సంపాదకీయం

మిత్రులారా,

గత మూడు  నెలలుగా మీరందరూ గోదావరి అంతర్జాల పత్రికను చదువుతున్నందుకు, రచనలు పంపి  ప్రోత్సహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.

విభిన్న ఆలోచనలు నిర్దిష్ట కార్యాచరణకు దారితీస్తాయి. కార్యాచరణే మనిషిని అర్థం చేసుకోవడానికి గీటురాయి.

ప్రతి సమస్యకి పరిష్కారం సమాజంలోనే దొరుకుంతుంది. ఎందుకంటే ఆ సమస్య సమాజంలోనే ఆవిర్భవించింది కనుక. సమస్యలకు దూరంగా మనగలిగే గలిగే వాళ్ళు ఎవరుా ఉండరు. ఉంటే ఆ మనిషికి ఆలోచనలు లేవన్నమాట.  అసలు ఆలోచనలు లేని మనిషి జీవచ్చవమే కదా. సమస్యలకు భయపడి పారిపోవడమో ఎదురు తిరిగి పోరాడడమో  అనివార్యం. ఎవరు ఎలాంటి వారనేది సమస్యలు  ఎదురయినపుడే తెలుస్తుంది. నమ్మిన విలువల కోసం నిలబడ్డ అట్టాడ అప్పలనాయుడు అనుభవాలను ఈ సంచికలో  మీకందిస్తున్నాము.

విభిన్న సమాజాల ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి, అనువాద సాహిత్యం అత్యంత్య కీలకం.  విస్తృతంగా అనువాద సాహిత్యం ఫై శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నదని గోదావరి భావిస్తున్నది. అందువల్లనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ అనువాదకుడు జిల్లెల్ల బాలాజీ గారి అనుభవాలను మీకందిస్తున్నాము.

కాత్యాయనీ విద్మహే గారు తెలుగు సాహిత్యంలో స్త్రీలు చేసిన కృషిని అందించే ప్రయత్నం చేస్తున్నారు.

విలువల కోసం నిలబడ్డ వాళ్ళ ఆకలిని సామాన్య మానవులు తమ ఆకలిని చంపుకొని కూడా తమకు తెలియకుండానే తీర్చిన విధం ‘అలక’ కథలో అల్లం వీరయ్య చిత్రిస్తే నమ్మిన ఆదర్శాల ప్రచారంలో  అమరుడయిన  కళాకారుని  కుటుంబ జీవితాన్ని ‘డప్పోడు’ కథలో చంద్  చిత్రించాడు.

విలువయిన పుస్తకాల మీద ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న విమర్శకులు వ్రాసిన వ్యాసాలు అందిస్తున్నాము.

అవసరాలకు మించి ఉత్పత్తి జరుగుతున్న కాలంలో  ప్రపంచ వ్యాప్తంగా  విధ్వంసమవుతున్న విలువల ఫలితమే కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవం. ఇట్లాంటి  సమస్యలు తలెత్తినపుడే వ్యక్తుల, సమూహాల, దేశాల కార్యాచరణ, నాగరికత  బయట పడుతుంది.

ఎన్ని ఆటంకాలు...ఎదురయితేనేమి  నిలబడడం నేర్చుకోవాలి.  అడ్డంకులు ఎదురయిన ప్రతిసారి సంయమనంతో వ్యవహరిచడం, ముందుకుపోవడం ప్రకృతి నుండి మనిషి నేర్చుకున్నవే.

ఆలోచనలను  నిర్భంధించాలని ప్రయత్నిచడం ప్రజాస్వామిక లక్షణం కాదు.

నిలబడ వలసినవాడు నిలబడకపోవడానికి కారణాలు వెతుక్కోవలసిన సందర్భంలో  ప్రజల తరపున వకాల్తా పుచ్చుకున్న గోదావరి సమాజం పట్ల బాధ్యత ఉన్న వారందరిని సాహిత్యం ద్వారా ఏకం చేసే ప్రయత్నం చేస్తుంది.

ముఖ్యంగా మహిళల ప్రత్యేక సంచికకు మీరు అందజేసిన ప్రోత్సాహం మరవలేనిది.

సామాజిక పరివర్తన సాహిత్యం కళల ద్వారానే సాధ్యమని నమ్ముతూ మీతో  కలిసి నడిచే ప్రయాణంలో ఎల్లప్పుడూ మీరు అందించే ప్రోత్సాహమే పత్రికా నిర్వహణకు ప్రేరణ అని సవినయంగా తెలియచేస్తున్నాను.

విలువైన రచనలకు వేదిక కావాలన్నదే సాహితీ గోదావరి అంతర్జాల పత్రిక ప్రధాన లక్ష్యం. అన్ని ప్రాంతాల నుండి సీనియర్ యువ కొత్త రచయితల నుండి రచనలు కోరుతున్నాం.మీ మిత్రులకు గోదావరిని పరిచయం చేయండి. పత్రిక తరపున వారి నుండి రచనా సహకారాన్ని కోరండి .కొత్త రచయితలకు కొత్త రకం రచనలకు ఎప్పుడూ  ఈ పత్రికలో స్థానం ఉంటుందని తెలియచేస్తున్నాను.

మీతో కలసి చేసే ఈ ప్రయాణంలో మీ యొక్క సహాయ సహకారాలను  అందించాలని, ఈ పత్రికను మీ మిత్రులందరికీ పరిచయం చేయాలని, ఎప్పటికప్పుడు మీ విలువైన సూచనలు సలహాలు అందజేయాలని   కోరుకుంటూ ..                                                                                 

సంపాదకవర్గం

ఈ సంచికలో...                     

Aug 2022

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు