మా రచయితలు

రచయిత పేరు:    గట్టు రాధిక

కథలు

ఎండిపోతున్న రొమ్ములు

"ఎల్లిపోవే...ఎల్లిపో...నువ్వెల్లిపోతే నాకు వందమందొస్తరు.నీ అయ్యకు ఫోన్జేసి రమ్మను.నువ్వేం తీస్కొచ్చినవని నీల్గుతానవ్? పోరన్ని ఇక్కడ్నే ఒదిలి,పొళ్లను తీస్కొనిపో... పొళ్లసుత వద్దంటే ఈన్నే ఒదిలిపో...దానికి పాలియ్యడానికి నీకేమన్న చాతనైతదా...ఇద్దరి పోరగాండ్లను మా అమ్మనే జూస్కుంటది" అని గట్టిగట్టిగ పొద్దుగళ్ల లేవడంతోనే మళ్ల లొల్లి మొదలుబెట్టిండు.

మా పెండ్లయ్యి నాలుగేండ్లయ్యింది.

పెండ్లిల ఒప్పుకున్న కట్నంలో ఇంకో నలభై వేలు ఇచ్చేదున్నది.ఇద్దరు పిల్లల కాన్పు మీద తులం బంగారం బెట్టమని మా బాపునడిగిండు.అవియ్యట్లేదని నా మీద రోజుకో దాడి జేసుకుంట నా ఒళ్లును...నా మనసును...నా బతుకును ఇరిచేస్తాండు.

                                                                                                **

బాపు రోజు కూలిపని జేసి ఇల్లునెళ్లదీసుకుంటొస్తాండు.అమ్మ బీడీల పని జేసేది. వాసన పడక లంగ్స్ కి ఇన్ఫెక్షనొచ్చింది.ఆరునెల్లు చాన ఇబ్బంది పడ్డది.డాక్టర్ దగ్గరికి తీస్కపోతే బీడీల పనిని బంద్జేయమన్నడు.అమ్మ తప్పని పరిస్థితులల్ల ఇంటికి ఆసరయ్యే పనిని బంద్జేసింది.నా తర్వాత ఒక శెల్లె,ఇద్దరు తమ్ముళ్ళున్నరు.పొద్దుగాళ్ల ఆరుగంట్లకే అమ్మ పెట్టిన సద్ది పట్టుకుని అడ్డమీదికి పోయి పని దొరికితె పనిని జేసెటోడు.బాపు ఒక్క శెయ్యితోనే ఇళ్ళంత గడిశేది.నా పదోతరగతి తర్వాత సదువొద్దని ఇంట్లనే ఉంచిండ్రు.ఉట్టిగనె ఉండటం ఇష్టం లేక కుట్టుమిషన్ నేర్చుకోడానికి ఎళ్లేదాన్ని.

ఏమే... మన స్వప్నకు మంచి సంబంధమున్నదని,నిన్న పనికాడ ఎంకన్న జెప్పిండు.నీకు నిన్న జెప్పడం మర్శిపోయ్న...ఏమంటవే నచ్చుతె పెండ్లి జేద్దమా స్వప్నకు" అని బాపు అమ్మకు జెప్పుతాంటే నేను గిన్నెలు తోముతాంటే ఇనబడ్డది.

"సరేనయ్య జేద్దము...మన పాలుకొచ్చిన పది గుంటల పొలం అమ్ముదాం...ఎవలన్న కొనేటోళ్లున్నరో మా అక్క కొడుక్కి జెప్పు.వాడు రెండేండ్ల నుండి రియలెస్టేట్ బిజ్నెస్ జేస్తాండని అక్క జెప్పింది. బిజ్నెస్ తోటే పెద్ద ఇల్లు గట్టిండని,వాడు ఇండ్లళ్లకొస్తాండని పిలిస్తే పోయినప్పుడు సుట్టాలందరు ఇల్లు జూసి వాని గురించే శెవులు గొరుక్కున్నరు" అని అమ్మ బాపుతో ఉన్న పది గుంటల పొలాన్ని నా పెండ్లి కోసం తీసెద్దమని జెప్పుతాంటే నా గుడ్లల్ల నీళ్లు తిరిగినయి. పదిగుంటల పొలాన్నమ్మితే శెల్లెకు, తమ్ముళ్లకెట్లననే రందెక్కువయ్యింది నాకు. నన్నడిగితే పెండ్లి జేస్కోనని జెప్పుదామనుకున్న.గానీ..అమ్మ,బాపు ఇద్దరూ అడగలేదు.

 

"బాపూ...ఎంకన్న మామ లైన్లున్నడు మాట్లాడు" అని పెద్ద తమ్ముడు బాపుకి ఫోనిచ్చిపోయిండు.నేనక్కడ్నే కూసున్న జాకెట్ పంపకం జేసుకుంట.

"...జెప్పుర ఎంకన్న? ఏం సంగతులు?"

"రాజయ్య బావా మొన్న జెప్పిన గద మన స్వప్నకో సంబంధమున్నదని,వాళ్లు ఫోన్జేసిండ్రు ఎప్పుడు రావాల్నని...ఏం జెప్పమంటవ్ వాళ్లకు".

" నిన్ననే మీ అక్కకు నువ్వు జెప్పిన సంబంధం గురించి జెప్పిన్రా...అక్క గూడ సరేనన్నది.ఎల్లుండి ఆదివారం రమ్మన్రా.."

                                                                                                                **   

అబ్బాయోళ్లకు నేను నచ్చిన్నని సూడొచ్చిన రోజే మాటముచ్చట గానిచ్చిండ్రు.లక్ష రూపాయలు పెండ్లికియ్యాల్నని,యాభై వేల రూపాయలు దీపాళి కట్నంగ బెట్టాల్నని పెద్దమనుషులు పెండ్లిని సెట్ జేసిండ్రు.ఎంటనే అబ్బాయికొక టవళ్ గప్పి మనోడనిపించుకున్నరు.పెండ్లి ముహుర్తం పన్నెండ్రోజులల్లనే ఒచ్చింది.

అబ్బాయి పేరు రవి.సెల్ ఫోన్ రిపేర్ షాప్ల పనిజేస్తడట,సిటీల సొంతిళ్లున్నది.

ఒక్క శెల్లె,ఒక్క తమ్ముడు.శెల్లె పెళ్లయ్యి యాడాదైంది.తమ్ముడేమో డిగ్రీ సదువుతాండట.తండ్రేమో ఇంటీరియర్ డిజైనింగ్ పనిజేస్తడట.మంచి కుటుంబం లాగనె ఉన్నదని అక్కడికొచ్చిన పెద్దమనుషులంతా అనుకున్నరు.

వాళ్లందరట్ల మాట్లాడుకుంటాంటే ...నాకు పెండ్లైనాక సిటీల సొంతింట్లోకి పెద్ద కోడలిగ పోతనననే గర్వం కొంచెం మనసుకి తగిలింది.ఇంత మంచి సంబంధం నాకొచ్చిందంటే,మూడేండ్ల నుండి ఉంటాన మంగళవారం ఒక్కపొద్దు మహత్యం లాగన్పిచ్చింది.

అనుకున్నట్లు గానే పెండ్లయ్యింది.

ఇంట్లకి ఒక కొత్త మనిషి కోడలుగా బంధాన్ని తగిలించుకొని వచ్చిందన్న సంబురంలో మూన్నెళ్లు మంచిగ జూస్కున్నరు.మూన్నెళ్లలోపే రెన్నెళ్ల కడుపొచ్చింది.ఒళ్లంత నీరసంగుండేది...

ఏం తిన్నా అంతకు రెట్టింపు కక్కుకునేదాన్ని. పని గూడా జేసే ఓపికుండకపోయేది పది రోజుల తర్వాత అత్త నుండి సూటిపోటి మాటలు రాలసాగాయిఈయనేమో ఎప్పుడు సూడు రోగమొచ్చిన దానిలాగుంటవని కసిరించుకోడం మొదలుబెట్టిండు.

ఒకదిక్కు నాలోపల పిండం పెరుగుడు...ఇంకోదిక్కు మొగుడు,అత్త,మామ,అప్పుడప్పుడని వచ్చి నెలల తరబడి ఇంట్లనే తిష్ట వేసే ఆడిబిడ్డ సాధింపులుండేయి.అటీటనే సరికి దీపాల పండగొచ్చింది.

పెండ్లికొప్పుకున్న యాభై వేల రూపాయలు రడీ జెయ్యమని మా పెండ్లికి మధ్యవర్తిగున్న ఎంకన్న మామకి మా మామ ఫోన్జేసి జెప్పిండుబాపు దగ్గర నయాపైస గూడ లేదు.వాళ్లు ఇంటిళ్లిపాది బతకడమే కష్టమైతాందిఇదే ముచ్చట మా మామకి బాపు ఫోన్జేసి జెప్పిండు.

అప్పట్నుండి నన్ను అమ్మోళ్లింటికి పోనియ్యక పోయేది.నోటికెత్తొస్తె అంత అత్త తిట్టడం... ఈయనమే ఉట్టి మనిషని గూడా సూడకుండ కొట్టెటోడు.

పొద్దులు బడ్డయ్ ...రేపో మాపో డెలివరీ అయితదని డాక్టర్ జెప్పింది.ఫస్టు కాన్పును తల్లిగారోళ్లే జేయాల్ననే ఒక రూలుండేసరికి...బాపు పదివేలన్న వీళ్ల శేతులల్లబెట్టి తీస్కపోదామని అప్పుజేసి పట్టుకొచ్చిండు.బాపుతోని అమ్మ గూడా వచ్చింది.వాళ్లిద్దర్ని జూసేసరికి వీళ్ల నోర్లకు ఎక్కడ లేని స్వాతంత్ర్యమొచ్చింది.ఎవర్కి తోశినట్టు వాళ్లు తిడ్తనే ఉన్నరుమా ఆడపిల్లను ఇంటికిచ్చినోళ్లమని అమ్మ బాపులు వాళ్ల తిట్ల పురాణంను భరిస్తనే ఉన్నరుచివరికి నన్ను వాళ్లతో ఎల్లడానికి ఒప్పుకున్నరు.

నార్మల్ డెలివరినే అయ్యింది.కొడుకు పుట్టిండురోజులు గడుస్తున్నకొద్ది పెట్టుబోతల మోత గూడా పెరుగుతనే ఉన్నది.మిగిలిన కట్నం నలభై వేలు ఇచ్చేవి అట్లనే ఉన్నయి. నాలుగేండ్ల నుండి గివే లొల్లులుఇష్టమొచ్చినట్లు కొట్టుకుంట అమ్మనా బూతులు తిట్టెటోడు ఈయనపండక్కి తీస్కపోదామని బాపొచ్చినప్పుడల్లా ఇంటిళ్లిపాది ఎగపోసుకుంట తిట్ల దాడి జేసేటోళ్లు.పండక్కి పోయొచ్చినాక నన్ను ఇష్టమొచ్చినట్లు సాధించెటోళ్లు.ఇదంత భరించలేక ఇగ పండక్కి పోవడం గూడా నేను బంద్జేసిన.

                                                                                                **

ఇప్పుడు రెండోసారి గూడా అలకటి కాన్పే అయ్యింది. సారి బిడ్డ పుట్టింది.గానీ చాన బ్లీడింగ్ అయితాందని డాక్టర్ ఇంకో అయిదు రోజులు హాస్పిటల్ లోనే ఉండాలన్నది.

"నీ అమ్మను,బాపును ఫోన్జేసి పిలిపిచ్చుకో ...నీకేమన్న సాకిరి జేయడానికున్నమా నా కొడుకు ,నేను.." అని మా అత్త డాక్టర్ అటేటు పోంగనె లొల్లి మొదలుబెట్టింది. ఈయన జరిగేదంత తమాష లాగ జూసుకుంట నిల్సున్నడు గానీ...ఒక్క మాట మాట్లాడ్తలేడు. పండేటప్పుడు పెళ్లాం గావాలె..! పిల్లల్ని కనడానికి పెళ్లాం గావాలే...! కొట్టడానికి...నోటి దూలంత పోయేట్టు అమ్మ నా బూతులు తిట్టడానికి..అన్నిటికీ పెళ్లమే గావాలే...!!!!! పనిమనిషికైన ఇంత గౌరవం, రెస్టుంటదేమో గానీ నాకైతె రెండు దొరకవు వీళ్ల దగ్గరఅసలు నేను మనిషినా...లేక వీళ్లు మనుషులా అనే అనుమానం అప్పుడప్పుడొస్తుంటది.

"అమ్మా... బాపుని తీస్కొని రావే,డాక్టర్ అయిదు రోజులుండాలన్నది హాస్పిటల్ లోనే...చాన బ్లీడింగ్ అయితాంది.నా కండ్లకంత చీకటొస్తాంది.అస్సలు చాతనైతలేదు.ఒళ్లంత పచ్చిపచ్చిగున్నది. అయిదు రోజుల తర్వాత ఇంటికి తీస్కపోండ్రి. నెల్రోజులు ఆడ్నే ఉంటనె..." అని అమ్మతో మాట్లాడుతాంటే ఏడ్పు ఆగట్లేదు.

"సరేనే ...బాపు ఇప్పుడే బయిటికి పోయిండు.బాపు ఇంటికి రాంగనె ఇంటిపక్క గోపన్న ఆటోను డైరెక్ట్ హాస్పిటల్ కే మాట్లాడుకొనొస్తాం.నువ్వు జర నిమ్మలంగుండు.అసలే బాలింతవు. ఎక్కువ ఆలోచించొద్దు...ఏడ్వొద్దు బాగ తల్కాయ నొస్తదే స్వప్న " అని నా ఏడ్పునిన్న అమ్మ గొంతు గూడా ఏడుస్తనే ఉన్నది.

                                                                                                ***

నేను అమ్మోళ్లింటికి హాస్పటల్ నుండే చిన్నోడిని సుత తీస్కొని పోయ్నా. పదిరోజుల తర్వాత మా అత్తను తీస్కొని ఈయ్నొచ్చిండు.కొద్దిసేపు కూసున్నరిద్దరు.అమ్మ బాపు శేతులు గడుక్కోండ్లి భోంచేద్దురని మూన్నాల్గు సార్లన్నా సప్పుడు జేయలేదు.

వాళ్లున్నంత సేపు చిన్నోడు మా అత్త ఒళ్లోనె కూసున్నడు.వాన్ని కిందికి దింపి పోదామని ఎల్తాంటే చిన్నోడు నేనొస్తనని బాగా ఏడ్చిండుఇగ వాన్ని గూడ వాళ్లతోనే తీస్కపోయిండ్రు.

చిన్నోడు నన్నొదిలి ఎప్పుడుండలేదు.

పొద్దాక మంచిగనే ఆడుకునేదట..‌! రాత్రి పండేటప్పుడు మాత్రం నాలుగైదు రోజులు నిద్రపోకుండ అమ్మ పోతనని ఏడుస్తాంటే ఈయన ఫోన్ల మాట్లాడిచ్చెటోడు.మాట్లాడి..మాట్లాడి అట్లనే పండెటోడువానికిప్పుడు మూడేండ్లు గూడ నిండలేదు.

మాటలిప్పుడిప్పుడే వస్తానయ్...ఏదో ఒకటి ఎప్పుడు మాట్లాడ్తనే ఉంటాడు.

రోజుకు మూన్నాల్గు సార్లు ఈయన ఫోన్జేసి బిడ్డ పుట్టింది గద...ఏం బెడ్తరో అడగమని ఫోన్లనే బండ బూతులు తిట్టెటోడు.

అటీటనంగ ఇరవై ఒక్కటొచ్చింది.

"స్వప్న ..మీ అత్త మామను,అల్లున్ని పిలిచి ఇంట్లమందమే అంగి కుల్ల తొడిగి బుడ్డ దానికి ఇరవై ఒక్కటి జేత్తనే...అంతకంటె నా దగ్గరెళ్లదు.నువ్వు సూత్తనే ఉన్నవు గదా!పూట పూట ఎట్ల జరుగుతాందో...బుడ్డ దానికి నెలొచ్చెదాక నువ్విక్కడ్నే ఉండు. తర్వాత మీ అత్త గారింటికి ఎల్లిపోదువు గానీ..." అని బాపు గుడ్లల్ల నీళ్లు దీసుకుంట ఇంట్లున్న పేదరికాన్నంత నా ముందరబోసిండు.

ఇరవై ఒక్కటి బాపన్నట్టే జరిగింది.మా అత్తమామ బండి మీద,ఈయనేమో కొడుకును తీస్కొని ఇంకో బండి మీద...

రెండు బండ్ల మీదొచ్చిండ్రు.కార్యక్రమం తొందర్గనె కానిచ్చిండ్రువాళ్లంత తిన్నరు.

ఇగ సాయంత్రం తిరిగెళ్లేటప్పుడు మళ్ల లొల్లి మొదలుబెట్టిండ్రు.మిగిలిపోయిన కట్నం నలభై వేలకు రెండు పైసల సొప్పున మూడేండ్ల మిత్తి గట్టియ్యాలని...! కొడుకు పుట్టినప్పటివి,

ఇప్పుడు బిడ్డ పుట్టినందుకు పెట్టుబోతల కింద తులం బంగారం పెడ్తనే నీ బిడ్డను తీస్కపోతనని ఇష్టమొచ్చినట్లు తిట్టుకుంట చిన్నోడిని తీస్కొని ఎల్లిపోయిండ్రు.

నాల్గైదు రోజులు ఫోన్ గూడా  జెయ్యలేదు.రోజు రాత్రి చిన్నోడితో మాట్లాడించెటోళ్లు.వాడు నాతోని మాట్లాడినంకనే పండుకునెటోడు.

ఇప్పుడెట్లున్నడోననే బెంగెక్కువైంది నాకు.వాడు అర్థంగాని భాషలో ముచ్చట జెప్పుతాంటే నాకు స్వర్గంలో ఉన్నట్లనిపించేది.వాని నవ్వులు,వాని ముచ్చట మిస్సైపోతాననిపించింది.

ఉండబట్టలేక ఇగ నేనె రోజు ఈయనకు ఫోన్జేసి మాట్లాడిన.

"చిన్నోడితో ఫోన్ ఎందుకు మాట్లాడిస్త లేవు? ఎల్లుండి వచ్చి నన్ను తీస్కపో...

చిన్నదానికి నెల నిండుతది.రెండో కాన్పు అత్తగారే జూస్కోవాలే...అయినా వీళ్లింటికొచ్చిన.నెలరోజులు జేసిపెట్టిండ్రు.

ఇంకా ఈన్నే ఉండాల్నా...మనకు పెండ్లై నాలుగేండ్లయ్యింది...ఇంకా పెట్టుబోతలనుకుంట లొల్లి బెడ్తానవ్! నీళ్ళు లేనికాడ నీళ్ళు తోడమంటే ఎట్ల తొడ్తరనుకుంటానవ్?నువ్వు మగోనివే గదా...ఇద్దరు పిల్లలు పుట్టిండ్రు.ఇప్పుడు నీకో సంసారమున్నదన్న సోయి ఎప్పుడొస్తది...!?" అని నా బాధను, ఆవేశాన్నంత మొదటి సారి ఈయన మీదగక్కిన.

"ఏంటే...మాటలెక్కువొస్తానయ్? సావగొడ్త ముండ నక్రాలు జేస్తే ? ఏం బెట్టిండ్రే నీ అయ్యవ్వ అంత నీల్గుతానవ్ ముదనష్ఠపు దానా...నా కోసమెన్నో మంచి మంచి సంబంధాలొచ్చినయ్...

గవన్నీ కాదని నిన్ను జేస్కునుడు నాకు శనిపట్టినట్టయ్యింది..." అని నోటికొచ్చినంత తిట్టి ఫోన్ ను పెట్టేసిండు.

ఆయన తిట్లకి నా శెవులు,నా మనసు అలవాటు పడ్డదేమో...!తిట్టినందుకు కోపం రాలేదు...బాధనిపించలేదు.నవ్వు మాత్రం వచ్చింది....

                                                                                                **

నన్ను జూసిన రోజే పెండ్లి ఖాయం జేస్కొని,పన్నెండు రోజుల్లోనే పెండ్లి జేసిండ్రు.రవి ఇంటికి పెద్దకొడుకు సిటీల ఉంటాండ్రు.సొంతిల్లున్నది,

ఉన్నకాడికి మంచిగనే బతుకుతాండ్రు.

వాళ్లనుకుంటే ఎక్కువ కట్నాలిచ్చెటోళ్లే దొరుకును..! ఇదంతొదిలి ఏంలేని మా సంబంధమే ఎందుకు గావలనుకున్నరనే అనుమానం బాపుకి మా పెండ్లైన కొత్తల లొల్లులు మొదలైనప్పుడు పెండ్లి కుదిర్చిన ఎంకన్న మామను నిలదీసిండట.అప్పుడు నమ్మలేని నిజాలు బయటపడ్డయి! అప్పటికే నాకు నలుగున్నెళ్ల కడుపు.పెండ్లి జెయ్యటానికే ఉన్న పదిగుంటల పొలానమ్మిండు.ఏం జెయ్యలేక అప్పట్నుండి కంటికి పుట్టెడు దుఃఖంతో నా పరిస్థితిని తల్సుకుంట మింగుకుంటున్నడు బాపు.

పెండ్లి గాకముందు ఈయనొక అమ్మాయిని లవ్ జేసిండు.ఇద్దరు గలిసి రెండేండ్లు బాగ తిరిగిండ్రు. అమ్మాయికి రెండు సార్లు కడుపొస్తె అబార్షన్లు చేయించిండు.ఇంట్ల విషయం తెల్సి కులం తక్కువ దానితో తిరుగుడు...

పండుడేందిరా ?? అని బాగ తిట్టిసస్తమని బెదిరిచ్చిండ్రట మా అత్తమామ.

ఎంటనె పెండ్లి జెయ్యాలని సంబంధాలు సూడటం మొదలుబెట్టిండ్రు. ఒకటి గొప్ప సంబంధమే ఒచ్చింది.మాట ముచ్చట గూడ జరిగింది. విషయం అమ్మాయికి తెల్సి ఇంటి ముందుకొచ్చి బాగ లొల్లి జేసింది. అమ్మాయి జేసిన లొల్లితో వాడ మీద,సుట్టాలకు,చివరికి సంబందమోళ్లకు గూడ తెల్సింది. సంబందం ఎత్తిపోయింది.వాడ మీద,సుట్టాలల్ల పరువుపోయింది.

ఎంకన్న మామ,మా మామ దగ్గర అప్పుడప్పుడు పనిజేసెటోడు. పరిచయంతో ఒక సంబంధం సూడమని మా మామ జెప్పితే...నన్ను,మా కుటుంబాన్ని దృష్టిలో బెట్టుకుని సంబంధాన్ని కుదిర్చిండు.ఇండ్ల ఎంకన్న మామను గూడ తప్పు పట్టాల్సిందేం లేదు.ఇంత జరిగినంక వీళ్లు మారకపోతారా ...! ఇంటికొచ్చిన కోడల్ని మంచిగ జూస్కోక పోతారా అని ఆలోచించి పెండ్లిని కుదిర్చిండు. ఇప్పుడు వీళ్ల తతంగాన్ని జూసి ఎంకన్న మామ బాధతో మాకు మొఖమే సూపెడ్తలేడు.

                                                                                                **

చిన్నదానికి నెలనిండిన తెల్లారి గోపన్న ఆటోను ఇంటికి డైరెక్ట్ మాట్లాడుకొని చిన్నదాన్ని తీస్కొని ఒక్కదాన్నే వచ్చిన.అమ్మ నాతోబాటు వస్తనన్నది, గానీ నేనె వద్దన్నా.ముందురోజు ఫోన్జేస్తే.. ఫోనెత్తలేదు ఈయన.నేను రేపు ఇంటికొస్తానని మెస్సేజ్ పెట్టిన జూస్కొనే ఉంటడు.

ఇంటిముందు ఆటో దిగంగనే చిన్నోడు నా దగ్గరికి అమ్మా...అమ్మా అనుకుంట ఉరికొచ్చిండు.వాన్నలా సూడంగనే నాకు దుఃఖమాగలేదు.దాదాపు పది రోజులైంది వానితో మాట్లాడక.వానికి నేను యాద్కుంటనో లేదోననే బెంగెక్కువయ్యే ఒక్కదాన్నే వొచ్చేసిన.వాడు అమ్మా ...అమ్మా అనుకుంట ఉరికొచ్చి నా కొంగుబట్టుకొని శెల్లెను సూపెట్టు...శెల్లెను సూపెట్టమని ముద్దుముద్దుగంటాంటే నాకప్పుడర్థమయ్యింది తల్లికి బిడ్డకున్న పేగుబంధాన్ని ఎవ్వరు మరిపించలేరని.

ఒక శేతిల బ్యాగు,ఇంకో శేతిల చిన్నది,నా కొంగుపట్టుకొని  ముచ్చటజెప్పుతున్న చిన్నోడు.మెల్లగ నడ్సుకుంట ఇంట్లకొచ్చిన.గుండెలంత భయంభయంగున్నది.ఇంట్ల ఎవ్వరి పనులల్ల వాళ్లున్నరు.ఎవ్వరేం మాట్లాడలేదు.నేను మా రూం కెళ్లి బ్యాగు పక్కనబెట్టి, బెడ్ మీద చిన్నదాన్ని పండబెట్టిన.అది నిద్రపోతాంది.నా పక్కనే ఉన్న చిన్నోడుని ఎత్తుకొని ముద్దాడుతుండగ ఈయనొచ్చి...

"ఎందుకొచ్చినవే నువ్విక్కడికి? ఆడ్నే పడి సావక ముండా..." అని తిట్టుకుంట ఎనకనుండొచ్చి ఈపు మీద తంతె నేను చిన్నోడు బెడ్ మీద బోర్లబొక్కల పడ్డము.చిన్నోడు భయపడి గట్టిగ ఏడ్చెసరికి,నిద్రపోయ్న చిన్నది గూడ లేచి ఏడ్వసాగింది.ఎంటనే మా అత్తొచ్చి అక్కడ్నుండి ఆయనను తీస్కపోయింది.

రోజు రాత్రి తాగొచ్చుడు తిట్టుడు,కొట్టుడుఅసలే బాలింత ఒళ్లు...

దెబ్బలకు ఒళ్లంత పచ్చిపుండు లాగయ్యేది.రాత్రంత చిన్నది నిద్రపోదు...తెల్లారుగట్ల ఎప్పుడో నిద్రపోయ్యేది.ఒంట్ల నొప్పులన్నీ ఎర్రటి నిప్పుల్లాగ మండేయి.చిన్నదాన్ని పడుకోబెట్టుకుంట నేనెప్పుడు నిద్రపోయేదాన్నో సోయుండేది గాదు.పొద్దున లేట్ లేస్తే అత్త బూతుల పురాణం మొదలయ్యేది.

చిన్నదానికి మూన్నెళ్లొచ్చినయి.పాలు బాగా తాగుతాంది.ఇంట్ల పనుల మీద పడి తిండి సరిగ తినకపోయేదాన్ని.

తినాలంటె భయం.తింటాంటె వచ్చి "దున్నపోతులాగ తిని బలుస్తానవ్...నీ అయ్య సొమ్మా నువ్వు తినేదేమన్న...!?" అని తిట్టెటోళ్లు.చిన్నది బాగ పాలు గుంజుతుండేసరికి ఆకలి బాగయ్యేది.

ఒక్కోసారి పని జేసుకుంట కండ్లు తిరిగి పడిపోయేదాన్ని.వారం రోజుల్లనే పాలు తగ్గిపోయ్నయి.చిన్నదానికి కడుపునిండక  బాగ ఏడ్వడం మొదలుబెట్టేది ఏడుపు వీళ్లకొక అవకాశంగ మారి ఇంక బాగ తిట్టెటోళ్లు.అదే టైంల కరోనా లాక్డౌన్ మొదలైంది.మా వాడంతా రెడ్ జోన్ ఉన్నది.

లాక్డౌన్ లేకముందు ఈయన పొద్దాక పనికి పోయినప్పుడన్న జర నిమ్మలంగుండేది నాకు.రెండు నెలలు లాక్డౌన్ వచ్చేసరికి అందరు ఇంట్లనె ఉన్నరు. రెండు నెలలు గూడ రోజుకో రకమైన నరకాన్ని సూపెట్టిండ్రు.వారంల నాల్గురోజులు అలారం మోగినట్లు రాత్రిళ్లంత నిద్రపోనీయకుండ ఏదో ఒక కారణాన్ని లేపి కొడ్తనే ఉండేది.పిల్లలు నిద్ర నుండి ఉలిక్కిపడి లేసి ఏడ్చినా గూడా కొట్టడం ఆపకపోయేది. లొల్లంత ఇనబడ్డ గూడ అత్తమామొచ్చి ఆపెటోళ్లు గాదు.పొద్దున లేవకపోతే అత్తతోని పోరు. రెండు నెలలు గూడ నాకు రెండు యుగాలుగ అవుపడ్డది.

ఆడదానిగ పుడ్తె ఇంతగనం నరకమనుభవించాల్న...? అంటే...రేపు నా చిన్నదాని పరిస్థితి గూడ ఇట్లనే ఉంటదా..? నేను జేసిన తప్పేంది...?  పుట్టినింటి పేరు నొదులుకొని,వీళ్లింటి పేరును పట్టుకొని,వీళ్ల వంశ బరువును మోయడానికొచ్చిన దాన్ని ఎట్ల జూస్కోవాలే..?? వీళ్లందర్ని నా వాళ్లనుకుంటాన.ఎన్ని తిట్టినా...కొట్టినా భరిస్తానంటే ఇది నా ఇల్లని అనుకోబట్టే గదా.వీళ్లకెందుకర్థం గాదు విషయం.వీళ్ల బిడ్డ ఇంటి కోడలేనని...నా అత్త గూడ నాతో సమానంగ ఇంటి కోడలేనని ఎందుకు మరిచిపోతాండ్రు.ఆడదాన్ని ఎదగనీయకుండ ఇట్ల అత్త ,ఆడిబిడ్డ రూపంల పీడిస్తాంటే ఇగ ఆడజాతికెప్పుడు స్వాతంత్ర్యమొస్తది‌.

