్చి నీటిబొట్టులా తనతో

కలుపుకొని పయనిస్తుంది.

 

 

 

 

 

 

కవితలు

సంఘర్షణ 

నీవేనాడైనా నా మనసు పుస్తకాన్ని 

పూర్తిగా చదివావా

చదివితే తెలిసేది 

దాని ఆవేదన ఏంటో....

 

వెళుతూ వెళుతూ ఆగి

ఒక పేజీ అయినా తిప్పావా

తిప్పి చూస్తే తెలిసేది

దాని ఆరాటమేంటో....

 

ఒక్క క్షణం అందులోని అక్షరం

మీదనైనా నిలిచిందా నీ చూపు

నిలచి చూస్తే తెలిసేది 

దాని బాధేంటో.....

 

పుస్తకం లోని ప్రతిపేజీ

ప్రతి అక్షరం నీకోసం 

తహతహలాడుతున్నాయి....

 

నీతో ఒక సుదీర్ఘ సంభాషణ

జరపాలని  తమలోని

సంఘర్షణ నీతో పంచుకోవాలని ....

 

అందమైన బంధాన్ని 

పటిష్టం చేసుకోవాలని

నిశీధి పరదాలను తొలగించి 

ఆనంద తీరాలకు చేరాలని....!!

 

కవితలు

 పద్యాలు

ఆ. వె

వంట యింటి లోన వయసంత గడిపింది

మగని మాటకేమొ మారాడ కుండయు

అత్త మామ లందు నధిక భక్తి కలిగి

నడచు కొనిన దామె నాటి మహిళ

 

ఆ. వె

మగని తోని పాటు మగువ తెగువచూపి

అన్ని కార్యములకు నంది వచ్చి

అతివ యెపుడు సబలె నబల కాదని తెల్పి

తెగువ చూపు నామె నేటి మహిళ

 

ఆ. వె

ఉన్న బట్ట తోనె వొళ్ళంత కప్పింది

సిగ్గు బిడియము లతొ శిరసు వంచి

కట్టు బొట్టు లందు కమనీయతయు నింపి

తల్లి దండ్రి కలిమి నాటి మహిళ

 

ఆ. వె

అంతరిక్షమందు నడుగు పెట్టిన దామె

రాష్ట్ర పతి పదవలంకరించె

క్రీడ లందు నామె కీర్తి గాంచిన దాయె

ఏలికైన దామె నేటి మహిళ

 

ఆ. వె

పంట పొలము లందు పశుల పాకల యందు

భర్త తోడ తాను భరము మోసె

కాయ కష్ట మందు కలిసి నడచినామె

ధరణి కాభరణము నాటి మహిళ

 

ఆ. వె

చదువు సంపదందు సరిగ తూగిన దామె

బాధ్యతందు నామె భాగ మాయె

పరుగు పరుగు నామె పనులన్ని చేసియు

సాటి లేని దాయె నేటి మహిళ 

 

కవితలు

మనో దౌర్బల్యం

అతడు ఆమెను  'అబల' అని తీర్మానించాడు.

ఆమె  'అబల' వలె బ్రతకాలని నిర్దేశించాడు. ఆమె  'అబల' గానే ఉండిపోవాలని శాసించాడు.   

 'అబల' కడుపున పుట్టినా తాను బలవంతుడినేనని గర్వపడ్డాడు. 

 'అబల' ఒడిలోనే  పెరిగినా తాను బలహీనుడిని కాదని జబ్బలుచరిచాడు..    

'అబల' ముందు అసమర్దతను చూపించలేక  అహంకారమనే ముసుగేసుకున్నాడు.. 

 గుండెబలం సరిపోక మేకపోతు గాంభీర్యాన్ని ముఖమంతా పూసుకున్నాడు. సమస్యలు ఎదురైనప్పుడు  మద్యాన్ని ఆశ్రయించాడు..

'అబల' ముందు ఓటమిని అంగీకరించలేక నిరంకుశత్వాన్ని అలంకరించుకున్నాడు. బాధ్యతలు పెరిగితే 'అబల' వల్లేనంటూ నిందలు మోపాడు.

 సౌఖ్యాలు తగ్గితే 'అబల' తప్పేనంటూ  ఆగ్రహించాడు.

 గెలిస్తే తనబలం అనుకున్నాడు. 

ఓడిపోతే 'అబలే' కారణమన్నాడు. 

అణకువ మాటున దాగివున్న 'అబల' ఆత్మబలాన్ని చూసి అసూయ చెందాడు. ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ తనలోని మనోదౌర్బల్యాన్ని కప్పిపుచ్చుకున్నాడు. చివరికి ఆమె 'అబల' కాదన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఆమెకు కన్నీళ్లు మిగిల్చి సంతృప్తి చెందాడు..

 

  

కవితలు

ఇదేనా?

మన సరాగాల సయ్యాటను వీక్షించుటకై

నిలువెల్లా కనులతో దోబూచులాడుతోంది రేయి

ఆ సరాగాల మధురిమల జ్ఞాపకాలను

నెమరువేసుకుని పులకించి పోవాలని ఉవ్విళ్లూరుతోంది  పగలు.

నీ స్పర్శ కోసం తహతహలాడే

ఈ తనువి తపన ఈ రేయి భరిస్తుందా!

నీ నిర్లక్ష్య వైఖరి ఆనవాళ్ల వేదనని

ఈ పగలు పలకరిస్తుందా!

నా కంటి చెలమ చెక్కిల్లను దాటి నా యదలను తడుపుతూ ఉంటే, తన ఒడిలోకి తీసుకున్న

ఈ రేయి సాక్ష్యం గా నిలిచింది.

నా నిశ్శబ్ద మౌనం నీ నిరాదరణకు ఆనవాళ్ళు

ఈ పడతి పరిమళాల కోరికల సెగలు

నీ నిద్రకు భంగం  కలిగించ లేదా!

సిగ్గుతో నీ ఎదుట కూడా పైట జార్చని

ఈ కోమలి కోరిక నీకు కానరాలేదా!

గొంతులోకి ఇంకిపోయిన కన్నీటి చారికలు సముద్రపు నీరే చాలవు అంటున్నాయి

మూడుముళ్ల బంధంతో, పెళ్ళినాటి ప్రమాణాలతో ఇదే! "నా" జీవితం అనుకున్న నాకు

"ఇదేనా?"  జీవితం అన్న ప్రశ్న మిగిలిపోయింది.

 

 

 

కవితలు

మన శక్తి-మన యుక్తి

ఈ ప్రపంచమంతా
మన అస్తిత్వానికి ఆనవాళ్లే
అయినా
అడుగడుగునా
ఎదురయ్యేవి సవాళ్లే

అందరూ అయినవాళ్లే
అయినా
మన అడుగెప్పుడూ
వెనకే ఉండాలని
శాసించేవాళ్లే

సమస్యోదయాన నిలచి
ఓటముల కంటకాలు విరిచి
స్వాభిమాన కందకాలు తొలిచి
స్వయంకృషీ సౌధాలు గెలిచిన
కళాయి లేని అద్దాలం కాకూడదు మనం

అందం ,ఆనందాలకు
అచ్చమైన నిర్వచనాలం
నిప్పులాంటి ఆత్మశక్తి
నివురుగప్పబడిన ఆంజనేయులం

ఎవరూ చేయందించకున్నా
ఎదిగే చూపించే తెగువ
మనకు ఊతకర్ర కావాలి
ఎవరో దించాలని చూసే
మన అభిమానం
అందనంత ఎత్తుకెదిగి
అద్వితీయమై వెలుగొందాలి

ఇది మానవారణ్యం!
బలహీనులపై బలవంతుల జులుం!
అవసరమైతే పీపీలకమై
అత్యవసరమైతే
బెబ్బులిగా మారినపుడే
ఇక్కడ మనుగడ సాగించగలం

మెత్తని మనసు ఒరలో
సుతిమెత్తని పంచ బాణాలకు తోడుగా
ఆగ్నేయాస్త్రాలతో
అంధకార బంధురమైన సమాజాన్ని
గెలిచే అసలు కిటుకు నేర్వాలి మనం!!


...............

 

కవితలు

కోపమాధుర్యం

ఒక్కోసారి కోపం కూడా

చాలా బావుంటుంది

బావుండటమంటే?

ముద్దుగా మురిపెంగా

మనసు కొమ్మపై అలకపిట్ట వాలినంత

ముచ్చటగా ఉంటుంది.!

 

అనురాగపు నదిపొంగి

మదివొడ్డును గారంగా కౌగిలించుకున్నట్టు

 

అప్పుడప్పుడు

అమ్మో నాన్నో..

అన్నీ వదులుకుని

గుండెకుటీరపుగడపలో ముక్కర్రలానో

ఇంటి నట్టింట దీపంలానో వెలిగే తను...

విల్లులాంటి కనుబొమ్మలు సంధించి

కోపంగ చూడటం చాలా అందంగా ఉంటుంది

 

పంతాలు నెగ్గే కోపం పనికిరాదు కానీ

జీవన వనాన వసంతాలు పూయించే

కోపాల కుహూ కుహూ కూసితీరాలి..!

 

కోపం ఎంత మధురమైనదో.!?

కోపం ఎంత వెచ్చనైనదో.!?

కోపం మధురాతి మధురమైనది

ఒకరుకోసం ఒకరు

తడితడిగా వెచ్చపరుచుకునేంత స్వఛ్చమైనది.!

 

ఇద్దరిమధ్య

వొట్టి ప్రేమ మాత్రమే ఏం బావుంటుంది

చలి సాయంత్రపు వేళ చల్లారిన కాఫీలా

కోపతాపాలు లేకుండా బతుక్కి రుచెలా వస్తాది.?

కోపతాపాలు లేకుండా జీవితమెలా గుబాళిస్తాది.?

 

గడ్డిపరకంత కోపమే మొలవకుండా

బతుకు సాగుచేస్తున్నావంటే

ఎదలోపల ఏదో ఎడారి పిలిస్తున్నట్టే.!?

 

ఎప్పుడో ఒకసారన్నా

పిడికెడు మాటల మరమరాలకు

చిటికెడు కోపపుకారం కలిపి చూడాలి

 

రుసరుసల సంగీతం అనంతరం

ఓదార్పుల హృది గీతి అనంతరం

ప్రేమ సముద్రమొకటి

మనసు తీరాన్ని ముద్దాడుతూ

శతాబ్దాలకు ఇంకని చెలిమిపాతంలా..

చెవిలో ఇల్లుకట్టుకున్న మోహాన్ని తాగి చూడాలి..!

 

ఇప్పటికీ

ఆవగింజంత చిటపటలైనా పేలకపోతే..!

యీ సాయంత్రం నువ్వైనా

రవ్వంత కోపాన్నిగీటి చూడు..!

**                      **                          **

30/11/2021.

(తన కోపాన్ని తనకోసం ఇష్టంగా భద్రపరుస్తూ..)

 

కవితలు

పంట పొలంలో ప్రసంగం 

పంట పొలం నట్టనడుమ

ధాన్యపు కంకులతో

ఎగిరే పక్షులతో

గెంతులేసే జంతువులతో

ఉద్యమ గానం చేస్తున్న కోయిలమ్మ పాటల మధ్య

చెంగు చెంగున మార్చ్ పాస్ట్ చేస్తున్న జింక పిల్లల అడుగుల సవ్వడి మధ్య

ఆ బాలుడి ప్రసంగం

బహుశా...

అది పర్యావరణ రక్షణకై కావచ్చు

అది రైతు వ్యతిరేక చట్టాలకు నిరసన రూపం కావచ్చు

అది సాగు నీరుకై కావచ్చు

అది గిట్టుబాటు ధర కోసం కావచ్చు

అది దున్నేవారికే భూమికై కావచ్చు

అంతిమంగా భూమి భుక్తి విముక్తి కోసమూ కావచ్చు

 

                                 12-10-2021

కవితలు

పరిమళం కోల్పోయిన కేవడో 

పగిలిన నా రవిక అద్దం చెప్పింది.. 

ధ్వంసం అయిన నా చరిత్రను..

 

ఏడు తీర్లా దారంతో ఎదపై పోదిమినా

రవిక(కాళ్ళీ) యదకు దూరమైంది..

 

తెల్లని గాజుల(బలీయ)కు కట్టిన నల్లని దారం

నరుడి దృష్టిని దూరం చేస్తాయనుకున్నా..

కానీ, తెల్ల గాజులే నా నుండి దూరం అయినాయి..

 

చెవులను తాకే కెంపైనా ఊసులు చెప్పే టోప్లీ  

శృతి చేయని వీణలా మూగబోయింది..

 

 మోముకి దిష్ఠి చుక్కలా.. ముక్కపై పోదిమిన అర్థ చంద్రాకారం మాయమై అమావాస్య చీకట్లను మిగిల్చాయి..

 

మెడను అలుముకున్న నక్షత్రహారాలను

వేటాగాడొకడు అపహరించి

నన్ను అమ్ముకునే వస్తువును చేశాడు..

 

అయినా....

నేను వస్తువును కాదు కాదా!

వనంలో ఒంటరిగా నాట్యమాడే 

మయూరం నా తోబుట్టువే!

 

అలా ఉన్నాననేగా వేటగాడు

నా రూపాన్ని దోచుకేళ్ళీంది

దోచుకెళ్ళని.... ఈసృష్టిలో తరగనంత సౌందర్యం

జీవనాడుల్లో పదిలంగా దాచుకున్నాను..

 

రేపటి కోసం వసంత కోకిల గానమై వస్తాను!

వాకిట్లో సింగిడి పూల మొగ్గనై పలకరిస్తాను!!

కవితలు

నీ కోసం నేను 

పంచ భూతాలు ఎంత నిజమో

నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది అంతే నిజం

 

ఎంతగా అంటే...

 

ఆకాశంలోనే నీలిరంగును కలంలో సిరాగా  పోసి

లోకంలోని చెట్లను కాగితాలు చేసి

అక్షరాలుగా రాసినా కూడా చాలనంతా..

 

ఎప్పటివరకు....?

ఆకాశం భూమి కలిసినంత వరకు

సూర్యుడు వెలుగును పూర్తిగా కోల్పోనంత వరకు

నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను

 

రైతు తొలకరి కోసం ఎదిరి చూస్తున్నట్లు

నీ కోసం నేను....

కవితలు

ఒకరే......

ఒకరుంటారు జీవితంలో
సజీవంగా
మనసును మోస్తూ ...

ఒకరే ఉంటారు బతుకులో
రహస్యంగా
మనసును ఆరాధిస్తూ

 

కవితలు

జర్నీ

అతడు 

మన రక్త బందు 

కాకపోతేనేమ్

నలభై ఏళ్లుగా

 రక్తంమెవరికై

ధారపోసాడో తెలుసుకో

 

అతను 

మన కులం వాడు 

కాకపోతేనేమ్

40 ఏళ్లుగా 

ఏ కులాల వైపు నిలబడ్డాడో చూడు

అతను

మనకు అక్షరాలు

 నేర్పక పోతేనేమ్

నలభై ఏళ్లుగా

నేర్చుకున్న ప్రతి అక్షరం 

ఏ సామాజిక మార్పుకై కృషి చేశాడో చూడు

అతను 

మన మతంవాడు 

కాకపోతేమ్

నలుభై ఏళ్లుగా

మతరహిత నూతన మానవ ఆవిష్కరణకై చేసిన ప్రయోగాలు ఎన్నో కనుక్కో 

అతను

 మన సిద్ధాంతాన్ని అంగీకరించకపోతేనేమ్

నలభై ఏళ్లుగా 

నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఏ యే దారుల్లో పాదయాత్ర చేశాడో చూడు

అతను

మన ఊరి వాడు 

కాకపోతేనేమ్

నలభై ఏళ్లుగా 

నాటిన పోరు మొక్కలు 

ఏ ఊర్లో పొలిమేరల్లో పెరిగినవో కనుక్కో

స్వచ్ఛమైన

 ఆక్సిజన్ కోసం

 నాలుగు అడుగులు వేద్దాం

 

కవితలు

ఉప్పుపూలు

అప్పటికది
బొట్టు ఆలోచనే...
వయచొచ్చిన ప్రవాహానికి
హృదయం సంద్రమైనది.

కాళ్లోచ్చిన ఒక్కో కల అల
ఆశల ఒత్తిడిలో
ఒడ్డును ఢీ కొడుతూ
ఎత్తుకి ఎదగాలనదే తపన.

ఆపలేని ముసురులో
ఆగని ఆవేదనకు
రాలే ఒక్కో కన్నీటి చుక్క
ఒక్కో తుఫాను.

తడిసిన బతుకున
మొలిచిన విధికి
పూసినవన్ని ఉప్పుపూలే.

కోయక తప్పని ప్రేమకి మూలం
ఆ బొట్టు ఆలోచనే
ఆ కన్నీటి ఆరాధనే.

     ...

కవితలు

నేనే నిదర్శనం

కండలేని నా అస్తిపంజరం

నీ దోపిడికి నిదర్శనం

నాకు నిద్రలేని రాత్రులు

నీ కుట్రల పన్నాగాన్ని

ఎండగట్టబోవుటకు నిదర్శనం

నా తలపై నరిసిన జుట్టు

నీ మోసం స్వేతపత్రంల

ప్రజలముందు పెట్టబోవుటకు నిదర్శనం

నా అమాయకపు బెదురు చూపులు

నీ మోసాల గారడీలు చెప్పబోవుటకు నిదర్శనం

నా గుండె స్పందనకు ఎగురుతున్న పెన్ను

అలసి  సొలసిన బక్కరైతుల 

బువ్వలేని తనాన్ని లికించబోవుటకు నిదర్శనం

నా సంచార జీవితమంత

నీ అన్యాయాలు సేకరించబోవుటకు నిదర్శనం

జైలుగోడలమద్య నా జీవితం

నీపై చేయబోవు జంగుకు నిదర్శనం

 

 

 

    

                           

 

 

కవితలు

దుఃఖపు ఊబి

ప్రేమించడం

మొదలుపెట్టినప్పటినుంచే

దుఃఖించడం ఆరంభమైంది

రోజురోజుకీ కొంచెం కొంచెం

దుఃఖంలోకి దుఃఖం రగుల్చుతున్నమంటల్లోకి

చొచ్చుకు పోతున్నాను

గోతంలో ఇసుక పోసి కూరినట్టు

లోపల లోపలికి వేదన కూరుకుపోతావుంది

 

ఎక్కడెక్కడో తిరుగుతూ వున్నా

ఏడుపు గుంజకు కట్టేసిన కుక్కపిల్లలా

మనసు గిలాగిల్లాడుతున్నది

 

పర్వతాలకు

హిమాలయాలని

వింధ్యా సాత్పురాలని పేరుపెట్టేవాళ్ళకు

గుండెలోపలి దుఖఃపర్వతాలు కనిపిస్తాయా?

మోసుకుతిరుగుతున్న దిగులు సముద్రాలు

వినిపిస్తాయా???

 

కేవలం విలపించడం ఎంత తెలివిమాలినతనం?

కేవలం దుఃఖించడం ఎంత పిరికితనం?

ప్రేమించి ప్రేమించి

ప్రేమకోసమే దుఃఖపుఊబిలో దిగబడిపోతూ..

 

కూర్చున్న కుమిలే చోటుమీద

నడుస్తున్న నగ్నదారిమీద

దారికి ఇరువైపులా 

నిస్సహాయతగా నిలబడ్డ చెట్లమీద గుట్లమీద

రాళ్లురప్పలు మీద ,తుప్పలు మీద

తుప్పలకు ఆవల అరణ్యాలమీద

అరణ్యాల ఎదలు పాడే పాటలుమీద

పాటకు పరవశించి చిందుతొక్కే పక్షిరెక్కలు మీద

ఎంత ప్రేమ ఉంటే ఇంతటి దుఃఖదార ఉబుకుతుంది

ఎంత ప్రేమ ఉంటే ఇంతటి దిగులువాగు పారుతుంది

 

ప్రేమించడం పరమ పవిత్రమైన కార్యమని

కాలం నుదుటిపై వణికే పెదవులతో

తనివితీరా ముద్దాడిన శోకగీతం

ఎంతకాలమిలా పొగిలిపొగిలి పారుతుంది??

                     *

యీ పొడవాటి దుఃఖాలు సాగిసాగి

దుఃఖపు లోయలు పగులుతాయని

ప్రేమల మైదానాలు పిగులుతాయని

ప్రేమించడం మొదలైనప్పటినుంచి

దుఃఖపు కళ్ళతో ఆశగా ఎదురుచూస్తున్నాను

దుఃఖానంతరం మండే ఆక్రోశగీతానికై..!

 

 

కవితలు

ఇంకిపోయాను....

ఆ క్షణం
గాలికి ఊపిరాడలేదు
వెలుగు చిట్లి చీకటిగా ముక్కలైంది.
మౌనజలపాతానికి
కాలం మెత్తగా కరిగి కొట్టుకుపోతుంటే
భావం బరువుగా తెలియాడుతూ
చూపలను వాటేసుకుని
సన్నని ప్రయాణంలో
ఇరుకుమాటల  అర్థాలఒత్తిడిలో
తీయని తెల్లని మాట
ఛాయలెక్కడని  వెదుకుతూ
ఒంటరిగా నాలో నేను ఇంకిపోయాను
నీ ఆలోచనల తేమను దాటుకుంటూ... 

కవితలు

పోరుగాలి

అదే పనిగా 

కొట్టుకొంటోంది కిటికీ

పదేపదే 

వచ్చి పోయే గాలికి

        *

ఎక్కడదీగాలి?

ఎందుకింతలా యీ గాలి?

సంకెళ్లు తెంపుకున్న సమూహాల

పిడికెళ్లు పైకెత్తిన హోరు మోసుకుంటూ

చెట్లను

గుట్టలను

సచ్చుగా మొద్దునిద్రలో పడుండనీక

వొకటే పోరు గాలి

         *

చెరువుల వీపులపై సత్యవాక్యాలను రాస్తూ

దారుల చెవుల్లో పోరు రహస్యాలను పాడుతూ

అలలు అలలుగా కదిలి

ఎడతెరపి లేకుండా ఇంటిని చుట్టుముట్టిన గాలి

           *

అంతా పొరుగాలియేరు పారుతున్న బొమ్మ

చుట్టూ పొరుగాలివాగు సాగుతున్న చెమ్మ

           *

కిటికీలు

తలుపులు

గుండెల గోడల ఇళ్లు

అదే పనిగా కొట్టుకుంటున్నాయి

ఊరిలో

గాలి పోరులో..!

 

**      **      **

కవితలు

నాకన్నా...

నా వాళ్ళకోసం

హక్కులని అడిగితే

నేను దేశద్రోహినైతే నక్సలైటునైతే

నాకంటే పెద్ద దేశద్రోహులు

నాకంటే పెద్ద నక్సలైట్

మరెవ్వరూ లేరు

నా వాళ్ళకోసం చేసే

పోరాటంలో

నేను ప్రాణాలు కోల్పోతే

అది నా పిచ్చితనమే అని

మీరంటే నాకంటే పెద్ద

పిచ్చివాడు మరెవ్వరూ లేడు

అందరూ నావాల్లే

అనుకోవటం స్వార్ధమే అయితే

నాకన్నా పెద్ద

స్వార్ధపరుడు మరెవ్వరూ లేరు

 

కవితలు

 కవిత వ్రాస్తాను....

నాలుగు గోడల మధ్యలో
ఒక సోఫా చూస్తుండగా
రెండు కుర్చీలు దగ్గరగా
రెండు కప్పులు కాఫీ వాసనతో
నాలుగు కళ్ళు ఒక చూపుతో...
రెండు మనసులు ఒకే తలపుతో....
మెరిసే మాటలకు రూపం తెచ్చే
ఆ రోజుకు కాళ్లకు మ్రొక్కుతూ
నీలో  నన్ను చూసుకుంటా
నాలో నిన్ను చూపుకుంటా
ఒక మల్లె తోడుగా
ఒక క్షణం నీడగా
ఓ తీపి జ్ఞాపకాన్ని
మనసు కాగితంపై
కవితగా వ్రాసి ఇస్తాను
జీవితాంతం గుర్తుండేలా...

 

కవితలు

ఇదో స్వతంత్ర భారతం

ఇక్కడ రైతులు స్వతంత్రగా ఆత్మహత్యలు చేసుకోవచ్చు....

ప్రభుత్వాలు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావచ్చు...!!!

ఇక్కడ ఉద్యోగాలు లేక, నిరుద్యోగులు స్వతంత్రంగా ఆత్మహత్యలు చేసుకోవచ్చు....

ప్రభుత్వాలు ఎలక్షన్లకోసం, ఉద్యోగాలు ఆపుకోవచ్చు...ఓట్లకోసం!!!

ఇక్కడ అణగారిన వర్గపు స్త్రీలను,స్వతంత్రంగా చరచవచ్చు...

అధికార వర్గాలు, చరిచిన వాళ్ళని కాపాడుకోవచ్చు...!!!

ఇక్కడ పేదవాళ్ళు స్వతంత్రంగా ఆకలి చావులు చావొచ్చు...

అధికారులు మాత్రం, సమావేశాల్లో చాయ్, బిస్కట్లకోసం కోట్లు ఖర్చు చెయ్యవచ్చు..!!!

పేదవాడు తప్పు చేస్తే వెంటనే,స్వతంత్రగా శిక్షించవచ్చు...

అదే పెద్దవాడు తప్పుచేస్తే...ఆ శిక్షలను ఎన్ని సంవత్సరాలైన వాయిదా వేయవచ్చు...!!!

ఇక్కడ ఆకలికోసం ప్రశ్నించిన వాణ్ణి నక్సలైట్ అనొచ్చు... అధికార దాహంకోసం ప్రశ్నించినవాన్ని నాయకుడు అనొచ్చు...!!!

మతఅణిచివేతని ఎదురించినవాన్ని,మాంత్రికుడని కొట్టి చంపొచ్చు...

మతఘర్షణలు సృష్టించినవాన్ని, బాబాలని పూజించవచ్చు...!!!

పేదవాడు ధనం దాచుకుంటే,

జైల్లో వెయ్యొచ్చు...

పెద్దవాడు దాచుకుంటే,వాన్ని విదేశాల్లో దాయావచ్చు...!!!

చివరిగా ఈ స్వతంత్ర భారతం...పేదవాడి చావులకి, పెద్దవాడి కాపాలకి తప్ప, స్వేచ్ఛ సమానత్వం కోసం కాదు... కాలేదు.. కాబోదు...!!!

 

కవితలు

సునామీ

నువ్వు...

బీటువారిన నా ఎద భూమిపై

చిగురించిన ఆశల ఆయువువి,

రాటుదేలిన మది చీకటిలో

మెరిసిన చిరు వెలుగువి 

 

నువ్వు....

అలసిన నా అంతరంగ తీరాన

ఎగసిన హాయి తరంగానివి

నిర్మేఘ నయనాకాశంలో

వెలసిన రంగుల హరివిల్లువి

 

నువ్వు.....

అరవిరిసిన మనోవిరిని

వికసింపిన విరిజల్లువి,

కనుమరుగైన నాలోని కవిని

నిదురలేపి , నెనరు చేసి

పలుకులిచ్చిపదునుచేసి

వరుణించికరుణించి

 మట్టిబొమ్మకి జీవం పోసిన

ప్రాణ నాదానివి

నా ప్రణవ వేదానివి !!

 

నువ్వు ....

కాగితంపై నే నాటిన కలం

నే పట్టని కత్తీఖడ్గం

పట్టిన పలకాబలపం

ఎత్తిన చిహ్నంబావుటా

అద్దిన అంకెదిద్దిన అక్షరం

నా ఆవేశంఆవేదనల 

అల్పపీడనం వల్ల

కలిగిన భావోద్వేగంతో

పదఝరి తుఫాను లా

కమ్మేస్తూ... 

నా అజ్ఞానాంధకార విల్లుని

చీల్చుకుంటూ ...

సెకనుకి వేలమైళ్ళు,

శిక్షాబాణంలా 

పై పై కి దూసుకొస్తున్న

నా కవితాన్వేషణా తరంగ

మహాసముద్ర సు-నామీ !!

 

 

   +65 98533934

 

కవితలు

కొన్నికలలు కావాలి

కులం మతం రెండుకళ్ళయి

అభివృద్ధి అంధకారం లో

అణుబాంబులు అణ్వాస్త్రాల కంటే

భయంకరమైన యుద్ధం

ఆకలితో చేస్తున్నది

చౌకగా లభించే

ఈ దేశప్రజల చావులతో

నీకోసం ఎడవడానికి

ఖరీదైన కన్నీళ్ళు కావాలి

పాలకుల అధికార మార్కెట్లో

అమ్మకనికిఉన్న నిన్ను చూస్తుంటే

స్వాతంత్ర సమరయోధులు కన్న

కలలు కావాలి

ఈ దేశానికి కొన్ని కన్నీళ్ళు కావాలి

 

 

కవితలు

నాకు కనబడు

ఇప్పుడు

నీ పేరు

నిషేధించిన పదం

 

కరడుగట్టిన

ఈ పితృస్వామ్యంలో

"రమ్య"రాగాలకు నోచుకోనిది

నీ గొంతుక

 

రక్తం ఏరులై ప్రవహించగా

శిలువెత్తిన క్రీస్తువలే

పడుతూ లేస్తూ

గాయాలెన్నయినా భరిస్తూ

అవమానాలను దిగమింగేది

నీ కుత్తుక

 

నువ్వు

నేనొక మనిషిని

మనుషుల్లో మనిషిని

ప్రత్యేకంగా కనిపిస్తానేమో చూడమంటూ

కాళ్లను నెర్రదన్ని

కూడలిలో నించోడమే

చేసిన నేరమూ

 

సమానత్వాన్ని సాధించే

రణనినాదంలో

కట్టుబాట్ల కంచెను తెంచి

మహిళ ఘనతను

ఇలకు తెలిపిన వీర వనితగా

నాకు కనబడు

ఈ విశ్వానికి వినబడేలా

అరుస్తూ

నీ పేరును వినిపిస్తాను

 

        -

కవితలు

స్పందనలో ఎందుకీ వివక్ష? 

పంద్రాగస్టు సాక్షిగా

ఒక వైపు భారతీయ పతాకం

నింగిలో రెపరెపలాడుతుంది!

మరో వైపు నెత్తికెక్కిన కామ కత్తిపోట్లకు

నవ భారతి ప్రాణం గాలిలో కలిసిపోయింది!!

అందరూ చూస్తుండగానే

శరీరమంతా కత్తిపోట్లతో రక్తసిక్తమైంది

చిందిన నెత్తురుతో రోడ్డంతా ఎరుపెక్కింది!!!

 

చీమ కాటుకే తల్లడిల్లే సున్నితమైన దేహం

కామ కత్తిపోట్లకు ఎంత వేదన పడిందో!

ఎదలో... గొంతులో... కడుపులో...

గాయాల - రక్తపుధారల మధ్య

బ్రతకాలనే ఆశ ఎంత సంఘర్షణ పడిందో!!

 

నేరస్తులు ఎవరు?

నేరానికి దారి తీసిన ఆధిపత్య సంస్కృతి ఎవడిది?

నేరాన్ని నిరసించని

నేరాన్ని ప్రశ్నించని

నేరాన్ని ధిక్కరించని

సభ్యసమాజం నేరస్తురాలు కాకుండా ఉంటుందా?

 

స్పందనలో ఎందుకీ వివక్ష?

ఈ రోజు వీధిలో పడగ విప్పిన కామ నాగు

రేపొద్దున మన ఇంట్లోకి రాకుండా ఉంటుందా?                             

(గుంటూరు లో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య కి నివాళిగా)

                                     17-08-2021

కవితలు

ఉదయాలు

రోజూ ఉదయాలింత సున్నితంగా తెరలేస్తే బావుణ్ణు.

రాత్రినుంచి పగటికి మృదుపుష్పంలా జారితే బావుణ్ణు

కిటికీ చాటునుంచి రాత్రంతా నాకోసమే  వీచే  పొన్నాయి పరిమళమైతే బావుణ్ణు

రాత్రి నిద్రలో బంగారుకలలు కని తమకాంకితమై సోలిపోయిన ఆ  పసిదాని ముఖమార్దవమైతే బావుణ్ణు

రాత్రి అక్క పెట్టిన గోరంటపంటను మూచూసుకుని తనిసిపోయే పదేళ్ల తమ్ముణ్ణయితే బావుణ్ణు

ముందురోజు సంగతుల్ని తలచి తలచి మురిసిపోయే తెల్లవారులైతే బావుణ్ణు

అప్పుడప్ప్పడూ ఉదయాలు -

ఒడ్డుకు కొట్టుకొచ్చి మెలిదిరిగి పడివున్న శవాల్లా భయపెడతాయి.

కవితలు

మహా వృక్షాలు

అడవికి తెగులుసోకి

మహా వృక్షాలు

నేల రాలుతున్నాయి

అవాసపు పక్షులు

కన్నీటి వీడ్కోలుతో

కర్తవ్యన్ని నెమరేసుకున్నాయి

 

ఎండ్రిన్ నీళ్లుతాగి

పాయిజన్ బువ్వతిని

విషపు పురుగుల మధ్య

నెగడులా జీవిస్తూ

క్రూరమృగాల్ని ఎదుర్కోని

నిఘా తోడేళ్ళను సైతం

నిలువరించినోళ్లు

 

యే గత్తర సోకిన

వేటకుక్కలు వల పన్నయో

గుంట నక్కల సంతలో

యే పక్షి పాదనికి

విషమంటుకుందో

రూపాంతర సామ్రాజ్యపు

తొత్తుల పాలకుల కుట్రలకు

మహా వృక్షాలు

నేల రాలుతున్నాయి

కవితలు

వాంటెడ్ O2

ఇప్పుడు ఎక్కడని వెతకాలి

హృదయ స్పందనను ఎలా పరిగెత్తించాలి

ఆ గదుల మధ్య కండరాలను ఎవరైనా కదిలిస్తే బాగుండు

సంకోచ వ్యాకోచాలను తిరిగి నిద్రలేపితే బాగుండు

కళ్ళలో పరుచుకుంటున్న నలుపును  ఒక్క బొట్టు  వెలుగుతో చేరిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా??

ఆకాశం గాలిపాట

అమ్మ పాడిన జోలపాట

ఊహాల ప్రపంచంలో రెక్కలు తొడిగిన మనసుపాట

అన్నీ ఒక్కసారే గుర్తొస్తాయే!!

కాకెంగిళ్లు

పంచుకున్న కౌగిళ్ళు

కాలంతో పరుగులు

కళ్లముందే కదలాడుతున్నాయే!!

పచ్చని చెట్టు

మట్టి పరిమళం

ఆప్యాయపు వానచినుకులు

ఎక్కడెక్కడికో వలస వెళ్లిపోయాయిగా...

ఆశనే దిక్సూచిలో  ఆశ పెరుగుతూనే ఉంటుంది

శ్వాశ మాత్రం చివరి అంకంలో శాంతమవడానికి సిద్ధమవుతోంది

అదేంటో!!

పశ్చాత్తాపమిప్పుడే పాలపొంగులా పైపైకి వస్తోంది

పచ్చని చెట్ల గుండెలు ఎన్నెన్ని కోసామో

వాటి ఉచ్వాస నిశ్వాసలెన్ని ఆపేశామో

ప్రకృతిని వికృతిగా మార్చేసి

ప్రాణవాయువు కోసం పొగిలి ఏడిస్తే ఎక్కడని వెతకాలి??

కాలం మీద వాంటెడ్ పోస్టర్ తగిలించి ఎదురుచూడటం తప్ప!!

 

కవితలు

బ్రతుకునే భారం చేసిన ఉద్యోగం

ఓ నా ఉద్యోగమా ...!!

బతుకే కాటికాపరి అయినది వేచి చూసి చూసి

నీ కోసం...

రాజు హోదా ఇచ్చెనా కనబడితే ...లేనియెడల బిచ్చగాడిలా చూసినా ఈ లోకమే ....

రోజులు గడిచే ఉద్యోగం ఎప్పుడు అని అని ధ్యాసలోనే...

మనుషులనే వేరు చేసేనే జీతమే లేకుంటే...

కన్న తండ్రి కూడు కోసం కొట్టుమిట్టాడెనే...

కూడు లేక గుడ్డలేక చేయిచాచి లేక ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని నాన్న అడిగెనే....

నలుగురు నాన్నను చూసి నవ్వే నా

తట్టుకోలేక చచ్చి బతికేనా....

మంచితనమే గౌరవం అనుకున్నా ..!!

ఉద్యోగమే గౌరవమా..??

కష్టమైన నష్టమైన రాళ్లను దాటితేనే కానీ నాన్న చితికలు పడిపోతే ఎలా దాటాను ??

చిరిగిన చీరతో మట్టి పిసుకుతున్న అవ్వకు

మంచి రోజులు వచ్చేది ఎన్నడు?

ఓ ఉద్యోగమా ఇంకెన్నాళ్లు నా ఎదురు చూపులు..??

 

కవితలు

అక్షర జ్ఞానం

అందని చూపులకు అమ్మే గా చందమామ

వాడిపోని, చెడిపోని, పరిమళం లాంటి ప్రేమను అందించే దైవం అమ్మే...

నడక రాని పసితనానికి నడిపించే నడకనే నా తల్లి

ఆకలి యెరుగని యవ్వనానికి కడుపు నింపే బువ్వే కదా అవ్వా

జ్ఞానం యెరుగని బాలతత్వానికి అక్షర జ్ఞానం అమ్మే గా

అచ్చమైన స్వచ్ఛమైన మనసే అమ్మా...

మహోన్నత ప్రేమా మూర్తి అయిన అమ్మకే సొంతం ప్రేమ చూపడం అందుకే అంటున్న "నా ప్రేయసి నా తల్లి"

కవితలు

"అ"మ్మ నేర్పిన తొలి పలుకులు

"అ"మ్మ నేర్పిన తొలి పలుకులు "ఆ"ప్యాయత నిండిన ఆ పిలుపులు

"ఇ"సుకలో నే దిద్దిన అక్షరాలు "ఈ" జన్మకి మరువలేని భావాలు

"ఉ"గ్గు పాలతో పాటుగా "ఊ"యలలో పాటగా

నిలిచిన నా మాతృ భాష కు "ఋ"ణ పడి ఉంటా.

కవితలు

చెట్టొక గొప్ప సామ్యవాది

చినుకులు పలపలా రాలగానే

చెట్టు వొళ్ళంతా పులకరిస్తుంది 

ఆకుల చేతివేళ్లు సంగీతం మీటుతాయి 

కొమ్మలు నాట్యం చేస్తాయి 

చిగుళ్ళు హాయిగా కళ్ళు తెరుస్తాయి

కొమ్మారెమ్మా రాగమందుకుంటాయి 

మొగ్గలు పూల చిందులేస్తాయి

చెట్టు వేళ్లకు నీటి లేఖలు రాస్తుంది

వేళ్ళు ఒళ్ళు విరుచుకొని నిద్ర లేస్తాయి

నీటిని ఆబగా ఒంటి నిండా పీల్చుకుంటాయి

కాండాన్ని తట్టి  లేపుతాయి 

వయ్యారంగా లేచిన కొమ్మలకు

నీటి పిలుపులు పంపుతాయి

కొమ్మలేమో రెమ్మలకు నీటిని జాలువారుస్తాయి

ఆకులేమో రెమ్మల నుండి 

నీటికి ఆహ్వానం పలుకుతాయి 

నోళ్లు తెరిచిన హరితం 

మత్తుగా ఒక్కో గుక్క వేస్తుంది 

సూర్యుడిని ఆహ్వానించి

కిరణాలు వెలుతురు సంతకం చేస్తాయి

చల్లని గాలి తెమ్మెర మెల్లగా చెంత చేరుతుంది సమిష్టిగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి 

చెట్టంతా హరితవనం పండుగ అవుతుంది 

చిగురు నుండి వేరు వరకు వాయిణాలు పంపుతుంది మొగ్గలు విచ్చుకుని పూల బాసలు చేస్తాయి 

రంగు రంగుల రెక్కలు వాలు చూపులతో 

తుమ్మెదలను రారమ్మని పిలుచుకుంటాయి మధురమైన మకరందాన్ని  పీల్చుతూ ఉంటే 

పువ్వు మధురోహల్లో తేలిపోతుంది 

పోతూపోతున్న తుమ్మెదకు పుప్పొడి వెల్ల వేస్తుంది వనమంతా పంచుకుంటూ తుమ్మెదలు రాగాలు తీస్తాయి 

పువ్వులు కాయలవుతాయి

కాయలు పండ్లవుతాయి

చిలకల గాయాలకు పులకించి పోతాయి

చెట్టు విరగ కాస్తుంది 

కొమ్మలు ఒళ్ళొంచుతాయి

రారండహో అంటూ వనానికి చాటింపు వేస్తాయి పక్షులు ఎన్నో గూళ్లు కట్టుకుంటాయి

చీమలు బారులు తీరుతాయి

పురుగు లెన్నో పాక్కుంటూ వస్తాయి 

మనుషులు ఆశల పల్లకీ ఎక్కుతారు 

జగమంతా చెట్టు చుట్టూ చేరి ఆకలి తీర్చుకుంటుంది

 

కవితలు

ఇప్పుడు కాసింత మనోధైర్యం కావాలి

ఎప్పుడు

ఎక్కడ

ఏం జరుగుతుందో

అర్థం కాని పాడు కాలం వచ్చింది.

 

ఎవరిని

ఎలా

కోల్పోవాల్సి వస్తుందో

తెలియని స్థితి నెలకొంది.

 

ఇప్పుడు

మనసుకు కొంత  హాయి

ప్రశాంతత

మనో ధైర్యం కావాలి.

****

మనుషిని మనిషి

కలవలేని రోజులొచ్చిన

మనసుకు కాసింత

మనోధైర్యం చెప్పే

మానవత్వం ఉన్న

మనిషితనం కావాలి

*****

ఇప్పుడు కాసింత

మనోధైర్యం కావాలి

 

అమ్మలా

లాలించె

ఆప్యాయత

 

నాన్నలా

వెన్నుతట్టి లేపే

ధైర్యం

 

స్నేహితులా

ఏదైనా

కడ దాకా

తోడుంటామని

చెప్పేవాళ్ళు  కావాలి.

 

స్వస్థత సాధించడానికి

ఏలికలకు కనువిప్పు కలిగించే

కదణరంగం ఒకటి నిర్మాణమై ఉండాలి.

 

(కరోనా రేపిన కల్లోలంలో మనుషులకు కాసింత మనోధైర్యం కావాలని వారికి అండగా ఉన్నదామని.....)

కవితలు

ఆజాది

బేపారంతో బత్మనీకచ్చిన బేయిజ్జతుగాళ్ళు
మన కంట్లెనే మన యేలు తోటే...
ఇస్సీ...! నంబకరాలు
తల్లిరొమ్మును గుద్దిన బేయిమానుగొట్టోళ్ళు

తెల్ల బంగారం, నల్ల బంగారం
అస్లీ బంగారమే కాదు, సకులం బాండువలకు బాండువలు
బొత్తిగ తెప్ప దాటిచ్చిన బట్టేబాజ్‌గాళ్ళు
కుటీర కార్ఖానాల కుంటువడగొట్టి
నకిలీ కొడుకుల దోప్కమే దోప్కం
మన గడ్డ మీదనే మనం పరాయోల్లం.

మన కట్టు, మన బొట్టు, మన జుట్టు
మన బోనం, మన మానం, మన పాణం
తెల్ల రక్కసులకు పరవా నహీ
పుల్లరి పితూరీల పయి
సలసల మసిలిన మజ్ఞారి మజ్జ
పరాయిపీడకులను ఉప్పు పాతరేయంగ
ఉరికొయ్యన ఉయ్యాలలూగిన ఉయ్యాలవాడ

కండ్ల ముందటే కన్నతల్లి వలపోత
పటపట పాలాలేగిన పండ్లు
చిటపొట నిష్కలయి దుంకిన కండ్లు
తుది నెత్తురు బొట్టు వడిసే దనుక
తెల్ల తోడేండ్లను తెగ నరికిన మణికర్ణిక

తంతెలకనంగ ఎట్టిసాకిరిల కట్టు బాంచె బత్కులు
చావలేక బత్కలేక తల్లడం మల్లడమాయే.
మా తాత ముత్తాతల తండ్లాటకు
త్యాగమే దారి దీపమయ్యింది
పదునెక్కిన గోండ్వానా పరగణం

బరిసెలు బరిల నిల్సినయి
విల్లంబులు విహంగాలయినయి
ఉరితాళ్ళను పేనిస వెయ్యి ఊడల మర్రి

దోపిడీదారుల్ని మార్చడమే కాదు
దోపిడీ నుండి విముక్తం కల్పించాలన్న
భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌, రాజ్‌గురుల బలిదానం
చిలచిలా నెత్తురు చిల్లి భాసిల్లినా
ముల్లును ముల్లుతోనే తీయాలన్న అల్లూరి ఆశయం.

మావా నాటే మావా గావ్‌
గొంతు పల్గొట్టుకొన్న జల్‌, జంగల్‌, జమీన్లు
కొదమ సింగపు కొట్లాట
ఆదివాసీల ఆత్మ గౌరవ పతాక.

బ్రిటీష్‌ రెసిడెన్సీపై తుర్రేబాజ్‌ఖాన్‌ దాడులు
దొడ్డి కొమురయ్య దుడ్డుకర్ర మోతలు
చాకలి ఐలమ్మ రోకలిబండ పోటులు
షోయబ్‌ ఉల్లాఖాన్‌ ఆజాది రాతలు
షేక్‌ బందగీ ఖానూనుకై లడాయి
మహ్మదాపూర్ల మారుమోగిన గుట్టలు
భూమి కోసం భుక్తి కోసం
వెట్టి చాకిరి విముక్తి కోసం
సాగిన రైతాంగ సాయుధ సమరం

ఇసిరెలు పసిరెలు మర్లవడ్డయి
అతారెలు పతారెలు తిరగవడ్డయి
గడీలు గజగజ వనికినయి
బూసాములు బుజబుజ వోసుకున్నరు
ఊరూవాడా కో... అంటే కో... అన్నయి
రజాకార్లను తరిమికొట్టినయి 
నిజాం పాలనకు గోరీ కట్టినయి.

జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
తెలంగాణ అమరవీరులకు జోహార్లు!


 

కవితలు

యంత్రస్పర్శ

యంత్రస్పర్శ

పెదవులకు తాళాలు బిగించి

తాళంచెవులను

జేబులో వేసుకుని పారిపోతోంది

అటు చూడకండి

చూసినా చూసీ చూడనట్టే

మీ చీకటిగుహలలో దూరి

ముసుగుతన్ని గుర్రుపెట్టండి

పసిపిల్లాడి చేతులలో

పాలసీసా లాగేసి

నోటి నిండా

అర్జంటుగా టెక్నాలజీని కుక్కండి

లేకపోతే వాడు రేప్పొద్దున్న

 నదినీ ఈదలేడు

అయ్యో అలా వెనకపడి ఉన్నారేమిటి

అందరినీ అనుసరిస్తూ

పరుగుపందెంలో పాల్గొని

ప్రపంచపు అంచులపై

అడుగిడాలని లేదూ

అదేమిటి

చెట్టునూ కొమ్మలపై పిట్టలనూ

అమాయకత్వంతో 

తదేకంగా చూస్తున్నారు

అరచేతిలోని జానెడు గాజుపలకకు

చూపులను వేళ్ళాడదీసి

మునివేళ్ళతో ప్రయాణించి

తడిలేని తీరాలని

తాకాలని లేదూ

సముద్రాలూ నదులూ

పర్వతాలూ ఆకాశాలూ

అన్నిటినీ మీ గుప్పెట్లో బంధించి

లోకాన్ని జయిస్తూ

మురవాలి కదా

మీరింకా

పాతచింతకాయ పచ్చడిలా మిగిలితే

ఆదిమానవుడంటూ

వింత జంతువంటూ

జూలో బంధించేస్తారు జాగ్రత్త

మీలోని పూలతనాన్ని

మనిషితనాన్ని పాతేసి

త్వరగా మరబొమ్మ బట్టలు తొడుక్కుని

కన్నీళ్ళకూ ఆనందభాష్పాలకూ

ఒకే కవళికలను

ముఖమంతా పౌడరులా పూసుకోండి

నరనరాలలో రక్తాన్ని తోడేసి

సిగ్నళ్ళూ ఫైవ్ జీ లూ

సెలైన్ లా ఎక్కించుకోండి

మీరు పూర్తిగా

యంత్రస్పర్శతో వికసించాకే

మీకిక్కడ మనుగడ దొరుకుతుంది

మీ జీవితం

లేటెస్ట్ గా మెరుస్తుంది


 


 

 

 

కవితలు

ఓ నిరుద్యోగి బలిదానాలు వద్దు

ప్రాణ త్యాగమే

మన సమస్యకు పరిష్కారమా?

సమస్యకు దీటుగా

సమీక్షించు ఎదురించు

హక్కుల కోసం పోరాడు

పరిష్కార మార్గం వైపు

బాటలు వేయ్...

 

తల్లిదండ్రుల కడుపు కోత మిగిల్చి

స్నేహితుల చెలిమిని వీడి

ఏమి సాధించావ్ మిత్రమా...

చరిత్రను సృష్టించాలి తప్ప

చరిత్రలో తనువు చాలించి ఆగిపోకూడదు

 

నీలా...

ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైజం ఉండాలి

చెడును విమర్శించే ధోరణి ఉండాలి

కానీ,

విమర్శనకు ఆకాశంలో నిచ్చెనేసి నిరాశవాదిగా

నీ ఆశయాలను విస్మరించి

ప్రాణ త్యాగం చేసే వైనం ఉండకూడదు

మహా అయితే చార్ దిన్ కి దునియా హై

దునియా మే దునియా దారి సీఖో

 

జీవితంలో జీవించు

సచ్చి సాధించేది

ఏది లేదు మిత్రమా...

నిరాశ నిస్పృహలే మిగులుతాయి

బ్రతికి జీవించూ

తల్లిదండ్రుల ఆశలకు నీవే ఆయువు అవుతావు

నిరాడంబరమైన జీవితంలో

గుండె ధైర్యంతో

ఆలోచన వివేచన శక్తితో

సహనం పాటిస్తూ

సౌమ్య హృదయంతో

జీవితంలో ముందుకెళ్లాలి మిత్రమా....

కన్న తల్లిదండ్రుల కలలకు కడుపుకోత మిగల్చకు

 

ఓ నిరుద్యోగి బలిదానాలు వద్దు

బ్రతుకు బాటలో ప్రయాణం చేద్దాం

 

నేటి సంఘటన

నా హృదయాన్ని కదిలించింది

నా గుండె బరువెక్కింది

జాలువారే కన్నీటి చుక్క

సిరా చుక్కై

నా మనసులోని భావాలను

నోట పలికించి

కలంతో కదిలించింది

 

సునీల్ నాయక్ కి జోహార్లు చెప్తూ

ఈ సందేశం నా మిత్రులకు అంకితం...

 

కవితలు

వందేమాతరం...

చెలికి చేదు అనుభవం

మదికి మాలిన్యం, తనువుకు తూటా ను

కానుకనిచ్చానే ప్రియా,

      ఈ బీడు భూముల్లో బంగారు పంటలకై నా నెత్తుటి ధారల సాక్షిగా

స్వేచ్ఛ ను ఆశించడమే తృప్తినిస్తుంది మంధరా, మరుజన్మలో నా చివరి, ఆకరి మజిలీవి నీవే సఖీ,

     మరు జన్మలో నైనా మన బంధం ఈ జాతి స్వేచ్చాయుదం లో బంధికాకుడదనీ ఆశిస్తూ నీ ఆనంద్...

     మరుగున పడిన మన బానిస సంకెళ్లను బద్దలు కొడుతూ

మన భారత భవిష్యత్తే తన సంతానమని బలి తీసుకున్న యువ వీరులెందరికో ఈ స్వేచ్ఛాయుత భారత వందనం...

వందేమాతరం... వందేమాతరం.....

 

                     

కవితలు

అలసిపోని ప్రయత్నాలు

అర్థరాత్రి గానీ రాని నిద్రలు

నిద్ర పట్టే ముందు ఎన్నెన్నో ఆలోచనలు

ఆ అర్థ రాత్రి వినిపించే నిశబ్ద కీర్తనలు

నేర్పెను జీవిత పాఠాలు

ఆ పాఠాల యాదిలో గడిచెను ఎన్నో రాత్రులు

మళ్ళీ మళ్ళీ కనుల ముందు నర్తిస్తున్న నగ్న గమ్యాలు

అలుపురాని ఆలోచనలు అలసిపోని ప్రయత్నాలు

                                 

కవితలు

భద్రం జర

వస్తున్నారు వస్తున్నారు

మన ఓట్లాడిగే పాలకులు

భద్రం ఓటరన్నా

భద్రం జర

 

ఓట్లకోసం

పాట్లు పడతారు

ఓటు వేసినాక

పంగనామం పెడతారు

 

మందు ఆశ

చూపుతారు

మతిలేకుండా

చేస్తారు

 

డబ్బు ఆశ

చూపుతారు

డౌటులేకుండా

గెలుస్తారు

 

సమస్యలన్ని

పరిష్కారిస్తా మంటారు

గెలిచాక మీరే మా

సమస్యాంటారు

 

నాయకులు

అవుతారు

న్యాయం లేకుండా చేస్తారు

 

అభివృద్ధి చేస్తా

అంటారు

గెలిచాక

అవినీతిలో ముందు ఉంటారు

 

భద్రం ఓటరన్నా జర భద్రమే....

      

                                                     

 

కవితలు

చెట్టమ్మ వందనం

చెట్టమ్మ నీకు వేలవందనాలమ్మ

నువ్వులేకపోతే ఈ మనుగడేలేదమ్మ

ప్రతి ఒక జీవికి ఊరిపోస్తావ్

నిండునూరేండ్లు మము సల్లంగజుస్తావ్

 

ఆకలైతే పండ్లనిచ్చి కడుపు నింపుతవ్

కనుమూస్తే నీ కట్టలే పాడేకందిస్తావ్

కొమ్మలే ఊయాలై ఊపుతుంటవ్

ఎండల్లో నీడనిచ్చి కాపాడుతవ్

 

ఎన్నో పక్షుల నివసంకై ఇళ్లతివి

తనువంత ఔషధ గుణంగలిగితివి

వాన చినుకుని నెలపైకి తీసుకొచ్చి

మొలకెత్తు విత్తనాలకు పురుడుపొస్తివి

 

నీ తనువంత త్యాగంజేసి ఎన్నో ఇసిరేలానందిస్తివి

మా అవసరాలకు ప్రాణ త్యాగం చేస్తివి

ఎండిపోయి చిగురిస్తూ

మానవాళికి ప్రేరణకల్పిస్తివి

నీవు లేకపోతే ఈ జగతేలేదు

నీ రుణమెట్ల తీరునోయమ్మ

మాకు బ్రతుకునిచ్చే ఓ మహా వృక్షమా

 

 

కవితలు

కలేకూరి ప్రసాద్ యాదిలో

రెండు కాళ్ళ జంతువుగా చేసి

ఊరికి దూరంగా నెట్టబడ్డ

వెలివాడలో నుంచి ఉదయించిన

ధిక్కార పతాకం నీవు

కలం నిండా ప్రేమతో పాటు

త్యాగాల రక్తాన్ని నింపుకొని

నీలాకాశంలో మెరిసిన

ఎర్రని నక్షత్రానివి నీవు

పీల్చే గాలి త్రాగే నీరు నిషిద్దమైన చోట

శత్రువు మీద దాని సాహిత్యం మీద

సముద్రంలోని కెరటం వలే

విరుచుకుపడిన అక్షర బాణం నీవు

పొత్తికడుపు వెన్నెముకకు అతికి

వెలివాడలోనున్న మూగజీవుల వెతల్ని

ఏటికి ఎదురీదుతున్న జీవన పోరాటాన్ని

అడవి బాట పట్టించిన ధీరుడవు నీవు

నీవు ఒరిగిన పొద్దున

వాడలో పొయ్యి వెలగకుండా దుఃఖించింది

కలం సిరా బదులు రక్తాన్ని స్రవించింది

పోరు నినాదాలతో ధరణి కంపించి ధ్వనించింది

మా గుండెకు తాకిన నీ కవిత్వం

మమ్మల్ని పోరు దారుల్లో నడిపించే యవ్వన శక్తి

నీకు నివాళిగా మేమేమివ్వగలం

యుద్దక్షేత్రంలో ప్రాణాలు తప్ప!

                          

                      రచనా కాలం. 17-05-2020

కవితలు

అగ్నినై

కుతకుతలాడుతున్న

రక్తాన్ని ఏరై పారించనా

పీడిత ప్రజల విముక్తి కొరకై

ఎరుపెక్కిన కనులతో

గుర్రుగా చూడనా

గుండాగిరి ఇక నడవదని

 

పిడికిలి బిగించి

ముందుకు సాగనా

నిరంకుశత్వాన్ని

కూకటి వేళ్ళతో పెకిలించ

పోరాట పటిమనందించనా

భవిష్యత్తు తరాలకు మార్గదర్శకుడినై

 

దిక్కులు పిక్కటిల్లేలా

గొంతెత్తి గర్జించనా

జరుగుతున్న అన్యాయాలపై

భగ భగ మండే సూర్యడినై

మల మల మాడ్చనా

అమాయకుల ఆక్రందనలకి కారణమయ్యేవాల్లని

 

అక్షరాలను ఆయుధాలుగా మార్చనా అజ్ఞానాందకారాన్ని తొలగించ

నిలదీయనా నిరభ్యంతరంగా

నిర్లక్ష్యాన్ని మరలా పునరావృతం కాకుడదనెలా

పోరాడనా భీకరంగా

శ్రామికుల చెమట చుక్కనై

 

అగ్ని ఖీలనై దహించనా

దోపిడి దారులను

తెరిపించనా మూసుకుపోయిన

కనులు జరుగుతున్న మోసాలు

చూడటానికి

సమరశంఖాన్ని పూరించనా

అసమర్థ పాలకులను గద్దెదించ

 

ఏకం చేయనా

నా దేశ పౌరులను స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఎవడబ్బ సొత్తు కాదని

అసమానతలను పెంచి పోషించేటోడి కుత్తిక కోద్దామనీ

సమానత్వపు పరిమళాలు అందరం రుచి చూద్దామని

అవినీతి రహిత భారతావనిని మరలా నిర్మించుకుందామని....!

  

           

కవితలు

మనసే ఖాళీ...

"రాత్రి కావాలి" నాకు
వీధుల్ని తోసుకొని ఊరిను నెట్టేసి,
పొలిమేర దాటి పొలాలు తిరుగుతుంటే..
చీకటి చెవిపట్టి ఇంటికి చేర్చింది.

దీపం వెక్కిరిస్తూ లోపలికి పిలిస్తే
మంచం ఉరిమిచూస్తూ సర్దుకుంది.
               * * *
"
రాత్రి కావాలి" నాకు
మళ్ళీ అదే ప్రశ్న వీధిలోకి నెట్టుకొస్తుంటే

తట్టుకోలేక కళ్ళు
లోపల నుండి బయటకు చూశాయి.

"చుట్టూ రాత్రే...
మనసే ఖాళీ."అని తెలిసి
నిద్రను కౌగించుకొని పడుకున్నా..

            * * *


  

 

కవితలు

చిన్ని చిన్ని సంగతులు

ఒక పని

ఎత్తుకున్నాడతను.

 

విరిగిన కలల్ని

అతుకేసే పని.

 

చెదిరిన బతుకుల్ని

కూడేసే పని.

 

సడలిన గుండెల్లో

ధైర్యం రాజేసే పని.

 

ఒక పనిని

తలకెత్తుకున్నాడతను.

 

వెనుదిరిగి చూసే

చరిత్రకు

ఎప్పుడో ఒకప్పడు

అతనితో

పని పడుతుంది.

******

నీకు తెలీదు.

 

వేర్లకి నీళ్లు పోస్తే

పైన పూలు పూస్తాయని..

కాయలు కాస్తాయని..

 

ఒక్కోసారి 

నీకు తెలీదు.

 

ఒక తడివిత్తనం పాతేసి

నువ్వెళ్లిపోతావు.

 

మాను మొలిచి కొమ్మలు చాచి

ఆకులనీడ పరిచినప్పుడు

కోటిలో ఒక్కడయినా

చల్లని కొమ్మల కింద కూచొని

తల్చుకుంటాడు నిన్ను

గుండెచేతులు జోడించి.

 

నువ్వప్పుడు

తల నెరిసి వుంటావో..

తల వాల్చేసి వుంటావో..

నువ్వు చేసిన పని మాత్రం

తల ఎత్తి నిలబెడుతుంది.

 

నీకు తెలీదు.

( కె.వి.రమణారెడ్డి తలపులో )

******

కాసిని

చెట్ల గుబురుల మధ్య

వున్నాను.

 

పక్షుల కూజితాలకి

పసరిక పచ్చి వాసనకి

లోన ఎండిపోయిన 

ఎదబీళ్ల మీద

వీస్తున్న పైరగాలికి

ఒక్కొక్కటిగా

నన్ను నేను కూడేసుకుంటున్నాను.

 

పిట్టలాగో పశువులాగో

తన ఇచ్ఛగా ఎగిరే

సీతాకోకలాగో

జీవించడానికి

ఒక అదను కోసం

వెతుకుతున్నాను.

 

అదేదో అభివృద్ధి

ఇక్కడిక్కూడా వెంటబడి

రాకుండా వుంటే

బాగుణ్ణు.

 

 

కవితలు

నిషేధం..

రాజ్యమా..

ప్రజా సమస్యలు

పరిష్కరించడం తెలియదు నీకు..

ఆ సమస్యలపై పోరాడుతున్న

ప్రజా గొంతుకులను

నిషేదించడం మాత్రమే తెలుసు ...

 

భూమిని కొల్లగొడుతున్న

బహుళ జాతి కంపెనీలను

నిషేధించడం తెలియదు నీకు..

ఆ దోపిడీని ఎండగడుతున్న

ఉద్యమల పై నిషేధం విధిస్తున్నావ్..

 

అమ్ముకోవడం వాడి

అలవాటు..

వాడికి కొమ్ముకాయడం ని అవసరం..

 

నీవు విధించే

నిషేధాలు ధిక్కరించైన సరే

మీ ఇద్దరి మెడలు వంచడం

మా పోరాటం..

 

కవితలు

క్రాంతికిరణ్ కవితలు ఐదు 

                   1

పోరాటమే స్వేచ్ఛా పునాది

ఏమిటి నేస్థం ఎందుకా కన్నీరు

స్వేచ్ఛా బందీ అయిందనా

విరామం విరమనవ్తుందనా

లే లేచి ఆ కన్నీరు తుడుచుకో

అదిగో అలా చూడు ఆకాశం

ఇంకా విశాలమౌతున్నది

అరుణ కాంతులతో విరసిల్లుతున్నది

చీకటికి చన్నీళ్ళ

చిరుదద్దు కుట్టినది

వసంతపు వానచినుకొకటి

యాంగ్సి మబ్బుల

నుండి గంగకు చేరింది

విప్పపూల వనంలో

తుపాకీ దండు విరిసింది

రెప్పపాటు దూరంలో

బంగారు లేడి కూలనుంది

పులిని మింగిన మేక

పిల్లనగ్రోవి ఊదింది

మేకలను మింగిన పులి

పల్లవి ఆగిపోయింది

చూసావుగా నేస్తం

ఇంకెప్పుడూ ఎడవమాకు

కష్టాల కాలిగొర్లు తియ్యమాకు

వాన వంటిది నీప్రేమ

మెరుపు వంటిది నీ దీమా

భుజం తట్టి చెబుతున్నా విను

అడుగు అడుగు ముందుకేస్తెనే

అలసట పారిపోతుంది

పిడికిలి బిగిస్తేనే

గెలుపు నీ ముందుంటుంది

          2

హిస్టరీ అడ్మిరెస్ డెత్

నేను వెళ్తున్న

ఒక ద్వేషాన్ని

ప్రేమగా మలిచెందుకై

ఒక సత్యాన్ని

నిలుపెందుకై

నేను వెళ్తున్న

ఆ దారిలో

కోర నాగులుండొచ్చు

నన్ను కాటేయోచ్చు

ప్రాణాలు తీసే

ఊబిలుండొచ్చు

నను ముంచేయొచ్చు

పీక్కు తినే పులుండొచ్చు

నను చీల్చేయొచ్చు

ఈ పోరులో

నా చేతులు తెగిపడొచ్చు

నా కళ్ళు రక్తం కార్చొచ్చు

నా తల పేలిపోవచ్చు

ప్రాణం పెకిలి పోవచ్చు

ఐతేనేం

చచ్చిన శవంలా

పడుండటం కంటే

చావేమేలు

చరిత్ర మెచ్చే

భానిస

చరిత్రను మార్చే

చావే మేలు

       3

ధిక్కార వసంతం

వసంత ఋతువుని

వర్షించే మేఘాన్ని

మట్టి వాసనని

అడవి అందాన్ని

పైడి పదాన్ని

వెన్నెల వసంతాన్ని

వేకువ ధీరత్వాన్ని

నువు

అణిచేద్దాం అని

అనుకున్నపుడల్లా

మరింత ఉవ్వెత్తున

లేస్తూనే ఉంటాయి

ఉప్పెనై పొంగుతూనే ఉంటాయి

       4

అణు సంగీతం

పుట్టుకే శరణమై

జీవితం మరణమై

ఊసుల ఉవ్విళ్ళు

ఊహల్లో ఉరి పోసుకుంటుంటే

మై డియర్ రెడ్ రోజ్

నా చివరి శ్వాస

నీ చిరుగాలి సితారా

సంగీతాన్ని వినింది

అణు వణువుకు

ఆ సంగీతం

ధైర్యం దారులేసింది

మందారం మకరందాన్ని

పులుముకుని నా చేతిని తాకింది

అది బారెల్ చివరినుంచి

బతుకును చూపింది

మై డియర్ రెడ్ రోజ్

నిజంగా నీ ప్రేమ ఎంతో గొప్పది

నా చివరి చూపూ వరకు

నీ వెకువ వెలుగులకే

ఈ నా జీవితం అంకితం

   5

వాగ్దానం

 

ప్రియా...

ఆవిరై

సగమాకాశంలో

మేఘమైన

నీ ప్రేమని

చినుకులు చినుకులుగా

వెన్నెల వానలా

కురిపించు

స్వేచ్ఛ గాలుల గానానివై

ఓసారి వచ్చి

మరోవసంతాన్ని

వాగ్దానం చేసిపో

 

కవితలు

పోయెట్రీ టైమ్ – 12

నా ఎద నది

నీ ప్రేమసంద్రాన్ని

చేరుకోక తప్పదు..

    ------

నీ మాట వింటే చాలు

నా పాట ఊపిరిపోసుకుంటుంది. 

    -----

నీ చూపు

నా వైపు మళ్ళితే

నా ఊపు

శిఖరాన్నే ఊపుతుంది.

    ------

వయసు తరువు మొలిచాక

కలల బరువు మోయాల్సిందే.

------

నాలో..నీవు

దీపికలా..

గీతికలా..

వెలుగుతూనే ఉంటావు

మ్రోగుతూనే ఉంటావు.

-------

ఓ కప్పు కాఫీతో

ఒక పాట ఉదయించాల్సిందే..

---------

నిన్న..

ఆమె వెనుక..

నడిచే పాటనయ్యాను.

 

నేడు..

ఆమె ముందు..

నడిచే బాటనయ్యాను..

-------

ఎగిసిపోనీ..

నీ కనుల పిలుపు

కడలి కంటే ఉవ్వెత్తుగా..

 

మెరిసిపోనీ

నీ చూపు మెరుపు

తూరుపు కంటే కొత్తగా...

 

కవితలు

కన్నెర్ర చేసిన కాలం 

ఇంకా కనువిప్పు కలగాలని కపట నాటకాలు ఆడుతున్న జనాలు ...

ఒకప్పుడు చెట్లను నరికి జీవనం సాగించేవారు

కాలం మారింది .....

ఇప్పుడు ఆక్సిజన్ కరువై ఎదురు చూపులు చూస్తున్న జనాలు...

మన అహంకారానికి ప్రతిచర్య

మనపై ప్రతీకారం

తీర్చుకుంటున్న పర్యావరణం ...

ఆకలిచావులు పోయాయి ...

అనారోగ్యంతో చావులు మొదలయ్యాయి ...

ఆక్సిజన్ కొరతతో నేడు ప్రపంచం విలవిలలాడుతోంది ...

ఇక కరోనా  విలయతాండవం చేస్తుంది ...

సాంఘిక జీవనాన్ని మరిచిన ప్రజలకు ఇదొక కనువిప్పు ..

ఇకనైనా మేల్కోండి ...

తిరిగి వెనక్కి వెళ్ళండి...

ప్రకృతి వైపు అడుగులు వేయండి  ....

సాంఘిక జీవనానికి అద్దం పట్టండి ...

ఫ్యాషన్ భూతానికి వేసిన మేకప్ ఆపండి ...

వృక్షో రక్షితి రక్షితః అన్నారు పెద్దలు

ఇప్పుడు ఆ విషయం గుర్తెరిగారు ప్రజలు

హ ఇక పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది ...

జనాలు కళ్ళు తెరిచే లోపే సమస్తం జరిగిపోతుంది ....

నారు పోసినవాడు నీరు పోయాడా ..

అన్నట్లు ఉంది మన వ్యవహారం ...

ఇకపైన నైనా సంవత్సరానికి ఒక్క మొక్కఅయినా  నాటండి ..

నీరు పోసి పెంచండి .

అదే మహావృక్షమై మనకు ఆక్సిజన్ ఇస్తుంది ..

మీ ముందు తరాల వారికి ఆస్తులు అంతస్తులు ఇవ్వనవసరం లేదు ..

మంచి ఆరోగ్యం ఇవ్వడానికి ప్రయత్నించండి ...

ఆరోగ్యమే మహాభాగ్యం ...

అదే మనందరి కి సౌభాగ్యం ...

విశ్వ కల్యాణానికి పూనుకోండి ...

పర్యావరణంను నాశనం చేసే కార్యక్రమాలను ఇకనైనా మానుకోండి ....

మేఘాల నుండి జాలువారే ...మొదటి వర్షపు శుద్ధ వర్షపు చినుకు కోసం ఎదురు చూస్తుంది..

చాటక పక్షి  కాంక్షా ఆశా దృక్పథం కేవలం ఒక శుద్ధ వర్షపు చినుకు కోసమే ...

తను పడే ఆరాటం ....కోరిక

మూగ జీవి అయిన పక్షి అంత ఆశావాద దృక్పథంతో బ్రతుకుతుంది ....

అన్ని తెలిసిన మనం కూడా కరోనా భయంతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నాం ...

బ్రతుకు పైన ఆశ ఆశావాద దృక్పథం మనపై మనకు ఉన్న నమ్మకం మాత్రమే కరోనాపై

జయించడానికి సాధనలవుతాయి

భయాన్ని అపోహలను వీడండి

ఆత్మవిశ్వాసంతో బ్రతకండి...

కరోనా మహమ్మారిని తరిమికొట్టండి...

 

కవితలు

నేటి బాల్యం

నేటి బాల్యం చదువన్నేశక్తిలో మునిగిపోయినది

నేటి బాల్యం కథలు లేని ఊహల్లో విహారిస్తుంది

నేటి బాల్యం తోక లేని గాలి పతంగిలా

ఎగురుతుంది

తల్లి తండ్రుల అత్యాసకు బలై

బందరు దొడ్డిలో బందీ అయింది

పుస్తకాల మోత

ర్యాంకుల వేటలో ఉక్కిరి బిక్కిరౌతున్నారు

హాస్టల్ గదులల్లో ఊపిరి వదులుతున్నారు

 

నల్ల బలపై రుద్ది రుద్ది

పసి మనుసు పై గుద్ది గుద్ది

బందీఖానాలో బలౌతున్నారు

కంప్యూటర్స్ కహానీలు

సెల్ఫోన్ సరదాల్లో సాగిపోతుంది

భవిష్యత్ అంధకారంలో మునిగిపోతున్నది

 

ఉజ్వల భవిష్యత్ కై బాటలు వేయాలి

ఉన్నత శీఖరాలకు అంది పుచ్చుకోవాలి

 

 

                   

కవితలు

నేను నా కవిత్వం

ప్రపంచాన్ని శాసించటం కోసం

దేశం అంతా నా రాతలు నింపటం కోసం

రాష్ట్రం తలలో నాలుక అవడం కోసం

నగరంలో కవయిత్రి గా మెప్పుల కోసం

జిల్లా వార్తాపత్రికలో కవితలు ప్రచురణ కోసం

మండలం పరధిలో సన్మానాలు జరగడం కోసం 

ఊరిలో నా కవితలు చదవటం కోసం

గృహంలో అంతా నన్ను చూసి గర్వ పడడం కోసం,

~ఆనం ఆశ్రిత రెడ్డి

పై వాటికి ఆశ పడి,

అత్యాశ అనే ఉరుకు తో

నేను కలం పట్టలేదు ,పుస్తకం ముట్టలేదు.

నా దేశంలో జరుగుతున్న ఘోరాలు

రాజ్యమేలుతున్న అవినీతులు పై

యుద్ధం చేయడమే సరైనది అని

కత్తి అనే కలం పట్టి

అక్షరమే ఆయుధంగా ఎంచుకోని

పుస్తకంలో సత్యాలు అనే సాక్ష్యాలు రాస్తూ

పాఠకుల అయినా ప్రజలకు

మంచిని మార్గంగా పరిచి,

తప్పును హెచ్చరికగా చెబుతూ

నీతి, నిజాయితీ, ధర్మం, త్యాగం

ఇవే దేశ ఉన్నతికి సోపానాలు అంటూ

జనుల తలరాతల మార్పు కోసం

నా రాతలు కవితలుగా రాస్తున్నాను

నావి నిర్దేశించే బాటలు మాత్రమే

ఇక నిర్ణయం మీదే!!!

 

కవితలు

కరోనాపై సమరం

కరోనా గెరిల్లా యుద్ధం

క్షణ క్షణం మృత్యు ఘంటికలు

మానవ జీవితం ప్రశ్నార్థకం

పుట్టుకొస్తున్న కొత్త వ్యాధులు

రోగుల సందేహం

చాలా మందిని వేధిస్తున్న

 

ప్రశ్నలు

ప్రజల నిర్లక్ష్యం

ఆయువు కోసం వాయువుల వైపుచూపులు

ఎక్కువ మంది తనువులు చాలించిన వైనం

దేశంలో కన్నీటి కాష్టం

ఆగని భగభగ మండే శవ దహనాలు

 

దశలు మారుతున్న కరోనా పై సమరం

అనుభవవైద్యులసలహాలు సూచనలు

జాప్యం జరిగితే చికిత్స సైతం కష్టం

కర్ఫ్యూ గంట మ్రోగింది

బతుకు బండి భారమైంది

 

నిరంతరంమరణమృదంగం వినిపిస్తుంది

జాగ్రత్తలు పాటించండి..

ప్రాణాలు పై శ్వాస పెంచండి

వేచి చూడకండి..వేగిర పడండి

 

కవితలు

ఆత్మవిశ్వాసమే

ప్రశాంతంగా ఉన్న బతుకులపై

పగబట్టింది ఈ మహమ్మారి...

ఆనందంగా ఉన్న కుటుంబాలలో

పుట్టెడు శోకం నింపుతుంది...

ఇటు కరోనా పీడిస్తుంటే

అటు ప్రకృతి విపత్తులు వణికిస్తున్నాయి...

భావితరాల చదువులు

ఆగమయ్యాయి...

మనిషిని చూసి మనిషే భయపడే రోజులు మొదలయ్యాయి...

నీ ఆత్మవిశ్వాసమే నీకు రక్ష

నీ భయమే నీకు తెస్తుంది శిక్ష

 

కవితలు

ఏం మారింది?

అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది

మారిందా ?

మార్చావ ?

మారావ ?

ఏనాడైనా అలోచించావా  ?

నువుంటున్న సమాజంలో నువ్వంటున్న సమాజాన్ని

నీ చుట్టూ ఉన్నవాళ్ళని

నీ చుట్టూర చేరినవాళ్ళని

నువ్వు చుట్టిన వాళ్ళని

చుట్టూ చుట్టూ ఒకరి చుట్టూ చేరి

ఒకరికొకరం చుట్టు కొలతలా మారి

తిట్టుకొని కొట్టుకొని పోగొట్టుకొని

చూసినవెన్నో చూడనివెన్నో

చేసినవెన్నో చేయనివెన్నో

ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదోరకంగానో

నువ్వు నేను మనమందరం

బాధపడిన వాళ్ళం

బాధపెట్టిన వాళ్ళం

బాధ్యులం

బాధితులం

 

కవితలు

మా ఊరి "పల్లెబావి"

పాతకాలంలో మట్టిమనుషులు
చెమటతో నింపినదే
మా ఊరి "మాలపల్లె చెరువు".....

ఊరికి దోసిలితో దాహం పట్టినట్లు
ఊరి గర్భానికి తేమను దానం చేసినట్లు
చల్లని మనసుతో చలువలూరిస్తూ
ఉమ్మడి ఆస్తిగా ఊరికి వ్రాసిన వీలునామాలా ఉంది.

ఆ చెరువులో మొలిచిన
ఓ మంచి నీటిచుక్క మొక్క వరమై
ఊటకు కట్టిన గుడి
దప్పికతీరగా కోలిచే దేవత
మా మంచినీటి తల్లి
మా పల్లె బావి.

వేసవి సెగకు
ఆవిరి పగకు
ఎండే ఊరి గొంతుకు అండగా
పక్కనే కొలువున్న
పోలేరమ్మ చల్లని చూపుకు ప్రక్కగా
నిండుగా వెలిసినది ఈ  తీపిధార.

నలుదిక్కుల
గిలకల సవ్వడితో ఊరు,
పలుప్రాంతాల
కడవల అలికిడితో ఇళ్ళు,
ఉదయించే మా ఊరి ముఖంలో
చిందే సందడిదే అందమంటే.

చెరువు ఒడ్డున
కొంగలబారులా కడవల అందం,
దారిపొడవునా
కవాతు చేసే సైనికుల్లా జనం,
ఆ తీయని దృశం
ప్రతివాని గుండెలో తీపి జ్ఞాపకం.

చేతిలో చెంతాడు
నెత్తిన కుదుర్లు
బాజారు బజార్లు జట్లు జట్లుగా
ఆడవాళ్లు రంగురంగుల కబుర్లు,
కుర్రకార్ల సైకిళ్ళు జోరు,
కష్టజీవుల జంట బుంగల కావిళ్ళు

రోజులో అందరి తొలిపనిగా
ఊరు ఉరుకుల పరుగులు
ఒక సంబరాన్ని తలపిస్తుంది.
వందలపాదాలు నడిచి నడిచి
మెత్తగా మారిన పల్లె బాట
మంచినీటికి చెప్పని చిరునామాగా మారింది.

చేతికొద్ది చేదే ఊపుకు
నడుములు విరిగె గిలకల అరుపులు
వీధులన్నీ వినపడే చప్పుళ్ళతో
చట్టు చుట్టూ బావిని చుట్టేసుకున్న జనాన్ని చూస్తే తిరుణాల గుర్తొస్తుంది.

వడివడిగా పోటీపడుతూ
నీటిని తొడే ఉత్సహనికి,
నీట జారిన బిందెలు
లాగి లాగి తెగిపోయే చేతి తాడులతో
తిట్లతో కాసేపు
పోట్లాటతో మరికాసేపు అలిసిపోయి
గ్రామ పురోహితుడు గారిఇంటికీ గాలానికి పరుగెత్తటనమే
అనుభావాన్ని ఇచ్చిన
భావి ఎంత సంతోషమో?
కలిసిమెలిసే పంచుకునే
నీరు ఎంత ఆరోగ్యమో?


 

కవితలు

ఓ మనిషీ

ఓ మనిషి వదిలేయ్...

ఇకనైనా వదిలేయ్...

నీలో కూరుకపోయిన అసూయ...

నీలో పేరుకుపోయిన అమానవీయం...

నీలో సమాధి చేసిన మానవత్వాన్ని మేల్కొలుపు...

ఇకనైనా నిద్రలేపు... 

మరమనిషిని సైతం మనుగడలోకి తీసుకొచ్చిన నువ్...

నీలో మానవత్వాన్ని ఎందుకింకా శిథిలాల కింద చితకనిస్తున్నావ్...

ఓయ్ నువ్ మనిషివి కాదేమో మరమనిషివి కాబోలు ...

మనసు లేదేమో నీకు...

ఇంకేం చూడాలి నీ అహంకారం...

ఇంకెన్నాళ్లీ వ్యవస్థల బానిసత్వం...

నీ కంటిపాపకు కానరాట్లేదా...

ఆ ఊపిరాడని ఆర్తనాదాలు...

నీ అంతరాత్మ ఐనా అడుగుతా లేదా నిన్ను...

నన్నెందుకిలా బంధిస్తున్నవని...

ఊరి చివరన శేవాల కుప్పలు ఎదురుచూస్తున్నాయి...

నువ్ ఇకనైనా మారుతావా అని...

ఇంకా వేచి చూడకు....

నీలో మానవత్వం కంపుకొడుతుంది...

పాతరేస్తున్నవెందుకు నీలోని మనిషిని...మంచిని...

లే... ఇకనైనా అడుగేయ్ ....

లోపాల్ని కడిగేయ్...

నీ అడుగుకోసమే బలహీనుల బతుకులు

పొలిమేరనా ఎదుచూస్తున్నాయ్...

అమాయకపు జీవితాలు ఆగమైతున్నాయి...

నీ దాకా వస్తేనే నీదా...

మనం మనుషులమన్న...

కాసంతాయినా మనసుండాలే కదా...

లేదేం మరీ...

నువ్ అనుకుంటే కదులుతావ్...

కదిలిస్తావ్...

మరెందుకి ఎదురుచూపులు...

ఎగిరముగా కదిలిరా...

విధికి తిరగబడే సత్తా నీకున్నది...

నీ సత్తువను సంపినవా...

లేక బలవంతంగా ఉరి బిగించినవా...

ఓ మనిషి...లే మనిషి...రా మనిషి...

ఒక సామాన్యుని కంటినీరు తుడువనికి...

ఆ పేదల గుండెల్లో ధైర్యం నింపడానికి...

ఆ శవాల ఘోష... వినడానికి...

ఓ మనిషి...లే మనిషి...రా మనిషి...

 

కవితలు

కాపాడుకొందాం !

కలలోనైనా ఊహించినా ఈ

కాలం మన మీద కక్ష కడుతుందని

కిరణాలు తాకని గదిలో బంధీలు అవుతామని

కీచక కరోనా తో యుద్ధం చేయాలని  కుదేలు అవుతున్న ఆర్థిక వ్యవస్థ ఒక పక్క

కూడు గూడు లేక అల్లాడుతున్న పేదలు ఒక పక్క

కృష్ణుడు లాంటి రథసారథి కోసం వేచి చూడక

కెరటాలు లాగా మన జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నిద్దాం.

కేవలం గృహ నిర్బంధమే మన ఆయుధం

కొన ఊపిరి ఉండే వరకు కరోనా తో పోరాడుదాం

కోట్లాది మంది జనాల ప్రాణాలను కాపాడుకొందాం !

 

కవితలు

మే డే

ఎన్నో పూలు తమకు తాముగా రాలి

భావితరాలకు విత్తనాలుగా మారి

 

పేదరికానికి, శ్రామికత్వానికి

సారుప్యతలు తప్ప సరిహద్దులండవని

"ప్రపంచ కార్మికులారా ఏకంకండ"ని

ఎలుగెత్తి చాటిన దినం

 

శ్రామికత్వం,సమైక్యత్వం,సమానత్వం

ప్రపంచ ప్రగతికి ప్రదీపికలుగా

విశ్వమానవ కార్మికతత్వమే

విశ్వమానవ సౌభ్రాతృత్వమని

పిడికిలెత్తి నినదించిన దినం

నేడే..."మే" డే...

*మే 01 "మే"డే సందర్భంగా...

 

కవితలు

నేను మళ్లీ వస్తాను

భయోత్పన్నమైన స్థబ్దత

ఐ కాంట్ బ్రీత్

వీ కాంట్ బ్రీత్ గా

లక్షల ఊపిర్లు అగిపోతున్న

కరోనతో కళేబరాలు

స్మశానంలో స్థలంకై వెతుకుతున్న

చితిమంటల విస్ఫోటనం

కమరు వాసనై వీస్తుంటే

చీకట్లోని ప్రజలకి

మిణుగురులైన మిగల్చని

ఫాసిస్ట్ వేవ్ ఇది

ఆశయలకు అంకితమై

నిర్భంధాలకు నిటారుగా నిలిచి

అసమ సమాజంపై

త్యాగల ఔషధలను వెదజల్లిన

వృక్ష సముహలపై

నిషేదపు ఆజ్ఞాల్ని ప్రకటించి

నిశబ్దపు డ్రోన్లతో

మానవ హననం జరుపుతుంటే

ప్రశ్నించకుండా నేను ఉండలేను

స్వేచ్ఛ నా ఊపిరి

ప్రశ్నించడం నా హక్కు

బహిరంగ చెరసాలలో

నన్ను మాయం చేసిన

నేను మళ్లీ వస్తాను

వసంతపు చిగురునై

 (పౌర రచయిత ప్రజా విద్యార్థి సంఘలపై నిషేదాన్ని విధించడంపై నిరసన తెలుపుతూ రాసిన సందర్భం)

కవితలు

పోయెట్రీ టైమ్ - 11

రాస్తాను నిను నా కావ్యంగా..

గీస్తాను నిను నా ఊహాచిత్రంగా..

------

దివి నుంచి దిగివస్తావా దివ్యతారలా..

దివ్వెవై వెలుగుతావా నవ్యగీతిలా..

------

నీ చూపుల రహదారుల వెంట నడుస్తూ

ప్రేమలోక సరిహద్దులు దాటుతాను..

-----

నీ చిరునవ్వుల నీడల్లో ఎన్ని వసంతాలో..

నీ చిరుకోపం జాడల్లో ఎన్ని గ్రీష్మాలో..

 ------

నా ఎదను

నీ ఎదలో పదిలంగా దాచుకో..

సరాగాల ఉయ్యాల హాయిగా ఊగిపో..

సంతోషాల సందళ్ళలో మునిగి తేలిపో..

 

 

 

కవితలు

కదిలించే మనస్సు కీలుబొమ్మ 

రాజీపడని ఉద్యోగ

జీవితంలో పయనించి

అవిరాలమైన సేవలందించి

విరామం కొరకై

పదవీ విరమణ పొందిన

స్త్రీ అనుభూతుల సారమే

కదిలించే మనస్సు కీలుబొమ్మ...

 

పదవీ విరమణానంతరం

కుటుంబం సమాజాల మధ్య అనుబంధ బాంధవ్యాలను

సమూలంగా చిత్రీకరించిన

సమగ్ర సమాహార రూపం

కదిలించే మనసు కీలుబొమ్మ

ఇతరుల కనువిప్పు చేసే

స్త్రీ అనుభవాల సంఘటిత

అద్భుత గాధ....

 

అమ్మను మదింపు చేసుకునే పలకరింపుతో ...

ఈ కథ ఆరంభం అవుతుంది

 

అమ్మ గర్భం దాటొచ్చి

జగతికి పరిచయం అయ్యాను

అన్ని దశలు ధీటుగా దాటుతూ

దశలెన్నో మార్చుకుంటూ

దిశానిర్దేశం చేస్తూ

నా చివరి దశకు చేరి

నోట మాటలను చెప్పలేక రాస్తూ

మీ ఎదుట ఉంచుతున్నాను...

 

మనిషి జీవితమొక

నాటకాల జగతిలో

జాతకాల జావళి

పాలోళ్ళ మాటలు

నిజజీవిత గుణపాఠాలు...

ముసుగు వేసుకున్న మనసు

మసక బారిన కళ్ళలో

ఆప్యాయత లేని ప్రేమ...

నడవలేక నడుస్తున్న

నా జీవితం ప్రేమానురాగాల కై పాకులాడుతున్న బంధుత్వం...

 

సమయానికి సాకు లేదు ఆగడానికి

నా తపన కు మార్గం లేదు ప్రయాణించడానికి...

సాగుతోంది ఆగకుండా

నా జీవిత ప్రయాణం...

తోలుబొమ్మ సైతం హంగులన్నింటితో రంగులను

సంతరించుకొని కదలికలతో అందరిని ఆహ్లాదపరుస్తుంది...

 

కానీ జీవనోపాధి పేరిట మమతానురాగాలకు

దూరమవుతున్న

బంధుత్వమును

ఏమీ అనలేక నిరాకరించలేక

బరువెక్కిన గుండెతో

మదింపు చేసుకుంటూ

కదలని కీలుబొమ్మ లాంటిది

నా మనసు...

 

 చివరగా యువతరానికో సందేశం

 

యువతరమా ముందడుగెయ్ చదువుకున్న విలువలను

చాటి చెప్పు...

కనుమరుగవుతున్న మనుషుల

మధ్య బంధాలను బతికించు... బంధమనే విలువకు

బాధ్యతగా మెలుగు...

విశాల దృక్పథానికి

నిదర్శనమై నిలువు...

నిరాడంబరమైన జీవితానికి బాటలు వేయ్...

నిస్వార్థ సేవకు నిరంతరం

కృషి చేయ్...

సమాజ శ్రేయస్సుకు

నువ్వే ఒక దర్పణం...

సమాజాభివృద్ధి నీవే ప్రతిబింబం...

 

 

కవితలు

పొరుబాటలో ఒరిగిన అమరులకు జోహార్లు

పల్లెను విడిచి పట్నం వొచ్చినా

ఆరాటమే తప్ప ఆనందం లేదు!

అరకొర బతుకుల్లో అనాధిగా ఉన్నాను

బంధీకానను... నేను బంధీకానను...

ప్రైవేట్ దోపిడి కొలువులో బందీ కానను!

తల్లిదండ్రులను వదిలిపెట్టి

ఉద్యమంలో వెనుకడుగేసి

ఉరుకు పరుగుల బతుకుల్లోని

ప్రైవేట్ కొలువులో బంధీకానను...!

బాధ్యతలన్నీ మీదపడి బతుకుబాటలో లీనమై

సాటి మనిషిని పలకరించే తిరుకలేని బంధీకానను!

బంధుమిత్రులంతా దూరమయ్యీ

బతుకు దెరువు బాధపట్టే

అణువణువునా అనాధిగానున్న ఆప్తమిత్రులు గుర్తుకొచ్చే

రాజ్యం సృష్టించిన బతుకు బండిని నడుపుతూ

కన్నవాళ్ళకు కానరాని దూరంలో

పలువురిని పలకరించే తీరిక లేని

కృత్రిమ జీవనయానం నాది!

పుట్టిన పల్లెలో

పెరిగిన దోస్తులతో

కలిసిమెలిసి కేరింతలతో ఆడుకునే సమయం

ఎప్పుడూ వస్తుందో

ఎవరూ మోసుకొస్తారో

ఏ పోరాటం వల్ల నా "బందీ జీవితం" బద్దలవుతుందో

ఎంతేంత మంది పుడమితల్లి ఒడిలో ఒరిగిపోతున్నారో

వాళ్ళ ఉద్యమ చైతన్య అడుగులకు కన్నీటి జోహార్లు

 

కవితలు

మంచి పుస్తకం 

మంచి పుస్తకం

మా మంచి పుస్తకం

మందహాసంతో పలకరించి

మదిలో మమతను కలిగించును

మనోవికాసాన్నందించి

మంత్ర ముగ్ధులను గావించును

మధుర భావాలనందించి

మనోల్లాసం కలిగించును

మార్కెట్ విషయాలందించి

మోతుబడిని గావించును

మంచి మిత్రునిగా మన్నించి

మనో నిబ్బరాన్నందించును

ముదిమి తనంలో ముచ్చటించి

మురిపాలనందించును

మూడాచారా ముసుగు తొలగించి

మూర్తిమత్వం అందించును

మృష్టాన్నాన్ని ముందుంచి

ముసలి తనాన్ని తొలగించును

మోహము నుండి మరలించి

మోక్షము నందింపజేయును

మత మౌఢ్యాన్ని అంతం చేసి

మానవత్వాన్ని మేల్కొల్పును

మేధస్సును అందించి

మేలిమి మానవుని గావించును

మేఘ జ్యోతిని అందించి

మహాత్మునిగా మార్చ వచ్చును

అదియే అదియే అంతిమ లక్ష్యం

అమూల్యమైన పుస్తక విశిష్ఠ విజయం

 

     

కవితలు

నాకున్నది కోరిక 

నాకున్నది కోరిక

నేను రాసే రాతలు

అందరికి మేలు చేసేవిగా ఉండాలని

ఆలోచించేవారికి ఆదర్శంగా ఉండాలని

మాట్లాడేవారికి వాస్తవంగా ఉండాలని

బాధల్లోనివారికి బాసటగా ఉండాలని

నాకున్నది కోరిక

నేను రాసే రాతలు

వృద్ధునికి ఆసరనిచ్చే చేతికర్రల ఉండాలని

దేశసైనికుల గుండెదైర్యంగా ఉండాలని

విద్యార్థులకుండే క్రమశిక్షణగా ఉండాలని

ఉపాధ్యాయుడిచ్చే ఉపదేశంగా ఉండాలి

నాకున్నది కోరిక

నేను రాసే రాతలు

తండ్రి హెచ్చరించే హెచ్చరికలా ఉండాలని

తల్లి లాలించే లాలిపాటల ఉండాలని

అందరికి మంచిచేసేదిలా ఉండాలని

అందరిలోఆలోచన రేకేతించేదిలా ఉండాలని

నాకున్నది కోరిక

 

కవితలు

తెలుసు 

తెలుసు

నిప్పుకు తెలుసు

గాలి వల్ల విర్రవిగుతానని

 

దీపనికి తెలసు

గాలి వల్ల మాయమవుతానని

 

భూమికి తెలుసు

భూకంపం వల్ల బద్ధలవుతానని

 

సముద్రానికి తెలుసు

అలల వల్ల  మాయమవుతానని

 

పగలుకు తెలుసు

చీకటి వల్ల మాయమవుతానని

 

చీకటికి తెలుసు

పగలు వల్ల మాయమవుతానని

 

మనిషికి తెలుసు

మరణం వల్ల మాయమవుతానని

 

నిప్పు,దీపం,

భూమి,సాంద్రం,

రేయి,పగలు,

మనిషి  అన్నింటికి తెలుసు  వారి శత్రువేదో

శత్రువు కోసం నిరంతరాయంగా  యుద్ధం

చేస్తునే ఉన్నాయి.....

కవితలు

ఆవేదన

క్షణకాలం గడవనే లేదు

కళ్లైన తెరవనే లేదు

దరిద్రం అంటూ మొదటి పిలుపు

ఆడపిల్లే పుట్టిందని అమ్మ కి వేదింపులు

నానమ్మ,తాతయ్య దగ్గరికి రానే లేదు

నాన్నైతే ఎత్తుకోనే లేదు

 

అన్ని తానై అల్లారు ముద్దుగా

అమ్మ పెంచుకుంటున్న వేల

బడి ఈడు పిల్లలతో బడి కి పోదాం అనుకుంటే

బాధ్యత మరచిన నానమ్మ

ఆడపిల్లకు చదివేందుకు

సదివేవరిని ఉద్దరిస్తవని సూటి పోటి మాటల్తో పసి హృదయాన్ని చిదిమేస్తుంటే

ఏమి సేయలేక తల్లడిల్లుతున్న కన్న తల్లికి ఏమని చెప్పేది నే చదువుకుంటా అని

 

బండెడు చాకిరీ బుజాల కెత్తి

బానిసలా చూస్తున్నా

బాల్యాన్ని కనికరం లేకుండా

చిదిమేస్తున్నా

చదువంటే ఇష్టం చావక

చదువుకుంటా నాన్న అంటే

సదివించలేను పని నేర్చుకో అని నాన్న విసుగ్గా చీదరింపు

 

కాలమే కరుణించదా అని బాధపడుతున్న క్షణం లో అటు గా వెళ్తున్న మాస్టారు ఇటుగా చూసి చదువు  విలువ తెలిపి

చదువుకు దూరం చేస్తే శిక్షార్హులు అవుతారనే బెదిరింపుకు ఆలోచనలో పడ్డ నాన్న సర్కారీ స్కూల్లో చదువు కోడానికి అంగీకారం

పని చేస్తూ చదువు కోవాలనే షరతు పై

 

ఎలాగోలా పాఠశాలలో చేరితే పదైన పూర్తి కాకుండానే పసి ఎదపై పసుపు తాడు ఉరి తాడు లా బిగుసుకుంటున్న క్షణం భవిష్యత్తు అంధకారమైన ఆనవాళ్లు కల్ల ముందే కదలాడుతున్న సమయాన

పోలీస్ ఆఫీసర్ హెచ్చరిక బాల్య వివాహం నేరం అని

బాద్యులందరు కారాగార వాసం అనుభవించాల్సి వస్తుంది అని

 

వెనకడుగు వేసిన నాన్న వెనుదిరిగి చూడ నెలేదు

మనస్సులో సంతోష పడుతూ పై చదువులకోసం కళాశాలకు వెళ్ళిన నేను డిగ్రీ పూర్తి చేశా

 

చదువు కు సమానమైన ఉద్యోగం చేస్తూ శబాష్ అనిపిం చుకున్న నేను చిన్న ప్పటి నుండి దొరకని ప్రేమ మిత్రుడి ద్వారా దొరికినందుకు

సంతోషపడి

మనసు పడిన వాడిని

మనువాడుదామనుకుంటే

పరువు కత్తి ఏలాడే ఎదపై

 

దుఃఖాన్ని దిగమింగుతూ అమ్మ ప్రాణానికి వేల నా వివాహామంటూ నాన్న బెదిరింపుకి తలవంచిన నేను గృహిణి ఐయ్యాను

 

ముతక మాటలతో, మనస్సులో మలినంతో

చిత్ర హింసలకు గురిచేసే పెనిమిటి ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది కలహాల కాపురం హద్దు మీరుతున్నదని

 

మనువాడిన వాడు

మురిపిస్తాడానుకుంటే

మూడు మూళ్ళ బంధం

మూన్నాల్లాయ్యేనా

 

సృష్టి కి మూలం స్త్రీ అంటారు

 స్త్రీ వేదన ఆలకించే వారెవ్వరూ, ఎదగనిచ్చే వారెవ్వరూ

ఆత్మాభిమానం తో బతుకుదామనుకుంటే

అడ్డుతగిలే వారే తప్పా ఆదరించే వారే కరువయ్యారు

స్వశక్తితో పైకొద్దామనుకుంటే చీదరించుకునే వారే తప్పా చిరునవ్వుతో స్వాగతం పలికే వారే లేరు

మగవాళ్ళతో సమానంగా బతుకుదామనుకుంటే వేధింపులే ఎక్కువాయే...

మగవారు ఎప్పుడైతే ప్రతి స్త్రీ లో ఓ సోదరిని, ఓ తల్లిని ఓ చూస్తారో అప్పుడు...నిజమైన సమానత్వం లభించేది...

          

           

కవితలు

వాడా – వీడా

ఎవరోయ్ మనిషి ! ఎవడోయ్!

ఉగ్రవాదం ఉసిగొల్పిన"వాడా"

రాజకీయం రాచరికం చేసిన"వీడా",

ఎవరోయ్ ? ఎవడోయ్ ?

 

అమ్మాయిల పైనా ఆసిడ్ పోసిన"వాడా",

కన్నవాళ్లని సైతం కాటేసే"వీడా",

ఎవరోయ్ ? ఎవడోయ్ ?

 

దొంగతనాన్ని దొరతనం చేసిన"వాడా"

మంచిని మాయం చేసే"వీడా",

ఎవరోయ్ ? ఎవడోయ్ ?

 

ధరిత్రిని ధనంగా దోచే"వాడా"

ప్రకృతిని వికృతంగా చేసే"వీడా"

ఎవరోయ్ ? ఎవడోయ్ ?

 

ఎవరోయ్ మనిషి !

  ఎవడోయ్ ?

 

కవితలు

నేను

ఏ కనుల

కలల ఆకాశంలో

చిగురించని

కలను నేను

ఎంతటి

స్వేచ్ఛా గాలిలోనైనా

ఊపిరాడని ప్రాణిని నేను

నలుగురితో కలిసి

నడువలేని

నవ్వలేని

వసంతాల నుంచి

విసిరేయబడ్డ

నవ వసంతాన్ని

నేను

నేను అంటరాని వాన్ని కాదు

ఏ అంధునికి కనిపించని

అద్భుత ప్రేమని

 

 

 

కవితలు

చేయాల్సింది సమీక్షే ...

చేయవలసింది

ఉత్సవం కాదు

చేయాల్సిందిప్పుడు

సమీక్ష...

 

గతానికైన

గాయాన్ని

వర్తమాన

శిక్షని

భవిష్యత్

బాధని

 

సవివరంగా

చేయాల్సిన

సమీక్ష

 

అజ్ఞాన తాయత్తు కట్టి

జోగిని బసివిని మాతంగుల జేసీ

దేవుని కుతి దీర్చమంటూ

అందాల ఆటబొమ్మల జేసీ

కార్పొరేటోడికి తాకట్టుపెడుతూ

రంగు రంగుల ముగ్గుల్లో

విషపు పొగల

క్లబ్బుల్లో పబ్బుల్లో

ఉక్కు గొలుసులతో

బంధించి

ఉత్సవానికి పిలుస్తారు

 

మీరు వెళ్ళకండి...

మహిళ బతుకు కాదది

 

అవనియంత పరిచి

ఆకాశమంత పొగిడి

పాతాలానికేసి తొక్కుతారు

జర పైలం....

 

కొత్తగా పుట్టింది కాదిది

మనువాద పితృస్వామ్యం

నీపై చేసిన ఆధిపత్యం

కత్తుల్తో చర్మమొలిచినట్టు

హక్కులన్నీ ఒక్కటొక్కటిగా

కాల్చేసింది పూడ్చేసింది

 

కట్టు కథలు కుట్ర కథలు

రోత పురాణాలు

పతివ్రత మంత్రమేసి

పరువును ఆపాదించి

గడప దాటకుండా

సూదిమొనల గీత గీసింది

 

బాల్యంలో

తండ్రి దగ్గర

యవ్వనంలో

భర్త దగ్గర

వృద్ధాప్యంలో

కొడుకు దగ్గర

బ్రతుకంతా

మగాడి బ్రతుకు కిందాని

ఆదేశించింది

 

కన్యాశుల్కం

సతీ సహగమనం

వితంతు విహహ రద్దు

దాసీ వ్యవస్థ

ఒక్కటి కాదు లెక్క లేనన్ని

దురాచారాలు...

తీసిన ప్రాణాలు

ఏ మట్టిని తాకినా చెప్తాయి

 

తరాల కాలగమనం జరిగింది

ప్రాణమొక్కటే మిగిలినప్పుడు

పోరాటమే సరైంది...

ఎందరో వీరవనితల పోరు ఫలితం

ప్రపంచ స్వేచ్ఛా పోరాటం...

నియంతల పాలననణిచి

శ్రమ దోపిడి లేని

ఎట్లాంటి భేదాలే లేని

అందరూ సమానంగా బ్రతికే

ప్రజా స్వపరిపాలనకోసం

త్యాగాలు కోకొల్లలు

 

మహిళా ప్రత్యేక చట్టాలు

చుట్టూ రక్షణ వ్యవస్థ

శాస్త్ర సాంకేతిక వృద్ధి

అన్నీ రంగాల్లో భాగస్వామ్యం

 

 అయినా ఏం మారింది

 

పట్ట పగలే పసిపిల్ల మొదలు

పండు ముసలి పై అత్యాచారాలు

అక్షరాస్యత ఎంతున్న

మనువు మూర్ఖత్వం తలకెక్కిచేసే

గృహ హింస వరకట్న వేధింపులు

వేల సంవత్సరాల ....