మా రచయితలు

రచయిత పేరు:    డా. కాసల

సాహిత్య వ్యాసలు

‘ఇక్కడ మనిషి కనబడుట లేదు

కనబడుటలేదు – సాధారణ  పత్రికల్లో కనిపించే ప్రకటన. అంటే అర్థం - ఫలానావారు తప్పిపోయారు, ఇక్కడ కనిపించడం లేదు – అని. ఒకవేళ మీకు కనబడితే దయచేసి మాకు తెలపండి - అని అందుకు కొనసాగింపుగా ఓ  అభ్యర్థన.

          అయితే ఇక్కడ మనిషి కనబడుట లేదు - అన్నది ఒక కంప్లైంట్. ఆ ఫిర్యాదు చేస్తున్నది - ఓ కవి - గుడిమెట్ల చెన్నయ్య.  ఇప్పటికీ తెలుగువారి  సాంస్కృతిక రాజధానిగా తన ఉనికిని చాటుకుంటున్న చెన్నైలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు భాషాభిమానిగా, నటుడిగా, గాయకుడిగా,  పుస్తక సమీక్షకుడిగా  తన అక్షర ప్రస్థానాన్ని  కొనసాగిస్తున్నవారు.   “జనని” పేరిట ఏర్పరచిన సాంఘిక సాంస్కృతిక సంస్థకి  ప్రధాన కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నవారు.  తమ సంస్థ తరఫున ఎన్నో పుస్తకాలను ఆవిష్కరింప జేసినవారు.  అంతకుమించి ఆ వ్యయప్రయాసల్ని  భరిస్తూ ఇతర రచయితల పుస్తకాలను సంస్థ పక్షాన  ప్రచురిస్తూవారు.   ఇంతగా భాష కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న ఈ అక్షర యోధుడు  అప్పుడప్పుడూ మధ్య మధ్య ఎలాగో తీరిక చేసుకుని తమలో తెరచాటున దాగి ఉన్న సృజనాత్మకతని  అక్షరాలతో అలంకరించి తెర ముందుకు తెస్తున్నారు.  అలా ఎప్పుడో రంగప్రవేశం చేసి ఆ ఆటపాటల్లో ఎంతో కొంత ప్రావీణ్యం సంపాదించిన తమ కవితా నటీమణిని మెల్లగా  పుస్తక వేదికనెక్కించి సోలోపర్ఫామెన్స్ -  ప్రత్యేక ప్రదర్శన – చేయించాలనుకున్నారు. తత్ఫలితమే “ఈ మనిషి కనబడుట లేదు” -  పూర్వరంగం 10 పుటలు, అసలు అభినయం 54 పుటలు - వెరసి 64 కళల మల్లే - 64 పుటలు - 40 కవితలు.

 

          ఇంతకీ ప్రొటోగరాస్ అన్నట్టు - అన్నింటికీ ప్రమాణం మనిషే – మంచికయినా, చెడుకయినా – కర్త, కర్మ, క్రియ తానే – అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా!  అయినా ఆ మనిషే – మంచి మనిషే - కనుమరుగవుతున్నా డు.  అన్ని కాలాల్లోను, అన్ని ప్రాంతాల్లోను! అందుకే ఇంతలా వాపోవడం  కవులూ,  కళాకారులూ,  సామాజిక కార్యకర్తలూ!

మాయమైపోతున్నడమ్మా!

మనిషన్నవాడు!

మచ్చుకైనా లేడు చూడు –

మానవత్వం ఉన్న వాడు! - ఇది ఈనాటి కవి గాయకుల ఆవేదన! ఆ కోవలో వస్తున్నదే - ఈ కవితా ప్రకటన –మనిషి కనబడుట లేదు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో యత్ర నార్యస్తు పూజ్యంతే - అని గొప్పగా వర్ణించి రైల్లో కింది బెర్తు మీద పడుకొని ఆదమరచి నిద్రపోతున్న ఓ అతివ అందాలను ఆబగా తన చూపులతోనే స్పృశిస్తున్న ప్రబుద్ధుడు,  కట్టుకున్న ఇల్లాలును శంకించి వీడు పుట్టింది నాకేనా?- అని అడిగిన పురుష పుంగవుడు,  మండుటెండలో రిక్షాని  తొక్క లేక తొక్కి వంతెన దాటించిన బడుగు జీవి చేతిలో చిరిగిపోయిన ఐదు రూపాయల నోటు నుంచిన తెగ బలిసిన శాల్తి, పరిగెత్తే రైల్లో నుంచి తనకు చెయ్యందించి ఎక్కించుకున్న వాన్నే కిందకి తోసేసిన విశ్వాస ఘాతకుడు,  శిష్యుడు రాసి వినిపించిన కథనే తస్కరించి వార పత్రికలో తన పేరు మీద అచ్చేయించుకున్న కుహన అయ్యవారు,  ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిని తనకేదో కావాలని అడిగిన కామాంధుడు, వంద నోటును  ముందుగానే ఇచ్చి వెచ్చాలు కొనుక్కున్న చిన్న పిల్లాన్ని మళ్లీ డబ్బులిమ్మని  అడిగే కిరాణాకొట్టు కిరాతకుడు - నిజానికి వీళ్ళందరూ  మనుషులే!  మనిషి ఆకారంలో ఉన్న వాళ్ళే! అయినా వీళ్లల్లో ఏ ఒక్కరి లోనూ    మంచితనం - మనిషి తనం -  ఉన్న మనిషి కనబడడు!

అయితే ఈ సంపుటిలోని కవి - తిలక్ పోల్చినట్టు - మంచిగంధం లాంటి మానవత్వం ఉన్న మనుషుల్ని కూడా ప్రస్తుతించారు.  చిన్నప్పుడు తాతయ్య చెప్పే మంచి మాటల్ని  వింటూ పెరిగిన మనవరాలు పెద్దయి, ప్రయోజకురాలై -  నన్నీ  స్థితిలో చూసేందుకు తాతయ్య  రాడా  నాన్నా! అని అడిగిందంటూ  మన కళ్ళలో సైతం  క్షణం సేపు  ఓ తడి మెరుపు మెరిపిస్తారు. గాలి వానలో ఇల్లు కూలిన భద్రానికి తలదాచుకోవడానికి తన ఊళ్ళో  తెలిసిన వాళ్లే ఆశ్రయం ఇవ్వక కసిరికొడితే   చివరికి ఆ చీకటి  రాత్రివేళ ఆ భద్రాన్ని ఈ నేలతల్లే  భద్రంగా తన అక్కున చేర్చుకుందంటూ  శ్రీశ్రీ  “భిక్షు వర్షీయసి” కవితను తలపిస్తారు. ఈ వట్టి మట్టి నేలలో మమత నిండిన మాతృమూర్తిని దర్శిస్తారు.  చెట్టున ఉన్న మామిడి పండును చూస్తూ  గుటకలేస్తున్న ఓ  ముసలతను - ఓ కుర్రాడు ఆ చెట్టెక్కి, పళ్ళు తుంచి తెచ్చి చేతికిస్తే - ముసిముసిగా నవ్వుతూ ఆరగించే సన్నివేశాన్ని ముచ్చటగా మన కళ్ళ ముందుంచుతారు.  ఇటీవలే మరలిరాని లోకాలకు తరలి వెళ్ళిన తన అభిమాన సినీకవి ని మళ్లీ రా సినారే, మా ప్రాణం మీరే! – అంటూ ఓ ఎలిజీని - స్మృతి గీతాన్ని- ఆలపిస్తారు. వీటితోపాటు ఆలోచించు, ఎన్నాళ్లీ మాయమాటలు, అధైర్య పడకు చెల్లీ!, ఉన్మత్తుల మదమణచు,  తలెత్తుకు తిరగాలి, ఆచరించి  చూపుటయే మిన్న- అన్న చక్కటి శీర్షికలతో ప్రబోధ గీతాలు పలికిస్తారు.  విరోధి, వికృతి, మన్మథ  సంవత్సరాల ఉగాది ఉత్సవ సంరంభాన్ని మరోమారు గుర్తు చేస్తారు.  అందులోనూ - ఉజ్వల భవిష్యత్తుకై /చీల్చుకొని గాఢ అంధకారాన్ని చీల్చుకొని/ దివ్య జ్యోతి వెలుగులో /శుభ  కార్యక్రమాలు నిర్వహిస్తూ తద్వారా బ్రాత్రు/  భావన పెంపొందించుకోవాలని / కాంక్షిస్తూ అలాంటి భావాలు /క్షణమైనా మీ మదిలో కొ/లులువుండాలని   ఆశిస్తున్నాను - అంటూ ఈ అష్టపది లోని ఆధ్యక్షరాలతో మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు.  ఇలా ఇంతలా  అరవై ఎనిమిదేళ్ళ వయసులో – ఆశ తీరా - తన కవితల్ని ఓ సంపుటిగా  సంపుటిగా చూసుకుంటున్నా ఈ గుడిమెట్ల అక్షరార్చనని శ్లాఘిస్తూ - పుస్తకానికి ముందుమాట రాసిన టీ శ్రీరంగస్వామి గారితో గొంతు      కలుపుతూ - ఈయన కార్యకర్తగా మాత్రమే కాక కావ్యకర్తగా కూడా నిలవాలని,  వీరి కలం నుండి మరిన్ని రచనలు జాలువారాలని  ఆశిద్దాం.

ఈ సంచికలో...                     

Oct 2023

    ఇంటర్వ్యూలు

ఇతర పత్రికలు