దీన్నలుసు జేస్కొనే గదా మగాళ్లంత పెండ్లాల మీద రాజ్యమేలుతాండ్రు.

మెడల తాళిబొట్టు గట్టగానే మగానికి పెండ్లాన్ని..పెండ్లాం తల్లిదండ్రులను తిట్టడానికి ఎక్కడ లేని అధికారాలు పుట్టుకొస్తయి.రేపు వీళ్లు గూడ బిడ్డకు తండ్రేనని ... బిడ్డ ఇంటిదయ్యేదాక గూడా బుర్రకెక్కదు.

ఇప్పుడు నా ఒళ్లంత దెబ్బలతో వాసం లేని ఇల్లుల కుప్పకూలినట్టనిపిస్తాంది.

వడగండ్ల వానకు చిత్తడైపోయిన పంటలాగున్నది.నా ఒంటికి

ఇరవైరెండేండ్లే అయినా...  సూపుకి మాత్రం రెట్టింపుగా కనబడ్తాంది‌.  సావు కండ్లముందుకొచ్చి రమ్మని పిలుస్తాంది నన్ను!నువ్వు సావు ...సావుమంటు నాకునేనే గట్టిగ జెప్పినట్టున్నది నాకు!!

నేను సావాల్నా...? ఎందుకు సావాలి? మరినేను సచ్చిపోతే నా పిల్లలేంగావాలె ? నాకు తల్లిదండ్రులు తోడున్నా వీళ్లతో ఇంత నరకమనుభవిస్తానా ! రేపు నేను  లేకపోతే నా చిన్నదానికి తోడెవ్వరుంటరు?? నేను బోయిన

తర్వాత ఈయన ఇంకో పెండ్లి తప్పకుండ జేసుకుంటడు.

ఇంతకుముందు ఒక అమ్మాయికి రెండు సార్లు కడుపు జేసి మోసం జేసిండు.వీళ్ల మీద కేసు పెడితే ... కేసుని పైసలతో కడిగేసుకున్నరు. సారి పరువు సచ్చినోళ్లు...మనిషి లక్షణాలే లేనోళ్లు దేనికైనా తెగిస్తరు.వాడ మీద వీళ్లతో ఒక్కరూ మాట్లాడరు! సుట్టాలెవ్వరూ వీళ్లను గలుపుకోరు!! అయినా వీళ్లకు ఫీలుండదు...మనుషులుగా మారుదామన్న సోయీ రాదు.ఇట్లాంటోళ్ల కోసం నేనెందుకు సచ్చిపోవాలెబతకాలి...నేను బతకాలి.తెగించి బతకాలి.తిరగబడి బతకాలి.వీళ్లను నా వాళ్లని నేనొక్కదాన్ని అనుకుంటె సరిపోదని బాగ అర్థమయ్యింది. ఇగ ఇప్పటి నుండి నాతోని నేను,నా ఇద్దరి పిల్లలు మాత్రమే ఉంటరుదీంతో పాటు వీళ్లనెదిరించడం గూడా నాకు అత్యవసరం.ఇప్పటిదాక నేనొక దెబ్బతిన్న పిల్లిని! ఇగ ఇప్పట్నుండి నాలోపల ఎదిరించే పులిని గూడా జూస్తరు.రేపటి నా చిన్నదానికి నేనొక దారినవ్వాలే..సూపు నవ్వాలే...

చిన్నది నిద్రలేచినట్టున్నది. ఏడుపినొస్తాందిదానికి కొన్ని   నా ఎండిపోతున్న రొమ్ములను పచ్చిగ జేసి పాలిచ్చి...ఇగ జీవితాన్ని గూడ పచ్చగా పాలిస్తాను.

 

                                                                                                ***

ఈ సంచికలో...                     

May 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు